అస్తిత్వానికి ఇంకో కోణం!

                  pothuri          

అస్తిత్వం.

ఆ మాట అందరికీ వర్తించటం ధర్మం.

కొన్ని దశాబ్దాల క్రితం వరకూ రాసేసుకున్నారుగా మీగురించే – ఇప్పుడక్కర్లేదులే అనటం అన్యాయం. చలనశీలమైన చరిత్ర లో కొత్త మనుషులు, వాళ్ళ సంగతులు- ఆ తర్వాత వాటిని తలచుకోవాలనుకునేవాళ్ళు – ఉంటూనే ఉంటారు.

90 లకి ముందర తెలుగు లో మనకు  ఆత్మాశ్రయ వచనం తక్కువ. ‘ అమరావతి కథలు ‘అమరావతి ని ఆశ్రయించుకున్నాయి గాని, ప్రత్యేకమైన మనుషులని కాదు. ‘ పసలపూడి కథలు ‘ దీ ఆ దారే. అది క్షేత్ర సాహిత్యం.

‘ పచ్చనాకు సాక్షి గా ‘ చదివి అందరం ఉలిక్కి పడ్డాం. నవ్వాం, ఏడ్చాం, జాలి పడ్డాం, కోపం తెచ్చుకున్నాం. ఆ తర్వాతి ‘ దర్గా మిట్ట కథలు ‘ – మరింకొంత ‘ సౌమ్యంగా ‘ అనిపిస్తాయి. అవీ బావున్నాయి . అంతకు ముందో ఆ తర్వాతో వచ్చిన ‘ మల్లె మొగ్గల గొడుగు ‘ . కథ ని మించి ఇతిహాసపు స్థాయి కి వెళ్ళబోయిన ‘ అంటరాని వసంతం ‘ ….

దర్గా మిట్ట కథలు  comfort zone  లో ఉండటం ఎక్కువనీ, పురాస్మృతులను romanticize  చేస్తున్నారనీ వచ్చిన విమర్శ కూడా నాకు తెలుసు. కావచ్చు. వేదన తోనో ఆగ్రహం తోనో మాత్రమే కాదు, ఇష్టం గానూ ముచ్చట తోనూ  కూడా  ఎవరి జ్ఞాపకాలను వారు రాసుకోవటం లో  తప్పు ఉందా ? ‘ ఎక్కువ కష్టాలను ‘ అనుభవించి ఉండకపోవటం అనర్హత అవుతుందా ? ” ఊహూ. నువ్వు అలా అనుకుని రాస్తున్నావు గాని జరిగింది అది కాదు, మాకు తెలుసు ” – అనేందుకూ వీలు లేదు. ఎన్నయినా దృక్కోణాలు ఉండవచ్చు –  ఉట్టిగా జ్ఞాపకాలనే పట్టుకుని ఎవరైనా తీర్మానాలు చేయబోతే అప్పుడు పేచీ పెట్టచ్చునేమో. నాకు తెలిసి , ఇటువంటి వాటి లక్ష్యమూ లక్షణమూ record  చేసి పెట్టటమే . తెలిసినదే రాస్తే దానిది సాధికారమైన  పరిమళం.

    సమగ్రమైన , విస్తృతమైన అధ్యయనం, తప్పని సరి గా పనిచేస్తుండవలసిన సహానుభూతి – ఇంకా చాలా కావాలి తీర్మానించటానికి.

ఈ  వర్గానికి మేము చెందుతాము, మా తీరూ తెన్నూ ఇదీ  అని రాసుకునే ధైర్యాన్ని కొద్దిగానైనా తెచ్చి ఇచ్చినవారు శ్రీ రమణ గారు. ‘ మిథునం ‘ పూర్తి గానూ, ‘ బంగారు మురుగు ‘ చాలా మేరకూ బ్రాహ్మణుల కథలు. ఇంకొక మంచి కథ ‘ ధనలక్ష్మి ‘ కూడా బ్రాహ్మణ, వైశ్య  వర్ణాల ప్రసక్తి లేకుండా సాగదు. భారత దేశం లో అప్పుడూ ఇప్పుడూ కూడా కులం ఉంది. ప్రతి కులం లోనూ రకరకాల ఆర్థిక స్థాయిలూ బౌద్ధిక పరిణతులూ ఉన్నా – సామాన్య ధర్మాలు గా కొన్ని గొప్పలు, కొన్ని తప్పులు , కొన్ని నడతలు, కొన్ని మమతలు .

ఒప్పుకోవటం లో సిగ్గు పడేదేముంది ? చెప్పుకోవటం లో అతిశయమేముంది ?

 అవును, నాలుగు వేళ్ళూ నోట్లోకి పోతున్నాయనే – 90 ల తర్వాత ఈ కథలు వచ్చాయి, అలాగే అనుకుందాం.

వ్యక్తిగతం గా నాకొక నేపథ్యం ఉంది. దానికీ కథ లోకి రావాలనే ఉబలాటం ఉంది.

 ‘ ఇల్లేరమ్మ కథలు ‘ – దాన్ని కొంత దగ్గరగా చూపించాయి . ప్రత్యేకించి ప్రస్తావించేందుకు రచయిత్రి వెనుకాడారేమోననిపిస్తుంది గాని,  అవి ఉద్యోగాలు చేసే మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాల కథలు. మరి ముఖ్యం గా, పల్లెటూళ్ళని ముందు వదిలిపెట్టిన బ్రాహ్మణ శాఖ అయిన నియోగుల ఇంటి కథలు.

 ఆ తర్వాత వచ్చిన ‘ పొత్తూరి విజయలక్ష్మి హాస్య కథలు ‘ – ఆవిడే చెప్పినట్లు ‘ పఠం ‘ కట్టిన బ్రాహ్మణ కథలు.[ వాక్యం లో రెండో భాగం ఆవిడ ది కాదు ]   పల్లెటూళ్ళవీ పట్నాలవీ – నా సొంత జిల్లా కథలు. నాకు తెలిసిన మనుషులే ఉన్న కథలు. Larger than life అనిపించే వాళ్ళవి.

 అసలు ఆ పేరు ఆ పుస్తకానికి పూర్తిగా తగదు. అందులో హాస్యం కానిది చాలా ఉంది.  హాస్యం మీద అఖండమైన గౌరవం  నాకు , అది కాదు ప్రశ్న. అవి ‘ హృద్యమైన ‘ కథలు. Feel good  అనే మాట కు తెలుగు ఏదో నాకు తెలియదు, ఇవి ఖచ్చితం గా అవే. ఈ feeling good  అనేది ముడుచుకు కూర్చోవటం కాదండీ, ‘ ఇచ్చుట లో ఉన్న హాయి ‘ .  వీటిలో మనుషులకి చాదస్తాలు, వెర్రి బాగుల తనాలు , పిచ్చి పట్టుదలలు – ఉన్నాయి. ఇంకొకడికి తిండి పెట్టటాలూ అందుకు వాళ్ళు  చిన్నబుచ్చుకోకుండా నెపాలు కల్పించటాలూ, పెద్దవాళ్ళు లెమ్మని, ఇబ్బంది అవుతున్నా చూసీ చూడనట్లుండటాలూ , ఆ పని మనదో కాదో ఎంచకుండా చేసుకుపోవటాలూ – ఇవీ ఉన్నాయి. తృప్తి గా బతకటం ఉంది. శాంతం గా ఊరుకోవటం ఉంది.  అంతా అనుకునేట్లు వియ్యాల వాళ్ళకి మధ్యలో ద్వేషాలూ పగలూ కాదు –  గౌరవాలూ మర్యాదలూ – దాదాపు గా మనస్ఫూర్తిగానే – ఉన్నాయి. ఈ కథల కొత్త ముద్రణ లో ‘ జ్ఞాపకాల జావళి ‘ అనే సీరీస్ ని కలపటం లో చాలా ఔచిత్యం ఉంది.

MythiliScaled

  రేడియో మోగుతుంటే కూర్చుని వినకపోతే అది నొచ్చుకుంటుంది . కరెంట్ పెట్టించుకుంటే షాక్ కొడితేనో …కట్టుకున్న మొగుణ్ణి కర్ర తో ఎట్లా కొడుతుంది అమ్మమ్మ ? టేప్ రికార్డర్ ని చూసి ‘ జాగర్త, అది వింటుంది ‘ అని భయపడతారు . అదొక అమాయకపు కాలం.

చెన్నా పట్నం నుంచి వస్తున్నాం కదాని వియ్యపురాలికి ఇంగిలీషు కూరలు తెచ్చిపెడతాడు వియ్యంకుడు. మా మామ గారు అటువంటి వారు. మా అమ్మకీ ఆయనకీ మంచి rapport  ఉండేది. ప్రాణాంతకమైన వ్యాధి తో మా నాన్న గారు హాస్పిటల్ లో చేరినప్పుడు – రెండు నెలల పాటు మామ గారే ఆయనని కనిపెట్టుకు ఉండిపోయారు.  చూసేవాళ్ళు తండ్రీ కొడుకులనో అన్నదమ్ములనో అనుకునేవారు.

ఉంటారు అటువంటి మనుషులు – చూశాము .

  భుక్తి గడవని వితంతువు చేత అట్ల దుకాణం పెట్టిస్తారు తాతగారు. ఆయన తో మొదలెట్టి ఆఖర్న అమ్మమ్మ కీ అవి నోరు ఊరిస్తాయి. ఏ పనీ రాని సీతా రావమ్మ కి ఊరికే తింటున్నాననిపించకుండా గుళ్ళో పాటలు పాడే పని ఇస్తారు. అదీ రాదు ఆవిడకి. ” వసుదేవాత్మజ రామా , కైలాసవాసా శ్రీహరీ ”- అదీ ధోరణి. ఆ పాటలు వినలేక దేవుడు పారిపోయి ఉంటాడనుకుంటారు, వరుణ యాగం చేసినా వానలు పడవు. అన్నమూ నీళ్ళూ మానేసి ఆవిడ పాడుతూ కూర్చుంటే రాత్రి పది గంటలు దాటాక వర్షం కురుస్తుంది. ఎందుకైతేనేమీ, ‘ పిచ్చి దాని పరువు దక్కింది ‘ . అవును – ఎవరికి మటుకు పరువు ఉండదు ? సీతారావమ్మకి  అక్క  భ్రమరాంబ గారు. నీళ్ళు తెచ్చి పోసి బతుకుతుంది, ఇబ్బందొచ్చినా చుట్టాలొచ్చినా చేసాయం చేసి పెడుతుంది. మిగిలిపోయినవి ఇస్తే తీసుకోదు, పాత చీర ఇస్తే సున్నితం గా వద్దంటుంది. మర్యాద గా భోజనం చేయమంటే చేస్తుంది, కొత్త చీర ఇస్తే నోరారా దీవిస్తుంది. ఎవరి ఋణానా పడకుండా దాటిపోతుంది.

   అల్లుళ్ళ మీద పెత్తనం చేసే మామ గారుంటారు ఇందులో. వాళ్ళకి ఇష్టమైన సినిమా ని కాదని తాను మెచ్చిన దానికి టికెట్ లు కొని కూర్చోబెట్టి మరీ వస్తాడు. చండశాసనుడు. ఆయనకి అన్నం వడ్డిస్తుంటే వంటావిడకి వణుకు పుడుతుంది – కాని చేతికి ఎముక లేని మనిషి. తన వాళ్ళూ కానివాళ్ళూ అని చూసుకోని మనిషి. ఈ అన్ని  లక్షణాలనూ

సంపూర్ణం గా మా మాతామహులు పూండ్ల రామమూర్తి రావు గారి లో చూశాను – ఆయన ఎంచి పెట్టే  ‘ లవకుశ ‘ వంటి సినిమాల తో సహా. ఆడ పెళ్ళి వాళ్ళ పనులనీ నెత్తి మీదేసుకుని చేయించే తాత గారి కథ ‘ మగ పెళ్ళివారమండీ ‘ చాలా మంచి కథ. అటువంటి తాత గారు నాకూ ఉండటం ఒకటే కారణం కాదు.

‘ పీత మీద కూతుని పాత పాదే ‘ పండు గాడి కథ అక్షరాలా గొప్ప కథ.బాగా  అలవాటయిపోయిన ఆ చిన్న వెధవ ని ఎక్కడికో వెంటబెట్టుకు పోదామనుకుంటే,  ‘ నేను లాను బాబూ. నాతు బోలెదన్ని పనులున్నాయమ్మా. నేనూ మా అమ్మ ఈ లాత్తిలి మీ బావిలో దూతి తచ్చిపోవాలి ‘ అంటాడు వాడు. అది నిజమే అని రాబట్టుకున్న ఈ కుటుంబం పెద్ద , పండుగాడి నాన్న కి ఊడిన ఉద్యోగాన్ని ఇంకోచోట వేయించి పెడతాడు. చిన్నదే ఉద్యోగం- చాలు, బతికేందుకు. పైకి చదువుతూంటే మా ఇంటి పెద్ద కంట తడి పెట్టిన కథ ఇది మాకు. 1992 లో అన్యాయం గా ప్రభుత్వ ఆసుపత్రి

పని లోంచి తీసేసినవాడికి  సొంత డబ్బు నలభై వేలు [ఆ. లంచమే ] ఖర్చుపెట్టి , జిల్లా కోర్ట్ లో కేసు వేయించి

తణుకు నుంచి ఏలూరు పదిసార్లు తిరిగి,   ఊడిన ఉద్యో గాన్ని మళ్ళీ వేయించిన  Deputy civil surgeon, మా నాన్న గారు గుర్తొచ్చారు.

గుర్తు చేసుకోనివ్వండి.

 వారానికి రెండు రోజులే పల్లెటూరికి వచ్చే తపాలా బంట్రోతు . ఆ వేళకి అంతా అక్కడికి చేరి వచ్చిన ఉత్తరాలన్నీ ముందే చదివేస్తుంటారు.

మా గుంటూరి బ్రాహ్మణేతర  మాండలికాన్ని ఈ ‘ రంగడు వస్తాడు ‘ [ ” ఎండన పడొస్తాడు, అన్నం తిననివ్వండి ముందు ” ]  లో ప్రయత్నించారు రచయిత్రి.

” సోమయ్య బావకి,

బావుండావా ? మా చెల్లి పిల్లలు బావుండారా ? బావా మా కోడలికి ఈ మధ్యన వొళ్ళు బాగాలేదు. …….

                   లక్ష్ముడు వ్రాలు ” [ ఈ ఉత్తరమూ వియ్యంకుడు రాసినదే ]

చెల్లెలికి పెళ్ళి సంబంధమని కబురు, సీతాపతి మేష్టారికి. ” నా మొహం నాకేం తెలుసు ? నాన్నే ఉంటే…” అని కళ్ళ నీళ్ళ పర్యంతమవుతాడు.

” ఉంటే బాగానే ఉండేది. లేనంత మాత్రాన ఏదీ అగదు. నాన్న లేకపోతేనేం బాబాయి ఉన్నాడు, చెట్టంత మేనమామ ఉన్నాడు…..అంతా సానుకూలం అయితే పెళ్ళే చెయ్యలేకపోతావా ? నువ్వు ఊళ్ళో ఉన్నావుగానీ అడవి లో లేవు కదా. మేమంతా లేమట్రా ? ” అని గదమాయించే తాతగారికి అందరూ అవునవునని వంత .

శంకరమంచి సత్యం గారు గుర్తు రాలేదా ?

ఇటువంటి theme నే మరొక సంపుటం’ పూర్వి ‘  లోని ‘ సుఖాంతం ‘ , ‘ పుణ్యాత్మురాలు ‘ కథల్లోనూ రాస్తారు.

గాజుల బత్తుడు విడిపోయి బతుకుతూన్న అన్నా చెల్లెళ్ళ మధ్యన వార్తలు మోస్తుంటాడు. ఇద్దరూ ముసలివాళ్ళే, దక్షత చేజారిన వాళ్ళే. విషయం తెలిసి తక్కినవారు సరిచేస్తారు. ఇక్కడా కంట తడి. నిజమే, చాలా చోట్ల ఉంటుంది. అది శోకం కాదు , బాధ్యత.

అప్పటి రోజుల్లో ప్రతి ఇంటా  ఉండిన బ్రాహ్మణ విధవ లు రెండు కథల్లో వస్తారు. అందరినీ పిల్ల విజయలక్ష్మి  గారు సినిమా కి తీసుకుపోయే కథ మహా సరదా గా ఉంటుంది. ఆవిడ ముద్ర కనిపించేది మరొకదాని లో- ‘సభల  సంరంభం ‘

 నెహ్రూ పోయాక లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాన మంత్రి గా ఉన్నప్పుడు ఇందిరా గాంధీ కాంగ్రెస్ సభలకి గుంటూరు వస్తుంది. కొత్త గా తండ్రి పోయిన ఆడపిల్ల అని, ఆవిడని ఇంటికి పిలిచి తీపి తో భోజనం పెట్టి చీరె పెట్టాలంటారు ఈ ముసలమ్మలు – కబురు అందిందనేవరకూ ఊరుకోరు. ” ఎంత గొప్పవాళ్ళైతే మాత్రం వాళ్ళకీ బాధలూ బరువులూ ఉంటాయి. మనం పిలవటం మర్యాద. అంత వీలు కాకపోతే ఆవిడే రాదు. అంతే గానీ అసలు పిలవకుండా ఎట్లా ? ” –

చెప్పండి, నవ్వొక్కటేనా వస్తోంది మీకు ?

పనిమనిషి కి తను అధ్యక్షు రాలిగా ఉన్న మహిళామండలి లో ఉద్యోగం వేయిస్తుంది అమ్మమ్మ. ఆమె ఆ తర్వాత ఈవిడ పనిని నిర్లక్ష్యం చేస్తోందని ఉడుక్కుని పీకేయమని బీడీవో కి ఉత్తరం రాయిస్తుంది. అంతలోకే చల్లబడిపోయి, ” పాపం, వద్దులే .ఉద్యోగం ఊడగొట్టి ఆ పాపం మూట కట్టుకోటం ఎందుకు ” అని ఆ ఉత్తరాన్ని వెనక్కి పట్టుకొచ్చెయ్యమంటుంది. డెబ్భై దాటిన  మా అమ్మకి  ఇట్లాగే పిచ్చి కోపమొస్తుంటుంది, ఇట్లాగే తగ్గిపోతుంటుంది.

 లేనివారి  ఇంటి పెళ్ళికి హడావిడిగా  అరిసెలు డబ్బాలకెత్తే ఇల్లాళ్ళు, గొప్పింటి  స్నేహితురాలికి ,ఇంట్లోవాళ్ళు కొని ఇవ్వరని,  పుణుకులు కొనిపెట్టేందుకు కనకాంబరాలు పెంచి అమ్మిన బీద పిల్లలు – ఇక్కడ ఉన్నారు. ఉండేవారు.

పూర్వి సంపుటం లోని బాలరాజు కథ నాకు చాలా ఇష్టం. విజయవంతం గా హోటల్ లు నడిపే ఒకాయన పూర్వాశ్రమం లో గల్ఫ్ వెళతాడు, ప్లంబర్ ఉద్యోగానికి. అక్కడి వాళ్ళకి కావలసింది వంటవాడు . పొరబాటు జరిగిందని

తిప్పి పంపించేస్తే చేసి వెళ్ళిన అప్పులు ఎట్లా తీరతాయి ? అక్కడి ఆఫీసర్ పూనుకుని, అతనికి వంట నేర్పి నిలబెడతాడు. చాలా ఏళ్ళ తర్వాత ఆయన్ని వెతుక్కుంటూ వెళతాడు హోటల్ యజమాని. పూర్తిగా మతిమరుపు [ Alzheimer’s ? ]  వచ్చేసి ఉంటుంది , కాని ఆఖరికి గుర్తు పడతాడు- ” నువ్వు రాజప్పడివి కదుట్రా ! వంట నేర్చుకున్నావా మరి ? ” – ఇతను సంబరం గా ఏడుస్తాడు.

” అన్నీ అంత సులువు గా అయిపోతాయా ఏమిటి ? అసలు అలా జరిగే వీలెక్కడుంటుంది ? ”  – అని ఒక రచయిత్రి నన్ను ప్రశ్నించారు.

సులువే. జరుగుతాయి. చాలా సార్లు.

పెద్ద మనసు ఉంటే.

అంటే ఏమిటంటే నేను చెప్పలేను.

*

 

అర్థాన్ని వెతికిన ప్రయాణం!

                                         Mythili

   సంతెశివర లింగణ్ణయ్య భైరప్ప గారు తెలుగువారికి బాగా పరిచయమైన కన్నడ రచయిత . నవోదయ, నవ్య, నవ్యోత్తర – ఏ కన్నడ సాహిత్య విభాగం లోనూ ఆయనను చేర్చటం వీలవదు గానీ , 2007 కు ముందు ప్రగతిశీలులందరూ ఏటవాలుగానే అయినా [ చాలా ‘ పాపులర్ ‘ రచయిత కనుక ] అక్కున చేర్చుకున్న రచయిత. ఆ ఏడు ‘ ఆవరణ ‘ నవల విడుదలయాక ‘’నవల రాయటమే రాదని ‘’ అనిపించుకున్నరచయిత కూడా . ఎవరన్నారు, ఎందు వలన అనేది చాలా పెద్ద చర్చ. మొత్తం మీద అదొక betrayal  గా తీసుకోబడింది.

బి.వి.కారంత్, గిరీష్ కర్నాడ్ లు – భైరప్ప రాసిన వంశవృక్ష, తబ్బలియు నీనదె మగనె నవలలని  సినిమాలు గా తీసుకున్నంత మాత్రాన  వారు అనుకున్నవన్నీ భైరప్ప లో అప్పటివరకూ ఉండినాయా ? ఉంటే వారు అనుకున్న పద్ధతి లోనే ఉండినాయా ?

కాకపోవచ్చు.

పరిమాణం లొనూ నేపథ్యం లోనూ మాత్రమే కాదు – తాత్వికం గా కూడా భైరప్ప గారి సరిహద్దులు పెద్దవి. ఆ సంగతి నాకు ‘ వంశవృక్ష ‘ నవల చదినప్పుడు అర్థమైంది. అందరి మాదిరే ఆ కథ ను నేను 1980 లో బాపు గారు సినిమా తీస్తేనే తెలుసుకున్నాను. మళ్ళీ వివాహం చేసుకున్న సరస్వతి [ నవలలో ఆమె పేరు కాత్యాయని ] వైపుకి మొగ్గిందన్నది స్పష్టమే. అందులో ఏమీ అన్యాయం అప్పుడు తట్టలేదు, ఇప్పుడు అంతకన్నా తట్టదు. కాని కథ లో కొన్ని ఖాళీ లు కనిపించినాయి సినిమా చూస్తుంటే. సరస్వతి ఇంటికి రాని రోజున మామ గారు ‘ చీకటి పడింది కదా, దారి తప్పి ఉంటుంది ‘ అంటాడు. అది చాలా లోతయిన వాక్యమని అప్పట్లో చెప్పుకోవటం గుర్తు.   సినిమా కథ పరం గా అది తప్పు ధోరణి.   అయినప్పుడు ఆ మాటలను అంత గంభీరం గా అనిపించటం లో ఔచిత్యం ఏముంది ? శంకరాభరణం లో వేసి జె. వి. సోమయాజులు గారు దొరికారని కాకపోతే, సినిమా లో బాపు గారు తేల్చినదానిలో    పెద్దాయన కు ఔన్నత్యాన్ని ఆపాదించేందుకు చోటు ఎక్కడ ?  ఆ పాత్ర చాలా linear గా ఉంటుంది సినిమా లో. చివరకు ‘ కనువిప్పు ‘ కలిగాకా అంతే. ఆ తర్వాత సరస్వతి కి బిడ్డలు దక్కకపోవటం ఒక విషయం. అందుకు  ఆమె అపరాధ భావనతో కృశించటం లో నాకు  అర్థమూ అగత్యమూ కనిపించలేదు.

 మరొక ఇరవై ఏళ్ళ తర్వాత – ‘ ఆ. ఎందుకులే ‘ అనుకుంటూనే చదివిన నవల నాకు మరి కొన్ని కిటికీలను తెరిచింది.

” ఇది జీవితం. ఇలాగే ఉంటుంది. ఇంత కర్కశం గా, నిర్దాక్షిణ్యం గా ఉంటుంది ” – అది రచయిత చెప్పదలచినది. ఏ పాత్రనూ సమర్థించలేదు, విమర్శించ లేదు. విభిన్నమైన ధర్మాల , కామన ల సంఘర్షణ ను చాలా నిజాయితీ గా చిత్రీకరించారు.భైరప్ప లో సర్వదా , సర్వత్రా ఒకటి కన్న ఎక్కువే దృక్కోణాలు ఉంటాయి . ఒక వృద్ధ బ్రాహ్మణ పండితుడి disillusionment  కనుక దానికి ఒక్క వైపు భాష్యమే ప్రసిద్దికెక్కింది. ఆ యేడు సితార పత్రిక అవార్డ్ లు ఇచ్చింది – వంశవృక్షం అత్యుత్తమ చిత్రం, శంకరాభరణం ద్వితీయ ఉత్తమ చిత్రం.

   భైరప్ప గారివి నేను  చదివినవి ఆరు నవలలు.  వంశవృక్ష, గృహభంగ, దాటు , పర్వ – తెలుగు లో; ఆవరణ , సార్థ ఇంగ్లీష్ లో. మొత్తం ఇరవై నాలుగింటి లో ఈ సంఖ్య కొద్దిదే. కాని అవన్నీ వేర్వేరు దశలలో రాసుకున్నవి కనుక రచయిత చేసిన ప్రయాణం ఏ మాత్రమో అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ అవగాహన లో నా అంతస్సూత్రాలు పనిచేయలేదని అనను. ఎన్ని సూత్రాల అన్వయానికైనా భైరప్ప గారి సంకీర్ణత లో వీలుంది.

 ” మృత్యువు నాకు అత్యంత  సన్నిహితం గా, అతి అనివార్యమైనది గా కనిపిస్తుంది. ఆ రహస్యానికి దగ్గరవుదామనే , అన్వేషణ లో భాగం గా  తత్త్వ శాస్త్రాన్ని  అధ్యయనం చేశాను ” అని ఆయన చెప్పుకున్నారు. ఎనిమిదేళ్ళ వయసు లో తల్లినీ, ఇద్దరు సోదరులనూ ఒక అక్కనూ ప్లేగు వ్యాధి వల్ల పోగొట్టుకున్న నిర్వేదం , నిర్లిప్తత , భీతి – ప్రాణమున్నంత వరకూ పోవు , మరిక ఎన్నటికీ ‘ మామూలు ‘ అయేది లేదు. చిన్న పనులు చేసీ ఒకోసారి బిచ్చమెత్తీ చదువుకున్నారు. ఫిలాసఫీ లో ఎం. ఏ, ఆ తర్వాత పి. హెచ్. డి ‘ సత్యం- సౌందర్యం ‘ [Truth and Beauty ] అన్న విషయం లో. ఇటువంటి మనిషి ఏ వాదం లోనైనా ఎట్లా ఇముడుతారు ?

ఆ దుర్భరమైన బాల్యాన్నంతా ‘ గృహభంగం ‘ లో రాస్తారు. లేదు. ఏమీ నిష్కృతి లేదు. నివృత్తి లేదు. ఇచ్చేందుకు రచయితకు మనసొప్పలేదు. ప్రపంచపు మహా విషాద కృతులలో చోటు చేసుకోదగిన నవల అది – వివరించేందుకు నాకూ చేతులు రావు.

 ‘ దాటు’ లో  ఒక బ్రాహ్మణ అమ్మాయి వక్కళిగ అబ్బాయిని ప్రేమిస్తుంది. కర్ణాటక లో వక్కళిగులు ఆర్థికం గానూ రాజకీయం గానూ బలమైనవారు. ఆ వివాహం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని అబ్బాయి తండ్రి కొంచెం ఊగుతాడు, అమ్మాయి తండ్రి ఒప్పుకోక పోయాక మరింకొక వివాహ పథకాన్ని వేసుకుంటాడు కొడుకుకి. అబ్బాయి

తండ్రిని ఎదిరించలేనివాడు. అమ్మాయి  తీవ్ర స్వభావ. ఆమె  తండ్రి అంత కన్నా తీవ్రుడు – ప్రతిగా తనని తను హింసించుకుంటాడు.  ఎవరికీ ఆ పల్లెటూరు వదిలిపోయేందుకు లేదు. అదీ నలుగుబాటు.

    భైరప్ప గారి నవలలో కాలం ఒక ముఖ్యమైన పాత్ర – అది సాగే కొద్దీ ప్రవృత్తులు కాస్త కాస్త గా మారుతూ ఉండటాన్ని అతి దగ్గర గా చూపించగల శక్తి ఉంది ఆయనకు.  బ్రాహ్మణుడిని    ‘ మచ్చ లేనివాడు ‘ గా ఏమీ చూపించలేదు. ఉందనే చెబుతారు, కావాలనే – అయితే అది గతం లోనే  ముగిసిపోయిన సంబంధం . అతను  గానీ ఆ నిమ్నజాతి స్త్రీ గానీ దాన్ని ఎప్పటికీ కొనసాగించాలనో దాని వల్ల తమ జీవితాలు మారిపోవాలనో అనుకోరు. ఎందుకంటే ఆ కాలానికి అది సహజం కాదు. ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి అభిమానమైతే ఉంటుంది ఆ తర్వాత కూడా – వారు జంతుసములు కారు. అంతకు మునుపే వచ్చిన ‘ సంస్కార ‘ లో అటువంటి సంబంధానికే ఇచ్చిన నాటకీయతను భైరప్ప గారు ఇవ్వదలచుకున్నట్లులేదు.

 పర్వ.   దీనికి చాలా ప్రశంసలు వచ్చాయి . మహా భారత ఇతిహాసాన్ని మరొక వైపునుంచి చూడటం కన్న సరదా పని ఇంకేముంటుంది ? ఇందులో గాంధారి నిస్పృహ తో కళ్ళ గంతలు కట్టుకుంటుంది. పాండురాజు ఇంచుమించు నపుంసకుడు. కుంతి అతనిని ఆకర్షించలేకపోతుంది. ఆమె శారీరకం గానూ మానసికం గానూ కూడా  ‘ పృథ ‘ – ఆమె ముందు పాండురాజు కు తను తక్కువవాడిననిపిస్తుంటుంది. మాద్రి ని డబ్బు ఇచ్చి తెచ్చుకుంటారు. పాండవులు దేవతలకు కాక హిమాలయ ప్రాంతాల లోని కొందరు ఉన్నత వ్యక్తులకు జన్మిస్తారు.

  భీమసేనుడి తండ్రి కుంతిని నిజంగా ప్రేమిస్తాడు, తన తో వచ్చేయమని బ్రతిమాలుతాడు. అతని వేదన, కుంతి నిస్సహాయత  నొప్పిస్తాయి. ధర్మరాజు, దుర్యోధనుడు, కర్ణుడు, అర్జునుడు – వీళ్ళలో రక రకాల ఛాయలు తెలుగుపౌరాణిక చలన చిత్రాలలో మనం చూసి ఉన్నవే, ఆశ్చర్యం కలిగించవు. భీముడిని మాత్రం పరిపూర్ణమైన వాడిగా , గొప్ప ప్రేమికుడిగా, మత్సరం లేని వాడి గా చూపిన తీరు నిండుగా ఉంటుంది. [ ‘ పర్వ’ భీముడి కోసం ఇంకా వెతుకుతూ భీముడే నాయకుడు గా ఎం.టి. వాసు దేవన్ నాయర్ ‘ రండా మూళ్జం ‘ వెతికి చదివాను – ఊహూ. ]

ద్రౌపదీ అర్జునుల మధ్య  అనురాగం, దాని లోని నెరసులు, విసుగులు – ఆమె మీద కక్ష తో సుభద్ర ను పెళ్ళాడితే – ద్రౌపది ముందు సుభద్ర ధూపానికి కూడా ఆగకపోవటం – గొప్ప చాతుర్యం తో రాస్తారు. అది అందం ప్రసక్తి కాదు , వ్యక్తిత్వం- ముఖ్యం గా తెలివితేటలు, ఆసక్తి కరమైన సాహచర్యం. సుభద్ర నిద్రపోతుంది అర్జునుడు మాట్లాడుతూండగానే – బుర్ర తక్కువదా అనిపించేలా [ పద్మవ్యూహాన్ని వివరించేప్పుడు సుభద్ర నిజం గానే పాపం నిద్ర పోయింది ] .

పర్వ లో గొప్ప న్యాయాన్ని చూపించింది కృష్ణుడి పాత్ర లో. నరకుడి చెర నుంచి విడిపించిన స్త్రీ లందరినీ ఆయన పెళ్ళాడిన కారణం వారికీ వారి సంతానానికీ సమాజం లో గౌరవాన్ని కల్పించాలని . ఆ కోణం భైరప్ప గారికి కనిపించటం విశేషం. అందరి తో ఒక్క రోజయినా  కృష్ణుడు గడపగలడని కాదు, అతి జాత్యుడని కాదు.

యుద్ధం – దాని భీకరత్వం, మిగిల్చే సర్వనాశనం – వీటిని అతి బిగ్గరగా వినిపించిన నవల ‘ పర్వ ‘ .అందులో ఉన్నది కేవలమైన పురాణవైరం కాదు

   నేను చదివినవాటిలో ‘ సార్థ ‘ కాలానుసారం ఆ తర్వాతది.నేను చదివిన వరస లో ఆఖరిది . వర్తకులను సార్థవాహులంటారు . వారి వెంట పంపబడిన నాగభట్టు అనే బ్రాహ్మణుడి కథ ఇది. సార్థ అన్న మాట లో  ఉన్న శ్లేష నవలంతా కనిపిస్తూనే ఉంటుంది

కథాకాలమైన ఎనిమిదవ శతాబ్దం లో వేద, జైన, బౌద్ధ మతా ల సంఘర్షణలు పతాక  స్థాయిలోకి చేరాయని రచయిత అంటారు. ఆదిశంకరుడు, కుమారిలభట్టు, మండనమిశ్రుడు, ఉభయ భారతి, రాజు అమరుకుడు – ఇందులో పాత్రలు గా వస్తారు. ఎక్కడికక్కడ న్యాయాన్ని  ప్రశ్నిస్తూ నవల నడుస్తుంది. ఎక్కడా నిలిచి stagnate  కాదు, అతి చలనశీలం గా ఉంటుంది. [ అలా రచయిత చెబుతూ ఉన్నది మనకు నచ్చుతోందా లేదా అన్నది కాదు ప్రశ్న .  ఆ ‘ నచ్చటం ‘ అనేది చాలా ప్రాథమికమైన చదువరుల లక్షణమని నేను అనుకుంటాను- ఉద్దేశపూర్వకం గా అలాగే ఉండదలచిన వారిది కూడానేమో, తెలియదు ] .

 రాజు అమరుకుడు నాగభట్టు భార్య ను కామించి అతని అడ్డు తొలగించేందుకు వర్తకుల రహస్యాలు తెలుసుకొనే మిష తో అతన్ని పంపించి వేస్తాడు. దారి లో ఎదురయిన బౌద్ధ విహారాలు. వాటిని నిర్మిస్తుండే శిల్పులలో ఒకరు నాగభట్టు తో మొర పెట్టుకుంటాడు – ‘ ఇదేమిటి ? వైదిక  దేవతల వర్ణన లకు తగినట్లు వారి దేవతల శిల్పాలు చెక్కమంటున్నారు ? ” – అని. బుద్ధుడు చెప్పివెళ్ళిన వర్ణరహిత  విరాగం లో ఎన్నెన్ని రంగులు – కొత్త కొత్త అవసరాల మేరకు చేరిపోయాయో రచయిత నిర్మొహమాటం గా రాస్తారు. ధనం, ఆధిపత్యం – వాటినే అవి ఎట్లా పెంచుకుంటూ పోతాయో

, వాటికి ఏమి పేర్లు తగిలిస్తారో కూడా.  ఒక నాటక సమాజం వారు అతని చేత కృష్ణుడి వేషం వేయిస్తారు – అక్షరాలా కృష్ణుడే అయినట్లు అతని రూపం సరిపోతుంది. అప్పుడు అతను అనుకుంటాడు – ” నిజం గా నేను అంత అందగాడినే అయితే నా భార్య రాజునెందుకు వలచింది ”- అని. ఈ ప్రశ్న ఆధునికానంతర కాలానికీ వచ్చి తగులుతుంది – అందం ఒకటీ చాలదు, అసలు ఏ ఒక్కటీ చాలకపోవచ్చు – ఎంచుతూ పోతే.

ఒక నాట్యగత్తె తో అతని స్నేహం , ఆమె దైహిక సంబంధానికి ఒప్పుకోకపోవటం – చివరికంటా నడుస్తుంది. ఒకే యోగి దగ్గర ఇద్దరూ ధ్యానాన్ని అభ్యసిస్తారు. ఆమె మున్ముందుకు వెళుతుంది, అతను అల్ప సిద్ధులను ఉపయోగించుకోబోయి పతితుడవుతాడు. తర్వాత కాపాలికుడయే ప్రయత్నం చేస్తాడు – ప్రయాణం సాగుతూనే ఉంటుంది.

నలందా విహారం లో – బౌద్ధుల రహస్యాలు తెలుసుకుందుకు మహా పండితుడైన కుమారిల భట్టు మారు వేషం లో చేరటం చరిత్ర లో ఉన్న విషయమే. పట్టుబడిన తర్వాత ఆయన ‘ గురు ద్రోహం ‘ [ బౌద్ధాచార్యుడి పరంగా ] చేసినందుకూ ఇటువైపున  లక్ష్యం  లో విఫలుడైనందుకూ తనకి తాను శిక్ష  విధించుకుంటాడు. వడ్ల పొట్టును పేర్చి మధ్యలో నిలుచుని దానికి నిప్పు అంటించటం ఆ శిక్ష. ఆ తీక్షణత్వం భైరప్ప రచన లో  చాలా చోట్ల కనిపిస్తుంది . సనాతన ధర్మం లో దేహం ప్రధానం కాకపోవటాన్ని అలా తీసుకొస్తారో లేక  కన్నడ దేశం లో ప్రబలిన జైనుల ఆత్మహింస [self molestation]  ఛాయ లో మరి …

 ఆ సంఘటన తర్వాత , కుమారిల భట్టు చెల్లెలు భారతీ దేవి [ ఉభయ భారతి ] కి వర్తమానం చెప్పేందుకు తిరిగి  నాగభట్టు స్వదేశం వెళతాడు. ఆమె భర్త మండనమిశ్రుడు ఒకప్పుడు తనకు గురువు. వారి ఇల్లు, గృహస్థ జీవనం, విద్యాదానం, అతిథులకు సత్కారం, అభ్యాగతులకు ఆశ్రయం – ఇది జీవిత పరమ ధర్మం గా రచయిత నిరూపిస్తారు.

కాని –

కర్మ యోగానుసారి అయిన మండనమిశ్రుడు జ్ఞాన యోగాన్ని వ్యాప్తి చేసిన ఆది శంకరుల చేతిలో ఓడిపోతాడు.  గృహస్థ వానప్రస్థ ఆశ్రమాలు దాటకుండా బ్రహ్మచారి సన్న్యాసం తీసుకోవటం వేద విరుద్ధమని మండన మిశ్రుడు వాదించినా ఉపయోగం ఉండదు. బౌద్ధులకు విరుగుడు గా శంకరులు బలపరచిన మాయా వాదాన్ని ఒప్పుకోలేకపోతాడు. మధ్యస్థం వహించిన ఉభయభారతి కామశాస్త్రం లో ప్రశ్న లు అడగటమూ శంకరులు రాజు అమరుకుడి దేహం లో ప్రవేశించటమూ – ఇక్కడ , శిష్యులు వెళ్ళి హెచ్చరిస్తే గాని ఆ దేహాన్ని వదిలి రావాలని శంకరులకు తోచదు. మాయాబద్ధులయినారు కద.

    శంకరులు యువకుడు, ఎక్కువ జవసత్త్వాలున్నాయి. మండన మిశ్రుడి శరీరానికీ బుద్ధికీ కూడా వార్థక్యం వస్తోంది – అతను ఓడిపోతాడు. అలా అని భారతీ దేవే ప్రకటించవలసి వస్తుంది. మాట ఇచ్చిన మేరకు ఆయన సన్న్యాసి అయి శంకరులకు శిష్యుడవుతాడు.ఆ తర్వాత శంకరులు ఉభయభారతి ని శృంగేరి శారదాంబ గా ‘ ప్రతిష్టించారనే ‘ ఐతిహ్యం ఉంది. ఈ నవల లో భారతీ దేవి భర్త సగం లో వదిలేసి వెళ్ళిన పనిని నిబ్బరం గా పూర్తిచేసేందుకు సిద్ధమవుతుంది, అంతే.

  అనేకమైన కారణాల వలన ఒక వాదం  ఒక చోట, ఒక సమయం లో  వీగిపోవచ్చును – గెలిచినదే సత్యం అయి తీరాలని లేదు. ఈ విషయం బాహాటం గానే ప్రకటిస్తారు  రచయిత.

   అందరూ భిక్షుకులైతే భిక్ష పెట్టేవారెవరు ? అందరూ సన్న్యాసులైతే బిడ్డలను కని ప్రపంచాన్ని నడిపించేవారెవరు ? అలా కాక కొందరికే అది వర్తిస్తుందంటే దానికి ప్రచారమూ పోటీలూ దేనికి ? మేధా శక్తి ఎక్కువ ఉన్నవారిని ఆ వంక తో లోపలికి లాగితే తమ వాదం బలపడుతుందనా ? నిర్భయం గా రచయిత వేసిన ప్రశ్నలు ఇవి.

 నవల చివర లో అరబ్ ల దండయాత్ర. బలవంతపు మత మార్పిడులు జరుగుతుంటాయి. నాగభట్టూ అతని స్నేహితురాలూ ఇద్దరూ పట్టుబడతారు . అరబ్ సేనాని నాగభట్టు తో వాదిస్తాడు. ఇతను అంటాడు – ” నేను భగవంతుడున్నాడని నమ్ముతున్నానో లేదో నాకే తెలియదు. అలా కూడా ఉండేందుకు మా ధర్మం లో వీలుంది. ఎవరూ ఎందుకూ బలవంతపెట్టరు ” అని. అరబ్ ముందు ఆశ్చర్యపోయి తర్వాత హేళన చేస్తాడు – ” మీది అసలు మతమే కానట్లుందే ” అని.

  అవును.  అనాదిగా ఈ దేశంలో మతం లేదు – ధర్మం మాత్రమే ఉంది. బల ప్రయోగాలూ ప్రలోభపెట్టటాలూ ఇక్కడ పుట్టినవారూ బయటినుంచి వచ్చినవారూ  కూడా ఆ పిదపనే  చేసుకుపోయారు.

 ముగింపులో నాగభట్టును రక్షించేందుకు స్నేహితురాలు అరబ్ సేనానికి లోబడిపోయి  గర్భవతి అవుతుంది, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది.  ఇద్దరూ తప్పించుకోగలిగి గురువు దగ్గరికి వెళతారు. గురువు వారిని   వివాహం చేసుకొని గృహస్థాశ్రమం లో ప్రవేశించమనీ ఆ బిడ్డ ను నాగభట్టు బిడ్డ గానే పెంచమనీ ఆదేశిస్తాడు.

    సార్థ 1998 లో వచ్చింది. ఆవరణ ఆ తర్వాత తొమ్మిదేళ్ళకి వచ్చింది .

      స్వ స్తి.

*

                              

  వేల  నక్షత్రాలు నడిచిన గది!

eleanor-farjeon-4

Eleanor Farjeon ప్రధానంగా కవయిత్రి. తర్వాతి రోజుల్లో  బాలసాహిత్యాన్ని సృష్టించారు. సంపూర్ణమైన జీవితాన్ని  పువ్వులతోటీ  మనుషులతోటీ పుస్తకాల తోటీ ప్రేమగా నింపుకుని ఆఘ్రాణించినవారు.

 చిన్నతనం, పుస్తకాల మీది మోహం – రెండూ కలిసి ఉండిపోయాయి నాకు. అర్థ శతాబ్దపు వయసు పూర్తయిన ఈ రోజుకీ ‘ పిల్లల కోసం ‘ రాసిన పుస్తకాలూ romance లూ fairy tales  – బలం గా లాగుతూంటాయి. Ms. Farjeon లో నేనొక  kindred spirit ని కనుగొన్నాను. ఆమె తన పుస్తకానికి తానే రాసుకున్న పరిచయం ఇది. స్నేహితులతో పంచుకోవాలని – ఇలా, ఈ సారికి.

*****

చిన్నప్పుడు మా ఇంట్లో మాకు ‘ బుల్లి పుస్తకాల గది ‘ ఉండేది. అసలైతే ఇంట్లో ప్రతీ గదీ పుస్తకాలదే – మేడ మీద మా పిల్లల గదుల నిండా పుస్తకాలే. కిందని నాన్న చదువుల గది లోనూ అవే. భోజనాల గది గోడల పొడవునా పుస్తకాలే , అవి పొంగి పొర్లి అమ్మ కూర్చుని కుట్టుపని చేసుకునే గదిలోకీ, పడక గదుల్లోకీ ప్రవహిస్తూనే ఉండేవి. దుస్తులు లేకుండా బ్రతకటం సాధ్యమేమో – పుస్తకాలు లేకుండానా ? ఆహారం ఎంత సహజమైన అవసరమో , చదవటమూ అంతే.

మా  బుల్లి పుస్తకాల గది – యథేచ్ఛగా పెరిగేందుకు వదిలేసిన తోట లాంటిది. పువ్వులూ పిచ్చి మొక్కలూ అన్నీ కలగలసిపోయి ఉండేలాగా. అక్కడ ఒక ఎంపిక గానీ పద్ధతి గానీ ఏమీ లేవు. తక్కిన గదులన్నిటినీ శ్రద్ధగా తీర్చి దిద్ది అమర్చేవారు – ఇది  మటుకు ఒక నానా జాతి సమితికి మల్లే ఉండేది. ఎక్కడా ఇమడని, పట్టని – అల్లరి చిల్లరి పుస్తకాలూ ఆకతాయి వీ , టోకున తగ్గింపు ధరల్లో నాన్న కొనుక్కొచ్చి పడేసిన బంగీ లూ- ఇంకా ఏమిటేమిటో. చాలా చెత్త, మరింకా చాలా సంపద . దేశ దిమ్మరులూ మర్యాదస్తులూ కులీనులూ అందరూ ఒక్కచోటే.   ఏ పుస్తకాన్ని ముట్టుకుని తిరగేసేందుకైనా మా ఇంట్లో పిల్లలకి అనుమతి ఉండేది – ఇక తవ్విన కొద్దీ దొరుకుతుండే నిధులూ నిక్షేపాలూ – అంతు లేకుండా.

MythiliScaled

ఆ గది కిటికీ లు మూసి బిగించి ఉండేవి . గాజు అద్దాలలోంచి  పడుతుండే సూర్యకాంతి తడవకొక్క మారుమూలకి వెలుతురు ఇచ్చేది  . పేరుకు పోయి ఉన్న దుమ్ము బంగారపు తునకల్లాగా మిల మిల మనేది.   మంత్రపు గవాక్షాలు నాకు తెరుచుకున్నది అక్కడే – అప్పటివీ అక్కడివీ కాని కాలాల్లోకీ దేశాల్లోకీ వాటిలోంచి తొంగి చూశాను- వచనమూ కవిత్వమూ వాస్తవమూ అద్భుతమూ నిండి ఉన్న లోకాల్లోకి.

పాత కాలపు నాటకాలుండేవి, చరిత్ర గ్రంథాలుండేవి, ప్రాచీన కాల్పనిక గాథలు…’ నిరాధారపు ‘ విశ్వాసాలూ ఇతిహాసాలూ పుక్కిటి పురాణాలూ – సాహిత్యపు ఉత్కంఠ అంతా రాసులు గా నివసించేది.  నన్ను మోహ పెట్టిన  ‘ Florentine Nights’ , జడిపించిన  ‘The Tales of Hoffman  ‘ అక్కడ ఎదురు పడ్డాయి. ఇంకో పుస్తకం – దాని పేరు ‘The Amber Witch ‘ . మామూలు గా నేను చదువుకునే fairy tales  లో మంత్రగత్తె కీ ఇందులో witch కీ ఏమీ సంబంధం లేదు – చాలా రోజులపాటు ఆమె ని తలచుకుంటే ఒళ్ళు జలదరించేది.

అన్ని రకాల అక్షర  పదార్థాలతో   కిక్కిరిసిన అల్మైరాలు అవి – ఇరుకు ఇరుకుగా గోడల కి సగం ఎత్తు వరకూ. వాటి మీదని అడ్డదిడ్డంగా పేర్చిన కుప్పలు పై కప్పుని తాకుతుండేవి. నేల మీది దొంతరల పైకి ఎక్కి చూడాల్సి వచ్చేది , కిటికీ అంచుకి బోటు పెట్టినవి ముట్టుకుంటే మీద పడేవి. ఒక లావుపాటి బౌండ్ పుస్తకం ఆకర్షించేది, దాన్ని అందుకునేలోపున మరొక వింత కాలికి తగిలేది. ముందే అనుకుని వెతకబోయినా వేరేవే ఒళ్ళో వాలేవి. అక్కడ – ఆ బుల్లి గదిలోనే – ‘ పుస్తకం ‘ అని పిలవదగిన ప్రతిదాన్నీ చదవటం నేర్చాను –  Charles Lamb లాగా.

The Little Bookroom

నేలమీద కూలబడో బీరువాకి ఆనుకునో – మహా అసౌకర్యపు భంగిమలలో స్తంభించిపోయి,  మైమరచి చదువుకుంటూంటే-  ముక్కుల్లోకీ కళ్ళలోకీ దుమ్ము పోయి దురదలు పెట్టేవి . నిజం కన్నా ఎక్కువ నిజమనిపించే ఆ గంధర్వ ప్రపంచాల లోంచి దిగి వచ్చిన తర్వాత గానీ కాళ్ళూ చేతులూ పట్టేయటమూ గాలి అందని ఉక్కిరి బిక్కిరీ తెలిసేవి కావు. తరచూ వచ్చే గొంతు నొప్పులు ఆ దుమ్ము వల్లనేనేమో అని అనుకోబుద్ధేసేది కాదు.

చీపురో పాతబట్టో పట్టుకుని ఆ గదిలోకి ఏ నౌకరూ అడుగు పెట్టిందే లేదు.  అద్దాల మీదా నేల మీదా అది అతి ప్రాచీనమైన ధూళి. అదే లేక పోతే అసలది ఆ గదే కాదు . అది నక్షత్ర ధూళి, సువర్ణ ధూళి, వృక్షాల ధూళి, భూమి అడుగున ధూళి లోకి చేరిపోయే ధూళి[dust to dust ] , తిరిగి భూమి ఒడిలోంచి పుష్పం గా రత్నం గా విరిసే ధూళి, వెలిగే ధూళి. ఆ నిశ్శబ్దపు ధూళి ని అమెరికన్ కవయిత్రి Emily Dickinson వర్ణించారు –

” ఇది, ఈ శాంత  ధూళి – ఇది స్త్రీలూ పురుషులూ అబ్బాయిలూ అమ్మాయిలూ అందరూ.

ఇది నవ్వులు, సామర్థ్యం, నిట్టూర్పులు – అన్నీ. ”

ఇంగ్లీష్ కవయిత్రి –Viola Meynell , ‘ రహస్యంగా ప్రవేశించి  ముంగిట్లో కమ్ముకున్న ‘  ధూళిని శుభ్రం చేస్తూ చేస్తూ – ఒకింత ఆగి అంటారు ఇలా –

” ఈ ధూళి ని తుడిచేస్తూంటే – పువ్వులని తుడిచేస్తున్నా నేమో, చక్రవర్తులని తుడిచేస్తున్నా నేమో – ఆలయాలనూ కవులనూ నగరాలనూ…”

పుస్తకాల గదిలోంచి మంట పెడుతూన్న కళ్ళతో బయటికి వచ్చాక కూడా ఆ చిత్ర వర్ణాల ధూళి మనస్సులో నర్తిస్తుండేది. ఆ సాలెగూడుల వెండి దారాలు బుద్ధికి పట్టుకునే ఉండేవి. అందుకనే – ఎన్నో ఏళ్ళ తర్వాత , సొంతగా నేను రాయటం మొదలెడితే అది – కల్పనా వాస్తవమూ,  సత్యమూ స్వప్నమూ కలిసిపోయి తయారైందంటే ఏం ఆశ్చర్యం ఉందని ? ఒక దాన్నుంచి మరొకదాన్ని విడదీయటం నాకెప్పుడూ పూర్తిగా సాధ్యం కాలేదు – నా కథలలో.  మాయమైన ఆలయాలూ మహారాజులూ , అందగత్తెల గిరజాలూ పువ్వులూ, పిల్లల నవ్వులూ కావ్యకర్తల నిట్టూర్పులూ – వీరందరి దుమ్మునీ – ఏడుగురు అమ్మాయిలు ఏడేసి చీపురులు చేతబట్టి అర్థ శతాబ్దం పాటు చిమ్మినా నా లోపల అది నశించలేదు. అదృష్టవంతులూ కానివారూ అందరూ – ఏదో ఒక బుల్లి పుస్తకాల గదిలోకి చేరి ధూళి గా మణిగేవారే – ఎప్పుడో ఒక్క లిప్త పాటు , కాంతివంతమవుతారేమో – ఏమో !

*

మిథ్యా జీవన రథ్యలలో…

MythiliScaled

 

” నమ్మటం సహజం. నమ్మకపోవటాన్ని సాధన చేసి నేర్చుకోవాలి ”

వింతగా అనిపిస్తున్నా మనస్తత్వ శాస్త్రం ప్రకారం ఇది నిజమట. పసిపిల్లలు కనబడేదాన్నంతా , వింటున్నదాన్నంతా నమ్ముతారు , మనకి తెలుసు. ‘ ఎదిగే ‘  కొద్దీ పెంపకం వాళ్ళకి అపనమ్మకాన్ని నేర్పుతుంది . ప్రపంచపు అనేకానేకమైన సంక్లిష్టతలలో బతికి బట్టకట్టేందుకు ఆ అవిశ్వాసం అవసరమే – కాని , దాన్ని కొన్నేసి సార్లు పక్కనపెట్టుకోవటమూ కావాలి.

ఎందుకంటే ప్రపంచం , అందులో వస్తువులూ విషయాలూ మనకి పూర్తిగా అలవాటైపోతాయి.  దాన్నంతా పూర్తిగా అర్థం చేసేసుకుంటామని కాదు – కొన్ని అనుభవాల వల్ల మొత్తం తెలిసిపోయిందనీ మరిక కొత్తదేమీ ఉండదనీ అనేసుకుంటాము. దీనికి – చుట్టూ ఉన్న సమాజపు తీర్మానాలు చాలావరకూ కారణం [cognitive bias ] . అయితే – ఆ తీర్మానాలకి పరిమితులు ఉంటాయి. అవి కొత్తగా వచ్చిన పరిమితులేమీ కాదు .  ఒకరి  నిజం మరొకరికి  అబద్ధం. ఒక చోట సహజమైనది మరొకచోట అసభ్యం. ఒక కాలపు న్యాయం మరొక యుగం లో అన్యాయం. అర్థసత్యాలను కూడా కలిపితే ఈ జాబితాకి అంతు ఉండదు.

దీన్ని సాగదీసి  – అసలు సత్యం అనేదేమీ లేదనీ ఒక hyper reality  లో మనం వేలాడుతున్నామనీ Jean Baudrillard వంటి  postmodernist లు తేల్చేయాలని ప్రయత్నించారు.

అవునా ?  ఒప్పుకుని ఏమని బతకాలి – కనీసం మనలో కొంతమంది ?

అక్కర్లేదు.

ఆ ముడినో వంతెననో వేసేందుకు ఆధ్యాత్మికత ఆ వైపు ఉండనే ఉంది . ప్రస్తుతం నేను వెళ్ళదలచుకున్నది అటు కాదు.

ఈ వైపున ఉన్న జలతారు పందిరి కిందకి – అది కళ.

భారతీయులమైన మనకి , సంప్రదాయాన్ని అనుసరిస్తూ వెనక్కి వెళితే – ఉత్తమమైన కళావిష్కరణ కూ ఆధ్యాత్మికానందానికీ ఖచ్చితం గా పోలికలు కనిపిస్తాయి. వాటి రెంటికీ స్థాయిల్లో మాత్రమే తేడా అనేంతవరకూ మనకి వాదనలు ఉన్నాయి. మరింకొకలాగా రసానందానికి అవధి గా మానుషానందం , దాన్ని ఎన్నో రెట్లు హెచ్చవేస్తే రాగల బ్రహ్మానందం – ఇలాంటి లెక్కలు  ఉన్నాయి.

 

కళాస్వాదన ని బుద్ధి తో గాక హృదయం తో , లేదా అంతకు తక్కువదైన మనస్సుతో చేస్తుండటం ఇక్కడ జరిగిన మేలు.   హేతువాదమో [తక్షణ ] ప్రయోజనాత్మక  దృక్పథమో  అడ్డు రావటం మనకి ఆ మధ్యన మొదలైందే.

పడమటి దేశాల్లో ఆ నీరసం 18 వ శతాబ్ది అంతానికే వచ్చేసింది. వారి ఆధునిక విద్య పాత నమ్మకాలని బద్దలుకొట్టి తీరాలని పట్టుబట్టుకు కూర్చుంది – ఆత్మల దినాలనీ హాలోవీన్ లనీ అనుమతించుకుంటూ వచ్చిన క్రైస్తవపు సహనమూ అప్పటికి అంతరించింది. మంత్రగత్తెలని వేటాడి తగలబెట్టటం [witch hunt ] 1750 కి దాదాపు గా పూర్తయిపోయింది. Folk tales, fairy tales మౌఖికం గా ఎప్పటినుంచో వ్యాపిస్తూ వచ్చాయి. ఆ కాలం లోనూ వాటిని  ఉద్ధరించినవారున్నా , ఆ సాహిత్యాన్ని ప్రధాన స్రవంతి లోకి రానీయక పోవటం మొదలైంది . బాలసాహిత్యం గా ముద్ర వేసి ఒక పక్కన పెట్టేశారు. [ 1930 లలో Tolkien వచ్చేవరకూ ఆ కథలు చిన్నపిల్లలకే పరిమితం ]

0415-william-wordsworth-daffodils

1798 లో Lyrical ballads  సంపుటం ప్రచురించబడింది. William Wordsworth, Samuel Taylor Coleridge ల సంయుక్త కృషి గా చెప్పబడిన అందులోWordsworth  ఇలా అంటారు.

” వీటిలో చాలా పద్యాలు ప్రయోగాత్మకం గా రాయబడినాయి. మధ్య, దిగువ తరగతి ప్రజలు మాట్లాడే భాష కవిత్వానికి ఎంత మేరకు తగుతుందో నిర్ధారించుకోవాలని ”

1802 లో , ఆ సంపుటాన్ని తిరిగి ముద్రించినప్పుడు Wordsworth ముందు మాట ని ఇంకాస్త పెద్దది చేశారు. అనుకుని అన్నారో అలా ధ్వనించిందో తెలియదు గాని , ‘ వాస్తవాధీనం ‘ కాని కవిత్వాన్ని ఆయన తిరస్కరిస్తున్నట్లుగా అర్థమైంది. అంతకుముందు వరకూ పాతపద్ధతులలో రాసిననదంతా కృత్రిమం అనేస్తే తిరగబడి  వెక్కిరించినవారు చాలా మందే ఉన్నారు. కాని – Wordsworth కవిత్వం లోని వైశాల్యం, సౌందర్యం, ప్రవహించే గుణం – దాన్ని కాపాడుకొచ్చింది. రాను రాను ఆయనను అతి ఎక్కువ భావోద్వేగాలతో [religious fervor ] ఆరాధించేవారు బయలుదేరిపోయారు.

అవును, Wordsworth ఒక path breaker  . అది ఒక కొత్త మతం కింద పరిణమించింది కొన్నేళ్ళ పాటు.

Coleridge 1817  లో నోరు విప్పారు. మొదట్లో వారిద్దరూ సంకల్పించుకున్నది అంతకన్న విస్తృతమైనదని తన Biographia Literaria లో బయటపెట్టారు.

” రెండు విధాలైన కవిత్వసృష్టి గురించి మేము మాట్లాడుకునేవాళ్ళం. ప్రకృతి సత్యాలను విశ్వసించటం ద్వారా  చదువరి సహానుభూతిని మేల్కొలపటం ఒక పద్ధతి. ఊహలకి రంగులు వేసి వినూత్నమైన ఆసక్తిని కల్పించటం రెండవది.

వెలుగునీడలు ఆడుకునేప్పుడు ఉన్నట్లుండి ఒక్కసారిగా  , చిరపరిచితమైన చోటంతా – ఆ చంద్రకాంతి లోనో సంజ వెలుగు లోనో కొత్త గా మోహపెట్టగలగటం …అటువంటిది మేము తలచుకున్న రెండు పద్ధతులూ మేళవించేందుకు వీలు ఇవ్వగలది. నిజానికి మేము కలిసి చెప్పదలచుకున్నది అదే ”

Coleridge , ఇంకా విశదం గా అంటారు – ”  మానవాతీతమైనవో , కనీసం అద్భుతమైనవో అయిన వ్యక్తుల గురించీ శక్తుల గురించీ నేను రాయాలని అనుకున్నాను .  ఆ ఊహల ఛాయలలో సత్యం వంటి మరొక సత్యాన్ని   ఆవిష్కరించాలనే ప్రయత్నం.   అప్పటికి, ఆ సందర్భం వరకూ – అపనమ్మకాన్ని కావాలని అణచిపెట్టటం ద్వారా[ Willing suspension of disbelief ]  , ఆ ‘ కవిత్వ సత్యా ‘ న్ని[ poetic truth ]  చదువరులు , తమ లోలోపల – తెలుసుకోవాలని. Wordsworth  – రోజూ కనబడేవాటినే కొత్త గా దర్శించగలగటం గురించి రాద్దామనుకున్నారు.  ప్రకృతి అందానికీ ఆకర్షణకీ కళ్ళు తెరవటం వల్ల ఆత్మ లోపలి బద్ధకం వదిలిపోతుందని . ఈ రెండు మార్గాలూ ఒకే లక్ష్యం లోకి పర్యవసిస్తాయని మేము నిశ్చయించుకున్నాము ”

కారణాలు ఏవైతేనేమి, Coleridge వి సంపుటం లో కొన్ని పద్యాలే ఉండినాయి. The Rime of the ancient mariner, Christabel, Kubla Khan వంటి ప్రముఖ కృతులని  తాను అనుకున్న పద్ధతిలోనే రాశారు.

ఆయన మొదట వాడిన ఆ పదబంధానికి,  కాలాంతరాలలో – చాలా విస్తృతమైన అన్వయమూ ప్రచారమూ జరిగాయి.

ఈ willing suspension of disbelief ని అన్నిందాలా చూడచ్చు మన  సంస్కృతి లో . కేవలం చెవుల ద్వారా మహా ఇతిహాసాలన్నిటినీ వంటబట్టించుకున్నాం. జంతువుల కథలతో నీతిచంద్రికలని వెలిగించుకున్నాం.

యుద్ధపర్వాలను పురాణం చెప్పే ముందు కోటలో ఆయుధాలన్నిటినీ గదిలో పెట్టి తాళం వేయించమని అన్న పౌరాణికులు ఉన్నారు. అయినా పురాణం విని ఒట్టి చేతులతోనే ఒకరి మీదికొకరు లంఘించిన సభికులు  ఉన్నారు వారికి. హరి కథ లు కార్పించిన కన్నీరు, బుర్ర కథలు ఎక్కించిన శివాలు – నమ్మకపోవటం అన్నదే లేదు. నమ్మను అన్న స్త్రీ కి  ప్రత్యక్షపురాణం చెబుతూ  లంకిణి ని లాగా మర్దించి బోధించిన వికటకవులున్నారు.

ప్రతీకాత్మకమైన భారతీయ శిల్పం, చిత్రకళ – నిజాన్ని ప్రతిబింబించాలనే ఉద్దేశాన్ని పెట్టుకున్నవి కావు.   పాశ్చాత్య చిత్రాలలో వాస్తవిక చిత్రకళ అత్యుత్తమమైన స్థాయికి వెళ్ళింది  . వాటిని నమ్మేందుకు శ్రమ అక్కర్లేదు. పారిశ్రామికవిప్లవం  తర్వాత ఫోటోగ్రఫీ అభివృద్ధి చెందినాక – impressionism  మొదలైందట. ఉన్నదాన్ని ఉన్నట్లు కాక , దాన్ని విడగొట్టి వెనక్కి తీసుకుపోయి చూసేవారి లో ఆ భావాన్ని ముద్రించేందుకు చేసిన ప్రయత్నమని impressionism ను నిర్వచించటం ఒక తీరు. ఇక్కడా suspension of disbelief  తిరిగి అవసరమైంది. ఫలితం గా మళ్ళీ గొప్ప సౌందర్య సృష్టి కూడా జరిగింది.

[  పిడివాదం ఏ ప్రక్రియనైనా ఎలా భ్రష్టు పట్టించగలదో ఇక్కడ మరొక ఉదాహరణ. ఆ కాలం లో వాస్తవిక చిత్రాలను వేసిన William – Adolphe Bouguereau వంటి దిగ్దంతుడిని నానా మాటలూ అన్నారు. 1974 వరకూ ఆయనను పట్టించుకున్నవారు లేరు, ఆ తర్వాత ఆయనకు తిరుగూ లేదు – అది వేరే కథ ] . ఈ ‘ విడగొట్టటం ‘ లోంచి జరిగిన వక్రీభవనం లోంచే Cubism, Dadaism  పుట్టాయి- వాటి సౌందర్యం తెలిసినవారికి తెలియగలది

ఒక జంతువు ని చెప్పేందుకు కొన్ని అక్షరాలతో ఒక పదాన్ని రాస్తున్నాం. ఆ అక్షరాలకూ జంతువుకూ ఉన్న సంబంధం మనం కల్పించుకున్నదే – ‘ వాస్తవం ‘ కాదు. ఆ భాష రానివారికి ఆ సంబంధమూ లేదు. ఇలాగ – భాషా పరిణామం లో , అపనమ్మకాన్ని అణచుకోవటం అనేది చాలా ముఖ్యమైన సంగతి.

దీన్ని కాస్త పొడిగిస్తే – షేక్ స్పియర్ పాత్రలు – డెన్మార్క్ యువరాజు హామ్ లెట్, వెనిస్ లో పుట్టిన పోర్షియో – ఇంగ్లీష్ మాట్లాడి ఉంటారా ? మన పౌరాణిక నాటకాలలో రాముడూ కృష్ణుడూ తెలుగు మాట్లాడి ఉంటారా ?

20, 21 వ శతాబ్దపు కామిక్ లూ  విడియో గేమ్ లూ  సినిమా లూ  ఈ ప్రక్రియ ని అతి పుష్కలం గా ఉపయోగించుకున్నాయి. Color blindness ఉన్న వారికి  తప్పితే తెలుపు నలుపు చిత్రాలలో లాగా మనుషులు కనిపిస్తారా ఎవరికైనా ?ఒక నాయకుడు వంద మందిని కొట్టటం దగ్గర నుంచి గాల్లో ఎగిరే సూపర్ మాన్, బాట్ మాన్ దాకా అసాధ్యమైన విషయాలను చూస్తూనే ఉన్నాం.

ఎందుకు ఇదంతా అవసరమైంది ?

నిజ జీవితపు పరిస్థితులను విస్తరించటమూ , కేంద్రీకరించటమూ – రెండూ కళారూపాలలో జరుగుతాయి. విస్తరించటం వల్ల ఒక సాధారణీకరణ [generalization ] జరిగి ఊరట వస్తుంది. కేంద్రీకరించటం వల్ల , ఆ ఒక్క చోటా జరిగే న్యాయం మనమే గెలిచిన భావాన్ని ఇస్తుంది.  ఇది సవ్యం గా జరగటానికి , ఆ కథ లోనో సినిమా లోనో – వాస్తవానికి అతీతమైనదైనా సరే, ఒక ‘ అంతర్గత తర్కం ‘[inner logic ] ఉండాలి.  ” అబ్బే, ఇదంతా ఉత్తినే ” అని రచయితో దర్శకుడో చెప్పేయటమూ జరగకూడదు.  ప్రేక్షకులూ చదువరులూ వారి వంతు కృషి చేసి కళ లో లీనమవుతారు.

అప్పుడొస్తుంది ఆనందం. ” కొండెక్కినంత సంబరం ” అంటారు కదా, అది. పడ్డ కష్టం ఫలించి Endorphin లు విడుదలయి జీవితాన్ని ఇంకొంత బాగా లాగేందుకు ఓపిక వస్తుంది.

*****

John Ronald Reuel Tolkien ( 1892 - 1973) the South African-born philologist and author of 'The Hobbit' and 'The Lord Of The Rings'. Original Publication: Picture Post - 8464 - Professor J R R Tolkien - unpub. Original Publication: People Disc - HM0232 (Photo by Haywood Magee/Getty Images)

1939 లో JRR Tolkien  , తన ‘ On Faeries ‘లో – suspension of disbelief ని తిరస్కరిస్తారు. అది అపనమ్మకాన్ని అణచటం కాదు  కాదు, మరొక నమ్మకాన్ని [ secondary belief ] సృష్టించుకోవటం  అని.

గంధర్వగాథలు [fairy tales ] చిన్న పిల్లల కోసమేననే వాదాన్ని ఆయన కొట్టి పారేస్తారు. పెద్దవాళ్ళు ఆ కథలకి దగ్గరవటం కేవలం పరిశోధన కోసమో సేకరణ కోసమో అవనక్కర్లేదని  బల్ల గుద్ది చెప్పారు. ” పిల్లలు ఎదుగుతూంటారు, వారి బుర్రలకి చక్కగా ఆకలి వేస్తుంటుంది – అందుకని అవి వాళ్ళకి చక్కగా అరుగుతాయి – ఆ లక్షణాలు పోని పెద్దవాళ్ళూ వాటిని అంత బాగానూ హరాయించుకోగలరు . Fantasy ఊహాశక్తి కి పరాకాష్ట . అందులోని వ్యక్తులూ సంఘటన లూ వాస్తవ ప్రపంచం లో ఉండవు అని ఒప్పుకుంటాను – అయితే నా దృష్టిలో అది దోషం కాదు, గుణం. ఆ రకం గా ఒక కళా రూపం గా fantasy ఎక్కువైనదీ మరింత స్వచ్ఛమైనదీ – ఫలితం గా ఎక్కువ శక్తివంతమైనది. అటువంటి సమాంతర ప్రపంచాన్ని మొదటి నుంచీ మొదలెట్టి సృజించటానికి ఎంత నేర్పైనా  కావలసి వస్తుంది.

వాస్తవ వాద సాహిత్యం లో లాగా కాదు – చెడు అంతమయేదాకా, సత్యదర్శనం జరిగే దాకా fantasy నడుస్తూనే ఉంటుంది. అది వాస్తవాన్ని గుర్తిస్తుంది, కాని దానికి దాస్యం చేయదు, పోరాడుతుంది.  ఒకవేళ సత్యమే అక్కర్లేని దశ కి మానవాళి చేరుకుంటే – అప్పుడు, అప్పుడు మాత్రమే, దాని అవసరం అంతమవుతుంది. ”

Fantasy ఏం చేయగలదు ? కోలుకునేలా  చేస్తుందని సమాధానం. ”  దృష్టి ని స్పష్టం చేస్తుంది. మన కిటికీ ల అద్దాలని శుభ్రం చేస్తుంది. వస్తువులని ‘ ఉన్నవాటిని ఉన్నట్లుగా ‘ కాక ‘ ఎలా చూడవలసి ఉందో అలా ‘ చూడటాన్ని నేర్పుతుంది. అతి పరిచయం వల్ల వచ్చిన చులకనను తీసేస్తుంది. సొంతం కావటం వల్ల వచ్చిన నిర్లక్ష్యాన్ని నాశనం చేస్తుంది. ఒకప్పుడు చూసి, తాకి, విని – అనుభవించి , దాచేసుకున్న  వాటికేసి మళ్ళీ చూపును తిప్పిస్తుంది ”

పలాయనం అన్న మాటను Tolkien ఒప్పుకోరు. దాన్ని విడుదల అంటారు. మనం తప్పించుకుని వీలైనంత మందిని మనతోబాటు తీసుకుపోవాలని బోధిస్తారు.

శత్రు నిర్బంధం లో ఉన్నాం మనం – ఈ ఇరుకు, చిరాకు , చీదర –  మన స్వస్థానమా  ?

కాదు, ఆనందం [glory of joy ] మనిషి సొంత స్థితి అనీ, దానికి fantasy లోంచి [ కూడా ] దారి ఉందనీ – అటువంటి మాటలు విడ్డూరం గా తోచగల పడమటి వైపున, యుద్ధ బీభత్సాల మధ్యన – Tolkien  ప్రకటించారు.

కనిపిస్తున్న  వాస్తవం ఎప్పుడూ సాపేక్షమే.

“Imagination is everything. It is the preview of life’s coming attractions.”
― Albert Einstein

Sources : Notes on Willing Suspension Of Disbelief [ Greg Martin ], Tales of middle earth [ JRR Tolkien ], Biographia Literatia chapter 15 [Samuel Taylor Coleridge ] , Some articles from wikipedia

 

వెలుతురు పూవుల జాలు 

 

 

ఆమె కల్లోలం లో పుట్టి పెరిగారు , అందుకని దాన్ని తిరిగి సృష్టించాలని అనుకోలేదు.

యూదు జాతి తలిదండ్రులకి , 1925 లో , ఆస్ట్రియాలోని వియన్నా లో జన్మించి – నాజీ ల విద్వేషం తో ఎంత పడాలో అంతా పడ్డారు.

బ్రిటన్ లో ఆశ్రయం పొంది తన జీవితాన్ని తిరిగి మొదలుపెట్టుకున్నారు కనుక , ఆ ఆశను రాసినదానిలో నింపి ఇచ్చారు, మరింకే నిరాశ లోనైనా చదివితే పనికి వచ్చేందుకు.

చిన్న వయసు లోనే అమ్మా నాన్నా విడిపోయారు – ఇద్దరి మధ్యనా తిరిగే నిలకడ లేని బాల్యం. అయితేనేం  , అమ్మమ్మ , ఆంట్ లూ ఉన్నారు కదా, లంగరు గా. విడాకులు తీసుకున్న తలిదండ్రులకి పుట్టిన పిల్లల వివాహాలూ నిలబడవనే పరిశీలనని అబద్ధం చేసి ,  ప్రేమించి పెళ్ళాడిన భర్త తో-   ఆయన వెళ్ళిపోయేదాకా ,  యాభై ఒక్కేళ్ళ పాటు ప్రేమించే ఇల్లాలి గానే బ్రతికారు.

పిల్లల కోసం రాసిన రచయిత్రులు వాళ్ళ పిల్లలతో సరిగ్గా లేరని – మనకి అక్కర్లేని కొన్ని నిజాలని A.S.Byatt – వంటి వారు చెప్పుకొచ్చారు[ The Children’s  Book] . ఈవిడ దానికీ మినహాయింపే – ముగ్గురు కొడుకులూ ఒక్క కూతురు …అందరినీ గారాబంగా , ఇష్టం గా పెంచుకున్నారు .

ఇలా కూడా జీవించవచ్చుననే విశ్వాసాన్ని , నిన్న మొన్నటి వరకూ ఇస్తూనే ఉన్నారు నా వంటి వారికి.

రాసినవాటి లో ఎక్కువ ప్రఖ్యాతి వచ్చింది చిన్న పిల్లల పుస్తకాలకే. The Great Ghost Rescue తో 1975 లో మొదలు పెట్టి 2010 వరకూ దాదాపు 15 నవలలు. పిల్లల తోబాటు వాటిలో దయ్యాలు – మనసులున్న దయ్యాలు, మంచి దయ్యాలు, నవ్వించే దయ్యాలు , ఇక్కట్లు పడే దయ్యాలు …అబ్బే , భయపెట్టవు ఏమాత్రం, మనుషులని పట్టవు కూడానూ. తొమ్మిది నుంచి పన్నెండేళ్ళ పిల్లలకి తెలియవలసినన్ని నిజాలు, ఇవ్వవలసినంత వినోదం , చెప్పీ చెప్పకుండా నేర్పగలిగినంత జ్ఞానం.  కళ్ళు మూసుకుని recommend  చేయచ్చు అన్నిటినీ.

Dated 02-08-2004 Childrens author Eva Ibbotson at her writing desk at home in Newcastle upon Tyne. FAO: Kate - Daily Telegraph

Eva Ibbotson 

వాటిలో ఒకటైన  Secret  of Platform 13  అనే పుస్తకం లోంచి ఒక విషయాన్ని J.K.Rowling  తన  Harry Porter లో వాడుకున్నారని అందరికీ తెలుసు.

[ ఆ మాటకొస్తే J.K.Rowling   రాసినదానిలో పాత రచనల నుంచి తీసుకున్నది ఎక్కువే ఉంటుంది. ఆమె కి ముందరా ఆంగ్ల సాహిత్యం లో పిల్లల కోసం  గొప్పfantasy  లు రాసిన ఉద్దండులు –Lloyd Alexander , Diana Winnie Jones  ,Madeleine L ‘Engle  , Ursula Le guin , Susan Cooper –  ఇంకా చాలా మంది ఉన్నారు .  వారెవరికీ రాని ప్రసిద్ధి J.K.Rowling కి వచ్చినప్పుడు సహజం గానే వారిలో కొందరు  చిరాకు పడ్డారు. సీరియస్ young adult fantasy చదువరులకి Harry Potter series   మీడియోకర్ పుస్తకాల నే అనిపిస్తాయి. ]

ఆ మాట అడిగితే ఈ పెద్దావిడ అంటారూ – ” Ms. Rowling తో నేను కరచాలనం చేస్తాను. మేమంతా రచయితలం   కదా- ఒకరి నుంచి మరొకరు అరువు తెచ్చుకోకుండా ఎలా కుదురుతుంది ? ” అని. వ్యంగ్యం గా కాదు, మనస్ఫూర్తిగా. ఆమె అలాంటివారు.

చిన్నప్పటి విధ్వంసాల గురించి పారిపోవాలనుకోలేదు –  ఆ వెళ్ళగొట్టబడటం, ఎవరికీ చెందక పోవటం – అవన్నీ కొన్ని నవలలలో అతి విపులంగా , కానీ సున్నితంగా కనిపిస్తాయి. ఆ పాత్రలు కష్టాలు పడుతూన్నా చిన్న చిన్న ఆనందాలకి అంధులు కారు. చుట్టూ ఉండేవారిలో ముళ్ళ కంచెలూ ఫలవృక్షాలూ పూల తీగ లూ – అన్ని రకాల మనుషులూ ఉంటారు. ప్రవాసం ఆమె చెప్పిన కథలలో ప్రధానమే , కాని ముఖ్యంగా ప్రతిపాదించినది అమాయకత్వాన్ని , అందులోంచి వచ్చే ఆహ్లాదాన్ని.

నా వరకు ఆమె రచనల లో మాణిక్యం అనదగిన Star Of Kazan లో – అప్పటి ఆస్ట్రియా వాతావరణమంతా అతి సాధికారం గా ఉంటుంది …అక్కడి అతి ప్రత్యేకమైన కేక్ ల, పేస్ట్రీ ల సువాసన ఉంటుంది ఆ పుటలకి. తర్వాత – సంగీతం. ఓపెరాల ఒద్దికలు, నాటకశాలలు , ఆ శాంతి మీద పడిన నాజీ పిడుగులు…

ఆమె రొమాన్స్ లు గా ఉద్దేశించి రాసిన నవలలు – 2000 సంవత్సరం తర్వాత , సహజం గానే , young adult సాహిత్యం గా ముద్రించబడుతున్నాయి. The Countess Below Stairs, The Secret Countess అని రెండు పేర్లున్న నవల ఎంత బావుంటుందో చెప్పలేను. రష్యన్ విప్లవం తర్వాత , ఇంగ్లండ్ కి పారిపోయివచ్చిన ఒక జమిందారీ కుటుంబం.  సేవికా వృత్తి ని అవలంబించిన ఒక ముగ్ధ అయిన అమ్మాయి. చివరలో ఆమె మళ్ళీ జమిందారిణి అయిపోవటమేమీ ఉండదు కనుక మనకి అభ్యంతరం ఉండక్కర్లేదు – హాయిగా చదువుకోవచ్చు. నిజానికి ఆమె కులీనత ని గొప్ప చేసిన వారూ కారు. 1998 లో భర్త మరణించాక , కాస్త గంభీరం గా రాసిన నవల Journey To River Sea  లో ఒక పెద్ద జమిందారీ కి హక్కుదారుడైన కుర్రాడు  తన స్థానం లో ఇంకొక అబ్బాయి  ని పంపించేసి తను దేశ దిమ్మరి గా ఉండిపోతాడు. ఆ రెండో పిల్లాడికి అది ఇష్టమే కూడానూ- తెరప !

ఒక ముఖాముఖి లో తనను ప్రభావితం చేసిన పుస్తకాల గురించి ప్రశ్నిస్తే Frances Hodgson Burnett  రాసిన అన్ని పుస్తకాలు , ముఖ్యం గా The Secret Garden  ;  L.M.Montgomery రాసిన Anne Of Green Gables అని చెప్పారు. ఉల్లాసం , చిన్న గర్వం – నాకు, జాడలు తీయగలిగినందుకు.

జంతువులు , వాటి పట్ల మన విధులైన వాత్సల్యం, స్నేహం ,  బాధ్యత – అతి సుందరం గా చాలా పుస్తకాలలో ఉంటాయి. The Beasts Of Clawstone Castle లో ఆ జంతువులు గోవులు – వాటిని పూజించే సంస్కృతి గురించిన ప్రస్తావన. [ఆమె ఫిజియాలజీ లో పట్టా పుచ్చుకున్నారు గాని అందులో ముందుకి వెళ్ళాలనుకోలేదు – ఆ పరిశోధనలలో ప్రాణులని బాధ పేట్టాల్సి వస్తోందని.]

కొన్ని కోట్స్ ని ఇక్కడ అనువదిస్తున్నాను – ఆమె ఏమిటో మచ్చు చూపేందుకు.

” మంచి సంగతులని మటుకే గుర్తుంచుకుంటే ఎలా ” – ఆమె అంది – ” చెడ్డవాటిని కూడా గుర్తుంచుకోవాలి, లేదంటే అదంతా నిజమేననిపించదు కదా ”

*****

eva1

” బాధ్యత అనేది ఉంది, అది వాస్తవం. మనం పొందిన కానుకనో మనకి ఉన్న సామర్థ్యాన్నో అక్కర ఉన్న వారితో

పంచుకోవలసిందే. అది నిర్భయత్వం, స్వార్థం లేకపోవటం – మనని మనం తెరిచి ఉంచుకోవటం ”

*****

 

” ఆ రోజుల్లో  ప్రపంచం ఎంత అందమో తెలుసా , అన్నికా ! పువ్వులు, సంగీతం, పైన్ చెట్ల సుగంధాలు… ‘  ఇప్పుడూ ఉంది అలాగే ‘ – అన్నిక అంది – ‘ నిజంగానే ఉంది ‘ ”

*****

 

” ‘ అయితే,  దేని గురించి భయం నీకు ? ‘- అతను అడిగాడు.

ఆమె ఆలోచించింది. ఆ అలోచన మొహం లో ఎంత కనిపిస్తుందో చేతుల్లోనూ అంతే – అతనికి తెలుసు. తన ఆలోచనలని అరచేతుల్లో నింపుకునేలాగా దోసిలి పడుతుంది.

‘ చూడలేకపోవటం- దాని గురించీ భయం నాకు ‘

‘ అంటే , గుడ్డితనమా ? ‘

‘ ఉహూ. కాదు. అది చాలా కష్టమే గాని, హోమర్ ఉండగలిగారు గా అలాగ. మా పియానో టీచర్ మాత్రం..ఎంత ప్రశాంతం గా ఉంటారని ! నేననేది – ఒక గొప్ప మోహం కప్పేసి తక్కిన ప్రపంచాన్ని మూసివేయటం గురించి. వ్యామోహమో , వ్యసనమో – మరింకేదో – ఆ భీషణమైన ప్రేమ …ఆకులూ పక్షులూ చెర్రీ పూగుత్తులూ – వేటినీ కనిపించనీని ప్రేమ – కేవలం,  అవేవీ అతని ముఖం కాదు గనుక… ‘ ”

*****

 

ఆమె  చెప్పిన ఒక నిజమైన  ఉదంతాన్నీ అనువదిస్తున్నాను ఇక్కడ – పంచుకోక ఉండలేక .

‘’ బ్రిటన్ కి శరణార్థిగా వచ్చినప్పుడు నాకు ఎనిమిదేళ్ళుంటాయి. అంత ఉత్సాహం గా ఉన్నానని చెప్పలేను . వియన్నా లో మా స్కూల్ లో ప్రతి ఏడూ క్రిస్మస్ ముందు క్రీస్తు జననం నాటిక[nativity scene ]  ఉంటుంది  కదా- అంతకు ముందంతా ఆవు వేషమో గొర్రె వేషమో వేస్తుండేదాన్ని …ఆ యేడు ,  ఎట్టకేలకి  నాకు కన్య మేరీ వేషం ఇచ్చారు .

ఆలోపే ,  అప్పుడు –  హిట్లర్ వచ్చాడు.

చిర్రుబుర్రులాడే అమ్మమ్మ, అయోమయపు పిన్ని, ఎక్కడో ఆలోచిస్తుండే కవయిత్రి  అమ్మ – మా అడ్డదిడ్డపు గుంపు అంతా 1934 లో లండన్ చేరాము. బెల్ సైజ్ పార్క్ కి అప్పట్లో ఏమంత మంచి పేరుండేది కాదు, అక్కడి ఇళ్ళూ బాగుండేవి కావు – ఇంచుమించు కూలిపోబోతున్న ఒక మూడంతస్తుల మిద్దె  ఇంట్లో అద్దెకి దిగాము. మాతోబాటు అందులో ఇంకా చాలా మంది కాందిశీకులు – అందరూ చేతిలో డబ్బు ఆడనివారే. వాళ్ళలో లాయర్ లు, డాక్టర్ లు, పరధ్యానపు ప్రొఫెసర్ లు – ఎవరికీ జర్మన్ తప్పించి మరే భాషా రాదు. నాకు స్నేహితులెవరూ లేరు, బళ్ళోకి వెళ్ళటం లేదు, ఆడుకుందుకు చోటు లేదు.

అప్పుడొక రోజు- అమ్మమ్మ ఏవో సరుకులు పట్టుకు రమ్మంటే , హాంప్ స్టెడ్ వైపు వెళ్ళాను. ఒక గుట్ట మీద , తెరిచి ఉన్న తలుపులతో- పెద్ద భవనం. లోపలికి అడుగు పెట్టాను. అంతా నిశ్శబ్దం గా ఉంది. బోలెడన్ని పుస్తకాలు ! తేలిక రంగు జుట్టున్న ఒకావిడ బల్ల ముందు కూర్చుని ఉన్నారు .  నన్ను వెళ్ళిపొమ్మంటారనుకున్నాను – కాని ఆమె చిరునవ్వు తో , ” లైబ్రరీ లో చేరతావా ? ” అని అడిగారు.

నాకు ఇంగ్లీష్ బాగా రాదు గానీ ఆ మాటలు అర్థమైనాయి. ‘ చేరటం ‘ అనే మాట ఎంతో అందం గా వినిపించింది. నా దగ్గర డబ్బులు లేవన్నాను. ఆవిడ – మిస్ పోల్ – చెప్పారు – ” ఊరికే చేరచ్చు. డబ్బు కట్టక్కర్లేదు గా ” అని.

చేరాను. చేరి అక్కడ ఉండిపోయాను. జర్మన్ చదివినంత బాగా ఇంగ్లీష్ చదవటం ఎప్పుడు మొదలు పెట్టానో సరిగా గుర్తు లేదు గానీ ఎక్కువ రోజులైతే పట్టలేదు. కొద్ది వారాలు గడిచేసరికి వాడుక గా వచ్చేవారంతా తెలిసిపోయారు – ఒకాయన న్యూస్ పేపర్ లో రేసు ల వార్తలు చదువుతుండేవారు  .  ఆయన బూట్లకి చిల్లులుండేవి – వెచ్చదనం కోసం కూడా వచ్చేవారనుకుంటాను. మరొకావిడ , ఇంట్లో అత్తగారి పోరు పడలేక కాస్త గాలి పీల్చుకుందుకు వచ్చేవారు. ప్రత్యేకించి – నాకు మంచి స్నేహితులైన హెర్ డాక్టర్ హెలర్. నా లాగే ఆయనా శరణార్థే – కాకపోతే బెర్లిన్ నుంచి వచ్చారు.

డా. హెలర్ , లైబ్రరీ కి బాగా పొద్దుటే వచ్చేసేవారు, చాలా రాత్రయే దాకా ఉండిపోయేవారు. ఆయన ముందు గుట్టలు గుట్టలు గా మెడికల్ పుస్తకాలు  – మోకాళ్ళ వ్యాధులు, లింఫ్ గ్రంథుల అస్తవ్యస్తాలు … ఇంకా చాలా. అవన్నీ ఇంగ్లీష్ లో ఉండేవి. జర్మనీ లో ప్రసిద్ధికెక్కిన ప్రసూతి వైద్యశాల లో Head of the department  అయిన ఆయన, ఆ గొప్ప స్త్రీ వైద్య నిపుణుడు –  ఇంగ్లీష్ లో మళ్ళీ పరీక్షలకి కూర్చుని పాసయితే గాని ఇక్కడ ప్రాక్టీస్ చేసేందుకు లేదు.

eva2

అప్పటికి ఆయన వయసు ముప్ఫై అయిదూ నలభై మధ్య ఉండేదనుకుంటాను. ఒక భాష నుంచి మరొకదానికి అవలీల గా మారిపోవటం ఆ వయసు లో కష్టం – చిన్నపిల్లలకైతే సులువు గాని. ఆయన చాలా సార్లు నిట్టూర్చటం చూశాను . కొన్నిసార్లు – నిస్పృహ తో కళ్ళు తుడుచుకోవటమూ గమనించి – మిస్ పోల్ , నేనూ ఒకరి మొహాలొకరు  చూసుకునేవాళ్ళం. ఆవిడ కి ఆయన పట్ల చాలా అక్కర ఉండేది – ఆయన వచ్చీ రాగానే లావుపాటి జర్మన్- ఇంగ్లీష్ dictionary ని తెచ్చి అక్కడ పెట్టేసేవారు. తరచూ ఆయన కోసమని లైబ్రరీ ని ఇంకొంత ఎక్కువ సేపు తెరిచి ఉంచేవారు. డాక్టర్ గారు ఉండేది చిన్న ఇరుకు గదిలో, దాన్ని వెచ్చగా ఉంచుకుందుకు ఆయన దగ్గర డబ్బు లేదు –  అందుకని చదివేదేదో లైబ్రరీ లోనే కానివ్వాలి.

వేరే బాధ లూ ఉండేవి ఆయనకి. ఆయన భార్య ‘ ఆర్యన్ ‘ జాతికి చెందినదట- అందుకని ఆమె జర్మనీ లోనే ఉండిపోయింది , ఈయన వెంట రానందట. ఎప్పుడో పదిహేనేళ్ళ కిందట  చదివి మర్చిపోయిన పాఠాలన్నింటినీ , ఇప్పుడొక పరాయి భాషలో – గొప్ప సహనం తో చదువుకుంటుండేవారు.

అంతలో – అనుకోకుండా , నాకొక బోర్డింగ్ స్కూల్ లో సీట్ వచ్చింది. ఒక దూరపు  పల్లెటూళ్ళో Quaker  మతస్తులు నడిపే బడి అది. అందరం లండన్ వదిలేసి వెళ్ళిపోయాము. మా లైబ్రరీ ని మూసేసి వేరే ఇంకొక పెద్ద లైబ్రరీ లో కలిపేశారు.

అప్పుడు యుద్ధం మొదలైంది.  మిస్ పోల్ సహాయకదళం లో చేరారని తెలిసింది. ఆశ్రయం కోసం వచ్చిన శత్రు దేశాల మనుషులకి ప్రత్యేక శిక్షణ లు ఇచ్చే కార్యక్రమాలని బ్రిటిష్ ప్రభుత్వం మొదలుపెట్టింది.

నా జీవితమైతే తర్వాత సజావు గానే నడిచింది. స్కూల్ లో చదువు అయాక యూనివర్సిటీ లో చేరాను. ఆఖరి సంవత్సరం లో ఉండగా – అప్పుడే బర్మా లో పనిచేసి విరమించి వచ్చిన ఒకరిని కలుసుకుని , ఆ తర్వాత పెళ్ళి చేసుకున్నాను. మరుసటి ఏడు – ప్రసవం కోసం క్వీన్ ఆలిస్ ప్రసూతి వైద్యశాల లో చేరాను. ఆ హాస్పిటల్ చాలా పేరుమోసినది, కేవలం అదృష్టం కొద్దీ నే నాకు అక్కడ ప్రవేశం దొరికింది.

మా పాప పుట్టాక ఆ మర్నాటి ఉదయం హాస్పిటల్ అంతా పెద్ద హడావిడి. నర్స్ లు యూనిఫారాలు సర్దుకుంటున్నారు, పేషెంట్ లని శుభ్రంగా తయారు చేస్తున్నారు, పక్క బట్టలు సవరిస్తున్నారు, వార్డ్ లన్నిటినీ అద్దాల్లాగా తుడుస్తున్నారు…మాట్రన్ కుర్చీ లోంచి లేచి నిలబడే ఉన్నారు.  అప్పుడొచ్చింది ఊరేగింపు. ఆ గొప్ప మనిషి, సీనియర్ నిపుణులు – మందీ మార్బలం తో  – morning rounds కి వచ్చారు. ఒక పక్కన registrar , ఈ పక్కన house surgeon  , ఇద్దరు వైద్య విద్యార్థులు – ఆయన నోట్లోంచి రాగల ప్రతి మాటకోసమూ ఆత్రంగా వేచి చూస్తూ.

మెల్లగా ఆయన పేషెంట్ ల మంచాల మధ్య నడుస్తున్నారు.  పలకరించే సాహసం చేయాలనుకోలేదు కాని, నా మంచం దగ్గరికి వచ్చినప్పుడు బాగా తేరిపార చూడకుండా ఉండలేకపోయాను – గుర్తు పడతారేమోనని ఆశ. గుర్తు పట్టారు. ఒక్క క్షణం నుదురు చిట్లించి వెంటనే నవ్వేశారు. ” నా చిన్నారి లైబ్రరీ నేస్తం !!! ” అని సంతోషంగా  ప్రకటించుకుని, తన పరివారానికి నా గురించి చాలా చెప్పారు. నేను ఆయనకి సాయం చేశాననీ ప్రోత్సహించాననీ ఎంతో ధైర్యం ఇచ్చాననీ …అవునా ? ఇచ్చానా ? ఇచ్చాను కాబోలు !!!

ఇంకొక్క మాట మిగిలింది , అదీ చెప్పాలి. డిస్చార్జ్ అయాక పాప తోబాటు వాళ్ళింటికి వెళ్ళాను. ఆ చక్కని డ్రాయింగ్ రూం లో టీ పాట్ వెనక…ఆమె ఎవరు ? ఓహ్ ! మిస్ పోల్ …ఆయన ఆమెని పెళ్ళాడారు ! ఎంత బావుంది….ఎంత బావుంది ! ”

https://en.wikipedia.org/wiki/Eva_Ibbotson

http://www.amazon.in/s/ref=nb_sb_ss_i_1_12?url=search-alias%3Dstripbooks&field-keywords=eva+ibbotson&sprefix=Eva+Ibbotson%2Caps%2C316

 

 

 

 

 

 

 

 

 

 

 

మిత్రస్పర్శ

 

 

తేలిక కాదు –  ఎద లోపలి ఎదను స్పృశించటం … ఆ సుకుమారమైన చోట్లను ఈ కథ తాకటమే కాదు , నెమ్మదినీ ఇస్తుంది.  బహుశా అందుకనే – ఫ్రెంచ్ లో తీసిన Intouchables సినిమా , సబ్ టైటిల్స్ తో 32 దేశాలలో విజయవంతమైంది.

‘ ఇచ్చుట లో ఉన్న హాయి ‘ ని పల్లకీ ఎక్కించినందువలన. మొట్టమొదట కొడవటిగంటి (కొ.కు.) చెబితే తెలిసొచ్చింది – ఇంకొకరికి సహాయం చేయాలనిపించటమూ ఒక instinct వంటిదేనని. అడ్డం పడకండి-  మన కడుపు ఎంతోకొంత  నిండాకనే, పోనీ.

ఏముంది ఇందులో ? చాలా  predictable కథ. చాలా సంపన్నుడైన పరాధీనుడు ఒకరు, తన పైన తనకు అదుపు లేని బీద మనిషి ఒకరు.   ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆప్తులవుతారు.

అవునవును, స్నేహం సమానుల మధ్యనే ఉంటుందని అంటారు నిజమే , కాని అవసరార్థం మొదలైన సంబంధాలు కూడా ఎత్తుకి ఎదగటమూ జరుగుతుంటుంది. చమత్కారం ఇది – ఈ కథ ఇంచుమించుగా ఇలాగే నిజంగా జరిగింది.

వాస్తవాధీనమైనంత మాత్రాన ఒక కళారూపానికి విలువ హెచ్చదని నా నమ్మకం – అలా చూస్తే ఇది యాదృచ్ఛికమంతే.   మంచం లో పడిఉండి, నిరంతరమూ సేవలు చేసేవారిని చీదరించుకోగలవారు లేరా ? ఉన్నారు, నా కళ్ళతో చూసి ఉన్నాను.  ఇక్కడొస్తుంది – వ్యక్తిగతమైన ఔన్నత్యాల ప్రాముఖ్యం

జాలి పడే సేవకుడు నాకు వొద్దని డబ్బుగలాయన Philippe కి పంతం. బీదవాడు Driss కి జాలీ గీలీ ఏం ఉండవు –  నీ కాళ్ళూ చేతులూ పనిచెయ్యవు గదూ  అని చిన్న పిల్లాడిలాగా వేళాకోళం చేస్తాడు, వేడి వేడి నీళ్ళు పోస్తే నీకు కాలదు గదా అని ఆడుకుంటుంటాడు. అదొక అపచారం అనిపించదు, మనకీ నవ్వొచ్చేస్తుంది.

Ludovico Einaudi సంగీతం – ఊరట, విడుదల. ఒక్కడే సింగపూర్ నాన్ యాంగ్ లో చదువుకుంటూ మా అబ్బాయి ఈ సినిమా చూసి ఆ దివ్య ధ్వనులలో  తల్లకిందులుగా మునిగిపోయాడు. ఒక సినిమా నేపథ్యసంగీతం లోంచి ఆ విద్వాంసుడిని కనుగొనటం దృశ్య మాధ్యమానికి గొప్ప గౌరవం. Ludovico పద్ధతిని alternate classical  లేదా classical crossover అని అంటుంటారు.  కదా, శాస్త్రీయమైనదాన్ని కాస్త అటూ ఇటూ మార్చుకుంటే జీవనం లో అన్నన్ని సందర్భాలకూ పాడుకోగల వీలు. అలా అని , తక్షణ ఉత్సాహాన్ని తెచ్చి పెట్టగల సంగీతాన్ని ఇందులో మెచ్చుకోకపోయింది లేదు. ఒకానొక ఉత్సవం లో Driss  అందరినీ ఆ లయకి నాట్యం చేయించేస్తాడు.

intouchables

Break the rules, Out of box thinking  అని రెండు స్థాయిల అరాచకపు ధోరణులున్నాయి. ప్రాణాంతకమైన వ్యాధులకి గరళం వాడేవారు గుర్తుందా – అలాగ, అంతకన్న చెడేదేమీ లేనప్పుడు -ఏం చేస్తేనేం ? ఆ సమర్థనే తోచకపోతే ఆ మితిమీరిన వాహనవేగాన్ని చూసి ఊరుకోబుద్ధి అవునా ! అయితే – కేవలమొక ఉద్వేగపు చెల్లింపు కోసం తలపెట్టుకునే paragliding, car racing లాంటి ప్రాణాంతక క్రీడ లని  మాత్రం నేను శాపనార్థాలు పెట్టుకుంటాను.

ధనికుడు తెల్లవాడూ సేవకుడు నల్లవాడూ అయారని అమెరికా లో దీనికి రేసిస్ట్ ముద్ర వేసి కొందరు అభిశంసించారు. ఏదీ కాని మనలాంటి వారికి వాళ్ళు ఇదీ అదీ వీళ్ళు అదీ  అయినా పట్టింపు ఉండదు- న్యాయంగా హక్కులు కొని తెలుగు లో తీసిన ‘ ఊపిరి ‘ కి ఆ దోషం పట్టనూ లేదు.

పునర్నిర్మాణం లో – రెండు యుగళ గీతాల జోడింపు తప్పించి రసాభాస ఏమీ జరగలేదు . చాలా సంతోషం.

” ఆ తిండి తినీ తినీ నోరు చవి చచ్చిపోయింది. కొంచెం చారు చేసి పెడతావా ” అని  తెలుగు రుచిని  తెచ్చి నింపారు.

నిజం చెప్పాలంటే , తెలుగు [ తమిళం లో కూడా ఒకేసారి తీశారు ] లో కొన్ని సంఘటన లు ఇంకా ఎక్కువ నిండుగా ఉన్నాయి – చెల్లి పెళ్ళి, తమ్ముడి రక్షణా లాంటివి , మనకి అలాగే well rounded గా  నచ్చుతాయి- తప్పేమిటట ?  డబ్బూ పరపతీ ఉన్నాయి – మనసు పుట్టి,  ఉపయోగించి  ఆదుకున్నాడు – లేకపోతే ఏమయిఉండేదీ అనటం లో ఏమీ అర్థం ఉండదు.

కార్తి ఇంత బాగా చేస్తాడని నాకు తెలీనే తెలీదు , ఊపిరి అతను నిజంగా. నాగార్జున చక్కగా తూగాడు [ ఈయన గురించి ఈ మాట అనుకోగలనని ‘ మనం ‘ చూసేదాకా ఊహించాను కాను ]

voppiri

కార్తి తమ్ముడి వేషం వేసిన అబ్బాయి ఫ్రెంచ్ సినిమా లో మెత్తగా గొప్పగా కనిపించిన పక్క ఎక్కి తొక్కుతుంటాడు , ఒక పక్కన హత్యా నేరం మీద పడి ఉండి. తెలుగు లో అది తీసేశారు. లాలాజలం తుడవటమూ  మరింకొన్ని శరీరధర్మాల ప్రసక్తీ కూడా పరిహరించబడింది తెలుగులో – మన sensibilities వేరు. కార్తి పెయింటింగ్ ని ప్రకాష్ రాజ్ చేత కొనిపించటం, దాన్ని ప్రకాష్ రాజ్ వైన వైనాలుగా కార్తి కే వివరించటం- తట్టుకోలేక ఇతను ఉన్నమాట చెప్పేయటం – తెలుగు లో ఎక్కువ ఆహ్లాదకరం గా ఉంది.

ఫ్రెంచ్ లో తమన్నా పాత్ర lesbian  . తెలుగు లో-  మరొక సందర్భం లోgay  విషయాల్లోంచి హాస్యాన్ని ఉద్దేశించారు. మా అమ్మాయి అంది – 90 ల వరకూ అక్కడా దాన్ని కామెడీ చేసేవారని. No comments.

శ్రీ శ్రీ 1960 ల్లో ‘ వెలుగునీడలు ‘ లో ఒక పాట రాసి తర్వాత నాలుక కరుచుకున్నారు . ” ఉన్నవారు లేని వారి కష్టాలను తీర్చు దారి కనిపెట్టి మేలు చేయగలిగినప్పుడే ” అని.

ఆ అక్కరే లేని రోజులు వస్తే ఎంతో ఆనందం – ఇప్పటికింతే, తప్పులు వెతకొద్దు. ఇదంతా fantasy  అంటారా , మీ ఇష్టం!

*

స్వేచ్ఛకీ సముద్రానికీ మధ్య…

 

 

” ఇదిగో, ఇక్కడివరకే వెళ్ళాలి – దాటి నడిస్తే నాశనమే ” అన్న కట్టు ఉన్నంతవరకు తెంపుకు పోవాలనే అనిపిస్తుంది. ‘’నీకు పూర్తి స్వేచ్ఛ ఉంది, ఏమైనా చేసుకోవచ్చు ‘’ నంటే దాన్ని ఉపయోగించుకోవాలని చాలా మందికి ఉండదు. మానవ స్వభావం లోని ఇలాంటి ఒక వైచిత్రి కి ఆవిష్కారం ఇబ్సన్ నాటకం Lady from the Sea లో. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా తీగలు  అక్కడ కదులుతాయి.

ఇబ్సన్ నాటకాలలో చాలా భాగం సమస్యలతో అంతమవుతాయి. ప్రసిద్ధికెక్కిన A Doll’s House  అటువంటిదే. ఎక్కువ వెలుగులోకి రాని విషయమేమిటంటే ఆ నాటకానికి మరొక ఆశాజనకమైన ముగింపు ని కూడా తర్వాతి కాలం లో ఇచ్చి రాశారు . ఈ నాటకాన్నీ దాన్నీ కలిపి ఇబ్సన్ తిరోగమనం గా వర్ణించేవారున్నారు. ఆయన  చివరి నాటకాలలో ఇది ఒకటి .

గోథె ఇట్లా అన్నారట – ” తొలి రోజుల్లో రాగినాణాలో వెండి ముక్కలో  పోగుచేసుకుంటాము, పక్వత వస్తూన్న కొద్దీ వాటిని మారకం చేసి బంగారాన్ని సంపాదించుకోబోతాము ” .  తొలినాళ్ళ సమస్యల కు తాను చెప్పుకున్న సమాధానాల కన్న మెరుగైనవాటిని – ఎదుగుతూన్న కొద్దీ రచయిత అన్వేషిస్తారు – తప్పదు. ఒకరి సృష్టి లో ఒకేలాంటి ఇతివృత్తాలూ   పాత్రలూ పునరావృత్తం అవుతూండటం మనకి తెలిసిందే – రచయిత ప్రశ్నలు తృప్తి పడి  తీరాన్ని దాటేవరకూ ఇది సంభవిస్తూనే ఉంటుంది.

మనిషి – తన లోపలి ప్రేరణలు ఏవైనా గాని, ఆత్మనాశనం వైపుకే వెళ్ళనక్కర్లేదని ఈ నాటకం లో ఇబ్సన్ ప్రతిపాదించారని అంటారు. ఎంత తీవ్రస్వభావానికైనా ప్రపంచం తో లయ కల్పించుకోగల శక్తి ఉండవచ్చుననే భరోసా ఇవ్వదలుస్తారని కూడా [Stephen Unwin ] . ఆత్మనాశనం అన్నది సాపేక్షమే. సాధారణమైన దృష్టి తోనే ఈ మాటలు – మనం ఎంతమందిమి అంత అసాధారణులం నిజానికి ?  మరింకొక స్థాయి లో ,  పరస్పర గౌరవమూ స్వేచ్ఛా ఉన్న పరిస్థితులలో వివాహవ్యవస్థ కొనసాగటం సాధ్యమేనని  ఈ దశ లో ఇబ్సన్ అనుకుని, మనకీ చెప్తారు.

సముద్రాన్ని స్వేచ్ఛకూ నేల మీది జీవనాన్ని నియమబద్ధులై ఉండటానికీ ప్రతీక లుగా తీసు కుంటారు .  ఈ నాటకం లో కొన్ని అతి మానుషాంశాలు ఛాయామాత్రంగా ఉంటాయి,  ఇబ్సన్ ప్రధానంగా వాస్తవిక రచయిత అయినప్పటికీ. తక్కిన ఇబ్సన్ నాటకాల శిల్పానికి ఇందులోది కొంత తగ్గుతుందని విమర్శకులు అంటారు , కాని సత్యదర్శనం లో మరింకే నాటకానికీ ఇది తీసిపోదు – ఒక మెట్టు పైనే ఉంటుంది.

నార్వీజియన్ అయిన ఇబ్సన్  ఈ నాటకానికి ప్రేరణ ని అక్కడి జానపద గాథ ల నుంచి తీసుకున్నారు. హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ Mermaid గాథ ని చిత్రిస్తారు. సగం మనిషీ సగం చేపా అయిన అమ్మాయి ఒకరిని ప్రేమించి పెళ్ళి చేసుకునీ హాయిగా  ఉండలేక , మరణిస్తుంది. Mermen కూడా అక్కడి గాథలలో ఉంటారు – మానవ స్త్రీలని వశం చేసుకోగలవారు. ఈ వైరుధ్యాల కలయికలలో అశాంతీ అంతమూ మటుకే ఉండాలా ? అక్కర్లేదేమోనని ఇక్కడ ఒక సూచన. తర్వాత ఆలోచించవలసిన విషయం-  అంత స్పష్టమైన వైరుధ్యాలు నిత్యమూ భార్యాభర్త ల మధ్యన ఉంటున్నాయా లేదా అనేది.  సున్నితత్వం కొంత ఎక్కువగా ఉందనిపించే ప్రతి స్త్రీ mermaid కాదు .

ibsen

Ellida సముద్ర తీరం లో పుట్టి పెరుగుతుంది. సముద్రమే  ఆమె ఉనికి, సర్వస్వం. పేరు స్పష్టం గా ఉండని ఒక అపరిచితుడు – సాగరమే మానవుడైనట్లు కనిపించేవాడు , వచ్చి ఆమెతో స్నేహం చేస్తాడు. చాలా ఆదిమమూ ప్రాకృతమూ అయిన ప్రేమ వారి మధ్య పుడుతుంది. ఇద్దరి ఉంగరాలూ కలిపి నదిలో వేసి పెళ్ళైపోయిందని ప్రకటిస్తాడు అతను. ఈ లోపు , తన వైయక్తిక న్యాయం ప్రకారం ఒకరిని హత్య చేస్తాడు. ఈ లోకపు మర్యాదలనూ నియమాలనూ చట్టాలనూ పట్టించుకోని వాడు అతను . ఆ తర్వాత నౌకలో సముద్రం మీదికి వెళుతూ ఎదురు చూస్తూండమని ఆదేశం ఇస్తాడు.. ..ఎన్నాళ్ళకీ

రాడు .అక్కడికి వచ్చిన Dr  Wangel  కోరితే వారిద్దరికీ  ప్రాపంచికమైన వివాహం జరుగుతుంది.Wangel  ఒక పల్లెటూరి వైద్యుడు. రెండో పెళ్ళి, ఇద్దరు కూతుళ్ళు. ఆ ఇంట్లో Ellida  కి ఊపిరాడదు. సముద్రపు అనంతత్వం అలవాటయిన ఆమె కి అది ఇరుకైన పరిమితి. రోజూ వెళ్ళి  దగ్గర్లోని చిన్న రేవులో మునిగివస్తుందే గాని, సముద్రాన్ని ఇంటికి తెచ్చుకోలేదు. ఆ పరిస్థితి గురించి రచయిత ఒక సంభాషణ నడిపిస్తారు –

” ఏమిటీ బొమ్మ ? ”

” mermaid ”

” అలా కృశించిపోయి ఉందేం ? ”

” సముద్రానికి దూరంగా బ్రతకలేదు కదా”

” అవును, చేపల సంగతి అంతే. మనుషులు వేరు. వారు అలవాటు పడగలరు ”

అతి ప్రాథమికమైన భావోద్వేగాలకు మనుషులు అస్తమానమూ లోబడిపోనవసరం లేదని రచయిత అభిప్రాయపడతారు.   దారి తప్పిపోయామనుకోవటం    అంత అనివార్యమైనది కాదు.

”  జీవ పరిణామ శాస్త్రం లో మన పాత బంధువులు చేపలూ పక్షులూ. ఆ అంతఃప్రేరణలు కొందరిని సముద్రానికీ ఇంకొందరినీ గాలికీ ఆకాశానికీ ఆకర్షించబడేలా చేస్తాయి – కాని ఆ దశలను మనం దాటివచ్చేశామని తెలుసుకోవలసి ఉంది ” – అంటారు ఆయన. ఇబ్సన్ మార్క్సిజం ప్రభావం ఉన్నవారు, భౌతిక వాది . మానవుడి సార్వభౌమత్వాన్ని ఆయన అంగీకరిస్తారు. ఆ ఆధిపత్యం ప్రకృతి పైనా, తన మీద పని చేసే ప్రకృతి శక్తుల మీదా కూడా – ఈ నాటకం లో.

[ ఇలా అంటే ఆశ్చర్యం గా అనిపించవచ్చు. సనాతన హిందూ ధర్మం లోనూ Victorian morality లోనూ conventional communism లోనూ కూడా ఉద్వేగాలకి విలువ తక్కువ , వివిధ స్థాయిలలో. ]

Ellida ఎవరినీ దేన్నీ పట్టించుకోకుండా కుములుతుంటుంది.  బిడ్డ పుట్టి మరణిస్తాడు – అదీ ఆమెని భయపెడుతుంది, అపరాధ భావన తో. ఒక దశలో భర్త తో ” మన ఇద్దరం బేరం కుదుర్చుకున్నాం అంతే, మనకి జరిగింది పెళ్ళే కాదు ” అనేస్తుంది. ఆ భర్త లౌకికుడైనా సజ్జనుడు, సహృదయుడు.

” అవును, క్రమక్రమం గా నువ్వు మారిపోతున్నావు – తెలుస్తోంది నాకు ” –  తన ఇంటినీ వృత్తినీ వదిలేసి ఆమె ని సముద్రానికి దగ్గరగా వెళ్ళి స్థిరపడదామంటాడు . ఈ లోపు ‘ అతను ‘ వస్తాడు. Ellida తన  భార్యే అతని దృష్టిలో. వెళ్ళిపోదాం రమ్మని, ఆమె వెనుకాడితే రెండు రోజుల వ్యవధి ఇస్తాడు.

మొదట భర్త భరించలేకపోతాడు. తర్వాత , అంచెలంచెలు గా – నిబ్బరించుకుంటాడు.

” నీకు పూర్తి స్వాతంత్ర్యం ఉంది ఇప్పుడు- ఏ నిర్ణయం తీసుకునేందుకైనా ” – అని ప్రకటిస్తాడు చివరికి. దాన్ని ఆమె ఉపయోగించుకోబోతోందనే అనిపిస్తుంది.

తీరా ఆ రోజు మొదలయాక ” నన్ను ‘ అతని ‘ నుంచి రక్షించు ” అంటుంది భర్త తో. ఊహించకుండా వచ్చిపడిన ఆ స్వేఛ్చ ఆమెని కలవరపెడుతుంది. అనంతర పరిణామాలను ఊహించుకుందుకు ధైర్యం చాలదు. భర్త కీ సవతి కూతుళ్ళకీ తన అవసరం ఉందనిపిస్తుంది , ఆ బాధ్యతని తీసుకోవటం ఒక సార్థకత అనుకుని, ఉండిపోతుంది.

స్వాతంత్ర్యం కొత్తగా వచ్చిన ఎవరికీ దాన్ని ఏం చేసుకోవాలో తెలియదు. ఆమె ఆ risk  తీసుకుని అతనితో ఎందుకు వెళ్ళిపోలేదు ? ఆమె సమస్య  తీరలేదనీ ఈ ముగింపు సుఖాంతం అవదనీ వాదించేవారు ఉన్నారు.

నాకు ఇలా అనిపిస్తుంది – ఆమె లో ‘ భద్రత ‘ ని కోరుకునే లక్షణం కూడా ఒకటి ఉంది. లేదంటే నిరంతరమూ ‘ అతని ‘ కోసం ఎదురు చూస్తూ ఉండిపోవలసిన మనిషి – ఏ కబురూ అందకపోతే మాత్రం , Wangel ని ఎందుకని పెళ్ళాడాలి ? అట్లాంటప్పుడు అతని మీద అంత విపరీతమైన ప్రేమ ఉన్నట్లూ కాదు .  పెళ్ళి ఒక లక్ష్మణ రేఖ  అనిపించినన్నాళ్ళూ ఆమె విలవిలాడింది. దాటరాదు  అన్నంతవరకూ చెలియలికట్టని బద్దలు కొట్టాలనుకుంది.

‘ కాదు ‘ అన్న తర్వాత – అనిశ్చితత్వాన్ని ఎంచుకోలేకపోయింది. ‘ అతని’తో జీవితం ఎంత ఆటవికం గా అరాచకం గా ఉండబోతోందో ఆమెకి స్పష్టంగా తెలుసు, దానికి ఇప్పుడు సిద్ధంగా లేదు . తను మరొకరికి ఉపయోగపడగలను అన్నది మనిషికి చాలా సద్గర్వాన్ని ఇస్తుంది , ఆ  వైపు కి వెళ్ళిపోయింది. ఆమె తత్వం అది –  మనుషులూ పరిస్థితులూ పలువిధాలు . A Doll’s House  లో డోరా ఇల్లు వదిలి వెళ్ళిపోవటాన్ని ఎట్లా సార్వత్రికం గా తీసుకోకూడదో దీన్నీ అంతే. రచయిత నొక్కి చెప్పే ఒక విషయం ‘ఆత్మగౌరవం .

అవును, ఇంతటి contrast ఉంది కనుక ఇక్కడి ఎంపిక సులభమవుతుంది- ఇది నాటకం కదా మరి. ఆ  contrast తగ్గుతూన్న కొద్దీ తేల్చుకోవటం భారమవుతుంది, అదీ నిజమే. సరిగ్గా ఇక్కడే , కళ్ళు తెరుచుకుని ఉంటే , సాహిత్యప్రయోజనం మనకి కనిపిస్తుంది.  కొత్త నియమాలను సిద్ధం చేయటం సాహిత్యం బాధ్యత ఎంత మాత్రమూ కాదు , అది చేయ గలిగినది సహాయమూ  సూచనా మాత్రమే- సందర్భానికి అనుగుణంగా.

కొంచెం పక్కకి వెళితే – అరేబియన్ నైట్స్ లో ఒక కథ – పక్షి తొడుగు తో ఎగిరే గంధర్వ రాజకుమారి , ఆ తొడుగు దొంగిలించిన వాడిని తప్పనిసరై పెళ్ళాడి బిడ్డలను కంటుంది .  తొడుగు ను సంగ్రహించగల అవకాశం రాగానే ఎగిరి వెళ్ళిపోతుంది. అతను అష్టకష్టాలూ పడి ఆమె కోసం వెళితే వెనకాలే వచ్చేస్తుంది – అంతలో ఉంటుందన్నమాట,  కనీసం కొన్నిసార్లు.

చలం గారి ‘ జీవితాదర్శం ‘ ముగింపు ని ఇక్కడ తలచుకోవటం అసందర్భం కాదు. ఏదీ కట్టి పడేయలేని లాలస దేశికాచారి ‘  ఇచ్చిన ‘ స్వేచ్ఛ కి లోబడిపోతుంది. జీవితాదర్శం శాంతి అనిపిస్తారు చలం .

” స్వేచ్ఛ కి ఉండే లక్షణం ఇది – దాన్ని అన్వేషించేకొద్దీ అది చేతికి అందదు – విస్తృతమవుతుంది. ఒక సంఘర్షణ  మధ్యన నిలుచుని ‘ నేను సాధించాను ‘ అన్న మనిషి దాన్ని ఆ క్షణాన్నే పోగొట్టుకుంటున్నాడని అనాలి ”  అని ఇబ్సన్ అంటున్నారు. జీవితపు హద్దులకి ఉన్న చలనశీలతను ఇంత బాగా చెప్పినవారు అరుదు.

*

గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ -19

 

[ Anne Of Green Gables By L M Montgomery ]

 

పెద్ద పెద్ద విషయాలతో చిన్నవీ కలిసి వస్తుంటాయి. ఘనత వహించిన కెనడా ప్రధానమంత్రి తన పర్యటన లో ప్రిన్స్ ఎడ్వర్డ్ దీవిని సందర్శించాలని మొదట అనుకోలేదు ..ఆ రాజకీయ పర్యటన కీ ఆన్ అదృష్టానికీ సంబంధం ఉండనక్కర్లేదు , కాని ఉండటం సంభవించింది.

ఆయన జనవరిలో వచ్చారు…చార్లెట్ టౌన్ లో గొప్ప బహిరంగసభ జరిగింది.  సమర్థించేవారితోబాటు కొందరు వ్యతిరేకించేవారు కూడా  గుమిగూడారు అక్కడ.  అవొన్లియా జనం లో చాలా భాగం ఆయన పక్షం వారే – అందరు మగవాళ్ళూ చాలా మంది ఆడవాళ్ళూ బయల్దేరి    ఆ ముప్ఫై మైళ్ళూ పడి వెళ్ళారు. మిసెస్ రాచెల్ లిండ్ కూడా ప్రయాణం కట్టింది – అసలైతే ఆవిడ అవతలి పక్షం మనిషే గాని, తను లేకపోతే అంత పెద్ద సభా బోసిపోతుందని ఆవిడ అభిప్రాయం. వాళ్ళాయన థామస్ నీ బయల్దేరదీసింది – లేకపోతే గుర్రాన్ని కనిపెట్టి ఉండేదెవరు మరి ! మెరిల్లానీ తనతో రమ్మంది . పైకి తేలదు గానీ , రాజకీయాల మీద మెరిల్లాకి కాస్త ఆసక్తే. ఒక ప్రధానమంత్రిని ప్రత్యక్షంగా చూసే అవకాశం మళ్ళీ ఎప్పుడొస్తుందిలే అనుకుని , ఆన్ కీ మాథ్యూకీ మర్నాటివరకూ ఇల్లప్పగించే సాహసం చేసింది మొత్తానికి.

అలాగ- మిసెస్ రాచెల్ , మెరిల్లాలు తమ రాజకీయోత్సవం లో ఉండగా ఇక్కడ ఆన్ , మాథ్యూ లు తమ స్వాతంత్రోత్సాహం లో  తలమునకలవుతున్నారు-  ఇల్లంతా వాళ్ళదేనాయె ! చక్కగా భగభగమంటూ పొయ్యి మండుతోంది. వంటింట్లో పాతకాలపు వాటర్ లూ స్టవ్వూ  , గోడలకి వేసిన తెలుపూ నీలం పింగాణీ  పలకలూ తళతళలాడుతున్నాయి. మాథ్యూ తీరుబడిగా సోఫాలో జేరబడి ‘ రైతు వాది ‘ పత్రిక తిరగేస్తున్నాడు. ఆన్ మహా బుద్ధి గా చదువుకునే ప్రయత్నం లో ఉంది , మధ్య మధ్యన కాస్త అవతలగా పెట్టుకున్న నవల కేసి చూసుకుంటోంది.  జేన్ ఆండ్రూస్ దగ్గర్నుంచి కిందటిరోజు తెచ్చుకుంది దాన్ని- బోలెడంత ‘ ఉత్కంఠ ‘ గా  ఉంటుందట అది  , జేన్ చెప్పింది.  దాన్ని అందుకుని తెరవాలని ఆన్ చెయ్యి లాగేస్తోంది…కాని రేపు పరీక్ష  యుద్ధం లో గిల్బర్ట్ ముందు ఓడిపోతే ఎలాగ ? అది అక్కడ లేదని ఊహించుకునే ప్రయత్నం చేస్తోంది.

” మాథ్యూ ! నువ్వు స్కూల్ కి వెళ్ళేప్పుడు జామెట్రీ చదువుకున్నావా ఎప్పుడన్నా ? ”

జోగుతూన్న మాథ్యూ ఉలిక్కిపడి లేచి – ” అబ్బే- లేదు- ఎప్పుడూ లేదు ”

” హు. నువ్వు చదువుకుని ఉంటే బావుండేది , నా కష్టం నీకు పూర్తిగా అర్థమయేది …ఏం జామెట్రీ ఇది మాథ్యూ ! నా జీవితాన్ని అంధకారబంధురం చేసేస్తోంది – నేనొట్టి మొద్దుని తెలుసా ఇందులో ? ”

” నువ్వు మొద్దువేమిటి ఆన్ ? కిందటివారం కార్మొడీ వెళ్ళానా – అక్కడ బ్లెయిర్ వాళ్ళ స్టోర్ దగ్గర మిస్టర్ ఫిలిప్స్ కనిపించి మాట్లాడాడు. నువ్వు బళ్ళోకంతా తెలివైనదానివట, అన్నీ ‘ గబా గబా ‘ నేర్చేసుకుంటున్నావట . ఆ టెడ్డీ ఫిలిప్స్ అంత మంచి మేష్టరేం కాదనేవాళ్ళున్నారులే గాని , నాకైతే అతను బుర్ర ఉన్నవాడేననిపించింది ”

ఆన్ ని మెచ్చుకున్నవాళ్ళెవరైనా తెలివిగలవాళ్ళే మాథ్యూ ప్రాణానికి.

” ఏమో. మిస్టర్ ఫిలిప్స్ జామెట్రీ లో అక్షరాలు మార్చెయ్యకుండా ఉంటే ఇదీ బాగానే నేర్చుకోగలనేమో. అంటే – గీతలతో బొమ్మలు వేసేప్పుడు గుర్తుకి ఎ, బి , సి అని అక్షరాలు పెట్టుకుంటామన్నమాట. ఎలాగో కుస్తీ పట్టి అన్నీ గుర్తు పెట్టుకుంటానా..మిస్టర్ ఫిలిప్స్ బోర్డ్ మీద రాసేప్పుడు అన్నీ కలగాపులగం చేసేస్తారు..నాకేమో బొత్తిగా తికమక అయిపోతుంటుంది. ఎంత మేష్టారైతే మాత్రం..అలా చెయ్యచ్చా చెప్పు ?

మెరిల్లా, మిసెస్ రాచెల్ ఏం చేస్తూ ఉండిఉంటారో ? అటావా లో పరిస్థితి ఏమీ బాగోవట్లేదనీ ఇదే గనక కొనసాగితే ప్రధాన మంత్రికి వచ్చే ఎన్నికల్లో కష్టమేననీ మిసెస్ రాచెల్ అంటున్నారు…అసలు ఆడవాళ్ళకి  కూడా ఓటు హక్కు ఉంటే మొత్తం మారిపోతుందట..ఆవిడే చెప్పారు. అవునూ నువ్వే పార్టీ కి ఓట్ వేస్తావు మాథ్యూ ? ”

” కన్ జర్వేటివ్ పార్టీ కి ” అనుమానం లేకుండా చెప్పాడు – ఆ పార్టీ మాథ్యూ జీవితం లో భాగం- చర్చికి వెళ్ళటం లాగా.

” అయితే నేనూ అదే ” ఆన్ నిర్ణయించేసుకుంది. ” నీది ఆ పార్టీ అవటం నాకు సంతోషమే ..ఎందుకంటే గిల్ – అదే , స్కూల్లో కొంతమందిది గ్రిట్స్ [  లిబరల్ ] పార్టీ. మిస్టర్ ఫిలిప్ కూడా ‘ గ్రిట్ ‘ నే అనుకుంటా, ఎందుకంటే ప్రిస్సీ ఆండ్రూస్ వాళ్ళ నాన్న ఆ పార్టీ యే కదా. ఎవరైనా అమ్మాయిని ప్రేమిస్తుంటే వాళ్ళమ్మ వెళ్ళే చర్చి కే  వెళ్ళాలట , వాళ్ళ నాన్న పార్టీ కే ఓట్ వెయ్యాలట- రూబీ గిల్లిస్ చెప్పింది. నిజమేనా మాథ్యూ ? ”

” ఏమో. తెలీదు ”

anne19-2

” నువ్వెవరైనా అమ్మాయిని ప్రేమించావా మాథ్యూ ? ”

” లేదు. ఎప్పుడూ లేదు ” – జన్మలో అలాంటి బుద్ధి పుట్టలేదు మాథ్యూకి.

ఆన్ అరచేతుల్లో గడ్డం ఆనించుకుని తలపోసింది –

” అదంతా  సరదాగానే ఉంటుందేమో కదా. రూబీ చెప్పిందీ – తను పెద్దయాక తన కి బోలెడంతమంది అబ్బాయిలు ఆరాధకులు గా అయిపోతారట, అందరూ పెళ్ళి చేసుకోమని అడుగుతారట ..తనకైతే పిచ్చెక్కి పోతుందిట..అంత మంది ఎందుకులే గాని, సరైనవాడు ఒకడుంటే బావుంటుంది. రూబీ కి ఇలాంటి విషయాలు బాగా తెలుసు , ఎందుకంటే తనకి చాలా మంది అక్కలు ఉన్నారు గదా. గిల్లిస్ వాళ్ళ అమ్మాయిలు హాట్ కేకుల్లాగా చలామణీ అవుతారుట –  మిసెస్ రాచెల్ అన్నారు. మిస్టర్ ఫిలిప్స్ రోజూ ప్రిస్సీ ఆండ్రూస్ వాళ్ళింటికి వెళ్తారు – పాఠాల్లో సాయం చేసేందుకని. మరైతే మిరండా స్లోన్ కూడా ఆ పరీక్షకే కదా చదువుతోంది..ప్రిస్సీ అంత బాగా కూడా చదవదు తను- వాళ్ళింటికీ  వెళ్ళి సాయం చెయ్యచ్చుగా..ఏమిటో ! అర్థం కాదు ..”

” నాకూ అలాంటివి అర్థం కావు ” మాథ్యూ ఒప్పుకున్నాడు.

” సరేలే. చదువుకోవాలి నేను..చాలా ఉన్నాయి పాఠాలు. ఆ జేన్ ఇచ్చిన నవల  తీసుకు చదవాలని ఎంత అనిపిస్తోందో..వీపు అటువైపు తిప్పి కూర్చున్నా అది నాకు కనిపిస్తూనే ఉంది. జేన్ అది  చదువుతూ ఏడ్చేసిందట తెలుసా..అలా కన్నీళ్ళు తెప్పించే పుస్తకాలు నాకు బాగా నచ్చుతాయి. హ్మ్..లాభం లేదు , దాన్ని పట్టుకుపోయి జామ్ అల్మైరా లో పెట్టి తాళం వేసి తాళం చెవి నీకు ఇచ్చేస్తానూ..నా చదువు పూర్తయేదాకా తాళం చెవి నాకు ఇవ్వకేం ! నేనెంత అడిగినా.. ప్రాధేయపడినా కూడా ! ఆకర్షణ  లని నిగ్రహించుకోమంటారు కదా , తాళం చెవి దగ్గర లేకపోతే ఆ పని చెయ్యటం కొంచెం తేలిక. నేలమాళిగ లోకి వెళ్తున్నా- రస్సెట్స్ [ తొక్క ముదురు రంగులోకి తిరిగిన ఆపిల్స్ ] కావాలా నీకు అక్కడినుంచి ?”

” నాకొద్దులే. నువ్వు తెచ్చుకో కావాలంటే ” ఆన్ కి అవి ఇష్టమని మాథ్యూ కి తెలుసు.

ఒకచేత్తో కొవ్వొత్తీ ఇంకో చేత్తో పళ్ళెం నిండుగా రస్సెట్స్ పట్టుకుని నేల మాళిగ నిచ్చెన మెట్లెక్కుతూ పైకి వస్తోంది ఆన్. బయట మంచు కట్టిన బాట మీద చక చకా నడిచే అడుగుల చప్పుళ్ళు . వంటింటి తలుపు చటుక్కున తెరుచుకుంది. చలిగాలికి పాలిపోయిన మొహం తో , రొప్పుకుంటూ- ఆదరాబాదరా తలమీంచి చుట్టుకున్న శాలువా తో – అక్కడ – డయానా బారీ !! ఆన్ చేతుల్లో ఉన్నవన్నీ రెప్పపాటులో కిందపడిపోయాయి…..[ నేలమాళిగ నేల మీద గ్రీజ్ పేరుకుని ఉంది- మరసటిరోజు మెరిల్లా అన్నీ శుభ్రం చేస్తూ మొత్తమంతా తగలబడిపోనందుకు హర్షం వ్యక్తం చేసింది ].

” ఏమైటి- ఏమైంది డయానా ?? మీ అమ్మగారు ఒప్పుకున్నారా ?? ”

 

” లేదు- అది కాదు. నువ్వు తొందరగా రా..మిన్నీ మే కి అస్సలు ఒంట్లో బాలేదు. అమ్మా నాన్నా ఊరెళ్ళారు..తనకి డిఫ్తీరియా అంటోంది మేరీ జో  – ఎక్కువగా వచ్చేసిందట..ఏం చెయ్యాలో తెలీట్లేదు ”  మిన్నీ మే డయానా చెల్లెలు- మూడేళ్ళుంటాయి. మేరీ జో పిల్లల్ని చూసుకుందుకూ ఇంట్లో సాయం చేసేందుకూ ఉంటుంది.  ఆమెకి పదహారేళ్ళు , ఫ్రెంచ్ అమ్మాయి.

మాథ్యూ తన టోపీ కోటూ తీసుకుని ఒక్క మాట మాట్లాడకుండా చీకట్లో పడి బయటికి వెళ్ళాడు.

” కార్మొడీ వెళ్ళేందుకు గుర్రబ్బండి సిద్ధం చేసుకుంటున్నాడు , డాక్టర్ కోసం – నాకు తెలుసు ” – ఆన్ తన కోటూ టోపీ వెతుక్కు తీసుకుంటూ అంది. ” వేరే చెప్పక్కర్లేదు,  తెలుసు ”

” కార్మొడీ లో ఎవరూ ఉండరు ” డయానా వెక్కిళ్ళు పెట్టింది ” డాక్టర్ బ్లెయిర్ మీటింగ్ కి వెళ్ళారట… డాక్టర్ స్పెన్సర్ కూడా వెళ్ళే ఉంటారు.. మిసెస్ రాచెల్ కూడా లేరు. మేరీ జో ఎప్పుడూ చూళ్ళేదట డిప్తీరియా వచ్చిన వాళ్ళని –

అయ్యో ! ఆన్ – ఏం చెయ్యాలి !!! ”

” వద్దు. ఏడవకు డయానా . మిసెస్ హమ్మండ్ కి మూడు జతల కవల పిల్లలు , నేను వాళ్ళింట్లో ఉండేదాన్ని – గుర్తు లేదూ ? ఎవరో ఒకరికి డిప్తీరియా వస్తూనే ఉండేది , నాకు తెలుసు ఏం చెయ్యాలో. ఇపికాక్ అని మందు ఉంటుంది , తీసుకొస్తా ఉండు – మీ ఇంట్లో ఉండి ఉండదేమో ” –  ఆన్  ధైర్యమిచ్చింది.

ఇద్దరు పిల్లలూ చేతులు పట్టుకుని చుట్టుదారిలో గబ గబా నడుస్తూ డయానా ఇంటికి బయల్దేరారు. దగ్గరిదారినిండా మోకాళ్ళ లోతున మంచు పేరుకుపోయిఉంది, అటు వెళ్ళేందుకు లేదు. మిన్నీ మే కి జబ్బు చేసినందుకు ఆన్ కి బాధ లేదని కాదుగానీ మళ్ళీ డయానా తో కలిసి ఉన్నందుకూ ఎంతో కొంత సాయపడబోతున్నందుకూ ఆనందంగా కూడా ఉంది .

రాత్రి శీతలనిర్మలంగా ఉంది. నల్లటి నున్నటి నీడలు, వెండిలాగా మెరుస్తూన్న కొండలు. నక్షత్రాల వెలుతురు. అక్కడా అక్కడా పొడుగ్గా కొమ్మలు చాచుకున్న ఫర్ చెట్లు , వాటి ఆకుల్లోంచి పొడి పొడి గా రాలే మంచు , వాటిలోంచి వినబడే గాలి ఈలలు. ఆన్ హృదయం ఆ మార్మిక సౌందర్యానికి మేలుకునే ఉంది .

మిన్నీ మే కి పాపం నిజంగా బాలేదు. జ్వరం మండిపోతోంది . సోఫా మీద పడుకోబెట్టారు గానీ నిమ్మళంగా ఉండ పోలేకుండా ఉంది. ఊపిరి పీల్చి వదుల్తుంటే గరా గరా శబ్దం- ఇల్లంతా వినిపిస్తోంది. మేరీ జో కి ఏమీ పాలుపోవటం లేదు – అటూ ఇటూ ఊరికే తిరుగుతోంది .

ఆన్ చురుగ్గా పనిలోకి దిగింది.

” మిన్నీ కి డిప్తీరియానే , ఎక్కువగానే వచ్చింది – కాని ఇంకా ఎక్కువ వచ్చినవాళ్ళని చూశాను నేను. మనకి ముందు బాగా కాగిన వేణ్ణీళ్ళు కావాలి- డయానా, చూడు – ఆ కెటిల్ లో ఉన్నట్టున్నాయి ? ఆ. ఇప్పటికి సరిపోతాయిలేగాని , మేరీ జో ! పొయ్యి లో ఇంకాసిని పుల్లలు వెయ్యి , మండటం లేదు అది. ఏమీ అనుకోకుగాని నువ్వు ఈ పాటికే ఆ పని చేసి ఉండాల్సింది. ఫ్లానల్ దుప్పట్లు ఉన్నాయా డయానా ? నాలుగైదు పట్టుకు రా. మిన్నీ బట్టలు వెచ్చగా లేవు, అవి విప్పేసి పక్కమీద పడుకోబెట్టి దుప్పట్లన్నీ కప్పాలి. ముందు ఇపికాక్ తాగించాలి , ఉండు ”

anne19-1

మిన్నీ ఆ చేదు మందు మింగేందుకు బాగానే మొరాయించిందిగానీ ఆన్ కి మూడు జతల కవలపిల్లల్ని చూసుకున్న అనుభవం- ఊరికే పోతుందా ? మందు దిగింది గొంతులోకి – అప్పుడే కాదు , ఆ రాత్రంతా చాలా సార్లు. ఆన్, డయానా ఓర్పుగా , శ్రద్ధగా మిన్నీ ని  కాచుకున్నారు. మేరీ జో కూడా చెప్పింది చెప్పినట్లు చేసుకుపోయింది. పొయ్యి బ్రహ్మాండంగా మండింది , ఒక హాస్పిటల్ నిండుగా ఉన్న డిప్తీరియా పిల్లలకి సరిపోయేంత వేణ్ణీళ్ళు సిద్ధమయాయి.

డాక్టర్ కి నచ్చజెప్పి అంత దూరమూ చలిలో తీసుకొచ్చేసరికి తెల్లారగట్ల మూడైంది.  కాని ఆ పాటికి గండం గడిచినట్లే ఉంది – మిన్నీ మే ప్రశాంతంగా నిద్రపోతోంది .

” ఇంచుమించు ఆశ వదిలేసుకున్నాను డాక్టర్ గారూ ” ఆన్ వివరించింది ” అంతకంతకీ పరిస్థితి క్షీణించింది –  మిసెస్ హమ్మండ్ పిల్లల కి వచ్చిందానికనా బాగా ఎక్కువ గా వచ్చినట్లుంది. ఇక తనకి ఊపిరి అందదేమోననిపించింది. సీసాలో ఉన్న ఇపికాక్ మొత్తం విడతలు విడతలు గా ఇచ్చేశాను. ఆఖరి మోతాదు  పోస్తూ అనుకున్నాను – అంటే డయానా కీ మేరీ జోకీ చెప్పలేదనుకోండీ , నాకు నేను చెప్పుకున్నానంతే – ‘ ఐపోయింది , ఇది గనక పని చెయ్యకపోతే నేను చేయగలిగిందింకేమీ లేదు ‘ అని . కాని మూడు నిమిషాలలో పెద్ద దగ్గు తెర వచ్చి చాలా కఫం బయటపడింది , అప్పట్నుంచీ ఊపిరి ఆడటం మెరుగుపడిందండీ. నాకు ఎంత ఊరట కలిగిందో చెప్పలేను, కొన్నిటిని మాటల్లో పెట్టలేం , కదండీ  ? ”

” అవును, నాకు తెలుసు ” డాక్టర్ తల ఊపాడు. ఆన్ వైపు చూస్తుంటే ఆయనకీ కొన్నిటిని మాటల్లో పెట్టలేమనిపించింది. అయితే ఆ తర్వాత మిసెస్ బారీ కీ వాళ్ళాయనకీ చెప్పకుండా ఉండలేకపోయాడు .

”  కుత్ బర్ట్ వాళ్ళింట్లో ఉండే ఆ ఎర్రజుట్టు అమ్మాయి – అక్షరాలా మీ పాపని బతికించింది. లేదంటే నేను వచ్చేవేళకి పరిస్థితి చెయ్యిదాటిపోయిఉండేది. అంత చిన్న వయసులో ఆ పిల్లకి ఎంత వివేకం, ఎంత సమయస్ఫూర్తి ! తనేమేం చేసిందో ఎలా చేసిందో ఎంత బాగా చెప్పింది నాకు ! ”

ఆ అద్బుతమైన ఉదయం లో ఆన్ మాథ్యూ తో కలిసి ఇంటికి బయల్దేరింది. నిద్రలేమితో కళ్ళు మూతలు పడుతున్నాయి గానీ ఆపకుండా మాట్లాడుతూనే ఉంది. మంచు కప్పిన తెల్లటి పొలాల మీదుగా , మెరిసిపోయే మేపుల్ చెట్ల కిరీటాల కిందుగా – ఇద్దరూ నడుస్తున్నారు.

” మాథ్యూ , ఎంత బావుందో కదా ? దేవుడే ఊహించుకుని సృష్టించినట్లుంది ఇవాళంతా. ఆ  మంచు ధూళి చూడు – ఉప్ఫ్ అని ఊదితే దాంతోబాటు చెట్లే ఎగిరిపోయేట్లున్నాయి కదూ ? మిసెస్ హమ్మండ్ కవల పిల్లల్ని పెంచి ఉండటం ఎంత మంచిదైందో – అప్పుడప్పుడూ తిట్టుకుంటుండేదాన్ని గాని ! నిద్రొచ్చేస్తోంది మాథ్యూ – స్కూల్ కి వెళ్ళలేనేమో , వెళ్ళి నిద్రపోతే  బుర్ర తక్కువ గా ఉంటుంది. కానీ వెళ్ళకపోతే ఎలా – గిల్ – అదే వేరేవాళ్ళు నా కంటే చదువులో ముందుకి వెళ్ళిపోతారు. మళ్ళీ అందుకోవటం కష్టం , కాని ఏ పనైనా ఎంత కష్టమైతే అంత తృప్తి , కదా ? ”

” ఏం పర్వాలేదులే , తేలిగ్గానే అందుకుంటావు నువ్వు ” ఆన్ చిట్టి మొహాన్నీ కళ్ళ కింద నీలి వలయాలనీ చూస్తూ ఆదుర్దా గా అన్నాడు మాథ్యూ – ” ఇంటికి వెళ్ళగానే పడుకుని హాయిగా నిద్రపో. పనులన్నీ నేను చూసుకుంటాను ”

ఆన్ అలాగే వెళ్ళి మంచి నిద్ర తీసింది. లేచేప్పటికి మధ్యాహ్నం దాటిపోతోంది. మెట్లు దిగి వస్తూంటే మెరిల్లా వచ్చేసి ఉంది , కూర్చుని ఊలు అల్లుకుంటోంది.

” వచ్చేశావా మెరిల్లా ! ప్రధానమంత్రి ని చూశావా – ఎలా ఉన్నారు ఆయన ? ”

” ఆయన అందం బట్టి  కాదు గా ప్రధానమంత్రి అయింది….ఆ బుర్ర ముక్కూ ఆయనానూ. కాని బాగా మాట్లాడారు , నేను కన్ జర్వేటివ్ అయినందుకు గర్వమనిపించింది. రాచెల్ లిండ్ లిబరల్ కదా , తనకి పెద్ద ఎక్కలేదులే ఆయన ఉపన్యాసం ! నీ భోజనం ఓవెన్ లో పెట్టాను చూడు , బ్లూ బెర్రీ ప్రిజర్వ్  తెచ్చుకో లోపల్నుంచీ. బాగా ఆకలేస్తుండి ఉంటుంది నీకు. మాథ్యూ అంతా చెప్పాడు – నీకు డిప్తీరియా గురించి తెలిసి ఉండటం ఎంత అదృష్టమో , నేనైతే ఏమీ చెయ్యగలిగిఉండేదాన్ని కాదు. అదిగో , మాటలు తర్వాత , ముందు తిను – తర్వాత ఎంతసేపైనా చెప్పచ్చు ”

మెరిల్లా ఏదో చెప్పదల్చుకుంది గానీ ముందే చెప్పేస్తే ఆన్ ఉద్రేకపడి భోజనం వంటి సాధారణ విషయాలని పట్టించుకోదని భయపడి ఊరుకుంది . ఆఖరి బ్లూ బెర్రీ ఆన్ పొట్టలోకి వెళ్ళిపోయాక అప్పుడు చెప్పింది –

” ఇందాక మిసెస్ బారీ వచ్చింది . నువ్వు నిద్రపోతున్నావు , లేపలేదు నేను. నువ్వు వాళ్ళ పాప ప్రాణాన్ని రక్షించావనీ నీకు చాలా చాలా కృతజ్ఞతలనీ చెప్పింది. నీ మీద కోపం పెట్టుకున్నందుకు బాగా నొచ్చుకుంది. ఆ వైన్ విషయం లో నువ్వు కావాలని చెయ్యలేదనీ డయానా తాగేసి వెళ్ళటానికి నువ్వు కారణం కాదనీ తెలుసుకుందట. ఎప్పట్లాగా డయానా తో స్నేహంగా ఉండమని నీకు చెప్పమంది. డయానా కి రాత్రి నుంచీ జలుబు చేసి ఉందట, ఈ చలిలో బయటికి పంపలేననీ నిన్నే వాళ్ళింటికి రమ్మనీ చెప్పి వెళ్ళింది. అరే – ఆగు – ఆన్- అలా గెంతకూ ..”

ఆన్ గాల్లో తేలుతూ లేచింది – మొహం ఆనందం తో వెలిగిపోతోంది.

” నేను వెళ్తాను మెరిల్లా..వెళ్ళద్దా , ఇప్పుడే ? గిన్నెలు తర్వాతొచ్చి కడుగుతాను…వచ్చాక ఇంకేం చెయ్యమన్నా చేస్తాను  ”

” సరే, సరేలే ” ముద్దుగా అంటూన్న మెరిల్లా నోట్లో మాట నోట్లో ఉండగానే ఆన్ ఒక్క పరుగు తీసింది . మెరిల్లా గాబరా పడింది ” తలకి టోపీ లేదూ ఒంటిమీద కోటు లేదు – అలాగే వెళ్ళిపోయింది పిల్ల. దీనికీ చలిగాలికి ఏమైనా

పట్టుకుంటే …”

ఆ మునిమాపు ఊదా రంగు కాంతిలో ఆన్ నృత్యం చేసుకుంటూ ఇంటికొచ్చింది. నైఋతి దిక్కున దూరంగా మొదటి చుక్క పొడుస్తోంది – లేత బంగారపు సంధ్యాకాశం మీదికి స్వర్గం లోంచీ  జారుతూన్న ముత్యంలాగా , చీకట్ల తోటల కి అవతల  మిలమిలమిలమంటోంది. మంచు కొండల దారుల్లోంచి వెళ్ళే స్లెడ్జ్ బళ్ళ గంటల ధ్వని ఏదో కిన్నెరల సంగీతం లా ఉంది – కాని అంతకన్న ఆన్ గుండెలోపలి పాట మధురంగా ఉంది , అది ఆమె పెదవుల్లోంచి ప్రవహిస్తోంది.

” నీ  ముందు నిలబడి ఉన్న వ్యక్తి పరిపూర్ణమైన ఆనందం తో నిండి ఉంది మెరిల్లా ” – ప్రకటించింది-  ” నాకు ఎర్ర జుట్టు ఉన్నాసరే , ఏం పర్వాలేదు. నా ‘ ఆత్మానందం ‘  ఎర్ర జుట్టు స్థాయిని దాటిపైకి వెళ్ళిపోయింది ! మిసెస్ బారీ నన్ను ముద్దు పెట్టుకుని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. నా ఋణం ఎన్నటికీ తీర్చుకోలేననీ అపార్థం చేసుకున్నందుకు క్షమించమనీ అడిగారు. నాకేమిటో ఇబ్బందిగా అనిపించిందిగానీ – వీలైనంత గంభీరంగా జవాబు చెప్పాను – నాకు ఆవిడ మీదేమీ కోపం లేదనీ నేను  బుద్ధిపూర్వకంగా డయానా కి సారా తాగించలేదని ఆవిడ నమ్మితే చాలనీ గతాన్నంతా జరగనట్లే మర్చిపోగలననీ …

డయానా నేనూ బోలెడంత మాట్లాడుకున్నాం. కార్మొడీ లో వాళ్ళ అత్తయ్య నేర్పిన క్రాషె కుట్టు నాకు నేర్పించింది – తెలుసా , అవొన్లియా లో ఇంకెవ్వరికీ రాదు అది. ఇంకెవ్వరికీ నేర్పించకూడదని ఒట్లు పెట్టుకున్నాంలే. డయానా నాకొక అందమైన కార్డ్ ఇచ్చింది..దాని మీద చుట్టూరా  రోజా పువ్వులు . మధ్యలో ఇలా ఉంది

‘ నేను ప్రేమిస్తున్నంతగా నువ్వు నన్ను ప్రేమిస్తే మనల్ని మృత్యువు తప్ప మనల్నేదీ విడదీయలేదు ‘

మిస్టర్ ఫిలిప్స్ ని మా ఇద్దర్నీ పక్క పక్కన కూర్చోబెట్టమని అడుగుదామనుకుంటున్నాం. గెర్టీ పై పక్కన మిన్నీ ఆండ్రూస్ కూర్చోవచ్చులే కదా [ ఇప్పుడు వాళ్ళిద్దరూ మా పక్కన కూర్చుంటున్నారు ] ? మిసె బారీ వాళ్ళింట్లో కెల్లా మంచి పింగాణీ టీ సెట్ ని బయటికి తీశారు నాకోసం ..నేనేదో గొప్ప అతిథిని అన్నట్లు – ఇదివరకెవ్వరూ అలా చెయ్యలేదు నా కోసం , ఎంత సంతోషమనిపించిందో ! ఫ్రూట్ కేకూ పౌండ్ కేకూ డో నట్ లూ రెండు రకాల ప్రిజర్వ్ లూ పెట్టారు. మిస్టర్ బారీ పక్కన కూర్చున్నాను నేను , మిసెస్ బారీ ఆయనకి నాకేం కావాలో చూస్తూ ఉండమని చెప్పారు. బిస్కెట్ లు తింటానా అనీ టీ లోకి పంచదార కావాలా అనీ ..నాకెంత మర్యాద చేశారో ! నన్ను నిజంగా పెద్దదానిలాగా , మంచిదానిలాగా చూశారు ”

” నువ్వు పెద్దదానివయానంటావా , ఏమో..” – మెరిల్లా కొంచెం దిగులుగా నిట్టూర్చింది.

” కొంచెం అయ్యాలే ” – ఆన్ చెప్పింది -” చిన్న పిల్లలతో నేనూ ఇక మీద అలాగే ఉంటాను,  వాళ్ళు పెద్దవాళ్ళన్నట్లే ! వాళ్ళు పెద్ద పెద్ద మాటలు వాడితే నవ్వెయ్యను, పాపం వాళ్ళూ నొచ్చుకుంటారు , తెలుస్తోంది. టీ తర్వాత డయానా నేనూ టాఫీ తయారు చేశాం. అంటే అంత బాగా రాలేదనుకో..పొయ్యి మీద గిన్నె లోది నన్ను గరిటె తో తిప్పుతూ ఉండమని డయానా, తను పళ్ళెం మీద వెన్న రాసి సిద్ధం చేస్తోంది. నేను మాటల్లో పడి తిప్పుతూ ఉండటం మర్చిపోయాను, అదేమో మాడిపోయింది. దాన్నే చల్లారబెట్టేందుకు పళ్ళెంలో పోసి ఉంచితే దాని మీంచి పిల్లి నడుచుకుంటూ పోయింది – పారేశాం, తప్పదు కదా ! అయినా చాలా సరదాగా ఉండింది.  వచ్చేస్తూంటే మిసెస్ బారీ  వీలైనప్పుడల్లా  నన్ను వస్తూండమన్నారు, డయానా కిటికీ లోంచి నాకు చెయ్యి ఊపుతూ గాల్లోకి ముద్దులు విసిరింది.

ఇవాళ రాత్రి ఒక కొత్త ప్రార్థన తయారు చేసి చెప్పుకుంటాను మెరిల్లా, ఈ ఆనందకరమైన సందర్భంలో ! ”

 

                                                               [ ఇంకా ఉంది ]

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ – 18

 

 

  Anne Of Green Gables By L.M.Montgomery

 మర్నాడు మధ్యాహ్నం ఆన్ వంటింటి కిటికీ పక్కన కూర్చుని బొంత కుట్టుకుంటోంది. డయానా వాగు పక్కని పల్లం లో నిలుచుని రహస్యంగా చెయ్యి ఊపటం కనిపించింది. ఆన్ ఒక్క తృటిలో అక్కడికి చేరింది…ఆశా ఆశ్చర్యమూ  కళ్ళలో గంతులేస్తున్నాయి..అయితే , దిగులుగా ఉన్న డయానా మొహం చూడగానే అవి ఆవిరైపోయాయి.

” మీ అమ్మగారు ఇంకా సర్దుకోలేదా ? ”

డయానా తల అడ్డంగా ఊపింది.

” లేదు…ఇంకెప్పుడూ నీతో మాట్లాడద్దంది. ఎంత ఏడ్చానో – నీదేం తప్పే లేదని , ఏమీ కరగలేదు. ఎంతో బతిమాలితేనే గాని  నీకు ఇలా వీడ్కోలు చెప్పేందుకు ఇక్కడికి రావటానికి ఒప్పుకోలేదు. పదంటే పదే నిమిషాలలో వచ్చేయాలట- గడియారం పక్కన పెట్టుకు కూర్చుంది ”

” పదినిమిషాలు ! ఎప్పటికీ విడిపోబోతుంటే ఏం సరిపోతాయి .. ” ఆన్ గొంతు బొగురు పోయింది – ” నన్ను మర్చిపోవు కదూ డయానా ? నీకు ఇంకా..మంచి స్నేహితులు దొరికాక కూడా ?? ”

” ఎందుకు మర్చిపోతాను..” డయానా ఏడుస్తోంది – ” ఇంకెవరూ నాకు ప్రాణ స్నేహితురాలు అవలేరు…ఎవ్వ- రూ ! ఇంకెవరినీ నిన్ను ప్రేమించినట్లు ప్రేమించనేలేను ”

” ఓ..డయానా ! నీకు నేనంటే అంత ప్రేమా ? ”

” అవును కదా..నీకు తెలీదా ? ”

” ఊహూ. తెలీదు ..నేనంటే ఇష్టం అనుకున్నాను నీకు ..ఇంత ప్రేమ ఉందని నిజంగా  అనుకోలేదు డయానా ! అసలు..అసలు నన్నెవరైనా ప్రేమించగలరనే నేను అనుకోలేదు …చాలు. ఇక అంతా చీకటైపోతున్నా ఈ కాంతికిరణం ఒకటీ జీవితాంతం చాలు ! ఏదీ..మళ్ళీ చెప్పవూ ఆ మాట ? ”

 

” నువ్వంటే నాకు చాలా చాలా ప్రేమ ఆన్ ! ఏనాటికీ..ఏమాత్రం సందేహం అక్కర్లేదు నీకు  ” – డయానా అమిత స్థిరంగా చెప్పింది.

” నాకూ అంతే- మనం ఆఖరిసారి చదువుకున్న కథలో లాగా..నీ స్మృతి నా జీవితాంతమూ  వెలిగే నక్షత్రం నాకు . నీ జుట్టులో ఒక కుచ్చుని కత్తిరించి ఇవ్వవా నాకు..నీ జ్ఞాపకంగా దాచుకుంటాను ”

” నీదగ్గరేమైనా ఉందా , కత్తిరించేందుకు ? ” డయానా కళ్ళు తుడుచుకుంటూ అడిగింది.

” బొంత కుడుతూ వచ్చేశానుగా, ఆ కత్తెర నా జేబులోనే ఉంది ” – ఆన్ దాన్ని బయటికి తీసి డయానా గిరజాలలో ఒక చిన్న దాన్ని జాగ్రత్తగా కత్తిరించి భద్రంగా జేబులో పెట్టుకుంది –  ” ఇక సెలవు నేస్తం ! పక్క పక్క ఇళ్ళలో ఉన్నా ఇక మనం అపరిచితుల్లాగే ఉండాలి కదా.. నా హృదయం మాత్రం ఎప్పుడూ నీదే, నీకే ”

డయానా కనుచూపుమేర దాటిపోయేదాకా ఆన్ అక్కడే నిలబడిఉంది. డయానా వెనక్కి వెనక్కి చూస్తూ, చెయ్యి ఊపుతూ వెళ్ళిపోయింది. అప్పుడిక ఆన్ కూడా  భారంగా అడుగులేసుకుంటూ ఇంటికి బయల్దేరింది-

” అంతా అయిపోయింది మెరిల్లా ” ప్రకటించింది . ” నాకిక ఎవ్వరూ స్నేహితులు దొరకరు. ఇదివరకైతే కాటీ మారిస్, వయొలెట్టా అయినా ఉండేవాళ్ళు – అదే మెరిల్లా, నా ఊహా సఖులు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వచ్చినా అప్పటిలాగా ఉండదు, నిజంగా ఉన్న అమ్మాయితో స్నేహం చేశాక. మేమిద్దరం వీడ్కోళ్ళు చెప్పుకున్నాం- ఆ మాటలు ఎప్పటికీ నాకు పవిత్రంగా మిగిలిపోతాయి. డయానా జుట్టు కొంచెం కత్తిరించి తెచ్చుకున్నాను- చిన్న గుడ్డసంచీలో వేసి కుట్టుకుని నా మెళ్ళోనే ఉంచుకుంటాను, అస్సలు తీయను. నేను పోయాక నాతోబాటు దాన్ని కూడా సమాధి చెయ్యి మెరిల్లా. నేనిక ఎక్కువ కాలం బతకననే అనిపిస్తోంది. నేను చచ్చిపోయి చల్లగా గడ్డకట్టి ఉన్నప్పుడైనా – నన్ను చూసి మిసెస్ బారీ మనసు కరుగుతుందేమో , డయానాని నా అంత్యక్రియలకి రానిస్తుందేమో ”

” నువ్వనుకునేవేమీ జరగవులే , నాకేం నమ్మకం లేదు ” – బాఢలోంచి వచ్చిన చిరాకు మెరిల్లాకి.

మరసటిరోజు పొద్దున- ఆన్ పుస్తకాలు చేత్తో పుచ్చుకుని బడికి బయల్దేరింది- పట్టుదలగా  మొహం పెట్టుకుని. మెరిల్లా ఆశ్చర్యపోయింది.

” మళ్ళీ బడికి వెళ్తాను ”  ప్రకటించింది – ” నాకిక మిగిలింది అదొక్కటే. డయానాని దూరం నుంచయినా చూసి తృప్తిపడతాను  ”

 

” కాస్త పాఠాల మీద కూడా ధ్యాస పెట్టు ” మెరిల్లా తన సంతోషాన్ని దాచుకుంటూ అంది . ” మనుషుల తలలమీద పలకలు బద్దలు కొట్టే కార్యక్రమాలూ అవీ మళ్ళీ పెట్టుకోవని ఆశిస్తాను.  నోరు మూసుకుని టీచర్ చెప్పినట్లు విను ”

MythiliScaled

” ఆదర్శ విద్యార్థిని గా ఉండేందుకు ప్రయత్నిస్తాను ” ఆన్ నిస్తేజం గా చెప్పింది- ” అలా ఉండటం ఏమంత  బావుంటుందనుకోను. మిన్నీ ఆండ్రూస్ ‘ ఆదర్శ విద్యార్థిని ‘ అని మిస్టర్ ఫిలిప్స్ అంటుంటారు , ఆమెకి పిసరంత ఊహాశక్తి కూడా లేదనిపిస్తుంది. ఎప్పు- డూ నీరసంగానో లేకపోతే ముళ్ళమీద కూర్చున్నట్లో ఉంటుంది.  ఇప్పుడు నేను ‘ క్రుంగిపోయి ‘ ఉన్నాను గనుక అలా ఉండటం నాకూ కుదురుతుందేమోలే. వెళ్ళొస్తాను మెరిల్లా, చుట్టు దారిలోంచి వెళతాను, బర్చ్ దారిలోంచి వెళ్ళను – డయానా లేకుండా ఒక్కదాన్నే అటు వెళితే తట్టుకోలేను ”

ఆన్ ని బళ్ళో పిల్లలందరూ చేతులు చాపి ఆహ్వానించారు.  ఆన్ కొత్త కొత్త ఆటలు కనిపెడుతుండేది , గొంతెత్తి భావస్ఫోరకంగా పాడుతుండేది ,  నాటకీయంగా పద్యాలు చదివేది – వాటన్నిటినీ గుర్తు చేసుకుని ఇన్నాళ్ళూ అందరూ నొచ్చుకునేవాళ్ళు , ఆన్ రావటం మానేశాకే ఆమె విలువ హెచ్చినట్లయింది. ఒక్కొక్కళ్ళూ యథాశక్తి ఆన్ ని సంతోషపెట్టే ప్రయత్నం చేశారు. రూబీ గిల్లిస్ తను తెచ్చుకున్న మూడు ప్లమ్  పళ్ళనీ ఆన్ కి ఇచ్చేసింది. ఎల్లా మెక్ ఫర్సన్ దగ్గర చాలా అందమైన పువ్వుల పుస్తకం ఉంది – అందులోంచి పెద్ద , పసుప్పచ్చటి పాన్సీ పువ్వుని కత్తిరించి ఆన్ కి బహూకరించింది. సొఫీ స్లోన్ కి లేస్ అల్లికలో ఒక సొగసైన పద్ధతి తెలుసు – అది ఇంకెవ్వరికీ రాదు – ఆన్ కి అది నేర్పిస్తానని వాగ్దానం చేసింది. కాటీ బట్లర్ తన దగ్గరున్న  ఖాళీ సెంట్ సీసా లో నీళ్ళు నింపి ని ఆన్ చేతిలో పెట్టింది- వాటిని ‘ పలక కడిగే నీళ్ళు ‘ గా వాడితే ఆన్ పలక పరిమళాలు వెదజల్లింది. జూలియా బెల్ ఒక లేత గులాబి రంగు కాయితాన్ని హృదయాకారం లో  కత్తిరించి దాని అంచు వెంబడి ఈ అక్షరాలు రాసింది – [ రూబీ చేతిరాత చాలా బావుంటుంది ]

” పొద్దువాలుతూన్నప్పుడు ..నింగి తన సిగలో నీలి తారకను తురుముకునేప్పుడు – నీ ఈ ప్రియసఖిని గుర్తు చేసుకుంటావు కదూ –   వెంటనే ఉన్నా, దూరాన ఉన్నా ”

” అందరిలో ఇలా మెప్పు పొందటం బాగుంది నాకు ” – ఆ రాత్రి మెరిల్లాకి ఆన్ ఆనందంగానే చెప్పింది.

ఆన్ తిరిగివచ్చినందుకు సంతోషించింది ఆడపిల్లలొకరే కాదు . మిస్టర్ ఫిలిప్స్ ఆన్ ని ఏమీ అనలేదు , మిన్నీ ఆండ్రూస్ పక్కన కూర్చోబెట్టాడు – భోంచేసేందుకు వెళ్ళొచ్చేసరికి ఆ డెస్క్ మీద పెద్ద ఆపిల్ పండొకటి ఉంది. దాన్ని స్ట్రాబెర్రీ ఆపిల్ అంటుంటారు. ఆన్ కి నోరూరి తీసుకుని కొరకబోతూ ఉండగా- అటువంటి పళ్ళు కేవలం గిల్బర్ట్ బ్లైత్ వాళ్ళ తోటలోనే పండుతాయని గుర్తొచ్చింది. చటుక్కున దాన్ని డెస్క్ మీద పెట్టేసి చేతిగుడ్డతో వేళ్ళు గట్టిగా తుడిచేసుకుంది. మర్నాటి పొద్దునవరకూ ఆ పండు అక్కడే ఉంది… పొద్దునే గదులు ఊడ్చే తిమోతీ ఆండ్రూస్ కి సొంతమయేవరకూ. ఆ రోజు బళ్ళో ఆన్ కి మరొక కానుక పంపబడింది. అది ఎరుపూ పసుపూ రంగు కాయితాలు చుట్టి ఉండే ‘ ప్రత్యేక బలపం ‘ . మామూలు బలపాలు ఒక సెంటు ఖరీదు ఉంటే దీని ఖరీదు రెండు సెంట్లు. పంపినవాడు చార్లీ  స్లోన్. ఆన్ దాన్ని ప్రీతితో అందుకుని చార్లీ కి ఒక చిరునవ్వు కూడా అందజేసింది. పాపం- కుర్రాడు సంతోషం తో తలతిరిగి డిక్టేషన్ మొత్తం తప్పులు రాశాడు – బడి వదిలాకా  ఇంకో గంట  అక్కడే కూర్చుని పదిసార్లు అదే మళ్ళీ మళ్ళీ రాసే శిక్షని మిస్టర్ ఫిలిప్స్ నుంచి స్వీకరించాడు.

డయానా మాత్రం తనవైపయినా చూడకపోవటం ఆన్ ని బాధపెట్టింది.

” కొంచెం నవ్వనైనా నవ్వచ్చు కదా నన్ను చూసి..” మెరిల్లా దగ్గర వాపోయింది.

అయితే ఆ మర్నాడు బడికి వచ్చేసరికి  డెస్క్ మీద బాగా మెలితిప్పి ఉన్న కాయితమూ చిన్న బంగీ – కలిసి ఆన్ కి ప్రత్యక్షమయాయి.

 

అందులో ఇలా ఉంది

” ప్రియమైన ఆన్ ! బళ్ళో కూడా నీదగ్గరికి రాకూడదనీ మాట్లాడకూడదనీ అమ్మ హెచ్చరించింది ..నా తప్పేమీ లేదు, కోపం తెచ్చుకోకు. నీకు కాకపోతే ఎవరికి చెప్పుకోవాలి నా రహస్యాలు ?? నా పక్కన కూర్చునే గెర్టీ పై నాకేమీ నచ్చనేలేదు. నీకోసం ఎర్ర టిష్యూ కాయితం తో ఈ బుక్ మార్క్ తయారు చేశాను.  మన బడి మొత్తం లో ముగ్గురికే ఇలాంటివి చేయటం వచ్చు. తీసుకో- నీ నిజమైన మిత్రురాలిని తలచుకో – ఇట్లు డయానా బారీ ”

ఆన్ ఆ ఉత్తరాన్నీ బుక్ మార్క్ నీ ముద్దుపెట్టుకుని అప్పటికప్పుడు జవాబు రాసి పంపింది .

anne18-2

” ప్రియాతి ప్రియమైన డయానా ! నీ మీద నాకేం కోపం లేదు – మీ అమ్మగారి పట్ల నువ్వు విధేయురాలిగా ఉండాలి కదా ! మన ఆత్మలు మాట్లాడుకుంటూనే ఉంటాయి సుమా ! నీ కానుకను అతి భద్రంగా దాచుకుంటాను. నా పక్కన కూర్చునే మిన్నీ ఆండ్రూస్ మంచిదే..పెద్ద ఊహాశక్తీ అదీ లేకపోయినా..కాని నేను డయానా కి మాత్రమే మిత్రురాలిని, మిన్నీ కి స్నేహితురాలిని ఎన్నటికీ కాలేను.

ప్రాణమున్నంతవరకూ నీదాన్ని

ఆన్/కార్డీలియా షిర్లే.

 

షరా : నీ ఉత్తరాన్ని దిండుకింద పెట్టుకుని పడుకుంటాను ఈ రాత్రి – ఎ లేదా సి.ఎస్. ”

బళ్ళో కొత్త ఉత్పాతాలు జరుగుతాయని మెరిల్లా భయపడింది , నమ్మింది కూడా- కాని అలా ఏమీ జరగలేదు. మిన్నీ ఆండ్రూస్ పక్కన కూర్చోవటం వల్లనో ఏమోగాని – ఆన్ చాలావరకు ఆదర్శ బాలిక గా ప్రవర్తించింది- మిస్టర్ ఫిలిప్స్ తో గొడవలు పెట్టుకోకపోగా అతను మెచ్చుకునేవరకూ వచ్చింది- అంత బాగా చదవటం మొదలుపెట్టింది. గిల్బర్ట్ బ్లైత్  తో ప్రతీ సబ్జెక్ట్ లో పోటీ పడింది. వాళ్ళిద్దరి మధ్యనా స్పర్థ ఉండటం స్పష్టం గా తెలిసిపోయేది. గిల్బర్ట్ వైపునుంచి ఆ స్పర్థలో సుహృద్భావం ఉండేది కాని ఆన్ వైపునుంచి కోపమూ కసీ మాత్రమే కనిపించేవి. అతనితో పోటీ పడుతున్నానని ఎప్పుడూ ఆన్ తన నోటితో అనేది కాదు, ఎవరైనా అన్నా పట్టించుకునేది కాదు – అతనొకడు ఉన్నాడని గుర్తించటమే ఆమెకి ఇష్టం ఉండేది కాదు.  స్పెల్లింగ్ లో గిల్బర్ట్ ని కొట్టేవారు లేరు, ఆన్ అతన్ని పడగొట్టింది. ఒక రోజు అన్ని లెక్కలూ సరిగ్గా చేశాడని గిల్బర్ట్ పేరు బోర్డ్ మీద రాయబడితే ఆ మర్నాడు ఆన్ పేరు అక్కడ దర్శనమివ్వాల్సిందే. ఒక్కోసారి ఇద్దరూ మాన నమై రెండు పేర్లూ బోర్డ్ మీద ఉండేవి – అప్పుడు గిల్బర్ట్ కి తృప్తి, ఆన్ కి మంట. రాత పరీక్షల్లో అయితే , పేపర్ లు ఇచ్చేవరకూ క్లాస్ లో విపరీతమైన ఉత్కంఠ. ఒక నెల పరీక్షల్లో గిల్బర్ట్ మూడు మార్కుల తేడాతో మొదటి వాడుగా వచ్చాడు- తర్వాతి నెల పరీక్షల్లో ఆన్ కి అయిదు మార్కులు ఎక్కువ వచ్చాయి. గిల్బర్ట్ హృదయపూర్వకంగా ఆన్ ని అభినందించాడు – అతను ఓడిపోయానని గింజుకుంటుండి ఉంటే ఆన్ కి సంతోషమయేది – ఇదేమీ రుచించలేదు.

ఆ టర్మ్ పూర్తయేసరికి ఆన్, గిల్బర్ట్ – ఇద్దరినీ పై తరగతికి పంపారు. లాటిన్, జామెట్రీ, ఫ్రెంచ్, ఆల్జీబ్రా వంటి ‘  ప్రధానాంశాలు ‘ వాళ్ళు చదవాల్సి ఉంది. జామెట్రీ తో ఆన్ భీకరంగా పోరాడింది.

” చాలా దరిద్రగొట్టు సబ్జెక్ట్ మెరిల్లా ఇది ” – ఆక్రందించింది . ” నాకసలు దీని తలా తోకా తెలియటం లేదు…ఊహాశక్తికి ఇందులో ఎంతమాత్రం చోటు లేదు. గిల్ – అదే, కొంతమందికి బ్రహ్మాండంగా వచ్చేస్తోంది – అది ఇంకా , చచ్చేంత- బాధగా ఉంది.. డయానాకి కూడా  నా కంటే బాగా వస్తోంది – అయితే డయానా చేతిలో ఓడిపోవటం నాకేం బాధగా ఉండదు – తన మీద నా ప్రేమ ఎప్పటికీ తరిగిపోదు, మాట్లాడుకోక పోయినా సరే. మాట్లాడుకోనందుకు ఒక్కోసారి చాలా దిగులుగా ఉంటోంది గానీ…..”

 

[ ఇంకా ఉంది ]

 

 

 

 

 

  గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్-17

 

 

                    Anne Of Green Gables By L.M.Montgomery

గ్రీన్ గేబుల్స్ పరిసరాలలో అక్టోబర్ నెలకి చాలా అందం. కొండవాలులో బర్చ్ చెట్లకి బంగారపు ఎండ రంగు వస్తుంది. తోపులోపై మేపుల్ చెట్లు ఎర్రగా  ధగధగమంటాయి. దారివెంబడి చెర్రీ వృక్షాలకి మెరిసే జేగురు రంగూ , ఆకుపచ్చని పసుపు రంగూ. కోత ముగిసిన పంటపొలాలలో కొత్త గడ్డి , సూర్యుడి కిందన.

ఆ వర్ణవైభవం ఆన్ కి పండగలా ఉంది.

” ఓ, మెరిల్లా ! ” ఒక శనివారం ఉదయం గంతులేసుకుంటూ వచ్చింది..సందిట్లో మేపుల్ రెమ్మలు. ” ఈ లోకం లో అక్టోబర్ నెల అనేది ఉండటం ఎంత బావుందని ! ఇది గనక లేకుండా సెప్టెంబర్ నుంచి సరాసరి నవంబర్ వచ్చేస్తుంటే దరిద్రంగా ఉండేది. ఇవి చూడు..తాకితే పులకింతలు ..బోలెడన్ని పులకింతలు – రావట్లేదూ నీకు ? నా గదిలో అలంకరించుకుంటాను వీటిని ”

” హ్మ్మ్ ” – మెరిల్లా సౌందర్యస్పృహ పెద్దగా అభివృద్ధి చెందిన దాఖలాలు కనిపించలేదు. ” బయటివన్నీ తీసుకొచ్చి గదినిండా  పేరుస్తావు..పడకగది ఉన్నది నిద్రపోయేందుకు ”

” కలలు కనేందుకు కూడా. గదిలో అందమైనవి ఉంటే ఊహించుకోవటానికి బావుంటుంది. ఆ పాత నీలం రంగు కూజాలో పెట్టుకుంటాను వీటిని, నా మంచం పక్కనే ”

” సరేలే. మెట్ల మీదంతా ఆకులు పోసేయకు. నేను ఊళ్ళోకి వెళుతున్నాను, సహాయకేంద్రం లో మీటింగ్ ఉంది నాకు. చీకటి పడేదాకా ఇంటికి రాను . మాథ్యూ కీ జెర్రీ కీ భోజనం ఏర్పాట్లు నువ్వే చూడాలి, తెలిసిందా ? టీ కోసం నీళ్ళు మరగబెట్టటం మర్చిపోయావు , కిందటిసారి నేను లేనప్పుడు… భోజనాల బల్ల దగ్గర కూర్చునేవరకూ గుర్తే రాలేదు నీకు ”

” నా వల్ల పెద్ద తప్పే జరిగిపోయింది అప్పుడు ” – ఆన్ చింతించింది. ” కాని ఆ మధ్యాహ్నం వయొలెట్ లోయ కి పెట్టాల్సిన పేరు గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. మాథ్యూ పాపం ఏమీ అనలేదు, తనే వెళ్ళి కెటిల్ ని పొయ్యి మీద పెట్టివచ్చాడు. ‘ కాసేపు ఆగితే కొంపలేం మునగవులే ‘ అని కూడా అన్నాడు.  ఈ లోపు నేను మంచి గంధర్వగాథ  చెప్పాను మాథ్యూకి,  కాలం ఎలా గడిచిపోయిందో తెలీనే లేదు తెలుసా !  భలే ఉంటుంది ఆ కథ , మెరిల్లా . చివరికేమవుతుందో మర్చిపోయాను, అందుకని నేనే ముగింపు తయారుచేసి చెప్పాను. ఎక్కడ దాకా అసలు కథో, ఏది నేను అల్లిందో – తేడా అస్సలు తెలీలేదన్నాడు మాథ్యూ ”

” మాథ్యూ కి నువ్వేం చేసినా బాగానే ఉంటుందిలే , నువు అర్థరాత్రి వరకూ అన్నం పెట్టకపోయినా ఏం పర్వాలేదు అతనికి. నేను మటుకు ఊరుకోను, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో. డయానా ని నీకు తోడు పిలుచుకుంటావా పోనీ…ఏమో, నీకు ఇంకా తిక్కలొస్తాయి డయానా ఉంటే . కానీలే,  పిలువు ”

” ఓ…” ఆన్ మురిసిపోయింది – ” నీకు కూడా ఊహించటం వచ్చనిపిస్తోంది మెరిల్లా, లేకపోతే ఇలా చెప్పవు. ఎన్ని రోజులనుంచీ ఊహించుకుంటున్నానో – ఇలా డయానా  నేనూ మటుకే , పెద్దవాళ్ళకి మల్లే ఇల్లు చక్కబెట్టుకోవటం .. ! నాకెవరైనా తోడుంటే నేను టీ కి నీళ్ళు పెట్టటాలూ అవీ మర్చిపోను కూడా కదా ! మరీ- ఆ గులాబిమొగ్గల టీ సెట్ వాడుకోవద్దా నేను…సరేనా ? ”

” ఇంకా నయం ! ఎప్పుడైనా బయటికి తీస్తానా నేను దాన్ని – పాస్టర్ గారొచ్చినప్పుడో, మనింట్లో సహాయకేంద్రం మీటింగ్ లు జరిగినప్పుడో తప్పించి ! మామూలు మట్టి రంగు టీ సెట్ నే వాడాలి నువ్వు. అయితే ఆ మట్టి జాడీ లో చెర్రీ జామ్  ఉంది కదా, అది కొంచెం తీసుకోండి పర్వాలేదు  – ఈపాటికే దాన్ని వాడేసి ఉండాల్సింది. ఒవెన్ లో పళ్ళ కేక్ ఉంది, పెద్ద ముక్క ఒకటి కోసుకోండి, అక్కడే బిస్కెట్లు కూడా ఉన్నాయి ”

anne17-1

” బల్ల దగ్గర నేనే అన్నీ వడ్డిస్తాను, కెటిల్ లోంచి నేనే టీ పోస్తాను ”…ఆన్ పరవశించిపోతోంది – ” డయానాని టీ లోకి పంచదార కావాలా అని అడుగుతాను ..తను వేసుకోదు , తెలుసు – కాని తెలీనట్లే అడుగుతానన్నమాట. ఇంకొంచెం కేక్ తినమనీ ఇంకాస్త జామ్ వేసుకోమనీ అడగటం – ఆహ్ ! డయానా నేనూ మన కచేరీ చావడిలో కూర్చోమా ? ”

” ఏం అక్కర్లేదులే. మీ ఇద్దరికీ ఈ వరండా చాలు. అన్నట్లు  , మొన్న చర్చ్ లో పార్టీ అయాక కొంచెం రాస్ప్ బెర్రీ కార్డియల్ మిగిలింది , అది తాగచ్చు మీరు కావలిస్తే , అలమార్లో రెండో చెక్కలో ఉంటుంది చూడు. దాంతోబాటు బిస్కెట్ లు తినచ్చు. మాథ్యూ వచ్చేసరికి ఆలస్యమవుతుందిలే , బంగాళాదుంపలు పడవలోకి ఎత్తిస్తుంటాడు కదా. ఈ లోపు మీరు బుద్ధిగా ఉండండి ”

ఆన్  ఒక్క పరుగున డయానా వాళ్ళ ఇల్లు ‘ తోటవాలు ‘ చేరింది. ఫలితంగా – మెరిల్లా అటు వెళ్ళగానే డయానా ఇటు వచ్చేసింది –  మంచి గౌను వేసుకుని పద్ధతిగా తయారై.

మామూలుగా అయితే తలుపుకొట్టకుండా వంటింటి గుమ్మం లోంచి వచ్చేస్తుంది  – ఇప్పుడు మర్యాదగా వాకిలి తలుపు కొట్టింది . ఆన్ కూడా వీలైనంత పద్ధతిగానే తయారై ఉంది- వెళ్ళి తలుపు తీయగానే ఇద్దరూ షేక్ హాండ్ లు ఇచ్చుకున్నారు… మొదటిసారి కలుసుకుంటున్నట్లుగా. ఈ  వ్యవహారం ఇద్దరూ ఆన్ గదిలొకి వెళ్ళి కుర్చీల్లో పదినిమిషాలపాటు ఆసీనులయేవరకూ సాగింది. డయానా పాదాలని ఒద్దిగ్గా పెట్టుకు కూర్చుంది అంతసేపూ.

” మీ అమ్మగారెలా ఉన్నారు ? ” ఆన్ బహు మర్యాదగా ప్రశ్నించింది. ఆ పొద్దుటే మిసెస్ బారీ పరిపూర్ణారోగ్యంతో ఆపిల్ పళ్ళు కోస్తుండగా  ఆన్ కి కనిపించి ఉంది.

” ఆవిడ కులాసాగానే ఉన్నారు, ధన్యవాదాలు. మిస్టర్ కుత్ బర్ట్ ఈ మధ్యాహ్నం బంగాళాదుంపలని లిల్లీ శాండ్స్ రేవుకి పంపిస్తున్నారనుకుంటాను, అవునా ? ” డయానా అడిగింది. అదంతా ముందే తెలుసు ,  ఉదయాన మాథ్యూ బండి లోనే ఎక్కి హార్మన్ ఆండ్రూస్ ఇంటికి వెళ్ళింది డయానా.

” ఆ. అవును. ఈసారి బంగాళా దుంపలు బాగా పండాయి. మీ నాన్నగారి పంట కూడా బావుందనుకుంటాను ”

” అవును. బావుంది, థాంక్ యూ. మీ ఆపిల్స్ అన్నీ  కోసేశారా ? ”

” ఇంకా బోలెడున్నాయి ” – ఆన్ చెంగున లేచింది , అక్కడితో గాంభీర్యం అంతరించింది. ” తోటలొకి పోదాం రా, డయానా. చెట్ల మీద మిగిలినవన్నీ మనకేనని మెరిల్లా చెప్పింది , కోసుకుందాం. మెరిల్లా ఎంత మంచిదో…పళ్ళ కేక్, చెర్రీ జామ్  తీసుకోవచ్చంది మనల్ని , టీ తోబాటుగా. ఇంటికొచ్చినవాళ్ళకి ఏం పెడుతున్నామో ముందే చెప్పటం మర్యాద కాదుగా..అందుకని మనకి తాగటానికి  ఏముందో మాత్రం చెప్పను నీకు. దాని పేరులో మొదటి అక్షరాలు ‘  ఆర్ ‘ , ‘ సి ‘ – ఎర్రగా ఉంటుంది అది. ఎర్రటి పానీయాలు భలే ఉంటాయి కదూ, వేరే రంగుల్లోవాటికంటే   రెట్టింపు రుచిగా ఉంటాయి !

పళ్ళబరువుకి వంగిఉన్న కొమ్మలతో ఆపిల్ తోట ఆహ్లాదకరంగా ఉంది.  తోటలో  ఒకమూలన  గడ్డి ఇంకా ఆకుపచ్చగానే ఉంది , సాయంత్రపు నీరెండ వెచ్చగా అలముకుంది . ఆ మధ్యాహ్నమంతా ఇద్దరూ అక్కడే –  ఆపిల్ లు కొరుకుతూ, బిగ్గరగా మాట్లాడేసుకుంటూ .ఆన్ తో  చెప్పాల్సినవి చాలా ఉన్నాయి డయానాకి. గెర్టీ పై పక్కన కూర్చోవాల్సి వస్తోంది రోజూ ..ఆ పిల్ల రాస్తుంటే పెన్సిల్ కీచ్ కీచ్  మంటూనే ఉంటుంది, డయానికి గొప్ప చికాగ్గా ఉంది. రూబీ గిల్లిస్ పులిపిరులన్నీ పోతాయిట –  ఏటిపక్కన ఇంట్లో ఉండే పెద్దావిడ  మేరీ జో దగ్గర్నుంచి చిన్న గుండ్రాయి తెచ్చుకుందట , నెల పొడుపు  రోజున దాంతో  అన్నీ రుద్దేసి , తల తిప్పకుండా ఎడం బుజం మీంచి దాన్ని వెనక్కి పడేస్తే ఇక పులిపిరుల మాటే ఉండదట.  ఎమ్మా వైట్ పేరునీ చార్లీ స్లోన్  పేరునీ కలిపి గోడ మీద రాశారట – ఎమ్మా కి పిచ్చికోపం వచ్చి ఏడ్చేసిందట. శా మ్  బట్లర్ మిస్టర్ ఫిలిప్స్ ని క్లాస్ లో  ఎగర్తించి మాట్లాడాడట  – మిస్టర్ ఫిలిప్స్     శా మ్  ని బెత్తం దెబ్బలు  కొట్టాడట. శామ్   వాళ్ళ నాన్న వచ్చి ‘మళ్ళీ నా పిల్లలెవరిమీదైనా చెయ్యి పడిందా, జాగ్రత్త ! ‘అని  మిస్టర్ ఫిలిప్స్ ని గట్టిగా హెచ్చరించి వెళ్ళాడట. మాటీ ఆండ్రూస్ కొత్తగా ఎర్ర టోపీ పెట్టుకొస్తోందట , దానికి నీలం రంగు కుచ్చులున్నాయట. బాగానే ఉందిగానీ మాటీ బాగా ఎచ్చులు పోతోందట- అందరికీ చిరాకేస్తోందట. లిజీ రైట్, మామీ విల్సన్ – మాట్లాడుకోవట్లేదట- లిజీ వాళ్ళక్క ప్రేమిస్తున్నవాడిని మామీ వాళ్ళక్క లాక్కుందని అట. ఆన్ బళ్ళోకి రాకపోవటం ఎవరికీ బాగోలేదట , మళ్ళీ వచ్చేస్తే బావుండుననుకుంటున్నారట…గిల్బర్ట్ బ్లైత్-

ఆన్ అతని గురించి ఏమీ వినదల్చుకోలేదు. రాస్ప్ బెర్రీ కార్డియల్ తాగటానికి వెల్దామని మాట మార్చేసి లేచింది.

anne17-2

వంటింటి అలమర   రెండో చెక్కలొ వెతికింది ఆన్ – అక్కడేం కనిపించలేదు. చూస్తే అది పైచెక్క లో ఉంది.  జాగ్రత్తగా దాన్ని దింపి సీసా, గ్లాసులూ ట్రే లో అమర్చింది.

‘ కొంచెం తీసుకో డయానా ” – మర్యాదగా చెప్పింది – ” నేనిప్పుడేమీ తీసుకోలేను.. చాలా ఆపిల్స్ తిన్నానేమో కదా ”

డయానా ఒక గ్లాస్ లో సగం పైదాకా పోసుకుని, ఇష్టంగా మొహం పెట్టి కొంచెం కొంచెం పుచ్చుకుంది.

” ఎంత బావుంది ఆన్ ! రాస్ప్ బెర్రీ కార్డియల్ ఇంత రుచిగా ఉంటుందని నాకు తెలీనే తెలీదు ”

” నీకు నచ్చటం ఎంతో సంతోషంగా ఉంది. కావల్సినంత పోసుకుని హాయిగా  తాగుతూ ఉండు. వంటింట్లో పొయ్యి రాజేసి ఇప్పుడే వస్తాను నేను – అబ్బా ! ఇల్లు చూసుకోవటమంటే అల్లాటప్పా పని కాదూ… ”

ఆన్ తిరిగి వచ్చేసరికి డయానా రెండో గ్లాస్ కార్డియల్ తాగుతోంది. ఆన్ బలవంతం చేస్తే, మూడోది నింపుకుందుకూ అభ్యంతరం పెట్టలేదు.  ఆ గ్లాస్ సైజు భారీగానే ఉంది ..కార్డియల్ రుచి అంత బావుంది మరి !

” ఇంత మంచిది నా జన్మలో తాగలేదు. మిసెస్ లిండ్ తెస్తూ ఉంటుంది మా ఇంటికి , దానికీ దీనికీ పోలికే లేదు !!! ” – డయానా ప్రకటించింది.

” మెరిల్లా తయారు చేసింది గా మరి, మిసెస్ లిండ్ చేసిందానికంటే ఖచ్చితంగా బావుంటుంది ” – ఆన్ విశ్వాసంగా అంది. ” మెరిల్లా వంట నేర్చుకోమంటుంది నన్ను, నాకూ నేర్చుకోవాలనే ఉంటుంది గాని , బాగా కష్టమైన పని. ఊహించుకుందుకు ఏ- మీ ఉండదు ..అంతా లెక్క ప్రకారమే చెయ్యాలి. మొన్నామధ్య కేక్ చేస్తూ పిండి కలపటం మర్చిపోయాను. అప్పుడు మనిద్దరి గురించీ ఒక విషాదగాథ ని ఊహించుకుంటున్నాను. నీకు మశూచి వచ్చిందట, నీ దగ్గరికి రావటానికి అందరూ భయపడుతుంటే , నేను నీ పక్కనే ఉండి రాత్రింబవళ్ళు సేవ చేశానట. నీకు నయమైపోయి, నాకు మశూచి వచ్చేసి నేను చచ్చిపోయానట. నన్ను స్మశానం లో పొప్లార్ చెట్ల కిందన  సమాధి చేశారట. నువ్వు నా సమాధిమీద ఎర్ర గులాబీ మొక్క నాటి నీ కన్నీళ్ళతో దాన్ని పెంచుతున్నావట…నీకోసం ప్రాణాన్ని త్యాగం చేసిన స్నేహితురాలిని నువ్వు నిరంతరమూ స్మరిస్తూనే ఉన్నావట. నా కళ్ళ నుంచి నీళ్ళు కాలవలు కట్టాయి… పిండి కలపటం మర్చిపోయాను ..కేక్ నాశనమైపోయింది ! మెరిల్లా మండిపడిపోయింది… కేక్ చేసేందుకు పిండి నిజంగా అవసరంలాగే ఉంది డయానా !

ఇంకోరోజున – రాత్రి భోజనాలయాక ప్లమ్ పుడ్డింగ్ , సాస్ – ఎక్కువ మిగిలిపోయాయి. వాటిని భద్రం చేసి మూతపెట్టమనీ మర్నాడు తినచ్చనీ మెరిల్లా చెప్పింది. అలాగే చేద్దామనుకున్నాను..ఈలోపల  గాఢంగా ఊహించు కోవటం మొదలుపెట్టాను  . నేను ‘ నన్ ‘ అయిపోయానట..నేను ప్రొటెస్టెంట్ నే లే, కాథలిక్ ని అని ఊహించుకున్నాను. ముసుగు వేసుకుని, భగ్నహృదయం తో , బయటి ప్రపంచానికి దూరంగా..ఒంటరిగా – జీవితం వెళ్ళబుచ్చుతున్నట్లుగా ….పుడ్డింగ్ సంగతి తెల్లారాక గుర్తొచ్చి వెళ్ళి చూస్తే మూత పెట్టటం మర్చిపోయాను.. సాస్ లో ఒక ఎలక తేలుతోంది. జాగ్రత్తగా చెంచా తో దాన్ని తీసి అవతల పారేసి చెంచాని మూడు సార్లు రుద్ది  కడిగాను. అప్పుడు మెరిల్లా , పాలు తీస్తూ పెరట్లో ఉంది. మిగిలిఉన్న పుడ్డింగ్ సాస్ ని పందులకి పోయనా అని మెరిల్లాని అడుగుదామనే అనుకున్నాను ..ఈ లోపు ఇంకో ఊహ.

మంచు పడుతూ ఉన్న అడవిలో నేనొక దేవకన్యని అయినట్లూ , ఎర్రటి పసుప్పచ్చటి ఆకులున్న చెట్ల మధ్యలోంచి ఎగిరి వెళుతూన్నట్లూ….ఎంత అద్భుతం గా ఉందనీ …సరే- మెరిల్లాకి చెప్పటం మర్చిపోయి ఆపిల్స్ కోసేందుకు తోటలోకి వెళ్ళిపోయాను, సాయంత్రం మిస్టర్ చెస్టర్ రాస్, వాళ్ళావిడా వచ్చారు. వాళ్ళు చా- లా నాగరికంగా, నాజూగ్గా ఉంటారు , తెలుసుగా ! నేను శుభ్రంగా మొహం కడుక్కుని తయారయాను. అందంగా ఉండకపోయినా, పెద్ద మనిషి తరహాగా కనిపించాలని నా ప్రయత్నం. అందరం భోజనాలకి కూర్చున్నాం. మెరిల్లా ఒకచేత్తో పుడ్డింగ్, ఇంకో చేత్తో సాస్ [ అప్పుడు  మళ్ళీ వెచ్చబెట్టింది దాన్ని ] తెస్తోంది…..ఆ భయంకరమైన నిమిషం లో…లేచి నిలుచుని శక్తికొద్దీ అరిచాను – ‘ మెరిల్లా..దాన్ని అవతల పారేయి..ఎలక చచ్చిపోయింది దాంట్లో, నీకు చెప్పటం మర్చిపోయాను ‘ అని. మిసెస్ చెస్టర్ రాస్ నా వైపు చూసింది చూడూ….ఇంకో వందేళ్ళకీ ఆ చూపు మర్చిపోలేను. ఆవిడ ఇంటిని ఎంతో నైపుణ్యం తో దిద్దుకుంటుందట…మమ్మల్ని గురించి ఏమనుకుని ఉండాలి చెప్పు ? మెరిల్లా మొహం ఎర్ర…గా….కొలిమి లాగా అయిపోయింది. ఏం మాట్లాడకుండా వెళ్ళి అవి పడేసి స్ట్రాబెర్రీ ప్రిజర్వ్ తెచ్చి వడ్డించింది. నాకూ పెట్టింది…ఒక్క చెంచా కూడా లోపలికి వెళ్ళలేదు..నా తలలో నిప్పులు చెరుగుతున్నాయి  …అరె ! డయానా..ఏమైంది నీకు ? ”

డయానా లేచి నిల్చుంది, తూలింది – మళ్ళీ కూర్చుంది. రెండు చేతులతో తల గట్టిగా పట్టుకుంది .

” నాకు..నాకేమిటో గా ఉంది ఆన్. వికారం పెడుతోంది..ఇంటికెళ్ళిపోవాలి…”

” అయ్యో..అలా అనకు. టీ తాగకుండా ఎలా వెళ్తావు..ఉండు , క్షణం లో అంతా సిద్ధం చేస్తాను ”

” లేదు. వె- ళ్ళా – లి , అంతే ”

‘’ ఇదెక్కడైనా ఉందా చెప్పు..వచ్చినవాళ్ళు టీ తాగకుండా వెళతారా ? ఒకవేళ నీకు నిజంగా మశూచి వస్తోందనిపిస్తోండా డయానా ? నన్ను నమ్ము – నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను, సేవ చేస్తాను. టీ మాత్రం తాగి వెళ్ళు ”

” నాకు కళ్ళు తిరుగుతున్నాయి ”

నిజంగానే  డయానా నిల్చోలేకుండా ఉంది. ఆశాభంగం తో కంటతడి పెట్టుకుంటూ ఆన్ , డయానాని పట్టుకుని నడిపించుకు వెళ్ళి ఇంట్లో దిగబెట్టి వచ్చింది. తిరిగొచ్చే దారంతా ఏడ్చుకుంటూనే ఉంది. రాస్ప్ బెర్రీ కార్డియల్ ని అలమర లో పెట్టి , దిగులుమొహం తో అంతా సర్దేసి, కళ్ళు తుడుచుకుని మాథ్యూ కీ జెర్రీకీ భోజనం ఏర్పాట్లు చేసింది …ఆమె ఆనందమంతా ఆవిరైపోయింది.

మర్నాడు ఆదివారం- జోరున వాన. రోజంతా ఇంట్లోంచి ఆన్ బయటికి రాలేదు. సోమవారం మధ్యాహ్నం మెరిల్లా ఏదో పని మీద మిసెస్ రాచెల్ ఇంటికి వెళ్ళిరమ్మంది. ఆన్ త్వరగానే తిరిగి వచ్చింది..కళ్ళమ్మట నీళ్ళు కారిపోతున్నాయి. వంటింటి సోఫాలో బోర్లాపడి  భోరుమంది.

” ఏయ్..ఏమైంది ? మళ్ళీ ఆవిడ తో దెబ్బలాడావా ? ” మెరిల్లా కంగారుగా, అనుమానంగా అడిగింది.

ఆన్ జవాబు చెప్పలేదు, ఎక్కిళ్ళు ఎక్కువయ్యాయి.

” ఆన్ షిర్లే ! నిన్నొక ప్రశ్న వేసినప్పుడు జవాబు చెప్పాలని కదా అర్థం ? ఏమైంది – చెప్పు ? ”

ఆన్ లేచి కూర్చుంది. శోకం మూర్తీభవించినట్లుంది.

” మరేమో..మిసెస్ రాచెల్ ఇవాళ మిసెస్ బారీ వాళ్ళింటికి వెళ్ళిందట. మిసెస్ బారీ చాలా చాలా కోపంగా ఉందట…శనివారం మనింట్లోంచి డయానా సారా తా గేసి వ చ్చిందని చెప్పిందట. నేను చాలా ఛండాలపు పిల్లననీ , ఇంకెప్పటికీ డయానాని నాతో ఆడుకోనివ్వననీ అందట….”

మెరిల్లాకి ఆశ్చర్యం తో నోట మాట రాలేదు.

” డయానా ఏమిటి..మనింట్లో సారా తాగటమేమిటి ..నీకు పిచ్చెక్కిందా లేకపోతే మిసెస్ బారీకా ? అసలేం ఇచ్చావు తాగటానికి నువ్వు ???”

” రాస్ప్ బెర్రీ కార్డియల్ తప్ప ఇంకేం ఇవ్వలేదు. అదే మూడు గ్లాసులు తాగిందంతే..అయితే మాత్రం..అది సారా కాదుగదా ? ”

” ఏది – ఏమిచ్చావో చూపించు ? ”

చూ స్తే – అది అప్పుడప్పుడూ, ఎంతో అవసరం పడినప్పుడు మాత్రమే – పుచ్చుకునే ఘాటైన ద్రాక్షసారా . మెరిల్లాకి తను రాస్ప్ బెర్రీ కార్డియల్ సీసాని నింపేందుకు తీసుకెళ్ళి నేలమాళిగలోనే వదిలేశాననీ పొరబాటున దాని బదులు ద్రాక్షసారా ని తెచ్చి అక్కడ పెట్టాననీ అప్పటికి గుర్తొచ్చింది.

మెరిల్లా నొచ్చుకుంది, ఒకవైపునుంచి నవ్వొస్తోంది.

” నువ్వు ఈ ద్రాక్షసారా  ఇచ్చావు డయానాకి..ఆన్…కార్డియల్ కీ దీనికీ తేడా తెలుసా నీకు ? చిక్కులు నీ వెంబడిపడి  వస్తుంటాయి , నువ్వే వాటినిరమ్మని పిలుస్తుంటావో ఏమిటో …”

” నేను దాన్ని రుచి చూడలేదు..” ఆన్ చెప్పుకొచ్చింది – ” అదే కార్డియల్ అనుకున్నాను. ఎంత గొప్ప- గా ఆతిథ్యం ఇవ్వాలనుకున్నానో ..అంతా పాడైపోయింది. డయానా తూలుకుంటూ వెళ్ళిందట. వాళ్ళమ్మ ఏదో అడిగితే పిచ్చి నవ్వులు నవ్విందట. పడుకుని గంటలు గంటలు నిద్రపోయిందట. ఊపిరి వాసన చూస్త  తాగేసి వచ్చిందని మిసెస్ బారీ కి తెలిసిందట. మర్నాడంతా ఘోరమైన తలనొప్పిట డయానాకి. మిసెస్ బారి…అయ్యో..నేనిదంతా కావాలనే చేశాననుకుంటోంది , చెప్పినా  నమ్మదు ”

” డయానాని తిట్టాలి ఆవిడ . ఎంత బావుంటే మాత్రం మూడు గ్లాసులు తాగుతుందా , అంత జిహ్వ చాపల్యమా పిల్లకి ? అంత తాగితే రాస్ప్ బెర్రీ కార్డియల్ కి అయినా జబ్బు చేస్తుంది. ఎప్పుడో ఒంట్లో బాగుండనప్పుడు కొద్దిగా తీసుకుందుకని దాచాను దీన్ని..ఇహ ఇప్పుడు ఊళ్ళో నా గురించి కూడా కథలు కథలుగా చెప్పుకుంటారు. సరేలే, ఏడవకు ఆన్..ఇందులో నీ తప్పేముంది – పొరబాటు నాదే ”

” నన్ను ఏడవనీ మెరిల్లా. నా గుండె బద్దలైపోతోంది. డయానా నేనూ ఇక విడిపోవాలి….జీవితాంతం కలిసి ఉండాలని వాగ్దానాలు చేసుకున్నాం …ఇలా జరిగిపోయింది ”

” పిచ్చిదానిలా మాట్లాడకు. మిసెస్ బారీ నువ్వు ఇదంతా సరదాగా చేశావనే అనుకుంటుంది బహుశా. అది కూడా కాదని చెప్పు వెళ్ళి. అంతా వివరంగా చెబితే నీ తప్పేం లేదని తెలుస్తుంది ఆవిడకి ”

”నాకు ధైర్యం చాలటం లేదు మెరిల్లా. పోనీ నువ్వు వెళ్ళి చెబుతావా ? నీ మాటైతే వింటుందేమో ? ” ఆన్ ఆశగా ప్రాధేయపడింది.

మెరిల్లాకీ అదే మంచిదనిపించింది . ” సరే . వెళ్తాలే.  నువ్వు ఏడుస్తూ కూర్చోకు, అంతా చక్కబడుతుందిలే ”

కానీ ఆ సాయంత్రం మెరిల్లా మిసెస్ బారీ దగ్గర్నుంచి వస్తున్నప్పుడు ఆమె కి అలా అనిపించలేదు. ఆన్ ఆత్రంగా వాకిట్లోనే ఎదురుచూస్తూ ఉంది.

మెరిల్లా మొహం చూస్తే విషయం  అర్థమైపోతోంది.

” ఏం లాభం లేదు కదూ మెరిల్లా ? మిసెస్ బారీ నన్ను క్షమించలేదు కదూ ? ”

” మిసెస్ బారీ !!! ఎంత మొండి మనిషి ఆవిడ ! చెప్తే వినదే అసలు !!! అంతా పొరబాటున జరిగిందంటే నమ్మదే !!! పైగా అంత ఘాటైన ద్రాక్షసారాని ఇంట్లో ఎందుకు  పెట్టుకున్నానని  ఆక్షేపి స్తుంది. నాకు మండుకొచ్చింది ఇంక- కాస్తే   తీసుకుని ఉంటే ఏమీ అయిఉండేది కాదనీ,  ఆశ కొద్దీ వాళ్ళమ్మాయి ఏకంగా మూడు గ్లాసులు తాగిందనీ, అదే నా పిల్ల అయితే నాలుగు తగిలించి ఉండేదాన్ననీ అనేశాను ”

anne17-3

మెరిల్లా విసవిసా వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆన్ బయల్దేరింది..చలి గా ఉన్న ఆ వేళ, తల మీద టోపీ కూడా పెట్టుకోకుండా. హేమంతానికి వడలిఉన్న క్లోవర్ పొలాల్లోంచి , పొడవాటి వంతెన మీంచి, స్ప్రూస్ తోపు లోంచి..స్థిరంగా, పట్టుదలగా నడిచివెళ్ళింది. పడమటి అడవుల వెనక  వెలవెలబోతున్న చంద్రుడు , గుడ్డి వెలుగు. మెల్లిగా తలుపు తట్టింది. తెరిచిన మిసెస్ బారీకి, చలికి  పాలిపోతున్న చిన్న ఆకారం ప్రత్యక్షమైంది.

ఆవిడ మొహం కఠినంగా అయిపోయింది. గాఢమైన ఇష్టాయిష్టాలు ఆవిడవి..ఆ కోపం కూడా భగ్గుమని చల్లారే తాటాకు మంట కాదు ,  ఏళ్ళతరబడి లోపల ఉండిపోయే రకానిది. ఆన్ ఇదంతా బుద్ధిపూర్వకంగానే చేసిందని , ఈ పిల్ల కల్మషం లోంచి తన కూతురిని రక్షించుకోవాలని నిశ్చయించేసుకుని ఉంది.

” ఏం కావాలి నీకు ? ” కొట్టినట్టు అడిగింది.

ఆన్ చేతులు జోడించింది – ” నన్ను క్షమించండి మిసెస్ బారీ. నేను కావాలని చేయలేదు. మీరే ఒక బీద అనాథ పిల్ల అయిఉండి, దొరక్క దొరక్క మీకొక ప్రాణస్నేహితురాలు దొరికితే ఆమె ని ఇంటికి పిలిచి  సారా తాగించి మైకం తెప్పిస్తారా చెప్పండి ? తెప్పించరు కదా ?? నేను రాస్ప్ బెర్రీ కార్డియల్ అనే అనుకున్నాను, రాస్ప్ బెర్రీ కార్డియల్ అనే నమ్మాను. డయానాని నాతో ఆడుకోనివ్వనని అనకండి దయచేసి, నేను బతికున్నంతకాలమూ దుఃఖిస్తూనే ఉంటాను ”

మెత్తని గుండె గల మిసెస్ రాచెల్ ని కరిగించినట్లుగా మిసెస్ బారీ హృదయాన్ని ఆ మాటలు కరిగించలేదు. ఆన్ వాడే పెద్ద పెద్ద మాటలూ నాటకీయ ధోరణీ ఆవిడకి అసలు నచ్చవు, ఇప్పుడూ నచ్చలేదు. ఈ పిల్ల మాటలు వినటం తనకి తలవంపులు  అనుకుంది.

” నువ్వు డయానా తో స్నేహం చేసేందుకు తగవు. వెళ్ళు. నీ పాటికి నువ్వు ఇంటికి వెళ్ళి బుద్ధిగా మసలుకో. ఇటువైపుకి రాకు ” క్రూరంగా చెప్పింది.

ఆన్ పెదాలు వణికాయి.

” ఒక్కసారి..ఒకే ఒక్కసారి..డయానాని నాతో మాట్లాడనివ్వరూ ? వీడ్కోలు చెప్పేందుకైనా ? ”

” డయానా ఇంట్లో లేదు. వాళ్ళ నాన్నతో కార్మొడీ వెళ్ళింది ” దఢేల్ మని తలుపు మూసేసింది మిసెస్ బారీ.

ఆన్ నిరాశగా, నిశ్శబ్దంగా- ఆ చీకట్లో పడి ఇంటికి పోయింది.

”నా ఆఖరి ఆశ కూడా పోయింది మెరిల్లా ” – నిర్లిప్తంగా చెప్పింది – ” నేనే వెళ్ళి మిసెస్ బారీని వేడుకున్నాను. ఆవిడ చాలా అవమానించింది నన్ను , పద్ధతిగా పెరిగిన మనిషి కాదనుకుంటాను ఆవిడ. ఇక దేవుడిని ప్రార్థించుకోవటం తప్ప నాకేం మిగల్లేదు..దానివల్లా పెద్ద లాభమేమీ ఉండదనుకుంటాను. మిసెస్ బారీ అంత గండాగొండి మనిషిని దేవుడు కూడా ఒప్పించలేడు ”

” ఆన్..అలా అనకూడదు, తప్పు  ” – వారించింది, ఇంకేమీ అనలేక.

ఆ రాత్రి మాథ్యూ కి అంతా చెప్పాక, ఆన్ ఎలా ఉందో చూసేందుకు వెళ్ళింది. ఏడ్చి ఏడ్చి ముడుచుకుపడుకుంది ఆన్. నిద్రలో కూడా మొహం లో దైన్యం. మెరిల్లా మనసు ఒక్కసారి గా ద్రవించిపోయింది.

” పిచ్చి పిల్ల..ఎలా బతుకుతుందో  ” –  ముంగురులు సర్ది, వంగి, కన్నీటితో తడిసిఉన్న బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది.

 

 

[ ఇంకా ఉంది ]

 

 

 

 

         గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ – 16

 

Anne Of Green Gables By L.M.Montgomery

ప్రిస్సీ ఆండ్రూస్ కి ఆల్జీబ్రా పాఠం బోధపరుస్తూ మిస్టర్ ఫిలిప్స్  క్లాస్ వెనక ఒక మూల కూర్చుండిపోయాడు. తక్కిన పిల్లలు ఇష్టారాజ్యం గా పచ్చి ఆపిల్ పళ్ళు తింటూ కాలక్షేపం చేసుకుంటున్నారు – ఇంకా, పలకల మీద పిచ్చి గీతలూ బొమ్మలూ  గీసుకుంటున్నారు ,  అతి రహస్యంగా చెవులుకొరుక్కుంటున్నారు.  ఆన్ ని ఆకర్షించాలని గిల్బర్ట్ బ్లైత్ యథాశక్తి ప్రయత్నిస్తున్నాడు గాని , ఆన్ కి ఆ ధ్యాసే  లేదు. తను ఎక్కడుందో కూడా మర్చిపోయినట్లుగా , అరచేతుల్లో గడ్డం ఆనించుకుని  కిటికీ లోంచి ప్రకాశమాన సరోవరాన్ని చూస్తోంది. ఆ నీలిరంగు నీటిమీద తన సొంత స్వప్నలోకాల్లో తేలిపోతోంది.

గిల్బర్ట్ కి ఇలా తననే ఆడపిల్లయినా పట్టించుకోకపోవటం కొత్త , ఏ మాత్రం రుచించలేదు. అందరూ తనని గమనించే తీరాలి… ఎవరికీ లేని పెద్దకళ్ళున్న ఆ సూదిగడ్డం అమ్మాయైనా సరే.

దగ్గరికి వచ్చేసి , ఆన్ పొడుగాటి జడని  అందరికీ ప్రదర్శిస్తున్నట్లు  పట్టుకుని…అందరికీ వినబడేలాగా, ఆన్ కి గుచ్చుకుపోయేలాగా , గొణిగాడు – ” ఎర్ర కారెట్ , ఎర్ర కారెట్  ”

వినిపించింది..తన ఊహాసౌధాలు కూలిపోతూండగా ఆన్ దిగ్గున లేచి నిలుచుంది.  కళ్ళలో మండుతూన్న క్రోధం, నిరసన …కన్నీళ్ళు కూడా భగ్గుమంటున్నాయి.

” నికృష్టుడా  ! ఎంత ధైర్యం నీకు !!! ”

థాట్ ! థాట్ !!   తన పలకని గిల్బర్ట్ తలకేసి బలంగా మోదింది ..అది ముక్కలైంది , తల కాదు – పలక.

అవోన్లియా బళ్ళో ఇలాంటి దృశ్యాలని తనివితీరా ఆస్వాదించే అలవాటు.  ఇది మహా రసవత్తరంగానూ  ఉంది ..అంచేత అందరూ సంభ్రమాశ్చర్యానందాలతో – ” ఓ….” అని అరిచారు. డయానా ఊపిరందక ఉక్కిరిబిక్కిరైంది. ఉత్తుత్తినే ఏడ్చేస్తుండే  రూబీ గిల్లిస్ బావురుమంది . కీచురాళ్ళకి దారాలు కట్టి కవాతు చేయిస్తున్న టామీ స్లోన్ దారాలు వదిలేసి నోరు తెరుచుకు ఉండిపోయాడు … వాటి దారిన అవి పోయాయి.

మిస్టర్ ఫిలిప్స్ అప్పటికి స్పృహలోకి వచ్చి గబ గబా అక్కడికి చేరి ఆన్ జబ్బ పట్టుకు నిలదీశాడు – ” ఏమిటిదంతా, ఆన్ షిర్లే ? ”

ఆన్ జవాబు చెప్పలేదు . తను ‘ ఎర్ర కారట్ ” అని పిలవబడ్డానని అందరి ముందూ చెప్పుకోవటం ఆమెకి  అసాధ్యమైనపని.

గిల్బర్ట్ దృఢంగా ఒప్పేసుకున్నాడు – ” తప్పు నాదే మిస్టర్ ఫిలిప్స్. నేనే ఏడిపించాను ఆమెని ”

మిస్టర్ ఫిలిప్స్ మీద ఆ మాటలేమీ పనిచేయలేదు.

MythiliScaled

” నా విద్యార్థులలో ఒకరికి ఇంత కోపమూ కసీ ఉండటం చూస్తే నాకు సిగ్గుగా ఉంది ” అని నొచ్చుకున్నాడు… అక్కడికి తను పాఠాలు చెప్పటం వల్లనే మానవ సహజమైన అన్ని దుర్గుణాలూ బలహీనతలూ  నశించిపోతాయన్నట్లుగా .   ” ఆన్, వెళ్ళి ఈ మధ్యాహ్నమంతా స్టేజ్ మీద నిలబడే ఉండు నువ్వు ” – తీర్మానించాడు.

తనని బెత్తం దెబ్బలు కొడితేనే ఆన్ కి నయం గా ఉండేది – ఈ శిక్ష కొరడా దెబ్బల్లాగా ఉంది . కాని మారుమాట్లాడకుండా వెళ్ళి దాన్ని పాటించింది. మొహం పాలిపోయి ఉంది, ఏ భావమూ కనిపించటం లేదు. మిస్టర్ ఫిలిప్స్ చాక్ పీస్ తో బోర్డ్ మీద పెద్దక్షరాలతో రాశాడు – ” ఆన్ షిర్లే కి కోపం ఎక్కువ. ఆమె నిగ్రహాన్ని సాధన చేయాల్సిఉంది ”

ఆ వాక్యాల కిందనే ఆన్ ఆ మధ్యాహ్నమంతా నిలుచుని ఉంది. ఏడవలేదు, తల దించుకోలేదు. రగులుతున్న ఆగ్రహం ఆమెకి అవమానాన్ని భరించే శక్తిని ఇచ్చింది. డయానా సానుభూతి చూపులనీ, నిరసన గా చార్లెస్ స్లోన్ తల ఆడించటాన్నీ, జోసీ పై  ద్వేషపు నవ్వులనీ ఆమె ఒకేలా ఎదుర్కొంది. గిల్బర్ట్ ` అతనివైపుకి చూడనేలేదు !!! జన్మలో అతని మొహం చూడదుగాక చూడదు !!!!

బడి వదిలేశాక ఆన్ తన ఎర్ర జుట్టు తలని ధీమాగా పైకెత్తుకుని బయటికి నడిచింది.  గిల్బర్ట్ వరండా లో ఆమెని  ఆపే ప్రయత్నం చేశాడు.

” ఆన్, క్షమించు నన్ను ,  నీ జుట్టుని వేళాకోళం చేసినందుకు . చాలా తప్పు అది , నిజం చెబుతున్నాను…మనసులో పెట్టుకోకు నువ్వు ”- వీలైనంత  నిజాయితీగా అన్నాడు.

విననట్లే , తిరస్కారంగా – అతన్ని దాటుకుని వెళ్ళిపోయింది ఆన్.  డయానా  వారించబోయింది – ” ఆన్…ఉండు ..” – సగం మెచ్చుకోలు, సగం అయిష్టం కలిగాయి ఆమెకి ఆన్ ధోరణి చూస్తే. తనే అయితే ఎప్పటికీ గిల్బర్ట్ ని అలా నిర్లక్ష్యం చేయనేలేదు.

” గిల్బర్ట్ బ్లైత్ ని ఎప్పటికీ క్షమించేదిలేదు ” ఆన్ తిరుగులేనట్లు చెప్పింది – ” నా హృదయం లో శూలాలు దిగిపోయాయి’’   డయానా కి ఆ మాటలు పెద్దగా  బుర్రకెక్కలేదు గాని , పరిస్థితి అర్థమైంది.

” నీ జుట్టు గురించి ఏడిపించాడని బాధపడద్దు ఆన్ ” ..ఓదార్చింది. ” అందరు అమ్మాయిలనీ అలాగే ఏదో ఒకటి అంటూనే ఉంటాడు కదా . నా జుట్టు ఇంత నల్లగా ఉంటుందని ఏడిపించాడు తెలుసా..నన్ను కనీసం పన్నెండుసార్లు ‘ నల్ల కాకి ‘ అని ఉంటాడు. ఇంతవరకూ ఎవ్వరికీ క్షమాపణ చెప్పుకోవటం నేను చూడనేలేదు ”

” కాకి అనిపించుకోవటానికీ కారట్ అనిపించుకోవటానికీ చాలా తేడా ఉంది ” ఆన్ నిర్వేదం గా చెప్పింది…” గిల్బర్ట్ బ్లైత్ నన్ను అతి తీవ్రంగా గాయపరచాడు డయానా ”

తర్వాత ఇంకేమీ సంభవించకపోతే ఆ గొడవ అంతటితో సమసిపోయి ఉండేదే. కాని ఒకసారి మొదలయాక ఇలాంటివి ఆగవు.

మధాహ్నాలప్పుడు  అవొన్లియా బడి పిల్లలు గుట్ట మీది స్ప్రూస్ చెట్ల తోపులో చెట్టు బంకని గిల్లుకుంటూ గంతులేస్తుంటారు.[ దాన్ని చ్యూయింగ్ గం లాగా నములుతారు ]  ఆ తోపు  మిస్టర్ బెల్ ది, అతని పచ్చిక బీడుకి ఆనుకుని ఉంటుంది. మిస్టర్ ఫిలిప్స్ ఎబెన్ రైట్ వాళ్ళింట్లో అద్దెకి ఉంటాడు. ఆ బీడు లోంచి చూస్తే అక్కడినుంచీ మిస్టర్ ఫిలిప్స్ బయల్దేరాడో లేదో పిల్లలకి కనిపిస్తుంది, టీచర్ కనిపిస్తూనే పరుగు లంకించుకుంటారు. శాయశక్తులా పరుగెత్తినా రెండు మూడు నిమిషాల ఆలస్యం అవుతూనే ఉంటుంది, పిల్లలు రొప్పుతూ రోజుతూ వచ్చేసరికి.

ఆ మర్నాడు మిస్టర్ ఫిలిప్స్ కి ‘ సంస్కరణల  ‘ మీద ధ్యాస మళ్ళింది [ అప్పుడప్పుడూ అలా తేడా చేస్తుంటుంది అతనికి ] . తను వచ్చేసరికి విద్యార్థులంతా ఎవరి చోట్లలో వాళ్ళు కూర్చుని ఉండాలని ఆశించాడు ఆ రోజు, ఎవరు ఆలస్యంగా వచ్చినా వాళ్ళకి దండన తప్పదు.

ఆవాళ అందరు అబ్బాయిలూ కొందరు అమ్మాయిలూ యథాప్రకారం స్ప్రూస్ తోపులోకి వెళ్ళారు. కాస్తంటే కాస్త .. బంక దొరకగానే వెనక్కి వచ్చేయాలనే వాళ్ళ ఉద్దేశం. అయితే అలా కుదిరింది కాదు.. ‘ నములు బంక మైకం ‘ వాళ్ళని కమ్మేసింది. చెట్టు మీదినుంచి ‘ వచ్చేస్తున్నాడు ‘ అని జిమ్మీ గ్లోవర్ కేక పెట్టే దాకా  అక్కడే ఉండిపోయారు.

ఆడపిల్లలు నేల మీదే ఉన్నారు గనక తక్షణం పరుగు పెట్టి ఒక్క అర క్షణం ముందుగా క్లాస్ లోకి చేరగలిగారు. మగపిల్లలు చెట్లు దిగి కాళ్ళకి పనిచెప్పేసరికి ఆలస్యం అవనే అయింది. ఆ తోపుకి ఆ చివరన  ఆన్ కూడా ఉంది..నములు బంక కోసం కాదు… తన ‘ సొంత స్వప్న లోకాల్లో ‘  విహరించుకుంటూ. జుట్టులో రైస్ లిల్లీ పూలు గుచ్చుకుని,  కూనిరాగాలు తీసుకుంటూ ఆ నీడల లోకం లో తననొక వనదేవత లాగా ఊహించుకుంటూ తిరుగుతోంది.  ప్రమాదపు హెచ్చరిక ఆమెకీ వినిపించింది .  వేగంగా పరుగెత్త టం వచ్చు కాని ,  ఎంత చేసీ మగపిల్లల గుంపుతో కలిసి మటుకే అక్కడ అడుగుపెట్టటం వీలయింది. అప్పటికి మిస్టర్ ఫిలిప్స్ క్లాస్ లోపలికి వెళ్ళిపోయి టోపీని గోడ మీది మేకుకి తగిలిస్తున్నాడు.

anne 16-3

మిస్టర్ ఫిలిప్స్ లో  సంస్కరణాభిలాష  ఆపాటికి బాగా ఉపశమించి ఉంది..పన్నెండు మంది అబ్బాయిలని ఒకేసారి శిక్షించి హడావిడి చేసే ఓపిక బొత్తిగా లేదు…కాని తన మాట వృధా పోకూడదు గనుక ఎవరో ఒకరి మీద తన ప్రతాపాన్ని ప్రదర్శించాలి. ఆయాసపడుతూ తన సీట్లో కూలబడుతున్న ఆన్ మీద  అతని దృష్టి ఆగింది. ఆన్ చెవి పక్కనుంచి  ఇంకా ఒక రైస్ లిల్లీల గుత్తి వేలాడుతూనే ఉంది , అది  క్లాస్ రూం తో బొత్తిగా పొసగని అవతారం  గనుక మిస్టర్ ఫిలిప్స్ విజృంభించాడు.

” ఆన్ షిర్లే ! నీకు అబ్బాయిలతో కలిసి తిరగటం బాగా నచ్చుతుంది లా ఉంది, నీ ఇష్టాన్ని ఈ మధ్యాహ్నం గౌరవించదలచుకున్నాను. ఆ పూల గుత్తి తీసి పడేసి వెళ్ళి గిల్బర్ట్ బ్లైత్ పక్కన కూర్చోమ్మా , పద  ”

తక్కిన అబ్బాయిలు కిసుక్కుమన్నారు. డయానా ఆందోళనగా  ఆన్ జుట్టులోంచి పూలగుత్తి లాగేసి ఆమె చెయ్యిగట్టిగా పట్టుకుంది  . ఆన్ గుడ్లప్పగించి టీచర్ వైపు చూస్తుండిపోయింది.

” నేను చెప్పింది వినబడిందా, ఆన్ ? ” కటువుగా అడిగాడు మిస్టర్ ఫిలిప్స్.

” వినబడిందండీ. కాని మీరు నిజంగానే అంటున్నారా అని… ” ..మెల్లగా అడిగింది.

” నిజంగానే , ఏ- మీ సందేహం అక్కర్లేదు. చెప్పినట్లు చెయ్యి ” ..పిల్లలందరికీ, ముఖ్యంగా ఆన్ కి – అసహ్యం పుట్టించే వ్యంగ్యం మిస్టర్ ఫిలిప్స్ గొంతు లో ఉట్టిపడుతోంది.

జారుడు మెట్లలో ఆఖరిది ఇది ఆన్ ప్రాణానికి . పదమూడు మందీ చేసిన తప్పుకి తననొక్కదాన్నే శిక్షిస్తుండటం ఘోరం, ఆ శిక్ష లో ఒక అబ్బాయి పక్కన కూర్చోబెట్టటం ఇంకా ఘోరం, ఆ అబ్బాయి గిల్బర్ట్ బ్లైత్ అవటం మహా ఘోరం. ఇది అతి దుర్భరం, భరించే ప్రయత్నం కూడా చేయలేనని ఆన్ కి అర్థమైంది. పట్టలేననంత ఆగ్రహం తో, అవమానం తో నిలువెల్లా వణికిపోయింది.

గిల్బర్ట్ నీ ఆన్ నీ చూసి తక్కిన పిల్లల  గుసగుసలూ మోచేత్తో ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుని నవ్వుకోవటాలూ కాసేపు సాగాయి. ఆన్ తలెత్తకుండా తదేకంగా నేలచూపులు చూస్తోంది..గిల్బర్ట్ తన భవితవ్యమంతా వాటిమీదే ఆధారపడిఉన్నంత దీక్షగా భిన్నాల లెక్కలు చేసుకుంటున్నాడు ..త్వరలోనే పిల్లల దృష్టి వాళ్ళ మీదినుంచి మళ్ళిపోయింది. మిస్టర్ ఫిలిప్స్ , క్లాస్ కి వచ్చేముందర ‘ ప్రిస్కిల్లా కోసం  ‘ అనే పద్యమాలికను తయారు చేసుకోవటం   మొదలుపెట్టి ఉన్నాడు – వాటిలో  ఒకచోట ఎంతకీ ప్రాసకుదర టం లేదు , దాన్ని  సాధించటం లో నిమగ్నుడై  ,అతనూ  ఆన్ ని పట్టించుకోవటం మానేశాడు.  అది అదనుగా గిల్బర్ట్ ఒక గులాబి రంగు పిప్పరమెంట్ ని సంచిలోంచి బయటికి తీసి ఆన్ మోచేయి కి లోపలి వైపున డెస్క్ మీద పెట్టాడు. అది హృదయాకారం లో ఉంది, దాని మీద బంగారు రంగు అక్షరాలతో ‘ నువ్వు మంచిదానివి ‘ అని రాసి ఉంది. ఆన్ అటూ ఇటూ చూసి, దాన్ని తీసుకుని  కింద పడేసి బూట్ కాలితో కసిదీరా పొడిపొడి చేసేసింది.  గిల్బర్ట్ వైపుకి తల తిప్పి చూడనే లేదు.

బడి అయిపోయాక ఆన్ తన డెస్క్ దగ్గరికి నిటారుగా నడుచుకుంటూ వెళ్ళింది. అక్కడి తన వస్తువులన్నీ..పలకా, పుస్తకాలూ, బలపాలూ పెన్సిళ్ళూ  అన్నిటినీ ఒకచోట పేర్చింది. తీసుకుని బయల్దేరింది.

సగం దూరం వెళ్ళాక, ” ఇవన్నీ ఇంటికెందుకు పట్టుకు పోతున్నావు ఆన్ ? ” డయానా భయం భయంగా అడిగింది, అప్పటివరకూ ఆ మాట అడిగేందుకు ధైర్యం చాలలేదు ఆమెకి.

” నేనిక బడికి రాదలచుకోవటం లేదు ” – ఆన్ గంభీరంగా జవాబు ఇచ్చింది. డయానా వెర్రి మొహం వేసుకుని చూస్తుండిపోయింది.

” దానికి మెరిల్లా ఒప్పుకుంటుందా ఏమిటి ?  ” –  డయానా ఆశ.

” ఒప్పుకు తీరాలి. మళ్ళీ బడికి వెళ్ళి ఆ మనిషి మొహం చూసేది లేదు , అంతే ”

”ఆన్…అయ్యో ” డయానాకి ఏడుపొచ్చేస్తోంది. ” నువ్వు ఆ మాట నిజంగా అనట్లేదు, నాకు తెలుసు. నువ్వు రాకపోతే ఎలా..ఆ మిస్టర్ ఫిలిప్స్ దరిద్రుడు నన్ను ఆ దిక్కుమాలిన పిల్ల గెర్టీ పై పక్కన కూర్చోబెడతాడు…నువ్వు లేకపోతే నాకెలా తోస్తుంది ..”

” నీకోసం ఏమైనా చేస్తాను డయానా..నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి ఇమ్మన్నా సరే. ఇది మాత్రం అడగద్దు నన్ను, నా ఆత్మ దగ్ధమైపోతుంది ”

” మరి ఇదంతా ఉంది కదా ” – డయానా బెల్లించబోయింది. ” మనం వాగు పక్కన కొత్త బొమ్మరిల్లు కట్టుకుందామనుకున్నాం కదా ?  వచ్చేవారం నాట్యగోష్ఠి పెట్టుకుందామనుకున్నాం కదా ? నువ్వెప్పుడూ నాట్యానికి వెళ్ళనేలేదని చెప్పావు…జేన్ ఆండ్రూస్  మనకి నాట్యం చేసుకుంటూ పాడేందుకు కొత్త పాట నేర్పిస్తానంది కదా  ?? ఆలిస్ ఆండ్రూస్ బొమ్మల పుస్తకం పట్టుకొస్తానంది కదా ?? వాగు పక్కనే కూర్చుని ఒక్కొక్క అధ్యాయమూ పైకి చదువుకుందామనుకున్నాం కదా …నీకు పైకి చదవటమంటే ఎంతో ఇష్టం కదా ఆన్..నువ్వు లేకపోతే ఇదంతా ఎలా ?? రావూ ? ”

ఆన్ వీసమెత్తు కూడా చలించలేదు. ఆమె దృఢంగా నిశ్చయించేసుకుంది- మళ్ళీ బళ్ళోకి వెళ్ళదు, మిస్టర్ ఫిలిప్స్ మొహం చూడదు – అంతే . ఇంటికి వెళ్ళి మెరిల్లా దగ్గర ఈ విషయం ప్రకటించింది.

” ఏడిశావులే . నీ మొహం ” మెరిల్లా కొట్టిపడేసింది.

” కాదూ కాదు !”  – ఆన్ రోషంగా చూసింది – ” నీకు అర్థం కావట్లేదా మెరిల్లా ? నాకు అవ- మా- నం – జరిగింది ”

” అవమానమా నీ తలకాయా. రేపు మామూలుగా బడికి వెళ్ళు ”

” లేదు మెరిల్లా. నా వల్ల కాదు. ఇంట్లోనే చదువుకుంటాను. నీకు అన్ని పనులూ చేసిపెడతాను, నువ్వు చెప్పినట్లే నోరు మూసుకుని ఉంటాను , ఎలా చెబితే అలా వింటాను. బడికి మాత్రం వెళ్ళను ”

అప్పటికి   ఈ బుజ్జిదాని మొండితనం మెరిల్లా బుర్రకెక్కింది. ” ఇది నిజంగానే అంటోంది. ఒక్కొక్కసారి ఎంత మొండికెయ్యగలదో నాకు గాక ఎవరికి తెలుసు !! మిస్టర్ ఫిలిప్స్ దే తప్పని నాకూ అనిపిస్తోంది. అయినా ఆ మాట పైకి అనకూడదు కదా . మిసెస్ రాచెల్ ని వెళ్ళి అడిగితే సరి. ఈపాటికి ఆవిడకి అంతా తెలిసిపోయే ఉంటుంది ” . ఇంకేమీ రెట్టించలేదు ఆన్ ని.

మెరిల్లా వెళ్ళేసరికి మిసెస్ రాచెల్ ఎప్పటి ఉత్సాహం తో బొంత కుట్టుకుంటోంది.

” నేనెందుకు వచ్చానో నీకు తెలిసే ఉంటుంది ” మెరిల్లా కొంచెం సిగ్గుపడుతూ అంది.

మిసెస్ రాచెల్ తల ఊపింది , చెప్పమన్నట్లుగా.

”అదే..బళ్ళో ఆన్ గొడవ. ఇక ససేమిరా బడికి వెళ్ళనని భీష్మించుకు కూర్చుంది. పిల్ల చూస్తే బొత్తిగా డీలా పడిపోయినట్లుంది. అసలు వెళ్ళటం మొదలెట్టినప్పటుంచీ ఇలాంటి అల్లరేదో జరుగుతుందని భయపడుతూనే ఉన్నాను. దీని స్వభావానికి ఇంతవరకూ అంతా సాఫీగా వెళ్ళటమే ఆశ్చర్యం. నాకేమీ పాలుపోవటం లేదు. ఏం చెయ్యమంటావో చెప్పు ”

” నన్ను అడుగుతున్నావు గనుక ..” – మిసెస్ రాచెల్ మొదలెట్టింది . ఆవిడకి సలహా అడగబడటమంటే ఎంతో ప్రీతి అని తెలిసిన సంగతే. ” నేనైతే కొన్ని రోజులు ఆన్ మాటే వింటాను.   ఆన్ కోపానికి  మిస్టర్ ఫిలిప్స్ నిన్న దాన్ని దండించటం సరైనదే. ఇవాళ మటుకు తప్పు పూర్తిగా అతనిదే. పదముగ్గురు ఒకే తప్పు చేస్తే దీనికొక్కదానికే  ఎలా శిక్ష వేస్తాడు ? పైగా ఒక అబ్బాయి పక్కన కూర్చోబెట్టటమా..అదేమీ మర్యాద గా లేదు. ఇందాకే టిలీ బట్లర్ బళ్ళోంచి ఇంటికి వెళుతూ నాకు అంతా చెప్పుకొచ్చింది. అదీ దాని తోటి ఆడపిల్లలూ అందరూ ఆన్ వైపే మాట్లాడుతున్నారట. మిస్టర్ ఫిలిప్స్ మీద అందరికీ మండిపోతోందట. ఆన్ కి బళ్ళో ఇంత పలుకుబడి ఉంటుందనుకోలేదు నేను, ఆశ్చర్యం వేసింది సుమా ”

” అయితే నిజంగానే బడికి పంపకుండా ఉంచెయ్యమంటావా ? ” – మెరిల్లా నమ్మలేక పోయింది.

” ఆ. అవును..అది వెళ్తాననేవరకూ. నేననుకోవటం ,  ఒక వారం రోజులు గడిస్తే అదే చల్లబడుతుంది. ఇప్పుడు బలవంతంగా పంపితే మంచి కన్నా చెడే ఎక్కువ. నా ఉద్దేశం లో ఇలాంటివాటి గురించి ఎంత తక్కువ హడావిడి జరిగితే అంత నయం. బళ్ళోకి వెళ్ళనంత మాత్రాన ఆన్ పెద్దగా నష్టపోయేదేమీ ఉండదు- ఆ మిస్టర్ ఫిలిప్స్  పాఠాలు అంత గొప్పగా ఏం ఉండవు లే . అతను చిన్నపిల్లలని అసలు పట్టించుకోకుండా క్వీన్స్ అకాడెమీ లో చేరబోయే పెద్ద పిల్లలకే మొత్తం సమయం కేటాయిస్తుంటాడట. ఇక క్రమశిక్షణ అంటావా..అతని పద్ధతులని ఆ మాటతో పిలవనేకూడదు. ట్రస్టీ లలో ఒకరు వాళ్ళమామయ్యకాబట్టిగాని , లేదంటే ఈ ఏడాది అతని  ఉద్యోగం ఊడేదే   ! ఏమిటో..ఈ ఊళ్ళో చదువు సంధ్యలు –  ఇక మీదట  ఎలా తెల్లారుతాయో  ఏమో   !!! ”

మిసెస్ రాచెల్ మాట ని మెరిల్లా అక్షరాలా పాటించింది. బడికి వెళ్ళటమన్న మాటే ఇంట్లో వినిపించలేదు. ఆన్ ఇంట్లో పనులకి సాయం చేసింది, శ్రద్ధగా పాఠాలు చదువుకుంది , సాయంకాలాలు డయానాతో ఆడుకుంది. ఏ దారివెంట వెళుతుంటేనో, ఆదివారం చర్చ్ లోనో గిల్బర్ట్ బ్లైత్ ఎదురైతే ఆమె మొహం ద్వేషం తో నిండిపోయేది. గిల్బర్ట్ ఆమె చేత క్షమించబడాలని ఎంత ప్రయత్నిస్తే ఆన్ అంత గా బిగుసుకుపోయేది. వాళ్ళిద్దరి మధ్యనా శాంతి నెలకొల్పాలనే డయానా ప్రయత్నాలు ఎంతమాత్రమూ ఫలించలేదు. గిల్బర్ట్ ని ఆన్ తన జీవితాంతమూ అసహ్యించుకుంటూనే ఉండేలా ఉంది.

గిల్బర్ట్ మీద ఎంత ద్వేషమో డయానా మీద అంత ప్రేమ ఆన్ కి..అది రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఆన్ హృదయం లో ప్రేమా ద్వేషమూ రెండూ అతి తీవ్రంగానే ఉంటుంటాయి, మధ్యే మార్గం ఆమెకి చేతనవదు.

ఒక రోజున మెరిల్లా బుట్టలో ఆపిల్ పళ్ళు నింపుకుని తోటలోంచి వస్తోంది. తూర్పు కిటికీ లోంచి సందెవెలుగు ని చూస్తూ ఆన్ కుమిలి కుమిలి ఏడుస్తోంది.

” ఎందుకెందుకు..ఏమైంది ? ”

” ఓ..మెరిల్లా. డయానా అంటే నాకు చాలా చాలా ఇష్టం. తను నాతో  లేకుండా ఉండలేను. పెద్దయాక తనకి పెళ్ళైపోతుంది కదా, భర్త తో వెళ్ళిపోతుంది కదా ..అది తలచుకుని ఏడుస్తున్నాను. భ-ర్త- అట…వాణ్ణి తలుచుకుంటేనే అసహ్యమేస్తోంది. అదంతా కనిపిస్తోంది నాకు మెరిల్లా…డయానా మంచులాగా తెల్లగా ఉన్న మెత్తటి పెళ్ళి గౌన్ లో ఎంత అద్భుతంగా ఉందో ! నేను తోడు పెళ్ళికూతురిని…నా గౌనూ బావుంది, దానికి బుట్ట చేతులు కూడా ఉన్నాయి. గుండె పగిలిపోతున్నా అణుచుకుంటూ చిరునవ్వుతో తిరుగుతున్నాను.  ఇదిగో..డయానా వెళ్ళిపోతోంది…వీడ్కోలు చెప్పాలి…” – ఒక్కసారిగా   గొల్లు మంది ఆన్.

మెరిల్లా చటుక్కున అటువైపుకి తిరిగిపోయింది, మొహం కనిపించకుండా. కాని లాభం లేకపోయింది- దగ్గరగా ఉన్న కుర్చీలో కూలబడి పొట్ట చెక్కలైపోయేలా నవ్వింది…నవ్వుతూనే ఉంది , ఆవైపు వెళుతూన్న మాథ్యూ ఆశ్చర్యంగా ఆగిపోయాడు..మెరిల్లా ఇంతగా విరగబడినవ్వి ఎన్నేళ్ళైపోయింది !!!

” ఆన్ షిర్లే ! ” – నవ్వులోంచి మాట పెగిలాక అంది ఇలా –  ” ఏం చోద్యమే నీది  !!! లేని బాధలు అరువు తెచ్చుకు మరీ ఏడుస్తుంటావు సరే ,  అంత అలవిగాని బాధలే తెచ్చిపెట్టుకోవాలా.. కాస్త మోతాదైనవి ఊహించుకోరాదా , నీ ఊహా శక్తి మండిపోను ! ”

 

– [ ఇంకా ఉంది ]

గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ – 15

 

                               [Anne Of Green Gables By L.M.Montgomery ]

 ” ఆహ్ ! ఎంత బావుందీ రోజు !!!  ”  గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ అంది ఆన్ – ” ఇలాంటిరోజున ‘ జీవించి ఉండటం ‘ ఎంతో మంచి విషయం… ఇప్పటికింకా  పుట్టనివాళ్ళని తల్చుకుంటే జాలేస్తుంటుంది…వాళ్ళకీ మంచి రోజులు వస్తుంటాయిలేగాని – ‘ ఈ ‘ రోజయితే రాదుగదా ! బడికి వెళ్ళేదారి ఇంత అందంగా ఉండటం ఇంకా బావుంది ”

” ఆ.అవునులే. రోడ్ మీద వెళ్ళటం కంటే ఇలా బాగానే వుంది, అక్కడైతే వేడీ దుమ్మూ ” – డయానా అంది , ఆమెకిలాంటివి పెద్దగా పట్టవు. బుట్టలో తెచ్చుకుంటున్న మూడు రాస్ప్ బెర్రీ కేకులని పరీక్షిస్తూ క్లాస్ లో ఉన్న పదిమంది అమ్మాయిలకీ అవి ఎలా పంచాలో, ఒక్కొక్కళ్ళకీ ఎన్ని ముక్కలు వస్తాయో లెక్కవేసుకుంటోంది ఆమె.  బళ్ళో ఆడపిల్లలందరూ తెచ్చినవన్నీ పోగేసి పంచుకుతినటమే ఆనవాయితీ. ఆన్ , తనూ మటుకే ఆ కేకులు తినేస్తే డయానాకి అందరూ ‘ పిసినారిపిల్ల ‘ అని పేరుపెట్టే అవకాశం బలంగా ఉంది…కాని ఉన్నవేమో మూడే- మనసొప్పటం లేదు.

వాళ్ళు వెళుతూ ఉన్నదారి నిజంగానే అందంగా ఉంటుంది. అలా డయానా తో కలిసి నడవటం ఆన్ కి కలల సాకారం వంటిది- దాన్ని అంతకన్న బాగా ఊహించుకోవటానికేమీ లేదనేంతగా. గ్రీన్ గేబుల్స్ పళ్ళతోట కి దిగువన ‘ ప్రేమపథం ‘ మొదలవుతుంది. దూరంగా కనిపించే అడవిలోపలివరకూ వెళుతుంది. రోజూ ఆవులు  మేతకి వెళ్ళేది అటువైపునుంచే . గ్రీన్ గేబుల్స్ కి వచ్చిన నెలరోజుల లోపే ఆ దారికి ప్రేమపథం అని ఆన్ పేరు పెట్టేసింది.

” అంటే అక్కడెవరో ‘ ప్రేమికులు ‘ నడుస్తారని కాదూ” – ఆన్ మెరిల్లాకి వివరించింది – ” డయానా నేనూ ఒక బ్రహ్మాండమైన పుస్తకం చదువుతున్నాం…అందులో  ప్రేమపథం అని ఒక చక్క- టి దారి ఉంటుంది .  అందుకని మాకూ ఒకటి ఉండాలనుకున్నాం. ఎంత బావుందో  కదూ ?  అక్కడికి  ఎవ్వరూ రారు – హాయి గా పైకే ఆలోచించుకుంటూ పోవచ్చు – ఎవరూ నన్ను పిచ్చిమొహం అనరు …అందుకు నాకిష్టం. ”

రోజూ  పొద్దున ఆన్ ఒక్కతీ బయల్దేరి వాగు వరకూ వెళుతుంది. అక్కడ డయానా వచ్చి కలుసుకుంటుంది. ఇద్దరూ మేపుల్ చెట్ల వంపు కిందినుంచి నడుస్తారు. ఆన్ అంటుంది – ” మేపుల్ చెట్లు ఎంత కలుపుగోలుగా ఉంటాయో..ఎప్పుడూ మనకి ఏమిటో చెబుతున్నట్లే ఉంటుంది వాటి ఆకులు కదుల్తుంటే ”. వంతెన దగ్గర ప్రేమపథాన్ని వదిలి బారీల పొలం వెనకనుంచి వెళ్ళి , విల్లో మియర్ దాటి వయొలెట్ లోయమీదుగా వెళ్ళాలి . మిస్టర్ ఆండ్రూ బెల్ వాళ్ళ చిట్టడివి కి ఆనుకున్న   ఆకుపచ్చటి పల్లపు ప్రాంత మే  వయొలెట్ లోయ . ” ఇప్పుడు అక్కడ వయొలెట్ లు లేవులే అనుకో ” ఆన్ మెరిల్లా కి చెప్పింది – ” వసంతకాలం వచ్చినప్పుడు లక్షల కొద్దీ పూస్తాయట- డయానా చెప్పింది.

అన్నేసి పూలు అలా .. నీకు   కళ్ళముందు కనిపించట్లేదూ మెరిల్లా – నాకైతే , ఊహించుకుంటే సంతోషం తో ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది. మంచి చోట్లకి  మంచి పేర్లు పెట్టటం లో  నన్ను మించినవాళ్ళని చూడలేదని డయానా అంది తెలుసా ? ఏదో ఒకదానిలో గొప్పగా ఉండటం బావుంటుంది. ‘ బర్చ్ దారి ‘ కి మటుకు డయానా యే పేరు పెట్టింది. తను పెడతానని సరదా పడింది, అందుకని పెట్టనిచ్చాను. నేనైతే ఇంకా కవితాత్మకంగా పెట్టి ఉండేదాన్ని ..కాని ప్రపంచం మొత్తం మీద చక్కటి ప్రదేశాల్లో బర్చ్ దారి ఒకటి  …”

ఆ మాట నిజమే. ఆన్ మాత్రమే కాకుండా ఆ దారివెంట నడిచిన ఇంకొందరూ అలాగే  అనుకున్నారు.  ఆ సన్నటి మెలికల బాట మిస్టర్ బెల్ చిట్టడివిలోంచి కొండ మీదికి ఎక్కుతుంది.  ఆకుపచ్చని తెరల్లోంచి వడకట్టబడే సూర్యకాంతి మరకతాలు కరిగి ప్రవహిస్తున్నట్లుంటుంది. దారి పొడుగునా లేతవయసు బర్చ్ చెట్లు,  వాటి నాజూకైన కొమ్మలు.  మధ్యలో  ఫెర్న్  మొక్కలు, నక్షత్రపు పూలూ , లోయలిల్లీ పూలూ .  ఎర్రటి అడవి బెర్రీ లు విరగకాసి ఉంటాయి. అక్కడంతా  ఘాటైన సువాసన ,  ఆహ్లాదంగా .  పక్షుల పాటలూ  చెట్లమీద గలగలా నవ్వే అడివిగాలులు. శబ్దం లేకుండా నడిస్తే అడపాదడపా అటూ ఇటూ పరుగు తీసే కుందేళ్ళుకూడా కనిపిస్తుంటాయి. ఆన్, డయానా ల విషయం లో సహజంగానే అది ఎప్పుడో గాని జరగదు- వాళ్ళు మాటలు ఆపితే కదా !  కొండ దిగాక ఆ దారి పెద్ద వీధిలో కలుస్తుంది- ఇక అక్కడికి బడి దగ్గరే- స్ప్రూస్ గుట్ట ఎక్కి దిగితే చాలు.

అవోన్లియా బడి పొడుగ్గా, కిందికి వాలుతుండే పై  కప్పుతో    , శుభ్రంగా సున్నం వేసి ఉంటుంది.  పెద్ద పెద్ద కిటికీలు. తరగతి గదుల్లో దిట్టమైన పాతకాలపు సొరుగుల బల్లలు. ఆ చెక్క ల మీద మూడు తరాల పిల్లల పేర్లు చెదురుమదురుగా చెక్కబడి ఉంటాయి… అక్కడా అక్కడా వాళ్ళు గీసివెళ్ళిన పువ్వులూ లతలూ మొదలైన కళాకృతులు కూడా. బడి వెనకాలే చిన్న సెలయేరు వెళుతుంటుంది, దాని ఒడ్డున ఫర్ చెట్ల గుబుర్లు. సీసాల్లో తెచ్చుకున్న పాలు అక్కడే పెట్టుకుంటారు పిల్లలు, చల్లగా తియ్యగా ఉంటాయని.

ఆన్ ని మొదటిరోజు బడికి పంపుతూ మెరిల్లా లోలోపల ఆదుర్దా పడింది. ఈ  విడ్డూరపు శాల్తీ  తక్కిన పిల్లలతో కలుస్తుందా ? అసలు పాఠాలు జరిగేప్పుడు నోరు మూసుకుని ఉండగలదా ??

మెరిల్లా భయపడినంత ఘోరంగా లేనట్లుంది పరిస్థితి. ఆన్ ఆ సాయంత్రం మహా ఉత్సాహంగా ఇంటికొచ్చింది.

anne15-1

” ఈ బడికి వెళదామనే అనుకుంటున్నాను. అంటే టీచర్ పెద్ద నచ్చలేదులే. అస్తమానం మీసాలు మెలితిప్పుకుంటూ , ప్రిస్సీ ఆండ్రూస్ వైపు చూస్తూ ఉంటారు ఆయన. ప్రిస్సీ పెద్ద అమ్మాయి, తనకి పదహారేళ్ళట. వచ్చే ఏడు చార్లొట్ టౌన్ లో క్వీన్స్ అకాడమీ లో చేరేందుకు  ప్రవేశపరీక్ష రాస్తుందట, దానికోసం చదువుతోంది. తన జుట్టు భలే నల్లగా మెరుస్తూ ఉంటుంది..తనేమో తెల్ల..గా , చక్కగా ఉంటుంది. టిల్లీ  బౌల్టర్ అందీ, టీచర్  ప్రిస్సీ అంటే పడిచచ్చిపోతారని. ప్రిస్సీ అందరికంటే వెనకాల ,  పొడుగుబల్ల మీద కూర్చుంటుంది., తనకి పాఠం వివరిస్తానని  టీచర్ కూడా అక్కడే  కూర్చుంటారు. ప్రిస్సీ పలకమీద ఆయనేదో రాస్తే చదివి, ప్రిస్సీ మొహం బీట్ రూట్ లా ఎర్ర..గా అయిపోయిందట. కిసుక్కున నవ్విందట  కూడా.  రూబీ గిల్స్ చెప్పింది నాకు – అది పాఠాలకి సంబంధించిందైతే అస్సలు కాదని ”

” ఆన్ షిర్లే ! ” కోపంగా అడ్డుకుంది మెరిల్లా. ” టీచర్ గురించి ఇలాగేనా మాట్లాడేది ? నీకు తెలీనివేవో  ఆయన కి తెలుసా లేదా ? చెబుతారు  – నీ పని నేర్చుకోవటం మాత్రమే, ఆయన మంచిచెడ్డలు చర్చించటం కాదు. ఇలాంటి పిచ్చి కబుర్లు ఇంకెప్పుడూ చెప్పకు నాకు , గుర్తుంచుకో. ఇంతకీ ఎలావెలగబెట్టావు  బళ్ళో ? ”

” బుద్ధిగానే ఉన్నాగా ” – వక్కాణించింది ఆన్.  ” అంత కష్టంగా ఏమీ లేదులే. డయానా పక్కనే కూర్చున్నాను , ఇంకో పక్కనేమో కిటికీ ఉంది, అందులోంచి ప్రకాశమాన సరోవరం కనిపిస్తుంటుంది. ఆడుకుందుకు అంతమంది అమ్మాయిలు దొరకటం ఎంతో బావుంది. అయినా డయానా తర్వాతే ఎవరైనా, డయానా అంటే నాకు చాలా చాలా ఇష్టం. వాళ్ళందరికంటే నేను వెనకబడి ఉన్నాను- అందరూ అయిదో వాచకం చదువుతుంటే నేనింకా నాలుగోదాన్లోనే ఉన్నాను. కాని నాకున్నంత ఊహాశక్తి వాళ్ళెవరికీ లేదు, అర్థమైపోయింది నాకు. మిస్టర్ ఫిలిప్స్ నా స్పెల్లింగ్ చాలా ఘోరంగా ఉందన్నారు. నా తప్పులన్నిటినీ అడ్డంగా  కొట్టేసి , ఆ  పలకని ఎత్తి పట్టుకుని అందరికీ చూపించారు.  బాధేసింది నాకు –  కొత్తగా వచ్చాను కదా, ఇంకొంచెం మర్యాదగా ఉంటే ఏం పోతుంది ? రూబీ గిల్లిస్ నాకొక ఆపిల్ పండు ఇచ్చింది. సోఫియా స్లోన్ ఒక గులాబి రంగు కార్డ్ ఇచ్చింది – దాని మీద ‘ నేను మీ ఇంటికి రావచ్చా ? ‘ అని ఉంది. రేపు వెనక్కి పట్టుకుపోయి ఇచ్చెయ్యాలి తనకి. టిల్లీ బౌల్టర్ తన పూసల ఉంగరం నన్ను పెట్టుకోనిచ్చింది మధ్యాహ్నమంతా .  మనింట్లో పిన్ కుషన్ కి గుచ్చి విడి పూసలున్నాయి కదా, వాటిని తీసుకోవద్దా ..నేనూ ఉంగరం తయారు చేసుకుంటాను ? ఇంకానేమో మెరిల్లా – జేన్ ఆండ్రూస్ నాతో అందీ…మిన్నీ మెక్ ఫెర్సన్ చెప్పిందట తనకి – ప్రిస్సీ ఆండ్రూస్ నా ముక్కు బావుందని సారా గిల్లిస్ తో అంటుంటే విన్నానని. నా మొహం లో దేన్నైనా ఎవరైనా మెచ్చుకోవటం ఇదే మొదలు…ఏమిటో కంగారుగా ఉంది నాకు. నా ముక్కు నిజంగానే బావుంటుందా – నిజం చెప్పవా మెరిల్లా ? ”

” దానికేం..బాగానే ఉంది ” మెరిల్లా అంది. లోపల్లోపల అనుకుంది, నిజంగానే ఆన్ ముక్కు చక్కగా ఉంటుందని – అయితే ఆమాట ఆన్ తో చెప్పదల్చుకోలేదు.

ఇదంతా జరిగి మూడు వారాలైంది. ఇంతవరకూ అంతా సవ్యంగా, సాఫీగా జరిగిపోయింది. అది  సెప్టెంబర్ నెల… పెళపెళలాడే ఉదయం . ఆన్, డయానా – బర్చ్ దారిలో ఉల్లాసంగా , గబగబా వెళుతున్నారు.

” ఇవాళ గిల్బర్ట్ బ్లైత్ బడికొస్తాడనుకుంటాను  ”  – డయానా అంది . ” ఈ వేసంకాలమంతా న్యూ బర్న్స్ విక్ కి వాళ్ళ అత్తా వాళ్ళింటికి వెళ్ళి ఉన్నాడులే . శనివారం రాత్రే వచ్చాడట.  చాలా బావుంటాడు తెలుసా…ఆడపిల్లల్ని తె-గ ఏడిపిస్తాడు – ప్రాణాలు పోతుంటాయనుకో ”

డయానా చెప్పే తీరు చూస్తే ఆ  ‘ ప్రాణాలు పోతుండటం ‘  బాగానే ఉండే ట్లుంది.

anne15-2

” గిల్బర్ట్ బ్లైత్ ? ” ఆన్ అడిగింది – ” జూలియా బెల్స్ తో కలిపి అతని పేరు గోడ మీద రాశారు కదూ , అతనేనా ? ”

” ఆ. జూలియా అంటే అతనికేం ఇష్టం లేదన్నాడటలే – ఆమె మొహం మీది freckles  చూసి ఎక్కాలు నేర్చుకోవచ్చన్నాడట ”

” freckles గురించి నా దగ్గర  అనద్దు దయచేసి  ” – ” నా మొహానే ఇన్ని ఉండగా వాటి గురించి మాట్లాడటం ఏమీ  బావుండదు. ఇలా అబ్బాయీ అమ్మాయిల పేర్లు గోడల మీద రాయటమంతా తిక్క వ్యవహారం. నా పేరెవరైనా రాస్తే అప్పుడు చెబుతా- ఆ… రాస్తారని కాదులే ”

ఆన్ నిట్టూర్చింది. అలా రాయించుకోవాలని ఆమెకి లేకపోయినా , రాసే అవకాశమే ఉండకపోవటం అవమానకరంగా తోచింది.

” నా మొహం !  ” డయానా అంది . ఆమె నల్ల నల్లని కళ్ళూ మెరిసిపోయే జుట్టూ అవోన్లియా అబ్బాయిల గుండెలని రెప రెపలాడిస్తూ ఉంటాయి. దరిమిలా ఆరేడు సార్లు ఆమె పేరు గోడల మీదికి ఎక్కే ఉంది. ” అంతా ఉట్టుట్టినే.. ఏం ఉండదు వాటిలో. నీ పేరు ఎప్పుడూ ఎక్కదనేమీ అనుకోకు – చార్లెస్ స్లోన్ కి నువ్వంటే ఇష్టంలాగా ఉంది. నువ్వు చాలా తెలివైనదానివని వాళ్ళ అమ్మతో చెప్పాడట- అ- మ్మ- తో- నే, ఏకంగా ! ! అందంగా ఉన్నావనటం  కన్న అది మెరుగైన విషయం కదా ? ”

” కాదు- అస్సలు కాదు ” ఆన్ నిరాకరించింది – ఆమె అణువు అణువునా ఆడపిల్ల. ” రెండిట్లో ఏదో ఒకదాన్ని ఎంచుకొమ్మంటే అందాన్నే ఎంచుకుంటాను నేను. చార్లెస్ స్లోన్ ఏమీ బావుండడు – మిడిగుడ్లవాళ్ళు అసలు నచ్చరు నాకు. చార్లెస్ పేరూ నాదీ గోడ మీద ఎక్కితే ఏ మాత్రం భరించలేను నేను . క్లాస్ లో ఫస్ట్ రావటం బాగానే ఉంటుందనుకో … ”

” ఇప్పుడు గిల్బర్ట్ వస్తాడుగా , నీకు పోటీగా ! చాలా తెలివిగలవాడు – వాళ్ళ నాన్న ఆరోగ్యం బావుండక మూడేళ్ళపాటు వేరే ఊళ్ళో ఉండి , అక్కడ బడి సరిగా లేక , వెనకబడ్డాడు గానీ అసలు నీ క్లాస్ లో ఉండాల్సినవాడు కాదు , చార్లొట్ టౌన్ కి వెళ్ళి చదువుతుండేవాడు ఈపాటికి.. ఇకమీదట నువ్వు ఫస్ట్ రావటం అంత సులువేమీ కాదు  ”

” మంచిదే ” ఆన్ వెంటనే అంది . ” నా క్లాస్ లో అందరూ బొట్టికాయలే, వాళ్ళలో ఫస్ట్ రావటం ఏం గొప్ప ! బాగా చదువుతారనుకునే పిల్లలకి  కూడా ఏమీ రావు సరిగ్గా. నిన్న నేను ebullition  అనే పదం చెబితే ఒక్కళ్ళకీ స్పెల్లింగ్ తెలీలేదు ”

మధ్యమధ్యలో కొన్ని పాఠాలకి అందరూ కలుస్తుండేవారు. అప్పుడు ,  ప్రిస్సీ ఆండ్రూస్ లాటిన్ పాఠాన్ని మిస్టర్ ఫిలిప్స్ పర్యవేక్షిస్తూ ఉండగా డయానా ఆన్ కి రహస్యంగా చెప్పింది – ” అడుగో, చూడు – ఆ చివర్నుంచీ రెండోవాడే గిల్బర్ట్. బావున్నాడు కదూ ? ”

ఆన్ చూసింది. చాలాసేపే చూసే అవకాశం దొరికింది – తన ముందర వరసలో కూర్చుని ఉన్న రూబీ గిల్లిస్ జడని కుర్చీకి తగిలించి కదలకుండా పిన్ పెట్టే   ప్రయత్నంలో గిల్బర్ట్ శ్రద్ధగా నిమగ్నుడై ఉన్నాడు.. అది ఫలించింది.  రూబీ మాస్టారికి లెక్క చూపించబోతూ గబుక్కున లేచింది…కెవ్వుమంది- తన జడ మొదలంటా ఊడొచ్చిందనే అనుకుంది పాపం. అందరూ రూబీ వైపు చూశారు. మిస్టర్ ఫిలిప్స్ ఎంతలా ఉరిమి చూశాడంటే  రూబీ కి హడలు పుట్టి గోలు గోలున ఏడవటం మొదలెట్టింది. గుట్టు చప్పుడు కాకుండా పిన్ తీసి దాచిపెట్టి, గిల్బర్ట్ ఏమీ ఎరగనట్లు చరిత్ర పాఠం చదువుకుంటున్నాడు. ఆన్ తనవైపే చూస్తూ ఉండటం అప్పటికి గమనించి నాలుక బయటపెట్టి  వెక్కిరించాడు.

” గిల్బర్ట్ నిజంగానే బావున్నాడు ” ఆన్ ఒప్పుకుంది డయానా దగ్గర. ” కాకపోతే ధైర్యం మరీ ఎక్కువలాగుంది – ముక్కూమొహం తెలియని అమ్మాయిలని చూసి   అలా ఎవరైనా వెక్కిరిస్తారా ? ”

అయితే ఆ రోజు మధ్యాహ్నానికిగాని అసలు కథ మొదలవలేదు.

                                                               [ ఇంకా ఉంది ]

తెలుగుసేత: మైథిలీ అబ్బరాజు

Insta photo editor1439479795873 (1)

 

 

 

 

 

 

గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ -14

 

    Anne Of Green Gables By L.M.Montgomery

పిక్ నిక్ కి ముందరి రోజు సాయంత్రం. ఆ రోజు సోమవారం. మెరిల్లా మెట్లు దిగి వస్తోంది , ఆమె మొహం వాడిపోయి ఉంది.

మచ్చ లేకుండా తుడిచిన బల్ల మీద బటానీలు ఒలుస్తూ ఆన్- డయానా నేర్పిన పాట  ‘ హేజెల్ కనుమ లో నెల్ ‘ పాడుకుంటోంది..గొప్ప భావావేశం తో.   మెరిల్లా అడిగింది – ” నా అమెథిస్ట్  పిన్ ని నువ్వుగానీ చూశావా ఆన్ ? నిన్న ఆదివారం చర్చ్ నుంచి వచ్చి పిన్ కుషన్ కి గుచ్చి పెట్టాను..ఇప్పుడు చూస్తే ఎక్కడా కనిపించట్లేదు…”

ఆన్ మెల్లిగా చెప్పింది- ” ఇందాక..మధ్యాహ్నం… చూశాను , నువ్వు బయటికి వెళ్ళినప్పుడు. నీ గది పక్కనుంచి వెళుతూంటే కనిపించింది…చూద్దామని లోపలికి వెళ్ళాను ”

” తీశావా దాన్ని ? ” మెరిల్లా కటువుగా అడిగింది.

” ఆ..అవును ” – ఆన్ ఒప్పుకుంది. ” నా గౌన్ కి పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూద్దామని…”

” నీకు అవసరమా అదంతా ? చిన్నపిల్లవి…నా గదిలోకి నేను లేనప్పుడు వెళ్ళటం ఒక తప్పు, నీది కాని వస్తువుని తీయటం ఇంకొకటి. ఎక్కడ పెట్టావు దాన్ని ? ”

” అక్కడే..బీరువాలో పెట్టేశాను…ఒక్క నిమిషమే పెట్టుకుని తీసేశాను మెరిల్లా. అలా లోపలికి వెళ్ళి చూడటం తప్పని అనుకోలేదు నేను..ఇంకెప్పుడూ చెయ్యను. నాలో అదొక సుగుణం- ఏ పిచ్చి పనీ రెండో సారి చెయ్యను ” – చెప్పుకుంది.

” నువ్వు పెట్టెయ్యలేదు. బీరువాలో లేందే..ఎక్కడుంది ?  ఏం చేశావు ? ”

” పెట్టేశాను ” – ఆన్ కొంచెందూకుడు  గా అనేసింది. ” పిన్ కుషన్ మీదో, పింగాణీ గిన్నెలోనో – ఎక్కడో గుర్తురావటం లేదు..ఖచ్చితంగా పెట్టేశాను ”

” సరే, మళ్ళీ వెళ్ళి చూసొస్తాను. అక్కడ ఉంటే నువ్వు పెట్టేసినట్లు, లేదంటే లేనట్లు ”

వెళ్ళి బీరువాలోనే కాకుండా మొత్తం గదంతా వెతికింది…లేదు.

”  పిన్ లేదు , పోయింది. ఆఖరిసారి చూసింది నువ్వే గనుక నువ్వే చెప్పాలి. నిజం చెప్పు. ఎక్కడైనా దాచావా ? పారేసుకున్నావా ?? ”

” నాకేం తెలీదు ” ఆన్ కోపంగా చూసింది. ” నేను గదిలోంచి బయటికి తేలేదు దాన్ని , అదే నిజం , అంతే ”

ఆ ‘ అంతే ‘ అన్న మాట పెడసరంగా ఉందనిపించింది మెరిల్లా కి .

” నువ్వు అబద్ధం చెబుతున్నావు ఆన్ ” .. పదునుగా అంది-  ” నిజం చెప్పదల్చుకోకపోతే ఇంకేమీ చెప్పకు నాకు . నీ గదిలోకి పోయి అక్కడే ఉండు, ఒప్పుకుంటానంటేనే బయటికి రా ”

” మరి బటానీలు ఎవరు ఒలుస్తారు ? ” ఆన్ దిగాలుగా అడిగింది.

” నేను చేసుకుంటాలే . చెప్పి నట్టు చెయ్యి నువ్వు ”

Mythili

ఆ సాయంత్రమంతా మెరిల్లా మనసు వికలంగానే ఉంది. ” ఎంతో విలువైన పిన్ అది..ఆన్ ఎక్కడ  పారే సిందో   ఏమో .. ఎలా ? అది తప్పించి ఎవరు తీస్తారు- ఎంతకీ ఒప్పుకోదేం ? దొంగిలించాలని తీసి ఉండదులే..దాని పిచ్చి ఊహలకి బావుంటుందని పట్టుకుపోయి ఎక్కడో పడేసి ఉంటుంది…ఆ మాట ఒప్పుకునేందుకు భయపడుతోంది. అబద్ధం చెబితే ఎలా మరి ? అది మోసం చేసినట్లు..ఇంట్లో ఉండే పిల్ల అలా చెయ్యకూడదు కదా..దాని కి  కోపం ఎక్కువనుకున్నాను..అబద్ధం కన్నా కోపమే నయం .   అది నిజం చెబితే చాలు నాకు, పిన్ పోయినా పర్వాలేదు…”

మధ్య మధ్యన గదిలోకి వెళ్ళి వెతుకుతూనే ఉంది..ఎక్కడా పిన్ జాడ లేదు. రాత్రి పొద్దుపోయాక ఆన్ గదికి వెళ్ళి మళ్ళీ నిలదీసింది- ఏం లాభం లేకపోయింది. మర్నాడు పొద్దున మాథ్యూ కి చెప్పింది. అతను కళవళ పడ్డాడు. ఆన్ మీద అతని నమ్మకం అంత త్వరగా పోయేది కాదు..కాని పరిస్థితులు ఆన్ కి వ్యతిరేకంగానే ఉన్నాయి.

” ఒకవేళ బీరువా వెనకాలకి పడిపోయిందేమో చూశావా ? ”

” ఆ. ముందుకి జరిపి మరీ చూశాను. అన్ని సొరుగులూ మూల మూలలా గాలించాను. అది పోయింది..ఆన్ తీసి ఎక్కడో పడేసింది, అబద్ధం చెబుతోంది …అంతే. మనకి మింగుడు పడకపోయినా ఆ సంగతి ఒప్పుకోవాల్సిందే ”

” ఏం చేస్తావు అయితే ? ” అడిగాడు…బొత్తిగా రుచించటం లేదు ఇదంతా.

” ఒప్పుకునేదాకా దాని గదిలోనే ఉండనీ ” – మిసెస్ రాచెల్ కి క్షమాపణ చెప్పే విషయం లో ఆ పద్ధతి పనిచేసినట్లు గుర్తు తెచ్చుకుని మెరిల్లా నిబ్బరించుకుంది. ” అది ఎక్కడ పెట్టిందో చెబితేనే కదా పిన్ దొరుకుతుంది ..ఏమైనా దాన్ని గట్టిగా శిక్షించాల్సిందే ”

” సరే. నీ ఇష్టం. నీకు తోచినట్లు చెయ్యి. నేను మటుకు కల్పించుకోను ” చెప్పేసి వెళ్ళిపోయాడు.

మెరిల్లాకి తనని అందరూ వదిలేశారనిపించింది. ఈ విషయం మిసెస్ రాచెల్ కి చెప్పి సలహా అడిగేందుకు కూడా లేదు. ఆన్ గదిలోకి మళ్ళీ వెళ్ళి ‘ నిజాన్ని ‘ రాబట్టే ప్రయత్నం చేసింది…ఆన్ మొండిగా అదే జవాబు. ఏడ్చేడ్చి ఆన్ కళ్ళు వాచిఉన్నాయి..మెరిల్లాకి జాలేసింది- కాని మనసు మార్చుకోదల్చుకోలేదు.

” ఏం జరిగిందో చెబితేనే నువ్వు బయటికొచ్చేది..తేల్చుకో ”

anne14-1

” అయ్యో..పిక్ నిక్ రేపే కదా మెరిల్లా ? నన్ను వెళ్ళనిస్తావు కదూ ..ఇక్కడే ఉంచెయ్యవు కదూ ? వెళ్ళొచ్చాక ఎన్ని రోజులు ఇక్కడే ఇలాగే ఉండిపొమ్మన్నా ఉంటాను ”- ఆన్ దీనంగా  బతిమాలుకుంది.

” పిక్ నిక్ లేదూ ఏం లేదు – నువ్వు ‘ ఒప్పుకుంటే ‘ నే ”

” మెరిల్లా…” ఆన్ కి ఊపిరి అందలేదు.

మెరిల్లా మాట్లాడకుండా తలుపు మూసి వెళ్ళిపోయింది.

.                  .                      .                    .                     .

పిక్ నిక్ కోసమా అన్నట్లు ఆ రోజున- బుధవారం – ఆకాశం ఎక్కడా మబ్బు తునకైనా లేకుండా నిర్మలంగా ఉంది…సూర్యుడు హాయిగా వెలుగుతున్నాడు. గ్రీన్ గేబుల్స్ చుట్టూ చెట్ల మీద పక్షులు పాడుకుంటున్నాయి. తోటలో  మడోనా లిల్లీలు విచ్చుకున్న పరిమళం గాలి తెరలమీంచి తేలివచ్చి ప్రతి గదినీ దేవతల ఆశీస్సులాగా నింపుతోంది. కొండవాలు లో బర్చ్ చెట్లు సంతోషంగా చేతులూపాయి…ప్రతిరోజూ ఆన్ వాటిని తనూ  చేతులూపి పలకరిస్తుంటుంది. అయితే ఇవాళ ఆన్   కిటికీ దగ్గరలేదు . మెరిల్లా ఉదయపు అల్పాహారం తీసుకెళ్ళినప్పుడు   తన మంచం మీదే బాసిపట్టు వేసుకు కూర్చుని ఉంది.  మొహం లో అదొకలాంటి పట్టుదల, బిగించిన పెదవులు.

” మెరిల్లా..ఒప్పుకుందుకు సిద్ధంగా ఉన్నాను ”

” అవునా ” మెరిల్లా పళ్ళెం కింద పెట్టింది. తన ‘ పద్ధతి ‘ మళ్ళీ పనిచేసింది – కాని ఆ విజయం మెరిల్లా కి చేదుగానే ఉంది .

” ఊ. చెప్పు. ఏమైందో ”

” నేను అమెథిస్ట్ పిన్ ని తీసుకున్నాను ” పాఠం అప్పజెబుతున్నట్లు మొదలుపెట్టింది ..” అచ్చం నువ్వు చెప్పినట్లే. ముం   దైతే తీసుకోవాలనుకోలేదు- కాని చాలా చాలా అందంగా ఉందనిపించింది. చాపల్యానికి లోనైపోయాను. నా గౌన్ కి తగిలించుకున్నదాన్ని తీయ బుద్ధి కాలేదు. మా ‘ తీరికగూడు ‘ కి పట్టుకుపోయి డయానా కి చూపించాలనిపించింది. మేము రోజ్ బెర్రీ లు గుచ్చి రత్నహారాలుగా ఊహించుకుంటూ ఉంటాము.. అమెథిస్ట్ ల ముందు అవేం పనికొస్తాయి .. కానీ డయానా అక్కడికి రాలేదు. నువ్వు వచ్చేలోపు వెనక్కి పెట్టెయ్యాలనుకున్నాను. ఎక్కువ సేపు పెట్టుకుని ఉండచ్చని చుట్టుదారిమీంచి ఇంటికి వస్తున్నాను. వంతెన మీద నడుస్తుంటే ఒకసారి తీసి చూడాలనిపించింది. ఎండలో తళ తళ తళా మెరిసిపోతోంది…వంతెన  ప్రకాశమాన సరోవరం మీద కదా ఉంది..వంగి చూస్తూ ఉంటే – టప్ మని నీళ్ళల్లో పడిపోయింది. ఊదారంగు లో వెలిగి పోతూ కిందికి..కిందికి..నీళ్ళ అడుక్కి ..పడిపోయింది…మునిగిపోయింది. అంతే మెరిల్లా- నేను చెప్పేది ”

మెరిల్లా కి మండిపోయింది. ” అంత అపురూపమైన పిన్ ని పోగొట్టేసి  ఎంత నిదానం గా చెబుతోంది , ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా ? ”

వీలైనంత నెమ్మదిగా అంది –  ” ఆన్- ఎంత ఘోరమైన పని చేశావు..పాపిష్టిదానా ”

” అవును. పాపిష్టిదాన్ని ” – ఆన్ ప్రశాంతంగా ఒప్పేసుకుంది. ” నన్ను శిక్షించాలి..నాకు తెలుసు. అది నీ బాధ్యత. అదేదో తొందరగా చేసెయ్యి మెరిల్లా, అయిపోతే పిక్ నిక్ కి వెళ్తాను ”

” పిక్ నికా ఇంకేమన్నానా ? నువ్వు వెళ్ళటానికి వీల్లేదు – అదే నీకు శిక్ష. నీ తప్పు కి వెయ్యాల్సినదాన్లో అది సగం శిక్ష కూడా కాదసలు ”

 

” పిక్ నిక్ కి వెళ్ళద్దా ….” ఆన్ దిగ్గున లేచి మెరిల్లా చెయ్యి పట్టేసుకుంది-  ” ఇది అన్యాయం మెరిల్లా. నువ్వు వాగ్దానం చేశావు నాకు వెళ్ళచ్చని. నేను వెళ్ళి తీరాలి మెరిల్లా- అందుకే ఒప్పుకున్నాను. దయ చేసి…దయచేసి – నన్ను వెళ్ళనీ మెరిల్లా. ఐస్ క్రీమ్   మెరిల్లా..మళ్ళీ జన్మ లో తినగలనా చెప్పు ? ”

మెరిల్లా చేతులు విడిపించుకుంది..రాయిలాగా అంది  – ” నువ్వు బతిమాలక్కర్లేదు ఆన్. నువ్వు పిక్ నిక్ వెళ్ళట్లేదు – అంతే. ఇంకేం మాట్లాడకు ”

ఇక మెరిల్లా మనసు మారదని ఆన్ కి అర్థమైంది. హృదయవిదారకం గా కేక పెట్టి పక్క మీద వాలిపోయింది. తీవ్రమైన ఆశాభంగం తో, నిర్వేదం తో , ఒంటరితనం తో – కుమిలి కుమిలి ఏడ్చింది.

మెరిల్లా ఉక్కిరిబిక్కిరైంది – ” ఓరి దేవుడా – ఏం పిల్ల ఇది.. దీనికి పిచ్చి గాని లేదు కదా ? లేదంటే నిజంగానే దీని కి వెధవ బుద్ధులున్నాయా…రాచెల్ మొదట చెప్పిందే నిజమా ? ‘’  – ఉక్రోషం వచ్చింది …’’ అయితే కానీ..పని మొదలుపెట్టాక  మధ్యలో విడిచేది లేదు ”

ఆ ఉదయమంతా దరిద్రంగా గడిచింది. మెరిల్లా పూనకం వచ్చినదానిలాగా అప్పటికే శుభ్రంగా ఉన్న ఇల్లంతా రుద్ది రుద్ది శుభ్రం చేసింది…ఇంకా దుగ్ధ తీరక పశువుల సాల ని పరా పరా ఊడవటం మొదలెట్టింది.

మధ్యాహ్నం భోజనానికి రమ్మని ఆన్ ని పిలిచింది. ఆన్ కి ఇష్టమైనవి వండానని చెప్పింది. కన్నీళ్ళతో తడిసిన చిన్న మొహం మేడ మీంచి బిక్కుబిక్కుమంటూ తొంగి చూసింది.

” నాకు భోజనం వద్దు మెరిల్లా ” వెక్కుతూ చెప్పింది – ” ఏం తినలేను నేను. నా గుండె బద్దలైపోయింది. దాన్ని పగలగొట్టినందుకు నువ్వు ఒకనాటికి పశ్చాత్తాపం చెందుతావు , కాని నిన్ను క్షమిస్తున్నాను. ఆ రోజు వచ్చినప్పుడు నిన్ను క్షమించానని గుర్తు చేసుకో. నన్నేమైనా తినమని మాత్రం అడక్కు …నాకు ఇష్టమైనవి అసలు తినను.  మనసు బాగాలేనప్పుడు మంచిభోజనం తినటం ఎంత మాత్రం బాగుండదు ”

మెరిల్లాకి నిస్సహాయం గా అనిపించింది. ఆగ్రహం వచ్చింది. మాథ్యూ రాగానే అంతా వెళ్ళబోసుకుంది. ఆన్ మీద మమకారం ఒక పక్కా తప్పు చేస్తే దండించాలనే న్యాయం ఒక పక్కా మాథ్యూ మనసులో యుద్ధం చేశాయి.

” ఆన్ ఆ పిన్ తియ్యటమూ పోగొట్టేసి అబద్ధాలు చెప్పటమూ తప్పేలే మెరిల్లా ” వడ్డించిన భోజనాన్ని చూస్తూ అన్నాడు. ఆ పదార్థాలు అతనికీ ఇష్టమే, అతనికీ తిన బుద్ధి కావటం  లేదు.  ఉండబట్టలేకపోయాడు – ” కాని పాపం చిన్న పిల్ల కదా అది..ఎంతో సరదా పడింది కూడానూ. పిక్ నిక్ మానిపించెయ్యటం మరీ  కఠినంగా లేదూ ? ”

” మాథ్యూ కుత్ బర్ట్- నాకు ఆశ్చర్యమేస్తోంది నీ మాటలు వింటుంటే. అది ఎంత వెధవపని చేసిందో తెలిసి కూడా.. ! కాస్త కూడా పశ్చాత్తాపం లేదు దానికి. తప్పు చేశానని దానికి అనిపిస్తోందంటే నయంగా ఉండేది . ఊరూరికే దాన్ని వెనకేసుకొస్తున్నావు – తెలుస్తోందా నీకు ? ”

” అవుననుకో.. పాపం..బుజ్జిది కదా అది…కొంచెం చూసీచూడనట్లు పోవచ్చు కదా.. దానికి సరైన పెంపకం లేదు..”

” ఇప్పుడు నేను చేస్తున్నది అదే- పెం-ప-కం ” – మెరిల్లా విసురుగా అడ్డుకుంది.

మాథ్యూ కి ఆ మాట నిజమనిపించలేదు – కాని ఇంకేం మాట్లాడలేకపోయాడు. పాలేరు కుర్రాడు జెర్రీ బ్యుయోట్ తప్ప ఇంకెవరూ మాట్లాడలేదు భోజనం చేస్తూ. జెర్రీ అంత ఉత్సాహం గా ఉండటం మెరిల్లాకేం నచ్చలేదు కూడానూ.

పనంతా అయిపోయాక మెరిల్లాకి తన నల్ల శాలువా లో చిరుగు ఉందని  గుర్తొచ్చింది . సోమవారం  బయటికి కప్పుకుని వెళ్ళింది , దోవలో చెట్టుకొమ్మకి పట్టుకుని చిరిగింది. ఇంటికి వెళ్ళగానే కుట్టుకోవాలనుకునీ ఆ పిన్ గొడవలో కుదర్లేదు.అప్పుడు వెళ్ళి శాలువాని పెట్టె లోంచి బయటికి తీ..స్తూ..ఉండగా..అందులో చిక్కుకుని ఉన్న వస్తువేదో..ఊదారంగు లో మిలమిలమంది. చూస్తే ఏముందీ…శాలువా లేస్ లో ఇరుక్కుని- అమెథిస్ట్ పిన్.

మెరిల్లాకి గుండె గుబుక్కుమంది. ” దేవుడా..ఇదేమిటిది ?? నా పిన్ ఇక్కడే ఉంది..బారీ చెరువులో కాదు !! తీశాననీ పోయిందనీ ఆ గాడిద ఎందుకు చెప్పినట్లు ? సోమవారం ఇంటికొచ్చి శాలువాని బీరువాలో పెట్టినట్లు గుర్తు..పిన్ ఆ బీరువాలోనేగా పెట్టానంది ఆన్…అప్పుడు శాలువాలో చిక్కుకుపోయి ఉంటుంది ”

మెరిల్లా పిన్ ని చేతిలో కనబడేలాగా పట్టుకుని ఆన్ గదికి వెళ్ళింది . ఆన్ ఏడ్చి ఏడ్చి అలిసిపోయి నిస్తేజంగా కిటికీ దగ్గర కూర్చుని ఉంది.

” ఆన్ షిర్లే ! ” మెరిల్లా గంభీరమైన గొంతుతో  పిలిచింది. ” ఇదిగో- నా పిన్ దొరికింది- నా నల్ల శాలువా లేస్ కి వేలాడుతోంది. తీసి బయటికి పట్టుకుపోయాననీ చెరువులో పడిపోయిందనీ ఎందుకు చెప్పావు నాతో ? ”

anne14-2

” నేను’ ఒప్పుకునే ‘ వరకూ బయటికి రాకూడదని నువ్వేగా చెప్పావు ? ” – ఆన్ నీరసంగా చెప్పింది – ”  పిక్ నిక్ కి వెళ్ళి తీరాలి గనుక ఒప్పుకోవాలనుకున్నాను. రాత్రి నిద్రపోయే ముందర , ఎలా చెబితే ఆసక్తిగా ఉంటుందో ఊహించి పెట్టుకున్నాను. మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ వల్లె వేసుకున్నాను. ఏం లాభం..నువ్వు నన్ను వెళ్ళనివ్వనే లేదు , నా శ్రమంతా వృధా అయిపోయింది ”

మెరిల్లాకి నవ్వూ బాధా ఒకేసారి వచ్చాయి.

” అఖండురాలివే నువ్వు ! నాదే తప్పు..ఒప్పుకుంటున్నాను. ..పాపం నువ్వు చెప్పిన మాట నమ్మలేదు , నువ్వు కథ కల్పించి చెప్పావు. చెయ్యని పని చేశానని ఒప్పుకోవటం నీదీ తప్పే- కాని దానికి నేనే కారణం. నన్ను క్షమించెయ్యి. త్వరగా తయారవు , పిక్ నిక్ కి పోదువుగాని ”

ఆన్ తారాజువ్వలాగా లేచింది – ” ఆలస్యమైపోలేదూ ?? ”

” లేదులే. ఇంకా మధ్యాహ్నం రెండు గంటలేగా అయింది- ఇప్పుడే అందరూ చేరుకుని ఉంటారు. ఇంకో గంట తర్వాత గాని తినటాలూ అవీ  ఉండవు. మొహం కడుక్కుని తల దువ్వుకో. కొత్త గౌను ఇంకోటి ఉందిగా, వేసుకో.  ఈ లోపు నీకు బుట్టలో కేకులూ బిస్కెట్లూ సర్దిపెడతాను. జెర్రీ బ్యుయోట్   ని బండి సిద్ధం చెయ్యమని చెబుతాను- నిన్ను అక్కడ దింపుతాడు ”

” ఓ మెరిల్లా ” ఆన్ ఎగిరివెళ్ళి మొహం కడుక్కుని వచ్చింది. తల దువ్వుకుంటూ ” ఐదు నిమిషాల కిందట నేనెందుకు పుట్టానా అనుకుంటున్నాను..ఇప్పుడైతే స్వర్గానికి  రమ్మన్నా వెళ్ళను ”

చివరికంటా అలిసిపోయి , ఆనందం లో మునిగిపోయి –  ఆ రాత్రి ఇంటికి తిరిగొచ్చిన ఆన్ మనసు ఎంత అద్భుతమైన స్థితిలో ఉందో చెప్పేందుకు లేదు.

” పిక్ నిక్ ఎంత ‘ రుచిరం ‘గా గడిచిందో మెరిల్లా  ! ఆ ‘ రుచిరం ‘ అనే మాట ఇవాళే నేర్చుకున్నా…మేరీ ఆలిస్ బెల్ అంది అలా . బావుంది కదూ ? అంతా ఎంతో బావుంది. టీ తాగి కేకులు తిన్నాక మిస్టర్ హార్మన్ ఆండ్రూస్ మమ్మల్ని  ప్రకాశమాన సరోవరం లో పడవ మీద తీసుకువెళ్ళారు.  ఒకసారికి ఆరుగురు వెళ్ళాం. జేన్ ఆండ్రూస్ అయితే నీళ్ళల్లో పడిపోబోయింది తెలుసా ? తామర పువ్వులు కోసుకుందామని వంగాము..అప్పుడన్నమాట. మిస్టర్ ఆండ్రూస్ పట్టుకోకపోతే మునిగిపోయి ఉండేదే. నాకే అలా జరిగిఉంటే బావుండేది…ఇంచుమించు మునిగిపోయానని అందరికీ చెప్పుకోవటం భలే ఉండేది…! ఐస్ క్రీమ్   తిన్నాం…ఎలా ఉందో చెప్పేందుకు ఎన్ని మాటలూ సరిపోవు… దివ్యంగా ఉంది అంతే. ”

ఆ రాత్రి ఊలు మేజోళ్ళు అల్లుతూ మాథ్యూ కి అంతా చెప్పుకుపోయింది మెరిల్లా.

” తప్పు చేశానని ఒప్పుకుందుకు సిగ్గు పడను …గుణపాఠం కూడా నేర్చుకున్నాను. ఆన్ ‘ ఒప్పుకోలు ‘ తలచుకుంటే ఇప్పుడు నవ్వొస్తోంది. నవ్వకూడదు నిజానికి ,  కాని అది నిజం కాదు కదా…కాకపోవటం ఎంతో హాయిగా ఉంది ప్రాణానికి. ఈ పిల్లని అర్థం చేసుకోవటం కష్టమే- కాని మంచిగానే తయారవుతుంది , అందుకు  ఢోకా లేదు. ఒకటి మాత్రం నిజం..ఇది ఉంటే  తోచకపోవటమన్నది ఉండదు ”

                                                      [ ఇంకా ఉంది ]

 

 

 

 

 

గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ -13

 

       [ Anne Of Green Gables By L.M.Montgoemry ]

                                   [ గత సంచిక తరువాయి ]

  ఆగస్ట్ నెల మధ్యాహ్నం. బంతిపువ్వు రంగు ఎండలో పరిసరాలన్నీ జోగుతున్నాయి. బయటికి ఒకసారీ గడియారం వైపు ఒకసారీ చూసి మెరిల్లా అనుకుంది – ” ఆన్ ఈ పాటికి వచ్చేసి కుట్టు పని మొదలెట్టుకోవద్దూ ? డయానా తో ఆడుకుంటూ అసలే అరగంట ఆలస్యం గా వచ్చింది..సరాసరి లోపలికి రాకుండా ఆ కట్టెల మోపుల  మీద కూర్చుని మాథ్యూ తో కబుర్లు మొదలెట్టింది ! ఏముంటాయో అన్నేసి మాటలు..గంటలు గంటలు దొర్లిపోతూ…ఆ మాథ్యూ అంతకన్నా –  అది ఏం చెప్పినా చెవులు దోరబెట్టుకు వింటుంటాడు. దాని కబుర్లు ఎంత పిచ్చిగా ఉంటే అంత సంతోషపడిపోతాడేమిటో…

‘’   ఏయ్ ఆన్ షిర్లే !! వినిపిస్తోందా ? రా ఇక్కడికి ” – పడమటి కిటికీ మీద టపటపా కొట్టింది. ఆన్ వచ్చింది…ఉత్సాహానికి కందిపోయిన బుగ్గలేసుకుని, తళతళ మనే కళ్ళతో  గంతులేసుకుంటూ  – జడలు ఊడిపోయిన జుట్టు ఆమె వెనకాల ఎగురుకుంటూ లోపలికి  వచ్చింది.

” ఓ మెరిల్లా…తెలుసా…వచ్చే ఆదివారమటా, పిక్ నిక్ అట…!!!! ప్రకాశమాన సరోవరం పక్క..నే – మిస్టర్ హార్మన్ ఆండ్రూస్ పొలం లేదూ..అక్కడంట. మిసెస్ బెల్ల్ , మిసెస్ రాచెల్ కలిసి ఐస్ క్రీ మ్   తయారు చేసి తెస్తారట …ఐస్ క్రీ మ్ …!!!!! నేను వెళ్ళొద్దా ?? ”

మెరిల్లా ఏం తొణకలేదు – ” ఒకసారి గడియారం చూడు తల్లీ, ఎంతైందీ ? నేను ఎన్నింటికి రమ్మన్నాను నిన్ను ? ఆ.. ? ”

” రెండింటికి. పిక్ నిక్ ఉండటం ఎంత…బావుందో కదా …ఎప్పట్నుంచో కలలు కంటున్నాను దాని    గురించి….మం..చిదానివి కదూ మెరిల్లా..పంపించవా నన్ను ? ”

” సరిగ్గా రెండు గంటలకి రమ్మన్నాను నిన్ను- ఇప్పుడు రెండూ ముప్పావు అయింది ..నా మాటెందుకు వినలేదో చెప్పు ముందు ”

” వద్దామనే అనుకున్నాను మెరిల్లా , డయానా వాళ్ళ తోటలో కొత్త పువ్వులు పూశాయి గదా అని  చూస్తుంటే ఆలస్యమైపోయింది.  తర్వాతేమో మాథ్యూ కి పిక్ నిక్ గురించి చెప్పాను ఇప్పటిదాకా …నేను వెళ్ళద్దా చెప్పు , దయచేసి…”

” నీ ఉబలాటాలు కొంచెం తగ్గించుకుంటే సంతోషిస్తాను ..రెండు గంటలూ అంటే రెండు గంటలే అని అర్థం , అరగంట తర్వాత అని కాదు. పిక్ నిక్ – ఆ , వెళ్ళచ్చులే, ఆదివారం బడికి ప్రతివారమూ వెళతావుగా , దీనికి వెళ్ళకపోతే బావుండదు ”

MythiliScaled

” అది కాదు మెరిల్లా.. డయానా చెప్పిందీ , ప్రతి వాళ్ళూ ఒక్కొక్క బుట్టతో తినుబండారాలు తీసుకెళ్ళాలట – నాకు వంట చేయటం రాదుగా మరి… బుట్ట చేతులు లేకుండా బడికైనా వెళ్ళచ్చుగానీ తినేవేమీ  లేకుండా పిక్ నిక్ కి వెళితే ఏమీ బావుండదేమో కదా , ఇందాకట్నుంచీ ఇదే ఆలోచిస్తూ ఉన్నాను ”

” అంత కంగారేం పడక్కర్లేదులే. బిస్కెట్ లూ  కేక్ లూ బేక్ చేసి ఇస్తాను –  బుట్టనిండుగా పట్టుకుపోదువుగాని ”

” మెరిల్లా..మెరిల్లా…ఎంత మంచిదానివి ! ఎంత గొప్పదానివి !! నన్నెంత బాగా చూస్తున్నావు !!!!! ”  చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది ఆన్.  మెరిల్లా ని చిన్న పిల్లెవరైనా ముద్దు పెట్టుకోవటం ఆమె జీవితం లో అదే మొదటిసారి – ఆనందం పొంగుకువస్తున్నా పైకి తేలకుండా బింకం గా –

” ఆ..చాలు చాలు…పిచ్చి హడావిడి చెయ్యకు. చెప్పింది చెప్పినట్లు చేస్తే అంతే చాలు .  నీకు వంట నేర్పుదామనే నా ప్రయత్నం ..ఏదీ , నీ బుద్ధికి కుదురు ఉంటే కదా ? పొయ్యి మీద ఏదో పెట్టినప్పుడే నీకు ఎక్కడెక్కడి ఊహలూ ఆలోచనలూనాయె…సరేలే, ఆ బొంత కుట్టే పని వదిలేసి పోయావుగా ఇందాక, పూర్తి చేసెయ్యి ఇప్పుడు ”

” ఇలా  అతుకులు పెట్టి కుట్టటం నాకేం నచ్చలేదు ” – ఆన్ నసపెట్టుకుంటూ పనిమొదలెట్టింది. ” కొన్ని రకాల కుట్టుపనులు  బాగానే ఉంటాయి గాని  ఇందులో ఊహించుకుందుకు ఏ..మీ ఉండదు..ఒక గుడ్డ ముక్క ని ఇంకొకదానికి అతికించి కుట్లు వేయటం తప్ప ! అయినా పర్వాలేదులే , ఇంకెక్కడో ఉండి రోజంతా ఆడుకోవటం కంటే గ్రీన్ గేబుల్స్ లో ఉండి బొంత కుట్టటమే నయం. అయినా..డయానా తో ఆడుకునేప్పుడు కాలం ఎంత గబ గబా  గడిచిపోతుందో ..ఇప్పుడసలు కదలదేం ??? అక్కడ ఎంత బాగా గడిచిందో తెలుసా మెరిల్లా ? ఊహించటం నాకు బాగా వచ్చు, అదే చేస్తూ ఉంటాను – తక్కినవన్నీ డయానా బ్రహ్మాండంగా చేసేస్తుంది.మన చోటుకీ డయానా వాళ్ళదానికీ మధ్యలో , వాగు పక్కన చిన్ని , సన్నటి చోటుంది చూడు , మిస్టర్ విలియం బెల్ వాళ్ళది – అక్కడొక మూల బర్చ్ చెట్లు గుండ్రం…గా పెరిగాయి. మేమిద్దరం అక్కడ బొమ్మరిల్లు కట్టాం… దానిపేరు ‘ తీరిక గూడు ‘ ..బావుందా ? నేనే పెట్టాలే అది…రాత్రంతా మేలు కుని..సరిగ్గా నిద్రపోబోయే ముందర తట్టింది .   నువ్వొకసారి వచ్చి చూడు మెరిల్లా.. పెద్ద పెద్ద రాళ్ళున్నాయి, వాటి మీద మెత్త..గా నాచు కూడా ఉంది, అవి మా కుర్చీలు. చెట్టునుంచీ చెట్టుకి అడ్డంగా కొమ్మలున్నాయి , వాటి మీద మా గిన్నెలూ అవీ పెట్టుకుంటామన్నమాట. అన్నీ కొంచెం పగిలిపోయిన గిన్నెలే ననుకో, బాగున్నట్లు ఊహించుకోవటం ఏం కష్టం చెప్పు ? ఒక పింగాణీ పళ్ళెం మీదయితే తెలుపూ ఎరుపూ తీగలు …ఎంతో అందంగా ఉంది అది. ఇంకో గాజు గిన్నె కూడా ఉంది మాకు  ..అది అచ్చం గంధర్వులది లాగా ఉంటుంది…కలల్లో మటుకే కనిపించేలాగా.   దాని మీద చిట్టి చిట్టి ఇంద్రధనుస్సులు…అంటే పిల్లవి అన్నమాట, ఇంకా పెద్దవి అవలేదు. వాళ్ళింట్లో వేలాడే గాజు దీపం ఉండేదట –  దాన్లోంచి ఊడిపడిందని డయానా వాళ్ళ అమ్మ చెప్పారు… కాని ఎవరో గంధర్వకన్యలు వెన్నెట్లో నాట్యం చేసుకుంటూ మర్చిపోయారనుకుంటున్నాం మేము ..ఇలాగే బావుంది కదా ?

anne13-2

అక్కడ వేసుకుందుకు మాథ్యూ మాకొక చిన్న బల్ల తయారుచేసి ఇస్తానన్నాడు. అక్కడొక కొలనుంది కదా, దానికి విల్లోమియర్ అని పేరు పెట్టాను. డయానా నాకొక పుస్తకం ఇచ్చిందిలే, అందులో దొరికింది ఆ పేరు. భలే పుస్తకం అది మెరిల్లా, అందులో అమ్మాయిని ఏకంగా అయిదుగురు ప్రేమిస్తారు..నాకైతే ఒక్కళ్ళు చాలనుకో…మరి నీకు ? ఆ అమ్మాయి గొ..ప్ప సౌందర్య రాశి అట,  ఊరూరికే మూర్ఛ పోతూ కూడా ఉంటుంది. నేనిప్పటి వరకూ ఒక్కసారి కూడా  మూర్ఛ పోలేదు , పోగలితే ఎంచక్కానో ఉంటుంది ..కదా మెరిల్లా ? నేను సన్నగా ఉన్నా చాలా ఆరోగ్యం గా ఉన్నాను ..అందుకని మూర్ఛపోననుకుంటా. అయినా నేను లావవుతున్నట్లున్నాను ఈ మధ్య..కదా ? పొద్దుటే లేవగానే నా మోచేతులు బొద్దుగా అయి సొట్టలు పడుతున్నాయేమోనని చూసుకుంటుంటాను. డయానా , మోచేతుల దాకా చేతులున్న గౌన్ లు కుట్టించుకుంటోందట, ఒకటి ఆదివారం పిక్ నిక్ కి వేసుకొస్తుందట…పిక్ నిక్ బుధవారమే అయితే బావుండేది… ఒకవేళ ఏమైనా జరిగి ,  నేను వెళ్ళలేకపోతే నా ఆశాభంగాన్ని భరించలేను మెరిల్లా ! ఆ తర్వాత జీవించి ఉంటానేమో గాని నాకు అది ఆజన్మ శోకం అవుతుంది…ఆ తర్వాత ఇంకో వంద పిక్ నిక్ లకి వెళ్ళినా సరే , ఆ బాధ తగ్గదు ! పిక్ నిక్ లో ప్రకాశమాన సరోవరం లో పడవల మీద వెళతామట..చెప్పారు..ఐస్ క్రీమ్  తింటూ అట. నేనింతవరకూ తినలేదు..డయానా అది ఎలా ఉంటుందో వివరించబోయింది , కాని ఊహ కి కూడా అందని సంగతుల్లో ఐస్ క్రీమ్   ఒకటి అనిపించింది… ‘’

anne13-3

ఎట్టకేలకి , అప్పటికి ఆన్ ఉపన్యాసం ముగిశాక –  మెరిల్లా అంది – ” ఆపకుండా పదినిమిషాలు మాట్లాడావు , లెక్కపెట్టాను నేను. అంతే సేపు నోరు మూసుకుని ఉండగలవా..చూద్దాం ? ”

” ఎదురుచూస్తూ ఉండటమే సగం సంతోషం కదా మెరిల్లా…ఆ తర్వాత అనుకున్నట్లు జరగకపోయినా కూడా, అనుకుంటూ ఉండటం ఎంత సరదాగా ఉంటుందో ! మిసెస్ రాచెల్ అన్నారు  – ‘ ఏమియును ఆశించనివారు ధన్యులు , వారు ఆశాభంగమును పొందరు ‘ .  కానీ  , ఏమీ ఆశించకుండా ఉండటం కంటే ఆశాభంగాన్ని పొందటం చాలా చాలా నయమనిపిస్తుంది ”

 

అమెథిస్ట్ జాతి రాళ్ళు  తాపడం చేసిన పిన్ ఒకటి మెరిల్లా దగ్గర ఉంది. ప్రతి ఆదివారమూ చర్చ్ కి వెళ్ళేప్పుడు మెరిల్లా దాన్ని తన గౌన్ కి పెట్టుకుంటుంది. దాన్ని మర్చిపోయి వెళ్ళటం బైబిల్ ని మర్చిపోయి వెళ్ళటం లాగా ఉంటుంది ఆమెకి. నౌకల్లో పనిచేస్తూ ఉండే బాబాయి ఒకరు మెరిల్లాకి దాన్ని బహూకరించారట. పాతకాలపుదిగా, పూల గుత్తి  ఆకారం లో  ఉంటుంది –  మధ్యని పెద్ద అమెథిస్ట్ కింద మెరిల్లా వాళ్ళ అమ్మ జుట్టుని కొంచెం అమర్చారు [ పాశ్చాత్యులలో గతించిన ఆప్తుల జ్ఞాపకం గా అలా ఉంచుకుంటారు ] , చుట్టూ చిన్న చిన్న రాళ్ళు మిలమిలమంటూ ఉంటాయి. మెరిల్లా కి వాటి విలువా నాణ్యమూ పెద్దగా తెలియవుగానీ తన మట్టి రంగు గౌన్ మీద వాటి ఊదా రంగు మెరుపు అందంగా ఉందనుకుంటుంది.

దాన్ని ఆన్ మొట్టమొదట చూసినప్పుడు సంతోషం తో తలమునకలైంది.

” ఎంత అద్భుతంగా ఉంది మెరిల్లా ! ఇలాంటిది పెట్టుకుని ఉంటే చర్చ్ లో ప్రార్థనలమీద ధ్యాస ఉంటుందో లేదో నాకైతే తెలీదుగాని..గొప్పగా ఉంది ఇది. వజ్రాలు ఇలా ఉంటాయేమో అనుకుంటుండేదాన్ని. చాలా రోజుల కిందట  వజ్రాలు  చూశాను. చూడకముందంతా ఊహించునేదాన్ని ఎలా ఉంటాయోనని –  ఇలా గాఢమైన ఊదా రంగులో మెరిసిపోతాయనుకునేదాన్ని … చివరికి ఒకావిడ ఉంగరం లో ఉన్నాయంటే దగ్గరికి వెళ్ళి చూశాను…ఆశాభంగం తో ఏడుపు వచ్చింది నాకు. చాలా అందంగానే ఉన్నాయనుకో , కాని  – ‘ అలా ‘  ఉంటాయని అనుకోలేదు . ఒక్కసారి చేత్తో పట్టుకు చూడద్దా  మెరిల్లా ? పుణ్యం చేసుకున్న  వయొలెట్ పువ్వుల ఆత్మలే అమెథిస్ట్ లు అవుతాయేమో , కదా ? ”

 

                                                                      [ ఇంకా ఉంది ]

 

   గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ -12

 

                                  గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ -12 [ Anne Of Green Gables by L.M.Montgomery ]

ఆన్ పెట్టుకు వెళ్ళిన పూల దండల టోపీ గురించి  శుక్రవారం వరకూ మెరిల్లాకి తెలీలేదు. ఆ రోజు మిసెస్ రాచెల్ ఇంటినుంచి వస్తూనే ఆన్ ని పిలిచి సంజాయిషీ అడిగింది.

    ” మిసెస్ రాచెల్ చెప్పింది – గుట్టలు గుట్టల పూలు   నీ టోపీకి చుట్టుకుని పోయావటగా , ఏం పుట్టింది నీకు ? వెర్రిమొహం  లా ఉండిఉంటావు కదా , నా ఖర్మ ! ”

  ” అనుకుంటూనే ఉన్నాను , పసుపు రంగూ గులాబి రంగూ నాకు నప్పవని …” ఆన్ మొదలెట్టింది.

 ” నప్పటమా నీ తలకాయా ” మెరిల్లా గర్జించింది – ” అసలు పూలెందుకు టోపీకి ? అలా చుట్టుకోవాలని ఎందుకనిపించింది నీకు ? ఒక్కోసారి నిజంగా పిచ్చెక్కిస్తావు కదా ”

  ” గౌన్ లకైతే పెట్టుకోవచ్చా మరి ?  ? అక్కడ బోలెడంతమంది  గౌన్ లకి పూల గుత్తులు పిన్ లతో గుచ్చుకుని వచ్చారు తెలుసా ? టోపీకి పెట్టుకుంటే తప్పేమిటి  ”  – ఆన్ వాదించింది.

మెరిల్లా అంత తేలిగ్గా ఏమారే మనిషి కాదు .

” అలా ఎదురు సమాధానాలు చెప్పకు నువ్వు..చేసింది చాలక..! మళ్ళీ ఇలాంటి వెధవపని చేశావంటే చంపేస్తాను . నీ పిచ్చి వాలకం చూసి మిసెస్ రాచెల్ కి సిగ్గుతో చచ్చిపోవాలనిపించిందట… దగ్గరికి వచ్చి చెప్పాలంటే ఎక్కడో దూరంగా ఉన్నావట నువ్వు. ఆ లోపు అంతా చూడనే చూశారు , చెవులూ కొరుక్కున్నారు. నిన్ను అలా తయారు చేసి పంపేందుకు  నా బుద్ధేమైందా అనుకుని ఉంటారు…’’

” అయ్యో , మెరిల్లా ! ” – ఆన్ బిక్కచచ్చిపోయింది  – కళ్ళనీళ్ళు కారిపోతున్నాయి .” నీకు అంత బాధ కలుగుతుందని అనుకోలేదు  నేను….ఆ పూలు చూట్టానికి ఎంతో చక్కగా ఉన్నాయి , టోపీకి పెట్టుకుంటే  బావుంటుందనిపించీ…చాలామంది కాయితం పూలు పెట్టుకుంటుంటారు కదా అని ..! నిన్ను ఇలాగే వేధిస్తుంటానేమో , నన్ను వెనక్కి పంపించెయ్యి పోనీ … నాకు చాలా చాలా కష్టంగానే ఉంటుంది ..ఇంత సన్నగా ఉంటాను కదా , క్షయ జబ్బు పట్టుకుంటుందేమో నాకు …అయినా సరే, వెళ్ళిపోతాలే, నిన్ను యాతన పెట్టేకంటే ”

” చాల్లే, నోరు ముయ్యి ” పిల్లని ఏడిపించినందుకు తనని తను తిట్టుకుంది మెరిల్లా. ” నిన్ను వెనక్కి పంపించేది  లేదు , ఎప్పటికీ. పిచ్చి వేషాలు వెయ్యకుండా అందరు పిల్లల్లాగా ఉండు, చాలు.  ఏడవకు ఇంక. చెప్పటం మర్చిపోయాను – డయానా బారీ ఊర్నించి వచ్చేసింది తెలుసా ! వాళ్ళమ్మ తో నాకు కొంచెం పని ఉంది, వాళ్ళింటికి వెళుతున్నాను- నువ్వూ వస్తావా ? డయానా ని చూడచ్చు కదా  ”

ఆన్ దిగ్గున లేచి నిలుచుంది. నీళ్ళు నిండి ఉన్న కళ్ళు తళ తళా మెరుస్తున్నాయి.

” నాకు భయంగా ఉంది మెరిల్లా ! తను ఎప్పుడొస్తుందా అని ఇప్పటిదాకా ఎదురుచూశాను, ఇప్పుడు  తనకి నేను నచ్చకపోతేనో ? గొప్ప విషాదపూరిత ఆశాభంగం నాకు ..”

” ఊరికే కిందా మీదా అయిపోకు. అంత పెద్ద మాటలు వాడద్దన్నానా , భూమికి జానెడున్నావో  లేదో  !  డయానా కి నువ్వు బాగానే నచ్చుతావులే, వాళ్ళమ్మ తోనే జాగ్రత్తగా ఉండాలి . ఆవిడకి నచ్చకపోతే డయానా కి ఎంత నచ్చినా లాభం లేదు. నీ పూలటోపీ వ్యవహారం ఈపాటికే తెలిసిపోయి ఉంటే ఆవిడ ఏమనుకుంటోందో అనుమానమే. మర్యాదగా పద్ధతి గా ఉండు అక్కడ , నీ విపరీతపు  ఉపన్యాసాల్లాంటివి ఇవ్వకు , తేడాలొస్తాయి .. . అరే, పిల్ల వణికిపోతోందే …” కంగారు పడింది మెరిల్లా.

ఆన్ నిజంగానే వణికిపోతేంది. మొహం ఉద్రేకం తో పాలిపోయింది…ఆ సంగతి ఆమెకీ తెలుసల్లే ఉంది –

” నీకు ప్రాణ స్నేహితురాలు అవబోయే వాళ్ళని నువ్వు కలుసుకోబోతూ ఉంటే, వాళ్ళమ్మకి నువ్వు నచ్చవేమోననే భయం ఉంటే – నువ్వైనా నాలాగే అవుతావు మెరిల్లా ” – టోపీ తీసుకుని బయల్దేరింది .

‘ తోట వాలు ‘ [ బారీ ల ఇంటి పేరు అది ] కి వాగు పక్కని అడ్డదారిలోంచి, ఫర్ పొదల గుట్ట ఎక్కి   వెళ్ళారు ఇద్దరూ. వెనకవైపు న వంటింటి తలుపు తట్టారు. మిసెస్ బారీ వచ్చింది- ఆవిడ పొడుగ్గా ఉంది ,  నల్లటి కళ్ళూ నల్లటి జుట్టు , పట్టుదలని సూచించే పెదవులు. పిల్లలని మంచి క్రమశిక్షణ లో ఉంచుతుందని పేరు.

” బాగున్నావా మెరిల్లా ” – పద్ధతిగా పలకరించింది . ..” లోపలికి రా. నువ్వు పెంచుకుంటున్న అమ్మాయి ఈమేనా ? ”

” అవును. పేరు ఆన్ షిర్లే ” మెరిల్లా చెప్పింది.

Mythili

” అవునండి. స్పెల్లింగ్ లో ‘ ఇ ‘ ఉండాలి ” – ఆన్ అంది. అంత ఉద్విగ్నపు స్థితిలో కూడా ఆ ‘ ముఖ్య విషయాన్ని ‘ విస్మరించకూడదని ఆన్ అభిప్రాయం.

మిసెస్ బారీ ఆ మాటలేమీ పట్టించుకున్నట్లు లేదు , ఆన్ కి షేక్ హాండ్ ఇచ్చి ” ఎలా ఉన్నావు ? ” అని కొంచెం దయ గానే అడిగింది.

” ఆత్మ లో నలిగిపోతూ ఉన్నా, శారీరకం గా బాగానే ఉన్నానండీ, ధన్యవాదాలు ” ఆన్ గంభీరంగా జవాబిచ్చింది. తర్వాత మెరిల్లా చెవిలో రహస్యంగా –  ” పర్లేదు కదా మెరిల్లా, విపరీతంగా ఏమీ లేదు గా ”

మెరిల్లా అదృష్టం కొద్దీ ,  మిసెస్ బారీ – ఆ  మాటలూ  శ్రద్ధగా వినలేదు  …ఎందుకంటే ఆ క్షణం లోనేఎవరో తలుపు తడితే వెళ్ళింది… ఈ లోపు    డయానా  బారీ వచ్చింది అక్కడికి…. సోఫా మీద కూర్చుని పుస్తకం చదువుకుంటోంది, వీళ్ళని చూసి దాన్ని వదిలేసి లేచింది. నిజంగా అందమైన పిల్ల. తల్లి జుట్టూ కళ్ళూ గులాబి రంగు బుగ్గలూ వచ్చాయి. మొహం ప్రసన్నంగా, ఉల్లాసంగా ఉంది- అది మటుకు తండ్రి పోలిక.

” ఇది మా పాప డయానా . డయానా, ఆన్ ని తీసుకెళ్ళి తోటలో నీ పూల మొక్కలు చూపించమ్మా. నీ కళ్ళకీ కాస్త పచ్చదనం మంచిదే, ఇందాకట్నుంచీ చదువుతూనే ఉన్నావు . అస్తమానమూ చదువుతునే ఉంటుందీ పిల్ల- చూపు దెబ్బ తినదూ ? ” ఈ మాటలు మెరిల్లా తో అంది మిసెస్ బారీ. ” నేనేమీ చెయ్యలేని ఆ విషయం లో , వాళ్ళ నాన్న వత్తాసు దీనికి. పోన్లే, ఆరుబయట ఆడుకుందుకు ఒక తోడు దొరికితే నయమే ”

అప్పటికి పొద్దు కుంకుతూ ఉంది.  తోట కి పడమటి వైపున నల్లగా కనిపించే  ఫర్ చెట్లు. వాటిలోంచి ప్రవహిస్తూన్న నారింజ రంగు వెలుతురు లో ఆన్, డయానా – ఒకరి మొహాలొకరు మొహమాటంగా చూసుకుంటూ నిలుచున్నారు.

బారీ   ల ఇంటి తోట ఒక పువ్వుల అరణ్యం లాగా ఉంటుందిడయానా తో స్నేహం గురించి ఆదుర్దాగా ఉందిగానీ , . ఇంకెప్పుడైనా అయితే ఆన్ మనసు అది చూసి పొంగిపోయి ఉండేది. తోట చుట్టూరా పెద్ద పెద్ద ఫర్ చెట్లు , విల్లో చెట్లు – బాగా పురాతనమైనవి అవి. వాటి కిందని నీడ లో పెరిగేకొత్త రకం పూల మొక్కలు. చక్కగా తీర్చి దిద్దిన కాలిబాటలకి అటూ ఇటూ విసనకర్రల్లాంటి గవ్వలు అమర్చారు. ఆ కాలి బాటల మధ్యని సాంప్రదాయికమైన  పూల మళ్ళు మహా వైభవంగా ఉన్నాయి. కెంపు వన్నె లో  ధగధగమంటున్న పియొనీ లు, తెల్లగా ఘుమఘుమలాడుతున్న నార్సిసస్ లు, ముళ్ళలోంచి పరిమళిస్తున్న స్కాచ్ గులాబీలు , నీలి రంగు కొలంబైన్ లు , ఊదా రంగు బౌన్సింగ్ బెట్ లు ….గుంపు లు గుంపు లు గా సదరన్ వుడ్, రిబ్బన్ గడ్డి , పొదీనా …ధూమ్రవర్ణం లో ఆడమ్ అండ్ ఈవ్ పూలు , డాఫోడిల్ లు. గుబురు గుబురు గా క్లోవర్ గడ్డి – దాని పల్చటి   పూలు , వాటి సున్నితమైన సువాసన. సంధ్య కాంతిలో  ఎర్రబడుతూన్న శ్వేత వర్ణపు కస్తూరిపూలు . ఆ తోటలో వెలుగులు ఆగుతున్నాయి …మృదువుగా  కదిలే  గాలులతో   తేనెటీగలు జుమ్మని మాట్లాడుతున్నాయి.

” డయానా ” – ఆన్ పిలిచింది చివరికి ,  మెల్లిగా. ” నేను నీకు నచ్చానా , కొంచెం ? నిన్ను చూడాలని ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నాను ”

డయానా నవ్వింది…ఆ పిల్ల మాటకి ముందు నవ్వుతుంటుంది.

” నచ్చావనే అనిపిస్తోంది. నువ్వు గ్రీన్ గేబుల్స్ కి రావటం చాలా సంతోషంగా ఉంది నాకు. ఆడుకుందుకు ఎవరూ అంత దగ్గర్లో లేరు…నా చెల్లెళ్ళేమో చిన్న వాళ్ళు ”

” ఎప్పటికీ..ఎప్పటికీ నాతో స్నేహం గా ఉంటానని ఒట్టేస్తావా ? ” ఆన్ ఆత్రంగా అడిగేసింది.

డయానా కంగారుపడిపోయింది.

తేరుకుని ,  ” అలా ఒట్లూ అవీ వెయ్యకూడదు , తప్పు ” కొంచెం నిరసనగా అంది.

” లేదు లేదు. నేను చెప్పే  ఒట్టు మంచిదే. ఒట్లు రెండు రకాలు కదా .. ”

” నాకొక్క రకమే తెలుసే మరి ” – డయానా సందేహించింది.

” ఇంకో రకం ఉంది..నిజ్జంగా. అది అస్సలు చెడ్డది కాదు , మాట ఇవ్వటం లాంటిది , అంతే ”

” అయితే సరే. ఎలా వె య్యాలి ? ”

” ఇదిగో, ఇలా  – కదిలే నీళ్ళ మీద చేతులు కలపాలి. ఈ కాలిబాటని నీళ్ళుగా ఊహించుకోవచ్చులే. ముందు నేను చెప్తానూ , తర్వాత నువ్వు అలాగే నా పేరుతో చెప్పాలి …సూర్యచంద్రులున్నంత వరకూ , ఆన్ షిర్లే అనే నేను – నా ప్రాణ స్నేహితురాలైన డయానా పట్ల – విశ్వాసం తో వ్యవహరిస్తానని వాగ్దానం చేస్తున్నాను !!!!! ఊ.. ఇప్పుడు నువ్వు – ”

తెరలు తెరలుగా వస్తున్న నవ్వుని ఆపుకుంటూ డయానా ఆ మాటలు ఆన్ పేరిట వల్లించింది .

” నువ్వు వింత పిల్లవి ఆన్ …ఎవరో అంటే విని ఏమో అనుకున్నాను గానీ… అయినా పర్వాలేదులే, నువ్వంటే నాకు     ఇష్టమే ”

కొంతసేపటికి మెరిల్లా, ఆన్ గ్రీన్ గేబుల్స్ కి తిరిగి వెళ్ళేప్పుడు డయానా వాళ్ళతో బాటు కర్రవంతెన వరకూ వెళ్ళింది. స్నేహితురాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని  నడిచారు. వాగు దగ్గర విడిపోతూ మర్నాటి మధ్యాహ్నం తప్పకుండా కలుసుకోవాలని వాగ్దానాలు చేసుకున్నారు.

తర్వాత మెరిల్లా అడిగింది – ” ఊ.అయితే డయానా నీకు సంబంధీకురాలేనా ? [kindred spirit ]  ”

మెరిల్లా వెటకారం ఆన్ కి అర్థం కాలేదు  ” ఓ , నిజంగా ” – ఆనందంగా  నిట్టూర్చింది.

anne12-2

” ఈ ప్రిన్స్ ఎడ్వర్డ్ దీవి మొత్తం లో నా అంత ఆనందంగా ఎవ్వరూ ఉండరు ఇప్పుడు. ఈ రాత్రి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాను. విలియం బెల్  వాళ్ళ బర్చ్ తోపు లేదూ , అక్కడ రేపు మేమిద్దరం బొమ్మరిల్లు కడుతున్నాం. మన కొట్టం లో పగిలిపోయిన పింగాణీ సామాను ఉంది కదా , అది తీసుకుపోవచ్చా నేను ? డయానా పుట్టినరోజు ఫిబ్రవరి లో, నాదేమో మార్చ్ లో- భలే సరిపోయాయి కదూ ?  తను నాకో పుస్తకం ఇస్తానంది…చా..లా ఆసక్తి..గా ఉంటుందట అది. ఇంకానేమో, అడవి లో రైస్ లిల్లీ లు ఎక్కడుంటాయో చూపిస్తానంది. డయానా కళ్ళు ‘ భావపూ..ర్ణంగా ‘ ఉంటాయి కదూ ? నాకూ భావపూర్ణమైన కళ్ళుంటే బావుండేది.  ‘ హేజెల్ కనుమ లో నెల్ ‘ అనే పాట నేర్పిస్తానంది నాకు. నా గదిలో తగిలించుకుందుకు మంచి కాలండర్  ఇస్తానంది.  దాన్లోనేమో,  లేత నీలం రంగు పట్టు గౌనువేసుకుని  చాలా అందమైన అమ్మాయి ఉందట ,   కుట్టు మిషన్ లు అమ్మే షాప్ వాళ్ళు డయానాకి  ఇచ్చారట దాన్ని.  తనకి ఇవ్వటానికి నా దగ్గర కూడా ఏమైనా ఉంటే బావుండేది…నేను డయానా కన్నా ఒక అంగుళం పొడుగున్నాను ..కాని తను నా కంటే బొద్దుగా ఉంది. తనూ సన్నగా ఉంటే బావుండేదని అంది , సన్నగా ఉంటే నాజూగ్గా ఉంటారట ..ఊరికే నా తృప్తి కోసం అని ఉంటుంది అలా. ఎప్పుడో ఒక రోజు సముద్రం ఒడ్డుకి వెళ్ళి గవ్వలు ఏరుకుంటాం మేము…

ఆ కర్రవంతెన కింది వాగు కి ‘ జలకన్య సెలయేరు ‘ అని పేరు పెట్టాము , బావుంది కదూ ? ఒకసారెప్పుడో ఆ పేరుతో ఒక కథ చదివాను . జలకన్య అంటే గంధర్వ కన్య లాంటిదే..కొంచెం పెద్దది అన్నమాట….”

” డయానాని మరీ  ఎక్కువ విసిగించలేదు కదా  ? ఇంట్లో పని, చదువు అయాకే ఏ ఆటలైనా , మీ ‘ ప్రణాళిక ‘ లో ఇది గుర్తు పెట్టుకోవాలి ” మెరిల్లా అంది.

ఆన్ సంతోషపు పాత్ర అప్పటికే పూర్తిగా నిండి ఉంటే , మాథ్యూ దాన్ని పొంగి పొర్లేట్లు చేశాడు ఆ రోజు. పట్నం నుంచి అప్పుడే తిరిగి వచ్చి ఉన్నాడు వీళ్ళు వెళ్ళేప్పటికి. జేబులోంచి చిన్న పొట్లం తీసి ఆన్ కి ఇస్తూ మెరిల్లా వైపు ఏం అనద్దన్నట్లు చూశాడు.

” నీకు చాకొలెట్ లు ఇష్టం అన్నారెవరో….అందుకని ….తెచ్చాను ”

”హు ” ముక్కు చిట్లించింది మెరిల్లా. ” దాని పళ్ళూ పొట్టా రెండూ పాడైపోతాయి….ఆ..ఆ..లేదులే, మొహం  వేలాడెయ్యకు – మాథ్యూ తెచ్చాడు కదా, తినచ్చు ఈసారికి- అన్నీ ఒకేసారి లాగించెయ్యకు , జబ్బు చేస్తుంది. పిప్పరమెంట్లు తే వాల్సింది మాథ్యూ , అవైతే హాని చెయ్యవు ”

” అన్నీ తినెయ్యను మెరిల్లా. ఒక్కటే తింటాను ఈ రాత్రికి. వీటిలో సగం డయానాకి ఇవ్వచ్చా నేను ?తనకి ఇచ్చేందుకు ఏదో ఒకటి ఉండటం బావుంటుంది నాకు … ఇస్తే ఇవి రెట్టింపు తియ్యగా ఉంటాయి ..”

ఆన్ తన గదికి వెళ్ళాక మాథ్యూ తో అంది మెరిల్లా – ” ఇంకేమైనా అవునో కాదోగాని, పిసినారిది మటుకు కాదు ఈ పిల్ల. పిల్లలు పిసినారిగా ఉంటే అస్సలు భరించలేను నేను. ఇది ఇక్కడికొచ్చి మూడు వారాలే కదా అయింది- ఎప్పట్నుంచో ఇక్కడే ఉన్నట్లుంది నాకు ! ఆ..అలా చూడక్కర్లేదులే, ‘ నేను చెప్పలేదా ? ‘ అన్నట్లు…ఒప్పుకుంటున్నాను, దీన్ని అట్టే పెట్టుకోవటం మంచిదైందని…కాని నువ్వు నన్ను వెక్కిరించక్కర్లేదు ”

                                                           [ ఇంకా ఉంది ]

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

   గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్- 11

 

                        [ Anne Of Green Gables by L.M.Montgomery ]

” ఎలా ఉన్నాయి ? నచ్చాయా ? ” మెరిల్లా అడిగింది.

  ఆన్ గంభీరంగా తిలకించింది – మంచం మీద మూడు గౌనులూ పరిచి ఉన్నాయి , ఆవేళే దర్జీ అతను తెచ్చాడు. ఒకటి మట్టి రంగు లో మంచి  దళసరిగా ఉంది. ఆ కిందటేడు వేసంకాలం లో ఇళ్ళమ్మట అమ్మొస్తే , బాగా మన్నేలా ఉందని తీసుకుంది మెరిల్లా. ఇంకోటి తెలుపు నలుపు గళ్ళ లో పెళపెళలాడే నకిలీ పట్టుది – ఆ  శీతాకాలంలోనే  తగ్గింపు ధరల బేరంలో ఇంటికి వచ్చింది. మూడోది మటుకు ఆ కిందటివారమే పట్నం వెళ్ళి కొట్లో కొంది మెరిల్లా –  వెలా తెలా పోతున్న నీలం రంగు  , బట్ట ఎక్కడా మడతకి లొంగకుండా నీలుక్కున్నట్లు నిల్చుంది .

   మూడూ మెరిల్లా వేసుకునే గౌన్ ల మాదిరే మహా పద్ధతిగా అతి సాదాగా  కుట్టబడ్డాయి.

” నాకు ఇవి బావున్నట్లు ఊహించుకుంటున్నాను ” ఆన్ తన మనోభావాలని వ్యక్తం చేసింది.

పాపం మెరిల్లా నొచ్చుకుంది – ” ఊహించుకుంటావా …నీకు నచ్చలేదన్నమాట – ఎందుకు ? ఏమైంది వీటికి ? బాగానే ఉన్నాయిగా…కొత్తవి , పైగా ..”

” అవును  ”

” మరెందుకు నచ్చలేదు ? ”

” ఇవి…ఇవి అందంగా లేవు ” – ఆన్ చెప్పలేక చెప్పింది.

” అందం..హు ! ” మెరిల్లా పెదవి విరిచింది – ” నేను నీకు అంద..మైన బట్టలు కొనాలనేమీ అనుకోలేదులే – అలాంటి వేషాలు నాకస్సలు గిట్టవు , గుర్తు పెట్టుకో. ఇవి మంచిగా మర్యాదగా ఉన్నాయి , కుచ్చులూ రిబ్బన్లూ ఆర్భాటాలూ లేకుండా- వచ్చే ఎండాకాలం దాకా ఇవే వేసుకోవాలి నువ్వు. ఆ మట్టి రంగుదీ నీలందీ బడికి వేసుకెళ్ళచ్చు , పట్టుది చర్చ్ కి వెళ్ళేప్పుడు. శుభ్రంగా ఉంచుకోవాలి, జాగ్రత్తగా వాడుకోవాలి- చింపి పోగులు పెట్టకూడదు. అయినా , నీ పాతబట్టలు బొత్తిగా చీకిపోయి ఉన్నాయి కదా, వాటికి  బదులుగా ఇంకేం వచ్చినా నువ్వు సంతోషిస్తావనుకున్నానే నేను ?  ”

” నేను సంతోషిస్తూనే ఉన్నాగా ” ఆన్ నొక్కి చెప్పింది ..” కాకపోతే , మరీ.. ఒక్క గౌనుకైనా బుట్ట చేతులుంటే ఇంకా..సంతోషించేదాన్ని –  ఇప్పుడు బుట్టచేతులు ఫాషన్ కదా ….’’

” ఏం అక్కర్లేదులే. బుట్టచేతులకి వృధా చేసేంత  బట్ట నా దగ్గరేం లేదు .  ఏం బావుంటాయీ అవి , వెర్రి మొర్రిగా  ”

” అందరితోబాటు నేనూ వెర్రి మొర్రిగానే ఉంటే ఏం ? ” – ఆన్ దిగులుగా సూచించింది.

” ఏడిశావులే. అన్నీ మడతలు పెట్టి భద్రంగా అల్మైరా లో పెట్టు , తర్వాత కూర్చుని పాఠం చదువుకో. రేపు ఆదివారం బడికి వెళ్ళాలి నువ్వు – మిస్టర్ బెల్ కి కబురు చేశాను ” – మెట్లు దిగి వెళ్ళిపోయింది మెరిల్లా.

ఆన్ చేతులు కట్టుకుని తన కొత్త గౌన్ లని పరికించింది.

” వీటిల్లో ఒక్కటైనా తెల్లగా , బుట్ట చేతులతో ఉండి ఉంటే ఏం పోయేది ” గొణుక్కుంది –   ” ఉండాలని ప్రార్థించుకున్నాను కూడా , కాని దేవుడంతటివాడికి నా బట్టల గురించి ఏం పడుతుంది !!! సరేలే, ఈ గౌను మంచులాగా తెల్లటి లేస్ తో కుట్టి ఉన్నట్లు ఊహించుకుంటాను ..దీనికేమో బుట్టచేతులు ఉన్నట్లు…’’

ఆ ఆదివారం మెరిల్లా కి బాగా తలనొప్పిగా ఉండి ఆన్ తోబాటు ఆదివారం బడికి వెళ్ళలేకపోయింది.

” మిసెస్ రాచెల్ ఇల్లు దోవలోనే కదా  , ఆవిడని అడిగితే నీ తరగతి ఎక్కడో చెబుతుంది. బడి అయాక చర్చ్ లో బోధ చేస్తారు , అది కూడా వినాలి నువ్వు. ఎక్కడ కూర్చోవాలో ఆవిణ్ణే అడుగు.  ఇదిగో, ఈ సెంట్ తీసుకుని హుండీలో వెయ్యి. మనుషులని ఎగా దిగా చూస్తూ కూర్చోకు , అటూ ఇటూ మెసలకుండా కుదురుగా ఉండు. ఇంటికొచ్చాక పాఠం ఏం చెప్పారో నాకు అప్పజెప్పాలి ”

ఆన్ బుద్ధిగానే బయల్దేరింది. నలుపుతెలుపు గళ్ళ గౌను వేసుకుంది – అందులో మరీ బక్కగా కనిపిస్తోంది. టోపీ చదునుగా , నావికులు పెట్టుకునేదానిలాగా ఉంది. ఆ సాదాతనాన్ని భరించలేక దానికి రిబ్బన్ లూ పువ్వులూ ఉన్నట్లు ఊహించుకుంటూ వెళుతోంది ఆన్. సగం దూరం వెళ్ళేసరికి పువ్వులు నిజంగానే సరఫరా అయాయి . గాలికి ఊగుతూ బంగారు రంగులో వెన్న గిన్నె పూలు , మిసమిసలాడుతున్న అడవి గులాబీలు. కావలసినన్ని తెంపుకుని మాల అల్లి టోపీ కి తగిలించుకుంది ‘ అమ్మయ్య ‘  అనుకుంది. ఆ రంగు రంగుల అలంకారం ఎవరికి ఎలా కనిపించినా ఆన్ కి మటుకు గొప్పగా గర్వంగా ఉంది.

మిసెస్ రాచెల్ ఇంటికి వెళ్ళేప్పటికి ఆవిడ వెళ్ళిపోయింది. ఆన్ కేం భయం…ధీమాగా ఒక్కతే చర్చ్ వరకూ వెళ్ళింది. అక్కడి వసారా లో దాదాపు ఆమె వయసే ఉన్న అమ్మాయిలు , చక్కటి బట్టలు వేసుకుని గుమిగూడి ఉన్నారు. ఈ కొత్తపిల్లనీ ఆమె యొక్క అసాధారణమైన శిరోలంకారాన్నీ వాళ్ళు గుడ్లప్పగించి చూశారు.  అప్పటికే ఆన్ గురించి వాళ్ళు కథలూ గాథలూ వినిఉన్నారు. ఆమెకి బోలెడంత కోపమని మిసెస్ రాచెల్ అందరికీ చెప్పింది[ ఆన్ వెళ్ళి క్షమాపణ చెప్పకముందు ] …గ్రీన్ గేబుల్స్ లో పాలేరు కుర్రాడు జెర్రీ బ్యుయోట్ – ఆన్ అస్తమానం చెట్లతోటీ పువ్వులతోటీ మాట్లాడుతుంటుందనీ ఒక్కోసారి వెర్రిదానిలాగా తనకి తనే ఏదో చెప్పుకుంటూ ఉంటుందనీ ప్రచారం చేశాడు.  అమ్మాయిలెవరూ ఆన్ తో స్నేహం చేసుకుందుకు ముందుకి రాలేదు… వెనకాల గుసగుసలు చెప్పుకున్నారు . ప్రార్థనా సమయం   అయిపోయి మిస్ రోగర్ సన్ పాఠం మొదలైంది.

మిస్ రోగర్ సన్ ఇరవై ఏళ్ళబట్టీ ఆదివారం బడిలో పాఠాలు చెబుతోంది. అందుకోసం పెద్దగా  ఏం కష్టపడదు – పాఠం అనబడేదాన్ని అచ్చుపుస్తకం లో చూస్తూ చదువుకుపోయి , తర్వాత పుస్తకం అంచు  మీది నుంచి చూస్తూ ఎవరో ఒకర్ని ప్రశ్నలు అడగటం – ఇంతే.  ఆన్ ని చాలా ప్రశ్నలే వేసింది , మెరిల్లా తర్ఫీదు వల్ల ఆన్ చాలావరకు సరిగ్గానే జవాబులు చెప్పింది – కాని విషయం ఏమాత్రం బుర్రకెక్కిందో దేవుడికే తెలియాలి !

ఆన్ కి మిస్ రోగర్ సన్   నచ్చలేదు .  పోతే , తరగతి లో ఆన్  తప్ప అందరూ బుట్ట చేతుల గౌన్లే వేసుకున్నారు- ఆన్ ఖిన్నురాలైపోయింది , బుట్టచేతులు లేని జీవితం వ్యర్థమనిపించింది.

” ఎలా ఉంది బడి ? ” ఇంటికొచ్చాక మెరిల్లా అడిగింది. టోపీకి చుట్టుకున్న దండ వాడిపోయిందని ఆన్ తీసేసింది దాన్ని , అందుకని అప్పటికి మెరిల్లా కి దాన్ని చూడటం తప్పింది.

” నాకేం బాగాలేదు….దరిద్రంగా ఉంది ”

” ఆన్ షిర్లే ” …గద్దించింది మెరిల్లా.

ఆన్ భారం గా నిట్టూర్చి  , ఊగుడు   కుర్చీలో కూలబడింది. బోనీ [ జెరేనియం పూల మొక్క ] ఆకునొకదాన్ని ముద్దు పెట్టుకుని, ఫ్యుషియా పూలగుత్తికి పలకరింపుగా చెయ్యి ఊపింది.

” నేను లేనప్పుడు వాటికేమీ తోచి ఉండదు కదా ” వివరించింది . ” ఆ..ఆదివారం బడిగురించే కదా…నువ్వు చెప్పినట్లే బుద్ధిగా నడుచుకున్నాను. మిసెస్ రాచెల్ ఇంట్లో లేకపోయినా  ఒక్కదాన్నే వెళ్ళగలిగాను. బ ళ్ళో ఒక మూల ,  కిటికీ  పక్కన కూర్చున్నాను. తర్వాతేమో మిస్టర్  బెల్ చా..లా..పె..ద్ద ప్రార్థన చెప్పారు. కిటికీ పక్క నే ఉన్నాను గనక సరిపోయింది…అందులోంచి ప్రకాశమాన సరోవరం కనిపిస్తూ ఉండింది. చూస్తూ అద్భుతమైన సంగతులని ఊహించుకున్నాను ,  అంత సేపూ ఆయన మాటలే విని ఉంటే నీరసం వచ్చుండేది ”

” అలా ఎందుకు చేశావ్ ?  మిస్టర్  బెల్  చెప్పేది విని ఉండచ్చు కదా ? ”

” ఆయనేమన్నా నాతో మాట్లాడారా ఏమిటి ? ” ఆన్ వ్యతిరేకించింది. ”  ‘ దేవుడితో ‘  మాట్లాడుతున్నారు , అదీ మనస్ఫూర్తిగా చేస్తున్నట్లేమీ  లేదు. దేవుడు బాగా దూరంగా ఉన్నాడు కనుక వినిపించదనుకున్నారో ఏమో మరి.

కిటికీ లోంచి చూస్తే సరస్సు మీదికి వాలిపోతూ గట్టు మీదంతా బర్చ్ చెట్లు. మధ్యాహ్నం ఎండ వాటిలోంచి జారి  నీళ్ళమీదికి దూకుతోంది ..ఎంత అందంగా ఉందనుకున్నావు మెరిల్లా ! ‘ దేవుడా, ధన్యవాదాలు ‘ అని రెండు మూడు సార్లు అనుకున్నాను ”

” పైకి అనలేదు కదా ” కంగారు పడింది మెరిల్లా.

” ఊహూ , లేదుగా – లోపల్లోపలే. చివరికి మిస్టర్ బెల్ చెప్పేది అయిపోయింది , నన్ను మిస్ రోగర్ సన్ తరగతిలోకి వెళ్ళమన్నారు. అక్కడేమో తొమ్మిది మంది అమ్మాయిలున్నారు – అందరికీ బుట్ట చేతులే తెలుసా ? నాకూ ఉన్నట్లు ఊహించుకోబోతే అస్సలు కుదర్లేదెందుకో- ఇక్కడ ఇంట్లో ఎంచక్కా కుదిరింది మరి ”

” ఆదివారం బళ్ళో కూర్చుని గౌను చేతుల గురించా ఆలోచించేది ? పాఠం వినాలని తెలీదూ నీకు ? ”

MythiliScaled

” ఎందుకు తెలీదూ..బోలెడు ప్రశ్నలకి జవాబులు కూడా చెప్పాను. మిస్ రోగర్ సన్ అడుగుతూ…నే..ఉన్నారేమిటో , ఆవిడొక్కరేనా అడిగేది…నాకూ చాలా అడగాలనిపించింది గాని ఆవిడ జవాబులు చెప్పరనిపించింది. అప్పుడు కొంతమంది పద్యాల్లాంటివి చదివారు. వాటిని ఉల్లేఖన లు [paraphrases ]  అంటారట , బైబిల్ లో ఉన్నవాటి గురించి అట. నాకేమన్నా వచ్చా అని అడిగారు . ‘ యజమాని సమాధి చెంత ఆయన శునకము ‘ వచ్చని చెప్పాను , మూడో తరగతి వాచకం లో ఉంది అది.  బాగా దిగులు దిగులుగా ఉంటుంది కదా, సరిపోతుందేమోననుకున్నాను. వద్దన్నారు. వచ్చే ఆదివారానికి పందొమ్మిదో ఉల్లేఖన చదువుకు రమ్మన్నారు.  అప్పుడే చదివేసుకున్నాను కూడా , బ్రహ్మాండం గా ఉంది అది.

ఈ మాటలు చదివితే ఒళ్ళు జలదరించింది .

`’Quick as the slaughtered squadrons fell In Midian’s evil day ‘’

Squadron అంటే ఏమిటో, Midian అంటే ఎక్కడో నాకు తెలీదు , అయినా   గొప్ప విషాదకరంగా ఉంది. తొందరగా ఆదివారం వచ్చేస్తే బాగుండును, చెప్పెయ్యాలి…..ఈ వారమంతా చదివిఇంకా బాగా నేర్చుకుంటాను.

అది అయిపోయాక మిస్ రోగర్ సన్ నే చర్చ్ లో ఎక్కడ కూర్చోవాలో అడిగాను –  మిసెస్ రాచెల్ ని అడగమన్నావు కదా, ఆవిడ  దూరంగా ఉన్నారు, అందుకని.   ‘ దివ్యవార్తలు ‘ [Revelations ] మూడో అధ్యాయం లోంచి రెండవ, మూడవ చరణాలు చదివారు. ఎంతసేపు పట్టిందో ! కదలకుండా కూర్చోటం బాగా కష్టమనిపించింది. నేనే పాస్టర్ ని అయిఉంటే పొట్టి పొట్టి వార్తలు ఎంచుకునేదాన్ని. అయిందా , తర్వాత పాస్టర్ గారు వివరించటం మొదలెట్టారు- అదీ బోలెడు సేపు పట్టేసింది … మరి పడుతుంది గదా, అంత పెద్ద వార్త అది. కొంచెం కూడా వినబుద్ధి కాలేదు , ఆయనకి బొత్తిగా ఊహాశక్తి లేదనిపించింది. నాలో నేను ఆలోచించుకుంటూండిపోయాను…. ”

మెరిల్లా నిస్సహాయురాలైపోయింది  …ఆ మిస్టర్ బెల్ చేసే ప్రార్థనా, పాస్టర్ గారి ప్రవచనమూ విసుగుపుట్టించేంత దీర్ఘం గా ఉంటాయని ఆమె ఎప్పుడూ అనుకుంటూనే ఉంటుంది… పైకి అనలేక దాచిపెట్టుకున్న మాటలన్నీ    ఈ పిల్ల శాల్తీ  అనేస్తే తిట్టటమెలా ??  తిట్టకుండా ఊరుకోవటమెలా ???

                                                                   [ఇంకా ఉంది]

  [19th Paraphrase – [The race that   long  in darkness pined ]John Morrison  అనేవారు 1781 లో రచించినది.

ఆన్ కి విషాదకరం గా ఉన్నాయనిపించిన ఆ మాటలు మిదియన్ జాతిని మోజెస్ నాశనం చేయటాన్ని చెబుతాయి.

క్రూరత్వం తప్ప  ఆహ్లాదం ధ్వనించని మతబోధల ని tongue in cheek గా తిరస్కరిస్తారు L.M.Montgomery. ]

 

గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ – 10

                                                                  Anne Of Green Gables By L.M.Montgomery

 మిసెస్ రాచెల్ విషయం లో అయిన గొడవ గురించి మెరిల్లా వెంటనే మాథ్యూ కి చెప్పలేదు . క్షమాపణ చెప్పదల్చుకోకపోతే గది దాటి రావద్దని మెరిల్లా ఆజ్ఞాపించింది కనుక ఆన్ తన గదిలోనే మొండికేసుకు కూర్చుండిపోయింది . మర్నాడు పొద్దున బ్రేక్ ఫాస్ట్ కి  ఆమె ఎందుకు రాలేదో  మాథ్యూ అడిగినప్పుడు  ఇక చెప్పక తప్పలేదు …ఆన్ ప్రవర్తన ఎంత విపరీతంగా ఉందో అర్థంఅవాలని  అతి వివరంగా చెప్పుకొచ్చింది మెరిల్లా.

” మిసెస్ రాచెల్ కి బాగానే అయిందిలే , ఎక్కడ లేని సంగతులూ ఆవిడకే కావాలి ” – మాథ్యూ ఓదార్పు.

” మాథ్యూ కుత్ బర్ట్ ! ఏమిటిది ?? ఆన్ అంత ఛండాలంగా చేస్తే దాని వైపు మాట్లాడతావేం ? కొంపదీసి దాన్నేమీ  శిక్షించద్దంటావా ?”

” అబ్బే, అలా అనేమీ కాదూ ” తడబడ్డాడు మాథ్యూ. ” కొద్దిగా..దండించచ్చులే. మరీ కటువుగా ఉండకు పాపం- దానికి మంచీ చెడ్డా ఎవరు నేర్పారు గనక ? నువ్వు..నువ్వు దానికి తినటానికేమైనా ఇచ్చావా ?”

” ఆ, డొక్క మాడుస్తాను మరి ” –  కస్సుమంది మెరిల్లా – ” మూడు పూట్లా వేళ కి భోజనం పెడుతున్నాను, నేనే తీసుకెళ్ళి ఇస్తున్నాను. తప్పు ఒప్పుకుని రాచెల్ కి క్షమాపణ చెబుతాననేవరకూ మాత్రం అది కిందికి రావటానికి వీల్లేదు, అది ఖాయం ”

పొద్దున , మధ్యాహ్నం , సాయంత్రం – అన్ని భోజనాలూ నిశ్శబ్దంగా సాగాయి , ఆన్ పట్టు వదల్లేదు. పళ్ళెం నిండా అన్నీ సర్ది మెరిల్లా తూర్పు గదికి పట్టుకెళుతోంది – కొంచెం మటుకే తరిగిన భోజనాన్ని వెనక్కి తెస్తోంది. ఆ సాయంత్రం , ఎలా వెళ్ళిన పళ్ళెం అలాగే తిరిగిరావటం మాథ్యూ కళ్ళబడింది. ఆన్ ఏమీ తినటం లేదా ఏం ? అతని ప్రాణం కొట్టుకుపోయింది.

ఇంటి వెనక బీడులో మేస్తున్న ఆవులని తోలుకొచ్చేందుకు మెరిల్లా వెళ్ళింది. అదను కోసం కాచుకుని ఉన్న మాథ్యూ మెల్లగా ,  దొంగలాగా మేడమీదికి వెళ్ళాడు. రోజూ వంటింట్లో భోజనం చెయ్యటం, హాల్ కి ఆనుకుని ఉన్న తన చిన్న పడకగదిలో నిద్రపోవటం – అంతకుమించి మాథ్యూ ఇంట్లో తిరిగేది లేదు. ఎప్పుడైనా టీ తాగేందుకు పాస్టర్ వచ్చి ఉన్నప్పుడు ఇబ్బంది పడుతూ వసారాలో కాసేపు కూర్చుంటాడు  . తన సొంత ఇంటి మేడ మీదికి మాథ్యూ వెళ్ళి ఇంచుమించు నాలుగేళ్ళయిపోయింది  – అప్పుడూ తూర్పుగదికి రంగులు వేసేందుకు మెరిల్లా కి సహాయంగా వెళ్ళాడంతే.

చప్పుడు కాకుండా , మునివేళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళి ఆన్ గది ముందు కాసేపు ఆగిపోయాడు. ధైర్యం తెచ్చుకుని చిన్నగా తలుపు తట్టి , ఓరగా తెరిచి తొంగి చూశాడు.

ఆన్ పసుప్పచ్చ కుర్చీలో కూర్చుని దిగాలుగా తోట లోకి చూస్తోంది. మాథ్యూ కళ్ళకి ఆమె అర్భకం గా  ,  బెంగ పడి ఉన్నట్లుగా   కనిపించి అతని మనసు కరిగిపోయింది.  శబ్దం అవకుండా తలుపు మూసి అలాగే మునివేళ్ళ మీద ఆన్ దగ్గరికి వెళ్ళాడు.

మెరిల్లాకి వినబడిపోతుందేమోనని , రహస్యంగా పిలిచాడు – ” ఆన్ ! ఏం చేస్తున్నావమ్మా ? ”

ఆన్ నీరసంగా నవ్వింది.

anne10-2

” బాగున్నాను. చాలా చాలా ఊహించుకుంటూ ఉన్నాను, అలా రోజు గడిచిపోతోంది. ఒంటరిగానే ఉంది – నిజమే , అలవాటైపోతుందిలెండి ”

మళ్ళీ నవ్వింది- ఏళ్ళ తరబడి ఎదురవబోతున్న ‘ ఏకాంత కారాగారవాసాన్ని ‘ ధైర్యం గా ఎదుర్కొంటున్నట్లు.

తను ఏమి చెప్పాల్సి ఉందో గుర్తు తెచ్చుకున్నాడు మాథ్యూ- గబ గబా చెప్పెయ్యాలి, మెరిల్లా వచ్చేసేలోపు. ” ఆ పనేదో పూర్తి చేసెయ్యకూడదూ ? ఎప్పటికైనా తప్పదు నీకు , మెరిల్లా కి మా చెడ్డ పట్టుదల , ఊరుకోదు. ఆమె చెప్పినట్లు చేసేస్తే ఒగదెగిపోతుంది కదా ? ” గుస గుసగా అన్నాడు.

” మిసెస్ రాచెల్ కి క్షమాపణ చెప్పటం గురించేనా మీరనేది ? ”

” క్షమాపణ ..ఆ , అదే, అదే. చెప్పెయ్యకూడదా ? ”

” మీకోసం…మీరు చెప్పమంటే..చెబుతానేమో ” ఆన్ ఆలోచిస్తూ అంది – ” జరిగిందానికి బాధపడుతున్నాను అని చెప్పటం లో అబద్ధం ఉండదు, ‘ ఇప్పుడు ‘ బాధ పడుతున్నానుగా ! నిన్న రాత్రైతే అలా లేను , పిచ్చి కోపంగా ఉండింది. మూడు సార్లు మెలకువొచ్చింది, ప్రతిసారీ కోపం ఎక్కువౌతూనే ఉంది. తెల్లారేసరికి…అంతా పోయింది , ఖాళీ గా అయిపోయానేమిటో. సిగ్గు పడుతున్నాను కూడా ..కాని వెళ్ళి మిసెస్ రాచెల్ కి క్షమాపణ చెప్పటం ….చా..లా అవమానకరంగా అనిపించింది. ఇక ఇలాగే ఎప్పటికీ ఈ గదిలోనే ఉండిపోదామని నిశ్చయించేసుకున్నాను… మీ కోసం అయితే – ఏమైనా చెయ్యగలను ..మీరు నిజంగా చెయ్యమంటే….  ‘’ – నసిగింది.

” చెయ్యమనే  కదా అంటున్నాను ? నువ్వు లేకపోతే కిందని ఇల్లంతా ఏమీ బాగోలేదు. వెళ్ళు, వెళ్ళి చెప్పు మెరిల్లాకి, మంచిదానివి కదూ ? ”

” సరే అయితే ” ఆన్ లొంగిపోయింది – ” మెరిల్లా రాగానే చెప్పేస్తాను ”

” నిజంగా..!  మంచిది..చాలా బాగుంది  ” సంతోషపడిపోయాడు మాథ్యూ – ” నేను చెప్పానని మటుకు మెరిల్లాకి చెప్పకూ…అనవసరంగా కలగజేసుకున్నాననుకుంటుంది ”

” చచ్చినా చెప్పను ” హామీ ఇచ్చింది ఆన్- ” అవునూ , చచ్చాక ఎలా చెప్పగలరూ ఎవరైనా ? ”

జవాబు చెప్పటానికి మాథ్యూ అక్కడ ఉంటే కదా…తన గెలుపుకి తనే జడుసుకుని – వెళ్ళే పోయాడు . మెరిల్లా కి ఏ మాత్రం అనుమానం రాకుండా గుర్రపుసాల లో ఒక మూల దాక్కున్నాడు.  ఇంట్లోకి వచ్చిన మెరిల్లా కి-  ఏడ్చి బొంగురుపోయిన గొంతుతో   ‘ మెరిల్లా ‘ అని మేడ మీదినించిపిలవటం వినిపించింది. సంతోషం..ఆశ్చర్యం .. అయినా బింకంగా ” ఆ, ఏమిటీ ” అంది.

” ఏమీ లేదూ..అదే..మరీ..నేను మిసెస్ రాచెల్ తో అలా మాట్లాడేశాను కదా, దానిగురించి సిగ్గుపడుతున్నాను- వెళ్ళి క్షమాపణ అడగమంటావా ? ”

మెరిల్లా ‘ అమ్మయ్య ‘ అనుకుంది, కాని పైకి తేలలేదు –  ఆన్ దారికి రాకపోతే ఏం చెయ్యాలా అని బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉన్నా కూడా. ” సరే. పాలు తియ్యటం అయాక నిన్ను కిందికి తీసుకొస్తాలే ” అని మాత్రం చెప్పింది.

ఆ ప్రకారంగా- పాలు పితకటం ముగిశాక, మెరిల్లా  విజయగర్వం తో నిటారుగా మేడ దిగుతోంది.  ఆ వెనక ఆన్ కుంగిపోతూ వస్తోంది .  అయితే సగం మెట్లు దిగగానే  ఆ దిగులు మంత్రం వేసినట్లు మాయమైంది . తలెత్తి కిటికీ లోంచి సూర్యాస్తమయాన్ని చూస్తూ , అణుచుకుంటున్న ఉత్సాహం కనబడిపోతుండగా తేలు తూ కిందికి వచ్చింది . ఈ పరిణామం మెరిల్లాకి పెద్దగా నచ్చలేదు ..పశ్చాతాపం తో కుమిలిపోతూ క్షమాపణ అడగబోయే శాల్తీ అలాగేనా ఉండేది ?

” ఏమిటి ఆలోచిస్తున్నావు ఆన్ ? ” పదునుగా అడిగింది.

” మిసెస్ రాచెల్ తో ఏం చెప్పాలో ఊహించుకుంటున్నాను ” ఆన్ ఎప్పట్లాగా కలలు కంటూన్న గొంతుతో జవాబిచ్చింది.

ఆ మాటలు మెరిల్లాకి తృప్తి కలిగించాలి నిజానికి, కాని ఎందుకో అనుమానం తగిలింది. తను వేయబోతున్న ‘ శిక్ష ‘ బెసకబోతోందా ఏమిటి ? లేకపోతే ఆన్ కి ఆ  ఆనంద పారవశ్యం ఎందుకూ ?

మిసెస్ రాచెల్ ఇంటికి వెళ్ళే వరకూ ఆన్ అలాగే ఉంది గానీ లోపలికి వెళుతూనే ఒక్కసారిగా మారిపోయింది. మొహం లో అణువణువునా పశ్చాతాపం పొంగిపోతుండగా మిసెస్ రాచెల్ ముందు మోకాళ్ళ మీద కూలబడి ప్రార్థిస్తున్నట్లు  చేతులు చాచింది – ఆవిడ  విస్తుపోయింది.

” మిసెస్ రాచెల్ ! జరిగినదానికి నేనెన్..తో చింతిస్తున్నాను. ఎంతగా అంటే , చెప్పేందుకు ఒక నిఘంటువు మొత్తం అయినా సరిపోనంతగా..మీరే ఊహించుకోగలరు ! మీ పట్ల నేను ఘోరంగా ప్రవర్తించాను, నా ఆత్మీయులైన మాథ్యూ మెరిల్లాలకి తలవంపులు తెచ్చాను. నేను అబ్బాయిని కాకపోయినా కూడా నన్ను వాళ్ళతో ఉండనిచ్చినా కూడా ,  నేను ఇంత చెత్తగా చేశాను,కృతఘ్నురాలిని –  నన్ను మర్యాదస్తులందరికీ దూరంగా పంపివేయాలి.  మీరు నిజమే చెప్పారు, నా జుట్టు ఎర్రగానే ఉంటుంది, నా మొహం మీద మచ్చలున్నాయి..నేను పీలగా అనాకారిగానే ఉన్నాను – అయినా నాకు విపరీతంగా కోపం వచ్చింది, అలా రాకూడదు, తప్పు.

నేను మిమ్మల్ని అన్నవన్నీ కూడా నిజమే, కానీ నేను అలా అనిఉండకూడదు , తప్పు.

దయచేసి నన్ను క్షమించండి మిసెస్ రాచెల్ ! ” ఆన్ పెద్దగా శోకం పెట్టింది ..” మీరు క్షమించకపోతే, నన్ను తిరస్కరిస్తే- ఒక అనాథ కు జీవితాంతమూ దుఃఖం కలిగించినవారవుతారు , ఆమె చాలా కోపిష్టి అనాథ పిల్లే అయినా కూడా ”

ఆన్ చేతులు జోడించి , తల దించుకుని, తీర్పు కోసం ఎదురుచూస్తున్న భంగిమలో ఉండిపోయింది.

ఆమె నిజాయితీని శకించేందుకు వీల్లేదు , అది ఆమె గొంతులో ఉట్టిపడుతూ ఉంది…మిసెస్ రాచెల్, మెరిల్లా ఇద్దరికీ ఆ సంగతి అర్థమైంది. అయితే  ఆ సందర్భాన్ని ఆన్ అమితంగా ఆస్వాదించేస్తోందని మెరిల్లాకి అర్థమై గతుక్కుమంది .  తన  ‘పతనాన్ని ‘ పరిపూర్ణంగా  , నాటకీయం గా  మలచుకుని  ఆన్ సరదాగా అభినయిస్తోంది . ఇంకెక్కడి శిక్ష ?

పాపం, మిసెస్ రాచెల్ ఊహ అంత దూరం పోలేదు ..ఆన్ అంత పద్ధతిగా  క్షమాపణ చెప్పినందుకు ఆవిడ ఆగ్రహం మొత్తం శాంతించింది. ఏమాటకామాటే చెప్పాలి, కాస్త అధికప్రసంగే గానీ ఆవిడ మనసు మెత్తనిది.

” లేదు లేమ్మా, లే. పర్వాలేదు లే ” మనస్ఫూర్తిగా అంది – ” ఎందుకు క్షమించనూ, క్షమిస్తున్నాను నిన్ను . నేనైనా కొంచెం  కఠినంగానే  మాట్లాడానులే నీ గురించి. నాకు ఉన్నది ఉన్నట్లు చెప్పెయ్యటం అలవాటు మరి…అన్నట్లు నాకొక అమ్మాయి తెలుసు , దాని జుట్టు నీ జుట్టు కన్నా ఎర్ర..గా ఉండేది . పెరిగి పెద్దయ్యాక అది చక్కగా ముక్కుపొడి  రంగు[auburn ] లోకి మారిపోయింది. నీ జుట్టూ అలాగే అవుతుందేమో, ఎవరికి తెలుసు ? అయినా నాకేం ఆశ్చర్యం లేదు … ”

anne10-1

ఆన్ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ లేచి నిల్చుంది – ” మిసెస్ రాచెల్ ! నాకు ఆశ కల్పించారండీ మీరు..మీ మేలు మర్చిపోను ! జుట్టు బాగుంటే మంచిగా నడుచుకోవటం ఎంతో సులువండీ ! నేను అలా మీ తోట లోకి వెళ్ళి ఆపిల్ చెట్టు కింద బెంచీ మీద కూర్చోవచ్చా ? మీరిద్దరూ మాట్లాడుకుంటారు కదా, అక్కడ కూర్చుంటే ఊహించుకోవటానికి బోలెడంత వీలుగా ఉండేలా ఉంది ”

ఆన్ వెళ్ళాక మిసెస్ రాచెల్ లేచి దీపం వెలిగించింది.

” ఇలా ఈ కుర్చీ లో కూర్చో మెరిల్లా, ఇంకొంచెం హాయిగా ఉంటుంది నీకు. ఆ..మొత్తానికి విడ్డూరపు  పిల్ల !  కాని దీనిలో ఆకట్టుకునే లక్షణమేదో ఉంది, అందుకే మీరు అట్టే పెట్టుకున్నారు… నాకు తెలిసింది.  మీ మీద జాలి పడేందుకేమీ లేదులే , బాగానే తయారయేలా ఉంది. కాకపోతే కొంచెం దూకుడెక్కువలా ఉంది, మీ దగ్గర ఉంటూ ఉంటే నెమ్మదిగా అదీ సర్దుకుంటుందిలే. కాస్త ప్రథమ కోపం ఉన్నట్లుంది- నిజానికి అలాంటివాళ్ళ కోపం ఊరికే చల్లబడిపోతుంది. పైకేమీ  మాట్లాడకుండా వెనకాల గోతులు తీసే నంగనాచులకన్నా ఇలాంటివాళ్ళు చాలా నయం …మొత్తానికి పిల్ల నాకు

నచ్చింది  ”

కాసేపాగి మెరిల్లా, ఆన్ – ఇంటికి బయల్దేరారు. మిసెస్ రాచెల్   ఇచ్చిన  తెల్లటి నార్సిసస్ పూల సువాసనని పీల్చుకుంటూ ఆన్ అడిగింది – ” బాగా చెప్పాను కదూ క్షమాపణ ? ఎలాగూ చెబుతున్నాను కదా అని పద్ధ..తి గా చెప్పాను ”

” అవునవును. బాగా చెప్పావులే ” అంది మెరిల్లా… నవ్వు రాబోయినందుకు   తనని తను తిట్టుకుంది.   మరీ అంత పద్ధతిగా చెప్పినందుకు ఆన్ ని మందలించాలేమో అనుకుంది గానీ అదెలా కుదురుతుంది ? ” ఇలా క్షమాపణ చెప్పే పరిస్థితులు ఎక్కువ తెచ్చుకోకు ” అని మాత్రం అనగలిగి సమాధానపడింది.

” నా ఆకారం గురించి ఎవరూ మాట్లాడకపోతే నేను బుద్ధిగానే ఉంటాను ”   భరోసా ఇచ్చింది ఆన్ – ” వేరే సంగతులేమీ పట్టించుకోనుగాని నా జుట్టు గురించి మాట్లాడితే…నాకు మండిపోతుంది ! అవునూ నా జుట్టు కూడా పెద్దయ్యాక  ‘ చక్కటి ముక్కుపొడిరంగు ‘  లోకి మారుతుందా ? ”

” నువ్వెలా ఉంటావూ అనేదాని గురించి అంత ఎక్కువ ఆలోచించకూడదు నువ్వు, అది మంచిది కాదు ”

” నేను సాదాగా ఉంటానని తెలిసి కూడా ఎలా చెప్పు ? ” ఆన్ ప్రతిఘటించింది – ” అందమైనవి అంటే నాకెంతో ఇష్టం..అందంగా లేని నన్ను అద్దం లో చూసుకుంటే దిగులు పుడుతుంది, నా మీద నాకు జాలేస్తుంది ”

” అందం కన్నా స్వభావమూ  ప్రవర్తనా ముఖ్యం ”  [Handsome is as handsome does ] మెరిల్లా చెప్పింది.

” చాలా సార్లు విన్నాను ఈ మాటలు, నాకంతగా నమ్మకం లేదు. ఈ పూలెంత మంచి వాసనేస్తున్నాయో , వాటిని మిసెస్ రాచెల్ నాకు ఇవ్వటం ఎంతో బావుంది కూడా. నాకు ఆవిడ మీద కోపం లేదు ఇప్పుడు. తప్పు చేశానని ఒప్పుకోవటం , క్షమించబడటం చాలా సుఖంగా ఉంటాయి నిజంగా. ఈ రాత్రి నక్షత్రాలు భలే వెలుగుతున్నాయి కదా ? నక్షత్రం లో ఉండేందుకు వీలుంటే ఎందులో ఉంటావు మెరిల్లా నువ్వు ? నేనైతే –  అదిగో, ఆ కొండ మీద పెద్ద నక్షత్రం వెలుగుతోంది చూడు….అందులో ఉంటాను ”

” కాసేపు నోరు మూసుకుంటావా ? ” మెరిల్లా విసుక్కుంది. ఆన్ ఆలోచనల వెనకాల పరిగెత్తలేక అలిసిపోయి ఉంది ఆమె.

వాళ్ళ వీధి లోకి వచ్చేవరకూ ఆన్ ఇంకేం మాట్లాడలేదు. షికారు బయల్దేరిన  గాలి పిల్ల ఒకటి వాళ్ళకి ఎదురొచ్చింది అక్కడ … మంచుకి తడిసిన ఫెర్న్ చెట్ల ఘాటైన పరిమళాన్ని పూసుకుని. చీకట్లో  దూరంగా చెట్ల మధ్యలోంచి  సంతోషం నిండిన వెలుతురు…గ్రీన్ గేబుల్స్ వంటింటి దీపం అది. ఆన్ ఉన్నట్లుండి మెరిల్లాకి దగ్గరగా వచ్చి చెయ్యి పట్టుకుంది.

” ఇంటికి రావటం, అది ఇల్లని తెలియటం ఎంత బావుంటుంది ! గ్రీన్ గేబుల్స్ ని ఎంత ప్రేమిస్తున్నానో నేను..ఇదివరకెప్పుడు దేన్ని చూసినా ఇలా లేదు..ఇంకేదీ నాకు ఇల్లనిపించలేదు. మెరిల్లా ! ఎంత ఆనందంగా ఉందో నాకు, ఇప్పటికిప్పుడు ప్రార్థన చెయ్యమన్నా చేసెయ్యగలను , ఏమీ కష్టం లేకుండా ”

తన అరచేతిలో ఇమిడిన ఆ చిన్న అరచేయి మెరిల్లా మనసులోకి సున్నితమైన ఆహ్లాదాన్ని దేన్నో తెచ్చింది , అది ఆమె  పొందలేకపోయిన మాతృత్వానికి సంబంధించిందేమో .  అలవాటులేని ఆ తీయదనానికి మెరిల్లా కళవళపడి మామూలుగా అయే ప్రయత్నానికి ఒక నీతి వాక్యాన్ని ఊతగా తెచ్చుకుంది.

” నువ్వు మంచిపిల్లవిగా ఉంటే ఎప్పుడూ ఆనందంగానే ఉండగలవు. ప్రార్థన చెయ్యటం నీకు ఎప్పుడూ కష్టంగా అనిపించకూడదు ”

 

” ప్రార్థన లో వాక్యాలు వల్లించటమూ ప్రార్థించటమూ ఒకటి కావు ” ఆన్ ధ్యానిస్తూన్నట్లు అంది – ” ఆ చెట్ల  కొమ్మల్లోంచి వీచే గాలిగా నన్ను ఊహించుకుంటాను..అక్కడ చాలనిపిస్తే , ఇదిగో ఈ ఫెర్న్ చెట్ల మీదినుంచి మెల్లగా ఊగుతాను. ఆ తర్వాత మిసెస్ లిండ్ వాళ్ళ తోటలోకి ఎగిరిపోతాను, అక్కడి పూలన్నిటినీ గంతులు వేయిస్తాను … అప్పుడు తటాలున  ఆ గడ్డి మైదానం దాటి వెళతాను…ప్రకాశమానసరోవరం లో-  మెరిసిపోయే  చిట్టి అలలని రేపుతాను … ఓహ్ ! గాలిలాగా ఊహించుకుందుకు ఎంతెంత ఉందో… ఇప్పుడింకేమీ మాట్లాడను మెరిల్లా ”

” బతికించావు ” – మెరిల్లా ఉపశమించింది.

      [ ఇంకా ఉంది ]

 

 

 

 

  గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ – 9

                                                           Anne of Green Gables by L.M.Montgomery

 

ఆన్ ని పరిశీలించేందుకు మిసెస్ రాచెల్ వచ్చేసరికి ఇంచుమించు రెండువారాలు పట్టింది….అయితే పాపం ఇందులో ఆవిడ దోషమేమీ లేదు. అనుకోకుండా ఫ్లూ జ్వరం వచ్చిపడింది . అసలైతే మిసెస్ రాచెల్ అస్తమానమూ జబ్బు పడే మనిషి కాదు..అలా తరచూ ముసుగుపెట్టి మూలిగేవారిమీద ఆవిడకి గొప్ప చిరాకు కూడానూ. ఈ ఫ్లూ జ్వరం లాంటివి మటుకు రాసిపెట్టి ఉండబట్టే వస్తాయనీ దానికి తన బాధ్యతేమీ లేదనీఆవిడ సమాధానపడింది  . ఇంట్లోంచి కాలు బయట పెట్టేందుకు డాక్టర్ అనుమతి ఇవ్వగానే హడావిడిగా గ్రీన్ గేబుల్స్ కి పరిగెత్తింది – మాథ్యూ మెరిల్లాలు పెంచుకుంటున్న అనాథ పిల్ల గురించి అవోన్లియా లో అంతా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు మరి…. 

ఆ పదిహేను రోజుల్లో , మేలుకుని ఉన్న ఒక్క నిమిషాన్ని కూడా ఆన్ వృధా చేయలేదు, అక్కడి ప్రతి చెట్టునీ పుట్టనీ పరిచయం చేసుకుంది. ఆపిల్ తోట దాటాక ఆ బాట చిట్టడవిలోకి మలుపు తిరుగుతుందని కనిపెట్టింది…ఆ దారివెంట కాచుకున్న అందమైన అద్భుతాలన్నిటినీ వెతికి శోధించింది…ఫర్ చెట్ల గుంపుల్లో..చెర్రీ చెట్ల గుబురుల్లో…ఫెర్న్ పొదలు మూసిన కోనల్లో…మేపుల్, ఆష్ వృక్షాల కొమ్మలు వేసిన పందిళ్ళ కింద….

లోయలోపలి నీటిబుగ్గతో స్నేహం చేసుకుంది. అపురూపమైన, అతి చల్లటి నీటిబుగ్గ అది…చుట్టూరా ఎర్రటి నున్నటి గులకరాళ్ళు..పెద్ద పెద్దవి. లోపల నాజూకైన నీటి మొక్కలు . అవతల-  వాగు మీదుగా కొయ్య వంతెన.

ఆ వంతెన మీదుగా ఆన్ పాదాలు నాట్యం చేస్తూ  కొండ మీది అడవికి వెళ్ళేవి. ఆ చిక్కటి చెట్ల కిందన రోజంతా సంజ వెలుగే…ఎక్కువ పూలూ ఉండవు- సిగ్గు సిగ్గుగా విచ్చుకునే జూన్ బెల్స్,  బెరుగ్గా పాలిపోయిన నక్షత్రపు పూలూ , అంతే.   వెండిదారాల సాలెగూళ్ళు అక్కడక్కడా.. కొమ్మలకి గుసగుసలు చెబుతూ.

ఆడుకుందుకు వదిలేసిన ఆ కొద్ది సమయం లో జరిగేవి ఈ ఆనందప్రయాణాలు… మాథ్యూకీ  మెరిల్లా కీ  ఆన్ ఈ సంగతులన్నీ చెబుతూనే ఉండేది. మాథ్యూ ఏం మాట్లాడేవాడు కాదు..మొహం మీద హాయయిన చిరునవ్వు తారట్లాడేది.  మెరిల్లా కాసేపు వింటుండేది, తనకీ ఆసక్తి కలుగుతోందేమోనని అనుమానం వస్తే మాత్రం- ఆన్ ని నోరు మూసుకోమనేది.

మిసెస్ రాచెల్ వచ్చేటప్పటికి ఆన్ తోటలో ఇష్టంగా పచార్లు చేసుకుంటోంది. ఒత్తుగా పెరిగిన పచ్చగడ్డి మీదని సాయంత్రపు ఎండ ఎర్రెర్రగా చిందుతూ ఉంది.

ఫ్లూ తో తను పడిన  బాధలన్నిటి గురించీ  మిసెస్ రాచెల్  సంబరంగా , కరువుదీరా మెరిల్లాకి చెప్పుకుంది…వింటూ మెరిల్లా అనుకుంది- ” అవున్లే పాపం, అంత లావున జ్వరం పడిందికదా, ఆ మాత్రం సరదా లేకపోతే ఎలా  ” అని.

జబ్బు వివరాలన్నీ పూర్తయిపోయాక మిసెస్ రాచెల్ అప్పుడు కదిలించింది అసలు విషయాన్ని.

” నీ గురించీ మాథ్యూ గురించీ ఏవో  విశేషాలు  వింటున్నాను ..”

” నిజమే. నాకే ఆశ్చర్యంగా ఉండేది, ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాను ”  మెరిల్లా ఒప్పుకుంది.

 

” మిసెస్ స్పెన్సర్ అలా పొరబాటు  చేయటం తప్పు కదా, ఈ పిల్లని వెనక్కి పంపించెయ్యటం కుదర్లేదా ? ” – మిసెస్ రాచెల్ సానుభూతి ప్రకటించింది.

” పంపించెయ్యచ్చూ..కాని వద్దులే అనుకున్నాం. మాథ్యూ కి ఆన్ బాగా నచ్చేసింది. నాకూ ఇష్టమే అదంటే, మంచి హుషారైన పిల్ల.  ఈ కొన్ని రోజుల్లోనే ఇల్లంతా మారిపోయినట్లుంది…”   మెరిల్లా,  తను చెప్పాలనుకున్నదానికన్న ఎక్కువ చెప్పేశానని మిసెస్ రాచెల్ మొహం చూసి గ్రహించింది…ఆ మాటలు రుచించలేదు ఆవిడకి.

” చాలా పెద్ద బాధ్యతే ఎత్తుకున్నారు మీరు…పైగా ఏమాత్రం అనుభవమూ లేదు.ఆ పిల్ల ఎవరో ఎలాంటిదో కూడా తెలీదాయె.. ఏం ముంచుకొస్తుందో  ఏమిటో – మిమ్మల్ని జడిపించాలనేమీ  కాదులేగానీ …”

” నేనేం జడిసిపోవటం  లేదు..” మెరిల్లా క్లుప్తంగా అంది, ” ఒక పని చెయ్యాలనుకుంటే చేసెయ్యటమే, ఇంకే ఆలోచనా ఉండదు. ఆన్ ని చూస్తావా..పిలుస్తాను దాన్ని ”

సరిగ్గా అప్పుడే ఆన్ ఒక్క పరుగున వచ్చింది..తోటలో పోగు చేసుకున్న  సంతోషం తో ఆమె మొహం వెలుగుతోంది.  ఎవరో కొత్తమనిషి ఉండటం చూసి మొహమాటంగా గుమ్మంలో నిలబడిపోయింది. అనాథాశ్రమం లో ఇచ్చిన పల్చటి ఊలు గౌనే వేసుకుని ఉంది- పొట్టిగా బిగుతుగా ఉంది అది, అడుగునుంచి సన్నటి కాళ్ళు మరీ పొడుగ్గా కనిపిస్తున్నాయి . [ ఒక దాని తర్వాత ఒకటిగా ఆవులు జబ్బు పడటం వల్ల , అనుకున్నంత తొందరగా ఆన్ కి కొత్త బట్టలు పట్నం నుంచి తీసుకు రావటం  మెరిల్లాకి కుదరలేదు . నాలుగైదు రోజుల కిందటే తెచ్చి  కుట్టటానికి ఇచ్చారు, ఒకటో రెండో తప్ప అవి ఇంకా తయారు కాలేదు. ]  ఎండలో తెగ తిరిగి మొహం మీది చిన్న మచ్చలు ఇంకొంచెం ఎక్కువయ్యాయి. టోపీ పెట్టుకోకుండా ఊరేగిందేమో  , బయటి  గాలికి జుట్టు మహా చిందరవందరగా రేగిపోయింది..ఎప్పుడూ లేనంత ఎర్రగానూ

ఉన్నట్లుంది ఆ జుట్టు.

” ఊ .. అయితే పిల్లా, నీ చక్కదనం చూసి వీళ్ళు పెంచుకుంటున్నట్లు లేరులే ” మిసెస్ రాచెల్ తన ఘనమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది . నదురూ బెదురూ లేకుండా , ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టి చెబుతామని గర్వపడే ఉద్దండులలో ఆమె ఒకతె .” పిల్ల మరీ ఇంత సన్నగా  వికారంగా  ఉందేమిటి మెరిల్లా ! ! !ఏదీ ఇలారా అమ్మాయ్, చూద్దాం…అబ్బా, ఇన్నేసి మచ్చలని ఎక్కడా చూడలేదు , అదీ మొహం మీద !  ఆ జుట్టు చూడు .. కేరట్ దుంపలంత ఎర్రగా…దగ్గరికి రావేం , నిన్నే- పిలవట్లేదూ ? ”

ఆన్  ‘ దగ్గరికి వచ్చింది ‘  ..అయితే మిసెస్ రాచెల్ ఆశించినట్లు వినయంగా  కాదు…ఒక్క అంగలో ఆవిడ ముందుకి దూకింది. మొహం కోపం తో కందగడ్డలా అయిపోయింది, పెదాలు వణికిపోతున్నాయి, తలనుంచి పాదాల దాకా ఆవేశంగా ఊగిపోతోంది.

” నువ్వంటే నాకు  అసహ్యం ”  పూడుకుపోతున్న గొంతుతో అరిచింది, అడుగులతో ధడా ధడా నేలమీద బాదింది.

” అసహ్యం..అసహ్యం..అసహ్యం ” మళ్ళీ మళ్ళీ అంటూ ఒక్కోసారికీ మరింత విసురుగా నేలని చరిచింది కాళ్ళతో. ” నన్ను వికారంగా ఉన్నానంటావా, నీకెంత ధైర్యం..ఆ ? నా మొహం మీద మచ్చలుంటే నీకేం, నా జుట్టు ఎర్రగా ఉంటే నీకెందుకు ? నీకు మంచీ మర్యాదా తెలీవూ , హృదయం లేదూ ?  ”

”  ఏయ్…ఆన్, ఆన్ …” మెరిల్లా దిగ్భ్రాంతితో కేక పెట్టింది.

anne9-1

ఆన్ చలించలేదు. నిప్పులు కురిసే కళ్ళతో నిర్భయంగా తలెత్తి మిసెస్ రాచెల్ ముందరే నిలుచుంది. ఆమెలోంచి ప్రవహిస్తున్న ఆగ్రహం అక్కడి వాతావరణాన్నే మార్చేసింది.

ఇంకా అరుస్తూనే ఉంది – ”  నన్ను అలాంటి మాటలనటానికి  నీకెంత ధైర్యం  ? నిన్నే గనక అలా అంటే నీకెలా ఉంటుంది … నువ్వు లావుగా , ఎడ్డి మడ్డిగా ఉన్నావనీ నీకు ఏమాత్రం నాగరికత లేదనీ అంటే ? అలా అంటే నువ్వేమనుకుంటావోననీ నొచ్చుకుంటావేమోననీ నాకేం లెక్క లేదు. నువ్వు నొచ్చుకోవటమే కావాలి నాకు. ఎంత బాధ పెట్టావు నన్ను..ఇదివరకెప్పుడూ ఎవరూ పెట్టనంత…మిస్టర్ థామస్ తాగేసి వచ్చినా నీలాగా మాట్లాడేవాడు కాదు. నిన్నెప్పటికీ క్షమించను..ఎప్పటికీ..ఎప్ప…టికీ !!! !”

ధడా, ధడా, ధడా !

” ఓరి నాయనో..ఇంత కోపిష్టి వాళ్ళని ఎక్కడన్నా చూశామా…”  మిసెస్ రాచెల్ హడిలిపోయింది.

” ఆన్…ముందు నీ గదిలోకి ఫో ! నేనొచ్చేవరకూ అక్కడే ఉండు ” మెరిల్లా గొంతు  పెగుల్చుకుని ఆజ్ఞాపించింది.

ఆన్ వల వలా ఏడుస్తూ హాల్ తలుపు దగ్గరికి పరిగెత్తింది.  దాన్ని దఢేల్ మని తెరిచింది … ఆ ఊపుకి గోడ మీది రేకు డబ్బాలు సైతం సానుభూతితో  కంపించాయి. సుడిగాలికి మల్లే  మెట్లెక్కి వెళ్ళిపోయింది. తన తూర్పు గది తలుపునీ అంత విసురుగానూ మూసిన చప్పుడు కిందికి వినబడింది.

” ఇలాంటిదాన్ని పెంచుకుంటున్నావు కదా మెరిల్లా, నీ పని అయిపోయింది ” – మిసెస్ రాచెల్ అతి గంభీరంగా అంది.

క్షమాపణ అడిగేందుకో, బ్రతిమిలాడేందుకో పెదవి విప్పింది మెరిల్లా…కాని ఆమె నోటి వెంట వచ్చిన మాటలకి  అప్పుడూ ఆ తర్వాతా కూడా ఆమెకే ఆశ్చర్యం…ఇవీ ఆ మాటలు-  ” నువ్వు దాని ఆకారాన్ని వెక్కిరించకుండా ఉండాల్సింది రాచెల్ ”

” అయితే మిస్ కుత్ బర్ట్ , ఆ అఘాయిత్యాన్ని సమర్థిస్తున్నావా నువ్వు ? ఇదేం చోద్యం ??? ” రోషంగా అంది మిసెస్ రాచెల్.

” లేదు ” మెరిల్లా నెమ్మదిగా చెప్పింది – ”  నేను దాన్నేమీ వెనకేసుకు రావటం లేదు .చాలా దుడుకుగా ప్రవర్తించింది,  దురుసుగా మాట్లాడేసింది, దాన్ని ఖచ్చితంగా  బాగా చీవాట్లు పెడతాను. కాని దాని వైపునుంచి కూడా ఆలోచించాలి కదా..మంచీ చెడూ ఎవరూ  నేర్పించలేదు ఇదివరకు. ను వ్వైనా మరీ కరుగ్గా ఉన్నా వేమో దానితో ”

ఆ ఆఖరి వాక్యాన్ని అనకుండా ఉండలేకపోయింది మెరిల్లా – అందుకూ ఆశ్చర్యపడింది. మిసెస్ రాచెల్ లేచి నిలుచుంది –  ఆవిడ గౌరవం  ఘోరంగా దెబ్బతినిపోయింది.

anne9-2

” సరే మెరిల్లా, ఇక మీదట గుర్తుంచుకుంటాలే. ఊరూ పేరూ లేని అనాథల సున్ని..తమైన మనసులు ఎక్క..డ నొచ్చుకుంటా యోనని, ఆచి తూచి, జాగ్రత్తగానే మాట్లాడతాలే !!!!!. నా గురించి ఏమీ బెంగ పడకు , నీ మీద గొప్ప జాలిగా ఉంది, అందుకని కోపం కూడా రావటం లేదు ..పాపం ఆ పిల్ల తో నీ కష్టాలు నీవి ! ఇదిగో చూడు, పదిమందిని కనిపెంచినదాన్ని, ఒక సలహా ఇస్తాను విను , నువ్వు పాటించవులే, అయినా విను. ఇలాంటి వ్యవహారానికి చీవాట్లు సమాధానం పేము బెత్తం తోనే పెట్టాలి తెలుసా , మాటలతో పని జరగదు. అమ్మో..ఏం పిల్ల అది..దాని జుట్టు ఎలా ఉందో స్వభావమూ అలాంటిదేలాగా ఉంది- ఎర్రగా ధుమ ధుమలాడుతూ ! గుడ్ ఈవెనింగ్ మెరిల్లా, వెళ్తున్నాను ఇంక. నువ్వు మామూలుగానే మా ఇంటికి రావచ్చు , నేను మటుకు ఇక్కడికి వచ్చేది లేదు , ఈ బొట్టికాయతో నానామాటలూ అనిపించుకునేదీ లేదు – మాటలు పడటమనేది బొత్తిగా అలవాటులేదు నాకు ”

మిసెస్ రాచెల్ మహా వేగంగా.. తన లావుపాటి శరీరం తో వెళ్ళగలిగినంత వేగంగా , వెళ్ళిపోయింది.

తీక్షణం గా మొహం పెట్టుకుని తూర్పుగదికి బయలుదేరింది మెరిల్లా. తను ఈ విషయం లో ఏమి చేయవలసిఉందా అని , కొంచెం ఇబ్బందిపడుతూ ఆలోచించింది మెట్లెక్కుతూ . జరిగిందాని గురించి బాగానే దిగులుపడుతోంది ఆమె. ఆన్ –  ఈ రభసని , ఎవరూ దొరకనట్లు మిసెస్ రాచెల్ ముందు చెయ్య టం ఎంత దురదృష్టం ! ఆన్ ప్రవర్తనకి, ఆమె లోని ఈ తీవ్రమైన లోపానికి –  బాధ కంటే కూడా అవమానం గా అనిపిస్తోంది మెరిల్లాకి. ఆమెని ఎలా శిక్షించాలి ? మిసెస్ రాచెల్ సూచించినట్లు గా బెత్తాన్ని ఉపయోగించటం మెరిల్లాకి నచ్చలేదు, పిల్లలని కొట్టి దండించటంలో  ఆమెకి  నమ్మకం లేదు. కాని ఆన్ ని శిక్షించి తీరాలి,  ఎంత తప్పు చేసిందో ఆమె తెలుసుకు తీరాలి  !

శుభ్రంగా ఉన్న అక్కడి నేలమీద బూట్ కాళ్ళ బురద మరకలు. అలాంటివాటిని మామూలుగా భరించలేని మెరిల్లా అప్పుడు మటుకు ఏమీ పట్టించుకోలేదు. ఆన్ బోర్లా పడుకుని కుమిలి కుమిలి ఏడుస్తోంది.

” ఆన్.. ” నిదానంగా పిలిచింది మెరిల్లా.

జవాబు లేదు.

” ఆన్ ..” ఈ సారి కొంత కఠినంగా పిలిచింది – ” వెంటనే పక్కమీదినుంచి లే..నేను చెప్పేది విను ”

ఆన్ ఈడ్చుకుంటూ లేచి పక్కన ఉన్న కుర్చీ మీద బిగుసుకుపోయి కూర్చుంది. మొహం ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయి ఉంది, కన్నీటి చారికలతో. మొండిగా కిందికి చూస్తూ ఉండిపోయింది.

” చాలా గొప్పగా ప్రవర్తించావు…సిగ్గుగా అనిపించట్లేదూ నీకు ? ”

‘ మరి నేను  వికారంగా ఉన్నానని ఆవిడ ఎందుకు అనాలీ…” బింకంగా  అంది ఆన్.

” నీకు మాత్రం అం…త కోపమెందుకు రావాలీ ..అన్నేసి చెడ్డమాటలెందుకు అనాలీ ? ” ప్రశ్నించింది మెరిల్లా- ” ఛీ.. ఎంత తలవంపులు తెచ్చావు నాకు ! మిసెస్ రాచెల్ నిన్ను మంచి పిల్ల వని అనుకోవాలని ఆశపడ్డాను..నువ్వు అంతా నాశనం  చే శావు. అయినా… బావుండనూ అనీ , ఎర్ర జుట్టు ఉందనీ  నిన్ను నువ్వే అనుకుంటుంటావు కదా, ఆ మాటలే ఆవిడ అంటే నీకంత కోపమెందుకు ? ఆవిడ అలా అందే అనుకో, నువ్వు అంత రాద్ధాంతం చెయ్యటం  బాగుందా ? ? చెప్పు ”

” మన గురించి మనం ఏమైనా అనుకుంటాము, అవే వేరేవాళ్ళ చేత  అనిపించుకోవటం ఏమీ బావుండదు ” – ఆన్ శోకాలు పెట్టింది . ..” ఒక సంగతి అలాగే ఉందని మనకి తెలిసినా అవతలి వాళ్ళకి అలా అనిపించదేమోననే ఆశ పడతాము.  మీరు నన్నేమను కున్నా సరే..అప్పుడు నాకు ఒళ్ళు తెలీలేదు . ఆవిడ  అలా అంటుంటే నాలోపల ఏదో బుస్సుమని లేచింది, ఊపిరాడలేదు నాకు- ఆమె మీద పడి కొట్టెయ్యాలనిపించింది ”

” ఆ..మంచి ప్రదర్శనే ఇచ్చావులే…ఇదంతా చిలవలూ పలవలూ చేర్చి మిసెస్ రాచెల్ ఊరంతా చాటిస్తుంది నీ గురించి. ఛీ ! ”

”మిమ్మల్నెనెవరైనా వికారంగా ఉన్నరంటే ఎలా ఉంటుంది మీకు..ఒక్కసారి ఊహించుకోండి ” – ఆన్ కన్నీళ్ళతో ప్రాధేయపడింది.

పాత జ్ఞాపకం ఏదో వచ్చింది మెరిల్లాకి- ఆమె బాగా చిన్నపిల్లగా ఉన్నప్పుడు  వాళ్ళ  పిన్ని  ఇంకో చుట్టాలావిడతో  అనటం వింది..” పాపం…ఇది ఎంత నల్లగా , మామూలుగా ఉందో, అందమన్నది లేదు ఈ పిల్ల కి ” – ఆ మాటలు ఇన్నేళ్ళు గడిచాకా మెరిల్లాకి గుచ్చుకుంటూనే ఉన్నాయి.

” ఆవిడ మాటలు బాగున్నాయని నేనేం అనటం లేదు ” కొంచెం మెత్తబడింది. ” కాని మన ఇంటికి వచ్చింది, వయసులో పెద్దది..అందుకైనా నువ్వు మర్యాదగా ఉండాల్సింది . దురుసుగా, పొగరుగా మాట్లాడేశావు ” అంటూండగా మెరిల్లాకి ఆన్ ని ఎలా శిక్షించాలో స్ఫురించింది. ” నువ్వు ఆవిడ దగ్గరికి వెళ్ళాలి..వెళ్ళి తప్పు చేశాననీ క్షమించమనీ అడగాలి ”

” ఆ పని మాత్రం చెయ్యను ” ఆన్ ఖండితంగా చెప్పింది – ” మీరు నన్నేమైనా చెయ్యండి…నన్ను కప్పలూ పాములూ ఉండే చీకటి కొట్లో పెట్టి తాళం వెయ్యండి, ఎండిపోయిన బ్రెడ్ ముక్కలూ నీళ్ళూ తప్ప ఇంకేమీ తినటానికీ తాగటానికీ  ఇవ్వకండి..ఏం పర్వాలేదు..ఆవిడని మటుకు క్షమాపణ అడగను, నా వల్ల కాదు ”

” చీకటి కొట్లలో పడేసి తాళాలు పెట్టటం ఇక్కడెవరికీ  అలవాటు లేదు ” మెరిల్లా పొడి పొడిగా అంది –

” అవోన్లియా లో సరిపడినన్ని చీకటి కొట్లూ లేవు. నువ్వు మిసెస్ రాచెల్ ని క్షమాపణ అడిగే తీరాలి…అంతవరకూ నీ గది దాటి బయటికి రాకు ”

” అయితే నేనెప్పటికీ ఇక్కడ ఉండిపోవాల్సిందే ” ఆన్ దుఃఖం తో అంది..” నేను అన్నమాటలకి పశ్చాత్తాపపడుతున్నానని మిసెస్ రాచెల్ కి చెప్పలేను. ఎలా చెబుతాను ? నేను పశ్చాత్తాపపడటం లేదు    కదా? మిమ్మల్ని కష్టపెట్టినందుకు బాధగా ఉంది, ఆవిడ ని అలా అన్నందుకు ఆ..నందం… గా ఉంది ! గొప్ప తృప్తిగా ఉంది !! బాధపడనప్పుడు పడుతున్నానని ఎలా చెప్పగలను…అలా అని ఊహించుకోవటం కూడా కుదరదు నాకు ”

” నీ  ‘ ఊహాశక్తి  ‘  రేపు పొద్దుటికేమైనా పని కొస్తుందేమో చూద్దాం ”  మెరిల్లా లేచి వెళ్ళబోతూ అంది –

” రాత్రంతా ఆలోచించి  తేల్చుకో. గ్రీన్ గేబుల్స్ లో ఉండనిస్తే మంచిపిల్లలాగా నడుచుకుంటానని చెప్పావు గా, ఇలాగేనా ? ”

అసలే అల్లకల్లోలంగా ఉన్న ఆన్ హృదయం లోకి ఈ బాణాన్ని  గురిచూసి విసిరి మెరిల్లా దిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆమె మనసంతా చిరాగ్గా , భారంగా ఉంది. ఆన్ మీద ఎంత కోపంగా ఉందో తన మీద తనకీ అంతే కోపంగా ఉంది…అయితే…ఆన్ మాటలకి నిర్ఘాంతపోయిఉన్న మిసెస్ రాచెల్ మొహం గుర్తొచ్చి…. అదేమిటోగానీ, ఎంత వద్దనుకున్నా మెరిల్లాకి నవ్వు రాబోయింది.

 [ ఇంకా ఉంది ]    

 

 

గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ –  8

anne5

  మరుసటిరోజు మధ్యాహ్నం వరకూ ఆన్ అక్కడే ఉండబోతోందని మెరిల్లా  చెప్పనేలేదు, కారణాలు మెరిల్లాకే తెలియాలి ! అప్పటిదాకా ఆన్ కి రకరకాల పనులు అప్పజెప్పి ఎలా చేస్తోందో ఓ కంట కనిపెడుతూ ఉంది. ఆన్ బుద్ధిమంతురాలూ చురుకైనదీ అని మెరిల్లాకి నమ్మకం కుదిరింది. ఏదన్నా చెబితే విని నేర్చుకుందుకు ఆన్ ఉత్సాహంగానే ఉంది. చిక్కెక్కడ వస్తోందంటే చేస్తూ చేస్తూ ఉన్న పని మధ్యలో పగటికలల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు గట్టిగా కేకలేస్తేనో, పని బొత్తిగా పాడయి ఊరుకుంటేనో తప్ప స్పృహ లోకి రాదు.

మధ్యాహ్నం భోజనాలయాక గిన్నెలు కడిగేసి మెరిల్లా దగ్గరికి వెళ్ళింది ఆన్. ఆమె వాలకం చూస్తే ఎంత చెడ్డ వార్త వినేందు  కైనా సిద్ధపడినట్లుంది.   చిక్కిఉన్న ఆ చిన్న శరీరం ఆపాదమస్తకం వణుకుతోంది. మొహం ఎర్రగా కందిపోయి ఉంది, కళ్ళు బెదురుతో విచ్చుకున్నాయి. గట్టిగా చేతులు కట్టుకుని మెరిల్లాని దృఢంగా అడిగింది-

” మిస్ కుత్ బర్ట్ , చెప్పండి  – నన్ను ఉండనిస్తున్నారా వెనక్కి పంపేస్తారా ?  పొద్దుట్నుంచీ ఓపిక పట్టాను , ఇంక నా వల్ల కాదు…దయచేసి చెప్పెయ్యండి ”

” ఆ గిన్నెలు తుడిచే గుడ్డని సలసల కాగే నీళ్ళలో ముంచి శుభ్రం చెయ్యలేదు నువ్వు ” – మెరిల్లా చలించకుండా అంది, ” ముందు ఆ పని పూర్తి చేసి రా ”

ఆన్ వెళ్ళి ఆ పని చేసి వచ్చి నిలుచుంది. ఆమె చూపులు మెరిల్లాను వేడుకుంటున్నాయి. ఇక వాయిదా వేసేందుకు మెరిల్లాకి సాకు దొరకలేదు. ” ఊ, సరే. మరి…మాథ్యూ నేనూ నిన్ను పెంచుకుందామనే అనుకుంటున్నాం. అదీ..నువ్వు మంచిపిల్లలాగా ప్రవర్తిస్తే… అరె, ఏమిటది, ఏమైంది ? ”

” ఏడుస్తున్నాను నేను ” ఆన్ గాబరాగా అంది. ” ఎందుకో తెలీదు. నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను…కాదు, సంతోషం అనే మాట సరైనది కాదు… శ్వేతమార్గాన్నీ చెర్రీ పూలగుత్తులనీ చూస్తే వచ్చేది, అది – సంతోషం అంటే. ఇది అంతకంటే చాలా చాలా ఎక్కువ. ఇది బాగా ఎక్కు..వ సంతోషం. నేను బుద్ధిగా ఉంటాను, చెప్పినట్లు వింటాను..బాగా కష్టమైపోతుందేమో నాకు  .. .ఎందుకంటే మిసెస్ థామస్ అనేవారు, నేను అసలు బాగుపడనూ అని. అయినా సరే గట్టి..గా ప్రయత్నం చేస్తాను. ఇంతకూ నేను ఎందుకు ఏడుస్తున్నానంటారు ?? ”

”  మరీ ఎక్కువెక్కువ  ఆలోచించి ఉంటావు, కాస్త పైత్యం ప్రకోపించిఉంటుంది. ఇదిగో, ఇలా ఈ కుర్చీలో కూర్చుని కాస్త నెమ్మదించు. నవ్వూ ఏడుపూ రెండూ నీకు ఊరికే వచ్చేస్తాయి ” – మెరిల్లా  అసమ్మతితో అంది – ‘’ అవును, నువ్వు ఇక్కడే ఉండచ్చు, మేము నీ బాగోగులన్నీ చూస్తాం. నువ్వు స్కూల్ కి కూడా వెళ్ళాలి, కాకపోతే ఇంకో రెండు వారాల్లో సెలవలిచ్చేస్తారు ఎలాగూ. ఒకేసారి సెప్టెంబర్ లో బడి తెరిచాక వెళుదువుగాని ”

” మిమ్మల్ని ఏమని పిలవాలి ? మిస్ కుత్ బర్ట్ అనాలా ? ఆంట్ మెరిల్లా అననా , పోనీ ?”

anne8-2

” అలా ఏం వద్దు. మిస్ కుత్ బర్ట్ అని పిలిపించుకోవటం  అలవాటు లేక నాకేమిటో కంగారుగా ఉంటుంది.  మెరిల్లా అను, చాలు ”

” మెరిల్లా అని పిలవటం ఏమీ మర్యాదగా ఉండదు కదండీ మరి ? ”

” మర్యాదగా పలికితే  ఎలా పిలిచినా మర్యాద గానే ఉంటుంది. అవోన్లియా లో చిన్నా పెద్దా అందరూ నన్ను మెరిల్లా అనే అంటారు, ఒక్క పాస్టర్ తప్ప. ఆయనొకరే పనిగట్టుకుని మిస్ కుత్ బర్ట్ అంటుంటారు ”

” నేను మిమ్మల్ని ఆంట్ మెరిల్లా అని పిలవద్దా ? నాకెప్పుడూ ఎవరూ ..ఆంట్, అమ్మమ్మ, నాయనమ్మ …లేనే లేరు..ఇప్పుడు మీరున్నారు కదా, మిమ్మల్ని ఆంట్ అంటే నాకు ఎంతో బావుంటుంది , నేను మీకు సొంతం అనిపిస్తుంది ” –

” వద్దు. నేను నీ ఆంట్ ని కానుగదా ? మనుషులకి చెందని పేర్లతో వాళ్ళని పిలవటం నాకు ఇష్టం ఉండదు ‘తేల్చేసింది మెరిల్లా.

” కాని మనం ఊహించుకోవచ్చు కదండీ, మీరు నాకు ఆంట్ అయినట్లు ? ”

” నేను ఊహించుకోలేను కదా మరి ” – మెరిల్లా గంభీరంగా అంది.

” అదికాదండీ, ఉన్నవాటిని ఉన్నట్లు కాకుండా వేరేలా ఊహించుకోలేరా మీరు ? ”

” ఊహూ  ”

” ఓ…  ” ఆన్ భారంగా ఊపిరి పీల్చి వదిలింది ..” మిస్ ..మెరిల్లా, మీరేం కోల్పోతున్నారో మీకు తెలీదు ”

” ఊహించుకోవటం లో నాకేమీ నమ్మకం లేదు. దేవుడు ఎలా ఉండవలసినవాటిని అలాగే సృష్టిస్తాడు, ఇంకోలా ఊహించుకోవటం ఎందుకట ? ఆ, ఇలా అంటుంటే గుర్తొచ్చింది , హాల్ లోకి వెళ్ళి..వెళ్ళేప్పుడు పాదాలు శుభ్రంగా పట్టా మీద తుడుచుకో, తలుపు తీసేప్పుడు ఈగల్ని లోపలికి రానీకు. వెళ్ళి, బల్ల మీద ఆ బొమ్మల అట్ట ఉంది చూడు, దాన్ని పట్టుకురా. దాని మీద దైవప్రార్థన రాసిఉంది. ఖాళీ దొరకగానే మొత్తం కంఠస్థం  చెయ్యి. నిన్నటిలాగా పిచ్చి పిచ్చి గా చేస్తే కుదరదు ‘’

” నేను ఏబ్రాసిగానే చెప్పాననుకోండీ…మరైతే నాకు అదే మొదలు కదా, చెప్పటం ? వెంటనే వచ్చెయ్యదుగా ఎలా చెప్పాలో…రాత్రి నిద్రపోయేప్పుడు మంచి ప్రార్థనని ఊహించుకున్నాను. ఇంచుమించు , చర్చ్ లో చెప్పేంత పెద్దది, అలాగే కవిత్వం తో ఉంది.ఏం లాభం ? తెల్లరేసరికి మొత్తం మర్చిపోయాను. మళ్ళీ ఊహించుకున్నా అంత బాగా రాదేమో…రెండోసారికి ఏదీ మొదటిసారంత బాగా ఉండదు కదండీ  ? ”

ఆన్ , లోపలికి వెళ్ళటమైతే బుద్ధిగానే వెళ్ళిందిగాని ఎంతకీ వెనక్కి రాలేదు. చూసి చూసి మెరిల్లా , అల్లుతూ ఉన్న ఊలు వదిలేసి లోపలికి వెళ్ళింది. అక్కడ, రెండు కిటికీ ల మధ్య ఉన్న చిత్రపటం ముందు ఆన్ పారవశ్యం తో నిలుచుని ఉంది. బయటి ఆపిల్ చెట్ల మధ్యలోంచీ అల్లుకున్న తీగల మధ్యలోంచీ వెలుతురు , తెల్లగా , ఆకుపచ్చగా  ఆమె  మీద మీద పడుతూ ఉంటే  ఏదో వేరే లోకపు మనిషికి మల్లే ఉంది.

” ఏయ్, ఆన్! ఏమిటి ఆలోచిస్తున్నావ్ ? ”

ఆన్ ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది.

” అది….అక్కడ …”   బాగా కాంతివంతమైన రంగులతో వేసిన   ‘  చిన్నపిల్లలలని దీవించే క్రీస్తు  ‘  పటాన్ని చూపిస్తూ అంది – ” నన్ను వాళ్ళలో ఒకదాన్ని గా ఊహించుకుంటున్నాను…అదుగో, ఆ నీలం గౌను వేసుకుని లేదూ, ఆ పిల్లగా. తను ఎవరిదీ కానట్లు ఆ మూల నిలుచుని ఉంది, నాలాగే. ఒక్కతే, బాధపడుతున్నట్లు లేదూ ? అమ్మా నాన్నా లేరల్లే ఉంది. కాని తనకీ దేవుడి దీవెనలు కావాలి కదా- అందుకు, సిగ్గు సిగ్గుగా, ఎవరికీ కనిపించకుండా ఆ మూల నిలుచుని ఉంది, ఆయన మటుకే చూసేలాగా. ఏమనుకుంటూ ఉందో నాకు ఖచ్చితంగా తెలుసు…గుండె దడా దడా కొట్టుకుంటూ ఉండిఉంటుంది, కాళ్ళూ చేతులూ చల్లగా అయిపోయి ఉంటాయి…నేను మీతో ఉండిపోవచ్చా అని అడిగేప్పుడు నాకూ అలాగే అయింది. తనని ఆయన గమనించరేమోనని భయపడుతోంది…కాని గమనిస్తారు తప్పకుండా, కదూ ? నేను అదంతా జరుగుతూ ఉన్నట్లు ఊహించుకుంటున్నాను..మెల్లి మెల్లిగా ఆయన దగ్గరికి జరుగుతోంది…బాగా దగ్గరికి వచ్చాక ఆయన తనని చూసి, దీవించేందుకు తలమీద చేయి వేస్తారు. అబ్బ ! ఒళ్ళు జల్లుమని ఉంటుంది…ఆయన్ని అలా దిగులు మొహం తో వేయకుండా ఉండాల్సింది…మీరు గమనించారో లేదో- అన్ని బొమ్మల్లోనూ అలాగే వేస్తారు. నాకు తెలిసి ఆయన ఏ మాత్రం దిగులుగా ఉండిఉండరు, అలా అయితే చిన్నపిల్లలు భయపడేవారు కదా ? ”

” అరే, ఆన్…” మెరిల్లా కంగారుగా పిలిచింది –  ఆన్ మాటలని మధ్యలోనే అడ్డుపడి తను ఎందుకు ఆపెయ్యలేదో మెరిల్లాకి తట్టలేదు.. ” నువ్వు అలా మాట్లాడకూడదు, తప్పు..అపచారం ”

ఆన్ ఆశ్చర్యంగా చూసింది.

” నేనేమీ అమర్యాదగా మాట్లాడలేదే ? ”

” నువ్వు అలా అనుకోకపోయిఉండచ్చు, కానీ అది అస్సలు పద్ధతి కాదు, దేవుడిగురించి అలా ఎవరో పక్కింటివాళ్ళ గురించి మాట్లాడినట్లు మాట్లాడకూడదు. సరే, నేనొక వస్తువుని తీసుకురమ్మంటే వెంటనే తేవాలిగాని ఇలా మధ్యలో ఊహల్లో మునిగిపోకూడదు, గుర్తు పెట్టుకో. ఆ అట్ట తీసుకుని వంటింట్లోకి రా- ఆ మూల కూర్చుని ప్రార్థన మొత్తం కంఠస్తం చెయ్యి ”

ఆన్ ఆ అట్టని వంటింట్లో బల్ల మీద పూల గిన్నె కి ఆనించింది. అందులో ఆపిల్ పూల గుత్తులని  ఆ రోజు పొద్దున  తనే తెచ్చి అలంకరించింది… అప్పుడు   మెరిల్లా అదొకలాగా చూసిందిగానీ ఏమీ అనలేదు. ఆన్ అరచేతుల్లో గడ్డం ఆనించుకుని ఏకాగ్రతతో కొన్ని నిమిషాల పాటు  అట్ట ముక్క మీది అక్షరాలు చదివింది.

” నాకు నచ్చిందండీ ఇది ” ఎట్టకేలకి ప్రకటించింది – ” ఎంతో బావున్నాయి ఇందులో మాటలు. నేను ఇదివరకు విన్నాను, అనాథాశ్రమం లో అయ్యవారు చదువుతుండేవారు.కాకపోతే అప్పుడు వింటే ఏమిటోగా ఉండేది. ఆయన గొంతు గరగరమంటుండేది , పైగా ఏడుపు గొంతు తో చదివేవారు. ప్రార్థన చెయ్యటమంటే ఆయనకి గిట్టేది కాదని ఖచ్చితంగా చెప్పగలను. ఇది కవిత్వం అయితే కాదుగానీ కవిత్వం చదినప్పుడు నాకు ఎలా ఉంటుందో అలాగే అనిపిస్తోంది. ” పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధమగును గాక ” ..ఈ వాక్యం పాట అచ్చం లో మాటల్లాగే ఉంది. మీరు దీన్ని నేర్చుకోమన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది , మిస్..మెరిల్లా ”

” అయితే నేర్చుకో,  దాని గురించి  వాగకు ” మెరిల్లా ముక్తసరిగా అంది.

ఆన్ పూల గిన్నెని ఊగులాడించి ఇంచుమించు దొర్లించబోయి సర్దుకుని కాసేపు బుద్ధిగా చదువుకుంది.

ఎంతోసేపు నోరు మూసుకుని ఉండలేదు గనుక మెరిల్లాని మళ్ళీ కదిలించింది – ” మెరిల్లా, నాకు అవోన్లియాలో ప్రాణస్నేహితురాలు దొరుకుతుందా ? ”

” ఎవరూ, ఎలాంటి స్నేహితురాలంటావూ ? ”

” ప్రా..ణ స్నేహితురాలు. బా….గా….దగ్గరిది అన్నమాట… నా లో..పలి సంగతులన్నీ చెప్పేసుకుందుకు . అలాంటి దానికోసం ఎప్పటినుంచో కలలు కంటున్నాను. నిజంగా దొరుకుతుందనేమీ అనుకోలేదు- అయితే ఇప్పుడు నా మధురస్వప్నాలలో ఒకటి నిజమైంది కదా, ఇదీ అవుతుందేమోననీ…అవుతుందంటారా ? ”

” ఆ తోటవాలు ఇంట్లో డయానా బారీ ఉంటోంది, నీ వయసే ఆ అమ్మాయికి. చాలా మంచి పిల్ల, ఇప్పుడు కార్మొడీ లో వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళి ఉంది. తిరిగివచ్చాక మీరిద్దరూ ఆడుకోవచ్చేమో.  కానీ నువ్వు బాగా జాగ్రత్తగా ఉండాలి , మంచిపిల్లలాగా నడుచుకోవాలి. డయానా వాళ్ళ అమ్మకి చాలా పట్టింపు ,  పిచ్చి వేషాలు వే శావంటే నీతో ఆడుకోనివ్వదు తనని ”

ఆన్, ఆపిల్ పూగుత్తుల మధ్యలోంచి మెరిల్లాని కుతూహలంగా చూసింది.

” డయానా ఎలా ఉంటుంది ? నాలాగా ఎర్ర జుట్టు లేదు కదా తనకి ? నా జుట్టుతోనే చస్తున్నాను, నా ప్రాణస్నేహితురాలికి కూడానా ..కష్టం ”

” డయానా చాలా అందమైన పిల్ల. నల్లటి జుట్టూ గులాబి రంగు బుగ్గలు.  తెలివిగలదీ మంచిదీ… అదీ ముఖ్యం- అందంగా ఉండటం కన్నా ”

ఆన్ ఆ నీతివాక్యాన్ని ఏమీ పట్టించుకోకుండా బోలెడంత సంబరపడిపోయింది.

anne8-1

‘’ ఓ !! తను అందంగా ఉండటం నాకెంత బావుందో ! మనం అందంగా ఉండటం తర్వాత…నా విషయం లో అది ఉండదనుకోండి…తర్వాత అందమైన స్నేహితురాలు ఉండటం గొప్ప విషయం. మిసెస్ థామస్ ఇంట్లో ఒక పుస్తకాల అల్మైరా ఉండేది , దానికి అద్దాలు ఉండేవి. లోపల పుస్తకాలేం ఉండేవి కాదు, పింగాణీ సామాను ఉండేది. ఒకసారి మిస్టర్ థామస్ ఒక అద్దాన్ని  పగలగొట్టారు, కాస్త మత్తులో ఉండి. ఇంకో తలుపు అద్దం బాగానే ఉండేది, నేను  అందు లోకి  చూస్తూ అక్కడ కేట్ మారిస్ అనే అమ్మాయి ఉన్నట్లు ఊహించుకునేదాన్ని,  ప్రతిరోజూ  మేమిద్దరం మాట్లాడుకునేవాళ్ళం. అన్నీ చెప్పేదాన్ని, విని నవ్వేది , ఓదార్చేది, తను ఉండటం చాలా హాయిగా అనిపించేది. ఆ అల్మైరా మంత్రపుది అయితే , కేట్ అక్కడ బంధించబడి ఉంటే, నేను ఆ శాపాన్ని విడిపిస్తే దాని లోపలికి వెళ్ళిపోవచ్చనుకునేదాన్ని. అప్పుడు తను నా చెయ్యి పట్టుకుని ఒక అద్భుతలోకానికి తీసుకెళ్ళిపోతుంది. అక్కడ పూల తోటల్లో దేవకన్యలు ఉంటారు, మేమిద్దరం ఎప్పటికీ అక్కడే ఉండిపోతాం…. అక్కడి నుంచి మిసెస్ హమ్మండ్ ఇంటికి వెళ్ళేప్పుడు కేట్ ని వదిలివెళ్ళలేక ఎంతో బాధపడ్డాను, కేట్ కూడా అంతే పాపం. ఏడుస్తూ అద్దాల తలుపులోంచి నన్ను ముద్దు పెట్టుకుంది. మిసెస్ హమ్మండ్ ఇంట్లో పుస్తకాల అల్మైరా లేదు. కాని ఇంటికి కొంచెం దూరం లో నది ఒడ్డున చిన్న ఆకుపచ్చటి లోయ ఉండేది…అందులోంచి ప్రతిధ్వని ఎంత బాగా వచ్చేదో ! గట్టిగా అనకపోయినాసరే, మాట్లాడిన ప్రతిమాటా మళ్ళీ వినిపించేది. ఆ మాట్లాడే అమ్మాయి పేరు వయొలెటా అని పెట్టుకున్నాను, మేమిద్దరం మంచి నేస్తాలైపోయాం. తనని ఇంచుమించు కేట్ మారిస్ ని ప్రేమించినంతగా ప్రేమించాను…ఇంచుమించుగా అంతే, పూర్తిగా కాదు. అనాథాశ్రమానికి వెళ్ళే ముందు రోజు వయొలెటా కి వెళ్ళొస్తానని చెప్పాను, తనూ దిగులు దిగులుగా వెళ్ళొస్తానంది. తనకి బాగా దగ్గరగా అయిపోయానో ఏమో , అనాథాశ్రమం లో మళ్ళీ ఎవరినీ అలా ఊహించుకోలేదు, ఊహించుకోవచ్చుగానీ…’’

” లేకపోవటమే మంచిదైందిలే ” మెరిల్లా పొడి పొడిగా అంది- ” నువ్వు ఊహించుకునేవన్నీ సగం నమ్ముతావులా ఉంది. నిజంగా స్నేహితురాలు దొరికితే పిచ్చి వ్యవహారం సర్దుకుంటుంది. డయానా వాళ్ళమ్మ, మిసెస్ బారీకి నీ కేట్ ల గురించీ వయొలెట్ ల గురించీ చెప్పకు, నువ్వు అబద్ధాలూ కాకమ్మకథలూ చెబుతావనుకుంటుంది ”

” లేదు లేదు, చెప్పను. ప్రతివాళ్ళకీ చెబుతానా ఏమిటి, మీకైతే చెప్పాలనిపించింది గాని. అరె..చూడండి, ఆపిల్ పూలలో పెద్ద తేనెటీగ !  భలే ఇల్లు కదా దానికి, పువ్వులో …గాలి కి పూలు ఊగుతుంటే లోపల నిద్రపోవచ్చు చక్కగా. నేను మనిషిని కనుక అవకుండా ఉంటే తేనెటీగ గా పుట్టి పూలలోపల నిద్రపోయేదాన్ని ”

” నిన్న సముద్రపక్షి అవుదామనుకున్నావుగా మరి ? నీకు బాగా చపలచిత్తం ఉన్నట్లుంది. ఇంతకీ నిన్ను మాట్లాడకుండా ప్రార్థన నేర్చుకో మని కదా చెప్పాను ? పక్కన ఎవరైనా ఉంటే నోరు మూసుకుని ఉండటం కష్టం నీకు, నీ గదికి వెళ్ళి ప్రార్థన కంఠస్థం చెయ్యి ”

” నాకు మొత్తం వచ్చేసిం దిగా దాదాపు- ఒక్క ఆఖరి వాక్యం తప్పితే ”

” అయినా సరే,  చెప్పినట్లు వెళ్ళి బట్టీ వెయ్యి. నేను వచ్చేదాకా అక్కడే ఉండు, తర్వాత టీ కి ఏర్పాట్లు చూడాలి ”

” మరి, నా గదికి ఈ పూలు తీసుకువెళ్ళద్దా ? ” ఆన్ బ్రతిమిలాడింది.

” గది లోకి   పువ్వులెందుకు ? అసలు కొయ్యటమెందుకు, చెట్టుకే ఉంచేస్తే పోయేది ”

” నేనూ అలాగే అనుకున్నాను ముందు, కోస్తే ఎక్కువసేపు ఉండవు కదా అని. నేనే గనుక ఆపిల్ పూలగుత్తి ని అయిఉంటే నన్ను కొయ్యటం నాకు ఇష్టం ఉండేది కాదు. కాని ఉండలేకపోయాను…తట్టుకోలేని ప్రలోభం. మీకెప్పుడైనా ‘ తట్టుకోలేని  ప్రలోభం ‘ వస్తే ఏం చేస్తారు ? ”

” నిన్ను నీ గదికి వెళ్ళమన్నానా లేదా ? ” మెరిల్లా కస్సుమంది.

ఆన్ నిట్టూర్చి తూర్పు వైపు గదిలోకి వెళ్ళి కిటికీ పక్కని కుర్చీలో కూర్చుంది.

” ఆ..వచ్చేసింది, మెట్లెక్కుతూ చివరి వాక్యం కూడా నేర్చేసుకున్నాను. ఇప్పుడిక ఈ గదిలో అందమైనవి ఊహించుకుంటాను, ఇక ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతాయిగా ! నేల మీద తెల్లటి వెల్వెట్ తివాసీ ఉంది, దాని మీద చిన్న చిన్న రోజాపూవులు అల్లి ఉన్నాయి. కిటికీలకి గులాబిరంగు పట్టు తెరలు. గోడల మీద బంగారు, వెండి దారాలతో నేసిన జలతారు జాలరులు. కుర్చీలూ బల్లలూ అన్నీ మహోగనీ కొయ్యతో చేశారు. నేనెప్పుడూ మహోగనీ ఎలా ఉంటుందో చూడలేదు, కాని దర్జాగా ఉంది అలా అంటే. ఈ మంచం మీద పట్టు దిళ్ళు… గులాబి రంగులో , నీలిరంగులో , కెంపువన్నెలో , బంగారు వన్నెలో.  వాటి పైన నేను విలాసంగా వాలి ఉన్నాను. ఆ పెద్ద అద్దం లో నా బొమ్మ కనిపిస్తోంది- నేను పొడుగ్గా , యువరాణిలాగా ఉన్నాను. పాలనురుగులాగా జీరాడే తెల్లటి లేస్ గౌన్ వేసుకున్నాను. మెడలోనూ జుట్టులోనూ ముత్యాల హారాలు. నా చర్మం స్వచ్ఛంగా , దంతమంత  తెల్లగా ఉంది, జుట్టు నడిరాత్రి చీకటంత నల్లగా ఉంది. నా పేరు..కార్డీలియా ఫిట్జ్ రాల్డ్ …అరే, ఇది మాత్రం నిజమనిపించట్లేదే…”

ఆన్ నాట్యం చేసుకుంటూ వెళ్ళి అద్దం లో చూసుకుంది. ఎప్పట్లాగా చిన్న జేగురు రంగు మచ్చల మొహమూ బెంగగా చూసే బూడిదరంగు కళ్ళూ ప్రత్యక్షమయాయి.

” నువ్వు కేవలం గ్రీన్ గేబుల్స్ ఆన్ వి అంతే. లేడీ కార్డీలియాగా నన్ను ఊహించుకోబోయినప్పుడల్లా నువ్వే  కనిపిస్తావు, నాకు తెలుసు. ఏమీ లేని ఆన్ కంటే గ్రీన్ గేబుల్స్ ఆన్ చాలా చాలా నయం, తెలుసుకో ”

వంగి అద్దం లో ప్రతిబింబాన్ని ప్రేమగా ముద్దు పెట్టుకుంది. తెరిచి ఉన్న కిటికీ లోంచి  చెప్పింది-

” గుడ్ ఆఫ్టర్ నూన్ హిమరాణీ ! కోన లో పెరిగే బర్చ్ చెట్లూ..మీకూ గుడ్ ఆఫ్టర్ నూన్ …కొండ మీది   మబ్బురంగు ఇంటికీ గుడ్ ఆఫ్టర్ నూన్ ! ఆ ఇంట్లో ఉండే డయానా  నాకు ప్రాణ స్నేహితురాలవుతుందా , లేదా ? అయితే బావుండును, ఆమె ని ఎంత ప్రేమిస్తానని….కాని కేట్ మారిస్ నీ వయొలెటా నీ మాత్రం మర్చిపోనేకూడదు , వాళ్ళు నొచ్చుకుంటారు. ఎవరైనా నొచ్చుకుంటే నాకేం బావుండదు , వాళ్ళని గుర్తుంచుకుని రోజూ ఒక ముద్దు పంపించాలి ”

గాలి లోకి రెండు ముద్దులు విసిరేసింది, ఆపిల్ కొమ్మల అవతలికి. ఆ తర్వాత అరచేతుల్లో గడ్డం ఆనించుకుని బ్రహ్మాండమైన పగటి కలల్లో మునిగిపోయింది .

 

[ ఇంకాఉంది ]

 

 

గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్- 7

ఆన్ ప్రార్థన

ఆన్ ని నిద్రపోయేందుకు తీసుకువెళ్ళింది మెరిల్లా.
” ఇదిగో చూడు, నిన్న రాత్రి నువ్వు నైట్ గౌన్ వేసుకుంటూ విప్పిన బట్టలన్నీ చిందరవందరగా పడేశావు. అది అస్సలు మంచి అలవాటు కాదు, నేను ఊరుకోను ”
” అయ్యో…అవునా ? రాత్రి నా బాధలో ఏమీ పట్టించుకోలేదండీ. ఇంకనుంచీ అన్నీ శుభ్రంగా మడత పెట్టి కుర్చీలో సర్దేస్తాను. అనాథాశ్రమం లో అలాగే చేయించేవారు…కాకపోతే కొన్నిసార్లు మర్చిపోతుండేదాన్ని, తొందరగా పక్క ఎక్కి ఏదైనా మంచి సంగతి ఊహించుకోవాలనే హడావిడిలో ”
” ఇక్కడ అలా కుదరదు. సరే, ప్రార్థన చేసుకుని నిద్రపో ఇంక ”
” నాకే ప్రార్థనలూ రావు ” ఆన్ ప్రకటించింది.
మెరిల్లాకి కంగారు పుట్టింది.
” అదేమిటీ ? నీకు దేవుడికి దణ్ణం పెట్టుకోవటం నేర్పలేదూ అక్కడ ? చిన్న పిల్లలు తప్పనిసరిగా రోజూ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి …దేవుడంటే ఎవరో తెలీదా నీకు , కొంపదీసి ? ”
” దేవుడు అనగా అనాదిఅయి న, అనంతమైన, అవ్యయమైన శక్తి. ఆయన మంచితనమునకు, సత్యమునకు, జ్ఞానమునకు, పవిత్రతకు నిలయమైనవాడు ” ఆన్ వల్లించింది.
మెరిల్లా ఊపిరి పీల్చుకుంది. ” అమ్మయ్య ! నీకు కొద్దో గొప్పో తెలుసు – మరీ ఏబ్రాసిదానివి కాదు. ఎక్కడ నేర్చుకున్నావు ఇది ?”
” ఆదివారం చర్చ్ లో. పవిత్రగ్రంథం లో ప్రశ్నలూ జవాబులూ కంఠస్తం చేయించేవారుగా. నాకు ఆ పదాలు పలకటం బావుండేది- ‘ అనాది, అనంతం, అవ్యయం…పాటలో మాటల్లాగా లేవూ ? అంటే అది పూర్తిగా కవిత్వం కాదనుకోండీ..”
” ఇప్పుడు కవిత్వం సంగతి అవసరమా ? రోజూ రాత్రి ప్రార్థన చేసుకోనివాళ్ళు ఖచ్చితంగా చెడ్డపిల్ల లే…నువ్వూ అలాంటిదానివేనా ఏమిటి ? ”
” నాలాగా ఇలా ఎర్ర జుట్టు ఉన్నవాళ్ళు చెడ్డగానే ఉంటుంటారు ” ఆన్ ఖిన్నురాలైపోయింది ..” దేవుడు కావాలనే నాకు ఎర్ర జుట్టు పెట్టాడట- థామస్ చెప్పాడు నాకు. అప్పట్నుంచీ దేవుణ్ణి పట్టించుకోవటం మానేశాను. అయినా – రోజంతా పిల్లల్ని ఆడించి బొత్తిగా అలిసిపోయాకగానీ నన్ను నిద్రపోనిచ్చేవాళ్ళు కాదు. అప్పుడింక ప్రార్థన చేసే ఓపికెక్కడుంటుంది చెప్పండి ? ”
ఆన్ కి మతశిక్షణ ని తక్షణమే మొదలుపెట్టాలనీ ఎంతమాత్రం ఆలస్యం చేసేందుకు లేదనీ మెరిల్లా గ్రహించింది.
” ఈ ఇంటి కప్పుకింద నువ్వు ఉన్నంత కాలమూ ప్రార్థన చేసి తీరాలి ” – నిష్కర్ష గా చెప్పేసింది.
” మీరు చెయ్యమంటే ఎందుకు చెయ్యను ? తప్పకుండా చేస్తాను. ఈ ఒక్కసారికీ ఎలా చెప్పాలో చెప్పండి. రాత్రికి ఊహించుకుంటాను, మంచి అందమైన ప్రార్థన ని, రోజూ చేసుకుందుకు ”
” ముందు మోకాళ్ళ మీద కూర్చో ” – ఆ సంగతి కూడా చెప్పాల్సివస్తున్నందుకు మెరిల్లా ఇబ్బందిపడింది.
మోకాళ్ళ మీద కూర్చున్న మెరిల్లాకి ఎదురుగా ఆన్ తనూ మోకరిల్లి గంభీరంగా మొహం పెట్టింది.

Mythili1
” అసలు ప్రార్థన ఇలాగే ఎందుకు చెయ్యాలో ? నేనైతే ఎలా చేస్తానో చెప్పనా – పె..ద్ద విశాలమైన పొలం లోకో, లేకపోతే దట్ట..మైన అడవి లోపల్లోపలికో- వెళ్ళి, తల పై..పై..కి ఎత్తి- అంతులేని ఆకాశపు నీలిరంగుని చూస్తూ – అప్పుడు, ప్రార్థన దానంతట అదే వచ్చేస్తుంది. సరే, నేను సిద్ధం- చెప్పండి ఏం చెప్పాలో ? ‘’
మెరిల్లా ఇంకా ఇబ్బంది పడిపోయింది. బాగా చిన్నపిల్లలు చెప్పుకునే ” నన్ను నిద్రింపనీ దేవా ” నేర్పుదామనుకుంది ముందు. కాని , తల్లి ఒళ్ళోంచి భద్రంగా పక్కమీదికి దొర్లే పాపాయిల ప్రార్థన అది – ఈ పిల్లరాకాసికి తగదనిపించింది ఆమెకి. ఆ పైనున్న దేవుడి ప్రేమ గురించి ఆన్ కి ఏమీ తెలీదు, ఏ లెక్కా జమా లేదు…ఎందుకంటే మనుషుల ఆప్యాయత రూపం లో దాన్ని ఆమె పొందలేదు కనుక – ఈ సంగతి మెరిల్లాకి అర్థమైంది. … ” నీ అంతట నువ్వు ప్రార్థన చేసుకునే వయసు వచ్చింది నీకు. దొరికిన వాటికోసం దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుని, ఇంకేం కావాలనుకుంటున్నావో వినయం గా అడుగు, చాలు ”
” సరే. నాకు వచ్చినట్లు చెప్తాను అయితే ” – మెరిల్లా ఒళ్ళో చెక్కిలి అనించుకుని అంది ఆన్. ” పరలోకమందున్న మా ఘనమైన తండ్రీ ”… తలెత్తి , ” చర్చ్ లో ఇలాగే కదా చెబుతారు, ఇంట్లోనూ అలాగే అనచ్చా ? ” అడిగి, జవాబుకోసం చూడకుండా కొనసాగించింది.

Mythili2
” పరలోకమందున్న మా ఘనమైన తండ్రీ ! ఆహ్లాద శ్వేత మార్గాన్నీ, ప్రకాశమాన సరోవరాన్నీ, బోనీ [ జెరేనియం ] నీ[ చెర్రీ చెట్టు ] హిమరాణినీ – నాకు ఇచ్చినందుకు అనేకానేక ధన్యవాదాలు. నిజంగా నేను ఎంతో కృతజ్ఞురాలిని. ఇకపోతే, నాకు కావల్సినవి చాలా చాలా ఉన్నాయి , ఇప్పుడే అన్నీ అడిగెయ్యలేను, . రెండు ముఖ్యమైనవి మాత్రం అడుగుతున్నాను- ఒకటి- నన్ను గ్రీన్ గేబుల్స్ లో ఉండిపోనియ్యాలి . రెండు – నేను పెద్దయాక అందంగా అయిపోవాలి. ఇప్పటికి ఇంతే- ఇట్లు మీ విధేయురాలు, ఆన్ షిర్లే. ”
లేచి నిల్చుంటూ ఆత్రంగా అడిగింది-” బాగా చెప్పానా ? ఇంకొంచెం తీరిగ్గా ఆలోచిస్తే చక్కటి మాటలు వచ్చి ఉండేవి ..”
ఆన్ చేత ఆ అసాధారణమైన ప్రార్థన చేయించింది అజ్ఞానమే గానీ దేవుడి పట్ల ఆమె కి అమర్యాదేమీ లేదని గట్టిగా గుర్తుచేసుకుంది గనుక, మెరిల్లా తేరుకుంది. ఆన్ ని పడుకోబెట్టి దుప్పటి కప్పి కొవ్వొత్తి తీసుకుని వెళ్ళబోతూ ఉంది….వెనక నుంచి ఆన్ పిలిచింది.
” ఇప్పుడే గుర్తొచ్చిందండీ…మీ విధేయురాలు అనే చోట ఆమెన్ అని ఉండాలేమో కదా ? చర్చ్ లో అలాగే అంటారు…ఇందాక మర్చిపోయాను. ప్రార్థన ఎలాగోలా పూర్తిచెయ్యాలి గదా అని, ఉత్తరాలు రాసేప్పుడు లాగా అన్నాను- ఏం పర్వాలేదంటారా ? ”
” ఆ.పర్వాలేదులే. ఇంక నిద్రపో, మంచి పిల్లలాగా. గుడ్ నైట్ ”
”నిన్న చెప్పబుద్ధి కాలేదు… ఇవాళ మటుకు మనస్ఫూర్తిగా గుడ్ నైట్ చెబుతున్నా…” – ఆన్ సుఖంగా దుప్పటి ముసుగుపెట్టుకుంది.
మెరిల్లా వంటింట్లోకి వెళ్ళి కొ వ్వొ త్తిని బల్లమీద పెడుతూంటే మాథ్యూ అక్కడే ఉన్నాడు.
” ఇది విన్నావా మాథ్యూ కుత్ బర్ట్ ? ఈ పిల్లకి తక్షణం మతవిజ్ఞానం ఇవ్వాలి. ఏనాడూ సరిగ్గా ప్రార్థనే చెయ్యలేదట …ఎంత ఘోరమో ! కావల్సిన పుస్తకాలన్నిటినీ రేపు పాస్టర్ ఇంటినుంచి పురమాయిస్తాను…రోజూ నూరిపోస్తేగాని లాభం లేదు. ఆదివారం చర్చ్ కి పంపితే ఇంకా నేర్చుకుంటుంది ..కాని చర్చ్ కి మంచిబట్టలు వేసుకోవాలి కదా , దీనికేమో సరైనవి లేవు…త్వర త్వరగా కుట్టించాలి. నాకిప్పట్లో తీరికన్నది ఉండదనిపిస్తోంది. ఇన్నాళ్ళూ తేలిగ్గా గడిచింది నా జీవితం, ఇప్పుడు నేనేం చెయ్యగలనో పరీక్ష పెట్టినట్లుంది . కానీలే, కష్టపడద్దూ మరి, లేకపోతే ఎంత అప్రతిష్ఠా..బరువు నెత్తికెత్తుకున్నామాయె ! ”
మాథ్యూ చిద్విలాసంగా చూస్తుండిపోయాడు.
[ ఇంకా ఉంది ]

   గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్- ఆరో అధ్యాయం

                    మెరిల్లా నిర్ణయం 

 

మొత్తానికి ఇద్దరూ మిసెస్ స్పెన్సర్ ఇల్లు చేరారు. వైట్ శాండ్స్ సముద్రానికి పక్కనే ఉంది ఆ పెద్ద ఇల్లు, పసుప్పచ్చ రంగు వేసి ఉంది దానికి. ఆవిడ బోలెడు ఆశ్చర్యపోయింది వీళ్ళని చూసి

” అరె ! మీరా…రండి, రండి. భలే వచ్చారే ! మెరిల్లా, గుర్రాన్ని ఇక్కడ కట్టేస్తావా ? ఆన్..బాగున్నావా ? ”

   ” అలాగే మిసెస్ స్పెన్సర్. కాసేపు ఉంటాముగా, గుర్రానికీ అలుపు తీరుతుంది. కాని త్వరగా వెళ్ళిపోవాలి.. మాథ్యూ ఎదురుచూస్తుంటాడు. అవునూ, …మేము పది పదకొండేళ్ళ అబ్బాయిని కదా తీసుకురమ్మని అడిగాము ?  మీ తమ్ముడు రాబర్ట్ కి అదే చెప్పాం కదా, ఇదేమిటి మరి ? ”

   మిసెస్ స్పెన్సర్ కంగారు పడిపోయింది. ” అదేమిటి మెరిల్లా…మీరు అడిగింది అమ్మాయిని కాదూ ? రాబర్ట్ వాళ్ళమ్మాయి నాన్సీ తో అలాగనే కబురు చేశాడు…కదూ ? ” మెట్లుగు దిగుతున్న తన కూతుర్ని కూడా రెట్టించింది .

” అవును మిస్ కుత్ బర్ట్, అంతే కదా  ” వంతపాడింది ఆమె కూతురు ఫ్లోరా జేన్. మెరిల్లా తల అడ్డంగా ఊపింది.

” క్షమించాలి మెరిల్లా. మీరు అడిగినట్లే చెయ్యాలని ఈ ఆన్ ని వెతికి పట్టుకొచ్చాను. ఇదంతా మా తమ్ముడి కూతురు నాన్సీ పనే..తనే తప్పు సమాచారం ఇచ్చి ఉంటుంది. ఆ పిల్ల అంతే. …దాని నిర్లక్ష్యానికి ఇదివరకు ఎన్నిసార్లు తిట్టిపోశానో…”

” తప్పు మాదేలే. ఇలాంటి ముఖ్యమైన విషయాలు మేమే వచ్చి చెప్పాలి గాని ఎవరితోనో కబురు చేస్తే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ పిల్లని వెనక్కి పంపించటం కుదురుతుందా ? వాళ్ళు చేర్చుకుంటారా ?”

” చేర్చుకుంటారేమో ” మిసెస్ స్పెన్సర్ ఆలోచిస్తూ అంది- ” కాని అలా అక్కర్లేదేమో. నిన్ననే మిసెస్ పీటర్ వచ్చింది. నీకు తెలుసుగా, వాళ్ళది పెద్ద సంసారం. సాయం చేసేందుకు ఒక అమ్మాయి ఉంటే బావుండునని ఎంతగానో అనుకుంటోంది. ఆమెకి ఆన్ సరిగ్గా సరిపోతుంది, కలిసిరావటమంటే ఇదే ”

MythiliScaled

మెరిల్లాకి మాత్రం అది కలిసిరావటంగా అనిపించలేదు ఎందుకో. ఈ అక్కర్లేని అనాథని వదిలించుకునే అవకాశం అనుకోకుండా వచ్చిందే  కాని అదేమీ  బావుండలేదు ఆమెకి.  మిసెస్ పీటర్ ని మెరిల్లా కొద్దిగా ఎరుగును. ఒక్క క్షణం ఖాళీ గా కూర్చోదు, ఎవరినీ కూర్చోనివ్వదు అని చెప్పుకుంటారు…పొద్దస్తమానమూ ధుమధుమలాడుతూనే ఉంటుందట.  ఆమె పీనాసి తనాన్నీ చేయించే గొడ్డు చాకిరీనీ  తట్టుకోలేక ఎవరూ ఆమె దగ్గర  ఎక్కువరోజులు పని చేయలేరు. అలాంటి ఆమె చేతుల్లో ఆన్ ని పెట్టేందుకు మెరిల్లా కి మనసు ఒప్పుకోవటం లేదు.

” సరే, మిసెస్ స్పెన్సర్. చూద్దాం లే ”

” ఇదిగో, మిసెస్ పీటర్ మాటల్లోనే వచ్చేసిందే ! అందరూ లోపలికి రండి, మాట్లాడుకోవచ్చు ”- మిసెస్ స్పెన్సర్ ఇంటి హాల్ లో అన్ని తలుపులూ కిటికీలూ  బిగించేసి ఉన్నాయి.  బయటి వెచ్చదనపు ఆహ్లాదం ఏదీ లోపలికి రావటం లేదు

. ” మెరిల్లా, అలా కూర్చో. ఆన్, నువ్విక్కడ . మెసలకుండా బుద్ధిగా కూర్చో. ఫ్లోరా జేన్ ! కాస్త ఆ కెటిల్ ని పొయ్యిమీద పెట్టమ్మా ! మిసెస్ పీటర్, ఈమె మిస్ కుత్ బర్ట్. మెరిల్లా, ఈవిడే…అయ్యో.ఒక్క క్షణం. ఫ్లోరాకి ఓవెన్ లోంచి బన్ లు తీసెయ్యమని చెప్పటం మర్చిపోయాను..మాడిపోతాయేమో..” మిసెస్ స్పెన్సర్ లోపలికి పరిగెత్తింది.

ఆన్ , ఒళ్ళో చేతులు పెట్టుకుని మెదలకుండా కూర్చుంది. మిసెస్ పీటర్ వైపే రెప్ప వెయ్యకుండా చూస్తోంది. మిసెస్ పీటర్ ఆన్ ని పురుగుని చూసినట్లు  చూసింది. ఈవిడకి తనని అప్పజెబుతారా ? ఆన్ గుండె గుబుక్కుమంది. కళ్ళమ్మట నీళ్ళు ఆపుకుందామన్నా ఆగటం లేదు. మిసెస్ స్పెన్సర్ ఇంట్లోంచి బయటికి వచ్చింది. ఎట్లాంటి ఇబ్బందినైనా ఇట్టే చక్కబెట్టెయ్యగల నన్న  నమ్మకంతో  ఆవిడ మొహం వెలిగిపోతోంది.

” చూడు మిసెస్ పీటర్..ఈ అమ్మాయిని మెరిల్లా వాళ్ళ కోసం తెచ్చాను. వాళ్ళసలు అబ్బాయి కావాలని అడిగారట, మా నాన్సీ నాకు ఆ మాట తేడాగా చెప్పేసరికి ఇలా పొరబాటైపోయింది. సరే, ఐందేదో ఐంది- నిన్ననే  నీకు అమ్మాయి అవసరమని చెప్పావుగా, ఈ పిల్లని తీసుకు వెళతావా ? ”

మిసెస్ పీటర్ ఆన్ ని నఖ శిఖ పర్యంతం అంచనా వేస్తోంది.

” ఏయ్ అమ్మాయ్ ! నీ పేరేమిటి ? నీ కెన్నేళ్ళు ? ”

”ఆన్ షిర్లే అండీ ” బిక్కచచ్చిపోయింది ఆన్…ఎక్కడైనా తప్పు చెప్పబోతానేమోనని కూడబలుక్కుంటూ   ” నాకు పదకొండేళ్ళండీ ”

” హూ. ఒంటి మీద పిడికెడు కండైనా ఉన్నట్లు లేదు. కానీ గట్టి శరీరంలాగే ఉందిలే. ఇలాంటి వాళ్ళే బాగా పనిచెయ్యగలరు. ఇదిగో అమ్మాయ్… నువ్వు బుద్ధిగా ఉండి చెప్పిన పనల్లా చేశావంటే నీకు మూడు పూట్లా తిండి పెడతాను. మిస్ కుత్ బర్ట్, ఇప్పటికిప్పుడే ఈ పిల్లని మీరు వదిలించుకోవచ్చు, నేను తీసుకెళ్ళిపోతాను. ఇంటి దగ్గర చంటాడు పోరు పెట్టి ఏడుస్తున్నాడు, సముదాయించలేకుండా ఉన్నాను.తక్కిన ఆరుగురూ ఒక్కొక్కళ్ళూ ఒక్కొక్క పేచీ. అవతలేమో  బోలెడంత పని నాకు, ఆయన భోజనానికి వచ్చేస్తారు   ”

మెరిల్లా ఆన్ వైపు చూసింది. తప్పించుకున్న బోను లో మళ్ళీ చిక్కుకుపోయిన ప్రాణిలాగా ఉంది ఆన్. ఆ మూగ బాధ కి మెరిల్లా కరిగిపోయింది. ఆ చూపు ని నిర్లక్ష్యం చేసి ఊరుకుంటే తను చచ్చిపోయేదాకా అదే వెంటాడుతుందని అనిపించింది.

మిసెస్ పీటర్ ఏమీ ఆకర్షించలేదు మెరిల్లాని. ఆన్ లాంటి సున్నితమైన పిల్లని ఆవిడ చేతుల్లో పడేసే బాధ్యత మెరిల్లా తీసుకోదల్చుకోలేదు.

mythili1

” ఏమో లెండి ” అంది మెల్లిగా. ” ఈ పిల్లని ఉంచుకోవద్దనేమీ మేమింకా నిర్ణయించుకోలేదు. మాథ్యూ కి ఐతే ఉంచేసుకోవాలనే ఉంది. అసలీ పొరబాటు ఎక్కడ జరిగిందో కనుకుక్కునేందుకు వచ్చాను అంతే. ఇప్పటికి ఆన్ ని ఇంటికి తీసుకు వెళతాను…ఇంట్లో  ఇద్దరం మాట్లాడుకోవాలి, నేనొక్కదాన్నే ఏ విషయమూ తేల్చటం కుదరదు. మేము ఆన్ ని పంపించెయ్యాలనుకుంటే రేపు రాత్రికల్లా మీ ఇంటికి చేరుస్తాము,  చేర్చలేదూ అంటే పంపించదల్చుకోలేదూ అని అర్థం ” ఇంత పొడుగున చెప్పుకొచ్చింది.

” సరేలేండి, ఏం చేస్తాం ” అంది మిసెస్ పీటర్ , కాస్త పెడసరంగా.

మెరిల్లా మాట్లాడుతూ ఉండగా ఆన్ మొహం లో సూర్యోదయం సంభవించింది. మొదటి మాటలతో బాధ నలుపు మాయమయింది, ఆ తర్వాత  లేత గులాబి రంగులో ఆశ విచ్చుకుంది. కళ్ళు ధగధగా మెరిసిపోయాయి. ఏదో పని మీద మిసెస్ పీటర్, మిసెస్ స్పెన్సర్ లోపలికి వెళ్ళగానే దిగ్గున లేచి మెరిల్లా దగ్గరికి ఎగిరి వెళ్ళింది.

” మిస్ కుత్ బర్ట్…నన్ను గ్రీన్ గేబుల్స్ లో ఉం చేసుకుంటారా , నిజంగానే ? ” ఊపిరి బిగబట్టి గుసగుసగా ప్రశ్నించింది, ఆ మాటలే పెద్దగా అనేస్తే అలా జరగదో ఏమో అన్నట్లు. ” మీరు నిజంగానే అన్నారా , లేకపోతే నేను అలాగని ఊహించుకుంటున్నానా ? ”

మెరిల్లా –    ” నీ’  ఊహాశక్తి ‘ ని  కొంచెం అదుపులో పెట్టుకో …నిజానికీ ఊహకీ తేడా తెలీకుండా పోతోంది నీకు ” చిరాగ్గా అంది. ” అవును, అన్నాను, అంతకు మించి ఇంకేం అనలేదు. మేమింకా తేల్చుకోవాలి, బహుశా మిసెస్ పీటర్ దగ్గరికే పంపించేస్తామేమో ! ఆవిడ కే నువ్వు ఎక్కువ అవసరం కూడానూ ”

ఆన్ ” అంత కంటే నన్ను అనాథాశ్రమానికే పంపించెయ్యండి, వెళ్ళిపోతాను. ఆవిడ…ఆ మిసెస్ పీటర్…ముళ్ళ కంచెలాగా ఉన్నారు ”

 

మెరిల్లా నవ్వు ఆపుకుంది. అలా అన్నందుకు ఆన్ ని మందలించాలి గనుక అంది –

” పెద్దావిడ ని అలా అనచ్చా ? నీకావిడ తో పరిచయం కూడా లేదు పైగా..  మంచి పిల్లలాగా నోరు మూసుకుని వెళ్ళి నీ కుర్చీలో కూర్చో ”

ఆన్  ,  గంభీరంగా  – ” నన్ను మీరు కావాలనుకుంటే, మీతో ఉంచేసుకుంటామంటే ….ఏదైనా చేసేందుకు ప్రయత్నిస్తానండీ ” – వెళ్ళి కూర్చుంది.

వాళ్ళిద్దరూ వెనక్కి వెళ్ళేసరికి మాథ్యూ ఇంటి బయటే తచ్చాడుతున్నాడు. ఎందుకో మెరిల్లా కి తెలుసు, ఆన్ ని కూడా తీసుకొచ్చినందుకు అతని మొహం విప్పారటాన్నీ గమనించింది.  ఐనా   అప్పుడే , అదీ  ఆన్ ఉండగా- ఏమీ చెప్పదలచుకోలేదు. తర్వాత కొంతసేపటికి, ఇంటి వెనక ఆవుల కొట్టం లో పాలు తీసేందుకు వెళ్ళినప్పుడు –  మిసెస్ స్పెన్సర్ ఇంట్లో జరిగిందంతా క్లుప్తంగా వివరించింది.

మాథ్యూ , తనకేమాత్రం అలవాటులేని రౌద్రం తో అన్నాడు- ” నాకు ఇష్టమైన కుక్కపిల్లని కూడా ఇవ్వను ఆ మిసెస్ పీటర్ కి, అలాంటి మనిషి  ఆవిడ ”

” నాకూ నచ్చలేదులే ఆ మనిషి . మరి ఆవిడ కి ఇవ్వకూడదూ అంటే మనమే అట్టే పెట్టుకోవాలి ఆన్ ని, కదా ? ” అనాథాశ్రమానికి పంపెయ్యచ్చు అనే అవకాశం లేనట్లే మాట్లాడింది మెరిల్లా. ” నువ్వు పెంచుకోవాలనుకుంటున్నావు గా..మరి..నేనూ ఆలోచించాను ఇప్పటిదాకా. నాకూ ఇష్టమే అనుకుంటున్నాను. ..అది నా బాధ్యత అనిపిస్తోంది. కాకపోతే నాకు పిల్లల్ని పెంచిన అనుభవం బొత్తిగా లేదు…అందులోనూ ఆడపిల్లని…సరిగా పెంచలేనేమో …ఐనా ప్రయత్నిస్తాలే. సరే మాథ్యూ, ఆన్ ని పెంచుకుందాం ”

మాథ్యూ మొహం ప్రకాశించింది.

” నీకూ తెలుస్తుందనే ఎదురుచూస్తున్నాను మెరిల్లా. ఆన్ భలే పిల్ల , నిజంగా ! ”

” సరేలే. కాస్త పనికొచ్చే పిల్ల అయితే కదా మనకి మంచిది…ఇంకనుంచీ తర్ఫీదు చెయ్యటం మొదలెడతాను. నువ్వు మాత్రం నా  పద్ధతుల్లో జోక్యం చేసుకోకూడదు .   పిల్లల్ని పెంచటం నీ కంటే నాకు బాగానే తెలుసు. అంత నెత్తిమీదికి వచ్చినప్పుడు నిన్ను సాయం అడుగుతాలే ”

” నీ ఇష్టం మెరిల్లా, నువ్వు ఎలా అంటే అలా. మరీ గారాబం చెయ్యక్కర్లేదుగానీ ఆన్ ని కొంచెం దయగా, ప్రేమగా చూడు అంతే. ప్రేమగా ఓర్పుగా చెబితే తను ఏం చెయ్యమన్నా చేస్తుందనుకుంటాను…”

మాథ్యూ మాటలు పెద్ద గా పట్టించుకోనట్లు మొహం పెట్టి , మెరిల్లా, పాలబిందెలు ఎత్తుకుని వెళ్ళిపోయింది. వెన్న తీసే యంత్రం లో పోస్తూ ,  తనలో తను అనుకుంది – ” ఇప్పుడు చెప్పను ఆన్ కి… ఉత్సాహం ఎక్కువై రాత్రంతా నిద్ర పోదు.  మెరిల్లా కుత్ బర్ట్, నిండా మునిగావు ఇందులో !  ఇలాంటి పని చెయ్యగల నని కలలోనైనా అనుకున్నావా అసలు ? మాథ్యూ మాత్రం…ఆడపిల్లలంటే నే హడలిపోయే మనిషి…ఈ పిల్ల ఎందుకు నచ్చిందో ! మొత్తానికి ఒక ప్రయోగం మొదలు పెడుతున్నాం , ఏమవుతుందో మరి ..చూడాలి ”

[ ఇంకా ఉంది ]

 

గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ – 5

[  Anne Of Green Gables By L.M.Montgomery ]

anne5ఆన్, మెరిల్లా కలిసి గుర్రం బండి లో వెళ్తున్నారు. ఆన్ రహస్యం చెబుతున్నట్లు అంది- ” ఇలా వెళ్ళటాన్ని ఆస్వాదించాలని నిర్ణయించుకున్నానండీ. నాకు తెలిసీ… గట్టిగా అనుకుంటే , ఇంచుమించు ఏదైనా బావుందనిపిస్తుంది.  గట్టి..గా అనుకోవాలంతే. ఈ షికారు అయాక మళ్ళీ అనాథాశ్రమానికి వెళ్ళిపోవాలని గుర్తు చేసుకోదల్చుకోలేదు నేను…ఈ షికారు గురించి మటుకే ఆలోచిస్తా. అరె ! చూడండి, అడవి రోజా పువ్వు పూసింది అప్పుడే, ఎంత ముద్దు గా ఉందో కదా ! రోజా పువ్వుగా ఉండటం ఎంత బావుంటుందో ! రోజా పూలకి మాటలొస్తే మనకి భలే ఉంటుంది కదా … అవి మనకి మంచి మంచి కబుర్లు చెబుతాయి. పింక్ రంగు మనోహరంగా ఉంటుంది కదండీ  ? నాకెంతో ఇష్టం, కాని నాకు బావుండదు. ఎర్ర  జుట్టు ఉన్నవాళ్ళు ఊహల్లో కూడా పింక్ రంగు బట్టలు వేసుకోలేరు.  అవునండీ, చిన్నప్పుడు ఎర్ర జుట్టు ఉండి పెద్దయాక అది వేరే రంగుకి మారటం చూశారా మీరెప్పుడైనా ? ”

” ఊహూ.లేదు. నీ జుట్టు రంగు మారుతుందని కూడా  నాకేం నమ్మకం లేదు ”మెరిల్లా ఖచ్చితంగా అంది.

ఆన్ నిట్టూర్చింది…” ఇంకో ఆశ కూడా పోయిందండీ. ‘ నా జీవితం ఆశలకు సమాధి ‘ …ఒక పుస్తకం లో చదివాను  ఈ మాటలు. అప్పట్నుంచీ దిగులేసినప్పుడల్లా అవి తల్చుకుంటూ ఉంటాను, కొంచెం నయంగా అనిపిస్తుంది అప్పుడు  ”

మెరిల్లా ” అలా అనుకుంటే ఎలా నయంగా ఉంటుందో నాకేమీ అర్థం కావట్లేదు ”

” లేదు, నిజంగా నయం గా ఉంటుంది. నేనొక కథలో  అమ్మాయినే  అనిపిస్తుంది. నాకు కథల్లో లాగా ఉండటమంటే చాలా ఇష్టం. మనం ఇవాళ ‘ ప్రకాశమాన సరోవరం ‘ మీదుగా వెళ్తామా ? ” ఆన్ అడిగింది.

” బారీ చెరువు అనేనా నీ తాత్పర్యం  ? అటు కాదు, సముద్రపు  ఒడ్డు పక్కనుంచి  వెళతాం ” మెరిల్లా .

 

” సముద్రపు ఒడ్డు  పక్కనే దారి  ” ..ఆన్ మైమరచి పోతూ మళ్ళీ అంది . ” బావుంటుందా ? మీరు ఆ మాట అనగానే చటుక్కున అదెలా ఉంటుందో నా కళ్ళ ముందు కనిపిస్తోంది . ‘ వైట్ శాండ్స్  ‘ అనే పేరూ బావుంది. అవోన్లియా అంత కాదనుకోండి..అవోన్లియా అంటుంటే సంగీతం లాగా వినిపిస్తుంది. వైట్ శాండ్స్ ఎంత దూరం ? ”

” ఐదు మైళ్ళు ఉంటుంది. సరే, నువ్వు మాట్లాడి తీరాలీ అంటే కాస్త పనికొచ్చేవి మాట్లాడుకుందాం. నువ్వు ఎవరు , ఎక్కడినుంచీ వచ్చావు..ఆ విషయాలు చెబుతావా ? ” మెరిల్లా  అడిగింది .

” అవన్నీ చెప్పటానికి ఏమీ బావుండవు. నేనెవరో ఏమిటో  – నేను ఎలా ఊహించుకుంటానో చెప్పనా ? ” ఆన్ సూచించింది.

” ఊహూ. అస్సలు వద్దు. పచ్చి నిజాలు అంటారు చూడు, అవి చెప్పు. నువ్వు ఎక్కడ పుట్టావు ? నీకు ఎన్నేళ్ళు ? ”

‘ పచ్చి నిజాలు ‘ చెప్పేందుకు ఆన్ నిట్టూరుస్తూ సిద్ధమైంది ..” మొన్న  మార్చ్ కి నాకు పదకొండేళ్ళొచ్చాయి. నేను బోలింగ్ బ్రోక్ లో పుట్టానట. అది నోవా స్కోటియా లో ఉంది. మా నాన్న పేరు వాల్టర్ షిర్లే. ఆయన బోలింగ్ బ్రోక్ స్కూల్లో టీచర్.  మా అమ్మ పేరు బెర్తా షిర్లే. వాల్టర్, బెర్తా- పేర్లు బావున్నాయి కదండీ  ? మా నాన్న పేరు జెడేడియా లాంటిదేదో అయి ఉంటే ఎంత ఇబ్బంది గా ఉండేదో ”

” ఏ పేరైతేనేం ? మనిషి ప్రవర్తన బావుండాలి గానీ ” మెరిల్లా నీతి వాక్యం చెప్పింది, నిజానికి అదే నీతి మెరిల్లాకీ అవసరమే.

 

mythili1” ఏమో మరి ” ఆన్ ఆలోచన లో పడింది. ” ఎక్కడో చదివాను, రోజా పువ్వు ని ఇంకే పేరు తో పిలిచినా అది మంచి వాసనెయ్యకుండా పోతుందా అని. కానీ రోజాని ముల్లు అనో కాబేజ్ అనో పిలవటం ఏం బావుంటుంది  చెప్పండి ? మా నాన్నకి జెడేడియా అని పేరున్నా ఆయన మంచి వాడే అయి ఉండేవాడేమో, అయినా బాగోదు. మా అమ్మ కూడా ముందు టీచర్ గానే ఉండేదట, పెళ్ళయాక మానేసిందట.  వాళ్ళు చాలా బీదవాళ్ళని మిసెస్ థామస్ చెప్పింది. నా కంటే ముందు ఇద్దరు పాపలు పుట్టారట గానీ చచ్చిపోయారట. బోలింగ్ బ్రోక్ లో ఒక చిన్న పసుప్పచ్చ ఇంట్లో ఉండేవాళ్ళట. నేనెప్పుడూ ఆ ఇల్లు చూడలేదు, కాని చాలా ఊహించుకుంటాను. గేట్ లోపల లిల్లీ పూలూ, వాకిట్లో లిలాక్ లూ, కిటికీ పక్కనే హనీ సకల్ లూ ఉండి ఉంటాయి.    కిటికీ లకి మస్లిన్ పరదాలు కూడా ఉండి ఉంటాయి. మస్లిన్ పరదాలు ఉంటే చాలు, ఇల్లు గొప్పగా ఉంటుంది. నేను ఆ ఇంట్లోనే పుట్టాను. నా అంత సాదా సీదాగా ఉన్న పాపాయిని ఎప్పుడూ చూడలేదని మిసెస్ థామస్ అంది. పీల గా ఈసురోమంటూ ఉండేదాన్నట, మొహం లో కళ్ళు తప్ప ఏమీ కనిపించేవి కాదట. కాని మా అమ్మ మాత్రం నేను చాలా ముద్దుగా ఉన్నానని అనుకుందట.  అదే నిజం అయి ఉండాలి, అమ్మ చదువుకుంది కదా –  తనకి తెలుస్తుందా, మిసెస్ థామస్ కి తెలుస్తుందా ? మిసెస్ థామస్ మా ఇంట్లో పని చేస్తుండేది. నేను అమ్మకి ఆశా భంగం కలిగించలేదని తలచుకుంటే తృప్తిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ తర్వాత అమ్మ ఎక్కువ రోజులు బతకలేదు.  నాకు మూడు నెలల వయసున్నప్పుడు జ్వరం తగిలి చచ్చిపోయింది. నేను  ‘ అమ్మా ‘ అని పిలవటం  గుర్తుండేదాకా ఐనా అమ్మ బతికి ఉంటే బావుండేదనిపిస్తుంది. ‘ అమ్మ ‘ అనటం హాయిగా ఉంటుంది, కదండీ ? తర్వాత నాలుగు రోజులకి నాన్న కూడా చచ్చిపోయాడు, ఆయనకీ అదే జ్వరమట. నేను అనాథ పాప ఐపోయాను. నన్నేం చెయ్యాలో ఎవరికీ ఏం తోచలేదట, మిసెస్ థామస్ చెప్పింది. అంత చిన్నగా ఉన్నప్పుడు కూడా నన్ను పెంచుకోవాలని ఎవరికీ అనిపించలేదు చూడండి, నాకు అలా రాసి పెట్టి ఉన్నట్లుంది.   అమ్మా నాన్నా ఇద్దరి ఊళ్ళూ చాలా  దూరమట, చుట్టాలెవరూ లేరట. చివరికి మిసెస్ థామస్ నే నన్ను పెంచుకుంటానంది. వాళ్ళాయన తాగుబోతు, వాళ్ళకేమీ డబ్బూ లేదు, అయినా సరే, మిసెస్ థామస్ తన చేతులతో నన్ను పెంచింది.’  చేతులతో పెంచిన ‘  పిల్లలు మామూలుగా పెంచిన పిల్లల కంటే మంచిపిల్లలు అవుతారా అండీ , మీకేమైనా తెలుసా ? మిసెస్ థామస్ నేను అల్లరి చేసినప్పుడల్లా  అనేది – నన్ను చేతులతో పెంచాననీ నేను అంత చెడ్డ పిల్లని ఎలా అయానా అని …

మిస్టర్ థామస్, మిసెస్ థామస్ , తర్వాత బోలింగ్ బ్రోక్ నుంచి మేరీస్ విల్ కి వెళ్ళారు. వాళ్ళకి నలుగురు పిల్లలు పుట్టారు, అందరూ నా కన్న చిన్నవాళ్ళే. వాళ్ళని పెంచటానికి మిసెస్ థామస్ కి సాయం చేస్తుండేదాన్ని. కొన్ని రోజులయాక మిస్టర్ థామస్ రైల్లోంచి కిందపడి చచ్చిపోయాడు. మిసెస్ థామస్ వాళ్ళమ్మ ఆవిడనీ పిల్లలనీ తీసుకుపోతానంది, నన్ను మాత్రం వద్దంది. మిసెస్ థామస్ కి ఏం చేయాలో తోచలేదు. అప్పుడు మిసెస్ హమ్మండ్ వచ్చి, నేను చిన్న పిల్లల్ని బాగా చూసుకుంటాను గనుక నన్ను ఇంట్లో ఉంచుకుంటానంది. ఆవిడ తో వెళ్ళిపోయాను. వాళ్ళ ఇల్లు ఎక్కడో విసిరేసినట్లు, నది పక్కన చిట్టడవిలో ఉండేది. మిస్టర్ హమ్మండ్ అక్కడ కలప మిల్ లో పని చేసేవాడు. నేను ఇంకెక్కడో ఉన్నట్లు ఊహించుకుంటూ ఉండకపోతే అక్కడ ఉండటం చాలా కష్టమయేది. వాళ్ళకి ఎనిమిది మంది పిల్లలు, మూడు సార్లు కవల పిల్లలు. నాకు చిన్న పిల్లలంటే ఇష్టమే, కాని కొంచెం మోతాదుగా ఉంటేనే ఇష్టం. ఒకరి తర్వాత ఒకరుగా అంతమంది పిల్లలని ఎత్తుకుని మోయటం కొంచెం కష్టంగానే ఉండేది.

mythili2

మిసెస్ హమ్మండ్ వాళ్ళతో రెండేళ్ళున్నాను. మిస్టర్ హమ్మండ్ కూడా చచ్చిపోయాడు, మిసెస్ హమ్మండ్ పిల్లల్ని చుట్టాల్లో అందరికీ పంచిపెట్టి అమెరికా వెళ్ళిపోయింది. ఇంకెవరూ నన్ను పెంచుకోవాలనుకోలేదు, అప్పుడు నన్ను అనాథాశ్రమం లో చేర్చారు. అక్కడ వాళ్ళూ అప్పటికే బోలెడు మంది పిల్లలున్నారు, నేను వద్దులే అన్నారు. కానీ రూల్ ప్రకారం నన్ను వద్దనకూడదట.  అలా మిసెస్ స్పెన్సర్ వచ్చేవరకూ అక్కడ నాలుగు నెలలు ఉన్నాను ” ఆన్ తన గాథ ముగించి ఊపిరి పీల్చుకుంది. తనని అక్కర్లేదనుకున్న ఆ ప్రపంచం లో తన అనుభవాలన్నీ చెప్పుకోవటం ఆన్ కేమీ ఇష్టం లేదు, తెలుస్తూనే ఉంది.

” ఎప్పుడైనా బడికి వెళ్ళావా ? ” మెరిల్లా ప్రశ్నించింది. గుర్రాన్ని సముద్రపు ఒడ్డు పక్కన ఉన్న బాట మీద నడిపిస్తోంది.

” ఎక్కువ రోజులు వెళ్ళలేదు . మిసెస్ థామస్ దగ్గర ఉన్నప్పుడు , ఆఖరి ఏడు వెళ్ళాను కొన్ని రోజులు. మిసెస్ హమ్మండ్ వాళ్ళ ఇల్లు ఊరికి చాలా దూరం కదా…చలికాలం లో అంత దూరం నడవలేకపోయేదాన్ని, వేసంకాలమేమో సెలవులిచ్చేసేవారు. వసంత కాలం లోనూ ఆకు రాలే కాలం లోనూ మటుకే వెళ్ళగలిగే దాన్ని. అనాథాశ్రమం లో ఉన్నప్పుడు రోజూ వెళ్ళాను. నాకు చదవటం బాగా వచ్చింది, బోలెడు పద్యాలు కంఠతా కూడా వచ్చు. ‘ హోహెన్ లిండెన్ సంగ్రామం ‘ , ‘ ఫ్లోడెన్ తర్వాతి ఎడింబరో ‘ , ‘ రైన్ తీరాన బింజెన్ ‘ మొత్తం వచ్చు.   ఇంకానేమో, ‘ లేడీ ఆఫ్ ద లేక్ ‘ , జేమ్స్   థాంప్సన్’ ఋతువులు ‘ – ఇవి చాలా వరకు వచ్చు. చదువుతుంటే వెన్ను జలదరిస్తుందే, అలాంటి పద్యాలు ఎంతో బావుంటాయి. ‘ పోలండ్ పతనం ‘ అని ఐదో తరగతి పుస్తకం లో ఉంటుంది, ఆ పద్యం అంతా అలాగే ఉంటుంది. నేనైతే   నాలుగో తరగతే , కానీ ఐదో తరగతి అమ్మాయిలు వాళ్ళ పుస్తకాలు అరువిచ్చేవాళ్ళు ”

” ఆ మిసెస్ థామస్, మిసెస్ హమ్మండ్ – వాళ్ళు నిన్ను బాగా చూసుకునేవాళ్ళా ? ” మెరిల్లా , ఆన్ ని ఓరకంటితో చూస్తూ అడిగింది.

” అదా..” ఆన్ తడబడింది. మొహం కందిపోయింది. ” నాకు తెలిసి,  నన్ను బాగా చూసుకోవాలనే అనుకునేవాళ్ళు. అలా మంచి ఉద్దేశం ఉన్నప్పుడు….ఒక్కోసారి చిరాకు పడినా పట్టించుకోకూడదు కదా ! వాళ్ళ బాధలు వాళ్ళవి…మిసెస్ థామస్ వాళ్ళాయన బాగా తాగేవాడు. మిసెస్ హమ్మండ్ కి మూడు సార్లు కవల పిల్లలు…ఎంత కష్టం చెప్పండి ? నాకు తెలుసు, ఇద్దరూ నన్ను దయగా ఇష్టంగా చూడాలని అనుకునేవాళ్ళు ”

మెరిల్లా ఇంకే ప్రశ్నలూ వెయ్యలేదు, పరధ్యానంగా బండి తోలుతోంది. సముద్రపు అందాన్ని చూసిన పరవశం లో ఆన్ మౌనంగా మునిగిపోయింది. మెరిల్లా ఆలోచిస్తోంది…ఆన్ చెప్పిన సంగతుల వెనక చెప్పకుండా దాచిపెట్టిన నిజాలు మెరిల్లాకి అర్థమవుతున్నాయి. ఈ చిన్న పిల్ల ప్రేమకోసం  ఎంత మొహం వాచిపోయి ఉంది ! ఎలాంటి పేదరికం లో, గొడ్డు చాకిరీ లో-  తన ఉనికిని ఎవరూ పట్టించుకోని జీవితాన్ని  గడిపి వచ్చింది ? తనకంటూ ఒక ఇల్లు ఉండబోతోందని అంతంత ఆనందపడిందంటే ఆశ్చర్యమేముంది ? పాపం…ఎందుకు వెనక్కి పంపెయ్యాలి అసలు ? మాథ్యూ కి ఆన్ ని అట్టే పెట్టుకుందామని బాగా ఉంది, అతను మనసు మార్చుకునేలాగా లేడు-  పోనీ , ఒప్పుకుంటే ఏం పోతుంది ? పిల్ల బుద్ధిమంతురాల్లాగే  ఉంది కదా, మెల్లిగా అన్నీ నేర్పుకోవచ్చు….

బండి వెళుతూ ఉన్న బాట కి ఆ వైపు న అడవి,  అంతా ఏకాంతం. ఏళ్ళ తరబడి సముద్రపు గాలులని ఎదిరించి పోట్లాడీ అలిసిపోయినట్లు లేని  ఫర్ చెట్లు గుబురు గుబురుగా . అక్కడక్కడా ఎగుడు దిగుడుగా ఎర్ర మట్టి దిబ్బలు, దారిని మూసేస్తూ, గుర్రం వాటిని దాటుంతూంటే బండి ఊగిపోతోంది. కిందికి చూస్తే నీటి నురగ కప్పిన పెద్ద పెద్ద రాళ్ళు. చిన్న చిన్న ఇసక దిబ్బలు, వాటి మధ్యలోంచి సముద్రపు రత్నాల లాగా గులకరాళ్ళు. అవతల ప్రకాశిస్తున్న  నీలపు సముద్రం. ఆకాశం లో సీ గల్ లు…ఎండలో వెండిలాగా మెరిసే రెక్కలతో …

” సముద్రం అద్భుతంగా ఉంటుంది కదూ ? ” ఆన్ అంది, చాలా సేపటి నిశ్శబ్దం తర్వాత,  విప్పారిన కళ్ళతో .  ” మేరీస్ విల్ లో మిస్టర్ థామస్ ఒకసారి పెట్టె బండి అద్దెకి తెచ్చాడు. సముద్రం ఒడ్డున పొద్దుట్నుంచీ సాయంత్రం దాకా  ఉన్నాం. అప్పటి ప్రతి నిమిషమూ గుర్తుంది నాకు, రోజంతా పిల్లలని ఆడిస్తూనే  ఉన్నా కూడా. మళ్ళీ మళ్ళీ గుర్తు  చే సుకుంటూనే ఉంటాను. ఇక్కడి సముద్రం మేరీస్ విల్ దానిలోకన్నా ఎంతో బావుంది. ఆ సీ గల్ లు దివ్యంగా ఉన్నాయి ! మీకెప్పుడైనా సీ గల్ ఐపోతే బావుండుననిపిస్తుందా ? నాకు అనిపిస్తుంటుంది, అంటే… మనిషి పిల్లని కాకపోయి ఉంటే. సూర్యుడు రాగానే నిద్ర లేచి ఆ నీలాల నీటి మీద వాలుతూ ఎగురుతూ రోజంతా గడిపేసి..రాత్రవుతూనే వెళ్ళి గూట్లో నిద్రపోతే….!

ఆ కనిపించే పెద్ద ఇల్లు ఎవరిదండీ  ? ”

” అది వైట్ శాం డ్స్ హోటల్. మిస్టర్ కిర్క్ నడుపుతాడు దాన్ని. కొద్ది రోజుల్లో బోలెడు మంది అమెరికన్ లు వస్తారు…ఈ సముద్రం వాళ్ళకి బాగా నచ్చుతుందని అంటుంటారు ”

ఇంకాస్త దూరం వెళ్ళారు . ” మిసెస్ స్పెన్సర్ ఇల్లు అదేనా ? ” ఆన్ బిక్కమొహం వేసుకుని అడిగింది. ” నాకు అక్కడికి వెళ్ళాలని లేదు …అక్కడితో అంతా ఐపోతుంది ”

[ ఇంకా ఉంది ]

గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్-4

 4 వ అధ్యాయం

[ Anne Of Green Gables by L.M.Montgomery ]

ఆన్ లేచేప్పటికి తెల్లగా తెల్లారిపోయింది. కిటికీ లోంచి కురిసే  వెలుతురు పకపకా నవ్వుతోంది. అవతల నీలాకాశం, దాని మీంచి ఊగుతూ  మబ్బుల తెల్లటి రెక్కలు.

ఒక్క క్షణం తను ఎక్కడుందో అర్థం కాలేదు.  ముందు ఉత్సాహం పొంగి వచ్చింది, ఆ వెంటనే దిగులు మూసేసింది. తను గ్రీన్ గేబుల్స్ లో ఉంది, కాని వీళ్ళకి తను అక్కర్లేదు , ఆడపిల్ల వద్దట.

ఐనా ఆ ఉదయపు వెలుగుకి  ఉత్సాహం ఆగలేదు .  గబగబా పరిగెత్తి కిటికీ చట్రాన్ని పైకి లేపింది. చాలా రోజులనుంచీ దాన్ని ఎవరూ కదిలించినట్లు లేదు, కిర్రు కిర్రుమని చప్పుడు చేసింది.

ఆన్ మోకాళ్ళ మీద కూలబడి ఆ జూన్ ప్రభాతం లోకి మెరిసే కళ్ళు పెట్టుకుని చూసింది. ఎంత అందమో …ఇక్కడే ఉండిపోతే బావుండును కదా ! పోనీ, ఉండిపోబోతున్నట్లు ఊహించుకుంటే ఏం పోతుంది…ఇక్కడ ఎంత ఊహకైనా చోటుంది.

కిటికీ బయట పెద్ద చెర్రీ చెట్టు , ఇంటికి ఆనుకుని. దాని కొమ్మలు లోపలికి తొంగి చూస్తున్నాయి. ఒక్క ఆకూ కనిపించనంత విరగబూసి ఉంది. ఇంటికి ఆ వైపున ఆపిల్ తోపు, ఈ వైపున చెర్రీ తోపు, అవి కూడా నిండుగా పూలతో. తోపుల్లో గడ్డి పైన డాండీలియాన్ పూలు. ఆ కిందన ఇంటి తోటలో  విచ్చిన ఊదారంగు లిలాక్ లు. వాటి సువాసన మత్తుగా గాలిలో తేలి లోపలికి వస్తోంది.

తోట కి దిగువన పచ్చగా ఒత్తుగా పెరిగిన క్లోవర్ గడ్డి , ఆ వాలు పక్కనే వాగు. తెల్లటి బర్చ్ చెట్లు పొగరుగా తలలెత్తి నిలుచున్నాయి. వాటి అడుగున ఫెర్న్ గుబుర్లు, మాస్ మొక్కలు…ఆ నీడల్లో దాగిఉన్న సంతోషం. వీటన్నిటికీ అవతల ఆ కొండ పైన పల్చగా స్ప్రూ స్, ఫర్ చెట్లు. వాటి మధ్యలోంచి బూడిదరంగులో ఇంటి కప్పు కొనదేలి కనిపిస్తోంది. ‘ ప్రకాశమాన సరోవరం ‘ ఒడ్డున ఆన్ చూసిన ఇల్లు అది.

ఎడమ వైపున పశువుల శాలలు, గడ్డి వాములు. వాటిని దాటి చూస్తే ఆకుపచ్చటి పొలాల అవతల మెరుస్తున్న నీలి రంగు సముద్రం.

may1

సౌందర్య పిపాసి ఐన ఆన్ కళ్ళు   ఆ దృశ్యాలన్నిటినీ ఆత్రంగా కావలించుకున్నాయి. పాపం..ఈ పసి పిల్ల తన చిన్న జీవితం లో అందపు లేమిని చాలా చూసింది. ఇక్కడ మాత్రం ఆమె కలలు కన్న సౌందర్యమంతా ఉంది.

ఆ ఏకాంతం లో మోకరిల్లి అలా ఉండిపోయింది..బుజం మీదొక చెయ్యి పడేవరకూ. మెరిల్లా వచ్చిన అలికిడి ఆన్ కి వినిపించనేలేదు.

” పద. తయారవు ” మెరిల్లా ముక్తసరిగా అంది.

నిజానికి మెరిల్లా కి ఆన్ తో ఎలా మాట్లాడాలో తెలియటం లేదు, ఆ ఇబ్బందిలోంచి ఆమె మాట తీరు అనుకోకుండానే మొరటుగా, ముభావంగా ధ్వనిస్తోంది.

ఆన్ లేచి నిలబడి గట్టిగా ఊపిరి తీసుకుంది.

” ఇదంతా అద్భుతంగా లేదూ ? ” చెయ్యి తిప్పుతూ మొత్తాన్నీ చూపించింది.

మెరిల్లా అంది – ” ఆ. పెద్ద చెట్టే. బాగా పూస్తుంది కూడా. కాయలే, చిన్నవిగా నాసిగా కాస్తాయి ”

” అంటే, చెట్టొక్కటే కాదు, అంతా ! చెట్లూ తోటా, తోపులూ , వాగూ అడవీ..ఆ ప్రియమైన  ప్రపంచం మొత్తం ! ఇలాంటి ఉదయాల్లో ప్రపంచాన్ని ప్రేమిస్తున్నామనిపించదూ ?  ఆ వాగు నవ్వటం వినిపిస్తోంది నాకు. అసలు ఈ వాగులు మంచి సరదా ఐనవి కదండీ ?  ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాయి. చలికాలం లో కూడా గడ్డ కట్టిన మంచుకిందనుంచి అవి నవ్వటం వినబడుతూనే ఉంటుంది నాకు. గ్రీన్ గేబుల్స్ పక్కనే వాగు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేనిక్కడెలాగూ ఉండబోవటం లేదు కదా, ఉంటేనేం లేకపోతేనేం అనుకోకండి. ఇక్కడ ఈ వాగు ఉందని నేనెప్పటికీ గుర్తు చేసుకుంటాను, మళ్ళీ దాన్ని చూడలేకపోయినా సరే. నేనివాళేమీ నిరాశ లో కూరుకుపోయి లేనండీ. ఇలాంటి ఉదయం లో నేను అస్సలు అలా ఉండలేను. ఉదయాలనేవి ఉండటం ఎంత గొప్ప సంగతో కదా ? కాని కొంచెం బాధగా మటుకు ఉంది. మీరు కావాలనుకున్నది నన్నేననీ ఇక్కడే ఎప్పటికీ ఉండిపోబోతున్నాననీ ఊహించుకుంటున్నా ఇందాక…ఊహించుకోవటం చాలా బావుంటుంది , అది నిజం కాదని తెలిసేప్పుడే బాధ ‘’

ఈ మాటల ప్రవాహం లో కాస్త సందు దొరకగానే మెరిల్లా అంది – ” నీ ఊహలు సరేగాని, త్వరగా తయారై కిందికి రా . బ్రేక్ ఫాస్ట్ సిద్ధంగా ఉంది. కాస్త మొహం కడుక్కుని తల దువ్వుకో. కిటికీ చట్రం కిందికి దించి దుప్పట్లు మడత పెట్టు. చేతయినంత పద్ధతిగా ఉండు ”

ఆన్ కి కాస్త పద్ధతిగా ఉండటం చేతయినట్లే ఉంది. పది నిమిషాల్లో కిందికి వచ్చేసరికి తల శుభ్రంగా దువ్వుకుని జడలు వేసుకుని ఉంది. మొహం కడుక్కుంది. మెరిల్లా చెప్పినవన్నీ చేసే వచ్చానని అనుకుంటోంది…నిజానికి దుప్పట్లు మడత పెట్టటం మర్చిపోయింది.

మెరిల్లా చూపించిన కుర్చీ లో కూర్చుంటూ ” నాకివాళ బాగా ఆకలేస్తోంది ” –  ప్రకటించింది ఆన్. ” ప్రపంచం రాత్రి అనిపించినంత గందరగోళం గా లేదెందుకో. మంచి ఎండ కాస్తోందిగా, అందుకేనేమో. పొద్దున్నే వాన పడినా నాకు ఇష్టమేననుకోండి.. పొద్దుటిపూట ఎలా ఐనా బావుంటుంది. ఆ రోజు ఏం జరగబోతుందో తెలీదుగా, ఎలా ఐనా ఊహించుకోవచ్చు. కాని ఇవాళ వాన పడకపోవటం మంచిదే ఐంది, నేను బోలెడంత భరించాలిగా, ఎండ కాస్తుంటే దేన్నైనా ఓర్చుకోవటం తేలిక .కష్టాలూ బాధలూ కథల్లో చదవటం బాగానే ఉంటుంది, నిజంగా ఐతే అంత బావుండదు ”

” కాసేపు నోరు మూసుకుంటావా ? చిన్న పిల్లకి ఇన్ని మాటలు !  ” మెరిల్లా కాస్త మెత్తగానే కసిరింది.

MythiliScaled

ఆన్ చాలా బుద్ధిగా  నోరు మూసుకుంది. మరీ  బొత్తిగా మాట్లాడకపోతేనూ  మెరిల్లాకి కంగారే వేసింది, అదేమీ సహజంగా లేదనిపించి. మాథ్యూ కూడా మౌనంగానే ఉన్నాడు, కాకపోతే అతనికి అదే సహజం. మొత్తం మీద ఉదయపు భోజన కార్యక్రమం నిశ్శబ్దంగా సాగింది.

ఆన్ మరీ మరీ పరధ్యానంగా ఐపోయింది. ఒక మరబొమ్మ లాగా తింటోంది అంతే . పెద్ద పెద్ద కళ్ళేసుకుని కిటికీ లోంచి ఆకాశాన్ని చూస్తున్నట్లే ఉందిగాని ఆ చూపు ఎక్కడో ఉంది. మెరిల్లాకి ఇంకా కంగారు గా అనిపించింది. ఈ విడ్డూరపు పిల్ల శరీరం ఇక్కడుందేగాని ఆమె ఆత్మ  ఎక్కడో గంధర్వలోకాల్లో విహరిస్తున్నట్లుంది , ఊహల రెక్కలమీద. ఇలాంటి పిల్లని ఎవరు ఉంచుకుంటారు ???

కాని మాథ్యూ ఆమెని పెంచుకోవాలనుకుంటున్నాడు, మెరిల్లాకి ఆ విషయం అంతు పట్టటం లేదు. రాత్రికీ ఇప్పటికీ అతని నిర్ణయమేమీ మారినట్లు లేదు. మాథ్యూ అం తే, ఒకసారి అతని బుర్రలో ఎదైనా దూరిందా ఇక దాన్నే పట్టుకు వదలడు. మాట్లాడడు దాని గురించి, కాని ఆ మౌనమే పది రెట్లు బలంగా చెబుతుంది అతనేమనుకుంటున్నాడో.

భోజనం అయాక ఆన్ తన పరధ్యానం లోంచి బయటికి వచ్చి, గిన్నెలు కడగటం లో సాయం చెయ్యనా అని అడిగింది .

” నీకు కడగటం వచ్చా ? ” మెరిల్లా అపనమ్మకంగా అడిగింది.

ఆన్ – ” ఓ ! బాగా వచ్చుగా ! చిన్న పిల్లలని కనిపెట్టుకు ఉండటం ఇంకా బాగా వచ్చు. ఇక్కడెవరైనా చిన్న పిల్లలుంటే బావుండేది ”

మెరిల్లా ” ఇప్పుడు వాళ్ళొకరు తక్కువయ్యారు నా ప్రాణానికి  ! నీ సంగతి చూసేసరికే  నానా హైరానా గా ఉంది. నిన్ను ఏం చేయాలో తెలీటం లేదు..మాథ్యూ మరీ బుర్ర తక్కువ మనిషి ”

” ఆయన చా…లా మంచివారు ” –   ఆన్ దృఢంగా చెప్పింది. ” ఏం చెప్పినా ఎంత ఓపిగ్గా వింటారో ! ఎంత సేపు మాట్లాడినా ఏమీ అనరు. ఆయన్ని చూడగానే నాబోటివారేననుకున్నాను  ”

” ఆ. మీరిద్దరూ ఒకలాంటివారేలే, వింత మనుషులు ” మెరిల్లా విసుక్కుంది. ” సరే, గిన్నెలు కడుగు. బాగా వేడిగా ఉన్న నీళ్ళు తీసుకో కడగటానికి, కడిగాక బాగా ఆరబెట్టు. ఇవాళ నాకు చాలా పని ఉంది. వైట్ శాం డ్స్ కి వెళ్ళి  మిసెస్ స్పెన్సర్ దగ్గర నీ సంగతేమిటో తేల్చుకోవాలి. నువ్వూ నాతో రావాలి. ఆ గిన్నెల పని పూర్తవగానే పైకి వెళ్ళి నువ్వు పడుకున్న  పక్క సర్దు.”

ఆన్ మొహం వెలిగిపోయింది. ఉత్సాహంగా తలుపు వైపుకి పరిగెత్తి వెళ్ళి ఆగి, మళ్ళీ వెనక్కి వచ్చేసి బల్ల దగ్గర కుర్చీలో కూర్చుండిపోయింది. మొహం లో సంతోషం ఊదేసినట్లు మాయమైపోయింది.

” మళ్ళీ ఏమైంది నీకు ? ” మెరిల్లా అడిగింది.

” నేను బయటికి రాలేనండీ ” – ఆన్ చెప్పుకుంది, ప్రాపంచిక సుఖాలన్నిటినీ త్యజిస్తున్న పరిత్యాగి లాగా. ” నేను ఇక్కడ ఉండబోవటం లేనప్పుడు గ్రీన్ గేబుల్స్ ని ప్రేమించి ఏం లాభం ? నేను మళ్ళీ ఆ చెట్లనీ పూలనీ వాగునీ చూస్తే వాటిని ప్రేమించకుండా ఉండలేను. ఇప్పటికే నాకు చాలా కష్టంగా ఉంది, ఇంకా పడలేను.  నాకు బయటికి వెళ్ళి తిరగాలని ఉంది- అవన్నీ ” ఆన్ ! ఆన్ ! రా, మా దగ్గరికి వచ్చెయ్యి. ఆడుకుందాం ” అని నన్ను పిలుస్తున్నట్లుంది..కానీ వద్దు, రాను. అన్నిటినీ వదిలేసి వెళ్ళబోతున్నప్పుడు ప్రేమించి ఏం లాభం ? ప్రేమించకుండా ఉండటం ఎంతో కష్టం కదండీ ? అందుకే ఇక్కడికొస్తున్నప్పుడు ఎంతో సంతోషం వేసింది నాకు. ప్రేమించేందుకు ఎన్ని ఉన్నాయో, ఎ వ్వ..రూ వద్దనరు ! కాని ఐపోయింది, ఆ కల కరిగిపోయింది. నా గతి ఇంతే అని నిబ్బరించుకుంటున్నాను, బయటికి వచ్చి అంతా చూస్తే ఆ నిబ్బరం పోతుంది కదా…అవునూ, ఆ కిటికీ లో ఉన్న జేరేనియం పూల మొక్క పేరేమిటండీ  ? ”

మెరిల్లా – ” అదా ! ఆపిల్ వాసన వేసే జెరేనియం అది ”

ఆన్ – ” అది కాదండీ ! అలాంటి పేరు కాదు. మీరు పెట్టిన పేరేమిటీ అని అడుగుతున్నా. ఏ పేరూ పెట్టలేదా ? పోనీ నేను పెట్టచ్చా? ‘ బోనీ ‘ – బావుందా ? ఇక్కడున్నంత సేపూ నన్ను అలా పిలవనివ్వరా ? ” వేడుకుంది.

” నీ తలకాయ ! జేరేనియం కి ఎవరైనా పేరు పెడతారా ? ” – మెరిల్లా .

” ఉండాలి. అన్ని..టికీ పేర్లుండాలి. అప్పుడు అవి మనలానే అనిపిస్తాయి. ఏ పేరూ పెట్టకుండా ఉత్తినే ‘ జేరేనియం ‘ అంటే అది నొచ్చుకోదూ పాపం ? మీకేమీ పేరు లేకుండా ఉత్తినే ‘ ఆవిడ ‘ అంటే మీకు బాధగా ఉండదూ ? నా కిటికీ పక్క చెర్రీ చెట్టుకి పేరు పెట్టాను…’ హిమరాణి ‘ అని…తెల్ల..గా పూసిందిగా ! ఎప్పుడూ పూసే ఉండదనుకోండీ, ఐనా అలా పిలుస్తూ పూసి ఉన్నట్లు ఊహించుకోవచ్చు ”

ఆ తర్వాత బంగాళా దుంపలు తెచ్చేందుకు నేలమాళిగ లోకి వెళ్తూ మెరిల్లా గొణుక్కుంది – ” నా జన్మలో ఇలాంటి పిల్లని చూడలేదు. మాథ్యూ చెప్పినట్లు భలే పిల్ల. తర్వాత ఏం చెప్తుందా అని ఎదురు చూడటం మొదలెడుతున్నానేమిటో ! మాథ్యూ కి వేసినట్లే నాకూ ఏదో మంత్రం వేసింది. మాథ్యూ పొలం వైపు వెళ్తూ నావైపు ఎలా చూశాడనీ…రాత్రి చెప్పిందీ సూచించిందీ అంతా మళ్ళీ ఆ చూపులో ఉంది. అందరు మగవాళ్ళకి మల్లే అతను గట్టిగా  మాట్లాడితే హాయిగా ఉండును..మాటలకైతే జవాబు చెప్పచ్చు, చూపులకి ఏం చెప్పాలి ? ”

may3

నేలమాళిగ సందర్శనం పూర్తయి మెరిల్లా వచ్చేసరికి ఆన్ అక్కడే కూర్చుని ఉంది… అరచేతుల్లో గడ్డం ఆనించుకుని ఆకాశం కేసి చూస్తూ, ఆలోచనలో మునిగి .   మధ్యాహ్నం భోజనానికి వేళయేవరకూ మెరిల్లా ఆమెని అలాగే ఉండనిచ్చింది.

” ఇవాళ బండినీ గుర్రాన్నీ నేను తీసుకెళ్ళచ్చా ? ” మాథ్యూని అడిగింది మెరిల్లా.

మాథ్యూ తలఊపి ఆన్ వైపు జాలిగా చూశాడు. మెరిల్లా పెళుసుగా చెప్పింది.  ” వైట్ శాండ్స్ కి వెళ్ళాలి నేను.  ఆన్ ని కూడా తీసుకుపోతాను. మిసెస్ స్పెన్సర్ తో మాట్లాడి ఈమెని నోవా స్కోటియా కి వెనక్కి పంపించెయ్యాలిగా ! నీకు టీ , ఫలహారం బల్ల మీద పెట్టి వెళ్తాలే. సాయంకాలం ఆవులకి పాలు తీసే వేళకి వచ్చేస్తాను ”

అప్పటికీ మాథ్యూ ఏమీ మాట్లాడలేదు. మెరిల్లాకి చిర్రెత్తుకొచ్చింది. ఊపిరి బిగబట్టి అనేసిన మాటలన్నీ వృధా ఐపోయాయి.

మాథ్యూ నిదానంగా గుర్రాన్నీ బండినీ సిద్ధం చేసి తెచ్చాడు. మెరిల్లా, ఆన్ ఎక్కి బయల్దేరారు. బండి కదిలాక, గేట్ తెరిచి, అప్పుడు- ఎవరికో చెబుతున్నట్లు చెప్పాడు మాథ్యూ- ” పొద్దున్నే జెర్రీ బ్యుయోట్ వచ్చాడు. ఈ వేసంకాలం అతన్ని  పొలం పనికి పెట్టుకుంటానని చెప్పేశాను ”

మెరిల్లా ఏమీ జవాబు చెప్పలేదు. ఒక్కసారి కొరడాతో గుర్రం వీపు మీద చరిచింది. అలాంటి దెబ్బ ఎప్పుడూ పడిఉండని గుర్రం , దౌడు లంకించుకుంది. ఆఘమేఘాలమీద బండి బయల్దేరింది. మలుపు తిరగబోతుంటే మెరిల్లా వెనక్కి చూసింది. మాథ్యూ గేట్ కి ఆనుకుని నిలబడి దిగులు దిగులుగా చూస్తూనే ఉన్నాడు.

[ ఇంకా ఉంది ]

గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్- 3

                       [ Anne of Green Gables by Lucy Maud Montgomery ]

 మాథ్యూ తలుపు తెరవగానే మెరిల్లా చర చరా నడుస్తూ ఎదురొచ్చింది. ఎర్రటి పొడుగాటి జడలతో, మిలమిలమంటున్న కళ్ళతో బిగుతైన గౌను లో ప్రత్యక్షమైన  ఆ వింత శాల్తీని చూసి నిర్ఘాంతపోయింది.

” మాథ్యూ కుత్ బర్ట్ , ఎవరిది ? పిల్లాడేడీ ? ”

” పిల్లాడెవడూ లేడు, ఉన్నది ఈమే   ” మాథ్యూ మొహం వేలాడేసుకుని పిల్లవైపు చూపించాడు…ఆమె పేరు కూడా కనుక్కోలేదని అప్పటికి తట్టింది అతనికి.

” ఏమిటీ …అబ్బాయి లేడా ? మనం  అబ్బాయిని కదా పంపమన్నాం ? ”

” ఏమో మరి. మిసెస్ స్పెన్సర్ ఈమెనే రైల్లోంచి దింపి  స్టేషన్ మాస్టర్ కి అప్పజెప్పిందట. అక్కడ వదిలేసి రాలేను గా, అది ఎవరి పొరబాటైనా ..”

” బాగానే ఉంది సంబడం ” మెరిల్లా చిరాకు పడింది.

పిల్ల , గుడ్లప్పగించి ఇద్దరి మొహాలూ మార్చి మార్చి చూస్తూ ఉంది…ఆమె మొహం మెల్లి మెల్లిగా వాడిపోయింది. ఒక్క పెట్టున అంతా అర్థమైపోయింది. సంచీ ని కిందికి వదిలేసి ఒక అడుగు ముందుకు వేసి కూలబడిపోయింది.

” నేను మీకు అక్కర్లేదా…! నేను మగపిల్లాడిని కాదు కాబట్టి ?నేనెప్పుడూ ఎవరికీ అక్కర్లేదు…నాకు ముందే  తెలియాల్సింది…ఇదంతా అంత బావుంది, ఎంతోసేపు ఉండదని ! నన్నెవరూ కావాలనుకోరు..ఏం చెయ్యను, ఏడుపొస్తోంది నాకు..”

బావురుమంది. చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. మాథ్యూ , మెరిల్లా ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకుంటూ అయోమయంగా ఉండిపోయారు. కాసేపటికి మెరిల్లా అంది …

” లేదులే.  ఊరుకో .అంత ఏడవాల్సిన పనేముంది ?”

 

పిల్ల చప్పున తలెత్తింది…కన్నీళ్ళతో మొహం తడిసి పోయింది, పెదాలు వణుకుతున్నాయి . ” ఏడవాల్సినపని లేదా..ఎందుకు లేదూ ? మీరైనా ఇలాగే ఏడుస్తారు… మీరొక అనాథ అయిఉండి, ఒక ఇల్లు దొరికిందనుకున్నాక మీరు అబ్బాయి కాదు గనుక మిమ్మల్ని వద్దంటే. దేవుడా ! ఇంతకు మించిన బాధని  నా జన్మలో ఎరగను ! ” రోషంగా అంది.

మెరిల్లా కొంచెం అయిష్టంగా నవ్వింది. ఆ నవ్వు వాడక తుప్పు పట్టినదానిలా ఉంది.

” సరేలే. ఇంక ఏడవకు. ఇప్పటికిప్పుడు నిన్నేం గెంటెయ్యట్లేదుగా. రేపు పొద్దున్నే సంగతేమిటో కనుక్కుంటాం…ఇంతకీ నీ పేరేమిటి ? ”

పిల్ల కొంచెం తటపటాయించింది.

” ఏమనుకోకపోతే నన్ను కార్డీలియా అని పిలుస్తారా ? ”

” నిన్ను కార్డీలియా అని పిలవాలా ? నీ పేరు అదేనా ? ”

” కాదుగానీ…నన్ను అలా పిలిస్తే నాకు ఇష్టం. చాలా చక్కటి పేరు అది ! ”

” నువ్వనే దేమిటో నాకర్థం కావట్లేదు..నీ పేరు కార్డీలియా కాకపోతే , ఏమిటసలు ? ”

” ఆన్ షిర్లే ” ఆ పేరుకి సొంతదారు తడబడింది. ” నన్ను కార్డీలియా అనచ్చు కదా ? నేనిక్కడ కొంచెం సేపే కదా ఉంటాను..ఏ పోతుంది ? ఆన్ అంటే ఏబ్రాసి పేరులా ఉంటుంది ”

” ఏబ్రాసి పేరూ కాదు, ఏ మీ కాదు- ఆన్ శుభ్రమైన పేరు. నువ్వేం సిగ్గు పడక్కర్లేదు ఆ పేరున్నందుకు ” -మెరిల్లా కస్సుమంది.

” నేనేం సిగ్గు పడట్లేదు , కార్డీలియా అంటే బావుంటుందంటున్నానంతే. నేనెప్పుడూ….ఈ మధ్యైతే, నా పేరు అదేనని ఊహించుకుంటున్నాను. చిన్నప్పుడైతే గెరాల్డిన్ అనుకునేదాన్ని గాని, కార్డీలియా ఇంకా బావుంది కదా. నన్ను ఆన్ అని పిలిస్తే మాత్రం చివర ‘ ఇ ‘ తో స్పెల్ చేయ్యండీ ”

” స్పెల్లింగ్ ఎలా ఉంటే ఏమిటి ? ఏమిటి తేడా ? ” మెరిల్లా మళ్ళీ కొంచెం నవ్వుతూ అడిగింది.

” తేడా ఎందుకు లేదూ, బోలెడుంది. ఏదన్నా పేరు పిలుస్తుంటే  ఆ అక్షరాలు బుర్రలో అచ్చు వేసినట్లు కనిపించవూ మీకు ? ఎ-ఎన్- ఎన్..ఆన్ అంటే చెత్తలా ఉంటుంది. ఎ-ఎన్-ఎన్-ఇ ..ఆన్ అంటే  దర్జాగా ఉంటుంది. అలా ఐతే నన్ను ఆన్ అని పిలిచినా సర్దుకుంటా ” పిల్ల హామీ ఇచ్చింది.

” సరే ఐతే. ‘ ఇ ‘ అక్షరం ఉన్న ఆన్, ఇలా ఎందుకైందో చెప్పు. మేము అబ్బాయిని కదా పంపమన్నది ? అక్కడ అనాథాశ్రమం లో అబ్బాయిలెవరూ లేరా ? ” మెరిల్లా అడిగింది.

” ఎందుకు లేరూ..బోలెడు మంది ఉన్నారుగా ! మిసెస్ స్పెన్సర్ పదకొండేళ్ళ అమ్మాయి కావాలనే అడిగారట మరి , మాట్రన్ నేను సరి పోతానన్నారు. అబ్బ ! ఎంత సంతోషమేసిందో తెలుసాండీ ? రాత్రంతా నిద్రే పట్టలేదు. ”..ఆన్ , మాథ్యూ వైపుకి తిరిగి అంది -” ఇలా అని మీరు స్టేషన్ లోనే  ఎందుకు చెప్పలేదండీ ? నన్ను అక్కడే వదిలేసి ఉండాల్సింది మీరు…ఆహ్లాద శ్వేతమార్గాన్నీ ప్రకాశమాన సరోవరాన్నీ చూసి ఉండకపోతే ఇక్కడినుంచి వెళ్ళిపోవటం ఇంత కష్టంగా ఉండేది కాదు ”

” ఏమిటి అంటోంది ఈ పిల్ల ? ” మాథ్యూ ని నిలదీసింది మెరిల్లా.

” అబ్బే, ఏం లేదులే. దార్లో ఏవో మాట్లాడుకున్నాం ” మాథ్యూ బెరుగ్గా జవాబు చెప్పాడు..” నేను గుర్రాన్ని కట్టేసి వస్తాగానీ కాస్త టీ పెడతావా ? ”

అతను వెళ్ళిపోయాక మెరిల్లా కొనసాగించింది ” నిన్ను గాక మిసెస్ స్పెన్సర్ ఇంకెవర్నైనా తీసుకొచ్చిందా ? ”

” లిల్లీ జోన్స్ ని తెచ్చుకున్నారు, ఆవిడ కోసం. లిల్లీ కి ఐదేళ్ళే.. బ్రౌన్ రంగు జుట్టుతో చాలా ముద్దుగా ఉంటుంది. నాక్కూడా ఆ రంగు జుట్టుండి నేను కూడా ముద్దుగా ఉండిఉంటే నన్ను మీరు అట్టిపెట్టుకునేవారేనా ? ” ఆన్ ప్రశ్నించింది.

” లేదు, మాకు అబ్బాయే కావాలి. మాథ్యూ కి పొలం లో సాయం చెయ్యాలి. సర్లే, నీ టోపీ తీసి ఇవ్వు, నీ సంచీ తో బాటు హాల్లో బల్ల మీద పెడతాను ” – మెరిల్లా.

ఆన్ మెదలకుండా టోపీ తీసి ఇచ్చింది. మాథ్యూ వచ్చేశాడు. ముగ్గురూ భోజనానికి కూర్చున్నారు. కాని ఆన్ ఏమీ తినలేకపోయింది. బ్రెడ్ కొద్ది కొద్దిగా కొరుకుతూ వెన్ననీ ఆపిల్ జాం నీ కొంచెం నంజుతూ ఉండిపోయింది. ఏమీ ఎక్కట్లేదు ఆన్ కి.

” నువ్వేమీ తినట్లేదు ” అదొక పెద్ద లోపం లాగా అంది మెరిల్లా.

ఆన్ నిట్టూర్చింది. ” తినలేనండీ. నిరాశ లో కూరుకుపోయి ఉన్నాను కదా .నిరాశ లో కూరుకుపోతే ఎవరైనా తినగలరా చెప్పండి ? ”

” ఏమో. నాకేం తెలుసు ! నేనెప్పుడూ అలా కూరుకుపోలేదు మరి ”

” ఎప్పుడూ లేదా ? పోనీ అలా ఉన్నట్లు ఊహించుకున్నారా ? ”

”లేదు ”

book

” ఐతే మీకసలు అర్థం కాదు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏమన్నా తినబోతే గొంతుకేదో అడ్డం పడ్డట్లుంటుంది. దేన్నీ మింగలేం..చాకొలెట్ కారమెల్ నైనా సరే. ఒక్కసారి తిన్నాను చాకొలెట్ కారమెల్, రెండేళ్ళ కిందట..ఎంత బావుందో అది. బోలెడన్ని  తింటున్నట్లు కలలొస్తుంటాయి..సరిగ్గా నోట్లో పెట్టుకోబోతుంటే మెలకువొచ్చేస్తుందండీ. నేనేమీ తిననందుకు ఏం అనుకోకండేం. అన్నీ చాలా చాలా బావున్నాయి, కాని కష్టం, తినలేను ”

అప్పటివరకూ మాట్లాడని మాథ్యూ అన్నాడు ” బాగా అలిసిపోయినట్లుంది మెరిల్లా. పడుకోబెట్టరాదూ ? ”

మెరిల్లా ఆ పాటికే ఆ లోచిస్తోంది ఆన్ ని ఎక్కడ పడుకోబెట్టాలా అని. ఎవరో అబ్బాయి వస్తాడని వంటింట్లో  చిన్న మంచం, పక్క వేసి ఉంచింది. అది శుభ్రంగానే ఉందనిపించినా ఎందుకనో అక్కడొక ఆడపిల్ల పడుకోకూడదేమోననిపించింది. ఎవరైనా అతిథులు వస్తే వాడే గదిలో ఈ దారే పోయే పిల్లని ఉంచటం మెరిల్లాకి నచ్చలేదు. ఇక మిగిలింది మేడ మీది  తూర్పు వైపు గది. మెరిల్లా ఒక కొవ్వొత్తి వెలిగించి పట్టుకుని ఆన్ ని తనతో రమ్మంది.  తన టోపీ, సంచీ తీసుకుని ఆన్ నీరసంగా బయల్దేరింది. హాల్ అంతా మరీ శుభ్రంగా ఉంది, ఆన్ కి కాస్త భయమేసింది. తూర్పు వైపు గది ఇంకా శుభ్రంగా ఉన్నట్లుంది.

మెరిల్లా కొవ్వొత్తిని అక్కడున్న ముక్కాలిపీట మీద  పెట్టి దుప్పట్లు సరిచేసింది.

” నైట్ గౌన్ ఉందా నీకు ? ” ఆన్ ని అడిగింది.

” ఆ.రెండున్నాయి. మాట్రన్ కుట్టించారు. బాగా పొట్టిగా ఉంటాయి. అక్కడ అన్నీ అలా చాలీ చాలకుండానే ఉంటాయనుకోండీ. నాకీ నైట్ గౌన్ లు చాలా చిరాకు, ఐతే అవి వేసుకున్నప్పుడు కుచ్చులు కుచ్చులుగా జీరాడే సిల్క్ నైట్ గౌన్ లు వేసుకున్నట్లు ఊహించుకుంటాను, అప్పుడు కొంచెం పర్వాలేదు. ”

” ఊ.ఐతే త్వరగా బట్టలు మార్చుకో.కాసేపట్లో  వచ్చి కొవ్వొత్తి తీసుకువెళతాను. నీ దగ్గర వదిల్తే దేనికైనా అంటించెయ్యగలవు ”

మెరిల్లా వెళ్ళగానే ఆన్ దిగులుగా చుట్టూ చూసింది. తెల్లగా సున్నం వేసిన గోడలు బోసిగా ఉన్నాయి, వాటి బోసితనానికి వాటికే బాధగా ఉందేమోననుకుంది ఆన్. నేల కూడా బోసి గానే ఉంది, మధ్యలో ఒక చాప తప్ప. ఒక పక్కన ఎత్తుగా పాతకాలపు పందిరి మంచం. ఇంకోపక్కన గోడకి ఆరూ ఇంటూ ఎనిమిది కొలతతో అద్దం. దాని పక్కనే వాష్ స్టాండ్. ఆన్ కి అటూ ఇటూ కదల్లేనట్లూ ఊపిరాడనట్లూ అనిపించిందెందుకో. ఏడుపు తన్నుకొచ్చింది. ఎక్కిళ్ళు దిగమింగి బట్టలు మార్చుకుని పక్క మీదికి ఎక్కి దుప్పటి తలదాకా లాగి ముసుగు పెట్టుకుంది. కాసేపటికి మెరిల్లా ఆ గదిలోకి వచ్చినప్పుడు చెల్లా చెదురుగా పడేసి ఉన్న చిన్ని చిన్ని బట్టలూ మెల్లిగా ఊపిరి తీసుకు వదులుతున్న శబ్దమూ తప్ప అక్కడ మరో మనిషి ఉన్న జాడే లేదు.

ఆ బట్టలన్నీ ఒక్కొక్కటీ తీసి మడత పెట్టి పసుపురంగు వేసిన కుర్చీ మీద పెట్టింది మెరిల్లా. పక్క దగ్గరికి వెళ్ళి , ” గుడ్ నైట్ ” అంది. కొంచెం ఇబ్బంది పడుతూ , కాని మెత్తగానే అంది.

దుప్పటి పైనుంచి పాలిపోయిన ఆన్ మొహం, ఉలిక్కిపడిన కళ్ళతో  తొంగి చూసింది.

” గుడ్ నైట్ అని ఎలా అంటారండీ ? నాకిది చాలా చాలా చెడ్డ రాత్రి ” ఆన్ నిరసనగా అంది.

అని మళ్ళీ దుప్పట్లోకి మాయమైంది.

unmade_bed-copy (1)

మెరిల్లా చిన్నగా వంటింట్లోకి వెళ్ళి గిన్నెలు కడగటం మొదలెట్టింది. మాథ్యూ పైప్  వెలిగించాడు, అంటే ఆందోళనగా ఉన్నాడని అర్థం. అతనికి పొగ తాగటం అలవాటు కాదు, మెరిల్లాకి నచ్చదు- కాని ఇలాంటప్పుడు తప్పదు. మెరిల్లా కూడా చూసీ చూడనట్టు ఊరుకుంటుంది, మగవాడు  కదా అతను , పాపం –  ఏ ఉద్వేగాన్నీ బయటపెట్టుకోలేడు.

మెరిల్లా అంది- ” బాగా ఇరుకున పడ్డాం కదా…మన పని మనం చక్కబెట్టుకోకుండా ఎవరి చేతనో కబురు పెడితే ఇలాగే ఉంటుంది. ఆ రిచర్డ్ స్పెన్సర్ వాళ్ళు అంతా మార్చేశారు. రేపు వెళ్ళి తేల్చుకోవాలి, పిల్లని వెనక్కి పంపించెయ్యాలి ”

” ఆ. అంతేనేమో  ” అన్నాడు మాథ్యూ  ఆ మాటలేమంత నచ్చనట్లుగా.

” ఏ- మో- నా ? ” మెరిల్లా రెట్టించింది… ” నీకు తెలీదా ? ”

మాథ్యూ అన్నాడు – ” ఏం లేదూ, పాపం బుజ్జి పిల్ల ముచ్చటగా లేదూ ? ఇక్కడే ఉండిపోదామని వచ్చిందే,  మనం వెనక్కి పంపించటం బావుంటుందా అని ”

” మాథ్యూ కుత్ బర్ట్ , ఏమిటి నువ్వనేది ? పిల్లని మనం ఉంచేసుకోవాలనా ? ” మెరిల్లా విస్తుపోయింది…మాథ్యూ తల కిందులుగా నడవబోతున్నానని చెప్పి ఉన్నా అంత ఆశ్చర పడి ఉండదేమో.

” అబ్బే, అలా అనేం కాదూ ” చెల్లెలు పసిగట్టేసినందుకు మాథ్యూ తబ్బిబ్బయ్యాడు…” ఎలా ఉంచేసుకుంటాం లే, ఐనా ” అన్నాడు.

మెరిల్లా- ” అవును, ఎలా ఉంచుకుంటాం ? మనకేం ఒరుగుతుంది  ? ”

మాథ్యూ ” తనకి ఒరుగుతుందేమో , మననుంచి ” అనేసి నాలిక కరుచుకున్నాడు.

” మాథ్యూ కుత్ బర్ట్ , ఈ పిల్లేదో మంత్రం వేసింది నీకు…నీకు ఉంచేసుకోవాలని ఉందని నాకు చక్కగా తెలిసిపోతోంది ”

marilla-cuthbert-is-surprised (2)

మాథ్యూ ” ఊ. భలే పిల్ల తను…దార్లో ఎన్ని కబుర్లు చెప్పిందో..నువ్వు విని ఉండాల్సింది ”

” ఆ. చక చకానే చెబుతోందిలే, కబుర్లకేమీ ! అదేం మంచి లక్షణం కాదు. చిన్న పిల్లకి అన్ని మాటలెందుకసలు ? నాకు అ నాథ పిల్ల వద్దు, అందులోనూ ఇలాంటి పిల్ల వద్దే వద్దు.  రేపు తిరుగు టపాలో పంపించెయ్యాల్సిందే ”

మాథ్యూ నచ్చజెప్పబోయాడు – ” పొలం పనికి నేనెవరన్నా కుర్రాడిని కుదుర్చుకుంటాలే మెరిల్లా,  నీకు తోడుగా ఉంటుంది…”

” నాకు ఏ- తో- డూ   అక్కర్లేదు, ఈ పిల్లని నేను ఉంచుకోబోవటం లేదు ” మెరిల్లా రుస రుసలాడింది.

” సరే, నీ ఇష్టం. ” పైప్ పక్కన పెట్టి అన్నాడు మాథ్యూ..” నేను వెళ్ళి నిద్రపోతాను ”

మాథ్యూ నిద్రపోయాడు. మొహం చిట్లించుకుని, గిన్నెలు అలాగే వదిలేసి , బిగువుగా వెళ్ళి మెరిల్లా నిద్రపోయింది. మేడ మీద తూర్పు వైపు గదిలో  ప్రేమకి మొహం వాచి ఉన్న ఆ ఒంటరి ప్రాణి ఏడ్చి ఏడ్చి నిద్రపోయింది.

                                                                                    [ ఇంకా ఉంది ]

 

 

 

 

 

 

 

 

 

 

గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ – రెండో అధ్యాయం

   మాథ్యూ కుత్ బర్ట్, అతని ఎర్ర గుర్రమూ పెద్దగా శ్రమ పడకుండానే ఎనిమిది మైళ్ళూ దాటి బ్రైట్ రివర్ కి వెళ్ళారు. ఆ దారి చాలా బావుంటుంది , కుదురుగా పొలాల మధ్యన ఇమిడిన ఇళ్ళతో. అక్కడక్కడా  బాల్సం వుడ్ చెట్లు…ప్లం చెట్లకి విరగకాసిన పళ్ళు. ఆపిల్ తోటల మీంచి వచ్చే గాలి సువాసన వేస్తోంది. మైదాన పు వాలు,   వంగిన ఆకాశం లోకి కలిసే చోట మంచుముత్యాలు ఊదారంగు లో మెరుస్తున్నాయి. ప్రతి రోజూ వసంతమే ఐనట్లు కొమ్మల్లో పిట్టలు పాడుతున్నాయి.

మాథ్యూ కి హాయిగానే ఉంది, తెలియని ఆడవాళ్ళెవరైనా ఎదురుపడ్డప్పుడు తప్ప… ఖచ్చితంగా వాళ్ళని తలఊపి పలకరించాలి మరి.

మాథ్యూ కి మెరిల్లా, మిసెస్ లిండ్ లు తప్పించి ఇంకే ఆడవాళ్ళన్నా వెర్రి బెదురు. వాళ్ళేదో తనని చూసి నవ్వుకుంటున్నట్లే ఉంటుంది అతనికి. అందులో నిజమూ ఉందేమో…అతను వింతగానే కనిపిస్తాడు చూసేవాళ్ళకి.వంగిపోయి ఉండే   బుజాల దాకా పెరిగిన జుట్టు, పొడుగ్గా ఒత్తుగా గడ్డం. ఆ గడ్డం అతనికి ఇరవై ఏళ్ళ వయసు నుంచీ అలాగే ఉంది…నిజానికి తల నెరిసిపోవటం తప్ప ఇరవై లోనూ అరవై లోనూ అతను ఒకలాగే ఉన్నాడు.

అతను స్టేషన్ చేరేసరికి అక్కడ రైలు ఉన్న ఛాయలేవీ లేవు…బాగా ముందే వచ్చేశానా అనుకున్నాడు. పొడుగాటి ప్లాట్ ఫాం మీద ఎవ్వరూ లేరు…ఆ చివార్న , చెక్కపెట్టెల  మీద కూర్చుని ఒక చిన్న పిల్ల తప్ప. ఆ వైపు తలతిప్పి కూడా చూడకుండా మాథ్యూ వెతుకుతూ ఉన్నాడు పిల్లాడి కోసం . చూసి ఉంటే –  ఆమె  బిక్కు బిక్కుమంటూ ఎవరికోసమో ఎదురు చూస్తుండటం అర్థమైపోయేదే.

గదికి తాళం పెట్టేసి  భోజనానికి పోబోతున్న  స్టేషన్  మాస్టర్ ని నిలబెట్టి అడిగాడు- అయిదున్నర బండి రావటానికి ఇంకా ఆలస్యం ఉందా అని.  ” వచ్చి వెళ్ళిపోయి అర్థ గంట దాటింది ” –  చెప్పాడాయన.  ” ఒక్క చిన్నపిల్ల మాత్రం దిగింది అందులోంచి..ఎవరో రావాలట ఆమె కోసం . లేడీస్ వెయిటింగ్  రూం లో కూర్చోమన్నాను , అక్కడే ప్లాట్ ఫాం మీదే ఉంటానంది . కొంచెం తమాషా  పిల్లలా ఉందేమిటో ”

మాథ్యూ – ” అమ్మాయి కోసం కాదండీ నేనొచ్చిందీ, అబ్బాయి ఒకడు దిగాలి ఈ రైల్లోంచి. మిసెస్ అలెక్జాండర్ స్పెన్సర్  అబ్బాయిని కాదూ పంపుతానందీ ? ”

స్టేషన్ మాస్టర్ అర్థమైనట్లు  ఈల వేసి అన్నాడు – ” ఏదో పొరబాటు జరిగినట్లుంది. మిసెస్ స్పెన్సర్ అయితే రైల్లోంచి దిగింది, ఈ పిల్లని నాకు అప్పజెప్పింది కూడా. నువూ మీ చెల్లెలూ నోవా స్కోటియా అనాథాశ్రమం నుంచి ఈ పిల్లనే తెచ్చుకుని పెంచుకోబోతున్నారని చెప్పింది నాకు. అబ్బాయెవరూ లేడు ఇక్కడ, నేనేమైనా దాచిపెట్టాననుకుంటున్నావా ? ”

మాథ్యూ కి  మెరిల్లా ఉండి ఉంటే బాగుండేదనిపించింది…అయోమయంగా అన్నాడు – ” నాకేమీ అర్థం కావట్లేదే ”

 

” అదేదో ఆ పిల్లనే అడిగి చూడు.అన్ని కబుర్లూ చెప్పేదాని లాగే ఉంది. మీరు అడిగిన రకం అబ్బాయిలు అనాథాశ్రమం లో అయిపోయారో ఏమో ” – నిర్లక్ష్యంగా అనేసి వెళ్ళిపోయాడు, అప్పటికే బాగా ఆకలేస్తోంది ఆయనకి.

మాథ్యూ ఒక్కడే పిల్లతో మిగిలిపోయాడు. అతనికి  అసలే ఆడపిల్లలంటే మొహమాటమూ  పిచ్చి భయమూ. ..నువ్వు అబ్బాయివి ఎందుకు అయావు కావూ అని ఆ పిల్లని పట్టుకుని ఏమని అడగటం ?

MythiliScaled

 

ఆ పిల్ల మాథ్యూ స్టేషన్ లోకి వచ్చినప్పటినుంచీ అతన్నే కళ్ళప్పగించి చూస్తోంది. పది పదకొండేళ్ళుంటాయేమో, బాగా పొట్టిగా బిగుతుగా ఐపోయిన బూడిద రంగు గౌను వేసుకుని ఉంది, అది బాగా వెలిసిపోయింది కూడా. మట్టి రంగు టోపీ కిందినుంచి రెండు లావుపాటి ఎర్రటి జడలు వేలాడుతున్నాయి .  పీక్కుపోయిన తెల్లటి మొహమూ, అక్కడక్కడా  చిన్న ముదురు జేగురు రంగు మచ్చలు [freckles ] 1….ఒకసారి ఆకుపచ్చగా, ఇంకొకసారి బూడిదరంగులో కనిపించే పెద్ద పెద్ద కళ్ళూ వెడల్పాటి నోరూ. మామూలుగా చూస్తే ఇంతే.

లోతుగా చూడగలిగేవాళ్ళకి ఆ గడ్డం కొనదేలి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.   కళ్ళ నిండా చెప్పలేనంత ఉత్సాహం, జీవ శక్తి చిందులు తొక్కుతాయి. పెదవులు భావోద్వేగాన్నీ  మధురమైన స్వభావాన్నీ సూచిస్తాయి. మొత్తం మీద ఆ ఆకారం లోపల ఉన్నది అసాధారణమైన ఆత్మ.

మాథ్యూ భయపడినట్లు అతనే ముందు పలకరించే అవసరం రాలేదు. తన కోసమే అతను వస్తున్నాడనిపిస్తూనే ఆ పిల్ల దిగ్గున లేచి నిలబడి, ఒక చేత్తో తన సంచీ పట్టుకునే ఉంది కనుక రెండో చేతిని అతని వైపుకు చాచింది –  హాండ్ షేక్ ఇచ్చేందుకు.

వింతైన తియ్యటి గొంతుతో మాట్లాడేసింది – ” మీరే కదూ, మాథ్యూ కుత్ బర్ట్ ?  అమ్మయ్య. మీరింకా ఎందుకు రాలేదా అనుకుంటున్నా. ఎందుకు వచ్చి ఉండరా అని ఆలోచిస్తున్నా.  ఈ రైలు కట్ట దిగి ఆ మలుపు దాటితే అక్కడ పెద్ద చెర్రీ చెట్టు ఉంది చూశారా ?  ఒకవేళ మీరిప్పుడు రాకపోతే ఆ చెట్టెక్కేసి రాత్రంతా ఉండిపోదామనుకున్నా. నాకేం భయం వెయ్యదండీ…వెన్నెట్లో తెల్లటి చెర్రీ పూల మధ్యన కొమ్మల్లో  నిద్ర పోతే చల్లటి పాలరాయి కొండల్లో పడుకున్నట్లుండదూ ? మీరెలాగూ పొద్దునే వచ్చేస్తారుగా ! ”

మాథ్యూ ఆ చిన్న చెయ్యి అందుకుని ఊపాడు. అప్పటికప్పుడే అతనొక నిర్ణయానికి వచ్చాడు –  ఇదంతా పొరబాటనీ మాకు అమ్మాయి అక్కర్లేదనీ  ఆ మెరిసిపోయే కళ్ళ వైపు చూస్తూ తను చెప్పలేడుగాక చెప్పలేడు. ఇక్కడ స్టేషన్ లో వదల్లేడు గా ఏమైనా, ఇంటికి తీసుకుపోతాడు,  ఆ చెప్పే దేదో మెరిల్లా నే చెప్పుకోనీ. ఇప్పుడే  ప్రశ్నలూ సంజాయిషీలూ తన వల్ల కావు.

ఆమెతో అన్నాడు – ” ఆలస్యమైంది. ఏమనుకోకు. ఆ సంచీ ఇలా ఇవ్వు. బయట గుర్రపు బండి ఉంది ”

” వద్దండీ, ఏం బరువు లేదుగా, నేను మొయ్యగలను ” – పిల్ల బోలెడు సంతోషం గా ఏమిటేమిటో చెప్పుకుపోయింది ” నా సామానంతా ఇందులోనే ఉందనుకోండి, ఐనా బరువుండదు. పైగా , దీన్నొకలాగా మటుకే పట్టుకోవాలి, లేకపోతే హాండిల్ ఊడిపోతుంది..పాత సంచీ కదండీ . చెర్రీ చెట్టులో నిద్రపోవటం బాగానే ఉండేదిగానీ మీరు వచ్చేయటం ఇంకా బావుంది. మనం చాలా దూరం వెళ్ళాలి కదా, మిసెస్ స్పెన్సర్ చెప్పారు, ఎనిమిది మైళ్ళని. నాకు అలా ప్రయాణం చేయటం గొప్పసరదా. మీ ఇంట్లో మీతోబాటు ఉండిపోవచ్చంటే ఎంత సంతోషంగా ఉందో ! నాకెప్పుడూ ఎవరూ లేనే లేరు. అనాథాశ్రమం లో ఐతే మరీ ఘోరం. నేను అక్కడున్నది నాలుగు నెలలే అనుకోండి…ఐనా సరే. మీరెప్పుడూ అలాంటి చోట ఉండి ఉండరేమో..అసలు ఊహించుకోలేరు అక్కడ ఎలా ఉంటుందో . మిసెస్ స్పెన్సర్ నేను అలా అనకూడదని అన్నారు…చెడ్డ పిల్లలకి మాత్రమే అలా అనిపిస్తుందట.  ఆవిడ అక్కడ ఉండి చూశారా చెప్పండి, ఉంటేనే గదా తెలిసేది ? పాపం అనాథాశ్రమం వాళ్ళు మంచి వాళ్ళే…కాని అస్సలు ఊహ లేదు వాళ్ళకి. పిల్లలకి మటుకు బోలెడు ఊహలు. నా పక్కన ఉండే పిల్ల తను ఒక జమీందారుల పిల్లననీ, చిన్నప్పుడే ఆయా కోపం వచ్చి మార్చేసిందనీ, ఎవరికైనా తెలిసేలోపు ఆవిడ చచ్చిపోయిందనీ అనుకుంటుండేది. నాకూ అలా అనుకోవాలని ఉండేది..రాత్రంతా ఊహించుకునేదాన్ని…పగలు ఖాళీ ఉండదుగా మరి ! అలా నిద్రపోకనో ఏమో , ఇలా చిక్కిపోయాను. బాగా సన్నగా ఉన్నాను కదండి ? బొద్దుగా చక్కగా ఉంటే ఎంత బావుంటుందో ….”

అప్పటికింక చెప్పటం ఆపింది, గుక్క తిప్పుకుందుకు. ఈ లోపు గుర్రం బండి వరకూ వచ్చారు. ఎక్కి కూర్చుని కొంచెం దూరం వెళ్ళే దాకా ఏమీ మాట్లాడలే. కొండవాలు లోంచి  బాగా లోతుగా వెళ్తోంది బాట.  బండి లో వాళ్ళ తలల పైగా ఎంతో ఎత్తున  …విరగబూసిన తెల్లటి పూలతో ,  సన్నని చెర్రీ చెట్ల  కొమ్మలు . పిల్ల ఒక చిన్న పూల కొమ్మ తుంచుకుని ఇష్టంగా బుగ్గ మీద రాసుకుంది.

” ఎంత బావుందో …ఆ  పూలు తెల్లటి లేస్ లా లేవూ ? ఆ చెట్టు  చూస్తే మీకేమనిపిస్తోంది ? ” అడిగింది మాథ్యూ ని.

”  మ్మ్. ఏమో మరి ” – మాథ్యూ.

anne2 (1)

” పెళ్ళి కూతురిలా ఉంది కదండీ, తెల్లటి మేలి ముసుగు వేసుకున్నట్లు..పెళ్ళికూతుర్ని నేనెప్పుడూ చూడలేదు, విన్నా అంతే. నాకెప్పుడూ పెళ్ళి అవదనే అనుకుంటా, నేనంత బాగోను కదా ? ” మాథ్యూ ఉలిక్కిపడ్డాడు . అదేం పట్టించుకోకుండా పిల్ల కొనసాగించింది – ” కాని ఎప్పుడైనా అలాంటి తెల్ల గౌను, పొడుగాటిది వేసుకోవాలనిపిస్తుంటుంది.  వేరే దేశాలకి వెళ్ళే  మిషనరీ లు ఎవరైనా నన్ను పెళ్ళి చేసుకోవచ్చేమో…వాళ్ళకి అందం గురించి పట్టింపులు ఉండకూడదుగా. ఇవాళ పొద్దున్నే ఈ గౌను వేసుకుని బయల్దేరానా,  …మరి ఇదేం బాగాలేదు కదా..రైల్లో అందరికీ  నన్ను చూసి జాలేస్తోందేమో అనిపించింది, నీలి రంగు సిల్క్ గౌన్ లాగా దీన్ని ఊహించుకున్నా.  అనాథాశ్రమం లో పిల్లలందరూ ఇలాంటి బూడిదరంగు గౌన్లే వేసుకోవాలి..ఎందుకంటే ఎవరో గొప్పాయన మూడొందల గజాల బట్ట దానం చేశారట..దాంతో కుట్టించారు. ఆయన అది అమ్ముకోలేక ఇచ్చేశాడని కొందరు అనుకున్నారుగాని నేనైతే పాపం ఆయన మంచాయన అనే అనుకున్నా. బోట్ లో వస్తుంటే కొంచెం కూడా కడుపులో తిప్పలేదు నాకు , సిల్క్ గౌన్ తో బాటు మంచి బూట్లూ, గ్లవ్స్ వేసుకున్నట్లూ పూలు వేలాడే టోపీ పెట్టుకున్నట్లూ నాకొక బంగారు వాచ్ కూడా ఉన్నట్లూ ఊహించుకున్నా..హాయిగా ఉండింది. మిసెస్ స్పెన్సర్ కి కూడా కడుపులో  తిప్పదుట, చెప్పారు. నేనేమో అటూ ఇటూ తెగ తిరుగుతున్నాననీ నన్ను నీళ్ళలో పడిపోకుండా  కనిపెట్టుకుంటూ ఉంటే వికారం పెట్టేందుకు తీరిక  ఎక్కడుందనీ కూడా అన్నారావిడ.  అదీ ఒకందుకు మంచిదే కదండీ  ? బోట్ లో చూడాల్సినవన్నీ ఒకేసారి చూసెయ్యాలి గదా నేను, మళ్ళీ ఎప్పుడైనా ఎక్కుతానో లేదో ?

 

అబ్బ ! ఎన్ని పూలచెట్లో !!!! ప్రిన్స్ ఎడ్వర్డ్ దీవి ప్రపంచం లోకెల్లా అందమైందని విన్నా..ఇక్కడ ఉండిపోయినట్లు ఊహించుకునేదాన్ని..నిజంగా ఉంటానని అనుకోనేలేదు ! ఈ రోడ్ లు భలే ఎర్రగా ఉన్నాయి కదా ? మేం రైల్లో వస్తూంటే కూడా కనిపించాయి, మాతోబాటు పరిగెత్తుతూ. అవి ఎందుకు ఎర్రగా ఉన్నాయని మిసెస్ స్పెన్సర్ ని అడిగాను. ఆవిడ అప్పటికే నేనొక వెయ్యి ప్రశ్నలు వేసి ఉంటాననీ, ఇంక అడగద్దనీ అన్నారు. ప్రశ్నలు అడక్కపోతే సంగతులెలా తెలుస్తాయి చెప్పండి ? ఇంతకీ ఈ రోడ్ లు ఎర్రగా ఎందుకున్నాయీ ? ”

మాథ్యూ ” ఏమో  మరి …”

పిల్ల- ” సర్లెండి. ఎప్పుడో ఒకప్పుడు తెలుసుకోవాలి. తెలుసుకుందుకు అన్ని సంగతులున్నాయి కదా అనుకుంటే భలే సరదాగా ఉంటుంది కదా ? అన్నీ తెలిసిపోతే ఏం బావుంటుందీ…ఊహించుకుందుకు ఏమీ ఉండదాయె.

నే నే మన్నా ఎక్కువగా మాట్లాడుతున్నానాండీ ? అందరూ అదే అంటుంటారు …మీరూ అదే అంటే మాట్లాడటం ఆపేస్తా…నేనైనా అనుకుంటే చెయ్యగలను, కొంచెం ఇబ్బందే కానీ…”

మాథ్యూ తనకే ఆశ్చర్యం వేసేలా ఆనందిస్తున్నాడు. ఎక్కువ మాట్లాడని చాలా మందికి లాగే అతనికీ ఎవరైనా మాట్లాడుతుంటే ఇష్టమే…తననేమీ పెద్దగా అడక్కుండా ఉంటే. కాని ఒక చిన్న ఆడపిల్ల నుంచి తనకి  ఆహ్లాదం వస్తుందని అతనెప్పుడూ అనుకోలేదు. ఆడవాళ్ళే చిరాకు పుట్టిస్తారనుకుంటే ఆడపిల్లలు మరీ దరిద్రం. ఏమిటో బెరుకు బెరుగ్గా ఓర చూపులు చూసుకుంటూ పక్కనుంచే వెళ్ళి పోతుంటారు , వాళ్ళని అమాంతం మింగెయ్యాలనిపించేంత కోపం వచ్చేది. అవోన్లియా లో అందరు ఆడపిల్లలూ అంతే. మాథ్యూ స్వతహాగా మేధకుడు. పాదరసం లా ఉన్న ఈ పిల్ల బుర్ర ని తను అందుకోలేకపోయినా, ఈ పిల్ల ఏదో చాలా వేరుగా ఉందనీ ఈ బుల్లి  మంత్రగత్తె వాగుడు తనకి బాగానే ఉందనీ అతనికి అనిపించింది.

కొంచెం బిడియంగా చెప్పాడు

” ఏం పర్వాలేదు..నీ ఇష్టమొచ్చినంత మాట్లాడచ్చు. ”

పిల్ల – ” అమ్మయ్య. బతికించారు. మనిద్దరికీ సరిపడేలాగే ఉంది. మాట్లాడాలనిపించినప్పుడల్లా  మాట్లాడటం ఎంతో బావుంటుంది. అదేమిటో..పిల్లలు కనబడాలి గానీ వినబడకూడదని నాకిప్పటికి  లక్షసార్లు చెప్పి ఉంటారు అందరూ. ఇంకానేమో..నేను పెద్ద పెద్ద మాటలు వాడితే అంతా నవ్వుతారు కూడానూ…మరి పెద్ద పెద్ద విషయాలు చెప్పాలంటే పెద్ద మాటలే వాడాలి కదండి ? ”

” అవునవును, నిజమే ” మాథ్యూ ఒప్పుకున్నాడు.

పిల్ల- ” నా నాలుక్కి నరం లేదని మిసెస్ స్పెన్సర్ అన్నారు..అంటే ఏమిటో ? నాకు తెలిసి నాదీ మామూలు నాలుకే  …అవునూ మీ ఇంటి పేరు గ్రీన్ గేబుల్స్ అట కదా ? అక్కడ బోలెడు చెట్లున్నాయని మిసెస్ స్పెన్సర్ చెప్పారు..నాకు చెట్లంటే ఎంతిష్టమో ! అనాథాశ్రమం లో ఎక్కువ ఉండేవే కావు..ఉన్న కాసినీ పాపం దిగులు మొహాలేసుకుని ఉండేవి, చుట్టూ కటకటాలు..అవీ అనాథల్లాగే ఉంటాయి. వాటిని చూస్తేనే ఏడుపొచ్చేది. నేను వాటితో అనేదాన్నీ…” మీరే కనుక ఏ పెద్ద అడవిలోనో ఉండి ఉంటే ఎంత ఎత్తుగా ఎదిగేవారో ! మీ చుట్టూ ఇంకా చాలా చెట్లుండేవి తోడుగా. మీ కొమ్మల్లో పిట్టలు పాడేవి, మీ వేళ్ళ మీద నాచు మొక్కలూ  జూన్ బెల్సూ పెరిగేవి…పక్కనే ఒక సెలయేరు కూడా ఉండేది..కదా  !  పాపం..

ఇక్కడ మీకెలా ఉంటుందో నాకు తెలుసు  ” అని. ఇవాళ వాటిని వదిలేసి రావాలంటే చాలా బాధేసింది నాకు. గ్రీన్ గేబుల్స్ ఇంటి దగ్గర సెలయేరు ఉందాండీ ? మిసెస్ స్పెన్సర్ ని అడగటం మర్చిపోయాను ”

మాథ్యూ – ” ఇంటి పక్కనే ఉందిగా ”

” అరే..భలే ఉందే. ఒక సెలయేరు పక్కనే ఉండాలన్నది నా కల్లో ఒకటి, ఉంటానని అనుకోలేదు ఎప్పుడూ. కలలు నిజం కావుగా , ఐతే బావుంటుంది గానీ…! ఇవాళ ఇంచుమించు పూర్తి సంతోషంగా ఉన్నా నేను, పూర్తి పూర్తి సంతోషంగా ఎందుకు లేనంటే… చెప్తా ఉండండి, ఇదేమిటీ, ఈ రంగుని ఏమంటారు ? ” పిల్ల తన జడనొకదాన్ని ఎత్తి పట్టుకుని మాథ్యూ కి చూపించింది.

మాథ్యూ – ” ఇది ఎరుపు కదా ? ” అన్నాడు.

ఏళ్ళ తరబడి గొప్ప  దుఃఖాన్ని మోస్తున్నదానిలాగా పిల్ల అతి గాఢంగా నిట్టూర్చింది. జడని కిందికి వదిలేసింది.

” అవును, ఎరుపు. ఎర్రటి జుట్టున్న ఎవరైనా పూర్తి సంతోషంగా ఉండగలరా చెప్పండి ? నేను బక్కగా ఉంటాను, నా కళ్ళు ఆకు పచ్చగా ఉంటాయి, మొహం మీద ఈ మచ్చలున్నాయి…ఇవేవీ లేనట్లు – నేను పుష్టిగా , గులాబి రంగులో ఉన్నట్లూ నా కళ్ళు వయొలెట్ రంగులో మెరుస్తున్నట్లూ ఊహించుకోగలను. నా జుట్టు గురించి మాత్రం అలా అస్సలు వీలవదు…నల్లగా తుమ్మెద రెక్కల్లాగా ఉందనో బంగారు రంగులో మిలమిలలాడుతోందనో ,  ఊహించుకోనే లేను. ఇది నాకు ఆజన్మ శోకం. ఒక నవల్లో ఒక అమ్మాయికి ఇలాగే ఆజన్మ శోకం ఉంటుంది, ఆమె జుట్టు ఎర్రగా లేదు మరి, బంగారు రంగులో ఉందట ..ఆమె నుదురు చంద్రకాంత శిల లాగ ఉందట…చంద్రకాంత శిలంటే ఏమిటండీ ? ”

” నాకు తెలీదనుకుంటా ” బెదురుగా అన్నాడు మాథ్యూ. చిన్నప్పుడెప్పుడో తోటి కుర్రాడొకడు తనని రంగులరాట్నం ఎక్కిస్తే కళ్ళు తిరగటం గుర్తొచ్చింది.

” అదేదో చక్కటి వస్తువే అయి ఉంటుంది..ఆ అమ్మాయి అతిలోక సౌందర్యరాశి మరి. అతిలోక సౌందర్యం ఉంటేఎలా ఉంటుందో మీకేమైనా తెలుసాండీ ? ” పిల్ల అడిగింది.

” లేదు, తెలీదు ” మాథ్యూ చెప్పాడు.

పిల్ల అడిగింది- ” అవునండీ, మీరు ఏది కోరుకుంటారు …అతిలోక సౌందర్యం గా ఉండటమా ? అద్భుతమైన తెలివి తో ఉండటమా ? లేకపోతే దేవుడంత మంచిగా ఉండటమా ? ”

” సరిగ్గా తెలీదు ” మాథ్యూ చెప్పుకున్నాడు.

” నాకూ తెలీదు, ఎప్పటికీ తేల్చుకోలేను. ఎలా ఐనా మాత్రం ఉండబోయానా  ఏమిటిలెండి నేను. దేవుడంత మంచిగా ఐతే ఎప్పటికీ అవనను.  మిసెస్ స్పెన్సర్ అన్నారు కదా………మిస్టర్ కుత్ బర్ట్ ! మిస్టర్ కుత్ బర్ట్ !   మిస్టర్ కుత్ బర్ట్ ! ” మిసెస్ స్పెన్సర్  అలా ఏమీ అనలేదు , పిల్ల బండి లోంచి కిందికి దొర్లలేదు, మాథ్యూ విడ్డూరపు పనేమీ చేయలేదు …పిల్ల అరిచింది వీటిలో దేనికీ కాదు. దారి వంపు తిరిగి వాళ్ళు ‘ అవెన్యూ ‘ లోకి ప్రవేశించారు అంతే.

ఈ అవెన్యూ నాలుగైదు వంద ల గజాలు పొడవున, అటూ ఇటూ పెద్ద పెద్ద ఆపిల్ చెట్ల తో ఉంటుంది. వాటిని అక్కడ ఏనాడో ఎవరో పనిగట్టుకుని పెంచారు. విరబూసిఉన్న రెండు వైపుల చెట్లూ కలుసుకుని పైన  పరిమళించే  మంచు చాందినీ పరిచినట్లుంది. ఊదారంగు సంజవెలుగు గాలిలో నిండిపోయి ఉంది.  కాస్త దూరంగా సంధ్యాకాశం  వర్ణ చిత్రం లాగా కనిపిస్తోంది… గులాబిరంగు గాజుతో చేసిన బ్రహ్మాండమైన చర్చ్ కిటికీ లాగా. ఆ సౌందర్యానికి లోనై పిల్లకి మాటలు రాలేదు. చేతులతో తనని తాను చుట్టుకుని వెనక్కి వాలి ఆ వైభవానికి తలెత్తి చూస్తూ ఉండిపోయింది. కాసేపటికి బండి దూరం వెళ్ళాక కూడా ఆమె పలకలేదు, ఆ పడమటి దిక్కు కేసి, సూర్యాస్తమయం కేసి, ఆనందం నిండిన ముఖం తో చూస్తూనే ఉండిపోయింది. ఆ వెలుగుల నేపథ్యం మీద ఏ సుందర దృశ్యాల కవాతు కనిపిస్తోందో ! న్యూ బ్రిడ్జ్  ఊళ్ళోంచి –  కుక్కలు అరుస్తూన్న వీధుల్లోంచి,  కుతూహలంగా కేకలు పెడుతూ మూగే చిన్న కుర్రాళ్ళ మధ్యలోంచి , బండి వెళ్తున్నప్పుడు   కూడా,  ఆమె మౌనం గానే ఉంది . మూడు మైళ్ళు దాటేశారు. మాట్లాడినంత శక్తితోనూ ఆమె నిశ్శబ్దంగా ఉండగలదిలా ఉంది.

” బాగా అలిసిపోయావు కదూ ? ఆకలేస్తోందా ? ” మాథ్యూ అడిగాడు, ఆమె మాట్లాడకపోవటానికి అవే కారణాలనుకుని. ” ఇంకెంతో దూరం లేదులే, వచ్చేశాం. ఒక మైలు ఉంటుంది ” ధైర్యం చెప్పాడు.

ఆమె  ట్రాన్స్ లోంచి బయటికొచ్చి నిట్టూర్చింది. నక్షత్రాల వెంట ఎంతెంత దూరాలకో వెళ్ళి వచ్చినట్లుంది ముఖం, స్వప్నా ల్లో తేలుతున్నట్లు.

”ఆ. మిస్టర్ కుత్ బర్ట్ ! మనం దాటి వచ్చామే, ఆ తెల్లటి చోటు, అదేమిటి ? ”

” దాన్ని అవెన్యూ అంటాం ” మాథ్యూ కొద్ది క్షణాలు ఆలోచించి అన్నాడు – ” అందమైన చోటు అది ”

” అందమా…ఆ మాట ఎంత దూరం వెళ్తుంది గనుక, చాలదు అలా అంటే. అది అద్భుతం. ఉన్నదానికంటే ఇంకా ఎక్కువగా  ఊహించుకోలేనిది ఇప్పటి వరకూ నాకు కనిపించలేదు, ఇదే మొదలు. ఇక్కడ తృప్తిగా ఉంది ” గుండె మీద చెయ్యి పెట్టుకుని చూపిస్తూ అంది పిల్ల, ” ఏదో నొప్పిగా ఉంది, ఆ నొప్పికూడా సుఖంగానే ఉంది. ఇలాంటి నొప్పి మీకెప్పుడైనా వచ్చిందా మిస్టర్ కుత్ బర్ట్ ? ”

” లేదు, నాకు గుర్తున్నంతవరకూ లేదు ” మాథ్యూ అన్నాడు.

” చాలా సార్లు వస్తుంది నాకు , చాలా గొప్పగా ఉన్నదాన్ని చూస్తే.  ‘ అవెన్యూ ‘ అదేం పేరు…దానికి సరిపోదు అసలు. ‘ ఆహ్లాద శ్వేత మార్గం ‘ అంటేనో ? బావుందా ? ఉన్న పేరుతో దేన్నైనా పిలవటం పెద్ద నచ్చదు నాకు. అనాథాశ్రమం లో హెప్జిబా జెంకిన్స్ అని ఒక అమ్మాయి ఉండేది, తనని ఎప్పుడూ నేను రొసాలియా డెవేరే అని ఊహించుకునేదాన్ని. అందరూ ఆ చోటుని అవెన్యూ అన్నా నేను మాత్రం ఆహ్లాద శ్వేత మార్గం అనే అంటాను. అయితే దగ్గరికి వచ్చేశామా ? సంతోషంగా ఉంది, బాధ గానూ ఉంది. ప్రయాణం చాలా బావుండింది కదా, అయిపోతోందని బాధ. మంచి విషయాలు కూడా అయిపోతుంటాయి, బాధేస్తుంది. తర్వాత ఇంకా మంచివి జరగచ్చనుకోండి, కాని అలా అని నమ్మకం లేదు కదా. నా అనుభవం ఐతే జరగవు అనే.  ఇంటికి వెళ్తున్నామంటే సంతోషంగా ఉంది, నాకెప్పుడూ ఇల్లే ఉన్నట్లు గుర్తు లేదు గా మరి ! ఇందాక చెప్పానే , అలాంటి హాయైన నొప్పి మళ్ళీ వస్తోంది, ఇల్లు తలుచుకుంటే. ”

ఒక చిన్న కొండ పైకి ఎక్కుతోంది బండి. కిందికి చూస్తే పెద్ద చెరువు. పొడుగ్గా, మెలికలు తిరుగుతూ, ఇంచుమించు నది లాగా ఉంది. మధ్యలోంచి ఒక వంతెన. జేగురు రంగులో ఉన్న ఇసుక గుట్టల వెనక నుంచి  సముద్రం కనిపిస్తోంది. ఆ నీరు వింత వింతగా వెలుగుతోంది … నీలంగా , ఆకుపచ్చగా, గులాబి రంగుగా, ఇంకేవేవో పేరు తెలీని రంగులుగా. అవేవో ఈ లోకానికి చెందిన వెలుగుల్లాగా లేవు. వంతెన కి అవతల చెరువు ఒడ్డు న దట్టంగా ఫర్ చెట్లూ, మేపుల్ చెట్లూ…చిక్కగా పాకే వాటి నీడలు. అక్కడక్కడా ఒక ప్లం చెట్టు చెరువు మీదికి వంగి ఉంది, తెల్లటి దుస్తులు వేసుకుని అద్దం లో చూసుకోబోయే అమ్మాయికి మల్లే. చెరువు అంచున బురదలో గొంతు విప్పి పాడుకుంటున్న కప్పలు. ఆపిల్ తోట లోంచి చిన్న బూడిదరంగు ఇల్లు తొంగి చూస్తోంది, ఇంకా పూర్తిగా చీకటి పడకపోయినా  ఇంటి కిటికీలో దీపం వెలుగుతోంది.

” అది బారీ చెరువు ” మాథ్యూ చెప్పాడు.

” ఊహూ, ఈ పేరూ బాగోలేదు. దీన్నేమని పిలవనూ … ‘ ప్రకాశమాన   సరోవరం ‘ . సరైన పేరు. పేరు సరైందైతే  తెలిసిపోతుంది నాకు, నా గుండె ఒకలాగ గుబుక్కుమంటుంది అప్పుడు. మీకెప్పుడైనా అలా అంటుందా ? ”

యథాప్రకారం మాథ్యూ ఆలోచించాడు ..” దోసపాదుకి చీడ పడితే దాన్ని చూసినప్పుడు  నా గుండె గుబుక్కుమంటుంది ” సూచించాడు.

” అదీ ఇలాంటిదేనంటారా ? ఏమో మరి. కాదేమో, చీడకీ వెలిగే నీళ్ళకీ సంబంధం ఉందంటారా ? అవునూ, దాన్ని బారీ చెరువని ఎందుకంటారు ? ”

” ఆ ఇల్లు మిస్టర్ బారీ ది కదా, అందుకేనేమో. ఆ ఇంటి పేరు ‘ తోట వాలు ‘ . అదిగో, ఆ చెట్ల గుబురు అడ్డం లేకపోతే ఇక్కడ్నుంచి గ్రీన్ గేబుల్స్ కనిపిస్తుంది. మనం ఇలా చుట్టు తిరిగి ఇంకో అరమైలు వెళ్ళాలి ”

” మిస్టర్ బారీ కి చిన్న అమ్మాయిలెవరైనా ఉన్నారా ? చిన్నంటే మరీ చిన్న కాదు, నా అంత వాళ్ళు ”

” ఒకమ్మాయి ఉంది. ఆమె పేరు డయానా ”

” ఓ.. ” పిల్ల గట్టిగా ఊపిరి పీల్చి వదిలింది – ” ఎంత చక్కటి పేరు ! ”

మాథ్యూ- ” ఏమో. నాకైతే అంత పద్ధతైన పేరులా ఉండదు. 2 జేన్ అనో, మేరీ అనో, అలాంటి శుభ్రమైన పేరేదైనా పెట్టాల్సింది. డయానా పుట్టినప్పుడు ఇక్కడొక స్కూల్ మాస్టర్ ఉండేవాడు, ఆయన్ని పేరు పెట్టమంటే ఈ పేరు పెట్టాడు. ” నిరసనగా అన్నాడు.

పిల్ల- ” నేను పుట్టినప్పుడూ అలాంటి మాస్టరెవరైనా ఉండి ఉంటే బావుండేది. ఇదిగో, వంతెన. కళ్ళు గట్టిగా మూసుకుంటానేం, నాకెప్పుడూ వంతెనల మీంచి వెళ్ళటమంటే చాలా భయం. గబుక్కున మధ్యలో అది కూలిపోతేనో ? మధ్యలోకొచ్చాక కళ్ళు తెరుస్తా. ఒక వేళ వంతెన కూలిపోతుంటే అదంతా  చూడాలిగా మరి ?  పెద్ద చప్పుడవుతుంది కదూ అప్పుడు , నాకిష్టం. ఇష్టపడేందుకు ఎన్నెన్ని విష యాలో ప్రపంచం లో ! ఆ..ఆ..దాటేశాం…ఇప్పుడు వెనక్కి చూస్తా. గుడ్ నైట్ ప్రకాశమాన సరోవరమా ! నాకు ఇష్టమైన వాటన్నిటికీ గుడ్ నైట్ చెప్తుంటాను, వాటికీ అలా చెప్పటం నచ్చుతుంది. ఆ నీళ్ళు నన్ను చూసి నవ్వుతున్నాయేమో ”

కొండ దాటి మలుపు తిరుగుతుంటే మాథ్యూ అన్నాడు….” ఆ.ఇదిగో. వచ్చేసినట్లే .అదే గ్రీన్ గేబుల్స్ ”

” ఆగండి.చెప్పెయ్యకండి..నన్ను ఊహించుకోనియ్యండి , సరిగ్గా ఊహిస్తానో లేదో ” అతను చూపించబోయే చెయ్యి పట్టుకుని ఆపి,  తన చేత్తో కళ్ళు గట్టిగా మూసుకుంది. కాసేపటికి కళ్ళు విప్పి చుట్టూ చూసింది. సూర్యుడు అస్తమించి కాసేపవుతోంది… కానీ ,పండిన  వెలుగు అంతా పరచుకునే ఉంది. బంతిపువ్వు రంగు ఆ కాశం మీద దూరం నుంచి చర్చ్ గోపురం కనిపిస్తోంది. కిందన పొడుగ్గా లోయ, నాజూగ్గా కనిపించే  ఎత్తు పల్లాల మధ్య లోంచి పొలాలూ వాటిలో రైతుల ఇళ్ళూ. పిల్ల కళ్ళు ఒకవైపునుంచి ఇంకోవైపుకి ఆత్రంగా , ఆర్తిగా వెతికాయి.  దారికి బాగా ఎడంగా , ఎడమ వైపుకి తిరిగి ఆమె చూపు ఆఖర్న ఆగింది. మీగడ రంగు  కట్టడం  , చుట్టూ పూసిన చెట్ల తో, ఆ మునిమాపు వెలుతురు లో చిట్టడవి మధ్యలోంచి. ఆ పైన, నైఋతి దిక్కున , మచ్చ లేని ఆకాశం లో స్ఫటికం లాగా మెరుస్తున్న పెద్ద నక్షత్రం …దారిదివ్వె లాగా , అభయమిస్తున్నట్లుగా.

చూపిస్తూ అంది ఆమె – ” అదిగో, అదే- కదూ ? ”

మాథ్యూ ఉల్లాసంగా గుర్రం వీపుని కళ్ళెం తో తట్టాడు ..” కనిపెట్టేశావే ! మిసెస్ స్పెన్సర్ చెప్పిందా ? ”

” లేదు. నిజంగా ! అసలు చెప్పలేదు. చూడగానే అదే  ఇల్లని అర్థమైపోయింది. నేను కలలు కన్నట్లే ఉంది. తెలుసాండీ, నా చెయ్యి మొత్తం కమిలిపోయింది ఇవాళ. ఇది నిజమే అని తెలిసేందుకు ఎన్నిసార్లు గిల్లుకున్నానో నన్ను. అస్తమానం ఇదంతా కలేమో, అయిపోతుందేమో- అనిపిస్తూనే ఉండింది. చివరికి ఇంత మంచి కల ,  కలే అయితేలెమ్మని గిల్లుకోవటం ఆపేశాను. కాని నిజం ఇది, ఇంటికి వచ్చాం ”

anne3 (1)

 

ఆనందంగా నిట్టూర్చి నిశ్శబ్దం లోకి జారింది.

మాథ్యూ ఇబ్బందిగా కదిలాడు. తను  అనుకునేటట్లు అది తన ఇల్లు కాబోవటం లేదని పిల్లకి చెప్పాల్సింది అతను కాకుండా  మెరిల్లా అయినందుకు అతనికి కాస్త ఊరటగా అనిపించింది. మిసెస్ లిండ్ ఇల్లు  దాటారు. చీకటి పడింది, కాని రాచెల్ లిండ్ కిటికీ పక్కన కూర్చుని వాళ్ళని గమనించలేనంత చీకటి ఐతే కాదు. ఈ పిల్ల పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోబోవటం తలుచుకుని మాథ్యూకి పెద్ద దిగులు వచ్చింది. ఆ కళ్ళలో వెలుతురు గుప్పున ఆరిపోతుందా ? అతనికి ఏదో హత్య చేయబోతున్నట్లుంది.

పెరడంతా బాగా చీకటిగా ఉంది. పొప్లార్ చెట్ల ఆకులు గలగలమంటున్నాయి.

పిల్లని బండిలోంచి కిందికి దించుతుంటే ,  అంది..” చూడండి..చెట్లు నిద్రలో మాట్లాడుతు న్నా యి…ఎంత మంచి కలలొస్తున్నాయో వాటికి ! ”

‘ తనకున్న సామానంతా ‘  దాచిన సంచీని గట్టిగా పట్టుకుని అతని వెంట ఆమె ఇంట్లో అడుగు పెట్టింది.

                                                                      [ఇంకా ఉంది ]

  1. చలి దేశాలలో చర్మం మీద ఏర్పడే ముదురు జేగురు రంగు మచ్చలు. చాలా సార్లు యుక్తవయసు వచ్చేసరికి అవి తగ్గిపోతాయి.
  2. డయానా  ఒక గ్రీక్ దేవత. ఆ పేరు క్రైస్తవానికి విరుద్ధంగా ఉందని మాథ్యూ అభిప్రాయం.

 

 

 

 

 

 

 

 

 

గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ [Anne of Green Gables ]

 – లూసీ మాడ్ మాంట్ గోమరీ    [ L.M. Montgomery ]

[ లూసీ మాడ్ మాంట్ గోమరీ[ 1874-1942 ]  ప్రసిద్ధ కెనడియన్ రచయిత్రి. తర్వాతి కాలం లో  9 నుంచి పన్నెండేళ్ళ పిల్లల సాహిత్యంగా గుర్తించబడినా ఆమె రచనలు వయోభేదానికి అతీతంగా అందరూ చదవదగినవి…అందమైన మానవసంబంధాలు , వ్యక్తిగతమైన ఎదుగుదల, ప్రకృతితోనూ  పరిసరాలతోనూ లయ కల్పించుకోవటం – ఆమె కథా వస్తువులు. ఆమె స్వయం గా పుట్టి పెరిగిన Prince Edward Island  చాలా రచనలకు నేపథ్యం .

  Anne of Green Gables 1908 లో రాయబడింది, ఎప్పుడూ out of print  కాలేదు. 20 భాషలలోకి అనువాదమైంది, 50 మిలియన్ లకు పైబడిన కాపీలు అమ్ముడు పోయింది. ప్రపంచమంతా సాహిత్యాధ్యయనం లో భాగమైంది. సినిమాలుగా టివి సీరీస్ లు గా సంగీత రూపకాలుగా ఈ నవల, దాని తరువాయి భాగాలు తయారవుతూనే ఉంటాయి.]

anne1

అవోన్లియా పల్లెటూళ్ళో  ఆ  వీధి మిసెస్ లిండ్ఇంటి  మీదుగా   కాస్త పల్లానికి దిగి   వెళుతుంది.    ఆ పక్కా ఈ పక్కా ఆల్డర్ పూల చెట్లూ ఫ్యూషియా మొక్కలూ . కొండలమీది అడవుల్లో పుట్టిన సెలయేరు ఒకటి  ఆ పక్కగా వస్తుంటుంది.  అంతకుముందరేమైనా  అల్లరిగా  గంతులేసినా   మిసెస్ లిండ్ ఇంటి దగ్గరికి వచ్చెసరికి సెలయేరు కూడా  నెమ్మదిగా, మర్యాదగా ఉండాల్సిందే…కిటికీ పక్కనే కూర్చుని ఆవిడ వచ్చేపోయే వాళ్ళందరి మీదా ఒక కన్ను వేసే ఉంచుతుంది మరి ! ఏది ఏమాత్రం తేడా గా కనిపించినా దాని సంగతంతా మొదలంటా కనుక్కోనిదే ఆవిడ ఊరుకోదు.

ఆ ఊళ్ళో – వాళ్ళ పనులు మానేసుకుని అయినా పక్కవాళ్ళ గొడవలు పట్టించుకోగలవాళ్ళు చాలా మందే ఉన్నారు. మిసెస్ లిండ్ అలా కాదు- ఆవిడ ఎంతో పద్ధతైన ఇల్లాలు , ఏ వంకా లేకుండా పనులు చక్కబెట్టుకుంటుంది. ఆ పైన  కుట్టు తరగతులూ పిల్లలకి ఆదివారం బడీ  చర్చ్ తరపున చేసే దానధర్మాలూ ప్రచారాలూ – ఏవీ ఆవిడ లేకుండా జరగవు.  ఇంత చేసీ వంటింటి కిటికీలో బొంత కుట్టుకుంటూ కూర్చుని ఊరి మంచీ చెడ్డా కనిపెట్టేందుకు ఆవిడకి చాలా  తీరుబడి ఉంటుంది. [  అప్పటికి పదహారు బొంతలు అటువంటివి కుట్టిందనీ ఆ చుట్టుపక్కల ఆ విషయం లో సాటి ఎవరూ లేరనీ చెప్పుకుంటారు  ] . అవోన్లియా  కి రెండు వైపులా సముద్రం , ఒక వైపు కొండ.  ఊరు ఇంచుమించు ముక్కోణపు ఆకారం లో ఉంటుంది.

ఒక జూన్ నెల మధ్యాహ్నం మిసెస్ లిండ్ ఎప్పట్లాగే వంటింటి కిటికీ పక్కన కూర్చుని ఉంది. సూర్యుడు వెచ్చగా వెలుగుతున్నాడు. కొండవాలు మీది తోటలో పువ్వులు లేత గులాబి రంగులో విచ్చుకున్నాయి , తే నెటీగలు  రొద పెడుతున్నాయి.  పొట్టిగా , మెతకగా ఉండే   థామస్ లిండ్ [మిసెస్ లిండ్ భర్త ] పొలం లో టర్నిప్ గింజలు పాతుతున్నాడు. ఆ చివరన గ్రీన్ గేబుల్స్ దగ్గర మాథ్యూ కుత్ బర్ట్  కూడా ఆ పనే చేయాల్సి ఉంది,ఎవరో అడిగితే పొద్దున చెప్పాడటకూడా [ అడగనిదే ఎవరితోనూ ఏమీ చెప్పడు ]…కాని మాథ్యూ  అప్పుడు పొలం లో లేడు. మధ్యాహ్నం మూడున్నరకి , మంచి పనివేళన- మంచి సూట్ వేసుకుని తయారై నిదానం గా గుర్రపు బండి లో బయల్దేరాడు- ఎక్కడికి ? ఎందుకు ?

అది ఇంకెవరైనా అయిఉంటే , మిసెస్ లిండ్ చిలవలూ పలవలూ అల్లి ఉండేది. కాని మాథ్యూ చాలా సిగ్గరి, ఇంట్లోంచి బయటికే వెళ్ళడు. కొత్తవాళ్ళని పలకరించాలంటే ఆమడ దూరం లో ఉంటాడు. అలాంటి మనిషి ఏమిటిలా…మిసెస్ లిండ్ కి బుర్ర తోచలేదు, చేతిలో పని సాగలేదు. ” గ్రీన్ గేబుల్స్ కి వెళ్ళి మెరిల్లా ని అడిగితే సరి. టర్నిప్ గింజల కోసం అయితే ఇలా ముస్తాబు చేసుకుని వెళ్ళడు కదా ? ఏ డాక్టర్ దగ్గరికో అయితే ఇంత నింపాదిగా కదలడు కదా ? ఏదో అయింది, ఏదో జరిగింది- ” …బయల్దేరింది. వీళ్ళ ఇంటికీ గ్రీన్ గేబుల్స్ కీ అర మైలు దూరం కూడా లేదు. గ్రీన్ గేబుల్స్ బాగా పెద్ద ఇల్లు.చుట్టూ పెద్ద తోట. ఆ ఇల్లు  మాథ్యూ నాన్న కట్టినది. ఆయనా కొడుకు లాగే సిగ్గరి. మరీ అడవిలో ఉండలేడు కనుక అందరికీ వీలైనంత దూరంగా , పొలానికి ఆ చివర్న ఇల్లు కట్టుకున్నాడు. చెట్ల చాటునుంచి అది ఒక పట్టాన ఎవరికీ కనబడేలా ఉండదు.

గడ్డి ఒత్తుగా పెరిగిన బాటకి అటూ ఇటూ అడవి గులాబి పొదలు విరబూసి ఉన్నాయి. ఆ ఇల్లు దగ్గర పడే కొద్దీ చడీ చప్పుడూ మాయమవుతాయి . మిసెస్ లిండ్ అనుకుంది – ” ఏమిటో ఈ ఇల్లు..ఎన్ని చెట్లుంటే మాత్రం, అవేమన్నా కబుర్లు చెబుతాయా ? ఎలా ఉంటారో అన్నా చెల్లెలూ ఇక్కడ ! ఏదో సామెత చెప్పినట్లు, దేనికైనా అలవాటు పడిపోవచ్చటలే … నా వల్లయితే కాదబ్బా ! ” పెరటి గుమ్మం లోంచి లోపలికి వెళ్ళింది. అద్దంలా తీర్చిదిద్దినట్లు,  పచ్చగా కళకళలాడుతోంది  పెరడు.  ఒక వైపున భారీగా ఎదిగిన విల్లో వృక్షాలూ ఇంకో వైపున మట్టసం గా లోంబార్డీ చెట్లూ. మెరిల్లా ఇల్లు చిమ్మినంత శ్రద్ధగా చిమ్ముతుందేమో పెరడంతా, నేల  మీద వడ్డించుకుని భోజనం చేసేంత శుభ్రంగా  ఉంటుంది.

తలుపు కొట్టి లోపలికి, వంటింట్లోకి  అడుగు పెట్టింది మిసెస్ లిండ్.   పడమటి  వైపు కిటికీ లోంచి మెత్తటి సూర్యకాంతి కురుస్తోంది. తూర్పు వైపు కిటికీకి ఆకుపసుపు తీగలు అల్లిబిల్లిగా అల్లుకున్నాయి..వాటిలోంచి  లోంచి పూత పట్టిన చెర్రీ చెట్టు ఊగుతూంది, బర్చ్ చెట్లు నాజూగ్గా తలలూపుతున్నాయి. మెరిల్లా కుత్ బర్ట్ ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడ కూర్చుంటుంది [ ఖాళీ గా ఉండటమంటూ ఉంటే ] . అప్పుడూ కూర్చుని ఉంది, పెద్దమనిషి తరహాగా, ఊలు అల్లుకుంటూ. సూర్యకిరణాలు బాధ్యత లేకుండా అలా చిందులేయచ్చా అనుకోగల మనిషి ఆమె,  అంత కట్టుదిట్టమైనది.

మిసెస్ లిండ్ వస్తూనే అంతా గమనించింది. ..ఎదురుగా బల్ల మీద ముగ్గురి కోసం భోజనం వడ్డించి ఉంది.ఎవరో అతిథులు వస్తారు కాబోలు, కాని ప్రత్యేకంగా చేసిన పదార్థాలేవీ లేవు, రోజువారీవే, ఒక్క క్రాబ్ ఆపిల్ కేక్ తప్పించి. మరయితే ఆ మాథ్యూ హడావిడి ఎందుకోసం ? మిసెస్ లిండ్ ప్రాణానికి అదొక గొప్ప రహస్యమనిపించింది.

మిసెస్ లిండ్ ని ఆహ్వానించింది మెరిల్లా  – ” గుడ్ ఈవెనింగ్  రాచెల్. రా, కూర్చో. ఎలా ఉన్నారు అందరూ ? ”

మెరిల్లా కుత్ బర్ట్ కీ రాచెల్ లిండ్ కీ మధ్య ఉన్నదాన్ని స్నేహం అనచ్చో లేదో కాని ఇద్దరూ దగ్గరివాళ్ళు మాత్రం అవును.

మెరిల్లా సన్నగా పొడుగ్గా బద్దలాగా ఉంటుంది. అక్కడక్కడా తెల్లబడ్డ జుట్టుని వెనక్కి లాగి ముడి పెట్టింది. పొడుచుకొచ్చే రెండు చెంప పిన్నులు అటూ ఇటూ దూర్చింది. ఎక్కువ ప్రపంచాన్ని చూడని మనిషి లాగా, పాతకాలం గా , కనిపిస్తుంది. ఆమె పెదవులలో మాత్రం ఎక్కడో లీలగా హాస్య ప్రియత్వం తెలుస్తుంటుంది.

మిసెస్ లిండ్ అంది – ” అందరం బా గా నే ఉన్నాంలే..మీ సంగతేమిటి ? మాథ్యూ అలా వెళ్తున్నాడేమిటీ ? కొంపదీసి డాక్టర్ కోసమైతే కాదుగదా ? ”

మెరిల్లా పెదవులు కొంచెం విచ్చుకున్నాయి. రాచెల్ లిండ్ ఇహనో ఇప్పుడో వచ్చేస్తుందని ఆమె అనుకుంటూనే ఉంది, అంత కుతూహలాన్ని ఆవిడ తట్టుకోలేదని మెరిల్లాకి తెలుసు.

anne3

” అదేమీ లేదు రాచెల్. కాస్త తలనొప్పిగా ఉందిగాని నేను బాగానే ఉన్నాను. నోవా స్కోటియా లో అనాథాశ్రమం ఉంది కదా, అక్కడినుంచి ఒక చిన్న పిల్లాడు   ఇవాళ సాయంత్రం రైల్లో వస్తాడు . పెంచుకుందామని తెచ్చుకుంటున్నాం ” – చెప్పేసింది.

ఆస్ట్రేలియానుంచి వచ్చే ఒక కంగారూని మాథ్యూ కలుసుకునేందుకు వెళ్ళాడని విన్నా రాచెల్ లిండ్ అంత ఆశ్చర్యపడిఉండదు.ఐదారు క్షణాలపాటు మాట కూడా పెగల్లేదు.  మెరిల్లా వేళాకోళం చేసే మనిషి కాదు, కాని అలాగే ఉంది చూడబోతే.

కాస్త తేరుకుని అంది – ” నిజమేనా మెరిల్లా ? ”

” ఆ.నిజమే ” యథాలాపంగా అంది మెరిల్లా… గిరిగీసుకున్నట్లుండే  అవోన్లియా లో అనాథాశ్రమాల్లోంచి అబ్బాయిలని పెంచుకుందుకు తెచ్చుకోవటం చాలా మామూలైన విషయం అన్నట్లు.

మిసెస్ లిండ్ పెద్ద కుదుపు తగిలినదానిలా అయింది. అనాథ పిల్లాడా  ? మెరిల్లా , మాథ్యూలు పెంచుకుంటారా ? ఇదేం విపరీతం ?? ఇహ  మీదట ఎలాంటి  వార్త విన్నా వింత ఉండదని అనుకుంది ఆవిడ.

” మీకసలు అలా ఎందుకనిపించింది మెరిల్లా ? ” నిరసనగా అడిగింది . మిసెస్ లిండ్ సలహా తీసుకుని ఆ పని తలపెట్టలేదు కనుక నిరసన ప్రకటించి తీరాలి ఆవిడ.

” ఒక్కసారిగా కాదులే, చాలా రోజులనుంచీ అనుకుంటున్నాం. మొన్న క్రిస్మస్ కి  మిసెస్ అలెక్జాండర్ స్పెన్సర్ వచ్చింది చూడు, తను చెప్పింది- హోప్ లో అనాథాశ్రమం నుంచి ఒక అమ్మాయిని తెచ్చి పెంచుకుంటున్నానని, ఈ పాటికి తెచ్చుకునే ఉంటుంది. అప్పుడనుకున్నాం, ఒక అబ్బాయిని పెంచుకోవాలని. మాథ్యూ కూడా పెద్దవాడైపోతున్నాడు, అరవై నిండాయి. ఇదివరకట్లా పనిచేయలేకపోతున్నాడు పాపం. కాస్త సాయం చేసి పెట్టేందుకు సరైన మనుషులే దొరకట్లేదు. ఎవరో దొరికి వాళ్ళకి కాస్త పని నేర్పించే లోపు  పట్నాల కి వెళ్ళిపోతున్నారాయె. మిసెస్ స్పెన్సర్ ని , ఆమె వెళ్ళినప్పుడు మాకూ ఒక పది పదకొండేళ్ళ అబ్బాయిని వెతికి పెట్టమన్నాం, కాస్త చురుకైన వాణ్ణి. ఆ వయసైతే కాస్త పని అందుకోగలరు, చెబితే వింటారు. ఇంట్లో పెట్టుకుని , రోజూ బడికి పంపించి చదివిస్తాం వాడిని. మిసెస్ స్పెన్సర్ ఇచ్చిన టెలిగ్రాం నిన్న వచ్చింది, ఇవాళ సాయంత్రం అయిదున్నర కి పిల్లాడిని ఇక్కడ బ్రైట్ రివర్  స్టేషన్ లో దిగబెడుతున్నట్లు ‘’-మెరిల్లా చెప్పుకొచ్చింది.

తనెప్పుడూ ఉన్నది ఉన్నట్లు మాట్లాడగలనని మిసెస్ లిండ్ కి నమ్మకం. కాస్త నిభాయించుకుని తన అభిప్రాయాన్ని ఇలా ప్రకటించింది .

” అది కాదు మెరిల్లా, ఇదెంత పిచ్చి పనో తెలుస్తోందా మీకు ? సాహసం కూడానూ…ఎవరో దారేపోయేవాడిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారా చెప్పు ? వాడెవరో ఏమిటో, వాడి అమ్మా నాన్నా ఎలాంటివాళ్ళో, రాను రాను ఎలా తయారవుతాడో ? నిన్నగాక మొన్న పేపర్ లో చూశాను, ఒక భార్యా భర్తా ఇలాగే ఎవర్నో తెచ్చి పెంచుకుంటుంటే ఆ దరిద్రుడు  అర్థరాత్రి కొంపకి నిప్పెట్టాడట, కావాలనే పెట్టాడు తెలుసా ? ఇద్దరూ మంటల్లో కాలి బుగ్గయిపోయారు పాపం. అంత కాకపోయినా,  ఇంకొక చోట ఇలాంటివాడే దొంగతనాలు మరిగాడట, వాణ్ణి వదిలించుకోలేక పెంచుకునేవాళ్ళకి తల ప్రాణం తోకకొస్తోంది.  నాకొక్క మాటైనా చెప్పలేదు మీరు…తప్పకుండా వద్దని ఉండేదాన్ని ”

ఈ హితబోధ మెరిల్లా మీద ఏమీ పని చేసినట్లు లేదు, ఆమె శాంతంగా ఊలు అల్లుకుంటూ జవాబిచ్చింది.

” నువ్వనేదాంట్లో నిజం ఉందిలే రాచెల్, నాకూ కొంచెం భయం గానే ఉండింది- కాని మాథ్యూ బాగా పట్టుపట్టాడు. నీకు తెలుసుగా, మామూలుగా ఏదీ గట్టిగా అడగడు – అందుకు ఒప్పుకున్నాను. అపాయాలంటావా, ఎక్కడ లేవు చెప్పు ? సొంత పిల్లలైతే మటుకు పెద్దయాక వెధవలు  కారని ఏముంది ? నోవా స్కోటియా మనకి దగ్గరే- ఇంగ్లాండో, అమెరికానో కాదుగా.. వాడూ మనలాంటి వాడే అయిఉంటాడు కదా ? ”

మిసెస్ లిండ్  కొనసాగించింది – ” సరేలే, ఏదో ఒకటి. అంతా బావుంటుందనే అనుకుందాం. వాడు రేపేదైనా అఘాయిత్యం  చేస్తే – నేను చెప్పలేదని మాత్రం అనుకోకు…ఇంటికి నిప్పు పెట్టటమో, బావిలో విషం కలపటమో- అలాంటిదేదో. అక్కడెక్కడో ఇలాగే ఇంటిల్లిపాదీ ఆ నీళ్ళు తాగి మెలికలు తిరిగి చచ్చారట…పెంచుకుంటున్న ఆడ పిల్ల చేసింది ఆ పని. ”

మెరిల్లా అంది ” మేము పెంచుకునేది ఆడపిల్లని కాదు గా ” అని, ఆ బావిలో విషం కలపటమనే పని ఆడపిల్లలే చేస్తారు, మగపిల్లలు చెయ్యలేరన్నట్లు. మళ్ళీ అంది – ” ఆ మిసెస్ స్పెన్సర్ ఆడపిల్లని ఎందుకు పెంచుకుంటోందో నాకు చచ్చినా అర్థం కాదు , విడ్డూరపు మనిషి ”

మాథ్యూ ఆ పిల్లాడిని వెంటబెట్టుకొచ్చే వరకూ ఉందామనే మిసెస్ లిండ్ అనుకుంది, కాని అందుకు కనీసం ఇంకొక రెండు గంటలు పడుతుంది. ఈ లోపు అలా బయటికి వెళ్ళి ఎవరో ఒకరి చెవిలో ఈ మాట వేయచ్చు, మంచి హడావిడయిపోతుంది. అటువంటి అలజళ్ళు సృష్టించటమంటే మిసెస్ లిండ్ కి ఎంతో ప్రీతి…మెల్లిగా జారుకుంది. మెరిల్లా ఒక్కసారి ఊపిరి పీల్చుకుంది..మి సెస్ లిండ్ ఉన్నంతసేపూ మెరిల్లా  భయాలూ అనుమానాలూ ఎక్కువైపోతూనే ఉన్నాయి.

దారి వెంట పోతూ మిసెస్ లిండ్ పైకే అనేసుకుంది – ” ఏమన్నా నమ్మేటట్లుందా  ఇది ?   ఆ పిల్లాడెవరో గానీ , వాడి పనైపోతుంది ఇంక – మెరిల్లాకీ మాథ్యూ కీ పిల్లల్ని పెంచటం ఒక్క రవ్వైనా తెలుసా అని ! ఆ చిన్న వెధవ , వాడి తాతయ్య అంత కుదురుగా తెలివిగా ఉండాలనుకుంటారు వీళ్ళు – పాపం వాడికసలు తాతయ్య ఉన్నాడో లేదో. అసలా గ్రీన్ గేబుల్స్ లో చిన్న పిల్లాడిని ఊహించుకుందుకే కష్టంగా ఉంది. ఆ ఇల్లు కట్టే నాటికే మాథ్యూ మెరిల్లా ఎదిగిపోయారు. వాళ్ళ మొహాలు చూస్తే అసలొకనాడు వాళ్ళూ పిల్లలేనని అనిపించదు కదా . ఆ పిల్లాడెలా నెగ్గుకొస్తాడో ఏమిటో ”

బ్రైట్ రివర్ స్టేషన్ లో దిగి మాథ్యూ కోసం ఓపిగ్గా ఎదురు చూస్తున్న ఆ చిన్న శాల్తీని గాని మిసెస్ లిండ్ అప్పుడు చూసి ఉంటే ఇంకెంత జాలిపడేదో !!!

                                           [ఇంకా ఉంది]

 

 

 

 

 

 

 

 

 

 

 

గండాలు దాటే మనిషి

mythili

చాలా ఏళ్ళ కిందట ఐర్లండ్ లో ఒక ఊర్లో కొనాల్ అని ఒకాయన ఉండేవాడు – అందరికీ చేతనైన సాయం చేసేవాడు, పెద్ద మనిషి.  ఆ ఊరి జమీందారు మంచివాడేగానీ ఆయన కొడుకులు చాలా దుడుకు వాళ్ళు. ఒకసారి వాళ్ళు ఏదో చెడ్డ పని చెస్తుంటే కొనాల్ కొడుకులు అడ్డు తగిలారు.  ఆ గొడవలో జమీందారు కొడుకు ఒకడు  చచ్చిపోయాడు. జమీందారు కి చాలా దుఃఖమూ కోపమూ వచ్చాయి. కొనాల్ ని పిలిచి ఇలా అన్నాడు  – ” నీ కొడుకులు ఏమని నా పిల్లల జోలికి వచ్చారు ? వాళ్ళని ఇప్పటికిప్పుడు ఏమైనా చేయగలను- కాని నీకొక అవకాశం ఇస్తున్నాను.  నువ్వూ నీ కొడుకులూ వెళ్ళి లోచ్ లాన్ రాజు గారి దగ్గర ఉండే మట్టి రంగు గుర్రాన్ని తెచ్చి నాకు ఇవ్వాలి. అలా అయితే మిమ్మల్ని క్షమించి వదిలిపెడతాను. లేకపోతే నీ కొడుకులు ముగ్గురినీ ఒకేసారిచంపించేస్తాను ”

జమీందారు పట్ల భక్తి ఉన్న కొనాల్ వెంటనే  ” నా కొడుకుల కోసమనే కాదు ప్రభూ, మీరు అడిగారు కనుక ఆ పని తప్పకుండా చేసిపెడతాను… ఎంత కష్టమైనా సరే, నావీ నా కొడుకులవీ ప్రాణాలు పోయినా సరే ” అన్నాడు. అనేశాడే గానీ ఇంటికి వెళ్ళి దిగులుపడుతూ పడుకుండిపోయాడు. ఆ రాజుగారికి ఆ గుర్రం చాలా అపురూపమైనది అని అందరికీ తెలుసు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన దాన్ని ఎవరికీ ఇవ్వడు. వీలైతే దాన్ని దొంగిలించి తేవలసిందే. రాజభవనం లో దొంగతనం చేయటం అయే పనేనా ? భార్య గుచ్చి గుచ్చి అడిగింది- విన్నాక  ఆమె కీ చాలా భయం వేసింది. లోచ్ లాన్ రాజు ఆ గుర్రాన్ని చాలా భద్రంగా కాపాడుకుంటాడు , దాన్ని దొంగిలించబోవటం అంటే కోరి చావును కొని తెచ్చుకున్నట్లే. మళ్ళీ తన భర్తా పిల్లలూ తనకి కనిపించరనే అనుకుంది ఆమె.

celts2

తెల్లారుతూనే కొనాల్, ముగ్గురు కొడుకులూ కలిసి బయల్దేరారు. సముద్రానికి అవతలి ఒడ్డున ఉంది లోచ్ లాన్ రాజ్యం. ఎక్కడా ఆగకుండా మరుసటిరోజు సాయంత్రానికి  అక్కడికి చేరారు. అప్పటికి చీకటి పడుతూ ఉంది.దగ్గరలో పెద్ద ధాన్యం మర ఒకటి కనిపించింది. ఆ రాత్రికి అక్కడ తలదాచుకుందుకు చోటు అడిగారు. మర యజమాని ఒప్పుకున్నాడు. అతని ఎద్దుల్లో రెండింటికి ఉన్నట్లుండి జబ్బు చేసి ప్రాణం మీదికి వచ్చింది. కొనాల్ కి  పశువైద్యం బాగా  తెలుసు , వెంటనే పూనుకుని వాటికి  చికిత్స చేసి కాపాడాడు.   మర యజమాని సంతోషించి  వాళ్ళకి భోజనం ఏర్పాట్లు కూడా చేసి వచ్చిన పని ఏమిటని అడిగాడు. కొనాల్ దాచకుండా విషయమంతా చెప్పాడు, ఆ గుర్రాన్ని సంపాదించటం లో ఏదైనా సాయం చేయగలరా అనీ అడిగాడు.    కొనాల్ చేసిన ఉపకారానికి మర యజమాని బదులు తీర్చాలనుకున్నాడు గానీ , ఆ పని ఎంత ప్రమాదమో అతనికి తెలుసు, అదే చెప్పాడు. కొనాల్-  తామంతా ఎలా అయినా చచ్చిపోయేవాళ్ళమే కనుక ఎంత ప్రమాదమైనా ఒకటేనని నచ్చజెప్పాడు . ఆ మర యజమానే రాజుగారి గుర్రపుసాలకీ  ధాన్యం సరఫరా చేస్తాడు. మర్నాడు పొద్దున పంపీంచే ధాన్యపు బస్తాలలో కొనాల్, కొడుకులూ రోజుకొకరు దాక్కుని గుర్రం ఉన్నచెటికి వెళ్ళచ్చు నని పథకం వేసుకున్నారు.

 

అలాగే తెల్లారి  చిన్నకొడుకు గుర్రాలసాల చేరాడు. మట్టిరంగు గుర్రం కనిపించింది.  దాని మీద చేయి వేయగానే పెద్ద గా సకిలించింది. రాజు గారి భటులు పరుగెత్తుకుంటూ వచ్చి అతన్ని పట్టుకుని చెరలో పెట్టారు. రాజు ఊర్లో లేడు, అందుకని ఆయన వచ్చేదాకా అతన్ని విచారించి శిక్ష వేయటం వీలు కాదు. చిన్న కొడుకు ఇంటికి రాకపోవటం తో అతను పట్టుబడ్డాడని అర్థమైంది. అయినా ప్రయత్నం మానేందుకు లేదు. రెండో కొడుకూ పెద్దకొడుకూ కూడా గుర్రాన్ని తెచ్చేందుకు వెళ్ళి పట్టుబడిపోయారు. అదృష్టం కొద్దీ రాజు గారు ఇంకా ఊర్నుంచి రాలేదు, వాళ్ళు ప్రాణాలతోనే ఉన్నారు. ఆఖరి రోజున కొనాల్ కూడా వెళ్ళాడు, అతని వల్లా కాలేదు, బంధించారు. రాజు ఆ రోజు కొలువుకి వచ్చాడు, అందరినీ ఒకేసారి హాజరు పెట్టారు.

రాజు ” మీరు చెప్పుకునేదేమైనా ఉందా ? ఇంత సాహసం దేనికి చేశారు ? ” అడిగాడు.

 

కొనాల్ ” తప్పనిసరయింది మహారాజా ! గుర్రాన్ని తీసుకెళ్ళకపోతే నా కొడుకులందరి ప్రాణాలూ పోతాయి. అడిగితే మీరు ఇవ్వరని దొంగిలించాల్సి వచ్చింది. మీరేం చేసినా సిద్ధంగా ఉన్నాం ” అన్నాడు.

రాజు – ” ఇంత ప్రమాదం లో పడ్డారు కదా, ఇంతటి  ప్రమాదకరమైన పరిస్థితిలో ఇదివరకెప్పుడైనా ఉన్నావా ? చెప్పు. నాకు అది నిజమని తోస్తే నీ కొడుకులలో ఒకరిని వదిలిపెడతాను ”

కొనాల్ కాసేపు ఆలోచించి – ” ఉన్నాను మహారాజా , ఇంతటి  ప్రమాదం లో ఒకప్పుడు ”

చెప్పటం మొదలుపెట్టాడు.

” నా చిన్నతనం లో మా నాన్నకి చాలా పొలమూ ఆవులూ ఉండేవి. ఆవులన్నీ మాకు  పదిమైళ్ళ దూరం లో , అడవి అవతలి  మైదానం లో ఉండేవి.  ఒకసారి వాటిలో ఒకటి దూడని పెట్టింది. ఆవునీ దూడనీ ఇంటికి తీసుకు రమ్మని మా నాన్న నన్ను పంపాడు. నేను అలాగే వాటిని తోలుకొస్తూ ఉంటే ఉన్నట్లుండి వాన మొదలైంది. రాత్రయిపోయింది కూడా.  దారి పక్కనే ఉన్న పాకలో తలదాచుకున్నాం. జల్లు కొట్టకుండా  తడిక తలుపు  ని బిగించాను. కాసేపటికి ఎవరో తలుపు తోసిన చప్పుడు.  వెళ్ళి తీశాను. నన్ను తోసుకుంటూ పిల్లుల మంద ఒకటి లోపలికి జొరబడింది.   అవి మామూలు పిల్లులు కావు, ఒక్కొక్కటీ ఆవు దూడ కంటే పెద్దగా ఉన్నాయి.  వాటిలో ఒంటి కన్ను పిల్లి ఒకటి అన్నిటి కన్నా పెద్దగా, భయంకరంగా ఉంది. తక్కిన పిల్లులు అన్నీ కలిసి చెవులు చిల్లులు పడేలాగా బిగ్గరగా అరవటం మొదలెట్టాయి. అవి అరవటం ఆపాక పెద్ద పిల్లి మనిషి భాషలో ” కొనాల్, నీ గౌరవార్థం మా వాళ్ళు కచేరీ చేశారు కదా, వాటికి ఏం బహుమతి ఇస్తావు ? ” అని అడిగింది. నాకు పైప్రాణాలు పైనే పోయాయి.

అది మళ్ళీ అంది – ” ఆకలి…మాకు తిండి కావాలి ”

నేను గొంతు పెగుల్చుకుని ” ఇక్కడేముంది ? ” అన్నాను.

” నీ ఆవూ దూడా లేవూ ? ” అని వాటి మీద పడి తినేశాయి.ఏమీ చేయలేక, ఆ భీబత్సం చూడలేక కళ్ళు మూసుకున్నాను

మళ్ళీ అరిచాయి, మళ్ళీ పెద్ద పిల్లి బహుమానం అడిగింది.

” ఇంకేమున్నాయి ? ”

” నువ్వు లేవూ ? ”

celts4

పక్కనే ఉన్న కిటికీ కంత లోంచి దూకి అడవిలోకి దౌడు తీశాను, అవి నా వెంటబడ్డాయి. కనిపించిన చెట్టు ఒకటి ఎక్కి చిటారు కొమ్మ మీద కూర్చున్నాను. పిల్లులు నన్ను పసిగట్టి వచ్చి కింద కాపు వేశాయి. అవి పైకి ఎక్కలేవు కాబోలు.  చెట్టుని పడగొట్టేందుకు దాని వేళ్ళు తవ్వటం మొదలుపెట్టాయి. చెట్టు సగానికి పైగా పడిపోయింది. ఇక నా పని అయిపొయినట్లేనని అనుకుంటూ ఉండగా పెద్ద కలకలం వినిపించింది. కొందరు వేటగాళ్ళు గుంపు గా ఆవైపుకి వచ్చారు. పిల్లులని ఎదుర్కొన్నారు. హోరాహోరీ యుద్ధం.  వాళ్ళ చేతుల్లో బరిసెలూ ఈటెలూ ఉన్నా కూడా ఇద్దరు ముగ్గురికి బాగా గాయాలైనాయి. చివరికి ఎలాగైతేనేం, దయ్యపు పిల్లులన్నిటినీ చంపేసి వాళ్ళు నన్ను రక్షించారు.అప్పటికి తెలతెలవారుతూ ఉంది.  పదే పదే వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుని మా ఊరికేసి బయల్దేరాను. మహారాజా ! మీరు నన్ను ఏం చేసినా సరే, ఆ పిల్లుల చేతిలో చచ్చి ఉండటం కన్న భయంకరం కాదనిపిస్తుంది ”

రాజు నిజమేనని ఒప్పుకుని  కొనాల్ ఆఖరి కొడుకుని విడుదల చేశాడు-  ” ఇంకా నీ జీవితం లో ఎదురైన ప్రమాదాలేవైనా ఉంటే చెప్పు. అవి  ఇంత భయంకరమైనవేనని నాకూ  అనిపిస్తే నీ తక్కిన కొడుకులనీ విడిపించే ఆలోచన చేస్తాను  ”

కొనాల్ మళ్ళీ కాసేపు ఆలోచించి – ” ఆ. ఇంకొక సంఘటన ఉంది మహారాజా !

ఒకరోజున అడవిలో వేటాడేందుకు వెళ్ళి దారి తప్పాను. తిరగ్గా తిరగ్గా దూరంగా రెండు కొండల మధ్యనుంచి పొగ రావటం కనిపించింది. అక్కడ మనుషులు ఉండచ్చుననుకుంటూ ఆ వైపుకి వెళ్ళాను.  కొండ గుహ లో మంట మీద  మాంసం ఉడుకుతోంది, ఎవరూ కనిపించలేదు.  నాకు బాగా ఆకలేస్తోంది. వాళ్ళెవరో వచ్చి నాకింత తిండి పెట్టి దారి చూపిస్తారేమోనని కూర్చుండిపోయాను. అంతలో  మేకల అరుపులు వినిపించాయి. అయితే వాటిని తోలుకు వచ్చింది మాత్రం మనిషి కాదు, రాక్షసుడు.  నేను పారిపోయే ప్రయత్నం చేసేలోపే వాడు నన్ను పసిగట్టి మెడ పట్టుకుని పైకిలేపాడు. వాడికీ ఒకే కన్ను ఉంది, రెండోదానికి చూపు లేదు.

నాకు ఆ క్షణానే ఉపాయం తట్టింది – ” నన్ను తింటే నీకొక పంటికిందకి కూడా రాను, ఇప్పటికి వదిలావా- నీ రెండో కంటికి చూపు వచ్చేలా చేస్తాను ”- వాడితో చెప్పాను. నేనెక్కడికీ తప్పించుకుపోలేననీ, ఈ లోపు నన్ను ఉపయోగించుకోవచ్చనీ అనుకుని వాడు నన్ను కిందికి దించి, గొర్రెల మందని గుహలోకి తోలాడు.  నేను మూలికలు సేకరిస్తుంటే నా వెనకాలే వచ్చాడు. త్వరలోనే నేనొక పసరు తయారు చేసి వాడి గుడ్డి కంట్లోనూ మామూలు కంట్లోనూ కూడా పిండాను. తెల్లారేసరికి నేను అనుకున్నట్లే వాడికి రెండు కళ్ళూ కనిపించకుండా పోయాయి, కేకలు వేయటం మొదలెట్టాడు.  నేను గుహలో ఏ మూలకి నక్కినా వాడి చేతులకి అందకుండా ఉండను గనుక గొర్రెల మందని బయటికి తోలుతూ నేనూ ఒక గొర్రె చర్మం కప్పుకుని వాటితో కలిసి బయట పడ్డాను. అలాగే పారిపోకుండా దూరం నుంచి  ” నేనే గెలిచాను ” అని కుర్రతనం కొద్దీ అరిచాను.

” మెచ్చానురా. ఇదిగో, కానుక ” అని వాడు తన ఉంగరం తీసి నాకేసి విసిరాడు. నేను తీసుకుని నా వేలికి పెట్టుకున్నాను, ఆశ్చర్యంగా అది సరిపోయింది. నా సరదా ఎంతోసేపు నిలవలేదు. ” ఉంగరమా, నువ్వెక్కడ ? ” అని వాడు కేక పెట్టగానే ” ఇక్కడున్నాను ప్రభూ ” అని నా ఉంగరం జవాబు చెప్పింది. వాడు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వచ్చేస్తున్నాడు. కాలిసత్తువ కొద్దీ పరిగెత్తాను – ఎంత లాగినా వేలినుంచి ఉంగరం ఊడిరాలేదు. జేబులోంచి చాకు తీసి ఉంగరం తో సహా వేలు తెగ్గొట్టుకుని దాన్ని కొండ లోయలోకి విసిరేశాను.

” ప్రభూ, ఇక్కడ ” అని ఉంగరం కేక పెట్టింది. రాక్షసుడు దాని గొంతు వెంట లోయలోకి పడి చచ్చిపోయాడు.

మహారాజా, ఆ రాక్షసుడి చేతిలో చచ్చిఉంటే అది మీరు వేయబోయే శిక్ష కన్నా భయంకరంగానే ఉండేదనిపిస్తోంది ” కొనాల్ చెప్పటం ముగించాడు, మొండిగా ఉన్న  వేలుతో చేతిని చూపించాడు.

రాజు – ” ఎంత సాహసివి కొనాల్ ! నువ్వు చెప్పింది నిజమే, ఇంతటి ప్రమాదపు కథని నేనూ వినలేదు ” అని రెండో కొడుకునీ విడుదల చేశాడు. ” మరి మూడో కొడుకునీ రక్షించుకోవూ ? ” అడిగాడు.

celts3

కొనాల్ గుర్తు చేసుకుని చెప్పటం మొదలు పెట్టాడు.

 

” రాక్షసుడి గుహలోంచి వచ్చిన కొన్ని రోజులకి మా నాన్న నాకు పెళ్ళి చేశాడు. కుదురుగా వ్యవసాయం చేసుకోమని హెచ్చరించాడు. కొంతకాలం పాటు అలాగే బుద్ధిగా ఉన్నాను. ఒక రోజున ఏమీ తోచక సముద్రపు ఒడ్డుకి షికారు వెళ్ళాను. అక్కడొక చిన్న పడవ. దాని నిండా అందమైన వస్తువులు. వాటిని దగ్గరగా చూద్దామని ఎక్కానో లేదో, పడవ దానంతట అదే కదలటం మొదలెట్టింది, ఎంత ఆపాలన్నా ఆగలేదు. దేవుడి మీద భారం వేసి ఊరుకోవాల్సివచ్చింది. కాసేపటికి  ఒడ్డు చేరింది – అదొక దీవి. కొంత దూరం లో ఒకావిడ ఇద్దరు పిల్లలతో కనిపించింది-  చిన్న  మూడేళ్ళ  పాప, ఏడాది వయసున్న పసి  బిడ్డ . ముగ్గురూ సంపన్నమైన కుటుంబానికి చెందినవాళ్ళ లాగా ఉన్నారు.  ఆమె చిన్న కత్తిని బిడ్డ గొంతుకి ఆనించి పొడవబోతోంది, వాడు దాన్ని పట్టుకుని ఆడుకుంటున్నాడు. ఆమె కత్తి విసిరేసి – ” నా వల్ల కాదు ” అని బిడ్డని గుండెకి హత్తుకుని ఏడుస్తోంది. నాకు అంతా అయోమయంగా అనిపించి – ” ఏమమ్మా, ఏమిటి నీకు అంత కష్టం ? ” అని అడిగాను. ఆమె ముందు నాకేమీ చెప్పలేదు, ఎక్కడినుంచీ ఏ సాయమూ రాదని నిరాశ చేసుకున్నట్లుంది. అడగ్గా అడగ్గా విషయం తెలిసింది. ఆవిడ నాలాగే షికారుకి వచ్చి పిల్లలతో సహా పడవ ఎక్కి ఈ దీవికి చేరింది. అదంతా దీవి మధ్యన రాతికోటలో ఉండే రాక్షసుడి పురమాయింపు- అలా వచ్చిన మనుషులని వాడు చంపి తింటూ ఉంటాడు. ఆమెకోటలో దొరికినవాటితో రకరకాలుగా , రుచిగా వంట చేసిపెడుతూ రాక్షసుడిని కొద్ది రోజులు తమని చంపి తినకుండా ఆపింది గానీ రాక్షసుడు ఇంక ఏమారటం లేదు. ముందు పసిబిడ్డని చంపి తనకి వండి పెట్టాలనీ లేదంటే ముగ్గురినీ ఒకేసారి చంపేస్తాననీ ఆ రోజు ప్రకటించాడు. అప్పటికే సగం మతి చెదిరి ఉన్న ఆమె ఆ పని చేసి పాపని రక్షించుకుందామా అని ఆలోచిస్తూ ఆ పని చేయబోయింది.

” ఇవాళ ముగ్గురం ఒకేసారి చస్తాం, ఒక బిడ్డ కోసం మరొకరిని చంపటం రాక్షసులు కూడా చెయ్యలేరు ” ఆమె అంది.

” అలా అక్కర్లేదు లేమ్మా ! నేను చెప్పినట్లు చేస్తే అందరమూ తప్పించుకోవచ్చు ” అని ఆమె ని కొన్ని ప్రశ్నలు అడిగి  ఒక ఉపాయం చెప్పాను. ఆ ప్రకారం పిల్లలిద్దరినీ గదిలో నిద్ర పుచ్చి తాళం వేసి,  కోటలొ ఉన్న పెద్ద గంగాళాన్ని పొయ్యి మీద పెట్టి నేను అందులోకి ఎక్కి కూర్చున్నాను. ఆమె అందులోకి నీళ్ళు నింపి చాలా సన్నగా మంట పెట్టింది. రాక్షసుడు వచ్చి ” బిడ్డని వండటం అయిందా ? ” అని అరిచాడు.

” ఇంకా పూర్తి కాలేదండి ” ఆమె జవాబు చెప్పింది.

” మంట ఇంత సన్నగా పెడితే ఎప్పటికి ఉడికేను ” అని వాడు మంటని బాగా ఎగదోసి పక్కనే నడుము వాల్చాడు. భోజనం చేసే ముందర వాడు కునుకు తీస్తాడనీ, వాడు తన చేత్తో పట్టుకు తిరిగే పెద్ద బల్లెం తప్ప కోట లో ఇంకే ఆయుధాలూ లేవనీ ఆమె చెప్పి ఉంది. రాక్షసుడు గుర్రు పెట్టేలోపు గంగాళం భయంకరంగా వేడెక్కింది- నా చర్మం బొబ్బలెక్కిపోతోంది. అప్పటికి ఆమె మూత ఎత్తి ” బతికే ఉన్నారా ? ” అని అడిగింది. ” కొసప్రాణం ఉంది ” అంటూ నేను బయటపడిరాక్షసుడి పక్కన ఉన్న బల్లాన్ని రెండు చేతులతో బలం గా పైకెత్తి వాడి కళ్ళ మధ్య పొడిచాను- వాడు కిక్కురుమనకుండా చచ్చాడు. రేవులో సిద్ధంగా ఉన్న పడవ ఎక్కి అవతలి ఒడ్డుకి చేరాం. ఆమె నా కాళ్ళ మీద పడి ధన్యవాదాలు చెప్పుకుని,  పిల్లలతో తన దారిన తను వెళ్ళింది. ”

కొనాల్ కథ ముగిస్తూనే రాజ సభ వెనక భాగం నుంచి ఒక పెద్దావిడ వచ్చి – ” ఆ రోజు నన్నూ పిల్లలనీ రాక్షసుడి నుంచి రక్షించింది నువ్వేనా నాయనా ? ” అని అడిగింది. కొనాల్ ఆమెని పరికించి చూసి గుర్తు పట్టి – ” అవునమ్మా, నేనే ” అన్నాడు.

ఆవిడ – ” నీ ఋణం ఎన్ని జన్మలెత్తితే తీరుతుంది …ఇదిగో, ఇతనే నువ్వు రక్షించిన పసిబిడ్డ ” అని రాజుని చూపించింది.

అక్కడున్న  వాళ్ళంతా ఆశ్చర్యం తో తలమునకలయారు. రాజు సిం హాసనం మీదనుంచి లేచి కొనాల్ చేతులు పట్టుకుని – ” ఎన్ని కష్టాలు పడ్డావు…నువ్వు మాకు చేసిందానికి నేను ఈ గుర్రాన్ని ఇవ్వటం ఏపాటిది ” అని  దాంతోబాటు సంచులకొద్దీ వెండి బంగారాలనీ రత్నాలనీ విలువైన పట్టుబట్టలనీ తెప్పించి ఇచ్చాడు. తన పక్కనే కూర్చోబెట్టుకుని విందు చేశాడు. రాజు తల్లి  ప్రత్యేకంగా కొనాల్ భార్య కోసం కానుకలు ఇచ్చింది. కొద్ది రోజులు వాళ్ళ తో గడిపి కొనాల్ కొడుకులతో సహా తిరిగి వెళ్ళాడు. వాళ్ళని మళ్ళీ చూస్తానని అనుకోని కొనాల్  భార్య ఆనందం పట్టలేకపోయింది.  గుర్రాన్ని తీసుకున్న జమీందారు, జరిగిందంతా విని కొనాల్ కొడుకులని క్షమించాడు.

                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                [ సెల్టిక్ జానపదకథ కి స్వేచ్ఛానువాదం.

                                                                                   సేకరణ – John Francis Campbell ]

                                                      పూల రాణి కూతురు

MythiliScaled

అనగా అనగా ఒక రాజకుమారుడు. ఒక రోజు ఉదయాన ఉల్లాసంగా గుర్రం మీద షికారు వెళ్ళాడు. పోగా పోగా  పెద్ద మైదానం వచ్చింది. దాని మధ్యనొక బావి. అందులోంచి ఎవరో ఏడుస్తూ పిలుస్తున్నట్లు వినబడింది. చూస్తే లోపల ఒక ముసలావిడ పడిపోయి ఉంది. రాజకుమారుడు గబ గబా ఆమెని పైకి లాగాడు. ఆమె ఎక్కడిదో ఏమిటో అడిగాడు.

” నాయనా, నీ దయ వల్ల బతికాను. లేదంటే ఇక్కడే చచ్చిపోయిఉండేదాన్ని . మా ఊరు ఇక్కడికి దూరం. ఈ పక్కన  పట్టణం లో పొద్దున్నే సంత జరుగుతుంది. అందులో గుడ్లు అమ్ముకునేందుకని చీకటితో బయల్దేరి చూపు ఆనక ఇలా పడిపోయాను, ఇంక వెళ్ళొస్తాను ” – ఆమె చెప్పింది.

రాజకుమారుడు  – ” అవ్వా, నువ్వు నడిచే పరిస్థితిలో ఎక్కడున్నావు, ఉండు, నిన్ను దిగబెడతాను ” అని ఆమెని ఎత్తి గుర్రం మీద కూర్చోబెట్టుకుని బయల్దేరాడు. అడవి అంచున ఉన్న ఆమె గుడిసెకి ఇద్దరూ వెళ్ళారు. దిగి లోపలికి వెళ్ళబోతూ ముసలావిడ ” ఒక్క నిమిషం ఆగు, నీకొకటి ఇస్తాను ” అని , ఒక చిన్న గంటను తీసుకొచ్చి ఇచ్చింది అతనికి. ” బాబూ, నువ్వు వీరుడివి, అంతకు మించి ఎంతో దయగలవాడివి.  పూలరాణి కూతురు అందం లోనూ, మంచితనం లోనూ నీకు తగిన భార్య. ఆమె నాగేంద్రుడి కోటలో బందీగా ఉంది. విడిపించి పెళ్ళి చేసుకో. ఈ గంట ని ఒకసారి మోగిస్తే గండ భేరుండాల రాజు వచ్చి నీకు సాయం చేస్తాడు. రెండు సార్లు మోగిస్తే నక్కల రాజూ, మూడు సార్లు మోగిస్తే చేపల రాజూ వచ్చి నీ కష్టం తీరుస్తారు. వెళ్ళిరా, నీకు శుభం జరుగుతుంది ” అని మాయమైంది, గుడిసె తో సహా.

అప్పటికి రాజకుమారుడికి ఆమె ఎవరో దేవకన్య అని అర్థమైంది. గంటని భద్రంగా దుస్తులలో దాచుకుని కోటకి వెళ్ళాడు. వాళ్ళ నాన్నకి అంతా చెప్పి పూలరాణి కుమార్తెని వెతికేందుకు మరుసటి రోజున ప్రయాణమయాడు. ఏడాది పొడుగునా తెలిసిన ఊళ్ళూ తెలియనివీ గాలించాడు. పూలరాణి కూతురు ఆచూకీ ఎక్కడా తెలిసిందే కాదు. బాగా అలిసిపోయాడు. చివరికి ఒక రోజు ఒక చిన్న ఇంటి ముందర చాలా ముసలిగా కనిపించే ఒకతన్ని చూసి అడిగాడు – ” తాతా, నాగేంద్రుడు ఎత్తుకుపోయిన పూల రాణి కూతురు ఎక్కడుంది ? ”

flower queens daughter 2

” నాకైతే తెలీదుగాని, ఈ దారమ్మటే, అటూ, ఇటూ చూడకుండా   ఒక సంవత్సరం వెళ్ళావా, ఇటువంటి ఇల్లే ఇంకొకటి వస్తుంది. అది మా నాన్నది. ఆయనకి  తెలిసి ఉండచ్చు, బహుశా ” ముసలివాడు జవాబు చెప్పాడు. రాజకుమారుడు అలాగే వెళ్ళాడు .  ముసలివాడి తండ్రి , ఇంకా ముసలివాడు – కనిపించాడు. కాని అతనికీ సమాచారం తెలీదు. అతని సలహా ప్రకారం ఇంకొక ఏడు అదే దారి వెంట ప్రయాణించి అతని తండ్రి ఇంటికి చేరాడు రాజకుమారుడు. ఈ ముసలితాత మాత్రం చెప్పాడు – ” అవును, ఆ నాగేంద్రుడి కోట ఆ కనబడే కొండ మీదేగా ఉంది ! ఇవాళే ఆయన నిద్ర మొదలెడతాడు, ఈ ఏడంతా నిద్ర పోయి వచ్చే ఏడంతా మేలుకుంటాడు. అయితే, ఆ పక్కన కొండ మీద నాగేంద్రుడి తల్లి ఉంటోంది. రోజూ  రాత్రి విందు చేస్తుంది ఆవిడ, పూలరాణి కూతురు ప్రతి రాత్రీ  అక్కడికి వెళుతుంది ” .

రాజకుమారుడు తాతకి కృతజ్ఞతలు చెప్పుకుని రెండో కొండ ఎక్కి నాగేంద్రుడి తల్లి కోటకి వెళ్ళాడు. అది బంగారపు కోట, కిటికీ లకి వజ్రవైఢూర్యాలు తాపడం చేసి ఉన్నాయి. తలుపు తెరిచి లోపలికి వెళ్ళేలోపు ఏడు సర్పాలు వచ్చి అతన్ని అడ్డగించాయి. రాజకుమారుడు యుక్తిగా జవాబు చెప్పాడు – ” నాగ రాణి ఎంతో అందమైనదనీ పెద్ద మనుసున్నదనీ విన్నాను. ఆవిడ దగ్గర కొలువు చేసేందుకని వచ్చాను ” . సర్పాలు ఆ మాటలకి సంతోషించాయి, రాజకుమారుడిని వెంటబెట్టుకుని నాగరాణి దగ్గరికి తీసుకు వెళ్ళాయి.

రత్నాలు చెక్కిన సిం హాసనం మీద నాగరాణి కూర్చుని ఉంది. ఆమె నిజంగానే చాలా అందంగా, కాని భయం పుట్టించేట్లుగా ఉంది… ” ఎందుకొచ్చావు ? ” రాజకుమారుడిని అడిగింది. అతను తడబడకుండా మళ్ళీ చెప్పాడు – ” మీ సౌందర్యం గురించీ  గొప్పతనం గురించీ,  కథలు కథలుగా విని, మీ దగ్గర పని చేసేందుకు వచ్చాను ”

 

నాగరాణి – ” సరే, చూద్దాం. ఇదుగో, నా గుర్రాన్ని ఆ కనిపించే మైదానం లో కి వరసగా మూడు రోజులు మేతకి తీసుకుపోయి  భద్రంగా వెనక్కి తేగలిగితే, అప్పుడు పనిలో చేరచ్చు. లేదంటే నా నౌకర్లు నిన్ను చంపి తినేస్తారు ” అంది.

రాజకుమారుడు ఒప్పుకుని నాగరాణి గుర్రాన్ని మేతకి తీసుకువెళ్ళాడు. కానీ ఆ మైదానం లో అడుగు పెట్టగానే గుర్రం  కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా  దొరకనేలేదు.  రాజకుమారుడు దిగాలుగా అక్కడొక బండరాయి మీద కూర్చుండి పోయాడు.  పైకి చూస్తే  ఆకాశం లో పెద్ద గద్ద ఎగురుతోంది. అతనికి వెంటనే దేవకన్య ఇచ్చిన గంట సంగతి గుర్తొచ్చింది. అప్పటివరకూ దాని సాయాన్ని ఉపయోగించుకోవాలని అతనికి అనిపించనేలేదు. జేబు లోంచి తీసి మోగించాడు. మరుక్షణం లో రెపరెపమని రెక్కల శబ్దం. గండ భేరుండాల రాజు ప్రత్యక్షమై రాజకుమారుడికి మోకరిల్లాడు. ” నీకేం కావాలో నాకు తెలుసు. తప్పిపోయిన గుర్రాన్ని నా అనుచరులని పంపి తెప్పిస్తాను,  అది మబ్బుల్లో దాక్కుని ఉంటుంది ” అని హామీ ఇచ్చి వెళ్ళిపోయాడు. రాజకుమారుడు అక్కడే, అలాగే  ఉండి పోయాడు. సాయంత్రమవుతూండగా గుంపులు గుంపులుగా పెద్ద గద్దలు ఎగిరి వచ్చాయి, వాటి ముక్కులతో పట్టుకుని గుర్రాన్ని తీసుకొచ్చాయి. రాజకుమారుడు దాన్ని నాగరాణికి అప్పగించాడు. ఆమె ఆశ్చర్యపోయింది.

” ఈ రోజు నువ్వు ఈ పని పూర్తిచేసినందుకు నిన్ను బహూకరిస్తాను ” అని ఒక రాగి కవచాన్ని అతనికి ఇచ్చి తొడుక్కోమంది. విందుజరుగుతున్న సభకి రాజకుమారుడిని తీసుకువెళ్ళింది.  నాగ కన్యలూ నాగ కుమారులూ జంటలు జంటలుగా అక్కడ నృత్యం చేస్తున్నారు. వాళ్ళ  ఆకారాలూ దుస్తులూ అతి పల్చగా, వింత వింత రంగులలో కదులుతున్నాయి. వాళ్ళలో నాగరాణి కూతురు కూడా ఉంది. తల్లిలాగే ఆమె కూడా అందంగా ఉంది,  క్రూరంగానూ ఉంది. రాజకుమారుడిని చూసి బావున్నాడని అనుకుంది గాని అతను ఆమె వైపు చూడనేలేదు. అందరికన్నా వేరుగా   పూల రాణి కూతురు కనబడింది. మల్లెపూవులూ గులాబీలూ కలిపినట్లు  సుకుమారంగా  వెలిగిపోతోంది . ఆమె దుస్తులు అరుదైన పూల రేకులతో అల్లినవి. ఆమె నర్తిస్తుంటే పూల వనాలు పరిమళిస్తున్నట్లుంది.  ఆమెతో నర్తించే అవకాశం, కాసేపటికి రాజకుమారుడికి వచ్చింది . రహస్యంగా ఆమె చెవిలో  – ” నిన్ను రక్షించేందుకు వచ్చాను ” అని చెప్పాడు. ఆమె అతి మెల్లగా అంది – ” మూడో రోజున నువ్వు గుర్రాన్ని వెనక్కి తెచ్చి ఇచ్చినప్పుడు ఆ గుర్రపు పిల్లని బహుమతిగా నాగరాణిని అడుగు ”

వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూస్తూనే ఇష్టపడ్డారు. విందు అర్థరాత్రి దాటే దాకా సాగి, ముగిసింది.

తెల్లవారాక మళ్ళీ గుర్రాన్ని మైదానం లోకి తీసుకు వెళితే అది ఎప్పటిలాగే మాయమైంది. ఈ సారి గంట మోగిస్తే నక్కల రాజు వచ్చి అడవిలో  దాక్కున్న గుర్రాన్ని తెచ్చిపెట్టాడు. ఆ రాత్రి నాగరాణి వెండికవచం ఇచ్చి అతను తొడుక్కున్నాక విందుకు తీసుకు వెళ్ళింది.  నాట్యం జరుగుతుండగా పూలరాణి కూతురు ” రేపు కూడా నువ్వు గెలిస్తే , గుర్రపు పిల్లతో మైదానం లోనే వేచి ఉండు. విందు పూర్త యేలోపున ఇద్దరం ఎగిరి వెళ్ళిపోదాం ” అంది.

మూడో రోజునా గుర్రం అదృశ్యమైంది. గంట మోగితే చేపలరాజు వచ్చి నదిలో దాక్కున్న గుర్రాన్ని పట్టుకొచ్చి ఇ చ్చా డు. నాగరాణి రాజకుమారుడిని మెచ్చుకుని, తన అంగరక్షకుడుగా నియమించుకుంటాననీ , ముందుగా ఏదైనా కోరుకుంటే ఇస్తాననీ చెప్పింది. రాజకుమారుడు ఆ గుర్రం పిల్లను ఇమ్మని అడిగాడు. నాగరాణి ఇచ్చింది. ఆ రాత్రి బంగారు కవచం తొడిగించి విందుకి తీసుకు వెళ్ళింది. నాగరాణి తన కూతురితో రాజకుమారుడికి పెళ్ళి చేసి దగ్గర ఉంచుకుందామని ,  విందు ముగిసిన తర్వాత ఇద్దరికీ పెళ్ళి చేసే ప్రకటన చేద్దామని, అనుకుంది.  అతను ఆవిడ కి అంతగా నచ్చేశాడు. అతను ఒప్పుకుంటాడో లేదోనన్న అనుమానం కూడా నాగరాణికి రాలేదు. అయితే విందు పూర్తయేదాకా రాజకుమారుడు ఆగలేదు. ఎవరూ చూడకుండా తప్పించుకుని గుర్రపుసాలలో పిల్లగుర్రాన్ని ఎక్కి మైదానం లో వేచి ఉన్నాడు. అది పేరుకే పిల్లగానీ బలంగా భారీగా ఉంది . త్వరలోనే పూలరాణి కూతురు వచ్చేసింది. ఇద్దరూ కలిసి  గాలి కన్న వేగంగా పూల రాణి కోట వైపుకి ఎగిరి వెళ్ళారు.

Girl with Flowers Painting by Hans Zatzka; Girl with Flowers Art Print for sale

ఈ లోపల  నాగేంద్రుడి సేవకులు వీళ్ళు వెళ్ళిపోవటం చూసి నాగేంద్రుడిని నిద్ర లేపారు. అతను చాలా కోపంగా, ఆవేశంగా ఆమెను మళ్ళీ ఎత్తుకువచ్చేందుకు వెళ్ళాడు. ఇప్పుడు ఏ దివ్య శక్తులూ తనదగ్గర లేకపోయినా   రాజకుమారుడు అతన్నిధైర్యంగా  ఎదుర్కొన్నాడు.  పూలరాణి తన తుమ్మెదల సైన్యాన్ని నాగేంద్రుడి మీదికి పంపింది .  యుద్ధంలో నాగేంద్రుడు ఓడిపోయి వెళ్ళి పోవలసి వచ్చింది.

పూలరాణి తన కూతురి ఇష్టం తెలుసుకుని రాజకుమారుడితో – ” మీ ఇద్దరికీ అలాగే పెళ్ళి చేస్తాను. కాని నా కూతురిని ఇంతకాలమూ వదిలి ఉన్నాను కదా…పూర్తిగా నీకే ఇచ్చేయలేను. ప్రతి ఏడూ చలికాలం లో, మంచు కప్పిన రోజులు మొత్తం ఆమె నా దగ్గర ఉండాలి. మళ్ళీ వసంతం రాగానే నీ దగ్గరికి వస్తుంది ” అని షరతు పెట్టింది. రాజకుమారుడు పూలరాణి కోరికలో న్యాయం ఉందని అనుకుని సరేనన్నాడు. ఇద్దరికీ మాలతి పూల పందిళ్ళ కింద పెళ్ళి అయింది.  రకరకాల పూల తేనె లతో విందులు జరిగాయి.  అవి వసంతపు రోజులే కనుక భార్యను తీసుకుని  రాజకుమారుడు తన రాజ్యానికి వెళ్ళాడు. అతని జీవితం ఆనందం తో నిండింది.

పూల రాణి కూతురు అక్కడ కాలు పెడుతూనే ప్రజలందరికీ మనసులు తేలికగా హాయిగా అయిపోయాయి.  అక్కడ పూసిన పూలు వాడేవే కావు. శీతాకాలం ఆమె లేనప్పుడు మాత్రం జనం దిగులు పడేవారు,  ఆమె తిరిగి రాగానే తెప్పరిల్లేవారు.

  • Bukovinan fairy tale కి స్వేచ్ఛానువాదం. సేకరణ-  Dr Heinrich von Wlislocki , Andrew Lang

 

 

మంచును కరిగించిన పాపాయి

MythiliScaled

ఒకానొకప్పుడు బల్గేరియా లో, ఒక ఊర్లో – ఎక్కడ చూసినా మంచు పేరుకుపోయింది. శీతాకాలం ఎప్పటికీ అయిపోయేట్లు లేదు, వసంతం వచ్చేటట్లు లేదు.ఒక రోజైతే, పొద్దున్నే లేచేప్పటికి ఇళ్ళన్నీ మంచు లో కూరుకుపోయి ఉన్నాయి. వాకిలి తలుపులు తెరవటమే కష్టమైపోయింది. అలాగే మంచుని తవ్వుకుని తలుపులు తీసి, ఇళ్ళ మధ్యన మంచు కిందన సొరంగాల లాగా దారి చేసుకుని, అందరూ ఊరి మధ్యన ఉన్న చర్చ్ లో కలుసుకున్నారు. ఇప్పట్లో పరిస్థితి మారకపోతే ఏం చేయాలనేది చర్చించారు. రకరకాల అభిప్రాయాలు వచ్చాయి కానీ ఏదీ తేల్చుకోలేకపోయారు. ఆ ఘోరమైన చలీ మంచు కురవటమూ అలాగే ఉంటే ఇహ ఆ యేడు పంటలేవీ పండించుకోలేరు. నెగళ్ళు వేసుకుందుకు అడవిలోంచి కట్టెలు తెచ్చుకోవటం కూడా వీలు పడదు. బతకటమే కష్టమైపోతుంది.

little girl 1” ఎవరో ఒకరు మంచు దేవుడి   దగ్గరికి వెళ్ళి మన బాధలు చెప్పి వేడుకోవాలి. ఆయన ఆజ్ఞాపిస్తేనే గాని చలిగాలులు వెనక్కి వెళ్ళవు ” అన్నాడొక పెద్దాయన. అక్కడికి దూరంగా ఎత్తైన కొండ మీద ఉంటాడు మంచు దేవుడు. ఆ దట్టమైన మంచు కిందన అంత దూరం సొరంగం తవ్వి ఎవరు అక్కడికి వెళ్ళగలరు ? అదే అన్నారు అంతా. పెద్దాయన అన్నాడు – ” అలా అక్కర్లేదు, మన ఊరంటే లోయలో ఉంది కనుక ఇంత దట్టమైన మంచు. ఎలాగో అలా ఊరి చివరి వరకూ సొరంగం తవ్వితే చాలు, అక్కడినుంచీ కొండల వరస మొదలవుతుంది. ఎత్తు పెరిగే కొద్దీ గాలులు బలంగా వీస్తాయి కాబట్టి మంచు పల్చగానే ఉంటుంది, సులువుగా చెదరగొట్టచ్చు ” అని.

అక్కడ చేరిన మగవాళ్ళంతా ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఎవరికి వారికి పక్కవారెవరైనా వెళ్తే బావుండునని ఉంది. ప్రతివారూ ఏదో ఒక వంక చెప్పారు . చివరికి ఎవరూ మిగల్లేదు. సిగ్గుతో తలలు దించుకున్నారు గాని అప్పటికైనా ఒకరు ముందుకు రాలేదు.

పెద్దాయన అన్నాడు – ” ఇహ నేనే మిగిలినట్లున్నాను. ఒక ఇరవై ఏళ్ళ కింద అయితే ఈ పని ఇట్టే పూర్తి చేసి ఉండేవాడిని. ఇప్పుడు నా వల్ల అవుతుందో లేదో ! అయినా బయల్దేరతాను లెండి ” అని.

little girl 2

” అక్కర్లేదు తాతా. నేను వెళ్తానుగా ” అందొక చిన్న పిల్ల. ఆమెని పసిపిల్లగా ఉన్నప్పుడే అమ్మా నాన్నా పోతే , పెద్దాయన పెంచుకుంటున్నాడు.

” వద్దు వద్దు ” అన్నారు అంతా జాలిగా. ఆమెకి సరైన కోటు అయినా లేదు. వెచ్చటి ఉన్ని టోపీ గాని, శాలువా గాని, చేతి తొడుగులు గానీ- ఏవీ లేవు .పాప తల నిమురుతూ తాత అన్నాడు – ” వద్దు తల్లీ. చిన్న పిల్లవి, అంత దూరం వెళ్ళలేవు ” అని.

” నాకస్సలు భయం లేదు తాతా ” పాప అంది. ” నా కాళ్ళకి చాలా బలం ఉంది. మంచు గొర్రెలంత వేగం గా పరిగెట్టగలను కూడా ”

” చలికి గడ్డకట్టుకు పోతావమ్మా , దారిలో ఎక్కడా తలదాచుకునేందుకేమీ ఉండదు ”

” అందరికీ మంచి జరగాలి కదా తాతా మరి ? నాకేమంత చలి ఉండదు తెలుసా ? ”

తాత ఆలోచించాడు. తనకా శక్తి లేదు, దారి మధ్యలో ఆగిపోయినా తనకేమైనా జరిగినా ఏమీ లాభం ఉండదు. ఇంకెవరూ వెళ్ళేలా లేరు. పాప చిన్నదైనా ధైర్యం గలది, ఆరోగ్యం ఉన్నది. చివరికి ఒప్పుకున్నాడు-” నీ గుండె నిండా ప్రేమ ఉందమ్మా ! అదే నీకు వెచ్చదనం ఇస్తుంది. వెళ్ళిరా ”

అంతా ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు. ఒకరు కోటూ, ఒకరు టోపీ, ఒకరు శాలువా, ఇంకొకరు బూట్లూ చేతి తొడుగులూ – ఇలా తమ దగ్గర ఉన్న వెచ్చటి దుస్తులని, పాపకి సరిపోయేవాటిని – తెచ్చి ఇచ్చారు. మగవాళ్ళంతా కలిసి ఊరి చివరి కొండవాలు దాకా సొరంగం తవ్వారు. అందరూ పాపని దీవించి జాగ్రత్తలు చెప్పారు. పాప బయలుదేరింది. ఇంతా అయేసరికి ఇంచుమించు సాయంత్రమైంది. మొదటి కొండ చేరే సరికే చీకటి పడిపోయింది. అయితే కాసేపటికి చందమామ వచ్చాడు. పౌర్ణమి రోజులేమో, వెన్నెల బాగా  వెలుతురు ఇచ్చింది. పాప రాత్రంతా నడుస్తూనే ఉంది, ఎక్కడా ఆగకుండా. వీలైనంత తొందరగా మంచు దేవుడి దగ్గరికి చేరాలని ఆమె ఆరాటం.

కాని మంచుగాలులు పాపని చూసి – ” ఎంత ధైర్యం ఈమెకి ! ఈమె పని చెబుదాం ఉండండి. గట్టిగా వీద్దాం , పడదోద్దాం ఆమెని. ఎందుకోసం వచ్చిందో మర్చిపోయేంత ఇబ్బంది పెడదాం ” అని కూడబలుక్కున్నాయి. చాలా విసురుగా, దుమారం లాగా వీచటం మొదలెట్టాయి. పాప   తొణకలేదు, బెణకలేదు. నడుస్తూనే ఉంది.

గాలులకి కోపం వచ్చింది. ఇంకా, ఇంకా విసిరి విసిరి వీచాయి, ఆయాసం వచ్చి ఆగాయి. ” ఏం పిల్ల ! మనకి అలుపు వస్తోందేగానీ ఆమెకేమీ లెక్కలేదే ” అని ఆశ్చర్యపోయాయి .

” ఇలా వదిలేస్తే లాభం లేదు. మనల్నెప్పుడైనా ఏ మనిషైనా గెలిచాడా ? ఇంత చిన్న పిల్ల ముందు ఓడిపోతామా ? మళ్ళీ మొదలెట్టండి ” రొప్పుతూ అంది   వాటిలో ఒకటి.

” నీకు ఓపిక ఉంటే నువ్వు మొదలెట్టు. ఇంక నావల్ల కాదు . ఒకరోజంతా పడుకుంటే గాని కదల్లేను ” అంది ఇంకొకటి.

” మేమూ అంతే, మా వల్లా అవదు ” ఒప్పుకున్నాయి తక్కినవి. మొదటిది అంది – ” అయితే మన అన్నయ్య ఉన్నాడు కదా మంచు తుఫాన్ … వాడు మనకన్న బలవంతులు. వాడిని పిలిచి పురమాయిద్దాం. ఈ పిల్లని మాత్రం వదిలేది

లేదు ‘’

అలాగే అన్నీ కలిసి మంచు తుఫాన్ ని పిలిచారు. అతను గబగబా వచ్చాడు. జరిగిందంతా విన్నాడు. ఆ సరికి పాప దూరంగా చివరి కొండ ఎక్కబోతూ కనిపించింది. తుఫాన్ ద్వేషం తో రుసరుసలాడిపోయాడు. ఎడాపెడా చేతులు జాడించాడు. అదేమి వింతో, పాప తుఫాన్ ని కూడా లెక్క పెట్టలేదు, ఆమెకేమీ కాలేదు.

” సిగ్గు సిగ్గు ” అనుకున్నాడు తుఫాన్. ” కోపమూ ద్వేషమూ ఈమెనేమీ చేయలేకుండా ఉన్నాయి. అటు వైపునుంచి ప్రయత్నిద్దాం ” అన్నాడు అతను.

ఒక చెల్లెలు వెటకారం చేసింది- ” ఎత్తుకుని కొండ మీద దించుతావా ఏమిటి ? ”

” కాదులే. మన అక్కయ్యని పిల్లుద్దాం. ఆమెని ఎవరూ ఎదిరించలేరు. తెలియకుండా వచ్చేసి ఎవరినైనా లోబరచుకుంటుంది ” అన్నాడు అతను. ఆ అక్కయ్య చలిరాక్షసి . మనుషుల ఒళ్ళు బిగుసుకుపోయి చచ్చిపోయేలా చేస్తుంది. ఆ దుష్టురాలు వీళ్ళు పిలవగానే వచ్చింది. ఆమెకి రూపం లేదు, కాని ఎలా కావాలంటే అలా మనుషులకి కనిపించగలదు. ఎప్పుడో చనిపోయిన పాప తల్లి రూపం ధరించి వచ్చి పాప కోసం తల్లి పాడే లాలిపాట పాడింది.

పాప నడక వేగం తగ్గించి, వింది, దూరం నుంచి చూసింది . ” ఇదేమిటి..అమ్మ మొహం, అమ్మ గొంతు, అమ్మ పాట … కాసేపు ఇక్కడ కూర్చుని వింటాను, అమ్మ దగ్గరికి వస్తుందేమో. దగ్గరికి వచ్చేశాను కదా , మంచు దేవుడి భవనం కనిపిస్తూనే ఉంది ” – కూర్చుండిపోయింది. పాట వింటూంటే పాపకి కళ్ళు మూసుకుపోతున్నాయి. మెల్లిగా నిద్రపోయింది. చలి రాక్షసి పళ్ళు బయట పెట్టి ఇకిలిస్తూ తమ్ముడికీ చెల్లెళ్ళకీ తన ఘనకార్యాన్ని చెప్పేందుకు వెళ్ళింది. అమ్మ కలలో కనిపిస్తుంటే పాప నిద్రలో నవ్వుకుంటోంది. కాని మొహం రంగు మారిపోతోంది, గులాబి రంగులోంచి నీలంగా అయిపోయింది.. తర్వాత పాలిపోయిన పసుపు పచ్చ రంగులోకి మారింది.. పాప బిగిసిపోతోంది. ఇంకెవరూ కాపాడేందుకు లేనట్లే ఉంది.

little girl 3

అప్పుడొక చిన్న శబ్దం, కీచుమని. పక్కన ఉన్న కలుగులోంచి చిట్టెలుక ఒకటి బయటికి వచ్చి తన చిన్న చిన్న కళ్ళతో పాప పరిస్థితి చూసింది. ” అయ్యో పాపం ” అనుకుని తోటి ఎలుకలని పిలిచింది. అవన్నీ పరుగెట్టుకొచ్చి పాప చేతులూ కాళ్ళూ రుద్ది వేడి పుట్టించే ప్రయత్నం చేశాయి. అవి చాలా చిన్నవి కనుక ఆ పని త్వరగా జరగటం లేదు పాపం, స్నేహితులని పిలిచాయి. బొరియల్లోంచి కుందేళ్ళు వచ్చాయి. మంచు కప్పిన పైన్ చెట్ల మీదినుంచి ఉడతలు కిందికి దూకాయి. పాప ఒంటిమీదికి ఎక్కి తమ బొచ్చుతో వెచ్చదనం పుట్టించాయి. పాప బుగ్గలు మెల్లి మెల్లిగా గులాబి రంగులోకి మారాయి. కళ్ళు విప్పబోయింది… రెప్పల మీద రెండు కన్నీటి బొట్లు గడ్డకట్టి ఉన్నాయి. ఒక చిట్టి ఉడత తోకతో వాటిని విదిలించింది. పాప కళ్ళు తెరిచింది. జంతువులకి గొప్ప సంతోషం వేసింది. పాప వాటికి పదే పదే కృతజ్ఞతలు చెప్పుకుని తనెందుకు వచ్చిందో వివరించింది.

” మేమూ వస్తాం నీతో ” అన్నాయి అవి. ” ఈ చలికి మేమూ తట్టుకోలేకపోతున్నాం ”

అంతా కలిసి మంచుదేవుడి భవనం చేరారు. వాకిలి మూసి ఉంది. పాప గట్టిగా కేక పెట్టి పిలిచింది. ఎవరూ పలకలేదు. చిన్న ఎలుకలూ ఉడతలూ ప్రతి కిటికీ దగ్గరికీ వెళ్ళి చూశాయి. ఒక కిటికీ మటుకు కొద్దిగా తెరుచుకుని ఉంది. అందులోంచి దూరి లోపలికి వెళ్ళి అవి తలుపు గడియ తీశాయి. గాజు  పలకల నడవాలగుండా నడిచి మంచు దేవుడి సభ కి వెళ్ళారు. అక్కడి సింహాసనం మలిచి స్ఫటికం తో మలిచి ఉంది. అందులో కూర్చుని మంచు దేవుడు – గాఢంగా నిద్రపోతున్నాడు. జంతువులు ఆయన ఒళ్ళోకీ భుజాల మీదికీ గెంతాయి. ఒక ఉడుత తన చిన్న తోకతో ఆయన ముక్కుని రాసింది. ఆయన తుమ్మాడు, మె లకువ వచ్చింది. నీలి రంగు కళ్ళతో వీళ్ళని చూసి నవ్వాడు.

” రండి, రండి. ఎందుకు వచ్చారు మీరు ? ” అడిగాడు.

పాప సంగతి అంతా చెప్పింది.

” అయితే మీరు లేపేవరకూ నేను నిద్ర పోతున్నానా ఏమిటి ? ”

” అవునండి ”

” ఇది నా సేవకులు, అదే మంచు గాలులూ మంచు తుఫాన్ లూ- వాళ్ళ పనే అయిఉంటుంది . మామూలు గా నేనింత మొద్దు నిద్ర పోనే పోను. ఈ పాటికి వాళ్ళందరినీ గదుల్లో పెట్టి తాళం వేసి ఉండేవాడిని, వసంతం వచ్చేసేది. వాళ్ళు ఎప్పటికీ అధికారం చలాయించాలని నన్ను నిద్ర పుచ్చినట్లున్నారు. ఎలా ? అవును, గుర్తొచ్చింది. నాకేదో కొత్తరకం టీ అని ఇచ్చారు. తాగుతుంటే నాకేదో అనుమానం గానే ఉండింది. మధ్యాహ్నం పడుకుని రాత్రికి లేవవలసినవాణ్ణి వారాల తరబడి నిద్రపోయాను. ఉండండి, అంతా చక్కబెడతాగా ”

little girl 4

చేతిలో ఉన్న వెండి ఈలని ఊదాడు. సేవకులంతా గజ గజా వణుకుతూ వచ్చి నిలుచున్నారు. వాళ్ళలో ఏ తప్పు చేయని వాళ్ళకి తలా ఒక టూత్ బ్రష్ ఇచ్చి,  వెళ్ళిఆకురాలే కాలం ముగిసేదాకా హాయిగా నిద్ర పొమ్మని చెప్పాడు. తప్పు చేసినవాళ్ళకి మాత్రం శిక్ష వేశాడు- వేడి వేడి మంటలు ఉన్న గదుల్లో వారం రోజులు గడి పేలా.

జంతువులకీ పాపకీ మంచి ఐస్ క్రీం తెప్పించి పెట్టాడు. పాప ధైర్యసాహసాలని మెచ్చుకుని ప్రత్యేకంగా సన్నటి వెండి గొలుసు కానుక ఇచ్చాడు. దానికి హృదయం ఆకారం లో ఉన్న స్ఫటికం వేలాడుతోంది. నిజం ఏదో మోసం ఏదో కనిపెట్టే శక్తిని ఆ స్ఫటికం ఇస్తుంది.

తలుపులు తెరుచుకుని బయటికి వచ్చేసరికి చెట్లన్నీ చిగిర్చి ఉన్నాయి. పూలు విచ్చుకుంటున్నాయి, పిట్టలు కువకువమంటున్నాయి….వసంతం వచ్చేసింది.

తిరుగు ప్రయాణం సులభంగా, సుఖంగా సాగింది. మళ్ళీ కలుసుకుందామని చెప్పుకుంటూ స్నేహితులు విడిపోయారు.

ఊర్లో అందరూ పాపని దేవతలాగా చూశారు. ఆమెని ఏ లోటూ లేకుండా పెంచేందుకు వాళ్ళ తాతకి అన్నీ ఇచ్చారు. చలికాలం ముగిసినందుకు వారం రోజుల పాటు ఉత్సవాలు చేసుకున్నారు .

  • బల్గేరియన్ జానపద గాథ
  • mythili

బొమ్మను ప్రేమించిన అమ్మాయి

MythiliScaled

 

అనగనగా ఇటలీ లో ఒక ధనవంతుడైన వర్తకుడు. అతనికి బెట్టా అని ఒక్కతే కూతురు. ఆమెకి పెళ్ళి వయసు వచ్చింది. తండ్రి ఎన్ని సంబంధాలు చూసినా తనకి ఒక్కటీ నచ్చలేదు. ఇలా అన్నిటినీ వద్దనుకుంటూ పోతే ఇక తనకి పెళ్ళి కాదేమోనని వర్తకుడు దిగులుపడిపోయాడు, కాని కూతురిని బలవంతపెట్టాలని అనుకోలేదు.

ఒక రోజు అతను నగరం లో జరగబోయే పెద్ద సంతకి బయల్దేరుతున్నాడు. అక్కడినుచి ఏమైనా కావాలా అని కూతుర్ని అడిగాడు. బెట్టా అంది- ” నాన్నా ! ఒక బస్తా మేలిరకం చక్కెర , రెండు బస్తాల తీపి బాదం పప్పు, నాలుగైదు సీసాల పన్నీరు, కొంచెం కస్తూరి, ఇంకొంచెం సాంబ్రాణి, నలభై ముత్యాలు, రెండు ఇంద్రనీలమణులు, గుప్పెడేసి కెంపులూ పుష్యరాగాలూ , బంగారుజరీ దారపు చుట్ట, వీటన్నిటితోబాటు ఒక పెద్ద వెండి గిన్నే చిన్న వెండి తాపీ- ఇవన్నీ కావాలి ” .ఇవన్నీ ఎందుకా అని తండ్రికి ఆశ్చర్యం వేసింది. అన్నీ కలిపితే చాలా ఖరీదవుతాయి కూడా. అయినా , మారుమాట్లాడకుండా వచ్చేప్పుడు వాటన్నిటినీ పట్టుకొచ్చి కూతురికి ఇచ్చాడు.

pinto 1

బెట్టా అన్నీ తీసుకుపోయి తన గదిలో గడియ వేసుకుంది. బాదం పప్పుల పొడిలో చక్కెర , కస్తూరి, సాంబ్రాణి -వెండిగిన్నెలో కలిపి పన్నీరు పోసి ముద్ద చేసి దానితో అపురూపమైన అందం గల యువకుడి నిలువెత్తు బొమ్మని తయారు చేసింది. వెండి తాపీతో ముఖాన్ని తీర్చిదిద్దింది . తెల్లటి పుష్యరాగాలూ ఇంద్రనీలాలూ కళ్ళుగానూ, కెంపులను పెదవులుగానూ ముత్యాలను పలువరుసగానూ అమర్చింది. బంగారు జరీదారాన్ని మెత్తని చిక్కని పోగులుగా పేని జుట్టుగా పెట్టింది. ప్రాణం ఒకటీ లేదేగాని అద్భుతంగా ఉన్నాడు . బెట్టా ఆ బొమ్మయువకుడిని ప్రేమించింది. అతను మనిషిగా మారితే బావుండుననుకుంది.ఒకప్పుడు సైప్రస్ రాజు ప్రార్థిస్తే బొమ్మకి దేవతలు ప్రాణం పోశారని వినిఉంది. ప్రేమ దేవతని భక్తిగా శ్రద్ధగా వేడుకుంది, కొన్ని రోజులపాటు. దేవత కరుణించింది- బొమ్మ యువకుడు మెల్లిగా ఊపిరి తీసుకుని వదలటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత పెదవులు కదిపి బెట్టా ని పలకరించాడు. చివరిగా కాళ్ళూ చేతులూ విదిలించి కదిలించి నడిచేశాడు కూడా. బెట్టాని చూస్తూనే అతనికిచాలా ఇష్టం వచ్చింది. అతనికోసమే అప్పటిదాకా బ్రతికిఉన్నానని బెట్టాకి అనిపించింది .

సంతోషంగా యువకుడి చేయిపట్టుకుని తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళి – ” నాన్నా, నాకు పెళ్ళి చేయాలనే కదా మీ కోరిక ? ఇడుగో, ఇతన్ని ఎంచుకున్నాను ” అని చెప్పింది. కూతురి గదిలోకి ఎవరూ వెళ్ళలేదు, ఇతను ఎలా బయటికి వచ్చాడో తండ్రికి అర్థం కాలేదు. కాని ఎవరూ ఎప్పుడూ ఎక్కడా చూసిఉండనంత అందం గా ఉన్న ఆ యువకుడిని చూసి చాలా ఆనందించాడు.యువకుడికి పింటో స్మాల్టో అని పేరుపెట్టారు.   త్వరలోనే వాళ్ళిద్దరికీ పెళ్ళి ఏర్పాటైంది. పెద్ద విందు చేసి ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిచారు. వాళ్ళలో ఒక దూరరాజ్యపు రాణి కూడా ఉంది. ఆ ఊళ్ళో ఆమె బంధువులు ఉన్నారు, వాళ్ళని బెట్టా తండ్రి విందుకి పిలిచాడు. ఆమె కూడా వాళ్ళతో అక్కడికి వచ్చింది. ఆమెకి పింటో చాలా చాలా నచ్చేశాడు అతని పెళ్ళి విందుకి వచ్చింది కాస్తా అతన్ని తనే పెళ్ళిచేసుకోవాలనుకుంది.పింటో కొత్తగా ప్రపంచం లోకి వచ్చాడు కనుక ఎవరితో ఎలా ప్రవర్తించాలో బెట్టా అతనికి చెప్పి నేర్పించింది. అయితే అతను పసిపాప అంత నిర్మలమైనవాడు, రాణి చెడుబుద్ధి అతనికి తెలియలేదు. అందరికీ ఇచ్చినట్లే రాణికీ వీడ్కోలు చెప్పేందుకు ఆమె కూడా వెళ్ళాడు. బెట్టా తక్కిన అతిథులతో ఇంటిలోపలే ఉండిపోయింది . రాణి అతని చేయి పట్టుకుని తన రథం లో ఎక్కించుకుని తన రాజ్యానికి ప్రయాణమైంది. ఆ రథానికి కట్టిన గుర్రాలు చాలా వేగంగా పరుగెత్తగలవు – అందుకని కన్నుమూసి తెరిచేలోపు రథం   వెళ్ళిపోయింది.

pinto 2

పింటో కోసం బెట్టా చాలాసేపు చూసింది. ఎవరితోనైనా మాట్లాడుతూ ఉండిపోయాడేమో నని కాసేపు, చల్లగాలికి బయటికి వెళ్ళాడేమోనని కాసేపు అనుకుని ఊరుకుంది. వచ్చినవాళ్ళంతా ఒక్కొక్కరూ వెళ్ళిపోయారు. చివరికి వెళ్ళి చుట్టుపక్కలంతా వెదికింది. ఎక్కడా లేడు పింటో. అతన్ని ఎవరో ఎత్తుకుపోయిఉంటారని అప్పటికి బెట్టాకి అర్థమైంది. వర్తకుడు సేవకులని పిలిచి అందినంతమేరా గాలించమని ఆజ్ఞాపించాడు. ఏమీ లాభం లేకపోయింది. బెట్టా ఏడ్చి ఏడ్చి చివరికి ఒకరోజున ధైర్యం తెచ్చుకుని తనే పింటో ని వెతుక్కోవాలని నిర్ణయించుకుంది. తండ్రికి తెలియకుండా , పేదపిల్లలాగా వేషం వేసుకుని, కావలసినవి తీసుకుని బయల్దేరింది.అన్ని ఊళ్ళూ తిరుగుతూ   కొన్ని నెలలపాటు వెతుకుతూనే ఉంది. అప్పుడు ఒక ఊళ్ళో ఒక పెద్దావిడ కలిసింది. ఆవిడ చాలా దయగలది. బెట్టా కథ అంతా విని జాలిపడింది. బెట్టా కి మూడు మంత్రాల వంటివి నేర్పింది. మొదటిది- ” ట్రిషే వర్లాషే – ఇల్లు కురుస్తోంది ” రెండోది – ” అనోలా ట్రనోలా – ఏరు పొంగుతోంది ” మూడోది – ” స్కటోలా మటోలా – సూర్యుడు వెలుగుతున్నాడు ”. బెట్టా కి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ మాటలు మూడుసార్లుగా పలికితే మేలు జరుగుతుందని హామీ ఇచ్చింది.

బెట్టాకి పెద్దగా నమ్మకమేమీ కలగలేదు. సరే, గుర్తుంచుకుంటే పోయేదేముందనుకుని పెద్దావిడకి ధన్యవాదాలు చెప్పి మళ్ళీ తనదారిన తను వెళ్తూ ఉంది. పోగా పోగా రౌండ్ మౌంట్ అనే నగరం వచ్చింది. మధ్యలో పెద్ద రాజభవనం. బెట్టా కి ఎందుకో పింటో అక్కడే ఉంటాడనిపించింది. దొడ్డిదారిన వెళ్ళి అక్కడి గుర్రపుసాలలో ఆ రాత్రికి తలదాచుకునేందుకు చోటు అడిగింది. గుర్రాలసాల ను చూసుకునేది ఒక ముసలివాడు. అతను చాలా మంచివాడు. బెట్టాని చూస్తే తన కూతురులాగా అనిపించి సాల పక్కనే ఉన్న తన చిన్న ఇంట్లో ఉండచ్చు, రమ్మని ఆహ్వానించాడు. బెట్టా అనుకున్నట్లే మరుసటి రోజే పింటో రాజభవనపు తోటలోదూరం నుంచి కనిపించాడు. ఏదో కలలో నడుస్తున్నట్లు దేన్నీ పట్టించుకోకుండా ఉన్నాడు అతను . జరిగిందేమిటంటే, పింటో నీ తీసుకొచ్చేశాక రాణి అతన్ని పెళ్ళిచేసుకోమని అడిగింది. పింటో తనకి పెళ్ళైపోయిందనీ బెట్టా దగ్గరికి వెళ్ళిపోతాననీ మొండికేశాడు.

అతన్ని ఒప్పించలేక రాణి ఒక మంత్రగత్తె ని సలహా అడిగింది. ఆమె ఒక మూలిక ఇచ్చి సంవత్సరం పాటు రోజూ అతనికి ఇస్తే జరిగిన దం తా మరచిపోతాడంది. రోజూ పింటోకి ఇచ్చే ఆహారం లో రాణి ఆ మూలిక కలుపుతూ వస్తోంది. పింటో జ్ఞాపకశక్తి చాలావరకు పోయింది. ఇంకా రాణిని పెళ్ళాడేందుకు ఒప్పుకోవటం లేదుకాని, కొద్ది రోజుల్లో సంవత్సరం పూర్తయిపోతుంది. పింటో తన ఇష్టం ప్రకారం అక్కడ ఉండిఉండడని బెట్టా కి తెలుసు, ఎలా అతన్ని అక్కడనుంచి తప్పించాలో తెలియలేదు. పెద్దావిడ చెప్పిన మొదటి మంత్రాన్ని మూడుసార్లు పైకి పలికింది. ” టిషే వర్లాషే- ఇల్లు కురుస్తోంది ” ఆ వెంటనే అక్కడొక చిన్న బంగారురథం ప్రత్యక్షమైంది. దాని మీదంతా రత్నాలు పొదిగి ఉన్నాయి. రథం దానంతట అదే ఆ తోట చుట్టూ ఉన్న కాలిబాట లో తిరగటం మొదలుపెట్టింది.

pinto3చూసినవాళ్ళంతా ఆశ్చర్యపడిపోయారు. అందరూ చూశాక బెట్టా దాన్ని పట్టుకుపోయి తన గదిలో పెట్టేసుకుంది. ఈ సంగతి రాణికి తెలిసింది.రాణికి అందమైన వస్తువులమీద చాలా వ్యామోహం, అవి ఎవరివైనా సరే. గుర్రాలసాల అతని ఇంటికి, బెట్టా గదిలోకి వచ్చి – ఆ బంగారు రథాన్ని తనకు అమ్మమని అడిగింది. బెట్టా అంది ” నేను బీదదాన్నేనండీ, కాని ఎంత డబ్బూ బంగారమూ ఇచ్చినా దీన్ని అమ్మను. ఒకటే కావాలి నాకు – ఇందాక ఒక అందమైన అబ్బాయి మీ భవనం లోకి వెళ్ళటం చూశాను, అతని గది తలుపు ముందు ఒక రాత్రంతా నన్ను గడపనిస్తే మీకిది ఇచ్చేస్తాను ” . ఈ పేదపిల్ల డబ్బూ బంగారమూ వద్దని ఇలా అడిగిందేమిటా అని రాణి విస్తుపోయింది . ” ఉట్టినే ఆ గదిముందు పడుకుంటాననే కదా అడిగింది.. అయినా పింటో ని పలకరిస్తుందో ఏమో, అతనికి నిద్రపోయే మందు ఇచ్చి పడుకోబెట్టేస్తే సరి, ఈమె ఎంత పిలిచినా జవాబు ఇవ్వడు ” అని పథకం వేసుకుంది.

 

రాత్రయింది. నక్షత్రాలు ఆకాశం మీదికీ మిణుగురులు నేల మీదికీ వచ్చాయి. రాణి రోజూ ఇచ్చే మూలికతోబాటు ,ఘాటైన నిద్రమందుని పాలలో కలిపి పింటో చేత తాగించింది. అతను పక్క మీద వాలగానే ఒళ్ళెరగకుండా నిద్రపోయాడు. అప్పుడు బెట్టా ఆ గదిముందుకు వచ్చింది. అతన్ని పిలిచింది, గట్టిగా అరిచింది, ఏడ్చింది- తన బాధనంతా వివరించి చెప్పుకుంది. అతను మాత్రం కళ్ళు విప్పనేలేదు . చూస్తుండగానే తెల్లారిపోయింది. రాణి వచ్చి బెట్టా ని రెక్క పట్టుకు లేపి ” చాలు కదా, ఇక వెళ్ళు ” అని పంపించేసింది. బెట్టా కోపంగా గొణుక్కుంది – ” నీకూ ఎప్పటికీ ఇదే చాలు, పింటో నిన్ను ప్రేమించనే ప్రేమించడు ”- అప్పటికిక చేసేదేమీలేక వెళ్ళిపోయింది.

 

మరుసటిరోజు బెట్టా రెండో మంత్రాన్ని మూడుసార్లు పలికింది – ” అనోలా ట్రనోలా- ఏరు పొంగింది ” . ఈసారి మణులు చెక్కిన బంగారుపంజరం లో ముద్దొచ్చే పక్షి ఒకటి ప్రత్యక్షమైంది. అది కోయిలకన్నా తీయగా పాడుతోంది. విషయం తెలుసుకున్న రాణి మళ్ళీ వచ్చి బెట్టా ని పక్షిని అమ్మమని అడిగింది. బెట్టా నిన్నటిలాగే కోరింది. ఇవాళైనా పింటో కి తన మాటలు వినిపించవా అని ఆమె ఆశ. రాణికి ఇంకాస్త అనుమానం వచ్చింది. పింటోకి రెట్టింపు మోతాదులో నిద్రమందు ఇచ్చింది. ఆ తర్వాత కథంతా నిన్నటిలాగే జరిగింది. అయితే, ఆ గది పక్కనే ఉన్న వసారాలో దర్జీ అతనొకడు పనిచేసుకుంటున్నాడు. అతను ఎవరూలేని ఒంటరివాడు . సంవత్సరం పూర్తవుతూనేజరగబోయే తమ పెళ్ళిబట్టలు కుట్టటం కోసం రాణి అతన్ని అక్కడే ఉంచి రాత్రింబవళ్ళు పనిచేయిస్తోంది. అతను బెట్టా మాటలన్నీ విన్నాడు. పూర్తిగా అర్థం కాకపోయినా బెట్టా కీ పింటోకీ పెళ్ళయిందనీ అతను భార్యని వదిలేసివచ్చాడనీ తెలిసింది. రాణి మీద దర్జీ అతనికి మంచి అభిప్రాయమేమీ అదివరకే లేదు, ఇప్పుడు ఈ సంగతి తెలిసి కోపం కూడా వచ్చింది.

pinto4

 

మూడోరోజు పొద్దునే పింటో కి కుట్టే బట్టలకోసం కొలతలు తీసుకోవాలని కబురు చేశాడు. కొలతలు సరిగ్గా రావాలంటే పింటో తనని ఒంటరిగా కలవాలనీ చెప్పి పంపాడు. రాణి ఒప్పుకుని పింటోని పంపింది. దర్జీ తను విన్నదంతా పింటోకి చెప్పేశాడు. పింటోకి అంతా గుర్తొచ్చీ రానట్లుంది. ఎప్పటినుంచీ ఆపుకోలేనంత నిద్రవస్తోందో అడిగి తెలుసుకున్న దర్జీ ఆ రాత్రి పాలు తాగకుండా ఉండమని సలహా ఇచ్చాడు.

 

బెట్టా ఆ రోజున ఆఖరిప్రయత్నం చేయాలనుకుంది. మూడో మంత్రాన్ని మూడుసార్లు పలికింది – ” స్కటోలా మటోలా-సూర్యుడు వెలుగుతున్నాడు ”. ఈసారి చిన్న బంగారపు ఉగ్గుగిన్నె వచ్చింది. అందులోంచి రంగురంగుల , సుతిమెత్తని పట్టుబట్టలు, సన్ననిముత్యాలు కుట్టినవి బయటికి వచ్చాయి. వాటిని మడిస్తే అన్నీ ఆ ఉగ్గుగిన్నెలో పట్టేస్తున్నాయి, అంత పల్చటివి. రాణి అవీ కావాలంది, బెట్టా ఇదివరకులాగే అడిగింది. రెండు రాత్రులూ ఏమి కాలేదు కదా, ఇప్పుడింకేం ముంచుకొస్తుందిలెమ్మని రాణి సరేనంది. ఆ రాత్రి రాణి ఇచ్చిన పాలని పింటో ఆమె చూడకుండా పారబోశాడు. బెట్టా వచ్చి గదివాకిలిలో కూర్చుంది. ఆమెకేమీ ఆశ మిగల్లేదు. పింటోకి చెబుతున్నట్లు కాకుండా గడిచిందంతా తలుచుకుంటోంది. ”అద్భుతమైనవన్నీ కలిపి అత్యద్భుతమైన అతన్ని మలిచాను. ప్రేమదేవిని అడిగి ప్రాణం తెచ్చాను. అంతా అయాక కోల్పోయాను, అతను తిరిగి కనబడినా నా మాటలు వినబడటం లేదు…ఇదే చివరి రాత్రి   ” మేలుకునే ఉన్న పింటోకి అంతా వినిపించింది, గుర్తొచ్చింది.గబగబావెళ్ళి , బెట్టా ని కలుసుకున్నాడు. ఇద్దరూ ఒకర్నొకరు చూసుకుని ఆనందం పట్టలేక ఏడ్చారు. రాణి , బెట్టా నుంచి సంపాదించిన వస్తువులు తీసేసుకుని ఇద్దరూ రాత్రికి   రాత్రి బయల్దేరి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. దర్జీ ని కూడా లేపి తమతో తీసుకుపోయారు. వీళ్ళని చూసి , బెట్టా తండ్రి సంతోషంతో చిన్నపిల్లవాడిలాగా గంతులు వేశాడు. అంతా సుఖంగా ఉన్నారు.

 

  • ఇటాలియన్ జానపదకథ , by Giambattista Baile      
  •  
  •                                                            [ from Pentamerone ]