ఈ కవిత్వం ఒక ఆర్ట్ గ్యాలరీ..వెంటాడే పూల సంబరం!

 

 “కవిత నా మతం – మతం లేనివాడి మతంనా భాషే నా ముల్లు

నెత్తురు చిమ్మే నా స్పర్శలో

నేలకి తెలియచేస్తున్నాను

నేనిక్కడ ఉన్నానని నేలకు తెలియదు

ఒకప్పుడు ఈ ముళ్లన్నీ పూలేనని

పచ్చికల దాపుల్లోమరో సౌందర్యం సృష్టిస్తున్నాను

వెన్నెలకి అతీతంగా కలలకి అతీతంగా

పదునైన సమాంతర భాష”.

-సచ్చిదానందన్ (ప్రసిధ్ద మలయాళీ కవి)

 

 

పూలండోయ్ పూలు కవిత్వ సంకలనం చదివిన ప్రతి రసహృదయుడూ ఒక రంగుల ప్రపంచం లాంటి ప్రసిద్ధ చిత్రకారుని ‘ఆర్ట్ గ్యాలరీ’ లోకి వెళ్లి వర్ణనకు భాష చాలని ఒక అద్భుత ‘వర్ణానుభూతిని’ పొంది తన్మయత్వంతో వెలుపలికి వస్తాడనటంలో సత్య సౌందర్య పూర్వకమైన సాహిత్య ప్రమాణమున్నది. బహుశ మనం సాధారణంగా అలవాటుపడ్డ  verbal expression కవి ప్రసాదమూర్తి  ‘heightened emotions’ ని అందుకోవడానికి, అభివ్యక్తం చెయ్యడానికి చాలా సీమితమైన మార్గంగా అగుపిస్తుంది. అతని కళాత్మక అనుభూతి పూల తోటల్లోకి సీతాకోక చిలుకలై ఎగిరిపోవాల్సిందే.

సుప్రసిద్ద సాహితీవేత్త సోమసుందర్ గారు ప్రసాదమూర్తి కవిత్వం లో ప్రసాద గుణం స్పష్టంగా కనిపిస్తుంది అని, విశిష్టకవి అని అభినందించారు. ప్రసాదమూర్తి సహజంగానే సౌజన్యమూర్తి, భావుకుడు,  సౌందర్యోపాసకుడు, ప్రకృతి ఆరాధకుడు, సాత్వికుడు, సదా సంచారి, సత్యాన్వేషి, సంఘమిత్రుడు, ఉలిపట్టని కవిశిల్పి.

నేను ‘పూలండోయ్ పూలు’ కవిత్వాన్ని ‘చిత్ర చిత్రాలు’గా రంగురంగులుగా , నది పాయలు పాయలుగా చదువుతూ, అనుభూతిచెందుతూ ఉంటున్నప్పుడు ఒక  అనిర్వచనీయమైన తాదాత్మ్యంలోకి వెళ్లాను. చైనా దేశపు తాత్త్విక పరిభాషలో ‘తావోయిజం’ పదజాలంలో అక్షరీకరించాలంటే అదొక ‘ Transcendental consciousness’.

‘పూలండోయ్ పూలు’ కవిత ఇటీవల తెలుగు కవిత్వంలో వచ్చిన  ‘ the most melodious, magical, mesmerising and enchanting poem గా సహృదయుల్ని సమ్మోహ పరిచింది. తన్ను తాను గానం చేసుకుంటూ, సరసుల హృదయ సరస్సుల్లోనే, హంసలా భావతరంగ మాలికలపై డోలలూగుతున్నది.

ఈ కవితలో ఈ చరణాలు.. ప్రసాదమూర్తి విలక్షణమైన ఊహాశక్తికి అద్దం పడుతున్నాయి.

“మనుషులంతా పూవ్వులైపోయినట్టు..

పువ్వులు మనుషుల్ని మూటలు గట్టి

మంచికీ, మానవత్వానికీ మధ్య

ఆదాన ప్రదానాలు చేస్తున్నట్టు..

——-   —–   ——

బతుకుల్ని తూకం వేసి అమ్ముకునే చోట

ఈ పరిమళాల బజారులోనే

నాకు బతుకుపరమార్ధం  దొరికింది.”.

పై చరణాల్లోంచి ఒక సారాంశాన్ని పిండుకోవడానికి వీలుంది. కవిత్వ కళ ఆత్మకళగా, హృదయకళగా విమర్శ పరిభాషలో ప్రస్తావించబడుతూ వుంటుంది. అది మనిషిని తన అంతస్సీమలలో గూడు కట్టుకున్న చీకటి నుంచి తేజస్సు దిశగా ప్రస్థానం సాగింపచేసే కళాత్మక సాధనం. మనిషిలోని  negative impulses,  క్రూరత్వం, ద్వేషం, అసూయల్ని సమూలంగా  ‘ప్రక్షాళన’ చేసి, వాటి స్థానంలో నిష్కళంక ప్రేమ, అవ్యాజమైన కరుణ, మైత్రి వంటి positive emotions  ని ప్రతిష్టించే సంస్కారోన్నత ప్రక్రియ. దీనినే (catharisis ( purgation) )  కెథారిసిస్ అని ప్రసిద్ధ గ్రీకు సాహిత్య తత్వ్తవేత్త అరిస్టాటిల్ విశ్లేషించాడు.

1904041_740635095949533_1999613464_n

ప్రసాదమూర్తి పై కవితలోనే  ‘పరమార్ధం’ అనే మాటలో టాల్ స్టాయ్ భావన  ‘poetic justice ’ ద్వారా నీతి బద్దత, ధర్మాచరణ, మానవతా దీప్తి స్పూర్తిని ప్రతిష్టించగలడు అన్న భావన అంతర్గతంగా ప్రవహిస్తున్నది.

ఈ కవితలో మరొక విలక్షణత కనిపిస్తుంది. బాహ్య ప్రపంచాన్ని మనిషి తనకు సంబంధించి  కేవల పదార్ధంగా కాకుండా దాన్ని తనలో పెనవేసుకున్న మానవీయ సంబంధాల్లోంచే చూస్తాడు. కనుక సాహిత్యం ఎప్పుడైనా మానవ సంబంధాలకు అతీతంగా బాహ్య ప్రపంచాన్ని దర్శించలేదు. తత్త్వానేషణకు ప్రయత్నించదు. సాహిత్యంలో హృదయపరమైన, నిర్మలమైన, నిసర్గమైన ఊహలకు ఉన్నతమైన స్థానం కలదు. అదే కళాత్మక స్థానం. ఈ ప్రక్రియలోనే బాహ్య ప్రకృతి మానవీకరణ చెందింది. ప్రాచీన సాహిత్యంలో నదులు జవనాశ్వాలుగా, పరుగెత్తే గోవులుగా పోల్చబడ్డాయి. కవుల సృజనల్లో నదులు, సముద్రాలు మానవీకరణ చెందాయి.

ఇక్కడ ప్రసాదమూర్తి ‘పూలండోయ్ పూలు’ కవితలో విలక్షణంగా, మనుషులంతా పువ్వులైనట్లుగా భావించాడు. మానవులు వాళ్ల కంటే ఉదాత్తమైన, ప్రేమపాత్రమైన సుమనోహరమైన, సుకుమారమైన  పువ్వులుగా  రూపాంతరం చెందారు. అంటే మనుషులు పుష్పీకరణ చెందారు అనువచ్చునేమో. ప్రసాదమూర్తి భావన ప్రకారం మానవత్వం కన్నా పూలతనం (పుష్పతనం) (Flowerliness) మరింత ఉదాత్తమైనది. మానవ సహజం తనకు తాను ఒంటరితనంతో కుంచించుకుపోకుండా  సామూహికత్వాన్ని పొందాలి. త్వారా మానవ సంబంధాలు బలపడతాయి. అదే మానవ ప్రగతి. మనిషిని మరొక మనిషికి మరింత సమీపానువర్తిగా చేయటంలో దోహదపడటమే సాహిత్యం యొక్క అంతిమ లక్ష్యం. మానవ జీవితాన్ని మరింత సంస్కారవంతం చేసి, ఉత్తమంగా ఉన్నతీకరించడం సాహిత్యం యొక్క ఉదాత్తమైన బాధ్యత. ఈ సామాజిక సత్యం తెలిసిన వాడు సాహిత్య సూత్రం కమ్యూనిజం, హ్యూమనిజం ద్వారా అధ్యయనం  చేసినవాడు కనుకే ప్రసాదమూర్తి

“పూలు లారీల కెక్కించే  చోట

పనిచేసుకున్నా సరిపోయేది

సువాసనల సూదీ దారాలతో

మనుషుల్ని కుట్టి పారేసేవాడిని” అంటూ ఉదాత్తమైన పూలపాదాలు అల్లగలిగారు.

ప్రసాదమూర్తి పూలండోయ్ పూలు కావ్యం పారాయణం చేస్తూ, పుష్ప పరిమళయోగ ముద్రలో ఉన్న సమయంలోనే మరొక మార్మికం, మధుర, మాదక ద్రవ్యం  లాంటి సుప్రసిద్ధ జపాన్ దేశ కవి మత్సువొబషో కవిత్వాన్ని ధ్యానస్థితిలో ఆస్వాదిస్తూ వుండటం కాకతాళీయంగా జరిగింది. ప్రసాదమూర్తి గారి అద్భుతమైన  పుష్పసృష్టి కవిత్వ వృష్టికి హృదయం మార్దవమైపోతున్న సందర్భంలోనే, ఏమిటి ఈ పూల మహిమ, ఈ పూలను ఇంత ప్రత్యేకించి కవితా వస్తువుగా తన ప్రతిభతో సుగందభరితం  చెయ్యడం ఏమిటి? పూల పరిమళం ఒక మాదక ద్రవ్యనదిగా తెలుగు కవిత్వపు మాగాణిలో ప్రవహించడమేమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు కొన్ని ఆశ్చర్యంగా  బషో రచనల్లో లభించాయి. బషో  తన  యాత్రా వర్ణనలో కవిత్వ తృష్ణ, సౌందర్య లాలసను గురించి, ప్రకృతితో తాదాత్మ్యం గురించి తన భావాలను చాలా కవితాత్మకంగా, తాత్వికంగా  విశ్లేషించాడు. కొంత మేరకు పూలండోయ్ పూలు కావ్య వస్తువుకి దగ్గరగా చూసుకోవడానికి సామ్యతను, సారూప్యతను కలిగి ఉంటుంది. కవిలోను, చిత్రకారునిలోను,  కవిత్వాసాద్వకునిలోను,  ప్రకృతిని ఆరాధించడం అనే సహృదయత, పరిపూర్ణ తాదాత్మ్యం చెందగల మనోధర్మం ఉంటుంది. అది కళా సౌందర్య సంబంధిగా ఉంటుంది.  అటువంటి హృదయ ధర్మం కలిగిన వ్యక్తి ఏది చూస్తే అది ఒక పువ్వై కనిపిస్తుంది. అతడేది స్వప్నించినా అది చంద్రుడై  సాక్షాత్కరిస్తుంది. పువ్వుకన్నా అన్యమైన దాన్ని చూడగలిగేది అసంస్కృత హృదయం మాత్రమే. ఏ కళాకారుడికైనా అటువంటి అసంస్కృతినీ,  అటువంటి చిత్తవృత్తిని ఎలా అధిగమించాలి, ప్రకృతితో ఎట్లా మమేకం చెందాలన్నదే అంటూ వివరిస్తాడు.

ప్రపంచంలో ఎక్కడైనా, మానవ సంస్కారం, సహృదయత, సౌందర్యదృష్టి ఒకేలా వుంటాయి. ఆ స్పందనల్లో, భావనల్లో ఒక అందమైన సారూప్యత ఉంటుంది అనడానికి ఇదొక దృష్టాంతం కావచ్చు, భావసౌందర్యం కావచ్చు. లేదా ప్రపచంలోనే కవుల హృదయ స్పందన ఒకే తీగపై సాగుతాయని ఊహించవచ్చు. ఆ తీగకు పూచిన పూలు మానవతా పరిమళాలే వెదజల్లుతాయని భావించవచ్చు.

ప్రసాదమూర్తి పూలండోయ్ పూలు, పచ్చ పూల చెట్టు (పురాప్రియురాలు) చదువుతూంటే జపాన్ కవి బషో కవితలు పక్కపక్కనే మనసు చెట్టు కొమ్మలపై వాలుతున్నాయి. అందుకే ప్రసాదమూర్తి కవితలు తెలుగులో చిత్రించినా, కవితా రసాస్వాదకులకు పున:పున: ‘జపనీయ’ కవిత్వమే.

దేశాలు వేరైనా భాషలు వేరైనా ప్రపంచంలో ‘కవిత్వ భాష ’ అనేది ఒక్కటే. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ  “THE VINTAGE BOOK OF CONTEMPORARY WORLD POETRY” సంకలనంలో జె.డి క్లాచ్ అంటాడిలా  “poetry knows no borders, it has no capitals and no provinces. Languages are many but poetry is one.  Every culture’s poetry is a local wine and tends to lose its unique savor the aroma of wine yard and weather, harvest and history- when sipped abroad.”

హెగెల్ అభిప్రాయం ప్రకారం ” The true medium of poetry is not words but poetic ideas”.

ఈ సంకలనంలో ప్రసాదమూర్తి కవిత్వ భావనలు ప్రతికవితలో సునిశితమైన ఊహాశాలిత్వంతో, సుందరమైన  అభివ్యక్తితో కళకళలాడుతూ ఉంటాయి. ప్రగాఢమైన మానవీయ స్పందనలతో సమ్మిళితమై ఉంటాయి. “కత్తుల భాష మాత్రమే తెలిసిన మనుషులకు / ఆ చెట్టుతో పూలగుత్తుల సంభాషణ నేర్పించాలి / నలుగురి ఆనందం కోసం / సర్వం రాల్చేసుకోవడం / ఎలాగో ఒక ఈ చెట్టు నీడలోనే తెలుసుకోవాలి”.

వస్తువుతో పాటు, శిల్పం, ప్రసాదమూర్తి కవిత్వంలో సంయమనంతో సాగటమే కాక, సమతౌల్య స్థితిని కలిగి ఉంటాయి. ప్రయోగించే భాష సార్ధకంగా వుండటమే కాక భావఫల సిద్దికి ప్రచోదక శక్తిగా ఉపయోగించడం ఈ కవికి అబ్బిన అరుదైన కళ. వర్తమానతా లక్షణం తో పాటు సమస్త సాహిత్యానికీ కేంద్రబిందువైన ‘ మనిషి’  మానవ సంబంధాలు, మనిషి బ్రతుకును ఉన్నతీకరించడంపై కవికి శ్రద్ధ, స్పృహ ఎక్కువ. అందుచేతనే పూలతోనో, చెట్టుతోనో మనిషికి హితబోధ చేయిస్తాడు.

‘దయామయి’  కవితలో అనాధ బిచ్చగత్తెను portray చేస్తూ కవి ప్రసాదమూర్తి మానవీయ సంస్కారంతో పలుకుతాడు. ఈ కవిత కరుణ భావనతో మలచబడి మానవ సేవా సౌందర్యంతో కవి బుద్ధుడి శిల్పం దర్శనమిస్తుంది.

“ధేహాన్ని ఒక బొచ్చెగా విసిరి / మెట్టులో మెట్టుగా ఒదిగిపోతుంది / మెట్లన్నీ నాకు /కనికరం లేని లోకాన్ని కాపాడమని / దేవున్ని వేడుకుంటున్న / అనాధ బిచ్చగత్తెల్లానే కనిపిస్తున్నాయి”.

తన కళ్లెదుటి భౌతిక జగత్తులో కాసింత జాలి కోసం, మానవ స్పందన కోసం దీనంగా ఎదురుచూసే తోటి మనుషుల కళ్లలోకి సానుభూతితో తొంగిచూస్తూ.. చలిస్తూ, ద్రవిస్తూ, ఆర్ధ్రతతో నిర్జీవ వస్తువుల్లో కూడా కదలాడే ప్రాణ స్పందనలో గుండెతో చూడగల సౌజన్యం, సున్నితత్వం కవి ప్రసాదమూర్తి తత్వం. కవిత్వపరంగా ఇదొక వినూత్న శిల్పం. ప్రసాదమూర్తి కవితాభివ్యక్తిలో మరొక వైవిధ్యమేమిటంటే సమాజం ఏ దీనుల కోసం, ఆర్తుల కోసం దయామయులుగా స్పందించి సహాయ హస్తాలనందించాలో.. వాళ్లే కరుణామయులుగా కనిపించటం. చూడండి ..”మాయదారి మనుషులే / ఆ మెట్టుదాకా వచ్చాక దేహాలనీ కళ్లనీ /చటుక్కున అటు తిప్పేసుకుని విసురుగా పారిపోతారు / ఆమె మాత్రం దయ నిండిన నేత్రాలతో ఆశీర్వదిస్తూనే ఉంటుంది”.  ‘దయామయి’ పేరు సార్థకమైంది. ఈ కవితలో బౌద్ధతత్వంలోని మూల భావనలు ద్యోతకమవుతాయి. సమ్యక్ కరుణ, సమ్యక్ జ్ఞానం మొదలైనవి. ఆమె పేరుకే బిచ్చగత్తె. కానీ లోకానికి దయాబిక్షం పెట్టే ప్రేమగల తల్లి. ఇక్కడ నేను ప్రస్తావించదలచిన మరొక ప్రధాన అంశం ఏమిటంటే, కవి సమాజం పట్ల దయామయుడు కావడం, స్పందించడం, నిస్వార్ధ చింతనతో నిబద్ధుడు కావడం – నిర్మల చిత్తంతో సేవా బుద్ధుడు కావడం. ఇది ప్రసాద కవి గుణంలో మరొక సాత్విక భావాంశంగా భావిస్తున్నాను. మనుషుల్లోనే కాదు, పూలలో, చెట్టులో, రాళ్లలో, కరుణాంతరంగాన్ని, దయా గంగోత్రిని ఈ కవి చూడగలడు. కవి ప్రసాదమూర్తి కవిత్వ నిర్మాణ పద్దతుల్లో ఇదొక విలక్షణత, వైవిధ్యం.

మరొక కవిత ‘గుండె కొల్లేరు’ పఠితల్ని మంత్ర ముగ్దుల్ని చేస్తుంది. మెస్మరైజ్ చేసేస్తుంది. ‘గుండె కొల్లేరు’  కవి ప్రసాదమూర్తి  ‘ పురిటి వేరు ‘ గా భావించవచ్చు. తాను బాల్యంలో దేనితో మమేకమై జీవించాడో, దాని ఉనికి ఇప్పుడు ప్రశ్నార్ధకం కావటం కవిని వేదనకు గురి చేసింది. తన జీవనానుభూతిని కవిత్వీకరించిన పద్దతి చాలా విలక్షణంగా ఉంటుంది. పఠితల్ని ఆ కవితావస్తువైన కొల్లేటితో మమేకం చేయిస్తుంది. మునకలు వేయిస్తుంది. ఈ కవితలో ప్రయోగించిన పదజాలం అచ్చమైన ప్రాంతీయతను, మట్టి వాసనల మాండలికాన్ని పుణికిపుచ్చుకొని ఉంటాయి. కవి ప్రసాదమూర్తి సహృదయుల్ని తన భావోద్వేగాలలో, పాత జ్ఞాపకాల వెతుకులాటలో, మూగ సంవేదనలో, మూగవాని పిల్లనగోవి పాటలో, దిసమొల ఆత్మలో పూర్తిగా సంలీనం చేసుకుంటాడు. ఒక తల్లిని పోగొట్టుకున్న పిల్లాడిలా.  ‘గుండె కొల్లేరు’ కవిత అచ్చంగా ప్రసాదమూర్తి  ‘ అమ్మ పాత ఫోటో ‘, పాత హిందీ సినిమాలో సైగల్ విరహగీతం, మెరాదీహసన్ గజల్.

ఎంత అద్భుతమైన పదచిత్రాల్ని సృష్టించాడో ఈ కవి అనబడే  ‘ రంగుల గీత కార్మికుడు ‘ చూడండి.    అచ్చెరువుతో  అచ్చెరువులో మునిగిపోతారు.  “ఆకాశం ఈ సరస్సులోనే   /  తన ముఖం చూసుకుంటూ  /  సూర్యుణ్ణి బొట్టు బిళ్లగా  /  సర్దుకునే దృశ్యం తలపుకొచ్చింది.”. ఈ చెదరిన నీటిగూడు ఎలా అల్లబడిందో , ఏ సామాగ్రి వాడాడో చూడండి. కొంగలు, నీటికాకి, తుమ్మచెట్టు, గట్లు, తాటి దోనె, నాచుబట్ట, చద్దన్నం, ఉలస పక్షులు, చిలకబాతులు, పరజ పిట్టలు, గిన్నికోళ్లు, నత్తకొట్టు పక్షులు. ఇవన్నీ కొల్లేరుతో విడదీయరాని అనుబంధమున్న సదాబాలకుడు కవి ప్రసాదమూర్తికి పుట్టిన నేల అందించిన పద సౌందర్య సంపద. మూల్యం అమూల్యం.

ఈ కవిత  మృగ్యమైన బాల్యంలోని కొల్లేటి సరస్సు ఆత్మను పలవరిస్తూ, స్మరిస్తూన్న ఒక  ‘ఎలిజీ  ఛాయ లాంటిది. ప్రసిద్ధ మలయాళీ కవి కె. సచ్చిదానందన్  ‘వడ్లగింజ’ కవిత ఇలాంటి పోగొట్టుకున్న ఇల్లు, పొలాన్ని గురించే. ఆయన భావాల్లోనే ఈ కొల్లేటిని కవి ప్రసాదమూర్తి   అనుభూతిని ఇలా కోట్ చెయ్యొచ్చు.  ‘ నా కవితలో నేను మండుతూనే ఉన్నాను  /  నా చితిలోని కట్టెలా  /  నాకవితలో నేను  /  కవిత్వాన్ని అనువదించడం  /  ఒక గూడు వదిలి మరో గూడు చేరటమే  /  నీటిలో మునిగి ఈదే చేపలా  / మనసులోనే మునిగి ఈదుతున్నాడు, అనువాదకుడు  / నాకు వచ్చిందో కల  /  ఓ రోజు నా కవితని నేనే  /  నా భాషలోకి అనువదిస్తున్నట్లు  /  మనం మన కవితలని  /  మన భాషలోకి అనువదిస్తున్నాం’.

కె. సచ్చిదానందన్  “కవిత్వ మంటే పరిపూర్ణ వ్యక్తీకరణ ”  అని చెప్పిన నిర్వచనానికి అర్ధం ఇదే. ప్రసాదమూర్తి  ‘ గుండె కొల్లేరు ‘ కవిత్వ నిర్మాణం ఇలా పరిపూర్ణ వ్యక్తీకరణతో  రూపుదిద్దుకున్నదే అని స్పష్టమవుతున్నది. ఏది ఏమైనా గుండె కొల్లేరు కవిత పరిపూర్ణమైన  ‘సరస్సౌందర్య శాస్త్రం ‘  (LAKE AESTHETICS)  గా తెలుగు కవిత్వంలో పచ్చగా పదిలంగా ఉంటుంది.

ఆధునిక కవిత్వంలో, కవిత్వీకరణ వ్యూహాలతో ప్రధానమైనది రూపకం. ప్రసాదమూర్తి కవిత్వంలో రూపకాలంకార ప్రయోగ నైపుణ్యం చాలా అందంగా ఆకర్షిస్తుంది.

మచ్చుకు కొన్ని :  జ్ఞాపకాల జాజులు  / మమకారాల మందారాలు  / మమతల మల్లెలు  /  కలల కనకాంబరాలు  / ఊహలగులాబీలు  / ముద్దు చూపుల ముద్దబంతులు  / పాటల పారిజాతాలు  / పరిమళాల బజారు  / ఎర్రని ఎండపిట్ట   / మబ్బుల బురఖాలు  / చెట్టు దేహం.

కవి  ప్రసాదమూర్తి ‘పూలండోయ్ పూలు ‘ కావ్యంలో ఇంకా ఎన్నో కవితలు, అమ్మ పుట్టిన రోజు, వాన, వాన, వాన, చిలకల రైలుడబ్బా , చెల్లి అమెరికా యాత్ర, పురా ప్రియురాలు మొ.. అన్నీ  ఈ కవిచిత్రకారుని  కవిత్వచిత్రశాల ( పొయెట్రీ ఆర్ట్ గ్యాలరీ ) లో కళాఖండాలు.  మాలాంటి కరువు సీమలో వజ్రకరూరు వజ్రాల్లాంటి వడ్లగింజలు, సన్నబియ్యపు గింజలలాంటి వానచినుకులు. కవిచిత్రకారుడు ( Poet Painter )  ప్రసాదమూర్తి గారి ‘Rare collection of poetry  paintings ‘.

ప్రసాదమూర్తి కవిత్వ నిర్మాణ పద్దతి ఒక చిత్రకారుడు దృశ్యాన్ని కళ్లద్వారా మనసులోకి ఒంపుకునే ధ్యానమార్గం. శిల్పి శిల్పాన్ని మలిచే ముందు సంభావించిన శిల్పానికి అనుగుణమైన శిలను ఉలితో హస్తస్పర్శతో పరిశీలించే నిపుణత్వం. నైశిత్యం.

అందుకే చివరగా  ప్రసిధ్ద చిత్రకారుడు పి. మోహన్ ప్రపంచ ప్రఖ్యాత ఇటాలియన్ చిత్రకారుడు  డావిన్సీ ,  మొనాలిసా చిత్రరచనను చేసే రసాత్మక సౌందర్య సమయ వర్ణన ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

“డావిన్సీ నవ్వుతూ కుంచెను, రంగుల పలకను అందుకున్నాడు.ఈజిల్ పై అప్పటికే కొంత ఆవిష్కృతమైన మోనాలిసా వర్ణచిత్రాన్ని నిశితంగా చూశాడు. కుంచెను లేత గోధుమ, రోజా రంగులను కొద్దిగా అద్దుకుని పలకపైనే వాటిని కలిపాడు. మోనాలిసి ముఖంపై ఆవరించిన వెంటాడే నవ్వును, వెలుగు నీడలను కళ్లలోకి ఆవాహన చేసుకున్నాడు. తూలికాచాలనం మొదలైంది. అందులోంచి సౌందర్యోపాసనానాదం  మంద్రంగా విస్తరిస్తోంది. మోనాలిసా మనోదేహాలు అతని కుం,చెలో రంగుల స్నానం చేసి తడితడిగా చిత్రంలోకి ఒదిగిపోతున్నాయి”.

ఈ వర్ణనతో పొయెట్ పెయింటర్, అన్వేషి, సంచార జీవి  ప్రసాదమూర్తి గారిని నిండుగుండెతో అభినందిస్తూ, మనసున మల్లెల మాలలూగుతూ ఉండగా, అతని కవిత్వపు కర్పూర వెన్నెలలో కరిగిపోతూ..

మల్లెల  నరసింహమూర్తి

(  కవి ప్రసాదమూర్తి నవంబర్ 18న ప్రతిష్ఠాత్మక సోమసుందర్ సాహితీ పురస్కారం అందుకుంటున్న సందర్భంగా)