గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ – 5

[  Anne Of Green Gables By L.M.Montgomery ]

anne5ఆన్, మెరిల్లా కలిసి గుర్రం బండి లో వెళ్తున్నారు. ఆన్ రహస్యం చెబుతున్నట్లు అంది- ” ఇలా వెళ్ళటాన్ని ఆస్వాదించాలని నిర్ణయించుకున్నానండీ. నాకు తెలిసీ… గట్టిగా అనుకుంటే , ఇంచుమించు ఏదైనా బావుందనిపిస్తుంది.  గట్టి..గా అనుకోవాలంతే. ఈ షికారు అయాక మళ్ళీ అనాథాశ్రమానికి వెళ్ళిపోవాలని గుర్తు చేసుకోదల్చుకోలేదు నేను…ఈ షికారు గురించి మటుకే ఆలోచిస్తా. అరె ! చూడండి, అడవి రోజా పువ్వు పూసింది అప్పుడే, ఎంత ముద్దు గా ఉందో కదా ! రోజా పువ్వుగా ఉండటం ఎంత బావుంటుందో ! రోజా పూలకి మాటలొస్తే మనకి భలే ఉంటుంది కదా … అవి మనకి మంచి మంచి కబుర్లు చెబుతాయి. పింక్ రంగు మనోహరంగా ఉంటుంది కదండీ  ? నాకెంతో ఇష్టం, కాని నాకు బావుండదు. ఎర్ర  జుట్టు ఉన్నవాళ్ళు ఊహల్లో కూడా పింక్ రంగు బట్టలు వేసుకోలేరు.  అవునండీ, చిన్నప్పుడు ఎర్ర జుట్టు ఉండి పెద్దయాక అది వేరే రంగుకి మారటం చూశారా మీరెప్పుడైనా ? ”

” ఊహూ.లేదు. నీ జుట్టు రంగు మారుతుందని కూడా  నాకేం నమ్మకం లేదు ”మెరిల్లా ఖచ్చితంగా అంది.

ఆన్ నిట్టూర్చింది…” ఇంకో ఆశ కూడా పోయిందండీ. ‘ నా జీవితం ఆశలకు సమాధి ‘ …ఒక పుస్తకం లో చదివాను  ఈ మాటలు. అప్పట్నుంచీ దిగులేసినప్పుడల్లా అవి తల్చుకుంటూ ఉంటాను, కొంచెం నయంగా అనిపిస్తుంది అప్పుడు  ”

మెరిల్లా ” అలా అనుకుంటే ఎలా నయంగా ఉంటుందో నాకేమీ అర్థం కావట్లేదు ”

” లేదు, నిజంగా నయం గా ఉంటుంది. నేనొక కథలో  అమ్మాయినే  అనిపిస్తుంది. నాకు కథల్లో లాగా ఉండటమంటే చాలా ఇష్టం. మనం ఇవాళ ‘ ప్రకాశమాన సరోవరం ‘ మీదుగా వెళ్తామా ? ” ఆన్ అడిగింది.

” బారీ చెరువు అనేనా నీ తాత్పర్యం  ? అటు కాదు, సముద్రపు  ఒడ్డు పక్కనుంచి  వెళతాం ” మెరిల్లా .

 

” సముద్రపు ఒడ్డు  పక్కనే దారి  ” ..ఆన్ మైమరచి పోతూ మళ్ళీ అంది . ” బావుంటుందా ? మీరు ఆ మాట అనగానే చటుక్కున అదెలా ఉంటుందో నా కళ్ళ ముందు కనిపిస్తోంది . ‘ వైట్ శాండ్స్  ‘ అనే పేరూ బావుంది. అవోన్లియా అంత కాదనుకోండి..అవోన్లియా అంటుంటే సంగీతం లాగా వినిపిస్తుంది. వైట్ శాండ్స్ ఎంత దూరం ? ”

” ఐదు మైళ్ళు ఉంటుంది. సరే, నువ్వు మాట్లాడి తీరాలీ అంటే కాస్త పనికొచ్చేవి మాట్లాడుకుందాం. నువ్వు ఎవరు , ఎక్కడినుంచీ వచ్చావు..ఆ విషయాలు చెబుతావా ? ” మెరిల్లా  అడిగింది .

” అవన్నీ చెప్పటానికి ఏమీ బావుండవు. నేనెవరో ఏమిటో  – నేను ఎలా ఊహించుకుంటానో చెప్పనా ? ” ఆన్ సూచించింది.

” ఊహూ. అస్సలు వద్దు. పచ్చి నిజాలు అంటారు చూడు, అవి చెప్పు. నువ్వు ఎక్కడ పుట్టావు ? నీకు ఎన్నేళ్ళు ? ”

‘ పచ్చి నిజాలు ‘ చెప్పేందుకు ఆన్ నిట్టూరుస్తూ సిద్ధమైంది ..” మొన్న  మార్చ్ కి నాకు పదకొండేళ్ళొచ్చాయి. నేను బోలింగ్ బ్రోక్ లో పుట్టానట. అది నోవా స్కోటియా లో ఉంది. మా నాన్న పేరు వాల్టర్ షిర్లే. ఆయన బోలింగ్ బ్రోక్ స్కూల్లో టీచర్.  మా అమ్మ పేరు బెర్తా షిర్లే. వాల్టర్, బెర్తా- పేర్లు బావున్నాయి కదండీ  ? మా నాన్న పేరు జెడేడియా లాంటిదేదో అయి ఉంటే ఎంత ఇబ్బంది గా ఉండేదో ”

” ఏ పేరైతేనేం ? మనిషి ప్రవర్తన బావుండాలి గానీ ” మెరిల్లా నీతి వాక్యం చెప్పింది, నిజానికి అదే నీతి మెరిల్లాకీ అవసరమే.

 

mythili1” ఏమో మరి ” ఆన్ ఆలోచన లో పడింది. ” ఎక్కడో చదివాను, రోజా పువ్వు ని ఇంకే పేరు తో పిలిచినా అది మంచి వాసనెయ్యకుండా పోతుందా అని. కానీ రోజాని ముల్లు అనో కాబేజ్ అనో పిలవటం ఏం బావుంటుంది  చెప్పండి ? మా నాన్నకి జెడేడియా అని పేరున్నా ఆయన మంచి వాడే అయి ఉండేవాడేమో, అయినా బాగోదు. మా అమ్మ కూడా ముందు టీచర్ గానే ఉండేదట, పెళ్ళయాక మానేసిందట.  వాళ్ళు చాలా బీదవాళ్ళని మిసెస్ థామస్ చెప్పింది. నా కంటే ముందు ఇద్దరు పాపలు పుట్టారట గానీ చచ్చిపోయారట. బోలింగ్ బ్రోక్ లో ఒక చిన్న పసుప్పచ్చ ఇంట్లో ఉండేవాళ్ళట. నేనెప్పుడూ ఆ ఇల్లు చూడలేదు, కాని చాలా ఊహించుకుంటాను. గేట్ లోపల లిల్లీ పూలూ, వాకిట్లో లిలాక్ లూ, కిటికీ పక్కనే హనీ సకల్ లూ ఉండి ఉంటాయి.    కిటికీ లకి మస్లిన్ పరదాలు కూడా ఉండి ఉంటాయి. మస్లిన్ పరదాలు ఉంటే చాలు, ఇల్లు గొప్పగా ఉంటుంది. నేను ఆ ఇంట్లోనే పుట్టాను. నా అంత సాదా సీదాగా ఉన్న పాపాయిని ఎప్పుడూ చూడలేదని మిసెస్ థామస్ అంది. పీల గా ఈసురోమంటూ ఉండేదాన్నట, మొహం లో కళ్ళు తప్ప ఏమీ కనిపించేవి కాదట. కాని మా అమ్మ మాత్రం నేను చాలా ముద్దుగా ఉన్నానని అనుకుందట.  అదే నిజం అయి ఉండాలి, అమ్మ చదువుకుంది కదా –  తనకి తెలుస్తుందా, మిసెస్ థామస్ కి తెలుస్తుందా ? మిసెస్ థామస్ మా ఇంట్లో పని చేస్తుండేది. నేను అమ్మకి ఆశా భంగం కలిగించలేదని తలచుకుంటే తృప్తిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ తర్వాత అమ్మ ఎక్కువ రోజులు బతకలేదు.  నాకు మూడు నెలల వయసున్నప్పుడు జ్వరం తగిలి చచ్చిపోయింది. నేను  ‘ అమ్మా ‘ అని పిలవటం  గుర్తుండేదాకా ఐనా అమ్మ బతికి ఉంటే బావుండేదనిపిస్తుంది. ‘ అమ్మ ‘ అనటం హాయిగా ఉంటుంది, కదండీ ? తర్వాత నాలుగు రోజులకి నాన్న కూడా చచ్చిపోయాడు, ఆయనకీ అదే జ్వరమట. నేను అనాథ పాప ఐపోయాను. నన్నేం చెయ్యాలో ఎవరికీ ఏం తోచలేదట, మిసెస్ థామస్ చెప్పింది. అంత చిన్నగా ఉన్నప్పుడు కూడా నన్ను పెంచుకోవాలని ఎవరికీ అనిపించలేదు చూడండి, నాకు అలా రాసి పెట్టి ఉన్నట్లుంది.   అమ్మా నాన్నా ఇద్దరి ఊళ్ళూ చాలా  దూరమట, చుట్టాలెవరూ లేరట. చివరికి మిసెస్ థామస్ నే నన్ను పెంచుకుంటానంది. వాళ్ళాయన తాగుబోతు, వాళ్ళకేమీ డబ్బూ లేదు, అయినా సరే, మిసెస్ థామస్ తన చేతులతో నన్ను పెంచింది.’  చేతులతో పెంచిన ‘  పిల్లలు మామూలుగా పెంచిన పిల్లల కంటే మంచిపిల్లలు అవుతారా అండీ , మీకేమైనా తెలుసా ? మిసెస్ థామస్ నేను అల్లరి చేసినప్పుడల్లా  అనేది – నన్ను చేతులతో పెంచాననీ నేను అంత చెడ్డ పిల్లని ఎలా అయానా అని …

మిస్టర్ థామస్, మిసెస్ థామస్ , తర్వాత బోలింగ్ బ్రోక్ నుంచి మేరీస్ విల్ కి వెళ్ళారు. వాళ్ళకి నలుగురు పిల్లలు పుట్టారు, అందరూ నా కన్న చిన్నవాళ్ళే. వాళ్ళని పెంచటానికి మిసెస్ థామస్ కి సాయం చేస్తుండేదాన్ని. కొన్ని రోజులయాక మిస్టర్ థామస్ రైల్లోంచి కిందపడి చచ్చిపోయాడు. మిసెస్ థామస్ వాళ్ళమ్మ ఆవిడనీ పిల్లలనీ తీసుకుపోతానంది, నన్ను మాత్రం వద్దంది. మిసెస్ థామస్ కి ఏం చేయాలో తోచలేదు. అప్పుడు మిసెస్ హమ్మండ్ వచ్చి, నేను చిన్న పిల్లల్ని బాగా చూసుకుంటాను గనుక నన్ను ఇంట్లో ఉంచుకుంటానంది. ఆవిడ తో వెళ్ళిపోయాను. వాళ్ళ ఇల్లు ఎక్కడో విసిరేసినట్లు, నది పక్కన చిట్టడవిలో ఉండేది. మిస్టర్ హమ్మండ్ అక్కడ కలప మిల్ లో పని చేసేవాడు. నేను ఇంకెక్కడో ఉన్నట్లు ఊహించుకుంటూ ఉండకపోతే అక్కడ ఉండటం చాలా కష్టమయేది. వాళ్ళకి ఎనిమిది మంది పిల్లలు, మూడు సార్లు కవల పిల్లలు. నాకు చిన్న పిల్లలంటే ఇష్టమే, కాని కొంచెం మోతాదుగా ఉంటేనే ఇష్టం. ఒకరి తర్వాత ఒకరుగా అంతమంది పిల్లలని ఎత్తుకుని మోయటం కొంచెం కష్టంగానే ఉండేది.

mythili2

మిసెస్ హమ్మండ్ వాళ్ళతో రెండేళ్ళున్నాను. మిస్టర్ హమ్మండ్ కూడా చచ్చిపోయాడు, మిసెస్ హమ్మండ్ పిల్లల్ని చుట్టాల్లో అందరికీ పంచిపెట్టి అమెరికా వెళ్ళిపోయింది. ఇంకెవరూ నన్ను పెంచుకోవాలనుకోలేదు, అప్పుడు నన్ను అనాథాశ్రమం లో చేర్చారు. అక్కడ వాళ్ళూ అప్పటికే బోలెడు మంది పిల్లలున్నారు, నేను వద్దులే అన్నారు. కానీ రూల్ ప్రకారం నన్ను వద్దనకూడదట.  అలా మిసెస్ స్పెన్సర్ వచ్చేవరకూ అక్కడ నాలుగు నెలలు ఉన్నాను ” ఆన్ తన గాథ ముగించి ఊపిరి పీల్చుకుంది. తనని అక్కర్లేదనుకున్న ఆ ప్రపంచం లో తన అనుభవాలన్నీ చెప్పుకోవటం ఆన్ కేమీ ఇష్టం లేదు, తెలుస్తూనే ఉంది.

” ఎప్పుడైనా బడికి వెళ్ళావా ? ” మెరిల్లా ప్రశ్నించింది. గుర్రాన్ని సముద్రపు ఒడ్డు పక్కన ఉన్న బాట మీద నడిపిస్తోంది.

” ఎక్కువ రోజులు వెళ్ళలేదు . మిసెస్ థామస్ దగ్గర ఉన్నప్పుడు , ఆఖరి ఏడు వెళ్ళాను కొన్ని రోజులు. మిసెస్ హమ్మండ్ వాళ్ళ ఇల్లు ఊరికి చాలా దూరం కదా…చలికాలం లో అంత దూరం నడవలేకపోయేదాన్ని, వేసంకాలమేమో సెలవులిచ్చేసేవారు. వసంత కాలం లోనూ ఆకు రాలే కాలం లోనూ మటుకే వెళ్ళగలిగే దాన్ని. అనాథాశ్రమం లో ఉన్నప్పుడు రోజూ వెళ్ళాను. నాకు చదవటం బాగా వచ్చింది, బోలెడు పద్యాలు కంఠతా కూడా వచ్చు. ‘ హోహెన్ లిండెన్ సంగ్రామం ‘ , ‘ ఫ్లోడెన్ తర్వాతి ఎడింబరో ‘ , ‘ రైన్ తీరాన బింజెన్ ‘ మొత్తం వచ్చు.   ఇంకానేమో, ‘ లేడీ ఆఫ్ ద లేక్ ‘ , జేమ్స్   థాంప్సన్’ ఋతువులు ‘ – ఇవి చాలా వరకు వచ్చు. చదువుతుంటే వెన్ను జలదరిస్తుందే, అలాంటి పద్యాలు ఎంతో బావుంటాయి. ‘ పోలండ్ పతనం ‘ అని ఐదో తరగతి పుస్తకం లో ఉంటుంది, ఆ పద్యం అంతా అలాగే ఉంటుంది. నేనైతే   నాలుగో తరగతే , కానీ ఐదో తరగతి అమ్మాయిలు వాళ్ళ పుస్తకాలు అరువిచ్చేవాళ్ళు ”

” ఆ మిసెస్ థామస్, మిసెస్ హమ్మండ్ – వాళ్ళు నిన్ను బాగా చూసుకునేవాళ్ళా ? ” మెరిల్లా , ఆన్ ని ఓరకంటితో చూస్తూ అడిగింది.

” అదా..” ఆన్ తడబడింది. మొహం కందిపోయింది. ” నాకు తెలిసి,  నన్ను బాగా చూసుకోవాలనే అనుకునేవాళ్ళు. అలా మంచి ఉద్దేశం ఉన్నప్పుడు….ఒక్కోసారి చిరాకు పడినా పట్టించుకోకూడదు కదా ! వాళ్ళ బాధలు వాళ్ళవి…మిసెస్ థామస్ వాళ్ళాయన బాగా తాగేవాడు. మిసెస్ హమ్మండ్ కి మూడు సార్లు కవల పిల్లలు…ఎంత కష్టం చెప్పండి ? నాకు తెలుసు, ఇద్దరూ నన్ను దయగా ఇష్టంగా చూడాలని అనుకునేవాళ్ళు ”

మెరిల్లా ఇంకే ప్రశ్నలూ వెయ్యలేదు, పరధ్యానంగా బండి తోలుతోంది. సముద్రపు అందాన్ని చూసిన పరవశం లో ఆన్ మౌనంగా మునిగిపోయింది. మెరిల్లా ఆలోచిస్తోంది…ఆన్ చెప్పిన సంగతుల వెనక చెప్పకుండా దాచిపెట్టిన నిజాలు మెరిల్లాకి అర్థమవుతున్నాయి. ఈ చిన్న పిల్ల ప్రేమకోసం  ఎంత మొహం వాచిపోయి ఉంది ! ఎలాంటి పేదరికం లో, గొడ్డు చాకిరీ లో-  తన ఉనికిని ఎవరూ పట్టించుకోని జీవితాన్ని  గడిపి వచ్చింది ? తనకంటూ ఒక ఇల్లు ఉండబోతోందని అంతంత ఆనందపడిందంటే ఆశ్చర్యమేముంది ? పాపం…ఎందుకు వెనక్కి పంపెయ్యాలి అసలు ? మాథ్యూ కి ఆన్ ని అట్టే పెట్టుకుందామని బాగా ఉంది, అతను మనసు మార్చుకునేలాగా లేడు-  పోనీ , ఒప్పుకుంటే ఏం పోతుంది ? పిల్ల బుద్ధిమంతురాల్లాగే  ఉంది కదా, మెల్లిగా అన్నీ నేర్పుకోవచ్చు….

బండి వెళుతూ ఉన్న బాట కి ఆ వైపు న అడవి,  అంతా ఏకాంతం. ఏళ్ళ తరబడి సముద్రపు గాలులని ఎదిరించి పోట్లాడీ అలిసిపోయినట్లు లేని  ఫర్ చెట్లు గుబురు గుబురుగా . అక్కడక్కడా ఎగుడు దిగుడుగా ఎర్ర మట్టి దిబ్బలు, దారిని మూసేస్తూ, గుర్రం వాటిని దాటుంతూంటే బండి ఊగిపోతోంది. కిందికి చూస్తే నీటి నురగ కప్పిన పెద్ద పెద్ద రాళ్ళు. చిన్న చిన్న ఇసక దిబ్బలు, వాటి మధ్యలోంచి సముద్రపు రత్నాల లాగా గులకరాళ్ళు. అవతల ప్రకాశిస్తున్న  నీలపు సముద్రం. ఆకాశం లో సీ గల్ లు…ఎండలో వెండిలాగా మెరిసే రెక్కలతో …

” సముద్రం అద్భుతంగా ఉంటుంది కదూ ? ” ఆన్ అంది, చాలా సేపటి నిశ్శబ్దం తర్వాత,  విప్పారిన కళ్ళతో .  ” మేరీస్ విల్ లో మిస్టర్ థామస్ ఒకసారి పెట్టె బండి అద్దెకి తెచ్చాడు. సముద్రం ఒడ్డున పొద్దుట్నుంచీ సాయంత్రం దాకా  ఉన్నాం. అప్పటి ప్రతి నిమిషమూ గుర్తుంది నాకు, రోజంతా పిల్లలని ఆడిస్తూనే  ఉన్నా కూడా. మళ్ళీ మళ్ళీ గుర్తు  చే సుకుంటూనే ఉంటాను. ఇక్కడి సముద్రం మేరీస్ విల్ దానిలోకన్నా ఎంతో బావుంది. ఆ సీ గల్ లు దివ్యంగా ఉన్నాయి ! మీకెప్పుడైనా సీ గల్ ఐపోతే బావుండుననిపిస్తుందా ? నాకు అనిపిస్తుంటుంది, అంటే… మనిషి పిల్లని కాకపోయి ఉంటే. సూర్యుడు రాగానే నిద్ర లేచి ఆ నీలాల నీటి మీద వాలుతూ ఎగురుతూ రోజంతా గడిపేసి..రాత్రవుతూనే వెళ్ళి గూట్లో నిద్రపోతే….!

ఆ కనిపించే పెద్ద ఇల్లు ఎవరిదండీ  ? ”

” అది వైట్ శాం డ్స్ హోటల్. మిస్టర్ కిర్క్ నడుపుతాడు దాన్ని. కొద్ది రోజుల్లో బోలెడు మంది అమెరికన్ లు వస్తారు…ఈ సముద్రం వాళ్ళకి బాగా నచ్చుతుందని అంటుంటారు ”

ఇంకాస్త దూరం వెళ్ళారు . ” మిసెస్ స్పెన్సర్ ఇల్లు అదేనా ? ” ఆన్ బిక్కమొహం వేసుకుని అడిగింది. ” నాకు అక్కడికి వెళ్ళాలని లేదు …అక్కడితో అంతా ఐపోతుంది ”

[ ఇంకా ఉంది ]

మీ మాటలు

  1. “తన ఉనికిని ఎవరూ పట్టించుకోని జీవితాన్ని గడిపి వచ్చింది ? తనకంటూ ఒక ఇల్లు ఉండబోతోందని అంతంత ఆనందపడిందంటే ఆశ్చర్యమేముంది ? పాపం…ఎందుకు వెనక్కి పంపెయ్యాలి అసలు ? ” … కరుగుతోంది , కాఠిన్యమ్ మెల్లగా కరుగుతోంది . సముద్రం తీరం లో ప్రయాణం కాస్త లోతులు తెలుసుకొనేందుకు సాయం చేసింది :) ఆన్ కి ఒక ఇల్లు రాబోతోందని ఊహించుకుంటాను .. వచ్చే వారం వరకూ !! TQqqq

    • Mythili abbaraju says:

      ధన్యవాదాలు రేఖా…చాలా సందర్భా లలో అది కాఠిన్యమేమీ కాదు, మరొకలా ఆలోచించ కపోవటం అంతేనేమో…

  2. కథలో ప్రదేశాలు, పేర్ల వలన ఇది అనువాదం అని తెలియాలి తప్ప, మీ రచనా శైలి చాలా చాలా బావుంటుంది మైథిలి గారు , ఇప్పుడిప్పుడే వ్రాయడం నేర్చుకొంటున్న నాలాంటి వాళ్ళకి మీ రచనలు నుండి చాలా నేర్చుకోవచ్చు. ఆరవ భాగం కోసం ఎదురుచూస్తున్నాను.

    • Mythili abbaraju says:

      ధన్యవాదాలు శివుడు గారూ. మీ మాటలు ధైర్యాన్ని ఇస్తున్నాయి ….

  3. ఈ భాగం చదవగానే మా అపార్ట్ మెంట్ పైకి వెళ్లి పెన్నా ని చూస్తూ “ప్రకాశమాన సరోవరం” అని పిలవాలి అనిపించింది. :)

మీ మాటలు

*