అ~దృశ్యం 

 

Art: Wajda Khan

Art: Wajda Khan

 

నిజంగా యిక్కడ ఎవరూ లేరు

కొండల్లో, లోయల్లో , గుహల్లో అంతటా వెతుకుతావు

ఎక్కడో ఓ చోట ఆనవాలైనా వుంటుందని

తడితగలక  దాహంతో  ఎదురుచూస్తున్న

నేలకి సర్దిచెప్పాలనుకుంటావు

 

చివరి అంచులో నిలబడి ప్రార్ధించి అలసిపోతావు

ఆకాశం సమస్తలోకాన్ని పాలిస్తుందని

సముద్రాలు ఎడారుల్లో యింకిపోయాయని దుఃఖిస్తావు

అందనంత దూరంలో గూడు కనిపించి కనుమరుగై

దారి తెలియక, వెతకలేక  విసిగి వేసారి వెళ్ళిపోతావు

 

జలపాతాలహోరు , .. తుంపర్ల తడి ఆత్మ చుట్టూ!

‘భిక్షాం దేహి’ అనే శబ్దమై వీధుల్లో విరాగివై తిరుగుతావు

దొరికినవన్నీ నీవికావని నిర్దారించి వెలివేసి

లోలోపలకి తిరిగి చూడకుండా పరిగెడతావు

 

నువ్వొక బిక్ష పాత్రవై , ఎండిన మెతుకులై

చినిగి చీకిన దేహపు వస్త్రమై

ఎగిరిపోయిన పూలలో, రాలిన ఆకుల్లో

ఎడారి రాత్రుళ్ళలో, కాంక్షాల్లో, ఆంక్షల్లో

పరావర్తించని చీకటి రేఖవై ,ప్రతిధ్వనించలేని శబ్దానివై

నిలవలేక ,నిలువరించలేక  వీగిపోతావు

*