వాక్యం ఆగిపోయిన చోట…

1

ఏడుపు కూడా అంత తేలిగ్గా యేమీ రాదు కొన్నిసార్లు!

వొక్కసారి పగలబడి ఏడ్చేస్తే లోపల వున్న దుఃఖమంతా అలల్ని యీడ్చి వొడ్డుకి కొట్టినట్టు వుండేదేమో! ఇవాళ్టికి దగ్గిర దగ్గిర రెండు నెలలు అవుతున్నాయా చే.రా. మాస్టారు వెళ్ళిపోయి!

అప్పట్నించీ లోపలి సజీవమైన అవయవమేదో వున్నట్టుండి నిర్జీవమైపోయినట్టు- లేదూ- వొక వెలితి యింక దేన్తోనూ నింపడానికి వొప్పుకోనట్టు – లేదూ- ఆ మరణపు వొక్క క్షణం అబద్ధమే అని యింకా అనుకుంటూ వున్నట్టుగా వుంది.

మరణాలు కొత్త కాదు. కానీ, ప్రతి మరణమూ కొత్తగా ఏడ్పిస్తుంది. అంతకు ముందు వెళ్ళిపోయిన మనుషులూ తక్కువ కాదు, కాని ఈ క్షణం వెళ్ళిపోయిన ఈ మనిషి యిలా వెళ్లి వుండకూడదనీ, మృత్యువు మరీ ఎక్కువ తొందరపెట్టి లాక్కు వెళ్ళిందనీ అనిపిస్తుంది.

నాన్నగారు పోయినప్పుడు- మట్టి కింద ఆయన్ని నేనే రెండు చేతులా  కప్పెట్టి వచ్చిన తరవాత చాలా రోజులు ఆయన మరణం అంతా అబద్దమనీ, ఆ మట్టి కింద నించి ఆయన వచ్చేస్తారనీ నమ్మేవాడిని. గాఢ నిద్రలో వున్న నిక్షేపంలాంటి మనిషిని తటాలున తీసుకువెళ్ళి మట్టిలో కలిపి వచ్చామనీ అనుకునేవాణ్ణి. అది అబద్దమని తెలిసినా సరే, అలాంటి వొక అబద్దంలో బతికాను కొన్నాళ్ళు. జీవితం ఆయన్ని మళ్ళీ వెనక్కి పిలుస్తుందనీ, “నీ విషయంలో మృత్యువు పొరపాటు చేసింది కౌముదీ!” అని సంజాయిషీ ఇచ్చుకొని, సెకండ్ చాన్స్ ఇస్తుందని కూడా పిచ్చిగా అనుకునేవాణ్ణి.

నాన్నగారు పోయాక చాలా మంది వెళ్ళిపోయారు. కాని, అలా జీవితం వెనక్కి పిలిచి రెండో వంతు ఇస్తుందని ఆశ పడింది వొక్క చే.రా. గారి విషయంలోనే!
అందుకే, యిప్పటికీ ఆయన మరణం నా మనసుకీ నా శరీరానికీ అలవాటు పడని చేదునిజం.

నాన్నగారు పోయినప్పుడు చాలా పత్రికలూ, మీడియా వాళ్ళు ఏమన్నా రాయండీ, చెప్పండీ అని అడిగీ అడిగీ అలసిపోయారు. కాని, ఏమీ రాయలేకపోయాను ఏడాది దాకా!

ఇప్పుడు చేరా విషయంలోనూ అంతే! కూర్చునే కుదురు లేదనీ కాదు, రాయాల్సినవి లేవనీ కాదు. తెలియని మౌనం వొకటి మనసులో కొంత భాగాన్ని తలుపు మూసి వుంచేసింది.

యిప్పటికీ ఈ రాసే నాలుగు వాక్యాల్లో నిగ్రహం వుంటుందని నేను అనుకోవడం లేదు. రాయాలని అనుకున్నది రాయకుండానే మనసూ, కాగితం రెండూ మడత పెట్టుకొని వెళ్ళిపోతానేమో కూడా తెలియదు.

2

టీనేజికీ, సైగల్ పాటలకీ జత కలవదు కానీ, ఎందుకో సైగల్ అలా వచ్చేశాడు అతని మంద్రస్వరంతో నా యవ్వనంలోకి! ఆ “సైగల్ పాట” అనే కవిత రాసి వుండకపోతే, చేరా కూడా నా జీవితంలోకి మరీ అంత నవయవ్వన కాలంలో వచ్చేవారు కాదు. మా యిద్దరి బంధంలో సైగల్ వొక live wire.

నిజానికి అంతకు ముందు నించీ చేరా గురించి folklore కొంత వుండింది మా వూళ్ళో! డబ్బు లేక ఆయన అమెరికాలో వొక ఫ్రెండ్ కి వంట చేసిపెడుతూ కష్టపడి చదువుకున్నారని, ఇక్కడి నించి అంత దూరం ఆయన అమెరికా వెళ్లి తెలుగు వాక్యం మీద రిసెర్చ్ చేసారనీ…ఇలా! నేను డిగ్రీలోకి వచ్చే సరికి ఈ folklore కి ఇంకా కొన్ని juicy details వచ్చి చేరాయి- చేరాగారూ ఆయన ప్రొఫెసరూ కలిసి మందు కొట్టేవారని! ఈ కథ ఎందుకో నాకు అప్పట్లో అంతగా నచ్చలేదు, నాలోపల puritan ఎవడో పీఠం వేసుకొని వుండడం వల్ల! అసలు అమెరికాలో విస్కాన్సిన్ యూనివర్సిటీ వొకటి వుందని కూడా ఆ తొలినాటి folklore వల్లనే తెలిసింది. చివరికి నేనూ అక్కడికే చేరుకుంటానని అప్పటికి నా వూహలో కూడా లేదు. సరే, ఈ పుక్కిటి పురాణాల సంగతి పక్కన పెడితే –

58

చిర్నవ్వే చేరా చిరునామా!

సైగల్ పాట కవిత అప్పట్లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో అచ్చయింది. బహుశా, అచ్చయిన నా తొలి కవితల్లో అదీ వొకటి. నేను రాసేది కవిత్వమనే నమ్మకం ఆ రోజుల్లో నాకు ఏ కోశానా లేదు. ఈ కవిత అచ్చయిన వారం రోజులకి నాకు చేరా గారి వుత్తరం వచ్చింది.  ఆ ఉత్తరం వచ్చిన వారం రోజులకి ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ఆయన కాలమ్ “చేరాత”ల్లో దాదాపు సగం పేజీ కేవలం ఆ సైగల్ పాట కవిత మీదే రాసేసరికి ఉత్సాహం కాస్త ఉరకలేసింది.  నా గురించి రాసినందుకు కాదు- పదిహేను లైన్లు కూడా లేని చిన్న కవిత మీద దినపత్రికలో సగం పేజీ రాయడం అంటే మాటలు కాదు. అంటే, వొక చిన్న కవిత వెనక ఇన్ని పెద్ద ఆలోచనలు సాధ్యమా అన్న ఉత్సాహం!

కవిత్వం పట్ల విపరీతమైన మోహం తప్ప కవిత్వ విమర్శ మీద పెద్దగా ఆసక్తి లేని నాకు ఆ వ్యాసం విశాలమైన కనువిప్పు. కవిత్వాన్ని గురించి మాట్లాడుకోవడానికి మళ్ళీ కవిత్వ వాక్యాలనే ఆశ్రయించే వాణ్ని ఆ రోజుల్లో! కవిత్వాన్ని కవిత్వ భాషలో మాత్రమే వ్యాఖ్యానించడం వీలవుతుందని వొక థియరీ కూడా చేసిన వాణ్ని. నా థియరీని రకరకాల పద్ధతుల్లో de-construct చేసి, “లేదు, కవిత్వాన్ని గురించి మనం నిరాడంబర/ నిరలంకార వచనంలో విమర్శ రాయాల్సిందే” అని నన్ను విమర్శ వైపు నెట్టిన నా తొలి ఉపాధ్యాయుడు చేరా.

ఆ రోజుల్లో చేత్తో వుత్తరాలు రాసే అలవాటు ఎక్కువగా వుండడం వల్ల ఎప్పటికప్పుడు తోచినప్పుడల్లా ఆయనకి రాసే వాణ్ని. ఆయన కూడా వెంటనే సమాధానం రాసే వారు. ఈ వుత్తరాలు రాసే అలవాటు నాకు ఎంత లాభించిందో చెప్పలేను. ఇస్మాయిల్ గారి ఉత్తరం ఎప్పుడూ కార్డుముక్క దాటి వెళ్ళేది కాదు. కాని, చేరా గారి వుత్తరం కనీసం మూడు అర ఠావు కాయితాలు వుండేది. చాల వోపిక ఆయనకి ఆ విషయంలో! విషయం డొంక తిరుగుడుగా వుంటేనో, కవితాత్మకంగా వుంటేనో వెంటనే ఆయన్నించి అక్షరాలా మొట్టికాయలు పడేవి. చేరాతో వుత్తరాల వల్ల నా వచనంలో అందమైన కవిత్వం లేకుండా పోతోందని చాలా మంది మిత్రులు ఆ రోజుల్లో బాధపడే వాళ్ళు కూడా! కాని, వచనం అనేది వొక thought process అనీ, rationalization అనీ నేనూ క్రమంగా నమ్మడం మొదలెట్టాక వాళ్ళ బాధ కొంత తగ్గింది. వొక రకంగా చేరాతో సాగిన ఆ వుత్తరాయణం అంతా నాకు వచనరచనలో శిక్షణ అన్నమాట.

సైగల్ పాటతో వొక ఉద్వేగభరితమైన సన్నివేశంతో మొదలైన మా స్నేహం చివరికి అలా ఆలోచనాత్మక దశకి మళ్ళిందన్న మాట.

ఈ స్నేహం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక మేం కలిసి సాహిత్య సభలకు ప్రయాణాలు చేయడం మొదలయింది. ఈ ప్రయాణాలు నా సాహిత్య యూనివర్సిటీలు! గంటల తరబడి ప్రయాణాల్లో నిద్ర కూడా పోకుండా రెండు మూడు ఇంగ్లీషు సాహిత్య విమర్శ పుస్తకాలు దగ్గిర పెట్టుకొని, అవి చదువుతూ, నా చేత వాటిని చదివిస్తూ, వాటి సారాంశం వివరిస్తూ, ప్రశ్నలు వేస్తూ, “ఎంతయినా నువ్వు కవివే! అంతే!” అంటూ మధ్యలో నా మందబుద్ధి మీద జోకులు రువ్వుతూ ఆ ప్రతి ప్రయాణం నేను ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకం.

అప్పుడే కవిత్వ నిర్మాణ వ్యూహాల మీద ఆయన కొత్తగా మాట్లాడుతున్న కాలం అది. అందులో భాగంగా ఆయన విపరీతంగా చదివే వారు. విదేశాలలో అప్పుడే వెలువడిన కొత్త కవిత్వ విమర్శ పుస్తకం ఏదీ ఆయన చూపు నించి తప్పించుకునేది కాదు. చదివిన వెంటనే దాన్ని గురించి మాట్లాడకపోతే ఆయనకి ఇబ్బందిగా వుండేది. అలాంటి చాలా సందర్భాల్లో నేను ఎలాగోలా దొరికే వాణ్ని – వుత్తరంలోనో, ఫోన్లోనో, సాహిత్య సభల్లోనో, లేదంటే ఆయన ఇంట్లోనో, కొన్ని సార్లు తను ఎంతో బిజీగా వుండే ఆఫీసులో కూడా ఆ పని అంతా పక్కన పడేసి మాట్లాడుతూనో!

గత నలభయ్యేళ్ళలో కవిత్వాన్ని గురించి చాలా విషయాలు మాట్లాడారు చేరా. సంపత్కుమారతో మొదలయిన వచన పద్య లక్షణ చర్చ నించి ‘చేరాతల’ కాలమ్ దాకా బహుశా ఆధునిక వచన కవిత్వం గురించి అంత విస్తారంగా చర్చించిన మరో విమర్శకుడు మనకు లేరనే అనుకుంటాను. అవన్నీ వొక ఎత్తు, 1985 తరవాత కేవలం కవిత్వ నిర్మాణ వ్యూహాల మీద ఆయన మాట్లాడిన విషయాలన్నీ ఇంకో ఎత్తు. (ఈ కవిత్వ వ్యూహాల గురించి ఆయన కల్పన కవిత్వ సంపుటి “నేను కనిపించే పదం”లో కూడా ప్రస్తావించారు.)

ఆధునిక భాషా వేత్తలు ఇప్పుడు కేవలం భాషకి మాత్రమే పరిమితమై మాట్లాడడం లేదు. భాష చుట్టూరా వుండే ఇతర సామాజిక మానసిక సాంస్కృతిక అంశాలను కూడా కలుపుకొని మాట్లాడుతున్నారు. వొకవిధంగా భాష అనేది సాంస్కృతిక అంశంగా (cultural pattern) గా మారింది. కవిత్వంలో వాడే భాష, వాక్య నిర్మాణాలూ, idiom, కవి తనకంటూ నిర్మించుకునే individual grammar, కవిత్వ వాక్యాల మధ్య వదిలేసే ఖాళీ జాగాలూ ఇవన్నీ ఇప్పుడు కవిత్వ రసనకి అవసరమవుతున్నాయి. అంటే, para-linguistic features కవిత్వ భాషలో భాగమవుతున్నాయి. 1985 తరవాత వొక భాషావేత్తగా చేరా మాస్టారు కవిత్వ విమర్శలో సాగిస్తూ వచ్చిన interventions ని స్థిమితంగా ఆలోచిస్తే, ఆయన్ని గురించి విమర్శపరంగా మనం చేసే ఆలోచనలు అర్థవంతంగా వుంటాయి. ఈ కోణం నించి చేరా అన్వేషణ ముత్యాల సరాల ఛందస్సు మీద చర్చతో మొదలయిందని నేను అనుకుంటున్నా.

1990 లో బెంగళూరులో ప్రపంచ తెలుగు మహాసభల్లో చేరాతో ఎన్. గోపి, శిఖామణి, కొండేపూడి నిర్మల, నాయని కృష్ణ కుమారి, అఫ్సర్, యాకుబ్.

1990 లో బెంగళూరులో ప్రపంచ తెలుగు మహాసభల్లో చేరాతో ఎన్. గోపి, శిఖామణి, కొండేపూడి నిర్మల, నాయని కృష్ణ కుమారి, అఫ్సర్, యాకుబ్. (ఫోటో సౌజన్యం: చేకూరి సంధ్య)

నా మటుకు నాకు 1990 లో బెంగుళూరులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు వ్యక్తిగతంగా మంచి అనుభవం. ఆ మహాసభల వేదిక మీద కవిత్వం చదవమని నాకు ఆహ్వానం రావడం పెద్ద ఆశ్చర్యమైతే, ఆ సభల కోసం హైదరాబాద్ నించి బెంగుళూర్ కి చేరా గారితో రైలు ప్రయాణం, ఆ వూళ్ళో నాలుగైదు రోజులు ఆయనతో కలిసి వుండడం ఇంకా అద్భుతమైన అనుభవం. నాకు తెలిసిన వాళ్ళలో నాయని కృష్ణకుమారి, ఎన్. గోపి గార్లు, శిఖామణి, కొండేపూడి నిర్మల, యాకూబ్ కూడా ఈ సభలకు వచ్చారు.

ఆ ప్రయాణంలోనే చేరాగారు ముత్యాల సరాలు ఛందస్సు మీద మాకు సుదీర్ఘ క్లాస్ తీసుకున్నారు. ముత్యాలసరాలతో గురజాడ గాని, శ్రీశ్రీ గాని ఎందుకు అంత ప్రేమలో పడ్డారో అప్పుడే నాకు గట్టిగా అర్థమైంది. అయితే, అది గురజాడ, శ్రీశ్రీ కంటే ఎక్కువ ఇప్పుడు చేరా విమర్శ గురించి చెప్పే సాధనం.

అప్పటివరకూ వున్న భాషనీ, దాని నిర్మాణాల్ని పడగొట్టి, కొత్త idiom ని కట్టుకుంటూ రావడంతో కొత్త కవిత్వం వస్తుంది. పునాదిలో కొంత పాత వున్నప్పటికీ కొత్త వాక్యం కొత్త గూడులా కట్టుకోకపోతే కవికి చిరునామా మిగలదు. ఆ చిరునామా కోసం వెతుకులాట కేవలం అనుభూతికో, కవిత్వ ఉద్వేగానికో సంబంధించిన విషయం కాదు. అంతకంటే ఎక్కువగా అది భాషకి సంబంధించిన ఉద్వేగం. మొన్నటి గురజాడ గాని, నిన్నటి శ్రీశ్రీ గాని, ఇవాళ్టి కొత్త కవి గాని ఆ పని వున్నపళాన చేయలేరు. వాళ్ళు పాతవాటిలో కొన్నిటికి కొత్త స్ఫురణ యిస్తారు, కొత్తవాటిని బలంగా చెప్పడానికి వీలుగా.

బెంగళూర్ లోనే నండూరి రామమోహన రావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారితో...

బెంగళూర్ లోనే నండూరి రామమోహన రావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారితో…

ఇలాంటి కృషిలో కవికీ, కవిత్వ విమర్శకుడికీ పెద్ద తేడా ఏమీ వుండదు. చేరా తను కొత్తగా చెప్పబోయే వచన కవిత్వ నిర్మాణ వ్యూహాలకు కావలసిన పరిభాష, తాత్విక పునాది ఏర్పర్చుకోడానికే ముత్యాలసరాల దాకా వెళ్ళారని నాకు అర్థమైంది. ముత్యాలసరాల్లో వ్యక్తీకరణకి సంబంధించి వొక linguistic/metrical ease వుంటుంది. అది షేక్స్పియర్ sonnet నించి తీసుకున్న ease లాంటిది. చేరా గారు కూడా కొత్త కవులు భాషలో తీసుకువస్తున్న ఈ linguistic/metrical ease ని చెప్పడానికే ముత్యాల సరాల దాకా వెళ్ళారు. ఇవాల్టి కవి వాడుతున్న భాష వెనక నిర్మితమవుతున్న/ లేదా వినిర్మితమవుతున్న కొత్త వ్యాకరణం అర్థం కావాలంటే ఆ ఇద్దరు మహాకవులూ ముత్యాలసరాలని ఎట్లా చాకిరీ చేయించారో తెలియాలి. ఈ విషయం కొంత నేను ఇదివరకే అచ్చయిన వ్యాస సంపుటి “ఆధునికత- అత్యాధునికత” (1992) లో చర్చించాను కనుక వాటి వివరణలోకి ఇప్పుడు వెళ్ళడం లేదు.

ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడం ద్వారా నేనేం సాధించానో నాకు గుర్తు లేదు కాని, ఆ నాలుగు రోజుల పాటు చేరాతో కలిసి వేసిన అడుగులూ, తాగిన కాఫీలూ, భోజన సమయాలూ సాయంత్రపు నడకలూ అటు ఇటు ప్రయాణాల్లో ఆయన విమర్శ హృదయానికీ, ఆయనలోని నిరాడంబర తాత్వికుడికీ దగ్గిరయ్యాను కదా అనిపించింది.

4

అలా దగ్గిరయ్యాక-

2000 లో మాడిసన్ నించి విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం ఆహ్వానం వచ్చినప్పుడు వెళ్ళాలా వద్దా అని విపరీతమైన డైలమాలో వున్నప్పుడు గంటల తరబడి చేరాతో చర్చలు. ఉద్యోగ రీత్యా నేను మంచి స్థితిలో వున్నప్పుడు, యింకా ముందుకు వెళ్ళే అవకాశాలే కనిపిస్తున్నప్పుడు మాడిసన్ వెళ్లి సాధించేదేమిటి అన్నది నా ప్రశ్న. ఇప్పుడు వెళ్ళకపోతే తరవాత repent అవుతావని ఆయన సూటిగానే చెప్పేశారు. చేరాకి మాడిసన్ అన్నా, విస్కాన్సిన్ యూనివర్సిటీ అన్నా ప్రత్యేకమైన ప్రేమ అని నాకు తెలుసు. 2007 లో కూడా నేను వొక గ్రాంట్ మీద ఇండియాలో వుండడమూ, అదే సమయంలో ఇండియా యూనివర్సిటీలలో వొకటి రెండు ఆఫర్లతో వూగిసలాడుతున్నప్పుడు కూడా ఇప్పటికి ఈ వుద్యోగాలు మంచి ఆకర్షణే కాని తరవాత నెమ్మదిగా అసంతృప్తి మొదలవుతుంది అని నీళ్ళు నమలకుండా నన్ను మళ్ళీ అమెరికా వేపు దాదాపూ నెట్టేశారు ఆయన.

మరీ వ్యక్తిగతంగా ఆలోచిస్తే, హైదరాబాద్ లో వుండగా నేను మానసికంగా ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో వున్నప్పుడు ఆ రెండు రకాలుగా కూడా వొక ఆత్మీయ స్నేహితుడిగానే ఆయన నన్ను ఆదుకున్నారు. ముందూ వెనకా ఏమీ ఆలోచించకుండా నా కోసం పరుగుపరుగున వచ్చారు. సాధారణంగా తెలుగు సాహిత్యలోకంలో ఇలాంటి ఆత్మీయతలు అరుదు.

వొక అక్షర స్నేహం కొన్ని సంవత్సరాల తరబడి కొనసాగినప్పుడు అందులో వ్యక్తిగతం, సాహిత్య గతం అని విభజన రేఖలు సాధ్యపడవు. స్నేహం ఎన్నాల్టిది అన్న ప్రశ్న కూడా వుండదు. కాని, ఏ ఇద్దరు వ్యక్తుల జీవితంలో అయినా ముప్ఫయ్యేళ్ళు అన్నది చాలా దీర్ఘ కాలమే! ముప్ఫయ్యేళ్ళలో ఎన్ని సంభాషణలూ, ఎన్ని కలయికలూ, ఎన్ని ప్రయాణాలూ! వాటన్నిటిని చెప్పుకుంటే పోతే సగం జీవిత చరిత్ర గడిచిపోతుంది.

5

 

2014: హైదరాబాద్ లో కడసారి వీడ్కోలు: అఫ్సర్, గద్దర్,  వరవరరావు, సంధ్య, చలసాని ప్రసాద్, చేకూరి శ్రీనివాసరావు.

హైదరాబాద్ లో కడసారి వీడ్కోలు: అఫ్సర్, గద్దర్, వరవరరావు, సంధ్య, చలసాని ప్రసాద్, చేకూరి శ్రీనివాసరావు (ఫోటో: డాక్టర్ కే. రాందాస్)

వొక నిష్క్రమణ గురించి చెప్పడానికి ఎప్పుడూ మనసొప్పదు. భాషా వొప్పుకోదు. కవిత్వమూ రాదు. వచనంలోనా, ఆ వుద్వేగాలేమీ నిలవవు.

వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతారు మనుషులు. ఈలోపు వాళ్ళు అత్మీయులవుతారే…అవుతూ అవుతూనో, మరీ దగ్గిరగా వచ్చి గుండెలో వొక చిన్ని అర కట్టుకొని, వొక వుదయాన చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతారే…అక్కడ మొదలవుతుంది pain- ఈ pain అనేది చాలా చిన్న మాట అనిపించే పెద్ద వెలితి.

వున్నట్టుండి వొక మనిషి మన మధ్య నించి వెళ్ళిపోవడం అంటే చూస్తూండగానే అక్కడ ఆ మనిషి లేని జ్ఞాపకం పుట్టుకురావడం! కొన్ని మాటలు ఆగిపోవడం! మనకై విరిసే కొన్ని చిర్నవ్వుల కళ్ళలోంచి చూపుల మెరుపులు రాలిపోవడం!

అంతకంటే pain – అవన్నీ ఇప్పుడు వొట్టి కాగితాల మీద తప్ప కనిపించకపోవడం!

*

ఆరుద్ర రైలు కాస్త లేటుగా అందుకున్నా…

arudra1

       శ్రీ శ్రీ మీద వున్న విపరీతమయిన ఇష్టం వల్ల ఆరుద్ర అంటే ఎందుకో అంతగా ఇష్టం వుండేది కాదు నాకు! అట్లా అని అయిష్టమూ లేదు.

   మరీ లేత వయసులో– అంటే టీనేజీ అని నా ఉద్దేశం- శ్రీశ్రీని ప్రత్యక్షంగా కలిసి వున్న అనుభవం కూడా దీనికి కారణమయి వుంటుంది! అయితే, ఆంధ్రజ్యోతి లో చేరిన కొత్తలో మంచి వచనం రాయడం ఎలాగా అని తెగ మథనపడే రోజుల్లో శ్రీశ్రీ వచనం, మరీ ముఖ్యంగా శ్రీశ్రీ వ్యాసాలు, నాకు పెద్ద ఆకర్షణ. అలా శ్రీశ్రీని వొక కవిగా కంటే గొప్ప వచన రచయితగా సొంతంగా డిస్కవర్ చేస్తున్న కాలం అది. ‘నువ్వు నీలాగే రాయ్” అని నండూరి అనే వారు. అయినా, ఏదో తాపత్రయం!

అలాంటి 1986 రోజుల్లో ఒక తెల్లారుజామున బెజవాడ బందర్ రోడ్డులో వేంకటేశ్వర స్వామి వీధిలో వున్నమా వొంటరి గది – ఈ ఇరుకు గదిలో నేనూ, రుద్రాభట్ల కిషన్ చాలా ఏళ్ళు ఒకే మంచం ఒకే కంచంగా బతికాం. ఆ గది తలుపు తట్టారెవరో! తలుపు తీస్తే ఎదురుగా వొక అపరిచిత వ్యక్తి.

అతను నన్ను పరిచయం చేసుకొని, “సార్, ఆరుద్ర గారు కబురు చేశారు. ఇవాళ మీకు వీలు కుదిరితే రమ్మన్నారు.” అన్నాడు.

ఆరుద్రగారు వూళ్ళో వున్న సంగతి నాకు తెలుసు కానీ, నా పొగరు వల్ల (పొగరు అనే కంటే శ్రీ శ్రీ పట్ల వున్న ప్రేమలోని “విగరు” వల్ల అనుకోవచ్చు) ఆ విషయం నేను అంతగా పట్టించుకోలేదు.

“సరే, వస్తాను”

“ఇప్పుడు వెంటబెట్టుకొని రమ్మన్నారండి” అన్నాడతను కదలకుండా.

నేను అంత తేలికగా కదిలే ఘటం కాదని అతనికి తెలీదల్లే వుంది. అప్పట్లో నాదయిన ఒక చచ్చు/నచ్చు క్రమశిక్షణ నాకుండేది. పొద్దున లేవగానే బందరు రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళ్ళి గాంధీనగర్ పక్కన ఎప్పుడూ వొకే టిఫిన్ సెంటరులో ఎప్పుడూ అదే ఇడ్లీ వడ సాంబారు లాగించి, ఎప్పుడూ అదే దారిలో వున్న ప్రబోధ బుక్ సెంటరులో మధ్యాన్నం దాకా పుస్తకాలు చదువుతూ కూర్చోడం అప్పటి అలవాటు. (అప్పుడంతా మధ్యాన్నమో, రాత్రి డ్యూటీలో వుండేవి కనుక, పుస్తకం కొనడం అంటే నెల జీతంలో సగమో, మూడు వంతులో “ధార” పోయడమే కనుక, ఆ క్రైస్తవ దుకాణం నాకు మంచి ఆశ్రమం అయ్యింది). మూడు నాలుగు గంటల చదువు తరవాత, విశ్వేశ్వర రావు గారి మెస్ (అవును, ఇప్పటి ‘శ్రీశ్రీ’ విశ్వేశ్వర రావే!) లో మధ్యాన్న భోజనం! బ్రహ్మాదులు వచ్చినా ఆ రొటీన్ మారేది కాదు.

‘నేనొస్తాను, మీరు పదండి” అని అతన్ని అప్పటికప్పుడు పంపించేసి, తరవాత నిదానంగా నేను నా డొక్కు ర్యాలే సైకిలెక్కి ఆరుద్ర దిగిన హోటల్ చేరుకున్నా.

వెళ్ళేసరికి ఆరుద్ర అప్పటికే రెడీగా వున్నారు, “రండి…మీరొస్తే కలిసి టిఫిన్ చెయ్యొచ్చని కూర్చున్నా” అంటూ కింద రెస్టారంట్ కి దారి తీశారు.

ఆరుద్ర గారు నాకంటే తాపీ మేస్త్రీ! చాలా తాపీగా పనులు చేసే మనిషిలా కనిపించారు మొదటి పరిచయంలోనే. ఆయన కదలికలూ, మాట తీరు చూసి, “మీరు కూడా తాపీ ధర్మారావు గారేనా?” అన్నాను సరదాగా. అసలు అంత నెమ్మదిగా వొక్కో వాక్యం తూచినట్టుగా మాట్లాడ్డం సాధ్యమా అని ప్రతిసారీ అనిపిస్తుంది ఆయన మాటలు వింటూ వుంటే!

దానికి ఆయన పెద్దగా నవ్వేసి, “అవును అందరం ఆ తాపీ తానులో గుడ్డలమే కదా!” అన్నారు, అదీ తాపీగానే! “నేనెక్కాల్సిన రైలు ఎప్పుడూ జీవిత కాలం లేటు” అని ఆయన ఎందుకు అంత అథారిటీగా అనగలిగారో అప్పుడే అర్ధమవడం మొదలయ్యింది.

“మీ గడ్డం ఇన్స్పిరేషను కూడా ఆయనేనా?”

“లేదు, లేదు. కేవలం నా బద్దకం వల్ల, తీరిక లేక, వదిలేశాను గడ్డం!” అన్నారాయన.

టిఫినీ కార్యక్రమాలు అయ్యాక, ఆయన నెమ్మదిగా విషయంలోకి వచ్చారు.

‘నేను ఒక సంకలనం పని మీద మీ కోసం కబురు చేశాను. ఇది కేంద్ర సాహిత్య అకాడెమీ వాళ్ళు నాకు అప్పజెప్పిన పని. వాళ్లకేమీ కాలం పట్టింపు లేదు. కానీ, నాకు వుంది. ఈ సంకలనంలో 1975 తరవాత కవిత్వం ఎక్కువ వుండాలి అనుకుంటున్నా.”

“అవును, 75 తరవాతే బాగుంటుంది. కనీసం అంతకు ముందు వచ్చిన కవిత్వం అంతా ఏదో వొక విధంగా సంకలనాలకి ఎక్కింది. పైగా, 75 తరవాత చాలా కొత్త తరం వచ్చింది.” అన్నాను నేను.

“ఇంకో మాట ఏమిటంటే, ఈ సంకలనం వచ్చేనాటికి ఇంకా కొంత సమయం పట్టవచ్చు. కనీసం 75 ని ఒక కొండగుర్తుగా గుర్తిస్తే మనం సాహిత్యాన్ని చూసే దృష్టి మారుతుంది. కానీ, ఇటీవలి రాస్తున్న వాళ్ళ గురించి నాకు ఆట్టే తెలియదు. అక్కడ మీ సాయం కావాలి. మనం ఇద్దరం కూర్చొని వొక జాబితా తయారు చేసి, వాళ్లందరినీ కలిసి సంప్రదిద్దాం.” అన్నారాయన.

‘నండూరి గారు, శ్రీకాంత శర్మగారు ఇంతకు ముందు “మహా సంకల్పం” చేశారు. వారిని అడిగితే బాగుంటుందేమో?!’ అన్నాను నేను.

“వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళే మీ పేరు చెప్పారు.” అన్నారు ఆరుద్ర.

ఆ తరవాత చాలా సేపు మా చర్చ అప్పుడు కొత్తగా రాస్తున్న వాళ్ళూ, వాళ్ళ కవిత్వాల చుట్టూ తిరిగింది. కానీ, చాలా సేపటి కబుర్ల తరవాత నాకు అర్ధం అయ్యిందేమిటంటే, సమకాలీన కవిత్వాన్ని ఆయన చాలా శ్రద్ధగా చదువుతున్నారని! నన్ను అడగడం కేవలం క్రాస్ చెక్ చేసుకోవడం కోసం మాత్రమేనని!

మేము అలా చర్చిస్తూ వుండగానే, అక్కడికి నండూరి, పురాణం గార్లు కూడా వచ్చారు. ఇక నేను నిష్క్రమించడం మంచిదని అనుకుంటూ, లేవడానికి ప్రయత్నిస్తూ, “నేను మళ్ళీ కలుస్తాను” అనబోతుండగా, నండూరి గారు “ఏం పర్లేదు, వుండవోయ్, కాసేపు!” అన్నారు.

Arudra

కానీ, ఆ కాసేపటి తరవాత ఆరుద్ర గారు “అఫ్సర్ గారూ, నేను వొక రెండు రోజులు ఈ చుట్టు పక్కల గుంటూరు, తెనాలి, బందరూ అన్నీ తిరిగి, కొత్త రచయితల్నీ, కవుల్ని కలుద్దామని అనుకుంటున్నా. మీరొస్తే బాగుంటుంది.” అన్నారు. నేను నండూరి గారి వైపు తిరిగాను, ప్రశ్నార్థకంగా.

“పరవా లేదు, వెళ్ళు. ఈ వారం సాహిత్య పేజీ ఇచ్చి వెళ్ళు, సరిపోతుంది” అన్నారాయన. ఆంధ్రజ్యోతి సాహిత్య వేదికని నిండు సాహిత్య పేజీగా మార్చిన కాలం అది. చాలా కొత్త శీర్షికల వల్ల సాహిత్య వేదిక అందరినీ ఆకట్టుకుంటున్న కాలం కూడా – రచనలు, లే ఔట్ విషయంలో ఇద్దరం చాలా శ్రద్ధ పెట్టేవాళ్లం. ప్రతి అక్షరం పట్టి పట్టి చదివే వాళ్ళం. కానీ, రచనల ఎంపిక విషయంలో నాకు పూర్తి స్వేచ్చ వుండేది. నేను వెంటనే ఆఫీస్ కి వెళ్ళి, ఆ సాయంత్రానికల్లా పేజీ ముస్తాబు చేసి, ఇచ్చి, హోటల్ కి వచ్చి, మళ్ళీ ఆరుద్రగారిని కలిశాను.

2

సాయంత్రం అయిదు గంటలకి మేము బెజవాడ నించి కారులో బయలు దేరాం. ఆ రెండు రోజుల ప్రయాణాలు నేను మరచిపోలేనివి. పూటకి ఒక ఊళ్ళో దిగడం, అక్కడి కవులూ, రచయితలతో మాట్లాడ్డం…! వెళ్ళిన వూళ్లలో కొద్ది సెపే వున్నాం కానీ, వొక వూరి నించి ఇంకో వూరికి ప్రయాణం మా ఇద్దరి మధ్య చాలా కబుర్లకూ, కథలకీ అవకాశం ఇచ్చింది.

ఆరుద్రని నేను నా చిరకాల స్థిర నిశ్చిత పూర్వ అభిప్రాయాల నించి కాకుండా, ప్రత్యక్షంగా చూడడం మంచిదే అయ్యింది. ఆరుద్రగారికి వున్న అనేక ఆసక్తుల్లో స్థల పురాణం వొకటి. దారిన కనిపించే ప్రతి వూరి కథా పురాణం ఆయనకి తెలిసినట్టే అనిపించింది, ఆయన చెబుతూ వుంటే! అలాగే, దాదాపు ప్రతి వూరు సాహిత్య చరిత్ర ఆయన కి కొట్టిన పిండి. అక్కడి రచయితలూ, వారి జీవన విశేషాలూ చెప్తూ వుంటే, ఇంత చరిత్ర దృష్టి వుండడం సాధ్యమా అని ఆశ్చర్యపోవడం మినహా నేను చేయగలిగిందేమీ లేదు. ప్రాంతీయ, స్థానిక చరిత్రల గురించి ఇప్పుడు ఇంత కంఠ శోష పెట్టినా, అసలు ఆ చరిత్రల్ని తవ్వి తీయగల శక్తి మనకి వుందా అనిపిస్తోంది నాకు! అసలు మన జాతి (అది “ఆంధ్రా” అయినా, “తెలంగాణ” అయినా, “రాయలసీమ’ అయినా) సాంస్కృతిక చరిత్ర గురించి అంత దీక్షగా పనిచెయ్యగలిగే అంకిత భావం మనకుందా అని!

అవన్నీ పక్కన పెట్టి, మా మధ్య జరిగిన కొన్ని సాహిత్య కబుర్లు మాత్రమే ఇప్పుడు చెప్తాను.

శ్రీశ్రీ గురించి మొదలయిన కబుర్లు ఆరుద్ర తొలినాళ్ళ దాకా వెళ్ళాయి. నాలో చాలా కాలంగా నలుగుతున్న ప్రశ్నల్ని బయటికి రువ్వే అదను దొరికింది. “ఇదే అదను…” అనుకుంటూ వొక్కోకటీ నెమ్మదిగా సంధించడం మొదలెట్టాను. ఆయన తాపీగా సమాధానాలివ్వడం మొదలెట్టారు.

‘మొదట్లో మీరు డిటెక్టివ్ నవలలు రాశారు, అవి ఎందుకూ?”

“డిటెక్టివ్ నవలలే కాదు, ఇంకా చాలా రకాలు రాసి, ఒక విధంగా చెప్పాలంటే, పారేశాం. మీ శ్రీశ్రీ కూడా డిటెక్టివ్ నవలలూ, కథలూ రాశాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే, మేం చేసిన పని ఏమిటో మీకు అర్థమవుతుంది. మేము అసలు పాఠకులు అంటూ కొత్తగా ఒక వర్గం తయారవుతున్న కాలంలో చేసిన రచనలు అవి. ఆధునికత వచ్చింది. పత్రికలు వస్తున్నాయి. అప్పుడప్పుడే కొత్త పాఠకులు తయారవుతున్నారు. ఎవరీ పాఠకులు? కాస్తో కూస్తో ఇంగ్లీషు చదువుకున్న వాళ్ళే కాదు, తెలుగులో పత్రికలకు, రాత సాహిత్యానికీ అలవాటు పడుతున్న వాళ్ళు. మధ్యతరగతి వాళ్ళు. ఇంకా కమ్యూనిస్టు భావజాలం ప్రవేశించని కాలం అది. పాఠకుడికి వామపక్ష స్వభావమో, ఇంకోటో అంటూ ఏర్పడని కాలం అది. వాళ్ళకి చదివే ఆసక్తి పెంచడం వొక్కటే అప్పట్లో మా పని. దాని కోసం కొన్ని పనులు పని కట్టుకుని చేశాం. ఇంగ్లీషులో డిటెక్టివ్ కథలు వున్నాయా, సరే, అయితే, తెలుగులో కూడా అవి వుండి తీరాలి. ఇంగ్లీషులో స్కేచెస్ వున్నాయా, సరే, అయితే, తెలుగులో కూడా అవి మనం రాసి తీరాలి. ఇలా అన్న మాట! అందులో సాహిత్యం వుందా లేదా అన్నది అప్పట్లో ముఖ్యం కాదు. అవి కొత్త పాఠకుల చేత చదివిస్తున్నామా లేదా అన్నది మా తాపత్రయం. ఇవన్నీ దాదాపూ అనుకోని చేశాం మేం!”

నిజమే, అచ్చు సంస్కృతి అప్పుడప్పుడే విస్తరిస్తున్న కాలంలో వాళ్ళు పడ్డ కష్టాలేమిటో నిజంగానే ఇంకా మనకి తెలియదు, శ్రీ శ్రీ “అనంతం”లో, శ్రీపాద “అనుభవాలూ జ్నాపకాల”లో కొన్ని ఉదాహరణలు తప్ప –

కానీ, ఆరుద్ర ఆ డిటెక్టివ్ తరహా వచనంలోంచి సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం దాకా తెలుగు వచనాన్ని తీసుకువెళ్లడం చాలా పెద్ద మలుపు. అది కేవలం సాహిత్య చరిత్ర కాదనీ, మొత్తంగా సాంస్కృతిక చరిత్ర నిర్మాణమే అనీ నా అభిప్రాయం.

బెజవాడ ప్రెస్ క్లబ్ లో ఆరుద్ర సభ అఫ్సర్ అధ్యక్షతన...

బెజవాడ ప్రెస్ క్లబ్ లో ఆరుద్ర సభ అఫ్సర్ అధ్యక్షతన…

అనేక రకాల పనులు చేస్తూ కూడా సమగ్రాంధ్ర సాహిత్యం మీద పని చెయ్యడం ఎలా సాధ్యపడిందని అడిగాను. “ఏమీ లేదు. కొంచెం బండగా అంత కంటే మొండిగా కూర్చొని తెల్లారే లేచి రాయడం మొదలుపెట్టాను. లేకపోతే, ఎక్కడ అవుతుంది, ఆ సినిమాల గోలలో, నానా రకాల వ్యాపకాలలో? కానీ, అలాంటి పనుల్లో రాయడం కంటే కూడా పరిశోధనకి ఎక్కువ సమయం కావాలి. సరే, ఆ పుస్తకం నా జీవితకాలం రచన అనుకున్నాను కాబట్టి అదే కాస్తో కూస్తో మిగిలే రచన అనుకున్నాను కాబట్టి దీక్షగా రాశాను.” అన్నారు ఆరుద్ర. ఆ రచన పరిశోధనకి ఆయన పడిన కష్టాలు, అన్నిటికీ మించి కొన్ని నిర్ధారణలకు రావడానికి ఆయన పడిన సంఘర్షణని చక్కగా పూసగుచ్చినట్టు చెప్పారు. ఇప్పుడు “పూసగుచ్చినట్టు” అంటే గుర్తొచ్చింది, ఆ మాట ఆరుద్ర మాట్లాడే శైలికి చక్కగా సరిపోతుంది నిజానికి.

సాంస్కృతిక చరిత్ర నాకు మొదటి నించీ చాలా ఆసక్తికరమయిన రంగం. ఆ విషయం మీద ఆయన ఆలోచనలూ, పరిశోధనా పద్ధతి తెలుసుకోవాలన్న ఉత్సాహంతో కొన్ని సంభాషణలు అటు తీసుకువెళ్లాను.

అప్పుడు ఆయన అన్న వొక మాట మా చర్చనీ వేరే దారి పట్టించింది . “మన చరిత్రలో విదేశీ చరిత్రల్లో మాదిరిగా సాంస్కృతిక చరిత్రని గాని, సాహిత్య కళా చరిత్రల్ని కానీ సామాజిక రాజకీయ చరిత్రల నుంచి విడిగా చూడడం సాధ్యం కాదు. ఉదాహరణకి ఇంగ్లీషులో రొమాంటిక్ ఉద్యమం వుందనుకోండి, అక్కడ మీరు వర్డ్స్ వర్తు, కీట్సు, షెల్లీని విడదీసి వాళ్ళ సాంస్కృతికతని చూడవచ్చు” అన్నారు.

ఠక్కున కౌంటర్లు ఇవ్వడం నాకు పుట్టుకతో అబ్బిన విద్య కాబట్టి, వెంటనే నేను దానికి కౌంటరు కొట్టేశాను.

“అది నిజం కాదేమో! ఏ సాంస్కృతిక చరిత్ర అయినా సమాజంతోనో, రాజకీయాలతోనో ముడిపడి వుంటుంది. వర్డ్స్ వర్తుని, కీట్సుని కూడా వాటికి విడిగా అధ్యయనం చేయలేం అనుకుంటా. వర్డ్స్ వర్తు చాలా స్పష్టంగానే తన రాజకీయాలు చెప్తాడు. కీట్సు చెప్పకపోవచ్చు, కానీ అలా చెప్పకపోవడం కూడా రాజకీయమే. కీట్సులోని నైరాశ్యానికి కేవలం అతని వ్యక్తిత్వమే కారణం కాదు, అతని చుట్టూ వున్న రాజకీయాలు, సమాజం సమానంగా కారణం” అన్నాను.

“ఆ…కావచ్చు. కానీ స్పష్టంగా చెప్పే రాజకీయాలకూ, చెప్పని రాజకీయాలకూ తేడా వుంటుంది” అన్నారాయన అంత తేలికగా నన్ను కాదనలేక, అవునని కూడా అనలేక.

“తెలుగు వాళ్ళం మనం షెల్లీని, కీట్సుని కొన్ని చరణాలుగా (stanzas) మాత్రమే చదువుతాం. ఆ మేరకే అర్ధం చేసుకుంటాం, అందుకే మనం మన కృష్ణ శాస్త్రి గారిని ఆంధ్రా షెల్లీ అని అమాయకంగా పేరు పెట్టుకున్నాం. నిజానికి కృష్ణ శాస్త్రి గారికీ, షెల్లీకి ఏ విషయంలోనూ పోలిక లేదు. షెల్లీకి వున్న స్పష్టత కృష్ణ శాస్త్రి గారికి లేదు, ఎందుకంటే, కృష్ణశాస్త్రి గారికి విషాదం అంటే అదేదో వేరే లోకం నుంచి ఉత్పత్తి అయిన వస్తువు.” అన్నాను నేను.

“ఇదేదో నాకు కొత్త సంగతి. కాస్త ఆలోచించనివ్వండి నన్ను- కృష్ణ శాస్త్రి గారి గురించి మీరు చెప్పింది నిజమే!” అన్నారాయన నేను వొక పట్టాన ఆ విషయం వదిలేట్టు లేదని అర్థమయినట్టుగా- “మీరు ఇంగ్లీషు కవిత్వమూ తెలుగు కవిత్వం మధ్య పోలికలు చూపిస్తూ మంచి వ్యాసాలు రాయాలి” అని ఆ పూట ఆయన మంచి సలహా ఇచ్చారు కానీ, అది మంచి సలహా కాబట్టి నేను వినలేదు!

ఆ ప్రయాణాల సందర్భంగా ఆరుద్ర గారు తన రాత క్రమశిక్షణ గురించి చెప్పిన చాలా విషయాలు నాకు నచ్చాయి. అంత క్రమశిక్షణ శ్రీశ్రీ కి వుంటే ఎంత బాగుండేది అనుకున్నా. ఆ విషయమే ఆయన్ని అడిగా.

“శ్రీ శ్రీ యవ్వనంలో వున్నప్పుడు బాగా క్రమశిక్షణగానే వున్నాడు. అందుకే చూడండి, ఎన్ని అనువాదాలు చేశాడో! అతని వచనం చాలా గొప్పది. కానీ, వొక్క సారిగా ‘మహాకవి’ అన్న ముద్ర పడ్డాక అతను ఆ వచనం జోలికి వెళ్ళలేదు. ఎంతో శక్తి వుండి కూడా ఏమీ చేయకుండా వుండి పోయాడు. రాజకీయ పర్యటనలు అతని సమయాన్ని బాగా తిన్నాయనుకోండి. నాకు రాజకీయాల మీద అంత ఆసక్తి లేదని అనను గాని, అలా తిరగడం మీద ఆసక్తి లేదు. నేను ఏమన్నా తిరిగితే ఇదిగో ఇలా సాహిత్యం పనులు పెట్టుకొనే తిరుగుతాను”

నిజమే! కానీ, శ్రీశ్రీకి అలాంటి తిరుగుళ్ళు వుండబట్టే, కొత్త తరంలోనూ అతని కవిత్వం బతికింది. అది కాదనలేని సత్యం. శ్రీశ్రీ గురించి ఆయన ఇంకా చాలా వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడారు కానీ, వాటిలో సగం విషయాల మీద నాకు ఆసక్తి లేదు, అవి నిజమని కూడా నాకు నమ్మకం లేదు! కాబట్టి, ఇక్కడ చెప్పడమూ లేదు.

మొత్తం మీద ఈ ప్రయాణం తరవాత ఆరుద్ర వ్యక్తిత్వంలోని కొత్త కోణాలు నాకు చాలా దగ్గిరగా అర్థమయ్యాయి. ఆయన మీద అంత అయిష్టం వుండక్కరలేదు అని కూడా అర్థమయింది. అప్పటి నించి ఆరుద్ర రచనల్ని తిరిగి ఇంకో సారి చదవడం మొదలెట్టాను, ఈ సారి నాకు తెలిసిన వ్యక్తిత్వపు వెలుగులో!

చాలా ఆశ్చర్యంగా వుంటుంది. జీవితం ఎప్పుడూ వొక ప్లాట్ ఫారం లాగానో, రైలు ప్రయాణమో అనుకుంటే, కొన్ని సార్లు మనం ఎక్కాల్సిన రైళ్లు మనం చూస్తూండగానే వెళ్లిపోతాయి. వొక్కో సారి అదృష్టం బాగుంటే, మనం ఎక్కిన కోచ్ లోనే మనకి బాగా ఇష్టమయి ఎన్నాళ్లుగానో కలవాలని ఎదురుచూస్తున్న వ్యక్తిని కలవవచ్చు. కాస్త మాట్లాడుకునే అవకాశమూ దక్కవచ్చు.

ఆ రెండు రోజుల ప్రయాణాల తరవాత ఆరుద్ర అనే రైలు నేను కాస్త లేటుగా ఎక్కానని అనిపించింది. కానీ, అది జీవిత కాలం లేటు కానందుకు ఇప్పటికీ సంతోషంగా వుంటుంది.

ఆ తరవాత ఆయన కన్ను మూసినప్పుడు మా ఎడిటర్ యంవీయార్ శాస్త్రి గారు ఆంధ్రభూమిలో ఆయన్ని గురించి ప్రత్యేక సంపాదకీయం రాయించారు. అది ఆరుద్రగారికి నేనిచ్చిన చివరి అక్షర నివాళి.

(‘ఆవకాయ’ వెబ్ పత్రిక సౌజన్యంతో- ఆగస్టు 31 ఆరుద్ర పుట్టిన రోజు కోసం )

నాన్న అంటే…వొక ఆదర్శం, వొక వాస్తవం!

నాన్నగారి  నవల "విజయ" ఆవిష్కరణ సందర్భంగా....ఆయన ప్రాణ మిత్రుడు మహాలక్ష్మేశ్వర రావు గారితో...

నాన్నగారి నవల “విజయ” ఆవిష్కరణ సందర్భంగా….ఆయన ప్రాణ మిత్రుడు మహాలక్ష్మేశ్వర రావు గారితో…

1

ఇప్పుడెలా వుందో తెలియదు చింతకాని!

          ఖమ్మం పక్కన చిన్న వూరు చింతకాని. ఆ రోజుల్లో చింతకాని స్టేషనులో పాసింజరు రైలు దిగితే వూళ్ళో నడిచి వెళ్లడానికి అర గంట పట్టేది. ఆ స్టేషను నించి వూరి నడి బొడ్డు – పీర్ల చావిడి- దాకా వెళ్తే మధ్యలో వొక పల్లెటూరి బతుకు ఎట్లా వుంటుందో అది అంతా అద్దంలో కనిపించినట్టు కనిపించేది. ఆ ఎగుడు దిగుడు బాటలు, అక్కడక్కడా విసిరేసినట్టుండే ఇళ్ళు, అనేక ఏళ్ల చరిత్ర భారంతో వంగిపోయినట్టున్న పెద్ద పెద్ద చింత చెట్లు, రాగి చెట్లు, మధ్యలో రామయ్య బావి, సీతమ్మ దిబ్బ….అబ్బాని తలుచుకున్నప్పుడల్లా ఈ పొడుగాటి బాట గుర్తొస్తుంది. సాయంత్రం బడి నించి వచ్చాక, రోజూ ఆ స్టేషను దాకా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం, నేనూ అబ్బా.

స్టేషనుకి చేరాక అప్పటికే ప్లాట్ ఫారం బెంచీల మీద ఇంకో ముగ్గురు నలుగురు టీచర్లు ఆయన కోసం ఎదురుచూస్తూ వుండే వాళ్ళు. అక్కడ బెంచీల మీద కూర్చోనో, ప్లాట్ ఫారం మీద నడుస్తూనో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు నేను స్టేషను ఆఫీసులో బెంజిమన్ మాస్టరు గారితో ఆయన యంత్ర సామగ్రితో ఆడుకుంటూ వుండే వాణ్ని. వొక గంటా, గంటన్నర తరవాత మేము ఇంటి ముఖం పట్టేవాళ్లం. ఈ మొత్తం దినచర్యలో నేను చాలా ప్రశ్నలు రువ్వుతూ వుండే వాణ్ని. కొన్ని మాటలు, కొంత మౌనం. కొన్ని ఆటలు, కొంత అల్లరి. కానీ, ఈ బాల్య అనుభవం వొక పునాది తరవాత నేను చేయబోయే రహస్య సాహిత్య ప్రయోగాలకు! అప్పటికే అబ్బా అనువాద నవల “కళంకిని” (1973) అచ్చయి, తెలుగు సాహిత్యలోకం ఆయన వైపు అబ్బురంగా చూడడం మొదలెట్టింది. వొక రచయిత విజయాన్ని కళ్ళారా చూడడం, చెవులారా వినడం అదే మొదలు నాకు.

చింతకాని స్కూల్లో అబ్బాజాన్ “మధురవాణి” అనే వొక గోడ పత్రిక నడిపే వాళ్ళు. అది రెండు నెలలకి వొక సారి దినపత్రిక సైజులో నాలుగు పుటలుగా స్కూలు లైబ్రరీలో అతి విశాలమయిన బోర్డు మీద అందమయిన ఆయన చేతిరాతతో దర్శనమిచ్చేది. టీచర్ అంటే పాఠాలు చెప్పడం మాత్రమే కాదనీ, విద్యార్థిలో సృజనాత్మకత పెంచే బాధ్యత అని ఆయన భావించే వారు. “సార్ క్లాసులో కూర్చుంటే చాలు, వొక్క సారి వింటే అదే మెదడులో నిలిచిపోతుంది,” అని విద్యార్థులు ఆయన గురించి గర్వంగా చెప్పేవాళ్ళు. కానీ, అక్కడితో ఆగకుండా ఆయన ఎంతో కొంత భాషా ప్రేమ, సాహిత్య సంస్కారం పెంచాలన్న దృష్టితో “మధురవాణి” మొదలు పెట్టారు. ఇందులో కేవలం విద్యార్థుల రచనలు మాత్రమే వేసే వాళ్ళు. వాటిని ఆయనే కొంత ఎడిట్ చేసి, ఆ దిన పత్రిక సైజు పోస్టర్ల మీద రాసే వారు. “సారు చేతిరాత కోసమే చదువుతున్నాం ఇది,” అని విద్యార్థులు అనే వాళ్ళు. ఆలోచనలు ఎంత ముఖ్యమో, చేతిరాత అంత ముఖ్యమని ఆయనకి పట్టింపు వుండేది. విద్యార్థులని దగ్గిర కూర్చొబెట్టుకుని, వాళ్ళ దస్తూరి దిద్దబెట్టే వారు ఆయన- ఈ “మధురవాణి” పత్రిక గోడమీద పెట్టే రోజుల్లో నేను అయిదో తరగతి. ఆ పత్రికలో నా రచన కనిపించాలని నా పట్టుదల. కానీ, అబ్బా వొక పట్టాన వాటిని వొప్పుకునే వారు కాదు. చాలా సార్లు తిరగరాయించేవారు. నిర్మొహమాటంగా నిరాకరించే వారు. అక్కడ వున్న కాలంలో “మధురవాణి”లో నేను అతికష్టమ్మీద వొక గేయం, వొక కథ మాత్రమే చూసుకోగలిగాను. కానీ, రచయితగా అది నాకొక ప్రయోగ శాల అయ్యింది, చాలా ప్రయోగాలు విఫలమయినా సరే!

నా చింతకాని బాల్యం గురించి అన్వర్ ఊహించిన చిత్రం

నా చింతకాని బాల్యం గురించి అన్వర్ ఊహించిన చిత్రం

ఇక ఇంటి విషయానికి వస్తే, పీర్ల చావిడి పక్కనే, మా ఇల్లు వుండేది. మా ఇల్లు అంటే కిలారు గోవింద రావు గారి ఇల్లు. ఆ రెండు గదుల ఇంట్లో తొమ్మిది మంది వుండే వాళ్ళం. దానికి తోడు, ఎప్పుడూ నాన్నగారి ఎవరో వొక సాహిత్య మిత్రుడు ఇంట్లో అతిధిగా వుండే వారు. వాళ్ళు మొదటి గదిని ఆక్రమించేస్తే, మేమంతా రెండో గదిలో ఇరుక్కుని వుండే వాళ్ళం. నేను మాత్రం మొదటి గదిలో ఆ సాహిత్య మిత్రుల సంభాషణలు వింటూ మూగిమొద్దులా కూర్చొని వుండే వాణ్ని. “ఒరే, నువ్వు కాస్త నోరు విప్పరా! నాకు భయమేస్తోంది నిన్ను చూస్తే!” అని వొక సారి దాశరథి గారు బయటికే అనేసి, నన్ను తన కుర్చీ పక్కన చేతుల్లోకి తీసుకుని, మాటల్లో దింపే ప్రయత్నం చేసే వారు. ఉర్దూ గజల్ వొకటి చెప్పి, దాన్ని నా చేత బట్టీ కొట్టించే వారు. అది నాకు ఎంతో వుత్సాహకరమయిన క్రీడ అయ్యింది. ఆ గజల్ రెండు పంక్తులూ నెమరేసుకుంటూ నేను, నా సొంత కవితలు కట్టే వాణ్ని. ముందు వాటిని పాడుకుంటూ తిరిగే వాణ్ని, నా స్నేహితులతో పాడించే వాణ్ని, ఆ తరవాత కాయితం మీద పెట్టే వాణ్ని. ఇదీ నా పాఠశాల!

ఈ మూడు భిన్న అనుభవాల కేంద్ర బిందువు అబ్బా. ఇక నిత్యనైమిత్తిక బతుక్కి వస్తే, ఆర్ధిక పరిస్తితులు బాగుండక, ఇంట్లో ఎప్పుడూ జొన్నన్నం, గోంగూర పచ్చడి మాత్రమే వుండేది. నెలకోసారి తెల్లన్నం, పావుకిలో మాంసం వండిన రోజు పండగలా వుండేది. కిలారు గోవిందరావు గారి ఇంటి నించి అప్పుడప్పుడూ కొంచెం ఎక్కువ పాలు, పెరుగు వచ్చిన రోజున అది మహాప్రసాదంలా వుండేది. కానీ, ఆర్థిక పరిస్తితులు బాగా లేవన్న బీద అరుపులు ఇంట్లో వినిపించేవి కావు. కొత్త పుస్తకాలు ఇంటికి వచ్చేవి, కొత్త కొత్త సాహిత్య మిత్రులు ఇంటికి వచ్చే వారు, చాలా కళకళలాడుతూ వుండేది ఇల్లు. “ఈ మాత్రం బర్కతు వుంది చాలు” అని తృప్తిపడేది అమ్మీ.

ఆ చిన్న వూళ్ళో మా చదువులు ఏమయిపోతాయో ఏమో అన్న బెంగతో కుటుంబాన్ని ఖమ్మం మార్చాలనుకున్నారు అబ్బా. చింతకాని, ఆ చుట్టుపక్కల వూళ్లలో ఈ విషయం తెలిసిపోయి, మా ఇల్లు వొక తీర్థ క్షేత్రమయ్యింది. ప్రతి వూరి నించీ విద్యార్థులు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులతో ఇరవైల, పాతిక సంఖ్యలో వచ్చి, అబ్బాకి నచ్చచెప్పే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వూళ్ళో పెద్ద పెద్ద రైతులు, నాయకులు ఖమ్మం జిల్లా పరిషత్తుకి వెళ్ళి అబ్బా బదిలీని ఆపడానికి ప్రయత్నించారు. కానీ, అబ్బా ఎవరి మాటా వినలేదు. చివరికి మాకు స్టేషనులో వీడ్కోలు ఇవ్వడానికి వూరంతా పెద్ద ఊరేగింపుగా స్టేషనుకు వచ్చింది, కళ్ల నీళ్ళు పెట్టుకొని!

2

“మీరు ఖిల్లాలోపల వుండాలి కౌముదీ సాబ్!”

అంటూ ఖమ్మం ముస్లిం మిత్రులు కొందరు ఖిల్లాలో చాలా చవకలో ఇల్లు చూపించారు. కానీ, అబ్బాకి అది ఇష్టం లేదు. “ఆ ఖిల్లా బంది ఖానా లా వుంది,” అనడం నాకు ఇప్పటికీ గుర్తు. కాంగ్రెస్ ఆఫీస్ వెనక ప్రసిద్ధ ఉర్దూ –తెలుగు రచయిత హీరాలాల్ మోరియా గారి ఇల్లు వుండేది. మళ్ళీ రెండు గదుల ఇల్లే, కానీ, చాలా పెద్ద ఆవరణ వుండేది. మోరియా గారు నామమాత్ర అద్దె మీద ఆ ఇల్లు మాకు ఇచ్చారు.

ఖమ్మం మా జీవితాల్లో పెద్ద కుదుపు. అబ్బా ఆలోచనల్లో కొత్త మలుపు. “సరిత” అనే టైటిల్ తో వొక సాహిత్య పత్రిక పెట్టాలని ఖమ్మంలో ఆయన “సాహితి ప్రెస్” పెట్టారు. ఖమ్మానికి ఆ ప్రెస్ అతి కొద్ది కాలంలోనే అదొక సాహిత్య కేంద్రంగా మారింది. కానీ, పత్రిక మొదటి సంచిక వచ్చే లోపలే, అబ్బా నష్టాల్లో కూరుకుపోయారు. ప్రెస్ నిండా మునిగింది, మేము అప్పుల్లో దిగడిపోయాం. ఆ తరవాత మా ఆర్థిక జీవనం మా చేతుల్లో లేకుండా పోయింది.

ఆ పరిస్థితుల్లో అబ్బా తెలుగు ప్రసంగాలు విన్న వొక క్రైస్తవ మిషనరీ ప్రచురణ సంస్థ ఆయన్ని వాళ్ళ తెలుగు విభాగం డైరెక్టరుగా ఆహ్వానించింది. మంచి జీతము, నాకు ఆస్ట్రేలియాలో కాలేజీ చదువుకి ఉపకారవేతనమూ ఆఫర్ చేసింది. “నా విశ్వాసాలకి దరిదాపుల్లో లేని ఏ పని నేను చేయలేను. పైగా, నా ఈమాన్ (faith) ని అమ్ముకోలేను,” అని అబ్బా ఖరాఖండిగా చెప్పడం నాకు గుర్తుంది. అబ్బా ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనక ఆయన చిత్తశుద్ధీ, సిద్ధాంత బలమూ కనిపించేవి. ఆయన అరబ్బీ, ఉర్దూ, ఫార్సీ బాగా చదువుకున్నారు, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సంస్కృతంతో పాటు! ఇస్లాం, వేదాలూ, మార్క్సిజం కూడా బాగా చదువుకున్నారు, ప్రాచీన ఆధునిక సిద్ధాంతాలతో పాటు! కానీ, వీటిలో వేటికీ ఆయన పూర్తిగా తలవంచలేదు. “అవన్నీ కళ్ళు తెరిపించాలి కానీ, కళ్ళు మూయకూడదు, అవన్నీ తలలో వుండాలి, కానీ అవే తల చుట్టూ రోకలి కాకూడదు,” అనే వారు. అటు అమ్మీ తరఫునా, ఇటు అబ్బా తరఫునా మా కుటుంబానికి కమ్యూనిస్టు చరిత్ర వుంది. అట్లా అని, వీళ్ళెవ్వరూ ఇస్లాం కి దూరం కాలేదు, అవి వొకే వొరలో ఎట్లా ఇముడుతాయి అని కొందరికి ఆశ్చర్యం కలిగిస్తూ.

తాతయ్య గారు నిజాం కొలువులో పనిచేశారు. దానికి భిన్నంగా నిజాంకి వ్యతిరేకంగా ఆయుధాలు దూసిన కమ్యూనిస్టుల పక్షం వహించారు అటు అమ్మీ తరఫు వాళ్ళు, ఇటు అబ్బా తరఫు వాళ్లు కూడా! పార్టీ కోసం వున్నదంతా వూడ్చిపెట్టారు, బంగారం లాంటి ఇనామ్ భూముల్ని కూడా ఖాతర్ చెయ్యలేదు. తీవ్ర ఆర్థిక కష్టానష్టాల్లో వున్నప్పుడు, బాగా కోపం వచ్చినప్పుడు అమ్మి అప్పుడపుడూ అనేది, “భూములూ ఇళ్ళు వదిలేసి, మీ అబ్బా పుస్తకాల గోనె సంచి వీపునేసుకుని, బెజవాడ వెళ్ళిపోయారు, పార్టీ కోసం!” అని. ఇంతా చేస్తే, అమ్మి కుటుంబం కూడా పార్టీ కోసం చివరి బంగారపు తునక కూడా ఇచ్చేసిన వాళ్ళే! పార్టీ రెండుగా చీలిపోయాక తమ ఇల్లే వాటాలు పడి, చీలిపోయినంత క్షోభ పడ్డారు, ఆ క్షోభ అబ్బాని చివరి దాకా వెంటాడుతూనే వుండింది, ఇలా మిగలాలా అని!

3

394925_10101015978163497_1224429015_n

“షంషుద్దీన్, నువ్వు రచనని అంతగా పట్టించుకోవడం లేదు. నువ్వు చాలా రాయగలవు. రాయాలి,”

అని అబ్బా బాల్యమిత్రులు, ఆనక బంధువులూ అయిన హనీఫ్ పెద నాన్న గారు ఎప్పుడూ అబ్బాని కోప్పడుతూ వుండే వారు. రచయితగా ఆయన ప్రయాణం అర్ధాంతరంగా ఆగిపోయిందని ఆయన మిత్రులు చాలా మంది ఇప్పటికీ అంటూ వుంటారు. ఆయన రచనలు ఇప్పుడు పెద్దగా అందుబాటులో లేకపోవడం మా దురదృష్టం. ఆయన 1960 నించి 1975 వరకూ విశాలాంధ్ర, యువజన, ప్రగతి, జనశక్తి, ఆంధ్రజ్యోతి పత్రికల్లో విస్తృతంగా సమీక్షలూ, కవిత్వం, కథలూ రాశారు, అనువాదాలు చేశారు. అభ్యుదయ రచయితల సంఘం ప్రచురించిన ప్రతి ప్రత్యేక సంకలనంలోనూ ఆయన కవిత్వం కనిపిస్తూనే వుండేది. కానీ, ఇదంతా నాకు రచయితగా వూహ తెలియని వయసు ముందే ఎక్కువగా జరిగాయి. బడి పంతులు బదిలీల బతుకులో వొక వూరంటూ స్థిరం లేకపోవడంతో చాలా రచనలు పోయాయి, ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగి చాలా రచనలు దగ్ధం అయ్యాయని పెద నాన్న గారు అంటూండే వారు. ఇప్పుడు మిగిలిన కొన్ని కవితలయినా పెద నాన్నగారు తన ఇంట్లో భద్రపరచిన నోట్ పుస్తకాల నించి తీసినవి కొన్ని, కవితలు. నేను అక్కడా, ఇక్కడా తీసి దాచిపెట్టినవీ ఇంకొన్ని, ఇప్పుడు ఖాదర్ బాబాయ్ కొత్తగా సేకరిస్తున్నవి కొన్ని.

1975 తరవాత రచనకి సంబంధించి అబ్బా దృక్పథంలో చాలా మార్పు వచ్చింది. “నాకు ఎందుకో చదవడంలో వున్న ఆనందం, రాయడంలో దొరకడం లేదు,” అనే వారు చాలా సార్లు. “అది రాయకుండా వుండడానికి వొక మిష మాత్రమే!” అని నేనొకటి రెండు సార్లు అన్నాను కూడా! కానీ, పార్టీ చీలిక ఆయన మీద గాఢమయిన ప్రభావం వేసిందని నాకు గట్టిగా అనిపించేది. అట్లా అని, పార్టీ పట్ల ఆయన నిబద్ధత ఏమీ తగ్గలేదు. ఖమ్మం వచ్చాక ఆయన అరసం సాహిత్య సమావేశాల్లో, సభల్లో నిమగ్నం అయ్యారు. అరసం అధ్యక్షుడిగా ఆయన ఖమ్మం జిల్లాలో చేసిన కృషి చిన్నదేమీ కాదు. మారుమూల పల్లెలో ఎక్కడ ఏ కవి, ఏ రచయిత దాగి వున్నా, ఖమ్మం పట్టుకొచ్చి, వేదిక ఎక్కించి, వాళ్ళ రచనల్ని తానే పత్రికలకి కూడా పంపించి, అదొక ఉద్యమంగా చేశారు. బెజవాడ, హైదారాబాద్, వైజాగ్ లాంటి సాహిత్య కేంద్రాలతో ఖమ్మంని అనుసంధానించి, ఖమ్మం జిల్లా సాహిత్య ఆవరణని పెంచారు. ఆ తీవ్రత చూస్తూ, “నువు కావ్యకర్తవి కావాలి కానీ, కార్యకర్తగా మాత్రమే మిగలకూడదు,” అని హనీఫ్ గారు గట్టిగానే మందలించే వారు.

ప్రజా నాట్య మండలి, అరసం వారసత్వ ప్రభావం వల్ల తానే వొక ఉద్యమంగా వుండడం, నిరంతరం జనంలో పని చెయ్యడం ఆయనకిష్టమయ్యింది. అక్షరదీపం కార్యక్రమం మొదటి సారి ప్రవేశపెట్టినప్పుడు, ఖమ్మం జిల్లా మారుమూల పల్లెల్లోకి ఆయన ఆ దీపాన్ని పట్టుకుని నడిచారు. రోడ్లు దిగని సర్కారీ జీపులకి సైతం పల్లె బాట చూపించారు, జీపు వెళ్లని చోటికి కాలి నడకన వెళ్ళి, తరగతులు నిర్వహించారు. నిరక్షరాస్యుల కోసం కథలూ, పాటలు రాసి, రాయించి, వాటిని పల్లెల్లో మార్మోగేట్టు చేశారు, ఆ క్రమంలో ఆయన ఆరోగ్యం దెబ్బ తినడం మొదలయ్యింది. దీనికి తోడు కుటుంబ ఆర్థిక పరిస్థితులు నానాటికీ దిగజారడం మొదలయ్యింది. నా చేతికి డిగ్రీ రాక ముందే, నేను వుద్యోగంలోకి వెళ్లాల్సి వచ్చింది. దిగువ మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే కష్టాలన్నీ వొక్క పెట్టున దాడి చేశాయి.

పరిస్తితులు ఎటు తిరిగి ఎటు వచ్చినా, ఇంట్లో సాహిత్య వాతావరణం మాత్రం స్వచ్ఛంగా అలా మిగిలిపోయింది. అన్ని పని వొత్తిళ్ల మధ్యా, ఈతి బాధల మధ్య కూడా అబ్బా కనీసం అయిదారు గంటలు పుస్తక పఠనంలో గడిపే వారు. ముందు గదిలో పడక్కుర్చీలో అలా పుస్తకం ముందు విధేయంగా వుండే వారు. “నేను పాఠకుడిని మాత్రమే!” అని నిర్ద్వంద్వంగా చెప్పే వారు. “వొక గంట రాస్తే బాగుంటుంది” అనే వాణ్ని. కానీ, ఆయనలోని రచయితని ఉత్సాహ పరచడం అంత తేలిక కాదు. ఆయనలోని వొక పర్ఫెక్షనిస్ట్ ఎప్పుడూ ఆయనకి అడ్డంకి. “రాస్తే ఇట్లా రాయాలి,” అని కొన్ని ఉదాహరణలు చూపించేవారు. రచయితగా ఆయనకి అలాంటి ఆదర్శాలు కొన్ని వుండేవి, అవి ఎన్నడూ వాస్తవికతతో రాజీ పడేవి కాదు. ఆయన ఉదాహరించే రచయితలు అటు సంస్కృతం నించి ఇటు ఆంగ్లం వరకూ వాళ్లు తెలుగులో అనువాదాలకయినా లొంగని శక్తిమంతులే, కానీ – “నిజమే కావచ్చు, కానీ, వాళ్లెవ్వరూ మీరు మాత్రమే రాయాల్సింది రాయలేరు కదా?!” అనే వాణ్ని నేను. అదే దశలో ఆయన మళ్ళీ పత్రికా రచయితగా మారడం వల్ల రచనా వ్యాసంగం వేరే దారికి మళ్ళింది. తరవాత హిందీ ఉర్దూ నించి అనువాదాల కోసం ఎన్ని ప్రచురణ సంస్థలు అడిగినా, ఆయన వొప్పుకోలేదు. “అనువాదం అనేది వొక వ్యసనం. అలవాటు పడితే, అందులో కూరుకుపోతాం. రాయగలిగితే, ఎప్పటికయినా సొంత రచనే చెయ్యాలి. వొక బృహత్తరమయిన నవల రాయాలి,” అనే వారు. ఆ నవల రాసే రోజు రాలేదు, ఈలోపు ఆయన ఆరోగ్యం క్షీణించింది. కనీసం రెటైర్మెంట్ వయసు కూడా రాక ముందే, ఆయన కన్ను మూశారు.

ఆయన రచయితగా రాయాల్సినంత రాయలేదని మా అందరికీ అసంతృప్తి తప్ప, ఆయన మటుకు ఆయన సంతృప్తిగా జీవించారనే నాకు అనిపిస్తుంది. జీవితం మీద ఆయనకి ఫిర్యాదులు లేవు. అది తిరిగిన అన్ని మలుపులూ ఆయనకి తెలిసినవే, అవి ఆయనకి అపరిచితమయినవీ, ఆశ్చర్యకరమయినవీ కావు. అటు రచయితగా, ఇటు వ్యక్తిగా కూడా తన అర్ధాంతర నిష్క్రమణ అబ్బాకి ముందే తెలుసేమో అని చాలా సార్లు అనిపిస్తుంది నాకు. కనీసం అట్లా అనుకొని తృప్తి పడడం మినహా మేం చెయ్యగలిగిందేమీ లేక పోయింది!

*

చూస్తూ చూస్తూ వుండగానే, అతనొక జ్ఞాపకం!

Dsc_7391

ముఖపుస్తకాలు లేని వొక అనగా అనగా కాలంలో స్నేహితులు వొకరి ముఖాలు వొకళ్ళు ఎలా చూసుకునే వారు? పొద్దూ పొద్దున్నే వొక చాయ్ తాగేసి, ఏ పొద్దుటి రైలో, ఫస్ట్ బస్సో అందుకొని దగ్గిరే వున్న స్నేహితుడి ముందు వాలిపోయే వాళ్ళు.

అవును, శేఖర్ – మేం “కంభా” అని పిలిచేవాళ్ళం- అలాగే వాలిపోయే వాడు వో ఆదివారం పొద్దున్న ఖమ్మంలో!

ట్విటర్లూ గట్రా లేని ఆ కాలంలో స్నేహితులు ఎలా పక్షి ముక్కుల్తో పొడుచుకునే వాళ్ళు? బహుశా, ఎక్కడో వొక పబ్లిక్ ఫోన్ పట్టుకొని, వొక పలకరింతో, ఇంకో తిట్టో రాల్చి వెళ్ళిపోయే వాళ్ళు.

అవును, కంభా అలాగే వున్నట్టుండి ఏ నెంబరూ లేని వొక ఫోన్లోంచి కొన్ని మాటలు మెల్లిగా రాల్చి తన వూళ్ళో తన మూలలో ఎక్కడో వొదిగి వుండి పోయే వాడు.

నెట్లూ మొబైల్ సెట్లూ లేని ఆ అనగా అనగా కాలంలోనే బహుశా మనుషులు ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళు. మాట కోసం ఎదురు చూస్తూ వుండే వాళ్ళు. మాట కోసం కలవరిస్తూ వుండే వాళ్ళు. నిద్రలో స్నేహితుల పేర్లు పలవరిస్తూ వుండే వాళ్ళు.

చాలా అమాయకంగా ముఖంమీద ఎలాంటి పేచీ లేని వొక విశాలమైన నవ్వుతో కంభా ఖమ్మంలో మా ఇంటికొచ్చే వాడు. “ఖంభా ఆయారే, బాబూ!” అంటూ మా అమ్మ నవ్వుకుంటూ లోపలికొచ్చి కబురు చెప్పేది. (ఆ రోజుల్లో నేను వంట గదిలో డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని రాసుకునే వాణ్ని, మధ్య మధ్యలో అమ్మతో కబుర్లు చెప్తూ) శేఖర్ ఇంటి పేరు అమ్మ దగ్గిరకి వచ్చేసరికి ఉర్దూ యాసలో “ఖంభా” – అంటే స్తంభం- అయిపోయేది.

javed

చిత్రం: జావేద్

2

అప్పుడు కార్టూన్ అంటే ఇంకా ఏమిటో కంభాకి పూర్తిగా తెలీదు. పుస్తకాలు విపరీతంగా చదివే వాడు. . కార్టూనిస్టులు ఆ కాలంలో సాహిత్యంతో సంబంధం లేని వేరే లోకంలో వుండే వాళ్ళు నిజానికి!

కాని, కార్టూనిస్టుల లోకంలో కూడా సాహిత్యమూ కవిత్వమూ వుంటాయని అప్పుడే నా మటుకు నాకు సురేంద్ర (ఇప్పుడు “హిందూ” సురేంద్ర) వల్ల అనుభవమైంది. అప్పుడే సురేంద్ర – తన పేరుని సురేన్ద్ర- అని రాయడం మొదలెట్టాడేమో! సురేంద్రలాగానే శేఖర్ కి కూడా సాహిత్యం వొక ప్రాణం! తన అసలు ప్రాణం కార్టూన్ లో వుందని కొంచెం ఆలశ్యంగా తెలిసి వచ్చింది శేఖర్ కి! కాని, ఆ ప్రాణం చిరునామా తెలిసాక వొక క్షణం వృధా చేయలేదు శేఖర్!

శేఖర్, శ్యాం మోహన్, సురేన్ద్ర…ఇలా ఇంకా ఈ తరం కార్టూనిస్టులు అక్షరంలోంచి కుంచెలోకి చేసిన ప్రయాణం చాలా విలువైనదని నాకు అనిపిస్తుంది. ఈ సాహిత్య సహవాసం వల్ల ముందు తరంలో ఏ కొద్ది మంది కార్టూనిస్టులకో పరిమితమైన కొత్త అందం వీళ్ళ కుంచెల్లోకి వచ్చి చేరింది.

శేఖర్ చివరి దాకా ఆ సాహిత్య సహవాసాన్ని నిలబెట్టుకుంటూ వెళ్ళాడు. బాగా గుర్తు- మహాశ్వేతా దేవి నవలల్ని చదివిన తాజా ఉద్వేగంలోంచి నడిచి వచ్చి, ఖమ్మంలో వొక ఆదివారం పొద్దున్న శేఖర్ అన్న మాటలన్నీ! “జీవితంలోని ఆ చిన్ని డీటెయిల్స్ మనం ఎందుకు పట్టుకోలేకపోతున్నాం?” అని ఆ రోజు అతను నన్ను అడిగాడు. శేఖర్ కి ఆ “చిన్ని డీటెయిల్స్” మీద విపరీతమైన పట్టింపు! సాహిత్య వ్యాసాల రచనతో మొదలైన శేఖర్ ప్రయాణం కార్టూన్ దగ్గిర స్థిర పడడంలోడీటైల్స్ మీది పట్టింపే కారణమని నాకు అనిపిస్తుంది. రోజువారీ జీవితాన్ని కార్టూనిస్టు చూసినంత దగ్గిరగా మరో కళాకారుడు చూడలేడు అని నేను ఖాయంగా చెప్పగలను. ఎందుకంటే, కార్టూనిస్టు daily basis మీద జీవితాన్ని బేరీజు వేసుకోవాలి. వాస్తవికతని చూస్తూనే దాన్ని ఆట పట్టించే క్రిటిక్ అతనిలో వుండాలి. అంత కంటే ఎక్కువగా ఆ వాస్తవికతని దాని అసలు రూపు చెడకుండా నవ్వు పుట్టించే కోణంలోంచి కూడా చూడాలి. కార్టూన్ వెనక వున్న ఈ ఫిలాసఫీ శేఖర్ కి అర్థమైంది. అందుకే, కార్టూన్ని వొక కళారూపంగా గుర్తించి తీరాలని మొండి పట్టుదల అతనికి!

ఇవాళ శేఖర్ మన ముందు లేని ఈ రోజున మీరు అతని కార్టూన్లన్నీ దగ్గిర పెట్టుకొని, వొక్కోటీ చూస్తూ వెళ్ళండి. ఈ కార్టూనిస్టు ఫిలాసఫీ గురించి నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది.

శేఖర్ చివరి గీత

శేఖర్ చివరి గీత

3

నిజమే, జీవితం చాలా వేగంగా దూసుకుపోతోంది. మన మధ్య ఎవరున్నారో ఎవరు లేరో కనుక్కునే వ్యవధి మనకెవ్వరికీ లేదు. చూస్తూ వుండగానే, మన కళ్ళ ముందు పెరిగి పెద్దదైన వొక కార్టూన్ గీత నిష్క్రమించింది. వొక చిర్నవ్వు నిశ్శబ్దంలోకి రాలిపోయింది. వొక స్నేహ హస్తం మన భుజమ్మీంచి బలహీనంగా కూలిపోయింది. బతికి వుండగా వొక మనిషి ఎన్ని పాత్రాలు పోషించ గలడో, ఆ పాత్రలన్నీ ధైర్యంగా వాటిల్లో ప్రాణం పొదివినంత పదిలంగా పోషించి వెళ్ళిపోయాడు శేఖర్!

“కలడు కలండు అను వాడు కలడో లేడో!” అన్న నిత్య సంశయంలోకి నేను వెళ్లదలచుకోలేదు కాని, వుంటే, ఇదిగో – ఖాలిద్ హుస్సేనీ నవల The Kite Runners లో వొక పాత్ర అడిగినట్టుగా ఇలా అడగాలని వుంది…

When you kill a man, you steal a life. You steal his wife’s right to a husband, rob his children of a father. When you tell a lie, you steal someone’s right to the truth. When you cheat, you steal the right to fairness. Do you see?

మన మధ్యలోంచి వెళ్ళిపోయింది కేవలం వొక వ్యక్తి మాత్రమే కాదు, వొక కుంచె మాత్రమే కాదు. వొక నిజాన్ని నిజాయితీగా పలికే స్వరం. నిజానికి వున్న అనేక రూపాల్లో వొక రూపం!!

 – అఫ్సర్

“నేను”తో వొక కొత్త విమర్శ ప్రయోగం!

 

(ప్రతిష్టాత్మకమయిన లోక్ నాయక్ సాహిత్య పురస్కారం ఈ ఏడాది ప్రసిద్ధ రచయిత్రి ఓల్గా కి దక్కింది. ఈ సందర్భంగా ఓల్గా సాహిత్య విమర్శ వ్యాసాల సంపుటి “సహిత” గురించి 2012 లో అఫ్సర్ రాసిన  వ్యాసం )

19BG_VOLGA_1336248e

నాకు చాలా ఇష్టమయిన పది పన్నెండు ప్రపంచ నవలల్లో వర్జీనియా వుల్ఫ్ రాసిన “టు ద లైట్ హౌస్” వొకటి. అది నేను నా తొలినాళ్లలో చదివిన నవల అవ్వడం వొక వ్యక్తిగత కారణం.   బీయ్యే ఇంగ్లీష్ చేసేటప్పుడు ఆధునిక ఇంగ్లీష్ నవల- సాహిత్య సిద్ధాంతాలు  స్పెషలైజేషన్ గా తీసుకుని, మొదట చదివి, విశ్లేషించిన పది ఆంగ్ల నవలల్లో ఇదీ వొకటి.  మిగిలిన ఆ తొమ్మిది నవలలు అంతగా మళ్ళీ మళ్ళీ చదివిందేమీ లేదు. కానీ  “టు ద లైట్ హౌస్”  నన్ను ఇప్పటికీ వెంటాడే నవల. నాలుగేళ్ళకోసారి నా చేతులు అప్రయత్నంగా ఆ నవలని తీసుకుంటాయి, ఆ చేతులు నొప్పెట్టినా సరే,  చివరి పేజీ దాకా చదవనిదే వదలనివ్వదు నవల .   

ఈ  నవలలో వొక స్త్రీ పాత్ర ఇంకో పురుష పాత్రని అడుగుతుంది,

“ఇంతకీ మీ నాన్నగారు రాసిన ఆ పుస్తకాలన్నీ దేన్ని గురించి?” అని-

అతను ఇంకే తడబాటూ లేక వెంటనే “subject, object and the nature of reality” అంటాడు.

“ఓర్నాయనో! ఏమిటదీ??” అని బిక్క మొహం వేస్తుంది ఆవిడ.

అప్పుడు పాపం, ఆమె  ఏ సాహిత్య కళా వాసనలూ లేని “వంటింటి కుందేలు” అన్న స్పృహ కలిగి,  ఆమెకి అర్థమయ్యే భాషలో చెప్పాలని అతను “ఈ కిచెన్ టేబులు గురించి ఆలోచించు, నువ్వు దాని దగ్గిర లేనప్పుడు!” అంటాడు, కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులు అంత తీవ్ర స్థాయిలో కాకపోయినా, “ఆడముండల్తోనా ఆలోచనా?” లాంటి ఏదో వొక భావంతో!

ఆమెకి ఆ ముక్క  అర్ధమయ్యిందా కాలేదా అన్నది వేరే సంగతి. నాకు మాత్రం చాలా కాలం అర్థం కాలేదు, కానీ, చాలా సందిగ్ధంలో పడి, తరవాత తరవాత శోధిస్తే తేలిందేమిటంటే ఇది నా బాధ కాదు, ప్రపంచం బాధ అనీ!

పాశ్చాత్య సాహిత్య విమర్శలో తల పండిన సాహిత్య విమర్శకులూ, సామాజిక  సిద్ధాంతకర్తలూ  పదే పదే  ఈ సంభాషణని ప్రస్తావిస్తూ వచ్చారు.  వివిధ కాలాల్లో వచ్చిన వీళ్ళంతా  కూడా ఆయా కాలాల్లో ఆయా రకాలుగా దీన్ని అర్థమో, అపార్థమో చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికీ ప్రతి నాలుగేళ్ళకి వొక సారి ఈ నవల నేను చదువుతూనే వున్నా, చదివిన ప్రతి సారీ ఈ సంభాషణ నాకు  వొక్కో కాలంలో వొక్కో  రకంగా అర్ధమయ్యింది. ఒక అర్ధానికీ ఇంకో అర్ధానికీ పొంతన లేదు. అలా పొంతన లేకపోవడానికి కారణం నేను ఆ సంభాషణ గురించి ఆలోచించే స్థితిలో, ధోరణిలో మార్పు రావడమే!

కాలానుగుణంగా మారుతున్న ఆలోచనలలో  మారుతూ వున్న ‘నేను” ముఖ్యమయిన పాత్ర తీసుకుంటోంది. ఆ “నేను” చుట్టూ మారే స్థల కాలాలు అంతకంటే గట్టి పాత్ర తీసుకుంటున్నాయి.  అటు నించి నరుక్కురావాలంటే, ఇప్పుడు  ఆ మగవాడి మాట అతనికే అప్పజెప్పాలి  స్త్రీత్వపు వైయక్తిక స్వరంతో – ‘విషయం, విషయి, వాస్తవికత స్వభావం’ ఎప్పటికప్పుడు మారిపోతాయి.  అంతే కాదు, ఆ మాటలు ఎవరు అంటున్నారు, ఎవరు వింటున్నారు అన్న ప్రశ్నని బట్టి కూడా వాటి అర్ధాలు మారిపోతాయి. అంటే, పఠనం అనేది కేవలం వొకే వైపు దూసుకెళ్లే ట్రాఫిక్ కాదనీ, అది చదువరి/ శ్రోత/ రచనలోని సాంస్కృతికత/ చదువరి, పఠిత సాంస్కృతికత మొదలయిన అంశాలు పఠనాన్ని ఒక performance గా మారుస్తున్నాయి. ఎవరు ఎవరికోసం చదువుతున్నారన్నది performativity కోణం నించి అడిగే ప్రశ్న. ఎవరు ఎవరి కోసం అన్న ప్రశ్నలో సమాధానాలు  “నేను” లోనే వున్నాయి.  వొక్కో సారి విషయం (subject) మారకపోయినా, విషయి మారకపోయినా, ఈ “నేను’ దాన్ని చూసే “subjective” దృష్టి వల్ల మొత్తం వాస్తవికత స్వభావమే మారిపోవచ్చు.

ఓల్గా గారి “సహిత” వ్యాసాలు చదువుతునప్పుడు ఆ మార్పు ఎట్లా వుంటుందో కళ్ళకి కట్టినట్టు తెలుస్తుంది. “సహిత”లో వొక రచయిత తన పఠనానుభవంలోకి తీసుకువెళ్లడం వొక ప్రధాన ప్రక్రియ. అయితే, అదే సమయంలో ఆ పఠనానుభవంలో “తను” ఏమిటి? ఆ “తను” ఎవరికోసం గొంతు విప్పుతోంది? అన్న ప్రశ్నలు కూడా ముఖ్యమవుతున్నాయి.

స్త్రీ వాదం చర్చలోకి వచ్చేంతవరకూ చాలా మంది విమర్శకులు  ఆ సంభాషన్లో “అతను” చెప్పిన ఆ ముక్కకే పరిమితమయి మాట్లాడారు, స్త్రీ వాదులు ఆ విమర్శనంతా తుంగలో తొక్కి, అప్పటి వరకూ ఎవరూ పట్టించుకోకుండా వదిలేసిన  ఆవిడ పక్షం తీసుకొని, అసలక్కడ “కిచెన్ టేబులు ఎందుకు ఉదాహరణ కావాలి?” అన్న కొత్త  సాంస్కృతిక వాస్తవిక ప్రశ్న లేవనెత్తారు. అది ఎలాంటి ప్రశ్న అంటే, ఆ నవల రాసిన కాలంలో అంటే 1927లో అలాంటి వొక ప్రశ్నని వర్జీనియా వుల్ఫ్ కూడా వూహించి వుండదు. అదే విధంగా, ఓల్గా “సహిత”లో వివిధ వ్యాసాలలో లేవనెత్తిన సాంస్కృతిక ప్రశ్నలన్నీ సమకాలీన/ దృక్పథ-కేంద్రిత స్పృహలోంచి మొలకెత్తినవి. వొక విధంగా ఈ ప్రశ్నలు ఇప్పుడు మొలకలయిన భావనల అప్పటి అంకురాల అన్వేషణ “సహిత.”

వర్జీనియా వుల్ఫ్ నవలానంతర  ప్రశ్నల  నేపధ్యంలో తలెత్తిన చర్చల్లో ఇంకా వేరే అంశాలు చాలా వున్నాయి, ఒక సామాజిక సిద్ధాంత చర్చే వుంది.  కానీ, నేను ఇప్పుడు ఓల్గా సాహిత్య వ్యాసాల సంపుటి “సహిత” విశ్లేషణలో ఆ చర్చలోని రెండు అంశాలని మాత్రమే ప్రధానంగా తీసుకుంటున్నాను -అందులో మొదటిది  స్త్రీవాద వైయక్తికత (subjectivity), రెండోది: స్త్రీవాద సాహిత్య/సాంస్కృతిక చరిత్ర నిర్మాణం (feminist historiography). ఈ రెండు మౌలిక భావనలకీ వొక దాంతో ఇంకో దానికి సంబంధం వుంది, అలాగే, ఈ రెండూ  ఓల్గా సాహిత్య వ్యాసాల ‘సహిత’ కీ పునాది అని నా అభిప్రాయం. వర్జీనియా వుల్ఫ్ రాసిన “టు ద లైట్ హౌస్” నవలకీ, ఓల్గా తెలుగు సాహిత్య రంగంలో చేస్తున్న పనికీ కూడా కొన్ని పోలికలు వున్నాయి. అది ఇంకా లోతయిన తులనాత్మక విశ్లేషణ జరగాల్సిన విషయం కాబట్టి, ఇప్పటికిప్పుడు  ఆ విషయం జోలికి నేను  పోవడం లేదు.

ఇక ఈ వ్యాసం ముగిసే లోగా నేను చాలా గట్టిగా  వాదించదలచుకున్న అతి ముఖ్యమయిన విషయం ఇంకోటి  వుంది – ఈ  ‘సహిత’ వ్యాస సంపుటి కేవలం సాహిత్య వ్యాసాల సంపుటి కాదనీ, ఇది  ఓల్గా మేధోజీవన ఆత్మ కథ (intellectual autobiography) అని. ఈ వాదన కొంచెం సంక్లిష్టమయింది అని నాకు తెలుసు. కానీ, అది ఈ సందర్భంలో ముఖ్యమయ్యిందని నాకు కచ్చితంగా తెలుసు, ఈ వ్యాసం చదివాక అది  మీకు కూడా తెలుస్తుంది.

1

      వైయక్తికత అనే మాటని కాస్త తేలిక పద్ధతిలో, ఇప్పుడు మరీ ఎక్కువగా ప్రాచుర్యంలో వున్న  వ్యక్తిగతం(పర్శనల్)   అందాం. కానీ, ఈ ‘వ్యక్తి’కేవలం  ‘నేను’ పరిధికి  కుంచించుకు పోయే వ్యక్తి కాదని చెప్పడం కోసం, దాన్ని వొక భావనగా చర్చించే వుద్దేశంతో ‘వైయక్తికత’ అని కొంచెం భిన్నమయిన పదాన్ని వాడుతున్నాం. కానీ, అన్నీ విధాలుగా వ్యక్తిగతం అనే మాట కింద వచ్చే విషయాలే ఇందులో చర్చకి వస్తాయన్నది వాస్తవం. ఇంకా కొంచెం స్పష్టంగా చెప్పాలంటే, ఇప్పుడు అస్తిత్వం అనే భావనకి ఒక రూపాంతరం   వైయక్తికత.

తత్వశాస్త్ర చరిత్ర చాలా కాలం పాటు అస్తిత్వం అనే భావనకి సామూహికత పునాది అంటూ వచ్చింది. అనేక మతాల దర్శనాల్లో కూడా సామూహిక అస్తిత్వానికే పెద్ద పీట వేశారు. దాని ప్రకారం, సామూహికంగా వొప్పుదల అయిన కొన్ని భావనల సమాహారమే వైయక్తికత లేదా అస్తిత్వం. ఆ అస్తిత్వ చర్చలో వ్యక్తికి విడిగా వొక స్థానం అంటూ లేదు. కానీ, ఆధునికత అనే భావనలో  వైయక్తికతని అస్తిత్వానికి వొకానొక ముఖ్యమయిన లక్షణంగా గుర్తించడం మొదలయ్యింది. ఆశ్చర్యంగా ఈ పదాన్ని వొక భావనగా వుపయోగించిన మొదటి  తాత్వికుడు వొక కాల్పనిక కవి కొల్రిడ్జ్. 1821 లో కొల్రిడ్జ్ చెప్పిన అర్ధం– consciousness of one’s perceived states- చాలా కాలం పాటు  అదే ప్రామాణికంగా వుంది.

కానీ, ఈ వైయక్తికత అనేది కేవలం వొక వ్యక్తి అవగాహనా, అనవగాహన మీద ఆధారపడిన స్థితి కాదనీ, ఈ వ్యక్తి అస్తిత్వ భావన అనేక అంతర్ బాహ్య పరిస్తితుల మీద కూడా ఆధారపడి వుంటుందని అత్యాధునిక  సామాజిక శాస్త్రవేత్తలు చెప్పడం మొదలు పెట్టారు. ఈ కొత్త భావన ప్రకారం సమూహం ఎంత ముఖ్యమో, వ్యక్తీ అంతే ముఖ్యం. కానీ, ఆ వ్యక్తికి ఎన్ని కోణాలు వుంటాయన్నది ఇప్పుడు ముఖ్యమయిన ప్రశ్న.  2001 లో ఆంథోనీ ఎలియట్ ఏమంటున్నాడో చూడండి:

…..the self is also shaped and defined against the backdrop of…..political and public forces; yet the fabrication of the self, psychologically and emotionally, is rightly understood to involve something more subjectivity, particularly in the ways in which desire, emotion and feeling influence the conscious and unconscious experience of sexuality, gender, race and ethnicity.

కొల్రిడ్జ్ నుంచి ఇటీవలి ఎలియట్ దాకా వైయక్తిక అస్తిత్వం వొక భావనగా సాగించిన ప్రయాణంలో మనం చూడాల్సిన మార్పు ఏమిటంటే, వైయక్తిక అస్తిత్వం అనేది మనం అనుకుంటున్నంత వైయక్తికం కాదు. అందులో ఆ అస్తిత్వాన్ని సృష్టించే పబ్లిక్ శక్తుల ప్రమేయం తప్పక వుంటుంది. అత్యాధునిక వాదం పర్సనల్ కీ, పోలిటికల్ కీ మధ్య వుండే పరస్పర బంధాన్ని చెప్పే దాకా వెళ్తుంది ఆ పునాది మీదనే. విశ్వజనీనత అనే భ్రమ నుంచి బయట పడి, చాలా నిర్దిష్టంగా, స్థానికంగా  మాట్లాడడం మొదలెడితే తప్ప ఈ అస్తిత్వ కోణాల్ని సమగ్రంగా చూడలేమని నా వాదన.

గత పాతికేళ్లుగా తెలుగు సాహిత్య/సామాజిక చరిత్రని శాసించిన రెండు మౌలిక భావనలు – నిర్దిష్టత, స్థానికత. ఎన్ని వాదాలు వచ్చినా, ఎని వివాదాలు జరిగినా, ఈ రెండు మౌలిక భావనల్ని అవి తప్పించుకోలేవని నా అభిప్రాయం. తెలుగు సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం అంటూ జరిగితే, అది ఈ భావనల పునాదిగా జరగాల్సిందే. కానీ, భిన్న వైయక్తికతలు వుండే కాలంలో సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం ఎలా జరుగుతుందీ, దానికి తగిన వనరులు, ఆధారాలూ, పరికరాలూ మనకి వున్నాయా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. వున్నాయని నా విశ్వాసం. అయితే, ఇప్పుడు వున్న సంకుచిత వైయక్తిక ధోరణుల నించి కాకుండా, వైయక్తికతని దాని నిజమయిన అర్ధంలో అర్ధం చేసుకుని, చర్చిస్తే, మన చుట్టూ వున్న రచయితలే సాంస్కృతిక చరిత్ర నిర్మాతలు అన్న విషయం కూడా మనకి అర్ధమవుతుంది. ఓల్గా సాహిత్య వ్యాసాల్ని ఆ దృష్టి కోణం నుంచి చదివినప్పుడు నేను ఇలాంటి కొన్ని సాంస్కృతిక తీగల్ని కలుపుకుంటూ వెళ్లగలిగాను. వాటన్నిటినీ కలిపి వొక చోటి నించి చూస్తే, సమకాలీన సాహిత్య సాంస్కృతిక చరిత్ర గురించి కొన్ని సాధారణ లక్షణాల్ని క్రోడీకరించే (classification), కోడీకరించే (codification)  అవకాశం కూడా వుంది. ఆ సాధారణ లక్షణాల సమ్మేళనమే కొత్త సాహిత్య చరిత్ర నిర్మాణానికి పునాది అని నేను వేరే చెప్పకర్లేదు కదా!

అంటే, ఈ వ్యాసాలలో చాలా బలమయిన అస్తిత్వ కోణాలు కనిపించినప్పటికీ, వాటి మూలాలు అన్నీ మొత్తం సాహిత్య చరిత్రలో వున్నాయి. అందుకే, ఈ వ్యాస సంపుటి గురజాడతో –  కాదు, కాదు, మధురవాణితో – మొదలవ్వడం కాకతాళీయం కాదనుకుంటా.  తెలుగు సాహిత్యంలో స్త్రీ చర్చకి మంచి ప్రారంభం వుంది కానీ, కొనసాగింపు లేదని నేను గతంలో ఒక సారి చెప్పాను. ఆ ప్రారంభం గురజాడతో జరిగింది. ఓల్గా సాహిత్య వ్యాసాలు ఇప్పుడు ఈ 2011 లో కూడా గురజాడతో ప్రారంభం అవ్వడం నాకు యాదృచ్ఛిక్కమూ అనిపించలేదు, ఆశ్చర్యమూ అనిపించలేదు, గురజాడ తీసుకువచ్చిన ఆధునికత లోతులు ఇంకా మనకు అంతు పట్టనే లేదు కనుక. వర్జీనియా వుల్ఫ్ నవలలో ఇటీవలి సాహిత్య సిద్ధాంత వేత్తలు ‘ఆమె’ పక్షం తీసుకోవడానికీ, ఓల్గా ఈ పుస్తకంలో మధురవాణి పక్షం తీసుకోవడానికీ ఆ సాహిత్య చరిత్రే కారణం. ఆ మాటకొస్తే, మధురవాణి గురించి ఇప్పటి వరకూ తెలుగు సాహిత్యకారులు మాట్లాడలేదా అంటే మాట్లాడారు.

మధురవాణిని తెలుగు సాహిత్యంలో ఇప్పటిదాకా బలంగా కాపాడుకుంటూ వస్తున్న లక్షణాలేమిటో ఇక్కడ ఏకరవు పెట్టక్కర్లేదు. కానీ, ఆమెని వాళ్ళు రొమాంటిసైజ్ కూడా చేశారన్నది నిజం. చాలా మందికి ఆమె అనేకానేక కాల్పనిక కావ్యకన్యల్లో వొకటిగా మిగిలిపోయింది తప్ప, ఆమె మాటల కింద ప్రవహిస్తున్న మూల భావనల జాడ వాళ్ళకి అంతుపట్టిందని అనుకోడానికి ఇప్పటివరకూ వున్న పురుష కేంద్రిత విమర్శ సాంప్రదాయంలో తగిన ఆధారాల్లేవు.  ఓల్గా ఇన్నేళ్ల తరవాత ఆమెని ఎందుకు భిన్నంగా చూడగలిగారు అన్న విషయం అర్ధం కావాలంటే నేను పైన ప్రస్తావించిన వైయక్తిక భావన చరిత్ర అర్ధం కావాలి. ఓల్గా చూసిన మధుర వాణికీ, గురజాడ ‘పాత్ర’కీ సంబంధం వుందా అంటే, ఆ విషయం ఇప్పటికిప్పుడు అప్రస్తుతమే అంటాను. ‘ప్రస్తుతం’లోకి  ఆ పాత్ర ఎట్లా అనువదించబడుతోందో అదే ముఖ్యమనీ అంటాను. ప్రతి రచనకీ, ప్రతి పాత్రకీ అనేక జన్మలు వుంటాయి. వొక్కో జన్మ ఆ కాలధర్మాన్ని బట్టి వుంటుంది. ‘ఒక్క నేనే నీకు, పెక్కు నీవులు నాకు” అని ఎంకి నాయుడు బావలు  ఎందుకనుకున్నారో  కచ్చితంగా అదే, వొక రచన విషయంలో కూడా జరుగుతుంది. ఒక్క రచనే, కానీ ‘పెక్కు నీవు’లుగా మారుతుంది. సాహిత్య చరిత్ర మూల మలుపుల్లో వున్నప్పుడు ఈ ‘పెక్కు నీవుల’ బహుళత్వం కొంత సంక్లిష్టంగా కూడా వుండవచ్చు.

మధురవాణి పాత్రని ఓల్గా కుటుంబ కేంద్రిత భావజాలంపై వొక ధిక్కార ప్రకటనగా చూశారు, ఇంటి శ్రమని గుర్తించిన గాఢమయిన వైయక్తికత వున్న ఆధునికవాదిగా విశ్లేషించారు. ఈ విధమయిన దృష్టి అంతకు ముందు లేదు. ఇంకో కోణం నించి అసిరిని విశ్లేషించడంలో ఈ కొత్త విమర్శనా పద్ధతికి విస్తృతి పెరిగింది.  నిజానికి మధురవాణి వ్యక్తిత్వానికి వ్యాఖ్యానం ఇవ్వగల పాత్ర ఆసిరి విశ్లేషణలో ఈ మొత్తం కుటుంబ, బ్రాహ్మణ కేంద్రిత మార్మికీకరణ రహస్యాలు బట్టబయలు చేస్తారు ఓల్గా. ఈ రెండు వ్యాసాలని వొక దాని వెంట వొకటి చదివితే, ఈ రెండీటీ విశ్లేషణకి ఓల్గా ఉపయోగించిన  లెన్స్ వొక్కటే అని అర్ధమవుతుంది. ఆ లెన్స్ ని నేను subjectivity అంటున్నాను.

2

       ఒక వ్యక్తి మనసూ, శరీరం చేసే వ్యాయామాల చరిత్ర ఆత్మకథ అయితే, ఆ వ్యక్తి మెదడు చేసే వ్యాయామాల చరిత్ర మేధో ఆత్మ కథ. అట్లా అని, శరీరానికీ, మెదడుకీ వైరుద్ధ్యం వుందని నేను అనడం లేదు. వాటి మేలు కలయికే మేధో ఆత్మకథ. ఈ వ్యాసం ప్రారంభంలో వర్జీనియా వుల్ఫ్ నవలలో స్త్రీ పాత్ర గురించి పురుషుడికి వున్న ‘సాంప్రదాయిక’ వంటింటికి పరిమితమయిన ఆలోచన ఎలాంటిదో తెలుస్తుంది. ఆ తరవాత ఆ ఆలోచనపై యుద్ధమే మిగతా నవల అంతా – ఒక వాస్తవికత ఎంత సంక్లిష్టంగా వుంటుందో, అది వొక వైయక్తిక కోణం (subjectivity)  వల్ల ఎంత భిన్నత్వాన్ని సంతరించుకుంటుందో చెప్పే ప్రయత్నమే నవల. నిజానికి, స్త్రీ ఆలోచనకి పురుషుడు ‘నిర్మించిన’ ఆ కిచెన్ టేబులు సాంస్కృతిక రాజకీయ వలయాన్ని ఛేదించడం అంతర్లీన ప్రయత్నంగా కనిపిస్తుంది. అయితే, ఈ నవలలో ఆత్మకథాత్మక లక్షణాలు కూడా అనేకం కనిపిస్తాయి.  ఏ రచయిత సృజనాత్మక రచనలో అయినా ఆత్మకథాత్మకత తప్పనిసరి లక్షణం. కానీ, సాహిత్య వ్యాసాలలోనో, సాహిత్యేతర వచనంలోనూ ఆత్మకథాత్మకత వుండే అవకాశం వుందా? అన్నది ప్రశ్న.

అలాంటి అవకాశం వుందనే “సహిత” నేపధ్యంగా మనకి అర్ధమవుతుంది. ఎందుకంటే, ఈ మొత్తం “సహిత” వ్యాసాలన్నీ ఆయా సాహిత్య సందర్భాలలోని ఆయా స్త్రీ పాత్రల వైయక్తిక అన్వేషణే కనుక. ఈ వైయక్తిక అన్వేషణ ముఖ్యంగా మూడు మార్గాలలో జరుగుతుంది. ఒకటి, ఆ రచయిత అధ్యయనం; రెండు, రచయితకి ఇతర రచయితలతో వుండే వ్యక్తిగత/ సైద్ధాంతిక అనుబంధం; మూడు, రచయిత వివిధ సాహిత్య సిద్ధాంతాల ద్వారానో, ఉద్యమాల ద్వారానో చేసే వ్యక్తిగత/ సైద్ధాంతిక ప్రయాణం. నిజానికి ఈ మూడు అంశాలు వొకదానితో వొకటి ముడిపడి వున్నవే. కానీ, వీటి పరిధుల్ని లోతుగా అర్ధం చేసుకోవడానికి వీలుగా వాటిని విడివిడిగా చూడడమూ అవసరమే. ఈ మూడింటి కలగలుపు  ప్రయాణమే ఒక రచయిత మేధోజీవన ఆత్మకథ అవుతుంది.

రచయిత అనుభవమూ అధ్యయనమూ ఎప్పుడూ కలగలిసి వుంటాయి. అనుభవాల్లో వైరుద్ధ్యమో,  సంఘర్షణో లేని రచయిత అధ్యయన పరిధి విస్తరించే అవకాశం తక్కువ. అయితే, అనుభవమనే కొలమానం తీసుకుంటే వైయక్తికతలో కొన్ని రాగద్వేషాలు కూడా బలంగానే వుండవచ్చు. అధ్యయనం వల్ల ఆ రాగద్వేషాల మధ్య కొంత సమతూకం సాధ్యపడవచ్చు. ఒక రచన చదువుతున్నప్పుడు రచయితకి  సామరస్యాల్ని బాగా చూసే అలవాటు అవుతుందని అందరం అనుకుంటాం. కానీ, సామరస్యం కంటే కూడా భిన్నత్వాన్ని చూసే అలవాటు బాగా పెరుగుతుంది. అలాంటి భిన్నత్వ దృష్టి ఆ రచయిత వైయక్తికతని బలంగా కుదుపుతుంది. ఓల్గా ఈ వ్యాసాలలో అలాంటి భిన్నత్వపు కుదుపులను చర్చకి తీసుకువస్తారు. అనుభవానికి వుండే  “తను” “ఇతర” అనే రెండు కోణాల నించి సాగే ఈ అధ్యయన ప్రయాణం ఈ వ్యాసాల్లో ప్రతి వాక్యంలోనూ కనిపించడం మొత్తంగా ఆమె ప్రతిపాదిస్తున్న/ సమర్ధిస్తున్న అస్తిత్వవాద రాజకీయాలకూ, వాటిని శరీర రాజకీయాల నించి చూసే తనదయిన ప్రత్యేకతకి సంకేతాలు. ఈ  అనుభవాన్ని చెప్పెటప్పుడు ఓల్గాలో మారుతున్న స్వరాన్ని గమనించినప్పుడు ఆ స్వరంలో ఉద్వేగం ఎంత వుందో, ఆ ఉద్వేగాన్ని ఆలోచనల భాషలోకి కుదించాలన్న తపన కూడా అంతే వుంది. తన వైయక్తికతని చెరుపుకోకుండా, తన స్వరాన్ని అణచుకోకుండా, తన తను ఇతరలోకి వొంపే సునిశితమయిన వొక సాంప్రదాయ విముక్త భాషని ఓల్గా ప్రతి వ్యాసంలోనూ ఉపయోగిస్తారు.

ఈ “ఇతర” ప్రపంచంలోకి ప్రయాణం ఆమెకి వున్న అనుభవ వైవిధ్యం వల్ల, బతుకు సంఘర్షణ వల్ల, వాటిని నడిపించే తాత్విక స్పష్టత వల్లా వివిధ రూపాలు తీసుకుంటుంది. ఒక రచనతో, ఆయా రచయితలతో తనకి ప్రత్యక్షంగా అనుబంధం వున్నప్పుడు – ఉదాహరణకి శ్రీశ్రీ, కొ.కు, చలం- లాంటి రచయితలని గురించి రాసిన వ్యాసాల్ని పఠిత రెండు సార్లు చదవాలి. మొదటి సారి  కేవలం ఆ రచయిత గురించి ఓల్గా ఏం అంటున్నారో వినడానికి చదవాలి. రెండోసారి, ఆ రచయిత లేదా రచనల వెలుగులో తన గురించి ఆమె ఏం అంటున్నారో వినడానికి చదవాలి. ఈ రెండు ప్రక్రియలూ వొకే మాదిరిగా అనిపిస్తాయి కానీ, నిజానికి కాదు. ముఖ్యంగా, శ్రీశ్రీ గురించి వ్యాసం చూడండి. మొదటి సారి చదివినప్పుడు శ్రీశ్రీ గురించి ఓల్గా కొత్తగా ఏం చెప్పారో నాకు అర్ధం కాలేదు. రెండో సారి చదువుతున్నప్పుడు శ్రీశ్రీ అనే కేంద్రాన్ని తొలగించుకొని, అక్కడ కాసేపు ఓల్గానో, నన్ను నేనో కేంద్రంగా తీసుకునో ఆ వ్యాసం చదివాను. అప్పుడు శ్రీశ్రీ గురించీ, అదే సమయంలో తన గురించీ, అదే అదే సమయంలో నా (నా అంటే నాలోని పఠిత) గురించీ ఓల్గా మాట్లాడుతున్నట్టు నాకు అర్ధమయ్యింది.

ఒక రచన గురించో, ఒక రచయిత గురించో మాట్లాడుతున్నప్పుడు – అది వ్యక్తిగత స్మృతి సందర్భం అయినప్పటికీ- మనం “తన” “ఇతర” మధ్య వొక వంతెన కట్టుకుంటాం. ఆ వంతెన మీద ఆ రచయితతో కలిసి కాసేపు జీవన “సంధ్యల” లోకి చూస్తాం (చలానికి కృతజ్నతలతో ఈ వాక్యం). అలా మనతో కలిసి ఎంతో సేపు సంభాషించలేని /వుండలేని రచయిత గానీ, రచన గానీ మన వైయక్తికతలో నించి అతి తేలికగా మనకి చెప్పా పెట్టకుండానే నిష్క్రమిస్తారు. ఆ తరవాత ఇక ఆ రచయిత గురించీ, ఆ రచన గురించీ మాట్లాడాల్సిందేమీ లేదనే అనుకుంటాను. (ఈ విధమయిన వైయక్తికతని reinforce చెయ్యడానికే చలం మ్యూజింగ్స్ రాసారేమో అనిపిస్తుంది ఈ మధ్య నాకు.) తన సంఘర్షణలో తనతో పాటు నిలిచిన రచయితలూ, రచనల ప్రస్తావన ద్వారా మనం నిజానికి మన లోపలి సంభాషణే వినిపిస్తాం. ఆ పని చలం గురించీ, కొ-కు గురించీ, శ్రీశ్రీ గురించీ రాసిన వ్యాసాలలో నైపుణ్యంతో చేశారు ఓల్గా.

ఈ లోపలి సంభాషణ ఏదయినా వొక విస్పష్టమయిన రూపం తీసుకోవాలంటే, తన బయటి లోకంతో  యుద్ధం కూడా వొక కొలిక్కి రావాలి రచయితకి- అది బయట వున్న ఉద్యమాల్ని ఆ రచయిత ఎంతగా internalize చేసుకోగలరన్న విషయం మీద ఆధారపడి వుంటుంది. ఈ దశలో రచయితలు  ఏ ఉద్యమాలతో, ఏ అస్తిత్వవాద చైతన్యంతో ఏ స్థాయిలో మమేకం అవుతున్నారన్న విషయం వాళ్ళ రచనల్లో బాహాటంగానే తెలుస్తుంది. అయితే, ఇదే సమయంలో ఆ రచయితలు ఆయా ఉద్యమాలతో, అస్తిత్వవాద చైతన్యాలతో ఎంత విమర్శ పెట్టగలరన్న విషయం కూడా ముఖ్యమే. ఓల్గా తన గురించి నేరుగా చెప్పుకున్న విషయాల్లోనూ, ఇతరులు వాహికగా తన గురించి పరోక్షంగా చెప్పిన విషయాల్లోనూ ఈ విమర్శనాత్మక ఆత్మశీలన (critical reflexivity) ని కొన్ని సార్లు ఎంత సున్నితంగా వ్యక్తం చేశారో, ఇంకా కొన్ని సార్లు అంతే ముక్కుసూటిగా నిక్కచ్చిగా critical distance గురించి కూడా  చెప్పారు. అంటే, వొక సైద్ధాంతిక క్రమశిక్షణ వున్న రచయితలు  తమ చుట్టూ వున్న ఉద్యమాల వాడినీ, వేడినీ ఎంత వేగంగా స్వీకరించగలరో, అంతే విమర్శనాత్మకంగా వొక ఆత్మీయమయిన “దూరాన్ని” కూడా స్వీకరించగలరు. అలా చెయ్యలేకపోతే, ఆ రచయితకి వున్న వైయక్తికత గాయపడుతుంది. అలా తన వైయక్తికత గాయపడిన సందర్భాల నించి ఓల్గా నేర్చుకున్న కొన్ని పాఠాలు “సహిత”లో వున్నాయి. ఆ పాఠాలు నిజానికి ఎవరికి వాళ్ళు తిరిగి అనుభవిస్తే తప్ప వాటి తీవ్రత తెలియదు, నిజమే, కానీ, ఆ పాఠాల నించి ఓల్గా తన ప్రయాణం నించి స్త్రీవాద చరిత్ర నిర్మాణ సాధనాల అన్వేషణకి బయలుదేరుతున్నారు, అడవిలో చిక్కుబడిన వొంటరి సీత తనలాంటి ఇతర సీతలతో కలిసి  ఇంకో కొత్త రామాయణం – కాదు సీతాయణం – తిరగరాస్తున్నట్టుగా.

3

       ఏక నలుపు అనే పదాన్ని “సహిత”లో ఓల్గా కొన్ని సందర్భాల్లో వాడడం చూస్తాం. అది ఇష్టంతో కాదు, అయిష్టంతో!

చరిత్ర అంటే ఏక నలుపో ఏక తెలుపో లేదా కేవలం తెలుపూ నలుపుల మిశ్రమం మాత్రమో కాదు. “ఆధునిక మహిళ చరిత్రని పునర్లిఖిస్తుంది” అన్న వాక్యం ఇటీవల చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ, ఈ పునర్లేఖన ప్రక్రియ ఎలా వుంటుందన్న అవగాహన కలగడానికీ, ఆ ప్రక్రియకి అవసరమయిన పనిముట్లని సాధించడానికి కొన్ని దశాబ్దాల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది తెలుగు సాహిత్యం.  చరిత్రని వొక మూసలోంచి కాకుండా అనేకత్వంలోంచి చూడాలన్న స్పృహ ప్రధానంగా జాతీయవాద అనంతర/ మార్క్సిస్టు అనంతర ధోరణి. ఒకే ఒక్క ప్రధాన ఆధిపత్య చరిత్ర అంటూ ఏదీ వుండదనీ, ఏక సమయంలో అనేక చరిత్రలు సమాంతరంగా, ప్రత్యామ్నాయంగా, జమిలిగా  పనిచేస్తుంటాయన్న విమర్శనాత్మక చైతన్యం మార్క్సిస్టు, జాతీయవాద చరిత్రల మహా కథనాలని ప్రశ్నించడంతో మొదలయ్యింది. కానీ, ఈ ప్రశ్నించడం అనే ప్రక్రియ సఫలమవ్వడానికి కొన్ని సాధనాలు కావాలి, కొంత సాధనా కావాలి. అలాంటి సాధనాల సాధన మన:కార్మికశాల  “సహిత.”

స్త్రీవాద విమర్శ సాధనాలను ఇంకా సమర్ధంగా వాడుకోలేకపోయామన్న విమర్శ చాలా మటుకు నిజమే. కానీ, ఆ సాధనాలు ఏమిటన్న అవగాహన లేకపోవడం, దానికి సంబంధించిన వచనం తెలుగులో తగినంతగా రూపొందకపోవడం దీనికి  ఒక కారణం.  ఆ ఖాళీని భర్తీ చెయ్యడానికి అన్నట్టుగా, “సహిత”లో ఓల్గా అలాంటి కొన్ని సాధనాలను అందుబాటులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. అలా అందుబాటులోకి తీసుకువచ్చే ముందు ఆమెకి స్వయంగా వాటి వాటి అలభ్యత గురించి స్పష్టత వుంది. 1986లో ఓల్గా “మనకి తెలియని మన చరిత్ర” ని సమీక్షిస్తూ అంటారు, “ తెలుగులో స్త్రీవాద దృక్పథం నుంచి రాసిన చరిత్రలు లేవు. చరిత్ర పుస్తకాలే కాదు, మిగిలిన సాహిత్యంలో కూడా స్త్రీ దృక్పథంతో మాత్రమే వచ్చినవి లేవు” ఈ వాక్యం ఇప్పటికీ నిజమే. “మనకి తెలియని మన చరిత్ర” “మహిళావరణం” లాంటి రచనలు ఎన్నో  వచ్చే అవకాశాలూ, భిన్న సందర్భాలూ  తెలుగు సాహిత్య/ సాంస్కృతిక చరిత్ర నిండా వున్నాయి. వాటి పునర్నిర్మాణం అనేక సందర్భాల్లో అనేక వినిర్మాణాలతో ముడిపడి వున్న విషయం కాబట్టి, ఆ వినిర్మాణ/పునర్నిర్మాణ ప్రక్రియలో వుండే వేదనా, శ్రమా రెండీటీని ఎదుర్కొనే శక్తి మన రచయితలకీ, ముఖ్యంగా విమర్శకులకి చాలా తక్కువ. అప్పుడప్పుడూ అరకొరగా సాగుతున్న కృషి వున్నా, అది సరిపోదు.   చరిత్ర నిర్మాణం పట్ల మనలో వున్న అలాంటి అంధత్వాన్ని గుర్తించి, కనువిప్పు కలిగించే సాధనాలు కొన్ని అయినా అందుబాటులోకి తేవాలన్న ప్రయత్నం “సహిత” లో కనిపిస్తుంది.

అలా ఓల్గా అందుబాటులోకి తీసుకువచ్చిన , మొదటి సాధనం – ఒక వాచకాన్ని దగ్గిరగా, విమర్శనాత్మకంగా, అంతర్దృష్టితో చదవడం (close, critical and reflexive reading). “సహిత”లో మొదటి  నాలుగు వ్యాసాలు గురజాడ కన్యాశుల్కం ని నాలుగు భిన్నమయిన సాధనలతో విశ్లేషిస్తాయి. మొదటి వ్యాసం మధురవాణిని కుటుంబ-కేంద్రిత కోణం నించి చూస్తుంది. రెండో వ్యాసం ఒక పురుష పాత్ర నించి మధురవాణిని ఆవిష్కరించడం, అదే సమయంలో ఆధిపత్య ధోరణిని ప్రశ్నించే సాధనాన్ని (de-heirarchization) ఉపయోగించారు. ఈ సాధనాల వాడకం దృష్టి నించి చూస్తే, మూడో వ్యాసం చాలా చర్చించదగింది. ఈ వ్యాసం ఫెమినిస్టులు చట్టాన్ని ఎట్లాచూడాలో, దాన్ని తిరిగి సాహిత్య దర్పణంలోంచి ఎట్లా వీక్షించాలో ఓల్గా తగిన ఆధారాలతో చూపిస్తారు. ఇదే వ్యాసంలో ఇంకో ముఖ్యమయిన సాధనాన్ని కూడా ఆమె బాగా వాడుకున్నారు. అది వలసవాదానంతర ధోరణి నించి రచనని చూడడం. బ్రిటిష్ వలస పాలన అనుసరించిన వ్యూహాల వినిర్మాణ ధోరణి  కనిపిస్తుంది.  ఇక నాలుగో వ్యాసం – domestic labor కోణం నుంచి కన్యాశుల్కం విశ్లేషణ. ఈ వ్యాసం ఒక social postmodernist కోణం నించి కూడా అర్ధం చేసుకోవచ్చు.  స్త్రీవాద విమర్శకోణం నించి వొక రచనని ఎట్లా దగ్గిరగా, విమర్శనాత్మకంగా చదవవచ్చో కొన్ని నమూనాల్ని ఓల్గా ఈ వ్యాసాల్లో చూపిస్తారు.

రెండో సాధనం ప్రతిఘటన  రాజకీయాలకి సంబంధించింది.  వొక స్త్రీవాదిగా ఏ రచనని స్వీకరించాలి, ఏ రచనని నిరాకరించాలి అన్నది ఎట్లా తేల్చుకోవడం?! సాధారణ  రచయితల కంటే భిన్నంగా  స్త్రీవాద రచయిత గానీ, అస్తిత్వవాద రచయిత గానీ  మూడు  రకాల అణచివేతల్ని ఎదుర్కోవాల్సి వుంటుంది. ఒకటి: నిజంగా సంప్రదాయ సాహిత్యం నించి, రెండు: ఆధునికంగా కనిపించే అంతర్గత సంప్రదాయం నించి, మూడు: అస్తిత్వాన్ని నిరాకరించే ఆధునికత నించి. వీటన్నిటినీ దాటుకొని వచ్చి స్త్రీ తన స్వరాన్ని ఎట్లా వినిపించాలన్నది తీవ్ర అన్వేషణ. ఇదే క్రమంలో ఇంకొక ముఖ్యమయిన వెతుకులాట కూడా వుంటుంది. అది తనదయిన స్మృతిని/ అనుభవాన్ని తిరిగి రాబట్టుకోవడం(retrieval of the personal memory).  ఇతర అనేక అంశాల మాదిరిగానే ఈ మూడు కూడా పరస్పరాధారిత కోణాలు. ఇక్కడ ఈ “వ్యక్తిగతం” రాజకీయాలకీ, పబ్లిక్ కి అతీతం కాదు. వాటన్నిటి కలయికలోంచి పుట్టిన subjectivity.

“సహిత” వ్యాసాల సారాంశాన్ని వొక వాక్యంలో చెప్పాలంటే, అదంతా ఈ నిరాకరణ-స్వీకరణ రాజకీయాల నుంచి ఓల్గా తనదయిన అనుభవ స్వరాన్ని వెతుక్కునే దారి. కాల పరిమితుల దృష్ట్యా ఓల్గా ఈ వ్యాసాలలో సంప్రదాయ సాహిత్యం జోలికి పోలేదు కానీ, గురజాడ కన్యాశుల్కం విశ్లేషణలో కొంత మేరకు ఆ సాంప్రదాయ అణచివేత ని విమర్శిస్తారు. అది కాక, మిగిలిన రెండు కోణాలు – ఆధునికంగా కనిపించే అంతర్గత సాంప్రదాయం, అస్తిత్వాన్ని నిరాకరించే ఆధునికత- ‘సహిత”లో ప్రధానమయిన ఇతివృత్తాలు. వాటి చుట్టూ జరిగే చర్చ కొంత మేరకు సంప్రదాయాన్ని కూడా ప్రశ్నించినా, వాటి యుద్ధ భూమి మాత్రం తక్షణ వర్తమాన  కురుక్షేత్రమే. ఆ కారణంగానే “సహిత” ఈ కాలపు స్త్రీవాదుల ఆత్మచరిత్ర కూడా!

-అఫ్సర్

2012

 

రాలిపోయిన వొక వాక్యం గురించి రెండు మాటలు …!

 

హార్వర్డ్ లో కవిత్వ పాఠాలు చెప్తున్న కాలంలో....

హార్వర్డ్ లో కవిత్వ పాఠాలు చెప్తున్న కాలంలో….

ఆగస్టు 30 పొద్దున్న.

వొక కవి చనిపోయిన రోజు మనసెలా  వుంటుంది?

ఇప్పుడు నేను మాత్రం వాన నీళ్ళు భారంగా దేహంలోకి ఇంకుతున్న పొడి నేలలాగా వున్నాను. కొన్ని నల్ల మబ్బులు తిరుగుతున్న బరువయిన గాలిలాగా వున్నాను.

ఆ కవి నాకేమీ బంధువు కాదు. స్నేహితుడూ కాదు. నన్ను రోజూ పలకరించే నా సహోద్యోగి కూడా కాదు. అసలు నాదీ అతనిది వొక భాష కూడా కాదు. వొక దేశం అసలే కాదు.

కాని, వొక కవి! పాతికేళ్ళుగా అక్షరాలా పలకరిస్తున్న కవి. పలవరిస్తున్న కవి – సీమస్ హీని ఇక లేడు! ఇవాళ పొద్దున్న ఆఫీసుకి వెళ్లి కూర్చోగానే ఈ-లేఖలో చిరకాల మిత్రుడు, అమెరికన్ కవి  మాథ్యూ గిన్నెట్ పలకరింత. “విన్నావా? సీమస్ హీని ఇక లేడు! ఇవాళ నువ్వూ నేనూ కలిసి మనిద్దరికీ ఇష్టమైన అతని కవిత ‘The Republic of Conscience’ చదువుకుందామా?”

అప్పటికప్పుడు నాకు చాల ఇష్టమయిన సీమస్ కవిత్వ సంపుటి OPENED GROUND తీసి, ఆ కవితలోంచి వొక్కో కవితా చదువుతున్నప్పుడు కంటి రెప్పలు తడుస్తో పోతున్నాయి.  కొంత దూరం చదివేసరికి అక్షరాలూ అల్లుకుపోయాయి  తడి పొరల కింద. నాకు తెలుసు- ఏడేళ్ళుగా అతని గుండె ఇక పని చేయను అని బలహీనంగా సడి  చేస్తూనే వుంది.

ఇక చదవలేక ఆఫీసులోంచి బయటికి వచ్చి అక్కడే వున్న Turtle pond అనే చిన్న కొలను పక్కన కూర్చొని, అక్కడి నీళ్ళనీ, అందులోని రాళ్ళ మీదికి మెత్తగా పాకుతున్న తాబేళ్లనీ చూస్తూ కూర్చున్నాను. సీమస్ హీని లేడు…అన్న రెండు పదాలు మెదడులోపల మోగుతున్నాయి. శరీరం చాలా అసౌకర్యంగా వుంది. మనసు లోపల్లోపల వెక్కిళ్ళు పెట్టుకుంటోంది.

ఎందుకీ కవి ఇంతగా నాలోపల మిగిలిపోయాడు? డెబ్బై నాలుగేళ్ల అతని దేహ నిష్క్రమణని ఎందుకు వొప్పుకోలేకపోతున్నాను?

కొంత కాలంగా వొక విధమయిన వ్యక్తిగత వైరాగ్యమూ, వైముఖ్యమూ, నా మీద నాకే కోపమూ  లోపల్లోపల పేరుకుపోయి, “ఇంక నేనేమీ రాయను, రాయలేను!” అని మనసూ, చేయీ రాయి చేసుకొని, రాయాల్సిన వాక్యాలన్నీ మనసులోనే భ్రూణ హత్య అయిపోతున్న సమయంలో సీమస్ నా చేత ఈ రెండు మాటలూ  రాయిస్తున్నాడు.

Seamus-Heaney-006

1

సీమస్ హీని నాకు తండ్రి లాంటి వాడు. మా నాన్నగారూ, అతనూ వొకే ఏడాది – అంటే 1939- లోనే పుట్టారు. ఇవాళ పత్రికలో సీమస్ చివరి ఫోటోలో అతని ముగ్గుబుట్టవంటి తలని చూస్తున్నప్పుడు మళ్ళీ నాన్నగారు గుర్తొచ్చారు. బహుశా, ఈ రెండు మరణాల స్మృతి భారం నన్ను మరింత దిగుల్లోకి నెట్టి వుంటుంది. తండ్రిలాంటి స్మృతి…కాని, సీమస్ వాక్యాలు ఎప్పుడూ వొక స్నేహ పరిమళం వీస్తున్నట్టు వుంటాయి.

ఎమ్మే ఇంగ్లీష్  చదువుతున్న సమయంలో నాగార్జున యూనివర్సిటీ కాంపస్ లో మొదటి సారి మా ప్రొఫెసర్ రంగన్ గారు నాకు ఈ ఐర్లాండ్ కవి వాక్యాలు చెప్పారు. అప్పటి నించీ సీమస్ ని వెతికి పట్టుకోవడం నాకొక వ్యాపకంగా మారింది. బెజవాడ గాంధీనగర్ లో ప్రబోధ బుక్ హౌస్ నించి మా ఆస్టిన్ లైబ్రరీ దాకా దొరికిన చోటల్లా సీమస్ కవిత్వం, వచనమూ వొకటికి రెండు సార్లు చదవడం, మననం చేసుకోవడం — ఈ పాతికేళ్ళుగా అతని కవిత్వం చదువుతున్నప్పుడు ఏనాడూ అతని వయసు అడ్డంకి కాలేదు నాకు. అతని భాష అతని దేశమూ పరాయీ అనిపించలేదు. అతని వదల్లేక వదిలిన వూరు నాదే, అతని చనిపోయిన క్రిస్ అన్నయ్య నా అన్నయే! అతను పాఠాలు చెప్పిన ఎలిమెంటరీ స్కూలు కూడా నాదే! అతన్ని మెప్పించిన ఈట్స్, ఇలియట్, థామస్ హార్డీ, టెడ్ హ్యూ నన్నూ మెప్పించారు. చాలా తక్కువ మంది కవులు ఇలా వుంటారు, మనల్ని తమలోకి ఇంకించుకునే వాళ్ళు! తలుపులు బార్లా తెరిచిన మనసుతో వాక్యాల వెంట తోడు తీసుకు వెళ్ళే వాళ్ళు!

భుజమ్మీద చేయి వేసి, ధైర్యం చెప్తూ కాసేపు, నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని అనునయిస్తూ కాసేపు, నా కళ్ళలోకి చూస్తూ ‘జీవితాన్ని కాస్త ప్రేమించవూ’ అని బతిమాలుతూ కాసేపు–వొక కవి కేవలం కొన్ని వాక్యాల ఆసరాతో ఇన్ని రకాల role-plays చేయగలడా అని విస్మయానికి లోను చేస్తూ–గత పాతికేళ్ళుగా సీమస్ అక్షరాలా తోడుగా వున్నాడు. ఇవాళ అలాంటిదేదో వొక తోడు తెగిపోయింది. లోపల మిగిలివున్న ఆ ధైర్యపు మాట ఏదో పుటుక్కున  దారం తెగిన దండలాగా రాలిపోయింది. వొక నిస్త్రాణ – శరీరంలో, మెదడులో!

ఆ కొలనులో నీటి గలగలల మధ్య అతను లేనితనంలోంచి అతని మాటల్ని వెతుక్కుంటూ కూర్చున్నాను. ‘కవిత్వం ఏమిటీ’ అన్న నా ప్రశ్నకి లోపల్నించి సీమస్ ఇలా సమాధానమిస్తున్నాడు: “నేను పుట్టిందీ పెరిగిందీ పొలాల మధ్య..పొలం పనుల మధ్య! అదీ నా వాస్తవ ప్రపంచం. ఆ పనుల మధ్య కొంచెం అలసట తీర్చుకోడానికి నేను ఆడుకోడానికి వెళ్ళే వాణ్ని. ఆ ఆటలో నన్ను నేను, నా వాస్తవ ప్రపంచాన్ని మరచిపోయే వాణ్ని. అంటే, ఆటస్థలం నా ఊహా ప్రపంచం. ఆ రెండీటి మధ్య వున్న ప్రపంచమే కవిత్వం నాకు!”

ఇంకా కొంచెం ముందుకు వెళ్లి మాట్లాడుకుంటే, జీవనోపాధి వల్ల తను పుట్టిన వూరికి దూరంగా వెళ్ళిపోవడం సీమస్ ని ఎప్పుడూ బాధించేది. వొక చిన్న వూళ్ళో బడిలో పాఠాలు చెప్పుకుంటూ చెప్పుకుంటూ చివరికి హార్వర్డ్ దాకా చేరుకున్నాడు సీమస్. ఈ సుదూర ప్రయాణంలో ఎంత ఆనందం వుందో, అంత బాధా వుంది అతనికి!

వొక కవితలో ఆ బాధని ఇలా చెప్పుకున్నాడు:

ఎక్కడెక్కడికో ఎగిరిపోతుంది గాలిపటం.

దాని దారం నీ చేతుల్లో

నీ గుండెని హత్తుకొని ఎలా వుంటుందో చూసావా?

నిజానికి  దారమొక్కటే నీ చేతుల్లో వుంది.

నీ గాలిపటం అందాలన్నీ

ఎక్కడో ఏ శూన్యాన్నో  అలంకరిస్తున్నాయి.

సీమస్ కవిత్వ రహస్యం అంతా ఆ దూరంలోని బాధ చెప్పడమే! ఎక్కడో వొక వూళ్ళో పుడతాం, కొన్నాళ్ళకి ఆ వూరు విడిచి వెళ్ళిపోతాం. వొక్క రోజు కూడా విడిపోతే వుండలేమనట్టుగా తల్లి కొంగు పట్టుకు తిరుగుతాం. ఆ కొంగుని వదిలేసి ఏడు సముద్రాలూ దాటి వెళ్ళిపోతాం. నాన్న భుజాల మీద ఆడుకోలేని రోజులు అర్థరహితంగా అనిపిస్తాయి. చివరికి అలాంటి అర్థరహితమయిన రోజులే జీవితంలో పెరిగిపోతుంటాయి. చిన్నప్పుడు స్నేహితులతో కలిసి తిరిగిన చెలకలూ, తవ్వి తీసిన చెలమలూ, హోలీ రంగుల కోసం కోసుకొచ్చిన పూలూ, అల్లరి చేస్తూ గడిపిన పండగ రోజులూ ఇవి లేని బతుకు ఏనాడూ వద్దనుకుంటాం.

కాని, అవన్నీ చూస్తూ చూస్తూ ఉండగానే గతస్మృతులు అయిపోతాయి. ఇప్పటి దూరపు బతుకు వొక్కటే మనకి మిగిలి వుంటుంది. సీమస్ కవిత్వమంతా ఆ ఇంటి పలవరింత, ఆ బంధాల పలకరింత. దూరమయిపోయే దగ్గరితనాల తలపోత. అందుకే, సీమస్ వాక్యాలు చదువుతున్నప్పుడు నా మటుకు నాకు అతని అద్దంలో నన్ను నేను చూసుకుంటున్నట్టు వుంటుంది. నా కాళ్ళని వెనక్కి నడిపించి గతంలోకి తోసుకుంటూ వెళ్ళే బాల్యమిత్రుడు సీమస్.

ఈ ఐరిష్ నేలా, గాలీ, చేలూ...అతని కవిత్వానికి ఊపిరి

ఈ ఐరిష్ నేలా, గాలీ, చేలూ…అతని కవిత్వానికి ఊపిరి

2

నాకు తెలిసీ, నాకు వున్న పరిమితమయిన అనుభవంలోంచి చెప్పాల్సి వస్తే,   కవిత్వం రాయడమే కష్టం. కోరి కోరి మనసుని నొప్పించుకోవడం! వొక్కో వాక్యం వొక్కో  రకం  నొప్పి. కాని, రాయకుండా వుండడం ఇంకా నొప్పిగా వుంటుంది. ఆ రాయలేని నొప్పి కన్నా రాస్తూ పడే నొప్పి సహించడం తేలిక. అందుకే, బాధపడుతూనే రాస్తాం. సీమస్ అంటున్నాడు:

I am tired of speculations about the relation of the poet’s work to the workings of the world he inhabits, and finally I disagree that ‘poetry makes nothing happen.’ It can eventually make new feelings, or feelings about feelings happen, and anybody can see that in this country for a long time to come a refinement of feelings will be more urgent that a reframing of policies or of constitutions.

ఎన్ని వాదాలు చేసినా, వివాదాలు పడినా కవిత్వం వొక అనుభూతి. రాయడం వొక అనుభూతి, చదవడం వొక అనుభూతి, నలుగురితోనూ కవిత్వం గురించి మాట్లాడుకోవడం వొక అనుభూతి. ఎవరైనా నాలుగు కవిత్వ వాక్యాలు వాళ్ళ గొంతులోంచి పలుకుతూ వుంటే వినడం వొక అనుభూతి.

అందుకే, సీమస్ ఎప్పుడూ అంటాడు: “The main thing is to write/ for the joy of it … It’s time to swim/ out on your own and fill the element/ with signatures on your own frequency.”

సీమస్ చివరిదాకా ఆ ‘రాయడం’ అనే ప్రక్రియలోని  అనుభూతిని కాపాడుకున్నాడు, అది ఎంత నొప్పెట్టినా సరే!

ప్రపంచాన్ని చదివించిన ఆమె..!

Malathi-candoor-Banner

చాలా సార్లు మనం పెద్దగా ఆలోచించం కాని, ఇది చాలా ముఖ్యమయిన ప్రశ్న!

వొక రచన మన జీవితంలోకి ఎలా ప్రవేశిస్తుంది? లేదా వొక రచయితో, కవో మన అనుభవంలోకి ఎలా అడుగులు వేసుకుంటూ వస్తారు?

 చెప్పడం కష్టమే!

కాని, మన చదువు అనుభవాలను నెమరేసుకుంటూ ఓ పది నిమిషాలు సాలోచనగా కూర్చున్నప్పుడు వొక్కో రచయితా వొక్కో రచనా వొక్కో మజిలీలా కనిపిస్తాయి. కొన్ని మజిలీలు మనల్ని విస్మయంలో పడేస్తే, ఇంకా కొన్ని మజిలీలు ప్రశ్నలవుతాయి. ఇంకా కొన్ని జవాబులవుతాయి. మాలతి చందూర్ ఏదీ కాదు! అసలు ఆమె రచనలు నేనెప్పుడూ సీరియస్ గా చదవలేదు. ఆమెని నేను సీరియస్ రచయిత్రిగా ఎప్పుడయినా తీసుకున్నానో లేదో తెలీదు. దానికి బలమయిన కారణం వొక్కటే: అసలు సాహిత్యాన్ని వొక సీరియస్ వ్యాపకంగా తీసుకోని కాలం నించీ నేను ఆమె రచనలు చదువుతూ ఉండడమే!

కాని, ఆశ్చర్యం ఏమిటంటే, జీవితంలోని ప్రతి దశలోనూ ఆమె రచనలు ఎదో వొకటి చదువుతూనే వున్నా. వొక రచయితని ఇన్ని దశల్లో ఇన్ని వయసుల్లో చదువుతూ రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

2

నేను మిడిల్ స్కూల్ లో – అంటే ఆరో తరగతి-  చదువుతున్న రోజుల్లో మా అమ్మ గారు రంగనాయకమ్మగారికి వీరాభిమాని. రంగనాయకమ్మ రచనలన్నీ ఆమె మళ్ళీ మళ్ళీ చదివేది. ‘ఆ పుస్తకంలో ఏముంది రెండో సారి చదవడానికి ?’ అని నేను అడిగినప్పుడల్లా నాకు అర్థమయ్యే భాషలో కథలాంటిది ఎదో చెప్పేది. కాని, వాటి మీద నాకు ఆసక్తి వుండేది కాదు. నాకు నాటికల పిచ్చి వుండడం వల్ల కేవలం నాటికల పుస్తకాలే చదివే వాణ్ని ఆ రోజుల్లో!  అవి చదవడానికి బాగుండేవి. పైగా, ఆ డైలాగులు కొట్టుకుంటూ తిరిగే వాణ్ని.

ఇంకో వేపు మా అమ్మగారు మంచి వంటలు చేసేది కాబట్టి, ఎక్కువ సమయం నేనూ అమ్మా వంట గదిలో గడిపే వాళ్ళం. అలా వంటల మీద ఆసక్తి పెంచుకుంటున్న రోజుల్లో ఉన్నట్టుండి వొక రోజు మా ఇంట్లో-వంట గదిలో-   ‘వంటలు- పిండివంటలు’ పుస్తకం ప్రత్యక్షమయింది. మొదటి పేజీ నించి చివరి పేజీ దాకా ఆసక్తిగా చదివిన తొలి పుస్తకాల్లో ఇదీ వొకటి అని ఖాయంగా చెప్పగలను. ఈ పుస్తకం ఎంత ఉపయోగంలో పెట్టానంటే, ఏడాది తిరిగే సరికి నూనె, కూరలూ, పసుపు మరకలతో ఈ పుస్తకం ఇక చదవడానికి వీల్లేకుండా పోయింది. నాన్నగారు బెజవాడ వెళ్తున్నప్పుడు పనిమాలా చెప్పే వాణ్ని “ మాలతి చందూర్ పుస్తకం ఇంకో కాపీ తీసుకు వస్తారా?” అని!

అలా ప్రతి ఏడాది ‘వంటలు-పిండి వంటలు’ పుస్తకం కొత్త ఎడిషన్ మా ఇంట్లో చేరేది. అది చదవడం వల్ల నాకు జరిగిన లాభం ఏమిటంటే, రెండు వందల పేజీల పుస్తకం ఏదన్నా అలవోకగా ధీమాగా  చదివేయడం! అది ‘చందమామ’ చదివే అనుభవం కన్నా భిన్నమయింది నాకు – మెల్లిగా నా చేతులు మా అమ్మగారి పుస్తకాల మీదకి మళ్ళాయి. నాటికలే కాకుండా, కథలూ నవలలూ చదవడం మొదలెట్టాను. అవి చదవడం మొదలెట్టాక మాలతి చందూర్ ‘వంటలు- పిండివంటలు’నా పుస్తక  ప్రపంచంలోంచి నిష్క్రమించింది.

ఏడో తరగతిలో మేం పట్నం- అంటే ఖమ్మం- చేరాం. కాన్వెంటు చదువు నాకు పెద్ద కల్చర్ షాక్. మిగతా పిల్లలు వాళ్ళ ఇంగ్లీషు పలుకులు వింటున్నప్పుడల్లా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్! అసలు నాకేమీ తెలియదు, ఎలాగయినా సరే ఈ లోకాన్ని ఉన్నపళాన అర్థం చేసేసుకోవాలి అని ఆబ. తెల్లారేసరికి మంచి ఇంగ్లీషు మాట్లాడేయాలి, క్లాస్ మేట్ల మైండ్ బ్లాంక్ అయిపోవాలి అని తీర్మానించుకున్న రోజుల్లో  కనిపించిన ఇంగ్లీషు పుస్తకమల్లా చదివేయడం! పిచ్చి పట్టినట్టు రెన్ అండ్ మార్టిన్ గ్రామర్ పుస్తకాన్ని మొదటి పేజీ నించి చివరి పేజీ దాకా చదివేయడం…శంకరనారాయణ నిఘంటువులో రోజూ కొన్ని పేజీలు  బట్టీ కొట్టడం!

నా అవస్థలు చూసి నాకే అవస్థగా వుండేది. అప్పుడు దొరికింది స్వాతి మాసపత్రిక! అందులో మాలతి గారి కెరటాల్లోకి దూకేసాను. మొదటి సారి చదివిన ఇంగ్లీష్ నవల ‘ of human bondage.’ ఆ నవల చదవడానికి ముందు మాలతి గారి వ్యాసం చదివి, అందులో events అన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకొని, ఆ పాత్రల పేర్లు కాగితం మీద తెలుగులో రాసుకొని, ఇంగ్లీషు నవల చదవడం! ఇదీ సాధన! అలా మాలతి గారి సపోర్టుతో  ప్రతి నెలా వొక ఇంగ్లీషు నవల చదవడం, ఆ నవల గురించి ఇంగ్లీషులో సమ్మరీ రాసుకొని, కొన్ని సార్లు మాలతి గారి కెరటాల వ్యాసాన్ని నా బ్రోకెన్ ఇంగ్లీషు  అనువాదం చేసుకోవడం ….అలా, ఏడాది తిరిగే సరికి మాలతి గారు నా చేత పన్నెండు నవలలు చదివించారు. డికెన్స్, థామస్ హార్డీ, జేన్ ఆస్టిన్, వర్జీనియా వూల్ఫ్….ఇలా నా బుర్ర నిండా ఇంగ్లీషు పేర్లు!

ఈ క్రమంలో మాలతి గారు నాకు నేర్పిన పాఠం: జ్ఞానానికి భాష అడ్డంకి కాదు- అని! ఆమె ఎంత కష్టమయిన నవల అయినా సరే, అతి తేలికయిన భాషలో చెప్పేస్తుంటే, అంత లావు లావు నవలలు కూడా ‘వీజీ’ అయిపోయేవి. పైగా, ఆ పిచ్చి అవేశాల ఉద్వేగాల టీనేజ్ లో ఆ చిన్ని వ్యాసాల  గడ్డిపోచ పట్టుకొని ఎంత పొగరుమోత్తనంతో ఎంత గోదారి ఈదానో!

 

4

ఆ తరవాత మాలతి చందూర్ సొంత రచనలు ఏం చదివానో పెద్దగా గుర్తుండని స్థితి కూడా వొకటి వచ్చేసింది. పైగా, ఆమె ‘ప్రశ్నలూ జవాబుల’ శీర్షిక ఆవిడ పట్ల నా గౌరవాన్ని తగ్గిస్తూ వచ్చింది కూడా!  ఇంత చదువుకొని ఈవిడ ఎందుకిలా మరీ నాసిగా రాస్తారా అనుకునే రోజులు కూడా వచ్చేసాయి. సొంతంగా రాయడం ఎంత కష్టమో కదా అని అనుకోవడం తప్ప ఇంకేమీ చేయలేని స్థితి! ఆవిడే పరిచయం చేసిన ప్రపంచ సాహిత్యం అంతా చదివాక, ఆవిడ సొంత రచనలు మరీ అన్యాయంగా అనిపించడం మొదలయింది. చూస్తూ చూస్తూ ఉండగానే, నా చదువు పటంలోంచి  మాలతిగారు నిష్క్రమించేసారు.

కాని, ఆమె ‘కెరటాలే’ తోడు లేకపోతే, నాకు ఈ మాత్రం ఇంగ్లీషు వచ్చేది కాదు. ప్రపంచ సాహిత్యం చదవాలన్న తపన నాలో పుట్టేది కాదు. కాని, నా ముందు పరచుకున్న ప్రపంచంలో మాలతి గారిని ఎక్కడ locate చేసుకోవాలో ఇప్పటికీ నాకు తెలియదు.

afsar— అఫ్సర్

 

 

 

 

ఏకాంత దేశంలోకి…త్రిపురలోకి వొక సాలిలాకీ!

tripuraవొక రచయిత తన పాఠకుడి జీవితంలోకి ఎంతవరకూ రాగలడు? వాళ్ళిద్దరూ కలిసి సహప్రయాణం – సఫర్ – చేయగలరా? చేస్తే, వొకరికొకరు ఎట్లా అర్థమవుతారు?

          త్రిపురని తలచుకున్నప్పుడు ఈ మూడు  ప్రశ్నలూ నన్ను వుక్కిరిబిక్కిరి చేస్తాయి. త్రిపుర కథల వెంట, ఆయన సృష్టించిన పాత్రల వెంటా నేను సాగించిన ప్రయాణాలు వొక్కోసారి నాకు ప్రశ్నలూ, ఇంకో సారి జవాబులు కూడా! కానీ, ప్రశ్నకీ, జవాబుకీ మధ్య ఇంకో స్థితి కూడా ఏదో వుంది. ఆ స్థితిలోకి నన్ను చాలా సార్లు నెడుతూ వచ్చాడు త్రిపుర. అసలు జీవితంలో అసంబద్ధతకి ఆ స్థితే తల్లివేరు అనుకుంటా.

ఏ వాస్తవికతా నన్ను స్థిరంగా వుండనివ్వని వయసులో నా కంట పడ్డాడు త్రిపుర. ‘స్థిరతా నహీ నహీ” అని ఎందుకో పాడుకుంటున్నప్పుడు –నా పందొమ్మిదో ఏడు దాటాక-మధ్యాన్నపుటెండలో ఉద్వేగంగా  వేగంగా నడుస్తూ పోతున్నప్పుడు అకస్మాత్తుగా అపరిచితుడిలా ఎదురుపడి “ ఇవాళ నీ పేరు అలఖ్ నిరంజన్!” అనేసి వెళ్లిపోయాడు. అప్పటినించీ ఆ పేరు రకరకాలుగా మా మిత్రుల మధ్య నలిగిపోవడం మొదలయ్యింది. మా సమకాలీన అసంబద్ధతకి అలఖ్ నిరంజన్ వొక కొండ గుర్తు అయిపోయాడు. ఆ సమయంలో “అప్పుడే కలలోంచి లేచి కొత్త ప్రపంచాన్ని చూస్తున్న” అనుభూతి త్రిపుర కథలన్నీ!

1

          ఆ మొదటి సారి చదువుతున్నప్పుడు త్రిపుర నిజంగానే కొత్తగా అనిపించాడు. బయటి వాస్తవికత మీద నాలోపల పెరిగిపోతున్న నిరసనకి ఇక్కడో భాష దొరికిందనిపించింది.

“బాల్యం…బాల్యపు అనుభూతులు…బాల్యం నన్ను విరామం లేకుండా మెత్తగా వెంటాడుతుంది. ఏళ్ళు గడిచిన కొలదీ, ఎడారిలాంటి ‘యధార్థం’ గుండెల్లో బలమయిన వ్రేళ్లతో పాటుకుపోయి స్థిరపడ్డ కొలదీ…నా వెనుకనే నీడలా వచ్చి వీపు మీద పచ్చటి వేళ్ళతో తట్టి పిలుస్తున్నారెవరో…జీవితానికి అర్థం లేదు, అంతా శూన్యం అని తెలుస్తున్న కొలదీ, నా పూర్ణ శక్తితో వెనక్కి…వెనక్కి పరుగెడదామనుకుంటాను….తిరిగీ, నా బాల్యంలోకి…క్షణానికీ, క్షణానికీ, క్రియకీ, క్రియకీ సంబంధం లేకుండా బతకడం…..”

ఈ భాష మొదటిసారి విన్నప్పుడు అంతకు ముందు చదివిన బైరాగీ, అజంతా కొంత కొంత గుర్తుకు వచ్చారు కానీ, లోపల పేరుకుపోతున్న శూన్యానికి వాళ్ళెవరూ వచనరూపం ఇవ్వలేదు కదా అన్న అసంతృప్తి వుండేది. పందొమ్మిది దాటి ఇరవైలోకి అడుగుపెడ్తున్న వయసులో, విద్యార్థి ఉద్యమాలూ, కాలేజీల్లో శ్రీశ్రీ వరవరరావుల ప్రసంగాలు ఇంకా చెవుల్లో గింగిరాలు తిరుగుతున్న వేడిలో వచ్చాడు త్రిపుర వొక జెర్కిన్  వేసుకుని…శూన్యాన్ని సఫర్ గా మార్చేస్తూ…!

1980. కొత్త వాస్తవికతని చెప్పడానికి – త్రిపుర భాషలో చెప్పాలంటే- “ఇమేజ్ దొరకడం లేదు.” జీవితంలోంచి “పోయేటిక్ వెదర్” తప్పించుకుంది. బీట్ నిక్స్ కోసం ఎదురుచూపులు. “రూట్ లెస్ ఫెలోస్” గా మారిపోతున్న చెట్లు కూలిపోతున్న దృశ్యం. అవున్నిజమే, “ఎంగ్రీ యంగ్ మెన్” ఇప్పుడు అత్యవసరమనే ఆవేశం. “మాటలు దేన్నీ వ్యక్తపరచలేవు…ఇటుకల్లాగా ప్రాణం లేకుండా కట్టుకుపోతాయి” అన్న భావమూ గట్టిపడుతున్న మనోస్థితి.

అప్పుడొచ్చాడు త్రిపుర…అతని మల్లిపూవు తెల్లని కాయితాల పుస్తకంతో! దాని మీద నల్లని అట్టతో…ఆ అట్ట మీద నిర్వర్ణ ముఖాలతో..! త్రిపుర కథల్ని ఆవురావురుమని చదవలేం. ఆగి ఆగి వొక్కో వాక్యాన్ని చదవాలి. తిరగ తిరగ చదవాలి. మొదట్లో నేను రోజుకో కథ చదివే వాణ్ని. ఆ వాక్యాల్ని మననం చేసుకుంటూ…ఆ భాషలోకి వలసపోతూ చదివే వాణ్ని. చదివిన వాక్యాల వెంట తూనీగలా పరుగులు పెట్టే వాణ్ని. నన్ను క్షణం సేపు నిలవనీయని ఆ పరుగులు కావాలి నాకు.

2

          ఎందుకో తెలీదు బెజవాడ మొగల్ రాజపురం కొండ నాకు చాలా ఇష్టం. ఆ కొండ పక్కనే రెండు గదుల్లో నేను అద్దెకి వుండేవాణ్ణి. నాతోపాటు నా చెల్లి. ఇంటి పక్క కొండపల్లి కోటేశ్వరమ్మ గారూ, ఇంకో పక్క వేణుగోపాలూ, ఇంకో రెండడుగులు వేస్తే డానీ, ఖాదర్, భట్టు గారూ,  మో…సిద్ధార్థ కాలేజీ నించి స్టెల్లా కాలేజీ దాకా సాయంత్రపు నడకలూ…అదీ జీవితం! అలాంటి వొక సాయంత్రం “నీతో నేనూ నడుస్తాను పద..!” అంటూ తోడొచ్చారు త్రిపుర.

“నాకు మాటలు రావేమో!” అన్నాను.

“మాటలు అక్కర్లేదు. వచ్చినప్పుడే రానీ!” అన్నారాయన.

నిజమే…ఇప్పుడొచ్చినన్ని మాటలు అప్పుడు రావు నాకు. అసలు నా నవ్వు తప్ప నా గొంతు వినని వాళ్ళు చాలా మంది వుండే వాళ్ళు అప్పుడు.

“Do you know you’ve a pleasant voice and a singer’s face?!” అన్నారాయన.

“నేనేమిటో నాకు ఇంకా తెలీదు!” అన్నాను సిగ్గుపడుతూ. నా ఇరవయ్యో  ఏడు అమాయకత్వం!

అలా కొన్ని సాయంత్రాలు నడిచాక ఆయన వెళ్ళిపోయారు, “మనం ఉత్తరాలు రాసుకుంటున్నాం!” అని ఇద్దరి తరఫునా డిక్లేర్ చేసేసి!

కాగితాల మీద చూసిన త్రిపురకీ, ఎదురుగా నిలిచిన/ తోడుగా నడిచిన త్రిపురకీ పెద్ద తేడా లేదు. ఆ ఇద్దరూ వొక్కటే అవడం నాకు చాలా ఆశ్చర్యం.

అలా ఆయన వెళ్ళిపోయిన ఆ రాత్రి నించి మరికొన్ని రోజులు త్రిపుర కథలు చదువుతూ కూర్చున్నా. నాకు త్రిపుర తెలుస్తున్నాడో లేదో తెలియడం లేదు! నాకు చాలా తెలియడం లేదు అని మోనోలాగ్ తో నన్ను నేను కొన్ని రోజులు త్రిపురాక్షరాల అద్దంలో నిలబడి తల దువ్వుకొని కొన్నిసార్లూ దువ్వుకోకుండా కొన్ని సార్లూ అడుక్కుంటూ వుండిపోయా. యవ్వనం చాలా desperate గా వుంటుంది కొన్ని సార్లు. అప్పుడు త్రిపుర నాలోని ఆ desperate mood లోకి ప్రవేశించే వాడు.

అప్పుడే మళ్ళీ కామూ వొకడు నా ప్రాణం తోడేయడానికి! “ఒరేయ్…వాడు నీ చమడాలు తీసేస్తాడ్రా…” అని ‘మో’ బెదిరింపులు. కామూ The Myth of Sisyphus చదువుకుంటూ…గడిపిన రాత్రుల్లో త్రిపుర కూడా!

In a universe that is suddenly deprived of illusions and of light, man feels a stranger. His is an irremediable exile…this divorce between man and his life, the actor and his setting, truly constitutes the feeling of Absurdity.

ఏమిటీ Absurdity లో ఆ A capitalize అయిపోయి నా అస్తిత్వాన్ని నన్నూ కడిగి ఉతికి పారేస్తూ…గది ముందు దండేనికి వేలాడుతున్న చొక్కాలా నేను!

3

Nothing happens, nobody comes, nobody goes; it’s awful!

ఇంకో పదేళ్ళకి చాలా అమాయకంగా ఆ Samuel Becket వాక్యం దుప్పట్లా కప్పేసుకునే human condition.  “…అర్థరాత్రి స్వప్నాల్లో …ఆ కనిపించని ద్వారం తెరుచుకుంటుంది. ఎవరో పచ్చటి వేళ్ళతో తట్టి లేపుతారు. లోపలకు వెళ్తావు. తలుపు మూసుకుంటుంది. చప్పుడు చేయదు. అప్పుడే సీజర్, జీసస్…..జూడాస్ కూడా!”

త్రిపుర పాత్రలు సృష్టించాడా? లేదు. అవి నా బహురూపాలు. నా భిన్న ముఖాలు. నా వొక్కో ముఖాన్ని వొలిచి వాటికి వేరే పేర్లు పెట్టాడు త్రిపుర.

త్రిపుర వేరే జీవితం చెప్పాడా కథల్లో? కాదు. అది నేను జీవించే జీవితమే. నేను జీవిస్తున్నాను అని చెప్పుకోడానికి నిరాకరించే జీవితం!

అందుకే –

త్రిపుర నిష్క్రమించడు. వొక కనిపించని ద్వారం తెరిచి అందులోంచి మనల్ని ప్రవేశపెట్టి, కాసేపు మన సంభాషణకి మనల్ని వదిలేసి వెళ్లిపోయాడు ఇదిగో ఇక్కడి దాకే!

వచ్చేస్తాడు ఏదో వొక క్షణం, ఇక్కడే వున్నట్టుగా!

 

 

 

 

 

 

 

ఏ నీటి వెనకాల ఏముందో?!

afsar dukeమొదటి సారి ఎక్కడి నించో వొక వాన చినుకు పడ్డప్పుడు ఆ అనుభూతిని నేను ఏ భాషలోకి తర్జుమా చేసుకుని వుంటానో?

అక్షరాలేమీ తెలియనప్పుడు అది వొక ఆనందపు కేరింత అయి వుంటుంది.

వొక సారి నేను మా పెదనాన్నగారి వూళ్ళో కాళ్ళు ఎటు నడిస్తే అటు వెళ్ళి ఎక్కడో వొక చెట్ల గుంపులోకి దారి తప్పాను. దాన్ని అడివి అంటారని కూడా తెలియని వయసులో –ఆ అడివి మధ్యలో ఏ మూల నించో వొక జలపాతం రహస్యంగా చప్పుడు చేసినప్పుడు  భయపడ్డానా? ఆశ్చర్యంలోంచి తేరుకోలేక అలా కూర్చుండి పోయానా?

అప్పుడు కూడా నా చేతుల్లో భాష లేదు.

ఇంకోసారి వొక నిమ్మతోట మధ్యలోంచి వెళ్తూ ఆ పరిమళాల ఉక్కిరిబిక్కిరిలో చివరికి వొక కాల్వ పక్కన నేను తేలాను. రాత్రి చీకటి పడే దాకా ఆ కాల్వలో మునకలు వేస్తూ వొళ్ళు కరిగిపోయేలా స్నానం చేశాను.

అప్పటికింకా  కవిత్వస్నానాలకు ఇంకా అలవాటు పడలేదు.

ఇంకా చాలా సార్లు పూలతో, మామిడి చెట్లతో, రాత్రి నేను నడిచే దారుల్లో అడ్డొచ్చి నన్ను ముందుకు వెళ్లనివ్వని నైట్ క్వీన్ పరిమళాల్లో నేనేమయిపోయానో తెలియదు –

వాటిని వాక్యాల్లోకి మార్చే రహస్యం వొకటి వుందని తెలియని కాలాల్లో!

ఇవన్నీ భాషలోకి తర్జుమా చేసుకుని, వాటిలో నన్ను నేను వెతుక్కునే కాలం కోసం చాలా ఎదురుచూడాల్సి వచ్చింది. నాకు కవిత్వం అంటే ఏమిటో తెలిసిన రుతువు వచ్చేంత వరకూ వాటిని దాచిపెట్టుకోవాల్సి వచ్చింది ఎక్కడో మనసు ముడతల కింద- ఇంకా చిన్నప్పటి ఆటల భాషలో చెప్పాలంటే ఎక్కడో వెన్నెల కుప్పల్లో…!

*

ఇదిగో ఈ వాక్యాల ఆసరా కూడకట్టుకొని వెళ్ళాను, నార్త్ కెరోలీన స్టేట్ యూనివర్సిటీ, డ్యూక్ యూనివర్సిటీ వేదిక మీదికి!

కవిత్వాన్ని గురించి యూనివర్శిటీ వేదికల మీద మాట్లాడ్డం నాకు కొత్త కాదు. అమెరికా వచ్చాక నా క్లాస్ రూముల్లో సరే, బయటి యూనివర్శిటీలలోనూ మాట్లాడుతూనే వుంటాను. కానీ, ఏప్రిల్  19, 20 తేదీల్లో నార్త్ కెరోలీన స్టేట్ యూనివర్సిటీ, డ్యూక్ యూనివర్సిటీలు కలిసి నిర్వహించిన Environment Across the Disciplines:  Perspectives from India and Beyond సదస్సులో మాట్లాడడానికి ఆహ్వానం వచ్చినప్పుడు మొదట నేను సంశయించాను.

ఎందుకంటే, అందులో మొదటి రోజు సదస్సులో మాట్లాడే నలుగురూ ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తలు, ఇంజనీరింగ్ రంగంలో నిపుణులు. రెండో రోజు మాట్లాడే నలుగురిలో వొకరు చరిత్రకారులు, ఇంకొకరు రాజకీయ నిపుణులు, మరొకరు ఆర్థిక నిపుణులు. నాలుగో వాణ్ని చివరి వాణ్ని నేను! వాళ్ళు అంకెల్లో మాట్లాడ్తారు, గ్రాఫులతో మాట్లాడతారు. కవిత్వాన్ని గురించి మాట్లాడే నేనేం చేయాలి? అంకెల్లో నేను మహా పూర్! గ్రాఫులతో నాకు ఎప్పుడూ పని లేదు. నా కవిత్వ భాష వాళ్ళకి అర్థమయ్యే ప్రసక్తే లేదు అనుకున్నా.  వెంటనే నేను ఆ ఆహ్వానాన్ని వద్దనుకున్నా.

కానీ, అవతల నించి ఎప్పటి నించో తెలిసిన Sandria Freitag, నేను ఏ అకడమిక్ సమావేశంలో కనిపించినా నన్ను వెంటనే డిన్నర్ కి లాక్కు వెళ్ళి కబుర్లలో ముంచెత్తే David Gilmartin రంగంలోకి దిగారు, ‘వచ్చి తీరాల్సిందే!” అంటూ!

“ నేనొక పెద్ద disaster అవుతాను ఆ సైంటిస్టుల మధ్య!” అనేశాను ఎలాంటి సంకోచం లేకుండా! “అవన్నీ కాదు. నువ్వొస్తున్నావ్!” అని ఏకంగా టికెట్ పంపించేశారు.

అంతే! నాకు అలవాటు లేనే లేని  ప్రేక్షక సమూహంతో మాటలు కలపడానికి నేను సిద్ధం కాక తప్పలేదు.

2

            “I begin where numbers fail and fumble, I turn my face to what these lines of graph not dare to capture the curved lines of emotions and senses. Here I speak straight into an emotional face of humanity that we miss in the name of statistics.”

ఆ మొదటి వాక్యానికి చప్పట్లు మోగాక నా గుండె చప్పుళ్ళు కుదుట బడ్డాయి. మొదటి వాక్యం నెగ్గుకొచ్చాక తరవాతి నడక దానికదే సాఫీగా సాగిపోతుందన్నది నా కవిత్వ ఫిలాసఫీ.

నేను మాట్లాడాల్సిన విషయం: Fluid Poetics: Visions and Revisions in Contemporary Indian poetry. అయితే, అక్కడ Fluid అన్న మాట కేవలం కవిత్వ శిల్పానికి సంబంధించిందే కాదు. కవిత్వ వస్తువు కూడా…దాన్ని నేను water అనే అర్థంలోకి మార్చుకున్నా. అంటే, నేను ఈ environment గురించిన సదస్సులో ‘నీటి’ ని వస్తువుగా తీసుకున్న కవిత్వం ఎలాంటి ప్రవాహగతితో సాగిపోతుందో చెప్పడానికే పరిమితమయ్యాను. కవులు నీటి చుట్టూ ఎలాంటి అనుభవాలు చెప్తారో, ఆ అనుభవాలని నడిపించే vision ఏమిటో, కాలగతిలో ఆ vision ఎలాంటి  revision కి లోనవుతుందో చెప్పుకుంటూ వెళ్లాలన్నది నా ఉద్దేశం. ఈ సందర్భంలో అప్పుడు నీటికి సంబంధించిన నా  అనుభవాలు- వాన చినుకు, నదిలో ఈత, కాల్వతో శరీరం పరుగులు – ఇవన్నీ నాకు వస్తువులే. ఇస్మాయిల్ గారు నది మీద రాసిన పద్యాలే కాదు, కొంచెం కవితాత్మకంగా అనిపించే పెద్దిభొట్ల గారి గ్లాసులో నీళ్ళ కథ ని కూడా వదల్లేదు.

అంటే, వాన గురించీ, నదుల గురించీ కవి వొక దశలో అమాయకంగా మాట్లాడినా, ఇంకో దశలో ఆ అమాయకత్వాన్ని వదులుకొని, వాస్తవికత వేపు వెళ్ళక  తప్పదని నా మౌలిక వాదన. అందుకే, ఇస్మాయిల్ గారికి బావి సొట్టపడ్డ బుగ్గలా కనిపిస్తుంది. అదే బావి సతీశ్ చందర్ కి రెండు కలవని కనుపాపలుగా కనిపించి అతని దళిత అస్తిత్వాన్ని చెప్తాయి. మామూలు కవికి సముద్రాన్ని చూడగానే మనసు కేరింతలు కొడితే, తెరేష్ బాబు లాంటి అస్తిత్వ ముద్ర వున్న కవికి హిందూ మహా సముద్రంలో ‘హిందూ’త్వం కనిపిస్తుంది.

గ్లాసెడు నీళ్ళ కోసం తపించే చోటే ఆ నీళ్ళు వ్యాపార వస్తువు అయిపోవడం గోపి లాంటి కవిని గాయపరుస్తుంది. చిన్నప్పుడు కలిసి ఈతలు కొట్టిన చెరువులే వున్నట్టుండి ‘మతం’ ముద్రలు పడే ఎడబాటు వొక ముస్లిం కవిని దిగులు పెడ్తుంది. బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే గుండె ఉప్పొంగే నేల ఇంకో చోట ఆ గుక్కెడు నీళ్లూ అందక నోరెండిపోతుంది. అంటే, నీరు అనుకున్నంత సరళమూ కాదు, అమాయకమూ కాదు. ఆ నీటి వెనక గతముంది,  బాధలున్నాయి, కథలున్నాయి. మన భవిష్యత్తూ వుంది.

3

          వొక నలభై అయిదు నిమిషాల నా ప్రవాహం తరవాత సదస్సుని చైర్ చేసిన దక్షిణాఫ్రికా ఆర్థిక నిపుణుడు క్లిఫర్డ్ గ్రిఫిన్ చర్చ మొదలు పెట్టారు. నా ప్రసంగం అంతా వొక ఎత్తు, ఆ తరవాత అరగంట పైగా జరిగిన చర్చలో  నేను ఉక్కిరిబిక్కిరయిన సన్నివేశం ఇంకో ఎత్తు. అది మరో సందర్భంలో…!

కొసమెరుపు:

సదస్సు అయిపోయిన తరవాత రాత్రి డిన్నర్ లో ఈ సదస్సు నిర్వహించిన అయిదుగురూ చేతులూ జోడించి “మీరు వచ్చు వుండకపోతే, మేము disaster అయి వుండే వాళ్ళం! You really struck the real chord!” అందరి ముందూ అనడంతో నా మనసు తేలిక పడింది.

వొక నిండైన వాక్యం కోసం…

mandira5afsar

One day the Nouns were clustered in the street,

An adjective walked by, with her dark beauty

The Nouns were struck, moved, changed.

The next day a Verb drove up, and created the Sentence.

 

ప్రసిద్ధ అమెరికన్ కవి కెన్నెత్ కోక్ ఎప్పుడో యాభై మూడేళ్ళ క్రితం రాసుకున్న కవితలో కొంత భాగం  అది. ఈ కవిత ఆసాంతం మొదటి సారి చదివినప్పుడు నాకు నవ్వొచ్చింది.

ఈ కవిత  చదివిన మర్నాడు – ఈ సెమిస్టర్ నేను చెప్తున్న ‘Modern Indian Poetry and Religions’ క్లాస్ లో వినిపించాను. ఆ క్లాస్ లో వున్న యాభై మంది విద్యార్థులూ  చాలా సేపు హాయిగా నవ్వుకున్నారు. కానీ, ఆ తరవాత ఆ కవితకి వాళ్ళలో కొద్దిమంది చెప్పుకొచ్చిన వ్యాఖ్యానాలు, అన్వయాలూ నా మెదడులో కొత్త పొద్దు పొడుపులు. వాటన్నిటినీ అల్లుకుంటూ పోతే, చివరికి ఆ కవిత నాలో అనేక భావనలతో  నిండిపోయింది.  వొక పాత పద్యమే కొత్త అర్థాల వస్త్రాలతో నా ముందుకొచ్చింది.  అప్పటి నించీ ఈ కవితలోని  ప్రతి వాక్యం నా వెంటే వుండి, నా లోపలే సుడి తిరుగుతూ, కచ్చితంగా ఈ క్షణాన అది నా కోసమే రాసినట్టు అనిపిస్తోంది, అందులోని కొన్ని ఆలోచనలు ఈపాటికే  నా సొంతమయిపోయాయి కనుక.

కవిత్వంలో అయినా, వచనంలో అయినా వొక వాక్యం ఎలా తయారవుతుందన్నది నాకెప్పుడూ ఆశ్చర్యం! వాక్యం తయారవడం అంటే ఆలోచనలు వొద్దికగా కుదురుకోవడం! లోపలి సంవేదనలన్నీ వొక లిపి కోసం జతకూడడం! అన్నిటికీ మించి – నేను ఇతరులతో , ఇతరులు నాతో మాట్లాడుకోవడం! వాక్యంలోని  నామవాచకాలూ, విశేషణాలూ, క్రియల మధ్య ఎలాంటి స్నేహం కుదరాలో నాకూ నా లోపలి నాకూ, నా బయటి లోకానికీ అలాంటి స్నేహమే కుదరాలి. అది కుదరనప్పుడు నేను వాక్యవిహీనమవుతాను. నా బయటి లోకం అర్థవిహీనమవుతుంది.  నాకొక వ్యాకరణం లేకుండా పోతుంది. ఇప్పటిదాకా అర్థమయిన జీవన పాఠం ఏమిటంటే: అసలు వెతుకులాట అంతా ఆ వ్యాకరణం కోసమే! సమాజాలకూ, సమూహాలకు కూడా అలాంటి వ్యాకరణమే కావాలనుకుంటా.

ఇంకా కొద్దిగా విస్తరిస్తే, సాహిత్య  రంగంలోకి వచ్చేసరికి ఈ వ్యాకరణం ఎలా తయారవుతుందంటే : రచయితలు రాస్తారు, ప్రచురణకర్తలు లేదా పత్రికల వాళ్ళు అచ్చు వేస్తారు, పాఠకులు చదువుతారు. మధ్యలో కొందరు ఆ రచనల మీద వ్యాఖ్యానాలు చేస్తారు. వాటి మీద ప్రతివ్యాఖ్యానాలు జరుగుతాయి. ఈలోపు కొన్ని అభిప్రాయాలూ కుప్పపడిపోతాయి. వాటిల్లో సారం కోసం – కొన్ని సార్లు గడ్డివామిలో సూది కూడా కావచ్చేమో!- అందరూ పడీ పడీ వెతుక్కుంటారు. ఈ వెతుకులాటలో కొందరు అవసరానికి మించి మరీ పారంగతులవుతారు, ఇంకా కొందరు వెతుక్కోడమే రాక నిస్సహాయులవుతారు. ఇంకా కొందరు వోటమితో రాజీ పడకుండా దరిచేర్చే వారి సాయం కోసం చూస్తూ వుండిపోతారు.

ఇప్పటి విషాదం ఏమంటే, ఇప్పుడీ వాక్యాల వంతెనలన్నీ కుప్పకూలిపోతున్నాయి.

అనేక రకాల భావ వ్యక్తీకరణ సాధనాలూ, కొత్త కమ్యూనికేషన్ దారులూ తెరుచుకుంటున్న ఈ-కాలంలోనే మన మధ్య ఇంకో విధమయిన అపరిచితత్వం కూడా ఏర్పడుతోంది. కుప్పపడిపోతున్న శబ్దాల మధ్య అర్థవంతమయిన మాటలు లేకుండా పోతున్నాయి. సాహిత్యరంగం కూడా దీనికి భిన్నంగా యేమీ లేదనే చెప్పాలి. అంతర్జాలలోకం వొక మాయాజాలంగా మారుతోంది. అంతర్జాల అక్షరాస్యతా, విజ్నానమూ సృష్టిస్తున్న సమాచారాన్ని ప్రోది చేసినంతగా ఆలోచననీ, వూహాశక్తినీ కూడదీయలేకపోతుందా అన్న సందేహం పుట్టుకువస్తోంది.

ప్రసిద్ద శాస్త్రవేత్త ఐనిస్టీన్ ఎక్కడో అన్నాడట: “Imagination is more important than knowledge. For knowledge is limited to all we now know and understand, while imagination embraces the entire world, and all there ever will be to know and understand.” ఈ-కాలం మనుషులు తమకి తెలిసిన సమాచారమే సర్వస్వం అనుకుంటున్నారు. కానీ, ఆ సమాచారం  వడపోత తరవాతే  తమ దాకా చేరుతుందని కానీ, ఆ సమాచారానికి తమదైన దృక్పథంలోంచి చూడాల్సి వుంటుందని గ్రహించలేకపోతున్నారు. ‘put it in a perspective’ అన్న భావనకి అర్థం లేకుండా పోతోంది.  ఇప్పటి సాహిత్య రూపాలు కూడా ఈ రకమయిన భావదారిద్ర్యంతో బాధపడుతున్నాయని నాకు అనిపిస్తోంది.

మనం అందమయిన ప్రతీకలూ, పదచిత్రాలూ, మాంత్రిక వాస్తవికవాదాలూ, అధివాస్తవిక విపరీత వాదనలూ సమకూర్చుకుంటున్నాం నిజమే, వాటి మధ్య అంతస్సూత్రాన్ని సాధించగలుగుతున్నామా అన్నది నా చింత. మనం కప్పుకుంటున్న వస్త్రాలు అందంగా వున్నాయి కాదనడం లేదు కానీ, ఆ వస్త్రాలలోపల వొక తెలియని డొల్లతనమేదో చప్పుడు చేస్తోంది. అంతా స్పష్టంగా కనిపిస్తున్న మాట కూడా నిజమే కానీ ఆ స్పష్టత కింద అంతుపట్టని అస్పష్టత ఏదో వుంది.

నేను పైన చెప్పిన కెన్నెత్ కోక్ పద్యం మీద జరిగిన చర్చలో నా విద్యార్థిని అయిన వొక అమెరికన్ కవయిత్రి క్లాస్ లో చర్చ మధ్యలో చాలా మంచి మాట అంది –“అసలు ఇప్పుడీ లోకంలో మిక్కీ మౌస్ కంటే  గొప్ప ఊహాశక్తి వున్న ప్రాణి ఇంకోటేదీ కనిపించడం లేదు” అని! అప్పుడు నేను వెంటనే “నిజమే కానీ, దాన్ని సృష్టించింది మనిషే కదా!” అన్నాను. “అదీ నిజమే! కానీ, వొక్కో సారి మనిషి సృష్టించినవే మనిషి కంటే ఎక్కువ వూహాశక్తిని సాధించుకుంటాయి. ఉదాహరణకు: దేవుడు!” అందామె నేను ఆశ్చర్యపోతుండగా! అంటే, ఆమె వివరణ ఏమిటంటే, విపరీతమయిన సమాచార వొత్తిడి వల్ల మన వూహాశక్తి కుంచించుకుపోతున్నదని!

ఆ వెంటనే ఆమె తన ఆలోచనని కెన్నెత్ కోక్ పద్యానికి అన్వయిస్తూ “మన సంభాషణల్లో నిండయిన వాక్యాలు లేవు. మనం మాట్లాడుకుంటున్నవనీ క్రియలూ, విశేషణాలూ, చివరికి వాటి మధ్య సంధి కుదిర్చే locatives లేని సంభాషణ. కాదంటారా?” అంది.

నిజమే. ఆ విద్యార్థిని అడిగిన ప్రశ్నకి నా దగ్గిర సమాధానం లేదు!

కానీ, వొక్కటి మాత్రం మేం అనుకున్నాం – మన వూహల  దిగంత రేఖ ఇంకాస్త విస్తరించాలని! మనం రాసుకుంటున్న వాక్యానికి ఇంకా కొన్ని వూహల పాఠాలు నేర్పాలని!

 

ప్రతి గురువారం ఇక ‘సారంగ’ వారమే!

mandira1పుస్తకాలు లేని గది మూగది! నిజమే…కానీ-

వొక పదేళ్ళ క్రితం మంచి చదువరి అంటేనో, పుస్తకాల పురుగు అంటేనే చుట్టూ పుస్తకాలు పోగేసుకుని లేదంటే చేతిలో కనీసం వో పుస్తకం కచ్చితంగా ఛాతీకి ఏటవాలుగా అమిరేట్టు పెట్టుకునో కనిపించడం వొక రొటీన్ దృశ్యం! ఇవాళ ఆ దృశ్యం నెమ్మదిగా కనుమరుగయిపోతోంది. ఇది పుస్తకాలకే కాదు, పత్రికలకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు మూడు నాలుగు పుస్తకాలేమిటి, రెండు మూడు పత్రికలేమిటి వొక్క చిన్న నోట్ బుక్ లాంటి పరికరంలో వందల పుస్తకాలూ పత్రికలూ అగ్గిపెట్టెలో చీరలా ఇమిడిపోతాయి! చూస్తూ చూస్తూ వుండగానే మన పుస్తకాల ‘గది’ ఎంత చిన్నదైపోయిందో! కానీ, ఆ గదిలో ఇమిడిన ప్రపంచం రెప్పపాటులోనే, మన చేతివేళ్ళ ఇంద్రజాలంతో ఇట్టే ఆకాశమంత విస్తరించింది.

చిన్నప్పుడు ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రిక ఏ రోజు వస్తుందా అని రోజులు – మరీ ఆ సస్పెన్స్ తీవ్రతని నాటకీయంగా  చెప్పాలనుకుంటే- క్షణాలు లెక్కపెట్టుకుంటూ గడిపేవాళ్లం. నిజంగానే! వారపత్రిక లేని అలనాటి  చదువరి బాల్యాన్ని నేను వూహించలేను. ‘ఈవారం కవిత, కథ’ అనగానే కళ్ళలో చక్రాలు గిర్రున తిరిగి, ఆ పేజీల్లో ఎవరున్నారా అని ఆతృతగా వెతుక్కోవడం, ఆ చదివిన పేజీల్ని, వాటికి వాడిన చిత్రాల్ని అందంగా నెమరేసుకోవడం, ఎప్పటికయినా ఆ పేజీల్లో నేనొక పేజీ కాగలనా అనుకుంటూ కలలు కనేయడం…ఇవాళ నలభైలకి అటూ ఇటూ వున్న ప్రతి రచయితకీ  పఠితకీ అనుభవమే! ‘ఈ వారం మీ పత్రిక చదివాము, ఇంటిల్లి పాదీ ప్రతి పేజీ చదువుకునీ మళ్ళీ చదువుకుని ఎంత హాయిగా కాలక్షేపం చేశామో చెప్పలేను’ లాంటి లేఖలు నిన్నటి నాస్తాల్జియాకి గురుతులుగా మిగిలిపోయాయి. ఆ ‘ఇంటిల్లిపాదీ’ అన్న పదం ఇప్పుడెక్కడా వినిపించనే వినిపించదు ఆశ్చర్యంగా!

చాలా మంది స్నేహితులు ఇప్పటికీ వొక వారపత్రిక వుంటే భలే బాగుంటుంది అని ప్రకాశంగా అనడమూ, ‘ఆ రోజుల్ని తలచుకున్నప్పుడల్లా ఆనందంలాంటి విషాదమో/ విషాదం లాంటి ఆనందమో!” అంటూ కవి తిలక్ లాగా బాధపడిపోవడమూ తెలుసు. అంటే, వెబ్ లోకంలో  ఇన్ని ద్వైమాసిక. మాస పత్రికలు వున్నా అలాంటి వార పత్రిక లేదే అన్న వెలితి మనలో వుండిపోయింది. ఆ వెలితిని తలచుకుంటూ ఇదిగిదిగో సారంగ సాహిత్య వారపత్రిక! నిస్సందేహంగా ఇది సారంగ బుక్స్ మరో ముందడుగు, మిమ్మల్ని చేరుకోడానికి! మీ పుస్తక ప్రపంచంలో మీ ఆలోచనల్లో మీ ఉద్వేగాల్లో  మీతో వో  కరచాలనానికి!

వొక శుభవార్త ఏమిటంటే ఈ వెబ్ వార పత్రికలో అచ్చయిన కొన్ని రచనలు ఏడాది చివర సారంగ బుక్స్ సిరీస్ లో అచ్చు రూపం కూడా తీసుకుంటాయి.

సారంగ బుక్స్ నించి వొక సాహిత్య వారపత్రిక రాబోతున్నదంటే అది అచ్చు పత్రిక అయి వుంటే బాగుణ్ణు అని ఆశపడ్డారు చాలా మంది సాహిత్య మిత్రులు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. అక్షర ప్రయాణం మొదలయిన ఈ రెండేళ్లలోనే సారంగ  బుక్స్ అంటే వొక మంచి ప్రచురణ సంస్థ అన్న గౌరవం ఏర్పడింది. ‘సారంగ’ నించి ముందు ముందు ఏ పుస్తకాలు వస్తాయన్న ఆసక్తి కూడా పెరుగుతూ వచ్చింది. అయితే, సారంగకి మొదటి నించీ సాంకేతిక వెలుగుల మీద గొప్ప ఆసక్తి. సాంకేతిక రంగంలో వస్తున్న కొత్త వెలుగుల్నీ, మెరుపుల్నీ సాహిత్యానికి ఎలా అద్దగలమన్నదే ‘సారంగ’ అన్వేషణ. ఇవాళ ఈ గురువారంతో ‘సారంగ’ అన్వేషణ వొక కొలిక్కి వచ్చింది. వొక శుభవార్త ఏమిటంటే ఈ వెబ్ వార పత్రికలో అచ్చయిన కొన్ని రచనలు ఏడాది చివర సారంగ బుక్స్ సిరీస్ లో అచ్చు రూపం కూడా తీసుకుంటాయి.

మరో అంతర్జాల పత్రిక అవసరమా అన్న ప్రశ్నకి సారంగ దగ్గిర సమాధానం వుంది. మన రోజు వారీ జీవితంలో కనీసం కొంత భాగం కాగల సాహిత్య వారపత్రిక వుండాలన్నది మొదటి సమాధానం. అయితే, తెలుగు సాహిత్య ప్రచురణ రంగంలో సారంగ బుక్స్ మొదటి నించీ చేయాలనుకుంటున్నది రచయితలకు అనువయిన ప్రచురణ వాతావరణాన్నీ, సంస్కృతినీ ఏర్పరచాలన్నది. లాభాలు ఆశించని, రచయిత ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయని, పఠిత ఆకాంక్షలకు అనువైన ప్రచురణ రంగం ‘సారంగ’ కల. అందులో భాగంగానే ఈ ఏడాది సారంగ బుక్స్ వొక పూర్తిస్థాయి ప్రచురణ సంస్థగా మీ ముందుకు రాబోతోంది. కేవలం ఫిక్షన్ మాత్రమే కాకుండా నాన్- ఫిక్షన్ రచనలు కూడా మరిన్ని తీసుకురావాలనే సత్సంకల్పం వొక ఎత్తు అయితే, ఆ రచనలు అత్యాధునిక సాంకేతిక పరికరాల ద్వారా మీ చేతుల్లోకి పదిలంగా చేరాలన్నది సారంగ కల. అలాగే, కొత్తగా ఏర్పడుతున్న పాఠక ప్రపంచానికీ సాహిత్యంలో వున్న రెండు భిన్న ప్రపంచాలకూ- వొకటి నిన్నటిదీ, రెండోది ఇవాల్టిదీ- మధ్య వంతెనగా వుండాలన్నది సారంగ ఉద్దేశం. అందుకే, ఈ సంచికలో ఆ రెండు ప్రపంచాల మేలుకలయికని మీరు చూస్తారు. సాహిత్యం పట్ల మీ అభిరుచిని పెంచే భిన్న శీర్షికల్ని మీ ముందుకు తెస్తోంది సారంగ.

ప్రతి గురువారం సారంగ వారపత్రిక మీ కంటి తలుపులు తడుతుంది, మీ పుస్తకాల గదిలోంచి కనుమరుగైపోయిన వారపత్రికా దరహాసమే కాంతిగా! ఈ కాంతిని అక్కున చేర్చుకోండి. ఈ రచనల వెలుగులో కాసింత తడవండి!
శీ ర్షి క లు
ప్రతి నెలా మొదటి గురువారం సారంగ అన్ని శీర్షికలతో కొంచెం ఎక్కువ సందడిగా వస్తుంది. ఆ తరవాతి గురువారాలు పరిమితమయిన శీర్షికలతో వస్తుంది. తెలుగు పత్రికా ప్రపంచంలో సాహిత్య జర్నలిజానికి శ్రీకారం చుట్టిన శ్రీరమణ గారు చాలా కాలం తరవాత ‘సారంగ’ కోసమే రాస్తున్నశీర్షిక  ‘రెక్కల గుర్రం’  మీ కోసం! కథారచనలో ఆరితేరిన పి.  సత్యవతి గారు ఏడు పదుల వయసులో కూడా ఇప్పటికీ రోజుకు కొన్ని గంటల తరబడి పస్తక పఠనంలో గడుపుతారు. అలా చదువుతున్న  కొన్ని పేజీల్ని మనతో పంచుకుంటారు. సమకాలీన కథ అనగానే గుర్తొచ్చే ఆత్మీయమయిన పేరు ఆర్. యం. ఉమా మహేశ్వర రావు. ‘సారంగ’ కోసం తన వర్తమాన కథానుభవాన్ని మనసు విప్పి చెప్పబోతున్నాడు ఉమా  ‘కథా సమయం’ లో నెలనెలా!

ప్రతి ఏడాది వొక ప్రముఖ కథా రచయిత  ‘కథా సారంగ’  శీర్షికని నిర్వహిస్తారు. ఈ ఏడాది  ప్రముఖ కథకుడు వేంపల్లె షరీఫ్ నిర్వహించబోతున్నారు. ఈ శీర్షిక కోసం ప్రముఖ కథకులతో ప్రత్యేకంగా కథలు రాయించి మనకి అందించబోతున్నారు వేంపల్లె షరీఫ్. ప్రసిద్ధ సినీగేయ రచయిత భువనచంద్ర చాలా మందికి పాటల రచయితగానే తెలుసు. కానీ,ఆయనలో అందమయిన కథకుడు కూడా వున్నాడు. ఆయన అనుభవాల అమ్ములపొది నించి చేస్తున్న శరసంధానం  ‘Untold stories’  ప్రతి నెలా మీ కోసం!

తెలంగాణ చరిత్ర శోధనకి మారుపేరు సంగిశెట్టి శ్రీనివాస్. తెలంగాణ సాహిత్య చరిత్రని ప్రతి నెలా  మన కళ్ల ముందు వుంచే శ్రీనివాస్ శీర్షిక  ‘కైఫియత్’ . అత్తగారిని కూడా నవ్వించగల అల్లరి కోడలు దాట్ల లలిత కథా శీర్షిక  ‘ఈదేసిన గోదారి’  ప్రతి నెలా మీ ఇంట నవ్వుల పంట! ప్రతి వారం మీ కోసం సీరియల్ నవల  ‘అల’  అనే శీర్షిక కింద మీ కోసం ఎదురుచూస్తూ వుంటుంది. ఈ సీరియల్ వచ్చే గురువారం మొదలవుతుంది. ప్రపంచ సినిమాని మీకు పరిచయం చేస్తున్నారు  ‘తెర’చాప’  శీర్షికలో మద్దూరి శ్రీరాం.

ఇవిగాక వారానికి కేవలం వొకే వొక కవితతో  ‘తరంగ’  ఈ వారం కవిత మీకు ప్రత్యేకం! వొక కవిత చదివిన అనుభవాన్ని మీ దోసిట వుంచే  ‘అద్దంలో నెలవంక,’  అచ్చయిన కథ వెనక దాచేసిన అసలు కథల్ని చెప్పే  ‘చెప్పని కథ’  శీర్షిక వచ్చే గురువారం.  ‘ఓ కప్పు కాఫీ’   ‘అక్షరాల వెనక’   ‘తలపుల నావ’  శీర్షికలు. మీకు ఇష్టమయిన రచయితలతో హాయిగా గడుపుకునే కాఫీ సమయాలు, ఉత్తమ పాఠకుల వేదిక  ‘పాఠకచేరీ’  మంచి కథల తలపోత  ‘కథనరంగం’  ప్రసిద్ధ రచయితలతో మీ జ్నాపకాల వెలుగు  ‘దీపశిఖ  అప్పుడప్పుడూ!

Painting by Mandira Bhaduri