వాన వెలిసింది !

ఆ చూపుకి, మాటకీ ఎంత శక్తి! ఎన్నడూ కనీసం ఊహించనైనా లేదు. పిల్లదాని మాటలో నన్ను నిర్బంధించే శక్తి  ఉందని. ఎక్కడికి వెళ్లినా, ఎందరితో మాట్లాడుతున్నా మనసులో ముద్రితమైన దాని మాట మాత్రం నన్ను వొంటరిగా లాక్కుపోతోంది. ఆఫీస్‌ టైమ్‌ అయిన హడావుడిలో దాన్నసలు పట్టించుకోవడం లేదు. తీరా వీధి గుమ్మం దగ్గరికి రాగానే అడ్డుపడి ‘ఇవాళ వెళ్లకమ్మా… నిన్ను పోనీనంతే..!’  అని గట్టిగా కావలించుకుంటుంది. ఇవాళా అంతే. నా హడావుడిలో దాన్ని విడిపించుకుని పట్టుకోమని అమ్మకి చెప్పి బస్సెక్కాను. కానీ ఆ పిచ్చిముండ ఎంత బాధపడుతోందో తెలీకా కాదు. ఈమధ్య ఆఫీసు పని ఎక్కువై దాని సంగతే పట్టించుకోవడం లేదు.

దానికి అమ్మే దగ్గరయింది. ఎప్పుడూ తన దగ్గరే ఎక్కువ ఉండటం, నన్ను చూస్తే కోపం, చిరాకూను.  నేనేం చెయ్యను? ఉద్యోగం చేయడం తప్పడం లేదు. అయినా ఇలాంటి నగరాల్లో బతకాలంటే ఇంటిల్లపాదీ చిన్నా చితకా ఉద్యోగం చేయక తప్పదు. అప్పడే కాస్తంతైనా ఆనందం. ఇదుగో యిలా నాలుగేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయమే నన్ను నా కూతురికి దూరం చేసింది. దానితో ఆడుకోవాలనుకునే సమయంలో ఉద్యోగం తప్పింది కాదు. ఆయన స్నేహితుల వల్ల మోసపోయి వ్యాపారంలో బాగా దెబ్బతిన్నారు. రెండేళ్లుగా మరీ పిచ్చెత్తినట్టు తిరుగుతున్నారు. ఆయన్నని లాభమేమిటి? అంఆ దురదృష్టం గాక. అప్పటికీ ఓ చిన్న ఉద్యోగం కోసం తిరుగుతూనే ఉన్నారు… ఆలోచనలు తెగేసరికి ఆఫీస్‌ బస్టాప్‌ వచ్చేసింది.

ఓ పదడుగులు నడిచి ఆఫీస్‌ చేరగానే జయ లాంగ్‌లీవ్‌ అయి చేరినట్టు తెలిసింది. ఇవాళ ఆఫీసర్‌ లేకపోవడంతో పని తగ్గించుకుని జయ కోసం పక్క సెక్షన్‌కి వెళ్లాను. చాలా రోజులకి కలవడంతో ఎంతో ఆనందించింది. ఇద్దరం క్యాంటిన్‌కి వెళ్లి చిన్నపిల్లల్లా ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం. తను ఏవో చాలా సంగతులు చెప్తోంది. నేను మాటల మధ్యలో ఎందురుగా గోడ మీద వాలిన పిచ్చికని చూస్తుండిపోయాను. అది ఒక్కసారి రెక్కలాడించడం, ముక్కుతో మట్టిని తాకడం తమాషాగా అనిపించింది.  నాకు నా కూతురు గుర్తొచ్చి ఏం చేస్తోందోనని ఆలోచనలో పడ్డాను..

నన్ను నిలదీసి అడిగేంత శక్తి ఎలా వచ్చిందోనని, నన్ను నేను ఆలోచించుకునేట్టు  ఎలా  అనగలిగిందోనని  ఆలోచనలో పడ్డాను. అంతలో బుజం మీద గట్టి దెబ్బ తగిలి ఆలోచనలు తెగాయి.

‘‘ఏమాలోచిస్తున్నావే. ?  ఇందాకట్నించీ పిలుస్తున్నాను. ఏమయింది?’’ నా స్నేహితురాలు అడిగింది.

‘‘ఏం లేదు.  ఉద్యోగం మానేద్దామనుకుంటున్నాను.’’

నీకేమైనా పిచ్చా ?? ఆరేళ్ల తర్వాత గవర్నమెంట్‌ జాబ్‌ వదులుకుంటావా?’’

‘………..’

‘‘ఉద్యోగాల్లేక జనాలు ఛస్తుంటే, ఉన్నది వదులుకుంటానంటావే?!’’

అది నిజమే. కానీ పిల్లదానికి  మరీ దూరమవుతున్నాను. ఈ ఉద్యోగం కంటే దాని ప్రేమే కావాలి. అది కనీసం నా వైపేనా చూడ్డం లేదు. నేనంటే అయిష్టం ఏర్పడింది. కానీ ఇవన్నీ ఎలా ఎవరికి చెప్పుకోను? జయ కూడా అర్థం చేసుకోలే దేమో? నన్ను నేను తర్కించుకుంటున్నాను.

‘‘పిల్లదానితో అమ్మా,  చెల్లెలూ అవస్థలు పడుతున్నారే..’’ అనగలిగాను.

‘‘మరి ఇంటి సంగతి ?’’

‘‘అదే ఆలోచిస్తున్నాను. నేను ఉద్యోగం చేయడం అందరికీ అవసరం. నాకు పిల్ల ఆవసరం’’

పిల్లకి మాత్రం నేనక్కర్లేదట! నాకు దుఖం పెల్లుబికింది. జయను కావలించుకుని ఏడ్చేశాను. నన్ను ఊరుకోబెట్టడానికి తను చాలా సంగతులు చెప్పింది.

సాయంత్రం ఆఫీస్‌ అయి ఇద్దరం చెరో దారాన బస్‌ ఎక్కాం.  ఆలోచన మాత్రం తెగలేదు. నన్ను ఇప్పుడు ఇంట్లోకి రానిస్తుందో లేదో నన్న భయమూ పట్టుకుంది. నాలో ఎందుకింత మార్పో అర్థం కావడం లేదు. పిల్లకి కోపం ఉండదన్న సంగతి మర్చిపోయి పిల్లది నేను ఆఫీస్‌కి వస్తుంటే చూసిన చూపుకి ఇంకా భయపడుతూనే ఉన్నాను. నాదో చిత్రమైన పరిస్థితి… ఇంతలో కండక్టర్‌ అరిచాడు..

‘‘అమ్మా, నారాయణగూడా వచ్చింది. దిగండి’’.. ఇటూ ఇటూ కంగారుగా చూసి గబగబా దిగాను. అక్కడి నుంచి నిదానంగా ఇల్లు చేరుకునే సరికి టైమ్‌ ఏడయింది.

హాల్లో కుర్చీలో కూచుని హోమ్‌వర్క్‌ చేసుకుంటున్న పిల్ల నా వైపు ఒకసారి తీక్షణంగా చూసింది. మళ్లీ తన రాత పనిలో మునిగింది. నా యింట్లో నేను అపరిచితురాలిలా నిదానంగా చెప్పులు ఓ మూల విడిచి బ్యాగ్‌ టీపాయ్‌ మీద పడేసి అతిధిలా లోపలికి వెళ్లాను. కాఫీతో మళ్లీ వచ్చేసరికి అమ్మలు అమ్మ దగ్గర కథ వింటోంది. అప్పుడు డిస్టర్బ్‌ చేయడం యిష్టంలేక,  తర్వాతనైనా దాన్ని పలకరంచి సారీ చెబుతామని ఎంతో ఆత్రుతతో అటూ యిటూ పచార్లు చేశాను. కానీ గుండెలో భయం మాత్రం పోలేదు. చిన్నప్పుడు లెక్కలు తప్పు చేస్తే నాన్న  కొట్టడం గుర్తొచ్చింది. నాన్నంటే ఎంత భయమో యిప్పుడీ చిన్న ముండంటే అంత భయమూ పట్టుకుంది. కానీ అది దూరమవుతోందన్న  బెంగ పట్టుకు  పీడిస్తోంది.

మా యిద్దరి మధ్యా భూమి బద్దలై అది నాకు కనుమరుగయినట్లనిపిస్తోంది … అబ్బా! తల తిరిగి పెరట్లో మెట్లపై పడ్డాను. ఒక్క పరుగున అమ్మ వచ్చి లేపింది. కానీ కాలు బెణికి విపరీతంగా నొప్పిగా  ఉంది, ఏడుపొస్తోంది. అయినా నేనిలా మరీ పరాధ్యానంగా ఉండటానికి కారణం తనకీ తెలుసు. అందుకే ఏమీ అనలేకపోయింది. కనీసం ఈ క్షణాన్నైనా పిల్లవచ్చి కావలించుకుంటుందని అనుకున్నాను. కానీ అది నా అరుపు విని హాల్లో గుమ్మందగ్గర సగం వేసిన తలుపుకి బుగ్గలు ఆనించి భయం భయంగా చూసి వెళ్లిపోయింది. నాకు ఏడుపు ఆగలేదు.

భోజనాలయ్యాక చిన్నదాన్ని ఎలాగయినా దగ్గరికి చేర్చుకోవాలనుకున్నాను. బెడ్‌ రూమ్‌ కిటికీలోంచి అది వీధిలో వర్షానికి నిలిచిన నీళ్లని చూస్తోంది. వెనగ్గా వెళ్లి పట్టుకున్నాను.

‘‘నా తల్లి గదూ, బంగారం కదూ, రామ్మా…’ అంటూ మీదికి లాక్కోబోయాను. అది నన్ను విదిల్చుకుని లేవబోయింది. దాని కాళ్లు పట్టుకని భోరున ఏడ్చాను.

‘‘నన్ను వొంటరిదాన్ని చెయ్యద్దని’ ఏడుస్తూ దాని వొళ్లో తలవాల్చాను కొంతసేపటికి అది తన చిట్టి చేతులతో నా ముఖాన్ని ఎత్తి  కన్నీళ్లు తుడిచింది.

‘‘నాన్న వెళుతున్నాడుగా నువ్వెందుకు ఆఫీసుకి వెళ్ళడం. అమ్మమ్మ, పిన్నీ యింట్లోనే ఉన్నారుగా?’ అంటూ అదీ ఏడ్చింది.

‘‘లేదమ్మా నిన్ను విడిచి ఎక్కడికీ వెళ్లను’’ అంటూ ఎత్తుకున్నాను. ఆ క్షణంలో నా ఆనందానికి అంతేలేదు. పిచ్చిగా అరిచాను. గట్టిగా నవ్వాను. దానితో దొంగా పోలీస్‌ ఆడాను. అంత చలిలోనూ  దానితో వీధి గేటు దగ్గర రోడ్డు మీదా నిలిచిన నీళ్లలో దానికంటే వేగంగా చిందులు వేశాను. ఈ ఆనందాన్ని పోగొట్టుకోకూడదనిపించింది. అలా ఆడుతూనే పిచ్చిదానిలా నవ్వుతూనే పక్కింటికెళ్లి ఫోన్‌ అడిగాను. అప్పటికి రాత్రి తొమ్మిది దాటింది. ఆఫీసర్‌ యింటికి ఫోన్‌ చేసి నేను వారం రోజులు రానని చెప్పాను.

ఆయనేమన్నాడో తెలీదు… వినలేదు… కాదు ఈ ఆనందంలో వినిపించలేదు..

— టి.లలితప్రసాద్‌