రాజ హంస

 

 

                    –  మైథిలి అబ్బరాజు 

 

Mythili1

ఉద్యాన   నగరం లో మే నెల సాయంకాలం సౌమ్యంగానే ఉంది  . ఆ కాస్త కాస్త వేడిని చల్లబరచుకుందుకు మెల్లి మెల్లిగా ఒక్కొక్కరూ అక్కడికి- వేడుక కోసం కంటే వాడుకయిన ఇష్టంతో.

ఆమె ఎప్పట్లాగే తన మూలలో…ఎక్కువ వెలుతురు రాని చోట. రోజూ తాగేదే , రోజూ తిరగేసేదే  , చూసీ చూడని చూపే.

ఆవాళ మటుకు అతను వచ్చాడు ఆమె ఎదటికి , మరెక్కడా ఖాళీ లేక.  ‘ ఫలూడా ‘  కోసం .  దొరికే కొద్ది చోట్లలో అది ఒకటి అని కొత్తగా వచ్చిన అతనికి చెప్పారెవరో.  హైదరాబాద్ లో పుట్టి పెరిగాడు ..  ఎన్నెన్ని మాక్ టెయిల్స్ వచ్చినా అతనికి అది మాత్రమే  ఇష్టం.   తర్వాత గమనిస్తే  ఆమె ముందున్నదీ అదే.  తలెత్తింది.

కనీకనిపించని పూలతో తేలిక రంగు నూలు చీర. ఒద్దికగా పిన్ చేసి కట్టుకుంది. పూర్తి తెల్లగా వదిలేసిన బాబ్డ్ జుట్టు. పండిపోయిన నుదురు.. అగాధసరోవరాల  కళ్ళు .. ఏటి ఒడ్డున ఇసక మీది నొక్కుల తో   ఉలిపిరి కాగితపు చర్మం . లావణ్యం పోయిందిగాని సౌందర్యం ఇంకా ఉంది. కొంచెం నవ్వింది. గుర్తు పట్టాడు… కాస్త ఆశ్చర్యం…ఇలా స్ఫురించదు అతనికి.

పలకరించింది –  ” నా పేరు రాజహంస ”

” మీరు నాకు తెలుసు…రాస్తారుగా ?   ” – ఆమె చిన్నప్పటి ఫోటో చూసి ప్రేమించానని చెప్పలేదు అతను..ఊహూ.అప్పుడే కాదు.

” కొత్తగా వచ్చారా ? ”

” అవును…పది రోజులైంది .  చెన్నై లో ఆర్నెల్లుండి…”

” ఎప్పుడయిపోయింది చదువు ? ”

తన కుర్రతనాన్ని  వెక్కిరిస్తోందనిపించింది.

” కిందటేడు ”

కాసేపు స్మాల్ టాక్.

లేస్తూ – ” ఈ వీకెండ్ కి మా ఇంటికి వస్తారా ? మాట్లాడుకుందాం ”

ఆమెకేమి తెలుసు అతని గురించి ?  ఇద్దరికీ ఒకేలా అనిపించేవేముంటాయని….?

” సరే ” .

చిరునామా అందింది.

*                   *                       *               *               *

ఇంచుమించు గా సవ్వడి  లేని వీధి . ఒక అంచు న – రోజాపువ్వుల  సముద్రాలు పొంగే ప్రాంగణం. సంజ చీకట్ల మధ్యన మేఘమాలిక వంటి ఇల్లు.

తాకగలిగినవీ తాకలేనివీ  కలిసిపోయిన   పురాతనమైన శీతలత్వమేదో చుట్టుకుంది అతన్ని. ఒణికాడు. దీపాలు వెలి గించి న   పిలుపు.

చాలా పెద్ద లైబ్రరీ, ఆనుకుని ఉన్న స్టడీ. గోడల మీద నీటి రంగుల్లో కొండలూఅడవులూ  . మొజార్ట్  ..  మైసూరు చందనపు సువాసన.

కలలోకో, స్మృతిలోకో- నడిచి వచ్చిన అతను ఉండిపోయాడు.

Kadha-Saranga-2-300x268

అయిదారేళ్ళ కిందట , అనుకోకుండా –  గూగుల్ ఇమేజెస్ లో ఆమె ఫోటో నిలబెట్టేసింది అతన్ని. సెపియా లో ఆరుబయట తీసినది. స్టూడియో లో సాధించగల వెలుగు నీడలు లేకుండానే ఆమె స్పష్టంగా అక్కడ ఉంది –  పెదవుల్లో పువ్వులతనం , బుగ్గల నునుపు మీద ఆడుకుంటూ ఉన్న జుట్టు ,  కళ్ళలోంచి దూకుతున్న వెలుతురు .   పెద్ద రెసొల్యూషన్ ఉన్నదాన్ని వెతికి కాయితం మీద ముద్రించుకున్నాడు. స్నేహితులు ఏడిపించేవాళ్ళు- ఇప్పుడామె వయసు తెలుసా అని. నవ్వేసి ఊరుకునేవాడు.

ఆ తర్వాత ఆమె రాసినవి తెచ్చుకుని  చదవబోయాడు… లోపలికి ఎక్కలేదు – వివరాలు తెలిశాయంతే . ఇంగ్లీష్ లో రాసిన రెండో తరం భారతీయులలో ఆమెకి మంచి చోటు ఉంది. చదువు డూన్ స్కూల్ లో, ఉస్మానియాలో,  తర్వాత ఆక్స్ ఫర్డ్ లో. ఇంగ్లీష్ లో పి హెచ్ డి చేసీ ఉద్యోగం చేయలేదు..ఇష్టమైనవాటి గురించి, ఇష్టమొచ్చినట్లుగానే రాసింది. తల్లి ఫ్రెంచ్ నాట్యకారిణి , తండ్రి తెలుగు శాస్త్రవేత్త – అవివాహిత అని ఉంది వ్యక్తిగత వివరాలలో.

అతని వంటి , అతనితోటి  టెక్ విద్యార్థులకి  ఆమె జాన్రె చాలా దూరం .

ముద్దు గా ఇంటికి తెచ్చుకుందిగాని ఏమడగాలో ఇతన్ని ?

” ఏమి చదువుతూ ఉంటారు ? ”

సిగ్గు పడ్డాడు. అంత వెసులుబాటు ఎక్కడుందని ? ఎవరు నేర్పారని  ? సాహిత్యం చదవటమనేది ఇంకా గర్వించుకోవలసినదే గనుక అందరి లాగే చేతన్ భగత్ ని చదువుకున్నాడు.

అదే చెప్పాడు.

ఆమెచదివిందో , తెలుసుకుందో మరి  –  ఎక్కువగానే నవ్వింది. అతని ఉక్రోషానికి క్షమాపణ చెప్పుకుంటూ

” ఏమనుకోకండి, సాహిత్యమంటే అది కాదేమో అని… ”

” మరి ఏది ? ”

ఆమెకి ఉత్సాహం వచ్చింది. ఆ తర్వాత మాటలకోసం తడుముకోనక్కర్లేకపోయింది. మంత్రనగరి ద్వారాలు ఒక్కొకటే తెరుచుకున్నాయి.

ఇంకొన్ని, మరికొన్ని – వారాంతాలు . సాహిత్యం లోంచీ ఒకానొక సాంగత్యం లోంచీ వచ్చే నిండైన   ఆకర్షణ.

rajahamsayuri pysar

” రెండో ప్రపంచ యుద్ధం తర్వాతి పుస్తకాలని ముందే చదివెయ్యకూడదు…ఆ నిరాశ కబళించేస్తుంది. మొదటి యుద్ధం ముందు నుంచి వెనక్కి వెళ్ళి తిరిగి రావాలి  ”

ఆ రోజు దట్టంగా మబ్బు. హోరుగాలి .

వుదరింగ్ హైట్స్ లోంచి చదువుతోంది .

” అతను ప్రశాంతమైన ఆనందంలో విశ్రమించుదామని అడిగాడు…నేను తళతళమనే  వైభవం లో నృత్యం చేయాలనుకున్నాను. అతని స్వర్గం లో జీవం ఉండదని నేను- నా ఉత్సవం లో తల తిరుగుతుందని అతను. అతనిదైన చోట నాకు నిద్ర వస్తుందని నేను – నేను అడిగే చోట ఊపిరి ఆడదని అతను ”[1]

ఆగిపోయింది.

” నన్నెందుకు కాదన్నావు ? నీ గుండెని నువ్వెందుకు మోసగించుకున్నావు ??  ” అతను ఆగ్రహం తో అరిచాడు. [2]

” ఏమిటి ? ఏమన్నావు ?? ”

అతనికేమీ తోచలేదు.

” ఏమో. ఎందుకు అన్నాను అలా ? ఎక్కడివి ఆ మాటలు ? మీకు తెలుసా ?”

” ఈ నవలలోవే ”

” ఎలా..ఇదెలా సాధ్యం…నాకా పేరే తెలీదే ” – అతనికి నిజంగానే తల తిరిగింది.

కాసేపాగి పిలిచింది – ” మౌళీ  ! ”

‘ అతని పేరు కాదు . కాని బదులు పలకబోయాడు  . ” అది నా పేరు కాదే ? ”

” ఇప్పుడు కాదేమో ”

” ఎవర్ని నేను ? ”

” నాకు తెలిసింది  నువ్వు అవునో కాదో … తెలీదు . ఏమో ‘’

లేచి అద్దం లో చూసుకున్నాడు..    ” ఈ మొహం నాదేనా ? ” అయోమయపు నవ్వొచ్చింది అతనికి. బుగ్గలు సొట్టలు పడ్డాయి. ఆ పోలికల వెనక ఉన్నదాన్నేదో ఆమె చూసుకుంది.

” నువ్వే ” – అనుకుంది.  ” ఆలోచించు ” అని మాత్రం అంది.

ఆ తర్వాత ఆ వారమంతా  ప్రయత్నించాడు . ఊహించినట్లుగా, ఆశపడినట్లుగా – ఒక్కసారిగా స్పష్టమయిపోలేదు  . చెదిరిన సన్నని గాజుధూళి  – వేయి రంగుల్లో  , …  వెతికేకొద్దీ కమ్ముకునే వక్రీభవనం.

ఫోన్ చేశాడు, ఆన్సరింగ్   మోడ్  లోకి వెళ్ళింది. వారం మధ్యలో వెళ్ళి చూశాడు- ఇంటికి తాళం వేసి ఉంది.

ఆఖరికి, ఆ శుక్రవారం సాయంత్రం , ఎప్పట్లాగా – అతన్ని లోపలికి ఆహ్వానించింది. ఆమె మొహం లోంచి దేహం లోంచి నడకలోంచి నవ్వులోంచి – వార్ధ క్యం  నీహారికలాగా జారిపోతోంది అతనికి.

” ఎవరు నువ్వు ? ” అడిగాడు.

” 1924 లో పుట్టాను ..ఆశ్చర్యం లేదుగా నీకు ? ” లేదు. అతనికి తెలుసు.

” చంద్రమౌళి నాకు హైదరాబాద్ లో పరిచయం. నేను కోఠీ వుమెన్స్ కాలేజ్ లో. అతను ఉస్మానియాలో- లిటరేచర్ .   ఇద్దరం మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాం. . రోజూ మధ్యాహ్నాలు కాలేజ్ పక్కని ఐస్ పార్లర్ లో ఫలూడా , సాయంత్రాలు ఇరానీ కెఫె లలో టీ , బోలెడంత కవిత్వం  .  చల్లని, వెచ్చని   అందమైన కాలం అది.

చదువైపోతూ ఉండగా  వాళ్ళ ఊరికి తీసుకు వెళ్ళాడు.   నిజానికి నన్ను ఒప్పుకోకూడదు  , కాని కొడుకు కోసం రాజీ పడ్డారు – నేను మా అమ్మ లాగా కాకుండా నాన్నలాగే ఉన్నాను…అందుకు కూడా.   షరతులు పెట్టారు – నా తల్లి ఫ్రెంచ్ ఆవిడ అని ఎక్కడా ఎవరికీ తెలియకూడదు , నా తల్లిదండ్రులతో ఏ సంబంధాలూ పెట్టుకోకూడదు ,  ఆ పల్లెటూళ్ళో ఉండిపోవాలి….

అక్కడి ఆస్తులూ వ్యవహారాలూ వదిలేసి అతను ఇంకెక్కడికీ వెళ్ళే వీలే లేదు. .. వాళ్ళనీ ఏమీ అనలేం, పరువూ ప్రతిష్ఠా ఇంకేవో. మా అమ్మా నాన్నా నన్ను స్వేచ్ఛగా పెంచారు , ఎక్కడా సర్దుకొనే అవసరమే రానీకుండా.  నన్ను మొత్తం పోగొట్టుకుని అక్కడ ఉండిపోవటం చావుతో సమానమనిపించింది- తిరస్కరించాను.అతనికి ఆ అఘాతం తట్టుకోలేనిది అయింది. ఎంత బ్రతిమాలినా నేను లొంగలేదు. అబద్ధాలతో మా జీవితం మొదలు కాకూడదనుకున్నాను.

కొన్నాళ్ళు ఆగితే ఎవరి మనసులు ఎలా మారేవో…కాని అతను అజాద్ హింద్ ఫౌజ్ లో చేరాడు…కోపమో తెగింపో దేశం మీద భక్తో- తెలీదు. 1945 లో బర్మాలో వాళ్ళు ఓడిపోయారు , అతను బతకలేదు.

అప్పుడు తెలిసింది  – అతను నాకు ఎంత అవసరమో. లేచి నిలుచునేందుకు కూడా శక్తి చాలదనిపించింది. అలాగ రెండు మూడేళ్ళు. గాయం నుంచి రక్తం కారటం తగ్గింది. అమ్మా నాన్నల మొహాలు కనిపించాయి…. బ్రతికాను. తర్వాత ఆక్స్ ఫర్డ్ తీసుకుపోయారు.  మంచి ప్రొఫెసర్ దొరికారు…చదువుకున్నాను. చాలా రోజులు అక్కడే ఉన్నాను. ఆ తర్వాత కొంతకాలానికి- అతన్ని ఇంకెవరెవరిలోనో వెతికే ప్రయత్నం – కుదరలేదు…రాయటం మొదలు పెట్టాను . ఇన్నిఏళ్ళు గడిచాయి , ఎందుకు ఉన్నానో ..

నిన్ను  చూశాను .  తెలిసిపోయింది.

ఇంతకాలం ఎక్కడున్నావో ..వీరస్వర్గం లోనా ? ”

” అయి ఉండచ్చు ”  బుద్ధిగా ఒప్పుకున్నాడు అతను. ” ఏమీ గుర్తు రావటం లేదు … ప్రేమిస్తున్నానని తప్ప   ” – నిస్సహాయ మందహాసం .

” చాలులే. నేనంటే కొనసాగుతున్నాను…నువ్వు కొత్తగా మొదలయ్యావు కదా ” ఆమె కూడా నవ్వింది.

” ఇప్పుడేమిటి ఇక ? ”

” ఏముంటుంది…ఏ దేవతలో నన్ను క్షమించి కరుణించి ఇచ్చిన ఈ కొద్ది రోజులూ నావి , అంతే ”

కాదనిపించింది అతనికి .

” నా వయసు తొంభై ఒకటి . ఇంకెన్నాళ్ళుంటాను…  పెళ్ళి చేసుకో , చక్కటి  అమ్మాయిని చూసి. నాలాగా తొంభై ఏళ్ళు మాత్రం బతకద్దు…నన్ను అన్నాళ్ళు అక్కడ ఉంచుతారో లేదో… మళ్ళీ ఫలూడా తాగుతూ కలుసుకునేప్పుడు నాకు ఇరవై ,  నీకు డెబ్భై అయితే ఎలా మరి ? ‘’ .. వేళాకోళాన్ని   తెచ్చిపెట్టుకుంది …‘’  ఒకసారి అవకాశాన్ని పాడుచేసుకున్నాను…వచ్చేసారికి అంతా..సరిగ్గా..అవుతుందని ..” – మరొక కాలానికి ప్రవహిస్తూన్న మాటలు.

వ్యవధి ఎంత –  ఈ  ఉరవడి లో , స్వరానికీ స్వరానికీ మధ్య , మరణానికీ జన్మకీ మధ్య ?? పట్టు జారిపోతున్నప్పటి ఆక్రందన ఎవరికి పడుతుంది , ఒకర్నొకరు పారేసుకున్నాక ???

అతన్ని ఉన్మాదం ఆవేశించింది ఆ క్షణం – ” నువ్వు పోతే నేనూ వెంటనే పోవచ్చుగా…ఎంత సేపు అది, చేతిలో పని ”

” అలా వీలవదు అబ్బాయీ…దానికింకా పెద్ద శిక్షలుంటాయి ”

” రెండు హంసలు జన్మానికి ఒకేసారి జంట అవుతాయట కదా ” అతనికి తట్టింది.

” అవునులే  .. ఇవాళ మాత్రం నీది . నిన్నా రేపూ మనవి… అందాకా…ఆగచ్చు    ”

మూడో రోజున ఆమె కథ ముగిసింది.

ఆమెని సాగనంపి వచ్చిన  అతనిది  కూడా,  సహజంగానే.

*                *                    *                     *

 

  1. “He wanted all to lie in an ecstasy of peace; I wanted all to sparkle and dance in a glorious jubilee. I said his heaven would be only half alive; and he said mine would be drunk: I said I should fall asleep in his; and he said he could not breathe in mine.”
  2. ‘’ Why did you despise me  ?  Why did you betray your own heart, Cathy?’

 

[  Ray Bradbury కథ   ‘ The Swan ‘ (కొంత ) ఆధారంగా — జననాంతర సౌహృదాలను అంగీకరించిన పాశ్చాత్య రచయితలలో  Ray Bradbury  ప్రముఖులు. James Long రాసిన Ferney నవల కథా అటువంటిదే. ]

 

 

 

 

 

మీ మాటలు

  1. కథ మొదలు పెట్టి, ఏకబిగిన చదివేశాను. ఇటీవల చదివిన కథలలో లేనిది …ఇందులో ఏదో ఉంది. ఆత్మ ఏమో?

  2. ఇందులో వాడిన ప్రతి పదము .. ఎంత చక్కగా కథలో ఇమిడిపోయాయో!! అద్బుతం

    • Mythili Abbaraju says:

      మీ వంటి వారి కోసం రాయచ్చు కదా అనిపిస్తోంది…

      • దయచేసి..కొద్దిగా తీరిక చేసుకొని ..మా అందరి కోసం…మరిన్ని కథలు రాయండి :)

  3. ” రెండు హంసలు జన్మానికి ఒకేసారి జంట అవుతాయట కదా ” బాగా తెలిసిన నవ్వుతో ఆమె కనిపిస్తూనే వుంది.. మహా శ్వేత ఎదురుచూపులు కొన్ని ఆర్ద్రమైన అక్షరాలలో _/\_ హృద్యమైన భాషలో !!

  4. ” వ్యవధి ఎంత – ఈ ఉరవడి లో , స్వరానికీ స్వరానికీ మధ్య , మరణానికీ జన్మకీ మధ్య ?? పట్టు జారిపోతున్నప్పటి ఆక్రందన ఎవరికి పడుతుంది , ఒకర్నొకరు పారేసుకున్నాక ??? ” మొత్తం వచన కవిత్వం లాగానే వుందండీ , చాలా బావుంది .

  5. G.S.Lakshmi says:

    జన్మ జన్మల బంధాన్ని అమృత ధారల్లాంటి పలుకులలో ,తెలిసీ తెలియని చమత్కార సంభాషణలతో చాలా చక్కగా చెప్పారండీ .. అభినందనలు మైథిలిగారూ ..

    • Mythili Abbaraju says:

      ధన్యవాదాలు సుబ్బలక్ష్మి గారూ…చాలా సంతోషం

  6. కధ చాలా బాగుంది మైథిలి గారు. ముఖ్యంగా ముగింపు చాలా నచ్చింది. కానీ హైదరాబాద్ లో 1940 లలో ప్రేమికులు ఐస్ పార్లర్ లో కూర్చొని ప్రేమించుకోవడానికి స్కోప్ లేదేమో అనిపిస్తుంది.

    • Mythili Abbaraju says:

      థాంక్ యూ సో మచ్ తనూజ గారూ. ఫలూడా హైదరాబాదీ సం స్కృతి లో భాగం కదా…

  7. చాలా బావుంది మైథిలి గారూ! ఒక అందమైన కవితలా, చక్కని అనుభూతిని ఇచ్చింది. ప్రసిద్ధ బెంగాలీ రచయిత్రిని తలపుకి తెచ్చింది, పేరు మాత్రం చెప్పను!
    ఇంకా ఇలాంటివి మరిన్ని రావాలి మీ నించి.
    “వ్యవధి ఎంత – ఈ ఉరవడి లో , స్వరానికీ స్వరానికీ మధ్య , మరణానికీ జన్మకీ మధ్య ?? పట్టు జారిపోతున్నప్పటి ఆక్రందన ఎవరికి పడుతుంది , ఒకర్నొకరు పారేసుకున్నాక ???”

  8. Sadlapalle Chidambara Reddy says:

    కవిత్వీక రించిన కథలాగా మార్మికంగా బాగుంది

  9. మైథిలి అబ్బరాాజు says:

    ధన్యవాదాలు చిదంబర రెడ్డి గారూ

  10. Krishna Vasanthika says:

    చాలా కాలం తర్వాత మనసు మూలలని తాకిన కధ చదివిన ఆనందం కలిగించిన కధ మైధిలి గారి “రాజహంస” .
    పునర్జన్మని ఆధారం చేసుకుని రాసినట్టు అనిపించినా రెండు ఆత్మల ప్రేమబంధంగా చెప్పవచ్చునేమో . తొమ్మిదో దశకం లో వున్న రచయిత్రి రెండో దశకం లో వున్న విద్యార్ధి మధ్య జరిగిన సంఘటనల లోని మార్మికత కేవలం ఎవరికి వారు అనుభవించాల్సినదే . వారి మధ్య జరిగిన సంభాషణలు సైతం మనసు లోతుల లోకి వెళ్ళి మనని ఉక్కిరిబిక్కిరి చేస్తాయనటం అతిశయోక్తి కాదు . ఇటువంటి కథలు రాయటం అందరి వల్లా సాధ్యం కాదు . కధకి కూడా ఆత్మ వుంటుందని తెలిసి , అనుభవించిన వారు మాత్రమే రాయగలరు. అటు వైద్యం , సంగీతం తో పాటు సాహిత్యాన్ని కూడా కరతలామలకం చేసుకున్న మైథిలి గారు ఈ కధ రాశారంటే , దానికి ముందు ఆమె ఎంతో శ్రమించి , అనుభవించి కానీ రాసి వుండరు . లేకపోతే అంతలా ఈ కధ మన మనసు మూలల లోకి చొచ్చుకొని పోదు.
    ఇటువంటి కధలు మైధిలి గారి కలం నించీ ఇంకా ఎన్నో రావాలనీ మనని కదిలించాలని నా ఆశ , కోరిక కూడా …..

  11. లావణ్యం పోయిందిగాని సౌందర్యం ఇంకా ఉంది. …… 🙏🙏🙏

  12. Mythili Abbaraju says:

    ధాంక్ యూ రమణ గారూ

  13. రాజహంస..రాకాపున్నమి రజితకాంతుల వెల్లువలో మలిజన్మల మందహాసం …మానస సరోవరంలో ప్రతిబింబించింది..
    చాలా హృద్యంగా వుంది..!

  14. ఒక జన్మాంతర అనుబంధాన్ని.. అతి సౌకుమార్యమైన అలతి పదాలతో అందించినందుకు.. వేలవేల దండాలు

  15. Mythili Abbaraju says:

    థాంక్ యూ సో మచ్ అనిత గారూ.

  16. అజిత్ కుమార్ says:

    మీరు అతడ్ని పాపం అప్పుడూ ఇప్పుడూ నిరాశ పరచారేమిటండీ…ఏం… 91వరకూ ఎందుకు ఉంచారూ…45లో కలిసుండాల్సింది….నేను బాగా హర్టయ్యాను… కనీసం వాడ్ని కాసేపన్నా మాట్లాడనివ్వకుండా ఏమంత తొందర…ఈసారన్నా కాస్త … మా అభ్యర్ధనమేరకు … మళ్ళీ….బాగా…రాయండి.

  17. Mythili Abbaraju says:

    అలాగేనండీ. ఇక మీదట మిమ్మల్ని సంప్రదించి గాని కీ బోర్డ్ ముట్టుకోను. ప్రామిస్.

  18. Gorantla sahebpeera says:

    ఏకబిగిన చదివించారు మైథిలి గారు.
    మరో లోకంలో విహరించినట్లైంది.
    ప్రేమ కాలాతీతమనే భావన చాలా బాగుంది.
    వ్యవధి మరీ ఎక్కవైందనిపించింది..
    సూపర్బ్
    కథ లా లేదు. కవితలా వుందంటే నమ్మండి

  19. Mythili Abbaraju says:

    ధన్యవాదాలు సాహెబ్ గారూ. వ్యవధి ఎక్కువైందనే మీ అబిప్రాయాన్ని గౌరవిస్తాను. కాని అనంతమైన కాలప్రవాహం లో డెబ్భై ఏళ్ళు [ తొంభై కాదు కదా ] తక్కువేనేమో అనిపిస్తుంది.

  20. అప్పారావు says:

    చక్కటి రాజహంస… కధ బాగుంది… ఫలూడ…లా అన్నట్లు మరిచ ..కృష్ణ శాస్త్రి గారికి నచ్చిన పేరు… అయన మొదటి భార్య పేరు రాజహంస … ఆమె పోయిన తరువాత… మల్లి పెళ్లి చేసారు వారికి .. ఆమెను కూడా అయన రాజహంసా అని పిలిచేవారు.

    • Mythili Abbaraju says:

      ధన్యవాదాలండీ చాలా సంతోషం.
      . కృష్ణ శాస్త్రి గారి రెండవ భార్య పేరు అదేనని విన్నానండీ. మొదటివారి పేరూ అదేనని ఇప్పుడే తెలిసింది.

  21. kameswara rao says:

    చాలా బాగుంది.

  22. మీరు మరీనూ అన్నేల్లకి చూపిస్తారా ఎక్కడయినా ..మళ్ళీ సహజంగానే అని చెప్పి అమ్పెసారు కూడాను .బాధేసింది నాకు .చండీదాస్ అనుక్షణికం గుర్తొచ్చింది .నేను తెలుగు అమ్మాయిని .అందుకని మీరు Ps అన్చేప్పీ కొనసాగింపు రాయాలి .అప్పుడు బాగుంటుంది బాధలేకుండా .
    Ps : అనుక్షణికం కూడా ఆగనీయకుండా చదివించింది కధ.మీ మరో మేజిక్ కోసం ఎదురు చూస్తూ …థాంక్స్

  23. Mythili Abbaraju says:

    స్వప్న రాగలీన..:(
    మీ కోసం మళ్ళీ రాస్తాను సామాన్య గారూ.
    ఇస్ బార్ సబ్ కుచ్ సహీ హోగా.
    థాంక్ యూ.

  24. Rishi Srinivas says:

    కధ కవితాత్మకంగా భలే వ్రాసారు. అభినందనలు !

  25. Mythili Abbaraju says:

    ధన్యవాదాలు రిషి శ్రీనివాస్ గారూ

  26. జీవంలో నుండి హంస ఎగిరిపోయిందని కథ చివరిలో మీరు అక్షరీకరించిన వైనం కథాగమనానికి ముగింపైనా చక్కని భాషాపటిమతో మరిన్ని కథలు మీనుండి వచ్చేందుకు ప్రారంభం.

  27. కామెంట్ రాయాలనే మొదలేట్టాగాని, ఏమి రాయాలో తెలీక బుర్ర గీరుతున్న..! ఏమో..ఆసాంతము ఇష్టంగా చదూకున్నా..చదివాక ,,చాల బాగా అనిపిస్తుంది.

    ఇవి కదా ప్రేమ కథలంటే!! :)

  28. Mythili Abbaraju says:

    అవునా అపర్ణ గారూ… చాలు, మీరు చెప్పిన మాటలు… :)

  29. suvarchala chintalacheruvu says:

    ఒళ్లు గగుర్పొడించింది. ప్రేమలు బాధాకరంగా ఉంటాయని బెంగాలీ కథల్లో చదివాను. అందుకే బెంగాలీ కథలు కొద్దిగా మనసు దిట్టపరచుకొని చదవటం మొదలుపెట్టాను. కానీ మీకథలో దాగిన మార్మిక అమలిన ప్రేమ నాకు ఊహకు కూడా జీర్ణంకానిది. గుండె ఎదురుతిరిగింది మీ కథ చదివి. మొజార్ట్, చందనపు సువాసనలు మనసుకు వినపడుతో, అలుముతో ఉన్నా..అదేదో చెప్పలేని భావన!

  30. mythili abbaraju says:

    అయ్యో…బాధ పెట్టాను మిమ్మల్ని… కొనసాగిం పో లేక మరొక ప్రారంభమో ఉంటుంది కదా అనీ…………

  31. ramanjaneyulu says:

    దీపాలు పిలిచాయి అద్భుతంం

  32. ఎందుకో మీ కధ చదువుతుంటే .నేను మొదటిసారి నయాగారా జల పాతాన్ని చూడటానికి వెళ్ళినపుడు చిరు చీకటులాక్రమించుకునే ఆ సంధ్యవేళ బాటకిరువైపు లా పందిరిలా అల్లుకున్న చెట్లు .. దూరం నుండి .అతి పెద్దజలపాతపు సన్నని సంగీతం … గుర్తోచ్చేయి నాకు .ఎదో ఒక అద్భుతమైన ఫీల్ ! ….ఇక్కడే మన హృదయం ఇరుక్కుపోయనట్లు చిన్న అర్ధం కాని బాధ …మీ కధలు కవితల్లా …హృదయానికి హత్తు కు పోతాయి మైధిలి గారూ!పెదవుల్లో పువ్వులతనం , కళ్ళనుండి దూకుతున్న వెలుగు ….ఈ పదాల అల్లిక ఒక్క సన్నజాజి కే సాధ్యం వేరే అభినందించాలా!

  33. Mythili Abbaraju says:

    ఎంత అందమైన మాటలు మాడమ్…ధన్యవాదాలు !!

  34. దేవరకొండ says:

    ఒక పూర్తి సంవత్సరం తర్వాత ఈ ‘రాజహంస’ దర్శన భాగ్యం కలిగింది. దీన్ని ఎలా మిస్ అయానన్న సిగ్గు కంటే ఇప్పుడైనా చదివానన్న ఆనందం ఎక్కువ కావడం వల్ల ఈ అభినందనలు. టీనేజి లో మూగమనసులు సినిమా చూసినప్పటి అనుభూతిని, ‘కహీ( దూర్ జబ్ దిన్..’ ముకేశ్ గళంలో రాజేష్ ఖన్నా పాడుతూ ఉర్దూ కవితాసంకలనంలో దాచుకున్న ప్రేయసి జ్ఞాపిక … తడిఆవిరైపోయిన సుమాన్ని తడిమిచూసుకునే దృశ్యం…ఇలాంటివే జ్ఞాపకాలు కలగలిసి…మైథిలి గారూ how could I miss your Rajahansa so far!

  35. Mythili Abbaraju says:

    థాంక్ యూ అండీ. ” Memory believes before knowing remembers. Believes longer than recollects, longer than knowing even wonders.” (Faulkner)

  36. ఇది నిస్సందేహం గా వచన కవిత్వమే . పూర్తి తెలుగు కథ లాగే ఉంది తప్ప ఎదో విదేశీ భావానికి తెలుగు అనుకరణ లా బొత్తిగా లేదు. Hats off to you!

మీ మాటలు

*