25వ క్లోను స్వగతం

damu
నా రాత్రికి దుఃఖమూ లేదు సంతోషమూ లేదు
నా చీకటికి మార్మికతా లేదు నిగూఢతా లేదు
నేను నియోహ్యూమన్ వుద్వేగ రహితుడ్ని
దేనికీ తగలకుండా జీవితం గుండా ప్రవహిస్తాను
నాకు భద్రతా లేదు స్వేచ్చయునూ తెలియదు
25 జీవితాలుగా మృత్యువు నన్ను మరచిపోయింది
జ్ఞాపకాలు మరణించాయి వూహలు మొలవలేదు
కోపమూ లేదు తాపమూ తాకదు
వేలాది దినాల విభిన్నత తెలీని కాలము
నాలోకి తిరిగి తిరిగీ కరుగుతోంది
ఈ విశ్వమే నాకు ద్రోహం చేసింది
నా స్వీయ నిరంతర పునఃసృష్టి లోకి కుదించుకు పోయాక
స్వీయ సంభాషణా స్వగతాల్లోకి మౌనాన్ని దిగ్గోట్టాక
సకల మానవ జ్ఞానం నుండి నన్ను నేను రక్షించుకున్నాక
ప్రేమా లేదు అసహ్యమూ లేదు
సానుకూలతా లేదు ప్రతికూలతా రాదు
Picasso7
నేను కాలానికి ఆవల నివసిస్తున్నాను
కొన్ని క్లోనుల కాలంలో కొన్ని క్లోనుల దూరంలో
జీవితము మొదలవలేదు జీవితము అంతమవలేదు
జననమూ లేని మరణమూ లేని
జీవించిందే జీవించిందే జీవించిందే జీవించిందే జీవిస్తున్న
యెడతెగని అనాసక్తి లోకి కూరుకుపోయాను
నా స్థలమూ కాలమూ నేనే
నాకు బయట చూచేందుకూ వినేందుకూ యేమీ లేదు
అర్ధరహిత శూన్యం లోకి పునర్జన్మిస్తూ వస్తున్నానో పోతున్నానో-
యుధ్ధం చేయటానికి నేనూ ఇతరులూ లేని వొక గ్రహమేదో నన్ను
మింగేసిందా?
అమ్మటమూ కొనటమూ మాత్రమే మిగిలిన
ఆనందమే దారి, గమ్యమూ అయిన మనుషుల నుండి
విముక్తి లోకి దిగబడి 25 క్లోనుల కాలం అయిందా
యిప్పుడేదో తిరోగమనాన్ని కాంక్షిస్తున్నానే
మానవలక్షణాల లక్షలాది క్షణాలు మరణించాక కూడా
లోపల్లోపల్లోపల్లోపలెక్కడో మనిషి వాసన మరుగుతుందే
–దాము