గదులు ఖాళీగా లేవు!

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

ప్రపంచంలో అత్యంగా భయంకరమైంది, అత్యంత క్రూరమైంది పేదరికం లేక దారిద్ర్యం.

దారిద్ర్యం మనిషిని నిలువునా క్రుంగదీస్తుంది.

దారిద్ర్యం మనిషిని అసమర్ధుడిగా చేస్తుంది. ఆత్మ విశ్వాసాన్ని లేకుండా చేస్తుంది.

దరిద్రుడికి ఆకలి, అనారోగ్యం, అవసరాలు తప్ప స్నేహితులు, బంధువులు ఎవరూ ఉండరు.

దరిద్రుడ్ని చూస్తే అంతా తప్పుకు తిరుగుతారు.

మాటలు, చూపులు, బాడీ లాంగ్వేజ్ ను బట్టి దరిద్రుడ్ని సులభంగానే గుర్తించవచ్చు.

ఎంతటి ప్రతిభ వున్నా దరిద్రుడు ప్రకాశించలేడు.

ప్రతిభ వున్న దరిద్రుడు మబ్బుపట్టిన సూర్యుడిలా అణగిపోవాల్సిందే. – ఇవన్నీ నూకరాజుకు తెలుసు. అతని బాల్యం, బాల్యంలో జరిగిన సంఘటనలు, పోటీల్లో చూపిన ప్రతిభ ఇవేవి అతనికి గుర్తింపు తెచ్చి పెట్టలేకపోయాయి. నూకరాజు పుట్టింది పూరి గుడిసెలలోనే. కానీ అతడికి పెంకుటింటివాళ్ళు, భవనాల మనుషులతో పరిచయాలు, స్నేహాలు వున్నాయి. చదువు సగంలో ఆగినా ఈ యేడో, వచ్చే యేడో మెట్రిక్ పరీక్షకు కూచోపోతున్నాడు. అతడికొక ఫాక్టరీలో, చిన్నదే అయినా మంచి ఉద్యోగం వుంది. దేశమాత పేరు చెబితే అతడికి ఒళ్ళు పులకరించేది. అంతలో పాకిస్థాన్ దాడి వచ్చింది. హోమ్ గార్డుల్లో చేరాక దేశభక్తి పట్ల అతని అభిప్రాయాలు మారతాయి. అన్ని ఖర్చులు మానుకుని ట్యుటోరియల్ కాలేజీలో చదవాలని కోరిక. వీటన్నింటిని మించిన కోరిక ఒకటే. కొత్తగా పెళ్ళి చేసుకున్న భార్యతో ఏకాంతంగా ఒక విశాలమైన గదిలో గడపాలని.  కుటుంబసభ్యులతో కిక్కిరిసి వున్న ఇరుకు గుడిసె లోనుండి దూరంగా, అంటే ఏదో ఒక లాడ్జిలో – ఖరీదైనది కాకపోయినా, పరిశుభ్రంగా వుండే ఒక లాడ్జిలో, భార్యతో సుఖంగా గడపాలనే కోరిక తొలిచివేస్తుంటుంది. తన అవసరాలన్నీ చంపుకుని డబ్బు కూడబెట్టుకుని భార్యకు నచ్చచెప్పి పెద్దలను అంగీకరింపచేసి దూరంగా వున్న లాడ్జి హౌస్ కు వస్తాడు. కానీ లాడ్జి గుమాస్తా నూకరాజు వాలకం చూసి లాడ్జి ఇవ్వడం ఇష్టం లేక ‘నో రూమ్’ అని వెళ్ళగొడతాడు.

ఆ హాస్టల్ గుమాస్తా సహాయకుడిగా పని చేస్తున్న దేవుడు నూకరాజు పరిస్థితిని చూసి జాలి పడతాడు. ఒకప్పుడు దేవుడు కూడా నూకరాజు లాంటి పరిస్థితినే ఎదుర్కొని వుంటాడు. పెద్ద కుటుంబంతో, ఇరుకు గుడిసెలో వుండే దేవుడికి తన అసహాయత, తన ఉక్రోశం, తన చేతకానితనాన్ని అంతా భార్యను గొడ్డును బాదినట్లు బాదడంలో చూపించేవాడు. దాంతో కుదురుకున్న నలభైయవ ఏట అతని భార్య కోరుకున్న తీరిక కూడా అదే. వాళ్ళిద్దరే ఎవరికంటాబడకుండా సుఖంగా, ఏకాంతంగా గడపాలని. కానీ ఆమె కోరిక తీరకుండానే కన్నుమూస్తుంది. అంత నిర్లిప్తంగా బతుకీడుస్తున్న దేవుడు – నూకరాజు జంటలో తనను తాను చూసుకోగలుగుతాడు. వారి మీద జాలి పడతాడు.

లాడ్జి నుండి అవమానభారంతో వచ్చిన నూకరాజుకు, సినిమాకు వెళ్దామన్నా టిక్కెట్లు దొరకవు. మంచి హోటల్ కు పోలేక కుళ్ళు కాలువ పక్కన వున్న టీ షాపులో ఫలహారం తీసుకుని భార్యతో బయటికి వస్తాడు. తను అనుకున్నది ఏదీ జరగలేదు. అన్నీ అడ్డంకులే. దాంతో ఎక్కడ లేని కోపం ముసురుకుంటుంది. ఏదో కసి, ఎవరిమీదో ఆవేశం, ఎవరినైనా చితకదన్ని తన కసిని తీర్చుకోవాలనే ఆవేశం ముంచెత్తుకొస్తుంటుంది. అలాంటి సమయంలో లాడ్జింగ్ నుండి వస్తున్న దేవుడు వాళ్ళను గుర్తుపట్టి ఆపుతాడు. నూకరాజు కోపంతో ఉన్నట్లు గమనించి అతని భార్యతో మాటలు కలపడానికి ప్రయత్నిస్తాడు. పరాకుగా ఒకదానికి బదులు ఇంకోటి మాట్లాడడంతో – నూకరాజు ఆగ్రహాన్ని, అవమానాన్ని తిరిగి రెచ్చగొట్టినట్లుగా గ్రహించలేకపోతాడు. దాని ఫలితం, నూకరాజు ఆ ముసలి దేవుడ్ని చితకబాదేస్తాడు. జనం అడ్డుకోవడంతో దేవుడు బతికిపోతాడు. భార్య సముదాయించి నూకరాజును రిక్షాలో తీసుకొనివెళుతుంది. ఏడుపును అణచుకొంటూ దెబ్బలతో దేవుడు లాడ్జింగుకు బయలుదేరుతాడు.

తనకు ప్రతికూలంగా పరిణమించిన పరిణామాలు పట్ల ఉక్రోశం, ఆవేశం, కసి కలగలిసిపోయి – తనను అవమానించిన గుమస్తాను, లాడ్జి ఓనరును చితకబాదాలనే కోపం, చివరికి అన్నెం పున్నెం ఎరగని దేవుడి మీద చూపించాల్సి వస్తుంది. తన నిస్సహాయతను, ఇంకో నిస్సహాయుని మీద తీర్చుకుంటాడు. గతంలో దేవుడు చేసిన పని మీద కూడా ఇదే. తన ఆవేశాలను, ఉద్వేగాలను భార్య మీద చూపించేవాడు. బయట తాము పడ్డ కష్టాలను, అవమానాలను తమ భార్యల మీద తీర్చుకోవడం గుడిసెవాసులకు మామూలే. ఇలా బాధలు పడింది దేవుడి పెళ్ళామే కాదు. అతని కూతురు పెద్దమ్మ అత్తారింట బాధలు పడలేక ఎందులోనో పడి చచ్చిపోతుంది.

లాడ్జిలో గదికోసం భార్యతో వచ్చిన నూకరాజు మంచిగా టక్ చేసుకొని బూట్లు వేసుకొని నీటుగానే వస్తాడు. “వేషం, గీషం అన్నీ బాగానే వున్నాయి కానీ బాగాలేంది కూడా ఏదో ఒకటి ఉండుంటుంది. రెండు కళ్ళలో ఒకటి గుడ్డిదైనా గుమస్తాగాడు సూడగానే దాన్ని పట్టేసినాడు.” అని దేవుడు సరిగానే ఊహిస్తాడు. ఇందులో గుమాస్తా తప్పేమీ లేదు. వాడు లాడ్జిని అలగా జనం నుండి దూరంగా, డబ్బున్న వాళ్ళ కోసం డబ్బులు వెదజల్లేవారికోసమే నడుపుతుంటాడు. చిల్లర జనాలు, చీప్ మనుషులు కనిపిస్తే డబ్బున్నవాడెవడూ ఆ లాడ్జికి రాడు. తన హోదాకు సరిపడే మరో లాడ్జికి వెళ్ళిపోతాడు. వాడు ఏ ముండను తెచ్చుకుని కులికినా వారికి అభ్యంతరం ఉండదు. రెంట్ కడతాడు. టిప్పులు వెదజల్లుతాడు. ఖరీదైన మనుషులు ఉంటారని తెలిసిన లాడ్జీల జోలికి పోలీసులు కూడా రారు. అందుకే ఈ లాడ్జీలన్ని అలాగా జనాన్ని దూరంగా                                         వుంచడానికే ప్రయత్నిస్తాయి. ఈ విషయాన్ని ఆ లాడ్జిని కడుతున్నప్పుడే మేస్త్రి ఆడకూలితో “ఈ మేడే వుంది. రేపొద్దున ఇందలో లాడ్జింగ్ యెడతారట. అందరిచ్చిందాని కంటే అర్ధో, రూపాయో ఎక్కువిస్తాను; నన్నోరాత్తిరి కిందల తొంగోనియ్ అను. నా నిలువెత్తు ధనం ఇచ్చినా నువ్వు కూల్దాని గున్నంత కాలం ఇందల అడుగెట్టనియ్యరు” అని చెప్పడం గమనించ తగ్గ విషయం.

మొత్తానికి ఈ కధ – కొత్తగా పెళ్ళైయిన భార్యతో ఏకాంతంగా సుఖంగా, ఒక రోజైనా గడపాలనే కోరికతో, లాడ్జీకి  వచ్చి భంగపడిన, నూకరాజు అనే యువకుడి కధ. ఇలాంటి కోరికలే వున్నా, అన్ని అణచేసుకొని నిర్లిప్తంగా బతికేస్తున్న ముసలి దేవుడు కూడా ఇందులో కనిపిస్తాడు. ప్రయత్నించి విఫలం అవుతాడు నూకరాజు. తన అశక్తతను గమనించి మిన్నకుండి పోతాడు దేవుడు. అందుకే నూకరాజు ప్రయత్నాన్ని మెచ్చుకొంటాడు. తన తరం కంటే తన తర్వాత తరం వారు అంటే ఇప్పటి వాళ్ళలో వున్న చొరవ, ధైర్యంను గమనించి  సెబాసో అనుకుంటాడు.

ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని పంచవర్ష ప్రణాళికలు వచ్చినా పేదవాడికి కూడు, గుడ్డ, వసతిని సమకూర్చలేకపోతున్నాయి. ధనవంతుడు రోజు రోజుకు మరింత ధనవంతుడు అవుతున్నాడు. పేదవాళ్ళు మరింత పేదగా తయారవుతున్నారు. ఎలాంటి కష్టమెరుగనివాడికి అప్పనంగా వందలకొద్ది ఎకరాల భూమి దఖలు పడుతుంది. కష్టజీవులకు, నిరుపేదలకు జానెడు భూమి దొరకదు. ఇక్కడ ఈ కధలో రచయిత భూమి లేని నిరుపేదల గురించి చెప్పదలుచుకొన్నారు. కనీసావసరాలు కూడా తీర్చలేని నిర్భాగ్యుల గురించి చెప్పదలుచుకొన్నారు. అందులో భాగంగానే లాడ్జి హౌస్ నిర్మాణం గురించి చెబుతాడు. కూలీలు – మేస్త్రీ – కాంట్రాక్టరు కలిసి లాడ్జి కడితే కాంట్రాక్టరు లాభపడతాడని తేల్చారు. మనం కట్టిన ఈ లాడ్జిలో మనకే ప్రవేశముండదు అంటారు. ఇదంతా మాండలికంలో, వర్ణనలో చెప్పడం బాగుంది.

ఈ కధలో  కొత్త జంటకు కావాల్సింది ఏకాంతం. కుటుంబసభ్యులతో కిక్కిరిసిపోయిన ఆ ఒంటి గది గుడిసెలో ఆ కొత్త దంపతుల ఆరాటాన్ని ఎవరు అర్ధం చేసుకొంటారు? అందుకే వాళ్ళు లాడ్జి వైపు చూశారని అనుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబసభ్యులే కూడబలుక్కుని వాళ్ళకు ఏకాంతం కల్పిస్తారు. లేదా ఆ దంపతులే ఏదో ఒక రకంగా ఆ గుడిసెలో ఏకాంతం వెతుక్కోవడానికి ప్రయత్నిస్తారు. అంతే తప్ప లాడ్జింగుల వైపుకు వెళ్ళే ఖరీదైన ఆలోచనలు చేయరు. ఈ కధ చదువుతుంటే రాజశ్రీ వారు తీసిన “పియా కా ఖర్” సినిమా గుర్తుకు వస్తుంది. బాంబేలో పిచ్చుక గూళ్ళు లాంటి ఇళ్ళలో కాపురాలు చేసే వారున్నారు. అందులో కూడా కిక్కిరిసిన కుటుంబ సభ్యుల మధ్య తమ ఆశలు, ఆరాటాలు తీర్చుకోవడానికి కొత్త దంపతులు లాడ్జికి వెళతారు. అక్కడ పోలీసులు రెయిడ్ చేసి వాళ్ళను వ్యభిచార నేరం క్రింద పట్టుకొంటారు. తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళు దంపతులని చెప్పి తీసుకువస్తారు. చివరకు కుటుంబ సభ్యులంతా  కలిసి వాళ్ళకు ఏకాంతం కల్పించడంతో సినిమా సుఖాంతం అవుతుంది. ఈ సినిమాలో చూపించే దంపతులు మధ్య తరగతికి చెందిన వాళ్ళు. చదువుకున్న వాళ్ళు. కాబట్టి వాళ్ళ వేషభాషలను చూసి లాడ్జిలోకి అనుమతిస్తారు.  నూకరాజు దంపతులను చూసి అలగాజనుల వ్యవహారమని తలచి గుమాస్తా వెళ్లగొడతాడు.

ఈ కధ వచ్చిన కొత్తల్లో చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇందులో వున్న సమస్యలకు లాడ్జీలను పరిష్కారంగా చూపడం నవ్వు తెప్పించింది. అక్కడి గుడిసె వాసులకు వున్న లాడ్జీల పరిజ్ఞానం మాలాంటి తెలంగాణా వాళ్ళకు లేకపోవడం ఒక కారణం కావచ్చును. లేదా మా దగ్గర లాడ్జీల సంస్కృతి లేకపోవడం వల్ల మేము సరిగా అర్ధం చేసుకోలేక పోయాం అనైనా అనుకోవాలి. నిజానికి ఆ పరిస్థితుల్లో ఆ జంట ఎలా ఆలోచిస్తుందనే విషయాన్ని కూడా రచయిత సరిగా పట్టుకోలేక పోయారు. గుడిసెవాళ్ళు లేదా కష్టజీవులు లాడ్జిలకంటూ బోలెడు డబ్బు పోసే బదులు, ఆ డబ్బుతో తన భార్యకు ఇష్టమైనవి తీసుకు వచ్చి ఆమె ప్రేమను చూరగొనాలనుకొంటాడు. ముఖ్యంగా స్త్రీలు అంత డబ్బును దుబారా చేయడానికి ఇష్టపడక, తమకు లేని వస్తువులను సమకూర్చుకోవాలని ఆశిస్తారు.

ఇంకా తెలివైన వాళ్ళయితే ఆ డబ్బుతో కుటుంబసభ్యులను తీర్ధయాత్రలకు తరిమేసి ఏకాంతాన్ని పొందగలుగుతారు. లేదా కొత్త దంపతుల తీర్ధయాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శన వాళ్ళకు ఏదో విధంగా హనిమూన్ కొరతను తీర్చగలుగుతాయి. ఇలా ఇరుకు ఇళ్ళలో గడిపేవారికి ఎప్పటికైనా స్వంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక కలుగుతుంది. మరింత డబ్బు సంపాదించే మార్గాలు కనుక్కుంటే మరింత విశాలమైన ఇంటిలోకి మారాలని అనుకుంటారు. ఆదాయం కొద్ది ఇల్లు సమకూరుతుంది. ఒక రోజు వ్యవహారంతో సరిపెట్టాలనుకుంటే తప్ప. ఆ విధంగా కూడా ఈ కధలో నూకరాజు ఆలోచించలేక పోతాడు. కధ చదివిన తరువాత సామాన్య పాఠకుడి ఆలోచనా ధోరణీ ఇలాగే కొనసాగుతుంది. మరి రచయిత ఉద్దేశించింది ఇదేనా? కానే కాదు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళవుతున్నా మనుషులకు జానెడు భూమి దొరకని పరిస్థితిని తెలియచేసారు. కనీస అవసరాలు కాదు గదా, చిన్న చిన్న సరదాలు కూడా తీర్చుకోలేని నిస్సహాయ పరిస్థితిని తెలియజేశారు. పాఠకుడు నూకరాజు పరిస్థితిని చూసి జాలి పడి పడతాడు. కానీ అంతకంటే నికృష్టమైన పరిస్థితుల్లో బతుకుతున్న వేలాదిమంది మాటేమిటి? హోటల్ లోంచి వస్తున్న నూకరాజు ఒక చోట అరుగు మీద మనుషులు మందల్లా పడుకోవడం, ఇంకొక చోట పేవ్ మెంట్ మీద బారులు తీరి పడుకోవడం గమనిస్తాడు.

“వాళ్ళకు ఇల్లంటూ ఉండదు. ఎలా బతుకుతారో” అనుకున్నాడు నూకరాజు.

“అలానే… కుక్కల్లా”

నూకరాజు తుళ్ళిపడ్డాడు మనసులో.

వేలకు వేలు జనం బతుకుతున్నారు ఆ నగరంలో. చెట్ల కింద సంసారాలు, గట్ల మీద వంటలు, వడ్డనలు. వానొస్తే, వరదోస్తే కనబడ్డ అరుగులు ఎక్కుతారు. కరకర ఎముకలు కొరికే చలిలో, జరజర వర్షంలా కురిసే మంచులో, భగభగ మండి మసి చేసే ఎండలో, నీడంటూ లేని బ్రతుకులు. వెళ్ళు, వెళ్ళండి .. లే లే .. ఇక్కడ కాదు అంటూ కుక్కల్ని తరిమినట్టు తరుముతారు. బురదలో, రొచ్చులో, దీపాల్లేని బ్రతుకులు. దుప్పట్ల ముసుగు. పక్కవాళ్ళ రెప్పల బరువులు తప్ప మరుగుల్లేని చీకటి కాపురాలు.

జాలి కలగడానికి బదులు కోపం వస్తున్నది నూకరాజుకి. ఏదో సినిమాలో, ఎక్కడో ఎవరో జనం రోతకి, అన్యాయానికి, హింసకు విరగబడి తిరగబడ్డం చూసేరు. ఈ జనం మాత్రం ఎన్నాళ్ళయినా ఇంతే.

జనానికి నిజమైన అనుభవాలు అందవు. అందాలనే కోర్కెలు, ఊహలు కలిగినా ప్రమాదమే.

వాళ్ళను ఊహాలలో విహరింపజేయడానికి సినిమాలు బాగా పనికివస్తాయి. తెరమీద చూపిస్తున్నదే మాయ. ఆ మాయను కూడా మాయగా చూపిస్తారు మాయవెధవలు.

పెద్దవాళ్ళు పిల్లల్ని ఉత్తుత్త కబుర్లతో మభ్యపెట్టినట్లు, ప్రజలని ప్రభువులు మాయా వాగ్దానాలతో మోసగిస్తున్నట్లు, కొందరు మాయగాళ్ళు జనంను మాయానుభవాలతో మోసగిస్తున్నారు. జనం మోసపోవడానికి సిద్దంగా ఉన్నారు. అందుకు ముడుపులు కూడా చెల్లిస్తున్నారు. ఆ ముడుపులు బ్లాక్ రేట్లలో చెల్లించడానికి కూడా వారు సిద్దం. మోసగిస్తున్నారంటే వాళ్ళది తప్పు కాదేమో.

కుక్కల్లా పందుల్లా బతుకుతున్న జనాలకు తామెందుకు ఆ పరిస్థితుల్లో బతుకుతున్నారో ఆలోచించలేక  అలాగే అడ్జెస్ట్ అయితున్నందుకు కోపం. వాళ్ళను ఆలోచించకుండా కలల స్వర్గంలో విహరింప చేస్తున్న మాయా ప్రపంచం అనే సినిమాల మీద కోపం. ఆ కోపం, ఈ కోపం అంతా కలిసి గట్టు తెగిన వరదలా దేవుడి  మీద చూపించాల్సి వస్తుంది.

‘నో రూమ్’ లో ముగ్గురి కధలున్నాయి. లాడ్జి కట్టిన మేస్త్రీకి, దాన్ని మెయింటైన్ చేస్తున్న దేవుడికి, అందులో డబ్బుతోనైనా ఒక్క రాత్రి సుఖాన్ని పొందాలనుకునే నూక రాజుకి అది అందుబాటులో లేదనే విషయం ముగ్గురి కధనాల ద్వారా తెలియచేసారు. ఇందులో మేస్త్రీ దోపిడి స్వభావాన్ని చక్కగా గుర్తించి విశ్లేషిస్తారు. కానీ తన అవసరాల దృష్ట్యా దాంతో అడ్జెస్ట్ అయిపోతారు. ఏమి చేయలేని స్థితిలో దేవుడు నైరాశ్యంలో, నిర్లిప్తంగా బతుకు వెళ్ళదీస్తుంటాడు. నూకరాజులో పొడసూపిన తిరుగుబాటు చైతన్యాన్ని, అతని నిస్సహాయతలోంచి పెల్లుబకడాన్ని చక్కగా చిత్రీకరించారు. మొత్తానికి – స్వాతంత్ర్యానికి పూర్వం దేవుడికి, తర్వాత నూకరాజుకి గూడు కల్పించలేని సమాజం మీద విసురుగా ఈ కధని గుర్తించాలని ప్రముఖ విమర్శకులు ఎ.కె. ప్రభాకర్ అభిప్రాయాలు ఆలోచించదగినవే.

–  కె.పి. అశోక్ కుమార్

1888749_1047824525231610_1628769097923067855_n

కె.పి అశోక్ కుమార్ జననం, ప్రాధమిక విద్యాభ్యాసం సికిందరాబాద్ లోని మచ్చబొల్లారంలో జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్కియాలజీ, ఆంధ్ర సారస్వత పరిషత్ లో తెలుగు సాహిత్యం, అనంతపూర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో గ్రంధాలయ సమాచార శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వీరు హైదారాబాద్ లో గ్రంధపాలకుడిగా పని చేస్తూ ఇటీవలనే పదవీవిరమణ చేశారు. ‘హాలీవుడ్ సినిమాలు’, ‘కధావలోకనం’, ‘తెలుగులో మారుపేరు రచయితలు’ పుస్తకాలు వెలువరించారు. నాలుగు పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ప్రస్తుతం పాలపిట్ట వర్కింగ్ ఎడిటర్ గా ఉన్నారు.  

 

 (వచ్చే వారం ఈ శీర్షికలో చివరి వ్యాసం: వరవరరావు  ‘కాళీపట్నం రామారావు కధలు, రాజకీయ అవగాహన’)

“నో రూమ్” కథ ఇక్కడ: