గండాలు దాటే మనిషి

mythili

చాలా ఏళ్ళ కిందట ఐర్లండ్ లో ఒక ఊర్లో కొనాల్ అని ఒకాయన ఉండేవాడు – అందరికీ చేతనైన సాయం చేసేవాడు, పెద్ద మనిషి.  ఆ ఊరి జమీందారు మంచివాడేగానీ ఆయన కొడుకులు చాలా దుడుకు వాళ్ళు. ఒకసారి వాళ్ళు ఏదో చెడ్డ పని చెస్తుంటే కొనాల్ కొడుకులు అడ్డు తగిలారు.  ఆ గొడవలో జమీందారు కొడుకు ఒకడు  చచ్చిపోయాడు. జమీందారు కి చాలా దుఃఖమూ కోపమూ వచ్చాయి. కొనాల్ ని పిలిచి ఇలా అన్నాడు  – ” నీ కొడుకులు ఏమని నా పిల్లల జోలికి వచ్చారు ? వాళ్ళని ఇప్పటికిప్పుడు ఏమైనా చేయగలను- కాని నీకొక అవకాశం ఇస్తున్నాను.  నువ్వూ నీ కొడుకులూ వెళ్ళి లోచ్ లాన్ రాజు గారి దగ్గర ఉండే మట్టి రంగు గుర్రాన్ని తెచ్చి నాకు ఇవ్వాలి. అలా అయితే మిమ్మల్ని క్షమించి వదిలిపెడతాను. లేకపోతే నీ కొడుకులు ముగ్గురినీ ఒకేసారిచంపించేస్తాను ”

జమీందారు పట్ల భక్తి ఉన్న కొనాల్ వెంటనే  ” నా కొడుకుల కోసమనే కాదు ప్రభూ, మీరు అడిగారు కనుక ఆ పని తప్పకుండా చేసిపెడతాను… ఎంత కష్టమైనా సరే, నావీ నా కొడుకులవీ ప్రాణాలు పోయినా సరే ” అన్నాడు. అనేశాడే గానీ ఇంటికి వెళ్ళి దిగులుపడుతూ పడుకుండిపోయాడు. ఆ రాజుగారికి ఆ గుర్రం చాలా అపురూపమైనది అని అందరికీ తెలుసు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన దాన్ని ఎవరికీ ఇవ్వడు. వీలైతే దాన్ని దొంగిలించి తేవలసిందే. రాజభవనం లో దొంగతనం చేయటం అయే పనేనా ? భార్య గుచ్చి గుచ్చి అడిగింది- విన్నాక  ఆమె కీ చాలా భయం వేసింది. లోచ్ లాన్ రాజు ఆ గుర్రాన్ని చాలా భద్రంగా కాపాడుకుంటాడు , దాన్ని దొంగిలించబోవటం అంటే కోరి చావును కొని తెచ్చుకున్నట్లే. మళ్ళీ తన భర్తా పిల్లలూ తనకి కనిపించరనే అనుకుంది ఆమె.

celts2

తెల్లారుతూనే కొనాల్, ముగ్గురు కొడుకులూ కలిసి బయల్దేరారు. సముద్రానికి అవతలి ఒడ్డున ఉంది లోచ్ లాన్ రాజ్యం. ఎక్కడా ఆగకుండా మరుసటిరోజు సాయంత్రానికి  అక్కడికి చేరారు. అప్పటికి చీకటి పడుతూ ఉంది.దగ్గరలో పెద్ద ధాన్యం మర ఒకటి కనిపించింది. ఆ రాత్రికి అక్కడ తలదాచుకుందుకు చోటు అడిగారు. మర యజమాని ఒప్పుకున్నాడు. అతని ఎద్దుల్లో రెండింటికి ఉన్నట్లుండి జబ్బు చేసి ప్రాణం మీదికి వచ్చింది. కొనాల్ కి  పశువైద్యం బాగా  తెలుసు , వెంటనే పూనుకుని వాటికి  చికిత్స చేసి కాపాడాడు.   మర యజమాని సంతోషించి  వాళ్ళకి భోజనం ఏర్పాట్లు కూడా చేసి వచ్చిన పని ఏమిటని అడిగాడు. కొనాల్ దాచకుండా విషయమంతా చెప్పాడు, ఆ గుర్రాన్ని సంపాదించటం లో ఏదైనా సాయం చేయగలరా అనీ అడిగాడు.    కొనాల్ చేసిన ఉపకారానికి మర యజమాని బదులు తీర్చాలనుకున్నాడు గానీ , ఆ పని ఎంత ప్రమాదమో అతనికి తెలుసు, అదే చెప్పాడు. కొనాల్-  తామంతా ఎలా అయినా చచ్చిపోయేవాళ్ళమే కనుక ఎంత ప్రమాదమైనా ఒకటేనని నచ్చజెప్పాడు . ఆ మర యజమానే రాజుగారి గుర్రపుసాలకీ  ధాన్యం సరఫరా చేస్తాడు. మర్నాడు పొద్దున పంపీంచే ధాన్యపు బస్తాలలో కొనాల్, కొడుకులూ రోజుకొకరు దాక్కుని గుర్రం ఉన్నచెటికి వెళ్ళచ్చు నని పథకం వేసుకున్నారు.

 

అలాగే తెల్లారి  చిన్నకొడుకు గుర్రాలసాల చేరాడు. మట్టిరంగు గుర్రం కనిపించింది.  దాని మీద చేయి వేయగానే పెద్ద గా సకిలించింది. రాజు గారి భటులు పరుగెత్తుకుంటూ వచ్చి అతన్ని పట్టుకుని చెరలో పెట్టారు. రాజు ఊర్లో లేడు, అందుకని ఆయన వచ్చేదాకా అతన్ని విచారించి శిక్ష వేయటం వీలు కాదు. చిన్న కొడుకు ఇంటికి రాకపోవటం తో అతను పట్టుబడ్డాడని అర్థమైంది. అయినా ప్రయత్నం మానేందుకు లేదు. రెండో కొడుకూ పెద్దకొడుకూ కూడా గుర్రాన్ని తెచ్చేందుకు వెళ్ళి పట్టుబడిపోయారు. అదృష్టం కొద్దీ రాజు గారు ఇంకా ఊర్నుంచి రాలేదు, వాళ్ళు ప్రాణాలతోనే ఉన్నారు. ఆఖరి రోజున కొనాల్ కూడా వెళ్ళాడు, అతని వల్లా కాలేదు, బంధించారు. రాజు ఆ రోజు కొలువుకి వచ్చాడు, అందరినీ ఒకేసారి హాజరు పెట్టారు.

రాజు ” మీరు చెప్పుకునేదేమైనా ఉందా ? ఇంత సాహసం దేనికి చేశారు ? ” అడిగాడు.

 

కొనాల్ ” తప్పనిసరయింది మహారాజా ! గుర్రాన్ని తీసుకెళ్ళకపోతే నా కొడుకులందరి ప్రాణాలూ పోతాయి. అడిగితే మీరు ఇవ్వరని దొంగిలించాల్సి వచ్చింది. మీరేం చేసినా సిద్ధంగా ఉన్నాం ” అన్నాడు.

రాజు – ” ఇంత ప్రమాదం లో పడ్డారు కదా, ఇంతటి  ప్రమాదకరమైన పరిస్థితిలో ఇదివరకెప్పుడైనా ఉన్నావా ? చెప్పు. నాకు అది నిజమని తోస్తే నీ కొడుకులలో ఒకరిని వదిలిపెడతాను ”

కొనాల్ కాసేపు ఆలోచించి – ” ఉన్నాను మహారాజా , ఇంతటి  ప్రమాదం లో ఒకప్పుడు ”

చెప్పటం మొదలుపెట్టాడు.

” నా చిన్నతనం లో మా నాన్నకి చాలా పొలమూ ఆవులూ ఉండేవి. ఆవులన్నీ మాకు  పదిమైళ్ళ దూరం లో , అడవి అవతలి  మైదానం లో ఉండేవి.  ఒకసారి వాటిలో ఒకటి దూడని పెట్టింది. ఆవునీ దూడనీ ఇంటికి తీసుకు రమ్మని మా నాన్న నన్ను పంపాడు. నేను అలాగే వాటిని తోలుకొస్తూ ఉంటే ఉన్నట్లుండి వాన మొదలైంది. రాత్రయిపోయింది కూడా.  దారి పక్కనే ఉన్న పాకలో తలదాచుకున్నాం. జల్లు కొట్టకుండా  తడిక తలుపు  ని బిగించాను. కాసేపటికి ఎవరో తలుపు తోసిన చప్పుడు.  వెళ్ళి తీశాను. నన్ను తోసుకుంటూ పిల్లుల మంద ఒకటి లోపలికి జొరబడింది.   అవి మామూలు పిల్లులు కావు, ఒక్కొక్కటీ ఆవు దూడ కంటే పెద్దగా ఉన్నాయి.  వాటిలో ఒంటి కన్ను పిల్లి ఒకటి అన్నిటి కన్నా పెద్దగా, భయంకరంగా ఉంది. తక్కిన పిల్లులు అన్నీ కలిసి చెవులు చిల్లులు పడేలాగా బిగ్గరగా అరవటం మొదలెట్టాయి. అవి అరవటం ఆపాక పెద్ద పిల్లి మనిషి భాషలో ” కొనాల్, నీ గౌరవార్థం మా వాళ్ళు కచేరీ చేశారు కదా, వాటికి ఏం బహుమతి ఇస్తావు ? ” అని అడిగింది. నాకు పైప్రాణాలు పైనే పోయాయి.

అది మళ్ళీ అంది – ” ఆకలి…మాకు తిండి కావాలి ”

నేను గొంతు పెగుల్చుకుని ” ఇక్కడేముంది ? ” అన్నాను.

” నీ ఆవూ దూడా లేవూ ? ” అని వాటి మీద పడి తినేశాయి.ఏమీ చేయలేక, ఆ భీబత్సం చూడలేక కళ్ళు మూసుకున్నాను

మళ్ళీ అరిచాయి, మళ్ళీ పెద్ద పిల్లి బహుమానం అడిగింది.

” ఇంకేమున్నాయి ? ”

” నువ్వు లేవూ ? ”

celts4

పక్కనే ఉన్న కిటికీ కంత లోంచి దూకి అడవిలోకి దౌడు తీశాను, అవి నా వెంటబడ్డాయి. కనిపించిన చెట్టు ఒకటి ఎక్కి చిటారు కొమ్మ మీద కూర్చున్నాను. పిల్లులు నన్ను పసిగట్టి వచ్చి కింద కాపు వేశాయి. అవి పైకి ఎక్కలేవు కాబోలు.  చెట్టుని పడగొట్టేందుకు దాని వేళ్ళు తవ్వటం మొదలుపెట్టాయి. చెట్టు సగానికి పైగా పడిపోయింది. ఇక నా పని అయిపొయినట్లేనని అనుకుంటూ ఉండగా పెద్ద కలకలం వినిపించింది. కొందరు వేటగాళ్ళు గుంపు గా ఆవైపుకి వచ్చారు. పిల్లులని ఎదుర్కొన్నారు. హోరాహోరీ యుద్ధం.  వాళ్ళ చేతుల్లో బరిసెలూ ఈటెలూ ఉన్నా కూడా ఇద్దరు ముగ్గురికి బాగా గాయాలైనాయి. చివరికి ఎలాగైతేనేం, దయ్యపు పిల్లులన్నిటినీ చంపేసి వాళ్ళు నన్ను రక్షించారు.అప్పటికి తెలతెలవారుతూ ఉంది.  పదే పదే వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుని మా ఊరికేసి బయల్దేరాను. మహారాజా ! మీరు నన్ను ఏం చేసినా సరే, ఆ పిల్లుల చేతిలో చచ్చి ఉండటం కన్న భయంకరం కాదనిపిస్తుంది ”

రాజు నిజమేనని ఒప్పుకుని  కొనాల్ ఆఖరి కొడుకుని విడుదల చేశాడు-  ” ఇంకా నీ జీవితం లో ఎదురైన ప్రమాదాలేవైనా ఉంటే చెప్పు. అవి  ఇంత భయంకరమైనవేనని నాకూ  అనిపిస్తే నీ తక్కిన కొడుకులనీ విడిపించే ఆలోచన చేస్తాను  ”

కొనాల్ మళ్ళీ కాసేపు ఆలోచించి – ” ఆ. ఇంకొక సంఘటన ఉంది మహారాజా !

ఒకరోజున అడవిలో వేటాడేందుకు వెళ్ళి దారి తప్పాను. తిరగ్గా తిరగ్గా దూరంగా రెండు కొండల మధ్యనుంచి పొగ రావటం కనిపించింది. అక్కడ మనుషులు ఉండచ్చుననుకుంటూ ఆ వైపుకి వెళ్ళాను.  కొండ గుహ లో మంట మీద  మాంసం ఉడుకుతోంది, ఎవరూ కనిపించలేదు.  నాకు బాగా ఆకలేస్తోంది. వాళ్ళెవరో వచ్చి నాకింత తిండి పెట్టి దారి చూపిస్తారేమోనని కూర్చుండిపోయాను. అంతలో  మేకల అరుపులు వినిపించాయి. అయితే వాటిని తోలుకు వచ్చింది మాత్రం మనిషి కాదు, రాక్షసుడు.  నేను పారిపోయే ప్రయత్నం చేసేలోపే వాడు నన్ను పసిగట్టి మెడ పట్టుకుని పైకిలేపాడు. వాడికీ ఒకే కన్ను ఉంది, రెండోదానికి చూపు లేదు.

నాకు ఆ క్షణానే ఉపాయం తట్టింది – ” నన్ను తింటే నీకొక పంటికిందకి కూడా రాను, ఇప్పటికి వదిలావా- నీ రెండో కంటికి చూపు వచ్చేలా చేస్తాను ”- వాడితో చెప్పాను. నేనెక్కడికీ తప్పించుకుపోలేననీ, ఈ లోపు నన్ను ఉపయోగించుకోవచ్చనీ అనుకుని వాడు నన్ను కిందికి దించి, గొర్రెల మందని గుహలోకి తోలాడు.  నేను మూలికలు సేకరిస్తుంటే నా వెనకాలే వచ్చాడు. త్వరలోనే నేనొక పసరు తయారు చేసి వాడి గుడ్డి కంట్లోనూ మామూలు కంట్లోనూ కూడా పిండాను. తెల్లారేసరికి నేను అనుకున్నట్లే వాడికి రెండు కళ్ళూ కనిపించకుండా పోయాయి, కేకలు వేయటం మొదలెట్టాడు.  నేను గుహలో ఏ మూలకి నక్కినా వాడి చేతులకి అందకుండా ఉండను గనుక గొర్రెల మందని బయటికి తోలుతూ నేనూ ఒక గొర్రె చర్మం కప్పుకుని వాటితో కలిసి బయట పడ్డాను. అలాగే పారిపోకుండా దూరం నుంచి  ” నేనే గెలిచాను ” అని కుర్రతనం కొద్దీ అరిచాను.

” మెచ్చానురా. ఇదిగో, కానుక ” అని వాడు తన ఉంగరం తీసి నాకేసి విసిరాడు. నేను తీసుకుని నా వేలికి పెట్టుకున్నాను, ఆశ్చర్యంగా అది సరిపోయింది. నా సరదా ఎంతోసేపు నిలవలేదు. ” ఉంగరమా, నువ్వెక్కడ ? ” అని వాడు కేక పెట్టగానే ” ఇక్కడున్నాను ప్రభూ ” అని నా ఉంగరం జవాబు చెప్పింది. వాడు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వచ్చేస్తున్నాడు. కాలిసత్తువ కొద్దీ పరిగెత్తాను – ఎంత లాగినా వేలినుంచి ఉంగరం ఊడిరాలేదు. జేబులోంచి చాకు తీసి ఉంగరం తో సహా వేలు తెగ్గొట్టుకుని దాన్ని కొండ లోయలోకి విసిరేశాను.

” ప్రభూ, ఇక్కడ ” అని ఉంగరం కేక పెట్టింది. రాక్షసుడు దాని గొంతు వెంట లోయలోకి పడి చచ్చిపోయాడు.

మహారాజా, ఆ రాక్షసుడి చేతిలో చచ్చిఉంటే అది మీరు వేయబోయే శిక్ష కన్నా భయంకరంగానే ఉండేదనిపిస్తోంది ” కొనాల్ చెప్పటం ముగించాడు, మొండిగా ఉన్న  వేలుతో చేతిని చూపించాడు.

రాజు – ” ఎంత సాహసివి కొనాల్ ! నువ్వు చెప్పింది నిజమే, ఇంతటి ప్రమాదపు కథని నేనూ వినలేదు ” అని రెండో కొడుకునీ విడుదల చేశాడు. ” మరి మూడో కొడుకునీ రక్షించుకోవూ ? ” అడిగాడు.

celts3

కొనాల్ గుర్తు చేసుకుని చెప్పటం మొదలు పెట్టాడు.

 

” రాక్షసుడి గుహలోంచి వచ్చిన కొన్ని రోజులకి మా నాన్న నాకు పెళ్ళి చేశాడు. కుదురుగా వ్యవసాయం చేసుకోమని హెచ్చరించాడు. కొంతకాలం పాటు అలాగే బుద్ధిగా ఉన్నాను. ఒక రోజున ఏమీ తోచక సముద్రపు ఒడ్డుకి షికారు వెళ్ళాను. అక్కడొక చిన్న పడవ. దాని నిండా అందమైన వస్తువులు. వాటిని దగ్గరగా చూద్దామని ఎక్కానో లేదో, పడవ దానంతట అదే కదలటం మొదలెట్టింది, ఎంత ఆపాలన్నా ఆగలేదు. దేవుడి మీద భారం వేసి ఊరుకోవాల్సివచ్చింది. కాసేపటికి  ఒడ్డు చేరింది – అదొక దీవి. కొంత దూరం లో ఒకావిడ ఇద్దరు పిల్లలతో కనిపించింది-  చిన్న  మూడేళ్ళ  పాప, ఏడాది వయసున్న పసి  బిడ్డ . ముగ్గురూ సంపన్నమైన కుటుంబానికి చెందినవాళ్ళ లాగా ఉన్నారు.  ఆమె చిన్న కత్తిని బిడ్డ గొంతుకి ఆనించి పొడవబోతోంది, వాడు దాన్ని పట్టుకుని ఆడుకుంటున్నాడు. ఆమె కత్తి విసిరేసి – ” నా వల్ల కాదు ” అని బిడ్డని గుండెకి హత్తుకుని ఏడుస్తోంది. నాకు అంతా అయోమయంగా అనిపించి – ” ఏమమ్మా, ఏమిటి నీకు అంత కష్టం ? ” అని అడిగాను. ఆమె ముందు నాకేమీ చెప్పలేదు, ఎక్కడినుంచీ ఏ సాయమూ రాదని నిరాశ చేసుకున్నట్లుంది. అడగ్గా అడగ్గా విషయం తెలిసింది. ఆవిడ నాలాగే షికారుకి వచ్చి పిల్లలతో సహా పడవ ఎక్కి ఈ దీవికి చేరింది. అదంతా దీవి మధ్యన రాతికోటలో ఉండే రాక్షసుడి పురమాయింపు- అలా వచ్చిన మనుషులని వాడు చంపి తింటూ ఉంటాడు. ఆమెకోటలో దొరికినవాటితో రకరకాలుగా , రుచిగా వంట చేసిపెడుతూ రాక్షసుడిని కొద్ది రోజులు తమని చంపి తినకుండా ఆపింది గానీ రాక్షసుడు ఇంక ఏమారటం లేదు. ముందు పసిబిడ్డని చంపి తనకి వండి పెట్టాలనీ లేదంటే ముగ్గురినీ ఒకేసారి చంపేస్తాననీ ఆ రోజు ప్రకటించాడు. అప్పటికే సగం మతి చెదిరి ఉన్న ఆమె ఆ పని చేసి పాపని రక్షించుకుందామా అని ఆలోచిస్తూ ఆ పని చేయబోయింది.

” ఇవాళ ముగ్గురం ఒకేసారి చస్తాం, ఒక బిడ్డ కోసం మరొకరిని చంపటం రాక్షసులు కూడా చెయ్యలేరు ” ఆమె అంది.

” అలా అక్కర్లేదు లేమ్మా ! నేను చెప్పినట్లు చేస్తే అందరమూ తప్పించుకోవచ్చు ” అని ఆమె ని కొన్ని ప్రశ్నలు అడిగి  ఒక ఉపాయం చెప్పాను. ఆ ప్రకారం పిల్లలిద్దరినీ గదిలో నిద్ర పుచ్చి తాళం వేసి,  కోటలొ ఉన్న పెద్ద గంగాళాన్ని పొయ్యి మీద పెట్టి నేను అందులోకి ఎక్కి కూర్చున్నాను. ఆమె అందులోకి నీళ్ళు నింపి చాలా సన్నగా మంట పెట్టింది. రాక్షసుడు వచ్చి ” బిడ్డని వండటం అయిందా ? ” అని అరిచాడు.

” ఇంకా పూర్తి కాలేదండి ” ఆమె జవాబు చెప్పింది.

” మంట ఇంత సన్నగా పెడితే ఎప్పటికి ఉడికేను ” అని వాడు మంటని బాగా ఎగదోసి పక్కనే నడుము వాల్చాడు. భోజనం చేసే ముందర వాడు కునుకు తీస్తాడనీ, వాడు తన చేత్తో పట్టుకు తిరిగే పెద్ద బల్లెం తప్ప కోట లో ఇంకే ఆయుధాలూ లేవనీ ఆమె చెప్పి ఉంది. రాక్షసుడు గుర్రు పెట్టేలోపు గంగాళం భయంకరంగా వేడెక్కింది- నా చర్మం బొబ్బలెక్కిపోతోంది. అప్పటికి ఆమె మూత ఎత్తి ” బతికే ఉన్నారా ? ” అని అడిగింది. ” కొసప్రాణం ఉంది ” అంటూ నేను బయటపడిరాక్షసుడి పక్కన ఉన్న బల్లాన్ని రెండు చేతులతో బలం గా పైకెత్తి వాడి కళ్ళ మధ్య పొడిచాను- వాడు కిక్కురుమనకుండా చచ్చాడు. రేవులో సిద్ధంగా ఉన్న పడవ ఎక్కి అవతలి ఒడ్డుకి చేరాం. ఆమె నా కాళ్ళ మీద పడి ధన్యవాదాలు చెప్పుకుని,  పిల్లలతో తన దారిన తను వెళ్ళింది. ”

కొనాల్ కథ ముగిస్తూనే రాజ సభ వెనక భాగం నుంచి ఒక పెద్దావిడ వచ్చి – ” ఆ రోజు నన్నూ పిల్లలనీ రాక్షసుడి నుంచి రక్షించింది నువ్వేనా నాయనా ? ” అని అడిగింది. కొనాల్ ఆమెని పరికించి చూసి గుర్తు పట్టి – ” అవునమ్మా, నేనే ” అన్నాడు.

ఆవిడ – ” నీ ఋణం ఎన్ని జన్మలెత్తితే తీరుతుంది …ఇదిగో, ఇతనే నువ్వు రక్షించిన పసిబిడ్డ ” అని రాజుని చూపించింది.

అక్కడున్న  వాళ్ళంతా ఆశ్చర్యం తో తలమునకలయారు. రాజు సిం హాసనం మీదనుంచి లేచి కొనాల్ చేతులు పట్టుకుని – ” ఎన్ని కష్టాలు పడ్డావు…నువ్వు మాకు చేసిందానికి నేను ఈ గుర్రాన్ని ఇవ్వటం ఏపాటిది ” అని  దాంతోబాటు సంచులకొద్దీ వెండి బంగారాలనీ రత్నాలనీ విలువైన పట్టుబట్టలనీ తెప్పించి ఇచ్చాడు. తన పక్కనే కూర్చోబెట్టుకుని విందు చేశాడు. రాజు తల్లి  ప్రత్యేకంగా కొనాల్ భార్య కోసం కానుకలు ఇచ్చింది. కొద్ది రోజులు వాళ్ళ తో గడిపి కొనాల్ కొడుకులతో సహా తిరిగి వెళ్ళాడు. వాళ్ళని మళ్ళీ చూస్తానని అనుకోని కొనాల్  భార్య ఆనందం పట్టలేకపోయింది.  గుర్రాన్ని తీసుకున్న జమీందారు, జరిగిందంతా విని కొనాల్ కొడుకులని క్షమించాడు.

                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                [ సెల్టిక్ జానపదకథ కి స్వేచ్ఛానువాదం.

                                                                                   సేకరణ – John Francis Campbell ]

మీ మాటలు

  1. చాలా రోజులైపోయింది ‘ గాజు కెరటాల మీద ఇంత వెన్నెల ‘ చూసి , ఒక్క కధలో మూడు సాహస కధలు , భలే ఉన్నాయి , కాస్త తెగని ఉత్కంఠ కూడా ! Thank you so much Mam :)

  2. ఆర్.దమయంతి. says:

    ఎంత బావున్నాయో కథలన్నీ! చక్కటి అనువాదం.

  3. అబ్బా …ఏకబిగిన చదివించేసారు. ఇంత చక్కగా అనువాదం చేస్తే, నేను ఇంక తెలుగు అనువాదాలే చదువుతాను… ఇంగ్లీష్ వదిలేసి

  4. Mythili abbaraju says:

    థాంక్ యూ సురేష్ :)

  5. Sitharentala says:

    భాలేగావుంది కధ!మళ్ళీ చందమామ రోజు ల్లోకి తీసుకెళ్ళారు.మీ శైలి చాలా బాగుంటుంది ఇట్ expresses రియల్ ఫీల్. సో it mesmerises us

  6. RAVINDRANATH NALAM says:

    భలే భలే ఎంత బాగుందో , 67 ఏళ్ళ వాడిని 6/7 ఏళ్ళ వాడి లాగా మారి పోయి ,అబ్బురముగా చదువుకున్నా.. చిన్నప్పటి సింద్బాద్ కథలు గుర్తుకు వచ్చాయి అబ్బ్బరాజు మైథిలి గారు. మరిన్ని కధలను అందించరూ?

    మా అమ్మాయి పేరు కూడా మైథిలి నే

  7. శ్రీ కొడవటిగని కుటుంబరావు గారు చందమామ కి ఒరవడిగాపెట్టిన చక్కటి సులభ గ్రాహ్యమైన భాషలో మీరు చక్కగా ఆంధ్రీకరించి అందించిన కదా చదువుతుంటే చిన్నప్పటి చందమామ కదా చదువుతున్న ఆనందం కలిగింది తల్లి
    ఈతీరులొ మరిన్నికధాలు మీ కలం నుండి రావాలనికోరుకుంటున్నానమ్మ
    శుభాకాంక్షలతో
    గాడేపల్లి బ్రహ్మానంద శాస్త్రి
    చలన వాణి 919035014046

మీ మాటలు

*