తబస్సుం

 

-రెహానా

~

 

సమయం సాయంత్రం పది తక్కువ అయిదు.
రెండు గదుల రేకుల ఇల్లు. ఆ రేకులే ముందుకు వచ్చిన చిన్నపాటి వసారా. వసారాకు ఒక వైపున పుస్తకాల సంచి ముందేసుకుని వాళ్లిద్దరు కూర్చుని ఉన్నారు. ఇద్దరిదీ ఒకటే వయస్సు. 12, 13 ఏళ్లుంటాయి. బ్లూ కలర్ గౌను కింద క్రీమ్ కలర్ పైజమా వేసుకుని ఉన్న పాప తాయారు. మిలమిల మెరిసే చెమ్కీలు ఉన్న ఎర్రటి చుడీదార్, తలకు నల్లటి హిజాబ్ చుట్టుకుని కడిగిన ముత్యంలా ఉందే తను తబస్సుం.

తబస్సుం అంటే అరబిక్ భాషలో నవ్వు అని అర్ధం. వాళ్లమ్మా నాన్నకు అర్ధం తెలిసి పేరు పెట్టడం వంటిది జరక్కపోయినా తబస్సుం మోము పై చిరునవ్వు సహజ ఆభరణం.

“ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు
చూడచూడ రుచుల జాడవేరు…ఆ…ఉండుండె…నేనే చెప్తా…ఆ…
పురుషులందు పుణ్య పురుషులువేరయ
విశ్వదాభిరామ వినుర వేమ…పొల్లు పోకుంటా చెప్పినా గందా?”….ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యింది తబస్సుం.

“నీకేందేమ్మా…నీది హుషారు బుర్ర. ” ముఖం చిన్నది చేసుకుంది తాయారు.
“తబస్సుం ఇస్కూలుకు పోతినే లేదు అయినా మళ్లా ఎట్టా సదుతాదో సూడు. దిమాగ్ పుస్తకంలో పెట్టాలా…ఆటల్న కాదు. సూసి నేర్సుకో..” రెండు గిన్నెల్లో ఇద్దరికీ మురమురాలు పట్టుకొస్తూ కూతుర్ని మందలించింది తాయారు వాళ్ళమ్మ.
“తాయారు తిరిగి వప్పచెప్పలేదు కాని…పాఠం మంచిగా వివరిస్తాది. లేకుంటే నాకేడ వచ్చే ఆంటీ…ఇస్కూలుకు పోయినానా…టీచర్ పాఠం విన్నానా…” కిలకిల నవ్వుతూ స్నేహితురాలి గొప్పదానాన్ని వాళ్లమ్మకు వివరించింది తబస్సుం. తాయారు మనసు తేలికపడింది. ఆ అమ్మ కూడా తన కూతురు తక్కువ కాదు అని నమ్మకం కలిగి మురిసిపోయింది.

హైదరాబాద్ పాత బస్తీలోని సుల్తాన్ షాహిలో పక్కపక్క ఇళ్లు తాయారు, తబస్సుం లవి. తాయారు వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్. ముగ్గురు పిల్లలు.వారిలో తాయారు చిన్నది. ఉన్నంతలో నెట్టుకొచ్చే సంసారం.
తబస్సుం వాళ్ళ నాన్నది సైకిల్ రిపేర్ షాపు. పేరు ఇస్మాయిల్. ఇద్దరన్నలు, ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు . ఏడుగురు సంతానంలో తబస్సుంది నాలుగో నెంబర్. బండెడు సంసారం పైగా ఆరేడేళ్ళ క్రితం చిన్న యాక్సిడెంట్ అయితే పక్క వీధిలో ఉండే ఆర్ఎమ్పీ డాక్టర్ దగ్గర పట్టీ వేసుకున్నాడు. అది కాస్త వికటించటంతో కుడి కాలు మోకాలు వరకు తీసేయాల్సి వచ్చింది. అందుకే ఇస్మాయిల్ ఇద్దరు మగ పిల్లల్ని పదేళ్లు నిండీ నిండకుండానే పనుల్లో పెట్టేశాడు. ఒకడు హోటల్ లో బాసన్లు తోమటం, బల్లలు తుడవటం వంటి పనులు చేస్తాడు. రోజూ ఇంటికి పదో పరకో పట్టుకొస్తాడు. రెండో వాడు నాన్న దగ్గరే చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఏడాది క్రితం తబస్సుం వాళ్ళక్క పెళ్లయ్యింది. కట్న కానుకలకు డబ్బులేక ఇస్మాయిల్ ఉన్న ఇంటిని అమ్మేశాడు.

ఇప్పుడు అదే ఇంట్లో వారు కిరాయికి ఉంటున్నారు. ఇక తబస్సుం ఆరోక్లాసు పూర్తి చేసి ఏడులోకి అడుగు పెట్టిన మొదటి నెలల్లోనే పెద్ద మనిషయ్యింది.
ఆ ఘడియ నుంచి తబస్సుంకు బురఖా కొత్త యూనిఫాం అయ్యింది. ఆ లేత బుగ్గలకు పెద్దరికాన్ని ఆపాదించి బడికి పంపటం బంద్ చేశారు.
తబస్సుంకు పుస్తకాలంటే పిచ్చి. చదువుంటే ప్రేమ. బడి అంటే ఆనందం, ఓ అద్భుతం. పలకా బలపం పట్టుకుని బుడి బుడి అడుగులు వెసుకుంటూ గవర్నమెంట్ స్కూల్ కు వెళ్లిన తొలి రోజు నుంచి బడికి పోతానంటూ గుక్కపట్టి ఏడ్చినా వినకుండా మాన్పించిన తుది రోజు వరకు క్లాస్ ఫస్ట తనే. టీచర్లకు తబస్సుం అంటే వల్లమాలిన అభిమానం. అమ్మ నుంచి వారసత్వంగా వచ్చిన తెల్లని మేనిఛాయ, కోమలమైన అందం, మెరుపులతో కొత్త అందాన్ని తెచ్చే కళ్లు, చదువులో చురుకుదనం అన్నీ కలిసి తబస్సుం అంటేనే ఆ బళ్లో ప్రత్యేకం అనిపించాయి.

తబస్సుం చేత బడి మాన్పించగలిగారు గాని చదువుని కాదు. నాలుగు కాగానే తాయారు బడి నుంచి ఎప్పుడు వస్తుందా అని ఇంట్లో నుంచి గుమ్మంలోకి , గుమ్మంలోంచి ఇంట్లోకి కాలు కాలిన పిల్లిలా తిరుగుతూనే ఉంటుంది తబస్సుం. తాయారు రాగానే వాళ్లింట్లోకి వాలి పోతుంది. ఇవేళ పాఠాలు ఏం చెప్పారే అంటూ. ఇక అంతే ఇంట్లోకి కూడా వెళ్లకుండానే తాయారు ఆ రోజు స్కూల్ లో జరిగిన ముచ్చట్లన్నీ జోషుగా చెప్పుకుంటూ వస్తుంది. స్కూల్ కు పోక పోయినా తాయారు మాటలు వింటూ తానూ స్కూల్ లో ఉన్నట్లు ఊహించుకుంటూ ఆనందాన్ని జుర్రుకుంటుంది తబస్సుం. స్నేహితుల కబుర్లు, టీచర్ల విషయాలు చెప్పిన తర్వాత ఇక పాఠాల్లో పడతారు. తాయారు గతంలో పాఠాలు అంత శ్రద్ధగా వినేది కాదు. పరీక్షల్లో తబస్సుమే దొంగ చాటుగా సమాధానాలు చెప్పేది. కాని తబస్సుం స్కూల్ కు రావటం మానేసినప్పటి నుంచి తనకు పాఠాలు చెప్పటం కోసం శ్రద్ధగా వినటం మొదలు పెట్టింది. స్కూల్ లో టీచరు ఎలా చెప్పారో ఇంటికి వచ్చి వారిని అనుకరిస్తూ తబస్సుంకు పాఠాలు చెప్పటం తాయారుకు గొప్ప ఆనందాన్ని ఇస్తోంది.

“కిత్తె బార్ బులానా రీ…వస్తాద్నీ ఆయే బోలేతో సునేజాతా నేహే…టీచరమ్మ వచ్చిందని పిలుస్తుంటే ఈ పిల్ల కదుల్తానే లేదు…రేపు షాదీలా బచ్చీ ఖురాన్ చదివిందా, దీన్ గురించి తెలుస్నా అని అడుగ్ తారు గాని ఈ దునియా పాఠాలు అడుగ్ తారు…?! “గోడ మీద నుంచి తల్లి పురాణం ఎత్తగానే తబస్సుం వెంటనే ఇంట్లోకి పరుగెత్తింది. మోగ్రీబ్ కా నమాజ్ అయిన తర్వాత అంటే ఆరున్నర ఏడు గంటల సమయంలో తబస్సుంకు అరబ్బీ సురాలు, ఖురాన్ చదివించటానికి వస్తాద్నీ వస్తారు.

…………………..

“తబస్సుం…తబస్సుం…నీకో విషం చెప్తా…నాకేమిస్తావ్…”
ఈ వేళ తాయారే స్కూల్ అయిన వెంటనే ఆటలకు పోకుండా పరుగెత్తుకుంటూ తబస్సుం
వాళ్లింట్లోకి జొరబడింది.
” అబ్బా తెచ్చిన బిస్కెట్ల నీకు రెండిస్తాలే…చెప్పు ఎందుకంత హుషారుగున్నావ్…చెప్పే…”స్నేహితురాలి ఆనందానికి కారణం ఏమిటా అని ఓ వైపు నుంచి ఆలోచిస్తూనే తాయారుని పట్టుకుని తెగ ఊపేస్తూ అడిగింది.
తబస్సుం. ఒక నిమిషం పాటు ఊరడించి అసలు విషయం చెప్పింది తాయారు కళ్లు విప్పార్చి.

“మన క్లాస్ టీచర్ కమల టీచర్ లా…పొద్దొస్తూ నీ గురించి అడుగ్ తా ఉంటాదని చెప్పా కదా. మీ అబ్బాని సానా మార్లు అడిగిందట నిన్ను బడ్లోకి పంపమని. నే చెప్పా నువ్వు ఈడికి రాకపోయినా ఏడాది సదువుంతా సదివినావని. క్వశ్చన్ పేపర్లు ఇంటికాడ నువ్ రాస్తే నేను దిద్దినానని. గప్పుడు టీచరమ్మ అంది కదా…అయితే ఎలాగో అలాగ హాజరీ సంగతి నేను సూసుకుంటాను , యాన్యువల్ ఎగ్జామ్స వచ్చి రాయమను అని.”

” నిజంగనే…తాయారు… నువ్ నిజంగనే చెబుతుండావా…? నేను పరీక్ష రాయొచ్చా…పాసైతే నీతో బాటు హైస్కూల్ కి పోతానా..”తబస్సుంకు నమ్మశక్యంగానే లేదు. పరీక్షలకు ఇద్దరు కలిసి బాగా చదవాలని, తబస్సుం వాళ్ల నాన్నను ఒప్పించి పరీక్షలకు ఎలాగైనా హాజరు కావాలని…బురఖా వేసుకుని వెళ్తానంటే నాన్న కాదనడని …ఇలా …ఈ ఇద్దరు చిన్నారుల కబుర్లు సాగిపోతానే ఉన్నాయి. తాను బాగా చదివి ఉద్యోగం చేసి ఇంటి ఖర్చంతా తానే చూసుకుంటానని తబస్సు చెబుతూ తెగ ఆనంద పడిపోయింది. ఈ ముచ్చట్లు తబస్సుం వాళ్ల అమ్మ ఎలాంటి భావం లేకుండా వింటూనే ఉంది.

……………………….

పరీక్షలకు ఇంకా నాలుగు దినాలో ఉన్నాయి. అమ్మను ప్రసన్నం చేసుకోవటానికి తబస్సుం ఇంటి పని అంతా గబగబా చక్కబెట్టేస్తోంది. అంట్లు తోమటం, వంట సహాయం చేయటం నుంచి తమ్ముడ్ని, చెల్లళ్లను చూసుకోవటం వరకు అన్నింట్లోను ముందు ఉంటోంది. అమ్మ కొంగు పట్టుకుని గారాబం చేస్తే అబ్బాను ఒప్పించటం తేలిక అనేది తబస్సుం ఆలోచన.

“తబస్సూమ్….”
ఆ….ఆఈ అమ్మీ…..” అమ్మ పిలుపుతో వీధి అరుగు మీద కూర్చుని వచ్చే పోయే వాళ్లను చూస్తున్న తబస్సుం లోపలికి పరుగెత్తింది.
తబస్సుం వాళ్ల అమ్మ పాత సూట్ కేసు ముందేసుకుని కూర్చుని ఉంది. “క్యావ్ అమ్మీ…ఏ సందూక్ కైకు నికాలే…?”
“దేఖో…ఈ చుడీదార్ కైసా హై…? ఆపా కే వలీమేకా ..పెహెన్ లో…” తబస్సుం వాళ్ళ అక్క వలీమా అంటే రిసెప్షన్ నాటి డ్రస్ అది. ఆకుపచ్చ మఖమల్ గుడ్డ పై గులాబీ రంగు చమ్కీలు, పూసలు, అద్దాలతో ఝిగేల్ మంటున్న చుడీదార్.

గులాబీ రంగు ధుపట్టా పై ఆకు పచ్చ కారీగరీ చేసి ఉంది. గతంలో ఎప్పుడు అడిగినా పెళ్లి సెంటిమెంట్ పేరు చెప్పి ఇవ్వని అమ్మ…ఇవాళ ఎందుకు బయటకు తీసిందో అర్ధం కాలేదు తబస్సుంకు.
“అబ్ కైకు అమ్మీ…?” దారిలో చెబుతాన్లే వేసుకో అనటంతో ఐదు నిమిషాల్లో హుషారుగా రెడీ అయ్యింది
తబస్సుం. మరో పది, పదిహేను నిమిషాలకు తబస్సుం వాళ్ల నాన్న ఇస్మాయిల్ కూడా ఇంటికి వచ్చాడు. వస్తూ వస్తూ ఆటో తెచ్చాడు.

“ఆటో లాయ్..పైసే భోత్ హోతే ఫిర్…”ఆటో కిరాయి ఎక్కువ అవుతుందేమో అని ఆందోళన వ్యక్తం చేసింది తబస్సుం వాళ్ల అమ్మ.
“తూ చుప్ రీ…దునియాకు మాలూమ్ హోనా క్యావ్. ఆటోమే చుప్ చాప్ బైఠో…” ఆటోలో మాట్లాడకుండా కూర్చోమంటూ ఆదేశాలు జారీ చేశాడు ఇస్మాయిల్. రెండు బురఖాలు ఎక్కిన తర్వాత ఇస్మాయిల్ కూర్చున్నాడు. ఆటో ముందుకు ఉరికింది.

……………………

“సలామ్ అలేకుం…”
రెండు పోర్షన్ల చిన్నపాటి డాబా ఇల్లు. ఇంటి ముందటి గేటు తీసుకుని లోపలికి అడుగు పెట్టగానే వసారాలో పొడవాటి చెక్కబల్ల పై పాన్ నములుతో కూర్చుని ఉంది ఒకావిడ. ఆవిడ ముందు ఒక ల్యాండ్ ఫోన్. ఆ పక్కనే పాన్ ఉమ్మివేసి ఒక రేకు డబ్బా. చేతిలో ఫోన్ నెంబర్లు రాసుకునే చిన్నపాటి పుస్తకం ఉన్నాయి.
వయస్సు 45-50 ఏళ్ళ మధ్యలో ఉంటుంది. భారీ దేహం, ముఖంలో కరుకుదనం కొట్టిచ్చినట్లు కనిపిస్తున్నాయి. పేరు నజీరున్ బీ.

“వాలేకుమ్ అస్సలామ్…”
ఆవిడ గుర్తు పట్టడానికి వీలుగా తబస్సుం వాళ్లమ్మ ముఖానికి ఉన్న నఖాబ్ తీసింది. ఇస్మాయిల్ కూడా సలామ్ చేసి ఇక మీరు చూసుకోండి అంటూ వెళ్లిపోయాడు. నజీరున్ బీ ఇద్దరిని వసారాను ఆనుకుని ఉన్న గదిలోకి తీసుకువెళ్లింది. మీ అమ్మాయేనా అని అడిగింది. అవునంది తబస్సుం వాళ్ళమ్మ.

“కా బచ్చీ…నఖాబ్ ఉతారో…పెహలే మైతో దేఖూ…బచ్చీ ఖూబ్ సూరత్ హై కీ నై…”
ఏం చేయాలో అర్ధం కాక అమ్మకేసి చూసింది తబస్సుం. ఆమె కూడా తీయమనటంతో ముఖాన్ని కప్పి ఉన్న నఖాబ్ తీసింది. అందంగా, అమాయకంగా ఉన్న తబస్సుంను చూడగానే ఆవిడ కళ్లు విప్పారాయి.
“మా షాల్లా…ఇత్తీ ఖూబ్ సూరత్ బేటీ హై ఆప్ కో…సమఝో సబ్ కుచ్ తై హోగయా…ఆప్ బే ఫికర్ రహ సక్తే. “అని భరోసా ఇచ్చింది నజీరున్ బీ. మళ్లీ అంతలోనే అనుమానం వచ్చి ఇది మొదటి సారే కదా అని ఒకటికి నాలుగు సార్లు అడిగి రూఢీ చేసుకుంది.

తబస్సుం అన్నీ నిశితంగా గమనిస్తోంది కాని ఏం జరుగుతుందో ఒక అంచనాకు రాలేకపోతోంది. అమ్మ ముఖంలో భావాలను చదివే ప్రయత్నం చేస్తున్నా ఆనందమో, బాధో తేల్చుకోలేకపోతోంది. నజీరున్ బీ తబస్సుంను వారున్న గదికి ఆనుకుని ఉన్న మరో గదిలోకి వెళ్ళమని చెప్పింది. ఆమె చూపుడు వేలు చూపిస్తున్న దిక్కుకు వెళ్ళి గుమ్మానికి ఉన్న కర్టెన్ ను కొంచెం జరిపి లోపలికి తొంగి చూసింది తబస్సుం. అక్కడ తన వయస్సుకు కాస్త అటూ ఇటూగా మరో ఐదారుగురు అమ్మాయిలు ఉన్నారు.

“జావ్…అందర్ జావ్…’ నజీరున్ బీ కంఠం వెనుక నుంచి వినిపించటంతో బెరుగ్గా ఆ గదిలోకి అడుగు పెట్టింది తబస్సుం. కొందరు అమ్మాయిల ముఖంలో నవ్వు ఉంటే కొందరు తనకు మల్లే ఆందోళనగా ఉన్నారు. ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు దట్టంగా పౌడర్ రాసుకుని పెదాలకు ఎర్రటి లిప్ స్టిక్, కళ్ళకు కాటుక, కను రెప్పలు, బుగ్గల పై కాస్త గులాబీ రంగూ పులిమారు. తలలో జడ పొడవుగా వేళ్లాడుతూ మల్లెపూలు. దాదాపు అందరూ కళ్ళకు ఛక్ ఛక్ మనిపించే మెరుపుల చుడీదార్లే వేసుకున్నారు. అందరూ ఒకరిని ఒకరూ
కళ్ళతోనే పరికించుకుంటున్నారు కాని…మాట కలపటం లేదు. వారందరిలో కాస్త సీనియర్ గా, ఇదంతా బాగా తెలిసిన వ్యవహారమే అన్నట్లున్న ఒక అమ్మాయి మాత్రం తబస్సుం దగ్గరికి వచ్చి అడిగింది..

“పహెలీ బార్…?”
దేనికి మొదటి సారో అర్ధం కాలేదు తబస్సుంకు. ఇక్కడికి రావటం మొదటి సారే కదా అని అవునంది. మొదటిసారి వచ్చినప్పుడు నేను కూడా నీకు లానే ఉండేదాన్నని చెప్పి నిట్టూర్చింది ఆ అమ్మాయి. నజీరున్ బీ రావటంతో మాటలు ఆగాయి. ఆయన వచ్చేశారు అంటూ హడావిడి మొదలుపెట్టింది. అడిగిన ప్రశ్నలన్నింటికి చక్కగా, నిజాయితీగా సమాధానాలు చెప్పాలంది. అబద్దాలు
చెబితే దొరికిపోతారు అని బెదిరించింది. ఆమె ఆదేశాలతో ఒకరి తర్వాత ఒకరిగా అమ్మాయిలు వేరే గదిలోకి వెళుతున్నారు నాలుగైదు నిమిషాల్లో బయటకు వస్తున్నారు. మరో మాట మాట్లాడకుండా తమ స్థానాల్లో బొమ్మల్లే నిలబడుతున్నారు. తబస్సుంతో మాట కలపటానికి ప్రయత్నించిన సీనియర్ అమ్మాయిని నీకు నేను తర్వాత చెబుతాన్లే అని చివరిగా తబస్సుంను తన వెంట రమ్మంది.

అమ్మ కోసం వెదికింది తబస్సుం. కనిపించలేదు. ఆందోళనతోనే నజీరున్ బీ వెంట నడించింది. ఆ గదిలోకి అడుగు పెట్టగానే ఏసీ తాలూకు చల్లదనం మృదువుగా తాకింది. మూసివేసిన కిటికీలకు కర్టెన్లు వేలాడుతున్నాయి. ఆ ఇంట్లో మిగిలిన గదులకు ఈ గదికి అస్సలు పోలిక లేదు.గది చిన్నదే కాని విలాశవంతమైన అలంకరణలతో ఉంది. ఒక వైపు ఉన్న విశాల మైన సోఫాలో డెబ్భై ఏళ్లు పైబడిన
ముసలాయన కాలు మీద కాలు వేసికుని దర్పాన్ని చూపిస్తూ కూర్చుని ఉన్నాడు. మెడ నుంచి కాళ్ళ వరకు తెల్లటి పొడవాటి డ్రెస్ వేసుకుని ఉన్నాడు. దాన్ని థోబ్ అంటారు తల మీద కప్పుకున్న గుడ్డను ఘుత్రా అంటారు. చూడగానే ఎవరికైనా ఇట్టే అర్ధం అయిపోతుంది ఇతని అరబ్ దేశాలకు చెందిన వాడని.

“సలాం కరో…” హూంకరించింది నజీరున్ బీ.
తనను ఎందుకు ఇక్కడికి తెచ్చారో మెల్లగా అర్ధం కాసాగింది తబస్సుంకు.
కళ్ళల్లో నీటి పొర కదలాడుతోంది. అమ్మా నాన్న , పుస్తకాలు , తాయారు, పరీక్షలు అన్నీ ఒక దాని తర్వాత ఒకటిగా కళ్ల ముందుకు వచ్చి వెళుతున్నాయి.

” బురఖా నికాలో “…మరో ఆదేశం
అక్షరాలకు రెక్కలు తొడిగి అనంత ఆకాశంలోకి ఎగిరి వెళ్లాలనే కలలు ఆ కళ్లవి. అవిటి నాన్నకు అండగా నిలబడాలనుకున్న ఆశలు ఆ చిట్టి తల్లివి.

కన్న పెగే కాసుల కోసం కాటు వేస్తుందని ఊహించని అమాయకత్వం ఆమెది. కల్లోనూ ఊహించని దెబ్బకు మనసు బీటలు వారుతోంది. తబస్సుం గుండె గొంతుకలో ఆర్తనాదాల హోరు. అమ్మీ, అబ్బా…నన్ను ఇలా అమ్మేస్తారా…? నేను మీ బిడ్డనే కదా. మీ కడుపునే పుట్టినా కదా. మేరీ బేటీ అని అమ్మీ నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేసేది కదా. అన్నీ మరిచి పోయారా…? ఇంత మందిని సాకలేకపోతే ఎందుకు కన్నావ్ నాన్న. ఏమంటే మజహబ్ అంటావ్. పిల్లలను అల్లా ఇస్తాడంటావ్. ఆపరేషన్లు చేసుకోకూడదంటావ్. మరి ఏ ఖురాన్ లో ఉంది నాన్న ఇట్టా ఆడబిడ్డల్ని పసువుల మాదిరిగా అమ్మేయాలని. ఆడిపిల్ల దేహంతో వ్యాపారం చేయాలని. నా ఆడపిల్లతనమే అడ్డు అనుకుంటే భయ్యాల్లాగా ప్యాంట్ , షర్టూ వేసుకుని క్రాప్ కొట్టించుకుని ఏ హోటల్ కో పోయి బాసన్లు కడిగిదాన్ని కదా నాన్న. లేదంటే నేనేవరో కనిపించకుండా నిండా బురఖా వేసుకుని రోడ్ల పై అడుక్కుని అయినా నాలుగు పైసలు తెస్తిని కదా అబ్బా. అమ్మీ..నీకేమి చెప్పాలా అమ్మీ. సందఖ్ లో నుంచి బట్టలు తీస్తుంటే నా కోసం ముచ్చట పడుతున్నావ్ అనుకున్నా కాని పైసల కోసం అని అనుకోలే అమ్మీ. నన్నెంత సింగారిస్తే అన్ని పైసలు వస్తాయని లెక్కల పుస్తకంల నేర్చుకోలేదమ్మీ. అబ్బా ఇంకో అమ్మీని పెళ్లి చేసుకున్నాడని ఆ నాడు వీధిలో పడి గొడవ చేస్తివే…మరి నన్ను ఈ ముసలోడితో నాల్గు దినాల షాది ఎలాగ చేయిస్తున్నావ్ అమ్మీ. మీ నిస్సహాయతకు, మీ మూర్ఖత్వాలకు, మీ మత విశ్వాసాలకు, మీ కష్టాలకు, మీ బాధలకు, మీ అవసరాలకు నన్ను పణంగా పెట్టాలనుకున్నారా? అల్లా కూడా ఇవన్నీ చూస్తూనే ఉన్నాడా..?ఇది అన్యాయం కాదా? తాయారు సానా మంది దేవుళ్ల గురించి చెబుతూ ఉండేది. వాళ్లూ అంతేనా? ఏ దేవుడూ ఏమీ చేయడా?
ఎవరూ ఏమీ చేయలేదు. ఆమె ఆర్తనాదాలు, ఆక్రందన బురఖా దాటి బయటకు పోలేదు. కూతుర్ని అమ్మిన డబ్బుల్లో మధ్యవర్తి వాటా పోగా వచ్చి సొమ్ములు తీసుకుని తబస్సుం అమ్మానాన్న ఇంటి దారి పట్టారు. అటు ముసలాడు తీసిన ఓ హోటల్ గదిలో తబస్సుం పంటిగాట్లు, అర్ధం కాని వికృత చేష్టలకు అలవాటు పడింది. సరిగ్గా ఇరవై రోజుల తర్వాత బహ్రెయిన్ ముసలాడు, తబస్సుం భర్త మళ్ళీ వస్తానంటూ ఫ్లైట్ ఎక్కేశాడు. నల్లటి బురఖాలో ఇంటి ముందు ఆటో దిగింది తబస్సుం.
*

వెన్నెల రాత్రి

 

   –  రెహానా

~
చీకటంతా ఒక్కచోటే పోగయ్యింది…
వెన్నెల రాత్రుల్లోని
ఆ వెలుగంతా ఎటు వెళ్లిందో…
ఒక దాని పై ఒకటి పేర్చుకుంటూ వెళ్లిన
నా ఆశల సౌధాలన్నీ ఎక్కడ
కుప్పకూలిపోయాయో…

నేను వెదుకుతూనే ఉన్నాను
ఆ చీకట్లో…
నా వేలి కొనలతో చూస్తూ,
తచ్చాడుతూనే ఉన్నాను..

నేను ఇష్టపడే రాత్రి- ఊసులాడే రాత్రి
నేను స్వప్నించే రాత్రి- శ్వాసించే రాత్రి
నేను నేనుగా జీవించే రాత్రి
దోసిలి నిండా తీసుకుని ముద్దాడే రాతిరి

గుమ్మానికి గుత్తులు గుత్తులుగా
వెళ్లాడే కబుర్ల జాజులు
ఎక్కడ రాలిపోయాయో

చీకట్లో వెతుకుతూనే ఉన్నాను.
నా వేలి కొనలతో చూస్తూ,
తచ్చాడుతూనే ఉన్నాను..

*