గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ -14

 

    Anne Of Green Gables By L.M.Montgomery

పిక్ నిక్ కి ముందరి రోజు సాయంత్రం. ఆ రోజు సోమవారం. మెరిల్లా మెట్లు దిగి వస్తోంది , ఆమె మొహం వాడిపోయి ఉంది.

మచ్చ లేకుండా తుడిచిన బల్ల మీద బటానీలు ఒలుస్తూ ఆన్- డయానా నేర్పిన పాట  ‘ హేజెల్ కనుమ లో నెల్ ‘ పాడుకుంటోంది..గొప్ప భావావేశం తో.   మెరిల్లా అడిగింది – ” నా అమెథిస్ట్  పిన్ ని నువ్వుగానీ చూశావా ఆన్ ? నిన్న ఆదివారం చర్చ్ నుంచి వచ్చి పిన్ కుషన్ కి గుచ్చి పెట్టాను..ఇప్పుడు చూస్తే ఎక్కడా కనిపించట్లేదు…”

ఆన్ మెల్లిగా చెప్పింది- ” ఇందాక..మధ్యాహ్నం… చూశాను , నువ్వు బయటికి వెళ్ళినప్పుడు. నీ గది పక్కనుంచి వెళుతూంటే కనిపించింది…చూద్దామని లోపలికి వెళ్ళాను ”

” తీశావా దాన్ని ? ” మెరిల్లా కటువుగా అడిగింది.

” ఆ..అవును ” – ఆన్ ఒప్పుకుంది. ” నా గౌన్ కి పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూద్దామని…”

” నీకు అవసరమా అదంతా ? చిన్నపిల్లవి…నా గదిలోకి నేను లేనప్పుడు వెళ్ళటం ఒక తప్పు, నీది కాని వస్తువుని తీయటం ఇంకొకటి. ఎక్కడ పెట్టావు దాన్ని ? ”

” అక్కడే..బీరువాలో పెట్టేశాను…ఒక్క నిమిషమే పెట్టుకుని తీసేశాను మెరిల్లా. అలా లోపలికి వెళ్ళి చూడటం తప్పని అనుకోలేదు నేను..ఇంకెప్పుడూ చెయ్యను. నాలో అదొక సుగుణం- ఏ పిచ్చి పనీ రెండో సారి చెయ్యను ” – చెప్పుకుంది.

” నువ్వు పెట్టెయ్యలేదు. బీరువాలో లేందే..ఎక్కడుంది ?  ఏం చేశావు ? ”

” పెట్టేశాను ” – ఆన్ కొంచెందూకుడు  గా అనేసింది. ” పిన్ కుషన్ మీదో, పింగాణీ గిన్నెలోనో – ఎక్కడో గుర్తురావటం లేదు..ఖచ్చితంగా పెట్టేశాను ”

” సరే, మళ్ళీ వెళ్ళి చూసొస్తాను. అక్కడ ఉంటే నువ్వు పెట్టేసినట్లు, లేదంటే లేనట్లు ”

వెళ్ళి బీరువాలోనే కాకుండా మొత్తం గదంతా వెతికింది…లేదు.

”  పిన్ లేదు , పోయింది. ఆఖరిసారి చూసింది నువ్వే గనుక నువ్వే చెప్పాలి. నిజం చెప్పు. ఎక్కడైనా దాచావా ? పారేసుకున్నావా ?? ”

” నాకేం తెలీదు ” ఆన్ కోపంగా చూసింది. ” నేను గదిలోంచి బయటికి తేలేదు దాన్ని , అదే నిజం , అంతే ”

ఆ ‘ అంతే ‘ అన్న మాట పెడసరంగా ఉందనిపించింది మెరిల్లా కి .

” నువ్వు అబద్ధం చెబుతున్నావు ఆన్ ” .. పదునుగా అంది-  ” నిజం చెప్పదల్చుకోకపోతే ఇంకేమీ చెప్పకు నాకు . నీ గదిలోకి పోయి అక్కడే ఉండు, ఒప్పుకుంటానంటేనే బయటికి రా ”

” మరి బటానీలు ఎవరు ఒలుస్తారు ? ” ఆన్ దిగాలుగా అడిగింది.

” నేను చేసుకుంటాలే . చెప్పి నట్టు చెయ్యి నువ్వు ”

Mythili

ఆ సాయంత్రమంతా మెరిల్లా మనసు వికలంగానే ఉంది. ” ఎంతో విలువైన పిన్ అది..ఆన్ ఎక్కడ  పారే సిందో   ఏమో .. ఎలా ? అది తప్పించి ఎవరు తీస్తారు- ఎంతకీ ఒప్పుకోదేం ? దొంగిలించాలని తీసి ఉండదులే..దాని పిచ్చి ఊహలకి బావుంటుందని పట్టుకుపోయి ఎక్కడో పడేసి ఉంటుంది…ఆ మాట ఒప్పుకునేందుకు భయపడుతోంది. అబద్ధం చెబితే ఎలా మరి ? అది మోసం చేసినట్లు..ఇంట్లో ఉండే పిల్ల అలా చెయ్యకూడదు కదా..దాని కి  కోపం ఎక్కువనుకున్నాను..అబద్ధం కన్నా కోపమే నయం .   అది నిజం చెబితే చాలు నాకు, పిన్ పోయినా పర్వాలేదు…”

మధ్య మధ్యన గదిలోకి వెళ్ళి వెతుకుతూనే ఉంది..ఎక్కడా పిన్ జాడ లేదు. రాత్రి పొద్దుపోయాక ఆన్ గదికి వెళ్ళి మళ్ళీ నిలదీసింది- ఏం లాభం లేకపోయింది. మర్నాడు పొద్దున మాథ్యూ కి చెప్పింది. అతను కళవళ పడ్డాడు. ఆన్ మీద అతని నమ్మకం అంత త్వరగా పోయేది కాదు..కాని పరిస్థితులు ఆన్ కి వ్యతిరేకంగానే ఉన్నాయి.

” ఒకవేళ బీరువా వెనకాలకి పడిపోయిందేమో చూశావా ? ”

” ఆ. ముందుకి జరిపి మరీ చూశాను. అన్ని సొరుగులూ మూల మూలలా గాలించాను. అది పోయింది..ఆన్ తీసి ఎక్కడో పడేసింది, అబద్ధం చెబుతోంది …అంతే. మనకి మింగుడు పడకపోయినా ఆ సంగతి ఒప్పుకోవాల్సిందే ”

” ఏం చేస్తావు అయితే ? ” అడిగాడు…బొత్తిగా రుచించటం లేదు ఇదంతా.

” ఒప్పుకునేదాకా దాని గదిలోనే ఉండనీ ” – మిసెస్ రాచెల్ కి క్షమాపణ చెప్పే విషయం లో ఆ పద్ధతి పనిచేసినట్లు గుర్తు తెచ్చుకుని మెరిల్లా నిబ్బరించుకుంది. ” అది ఎక్కడ పెట్టిందో చెబితేనే కదా పిన్ దొరుకుతుంది ..ఏమైనా దాన్ని గట్టిగా శిక్షించాల్సిందే ”

” సరే. నీ ఇష్టం. నీకు తోచినట్లు చెయ్యి. నేను మటుకు కల్పించుకోను ” చెప్పేసి వెళ్ళిపోయాడు.

మెరిల్లాకి తనని అందరూ వదిలేశారనిపించింది. ఈ విషయం మిసెస్ రాచెల్ కి చెప్పి సలహా అడిగేందుకు కూడా లేదు. ఆన్ గదిలోకి మళ్ళీ వెళ్ళి ‘ నిజాన్ని ‘ రాబట్టే ప్రయత్నం చేసింది…ఆన్ మొండిగా అదే జవాబు. ఏడ్చేడ్చి ఆన్ కళ్ళు వాచిఉన్నాయి..మెరిల్లాకి జాలేసింది- కాని మనసు మార్చుకోదల్చుకోలేదు.

” ఏం జరిగిందో చెబితేనే నువ్వు బయటికొచ్చేది..తేల్చుకో ”

anne14-1

” అయ్యో..పిక్ నిక్ రేపే కదా మెరిల్లా ? నన్ను వెళ్ళనిస్తావు కదూ ..ఇక్కడే ఉంచెయ్యవు కదూ ? వెళ్ళొచ్చాక ఎన్ని రోజులు ఇక్కడే ఇలాగే ఉండిపొమ్మన్నా ఉంటాను ”- ఆన్ దీనంగా  బతిమాలుకుంది.

” పిక్ నిక్ లేదూ ఏం లేదు – నువ్వు ‘ ఒప్పుకుంటే ‘ నే ”

” మెరిల్లా…” ఆన్ కి ఊపిరి అందలేదు.

మెరిల్లా మాట్లాడకుండా తలుపు మూసి వెళ్ళిపోయింది.

.                  .                      .                    .                     .

పిక్ నిక్ కోసమా అన్నట్లు ఆ రోజున- బుధవారం – ఆకాశం ఎక్కడా మబ్బు తునకైనా లేకుండా నిర్మలంగా ఉంది…సూర్యుడు హాయిగా వెలుగుతున్నాడు. గ్రీన్ గేబుల్స్ చుట్టూ చెట్ల మీద పక్షులు పాడుకుంటున్నాయి. తోటలో  మడోనా లిల్లీలు విచ్చుకున్న పరిమళం గాలి తెరలమీంచి తేలివచ్చి ప్రతి గదినీ దేవతల ఆశీస్సులాగా నింపుతోంది. కొండవాలు లో బర్చ్ చెట్లు సంతోషంగా చేతులూపాయి…ప్రతిరోజూ ఆన్ వాటిని తనూ  చేతులూపి పలకరిస్తుంటుంది. అయితే ఇవాళ ఆన్   కిటికీ దగ్గరలేదు . మెరిల్లా ఉదయపు అల్పాహారం తీసుకెళ్ళినప్పుడు   తన మంచం మీదే బాసిపట్టు వేసుకు కూర్చుని ఉంది.  మొహం లో అదొకలాంటి పట్టుదల, బిగించిన పెదవులు.

” మెరిల్లా..ఒప్పుకుందుకు సిద్ధంగా ఉన్నాను ”

” అవునా ” మెరిల్లా పళ్ళెం కింద పెట్టింది. తన ‘ పద్ధతి ‘ మళ్ళీ పనిచేసింది – కాని ఆ విజయం మెరిల్లా కి చేదుగానే ఉంది .

” ఊ. చెప్పు. ఏమైందో ”

” నేను అమెథిస్ట్ పిన్ ని తీసుకున్నాను ” పాఠం అప్పజెబుతున్నట్లు మొదలుపెట్టింది ..” అచ్చం నువ్వు చెప్పినట్లే. ముం   దైతే తీసుకోవాలనుకోలేదు- కాని చాలా చాలా అందంగా ఉందనిపించింది. చాపల్యానికి లోనైపోయాను. నా గౌన్ కి తగిలించుకున్నదాన్ని తీయ బుద్ధి కాలేదు. మా ‘ తీరికగూడు ‘ కి పట్టుకుపోయి డయానా కి చూపించాలనిపించింది. మేము రోజ్ బెర్రీ లు గుచ్చి రత్నహారాలుగా ఊహించుకుంటూ ఉంటాము.. అమెథిస్ట్ ల ముందు అవేం పనికొస్తాయి .. కానీ డయానా అక్కడికి రాలేదు. నువ్వు వచ్చేలోపు వెనక్కి పెట్టెయ్యాలనుకున్నాను. ఎక్కువ సేపు పెట్టుకుని ఉండచ్చని చుట్టుదారిమీంచి ఇంటికి వస్తున్నాను. వంతెన మీద నడుస్తుంటే ఒకసారి తీసి చూడాలనిపించింది. ఎండలో తళ తళ తళా మెరిసిపోతోంది…వంతెన  ప్రకాశమాన సరోవరం మీద కదా ఉంది..వంగి చూస్తూ ఉంటే – టప్ మని నీళ్ళల్లో పడిపోయింది. ఊదారంగు లో వెలిగి పోతూ కిందికి..కిందికి..నీళ్ళ అడుక్కి ..పడిపోయింది…మునిగిపోయింది. అంతే మెరిల్లా- నేను చెప్పేది ”

మెరిల్లా కి మండిపోయింది. ” అంత అపురూపమైన పిన్ ని పోగొట్టేసి  ఎంత నిదానం గా చెబుతోంది , ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా ? ”

వీలైనంత నెమ్మదిగా అంది –  ” ఆన్- ఎంత ఘోరమైన పని చేశావు..పాపిష్టిదానా ”

” అవును. పాపిష్టిదాన్ని ” – ఆన్ ప్రశాంతంగా ఒప్పేసుకుంది. ” నన్ను శిక్షించాలి..నాకు తెలుసు. అది నీ బాధ్యత. అదేదో తొందరగా చేసెయ్యి మెరిల్లా, అయిపోతే పిక్ నిక్ కి వెళ్తాను ”

” పిక్ నికా ఇంకేమన్నానా ? నువ్వు వెళ్ళటానికి వీల్లేదు – అదే నీకు శిక్ష. నీ తప్పు కి వెయ్యాల్సినదాన్లో అది సగం శిక్ష కూడా కాదసలు ”

 

” పిక్ నిక్ కి వెళ్ళద్దా ….” ఆన్ దిగ్గున లేచి మెరిల్లా చెయ్యి పట్టేసుకుంది-  ” ఇది అన్యాయం మెరిల్లా. నువ్వు వాగ్దానం చేశావు నాకు వెళ్ళచ్చని. నేను వెళ్ళి తీరాలి మెరిల్లా- అందుకే ఒప్పుకున్నాను. దయ చేసి…దయచేసి – నన్ను వెళ్ళనీ మెరిల్లా. ఐస్ క్రీమ్   మెరిల్లా..మళ్ళీ జన్మ లో తినగలనా చెప్పు ? ”

మెరిల్లా చేతులు విడిపించుకుంది..రాయిలాగా అంది  – ” నువ్వు బతిమాలక్కర్లేదు ఆన్. నువ్వు పిక్ నిక్ వెళ్ళట్లేదు – అంతే. ఇంకేం మాట్లాడకు ”

ఇక మెరిల్లా మనసు మారదని ఆన్ కి అర్థమైంది. హృదయవిదారకం గా కేక పెట్టి పక్క మీద వాలిపోయింది. తీవ్రమైన ఆశాభంగం తో, నిర్వేదం తో , ఒంటరితనం తో – కుమిలి కుమిలి ఏడ్చింది.

మెరిల్లా ఉక్కిరిబిక్కిరైంది – ” ఓరి దేవుడా – ఏం పిల్ల ఇది.. దీనికి పిచ్చి గాని లేదు కదా ? లేదంటే నిజంగానే దీని కి వెధవ బుద్ధులున్నాయా…రాచెల్ మొదట చెప్పిందే నిజమా ? ‘’  – ఉక్రోషం వచ్చింది …’’ అయితే కానీ..పని మొదలుపెట్టాక  మధ్యలో విడిచేది లేదు ”

ఆ ఉదయమంతా దరిద్రంగా గడిచింది. మెరిల్లా పూనకం వచ్చినదానిలాగా అప్పటికే శుభ్రంగా ఉన్న ఇల్లంతా రుద్ది రుద్ది శుభ్రం చేసింది…ఇంకా దుగ్ధ తీరక పశువుల సాల ని పరా పరా ఊడవటం మొదలెట్టింది.

మధ్యాహ్నం భోజనానికి రమ్మని ఆన్ ని పిలిచింది. ఆన్ కి ఇష్టమైనవి వండానని చెప్పింది. కన్నీళ్ళతో తడిసిన చిన్న మొహం మేడ మీంచి బిక్కుబిక్కుమంటూ తొంగి చూసింది.

” నాకు భోజనం వద్దు మెరిల్లా ” వెక్కుతూ చెప్పింది – ” ఏం తినలేను నేను. నా గుండె బద్దలైపోయింది. దాన్ని పగలగొట్టినందుకు నువ్వు ఒకనాటికి పశ్చాత్తాపం చెందుతావు , కాని నిన్ను క్షమిస్తున్నాను. ఆ రోజు వచ్చినప్పుడు నిన్ను క్షమించానని గుర్తు చేసుకో. నన్నేమైనా తినమని మాత్రం అడక్కు …నాకు ఇష్టమైనవి అసలు తినను.  మనసు బాగాలేనప్పుడు మంచిభోజనం తినటం ఎంత మాత్రం బాగుండదు ”

మెరిల్లాకి నిస్సహాయం గా అనిపించింది. ఆగ్రహం వచ్చింది. మాథ్యూ రాగానే అంతా వెళ్ళబోసుకుంది. ఆన్ మీద మమకారం ఒక పక్కా తప్పు చేస్తే దండించాలనే న్యాయం ఒక పక్కా మాథ్యూ మనసులో యుద్ధం చేశాయి.

” ఆన్ ఆ పిన్ తియ్యటమూ పోగొట్టేసి అబద్ధాలు చెప్పటమూ తప్పేలే మెరిల్లా ” వడ్డించిన భోజనాన్ని చూస్తూ అన్నాడు. ఆ పదార్థాలు అతనికీ ఇష్టమే, అతనికీ తిన బుద్ధి కావటం  లేదు.  ఉండబట్టలేకపోయాడు – ” కాని పాపం చిన్న పిల్ల కదా అది..ఎంతో సరదా పడింది కూడానూ. పిక్ నిక్ మానిపించెయ్యటం మరీ  కఠినంగా లేదూ ? ”

” మాథ్యూ కుత్ బర్ట్- నాకు ఆశ్చర్యమేస్తోంది నీ మాటలు వింటుంటే. అది ఎంత వెధవపని చేసిందో తెలిసి కూడా.. ! కాస్త కూడా పశ్చాత్తాపం లేదు దానికి. తప్పు చేశానని దానికి అనిపిస్తోందంటే నయంగా ఉండేది . ఊరూరికే దాన్ని వెనకేసుకొస్తున్నావు – తెలుస్తోందా నీకు ? ”

” అవుననుకో.. పాపం..బుజ్జిది కదా అది…కొంచెం చూసీచూడనట్లు పోవచ్చు కదా.. దానికి సరైన పెంపకం లేదు..”

” ఇప్పుడు నేను చేస్తున్నది అదే- పెం-ప-కం ” – మెరిల్లా విసురుగా అడ్డుకుంది.

మాథ్యూ కి ఆ మాట నిజమనిపించలేదు – కాని ఇంకేం మాట్లాడలేకపోయాడు. పాలేరు కుర్రాడు జెర్రీ బ్యుయోట్ తప్ప ఇంకెవరూ మాట్లాడలేదు భోజనం చేస్తూ. జెర్రీ అంత ఉత్సాహం గా ఉండటం మెరిల్లాకేం నచ్చలేదు కూడానూ.

పనంతా అయిపోయాక మెరిల్లాకి తన నల్ల శాలువా లో చిరుగు ఉందని  గుర్తొచ్చింది . సోమవారం  బయటికి కప్పుకుని వెళ్ళింది , దోవలో చెట్టుకొమ్మకి పట్టుకుని చిరిగింది. ఇంటికి వెళ్ళగానే కుట్టుకోవాలనుకునీ ఆ పిన్ గొడవలో కుదర్లేదు.అప్పుడు వెళ్ళి శాలువాని పెట్టె లోంచి బయటికి తీ..స్తూ..ఉండగా..అందులో చిక్కుకుని ఉన్న వస్తువేదో..ఊదారంగు లో మిలమిలమంది. చూస్తే ఏముందీ…శాలువా లేస్ లో ఇరుక్కుని- అమెథిస్ట్ పిన్.

మెరిల్లాకి గుండె గుబుక్కుమంది. ” దేవుడా..ఇదేమిటిది ?? నా పిన్ ఇక్కడే ఉంది..బారీ చెరువులో కాదు !! తీశాననీ పోయిందనీ ఆ గాడిద ఎందుకు చెప్పినట్లు ? సోమవారం ఇంటికొచ్చి శాలువాని బీరువాలో పెట్టినట్లు గుర్తు..పిన్ ఆ బీరువాలోనేగా పెట్టానంది ఆన్…అప్పుడు శాలువాలో చిక్కుకుపోయి ఉంటుంది ”

మెరిల్లా పిన్ ని చేతిలో కనబడేలాగా పట్టుకుని ఆన్ గదికి వెళ్ళింది . ఆన్ ఏడ్చి ఏడ్చి అలిసిపోయి నిస్తేజంగా కిటికీ దగ్గర కూర్చుని ఉంది.

” ఆన్ షిర్లే ! ” మెరిల్లా గంభీరమైన గొంతుతో  పిలిచింది. ” ఇదిగో- నా పిన్ దొరికింది- నా నల్ల శాలువా లేస్ కి వేలాడుతోంది. తీసి బయటికి పట్టుకుపోయాననీ చెరువులో పడిపోయిందనీ ఎందుకు చెప్పావు నాతో ? ”

anne14-2

” నేను’ ఒప్పుకునే ‘ వరకూ బయటికి రాకూడదని నువ్వేగా చెప్పావు ? ” – ఆన్ నీరసంగా చెప్పింది – ”  పిక్ నిక్ కి వెళ్ళి తీరాలి గనుక ఒప్పుకోవాలనుకున్నాను. రాత్రి నిద్రపోయే ముందర , ఎలా చెబితే ఆసక్తిగా ఉంటుందో ఊహించి పెట్టుకున్నాను. మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ వల్లె వేసుకున్నాను. ఏం లాభం..నువ్వు నన్ను వెళ్ళనివ్వనే లేదు , నా శ్రమంతా వృధా అయిపోయింది ”

మెరిల్లాకి నవ్వూ బాధా ఒకేసారి వచ్చాయి.

” అఖండురాలివే నువ్వు ! నాదే తప్పు..ఒప్పుకుంటున్నాను. ..పాపం నువ్వు చెప్పిన మాట నమ్మలేదు , నువ్వు కథ కల్పించి చెప్పావు. చెయ్యని పని చేశానని ఒప్పుకోవటం నీదీ తప్పే- కాని దానికి నేనే కారణం. నన్ను క్షమించెయ్యి. త్వరగా తయారవు , పిక్ నిక్ కి పోదువుగాని ”

ఆన్ తారాజువ్వలాగా లేచింది – ” ఆలస్యమైపోలేదూ ?? ”

” లేదులే. ఇంకా మధ్యాహ్నం రెండు గంటలేగా అయింది- ఇప్పుడే అందరూ చేరుకుని ఉంటారు. ఇంకో గంట తర్వాత గాని తినటాలూ అవీ  ఉండవు. మొహం కడుక్కుని తల దువ్వుకో. కొత్త గౌను ఇంకోటి ఉందిగా, వేసుకో.  ఈ లోపు నీకు బుట్టలో కేకులూ బిస్కెట్లూ సర్దిపెడతాను. జెర్రీ బ్యుయోట్   ని బండి సిద్ధం చెయ్యమని చెబుతాను- నిన్ను అక్కడ దింపుతాడు ”

” ఓ మెరిల్లా ” ఆన్ ఎగిరివెళ్ళి మొహం కడుక్కుని వచ్చింది. తల దువ్వుకుంటూ ” ఐదు నిమిషాల కిందట నేనెందుకు పుట్టానా అనుకుంటున్నాను..ఇప్పుడైతే స్వర్గానికి  రమ్మన్నా వెళ్ళను ”

చివరికంటా అలిసిపోయి , ఆనందం లో మునిగిపోయి –  ఆ రాత్రి ఇంటికి తిరిగొచ్చిన ఆన్ మనసు ఎంత అద్భుతమైన స్థితిలో ఉందో చెప్పేందుకు లేదు.

” పిక్ నిక్ ఎంత ‘ రుచిరం ‘గా గడిచిందో మెరిల్లా  ! ఆ ‘ రుచిరం ‘ అనే మాట ఇవాళే నేర్చుకున్నా…మేరీ ఆలిస్ బెల్ అంది అలా . బావుంది కదూ ? అంతా ఎంతో బావుంది. టీ తాగి కేకులు తిన్నాక మిస్టర్ హార్మన్ ఆండ్రూస్ మమ్మల్ని  ప్రకాశమాన సరోవరం లో పడవ మీద తీసుకువెళ్ళారు.  ఒకసారికి ఆరుగురు వెళ్ళాం. జేన్ ఆండ్రూస్ అయితే నీళ్ళల్లో పడిపోబోయింది తెలుసా ? తామర పువ్వులు కోసుకుందామని వంగాము..అప్పుడన్నమాట. మిస్టర్ ఆండ్రూస్ పట్టుకోకపోతే మునిగిపోయి ఉండేదే. నాకే అలా జరిగిఉంటే బావుండేది…ఇంచుమించు మునిగిపోయానని అందరికీ చెప్పుకోవటం భలే ఉండేది…! ఐస్ క్రీమ్   తిన్నాం…ఎలా ఉందో చెప్పేందుకు ఎన్ని మాటలూ సరిపోవు… దివ్యంగా ఉంది అంతే. ”

ఆ రాత్రి ఊలు మేజోళ్ళు అల్లుతూ మాథ్యూ కి అంతా చెప్పుకుపోయింది మెరిల్లా.

” తప్పు చేశానని ఒప్పుకుందుకు సిగ్గు పడను …గుణపాఠం కూడా నేర్చుకున్నాను. ఆన్ ‘ ఒప్పుకోలు ‘ తలచుకుంటే ఇప్పుడు నవ్వొస్తోంది. నవ్వకూడదు నిజానికి ,  కాని అది నిజం కాదు కదా…కాకపోవటం ఎంతో హాయిగా ఉంది ప్రాణానికి. ఈ పిల్లని అర్థం చేసుకోవటం కష్టమే- కాని మంచిగానే తయారవుతుంది , అందుకు  ఢోకా లేదు. ఒకటి మాత్రం నిజం..ఇది ఉంటే  తోచకపోవటమన్నది ఉండదు ”

                                                      [ ఇంకా ఉంది ]

 

 

 

 

 

మీ మాటలు

  1. ” వంతెన మీద నడుస్తుంటే ఒకసారి తీసి చూడాలనిపించింది. ఎండలో తళ తళ తళా మెరిసిపోతోంది…వంతెన ప్రకాశమాన సరోవరం మీద కదా ఉంది..వంగి చూస్తూ ఉంటే – టప్ మని నీళ్ళల్లో పడిపోయింది. ఊదారంగు లో వెలిగి పోతూ కిందికి..కిందికి..నీళ్ళ అడుక్కి ..పడిపోయింది…మునిగిపోయింది. అంతే మెరిల్లా- ” , మనం చిన్నవారిగా వున్నప్పుడు అభాండం వేస్తే మొదట గింజుకొని వాదించి తర్వాత కుమిలి పోయేవాళ్లం … ఆ తర్వాత పెద్ద వాళ్ళు తెలుసుకొని ‘ సర్లే ‘ అనేవారకూ , … కానీ ఈ బుజ్జి పిల్ల ‘ ఒప్పుకోలు ‘ ఎంత అందంగా అల్లింది !! – మొదటి పారాల్లో బాధ , తర్వాత ఇంట్లో ఏదో గొడవ ముగిసినంత ప్రశాంతంత … hmmm , Hats off తో ఉ Mythili Abbaraju Mam !!

    • Mythili Abbaraju says:

      థాంక్ యూ సో మచ్ రేఖా. అవును, ఆ బుజ్జి పిల్ల బుర్రలో బోలెడు ఆలోచనలు :)

  2. తోటలో మడోనా లిల్లీలు విచ్చుకున్న పరిమళం గాలి తెరలమీంచి తేలివచ్చి ప్రతి గదినీ దేవతల ఆశీస్సులాగా నింపుతోంది. కొండవాలు లో బర్చ్ చెట్లు సంతోషంగా చేతులూపాయి…ప్రతిరోజూ ఆన్ వాటిని తనూ చేతులూపి పలకరిస్తుంటుంది.

    • Mythili Abbaraju says:

      థాంక్ యూ అండీ . నిజంగా , ఇలా చెట్లతో మాట్లాడే పిల్ల ఒకటి నాకు తెలుసు , వాటి మూడ్స్ ని కోడా కనిపెట్టి నాకు చెబుతుండేది. :)

  3. Ramprasad J says:

    జేన్ ఆండ్రూస్ అయితే నీళ్ళల్లో పడిపోబోయింది తెలుసా ? తామర పువ్వులు కోసుకుందామని వంగాము..అప్పుడన్నమాట. మిస్టర్ ఆండ్రూస్ పట్టుకోకపోతే మునిగిపోయి ఉండేదే. నాకే అలా జరిగిఉంటే బావుండేది…ఇంచుమించు మునిగిపోయానని అందరికీ చెప్పుకోవటం భలే ఉండేది…! ఆన్ ని చూడాలని, ఆన్ మాటలు వినాలని పిస్తుంది…. మైథిలి గారు అద్భుతం గా వుంది.

    • Mythili Abbaraju says:

      థాంక్ యూ వెరీ మచ్ అండీ . మీకు అలా అనిపించటం రచయిత్రి గొప్పదనం , నా అదృష్టం !

మీ మాటలు

*