ఇది ‘పెట్టుబడి’ చేసిన హత్య!

Uday-Kiran-Modeling-Pic‘‘ప్రముఖ సినీనటుడు ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్య’’ అన్న వార్త టెలివిజన్‌ తెరమీద స్క్రోల్‌ రూపంలో చూసినపుడు నాకు పెద్దగా ఆశ్చర్యంకానీ, దు:ఖం కానీ కలగలేదు. వైయక్తిక దు:ఖానికి తప్పిస్తే, సామాజిక అవ్యవస్థకి మనం మనుషులుగా స్పందించడం మానేసి చాలాకాలమయింది కనుక…దు:ఖం స్థానంలో ఒక నిర్లిప్తత, ఒక ఉదాసీనత ఏదో కలిగింది. చిత్ర సీమకు ఇలాంటి రోజు ఏదో ఒక రోజు వస్తుంది అని తెలుస్తూనే వుంది కనుక ఆశ్చర్యం లాంటి భావమేదీ కలగలేదు.
ఆ ఏదో ఒక రోజు ఇంత త్వరగా రావడం మాత్రం ఖఛ్చితంగా విషాదమే!
సినిమా అవకాశాలు తగ్గిపోవడమూ, ఆర్ధిక ఇబ్బందులు, పరాయీకరణ లాంటి కారణాల వలన డిప్రెషన్‌కి గురి అయి ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించి ఇవ్వాళో, రేపో కేసు మూసివేయ వచ్చు. కానీ ‘‘హత్య’’కి ఆత్మహత్యకి మధ్య ఉన్న ఒక సన్నని రేఖను వాళ్ళెప్పుడూ, ఎప్పటికీ ఛేదించలేరు. అది వాళ్ళ తప్పు కూడా కాదు సమాజంలో కొండలా పేరుకుని పోయిన రుగ్మత, పోలీసులకి భౌతిక, ప్రాసంగిక సాక్ష్యాలు కావాలి. వాటి అవసరం లేకుండానే సమాజం, ఏది హత్యో, ఏది ఆత్మహత్యో నిర్ధారణ చేయవచ్చు కానీ మన సమాజం ఆ దిశగా ప్రయత్నించదు అది మన దురదృష్టం.
‘‘ఉదయ్‌ కిరణ్‌’’ హత్య, పోనీ ఆత్మహత్య వెనుక నాలుగు శక్తులు ప్రధానంగా పనిచేశాయి అని ఈ వ్యాసకర్త బలమయిన నమ్మకం. ఒకటి సినిమా, రెండు సమాజము, మూడు ప్రేమ రాహిత్యము చివరగా చెపుతున్న కారణం  అత్యంత బలమయినది. ఏ ఆత్మహత్య వెనుక అయినా, కొంచెం లోతుగా పరిశీలిస్తే ఈ నాలుగు అంశాలు తప్పిస్తే మరేమీ కన్పించవు.
ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్య వార్త లోకానికి వెల్లడి కాగానే మొదటి చూపుడు వేలు సినిమా రంగం వైపే చూపించింది. అవునన్నా, కాదన్నా యివ్వాళ సినిమా రంగంలో  సామాన్యుడికి స్థానం లేదు.
ప్రపంచీకరణ విధానాలు ఆంధ్రదేశంలో అమలు కావడం మొదలయిన తర్వాత, ఆ విధానాలకు బలంగా ప్రభావితమయినది మాత్రం సినిమా రంగమే 1980 దశకం దాకా రాష్ట్రం ఎల్లలు దాటని సినిమా రంగం షూటింగ్‌లు, సినిమా వ్యాపారము 1990 తర్వాత మెల్ల మెల్లగానూ 2000 తర్వాత ఉధృతంగానూ విశ్వవ్యాప్తమయినాయి.

ప్రేమాభిషేకం లాంటి సినిమా ఇరవై, ముప్పై లక్షలులో తయారయిందంటే మనకు ఆశ్చర్యంగా ఉండవచ్చు. ఇవ్వాళ ‘‘కోటి’’ రూపాయల బడ్జెట్‌ లేకపోతే ఎంత చిన్న సినిమా అయినా తయారుకాదు. ఒకప్పుడు ‘‘అడవిరాముడు’’ అనే సినిమా రాష్ట్రవ్యాప్తంగా 27 ధియేటర్లలో విడుదల అయితేనే ఒక రికార్డు. కానీ ఇవ్వాళ సినిమా రెండు వేలకు పైగా ధియేటర్లలో విడుదల అవుతుంది పెట్టుబడి వరదలాగా చిత్రసీమలోకి వచ్చి చేరుతున్నది ప్రభుత్వ రాయితీలూ యింతకు ముందు కంటే పదిరెట్లు పెరిగాయి. ఇన్ని సానుకూల అంశాలు ఉన్నప్పుడు చిత్రసీమ కళకళలాడుతూ ఉండాలికదా… అలా వుండలేదు ఎందుకని?
దీనికి ప్రధానమయిన కారణం కేంద్రీకరణ, పెట్టుబడి, అవకాశాలు, మార్కెటీకరణ లాంటి అన్ని అంశాలలో కేంద్రీకరణ కేవలం నాలుగయిదు కుటుంబాలకే పరిమితం కావడంతో ఈ దుస్థితి ఏర్పడిరది. ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్య వార్త వినగానే ఏ రాజకీయాలూ తెలియని ఒక సినిమా ప్రేమికుడి ప్రతిస్పందన ‘‘తొక్కేశారు’’అని.
అక్కినేని కుటుంబం నుండి అయిదుగురు నటులు చిరంజీవి కుటుంబం నుండి ఐదుగురు నటులు, దగ్గుబాటి కుటుంబం నుండి ఇద్దరు నటులు, మంచు వంశం నుండి నలుగురు నటులు ఇవ్వాళ ఇండస్ట్రీలో ఉన్నారు. వీళ్ళ అధీనంలోనే రాష్ట్రంలో తొంభైశాతానికి పైగా ధియేటర్లు వున్నాయి, వీళ్ళ చేతుల్లోనే మీడియా వుంది. దర్శకులు, నిర్మాతలు కుటుంబాల వారీగా విడిపోయారు ఈ నటులు ఎవరిని చెపితే వారినే తీసుకునే స్థితిలో వున్నారు చిన్న సినిమాకు, చిన్న నటులకు అవకాశం ఎండమావి.
ఈ పెద్ద కుటుంబాలలోని హీరోలకి ఒక్క హిట్‌ వస్తే చాలు పది, పదిహేను మంది నిర్మాతలు క్యూ కడతారు. ఆ పదింటిలో మరొక్క హిట్‌ వస్తే మరొక పది, పదిహేను సినిమాలు చేతిలోకి వస్తాయి. ఈ హీరోల సినిమాలకి ఆయా సామాజిక వర్గాలకి చెందిన రాజకీయ పార్టీలు, యువజన సంఘాలు వెన్నుదన్నుగా నిలుస్తాయి. లక్షలు వెచ్చించి కాంప్లిమెంటరీ టిక్కెట్లు కొంటాయి మీడియా సినిమా వసూళ్లు ఇన్ని కోట్లు దాటాయి అన్ని కోట్లు దాటాయి అని ప్రచారంతో హోరెత్తిస్తుంది. ఇన్ని సౌకర్యాలు చిన్న సినిమాకు ఏవి? చిన్న సినిమాకు ధియేటర్లు దొరకటమే కష్టం, దొరికినా ‘‘సినిమా బావుంది’’ అనే మౌత్‌ పబ్లిసిటీ వ్యాపించే లోగానే ధియేటర్ల నుండి ఆ సినిమాను ఎత్తేస్తారు అందుకేనేమో చిన్న సినిమాల వైపుకి వెళ్లకుండా ఇద్దరు ముగ్గురు నిర్మాతలు కలసి ఒక పెద్ద హీరో సినిమాను ఇవ్వాళ తీస్తున్నారు. ఒక పెద్ద హీరో సినిమాకు ఇద్దరు ముగ్గురు సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. ఇక నిర్మాతలు, దర్శకులు అయితే తమ సృజనాత్మకతను అంతా ఆ పెద్ద హీరోల ప్రాపకం కోసం ఖర్చు పెడుతున్నారు. ఇటీవల ఒక ఆడియో ఫంక్షన్‌లో ఒక నిర్మాత ‘‘నాన్నా దేవుడు ఎలా వుంటాడు?’’ అని మా అబ్బాయి అడిగితే గదిలోకి తీసుకెళ్లి ఫలానా హీరో ఫోటో చూపించాను అని చెప్పడం ఈ కేంద్రీకరణకి పరాకాష్ట.
నాగార్జున మొదటి సినిమా ‘విక్రమ్‌’ నాగేశ్వరరావుగారి అబ్బాయి ఎలా చేశాడో అన్న ఉత్సుకతతో జనం చూశారు. తరువాత కెప్టెన్‌ నాగార్జున, అరణ్యకాండ, మజ్నూ వరకు వరుస ఫ్లాప్‌లు. బాలకృష్ణకి సుల్తాన్‌, కృష్ణబాబు, రాణా సమయంలో వరుస అపజయాలు. చిరంజీవి ఏకంగా సంవత్సరంపాటు ముఖానికి రంగేసుకోలేదు, ఫెయిల్యూర్‌కి భయపడి అయినా వాళ్లంతా ఎలా నిలదొక్కుకున్నారు వారి వెనుక బలమయిన డబ్బువుంది. దాన్ని మించిన అక్కినేని ఫ్యామిలీ, నందమూరి వంశం చిరంజీవి మెగాస్టారిజం అనే దుర్బేధ్యమయిన గోడలు వున్నాయి. ‘‘మనవాడు పడిపోకూడదు’’ అని కాపు కాసిన కుల సంఘాలు ఉన్నాయి.  ఉదయ్‌ కిరణ్‌ వెనుక యివేమీ లేవు.
ఇవ్వాళ ఉదయ్‌ కిరణ్‌ అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకున్నాడు ఇంతకు ముందే ఒక నిర్మాత ఒక భారీ సినిమా నిర్మించి విడుదల చెయ్యలేక హుస్సేన్‌ సాగర్‌ లో దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు మరో నిర్మాత బాగా నడుస్తున్న సినిమాను మరో పెద్ద హీరో సినిమా కోసం ధియేటర్‌ నుండి తీసివేస్తున్నారని ‘‘కూకట్‌ పల్లి’’ చౌరస్తాలో  ధర్నా చేసి పోలీస్‌ కేస్‌ పెట్టాడు.
ఇవన్నీ చదువుతుంటే మీకు ఏం అనిపిస్తోంది? కె.వి. రెడ్డి, బి.ఎన్‌. రెడ్డి తరంలో సినిమా ఒక కళ. అది ప్రజల ప్రయోజనాలని కలవరించింది, కాంక్షించింది.
బాపు, విశ్వనాధ్‌, దాసరినారాయణరావుల తరంలో ‘సినిమా’ కళాత్మక వ్యాపారం కళాత్మక విలువలు కాపాడుకుంటూనే వ్యాపార సూత్రాలను అందిపుచ్చుకుంది.
ఎస్‌.ఎస్‌ రాజమౌళి, వి.వి. వినాయక్‌ల తరంలో సినిమా కళకాదు, వ్యాపారమూ కాదు. డబ్బు తయారుచేసే యంత్రం. వ్యాపారంలో, యుద్ధంలో కొన్ని నైతిక సూత్రాలు, విలువలు వుంటాయి కానీ యంత్రానికి అదేమీ తెలియదు. మానవీయ స్పర్శ ఇప్పటి సినిమాకు లేదు.
విశ్వనాధ్‌ ప్రతి సినిమాకు ‘‘ఎస్‌’’ అనే అక్షరంతో మొదలయ్యే పేరు పెడతానో, మూడు అక్షరాల పేర్లు మహేష్‌ బాబుకి కలసి వస్తుందనో, వి.వి. వినాయక్‌ హీరోయిన్‌కి ‘నందిని’ అనే పేరు పెడితే హిట్‌ అవుతుందనో, కృష్ణవంశీ సినిమాలో హీరోయిన్‌ ఎప్పుడూ ‘‘మహాలక్ష్మీ’’ అనో సినిమా పరిశ్రమకి సెంటిమెంట్లు ఎక్కువ అని మనం అనుకుంటాం కానీ… సెంటిమెంట్‌ లేనిదే సినిమా పరిశ్రమలో!
సెంటిమెంట్‌ అంటే ఒక మానవీయ స్పర్శ. సెంటిమెంట్‌ అంటే భావోద్వేగాల కలబోత. సెంటిమెంట్‌ అంటే మనిషి పట్ల ప్రేమ, సెంటిమెంట్‌ అంటే మనిషిని సొంతం చేసుకునే గుణం ఇవేవీ ఇవ్వాళ ఇండష్ట్రీకి లేవు.
అందుకే ఉదయ్‌కిరణ్‌ గురించి నాలుగు మంచి మాటలు చెప్పిన సిన జీవుల ముఖాల మీద దు:ఖం సగం కరిగిన మేకప్‌ లాగా కనిపించింది.
ఇక రెండో చూపుడు వేలు సమాజం ఆంధ్రదేశంలో ఎన్నికలు ఏడో ఋతువు అన్నాడు నగ్నముని, ఎనిమిదో ఋతువు కూడా వుంది అది ఆత్మహత్య. ఉద్యమాల పేరుతో, వ్యవసాయ రంగం సంక్షోభం పేరుతో, మానసిక ఒత్తిడి పేరుతో ఈ పదిహేనేళ్ల కాలంలో ఆంధ్రదేశంలో ఆత్మహత్యలు చేసుకున్నవారి సంఖ్య కనీసంలో కనీసం యాభైవేలు పదిహేనేళ్ల కాలంలో ఆత్మహత్యల్లో ఆంధ్రదేశ పోగ్రెస్‌ రిపోర్ట్‌ యాభైవేలు.
ఇది ఏ రకంగా చూసినా ఆందోళన కలిగించే విషయమే నిర్భయ ఉదంతం జరిగినప్పుడు ఒక టి.వి ఛానల్‌ ఢల్లీిలో జరిగిన కొవ్వొత్తుల ప్రదర్శన ‘‘లైవ్‌’’ లో చూపించింది. విరామ సమయంలో అది చూపించిన ప్రకటన గుర్తుందా? ‘‘అమ్మాయిలను పడగొట్టడం ఎలా?’’ అనే విరాట్‌ కోహ్లి ప్రకటన నిర్భయకి నివాళులు అర్పిస్తూనే ఈ ప్రకటనను చూసి మనం ఆనందించాం అంటే మన చైతన్యస్థాయి ఏ రకంగా వుందో తెలుస్తూనే వుంది.
ఇలాంటి సమాజం ‘‘ఆత్మహత్యలు’’ లాంటి మానసిక సంక్షోభాలను ఎలా దాటుతుంది? ఒక ఆత్మహత్య జరిగినప్పుడు కవులు ఒక కవిత రాసి, ఒక కవిత్వ సంకలనం వేసి తమ బాధ్యత తీరిపోయింది అనుకుంటారు. సామాజిక అధ్యయన పరులు రెండురోజులు ఓపెన్‌ ఫోరంలలోనూ, బిగ్‌ డిబేట్లలోనూ చర్చోపచర్చలు చేసి తమ పని అయిపోయింది అనుకుంటారు. ఎవరికి వారు తమ తమ లోకంలోకి జారుకుంటారు ఒక సమగ్రమయిన కార్యచరణ తీసుకుని ముందుకి కదలరు ఎందుకని? ఇవ్వాళ ప్రతి మనిషీ ఒక ఒంటరి ద్వీపం భౌతికంగా అతడు సమాజంలో నివశిస్తున్నాడు తప్పిస్తే దానితో అతనికేమీ సంబంధం లేదు అతడొక ఒంటరి ద్వీపం అతడొక రహస్యగాయం అతడు ఏ పరమార్ధాన్ని కౌగిలించుకోలేని నిలువెత్తు స్వార్ధం. అతడొక కాగితం పువ్వు.
అందుకే ఈ సమాజంలో ఆత్మహత్యలు అనేవి ‘‘ఎనిమిదో’’ ఋతువు అనేది.
ఇక మూడవ చూపుడు వేలు ప్రేమరాహిత్యం. ఉదయ్‌కిరణ్‌ మృతశరీరాన్ని తీసుకోవడానికి తండ్రి నిరాకరించాడన్న వార్త కలచివేసింది తండ్రి వంద తప్పులు చేసి వుండ వచ్చు కొడుకూ వంద తప్పులు చేసి వుండవచ్చు ఆ తప్పులు తండ్రులవీ, కొడుకులవీ తప్పిస్తే తండ్రీకొడుకుల బంధానిది కాదుకదా!
‘‘అంగా దంగాత్సంభవతి నిజస్నేహజో దేహసౌర:
ప్రాదుర్భూయ స్థితి ఇవ బహిశ్చేతనా ధాతురేక:
సాంద్రానంద క్షుభిత హృదయ ప్రస్రవేణావస్తికం
గాఢాశ్లేషస్సహిమమ హిమశ్చ్యోత మాశంసతవ’’
అంటాడు ఉత్తరరామ చరిత్రలో భవభూతి. పుత్రుడి శరీరం తండ్రి ప్రతి అంగం నుండి ఉదయిస్తుందట అంటే తనే మరోసారి పుడతాడన్న మాట. అలాంటి పుత్రుడు విగతజీవిగా పడివున్నప్పుడు తండ్రి నిరాకరించాడంటే  ఆ బంధం ప్రేమాన్వితం అనాలా? ప్రేమరాహిత్యం అనాలా? ఈ ప్రేమరాహిత్య మూలం కూడా సామాజిక మూలంలోనే దాగి వుంది.

భార్య అంటే భర్తకి ప్రేమ వుండదు. భర్త అంటే భార్యకు ప్రేమ వుండదు తల్లి దండ్రులు పిల్లలని తమ కోరికలకి ప్రతిరూపం కావాలని అనుకుంటారు. కానీ వాళ్లకీ ఒక లోకం ఉందని గ్రహించరు మనుషుల మధ్య మిగిలీ మిగలని మానవ సంబంధాలని కలిపి విడదీస్తున్న ఊహా మేఘం డబ్బు. డబ్బులేని చోట ప్రేమ వుంటుందా? డబ్బుకొద్దీ ప్రేమ అని బాలచందర్‌ ఊరికే అన్నాడా…? ఇటీవలి సినీ నటి అంజలి ఎపిసోడ్‌ గుర్తుందా?

ఇక చివరి చూపుడు వేలు ఉదయ్‌ కిరణ్‌  చివరగా చెపుతున్నా మొదట చెప్పవలసింది ఉదయ్‌ కిరణ్‌ గురించి…!
అవును ఉదయ్‌ కిరణ్‌ హత్యకి అతడే కారణం మన పక్కంటి పిల్లాడిలాగా కనిపించే ఉదయ్‌ కిరణ్‌ మన పక్కింటి పిల్లాడి  లాగానే ఒత్తిడి తట్టుకోలేకపోయాడా? 2000 నుండి 2013 వరకు సినిమా రంగంలో వున్నాడు కదా…! ఆ మాయాజలతారు మృదుచేలాంచలములకొసగాలుల విసురు పట్టుకోలేక పోయాడా? ఆ పాకుడు రాళ్లమీద కాలు బలంగా నిలపలేక పోయాడా?

ఒక రంగంలో వైఫల్యం ఎదురయినప్పుడు మరోరంగాన్ని ఎంచుకోవాలనే ప్రాప్త కాలజ్ఞత ఎందుకు లోపించింది? జీవితాన్ని సున్నా నుండి ప్రారంభించి గెలవగలిగే ఆత్మస్థైర్యాన్ని ఎందుకు కోల్పోయాడు. జీవితాన్ని ఒంటరిగా గెలవాలనే విషయాన్ని ఎందుకు మర్చిపోయాడు తను పోషించిన పాత్రలను తనెందుకు మనసులోకి తీసుకోలేక పోయాడు? శిఖరం మీద ఎవరూ ఎల్లకాలం ఉండరనే విషయం త్వరగానే గ్రహింపుకి వచ్చివుండాలి కదా..

ఒక విజయం ఆత్మవిశ్వాస స్థాయిని పెంచుతుంది. ఒక అపజయం ఆత్మవిశ్వాస స్థాయిని పడవేస్తుంది నిజమే! ప్రాణం పోసే శక్తి మనకు లేనప్పుడు ప్రాణం తీసుకునే హక్కు మనకు ఉందా అనేదే అసలు ప్రశ్న…బ్రతకడానికి వందకారణాలు అవసరం లేదు ఒక్క కారణం చాలు ఎందుకంటే జీవితం ఒక్కటే కనుక. మరణానికే వంద కారణాలు కావాలి.

ఏదయితేనేం హృదయ కమలం వాడిపోయింది. ఉదయ్‌కిరణ్‌ ఇక లేడు. అతడి పందొమ్మిది సినిమాలు అతడి మరణాంతరం కూడా జీవిస్తాయి.
అతడి మరణం నుండి అయినా చిత్రసీమ పాఠం నేర్చుకుంటుందా? దాసరి నారాయణరావు, తమ్మారెడ్డి భరద్వాజ లాంటి పెద్దలు సీరియస్‌గా ఆలోచిస్తారా…. సగటు సినీ ప్రేమికుడిగా అడుగుతున్న ప్రశ్నలకు స్పందిస్తారా…. లేక ఇది ఒక కామా మాత్రమేనా…..?

 – వంశీ కృష్ణ

భద్రలోకపు అడ్డుగోడలు కూల్చేసిన గొరుసు!

ఒక కొత్త కథను చదవడమంటే, ఒక కొత్త వ్యక్తితో పరిచయం చేసుకోవడమే అంటారు కొడవటిగంటి కుటుంబరావుగారు ఒకచోట. ఒక మనిషిని చూసీ చూడగానే మనకంటూ ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. అది సానుకూలమయినా కావచ్చు, ప్రతికూలమయినా కావచ్చు. కానీ ఆ మనిషిలో మన పరిచయం పెరుగుతున్న కొద్దీ అతని పట్ల మన అభిప్రాయాలు మారడమో, మరింత బలపడటమో జరుగుతుంది. నిజానికి ఒక మనిషిని అర్థం చేసుకోవడం అనేది ఒక లిప్తలో పూర్తయ్యే క్రియ కాదు. అది జీవితకాలం కొనసాగవలసిన ప్రక్రియ.

ఇలాంటి జీవిత కాలపు ప్రయత్నం కొన్ని కథల విషయంలో కూడా కొనసాగాలి. ఎందుకంటే ఆ కథలు చదివిన ప్రతిసారీ కొత్త అర్థాన్ని ఇస్తాయి. కొత్త కొత్త విషయాలను అవగతం చేస్తాయి. బాహ్య అంతర్లోకాల రహస్యాలను కొత్తకొత్తగా విప్పుతాయి. అందుకే అలాంటి కథలను మళ్లీ మళ్లీ చదవాలి.

ఈ సంవత్సర కాలంలో నేను మళ్లీ మళ్లీ చదివిన కథలు మూడు. ఒకటి దేవరకొండ బాలగంగాధర తిలక్‌ ‘నల్లజర్ల రోడ్డు’, రెండు తల్లావజ్ఝల ‘వడ్ల చిలకలు’, మూడు గొరుసు జగదీశ్వర రెడ్డి ‘చీడ’. ఈ మూడు కథలకి రూపంలో, సారంలో, శైలిలో, శిల్పంలో ఎలాంటి సారూప్యములూ లేవు. వేటికవే ప్రత్యేకమయినవి.

gajaeetaraalu

‘వలసపక్షులు’ కథతో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్న కథకుడు గొరుసు జగదీశ్వర రెడ్డి. అతడి పాత కథల సంపుటి ‘గజ ఈతరాలు’ కొత్తగా చదవడం ఒక తాజా అనుభవం. ఆంధ్రదేశానికి ఆ మూలన ఉన్న విశాఖపట్నం, ఈ మూలన ఉన్న మహబూబ్‌నగర్‌, ఒక ఆంధ్ర, ఒక తెలంగాణ ప్రాంత జీవితంలోని చీకటి కోణాలని, ఆ చీకటి కోణాలు ఏర్పడటానికి ఉన్న సామాజిక ఆర్థిక కారణాలను, వాటి కార్యకారణ సంబంధాలను, సునిశిత దృష్టితో, సున్నితంగా వెలికి తీసిన కథా సంపుటి ఇది.

”జీవితం కొందరి పట్ల పరమ దయా పూరితంగా ఉంటుంది. మరికొందరి పట్ల కర్కశంగా ఉంటుంది. దాని ఆగ్రహమూ, అనుగ్రహమూ అకారణమే” అంటారు బుచ్చిబాబు ఒకచోట. ”వలస పక్షులు’ కథ చదువుతున్నంతసేపూ నాకు ఎందుకో కానీ ఈ మాటలు పదే పదే గుర్తుకు వచ్చాయి. ఈ కథలో విశాఖ మాండలికాన్ని, మహబూబ్‌నగర్‌ పలుకుబడిని ప్రతిభావంతంగా ఉపయోగించాడు జగదీశ్వరరెడ్డి.

‘విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు’ అన్న రాజకీయ నినాదం కొంతమందికి రాజకీయంగా పునర్జన్మ. మరికొంతమందికి అందలాలను ప్రసాదించింది. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంలో ప్రాణాలు కోల్పోయిన కొన్ని గ్రామాలు, అంతకు రెట్టింపు ప్రాణాలు ఇవాళ చరిత్రలో ఎక్కడా కానరావు. వాళ్ల పట్ల చూపించవలసిన కనీస గౌరవం కూడా సమాజం చూపదు. కాంట్రాక్టర్ల దోపిడీకి, దౌర్జన్యానికి బలైపోయిన రాములమ్మ కొడుకు. మరొక పేద తల్లి సహాయంతో పెరిగి పెద్దవాడై, అదే స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగం సంపాదించుకుంటాడు. ముప్పై ఏళ్ల క్రితం కాంట్రాక్టర్ల రూపంలో మొదలైన దోపిడే, ఔట్‌సోర్సింగ్‌ రూపంలో మళ్లీ కొత్తగా ఎలా రూపు మార్చుకున్నదో తెలిశాక, తన గత జీవితాన్ని సకారణంగా పునశ్చరణ చేసుకోవడం ఇందులో ఇతివృత్తం.

డబ్బుకి ఉన్న విలువకి తప్పిస్తే మరే విలువకీ కట్టుబడని ఆధునిక సమాజపు నగ్న స్వరూపాన్ని ఉత్తమ పురుషలో చెప్పిన కథ మనలను మంత్రముగ్థులని చేస్తుంది. రాములమ్మ మాటలు చదువుతున్నప్పుడు ఎంత నిరాశ నిస్పృహ కలుగుతాయో, ముత్యాలమ్మ మాటలు వింటుంటే జీవితం పట్ల అంత ప్రేమ, భరోసా కలుగుతాయి. జీవిత రథపు చక్రాల కింద పడి తనువు చాలించినది ఒకరయితే, దాన్ని సుదర్శన చక్రంలా వినియోగించుకుని కష్టాలను కడతేర్చినవారు మరొకరు. నిజానికి ఈ రెండు కేవలం పాత్రలు మాత్రమే కాదు, మనిషి మనసులో గారడి చేసే రెండు మార్మిక శక్తులు. ఒక దుఃఖం, ఒక సుఖం. ఈ రెండింటి మధ్యా దోబూచులాడటమే జీవితం అని ఈ కథ చెపుతుంది.

16(1)

అమెరికా సబ్‌ప్రైమ్‌ సంక్షోభానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయినట్లుగానే, ఎక్కడో ఒక చిన్న దురాశ, దురూహ, ఏ మాత్రం సంబంధం లేని ఎందరి జీవితాలనో దుర్మరణం పాలు చెయ్యడం ఒక వైచిత్రి. సునామీ వచ్చి వెళ్లాక కన్పించే విధ్వంసక దృశ్యాలు సునామీ వచ్చిందని బాధితులకు తెలియచెప్పినట్లుగానే, జీవితాలు సమూలంగా మారిపోయాక, జీవ విషం చేదు ఫలం అని అర్థం కావడమూ అంత విషాదం.

ఈ సంపుటిలో ‘చీడ’ కథ చదివాక గుండె బరువెక్కుతుంది. ఆల్విన్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవితం ఒక ‘సంతోష చంద్రశాల’ అనుకుంటూ భద్ర జీవనం గడిపే ఒక కుటుంబం, ఆ ఆర్థిక ఆసరా తమ ప్రమేయం లేకుండా చెయ్యిజారి పోతుందో, ఎలాంటి ఉత్పాతానికి గురి అవుతుందో సున్నితంగా చెప్పిన కథ ఇది.

ఉద్యోగం కోల్పోయి హఠాత్తుగా వీధిలో పడిన తరువాత కట్టవలసిన అప్పులు, నెరవేర్చవలసిన బాధ్యతలు కొండలా భయపెడుతుంటే, మామూలుగా స్థిర చిత్తులు అనుకునే పెద్ద పెద్ద వాళ్ళే సంయమనం కోల్పోయి జీవితాన్ని దుఃఖభాజనం చేసుకుంటుంటే, పసిపిల్లల సంగతి చెప్పేదేముంది?

మనుషుల మధ్యన ప్రేమ డబ్బుకొద్దీ పరిపుష్టమవుతుందా? మనుషుల మధ్యన సంబంధాలను కలుపుతూ, విడదీసి, విడదీస్తూ కలిపే ఊహా మేఘం ‘డబ్బు’ పాత్రను జీవితాలలో శూన్య స్థాయిని తీసుకుని రాలేమా? డబ్బు లేకపోతే మనుషుల మధ్య ప్రేమ మరీ అంత బలహీనంగా ఉండాలా? లాంటి ప్రశ్నలు ‘చీడ’ కథ చదువుతుంటే కలుగుతాయి.

ఈ కథలో అరవింద్‌, సుజాత ఇద్దరూ చదువుకున్న వారే! జీవన గమనం పట్ల అవగాహన ఉన్నవారే. వారే జీవితంలో వచ్చిన పెనుమార్పుకు తల్లడిల్లి చిగురుటాకుల్లా కంపించి పోతే, చిన్న పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుంది.

ఉద్యోగం ఉన్నప్పుడు అప్పుచేసి మరీ కట్టుకున్న ఇల్లు – పడకగది కిటికీని అల్లుకున్న ‘రేరాణి’, కాంపౌండ్‌ ముందున్న సంపెంగను ప్రధాన పాత్రలుగా చేసి చిట్టితల్లి అంతరంగ ఆవిష్కరణను, లలిత లలితంగా చేసిన కథ, చివరలో చిట్టితల్లి కోరికను తెలుసుకుని పాఠకుడు కళ్ల నీళ్ల పర్యంతం అవుతాడు.

ప్రపంచీకరణ విధానాలనే లిక్విడ్‌ పెట్రోలియం గ్యాస్‌ విధానాలని ప్రపంచీకరణ విధ్వంసం గురించి తెలిసిన వాళ్లు ముద్దుగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ప్రపంచీకరణకు మకర ముఖమే కానీ, మానవీయ ముఖం లేదని, లాటిన్‌ అమెరికా, అర్జెంటీనా అనుభవాలు చెప్పకనే చెపుతున్నాయి. అయినా వాటిపట్ల మక్కువ పెంచుకున్న రాజకీయ ఆర్థిక అధికారులకు, చిట్టితల్లి జీవితంలో ఎదురయిన సంక్షోభం గురించి ఎప్పటికయినా అర్థం అవుతుందా?

తల్లిదండ్రుల మధ్య సరైన సంబంధాలు లేకపోతే పిల్లలు ప్రేమరాహిత్యానికి గురి అవుతారు. ప్రేమరాహిత్యంలో పెరిగిన పిల్లలు ఎలాంటి భవిష్యత్‌ సమాజానికి సృష్టికర్తలు అవుతారు? ఈ ప్రశ్నను బలంగా వినిపించిన కథ ‘చీడ’.

పిల్లల ప్రపంచంలో లేనిదేమిటో ఎవరికయినా తెలుసా? కోపం, ద్వేషం, అసూయ. మరి పిల్లల ప్రపంచాన్ని వెలిగించేదేమిటి? ప్రేమ. పిల్లల లోకంలో కేవలం ప్రేమ మాత్రమే ఉంటుంది. మనం పిల్లలకి ఎంత ప్రేమను యిస్తే వాళ్లు మనకు రెట్టింపు ప్రేమను యిస్తారు. ఒక మనిషిని ద్వేషించడానికి సవాలక్ష కారణాలు ఉండవచ్చు. అందులో పట్టుదల అనే రీజన్‌ కూడా ఉండవచ్చు కానీ ప్రేమించలేకపోవడానికి ఏ కారణమూ ఉండదు. జీవితంలో అసలయిన విషాదం ప్రేమించలేకపోవడమే.

ఈ విషయాన్ని బలంగా చెపుతుంది ‘వాచ్‌మాన్‌’ కథ? ‘గూర్ఖా’ పేరుతో ఎండ్లూరి సుధాకర్‌ ఒక మంచి కవిత రాశారు. అది ఎంతో మంది ప్రశంసలు పొందింది. ఆ తరువాత ఆ స్థాయిలో అనుభూతిని యిచ్చిన కథ ‘వాచ్‌మాన్‌.’ తమ అపార్ట్‌మెంట్‌కు అనునిత్యం కాపలా కాస్తూ, తమకు తలలో నాలుకలా ఉంటూ, తమ పనులన్నీ ప్రతిఫలాపేక్ష లేకుండా చేసిపెట్టే వాచ్‌మాన్‌ అకస్మాత్తుగా చనిపోతే, అతని చివరి  సంస్కారం గురించి కులం, మతం, సంప్రదాయం అంటూ సాకులు వెతికిన పెద్దల చిన్న బుద్ధులను, వాళ్ల పిల్లలే అసహ్యించుకుని, తమ స్వచ్ఛ సుందర శుభ్రస్ఫటికం లాంటి మనసులకు మాలిన్యం అంటదని చెప్పిన కథే యిది.

పుత్రుడి గురించి చెప్పేటప్పుడు మన వేదాలు ‘అంగా అంగాత్‌ సంభ వసి’ అని ‘ఆత్మా వై పుత్ర నామాసి’ అని వ్యాఖ్యానించాయి. తల్లిదండ్రుల ప్రతి అంగంలో నుండి పిల్లల అవయవాలు రూపుదిద్దుకుంటాయని భావం. అలాంటప్పుడు పిల్లల మీద తల్లిదండ్రులకు ఉండే ప్రేమను ఏ ప్రేమమాపకంతో కొలవగలం. లోకంలో చెడ్డ కొడుకులు, చెడ్డ భర్తలు ఉండవచ్చు కానీ, చెడ్డ తల్లి మాత్రం ఉండదని అంటారు. ఈ మాటలకి, ప్రత్యక్ష ప్రతీకలుగా రెండు కథలు నిలుస్తాయి.

Gorusu(1)

ఒకటి ‘వాల్తేరత్త’, రెండు ‘గజ ఈతరాలు’.

చెడు వ్యసనాలకి బానిసయిన భర్తతో లాభం లేదనుకొని కొడుకు ఉన్నత భవిష్యత్తు కోసం తనకు తెలిసిన వడ్డీల వ్యాపారం చేస్తూ జీవితాన్ని కరిగించుకున్న వరాలమ్మ, కొడుకుకి సర్కారీ నౌకరు రావాలని జీవితాంతం కష్టపడి, ఆ ఉద్యోగం సంపాదించాక, తదనంతర పరిణామాల నేపథ్యంలో కొడుకుకి భారం కాకూడదనుకున్న పూర్ణమ్మ, రెండు ప్రత్యేక పౌనః పున్యాలలో తల్లి ప్రేమను విశదీకరిస్తారు.

”నానెంత వడ్డీ యాపారం సేసినా నానూ మడిసి జలమే ఎత్తాను. ఆడపుట్టకే పుట్టి పాలిచ్చే పెంచాను. నా పేగు తీపి వొవులికి అరదమవుతాది బాబూ! నా సిమ్మాసెలం ఒచ్చేత్తాడొచ్చేత్తాడని నా మనసంతాది బాబూ! ఆడెక్కడున్నాడో కానీ… ఆడి పేగోసన అప్పుడప్పుడూ నా ముక్కుకి తగలతాది బాబూ” అంటుంది వాల్తేరత్తలో వరాలమ్మ.

సింహాచలం ఆమెను దగా చేసి వెళ్లిపోయాడు. అయినా వాడెప్పుడో వస్తాడని ఆమె ఎదురుచూపు, పేగు కదలిన చప్పుడు వినడం ఏ చర్మ చక్షువుకు సాధ్యపడుతుంది.

కొడుకు పెద్దవాడయ్యాడు. తన రెక్కల కష్టం కొడుకు గవర్నమెంటు ఉద్యోగస్తుడు కావాలన్న తన కోరికను తీర్చింది. చివరి క్షణాలు కొడుకు దగ్గర ఆనందంగా గడుస్తున్నాయి కూడా. కానీ పులిమీద పుట్రలాగా కంపెనీ మూతపడింది. నూతన ఆర్థిక విధానాల ఫలితంగా పనిచేసే కంపెనీ ప్రయివేట్‌ పరం అయింది. లిబరలైజేషన్‌, ప్రవేటైజేషన్‌, గ్లోబలైజేషన్‌ కాస్తా లిక్విడ్‌ పెట్రోలియం గ్యాస్‌గా మారి కొడుకు జీవితాన్ని బుగ్గిపాలు చేశాయి. దానికితోడు తనకు వచ్చిన జబ్బుకి కావలసిన మందులు కొడుకుకు అదనపు భారం కాకూడదు అనుకున్నది.

”ఊర్లందరికీ ఈత నేర్పి, ఈదరాకుండా రెండు కాళ్లకు బండరాళ్లను కట్టుకున్నది…. బలిమిసావు సచ్చె కొడుకా…” ఈద గలిగి ఉండీ బలవంతంగా ప్రాణం తీసుకోవడం వెనక ఉన్న విషాదం ఏ ప్రపంచ బ్యాంకు ప్రాయోజిత ప్రపంచీకరణ కథ సారథులకు అందుతుంది?

వాల్లేరత్తలో వరాలమ్మ, గజ ఈతరాలులో పూర్ణమ్మ. వీళ్ళిద్దరి ప్రేమ ఏ నిర్వచనానికి అందుతుంది? తమ కొడుకులు సుఖంగా ఉంటే తాము సుఖంగా ఉన్నట్లే అన్న వాళ్ల తాత్వికత, అందుకోసం తమ జీవితాలని త్యాగం చెయ్యడం ‘అంగారంగాత్‌ సంభ వైసి’ అన్న వాక్యానికి నిలువెత్తు దర్పణంలాగా లేదూ? ‘ఆత్మా వై పుత్ర నామసి’ అంటే ఇదే కదా!

ఇలా ఈ సంపుటిలోని ప్రతి కథ గురించీ వివరంగా రాయొచ్చు. మొత్తంగా ఈ కథలు-

1. ప్రపంచీకరణ మధ్య తరగతి జీవితాలలో సృష్టించిన విధ్వంసాన్ని దృశ్యమానం చేస్తాయి. డబ్బు లేనప్పుడు కూడా మనుషుల మధ్య ప్రేమానుబంధాలు ఉంటాయి కానీ… అవి గుర్తించలేనంత బలహీనంగా ఉంటాయి అన్న విషయాన్ని తేటతెల్లం చేస్తాయి.

2. జీవితం ఏ నిర్వచనాలకీ లొంగదని, నాటకీయత లేదా ఐరనీ దాన్ని ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉంటాయని చెప్పకనే చెపుతాయి.

3. అపార్ట్‌మెంట్‌ పిల్లల రూపంలో జీవితం పట్ల ప్రేమనీ, బ్రతుకు భవిష్యత్తు పట్ల నమ్మకాన్ని కలిగిస్తాయి.

4. సున్నితత్వం లోపల ఉంటే గోరంత వెలుగే కొండంత దీపమై దారి చూపిస్తుందని అనుభవంలోకి తెస్తాయి. ఒక సందిగ్ధ కాలంలో రాష్ట్రంలోని రెండు విభిన్న ప్రాంతాల, ప్రజల అంతరంగ కల్లోలాన్ని సున్నితంగా స్థానిక స్పహతో అక్షరబద్ధం చేసిన కథలు ఇవి.

  – వంశీకృష్ణ

———————————————————————————————–

చీడ

-గొరుసు జగదీశ్వర్ రెడ్డి

 

 

నా పేరు సంపంగి. ఎనిమిదేళ్ళ క్రితం సింహాచలం నుండి తీసుకొచ్చి ఇక్కడ నాటారు. అడుగు ఎత్తులో మొక్కగా ఉండేదాన్ని. పదహారడుగుల మానుగా పెరిగాను. ఇప్పుడు నా పూలని కోయాలంటే వంకీ కత్తి కట్టిన పెద్ద వెదురు బొంగు అవసరం మీకు. అదే నా చిట్టి తల్లి వచ్చి, నా కింద నిల్చుని దోసిలి పట్టిందంటే జలజలమని పూలవర్షం కురిపిస్తాను. ఎందుకంటే చిట్టితల్లి మాకందరికీ ప్రాణం.

నేను వచ్చిన కొత్తలో ఈ తోటంతా పచ్చగా కలకలలాడేది. నాతోపాటు ఎన్నోరకాల పూలమొక్కలు, పండ్ల చెట్లు ఉండేవి.

ఇంటి ముందు నుండి ఎవరు వెళ్ళినా, మా సౌరభాలకు మత్తెక్కినట్లు ఒక నిముషంపాటు నిల్చొని శ్వాస ఎగబీల్చి వెళ్ళేవారు. విషాదమేమంటే అలా ఆస్వాదించిన వాళ్ళే రెండేళ్ళుగా ఏదో కాలిన వాసన వేస్తున్నట్లు ముక్కుకు అడ్డుగా చేతిరుమాలు పెట్టుకొని గబగబ వెళ్ళిపోతున్నారు.

ఇప్పుడు నన్నల్లుకున్న మాధవీలత, కిటికీ దగ్గరున్న రేరాణి, నా మొదలు దగ్గరున్న డిసెంబరం పొద, రెండు మూడు రకాల తెగులుపట్టిన పండ్ల చెట్లు తప్పించి… తోటంతా బోసిపోయింది.

*

గాలికి అటూ, ఇటూ ఊగుతున్న నేను గేటు చప్పుడుకి అటుకేసి చూసేను. లోపల్నుండి వేసిన గడియని అందుకోవాలని మునివేళ్ళపై నిల్చుని తీసే ప్రయత్నంలో ఉంది చిట్టితల్లి.

భుజాలపై వేలాడే పది కేజీల పైనే బరువున్న పుస్తకాల సంచీని, చేతిలోని కేరేజ్‌ బుట్టనీ దభీమని వరండా అరుగుపైన విసిరేసింది.

ఇంటికి తాళం వేసి ఉంది. అక్కడే పడున్న షూ జతల్లో తాళం చెవికోసం వెతికింది. దొరికినట్టు లేదు. గబగబ గేటుదాకా వచ్చి అన్నయ్య కోసం కాబోలు అటూ, ఇటూ చూసింది. వాడి అలికిడి ఎక్కడా ఉన్నట్లు లేదు.

విసురుగా వెనక్కి వచ్చి వరండా మెట్లపైన కూర్చొని, మోకాళ్ళ మధ్యకి తలను వాల్చేసి ఉబికి వచ్చే దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కివెక్కి ఏడ్వడం మొదలుపెట్టింది.

అరగంట ముందే వచ్చిన శ్రావణ్‌ స్కూల్‌ బేగ్‌ని ఇంట్లో పడేసి, బేట్‌ పట్టుకొని క్రికెట్‌ ఆటకోసం పరిగెట్టడం చూసేను. ఇంటికి ఎవరు తాళం వేసినా చెవిని తలుపు పక్కనున్న చెప్పుల అరలోని ఏదో ఒక షూలో రహస్యంగా దాచి వెళ్ళడం అలవాటు.

చిట్టితల్లి కన్నా శ్రావణ్‌ మూడుళ్ళు పెద్ద.

చిట్టితల్లి ఆరున్నొక్కరాగానికి నా గుండె కరిగిపోతోంది.

ఎంత మారిపోయిందీ పిల్ల! స్కూలు నుండి రావడంతోనే మమ్మల్ని పలకరించి, ముద్దాడి కబుర్లు చెప్పిగానీ వరండా మెట్లెక్కేది కాదు. అలాంటిది, మా ఉనికే తెలీనట్లు ప్రవర్తిస్తోంది. ఎప్పుడూ గలగల మాట్లాడ్తూ, కిలకిల నవ్వుతూ గెంతులేసే మా చిట్టితల్లేనా! ఏదో గాలిసోకినట్లు రోజురోజుకీ ఎలా క్షీణించిపోతోందీ…

నే వచ్చేసరికి చిట్టితల్లి మూడేళ్ళ పిల్ల. తేనె కళ్ళు, గులాబీ బుగ్గలు, బీరపువ్వులా పసుపు ఛాయతో బొద్దుగా ఉండి, గునగున నడిచేది.

ఇప్పుడు చిట్టితల్లికి పదో ఏడు.

ఛాయ తగ్గి, సన్నబడి, ఒంటరితనంతో దిగులుగా ఉంటోంది.

ఆ ఏడుపు నాకు రంపపుకోతలా ఉంది. నా తల్లిని పట్టించుకునే వాళ్ళేరీ? ఏం చేయాలో పాలుపోవడం లేదు.

”అయ్యో, అలా ఏడవకమ్మా, నా బంగారుతల్లివి కదూ, ఇలారా, నే తొడిగిన మొగ్గలు చూడు. రేపు పూస్తాగా, నే పూచేది నీ కోసమేరా…”   బతిమాలుతూ పిలవాలని పించింది.

ఎదురింటావిడ వచ్చి పిల్చింది. అన్నయ్య వచ్చేదాకా వాళ్ళింట్లోనే ఉండమంది.

”ఆకలేస్తోంది మమ్మీ, డాడీ రాత్రి ఎప్పుడొస్తారో తెలీదు. అన్నయ్య ‘కీ’ తీసుకెళ్ళాడు. బోల్డంత హోంవర్క్‌ చేసుకోవాలి” ఆమె మాటకి వెక్కిళ్ళ మధ్యే ఆగి ఆగి సమాధానం ఇస్తోంది.

మెల్లగా తన కాళ్ళకున్న షూ విప్పి, ఆపైన మేజోళ్ళు తీసి వాటిలోనే ఉంచి పక్కకు గిరాటేసింది.

కళ్ళు తుడుచుకుంటూ లేచి నిల్చుంది.

మళ్ళీ ఒకసారి గేటువైపు నడిచింది. కాస్సేపు అక్కడే ఉండి, వీధిలో ఆడుకుంటున్న పిల్లల్ని చూసి, ఆ తర్వాత నా దగ్గరగా వచ్చి నిల్చుంది.

”నన్ను మర్చిపోయావు కదూ” నా మాట అర్థమయినట్టు జవాబుగా తన రెండు చేతుల్తో నన్ను చుడ్తూ తన గుండెలకేసి హత్తుకుంది. ఆ స్పర్శకు ఒళ్ళంతా పులకరించింది. ఒక్కసారిగా ఏడ్చేశాను. ఇద్దరం ఆత్మీయంగా గొప్ప అనుభూతితో చాలాసేపు మౌనంగా ఉన్నాం. ముందుగా నేనే తెప్పరిల్లి-

”చూడు నా తోటి మొక్కలన్నీ ఎలా ఎండిపోతున్నాయో! చిగుళ్ళు ఎలా వాడిపోతున్నాయో! మా గురించి ఎవరూ పట్టించుకోరు. చివరకు నీవు కూడానూ, నీ చేతుల్తో నీళ్ళు పోసి ఎంత కాలమయిందీ, నేనింకా ఎవరికోసం బతుకుతున్నానో తెలీదూ? చేమంతులూ, విరజాజీ, పారిజాతం.. వాటిలాగే చివరకు నేనూ నీకు దూరం అవుతాను. అదిగో మీ కిటికీ దగ్గరున్న రేరాణి ఎలా కొన ఊపిరితో ఉందో!  నీవు స్కూల్లో నుండి రాగానే నీకు పండ్లను అందించే జామకు తెగులుపట్టి ఎన్నాళ్ళయ్యిందో…” నా ఆత్మఘోషను నా చిట్టితల్లికి ఎలా చెప్పను?

చిట్టితల్లి వంక పరిశీలనగా చూసేను. కళ్ళల్లో తెలియని భయం, ఎండుతున్న పెదాలు దుమ్ము కొట్టుకుపోయిన బట్టలు, మొద్దుబారుతున్న శరీరం.

”చర్మం చూడు, ఎలా పగిలిపోయి ఉందో, వెన్న రాయమని మమ్మీతో చెప్పమ్మా” నా మనసు చదివినట్టు పగిలిన చర్మంకేసి దిగులుగా చూసుకుంది.

తన ఆరోగ్యం గురించి పట్టించుకునే వాళ్ళేరీ!

మెల్లగా నిల్చొని, మళ్ళీ వరండా మెట్లపైన కూర్చోడానికి వెళ్ళింది.

చూస్తుండగానే ఆవలిస్తూ, అలాగే వెనక్కి వాలి ఒరిగి కళ్ళు మూసుకుని పడుకొంది. ధనుర్మాసపు చలికి వణుకుతున్నట్లు ముడుచుకుపోతోంది చిట్టితల్లి. చెల్లాచెదురైన చెప్పులు, బాగ్‌లోంచి వీడిన పుస్తకాలు, కేరేజీ ఎంగిలి గిన్నెలు – మధ్యలో నా చిన్నారి, అయ్యయ్యో! దోమలు స్వైరవిహారం చేస్తూ, రక్తం పీల్చేస్తున్నాయి కదా… దోమల్ని పారదోలమని గాలిని బతిమాలుకున్నాను.

శ్రావణ్‌ త్వరగా వస్తే బావుణ్ణు.

రాత్రి అయినట్లు తెలుస్తోంది. వీధిలోని ట్యూబ్‌లైట్‌ కాంతి ఇంటి గోడపైన పడుతోంది. ఆడుకొంటోన్న పిల్లల్ని ‘ఇక ఆటలు చాలించి, చదివి చావండి’ అంటూ తల్లుల గర్జనలు విన్పిస్తున్నాయి. అడపాదడపా ఏవో వాహనాలు వెళ్తున్న శబ్దం.

తూర్పున చంద్రోదయం అయినట్లు నాకు కొద్దిదూరంలో ఉన్న మామిడి చెట్టు ఆకుల్లోంచి వెన్నెల చిట్టితల్లి మొహంపైన ఊగుతోంది.

ఎంత సందడిగా ఉండే ఇల్లు… ఎట్లా మారిపోయింది!

మళ్ళీ ఆ రోజులు వస్తాయా?

*

నేను ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు… అంతా కొత్తగా, దిగులుగా ఉండేది. కానీ మేము పూచే పూలలాంటి చిట్టితల్లి ఈ ఇంట్లో ఉందని తెలిసి సంతోషం వేసింది. నాతోపాటే గులాబీ, పారిజాతం వచ్చాయి.

మేం వచ్చేసరికి మామిడి, జామ, సపోట, దానిమ్మ ఆరునెలల వయసువి, తొలకరిలో వచ్చాం. తీరా కార్తీకానికి మల్లి, చేమంతి, రేరాణి, నూరు వరహాలు వచ్చాయి.

అరవింద్‌, సుజాత ఇద్దరూ గునపంతో గుంతలు తవ్వడం, మమ్మల్ని నాటడం, శ్రావణ్‌, చిట్టితల్లి బకెట్లతో నీళ్ళు తెచ్చి, చిట్టిచిట్టి చేతులతో మాకు పోయడం… ఎంత సుకుమారంగా పెంచారనీ మమ్మల్ని.

మా గురించి అందరూ శ్రద్ద తీసుకునేవాళ్ళే. మేం పూచే పువ్వుల్ని ఫొటోలు తీసి, ‘ఎంత అందంగా వచ్చాయో’ అంటూ ఇంటికి వచ్చిన మిత్రులకు చూపిస్తూ పొంగిపోయే అరవింద్‌ ఇంత నిర్దయగా ఎలా మారిపోయాడు!

అరవింద్‌ ఉద్యోగం చేస్తున్న కంపెనీ సొసైటీ తరపు నుండి కొత్తగా కట్టుకున్న ఇల్లు. ఎల్‌.ఐ.సి లోనుతో ఆ కాలనీలో దాదాపు వెయ్యి ఇండ్లదాకా కట్టారు. ఎవరెవరి స్తోమతని బట్టి వాళ్ళు ఇంటిని రకరకాలుగా తీర్చిదిద్దుకుంటున్నారట.

నన్ను ఇంటికి తీసుకొస్తున్నప్పుడు గమనించాను. వీధులకు అటు ఇటుగా పూచి ఉన్న తురాయిలూ, దిరిసెనలూ కాలనీకి ఎంత అందంగా ఉన్నాయో!

నేను వచ్చేసరికి ప్రహరీగోడ పూర్తి కావస్తోంది. మేం రాకముందే పది ట్రాక్టర్ల ఎర్రమట్టిని, రెండు ట్రాక్టర్ల పశువుల ఎరువుని పోయించి చదును చేయించాట్ట. అరవింద్‌కి మొక్కలంటే ప్రాణం. తలపాగా చుట్టి అచ్చం రైతులా పార, గునపం, కత్తెర్లతో పెరట్లోకి వచ్చేవాడు. మాకు కుదుర్లు కడుతూ, గొప్పులు తవ్వుతూ, అడ్డుగా పెరిగే మమ్మల్ని అందంగా కట్‌ చేస్తుండగా లోపల్నుండి కాఫీ కప్పుతో వచ్చేది సుజాత. తనూ పనిలో పాలు పంచుకోబోయేది.

”గార్డెన్‌ వర్కంతా నాదే, కిచెన్‌ వరకే నీ పరిధి” అంటూ సుజాతని పని చేయనిచ్చే వాడు కాదు. కాస్సేపు ఇద్దరూ సరదాగా ఒకర్నొకరు గిల్లికజ్జాలు పెట్టుకునేవారు. పెరట్లో వాళ్ళిద్దరూ అలా చిలకా గోరింకల్లా తిరుగుతూంటే తోటంతా కళకళలాడేది. అంతలో స్కూల్‌ నుండి శ్రావణ్‌, చిట్టితల్లి వచ్చేసి మాకు నీళ్ళు పోయడానికి తయారయ్యేవాళ్ళు.

ఒక్కోసారి పైపుని కొళాయికి తగిలించి, మాకు స్నానం చేయించేది చిట్టితల్లి… మేం ఆ నీటి వేగానికి ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోయి, ఉక్కిరిబిక్కిరై అటూ, ఇటూ ఊగుతుంటే కిలకిలమంటూ పడీపడీ నవ్వేది.

నేను వచ్చిన ఏడాదికే పెరడంతా పచ్చగా మెరిసిపోయింది.

రాత్రనక, పగలనక మేం పూచే పూలవంక మురిపెంగా చూస్తూ, పండుటాకుల్ని  ఏరిపారేస్తూ కబుర్లు చెప్పేది చిట్టితల్లి. ‘పురుగూ, పుట్రా ఉంటాయి. పెరట్లోకి వెళ్ళొద్ద’ని మందలించే సుజాత మాటల్ని అంతగా పట్టించుకునేది కాదు.

సాయంకాలం నీరెండలో అరవింద్‌ చిట్టితల్లితో కలిసి ఆడుకుంటున్నప్పుడు… ఆకాశంలో గుంపులు గుంపులుగా ఎగిరే కొంగల్ని చూపిస్తూ, అవి ఎక్కడికి వెళ్తున్నాయనీ, చీకటి రాత్రుళ్ళలో తళతళ మెరిసే నక్షత్రాల్ని చూపిస్తూ అవి ఎందుకలా మెరుస్తున్నాయని లక్ష ప్రశ్నలు వేసేది.

ధృవుడు, గొరుకొయ్యలు, పిల్లలకోడి, మంచంకోళ్ళు… ఒక్కో నక్షత్రం చూపించి, వాటి గురించి చెబుతూ ఉండేవాడు. సప్తరుషి మండలంలోని అరుంధతీ నక్షత్రాన్ని చూపించి ఆమె కథ గురించి చెప్పాడు.

”అది మా స్కూల్‌ మేడమ్‌ పేరు కదా, ఆ స్టారుకు అరుంధతి అని పేరు ఎవరు పెట్టారు?” అంటూ ప్రశ్నించేది.

స్కూల్‌కి వెళ్ళే ముందు వాళ్ల క్లాస్‌ టీచర్ల కోసం ఎక్కువగా గులాబీలు కోసుకెళ్ళేది. నేనప్పటికి ఇంకా మొగ్గలు తొడగలేదు.

ఒకరోజు స్కూల్‌ నుండి రాగానే, డ్రస్‌ తీసి, గౌను వేసుకొని, టవల్‌ని చుట్టుకొని కుడివైపు పైటేసుకుంది. లోపల్నుండి కుర్చీ ఒకటి తెచ్చి మా మధ్యలో వేసింది. గేటు బయటకి వెళ్ళి రోడ్డు పక్కనున్న కానుగ కొమ్మ విరిచి బెత్తంలా తయారుచేసింది.

నిశ్శబ్దంగా చిట్టితల్లి చేష్టలని గమనిస్తున్నాం. గాలి కుదుపులకు మేమంతా ఒక్కసారిగా అటూ, ఇటూ ఊగేసరికి ”సైలెన్స్‌, సైలెన్స్‌” అంటూ చేతిలోని బెత్తాన్ని ఊపింది. అచ్చంగా వాళ్ళ టీచర్‌ మల్లే, తెచ్చిపెట్టుకున్న గంభీరంతో. ‘నేలకు జానెడుంది. పొట్టి బుడెంకాయ టీచరమ్మ మాకొద్దు.’ చిట్టితల్లి బెత్తం దెబ్బకు తమ రెమ్మలు గాల్లోకి ఎగిరాయన్న కోపంతో చిందులు తొక్కాయి దవనం, మరువం.

”ష్‌… తప్పర్రా. ఇదంతా ఉత్తుత్తినేరా” ఇద్దర్నీ బుజ్జగించాను.

”ఆఁ, ఎవరెవరు హోంవర్క్‌ చేయలేదో చేతులెత్తండి”

”హోంవర్క్‌ అంటే” నావైపు వంగి అడగబోయింది మందారం.

”ష్‌… సైలెన్స్‌”

”ఇదిగో పారిజాతం, నిన్న ఇచ్చిన లెక్కల హోంవర్క్‌ చేసావా?”

”చేమంతీ, నీ సైన్స్‌ హోంవర్క్‌ ఏదీ?”

”మందారం నీకసలు బుద్ధిలేదు. ఆ బొండుమల్లితో మాటలేమిటీ”

”డిసెంబరం నిన్నటి ఇంగ్లీషు గ్రామర్‌ కంప్లీట్‌ చేసావా?” తన చేతిలోని బెత్తంతో సన్నగా చరిచేది.

కాస్త నెప్పిగానే ఉన్నా చిట్టితల్లి ఆరిందాతనానికి ముచ్చటేసేది. అది మొదలు రోజూ స్కూల్‌ నుండి రాగానే మాకందరికీ పాఠాల్తోపాటే రయిమ్స్‌ పాడించడం, డాన్స్‌లు చేయించడం… ప్రతిరోజూ చిట్టితల్లితో ఆటల్లో పండగే.

పెరట్లో ఎక్కువ భాగాన్ని ఆక్రమించుకున్న బంతులు, లిల్లీలు మా ఆటలు గమనిస్తూ గాలికి లయగా తమ సన్నని నడుములు వయ్యారంగా ఊపుతూ ఆనందంగా డాన్స్‌లు చేసేవి.

శ్రావణ్‌ ఒక్కోసారి గేటు బార్లా తీసి వెళ్ళేవాడు. వీధిలోని పిల్లలంతా బిలబిలమంటూ వచ్చేసేవారు. గడుగ్గాయిలు. తిన్నగా ఉంటారా! మమ్మల్ని నలిపి, గిల్లి చిగుళ్ళు తుంచి నానా రభస. ఇంతలో సుజాత వచ్చి అరిస్తే మమ్మల్ని వదిలి పరిగెత్తేవాళ్ళు.

నా గుబుర్లలో ఓ బంగారు పిచిక నారతో గూడు అల్లటం నేను మరవలేదు. ఆవగింజంత మెదడైనా ఉందో లేదో గాని, దాని తెలివేం తెలివనీ! రెండు ఆకుల్ని కలుపుతూ తెల్లని జిగురు పామింది. ఆ ఆకుల మధ్యనుండే నారను తాడులా పేనుతూ, చిన్న వెలక్కాయంత సైజులో గూడు అల్లి రెండు గుడ్లు పెట్టింది. అవి పిల్లలు అయ్యాక చూడాలి నా అవస్థ. ‘కిచకిచకిచకిచ’ క్షణం నిద్రపోనిచ్చేవి కాదు కదా! అప్పుడు నా ఎత్తు మూడు అడుగులే. చిట్టితల్లికి నేను బాగా అందేదాన్ని.

చిట్టితల్లి తడతడవకీ రావడం, నా గుబుర్లు విడదీసి, పిచిక పిల్లల్ని మురిపంగా చూస్తూ ముద్దాడటం… తొండలు, పిల్లులూ వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా వాటిని కాపాడేదాన్నో. గూడు మూడో కంటికి తెలీకుండా కొమ్మల్తో కప్పేసేదాన్ని.

రాత్రుళ్ళు మాపైన రాలిన మంచు బిందువుల్ని ముక్కుల్తో పొడిచి నీరు తాగేవి. అప్పుడు మాత్రం భలే కితకితలుగా ఉండేది.

మా పూలలోని మకరందం తాగి తాగి మత్తెక్కిన సీతాకోకచిలుకలు, తుమ్మెదలు కదల్లేక కదల్లేక గాల్లో పల్టీలు కొడ్తూ ఎగిరేవి. మా పూలపుప్పొడి రజన తాపడంతో వాటి శరీరాలు ధగధగ మెరుస్తూ కాంతులీనేవి.

ఒకరోజు హఠాత్తుగా పిల్లల్ని తీసుకొని బంగారుపిచుక ఎగిరిపోయింది. చిట్టితల్లి పిచికలు కావాలని పేచీ పెట్టింది.

”వాటికి రెక్కలొచ్చాయి కదా. ఎన్నాళ్ళని తల్లి తెచ్చి పెడుతుంది. తిండి ఎలా సంపాదించాలో నేర్పించడానికి పిల్లల్ని తీసుకెళ్ళింది. మళ్ళీ వచ్చేస్తాయిగా” అంటూ అరవింద్‌ ఊరడించాడు. కానీ ఎన్నాళ్ళయినా పిచికలు రానేలేదు.

తెలతెలవారుతుండగా జాంపళ్ళు కోసం వచ్చే చిలుకల్ని చూపించాడు చిట్టితల్లికి. వాటిని చూస్తూ నెమ్మదిగా బంగారు పిచికల్ని మరిచింది. తూనీగల గాజురెక్కల రెపరెపల్ని చూస్తూ మురిసిపోయేది చిట్టితల్లి.

మేం ఎందరం ఉన్నా మేడ మీదకి పాకించిన రాధామనోహరాలంటే చాలా ఇష్టం తనకి. పొడవైన కాడల్తో, ఎరుపు, తెలుపు రంగుల్లో గుత్తులుగా పూసే ఆ పూలని అందుకోవాలని ప్రయత్నించేది. గాలికి రాలిన వాటి కాడల్తో జడలల్లేది.

ఉడతలు మా పొదల్లో దాగుడుమూతలాడుతూ చిట్టితల్లి రాగానే మామిడిచెట్టు ఎక్కేసేవి. ఇంటికి నైరుతివైపు అరటి చెట్లు ఉండేవి. అవి గెలలు తొడిగినప్పుడు, అరటిపూలలోని తేనె కోసం గబ్బిలాలు గుంపుగా వచ్చేవి. వాటిని చూస్తూనే చిట్టితల్లి హడలిపోయి, ఇంట్లోకి పారిపోయి దాక్కునేది.

‘అరటిపూలల్లో అమృతం దాచుకున్నట్లు మాయదారి గబ్బిలాలు, దిక్కుమాలిన గబ్బిలాలు, చిట్టితల్లిని జడిపిస్తున్నాయి కదా.’ కాయలు పెరిగి, పూత రాలేకొద్దీ…రావడం తగ్గించేశాయి.

చిట్టితల్లిని నేనెంత ప్రేమించేదాన్నో- అంతకన్నా ఎక్కువగా ప్రాణం వదిలేది మేమంటే… ఆరోజు సుజాత, అరవింద్‌ పిల్లల్తో కలిసి తోటలో  దాగుడుమూతలు ఆడుతున్నారు. ఈసారి సుజాత వంతు వచ్చింది. కళ్ళకు గంతలు కట్టారు. సుజాత దొంగ అనగానే అరవింద్‌ కేరింతలు కొట్టాడు. సరదాగా గిల్లి ఏడిపించవచ్చని. వాళ్ళిద్దరి సరాగాలు చూస్తే మాకెంతో ముచ్చటేసింది. ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమని… అరవింద్‌, పిల్లలిద్దరూ దొరక్కుండా చప్పట్లు చరస్తూ పరుగులు తీస్తున్నారు. అంతలో పక్కనే ఉన్న డిసెంబరంపై కాలు వేసింది సుజాత. అది గమనించిన చిట్టితల్లి –

”మమ్మీ, నా డిసెంబరాన్ని తొక్కేశావు. చూడు ఎలా విరిగిపోయిందో” గట్టిగా అరుస్తూ పైకి లేపింది.

”సారీ డిసెంబరం” కళ్ళకు గంతలు విప్పుతూ అంది సుజాత.

తల్లి వైపు కోపంగా చూస్తూ శ్రావణ్‌తో గుడ్డ తెప్పించి, తడిపి, విరిగిన కొమ్మ వద్ద కట్టు కట్టింది. చిట్టితల్లి ప్రేమకు మేమంతా కరిగిపోయాం.

ఇంట్లోని విషయాలు, అరవింద్‌, సుజాతల మధ్య జరిగే సంభాషణలు ఎక్కువగా రేరాణి ద్వారా తెలిసిపోయేవి. రేరాణి వాళ్ళ పడగ్గదిని ఆనుకునే ఉండేది కదా… చెవులు రిక్కరించి మరీ విని, గాలితో కబుర్లు పంపేది.

చిట్టితల్లి రోజూ వాళ్ళ మమ్మీ డాడీలపైన చేతులు వేసి, అరవింద్‌తో కథలు చెప్పించుకొని గానీ పడుకోదట. ఏరోజు ఏ కథ చెప్తాడో రేరాణి మళ్ళీ ఆ కథ నాకు విన్పించేది.

నా చిట్టితల్లి పుట్టినరోజు వచ్చిందంటే ఎంత సందడనీ, ఆకాశంలోని నక్షత్రాలన్నీ నేలకు దిగివచ్చినట్లు మమ్మల్ని చిన్నచిన్న లైటు బల్బులతో అలంకరించి అరవింద్‌ ఎంత హడావుడి చేసేవాడో! మా మధ్య రౌండు టేబుల్‌ వేసి, అందమైన ముఖమల్‌ గుడ్డ కప్పి, ఆ పైన పెద్ద కేక్‌ కట్‌ చేయించేవాడు.

వీధిలోని పిల్లలు, కంపెనీలో కొలీగ్స్‌ అంతా వచ్చేవారు. వాళ్ళు తెచ్చిన బహుమతుల్ని ఎంతో మురిపెంగా మాకు చూపించేది చిట్టితల్లి.

చూస్తుండగానే నేను ఇంట్లోకి వచ్చి రెండేళ్ళు దాటింది. నేను చిట్టితల్లికి అందనంతగా ఎదుగుతున్నాను. మాధవీలతను నా కొమ్మలకు పాకించారు.

మామిడి, దానిమ్మలు అప్పుడప్పుడే పిందెలు వేస్తున్నాయి.

ఈమధ్య అరవింద్‌ డ్యూటీ అవగానే ఇంటికి రావడంలేదు. ఎక్కడెక్కడో తిరిగి రాత్రి ఏ పన్నెండుకో వస్తున్నాడు.

మనిషి చాలా అసహనంతో ఉన్నట్లు అనిపించింది. పిల్లలిద్దరూ పడుకున్న తర్వాత అరవింద్‌, సుజాత మాకు దగ్గర్లోనే కుర్చీలు వేసుకొని చాలా రాత్రి వరకు మాట్లాడుకునే వాళ్లు. అవన్నీ కంపెనీకి, ఉద్యోగానికి సంబంధించిన విషయాలు.

పసుపు కనకాంబరం హఠాత్తుగా ఎండిపోయి చనిపోయిందో రోజు. ఏం జరిగిందో తెలీలేదు. మా రెమ్మలు విరిగితేనే తల్లడిల్లే అరవింద్‌ కనకాంబరం గురించి పట్టించు కోలేదు. చిట్టితల్లి మాత్రం ఏడ్చింది.

ఆవేళ రాత్రి ఎనిమిది గంటలప్పుడు అరవిందుతో పాటే కంపెనీలో పనిచేసే కొందరు మిత్రులు వచ్చారు. వాళ్ళంతా మామిడిచెట్టు కిందున్న పచ్చికలో కూర్చున్నారు. వరండా లోని ట్యూబ్‌లైట్‌ కింద చిట్టితల్లి హోంవర్క్‌ చేసుకుంటోంది. లోపల్నుండి అందరికీ ఏ నిమ్మకాయరసమో తెచ్చినట్టుంది సుజాత.

”అరవింద్‌ రేపు నీవు డైరెక్ట్‌గా మన యూనియన్‌ లీడర్‌ని తీసుకొని సెక్రటేరియట్‌ దగ్గరికి వచ్చేయ్‌. మేం కంపెనీ దగ్గర్నుండే ర్యాలీ తీస్తాం. చూద్దాం. అన్ని యూనియన్‌ వాళ్ళూ ఒక్కటయితేనే గానీ లాభం లేదు. ఆ మధ్య ప్రైవేట్‌కి అప్పగిద్దాం అనుకున్నారా, కానీ నిన్న జరిగిన యూనియన్‌, మేనేజ్‌మెంట్‌ మీటింగ్‌లో ఏకంగా లాకౌట్‌ చేసే ఉద్దేశ్యం ఉందట గవర్నమెంట్‌కి…” వాళ్ల మాటల్లో చిట్టితల్లి వచ్చింది.

మధ్యలోకి ఎందుకొచ్చావని చిరాకుతో కసిరేడు అరవింద్‌. చిన్నబుచ్చుకున్న చిట్టితల్లి నా వద్దకు వచ్చి నిల్చుంది.

రాత్రి ఏ ఒంటిగంట వరకో వాళ్ళ చర్చలు సాగినట్లున్నాయి. ఆకాశంలో గొరుకొయ్యలు నడినెత్తికి వస్తుండగా నిద్రలోకి జారుకున్నాను.

ఆ తర్వాత చాలా రోజులు ర్యాలీలనీ, ధర్నాలనీ తిరిగేడు అరవింద్‌. వాటిల్లో తిరుగుతున్నప్పుడు పోలీసుల లాఠాఛార్జీలో దెబ్బలు తగిలి, రెండ్రోజులు హాస్పిటల్‌లో ఉండి వచ్చాడు.

సుజాత కూడా ఏదో లోకంలో ఉన్నట్లు ఉంటోంది. శ్రావణ్‌ ఎక్కువగా క్రికెట్‌ పిచ్చితో బయటే ఉండేవాడు. పాపం! చిట్టితల్లి ఒక్కర్తీ దిగులుగా బిక్కచచ్చినట్లు మా మధ్య తిరిగేది.

క్రమేపి ఇంట్లోని వాతావరణంలో ఏదో మార్పు చోటు చేసుకుంది. మరికొంత కాలం ఇలాగే మందకొడిలా సాగింది.

ఏమయ్యిందో తెలీదు. ఈ మధ్య చాలా రోజుల్నుండి అరవింద్‌ ఇంట్లోనే ఉంటున్నాడు. పొద్దస్తమానం ఇంట్లోనే ఉంటాడా… మాకు గొప్పులు తవ్వడం, ఎరువులు వేయడం… కనీసం పిల్లల్ని కూడా దగ్గరికి తీసుకోవట్లేదు.

ఈ మధ్య సుజాత ఏదో కాస్మోటిక్స్‌ ఏజన్సీ తీసుకొని మెంబరయ్యింది. సుజాతకు చేదోడుగా ఉంటుందని అప్పుడప్పుడు పిల్లలకు వంటచేసి, హోంవర్కులు చేయించేవాడు అరవింద్‌. అదీ కొంతకాలమే. ఇంటి పనులు తనవల్ల కావట్లేదని చేతులెత్తేసేవాడు.

మరో ఆర్నెల్లలో అరవింద్‌కు ప్రైవేట్‌లో చిన్న ఉద్యోగం దొరికింది. ఇక అప్పట్నుండీ మొదలయ్యాయి చిట్టితల్లికి కష్టాలు.

సాయంకాలం స్కూలు నుండి వచ్చేసరికి ఇంటికి తాళం ఉండేది. మొదట్లో ఎదురింట్లో వాళ్ళకి తాళం చెవి ఇచ్చేవారు. బిక్కుబిక్కుమంటూ ఇంట్లో ఒక్కతే ఉండేది. శ్రావణ్‌కు ఎప్పుడూ ఆటపిచ్చే.

పెరట్లో నేల బీడుపడిపోతోంది. మా మొదళ్ళు నేలలో బిగుసుకుపోయాయి. గాలి అందదు, నీళ్ళు పోసే దిక్కులేదు.

చిట్టితల్లి కూడా ఏదో పోగొట్టుకొన్నదానిలా మా అవసరాల్ని మరిచిపోసాగింది. చూస్తూ చూస్తూ ఉండగానే మందారం, చేమంతులు, విరజాజీ, పారిజాతం… ఒక్కొక్కటీ నన్నొదిలేసి వెళ్ళిపోతున్నాయి.

అయ్యో! ఇవన్నీ చూసేందుకే ఇంకా ఉన్నానా… నేనూ వెళ్ళిపోతే నా చిట్టితల్లిని ఊరడించే వాళ్ళెవరూ!

ఏదో విధంగా తేమని పీల్చుకుంటూ జీవిస్తున్నాను.

అప్పుడప్పుడు సుజాత రాత్రి పది దాటేక వచ్చేది. వాళ్ళ ఆఫీసు మేనేజరు ఒక్కోసారి కారులో డ్రాప్‌ చేసి వెళ్ళేవాడు.

అరవింద్‌ మొదట్లో కొంత భరించినా, రానురానూ సుజాతని క్షమించలేకపోయేవాడు. ఇద్దరి మధ్యా రభస మొదలయ్యేది. సుజాతని సాయంత్రం ఆరులోపుగా ఆఫీసు వదిలి రమ్మనేవాడు.

”నేను చేసేది ఏజన్సీ కంపెనీ. చాలామంది ఏజంట్లని కుదర్చాలి. ఎక్కడెక్కడికో తిరగాల్సి ఉంటుంది. రాత్రి చాలా పొద్దుపోతే మా బాస్‌ మనింటిదాకా డ్రాప్‌ చేయడం తప్పా… నీ ఇన్ఫీరియారిటీ వల్ల నీకంతా తప్పుగా తోస్తుంది.”

సుజాత చాలా ఎత్తిపొడుపుగా జవాబు ఇచ్చేది. ఆ మాటలకి అరవింద్‌లో అహం దెబ్బతినేది.

కోపంతో ఊగిపోయేవాడు. చేతికందిన వస్తువు బద్దలయిపోవడం ఆ సమయంలో అతి మామూలయిపోయింది.

అరవింద్‌కు ఇప్పుడు తెలుస్తోంది ఇంటిపనుల్లోని నరకం.

పాపం సుజాత! ఎంత కష్టపడేది! తెల్లవారింది మొదలు… మేం రాత్రంతా రాల్చిన పండుటాకుల్ని ఊడ్చి ఎత్తడం, గదులన్నీ చిమ్మటం, కల్లాపీ, ముగ్గులు, ఉదయం టిఫిన్లు, ముగ్గురికీ కేరేజీలు కట్టడం, గిన్నెలు తోమటం, బట్టలుతకడం, పిల్లలకు స్నానాలు, స్కూల్లో దిగబెట్టడాలు… మళ్ళీ సాయంకాలం టిఫిన్లు, హోంవర్కు చేయించడం, రాత్రి వంట, పడుకునేవరకు వంచిన నడుం ఎత్తకుండా ఎంత పనిచేసేది!

సుజాత ఎంత పనిచేసినా అలిసినట్లు అనిపించేది కాదు. ఇంటి పనంటే తనకెంతో ఇష్టంలా చేసేది.

తనిప్పుడు తీసుకున్న ఏజన్సీకి సంబంధించి కాస్మోటిక్స్‌ని అమ్మటం, వాటి తాలూకు పాలసీల కోసం తిరిగి తిరిగి వాడిన తోటకూర కాడల్లే రావడం… మళ్ళీ బండెడు చాకిరీ గుర్తుకు రాగానే సన్నని వణుకు ప్రారంభమయ్యేది ఆమెలో.

ఇద్దరి మధ్యా అప్పుడు మొదలయ్యేది సన్నని సెగ. చిలికి చిలికి గాలివాన తుఫానుగా మారిన తీరల్లే… పిల్లల ముందే మాటా మాటా అనుకుంటూ తమ వివేకాన్ని పూర్తిగా కోల్పేయేవారు.

అరవింద్‌ అమ్మ, నాన్నలు వచ్చారొకసారి. ఇద్దరూ ముసలివాళ్ళు. కాస్త జబ్బులో ఉన్నట్టనిపించింది. చిట్టితల్లికి కాస్త ఊరటగా ఉంటుందనుకున్నాను. తాత, నాన్నమ్మలతో బాగానే కలిసిపోయి కబుర్లు చెబుతోంది.

వాళ్ళ నాన్నమ్మని తోటంతా తిప్పుతూ మమ్మల్ని పేరుపేరునా పరిచయం చేసింది.

”నాన్నమ్మా, ఈ నీలిగోరింట పువ్వుల్లాంటి జూకాలు చేయిస్తావా?”

”అలాగే తల్లీ”

”నాన్నమ్మా. మా క్లాస్‌లో అర్చిత తన బర్త్‌డేకి మొగలిపూల జడ వేసుకొచ్చింది. మనం కూడా మొగలిచెట్లు వేసుకుందామా?”

”మొగలిచెట్లు ఇంట్లో పెంచుకోరాదమ్మా, పాములొస్తాయి”

”అమ్మో! నాకు పాములంటే భయంగా”

”నాన్నమ్మా! చంద్రకాంతల్ని అల్లి నా సిగచుట్టూ ముడివేస్తావా, మా జానకి టీచర్‌ అలాగే పెట్టుకొని వస్తుంది”

”చంద్రకాంతలేఁ ఖర్మ తల్లీ, మన తోటంతా కనకాంబరాలు, డిసెంబరాలు ఉంటేనూ, ఎంచక్కా వాటిని అల్లిపెడ్తానేఁ”

చిట్టితల్లి కోసం మామిడిచెట్టుకు కొబ్బరితాళ్ళతో ఊయల కట్టేడు తాతయ్య. తాళ్ళు గుచ్చుకోకుండా పాత దుప్పటి మడతపెట్టి వేసింది నాన్నమ్మ.

చిట్టితల్లిని ఊయలలో ఊపడం తనకొచ్చిన పాటలు పాడి కథలు చెప్పడం నాన్నమ్మ పని.

చిట్టితల్లికి మంచి స్నేహితులే దొరికారు కాలక్షేపానికి. మళ్ళీ కొద్దికొద్దిగా చిట్టితల్లి ముఖంలో కళ రావడం చూస్తుంటే తృప్తిగా ఉంది.

అప్పుడప్పుడు డ్యూటీకి సెలవు పెట్టి వాళ్ళను హాస్పిటల్‌కి తీసుకెళ్ళేవాడు అరవింద్‌.

ఆరోజు బెడ్‌రూమ్‌లో తెల్లవార్లూ లైట్‌ వెలుగుతూనే ఉంది. అరవింద్‌ సుజాతల మధ్య ఏదో వాగ్వివాదం నడుస్తోందని అనిపించింది. రేరాణితో విషయం తెలుసుకొని బాధపడ్డాను.

”మీ అమ్మానాన్నలు ఇక్కడే ఉండిపోదామని అనుకుంటున్నారల్లే ఉంది. ఇల్లు ఎంత ఇరుగ్గా ఉందో మీకు తెలీదా! మరో గది కట్టాలంటే చేతిలో చిల్లిగవ్వ లేదు. మీకు వి.ఆర్‌.ఎస్‌. కింద వచ్చిన లక్షా ఈ ఆరునెలల్లో ఎలా మాయం అయ్యాయో తెలీదు. ఇప్పుడు మీరు డ్యూటీకి లీవులు పెట్టి వీళ్ళను హాస్పిటల్‌ చుట్టూ తిప్పితే జీతం ఎంత తగ్గుతుందో ఆలోచించారా”

”నేను సరదాగా తీసుకెళుతున్నానా, నిన్ను తీసుకెళ్ళమని చెప్పలేదే”

”ఎంతకూ మీ ధోరణి మీదేనా. హాస్పిటల్‌ ఫీజులు, మందుల ఖర్చు ఎంతవుతుందో తెలీదా”

”వాళ్ళకు వచ్చే పెన్షన్‌లోంచే ఖర్చు పెడుతున్నాను. నీవు సంపాదించేది అడిగితే అప్పుడు అడుగు.”

”వాళ్ళ ఫించనీ ఎంతనీ, రెండురోజులు హాస్పిటల్‌ ఫీజు, మందులకే సరి. రోజు రోజుకూ ధరలు ఎలా మండిపోతున్నాయని ఇద్దరం ఉద్యోగం చేస్తున్నామన్నమాటే గాని, రాబడి ఎంత తక్కువగా వస్తుందో తెలియదా? ఇద్దరు మనుషుల భోజనం కనీసం రెండువేలయినా నెలకు అదనపు ఖర్చు. మనకు జరుగుబాటుగా ఉంటే ఇలా అంటానా. పైగా ఇద్దరూ అనారోగ్యంతో ఉన్నారు. వీళ్ళను కనిపెట్టుకుని ఇంట్లో ఎవరుంటారు? నిన్ను ఒక్కడ్నే కన్నారా? మీ అన్నయ్య ఉన్నారు కదా… అక్కడికి వెళ్ళమనండి.”

”నీకసలు మతుండే మాట్లాడుతున్నావా”

తెల్లవార్లూ ఇద్దరి మధ్యా చాలా రభస జరిగిందని చెప్పింది.

”నాన్నమ్మ, తాత అచ్చంగా ఇక్కడే ఉండిపోతారంట తెలుసా” ఎంతో సంతోషంతో చిట్టితల్లి వాళ్ళ స్నేహితులతో చెప్పడం విన్నాను. కానీ… ఆ సంతోషం ఎన్నాళ్ళో నిలవకుండానే ఆ ముసలి దంపతులిద్దరూ కళ్ళు తుడుచుకుంటూ, తమ సామానుతో వెళ్ళి పోవడం చూసిన నేను ”అయ్యో ఎందుకెళ్తున్నారమ్మా. నా చిట్టితల్లి కోసం ఇక్కడే ఉండిపోకూడదు” బాధతో తల్లడిల్లాను.

వాళ్ళు వెళ్ళిన రోజు అరవింద్‌, సుజాతల మధ్య చిన్న యుద్దమే జరిగింది. వాళ్ళ వాదులాటల్లో పిల్లలిద్దరూ చెరో మూలకీ నక్కి బెదిరిపోయి చూస్తారట.

ఇప్పుడు చిట్టితల్లి మళ్ళీ ఒంటరిదయిపోయింది.

కథలూ, కబుర్లూ చెప్పేవారు ఎవరూ లేరు. మంచానికి ఆ చివర్నొకరు, ఈ చివర్నొకరు పడుకోవడంతో వారిద్దరి మధ్యలో పడుకునే చిట్టితల్లికి చేతులు వేద్దామనుకుంటే ఎవరూ అందటంలేదు. పలకరిస్తే కసురుతున్నారు. ఒక్కోసారి చేయి చేసుకుంటున్నారు. ఆ దృశ్యం చూళ్ళేకపోతున్నానని దుఃఖిస్తూ గాలితో చెప్పి పంపింది రేరాణి.

ఓసారి మార్కులు తక్కువగా వచ్చాయని పిల్లల్ని గొడ్డును బాదినట్లు బాదింది సుజాత. ఆవేళ ఎంత కన్నీరు మున్నీరయ్యానో… ఏం మనుషులు! లోపలి అసహనాల్ని పిల్లల మీదా చూపించడం.

పిల్లలు రోజూ సాయంత్రం స్కూల్‌ నుండి రాగానే వారికిష్టమైన టిఫిన్‌ చేసిపెట్టి తరువాత వరండాలో కూర్చోబెట్టి చదువు గురించి శ్రద్ధతో కనీసం గంటకు పైగా సమయాన్ని కేటాయించేది సుజాత.

మరిప్పుడు- అసలు వారి చదువుల్లో తలదూర్చక ఎన్నాళ్ళయిందీ?

అరవిందు అప్పుడు, ఇప్పుడూ, ఎప్పుడూ పట్టించుకోవడం చూడనేలేదు! మార్కులు తక్కువ వచ్చాయని వాతలొచ్చేలా చితకబాదితే వచ్చేది చదువా! ముందే పిల్లలిద్దరూ వాళ్ళకే తెలియని ఒంటరితనంతో విలవిల్లాడిపోతున్నారని వీళ్ళకి ఏ భాషలో చెప్పేది?

ఆవేళ సుజాతపైన నిజంగానే కోపం వచ్చింది నాకు.

చిట్టితల్లిని ఊరడిద్దాం అని ఎంతగా ప్రాణం కొట్టుమిట్టాడిందో… కానీ చిట్టితల్లి సుజాత భయానికి ఇంట్లోంచి కదల్లేదు, పుస్తకాన్ని వదల్లేదు.

అప్పుడప్పుడు సుజాత ప్రవర్తన చాలా విచిత్రంగా ఉండేది. అరవింద్‌ పడుకున్న తర్వాత ఒక్కర్తీ మేల్కొని నిద్రపోతున్న పిల్లల్ని స్పృశిస్తూ మౌనంగా కన్నీరు పెట్టేది. ఆమెలో ఏదో చెప్పుకోలేని అలజడి కనిపించేది.

పిల్లల్ని కొట్టినరోజు రాత్రి ఆరుబయటకు వచ్చి మామధ్య కూర్చుని వినీవినబడనట్లుగా దుఃఖిస్తూ తన తలరాతని తిట్టుకుంటూ తనలో తాను గొణుక్కోవడం చూసి, ఆమెపై ఆ క్షణంలో చాలా జాలి కలిగింది.

స్కూల్‌ నుండి వచ్చిన పిల్లలకు సేమియా పాయసం మొదలుకొని, మెత్తని పకోడీల వరకు వాళ్ళ కిష్టమైన పిండివంటలు చేసిపెట్టేది. తోటలోని పండ్లేకాక, బయట నుండి తెచ్చినవీ తినిపిస్తూ, పోషక విలువలతో పిల్లల్ని పెంచాలని పరితపించే సుజాత .తనిప్పుడు పిల్లలకి ఏమీ పెట్టలేకపోతున్నానని బాధపడేది చాలసార్లు.

తన జీతంలోంచి చిట్స్‌ వేస్తానంటోంది సుజాత. ”ఇద్దరి జీతం ఇంటిఖర్చులకే సరిపోతే మరి భవిష్యత్‌లో పిల్లలకు కూడబెట్టేదెప్పుడూ కాలేజి చదువులప్పుడు డొనేషన్స్‌ కట్టేదేలా?”

”వాటర్‌, కరెంట్‌, టెలిఫోన్‌ బిల్‌, స్కూల్‌ ఫీజ్‌..వీటితో నాకు సంబంధం లేదు. అవన్నీ నీ జీతంలోంచే…” అరవింద్‌.

”ఇంటికి ఎల్‌.ఐ.సి ఇన్‌స్టాల్‌మెంట్‌ కట్టకపోతే వడ్డీ పెరిగిపోతుంది ముందుగా అది కట్టాకే మిగతా ఖర్చులు” సుజాత.

ఒకటి, ఒకటీ…మాటా మాటా.. పంతాలు, వాదనలు, తర్కాలు… అలకలు, అరుపులు… ఇద్దరి మధ్య అన్యోన్యత అంతరించి అనురాగం సన్నగిల్లి, అవగాహనా రాహిత్యం బలపడుతోంది. ఒక్కరోజా, రెండ్రోజులా… ఇదేమి సంసారం? ఇంకా ఎంత కాలమో? మధ్యలో బిక్కచచ్చే చిట్టితల్లి బాధ చూడలేకున్నాను…ఎడమొహం పెడ మొహాలతో ఉంటే నా సౌరభాన్ని ఆస్వాదించేదెవరూ? నాకు తేమ అందటం లేదు. జీవ పదార్థం నాలోనూ ఎండిపోతుంది…రేరాణి ఏడుస్తూ మొరపెట్టుకుంది.

మామిడి, జామ మిగతావి అందనంత ఎత్తుకు వెళ్ళాయి.

జామకు పట్టిన తెల్లదోమ గాల్లో చెల్లాచెదురై చిరాకు తెప్పిస్తోంది.

నాకు తెలిసీ వాళ్ళిద్దరి మధ్య మాటలు ఆగిపోయి రెండు సంవత్సరాలు కావస్తోంది. కొన్ని విషయాల్లో పిల్లలు మధ్యవర్తులు. మొదట్లో పిల్లలకు  కొత్తగా ఉండేది. ”మీ ఇద్దరికీ మాటలువచ్చు కదా, మధ్యలో మేమెందుకు” ఒకసారి శ్రావణ్‌ అనుమానం ప్రకటించాడు. తర్వాత్తర్వాత పిల్లలకు వాళ్ళమధ్య దూరం కొలవడం అలవాటైపోయింది.

చూస్తుండగానే టెలిఫోన్‌ కనెక్షన్‌ కట్‌ అయిపోయింది. ఫ్రిజ్‌ ఉన్నా వాడకంలో లేదు. కార్టూన్‌ సినిమాలు చూస్తూ సరదాపడే పిల్లలు కేబుల్‌ కనెక్షన్‌ తీయించేస్తున్నప్పుడు ఎంత విలవిల్లాడారనీ.

ఎంతో ఆదర్శంగా ప్రేమించి పెళ్ళీ చేసుకున్న జంటనీ, పైగా కులాంతరమనీ ఇంటికి వచ్చిన మిత్రులు అప్పుడప్పుడు పొగడ్డం విన్పించేది. నాకు ఈ ప్రేమలకు, ఆదర్శాలకు లొంగని అతీతమైన శక్తి ఏదో పట్టి పీడిస్తోందని అనుమానం.

ఇప్పుడు ఇంటికి ఎవరూ రావడంలేదు. అరవింద్‌ అమ్మానాన్నలు ఇప్పుడెక్కడున్నారో ఎలా ఉన్నారో వాళ్ళ వివరాలేవీ తెలియవు. ఒకవేళ అరవింద్‌ కు తెలిసినా వాళ్ళ ప్రసక్తి ఇంట్లో పిల్లల ముందు కూడా తేవడం లేదు.

మళ్ళీ ఈ మధ్య ఏవో అసహనాలు రేగుతున్నాయి. ఒకరి పొడ మరొకరికి గిట్టనంతగా దూరం అవుతున్నారనిపించింది. వాళ్ళ మాటల్లో విడిపోవడాలు, విడాకులు, ఒకర్ని మరొకరు దగా చేసారని దెప్పుకోవడాలు.. రేరాణి పంపే పిడుగుల్లాంటి వార్తలు నాలో ఫిరంగులు పేలుస్తున్నాయి. మనసంతా అతలాకుతలం అయిపోతుంది.

దేశాల మధ్యే కాదు యుధ్ధాలు సంసారాలలోను జరుగుతాయనిపించింది. ప్రాణాలు కోల్పోయేదెప్పుడూ అమాయక జీవులే. ఈ ఇంట్లో జరిగిన యుద్ధంలో అన్నీ అలా అంతరించిపోగా దిక్కుతోచని స్థితిలో క్షతగాత్రులమై మిగిలిఉన్నాము. మాతోపాటు శ్రావణ్‌, చిట్టితల్లీనూ…

ఎక్కడో సింహాచలంలో పుట్టి ఇలా వీళ్ళమధ్యకు రావడం ఏమిటి? చిట్టితల్లి మా అందరికీ నేస్తం కావటం నవ్వుల పువ్వులతో కళకళలాడిన సంసారం రానురాను ఏదో గ్రహణం పట్టినట్లు క్షీణించిపోతుంది.

ఈ క్రమం ఇలా సాగాల్సిందేనా! తడారిపోతున్న జీవ పదార్థంతో కన్నీరు కూడా రాల్చలేని పరిస్థితి నాది.

*

గేటు చప్పుడవుతోంది. శ్రావణ్‌ వచ్చినట్టున్నాడు. వరండాలో పడుకున్న చిట్టితల్లిని బేట్‌తో పొడుస్తూ నిద్రలేపాడు.  నిద్రమత్తులో ఊగుతూ లోపలికి వెళ్ళింది.

రాత్రి ఎనిమిది దాటే వుంటుంది. అరవింద్‌, సుజాతలు ఇంకా రాలేదు. ”చిట్టితల్లి అప్పుడే ఆకలని ఏడ్చింది. నిద్రలో ఆకలి మర్చిందేమో.., సన్నని బాధ సుళ్ళు తిరుగుతూనే వుంది. చిట్టితల్లి ఆలోచనల్లోనే చిన్నగా కునుకుపట్టింది.

ఎల్‌.ఐ.సి లోను కట్టడం చేతగావట్లేదని చేతులెత్తేసాడు. అరవింద్‌. ఇంటిని అమ్మకానికి పెట్టారు. ఎవరో ఇల్లు చూసేందుకు వచ్చారు. మొక్కలన్నీ  నరికేసి అపార్ట్‌మెంట్‌ కట్టాలని ఆలోచనట.

ఆ మాట వినగానే నాతోపాటు మిగతా చెట్లన్నీ గజగజ వణికిపోయాయి. ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు నన్ను వదల్లేక చిట్టితల్లీ  ఒకటే ఏడుపు. సుజాత చిట్టితల్లి చేయి పుచ్చుకొని బరబర ఈడ్చుకుపోతుంది.

చిట్టితల్లి రోదన రంపపుకోతలా విన్పిస్తోంది. గుండె తరుక్కుపోతుంది. చిట్టితల్లిని వదిలేసి నేను బతకగలనా?

ఎక్కడో బాంబులు పేలినట్లు నేల అదురుకు ఒక్కసారిగా కంపిస్తూ కళ్ళు తెరిచాను

పీడకల… ఒళ్ళంతా చెమటలు.

ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి…. వస్తువులేవో ఎగిరిపడుతున్న శబ్దాలు.

రాత్రి పన్నెండు దాటిందేమో

ఉండుండి అరవింద్‌, సుజాతలు అరుపులు, పిల్లల ఏడుపులు విన్పిస్తున్నాయి.

ఇంటికి ఏ శని పట్టిందో తెలీదు. లేకపోతే అర్థరాత్రివేళ…. ఇదేం ప్రళయం!

పెద్దగా ఏడుస్తూ, ఇంట్లోంచి దూసుకువచ్చింది చిట్టితల్లి.

ఏం జరిగిందో అడిగేలోగా వచ్చి నన్ను చుట్టేసింది.

గౌను మడతల్లో దాచిన వస్తువేదో నా మొదలు దగ్గరున్న డిసెంబరం కొమ్మల్ని పాయలుగా తీసి గుబుర్లలో  దాచింది.

వెక్కివెక్కి ఏడుస్తున్న పిల్లను ఎలా ఊరడించను?

”ఏం జరిగిందమ్మా’ అంటూ రేరాణిని అడిగాను.

రేరాణి చెప్పింది విని అవాక్కయిపోయాను. వీరి మధ్య శతృత్వం చాపకింద నీరులా పాకుతోందని తెలుసుకాని, పరాకాష్టకి చేరిందని ఇప్పుడే తెలిసింది. ఒకరికొకరు ప్రేమగా ఉన్నప్పుడు ఇచ్చి పుచ్చుకున్న కానుకల్ని, కలిసి తీయించుకున్న ఫొటోల్ని చింపేస్తూ, కాల్చేస్తున్నారట.

ఇద్దరికీ పిచ్చిగానీ పట్టలేదు కదా!

వాళ్ళ ప్రవర్తన గుర్తొచ్చినప్పుడల్లా వణికిపోతూ వెక్కిళ్ళతో బెక్కుతూనే ఉంది. చిట్టితల్లి.

ఒకప్పుడు తమ పిల్లలతోపాటే మమ్మల్ని, వెన్నెలనీ అపారంగా ప్రేమించిన వీళ్ళ మధ్య అంతర్యుద్ధం ఎలా మొదలయిందని మూలాలు వెతకసాగేను.

తెగులు పట్టిందని చెట్టు మొదలు నరుక్కుంటారా!

మూలం ఏదైనా కానీ…

మీ ఇద్దరి మధ్యా పిల్లలు నలిగిపోతున్నారనీ, మీరు పంచే ప్రేమ కోసం పరితపిస్తున్నారనీ మీ వల్ల పూరేకుల్లాంటి బాల్యం పసివాడుతోందని… ఎలా గొంతెత్తి చెప్పను?

భగవాన్‌! దిక్కులు పిక్కటిల్లేలా నా బాధను అరిచి చెప్పడానికి నా స్వరాన్ని పలికించు.

దుఃఖంతో గొంతు పూడుకుపోయింది నాకు.

చాలాసేపు తరువాత సుజాత వచ్చింది. నన్ను కావలించుకున్న చిట్టితల్లిని నా నుండి విడదీసి, ఇంట్లోకి తీసుకెళ్ళింది.

అప్పుడు గుర్తొచ్చి చూసేను. డిసెంబరం గుబుర్లలో చిట్టితల్లి దాచిందేమిటని? వెన్నెలకాంతిలో కన్పించింది. మూడెళ్ళ క్రితం మా అందరి మధ్య తీయించుకున్న ఫొటో అది.

మమ్మీ డాడీల భుజాలపై కూర్చొని వాళ్ళ మెడచుట్టూ చేతులు బిగించి, నవ్వులు చిందిస్తూ శ్రావణ్‌, చిట్టితల్లి.

చిట్టితల్లి కోరుకుంటున్నదేమిటో అర్థమై గుండె బరువెక్కింది.

 

                   ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక

26 సెప్టెంబరు 2003

 

కథా నేపథ్యం

1992-93 ప్రాంతంలో ఆల్విన్‌ కంపెనీలో పనిచేసే కార్మికుల కోసం ఓ గూడంటూ ఉండాలనే ఆలోచన వచ్చింది అప్పటి మా యూనియన్‌ ప్రెసిడెంట్‌ శ్రీ దయాకర్‌ రెడ్డి గారికి. వారు దీన్ని బలోపేతం చేసి, కూకట్‌పల్లికి దగ్గరలో స్థలాల్ని వెతికి, అంతవరకూ మేం దాచుకున్న పి.ఎఫ్‌.తో ప్లాట్స్‌ అలాట్‌ చేశారు. తర్వాత ఎల్‌.ఐ.సి.లోన్‌తో మాకు ఇండ్లను కట్టించి ఇచ్చారు. 1994లో ఆ ఇండ్లలోకి వచ్చాం. ఇంటికి కాంపౌండ్‌ కట్టుకుని, రకరకాల మొక్కల్ని నాటుకున్నాం.

మా పాప రోహిత ఎప్పుడూ చెట్ల మధ్యనే ఉండేది. వాటితో మమేకమయ్యేది. వాటితో మనసువిప్పి మాట్లాడేది. ఇక మా బాబు తేజ. వాడి ఆటల ప్రపంచం వాడిదే. సొంత ఇల్లు, చక్కని సంసారం … మనిషికి ఇంతకంటే ఏం కావాలీ?

హైదరాబాద్‌లో మాకంటూ సొంత ఇల్లుంది అని సంతోషించేంతలో ఆల్విన్‌ మూత పడింది. అప్పుడు మొదలయ్యాయి కష్టాలు.

సాఫీగా సాగుతున్న జీవితాలకు అదొక పెద్ద కుదుపు. ఉద్యోగాల వేటలో ఊరిమీద పడ్డాం. అంతవరకు ఆర్థిక సూత్రంపై నిలబడ్డ పచ్చటి సంసారాలు తలకిందులు కాసాగాయి.

విధి వక్రించింది. అన్నిటికీ మూలం డబ్బే అయ్యింది. నాతో పాటు తను కూడా చిన్న ఉద్యోగం చూసుకుంది. ఇద్దరం ఏ రాత్రికో ఇల్లు చేరేవాళ్లం.  సాయంత్రం స్కూల్‌ నుండి అలసిపోయి వచ్చిన పిల్లలు ఈసురోమని ఒంటరిగా ఉండేవాళ్ళు.

అంతవరకు చెట్ల ఆలనా పాలన చూసిన వాళ్ళం, ఆ తర్వాత పట్టించుకోవడం మానేశాం. ఒక రకంగా చెప్పాలంటే చాలా మొక్కల్ని హత్య చేసినవాళ్ళం అయ్యాం.

పని ఒత్తిడి, చాలీచాలని జీతాలు, తప్పనిసరిగా కట్టాల్సిన ఎల్‌ ఐ సి ఇన్‌స్టాల్‌మెంట్‌, పెరిగే ఖర్చులు వెరసి మా ఇద్దరిలో చిరాకు, అసహనం, అవగాహనారాహిత్యం పెరగసాగాయి. ఒకపక్క పిల్లల్ని సరిగా చూళ్ళేకపోతున్నామనేది తెలుస్తూనే ఉంది.

తల్లిదండ్రుల మధ్య సరయిన సంబంధాలు లేకపోతే పిల్లలను లాలించలేరు, ప్రేమించ లేరు. వీరిద్దరి కోపాగ్నిలో ఆ పసికూనలు సమిధలవుతారు. వారి అందమైన బాల్యంపై అదొక వేటు.

ప్రశాంతమైన కొలనులోకి ఎవరో రాయి విసిరి అల్లకల్లోలం సృష్టించినట్టయింది. మా జీవితాల్లో కొట్టొచ్చినట్టు కన్పించే ఈ మార్పుకు కారణం మా కంపెనీ మూసివేతా? అందుకు పరోక్షంగా దోహదపడిన ప్రపంచీకరణా?

ఈ నేపథ్యంలో రాసిన కథే చీడ.

సంపెంగ చెట్టు, కథని చెప్పినట్టుగా రాయాలనుకున్నాను. ఐతే ఆ చెట్టుకి ఇంట్లోని విషయాలు, జరిగే సంఘటనలు తెలియవు. అంచేత కిటికీ దగ్గరున్న నైట్‌క్వీన్‌తో గాలి ద్వారా సంభాషణని జరిపించి కథనం నడిపించాల్సి వచ్చింది.

-గొరుసు జగదీశ్వర రెడ్డి

*