ఒక్కో అక్షరానికి ఓ నెత్తుటి బొట్టూ ఇచ్చి…

02

– డా.పి.బి.డి.వి.ప్రసాద్ 

~

 

                      వృద్ధజగతి సమాధిపై సమధర్మం ప్రభవించును

                       నిద్దుల చీకటి వెలుపల వేకువ మెళకువ పుట్టును   

                                                                                                                                                    – ఆవంత్స సోమసుందర్

 

నిన్నటికి నిన్న ప్రసాదమూర్తి కవిత్వానికి ఆవంత్స సోమసుందర్ పురస్కారం లభించటం కవిత్వాభిమానులందరికీ సంతోషం కలిగించిన విషయం. శారీరకంగా దాదాపు తొంభై సంవత్సరాలు పైబడిన పితామహుడు, అనేకానేక కవిత్వ పంథాలధిగమించిన సాహితీ పరిణిత మనస్కుడు. మడిగట్టుకుని కూర్చుని పక్వాన్నాలు మాత్రమే భుజింపక కాలంతో నడిచిన సాహిత్య యుక్త వయస్కుడు శ్రీ ఆవంత్స .  ‘పూలండోయ్ పూలు’ ఆయన వయస్సును తగ్గించేసింది. మైమరచిపోయి త్రుళ్ళింతలతో కేరింతలతో ఆ సాహిత్య విహారం చేసి, సమీక్ష పేరిట ఏరిన పూలతో పెద్ద దండే కట్టేసి ప్రసాద మూర్తిని, కవిత్వాన్ని పాఠకులతో కలిపి అలంకరించాడాయన. ఈ పురస్కారంతో చక్కటి చిక్కటి కవిత్వాన్ని వర్థిల్లమని ఓ పెద్ద మనసు దీవించినట్లయ్యింది. కవిత్వానికి ప్రసాదమూర్తి పుష్పాభిషేకం చేస్తే, అదే కవిత్వానికి నేటికి నేడు 2015కి  ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం ప్రకటించటం సాహిత్యానికి మూర్దాభిషేకం చేసినట్లయ్యింది.

‘పూలండోయ్ పూలు’ ప్రసాదమూర్తి నాలుగో కవితాసంపుటి. వీటికన్నా ముందు ప్రసాదమూర్తి పద్యకవి. సాహిత్యాభిమానంతోనే ఓరియంటల్ కాలేజీలో చేరిన వాడవ్వటం చేతనూ, సంస్కృతాంధ్ర ప్రాచీన కావ్యాలను అధ్యయనం చేయడంతోనూ చదువుకుంటున్న రాయప్రోలు, కృష్ణశాస్త్రి, శేషేంద్ర, జాషువ, కరుణశ్రీ ల ప్రభావంతో, భావ కవితా పోకడలతో పుంఖానుపుంఖాలుగా పద్యాలు, ప్రేయసీ శతకాలు మోజుకొద్దీ అవధానాలు చేస్తున్న వాణ్ణి శ్రీశ్రీ కవిత్వం..వామపక్ష భావజాలం పూర్తిగా మార్చేసింది. బాల్య స్నేహితుడు  కూనపరాజు కుమార్ పరిచయంతో విశ్వసాహిత్యపు వినువీధుల్లో విహరించే అదృష్టం దక్కింది.  శ్రీశ్రీని చలాన్ని వామపక్షాలను అభిమానంగా చూస్తూ చదువంటే ఆసక్తి చూపని అమ్మానాన్నలకు సర్ది చెప్పి ఆంధ్రా యూనివర్సిటీలో అడుగుపెట్టాడు. విశాఖ సౌందర్యం కవిత్వ పిపాసను మరింత పెంచింది.

విశాఖ సముద్రం, విశ్వవిద్యాలయంలో గుబురుగా పెరిగిన జీడిమామిడి చెట్లు, రాకాసి లైబ్రరీ, విశాలంధ్ర పుస్తకాలు, అత్తలూరు మాస్టారు, శిఖామణి, గాలినాసరరెడ్డి, రాజేశ్వరి, పిబిడివి ప్రసాద్, జగధాత్రి లాంటి సాహిత్య ప్రేమికుల సావాసాలు విశాఖలోనూ, కేంపస్ లోనూ చాలా తరచుగా కనపడే కారామాస్టారు, రావిశాస్త్రి, చందూగార్లు, ప్రక్కనే భీమిలి బీచ్ లో తడియారని చలం అడుగుజాడలు, యారాడ కొండ లైట్ హౌస్ వెలుగులు, మహారాణిపేట హాస్టల్ డౌన్ లో బీట్లు, శిఖామణి ప్రమూలను ఎంత శాసించాయో, ఏమి ఆశించాయో, మరేది ఆదేశించాయో తెలియదు గాని వీళ్ళిద్దరు కవిత్వాన్నే శ్వాసించటం మొదలుపెట్టారు. చిన్నాచితకా పత్రికలతో పాటు భారతి పత్రికలో చోటు సంపాదించారు.

భావజాలాన్ని కలానికి మాత్రమే పట్టించక తలకు కూడ ఎక్కించుకున్నవాడు కనుక ప్రసాదమూర్తి ఈ మధ్య కాలంలో బాగానే యుద్ధం చేశాడు. ఎంతో మందిని ఎదుర్కొని రాజేశ్వరిని కులాంతర వివాహం చేసుకోవటం. బీహార్ ప్రవాసాంధ్రోద్యోగ జీవితం గడపటం మార్క్సిజం కన్నా లోతైన అంబేద్కరిజం వైపు వచ్చి దళితవాదపు జండాను సమర్థిస్తూ ఎగరేయటం ఈ హీరోయిజాలన్నీ ప్రసాదమూర్తిలోని సహజాతమైన కవిత్వాన్ని సిద్ధాంత నిబిడీకృతం చేశాయి.

ఈ సందర్భంలో తాతకోనూలు పోగు కవిత గురించి చెప్పుకోవాలి. పత్రికలో ప్రచురితమైన ఈ కవిత ఎంతో మంది సాహిత్య విమర్శకుల నాకట్టుకొంది.  తెలుగు సాహిత్యంలో దళితవాద స్త్రీవాద అల్పసంఖ్యాక బహుజన వర్గాల సంఘర్షణల  అంతస్సూత్రాన్ని తీసుకుని, కవిత్వ వర్ణాలు అద్ది, కలనేసి, పడుగుపేకల మధ్య తల్లడిల్లతూ, గోతుల మధ్య మగ్గుతున్న తరాల నాటి దైన్యానికి కప్పిన వస్త్రం ప్రసాదమూర్తి తొలి కవితా సంపుటి కలనేత. అది 1999లో వచ్చింది.

DSC_0593

గుండెకి ఒక కొస నిప్పంటించుకుని

ఒక అక్షరానికి ఓ కన్నీటిచుక్క

ఒక అక్షరానికి ఓ నెత్తుటి బొట్టూ ఇచ్చి – ఒక వేదనగా మొదలై ప్రశ్నిస్తూ, సమాయత్తం చేస్తూ సమైక్య పరుస్తూ  కవిత్వపు రెపరెపలతో కలనేత వర్ణాలు ద్విగుణీకృతమయ్యాయి. సినారె, గోపి, శివారెడ్డి మొదలైన ప్రముఖుల ప్రశంసలే కాదు ఎందరో సాహితీ హితులను కలనేత ప్రసాదమూర్తికి సంపాదించిపెట్టింది.

తర్వాత ప్రమూ రెండో కవితా సంపుటి వెలువడటానికి మధ్య గల అంతరంలో మరో సంపుటి వచ్చి ఉండాల్సింది అని శివారెడ్డిగారు లాంటి కవులూ కవిత్వాభిమానులు అభిప్రాయపడినా, ఈ సమయంలో దళితవాద దృక్పథంతో వచ్చిన సాహిత్యాధ్యయనం చేసి దళిత కవిత్వం  మీద సిద్ధాంత గ్రంథం రాసి డాక్టరేట్ అందుకోవటం విశేషం. కారంచేడు ఘటన తర్వాత సుమారు పదేళ్ళు తెలుగునాట భూకంపం పుట్టించిన దళిత కవిత్వం మీద ప్రసాదమూర్తి రాసిన సిద్ధాంత గ్రంథం త్వరలో పుస్తక రూపంలో రాబోతోంది.

అధ్యయన అధ్యాపకత్వాల వ్యాపకత్వంతో అంతరాయాలేర్పడుతున్నప్పటికినీ, తన కవితా చలమల నుండి పెల్లుబుకుతున్న కవనధారలను కట్టడి చేసుకుంటూ కొంతకాలం పత్రికలకే పరిమితమైనా.. నిదానంగా మెత్తగా బత్తాయిపండు తొనలు విప్పినట్లు కవిత్వమూటని విప్పి వెలుగే కాని చీకటి లేని మాటలతో మాట్లాడుకోవాలన్నాడు.

అట్లా ఆవిష్కరించిన ‘మాట్లాడుకోవాలి’ కవిత్వం మాట్లాడుతూనే అంతరాంతరాల్లోకి చొచ్చుకుపోతూ మనిషి మనిషికి మధ్య విస్తరించిన కారడవిలాంటి మౌనాన్ని చేధించింది. అగ్రరాజ్యాల నుండి సగటు మనిషి హృదయ సామ్రాజ్యం వరకు కొనసాగుతున్న దమన నీతులను నిరసించింది. 2007లో తీసుకొచ్చిన ఈ కావ్యం శివారెడ్డి అద్భతమైన ముందు మాటతో తెలుగు కవితా ప్రపంచంలో దుమ్ము రేపింది. ప్రసాదమూర్తిలో మరింత రాటుదేలిన వస్తుశిల్పాల ఐక్యతను ఈ సంకలనం చాటిచెప్పింది. ఎంత గంభీరమైన  సామాజికాంశమైనా దాన్ని కవిత్వం చేయడంలో ప్రసాదమూర్తి సాధించిన నేర్పును ఈ పుస్తకం పాఠకలోకానికి పరిచయం చేసింది. క్రమంగా ప్రసాదమూర్తి అభిమానుల ప్రపంచం కూడా విస్తరించింది.

కవిత్వమే ఊపిరైన తన ప్రవృత్తికి ఆటంకంగా మారిన ఉద్యోగానికి స్వస్తి చెప్పి జరుగుతున్న జగన్నాటకాన్ని చాలా దగ్గరుండి చూసే మీడియాలోకి వచ్చి అనివార్యంగా స్పందించే దినచర్యగా మారిన జీవితాన్ని అక్షరమయం రసవత్కవితామయం చేసుకున్నాడు ప్రసాదమూర్తి. అరుంధతీరాయ్ లాంటి  ఆధునిక విశ్లేషకులను  చదవటంతో సమస్య మూలాల్లోకి వెళ్ళే దారి దొరికింది. దాంతో తనలో ఎప్పటికప్పుడు తాజాగా ఉబుకుతున్న కవిత్వానికి ఏ రూపం ఇవ్వాలో తెలిసొచ్చింది. అది ముచ్చటగా మూడో సంపుటమై 2010లో   ‘నాన్న చెట్టు’ గా రూపం దాల్చింది.

ఈ పుస్తకానికే నూతలపాటి గంగాధరం సాహితీ పురస్కారం లభించింది. అంతే కాదు. 2012లో ఢిల్లీ తెలుగు అకాడెమీ సాహితీ పురస్కారం కూడా అందుకున్నాడు ప్రసాదమూర్తి. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. అంతలోనే  రెట్టించిన ఉత్సాహంతో ‘కవి నిద్రపోతాడా? నిద్రను కలలకు కాపలా పెడతాడు’ అంటూ మరింత నిబద్ధతతో వెలయించిన కవిత్వమే ‘పూలండోయ్ పూలు’. ఇందులో భావోహల మీదే కవిత్వాన్ని తిప్పుతూ కేవలం పూలవనాన్నే చూపించలేదు. రంగుల కలే సృష్టించలేదు. కవిగా తన భుజాల మీద కెత్తుకున్న సామాజికి బాధ్యతను నెరవేర్చే ప్రయత్నమే చేసాడు.

ఎంత సీరియస్ విషయాన్ని అయినా అసలు సిసలు కవిత్వం చేసే రసవిద్యను ప్రసాదమూర్తి పూర్తిగా సాధించాడని చెప్పడానికి పూలండోయ పూలు కావ్యం ఉదాహరణగా నిలుస్తుంది.  చదివిన వాళ్ళ విన్నవాళ్ళ గుండెల నిండా పూలజల్లు కురిపించే శీర్షిక కవిత పూలండోయ్ పూలు తలచుకుంటేనే సుగంధాన్ని వ్యాపింపజేసే కవిత.  కాగా.

‘హృదయం దొర్లుకుంటూ

ఏ లోయల్లోకో జారిపోయే’ టట్లు చేసే దయామయి. రైల్వేష్టేషనో గుడో ఏ మెట్ల మీంచో మనుషుల్ని రుతువుల్ని కదలని కనురెప్పల మధ్య నుంచి కనికరంగా చూస్తుంటుంది.

పాలకుల నిర్లిప్తతకు చురక అంగన్ వాడీల మీద రాసిన ‘సమరాంగనవాడి’. కొంగు నడుముకు చుట్టడమే కాదు. అవసరమైతే అసెంబ్లీ గొంతు చుట్టూ బిగించగలరనే హెచ్చరికని స్పష్టం చేస్తుంది. విడిపోయిన రెండు ప్రాంతాల మనుష్యుల్ని ఇక ప్రేమించుకుందాం  అంటూ మనసుల్లోంచి సమైక్య సంగీతం ఆలపిస్తూ అనటం ఒక సౌహార్ధ్రభావం.

ఇలా అనుభవించి పులకరించి పలవరించుకుంటూ, ప్రతి కవితనూ ఎంతైనా పరామర్శించుకోవచ్చు. ప్రసాదమూర్తి తనదైన శైలిని నిర్మించుకుంటూ మరింత పదునైన కవిత్వంతో ముందుకు వెళుతున్నాడని నిజాయితీగా ఎవరైనా ఇప్పుడు ఒప్పుకుంటారు.  రానున్న కవితా సంపుటి అందుకు పూర్తి తార్కాణగా నిలుస్తుందని ధీమాగా చెప్పొచ్చు.

కవిత్వరూపమే తానై నిత్యం తనని సమాజాన్ని ఆవిష్కరించుకుంటూ సాహిత్యయానం చేస్తున్న వానికి పురస్కారాలు కొలమానాలు కాదు కాని.. అతడు ఎంత దూరం వచ్చాడో ఏమి సాధించాడో ప్రజలు గుర్తించగలగడానికి అవి సాక్ష్యాలుగా నిలుస్తాయి.

ప్రతిష్టాత్మకమైన ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం  ‘పూలండోయ్ పూలు’ కవిత్వాన్ని మరింత పరిమళభరితం చేయటమే కాక నిఖార్సయిన కవిత్వానికి మెరుగులద్దినట్లయ్యింది.

*