బాధాపుష్పం.

mandira

Art: Mandira Bhaduri

-వాసు 

~

 

కమలం సూర్యుడినీ కలువ చంద్రుడినీ చూసి వికసిస్తాయని కవులు చెబుతారు
ఈ బాధాపుష్పం నన్ను చూసి వికసిస్తోందేంటి
దీని కోసమే నేను పుట్టినట్టు.
స్వచ్ఛమైన కన్నీటిచుక్కని నా పసిబుగ్గలపైనైనా ఎన్నడూ ఎరగను.
ఈ బాధాపుష్పం మాత్రం తన రేకలని నాకు తాకించింది
దానికీ కన్నీటిచుక్కల్ని కోల్పోవడం తెలుసేమో
లేకపోతే నీకోసం నేనున్నానంటూ ఎందుకొస్తుందీ?
పగటి అనుభవాల పోగులన్నీ రాత్రికల్లా పీడకలల్లా మారడం తెలిసినవాడికి
ఈ బాధాపుష్ప సాహచర్యం ఒక దైవదత్త వరం కదూ
ఈ పరిమళాఘ్రాణమే బరువెక్కిన కళ్ళవెనకని కారని కన్నీటిచుక్క చెలి కదూ
ఎన్నేళ్ళని చూస్తున్నాను
ఎన్ని ప్రేమామృతధారల్ని నేను వర్షించినా
విషసర్పాలు వెయ్యినోళ్ళతో తాగేసి వేయిన్నొక్క దంష్ట్రతో నన్ను కాటేస్తాయి
నొప్పి తెలుస్తుంది కేక పెట్టలేను.
ఎంత సహజ హరితాన్ని పూచిచ్చినా
ఏదో మాయాగ్రీష్మం ఎండగట్టేస్తోంది.
నాకు నమ్మకం చావదు కదా!
పునరపి.
ఎడారికి ఒయాసిస్ చెమర్చిన కన్ను
సరిగ్గా ఈ బాధాపుష్పం నాకూ అంతే
ఇదే లేకపొతే
నేనొక మొండిచెట్టుని
దీన్ని భక్తిగా కళ్ళకద్దుకుంటాను ప్రతిరోజూ పూజగదిలో మంగళాశాసనం తదుపరి
అప్పుడు నాకు నేనే ఒయాసిస్‌ని.

*