ఆలోక

A19

-రాధిక

~

Radhikaవాళ్ళిద్దరినీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను.  ఇంకా రిటైర్ అయినట్టు లేరు. ఇద్దరూ రోజూ బయట వున్న చిన్ని తోట లో కూర్చుంటారు. ఆమె మాట్లాడితే అతను వింటుంటాడు. లేదా అతను మాట్లాడితే ఆమె వింటుంది. అప్పుడు వాళ్ళని  చూస్తే ప్రపంచం ఇంకేమీ లేదు… ఆమెకి అతను, అతనికి ఆమె.. మాత్రమే అనిపిస్తుంది.  పక్క పక్కన కూర్చుని  చేతిలో చెయ్యి వేసుకుని అనురాగాన్ని, ప్రేమని ఒకరిలో ఒకరు  నింపుకుంటున్నట్టు వుంటారు.

వెన్నల రాత్రులలో అయితే ఎక్కువ సేపు వెన్నెలలో తడుస్తూ అక్కడే భోజనం చేస్తుంటారు.  ఆరుబయట వుండటం వలన కావచ్చు, మొదటి ముద్ద ఒకరి చేతిలో ఒకరు పెట్టుకుంటారు.వాళ్ళ వంటగది మా బాల్కనీ లోకి కనబడుతుంది. అందులో ఆమెని ఎప్పుడూ ఒక్కదాన్ని చూడలేదు, అతను వూరిలో లేనప్పుడు తప్ప. ఆమెకి కావలిసినవి అందిస్తూనో, ఏమీ పనిలేక పొతే ఆమె జుట్టుని సవరిస్తూనో ఉంటాడు అతను. చూడటం సభ్యత కాదు అనిపించినా వాళ్ళిద్దరి మధ్యా వున్న ప్రేమని, అనురాగాన్ని పదే పదే చూడాలనిపిస్తుంది. ఇంత జీవితం గడిచిన తరువాత కూడా తొలి ప్రేమలో వుండే సున్నితత్వాన్ని, మాధుర్యాన్ని  ఇంకా ఎలా మిగుల్చుకున్నారో తెలుసుకోవాలనిపిస్తుంది.

 

వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే రవి గుర్తుకు వస్తాడు.ఇద్దరం కలిసి అలా వెన్నెలనీ, ప్రకృతినీ అనుభవించాలి అనిపిస్తుంది నాకు. “ఓ సరూ..నువ్వు అన్నీ రొమాంటిసైజు చేస్తావు. అక్కడ ఏమి లేదు” అని ఒక్క మాటలో కొట్టి పడేస్తాడు. నావి పనీ పాటా లేని భావాలుగా తీసి పడేస్తాడు. మనసు చివుక్కు మంటుంది. ఇదంతా భావవాదం ఎలా అవుతుందో నాకు అర్థం కాదు. మనిషి పరిణామం లో భావాలు, ఆలోచనలు, స్పందనలు కూడా ఒక భాగామేకదా. ప్రకృతిని ప్రేమించటం, భావోద్వేగాలకు గురి కావటం ఎలా భావవాదం. ఇదంతా చెప్పి నేను రవిని ఒప్పించలేను. మొదటిలో కొన్ని సార్లు అడిగినా, మనసును పదే పదే నొప్పించుకోవటం ఇష్టం లేక అడగటం మానేసాను. నా ఏకాంతంలో విధ్వంసం, ఒంటరితనంలో నిశ్శబ్దం రవి.

“సరూ ఎంత సేపు… రా… డిన్నర్ చేద్దాము” నాన్న పిలుపు విని లేచాను.

ఎదో మెసేజ్ వచ్చినట్టు వుంది. సెల్ తీసుకుని చూసాను.

“సరయు.. వెన్నెలలో తడుస్తున్నారా. మీ అంత కాదుగాని వెన్నెల అద్భుతంగా వుంది కదూ”  అనీల్ నుంచి మెసేజ్.

ఆకాశం వైపు చూసాను. శరత్ కాలపు వెన్నెల పారిజాత పరిమళం లాగా మనసుని మెత్తగా తాకుతుంది. సంతోషం,దిగులు కలిసినట్టు వుంది వెన్నెల. వాళ్ళిద్దరి కోసం చూసాను. అక్కడే వున్నారు వాళ్ళు యుగయుగాల నుంచి ప్రేమించుకుంటున్నట్టు, ఒకరికోసం ఒకరు పుట్టినట్టు.

నెమ్మదిగా లేచి ఇంట్లోకి వెళ్ళాను.

***

ముగ్గురం నిశ్శబ్దంగా భోజనం చేస్తున్నాం. మనసుకు శరీరానికి సంబంధం లేదేమో. ఎంత బాధలో వున్నా, ఆ బాధతో సంబంధం లేనట్టు ఆకలి వేస్తూనే వుంది. ఎవరి ఆలోచనలలో వాళ్ళు. ఏమనుకుంటున్నారో గాని, అమ్మా,నాన్న ..నన్ను ఏమీ అడగలేదు. వీలైనంత వరకు నన్ను సంతోషంగా ఉంచటానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఏమైనా మాట్లాడితే బాగుండు . టి.వి లో ఎదో సినిమా వస్తుంది.

“ఈ ఆర్చరి భలే గ్లామర్ గా వుంటుంది కదా నాన్నా” సినిమాలో ఎదో వార్ సన్నివేశం నడుస్తుంది. “మిగతావి అన్నీ ద్వంద్వ యుద్ధాలు. ఆర్చరి లో మాత్రం ఎక్కడి నుంచి అయినా శత్రువుని చంపవచ్చు.”

నా మాటకి నాన్న కూడా టి.వి వైపు చూసాడు.

“ఏ ఆయుధం అయినా ప్రయోజనం ఒకటే కదా” ఎదో ఆలోచిస్తూ అన్నాడు నాన్న.

మళ్ళీ మా మధ్య మౌనం పరచుకుంది.

“నిద్ర వస్తుంది. పడుకుంటాను” లేచి నా గదిలోకి వచ్చాను.

దస్తయేవస్కీ బుక్ తీసుకున్నాను. ఈ రష్యన్ రచయితలు మనసుని జల్లెడ పట్టినట్టు రాస్తారు.  ఏ ఒక్క అనుభూతిని జారిపోనివ్వరు. అనీల్ గుర్తు వచ్చాడు. అనీల్ కి కూడా ఈ బుక్స్ అంటే ఇష్టం.

“సరూ” అమ్మ లోపలికి వచ్చింది. అమ్మ వెనుకే నాన్న కూడా.

“కూర్చోమ్మా”

Kadha-Saranga-2-300x268

“సరూ… నువ్వు ఏమి  నిర్ణయించుకున్నావో తెలియదు. కాని నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మేము నీతోనే ఉంటాము. నువ్వు సంతోషంగా ఉండటమే మాక్కావలిసింది” నెమ్మదిగా నా చెయ్యి నిమురుతూ చెప్పింది.

“మా“ ఎందుకో తెలియకుండానే దుఖం వచ్చింది.

“మా.. రవి భర్త కాబట్టి ప్రేమించటం లేదమ్మా. తన నుంచి నేను అలాంటి స్థానం కూడా ఆశించటం లేదు. నాక్కావలిసింది  అది కాదు. ఒకరి అనుభూతులను  ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరి స్పందనలకి  ఒకరు స్పందిస్తూ వుండే సాహచర్యాన్ని కోరుతున్నాను. వుద్యోగం  నాకు ఒక ప్రొఫెషన్. ప్రపంచమూ,పుస్తకాలు, వెన్నెలలు, వానలు… ఇవన్నీ నాలో భాగాలు. ఇంట్లో,ఆఫీసులో వుండే లాప్టాప్ లలో ఒకదానిగా నన్ను భావిస్తాడు రవి. అసలు ఈ రవిని కాదమ్మా నేను ప్రేమించింది. ఆ వ్యక్తి వేరే. నాకు ఎవరో తెలియని వ్యక్తితో కాపురం చేస్తున్నట్టు వుంది.”

నేను చెప్పేది అర్థం చేసుకుంటున్నట్టుగా అమ్మ నా చెయ్యి నిమురుతూ వుంది.

“అప్పటికీ రవి తో మాట్లాడటానికి ప్రయత్నం చేసాను.  చిన్న విషయాలకు కూడా ఎక్కువ స్పందిస్తానని, ప్రతి విషయాన్ని చాలా ఎక్కువ ఆలోచించి వుద్రేకపడతానని అన్నాడు రవి. నన్ను చిన్నప్పటినుంచి చూస్తున్నావు కదమ్మా రవి చెప్పేది నిజమేనా”

“చిన్నది పెద్దది ఏముంటుంది రా. ఒకరికి చిన్నది అనిపించేది వేరొకరికి పెద్దది కావచ్చు.ఎవరి కడుపునెప్పి వారిది.  ఎవరి అనుభవాలు వాళ్ళవి.” చెప్పింది అమ్మ.

“అక్కడ అలాగే  వుంటే నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నా నేమో, నా ధోరణిలో నేను వున్నా నేమో అనిపించింది. కొద్ది రోజులు ఒంటరిగా వుంటే నాలో నేను తరచి చూసుకోవచ్చు అనిపించి ఇక్కడకు వచ్చాను.“

“జీవితం చాలా చిక్కుముడులతో  ఉంటుంది. బయటి నుంచి చూస్తే ఎదుటివారి జీవితం సాఫీ గా గడచిపోతున్నట్టు గా అనిపిస్తుంది అంతే. మనం చెయ్యవలసింది ఏంటంటే నచ్చినట్టు గా జీవించటానికి ట్రై చెయ్యాలి.” నా పక్కకి వచ్చి కుర్చుని నాన్న చెప్పాడు.

అమ్మ భుజానికి తల ఆనించి పడుకుంటే ఎంతో భరోసాగా వుంది. ఒక సంక్లిష్టతని అధిక మించే టప్పుడు మనలని  అర్థం చేసుకునే మనుషులు వుండటం ఎంత అదృష్టం.

ఇంకొంచెం గట్టిగా అమ్మ చేతిని పట్టుకున్నాను.

***

“గుడ్ మార్నింగ్ సరయు. లేస్తే కలిసి కాఫీ తాగుదాం” అనీల్ ఫోన్ కి మెలుకువ వచ్చింది.

“గుడ్ మార్నింగ్ అనీల్. తరువాత మాట్లాడతాను” చెప్పి ఫ్రెష్ అయి బాల్కనీ లోకి వచ్చాను. నా చూపు అనుకోకుండానే పక్కకి తిరిగింది. ఏ సమస్యలో కొట్టు మిట్టాడుతుంటామో బహుశా ప్రతి దాన్ని అదే కోణం లోనుంచి చూస్తామేమో. అందుకే వాళ్ళ గురించి అంతగా పట్టించుకుంటున్నాను.

“సరూ కాఫీ” కాఫీ ఇచ్చి నా పక్క నే కూర్చుంది. ఇవాళ ఆఫీస్ కి సెలవు. తీరిగ్గా వుంది అమ్మ.

“అమ్మా.. .నాన్న, నువ్వు ఎప్పుడైనా వాళ్ళు ఉన్నంత ప్రేమగా వున్నారా” కాఫీ అందుకుంటూ అడిగాను అమ్మని.

“ఎవరి గురించి…ఓ ఆలోక వాళ్ళ గురించా”

“నీకు తెలుసా వాళ్ళ గురించి”  నాకు వుత్సాహం వచ్చింది. “నాకు చెప్పవా”.ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా ధ్యాసలో నేను వున్నాను. ఎవరిగురించి తెలుసుకోలేదు.

“వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది. నువ్వు ఇంతకుముందు సుడిగాలిలా వచ్చి వేళ్ళేదానివి. అందుకే గమనించలేదు.ఇప్పుడే కదా.. కాస్త నేల మీద కాళ్ళు పెట్టావు.” నవ్వింది అమ్మ.

“వివాహాలు వ్యక్తుల మధ్య కాకుండా ఆస్తులు,అంతస్తులు, కులాలు, మతాల మధ్య జరుగుతాయి. అందుకే ఇలాంటి పెళ్ళిళ్ళల్లో ప్రేమలు ఎక్కడో తప్ప కనబడవు అంటాడు అనీల్, నిజమే అనిపిస్తుంది నా క్కూడా . కాని వాళ్ళిద్దరినీ చూస్తే ఆశ్చర్యంగా వుంటుంది. మీ అంత వయసే కదా వాళ్ళది, ఎలా సాధ్యమైంది “

“ఇప్పటిదా ..వాళ్ళ ప్రేమ. దాదాపు పదిహేను సంవత్సరాలు ఓపికపట్టి నిజం చేసుకున్నారు” చెప్పింది అమ్మ.

నాకేమీ అర్థం కాలేదు. అంటే ఏంటి…. వాళ్ళ వయసు అమ్మ,నాన్న అంత వుంటుంది. ఏంటో అంతా గందర గోళం గా వుంది.

“అర్థం అయ్యేటట్టు చెప్పమ్మా”

“భర్త నుంచి విడిపోయిన తరువాతే శశాంక.. ఆలోక జీవితం లోకి వచ్చాడని కొందరంటారు, కాని శశాంక ఆలోక జీవితంలోకి రావడం వలెనే ఆమె భర్త నుంచి విడిపోయింది అని కొందరంటారు. ఏది నిజమో నాకు తెలియదు  కానీ  పాప పుట్టినతరువాత భర్త నుంచి విడిపోయింది. శశాంక కు కూడా భార్యతో సయోధ్య వున్నట్టు లేదు. “

“మరి ఈ మధ్య నే పెళ్లి చేసుకున్నారంటున్నావు”

“ అవును. రెండు సంవత్సరాలు అయివుంటుంది. అందరూ అప్పుడే పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. కాని పాపకోసం అగినట్టుంది. నీ సందేహాలన్నీ నేను తీర్చలేను. మనం ఆలోక దగ్గరకి వెళదాము. తను చాలా ఫ్రాంక్. ఏ విషయం అయినా చాలా ఓపెన్ గా చెబుతుంది. నాకు మంచి ఫ్రెండ్.నువ్వే మాట్లాడు. నీ జీవితానికి కూడా ఏమైనా ఉపయోగ పడుతుందేమో” చెప్పింది అమ్మ.

నాకూ తెలుసుకోవాలనే వుంది. రవి తో నా జీవితాన్ని ఎలా డీల్ చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు. ఇంకో వైపు రిలెషన్ కోసం అనీల్ వత్తిడి.

“సరూ…. అనీల్ ని ఇష్ట పడుతున్నావా” నెమ్మదిగా అడిగింది అమ్మ.

“ఇష్ట పడుతున్నానా….వూ… సరిగ్గా అర్థం కావటం లేదు. లేదనుకుంటాను. రవి  వల్ల వచ్చిన వెలితిని పూడ్చుకునే ప్రయత్నమేమో అనిపిస్తుంది. ఒక ప్రేమ ని కొల్పొయినప్పుడు ఆ బాధనుంచి బయట పడటానికి ఇంకో ప్రేమ  కావాలనిపిస్తుంది కదా.ఇదీ అలాంటిదే ననుకుంటా. ఏమైనా నేను అనలైస్ చేసుకోవాలి ఇంకా ” ఆలోచనలను కూడా పెట్టుకుంటూ చెప్పాను అమ్మ తో.

***

A19“కొంత కాలం గడిచిన తరువాత జీవితం చాలా పొడవైనదనిపించింది సరయు. అమ్మ కోసం,నాన్న కోసం, బంధువుల కోసం, సమాజం కోసం అంత పొడవైన దారిని దాట లేననిపించింది. అందుకే విడిపొయాను. కానీ శశాంక పరిచయం తో అంత పొడవైన జీవితానికి ఎంత సుందరమైన బాట వేసుకోవచ్చో నాకు తెలిసింది. తన యవ్వన కాలం అంతా నాతో కలిసి గడపబోయే జీవితాన్ని వుహించుకుంటూ గడిపివేసాడు. ఒక మగవాడి గా సమాజం తనకు ఇచ్చే ప్రయోజనాలని వదిలేసాడు. “ ఆలోక కళ్ళలో సన్నటి తడి మెరిసినట్టుగా వుంది.

ఆ రోజు సాయంత్రమే ఆలోక ఇంటికి వెళ్ళాము. నన్నూ, అమ్మనీ చాలా ఆప్యాయంగా ఆహ్వానించింది ఆలోక.  దగ్గరనుంచి చూసినప్పుడు ఆలోక ఎంతో అందంగా కనబడింది.  సున్నితమైన గులాబీ లాగ చాలా భద్రంగా చూసుకోవాలి ఈమెని అనిపించేలాగా వుంది. ఇంత సున్నితంగా వుండే ఈమె, జీవితానికి  ఎంత ధైర్యంగా ఎదురు నిలిచింది అనిపించింది. కొంత వయసు వచ్చిన తరువాత కొన్ని చేదు అనుభవాలు గుండెల్లో వుండే వెచ్చదనం తో పాటు పెదవి చివర జాలువారే నవ్వుని మాయం చేస్తాయి. కాని ఆలోక ఆ నవ్వు ని నిలుపుకో గలిగింది. బహుశా శశాంక  ఆ నవ్వుకి కారణం కావచ్చు.

“వెంటనే ఎందుకు పెళ్లి చేసుకోలేదు” అడిగాను.

“ఎదో మూల మనపైన కుడా సమాజపు తాకిడి వుంటుంది. నా స్నేహితులంతా మా ఇద్దరినీ పెళ్లి చేసుకోమనే చెపారు.  శ్వేత కి వాళ్ళ నాన్న ఎవరో తెలుసు. నా జీవితంలోకి శశాంక రావటం అర్థమయ్యే వయసు కాదు దానిది.  పెళ్లి చేసుకుంటే ఇంట్లో, అమ్మ పక్కన  నాన్న బదులుగా శశాంక ని ఎలా రిసీవ్  చేసుకుంటుంది.  ఏమైనా మానసికంగా క్రుంగిపోతుందా అని బాగా మధన పడ్డాను. భర్త నుంచి ధైర్యంగా విడిపోయిన నేను కూతురి విషయం లో ధైర్యం చెయ్యలేక పోయాను. అమ్మా,నాన్న విడిపోయిన పిల్లలకు ఇక్కడ సామాజిక భద్రత తక్కువ . మనమేమి మెట్రో సిటీస్ లో లేము కదా. శ్వేత ను తలుచుకుంటే నాకు చాలా గర్వంగా వుంటుంది. నా నిర్ణయాన్ని ఎలా తీసుకుంటుందా అనుకున్నాను. తను ఏమి చెప్పిందో తెలుసా ”

శ్వేత గుర్తు వచ్చిన ఆనందం ఆమె ముఖం మీద ప్రతి ఫలించింది.

“అమ్మా… నువ్వూ,అంకుల్ నా కోసం చాలా జీవితాన్ని కోల్పోయారు. నీ డెసిషన్ నాకు చాలా సంతోషంగా వుంది అని చెప్పింది తెలుసా సరయు.”

అ అమ్మాయి ఎంత గొప్పగా అర్థం చేసుకుంది అమ్మని అనిపించింది నాకు.

“శ్వేతకి మీరు విడిపోయిన విషయం అన్ని రోజులు  తెలియకుండా ఎలావుంది?

“మనుషులలో కొంత దయ ఉంటుందనుకుంటాను. వాళ్ళు ఆ దయని కొద్ది మందికే పంచగలరు. శ్వేత నాన్న విడాకుల విషయంలో శ్వేత కు ఇబ్బంది కలగకుండా ఉంచటానికి అంగీకరించాడు.  అప్పటికే అతను ఉద్యోగరీత్యా వేరే చోట వుండటం, వీక్ ఎండ్స్ కి రావటం జరుగుతుండేది.  విడాకుల తరువాత శ్వేత ఇబ్బంది పడకుండా ఆ పద్ధతినే కొనసాగించాడు.  శ్వేతకి విషయం తెలిసే సరికి అర్థం చేసుకునే పరిణితి వచ్చింది.”

“మీ తోట చాలా బాగుంది” చెప్పాను.

“ఓహ్.. పెద్ద తోట, చిన్ని ఇల్లు కావాలనుకునే వాళ్ళం నేను,శశాంక. కాని అంత పెద్ద తోటని చూసుకోవటం కష్టం కదూ. అందుకే చిన్న తోట “ సంతోషంగా చెప్పింది ఆలోక.

“మీరు ఎందుకు విడిపోయారు” అడిగాను శశాంకని

“నాకు చదువంటే చాలా ఇష్టం. కూతురిని పెళ్లి చేసుకునే షరతు మీద నన్ను చదివించటానికి సహకరించాడు ఆమె నాన్న. నేనంటే ఇష్టమో కాదో ఆమెని నేనూ అడగలేదు. బహుశా భర్తలను ప్రేమించటం భార్యల భాద్యత కదా అని నేను అనుకున్నానేమో. వాళ్ళ నాన్న మాటకి ఎదురు చెప్పలేక నన్ను చేసుకుంది. ఆమె నాన్న చనిపొయిన తరువాత నాతో ఉండనని చెప్పింది. “  చెప్పాడు శశాంక.

“ భర్త నుంచి విడిపోయిన తరువాత అందరూ కూతురిని చూసుకుని బతక మన్నారు. శశాంక తో వుండబోతున్నానని తెలిసిన తరువాత ఈ వయసులో  పెళ్లి ఎందుకు మనవళ్ళని చూసుకుంటూ బతకక అన్నారు. జీవితంలో కావలసింది తోడు కాదు. ఒక సాహచర్యం, బతకటం కాదు జీవించటం అని అర్థమయిన తరువాత ఎవరినీ పట్టించుకోలేదు. నా నిర్ణయం నేను తీసుకున్నాను.వుండేది ఒకే జీవితం కదా. వీలైనంత సారవంతం చేసుకోవాలి.” నెమ్మదిగా చెప్పింది ఆలోక.

***

ఆలోక తో మాట్లాడిన తరువాత  మనసులో వుండే చీకటి గదులలోకి వెలుతురు ప్రసరించినట్టు అయింది. నా ఆలోచనలకూ ఒక స్పష్టత వచ్చింది.

“ అమ్మా … నేను రేపు వెళతాను” చెప్పాను అమ్మతో మెయిల్ ఓపెన్ చేస్తూ.

నా వైపు అర్థం కానట్టు చూసింది అమ్మ.

“ అమ్మా …..రవి మీద నేను కోపం, ద్వేషం పెంచుకోవటం అనవసరం. నా ప్రపంచం వేరు.రవి ప్రపంచం వేరు. మేమిద్దరం కలిసి ఉండాలంటే ఈ రెండు ప్రపంచాల మధ్య కొంతైనా సారూప్యం వుండాలి. అలా లేనప్పుడు మా ఇద్దరికీ జీవితం లో ఏమిమిగలదు. రవి తో  మాట్లాడతాను.బహుశా కలిసి వుండటం సాధ్యం కాదేమో.

అమ్మ ముఖంలో కొద్దిగా బాధ పారాడినట్టుగా వుంది. జీవితకాల బంధాలు అనుకున్నవి తెగిపోతుంటే ఆ బాధ ఉంటుందేమో ఎవరికైనా.

“అమ్మా…. ఆలోక, శశాంక ని చూడు. నా ముందు తరం వాళ్ళు. ఎంత ఓపికగా,తెగువగా జీవితాన్ని  ఫలవంతం చేసుకున్నారో. జీవితమంతా ఎండిపోయి బతకలేనమ్మా. కొన్ని హరిత వనాలు కావాలి.”

ఇన్ని రోజులు కృంగిపోయి, దీనంగా ఉన్న కూతురు ఆత్మ విశ్వాసంతో, స్పష్టత తో మాట్లాడటం చూసిన అమ్మ దగ్గరకు వచ్చి నా నుదిటి మీద చిన్న ముద్దు పెట్టుకుంది.

“మరి అనీల్….”

“అనీల్ శశాంక కాడమ్మా. అనీల్ కి జీవితంలో అక్కడక్కడ వున్న ఖాళీలు నాతో  నింపుకోవాలనుకుంటున్నాడమ్మా. కాని నేను అలా కాదు.”

అనీల్ కి మెయిల్ టైపు చెయ్యటం మొదలు పెట్టాను.

***

………… అనీల్.. నేను ప్రేమించే దేనినైనా చేతులు బార్లా చాచి నాలోకి ఆహ్వానించాలనుకుంటాను. నిన్ను ప్రేమించి ఎక్కడో మనసుపోరల్లో ఎవరికీ కనబడకుండా దాచుకుని చుట్టూ చీకటి పరుచుకున్న సమయంలో మాత్రమే నిన్ను హత్తుకోగలగటం నేను భరించలేను. నా గుండె గదుల్లో ఎదోమూలకు నిన్ను నెట్టి మిగతా గదులన్నీ పరాయి వాళ్ళ తో నింపలేను. నేను మనసా.వాచా, కర్మణా ప్రేమిస్తాను. నన్ను ప్రేమించేవాళ్ళు కూడా అలాగే నన్ను ప్రేమించాలి. సో అనీల్……

*

 

Artwork: Srujan Raj

 

 

 

.