The professional

 Kadha-Saranga-2-300x268

“వెళ్ళాలా”

“వెళ్ళాలి… ఇంటి దగ్గర పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు”

“కాసేపు ఉండొచ్చు గా”

ఎంత సేపు ఉంటే తీరుతుంది ఉండాలన్న తపన. చుట్టూ చిమ్మ చీకటి… అక్కడక్కడా ఒకటి రెండు ఇళ్ళు. రోడ్ పక్కగా ఆపిన కార్. అబ్బ ….ఈ కార్ లకు బ్లాక్ ఫిల్మ్లు తీసేసాక అంతా విజిబుల్ అవుతుంది. “అర్చనా” అంటూ చేతిని పట్టుకోడం అప్పటికి ఇరవయ్యో సారి. ఏం చెయ్యాలి? “అసలు మీకు నేను తెలుసు కదా…ఒక్కసారి వచ్చి నన్ను అడిగి ఉండొచ్చు కదా”.”అప్పుడు నాకంత ధైర్యం లేదురా”.

“మీరు మిస్ చేసింది జీవితాన్ని” అటు నుండి మౌనం. “ఒక్క నిమిషం” అంటూ కార్ దిగాడు. ఒక్కసారిగా ముసురుకున్న అలోచనలు.అవును … అపుడు జీవితంఎలా ఉండేది?  ప్రే మ గా ఉండేది.

ప్రేమ అంటే మన శరీరాన్ని  , మనసునీ, ఆత్మనూ ప్రేమించే ప్రేమ. ప్రేమ , మోహం మనిషిలో ఒక నమ్మకాన్ని,నెమ్మదినీ,స్థిరత్వాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంచాలి. ప్రేమ వివాహాలలో జరిగేది అదేనా? ఇదే కాక ఇంకా.. సమాజం తో మమేకమై పోయి ఉండేది. తను వెళ్ళిన చోటికి వెళ్తూ తనపోరాటాలను పంచుకుంటూ ఉండే దాన్నా  ? మరి అప్పుడు పిల్లల్ని ఎవరు చూసేవాళ్ళు? పిల్లల కోసం ఇంట్లో ఉండే దాన్నా? మా సంసారం ఎలా ఉండేది? ఇప్పటిలాచిన్న చిన్న విషయాలకు గొడవ పడుతూ కాకుండా మెచ్యూర్డ్ గా ఉండేదా? సమాజం కోసం అలోచించే సామాజిక స్పృహ …… లేకపోతే ఒక పెయింటర్,ఒకరచయిత, ఒక కవి … వీళ్ళ వ్యక్తి గత జీవితాలు ఇళ్ళల్లో ఎలా ఉంటాయి? ఎంత గొప్ప వ్యక్తి అయినా అయ్యుండొచ్చు.

ఇంట్లో ప్రవర్తన ను బట్టే అంచనావేయాలనిపిస్తుంది. నిజమే కదా! కుటుంబ సభ్యుల కు ప్రేమ పంచలేనోడు లేదా పంచలేని స్త్రీ బయట ఎంత మంది తో ప్రేమ గా ఉండి ఏం లాభం? కానీ ఆ ప్రేమ మనఆత్మ ను చంపేసేదైతే? మన మూడ్ ను, మన ప్రతిభ ను పట్టించుకోని దైతే? కేవలం వంట, ఇంటి పనులు, డబ్బు ఇలాంటి అవసరాలనే మన నుండి నిరంతరాయంగా డిమాండ్ చేస్తే?

నిజమే కాదనేది ఏం లేదు… ఒక్కసారి పెళ్ళి అని కమిట్ అయ్యాక …పిల్లలు పుట్టాక ఫ్యామిలీ ఆ రూపం లో నే ఉండాలి… కనీసం పిల్లల ముందుగట్టిగా అరిచే హక్కు కూడా లేదు మనకు. కార్ తలుపు తీసిన చప్పుడు కు ఈ లోకం లోకి వచ్చాను.”ఈ   మధ్య ఏమైనా పెయింటింగ్ చేసావారా”లోపలకూర్చుంటూ అడిగాడు.

“ఏం చేయ లేదండీ”

తనొక పెయింటర్ ను అని గుర్తుందా తనకైనా? ఇద్దరు పిల్లల ప్రెగ్నెన్సీ.. పుట్టాక వాళ్ళ సం రక్షణ..ఉద్యోగం. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే పిల్లలు పెద్దవాళ్ళయ్యారు కదా ఏదైనా  చేద్దాం అనుకుంటే వాళ్ళ అల్లరి, చదువులు, రాత్రి ఫుడ్ … వీటి తోనే సరిపోతుంది . ” అలా అయితేఎలారా …ఏదోఒకటి చదువుతూ ఉండు…పెయింటింగ్స్ చేస్తూ ఉండు”. చెప్పడం ఈజీ. పెళ్ళి చేసుకోని తనకేం తెలుసు? ” సరే…. మీరేం చేస్తారు సాయంత్రం”.

“సినిమాలు బాగా చూస్తాను. ఆ సమయం చాలా నరకం లా అనిపిస్తది”… కుటుంబం  మనుషుల్ని ఏం చేస్తుంది? ఉన్నా బాధే… లేకున్నా బాధేనా? అమ్మో… లేదులేదు నా పిల్లలు లేకుంటే నేను బతకగలనా? ఇంటికెళ్ళ గానే ఎంతో ఆపేక్ష తో చుట్టుకునే చిట్టి చేతులు… వాళ్ళ ముద్దు ముద్దు  మాటలు.

ఈ పెళ్ళిల్లు ఉన్నాయే…బుచ్చిబాబు చెప్పినట్టు లోపల ఉన్నవాళ్ళు బయటికి రావాలనుకుంటారు… బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళాలనుకుంటారు. పెళ్ళి అయిన తరువాత నమ్మకంతో, ఇష్టం తోకాపురం చేయాలి. అలా చెయ్యాలి అంటే పెళ్ళి అనే బంధం లోకి వెళ్తున్న ప్రాసెస్ ను గమనించాలి. ఏ కులం వాళ్ళు ఆ కులం వరున్ని మ్యారేజ్ బ్యూరోలోనో, తెలిసిన వాళ్ళ ద్వారా నో చూస్తారు. అమ్మాయికి ఒక్కసారి చూపిస్తారు. కొంచెం యంక్వయరీ . కుటుంబం ఇరుగు పొరుగు తో ఎలా ఉంది అని. ఇక కన్విన్స్.

అబ్బాయి మంచోడా అమ్మాయి జీవితం బాగుంటుంది. లేదంటే …!! అనుమానం, తాగుడు, సంపాదించగలడో…లేదో….ఇవన్నీ మనిషిని దగ్గరగా గమనిస్తే తెలిసేవిషయాలు. ఇంత లోతు గా తెలుసుకుంటున్నారా? లేదు.ఇంత బాధ పెడుతున్న ఈ ప్రాసెస్ మారాల్సిన పని లేదా?

“ఏంటి… ఏం అలోచిస్తున్నావ్…ఏదైనా మాట్లాడు.”

ఎన్నో రోజుల తరువాత దొరికిన ఏకాంతం… ఊహించని సమయం. అయినా స్పందించని మనసు. సడెన్ గా నుదిటి మీద చిన్న ముద్దు. అక్కడి నుండి చెంపల పై. “అర్చనా” అని ప్రేమ గా పిలుపు. నేను పక్కనే ఉన్నా… కావలిసిన సందర్భం దొరికినా… ఇంత కంటే ఏం చేయమా? చేయాలంటే ఒక రకమైన శారీరక ఆకర్షణఉండాలి.  మరి ఏంటి?శారీరకం గా కోరుకోవడం లేదా? లేక నా శరీరానికి ఆ లక్షణం లేదా?  ఎంతో మంది “ప్రపోజల్స్” గుర్తొచ్చాయి.

కానీ ఈ మనిషికి? ఇంత ప్రేమ నా?ఇంత గౌరవమా?

అది ఎప్పుడూ మాటల్లో తెలుస్తూనే ఉంటుంది గానీ… ఇంత స్వచ్ఛతా? !! “ఇక బయలుదేరదాం.. చాలా ఆలస్య మవుతుంది”. కార్ సర్రున పోతూఉంది. అంత కంటే స్పీడ్ గా ఆలోచన. ఇంటికెళ్ళాను.

******           ******    ********

అప్పుడే ఆర్ట్ ఎగ్జిబిషన్ కు వెళ్ళి  తీసుకున్న  ఫోటోలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తున్నాయి. పిల్లలు పడుకున్నారు. అసలు ఈ ఎగ్జిబిషన్ కు వెళ్ళడం కూడా తనుఊర్లో లేడు కాబట్టి వీలయింది. ఉంటే వద్దని అనడు గానీ.., ఒక సాయంత్రం పిల్లల్ని వదిలి వెళ్ళేంత ముఖ్యమైంది  కాదనేలాఉంటుంది ఇంట్లో వాతావరణం. చాలా సార్లుఅలా అని నాకే అనిపిస్తుంది. ఎందుకింత గా ట్యూన్ చేయ బడ్డారు ఆడవాళ్ళు?

పూజలు  , వ్రతాలు , ఇళ్ళు , ఆడంబరాలు, చీరలు, నగలు అని ఒక మూస ధోరణి. ఆమూస లోఎవరైనా ఇమడ లేదా.. వాళ్ళ స్థాయి కి దిగి మాట్లాడలేదా… వెలివేసినట్టుగా…., అబ్నార్మల్ గా చూస్తారు.విచిత్రం ఏంటంటే అందరూ అలాంటి వారినేఆమోదిస్తారు. అప్పుడప్పుడు అనుకుంటాను.. ఎలాగో మంచి బట్టలు వేయాల్సినప్పుడు, నలుగురిలో అందం గా కనిపించాలి అనుకున్నప్పుడు అదే పని ఇంకొంచెంబెటర్ గా చేస్తే తప్పేంటి అని. కానీ అవి తప్ప మరో లోకం లేనట్టు బతకడం అసహ్యం. ఆలోచనలతోనే నిద్ర పట్టేసింది.

చిత్రం: కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి

చిత్రం: కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి

****** ******* ***** ****

తెల్లవారి అసలు ఆఫీస్ కు వెళ్ళాలనిపించలేదు . తనతో మాట్లాడేది చాలా తక్కువ. అంతా మెసేజ్ లే.

” నిన్న పెదవులు దొరికినా ముద్దు పెట్టాలిఅనిపించలేదామీకు….  అంత కాంక్ష లేని ప్రేమనా మీది” అని  మెసేజ్ చేసా. చాలా సేపటి తరువాత రిప్లై..” లేదురా నాకు అలా ఏం అనిపించలేదు. ఏదైనాజరగాలంటే అది బహుషా తెలియకుండా జరిగి ఒక తెలియని స్థితి లోకి జారిపోయే వాళ్ళం” అన్నాడు.

కొంచెం నవ్వొచ్చింది. అంటే మనసు అందుకు సిద్దం గా ఉందాలేదా తెలుసుకోరా?కాసేపు అల్లరి పట్టిద్దామనిపించింది.

” నేనంటే ఎంత క్రేజ్ తెలుసా? ఎవ్వరూ అంత ఈజీ గా నచ్చని నాతో దొరికిన ఏకాంతాన్ని మిస్ చేస్తే “అది”లేదనుకుంటారు”

” (చిన్న నవ్వు.) అవునా తల్లీ. నీకు చాలా మంది ప్రొపోజ్ చేసి ఉంటారు లే. చెయ్యకపోతే ఆశ్చర్యం”.చప్పున చల్లారిన అతిశయం. సరే లోతులకు తరచి చూస్తేఇష్టానికి శరీరానికి సంబంధం ఉందా?

ప్రతీ ఇష్టం దేహాల కలయిక తోనే ముగుస్తుందా? అలాంటి ఫీలింగ్ లేకపోవడం ఫ్రిజిడిటీనా? పాతివ్రత్యమా? శరీరాలు కలవాలంటేఎంత ఇష్టం ఉండాలి!ఇష్టం లేకుండా చిటికెన వేలు తగిలినా కంపరం పుడుతుంది. భర్త తో “హ్యాపీ” గాఉంటే మరో అలోచన రాదా?

ఒక వేళ ఏదైనా అసంతృప్తిఉండో…..బాగా నచ్చో అలాంటి సంబంధం లోకి వెళ్తే?పరిణామాలు ఏంటి? ఎన్ని చూడడం లేదు…. ఇలాంటి సంబంధాలన్నీ కుటుంబ విచ్చిన్నానికే దారి తీస్తాయి.శరీర ప్రస్తావన లేని.. మనుషుల జ్ఞానమో, చురుకుదనమో, మంచితనమో నచ్చి స్నేహం చేయాలనిపిస్తే?   అలాంటి స్నేహాలు తప్పా? భర్త తో లేదా భార్య తోకమిట్ అయ్యాక ఇంకో స్నేహం చేయడం తప్పా? చాలా విషయాలలో ఎంతో లిబరల్ గా అలోచించే నాకు ఈ విషయం లోకన్ ఫ్యూజన్.

ఇలాంటివి ఖచ్చితం గాఎదుటి వారిని బాధ పెడతాయి. స్నేహం వరకే ఉంచితే పర్వాలేదు. కానీ దేహం , అందం ప్రస్తావన ఒక్క వాక్యమంతైనా లేకుండా నాకైతే ఒక్క స్నేహమూతారసపడలేదు.  రోజుకో సారి కండక్ట్ సర్టిఫికెట్ సమర్పించుకోవలసిన స్థితి లో ఉండి కూడా ఇలాంటి అలోచనలా? ఒక్కసారి ఇంట్లో తెలిస్తే? నిజానికి ఇదంతా తప్పా?తప్పు ఒప్పుల సంగతేమో గానీ…. “క్యారక్టర్ ” మీద ఒక ముద్ర వేస్తారే…. భరించడం చాలా కష్టం. వివాహ బంధం లో ప్రేమ ను , నమ్మకాన్ని ఇరువురూనిలుపుకోవాలి అని నేను గట్టిగా నమ్ముతాను.

మరి అలాంటప్పుడు ఈ స్నేహాలేంటి? ఈ మాటలేంటి? ఒక్కసారే లోపలి నుండి ఒక దడ మొదలైంది . ఎందుకో భర్త తోతప్ప ఎవరితోనూ శారీరక సంబంధం వరకూ పోకున్నా…..లోలోపల అలాంటి సంబంధాల పట్ల అంత వ్యతిరేకత లేదనిపించే భావనే చాలా గిల్టీ గా ఉంది. నిజానికి భర్తతో పెద్ద ఇష్యూస్ లేవు.

తాగడం, అనుమానం ఉన్నా పిల్లల కోసం భరించ గలిగే ఒర్పు ఉంది. బహుషా ఇంత ఓపిక తో ఉంటున్నా ఇలాంటివి ” బయట పడితే ” ఆ మగవాన్ని పాపమనో, ఎలాంటి దాన్ని భరిస్తున్నాడనో లోకమంతా సాను భూతి చూపిస్తుంది. ఇక ఇంట్లో…. పిల్లల కోసం క్షమిస్తున్నా అని…. జీవితాంతం సరెండర్ అయ్యేలా మాటలతో పొడుస్తూ ఉంటాడేమో!

****      ******    *******    ******

మరి ఇంత ప్రమాద కరమైన సిచ్యుయేషన్ లో ఉండి ఈ స్నేహాలు కొనసాగించి బావుకునేది  ఏంటి?ఒరిగేది ఏంటి?

ఆ స్నేహాలు,  ప్రేమలు….

జీవితానికి ఉత్సాహాన్ని ఇస్తాయి.

ఒక సూర్యోదయాన్నో, సూర్యాస్తమయాన్నో…మరింత అందం గా మారుస్తాయి.

కొంచెం కరుణ ను, కొంచెం దయ ను మిగులుస్తాయి.

ఉద్యోగాన్ని మరింత మెరుగ్గా చేసుకోగలిగే శక్తి  నిస్తాయి.

ఒక ప్రశాంతత ను ఇస్తాయి.

చిరునవ్వు నిస్తాయి.

చిరుగాలై చుట్టేస్తాయి.

జ్ఞానాన్ని ఇస్తాయి.

స్వాంతనను ఇస్తాయి.

ఇవన్నీ ఒక్క మనిషి వివాహం లో ఇవ్వగలిగితే…. ఎంత   అద్భుతమైన బంధం!! పొందాలన్న మనసు ఉండీ ఇవ్వలేని బంధం లో ఉన్నా …. పిల్లల కోసం ఉండాల్సినపరిస్థితి. మరీ బాధ పెడితే తప్ప అడ్జస్ట్ కమ్మనే చెప్తారు ఎవరైనా. చెప్పడమేంటి? ఈ ఫ్యామిలీ ని వదలి వెళ్ళాలన్న తలపే లేదు.

ఈ అతి మామూలు స్పర్శలు, షేరింగ్స్ సమాజం దృష్టిలో తప్పు.

జీవితాన్ని హుందాగా, ఉన్నతంగా మార్చుకోవాలి, పిల్లలను గొప్పగా తీర్చి దిద్దుకోవాలి అన్న తపన ముందు ఈ చిన్ని చిన్ని క్రష్ లు ఎంత!!

అయినా ఇవి తెలిస్తే… ఎవరి వ్యక్తిగత ఇష్టాలు వారివంటుందా  సొసైటీ…

ఇంటిని సమర్దవంతం గా నిర్వహిస్తున్నా……

ఒక విజన్ తో ఆర్దిక ప్రణాళికలు వేస్తున్నా…..

ఉద్యోగం దగ్గర ఎంత నేర్పు తో  పని చేసినా….

అవన్నీ ఈ ఒక్క టాపిక్ లో కొట్టుకుపోతాయి.

*****    *******     *******

ఆలోచనల్లో ఉండగానే తలుపు చప్పుడైంది.

తీయగానే ఎదురుగా మోహన్.

అప్రయత్నం గా చిన్న చిరునవ్వు.

” బాగా జరిగిందా ప్రయాణం”.

“హా.. బానేఉంది.కాఫీ ఇవ్వు. చిరాగ్గా ఉంది”.

అర్చన వంటింట్లోకి వెళ్ళింది. ఈ లోపు లో ఫ్రెష్ అయ్యి వచ్చాడు మోహన్.

చాలా మంది కంటే చాలా బెటర్. కానీ తను తాగి ఇంటికి వచ్చిన ప్రతి సారీ ఎన్నో చేదుఅనుభవాలు ఉన్నాయి. గొడవలు అయ్యే కొన్ని  విషయాలలో ఇది  మొదటిది. అనుమానం రెండవది. కారణం లేకుండా అనుమానించినప్పుడల్లా కన్నీళ్ళ తోనిస్సహాయం గా కడిగేసిన రోజులెన్నో!

కానీ మేల్, ఫిమేల్ స్నేహాలన్నీ  శారీరక సంబంధం కోసం వెంపర్లాడేవేనా? కాదు. కాదు అని గట్టిగా అనుకుందామంటే…. “There is no friendship between male and female with out lust”అన్న వాక్యం, దాని వెంటనే మగబుద్దీ గుర్తొస్తున్నాయి.

స్నేహం చేసే మనస్తత్వాలను అర్దంచేసుకోవడం చాలా అరుదు. అయినా మన కోపాలను , లోపాలను అనుదినం భరించే భర్త దగ్గర తప్ప ఇంకెక్కడా శరీరం అలా స్పందించదు అన్న నిజం , ఆడవాళ్ళహృదయం స్పష్టం  గా ఎప్పటికీ అర్దం కావు.  అడ్జస్ట్ మెంట్ ,కాంప్రమైజ్…..కావాలి. ఎందుకంటే కుటుంబం నిలబడాలి. ఏ లైఫ్ స్టైల్ లో మాత్రం స్ట్రగుల్ లేదు?కుటుంబం కంటే వేరే ప్రత్యామ్నాయం దొరికిందాకా….. స్త్రీ , పురుష శారీరక సంబంధాలలో క్లారిటీ వచ్చిందాకా…కత్తి మీద సాము లాంటి కాపురాలు జాగ్రత్తగా చేయాల్సిందే.

ప్రేమ, మోహం కూడా తాత్కాలికమే …. అవి కూడా అవసరాన్ని బట్టి ప్రొఫెషనల్ అయిపోయాయి.

కుటుంబం కూడా అవసరాల ప్రాతిపదికఅయినప్పుడు… భార్య గా, తల్లి గా, కూతురుగా, కోడలు గా పక్కా ప్రొఫెషనల్ గా రూపాంతరం చెందుతున్నామనిపిస్తుంది.

ఎడతెగని ఆలోచనలకు నిశ్శబ్దం గా టీ తోబ్రేక్ వేయడానికి ప్రొఫెషనల్ చెఫ్ గా కిచెన్ లోకి వెళ్ళింది అర్చన…..

-గమన