కూలి బతుకు

Kadha-Saranga-2-300x268

సూరీడు సరిగ్గా నడినెత్తి మీదకొచ్చాడు. మిట్ట మధ్యాహ్నం కావడం వల్ల ఎండ ఇరగ్గాస్తుంది. మేనెల్లో ఎండలు ఉండాల్సిన దానికంటే ఈ సంవత్సరం కాస్త ఎక్కువగానే ఉన్నాయి. చెమట పట్టడం వలన సిమెంటు పొడి మొహానికి అతుక్కుపోయి రాముడి మొహం జిడ్డుగా ఉంది. తలకు చుట్టుకున్న తువ్వాలు గుడ్డను విప్పి, ఆ తువ్వాలుతో మొహం తుడుచుకున్నాడు. చెమట తుడుచుకున్నాడు గాని జిడ్డుమాత్రం పోలేదు. ఆ జిడ్డు మొహంతోనే అడ్డ పారేసి సిమెంటును ఒక చోటకు లాగాడు. అప్పటికే మూడు సార్లు సిమెంటును కలతిప్పినా ఇంకా అక్కడక్కడ ఇసుక కనిపిస్తూనే ఉంది.

అంతలో ‘రేయ్… బామ్మార్ది… సిమెంటురా… ఈడ సిమెంటు అయిపోయి చాలా సేపయిందిరా మామా… తొందరగా తీసకరా…’ అని లోపలున్న బేల్దారి శీను అరిచాడు. ‘ఆ మామా… తెచ్చాన సామి. సిమెంటు కలిపి, కుంది తీసి నీళ్ళు పోసినా… రెండు నిమిషాలబ్బా…’ అని రాముడు శీనుకు చెప్పాడు. ‘దా…దా… నేను ఇంతలోపల ఒక దమ్ము లాగిస్తా… ’అని చెప్పి చొక్కా జేబులో ఉన్న బీడి తీసి వెలిగిచ్చాడు. ఒక్కసారి గట్టిగా ఆ బీడిని లాగి పొగ ఊదేతలికే ఆ పొగ నీళ్ళలో వేగంగా పాకిన పాములాగా మెలికలు తిరుగుతూ ఒక మూలకు పోయింది. సిమెంటులో నీళ్ళు పోసినాడే గానీ రాముడి మనసంతా గందరగోళంగా ఉంది. ఏమి దిక్కు తోచడం లేదు. పనిలో ఒంగినాల నుంచి రాముడి మనసు అదోలా ఉంది. ఎంత వద్దనుకున్నా నిన్నటి సంఘటనే గుర్తుకొస్తావుంది. ఎంత మరిచిపోదామన్నా ఆ సంఘటనే గుర్తుకు వస్తావుంది. ఆ సంఘటన వలన రాత్రికూడా సరిగా నిద్రపోలేదు.

’ఏం రా… సిమెంటు రెడీనా?’ అని శీను ఒక్కసారి గట్టిగా రాముడిని పిలిచాడు.

’ఆ మామా… రెడీ… కావాలా..’

’తొందరగా తీసకరా… పద్దన్నుంచి ఇప్పటికి సరిగా చదరం పూతకూడా జేయ్ లా… మీ తాత వచ్చినడంటే నీకు నాల్గు, నాకు నాల్గు సింగారాలు ఇచ్చడు.. తొందరగా తీసుకురా…’

’ఇదోబ్బా… కానీ మరి… అన్నానికి ఇంకా అర్ధ గంట టైముంది. ఈ లోపల ఈ గోడ పూర్తైతది. గబగబ కాని మరి. సిమెంటు రెడీ. నేను గబగబ అందిచ్చా… నీదే లేటు మరి’ అనిచెప్పి సిమెంటు గోలం తెచ్చి శీను నిలబడిన సారవ మీద పెట్టాడు రాముడు.

’సరే మరి అందీ… నువ్వు కొంచెం ఉషారుగా ఉంటే ఈ పాటికి సుమారుగా అయి పోయిండేది. నువ్వేమో పద్దన్నుంచి మన్ను తిన్న పాము మాదిరి మెత్తంగుండావ్…’ అని రాముడితో చెప్పి గోలంలోని సిమెంటు తీసుకొని గోడకు లకారిచ్చడం మొదలు పెట్టాడు శీను. పది, పదైదు గోలాల సిమెంటు అందించి గోడకు కాలు ఆనించి నిలబడ్డాడు రాముడు. గోడకు సిమెంటు లకారించడం పూర్తైంది. గజంకట్టె తీసుకొని గోడకు గజం ఈడ్చడం ప్రారంభించాడు శీను. గజం ఈడ్చడం పూర్తైం తరువాత గోడకు ఉన్న హెచ్చుతగ్గులకు మళ్ళీ సిమెంటు లకారించాడు.

’రేయ్ బామార్ది… చక్కతాపి తీసకరా… ’ అని రాముడిని శీను పిలిచాడు.

తలపైకి పెట్టి పైనున్న స్లాబు వైపు చూస్తున్న రాముడు ఒక్క సారిగా శీను వైపు తిరిగి ’ఆ మామా…’ అని అన్నాడు.

’చక్కతాపిరా సామి’ అని మరో సారి గట్టిగా అరిచాడు శీను.

’ఇదిగో..’

’పద్దన్నుంచి ఎదో ఒకమాదిరిగా ఉండావురా… ’ అని చక్కతాపి తీసుకొని గోడకు చక్కపట్టాడు. అక్కడక్కడా నొక్కులు మాదిరిగా ఉండే సరికి మరోసారి తాపితో సిమెంటు తీసుకొని నొక్కులకు సిమెంటు పెట్టి చక్కపట్టాడు. ఇసారి శీను అడక్కముందే స్పాంజిని నీళ్ళల్లో పిండి చేతిలో రెడీగా పట్టుకుని ఉన్నాడు రాముడు. ’ఆ స్పాంజి ..’ అని శీను అడగి అడగక ముందే చేతిలోని స్పాంజిని బేల్దారి చేతికిచ్చాడు రాముడు. అలా నాలుగైదు సార్లు స్పాంజిని నీళ్ళలో పిండి శీనుకు అందించాడు రాముడు. సగం గోడ పూత దాదాపు పూర్తైంది. గట్టున ఉన్న కప్ప నీళ్ళలోకి దూకినట్టు అప్పటి దాకా సారవ మీద ఉన్న శీను ఒక్క ఉదుటున ఇసుకలోకి కిందికి దూకి ’టైం ఎంతైందో చూడు’ అని రాముడిని అడిగాడు. రాముడి దగ్గర కూడా వాచి లేకపోవడంతో ’ఉండు చూసొచ్చా!’ అని చెప్పి పక్కింట్లో ఉన్న అబ్బాయిని ’అన్నా టైమెంతా?’ అని అడిగాడు. అతడు వెంటనే చేతిలో వాచిని చూసి ’పన్నెండు ముక్కాలు’ అని రాముడితో చెప్పాడు. రాముడు శీను దగ్గరికి వచ్చి ’మామా ఇంకా ఒంటి గంటకు పదహైదు నిమిషాలుంది సామి. ఏం చేద్దాం?’ అని బేల్దారిని అడిగాడు. పని దగ్గర అంతా కూడా బేల్దార్లు చెప్పినట్లే వినాలి. ముఖ్యంగా చిన్న కూలోల్లు, పెద్దకూలోల్లు బేల్దార్ల మాటలు తు.చ. తప్పక ఆచరించాలి. పని దగ్గర మేస్త్రి తరువాత బేల్దారి మాటే వేదవాక్కు. వారు ఏం మాట చెబితే ఆ మాట కూలోల్లకు శిలాశాసనం.

’ఇంకా పదైదు నిమిషాలుంది. సరే ఒక పని చేయి… ఇప్పుడు అర మూట దాకా సిమెంటుంది. ఇంకొక మూటకు ఇసుక కొలిచి సిమెంట్ కలుపు. మధ్యాన్నం వస్తానే పని జరుగుతది. సిమెంటు కలిపిన తరువాత అన్నానికి చాలిద్దాం’ అని శీను రాముడితో చెప్పాడు. మాములుగా అయితే అరమూట సిమెంటుతో గంట పని జరుగుతుంది. ఆ పదైదు నిమిషాలు పనిచేయటం ఇష్టం లేక సిమెంటు కలపమని రాముడితో చెప్పాడు. తమకు పని చేయటం ఇష్టం లేనప్పుడు చిన్నకూలోల్లకు, పెద్దకూలోల్లు ఏదో ఒక పని చెప్పి తాము బాతాఖాని చేయడం బేల్దార్లకు మామూలే. ’ఆ…సరే మామా’ అని మూటకు పదైదు గోలాలు ఇసుక కొలిచి కుప్పగా పోసి, దాని మీదకు సిమెంటు మూటను లాక్కొచ్చాడు రాముడు. సిమెంటు మూటను విప్పటానికి పదునైన రాయి కోసం అంతా పరికించి చూశాడు. ఎక్కడా కనిపించకపోయే సరికి ఇంతకు ముందు సిమెంటు మూట విప్పినప్పుడు ఒక సూదైన రాయిని తెచ్చి గూట్లో పెట్టాడు. వెళ్ళి గూట్లో రాయి తీసుకొచ్చి సిమెంటు మూట ఒక కొసన చిన్న దారాన్ని కోశాడు. దానితో మొత్తం దారమంతా సులభంగా ఊడొచ్చింది. తరువాత అదే మాదిరిగా రెండో కుట్టును కూడా విప్పదీశాడు. సిమెంటు సంచిని పైకెత్తి సిమెంటు పొడి మొత్తాన్ని ఇసుక పైకి గుమ్మరించాడు. సిమెంటు మూట ఎండలో ఉండటం వలన ఒక్క సారిగా సిమెంటు పొడి కాళ్ళకు చాలా వేడిగా తాకింది. కాళ్ళతో సిమెంటును అటు ఇటుగా నెరిపెతలికే కాలుతున్న పెనం మీద కాలును పెట్టినట్లనిపించింది రాముడికి. తలపైన భానుడు, కింద సిమెంటు పొడి ప్రతాపం చూపుతుంటే వీరికి సావాసగాడైనట్లు వాయుదేవుడు కూడా చడిచప్పుడు చేయకుండా ఉన్నాడు. అన్నంవేళ కావడంతో ఆకలితో ఉన్నరాముడు వీరందరి బాధితుడైనట్లు నీరసంగా సిమెంటును కలిపి, కుంది కొట్టి, అందులో రెండు బిందెలు నీళ్ళు పోశాడు. అప్పటికే కాళ్ళు మొహం కడుక్కొని శుభ్రంగా తయారైన శీను ’నేను ఇంటికి పోయి అన్నం తిని గబక్కనొచ్చాగానీ, నువు తిని సిమెంటును అంతా కలిపి రెడీ చేసిపెట్టు’ అని సైకిల్ తీసుకొని దావపట్టాడు. రాముడు కూడా డమ్ములో ఉన్న నీళ్ళు తీసుకొని కాళ్ళు మెహం కడుక్కొని, అన్నం తెచ్చుకొని, మూలన ఒక చోట కూర్చున్నాడు. అప్పటికే అక్కడ ఉన్న ఒక కుక్క ’నాకు ఒక ముద్ద పెట్టవా’ అన్నట్లు ఎదురుగా నిలుచుంది. దానికి ఒక ముద్ద పెట్టి, చూస్తున్నాడు. ఆ అన్నం ముద్ద తిని ఇంకా పెట్టమన్నట్లు తిరిగి రాముడివైపు చూసింది. ఇక ఈ కుక్కపోదని తెలిసి, పక్కనున్న గజం కట్టె తీసుకొని ’ఏయ్…పో… పో… ’అని గట్టిగా తరుముకునే లోపల ఆకుక్క అక్కడనుంచి వెళ్ళిపోయింది. అప్పటికే రాముడు ఆకలితో నకనకలాడుతుండడంతో అన్నం దగ్గర పెట్టుకొని తనకిష్టమైన చనిక్కాయల కారాన్ని అన్నానికి దట్టంగా కలిపి తినడం మొదలుపెట్టాడు. ఆకలిమోపున గబగబ అన్నం ముద్దలు నోట్లోకి పోతున్నాయి. అతడు అన్నం తినేవిధానం చూస్తే, ఇదేమిటి? ఇంత ఆత్రంగా తింటున్నాడు? అనేలా తింటున్నాడు. బహుశా ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుందేమో! అన్నం తినడం పూర్తైన తరువాత గిన్నెను ఇసుక వేసి ఒకటికి రెండు సార్లు కడిగి, వైరుబుట్టలో పెడుతుంటే, ఆ గిన్నెలో తన మెహం కనిపించింది. మొహానికి నాలుగైదు సార్లు సబ్బును రుద్దీ, రుద్దీ మెహం కడుక్కొని కాలేజికి వెళ్ళేవాడు, ఇప్పుడు పని సాలిచ్చి, కనీసం మొహం మీద నీళ్ళుకూడా పోసుకోకుండానే అన్నం తిన్నాడు. ఆ విషయం గుర్తొచ్చి తనలో తానే ముసిముసిగా నవ్వుకొన్నాడు. నడుముకు కట్టుకున్న తువ్వాలు గుడ్డను ఇసుకలోపరిచి, నడుం వాల్చాడు. మామూలుగా అయితే మధ్యాహ్నం పడుకునే అలవాటు లేదు. రాత్రి సరిగా నిద్రపోకపోవడం వలన కొంచెం అలసినట్టుగా ఉంది. దీనికి తోడు ఈ రోజు ఎవరూ చిన్న కూలోల్లు కూడా రాలేదు. ఒక్కడే కావడం వలన పని ఎక్కువై కొంచెం అలసినట్టుగా ఉంది. పడుకుందామని కళ్ళు మూసుకున్నాడు. కాని నిన్న జరిగిన సంఘటన పదేపదే తనకు తెలియకుండానే గుర్తొస్తుంది.

*****************

Sketch5394246

రాముడు గత నెల రోజులుగా తన దూరపు బంధువుగా చెప్పుకొనే చలమయ్య దగ్గరకు పనికి వస్తున్నాడు. సంవత్సరం పొడుగునా పనికి రావడం రాముడి వృత్తి కాదు. బి.ఎ. రెండవ సంవత్సరం చదువుతున్నాడు. రాముడికి ఇంట్లో ఆర్ధిక ఇబ్బందుల వలన ప్రతి సంవత్సరం ఎండాకాలం సెలవల్లో, ఇలా ఎవరో ఒకరి దగ్గరికి పనికి వెళ్ళి పుస్తకాలకు, ఫీజులకు కావలసిన డబ్బును తనే సంపాదించుకుంటున్నాడు. అందరి పిల్లలకు స్కూలు సెలవలు వస్తే ఆనందం. కానీ రాముడి పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. సెలవల్లో పనికి పోవాల్సిన పరిస్థితి. తండ్రి మరణించడంతో తల్లి చేసే కూలి డబ్బులు తిండికే సరిపోని పరిస్థితి. ఇక ఫీజులకు, పుస్తకాలకు, బట్టలకు డబ్బంటే కష్టంతో కూడుకున్న పని. అందుకు సెలవు సమయాల్లో పనికి పోవడం చిన్నప్పటినుంచే అలవాటు చేసుకున్నాడు. పనుల దగ్గర ఆడవాళ్ళ ఇబ్బందుల గురించి అప్పటికే పలువురి ద్వారా విని ఉన్నాడు. ముఖ్యంగా బేల్దార్లు అక్కడ పనికి వచ్చే ఆడవాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటారని కొంతమంది మాట్లాడుకోవడం వినివున్నాడు. కానీ ఆడవాళ్ళలో కూడా కొందమంది జాచ్చి ముండలే ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తారని ఊర్లో ఉన్న బేల్దార్లు అరుగు మీద కూర్చోని మాట్లాడుకోవడం రాముడు విని ఉన్నాడు.

చలమయ్య దూరపు బంధువు కావడంతో వేరే వాళ్ళ ద్వారా తను కూడా పనికి వస్తానని అడిగి రమ్మన్నాడు. చలమయ్య రమ్మనడంతో అతని దగ్గర పని చేస్తున్నాడు. ఈ నెల రోజుల్లో అతని దగ్గర ఉన్న బేల్దార్లతో, పెద్ద కూలోల్లతో, చిన్న కూలోల్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఎవరేమిటి? అనే ఒక అవగాహన వచ్చింది. అక్కడకి పనికి వచ్చే వాళ్ళలో పార్వతమ్మ, రాజమ్మ, శీనులపై ప్రత్యేక అభిమానం ఏర్పడింది రాముడికి. ఆ అభిమానం ఏర్పడటానికి కారణం ఉంది. వారు రాముడు చదువుకునే పిల్లోడని జాలి చూపేవారు. శీను కూడా తను పనిచేసే చోటకు రాముడిని తీసుకు వెళ్ళేవాడు. రాజమ్మ నడివయసు మనిషి. దాదాపు యాభై సంవత్సరాలకు అటు ఇటు ఉంటాయి. ఎత్తైన మనిషి. చామన ఛాయ రంగు. రూపాయి మందంతో ఉండే బొట్టు, వక్కాకు నమలడం వలన ఎరుపు, తెలుపు రంగులో ఉండే పళ్ళు. ఎందుకో తెలీదుకానీ చూడడానికి ఆమె కొంత ప్రత్యేకంగా కనిపిస్తుంది. పార్వతమ్మ పేరు కొంచెం పెద్దవారి పేరులా కనిపిస్తున్నా, వయసు పాతిక సంవత్సరాలకు మించదు. కాస్త ఎత్తు తక్కువగా ఉన్నప్పటికీ చాలా చక్కనైన రూపం. చాలా తెల్లటి మనిషి. ఆమె మనసు కూడా పాల మీగడలాగా తెల్లగా ఉంటుందని ఆమె మాటల ద్వారా చాలా సులభంగా తెలుసుకోవచ్చు. పెళ్ళై ఆరు సంవత్సరాలైనా ఇంకా పిల్లలు లేరు. దాదాపు మూడు నాలుగు నెలల కిందటి నుంచే చలమయ్య దగ్గరకు పనికి వస్తుందని రాజమ్మ ఏదో సందర్భంలో రాముడితో చెప్పింది. రాముడు కూడా అక్కా… అక్కా… అంటూ పార్వతమ్మతో మాట్లాడేవాడు. ఆమె కూడా అభిమానంగా రాముడితో మాట్లాడేది. పని దగ్గర వారు చూపే అభిమానం వలన రాముడు కూడా వారితో పని చేయడం ఆనందంగానే భావించేవాడు.

అయితే వారిలో బేల్దారి గిరి కొంచెం అసూయ మనిషి. పని దగ్గర కొందరితో పనికిమాలిన విధంగా ప్రవర్తించేవాడని వేరే బేల్దార్లు అంటుండేవారు. అతడి గురించి బేల్దార్లు బయట గుసగుసలాడినా పైకి మాత్రం అతనితో బాగానే ఉండేవారు. అతడు పని బాగా తెలిసినవాడని చెబుతారు. అందువలన అతడు చెప్పిన మాట చలమయ్య వింటాడని అందరు అంటారు. గిరి దాదాపు రెండు మూడు సంవత్సరాలుగా చలమయ్య దగ్గర పని చేస్తున్నాడు. పనికాడ గిరికి కమల అనే ఆమెతో సంబంధం ఉందని అందరికి తెలుసు. అతను పని చేసే దగ్గర చిన్న కూలిగా కమలే ఉంటుంది. సిమెంటు, ఇటుకలు అన్ని కూడా ఆమే గిరికి అందిస్తుంది. గిరి కూడా సులభమైన పనులే కమలకు చెబుతాడు. బరువైన పనులు ఇతరులకు చెబుతాడు. అయితే పార్వతమ్మ చలమయ్య దగ్గర చేరినప్పటి నుంచి గిరి కన్ను ఆమెపై పడింది. చాలా సందర్భాలలో ఆమెతో ద్వంద్వార్థాల మాటలు మాట్లాడేవాడు. ఆమె ఆ విషయాలను పెద్దగా పట్టించుకునేది కాదు. నలుగురైదుగురు బేల్దార్లు ఒకేచోట పని చేయటం వలన అతనికి ఆమెను చెనికే అవకాశం రాలేదు. పైగా ఆమెతో ద్వంద్వార్థాలు మాట్లాడిన ప్రతిసారి కమల గిరిని గుడ్లురిమి చూసేది. ఆమెతో సంబంధం ఉండటం వలన కాబోలు కక్కలేక, మింగలేక గుక్కూరుమని ఉండేవాడు. గత వారం రోజులుగా గిరితో సంబంధం ఉన్న కమల కూడా పనికి రావడం లేదు. చలమయ్యకు రెండు కొత్త పనులు పడటంతో ఒకరిద్దరి బేల్దార్లనే ఒక చోట ఉంచుతున్నాడు. కమల లేకపోవటంతో తన దగ్గర సిమెంటు, ఇటుకలు అందించడానికి పార్వతమ్మని పిలిచాడు గిరి.

ఇద్దరు బేల్దార్లు, ఇద్దరు చిన్న కూలోల్లు, రాముడు మాత్రం ఒక పనికాడ పని చేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో చలమయ్య పని దగ్గరకి వచ్చి ’రేయ్ శీను మధ్యాన్నుంచి పని భాగ్యనగర్ కాలనీలో చెయ్యాలరా. ఈడ ఒక బేల్దారి ఆడమనిషి చాలు. నువ్వు, వాడు రాముడు ఒక ఆడమనిషి ఆడికిపోండి’ అని శీనుతో చెప్పాడు. మొదట శీనుతో ’నేను వస్తానన్నా…. ఆ పనికాడికి’ అని పార్వతమ్మ చెప్పింది. అయితే ఈ పనికాడ తాపలు ఎక్కి సిమెంటు అందించాలి. దానితో పెద్దామైన రాజమ్మకు కష్టం అని గిరి తెలుసు. ఇదే అదునుగా ’పార్వతమ్మ ఈడ పెద్దామ తాపలెక్కి సిమెంటు అందీలేదు. నువ్వు ఈడ ఉండు. పెద్దామ, రాముడు, శీనుగాడు ఆడికి పోతారు’ అని చెప్పాడు. రాజమ్మ కూడా తాపలెక్కలేక ’నువ్వుండు పార్వతమ్మ నేను ఆడికిపోతా…’ అని చెప్పింది. పార్వతమ్మకు గిరి దగ్గర పని చేయడం కంటే మధ్యాహ్నం మానేస్తే బాగుండనిపించింది. కాని ఇప్పుడు పనికాడ ఆడమనిషి కావాలి. ఇప్పుడు పనికిరానంటే రేపు వద్దంటాడేమోనని మనసులో అనుకుంది. ’సరేలేయ్యా… నేను అన్నం తిని ఈడనే పనిజేచ్చాలే’ అని చలమయ్యతో చెప్పింది పార్వతమ్మ. గిరికి మనసులో ఎక్కడో తెలీని ఆనందం కనిపించినప్పటికీ బయటపడకుండా ’నేను అన్నం తినేసి వచ్చాగానీ, రాముడు ఒక అర మూటకు ఇసుకపోసి, ఆ సిమెంటును కూడా దీంట్లో ఏసి మెత్తం ఒకసారి తీరగేయ్’ అని రాముడుతో చెప్పాడు. ’రేయ్ మీరాడికి రాండిరా… నేను ఒక అరగంటకల్లా ఆ పనికాడికొచ్చా…’ అని చెప్పి చలమయ్య సైకిల్ ను ఇంటి దారి పట్టించాడు. అందరు ఇండ్లకు అన్నానికి వెళ్ళారు. రాముడు ఏడుగోలాలు ఇసుకపోసి, సుమారు ముక్కాలుమూట సిమెంటేసి, పాత సిమెంటుని దాంట్లో ఏసి, రెండు సార్లు తిప్పి, కుంది కొట్టాడు. నీళ్ళు పోయటానికి బిందె తీసుకొని సిమెంటులో నీళ్ళు పోసి, అక్కడే కాళ్ళు కడుకున్నాడు. చలమయ్య వేరేపనికాడికి అరగంటకల్లా వస్తానన్నాడు కాబట్టి తాను కూడా అక్కడికి తొందరగా తినేసి వెళ్ళాలనుకున్నాడు. అన్నం తిని పదినిమిషాలు కూర్చొని ఆలోచన చేస్తున్నాడు. ఇక వారం రోజుల్లో తన కాలేజి తెరుస్తారు. ఈ పని బాధ తప్పుతుందనుకున్నాడు. ఇక బయలు దేరుదామని రాముడు అనుకుంటుండగా ఇంతలో గిరి అక్కడి వచ్చాడు. మామూలుగా అయితే మధ్యాహ్నం రెండు దాటిన తరువాత వచ్చేవాడు. కాని ఈరోజు ఒకటి నలభైకల్లా ఇక్కడుండడం రాముడికి కొంత ఆశ్చర్యమేసింది.

’చిన్నోడా ఇది ఒక సారితిరగైరాదు’ అని రాముడుతో గిరి చెప్పాడు.

’ఆ అన్నా… తిరగేసి ఆ పనికాడికెళ్తా…’

’కానీ…, కానీ… గబగబ కానిచ్చీ ఆడికంట బయలు దేరు’

’సరే అన్నా…’

రాముడు పార తీసుకొని గబగబ రెండు నిమిషాలలో సిమెంటు మొత్తం తిరగేసి కాళ్ళు చేతులు కడుకున్నాడు. గోడకున్న చొక్కా, ప్యాంటు తీసుకొని బట్టలు మార్చుకున్నాడు. అన్నం క్యారీ, లుంగీ, తువ్వాలును సంచిలో పెట్టుకొని సైకిలెక్కి భాగ్యనగర్ కాలనీలోని పని దగ్గరకు వచ్చాడు. అప్పటికే చలమయ్య అక్కడికి వచ్చి ఉన్నాడు.

’రేయ్… ఆ రూముల్లో మట్టెత్తు. వాళ్ళు మోచ్చరు. శీను ఆ పక్క కొయ్యలతో బయట సారవలు కట్టుకుంటాడు. ఆ రూముల్లో పారలు, గోలాలు ఎన్ని ఉండయో చూడు’ అని చలమయ్య రాముడితో చెప్పాడు. లోపలికెళ్ళి గోలాలు, పారలు చూసి ’మూడు పారలు, ఎనిమిది గోలాలున్నాయి తాతా…’ అని చలమయ్యతో చెప్పాడు రాముడు. ఇంతలో రాజమ్మ, శీను మరో ముగ్గురు కొత్త కూలోల్లు అక్కడికి వచ్చారు.

’శీను… నువ్వు సారవలు కట్టుకో. వాడు మట్టి ముంచుతాంటాడు. పెద్దామా… నువ్వు, కొత్తోళ్ళు మట్టి మోయండి. ఈ రోజు మూడురూముల్లో మట్టి అయిపోవాలా… ఎప్పుడన్న అయిపుజేసుకోని పోండి. నేను వేరే పనికాడికి పోతాన…’ అని కూలోల్లతో చెప్పి చలమయ్య వెళ్ళిపోయాడు.

’రాండిమ్మా… గబగబ నాలుగున్నర్రకల్లా ఈ మట్టి ఎత్తి ఇంటికి పోవాల… మీరు కొంచెం హుషారుగా తిరగండి. నేను గబగబ మట్టి ముంచుతా’ అని రాజమ్మతో అన్నాడు రాముడు.

’తాలు నాయనోవ్… యాడ నాలుగున్నర్రకు అయిపోతది. మీ తాత అయిపోజేసుకొని పోండని ఏదో ఒక మాట చెప్పినాడు. అది అయ్యే పని కాదు. చూడ్డానికి రోంతున్నెట్లుంది. అయిపోయేతలికి అయిదున్నర అయితది’ అని రాజమ్మ రాముడితో అనింది.

’సరేమ్మా ఎన్ని గంటలైన పర్వాలేదులే అని చెప్పి’ మట్టి ముంచి ఆడోల్లకిస్తున్నాడు రాముడు. దాదాపు మూడు గంటలకల్ల ఒక రూము మట్టి ఎత్తేది పూర్తైంది. ఇంతలో చలమయ్య పని దగ్గరకొచ్చాడు.

’ఓమ్మా రాజమ్మా… రూంలో టేపేమన్నా ఉందేమో చూడు’ అని రాజమ్మతో చెప్పాడు.

దాదాపు అయిదు నిమిషాల తరువాత ’ఈడ లేదయ్యా. ఆ పనికాడేమన్నా ఉందేమో… ’ అని చెప్పి వెంటనే ’ఆడ్నే ఉందయ్యో… నేను నిన్న చూసినా… సామాన్ల సంచిలో ఉంది.’ అని చలమయ్యతో చెప్పింది.

’రేయ్… ఆడికి పోయి టేపు తీసుకొద్దురా…’అని రాముడితో చెప్పాడు చలమయ్య.

అంతలోనే ’బామ్మార్ది… నువ్వు అటుపోతాండావ్. ఇదో వచ్చేటప్పుడు ఒక కట్ట సంఘం బీడీలు తీసుకొనిరా’ అని చెప్పి పది రూపాయల నోటు రాముడి చేతికిచ్చాడు శీను. ఆ మాటలు విన్నాక, నీళ్ళడమ్ము దగ్గరకు వచ్చి, నెత్తికున్న తువ్వాలు గుడ్డను విప్పి పక్కనపెట్టి, మొహం కడుక్కొన్నాడు రాముడు. చొక్కా వేసుకొని గుండీలు పెట్టుకుంటుండగా ’రేయ్ ఈనించి ఈడికి ఇంత సోకు అవసరమారా… గబక్కన పోయొజ్జురారా మామా నువ్వు’ అని చలమయ్య గట్టిగా అరిచాడు. సరే అని అట్లే ఆ సగం గుండీలు పూర్తిగా పెటుకొని, నెత్తిని చేత్తోనే దువ్వుకొని తన సైకిల్ తీసుకొని పాత పనికాడికి వచ్చాడు.

సైకిల్ ఇంటి ముందర పెట్టి రూము లోపలికెళ్ళి ’అక్కా…’ అని అలాగే నిలబడిపోయాడు రాముడు. ఒక్క సారిగా ఏదో తేడాగా అనిపించింది. తన కళ్ళను తానే నమ్మలేనట్లు గమ్ముగా లోపల ఉన్న పార్వతమ్మను, గిరిని చూస్తుండి పోయాడు రాముడు. పార్వతమ్మ ఏడుస్తూ ఉంది. ఆమెకు అలా దూరంలో భయంతో ఉన్నట్లుగా నిలబడివున్నాడు గిరి. తనను చూడగానే కళ్ళు తుడుచుకొని అలాగే గమ్ముగా నిలబడింది పార్వతమ్మ. ’ఏం గావాల్రా …ఏం ఇటొచ్చినావే’ అంటూ చాలా హీన స్వరంతో గిరి రాముడ్ని ప్రశ్నించాడు.

’అన్నా… తాతా… టేపు తెమ్మన్నాడన్నా… సామాన్ల సంచిలో ఉందని రాజమ్మక్క చెప్పింది’ అని రాముడు గిరితో చెప్పాడు. గిరి మాటలో శరీరంలో ఏదో భయం కనిపిస్తుంది రాముడికి. పార్వతమ్మ మాత్రం ఏమి మాట్లాడకుండా అలాగే ఉంది. గిరి సామాన్ల సంచిలో చూస్తానే చిన్న టేపు, పెద్ద టేపు కనిపించాయి. ’ఏదిరా… చిన్న టేపా? పెద్దటేపా? కావాల్సింది’ అని రాముడ్ని అడిగాడు.

’అదేం చెప్పలేదన్నా తాత…’ అని చెప్పాడు రాముడు.

’సరే! రెండు టేపులు పట్టకపో. రెండు టేపులు నేనే తెచ్చినా అని చలమయ్యతో చెప్పు. నేను ఇచ్చినాని చెప్పాకు’ అని గిరి రాముడితో చెప్పి రెండు టేపులు చేతికిచ్చాడు. ఆ టేపులను తీసుకోవడం కంటే పార్వతమ్మ కళ్ళలో వచ్చే కన్నీళ్ళనే చూస్తున్నాడు రాముడు. ఇది గమనించిన గిరి ’రేయ్! ఈ టేపులు తీసుకొని పో’ అని తొందరగా రాముడ్ని అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు గిరి. రాముడి మనసులో ఎన్నెన్నో సందేహాలు వస్తున్నాయి. ఏమి మాట్లాడటానికి అవకాశం లేక అక్కడే నిలబడ్డాడు. పార్వతమ్మ ’నన్ను ఈడు పట్టుకున్నాడు రాముడు’ అని ఒక్క మాట అంటే చాలు వాడి మీద కలబడి కొట్టాలన్నెంత కోపం రాముడి మనసులో ఉంది. కాని ఆమె మాత్రం రాముడి మొహం వైపు చూసి, కన్నీళ్ళు తుడుచుకుంది. రాముడు కూడా ఏమి మాట్లాడకుండా అక్కడే నిలబడ్డాడు. ఇంతలో గిరి ’రాముడు నువ్వెళ్ళు’ అని చిన్నగా చెప్పాడు. ఏమి మాట్లాడలేక టేపు తీసుకొని పని దగ్గరకు బయల్దేరాడు. దారిలో వస్తున్నప్పటికీ పార్వతమ్మ కన్నీళ్ళే గుర్తొస్తున్నాయి. ఆ కన్నీళ్ళు గిరి వలన చిందిన అకాల వర్షపు చినుకులుగా కనిపించాయి రాముడికి. ’గిరి ఆమెను ఏదో అన్నాడు’ అనే అభిప్రాయానికొచ్చాడు రాముడు. అర్థంపర్థం లేకుండా ఏవేవో ఆలోచనలు మనసుకు తట్టుతున్నాయి రాముడికి. బహుశా బోయవాని బాణం దాటికి పక్షి కూడా ఇలాగే విలపించింటుందేమోననిపించింది రాముడికి. ’గిరి మీద నాకు మనసులో కోపం వచ్చినప్పుడు ఒకవేళ పార్వతమ్మ నన్ను గిరిని కొట్టమని చెప్పింటే’ అని గబక్కున ఆలోచనలో పడ్డాడు రాముడు. తనకు తెలుసు గిరిని తనుకొట్టలేడని. తనేమో పిల్లోడు. గిరి చూస్తే దున్నపోతుమాదిరి ఉండాడు. ’అయినా సరే కలబడేవాన్ని. నా కొడుకుని ఏది దొరితే అది తీసుకొని ఏసిందును’ అని తన మనసుకు తానే ధైర్యం చెప్పుకున్నాడు. ’ఆమె ఏమి చెప్పంది మనం ఏం చేయలేం. ఆమె ఏమి చెప్పకుండా ఉందంటే ఏదో బలమైన కారణం ఉంటుంది’ అని తనకు తానే ఏవేవో ఊహించుకొన్నాడు. ఈ ఆలోచనలతోనే భాగ్యనగర్ కాలనీలోని పని దగ్గరకొచ్చాడు. అక్కడ చలమయ్య తన కోసమే ఎదురు చూస్తున్నాడు.

’ ఏరా! టేపు ఉన్నిందా?’ అడిగాడు చలమయ్య.

ఏమి మాట్లాడకుండా రెండు టేపులు చలమయ్య చేతికందించాడు రాముడు.

’పెద్దటేపు ఒకటి చాలు రా సామి. సరేలే… రెండు టేపులు పనికొచ్చయ్’ అని టేపులు తీసుకొన్నాడు.

’మట్టి ఎత్తడం ఎంత వరకు వచ్చిందిమ్మా…’ అని రాజమ్మను అడిగాడు.

’ఇంకో గంటకల్లా అయిపోతదయ్యా. అయిపోయిన తరువాతే ఇంటికి పోతం’ అని రాజమ్మ సమాధానం చెప్పింది.

’శీను నువ్వు రా. ఆ పని కాడ ఒక్కరవ్వ మార్కింగ్ వెయ్యాల’ అని శీనును పిలిచాడు.

’మరి సారవా?’ అని శీను చలమయ్యను అడిగాడు.

’దాని పరిస్థితి రేపు చూద్దాం రా…’ అని చలమయ్య చెప్పడంతో శీను మొహం కడుక్కొని అతనితో పాటు వెళ్ళిపోయాడు. రాముడు మిగిలిన నలుగురు ఆడోళ్ళు మాత్రమే పనికాడ ఉన్నారు. తాను చూసిన విషయాన్ని రాజమ్మతో చెపుదామనుకొన్నాడు రాముడు. కాని ధైర్యం చాల్లేదు. మళ్ళీ ఎందుకొచ్చిన గొడవ అనుకొన్నాడు. ఏ విషయం తేల్చుకోలేక సతమతమవుతున్నాడు. మనస్సులో ఏవేవో ఆలోచనలు… చివరకు ఏదో ఒక విధంగా మౌనంగానే ఆ పని దగ్గర రూముల్లో మట్టి ఎత్తడం పూర్తిచేశాడు. రాముడు మౌనంగా ఉండటాన్ని పలుసార్లు రాజమ్మ అడిగినప్పటికీ ఏమి మాట్లాడకుండా మట్టిపని పూర్తిచేశాడు రాముడు. ఇంటికి వెళ్ళినప్పటికీ పార్వతమ్మ కన్నీళ్ళే గుర్తొస్తున్నాయి.

************

’రాముడూ… రాముడూ…’ పిలిచేతలికే ఉలిక్కిపడి ఆలోచనల నుంచి బయటకు వచ్చాడు రాముడు. తీరాచూస్తే పిలిచింది రాజమ్మ.

’ ఆ… అక్కా… దా…’ అని పిలిచాడు.

’చలమయ్య రాలేదా రాముడు?’ అని అడిగింది.

’మధ్యాహ్నం అన్నానికి వెళ్ళే ముందు వచ్చి వెళ్ళాడక్కా’ అని చెప్పాడు రాముడు.

’ఏం లేదయ్యా. లెక్కిస్తానన్నాడు. అందుకని ఈడికొచ్చినా.’

’ఇప్పుడు మళ్ళీ ఈడికొచ్చి వెళ్తాడక్కా…’

’అందుకోసమే ఈడికొచ్చినా, ఎవరెవరు పని చేస్తానరిక్కడ?’ అని అడిగింది రాజమ్మ.

’నేను, శీను మామ ఇద్దరమే అక్కా’ అని చెప్పాడు రాముడు

’ఏం అక్కా నువ్వు పనికి రాలేదా ఈరోజు?’ అని తిరిగి అడిగాడు రాముడు రాజమ్మను.

’నాకు ఈ రోజు పని పడిందయ్యా. నాకూతురును ఆసుపత్రికి తీసికెళ్ళాల. అందుకనే రాలేదు’ అని చెప్పింది రాజమ్మ.

’మరి పార్వతమ్మక్క కూడా రానట్టుంది కదక్కా’ అని అడిగాడు రాముడు. ఇలా అడగడంలో రెండు రకాల అర్థాలున్నాయి. ఆమె రానందుకు కారణం అడగడమే కాక, నిన్న జరిగిన సంఘటన గురించి ఆమెకేమైన తెలుసేమో తెలుసుకోవాలనే ఆతృత.

’రాముడు. పార్వతమ్మ ఏడుస్తుండేది నువ్వు చూసినావంటగదయ్యా!’ అని నిన్న జరిగిన సంఘటనను ఆమే ప్రస్తావించింది. పార్వతమ్మ నిన్న ఏడ్చిందానికి కారణం ఆమెకు తెలిసివుంటుందని నిర్ణయానికొచ్చాడు రాముడు.

’అక్కా! నిన్నట్నించి ఏదో ఒక విధంగా ఉందక్కా. ఎప్పుడూ సరదాగా మాట్లాడే పార్వతమ్మక్క ఎందుకు ఏడ్చిందక్కా? నేను అడుగుదమన్నాగానీ, గిరన్న పొమ్మన్నట్లు మాట్లాడినాడు. ఏం జరిగిందో పార్వతమ్మక్కను అడగలేక, ఎవరికీ చెప్పలేక మనసంతా ఏదో గందర గోళంగా ఉంది. అసలు ఏం జరిగిందక్కా. బహుశా నీకు తెలిసే ఉంటుంది. చెప్పు.’ అని బతిమాలినట్లు అడిగాడు.

’నువ్వు ఏమేం ఊహించుకున్నింటావో అదే జరిగిందయ్యా. ఆనాకొడుకు ఆయమ్మిని పట్టుకున్నాడంటయ్యా. ఈ పనలకాడ ఇయన్నీ మామూలైపోయాయి. ఆనాకొడుకు మొకమైన చెడిపోయి, మూలబడిన లారికున్నట్లుంది. వాడికి ఆయమ్మి కావాలంట. బలంతం చేశాడంటా. అరుచ్చా, నా మొగుడికి చెబుతా అని చెప్పినా చాలా ఇబ్బంది పెట్టాడంటా. వాడు చూస్తే దున్నపోతు మాదిరుండే. ఈయమ్మి ఏమనగలదు. చివరకు ఏడ్చి, ఇడిపిచ్చుకొని బయటకొచ్చే ప్రయత్నం చేసింది. అప్పుడు మళ్ళీ వచ్చి, తప్పైపోయింది, కాళ్ళు పట్టుకుంటా… ఎవరికి చెప్పొద్దని బతిమిలాడినాడంట. అపుడే నువ్వు వెళ్ళినావు. చివరికి ఎవరికి చెప్పద్దని ఆయమ్మికి దన్నం పెట్టినాడట. వాని నోట్లో నామెట్టు పెట్ట. ఆనాబట్ట కొడుక్కు పెళ్ళాం ఉంది. ఆ పనికిమాలిన లం… కమల ఉంది. ఇంకా వేరేవాళ్ళు కావాలంట. మరి వాడు ఎంత పోతుమొగోడో మరి’ అని గిరిని నోటికొచ్చినట్లు తిడుతూనే ఉంది.

’అక్కా! వాడింత జేస్తే పార్వతమ్మక్క వాళ్ళమొగుడికి చెప్పలేదాక్కా?’ అని రాజమ్మను అడిగాడు రాముడు.

’ఆయమ్మి వాళ్ళ మొగుడితో చెప్తే లేనిపోని తలనొప్పి నాయినా. ఆయమ్మి మొగుడు తాగుబోతు, మెంటల్ నాకొడుకు. వానికి తెలిస్తే వాడు ఏమైనా చేస్తాడు. వాడు ఎంతకైనా తెగించే మనిషి. వాళ్ళు మా ఇంటికాడ్నే ఉండేది. నాకు అయిదు సంవత్సరాల్నుంచి తెలుసు. ఒక సారి మా వీధిలో నీళ్ళకాడ ఒకడు ఆయమ్మీతో ఏదో జాంతానమాడినాడని వాడితో గొడవపడి, కట్టెతో వాడి తలపగలగొట్టాడు. అది కేసయ్యి పెద్ద తలనొప్పైంది. ఆయమ్మి పని చెయ్యకపోతే ఇంట్లో జరగని పరిస్థితి.’ అని చెప్పింది.

’మరి నిన్న జరిగిన విషయం నీకెవరు చెప్పారక్కా?’ అని రాముడు అడిగాడు.

’ఆయమ్మే చెప్పిందయ్యా. ఇంకా చాలా ఇబ్బందులు పడిందయ్యా ఆయమ్మి. ఇంతకు ముందు ఆయమ్మి కర్రి నారాయణ దగ్గర పని చేస్తుండేది. ఆడొక బేల్దారి… మాట్లాడితే ఈయమ్మితో జాంతానం ఆడేవాడంట. ఒక రోజు ఆయమ్మి ఆ బేల్దార్ని గదురుకునే సరికే వాడు ఆయమ్మికి బరువు పనులు చెప్పావాడంట. ఆయమ్మికి మూడొ నెలప్పుడు ఇంట్లో కష్టంగా ఉంటే పనికి పోయింది. అప్పుడు కర్రినారాయణ దగ్గర రాతి కట్టుడు పని ఉన్నింది. వాడు కావాలని ఆయమ్మితో పెద్దపెద్ద రాళ్ళు ఎత్తించాడు. ఆయమ్మి ఆబరువులు మోసెతలికే కడుపు పోయింది.’ వాడి పోడు తట్టుకోలేక ఆడపని మానేసింది. నాలుగు రోజులు ఇంటికాడుండి మల్లా ఈ చలమయ్య దగ్గరకొచ్చింది. మీ తాత చలమయ్య ఏం తక్కువోడు కాదయ్యా. ఒట్టి పనికిమాలినోడు. అన్ని తెలుసు. ఏం చెయ్యాల. గతిలేక పనికొచ్చానం.’ అని చెప్పింది రాజమ్మ రాముడికి.

ఇది విన్న రాముడు ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు. ’నాకు చాలా మంది బేల్దార్లు తెలుసు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఇక్కడ కూడా కొంత మందిపైన చాలా గౌరవం ఉంది. కానీ బేల్దారి పని దగ్గర కొందరు బేల్దార్లు ఇంత ఘోరంగా ఉంటారా’ అని మనసులోనే తిట్టుకున్నాడు. ఇంతలో రాజమ్మ ’అయ్యా నీకు ఈ విషయం చెప్పడానికి ఒకే కారణం ఉందయ్యా. నువ్వు ఈ విషయాన్ని ఎవరికకీ చెప్పొద్దయ్యా. పార్వతమ్మ నాతో ఈ మాటే నీతో చెప్పమనిందయ్యా. ఎవరికన్నా తెలిస్తే పరువు పోతుందయ్యా. ముఖ్యంగా ఆయమ్మి మొగిడికి తెలిస్తే లేనిపోని తలనొప్పి. నీకు దండం పెడతా ఎవరితో చెప్పాకు. రేపట్నుంచి నేను పని చేసేకాడికి ఆయమ్మిని వెంట పెట్టకపోతా’ అని రాముడితో విన్నవించుకొన్నట్లు చెప్పింది.

ఈ మాటలు విన్న రాముడి ఏం మాట్లాడాలో తెలీక ’సరే అక్కా నువ్వు చెప్పావు గదా. వారం తరువాత నా కాలేజి తెరుస్తారు. తరువాత నేను ఎలాగు ఈ పనికి రాను. నాకేం పనక్కా చెప్పడానికి. పొరపాటున కూడా ఎవరికి చెప్పను’ అని రాజమ్మతో రాముడు చెప్పాడు. ’సరే చలమయ్య వచ్చేటట్టులేడు. వచ్చే నేను వచ్చిన్నానని చెప్పు’ అని చెప్పి వెళ్ళింది. ఆమె వెళ్తూ ఉంటే ఆమె వంకే చూస్తూ ఉన్నాడు రాముడు. ’కష్టం, ఓర్పు, బాధను దిగమింగి నడుస్తున్న ధరిత్రీలాగా’ కనిపించింది రాజమ్మ రాముడికి. ’ఈ పనిలో ఇంత ఇబ్బందుంటుందా! బేల్దార్లు కూలికే పనికి వస్తున్నారు. ఆడోళ్ళు కూలి కోసమే పనికి వస్తున్నారు. కానీ మరి మగాళ్ళు ఆడవాళ్ళను ఎందుకు ఇంత హింస పెడుతున్నారు. ఎందుకు మృగాళ్ళుగా ప్రవర్తిస్తున్నారు! అని పలువిధాలైన ఆలోచనలు చేస్తుకుచ్చున్నాడు రాముడు. ఒకవేళ తన వాళ్ళు పనికి వచ్చినా ఇలాగే ప్రవర్తిస్తారా? ఆ ఆలోచన రాగానే ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది రాముడికి. ఛ! ఇలాంటి ఆలోచనలొస్తున్నాయేమిటి? అనుకొన్నాడు. దీని గురించి ఆలోచిస్తూ అలాగే కూర్చుండి పోయాడు రాముడు. గిరిలాంటి వాళ్ళు పరాయి ఆడమనిషి గురించి చెడుగా తలుచుకుంటేనే వణుకుపుట్టేలా చేయాలి. అదే సరైన పరిష్కారం అని మనసులో అనుకున్నాడు రాముడు.

**************

 

జి. వెంకట రామయ్య

జి. వెంకట రామయ్య