రావి శాస్త్రి గారి ఆరు సారా కధల్లో ….

 

ravi-sastry

నా మేనమామ ఆకెళ్ళ కృష్ణమూర్తి గారు శాస్త్రి గారి ఆప్తమిత్రుల్లో ఒకరు కాబట్టి, వారు మా మావయ్య తో విశాఖలో ని సింధియా కోలని లో ఉన్న మా ఇంటికి తరచూ  రావడం వల్ల వారితో నా చిన్నప్పటి నుంచి పరిచయం ఉండడం నా అదృష్టం. ఆ పరిచయం నా వ్యక్తిత్వమూ, ఆలోచనలు సరి అయిన దారిలో రూపొందడానికి చాలా సహకరించింది. ఆరు సారా కధలు ఏప్రెల్ 2 1961 నుంచి  లో  విశాలాంధ్ర ఆదివారం సంచికలో 6 వారాలు వచ్చినప్పుడు 16 సంవత్సరాల వయస్సులో నేను అన్ని  కధలు చదివి  చాలా ఇష్టపడి మా ఎకనామిక్స్ డిపార్టుమెంట్ లో ( అప్పుడు నేను ఆంధ్రవిశ్వవిద్యాలయం లో 4 సంవత్సరాల  ఎకనామిక్స్‌ హానర్స్ రెండవ సంవత్సరం విద్యార్ధిని) అందరితోనూ ఆ కధలు చదివించే వాడిని.

ఆ తర్వాత 1983 లో ఢిల్లీలో కల జె,యెన్.యు లో టంకశాల అశోక్ గారి ఆధ్వర్యంలో ఉండే  “ప్రగతి సాహితి” మిత్రులతో కలిసి సారా కధల ఆధారంగా   అత్తిలి కృష్ణరావు గారు రాసిన సారాంశం నాటికను నా దర్శకత్వంలో  ఢిల్లీలో 5 చోట్ల తర్వాత విజయవాడ లో జరిగిన విరసం సభల్లోనూ ప్రదర్శించాం . ఆ రకంగా ఆరు సారా కధలతో 21 ఏళ్ల తర్వాత నా అనుబంధాన్ని గట్టి పరచుకున్నాను.

2014 మార్చ్  లో ఢిల్లీ తెలుగు సాహితీ వేదిక వారు రావిశాస్త్రి గారి కధల మీద ఒక సదస్సు నిర్వహించినప్పుడు, శాస్త్రి గారి ఆరు సారా కధల మీద ఒక ప్రసంగం  చేయాలని ,   ఈ కధలని విపరీతంగా ఇష్టపడే  వాడిని కనుక,    సదస్సు నిర్వాహకుల అంగీకారం తర్వాత ఒక ప్రసంగం  చేశాను. ఇప్పుడు అదే ప్రసంగాన్ని  చాలా మార్పులు చేసిన వ్యాసమిది.  55 సంవత్సరాల తర్వాత నాకెంతో ఇష్టమయిన రావి శాస్త్రి గారి ఆరు సారా కధలను మళ్ళీ తలచు కోవడం  ఎంతో ఆనందం గా ఉంది.

మన రాజ్యాంగానికి స్వాతంత్రం  వచ్చి ఇన్నాళ్లు అయినా కూడా మన న్యాయ వ్యవస్థ ఇంకా బ్ర్తిటిష్ వాడు తన వలస పాలన సౌలభ్యం కోసం  పెట్టిన   న్యాయ పద్ధతులు, ముఖ్యంగా భారత శిక్షా స్మృతి, ( బ్రిటిషోడు 1860 లో పెట్టినదే  – పాపం కొన్ని మార్పులు తర్వాత చేసినట్టున్నారు), ఇంకా అమల్లో ఉండడం మన దౌర్భాగ్యం. 2015, 2016 ల్లో,    బ్రిటిషోడు ప్రజలు తమకు అణిగి ఉండడం కోసం ఏర్పాటు చేసిన దేశభక్తి న్యాయం (Sedition Law) కూడా ఇంకా అమల్లో ఉండడం రాజ్యం చేస్తున్న దౌర్జన్యం. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే దేశద్రోహమనే ఈ చట్టం , 2016 జనవరి – ఫిబ్రవరిలో లో హైదరాబాద్ సెంట్రల్ & జె.ఎన్.యు. విశ్వవిద్యాలయాల విద్యార్ధుల మీద జరిగిన దౌర్జన్యానికి  ప్రస్తుత ప్రభుత్వం వాడింది. . అక్కడే కాదు ఇంకా అనేక చోట్ల ఈ ‘దేశద్రోహ నేరం’ ప్రస్తుత కేంద్ర పాలకులకు తరచుగ  ఉపయోగ పడుతోంది. ఈ మార్పులను దృష్టిలో  పెట్టుకొని, 2 ఏళ్ల తర్వాత ఈ వ్యాసాన్ని తిరిగి రాసాను.

పేదల – బడుగుల సమస్యల్నే కథలుగా మలిచిన రావిశాస్త్రి గారు, ఉత్తరాంధ్ర తెలుగు సాహిత్యానికి ఇచ్చిన   గొప్ప వరం. ఆయన 1960 లో రాసిన ఆరు సారా కధలు తెలుగు సాహిత్యం లో ఒక మరుపు లేని కొత్త మలుపు. రాజ్యము రాజ్యవ్యవస్థగా ఉన్న కోర్టులు, పోలీసులు, ప్రభుత్వ కార్యాలయాలలోని ప్రజా వ్యతిరేకత  చూపించిన ఘనత ఆరు సారా కధలకే దక్కుతుంది

“ఉత్తమ సాహిత్యం సామాజిక శాస్త్రాల కన్నా ప్రతిభావంతంగా సమాజాన్ని  ప్రతి ప్రతిఫలిస్తుంది. అందుకే “సాహిత్య పరిశీలన సామాజిక అధ్యయనానికి సాధనం మాత్రమే  కాదు అవసరం కూడా” అని మిత్రుడు సి.వి.సుబ్బారావు (విరసం రచయిత + పౌరహక్కుల ఉద్యమకారుడు  – సుర/సుబ్బా) తన విభాత సంధ్యలో అన్నారు. ఆ దృష్టి లో చూస్తే ఆరు సారా కధల పరిశీలన చాలా అవసరం  అని  నా ఉద్దేశం.

ఆరు సారా కధల సంపుటి  ముందు మాటలో శ్రీ శ్రీ  గారు అన్నట్టుగా ” అతడు కళా స్రష్ట. అతడు వ్రాసిన ఆరు కథానికలు ఆరు కళా ఖండాలు.  తెలుగులో ఒక్క గురజాడ మహాకవికి మాత్రమే సాధ్యమయిన పాత్ర చిత్రణ ఈ కధల్లో కనపడుతుంది. ఇవి వాస్తవికతకు ఒక నివాళి. వీటిలో  కధనం ఉంది, కావ్యం ఉంది, డ్రామా ఉంది. జీవితాన్ని  నిశితంగా పరిశీలించడం ఉంది. ఆ చూసిన దాని మీద వ్యాఖ్యానించినట్టు గా కనిపించని వ్యాఖ్యానం ఉంది”

రావి శాస్తి గారి ఆరు సారా కధల్లో ప్రత్యేకంగానూ, ఆయన రచనలు అన్నిటిలోనూ ప్రఖ్యాత జర్మన్ నాటక రచయిత-దర్శకుడు బెర్టోల్ట్ బ్రెక్ట్  దూరీకరణ  సూత్రం  (alienation effect) ,  తాదాత్మ్య విచ్ఛిత్తి , కనిపిస్తుంది.  ఇందు లో  నాటకంలో ప్రేక్షకులకు/కధలో పాఠకులకు , తాదాత్మ్యం కలిగించి వాస్తవమని భ్రమ కలిగించాలన్న సూత్రానికి భిన్నం గా ఆ తారతమ్యాన్ని ఛేదించి, నిరంతరం ఇది నాటకం/కధ అని జ్జ్ఞప్తికి తెస్తూ, వాటిల్లో ఇమిడి ఉన్న నైతిక, సామాజిక, రాజకీయ సంఘర్షణల అంతరాయాన్ని ప్రేక్షకుడు/పాఠకుడు గ్రహించే విధంగా  చేయడం ఈ సూత్రం లక్ష్యం.

ఉదాహరణకి ‘మాయ’ కధలో ముత్తేలమ్మ అన్న పాత్ర చేత అప్పుడు దేశం లోని సామాజిక పరిస్థితిని శాస్త్రి గారు చెప్పించిన విధం చూడవచ్చు. ఆమె ఇలా అంటుంది “పీడరు బాబూ సెప్తున్నాను ఇను! నువ్వే కాదు, ఈ బాబే కాదు, ఏ మనిసి మంచోడని ఒవురు సెప్పినా  నాను  నమ్మను.   ఈ నోకంల డబ్బూ యాపారం తప్ప  మరేట్నేదు. పశువులూ-నోర్లేని సొమ్ములు  – ఆటికి నీతుంది కానీ మనకి నేదు. సదువు లేందాన్ని నాకూ నేదు; సదువుకున్నాడివి నీకూ నేదు. డబ్బు కోసం నోకం – నొకమంతా పడుచుకుంటోంది. డబ్బుకు నాను సారా అమ్ముతున్నాను, డబ్బుకి సదువుకున్న సదువంతా నువ్వమ్ముతున్నావు. డబ్బుకి పోలిసోళ్ళు  నాయ్యేన్నమ్ముతున్నారు. మందు కోసం పెద్దాసుపత్రికెల్తే  అక్కడ మందులమ్ముతున్నారు. గుళ్ళోకెళ్లి కొబ్బరికాయ సెక్కా  కాన్డడబ్బూ  ఇస్తే ఆ దేవుడి దయే అమ్ముతున్నారు. వొట్లొస్తే ( ఎన్నికలు) పీడరు బాబూ నువ్వూ. నానూ ,ఈ బాబూ, అందరం అమ్ముడయిపోతున్నాం. అమ్మకం! అమ్మకం! అమ్మకం! అమ్మకం తప్ప మరెట్నేదీలోకంలో.” ఇంతకన్నా సమాజంలో డబ్బు   ఎంత ముఖ్య పాత్ర వహిస్తోందో ఈ మాటల్లో శాస్త్రి గారు   నేరుగా  పాఠకులకు చెప్పారు. అలాగే ఈ కధల్లో  చాలా సార్లు పాత్రలు తిన్నగా పాఠకులతో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి .

సామాన్య ప్రజలు తమ రోజు వారీ జీవితం లో ఎదుర్కునే రాజ్యం యొక్క వివిధ రూపాలను /శక్తులను, వాటితో ప్రజల ప్రతి చర్యలను ఉదాహరణగా తీసుకొని మన సమాజంలో రాజ్య స్వభావం  మీద మనకున్న అమాయక మాయను తొలగించడానికి రావి శాస్త్రి గారు ఆరు సారా కధల్లో అపూర్వమయిన ప్రయత్నం చేశారు. ఆయన ఈ రచనలో  పాత్రలు రాజ్యం తాలూకా   రూపాలు లేదా శక్తులు, విభిన్న సందర్భాల్లో  ఎదుర్కుంటాయి.   వాళ్ళ సామాజిక అనుభవాలని విశ్లేషించడం రావి శాస్త్రి గారు సాధించిన విజయం. ఆ పరిశీలనను, పైన చెప్పిన  బెక్ట్ పద్ధతి లో పాఠకులు ఆలోచించే శైలి లో వారు రాశారు.  అయన ఆరు సారా కధల  తరవాత వచ్చిన ఇతరుల కధల మీద, ముఖ్యం గా బీనాదేవి , పతంజలి రచనల మీద, వాటి ప్రభావం చాలా ఉంది.

వివిన మూర్తి, ఏం.వి.రాయుడు గార్ల సంపాదకత్వంలో వచ్చిన “రాచకొండ విశ్వనాధశాస్త్రి  రచనా సాగరంలో” లో వారు చెప్పినట్టు “బాధ్యతగా మాత్రమే రాయాలనుకుంటున్న రచయిత   తన ఆవేశానికి అనుగుణంగా కళాకౌశవాన్ని ఇనుమడింప చేసుకుని ఆరు సారా కధల వంటి కళాఖండాలను  వెలువరించిన దశ ఇది. ఈ కధలు శాస్త్రి గారు తన రాజకీయ దృక్పథాన్ని స్థిరపరచుకున్న దశలో వచ్చిన మొదటిది”.

ఆరు సారా కధల్లో రావి శాస్తి గారు రాజ్యం, ప్రజల, ముఖ్యంగా అణగారిన ప్రజల పైన, తన అధికారం చూపడానికి సులభంగా, అది కూడా వలస వాదులు, ఎదురు తిరిగే ప్రజలను అణచివేయడానికి పనికి వచ్చే శిక్షా స్మృతి , మిగిలిన వలస వాద న్యాయ సూత్రాల సహాయంతో, రాజ్యం కొమ్ము కాచే  రెండు ముఖ్య సంస్థలు పోలీసు , న్యాయ వ్యవస్థ ల గురించి ఒక తిరస్కార   విమర్శ చూపించారు.  అయితే పోలీసుల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ బాధను, నిస్సహాయతను సహానుభూతితో చూపుతారు. ఇది మనం మోసం కధలో చూడవచ్చు.  ప్రజల రక్షణ కోసం ఉన్న పోలీసులను తమ స్వంత పనులకోసం  రాజ్యాన్ని నడిపే రాజకీయ నాయకులు, ఆ నాయకులను నిలబెట్టి గెలిపించే అత్యధిక ధనిక వర్గాలు  ఎలా హింస పెడతారో   అద్భుతంగా చెప్పారు శాస్త్రి గారు.

బ్రిటిషోడు తన రాజ్యాధికారం కోసం మరియు  తన వలసను స్థిరపరచుకునేందుకు ఏర్పాటు చేసిన శిక్షాస్మృతిని, న్యాయవ్యవస్థని స్వాతంత్రం వచ్చేకా కూడా మన దేశం లో అమల్లో ఉండటాన్ని “మాయ’ కధలో ఒక సీనియర్ న్యాయవాది ఒక చిన్న న్యాయవాదితో చెప్పిన ఈ కింది సంభాషణ లో కనిపిస్తుంది. అప్పటి వలస చట్టాలను గత రెండు సంవత్సరాలుగా , 2015-2016 ల్లో మన ప్రభుత్వం  దేశ ప్రజలమీద, ముఖ్యంగా విద్యార్ధుల మీద, రాజ్య పద్ధతులను ప్రశ్నిస్తున్న అన్నీ వర్గాల మీద   ప్రభుత్వం   తన సంస్థల  ద్వారా జరిపిస్తున్న దాడుల్లో కూడా ఈ సంగతి ఖచ్చితంగా కనిపిస్తుంది.

జ్ఞానమొచ్చినప్పటినుంచి,  నాకు  ఒక విషయం ఎప్పుడూ అర్ధమయ్యేది కాదు. చట్టాలోకటే అయినప్పుడు ఒక కేసు నిర్ణయం ఒకొక్క కోర్టు లో ఒకొక్క విధంగా యెందుకుంటుందని . ఈ న్యాయ నిర్ణయం లో అంతులేని పేద నిస్సహాయులకు, పలుకుబడీ, అధికారం లో ఉన్న తేడా కూడా మనం చూస్తూనే ఉంటాం. మనది చాలా గొప్ప ప్రజాస్వామ్య దేశమనీనూ , ఇంత గొప్ప దేశం లో న్యాయం  చాలా నిజంగానూ, స్వచ్ఛంగా తళతళ మెరుస్తుందనీనూ    నమ్మేవారు శాస్త్రి గారు   చెప్పిన ఈ కింది మాటలు (మాయ కధ)  మనస్సులో పెట్టుకోవాలి. ఈ మాటల నిజం  ఈ మధ్య ప్రభుత్వం ఆడిన  డీమోనటైజేషన్ నాటకం లో బాగా కనిపిస్తుంది. దేశం లో ఉన్న నల్ల డబ్బును బయటకు తీయడానికి మొదలు పెట్టిన ఈ ప్రక్రియ లో నల్ల డబ్బున్న కొద్దిమందీ బాగానే ఉన్నారు, ఏమీ లేని జనం మాత్రం  రోజుల తడబడి లైన్లలో నుంచుని , అందులో కనీసం 100 పైగా చనిపోయిన దౌర్భాగ్యం,  ఎలా జరిగుంటుందో  కూడా ఈ మాటల్లో తెలుస్తుంది.

ఇంగ్లీషువాడు మనకి స్థాపించిన న్యాయం అది. ఆకులన్నీ ప్రజలవి. ఆపిల్ పళ్ళన్నీ అధికారులవి. వాళ్ళ దేశంలోనూ అంతే, మన దేశంలోనూ అంతే.      మనకి వాడు చెప్పిన పాఠమే అది. పని కూలివెధవల్ది. లాభం బుగతది     (పెట్టుబడిదారుడిది).   ఏమైనా అంటే , ఎదురు తిరిగితే మన (రాజ్యం)    సాయానికి  (పోలీసులున్నారు) కోర్టులున్నాయి, జెయిళ్ళున్నాయి.  ఇవి లేకపోతే        ఇంగ్లీషువాడి  రాజ్యమే లేదు. ……… ఆఖర్నయినా ఏం          చేశాడు? అక్కడా-అక్కడా  చలాయించినట్టు ఇక్కడ (కూడా) కూలి       వెధవలు   పెత్తనం             చలాయిస్తారేమోనని అనుమానం కలిగింది.  వెంటనే సాటి        షావుకార్లకి   రాజ్యం అప్పచెప్పి చల్లగా తెర వెనక్కి      జారుకున్నాడు.   గొప్ప మాయగాడు. వ్యాపారం, వ్యాపారం లాగే ఉంది.   లాభాలు  లాభాల్లాగే ఉన్నాయి.  ఏదైనా       రొష్తుంటే అదంతా మన      వెధవల్దే  అయింది.

అందుకే ఇప్పటి న్యాయవ్యవస్థలో, అప్పటి వలస రాజ్యం లో లాగా, కోర్టుల్లో అనాధుల ఆక్రందన, పేదల కన్నీటి జాలులే కనిపిస్తాయి. ప్రభుత్వం వారి లెక్కల ప్రకారమే  డిసెంబర్ 31, 2015 కు , దేశంలో నిందమోపబడి, న్యాయ విచారణ కోసం  జైళ్లలో మగ్గుతున్న ఖైదీలలో సగానికి పైగా – 54.9 శాతం , (దళితులు  21.6%. గిరిజనులు  12.4% మరియు ముస్లింలు 20.9%) వీరే కనిపిస్తారు. వీరు కాక మిగతా వెనుకబడిన కులాల (OBC) 31% శాతం కూడా కలిపితే మొత్తం 85.9% ఉన్నారు.

ఇదేమాట శాస్త్రి గారు 50 సంవత్సరాల కిందట  రాసిన వారి నిజం నాటకం ముందు మాటలో   ఇలా చెప్పారు.

ప్రస్తుతం మన దేశంలో ప్రతి రోజూ, ప్రతీ ఛోటా కూడా ఎందరో      కొందరమాయకులు వాళ్ళు చేయని నేరానికి శిక్షలనుభవించడం            జరుగుతోంది. కానీ , ఈమాత్రం డబ్బూ పలుకుబడీ, పదవీ, హోదా        కలవాడెవడూ పడడు, ఇరుక్కోడు, ఒకవేళ పడినా, ఇరుక్కున్నా పైకి    తప్పించుకోగలడు.

ఇలా ఎన్ని రోజులు?. రావి శాస్త్రి గారు సారా కధల్లోని పుణ్యం కధలో మార్పు ఎలాగో సూచించారు. ఈ కధలో  పోలమ్మ అన్న ఆవిడ గురించి కరుణాకరం అనే లాయరు ఇంకో తోటి లాయరుతో మాట్లాడుతూ :

            అది తెలివితక్కువ ముండ, వెర్రి వెంగళ్ళప్పన్నావు . ఇప్పటికీ బాగానే  ఉంది. అలాంటి వాళ్ళు దేశంలో కోటానుకోట్లున్నారు. అందుకే నువ్వూ      నేనూ బతికేస్తున్నాం. కానీ ఎల్లకాలం వాళ్ళు అలా వెంగళప్పల్లా        ఉండిపోరు. ఎప్పుడో అప్పుడు వాళ్ళు గప్పున తెలివి             తెచ్చుకుంటారు. వాళ్ళు తెలివి     తెచ్చుకుంటే నువ్వూ నేనూ,   నీలాంటి వాళ్లూ నాలాంటి వాళ్ళం అంతా కూడా జాగ్రత్తగా      ఉండాలి.            ఏంచేత జాగ్రత్తగా వుండలో తెలుసా?. అప్పుడు    పుణ్యం వర్ధిల్లుతుంది . అప్పుడు మనలాంటి పాపులం బహు జాగ్రత్తగా ఉండాలి.

  ఇప్పుడున్న వ్యవస్థలో, రాజ్యం సామాన్య ప్రజల అణచివేతకు, దోపిడీకి, బ్రిటిష్ వాడు తన వలస పాలన కోసం ఏర్పాటు చేసిన చట్టాలూ, న్యాయ వ్యవస్థలనూ,  స్వాతంత్రం వచ్చాక కూడా ప్రభుత్వం ఎలా వాడుకుంటున్నాయా 1961 లోనే చెప్పారు తన ఆరు సారా కధల్లో.

 చివరగా….

ఆరు సార కధల్లోని మోక్షం కధలో చెప్పినట్టు  –   ఒహ్హో మర్చేపోయాను! గవర్నమెంటుకి పాపం (ఈ డీమోనటైజేషన్ తో) పిచ్చెకింది కదూ? ఎలా ఉందో ఏమిటో చూద్దాం పదండి.

(ఈ వ్యాసం రాయడం లో మిత్రులు మృణాలిని, వేణుగోపాల్, , సాయిపద్మ, విజయభాను కోటె మంచి సలహాలనిచ్చి  సహకరించారు. వారికి నా కృతజ్ఞతలు )

 

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. Kcube Varma says:

    Correct timelo Manchi parichayam chesaaru sir . Sastry gari kathallo unna vaastavika jnaanam manalni chaitanyam chestundi. Rajyam yenta Maya chestundo Tanu pottavippi choopaaru. Modi maayaajaalam daanini toduga unna neti media yentaga sahakaristu saamaanyunni abhadrata bhaavaniki gurichestu kalugulonchi bayataku raaniyakunda chestundo manaku pratyaksha anubhavamavutondi. Meku dhanyavadaalu.

  2. Krishna Rao says:

    చక్కగా చెప్పారు.. మీరు ఇంకా రాయండి

  3. కె.కె. రామయ్య says:

    కరెక్ట్ టైంలో మంచి పరిచయం చేశారు సార్.

    శాస్త్రి గారి కధల్లో ఉన్న వాస్తవిక జ్ఞానం మనల్ని చైతన్యం చేస్తుంది. రాజ్యం యెంత మాయ చేస్తుందో తను పొట్టవిప్పి చూపారు. మోడీ మాయాజాలం దానికి తోడుగా ఉన్న నేటి మీడియా ఎంతగా సహకరిస్తూ సామాన్యుణ్ణి అభద్రతా భావానికి గురిచేస్తూ కలుగులోంచి బయటకు రానియ్యకుండా చేస్తున్నదో మనకు ప్రత్యక్ష అనుభవమవుతోంది.

    మీకు ధన్యవాదాలు ~ కెక్యూబ్ వర్మ

  4. సాయి పద్మ says:

    సుబ్బు సర్.. బాగా రాసేరు, ముఖ్యంగా నాటకానికి రావి శాస్త్రి గారి కథలు వోదిగినంత గా ఇంకేవీ వోదగలేదేమో అనిపిస్తూ ఉంటుంది. టెక్నికల్ గా మీరు రాసింది చదివాక , ఎందుకో అర్ధమైంది. రాస్తూ ఉండండి. చాలా నచ్చింది.
    అదే సమయంలో, కాన్తెంపరరీ ఇస్స్యూస్ కి కూడా కనెక్ట్ చేసారు.. అది కూడా బాగా కుదిరింది. మన వోయిజాగు బాసలో సెప్పాలంటే.. గురువా.. మా సెడ్డ గా రాస్సీనావు.. చాత్రి బావు పూనేసినాడా ఏటి గానీ..

  5. రావు వేమూరి says:

    ఈ ఆరు సారా కథలు అంతర్జాలంలో ఎక్కడైనా దొరుకుతాయా? తెలిస్తే లంకెలు పంపండి. ధన్యవాదాలు

    – వేమూరి

  6. కె.కె. రామయ్య says:

    ఆరు సారా కథలు కాకున్నా, రావిశాస్త్రి గారి రచనల కోసం ఇక్కడ ప్రయత్నించవలసినది

    1) మనసు పౌoడేషన్
    http://www.manasufoundation.com/works/works-done/books/books-complete-works/raavisaastri-rachanaa-saagaram/

    2) నవోదయ బుక్ హౌస్ కాచిగూడా, హైదరాబాదు వారి నుండి కానీ
    http://www.telugubooks.in/collections/raavi-sastry

  7. కె.కె. రామయ్య says:

    http://vaakili.com/patrika/?p=2697
    మరపురాని కథ… రావిశాస్త్రి ‘మాయ’! – సి. హెచ్ వేణు

    రా.వి.శాస్త్రి గారి ‘ఆరు సారాకథలు’ (పాపి, మాయ, న్యాయం, మోసం, పుణ్యం, మోక్షం ) పుస్తకంగా మే 1962లో వచ్చినపుడు ‘మొదటి మాట’ రాశారు శ్రీశ్రీ. దానిలో ఈ ‘మాయ ’ కథలో ముత్యాలమ్మ ప్రసంగాన్ని సాహితీ శిఖరంగా అభివర్ణించారు. మాయ’ కథానికను ఈ లింకులో చదవొచ్చు: http://www.scribd.com/doc/135355638/Maaya

    • D. Subrahmanyam says:

      అవును. అందుకే నేను నా వ్యాసంలో శాస్త్రి గారిని బ్రేక్ట్ alienation టెక్నిక్ తో పోలుస్తూ మాయలో ముత్యాలమ్మ సంభాషణ ఉదాహరించాను. యడవల్లి రమణ గారు ఇంకో సందర్భంలో మాట్లాడుతూ ఆరు సారా కధలు అప్పటి మధ్యనిషేధ సమయంలో రాయబడ్డావని చెప్పాలని. నిజమే, రావి శాస్త్రి గారు ఆరు సారా కధలు రాసినప్పుడు అపుప్డఫు అమలు లో ఉన్న మద్యనిషేధం వల్ల అల్పజీవుల బాధలు, ముఖ్యంగా మా సింధియా కోలనీకి అనుకోను ఉన్న ఏరడా కొండా అవతల నుంచి వచ్చేది ఎక్కువుగా. శాస్త్రి గారికి ఏరడా కొందంటే భలే ఇష్టం .

  8. దేవరకొండ సుబ్రహ్మణ్యం గారూ …రావి శాస్త్రి గారి 6సారా కథల పై మీ విస్లషణ చదివాక ఇప్పుడు ఆ కథలు చదవాలనిపిస్తుంది..చదువుతాను.ఆ కథలు ప్రచురించినపుడు నాది school going age. రావి శాస్త్రి గారి కథల్లోని Alienation technique విడమరిచి చెప్పారు . బాగుంది . ధన్యవాదాయాలు .

  9. విమల says:

    సుబ్బుగారు, ఆరుసారా కధల సారాన్ని, సమకాలీన రాజకీయాలకి అన్వఇస్తూ బాగా రాసారు.
    ఈ కధలను నాటకాలుగా మలచటం, దానికి వచ్చిన ప్రతిస్పందనల పైన కూడా మీరు రాయాలి, నిజానికి నాటకరంగం లో ఎంతో అనుభవం ఉన్న మీ నుండి మరిన్ని మంచి సంగతులు తెలుసుకోవాలని ఉంది. రాయండి ఇంకా ఇంకా.. అభినందనలు

    విమల

  10. వివిన మూర్తి says:

    సర్ మీ వ్యాసంలో
    ౧. వర్తమాన సామాజిక, రాజకీయ సన్నివేశాలను ఆరు సారా కథల నేపధ్యంలో పరిశీలించే ప్రయత్నం నాకు నచ్చింది. whole system is pitted against individual అంటారు శాస్త్రి. ఈ వాక్యం గుర్తు మేరకి రాసింది. చిన్ని తేడా ఉండొచ్చు. సారాకథలు నిజం వంటి అనేక రచనలు ఈ అంశాన్నే చూపిస్తాయి. కాకపోతే వర్తమాన ప్రభుత్వం సెడిషన్ చట్టాన్ని వాడినంతగా ఎమర్జన్సీలో కూడా వాడలేదు. చట్టం గురించి.. మనదేశం కొనసాగిస్తున్న పాత చట్టాల గురించి అనుకోవలసింది ఒకటే. పరాయి పాలకుల అవసరాలు తీర్చిన చట్టాలు కొనసాగింపు పరాయి పాలన కొనసాగింపు.
    2. ఉత్తరాంధ్ర సాహిత్యంగా మాత్రం దీనిని రాయటం నాకు నచ్చలేదు. రావిశాస్త్రిగారి వంటి వారిని కుబ్జలుగా మార్చటానికీ దీనికీ తేడాలేదు. ఇది తెలియక జరిగితో సరిదిద్దుకుంటే సంతోషం. తెలిసి చేస్తే మీ తెలివిడిని పునఃపరిశీలన చేసుకోవాలి. రచయిత సమర్థుడైతే తన చుట్టూ ఉన్న చిన్ని ప్రపంచం నుంచే సమస్త ప్రపంచానికీ సంబంధించిన అంశాన్ని చూస్తాడు. వీధియుద్దంలో ప్రపంచయుద్దాన్ని దర్శించగలవాడే రచయిత అంటారు టాల్ స్టాయ్.
    3.

    • D. Subrahmanyam says:

      Thanks sir. Without any hesitation I agree with your point. Ravi sastri garu belongs to the entire Modern Telugu sahitysm. I only said Uttarandhra contributed another good great writer. A writer who made an unforgettable contribution to the genre of Entire Telugu literature.

  11. Sharada Sivapurapu says:

    సుబ్రమణ్యం గారూ, మీ వ్యాసం చాలా విపులంగా ఎన్నో విషయాలను చెప్తూ సాగింది. నేనెంతో ఇష్టపడే రచయిత రావి శాస్త్రి గారు. నేను చదివిన ఆయన ప్రతి కధా, ఆ కధనీ ఆ పాత్రల్నీ కధలో జరిగే సంఘటనలు చిత్రించడంలో ఆయన ప్రతిభనీ, మానవ సంబంధాల్లోన్ని పోలిటిక్స్ అండర్స్టాండింగ్ నీ అబ్బురపడేలా చేసిందన్నమాట నిజం. మీకు రావి శాస్త్రిగారితో ఉన్న అనుబంధం తెలిసాకా చాల సంతోషంగా ఉంది. రుక్కులు మళ్ళీ చదువుదామని ప్రయత్నిస్తే ఈమధ్య పుస్తకం దొరకలేదు. మొత్తానికి మళ్ళీ రావి శాస్త్రిగారి కధలన్నీ చదవాలన్న కుతూహలం రేకెత్తించారు. ధన్యవాదాలు.

  12. Narayanaswamy says:

    రావి శాస్త్రి గారి సాహిత్యం సమాజం లోని అధోజగత్తును దాని వ్యవహారాలను అందులో నలిగిపోయిన పతితులను బాధాసర్పదష్టులను అద్భుతంగా ప్రతిఫలించింది – మీ వ్యాసంలో రావిశాస్త్రి గారి ఆత్మను పట్టుకున్నారు – చాలా వివరంగా గొప్పగా రాసారు సుబ్బు గారూ – అభినందనలు.

మీ మాటలు

*