బువ్వగాడు

కాశిరాజు

కాశిరాజు

“ఒలేయ్ ఆడికి అన్నమెట్టు” అన్నప్పుడల్లా
నాకు ఆకలేయదేందుకు ?
అన్నమంటే అమ్మా, నాన్నే అనిపిస్తుందెందుకు!

ఒరేయ్ బువ్వగా
ఇంతకుముందెప్పుడో ఇలాగే  అన్నం తింటన్నప్పుడు
రొయ్యల సెరువు కోసం ఇసకలంకని ఎవరికో ఇచ్చేసారని
కంచంలో కూడు అలాగే వొదిలి పరిగెట్టినపుడు
నీకూడా నేనొచ్చుండాల్సింది
ఆపూట నువ్వొదిలెల్లిన కూడు తినకుండా
నువ్వు తిన్న దెబ్బలని నేను కూడా తినుండాల్సింది.
నీ ఒళ్ళు సూత్తే నేతొక్కి తిరిగిన నేలలాగే ఉంది
ఒరేయ్ మట్టంటుకున్నోడా మురికి నిన్ను వదలదేరా

****
ఇంకోసారి
ఒలేయ్ ఆడికి అన్నమెట్టని
కాళ్ళు కడుక్కుని కంచంముందు కుచ్చున్నావు
కాపుగారు పిలిచారనీ
వారం రోజుల్లో పెల్లుందనగా
పదిరోజుల ముందెళ్ళి పందిరేసావ్
విందులో సందడికి నోచుకోక విస్తళ్ళు తీసావ్
ఒరేయ్ ఆకలిదాచుకు నవ్వేవాడా
అందరూ నీకు బందువులేరా !

la
****
మరోసారి
శీతాకాలం పొద్దున్నపూట సూరీడుకంటే ముందులెగిసి
ఒలేయ్ ఆడికి అన్నమెట్టని
నువ్వేమో కొరికిన ఉల్లిపాయ్ అలాగే వొదిలి
సద్దన్నం సకం కొల్లకేసి
పంచినుంచి రుమాలకి , రుమాలనుంచి గోసీకి మారి
శ్రమని చేలో చల్లడానికెల్లావ్
ఆ పూట నా బాక్సులో రొయ్యల గోంగూర బడికట్టికెల్లకుండా బండాడ దిబ్బకి తెవాల్సింది
ఒరేయ్ చేనుకు నీరైనోడా ! నువ్ చల్లిన మెతుకులే మొలుస్తున్నాయ్

****
బెమ్మోత్సవాలపుడు
మళ్ళీ ఒలేయ్ ఆడికి అన్నమెట్టని
అమ్మోచ్చేలోపే రధానికి రంగులేయడానికెల్లావ్
చెక్రాలు సుబ్బరంగా  తుడిసి, సీలల్లో నూనె పోసావ్
బగమంతుడు బద్దకిస్తాడని రధాన్ని నువ్వేలాగావ్
బతుకంతా మెతుక్కిమొకమాసినా బాగవంతుడుకంటే  గొప్పయ్యావ్

ఒరేయ్ బువ్వగా!
గెడ్డం మాసిన సూరీడా
బతుకంటే మెతుకులేనా?
అన్నమంటే  అమ్మా, నాన్నేనా
అన్నం ముందు కుచ్చుంటే
కంచం నిండినా , నువ్వు గుర్తొచ్చాకే కడుపునిండేది.

(నా బతుక్కీ , నా మెతుక్కీ, నా బంగారానికి , అంటే మా నానకి )

-కాశి రాజు

చిత్ర రచన: ఏలే లక్ష్మణ్