చిన్నికలలని దాచి…చిట్టి పడవలో…

గరిమెళ్ళ నారాయణ 

 

Photo Narayana Garimellaపక్షిని ప్రేమించడం అంటే, దానికున్న స్వేచ్చ తో సహా ఆ పక్షిని ప్రేమించడం. పంజరం లో బంధించో, రెక్కలు నిలువరించో ఆ విహంగ జీవికి ఎన్ని భోగ భాగ్యాలు కల్పించినా అది ప్రేమ కాదు, కాలేదు. ముమ్మాటికీ స్వార్ధమే అవుతుంది.

జీవులను వాటి స్వేచ్చతో సహా ప్రేమించడం తెలిసిన వాళ్ళకు, బంధాలు, అనుబంధాలు, ప్రేమలు, ఆప్యాయతల గురించి వేరే చెప్పనవసరంలేదు. ప్రతి బంధాన్ని పరిపూర్ణంగా చూడగలరు, ఆశించగలరు. ఇంద్ర-ధనుస్సులోని రంగులను తమవిగా చేసుకుని తిరుగాడే సీతాకోక చిలుకలను సైతం అంతే పరిపూర్ణంగా దర్శించగలరు. సహజ రంగులూ, రంగులలో కాంతులీనే సహజ మెరుపుల తో సహా కలలో కూడా వారి  సీతాకోక చిలుకల రంగులు మాయవు.

స్వేచ్చను గౌరవించడం తెలిసిన ఎవ్వరైనా చదవదగిన ఇరవై ఐదు కవితల సమాహారం మమత వ్రాసిన రంగులు మాయని సీతాకోక చిలుక’ కవితా సంపుటి. గుండె ఆనందంతో ఉప్పొంగినప్పుడో,  బాధతో గుక్కపట్టినప్పుడో తప్ప కవిత్వాన్ని అల్లలేనని నిజాయితీగా చెప్పిన మమత స్వగతంగా ఆవిష్కరించిన పెరటిలోని అపురూపమైన పూల మొక్కల లాంటి కవితలు ఇందులో ఉన్నాయి.

‘స్వేచ్చగా ఎగరవే చిలుకా’ అని ఒక అందమైన ఉదయానికి దారితీస్తూ రోజు ప్రయాణం మొదలౌతుంది. నీడలలో నడుస్తూ, ట్రాఫిక్ లో దూసుకుపోతూ, దారిలోని మరో మోనాలిసాల కృత్రిమ నవ్వులను దర్శించి నిర్లిప్తంగా నవ్వుకుంటూ, పదిలంగా ఇల్లు చేరడం తో ఆ ప్రయాణం లో సగ భాగం పూర్తవుతుంది. అటు తరువాత ఎవరి కోసమో ఎదురు చూసి, నిరీక్షణల నిరాశతో ఎడబాటునొకదాన్ని ఎదుర్కొని, సాయం సంధ్య కు వీడ్కోలు చెప్పి, మంచు పూల వానలో తడిసి ముద్దవ్వడం తో ప్రయాణం లో రాత్రి మొదలవుతుంది. నిద్రలో ఒక దిగులు స్వప్నాన్ని విదిలించుకుని, కొన్ని తడి ఆరిన ఇసుక రేణువులని దులుపుకుని, పక్కనే పడుకున్న పసి పాపను హత్తుకుని, ఒక దివ్య స్వప్నం గుండా మళ్ళీ స్వేచ్చగా అందమైన ఉదయానికి చేరుకునే సరికి పరిపూర్ణమయ్యే ఒక ప్రయాణం ఈ కవితల పుస్తకం. ఆ ప్రయాణం నిండా పూలు, మడుగులూ, శంఖాలు, గవ్వలూ, గువ్వలూ, తూనీగలు, సీతాకోకలు ఒక పక్క నడయాడుతూ ఉంటాయి. అంతర్లీనంగా ఒక దుఃఖ జీర కూడా వదలని ప్రేమ బాంధవ్యం లా వెన్నంటి వస్తుంది.

నీ ప్రయాణం అంటే నిన్ను నువ్వు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరించుకోవడమే. స్వ-అవగాహన లోనే, నువ్వు కోరుకుంటున్న ‘స్వేచ్చ’ కూడా తెలిసొస్తుంది.

నీవు నిర్మించుకున్న ఆశలసౌధం

పేకముక్కలతో కట్టినది కాదని

నీలో రగుల్తున్న లావా

పినటబు బురద కాదని

తెలుసుకున్న వేళ నీకు నీవే అర్ధమౌతావు

పేక మేడ కాదని’ అని క్లుప్తంగా అనెయ్యకుండా, ‘పేకముక్కలతో కట్టినది కాదని’వివరంగా అనడం వల్లే ఆశలసౌధానికి (బలహీనమైన దానితో పోలిక లేదనడం లో) బలం ఇవ్వబడుతుంది. అలాగే లోపలున్నది లావా అని తెలిసినప్పుడు, పైపైన పేరుకున్నట్టనిపించే బురద హాస్యాస్పదంగా అనిపిస్తుంది. మౌంట్ పినటబు అనే

అగ్ని పర్వతం 1991 లో బద్దలైనప్పుడు మొదట చిమ్మిన బురదని రెండు పదాలతో ప్రస్తావించడం కవితా ప్రవాహం లో అలవోకగా వచ్చినదని అర్ధమై సరదాగా ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుంది. పద చిత్రాలను ఎన్నుకోవడమే కాదు, వాటిని అలవోకగా అల్లుకుంటూ పోవడమూ కళే.

పంజరంలోని చిలుకా

ఇక పాడవే ఒక స్వేచ్చా గీతికా!

అని అనుకున్నాక,  ‘స్వేచ్చ’నుండి మరొక కవిత ‘అందమైన ఉదయం’ లోకి ప్రయాణం సాగుతుంది. కాస్త తడిసినా చెరగని రెక్కల మెరుపులతో ఒక సీతాకోక చిలుక కు కొత్త జీవితం రూపం లో అందమైన ఉదయం సాక్షాత్కారమౌతుంది. ఆ సీతాకోక తన పాప చేతిలో రెక్కలు ఆరబెట్టుకోవడంతో తల్లీ కూతుర్లిద్దరికీ కూడా ఆ ఉదయం మధురమౌతుంది.

ఉదయం మాత్రమే కాదు, సాయంత్రం కూడా మధురం గానే ఉంటుంది. ‘తొలిసంధ్య’ లో అవతలి అంచుకి చేరుకునే ఒక అసలైన ఆరంభాన్ని అందులోని మాధుర్యాన్ని ఇలా చూడవచ్చును.

ఆమె కల అవతలి అంచు కి

నన్ను లాక్కెళుతోంది

ఉప్పొంగుతున్న ఆశలకు అచ్చెరువొందుతూ ఆమెకు చేయి అందించి ప్రయాణమయ్యాక ….

తామరపూలు నిండిన మడుగువైపు ఎగిరిపోయాం

ఆమె తో అంత అందమైన విహారాన్ని తలపోయటాన్ని ఇంకా ఆస్వాదిస్తూ ఉండగానే

తామరతూళ్ళ నడుమ కనుమరుగవుతూ

చివరొక్కసారి అరిచిందామె

ఈసారి స్పష్టంగా

ఇదిగో! ఇదీ అసలైన ఆరంభం!”

కవయిత్రి చేయి అందుకుని ఆనందించిన సాయంకాలం నాటి నెచ్చెలి సూర్యుడే అని తెలిశాక, ఆ ఎడబాటు తాత్కాలికమే అనిపించడమే కాదు…అదే అసలు సిసలు ఆరంభం అనీ అనిపిస్తుంది. సూర్యుడి లో నెచ్చెలి ని చూడటం కుదరదనుకుంటే నెచ్చెలినే సూర్యుడిలా చూసుకున్నా ఈ అనుభవం ఇలాగే పరవళ్ళు తొక్కుతుంది.

‘ఎడబాటు అన్ని సార్లూ చక్కని ఆరంభమే అవుతుందా?’ అనే ప్రశ్న తలెత్తితే ‘ ఒకరు – రెండు జ్ఞాపకాలు’ చదవాలి.

అందులోని మొదటి జ్ఞాపకం ఇలా ఉంటుంది.

ఆనాడు రోడ్డు దాటుతూ విడిపోయినప్పుడు

నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అన్నావు నువ్వు

భలే వీడిపోయి కలుసుకున్నాం కదా?” అని

మళ్ళెప్పుడు రోడ్డూ దాటుతున్నా

మలుపులో నీ నీడ నా వైపు చూసి నవ్వుతుంది

ఇప్పటి వరకు ఎన్ని స్నేహాలు వచ్చి వెళ్ళినా

నీ అల్లరి నవ్వు మాసిపోలేదిప్పటికీ

ఒక మనిషిని ప్రేమిస్తే…ఆ మనిషితో ముడిపడిన కొన్ని సందర్భాలు అనాలోచితంగా గుర్తుకొచ్చి కలగలసిన కొన్ని ప్రేమైక ఆలోచనలను ఇలాగే కొత్త పుంతలు తొక్కిస్తాయి.

ఈ జ్ఞాపకంలోని ప్రేమను ‘ఆహా’ అని నెమరు వేస్తూ, రెండో జ్ఞాపకం లోకి ప్రయాణిస్తే….

అప్పుడప్పుడు నువ్వు నన్ను పిలిచినట్లయ్

గడిచిపోయిన జాడలవెంట వెనక్కి రావాలని

మనస్సు ఉక్కిరిబిక్కిరవుతుంది

కానీ, ఆఖరిసారి నీ కళ్ళల్లో నేను వెదికిన ప్రేమ

ఇప్పటికీ కనిపించదు మసకగానైనా

రెండు జ్ఞాపకాలనూ పూర్తిగా చదివాక ‘గొప్పగా ప్రేమించిన కుక్కపిల్లను పోగొట్టుకున్న పసిపాప’ వంటి వ్యక్తి కవిత వ్రాసిన మమతలో కనిపించి,అసంకల్పితంగా కళ్ళు చెమరుస్తాయి. నూరేళ్ళు మాత్రమే అని లిఖించిన మానవ జీవితాలకి, ‘ప్రేమించిన జీవుల ఎడబాటు’అనే కష్టం మాత్రం ఎందుకు? అనే ప్రశ్న తొలచుకొస్తుంది. మళ్ళీ తిరిగిరాదని తెలిసిన ఎడబాటు బాధపెడితే…తిరిగొచ్చే తొలిసంధ్య లాంటి ఎడబాటు మదిని పూయిస్తుంది.

దూరమైన తన తండ్రి  ఎడబాటు ను తలపోస్తూ ఒక పసిపాప అతనికి తన సందేశాన్ని పంపినప్పటిది. తెలిసీ తెలియని ఆ పసి వయసు నుండి చూసినప్పుడు (ఎడబాటు అనే ఊహ కూడా కఠినంగానే)  అనిపిస్తుంది. అది వాస్తవమే ఐనప్పుడు కూడా ఆ కాఠిన్యం ఇలా మృదువుగా ప్రేమగా జాలు వారడం ఎంత పరిణితో కదా అనిపించక మానదు. కల్మషం లేని పసి ఆశ ని ఇంతకన్నా నిరాడంబరంగా ఆవిష్కరించడం సాధ్యం కాదేమో!?

నిన్న రాత్రి

వెన్నెల్లో దొరికిన శంఖంలో

కొన్నంటే కొన్ని నా చిన్నికలలని దాచి

చల్లగా కాళ్ళను ముద్దాడిన

చిట్టి అల ఒడిలో వదిలాను

అవి నిన్ను చేరుకోవాలని

‘సముద్రపు ఒడ్డు మీద శంఖాలు, గవ్వలు ఏరుకుంటూ చల్లగా స్పృశించే నీటి అలల తాకిడిలో తుళ్ళుతూ తూలుతూ అనందించడం’ అనేది పెద్దలు సైతం పసివాళ్ళలా చేసేది. కానీ ఈ కవితలో పసిపిల్ల అవన్నీ వదలుకుని, దాటుకుని మరీ తండ్రిని తలపోస్తుంది. తను కోల్పోతున్న తండ్రికి, అతని ప్రేమకి ఒక సందేశాన్ని పంపిస్తుంది. పాషాణుడైతే తప్ప, ఆ తండ్రి అంత మృదు మధురమైన పసి ప్రేమని కోల్పోడు అనిపిస్తుంది.

ఇలాంటి కవితలు చదివినప్పుడే ఎడబాటు గుర్తుకు రాకుండా లేదా తెలియనివ్వకుండా, మనతో పాటూ ఉన్న భార్య (లేదా భర్త) ని, పిల్లలనీ వారితో పాటే అక్కడే అందుబాటులో ఉంటే తల్లిదండ్రులు, తోబుట్టువులు, లాంటి

వారందరినీ ఒకసారి మనసారా చూసుకుని హత్తుకోవాలనిపిస్తుంది. ఒకరు కోల్పోయిన సందర్భం తాత్కాలికమే ఐనా అది వారికి అది కల్గించిన భావావేశం ఎంతటిదో మనకి తెలిశాక, అలాంటి సందర్భం ఆ క్షణంలో మనకి లేనందుకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది.

చిన్నికలలని దాచి చిట్టి అల ఒడిలో వదలడం చిన్నారి మాటగా చెప్పక చెప్పడం అన్నమాట.

కవిత్వమంటే వ్యక్తిగతంగా చూసేది లేదా అనుభవించేదే. పాఠకుడు భావాన్ని గ్రహించే విధానం సార్వజనీనతని నిర్దేశిస్తుంది. ‘మరో మోనాలిసా’ కవిత ఇందుకు మంచి ఉదాహరణ. న్యూయార్క్ నగర వీధులలో పొట్ట నిమురుకుంటూ కనిపించిన ఒక మెక్సికన్ యువతి నవ్విన కృత్రిమ నవ్వూ , మన దేశం లోనే మరో చోట తన చేతిలోని చిట్టి చెల్లాయిని సముదాయిస్తూ  మల్లెమాలలు అమ్మి అమ్మకూ నాన్నకూ చేదోడువాదోడుగా కనిపించిన మరొక అలాంటిదే పసి నవ్వూ ముమ్మూర్తులా మరో మోనాలిసాల నవ్వులే అనిపిస్తాయి. అలాంటి నవ్వుల ఆంతర్యం చదవడానికి ప్రత్యేక దృష్టి కావాలి. ఈ నవ్వులెప్పుడూ నిరాశల ధుఖాల్ని దాచేసినందుకు రువ్వబడే భావ ఆవిష్క్రరణలే అనిపిస్తుంది. ఆ నవ్వులను మరచి, నవ నాగరికత ఒకటి తొందరపెడుతోందని ట్రాఫిక్ గుంపు లోకి దూసుకు పోయినా, సహజత్వాన్ని మాయం చేసే యాంత్రికత వెంబడిస్తూనే ఉంటుంది.

స్వచ్చమైన ప్రాణవాయువును కాస్త

పొగచూరిన గాలిలోంచి

వడగట్టుకోవడానికి

మొఖానికి చుట్టేసుకున్న

రంగురంగుల ముసుగుపై

పూలని భ్రమపడి వాలిన

సీతాకోకచిలుకను

చిరాకుగా దులిపేసి

పక్కవాడిని తోసుకుంటూ

దూసుకుపోతూ..

జీవితాన్ని అందులోని వివిధ పార్శ్వాలను నిర్మలంగా, ప్రేమగా, భావా వేశ పూర్వకంగా, వాస్తవంగా అనేక కోణాలలో దర్శించి చూసింది చూసినట్టే కవిత్వం ఆవిష్కరించారు మమత గారు. ఇందులో గోరు వెచ్హని ఉదయాలున్నాయి, సీతాకోకను తడిపేసిన వాన చినుకులున్నాయి. అదే సీతాకోకకు ప్రాణంపోసిన చిట్టి చేతులున్నాయి. దిగులూ, నిరాశ, నిరీక్షణ ,ఎడబాటు, వాటిని ఎదుర్కొని చేసే లావా లాంటి ప్రవాహం అన్నీ ఈ కవిత్వం లో ఉన్నాయి.

జీవితం ఉగాది పచ్చడిలా అన్ని రుచులూ కలిస్తేనే బాగుంటుంది అంటారు. తలవని తలంపుగా ఒక్క రుచి ఎక్కువైనా తక్కువైనా సమతూకం లోపిస్తుంది. అధిరోహనానికి ఆశ, శక్తీ, ఉత్సాహం అన్నీ ఉంటాయి. కానీ, మనం ఎంత ఇచ్చినా కొంచెం కూడా వెనక్కి ఇవ్వ బడని ప్రేమ ఒకటి సదా నిరుత్సాహపరచి పాతాళం లోకి లాగెయ్యాలనుకుంటూ ఉంటుంది. ఎన్ని అవరోధాలు ఎదురైనా ముందుకే తప్ప వెనుకకు ప్రయాణించ నివ్వని పట్టుదల ఒకటి భుజం తడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, చుట్టూ ఉన్న సమాజం పై ప్రేమని, బాధ్యతని ఒకే సారి చూపించే కవితలున్నాయి ఇందులో.

 

*