నాకు నచ్చిన చిత్రం: జయభేరి

‘సంగీతమపి సాహిత్యం సరస్వత్యా కుచద్వయం; ఏక మాపాత మధురం అన్యదాలోచనామృతం.’ సంగీతం చెవిన పడినంతనే మధురం. సాహిత్యం అలా కాదు. ఆలోచిస్తే అమృతం. ఆలోచింపచేసే దే సాహిత్యం.” అని అంటారు దాశరధి రంగాచార్యులు గారు తమ ఋగ్వేద పరిచయ పుస్తకంలో. సినిమా అనేది- ఒక కళ. నటన, నాట్యము,  సంగీతము, సాహిత్యము మరియు దృశ్యము- సమపాళ్ళలో మేళవించి చెక్కిన శిల్పమే, ఈ దృశ్య కావ్యము. తెలుగు చలనచిత్ర స్వర్ణ యుగములో అజరామరమైన చిత్రాలు అందించినవారిలో శ్రీ పి. పుల్లయ్య ఒకరు. వందల చిత్రాలకు కధా, మాటలు, పాటలు సమకూర్చి, తన పదునైన సంభాషణలతో, ప్రేక్షకుల గుండె లోతులను తట్టినవాడు ఆచార్య ఆత్రేయ. ఒక రచయితగా, సినీ కవిగా, మాననీయ వ్యక్తిగా, అంతకంటే అందరిచే గురువుగా మన్ననలందుకున్న ఒకే ఒక వ్యక్తి, శ్రీ మల్లాది రామసృష్ణశాస్త్రి గారు. మేటి సంగీత దర్శకులలో తలమానికమైన సంగీత రసగుళికలు అందించినవారు, శ్రీ పెండ్యాల నాగేశ్వరరావుగారు. ఈ ఉపోత్ఘాతమంతా ఎందుకంటే- ఈ అందరి మహామహుల అనితర సాధ్యమైన సాధనవల్ల, 1959లో శారదా ఫిలిమ్స్ పతాకంపై, శ్రీ వాసిరెడ్డి నారాయణరావు/ ప్రతిభా శాస్త్రి గార్ల నిర్మాణములో రూపొందుకున్న మహత్తర సంగీత, సాహిత్య , సందేశాత్మక దృశ్యకావ్యం, జయభేరి.

 

క్లిష్టమైన ఇతివృత్తంతో కొన్ని చిత్రాలు, ఇతివృతాలు ప్రధానంగా కొన్ని చిత్రాలు వచ్చాయి. మనకు ప్రేమ కథలు, కులాంతర విహాహాలు అరుదు కాదు. కవుల, కళాకారుల జీవితము, మతము, ఆచారాల కథనము క్రొత్తవి కావు. కాని వీటన్నిటిని రంగరించి, సంగీత సాహిత్యాలను మేళవించి, వైవిధ్యంగా, కష్టతమమైన అంశాలను అతి మెళుకువగా విశ్లేషించిన చిత్రాలు బహుకొద్ది. ఆ కోవలో ప్రజలను ఆలోచనాపరులను చేస్తూ, కళల మరియు మానవ పరమావధిని జనరంజకంగా చెప్పి, సంస్కరణకు ఉద్యుక్తులను చేసే మకుటాయమానమైన సందేశాత్మక చిత్రం, ‘జయభేరి’. ఆత్రేయ తెలుగువారికి అందించిన మరొక కావ్యం, ఈ జయభేరి.

ఒక సంగీత తపస్వికి, ఒక మహత్తమమైన గురువుకి ఆలోచనాసరళిలో తేడాలుండవచ్చు. ఆ విభేదము మనుషుల, మనసుల మధ్య ఈర్శ, ద్వేషాల కతీతమై, కళ పరమావధికి, దాని భవితకు చెందినదైతే, దాని పర్యవసానము ఏమిటి? కళ ప్రయోజనం, విద్వత్ సభలలో ప్రదర్శించి, పెద్దలను మెప్పించుటయే పరాకాష్టయని ఒకరు, జన సామాన్యానికి దూరమైన కళ, సంకుచితమై, సమసిపోతుందని, కళ బహుజన హితము, ప్రియము కావాలని తపించే వారొకరు.

జయభేరికి ముందూ, తరువాత కూడా ఎన్నో సంగీత, సాహిత్య, నాట్య పరమైన చిత్రాలు వచ్చాయి. రావచ్చు కూడా! ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఈ చిత్రంలోని ఒక సన్నివేశాన్నో, లేక ఒక అంశాన్నో తీసుకొని, మరిందరు చిత్రాలు తీశారేమో కానీ, ఆ ఆదర్శాన్ని ప్రతిబింబించలేదు . అంతేకారు, సంగీతము, సాహిత్యము, అభినయము సమపాళ్ళలో పోటీపడి, తమ సత్తా చాటుతూ సమ్మిళితమై, ఆనందముతో పాటు, ఆలోచనామృతాన్ని కలిగించిన తీరు నాటికి, నేటికి జయభేరి జయభేరియే! మధురమైన సంగీతముతోపాటు, మెదటికి పదునుబెట్టే మాటలు, పాటలు మనుషులను ఆలోచింప చేస్తుంది. మతము, ఆచారము, సాంప్రదాయము, ఈర్ష, అసూయలు – మానవత్వాన్ని విడిచి, మరిచి విజృంభిస్తే – మంచికి, మనసుకి, కళకి మనుగడ కరువు అవుతుందని కనులముందు ప్రత్యక్ష పరుస్తుంది.

పెండ్యాల నాగేశ్వరరావు గారు చక్కని శాస్త్రీయమైన బాణీలు కూర్చటంతోపాటు, కన్నడ మరియు చక్రవాక రాగాలను మిళితంచేసి, సృష్టించిన ‘విజయానంద చంద్రిక’ రాగంలో మల్లాది వారి సాహితికి మన ఘంటసాల ప్రాణము పోయగా, అక్కినేని అద్భుతంగా అభినయించిన పాట, ‘రసిక రాజ తగు వారము కామా’. గురు శిష్యుల సరళిని మమేకం చేస్తూ, పండిత పామరుల ప్రశంసలు పొంది, సినీ వినీలాకాశంలో ఒక తారగా నిలిచిపోయింది. ఈ ఒక్కపాటపై శ్రీ సత్యనారాయణ వులిమిరి గారు ఆరు పేజీల వ్యాసము వ్రాశారు. ఆనాటి మేటి గాయకులు: ఘంటసాల, పి.బి. శ్రీనివాస్ మరియు రఘురాజ్ పాణిగ్రాహి కలిసి ఆలాపించిన, మల్లాది వారి, ‘మది శారదా దేవి మందిరమే’ మరొక అనితర సృజన. విజ్ఞుల అభిప్రాయంలో సంగీత-సాహిత్యపరంగా తెలుగు సినీ చరిత్రలో ఇంతవరకు సృజించబడిన మూడు అగ్రతమమైన పాటలలో, ఈ రెండు పాటలను ఉదాహరిస్తారంటే (మూడో పాట ‘జగతేకవీరుని కథ’ లోని ‘శివశంకరి శివానందలహరి’), జయభేరి అందుకున్న శిఖరాలేమిటో మరి నొక్కి చెప్పవలసిన అవసరం లేదేమో!

కధాగమన ప్రస్థానంలో, మూర్ఖుల ఛాందసాన్ని నిరసిస్తూ మనసులను నిలదీసే ఆత్రేయ సమయానుచిత వాదనకు, మహత్తర సందేశాన్ని జోడించి మహాకవి శ్రీశ్రీ అందించిన ‘నందుని చరితము వినుమా’ పాట ఒక కలికితురాయి. దేవుని చూడాలనే ఓ నిస్సహాయ చిన్నవాని ఆక్రందనకి, మూగబోయిన గొంతుని సవరించి, ఆలయాలలోనే దేవుడు లేడని, నందునికి మోక్షమిచ్చే శివుడున్నాడని, తన పాటతో అండగా నిలిచే అద్భుత అక్కినేని నటన మనముందుయించి, పుల్లయ్యగారు మన కంట కన్నీరు కురియించ, దీనికి మరి ప్రతి లేదు! ఈ పాటను, కుల నిర్మూలన ప్రచారానికై, ఆనాడు ప్రభుత్వము 16యమ్ యమ్ ప్రింట్లు తీసుకొన్నారని అంటారు పులగం చిన్నారాయణగారు తమ ‘ఆనాటి ఆనవాళ్ళు’ పుస్తకములో.

పెండ్యాల నాగేశ్వరరావు గారు అందించిన మరికొన్ని ఆణిముత్యాలు:

 

  • రాగమయి రావే.. అనురాగమయి రావే (మల్లాది)
  • సవాల్ సవాల్ అన్న చిన్నదానా.. సవాల్ పై సవాల్ (మల్లాది)
  • నీవెంత నెరజాణనౌర (మల్లాది)
  • సంగీత సాహిత్యమే మేమే నా శృంగార (మల్లాది)
  • నీ దాన నన్నదిర, నిన్నే నమ్మిన చిన్నదిర (మల్లాది, చిత్రంలో లేదు)
  • యమునా తీరమున.. సంధ్యా సమయమున (ఆరుద్ర)
  • ఇంద్ర లోకంనుండి తెచ్చినారయ్యా (ఆరుద్ర)
  • హోయ్ వల్లో పడాలిరా పెద్ద చేప (ఆరుద్ర)
  • ఉన్నారా.. జోడున్నారా.. న్నానోడించే వారున్నారా (కొసరాజు)
  • దైవం నీవేనా, ధర్మం నీవేనా (నారపరెడ్డి, టి‌.ఎం. సౌందర్ రాజన్ పాడారు)

 

ఆచారాల అనాచారానానికి తమ్ముని, కడకు భార్యను కూడా త్యజించవలసిన పాత్రలో గుమ్మడి; తల్లి కాని తల్లిగా తన మరిది భవిత కోసం ప్రాణ త్యాగం చేసే ఇల్లాలుగా శాంతకుమారి; లోన వ్యక్తిత్వానికే విలువయిచ్చే మాననీయ గురువుగా నాగయ్య; ప్రజారంకంగా పాలించే కళా హృదయుడైన రాజుగా ఎస్‌.వి. రంగారావు; నాట్యంతో పాటకు జీవంపోసి, చాకచక్యంతో రాజా దండన నుంచి భర్తను కాపాడుకొనే పాత్రలో అంజలిదేవి; రాజ నర్తకిగా కపట యోచనతో ఒక తోటి కళాకారుని జీవితాన్ని కడతెర్చే కరకు పాత్రలో రాజసులోచన, మతం కోసం మానవత్వాన్ని పణంగా పెట్టె రాజగురువు పాత్రలో ముక్కామల, మనకు మరపురాని అనుభూతిని కలిగించారు. మరియు రమణారెడ్డి, రేలంగి, చదలవాడ, సూర్యకాంతం పోటీపడి, అత్యుత్తమ నటన అందించన ఈ చిత్రం, మీరు చూసివుంటే మరొక్కమారు చూడండి, లేకపోతే మీరు తప్పక చూడవలసిన చిత్రాల జాబితాలో ముందుంచండి.  ఈ విశ్లేషణని ముగించడం చాలా కష్టమనిపించింది. ఆలోచించగా, నాకు కనిపించిన ఈ Lancelot Hogben మాటలతో సశేషం (from his book ‘Mathematics for the Million’):

“Our studies in Mathematics show us that whenever the culture of a people loses contact with the common life of mankind and becomes exclusively the plaything of a leisure class, it is becoming a priestcraft. It is destined to end… To be proud of intellectual isolation form the common life of mankind and to be disdainful of the great social task of education is as stupid as it is wicked. It is the end of progress in knowledge. History shows that superstitions are not manufactured by the plain man. They are invented by the neurotic intellectuals with too little to do.”

ఆలాగునే యుగాల పరిణామములో, మహర్షుల తపో యజ్ఞములతో, సకల జీవకోటి శాంతి కోసం- ఆవిర్భవించిన మన వేదాలు, ధార్మిక వర్తన, సాహిత్యము, సంగీతము, ఇతర కళలు ఈనాడు సామాన్యునికి, యువతరానికి ఎంత చేరువలో ఉన్నాయి? వాటిని భూమార్గాన్ని పట్టించే భగిరధ ప్రయత్నము, ఆలోచించండి, ఎవరి చేతిలో ఉందో?

*

 

ఆద్యంతాలు లేని ‘ఆగమనం’

arrival1

ప్పట్లాగే ఈ సంవత్సరం(2016)  కూడా హాలీవుడ్ లో ఓ మంచి సైన్స్ ఫిక్షన్ సినిమా వచ్చేసింది. ‘టెడ్ చియాంగ్’ రాసిన ‘స్టోరీ అఫ్ యువర్ లైఫ్’ అనే కథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఎరైవల్(Arrival)’ అనే పేరుగల ఈ సినిమా కథాంశం ఏలియన్ సంబంధితమైనది అయినప్పటికీ, ఈ దృశ్య ప్రవాహపు ప్రతీ కదలికా, మెలకువతో మెళకువగా చూస్తున్న జీవిత ఘట్టాల బిందు సమూహంలానే కనిపిస్తుంది.

ఒక ప్రాణాంతకవ్యాధి కారణంగా యుక్త వయసులోకి అడుగుపెడుతూనే మరణించిన కుమార్తెతో పాటుగా ఆశలనన్నిటినీ అంతం చేసుకున్నట్టుగా కనిపించే ‘లూయిస్’ కథతో సినిమా ఆరంభమవుతుంది. కానీ అప్పుడు కూడా ఆమె, తనకి ఆరంభాల మీదా అంతాల మీదా నమ్మకమనేది ఉందో లేదో చెప్పలేకపోతున్నానంటుంది. ఇంతకూ లూయిస్ ఒక  బహుభాషా ప్రవీణురాలు. అనేక భాషలపైన మంచి పట్టును కలిగి ఉన్న లూయిస్, యూనివర్సిటీలోని విద్యార్థులకి బోధన చేస్తుంటుంది. ఇంతలో అనుకోకుండా భూమి మీద ఏలియన్ షిప్ లు ల్యాండ్ అయ్యాయని తెలియడంతో ప్రజలంతా బెంబేలెత్తిపోతారు. అవి ప్రపంచవ్యాప్తంగా పన్నెండు చోట్లకి వచ్చి ఆగుతాయి. .కానీ ఆ ఏలియన్స్ మనుషులకు హాని చేయడానికి రాలేదనీ, వారు తమతో మాట్లాడే  ప్రయత్నం చేస్తున్నారనీ భావించిన అమెరికన్ ఆర్మీ చీఫ్, వారి భాషను అర్థం చేసుకుని వివరించమని లూయిస్ ని కోరతాడు. ఆమెతో పాటుగా  ఫిజిసిస్ట్ అయిన అయాన్ అనే వ్యక్తిని కూడా ఆర్మీ ఈ పని నిమిత్తం నియమిస్తుంది. వారిద్దరూ కలిసి ఆ ఏలియన్ల భాషను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఏలియన్ల భాష శబ్ద ప్రధానమైనది కాదనీ దృశ్యరూపమైనదనీ గ్రహించి, ఆమె ఆ భాషను నేర్చుకునే ప్రయత్నం చేస్తుంటుంది. అందుకు కొంచెం సమయం అవసరమవడంతో, ఆ లోపుగా ప్రపంచంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడతాయి.

ఏలియన్స్ భాషను సరిగా అర్థం చేసుకోలేకపోవడం వలన, వారు యుద్ధానికి సిద్ధమై వచ్చినట్టుగా భావించి  చైనా ఆర్మీ జెనెరల్ షాంగ్, వారిపై యుద్ధానికి పిలుపునిస్తాడు. అతనికి మరికొన్ని దేశాలు కూడా మద్దతు పలుకుతాయి. కానీ లూయిస్ కి మాత్రం ఏలియన్లు తమకి సహాయపడే ప్రయత్నం చేస్తున్నారనే నమ్మకముంటుంది. ఈ మధ్యలో ఆమెకు, తన కుమార్తెకి చెందిన కలలూ, జ్ఞాపకాలూ ఏర్పడటం ఎక్కువైపోతుంటుంది. ఆ ఏలియన్స్ కీ, తన కుమార్తెకీ మధ్య గల సంబంధమేమిటో ఆమెకి అర్థం కాదు. చివరికి అసలు విషయాన్ని అర్థం చేసుకుని, ఏలియన్ల సందేశాన్ని ప్రపంచానికి చేరవేసి యుద్ధాన్ని ఆపడంలో ఆమె సఫలీకృతురాలవుతుంది. ఈ క్రమంలోనే ఆమెకి అనుకోని ఓ రహస్యం కూడా తెలుస్తుంది. ఆ రహస్యమేమిటో సినిమా చూసి తెలుసుకుంటేనే బావుంటుంది.

సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయాలు మూడు. మొదటిది, కథని ముందుకూ వెనకకూ జరపడంలోనూ, మానవీయ కోణానికీ, సెన్సిబిలిటీకీ పెద్ద పీట వెయ్యడంలోనూ దర్శకుడు చూపిన ప్రతిభ, సినిమా విజయానికి మూల కారణమైతే, అందుకు తగ్గ దృశ్య రూపావిష్కరణ చేసిన సినిమాటోగ్రాఫర్ ‘బ్రాడ్ ఫోర్డ్ యంగ్’  కృషి కూడా అభినందనీయం. ముఖ్య పాత్రధారిణి లూయిస్ గా నటించిన ‘అమీ ఏడమ్స్’ నటన అత్యంత సహజసిద్ధంగా ఉండి మనసును కట్టి పడేస్తుంది. ఇక సినిమాకు సంగీతాన్ని సమకూర్చిన జోహాన్ జోహన్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు కదా. ఇక కీలకమైన ప్రాముఖ్యత కలిగిన ఏలియన్ల భాషను ‘మార్టిన్ బెర్ట్రాండ్’ అనే ఆర్టిస్ట్ డిజైన్ చేసిందట.

arrival2

‘సికారియో, ప్రిజనర్స్, ఇన్సెన్డైస్’ వంటి మంచి సినిమాలను అందించిన దర్శకుడు ‘డెనిస్ విలెనెవ్’ ఈ సినిమా ద్వారా తన సమర్థతని మరోసారి నిరూపించుకున్నాడని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇతని సినిమాలలో, నాటకీయత – సహజత్వం విడదీయలేనంతగా కలిసిపోయి ఉండటం గమనించవచ్చు. ఈ సినిమా విషయానికి వస్తే, అసలు  సై.ఫి. సినిమాలంటేనే ముఖ్యంగా ఊహా ప్రధానమైనవి. అతికినట్టుగా అనిపించకుండా వాటిలో జీవాన్ని నింపాలంటే చాలా నేర్పు అవసరం. ఈ సినిమా ఇంత అద్భుతంగా అమరడానికి అటువంటి నేర్పే కారణమని చెప్పుకోవచ్చు. గొప్ప గొప్ప మలుపులూ, ‘ఇంటర్ స్టెల్లార్’ లా విపరీతమైన సైన్స్ పరిజ్ఞానమూ ఉపయోగించకుండానే ఒక పటిష్టమైన, ఆసక్తికరమైన సినిమాని తయారు చేయడం హర్షించదగిన విషయం.

లూయిస్ వ్యక్తిగత జీవితం, ఏలియన్స్ తో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉందన్న సందేహమే సినిమాను అత్యంత ఆసక్తికరంగా తీర్చిదిద్దుతుంది. ఆమె కుమార్తె ఏలియన్ నా? లేక చనిపోయి ఆ రూపంలో తిరిగి వస్తుందా? ఆమె మరణానికీ, ఏలియన్స్ కీ ఏమైనా సంబంధం ఉందా?…. వంటి సందేహాలు మన మనసుని ఎంగేజ్ చేసి దృష్టి మరల్చనివ్వకుండా చేస్తాయి. ఇక అయోమయానికి గురి చేయని కథనం కూడా సినిమాకు గొప్ప ఆకర్షణ.

సినిమాకి ప్రాణమైన అతి ముఖ్యమైన ఒక ట్విస్ట్ మాత్రం సగం దారి నించీ ఊహకు అందుతూ ఉంటుంది. తెలిసిపోయినా మళ్లీ తెలుసుకోవాలనిపించే వింత రహస్యమది. ముగింపులో మాత్రం సైన్స్ పరంగా కొద్దిపాటి క్లిష్టతరమైన అంశాలను జోడించినప్పటికీ, సై. ఫి. చిత్రం కనుక ఆ మాత్రం క్లిష్టత తప్పనిసరి. (ఇంతకు మించి వివరిస్తే, సినిమా చూడాలనుకునేవారికి స్పాయిలర్ అవుతుందన్న ఉద్దేశ్యంతో చెప్పడం లేదు). మొత్తానికి ఏదెలా ఉన్నా, కళ్లు తిప్పుకోనివ్వని విజువల్ ఎక్స్పీరియన్స్ కారణంగా ఈ సినిమా అసంతృప్తిని మిగిల్చే అవకాశమైతే మాత్రం అణువంతైనా ఉండనే ఉండదు.  కాలాలూ, పరిస్థితులూ ఎంతగా మారినా, మన ఊహలనేస్థాయిలో విశ్వపు అంచుల వరకూ విహరించేందుకు పంపినా, విలువలనూ, మానవ సహజమైన ప్రేమాభిమానాలనూ పోగొట్టుకోనంతవరకూ మనం మనంగానే ఉంటామన్న నిజాన్ని ఈ సినిమాకి లభించిన ఘన విజయం నిరూపిస్తుంది.

 

***

కన్ఫెషన్స్ ఆఫ్‌ సిద్ధార్థ్ అభిమన్యు!

arvind-swamy-thanioruvan-01

 

“చదరంగానికి ప్రాథమిక సూత్రం ఎదుటివాడు వేసే ఎత్తు మనం ఊహించి, ప్లాన్ చేసుకోవడం కాదు.
ఎదుటివాడు ఎలాంటి ఎత్తు వేయాలో మనమే నిర్ణయించడం”

“ప్రపంచంలో చాలామంది పరిస్థితుల చేతిలో బందీలు, అవి ఎటు నడిపిస్తే అటు నడిపిస్తారు. అలా నడుస్తూ ఒక్కోసారి లక్కీ మీ అనుకుంటారు, మరోసారి హార్డ్ లక్ అని బాధపడతారు. ప్రేమ, కృతజ్ఞత, న్యాయం, అన్యాయం, ధర్మం లాంటి ముసుగు మాటలని తాళ్లుగా కట్టి వీళ్ళని తోలుబొమ్మలుగా ఆడిస్తూంటే ఆడుతూంటారు. జనం చదరంగంలో పావులైతే, వీళ్ళని కెదుపుతూ చదరంగం ఆడేవాళ్లు వేరు, వాళ్ళు చాలా తక్కువమంది. ఆ చదరంగంలో ఛాంపియన్‌ని నేను. సామాన్యమైన జనాన్ని పావులుగా చేసి చదరంగం ఆడుకుంటున్న కింగ్‌పిన్స్ నా చదరంగంలో పావులు – అంటే పరిస్థితులను నడిపిస్తున్నాం అనుకునేవాళ్ళని నడిపించేవాణ్ణి.

ఎక్కడో జరిగే దొంగతనం, మరెక్కడో హత్య – చేసేవాళ్ళకి తామిద్దరూ నా కోసం పనిచేసేవాళ్ళ కోసం పనిచేస్తున్నారని తెలియదు. ఎందుకు చేస్తున్నారో నాకు తప్ప మరెవరికీ తెలీదు. నా చదరంగపు టెత్తులు తెలియాలంటే నా స్థాయిలో ఆలోచించి, నా ఊహని పసిగట్టాలంటే నా మెథడ్స్‌ని ఎంతగా మెడిటేట్ చెయ్యాలి! ఇక ఆ ఆటలో నాతో తలపడి నన్నే దెబ్బకొట్టాలంటే ఇంకెంత కెపాసిటీ కావాలి? అందుకే ఏళ్ళపాటు నన్ను టచ్ చేయడం సంగతి అటుంచి, గెస్ చేయడానికి ప్రయత్నించినవాడెవడూ ప్రాణాలతో మిగల్లేదు. అలాంటిది.. వాడు నన్నే కుదిపేశాడు.

డబ్బు, కీర్తి, అధికారం లాంటివన్నీ నా నుంచి లాక్కుని, నాకు చెక్‌మేట్ పెట్టగలిగాను అనుకుంటే తప్పు. నాకు తగిలిన నిజమైన దెబ్బ – పరిస్థితుల్ని నేను నియంత్రించగల స్థితి నుంచి పరిస్థితులు నన్ను నియంత్రించే స్థితిలో నిలబెట్టడం. అంటే నేను ఈ చదరంగంలో పావులు కదపలేను, పావులా కదులుతాను. నా పదిహేనో ఏట పావుల్ని తీసేయడం, మంత్రిని కదపడం, గుర్రాన్ని జరపడం మొదలుపెట్టక ముందు ఎలా చదరంగంలో పావుగా ఉండేవాణ్ణో – మళ్ళీ అలాగే అయ్యాను.

I hate it – పరిస్థితులు నన్ను పరుగులు తీయించిన ఆ రాత్రి మళ్ళీ గుర్తొచ్చింది. మా అమ్మ గుర్తొచ్చింది.
****

పవన్  సంతోష్

పవన్ సంతోష్

రాజకీయ చదరంగంలో ఎప్పుడూ మానాన్న బంటుల్లోకీ బంటు. ఆ రాత్రి కూడా అలానే ఎవడో నాయకుడు హాస్పిటల్లో ఉన్నాడని ఏడ్చుకుంటూ వెళ్ళాడు. ఇంట్లో మా అమ్మ ఎలా వుందో అతనికి తెలీదు. పన్నెండేళ్ల వయసున్న నాకు ఊహకందని జబ్బు అది. నానా తంటాలూ పడి అమ్మని హాస్పిటల్‌కి తీసుకెళ్లాం. అయితే అదేమీ మా నాన్న బానిసగా ఉన్న నాయకుణ్ణి చేర్చిన గొప్ప ఆసుపత్రి కాదు, అలాంటి వాళ్లు పళ్లు పంచిపెట్టే పెద్దాసుపత్రి.

హాస్పిటల్ బయటా, నాలోపలా తుఫాను. మా బస్తీ జనం నాన్న వస్తాడేమోనని ప్రయత్నించారు. అయితే అతనున్న చోట లక్షల మంది జనం. అందరూ గాలి గట్టిగా వీస్తే ఒకే వైపుకు ఊగే గడ్డి మొక్కల్లాంటి పనికిమాలిన జనం. వాళ్ళలో మావోడు ఎక్కడున్నాడని తెలుసుకోవాలి. తెలిస్తే మాత్రం ప్రయోజనం..

జబ్బుపడ్డ భార్య మంచాన పడివుండగా, ఎవడో నాయకుడి ఆఖరి చూపు కోసం ఆస్పత్రికి పోయిన ఆ నా కొడుకు గురించి వెతకడం అనవసరం. ఓ పక్క తుఫాను పెరుగుతూంటే – వాళ్ళ గుడిసెలు కూలిపోతాయేమోనని చూసుకోవడానికి ఇప్పుడే వస్తాం అని ఒక్కొక్కడే వెళ్లిపోయాడు. డాక్టర్ వచ్చాడు, అప్పటికి జరిగిన టెస్టులు, పేషెంట్ ఉన్న స్థితి చూశాడు. పేషెంట్‌తో ఉన్నవాణ్ణి నేనొక్కణ్ణే, చిన్నపిల్లాణ్ణని ఆలోచించినా, తప్పక నాకే ఆమె స్థితి చెప్పాడు. ఆపరేషన్ చెయ్యడానికి ఇక్కడ ఎక్విప్‌మెంట్ లేదట, ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి నా దరిద్రం రికమెండ్ అయినా చెయ్యనివ్వలేదు. ఓ మందుల చీటీ మాత్రం రాశాడు, చూడాల్సినవాళ్లెవరైనా ఉంటే తీసుకువచ్చి చూపించండి అని క్యాజువల్‌గానే అయినా, కళ్ళలో ఓ జాలి పొర కదులుతూంటే చెప్పి వెళ్ళిపోయాడు.

ఆ చీటీతో రోడ్డు మీదికి వెళ్ళిన నాకు తుఫాను గాలికి వదిలిన చీటీ, రూపాయి బరువు లేని మనిషీ ఒకటే అని తెలిసి రావడానికి టైం పట్టింది. జాలి, దయ కరెన్సీ కాదని, చెల్లవని తెలిసొచ్చింది. ఏడుస్తూ, ఓదార్చుకుంటూ వెనక్కి వచ్చిన నాకు వార్డులో అమ్మ ఉండాల్సిన మంచం ఖాళీగా కనిపించింది. గాలికి ఎగిరే చిత్తుకాయితంలా దారీ తెన్నూ లేక తిరిగీ తిరిగీ ఓ మూల నెత్తురు ఉబుకుతున్న బుగ్గలా కనిపించింది, ప్రాణానికి కొట్టుకుంటోంది.

అమ్మని ఆ స్థితిలో చూడగానే ఏమయిందో అర్థమైంది, కానీ చెప్పడం కాదు కదా తలచుకోవడం కూడా నాకిష్టం లేదు. బతకడానికి కాక చావడానికి ఆ ప్రాణం గింజుకుంటోంది. అంతే సుళ్ళుతిరుగుతున్న నా మనుసులో బాధ, నిశ్చలమైపోయింది. వందమైళ్ళ స్పీడులో వచ్చే కార్లు, బైకులూ ఢీకొట్టేసుకుంటున్న సిగ్నల్లా ఆలోచనలు ఢీకొట్టుకుంటూన్న నా మెదడు స్తంభించిపోయింది.

అమ్మ ప్రాణాన్ని నేనే తీసేశాను, ఆ క్షణమే మళ్ళీ పుట్టాను.

ప్రేమ, స్నేహం, మర్యాద, జాలి, దయ లాంటివాటి నిజమైన అర్థం తెలిసింది. అవి ఒకోసారి పాచికలు, ఒకోసారి ముసుగులు. అంతటితో ఆ మాటలకి విలువ ఇవ్వడం పూర్తిగా మానేశాను. పరిస్థితులు నన్ను తీయించిన పరుగులు చాలు, ఆ రాత్రి నేను చచ్చిపోయి బూడిదలోంచి మళ్ళీ పైకి లేచాను. అమ్మ ప్రాణం కోసం పరుగులు పెట్టినంతసేపూ అవి నాతో ఆడుకున్నాయి. ఆ ప్రాణాన్ని నేనే తియ్యడానికి నిర్ణయించుకోగానే నా చేతిలోకి వచ్చేశాయి.
సిద్ధార్థ్ అభిమన్యు … పరిస్థితులను శాసించే దేవుడు.

తెల్లవారాకా అందరూ వాలారు. శవాన్ని ముందుపెట్టుకుని నాన్న ఏడుస్తూంటే – నవ్వొచ్చింది. వాళ్ళూ వీళ్ళూ నేను డాక్టర్‌ని అయి, ప్రాణాలు కాపాడుతూ ఉచితంగా సేవ చెయ్యాలన్నారు. హహ్హహ్హహ్హ. మా అమ్మకి ఎవడు చేశాడు? ఎవడినీ నమ్మలేదు, అందరి మాటలూ విన్నాను.

నా సర్వశక్తులూ కూడదీసుకుని చదవడం మొదలు పెట్టాను – పుస్తకాలని, ప్రపంచాన్నీ, ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న శక్తుల్ని. ప్రపంచాన్ని మన చేతిలోకి తీసుకోవాలంటే, మనికి ఓ సైన్యం ఉండాలి. కొందరు బంట్లు, రెండు ఏనుగులు, గుర్రాలూ, ఒంటెలు, మంత్రి ఇలా. మా నాన్ని బంట్లలోకెల్లా బంటు. అతన్ని జాగ్రత్తగా నడిపించుకుంటూ తీసుకుపోయి అవతలి గడికి చేర్చి మంత్రిని చేశాను.

ఇంతకీ నేను చేసిన ఆఖరి హత్య మా అమ్మదే. ఆ తర్వాత అంతా చదరంగం గడిలోంచి పావుల్ని తీసేయడమే తప్ప మరేం కాదు. అలాంటి నన్ను వాడు… వాడు….
వాడు పావుని చేసి ప్రాణాల కోసం అడ్డమైనవీ ఒప్పించాలనుకున్నాడు. చివరకు వాణ్ణి నా స్థానంలోకి తీసుకువచ్చి నేను తప్పించుకున్న ప్రమాదాలు తలకు చుట్టాను. మరి నేనంటే ఏంటి?

ష్‌… అదిగో జింకల గుంపు. నేనొస్తా”

పసుపు రంగు చర్మంపై, చారలు అలల్లా కదులుతున్నాయి. ఊపిరి మంద్రంగా అయింది, జింక తను అనుకున్న చోటికి రాగానే వందల కిలోల బరువు పంజాపై నిలిపి, వేట మీద వేటు వేసింది. జింకల గుంపులో కలకలం మధ్య ఆ జింక చట్టని నోటితో చీలుస్తూ …

“సిద్ధార్థ్‌ అభిమన్యు సైనింగ్ ఆఫ్‌”


(తని ఒరువన్, ధృవ సినిమాల్లో ప్రతినాయక పాత్ర సిద్ధార్థ్ అభిమన్యు కల్పిత చరిత్ర)

మహానాయక్ ఉత్తమ్ కుమార్

 

uttam1

కలకత్తా లో, ఇంకా చెప్పాలంటే బెంగాల్ మొత్తం మీద అంతిమ యాత్ర  చరిత్రగా మిగిలిన సందర్భాలు రెండు ఉన్నాయని చెపుతారు. ఒకటి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అంతిమయాత్ర, ,మరొకటి అరుణ్ కుమార్ ఛటర్జీది.ఈ రెండు సందర్భాల్లో అశేష జనవాహిని, వారు అంతగా అభిమానించేవారి మరణాన్ని జీర్ణించుకోలేక, తీరని శోకం తో అంతిమయాత్ర లో పాల్గొని చివరి వీడ్కోలు పలికారు. అరుణ్ కుమార్ ఛటర్జీ మరణం తన అభిమానులకి జీర్ణించుకోవటానికి చాలా కాలమే పట్టింది. ఆ అరుణ్ కుమార్ ఛటర్జీయే బెంగాళీ సూపర్ స్టార్, మహానాయక్ ఉత్తమ్ కుమార్.

తన చివరి శ్వాస సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడే వదలాలని అనుకునే ఉత్తమ్ కుమార్, ఈ ప్రపంచ రంగస్థలం నుండి అదే విధంగా నిష్క్రమించాడు. ‘ఓగో బొదు శుందొరి సినిమా షూటింగ్ సమయం లో గుండెపోటు రావడంతో బెల్లీవ్యూ హాస్పిటల్ లో చేర్పించారు. 16  గంటలపాటు డాక్టర్లు ఎంతగా శ్రమించినా తనని బ్రతికించలేకపోయారు.

దాదాపు మూడు దశాబ్దాలపాటు బెంగాలీ సినీరంగాన్ని రారాజుగా ఏలి, దాదాపుగా 250 వరకు (బెంగాలీ, హిందీ అన్నీ కలిసి) సినిమాల్లో నటించాడు. ఉత్తమ్ కుమార్ కేవలం నటన తో తన పిపాసని తృప్తి పరచుకోలేదు. దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా,నిర్మాతగా,నేపథ్య గాయకుడిగా అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసాడు.

బెంగాళీ లోనే కాకుండా భారత దేశం లోనే అత్యుత్తమ నటుడిగా కిర్తించబడ్డ మహానాయక్ ఉత్తమ్ కుమార్.

ఉత్తమ్ కుమార్ మరణించిన రోజు కొంత మంది సినీ ప్రముఖులు:

“బెంగాళీ చిత్రపరిశ్రమకే దారిచూపించే దివిటీ వెళ్లిపోయింది. తనకు ముందు గానీ తరువాత గాని అలాంటి హీరో లేడు”

~~ సత్యజిత్ రే         

“మా అందరు హీరోల్లో ఉత్తమ్ కుమార్ బెస్ట్”

~~రాజ్ కపూర్

“ప్రపంచంలోని ఏ నటుడితో అయినా పోల్చగల సమర్థత ఉన్న నటుడు ఉత్తమ్ కుమార్. తనలో ఉన్న గొప్ప సుగుణం శ్రద్ధ.

చాలా మంది నటులకు పుట్టుకతోనే ఆ ప్రతిభ ఉంటుంది. కానీ ఆ ప్రతిభ,  శ్రద్ధ లేకపోవటం వల్ల త్వరగానే అంతరిస్తుంది. కానీ ఉత్తమ్ కుమార్ కి  ప్రతిభతో పాటు అకుంఠిత శ్రద్ధ ఉంది. అందువల్లే ఆ నట నక్షత్రం ఇంకా వెలుగులు విరజిమ్ముతూనే ఉంది.

  ~~ తపన్ సిన్హా

ఉత్తమ్ కుమార్ సినీ ప్రస్థానం లో అద్భుతమైన సినిమాలు ఎన్నో ఉన్నాయి.  దస్తూరి లా, తన సొంతదైన ప్రత్యేక నటనాశైలి తో భావి నటులకి సమగ్రంగా ఒక “నటనా నిఘంటువుని” సమకూర్చాడు. ఆయన  చేసిన ఒక్కొక్క పాత్ర, ఒక్కో నటనా శైలిని ఆవిష్కరిస్తాయి. తను చేసిన కొన్ని పాత్రలు మనల్ని ఆలోచింపజేస్తాయి. మరికొన్ని పాత్రతో పాటుగా మనల్ని పయనింపజేస్తాయి. ఉత్తమ్ కుమార్ నటనా తాలూకా ప్రభావం మనల్ని అంత సులువుగా వదలదు. ఆ పాత్రలు మళ్ళీ మళ్ళీ చూసేలా చేస్తాయి. చూసిన ప్రతీసారి , ఆ పాత్ర తాలూకు కొత్త కోణం ఏదో కనపడుతుంది.

తన నటన గురించి చెపుతూ ” నేను నా సహజ నటనా పద్ధతులనే అనుసరిస్తాను. మనం నిజ జీవితం లో ఎలా మాట్లాడుకుంటాము? ఎలా కోపగించుకుంటాము ? అలాంటి సహజమైన నటననే నేను ఇష్టపడతాను” అని అంటాడు మహానాయక్.

అంత స్టార్డం ని , ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఉత్తమకుమార్ కి విజయ శిఖరాల వైపు ప్రయాణం అంత సులువుగా జరగలేదు.ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని , కలకత్తా పోర్ట్ ట్రస్ట్ లో క్లర్క్ గా ఉద్యోగం నుండి మహానాయక్ ఉత్తమ్ కుమార్ గా ఎదిగేవరకు ఎన్నో అపజయాలు ఎప్పటికప్పుడు తనని పరీక్షిస్తూనే ఉన్నాయి.

మొదటి సినిమా విడులకి నోచుకోలేదు. తరువాత చేసిన 4 -5  సినిమాలు పరాజయంపాలు కావటంతో ఎన్నో అపజయాలు,హేళనలు, అవమానాలు తనని ప్రతి నిత్యం పలకరించేవి. ఇలా వరుస అపజయాలతో విసిగిపోయి, సినీరంగాన్ని వదిలివెళ్ళి క్లర్క్ ఉద్యోగానికి వెళ్లిపోదామనుకునే తరుణంలో భార్య గౌరి దేవి “మీకు ఇష్టమైన కళని వదులుకుని , ఏమాత్రం ఇష్టపడని ఆ ఉద్యోగం చేయటం కంటే,మీరు ఖాళీగా ఉన్నా ఫరవాలేదు ” అని ఉత్తమ్ కి ధైర్యాన్నిచ్చింది.

బెంగాళ్-బాంగ్లాదేశ్ లో అంతలా అభిమానులని సంపాదించుకున్న చరిత్ర బహుశా ఉత్తమ్ కుమార్ కే సొంతం.

దిలీప్ కుమార్దేవానంద్ఉత్తమకుమార్ ముగ్గురూ సమకాలీన నటులు. ముగ్గురూ దాదాపుగా తమ సినీరంగ ప్రయాణం ఒకేసారి మొదలుపెట్టారు.

దిలీప్ కుమార్ ఎక్కువగా త్యాగపు ఛాయలు ఉన్న పాత్రలకి పెద్ద పీట వేస్తే, దేవానంద్ ప్రేమికుడి గా, డైనమిక్ గా ఉండే పాత్రల్ని ఎంచుకునేవాడు.అందుకు భిన్నంగా ఉత్తమ్ కుమార్ అన్నిరకాలయిన కథలని ఎంచుకునేవాడు. తాను ఎంచుకునే కథలూ, పాత్రలు అప్పటి బెంగాళీ హీరోలు పాటించే పద్దతులకి భిన్నంగా ఉండేది.

అయితే ఈ కథల్ని ఎంచుకునే ప్రక్రియ తనకి అంత సులువుగా రాలేదు. తన సినీ జీవితం లో ఎదుర్కున్న అపజయాలనుండే ఈ కొత్త పాఠాలు నేర్చుకున్నాడు.

బెంగాళీ ప్రొడ్యూసర్లకి ఉత్తమ్ కుమార్ ఒక కల్పవృక్షమే. అగ్రస్థాయి నిర్మాతలు ఇద్దరు ముగ్గురు తమ సినిమా ఒప్పుకోవడానికి ముందే బ్లాంక్ చెక్స్ పంపేవారట. అప్పటి హీరోయిన్స్ ఉత్తమ్ పక్కన నటించడం ఒక అదృష్టం లా భావించి, తమకి ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా? అని అనుకునేవారట. సినిమా రిలీజ్ కి ముందే ‘హౌస్ ఫుల్’ బోర్డ్స్ కి ఆర్డర్లు ఇచ్చేవారట.

ఉత్తమ్ కుమార్ సెప్టెంబర్ 3, 1926 తేదీన తన మేనమామ ఇంట్లో జన్మించాడు. ఉత్తమ్ కుమార్ అసలుపేరు అరుణ్ కుమార్ ఛటర్జీ,తల్లిదండ్రులు, చపలాదేవి-సత్కారి ఛటర్జీ.

సౌత్ సబర్బన్ స్కూల్ లో చదివి , గోయెంకా కాలేజీ లో డిగ్రీ పూర్తి అవకముందే కలకత్తా పోర్ట్ ట్రస్ట్ లో క్లర్క్ గా ఉద్యోగం రావడం తో,  క్లర్క్ గా పనిచేస్తూనే నాటక రంగానికి పయనం.

ఉత్తమ్ కుమార్ కుటుంబానికి సుహృద్ సమాజ్, అని ఒక నాటక సంస్థ ఉండేది.  చిన్నతనంలోనే ఆ వాతావరణం ఉండటం వల్ల తన నటన కి సంబందించిన బీజాలు అక్కడే పడ్డాయి. నటనే కాకుండా రకరకాలయిన ఆటలు, ఈత, టెన్నిస్, కుస్తీ పోటీలు,గుర్రపు స్వారీ ఇలా ఒకటేమిటి అన్నిట్లో తన ప్రతిభ కనబరిచేవాడు.

నితిన్ బోస్ దర్శకత్వం లో వచ్చిన మొదటి సినిమా “మాయాదోర్”, కానీ అది విడుదల అవలేదు.

ద్రిష్టిదాన్ (1948 ) విడుదలయిన మొదటి సినిమా. ఆ తరువాత విడుదల అయిన, 4 -5 సినిమాలు వరుసగా ప్లాప్. అందువల్ల ప్రతి సినిమాకు తన పేరు మార్చుకున్నాడు. అరుణ్ ఛటర్జీ నుండి అరుణ్ కుమార్ అని , ఆ తరువాత ఉత్తమ్ ఛటర్జీ అని, చివరగా ఉత్తమ్ కుమార్ అని మార్చుకున్నాడు. ఆ పేరుతోనే బెంగాళ్ సినీ చరిత్రలో చిరస్థాయిగా, మహానాయక్ గా నిలిచిపోయాడు.

uttam2

‘బసుపరిబార్ ‘ సినిమా కొంతమేర విజయాన్ని సాధించగలిగింది.ఆ తరువాత విడుదలయిన ‘అగ్ని పరీక్ష'(1954 ) ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఉత్తమ్ కుమార్సుచిత్ర జంటగా నటించిన ఇది. ఈ సినిమా తరువాత ఈ జంట రొమాంటిక్ పెయిర్ గా పేరు తెచ్చుకుంది.

సుచిత్ర-ఉత్తమ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు చాలా ఉన్నాయి అందులో కొన్ని:

శిల్పి ,సప్తపది, పతే హోలో దేరి,హరనో సుర్, ఛోవాపావా, బిపాషా ,జిబాన్ త్రిష్ణ.

ఉత్తమ్ కుమార్కొన్ని విశేషాలు::

కలకత్తాలో ఉత్తమ్ స్మారకార్థం ఒక థియేటర్ ని (ఉత్తమ్ మంచ) నిర్మించారు.

కలకత్తా టోలీగంజ్ ప్రాంతం లో ఉత్తమ్ కుమార్ భారీ విగ్రహాన్ని నెలకొల్పారు. సెంట్రల్ రైల్వేస్ వారు టోలీగంజ్ మెట్రో స్టేషన్ ని ఉత్తమ్ కుమార్  స్టేషన్ గా మార్చారు.

శిల్పి సంసద్ అని పేద, వృద్ధ కళాకారులని ఆదుకోవడానికి ఉత్తమ్ స్థాపించిన సంస్థ తన కార్యకలాపాల్ని ఇప్పటికీ కొనసాగిస్తోంది.

2009  లో భారత ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ పేరు మీద  “ఉత్తమ్ కుమార్ది లెజెండ్ అఫ్ ఇండియన్ సినిమా” అని  స్టాంప్ ని విడుదల చేశారు.

సినిమా టైటిల్ క్రెడిట్డ్స్ లో తన పేరుకి ముందుగా హీరోయిన్ పేరు ని వేయించే సంప్రదాయాన్ని మొదలు పెట్టాడు ఉత్తమ్ కుమార్.

భారతరత్న సత్యజిత్ రేఉత్తమ్ కుమార్ కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి. అందులో నాయక్ సినిమా అత్యద్బుతమైనది. కొన్ని సంవత్సరాల క్రితం సత్యజిత్ రే సినిమాలు ఏవో చూస్తూ అనుకోకుండా నాయక్ సినిమా చూశాను. ఉత్తమ్ కుమార్ నటన నన్ను మెస్మరైస్ చేసింది. ఒకసారి చూశాక మళ్లీ చూశాను. అలా మళ్లీ మళ్లీ చూస్తూనే ఉన్నాను. ప్రముఖ హీరో అరింధం ముఖర్జీ గా ఉత్తమ్ కుమార్ నటన మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది.

అసలు ఉత్తమ్ కుమార్ ని నేను అంతలా అభిమానించడానికి కారణమే ,నాయక్(1966) సినిమా.

దీని గురించి వచ్చేవారం….!

*

 

డియర్ జిందగీ

zindagi

ఏక్టర్లు: అలియా భట్, షా రుఖ్ ఖాన్.
కేమియో పాత్రల్లో-కునాల్ కపూర్, అలీ జఫర్, అంగద్ బేదీ, ఈరా డూబే.
రిలీస్ తేదీ-నవెంబర్ 25, 2016.

రెడ్ చిల్లీస్, ధర్మా ప్రొడక్షన్స్, హోప్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద- గౌరీ షిండే దర్శకత్వంలో, గౌరీ ఖాన్ ప్రొడ్యూస్ చేసిన సినిమా. కరణ్ జోహార్ కో-ప్రొడ్యూసర్.
లక్ష్మణ్ ఉతేకర్ ఫోటోగ్రాఫర్.

బాల్యంలో జరిగిన ఒక సంఘటనో, ఏదో అనుభవమో, పెద్దయ్యాక జీవితాలమీద ఏదో దశలో ప్రభావం చూపించకుండా ఉండదు. ఇది సామాన్యంగా ప్రతీ ఒక్కరూ, ఎప్పుడో అప్పుడు ఎదురుకునేదే. ఈ పాయింటునే ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని, తీసిన సినిమా ఇది.

కథ: సినిమా ప్రారంభంలో, క్రేన్ మీద కూర్చుని ఒక సీన్ షూట్ చేస్తూ కనిపించిన కైరా(అలీయా భట్ )-ఉర్ఫ్ కోకో 20లలో ఉన్న ఒక సినిమాటోగ్రఫర్. ముంబయిలో ఆమె గడిపే జీవిత విధానాన్నీ, ఈ తరపు యువత కష్టపడి పనిచేసి, అంతే ఉల్లాసంగా పార్టీలలో పాల్గొనడమూ అవీ చూస్తాం. కైరాకి జీవితంలో ఎంతో సాధించాలన్న ఆశ ఉంటుంది. కాకపోతే, వృత్తివల్ల పొందగలిగే సంతృప్తి దొరకదు. తనకి తారసపడిన యువకులతో ప్రేమలో పడుతూ కూడా, ఏ బంధానికీ కట్టుబడి ఉండలేకపోతుంది.
మొండి స్వభావం, ముక్కుమీదుండే కోపం. డిప్రెషన్‌కి గురై- స్నేహితులయిన ఫాతిమా, జాకీతోనే గడపడంతోనూ, ఈ బే లో షాపింగ్ చేయడంలోనూ ఓదార్పు వెతుక్కుటూ ఉంటుంది. బోయ్ ఫ్రెండ్‌కి ఇంకెవరితోనో ఎంగేజ్‌మెంటవుతుంది.

ముంబాయిలో, తనున్న అపార్టుమెంటులో పెళ్ళవని వాళ్ళని ఉండనివ్వనని ఇంటి యజమాని చెప్తాడు. వీటన్నిటివల్లా, ఇన్సొమ్నియక్‌గా తయారవుతుంది. దిక్కు తోచక, అయిష్టంగా, తల్లితండ్రులుంటుండే తన స్వంత ఊరైన గోవా వెళుతుంది. వాళ్ళతో సంభాషణ అన్నా, కలిపి ఉండటం అన్నా విముఖత. తన హోమోసెక్స్యువల్ స్నేహితుని మాట విన్న తరువాత, ఒక మెంటల్ అవేర్‌నెస్ కాన్ఫెరెన్సులో సైకోలొజిస్ట్ జహంగీర్ ఖాన్ (బ్రెయిన్ డాక్టర్- షా రుఖ్ ఖాన్, కైరా మాటల్లో-జగ్)మాట్లాడుతుండగా విని, అతని క్లినిక్కి వెళుతుంది.
ఒక థెరపీ సెషన్లో కోకో- తను బాల్యంలో అనుభవించిన వేదనా, నిస్పృహా, ఆశాభంగాన్నీ అతనికి వెల్లడిస్తుంది. తన చిన్నప్పటి అనుభవాలని బట్టి, వదిలివేయబడటం అంటే కలిగిన భయం వల్ల తానే ఏ బంధాన్నీ నిలుపుకోలేకపోతోందని జగ్ చెప్పి, కైరా తన తల్లితండ్రులని క్షమించనవసరం లేదు కానీ వారిని ఒక తప్పు చేసిన, సామాన్యమైన మనుష్యులుగా మాత్రం చూడమని సూచిస్తాడు.

ఈ సినిమాలో ఖాన్‌కీ, ఆలియాకీ ఈ సినిమాలో ఏ శృంగారపరమైన సంబంధమూ ఉండదు. కాబట్టి ఖాన్ సినిమా అనుకుంటూ చూద్దామని వెళితే కనుక, నిరాశకి లోనయే అవకాశం ఉంది.
“నీ గతం నీ వర్తమానాన్ని బ్లాక్‌మైల్ చేసి, అందమైన భవిష్యత్తుని నాశనం చేయకుండా చూసుకో” అన్న జగ్ సలహా ప్రకారం, కన్నవాళ్ళతో రాజీపడి ఎన్నాళ్ళగానో వెనకబడి ఉన్న తన షార్ట్ ఫిల్మ్ పూర్తి చేస్తుంది.
బీచ్ మీద తన జీవితంలో భాగం అయిన వారందరిముందూ ఫిల్మ్ స్క్రీన్ చేసినప్పుడు- వారిలో, త్వరలోనే తను ప్రేమలో పడబోయే ఆదిత్య రోయ్ కపూర్ కూడా ఉంటాడు.
నిజానికి, సినిమాకి ప్లాటంటూ ఏదీ లేదు. కథనం సాగేది కొన్ని సంఘటనల, కదలికల, భావోద్వేగాలవల్లే.

కైరాకి సినిమాటోగ్రఫీలో సామర్థ్యం ఉందని మొదటి సీన్లోనే చూపించినప్పటికీ, తన వృత్తిలో ఆమె పడే శ్రమకానీ ప్రయాస కానీ కనపడవు. నిజానికి, ఆమె ఆకర్షణీయమైన జీవితం గడుపుతున్నట్టుగా కనిపిస్తుంది. అందమైన అపార్టుమెంటూ, ఆర్థిక ఒత్తిడి లేకపోవడం, మద్దత్తుకి ఇద్దరు స్నేహితురాళ్ళూ, రొమాన్సుకి ముగ్గురు అందమైన అబ్బాయిలూ.

కైరా పాత్రకీ, ‘హైవే’ సినిమాలో చివర సీన్లలో ఆమె చూపిన కొన్ని లక్షణాలకీ బాగా పోలిక ఉంది. అవే అణిచివేయబడిన అనుభూతులూ, వేదనాభరితమైన జ్ఞాపకాలని వదిలిపెట్టి, ముందుకు సాగాలన్న సందేశాలూ. అయితే, దీనిలో మట్టుకు వీటిని చూసినప్పుడు మనకి అంత బాధ కలగదు.
ఖాన్ ట్రేడ్ మార్కులయిన శరీర భంగిమలు, పెదవి విరుపులూ అవీ ఈ సినిమాలో కనబడవు. సూపర్ స్టార్‌గా కాక, ఆలియా పాత్రకే ప్రాముఖ్యతని వదిలి, తను పక్కకి తప్పుకున్నాడు. పూర్తి ఫోకస్ ఉన్నది ఆలియా భట్ మీదనే.
గోవా వీధులూ, సముద్రం, ప్రామాణికతని కనపరుస్తాయి. ఆలియా వేసుకున్న బట్టల డిసైన్లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి ఉంటాయన్నదాన్లో సందేహం ఏదీ లేదు.

పెద్ద హిట్ అయిన ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమాని డైరెక్ట్ చేసిన గౌరీ షిండే, మరి ఎందువల్లో కానీ ఈ సినిమాలో అంత ఎక్కువ వ్యక్తీకరించలేకపోయిందనిపిస్తుంది.
2.5 గంటల నిడివి కొంచం ఎక్కువే అనిపించినప్పటికీ, 4 ఏళ్ళల్లోనే 10 సినిమాల్లో నటించి, ఆలియా ఒక ఏక్టర్గా ఎంత ఎదిగిందో అని చూడటానికి ఈ అదనపు టైమ్ వెచ్చించడం సమంజసమే.

అమిత్ త్రివేదీ సంగీతం తేలిక్గా ఉంది. ‘గో టు హెల్’ అన్న పాట, హర్టుబ్రేక్ తర్వాత కలిగే నొప్పిని చక్కగా వర్ణిస్తుంది. ‘లవ్యు జిందగీ’ పాట వింటే, జీవితాన్నీ అది కలిగించే అనుభూతులన్నిటినీ అంగీకరించాలనిపిస్తుంది. కౌశార్ మున్నీర్ లిరిక్స్ ఇంపుగా ఉండి, అర్జీత్ సింగ్ పాడిన ‘ఏ జిందగీ’’ పాట, ఇప్పటికే అందరి నాలికలమీదా ఆడుతోంది.

ఖాన్‌తో థెరపీ సెషన్స్ అయిన తరువాత తప్ప, కైరా చిరాకెందుకో మనకకర్థం అవదు. తన తల్లితండ్రులతో, బంధువులతో కఠినంగా ఎందుకు ప్రవర్తిస్తుందో తెలియదు.

ఒక యువతి అంతర్గత జీవితాన్ని ఇంత విశదంగా అన్వేషించిన బోలీవుడ్ సినిమాలు చాలా తక్కువ.
ఈ ఫిల్మ్ ఉద్దేశ్యం కేవలం ప్రేక్షకులకి ఒక కథ అందించడమే అనీ, ఏ సామాజిక సందేశాలనీ ఇవ్వడం కాదనీ షిండే, భట్, ఖాన్ ముగ్గురూ-ఇంటర్వ్యూల్లో చెప్పినప్పటికీ, ఈ మధ్యే కొంతమంది సెలెబ్రిటీలు తాము తమ డిప్రెషన్తో ఎలా పోరాడారో అని పబ్లిక్గా చెప్పిన వెనువెంటనే, మానసిక ఆరోగ్య థెరపిస్టులని విసిట్ చేయడం అంటే ఏ పిచ్చిలాంటిదో ఉన్నప్పుడే, అన్న భ్రమని డియర్ జిందగీ కొంతలో కొంతైనా తొలిగించగలుగుతుందేమో!

సినిమా చూసిన తరువాత ప్రతీ ఒక్కరికీ బి డి (బ్రెయిన్ డాక్టర్) అవసరం తప్పక ఉంటుందనీ, దాన్లో తప్పేమీ లేదనీ మనం అంగీకరిస్తాం.
ఒక సీన్లో, కైరా బోయ్ ఫ్రెండ్‌కి ఇంకెవరితోనో ఎంగేజ్‌మెంటయిందని స్నేహితురాలైన ఫాతిమా( ఇరా డూబే) చెప్పినప్పుడు, పచ్చిమిరపకాయొకటి కొరికి నమిలి మింగేసి, ఎగపీలుస్తూ, ‘అది మిరపకాయవల్లే’ అని ఫాతిమాతో అని, తప్పించుకుంటున్న ఆలియా మొహంలో చూపిన షాక్, అపనమ్మకం లాంటి ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే, ఒక ఏక్టర్గా ఈ మధ్య తనకి ఇంత చిన్న వయస్సులోనే, ఇంత పేరెందుకు వస్తోందో అర్థం అవుతుంది.

ఇకపోతే, షిండే చాలా భారీ పాఠాలన్నిటినీ ఒకే స్క్రిప్టులో కూరడానికి ప్రయత్నించిందేమో అనిపించక మానదు.

కైరాని, ఆమె అంకుల్ తను ‘లెస్బియనా?’ అని అడగడానికి బదులు ‘లెబనీసా?’ అని అడగడం హాస్యం అనిపించదు.
సినిమాకి అతకకపోయిన కొన్ని ఇలాంటి చెదురుమదురు సీన్లు తప్పితే, డియర్ జిందగీ తప్పక చూడవలిసిన ఫిల్మ్.
*

 

 

విరుగుతున్న రెక్కల చప్పుడు – ఉడ్తా పంజాబ్

alia-bhatt-udta-punjab-trans

 

‘ఫ్లైయింగ్ హై’ అనేది ఒక మెటాఫర్.  ఇది ఒక విజయవంతమైన ఆనందమనే కాదు, ‘ఒక మత్తు మందు ప్రభావంతో ఆకాశంలో విహరిస్తున్న అనుభూతిని పొందడం’ అనే అర్థాన్ని కూడా కలిగి ఉంది. మన దేశంలో సాధారణంగా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతుంటే ‘తాగున్నావా?’ అనడుగుతారు. అదే డ్రగ్స్  వాడకం అధికంగా ఉన్న దేశాల్లో అయితే ‘ఆర్ యు హై?’ అని అడగటం పరిపాటి. దానికి అర్థం, ‘నువ్వు డ్రగ్స్  గానీ తీసుకుని ఉన్నావా?’ అని అడగటం. ‘ఉడ్తా పంజాబ్’ అంటే ఇక్కడ, పంజాబ్ ఎంతో గొప్ప స్థాయికి ఎదిగిపోయిందనీ, ఉన్నతమైన స్థితికి చేరుకుంటోందనీ అర్థం కాదు. డ్రగ్స్  మత్తులో మునిగి తేలుతోందని చెప్పడం. పేరుతో సహా అన్ని రకాలుగా ఈ సినిమా, పంజాబ్ లోని డ్రగ్ మాఫియా గురించి మాట్లాడబోతున్నట్టుగా

ముందుగానే ప్రచారం పొందింది. బాలీవుడ్ లో ఇప్పటివరకూ డ్రగ్స్  వాడకం కథాంశంగా కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ, అవేవీ పూర్తి స్థాయిలో ఈ సమస్య  గురించి చర్చించలేదు.

ఈ సినిమా ఒక రాక్ స్టార్ (షాహిద్ కపూర్), ఒక బీహారీ అమ్మాయి (ఆలియా భట్), ఒక సబ్ ఇన్స్పెక్టర్(దిల్జీత్ దోషన్జ్), ఒక డాక్టర్(కరీనా కపూర్) లు ప్రధాన పాత్రలుగా నడుస్తుంది. సినిమా మొదలవడమే రాక్ స్టార్ ‘గబ్రూ’ హోరెత్తించే పాటతో మొదలవుతుంది. పంజాబ్ లో చాలా మంచి రంగు కలిగిన అమ్మాయిలని ‘గోరీ చిట్టీ’ అని పిలుస్తారు. చిట్టా అంటే తెలుపు రంగని అర్థం. “ఓ చిట్టా వే” అంటూ మొదలయ్యే ఈ పాట తెల్లని డ్రగ్ పౌడర్ గురించి మాట్లాడుతుంది. మొత్తం పాటంతా ఒక తెల్లని అందమైన అమ్మాయికో లేక డ్రగ్ పౌడర్ కో, ఎలా అన్వయించుకున్నా సరిపోలే విధంగానే ఉంటుంది. డ్రగ్స్, వాటిని వాడినవారి నరాల్లో రేపేటంతటి హుషారూ, ఈ పాటకున్న సంగీతం కూడా రేపుతుంది.

లండన్ నుండి ఇండియాకు తిరిగి వచ్చి రాక్ స్టార్ గా మారిన ఒక గ్రామీణ పంజాబీ యువకుడు టామీ సింగ్. అప్పటికే పూర్తి స్థాయిలో డ్రగ్స్ మత్తులో కూరుకుపోయిన ఇతడు, డ్రగ్స్ తీసుకునేందుకు యువత ఉత్ప్రేరితమయ్యే  విధంగా పాటల్ని రాసి పాడుతుంటాడు. బాగా ప్రాచుర్యాన్ని కూడా పొందుతాడు. అలాగే అక్కడికి దగ్గరలో మరోచోట ఒక బీహారీ అమ్మాయి(ఆలియా భట్)కి దొరికిన 3 కిలోల హెరాయిన్ ఆమెకి తీవ్రమైన సమస్యల్ని తెచ్చిపెట్టి, డ్రగ్ మాఫియా చేతిలో చిక్కుకుపోయేలా చేస్తుంది. వీరిద్దరూ ఒకరికొకరు అనుకోకుండా ఎదురుపడటం, టామీ సింగ్, బీహారీ అమ్మాయి ప్రేమలో పడటం, అప్పటికే తను చేస్తున్నది తప్పన్న ఆలోచనలో ఉన్న అతడు, ప్రేమ డ్రగ్స్  కంటే ఎక్కువ మత్తుని కలిగిస్తుందని భావించడం, ఆమెని డ్రగ్ మాఫియా బారి నుండి కాపాడి పోలీసులకి లొంగిపోవడం ఒక స్టోరీ.

ఇక అదే గ్రామానికి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ సర్తాజ్ సింగ్, తన తమ్ముడు డ్రగ్ ఎడిక్ట్ గా మారి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం వల్ల జ్ఞానోదయం పొంది, అప్పటికే యాక్టివిస్ట్ గా పని చేస్తున్న డాక్టర్ ప్రీత్ సాహ్నీతో కలిసి ఆ ముఠా గుట్టు రట్టు చేసే ప్రయత్నం చేస్తాడు. కథ ఏవేవో మలుపులు తిరిగి చివరికి ఆ డాక్టరమ్మాయీ, ఇంకా కొందరి డ్రగ్ మాఫియా సభ్యుల మరణాలకి దారి తీస్తుంది. మొత్తానికి వీరి ప్రయత్నాల కారణంగా ప్రభుత్వంలో, ప్రజలలో కొంత ఉత్తేజంగా కలిగినట్టుగా భావించమనే విధంగా సినిమా ముగుస్తుంది.

సినిమా మొత్తానికి ప్రధానంగా చెప్పుకోవాల్సింది బీహారీ అమ్మాయిగా నటించిన ఆలియా భట్ గురించి. పూర్తిగా డీ గ్లామరైజ్ చేయబడిన పాత్రలో ఆమె నిజంగా చక్కని నటనను ప్రదర్శించింది. బీహార్ లో పనులు దొరకని కారణంగా చాలామంది అక్కడినుండి సంపన్న రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, జమ్మూ వంటి ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. అక్కడ దొరికిన పనులు చేసుకుంటూ ‘జుగ్గీ’లనబడే తాత్కాలికమైన గుడారాల్లో కాలాన్నివెళ్లదీస్తుంటారు. అటువంటి ఒక పదిహేను, పదహారు సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి పాత్రలో ఆలియా భట్ చక్కగా ఇమిడిపోయింది. వేషభాషలు, మాట్లాడే యాసా, బాడీ లాంగ్వేజ్ ఆమెకు సరిగ్గా సరిపోయాయి. (నాకైతే మేం జమ్మూలో ఉన్నప్పుడు, వీధి చివరి జుగ్గీలో ఉండే ఉషా అనే బీహారీ అమ్మాయే గుర్తొచ్చింది). అంతే కాక అధికమైన విల్ పవర్, ధైర్యం కలిగిన అమ్మాయిగా ఆమె పాత్ర సినిమాకు మంచి బలాన్ని చేకూర్చింది. మాఫియా ముఠా సభ్యులు ఆమెని డ్రగ్ ఎడిక్ట్ గా మార్చినప్పటికీ, తన నోట్లో తనే గుడ్డలు కుక్కుకుని ఆ కోరికని అణుచుకునే ప్రయత్నం చేయడం, ఇంకా ఆమె పాత్రకు చెందిన కొన్ని ఇతర సన్నివేశాలూ  చాలా సహజంగా, మనసుని కదిలించేవిగా ఉన్నాయి. సంగీత దర్శకుడు అమిత్ త్రివేదీ అందించి హిప్ హప్ సంగీతం కూడా సినిమాకు చెందిన బలమైన విషయాలలో ఒకటిగా చెప్పుకోవాలి. దాంతోపాటుగా డ్రగ్స్  ప్రపంచానికి చెందిన ఆ చీకటి వాతావరణాన్ని సృష్టించడంలో సినెమాటోగ్రాఫర్ రాజీవ్ రవి సఫలమయ్యాడు

అయితే, మొదలవడం బాగానే మొదలైనప్పటికీ, ఎక్కడ తప్పిందో తెలీకుండానే కథ దారి తప్పి ఎటో వెళ్లిపోతుంది. ఒక జటిలమైన సమస్యకి కొంత కామెడీని కూడా కలిపి సినిమాను డార్క్ కామెడీగా ప్రజెంట్ చేద్దామనుకున్న దర్శకుడి ఆలోచన ఎక్కువై, అసలు విషయం పక్కకి తప్పుకుంది. ఈ సినిమా ద్వారా ఒక్క విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఇండియాలో, ముఖ్యంగా పంజాబ్ లో చాలా సులువుగా డ్రగ్స్  లభ్యమవుతున్నాయి. అవి కూడా ప్రాంతీయంగా తయారుచేయబడి

చాలా తక్కువ ధరలకే అన్ని మందుల దుకాణాలలోనూ దొరుకుతున్నాయి. ఇందుకు రాజకీయ నాయకుల, పోలీసుల అండాదండా పుష్కలంగా లభిస్తోంది. ఈ విషయాన్ని చెప్పడం కోసం దర్శకుడు ‘అభిషేక్ చౌబే’ ఎంచుకున్న కథలోనే కొంత తడబాటు ఉంది.

ఒక సమస్య  ఉందని చెప్పినప్పుడు, అది ఎందుకు ఎలా మొదలైందో మూల కారణాలను వెదకడం, అది ఇంకా ఏ విధంగా విస్తరిస్తోందో గమనించేలా చేయడం, అవకాశం ఉంటే ఆ సమస్యకు తోచిన పరిష్కారాన్ని సూచించడం ఒక పధ్ధతి. లేదూ, ఆ సమస్యని కథలో భాగంగా తీసుకున్నప్పుడు, కథను ప్రధానంగా నడిపించి సమస్యను అందులో సహజంగా లీనం చెయ్యడం రెండో పధ్ధతి. కానీ ఈ సినిమా రెండు పడవల మీదా కాళ్లు పెట్టి ప్రయాణించే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది. అలాగే సెన్సార్ సమస్యని తీవ్రంగా ఎదుర్కొన్న చిత్రంగా కూడా ఈ సినిమా వార్తలకెక్కింది. నిజానికి కథకు అంతగా అవసరం లేని అశ్లీల పద ప్రయోగాలు సినిమాలో ఎక్కువగా ఉన్న మాట వాస్తవం.

ఇప్పటికే ధూమపానం, మద్యపానం కారణంగా అన్ని విధాలుగా నాశనమయిపోతున్న మన దేశం, సరైన పద్ధతిలో ఆలోచన చేసి ఈ సమస్య  మరింతగా విస్తరించిపోకుండా అవసరమైన చర్యలు తీసుకోవడం మంచిది.  అలా చెయ్యని పక్షంలో, ఈ సినిమాలోనే చెప్పినట్టుగా మన దేశం డ్రగ్స్ విషయంలో మరో మెక్సికోగా మార్పు చెందే సమయం పెద్ద దూరంలో ఉన్నట్టుగా కనిపించడం లేదు. పాబ్లో ఎస్కబార్ అనే డ్రగ్ మాఫియా డాన్, 1970,80 లలో అమెరికన్ రాష్ట్రాలకి డ్రగ్స్  అక్రమంగా రవాణా చేసి, అక్కడి యువతను మత్తుపదార్ధాలకి బానిసలుగా చేసాడు. ఒకవేళ అవే మత్తు పదార్ధాలు ప్రాంతీయంగా తయారుచేయబడితే, తక్కువ ధరకే లభ్యం కావడంతో పాటుగా మన దేశంలోని అవినీతి కూడా తోడై అతి సులువుగా వ్యాపించిపోతాయి. ఒక్క సారి గనక జనం, ముఖ్యంగా యువతరం వాటికి అలవాటు పడితే, మానడమనే విషయం చాలా కష్ట సాధ్యమైపోతుంది. అందువల్ల ఇటువంటి ప్రాథమిక దశలో ఉన్నప్పుడే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ కి చెందిన అసలైన చీకటి కోణాల గురించీ, వీడ్ అనీ పాట్ అనీ పిలవబడే మార్జువానా గురించీ, మెథ్, కొకైన్, హెరాయిన్ వంటి మత్తు పదార్ధాల తయారీ, వాటి అక్రమ రవాణాల గురించీ, అవి కలిగించే దుష్ఫలితాల గురించీ, ఆ మాఫియా గ్రూప్ ల గురించీ సవివరంగా తెలుసుకోవాలంటే నెట్ఫ్లిక్స్  ఒరిజినల్ సీరిస్ అయిన “నార్కోస్” చూస్తే సరిపోతుంది. ఇది యథార్థ గాథ. అదికాక డ్రగ్స్ ప్రపంచానికి చెందిన కల్పిత గాథ ‘బ్రేకింగ్ బాడ్”. బాగా ప్రాచుర్యం పొందిన ఈ టీవీ సీరీస్ కూడా నెట్ఫ్లిక్స్ లో ఉంది.

మనిషికి వెన్నెముకా, పక్షికి రెక్కల వంటి వారు దేశానికి యువత. ఇప్పుడవి డ్రగ్స్ మూలంగా పటపటా విరుగుతున్న చప్పుడు పంజాబ్ అంతా వినిపిస్తోందని ఈ సినిమా చెప్తోంది. మిగిలినవన్నీ పక్కన పెట్టి చూస్తే,  ‘డ్రగ్స్  విషయంలో పూర్తిగా ఆలస్యమైపోక ముందే మేలుకోవాల్సిన అవసరం ఉందంటూ’ దేశానికీ, సమాజానికీ ఈ సినిమా ఒక హెచ్చరికని జారీ చేసిందన్న విషయాన్ని మాత్రం ఒప్పుకోవాలి.

***

 

దృశ్యాదృశ్య ఆవిష్కర్త – జాంగ్ యిమో

ram4

“Life is a strange mixture of bitterness and sweetness. A journey through the enormous dangers and sorrows as well as happy moments. If the music of love fills the heart…the life has its meaning even in headrest circumstances. This is the life of few simple and humble people. They are so ordinary. They just accept life as it comes, so naturally, without any complaints. If they are so ordinary what makes you hear their story. It is the love they have in their hearts.”

(మహాదర్శకుడు జాంగ్ యిమో చిత్రం “To Live” చూసినప్పుడు నేను నా డైరీలో రాసుకున్న వాక్యాలు)

 

“To do art, one thing should always remember – subjects of people in misery have deep meanings.”

– Zang Yimou

నల్లని మానవ జీవిత దుఃఖపు పొరల సందుల్లోంచి చిక్కగా పెల్లుబికే ఆనందపు కాంతిని ఒడిసిపట్టుకొని, విస్మయం కలిగించే చిత్ర విచిత్ర వర్ణపటలాల గుండా  మానవ హృదయం మీద గాఢంగా, లోతుగా అపూర్వమైన శక్తితోనూ, విభ్రాంతికరమైన తీక్షణతతోనూ ముద్ర వేసే దృశ్యాదృశ్య ఆవిష్కర్త, మహాకళాకారుడు జాంగ్ యిమో.

క్రూరమైన జీవిత పదఘట్టనల క్రింద నలిగే సాదాసీదా ప్రజల ఆత్మలలోని సౌందర్యం అణచివేయబడుతుందా? వారి హృదయాలలోని ఆనందాన్ని, ఉన్నతిని లోకపు మూఢత్వం, అజ్ఞానం, యుద్ధోన్మాదం చెరిపివేయగలవా?

దర్శకుడు జాంగ్ యిమో పాత్రలు దుఃఖానికి, ఆనందానికి అతీతమైన ఒక తీక్షణమైన ఎరుకలోకి మనల్ని నెట్టివేస్తాయి. మనం ఆయా పాత్రలుగా మారిపోతాం. పునర్జన్మిస్తాం. ఒక్కొక్క జీవితాన్ని జీవిస్తాం. మరణిస్తాం. చివరికి తిరిగి మన రోజువారీ జీవితంలోకి వచ్చినప్పుడు ఒక జ్ఞానాన్ని మోసుకొని వస్తాం. అప్పటి వరకు మనం జీవించిన అదే పాత మసకబారిన జీవితం కొత్త సాంద్రతతో, కొత్త వర్ణాలతో, కొత్త కాంతితో మెరిసిపోవడం చూస్తాం. ప్రేమ దుఃఖానికీ, ఆనందానికీ అతీతంగా మనలో ప్రవహించడం గమనించి ఆశ్చర్యపోతాం.

ram2

జాంగ్ యిమో మొదటి కమర్షియల్ చిత్రం జట్ లీ, డాని యాన్ ప్రధాన పాత్రలుగా 2002 లో Hero విడుదలైనప్పుడు ఆ చిత్రంలోని అత్యున్నతమైన సాంకేతికతకి, దృశ్య చిత్రీకరణాసంవిధానానికి hollywood విస్తుపోయింది. ఎన్నడూ చూడని ఖచ్చితత్వం, తీక్షణత ఆయన సృజించే దృశ్యాలను అనితర సాధ్యం చేస్తాయి. ఆయన దృశ్యావిష్కారానికి మంత్రముగ్ధమయింది యావత్ ప్రపంచమే కాదు, కఠినమైన చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం కూడా. US Top 10 లో No.1 గా నిలచిన Hero చిత్రం 2003 వ సంవత్సరం జాంగ్ యిమోకి ౩వ ఆస్కార్ నామినేషని కూడా గెలుచుకుంది. ఎన్నో పర్యాయాలు ఆయన కళాఖండాల మీదే కాకుండా, ఆయన మీద కూడా నిషేధం విధించిన చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి సైతం ఆయనను గౌరవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనను చైనా దేశపు అత్యున్నత కళాకారునిగా గుర్తించడమే కాకుండా చైనా సినిమాకే ప్రతినిధిగా భావించింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్ ప్రారంభ మరియు ముగింపు ఉత్సవాలకు దర్శకత్వం వహించే గురుతర బాధ్యతను ఆయనకు  అప్పగించి గౌరవించింది. ఆ ఉత్సవాలలో జాంగ్ యిమో కళాత్మక ప్రజ్ఞను చూసి; చైనా దేశపు ఆధ్యాత్మిక, సాంస్కృతిక సారాన్ని అత్యున్నత సాంకేతిక ఉత్కృష్టతతో మేళవించి ఆయన రూపొందించిన శక్తివంతమైన కళారూపాల్నిదర్శించి ప్రపంచం అవాక్కయింది. ఏ ఒలింపిక్స్ లోనూ చూడనిది, ఇకపై చూడబోనిది అయిన ఆ కళాప్రదర్శన అనన్యసామాన్యం. ఎన్నో సంవత్సరాలు గడచినా ప్రజలు ఇంకా ఆ ఉత్సవాలను డీవీడీలు, బ్లూరేల వంటి మాధ్యమాల ద్వారా చూసి ఆనందిస్తున్నారు.

ram3

స్టీవెన్ స్పీల్ బర్గ్ ఆయనతో భారీ చిత్రాన్ని నిర్మించాలని ఆశపడినా; క్రిస్టిన్ బాలే, మాట్ డామన్ వంటి సూపర్ స్టార్లు ఆయన చిత్రంలో చిన్న పాత్ర చేసినా చాలని పరితపించినా, hollywood ఆయన సాంకేతిక ప్రజ్ఞను సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించినా; ఆయన చైనాను, ఆ దేశపు సంస్కృతిక మూలాల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. అలాగే కేవలం భారీ చిత్రాలకు పరిమితం కాలేదు. ఆయన కళాత్మక తృష్ణను తృప్తిపరచే బాధితుల, వ్యధార్తుల, దీనుల, నిష్కల్మషమైన ప్రేమికుల కథలను విడువలేదు. మానవీయతలో సుస్థిరంగా పాదుకొన్నఆయన దార్శనికత, అనన్యసామాన్యమైన ఆయన కళాత్మక శక్తి, ఆయనను చైనా సినిమాకే అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టినా, ఆయన చూపు ఎప్పుడు మట్టిలో అజ్ఞాతంగా ఒక క్షణం అత్యంత వైభవంతో ప్రకాశించి తిరిగి మట్టిలో కలిసిపోయే మాణిక్యాల(ఆయన కథలలోని పాత్రలు) మీదే ఉంటుంది.

చైనా దేశపు సాంస్కృతిక వైశిష్ట్యాన్ని, తాత్విక సారాన్ని హృదయంలో ఇంకించుకున్న జాంగ్ యిమో కాలాతీతమైన విలువలకి సాటిలేని artistic authorityతో ప్రాతినిధ్యం వహిస్తారు. ఇంత గొప్ప విజయాలు సాధించిన జాంగ్ యిమో, వాటికి అంటకుండా కర్మయోగిలా ఎంతో సాదాగా జీవితాన్ని గడుపుతారు.

చైనా దేశపు దర్శకులలో 5వ తరం వాడయిన జాంగ్ యిమో జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మావో నేతృత్వంలోని కమూనిస్ట్ సైన్యం చేతిలో చైనా జాతీయ ప్రభుత్వం పరాజయం పాలైన పరిస్థితుల్లో ఆయన 1950లో Shaanxi provinceలోని Xi’anలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించడం జరిగింది. 1960లలో ప్రారంభమైన క్లిష్టమైన సాంస్కృతిక విప్లవ కాలపు అస్థిర పరిస్థితుల్లో పాఠశాల విద్యను మధ్యలో ఆపివేయించి, వ్యవసాయ క్షేత్రానికి రైతులతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం అతనిని పంపించింది. ఆ తరువాత Xianyangలోని వస్త్ర పరిశ్రమలో కూలీగా కూడా ఆయన పనిచేయవలసి వచ్చింది. ఆ సమయంలోనే జాంగ్ యిమోకి చిత్రలేఖనం మీద, ఫోటోగ్రఫీ మీద అభినివేశం కలిగింది. అప్పుడే ఆయన తన రక్తాన్ని అమ్మి మొదటి కెమెరాని కొనుక్కున్నాడని చెబుతారు.

1976లో మావో మరణం తరువాత, సాంస్కృతిక విప్లవానంతరం, ఉద్రిక్త పరిస్థితులు సడలిన తరువాత బీజింగ్ పిల్మ్ అకాడమీలో చేరడానికి దరఖాస్తు చేసినప్పుడు వయసు ఎక్కువ కావడం వల్ల జాంగ్ యిమోకి ప్రవేశం నిరాకరించబడింది. అయితే ఆయన తీసిన ఛాయా చిత్రాలతో కూడిన portfolioను చూసిన తరువాత, ఆయన ప్రతిభకు ముగ్ధులయిన అధికారులు విచక్షణాధికారంతో ప్రవేశం ఇచ్చారు. అక్కడే 5వ తరం మహాదర్శకులైన  Chen Kaige మరియు Tian Zhuangzhuangలు  సహ విద్యార్థులుగా ఆయనకు పరిచయం అయ్యారు. సినిమాటోగ్రాఫర్ గా జీవితం ప్రారంభించిన జాంగ్ యిమో Chen Kaige  సినిమాలకి పనిచేయడం ఆయనకి ఎంతో గుర్తింపు తెచ్చింది. వారిద్దరి కలయికలో Yellow Earth (1984) వంటి గొప్ప చిత్రాలు నిర్మితమయ్యాయి.

ram1

Central Academy of Dramaలో విద్యార్థిని అయిన గాంగ్ లీ(అనంతర కాలంలో ఆమె మహానటిగా అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు)ని పరిచయం చేస్తూ, జాంగ్ యిమో దర్శకత్వం వహించిన ఆయన మొదటి చిత్రం Red Sorghum(1997) ఆయనకి విశ్వ ఖ్యాతిని తీసుకురావడమే కాకుండా, 1998లో ఉత్తమ చిత్రంగా 38వ Berlin International Film Festival లో Golden Bear పురస్కారాన్ని తీసుకువచ్చింది. కాని ఆ తరువాతి  చిత్రాలయిన Judou మరియు Raisethe Red Lantern చైనాలో నిషేధానికి గురయ్యాయి. అలాగే To Live చిత్రంతో ఆయన పై దర్శకుడిగా నిషేధం విధింపబడింది. Judou మరియు Raise the Red Lantern చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకోవడమే కాకుండా ఆస్కార్ నామినేషన్ లతో సహా పలు అంతర్జాతీయ పురస్కారాలను ఆయనకు తీసుకువచ్చాయి. ఆ తరువాత ఆయన ఎన్నో వైవిధ్యమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు, అసంఖ్యాకమైన పురస్కారాల్ని అందుకున్నారు.

ఆయన చిత్రాలు మన హృదయాల్ని ద్రవింపజేయడమే కాదు, జీవితాంతం మనలో భాగమై జీవిస్తాయి. మన దృక్పథాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ప్రపంచంలో గొప్ప కళాత్మక చిత్రాలు తీసిన మహాదర్శకులు ఎందరో ఉన్నారు. అయితే వారి చిత్రాలు అందరి హృదయాలనీ తాకలేవు. కాని జాంగ్ యిమో చిత్రాలు మేధావులతో పాటు సామాన్యులను కూడా అలరిస్తాయి. ఎవరి స్థాయిలో వారికి అవి అర్థం అవుతాయి. Connect అవుతాయి. జీవిత మర్మాన్ని విశదపరుస్తాయి. ఇక విశ్వజనీనతని, అమేయమైన శక్తిని నింపుకున్న విశిష్ట కళారూపాలు ఆ దృశ్య మాంత్రికుని హస్తాల నుండి అనూహ్యమైన, మహిమాన్విత వర్ణాలలో, రంగులలో పుప్పోడిలా వెదజల్లబడతాయి.

జాంగ్ యిమో techinical excellencyని అందుకోవడం hollywoodకి సాధ్యం కాదు. అలాగే హృదయాన్ని నవనీతం చేసే ఆయన కవితాత్మకతని కూడా. ఆయన ఒక విశిష్ట కళాకారుడు. దృశ్య ద్రష్ట.

సుమారు 15 ఏళ్లుగా నిర్మాతలు ఆయనకు పారితోషకం ఇవ్వకుండా ఆయనను మోసం చేస్తున్నా, ఆయన వారితో చిత్రాలు తీస్తూనే ఉన్నారు. ఆయనకు గొప్ప చిత్రాలు తీయడం ఒక్కటే జీవితంలో ముఖ్యమని ఆయన చెప్పిన ఈ వాక్యం  చదివితే అర్థమవుతుంది.

“I hope before I am getting too old and when my mind is still functioning, I can tell some better stories.”

*

మనసు గీసిన బొమ్మలు ఈ సినిమాలు!

                     

                               siva1

                               

“ఓ నాటికి ఈ భూమండలం నాగరికతా ముఖ చిత్రాన్ని మార్చివేయగల శక్తివంతమైన నవ కల్పన సినిమా. తుపాకీ తూటా, విద్యుత్ శక్తి, నూతన ఖండాలు కనుగొనటం కన్నా ప్రధానమైన ఆవిష్కరణ సినిమా. ఈ భువిపై మానవాళి ఒకరి నొకరు తెలుసుకోవడానికి, ఒకరి కొకరు చేరువ కావడానికి, ఒకరి నొకరు ప్రేమించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది సినిమా. సినిమాకు సముచిత ప్రాధాన్యత నిద్దాం. ప్రేమిద్దాం!గౌరవిద్దాం”-అని అంటారు ముస్తఫా కమాల్ అటాటర్క్.

చలన చిత్రమంటే కదిలే బొమ్మలతో కథ చెప్పేది. తక్కువ మాటలు-ఎక్కువ దృశ్యాలు. కినిమా అంటే పురోగమనమని అర్ధం. దాని సమానార్ధకమే సినిమా! ప్రపంచ సమాజంలో వెల్లి విరిసిన భావ పరంపరల వ్యక్తీకరణ సాహిత్యమైతే దాని విస్తృత దృశ్యీకరణే సినిమా! దృశ్యీకరణ ద్వారా మనిషిని చిరంజీవిని చేసింది సినిమా!

దృశ్యమైతే  జీవితాంతం మనసులో ముద్ర పడి పోతుంది. ఉదాహరణకి కన్యాశుల్కంలో సావిత్రి ఏడు నిమిషాల పాటు న  వ్విన దృశ్యం. ఒకసారి చూసిన వారు ఆ దృశ్యాన్ని మర్చిపోవడం అసంభవం. కొన్ని వందలు, వేలు, లక్షలమంది పుస్తకాలు చదివితే  ఎన్నో కోట్ల మంది  సినిమాలు చూస్తారు.ఏది సాధించాలన్నా ముందుగా ప్రజల ఆలోచనా విధానాల్లో మార్పు రావాలి.భావవ్యాప్తి లేకుండా ఏదీ సాధ్యం కాదు. మన రాష్ట్రం, మనదేశం అని కాకుండా రచయితలు ప్రపంచానికి చెందినవారనుకుంటే మనం ఇప్పుడు ప్రపంచీకరణ వల్ల ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకూ ప్రపంచం వైపుకి దృష్టి సారిస్తే, ప్రతి విషాదాన్నీ మనకంటే ముందు ఎదుర్కొన్నవాళ్ళు ప్రపంచ సినిమాల్లో కనిపిస్తారు.కష్టంలో ఉన్న మనుషులకి గొప్ప దన్నూ, మనం ఒంటరి వాళ్ళం కాదు అనే భరోసా లభిస్తాయి.కనపడని సమాజం, వ్యవస్థలు మనుషుల రూపంలో చేస్తున్న ఆగడాలు తెలిసివస్తాయి.ఎవరు చెప్పినా నమ్మం కనుక మన నరనరాల్లో జీర్ణించుకు పోయిన అమానుషత్వం, అవినీతి, ఉదాసీనత, మూఢవిశ్వాసాలు, అసమర్థత, నిరక్షరాస్యతలను ఎదురుగా పెట్టి కళ్ళకు కట్టినట్లు మన జీవితాలను మనమే చూస్తున్నామా అన్నట్లు చూపిస్తాయి సినిమాలు.

ఏ వ్యక్తైనా అతని జీవితంలో వ్యక్తులనుంచి,వ్యవస్థల నుంచి వచ్చిన ఒత్తిళ్ళను తట్టుకుని నిలబడి,ప్రశ్నించి, ప్రతి ఘటించి, సామాజిక ఎజెండాను ఎదుర్కొని, ప్రజల ఆకాంక్షలను నిలబెట్టే ప్రయత్నంలో ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తూ  చేసే ఏ పనైనా మానవజాతి పురోగమనానికి దోహదపడుతుంది.  ప్రపంచంలోని ఎందరో ప్రతిభావంతులైన రచయితలు,కళాకారులు సినిమా మాధ్యమం ద్వారా మానవాళికి వినోదాన్నందిస్తూనే చైతన్యవంతం చెయ్యడానికి తమ జీవిత కాలమంతా శ్రమించి,పోరాడి,రహస్యంగా పని చేసి,చివరికి ప్రాణత్యాగాలు కూడా చేసి చిరస్మరణీయమైన కృషి చేశారు.

సినిమా మేధావి చాప్లిన్ తన చిత్రాల్లో పాలక సమాజాన్ని తన వ్యాఖ్యానాలతో విమర్శలతో చీల్చిచెండాడాడు.

రష్యాలో మార్క్స్ గతి తార్కిక భౌతికవాదాన్ని “మాంటేజ్” కి అన్వయించి, అద్భుతమైన చిత్రాలు నిర్మించారు సెర్గాయ్ ఐసెన్ స్టీన్,వుడోవ్ కిన్ మొదలైన ప్రపంచ ప్రసిద్ధ ప్రముఖులు.  ఫుడోవికిన్ గోర్కీ “మదర్”ని చలన చిత్రంగా నిర్మిస్తే, ఐజెన్ స్టీన్   “స్ట్రైక్” లాంటి చిత్రాలను “మాంటేజ్” విధానంలో రూపొందించారు.

లాటిన్ అమెరికా సినిమా రచయితలు. “ప్రతీకారమో, ప్రాణ త్యాగమో” అనే నినాదమిస్తూ జనంలో మమేకమై “విప్లవానికి ప్రేలుడు పదార్ధాల్లా ఉపయోగపడే చిత్రాలు తీస్తున్నాం” అంటూ గెరిల్లా సినిమాకు బాటలు పరిచారు.

జర్మనీ నుంచి పురుషాధిక్య ప్రపంచంలో నిలదొక్కుకుని 56 మంది మహిళల్లో జుట్టా బ్రుకనీర్, మార్గరెట్ వాన్ ట్రోటా, డొరిస్ డెర్రీ, హెల్కే సాండర్స్ వంటివారు ఉత్తమ ప్రపంచ దర్శకులుగా ఘనకీర్తి సాధించారు.

విదేశాల్లో అన్ని రకాల ఇజాల్లో సాహిత్యం వచ్చినట్లే, సినిమాలూ వచ్చాయి.

ఇటలీ నుంచి విట్టోరియా డిసికా తీసిన నియో రియలిస్టు సినిమా బైసికిల్ తీఫ్. సినిమా పూట గడవని మామూలు మనిషిని దోషిగా నిలబెడుతున్న కంటికి కనపడని అసలు దొంగ ఫాసిజం అని తేల్చి చెప్తుంది.1948 లో వచ్చిన సినిమా మన సత్యజిత్ రే కి ప్రేరణ నిచ్చిపథేర్ పాంచాలివాస్తవమైన అద్భుత సృష్టికి  కారణమైంది.

మన దేశం విషయాని కొస్తే సత్యజిత్ రే, మృణాల్ సేన్, రిత్విక్ ఘటక్, భూపేన్ హజారికా, శాంతారాం, బిమల్ రాయ్, గురుదత్, శ్యాం బెనెగల్, గౌతం ఘోష్ మొదలైన ఎందరో ప్రతిభావంతులు మంచి సినిమాలతో అంతర్జాతీయ ఖ్యాతి నార్జించారు. ఇక మన తెలుగు విషయాని కొస్తే “జాతీయోద్యమ చైతన్య దీపం చాలా చిన్నది”అని  కె.వి.ఆర్. అన్నట్లు ఆ పరిమితుల్లోనే మన సినిమాలొచ్చాయి. జాతీయోద్యమ, సంస్కరణోద్యమ ప్రభావాలతో కొన్ని విలువల్ని ప్రతిబింబించే చిత్రాలు 50,60 దశకాల్లో వచ్చాయి. “సినిమా అన్నది చాలా శక్తివంతమైన సాంస్కృతిక మాధ్యమం. దాన్ని సరిగా ఉపయోగించుకో దగ్గ ప్రతిభావంతులు ఇంకా రావాల్సి ఉంది” అన్నారు సినిమారంగంలో ఎన్నో దశాబ్దాలు గడిపిన శ్రీశ్రీ. మహాకవి అన్నట్లే ఇప్పుడెదుర్కొంటున్న ప్రపంచీకరణ విపత్కర పరిస్థితులకు ఎదురు నిలిచే, చైతన్యాన్నిచ్చే చిత్రాలు మనకి లేవు.

ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా 1913 లో ప్రపంచ సినిమా విశ్వవేదిక మీద కొచ్చింది. వెయ్యేళ్ళు గడిచాక ఇప్పుడొస్తున్న సినిమాలను పరిశీలిస్తే స్త్రీల జీవితాలు ఏమాత్రం మెరుగుపడలేదనీ, వారు ఆత్మ గౌర వంతో జీవించే పరిస్థితులు ఏ దేశంలోనూ లేవనీ రుజువైంది. 1913 తర్వాత సరిగ్గా శతాబ్దం తర్వాత అంటే 2013 లో వచ్చి నన్ను అమితంగా దుఖపెట్టి, కదిలించి,  కలవరపెట్టి, మనసులో తిష్ట వేసిన  రెండు సినిమా కథల గురించి ఇక్కడ ప్రస్తావిస్తాను.

మొదటి సినిమా పేరు ఒసామా”(Osama)

ఇది ఆఫ్గనిస్తాన్ చిత్రం. దర్శకుడు బర్మెక్. 1996 నుండి ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వం పూర్తిగా చిత్రనిర్మాణాల్ని నిషేధించింది. ఈ సినిమా ఆఫ్గనిస్తాన్,నెదర్లాండ్స్,జపాన్,ఐర్లాండ్,ఇరాన్ కంపెనీల మధ్య ఒక అంతర్జాతీయ సహ-ఉత్పత్తి వల్ల ప్రపంచం ముందుకొచ్చింది.ఈ సినిమా ఒక నిరాశ, భయంకరమైన లేమి, మరణం, ఒక విషాదం, అన్నీ కల గలిపిన ఒక గొప్ప షాక్! బాలికలు,మహిళలకు సంబంధించి ప్రపంచ దుస్థితినీ, వారి పట్ల వ్యవస్థలు అవలంబించే దుర్మార్గమైన పద్ధతులనూ అద్దంలో పెట్టి చూపించే చిత్రం.

siva2

 

ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల నియంతృత్వ పాలనలో ఉన్న సమయంలో ప్రజలపై ఎన్నో రకాల ఆంక్షలు, పెత్తనా లుండేవి.ముఖ్యంగా మహిళలపై అణచివేత మరీ దారుణంగా ఉండేది.వారికి సామాజిక జీవితం నిషేధించ బడింది.తాలిబన్లు స్త్రీలను బురఖా ధరించి తీరాలని నిర్భంధిస్తారు.వారిని ఎవరూ చూడ కూడదనుకుంటారు. ఎందుకంటే  మహిళల ముఖం చూడడం వల్ల సమాజం లోని అన్ని రకాల అధోగతులు చుట్టుకుంటాయని, సర్వనాశన మవుతుందని తాలిబన్ల బలమైన విశ్వాసం.పనిహక్కు లేదు. అసలు స్త్రీలు భర్తతో తప్పించి బయట కనపడగూడదు.తప్పనిసరైతే బురఖాలో కాలికున్న చెప్పులు కూడా ఎవరి కళ్ళ బడకుండా ఒబ్బిడిగా వెళ్ళి, ఇంట్లో కొచ్చి పడాలి.యుద్ధాల వల్ల ఆఫ్గనిస్తాన్ లో మహిళలు వారి భర్తలు, తండ్రులు, కొడుకులను భారీ సంఖ్యలో పోగొట్టుకుని,అనాధలవుతారు.

ప్రారంభ సన్నివేశంలో “క్షమించ గలనేమో కానీ మర్చిపోలేను” అనే నెల్సన్  మండేలా సూక్తి తో  సినిమా   మొదలవుతుంది. మొదటి సీన్ లోనే పైనుంచి కిందివరకూ ముఖాలు కూడా కనపడకుండా  నీలి రంగు బుర్ఖాలు  ధరించిన   మహిళలు గుంపులు గుంపులు గా కనిపిస్తారు.

“ఆకలి మా ప్రాణాల్ని తోడేస్తుంది”.

“మేము వితంతువులం”.

“మాకు పని కావాలి”

“మేము రాజకీయం చెయ్యడం లేదు”

అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తుంటారు.

 

చావుకి తెగించి  మనుగడ కోసం పోరాటం చేస్తున్న మహిళల మీద తాలిబాన్ సైనికులు నీటి గొట్టాలను వదలడం, గ్రెనేడ్ లాంచర్లు పేల్చడం లాంటి దృశ్యాలను ఒక పదమూడేళ్ళ బాలిక, మన కథానాయిక తలుపు సందు గుండా చూస్తుంది. ఇది చాలా శక్తివంతమైన  దృశ్యం. తర్వాత  సినిమా మొత్తం దీనీ కొనసాగింపుగా నడుస్తుంది.

ఈ దుర్భర పరిస్థితుల్లో ఒక ఇంట్లో మూడు తరాలకు  ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మహిళలు బాలిక అమ్మమ్మ-అమ్మ-మనవరాలు సాంపాదించే పురుషుడే లేకుండా దిక్కులేని వాళ్ళవుతారు. బాలిక తండ్రి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో మరణిస్తే, బాలిక మేనమామ  రష్యన్ యుద్ధంలో మరణిస్తాడు.ఆ ఇంట్లో పోషించే పురుషుడే ఉండడు. వృద్ధురాలైన తల్లినీ, బిడ్డనూ పోషించడం కోసం బాలిక తల్లి ఒక హాస్పిటల్ లో నర్సుగా పనిచేస్తుంటుంది.అమ్మాయి కూడా తల్లికి తోడుగా అదే హాస్పిటల్ లో చిన్న చిన్న పనులు చేస్తూ  అమ్మకు సహాయంగా ఉంటుంది. ఆ సమయంలో స్త్రీలు బయటి కొచ్చి పని చెయ్యకూడదు అనే ఆంక్ష విధిస్తారు తాలిబన్లు. అంతేకాదు. అకస్మాత్తుగా వీళ్లు పని చేస్తున్న హాస్పిటల్ కి నిధులు ఆపేస్తారు. ఆమెకు మూడు నెలల జీతం కూడా రావలసి ఉంటుంది. ఆమె ఎంత మొత్తుకున్నా వినిపించుకునే వారెవరూ ఉండరు. పైగా తల్లీ-బిడ్డా ఎవరో పురుషుణ్ణి కాళ్ళా వేళ్ళా పడి బతిమాలుకుని అతని భార్యా,బిడ్డలుగా బండి మీద వస్తుంటే ఆమె కాళ్ళు బయటికి కనిపిస్తున్నాయని పోలీసు ఆమె కాళ్ళ మీద లాఠీ తో కొడతాడు. నానా కష్టాలూ పడి ఆ పూటకి ఇల్లు చేరడమే గగనమవుతుంది.

ఆకలితో అలమటించి పోతామని భయపడిన తల్లీ-అమ్మమ్మ రోజులు చాలా గడ్డుగా ఉన్నాయనీ,ఏదో ఒకటి చెయ్యకపోతే ప్రాణాలు నిలుపుకోలేమనీ అనుకుంటారు. ఇంకో దారే లేని పరిస్థితుల్లో మనవరాలికి మారువేషం వేసి,అబ్బాయిగా తయారు చేసి ఏదో ఒక పనికి పంపించాలని భావిస్తారు.బాలిక మాత్రం తాలిబన్లు ఈ సంగతి తెలిస్తే తనని చంపేస్తారని భీతిల్లిపోతుంది.నిస్సహాయంగా భయం భయంగా బేల చూపులు చూస్తూనే గత్యంతరం లేని పరిస్థితిలో అమ్మమ్మ-అమ్మ చెప్పినట్లే చెయ్యడానికి సంసిద్ధమౌతుంది.అమ్మమ్మ అమ్మాయి పొడవైన జుట్టంతా జడలుగా అల్లి కత్తిరిస్తుంది.అమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళ నాన్న బట్టలు తెచ్చి వేస్తుంది.మొత్తానికి అందమైన సుకుమారమైన అమ్మాయి కాస్తా అచ్చం అబ్బాయిలా తయారవుతుంది.తండ్రి స్నేహితుణ్ణి బతి మాలి అబ్బాయికి చిన్న టీదుకాణంలో పనికి కుదుర్చుకుంటారు.అందరూ మారువేషంలో ఉన్న అమ్మాయిని అబ్బాయనే అనుకుంటారు గానీ తల్లితో పాటు హాస్పిటల్ పనికి వెళ్ళొస్తున్నప్పుడు చూసినఎస్పాండీఅనే బాలుడు మాత్రం ఈ రహస్యాన్ని పసిగట్టేస్తాడు. అతనేఒసామా అని పేరు పెడతాడు. ఒసామా బాలుడు కాదు బాలిక అని మిగిలిన పిల్లలకు అనుమానం వచ్చినప్పుడు ఎన్నోసార్లు ఎస్పాండీ ఆదుకుంటాడు.నాకు తెలుసు.అతను అబ్బాయే, పేరు ఒసామా” అని చెప్పి రక్షించడానికి ప్రయత్నిస్తాడు కానీ అతని ప్రయత్నాలేవీ ఫలించవు.

 siva3

ఇంత దయనీయమైన పరిస్థితుల్లో కనాకష్టంగా బతుకీడుస్తున్న వాళ్ళను విధి ఈ రకంగా కూడా బతక నివ్వ దల్చుకోలేదు. గ్రామంలోని బాలుర నందరినీ తాలిబాన్ శిబిరం నిర్వహించే ఒక మతపరమైన పాఠశాలకు తరలిస్తారు. తప్పనిసరిగా ఒసామా కూడా వెళ్ళవలసి వస్తుంది. ఈ పాఠశాలలో మతగురువులు పోరాడే పద్ధతులతో పాటు, భవిష్యత్తులో వివాహాల తర్వాత వారి వారి భార్యలతో ఎలా ప్రవర్తించాలో, భార్యలను కలిసిన తర్వాత స్నానంతో వారి శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలో కూడా నేర్పించే సన్నివేశమొకటి జుగుప్సతో, భయంతో వళ్ళు గగుర్పొడిచేలా చేస్తుంది. బాలిక తన రహస్యాన్ని తాలిబన్ల నుంచి కాపాడుకోవడానికి అవయవాలను శుభ్రం చేసుకునే సందర్భంలో తప్పించుకోవడానికి విఫలయత్నాలు చేస్తుంది. తాలిబాన్ ఉపాధ్యాయులు పెట్టే నరకయాతనల పరిక్షల సమయంలోనే రజస్వల కూడా అయినందువల్ల  ఆమె కాళ్ళనుంచి రక్తం కారడం వల్ల, ఆమె ఒక బాలిక అని వాళ్ళకు తెలిసిపోతుంది. హాస్పిటల్ లో అరెస్ట్ చేసిన ఒక జర్ణలిస్ట్ నీ, ఒక విదేశీ వనితతో  పాటు ఆమెను జైలుకి పంపిస్తారు. పెద్ద పంచాయితీ చేసి మిగిలిన ఇద్దరికీ  మరణ శిక్ష విధిస్తారు. ఇంతలో ఒక ముసలి ముల్లా వచ్చి తాను బాలికను వివాహ మాడతానంటాడు. న్యాయ నిర్ణేతను “నన్ను ఈ ముసలివానికివ్వొద్దు. నాకు మా అమ్మ కావాలి.నన్ను అమ్మదగ్గరకు పంపించండి”అని దీనంగా,హృదయ విదారకంగా వేడుకుంటుంది బాలిక. జడ్జి మనసు కరగదు. పదమూడేళ్ళ  పసిపిల్ల పండు ముసలివానికి ఆఖరి భార్య కాక తప్పలేదు! అప్పటికే అతనికి ముగ్గురు భార్యలూ బోలెడంతమంది పిల్లలూ ఉంటారు. అది ఒక శిక్షగా ఆమెను అతని కిచ్చేస్తారు. అతని కౄరత్వం గురించి, అతని వల్ల తమ జీవితాలెలా నాశనమయ్యాయో అతని భార్యలే బాలికకు వివరించి చెప్తారు. సహాయ పడాలని ఉన్నా తాము ఏమీ చేయలేని నిస్సహాయులమని చెప్తారు.  ఇంతకు ముందున్న భార్యలతో పాటు బాలికను కూడా బంధించి, ఒక ఇంటిపై భాగంలో పెట్టి పెద్ద తాళం వేస్తాడు. ప్రతిరోజూ ముసలివాడు  పెట్టే హింస  చిన్నారిని  బాధిస్తూనే  ఉంటుందని  చెప్పకనే చెప్తారు.

ఒక వాస్తవిక కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఆఫ్ఘానీ మహిళల దుస్థితిని చాలా  ఆర్ధ్ర్తతతో అద్యయనం చేసిన రచయిత  “సిద్దిక్ బర్మెక్. ఆయనే దర్శకులు, ఎడిటర్, స్క్రిప్ట్ కూడా ఆయనే రాశారు.

మహిళలకు “గౌరవం” సంగతి అటుంచి  అమానుష భౌతిక, మానసిక హింసలు  జీవితకాలమంతా  ఆఫ్గనిస్తాన్ లో  అమలవుతున్నవి. ఒక మహిళను గొంతు వరకూ పాతి పెట్టి ఆ పైన రాళ్ళు రువ్వే దృశ్యం కూడా  ఉందీ సినిమాలో! ఆఫ్ఘానీ మహిళల జీవిత సమస్యలను అర్థం చేసుకుని విశ్లేషించడానికి ఎంతో గుండెనిబ్బరం ఉండాలి. అయినా సరే మొట్టమొడటగా ఇంత ధైర్యం చేసిన బర్మెక్.ను ఎంతప్రశంసించినా తక్కువే!

బూర్జువా ప్రపంచంలో బాల్యాన్ని,యవ్వనాన్ని, జీవితాన్ని పోగొట్టుకున్న ఒక బాలిక ద్వారా మొత్తం దేశాన్ని తద్వారా తాలిబన్ ఇనుప పాలనను గొప్ప స్కోప్ లో బర్మెక్ చూపించారు.

రెండో సినిమా గురించి తర్వాత సంచికలో చెప్పుకుందాం.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఆ ఆఖ‌రి మ‌నుషుల కోసం… ఆర్తిగా..!

akshara2

‘‘క‌ళ బ‌త‌కాలంటే…ముందు క‌ళాకారుడు బ‌త‌కాలి’’అంటాడు అక్ష‌ర‌కుమార్‌. త‌న‌ది మూడు ప‌దుల వ‌య‌సు. క‌ల్లోలిత క‌రీంన‌గ‌ర్ జిల్లాలో పుట్టిన ఈ కుర్రాడు సినిమా ఇండస్ర్టీలో ప్ర‌స్తుతం త‌న సామర్ధ్యాన్ని, అసిస్టెంట్ డైర‌క్ట‌ర్‌గా ప‌రీక్షించుకుంటున్నాడు. క‌ళ‌కు జీవితాన్ని అంకితం చేయాల‌న్న త‌ప‌న ఉన్నోడు తాను. అంతేకాదు నిత్యం సాహిత్యం చుట్టూ వైఫైలా తిరిగే అక్ష‌ర‌కు పుస్త‌కాలు చ‌ద‌వ‌డం, సినిమా స్ర్కిప్ట్‌లు రాయడం హాబీలు. వీట‌న్నింటికీ తోడు అంత‌రిస్తున్న క‌ళారూపాల‌ను చూసి, ఆవేద‌న చెందుతుంటాడు. అట్లా ప్ర‌స్తుతం కాకిపడిగెల వారి మీద ఏకంగా ఓ ఫిచ‌ర్ ఫిల్మంత డాక్యుమెంట‌రీనీ తీశాడు. అదే కాకి ప‌డిగెల క‌థ‌.

డాక్యుమెంట్ చేయ‌డం వ‌ల్ల ఎప్పుడూ రెండు ప్ర‌యోజ‌నాలుంటాయి. అవి ఒక‌టి వ‌ర్త‌మాన స‌మాజంలో మ‌న చుట్టూ ఉన్న మ‌రో ప్ర‌పంచాన్ని ప‌రిచ‌యం చేయ‌డం ద్వారా ఆలోచ‌న రేకిత్తించ‌డం. మ‌రొక‌టి భ‌విష్య‌త్ త‌రాల‌కు ఒక క‌ళారూపం యొక్క గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేయ‌డం ప్ర‌స్తుతం గ్లోబ‌లైజేష‌న్ రెండ‌వ ద‌శ‌లో ఉన్నవాళ్ల‌కు ఇవేవి ప‌ట్ట‌ని సంద‌ర్భం ఇది. ఈ స‌మ‌యంలో ఓ కుర్రాడు వేల యేండ్ల చ‌రిత్ర క‌లిగిన  ఓ క‌ళారూపాన్ని బ‌తికించుకోవాల‌నే త‌ప‌న‌తో చేసిన ప‌నే ఈ డాక్యుమెంటరీ.

ముదిరాజుల మిరాశి కులం కాకిప‌డిగెల‌. వీరి జ‌నాభా క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌, న‌ల్ల‌గొండ జిల్లాల్లో నామ మాత్రంగా ఉంది. వీరికి వార‌స‌త్వంగా వ‌స్తున్న క‌ళారూపంతోనే వీరి బ‌తుకు గ‌డుస్తోంది. ప‌ట‌మేసి పాండ‌వుల క‌థ చెప్పే సంప్ర‌దాయం వీరిది. చెట్టుకొక‌రు పుట్ట‌కొక‌రుగా ఉన్న ఈ కుల‌స్తుల కుటుంబాలు ఒక‌టి వ‌రంగ‌ల్లో ఉంటే మ‌రొక‌టి సిద్ధిపేట ప‌రిస‌ర గ్రామాల్లో ఉంది. వంద‌ల యేండ్లుగా కాకిప‌డిగెలు క‌థ చెప్పుకుంటూ బ‌తుకీడుస్తున్నారు. ఇలాంటి వారి ప‌ట్ల అక్ష‌ర‌కు ఎడ‌తెగ‌ని మ‌మ‌కారం. వారి క‌ళ ప‌ట్ల గౌర‌వం ఉంది. వారి చ‌రిత్ర‌ను బ‌తికించాల‌నే తండ్లాట ఉంది. ఆ తండ్లాట‌లోనుండే ఈ డాక్యుమెంట‌రీ రూపొందింది. ఎవ‌డికి ఎవ‌డూ కాని  లోకంలో, ఓ అంత‌రిస్తున్న క‌ళ గురించి,క‌ళాకారుల గురించి ఈ యువ ద‌ర్శ‌కుడు మ‌ధ‌నప‌డుతున్నాడు. క‌ళాకారుల క‌ళ‌నే కాదు, ఆ క‌ళ వెనక  దాగిన క‌న్నీళ్ల‌ను ఒడిసి ప‌ట్టుకుంటున్నాడు. అందుకే జాగ్ర‌త్త‌గా వారి గ‌తాన్ని వ‌ర్త‌మానాన్ని రికార్డు చేస్తున్నాడు.

akshara1

పురాణాలు అంతిమంగా బ్రాహ్మ‌ణిజం చుట్టే తిరుగుతాయి. అవి హిందు దేవ‌త‌ల‌ను కొలిచే ముగింపునే క‌లిగి ఉంటాయి. ఈ పుర‌ణాల మీద ఆధార‌ప‌డి  సృష్టించ‌బ‌డిన క‌ళారూపాలు కూడా ఆ మూస‌లోనే కొన‌సాగుతుంటాయి. అంతమాత్రం చేత వాటినే న‌మ్ముకున్న క‌ళాకారులు అంత‌రించాల‌ని కోరుకోవ‌డం తిరోగ‌మ‌న‌మే అవుతుంది. హిందు కుల వ్య‌వ‌స్థ ఒక్కో కులానికి ఒక్కో ఆశ్రిత కులాన్ని సృష్టించింది. ఈ సంస్కృతి ఆయా కులాల చ‌రిత్ర‌ను గానం చేసే ప్ర‌స్థానంతో మొద‌లై ఉంటుంది. మాదిగ‌ల‌ను కీర్తిస్తూ చిందు,డ‌క్క‌లి, బైండ్ల కులాలు ఇప్ప‌టికీ గ్రామీణ ప్రాంతాల్లో క‌థ‌లు చెబుతుంటాయి. మాదిగ‌లు ఇచ్చే త్యాగం మీదే వీరి జీవితాలు గ‌డుస్తుంటాయి. అలా ముదిరాజు కుల చ‌రిత్ర‌ను గానం చేస్తూ ప‌టం మీద పురాగాథ‌ల్ని పాడే కుల‌మే కాకిప‌డిగెల కులం. ఈ క‌ళాకారులు మిగిలిన ఆశ్రిత కులాల క‌ళాకారుల వ‌లెనె అంప‌శ‌య్య మీద జీవ‌నం సాగిస్తున్నారు.

కాకి ప‌డిగెల సంప‌త్‌! ఈ పేరు ఈ డాక్యుమెంట‌రీ చూసే వ‌ర‌కు నాకైతే తెలియ‌దు. ప్ర‌స్తుతం క‌ళా రంగంలో ఉద్ధండులైన పండితుల‌కు కూడా ఈ పేరు కొత్తే. కాకిప‌డిగెల సంప‌త్ క‌థ చెబితే ప‌ల్లె తెల్ల‌వార్లు మేల్కొని చూడాల్సిందే. క‌థ‌ను త‌న మాట‌ల‌తో ప్ర‌వ‌హింప జేసేవాడు సంప‌త్‌. తాను పురాగాథ‌ల్ని గానం చేస్తుంటే ఒక మ‌హా వాగ్గేయ‌కారుడు మ‌న కండ్ల ముందుకొస్తాడు. అడుగులు క‌దుపుతూ డోల‌క్ ద‌రువుల‌కు, హార్మోనియం రాగాల‌కు గాలిలో తెలియాడుతూ చేసే సంప‌త్ ప్ర‌ద‌ర్శ‌న ఎవ్వ‌రినైనా మంత్ర ముగ్ధుల్ని చేసేది. అందుకే ఢిల్లీ వ‌ర‌కు త‌న ప్ర‌ద‌ర్శ‌న ప‌రంప‌ర కొన‌సాగింది. ఆశ్రిత కులాల క‌ళాకారులు ఎంత గొప్ప ప్ర‌తిభ క‌లిగినా వారికి ద‌క్కేది ఏమీ  ఉండ‌దు. అకాల మ‌ర‌ణాల పాల‌వ్వ‌డ‌మే ఈ వ్య‌వ‌స్థ వారికిస్తున్న బ‌హుమ‌తి. అలా అనారోగ్యంతో సంప‌త్ నేలరాలాడు. ద‌శాబ్దాలుగా కాకిప‌డిగెల క‌ళారూపానికి జీవితాన్ని అంకితం చేస్తే, త‌న భార్యా బిడ్డ‌ల‌కు తాను సంపాదించింది ఏమీ లేదు. మ‌ళ్లీ అదే పూరి గుడిసె, అవే డోల‌క్ తాళాలు. తండ్రి అందించిన క‌ళారూపాన్ని త‌మ ఆస్తిగా భావించారు సంప‌త్ ఇద్ద‌రు కొడుకులు. ఇప్పుడు వారు మ‌ళ్లీ కాకిప‌డిగెల క‌థ చెబుతూ త‌మ తండ్రికి మ‌న‌సులోనే నివాళులు అర్పిస్తున్నారు. గ్లోబ‌లైజేష‌న్ వ‌చ్చి త‌మ పొట్ట‌కొట్టినా తాము ఆక‌లితో అల్లాడిపోతున్నా త‌మ క‌థ ఆగొద్ద‌నేదే వారి భావ‌న‌. అందుకే అన్నీ మ‌రిచిపోయి ఆట‌లోనే శిగ‌మూగుతున్నారు. ఇదీ విషాదం. ఈ విషాదాన్ని ప్రపంచానికి చెప్పేందుకే అక్ష‌ర కుమార్ అంకిత‌మ‌య్యాడు.

ఈ యువ‌ద‌ర్శ‌కుని ప్ర‌తిభ ఇందులో అడుగ‌డుగునా క‌నిపిస్తుంది. డాక్యుమెంట‌రీలు అన‌గానే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఓవ‌ర్‌తో ఏదో ఇంట‌ర్ ప్రిటేష‌న్ వ‌స్తుంటుంది. దాన్ని నిర్మిస్తున్న‌వారి ఆబ్జెక్టివ్స్ వారికుంటాయి. కాని, అక్ష‌ర ఈ రొటీన్ వ‌ర్క్ మాడ‌ల్‌ని బ్రేక్ చేశాడు. వారి లైఫ్ స్టైల్, వారి స్ర్ట‌గుల్, వారి లెగ‌సీ, వారి ట్రాజెడీ అన్నీ వారితోనే చెప్పించాడు. ఉన్న‌ది ఉన్న‌ట్లు క‌ళ్ల ముందుంచి, ప్రేక్ష‌కుణ్ణే ఆలోచించ‌మంటాడు. ఇక సినిమా ఇండ‌స్ర్టీ అనుభ‌వాల‌ను కూడా రంగ‌రించాడు అక్ష‌ర‌. డాక్యుమెంట‌రీని ఒక ఆర్ట్ ఫిల్మ్‌లా మ‌లిచేందుకు శ‌త‌థా ప్ర‌య‌త్నించాడు. ఒక దృశ్య‌కావ్యం మ‌న మ‌న‌సుల్ని ఆక‌ట్టుకోవాలంటే అందులో హ్యూమ‌న్ ఎమోష‌న్స్‌ని ప‌లికించాలి. ఇదే అక్ష‌ర ఉద్దేశం కూడా. అందుకే క‌ళ‌ను న‌మ్ముకున్న ఈ ఆఖ‌రి మ‌నుషుల అంత‌రంగాన్ని ఆవిష్క‌రించేట‌పుడు కూడా ఎమోష‌న్స్‌ని వ‌దిలిపెట్ట‌లేదు. ఆక‌లితో అల‌మ‌టిస్తూనే వారి పండించే హాస్యాన్ని కూడా తెర‌కెక్కించాలంటే ద‌మ్ముండాలి. ఆ ద‌మ్మున్న ద‌ర్శ‌కుడు అక్ష‌ర‌. అందుకే వారి దుఃఖాన్ని ప‌ట్టుకున్నంత సుల‌భంగా వారి ధైర్యాన్ని ఏటికి ఎదురీదేత‌నాన్ని కూడా ప‌ట్టుకున్నాడు.

కులం స‌ర్టిఫికెట్లు జారీచేయ‌డానికి అర్హ‌త క‌లిగిన  6432 కులాల జాబితాలో పేరు లేని కులం ఈ కాకిప‌డిగెల‌. దీంతో వీరికి విద్యా ఉద్యోగం అనేవి ద‌రిచేర‌నివిగానే మిగిలిపోతున్నాయి. కాళ్లావేళ్లా ప‌డితే వీరికి బీసీ-డీ స‌ర్టిఫికెట్ ఇచ్చి చేతులు దుల‌పుకుంటున్న‌ది స‌ర్కార్‌. ఈ విషాదానికి తెర‌ప‌డాల‌న్న‌దే ఈ డాక్యుమెంట‌రీ ఉద్దేశం. తెలంగాణ నూత‌న రాష్ర్టంలో కోల్పోయిన చ‌రిత్ర‌ను పున‌ర్నిర్మాణం చేసుకుంటున్న ద‌శ ఇది. ఈ స‌మ‌యంలో ఈ జాన‌ప‌ద క‌ళాకారుల‌పైన వారి క‌ళారూపాల‌పైన అక్ష‌ర కుమార్‌కు ఉన్న శ్ర‌ద్ధ ప్ర‌తీ ఒక్క‌రికీ ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. గ్రామాల‌కు వెళ్లిన‌పుడు ఏ క‌ళారూపాన్ని లెక్క‌చేయ‌ని యువ‌త‌, ప‌ట్నానికొస్తే శిల్పారామంలో మాత్రం ఎగ‌బ‌డి డ‌బ్బులు పెట్టి మ‌రీ జాన‌ప‌ద క‌ళారూపాల‌తో, క‌ళాకారుల‌తో సెల్పీలు దిగే వైవిధ్యం నేడున్న‌ది. ఇలాంటి జ‌మానాకు దూరంగా నిజాయితీతో జాన‌ప‌ద క‌ళారూపాల‌ను బ‌తికించాల‌నే ల‌క్ష్యంతో అక్ష‌ర కుమార్ చేసిన ఈ ప్ర‌యత్నం వృథాపోదు. రేప‌టి త‌రాల‌కు కాకిపడిగెల జీవితం దృశ్య రూపంలో అందుతుంది. ఇలాంటి ప‌నిని ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చి, చేసిన అక్ష‌ర కుమార్‌కు అభినంద‌న‌లు. అక్ష‌ర‌కుమార్ సంక‌ల్పానికి అండ‌దండ‌గా నిలిచిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాల‌కులు, జాతీయ అవార్డు గ్ర‌హీత మామిడి హ‌రికృష్ణ అభినంద‌నీయులు. తెలంగాణ‌లో ఉన్న డెభ్భైవేల మంది జాన‌ప‌ద క‌ళాకారుల్ని త‌న కుటుంబ స‌భ్యులుగా భావించే మామిడి హ‌రికృష్ణ‌గారి ఔదార్యం గొప్ప‌ది. అక్ష‌ర అండ్ టీం శ్ర‌మ‌కోర్చి నిర్మించిన ఈ దృశ్య‌రూప కావ్యం ఈ నెల 4వ తేది సాయంకాలం ర‌వీంద్ర భార‌తిలో ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతుంది.

ఆఖ‌రి మ‌నుషుల కోసం అల్లాడిన ఆర్తి ఇది

క‌నుమ‌రుగ‌వుతున్న క‌ళారూపానికి క‌న్నీటి భాష్యం

కాకిప‌డిగెల స‌జీవ దృశ్య‌కావ్యం

గ్లోబ‌ల్ ప‌డ‌గ గాయాల‌ను మాన్పేందుకు.. అక్ష‌ర హృద‌య ఔష‌ధం

రండి అంద‌రం క‌లిసి వీక్షిద్ధాం..

ఆత్మీయ క‌ర‌చాల‌నాల‌తో అభినందిద్ధాం…  

*

అన్నదాత మరణమృదంగ వాయుధ్వని!

1973-2 మనలో ఎంతమందిమి అన్నం తినేటప్పుడు రైతు గురించి ఆలోచిస్తాం? అసలీ వ్యవసాయక దేశంలో ఇంతవరకు ఏ రైతుకూ ఎందుకని భారతరత్న అవార్డు రాలేదు?” ఇవి నటరాజ్ మహర్షి వేసిన ప్రశ్నలు, తనకు తానే వేసుకున్న ప్రశ్నలు. అతనికి ఎవరూ సమాధానం ఇవ్వలేదు. బహుశ వాటికి జవాబులు దొరక్కపోవచ్చు. కానీ రైతుకి తన రుణం మాత్రం తీర్చుకోవాలనుకున్నాడాయన. ఫలితమే “1973 – యాన్ అన్ టోల్డ్ స్టోరీ” అనే లఘు చిత్రాన్ని నిర్మించారు.

నిజానికి నటరాజ్ కి ఇది మొదటి సినిమా కాదు. ఈ సినిమా కి ముందుగా ఓ ఫిలిం మేకర్ గా ఆయన చేసిన ప్రయాణం వుంది. “న్యూయార్క్ ఫిలిం అకాడెమీ” అనుబంధంతో కాలికట్ లో జరిగిన వర్క్ షాప్ లో శిక్షణ పొందిన నటరాజ్ అక్కడ మెథడ్ యాక్టింగ్ అండ్ డైరెక్షన్ లో గోల్డ్ మెడల్ సాధించారు. ఆ తరువాత నవ్య యుగపు నవీన భావాల దర్శకులందర్నీ కలుసుకున్నానని చెప్పారు. ఆ తరువాత ముంబైలో సెటిల్ ఐన నటరాజ్ 2014 లో “డ్రాయింగ్ బ్లడ్” అనే ఇంగ్లీష్ సినిమా తీసారు. అది ఒక పెయింటర్ కథ. ఆ తరువాత కెరీర్లో ఎదగటం కోసం తనని తాను కోల్పోయిన ఒక గజల్ గాయని మీద “మేరా ఆలాప్” అనే హిందీ లఘు చిత్రం 2015లో తీసారు. తన అన్ని సినిమాలకీ తనే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, తనే స్క్రిప్ట్ రైటర్, తనే దర్శకుడు. ప్రతి షాట్ ని ఎంతో శ్రద్ధగా చిత్రిస్తారు ఆయన. లైటింగ్, కెమెరా యాంగిల్స్ వంటి అన్ని విషయాల్లో మంచి క్రాఫ్ట్స్ మెన్ షిప్ కనబరుస్తారు. ప్రేక్షకుడి మూడ్ ని ఎలవేట్ చేసే నేపధ్య సంగీతం గురించి, ఎడిటింగ్ గురించి శ్రద్ధ తీసుకుంటారు. నేను ఆయనతో మాట్లాడిన మేరకు ఆయనలో ప్యూరిటానిక్ కళాకారుడు ఉన్నాడు. ఇది ఆయన మొదటి ఫీచర్ సినిమా “డ్రాయింగ్ బ్లడ్” లో కనిపిస్తుంది. జీవిత పరమార్ధం ఆధ్యాత్మిక దృక్పధంలో దొరుకుతుందనే ఆలోచన ఆయనలో వుంది. ఇది ఆయన షార్ట్ ఫిలిం “మేరా ఆలాప్” లొ స్పష్ఠంగా కనబడుతుంది. ఆయన ప్రస్తుతం “ద స్కల్ప్టర్” అనే డాక్యుమెంటరీ నిర్మాణంలో వున్నారు. ఇది కాకుండా “అనోనా” అనే ఫీచర్ ఫిలిం కూడా తీస్తున్నారు. శరవేగంతో షూటింగ్ తీసినా దాని ముందు, తరువాత చాలా పని చేస్తానంటారు నటరాజ్.

“1973” సినిమాలో నటరాజ్ ఏ చెప్పారు? వర్తమాన రైతు సమస్యల మీద, రైతుల ఆత్మహత్యల మీద తీసిన సినిమా కాదిది. తనకేమైన కష్టం వస్తే ఎవరికీ పట్టని రైతు ఒంటరితనం గురించి, నిస్సహాయత గురించి, ఎవరికీ వినిపించని రైతు ఆర్తనాదం గురించి, దుఖం గురించి, అభద్రత గురించి, నిన్నటి దాకా పంటకి నీరు పెట్టిన రైతు హఠత్తుగా కనిపించక పోతే పట్టించుకోని సమాజ నిర్లక్ష్యం గురించి నటరాజ్ చెప్పారు. నీరందని పంటలాగా ఎండిపోతున్న రైతు గురించి చెప్పారు. రైతు భూమిలో వనరుల మీద కన్నేసి అతని భూమిని దక్కించుకోవాలన్న పొలిటీషియన్ స్వార్ధం గురించి, క్రూరత్వం గురించి చెప్పారు. ఎవరూ చెప్పని ఓ రైతు గురించి చెప్పారు. నిస్సహాయంగా గాలిలో కలిసిన అతని ఆక్రందనని మనకు వినిపించారు. అసలు భవిష్యత్తులో రైతనే వాడుండని హెచ్చరించారు.

నిజానికి నటరాజ్ ఏమీ చెప్పలేదు. కేవలం చూపారు. చాలా చూపించారు. దేశం మీద ప్రేమతో జెండా కింద సేద్యం చేసిన రైతు నిబద్ధత గురించి చూపించారు. ఆ రైతు వెక్కిళ్ళు మన దోసిలిలో పోసి చూపించారు. “దాహం వేస్తుంది. నీ భూమిని ఇస్తావా?” అనే రాజకీయ నాయకుడి స్వార్ధం చూపించారు. పెద్దగా డైలాగులు లేని ఓ ఇరవై నిమిషాల లఘు చిత్రంలో ప్రేక్షకుడి మనసుని కదిలించే విధంగా ఆయన ఇవన్నీ చూపించారు. జెండాని సంక్షేమ రాజ్యానికి చిహ్నంగా చూపించి బలవంతుడి దౌష్ట్యం ముందు రాజ్యాంగం పూచీపడే సంక్షేమం ఎంత బలహీనమో చూపించారు. రైతుని కొట్టడానికి జెండా కర్రని వాడుకున్న మంత్రి చివర్లో జెండా విశిష్ఠతని గురించి రేడియోలో ఉపన్యసిస్తాడు. ప్రతీకలు కలిగించే మిధ్యావేశంలో మనం బతికేస్తుంటాం కదా!

1973-3

1973లో ఖమ్మం జిల్లాలో ఒక పోలీసు హెడ్ కానిస్టేబుల్ కుమారుడిగా పుట్టిన నటరాజ్ కి ఆయన తండ్రి అదే సంవత్సరంలో తన పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రైతుకి జరిగిన అన్యాయాన్ని వివరించి చెప్పారు. ఎవరికీ తెలియకుండా చరిత్ర కాలగర్భం లో కలిసిపోయిన ఆ రైతు కథ ఇప్పుడు నటరాజ్ చేతిలో ఓ సినిమాగా ప్రాణం పోసుకుంది.

“వాయుధ్వని ప్రొడక్షన్స్” సమర్పణలో నటరాజ్ మహర్షి తానే స్వయంగా రాసి, తీసిన “1973 – యాన్ అన్ టోల్డ్ స్టోరీ” ఇప్పటికి 5 అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఎంపికైంది. ఆల్ లైట్స్, బెంగళూరు, రుమేనియా, మన్ హట్టన్ ఫిలిం ఫెస్టివల్ స్క్రీనింగ్ లో ఈ సినిమా ఎంపికైంది. ఇది ఓ తెలంగాణ యువకుడు సాధించిన ఘనత.

ఈ సెప్టెంబర్ 24 నుండి 27 వరకు రామోజీ ఫిలిం సిటిలో జరగబోయే “ఆల్ లైట్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్”లో ఈ సినిమాని ప్రదర్శించబోతున్నారు. “షార్ట్ ఫిలిం కార్నర్”లో తెలుగు నుండి అఫీషియల్ ఎంట్రీగా ఎంపికైన రెండు సినిమాల్లో ఇదొకటి. కెవీఅర్ మహేంద్ర తీసిన “నిశీధి”మరొకటి. ఇది తెలంగాణ చిన్న సినిమా చరిత్రలో చెప్పుకోదగ్గ విజయం. మొన్నీమధ్యనే 1973 కి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ని విడుదల చేసారు. ఈ సినిమా చూసి నగ్నముని గారు స్పందించిన వీడియో కూడా యూట్యూబ్ లో లభ్యమౌతుంది.

స్లాప్ స్టిక్ కామెడీ తోనో, చీప్ డైలాగులతోనో నాసిరకపు సాంకేతిక, సంగీత నాణ్యతా విలువలతో కనబడతాయి తెలుగులో షార్ట్ ఫిలింస్ యూ ట్యూబులో. వాటికి భిన్నంగా మంచి అభిరుచితో, బాధ్యతతో సినిమాలు తీసే వృత్తిరీత్యా ఫాషన్ ఫోటోగ్రాఫర్ ఐన నటరాజ్ మహర్షి వంటి ఫిలిం మేకర్స్ ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మన మీదుంది. మనం ప్రోత్సహించాలే కానీ ఆయన దగ్గర చాలా మెటీరియల్ వుంది. ద బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్!
Official Trailer – 1973 An Untold Story (2016) Short Film

 

ఆకాశానికి అంకెల నిచ్చెన!

ramanujan1

గణితమంటే అతనికి అంకెలతో ఉప్పొంగే అనంత ప్రవాహం . అందరూ చూడలేని  విచిత్రమైన రంగుల్ని నింపుకున్న వింత వర్ణచిత్రం, ఇసుక రేణువులన్ని రహస్యాల్ని గర్భాన దాచుకున్న సాగర తీరం. గణితం అతనికి జీవం, జీవన వేదం. గణితం అతని దైవం. అసలతనికి గణితమే జీవితం. ఇంతకీ అతని పేరు శ్రీనివాస రామానుజన్. అంకెల్తో ఎటువంటి ఆటైనా  అడగలిగేటంతటి మేధస్సును కలిగి ఉన్నప్పటికీ వాటిని దైవ సమానంగా పూజించగలిగేటంతటి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన  గొప్ప వ్యక్తి శ్రీనివాస రామానుజన్.

రాబర్ట్ కనిగల్ రచించిన రామానుజన్ జీవిత చరిత్ర  ఆధారంగా, అదే పేరుతో 2015లో నిర్మింపబడిన చలన చిత్రం The Man Who Knew Infinity.

భారతీయ గణిత శాస్త్రవేత్తగా, అత్యున్నతమైన మేధా సంపత్తి కలిగిన వ్యక్తిగా శ్రీనివాస రామానుజన్ పేరు వినని వారెవరూ ఉండరు. తమిళ బ్రాహ్మణ కుటుంబంలో 1887 నవంబర్ 22న జన్మించిన రామానుజన్ ని ముఖ్యంగా గణిత శాస్త్రం రంగంలో అత్యంత మేధావిగా పేర్కొనవచ్చు. కానీ అతని జీవితం నల్లేరు మీద నడకేమీ కాదు.

ఈ సినిమా అతని చిన్నతనాన్నీ, చదువుకున్న రోజుల్నీ ప్రస్తావించకుండా యవ్వన దశలో దుర్భరమైన పేదరికాన్ని అనుభవిస్తూ ఉద్యోగం కోసం వెతుకులాడుతున్న పరిస్థితులతో మొదలవుతుంది. మెల్లగా చిన్న ఉద్యోగం సంపాదించుకున్న కొద్ది రోజులకే ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జ్ ట్రినిటీ కాలేజ్ కి వెళ్లే అవకాశం అతనికి లభిస్తుంది. ఆ రోజుల్లో సముద్రయానం నిషిద్ధం కావడం వల్ల కొన్ని సందేహాలతో, మరి కొన్ని సంశయాలతోనే అతను కేంబ్రిడ్జికి వెళ్తాడు.

అతను ఇంగ్లాండ్ రావడానికి కారకుడైన సీనియర్ గణిత శాస్త్రవేత్త సి.హెచ్. హార్డీతో కలిసి ఐదు సంవత్సరాల పాటు తాను రాసిన గణిత సిద్ధాంతాలపై సాధన చేస్తాడు. పరస్పర వ్యతిరేక వైఖరులు కలిగిన ఆ ఇద్దరు మేధావుల మధ్య  ఏర్పడే ఘర్షణ, అనుబంధం, అక్కడ రామానుజన్ గడిపిన జీవితం ఈ చలనచిత్రంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తుంది. నిజానికి ఆ రోజులే రామానుజన్ కి అత్యంత ఆనందాన్నీ, కష్టాన్నీ కూడా కలిగించిన రోజులు.

ramanujan2

అంకెల్ని అక్షరాలుగా భావిస్తే, రామానుజన్ ని అతి విశిష్టమైన కవిగా పేర్కొనవచ్చు. కవికి హఠాత్తుగా కలిగే సృజనాత్మకమైన ఊహల్లా ఇతని ఆలోచనల్లోకి ఉన్నట్టుండి సరికొత్త సమీకరణాలు ప్రవేశించేవి. కవి వాస్తవాన్నీ, కల్పననీ పద చిత్రాలతో పెనవేసినట్టు, అసంకల్పితంగా ఇతను రాసిన సిద్ధాంతాలన్నీ నిదర్శనాలతో సహా నిజాలుగా నిరూపితమయ్యాయి. ఇసుక రేణువుల్లోనూ, నీటి ప్రతిబింబంలోనూ, కాంతి రంగుల్లోనూ ఇలా ప్రకృతికి చెందిన ప్రతీ చిత్రంలోనూ విచిత్రమైన అంకెల క్రమాన్నీ, అందాన్నీ చూడగలిగిన సౌందర్య పిపాసి రామానుజన్.

ఆటోడిడక్ట్ అయిన రామానుజన్ గణిత శాస్త్రంలో అప్పటివరకూ సాంప్రదాయబద్ధంగా ఉపయోగిస్తున్న పద్ధతులేవీ తెలుసుకోకుండానే ఆ శాస్త్రానికి చెందిన ఎన్నో కొత్త విషయాల్ని వెలికి తీసి తనకో ప్రత్యేకమైన శైలినీ, మార్గాన్నీ ఏర్పరుచుకున్నాడు. తీవ్రమైన ఆధ్యాత్మిక భావాలు కలిగిన ఈ మేధావి, తన ప్రతిభను తమ ఆరాధ్య దేవత నామగిరి అమ్మవారి అనుగ్రహంగా అభివర్ణించాడు. ‘దేవుడి ఆలోచనను ప్రతిబింబించనప్పుడు ఏ సమీకరణమైనా తనకి  అర్థవంతం కాదన్న’ అభిప్రాయాన్ని అతను వ్యక్తపరిచాడు. మేథమెటికల్ ఎనాలసిస్, నెంబర్ థియరీ వంటి గణిత శాస్త్ర రంగాల అభివృద్ధిలో ఇతని పాత్ర అమూల్యమైనది. రామానుజన్ వ్యక్తిత్వంలోని ఈ విభిన్నమైన

కోణాలన్నిటినీ నటుడు దేవ్ పటేల్ అత్యద్భుతంగా ఆవిష్కరించాడు. హార్డీగా నటించిన జెర్మీ ఐరన్స్  నటన కూడా చెప్పుకోదగ్గది.

అతని జీవితాల్లోని కొంత భాగానికే అధికమైన ప్రాధాన్యతను ఇచ్చి, నటీనటుల నటనా చాతుర్యంపై ఎక్కువగా ఆధారపడిపోవటం వల్ల ఈ చలన చిత్రం అసంపూర్ణంగా అనిపించినప్పటికీ రామానుజన్ వ్యక్తిత్వాన్నీ, మేధా శక్తినీ ప్రతిఫలించడంలో  మాత్రం సంపూర్ణంగానే  సఫలమైంది. పరిసరాలపై తక్కువా, వ్యక్తుల భావాలపై ఎక్కువా శ్రద్ధ పెట్టడం వలన కెమెరా కన్ను వంద శాంతం పనితీరును ప్రదర్శించలేకపోయినప్పటికీ అసంతృప్తిని మాత్రం మిగల్చలేదు. పూర్తి సాంప్రదాయ పద్ధతిలో చలన చిత్రాన్ని నడిపించినా  దర్శకుడు మాథ్యూ బ్రౌన్ కృషి, ప్రయత్నం అభినందనీయమైనవి.

‘మనుషులకంటే మీరు అంకెలనే అధికంగా ప్రేమిస్తారటగా’ అని అతని భార్య  జానకి దెప్పి పొడిచినప్పుడు అతను సంతోషంగా అంగీకరిస్తాడు గానీ భార్యనీ, బాధ్యతనీ కూడా అతను అమితంగానే ప్రేమిస్తాడు, ఇంగ్లాండ్ లో ఉన్న రోజుల్లో ఆమె కోసం తీవ్రంగా పరితపిస్తాడు. సనాతన వాది కావడం వలన అక్కడి ఆహారానికి అలవాటుపడలేక, పర దేశపు వాతావరణంలోని మార్పులకి సర్దుబాటు చేసుకోలేక అనారోగ్యం పాలవుతాడు. టీబీ వ్యాధి బారిన పడి శారీరకంగా నరకాన్ని అనుభవిస్తున్నా తన పనికి మాత్రం ఆటంకం కలగనివ్వడు. ఒక భారతీయుడిగా వివక్షకి గురికావడం వలన కొంత  ఆలస్యమైనప్పటికీ చివరికి హార్డీ కృషి ఫలితంగా తన సిద్ధాంతాలని ప్రచురించుకుని, అరుదైన పురస్కారమైన రాయల్ సొసైటీ ఫెలోషిప్ ని పొందుతాడు. ఇక ఇంటికి వెళ్లాలన్న కోరికతో ఇండియాకి తిరిగొచ్చి దారిలో మళ్ళీ  తిరగబెట్టిన అనారోగ్యం కారణంగా, జన్మభూమిని చేరుకున్న సంవత్సరానికే 1920 లో తన 32 వ ఏట తుది శ్వాసని విడుస్తాడు ఈ అపర బ్రహ్మ.

మరణం కంటే బాధాకరమైన విషయం మరింకేముంటుంది. మరణమంటే నాశనం కావడమేగా. మరణించిన వారు, జీవించి ఉన్న కాలంలో చేసిన గొప్ప పనులు, లోకం వారిని పది కాలాల పాటు గుర్తుపెట్టుకునేలా  చెయ్యవచ్చు . కానీ వారి అనుభూతులు, అనుభవాలు ముఖ్యంగా వారి  విజ్ఞానం వారితో పాటుగా అంతం కావాల్సిందేగా. అటువంటిది, ఒక మేధావి అంత చిన్న వయసులో మరణించడం జాతికి ఎంతటి నష్టాన్ని కలిగిస్తుందన్న భావన మనల్ని దుఃఖానికి గురిచెయ్యకమానదు.

అయితేనేం? అతనికి అనంతమైన అంకెల గమనం తెలుసు. అత్యల్పమైన జీవితకాలంలోనే అంతులేనన్ని అద్భుతాలని సృష్టించడమూ తెలుసు. అందుకే అతను విశ్వమంత విశాలమైన ప్రపంచ చరిత్రలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రంగా మిగిలిపోయాడు.

                              ***

 

మనందరి కథ!

manam1
‘మనమంతా’ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. తెలుగులోనే కాకుండా, తమిళం మరియు మళయాలంలోకి డబ్ చేయబడింది. ప్రేమం, దృశ్యం లాంటి చిత్రాలను మన తెలుగు వారు అప్రీషియేట్ చేయడమే కాకుండా ఈ సారి ఇతర భాషల సినీ ప్రేమికులు మన తెలుగు వాడి గురించి చెప్పుకునే విధంగా, మనం కూడా తలెత్తుకొనే విధంగా తీయబడ్డ సినిమా ‘మనమంతా’.
 M1
సాయిరాం అనే అసిస్టెంట్ స్టోర్ మేనేజర్ తను మేనేజర్ కావడానికి చేసిన ప్రయత్నం ఎలా మలుపు తిరిగింది అనేది ఒక కథ, మహిత అనే అమ్మాయి తమ ఇంటి పక్క గుడిసెలో ఉన్న చిన్న పిల్లవాడికి చదువు చెప్పించాలనే కోరిక… తర్వాత ఆ పిల్లవాడు తప్పిపోయి వాడిని వెతుకుతూ వెళ్లే దారి మరో కథ, ఓ కుర్రాడు తను ఎంతో ప్రేమతో చూసుకునే లాప్ టాప్ అమ్మి ఓ అమ్మాయి ప్రేమ కోసం తను నమ్మిన విలువలను ఒక్కోటీ ఎలా కోల్పోయి హుస్సేన్ సాగర్లో తన ఐడెంటిటినీ మళ్ళీ ఎలా తిరిగి తెచ్చుకొన్నాడో చెప్పే కథ, గాయత్రి అనే మధ్యతరగతి గృహిణి తన కుటుంబం కోసం సింగపూరు బయలుదేరి చివర్లో తన గమ్యం చేరే కథ…ఈ నాలుగు కథల్ని ఒడుపుగా ఒకదానిలోంచి మరోటి పాయలుగా సాగి ఒక నదిలా ఉరకలెత్తి, సంద్రంలా మనల్ని ఓ భావావేశంలో ముంచెత్తుతుంది. ఈ సినిమాకు ఇరవై నిమిషాల క్లైమాక్స్ ఆయువుపట్టు. అలా అని క్లైమాక్స్ ఒక్కటే బావుందని కాదు. అనుకోకుండానే ఓ చిన్న కన్నీటి పొర, మీ గుండె చిక్కబడేలా చేస్తుంది. ఒక కథని ఎంత చిక్కగా చెప్పవచ్చో దర్శకుడు నిరూపించాడు.
yeleti
ఇరువర్/ ఇద్దరులో తన నటనతో సంభ్రమంలో ముంచెత్తిన నటుడు మోహన్ లాల్ ఈ సినిమాలో సటిల్ గా నటిస్తూ చివరికొచ్చే సరికి తనేంటో మరోసారి తెలియపరుస్తాడు. గౌతమి కూడా చాలా చక్కగా చేస్తూ చివరి ఇరవై నిముషాల్లో తన ప్రతిభ ఏంటో గుర్తు చేస్తుంది. వీరిద్దరినీ మరిపిస్తూ ఓ పదేళ్ల పాప ‘రైనా రావు మహిత పాత్రలో మనల్ని లీనం చేసుకుంటుంది. తను నవ్వితే మనం నవ్వుతాం, తను ఏడిస్తే మనం కూడా కళ్ల నీళ్లు పెట్టుకుంటాం. అంతగా ఆ అమ్మాయి మనల్ని కదిలిస్తుంది. విష్వాంత్ అనీషా ఆంబ్రోస్ హర్ష వర్ధన్, గొల్లపూడి, ఊర్వశి, అయ్యప్ప శర్మ, వెన్నెల కిషోర్, ధన్ రాజ్ వారి పాత్రల కు పూర్తి న్యాయం చేసారు.మొత్తం మీద ఇది ఇంటిల్లిపాదీ చూడదగ్గ సినిమా. ‘వారాహీ చలనచిత్రం సాయి కొర్రపాటి నిర్మాణం: ‘మనమంతా’ Rating 4****/5

ఆరు ముత్యాలున్న అడవి!

 

-భవాని ఫణి

~

wild tales1

రోడ్డు మీద మన మానాన మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరో తెలీని వ్యక్తి వచ్చి మనల్ని తీవ్ర పదజాలంతో దూషిస్తేనో లేక అవమానిస్తేనో మనమేం చేస్తాం?. ఈ ప్రశ్నకి ఒక్కటే సమాధానం ఉండదు. ఎవరికి వారు, వారి వారి పరిణితిని బట్టీ, విజ్ఞతని బట్టీ, ధైర్యాన్ని బట్టీ, అవకాశాన్ని బట్టీ,పరిస్థితుల్ని బట్టీ విభిన్నంగా స్పందిస్తారు. మనుషులందరిలో ఉండే భావోద్వేగాలు ఒకే విధమైనవి అయినప్పటికీ, వారవి ప్రదర్శించే స్థాయిలో మాత్రం హెచ్చు తగ్గులు తప్పనిసరిగా ఉంటాయి. నిజానికి కాస్తంత వివేకమో, భయమో ఆపలేనప్పుడు, పగా ప్రతీకారాలు మనిషిచేత ఎటువంటి నీచ కార్యాలనైనా చేయించగలవు. ఎంతటి అధమ స్థాయికైనా దిగజార్చగలవు. విచక్షణని కోల్పోయేలా చేసి, అతని స్వంత గౌరవాన్నీ, మర్యాదనీ, ధనాన్నీ, ప్రాణాన్నీ కూడా పణంగా పెట్టించగలవు. చివరికి అతడిలోని పశు ప్రవృత్తిని వెలికి తీయగలవు.
అటువంటి పగనీ, ప్రతీకారాన్నీ కథా వస్తువుగా తీసుకుని మనిషిలోని సహనపు స్థాయిని ఒక విభిన్నమైన కోణంలోనుండి సమీక్షించి నిర్మించిన బ్లాక్ కామెడీ చలన చిత్రం “వైల్డ్ టేల్స్” (Spanish: Relatos salvajes). 2014 లో విడుదలైన ఈ ‘అర్జంటైన్ – స్పానిష్’ సినిమా, అర్జెంటీనా సినిమా చరిత్రలోనే అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.  2015 ఫారిన్ లాగ్వేజ్ ఆస్కార్ కి నామినేట్ చేయబడింది కూడా . పోలిష్ సినిమా “ఇదా”తో పోటీపడి గెలవలేకపోయినా ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలతో పాటుగా ప్రేక్షకుల అభిమానాన్నీ చూరగొంది.
wild-tales-2
ఆరు భాగాలు గల ఈ యాంథాలజీ చలన చిత్రపు మొట్టమొదటి కథ “Pasternak”. ఒక విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణీకులంతా, తామందరూ ఒక సారూప్యతని కలిగి ఉండటాన్ని గమనిస్తారు. వీరంతా ఏదో ఒక సమయంలోనో, సందర్భంలోనో Pasternak అనే వ్యక్తిని మోసంచెయ్యడమో, ఇబ్బందికి గురి చెయ్యడమో చేసిన వారే. Pasternak ఆ విమానానికి కేబిన్ చీఫ్ అనీ, వారంతా ఒకే విమానంలో ప్రయాణించడం యాదృచ్ఛికం కాదని వారు గుర్తించేలోపుగానే ఆ విమానం నేలకూలిపోతుంది. ఇక్కడ ఈ కథ ద్వారా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఎంత చిన్న విషయంలోనైనా అన్యాయానికి గురికావడమనేది మనిషిని తీవ్రంగా బాధిస్తుంది. కొందరు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుని వదలిస్తే, మరి కొందరు తిరుగుబాటు బాట పడతారు. రెండూ చెయ్యలేక పదే పదే అన్యాయానికి, అసమానత్వానికీ బలవుతున్నానని ఒక వ్యక్తి భావించినప్పుడు, అతను తీవ్రమైన మానసిక సంఘర్షణకి లోనై చివరికి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని, తనకి తోచిన రీతిలో న్యాయాన్ని పొందే ప్రయత్నం చేస్తాడు.  “Pasternak”,అందుకు సరైన ఉదాహరణ.
 రెండో కథలో, లేట్ నైట్ కావడం వల్ల నిర్మానుష్యంగా ఉన్న ఒక హోటల్ కి ఒక వ్యక్తి రావడం, అక్కడ పని చేసే ఒకమ్మాయి అతన్ని, తన తండ్రి చావుకు కారకుడిగా గుర్తించడం, తన బాధని తనతో పాటుగా పని చేసే ఒక ముసలి వంటామెతో పంచుకోవడం, ఆ  ముసలామె ఈ  అమ్మాయి అడ్డు చెబుతున్నా వినకుండా  ఆ వ్యక్తిని చంపెయ్యడం జరుగుతుంది. ఇక్కడ ముసలామె, అమ్మాయి ప్రతీకారాన్ని తనదిగా భావించి ముక్కూ మొహం తెలీని వ్యక్తిని పొడిచి చంపేస్తుంది. ఇందుకు కారణమేమిటా అని ఆలోచిస్తే, ఒకప్పుడు ఆమె ఎదుర్కొన్న అన్యాయానికి  ఈ విధంగా న్యాయం పొందినట్టుగా భావించి ఉండవచ్చని అనుకోవచ్చు. లేదా తన సహోద్యోగిని బాధ ఆమెని అంతగా కదిలించి అయినా  ఉండవచ్చు. లేదంటే ఆమెలోని హింసాత్మక ప్రవృత్తి అటువంటి సందర్భం కోసం వెతుక్కుంటూ ఉండి కూడా ఉండవచ్చు. మొత్తానికి ఈ కథ వేరొకరి పగకి ప్రతీకారం తీర్చుకోవడమనే అంశాన్ని గురించి చర్చిస్తుంది. ఈ కథ పేరు “The Rats”.
ఇక మూడవ కథ “The Strongest” తాత్కాలికమైన చిన్నపాటి రోడ్ రేజ్ సంఘటన కలిగించే కసీ, ద్వేషానికి సంబంధించినది.  కారుకి దారివ్వని కారణంగా రోడ్డు మీద మొదలైన చిన్న గొడవ ఇద్దరు వ్యక్తుల్ని ద్వేషంతో రగిలిపోయేలా చేసి, చివరికి ఇద్దర్నీ కాల్చి బూడిద చేస్తుంది. తాత్కాలికమైన ఆవేశం, తర్వాత కలిగే కష్టనష్టాల గురించి కూడా ఆలోచించనివ్వనంతగా విచక్షణని పోగొడితే ఏం జరుగుతుందో తెలియజేస్తుందీ కథ.
పాలక వ్యవస్థలో గల లోటుపాట్లూ, అది చూపే నిర్లక్ష్యం కారణంగా సామాన్య ప్రజానీకంలో ఏర్పడే అసహనం, అసంతృప్తుల యొక్క  తీవ్ర రూపాన్ని అతిశయంగా చూపిస్తుంది నాలుగో కథ “Little Bomb”. పార్క్ చెయ్యకూడని స్థలమని స్పష్టమైన సూచనల్లేని ప్రదేశాలనించి, తన కార్ ని మాటి మాటికీ తీసుకెళ్లి జరిమానా వేస్తున్న నిర్లక్ష్యపు వ్యవస్థపై కోపంతో,
అసంతృప్తితో Simón Fischer అనే వ్యక్తి, ఒక గవర్నమెంట్ ఆఫీస్ ని బాంబ్ తో పేల్చేస్తాడు. ఈ కథలో మాత్రం సమాజంలో కదలిక ఏర్పడినట్టుగా, Simón న్యాయాన్ని పొందే దిశగా అడుగు వేస్తున్నట్టుగా  అనిపించే విధంగా ఉంటుంది ముగింపు. మొదటి మూడూ పూర్తి స్థాయి హింసాత్మక ప్రతీకారానికి చెందిన కథలైతే, ఇది మాత్రం చైతన్యంతో కూడిన హింసగా దర్శకుడు అభిప్రాయపడ్డట్టుగా కనిపిస్తుంది.
ఒక్కోసారి మన వల్ల ఎదుటివారికి అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా, అది మనకి జరుగుతున్న అన్యాయంగా ఊహించుకుని, ఎదుటి వ్యక్తికి కూడా అటువంటి అభిప్రాయాన్నే కలిగించగలిగితే ఎలా ఉంటుందన్నది ఐదో కథ “The Proposal”. తన కుమారుడు చేసిన ఒక కార్ యాక్సిడెంట్ నేరాన్ని తనపై వేసుకునేందుకు తోటమాలిని ఒప్పిస్తాడు ధనికుడైన ఒక వ్యక్తి. కానీ ఒప్పందం సమయంలో లాయరు, ప్రాసిక్యూటరు, తోటమాలీ డబ్బు విషయంలో తనని మోసం చేస్తున్నారని భావించి, వారికి కూడా అదే అభిప్రాయాన్ని కలిగించి చివరికి
తనకి కావలసిన విధంగా ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడతను. అంతా అతనికి అనుకూలంగా జరిగిపోబట్టి సరిపోయింది కానీ ఆ ఒప్పందం కుదరకపోతే తన కన్నబిడ్డని పోగొట్టుకోవాల్సి వస్తుందన్న నిజాన్ని, అతను తన కోపానికి పణంగా పెడతాడు.
కొత్తగా పెళ్లైన ఒకమ్మాయి, తను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తికి వేరే అమ్మాయితో శారీరక సంబంధం ఉందన్న విషయాన్ని తెలుసుకుని తట్టుకోలేకపోతుంది. ఆ కోపంలో, ఆవేశంలో ఆమె తీవ్రమైన దుఃఖానికి లోనై, తన సహజమైన మృదుత్వాన్నీ, సామాజిక లక్షణాన్నీ కోల్పోతుంది. తత్ఫలితంగా తీవ్రమైన విశృంఖలత్వాన్నీ, హింసాత్మక ధోరణినీ ప్రదర్శించి తన పెళ్లి పార్టీలోనే విధ్వంసాన్ని సృష్టిస్తుంది. చివరికి భర్త చొరవతో స్పృహలోకి వచ్చి సర్దుబాటు చేసుకుంటుంది. ఈ కథ బ్లాక్ కామెడీ అన్న పదానికి పూర్తి న్యాయాన్ని చేకూరుస్తుంది. అమ్మాయి రోమినా ప్రదర్శించే ‘గాలొస్ హ్యూమర్’ చాలా అసహజమైందే అయినప్పటికీ,  నవ్వడానికి కూడా మనస్కరించనంతగా మనల్ని తనలో లీనం చేసుకుంటుంది. ఇది ఈ యాంథాలాజీ సినిమా కథల్లోని ఆఖరి కథ “Till Death Do Us Part”. రోమినాగా నటించిన ‘ఎరికా రివాస్’ అద్భుతమైన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించింది.
ఈ కథలన్నిటినీ కలిపే చక్కని సంగీతం, ‘ఇది ఒక కామెడీ సినిమా సుమా’ అని చెప్పే ప్రయత్నం చేసినా, ఆలోచింపచేసే థ్రిల్లర్స్ గానే మనం వీటిని స్వీకరిస్తాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే “అన్యాయాన్ని ఎదిరించగలిగినప్పుడు కలిగే ఆనందానికి చిరునామా”గా ఈ చలన చిత్రాన్ని అభివర్ణిసాడు దర్శకుడు Damián Szifron.
*

ఆడంబరం లేని అబ్బాస్!

 

ఇంద్రగంటి మోహన కృష్ణ

~

 

mohanakrishnaఆంద్రెయ్ తార్కోవిస్కీ  (Andrei Tarkovsky) అనే ఒక గొప్ప రష్యన్ ఫిల్మ్ మేకర్ ఒక మాటన్నారు. కళలో అబ్సల్యూట్ సింప్లిసిటీ అంటే పరిపూర్ణమైన నిరాడంబరత అనేది చాలా కష్టమని అన్నారు. .అబ్సల్యూట్ సింప్లిసిటీ అంటే ఎటువంటి హంగులూ ఆర్భాటాలూ లేకుండా ఎంత క్లిష్టమైన విషయాన్నైనా సరళంగా  చెప్పగలగడం .

సరళంగా చెప్పగలగడం అంటే తెలివితక్కువగా సింప్లిస్టిక్ గా చెప్పడం అని కాదు. ‘సరళంగా చెప్పగలగడం అనేది ఒక అద్భుతమైన కళ’ అని తార్కోవిస్కీ అన్నారు. అలా అంటూ ఆయన, సంగీతంలో యొహాన్ సెబాస్టియన్ బెక్ (Johann Sebastian Bach)సంగీతమూ, సినిమాల్లో రాబర్ట్ బ్రెస్సోన్(Robert Bresson) సినిమాలూ ఇందుకు తార్కాణాలుగా పేర్కొన్నారు . నా దృష్టిలో వాళ్ల తర్వాత అబ్బాస్ కిరొస్తామీ(Abbas Kiarostami)సినిమాలు ఈ అబ్సల్యూట్ సింప్లిసిటీకి గొప్ప ఉదాహరణలు. దీనినే పరిపూర్ణమైన నిరాడంబరత అని కూడా అనవచ్చు.

అంటే ఎంచుకున్న విషయం చిన్నదైనా కూడా ఒక గొప్ప లోతునీ, ఒక అద్భుతమైన జీవిత సత్యాన్నీ అత్యంత సరళంగా ఆవిష్కరించగలిగిన  చాలా కొద్ది మంది దర్శకుల్లో నా దృష్టిలో కిరొస్తామీ ఒకరు.  ‘వైట్ బెలూన్’ గానీ, ‘ద విండ్ విల్ క్యారీ అజ్’ గానీ, ‘టేస్ట్ ఆఫ్ చెర్రీస్’ గానీ, ‘వేర్ ఈజ్ ద ఫ్రెండ్స్ హోం’ గానీ ఇలా ప్రతి సినిమాలోనూ ఒక దర్శకుడి యొక్క అహం గానీ, అహంకారం గానీ  కనబడకుండా అద్భుతమైన పారదర్శకతతో, సింప్లిసిటీతో ఎటువంటి ఆడంబరాలకీ, స్టైలిస్టిక్ టచెస్ కీ, అనవసరపు హంగామాలకీ పోకుండా జీవితాన్ని ఉన్నదున్నట్టుగా చూడటం, ఆ చూడటం ద్వారా అతి చిన్న విషయాలని కూడా  పరిశీలించడమెలాగో నేర్పించిన దర్శకుడు అబ్బాస్ కిరస్తామీ.  అది చాలా చాలా కష్టమైన కళ.

అబ్బాస్ కిరస్తామీ నా దృష్టిలో చనిపోలేదు. ఆయన అవసరం ఉంది కనుక కొంతకాలం మన భూమ్మీద నివసించడానికి వచ్చారు. ఇక వేరే గ్రహాల్లో, వేరే అంతరిక్షాల్లో, వేరే లోకాల్లో కూడా ఆయన అవసరం పడి ఉండటం వల్ల ఇలా వెళ్లిపోయారని అనుకుంటున్నాను. కాబట్టి థాంక్ యూ అబ్బాస్ కిరస్తామీ.

(సాంకేతిక సహకారం: భవాని ఫణి)

 

చిగురంత ఆశ ..ఈ చిన్ని సినిమా!

 

siva

 

శివలక్ష్మి 

~

గర్ల్ రైజింగ్ (Girl Rising)  అనే ఈ స్పెషల్ ఇంట్రస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ న్యూయార్క్ లో చిత్రీకరించబడింది.

ఈ చిత్ర దర్శకుడు రిచర్డ్ రాబిన్స్ .

ఈ సినిమా నిడివి గంటా 41 నిమిషాలు.

 

ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఆడపిల్లలు పుట్టిన దగ్గరనుంచి పెరుగుతున్న క్రమంలో పడుతున్న దారుణ మైన హింసల్ని రికార్డ్ చేసిన చిత్రమిది. బాల్య వివాహాలు,  పిల్లల బానిసత్వం, నిరక్షరాస్యత, పేదరికం, మానవ రవాణా మొదలైన సమస్యల గురించి హృదయ విదారకమైన కథలు చెబుతుంది. 9 దేశాల ప్రతినిధులుగా 9 మంది బాలికలు ఈ అడ్డంకులన్నిటినీ అధిగమిస్తామని గొప్ప ఆశావాదాన్ని వినిపిస్తారు.

కంబోడియా మురికి వాడ నుంచి వచ్చిన అనాధ “సోఖా” చురుకైన విద్యార్ధిగా, ‘నర్తకి’ గా మారిన విధానాన్ని మనసులో నిల్చిపోయేటట్లు చిత్రించారు.

నేపాల్ నుంచి “సుమ బలవంతపు దాస్యం నుంచి తాను తప్పించుకుని మిగిలిన తనలాంటివారిని తన సంగీత విద్య ద్వారా బాధ్యతగా తప్పించే పనిలో నిమగ్న మవడం చూస్తాం.

ఇండియా నుంచి కలకత్తాలో రోడ్డు పక్కన నివసించే ఒక తండ్రి తన చిన్నారి పాప  “రుక్సానా లోని ఆర్టిస్ట్ ని గుర్తించి ఆమె కోసం కుటుంబమంతా తమ  ప్రాధమికావసరాల్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడతారు. రోడ్డు మీద నివశించే వారి కుటుంబం ఒకసారి కురిసిన తుఫాన్ లాంటి వర్షంలో అల్లాడిపోతుంది.”వెయ్యి నదులు కక్షతో ప్రవహిస్తున్నట్లు వర్షిస్తుంటే,నిలువ నీడలేని మా అందరితో పాటు నా చిత్రలేఖనాలు కూడా రోదిస్తున్నట్లనిపిస్తుంది. నానిపోయిన నా డ్రాయింగ్స్ ని ఏమూల ఆరబెట్టాలి?” అంటుంది రుక్సానా ఏడుపు గొంతుతో.

అలాగే పెరూ దేశం నుంచి “ సెన్నా” అనే పాప పేరుని క్లాస్ రిజిస్టర్ నుంచి స్కూలు ఫీజ్ కట్టనందు వల్ల    తీసేస్తారు.తల్లిని చదువుకుంటానని అడుగుతుంది. తల్లి “మన దగ్గర డబ్బుల్లేవమ్మా” అని చెప్తుంది. తల్లికి సహాయం చేస్తూనే మళ్ళీ క్లాస్ కెళ్తుంది. బహుశా అది పేద దేశమైనందు వల్లనో ఏమో స్కూలు బిల్డింగ్  లాంటి వేమీ ఉండవు.ఒక ఖాళీ జాగాలో టీచర్ పాఠాలు చెప్తూ ఉంటుంది.నిశ్శబ్దంగా మన పాప వెనక బెంచీలో కూర్చుని పాఠాలు వింటూ ఉంటుంది. టిచర్ చూసి “మీ అమ్మ స్కూలు ఫీజ్ ఇచ్చిందా”? అనడుగుతుంది.పాప ధైర్యంగా “లేదు. మా దగ్గర డబ్బు లేదం”టుంది.ఐతే క్లాస్ నుంచి  వెళ్ళిపొమ్మంటుంది టిచర్. మొదటిసారి నిరాశగా వెళ్ళిపోతుంది సెన్నా. చదువుకోవాలనే కోరిక ఆ పాపని నిలవనీయదు. ఎన్నిసార్లు వెళ్ళమన్నా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది.ఇక చివరికి టీచర్ కి ఆ పాప పట్ల ఇష్టం పెరిగిపోయి చిరునవ్వుతో చూస్తూ ఉండిపోతుంది.చిత్రం ముగుస్తుంది.

“నేను చదువుతాను. నేను చదువుకుంటాను. నేను నేర్చుకుంటాను. మీరు నన్ను ఆపడానికి ప్రయత్నిస్తే నేనింకా బలంగా పోరాడతాను” – అని కధకురాలు తన గొంతుతో చెప్తుంది గానీ ఆ పాప తాను చదువుకోవాలనే విపరీతమైన తన కాంక్షను తన నటన ద్వారా అద్భుతంగా వ్యక్తీకరించింది. “ఒకవేళ మీరు గనక నన్ను దూరంగా పంపిస్తే మీరు ఉండమనేవరకూ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను” అని చెప్తూ నటించడం కాకుండా ఆ చిన్ని పాత్రలో జీవించి చూపించింది.కాకరాల గారంటారు “పాత్రలలో చిన్నా, పెద్దా అని తేడాలుండవు. ప్రతిదీ ప్రత్యేకమైనదే”అని.

అమ్మాయిలందరూ ఎవరికి వారే సాటి అని అనిపించినప్ఫటికీ ఈ సెన్నాపాప కథ చాలా ఆశాజనకంగా ఉండి నాకు విపరీతంగా నచ్చేసింది. అసలు సినిమాలో ఈ పాప కథని నడిపించే సంగతేమిటంటే  “వారియర్ ప్రిన్సెస్ సెన్నా”లా పెరగాలని తండ్రి ఆమెకు ఆ పేరు పెడతాడు. అతను సెన్నాకి పాఠశాలకి వెళ్ళి బాగా చదవాలని చెప్తుండేవాడు. తర్వాత తండ్రి ఒక బంగారు గని మైనింగ్ ప్రమాదంలో మరణిస్తాడు. ఆమె తండ్రి ఆదేశం ప్రకారం స్కూలుకి వెళ్ళడానికి తన శక్తికి మించి ప్రయత్నించి తన కోరికే కాక తండ్రి ఆశయాన్ని నెరవేర్చే దిశగా దృఢ నిశ్చయంతో అడుగులు వేస్తుంది. పౌరహక్కుల సంఘం నాయకుడు పురుషోత్తం గారిని హైదరాబాద్ లోని దిల్ శుక్ నగర్ లో నడిరోడ్డుమీద గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపేస్తే ప్రతి ఒక్కరూ కన్నీళ్ళు పెడితుంటే వాళ్ళ పాప మాత్రం (పదేళ్ళుంటాయేమో) నిబ్బరంగా ఉంది. అస్సలేడవలేదు.”ఏంట్రా, నీకేడుపు రావట్లేదా?” అనడిగితే “బాపు నాకు ఏడవద్దని చెప్ఫాడు” అని చెప్పింది. తండ్రి చెప్పిన మాటను తు.చ. తప్పకుండా పాటించాలనుకునే సెన్నాని చూసినప్పుడు నాకది గుర్తొచ్చింది!

అసలెందుకిలా జరుగుతుంది? ఈ అమ్మాయిలేమీ అసాధ్యమైన, గొంతెమ్మ కోరికలు కోరడం లేదు కదా? ఈ పిల్లలు భావి ప్రపంచపౌరుల కిందికి రారా? వీళ్ళు విద్యావంతులవ నవసరంలేదా? అనే భావాలతో హృదయం తల్లడిల్లిపోయింది.

ఆఫ్ఘనిస్తాన్ నుంచి “అమీనా” “నా తండ్రి నాకు పెళ్లి ఏర్పాట్లు చేసినప్పుడు నాకు 11 సంవత్సరాలు” అని అంటుంది.

అలాగే తొమ్మిది మంది  బాలికల కథలు తొమ్మిది రకాలైన ప్రత్యేక కథనాలైనప్పటికీ ఇవి ప్రపంచంలోని అన్ని దేశాల్లో సర్వ వ్యాపితమైనవే. ఎక్కడో జరుగుతున్నట్లనిపించవు.మన చుట్టూ మనం చూస్తున్న సంఘటనలే అనిపిస్తాయి!

“ఇంత  అందమైన ప్రపంచంలో అందం,ఆనందాలతో పాటు ఇంత కౄరమైన నీచత్వం ఒకే చోట  ఎలా కలగలిసి ఉంటున్నాయి?” అని అంటుందొక పాప.

“బాలికలు ఎప్పటికీ సమస్య కాదు. వారు అన్నిటికీ పరిష్కారాలు సూచించగలరు. మీరు ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టాలన్నా, ప్రపంచ ఆర్థికపరిస్థితిని మెరుగు పరచాలన్నా అమ్మాయిల్ని చదివించండి” అని అంటుందింకొక అమ్మాయి.

“నేను మా ప్రాంతాల్లో అమ్మాయిల వేలం  పాట విన్నాను.పురుషులను కూడా అలాగే వేలం  వెయ్యండి” – అని ఒక పాప అంటే,

“నావిషయంలో ఏంజరిగిందో ప్రతిదీ నేను మీకు చెప్పలేను. కానీ ఆ హింసను నేను నాజన్మలో మర్చిపోలేను” – అని మరొక అమ్మాయి అంటుంది.

సామాజిక కార్యకర్త మరియాసియర్రా ఒక ఇంట్లో బానిస చాకిరీ చేస్తున్న ఒక అమ్మాయికి స్వేచ్చ నివ్వమని అడుగుతుంది. ఆ యజమాని నిరాకరించినప్పుడు ఆమె వివిధ చట్టాల గురించి వివరించి చెప్పి ఆయన నొప్పించి అమ్మాయికి విముక్తి కలిగిస్తుంది.

“మీరు గనక నన్ను ఆపివేస్తే, నా వెనక లక్షలమంది అమ్మాయిలు ఈ కారణం కోసం పని చేస్తారు”.

“చదువుతో ఏదైనా చేయగలనని భావిస్తున్నాను.ఆడపిల్లల ప్రపంచాన్ని మార్చే శక్తి వస్తుంది”.

“చదువుకుని ఆర్ధికంగా నా కాళ్ళమిద నేను నిలబడగలిగితే నాకు నేనే స్వంత మాస్టర్ నవుతాను”

“నేను మేకల పర్యవేక్షణలో ఉన్నప్పుడు అమ్మాయిల కంటే మేకలే మంచి స్థితిలో ఉన్నట్లనిపించింది”.

ఈ విధంగా అమ్మాయిలు వాళ్ళ వాళ్ళ కోరికల్ని, అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. తమ వ్యక్తిగత బాధామయ ప్రయాణాలను ప్రపంచంతో పంచుకోవడం ద్వారా ఒక్కొక్కరూ ఒక్కో ఉపాధ్యాయురాలి లాగా మారినట్లు ప్రేక్షకులకు కనిపిస్తారు. సినిమా చూచిన వారందరికీ మెరుపు తీగల్లాంటి తొమ్మిదిమంది అమ్మాయిలు మన మనో ఫలకంపై ముద్ర పడిపోతారు. ఆడపిల్ల  చదువుకుని విద్యావంతురాలైతే ఆమె జీవితం లోనే కాక ప్రపంచాన్నే మార్చగలిగిన శక్తి వస్తుందనే ఆశాభావాన్ని కలిగిస్తారు.

ఈ కథ సాధారణమైనదే! ఇది మొదలూ కాదు, అంతమూ కాదు. కానీ ఈ పిల్లల్లో కనిపించే గొప్ప ఉత్తేజం ఆనందం కలిగిస్తుంది. ఒక్కొక్కరినీ చూస్తుంటే శతాబ్దాలుగా చెత్త పోగులో పడి ఉన్న “ఆమె” ఇప్పుడు కటిక చీకటిలో అందమైన మిణుగురుల పంట పండిస్తుందనిపించింది!

ఇది వినూత్నమైన పద్ధతిలో నిర్మించిన ఒక కథా చిత్రం. ప్రపంచ మంతటా ఎదుర్కొనే ప్రమాదకరమైన అసమానతలను విశ్లేషించారు. తీవ్రంగా కలతపెట్టే సమస్యల చర్చలున్నాయి. ఆడపిల్లల సాధికారత, విద్య, సమానత్వాల గురించి చర్చించినప్పటికీ, ఈ అమ్మాయిలు ఎలా దోపిడీ అణచివేతకు గురౌతున్నారో చిత్రించడానికి భయానక శబ్దచిత్రం గా రూపొందించారు. ఎదుగుతున్న తరం కూడా తమ స్త్రీజాతి ఇక్కట్ల గురించి తెలుసుకోవాలని, అవగాహన కలిగించాలని ఒకవేళ వారి తల్లిదండ్రులు ఎవరైనా అనుకుంటే ఈ సినిమా చూపించడానికి  ప్రయత్నించే వీలే లేదు. తమ టీనేజ్ ఆడపిల్లలతో కూర్చుని ఈ చిత్రాన్ని చూడడం గానీ, వాళ్ళకు ఈ కల్లోల పరిస్థితుల్ని వివరించి చెప్పడం గానీ, ఆలోచనలు పంచుకోవడం గానీ కుదరదు. వారి పెద్దలకు చాలా ఇబ్బందిగా అసౌకర్యంగా ఉంటుంది!

ఒక్కో అమ్మాయి కథను కు చెందిన ఆయా దేశాలకు చెందిన ఒక్కో ప్రఖ్యాత రచయిత రాశారు. సామాజిక కార్యకర్త మరియా-సియర్రా గొంతుతో పాటు, ఆయా దేశాల ప్రముఖ నటీమణుల స్వరాలతో కధనాన్ని హృద్యంగా దృశ్యీకరించారు దర్శకులు రిచర్డ్ రాబిన్స్. ఆయన ఆస్కార్ నామినేటెడ్ డాక్యుమెంటేరియన్.

మొత్తానికి పాఠశాలకు వెళ్ళాలని  కలలు కంటున్న  అద్భుతమైన అమ్మాయిలు వీళ్లంతా! ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి బాలికలు 66 మిలియన్ల మంది ఉన్నారని తెలుస్తుంది. ఒక్కోఅమ్మాయి ధైర్యంగా చదువుకోవాలని ఆరాటపడడం చూస్తే ఎవరికి వారు వారి వారి దేశాల్లో విప్లవాలు చేసేటట్లున్నారు !

ఇంత గొప్ప దర్శకులు రిచర్డ్ రాబిన్స్ పిల్లల్ని విప్లవాలనుంచి తప్పించే ప్రయత్నంలో ఉన్నారా అనే విషయం నిరాశ పరిచింది. నిజంగా స్పష్టమైన మూల కారణాలను అన్వేషించే ప్రయత్నమైతే కనిపించలేదు.  రిచర్డ్ రాబిన్స్ బాలికలకు విద్యా, సమానత్వం కోరుతూ పని చేసే  “10” అనే ఒక సామాజిక సంస్థ డైరెక్టర్. ప్రపంచమంతా దీని శాఖలున్నాయి.

“అదిగో చూడండి,అక్కడ పీడితులున్నారు.బాధితులున్నారు” అని చెప్పడానికి అసలు విషయం చెప్పకుండా నిజమైన స్ట్రగుల్స్ నిర్మించకుండా వారిని దిష్టి బొమ్మలుగా చూపిస్తూ తమ భవిష్యత్తుని దేదీప్యమానంగా వెలిగించుకుంటారు కొందరు ఎన్ జీ వో  సంస్థల నాయకులు. పీడితుల వెతల్ని హృదయ విదారకంగా వర్ణిస్తూ మన రచయితల్లాగే అవార్డులూ, రివార్డులూ ఆస్కార్ నామినేషన్లూ సాధించుకుంటారు. కానీ పీడితుల, బాధితుల పరిస్థితులు ఎప్పటికీ మారవు. ప్రభుత్వాలు కోరుకుంటున్నట్లే వీళ్లకు కూడా  యధా తధ పరిస్థితులు  కొనసాగాలి. చిత్ర నిర్మాణాలకు దర్శకులకు,రాయడానికి రచయితలకు మాత్రం వాళ్ళ బాధలు కావాలి,ఆ తర్వాత బాధితులు ఎలా చస్తే మనకెందుకు మన బహుమతులు మనం గెల్చుకోవాలి అని కోరుకుంటారు!

“పిల్లలు స్త్రీలు బలహీనులు.నిరుపేదలు.సమానత్వాన్ని కోరుకుంటారు.బలవంతులకి ఆ ఆలోచనే ఉండదు”- అని అరిస్టాటిల్ 348 B.C.లోనే చెప్పాడు. అప్పటినుంచి ఇప్పటివరకూ హింసను కొనసాగిస్తున్న ప్రపంచ పాలకుల, వారి మద్దతు దార్ల ఘనతను ఏమని కొనియాడాలి?

మానవత్వం అనేది ఏమిటో మచ్చుకైనా తెలియని పెట్టుబడి చేస్తున్న విధ్వంసమిది!మార్కెట్ కి వినియోగదారులుగా పనికిరాని, కొనుగోలు శక్తి లేని పేద ప్రజలను ఏకంగా  మట్టుబెట్టాలని చూస్తుంది. ఈ సినిమాలో కనిపించే అసలు రహస్యం ఇదే! దీనంతటికీ మూల కారణాలైన కేపిటల్ గురించీ, మార్కెట్ గురించీ చెప్పకుండా చేసిన ఈ దృశ్యీకరణ ఎంత బాగున్నప్పటికీ, పేదలపట్ల జరుగుతున్న ఈ ఘోరకలిని మెచ్చుకోలేం!

“సాధారణ ప్రజలు మనకంటే చాలా తెలివైనవాళ్ళు. ఈ కష్టాల వ్యవస్థలో ఎలా బతకాలో వాళ్ళకి తెలుసు.ఎవరూ ఏమీ చెయ్యకపోయినా ఫరవాలేదు. మీరందరూ హాయిగా బతకండి.  కానీ వారి ఉద్యమాలకు వెనకుండి మద్దతు నివ్వండి” అని అంటారు  మహాశ్వేతా దేవి. మన వంతుగా కనీసం అది చేసినా చాలు!

నేనీ సినిమా గోతెజెంత్రం (జర్మన్ ఫిల్మ్ క్లబ్) లో చూశాను.

 

~

చూడదగ్గ వి’చిత్రం’ 24

 

 భవాని ఫణి
~

కనీస అవసరాలన్నీ అలవోకగా తీరిపోతుంటే అప్పుడు మనిషికి కలిగే తరవాతి ఆశ ఏమిటి? ఆరోగ్యంగా ఎక్కువకాలం, కుదిరితే కలకాలం జీవించి ఉండాలనేగా. ఈ ఆశని తీర్చగల అతి సులువైన ఊహల్లో  కాలంలోకి ప్రయాణించడం కూడా ఒకటి. అంతేకాక కాలంలో ప్రయాణించగలిగితే పొందగల మిగతా లాభాలు అంకెలతో లెక్కించలేనన్ని. అటువంటప్పుడు అలా కాలం గుండా మనల్ని విహరింపచేయగల యంత్రమేదైనా మనకే, మనకి మాత్రమే దొరికితే ఎంత బాగుంటుందో కదా. ఎన్ని అద్భుతాలు చెయ్యచ్చు! ఎంత గొప్పవాళ్ళం అయిపోవచ్చు! ఒక వేళ అదే యంత్రం ఒక దురాశాపరుడి లేదా దుర్మార్గుడి చేతిలో పడినట్లయితే జరిగే అనర్థాల్ని కూడా మనం సులభంగానే ఊహించగలం. ఇటువంటి ఆలోచనకే దృశ్యరూపం “24” చలన చిత్రం.

మన దక్షిణాదిన నిర్మితమయ్యే  చలన చిత్ర కళా ప్రక్రియ( జెనెరె)ల్లో సైన్స్ ఫిక్షన్ చాలా అరుదు. విచిత్రంగా మన తెలుగులో అయితే ఆదిత్య 369 ఒక్కటి మాత్రమే అటువంటి చలనచిత్రంగా కనిపిస్తోంది. ( డబ్బింగ్ చిత్రాలని మినహాయిస్తే). నిజానికి ఈ అంశంపై హాలీవుడ్ లో లెక్కలేనన్ని కథలూ, సినిమాలూ సృష్టించబడ్డాయి. మన దేశంలో కూడా హిందీ, బెంగాలీ,తమిళ భాషల్లో ఇటువంటి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఆలోచనలు పాతవే అయినా వాటి వ్యక్తీకరణ జరిగిన విధానాన్ని బట్టి చలన చిత్రపు విజయం ఆధారపడి ఉంటుంది . అటువంటి చెప్పుకోదగ్గ సై. ఫి. చిత్రంగా 24 మిగిలిపోతుందని చెప్పచ్చు.
సైన్స్ పరంగా పెద్దగా తర్కానికి అందని కథైనప్పటికీ ఈ సినిమాలో మనం గమనించాల్సింది దర్శకుడు కథని ప్రజెంట్ చేసిన విధానాన్ని . జరిగిన ప్రతి సన్నివేశానికీ, సంభాషణకీ ఒక అంతరార్థాన్ని కల్పిస్తూ అల్లబడిన బిగువైన దృశ్య ప్రదర్శనగా ’24’ని పేర్కొనవచ్చు. మధ్యలో కమర్షియల్ అంశాలనీ, హాస్యాన్నీ, ప్రాంతీయతనీ చొప్పించినప్పటికీ అవి ఎబ్బెట్టుగా అనిపించని విధంగా జాగ్రత్తపడ్డాడు దర్శకుడు విక్రం కుమార్.
కథ టూకీగా చెప్పాలంటే సైంటిస్ట్ అయిన డాక్టర్ సీతారాం, కాలం గుండా ప్రయాణించగలిగే ఒక చేతి గడియారాన్ని తయారుచేస్తాడు. ఇక్కడ కాలం గుండా ప్రయాణం అంటే భౌతికంగా కాదు. కేవలం మానసికంగా మాత్రమే. అంటే ఈ వాచ్ ని ఉపయోగించి మన ఆలోచనల్నీ అనుభవాల్నీ వెనక్కి గానీ ముందుకు గానీ పంపవచ్చు. ఉదాహరణకి మనం ఈ వాచ్ సహాయంతో పది సంవత్సరాలు కాలంలో  వెనక్కి ప్రయాణం చేసామనుకోండి. గతంలో  ఉన్న మనకి, తర్వాతి పది సంవత్సరాల కాలానికి చెందిన జ్ఞాపకాలూ, అనుభూతులూ కలుగుతాయి. అక్కడినించి ఆ జ్ఞానాన్నిఉపయోగించి మనం చేసే చర్యల ఫలితంగా మరో కొత్త భవిష్యత్తు సృష్టింపబడుతుంది. అలాగే కాలాన్ని కొంతసేపు నిలిపి వేయవచ్చు కూడా .
సీతారాం, ఇటువంటి ఒక గొప్ప కాల గడియారాన్ని సృష్టించిన ఆనందంలో ఉండగానే దుర్మార్గుడైన అతని కవల సోదరుడు ఆత్రేయ,  ఆ వాచ్ ని చేజిక్కుంచుకుని, కాలాన్ని జయించాలన్న కోరికతో చేసిన కొన్ని దుష్ట కార్యాల కారణంగా ఆ అన్నదమ్ముల జీవితాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి.
అటుపైన ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత సీతారాం కుమారుడైన మణి, ఆత్రేయ ఆట కట్టించి పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దాడనేది కథాంశం. కథ గురించి ఇంతకుమించిన వివరాలూ, సినిమాకి 24 అనే పేరు ఎందుకు పెట్టారన్న విషయానికి చెందిన సమాచారమూ సినిమా చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది. మొత్తం కథలో, ఏడాది లోపు వయసున్న పసి పిల్లవాడు, ఇరవై ఆరేళ్ళ మానసికమైన వయసుతో,  అనుభవాలతో, ఆలోచనలతో ఉండిపోవడమనే ఊహ చాలా కొత్తగా అనిపించింది.
ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది స్క్రీన్ ప్లే గురించి. దాన్ని ఎంతో ఆసక్తికరంగా తీర్చిదిద్దడంతో పాటుగా, అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో తయారుచేసేందుకు
దర్శకుడు చాలా కృషి చేసాడు. ముందు కనిపించే ఒక దృశ్యాన్ని లేదా సన్నివేశాన్ని తర్వాతెప్పుడో జస్టిఫై చేసి జతకూర్చిన తీరు చాలా బావుంది. లాజిక్ చెడకుండా ఉండేందుకు దర్శకుడు తీసుకున్న శ్రద్ధ సినిమా ఆద్యంతమూ కనిపిస్తుంది.
సాధారణంగా సై.ఫి చిత్రాలలో మానవ సంబంధిత భావోద్వేగాలకి చెందిన అంశాల లోపం స్పష్టంగా కనిపిస్తుంటుంది. కొన్ని కథల్లో అయితే కనీసం స్త్రీ పాత్ర ఉండను కూడా ఉండదు. కానీ 24 లో ఉన్న మెచ్చుకోదగ్గ అంశం ఏమిటంటే, మనుషుల మధ్య ఉండే అనుబంధ బాంధవ్యాలని, ప్రేమాభిమానాల్ని ఈ సినిమా చాలా సహజంగా ఆవిష్కరిస్తుంది. మణికీ, అతన్ని పెంచిన తల్లి సత్య భామకీ మధ్య నడిచిన కథ, సినిమాని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది.  సినిమాలో అరవై శాతం వరకు ఉపయోగించిన విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా సహజంగా ఇమిడిపోయాయి. సూర్య నటన గురించి ఇక్కడ తప్పనిసరిగా చెప్పుకోవాలి. అతను ధరించిన మూడు పాత్రల్లో నటనకి అవకాశం ఉన్న మణి, ఆత్రేయ పాత్రలకి అతను పూర్తి న్యాయం చేకూర్చాడు. హీరోయిన్స్ నిత్యా మీనన్, సమంతాలు  సాంప్రదాయబద్ధమైన తీరులో అందంగా కనిపించారు. విభిన్నమైన కోణాల్లో కెమెరాని ఉపయోగించి సినిమాటోగ్రాఫర్ “తిరు” సినిమాకి తన వంతు సహాయాన్ని అందించారు  రెహమాన్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం మాత్రం తీసికట్టుగా ఉన్నా వాటి మీద పెద్దగా దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపించదు.
మామూలు వాచ్ మేకర్ అయిన మణి, అతని సైంటిస్ట్ తండ్రి సీతారామ్ తయారుచేసిన కాల గడియారంలో సులభంగా మార్పులు చెయ్యగలగడం వంటి చిన్న చిన్న లోపాలూ, వాన చినుకుల్ని ఫ్రీజ్ చేసి చెదరగొట్టడం వంటి  అసంభవమైన అతిశయోక్తులూ కొన్ని కొన్ని ఉన్నప్పటికీ  24 ని ఒక  తెలివైన ప్రయోగంగా పేర్కొనవచ్చు.
*

  ప్రపంచ శ్రమజీవుల సినిమా “స్ట్రైక్”

strike

 

-శివలక్ష్మి 

 ~

1925 లో సోవియట్ యూనియన్ నుంచి వచ్చిన అత్యద్భుతమైన ఆవిష్కరణస్ట్రైక్. ఈ సినిమా డైరెక్టర్ ప్రపంచ ప్రఖ్యాత సోవియట్ చిత్ర నిర్మాత “సెర్గీ మిఖాయ్లోవిచ్ ఐసెన్ స్టీన్. ప్రపంచ కార్మికులంతా ఏకం కావాలనే సమైక్యవాదం గురించి బలమైన ప్రకటనలు చేసిన  రాజకీయ చిత్రం. దీని నిడివి ఒక గంటా,ఇరవై రెండు నిమిషాలు.

కథలోకి వెళ్ళి క్లుప్తంగా చెప్పుకోవాలంటే – ఒక మెటల్ ఫ్యాక్టరీలో 25 రూబిళ్లు ఖరీదు చేసే ఒక మైక్రోమీటర్  మాయమవుతుంది. ఆ నేరాన్ని యాజమాన్యం యాకోవ్అనే కార్మికుడి మీదకు నెడుతుంది. అవమానభారంతో అతను ఉరి వేసుకుని మరణిస్తాడు. యాకోవ్ ఉరి తీసుకునే ముందు తనకు జరిగిన అన్యాయం గురించి తన సహ కార్మిక సోదరులకు వాస్తవాలను వివరిస్తూ రాసిన ఒక లేఖను వదిలి వెళ్తాడు. ఆ లేఖతో పాటు, యాకోవ్ వేళ్ళాడుతున్న శవాన్ని చూసిన కార్మికులు పట్టరాని ఆగ్రహంతో పని అక్కడికక్కడే ఆపేసి, మిల్లింగ్ గది వదిలేసి మెరుపు సమ్మెకు దిగుతారు. స్ట్రైకర్స్ వదులుగా ఉన్న మెటల్ ని, రాళ్ళని కొలిమి కిటికీల నుంచి విసురుతూ ఫ్యాక్టరీ పనికి ఆటంకం కలిగిస్తారు. అప్పుడు యాజమాన్యం మండిపడుతూ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ గేట్ల లోపల కార్మికులందర్నీ నిర్భందిస్తుంది. కోపించిన శ్రామికులు కార్యాలయాన్ని ఆక్రమించి ఒక అధికారిని బలవంతంగా ఒక బండి చక్రానికి గట్టి కొండ పక్కనున్న వాగు నీటిలో ముంచుతారు. ఆ రోజు నుంచి కార్మికులు పనిని స్తంభింపచేయడం వల్ల ఫ్యాక్టరీ ఖాళీగా ఉండి, కళావిహీనమై పోతుంది. రాబడి ఆగిపోయినందువల్ల యాజమాన్యం ఆగ్రహం రోజు రోజుకీ   పెరిగిపోతూ ఉంటుంది. శ్రామికులు ఐక్యంగా ఉండి, సమిష్టి ఆలోచనలతో తమ డిమాండ్లు రూపొందిస్తారు. అవి

1) కార్మికులందరికీ 8 గంటల పని దినం కావాలి

2) యాజమన్యం శ్రామికులను మర్యాదగా,సాటి మనుషులుగా చూడాలి.

3) 30% వేతనం పెంచాలి.

4) బాల కార్మికులకు 6 గంటలకు మించి పని ఉండరాదు.

ఈ నాలుగు ముఖ్యమైన డిమాండ్లతో తయారైన ఒక రాత ప్రతిని  కార్మికులు యాజమాన్యం ముందుంచుతారు. ఈ దరఖాస్తును యాజమాన్యం – పెట్టుబడి పెట్టిన వాటాదారులు కలిసి కూర్చుని సిగార్ల ధూమపానం పీలుస్తూ, రకరకాల  పానీయాలు సేవిస్తూ మహా విలాసంగా తమ సమావేశంలో చర్చిస్తారు.

ఇంతకీ చర్చల అనంతరం ఏం సెలవిచ్చారనుకున్నారు?

8 గంటల పని దినం చట్ట విరుద్ధమైనదన్నారు!

బాల కార్మికులకు 6 గంటల పని దినం అడగడం అన్యాయమన్నారు!

30% వేతన పెంపకం, తోటి మనిషిని మనిషిగా మర్యాదగా చూడడ మనే మిగిలిన డిమాండ్ కూడా న్యాయ సమ్మతమైనది కాదని నిర్ద్వద్వంగా తిరస్కరిస్తారు!!

ఇదంతా  వాటాదారుల ఆదేశాలతోనే, వాళ్ళ ఆజ్ఞానుసారం ప్రకారమే జరుగుతుంది.

ఆగ్రహించిన కార్మికులు సమ్మెకు దిగుతారు. రోజుల తరబడి సమ్మె కొనసాగుతుంది.రెక్కాడితేగాని డొక్కాడని శ్రామికుల కుటుంబాలు  పసిబిడ్డలతో సహా ఆకలి బాధలకు అల్లాడిపోతుంటారు. యాజమాన్యం కార్మికుల పట్ల ఏమాత్రం సానుభూతి లేకుండా తాను పట్టిన పట్టు వీడదు. శ్రామికుల నిరసన తీవ్రరూపం దాలుస్తుంది. పోలీసులు పురికొల్పడంతో శ్రామిక వర్గంలోనే ఉన్న దుష్ట కార్మికులు పోలీసులతో కుమ్మక్కై సోదర కార్మికులకు అన్యాయం చేసి వెన్నుపోటు పొడిచే భ్రష్టాత్వనికి పాల్పడతారు. యాజమాన్యపు గూఢచారులు జరుగుతున్న పరిణామాలన్నిటినీ జాగ్రత్తగా గమనిస్తూ అప్రమత్తంగా కాపలా కాస్తుంటారు. వీళ్ళందరూ కలిసి – ఆకలి మంటలను సహిస్తూ ,సర్వ శక్తులూ కేంద్రీకరించి సమ్మె చేస్తున్న కార్మికులపై అగ్నిమాపక విభాగంతో, పోలీసులతో దాడి చేయిస్తారు. ఇంతలో సైనిక సిబ్బంది నలువైపులా చుట్టు ముట్టడంతో కార్మిక శక్తి చెల్లాచెదురవుతుంది.

“మాలో పిరికి వాళ్ళు లేరు. దేశద్రోహులు లేరు. మా చివరి రక్తపు బొట్టు వరకూ మేము మా డిమాండ్లను సాధించు కోవడానికి శాయశక్తులా పాటు పడతాం” – అని నినదించిన శ్రమ జీవులందరూ అమరులవుతారు.  ఆ ఆవరణమంతా శ్రమ జీవుల శవాల గుట్టలతో నిండిపోతుంది. సినిమా ఒక విషాద నెత్తుటి టోన్ లో ముగుస్తుంది.

స్థూలంగా ఇదీ కథ. కానీ ఈ సినిమాని ఐసెన్ స్టీన్ దృశ్యకావ్యంగా మలిచిన విధానం చెప్పాలంటే అదొక గొప్ప వచన కావ్యమవుతుందని సినీ విమర్శకులూ, మేధావులూ అన్నారు.

ప్రస్తుతం నాకర్ధ మైనంత మేరకు మే డే సందర్భానికి వర్తించే విషయాలు ప్రస్తావించుకుందాం!

అప్పటికింకా టాకీలు రాలేదు. అదొక నిశ్శబ్ద యుగం. ఈ ‘స్ట్రైక్’ అనే నిశ్శబ్ద సినిమాకి ప్రధానంగా మూడు గొప్ప  లక్షణాలున్నాయి .

మొదటిది ముందు తరాల విప్లవ చరిత్ర,

రెండోది సమూహాల కథ,

మూడోది మాంటేజ్ తాకిడి అంటే రెండు విరుద్ధ సంఘటనల ఘర్షణ సృష్టించి తాను చెప్పదలచుకున్న కొత్త విషయాన్ని చెప్పడం.

ఐసెన్ స్టీన్ ముందు తరాల కార్మికులు రోజంతా పని, అంతులేని పనిగంటలు, వెట్టి చాకిరీతో విసిగిపోయారు. పని వేళలకోసం, పని స్థలంలో కనీస సౌకర్యాలకోసం, చేసిన చాకిరికి సరైన కూలికోసం, మరీ ముఖ్యంగా 8  గంటల పని దినం కోసం ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఎక్కడివారక్కడ ఆందోళనలు, ఉద్యమాలు,సమ్మెలు చేశారు. ఫలితంగా  చిలికి చిలికి ఉధృతమైన వడగళ్ళవానగా రూపుదిద్దుకుని 1886 మే 3 న చికాగోలో  బద్దలైంది. ఆరోజు 25000 మందితో కార్మికులు గొప్ప ఊరేగింపులో పరిసరాలు హోరెత్తేలా కదం తొక్కారు. తర్వాత రోజు హే మార్కెట్లో జరుగుతున్న కార్మిక సభపై పోలీసులు అతి కౄరమైన వికృత వీరంగం చేశారు. “మతియాస్ డేగన్” అనే ఒక పోలీసు అధికారిని గుర్తు తెలియని వ్యక్తి పేల్చినందుకు, దుర్మార్గంగా అనేకమంది కార్మికుల్ని పోలీసులు కాల్చి చంపారు. అమెరికా ప్రభుత్వం ఒక బూటకపు ఎన్ కౌంటర్ జరిపి ఆనాటి కార్మిక నాయకులు పార్సన్స్, స్పైజ్, ఎంగెల్స్ లను ఉరి తీసింది.దీని ఫలితంగా 1890  లో పారిస్ లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్టుల సమావేశం  మే 1 తేదీనిఅంతర్జాతీయ కార్మిక పోరాటదినంగా పాటించాలని తీర్మానించింది.అప్పటినుంచి ప్రపంచవ్యప్తంగా ఉన్న కార్మికులు చికాగో వీరుల బలిదానాన్ని స్మరించుకుంటూ మేడేని తమ విముక్తి పోరాటాలదినంగా జరుపుకుంటున్నారు.

మహత్తరమైన ఈ మే డే పోరాటాలతో పాటు 1917 లో రష్యన్ కార్మిక వర్గం దేశంలోని జాతులన్నిటినీ ఏకం చేసి జరిపిన అక్టోబర్ విప్లవం అంతర్జాతీయంగా వ్యాపించి ఉన్న కార్మిక ప్రపంచానికి ఒక గొప్ప విస్ఫోటనం లాగా, అద్భుతమైన వర్గపోరాటంగా రూపుదిద్దుకుంది.

తనకు  గొప్ప ప్రేరణ నిచ్చిన  19 వ శతాబ్దంలోని తన ముందు తరాల ఉద్యమాల నన్నిటినీ, విప్లవ పోరాట ప్రభావాలనన్నిటినీ  ఈ సినిమాలో అపురూపంగా ఆవిష్కరించారు ఐసెన్ స్టీన్.

ఇక ఈ సినిమా రెండో లక్షణం-సమూహాల కథ. కార్మిక సమూహాల కథ. ఇది ఏ ఒక్కరి కథా కాదు. ప్రాంతం రష్యా కావచ్చు గానీ ప్రపంచమంతా వ్యాపించి ఉన్న కోట్లాది శ్రమజీవుల కథ. వస్తువు విశ్వజనీన మైనది. సినిమా ప్రారంభమే వ్లాదిమిర్ లెనిన్  కొటేషన్ – “The strength of the working class is organization. Without organization of the masses, the proletarian is nothing. Organized it is everything. Being organized means unity of action, unity of practical activity” తో మొదలవుతుంది. తర్వాత బాతులు, బాతు పిల్లలు, పిల్లి పిల్లలు, పందిపిల్లలు, మొదలైన జంతువుల యొక్క ఫుటేజ్  కనిపిస్తుంది. యాజమాన్యం-పెట్టుబడి పెట్టిన వాటాదారుల సమావేశంలో ఒక నిమ్మకాయను రసం తీసే మెషీన్ లో పెట్టి పీల్చి పిప్పి చేస్తుంటాడొక వాటాదారుడు.అంటే శ్రమిస్తున్న మనుషులమీద అపరిమితమైన ఒత్తిడి ఉందని, వాళ్ళను సాటి మనుషులుగా కాక జంతువుల కంటే హీనాతిహీనంగా చూస్తున్నారని దీనర్ధం. కార్మికులు ఐక్యంగా ఉండి వళ్ళంతా కళ్ళు చేసుకుని, ఎంతో శ్రద్ధాసక్తులతో తమ డిమాండ్లను ఒక రాతప్రతి లో రూపొందిస్తారు.యాజమాన్యం-వాటాదారులు అసలు వర్కర్స్ ని ఏమాత్రం ఖాతరు చెయ్యకుండా ఆ దరఖాస్తు ఫారం గురించి అసలు సీరియస్ గా తీసుకోకుండా దానితోనే టేబిల్ మీద చిందిన మత్తుపానీయాలను తుడుస్తారు. కార్మికులు ప్రాణాలుగ్గబట్టి రాసిన దరఖాస్తులోని విషయాలు శ్రమ జీవులకు జీవన్మరణ సమస్యలు. అవే సమస్యలు యాజమాన్యాలకు పనికిమాలినవిగా, అసంబద్ధంగా కనిపిస్తాయి. వేళ్ళతో లెక్కించదగినంత మంది, వేలాది మంది జీవితాలను నిరంకుశంగా శాసిస్తున్న విధానాన్ని (అచ్చం ఇప్పటి కార్పొరేట్ శక్తులు శాసిస్తున్నట్లే) ప్రేక్షకులకందించి ఆలోచించమంటారు ఐసెన్ స్టీన్. ఉద్రిక్తతలు, కష్టాలు, శ్రామికవర్గ త్యాగం మొదలైన ఉద్విగ్న సందర్భాలను తన కథనం ద్వారా ఏకైక దృశ్య భాష మూకీలో ప్రదర్శించడంలో ఒక అద్భుతమైన అవగాహన, మేధావితనం స్పష్టమవుతుంది. వందల మంది తారాగణంతో సినిమా ఆద్యంతం అద్భుతమైన వివరాలు అందిస్తూ, శ్రామికవర్గ విలువల్ని పటిష్టం చేస్తూ  శ్రామికవర్గ ప్రచారాన్ని  చిత్రీకరించడంలో వల్లమాలిన నేర్పరితనం చూపిస్తారు ఐసెన్ స్టీన్.ఇది చాలా ప్రతిభావంతమైన సమూహాల కథా కథనం.

ఇక మూడోది మాంటేజ్ ఆవిష్కరణ. మాంటేజ్ అంటే ఫ్రెంచ్ లో ఆకర్షణ అని అర్ధం .ప్రతి చిత్రం ఓ పుట్టుక.ఓ కొత్త జన్మ ఎత్తడం అన్న ఐసెన్ స్టీన్ రెండు పరస్పర విరుద్ధ శక్తుల సంఘర్షణలో ఓ నూతన శక్తి ఆవిర్భవిస్తుందనే మార్క్స్ గతి తార్కిక భౌతికవాదాన్ని ఆధారంగా చేసుకుని “మాంటేజ్” కి అన్వయించారు. దీనికి ఆయనే ఆద్యుడు. ఇంతకుముందు మాంటేజ్  దర్శకులు వెర్టోవ్, పుడోవ్ కిన్ లాంటి వారున్నప్పటికీ ఐసెన్ స్టీన్ వాళ్ళకి భిన్నమైనవారు. ఐసెన్ స్టీన్ ఈ సినిమా తీస్తున్న సమయానికి రష్యా ప్రజలు 80% నిరక్షరాస్యులు. రోజు రోజుకీ, క్షణ క్షణానికీ ఉధృతమవుతున్న విప్లవోద్యమంతో ప్రేక్షకుణ్ణి మమేకం చెయ్యడాని కీ, రాజకీయ ఆలోచనలు చెప్పడానికీ  మాంటేజ్ ని ఎన్నుకున్నారు ఐసెన్ స్టీన్. దృశ్య భాష ద్వారా రాజకీయ సందేశాలను తెలియజేసేందుకు మాంటేజ్ లోని విస్తారమైన అవకాశాలను వాడుకుని ప్రజలకు అవగాహన కలిగించి, చైతన్య పరచడానికి ప్రయత్నించారు. విభిన్న భాషల, జాతుల ప్రజలను చైతన్య పరచడానికి సినిమాకు మించిన కళారూపం మరొకటి లేదనిఅన్న లెనిన్ సూత్రీకరణను నూటికి నూరుపాళ్ళూ వాడుకున్నారు.

మాంటేజ్ ని అర్ధం చేసుకోవడానికి ప్రేక్షకుల్ని సంసిద్ధం చేసుకుంటారు ఐసెన్ స్టీన్.ఉదాహరణకి సైన్యం చేతిలో కార్మికులు చనిపోతున్న కౄరదృశ్యాన్ని  పశువుల వధ జరుగుతున్నట్లు  గ్రాఫిక్ చిత్రాలతో చూపించి ప్రేక్షకుల దిమ్మ తిరిగేట్లు చేస్తారు. యాకోవ్ మీద దొంగతనం ఆపాదిస్తున్న సీన్ లో యాకోవ్ క్లోజ్ అప్,మేనేజర్ క్లోజ్ అప్ రెండూ కనిపిస్తాయి.రెండు షాట్స్ ఒకదానితో ఒకటి ఘర్షణ పడతాయి. యాకోవ్ ని చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు అతని పట్ల సహానుభూతితో ఐడింటిఫై అవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు ఐసెన్ స్టీన్ . మేనేజర్ క్లోజ్ అప్ షాట్ చూస్తున్నప్పుడు మేనేజర్ నేరుగా తనమీదే దొంగతనం నేరారోపణ చేస్తున్నట్లు ప్రేక్షకుడు ఫీలవుతాడు. ఈ రెండు షాట్లనుంచి ఐసెన్ స్టీన్ సాధించదలచుకున్న మూడో ప్రయోజనం-దొంగైనందుకు మేనేజర్ యాకోవ్ ని తిట్టడమే కాదు,తాను దొంగగా భావిస్తున్న యాకోవ్ పక్షం వహిస్తున్న ప్రేక్షకుణ్ణి కూడా తిడుతున్నట్లు ప్రేక్షకుడు ఫీలయ్యేలా చెయ్యడం. ఇది ఒక అత్యద్భుతమైన ప్రయోగం.తెలుగులో మన మహాకవి శ్రీ శ్రీ కూడా తన రచనల్లోని చరమరాత్రి కథల్లోనూ,”గుమస్తా కల”మొదలైన రేడియో నాటికల్లోనూ మాంటేజ్ ని ప్రయోగాత్మకంగా శక్తివంతంగా వాడి విజయం సాధించారు.

విప్లవ కాలంలో ఇంజనీరింగ్ చదువు మాని రెడ్ ఆర్మిలో పని చేసిన చైతన్యశీలి ఐసెన్ స్టీన్. 27 ఏళ్ల వయసులో (స్ట్రైక్ సినిమాకి ముందు) 1925 లోనే దృశ్యీకరించిన బాటిల్ షిప్ పొటోంకిన్ ఒక సృజనాత్మక విస్ఫోటనం. ప్రపంచ సినిమా ప్రేక్షకుణ్ణి దిగ్భ్రాంతికి గురి చేసింది. సోవియట్ యూనియన్ లో సోషలిస్టు రాజ్య స్థాపన గురించి తీసిన ఈ సినిమా సృష్టించిన విప్లవ ప్రకంపనాలకు కంపించిన బెర్లిన్, బ్రిటన్ దేశాలు చిత్రాన్ని నిషేధించాయి.అమెరికా కూడా భయంతో చిత్రంలోని కొన్ని భాగాలు కత్తిరించింది. స్ట్రైక్ సినిమా తర్వాత వచ్చిన అక్టోబర్ చిత్రంలో కూడా జార్ చక్రవర్తి “వింటర్ ప్యాలెస్” పై విప్లవ వీరుల దాడిని అమోఘంగా దృశ్యీకరించారు. ప్రపంచాన్ని గజ గజలాడించిన పది రోజులు అనే జాన్ రీడ్ రచన ఆధారంగా ఈ సినిమాని చిత్రీకరించారు. ఇదంతా గమనించినప్పుడు ఐసెన్ స్టీన్ వ్యక్తిత్వం లోనే కార్మిక రాజ్యం రావాలనే ఆకాంక్ష ఉందనీ, శ్రమజీవుల పట్ల అపూర్వమైన ప్రేమాభిమానాలున్నాయనీ అర్ధమవుతుంది.తన ముందు తరాల విప్లవ పోరాట ప్రభావాలన్నీ ఈ సినిమాలో అపురూపంగా ఆవిష్కరించారు. ఆయన ఎవరి మెప్పు కోసం ఈ సినిమా తియ్యలేదు.సమాజంలోని అట్టడుగు మనుషులు, జంతువులకంటే హీనంగా చూడబడుతున్న మనుషుల పక్షం వహించి, వారి పట్ల ఆయనకున్న నిజాయితీ, నిబద్ధతలను చాటి చెప్పారు!

చూడగానే మనసు చలించే   గొప్ప దృశ్యాలు చాలా ఉన్నాయీ సినిమాలో!

ఒక నెత్తుటి ముఖం, ఒక మండే ఆయుధం ఉపయోగించి, సాధించదలచుకున్న మూడో ప్రయోజనాన్ని స్ఫురింపజేస్తారు!!

సైన్యం సమ్మెను విధ్వంసకరంగా అణిచివేస్తుంది. అసలు సైన్యం ప్రజలకు సేవ చెయ్యాలి.కానీ ధనస్వామ్యానికీ బూర్జువా, కులీన వర్గాలకు సేవ చేస్తుందని చెప్పకనే చెప్తారు ఐసెన్ స్టీన్.

యాజమాన్యం-వాటాదారుల విలాసవంతమైన జీవితాలనూ వాళ్ళకి కార్మికుల పట్ల ఉన్న ఏహ్య భావాన్నీ తెలిపే దృశ్యాన్ని ప్రతిమనిషీ చూచి తీరాలి! యాజమాన్యం-వాటాదారుల సమావేశంలో ఒక నిమ్మకాయను జూస్ తీసే మెషీన్ లో పెట్టి పీల్చి పిప్పి చేస్తుంటాడొక వాటాదారుడు.అంటే శ్రమిస్తున్న మనుషులమీద అపరిమితమైన ఒత్తిడి ఉందని, వాళ్ళను సాటి మనుషులుగా కాక జంతువుల కంటే హీనాతిహీనంగా చూస్తున్నారని దీనర్ధం.

కార్మికుడు తన కుటుంబ పోషణ కోసం పని చెయ్యాల్సింది 6 గంటలు మాత్రమే నంటారు మార్క్స్. కార్మికునికి చెందవలసిన భోజన విరామ సమయాన్ని, ఇతర విశ్రాంతిని కొద్ది కొద్దిగా తగ్గించి తన లాభాలు పెంచుకుంటూ వచ్చాయి యాజమాన్యాలు. ప్రతిరోజూ భోజన విరామ సమయాన్ని పది నిమిషాలు తగ్గించడం ద్వారా ఏడాదికి వెయ్యి పౌండ్లు లాభం వచ్చిందని ఆనందంగా వికటాట్టహాసం చేశాడట ఒక యజమాని. ఇదే స్త్రీల విషయంలో నైతే ఇంకా శ్రమ దోపిడీ చేస్తారు.నేను పని చేసిన ఫెమినైజ్డ్ టెలిఫోన్ ఏక్చేంజి లలో నైతే గంట ఉండాల్సిన భోజన విరామ సమయాన్ని తగ్గించి 10 నిమిషాలే ఇచ్చేవారు! కలుపుకొచ్చుకున్న బాక్స్ల లోని  అన్నాన్ని చార్లీ చాప్లిన్ “మోడరన్ టైమ్స్ ” సినిమాలో యంత్రం ఒక్కొక్క కార్మికుడి దగ్గరకొచ్చి తినిపించినట్లే మేము గుక్కతిప్పుకోకుండా గుటకలు వేస్తూ తినడం ముగించేవాళ్ళం. అరగంట టీ సమయం తగ్గించి 5 నిమిషాలే ఇచ్చేవారు! మధ్యలో అర్జెంట్ గా బాత్రూం అవసరాలొస్తే “ఒన్ మినిట్ ప్లీజ్” అని అడుక్కుని వెళ్ళేవాళ్ళం1!

“తొమ్మిది, పదేళ్ళ పిల్లల్ని, అర్ధరాత్రి రెండు, మూడు, నాలుగు గంటలకు నిద్ర లేపి తెల్లవారి పది, పదకొండు, పన్నెండు దాకా పని చేయిస్తారు.ఆ పరిస్థితిలో వాళ్లు జీవచ్చవాల కన్నా ఎక్కువేమీ కాదు” అని నాటింగాం లోని లేసు పరిశ్రమ గురించి ఆ రోజుల్లో రిపోర్ట్ చేసింది డెయిలీ టెలిగ్రాఫ్ పత్రిక (మార్క్స్ పెట్టుబడి-రచనా క్రమం,ఫ్రాన్సిస్ వీన్, అనువాదం-ముక్తవరం పార్ధసారధి అరుణ తార,ఏప్రిల్ 2016)

వాస్తవాలిలా ఉంటే పెద్దలకు 8 గంటలు, పసివారికి 6 గంటలు కావాలని డిమాండ్ చెయ్యడం చట్టబద్దం కాదట! సాటి మనిషిని మనిషిగా చూడడమనే విషయం  సమాజ నాగరికతలో భాగమవ్వాలి. కానీ అది కూడా ఒక   డిమాండ్ గా పెట్టవలసి రావడం ఎంత విషాదం! పైగా అది న్యాయసమ్మతం కాదట! ఎన్నెన్ని గడ్డుకాలాల్ని దాటి మనకిప్పుడున్న సౌకర్యాలనందించారు మన పూర్వులు? మన ముందు తరాలవారి ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న 8 గంటల పనిదినం ఇవాళ కార్పొరేట్ శక్తుల చేతుల్లో హరించుకుపోయి మళ్ళీ మన తరాలు, మన భావి తరాలు గంటలతరబడి పని చేసే స్థితిలోకి నెట్టబడ్డారు.ఇంకా విచిత్రమేమిటంటే ఇంటి నుంచి పని చెయ్యడం ఒక సౌకర్యంగా చిత్రిస్తున్నారు.దానివల్ల యాజమాన్యం కార్మికులకు సమకూర్చవలసిన సౌకర్యాల నుంచి, కార్మికులు హక్కులుగా పొందవలసినవాటి నుంచి  యాజమాన్యం ఏ మాత్రం బాద్యత వహించకుండా  హాయిగా తప్పించుకుంటుందని కార్మికులు కూడా గమనించడం లేదు. మార్క్స్ చాలా లోతుగా విశ్లేషించి చెప్పిన శ్రమదోపిడీకి ఇదొక పరాకాష్ట!

పరిశ్రమల యాజమాన్యాలు వారి స్వంత సాయుధ బలగాల నేర్పరచుకొని, గూఢచార వ్యవస్థ ద్వారా చైతన్యవంతులైన కార్మికుల గురించీ, వారి నాయకుల గురించీ రహస్య సమాచార సేకరణ చేసేవారు. అలా కనిపెట్టిన సమాచారాన్ని బట్టి యాజమాన్యాలు వారి స్వంత సాయుధ బలగాల ద్వారా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేసేవారు. నాయకులను జైళ్ళ పాలు చేసేవారు.

ఎంతో శ్రమకోర్చి ఎన్నో అద్భుతమైన సీన్లను ఈ చిత్రంలో కార్మికుల పక్షం వహించి ఎంతో హృద్యంగా దృశ్యీకరించారు ఐసెన్ స్టీన్.

కార్మికులందరికీ, శ్రామిక సమూహాలన్నీటికీ, ఆ మాటకొస్తే సామాన్య ప్రజలందరికీ విశ్వ వ్యాప్తంగా వర్తించే సామాజిక ఇతివృత్తంతో, మాంటేజ్ టెక్నిక్ ని సమర్థవంతంగా ఉపయోగించి, ఈనాటికీ వర్తించేలా స్ట్రైక్ సినిమాని రూపొందించి చలన చిత్ర చరిత్రలో  తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు ఐసెన్ స్టీన్.

ఇప్పటి యూనియన్ నాయకులూ, వారి కపట నాయకత్వాలను తలచుకుంటే  నిరాశా, నిస్పృహలు ముంచుకొస్తున్నాయి. కార్మికుల పక్షం వహించిన ఇంత అద్భుతమైన వ్యక్తి ఈ భూమి మీద ఒకప్పుడు సంచరించారంటేనే మనసు సంతోషంతో నిండిపోతుంది.

ఇంకో వెయ్యి సంవత్సరాలకైనా మనదేశంలో ఇటువంటి సినిమాని ఆశించలేము!ప్రేక్షకుల హృదయాలలో లేని జుగుప్సాకరమైన అభిరుచులను వెలికితీసి రెచ్చగొట్టే మన దర్శక నిర్మాతలు కళ ప్రజలకోసం అని గుర్తించి ఎప్పటికైనా ఇంతటి ఉత్తమ విలువలను పోషించే చిత్ర నిర్మాణం చెయ్యగలరా?

శ్రమజీవుల గురించి తపించే వారందరూ ఈ సినిమాని తప్పనిసరిగా చూడాలి! కూలిపోతున్న జీవితాలను నిలబెట్టడానికే కాదు, మనల్ని మనం నిలబేట్టుకోవడానికి కూడా ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి తీరాలి!!

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

   పెట్టుబడి ఊసెత్తని ఉద్యమ సినిమా!

 

 

-శివలక్ష్మి 

~

 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  గోతె జెంత్రం (Goethe Zentrum-German film Club) లో నాలుగు సినిమాలు ప్రదర్శించారు. అందులో మార్చ్ 9 న ప్రదర్శించిన రెండు సినిమాలు మాత్రమే నేను చూశాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాల్లోని మహిళల, బాలికల దారుణమైన పరిస్థితుల్ని ఈ రెండు సినిమాలు కళ్ళముందుంచాయి. అందులో మొదటి సినిమా: From Fear to Freedom ending violence against women 35 నిమిషాల నిడివి కల ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ఇది. దీనిని ఉమెన్స్ లెర్నింగ్ పార్ట్ నర్ షిప్ (Women’s Learning Partnership) వారు నిర్మించారు.

 

ప్రపంచవ్యాప్తంగా, ప్రతి ముగ్గురు మహిళల్లో కనీసం ఒకరు అతికౄరమైన హింస బారిన పడుతున్నారు. ప్రతి దేశంలో, ప్రతి సంస్కృతిలో, ప్రతి మతంలో, వర్గాల కతీతంగా ఉన్నత, మధ్య, అట్టడుగు తరగతుల్లోని మహిళలందరూ మానవ హక్కుల ఉల్లంఘనకు గురవుతున్నారు. మహిళలపై జరుగుతున్నఅన్ని రకాల హింసలు అంతం కావాలంటూ, భయాలనుండి స్వేచ్చ కోసం చేసే ప్రయాణమే సినిమా ఇతివృత్తం

 ఐక్య రాజ్య సమితి గణాంకాల ప్రకారం 87% ఆఫ్ఘన్ మహిళలు  గృహ హింస బాధితులు.   కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ లో రోజువారీ 1100 కంటే ఎక్కువమంది  మహిళలు,  బాలికలు అత్యాచారానికి  గురవుతున్నారు. ప్రపంచం లోని 137 దేశాల్లో మానవ రవాణా  అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీని బారిన పడే 80% మంది స్త్రీలే!

ఈ చిత్రంలో పురుషుల్ని ఒక్కొక్కరినీ “నువ్వెంతమందిని అత్యాచారం చేశావు? అనడగడం కనిపిస్తుంది.ఆ పురుషులు ధీమాగా సిగ్గూ శరం లేకుండా 5, 10, 20 మంది అని చెప్తారు.గ్రామాలు తిరుగుతున్న కొద్దీ ఇంకా ఎక్కువమందిని అత్యాచారం చేస్తామని కూడా నిర్భయంగా చెప్తారు. పరువు కోసం చెల్లెల్ని చంపేశానని చెప్తాడొకడు. ప్రతి ఏటా దాదాపు 5000 మందిని పరువు, మర్యాదల పేరిట సొంత కుటుంబ సభ్యులే హత్యలు చేస్తున్నారు.

ఏడేళ్ళ పాపకి పెళ్ళి చేస్తే, ఆమె 15 ఏళ్ళకి ఇద్దరు బిడ్డల తల్లవుతుంది.బాల్య వివాహాలు, గర్భ ధారణలతో చిన్న పిల్లలైన తల్లులు, పసిబిడ్డలు కూడా  ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యలు దాదాపు చాలా దేశాల్లో చిత్రీకరించడం కనిపిస్తుంది.

“ప్రపంచవ్యాప్తంగా మహిళలు బృందాలుగా ఏర్పడి హింస లేని సమాజం కోసం,స్త్రీల హక్కుల్ని సమర్ధించే మెరుగైన కొత్త చట్టాల కోసం పోరాడుతున్నారు. బలమైన వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ మహిళల హక్కులు కూడా మానవ హక్కులే అనే ప్రజాస్వామ్య భావనలు నెలకొల్పడానికీ, హింసా సంస్కృతిని అంతం చేయడానికి కొత్తమార్గాలు అన్వేషిస్తున్నారు”- అని అంటారు యునైటెడ్ నేషన్స్ మాజీ సెక్రటరీ జనరల్ గా పని చేసి ప్రస్తుతం ‘ఉమెన్స్ లెర్నింగ్ పార్ట్ నర్ షిప్’ బోర్డ్ చైర్మన్ గా ఉన్న తొరయా ఒబైడ్ (Thoraya Obaid)

ఇరాన్, అమెరికాలలో ‘ఉమెన్స్  లెర్నింగ్ పార్ట్నర్ షిప్’ వ్యవస్థాపక సభ్యురాలైన మెహ్ నాజ్ అఫ్ కామీ (Mahnaz Afkhami) “మా సంస్థ లింగ వివక్ష మూల కారణాలను అన్వేషిస్తుంద”ని అంటారు. దేశ దేశాల్లో పని చేసే వీరందరూ ఉమెన్స్  లెర్నింగ్ పార్ట్నర్ షిప్ భాగస్వాములే!

సింధి మేదర్ గౌల్డ్ (Sindi Medar Gould) నాయకత్వంలో నైజీరియాలో పనిచేస్తున్న ఒక సంస్థ మహిళలపై హింసను నమోదు చేస్తుంది.

నైజీరియా నుంచి బాయోబాబ్ అనే సంస్థలో పని చేసే షిబోగూ ఓబెన్వా (Shibogu Obinwa) మహిళలకు జరిగే శరీర హింస నుండి తమను తాము రక్షించుకునే హక్కుల గురించి “నా శరీరం, నా ఇష్టం” అని చెప్పే అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్తారు.

హఫ్సాత్ ఆబియోలా (Hafsat Abiola) నైజీరియాలో ప్రజాస్వామ్య స్థాపనే తమ ధ్యేయమంటుంది.

టర్కీలో పని చేసే యాకిన్ ఎర్టర్క్ (Yakin Erturk)  మహిళల మీద అమలవుతున్న హింస గురించి ప్రస్తావిస్తారు.

అమెరికా నుంచి ఫ్రాన్సెస్ కిస్లింగ్ (Frances Kisling) మహిళలు లైంగిక పరమైన దుర్గార్గపు ఆలోచనలను ప్రేరేపించేవారుగా, పురుషులు దానికి బలవుతున్న వారుగా సమాజపు నరనరాన ఎందుకు ఇంకిపోయిందో అనేదాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తుంది.

అమెరికా రట్జర్స్ విశ్వవిద్యాలయం నుంచి కరీమా బెన్నౌన్ (Karima Bennoune) అమెరికాలో చట్టాల అమలు గురించి మాట్లాడతారు.

జాక్వెలిన్ పీటాంగ్వై (Jacqueline Pitanguy ) బ్రెజిల్ నుంచి తమ సంస్థ సమాజంలోని స్త్రీ-పురుష అసమానతల గురించి పనిచేస్తుందని చెప్తారు.

బహ్రెయిన్ నుంచి వాజీహా అల్ బహార్న (Wajihaa Albarna) తమ సంస్థ పురుషాధిపత్యాన్ని ప్రశ్నిస్తుందని చెప్తారు.

మలేషియా నుంచి బెట్టీ యో (Betty Yeoh) పని ప్రదేశంలో వేధింపుల మీద తమ సంస్థ గురి పెడుతుందంటారు.శక్తివంతమైన అంతర్జాతీయ చట్టాల నుపయోగించి సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తుందని చెప్తారు.

మలేషియా లోని మ్యూస్ వా నుంచి జైనా అన్వర్ (Zainah Anwar) ముస్లిం పురుషులు స్త్రీలను కొట్టి, రకరకాల హింసలకు గురి చేస్తున్నారనే విషయాన్ని ప్రచారం చేసి ప్రజల మద్దత్తుని కూడగట్టడానికి తమ సంస్థ కృషి చేస్తుందని చెప్తారు.

జోర్డాన్ నుంచి అస్మా ఖాదర్ (Asma Khader) కొత్త సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో స్త్రీల సమస్యల మీద ప్రజల్లో అవగాహన పెంచడానికి తమ సంస్థ కృషి చేస్తుందంటారు. పరువు కోసం తన చెల్లెల్ని హత్య చేసిన కేసులో మహిళల నిరసన ఫలితంగా, ఆమె సోదరుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. ఇలాంటి ముఖ్యమైన సందేశం ప్రజల్లో మార్పు తెస్తుందంటారు అస్మా.

లెబనాన్ నుంచి పని చేసే లిన హబీబ్ (Lina Habib) తమ సంస్థ పురుషాధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తుందని చెప్తారు.

ఐర్లండ్ నుంచి మేరీ రాబిన్సన్ (MARY ROBINSON) వారి సంస్థ మహిళల హక్కులు కూడా మానవ హక్కులే అని నినదిస్తూ ప్రజల్లో అవగాహన పెంచడానికి దోహదం చేస్తుందంటారు.

పాకిస్తాన్ నుంచి రబియా హది (Rabia HAdi) స్త్రీల పట్ల హింస అంతం కావాలంటే విద్య ద్వారా సాధికారత సాధించాలంటారు.

1993 డిసెంబర్ 20న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా మహిళలపై హింస నిర్మూలన గురించి ఒక ప్రకటన వెలువడింది. అందులో కార్యాచరణ ప్రణాళికను నిర్దేశిస్తూ “స్త్రీల సమానత్వం, భద్రత, స్వేచ్ఛ, గౌరవం మొ.న హక్కుల పట్ల హామీ పడుతూ స్త్రీల పట్ల వివక్ష తగదని హెచ్చరించింది. మహిళల హక్కులు కూడా మానవ సార్వత్రిక హక్కులలో భాగమేనని ప్రకటించింది.

ఈ హక్కులు అమలు కావడానికి పితృస్వామ్యం పెద్ద అడ్డంకిగా నిలుస్తుందని చెప్తారు ఈ ఉమెన్స్ లెర్నింగ్ పార్ట్ నర్ షిప్ నాయకులు.

ఒక సంస్థ నుంచి మిగిలిన అన్ని సంస్థలూ సమాచారాన్ని,కష్ట-నష్టాలను పంచుకోవడం, ఒకరినుండి మరొకరు నేర్చుకోవడం ద్వారా వారి మధ్య కొన్ని భావ సారూప్యతలూ – కొన్ని తేడాలు ఉన్నప్పటికీ వారి వారి లక్ష్యాల దిశగా పని చేస్తూ భవిష్యత్తులో ప్రజాస్వామ్య సమాజాన్ని సాధిస్తామని చెప్పుకొచ్చారు.

అన్ని సంస్కృతుల, అన్ని తరగతుల, అన్ని తరాల లింగ పరిధుల్లో సంభాషణ నడుపుతూ మేము సంఘటితమై మా భాగస్వామ్య సామర్థ్యాన్ని పటిష్టపరచుకుంటూ మరింత విస్తరణకు ప్రయత్నిస్తున్నా మంటారు దీని నాయకులు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చివరికి 1800 సంవత్సరం నుంచి మొదలై 1910 వరకూ కొనసాగి తమ రాజీ లేని పోరాటాలతో, చివరికి 140 మంది చికాగో దుస్తుల తయారీ ఫ్యాక్టరీలోని మహిళా కార్మికుల ప్రాణత్యాగాలతో అంతర్జాతీయ మహిళా ఉద్యమాలు సాధించిన ముఖ్యమైన మైలురాళ్ళ ఫలితంగా “అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం” ఏర్పడింది. ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధిని సమీక్షించుకుని,సాధించుకోవలసిన సమస్యల కోసం భావి పోరాటాలకు సిద్ధం కావడం “అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం” లక్ష్యం. పండగల్లాగా పట్టు చీరల బహుమతులతో,ముగ్గుల పోటీలతో జరుపుకుంటారు “ అంతర్జాతీయ మహిళా దినోత్సవం” – ఈ రెండిటికీ స్పష్టమైన తేడా ఉంది. అందరూ ఈ భేదాన్ని తెలుసుకోవాలి!

మహిళల మీద అమలవుతున్న హింసను ఎంతో హృద్యంగా  దృశ్యీకరించిన ఈ నాయకత్వం అసలు దీనికంతకూ మూలకారణమైన పెట్టుబడిని రవ్వంతైనా ఎక్కడైనా చెప్తారేమోనని వళ్ళంతా కళ్ళు చేసుకుని కళ్ళార్పకుండా శ్రద్ధగా సినిమా చూశాను.పొరపాటున కూడా పెట్టుబడి ప్రస్తావన రానివ్వలేదు. అసలు జబ్బేమిటో తెలుసుకోకుండా బస్తాలు బస్తాలు మందులు మింగించినట్లుంది. ప్రభుత్వాలను ప్రశ్నించకుండా సన్నాయి నొక్కుల ఉద్యమాల వల్ల ఉపయోగం ఉండదు.

ఎన్ని చట్టాలు వచ్చినా అవి అమలు కావు.మహిళల మీద హింస ఆగదు.దీనికి కారణం ప్రభుత్వాలను తమ పెట్టుబడితో వెనకుండి నడిపే కార్పొరేట్ శక్తులు.

” పెట్టుబడి అనే బండ రాయి కింద నలిగిపోతున్న చీమలు మన శ్రామికులు. పెట్టుబడి రాక్షసికి ఆహారం జంతువు ల్లాంటి మన శ్రామికులు “అని 16 వ శతాబ్దం లోనే తన “అన్నా కరేనినా నవల్లో నికొలాయ్ అనే పాత్రతో చెప్పిస్తారు టాల్ స్టాయ్. శ్రామికులవే బానిస బతుకులైతే, ఇక బానిసకు బానిసలైన స్త్రీల పరిస్తితి ఎంత హీనంగా ఉంటుందో చెప్పనే అక్కరలేదు !

“బీద వారినే కాదు,ఈ భాగ్యవంతుల్నీ వాళ్ళ గొప్ప తనాల భారాల నించీ, ఊపిరాడని గర్వాల నించీ,మర్యాదల నించీ,ఈర్ష్యల నించీ, చికాకుల నించీ తప్పించి, శాంతినీ, సంతోషాన్నీ, తృప్తినీ ఇచ్చి కాపాడే కమ్యూనిజం రావాల”ని కాంక్షించాడు చలం. అంతో ఇంతో సామాజికంగా,ఆర్ధికంగా మెరుగైన స్థితిలో ఉన్న స్త్రీలకైనా స్వేచ్చ రావాలంటే ఈ అణచివేతలకు మూలకారణాలను అన్వేషించాలి!

*

ఈ ఇరానీ సినిమా ఒక కొత్త రుతువు!

 

-భవాని ఫణి

~

 

సినిమాల్లో అయినా , నిజ జీవితంలో అయినా నాటకీయత అనే అంశానికి ఆకర్షణ ఎక్కువ . ఒక చిన్న కుతూహలం ఒక్కోసారి ఎక్కడివరకైనా మనల్ని నడిపించి తీసుకెళ్తుంది. లోపలున్న బహుమతి ఏమిటో తెలీనప్పుడు గిఫ్ట్ ప్యాక్ ని ముక్కలు ముక్కలుగా చించైనా వెంటనే తెలుసుకోవాలనుకునే పసిపిల్లవాడి ఆత్రం, ఎంత ఎదిగినా అతన్ని వదిలిపెట్టదు. మూసిఉన్న పిడికిలి తెరిచి చూసేవరకు మనశ్శాంతిగా ఉండనివ్వదు. అపరాధ పరిశోధనకి చెందిన కథల్లో, చలన చిత్రాల్లో ఇటువంటి పధ్ధతిని ఎక్కువగా అవలంబించినా, వాటిలో నాటకీయత పాళ్లు ఎక్కువ కావడం వలన, మనకి కలిగే కుతుహలంలో కొంత కృత్రిమత్వం ఉంటుంది  అదే ఒకవేళ  సాధ్యతరమని అనిపించే సహజమైన అంశాలతో నాటకీయతని సృష్టించగలిగితే, అది కలిగించే కుతూహలం అంతా ఇంతా కాదు . ఆ పట్టుని అంత బాగా పట్టుకున్న దర్శకుడు అస్ఘర్ ఫర్హాదీ మాత్రమే అని చెబితే అది అబద్ధం కాకపోవచ్చు.  నలభై మూడు సంవత్సరాల ఈ ఇరానియన్ దర్శకుడు,తన నేర్పరితనంతో అద్భుతమైన చలన చిత్రాలకి ప్రాణం పోసాడు .

అన్నీ మనం రోజూ చేసే పనులే, చూసే విషయాలే కదా అనిపిస్తాయి. కానీ కథలో అతను ఎక్కడ ఎలా ఎప్పుడు మెలిక పెడతాడో మాత్రం అర్థం కాదు. కథ అల్లడంలోని ఆ నేర్పరితనం మనల్ని తన్మయత్వానికి గురి చేస్తుంది. ఏ సైన్స్ ఫిక్షన్లు గానీ , సైకలాజికల్ థ్రిల్లర్స్ గానీ , మర్డర్ మిస్టరీలు గానీ కలిగించనంతటి ఆసక్తిని అతని సినిమాలు కలిగిస్తాయి. అంతే సహజమైన ముగింపుతో సంతృప్తి పరుస్తాయి. ఎక్కడా ఏ సందర్భంలోను విసుగు కలగనివ్వనంత బిగువుగా కథ అల్లబడి ఉంటుంది.  ఆ కథనాన్ని ఆస్వాదించడం తెలిస్తే దర్శకుడి ప్రతిభని మెచ్చుకోకుండా ఉండలేం .
అంతేకాక ఫర్హాదీ చిత్రాలలో పాత్రల్ని మంచి చెడుల ఆధారంగా విడగొట్టడం వీలు కాదు. , పెరిగిన సమాజం, పరిస్థితుల ప్రభావం వంటివి మనిషి స్వభావాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయన్న విషయాన్ని అవగతం చేసే విధంగా పాత్రల చిత్రీకరణ ఉంటుంది. ఈ విధమైన పధ్ధతి వల్ల ప్రేక్షకుడు కేవలం ఏదో ఒక పాత్రకే ఆకర్షితుడు కాకుండా, అందరి వైపునుండీ అలోచించి వారి వారి ప్రవర్తనలని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు.
అతని చలన చిత్రాల్లో అతి ముఖ్యంగా చెప్పుకోవలసినవి మూడు చిత్రాలు. మొదటి స్థానంలో ఇరాన్ చిత్ర పరిశ్రమకి మొట్టమొదటి ఆస్కార్ ని సంపాదించి పెట్టిన  ” ఎ సెపరేషన్(A Separation) ఉంటుంది. చిక్కగా గుచ్చబడిన దండలో దారం ఎక్కడుందో తెలీనట్టుగానే అసలు విషయాన్ని అతను ఎక్కడ దాచిపెట్టాడో చాలా సేపటి వరకు తెలీదు. దాంతోపాటుగా ప్రేమ, జాలి, అహంకారం, అపరాధ భావం వంటి మనిషిలోని సహజలక్షణాలు అంతర్లీనంగా అవసరమైనంత మేరకు తమ తమ పాత్రల్ని పోషిస్తూ ఒక నిండైన వాతావరణాన్ని సృష్టిస్తాయి.  ఈ సినిమా చూసిన తర్వాత కథ ఎవరికీ చెప్పాలనిపించదు. ఎవరికి వారే చూసి ఆ ఆనందాన్ని అనుభవిస్తే బాగుండునని అనిపిస్తుంది . అయినా చెప్పక తప్పదనుకుంటే ఇలా చెప్పడం మంచిది .
నాడెర్ , సిమిన్ భార్యా భర్తలు . వాళ్లిద్దరూ విడిపోవడం కోసం కోర్ట్ లో వాదించుకోవడంతో కథ ప్రారంభమవుతుంది . భార్య ఇరాన్ లోని కఠిన పరిస్థితుల మధ్య తమ పాప పెరగడం ఇష్టం లేక విదేశాలకి వెళ్లడం కోసం పట్టుపడితే, నాడెర్ మాత్రం, అల్జీమర్ వ్యాధితో బాధపడుతున్న తన తండ్రిని వదిలి రావడానికి ఇష్టపడకపోవడంతో పంతం మొదలై ఇద్దరూ విడిపోవడానికి నిర్ణయించుకుంటారు. కోర్ట్ విడాకులు మంజూరు చెయ్యకపోవడంతో సిమిన్ పంతం కొద్దీ విడిగా వెళ్లిపోతుంది.  వారి కుమార్తె పదకొండేళ్ల తెర్మెహ్ మాత్రం తండ్రి దగ్గరే ఉండిపోతుంది. ముసలివాడైపోయి, ఆల్జీమర్ కారణంగా ఏదీ గుర్తుడని స్థితిలో ఉన్న తన తండ్రి కోసం నాడెర్ ఒక స్త్రీని నియమిస్తాడు. ఆమె పేరు రజియా. ఐదారేళ్ల వయసున్న పాపని వెంట బెట్టుకుని రెండు ట్రైన్లు మారి నాడెర్ ఇంటికి వస్తూ ఉంటుంది రజియా. పైగా ఆమె గర్భవతి కూడా. ఇంట్లో పనీ, ముసలాయన్ని సంబాళించడం ఆమెకి చాలా కష్టమైపోతుంది.
నాడెర్ ఆఫీసు నించి వచ్చేవరకు ముసలాయన్ని కనిపెట్టుకుని ఉండటం రజియా చెయ్యవలసిన ముఖ్యమైన పని . కానీ ఒకసారి తొందరగా ఇంటికి వచ్చిన నాడెర్ కి ఇల్లు తాళం వేసి కనబడుతుంది . డూప్లికేట్ కీ తో లోపలి వెళ్లి చూస్తే కింద పడిపోయి ఉన్న తండ్రి కనిపిస్తాడు. పైగా అతను మంచానికి కట్టేసి ఉంటాడు. తండ్రి బ్రతికి ఉన్నాడో లేదో అర్థం కానంత ఉద్వేగంలో నాడెర్ విపరీతమైన ఒత్తిడికి గురవుతాడు. ఆ కోపంలో, అప్పుడే బయటి నించి వచ్చిన రజియాని ఇంట్లోంచి బయటకి గెంటేస్తాడు. తర్వాత ఆమెకి అబార్షన్ అయిందని తెలుస్తుంది . అందుకు నాడెర్ కారణమని రజియా భర్త కోర్ట్ లో కేస్ వేస్తాడు . ఇంతకీ అసలు జరిగింది ఏమిటి? భార్యా భర్తలు మళ్ళీ కలుసుకున్నారా అన్న అంశాలతో ఎంతో ఆసక్తికరంగా మలవబడిన కథ ఇది. నటీనటుల నటన కథకి జీవాన్ని సమకూర్చింది.  సమాజపు స్థితిగతులనే ఈ చలన చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలబెట్టగలగడం కూడా పెద్ద విశేషం.
ఇక రెండోది ‘ఎబౌట్ ఎలీ (About Elly)’.  చిత్రం పేరు సూచిస్తునట్టుగానే కథ ‘ఎలీ’ అనే అమ్మాయి గురించి. ఆమె ఒక కిండర్ గార్డెన్ స్కూల్ టీచర్. ఆమె స్కూల్ లో చదివే ఒక విద్యార్థిని తల్లి సెపిదే, ఆమెని తమ స్నేహితుల కుటుంబాలతో పాటుగా పిక్నిక్ కి తీసుకుని వెళ్తుంది. జర్మనీ నించి వచ్చిన ఒక స్నేహితుడికి ఎలీని చూపించి , అతనికి నచ్చితే వాళ్లిద్దరికీ పెళ్లి చెయ్యాలన్నది సెపిదే ఆలోచన . కానీ అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదం, ఎలీ గురించి వారిలో ఎన్నో సందేహలని రేకెత్తిస్తుంది. ఒక్కో పాత్రా దాచిపెట్టిన చిన్న చిన్న విషయాల్ని మెల్లగా అన్ ఫోల్డ్ చేస్తూ చూపడం వల్ల ఆద్యంతం ఒక విధమైన ఉత్కంఠభరిత వాతావరణం నెలకొని ఉంటుంది. ఈ సినిమా కూడా కథ తెలుసుకోకుండా చూస్తేనే బాగుంటుంది.  .
ఇక మూడోది ‘ది పాస్ట్ (The Past)’. ఈ కథ ఫ్రాన్స్ లో జరుగుతుంది. భర్త నుండి విడాకులు తీసుకుని, మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకునే ఇద్దరు పిల్లల తల్లి మేరీ కథ ఇది. ఆమె వివాహం చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి భార్య కోమాలో ఉంటుంది . మేరీ కుమార్తెకి వారి వివాహం ఇష్టం ఉండదు. అతి సాధారణమైన కథాంశంలా అనిపించినప్పటికీ ఇందులో కూడా కొన్ని చిన్న చిన్న రహస్యాలు ఉంటాయి . కథని పొరలు పొరలుగా తవ్వుకుంటూ వెళ్తూ, ఎక్కడో ఓ ఊహకందని మలుపు దగ్గర నిలబెట్టగల దర్శకుడి నైపుణ్యత ఈ సినిమాకి కూడా మనల్ని కట్టి పడేస్తుంది.
కానీ A Separation , About Elly లతో పోలిస్తే The Past కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ చలన చిత్రంలో  ఫర్హాదీ, సస్పెన్స్ కంటే మానవ సంబంధాల స్వరూప స్వభావాలకి ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చాడు. సహజమైన ఆవేశకావేశాలు, అపార్థాలు మనిషి విచక్షణా జ్ఞానాన్ని మరుగుపరుస్తాయి. ఆ సమయంలో అవి మనిషిని తప్పుదోవ పట్టిస్తాయి . ఆ ఒక్క క్షణం కొద్దిపాటి సంయమనాన్ని పాటించే ప్రయత్నం చెయ్యగలిగితే ఏమానవ సంబంధమైనా అంత తొందరగా ఒడిదుడుకులకి లోనుకాదు అన్నది ఈ చిత్రం చెప్పదలుచుకున్న ప్రధానమైన అంశాలలో ఒకటి. అయినా ఫర్హాదీ చిత్రాలు మనిషి స్వభావాన్ని నిర్దేశించవు. కేవలం అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే చేస్తాయి. చేయిస్తాయి .
కథ చెప్పే విధానం ఒక్కటే కాదు. చిత్రీకరణలోనూ, సినిమాటోగ్రఫీలోనూ, నటీనటుల ఎంపికలోనూ కనిపించే వైవిధ్యతలు అతని చలన చిత్రాల్ని అరుదైన వజ్రాల మాదిరిగా మెరిపిస్తాయి .ఎక్కడా  నేపధ్య సంగీతమే  వినిపించదు. కేవలం మాటలూ, అవసరమైన శబ్దాలూ మాత్రమే వాడి, అతను సహజత్వాన్ని కనబరచడమే కాదు వినిపించేలా కూడా చేస్తాడు.
చివరగా చెప్పేదేమిటంటే అస్ఘర్ ఫర్హాదీ సినిమాలు చూడని సినీప్రియులు, కొన్ని ఋతువుల్ని అనుభవించనట్టే.  కొన్ని దారుల్ని కనుగొననట్టే. కొంత ఆనందాన్ని పోగొట్టుకున్నట్టే.
*

కొన్ని యువ హృదయాలూ – వాటి కలలూ!

testament-of-youth

-భవాని ఫణి
~

bhavaniphaniఅనగనగా అవి మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు రోజులు .

చదువే ప్రాణమైన ఓ బ్రిటిష్ అమ్మాయి .
రహస్యంగా వర్డ్స్ వర్త్ నీ,షెల్లీనీ,బైరన్ నీ చదువుకుంటూ, ఆ ప్రేరణతో తను రాసుకున్న కొద్దిపాటి రాతల్ని ఎవరికైనా చూపించడానికి కూడా మొహమాటపడి దాచుకునే ముత్యంలాంటి అమ్మాయి.
ఆత్మ విశ్వాసమే అలంకారంగా కలిగిన దృఢ మనస్విని.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్ చదవడం  ఆమె ఆశయం . స్వప్నం.
ఎంతో కృషితో, పట్టుదలతో అక్కడ అడ్మిషన్ సంపాదించుకున్న ఆనందం,సంబరాలని అంబరానికి తాకిస్తున్న ఓ మంచి తరుణంలో అనుకోకుండా యుద్ధమొచ్చింది. అంతా తలక్రిందులైంది.
అన్న,స్నేహితుడు, ప్రేమికుడు అందరూ సైనికులుగా మారి , యుద్ధంలో ఉత్సాహంగా పాలు పంచుకుంటుంటే తనకి చేతనైనది తను కూడా చెయ్యాలన్న ఆశతో, కోరికతో, కలల సౌధమైన ఆక్స్ఫర్డ్ నీ, ఎంతో ఇష్టమైన చదువునీ కూడా వదిలిపెట్టి వార్ నర్స్ గా మారుతుంది ఆ ధైర్యశాలి.
పట్టుబడ్డ జర్మన్ సైనికులని ఉంచిన టెంట్ లో విధులు నిర్వహించే బాధ్యత ఆమెకి అప్పగించబడుతుంది.
అలా అక్కడ తీవ్రంగా కలిచివేసే పరిస్థితుల మధ్య,  గాయపడిన శత్రు సైనికులకి సేవలందిస్తుండగా అంతులేని శోకం వెతుక్కుంటూ వచ్చి ఆమె జీవితాన్ని మరింత అల్లకల్లోలం చేస్తుంది .
ముందుగా ప్రాణం కంటే ఎక్కువైన ప్రేమికుడు , తర్వాత ప్రాణప్రదమైన నేస్తం , ఆ తర్వాత ఆరో ప్రాణం వంటి సోదరుడు ఇలా ఎంతో ప్రియమైన వారంతా ఒకరి తర్వాత ఒకరు రక్కసి యుద్ధపు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతూ ప్రాణాలు విడుస్తుంటే ఆ లేత మొగ్గ ఏమైపోవాలి? ఆ మారణ హోమానికి ఎలా నిర్వచనం చెప్పుకోవాలి?
 ఈ యుద్ధాలూ , ఈ పోరాటాలూ  ఇవన్నీ ఎందుకని ,ఎవరికోసమని లోలోపల బాకుల్లా పొడిచే సందేహాల గాయాలకి ఎటువంటి సమాధానాల్ని లేపనంగా పూయాలి?
ప్రాణాలు శరీరాలని విడిచి గాల్లో కలిసిపోతున్నప్పుడు ఏ మనిషి బాధైనా ఒకటి కాదా ? మనమంతా మనుషులమైనప్పుడు , మనుషులంతా ఒకలాగే ఉన్నప్పుడు ఒకర్నొకరు ఎందుకు చంపుకోవాలి? చంపుకుని ఏం సాధించాలి?
ఇటువంటి ప్రశ్నలు మాత్రమే చివరికి ఆ అమ్మాయి దగ్గర మిగిలినవి.
ఆప్తుల మరణం వల్లనా, ఎంతో క్షోభకి గురిచేసే యుద్ధ వాతావరణంలో పని చేసి ఉండటం వల్లనా ఆమె తీవ్రమైన మానసిక వత్తిడికి గురవుతుంది . ఒక స్నేహితురాలు అందించిన సహాయంతో ఆ క్రుంగుబాటు నుండి బయటపడి తన జీవితాన్ని ముందుకు నడుపుకున్నా తన వారిని మాత్రం జీవితాంతం గుర్తు పెట్టుకోవాలని బలమైన నిర్ణయం తీసుకుని , చివరి రోజుల వరకూ ఆ నిర్ణయానికి కట్టుబడే ఉంటుంది.
ఇదంతా వీరా మారీ బ్రిట్టైన్ అనే ఒక స్త్రీ వాది అయిన రచయిత్రి కథ . ఒక్కోసారి నిజ జీవితపు కథలు, కల్పన కంటే ఆసక్తికరంగా ఉండి హృదయానికి పట్టుకుంటాయి . ఎందుకంటే ఆ కథలోని పాత్రలు , మలుపులు ఎవరో ఏర్పరిస్తే ఏర్పడినవి కాదు .. అవి అలా జరిగిపోయినవి అంతే . అందుకే అవి ఎందుకు అలాగే జరిగాయని ఆలోచించి వాదించే  అవకాశం మనకి ఉండదు. వీరా కథలో అటువంటి ఆసక్తికరమైన మలుపులేవీ లేవు గానీ విధి ఆమెతో ఆడుకున్న విషాదకరమైన ఆట ఉంది .జీవిత కాలానికి సరిపడే దుఃఖమూ ఉంది . అవే ఆమెని యుద్ధ వ్యతిరేకిగా మారుస్తాయి. తర్వాతి  కాలంలో పాసిఫిస్ట్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేందుకు ఆమెని ప్రేరేపిస్తాయి.
వీరా బ్రిట్టైన్, తన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలని వివరిస్తూ రాసుకున్న “టెస్టమెంట్ అఫ్ యూత్” అనే పేరుగల ఆత్మకథ ఆధారంగా ఈ చలన చిత్రాన్ని నిర్మించారు. సరళంగా ఉన్న స్క్రీన్ ప్లే, కథ అర్థం చేసుకోవడంలో మనకి ఇబ్బంది కలిగించదు . ఏదో నిజంగా అక్కడే జరుగుతున్నట్టే ఈ దృశ్య ప్రవాహం కళ్ల ముందు నుండి అతి సాధారణంగా సాగిపోతుంది .ఈ ఆత్మకథలో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ లోని సామాజిక పరిస్థితుల్ని కళ్లకి కట్టినట్టు చూపడం జరిగింది . అంతే కాక ఆత్మ విశ్వాసం , ధైర్యం మెండుగా కలిగిన ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తే అయినప్పటికీ స్త్రీ అయిన కారణంగా, వీరా తనకి ఇష్టమైన కెరీర్ ని ఎంచుకోవడం కోసం ఎంత ఘర్షణ పడాల్సి వచ్చిందో కూడా మనకి ఈ కథ వివరిస్తుంది.
ముఖ్య పాత్రధారిణి అయిన “అలీసియా వికండెర్” అత్యున్నతమైన నటనని కనబరిచి తన పాత్రకి సరైన న్యాయాన్ని చేకూర్చింది. ఉత్తమమైన ఆత్మకథల్లో ఒకటిగా పేరు సంపాదించిన ఈ వార్ టైం మెమోయిర్ ని అంతే ఉత్తమంగా తెరకెక్కించడంలో దర్శకుడు జేమ్స్ కెంట్ విజయం సాధించారు. కథలోని ఆత్మని పట్టుకుని దృశ్యంగా మలిచి మన కళ్ల ముందు నిలపగలిగారు.
*

సావిత్రి- ఎప్పటికీ ఒక అద్భుతం!

 

– కొత్తింటి సునంద 

~

FullSizeRender (1)1996 సంవత్సరానికి గాను ఆంగ్ల సాహిత్యానికి అత్యున్నత పురస్కారం నోబెల్‌ బహుమతి పొందిన ఆఫ్రికన్‌ అమెరికన్‌ రచయిత్రి టోని మారిసన్ను ఇంటర్వ్యూ చేసిన పత్రిక విలేఖరి ‘‘మీరు ఆంగ్ల భాషను ఇంత అందంగా  ఎలా రాయగలరు’’ అని అడిగాడట. దానికావిడ ఆంగ్ల భాషలోకేవం 26 అక్షరాలు  మాత్రమే ఉన్నాయి. ప్రపంచమంతటా వ్యాపించిన ఆంగ్లభాషను వాడే వ్యక్తులు  కోట్ల సంఖ్యలో ఉంటారు. వీరందరు వాడి వాడి ఆ అక్షరాలు  అరిగి పోయుంటాయి. మకిలి పట్టుంటాయి. వాటిని మర పాలిష్‌ చేసి మెరుగుపెట్టి వాడాల్సి ఉంటుంది. నేనదే చేస్తానుఅందట. మనకందుబాటులో వున్న దానికి మెరుగు పెట్టడమనే సూత్రం అన్ని రంగాలకు వర్తిస్తుంది. అది కళారంగంలో మరీ ముఖ్యం. ఉదాహరణకు సప్తస్వరాను లయబద్ధంగా  పలికించడమే సంగీతానికి ఆయువుపట్టు. మనకు వేలాది మంది గాయకులు , గాయనీమణులున్నారు.అందరూ  ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి  స్థాయిని చేరుకోలేకపోయారు. సినీ నటనారంగంలో అత్యున్నత స్థాయిని చేరుకొన్న నటి సావిత్రి ఆ కోవకు చెందిందే. కొన్ని తరాలపాటు దక్షిణభారత సినీ సామ్రాజ్యాన్ని మకుటం లేని మహారాణి లాగ ఏలిన నటి సావిత్రి..  తమిళులు ఆవిణ్ణి నటిగర్‌తిలకం అని, కలైమామణి అని అభిమానంగా పిలుచుకొన్నారు.

నటనకు ఆంగికం, వాచికం, ఆహార్యం అతిముఖ్యమైన హంగు. తమకున్న శరీరాకృతిని పాత్రోచితంగా  మలచుకోడం, దానికనుగుణంగా  నడుచుకోడం, ఆయా సంఘటన ప్రకారం తమ గొంతును సరిచేసుకోడం, రకరకాల  మాడ్యులేషన్‌తో సంభాషణను పలికించడం, భావ ప్రకటనచేయడం. తగిన దుస్తులు  ధరించడం ఇవన్ని ముఖ్యం. హీరోయిన్‌ నడుమిలాగ ఉండాలి, శరీరం ఇంత పొడవుండాలి అని కొలతలతో కూడిన శరీరాకృతి కాదు సావిత్రిది. మొదట్లో వేసిన కొన్ని సినిమాలలో తప్ప ఆవిడ దాదాపు అన్ని సినిమాలో లావుగానే ఉంది. మూగమనసుసినిమాలో రెండు పుస్తకాలు  చేతపట్టుకొని కాలేజి విద్యార్థిగా  ఎంతబాగా చెలామణి అయ్యిందో కదా అని మెచ్చుకొన్నారు శేఖర్‌ కమ్ముల. అదే లావుపాటి శరీరంతో డాక్టర్  చక్రవర్తి సినిమాలో “నీవు లేక వీణ” పాటకు అభినయించే సన్నివేశంలో మెట్లమీద వాలి ఆమె ఒలక బోసినవయ్యారం, కళ్ళలో పలికించిన విరహం ప్రతి మగవాడి గుండెల్లో గుబులు  పుట్టించి ఉంటుంది. ఆడవారిలో అసూయ రేకెత్తించి ఉంటుంది. “కలసి ఉంటే కలదు సుఖం” సినిమాలో గంప నెత్తికెత్తుకొని “అద్దమంటి  మనసు ఉంది అందమైన సొగసు ఉంది ఇంతకంటే ఉండేదేందిచెప్పయ్యా ” అనే పాటకామె నడుము ఊపుతూ, వయ్యారంగా  నడిచే సన్నివేశాన్ని మనం మరవగలమా. హంసలా నడచి వచ్చే చిట్టెమ్మో అని హీరోగారామెకు కితాబివ్వనే ఇస్తాడు. గుండమ్మ కథలో “కోలు కోలోయన్న”  పాటలో కూడ మేల్ మేలో యన్న మేలో పెద్దమ్మి చిలకలాకులికేను బాలా అని మురిసి పోతాడు హీరో. కులకడానికి ఆమెకు తన లావు అడ్డం కాలేదు. ఇంతకు ముందు చెప్పుకొన్నట్లు తమకున్న వనరునే అద్భుతంగా  వాడుకోడమనేదానికి ఇదొకమంచి ఉదాహరణ. అసలాపాట ఆ సినిమాకే హైలైటు. సాదా సీదా గెటప్పు. అందులో సావిత్రిముద్దుగా, గోముగా, మూతితిప్పినట్లుగా  ఇంకెవరైనా తిప్పగలరా అనిపిస్తుంది. మూతితో పాటు కళ్లను చక్రాల్లాగ తిప్పడం ఆమెకొక్కదానికే సాధ్యమనిపిస్తుంది.

ఒక వయ్యారమనే కాదు. ఆ బొద్దు శరీరంతో చెంగు చెంగుమని ఎగరడం, చలాకీగా  గెంతులేయడం, చకచకమని నడవడం ఎన్ని సినిమాలలో చూడలేదు మనం. “మంచి మనసులు ”  సినిమాలో ఏమండోయ్‌ శ్రీవారు పాట ఆవిడ ఎంత హుషారుగా , ఎంత ఉల్లాసంగా ,ఉత్సాహంగా అభినయించింది. అప్పుడామె వయస్సు గాని, లావు గాని మనకు గుర్తుకొచ్చాయా అదీ సావిత్రి నటనా చాతుర్యం.  ఇక మాయా బజారు సినిమాలో మాయా శశిరేఖగా  ఆమె చేసిన అల్లరి  అంతా ఇంతా కాదు. ఆ నటన గురించి, ఆ వన్నె చిన్నెల  గురించి ఒక వ్యాసమేరాయొచ్చు. అహ నా పెళ్ళంట పాట కామె చేసిన నాట్యం గాని, ప్రదర్శించిన హావభావాలు  గాని నభూతో నభవిష్యతి. నటనలో విశ్వరూపమే చూపిందావిడ. ఆ వేగమూ, ఆ విరుపు, మెరుపు, ఆ హోయలు  చాలా ప్రత్యేకం. అవన్ని ఒకెత్తు అప్పటికప్పుడు (ఆ పాటంతా ఒకే టేకులో తీసారంట – అదొక రికార్డు) వయ్యారి ముద్దుగుమ్మ కాస్త ఆజానుబాహుడైన ఘటోత్కచుడిగా  బారమైన అడుగు వేయడం, చిందు వేయడం, హుందాగ మగసిరిని ఒలకబోయడం, అంతలోనె గొంతు సవరించుకోడం, తడబడడం, గబగబ సర్దుకోడం, అల్లరిగా  నవ్వడం ` ఎన్ని కళలు! పరకాయ ప్రవేశం చేయడమంటే ఇదేనేమో. ఎన్నేళ్ళయింది చూసి ఆ సీను ఇంకా కళ్ళకు కట్టినట్లే ఉంది. ఆ షూటింగు చూస్తూ నిల బడిన కళాకారులు, టెక్నీషియన్స్‌ అప్పుడు ఆమెకి  స్టాండిరగ్‌ ఒవేషన్‌ ఇచ్చారట.  అదండి సావిత్రి తడాఖా. అసలా సినిమా విజయానికి సావిత్రి,ఎస్వి రంగారావులే ముఖ్య కారకులని చాలామంది అభిప్రాయం.

ఈ సందర్భంగా  మిత్రులొకరు చెప్పిన విషయం గుర్తొస్తున్నది. నటనకు, డైలాగు డెలివరికి మారుపేరని ఖ్యాతి గాంచిన ఎస్వీఆర్‌ తనకు సావిత్రితో షూటింగుంది అన్న రోజు ఇంట్లో చిరాకు పడి చిటపటలాడే వాడట. సావిత్రి నటన పక్కన తన నటన ఎక్కడ తేలిపోతుందోననిభయపడిపోయేవాడట. బాగా రిహార్సల్స్‌ చేసిగాని షూటింగుకి వెళ్ళే వాడు కాడట. ఎన్ని సినిమాలలో వారిద్దరు తండ్రికూతుళ్ళుగా  పోటీపడి నటించారో!  ఆ కాంబినేషన్లో సినిమాలు  చూసిన మనమెంత అదృష్టవంతులం!  తెలుగు  సినీ చరిత్రలో 50, 60, దశాబ్దాన్ని  స్వర్ణయుగమని పిలుస్తారు. దానికిగాను ఈ ఇద్దరూ   చేసిన దోహదం అంతా ఇంతా కాదు.

mayabazar

నాదీ ఆడజన్మేలో సావిత్రి ధరించిన పాత్ర చాలా ఛాలెంజింగ్‌ పాత్ర. అందము, ఆకర్షణ లేని నల్లని  రూపుతో వున్న స్త్రీ. అంతేకాదు చదువు సంధ్య లేని నిరక్షరకుక్షి. ఎవరి ప్రేమకు నోచని అభాగ్యురాలు. అయినా అందరి ఆనందం కోసం తాపత్రయపడే ఉత్తమ ఇల్లాలు.  ఆపాత్రలో సావిత్రి జీవించింది. అటువంటి పాత్రనంగీకరించడానికెంతో ధైర్యము, ఆత్మస్థైర్యము కావాలి. ఒకపక్క అందానికి పేరుపడ్డ ఎన్టీఆర్‌ పక్కన అందవిహీనంగా  కనపడడం, ఇంకొక పక్క నటనలో మేరునగధీర సమానుడైన ఎస్వీఆర్‌తో పోటీపడి నటించడం ఒక్క సావిత్రికే చెల్లు. మనిషికి అందము, ఆకర్షణ చదువు సంధ్యలే కాదు మనసు, మమత ముఖ్యమని ఆ సినిమా సందేశం. కుటుంబానికి ఆధారభరితమైన ఇల్లాలికవేవీ లేకపోయినా ఫరవా లేదనే ఆ సందేశాన్ని నూటికి నూరుపాళ్ళు ప్రజ మనసులోకి సూటిగా  తీసుకొని వెళ్ళగలిగింది సావిత్రి నటన.

ఎన్టీ రామారావు పక్కన ఎన్నో సినిమాలలో నటించి విజయఢంకా మోగించిన సావిత్రి రక్తసంబంధం సినిమాలో అతడికి చెల్లెలిగా  నటించింది. చాలామంది ప్రేక్షకులు  మిమ్మలని  అన్నా చెల్లెళ్ళగా  మెచ్చరు. మీరాపాత్ర ఒప్పుకోవద్దన్నారట. కాని వారిద్దరూ కూడ పక్కాప్రొఫెషనల్స్‌. తమ నటనాశక్తి మీద అపారమైన నమ్మకమున్నవారు. ఆ పాత్రలో వారు జీవించారు. నిజమైన అన్నా చెల్లెళ్ళేమో అన్నంత సహజంగా  నటించారు.

సినిమాలో చేరాలని సావిత్రి మద్రాసు చేరినప్పుడు ఆమెకు 15 ఏళ్ళ వయసు. సంసారం సినిమాలో హీరోయిన్‌గా  తీసుకోవాలనుకొన్నారు. ఏఎన్నారందులో హీరో. అతడిని విపరీతంగా  అభిమానించి అతడిని చూడాలనే కోరికతో విజయవాడలోని ఒక థియేటర్‌కెళ్లి ఆ తోపులాటలో కిందపడిన ఆ అమ్మాయికి ఏకంగ అతడి పక్కన హీరోయిన్‌గా వేషమేయడమంటే బెదరిపోయింది. బెంబేలు  పడింది.  ఈ అమ్మాయి హీరోయిన్‌ వేషానికి తగదని ఏదో ఒక చిన్న వేషమిచ్చి పంపారట. అటువంటి సావిత్రి మా పక్కన సావిత్రి కథానాయికగా ఉంటేగానిమేము నటించము అని హీరోలూ,  ఆమె లేకపోతే మా పిక్చర్‌ ఆడదని నిర్మాతలు  ఆమె కోసం పడిగాపులు  పడే స్థితికి చేరింది సావిత్రి. అది ఓవర్‌నైటు జరగలేదు. సినీ పాఠశాలలో చేరి అంచెలుగా ఎదిగి మహోన్నత స్థానం చేరుకొన్నది. నటనలో ఎంత పరిణతి చెందిందంటే తానుఎవరి పక్కన హీరోయిన్‌గా  పనిచేయడానికి భయపడిందో ఆ నాగేశ్వరరావుకే నటనలో డైలాగు డెలివరిలో పాఠాలు  చెప్పే స్థాయికి! నటనలో ఆమెకు ఆమే సాటి. నటనలో ఆమెతో పాటీ పడే స్థాయి తనకు కూడ లేదంటారు నాగేశ్వర్రావు. ఇది సుమంగళి సినిమా తీసేటప్పుడు జరిగింది. సినిమా షూటింగ్లోనే నేరుగ తెలుపలేని పాత్ర మనోగతాన్ని, మానసిక సంఘర్షణని గోడమీద పడే నీడ ద్వారా చిత్రీకరిస్తే బాగుంటుందని దర్శకుడికి సూచించింది. సినిమా కళనంతగా జీర్ణించుకొందప్పటికి.

సుమంగళి సినిమాలో ఆవిడ ధరించిన పాత్ర వైవిధ్యభరితమైనది. చాలా క్లిష్టమైనది. ప్రేమ పెళ్ళికి దారి తీసింది. ఇక దాంపత్య జీవనానికి నాంది పలికే శోభనం జరగడానికి ముందు జరిగిన ప్రమాదంలో భర్తకు వంద్యత్వం సంప్రాప్తిస్తుంది. అతడికి ఆ విషయం తెలపకూడదనికట్టడి. ఒక వంక వయసులో ఉన్న తనలో చెలరేగే కోరిక ఉధృతిని, తాపాన్ని చల్లబరచుకోవాలి. ఇంకొక వంక తమకంతో తన దరికి చేరుతున్న తన ప్రియుడిని కంట్రోల్ చేయాలి. మరొక వంక తన మీద నిఘాపెట్టిన అత్తకు అనుమానం రాకుండ మానేజి చేయాలి. వీటన్నిటి మధ్యనలిగిపోయే ఒక అసహాయమైన స్త్రీగా  సావిత్రి నటించిన తీరు అనన్య సామాన్యము. సినిమా మొత్తం కేవలం  తన చూపుతోటే నడిపిందంటే అతిశయోక్తి కాదేమో. అమితాబ్‌ బచ్చన్‌ కోసమె పాత్రను సృష్టించడం, ఆ పాత్రలతో సినిమాలు  తీయడం మనకు తెలుసు . అప్పట్లోనేసావిత్రిని దృష్టిలో పెట్టుకొని పాత్రను సృష్టించడం, సినిమాలు  తీయడం జరిగి ఉంటుంది. సందేహం లేదు. సావిత్రి వంటి నటి మళ్ళీ మళ్ళీ దొరుకుతుందా మరి.

మనం మొదట్లో చెప్పుకొన్నాం ఆహార్యం గురించి. ఒంపు సొంపు గురించి. సావిత్రికి ఒంపుసొంపు లేవు. కాని మనకా సంగతే గుర్తు రాదు. ఆమె చందమామ లాంటి మోమును చూస్తూ మైమరచిపోతాము. చాలా అరుదైన అందమైన మొఖం సావిత్రిది. అందమైన సరస్సులోవిచ్చిన కమలాలు  ఆమె కళ్ళు. స్వచ్ఛమైన తటాకంలో ప్రతిబింబం ప్రతిఫలించినట్లే సావిత్రి కళ్ళలో ప్రతిఫలించని భావం లేదు. కళ్ళే ఆమె ఆభరణాలు. . కళ్ళే ఆమె ఆయుధాలు. అవి చల్లని  వెన్నెల  కురిపించ గలవు. నిప్పులూ  కురిపించగవు. చిలిపి నవ్వు రువ్వగలవు.చిరాకునూ ప్రదర్శించగవు. సావిత్రి ఏనాడూ అసూయ, ద్వేషాలున్న పాత్ర ధరించలేదు. ఉంటే కష్టాలు  కన్నీళ్ళు ఉంటాయి. లేదా బలిదానాలూ , త్యాగాలుం టాయి. లేదా చిలిపితనం, హుషారు ఉంటాయి. వాటిని ప్రదర్శించడం ఆమెకు బాయే హాత్‌కి ఖేల్‌ హై.

devadasu

బరువైన పాత్రలని సావిత్రి ఎంత అద్వితీయంగ పోషించగల దంటే, అటువంటి పాత్రను పోషించడంలో ప్రఖ్యాతి గాంచిన హిందీతార మీనాకుమారి మద్రాసుకొచ్చినప్పుడల్లా సావిత్రి సినిమాలు  చూసి, ఈ పాత్రను నేను ఇంతబాగా చేయగలనా అని ప్రశ్నించుకొనేదట. బాధాతప్తస్త్రీ వేదనని సావిత్రి ప్రజెంట్‌ చేయడంలో ఒక వరవడినే ఆమె సృష్టించింది. అంతకు ముందు కడవలతో కన్నీళ్ళు కార్చడమే దుఃఖాన్ని ప్రదర్శించే విధానం.  తాను కన్నీళ్ళే కార్చకుండ మన గుండె  పిండేసే విధంగ నటించడం సావిత్రి వంతు. అటువంటి పాత్రలు  పోషించడందేవదాసుతోనే మొదలు . అప్పటికామె వయసు పదహారో పదిహేడో, సాహిత్యంతో పెద్దగ పరిచయం లేని బ్యాగ్రౌండు. నటనానుభవము అంతంత మాత్రమే. ముందా పాత్రకి భానుమతిని గాని జానకిని గాని తీసుకోవాలను కొన్నారట. అయినప్పటికి ఆ పాత్రలో ఆమె జీవించింది.దేవదాసంటే నాగేశ్వర్రావే, పార్వతంటే సావిత్రే.. వారి స్థానంలో మరొకరిని ఊహించుకోలేము అన్నంత గొప్పగ వారిద్దరు నటించారందులో. ఆ సినిమా రికార్డు బద్దలు  కొట్టింది. అజరామరంగా నిచిపోయింది. పెద్ద నటనానుభవం లేకపోయినప్పటికీ  అంత చిన్న వయసులో అంతగాఢమైన భావాలనేలా  పలికించ గలిగిందో ఆశ్చర్యం కలు గుతుంది. కొన్ని సన్నివేశాలలో కళ్ళల్లో శూన్యభావాన్ని ప్రతిఫలింప చేయగలగడం మనకు కన్పిస్తుంది. అదెంత కష్టమో కదా. అంతేకాదు తన గొంతులో, డైలాగు పలికిన తీరులో నిరాశను, బాధను, వేదాంత సరళిని పలికించినతీరు కూడ గొప్పగ ఉంటాయి. మొహము, హావభావాలు  ఒకరివి – గొంతు,  డైలాగు డెలివరి మరొకరివి ఐన నేటి యుగంలో అన్ని కళలను తనలో ఇముడ్చుకొన్న సావిత్రి వంటి నటిని మళ్ళీ  చూడగమా అనిపిస్తుంది. అప్పట్లో అందరూ  తమ డబ్బింగు తామేచెప్పుకొనేవారేననుకోండి. అందులో ప్రత్యేకంగా  చెప్పుకొనే వారిలో ఎస్వీఆర్‌, జగ్గయ్య, ఎన్టీఆర్‌, సావిత్రి ముఖ్యులు.

ఇందాక కన్నీళ్లు కార్చడం గురించి అనుకొన్నాము కదా. అందులో సావిత్రి ప్రతిభ గురించి ఒక కథనముంది. మాయాబజార్‌ సినిమాలో “నీకోసమె నే జీవించునది” పాట చిత్రీకరిస్తున్నారట. “అమ్మాయ్‌ నీవిప్పుడు కన్నీరు కార్చాలి గ్లిసరిన్‌ తీసుకో”మన్నారట దర్శకు కె.వి.రెడ్డి. దానికి సావిత్రి “కన్నీరు కార్చడానికి నాకు గ్లిసరిన్‌ అవసరం లేదు. చెప్పండి మీరే కంటిలో కార్చమంటే ఆ కంటిలోనే కారుస్తా కుడికన్నా, ఎడమ కన్నా, అంతే కాదు ఎన్ని చుక్కలు  కార్చమంటే అన్ని చుక్కలే కారుస్తా”నందట. దర్శకుడికి పంతం కలిగి ఛాలెంజ్‌ చేసాడట.అప్పటికే ఆ యూనిట్‌ వాళ్ళంతా అక్కడ చేరారట. ఎవరు నెగ్గుతారో చూద్దామని. అందరిలో ఉత్కంఠ.  ఏ కన్ను కెమెరావైపున కనిపిస్తూ వుందో ఆ కంటినుండి మాత్రమే ముచ్చటగ మూడంటే మూడు కన్నీటి చుక్కలు  రాల్చిందట సావిత్రి. అటువైపున్న కంట్లో ఒక్కటంటే ఒక్క చుక్కరాల్చలేదట. ఆ అద్భుతాన్ని చూసి అందరూ అవాక్కై ఉంటారు. కాదంటారా!

ఇటువంటి చోద్యాలు  సావిత్రి నట జీవితంలో మరెన్ని జరిగాయో మనకేం తొలుసు. నటనలో ఉద్దండపిండాలైన నటులకే చెమటలు  పట్టించిందని తెలుసుకొన్నాం కద. సావిత్రి నటనా దురంధరతను గూర్చి ఏఎన్‌ ఆర్‌ మరొక సందర్భంలో ఇలా అన్నారు. సావిత్రి నటనఆర్భాటంతో కూడినది కాదు. బహు సున్నితంగా, సూచన ప్రాయంగా  ఉంటుంది. ఆంగ్లంలో” సటిలిటి” అంటారు. అంటే అతి సూక్ష్మమైన భావాను సైతం నటనలో ప్రతిఫలింప చేయటమన్నమాట. సుచిత్రాసేన్‌ కథానాయికగా  బెంగాలి భాషలో 1959లో “దీప్‌ జ్వలే జాయె” అనేసినిమా తీసారు. 1960లో దానినే సావిత్రితో “చివరికి మిగిలేది” అనే సినిమాగా  తీసారు. 1968లో వహీదా రెహమాన్‌ హీరోయిన్‌గ హిందీలో “ఖామోషి” తీసారు. ముగ్గురూ అగ్ర శ్రేణి నటీమణులు.  తమ హావభావాను అతి సున్నితంగా  డైలాగు అవసరం లేకుండచూపుతోనే తెలుపగల దిట్టలు.  అది చాలా బరువైన పాత్ర..  వారు మాత్రమే ఆ పాత్రకు న్యాయం చేకూర్చగలరనే నమ్మకంతో ఆయా నిర్మాతలు , దర్శకులు  వారిని ఆ పాత్ర పోషించడానికి ఎన్నుకోవడం జరిగింది. ఎవరిమట్టుకు వాఋ అత్యద్భుతంగా  నటించారు.. ఎవరికి వారేగొప్ప వారు. అయినప్పటికీ సావిత్రి చూపించిన “సటిలిటి” నీ  ప్రత్యేకంగా చెప్పుకోవసిన అవసరముంది. ఆ పాత్ర ఒక నర్సుది. ఒకానొక రోగికి పరిచర్య చేయడానికి ప్రత్యేకంగా  నియమించబడినది. ఆ రోగి మానసిక స్థితి దుర్భరంగా   ఉండటం వలన అతడితో ప్రేమగా  ఉండమని,కంటికి రెప్పలాగ కాపాడవసిన అవసరముందని డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. ఆ నర్సు నిజంగానే ఆ రోగి ప్రేమలో పడిపోతుంది. అతడికి శుశ్రూష చేయడం కేవలం  తన విధి మాత్రమే అనుకోదు. అది తన భాగ్యమనుకొంటుంది. అందులో లీనమై తానెవరో ఏమిటో మరచిపోయేస్థితికి చేరుకొంటుంది. ఆ రహస్యాన్ని మదిలోనే దాచుకొని ఉంటుంది. ఆమె చేసిన సేవల వలన ఆరోగ్యం కుదుటపడి ఆస్పత్రి నుండి డిస్చార్జికి సిద్ధపడతాడు. దీనికంతటికి కారకురాలైన నర్సును పిలిచి అభినందిస్తాడు డాక్టరు.

నిజమేమిటో తెలియని అతడు నీవు గొప్పగ నటించావు.నీది నిజమైన ప్రేమ అని నమ్మిన రోగి బాగుపడ్డాడు. అంతే చాలని మెచ్చుకుంటాడు. ఆ మాటలు  విన్న ఆ నర్సు దుఃఖంతో తల్లడిల్లిపోతుంది. గద్గద స్వరంతో సావిత్రి ఆ వేదనను అభివ్యక్తీకరించిన విధానం అనన్యసామాన్యం. కపటనాటకం ఆడడం ఎలా, నటన నా వల్ల  కాదు’ అనిరోదించే సన్నివేశం మనని కదిలించి వేస్తుంది. ఆ సినిమా మొత్తం తన భుజస్కందాల మీద మోసింది సావిత్రి.. ఆ సినిమా కమర్షియల్గా  విజయవంతమయ్యిందో లేదో కాని అదొక క్లాసిక్‌గా మిగిలిపోయింది. పెద్ద హీరోల తోనే కాదు అంతగా ప్రాబల్యం లేని వారితోకలసి  నటించడానికావిడ వెనకాడలేదు. తనమీద తనకు, నిర్మాతకు ఆవిడ మీద ఉన్న నమ్మకమటువంటిది.

kanyasulkam

మన తెలుగు సాహితీ సౌరభాలను దశదిశలా వెదచల్లిన వారిలో ముఖ్యులు  గురజాడ. ప్రపంచ సాహిత్యంలో విశిష్టమైన వంద కావ్యాలో కన్యాశుల్కం ఒకటి .  వంద గొప్పస్త్రీ పాత్రలలో  మధురవాణి ఒకటి. అంతటి ప్రాధాన్యమున్న ఆ పాత్రను పోషించడానికి సావిత్రి కాక మరి ఎవరు తూగగలరు. మధురవాణి ఒక నెరజాణ. తన ఆటపాటలతో మగవారి మనసు రంజింప చేయడమే కాకుండ తన కబ్జాలో చిక్కిన వారిని జారిపోనీకుండా  ఒడిసి పట్టుకొనిఉండే చాకచక్యం కలిగిన  జాణ. ఇతరుల  నొప్పింపక తానొవ్వక తిరిగగలిగిన చమత్కారి మధురవాణి. వృత్తికి సానే కాని ప్రవృత్తి హుందాతనం, దయ, అంతఃకరుణ కలిగిన స్త్రీ రత్నం. తన తెలివితేటల తో లుబ్దావధాన్లతో, రామప్పంతులు వగైరాతో మాట్లాడే సమయంలో ఆడే మాటలోఎకసెక్కం, వెటకారం నిండి ఉంటాయి. పెదవులు  నవ్వుతుంటాయి. నొసలు వెక్కిరిస్తుంటుంది. సావిత్రి బుగ్గనటుఇటు ఆడిస్తుంది. బుగ్గను నొక్కుకొంటుంది. కళ్ళను వంకరగా  పెట్టి ఓరచూపు చూస్తుంది. కళ్ళను చికిలిస్తుంది. మాటతూటాల నొదులు తుంది. మాటను విరుస్తుంది.దీర్ఘాలు తీస్తుంది. ఎదుటి వారి ఎత్తుకు పై ఎత్తు వేస్తుంది. తన మనసులోని మాట బయటపడనీకుండా  ఎదుటి వారిని మాయలో ఉంచడానికి వారిని ఆనందింప చేస్తుంది. విసవిస నడుస్తుంది. రుస రుస లాడుతుంది. చిరుకోపం నటిస్తుంది. వారిని మోహావేశంలో ఉంచడానికిఅగ్గిపుల్ల వెలిగిస్తుంది. అదే కరటకశాస్త్రి, అతడి శిష్యుడిని చూసినప్పుడు మాత్రం అవ్యాజానురాగాలు  కురిపిస్తుంది. వారిని చూసే చూపే వేరు. మిస్సమ్మ సినిమా రిలీజయ్యేసరికి సావిత్రి అంతగా పేరు ప్రఖ్యాతి గాంచలేదు. అసలాపాత్రకి ముందు భానుమతిని ఎన్నిక చేశారట.హాస్యపాత్రను చేయడంలో ఆవిడ అందెవేసిన చేయి. మిస్సమ్మ ఆద్యంతం హాస్యభరితమైన సినిమా. భానుమతి మాత్రమే ఆ పాత్రకి న్యాయం చేకూర్చగల దని వారి నమ్మకం. కొన్ని కారణాల వల్ల భానుమతి తప్పుకుంది . అదే పాత్రను సావిత్రి అద్భుతంగా పోషించడమూ . ఆసినిమా విజయ దుందుభి మోగించడమూ మనకు తెలుసు. బరువైన పాత్రలే కాదు హాస్యభరిత పాత్రను కూడ పోషించగల దని రుజువు చేసుకుంది సావిత్రి .  విజయా సంస్థ సావిత్రిని, సావిత్రి విజయా సంస్థను వదిలి పెట్టలేదు. ఎస్వీ రంగారావు, సావిత్రి కాంబినేషను అప్పటినుండేమొదలైందనుకుంటా.

ఇక మిస్సమ్మ  పాత్రను గురించి చెప్పుకుందాం. సావిత్రి చూసే చూపు, పడే చిరాకు మనం మరచిపోలేము. ఎన్టీఆర్‌ను కూడా ఒక పట్టాన నమ్మదు. గమనిస్తూ ఉంటుంది. పెళ్లికాని అమ్మాయి తీసుకోవలసిన జాగ్రత్తలు  తీసుకొంటూ  ఉంటుంది. ఆ ఇద్దరు కలసి  పండించినహాస్యం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మీకు గుర్తుండే ఉంటుంది. కాలికి తగిలిన దెబ్బ ఉత్తుత్తిదని కట్టుతీసి అటూ ఇటూ చకచక తిరుగుతున్న అతడి వెంటపడి తిరిగే సావిత్రి కళ్లలో సంభ్రమాశ్చ ర్యాలులు చూడాల్సిందే కాని వర్ణించలేం. అతడి మీద నమ్మకం, ఇష్టం కలిగిన తరువాత ఆభావాల ను అవ్యక్తంగా వ్యక్తీకరించిన తీరు భేషుగ్గా  ఉంటుంది. “ఏమిటో నీ మాయా ఓ చ్లని రాజా ” పాటను ఎంత మధురంగా , ఎంత సున్నితంగా  అభివ్యక్తీకరించిందో గుర్తు తెచ్చుకోండి. ఎక్కడ జమున ఎన్టీఆర్ ని  ఎగరేసుకొని పోతుందో నని భయపడడం, జమునని కసురుకోడం,రుసరుసలాడడం ఎంత సహజంగా  ఉన్నాయో, అసూయతో ఏఎన్నార్ని ఎగదోసే తీరు, అతడికి పాట నేర్పే సన్నివేశం తెలుగు  సినిమా చరిత్రలో హాస్య సన్నివేశాలో మకుటాయమానం. అందులో నటించిన ఏఎన్నార్‌, ఎన్టీఆర్‌, సావిత్రి, రేలంగి, బాలకృష్ణ, ఆ సన్నివేశాన్ని కల్పించినదర్శకుడు అజరామరంగా  నిలిచి ఉంటారు. శ్రీమంతం సీనులో కూడ ఆ తతంగాన్నంత విధిలేక భరిస్తున్నట్లు సావిత్ర మొహంలో కనబరిచే హావభావాలు  చూడముచ్చటగా ఉంటాయి. చివర్లో అందరూ తనవారే అని తెలుసుకొని సంతోషాన్ని వ్యక్తపరుస్తు అందరినీ  అక్కున చేర్చుకొన్నతీరు అత్యంత సహజంగా ఉంటుంది. సావిత్రి తరువాత వచ్చిన నటీమణులకు ఏవేవో బిరుదులిచ్చారు ప్రేక్షకులు. నటనకే భాష్యం చెప్పగలిగిన సావిత్రినేమని పిలవగలరు మహానటి అని కాకుండా !.

సామాన్యజనం నుండి మేధావుల  వరకు ఆమె నటనకు నీరాజనాలిచ్చిన వారే. ప్రజాకవి గద్దర్‌ ఆమెను గురించి ఇలా అన్నారు. మనసున్న మారాణి సావిత్రి. హీరోలు  రాజ్యమేలు తున్న తరుణంలో వారికి ధీటుగ నిలచిన సావిత్రి హీరోకు హీరో. తారలు  రావచ్చు తారలు  పోవచ్చు కానీ కలకాలం నిలిచే ధృవతార సావిత్రి. “సాము నలుపుదాన సక్కని దాన సల్లంగ ఉండాలె  సెల్లె నీవు” అని పాట కూడ రాశారు.

ఆనాడే సినిమాకి లక్ష  రెమ్యునరేషన్‌ తీసుకొన్న సత్తా కలిగిన తార సావిత్రి.. సినిమా ప్రపంచంలో ఉన్న ముగ్గురు శిల్పుల్లో  సావిత్రి ఒకరన్నారట శ్రీశ్రీ.  1960లో ఆవిడ కథానాయికగా  నటించిన 21 సినిమాలు  రిలీజయ్యాయట. అన్నీ సూపర్‌ డూపర్‌ హిట్టులే. ఆంధ్రయువతీ మండలి వారు ఆమెను ఏనుగు అంబారీ మీద ఊరేగించారట. ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి అంబారీకి ఎదురేగారట.  సావిత్రి తన తరువాత వచ్చిన నటీమణుందరికీ  నటనలో మార్గదర్శకురాలు . దాదాపు అందరూ ఆమెలా నటించాలని కోరుకొన్నవారే. ఆమెను అనుకరించినవారే.

( డిశంబర్ 26 సావిత్రి వర్ధంతి సందర్భంగా ) 

అతను సాహిత్య లోకపు ధృవతార  

 

-భవాని ఫణి

~

bhavani phani.

పందొమ్మిదవ శతాబ్దపు గొప్ప కవి అయిన జాన్ కీట్స్ ప్రేమ (జీవిత) చరిత్ర ఆధారంగా 2009 లో రూపొందింపబడిన చలన చిత్రం “బ్రైట్ స్టార్(Bright Star )”. చాలా మందికి అతని జీవితంలోని విషాదం గురించి తెలిసే ఉంటుంది . పాతికేళ్ల వయసుకే అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచిన ఆ మహా కవి, తను జీవించి ఉన్న కాలంలో పెద్దగా గుర్తింపు పొందలేకపోయాడు . అతని దృష్టిలో అతనో విఫల కవి. సమాజం ఎప్పట్లానే అతని గొప్పతనాన్ని జీవితకాలం ఆలస్యంగా గుర్తించింది . ఇదంతా పక్కన పెడితే అతని అతి చిన్న జీవితంలోకి వలపుల వసంతాన్ని మోసుకొచ్చిన అమ్మాయి ఫానీ బ్రాన్. వాళ్ల ప్రణయగాథకి దృశ్య రూపమే ఈ బ్రైట్ స్టార్ చలన చిత్రం .

కొంచెం బొద్దుగా ముద్దుగా ఉన్న ఆ పద్దెనిమిదేళ్ల  అమ్మాయి, కళ్లలోంచి కవిత్వాల్ని వొలికించగల జాణ.  యువకుల హృదయాల్ని ఉర్రూతలూపగల అందం , ఆధునికత ఆమె సొంతం . కథానాయిక ‘ఫానీ బ్రాన్’ పాత్ర ధారిణి అయిన ‘అబ్బే కోర్నిష్’  కళ్లకి ఇదీ అని చెప్పలేని వింత ఆకర్షణ ఉంది . ఆ కళ్లలో చంచలత్వం లేదు . ఒక పరిణితి, ఉదాత్తత , హుందాతనం వాటి నిండా కొలువు తీరి ఉన్నాయి . నటిస్తున్నది ఆ అమ్మాయా లేకపోతే ఆమె కళ్లా అనిపించింది ఒక్కోసారి .

ఆ కన్నుల లోతులు కొలవడమంటే
గుండె గర్భానికి బాటలు వెయ్యడమే
ఆ కన్నులతో చూపు కలపడమంటే
మబ్బుల చిక్కదనంలోనికి మరలి రాని పయనమే

అన్న భావం  ఆ అమ్మాయి కళ్లని చూస్తే కలిగింది  . చూసే కొద్దీ ఆ భావం మరింతగా బలపడింది . ఆ కళ్లలో ఏదో ఉంది . అనంతమైన సాగరాల అలజడి , అగ్ని పర్వతాల అలికిడి , సెలయేటి పరవళ్ల ఉరవడి , చిరు అల్లరిని రేగించే సౌకుమార్యపు సడి….. ఇక అవి ఏ కవి కళ్లలో పడినా కవితల సందడే సందడి .ఎందఱో యువకుల ఆరాధ్య దేవత అయినా ఫానీ మాత్రం జాన్ కీట్స్ ని ఇష్టపడింది . మొదట్లో ఆమెని పెద్దగా పట్టించుకోకపోయినా అతని తమ్ముడు క్షయ వ్యాధితో చనిపోయినప్పుడు ఆమె ప్రదర్శించిన దుఃఖాన్ని గమనించాకా  కీట్స్ కి కూడా  ఆమెపై ఇష్టం ఏర్పడుతుంది. కవిత్వ పాఠాలు నేర్చుకునే వంకతో ఫానీ , కీట్స్ తో సాన్నిహిత్యం పెంచుకునే ప్రయత్నం చేస్తుంది . ఆ  సమయంలో జాన్ కీట్స్ కొన్ని ఆణిముత్యాల్లాంటి మాటలు చెప్తాడు . “చెరువులోకి దూకడం, వెంటనే ఈదుకుంటూ ఒడ్డుకు చేరడం కోసం కాదట . అక్కడే కొంతసేపు ఉండి , ఆ నీటి తాకిడిలోని లాలిత్యాన్ని అనుభవించడం కోసమట! అది ఆలోచనకి అందని ఒక అపురూపమైన అనుభవమట . అతను ఆ సందర్భాన్ని కవిత్వాన్ని అర్థం చేసుకోవడంతో పోలుస్తాడు . చెట్టుకి ఆకులు చిగురించినంత సహజంగా రానప్పుడు , కవిత్వం అసలు రాకపోవడమే మంచిదట. ”

అలా కవిత్వ పాఠాల ద్వారా ఆ ఇద్దరి మధ్య తగ్గిన దూరం , వారి మనసుల్ని మరింత దగ్గర చేస్తుంది. అలౌకికమైన ఓ ప్రేమ భావన , ఇద్దర్నీ పెనవేసుకుని చిగురిస్తుంది. ఇంతలో ఫానీ , కీట్స్ లకి ఒకే ఇంట్లో పక్క పక్క వాటాల్లో నివసించే అవకాశం లభించడంతో వారి ప్రేమ బంధం మరింత గట్టిపడుతుంది . మధ్యలో కొంతకాలం కలిగిన తాత్కాలికమైన ఎడబాటు సమయంలో కీట్స్ ఆమెకి ఎన్నో అందమైన లేఖలు రాస్తాడు.  అతని కోసం ఏమైనా చెయ్యగలిగేంత ప్రేమ ఆమెది.  ఆమె గురించి పేజీల కొద్దీ సోనెట్లు రాయకుండా ఉండలేనంత అనురాగం అతనిది .

ఆ సమయంలో  కీట్స్ రాసిన కవిత “బ్రైట్ స్టార్” ఇదే .
Bright star, would I were stedfast as thou art—
Not in lone splendour hung aloft the night
And watching, with eternal lids apart,
Like nature’s patient, sleepless Eremite,
The moving waters at their priestlike task
Of pure ablution round earth’s human shores,
Or gazing on the new soft-fallen mask
Of snow upon the mountains and the moors—
No—yet still stedfast, still unchangeable,
Pillow’d upon my fair love’s ripening breast,
To feel for ever its soft fall and swell,
Awake for ever in a sweet unrest,
Still, still to hear her tender-taken breath,
And so live ever—or else swoon to death.ఈ కవితలో కీట్స్ ఒక కదలని నక్షత్రంతో మాట్లాడుతున్నాడు .
అతనికి కూడా ఆ నక్షత్రంలా మార్పు లేకుండా , స్థిరంగా ఉండాలని ఉందట .
కానీ, ఆ నక్షత్రపు ఒంటరితనం ఎంత అద్బుతమైనదైనా అటువంటి స్థిరత్వాన్ని కాదట అతను కోరుకునేది .
ఆ నక్షత్రంలా ఎంతో ఎత్తున నిలబడి ఎప్పటికీ మూతపడని కనురెప్పల మధ్య లోంచి ప్రకృతి చూపించే ఓర్పునీ, మార్పు చెందని ఆధ్యాత్మికతనీ చూడాలని కాదట అతని కోరిక .
గుండ్రని భూమి యొక్క మానవత్వపు తీరాల్ని ఒక పూజారిలా శుధ్ధి చేస్తున నీటి కదలికల్ని గమనించాలని కూడా కాదట అతను స్థిరంగా ఉండాలని అనుకుంటున్నది .
పర్వతాల మీదా, బంజరు భూముల మీదా ముసుగులా పరుచుకుంటున్న మెత్తని మంచుని తదేకంగా చూడటమూ అతని ఉద్దేశ్యం కాదట .
కానీ అతని స్థిరంగా ఉండాలని ఉందట .
పరిపూర్ణమవుతున్న అతని ప్రేమభావం(ప్రేయసి?) యొక్క పయ్యెదని దిండుగా చేసుకుని మార్పు లేని స్థితిలో ఉండాలని ఉందట
ఆ పడి లేస్తున్న మెత్తదనాన్ని అనుభవిస్తూ
ఒక తియ్యని అవిశ్రాంత స్థితిలో ఎప్పటికీ మేలుకుని ఉండాలని ఉందట
ఎప్పటికీ కదలకుండా ఉండి, ఆ శ్వాస తాలుకూ పలుచదనాన్ని వింటూ
ఎప్పటికీ జీవించి ఉండాలని ఉందట, లేకపోతే మరణంలోకి మూర్ఛిల్లాలని ఉందట!!!ఎంత గొప్ప భావం! ఒక్కొక్క పదానికీ ఎన్నెని అర్థాలో!  ప్రతి వాక్యంలోనూ ఎంతటి భావ సంఘర్షణో! ఓ పక్క ఉత్తేజభరితమైన జీవితాన్నీ , మరో పక్క అమానవీయమైన నిశ్చలతనీ కోరుకుంటూ , ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్లాడుతున్నట్టుగా అనిపించే ఈ గొప్ప కవిత రాయడానికి కీట్స్ దగ్గర ఒక బలమైన కారణముంది .
అదేమిటంటే అనారోగ్యం! అప్పటికే అది కీట్స్ శరీరాన్నిఆత్రంగా ఆక్రమించుకుంటోంది. అతని తమ్ముడిని పొట్టన పెట్టుకున్న అదే క్షయ వ్యాధి అతన్ని కూడా తన కబంధహస్తాల మధ్య ఇరికించుకునే ప్రయత్నం చేస్తోంది . పైగా బీదరికం.  అతను అటువంటి దయనీయమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ ఫానీ అతనితో వివాహానికి సిద్ధపడి , అతన్ని తన ఇంట్లో ఉంచుకుని సపర్యలు చేస్తుంది . కానీ అక్కడ లండన్ లో ఉన్న తీవ్రమైన చలితో కూడిన వాతావరణ పరిస్థితుల కారణంగా , క్షీణిస్తున్న అతని ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని,  మిత్రులంతా ధనాన్ని ప్రోగు చేసి, చలి కొంచెం తక్కువగా ఉండే ప్రాంతమైన ఇటలీకి అతడిని పంపుతారు . అతను అక్కడే తన ఇరవయ్యైదవ ఏట వ్యాధి ముదిరి మరణిస్తాడు .కీట్స్ కొన్ని రోజులు కనిపించకపోతేనే విలవిల్లాడిపోయే ఫానీ , ఈ దుర్వార్త విని తీవ్ర వేదనకి గురవుతుంది . ఆ సన్నివేశంలో విషాదమూర్తిగా మారిన ‘ఫానీ’గా, అబ్బే కార్నిష్ చూపిన నటన గురించి వివరించాలంటే అద్భుతం అన్నమాట అనక తప్పదు . ఎందుకంటే అంతకంటే ఉన్నతంగా ఆమె నటనని వర్ణించగల పదమేదీ లేదు కనుక . జుట్టు కత్తిరించుకుని , నల్లని దుస్తులు ధరించి , అతను రాసిన బ్రైట్ స్టార్ సోనెట్ ని వల్లె వేసుకుంటూ రాత్రి పూట ఆ ప్రదేశమంతా సంచరిస్తూ చాలా ఏళ్ల పాటు అతని వియోగ దుఃఖాన్ని ఆమె అనుభవిస్తుంది .  అలా అక్కడితో కథని ముగిస్తాడు దర్శకుడు జేన్ కాంపియన్ .

ఈ చలన చిత్రంలోని ప్రతి సన్నివేశం ఓ అపురూపమైన కళాఖండంలా ఉంటుంది . అతి పెద్ద కేన్వాస్ మీద ఓ గొప్ప కవి జీవితంలోని కొంత భాగాన్ని చిత్రించి చూపడంలో  దర్శకుడు ఎంతగా తన ప్రతిభని కనబరిచాడో , నటీనటులంతా అంతే సహజత్వాన్ని తమ తమ నటనలో ప్రదర్శించారు. జాన్ కీట్స్ పాత్రధారి ‘బెన్ విషా’ , ఫానీ పాత్రధారిణి ‘అబ్బే కార్నిష్’ ల నటన అత్యుత్తమం .  ముఖ్యంగా అబ్బే కార్నిష్, చలన చిత్రాన్నీ, ప్రేక్షకుల్నీకూడా  తన చుట్టూ రంగుల రాట్నంలా తిప్పుకోగలిగేంత అద్వితీయమైన చార్మ్ ని ప్రదర్శించింది . అలాగే ఒక సన్నివేశం తాలుకూ ఆడియో మరో సన్నివేశానికి కొనసాగింపబడటం, చలన చిత్రానికి ఒక ప్రత్యేకతని ఆపాదించింది . ఆ విధమైన ఎడిటింగ్ కారణంగా  కాలం  ఏక ప్రవాహమై తన గమనాన్ని గమనించనివ్వకపోయినా, చలన చిత్రమంతా ఓ కొత్త అందమే పరవళ్లు తొక్కింది .

మొత్తానికి ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రకాశవంతమైన ఈ ‘తళుకుల తార’ , తీవ్రమైన ప్రేమభావాన్ని తనలో తను అనంతంగా జ్వలించుకుని, మన మనసుల్లోపల అపూర్వమైన జ్ఞాపకాల్ని వెలిగిస్తుంది . కానీ అన్ని గొప్ప ప్రేమ కథల్లోలాగే ఇక్కడ కూడా వియోగమే గెలుస్తుంది . విషాదాన్నే మిగులుస్తుంది.

‘కంచె’లు తొలగి.. చిగురంత ఆశ!

– బుద్ధి యజ్ఞమూర్తి
~
తెలుగు చిత్రసీమలో క్రిష్ ఒక విభిన్న దర్శకుడు. ఇవాళ్టి టాప్ డైరెక్టర్లలో అత్యధికులు మూస కథలు, భావావేశ సన్నివేశాలు, వినోదం, వందమందిని ఒక్కడే అలవోకగా చిత్తుచేసే యాక్షన్ ఎపిసోడ్స్‌తో నింపేసి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నవాళ్లే. వాళ్ళ సినిమాలు కేవలం కాలక్షేపం బఠాణీలే. అవి ప్రేక్షకుల అభిరుచుల్ని ఏమాత్రం పెంపొందించకపోగా, మరింత నష్టాన్ని కలగజేస్తున్నాయని చెప్పొచ్చు. ఆఖరుకి తెలుగు సినిమా సత్తాని ‘బాహుబలి’ విశ్వవ్యాప్తం చేసిందని ఎక్కువమంది గర్వపడుతున్నా, నా దృష్టిలో ఆ సినిమా కూడా ప్రేక్షకుల అభిరుచిని కాస్త కూడా పెంచే రకం కాదు. కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో ఆడియెన్స్‌ను అది మెస్మరైజ్ చేస్తే చేసుండవచ్చు. కానీ వస్తుపరంగా అది ఏమాత్రమూ ఉత్తమ స్థాయి సినిమా కానే కాదు.
రాజమౌళికి జనాన్ని ఎట్లా మెప్పించి, వాళ్ల డబ్బు కొల్లగొట్టాలనేదే ప్రధానం. దానివల్ల వాళ్ల ఆలోచనలు వికసిస్తాయా, వాళ్లలో మానసిక చైతన్యం కలుగుతుందా.. అనేది ఆయనకు పూర్తిగా అప్రధానం. ఆయన తీసిన ఏ సినిమా అయినా తీసుకోండి. అవన్నీ భావావేశాలు, ఉద్రిక్తతలు, ఉద్వేగాలు, భీబత్సాలతో నిండివుండేవే. సరిగ్గా క్రిష్ ఇందుకు పూర్తి విరుద్ధ దర్శకుడు. తొలి అడుగు ‘గమ్యం’ నుంచి, ఇప్పటి ‘కంచె’ దాకా అతడి సినిమాలు మానవ సంబంధాలపై అల్లినవే. వివిధ పరిస్థితుల్లో మనుషులు ఎట్లా ప్రవర్తిస్తుంటారు, ఎలా స్పందిస్తుంటారు అనే విషయాల్ని కమర్షియల్ పరిధిలోనే వీలైనంత వాస్తవికంగా చూపించే సినిమాలే. ‘కంచె’ ముందు ఆయన హిందీలో ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ సినిమాను తీస్తున్నప్పుడు నేను అసంతృప్తి చెందాను.
ఇప్పటికే రెండు భాషల్లో వచ్చిన సినిమాను హిందీలో తీయడంలో ఆయన ప్రతిభ ఏముంది? అసలు ఎందుకు ఆ ప్రాజెక్టుకు ఒప్పుకున్నాడా? అనేది ఆ అసంతృప్తికి కారణం. ఆ సినిమా సమాజంలోని.. ముఖ్యంగా బ్యూరోక్రసీలోని అవినీతిపై ఓ వ్యక్తి సాగించిన సమరం. కానీ అందులో వాస్తవికత కంటే, నాటకీయత పాలే ఎక్కువ. అంటే క్రిష్ స్కూల్‌కు భిన్నమైన అంశం. ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ ఆశించిన రీతిలో ఆడకపోవడంతో నేను సంతోషించాను. అవును నిజం. అది ఆడుంటే, క్రిష్ ఆ స్కూల్లోకి వెళ్లిపోయే అవకాశాలుంటాయి కదా. అలా జరగలేదు. ఫలితమే ‘కంచె’. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో మొదటిరోజు ఉదయం మీడియాకు వేసిన 8.45 గంటల షోకు వెళ్లాను. ఇంటర్వెల్ పడింది. క్రిష్ చేసిన సాహసానికి ఆశ్చర్యపోయాను. యుద్ధ నేపథ్య చిత్రాలు తెలుగులో ఆడవనేది నాకున్న నమ్మకం.
మనవాళ్లు అట్లాంటి వాటికి కనెక్ట్ కారు. క్రిష్ ఈ సినిమాతో ఎంత పెద్ద సాహసం చేశాడంటే, తను తీసుకున్న నేపథ్యం కారణంగా విదేశీ పాత్రల్ని కీలక పాత్రలుగా చూపించాడు. జర్మన్, బ్రిటీష్ పాత్రలుగా అవి మనకు కనిపిస్తాయి. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో మినహా మిగతా సినిమా అంతా ఆ పాత్రలకు ప్రాధాన్యం ఉంది. వాటితో తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ కాలేరనేది అప్పటిదాకా నాకున్న అభిప్రాయం. చాలామంది సహచర మీడియా మిత్రులు ‘ఏందీ సినిమా? నాకైతే అర్థం కాలేదు. క్రిష్‌కు డబ్బులెక్కువయ్యాయా?’ అని కూడా అనడం విన్నాను. నలుగురైదుగురు నా వద్ద కూడా దాదాపు అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ‘సెకండాఫ్ కూడా చూసి మాట్లాడండి’ అన్నాను. సినిమా అంతా అయ్యాక నేనెవరి అభిప్రాయం కోసం ఆగలేదు. అప్పుడైనా వాళ్ల నుంచి భిన్నమైన అభిప్రాయం వస్తుందని అనుకోను. నా మనసు నిండుగా ఉన్నట్లనిపించింది.
మనుషుల మధ్య, వాళ్ల మనసుల మధ్య.. హోదాలు, అంతస్థులు, కులాలు ఎట్లా అడ్డు’కంచె’లవుతున్నాయో, అలాంటి ‘కంచె’ల కారణంగానే ఆధిపత్యం కోసం దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయని ప్రతీకాత్మకంగా చూపిస్తూ ఎంత బాగా తీశాడనుకున్నా. మనుషుల మధ్య ‘కంచె’ కారణంగా రెండు భిన్న నేపథ్యాలున్న ప్రేమికుల జీవితాలు ఎలా విషాదమయమయ్యాయో హృద్యంగా చూపించాడు దర్శకుడు. ఇక్కడ కూడా ఆయన ఫార్ములాకు భిన్నంగానే వెళ్లాడు. హీరో హీరోయిన్లు చనిపోతే.. ఆ సినిమాను తెలుగు ప్రేక్షకులు కన్నెత్తి చూస్తారా?.. అయినా క్రిష్ తెగించాడు. ‘కంచె’ల వల్ల జరుగుతున్న అనర్ధం తెలియాలంటే విషాదాంతమే సరైందనుకున్నాడు. అప్పుడే కదా.. అందులోని నొప్పి తెలిసేది. కథలో ఎవరైతే ప్రేమికులకు ప్రధాన అడ్డంకిగా నిలిచాడో, ఆ వ్యక్తి (హీరోయిన్ అన్న) చివరకు ఊళ్లమధ్య లేసిన ‘కంచె’లను తీసేయమనడం కథకు సరైన ముగింపు.
ఈ సినిమా ఆడితే.. ప్రేక్షకులు ఎదిగినట్లేననేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇవాళ వినోదం కోసమే సినిమాలు చూస్తున్నవాళ్లు ఎక్కువ. యువత కోరుకుంటోంది అదే. అలాంటప్పుడు ‘కంచె’లాంటి సీరియస్ సినిమా ఎవరికి కావాలి? వారాంతపు సెలవుల్ని ఎంజాయ్ చేసేవాళ్లకు ‘కంచె’ల గురించి ఆలోచించే తీరుబాటు ఉంటుందా? అందువల్ల ‘కంచె’ విషయంలో నాది అత్యాశ అవుతుందనే అనుకున్నా. కానీ.. సుమారు రూ. 20 కోట్లు ఖర్చుపెట్టి తీసిన ఈ సినిమాకు తొలి మూడు రోజుల్లోనే రూ. 8 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయని తెలిసి ఎంత ఆనందమేసిందో? మొత్తంగా ఆ సినిమాకు పెట్టిన డబ్బులు వస్తాయనే నమ్మకం కలుగుతోంది.
ఒకవేళ పోయినా అతి తక్కువ మొత్తంలోనే పోవచ్చు. ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయనడానికి ఇది సంకేతమా? మూస ‘బ్రూస్‌లీ’కి పరాభవం ఎదురై, కొత్త ‘కంచె’కు ఊహించిన దానికంటే ఆదరణ లభించడం జనం మారుతున్నారనడానికి నిదర్శనమా? చెప్పలేం. కానీ ఒక ఆశ కలుగుతోంది. కొత్తకు మార్గాలు తెరుచుకుంటున్నాయని ఆశ కలుగుతోంది. ‘కంచె’ ఆడితే కొత్త భావాలు, కొత్త వస్తువులతో తెలుగు సినిమాలు వస్తాయనే ఆశ కలుగుతోంది. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుం’, ‘కంచె’ వంటి సినిమాలు తీసిన క్రిష్ వంటి దర్శకుల అవసరం ఇవాళ తెలుగు సినిమాకు ఎంతైనా ఉంది. ఫార్ములా కంచెలు దాటుకొని కొత్త ప్రయోగాలతో, కొత్త నిర్వచనాలతో తెలుగు సినిమాకు అర్థంచెప్పే క్రిష్‌కు తోడుగా అనేకమంది దర్శకులు రావాల్సిన అవసరం చాలా చాలా ఉంది.
*

కొంత కాలం …కొంత కాలం …కాలమాగిపోవాలి

 

-శ్రీపతి పండితారాధ్యుల దత్తమాల

~

 

sp dattamalaకొంత కాలం …కొంత కాలం …కాలమాగిపోవాలి

నిన్న కాలం …మొన్న కాలం… రేపు కూడ రావాలి

ఒక ప్రేమికురాలు మనసు  పొంగి  పాడుకునే పాట.

ఇలాంటిదే, కాలానికి ఉన్న విలువను తెలుపుతూ, కాకపోతే  విషాద గీతం ఉంది.

జాలాది రాజారావు గారు  వ్రాసారు.

1976 లో విజయనిర్మల దర్శకత్వం వహించిన   “దేవుడే గెలిచాడు” సినిమాకు   రాసిన  పాట.

పల్లెసీమ కోసం వ్రాసిన “చూరట్టుకు జారతాది సిటుక్కు సిటుక్కు వాన చుక్క ” మొదటి పాటైతే ,ఇది  జాలాదిగారి రెండో పాట.

లిరిక్స్ వింటుంటే మాట పడిపోతుంది.

పాట సందర్భం అలాంటిది మరి …

నేను ఇద్దరు ప్రేమికులు  మాట్లాడుకోవడం చెవులారా విన్నాను …ఇలా

అతను : ఉన్నావా ? పోయావా ?

ఆమె : అదేంటి అలా అంటావ్? జస్ట్ ఒక వారమే కదా మాట్లాడలేదు.

అతను : అంతే కాంటాక్ట్ లో  లేకపోతే ఉన్నా… పోయినట్టే నాకు

 

అలాంటిది …చనిపోతున్నానని, తన వాడితో కలిసి బ్రతకనని  తెలిసిన ప్రియురాలి మానసిక క్షోభ ఎలా ఉంటుందో

ఈ పాటలో మనసు  పిండి పిండి  రాసారు.

సుశీలగారైతే చెప్పకర్లేదు .ఆవిడే  ఆ బాధంతా అనుభవించారా అన్నట్టు పాడారు.

ఇలా సాగుతుంది పాట ….

ఈ  కాలం పదికాలాలు బ్రతకాలని…ఆ బ్రతుకులో  నీవు, నేను  మిగలాలని…

చెరి సగాల భావనతో, యుగ యుగాల దీవెనతో రేపు,మాపులాగా కలిసిఉందాము …కరిగిపోదాము …కరిగిపోదాము

నాలో…నీలో…నాలో నీలో ….నువ్వు  నేనుగా  మిగిలి పాడతాను…

పాడి ఆడతాను …

నిన్నటి లో నిజం  లాగనే,  రేపు తీపిగా ఉంటె, ఆ తీపి గుండె రాపిడిలో ఊపిరిగా మిగిలుంటే,

చావని కోరిక లాగే…. పుడుతుంటాము

తిరిగి పుట్టి చావకుండ… బ్రతికుంటాము

నా జన్మకు ప్రాణం  నీవై

నీ ప్రాణికి ఆత్మను నేనై

కాలానికి ఋతువు నీవై, తిరుగాడే వలయం నేనై

ఎన్ని తరాలైనా … మరెన్ని యుగాలైనా…

వీడని బంధాలై… కావ్యపు గంధాలై….

నాలో…నీలో…నాలో నీలో ….నువ్వు  నేనుగా  మిగిలి పాడతాను

ఈ  కాలం పదికాలాలు బ్రతకాలని,ఆ బ్రతుకులో  నీవు, నేను  మిగలాలని..

 

పాట లింక్

http://www.allbestsongs.com/telugu_songs/telugu-Movie-Songs.php?st=3092

 

 

 

త్రాసు సరే, కత్తి మాటేమిటి?!

మోహన్ రావిపాటి 

~

mohan“మనందరం న్యాయదేవత చేతిలో ఉన్న త్రాసు నే చూస్తున్నాం, కానీ రెండవ చేతిలో ఉన్న కత్తిని ఎవరూ చూడటం లేదు, ఆ కత్తి మీద దుమ్ము పట్టుంది, ఆ దుమ్ము దులిపి ఆ కత్తికి పదును పెట్టాలి ” తల్వార్ సినిమాలో ఒక డైలాగ్. నిజమే బాగా దుమ్ము పట్టింది, ఆ కత్తిని పదును పెట్టాల్సిందే.

కానీ , న్యాయదేవత చేతిలో త్రాసుకు ఎలా ఎటూ మొగ్గు చూపకుండా ఉండగలదో, రెండో చేతిలోని కత్తి అలా ఉండలేదు, ఆ కత్తి కి రెండు వైపులు ఉంటాయి, ఆ రెండువైపులా పదును ఉంటుంది. ఆ పదునుకు కుత్తుకలు రాలిపడతాయి. తెగే కుత్తుకలన్నీ నేరస్తులవే కాకపోవచ్చు, కావచ్చు. కళ్ళు మూసుకొని కత్తి ఝలిపించే న్యాయదేవతచేతిలో తెగిపడిన తలదే నేరం అని మన న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. అతదే నేరస్తుడు అని సమాజం  భావిస్తుంది  . కానీ కత్తి కొయ్యాల్సిన కుత్తుకనే కోసిందా !!!??!!! ….ఏమో న్యాయదేవతతో సహా ఎవ్వరికీ తెలియదు.. తెలిసే అవకాశమూ లేదు.

2008 లో ఆరుషి హత్య కేసు సృష్టించిన సంచలనం అంతా, ఇంతా కాదు. అప్పట్లో దేశం మొత్తం ఆ కేసు గురించే చర్చించుకుంది. మీడియా అదే వార్తను పదే పదేచుపించింది. ఒక్కోసారి అత్యుత్సాహం చూపించి తనే దర్యాప్తు చేసింది, తీర్పు ఇచ్చింది. ప్రారంభంలో పొలిసులు చేసిన దర్యాప్తు ప్రకారం నేరస్తులు ఆరుషి తల్లిదండ్రులు అయితే, సి.బి.ఐ వారి దర్యాప్తు ప్రకారం నేరస్తులు ఆరుషి తల్లిదండ్రుల క్లినిక్ లో పని చేసే కృష్ణ అతని స్నేహితులు. తిరిగి సి.బి.ఐ దర్యాప్తు మరొసారి చేస్తే ఈ సారి నేరస్తులుమొదట పోలీసులు దర్యాప్తులో ఆరుషి తల్లి దండ్రులు . అన్నిటికీ ఋజువులు ఉన్నాయి. కానీ శిక్ష ఆరుషి తల్లిదండ్రులు రాజేష్ తల్వార్, నూపుర్ తల్వార్ లకు అమలుఅయ్యింది. ప్రస్తుతం వారు జైలు శిక్ష అనుభవిస్తున్నారు . దీన్ని ఆధారంగా చేసుకొని రూపొందిన చిత్రం “తల్వార్”

ఒకరోజు ఉదయం గుర్గావ్ లోని ఒక అపార్ట్మెంట్ లో శ్రుతి( ఆయేషా పర్వీన్) హర్యకు గురి అవుతుంది. శృతి తన తల్లి నూపూర్ తల్వార్ ( కొంకణాసేన్ ) తండ్రి రమేష్ టాండన్( నీరజ్ కబి) తో కలిసి నివసిస్తూ ఉంటుంది. ఇనస్పెక్టర్ ధనిరాం ( గజరాజ్ రావ్) ఆధ్వర్యంలొ కేసు దర్యాప్తు సాగుతూ ఉంటుంది. మొదటగా వారి ఇంటిలో పనిచెసే కెంఫాల్ నిఅందరూ అనుమానిస్తారు, కానీ విచిత్రంగా మరుసటి రోజు కెంఫాల్ కూడా పైన లిఫ్ట్ రూం లో శవం గా కనిపిస్తాడు, పొస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం రెండు హత్యలు కొంచెం అటుఇటుగా ఒకే సమయంలో జరిగిఉంటాయి, దానితో కేసు మలుపు తిరుగుతుంది. పోలీసులు శృతి తల్లిదండ్రులు నూపుర్, రమేష్ ని అనుమానిస్తారు. శృతి,కెంఫాల్ మధ్యలైంగిక సంబంధం  ఉంది అని దాన్ని చూసిన తండ్రి వాళ్ళిద్దరినీ చంపేశాడు అని, దానికి తల్లి సహకరించింది అన్న అభియోగం నమోదు అవుతుంది, దానికి రమేష్ క్లినిక్ లోపని చేసే  కన్నయ్య (సుమిత్ గులాటి)  చెప్పిన విషయాలు సాక్ష్యాలుగా సమర్పిస్తారు. కానీ కోర్ట్ ఆ ఆధారాలతో తృప్తి చెందదు. కేసు తీవ్రత దృష్ట్యా దాన్ని సెంట్రల్ డిపార్ట్మెంట్ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సి.డి.ఐ) కి అప్పగిస్తుంది. సి.డి.ఐ హెడ్ ( ప్రకాష్ బేలవాడి) ఆ కేసు బాధ్యత అశ్విన్ కుమార్ ( ఇర్ఫాన్ ఖాన్) కు అప్పగిస్తాడు. అశ్విన్ ఆ కేసును తిరిగిదర్యాప్తు చేస్తాడు. పోలీసులు ఇచ్చిన ఆధారాలు, తీసుకువచ్చిన సాక్ష్యాలు అన్ని తప్పుడువని, అసలు శృతిని , కెంఫాల్ ని చంపింది, రమేష్ క్లినిక్ లో పనిచేసి, తప్పుడుసాక్ష్యం ద్వారా రమేష్ ని, నూపూర్ ని నేరస్తులగా చిత్రీకరించిన కన్నయ్య  అతని స్నేహితుడు  అని, అతను కెంఫాల్ కి కూడా స్నేహితుడు అని , కెంఫాల్ కొసం వచ్చి మధ్యమత్తులో శృతిని చంపి, ఆ విషయం బయటకు వస్తే  ప్రమాదం అని కెంఫాల్ ని కూడా చంపాడు అని తేలుతుంది.

ఇదే సమయంలో సి.డి.ఐ లో పాత డైరెక్టర్ రిటైర్ అయ్యి కొత్త డిరెక్టర్ ( శిశిర్ శర్మ) పదవీ బాధ్యతలు స్వీకరిస్తాడు. ఇన్వెస్టిగేట్ పూర్తి చేసిన శశి సాక్ష్యులను బెదిరించి సాక్ష్యంచెప్పించాడు అనే అభియోగం రావటంతో శశి ని ఆ బాధ్యతలనుండి తప్పించి మరో అధికారికి (అతుల్ కుమార్) కి అప్పగిస్తాడు, అతుల్ కుమార్ తిరిగి కెసు దర్యాప్తు చేస్తాడు.అతను సేకరించిన సాక్ష్యాధారాల ప్రకారం రమేష్, నూపుర్ లే ఆ హత్య చేశారు అనే నిర్ధారణకు వస్తాడు. దీనితో అధికారులంతా కలిసి, ఈ కేసుని ఏదో ఒక విధంగా ముగింపుపలకాలి అనే ఉద్దేశ్యంతో రమేష్, నూపుర్ కలిసి హత్య చేశారు అని ఉన్న ఆధారాలనే కోర్ట్ కు సమర్పిస్తారు, దాని ఆధారంగా కోర్ట్ వ్యతిరేక ఆధారాలు ఏమి లేవు కాబట్టివాళ్ళిద్దరికి శిక్ష విధిస్తుంది

ఇది స్థూలంగా కథ, ఇది అందరికి తెలిసిన కథే కాబట్టి కథలో దాపరికాలు ఏమి లేవు, కానీ దాన్ని తెరకెక్కించిన విధానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మేఘనా గుల్జార్ని ఈ విషయంలో అభినందించే తీరాలి.అందరికి తెలిసిన కథలో ఎలాంటి థ్రిల్లింగ్ పాయింట్స్ ఉండవు, తెలియని మలుపులు ఉండవు. అలాంటి కథతో ఒక క్రైం సినిమాతియ్యాలంటే చాలా కష్టం. కానీ దాన్ని మేఘనా గుల్జార్ దాదాపుగా  అధిగమించింది అనే చెప్పాలి. విశాల్ భరద్వాజ్ రచన దానికి చాలా వరకు కారణం అయ్యింది. ఇర్ఫాన్ ఖాన్ అధ్బుతమైన నటన మిగతా కారణం. తనదైన డార్క్ హ్యూమర్ తో సినిమా నడిపించాడు. విశాల్ భరద్వాజ్ సంగీతం కూడా సమకూర్చటంతో తన రచనకు ఎక్కడ ఎంత ఎమోషన్ లో ఎలా ఇవ్వాలో అలా పర్ఫెక్ట్ గా పలికించాడు. పంకజ్ కుమార్ కెమేరా పనితనం సూపర్బ్. ఎమోషన్స్ పలికించటంలో నటన, మ్యూజిక్, కెమేరా మూడు సరిగ్గాసరిపోతే ఎలా ఉంటుందో సినిమా సరిగ్గా అలా ఉంది.

సినిమా కథనంలో అకిరా కురుసోవా రూపొందించిన రోషోమొన్ ఛాయలు కనిపించినా, ఒక సంఘటనను ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పటం , అది ఈ సినిమాకు ప్లస్ పాయింటేఅయ్యింది కాని మైనస్ పాయింట్ కాలేదు. “టాబూ” పాత్ర మాత్రం నిరాశపర్చింది, టాబూలాంటి పొటేన్షియల్ ఆర్టిస్ట్ తో సినిమా కథకు సంబంధం లేని ఒక కారెక్టర్చేయించటం ద్వారా దర్శక నిర్మాతలు ఏమి చెప్పాలి అనుకున్నారో అర్ధం కాలేదు

చివరిగా “మనకు కనిపించేది న్యాయం కావచ్చు, కాకపొవచ్చు, కానీ న్యాయం గా మనకు న్యాయం అనిపించేది న్యాయమే అని అనుకోవటమే న్యాయం ”

*

కొంచెం చేదు..కొంచెం కారం…ఇంకొంచెం తీపి!

namkeen

 

-శ్రీపతి పండితారాధ్యుల దత్తమాల 

~

sp dattamalaయండమూరి వీరేంధ్రనాథ్  “నిశ్శబ్దం నీకు నాకు మధ్య” అనే  నవల్లో  “One Flew Over the Cuckoo’s Nest” అనే ఇంగ్లీష్ సినిమాను ఉద్దేశించి “అది మంచి సినిమా కాబట్టి జనం అట్టే లేరు “అంటారు. గుల్జార్ దర్శకత్వం వహించిన సినిమాలకూ  ఈ మాట  వర్తిస్తుంది. ఎన్నో అవార్డ్స్ వరించినా కమర్షియల్  సక్సెస్ రాలేదు.అలాంటిదే “నమ్కీన్ ” …గుల్జార్  దర్శకత్వంలో వచ్చిన హిందీ సినిమా. బెంగాలీ రచయిత సమరేష్ బాబు వ్రాసిన  “అకాల్ బసంత్ “కథ  ఆధారంగా తీసిన సినిమా.

సమరేష్ బాబు కథలు కొన్ని సినిమాలుగా వచ్చాయి. నేను కొన్ని చూసాను. గౌతం ఘోష్ తీసిన పార్, గుల్జార్ తీసిన కితాబ్ ,నమ్కీన్. తపన్ సిన్హా, మృణాల్ సేన్, బసు చటర్జీ   మొదలైన  వారందరు సమరేష్ బాబు కథలను సినిమాలుగా తీసారు.ఇక ” నమ్కీన్” సినిమా విషయానికి వస్తే దీనికి దర్శకత్వం , స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ,పాటలు  అన్ని గుల్జారే. నటీ నటులు   అందరు ఉద్దండులె.సంజీవ్  కుమార్,వహీదా రెహమాన్, షర్మిల టాగోర్ ,షబానా అజ్మి,కిరణ్ వైరాలె. ఎవరికెవరు తీసిపోరు అన్నట్టు   నటించారు.

కొండప్రాంతంలో నివసించే  తల్లి,ముగ్గురు కూతుర్లు వారి ఇంట్లో కొద్ది నెలలు అద్దెకు ఉండే  బాటసారి కథ ఇది. ఇల్లు గడవడానికి తమ వంతుగా కష్టపడే వ్యక్తిత్వం ఉన్నవారు.గుల్జార్ ఒక రైటర్ కాబట్టి ఆ కోణం నుంచి చూసానో లేక సన్నివేశాల చిత్రీకరణ వల్లనో   … పుస్తకం చదివినట్టు అనిపించింది.కాలక్షేపానికి సినిమా  చూసినపుడు రాని డౌట్స్ రాసేప్పుడు వచ్చాయి. ఉదాహరణకి .. చిత్రంలో షర్మిల టాగోర్ (పెద్ద కూతురు ,పేరు నిమ్కి ) రోజు రాత్రి బావి గట్టు దగ్గర స్నానం చేస్తుంది. ఇలా రెండు మూడు సందర్భాల్లో వస్తుంది ఆ ప్రస్తావన. రాత్రి పూటే ఎందుకు చేస్తుంది అనుకున్నాను. రోజంతా పని వత్తిడో   లేక  పగలు స్నానం చేసే వసతి(చాటు ) ఇంట్లో లేదేమో, రాత్రి అయితే చీకట్లో ఎవరికీ కనిపించదు అందుకే చేస్తుందేమో అనుకున్నాను. అలా అయితే ఇంట్లోని  అందరూ  రాత్రే చెయ్యాలి. అలా కాకుండా తను మట్టుకే ఎందుకు చేస్తుంది అని.పుస్తకములో అయితే వివరణ ఉంటుంది. కాని సినిమా కాబట్టి మనమే రాబట్టుకోవాలి,  కుతూహలం ఉంటె, లేదా వదిలెయ్యొచ్చు.  మళ్ళీ చూసాను ఒక్క సీన్ ,డైలాగ్ మిస్ అవ్వకుండ…ఒకసారి  తల్లి గొణుగుతుంది పెద్ద కూతురి గురించి “ఏదో ఒకరోజు  బావిలో పడి చస్తుంది”…అప్పుడర్దమయ్యింది  రాత్రిపూట బావి దగ్గర స్నానం చెయ్యడం తనకు సరదా అని. ఎలా అంటే “నీ సరదా ఎప్పుడో కొంప ముంచుతుంది” అంటూ మన సన్నిహితులు చనువుగా హెచ్చరించడం వింటూనే ఉంటాము.

సినిమా  హీరో సంజీవ్ కుమార్(గేరులాల్). మామూలు  సగటు మనిషి .పెద్దగా గొప్పదనాన్ని ఆపాదించలేము.  ట్రక్ డ్రైవర్. కష్టాల్లో ఉన్న హీరోయిన్  షర్మిల టాగోర్ కుటుంబానికి  ఎలాంటి చెప్పుకోదగ్గ ఆసరా ఇవ్వడు.దర్శకులు గుల్జార్ ఈ స్పృహ మనకు ఎప్పుడు  కలిగిస్తారు అంటే సినిమా ఆఖరులో షర్మిల టాగోర్ చిన్న చెల్లెలుగా నటించిన  కిరణ్ వైరాలే ( చింకి )తో చెప్పిస్తారు.”మా కోసం ఏమి చేసావని ?ఇంటికి కావాల్సిన  పప్పు ,బియ్యం, కూరగాయలు తేవడం తప్ప ఇంకేమి  చేసావు?మా అక్కను పెళ్లి  చేసుకోమన్నాను.  చేసుకున్నావా ?” అంటూ నిష్టూరాలాడుతుంది . అప్పుడు గాని మనకు అనిపించదు ఏమి చెయ్యలేదని. ఆ మాట కొస్తే చెయ్యాల్సిన అవసరం కూడా లేదు. హీరో అనగానే అందర్నీ ఉద్దరించాలంటే ఎలా? వర్తమాన విషయాల మీద  కూడా సరయిన అవగాహన ఉండదు. ఉదాహరణకు : డబ్బులు మనీ ఆర్డర్ చెయ్యకుండా కవర్ లో పెట్టి పంపిస్తాడు.

వహీదా రెహమాన్ తల్లిగా నటించింది.పేరు జ్యోతి. పూర్వాశ్రమంలో జుగ్ని పేరుతో నాటకాల్లో నర్తిస్తుంది. అక్కడ సారంగి వాయించే వాడిని ప్రేమించి, పెళ్లి చేసుకొని ముగ్గురు ఆడపిల్లలకు తల్లి అవుతుంది. అలసిపోతుంది.తన పిల్లలు అలా బ్రతకకూడదని,భర్త నుంచి దూరంగా వచ్చి బ్రతుకుతుంది.వీళ్ళు వంటల్లో వేసే మసాల పొడులు తయారు చేసి ఆ ఊర్లోనే ఉన్న దుకాణాదారుడుకి అమ్మి జీవితం సాగిస్తారు.  ఈ దుకాణాదారుడి పేరు దనీరాం. ఈ కుటుంబ ఆర్ధిక పరిస్థితి చూసి, సరైన వసతులు లేకపోయినా తన మాట చాకచక్యం,హాస్య చతురతతో  గేరులాల్ కి వీళ్ళింట్లో, అద్దెకు ఉండే ఏర్పాటు చేస్తాడు. ఈ కాలంలో  ఇదొక వ్యాపారం. ఏజెంట్స్ ఇరు పార్టీల నుంచి కమిషన్ తీసుకుంటున్నారు. కాని ఒకప్పుడు  ఎలాంటి ధనాపేక్ష లేకుండ సహాయం చేసి,వారి  తిట్లు కూడా భరించేవారు.అందరి గురించి ఆరాలు తియ్యడం,సానుభూతి చూపించడం, ఆడవాళ్ళని అవహేళన చెయ్యడం,  ఆడవాళ్ళ పోట్లాటలు, ఇలా ఊరంటే ఎలా ఉంటుంది అనే సమగ్ర చిత్రీకరణకు సంబంధించిన   సన్నివేశాలను  ఏది వదలలేదు గుల్జార్.

ఈ చిత్రంలో వహీదా రెహమాన్ నటన తారాస్థాయికి చేరింది.వృద్దాప్యం వల్ల మతిమరుపుతో జనాలను గుర్తుపట్టక పోవడం, గుర్తు పట్టిన వెంటనే దేనికో తిట్టడం, అవసరాన్ని బట్టి తెలివిగా మాట్లాడ్డం,పిల్లల్ని అదుపులో పెట్టడం ఇలా బహుముఖ పాత్రలు… అతి సహజంగా పోషించింది .మళ్ళి మళ్ళి చూడాలనిపిస్తుంది.అవసరం లౌక్యాన్ని  నేర్పుతుందేమో .  ఇంటికి అద్దెకు వచ్చిన గేరులాల్ ని అడుగుతుంది. భోజనము ఎక్కడ చేస్తావని, ఎక్కడో బయట హోటల్ లో తినేబదులు, ఆ డబ్బేదో తమకే ఇస్తే ఇల్లు గడుస్తుందని.మర్నాడు సంజీవ్ కుమార్ ని చూసి “ఎవరు నువ్వు? నా ఇంట్లో ఎందుకున్నావు?” అని గద్దిస్తుంది.గుర్తుకొచ్చాక వెంటనే, ఏమైనా తిన్నావా ? అని తల్లి లా అడుగుతుంది.”లేదు ” అంటే “తినేసి వెళ్ళు ఖాళికడుపుతో వెళ్ళకూడదు” అంటుంది . “సరే ” అనగానే వెంటనే, “ఇక్కడ ఏది ఉచితంగా దొరకదు,డబ్బు  పెట్టి వెళ్ళు ” అంటుంది. మళ్ళీ  వెంటనే “నా దగ్గర ఉంటె నీకు ఊరికే పెట్టేదాన్ని ఏమి అనుకోకు” అంటుంది .ఇలా వెంట వెంటనే రకరకాల హావభావాలతో , “అపరిచితుడు”లో  విక్రం గుర్తొస్తాడు.

షర్మిలా  టాగోర్ నటన అందరికి తెలిసిందే.ఆ మాట తీరు,పొందిక ఎవరికి రాదు. మాటలతో మెత్తగా కొడుతుంది. తిరిగి ఎదురు చెప్పకుండా అలా అని పోట్లాడినట్టూ ఉండదు. పాపం గేరులాల్ కి  వీళ్ళింట్లో సరైన వసతులు ఉండవు. పాడుపడిన ఇల్లు, కొత్త ఊరిలో దొరకాల్సిన స్వాగతం , స్నేహం లేక మొదటి రోజు ఆ కోపం,తిక్క వీళ్ళ మీద చూపిస్తాడు.కాని రెండో రోజుకి నెమ్మదిస్తాడు. “ఇష్టం లేకపోతే ఇచ్చిన అద్దె తీసుకొని వెళ్ళిపో” అంటుంది నిమ్కి. “ఎదో మొదటి రోజు కదా అందుకే అలా చేశాను ” అంటాడు . అప్పుడు  “మాకు కూడా నీతో మొదటి రోజే కదా.” అంటుంది.

తర్వాత చెప్పుకోవాల్సింది షబానా ఆజ్మి గురించి(మిట్టు). రెండో కూతురు.చాల తెలివయినది. సంజీవ్ కుమార్ని  ప్రేమిస్తుంది. అది  హీరోకి ,ప్రేక్షకులకు తెలిసేది ఎలా?మిగతా సినిమాల్లా  అద్దం ముందు నిల్చొని తనలో తానూ  లేదా తన ఆత్మతో మాట్లాడడం లాంటి సీన్స్ లేకుండ ఇంకోలా చూపిస్తారు గుల్జార్. ఇంటికి  ఒక ఉత్తరం రాస్తూ,తనకి పెద్ద కూతురైన నిమ్కి నచ్చిందంటూ రాసి , ఉత్తరం అక్కడే మర్చిపోతాడు. మళ్ళి వచ్చి చూస్తే నిమ్కి స్థానం లో మిట్టు అని రాసి  ఉంటుంది. మిట్టు తనని ప్రేమిస్తుంది అని  గర్వంగా నవ్వుకుంటాడు. తర్వాత  గదిలోకి ఎవరు వచ్చారని? నీకు మాటలు రావా? అని మిట్టుని గద్దించి అడుగుతాడు. ఏడుస్తూ వెళ్ళిపోతుంది. మనకూ ఇప్పుడే  తెలుస్తుంది మిట్టు మూగదని.ఆశ్చర్యం వేస్తుంది .అంతవరకు మనకు అస్సలు అనుమానం రాదు.అక్క, చెల్లెలు గురించి  చెప్తూ  “ఏది చేసినా ఎక్కువే చేస్తుంది. నవ్వు,కోపం,సంతోషం ఇలా అన్ని ఉన్నాయ్ ఒక్క పిచ్చి తప్పించి” అంటుంది. యే అశుభ గడియలో అంటుందో కాని, పాపం పిచ్చితోనే ఆత్మహత్య చేసుకుంటుంది.  మిట్టు కవితలు రాస్తుంది అని కూడా తెలుస్తుంది.

మిట్టు రాసిన  కవితే సినిమాలో ఒక పాట. మంచి ఆణిముత్యం. ఆర్డీ బర్మన్ సంగీతము. ఆశా భోంస్లే  గళంలోంచి జారిన అమృతధార అని చెప్పొచ్చు. ఇదీ గుల్జార్ విరచితమే కొన్ని కొన్ని గుల్జార్ వల్లే అవుతాయేమో అనిపిస్తుంది, ఎందుకంటే సినిమా చూడకుండ పాట వింటే అర్ధం ఒకలా తోస్తుంది.అదే సినిమా చూసి, పాట వింటే అర్ధం ఇంకోలా ఉంటుంది.యే విధంగా విన్నా బాగుంటుంది.  ఈ సం(గీతం)  ప్రేక్షకులకు వీనులవిందు అని చెప్పొచ్చు.

సరదా,సంతోషాలు  డబ్బుతో వచ్చేవి  కావు,  చుట్టూ నలుగురు ఉంటె చాలేమో అనిపిస్తుంది ఒక సీన్ చూస్తే. వాకిట్లో కళ్ళాపి పచ్చిగా ఉండడంతో నలుగురు అందులో  జారిపడి కాస్సేపు సరదాగా నవ్వుకునే సన్నివేశాలు ఉంటాయి.

అదేంటో ఏది ఎక్కువసేపు ఉండదు సినిమాలో , జీవితంలా    …సంజీవ్ కుమార్, ట్రక్ డ్రైవర్ కాబట్టి ఇంకో ఊరు వెళ్ళాల్సి వస్తుంది. తన ప్రేమ విషయం బయట పెడతాడు నిమ్కి దగ్గర. ఇక్కడ తెలుస్తుంది ఉత్తరంలో నిమ్కి బదులు మిట్టు అని మార్చింది నిమ్కి అని. చెల్లెల్ని(మిట్టు) చేసుకోమంటే  ఒప్పుకోడు. తన అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోతాడు. రోడ్డు మీదే రోజులు గడుస్తాయి అనే అర్ధం వచ్చే పాట ఒకటి ఉంటుంది. బండి అన్నాక ఎక్కడో ఒకచోట ఆపాల్సిందే. వినోదం చూడాల్సిందే. వినోదం కాస్త విషాదం అవుతుంది. చిన్న చెల్లెలు చింకి నాటకంలో గంతులేస్తూ కనిపిస్తుంది.  తల్లి ఏదైతే తన పిల్లలు కాకూడదు అనుకుంటుందో అదే అవుతుంది.  గుండె ఆగినంత పనవుతుంది. తిడదామని వెళ్తే తానే మాటలు పడాల్సివస్తుంది. తిరిగి అనడానికి ఏమి ఉండదు.మళ్ళీ ఆ ఊరు వెళతాడు.ఇంకో విషాదం మూటగట్టుకోడానికి. రెండో చెల్లెలు మిట్టు మతి చెడి,  కొండపైనుంచి దూకి చనిపోతుందని  తెలుస్తుంది .

Shakespeare,  Mid Summer Night’s Dream లో  Thesues అనే ఒక పాత్ర ద్వారా “The lunatic, the lover, and the poet are of imagination all compact”. అని చెప్పిస్తారు.పిచ్చివాడు, ప్రేమికుడు,కవి ….వీరందరు వారి వారి ఊహాజనితమైన లోకంలో విహరిస్తూ ఉంటారు. ఇక మిట్టు అంటే షబానా అజ్మి విషయానికి వస్తే కవితలు రాస్తుంది. తర్వాత ఆమెలో ప్రేమ జనిస్తుంది. ఆఖరికి పిచ్చిదవుతుంది. పైన పేర్కొన్న ముగ్గురు ఈమెలో ఉన్నారు.ఒకటి ఉంటేనే తట్టుకోవడం కష్టం మరి మూడంటే …మూడినట్టే కదా!  సంజీవ్ కుమార్ ని ప్రేమించిందని,దాని వల్లే పిచ్చిది  అయ్యిందని  ఇంట్లో ఎవరికీ తెలియదు, చూసే మనకు తప్ప. తల్లి మంచం పట్టి కొద్దిరోజులకు చనిపోతుంది.ఇల్లు విడిచిన చిన్నచెల్లెలు ఎప్పుడైనా రాకపోతుందా అని నిమ్కి ఒక్కతే ఆ పాడుపడిన ఇంట్లో ఉంటుంది.ఆఖరుకి  గేరులాల్ ,నిమ్కి ఒక్కటవుతారు. పెళ్లి వయసు దాటిన తర్వాత ఒక్కటయ్యారు కాబట్టి “అకాల్ బసంత్ “అని కథకు  పేరు పెట్టి ఉంటారు సమరేష్ బాబు.

ఒకే విషయాన్ని ఎన్ని కోణాల నుంచైనా చూడొచ్చు.ఉప్పు,తీపి ,కారం వగైరా రుచులతో చేసే ఒక రకమైన పలహారాన్ని నమ్కీన్ అంటారు. ఇంకా చెప్పాలంటే చుడువ, కార, ఇలా చాలా  పేర్లు ఉన్నాయ్.ముగ్గురు అక్కాచెల్లెళ్ళ స్వభావాలకు తగ్గట్టు పేర్లు  అంటే   నిమ్కి అంటే ఉప్పు ,మిట్టు అంటే తీపి, చింకి అంటే కారం…మొత్తం కలిపితే “నమ్కీన్ “, ఇదే గుల్జార్  సినిమా కథ.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 మరణానికి చిరునామా ఈ ‘డెత్ నోట్’    

 

భవాని ఫణి 

 

bhavaniphaniఅనుకోకుండా మీకో పుస్తకం దొరికిందనుకోండి . అందులో ఎవరి పేరు రాస్తే వాళ్లు చనిపోతారని కూడా తెలిసిందనుకోండి . అప్పుడు  మీరేం చేస్తారు?  ఏం చెయ్యాలన్న ఆలోచన మాట అటుంచి అసలు అటువంటి పుస్తకం ఒకటుంటుందన్నఊహ కూడా మనకి రావడం కష్టం కదూ! అటువంటి ఒక విచిత్రమైన ఆలోచనకి దృశ్య రూపమే ‘డెత్ నోట్’

ఒటాకూ (Otaku ) అన్న పదం ఎప్పుడైనా విన్నారా ? పోనీ ‘మాంగా’ అన్న పదం? యానిమే అన్న పదం మాత్రం ఖచ్చితంగా విని ఉంటారు . ఇంట్లో ఓ మాదిరి వయసున్న  పిల్లలుంటే ఈ పదాలు వినడం సర్వ సాధారణం  . మరీ చిన్నపిల్లలున్న ఇంట్లో అయితే ఎప్పుడు చూసినా డోరేమన్, నోబితాల కబుర్లు  వినిపిస్తూనే ఉంటాయి కూడా .

జపాన్ లో ప్రచురితమయ్యే కామిక్స్ ని ‘మాంగా’ అని పిలుస్తారనీ,  అలాగే అక్కడ నిర్మించబడే యానిమేటెడ్ చిత్రాలని ‘యానిమే’ అంటారనీ  చాలా మందికి తెలిసే ఉంటుంది . ఎక్కువగా ఆదరణ పొందిన మాంగాలు, యానిమేలుగా  కూడా నిర్మితమవుతాయి . ఈ యానిమేలలో చాలా ప్రక్రియలు (జెనెరె )ఉన్నాయి. అన్ని వయసుల  వారికోసం మాంగాలు వ్రాయబడతాయి . యానిమేలు నిర్మింపబడతాయి  .

వాటిలో ముఖ్యంగా యుక్త వయసులో అడుగు పెట్టిన , పెట్టబోతున్న  పిల్లల కోసం వ్రాసినవీ, తీసినవీ చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్దబడతాయి . అటువంటి ఒక యానిమే గురించే ఇప్పుడు  చెప్పబోతున్నది . దాని పేరు “డెత్ నోట్ “. ఇది ముందు ‘మాంగా’ గా  ప్రచురింపబడింది .   Tsugumi Ohba అనే ఆయన ఈ మాంగా రాసారు . తర్వాత ఇది యానిమేగా కూడా రూపొందించబడి , మంచి ప్రాచుర్యం పొందింది . దీనిలో కొన్ని హింసాత్మకమైన అంశాలున్నాయన్న విషయాన్ని కొంచెం పక్కన పెడితే , ఇంత శక్తివంతమైన, మేధతో కూడిన మైండ్ గేమ్స్ నీ, ఎత్తుల్నీ, పైఎత్తుల్నీ మరెక్కడా చూడలేమంటే అతిశయోక్తి  కాదు . 37 ఎపిసోడ్ లున్న ఈ యానిమే సిరీస్, జపాన్ లోని నిప్పాన్ టీవీలో 2006 లో ప్రసారమైంది .

విజ్ఞానాన్నీ ,తెలివితేటల్నీ మంచికోసం వాడితే ఎంత ఉపయోగకరమో , చెడుకి ఉపయోగిస్తే అంత ప్రమాదకరమన్న విషయం అందరికీ తెలిసిందే  . డెత్ నోట్ ఇతివృత్తం అదే .

death note book

లైట్ యాగామీ అనే పదేహేడేళ్ల అబ్బాయి చాలా తెలివైనవాడు. వయసుకి మించిన పరిపక్వత కారణంగా అతనికి జీవితం నిస్సారంగా అనిపిస్తూ ఉంటుంది . అదే సమయంలో షినిగామీ (మరణ దేవత) ల లోకం నుండి జారి పడిన ఒక పుస్తకం లైట్ కి దొరుకుంతుంది. ఆ పుస్తకంలో ఎవరి పేరు రాస్తే వాళ్లు చనిపోతారు . ఒకే పేరు ఎక్కువ మందికి ఉండే అవకాశం ఉండటం వల్ల, ఆ వ్యక్తి ముఖాన్ని  చూసిన తర్వాత అది గుర్తు తెచ్చుకుని పేరు రాస్తేనే అతని మరణం సంభవిస్తుంది . షినిగామీలు ప్రపంచంలోని అందరి మరణాన్నీ నిర్దేశించలేరు . కానీ డెత్ నోట్ ని ఉపయోగించి కొందరి మరణాన్ని ముందుకు జరపడం ద్వారా తమ ఆయుష్షుని పొడిగించుకోగలరు . అటువంటి ఒక పుస్తకాన్ని సరదా కోసం ఒక షినిగామీ భూలోకంలో పడేస్తాడు . అదే లైట్ యాగామీకి దొరుకుతుంది . నిరాసక్తమైన జీవితాన్ని గడుపుతున్న లైట్ , ఆ పుస్తకం నిజంగా శక్తి కలదని తెలుసుకుని ఉత్తేజాన్ని పొందుతాడు . ఆ పుస్తకాన్ని ఉపయోగించి దేశంలో నేరస్తులందరినీ  చంపి , తద్వారా నేర వ్యవస్థని సమూలంగా నాశనం చెయ్యాలని నిర్ణయించుకుంటాడు .

టీవీలో కనిపించే నేరగాళ్ల  పేర్లతో ఒక జాబితా సిద్ధం చేసుకుని వాళ్లందరినీ చంపేస్తూ ఉంటాడు . అతని తండ్రి పోలీస్ అధికారి కావడం వల్ల అతనికి  నేరగాళ్లకి చెందిన మరింత సమాచారం లభిస్తూ ఉంటుంది . ఇలా ఎక్కువ రోజులు గడవకుండానే  ఏదో జరుగుతోందని ఇంటర్ పోల్ కి అనుమానం  కలగడంతో,   “ఎల్(L)” అనే ఒక అత్యంత ప్రతిభావంతుడైన  డిటెక్టివ్ ని రంగంలోకి దింపుతుంది . లైట్ మాత్రం , అభిమానులతో ‘కీరా’ అనే మారు పేరుతో పిలవబడుతూ  విపరీతమైన ప్రాచుర్యాన్ని పొందుతాడు .

లైట్ యాగామీనే ‘కీరా’ అన్న అనుమానం డిటెక్టివ్ ‘ఎల్’ కి మొదట్లోనే కలుగుతుంది . అతన్ని పక్కదోవ పట్టించడం  కోసం  ఇన్వెస్టిగేషన్ లో సహాయపడుతున్నట్టుగా నటిస్తాడు లైట్.

“ఎల్ ” పూర్తి  పేరు తెలియకపోవడం వల్ల అతడ్నిమాత్రం  ఏమీ చెయ్యలేకపోతాడు .ఆ సమయంలో లైట్ , ఎల్ లు ఉపయోగించే తెలివైన యుక్తులు , కుయుక్తులూ, పరస్పరం చేసుకునే మానసికమైన దాడులూ , ప్రతి దాడులూ చాలా మేధోవంతంగా  రచించబడి,రెప్ప వెయ్యనివ్వనంత ఉత్కంఠని రేకెత్తిస్తాయి.

డెత్ నోట్ అసలు యజమాని అయిన, ర్యూక్ అనే పేరుగల షినిగామీ  కూడా లైట్ దగ్గరకి వచ్చి అతని దగ్గరే ఉంటూ ఉంటాడు .  ఆ షినిగామీ,  లైట్ కి తప్ప వేరే వాళ్లకి కనిపించడు . ఇంతలో కీరా వీరాభిమాని అయిన ప్రఖ్యాత మోడల్ మీసా అనే అమ్మాయికి మరో డెత్ నోట్ దొరుకుంతుంది .

లైట్ నే కీరా అని తెలుసుకుని అతన్ని వెతుక్కుంటూ వస్తుంది . ఆ అమ్మాయికి తన మీదున్న అభిమానాన్ని అవకాశంగా తీసుకుని , ఆమెని కూడా కీలుబోమ్మని చేసి ఆడిస్తూ , తన ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటూ ఉంటాడు లైట్ . డెత్ నోట్ లో ఉన్న వివిధ రకాల నియమాలని తనకి అనుకూలంగా మార్చుకుని  తప్పించుకు తిరుగుతూ,  నేరగాళ్ల హత్యలు కొనసాగిస్తూనే ఉంటాడు . ఆఖరికి ప్రపంచాన్ని ఉద్దరించాలన్న అతని కోరిక, స్వీయ ఆరాధనగా మారి, అమాయకులని  సైతం చంపడంతో పాటుగా స్వంత తండ్రినీ , చెల్లెలినీ కూడా అంతం చెయ్యడానికి  వెనుకాడనంత క్రూరత్వంగా రూపాంతరం చెందుతుంది . ఎన్నో మలుపుల తర్వాత , చివరగా లైట్  మరణంతో కథ ముగుస్తుంది .

ఎటువంటి డిటెక్టివ్ కథ అయినా దీని ముందు దిగదుడుపే అనిపించేంత బిగువుగా అల్లబడిన కథే ఈ డెత్ నోట్ పాపులారిటీకి కారణం . ఇద్దరు మేధావుల మధ్య జరిగే ఈ దోబూచులాట ఊహించలేనన్ని మలుపులతో నిండి  ఆద్యంతం ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది . అన్ని పాత్రల స్వభావం , చిత్రీకరణ వాటి వాటి పరిధులలో ఎటువంటి లోటు పాట్లూ లేకుండా ,అత్యున్నతంగా తీర్చిదిద్దబడ్డాయి . అంతే కాక  డెత్ నోట్ నియమాలు విచిత్రంగా, చాలా ఆసక్తికరంగా ఉంటాయి . సంగీతం కూడా ఈ యానిమేకి గొప్ప బలం .

death note ryuk yagami light l 1280x800 wallpaper_www.wallpaperhi.com_55

మచ్చుకి కొన్ని డెత్ నోట్ నియమాలు 

  1. ఈ పుస్తకం లో పేరు రాయబడిన వ్యక్తి చనిపోతాడు
  2. చంపాలనుకునే వ్యక్తి ముఖాన్ని మనసులో ఊహించుకుని పేరు రాస్తేగానీ మరణంaug27 సంభవించదు .
  3. పేరు రాసిన నలభై సెకండ్ల లోపు , మరణానికి కారణం కూడా రాయాలి .
  4. మరణానికి కారణంకనుక పేర్కొనకపోతే, అదిహార్ట్ అటాక్ గా  తీసుకోబడుతుంది .
  5. డెత్ నోట్ కలిగి ఉన్నమనిషి, ఆ డెత్ నోట్ అసలు యజమాని అయిన షినిగామీకి చెందుతాడు .
  6. డెత్ నోట్ కలిగి ఉన్న మనిషి లేదా తాకినమాత్రమే ఆషినిగామీని చూడగలుగుతాడు . వినగలుగుతాడు
  7. డెత్ నోట్ ని వేరే మనిషికి పూర్తిగా ఇచ్చివేయడం గానీ , కొన్ని రోజుల పాటు ఇవ్వడం గానీ చెయ్యవచ్చు .
  8. ఒక వ్యక్తి డెత్ నోట్ నివేరే వాళ్లకి ఇచ్చి వేస్తే , దానికి సంబంధించిన విషయాలన్నీ మరచిపోతాడు .

………………………..

ఇటువంటి నియమాలు వంద పైనే ఉంటాయి . అవన్నీ చూడాలనుకుంటే ఇక్కడ చూడచ్చు .

http://deathnote-club.deviantart.com/art/All-Deathnote-Rules-116939019

 

 

ఇంతకీ “ఒటాకూ” అంటే చెప్పనేలేదు కదూ ,  ఏదైనా ఒక వ్యాపకానికి దాసోహం అయిన వ్యక్తిని జపనీస్ లో “ఒటాకూ” అని పిలుస్తారు . ముఖ్యంగా యానిమేలు చూడటానికి  అలవాటు పడిన వారికోసం ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు . ఒకసారి ఒటాకూగా మారి , వాటికి ఎడిక్ట్ అయితే  పిల్లలైనా పెద్దలైనా బయట పడటం కొంచెం కష్టమే .

అయినా సరే చూడాలనుకునేవారి కోసం డెత్ నోట్ మొదటి ఎపిసోడ్ లింక్ ఇదిగో

http://kissanime.com/Anime/Death-Note/Episode-001-Rebirth?id=93417

 

పాటకోసం చూశాను.. మాటలు వెంటాడాయి!

 

 నీరుకొండ అనూష

anushaనాకు ఏదైనా అనిపిస్తే బాధైనా, సంతోషమైనా సరే! ఎందుకో తెలియదు కానీ కారణాన్ని రాయాలనిపిస్తుంది. అలా రాతరూపంలో చూసుకుంటే ఏదో తెలియని సంతృప్తి. ఇలా ఏదో ఒకటి రాస్తూ ఉంటే.. రైటింగ్‌ స్కిల్స్‌ (రాత నైపుణ్యాలు) కూడా పెరుగుతాయనే ఉద్దేశం. అయితే కొద్ది కాలంగా ఏదో ఒకటి రాద్దామనుకున్నా.. ఏదో కారణంగా అది ఆగిపోవడమో, సగంలోనే ఆపేయడమో జరుగుతోంది. కానీ ఇప్పుడు కచ్చితంగా రాసితీరాలి అనే ఆలోచన కల్పించింది- ‘హమారీ అదూరీ కహానీ’ సినిమా.

మామూలుగా అయితే నేను సినిమా విశ్లేషకురాలిని కాదు. సాంకేతిక నైపుణ్యం, కథ ఇవన్నీ విశ్లేషించడమూ రాదు. ఒక సగటు ప్రేక్షకురాలినంతే! సినిమా నచ్చింది, నచ్చలేదు. ఫలానా చోట హీరో బాగా చేశాడు, లేదా ఫలానా ఆరిస్ట్‌ ఇలా చేసుంటే బాగుండేది వరకు మాత్రం చర్చించుకోగల పరిజ్ఞానం ఉందనుకుంటున్నా. అయితే ఈ సినిమా మాత్రం అక్కడితో ఆపేయాలనిపించలేదు. బహుశా ఎక్కువ అంశాలు నాకు నచ్చడమే కారణమేమో!

నాకు నచ్చిన అంశాలను చర్చించే ముందు స్థూలంగా కథను చూస్తే..

ఒక ముసలావిడ, పేరు వసుధ (విద్యాబాలన్‌) ఒక ప్రదేశంలో బస్సు  దిగడంతో  సినిమా మొదలవుతుంది. కొన్ని అడుగులు కష్టంగా వేసిన తరువాత పడిపోతుంది. తరువాత ఆమె చనిపోయినట్లుగా.. ఆమె అంత్యక్రియలు జరిగినట్లుగా చూపిస్తారు. మరోవైపు ఆమె భర్త హరి (రాజ్‌ కుమార్‌ యాదవ్‌) సైకియాట్రిస్ట్‌ దగ్గర తన భార్య తన దగ్గరకు వచ్చిందని.. ఏదో అడిగివెళ్లిపోయిందనీ చెబుతుంటాడు. ఆమె చనిపోయిన విషయాన్ని హరికి తెలియజేయడానికి అతని కోడలు తన దగ్గరకు వస్తుంది. ఆమె అస్తికలను తండ్రి చేతులమీదుగా నిమజ్జనం చేయించడం కొడుకుకు ఇష్టం ఉండదు. కానీ హరి మాత్రం ఆమె అస్థికలను దొంగిలించి, కొడుకు కోసం ఒక డైరీని వదిలిపెడతాడు. దీంతో కథ ప్లాష్‌బాక్‌ లోకి వెళుతుంది.

వసుధ ఒక హోటల్లో పూలు అమర్చే ఆవిడగా చేస్తుంటుంది. భర్త తనను వదిలేసి ఎక్కడికో వెళతాడు. కొడుకుతోపాటు ఆమె అతని కోసం అయిదేళ్లుగా ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆమెకు ఆరవ్‌ రూప్‌రెల్‌ (ఇమ్రాన్‌ హష్మి) పరిచయం అవుతాడు. అతను గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్‌కు యజమాని. ఆమె పని చేస్తున్న హోటల్‌ను కొనాలనుకుంటాడు. అందుకుగానూ అక్కడ పనిచేసేవారిని పరీక్షిస్తాడు. అప్పుడు వసుధ నిజాయతీ అతనికి నచ్చుతుంది. దీంతో ఆరవ్‌ తన దుబాయ్‌ లోని హోటల్లో పనిచేయడానికి ఆమెకు ఆఫర్‌ ఇస్తాడు. భర్త కోసం వేచిచూస్తున్నందువల్ల తను దానిని తిరస్కరిస్తుంది. అయినా ఆరవ్‌ ఆమె ఎప్పుడైనా ఈ ఆఫర్‌ను వాడుకోవచ్చని చెబుతాడు. సరిగా అపుడే పోలీసుల ద్వారా తన భర్త అయిదుగురు అమెరికన్‌ జర్నలిస్టులను చంపాడనీ, అతనో టెర్రరిస్టనీ తెలుస్తుంది. దీంతో కొడుకు భవిష్యత్తు కోసం దుబాయ్‌ వెళుతుంది. అక్కడ వసుధ, ఆరవ్‌ లు ప్రేమలో పడతారు. పెళ్లికూడా చేసుకోవాలనుకుంటున్న క్రమంలో తిరిగి హరి వచ్చేస్తాడు. తను నిర్దోషినని చెబుతాడు. వసుధ తన ప్రేమ కథను చెబుతుంది. వారిద్దరి మధ్య గొడవ జరుగుతున్నపుడు పోలీసులు హరిని అరెస్ట్‌ చేసి తీసుకెళతారు. హరి వసుధను ఎలాగైనా ఆరవ్ తో కలవకుండా చేయడం కోసం కోర్టులో నేరాన్ని తనపై వేసుకుంటాడు. కానీ అందరి ముందూ మాత్రం వసుధ ఆనందం కోసం ఈ పని చేస్తున్నట్టుగా చిత్రీకరిస్తాడు. అయితే వసుధ కోరిక మేరకు హరిని విడిపించడానికి ఆరవ్‌ ప్రయత్నిస్తాడు. అయితే హరిని ఆరవ్‌ విడిపిస్తాడా? చివరికి ఆరవ్‌, వసుధ కలుస్తారా అన్నది మిగిలిన కథ.

కథను ఈ విధంగా చూస్తే మాత్రం దీనిలో కొత్తగా ఏముందిలే అనిపిస్తుంది. కానీ చూపించిన విధానం, చెప్పిన విధానం కొత్తగా తోచాయి.

విద్యాబాలన్‌ జాతీయ అవార్డు గ్రహీత (డర్టీ పిక్చర్‌), మంచి నటి అని తెలుసు . అది కూడా వార్తా పత్రికల కథనాల ద్వారానే. ఆమె సినిమాలు నేను పెద్దగా చూడలేదు. డర్టీ పిక్చర్‌ కొద్దిగా మాత్రం చూశానంతే. అయితే వసుధగా ఆమె పాత్ర మాత్రం కంటనీరు తెప్పించకుండా ఉండదు. ఇక హీరో- ఇమ్రాన్‌ హష్మిపై నాకు అంత మంచి అభిప్రాయం కూడా లేదు (నటన విషయంగా). అందుకు ఆయన తీసిన సినిమాలే కారణమై ఉండొచ్చు. లేదా నటన కంటే వేరే అంశాలకే అతను ప్రసిద్ధమవడమూ కారణమవచ్చు. అయినా నేను ఈ సినిమాను చూడడానికి కారణం మాత్రం సినిమాలో ‘మై జానె యే వారు దూ..’ పాటే.

ఇక సినిమా విషయానికొస్తే.. మొదట ఆకట్టుకున్నది- పూలు అమర్చిన తరువాత హీరో మీకు మీ వృత్తిలో నచ్చనిది ఏది అని హీరోయిన్‌ను అడుగుతాడు. అపుడామె.. ‘పూలు చెట్లకు ఉన్నపుడే వాటికి అందం, వాటిని మనం సరిగా ఆస్వాదించేది కూడా అపుడే. వాటిని ఎవరి ఆనందం కోసమో, దేవుడి కోసమో తెంపడం నచ్చదు. కానీ ఈ వృత్తే నాకు అన్నం పెడుతోంది..’ అని చెబుతుంది. ఎంత నిజమో కదా!

తరువాత దుబాయ్‌లో.. హీరో ఒక గార్డెన్‌ ను చూపిస్తూ.. ‘దీనిని ఇంత అందంగా తీర్చిదిద్దినా ఏదో వెలితిగా ఉంది. దీనికేమైనా పరిష్కారం చెప్పగలవా?’ అని అడుగుతాడు. దానికి ఆమె..’ఇక్కడ చాలా అందమైన పూలున్నాయి. నిజమే.. కానీ, కృత్రిమతే దీనికి వెలితి. ఒక తోటైనా పూలైనా అందంగా కనిపించాలంటే సహజసిద్ధంగా ఉండాలి. దీనిలో అదే లోపించింది. మొక్క అన్నాక ఎండిన ఆకులు, పూలుండడం సహజం. అవే లేనపుడు ఎంత అందమైన పూలను పెట్టినా దాని అందం తెలియదు’ అని చెబుతుంది. ఇక్కడ అందం తెలియాలంటే దానిపక్కన అందవిహీనమైనది ఉండాలన్నది కాదు నా ఉద్దేశం. సృష్టిలో ప్రతి దానికీ ఓ అందం ఉంటుంది. కానీ అద్భుతమనో, అత్యద్భుతం అనో మనమనాలంటే.. అసలు అది కనిపించడానికీ, అనిపించడానికీ తగిన వాతావరణం ఉండాలి కదా! అనిపించింది. అలా నాకు ఆ సంభాషణ నచ్చింది. నిజానికి చూసే మనసుండాలే కానీ ఎండిన ఆకులోనూ ఎంతందం?!

humari-adhurio-kahani_640x480_61430566630

అన్నట్టూ చెప్పడం మరిచాను.. ఈ సినిమాలో అమల అక్కినేని హీరో తల్లిగా నటించారు. అసలు కథ మలుపు తిరగడంలో ఈమెదే ముఖ్య పాత్ర. ఒకరకంగా ఈమెదీ, వసుధ పాత్రదీ ఒకే నేపథ్యం. బహుశా హీరోకి హీరోయిన్‌ నచ్చడానికి ఇదీ ఒక కారణమై ఉండొచ్చనిపిస్తుంది.. బాగా ఆలోచిస్తే!  హీరోయిన్‌ తో సంభాషణలో ఒక మాటంటుంది.. ‘ప్రతి అమ్మాయికీ మన దేశంలో సీతలా ఉండమని చెబుతారు. సహనంతో, సౌశీల్యంతో ఉండాలంటారు. కానీ రాధలా ఉండమని ఎవరూ చెప్పరు.. రోజూ రాధకృష్ణులకు పూజలు చేసినా! ‘ అంటుంది. ‘భర్త ఎన్ని బాధలకు గురిచేసినా.. ఓర్చకోవాలంటారు.. కానీ ప్రేమ కరవైనపుడు దొరికిన దాన్ని అందిపుచ్చుకోమని ఎవరూ చెప్పరు.. ఎంత విచిత్రం! నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో నువ్వే నిర్ణయించుకో.. బలవంతపు సీతలానా.. నచ్చిన రాధలానా?’ అని అడుగుతుంది. ఉన్నది కొంచెం పాత్రే అయినా అమల పాత్ర చాలా నచ్చుతుంది. అంత బాగా నటించారామే.

వసుధ ఆరవ్‌ గురించి తన భర్తకు చెప్పినపుడు.. అతను ఆమె తనను మోసం చేశావనీ, నా కోసం వేచి చూడలేదని తిడతాడు. నువ్వు అతనితో ప్రేమలో పడినపుడు నేను గుర్తుకు రాలేదా అని అడుగుతాడు.. అపుడామె.. ‘నీ గురించి ఏం గుర్తుంచుకోవాలి? భర్త అనే అధికారంతో.. యజమాని పశువుపై వేయించినట్టుగా బలవంతంగా వేయించిన ఈ పచ్చబొట్టా? ‘ అని అడుగుతుంది. మళ్లీ చివర్లో.. ‘నేను నీ దానినంటూ నా నుదుటిన బొట్టూ, మెడలో తాళి, చేతికి గాజులూ నీ పేరు పెట్టుకున్నావ్‌. మరి నా కోసమంటూ నీ దగ్గర ఏం పెట్టుకున్నావ్‌?’ అంటుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలా అంశాలు నచ్చుతాయి. నిజానికి ఈ సినిమాకు ప్రాణం ఈ సంభాషణలే. పెద్దగా బుర్రకు పనిపెట్టేలా కాకుండా.. మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. రాజూ సింగ్ సంగీతం సినిమాకు ప్రాణం. ఇంకోటి నేను గమనించిందేమిటంటే.. గత కొన్ని సినిమాలు చూస్తుంటే.. హీరో, హీరోయిన్ల మధ్య స్టెప్పులతో, హోరెత్తే మ్యూజిక్‌ కంటే.. శ్రవణానందంగా, కథలో భాగంగా పాటలను జోడించడం బాలీవుడ్‌ లో ఎక్కువగా కనిపిస్తోంది. మనవాళ్లు కూడా దీనిని అనుసరించాలని కోరుకునేవాళ్లలోనేనూ ఒకదానిని.

చివరగా ఇంకొక్కట్టుండి పోయింది.. పూలు. ఈ సినిమా మొత్తంలో ఆరిస్ట్‌ లందరితో పోటీపడిన తెల్లపూలు. తెల్లని ఆరమ్‌ లిల్లీస్‌. చాలా బాగుంటాయి. కథ ప్రారంభం, ముగింపు వీటితోనే ఉంటుంది.

‘హమారీ అదూరీ కహానీ’ అంటే.. పూర్తవని కథ అని అర్థం. కానీ ఈ సినిమానే ఎప్పటినుంచో రాయాలనుకుని, పూర్తి చేయలేకపోతున్న నా వ్యాసాన్ని పూర్తి చేసేలా చేసింది. మొత్తానికి పూర్తవని కథతో నా వ్యాసం ముగిసిందన్నమాట.

*

మబ్బుల చాటున మహాతార : తొషిరో  మైఫ్యున్  

 

నక్షత్రం  వేణుగోపాల్

తెలుగు చలన చిత్ర చరిత్రలో బాపు రమణల కాంబినేషన్ కి ఒక ప్రత్యేకత , అలాగే  హాలివుడ్ లో డైరెక్టర్  జాన్ ఫోర్డ్ , నటుడు జాన్ వేన్ కలసి 21  సినిమాల్లో  నటించడం ఒక పెద్ద రికార్డు , అయితే,  అలాంటి ఇంకొక కాంబినేషన్    ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన  బ్లాక్ బస్టర్ సినిమాలతో  ఒకప్పుడు హోలీవుడ్ని జపాన్ సినిమా వైపుకి తిప్పుకునేట్టు చేసిన ప్రముఖ డైరెక్టర్, ఆయన సినిమాల్లో నటించిన  ఒక ప్రముఖ నటుడు , ప్రపంచ చలన  చిత్ర చరిత్రలో కలకాలం  నిలిచి పోయే  ఆణిముత్యాలు లాంటి  ఎన్నో హిట్లు ఇచ్చిన  ఈ ఇద్దరి  కాంబినేషన్ లో డైరెక్టర్ అందరికీ తెలుసు  కాని  అంతగా వెలుగు చూడని ఆ నటున్ని పరిచయం చేయడం కోసమే ఈ వ్యాసం  .

ఎక్కడో జపాన్ మారు మూల ప్రాంతంలో పుట్టి , ప్రపంచ చలన చిత్ర రంగంలో ,  చిరకాలం నిలిఛి పోయిన   డైరెక్టర్ అకిరా కురుసోవా . ఆయనను   డైరెక్టర్ లకే  డైరెక్టర్ అంటారు . ఒక ప్రఖ్యాత టాలీవుడ్ హీరో ఆయన కోడుకుకి అకిరా అని  పేరు కలిసి వచ్చేట్టు కూడా నామకరణం చేయడం కూడా జరిగింది అంటే ఆ డైరెక్టర్ కి ఉన్న ఖ్యాతి, పాపులారిటీ   ఎంతటిదో అర్థం చేసు కోవచ్చు.   ఎంతో పేరు ప్రఖ్యాతులు, ఎన్నో ఆస్కార్  అవార్డులు పొందిన ఆ డైరెక్టర్ కి పేరు రావడం వెనుక ఇంకొక నటుని కృషి కూడా లేక పోలేదు.  ఎందుకంటే   1948 – 1965 మధ్య కురోసోవా  తీసిన 17 సినిమాల్లో ఒక్కటి మినహా  16 సినిమాల్లో  ఆ నటుడే అన్ని ప్రాముఖ్యత గల పాత్రల్ని పోషించాడు అనే విషయమే   నా వ్యాఖ్యలకి బలము చేకూర్చుతాయి .   అందులో ఎన్నో చిత్రాలు హాలివుడ్ లో  బ్లాకు  బస్టర్  హిట్సే . అన్ని హిట్స్ అందించిన ఆ నటుని గురించి చాల మందికి  తెలియక పోవడం కొంచం విస్మయం కలిగించింది .

కురొసొవా సినిమాలు ” త్రోన్ అఫ్ బ్లడ్ “, “యోజింబో”  ,”సెవన్ సమురై, “రోషోమాన్” ,”రెడ్ బియర్డ్”, “లోయర్ డెప్థ్స్” ,” హై  అండ్ లో”  లాంటి చిత్రాలు చూస్తున్నప్పుడు అన్ని సినిమాల్లో ఆ నటుని నటన  నన్ను అమితంగా ఆకర్షించినది.   ఆ నటున్ని గురించి తెలుసు   కోవాలనే ఉత్సాహం మొదలయింది , ఎందుకు ఈ నటుడే ప్రతి సినిమాలో , ప్రతి చిత్రం లో వైవిధ్య మైన  పాత్ర ద్వారా ముందు కోస్తున్నాడు, ఎందుకు కురుసోవా ఆ నటున్నే తీసుకోవాల్సి వచ్చింది  అనే కుతూహలమే  నన్ను ఈ రోజు వ్యాసం రాసేట్టు చేసింది .    నేను చేసిన ఒక చిన్న పరిశోధన వల్ల  ఆ  నటుని   గురించి తెలుసుకున్న  ఎన్నో అబ్బుర పడే విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను . ఇంతకీ ఆ నటుడు  ఎవరో కాదు , ఆయన పేరే “తొషిరో మైఫ్యూన్ ”  Toshiro Mifune.     అసలు ఆయన నటుడు కావాలనే అనుకోలేదు ,  ఎప్పుడూ ప్రయతించ లేదు కూడా  . ఆయన సినీ రంగ ప్రవేశమే చాల విచిత్రంగా జరిగింది.  ప్రస్తుత నటులు, కాబోయే నటులు తొషిరో మైఫ్యూన్  నటజీవితం నుండి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో వున్నాయి .

IMG_7797

అది సెప్టెంబరు 1945, రెండవ ప్రపంచ యుద్ధం తో బాంబుల దాడికి రక్త సిక్త మయిన జపాన్ గాయాలతో సత మవుతూంది . తొషిరో  మైఫ్యూన్ తల్లి దండ్రులు క్రిష్టియన్ ప్రచారకులు, చైనా కు సమీపంలో వుండే మంచూరియాలో వాళ్ళ  కుటుంబం స్తిర పడింది , అయితే తొషిరో  మైఫ్యూన్  జపాన్  జాతీయుడు కాబట్టి తప్పని సరిగా జపాన్ సైన్యం లో చేరాల్సొచ్చింది .   తండ్రి వద్ద నేర్చుకున్న ఫోటోగ్రఫి అనుభవంతో యుద్ధంలో విమానం నుండి ఫోటోలు తీసే వుద్యోగం .    అప్పుడు ఆయనకు సుమారుగా 25 సంవత్సరాల వయసు వుంటుంది ,  యుద్ధంలో  ఓడిపోయిన   వాయు దళం నుండి గెంటి వెయబడ్డాడు.      తల్లి తండ్రులు యుద్ధంలో మరణించారు .   ఎవరూ తెలిసిన వారు లేరు, తెలిసిన బందువులు ఎవరూ లేరు.  కొత్త  ప్రాంతం, తన స్వంత దేశం లోనే పరాయి వాడు అయ్యాడు. తిరిగి ఇంటికి తీసుకెళ్లడానికి ఎవరూ లేరు.  ఇప్పుడు అతని పరిస్థితి ఏమిటి?
ఇదంతా వింటుంటే  ఒక సినిమా కథ లాగే వుంటుంది కదూ!  ఇలాంటి  కథల్లోని పాత్రలలో  వెండి తెరపై జీవించి , ప్రపంచం లోని ఎన్నో గొప్ప అవార్డులని తన చిత్రాల వైపుకి తిప్పుకున్న ఒక సామన్యుని  జీవితంలో జరిగిన యదార్థ గాధ .

ఇప్పుడు తన ముందుంది ఒకటే మార్గం .  తండ్రి ఫోటో స్టూడియోలో నేర్చుకొన్న కొద్ది పాటి ఫోటోగ్రఫి ,  అదీ టోక్యో మహా నగరంలో  అయితేనే  సాధ్యం అని నిర్ణయించుకుని , బాంబుల దాడిలో ధ్వంసం అయిన బూడిదగా మారిన భవంతులు, శ్మశానాన్ని తలపిస్తున్న , రక్త సిక్తమయిన నిర్మానుష్యమైన  వీధుల గుండా , తిండి లేక, నిద్ర లేక జేబులో చిల్లి గవ్వ లేకుండా ఎన్నో పగలు రాత్రులు, నడిచి నగరానికి చేరుకున్నాడు .  తనతో పాటు యుద్ధంలో పని చేసిన ఒక  మిత్రుడు కన పడితే ,సహాయం ఆర్జించి, ఆశయ్రం  పొంద గలిగాడు కానీ ఫోటోగ్రఫీ ఒక కల అని మాత్రమే అర్థమయ్యింది , ఎందుకంటే  అక్కడ ఫోటోలు తీయించుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు, బూడిద శవాలు, గుట్టలు తప్ప .   ఆ తర్వాత మరో వ్యక్తి ద్వారా, ఒక ఫిలిం స్టుడియోలో కెమెరా మెన్ కి సహాయకుడి వుద్యోగం వుందని తెలిసి ధరఖాస్తు చేసుకున్నాడు, కాని ఆ వుద్యోగం వస్తుందని ఏ మాత్రం నమ్మకం గాని, ఆశ గానీ లేదు.

అలా ఎన్నో ధరఖాస్తు లు, ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి,  కానీ అన్ని ధరఖాస్తు లు గోడకు కొట్టిన పిడికల్లా ఆటే అతుక్కు పోయాయి  కానీ  ఒక్క ధరఖాస్తు నుండి కూడా పిలుపు రాలేదు, ఆ తర్వాత సరిగ్గా ఒక నెల రోజుల తర్వాత ఒక స్టూడియో నుండి ఉత్తరం వచ్చింది, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా  ఎంతో ఆశగా వెళ్ళాడు. కానీ అప్పటికే అక్కడ వంద లాది మంది వేచి చూస్తున్నారు . వారందరినీ చూడగానే వున్నా ఆశ కాస్త నీరు గారి పోయింది . పిలుపు కోసం వేచి చూడగా చూడగా లోపలి నుండి పిలుపు రానే వచ్చింది .   అక్కడ నల్గురు పెద్ద మనుషులు ఇంటర్వూ చేయడానికి సిద్దంగా వున్నారు .

గదిలోకి అడుగు పెట్టగానే   ఇంటర్వూ బోర్డు సభ్యుడొకడు  “నవ్వు” అన్నాడు .  నవ్వ డానికి  కాదు,  నేను  ఉద్యోగం కోసం వచ్చానని వారికీ అసహనంగా చెప్పాడు.  నీకు వుద్యోగం రావాలంటే నీవు నవ్వాల్సిందే ! కటువు గా అన్నాడు ఇంకొక ఇంటర్వూ మెంబరు .   వూరికే నవ్వు మంటే ఎలా నవ్వను?.. కొంచెం కోపంగా , ధైర్యంగానే చెప్పాడు .   ఇతనికి అర్థం అయ్యిందేమంటే , వాళ్ళు తనని మూర్ఖున్ని చేసి ఆడు కుంటున్నారు అని పించింది .  ఇంటర్వ్యూ బోర్డు మెంబర్లకి అసహనంగా వుంది .  నవ్వు మంటే నవ్వడు , వారి సమయాన్ని వృధా చేస్తున్నాడనిపించి, అతని ధరఖాస్తుని  తిరిస్కరించారు. కాని ఈ తతంగాన్ని పక్కగది నుంచి    చూస్తున్న ఒక పెద్ద మనిషి తిరిగి పిలిపించాడు.   ఇప్పుడు తాగు బోతుగా నటించమన్నాడు . అప్పుడు  ఆయనకు చిర్రెత్తు కొచ్చింది , కోపం తారా స్తాయికి చేరింది .  ఇంకా వారు తనని మూర్ఖున్ని చేసి తనతో ఆడు కుంటున్నారనిపించింది .

IMG_7795

తను ఇక్కడికి నటుడవ్వాలని  రాలేదు,  కెమరా మెన్  వుద్యోగం  కోసం వచ్చానని చెపాడు .  అయినా  ఆ పెద్ద మనిషి వినకుండా తాగుబోతూ లా నటించాల్సిందే ,  అంటూ పక్క గదిలో వున్న ఇంకొక వ్యక్తిని పిలిచాడు. ఇంకే మార్గము లేదు , అక్కడి నుండి బయట పడాలంటే ఏదో త్రాగు బోతు లా చేయాల్సిందేనని నిర్ణ యించుకొని , అక్కడి కుర్చీలు విసురుతూ, ఉరిమి ఉరిమి చూస్తూ , పిచ్చి అరుపులతో కొంచెం సేపు గందర గోళం     సృష్టించాడు .   హమ్మయ్య , ఒక  భారం దిగింది  అని  కనీసం జడ్జీల  మొహం వైపు కూడా చూడకుండా వెనుతిరిగి  పోతున్న  ఆయనకు ఆ గది కరతాళ ధ్వనులతో మారు మ్రోగడంతో బయటకు పెట్టబోతున్న కాలు అక్కడే ఆగి పోయింది .    ” యు ఆర్  సెలెక్టెడ్ ”  అని భుజం పై  ఆ పెద్ద మనిషి చేయి పడింది . ఆశ్చర్య పడడం తొషిరో మైఫ్యూన్ వంతు అయ్యింది .
ఆ పెద్ద మనిషి ఎవరో కాదు, యుద్ధం, యుద్ధ యోధుడు  ( సమురాయ్ ) నేపధ్యం లో నిర్మించబడ్డ ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించిన  ప్రముఖ డైరెక్టర్   కజిరో యమమోటో (Kajiro Yamamoto).  పక్క గదిలో వున్నఇంకొక వ్యక్తే – అకిరా కురుసోవా .  తొషిరో మైఫ్యూన్ లో దాగి ఉన్న నటన ప్రతిభని  గుర్తించిన ప్రముఖ డైరెక్టర్   కజిరో యమమోటో,     అకిరా కురో సోవా సినిమా కోసం  జరుగుతున్న  16 మందిలో ఒకరిగా తొషిరో   మైఫ్యూన్ ని  సెలెక్ట్    చేయడమే కాక ,  ఇంకొక ప్రముఖ డైరెక్టర్  “సెంకిచి తనిగుచ్చి”(Senkichi Taniguchi ) కి పరిచయం చేస్తే ” సెంకిచి తనిగుచ్చి” దర్శకత్వం వహించ బోతున్న ” సిన్ బాకా జిదాయి ( జెన్) ”   అనే చిత్రం లో ఒక ప్రాముఖ్యం  గల పాత్రని అప్పటికప్పుడు ఇవ్వడం జరిగింది .   ఆ స్టూడియో నే ప్రపంచ  ప్రఖ్యాతిగాంచిన ఎన్నో చిత్రాలు నిర్మించ బడ్డ    “తోహో ” స్టూడియో .

ఇంతకీ జరిగిందేమంటే   నటీనటుల కోసం  జరుగుతున్న కమిటీకి , తొషిరో మైఫ్యూన్  కు తెలియ కుండా ఆయన ఫ్రెండ్   ధరఖాస్తు ని పంపాడు. కాని ఆ విషయం  తొషిరో మైఫ్యూన్  కి చెప్పలేదు . తొషిరో మైఫ్యూన్ కెమరా మెన్ వుద్యోగం కోసమని వచ్చాడు .   కురుసోవా సినిమా కోసం చూస్తున్న 16 నటుల కోసం జరిగిన పోటీల్లో వచ్చిన మొత్తం  4000 మందిలో  తొషిరో మైఫ్యూన్ ఒక నటుడిగా  సెలెక్ట్ కావడమే కాకుండా అప్పటికప్పుడు  కురుసొవా  తన తీయబోయే  ఇంకొక సినిమా లో  ప్రధాన పాత్రకి  ఎంపిక చేసుకున్నాడు .    ఎంపిక రోజునే మొత్తం మూడు పాత్రలు దక్కించుకున్న ఘనత కూడా  తొషిరో మైఫ్యూన్ కి దక్కింది.   కురుసొవా  సాధారణంగా ఈ నటున్ని పొగడడు  కానీ , మొదట గా , చివరగా పొగిడిన ఒకే ఒక నటుడు తొషిరో మైఫ్యూన్

అలా అనుకోకుండా  నటుడు అయిన  తొషిరో మైఫ్యూన్ నట ప్రస్థానం  అంచెలంచెలుగా ఎదుగుతూ  వచ్చింది . 1953 లో విడుదల అయిన “రోషోమన్” వెనిస్ ఫిలిం ఫెస్టివల్లో  ఉత్తమ చిత్రంగా ఎన్నికైనప్పుడు  ప్రపంచ  సినిమా ఒక్కసారి తొషిరో మైఫ్యూన్  యొక్క అద్భుత నటనని  గుర్తించింది .    ఒక యోధుడు  (సమురాయ్ ) అంటే ఏమిటో ఎలా  ఉండాలో కురోసోవా ప్రపంచానికి చాటి చెప్పాడు .  అంతటితో ఆగ కుండా, గోల్డెన్ లైన్ , విదేశీ క్యాటగిరీ లో ఆస్కార్ అవార్డు ని కూడా  ఈ సినిమా దక్కించుకుంది .
డ్రంకెన్ ఎంగెల్  (1948 ) కురుసోవా  మొట్ట మొదటి సారిగా  తొషిరో మైఫ్యూన్ ని ప్రముఖ నటుల మధ్య  హీరో గా నిలబెట్టి నపుడు , జపాన్ సినిమా ముక్కున వేలేసు కుంది .

బ్లాక్ బస్టర్ సినిమా  సెవెన్ సమురాయ్ (1954) లో ఒక యోధునిగా తనను తను ఊహించుకుంటూ ఎన్నో కలలు కనే ఒక యువకుడి పాత్రలో జీవించాడు  నవ్వించాడు తొషిరో మైఫ్యూన్ .  The Magnificent Seven లాంటి డైరెక్ట్ హాలీవుడ్ మూవీనే  కాక ఇంకా ఇన్నో హాలివుడ్ చిత్రాలకి సెవెన్ సమురాయ్ ప్రేరణ . అల్ టైం రికార్డ్ సాధించిన బాలీవుడ్ చిత్రం “షోలే ”  సెవెన్ సమురాయ్  చిత్రం యొక్క స్ఫూర్తి తోనే నిర్మించ బడింది.

సెవెన్ సమురాయ్ – రెండు  అకాడమీ అవార్డులకి నామినేట్  అవడమే కాకుండా, బ్రిటిష్ అకాడెమి ఫిలిం అవార్డుకి  (ఉత్తమ చిత్రం, ఉత్తమ విదేశీ నటుడు క్యాటగిరి లో    తొషిరో మైఫ్యూన్ , టకాషి షిమురా  నామినేట్ కాబడ్దారు .
” త్రోన్ అఫ్ బ్లడ్ ‘   1957  వెనిస్ ఫిలిం ఫెస్టివల్ లో కురుసోవ కి గోల్డెన్ లయన్ అవార్డు కి నామినేట్  కావడమే కాక , తొషిరో మైఫ్యూన్  కి ఉత్తమ నటుడిగా  మైనిచి ఫిలిం ఫెస్టివల్ మరియు  కినేమ జున్పో ఫిలిం ఫెస్టివల్ లో అవార్డు లభించింది .
వెనిస్ ఫిలిం ఫెస్టివల్ లో సిల్వర్ లైన్ అవార్డు గెలుచు   కోవడమే కాకుండా , గోల్డెన్ లైన్  కి  నామినేట్ కాబడ్డది . ఇవే కాకుండా ఇంకా చాలా  అవార్డులని ఈ చిత్రం సొంతం చేసుకుంది

1958 లో “The Hidden Fortress”  తొషిరో మైఫ్యూన్   నటించిన ఈ సమూరాయ్ చిత్రం ఇంటర్నేషనల్ క్రిటిక్స్ ప్రైజ్,  బెర్లిన్ ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో “సిల్వర్ బేర్” ఫర్ బెస్ట్ డైరెక్టర్ అవార్డుని నోచుకుంది .

“The Bad Sleep Well” 1960 లో నిర్మించబడ్డ  ఈ చిత్రంతో కురుసోవా  నిర్మాతగా మారాడు .   షేక్స్పియర్ “హామ్లెట్ ” ను తల పించే ఈ చిత్రం  సమురాయ్ చిత్రాలకి భిన్నంగా , కార్పొరేట్ లలో జర్గుతున్న అవినీతి ఆధారంగా నిర్మించ బడింది .  ఇందులో కంపనీ ప్రెసిడెంట్ కి సెక్రెటరిగా  తొషిరో మైఫ్యూన్  నటించాడు.  11 వ బెర్లిన్  అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ  డైరెక్టర్   ‘గోల్డెన్ బెర్లిన్ బేర్ ” అవార్డు కి కురుసొవా నామినేట్  కాబడ్డాడు .  మాక్సిం గోర్కీ నవల ఆధారంగా కురుసొవా   స్వంతం ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మించ బడ్డ చిత్రం  “ది లోయర్  డెప్త్స్ ” ప్రపంచ వ్యాప్తంగా  విమర్శల దృష్టిని ఆకర్షించింది.

“యోజింబో”  1961 లో వచ్చిన ఈ చిత్రంలో నటనకు   వెనిస్ ఫిలిం ఫెస్టివల్  తొషిరో మైఫ్యూన్  కి ఉత్తమ నటుడి అవార్డుని ప్రకటించింది .  కురుసోవా కి గోల్డెన్ లయన్ అవార్డుని తెచ్చి పెట్టింది . ఇక్కడ  ప్రస్తావిస్తున్న అవార్డులలో  చాలా వరకు   ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచినవే . ఇవే కాక ఇంకా జపాన్ లో చాల అవార్డులు చేసు కున్నారు కురుసోవా   మరియు తొషిరో మైఫ్యూన్ .
” రెడ్ బియర్డ్ ” 1965 కురుసోవా ,  తొషిరో మైఫ్యూన్ ల కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం ( 16వ ) .  ఈ చిత్రం కోసం  తొషిరో మైఫ్యూన్  ని గడ్డంపెంచు మని చెప్పడం , షూటింగ్ అనుకున్న దాని  కంటే ఎక్కువ సమయం పట్టడంవళ్ళ   సహజంగా పెంచిన గడ్డం తీయలేక, కొత్త సినిమా లను అంగీకరించ లేక    కల్గిన  ఆర్థిక  సమస్యల  ప్రభావం  ఆయన నటన పై కూడా  పడింది .  స్క్రిప్ట్ రైటర్  Hideo Oguni   రాసిన ఒక  పుస్తకంలో  , ఈ సినిమాలో  తొషిరో మైఫ్యూన్ నటన చాల తప్పుల తడక సాగింది  అన్న ఒక్క వ్యాఖ్య కురుసోవా ,  తొషిరో మైఫ్యూన్ ల మధ్య మనస్పర్ధలకు కారణం అవడమే కాకుండా సినిమాతో వున్న  వారిద్దరి అనుబంధానికి   శాశ్వతంగా తెర  పడింది .  ఆ తర్వాత వారిద్దరూ కలిసి  ఎప్పుడూనటించ లేదు .
కురొసొవా తోనే తొషిరో మైఫ్యూన్  కి ఖ్యాతి వచ్చింది అనే వాదనను త్రోసి పుచ్చుతూ ఆ తర్వాత  తొషిరో మైఫ్యూన్   కూడా నిర్మాత మారి తన స్వంత బ్యానర్లో  డజను చిత్రాల వరకూ నిర్మించాడు.   “సమురాయ్ రెబిలియన్” , అనే చిత్రం మసాకి కొబయాషి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1967 లో ఉత్తమ జపాన్ చిత్రంగా ఎన్నికవ్వడమే కాక,   అంతర్జీతీయ మార్కెట్ లో మంచి పేరు, డబ్బు సంపాదించింది పెట్టింది .  వెనిస్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ డైరెక్టర్ అవార్డు,  నినేమ జున్పో వార్డు ( బెస్ట్ డైరెక్టర్), బెస్ట్ ఫిలిం , బెస్ట్ స్క్రీన్ప్లే , మైనిచి ఫిలిం కాంకోర్స్ ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం  అవార్డు స్వంతం చేసుకుంది .

1979  లో వచ్చిన స్టీవెన్ స్పీల్ బర్గ్  హాలీవుడ్ చిత్రం “1941” లో నావికాదళంలో  సబ్ మెరైన్ లతో బాంబులు కురిపించే కెప్టెన్ పాత్రలో  అమెరికన్   ప్రేక్షకులని తన అధ్బుత నటనతో అబ్బురపరిచాడు .  ఆ తర్వాత, జేమ్స్ క్లావేన్స్ నిర్మించిన  “షోగన్”  చిత్రం  TV సీరియల్ “తోరినాగా” పాత్ర ద్వారా  అమెరికన్ ప్రేక్షక హృదయాల్లో చిర స్తాయిగా నిలిచి పోయాడు,  ఆ కాలంలో  అత్యదిక రేటింగు సంపాదించుకున్న సీరియల్  షోగన్.

తొషిరో మైఫ్యూన్ నటించిన 130 చిత్రాల్లో సగానికి పైగా  ‘ సమురాయ్  ‘ పాత్రల్లో జీవించి , తెలుగు సినిమాలో కృష్ణుడు , రాముడు  అంటే , మహా నటుడు ఎన్టీఆర్  గుర్తుకు  వచ్చినట్టు , ప్రపంచ  ప్రేక్షకులకు ఒక యోధుడు అంటే   తొషిరో మైఫ్యూన్ లాగ వుండాలి అని ఎందరి హ్రుదయాల్లోనో చెరగని ముద్ర వేసాడు .  ఇలా చెప్పుకుంటూ పోతే తను నటించిన  ప్రతిచిత్రం ఒక ప్రత్యేకతను సంతరించుకున్నదే .  అన్నిట్లో హీరోనే కాకుండా , ప్రాముఖ్యత వున్న నెగటివ్ షెడ్స్  రోల్స్ లోనూ నటించి పేరు తెచ్చుకున్నాడు . మల్టీ స్టారర్ మూవీస్ లోనూ నటించాడు . కొన్ని సందర్భాల్లో ,  ప్రసిద్ధ తెలుగు నటుడు  ఎస్వీ రంగారావు గారిని  తలపించే  పౌరుషం, రౌద్రం , సున్నిత హాస్యం ఇలా  ఏ పాత్ర లోనయినా  ఇమిడి పోయే    లక్షణాలు  తొషిరో మైఫ్యూన్  లో చాల వున్నాయి .
అసలు “హీరో-హీరొయిన్ ”  అనే  పదాలు  మన తెలుగు సినీ పరిశ్రమ పెంచి పోషించిన ఒక  చెడు సంప్రదాయం , ఈ పదాలు ఏ ఇతర బాషలలో కూడా ఎక్కువ గా కనిపించవు .  హాలివుడ్ సినిమాల్లో కూడా ఈ పదాలు ఎప్పుడో కాని, వినిపించవు, కానీ ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అని మాత్రమే వినిపిస్తుంది. కేవలం హీరొ  పాత్రలే కాకుండా  ఎలాంటి పాత్రనయినా నటించి మెప్పించిన వాడే నటుడు అంటాడు తొషిరో మైఫ్యూన్.  కురుసోవా  మరణానికి కొన్ని నెలల ముందు డిసెంబర్ 24, 1997న   , అల్జమైర్ వ్యాధితో   తుది  శ్వాశ  వదిలాడు తొషిరో మైఫ్యూన్.

సినీ రచయితలు  హీరో చుట్టూ కథలు అల్లకుండా , కథ కోసం  మంచి నటులని  ప్రోత్సహిస్తే , తెలుగులో మరిన్ని మంచి చిత్రాలు, మరింత మంది మంచి నటులు వచ్చే అవకాశం వుంది . తెలుగు సినీ పరిశ్రమ ,  ముఖ్యంగా హీరో కావాలనో, హీరోయిన్ కావాలనో  స్టూడియోల చుట్టూ  తిరుగుతున్న కొత్త నటులు తొషిరో మైఫ్యూన్  సినిమాల నుండి, ఆయన నటన నుండి  నేర్చుకోవాల్సింది చాలావుంది .

*

 

కిల్లా :కవిత్వంలాంటి సినిమా

 

కృష్ణమోహన్ బాబు

యువ  మరాఠీ దర్శకుడు, అరుణ్ అవినాశ్ ‘కిల్లా’ (కోట)  ధియేటర్ వదిలినా పదే పదే మనల్ని మర్చిపోని ఖమాజ్ రాగంలో పాడిన చక్కని కవిత్వంలాంటి సినిమా.  అరుణ్ కిది మొదటి  మరాఠీ సినిమా. కథ, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం అరుణే చేసి అన్ని విభాగాల్లోనూ ఆరితేరిన సీనియర్ కళాకారులను మించిన పనితనాన్ని చూపించాడు.  2015 వ సంవత్సరానికి మరాఠీ సినిమాలు ఏకంగా 5 జాతీయ అవార్డులు గెల్చుకుంటే, ‘కిల్లా’ సినిమా ఉత్తమ మరాఠీ చిత్రంగా, అందులో  నటించిన బాల నటుడు, అర్చిత్ దేవ్ ధర్ ప్రశంసాత్మక నటనకి ‘స్పెషల్  మెన్షన్ ‘ గా   రెండు అవార్డులు గెల్చుకుంది.  ఈ సినిమా అనేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో కూడా ప్రశంసలని, అవార్డులని అందుకుంది.

పదకొండేళ్ళ చిన్మయ్ తల్లి పూనా మహా నగరంలో  ప్రభుత్వ రెవెన్యూ డిపార్టుమెంట్ లో  ఒక చిన్న ఉద్యోగిని.  చిన్మయ్ తండ్రి పోయాక ప్రమోషన్ మీద ఆవిడ కొంకణ్ తీరంలో  వున్న ఓ మారు మూల గ్రామానికి బదిలీ అవుతుంది.  హడావిడిగా వుండే పూనా నగరం నుంచి  ఏ శబ్దాలూ లేని ఓ మారు మూల పల్లెటూరుకి రావటం  చిన్మయ్ ని చాలా చికాకు పరుస్తుంది.

ఇస్మాయిల్ ‘బదిలీ ‘ కవిత గుర్తుందా?

“బర బరా

ఈడ్చిన ట్రంకు పెట్టేలా

హృదయం క్షోభ పడింది.

ఇది

జరపడానికి చేసింది కాదు “

ఏ కుదుళ్ళలోనూ కుదురుకోలేని  జీవితం అంతా గందరగోళం.

స్కూలులో స్కాలర్ షిప్ వచ్చిన తెలివైన కుర్రాడిగా చిన్మయ్ ని టీచర్ పరిచయం చేస్తే, అంతంత మాత్రం చదువులతో అల్లరి చిల్లరిగా వుండే ఆ వూరి కుర్రాళ్ళ కది, అదో ఆకతాయి వ్యవహారంలా వుంటుంది.  ఎవరూ చిన్మయ్ తో  కలవడానికి పెద్దగా ఆశక్తి చూపరు.  పొద్దుటే స్కూలు దగ్గర దింపి వెళ్ళిన తల్లి, రాత్రి చీకటి పడ్డాక హడావిడిగా రావటం రోజువారీ దృశ్యం.  నగరం ఇచ్చిన వయసుకు మించిన పెద్దరికం , ఒంటరితనం , పూనా తాలూకు జ్ఞాపకాలు, అక్కడి మిత్రులు ఎవారితోనూ కలవకుండా చేస్తాయి.  తల్లితో నైనా విషయాలు పంచుకుందాం అంటే, ఆవిడ చికాకులు ఆవిడవి.  రెవెన్యూ డిపార్టుమెంట్ అంటే మగాళ్ళ ఆధిపత్యంలో చట్టపరంగా పనులు ఎలా జరగకూడదో చూసే అవినీతి సాలెగూడు.

సాలీడుకు దొరక్కుండా ఎలా రక్షించుకోవాలో  చూసుకోవాలో  తప్ప, గూడు వదిలి వచ్చే దారి లేదు.  తన కిష్టం లేకపోయినా తోటి  ఉద్యోగుల ఒత్తిడి మీద ఓ తప్పుడు పనిలో  తప్పక యిరుక్కున్న తల్లి, ఆ సమస్యని ఎలా దాటాలా? అని మథన పడ్తుంటే, ఇక చిన్మయ్ సంతోషంగా గడిపే క్షణాలు ఏముంటాయి?  ఒక రోజు తోటి కుర్రాళ్ళతో  సైకిలు పందెం వేసుకుని, వూరి చివర వున్న కోట దాకా వెళ్ళి యితర కుర్రాళ్ళు  వెళ్ళిపోయినా, అతను కోట లోనే  వుండిపోతాడు.  సముద్రపు అంచున వున్న ఆ కోట, చిన్మయ్ మానసిక స్థితిని ఎత్తి చూపించిందా అన్నట్టు, దారి ఎటో తెలియని కోట లోపలి  బాటలు, ఉరుములు, మెరుపులతో బయట కురుస్తున్న వర్షం, గొంతెత్తి అరచినా  ఎవరికీ వినబడని పిలుపు , చివరికి ఎలాగో అలాగ కోటలో నుంచి బయట పడ్డ తనలో గూడు కట్టుక్కున్న భయాల్ని అధిగమించడానికి తల్లి మీద చిన్నగా తిరగ బడటం మొదలు  పెడ్తాడు.

ఒక రోజు ఒక చేపలు పట్టే వాడితో కల్సి  పడవలో  మైళ్ళ దూరం సముద్రం మీద కు వెళ్ళి, తిరిగి వస్తానో రానో అనే భయం తో రాత్రి పొద్దు పోయాక  ఇల్లు చేరుకున్న తర్వాత ఉద్వేగానికి గురి అవుతాడు.  తన మీద తనకి వీటి నన్నిటి నుంచి కూడా బయట పడగలనని  నమ్మకం కలుగుతుంది.  తను వదిలేసిన తోటి కుర్రాళ్ళతో నెమ్మిదిగా  స్నేహం మొదలవుతుంది.  అయితే ఆఫీసులో తల్లి చేసిన తప్పు వాళ్ళ జీవితాలని మరో మలుపు తిప్పుతుంది.  అయితే తల్లికీ, కొడుక్కీ యిప్పుడా సమస్య లేదు.  సర్దుబాటుకి అలవాటు పడ్డారు.  తప్పదు. జీవితం అంతే.  పదే పదే వచ్చే సమస్యకి మొదట  భయం వుంటుంది.  తర్వాతర్వాత అదే అలవాటయి పోతుంది.

అరుణ్ అవినాశ్ సొంత అనుభవాలతో  రాసిన ఈ సినిమా స్క్రీన్ ప్లే  చాలా మందికి ఓ పాఠంలా పనికి వస్తుంది.  ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండు మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఈ సినిమాని మరో మెట్టు పైకి తీసుకెళ్తాయి.  విచిత్రం ఏమిటంటే సినిమాని ఓ డ్రామాగానో, మెలో డ్రామాగానో మలచడానికి  ప్రేక్షకుల్ని  కన్నీళ్ళు పెట్టించడానికి అనేక అవకాశాలు వున్నా, దర్శకుడు వాటి దరిదాపులలోకి  వెళ్ళడు.  ఎందువల్ల అంటే ఇది రోజువారీ జీవితం.  సమస్యలు చాలా వ్యక్తిగతం అయినవి.  అక్కడ డ్రామాతో పని లేదు.  ఆ విషయం సరిగా అవగాహన చేసుకోవటం  వల్లనే రెండో సినిమాతోనే  జాతీయ  స్థాయికి  ఎదిగాడు.

ప్రతీ పాత్ర ఎంతో శ్రధ్ధగా, చాలా ప్రేమతోటి తీర్చి దిద్దాడు.  అందుకే ఒక్క నిమిషం పాటు వచ్చే ప్రక్కింటి అమ్మమ్మ కూడా తెర మీద తన ఉనికిని చూపెట్టుకో గలుగుతుంది.  అర్చిత్ దేవ్ ధర్ మహా నటుల్ని తల దన్నెలా చేశాడు.  తల్లి, అమృతా సుభాష్ , తోటి  స్కూలు కుర్రాడిగా భలేరావ్ భంద్యా చక్కగా నటించారనటం చిన్న మాట.

ఈ సినిమా చూసిన తర్వాత చప్పుడు లేని సుదూర సముద్రపు ఒడ్డు, ఒంటరిగా నడిచి పోయే పీత, మసక దీపాల వెలుగులో, మనుష్యులు లేని పల్లె వీధుల్లో ఒంటరి గా తల్లి కోసం చూస్తుండే కుర్రాడు, అలలు ఎంత పెకిలిద్దామని చలించక గంభీరం గా  నిలిచిన కోట మన కలల్ని, ఆలోచల్ని పదే పదే తట్టి నిలబెట్టక పోతే  ఆశ్చర్య పోవాలి.  కొన్ని విషయాలని చిన్న చిన్న సజెషన్ ద్వారా  దర్శకుడు చాలా తెలివిగా చెప్తాడు.  ఎలా అంటే, తల్లి రోజూ ఇంటికి వర్షంలో చీకటి పడ్డాక గొడుగు వేసుకుని వస్తూ వుంటుంది.  కాని ఆఫీసులో  సమన్లు అందుకున్నప్పుడు మాత్రం వర్షంలో తడుసుకుంటూ వస్తుంది. నిర్మానుష్యమ్ గా వున్న సముద్రం ఒడ్డున చిన్మయ్ ఒంటరిగా కూర్చున్నుండగా సముద్రం నుంచి ఏ ఘోషా  వినబడదు.  ఒకే ఒక్క పీత మాత్రం గబగబా పాక్కుంటూ వెళ్తూ వుంటుంది.  రోజువారీ  సర్దుబాటే కష్టంగా వున్న పరిస్థితిలో ఒక రోజు చిన్మయ్ బడికి వెళ్ళేముందు, ఇంటి ముందు తల్లి కొన్న కొత్త సైకిలు వుంటుంది.  వ్యవస్థ తో తల్లి రాజీ పడిన దన్న విషయం చాలా సున్నితంగా చెప్తాడు దర్శకుడు.  ఇలా చాలా వున్నాయి.  అలాగే స్కూలు లో  పిల్లల మధ్య జరిగే కొన్ని విషయాలు మనల్ని చిన్నప్పటి స్కూలు రోజులకి తీసుకుపోతాయి.

గత ఆరేడు సంవత్సరాల నుంచి మరాఠీ, బెంగాలీ, మలయాళీ, తమిళ్ సినిమాల పరిశ్రమ నుంచి చాలా మంది కుర్రాళ్ళు, జాతీయంగా, అంతర్జాతీయంగా తమ సత్తాని చాటుకుంటూ అనేక మంచి సినిమాలని తీస్తున్నారు.  వీళ్ళందర్నీ చూసినప్పుడు  భారతీయ సినిమాకి, సంగీతానికి, సాహిత్యానికి మంచి రోజులు పోలేదని, ఈ పిల్లల చేతిలో  అవి మరింత అందాలు దిద్దుకుంటున్నాయని అనిపిస్తుంది.  ఖచ్చితంగా వీళ్లలో అరుణ్ అవినాశ్ ఒకడు.  రాబోయే “దృశ్యం”  హిందీ సినిమాకి  ఇతనే ఫోటోగ్రాఫర్.

 

*