గొప్ప కథ దానంతటదే ఊడిపడదు. అదొక మథనం!

 

TV-99 ఛానెల్ ’99-అడ్డా’ కార్యక్రమం కోసం ప్రముఖ కథకుడు వేంపల్లె షరీఫ్ సాటి కథకుడు అనిల్ ఎస్. రాయల్ తో జరిపిన చర్చాగోష్టి పూర్తి పాఠం. ఈ ఇంటర్వ్యూ ప్రచురించటానికి ‘సారంగ’ని అనుమతించిన వేంపల్లె షరీఫ్ కు ధన్యవాదాలు.

జీవితాన్ని కథగా రాయాలంటే అనుభవం కావాలి. మరి సైన్స్ ఫిక్షన్ రాయాలంటే ఏం కావాలి? మాత్రం బోర్ కొట్టకుండా సైన్స్ ఫిక్షన్లో సస్పెన్స్ నింపి రాయటం అనిల్ ఎస్. రాయల్కి వెన్నతో పెట్టిన విద్య.

షరీఫ్: సైన్స్ ఫిక్షన్ అంటే ఏమిటి? మీరు ఆ తరహా కథలే రాయటానికి కారణమేంటి?

అనిల్: సైన్స్ ఫిక్షన్ అంటే – తేలికపాటి మాటల్లో చెప్పాలంటే – శాస్త్రాన్ని ఆధారం చేసుకుని, దానికి కాస్త కల్పన జోడించి రాసే కథ.

షరీఫ్: సైన్స్ ఫిక్షన్ రాయటానికి, ఇతర కథలు రాయటానికి తేడా చెప్పండి.

అనిల్: ఇందాక మీరన్నారు – జీవితాన్ని కథగా రాయాలంటే అనుభవం కావాలని. సైన్స్ ఫిక్షన్ రాయాలంటే ఆలోచన కావాలి; ఒక ఐడియా కావాలి. ఎక్కువగా ఆలోచన – ‘ఇలా జరిగితే ఎలా ఉంటుంది’ అనే ఆలోచన.

షరీఫ్: ఆ ఐడియాకి ఒక లాజిక్ కూడా కావాలా?

అనిల్: కచ్చితంగా కావాలి. ఆ ఐడియాకి ఒక శాస్త్రీయమైన పునాది కూడా కావాలి. అభూత కల్పనలు చేసి ఏదేదో రాసేసి అది సైన్స్ ఫిక్షన్ అనలేం.

షరీఫ్: మీ నేపధ్యం ఏమిటి? ఈ పునాదులు ఎక్కడినుండొచ్చాయి? అసలు సైన్స్ ఫిక్షనే ఎందుకు రాస్తున్నారు?

అనిల్: కంప్యూటర్ సైన్స్‌లో బాచిలర్స్, గణితంలో ఎం.ఫిల్; మొత్తమ్మీద సైన్స్ నేపధ్యం బాగా ఉంది. చరిత్ర అంటే కూడా చాలా ఆసక్తి. నాకు బాగా తెలిసినవి ఇవి. పెద్దగా జీవితం తెలీదు. అందువల్ల కథలు రాయాలనుకున్నప్పుడు సహజంగానే సైన్స్ ఫిక్షన్ ఎంచుకున్నాను.

షరీఫ్: తెలుగులో ఇప్పుడొస్తున్న సాహిత్యాన్ని గమనించినట్లైతే – అస్తిత్వ వాదాలొచ్చేశాయి. అలాగే, తాత్విక దృష్టితో తార్కికమైన అంశాలు తీసుకుని విరివిగా కథలు రాయటం కనిపిస్తూంది. వాటి ప్రభావం లేకుండా నాకంటూ ఓ ప్రత్యేకమైన దారి ఏర్పాటు చేసుకోవాలి, సైన్స్ ఫిక్షన్ అనే దారిలో ప్రయాణం చేయాలి అని ఎందుకనిపించింది?

అనిల్: నా మొదటి కథ ‘నాగరికథ’ రాసినప్పుడు ప్రత్యేకమైన దారి ఏర్పాటు చేసుకోవాలనేమీ అనుకోలేదు. అప్పట్లో ఇలా ఈ సైన్స్ ఫిక్షన్ జెండా పట్టుకుని పరుగెత్తాలనే ఆలోచనే లేదు. ఆ మొదటి కథ రాయటమే అనుకోకుండా జరిగింది. నాకు వర్తమాన కథల్లో వెరైటీ కనబడలేదు. ఇప్పుడు మీరన్నారు కదా – తాత్వికం అంటూ. లిటరరీ ఫిక్షన్ అంటారు దాన్ని. మనస్తత్వాల విశ్లేషణ గూర్చిన కథలు, ఎక్కువగా. అవి తప్పని కాదు. అవి కావాలి. వాటిని గొప్పగా రాసేవాళ్లు అప్పుడూ ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో అవి మరీ ఎక్కువైపోయాయి. వీటిలో భావోద్వేగాలకే పెద్దపీట. క్రైమ్, హారర్, సస్పెన్స్, డిటెక్టివ్, హిస్టారిక్ ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్ …. ఇటువంటివి – అంటే ప్లాట్ డ్రివెన్ కథలు – దాదాపు కనుమరుగైపోయాయి. నాకివి చదవాలని కోరిక. కానీ అవెక్కడా కనబడటం లేదు. నా స్నేహితులతో ఈ ‘బాధ’ వెళ్లబోసుకునేవాడిని (నవ్వు). వాళ్లు “ఎవర్నో అనేబదులు అవేవో నువ్వే రాయొచ్చు కదా,” అన్నారు. నేను రాయగలుగుతానో లేదో తెలీదు. ఐనా, “సరే రాద్దాం పద,” అనుకుని, “ఏం రాయాలి,” అని ఆలోచిస్తే, నాకు ఆసక్తి ఉన్న సబ్జెక్ట్స్ సైన్స్, చరిత్ర – అవి రెండూ కలిపేసి రాసేద్దాం అనిపించింది. అలా ‘నాగరికథ’ రాశాను. ఆ విధంగా మొదలైంది నా ప్రయాణం.

షరీఫ్: మీరు టైమ్ ట్రావెల్ నేపధ్యంలో ఎక్కువ కథలు రాశారు. టైమ్ ట్రావెల్ లేని వాటిలో కూడా ఏదో ఓ రూపంలో కాలం ప్రస్తావన వస్తూంటుంది. కాలంతో ఆ యుద్ధం ఎందుకు మీకు?

అనిల్: అదొక సరదా. కాలంలో వెనక్కి వెళ్లటం సాధ్యమైతే ఎలా ఉంటుందనే ఊహ అద్భుతంగా ఉంటుంది. అది సాధ్యమో కాదో అవతల పెట్టండి. అలా జరిగితే చాలా పారడాక్సెస్ పుట్టుకొస్తాయి. తిరకాసులన్న మాట. ఈ తిరకాసుల్లో చాలా రకాలున్నాయి. వీటిని వాడుకుని కథ రాయటం అనేది నాకో సరదా. అంతే.

షరీఫ్: ఒకవేళ మీకే ఓ టైమ్ మెషీన్ లభించి, మీరు మళ్లీ బాల్యంలోకి వెళ్లగలిగితే ‘ఇలా చెయ్యాలి’ అనే ఆలోచనలేమన్నా ఉన్నాయా? లేదా ఓ యాభై సంవత్సరాలు ముందుకి – భవిష్యత్తులోకి – వెళ్లగలితే ఏం చెయ్యాలి అనుకుంటారు?

అనిల్: అలాంటి ఆలోచనెప్పుడూ చెయ్యలేదు. టైమ్ ట్రావెల్ అనేది నిజంగా జరిగేది కాదని నాకు తెలుసు (నవ్వు). నేనెప్పుడూ వర్తమానంలో బ్రతుకుతాను. జీవితం విషయంలో నాకు పెద్దగా ప్లానింగ్ అంటూ లేదు. కథా రచయితనవటం కూడా కాకతాళీయంగానే జరిగింది. ‘నాగరికథ’ రాసినప్పుడు భవిష్యత్తులో మరికొన్ని కథలు రాస్తాననుకోలేదు. ఏదో పంతానికి పోయి ఆ ఒక్కటి రాశాను. ఆ తర్వాత ఇక చాలు అనుకున్నాను. ఇన్నేళ్ల తర్వాత చూస్తే మరి కొన్ని కథలున్నాయి నా ఖాతాలో. ఏదో ఆశించటం, దాన్ని సాధించలేదనో, అది దక్కలేదనో బాధ పడటం ఇవన్నీ ఉండవు నాకు. అలాగని నేనేమీ జీవితాన్ని ఆషామాషీగా తీసుకోను. ప్రస్తుతం చేసే పని మీద ఎనలేని శ్రద్ధ పెడతాను – ఫలితంతో సంబంధం లేకుండా. అలా చేస్తే కొన్నిసార్లు అపజయాలు పలకరించినా, ఎక్కువగా విజయమే లభిస్తుందని నమ్ముతాను.

షరీఫ్: అంటే, మీరో ప్రాక్టికల్ మనిషి అంటారు. మరి కథలు మాత్రం ఎందుకలా రాస్తున్నారు? సాధ్యం కాని విషయాలని జనాలకు చెప్పటం వల్ల ఉపయోగం ఏమిటి?

అనిల్: చెప్పాను కదా, అదో సరదా. అయితే, అవన్నీ సాధ్యం కాని అంశాల చుట్టూతానే తిరగవు. టైమ్ ట్రావెల్ అనేది నా కథల్లో ఓ చిన్న అంశం మాత్రమే. అసలు కథ వేరే ఉంటుంది వాటన్నిట్లోనూ. నా ‘రీబూట్’ కథే ఉంది. అందులోనూ టైమ్ ట్రావెల్ ప్రస్తావనుంటుంది. అయితే దానిపై పెద్ద చర్చేమీ ఉండదు. ఈ తిరకాసులూ అవీ ఉండవు. తోకచుక్కలో, గ్రహ శకలాలో వచ్చి గుద్దుకుంటే భూమండలం నాశనమైపోతుందకుంటారు సాధారణంగా. కానీ అసలు ప్రమాదం ఈ భూమ్మీదనే పొంచి ఉంది. అదేంటనేది ఆ కథలో నేను చెప్పిన విషయం. దానికి టైమ్ ట్రావెల్ అనేది కొంచెం వాడుకున్నాను. అంతే తప్ప అందులో టైమ్ ట్రావెల్ అనేది అసలు విషయం కాదు.

anil2

షరీఫ్: కథకి ఓ ప్రయోజనం ఉండాలి అంటారు. మరి సైన్స్ ఫిక్షన్ కథలకి ఎటువంటి ప్రయోజనం ఉంది?

అనిల్: అస్తిత్వవాదాలు తీసుకున్నామనుకోండి. అవి కొన్ని వర్గాలకి పరిమితమవుతాయి. వద్దన్నా వివాదాలు, కొట్లాటలు, ఒకర్నొకరు చీల్చి చెండాడుకోవటాలు …. ఇవన్నీ వచ్చిపడతాయి. సైన్స్ ఫిక్షన్‌తో ఆ సమస్య లేదు. చదివిన వాళ్లు చదువుతారు, లేనివాళ్లు లేదు. అంతేతప్ప అనవసరమైన కొట్లాటలుండవు. అదో ప్రయోజనం (నవ్వు).

షరీఫ్: మీరు రాస్తున్న కథల్లో సామాజిక ప్రయోజనం ఏ మేరకు ఉందని భావిస్తున్నారు?

అనిల్: నా కథల్లో నేను అణగారిన వర్గాల గురించో, మరో వర్గం గురించో మాట్లాడను. అంత మాత్రాన వాటివల్ల సామాజిక ప్రయోజనం లేదనకూడదు. ఉదాహరణకి, ‘నాగరికథ’ చదివి ఓ పిల్లవాడు “ఓహ్. ఇలా కూడా చేయొచ్చా! ఇలా కూడా ఆలోచించొచ్చా!” అనుకోవచ్చు. డార్క్ మ్యాటర్, సింగ్యులారిటీ, సూపర్‌నోవా, క్వాంటం మెకానిక్స్ …. ఇలాంటివన్నీ కథ పరిధిలో వివరిస్తుంటాను నేను. నిన్నటిదాకా ఫిజిక్స్ చాలా బోరింగ్‌గా ఉందనుకున్న పిల్లలు ఇది చదివాక చాలా ఆసక్తికరంగా ఉందనుకోవచ్చు. “ఇదేదో ఆసక్తికరంగా ఉంది. దీని గురించి మరికొంత నేర్చుకుందాం,” అనుకోవచ్చు. సైన్స్ మీద వాళ్లకి ఆసక్తి పెరగొచ్చు. అది కూడా సామాజిక ప్రయోజనమే. నిజానికి, సమాజానికి లిటరరీ ఫిక్షన్ కన్నా సైన్స్ ఫిక్షన్ వల్ల కలిగే ప్రయోజనమే ఎక్కువని నేను భావిస్తాను. ఇవి ఏ ఒక్క వర్గానికో పరిమితమైన కథలు కావు. ప్రపంచం ముందుకు పోవటానికి ప్రధాన కారణం సాంకేతిక ప్రగతి. ఉద్యమాల ద్వారా కన్నా కూడా సాంకేతిక పురోభివృద్ధి ద్వారానే ఎక్కువ సమానత్వం సిద్ధిస్తుంది. మన సమాజంలో ఒకప్పుడు అణచివేయబడ్డ స్త్రీలు ఈ నాడు చాలా రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారంటే దానిక్కారణం సాంకేతికాభివృద్ధి వల్ల పుట్టుకొచ్చిన అపారమైన అవకాశాలే. ఆ విషయంలో స్త్రీవాద ఉద్యమాలు, ఇతర చోదక శక్తుల పాత్ర లేదని కాదు కానీ, అది పరిమితం. ఇది ఇతర వర్గాలకీ వర్తిస్తుంది. అంత ముఖ్యమైన సాంకేతిక పురోగతికి బీజాలు సైన్స్ ఫిక్షన్ సాహిత్యంలో ఉన్నాయి. ఇంటర్‌నెట్, శాటిలైట్లు, సెల్ ఫోనులు, క్రెడిట్ కార్డులు, అవయవ మార్పిడి, అణు శక్తి – ఇవన్నీ సైన్స్ ఫిక్షన్లో పురుడుపోసుకున్న ఆలోచనలే. వాటి ప్రమేయం, ప్రభావం లేని ప్రపంచాన్ని ఓసారి ఊహించుకోండి, సైన్స్ ఫిక్షన్ ప్రయోజనమేంటో అర్ధమవుతుంది.

షరీఫ్: మీ కథల ప్రేరణతో ఎవరైనా ఓ సైంటిస్ట్‌గా మారాలని కానీ, ఓ వస్తువు కనిపెట్టాలని కానీ అనుకున్న సందర్భం ఉందా? ఎవరైనా అలా ఇన్‌స్పైర్ అయినట్లు తెలుసా?

అనిల్: నేను అంత గొప్ప కథలు రాశానని అనుకోను. సైన్స్ ఫిక్షన్ రచయితల్లో మహామహులున్నారు. వాళ్ల స్థాయి కథలు నేను రాయలేదింకా.

షరీఫ్: ఎన్ని కథలు రాశారు ఇప్పటిదాకా?

అనిల్: పది కథలు. వాటిలో ఒకటి అనువాద కథ. మిగతా తొమ్మిది నా సొంతవి. వాటిలో ఎనిమిది సైన్స్ ఫిక్షన్. మిగిలిన ఒక్కటీ సైన్స్ ఫిక్షన్ కాదు.

షరీఫ్: ఇందాక ‘వివాదాలు, కొట్లాటలు’ అన్నారు. వివాదాలకి చోటిచ్చేవన్నీ తక్కువ స్థాయి రచనలు, తక్కినవన్నీ గొప్పవి అంటారా?

అనిల్: అలా ఏం లేదు. ఓ కథ గొప్పదా కాదా అనేది అందులో ఉన్న సరుకుని బట్టి నిర్ధారించబడుతుంది కానీ, దాని చుట్టూ జరిగే గొడవలని బట్టి కాదు. ఇందాక నేనన్నట్లు, సైన్స్ ఫిక్షన్ కథలు చదివితే చదువుతారు లేకుంటే లేదు. అంతే తప్ప వాటి గురించి వివాదాలు చేసుకునే పరిస్థితి లేదు. ఇది నా మనస్తత్వానికి సరిపడే విషయం. ప్రశాంతంగా నా కథలేవో నేను రాసుకోవచ్చు, మిగతా గొడవల్లో ఇరుక్కోకుండా. అంతే తప్ప మరో ఉద్దేశం లేదు, ఆ ‘వివాదాలు, కొట్లాటలు’ వ్యాఖ్య వెనక.

షరీఫ్: ఒకవేళ సైన్స్ ఫిక్షన్ కి ఆ పరిస్థితొస్తే, మీరు ఆ తరహా కథలు రాయటం మానేస్తారా?

అనిల్: అందాకా వస్తే చూద్దాం. వస్తుందని మాత్రం నేను అనుకోను.

షరీఫ్: అసలు ఏ కథకైనా ఆ పరిస్థితి ఎందుకొస్తుంది? వివాదాలు ఎందుకు మొదలవుతాయి?

అనిల్: సమీక్షకులు, విమర్శకులు తమ కథలపై వ్యక్తం చేసే అభిప్రాయాలు రచయితలకి నచ్చకపోవటం దగ్గర గొడవ మొదలవుతుంది. రచయిత సంయమనం వహిస్తే అది వెంటనే సద్దుమణుగుతుంది. లేకుంటే పెద్దదవుతుంది. ఎక్కువగా రెండోదే జరుగుతుంది.

షరీఫ్: మీ దృష్టిలో కథని సమీక్షించటానికి, విమర్శించటానికి తేడా ఏమిటి?

అనిల్: సమీక్ష అంటే కథని పాఠకులకి పరిచయం చేసే సాధనం. సమీక్షకుడు కథని మరీ లోతుగా విశ్లేషించడు. అది విమర్శకుడి పని. అంతే తేడా. సమీక్ష అనేది ఓ రకంగా సేల్స్ పిచ్. విమర్శ అంటే కథని అధ్యయనం చేయటం. అయితే ఈ మధ్య ఈ రెండింటి మధ్య తేడా చెరిగిపోతూంది. రెండూ కలగలిసిపోతున్నాయి.

షరీఫ్: నేటి విమర్శకులపై మీ అభిప్రాయం?

అనిల్: విమర్శకులు స్వేఛ్చగా తమ పని చేసే పరిస్థితి ప్రస్తుతం ఉందనిపించటం లేదు. ఈ మధ్యనో ధోరణి గమనించాను. కొన్ని వర్గాలని ఉద్దేశించి రాసే కథలు బాగోలేవన్నవారిపై విరుచుకుపడటం జరుగుతోంది. ఓ స్త్రీవాద కథ బాగోలేదంటే అతన్ని పురుషాహంకారి అనటం, మరో వాద కథ బాగోలేదంటే ఆ వాదానికి వ్యతిరేకిగా ముద్రవేయటం జరుగుతోంది. విమర్శ అనేది కథలో ఉన్న సరుకుని బట్టి కాకుండా రచయిత నేపధ్యాన్ని బట్టి చేయాల్సొస్తున్న విచిత్ర పరిస్థితినీ గమనించాను. కుత్సితంగా విమర్శలు చేసేవాళ్లు ఉండరని కాదు. కథలో అసలు విషయం వదిలేసి దాని చుట్టూ ఉన్న విషయాలు పట్టుకొచ్చి విమర్శలు చేసేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. వాళ్లని పట్టించుకోనవసరం లేదు. నేను చెప్పేది నిజమైన విమర్శకుల గురించి. వాళ్ల చేతులు కట్టేయబడి ఉన్నాయి ప్రస్తుతం. లిటరరీ ఫిక్షన్, ముఖ్యంగా అస్తిత్వవాద కథలకి సంబంధించిన సమస్య ఇది. సైన్స్ ఫిక్షన్‌కి అదృష్టవశాత్తూ ఈ పరిస్థితి లేదు. అక్కడ వచ్చే కథలు వేళ్ల మీద లెక్కించేన్ని మాత్రం కావటం వల్లనో, ఆ రకం కథలపై సాధికారికమైన విమర్శలు చేయగలిగేవారు దాదాపు లేకపోవటం వల్లనో, అక్కడ పరిస్థితి ప్రశాంతంగా ఉంది (నవ్వు).

షరీఫ్: ‘నాగరికథ’ చదివాక ఓ వ్యక్తి ఫోన్ చేసి “ఇది నిజంగా జరిగేది కాదు. ఇది గొప్ప కథేంటి?” అన్నాడని చెప్పారు. మీ దృష్టిలో గొప్ప కథ అంటే ఏమిటి?

అనిల్: నాకెవరూ ఫోన్ చేసి అలా చెప్పలేదు (నవ్వు). కానీ ఆ మాట విన్నాను. గొప్ప కథ ఏది అంటే …. నా దృష్టిలో చదివించగలిగేది ఏదైనా మంచి కథే, గొప్ప కథే. దాని వల్ల కలిగే సామాజిక ప్రయోజనాలూ అవీ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే. కథనేది ముందుగా ఆసాంతం ఆసక్తిగా చదివించగలగాలి. ఆ పని చెయ్యలేని కథలో ఎంత గొప్ప సందేశం ఉన్నప్పటికీ అదో గొప్ప కథని నేననుకోను.

షరీఫ్: ‘గొప్ప కథ’ రాయటం ఎలా?

అనిల్: గొప్ప కథలు రాయటానికి గైడ్ బుక్ అంటూ ఏమీ లేదు. ఏ కళారూపానికీ లేదు. గొప్పగా పెయింటింగ్స్ వేయటం ఎలా, గొప్పగా నాట్యం చెయ్యటం ఎలా – ఇలాంటివి ఎవరూ నేర్పలేరు. కాకపోతే ప్రతిదానికీ కొన్ని ట్రిక్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించి కథని శ్రద్ధగా చెక్కాలి. ఏ art form తీసుకున్నా, అదొక craft కూడా. కొందరు ఈ మాట ఒప్పుకోకపోవచ్చు. కళ అంటే కళే. అది క్రాఫ్ట్ కాదు అంటారు వాళ్లు. చెక్కుడూ అదీ ఉంటే ఆర్ట్ కానే కాదు అంటారు. నా దృష్టిలో అవన్నీ fine touches. అవి కూడా ఉండాలి. సానబట్టటం అన్నమాట. సానబట్టటాలు ఉండకూడదు అనే వారిని నేనేమీ అనను, అది వాళ్లిష్టం. నా వరకూ ఓ మంచి కథ గొప్ప కథగా రూపొందాలంటే దాన్ని సాన పట్టాల్సిందే. నిర్మాణ కౌశలం చూపించాల్సిందే. గొప్ప కథ దానంతటదే ఊడిపడదు. అదొక మథనం.

షరీఫ్: మీరు ‘కథాయణం’ పేరుతో ఫేస్‌బుక్‌లో పలు వ్యాసాలు రాశారు. పట్టుమని పది కథలైనా రాయని అనిల్ ఎస్. రాయల్ ఏం అర్హత ఉందని కథాయణాలు రాస్తున్నాడు అన్న వ్యాఖ్యలు వచ్చాయి. వాటిపై మీ స్పందన?

అనిల్: అలా అడిగిన వారికి ఏం అర్హత ఉందో, నాకూ అదే అర్హత ఉంది. కథంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే వాళ్లకి కోపమొచ్చి ఉంటుంది, “ఇతనెవరు ఇలాంటివి రాసేదానికి” అని. తప్పేమీ లేదు. ఆ ఇష్టంతోనే నేను కూడా అవి రాశాను.

షరీఫ్: ‘కథాయణం’లో మీరు “నేను ముందుగా కథకి ముగింపు రాస్తాను. తర్వాత మిగతా కథ రాస్తాను,” అన్నారు. ఏమిటా టెక్నిక్?

అనిల్: నేను రాసే కథలకి ముగింపు చాలా కీలకం. నా కథలకే కాదు, అసలు ఏ కథకైనా – అది లిటరరీ లేదా genre తరహా ఫిక్షన్ ఏదైనా కానీడి – ముగింపే ముఖ్యం. మిగిలినదంతా పాఠకుడిని ఆ ముగింపువైపుకి తీసుకెళ్లటానికి రచయిత పడే ప్రయాస. ముగింపు అంత కీలకం కాబట్టి, అసలు కథలో నేనేం చెప్పాలనుకుంటున్నాను అనేది ముగింపులోనే ఉంది కాబట్టి, నేను ముందుగా ముగింపు గురించే ఆలోచిస్తాను. ముందుగా అదే రాస్తాను. కథని ‘అట్నుండి’ నరుక్కొస్తానన్న మాట (నవ్వు).

షరీఫ్: ఒక సందర్భంలో మీ కథని ఎవరో సమీక్షిస్తూ ముగింపు బయటపెడితే మీరు కాస్త ఇబ్బంది పడ్డారు. “సమీక్షకుడు ఎప్పుడూ ముగింపు చెప్పకూడదు” అనే వ్యాఖ్య చేశారు. ముగింపు చెబితే కథ చచ్చిపోతుందా?

అనిల్: కొన్ని కథలు కచ్చితంగా చచ్చిపోతాయి. నా కథలు అన్నీ చచ్చిపోతాయి. నేనిందాక అన్నాను కదా. నా కథలకి ముగింపెంత కీలకమంటే, నేను ముగింపుతోనే కథ రాయటం మొదలు పెట్టి వెనక్కు డెవలప్ చేసుకుంటూ వెళతానని. అంత ముఖ్యమైనది నాకు ముగింపు. అది తెలిసిపోయాక ఇక కథ చదవాలన్న ఆసక్తి ఏముంటుంది? ఇది కామన్ సెన్స్.

షరీఫ్: అంటే, మీ కథల్ని ఒకసారి చదివి ముగింపు తెలుసుకున్నాక మరోసారి చదవలేరు అంటారా?

అనిల్: తెలుగులో ఏడాదికి పదిహేనొందల కథల దాకా వెలువడుతున్నాయి. వాటిలో మంచి కథలు చాలా ఉంటాయి. అవన్నీ ఒక్క సారి చదివే సమయం ఉంటేనే ఎక్కువ. అలాంటిది ఏ కథనైనా మళ్లీ మళ్లీ చదివే తీరుబడి ఎక్కువమందికి ఉంటుందని నేననుకోను. ఏ కొద్దిమందికో అంత తీరిక  ఉండొచ్చు. నేను రాసేది ఆ కొద్దిమంది కోసం మాత్రమే కాదు. రిపీట్ రీడర్‌షిప్ నాకు ముఖ్యం కాదు. నా కథని ఒకే ఒకసారి చదివినా, ఆ కాసేపూ పాఠకుడికి అద్భుతమైన అనుభూతినివ్వాలి. ముగింపు ముందే తెలిసిపోతే నా కథని ఆ ఒక్కసారీ చదవరు. అందుకే సమీక్షకులు ముగింపు బయటపెట్టేయటం పట్ల నా అభ్యంతరం.

షరీఫ్: అనిల్ ఎస్. రాయల్ కథల్ని, “ముగింపు తెలిసిపోతే చచ్చిపోయే కథలు” అనుకోవచ్చా?

అనిల్: అనుకోవచ్చు. ఏం ఫరవాలేదు. నేనేమీ అనుకోను (నవ్వు).

షరీఫ్: మీరు అమెరికాలో ఉంటున్నారు. అమెరికా తెలుగు కథకి, ఇక్కడి తెలుగు కథకి తేడా ఏమన్నా గమనించారా? గమనిస్తే, అదేమిటి?

అనిల్: ఇతివృత్తాలు, నాణ్యత పరంగా ఇక్కడి కథలే బాగున్నాయనిపిస్తుంది. అమెరికా తెలుగు కథల్లో చాలావరకూ మొనాటనీ కనిపిస్తుంది. నేనక్కడ పదహారేళ్ల నుండి ఉంటున్నాను. నా తరం ఎన్నారై జీవితాల పరిధి చాలా చిన్నది. ఎక్కువగా మనలో మనమే. ఇతర సంస్కృతులతో కలవటం చాలా తక్కువ. మొదటి తరం ఎన్నారైలు ఈ విషయంలో చాలా మెరుగు. అప్పట్లో వాళ్లు అక్కడొకరూ ఇక్కడొకరూ విసిరేసినట్లు ఉండటం వల్ల కావచ్చు, వాళ్లకి చుట్టూ ఉన్న అమెరికన్ సమాజంతో కలవక తప్పని పరిస్థితి ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పుడు మనవాళ్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవటం వల్ల వాళ్లుండే ప్రాంతాలు మినీ విజయవాడ, మినీ హైదరాబాద్ …. ఇలా తయారయ్యాయి. వాళ్లంతా చుట్టూ గిరిగీసుకుని ఆ పరిధిలోనే ఉంటున్నారు.  అమెరికన్ సమాజాన్నుండి ఐసొలేటెడ్ బ్రతుకులు. చుట్టూ ఉన్న పరిస్థితులపై, సమాజంపై superficial knowledge మాత్రమే తప్ప పెద్దగా అవగాహన లేదు. దాంతో ఎక్కువమంది ఎన్నారై రచయితల ఇతివృత్తాల్లో ప్రవాసం మొదట్లో కలిగే కల్చర్ షాక్, ఇళ్లలో జరిగే రోజువారీ సంఘటనలు, భార్యాభర్తల మధ్య పొరపొచ్ఛాలు, ఇలాంటివే తప్ప పెద్ద లోతు కనిపించటం లేదు. అక్కడినుండి అరుదుగా మాత్రమే మంచికథలొస్తున్నాయి.

షరీఫ్: ఈ మధ్య తానా సభలు చాలా గ్రాండ్‌గా జరిగాయి. మీరు అమెరికాలో ఉంటూ కూడా వాటికి వెళ్లకపోవటానికి కారణమేంటి?

అనిల్: నేను తానా సభలకి కానీ, వేరే సభలకి కానీ ఎప్పుడూ వెళ్లలేదు. నాకు ఎటువంటి అసోసియేషన్స్‌లోనూ సభ్యత్వం లేదు.

షరీఫ్: ఎందుకని?

అనిల్: ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. ఏదన్నా ఆసక్తికరమైన కార్యక్రమం జరిగితే ఎప్పుడన్నా టికెట్ కొనుక్కుని వెళతాను. అంతే తప్ప మెంబర్‌షిప్స్ లాంటివేమీ లేవు. ఎందులోనైనా సభ్యత్వం ఉంటే చాలా కమిట్‌మెంట్ అవసరం పడుతుంది. వాళ్లకి ప్రతివారం ఏదో ఓ కార్యక్రమం ఉంటుంది. అవి చాలా hectic గా ఉండే పనులు. వారాంతాల్లో వాటితో చాలా హడావిడిగా ఉంటుంది. నాకంత తీరిక ఉండదు. నాకు దొరికే ఖాళీ సమయాన్ని నా కుటుంబంతో గడపటానికే ఇష్టపడతాను.

షరీఫ్: మీ కుటుంబం గురించి చెప్పండి.

అనిల్: నేను పుట్టింది గుంటూరు జిల్లా మాచర్ల. (పిడికిలి బిగించి) పల్నాడు …. బ్రహ్మనాయుడు (నవ్వు). మా తల్లిదండ్రులు నరసరావు పేట ప్రాంతం నుండొచ్చి మాచర్లలో స్థిరపడ్డారు. నా స్వస్థలం అదే కానీ నేను చదువుకున్నదంతా బయట. రెంటచింతల, విజయవాడ, మద్రాసు …. ఇలాంటిచోట్ల చదివాను. మా ఊరితో పెద్దగా అనుబంధం లేదు. పెద్దగా స్నేహితులూ లేరక్కడ. మద్రాస్ లయోలా కాలేజ్‌లో ఉన్నత విద్య పూర్తయ్యాక అమెరికా వెళ్లిపోయాను. నా ఉద్యోగ జీవితం అమెరికాలోనే మొదలైంది. అదే అసలైన జీవితం కూడా. నా భార్య పేరు చైతన్య. మాకో పాప, పేరు మనస్వి. హ్యాపీ ఫామిలీ.

షరీఫ్: సాహిత్య నేపధ్యం ఎక్కడా తగల్లేదు, మీరు చెప్పినదాంట్లో.

అనిల్: అవును. మా ఇళ్లలో కళాకారులెవరూ లేరు. కళాపోషకులు మాత్రం ఉండేవారు. మేనమామలు, ముఖ్యంగా. వాళ్ల పోషణకి ఆస్తులు అర్పణమైపోయాయి (నవ్వు). మా అమ్మకీ కళల్లో ఆసక్తి ఉంది, స్వయంగా ప్రవేశం లేకపోయినా. శాస్త్రీయ సంగీతం, నృత్యం, వగైరా. తన చిన్నతనంలో మా తాతగారింట్లో ఘోషా పద్ధతుండేది. ఇళ్లలో ఆడవారిని బయటికి పంపేవారు కాదు. అలా ఆమె చదువు ఏడో తరగతితోనే ఆగిపోయింది. కానీ ఆమెకి చదవటమ్మీద ఆసక్తి పోలేదు. కనిపించినవన్నీ విపరీతంగా చదివింది. ఆ ఆసక్తే నాకూ వచ్చింది. ఇక మా నాన్నకి చరిత్ర మీద చాలా ఆసక్తి. చరిత్రలో ఎప్పుడేం జరిగిందో తేదీలతో సహా ఆయనకి గుర్తుండేంది. హిస్టరీ మీద ఆసక్తనేది నాకు ఆయన దగ్గరనుండొచ్చింది.

షరీఫ్: తెలుగులో సైన్స్ ఫిక్షన్ సినిమాలు రావటం లేదు కాబట్టి, వాటిలో కూడా వేలు పెట్టే ఉద్దేశం ఏమన్నా ఉందా? (నవ్వు)

అనిల్: (నవ్వు) సినిమాలు తీసే ఆలోచన నాకేమీ లేదు.

షరీఫ్: పోనీ కథలందిస్తారా, అలాంటి వాటికి?

అనిల్: ఎవరడుగుతారు నన్ను? అడిగితే ఇస్తాను, పోయేదేముంది (నవ్వు).  సైన్స్ ఫిక్షన్ సినిమాలు తీయాలంటే తెలుగు నిర్మాతలకి భయమనుకుంటా. అప్పుడెప్పుడో నా ఫేవరెట్ టైమ్ ట్రావెల్ కథాంశంతో ‘ఆదిత్య 369’ వచ్చింది. ఆ తర్వాత మరేవన్నా వచ్చాయో లేదో తెలీదు. బహుశా సైన్స్ ఫిక్షన్ అంటే పెద్ద పెద్ద యుద్ధాలూ అవీ ఉంటాయి, భారీగా ఖర్చవుతుందనేమో మరి. నిజానికి సైన్స్ ఫిక్షన్ కథలకి అవన్నీ ఉండాల్సిన అవసరం లేదు. చిన్న బడ్జెట్‌లోనూ తీయొచ్చు. కథని బట్టి ఉంటుంది కదా.

షరీఫ్: మీ కథల్లో మీకు ‘నచ్చనిది’ ఏదన్నా ఉందా? ఉంటే, ఏమిటా కథ?

అనిల్: నేనింత వరకూ రాసింది తొమ్మిది కథలే – అనువాద కథ కాక. అవన్నీ నచ్చినవే. నచ్చకపోతే అచ్చుకి పంపను. నేను ఆరేళ్ల నుండి రాస్తున్నాను. ఆరేళ్లలో తొమ్మిదే రాశానంటే, నాకు బాగా నచ్చితేనే అవి బయటికి వెళతాయి. లేకపోతే యాభై కథలు అచ్చేసి ఉండేవాడినిప్పటికి.

షరీఫ్: మీ కథల పుస్తకం ఎప్పుడొస్తుంది?

అనిల్: ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. త్వరలో విడుదలవుతుంది.

షరీఫ్: ఏం పేరు పెట్టబోతున్నారు? ఎన్ని పేజీలుంటుంది?

అనిల్: పేరు …. ఇంకా ఏమీ అనుకోలేదు. బహుశా నా తొలి కథ ‘నాగరికథ’ పేరే పెడతానేమో పుస్తకానికి. ఇక పేజీలు – పది కథలు కదా, సుమారుగా నూట నలభై ఉండొచ్చు.

[ ఇంటర్వ్యూ రికార్డ్ చేసేనాటికి ఇంకా సన్నాహకాల్లోనే ఉన్న అనిల్ ఎస్. రాయల్ కథల పుస్తకం నాగరికథఆగస్ట్ 5 విడుదల.  దానితో పాటే ఔత్సాహిక రచయితల కోసం అనిల్ రాసిన వ్యాసపరంపర కథాయణంకూడా పుస్తకరూపం తీసుకుంది ]

nagarikatha

kathayanam

షరీఫ్: ఓ సూటి ప్రశ్న. మీరు తక్కువ కథలే రాసినా, ఎక్కువ పేరు రావటానికి కారణం ఏమనుకుంటున్నారు?

అనిల్: ఎక్కువ పేరొచ్చిందనేది మీరు చెబితే కానీ తెలియలేదు. ఎక్కువ పేరుందో, ఎంత పేరుందో, అసలుందో లేదో నేను పట్టించుకోను. నా ధ్యాస కథ రాయటమ్మీదనే. నేను సాహితీ సమావేశాలకి, సభలకీ వాటికీ కూడా వెళ్లను. అందువల్ల నా గురించి ఎవరేం అనుకుంటున్నారనేది నాకు తెలియదు.

షరీఫ్: మీరు కథలు రాయటం మొదలు పెట్టటానికి ముందు బ్లాగుల్లో రాసేవారు. మీరు కథలు రాయటం మొదలు పెట్టాక వచ్చిన స్పందన అంతకు ముందు ఎందుకు రాలేదు, కథలకి మాత్రమే ఈ స్పందన ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు?

అనిల్: బ్లాగులు రాసిన కాలంలోనూ స్పందన ఉంది. కాకపోతే వాటి పరిధి చిన్నది. అవి చదివేవాళ్లు తక్కువ. అదీ కాక నేనవి ‘అబ్రకదబ్ర’ అనే మారుపేరుతో రాసేవాడిని. అది నేనే అని చాలామందికి తెలియదు. ఇక, నా కథలు …. అవి విభిన్నంగా ఉండటం వల్ల నచ్చాయని అనుకుంటున్నాను.

షరీఫ్: మీ కథలు వివిధ సంకలనాల్లో రావటం వల్ల వాటికి పేరొచ్చిందని అనుకుంటున్నారా?

అనిల్: సంకలనాల్లో వచ్చే కథలన్నీ గొప్పవని కాదు. వాటిలో రానివన్నీ గొప్పవి కాదనీ కాదు. నేను ఆరేళ్లలో తొమ్మిదికథలు రాస్తే, 2013లో ఒక్క ఏడాదే ఐదు రాశాను. వాటిలో నాకు బాగా నచ్చింది ‘శిక్ష’. అది సైన్స్ ఫిక్షన్ కాదు. ఆ తర్వాత నచ్చింది ‘ప్రళయం’ (ఇది సారంగలో వచ్చింది). ‘రీబూట్’ అనే కథ ఆ ఏడాదిలో నాకు బాగా నచ్చిన నా కథల్లో మూడవ స్థానంలో ఉంది. కానీ ఆ కథ కథాసాహితి వారి సంకలనంలో వచ్చింది. సంకలనకర్తలకి వాళ్ల స్టాండర్డ్స్, కొలతలు ఏవో ఉంటాయి కదా. వాటి ప్రకారం చూస్తే వాళ్లకి ‘రీబూట్’ ఎక్కువ నచ్చిందేమో. సంకలనాలకి ఎంపిక కాకపోయినా ‘ప్రళయం’, ‘శిక్ష’ కూడా పేరు తెచ్చుకున్నవే కదా. కాబట్టి సంకలనాల్లో రావటం అనేదొక అదనపు గౌరవమే తప్ప, కథలో సరుకున్నప్పుడు సంకలనాల ఊతం లేకుండానే గుర్తింపు వస్తుందని నా నమ్మకం.

 

షరీఫ్: మీకు సైన్స్ ఫిక్షన్ కథలంటే చాలా ఇష్టం అన్నారు. మరి సైన్స్ ఫిక్షన్ కాని ‘శిక్ష’ ఎందుకు మీర్రాసిన వాటిలో మీ ఫేవరెట్ అయింది?

అనిల్: నాకెప్పట్నుండో నా సహజశైలిలో ఓ కథ రాయాలనుండేది. పదాలతో ఆడుకోవటం, వెటకరించటం, వాక్యాల్లో వ్యంగ్యం గుప్పించి రాయటం నాకిష్టం. కానీ నేను రాసే సైన్స్ ఫిక్షన్ కథలకి వాటి అవసరం లేకపోయింది. ఇవి చాలావరకూ సీరియస్ టోన్‌తో నడిచే కథలు. వీటికోసం నేను నా సహజ శైలికి చాలా దూరం జరిగి రాయాల్సొస్తుంది. అందువల్ల ఈ సైన్స్ గోల పక్కనబెట్టి ‘శిక్ష’ రాశాను. ఇందులో నేను చెలరేగిపోవచ్చు (నవ్వు). నా ఇష్టమొచ్చినట్లు రాసుకోవచ్చు. చెప్పుకోదగ్గ ప్లాట్ లేకుండా కేవలం కథనంతోనే పాఠకుల్ని ఆకట్టుకున్న కథ ‘శిక్ష’. అందుకే అది నాకు బాగా నచ్చింది.

షరీఫ్: సైన్స్ ఫిక్షన్ నవలేమన్నా రాసే ఆలోచనుందా?

అనిల్: సైన్స్ ఫిక్షన్ నవల అనే కాదు, ఏ నవలైనా ఇప్పుడు చదివేవాళ్లు ఎక్కువగా ఉన్నారని నేననుకోను. టెక్నాలజీ కారణంగా పాఠకుల అటెన్షన్ స్పాన్ బాగా తగ్గిపోయింది. గంటలో పదిసార్లు ఎస్సెమ్మెస్ మెసేజెస్ వస్తాయి, లేకపోతే వాట్సాప్ సందేశాలు, లేదా ఫోన్ కాల్స్, ఇ-మెయిల్స్ ఇలాంటివొస్తుంటాయి. వీటన్నింటి మధ్యలో కథలు చదవటం కూడా కష్టమైపోతుంది. అలాంటిది నాలుగొందల పేజీల నవల చదవటం ఇంకా కష్టం. అందువల్ల కష్టపడి నవల రాసీ ఉపయోగం లేదు. నాకా పని చేసే ఆలోచనా లేదు.

షరీఫ్: ఒక కథ రాసేముందు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?

అనిల్: ఇందాకన్నట్లు, నేను ముందుగా ముగింపు గురించి ఆలోచిస్తాను. ముగింపులో ఓ బ్రహ్మాండమైన, పాఠకుల బుర్ర తిరిగే రివిలేషన్ కావాలి. అటువంటిది తట్టిన తర్వాత, ఆ రివిలేషన్ జరగాలంటే ఎటువంటి సంఘటనల సమాహారం ఉండాలనేది చూస్తాను. వాటినో క్రమంలో పేర్చిన తర్వాత పాత్రల గురించి ఆలోచిస్తాను. ఇలా చేయటం వల్ల నాకో అడ్వాంటేజ్ ఉంది. నా కథకి తగ్గట్లు పాత్రల్ని మలచుకోవచ్చిక్కడ. అలా కాకుండా ముందుగానే పాత్రని సృష్టించి దానికో వ్యక్తిత్వం ఇచ్చేస్తే అది దాని చిత్తమొచ్చినట్లు ప్రవర్తించటం మొదలెడుతుంది. ఎటో పరిగెడుతుంది. దాన్ని మళ్లీ కథలోకి లాక్కురావటానికి నానా తిప్పలు పడాలి. అదే నా పద్ధతిలో ఐతే – ఇక్కడ ముగింపేమిటో ముందుగానే తెలుసు, దానికి దారి తీసే సంఘటనలూ తెలుసు కాబట్టి వాటికి అనుగుణంగానే పాత్రలకి ఓ వ్యక్తిత్వాన్నిస్తాను. నేననుకున్న ముగింపుకి చేరాలంటే ఆయా పాత్రలు ఎలా ప్రవర్తించాలో, ఒకదానితో మరొకటి ఎలా సంఘర్షించాలో నిర్దేశిస్తాను. నా పాత్రలు నేను ఆడించినట్లే ఆడతాయి. ఆ విధంగా కథ మొత్తం నా కంట్రోల్‌లో ఉంటుంది. అలా ప్లాట్ డెవలప్ చేశాక కథకి ఒక రూపం – ఔట్‌లైన్ – వచ్చేస్తుంది. ఇక మిగిలింది దీనికి సంభాషణలూ అవీ చేర్చి కథ రాయటమే.

షరీఫ్: మీరు చాలా ఏళ్ల కిందటే తెలుగు ప్రాంతాన్ని వదిలేశారు. అమెరికాలో ఎక్కడో ఉంటున్నారు. కానీ మీ వచనం ఎటువంటి గందరగోళం, పునరుక్తులు లేకుండా, చిన్న చిన్న వాక్యాలతో హాయిగా ఉంటుంది. అంత అందంగా భాష అలవడటానికి మీరు చేసిన సాధన ఏమిటి?

అనిల్: నేను రాసే ప్రతి అక్షరాన్నీ తరచి చూసుకోవటమే. అంతకన్నా పెద్ద సాధన ఏమీ లేదు. నాదంతా వార్తాపత్రికలు, కథలు, నవలలు ఇలాంటివి చదివి నేర్చుకున్న తెలుగే తప్ప నేను ప్రబంధాలూ గట్రా చదవలేదు. నాకు భాషపై ఆ స్థాయి పట్టు కూడా లేదు. అది లేనప్పుడు భీకరమైన భాషలో ఏదో రాయబోవటం అనవసరం. చేతగాని పని చేసినట్లుంటుందది. అందువల్ల నాకొచ్చిన భాషలోనే రాసుకొస్తాను. ఆంగ్ల పదాల వాడకం విషయంలో మడికట్టుకు కూర్చోకపోయినా, వీలైనంత వరకూ తెలుగులోనే రాయటానికి ప్రయత్నిస్తాను. రాసినదాంట్లో తప్పులు లేకుండా జాగ్రత్త పడతాను. ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటాను. అంతే. కాకపోతే ఒకటి. లియొనార్డో డావించీ చెప్పినట్లు, simplicity is the ultimate sophistication. అత్యంత సాధారణంగా కనిపించటమే ఉత్కృష్టతకి పరాకాష్ట. ఇది స్టీవ్ జాబ్స్ నమ్మిన సిద్ధాంతం. నేనూ దాన్ని నమ్ముతాను. ఎంత క్లిష్టతరమైన కథాంశాన్నైనా తేలికపాటి భాషలో రాయటానికి ప్రయత్నిస్తాను. అనవసరమైన మార్మికత, నిగూఢార్ధాలు చొప్పించటం నాకిష్టం ఉండదు. బహుశా ఈ కారణం వల్లనే – సింపుల్‌గా కనిపించటం వల్లనే నా వాక్యాలకి మీరనే అందం చేకూరి ఉంటుంది.

Youtube link for the above interview