కిల్లా :కవిత్వంలాంటి సినిమా

 

కృష్ణమోహన్ బాబు

యువ  మరాఠీ దర్శకుడు, అరుణ్ అవినాశ్ ‘కిల్లా’ (కోట)  ధియేటర్ వదిలినా పదే పదే మనల్ని మర్చిపోని ఖమాజ్ రాగంలో పాడిన చక్కని కవిత్వంలాంటి సినిమా.  అరుణ్ కిది మొదటి  మరాఠీ సినిమా. కథ, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం అరుణే చేసి అన్ని విభాగాల్లోనూ ఆరితేరిన సీనియర్ కళాకారులను మించిన పనితనాన్ని చూపించాడు.  2015 వ సంవత్సరానికి మరాఠీ సినిమాలు ఏకంగా 5 జాతీయ అవార్డులు గెల్చుకుంటే, ‘కిల్లా’ సినిమా ఉత్తమ మరాఠీ చిత్రంగా, అందులో  నటించిన బాల నటుడు, అర్చిత్ దేవ్ ధర్ ప్రశంసాత్మక నటనకి ‘స్పెషల్  మెన్షన్ ‘ గా   రెండు అవార్డులు గెల్చుకుంది.  ఈ సినిమా అనేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో కూడా ప్రశంసలని, అవార్డులని అందుకుంది.

పదకొండేళ్ళ చిన్మయ్ తల్లి పూనా మహా నగరంలో  ప్రభుత్వ రెవెన్యూ డిపార్టుమెంట్ లో  ఒక చిన్న ఉద్యోగిని.  చిన్మయ్ తండ్రి పోయాక ప్రమోషన్ మీద ఆవిడ కొంకణ్ తీరంలో  వున్న ఓ మారు మూల గ్రామానికి బదిలీ అవుతుంది.  హడావిడిగా వుండే పూనా నగరం నుంచి  ఏ శబ్దాలూ లేని ఓ మారు మూల పల్లెటూరుకి రావటం  చిన్మయ్ ని చాలా చికాకు పరుస్తుంది.

ఇస్మాయిల్ ‘బదిలీ ‘ కవిత గుర్తుందా?

“బర బరా

ఈడ్చిన ట్రంకు పెట్టేలా

హృదయం క్షోభ పడింది.

ఇది

జరపడానికి చేసింది కాదు “

ఏ కుదుళ్ళలోనూ కుదురుకోలేని  జీవితం అంతా గందరగోళం.

స్కూలులో స్కాలర్ షిప్ వచ్చిన తెలివైన కుర్రాడిగా చిన్మయ్ ని టీచర్ పరిచయం చేస్తే, అంతంత మాత్రం చదువులతో అల్లరి చిల్లరిగా వుండే ఆ వూరి కుర్రాళ్ళ కది, అదో ఆకతాయి వ్యవహారంలా వుంటుంది.  ఎవరూ చిన్మయ్ తో  కలవడానికి పెద్దగా ఆశక్తి చూపరు.  పొద్దుటే స్కూలు దగ్గర దింపి వెళ్ళిన తల్లి, రాత్రి చీకటి పడ్డాక హడావిడిగా రావటం రోజువారీ దృశ్యం.  నగరం ఇచ్చిన వయసుకు మించిన పెద్దరికం , ఒంటరితనం , పూనా తాలూకు జ్ఞాపకాలు, అక్కడి మిత్రులు ఎవారితోనూ కలవకుండా చేస్తాయి.  తల్లితో నైనా విషయాలు పంచుకుందాం అంటే, ఆవిడ చికాకులు ఆవిడవి.  రెవెన్యూ డిపార్టుమెంట్ అంటే మగాళ్ళ ఆధిపత్యంలో చట్టపరంగా పనులు ఎలా జరగకూడదో చూసే అవినీతి సాలెగూడు.

సాలీడుకు దొరక్కుండా ఎలా రక్షించుకోవాలో  చూసుకోవాలో  తప్ప, గూడు వదిలి వచ్చే దారి లేదు.  తన కిష్టం లేకపోయినా తోటి  ఉద్యోగుల ఒత్తిడి మీద ఓ తప్పుడు పనిలో  తప్పక యిరుక్కున్న తల్లి, ఆ సమస్యని ఎలా దాటాలా? అని మథన పడ్తుంటే, ఇక చిన్మయ్ సంతోషంగా గడిపే క్షణాలు ఏముంటాయి?  ఒక రోజు తోటి కుర్రాళ్ళతో  సైకిలు పందెం వేసుకుని, వూరి చివర వున్న కోట దాకా వెళ్ళి యితర కుర్రాళ్ళు  వెళ్ళిపోయినా, అతను కోట లోనే  వుండిపోతాడు.  సముద్రపు అంచున వున్న ఆ కోట, చిన్మయ్ మానసిక స్థితిని ఎత్తి చూపించిందా అన్నట్టు, దారి ఎటో తెలియని కోట లోపలి  బాటలు, ఉరుములు, మెరుపులతో బయట కురుస్తున్న వర్షం, గొంతెత్తి అరచినా  ఎవరికీ వినబడని పిలుపు , చివరికి ఎలాగో అలాగ కోటలో నుంచి బయట పడ్డ తనలో గూడు కట్టుక్కున్న భయాల్ని అధిగమించడానికి తల్లి మీద చిన్నగా తిరగ బడటం మొదలు  పెడ్తాడు.

ఒక రోజు ఒక చేపలు పట్టే వాడితో కల్సి  పడవలో  మైళ్ళ దూరం సముద్రం మీద కు వెళ్ళి, తిరిగి వస్తానో రానో అనే భయం తో రాత్రి పొద్దు పోయాక  ఇల్లు చేరుకున్న తర్వాత ఉద్వేగానికి గురి అవుతాడు.  తన మీద తనకి వీటి నన్నిటి నుంచి కూడా బయట పడగలనని  నమ్మకం కలుగుతుంది.  తను వదిలేసిన తోటి కుర్రాళ్ళతో నెమ్మిదిగా  స్నేహం మొదలవుతుంది.  అయితే ఆఫీసులో తల్లి చేసిన తప్పు వాళ్ళ జీవితాలని మరో మలుపు తిప్పుతుంది.  అయితే తల్లికీ, కొడుక్కీ యిప్పుడా సమస్య లేదు.  సర్దుబాటుకి అలవాటు పడ్డారు.  తప్పదు. జీవితం అంతే.  పదే పదే వచ్చే సమస్యకి మొదట  భయం వుంటుంది.  తర్వాతర్వాత అదే అలవాటయి పోతుంది.

అరుణ్ అవినాశ్ సొంత అనుభవాలతో  రాసిన ఈ సినిమా స్క్రీన్ ప్లే  చాలా మందికి ఓ పాఠంలా పనికి వస్తుంది.  ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండు మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఈ సినిమాని మరో మెట్టు పైకి తీసుకెళ్తాయి.  విచిత్రం ఏమిటంటే సినిమాని ఓ డ్రామాగానో, మెలో డ్రామాగానో మలచడానికి  ప్రేక్షకుల్ని  కన్నీళ్ళు పెట్టించడానికి అనేక అవకాశాలు వున్నా, దర్శకుడు వాటి దరిదాపులలోకి  వెళ్ళడు.  ఎందువల్ల అంటే ఇది రోజువారీ జీవితం.  సమస్యలు చాలా వ్యక్తిగతం అయినవి.  అక్కడ డ్రామాతో పని లేదు.  ఆ విషయం సరిగా అవగాహన చేసుకోవటం  వల్లనే రెండో సినిమాతోనే  జాతీయ  స్థాయికి  ఎదిగాడు.

ప్రతీ పాత్ర ఎంతో శ్రధ్ధగా, చాలా ప్రేమతోటి తీర్చి దిద్దాడు.  అందుకే ఒక్క నిమిషం పాటు వచ్చే ప్రక్కింటి అమ్మమ్మ కూడా తెర మీద తన ఉనికిని చూపెట్టుకో గలుగుతుంది.  అర్చిత్ దేవ్ ధర్ మహా నటుల్ని తల దన్నెలా చేశాడు.  తల్లి, అమృతా సుభాష్ , తోటి  స్కూలు కుర్రాడిగా భలేరావ్ భంద్యా చక్కగా నటించారనటం చిన్న మాట.

ఈ సినిమా చూసిన తర్వాత చప్పుడు లేని సుదూర సముద్రపు ఒడ్డు, ఒంటరిగా నడిచి పోయే పీత, మసక దీపాల వెలుగులో, మనుష్యులు లేని పల్లె వీధుల్లో ఒంటరి గా తల్లి కోసం చూస్తుండే కుర్రాడు, అలలు ఎంత పెకిలిద్దామని చలించక గంభీరం గా  నిలిచిన కోట మన కలల్ని, ఆలోచల్ని పదే పదే తట్టి నిలబెట్టక పోతే  ఆశ్చర్య పోవాలి.  కొన్ని విషయాలని చిన్న చిన్న సజెషన్ ద్వారా  దర్శకుడు చాలా తెలివిగా చెప్తాడు.  ఎలా అంటే, తల్లి రోజూ ఇంటికి వర్షంలో చీకటి పడ్డాక గొడుగు వేసుకుని వస్తూ వుంటుంది.  కాని ఆఫీసులో  సమన్లు అందుకున్నప్పుడు మాత్రం వర్షంలో తడుసుకుంటూ వస్తుంది. నిర్మానుష్యమ్ గా వున్న సముద్రం ఒడ్డున చిన్మయ్ ఒంటరిగా కూర్చున్నుండగా సముద్రం నుంచి ఏ ఘోషా  వినబడదు.  ఒకే ఒక్క పీత మాత్రం గబగబా పాక్కుంటూ వెళ్తూ వుంటుంది.  రోజువారీ  సర్దుబాటే కష్టంగా వున్న పరిస్థితిలో ఒక రోజు చిన్మయ్ బడికి వెళ్ళేముందు, ఇంటి ముందు తల్లి కొన్న కొత్త సైకిలు వుంటుంది.  వ్యవస్థ తో తల్లి రాజీ పడిన దన్న విషయం చాలా సున్నితంగా చెప్తాడు దర్శకుడు.  ఇలా చాలా వున్నాయి.  అలాగే స్కూలు లో  పిల్లల మధ్య జరిగే కొన్ని విషయాలు మనల్ని చిన్నప్పటి స్కూలు రోజులకి తీసుకుపోతాయి.

గత ఆరేడు సంవత్సరాల నుంచి మరాఠీ, బెంగాలీ, మలయాళీ, తమిళ్ సినిమాల పరిశ్రమ నుంచి చాలా మంది కుర్రాళ్ళు, జాతీయంగా, అంతర్జాతీయంగా తమ సత్తాని చాటుకుంటూ అనేక మంచి సినిమాలని తీస్తున్నారు.  వీళ్ళందర్నీ చూసినప్పుడు  భారతీయ సినిమాకి, సంగీతానికి, సాహిత్యానికి మంచి రోజులు పోలేదని, ఈ పిల్లల చేతిలో  అవి మరింత అందాలు దిద్దుకుంటున్నాయని అనిపిస్తుంది.  ఖచ్చితంగా వీళ్లలో అరుణ్ అవినాశ్ ఒకడు.  రాబోయే “దృశ్యం”  హిందీ సినిమాకి  ఇతనే ఫోటోగ్రాఫర్.

 

*

 

 

 

 

 

 

 

 

ఈ కథల మేజిక్ అనుభవించి పలవరించాల్సిందే…

                                                                              కృష్ణమోహన్ బాబు

 

krishna mohan babu“బాబూ గిఖోర్ , నీకు కొన్ని విష యాలు చెప్పవలసివుంది.  ఇక్కడ పరిస్థితులు చాలా క్లిష్టంగా వున్నాయి.  పన్నుల కోసం మమ్మల్ని వత్తిడి చేస్తున్నారు.  మా దగ్గర డబ్బు లేదు.  మీ అమ్మకి , జాన్నీకి వేసుకోవడానికి బట్టలు లేవు.  నిజానికి బనీను గుడ్డల్లాంటివి వేసుకుని బతుకుతున్నాం.  మాకు కొంచెం డబ్బు పంపించు బాబూ.  నీ క్షేమం గురించి ఒక వుత్తరం కూడా రాయి.  ఆవు చచ్చిపోయింది.  మీ అమ్మకి, జాన్నీకి ఒళ్ళు కప్పుకోవడానికి ఏమీ లేదు.”

గిఖోర్ అనే కుర్రవాడికి  వూరి వాళ్ళ ద్వారా వాళ్ళ నాన్న పంపిన వుత్తరం యిది.  హువనేస్ తుమన్యాన్ “కథలు – గాథలు” అనే పుస్తకం లో ‘గిఖోర్ ‘ అనే కథ లోది. ఆర్మేనియన్ సాహితీ చరిత్రలో పెద్ద దిక్కుగా పేరు తెచ్చుకొన్న తుమన్యాన్.

ఫిబ్రవరి 19, 1869లో పుట్టాడు .  అప్పుడు  ఆర్మేనీయా రష్యన్ రాజారికం లో భాగం .  తుమన్యాన్ ని ఆర్మేనీయన్ జాతి సంపదగా కొల్చుకుంటారు.  ప్రతి యేడు ఏప్రిల్ లో అతనిని   గుర్తు చేసుకుంటారు .  ఇతను  తల్లి నుంచి కథలు చెప్పడం నేర్చు కున్నాడు.  12 యేళ్ళ కి మొదటి  కవిత్వం రాశాడు .  కవిత్వం, కథలు, జానపద కథలు, గాథలు అలా అన్ని రకాల ప్రక్రియల్లో పేరు సంపాదించాడు .  1923, మార్చ్ 23 న చనిపోయాడు.  ఈ పుస్తకం లో 6 కథలు, 9 జానపద గాథలు వున్నాయి.  ఈ పుస్తకం 40 యేళ్ళ క్రితం ఒకసారి సోవియట్ అనుబంధ సంస్థ  ‘ప్రగతి ప్రచురణాలయం’  వారు వేశారు.  దీనిని పి. చిరంజీవినీ కుమారి గారు తెలుగు లోనికి తీసుకు వచ్చారు. నవచేతన్ పబ్లిషింగ్ హౌస్, హైదారాబాద్ వారు ఈ మధ్యనే ఈ పుస్తకాన్ని మళ్ళీ అచ్చువేశారు.

ఇందు లో మొదటి కథ ‘గిఖోర్ ‘.  ఒక బీద రైతు, తన 12 యేళ్ళ కుర్రాణ్ని, బతుకు తెరువు తెలుస్తుంది, పని నేర్చు కుంటాడనుకొని, పట్నం లో షావుకారు దగ్గర జీతభత్యాలు లేని పనివాడుగా పెడతాడు.  ‘ముక్కుపచ్చలారని బిడ్డని నీతి, న్యాయం లేని ఈ ప్రపంచం లోనికి తోసేయడానికి వీలులేదని’ వాళ్ళ అమ్మ ఏడుస్తుంది.  తన పరిస్థితి ఎలాగూ దుర్భరంగా వుంది.  కనీసం కొడుకైనా ఏదో

ఒక పని నేర్చుకుని కుటుంబాన్ని ఆదుకోపోతాడా అన్నది రైతు ఆశ.    ఈసడింపులు, తిట్లు, చివాట్లు మధ్య అతి హీనమైన పరిస్థితులలో ఆ కుర్రాడు షావుకారు దగ్గర వుంటాడు.  వెనక్కి వెళ్ళడానికి వీలు లేని పరిస్థితులు.   తన వాళ్ళెవరినీ తిరిగి చూడకుండానే కొద్ది కాలంలోనే  ఆ కుర్రాడి జీవితం కడతేరిపోతుంది.  చెల్లెలి కోసం పోగు చేసిన మెరుస్తున్న బొత్తాలు, రంగురంగు కాగితం ముక్కలు, పిన్ను సూదులు, బట్టల తాన్ల పీలికలు మిగులుతాయి.  1894 లో వచ్చిన ఈ కథ తర్వాత రష్యన్ సినిమాగా కూడా వచ్చింది.  ఇది ‘యూ ట్యూబ్ ‘ లో కూడా వుంది.   ఇది ఈ రోజుకీ నడుస్తున్న కథే.   ఇప్పటికీ ఒక్కసారి బయటికి తొంగి చూడండి.  పిల్లల్ల్ని మోస్తూనో, నౌకర్లు గానో, కాఫీ హోటళ్ళలో బల్లలు తుడుస్తూనో, నాశనమవుతున్న పల్లె జీవితాల నుంచి పట్టణకీకారణ్యంలో  పడ్డ గిఖోర్లు అన్ని చోట్లా  కనబడుతూనే వుంటారు.

రెండో కథ ‘నా నేస్తం  – నెస్సో.’   చిన్నతనంలో ఏ తారతమ్యాలు లేకుండా ఆడుకోవడమే జీవిత లక్ష్యంగా ప్రాణానికి ప్రాణంగా పల్లెటూరిలో పెరిగిన ఒక కుర్రాళ్ళ గుంపు.  ఆ గుంపులో నెస్సో ఒకడు.  వేసవి వెన్నెలలో నెస్సో మిగతా

కుర్రాళ్ళకి ఎన్నెన్నో కథలు చెప్పేవాడు.  అప్సరసల గురించి , రత్నాల పక్షి గురించి, గుడ్డి రాజు గురించి. మిగతా కుర్రాళ్ళంతా వాడి కథల కోసం ఆత్రుతగా ఎదురు చూసేవారు.  కాలప్రవాహంలో డబ్బులున్న పిల్లలు చదువులతో ముందుకెళ్ళి నాగరికంగా తయారయితే, దారిద్రంలో జీవిస్తున్న నెస్సో సామాజిక పరిస్థితుల వల్ల దొంగగా మారతాడు.  ఎంత నాగరికంగా మారినా, వెన్నెల రాత్రి నెస్సో చెప్పిన కథలు తీయని జ్ఞ్యాపకాలుగా వెంటాడుతూనే వుంటాయి.

“నెస్సో దరిద్రుడు, నెస్సో అజ్ఞ్యాని.  దౌర్భాగ్యం బీదరైతులకి ప్రసాదించే కష్టాలలో నెస్సో నలిగిపోయాడు.  వాడికే చదువుంటే, వాడికే భవిష్యత్తు మీద భరోసా వుంటే, వాడూ మంచి వాడయ్యే వాడే.  నా కంటే కూడా గుణవంతుడు అయ్యేవాడు—-” నెస్సో మిత్రుడు నెస్సోని తలచుకుని అనుకున్న మాటలు.  వెనక్కి తిరిగి చూసుకుంటే మనలో చాలా మందికి యిలాంటి తడి జ్ఞ్యాపకాలు వుండే వుంటాయి.

పారిశ్రామిక ప్రగతి జీవితాలలో ప్రవేశించినపుడు మనుషుల విలువల్లో వచ్చే మార్పుని సూచిస్తుంది ‘రైల్వే లైను నిర్మాణం’ కథ.

మూడో కథ ‘పందెం’.  ఆర్మేనియన్లని టర్కీ దేశస్తుల్ని విడదీశే కొండల మధ్య వున్న ‘మూతు  జోర’  అనే లోయలో జరిగిన కథ.  ఒక టర్కిష్ బందిపోటు, ఛాతి అనే ఆర్మేనియన్ పశువుల కాపర్ని చంపుతానని పందెం కాసి ఆ కుర్రాడి చేతిలో తనే ప్రాణాలు పోగొట్టు కున్న కథ.  అయితే ఆ బందిపోటు తండ్రి తన కొడుకు చేసిన దుర్మార్గాన్ని ఖండించి వాడి తలపాగా, కత్తి, డాలు  ఇచ్చేయమని అర్థించి యిలా అంటాడు “వాడి తల్లి మాత్రం ఏం చేయగలదు.  ఎంతయినా తల్లి కదా!  గుండె చెరువయ్యేలా ఏడుస్తోంది.   వాడి బట్టలు యిచ్చేస్తే, ఆమె దగ్గరికి తీసుకుపోతాను.  కరువుతీరా ఏడుస్తుంది.  అప్పటికైనా ఆమె దుఖ్ఖమ్ తీరి మనసు కొంచం కుదుట పడుతుంది.”

తాము అనుకున్న పని జరుగకపోతే ఎంత దగ్గిర వాళ్ళయినా నీచంగా చిత్రించే మనిషి నైజాన్ని చెప్పే కథ, ‘ఖేచన్ మామయ్య.’

యిక చివరి కథ ‘లేడి,’  మనిషి కంటే క్రూర జంతువు మరొకటి లేదనిపించే కథ.  తుపాకి పట్టి ఒక మృగాన్ని చంపిన తర్వాత దాని తల్లి దీనంగా దిక్కులు చూస్తూ ఆ పిల్ల కోసం, అది పడే తపన, మన యిళ్ళల్లో పి‌ల్లో పిల్లవాడో చావుబతుకుల్లో వున్నప్పుడు ఆ తల్లి పడే బాధ లాంటిదే.  అందుకే తోటమాలి ‘ఓవంకి ‘ అంటాడు “ మనకీ, ఈ కొండల్లో లేళ్ళకి తేడా ఏంటి?  ఏమీ లేదు.  మనసు మనసే.  బాధ బాధే.”

యింకా గాథలలో  వున్న 9 కథలు చాలా చమత్కారంగా, నవ్విస్తూ కొన్ని సందేశాలను కూడా చెబుతాయి.  ‘తోక తెగిన నక్క’  అనే కథ  రాజుగారు – ఏడు చేపల కథను గుర్తు చేస్తుంది.  మనం ఎవరికైనా ‘ మేలు చేస్తే దాన్ని సముద్రంలో పారేసినా మళ్ళీ నీ వద్దకు ఒకనాడు తిరిగి వస్తుంది’  అన్న ఆర్మేనియన్ సామెతని పిల్లలకి ‘మాట్లాడే చేప’  కథ ద్వారా చెబుతారు.  మన ‘శ్రావణ, భాద్రపద’  కథ లాంటిదే ‘తీర్ధం’  కథ.  తెలివి తేటలతో కష్టాల్నించి ఎలా గట్టెక్కచ్చో చెబుతుంది ‘యజమాని – పనివాడు’  కథ.  వీటన్నిటినీ మించిన తమాషా కథ, ‘వేటగాడి కోతలు .’  ఇది ఒక మ్యాజిక్ రియలిజం లాంటి కథ.

ఈ కథ చదువుతూ వుంటే దక్షిణ అమెరికా కథను దేన్నో చదువు తున్నట్లు వుంటుంది.    ఇవి ముఖ్యంగా పిల్లల్ని వుద్దేశించి, వాళ్ళకి లోకరీతిని నేర్పించేవి.  అందుకనే ఆ కథలు చెప్పే తీరు చదివి అనుభవించాల్సినదే గాని, మాటల్లో చెప్పేవి కాదు.

 వందేళ్ళ నుంచి ఈ కథలు జనం చదువుతూనే వున్నారు.  మళ్ళీ మళ్ళీ నెమరువేసుకుంటూనే వున్నారు.  తెలిసిన విషయాలే అయినా ఇంత కాలం మన మధ్య ఈ కథలు బతికి వుండడం కథకుడిగా తుమన్యాన్ మ్యాజిక్.  రచయితలు అనుకుంటున్న వాళ్ళు,  తమ రచనలు జనాల మధ్య పది కాలాలపాటు వుండాలనుకునే వాళ్ళు ఈ కథల్లోకి తొంగి చూడండి.  ఆ మ్యాజిక్ ని పట్టుకోండి.  మిమ్మల్ని మీరు బతికించుకోండి.

*