మాటల రంగు వేరు…చేతల రంగు వేరు..!

డా .నీరజ అమరవాది

      neeraja  నీలాకాశంలో నల్లటి మబ్బుల మధ్య నిండు చందమామని చూపిస్తూ అమ్మ గోరుముద్దలు తినిపిస్తుంటే , నలుపూ , తెలుపుల కలనేత ఎంత బాగుందో అనిపించింది .

          పంతులుగారు నల్లబల్లమీద ముత్యాలలాంటి అక్షరాలతో బోధిస్తుంటే అజ్ఞాన తిమిరాలు తొలగి , విజ్ఞాన కిరణాలు సోకినట్లనిపించింది .

        తెల్లటి కాగితం పై నల్లటి అక్షరాలతో పరీక్ష రాస్తున్నప్పుడు నలుపంటే  విజయం అనుకున్నాను .

గురజాడని చదువుకున్న తర్వాత   మంచి చెడులు రెండె జాతులు ఎంచి చూడగ అని తెలుసుకున్నాను .

     21 వ శతాబ్దంలో నాయకుల అభిలాషలు సాకారం అయి కులాతీత , మతాతీత , వర్ణరహిత అంతర్జాతీయ సమాజంలో నివసిస్తున్నందుకు గర్వపడ్డాను .

        జాతివివక్షలు ఆనాడే తొలగిపోయాయి . నల్లజాతీయులు , తెల్లజాతీయులతో సోదరులలాగా కలసిమెలసి జీవిస్తున్నారని శ్వేతసౌధం సాక్షిగా నమ్మాను . మానవత్వమే నిజమైన జాతి అనుకున్నాను .

        ఐక్యరాజ్యసమితి సైతం అక్షరాస్యత , పేదరిక నిర్మూలనతో పాటు జాతి వివక్ష , జాత్యహంకార భావజాలాన్ని తుదముట్టించేందుకు నడుం బిగించి ఎజెండాలు తయారుచేసింది .

            నిరాడంబరమైన జీవితం , ఉన్నతమైన ఆలోచనలే మనిషిని మనీషి గా చేసే లక్షణం అంటూ జాతిపితలు సెలవిచ్చారు . వారి అడుగుజాడలే శిరోధార్యంగా , గాంధీ జయంతులను జరుపుకుంటూ , అహింసా సిద్ధాంతాలను మననం చేసుకుంటూ , గాంధీ టోపీలను పెట్టుకుంటూ , గాంధీ జోడును , కర్రను  స్వచ్ఛతకు , స్వేచ్ఛకు చిహ్నాలుగా అంతర్జాతీయ సమాజం భావిస్తూ , గౌరవిస్తోంది .

            ఇన్ని భావనల మధ్య పెద్దన్న సమక్షంలో  ఒక నల్ల జాతీయుడిని , శ్వేతజాతి పోలీసులు కేవలం కళ్లల్లో కళ్లు పెట్టి చూసినందుకు , అమానుషంగా , సంకెళ్లు బిగించి రఫ్ రైడ్ లతో పాశవికంగా ఈడ్చుకెళ్లి , వెన్ను విరగ్గొట్టి , ప్రాణాలను హరించి , మృగరాజులా మీసం దువ్వుకున్నారు . అధికారులు వంతపాడారు .

     రక్షకభటుల దుస్తులతో పాటు అంతరంగం కూడా నల్లనిదే అని శ్వేతజాతి పోలీసులు తమ చర్యలతో చెప్పకనే చెప్పినట్లు చూపారు .

        చర్మపు రంగు ఆధారంగా , సాటి సోదరుని పై జాత్యహంకార బలుపును  ప్రదర్శించిన భక్షక భటులను అందరూ ఉలిక్కిపడి చూస్తున్నారు . తమ అస్తిత్వాన్ని ప్రశ్నించుకుంటున్నారు .

            మనిషి ప్రవర్తన , ఆలోచనా విధానం చర్మపురంగుతో ముడిపడి ఉంటుందేమో అని పరిశోధనలు చేయాల్సిన సమయం వచ్చింది .

             మాటలలో ఒక రంగును , చేతలలో మరొక రంగును చూపే నాయకులారా ! ఇది రంగుల ప్రపంచం అని మళ్లీ మళ్లీ నిరూపించబడింది .

                                      *

 

 

జీవితానుభవాలే కథలు

కథలు ఎలా రాయాలి అనే ప్రశ్నకు కారా గారి కథల నుండి సమాధానం

 

ఒజ్జ పంక్తి

photo(2)జీవితానుభవం నుండి జాలువారే సృజనానుభవం కథగా రూపుదిద్దుకుంటుంది. కవి కూడా ఋషిలాగా క్రాంతదర్శనం చేసి, సమాజంలో రాబోయే పరిణామాలను ముందుగానే ఊహించి, వాటిని కథలలో పొందుపరుస్తాడు. మార్పు వలన కలిగే కష్టనష్టాలపై ముందుగానే హెచ్చరించే  ‘సాహితీ పోలీస్’  రచయిత . ఈ లక్షణాలన్నీ కారా మాస్టారి కథలకు వర్తిస్తుంది. తెలుగు కథకు మారుపేరైన ‘యజ్ఞం’  కథ నుండి ఆయన కలం నుండి రూపుదిద్దుకున్న ప్రతి కథలోనూ, సమాజంలోని భిన్న పార్శ్వాలను ‘మల్టీవిటమిన్ టాబ్లెట్’ లాగా పఠితలకు అందించారు. రంగురాయిలా కనబడే కథావస్తువును ‘కారా’ తన శిల్పనైపుణ్యంతో పాలిష్ చేసిన రత్నంలాగా మలచి కథాత్మకంగా తయారుచేశారు .

చిన్నతనంలో గుంట ఓనమాలు దిద్దుతూ అక్షరాలను నేర్చుకుంటాము. అలాగే కథలు రాయాలనుకునే వారికి ‘కారా మాస్టారి’ కథలు గుంట ఓనమాలుగా  ఉపయోగపడతాయి. కమండలంలో  సాగరాన్ని బంధించినట్లుగా పెద్ద నవలలు చేయలేని పనిని ‘ సామాజికస్పృహ’  కలిగిన కారా కథలు/ కథానికలు  చేశాయి. పదాడంబరం లేని శైలితో , దిగువ , మధ్య తరగతి సమస్యల నేపధ్యంగా రాసిన కారా కథలు సమాజంపై బులెట్ల  లాగా పేలాయి. రచయితలను, పఠితలను ఆలోచింప చేశాయి. అనుసరించేటట్లు చేశాయి. వర్థమాన రచయితలకు నిఘంటువుగా నిలిచాయి. రాస్తే కథానికలే రాయాలి అన్నంత స్ఫూర్తిని నింపాయి.

స్వచ్ఛత, స్వేచ్ఛ, నిరాడంబరత, భవిష్యత్ దర్శనం అనేవి కారా కథల ప్రత్యేకత. ఈనాటి సమాజ స్వరూపాన్ని 50 సంవత్సరాల ముందే  ‘టైం మిషన్’ లో చూపినట్లుగా ఆయన కథలలో మనకి చూపించారు.  కాళీపట్నం రామారావు మాస్టారు ఒక ప్రాంతానికి, వర్గానికి, భావజాలానికి ప్రతినిధి అయ్యి కూడా కలంలో బలం, నిబద్ధత, నిమగ్నతలతో ఆయన చేసిన సాహితీసేవ ‘కేంద్ర సాహితీ అకాడమీ  పురస్కారాన్ని’  పొందేట్లు చేసింది. సమాజం పట్ల రచయితలకు గల గురుతర బాధ్యతలను తెలుసుకొని ,  ‘కారా‘  కథలను ఒజ్జ పంక్తిగా  చేసుకొని కలం పట్టే రచయితలు స్వాతి ముత్యం లాంటి అచ్చ తెలుగు కథా సాహిత్యాన్ని సృష్టించగలుగుతారు. అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకోగలుగుతారు.

డా. నీరజ అమరవాది .