మనలోకి మనం పుప్పొడిలా…

కొన్ని మాటలూ, పాటలూ, కవితలూ దయలేనివి! కదిలించీ, కంపించి పోయేట్లు చేసి.. మనలోకి మనం పుప్పొడిలా రాలిపోయేలా చేస్తాయి.
‘…నహీ ఆయే కేసరియా బల్మా హమారా..’ అంటున్న శుభా ముద్గల్ స్వరంలో మునిగి, ఆ భావావేశంలో ఊపిరాడక ఉగ్గపట్టినట్లుండగానే ‘యే బారిష్ గున్‌గునాతీ థీ…….’ అంటూ గంభీరంగా గుల్జార్ గొంతు పొదవిపట్టుకుంటుంది.. ఆ మరునిమిషంలోనే ఆ పదాలు తడిచిన కనురెప్పల గుండా గుండెని పెకలించివేస్తాయి!
వెలుతురూ, చీకటితో సంబంధం లేకుండా చుట్టూ నిశ్శబ్దం ఒక కంచెలా పాతుకుపోతుంది. ఎక్కడో మనకి సంబంధంలేని అడవిలోతన మానాన తాను కురుస్తున్న వర్షం అకస్మాత్తుగా రెక్కలు విదిల్చుకుంటూ వచ్చి మన తలుపవతలే కురుస్తున్నట్లు… ఎన్నెన్నో సంగతులు.. బుజ్జగించేవీ, పదునైనవీ, వణికించేచీ… ఏవేవోజ్ఞాపకాలు ఆ కంచె లోపల చేరతాయి.
ఎంతసేపనీ, ఎన్నిరోజులనీ ఇంక లెక్కలనవసరం!
 

రెయిన్‌కోట్ సినిమాలో ‘పియా తోరా కైసే అభిమాన్ ‘ పాట, మధ్య మధ్యలో గుల్జార్ స్వయంగా వినిపించే ఈ కవితా ఆ కోవలోకే వస్తాయి.


ఏదో
ఈదురుగాలి వల్ల అనుకుంటా…

~

ఏదో ఈదురుగాలి వల్ల అనుకుంటా

ఈ గోడకి తగిలించి ఉన్న చిత్రం పక్కకి ఒరిగింది

పోయిన వర్షాకాలంలో గోడలు ఇంత తేమగా లేవు
ఈసారి ఎందుకో వీటిలో తడి చేరింది..
బీటలు వారాయి.
ఈ చెమ్మ ఎలా పారుతుందంటే

ఎండిన చెంపల మీదుగా కన్నీటి తడి జారుతున్నట్టుంది!

ఈ వాన ఇంటి పైకప్పు మీద తనలోతాను పాడుకుంటుండేది
కిటికీల అద్దాల మీద తన వేలికొసలతో ఏవేవో సందేశాలు రాస్తుండేది

ఇప్పుడు మాత్రం మూసిన వెంటిలేటర్ అవతల నిర్లిప్తంగా కురుస్తోంది!

ఇప్పటి మధ్యాహ్నాలని చూస్తుంటే
ఏ పావులూ లేని చదరంగపు బల్ల ఖాళీగా పరిచినట్లుంది

ఎత్తుగడ వేయడానికి ఎవరూ లేరు.. తప్పించుకునే ఉపాయాలు అసలే లేవు!

పగలు మాయమయింది.. ఇక రాత్రి కూడా తప్పించుకుపోతోంది
ఆసాంతం ఆగిపోయింది!
అనుకోని ఋతుపవనాల వల్లనే అనుకుంటా

ఈ గోడ మీద తగిలించిన చిత్రం పక్కకి ఒరిగిపోయింది!

satya

Artwork: Satya Sufi

మూలం:
Kisi mausam ka jhonka tha…

Kisi mausam ka jhonka tha
Jo iss deewar par latki tasveer tirchhi kar gaya hai

Gaye sawan mein ye deeware yun seeli nahi thi
Na jane kyun iss dafa inn mein seelan aa gayi hai
Daraarein pad gayi hain
Aur seelan iss tarah behti hai jaise
Khushk rukhsaaro par geele aansun chalte hain

Ye baarish gungunati thi isii chhat ki mundero par
Ye ghar ki khidkiyon ke kaanch par ungliyon se likh jaati thi sandese
Bilakhti rahti hai baithi hui ab band roshandano ke peechhe

Dopehre aisi lagti hain
Bina moheron ke khali khane rakkhe hain
na koi khelne wala hai baazi, aur na koi chal chalta hai

Na din hota hai ab na raat hoti hai
Sabhi kuchh ruk gaya hai
Wo kya mausam ka jhonka tha
Jo iss deewar pe latki tasveer tirchhi kar gaya hai

——————————————-

లేదులే, నేనలాంటి విముక్తి కోరట్లేదు!

 

నువ్వెళ్తున్న సంగతి పాపం నీక్కుడా తెల్సుండదులే! వెళ్తూ వెళ్తూ హడావిడిగా బుద్దుడి విగ్రహం దగ్గర నాలుగు నందివర్ధనాలు పెట్టి, కాళ్ళల్లో చెప్పులు దూర్చి కూడా ఎందుకో ఆగి క్షణ కాలం ఆ మౌనినీ, వెనువెంటనే నన్నూ ఆప్తంగా చూశావు.

ఆ రోజు సాయంత్రం పార్టీకి వేసుకుందామనుకుని బయటపెట్టిన బట్టలూ, ఎలాగైనా ఆరోజుకి ముగించేస్తానని అనుకున్న పుస్తకంలోని ఆఖరి పది పేజీలూ ఇవాళ్టి రోజున కూడా చాలా ఓపిగ్గా ఎదురుచూస్తున్నాయి.

నేనూ.. ఆ నందివర్ధనాలూ మాత్రం ఒకేలా మిగిలాం!

పువ్వులంటూ నువ్వు, కాయలంటూ నేనూ కావాలని ఇష్టంగా తెచ్చుకున్న నారింజ చెట్టు కోసం తవ్విన గొయ్యి మాత్రం చాలా అసహనంగా చూస్తోంది. చాలా సార్లు దాని పక్కనే కూర్చుని బొమ్మా బొరుసు వేస్తుంటాను.. నేనా, నారింజ చెట్టా అని!

కాసేపేలే!

నువ్వు పెంచుకునే పిట్టలకి గింజలు వేయాలన్న నెపంతో చివాలున లేచి వచ్చేస్తాను!
అప్పటివరకూ ముద్దగా, ముగ్ధంగా నవ్వుతున్న పువ్వు రేకలన్నీ ఒక సన్నగాలి స్పర్శతోనే ఊగి, రాలి పడిపోయాక స్థాణువైపోయే తొడిమని చటుక్కున నువ్వు తుంచేసేప్పుడు విసుక్కున్నాను కానీ, ఒక మహా దిగులు నించి తప్పించడమని ఇప్పుడిప్పుడే అర్ధం అవుతుంది.

లేదులే, నేనలాంటి విముక్తి కోరట్లేదు!

వెళ్ళాల్సిన దూరం ఇంకా ఉంది కానీ, మొదలూ చివరా కూడా కూడానే ఉంటావనుకుంటే.. కాస్త వరకూ తోడొచ్చినట్లు వచ్చి, ఒంటరిగా వదిలేస్తే ఎలా!?
తోవ కనబడుతూనే ఉంది కానీ, ముందుకెళ్ళాల్సినప్పుడల్లా మాత్రం కాస్త వెనక్కెళ్ళి నువ్వు వేసిన అడుగుల్ని కొన్ని అప్పుగా తెచ్చుకుంటూ ఉంటాను!

 

~

satya

నువ్వొదిలి వెళ్ళిన రోజులు…

*

 

నువ్వొదిలి వెళ్ళిన రోజులు ఇంకా లాన్‌లో వైర్ మీద వేళ్ళాడుతున్నాయి
అవి పాతబడనూ లేదు, అలా అని రంగు వెలిసిపోలేదు
ఎక్కడా కూడా ఏ కుట్టూ చెక్కుచెదరలేదు!

యాలకుల మొక్క పక్కనే ఉన్న రాయి మీద
కాస్తంత త్వరగా అయితే నీడ పరుచుకుంటోంది
ఆ మొక్క మాత్రం ఇంకొంచెం గుబురుగా పెరిగింది
నేను ఆ కుండీని కొంచెం కొంచెం జరుపుతూ ఉంటాను..
ఫకీరా ఇప్పుడు కూడా నా కాఫీని అక్కడికే తెస్తాడు
ఉడుతలని పిలిచి బిస్కట్లు తినిపిస్తుంటాను
అయినా అవి నా వంక అనుమానంగా చూస్తుంటాయి
నీ చేతి పరిమళం వాటికి బాగా పరిచయమనుకుంటా!

అప్పుడప్పుడూ సాయంత్రమవుతూనే ఒక డేగ పైకప్పు నించి వాలుతుంది
అలసటగా కాసేపు లాన్‌లో ఆగి,
బత్తాయి చెట్టు వైపుకి ఎగిరి, తెల్లని గులాబీ పూల మధ్యలో మాయమైపోతుంది
అచ్చు ఐస్ ముక్క విస్కీలో కలిసిపోయినట్టుగా!

ఇవాళ్టి రోజుని నా మెడలోంచి స్కార్ఫ్‌లా తీసి వేసి,
నువ్వొదిలి వెళ్ళిన రోజుల్ని చుట్టుకుంటాను
నీ పరిమళంలో ఎన్నో రోజుల్ని గడిపివేస్తుంటాను!

నువ్వొదిలి వెళ్ళిన రోజులు ఇంకా లాన్‌లో వైర్ మీద వేళ్ళాడుతున్నాయి
అవి పాతబడనూ లేదు, అలా అని రంగు వెలిసిపోలేదు
ఎక్కడా కూడా ఏ కుట్టూ చెక్కుచెదరలేదు!

*

మూలం:

 

Tere Utaare Hue Din Tange Hain Lawn Mein Ab Tak..

*

Tere utaare hue din tange hain lawn mein ab tak,
na woh puraane hue hain, na unka rang utra..
kahin se koi bhi seevan abhi nahin udhadi …!

Elaichi ke bahut paas rakhe patthar par,
zara si jaldi sarak aaya karti hai chhanv..
Zara sa aur ghana ho gaya woh paudha,
main thoda thoda woh gamla hatata rehta hun.
Fakeera ab bhi wahin meri coffee deta hai..
gilhariyon ko bula kar khilata hun biscuit.
Gilahariyaan mujhe shaq ki nazar se dekhti hain..
woh tere haathon ka maans jaanti hongi …!

Kabhi kabhi jab utarti hai cheel shaam ki chhat se..
thaki thaki si zara der lawn mein ruk kar,
suffeid aur gulaabi masumbe ke paudhon mein hi ghulne lagti hai..
ki jaise barf ka tukda pighalta jaaye whiskey mein …!

Main scarf din ka gale se utaar deta hun..
tere utaare hue din pehen ke ab bhi main,
teri mehak mein kayi roz kaat deta hun …!

Tere utaare hue din tange hain lawn mein ab tak,
na woh puraane hue hain, na unka rang utra..
kahin se koi bhi seevan abhi nahin udhadi!!

***

 

చిత్రం

 

గుర్తుందా ఒకరోజు?
నా బల్ల మీద కూర్చున్నప్పుడు
సిగరెట్ డబ్బా మీద నువ్వు
చిన్న మొక్కలాంటి
ఒక చిత్రాన్ని గీశావు…

వచ్చి చూడు,
ఆ మొక్కకి ఇప్పుడు పూలు పూస్తున్నాయి!

మూలం:

Sketch

Yaad Hai Ik Din?
Mere Maze Par Baithe Baithe
Cigartte Ki Dibiya Par Tumne
Chhote Se Ek Paudhe Ka
Ek Sketch Banaya Tha

Aakar Dekho,
Us Paudhe Par Phool Aaya Hai

————————–

Artwork: Satya Sufi

ఇంకా భూమి కోలుకోనేలేదు!

 

జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అవగాహన కలిగేది సినిమాల వల్లనే అనుకుంటా, నా మట్టుకూ!
చిన్నప్పుడెప్పుడో ‘కాశ్మీర్ కీ కలీ’ సినిమా పాటలు చూసినప్పుడనుకుంటా మొదటిసారి ఆ ప్రాంతం మీద ఆసక్తి కలిగి ఎక్కడా, ఏమిటీ అనే ప్రశ్నలు ఉదయించాయి.
తెల్లని పర్వత శ్రేణులూ, పచ్చని లోయలూ, సరస్సులూ, అన్నిటినీ మించిన కాశ్మీరీ అమ్మాయిల అందం, అమాయకత్వపు నవ్వు… ఇదేదో పెద్దయ్యాక పదే పదే వెళ్ళాల్సిన ప్రదేశం అని తీర్మానించుకున్న రోజులవి!

‘రోజా’ సినిమాతో ఆ ఆశలన్నీ పటాపంచలయ్యాయి, అది వేరే విషయం! అసలు కాశ్మీరు సంక్షోభంలో ఎవరి పాత్ర ఎంత అనే వాదోపవాదాలు పక్కన పెడితే కాలేజీ రోజుల్లో నా హాస్టల్ రూమ్మేట్, కాశ్మీరీ అమ్మాయి కళ్ళల్లో నిరంతరం కనిపించిన భయం ఇంకా గుర్తుంది.
వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి సమయంలో ఊరు వదిలి రావాల్సి వచ్చిందో చెప్పాలంటే ఒక పెద్ద కధ అవుతుంది, కానీ తను అన్న ఒక మాట ఎప్పటికీ గుర్తుంటుంది, ‘ఇప్పుడు ఎక్కడ ఉన్నా, క్షేమంగానే ఉన్నా కానీ ఏదో కార్నివాల్ లో తప్పిపోయినట్టు భయం, ఆందోళన! ఏదో ఒక రోజు మన ఊరుకి, మన వాళ్ళ దగ్గరకి వెళ్ళిపోతామనే ఆశ. ‘

ఆ మధ్యనెప్పుడో ఈ కింది చిట్టి గుల్జార్ కవిత చూడగానే మళ్ళీ ఆ అమ్మాయి ముఖం కళ్ళ ముందు నిలిచింది.

కాశ్మీరు నించి వచ్చిన పండిట్‌లు
తమ పేరుతో ఇంటికి ఉత్తరాలు రాస్తుంటారు
తాము వదిలివచ్చిన ఇంటికి కనీసం
ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉంటారని!

gulzar

కాశ్మీరు లోయ

ఎంతో ఉదాశీనంగా ఉంటుంది ఈ లోయ
ఎవరో వేలితో బలవంతంగా గొంతుని నొక్కిపెట్టినట్టు

ఇది ఊపిరి తీసుకోవాలి, కానీ ఊపిరి అందనీయనట్టు!

మొక్కలు మొలవడానికి ఎంతో ఆలోచిస్తూ అనుమానపడుతుంటాయి
మొదట పెరిగిన తల అక్కడికక్కడే తీసివేయడుతుందని
మబ్బులు తలలు వంచుకుని వెళ్తుంటాయి, నపుంసకుల్లా

వాటికి తెలుసు రక్తపు మరకల్ని కడిగివేయడం తమకి చేతకాదని!

చుట్టూ పరిసరాల్లో పచ్చదనమే కానీ, గడ్డి మాత్రం ఇప్పుడు పచ్చగా లేదు
బుల్లెట్లు కురిసిన గాయాలనించి ఇంకా భూమి కోలుకోనేలేదు!
ఎప్పుడూ వచ్చే వలస పక్షులన్నీ
గాయపడిన గాలికి భయపడి వెనుతిరిగి పోయాయి
ఎంతో ఉదాశీనంగా ఉందీ లోయ.. ఇది కాశ్మీరు లోయ!
* *
మూలం:

Vaadii-E-Kashmiir

Badii udaas hain vaadii
Galaa dabaayaa huaa hain kisii ne ungalii se

Ye saans letii rahen, par ye saans le na sake!

Darakht ugate hain kuch soch-soch kar jaise
Jo sar uthaayegaa pahale vahii kalam hogaa
Jhukaa ke gardane aate hain abr, naagim hain

Ki dhoyen jaate nahii khoon ke nishaan un se!

Harii-Harii hain, majar ghaans ab harii bhii nahii
Jahaan pe goliyaan barsii, jamiin bharii bhii nahin
Vo migratory panchii jo karate the
Vo saare jakhmii hawaavon se dar ke laut gaye

Badii udaas hai vaadii – ye vaadii-E-Kashmiir!!

————————————-
చిత్రం: సత్యా సూఫీ

….ఇవన్నీ ఏమైపోతాయి!?

satya

Art: Satya Sufi

ఒకప్పుడు.. చాన్నాళ్ళ క్రితం పుస్తకాల షాపుకి వెళ్ళడమంటే చెప్పలేని ఉత్సాహం. దాచుకున్న పాకెట్‌మనీని ఒకటికి పదిసార్లు లెక్కపెట్టుకుని, కొనాల్సిన పుస్తకాల జాబితాని అరడజను సార్లైనా సరిచేసీ… తీరా అక్కడికెళ్ళాక ఇంకొన్ని పుస్తకాలు నచ్చేసీ, ఏది కొనాలో ఏది వాయిదా వేయాలో తేల్చుకోలేక అక్కడే అదేపనిగా తచ్చట్లాడిన పుస్తకాల రాక్‌లు గుర్తొస్తుంటాయి అప్పుడప్పుడూ!
కొత్త వాసనతో పెళపెళలాడే పేజీలు తిప్పుకుంటూ ఆ పుస్తకాల్ని చదవుకోవడం ఇంకో అనుభవం.. మనమూ, మన పుస్తకమూ తప్ప ఇంకేదీ ఉండని సమయాలూ, ప్రదేశాలూ వెదుక్కుని ఆ అక్షరాల్లో తప్పిపోవడం గమ్మత్తుగా ఉండేది.
పుస్తకమంటే ప్రాణం అయితే అది ఏ రూపంలో ఉన్నా ఇష్టం గానే ఉంటుంది.. కాయితమైనా, కంప్యూటర్ స్క్రీన్ అయినా!
కాకపోతే ఇప్పుడంతా ఇన్‌స్టెంట్… ఎదురుచూడటమంటే మహాపరాధం చేసినట్టే! ప్లానింగులూ, షాపింగులూ అనే ప్రోసెస్ ఆప్టిమైజ్ చేశేయబడి ఒక క్లిక్ లో మన కళ్ళ ముందు ఉంటుంది.
అయినా పెద్ద తేడా ఏం కనబడదు.. ఎలక్ట్రానిక్ బుక్ రీడర్ అయినా చేతిలో ఇమిడి పోయే ఒకలాటి అచ్చు పుస్తకమే!
వెల్లకిలానో లేక బోర్లానో పడుకునీ ప్రబంధ నాయికలా వేలికొసలతో వాలుజడని తిప్పుకుంటూ ఒక్క రీడర్‌తో బోల్డన్ని పుస్తకాలు చదివేసుకోవచ్చు!

కాకపోతే ముందుపేజీ తిప్పి అపురూపంగా చూసుకుంటే మన పేరో లేక ‘ప్రేమతో…’ అంటూ మనకిచ్చిన వారి పేరో కనబడదు! ఇంకా, గుల్జార్ అన్నట్టు చదువుతూ ఉంటే మధ్యలో ఉన్నట్టుండి నెమలీకలూ, ఎండిన పూలరేకుల జ్ఞాపకాలు రాలి పడవంతే!

 

gulzar

 

పుస్తకాలు

మూసిన అల్మరా అద్దాల్లోంచి తొంగి చూస్తుంటాయి పుస్తకాలు
చాలా నిరాశతో తదేకంగా చూస్తుంటాయి
నెలల తరబడి కలవనే లేదు
ఒకప్పుడు వాటి సమక్షంలో గడపబడే సాయంత్రాలన్నీ ఇప్పుడు తరచుగా
కంప్యూటర్ తెర మీదనే గడచిపోతున్నాయి!
ఎంతో అసౌకర్యంగా కదులుతుంటాయి ఆ పుస్తకాలు
వాటికిప్పుడు నిద్రలో నడిచే అలవాటు మొదలైపోయింది

చాలా నిరాశతో తదేకంగా చూస్తుంటాయి

అవి వినిపించే విలువలకి
ఎన్నడూ బ్యాటరీ అయిపోవడమనేది ఉండదు
ఏ బంధాల గురించి వివరించాయో
అవన్నీ విడివడి తెగిపోయాయి
ఏదైనా పేజీ తిప్పినప్పుడు ఒక నిట్టూర్పు వెలువడుతుంది
ఎన్నో పదాలకి అర్ధాలు రాలి పడిపోయాయి
ఆకులు రాలి, మోడు బారిన కొమ్మల్లా మిగిలాయి ఆ మాటలన్నీ ఇప్పుడు
వాటి మీద ఏ అర్ధాలూ మొలకెత్తవు!
ఎన్నో పరిభాషలున్నాయి
అవన్నీ పగిలిన మట్టి కుండల్లా చిందరవందరగా పడి ఉన్నాయి
ఒక్కొక్క పేజీ తిప్పినప్పుడల్లా
కొత్త రుచి ఏదో నోటికి తగిలిన అనుభూతి!
ఇప్పుడొకసారి వేలితో నొక్కగానే
ఓరచూపు మేరలో స్క్రీన్ మొత్తం పొరలు పొరలుగా బొమ్మలు పరుచుకుంటాయి
పుస్తకాలతో ఆ వ్యక్తిగత అనుబంధం తెగిపోయినట్లే ఉంది
ఒకప్పుడు వాటిని గుండెల మీద పరుచుకుని నిద్రలోకి జారుకునేవాళ్ళం
లేకపోతే ఒడిలో దాచుకునో
లేక మోకాళ్ళని బుక స్టాండ్ చేసుకుని

ఏదో ఒక దీర్ఘ పూజలో ఉన్నట్టు.. ఇంచుమించు నుదుటిని తాకిస్తూ.. తలలు వంచుకుని చదివేవాళ్ళం!

అ ప్రపంచ జ్ఞానం అంతా ఇప్పటికీ ఏదోరకంగా లభిస్తూనే ఉందనుకో
కానీ,
ఆ పేజీల మధ్యలో ఉన్నట్టుండి పలకరించే ఎండిన పూలూ, పాత ఉత్తరాల పరిమళాలూ,
పుస్తకాలు ఇచ్చిపుచ్చుకుంటూ కావాలని జారవిడిచీ,
కలిసి తీసుకునే నెపం మీద నిర్మించుకునే కొత్త బంధాలూ
ఇవన్నీ ఏమైపోతాయి!?
అవన్నీ ఇక మిగిలుండవేమో!?!?
 * *
మూలం:

Kitaaben

~

Kitaaben jhaankti hain band almaari ke sheeshon se
badi hasrat se takti hain
maheenon ab mulaqaaten nahin hoti
jo shaamen un ki sohbat main kataa karti thi,ab aksar
guzar jaati hain computer ke pardon par
badi bechain rehti hain kitaaben
Unhe ab neend mein chalne ki aadat ho gayi hai
badi hasrat se takti hain

jo qadren woh sunaati thi
ki jin ke cell kabhi marte nahin the
woh qadren ab nazar aati nahin ghar mein
jo rishte woh sunaati thi
woh saare udhde udhde hain
Koi safha palatTa hun toh ek siski nikalti hai
kayi lafzon ke maani gir pade hain
bina patton ke sookhe tund lagte hain woh sab alfaaz
jin par ab koi maani nahin ugte
bahut si istelaahen hain.
Jo mitti ke sakoron ki tarah bikhri padi hain
gilaason ne unhen matrook kar dala

zabaan par zaaiqa aata tha jo safhe palatne ka
ab ungli click karne se bas ek
jhapki guzarti hai
bahut kuchh tah-b-tah khulta chala jaata hai parde par.

Kitabon se jo zaati raabta tha kat gaya hai
kabhi seene pe rakh ke lett jaate the
kabhi godi mein lete the
kabhi ghutnon ko apne rahl ki soorat bana kar
neem sajde mein padha karte the, chhoote the jabhee se.

Woh saara ilm toh milta rahega aainda bhi
magar woh jo kitaabon mein mila karte the sookhe phool aur
mehke hue ruqe
kitaaben maangne, girne, uthaane ke bahaane rishte bante the
un ka kya hoga ?
woh shayad ab nahin honge. !!

———————-

‘కాస్త దూరం జరగవూ?’

 

అది ఏ కాలమూ, ఏ సమయమూ అని పట్టించుకోవాలనిపించని సందర్భాలు కొన్ని ఉంటాయి. పక్కన నువ్వున్న స్పృహ తప్ప ఇంకేదీ తెలీని, అక్కర్లేని సందర్భాలవి!

అలసటతోనో, బద్దకంగానో చేరువలో ఒత్తిగిల్లి ముడుచుకుంటున్న నిన్ను చేతులు చాచి, తపనగా మెడవంపులో తలని దాచుకున్నప్పుడు… మాటలు అక్కర్లేని ఇష్టంతో అరచేతిలో ముద్దు పెట్టుకోవాలని వున్నప్పుడు, ఇంచుమించు అప్పుడే,

రాబోయే కలల సంకేతాలతో బరువెక్కిన కళ్ళని మెల్లగా తెరిచి నువ్వు నవ్విన చప్పుడు!

కేవలం అప్పుడు మాత్రమే, వెంట్రుకల్లోకి మృదువుగా వేళ్ళు జొనిపి  అపురూపంగా దూరం జరపాలనిపిస్తుంది! చేతుల మధ్యనున్న వసంతాన్ని పక్కన కూర్చోబెట్టుకుని నిశితంగా పరికించాలనిపిస్తుంది!

వెన్నెల తారట్లాడే ముఖాన్ని, దానిపై కదలాడే ఒక పసినవ్వునీ అప్పటికప్పుడు చూడకుండా ఉండలేని నిస్సహాయతతో వేడుకుంటుంటాను, ‘కాస్త దూరం జరగవూ?’

 

 

దూరం:

నీ తల ఒత్తిడి వల్ల దిండు మీద పడ్డ ఆకృతి ఇంకా అలానే ఉంది

తేమతో కూడిన నీ శరీరపు సువాసన దుప్పట్లో తేలియాడుతోంది
చేతుల్లో కదలాడుతున్న నీ మోము పరిమళం

నా నుదుటిపైన నీ పెదవుల కదలికలు

ఇంతలా దగ్గరైతే ఇక నిన్నెలా చూశేది?

కాస్తంత విడిపడ్డావనుకో నీ ముఖాన్ని చూడగలను!

Phaasala:

Takiye pe tere sar ka woh tippa hai, pada hai

Chaadar mein tere jism ki woh saundhi si khushbu

Haathon mein mehekta hai tere chehre ka ehsaas 

Maathe pe tere honto ki mohar lagi hai

 

Tu itni qareeb hai ki tujhe dekhun to kaise

Thodi si alag ho to tere chehre ko dekhun 

 

****************

gulzar

ఇంటినిండా సర్దినవీ, సర్దాల్సినవీ వస్తువులూ, పుస్తకాలూ, బట్టలూ… అన్నీ నీ చేత ఎంపిక చేయబడినవే! నువ్వూ, నీ వెంటే నీ ఊపిరీ కదిలెళ్ళిపోయాయి కానీ, నీ దేహపు జాడలింకా చుట్టూ ఉన్నట్లే ఉంది. పసుపు గులాబీ చెట్టు నాటుతూ, మధ్యలో ఆసరా కోసమనుకుంటా పక్కనే ఉన్న తెల్లగోడని పట్టుకున్నావు. పూచిన పూల వంక చూద్దామనే అనుకుంటాను కానీ, గోడ మీద మిగిలిన నీ చేతి మరకల నించి అస్సలు మళ్ళించలేను కళ్ళని!

నువ్వు వెళ్ళేరోజు విడిచివెళ్ళినవో, లేక వేసుకుందామని వదిలి వెళ్ళినవో మరి ఆ దుస్తులన్నీ ఉతికి శుభ్రం చేసి, తగిలిస్తుంటాను.. వాటి మీద దీపావళి రాత్రి అంటుకున్న నల్లటి చారిక మాత్రం అంతకంతకూ చిక్కబడుతోంది!

ఏ రోజు ఏ పూట అయినా నువ్వొచ్చి ‘ఇదేంటి ఇల్లంతా!?’ అని గదమాయిస్తావని ఏవో సర్దుదామనీ, అంతా శుభ్రం చేద్దామనీ అనుకుంటాను కానీ, బాల్కనీలో, మంచం మీదా, వంటింటి పాత్రల నిండా ఉన్న నిశ్శబ్దాన్ని మాత్రం తుడిచేయలేక పోతున్నాను.

మొత్తం కొల్లగొట్టబడింది… నా లోపలి నించో? ఇంటి లోపలి నించో?

 

 

బట్టలు:

నా బట్టల మధ్యలోనే తగిలించి ఉంటాయి నీ అందమైన రంగురంగుల బట్టలు

ఎప్పుడూ నేనే ఇంట్లో వాటిని ఉతికి, ఆరవేసి, ఆ తర్వాత

నా చేతులతో స్వయంగా ఇస్త్రీ చేస్తాను కానీ,

వాటి ముడుతలు ఎంత ఇస్త్రీ చేసినా పోనే పోవు

అదే కాదు, ఎంత ఉతికినా గతంనాటి మనోవేదనల మచ్చలు వదలనే వదలవు!

జీవితం ఎంత సులభమయ్యేదో కదా

ఒకవేళ ఈ బంధాలన్నీ దుస్తుల్లా ఉండి ఉంటే

షర్ట్ మార్చినట్టు ఎప్పటికప్పుడు మార్చుకోగలిగితే!

 

 

Libaas:

Mere kapdon mein taanga hain tera khushrang libas

Ghar pe dhota hun har bar main use, aur sukha ke phir se,

Apne haathon se use istrii kartaa hun magar,

Istrii karne se jaathii nahin shikne uskii,

Aur dhone se jile-shikvon ke chikatte nahin mitthe

Jindagii kis kadar aasaan hothii

Rishte gar hote libaas —

Aur badal lete kamiijon kii tarah!

——————

Artwork: Satya Sufi

ఈ అలవాట్లు కూడా ఎంత చిత్రమైనవో!

 

తలుపులన్నీ తెరిచి ఉన్నా బయటకి ఎగిరివెళ్ళక లైటు చుట్టూనే రెక్కలు తపతప కొట్టుకుని కొట్టుకుని మరణిస్తాయి కొన్ని పురుగులేవో!

విషాదం లోంచీ, నొప్పుల్లోంచీ, చీకటి వలయాల్లోంచీ నడుస్తూ ‘అబ్బా, ఈ ఊపిరాగిపోతే బాగుండు!’ అని విసుగ్గా అనుకుంటూనే తెలీకుండా ఇంకాస్త గట్టిగా శ్వాస తీసుకుంటాం!

పోరాడీ పోరాడీ విరిగిన రెక్కలతో, రాలుతున్న పూవులని చూస్తూ కూడా మరుసటి రోజుకి మొగ్గల్ని యధాలాపంగా లెక్క వేసుకుంటాం!
కరుకు కాలాల బారినుండి అతిరహస్యంగా తప్పించుకుందామనుకుంటూనే అవసరంగానో, అప్రయత్నంగానో మళ్ళీ మంచి ఘడియలేవో దరిదాపుల్లోనే ఉన్నాయనుకుంటూ అక్కడే ఆగిపోతాము..
అలవాట్లు నిజంగానే చాలా విచిత్రమైనవి! బహుశా, ఇవే కొన్నిసార్లు మనుషుల్ని చీకట్లో సైతం వెలిగించగలుగుతాయి!

* * *

అలవాట్లు

ఊపిరి తీసుకోవడం కూడా ఎలాంటి అలవాటో!

బ్రతుకుతూ ఉండటం కూడా ఒక తంతులాంటిదే

ఎలాంటి శబ్దాలు లేవు శరీరంలో ఎక్కడా కూడా

ఏ నీడలూ లేవు కళ్ళల్లో

అడుగులు తడబడుతున్నాయి, నడక మాత్రం ఆగదు

ఈ ప్రయాణం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది

ఎంత కాలం నించో, ఎన్ని ఏళ్ళుగానో

జీవిస్తూ ఉన్నాము, జీవిస్తూనే ఉన్నాము

ఈ అలవాట్లు కూడా ఎంత చిత్రమైనవో!
satya
మూలం:
Saans Lena Bhi Kaisi Aadat Hai
Jiye Jaana Bhi Kyaa Ravaayat HaiKoi Aahat Nahin Badan Men Kahin
Koi Saaya Nahin Hai Aankhon MenPaanv Behis Hain, Chalte Jaate Hain
Ik Safar Hai Jo Bahta Rahta HaiKitne Barson Se, Kitni Sadiyon Se
Jiye Jaate Hain, Jiye Jaate Hain

Aadaten Bhi Ajeeb Hoti Hain

*

painting: Satya Sufi

చెట్లు చెప్పేస్తాయి మన రహస్యాలన్నీ!

ఎండా, వాన ఏదో ఒకటి ఎక్కువలో ఎక్కువై, ఎలా తలదాచుకోవాలో తెలీనప్పుడు మనకోసమని నేలతల్లి తెరిచి ఉంచిన పచ్చని గొడుగులే చుట్టూ ఉన్న చెట్లన్నీ!
తరతరాల జ్ఞాపకాలనీ, అనుభవాలనీ మొదట్లో దాచేసుకుని గలగలమంటూ ఆకులూ, పువ్వులూ, పళ్ళతో పలకరిస్తుంటుంది.. కురవకుండా మారాం చేసే మబ్బుల్ని బుజ్జగించడానికన్నట్టు గాలి తెరలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంటాయి!
రోజూ వచ్చి వెళ్ళే దారిలో మరెన్నో నేస్తాలయి కూర్చుంటాయి.. దగ్గరకి వెళ్ళీ వెళ్ళగానే కొన్ని భళ్ళున నవ్వుకుంటూ, ఇంకొన్ని చిరునవ్వులతోనూ పూలో ఆకులో జల్లుతాయి.
ఏదో పనిమీద బయట ఊరికెళ్ళి, తిరిగొచ్చినప్పుడు వీధి మొదట్లోనో, గేటు ఎదురుగానో ఉండే చెట్టు కనిపించకపోతే!?!?
కాల్చేసే ఎండల్నీ, కొరికి నమిలేసే చలినీ, ఈదురుగాలుల్నీ గుంభనంగా భరించి, మనకి మాత్రం విరామం, శాంతి మాత్రమే చూపించే చెట్లు మనిషి ముందు పూర్తిగా తలవంచుతాయి.. ఎదుర్కోలేని నిస్సహాయతతో స్థాణువై మిగిలిపోతాయి!
ఎప్పటికప్పుడు ఆకుల్ని, పువ్వుల్నీ నేలతల్లికి నైవేద్యంగా సమర్పించుకుంటున్నా నిలువ నీడ ఇవ్వనందుకు విస్తుపోతుంటాయి.
ఎక్కడో చదివాను, ప్రముఖ నగరంలో ప్రముఖ ప్రభుత్వాధికారి చెప్పిన మాటలు… ‘ఎక్కడ స్థలం ఉంటే అక్కడ చెట్లు నాటండి ‘ అని!
చెట్లూ, చేమలూ నరికి నగరాలు నిర్మించి… ఇప్పుడు చెట్లు నాటడానికి స్థలం వెదకడం…… ఐరానిక్ కదా!!

gulzar

పచ్చని క్షణాలు
అలసిపోయిన తెల్లని గద్ద కిందకి దిగుతూ
కొండలకి చెప్తూ ఉంటుంది

ఒకనాటి చెట్లకి సంబంధించిన గడచిపోయిన కొన్ని కధలని!

అక్కడొక పొడవాటి దేవదారు చెట్టు ఉండేది, ఒకప్పుడు
అది మబ్బులని చుట్టి ఆకులకి తలపాగా పెట్టేది
లేదంటే వాటిని శాలువాలా చుట్టూ కప్పుకునేది
గాలిని పట్టి ఆపి,
అప్పుడప్పుడూ ఊగుతూ, ఆ తెరలతో చెప్పేది,

‘నా కాళ్ళు వేళ్ళల్లో బంధించబడి ఉండకపోతే, నేనూ నీతోనే వచ్చేసేదాన్ని!’

ఆపక్కన కీకర్ చెట్టుకి అవతలే రోజ్‌వుడ్ చెట్టు ఉండేది
ఎప్పుడూ కీచులాడుకుంటూనే ఉండేవి ఆ రెండూనూ!
ఆసలు సంగతేంటంటే.. కీకర్ కి ఈర్ష్య, రోజ్‌వుడ్ పొడవు చూసి!
రోజ్‌వుడ్ ఆకులగుండా గాలి ఈలలు వేసినప్పుడల్లా

కొమ్మలమీద కూర్చున్న పక్షులన్నీ అనుకరించేవి!

అక్కడ ఒక మామిడి చెట్టు కూడా ఉండేది
దాని దగ్గరకి ఒక కోయిల ఎన్నాళ్ళనించో వస్తూ ఉండేది,
మామిడిపూత కాలం వస్తూనే!
దగ్గర్లోనే కొన్ని గుల్మొహర్ చెట్లు కూడా ఉండేవి, వాటిలో ఒక్కటే ఇప్పుడు మిగిలింది
అది తన శరీరంపైన చెక్కబడిన పేరుల బాధని సహిస్తూ నించుని ఉంటుంది!
అక్కడే ఉండేది వేపచెట్టు కూడా
వెన్నెలతో అసాంతం ప్రేమలో మునిగి..

అ మత్తులో దాని ఆకులన్నీ నీలమై మిగిలేవి!

కాస్తంత దూరం వెళ్ళగానే, ఆ పక్క కొండ మీద
బోల్డన్ని పొదలు ఉండేవి, బరువాటి గుసగుసల శ్వాస తీసుకుంటూ
కానీ, ఇప్పుడొక్కటి కూడా కనిపించండం లేదు, ఆ కొండ మీద!
ఎప్పుడూ చూడలేదు కానీ, అందరూ చెప్పుకుంటుంటారు,ఆ లోయ ఆత్మీయతని అంటిపెట్టుకుని
పెద్ద మర్రిచెట్టుని మించిన చంపా చెట్టు ఒకటి ఉండేది
ఎక్కడ గాటు పెట్టినా, అక్కడనించి పాలవంటిది ఏదో స్రవిస్తూ వుండేది

ఎన్నో ముక్కలుగా మారిపోయి పాపం అది ఆ అడవినించి తరలిపోయింది!

ఆ తెల్లటి గద్ద మోడై మిగిలిన చెట్టు మీద కూర్చుని
కొండలకి చెప్తూ ఉంటుంది

ఒకనాటి చెట్లకి సంబంధించిన గడచిపోయిన కొన్ని కధలని!

ఈ తెలివితక్కువ మనిషి
నరికి, కూల్చి, ముక్కలుగా మార్చి, కాల్చి వేసిన చెట్ల గురించి చెప్తూ ఉంటుంది!

మూలం: Sabz Lamhe

Safedi cheel jab thak kar kabhi niche utarti hain
Pahado ko sunati hai
Purani dastaan pichle pedo ki!

Wahan deodar ka ek unche kad ka, pedh tha pehle
Woh badal baandh leta tha kabhi pagdhi ki surat apne patto par
Kabhi doshale ki surat usi ko ordh leta tha~
Hawa ki tham ke bahe~
Kabhi jab jhumta tha, use kehta tha,
Mere pao agar jakrhe nahi hote, mein tere saath hi chalta!

Udhar sheesham tha, kikar se kuch aage
Bahut larhte the woh dono~
Magar sach hai ki kikar uske uche kad se jalta tha~
Surili sitiyan bajti thai jab sheesham ke patto mein,
Parinde beth kar shaakhon pe, uski nakle karte the

Wahan ek aam bhi tha,
Jis par ek koyal kahi barso tak aati rahi~
Jab bor aata tha.
Udhar do teen the jo gulmohar, ab tak baki hai,
Woh apne jism par khode hue namo ko hi sehlata rehta hai
Udhar ek neem tha
Jo chandini se ishq karta tha
Nashe mein nili padh jati thi saari pattiyan uski.

Zara aur us taraf parli pahadi par,
Bahut se jhadh the jo lambi-lambi saanse lete the,
Magar ab ek bhi dikhta nahi hai, us pahadhi par.
Kabhi dekha nahin, sunte hai, us waadi ke daman mein,
Bade barghad ke ghere se badi ek champa rehti thi,
Jahan se kaat le koyi, wahi se dudh behta tha,
Kayi tukdho mein bechari gayi thi apne jungle se!

Safeda cheel ek sukhe huye se pedh par bethi
Pahadho ko sunati hai purani dastane unche pedho ki
Jinhe in past-kand insaan ne kaanta hai, giraya hai,
Kai tukde kiye hai aur jalaya hai!

*

చిత్ర రచన: సత్యా  సూఫీ 

 

మనుషుల్ని ప్రేమించడమెలాగో!

కంచెలూ, గోడలూ, కందకాలూ మనుషుల మధ్య బలవంతపు రేఖల్లానే ఉండిపోతాయి. ఏ సమాచారమైనా అందజేయడానికి ఈ ఎలక్ట్రానిక్ యుగంలో క్షణం పట్టదు.
కానీ, ఒక మనిషి ఇంకొక మనిషిని కలవాలంటేనే యేళ్ళు గడిచిపోతాయి.
ఆధునికత పెరుగుతున్న కొద్దీ భావోద్వేగాలు కూడా పెరుగుతున్నాయి. సరిహద్దు రేఖకి అటువైపు అంటేనే శత్రుపక్షమే, ఎదురుపడేది సమరానికే వంటి అల్పత్వమో, ఉన్మాదమో రాజ్యమేలుతున్నంతకాలం సరిహద్దు దాటాలనుకునే ఎన్నో కలలు అక్కడి ముళ్ళకంచెలకే చిక్కుకుపోయి వేళ్ళాడుతున్నాయి. భద్రతాదళాలు, పకడ్బందీ తనిఖీలలో ఎన్నోసార్లు మానవత్వం దొంగలించబడుతుంది. మాటలు భాషని కోల్పోతాయి!
మనుషులకి ఎవరు నేర్పగలరో, మనుషుల్ని ప్రేమించడమెలాగో!? ఎవరు చక్కగా వివరించగలరో ఆశల సమానత్వం గురించి!?
gulzar

తలుపు చప్పుడు:

తెల్లవారుఝామునే ఒక కల తలుపు తడితే తెరిచి చూశాను

సరిహద్దుకి అటువైపు నించి కొంతమంది అతిధులు వచ్చారు

ఎక్కడో చూసినట్లే ఉన్నారు అందరూ
ముఖాలన్నీ బాగా తెలిసినవాళ్ళవి లానే ఉన్నాయి
కాళ్ళూ చేతులూ కడిగి,
పెరట్లో విశ్రాంతిగా కూర్చోబెట్టి,

తందూర్ లో మొక్కజొన్న రొట్టెలు కొన్ని వేడివేడిగా చేశాము

మా అతిధులేమో గుడ్డసంచిలో

పోయినేడాది పంటతో చేసిన బెల్లం తెచ్చారు

కళ్ళు తెరుచుకున్నాక చూస్తే ఇంట్లో ఎవరూ లేరు
చేత్తో తాకితే మాత్రం తందూర్ ఇంకా వెచ్చగానే ఉంది

అదేకాక, పెదాల మీద తీయని బెల్లపు రుచి ఇప్పటికీ అతుక్కునే ఉంది

బహుశా కల అనుకుంటా! తప్పకుండా కలే అయి ఉంటుంది!!

సరిహద్దు దగ్గర రాత్రి, కాల్పులు జరిగాయని తెలిసింది
సరిహద్దు దగ్గర రాత్రి, కొన్ని కలలు హత్య చేయబడ్డాయని తెలిసింది!
మూలం:
Dastak

Subah subah ik khwab ki dastak par darwaza khola, dekha
Sarhad ke us paar se kuchh mehmaan aaye hain

Aankhon se maanoos the saarey
Chehre saarey sune sunaaye
Paanv dhoye, Haath dhulaye
Aangan mein aasan lagwaaye…
Aur tandoor pe makki ke kuchh mote mote rot pakaye

Potli mein mehmaan mere
Pichhale saalon ki faslon ka gud laaye the

Aankh khuli to dekha ghar mein koi nahin tha
Haath lagakar dekha to tandoor abhi tak bujha nahin tha
Aur hothon pe meethe gud ka zaayka ab tak chipak raha tha

Khwab tha shayad! Khwab hi hoga! !

Sarhad par kal raat, suna hai, chali thi goli
Sarhad par kal raat, suna hai kuchh khwaabon ka khoon hua hai

———————–

Painting: Satya Sufi

ఎగిరిపోతే బావుండని …!

తనపై కాసేపు సేదతీరి, తిరిగి దిగంతాలవైపు తరలిపోయే మేఘంలా మారాలని కొండ శిఖరాలూ..
తనని అణువణువునా తడిమి తడిపివేసే చినుకులల్లే చిందులువేయాలని ఆకుపచ్చ లోయలూ..
గలగలమని కబుర్లు చెప్తూనే తమని దాటి పరుగులు తీసే ప్రవాహంలా మారాలని సెలయేటి గులకరాళ్ళూ
బెంగగా నిస్సహాయంగా ఏ చీకటి రాత్రిళ్ళలోనో కంపించే ఉంటాయి!
ఈ కొండలూ, లోయలూ, చెట్లూ ఏళ్ళకి ఏళ్ళ తరబడి ఓరిమితో నిశ్చలంగా నిలబడి రాలే పువ్వులకీ, వాలే పక్షులకీ ఆశ్రయమిచ్చినా..
ఎదగని, ఒదగని అస్తిత్వం గుర్తొచ్చినప్పుడల్లా తమని చుట్టుముట్టి, స్పృశించే గాలుల్లోకి హఠాత్తుగా ఒరిగిపోయి,
ఎగిరిపోతే బావుండని కొట్టుకులాడిపోయే క్షణాలు కొన్ని తప్పక ఉండే ఉంటాయి!
gulzar
పచ్చపూల చెట్టు:

 

వెనకాల కిటికీ తెరిచినప్పుడల్లా కనపడుతుండేది
అక్కడొక పచ్చపూల చెట్టు.. కాస్తంత దూరంగా, ఒంటరిగా నిలబడి
కొమ్మలన్నీ రెక్కల్లా చాపుకుని
అచ్చు ఒక పక్షి లానే!

ఊరిస్తుండేవి ఆ చెట్టుని రోజూ పక్షులన్నీ వచ్చి
తాము చేసొచ్చిన సుదూరాల ప్రయాణాల గురించి వినిపించీ,
తమ రెక్కల విన్యాసాలన్నీ అల్లరల్లరిగా గిరికీలు కొడుతూ ప్రదర్శించీ!
మేఘాల్లోకి రివ్వున దూసుకెళ్ళి చెప్తుంటాయి, చల్లగాలిలోని మహత్యమేమిటో!

రాత్రి తుఫాను గాలి సాయంతో బహుశా
తానూ ఎగరాలని ఆశపడిందో ఏమిటో
రోడ్డుకి అడ్డంగా, బోర్లా పడి ఉంది!!

 

మూలం:
Amaltas

Kidkii pichavaade kii khulthii to najar aataa thaa
Vah amalataas kaa ped, jaraa door akelaa-saa khadaa thaa
Shakhen pankhon ki tarah khole huye,

Ek parinde ki tarah!

Vargalaate the use roj parinde aakar
Jab sunaate the parvaaj ke kisse usko,
Aur dikhaate the use ud ke, kalaabaajiyaan khaa ke!

Badaliyaan choon ke bataate the, maje tandii hawaa ke!

Aandhii kaa haath pakaD kar shaayad,
Usne kal udne kii koshish kii thii
Aundhen munh beech sadak jaake giraa hain!!

—————–

ఎప్పుడైనా ఆత్మని చూశావా?

 

 

అసలు కళ్ళతో చూడగలమా? లేక గుప్పిళ్ళతో అందుకోగలమా??

మనల్ని మనం తనువుగా త్యజించడమా? లేక మనలోని మనల్ని స్పృశించగలగడమా??

ఎలా, ఎక్కడ చేజిక్కించుకోవడం ఆత్మని!?

ఆలోచలన్నీ ఆవిరైపోయి ఖాళీ మట్టికుండలా మనసు మిగిలినప్పుడు.. అప్పుడు అవగతమవుతుందా ఆత్మ అనే పదార్ధం!?

అలా కాకుంటే,

సముద్ర తుఫానులో చిక్కుకున్నట్టు ఆధ్యాత్మిక సందేహాలలో మునిగి, విసిగి, అలసి, దిక్కుతోచని దాహంతో చేష్టలుడిగినప్పుడు, దారి తప్పినప్పుడు మనపైకి వంగి కురిసే వానజల్లేనా ఆత్మంటే!?

నా మట్టుకు నాకు,

ప్రపంచం సాయంత్రాన్ని సిగలో ముడుచుకునే వేళల్లో.. పూలు గుచ్చుకుంటూనో లేక తల వంచుకుని ఒక కవిత రాసుకుంటూనో.. నాలోంచి నన్ను కొద్దిగా పక్కన బెట్టేసుకునే క్షణాల్లో… ఆ కాస్త నేను అరణ్యాలూ, అనంతాకాశాలూ చుట్టివచ్చేసే పయనాల్లో… అభావంతో ఆనందం మమేకమైనప్పుడు… జననమూ, మరణమూ మధ్యలో నేను అనబడే ఒక సంరంభం సంభవిస్తుందని అర్ధమైనప్పుడు… అప్పుడే అనుకుంటా, నాకు ఆత్మ అనేదేదో ఉందనిపిస్తుంది!

gulzar

 

ఎప్పుడైనా ఆత్మని చూశావా?

 

ఆత్మని చూశావా, ఎప్పుడైనా ఆత్మని అనుభూతి చెందావా?
సజీవంగా కదిలి మెదిలే పాల తరకల తెల్లదనపు పొగమంచులో చిక్కుకుని
శ్వాస తీసుకునే ఈ పొగమంచుని ఎప్పుడైనా స్పర్శించావా?

పోనీ, పడవ ప్రయాణంలో ఒక సెలయేటి మీద రాత్రి పరుచుకుంటూ
ఆపైన నీటి అలల తాకిడితో చప్పట్లు మోగిస్తున్నప్పుడు
వెక్కిళ్ళు పెడుతున్న గాలి ఉఛ్ఛారణ ఎప్పుడైనా విన్నావా?

వెన్నెల రాత్రి పొగమంచులో జాబిలిని అందుకోవడానికి
బోల్డన్ని నీడలు పరుగులు పెడుతున్నప్పుడు
నువ్వు తీరాన ఉన్న చర్చి గోడలని ఆనుకుని
నీ పొట్టలోనించి వస్తున్న ప్రతిధ్వనులని అనుభవించావా?

ఈ శరీరం, వందసార్లు కాలినా కానీ అదే మట్టిముద్ద
ఆత్మ ఒక్కసారి జ్వలిస్తే చాలు అది మేలిమి బంగారమే!
ఆత్మని చూశావా, ఎప్పుడైనా ఆత్మని అనుభూతి చెందావా?

 

మూలం:

Rooh daekhi hai, kabhi rooh ko mahsoos kiya hai?

Jaagate jeete hu e doodhiya kohre se lipatkar
Saans lete hu e is kohare ko mahsoos kiya hai?

Ya shikaare mein kisi jheel pe jab raat basar
aur paani ke chapaakoon pe baaja karti hon taliyaan
subkiyaan leeti hawaoon ke kabhi bain sune hain?

Chodhaveen raat ke barfaab se ek chaand ko jab
dher se saaye pakarne ke liye bhaagate hain,
tum ne saahil pe khare girje ki deewar se lagkar
Apni gahnaati hui kokh ko mahsoos kiya hai?

jism sau baar jale tab bhi wahi mitte ka dhela
rooh ek bar jalegi to woh kundan hogi

Rooh daekhi hai, kabhi rooh ko mahsoos kiya hai?

*

Painting: Satya Sufi