కవిత్వపు తోటలో పాటల చెట్టుతో ఓ సాయంత్రం

gorat1

కవిత్వపు తోటలో విహరించడమే ఒక వరమైతే… అందులో పాటల చెట్టు ఎదురైతే.. అంతకన్నా అదృష్టం మరేముంటుంది. అదే ఈ సాయంత్రం. మరపురాని అనుభూతుల్ని మిగిల్చిన సాయంత్రం.

జీవితమనే ప్రయాణంలో ఎంతోమంది కలుస్తుంటారు. కొంతమంది కలయిక మనలో నూతన చైతన్యాన్ని, ఉత్సాహాన్ని, ఒక్కొక్కసారి గుర్తింపుని ఇస్తుంది. అలా ఎంతోమంది యువకవుల్లో చైతన్యాన్ని, ఉత్సాహాన్ని నింపుతూ…. గుర్తింపు దిశగా అడుగులు వేయిస్తున్న మార్గదర్శి కవి యాకూబ్.

ప్రవహించే జ్ఞాపకాలతో ఎడతెగని ప్రయాణం చేస్తూ… సరిహద్దు రేఖల్ని దాటుకుంటూ కవిత్వలోకంలో విహరిస్తున్న విహంగం అతడు. తనతోపాటు ఎంతోమందిని తన దారిలో నడిపిస్తున్న కవిత్వప్రేమికుడు. జీవితపు అవతలి తీరాన్ని చూపిస్తున్న దిక్సూచి.

ఎన్నో నెలలుగా తన ఇంటికి ఆహ్వనిస్తున్నా… పని ఒత్తిడులతో వెళ్లలేని పరిస్థితి. ఆయన రమ్మనడం… నేను ఏదో ఒకరోజు వస్తాననడం పరిపాటిగా మారింది. ఇక ఈ రోజు ఎలాగైనా వెళ్లాలని నిర్ణయించుకొని, ఫోన్ చేశా… అవతలివైపునుండి ‘నమస్తే అన్న’ అని తీయని పలకరింపు… సార్ మీరు నన్ను ‘అన్నా’ అనడమేంటి అని అడిగా… మా కవిత్వంకోసం ప్రతినెలా మీ వేదికను మాకిస్తున్నారు, నువు నాకు అన్నవి కాక మరేంటి అంటూ నవ్వులతో సమాధానం.

సార్ మీ ఇంటికి వస్తున్నా అనగానే.. అలాగే నాన్న.. తప్పకుండా.. అంటూ ఇంటి అడ్రస్ చెప్పారు. తెలియదు సార్ అంటే ఏంపర్లేదు.. చైతన్యపురి బస్టాప్ కి రా అక్కడినుండి నేను తీసుకెల్తాగా అన్నారు. మొదటిసారి తన ఇంటికి వెల్తున్నాకదా… ఇంకెవరైనా తోడుంటే బాగుండు అనిపించింది. మిత్రులు కట్టా శ్రీనివాసరావు గారు కూడా కలుస్తానన్నవిషయం గుర్తొచ్చి తనకి ఫోన్ చేయగా.. ఆయనా సై అన్నారు. హమ్మయ్య… ఒక పనైపోయింది అనిపించింది.

అప్పటికి సమయం 4.30ని.లు. నేను ఉన్నది అబిడ్స్. బస్ లో ప్రయాణం. ఆలస్యమవుతుందేమోనన్న టెన్షన్. మొదట కోఠికి వచ్చాను. అక్కడ చాలామంది జనం. 10ని.లు ఎదురుచూపు. ఆతర్వాత వచ్చిన హయత్ నగర్ బస్ ఎక్కాను. మండే ఎండలో, కిక్కిరిసిన బస్ లో శరీరం వేడెక్కుతున్నా… ఈ సాయంత్ర విశేషాన్ని ముందే పసిగట్టిందేమో… మనసు మాత్రం ఉల్లాసంగానే ఉంది.

5.30ని.లకు చైతన్యపురిలో దిగి, కట్టాగారికి ఫోన్ చేస్తే.. మరో 15ని.లు పడుతుందన్నారు.

5.45 అయింది. కాని రాలేదు. ఇంతలో యాకూబ్ గారినుండి ఫోన్. బస్టాప్ లో ఉన్నా అని చెప్పగానే.. 5 ని.లో బైక్ తో ప్రత్యక్షం. ఇద్దరం కల్సి ఇంటికి పయనమయ్యాం.

*****

ఇంటి ఆవరణలోకి ప్రవేశించగానే ఏదో కొత్త అనుభూతి. కవిత్వపు తోటలోకి విహారానికి వచ్చినట్లనిపించింది…. చల్లని పందిరిపై ఉన్న మల్లెతీగ తన కొమ్మలను పందిరంతా పరచుకొని, తన పూల సువాసనతో నాకు స్వాగతం పలికింది. ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూనే గుమ్మం దగ్గరికి వెళ్లా…ఎదురుగా ఉన్న గోడకి ఒక పోస్టర్. దానిపై

‘‘గొప్పవారు కావడానికి డబ్బుకాదు ముఖ్యం

కష్టించి పనిచేసే తత్వం. ఉన్నత వ్యక్తిత్వం

ఈ రెండూ ఉంటే అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి

ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే

విజయం పది అడుగులు ముందుకు వేస్తుంది’’

అన్న ఠాగూర్ మాటలు కనిపించాయి. ఆహా… ఎంత చక్కటి ప్రేరణ. గుమ్మంలోనే యాకూబ్ గారి స్పూర్తి తెలిసిపోతుంది. అందుకేనేమో యాకూబ్ గారి ఇంటికి యువకవులంతా దారులు కడతారు.

ఇంటిలోనికి అడుగుపెట్టగానే లోపల సాహిత్య వారధలు శిలాలోలిత గారు, కట్టా శ్రీనివాసరావు గారు, బేబి రక్షిత సుమలు నాకోసం ఎదురుచూపు. కుశల వివరాలు, టీ స్నాక్స్ తో 15 ని.లు గడిచింది. ఆ సమయంలో యాకూబ్ గారు తనకు వచ్చిన జ్ఞాపికలను చూపిస్తూ… వాటి నేపథ్యాన్ని వివరించారు.

6గం.లకు వికీపీడియాలో ఎడిటింగ్ ప్రారంభించాం. కట్టా శ్రీనివాసరావు గారికి లాప్ టాప్ అప్పగించి, వికీలో యాకూబ్, శిలాలోలిత గార్ల గురించిన వ్యాసాలను రాశాము.

సమయం 9 గం.లు. బయటిరూంలో ఎవరో వచ్చిన శబ్దం వినిపించింది. ఆ వ్యక్తి ఎవరో అని చూడగా… ఎదురుగా పాటల చెట్టు గోరటి వెంకన్నభోజనం చేస్తూ కనిపించారు. ఎంత అదృష్టం. ఇప్పటివరకు టి.విల్లో చూసిన ఆయన ఈరోజు నాముందు, నాకు దగ్గరగా ఉండడం. చిన్నప్పుడు ఆయన పాటలు విని, పుస్తకాల్లో రాసుకొని, పాడుకునేవాణ్ణి.

 

వికీపీడియా పని పూర్తిచేసి, కట్టా గారితోకల్సి హాల్లోకి వచ్చాను. యాకూబ్, వెంకన్నలుకబుర్లలో ఉన్నారు. అపుడు సమయం 9.30ని.లు. ఇంకా ఆలస్యమైతే బస్సులుఉండవన్న ఆందోళన ఒకవైపు, వెళ్లిపోతే ఈ వాతావరణాన్ని మిస్ అవుతానన్న ఆలోచనమరోవైపు. ఉండడానికే మనసు మొగ్గుచూపింది. అందరం కల్సి ఫోటోలు దిగాము.

యాకూబ్, వెంకన్నలుకల్సి కవిత్వాలు, చీమకుర్తి వారి పద్యాలు పాడుతున్నారు. వాళ్ల ప్రవాహానికి అడ్డుగా ‘సార్ లేటవుతుంది. ఇక వెల్తాను’ అన్నాను. ‘లేదు లేదు తిని వెళ్లాలి’ అని అమ్మగారి ఆర్డర్. ‘మొదటిసారి మా ఇంటికొచ్చావ్, భోజనం చేయకుండా వెల్తావా’ అని యాకూబ్ గారి ప్రశ్న.

క్షణాల్లో భోజనం ప్లేట్లతో మేం సిద్ధమవగా… తన గానంతో వెంకన్న సిద్ధం. మీకు అన్నంతోపాటు నా పాటల్నికూడా రుచిచూపిస్తా అంటూ మొదలుపెట్టాడు. ఇంతకుముందు తను రాసిన పాటలు పాడుతూ.. అందులో వచ్చిన పదాలతో అప్పటికప్పుడు ఆశుగా పాటలుపాడుతూ మమ్మల్ని గానలోకంలో విహరింపజేస్తున్నాడు.

ఆహ… ఆ అనుభూతే వేరు. వేడి వేడి అన్నంలో పప్పు, ఆవకాయ, నెయ్యి కలిపి తింటున్న రుచి ఒకవైపు… వెంకన్న గానం మరో వైపు. ఇంతకంటే స్వర్గం మరోటి ఉంటుందా అనిపించింది.

అపుడు లచ్చువమ్మా పాట పాడాలని యాకూబ్ గారు కోరగా…

‘‘పారే ఏటి అలలమీదా పండుటెన్నెల రాలినట్లు

ఊరే ఊటా సెలిమలోనా తేటనీరు తోలకినట్లు

వెండి మెరుపుల నవ్వునీదో లచ్చువమ్మో

నీవింత సక్కని రూపమేమో లచ్చువమ్మా……

మంచె ఎక్కి కేకబెడితే కంచిమేకలు సుట్టూ జేరును

నీ అల్లరిని ఆలేగదూడలు ఒళ్లేకొచ్చి ఒదిగిపోవును

పాలిపోయిన కందిసేనే లచ్చువమ్మో

నువు పాట పాడితే పూతబడుతది లచ్చువమ్మా….

కోడికూతకు ముందూలేసి పేడనీళ్ల కళ్లాపి జల్లి

ముచ్చటొలుకా ముగ్గూలేసే మునివేలి గోరుపైనా

ఆ పొద్దే ముద్ద గోరింటైతది లచ్చువమ్మో

పొడ ఎండ నీ మెడలారమైతది లచ్చువమ్మా…..

నీ కాలిఅందెల సవ్వడికి తాబేళ్లు ఇసుకల గంతులేస్తవి

జాలిగల నీ చూపులకు తోడేళ్లు సాధు జీవులైతవి

దారిలో పల్లేరు ముళ్లే లచ్చువమ్మో

నువు కాలు మోపితే మల్లెలౌతవి లచ్చువమ్మా…..’’ అంటూ

లచ్చువమ్మ పాటను అందుకున్నాడు వెంకన్న. ఆయన పాడుతున్న తీరు చూస్తుంటే ఆ లచ్చువమ్మ నేపథ్యం మా కళ్లముందు కదలాడింది. చక్కని పదాలతో, అంతకంటే చక్కని పోలికలతో లచ్చువమ్మని వర్ణించడం అద్భుతం అనిపించింది. అలా మా భోజనం తృప్తిగా ముగిసింది.

ఇక మళ్లీ కచేరి. మేంఅందరం వెంకన్న చుట్టూ చేరి ఒక్కో పాటను అడుగుతున్నాము. తను కూర్చున్న సోఫాపై దరువులు వేస్తూ పాడుతున్నాడు. అది చూసిన యాకూబ్ చిన్న టేబుల్ తెచ్చాడు. అపుడు ఆ టేబుల్ పై దరువులు వేస్తూ…

 

‘‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల

నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల…….

 

కుమ్మరి వామిలో తుమ్మలు మొలిచెను

కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను

పెద్దబాడిస మొద్దు బారినది

సాలెల మగ్గం సడుగులిరిగినవి

చేతి వృత్తుల చేతులిరిగిపాయే నా పల్లెల్లోనా

అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోనపాయే ఈ దేశంలోనా…

 

మడుగులన్ని అడుగంటి పోయినవి

బావులు సావుకు దగ్గరైనవి

వాగులు వంకలు ఎండిపోయినవి

చాకలి పొయ్యిలు కూలిపోయినవి

పెద్దబోరు పొద్దంతా నడుస్తుందో బలిసీన దొరలది

మరి పేద రైతు బావులెందుకెండే నా పల్లెల్లోనా…..’’ అంటూ గ్రామంలో కూలిపోతున్న బతుకుల గురించి చిన్నచిన్న పదాలతో కూడిన శబ్ధసౌందర్యం మరింత అందానిచ్చిన ఈ పాటను వింటున్నంతసేపు ఒక చక్కని అనుభూతిని కలిగించింది. యాకూబ్ గారితోపాటు మేం కూడా శృతి కలిపాం…

అలా అలా సాగుతున్న పాటల ప్రవాహంలో మధ్యమధ్యలో తమ అనుభవాలను, వాటిద్వారా వచ్చిన పాటల, కవిత్వాల గురించి గోరటి వెంకన్న, యాకూబ్ లు వివరించారు.

ఇతర రచయితలు, వారి సాహిత్యంపై కూడా తన ప్రసంగాన్ని వినిపించాడు వెంకన్న. ఏ రచయిత శైలి ఏవిధంగా ఉంటుందో వివరిస్తుంటే… ఇంతమందిని చదివాడా అని ఆశ్చర్యం వేసింది. అలా అలా తన ప్రవాహం ప్రవహిస్తునే ఉంది.

gorat2

కొంతసేపటితర్వాత తన ఎడతెగని ప్రయాణం పుస్తకంలో వెంకన్న గురించి రాసిన కవిత్వాన్ని,

‘‘అతడిరాకను ఇట్టే గుర్తుపట్టగలను…

దూరంనుంచే ముక్కుపుటాల్ని చేరుకునే

స్నేహగంధం నాకుముందే అతడిరాకను చేరవేస్తుంది

మనదగ్గరున్నదేదో మనమే విసిరేసి

తిరిగి దానికోసమే యుగాలుగా వెతుక్కుంటున్నట్లు

అతడి సమక్షాన్ని గుర్తుపట్టకుండా

అతడి కోసం ఎదురుచూస్తూ గడిపేస్తుంటాం

గుర్తుకొస్తూ మరపులోకి వేగంగా జారిపోయే

మాఊరి కొండల వెనుక దాచివుంచిన

నా బాల్యపు సంపాదనంతా తాను చూసివచ్చి

నాకే ఎరుక పరుస్తున్న అతడి రుషిత్వం అబ్బురపరుస్తుంది’’

శిలాలోలిత గారు స్నేహితుని గురించి రాసిన కవిత్వాన్ని యాకూబ్ గారు మా అందరికి వినిపించగా… యాకూబ్ గారి ఊరైన రొట్టమాకు రేవు, దాని చెరువు గట్టు గురించి వెంకన్న అప్పటికప్పుడు కవిత్వాన్ని అల్లి వినిపించాడు.

బేబి రక్షిత సుమ రాసిన కవిత్వాలను కూడా చూసి, ‘ఇంత చిన్నవయసులోనే ఎంతగా ఆలోచిస్తున్నావ్ తల్లీ’ అంటూ అభినందించారు.

సమయం 10.30ని.లు అవుతుండగా అందరం వాకిట్లోకి వచ్చాం. ముందుగా వెంకన్న గారు బయలుదేరగా… కట్టా గారు తర్వాత బయలుదేరారు. ఇక మిగిలింది నేనే. యాకూబ్ గారు నాకోసం బైక్ తీసారు. అమ్మగారి దగ్గర సెలవు తీసుకోని బయలుదేరాను.

ఎంతో ఆనందాన్ని, ఎన్నో అనుభూతుల్ని మిగిల్చిన ఈ సాయంత్రం… నాకెంతో అపురూపం.

-ప్రణయరాజ్ వంగరి