లోలోపలే మరణిస్తున్న ఎందరో….

నాలుగు వందల సంవత్సరాల వివక్షా పూరిత గాలులలో ఇప్పటికీ విషం చెరిగే అసత్యపు సాంస్కృతిక మూస ధోరణులు, జాతి మరీచికల నడుమ మనిషికి మనిషికి మధ్య ముఖ్యంగా నల్లజాతి మనిషికి తెల్లజాతి మనిషికి మధ్య  ముడి నగ్న సత్యాల మార్పిడి అత్యవసరం అంటారు  మనందరం చదివి ఔపోసన పట్టిన “రూట్స్” రచయిత అలెక్స్ హేలీ . మరి వేల ఏళ్లకి పైగా రంగు తేడాలు లేకుండానే వివక్షలననుభవిస్తున్న16.6 శాతం షెడ్యుల్ క్యాస్ట్స్ ఇంకో 8.6 శాతం షెడ్యుల్ ట్రైబ్స్ గొంతెత్తి చెప్తున్న నగ్న నిజాలని హత్తుకొనే ధైర్యం లేకపోయినా కనీసం రెండు చెవుల మధ్య మెదడు తెరచి పెట్టుకొని వినే క్షమత అయినా మిగిలిన వాళ్లందరికీ ఇప్పుడు ఉందా అన్నదే ప్రశ్న .

రెండున్నరేళ్ళ క్రితం ఎంపికైన బ్యాలెట్ల రక్తం నిరంతర బలవంతపు సామాజిక సంఘీభావాలు  , నియంతృత జాతీయవాదాలుగా మారిపోయి నిరపరాధులను అమాయకులను హతమార్చడం ,ఇన్నోసెంట్ పీడిత మేధావుల అణచివేతకు కేరాఫ్ అడ్రెస్గా ప్రభలుతూ, గాంధీ స్థానంలో గాడ్సే ఆరాధకుల హంతక ముఖచిత్రాలు ముద్రించుకుంటున్న నయా మూఢభారతం అసలు వినిపించుకొనే పరిస్థితిలో ఉందా అని  ?

సరిగ్గా ఏడాది ఇప్పటికి, ఒక ధిక్కారాన్ని హత్య చేసి ! బ్రాహ్మణ వాదాన్ని భుజాన మోసిన గౌతమీ పుత్ర శాతకర్ణి, తల్లికిచ్చిన మర్యాదల కథలకి  కదిలిపోయి ఈ రోజుకి సైతం కన్నీరు పెట్టుకొనే సమాజం రోహిత్ వేముల తన కులమేమిటో నిర్ణయించుకొనే హక్కు మాత్రం తల్లి పేగు నుండి విడదీసి తండ్రి మొలకి చుట్టి చప్పట్లు కొడుతున్న అదే ప్రజల సమాజంగా రెండు నాలుకల పితృస్వామ్య నిసిగ్గు ధోరణికి పరాకాష్టగా నిలబడుతున్నప్పుడు ఇక్కడ ప్రశ్నలు మూగబోవట్లేదా ? సమాధానాలు నిశబ్దంగా సజీవ సమాధి కాబాడటం లేదా ? ఇహ ఇక్కడ వినేవాళ్ళు ఎవరు అసలిక్కడ  ?

ఇప్పుడిక్కడ సంస్థాగత హత్యని యేమార్చి, హంతకులని అట్రాసిటీ కేసులనుండి తప్పించడమే మిగిలిన పరమ ధర్మం అయినప్పుడు దేవుడి సాక్షిగా సైన్సు పీఠాధిపతులు మధ్య ప్రధానమంత్రి చేతి నుండి ప్రతిభావంతుల తలారులు మిలేనియం అవార్డులు పొందుతారు . హత్యను ప్రేరేపించిన పరిమిత నేషనలిజపు పెద్ద తలకాయలు ఆధిపత్య జెండాలు ఎగరేయడానికి కొత్త అధికార కేంద్రాల మధ్య అదలాబదిలీ ఆటాడుకుంటుంటాయి. ప్రతిసారి పాయిజన్లు పరాన్న జీవులు కలగలిసిన తప్పుడు విశ్వాసాల ప్రమాణాల మధ్య  ప్రాదేయపడుతున్న హక్కుల వికాసం మళ్ళీ మళ్ళీ ఒక రోహిత్ వేములగా ఉరికొయ్యకి వేలాడుతుంది. అందుకేనేమో ఇప్పుడిక్కడ నిశబ్ధం కూడా చోటుచేసుకోనంత అనంత శూన్యమే మిగిలినట్టు కనిపిస్తుంది .

బహుశ అధికార నియంతృత్వ మీడియాలో కాకపోయినా కనీసం సోషల్ మీడియాలో సైతం భావప్రకటనా స్వేచ్చ కరువైపోయాక, పౌరుషాలన్నీ ఎటిఎం క్యూల ముందు డీలా పడి స్వీయసంపాదనలలో పావలాకి  అర్ధకి యాచకులైనప్పుడు భారతదేశం శాంతికాముకుల దేశం కాదిది చేతగాని చవటాయిల రాజ్యమని నిసిగ్గుగా ప్రపంచ దేశాల ముందు ప్రకటించుకుంటున్నప్పుడు , దేవుని పేరిట రాజుల పేరిట నియంత్రించబడి, విభజించి జయించడానికే పరిమితమయిన సాంస్కృతిక రక్షకుల మెదడులు, చెవులు మాత్రమే కాదు ఇక్కడ ముక్కలయిన హృదయాలు సైతం మూతపడిపోయాయి అనుకుంటా కదా !

ఇహముందు రాబోయేదంతా మరింత గడ్డుకాలమే అని చుట్టూగాలులన్నీ వెర్రిగా ఏడుస్తున్నప్పుడు క్లాడ్ మెకై (Festus Claudius “ClaudeMcKay (September 15, 1889 – May 22, 1948) రాసిన   చిన్న పవర్ఫుల్ కవిత “ If we must die” అనుసృజన మనకేమన్నా కొద్దిపాటి ధైర్యం నేర్పుతుందేమో చూద్దాం .

 

చావు తప్పనిసరైనప్పుడు

_ క్లాడ్ మెకై  Claude McKay

 

మనందరికీ

చావు తప్పనిసరైనప్పుడు

శపించబడిన మనలాంటివారి చుట్టూచేరి

గేలిచేస్తున్న ఆకలి కుక్కల నడుమ

నికృష్టకరమయిన స్థలాలలో వేటాడబడిన పందుల్లా కాకుండా

చివరికి మనల్ని అంగీకరించని క్రూరులు సైతం ఈ మరణాలniని గౌరవించక తప్పనట్లు

మనందరికీ చావు తప్పని సరైనప్పుడు

మన విలువైన రక్తం నేలపాలు కాకుండా ఘనంగా చావునాహ్వానిద్దాం !

 

ఓ సంబంధీకులార !

మనది పరిమిత సంఖ్యే అయినా

వాళ్ళ వేల దెబ్బల ముందు ఒక్క మరణం విలువేమిటో చూపి

మన ధైర్యం చాటడానికిi మన సమిష్టి శత్రువుని మనందరం కలవాలి

(వంద గొడ్లని తిన్న రాబందులు ఒక్క తుఫానుకి చచ్చినట్టు )

 

అయినా ,

మన సమాధుల ముందు ఇహ మనకేమి మిగిలుందని

గోడలకేసి నొక్కి పెట్టె హంతక తోడేళ్ళ గుంపులపై తిరిగి పోరాడటం మినహా !

 

(“రో” జ్ఞాపకంలో  రోజురోజుకి లోలోపలే మరణిస్తున్న ఎందరో ఔత్సాహికులతోపాటు…)

*

 

 

 

 

చిలకకొట్టుడు జాంపళ్లలాంటి పద్యాల గుసగుసలు!

చిత్రం: రాజశేఖర్ చంద్రం

చిత్రం: రాజశేఖర్ చంద్రం

నల్లరాతి జైలుగోడల్లాంటి ప్రహేళికలోంచి, ఎన్ని ఆధారాల సాయం ఉన్నా బయటపడటానికి ప్రయత్నంకూడా చెయ్యలేని ఒక అమాయకపు పదానికీ,

ఎన్నో నోళ్లలో అపశృతులతో పాటూ నాని, చివికిపోయి, మెలికలు తిరిగి, తనని కడుపులోపెట్టుకుని ప్రేమించే గొంతుకోసం ఆరాటపడే ఒక పాటకీ,

కొండనెత్తిన గోవిందయ్య శౌరేకానీ, తన గుండెల్లో ఒక నదిని నిరంతరం మోసే కోదండయ్య గుండెబరువుని వర్ణించే పదాలు ఏ భాషలోనూ లేవనీ,

కవితకోసం కత్తిరించిగా, తప్పించుకుపోయిన ముక్కల్లోనే అసలు కవిత్వాన్ని వెదుక్కోవాలనీ తప్పకుండా తెలిసే ఉంటుంది

అట్లాంటి చిలకకొట్టుడు జాంపళ్లలాంటి పద్యాల గుసగుసలు వంశీధర్ రెడ్డి కవితల్లో వినిపిస్తాయి.

రాసిన కవితలో పలకబారని పచ్చికాయే కనిపిస్తుంది, చెవులతో వెతికితే కవిత వెనకాల దాంకున్న కొన్ని పదాల్లోంచి ఓ పాట వినిపిస్తుంది – పండుముక్క తినేసిన చిలక పలుకుల్లా!

—-
* ఒక స్వప్నం – రెండు మెలకువలు *

-(vamsidhar reddy)

దుప్పటి చిరుగులగుండా తప్పిపోయిన చుక్కల్ని లెక్కిస్తూనో
చిక్కటి చీకటి చిమ్మిన వాసనల్ని నాసికమీదుగా తెలివికి పట్టిస్తూనో
ఓ కలను కళ్ళకద్దుకోవాలి
ఈ రోజైనా..

పసివాడి ఏడుపుని ఎప్పట్లాగే బహిష్కరించి
మనిద్దరం ఏకాంతంగా నగ్న నాగులమై సంగమిస్తున్నపుడు
శాశ్వతంగా ఆగిన ఓ చిరుశ్వాస,
ఆ ఙ్నాపకాలని సృజించే నీ స్పర్శనుండి యుగాలుగా
నేను అస్పృశ్యమై పారిపోతుండగా
పాలకడలిలో దాహం తీర్చుకుంటూ వాడు, మనవాడే,
ఎందుకొచ్చావని ప్రశ్నిస్తూ..

నరకంలో నా తండ్రి,
కంటి శుక్లాలకు చూపుని చిదిమేసి
పచ్చని పొలాలమ్మి పిచ్చుకలగుంపును చెదరగొట్టిన
నా మీద యముడికి పితూరీలు చెప్తూ..
విచిత్రం, యముడు నా తండ్రి పాదాల మీద
ఏడుస్తూ, అతణ్ణి నవ్విస్తూ..

బాల్యం దొంగిలించిన పెన్సిల్
కాలంతో పెరిగి,
గుండెల్లో గుచ్చడానికేమో రంపాలతో పదునుదేల్చుకుని
లోకపు కూడళ్ళపై నా బొమ్మగీసి “దొంగలకు దొంగ” అని అరుస్తుండగా,
సాక్షానికొస్తూ
నేనిన్నాళ్ళూ తస్కరించిన ఙ్నానం..

శూన్యం దగ్గర అపరిచితుడు, ఊర్ధ్వముఖంగా..
ఆలోచనల వేగం మా దూరాన్ని తగ్గిస్తుంటే
అతన్నెపుడో కలిసిన ఆనవాలు కలలో ఉపకలలా మెరుస్తూ,
ఆకాశం అద్దమై అతడి ముఖం లేని ముఖాన్ని చూపగా
అనుమానమేమీ లేకుండా నేనకున్నదే నిజమై ..
నా ముఖం తప్ప మిగతా శరీరం శూన్యమై..

అనుభవాలే కలలౌతాయో
కలలే అనుభవాలిస్తాయో.
ఏ కలా నన్ను నానుండి దాచలేక
ప్రతీ కలా.. ఓ ప్రతీక లా,

రెండుమెలకువల మధ్య
వంతెనైన సుషుప్తికి ఆధారమయే అవస్థే కలలై,
మనస్సంద్రాన
ఒడ్డుకొచ్చి మరలే అలలే కలలై,

నిజంగా
కొన్ని కలలు
నిజంకంటే గొప్పగా దృశ్యాలు ఆవిష్కరిస్తూ..
అబధ్దాన్ని నిజం చేసే పరిణామంలో వేకువకి దొరికిపోతూ..

*

వెచ్చని ఊపిరి!

swati

సంధి కుదరని అస్తిత్వంతో భావం పలకని విశ్రాంతికి అలవాటుపడిన వ్యక్తిగా తన పరిచయాన్ని వినిపిస్తారు స్వాతి బండ్లమూడి. కాలనాళికలో తానొక రంగులొలికిన చిత్రంగా దార్శనికత. ‘ దినచర్యలో స్పృశించిన పల్లవులు పొదువుకున్నచోట మిగిలిపోతాయి.’ఎంత చక్కని అభివ్యక్తి!కళ్లతోకాక మనసుతో చదవాల్సిన కవితలివి.ప్రతిపదము అక్షర ఆర్తిని వినిపిస్తుంది. మనసులోని మమత శ్రావ్యమైన వేణునాదమై వినిపించినపుడు  వెచ్చని ఊపిరి మనసును ఆవిరై కమ్ముకుంటుంది.దైవాన్ని మనోచక్షువులతో కాంచిన మురళీగానం వినిపించిన కవిత ‘ ఊపిరిపాటకు చూపేది’.

మనసున దాగున్న వేదన గుర్రపుడెక్కలా పరచుకుని సలుపుతుంటే కదంతొక్కిన పదాలు  మిగిల్చిన ఆనవాళ్లను పద్యాలరొదగా వర్ణించడం అద్భుతం.పాటలు పసిపాపలై కాళ్లకు పెనవేసుకున్నాయని ఒక్క అక్షరమైనా తాకని ఖాళీ కాగితాలన్నీ జాలిగా ఎగిరి రెక్కలార్చి నీ గుండెలపై వాలిపోయాయనీ ..అంటారు.భావుకత నిండిన పదనర్తనమంటే ఇదే! ‘ అరచేతిలో కొవ్వొత్తి వెలిగించుకుంటే తప్ప ఓర్చుకోలేనంత దుఃఖం ఉందని నమ్మలేరంటారు.’

‘గుండె చిల్లు పెట్టుకుని ఇద్దరిని చెరొక దరిని విసిరేసి మునిగిన పడవ అతుకేసుకుని మరో ప్రయాణం మొదలెట్టినా కథ ముగిసేది మాత్రం అవ్యక్తంకాని బాధతోనే ’ అని చెప్పే భావలాహిరి మనల్ని పట్టి ఊపుతుంది.

‘పెద్దయ్యాక తల్చుకుని బాగుందనుకోవడానికి బాగుంటుందికదా చిన్నతనం?’ బాల్యపు అమాయకత్వం,విసుగు తెప్పించేలా అన్నిటికీ ఆధారపడటం ఎప్పటికీ గుర్తుంటుందంటారు.

‘ఎప్పుడైనా ఒకరోజు-అలమరలో పాత పుస్తకాలు దులిపి ఎవరికో చూపిస్తూ, ఎందుకో!ఈ మధ్య కుడివైపు కూడా బాగా ఎక్కువగా…అని కూలబడ్డప్పుడు-పలకరించొద్దు.కవిత్వం గొంతుకి అడ్డుపడొచ్చు.’ఈ వాక్యాలు చదవగానే ఆనందమో,దుఃఖమో తెలియని భావమేదో పొటమరించి ఆ వాక్యాలకడనే మోకరిల్లాలనిపిస్తుంది.

భావుకత పరిణితి పరిపుష్టమై ప్రతి అక్షరాన్ని అల్లుకుని వాక్యనిర్మాణాన్ని మెట్టు మెట్టుగా ఉన్నతీకరిస్తూ పాఠకులను ఆలోచనలతో చుట్టిపడేస్తారు.ఆకుపచ్చ దుప్పటి మట్టివేర్లతో మనమీద పరచుకుందన్నా,పచ్చికపై రాలే పూలశబ్దాల కింద అదమరచామన్నా కవయిత్రి పసిపాపై ఆడుకుంటూ వెదజల్లిన అక్షరాలను జారిపోకుండా ఒడిసిపట్టుకుంటాం.

భావప్రకటనలో వెలువడే ప్రకంపనలు,వ్యక్తీకరణలో అసాధరణ పదమాధుర్యం,దృష్టికోణంలో విభిన్నపార్శ్వాలు!ఇంత భావచైతన్యానికి కరదీపిక సమాజమే కదా!సంఘర్షణ,సంక్షోభం,సంతోషం సమాలోచనవైపు అడుగిడమంటాయి.మనసులో భావజ్వాలలు ప్రజ్వరిల్లినప్పుడు పదవిస్ఫోటనం భళ్లుమంటుంది.స్వాతికుమారి బండ్లమూడిగారి నివాసం చల్లని చలివేంద్రం మదనపల్లియైనా ఆమె కవితలు నింపిన ఆవిరి చలికాలంలో వెచ్చనిదుప్పటి అందించే వెచ్చదనమే!

*

నాలుగు రంగులు మిగిల్చే కవిత

painting: Mandira Bhaduri

painting: Mandira Bhaduri

ఏ కవితైనా అది కవియొక్క స్వీయప్రకటన. దానికి సృష్టికర్త కవే . ఆ కవితను చదువుతున్నంత సేపూ ఆ కవి మనస్సులో ఆ సమయంలో కదలాడిన భావాలే కాక, ఆ కవి హృదయసంస్కారం కూడా అంతర్లీనంగా కనిపిస్తూంటుంది. కొన్ని కవితలు తమవైన కొత్తలోకాల్ని సృష్టించి, మనల్ని చేయిపట్టుకొని వాటిలోకి తీసుకెళ్ళి అలౌకికానందాలను పంచుతాయి. కవితపూర్తయ్యాకాకూడా ఆ లోకంలోనే సంచరిస్తూ ఆ మథురభావనల్లో ఉండిపోతాం చాలాసేపు.

మానస చామర్తి వ్రాసిన “వర్ణచిత్రము” అనే కవిత చదివాకా ఎందుకో ఈ మధ్య వచ్చే కవిత్వానికి భిన్నంగా అనిపించింది.

ప్రకృతి జీవితంలోకి ఎలా ప్రవేశించాలని ప్రయత్నిస్తుందో అదే సమయంలో జీవితం ఆ సౌందర్యాన్ని పీల్చుకొని జ్ఞాపకాలుగా మలచుకొని భద్రపరచుకోవాలని ఎంతెలా ఆరాటపడుతుందో – అనే Conflict ను భలే గొప్పగా పట్టుకొందీ కవిత.

కొత్తరోజులన్నీ ఖాళీకాగితాలై అంటూ మొదలౌతుంది కవిత. ఎంత చక్కని భావన! గతకాలపు బరువులు లేకుండా తేలికగా ఎగిరే సీతాకోకచిలుకల్లా – కొత్తరోజులన్నీ తెల్లకాగితాలైతే, ఎన్నెన్ని వర్ణ చిత్రాల్ని చిత్రించుకోవచ్చో కదా అనిపించకమానదు. మంచి ఎత్తుగడకు ఉండే అడ్వాంటేజ్ ఇది. చదువరిని వేగంగా లోనికి లాక్కొంటుంది. డిసెంబరు పూవులు, ఆకుపచ్చని కొండలు, సూరీడు, చంద్రవంక అంటూ ఒక్కొక్క వర్ణచిత్రాన్నీ ఒక్కో పూలరేకలా విప్పుకొంటూ, కవిత ముగింపుకు వచ్చేసరికి ఒక రోజు కాలచక్రాన్ని పూర్తిచేస్తారు మానస గడుసుగా.

పసిమికాంతుల నెగురవేస్తూ, తెల్లగా నవ్విన చంద్రవంక, గొడుగులు పట్టే ఆకుపచ్చని కొండలు వంటి ప్రయోగాలు నవ్యమైన అభివ్యక్తి. హృద్యంగా ఉంది. What is poetry but the thought and words in which emotion spontaneously embodies itself అంటాడు John Stuart Mill ఒక దృశ్యాన్ని చూసి చలించిన హ్రుదయం తన ఉద్వేగాల్ని తనంతతాను పదాలలోకి అనువదించుకొంటుంది సహజంగా. ఆ అనుభవం కొన్నిసార్లు పైకి ఆనందాన్నిమాత్రమే ఇచ్చేదిగా కనిపించినప్పటికీ హృదయాన్ని మార్ధవం చేసే శక్తిని లోలోపల కలిగిఉంటుంది.

హృదయసంస్కారాన్నివ్వటం కన్నా ఉత్తమోత్తమమైన సామాజికప్రయోజనం ఏముంటుంది? అందుకనే కదా కవిత్వాన్ని “హృదయసంబంధి” అని ఇస్మాయిల్ అన్నది.
“నలుపొక్కటే మిగలాల్సిన ఈ లోకంలో” ఇలాంటి కవితలే “నాలుగు రంగులు మిగిల్చిపోతాయి” అనటానికి నేనేమాత్రం సందేహించను.
*

వర్ణ చిత్రం

-మానస చామర్తి

~
కొత్తరోజులన్నీ ఖాళీ కాగితాలై
రంగులద్దుకోవాలని నా ముందు రెపరెపలాడతాయి.
తైలవర్ణచిత్రమేదో గీయాలని తొందరపడతాయి
వేళ్ళు. వీచే గాలికి ఉబలాటంగా ఊగుతూ
ఖాళీ కాన్వాసు మీదకి ఎగిరి చూస్తూంటాయి
డిసెంబరు పూవులు ఊదారంగు సముద్రం,
పైనేమో నీలాకాశం
గరుడపచ్చ పూసలకు గొడుగులు పడుతున్నట్టు
ఆకుపచ్చాపచ్చని కొండలు
పసిమి కాంతుల నెగురవేస్తూ
వెనుకొక లోకం గీతలుగా మెదులుతూ
చెదురుతున్న చిత్రం పూర్తయ్యీ అవకుండానే
గుప్పెళ్ళతో కెంజాయలు రువ్వి
ఎర్రటి సూరీడెటో మాయమవుతాడా-
నల్లని రెప్పల తాటింపునాపి
నివ్వెరపాటుతో నిలబడిపోతుంది
కుంచె జీవితంలోని వర్ణాలనో
వర్ణాల్లోని జీవితాన్నో జ్ఞాపకంగా నిల్పుకునే నేర్పు లేక
ఒళ్ళంతా ఒలకబోసుకుంటుంటే
అక్కడెక్కడి నుండో తొంగిచూసి
తెల్లగా నవ్విన చంద్రవంక
పెదాలపై నవ్వు ముద్దరై వెలుగుతుంది.
చిత్రం పూర్తవకపోతేనేం..?
చలిలోకి ముడుచుకునే వేళయ్యేసరికి
ఆనందం అర్ణవమయ్యీ,
సౌందర్యం అనుభవమయ్యీ,
తీరం వెంట తడితడిగుర్తులతో
అసంపూర్ణ చిత్రాలన్నీ పరుగులు తీస్తాయి.
నలుపొక్కటే మిగలాల్సిన ఈ లోకంలో,
నా బొమ్మలు నాలుగు రంగులు మిగిల్చి పోతాయి.

చిత్రం: టి. చంద్రశేఖర రెడ్డి

చిత్రం: టి. చంద్రశేఖర రెడ్డి

రెండు పదుల దక్కనీ ఘోష!

Siddharta Book Coverసిద్దార్థ 1994 లో “దీపశిల” తో తెలుగు సాహితీలోకానికి వచ్చి “దీపశిల సిద్దార్థ” గా పేరు తెచ్చుకొన్నారు. ఇప్పుడు తన ఇరవై సంవత్సరాల కవిత్వాన్ని ఒకచోటకు చేర్చి ‘బొమ్మలబాయి’ పేరుతో సంపుటిని తెచ్చారు. సిద్దార్ధ కవిత్వంలో – గొప్పజీవన కాంక్ష, ఆదిమ సౌందర్యం, వలస దుఃఖం, గ్రామ్యజీవనం వివిధ కోణాలలో దర్శనమిస్తుంది. ఇప్పుడు వస్తున్న కవిత్వ తీరులకు పూర్తి భిన్నంగా ఉంటూ చదువరులకు సరికొత్త పఠనానుభవాన్ని కలిగిస్తుంది.

ప్రముఖ మళయాలి కవి సచ్చిదానందన్ “కవిత్వానికి సమాంతర భాష కావాలి” అంటారు. అంటే – కవిత్వంలో వాడే పదాలు తమ మామూలు అర్థాల్ని వదిలి వేరే విశిష్టార్థాల్ని ధ్వనించాలని, వాక్యాలు ఒట్టి వాచ్యంగా ఉండకుండా భిన్న పొరలలో ఒక అనుభవాన్ని దర్శింపచేయాలని ఆయన ఉద్దేశం. అలాంటి కవిత్వంలో పదాల అర్ధాలు క్రమక్రమంగా అదృశ్యమై మనోద్వేగం (Emotion) మాత్రమే మిగుల్తుంది. పదాలు అర్ధాల్ని వీడి ఉద్వేగాన్ని తొడుక్కొంటాయి. ఏ ఉద్వేగానికి కవి లోనై ఆ కవితను సృజించాడో అది యధాతధంగా స్పష్టంగా దర్శనమిస్తుంది. “సమాంతర బాష” అని సచ్చిదానందన్ అన్నది అలాంటి కవిత్వభాష గురించే. ఇది ఉత్తమోత్తమ కవిత్వాభివ్యక్తి.

తెలుగు సాహిత్యలోకంలో సమాంతరభాషలో కవిత్వం వ్రాసే అతికొద్దిమందిలో సిద్దార్థ ఒకరు.

కురిసిన వానలన్ని ఏమయిపొయ్యాయి
పక్కటెముకల ఎద్దూ ఆకాశమూ
ముచ్చటించుకొంటున్నాయి
భూమిపొరల్లో దొరికిన వొకడి అస్థిపంజరం గురించి
అందులో పడుకుని నిద్రిస్తూన్న
పచ్చచిలుక దేహం గురించి—- “వానలు సిప్తల వనాలు” అనే కవిత ఒక భయంకరమైన కరువును సమాంతర భాషలో దృశ్యమానం చేస్తుంది. ఆ అస్థిపంజరం రైతుది కావొచ్చు, అతనిలో నిద్రిస్తున్న పచ్చచిలుక అంటే అతను జీవితకాలమంతా ఎదురుచూసిన పచ్చదనం అవ్వొచ్చు. ఇక్కడ పదాల అర్ధాలు అదృశ్యమై వాక్యాలు కరువుకాలపు ఉద్వేగాల్ని ఆవిష్కరిస్తాయి.

‘బొమ్మలబాయి’ లో కనిపించే అనేక దేశీపదాలు, ప్రయోగాలు జానపద సాహిత్యరూపానికి దగ్గరగా ఉంటాయి. సమకాలీన కవిత్వరీతులతో పోల్చితే ఇది ఒక భిన్నమైన స్వరం. బండమైసమ్మ, గట్టుమైసమ్మ, ఒగ్గుకథలు, బాలసంతు, పెద్దలకు బియ్యాలివ్వటం, శివసత్తు, ప్రభలు, మల్లన్న, గండెమ్మ, జోగిని, చిందెల్లమ్మ వంటి వివిధ విషయాలు, ఒక ప్రాంత సంస్కృతికి, ఆధునీకరణ పేరుతో మార్జినలైజ్ అవుతున్న జీవనరీతులకు ప్రతీకలు. వీటిని స్మరించుకోవటం, అక్షరాలలో పదిలపరచటం నేటి కాలానికి చాలా అవసరం. సిద్దార్థ తన కవిత్వం ద్వారా ఆపని చేసినట్లు బొమ్మలబాయి నిరూపిస్తుంది.

సిద్దార్థ కవిత్వం నిండా పల్లెదనం ఉంది. అక్కడ గడిపిన బాల్యం ఉంది. ఖేదమో మోదమో అర్ధంకాని ఆధునిక జీవనముంది. తనకలలకు, జ్ఞాపకాలకు వారధిగా నిలిచి తనలోకి కవిత్వప్రవాహాల్ని ఒంపిన మహా నగరముంది.

సీమసింతకాయ నవ్వినట్టు
నల్లతుమ్మ పువ్వు పసుపై రాలినట్టు
తనకడియాల దరువులో కాలమంతా పొగిలినట్టు -(బుశ్శెడ) అంటూ పల్లె సౌందర్యాన్ని కళ్లకుకడతాడు.

సిటీ కదులుతూంటే
ఎటుతిరిగినా వొక బరువుంటుంది
నన్ను నాకుతూనే వుంటుంది
వలసపోవటం ఎంత నరకం
నా గూడుకు నేనే కిరాయి కడుతున్నాను -(సింగాడ) అంటూ నగర జీవనపు ఒరిపిడిని, వలస దుఃఖాన్ని పట్టుకొంటాడు.

బాకీ మొత్తం/అతివాస్తవం
వొక మల్టిమీడియా బ్లూ సరస్సు
దానిపైని ఫ్లైవోవరు
పేగును కొరికే కరెంటు బిల్లు
కుత్కెలోపల వంకరగా దిగిన రేగుముల్లు// -(కర్రెసామీ జంగపోడా) వాక్యాలలో నగరజీవితాన్ని నగ్నంగా మనముందు నిలుపుతాడు. ఫ్లైవోవర్లు, హైటెక్ సిటీలతో అందంగా కనిపించినా, తీర్చాల్సిన అప్పులు, కరంటుబిల్లు కట్టలేనితనం, మహాకవి కాళోజీ “ఏం తినేట్టు లేదు, ఏం తాగేట్టు లేదు” అన్నట్టు గొంతులో దిగిన ఆకలిముల్లు….. అని ఒకానొక భీభత్స దృశ్యాన్ని చూపిస్తాడు చిన్న చిన్న పదాలలో. సిద్దార్థ కవిత్వగొప్పతనం అది.

అజంతా కవిత్వంలో పదే పదే వచ్చే భయం- రాక్షసాకారం దాల్చి రక్తం పీల్చే మహానగరం పట్ల భయకంపితుడైన వ్యక్తి వైయక్తిక అనుభవంలా అనిపిస్తుంది అంటారు నున్నా నరేష్ ఒక మిసిమి పత్రికా వ్యాసంలో. ‘బొమ్మలబాయి’ లో కూడా భయం, ఒక భీతావహ వాతావరణం అనేక కవితల్లో కనిపిస్తుంది. కానీ ఇది వైయక్తిక అనుభూతిగా కాక ఒక సామాజిక ప్రకటనలా వ్యక్తమౌతుంది.

భయం తింటున్న జాతివాణ్నని
తిట్టూ తిట్టూ నాకేమీ సిగ్గులేదు//
నా భయమో పదిజిల్లాలంత వెడల్పూ
ఏడు సముద్రాలంత లోతూ. — అంటాడు (భయచరాన). ఇక్కడ పదిజిల్లాలు అనటం ద్వారా తన సమాజపు చారిత్రికనేపథ్యాన్ని ప్రతిభావంతంగా ప్రతిబింబించగలిగాడు సిద్దార్థ. ఆశ్చర్యకరమైన అంశమేమిటంటే మలిదశ తెలంగాణా పోరాట సాహిత్యం ఇంకా ఊపందుకోని కాలం లోనే (1999) సిద్దార్థ భవిష్యత్తుని దర్శించాడు. ఆ తరువాత కాలంలో విరివిగా వచ్చిన తెలంగాణ అస్థిత్వ సాహిత్యానికి సిద్దార్థ కవిత్వం చక్కని భూమికను ఏర్పరచిందనటంలో సందేహం లేదు.

సిద్దార్థ కవిత్వాన్ని ఓపికగా చదవాలి. ఏ వాక్యమూ వాచ్యంగా ఉండదు. అంతా ధ్వనిప్రధానంగా ఉంటుంది. ఆ వాక్యాన్ని మనోలోకంలో మరోసారి చదువుకొన్నప్పుడు ఏదో దృశ్యం కనిపిస్తుంది. దాన్ని అలా మనకు మనం ఏర్పరుచుకొన్నప్పుడు గొప్ప తృప్తి ఆనందం కలుగుతాయి. ఇది ఒకరకంగా డీకోడింగ్ చేసుకోవటం లాంటిదే. ఆ కాస్త ప్రయత్నం చేయని/చేయలేని వారికి సిద్దార్థ కవిత్వం జఠిలంగా కన్పించవచ్చు. కవిత్వం రాయటంలో కవి పడే తపనతో పోల్చుకొంటే, పాఠకుడు కూడా ఎంతోకొంత శ్రమించకపోతే కవిత్వప్రయోజనం ఎలా దక్కుతుందీ?

కినిగె పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో “కవిత్వం అనేది నేచర్. నేను మీడియం మాత్రమే. మన చుట్టూతా ఉండే అనేకానేక శక్తులు మన మీద దాడి చేసి, మనల్ని ఎంచుకుని, ఒక మీడియంలా వాడుకుని వదిలేస్తాయి. అప్పుడు కవిత్వం పుడుతుంది” అంటారు శ్రీ సిద్దార్థ. ఈలోకంలో చెట్టు, పుట్టా రాయి రప్పా వాగు గుట్టా వాటి పనులు నిర్వహిస్తున్నట్లే నేనూ నా పని నిర్వహిస్తున్నాను అంటూ కవిత్వాన్ని ఒక ఒక సహజమైన స్వభావంలా భావించే శ్రీ సిద్దార్థ ‘బొమ్మల బాయి’ మంచి, చిక్కని కవిత్వాన్ని ఇష్టపడేవారికి తప్పక నచ్చుతుంది. ఎందుకంటే ఇది స్పందించే హృదయమున్న కవి రెండు దశాబ్దాల జీవితపు కవితాయాత్ర.

పుస్తకం పేజీలు: 208
వెల: 150/-
ప్రతులకు: 9848015364

ప్రతి వాక్యం ప్రతిఘటనే!

mouli

 

“…for a brave and kindly-natured comrade is as dear to a man as his own brother.” (Odyssey, Book IX, 585-86).

1

మౌళీ నాకు ఫోన్ చేసి ‘ నా కవితాసంపుటి ‘ ఆకు కదలని చోట ‘ ఈ 21 న ఆవిష్కరణ వుంది. దాని మీద నీ అభిప్రాయం రాస్తే బాగుంటుంది” అన్నాడు. మొదట్లో నేను తటపటాయించాను. నేనెప్పుడు తెలుగు సాహిత్యాన్ని, కవిత్వాన్ని అంత క్షుణ్ణంగా అనుసరించలేదు. ” నా కంటే  బాగా రాసే వాళ్ళు, అనుభవజ్ఞులు చాలా మంది ఉన్నారు ” కదా అన్నట్టు అన్నాను. ” లేదు. నువ్వే రాస్తే బాగుంటుందని…” అన్నాడు మౌళి. నేను అభ్యంతరంగానే ఒప్పుకున్నాను- మౌళీ కవిత్వానికి నేను న్యాయం చేయలేనేమోనన్న భయంతో!

ఫోను ముగించగానే పుస్తకం పేరు మరొకసారి గుర్తు తెచ్చుకున్నాను. ‘ఆకు కదలని చోట ‘ – వెంటనే ఫిలిప్పైన్ కమ్యునిస్టు పార్టీ స్థాపించిన విప్లవకారుడు, కవి హోస్ మారియా సిసోన్ రాసిన ‘గెరిల్లా యోధుడు కూడా ఓ కవే ‘ అన్న కవితలోని మొదటి వాక్యాలు గుర్తొచ్చాయి.

“ఆకు కదలికకు,

చితికిన రెమ్మకు,

నది అలజడికి,

నిప్పు వాసనకు,

వెనుదిరిగినపుడు రాలే బూడిదకూ

ప్రతీ అలికిడికీ అప్రమత్తం అయ్యే

గెరిల్లా యోధుడుకూడా ఓ కవే”

ఇక్కడ సిసోన్ ఒక విషయం చెప్పకనే చెప్పాడు – సున్నితత్వం (sensitivity) లో గెరిల్లా యోధునికీ, కవికీ తేడా లేదని.

చేగువేరా తన పిల్లలకు రాసిన వీడుకోలు లేఖలో విప్లవకారుడి సున్నితత్వం గురించి “ప్రపంచం నలుమూలలలో ఎక్కడ అన్యాయం జరిగినా అంతరాంతరాల్లో నుండి ప్రతిస్పందించగలగాలి” అని రాస్తాడు. బహుశా అలాంటి సున్నితత్వం వలనే మౌళీ బస్తర్ నుండి సిరియా వరకూ, తెలంగాణా ఉద్యమం నుండి టర్కీ శరణార్థుల వరకు ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఆ పరిస్థితిలో తనను తాను మమేకం చేసుకొని  (identify)  సంఘీభావం (solidarity) తెలుపుతూ కవితలు రాసాడు.

2

మౌళికి నటించటం రాదు. తానేం చూస్తాడో అదే రాస్తాడు. తన చుట్టూ పరిసరాలను, మారుతున్న ప్రపంచాన్నీ, దోపిడీని, అణిచివేతనీ, ప్రకృతిని, రాజుకుంటున్న విప్లవాన్ని- నిజాయితీగా ‘witness’ చేస్తాడు.  ఇలాంటి కవిత్వాన్ని అమెరికన్ కవియిత్రి, మానవహక్కుల ఉద్యమకారిణీ అయిన కెరోలిన్ ఫోర్ష్ ‘Poetry of Witness’ అంటుంది. ఈ రకమైన కవిత్వన్నే రాసే Yannis Ritsos అనే గ్రీకు మహాకవి, మౌళీ కి ఇష్టమైన కవి కావటంలో ఆశ్చర్యం లేదు. Ritsos ఎంత ప్రమాదకరమైన కవి అంటే అతని కవిత్వ జ్వాలకు ఎదురుగా నిలబడలేక 1936 లో గ్రీకు దేశపు ఫాసిస్టు ప్రభుత్వం అతని కవిత్వాన్ని కాల్చి దగ్ధం చేసింది. Ritsos ని  మౌళీని ఇద్దరినీ కలిపే ఓ మౌలిక స్వభావం- నిజాయితీ. తమ అక్షరాల పట్ల నిజాయితీ. తమ జీవితాలలో నిజాయితీ. తమ ఉద్యమాలకూ, భావజాలలకూ నిజాయితీ. తమ చుట్టూ ప్రపంచంతో నిజాయితీ.

ఈ నిజాయితీనే మౌళీ కవిత్వానికి అస్తిత్వం, ప్రాణం.

ఓ నైరూప్య వినియోగదారుడికోసం నిజాన్ని కూడా  న్యూస్ అన్న పేరుతో కమోడిటీ చేసి కృత్రిమంగా మార్కెట్లో అమ్ముతున్న తరుణంలో మౌళీ రాస్తున్నటువంటి కవిత్వం, సాహిత్యం ఓ ప్రత్యామ్నాయ చరిత్రనే  సృష్టించగలదు.

3

స్పానిష్ మహా కవి నెరుడా తన నోబెల్ ప్రసంగంలో కవి గురించీ ఇలా అంటాడు.

“ప్రజలందరిలాగ తాను కూడా ఉత్పత్తి సంబంధాల్లో పాల్గొంటూ, మిగిలిన మనుషుల పట్ల వారి పనుల పట్ల సున్నితత్వంతో వ్యవహరిస్తూ, రోజువారి సామాన్య జీవితపోరాటాలలో పాలుపంచుకుంటూ, చెమటలు కక్కుతూ ఆహారాన్ని ఉత్పత్తి చేయటం ద్వారా మానవత్వం సమూహంగా కనే ఓ మహోన్నత కలలో తాను కూడా భాగస్వామయినప్పుడు.. ఆ కవి కవిత్వం చారిత్రాత్మకమవుతుంది”

మౌళీ కూడా అలాంటి కవే. ప్రజలలో, పోరాటాలలో మమేకమైన కవి. కవిత్వం సామాన్య ప్రజలకోసమని అనుకునే కవి. అందుకే తాను పాఠాలు చెప్పే తరగతిలోని విద్యార్థులకు కవిత్వం కూడా చెప్తూ, కవిత్వం చదవటాన్ని, రాయటాన్ని  ప్రోత్సహిస్తూ, వారు రాసిన కవిత్వాన్ని పత్రికలకు పంపిస్తూ ఉంటాడు.

ఎందుకంటే మౌళి దృష్టిలో కవిత్వం ప్రజాస్వామికమైనది.

4

మౌళీ కవిత్వంలో మరొక ముఖ్యమైన అంశం జ్ఞాపకం. ఓ వ్యక్తి వ్యవస్థను  ఎదిరించి నిలబడటం లాంటిదే జ్ఞాపకం మరుపును నిలువరించటం కూడా అంటాడు జెకొస్లెవేకియన్ రచయిత మిలన్ కుందేరా.

ప్రపంచం మనిషి ఇచ్ఛతో సంబంధం లేకుండా, నిర్విరామంగా మారుతున్న సమయం ఇది. ఇలాంటి పరిస్థితులలో జ్ఞాపకానికి ఓ విప్లవాత్మకమైన బాధ్యత ఉంటుంది.

మౌళీ కవిత్వం రాయటం ద్వారా జ్ఞాపకాన్ని బలపరిచే ప్రయత్నం చేస్తుంటాడు. జాతీయంగా అంతర్జాతీయంగా జరుగుతున్న ఉద్యమాల తాలుకు జ్ఞాపకం, తను పుట్టిపెరిగిన పల్లెటూరు, అక్కడ చుట్టూ మారుతున్న పరిస్థితుల తాలుకు జ్ఞాపకం రెంటినీ తన కవిత్వం ద్వారా ఒక చోటికి తెచ్చి shortcircuit చేస్తూ ఆ జ్ఞాపకంతో పాఠకున్ని shock కి గురిచేస్తాడు.

5

ఎప్పుడూ ఏకాంతాన్నీ, ఏకాంతంలోని రసాన్ని పెంచి పోషించే mainstream సాహిత్యం నుండి వేరుపడతాడు మౌళి.

మౌళి కవిత్వం ఏకంతాన్ని ప్రతిఘటిస్తుంది. పెట్టుబడీదారివ్యవస్థ ప్రజలందరినీ తమతమ ఏకాంతాలలో బంధించి individualisation అనే పేరుతో  సమాజాన్ని విడగొట్టి ఉద్యమాలను విచ్చిన్నం చేస్తున్న తరుణంలో మౌళీ కవిత్వం deindividualise అవ్వమని, గుంపులు గుంపులుగా రోడ్డుపైకొచ్చి ప్రశ్నల వర్షం కురిపించమని పిలుపునిస్తుంది.

మరి మౌళీకి ఏకాంతం లేదా?

ఉండకనేం!

ఏ కవికైనా తన అంతరాంతరాల్లో కూరుకుపోయిన భావోద్వేగాలు, భావాలు, తన జ్ఞానం, తన అస్తిత్వం అన్ని కలగలిసిన  ఏకాంతంలో నుండే కవిత పుట్టుకొస్తుంది. కానీ ఎప్పుడైతే సమాజంలోని చలనాలను, మార్పులను, దోపిడీని, అణచివేతనూ ప్రత్యక్షంగా ఎదుర్కుంటాడో అప్పుడు కవి ఏకాంతం కూడా political అవుతుంది.

సమాజంలోని మార్పులతో, అదృశ్య అణచివేతలతో ,  కుల వర్గ దోపిడీలతో ఎంతో మమేకమవ్వటం చేతనే మౌళీ ఏకాంతం కూడా ఓ political రూపం దాల్చింది అనుకుంటాను. తన ఏకాంతానికి కూడా proletariate అస్థిత్వం సంతరించింది. అందుకే మౌళీ ఏకాంతం ఆధిపత్య బూర్జువా భావజాలాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తుంది.

6

శివారెడ్డి గారు 1990 లో ‘అజేయం’ అనే కవితా సంకలనంలో ‘కవులేంజేస్తారు!’ అనే కవితలో ఇలా అంటారు-

“కవులేం జేస్తారు

ప్రభుత్వాన్ని ధిక్కరిస్తారు

ప్రజలకు చేతులిస్తారు

తెల్ల కాయితానికి అనంతశక్తినిస్తారు

కవులేం జేస్తారు

చేతుల్లో కింత మట్టి తీసుకొని శపిస్తారు

మణికట్టు దాకా నరికినా

మొండిచేతుల్తో గోడల మీద పద్యాలు రాస్తారు,

..

కవులేం జేస్తారు

చట్టాన్ని ధిక్కరిస్తారు,

ఎడారి మీద పద్యాలు రాస్తారు

ఎడారి క్రమక్రమంగా

సజీవ దేశంగా రూపొందుతుంది

కవులేం జేస్తారు

గోడలకు నోరిస్తారు

చెట్లకు కళ్ళిస్తారు, గాలికి గొంతిస్తారు

ప్రజలకు చేతులిస్తారు

ప్రజల చేతుల్లో

అనంతశక్తి సంపన్నమయిన పద్యాన్ని పెడతారు.”

తెలుగులో ఈ మధ్య రాస్తున్న మిగిలిన కవుల గురించి నాకు తెలియదు కాని- మౌళీ మాత్రం ఖచ్చితంగా ఇలాంటి కవే!

*

mouli1

తెలంగాణా చెలిమె కూకట్ల కవిత్వం

 

–     విలాసాగరం రవీందర్

~

 

మనిషి సంఘజీవి.   సంఘం చరణం గచ్ఛామి అంటూ బుద్ధునిలా త్యాగం చేసే వారు కొందరయితే, సమాజాన్ని చీడ పురుగులా కొరుక్కుతినే వారు మరికొందరు. సమాజ హితాన్ని కోరుతూ, సమ సమాజం కొరకు పరితపించే వారు బుద్ధి జీవులు. వారిలో కవులు, కళాకారులు అగ్ర భాగాన వుంటరు. కత్తి కన్నా కలం గొప్పదని నిరూపిస్తూ సమాజంలోని అసమానతల చెదను దులిపే అక్షరాలెన్నో ! కవిత్వం మనిషిలోని మనసును మేలుకొల్పుతది. మనిషిని మనీషిగ జేస్తది.

          కూకట్ల తిరుపతి 2000 నుంచి కవిత్వం రాస్తున్నడు. మూడు పదుల వయసులోనే “మేలుకొలుపు(2005)” కవితా సంపుటిని వేసి, ఒక శతకం, ఒక నానీల సంకలనాలను ప్రచురించి కవిత్వ ప్రపంచంలో సుపరిచితమయిన పేరు. ఇతడు “ఆరుద్ర పురుగు” పుస్తకంలో రాసిన ప్రతి పదంలో పల్లెదనం పరిమళిస్తది. మండుతున్న పల్లెల గుండెలను చూసి ఈ కవి కలం నుంచి వచ్చిన మరో కన్నీటి కావ్యమే “ఎర్ర గాలు”.

ప్రపంచీకరణ ప్రభావంతో పల్లెల ఉనికి ప్రశ్నార్ధకమయింది.  చేతి వృత్తుల మెడకు కత్తి వేలాడుతంది. ఈ దుస్థితిని ‘వలస వోయిన పల్లె’ కవితలో చిత్రిక కట్టిండు.

“ఎర్రమట్టి అలుకు పూతలు

ముంగిళ్ళ జాజు తీనెలు

ఎలిసిన సున్నం బొట్లు

కూలిన కుమ్మరి గూనపెంకుటిళ్ళు…

కూలవడ్డ మట్టి గోడలు

చితికిన బతుకుల ఆనవాళ్ళు …”

అంటూ వలస వోయిన పల్లె ధీన దృశ్యాన్ని కళ్ళ ముందుకు తెస్తడు. మనుషులు వలస బోతరు. బతుకు దెరువు వెతుక్కుంట వేరే చోటికి మారుతరు. కాని కవి పల్లెనే వలస బోయిందని చెబుతున్నడు. అంటే పల్లె తన అస్తిత్వాన్ని కోల్పోవటం. పల్లె ఖాళీ కావడం.

మరో కవిత ‘దీన దృశ్యం’లో పల్లెలు బొందల గడ్డలయినవంటడు. ఓట్ల కోసం తెచ్చే పథకాలతో ప్రభుత్వాలు కనికట్టు చేస్తున్నయని బాధ పడుతడు.

“ఎండిన చెరువు

బోర్లేసిన బాయి

నడుమిరిగిన నాగలి

కొండెక్కిన కోరిక

వట్టిపోయిన ముల్లెలు

బొందల గద్దయిన పల్లెలు “

మనిషి చివరి ప్రయాణం బొందలగడ్డకు పోవుడే గదా ! బతికినాన్ని నాళ్లు ఆసరా వుండే పల్లెనే నేడు బొందల గడ్డ అయ్యిందట. అన్ని వృత్తులు నశించి పల్లె మాయమయింది అంటున్నడు కూకట్ల తిరుపతి. చాలామంది ప్రపంచీకరణ వల్ల ఏమి నష్టం వచ్చింది అని అడుగుతరు. ఈ కవితను వినిపిస్తే చాలు వారికి నష్టం కళ్ళకు కడుతది.

ప్రభుత్వాలు ప్రజల కోసం చట్టాలు చేస్తయి. కాని వాటి అమలులో నిర్లక్షం వహిస్తయి. మనిషి జీవనాధారం నీరు.  ఈ నీటి వనరుల సంరక్షణ కొరకు ఏర్పాటు చేయబడింది వాల్టా చట్టం.  ఈ చట్టం ఏ విధంగా నిర్వీర్యం చేయబడిందో ‘పచ్చ దనాల బాట’ పేరుతో కవిత్వం చేస్తడు.

“ఉల్టా పల్టాగా వాల్టా

పచ్చల హారాలు  ఏలిక మేడల్ల

భరించడం ఇంకెన్నాళ్ళు ?” అంటూ ప్రశ్నిస్తడు.

బుక్ టైటిల్ పోయెం “ఎర్రగాలు” పుస్తకానికే హైలైట్ . ఎర్రగాలు అనేది ఎర్ర కాలం. యాసంగి(రభి)కి వానా కాలం(ఖరిఫ్) కు మధ్యన వచ్చే పంట కాలం. స్వచ్ఛమైన తెలంగాణా భాషలో రైతు ఎతను, ఎవుసం చేసే విధానాన్ని వర్ణిస్తది. ఈ కవిత మనం కన్న పిల్లలను ఎట్లా అరుసుకుంటమో అట్లా పోషణ చేస్తరట

“కంటి పాపల కడుపుల వెట్టుక

అరొక్క తీర్ల అరుసుకున్నట్టు

ఆవురావురుగా ఆరుకాలం

యాళ్లకనంగ సేన్ల పొదన…”

ఇంత కష్టం జేసినా పూర్తిగా కరువుతీరుతుందా అంటే అదీ లేదు. మండే ఎండల్ల ఎండుక పోవుడే తప్ప రైతుకు మిగిలేది ఏమి వుండదంటున్నడు కూకట్ల తిరుపతి.

“ఎర్రగా బుర్రగ ఎర్ర తేలోలె వున్నా !

ఎండి ఎర్రగప్పవుడే

ఎర్రగాలు దెబ్బకు.

రైతుల కాయ కష్టాన్ని, వారి దయనీయ జీవన దృశ్యాన్ని ఆవిష్కరించేది ‘అకాలం’ కవిత. మూడు కాలాలు కలసి రైతును విగత జీవిగా చేస్తున్నయంటడు కవి.

నాటి నుంచి నేటి వరకు కుల, మతాలు సమాజాన్ని ఎట్లా అతలా కుతలం చేస్తున్నాయో చూస్తున్నం. అట్లనే ఆడా, మగ తేడాలు కూడ ముల్లులా గుచ్చుకోవడం అనుభవంలోదే కదా !  అందరూ సమానమే నంటూ ‘సర్దుబాటు’ కవితలో ఎవుసానికి ఎనగర్ర అయిన నాగలిలోని భాగాలను ప్రతీకలుగా తీసుకొని అద్భుతంగా కవిత్వం చేస్తడు. నాగలిలో పొడుగు కర్రను ‘కోలా’, అని నిలివు భాగాన్ని ‘పాలే’ అని, పట్టుకొనే కర్రను ‘పడుసోగ’ అని అంటరు. ఇవన్ని కలిసి పని చేస్తేనే దుక్కి దున్నబడి పంట వేయడానికి పనికివస్తుంది. అలాగే సమాజంలో కుల, మత, ఆడ, మగ తేడాలు లేకుండా ఉండాలంటడు ఈ కవి. ఈ కైత ను సంపుటి చివరికి పెట్టడంలో కూడా తన అంతిమ లక్ష్యం అదే అని చెప్పకనే చెబుతడు.

 

కవిది మెత్తటి మనసు. సున్నిత మనస్కులే కవిత్వం రాస్తరని ఎక్కడో చదివిన గుర్తు.  ఏది కవిత్వమో ‘కవిత్వం’ శీర్షికన మొదటి కవితలో  చెబుతడు. ‘నిప్పుల ఉప్పెన వలె ఉప్పొంగి \ వెట్టి చాకిరిని మట్టీడేది , భూస్వామ్య నియంతృత్వం పై \ అగ్ని పూలు పుయించేది’ కవిత్వం అంటదు. కవిత్వం ‘సామాన్యుని తలలో నాలుకలా, గాయపడిన ఉవిదకు ఓదార్పునివ్వాలనీ, అణచబడినోడి కరాయుధం కావాలనీ, జన చైతన్యం పరమార్ధంగా ఉండాలంటడు. బడుగు జీవుల బానిసత్వ విముక్తి కోసం సమరం సాగించాలని పిలుపునిస్తడు.

ఈ కవి చెప్పిందే రాస్తడని “అక్షర నిరసన”, “ఖబర్దార్ ఖబర్దార్”  కవితలు చదివితే అర్ధం అవుతది. లక్ష్మిదేవిపల్లి గ్రామంలో దళితుల ఊచకొతను ఖండిస్తూ ‘అక్షర నిరసన’ ప్రకటిస్తడు. ప్రభుత్వ భూ పంపిణీ ప్రచార పటాటోపాన్ని దునుమాడుతడు.  ఫాసిస్టు పాలకుల పక్ష పాతాన్ని తెగడుతడు. భూ విముక్తి పోరాట యోధులను గుర్తుచేస్తడు. అణగారిన జనం అగ్గిరవ్వలై తిరగబడాలంటడు. అణచబడ్దోడు లేచి నిలబడి, తెగిపడిన చోట తెగబడటమే అంతిమ పరిష్కారమని నినదిస్తడు.

యానాం పరిసర ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాల విధ్వంసం సంఘటనను తీవ్ర స్వరంతో ఖండిస్తడు. అగ్రవర్ణ దురహంకారాన్ని నిరసిస్తడు.  కారంచేడు, నీరుకొండ, చుండూరులలో పారిన నెత్తుటిదారలకు దుక్కపడుతడు.  ‘ఒక్కో బక్క జీవి…. మండే సూర్యుల్లయి  మసి చేస్తరు… ఖబర్దార్ ఖబర్దార్’ అంటూ హెచ్చరిస్తడు.

కూకట్ల తిరుపతికి అమ్మంటే అలవిమాలిన ప్రేమ.   ‘కమ్మని అమ్మ మనసు, పూల జల్లైయి కురిసి, మంచు పర్వతంలా మారి, శాంతి కపోతమై సమతను పంచుతుందని’ చెబుతడు. చివరకు ‘అమ్మ ఋణం జన్మ జన్మలకు సశేషం’ అంటడు.

పేగు సంబంధం తల్లి అయితే జీవిత బంధం ఇల్లాలు. ఈ కవి తన భార్యను ‘ఇంటికి దీపం’గా భావిస్తున్నడు. దీపం లేని ఇల్లు చీకటి చిరునామే కదా ! అలాగే తన ఇంటికి దీపం ఆవిడే అంటున్నడు. ఆమె

“చేనుకు చెమట చుక్కలను జల్లుతూ

పంట పరిమళాలను పరివారానికి పంచుతూ

వ్యవసాయాన వెన్నుదన్నుగా నిలిస్తుంది” అంటడు.

మహా కవి జాషువా కష్ట జీవి కవితలో ‘వీని రెక్కల కష్టంబు లేనినాడు / సస్యరమ పండి పులకరించ సంశయించు… అప్పు వడ్డది సుమీ భరతావని వీని సేవకున్’ అన్నట్టు ఈ కవి “నా అక్షరాల సాక్షిగా / ఆమె సేవకు / నా జీవితం ఋనపడ్డది” అని నొక్కి చెబుతడు.

ఈ కవి మూలాలు మరువని కవి. తన ముందు మాటలో చెప్పినట్టు తాను బాల కార్మికుడి నుండి బడి పంతులు దాకా కష్టపడి ఎదిగాడు. తన స్వానుభవాన్ని, తాను సమాజంలో గమనించిన పసి చేతుల కష్టాన్ని, దీనత్వాన్ని కళ్ళకు కట్టే విధంగా ‘బాల కార్మికులం’ పేరున అక్షరీకరిస్తడు.

సునామీ వచ్చినప్పడు చాలా మంది కవులు సునామీని తిడుతూ కవిత్వం చేసారు. దానికి భిన్నంగా కూకట్ల తిరుపతి సముద్రాన్ని విచ్చలవిడిగా మనిషి తన స్వార్ధానికి ఉపయోగించుకోవడం వల్లలే ఈ ఆపద వచ్చిందని ‘సాగర ఘోష’లో అంటడు. ‘అంతులేని సముద్ర తీరాన పిల్లల గొప్ప సమావేశం జరుగుతూంది’ అని గీతాంజలిలో రవీంద్రనాథ టాగూరు అంటే ఈ కవి మానవుడి దురాశనే ‘మృత్యువు విచ్చలవిడిగా సంచరించెట్లు ‘ చేస్తుందని చెబుతడు.

ఈ కవికి స్నేహమంటే వల్లమాలిన ప్రేమ. అందుకే “ఆపదలో … ఆనందంలో … / నా చెలిమి చెలిమయి / అలుపెరుగక పారునది” అని ‘చెలిమి’ కవితలో నెయ్యాన్నిపారే నదితో పోలుస్తడు. పారే నది ఎప్పుడు ఎండి పోనట్టే తన మిత్రత్వం కూడా అజరామరం అంటున్నడు.

కవిత్వంలో రూపం, సారంతో పాటూ అలంకారాలు ఉన్నప్పుడే వినసొంపుగా వుంటది. “ఎర్ర గాలు”లో ‘ఊర చెరువు’ అద్భుతమైన నాద సౌందర్యం వున్న కవిత. ప్రతి పాదం చివర సున్నాతో కూడిన గకారాలను వాడినరు. దీనివల్ల ఆ కవిత చదువుతుంటే నీటి ప్రవాహ వేగం కనబడుతది. అంత్య ప్రాసలతో పాటు రూపకాలను, ఉపమాలను సందర్భానుసారంగా ఉపయోగించే నేర్పు కూకట్ల తిరుపతి కవిత్వంలో మరో ప్రత్యేకత.

ఈ సంపుటిలోని 37 కవితలలో ‘కలం యోధుడు’ కాళన్న, ‘షెహనాయి శిఖరం’ బిస్మిల్లా ఖాన్, ‘ఆదివాసి ఆణిముత్యం’ కొమురం భీమ్ కవితలు అద్భుతమైన స్మృతి కవితలు. అలాగే ‘అమ్మ ఆనవాళ్ళు’లో మనువాద ద్వంద్వ నీతిని ప్రశ్నిస్తూ. ‘అమీనాలు’ కవిత లో అరబ్బు షేకుల అకృత్యాలను తెగనాడుతూ హైదరాబాదుపాత బస్తి పేదరికానికి బాధ పడుతున్న కవితలూ కలవు.

మొత్తంగా చూస్తే కూకట్ల తిరుపతి కవిత్వం తెలంగాణా మట్టి పదాల పరిమళం అద్ది, పాల కంకుల సాల్ల వాక్యాలతో సాగి, సమ సమాజం కొరకు ఆరాటపడే పందిరి గుంజలాంటి కవిత్వం. అసమానతల పొగరును నరికే కరవాలం ఇతని కవనం.

*

 

మునివేళ్ళ మీది పుప్పొడి!

 

 

-జి. సత్య శ్రీనివాస్

~

విశ్వకవి ‘ stray birds ’ ,బోల్లోజు బాబా  ‘స్వేచ్చా విహంగాలు’ అనువాదం చదువుతునప్పుడు నా అరచేతి ఆకాశం నుండి ఎగిరే గాలి పక్షులు రెక్కల తివాచీ పై పయనించేట్టు చేసింది. అందుకే, ముందుగా బొల్లోజు  బాబా  ముని వేళ్ళని ముద్దాడాలనిపిస్తుంది. సరిగ్గా వందేళ్ళ మునుపు అచ్చయిన స్ట్రె బర్డ్స్  ద్వారా కవిత్వంలో మరో కొత్త ఒరవడిని విశ్వ కవి సృష్టించారు. చైనీస్ ఆధునిక కవిత్వానికి, చైనీస్  వెదురు వేణువు లోనుండి వీచే గాలికి విశ్వకవి కొత్త రుతువుగాలి  కల్పించారు అని  చైనీస్ సాహిత్య కారులే అన్నారు. అటువంటి కవితలలోని భావాన్ని పొల్లుపోకుండా ,చక్కని నైపుణ్యం తో అనువదించారు బొల్లోజు బాబా .

అనువాదం ఒక నెరేటివ్ రీసర్చ్ , ఒక వైవిధ్యమైన ప్రక్రియ. అది భాషా నైపుణ్య పరిధులు దాటే ఏరు.ఎందుకంటే అది కవిని,అనువాదకుడ్ని , పాటకుడ్ని, బాషకల్లుకున్న సాంస్కృతిక మూలాల్లోకి తీసుకువెళుతుంది. అందరూ కలిసి నది ఒడ్డున చేసే ప్రయాణాన్ని బొల్లోజు బాబా గారు ఏర్పచ గలిగారు. మన అడగుజాడల గుర్తులు ఇసుక మబ్బు  గూళ్ళలోని నీటి చుక్కలా  మిగిలి వుంటాయి.

దేశ దిమ్మరి పిల్ల మూకల్లారా

మీ పాద ముద్రలను నా పదాలపై విడువండి.

అనువాదంలో ఒక ఇజ్స్ తో బాటు అల్లుకుపోయిన Colloquialness,నేటివిటీ వుంది.  దానితో బాటు అనువాదానికి కావాల్సిన స్వేచ్చ మంత్రం ధ్వనిస్తుంది. అది ఈ కవితలో స్పష్టంగా కనబడుతుంది

వసంతపు దరహాసాలను కావలి కాసేది

మట్టి అశ్రువులే

ఈ స్వేచ్చకు రహస్యం తెగింపు కూడా అవసరమని చెబుతోంది.అనువాదంలో వుండే కీలకమైన ఇబ్బంది వేరు వేరు బాషల మధ్య వుండే వ్యాకరణ రూపంలోని వైవిధ్యం.కొన్ని పోలి వుంటాయి ,మరి కొన్ని భిన్న దృవాలు గా వుంటాయి. అందుకే అనువాదానికి ప్రేమపూరితమైన బాధ్యతతో  నిండిన స్వేచ్చవుండాలి. రవీంద్రుడు కాక మరొకరు స్ట్రె బర్డ్స్ ని ఆంగ్లంలోకి అనువాదం చేసి వుంటే అది మరోలా వుండేది.కారణం భారతీయ ఆంగ్లం లో స్ధానిక పోపు సామాగ్రిని మిళితం చేయడం చాల అవసరం.  ఆయన అనువాదం తన గూటి పక్షుల్ని, గగనం లోని మరో మార్గంలో లోకి తనే  ఎగరేసాడు. బాబా కి  ఆ  మార్గాన్ని పట్టుకునే స్వచ్చమైన, స్వేచ్చమైన  చూపుంది.

baba

What you are you do not see, what you

see is your shadow.

నీవేమిటనేది నువ్వు దర్శించలేవు

నీవు దర్శించేది నీ ఛాయా

అనువాదం కూడా ఇంతే. అనువాదం ద్వారా కవి మనో భావ బాషని అనువాదకుడు ఇది అనువాదం అని నొక్కివక్కా ణిoచకుండా చెపుతూనే ,మూలాన్ని ,తన – మన అన్న బేధం లేకుండా ఆస్వాదించేలా చేయాలి.అప్పుడే మూల బీజంలో మొలకెత్తే గుణం పొదిగివుంటుంది,అది పరివ్యాపిస్తుంది. సహజంగానే మూలం లోని తాత్విక సంచారి నైజం అనువదoలోనూ వచ్చింది. బీజం లోని మొలకెత్తే గుణం పోలేదు. కారణం విశ్వకవే బెంగాలీనుండి ఆంగ్లంలోకి అనువదించుకున్న మూల ఆనువాదకుడు, అది ఇంకెన్ని బాషల్లో అనువాదమైనా పరివ్యాప్తి చెదే గుణం పోదు.   ‘స్వేచ్చా  విహంగాలు’ తో ప్రయాణం అంటే ,ఈస్ట్ కోస్ట్ లో హౌరాకి వెళ్ళినట్టు.

మన బాషనుండి,ఆంగ్లం లోకి అనువాదం మళ్ళీ వేరే ప్రాంత బాషలోకి అనువాదం అంటే. తెలియందేముంది మన ప్రాంతంలో మాట్లాడే ఆంగ్లానికి కూడా మన రంగు, రుచి, సువాసన వుంటాయి.వందేళ్ళ చరిత్ర గల ఈ పుస్తకానికి మనం నివాళిగా మన కవితల్ని మనమే ఆంగ్లంలో అనువదించి మనమే నేటి గ్లోబల్  విలేజ్లో  మనమే నాటుదాం అని,నేటి తరానికిచ్చే  పచ్చటి స్పూర్తి. పుస్తకం మొత్తం చెప్పేదిఇదే తత్త్వం.

విహంగం తానొక మేఘాన్నైతే

బాగుణ్ణనుకొంటుంది

మేఘం

తానొక విహంగాన్నెందుకు కాలేదా అనుకొంటుంది……

 

మన భావవ్యక్తీకరణ, దాని రూపం మన జనపదాల్నుండి వచ్చిన ఆస్తి, దీన్ని ముందు తరానికి అందించడం అంటే, బాషల కుటుంబ చెట్టు సంరక్షణే. అది జరగాలంటే దీనిని విధ్వంసం చేసే అనువదీకరణకు అడ్డుకట్ట వేయాలి. అందుకు కవిత్మాకంగా అలోచిండడం కంటే గొప్ప ఆయుధం లేదు. అనువాదం అన్నది మూల రూపాన్ని మళ్ళీ నాటే సృజనాత్మక ప్రక్రియ. పలు  చోట్లున్న   పాటకులని, కవికి అందించి ,పాటకులకి కొత్త చిగుర్లని చూపించే దృష్టి. రాతలు కొనసాగాలి వాగుల్లా,వంకల్లా…

చిన్నారి గడ్డిపోచా

నీ పాదం చిన్నదే కావచ్చు కాని

పుడమి మొత్తం నీ అడుగుల కిందే వుంది.

‘స్వేచ్చా విహంగం” గా వెళుతునప్పుడు అక్కడక్కడా కాలిబాటలో అరికాలిలో చిన్ని రాళ్ళు గుచ్చు కుని మనం ఎక్కడున్నాం అని గుర్తుచేసినట్టు చిన్న ఇక్కట్లున్నాయి. అవి మూల స్పర్శ .పరిమళాన్ని వదిలేసిన జాడలు. ఇది అనువాదంలో , లీనమైపోవడం వల్ల  ఏర్పడే పొరపాట్లు  తప్ప తెలిసి చేసినవి కాదు. ఎందుకంటే ,  ప్రతి పదానికి నిఘంటువులో మనకి కావాల్సిన అర్ధం దొరకదు,ముఖ్యంగా కవిత్వానికి.

 

Night’s darkness is a bag that bursts

with the gold of the dawn.

 

రాత్రి చీకటి తిత్తి

సువర్ణోదయం లా పగిలింది

పగిలింది అనే పదానికి బదులుగా విచ్చుకుంది అంటే బాగుoటుంది. కారణం అనువాదం  ఒక శీర్షాసన ముద్ర, కొన్ని జాగ్రత్తలు అవసరం ,వాట్ని విస్మరించలేం,న్యూయాన్సెస్ ని పట్టుకోవాలి.

That which ends in exhaustion is death,

but the perfect ending is in the endless.

అలసటలో  ముగిసేది మృత్యువు మాత్రమే,

సంపూర్ణ ముగింపు అనంతంలోనే వుంది.

అనువాదం ఫర్ఫెక్షన్ కాదు ,పసి పిల్లల అడుగుల సవ్వడి, అవి తడబడే అడుగులు కావు, ఇరువురి చూపులకి  నడకలు నేర్పే లయలు. ‘స్ట్రె బర్డ్స్’  నాకై  నేను ,ప్రపంచానికి ‘కవిత్వ’ మాధ్యమం లో ఆలాపించే ప్రవచనా గీతం. ఆ గీతాన్ని ‘స్వేచ్చా విహంగాలు’ గా  చదువుతునప్పుడు సీతాకోకచిలుక ని పట్టుకుని వదిలేసిన తర్వాత దాని పుప్పిడి మునివేళ్ళకి సింధూర తిలకంలా అద్దుకుంటుంది. అందుకే బాబా మునివేళ్ళని మరోసారి ముద్దాడుతూ…

 

*

 

 

 

చంద్రవంకల ఆత్మఘోష గురించి…. 

 

cover page of mudava manishi
-అరణ్య కృష్ణ
~
మనుషులెన్ని రకాలంటే రెండు రకాలని, అది ఆడా మగా అని చెప్పే దురహంకారం మనది.  సంసారం ఈతి బాధలు మోస్తూ మగాడు, పురుషాహంకారానికి బలైపోయే స్త్రీల వెతలే మనకు తెలుసు. వాటికే సాహిత్య గౌరవాన్ని ఇచ్చే సంకుచిత్వం మనది.  ఈ రెండు రకాల మనుషుల బాధలకి స్పందించే మనం, కళ్ళనీళ్ళు పెట్టుకునే మనం, కారాలు మిరియాలు నూరే మనం, తిరుగుబాట్లు ప్రబోధించే మనం, సమానత్వం గురించి ఘోషించే మనం మనుషుల్లో మనలాగే పుట్టిన మూడోరకం మనుషుల పట్ల మాత్రం అమానుషంగా వ్యవహరిస్తాం. విలన్లుగా ప్రవర్తిస్తాం.  అజ్ఞానమూ, దురహంకారమూ, అశాస్త్రీయమూ కలగలిసిన విచిత్ర వికృత ప్రవృత్తితో వారిని చూసి ఫక్కున నవ్వుతాము, హేళన చేస్తాము, అనుమానిస్తాము, అవమానిస్తాము కూడా. కడుపున పుట్టినా, తోడపుట్టినా కూడా కనికరించము. నిజంగానే పలుకాకుల్లా పొడుచుకు తింటాం.  తరిమేస్తాం.  వాళ్ళను చూడగానే నవ్వటానికి ఏం వాళ్ళు మన వినోదం కోసం పుట్టారా?  వాళ్ళను అనుమానంగా చూడటానికి, అవమానించటానికీ  వాళ్ళేమన్నా మన కట్టు బానిసలా? జాత్యహంకార చరిత్రలో కూడా ఏ తెల్లవాడూ మరో నల్లవాడ్ని చూడనంత ఘోరంగా మనమెందుకు చూస్తాం?  జననాంగాల చలనశీలతే కదా తేడా వాళ్ళకీ మనకు?  మనం పేద్ద పోటుగాళ్ళం, పోటుగత్తెలమై పునరుత్పత్తి కార్యక్రమానికి దోహదం చేస్తున్నామనేగా మన మిడిసిపాటు.  మిగతా అంతా వాళ్ళూ, మనమూ ఒకటే కదా! మనసు, హృదయం, స్పందన ఒక్కటే కదా! మనకైనా, వారికైనా చర్మాన్ని గాటు పెడితే వచ్చేది నెత్తుటి బొట్లే కదా. కడుపుకి వేసే ఆకలొక్కటే కదా! గాయపడ్డ గుండె కార్చే ఉప్పటి కన్నీరు ఒక్కటే కదా!  ఎందుకు సాటి మనుషుల్ని గౌరవించలేక పోతున్నాం? సాటి మనుషుల్ని చూసి ఏమిటా కుసంస్కారపు గగుర్పాటు? నిజానికి ఒక గొప్ప విషయం ఏమిటంటే థర్డ్ జెండర్ వారు ప్రధానంగా తమని తాము స్త్రీలుగా ప్రకటించుకుంటారు.  బహుశ కష్టాల్ని, కన్నీటిని, ప్రేమరాహిత్యాన్ని, ఎడబాటుని తాము స్త్రీలైతేనే భరించగలమేమొ అన్న అసంకల్పిత ఆలోచనే అందుకు కారణమేమో! వారో ప్రత్యేక సమూహంగా కదులుతారు. తమదైన లోకాన్ని, బంధాల్ని, బంధనాల్ని సృష్ఠించుకుంటారు.
రేవతి అనే హిజ్రా ఈ సమాజానికి పెద్ద ఝలక్ ఇచ్చారు.  ఆమె తన జీవిత చరిత్రని “ఒక హిజ్రా ఆత్మ కథ”గా మన ముందుకు తెచ్చారు.     ప్రకృతి పరంగానే ఒక మనిషిలో రెండు అస్తిత్వాల మనుగడ, రెండు లింగాల వైవిధ్య సమ్మేళనం వలన కలిగిన ఇబ్బందుల్ని ఆమె మనతో పంచుకున్నారు.  అతడుగా మొదలైన ప్రయాణం మధ్యలో ఆమె గా మారి, ఇంక ఎప్పటికీ ఆమెగానే కొనసాగే సాహసిక ప్రయాణంలో తన అనుభవాల్ని ఆమె మనతో పంచుకున్నారు.  ఆ ప్రయాణాన్ని చదివి, స్పందించి రేణుక అయోల “మూడవ మనిషి” అనే ఒక దీర్ఘకవిత రాసారు.  తెలుగులో అనే కాదు, ఏ భాషలో అయినా థర్డ్ జెండర్ మీద వచ్చిన సాహిత్యం అతి తక్కువ. అందుకుగాను రేణుక అయోల గార్ని ముందుగా అభినందించాలి.  నిజానికి దీర్ఘ కవిత ఒక క్లిష్టతరమైన కవ్విత్వ ప్రక్రియ.  పాఠకుడి ఆసక్తి ఎంతమాత్రం దెబ్బతినకుండా కవ్వితని నిర్వహించాలి.  వాక్యనిర్మాణం, నడకలతో కూడిన శిల్పంలో పరిపక్వత కనిపించాలి.  ఎక్కడా ఫీల్ చెడకూడదు.  భావోద్వేగ ప్రవాహం నిరంతరాయంగా కొనసాగాలి. దాన్లో చిన్న తేడా వచ్చినా యాంత్రిక వ్యక్తీకరణ ప్రస్ఫుటంగా కనిపించి, ఆసక్తి నీరసించి కవిత పఠనం కుంటుపడుతుంది.  అందుకే ఇదో చాలెంజ్.  అందుకే శివారెడ్డి గారు దీర్ఘ కవిత ఒక సవాలని, మంచి కవులు ఆ సవాలుని స్వీకరించాలని చెబుతుంటారు.  ఈ సవాలుని రేణుక స్వ్వీకరించారు.  స్వీకరించి పరకాయ ప్రవేశం చేసారు.  మొత్తం పదిహేను భాగాలుగా సాగిన ఈ 53 పేజీల కవిత మొత్తాన్ని ప్రధమ పురుషలోనే  నడిపించారు.  ఇదేం చిన్న విషయమేం కాదు.  ఇక్కడ సవాలు రెండు రకాలు. ఒకటి దీర్ఘ కవితే ఒక సవాలు కాగా, రెండోది ఎంచుకున్న వస్తువు.  అందరూ ముఖం తిప్పేసుకునే వస్తువు. ఇదేం చోద్యం అని బుగ్గలు నొక్కుకునే వస్తువు.  ఈ రెండూ కష్టమైన సవాళ్ళే.    ఇటువంటి కవిత రాయటానికి కేవలం సానుభూతి మాత్రమే కాక చాలా అవగాహన కావాలి.  ఒక మామూలు మనిషి ఒక వయసు వచ్చాక హిజ్రాగా మారే పరిస్తితుల పట్ల అవగాహన వుండాలి.  సాంఘీక పరిస్తితుల మీద, జెండర్ అంశాల మీద, దైహిక ప్రక్రియల మీద పూర్తి అవగాహన కావాలి.  ఇది వైద్యపరమైన సబ్జెక్ట్. సాంకేతికమైన సబ్జెక్ట్.  మనో వైజ్ఞానిక సబ్జెక్ట్.  అందుకనే ఇది కత్తిమీద సాము.  ఈ విషయంలో రేణుక గారు చాలావరకు సఫలమయ్యారు.
“రూపాన్ని వ్యక్త పరచలేని
ఒక దేహ చరిత్ర రాసుకోవాలనుకున్నప్పుడు
అక్షరాల గాయాలు రహిదారిలో నిలబడి
దిక్కులు చూస్తున్నాయి”
నిజమే సందిగ్దతే హిజ్రా అస్థిత్వం.  ఎందుకంటే “ఒక శరీరం రెండు రూపాలతో కొట్టుమిట్టాడు”తుంది కనుక.  ఆ కొట్టుమిట్టాడినతనాన్ని ఎలా చెప్పారంటే:
“కొన్నిసార్లు మరణించి
కొన్నిసార్లు జీవించి
ఆ రెంటి పొలిమేరల్లో బతుకుని ఒడొసిపట్టుకుని
ఈ కాగితం మధ్యలో నిలబడి
బతుకు గోడు చెప్పుకోవాలనుకున్నప్పుడు
ఒక నిశ్శబ్దపు నీలివర్ణం
నా చుట్టూ పేరుకుంది”
ఎదిగాకే మూడవ మనిషి. కానీ పుట్టినప్పుడు అందరూ మొగ పిల్లాడనే అనుకున్నారు.  సంబరపడ్డారు. అమ్మకి మాత్రం సందేహమే.
“చీరబొంతలో తమలపాకు కట్టలా నన్ను దాచి
సందేహంలో  పడిపోయిన అమ్మ
ఎన్నిసార్లో నా పసి దేహన్ని పట్టి చూసుకుందో”
మగపిల్లాడిగా పుట్టి ఆడతనపు ప్రవర్తనతో ఎన్నో ఇబ్బందులు పడ్డ ఆ జీవన ప్రస్థానాన్ని వివిధ దశల్లోని క్రూర ఘోర అనుభవాల్ని కళ్ళకు కట్టినట్లు చెబుతారు కవి.   ఆమె జీవితంలోని ప్రతి భావోద్వేగ సందర్భాన్ని  రేణుకగారి సహానుభూతి కవితాత్మకం చేసింది.  ప్రకృతిపరంగా తన ఆత్మ బంధువుల్ని కలిసినప్పుడు, చీర కట్టుకున్నప్పుడు, స్త్రీగా మారిపోవటానికి పురుషాంగం తీయించేసుకున్న ఆపరేషన్ చేయించుకున్నప్పుడు, ఇంటికి తిరిగివస్తే వెలివేయబడ్డప్పుడు, ఆకలి తీర్చటం కోసం వ్యభిచారం చేసినప్పుడు…ఇలా ప్రతిసందర్భంలోనూ మంచి వాక్యాలు రాసారు.  మచ్చుకి కొన్ని పంక్తుల్ని కింద ఇస్తున్నాను. చూడండి.
“ఒంటిని విడవని చీరకట్టు
కవచంలో కాపాడే చీరకట్టు
కలలో మెలకువలో వెంటపడ్డ ఆనందం
మెత్తని పక్షి ఈక ఒంటిని నిమురుతూ
జీవించటానికి తాగుతున్న అమృతం
మెడచుట్టూ గిల్టు నగలు
అద్దం కాంతికి మెరిసే తెల్లటి రాళ్ళు”
“నా చేతినిండా ఆకలి చుట్టూతా ఆకలి
ఆకలి చల్లార్చడానికి బజారున పడ్డ శరీరాలు
చప్పట్లు చరుస్తూ మీద మీద పడుతూ
దండుకునే రూపాయల నిండా దుఖం”
“గాయపడ్డ నరం చిట్లినప్పుడు
లోలోపల ప్రవహించే నెత్తురు చప్పుడు
కళ్ళ కొసలలో ఆగిపోయేది”
“శరీరం చెట్టు నుండి
కొమ్మలు నరకాలి అనుకున్నప్పుడు
కూకటివేళ్ళతో సహా పెకిలించబడింది
శరీరం నుండి చిన్న అంగం తెగిపడింది
చుట్టూతా నిశ్శబ్దం
జీర్ణం కాని జడత్వం
చల్లారిన అగ్నిపర్వతం”
“ఇప్పుడు నేను స్త్రీని
అదమైన జీవితంతో
నీలినదిలో పడవలో తేలుతున్న చంద్రవంకని
రేపటి వెలుగులోకి తొంగి చూస్తున్న
ఒంటరి నక్షత్రాన్ని”
“రోడ్డు మీద గోడవారగా
రేకు తలుపులు ఆనుకొని
దేహాన్ని అమ్మకానికి పరిచిన ప్రతిసారి
ఒక నొప్పి పేగులు తెంచుకొని
రక్తాన్ని బైటకి తెస్తుంది”
“ఈ శరీరాలకి వెల వుంది
ప్రేమకి వెల లేదు
దాహానికి నోటు వుంది
ఆప్యాయతకి ఆసరా లేదు
చేతినిండా దాహపు పాత్రలే”
ఇలా గుర్తించదగ్గ, గుర్తుపెట్టుకోదగ్గ పంక్తులు ఈ దీర్ఘ కవితలో కనిపిస్తాయి.  ఈ భూమ్మీదకి మనందరిలాగానే వచ్చి ఒక తీవ్ర అంతర్ అన్వేషణతో తన అస్తిత్వాన్ని నిర్ధారించుకునే “మూడవ మనుషులు” గురించి వేదనాత్మకంగా రాసిన అర్ధవంతమైన కవిత ఇది.  మొదటి నుండి చివరి వరకు చదివించగల సరళవంతమైన నడక, నిర్వహణ కనబడుతుంది.  అక్కడక్కడా కొంత వాచ్యంగా అనిపించొచ్చు.  కొంత ఎడిట్ చేసుకోతగ్గ పంక్తులూ లేకపోలేదు. అయినా మొత్తం మీద వస్తువు, రూపం, నిర్వహించిన తీరుతో ఒక విలువైన కవితగా రూపొందించారు. అభినందనలు రేణుక గారూ!
(“మూడవ మనిషి” దీర్ఘ కవిత. రచన రేణుక అయోల, 8-3-677/ఎ/2, యూకో ఆర్కేడ్, ఫ్లాట్ నం.2, నవోదయ కాలని, యెల్లారెడ్డిగూడ, హైదరబాద్-500037. వెల రూ.50. ప్రచురణ జె.వి.పబ్లికేషన్స్.)

అవును నిజమే… స్వప్నమే కావాలి!

 

 శివలెంక రాజేశ్వరీదేవి  రాసిన కవితల పుస్తకం “సత్యం వద్దు స్వప్నం కావాలి” ప్రచురణని గురించిన వార్త  కనిపించిన ప్రతి సారి తప్పకుండ ఆ బుక్ చదివి తీరాలన్న కోరిక బలం గా పాతుకుంది. అలాగే సాయంకాలపు వడగాలుల్ని మహా నగరపు దూరాభారాల్నీ దాటి తార్నాక నుండి  అబిడ్స్ లోని  గోల్డెన్ థ్రెషోల్డ్ లో అడుగు పెట్టి బుక్ కొన్న తర్వాత గానీ ఆ లోలోపలి అశాంతి తగ్గలేదు. ఏదో అపురూపమైంది చదవడానికి దొరుకుతుందన్న నమ్మకం.  అప్పటికి అక్కడ వీర లక్ష్మి గారి ఉపన్యాసం వినిపిస్తోంది. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి ఉపన్యాసం ముగిసిందీ. అక్కడి వక్తల ప్రసంగాలేవీ చెవికెక్కలేదు. అప్పటికి ఒక పాతిక పుస్తకాల దాకా సేల్ అయినట్టున్నాయి. తెలిసిన వారందరికి హెల్లోలూ హాయ్ లు చెప్పేసి ఇంటికి వచ్చేసి, డిన్నరయ్యాక, స్థిమితంగా వెనక పరిచయాల వివరణల నుంచీ మొదలు పెట్టాను చదవడం. ముట్టుకుంటే చిట్లిపోతుందేమో అనిపించే గాజు బొమ్మ, రాత్రిని పగలు గా పగటిని రాత్రిగా మలుచుకున్న స్వాప్నిక, ప్రేమార్త హృదయం – ఇవీ అందులో అందరూ కామన్ గా రాజేశ్వరి గురించి ఉదహరించిన విశ్లేషణలు. మొదటి కవిత “ఊరికెనే” చదవడం మొదలు పెట్టాను.

 

ఎంతో మామూలుగా సామాన్య ధోరణిలో తేలికగా ఉపయోగించే పదం అది. చిన్న సంభాషణా పూర్వక దృశ్యాన్ని ఆవిష్కరించిన కవిత అది. వాక్యం తర్వాత వాక్యం చదివే సరికి, నా చుట్టూ ప్రపంచపు కోటి గొంతులు ప్రతిధ్వనించాయి. ప్రతి వాక్యమూ ప్రపంచపు కఠినత్వపు ధోరణి, మూగగా స్పందించే కవితాత్మక సుకుమారత్వమూ, కొంత బేలతనమూ, ఒక హృదయపు కోమలత్వమూ సాక్షాత్కరించాయి. మొదటి కవిత చదవడం పూర్తయ్యే సరికి, తెలియని గుండె భారం కళ్ళకు కమ్మి, పేజీలని ముందుకు కదలనివ్వలేదు.
 
ఈ కవితకి యే వ్యాఖ్యానమూ అక్కరలేదు. ప్రపంచపు పోకడలకీ కవయిత్రి పసి మనసుకి జరిగిన సంవాదమిది. అతి సులభంగా ప్రతి సున్నిత హృదయమూ తనని తాను చూసుకునే అద్దం. అందుకే యే వివరణ ఇవ్వకుండా – సూటిగా కవితనే ఇక్కడ పొందు పరుస్తున్నాను. అద్దం లో నెలవంక శీర్షికని తిరిగి మొదలు పెడదామని గత మూడు నెలలుగా చాలా ప్రయత్నిస్తున్నాను. రఫ్ స్కెచెస్ రాసుకున్న కవితలున్నాయి. కానీ తనను తాను గా ప్రవహింప చేసుకున్న చిక్కని భావాన్ని, తేట దనపు ప్రవాహాన్నీ ఒకే చోట చూసిన యీ కవిత చదవాక యీ కవితా సంపుటి గురించి తప్పక రాయాలి అనిపించింది. పరిమళానికి చిరునామాలు అవసరం లేదు. వ్యాపించడమే దాని పని. రాజేశ్వరి పరుచుకుంటూ వెళ్ళీన అక్షరాల వెంటా మన కళ్ళు పరుగెత్తిస్తే చాలు, అనేక అమూర్త భావాల మల్లెల పారిజాతాల పరిచయాలవుతాయి, నైట్ క్వీన్ డాఫోడిల్స్ ఆమె వెన్నెల ఏకాంతాల రహదారుల్లో సాక్షాత్కరిస్తాయి. వేదనా భరితమైనా, ఏకాంతమే స్వాంతన ఆ కవితాత్మక మూర్తికి!  ఆలస్యం గా నైనా ఆమె కవితలు ఇలా ఒక సంకలనంగా చదువరుల చేతికి అందించిన విషయమై  తెలుగు కవితాత్మక ప్రేమికులు నామాడి శ్రీధర్ గారికి ఋణపడివుంటారు!
 
అక్షరాల నిండా పరుచుకున్న రాజేశ్వరీదేవి వేదనాత్మక ప్రణయ పూరిత భావాల గాలుల్ని మనస్ఫూర్తిగా శ్వాసించిన మనసులన్నీ  ఆమెతో యీ విషయంలో ఏకీభవిస్తాయి…
  అవును నిజమే… సత్యం వద్దు, స్వప్నమే కావాలి!

 
“ఊరికేనే”

 
కవితా సంకలనం: సత్యం వద్దు స్వప్నమే కావాలి
కవయిత్రి: శివలెంక రాజేశ్వరీదేవి
ఎందుకలా వర్షం లో
డాబా మీదకి వెళతావ్ పాపా?
“ఊరికేనే”
ఎందుకలా పని ఆపేసి
పాట వింటావ్ పాపా
“ఊరికేనే”
ఎందుకనవసరంగా
వాళ్ళ దిగులు నీకు పాపా
“ఊరికేనే”
ఎందుకా టెలిఫోన్ టాక్ పాపా
“ఊరికేనే ఆ స్వరం తీయగా వుంటేను”
ఇక్కడ ఆగి అక్కడ ఆగి పనేమైనా వుందా?
“ఊరికెనే, పనేం లేదూ పలకరించి పోదామని”
ఇదిగో ఇదే చెపుతున్నా గుర్తుంచుకో పాపాయ్
పనేం లేకపోతే
ఊరికేనే పలుకరించకూడదు ఎవరినీ-
ఆ అలా చూడకు నా కళ్ళలోకి “ఊరికేనే”
అదో ప్రశ్నార్థకమై నన్ను భయపెడుతుంది
***

కవిత్వంలో “మెటానమీ” !

 

metonymy_cover

-పెన్నా శివరామకృష్ణ

~

 

–“Chess is a play – activity,  yet it is play only because the players deliberately make the game difficult in order to overcome the difficulties. The equation is simple: no difficulty no fun. No Chess player finds

any real pleasure in playing an obviously inferior opponent. Every game ever invented by mankind is

a way of making things hard look easy…….Learning to experience poetry is not a radically different

process from that of learning any other kind of play.”

–John Ciardi   (How Does a Poem Mean, pg. 669)

 

క్లుప్తతనూ, గుప్తతనూ సాధించడం కోసం కవిత్వంలో ఉపయోగింపబడే అనేక పద్ధతులలో మెటానమీ (Metonymy), సినెక్^డకీ (Synecdoche) కూడ ప్రధానమైనవి. ఇవి నిశ్చయంగా అలంకారాలు కాకపోయినా అలంకారాల వంటివే. మెటఫర్ (రూపకానికీ)కు దగ్గరి సంబంధం కలిగినవి మెటానమీ, సినెక్^డకీ.  మెటానమీకి దగ్గరి పోలిక కలిగినది సినెక్^డకీ.

–“In metonymy (Greek for “a change of name) the literal term for one thing is applied to another with

Which it has become closely associated because of a recurrent relation in common experience.

Thus “the crown” or “the scepter” can be used to stand for a king and “Hollywood” for the film

Industry. ……….In synecdoche (Greek for “taking together), a part of something is used to signify

the whole, or (more rarely) the whole is used to signify a part. We use “ten hands” for

“ten workers”, in current slang “wheels” to stand for an automobile

–M.H. Abrams (A Glossary of Literary Terms, pg. 103)

ఒక వస్తువుకు లేదా అంశానికి విడదీయరాని సంబంధం కలిగిన లేదా సన్నిహిత సంబంధం కలిగిన అంశాన్ని మాత్రమే పేర్కొనడం ద్వారా, ఆ వస్తువును (లేదా ఆ అంశాన్ని) అంతటినీ సూచించడాన్ని మెటానమీ అంటారు. ఒక వస్తువులోని ఒక భాగాన్ని మాత్రమే పేర్కొని, ఆ వస్తువునంతటినీ సూచించడాన్ని సినెక్ డకీ అంటారు. ‘శకలం’ ద్వారా ‘సకలం’ స్ఫురింపజేయడం వీటిలో ప్రత్యేకత.

మెటానమీ, సినెక్^డకీ అనేవి ఆంగ్ల అలంకార శాస్త్ర పారిభాషిక పదాలే అయినప్పటికీ, తెలుగు నుడికారాలలో, జాతీయాలలో, సామెతలలో గుప్తంగా ఒదిగి ఉన్నవే. “పొయ్యిలో పిల్లి లేవలేదు” అనే జాతీయంలోని  ‘పొయ్యి’ అనే ప్రధాన సాధనం ద్వారా ‘వంట’ సూచింపబడింది. “కత్తి కంటే కలం గొప్పది” అనే వాక్యం కూడ ఇలాంటిదే. ఇక్కడ ‘కత్తి’ యుధ్ధానికీ, ‘కలం’ ప్రబోధాత్మకమైన రచనలకూ ప్రతినిధులు. ఇలాంటివన్నీ మెటానమీకి ఉదాహరణలే. “నోరు మంచిదైతే, ఊరు మంచిదవుతుంది” అనే వాక్యంలో,వ్యక్తి యొక్క మాటతీరు, నడవడిక, వ్యవహార జ్ఞానం మొదలైన వాటికన్నిటికీ నోరు సంకేతం. “తలా ఒకటి ఇవ్వడం..” అనే వాక్యంలోని ‘తల’ వ్యక్తి సూచకం. ఇలాంటివి సినెక్^డకీ కి నిదర్శనాలు.

లక్ష్యార్థంతోపాటు ముఖ్యార్థం కూడ అన్వయిస్తున్నప్పుడు, దానిని భారతీయ అలంకారశాస్త్ర పరిభాషలో ‘ఉపాదాన లక్షణ’ అంటారు. దీనికే ‘అర్థాంతర సంక్రమిత వాచ్యం’, ‘అజహల్లక్షణ’, ‘అజహదభిదేయ’ అనే నామాంతరాలున్నాయి. ఒకరకంగా మెటానమీ, సినెక్ డకీలు ‘ఉపాదాన లక్షణ’లో అంతర్భాగాలే. ఒక వాక్యంలో వాచ్యార్థం పోసగనప్పుడు, రూఢిని బట్టి కానీ, ప్రయోజనాన్ని బట్టి కానీ, మరొక అర్థాన్ని స్ఫురింపజేసే శబ్దశక్తిని “లక్షణ” అన్నారు. ‘ప్రాణి లక్షణారోపణ’, ‘మానవ లక్షణారోపణ’, ‘ప్రతీక’, మెటానమీ, సినెక్^డకీ లాంటి విభజనలనూ, అంతర్విభజనలనూ చెప్పకపోయినా, ఇలాంటివన్నీ వివిధ ధ్వని భేదాలలో అంతర్భాగాలే.

ప్రపంచంలో ఎక్కడైనా అలంకారశాస్త్ర పరమ లక్ష్యం కావ్యసౌందర్య అన్వేషణమే. కావ్యసౌందర్య సాధనాలను రకరకాలుగా సూత్రీకరించి, విభజించి, రకరకాల పేర్లు పెట్టారు. ఈ విభజనలలో, నామకరణాలలో కొన్ని భేదాలున్నప్పటికీ, సంఖ్యాధికమైన సామ్యాలూ ఉన్నాయి.

—“వర్తమాన తెలుగు కవిత్వాభివ్యక్తికి వైవిధ్యం ప్రధానంగా నాలుగు అభివ్యక్తి విధానాల ద్వారా వస్తున్నది. అవి వరుసగా 1. Metaphor, 2. Metonymy, 3. Synecdoche, 4. Paradox. వీటిని  వీటిని ‘tropes’గా వ్యవహరిస్తున్నారు విమర్శకులు. అంటే, భాషను సాధారణ అర్థాల నుంచి   విశేష అర్థాలకు మార్చే సాధనాలు. ఒక కోణంలో అలంకారాలే కానీ ఖచ్చితంగా అలంకారాలు కావు.   భాషలోని పదాలకుండే అర్థాలను సందర్భానుగుణంగా మార్చి నూతనార్థాలను సృష్టించే పనిని ఇవి   నిర్వహిస్తాయి. ఈ సాధనాలు లేకుండా కవిత్వం ఉండే వీలు లేదు.” (“అదే పుట” సాహిత్య వ్యాసాలు  పు. 17)

పై సీతారాంగారి పరిశీలన సమంజసమైనదే. కాని, వర్తమాన వచనకవిత్వంలో, పర్సానిఫికేషన్, ఐరనీ, సానుకూల లేదా ప్రతికూల సమాధానాలను ఆశించే ప్రశ్నలతో కూడిన (రిటారిక్) సంభాషణాత్మకత లాంటి వ్యక్తీకరణ పద్ధతులు కూడ ప్రముఖ భూమిక పోషిస్తున్నాయి.

***

—“ఓల్గా ఘనీభవించెను / యంగ్సీ నది పొంగెను / రుతుగీతికి పరవశించి/గంగ కూడ పొంగెను”

“రుతుసంగీతం” అనే శివసాగర్ గేయంలోని పై వాక్యాలు ప్రసిద్ధమైనవే. ఇక్కడ ‘ఓల్గా’, ‘యంగ్సీ’, ‘గంగ’లు క్రమంగా సోవియట్ రష్యా, చైనా, భారత దేశాలను గుర్తు చేస్తాయి. సోషలిజం సాధనలో రష్యామార్గం గడ్డకట్టుకుపోయింది, మార్క్సిస్టు లెనినిస్టు పంథాను మావో ఆలోచనావిధానం ద్వారా చైనా కాపాడుకుంటున్నది, చైనా స్ఫూర్తితో భారతదేశంలో విప్లవోద్యమం విస్తరిస్తున్నది అనేది లక్ష్యార్థం. నదుల పేర్ల ద్వారా దేశాలూ, దేశాల పేర్ల ద్వారా విప్లవోద్యమాలూ స్ఫురింపజేయబడినాయి. ముఖ్యార్థ సంబంధం సాక్షాత్ సంబంధంగా కాక పరంపరా సంబంధంగా అభివ్యక్తమైతే కనుక, దానిని భారతీయ ఆలంకారిక పరిభాషలో ‘లక్షితలక్షణ’గా చెప్పవచ్చు.

—“నేను జేబుల్లో కోకిలల్ని వేసుకురాలేదు

                                      పిడికిళ్ళలో బాంబుల్ని బిగించుకుని వచ్చాను”  (ఆధునిక మహాభారతం, పు. 332)

 

ఇవి శేషేంద్ర వాక్యాలు. ఇవి వాచ్యార్థాలు పొసగని వాక్యాలని తెలుస్తూనే ఉంది. ఇక్కడ ‘కోకిలలు’ వసంత రుతు సూచకాలు. ‘బాంబులు’ ఆధునిక ఉపకరణాలలో ప్రధానమైనవి. వసంత రుతువు, ఆనందదాయక జీవనస్థితినీ, భోగప్రవృత్తినీ (శృంగారాన్నీ) తెలుపుతుంది. యధాతథ స్థితిని కాంక్షించే వారికీ, సంతుష్ఠ భద్రలోక జీవులకూ తన కవిత్వం ఆనందం కలిగించేది కాదనేదీ, సామాజిక చైతన్యాన్ని కలిగిస్తూ పీడితులను పోరాటాలకు ఉసిగొల్పుతుందనేదీ పై వాక్యాల భావం.

గుండె పగిలిన తమసా తీరం, ఘూర్ణిల్లింది శోకచ్చందంగా” (విశ్వంభర, పు. 27),  తమసా నదీ తీరంలోనే వాల్మీకి ఆశ్రమం ఉండేదట. ‘శోకచ్చందం’ అనే కొత్త పదబంధం, ‘శ్లోకం శోకత్వమాగచ్చతి’ అనే సాంప్రదాయిక భావనకు సూచకం. ‘గుండె పగలడానికి’ కారణం పక్షుల జంటలో ఒక పక్షిని ఒక బోయవాడు చంపడం. దానిని చూసిన వాల్మీకి నోట అప్రయత్నంగా “మానిషాద ప్రతిష్ఠాంత్వమ్…” ఇత్యాది శ్లోకం వెలువడడం…అదే రామాయణ రచనకు నాందీవాచకం కావడం అనే అంశాలన్నిటినీ అతి తక్కువ మాటలలో కవి ధ్వనించాడు. మానవ లక్షణారోపణతో కూడిన, ‘తమసాతీరం” అనే మెటానమీ ఈ క్లుప్తతకు ప్రధాన కారణం.  –“ప్రతి మకుటం తన కాలిగోటిలో ప్రతిఫలించాలని…” (విశ్వంభర, పు. 50) ఇక్కడ మకుటం అంటే మకుటధారులని లక్ష్యార్థం. లక్ష్యార్థంలో ముఖ్యార్థం కూడ ఇమిడి ఉన్నది. ప్రయోజనం దృష్ట్యా అర్థాంతరాన్ని చెప్పుకుంటున్నాం. లక్ష్యార్థం తోపాటు ముఖ్యార్థం కూడ వాక్యార్థంలో అన్వయిస్తూ ఉంటే దానిని ’ఉపాదాన లక్షణ’ అంటారు. ఇది సినెక్^డకీకి ఒక ఉదాహరణ.

–“నా గూడు బాణసంచా అవుతుంది

                             నా గూడు భోగిమంటవుతుంది

                             నా గూడు నరకాసురుని చితాభస్మమవుతుంది”

 

ఖాదర్ మొహియుద్దీన్ గారి “పుట్టుమచ్చ” (దీర్ఘ కవిత”)లోనివి ఈ వాక్యాలు. ఇక్కడ దీపావళికీ, సంక్రాంతికీ, దసరాకీ అవినాభావాలైన ‘బాణసంచా’, ‘భోగిమంట’, ‘నరకాసురుని చితాభస్మం’ అనే ప్రయోగాలు గమనించండి. ఈ మూడు పండుగలనూ ప్రస్తావించి, హిందూ ఆధిక్యతాభావాగ్నికి ముస్లింల ఆత్మగౌరవం భస్మమవుతున్నదన్న భావాన్ని వ్యంగ్యం చేశారు. ఇదే కవితలో “త్రిశూలాల మొనల మీదా / పి. ఏ. సి. తుపాకుల కోనల మీదా / బాలెట్ బాక్స్ ల కొనల మీదా/ నెత్తురోడుతున్న నా పుట్టుమచ్చను గురించి ప్రశ్నించలేను” అన్నారు. హిందూ మతోన్మాదమూ, సైనిక (పోలీసు)వ్యవస్థా, ‘ప్రజాస్వామ్యమూ’ ముస్లిం సమాజాన్ని వంచిస్తున్న తీరును ధ్వనించడానికి,  ‘త్రిశూలాలు’, ‘తుపాకులు’, బాలెట్ బాక్స్’ అనే మాటలను కవి ఎంతో సమర్థంగా ఉపయోగించుకున్నాడు.

జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వారి కష్టనష్టాలను చెబుతూ “బతకవోయిన చోట / ఇంటి తుఫాన్లు ఇసుక తుఫాన్లు తట్టుకోవలసిందే / ఎన్నాళ్ళయినా కట్టెను మోసుకుంటూ బతక వలసిందే” (ఇక్కడి చెట్ల గాలి, పు. 12) అన్నారు నందిని సిధారెడ్డి. ‘ఇంటితుఫాన్ల’ ద్వారా, స్వగ్రామంలోనే ఉన్న కుటుంబ సభ్యుల కష్టనష్టాలనూ, ‘ఇసుకతుఫాన్ల’ ద్వారా అక్కడి వృత్తిపరమైన, వ్యక్తిపరమైన ఒత్తిడులనూ దుఃఖాలనూ స్ఫురింపజేశారు. “నడి ఎండలో పడి పడి పాదయాత్ర చేస్తే / మనిషిని నమ్మాలె గద / నమ్మిన / పాదాలకు కండ్లుంటయంటరు / పాదయాత్ర చూపంతా / భూముల ఆక్రమణ వ్యూహమని గుర్తించలేదు” (ఇక్కడి చెట్ల గాలి”, పు. 43) అంటూ, ‘పాదయాత్ర’ అనే మాట ద్వారా, ఆనాడు పాదయాత్ర చేసే గద్దెనెక్కిన ఒకానొక ముఖ్యమంత్రి నిర్వాకాలను గుర్తు చేశారు. “సింహాసనాలూ, సినిమా హోర్డింగులూ వియ్యమందుకుంటాయి” అనే చోట, ‘సింహాసనాలు’, అధికారం అనుభవిస్తున్న ‘పెద్దల’కూ, ‘సినిమా హోర్డింగులు’ సినిమా రంగంలోని ‘పెద్దల’కూ సంకేతాలు.

“నల్లతల్లి” అనే కవితలో “బొట్టులేని నీ కాటుకరంగు నుదురు చూస్తే / కుంకుమ భరిణెలు నెత్తురు కక్కుకుంటాయి” అన్నారు ఎండ్లూరి సుధాకర్. హిందూ (ఐదువ) స్త్రీలకు సంబంధమున్నవి ‘కుంకుమ భరిణెలు’. తద్ద్వారా హిందూభావజాల ప్రతినిధులు. దళితులనూ, అందులోనూ దళితక్రైస్తవులనూ కొందరు హిందువులు న్యూనంగా చూసే ధోరణిని ధ్వనించడానికి, కవి మెటానమీని చక్కగా వాడుకున్నారు.

సానుకూల (లేదా ధనాత్మక) ఫలితానికి దారి తీసే “అనూహ్యత” (“అపూర్వత” కూడ) జీవితంలో అయినా, కవిత్వంలో అయినా అమిత ఆనందదాయకమే. ఉపమానం, ఉత్ప్రేక్ష, ప్రతీక లాంటి ఆలంకారిక రీతులలో కానీ, సంపూర్ణంగా అభివ్యక్తి రూపంలో కానీ పాఠకుడు ఊహించని ప్రయోగాలు ఎదురైనప్పుడు, ఆ ప్రయోగాలు వక్తవ్యాంశాన్ని గుప్తంగా వెల్లడించి నప్పుడు, ఆ రచన పాఠకుడిని గొప్పగా ఆహ్లాదపరుస్తుంది. ( ‘పారదర్శకం’ కాని ‘గుప్తత’, ‘నిగూఢత’గా పరిణమిస్తుంది. ఎవరు అన్ని సిద్ధాంతాలను అడ్డుపెట్టుకొని సమర్థించుకున్నా, అలాంటి రచనలు ‘భావాలను బట్వాడా చేయలేక’ అర్థరహితమైనవిగానే మిగిలిపోతాయి, క్రమంగా కాలగర్భంలో కలిసిపోతాయి. గత మూడు, నాలుగు దశాబ్దుల తెలుగు కవిత్వంలోనే ఇందుకు ఉదాహరణ ప్రాయమైన ‘రచన’లు ఎన్నో ఉన్నాయి.)  అలాంటి రచనలలోని వస్తువుకు వన్నె సమకూరుతుంది; కవి దృష్టికోణాన్ని పాఠకుడు తేలికగా అందుకొన గలుగుతాడు. అదను ఎరిగి ప్రయోగింపబడే పదునైన మెటానమీలూ, సినెక్^డకీలూ చదువరికి అనూహ్య ఉదాత్త ఆనంద ప్రదాయకాలై, కవి లక్ష్యసిద్ధికి తోడ్పడుతాయి.

కవిత్వం రెండు రకాలుగా ఉంటుంది. ఆలంకారికంగా నయితే. ఒకటి synecdoche, మరొకటి metonymy . ముఖ్యంగా ఆధునిక కవిత్వం మెటనామిక్ గా, మిథో పోయిక్ (mytho – poeic) గా ప్రవర్తిల్లుతోంది.” అన్నారు వేగుంట మోహన్ ప్రసాద్. (రహస్తంత్రి, పు. ii)

 

***

 

 

 

 

 

 

 

 

 

 

 

తమకమూ + తాత్వికత = గాలి అద్దం!

 

-నిశీధి

~

కాలం కాసేపు కదలకుండా కవిత్వం అవ్వడం అంటే గాలి అద్దంలో మనల్ని చూసుకోవడం కాబోలు అనిపించేలా , ఎన్ని ఊహాలు  ఎన్ని ఊసులు .

చదువరికి ఒకో పేజి తిప్పుతున్నప్పుడు ఒకో పాదం గుండా పదాల సరిగమల్లో సాహితీకరణ చెందుతున్నప్పుడు ప్రతి అనుభూతి తనదే అనిపించాలి , భవిష్యత్తు వర్తమానం కన్నా కూడా ఎదో జ్ఞాపకాల వీచికలో బలంగా కొట్టుకుపోతున్న భావనలో కాసేపు నలిగి కరగాలి . అపుడది కవిత్వం అవుతుంది ఇంకా  సరిగ్గా చెప్పాలంటే  గాలి అద్దం అవుతుంది .

 

విప్పేసిన జ్ఞాపకాలనే

తిరిగి తిరిగి తొడుక్కుని

మరణ ప్రవాహంలో ఈదుతావు

నిశ్శబ్దాన్ని నిశ్శబ్దంతో వింటూ తేలిపోతుంటావు

కవిత్వమేనా  ఇదంతా  కాదేమో ,కవి ఆత్మ కవితాత్మతో ముడిపడి సున్నితంగా గుండెకోత జరిపే క్షణాల అనుభవమేమో . నమ్మకం  కలగలేదా  అయితే

“ ఈ రాత్రినే

దాచిపెట్టు నేలవంకకి తెలియకుండా “

ఈ వాక్యంలో నిన్నోమారయిన పోగొట్టుకున్నావా నేస్తం ? లేదంటే  ఇలా చూడు

“పాడుబడ్డ పదాల పేద గూటిలో

పెంచుకున్న వాక్య పక్షి ఎగరదు

దిగంతాల దుఃఖమేది అందదు .

Hmmm కాసేపో  విషాదం కమ్ముకున్న మేఘంలో ఒంటరి ప్రయాణం .

 

సోషల్ మీడియాలో అక్కడక్కడా సత్యంగా  చెప్పుకోవాలంటే చాలా అరుదుగా  మెరిసే మెరుపులా చమక్కులా మాత్రమే ఎం ఎస్ నాయుడు గారు తెలిసిన నాలాంటి చదువరులు “ గాలి అద్దం”  పుస్తకాన్ని చేతుల్లోకి  తీసుకోగానే ముందు కవర్పేజీల  నలుపు తెలుపు రంగుల్లో రమణజీవి , శంకర్ పామర్తి గారి గీతలలో  మిస్టిక్ వాసనలకి మైమరిచిపోయి కాసేపలా ఆగిపోవడం  ఒక వంతయితే  పేజీలు తిప్పడం  మొదలు పెట్టగానే నెమ్మదిగా  మొదలయ్యే ఉద్వేగం , ప్రాణం ఎక్కడ ఆగుతుందో , కవిత యే జ్ఞాపకాల పరదాలు చీల్చుకొని  ఏ కణంలో సున్నితంగానే  అయినా  కస్సుమని దిగుతుందో  చెప్పడం  అంత  సులువేం కాదు .

నిజానికి  గాలి అద్దంలో ప్రతి కవిత  ఒక రోలర్ కోస్టర్ రైడ్గానే చెప్పుకోవాలి

మనసొక శోకవాయువు అని మొదలు పెట్టి ఇపుడైనా గెంతెయ్యాలి మనసు మట్టి మీద నుంచి అని రాసుకోగలిగే  కవులు  ఎంత మంది  ఉంటారు , ఆ కవితా సముద్రంలో కాసేపు ఉక్కిరిబిక్కిరికాకుండా మనం ఎలా  ఉండగలం .

టాగోర్ ఆరాధన నుండి భయటికి రావడానికి ఇష్టపడని సాహితీప్రియులు “ విసిరేసిన వక్షోజాలు జారుడుబల్లలో ఆగిపోయి కలలు కంటున్నాయి “ లాంటి వాక్యాలకి ఎంతగా ఉలిక్కి పడతారో తెలియదుగాని , ఈ పుస్తకంలో “ డాలీనందుకోలేక “ కవితలాంటివి అలాగే స్థలంకై స్తనంకై లాంటి టైటిల్స్ ,  ఎం ఎస్ గారి పదాల్లో బోల్డ్ నేచర్కి న్యూ ఏజ్ కవులు ఒక సలాం  కొట్టాల్సిందే . పుస్తకం మొదట్లో కంటే కూడా లోలోపలకి చేరేకొద్దీ కవితో పాటు రీడర్ తనలోకి తానూ చేసే ఏకాంత ప్రయాణమొక నిజ అనుభవం . కొన్ని క్షణాల స్టిల్  లైఫ్ . అందుకే అన్నది ప్రాణమెక్కడ  ఆగిందో  పదమెక్కడ గుచ్చుకుందో చెప్పడం అంత సులువేం కాదు .

Thomas Gray ప్రఖ్యాత వాక్యం చెప్పినట్లు Poetry is thought that breathe and words that burn అని సెగలు , శ్వాసలు , శ్వాసల సెగలలో సగం సగం కాలిపోయి నిలబడటం గాలి అద్దం స్పెషాలిటీ ఖచ్చితంగా . జీవితపు తమకానికి తాత్వికత అద్దితే అదే ఎం ఎస్ నాయుడి గారి గాలి అద్దం . సాహితీవ్రణాలకో అవసరమైన మలాం .

*

 

ఏ పిలుపో వినిపిస్తుందనే ఆశతో…

Kasepu

-అరణ్య కృష్ణ

~

 

“కాసేపు” అంటూ ఒక 22 సంవత్సరాల క్రితం  తీరైన కవిత్వం చెప్పి మళ్ళీ కనిపించకుండా పోయాడు వాసు.  అంత మంచి కవులు ఏదో కాసేపు – అంటే ఒక ఐదారేళ్ళ పాటు కవిత్వం చెప్పి మళ్ళీ కలం పట్టుకోక పోతే ఎలా?  అలాంటీ వాసుని పరిచయం చేయటం ఈ వ్యాసం ఉద్దేశ్యం.  1987 నుండి 1994 వరకు సుమారు 7 సంవత్సరాల కాలంలో కేవలం ఒక 15 కవితలు మాత్రమే రాసిన వాసు కవితల్లో అధిక భాగం “ఆంధ్రజ్యోతి” వారపత్రికలోనే ప్రింటయ్యాయంటే కవిగా అతని సత్తా ఏమిటో తెలుస్తుంది.  ఆయన తన కవితల సంకలనం “కాసేపు” 1994లో ముద్రించారు.  ఈ సంకలనం నగ్నమునికి అంకితమిచ్చారు.

అతి సరళమైన వ్యక్తీకరణలో భావోద్వేగాల జుగల్బందీ వినిపించటం వాసు ప్రత్యేకత.  ఈయన కవితలు పల్లెలోనూ, సంస్కృతిలోనూ లోతైన పునాదులు కలిగివుండి బతుకుతెరువుకి నగరానికి వచ్చిన అనంతరం  కోల్పోయింది పొందలేక, ఉన్నదాన్ని స్వంతం చేసుకోలేని ఒక అస్తిమిత మానసిక స్థితిని తెలియచెబుతాయి.  వాసు చెప్పినట్లు “కాలం ముందుకే పోతుంది/మనసు వెనక్కి కూడా పోగలదు”.  ముందుకురుకుతున్న కాలంకి వ్యతిరిక్తంగా బాల్యంలోకి, బాల్యంలో మాత్రమే ఆస్వాదించగల మానవ సంబంధాల పరిమళాల్లోకి కవి జారుకుంటాడు.  అలా జారుకున్నప్పుడే “సంప్రదాయానికి నమస్కారం” అన్న కవిత వస్తుంది.  ఈ కవిత శీర్షికలో లేని కవిత్వమంతా కవితలో వుంది.

“అది ఎగరటానికి రెక్కలక్కర్లేని వయసు

అనుక్షణం ఆనందం ఒక్కటే మనకి నేస్తం

నేస్తం కట్టడమే పసిపిల్లల చాదస్తం”

 

“తుపాకీ పేలిస్తే పువ్వులు రాలేవి

కన్నీళ్ళు పోస్తే నక్షత్రాలు మొలిచేవి”

 

ఇంతకంటే సరళంగా బాల్యాన్ని నిర్వచించటం ఎవరికైనా సాధ్యమా?  గడిచిపోయిన కాలాల్లోకి దూకి బతికిన క్షణాల్ని నెమరేసుంటాడు కవి అలా.  ఎందుకంటే “బాల్యానికి కాలం పట్టదు / బాల్య స్మృతులకు కాలదోషం పట్టదు”

“నాకూ చెట్టుకూ పెద్ద తేడా ఏముంది?

పండిన ఆకుల ముడతలతో

పువ్వుల కవళికలతో

చెట్టు నాకు అద్దం పడుతుంది

నడుస్తూ నేను చెట్టుకు కదలికనవుతాను

వేళ్ళు భూమిలో పాతుకుపోయి

కదలలేని శక్తిహీన ఈ చెట్టు

కాళ్ళు కదపగలిగీ శక్తిహీనుణ్ణి నేను”

 

“చెట్టుతో సంభాషణ అనవసరం

చెట్టు దగ్గర దాపరికం అసాధ్యం”

 

“ఎవరో చెట్టుకున్నవన్నీ వొలిచేసి

మోకాళ్ళ మీద కూచోబెట్టారు”

 

“చెట్టూ చిగురిస్తుంది

చెట్టులా నిలిచిపోవటానికి

చెట్టంత ప్రయత్నం చేస్తూ” (ఎర్రగన్నేరు)

వాసులోని అనుభూతి కవితాధోరణికి అద్దం పట్టే కవిత ఇది.  మానవజీవితంలోని రకరకాల అనుభూతులన్నింటినీ చెట్టులో చూడగలిగిన కవి తన కవితా వస్తువుతో ఎంతగా తాదాత్మ్యీకరణం చెందగలడో ఈ కవిత నిరూపిస్తుంది.  పాఠకుడి మనసులో ముసురు పట్టించగల కవిత ఇది.

“ఏ పిలుపో వినిపిస్తుందనే ఆశతో

రాత్రి ఒక్కణ్నీ మేల్కొని కూర్చుంటాను” అంటూ మొదలయ్యే “జననం” కవిత ఏకాంతాల చుట్టూ ఏర్పడే ప్రాకారాల్ని, తొలి కదలిక కోసం చేసే నిరీక్షణని వివరిస్తూ

“అసహనం చీకట్లో అనంతంగా పెరిగిపోయి

జిరాఫీ మెడలో కొండ చిలువ వొళ్ళు విరుచుకున్నప్పుడు

రాత్రిని ఉషస్సు జయిస్తుంది

టేబుల్ మీద మహా ప్రస్థానం

నన్ను కౌగిట్లోకి లాక్కొని కవిత్వం నేర్పిస్తుంది” అంటూ ముగుస్తుంది.  జిరాఫీ దేహం మీద ప్రాకృతిక డిజైన్ని అసహనంతో వొళ్ళు విరుచుకుంటున్న కొండ చిలువ తో పోల్చటం కవి నిర్నిబంధ ఊహాశక్తికి అద్దం పడుతుంది.  టబుల్ మీద మహా ప్రస్థానం తనని కౌగిట్లోకి లాక్కొని కవిత్వం నేర్పించటమే కవితా జననం.

పరాయి నగరంలో ఏదో ఒక రూంలో ఒంటరిగా బతికే బ్రహ్మచారి జీవితమో సంక్లిష్ట దశ.  కొంత విచిత్రంగానూ ఉంటుంది. పుస్తకాలు చదువుతూ, సిగరెట్లు ఊదిపడేస్తూ, బద్ధకంగా బతికేస్తూ….గొప్ప విచిత్రంగా ఉంటుంది.  రూం తాళం తీసుకుంటూ లోపలికెళ్ళిన ప్రతిసారి బహుళత్వాన్ని తలుపు బైటనే వదిలేసి లోపలికి  మళ్ళీ బైటకి వొచ్చేవరకు ఏకాత్మతో ఒక గొప్ప ఏకాంకిక నడుస్తుందిలే! అది అనుభవించినవాడికే తెలుస్తుంది (“అనుభవించిన వాడికే” అని ఎందుకన్నానంటే ఆడపిల్లలంత బుద్ధిగా మగపిల్లలుండరుగా రూముల్లో).  రూంలోని ఏకాంతంలోనే కవి తన సజీవతని, నిర్జీవితనీ కనుగొన్నాడు. మళ్ళీ రూంనుండి బైటకొచ్చినప్పుడెలా వుంటుంది మరి?

“నేను రూం బైట నిలబడి

తాళం వేస్తూ గడప మీద నించుంటే

ఆ దృశ్యం ఉబ్బిన పుట్టుమచ్చలోంచి

వెంట్రుక బైటపడుతున్నట్లుంటుంది”

మనసులోని సంక్లిష్టతని వివరించటానికి “ఉబ్బిన పుట్టుమచ్చలోంచి వెంట్రుక బైటపడటం”ని మించిన ప్రభావవంతమైన ప్రతీక ఏమన్నా వుంటుందా ప్రియ పాఠకులారా?

వాసు రాసిన మరో కవిత “కూల్ డ్రింక్ పార్లర్లో…..” పొద్దుట్నుండి రాత్రివరకు కూల్ డ్రింక్ పార్లర్లో పని చేసే బాల కార్మికుడి జీవన వ్యధార్తి దృశ్యం ఈ కవిత వస్తువు.  1988లో రాసిన ఈ కవిత ఇటువంటి వృత్తిగతమైన విచలిత దృశ్యాల్ని ఆవిష్కరించే కవితలకి నాంది అని నౌదూరి మూర్తిగారు అభిప్రాయపడ్డారు.  తల్లెత్తకుండా రబ్బరు సంచీలో ఐసుముక్కలేసి కర్ర సుత్తితో ముక్కలు చేసుకుంటూ పోయి ఎండిపోయిన ఐస్ కుర్రాడి కళ్ళల్లో స్వప్నసీమల కోసం కవి అన్వేషిస్తాడు.

“వాడలా వున్నప్పుడు

వాడలా వుండి పోవాలనుకున్నప్పుడు

రెండు ఐస్ తునకలు కంట్లో పడి

కళ్ళల్లో ఐస్ మేఘాలు కరిగి

వాడి చెంపల మీదుగా హిమవాహినీ చారికల్ని గీసి

కింద పడిపోతాయి”

“వాడి జీవితం చాలనంత మంచు

వాడి భవిష్యత్తులో వుంది”

ఎవరికైనా నోస్టాల్జియాలో జ్వరం రావటం ఖచ్చితంగా ఉంటుంది.  జ్వరం ఒక తియ్యని బాధ.  జ్వరం వచ్చినప్పుడు మీరు చాలా ప్రత్యేకం.  రోజూ మీతో పోట్లాడే వారికి మీ మీద అనురాగం చూపించే ఒక గొప్ప అవకాశం.  ఆ జ్వర తీవ్రతని కవి ఎలా వివరిస్తాడో చూడండి-

“దేహం పక్క మీదకి వాలగానే

నెత్తుర్లో మంచు ముక్కలు తేల్తాయి

ఉడుకు తగ్గిన నెత్తురు

చేతులోంచి వేళ్ళలోకి ప్రవహిస్తుంది

దట్టమైన అరణ్యంలో కొమ్మల్ని చీలుస్తూ

పాయలై తెగిన వెన్నెల్లాగ”

కానీ కవి అన్నట్లే “జ్వరమూ తరుచుగా రాదు”. అయ్యో కదా!

“లెక్క తెగట్లేదు” వాసు అత్యుత్తమ కవితల్లో ఒకటి.  తనకి లెక్కలు బాగా వివరించి చెప్పే మిత్రుడు నాయుణ్ని ఉద్దేశిస్తూ చెప్పిన కవిత ఇది.

“అప్పుడు నువ్వేం చెప్పే వాడివో!

నీ వెనుక నడుస్తూ నేనేం వినేవాడ్నో!

ఒక సముద్ర శాఖ దూసుకొచ్చి

ఒడ్డుని చీపురు కట్టలా ఊడ్చేసి

అఖండ భూభాగం చీలిపోవడం చెప్పేవాడివి

బతుకుతెరువు తోడలై

సరళ జీవన కాంక్షా కురంగాన్ని పట్టుకోవడానికి

పూలమొక్కల వెనక పొంచున్న సంగతి చెప్పేవాడివి”

తనకింత చెప్పిన నాయుడితో కవి చివర్లో ఏమంటున్నాడో వినండి.

“ఇవాళ నేను ఆ పాటలే వింటూ అవే లెక్కలు చేస్తున్నా!

లెక్క తెగట్లేదు నాయుడూ”

 

జీవితం ఎప్పుడూ తెగని లెక్కే. నిజానికి లెక్క తెగితే మాత్రం జీవితంలో మజా ఏముంటుంది?  మృత్యువు లోని అనూహ్యతే కదా జీవితం మీద ఆసక్తిని పెంచేది.  జీవితం లెక్క శాశ్వతంగా తెగేది మృత్యువుతోనే మరి.  అందుకే లెక్క తెగకపోవటమే ఆసక్తికరం.

మరికొన్ని మంచి కవితలతో పాటు ఇంకొన్ని అనువాద కవితలు కూడా “కాసేపు”లో కనిపిస్తాయి.  కాసేపట్లోనే చదవటం పూర్తయ్యే ఈ సంకలనం చాలాకాలం మీ మనసులో వుంటుంది. చదవండి. నిజానికి వాసు కవిత్వం చదువుకుపోవాల్సిన కవిత్వం.  ఈ పరిచయం కేవలం నామమాత్రమే. అదికూడా ఎందుకంటే వాసు కవిత్వాన్ని ఈ తరానికి పరిచయం చేయటంతో పాటుగా వాసుకూడా తానొకప్పుడు కవినేనన్న విషయం గుర్తు చేయటం కోసం, మళ్ళీ కవిత్వం వైపు పురికొల్పటం కోసం!

*

అభివృద్ధి కుట్రపై అరుణాక్షర యుద్ధం!

 

 

-నిశీధి
~

కెహనా సఖు కిత్నా ప్యార్
సెహ నా సఖు ఇత్నా ప్యార్

అతనికింత ప్రేమెందుకు పుట్టిందో విస్మయం , మనలో ఏ లోపం ఆ సహజమయిన ప్రేమకి మనల్నింత దూరం చేసిందని విషాదం. ఎంత దుఃఖం ఎంతకని దుఃఖం , కన్నీళ్ళలో హోలీ డిప్స్ , ఎన్ని లక్షల టీఎంసీల విషాదంలో మునిగినా దొరకని పాప విముక్తి.

అది కవిత్వమా కాదు ప్రభో! మనసు కన్నీరయి కలంలో కరిగి , ముందు కాలం అంతా Development ది అని మనం స్వయంగా మన చేతులతో చేస్తున్న హత్యలపై నిరసన గళం . వెర్రి కేక, మైదానం కొరకు , వలన కాలరాయబడ్డ కఠిన నిజాల నినాదం.

అన్ అవేర్ ఆఫ్ ఆల్ దీజ్ థింగ్స్ అనబడు మన మర్డర్ సంతకాలలో నెమ్మదిగా ఆరిపోతున్న చిరునవ్వులు అవేర్ ఆఫ్ ఆల్ దీజ్ థింగ్స్ స్వయంగా మనకోసం మన జీవితాల్ని వెలిగించుకొంటున్నామనే వృద్ధి మంత్రంతో బ్రతుకంటే రేలా లయలని బ్రతకడమంటే శబరి నీడలో అమాయకంగా నవ్వడమే అని మాత్రమే తెలిసిన జీవితాల్ని ముంచి చంపేసే మనలోని కోల్డ్ బ్లడెడ్ మర్డరర్స్ ని మనసు కోర్టులో వేసే క్షణకాలపు ఉరిశిక్ష . నిజమే ఏడ్చుకోవడానికి మనకి తొక్కలో . కవిత్వం అన్నా ఉంది . వాళ్ళకేమి మిగిల్చాం ? అరుణ్ ప్రశ్నించడు, చాలా సింపుల్గా మనం కట్టుకుంటున్న కొత్త ఆశల ప్రాజెక్ట్ హైయెస్ట్ పాయింట్ నుండి వెల్లువవుతున్న రక్తపు మడుగుల తరంగాలపై ఉల్టా వ్రేళ్ళాడదీస్తాడు . వాక్యాల దిగ్బంధనంలో నిలేసి కలేసి నువ్వు మురుస్తున్న అభివృద్ధి నమూనాలో ఏదో ఒక రోజు నువ్వు నాశనం అవుతావురోయ్ అంటూ గోదాట్లో కలవమని శపిస్తాడు . Yes, dear we all deserve that ultimate curse.

ప్రియతమా

ఒక వాక్యం దాటి ఒకవాక్యంలోకి సాగే ప్రతి ప్రయాణంలో కరిగిపోతున్న ప్రతి క్షణం శబరి ఇసుకల్లో గుండెని అమాంతంగా తవ్వి పాతరేసినట్లు మేటలేసుకున్న దుఃఖంతో తడిపేసాక , ఎవరన్నా రిమూవ్డ్ ఫ్రం రికార్డ్స్ కాగితం చెమ్మలవ్వకుండా గుండెలో గాంభీర్యపు నిశబ్దాలు పెళ్ళుమన్న శబ్దంలో విరిగాక కనీసం ఈ ట్రిబ్యూట్ చదవడమయినా ముగించగలిగితే నిజంగా వాళ్ళు ఐరన్ మ్యానే అని చెప్పుకోవాలి ఖచ్చితంగా.

మనకి తెలియకుండానే లక్షల్లో మనుష్యులని , కొన్నయిన భాషల్ని కొన్ని కోట్ల గుండె చప్పుళ్ళని జలజీవసమాధి చేసిన రక్తసిక్తపు మరణవాంగ్మూలం ఈ మ్యూజిక్ డైస్ .. కొట్టుకొచ్చిన శవాలని సాముహిక దహనం చేసిన బూడిదల్లో కోరి తెచ్చుకున్న నాశనానికి రాసుకున్న ముందస్తు విలాపవాక్యం.

ఈ గిల్టీ కన్ఫెషన్స్ లోకి మనల్ని అమాంతంగా తీసుకెళ్ళి , అక్కడ తప్పిపోయిన చంటిపిల్లలవడానికి బయటికి రాలేని బేలతనంలో బోరుబోరున ఏడ్చుకోవడానికి అరుణ్ వాక్యం కాకుండా వాడిన మరో అస్త్రం ప్రతి పేజ్లో అమాయకంగా ప్రశ్నల కళ్ళేసుకొని చూసే ఇమేజెస్ . పచ్చపూలతో చిరునవ్వులు చిందించే కోయ అడుగులు , దుఃఖంతో పూడుకుపోతున్న ముసురు గోదావరి , కూనవరం గిరిజన బాల్యంలో దిగులు , గొడుగుల కింద దాగి తొంగి చూస్తున్న విప్పసార , మూలబడ్డ భాస్కర్ టాకీస్ , నాచు గోడలు , గిరిజన బడులలో దడుల మధ్య దూరి ఆడుకుంటున్న పసితనాలు, భవిష్యత్తు అయోమయంలో నడిరోడ్డున పడ్డ యవ్వనాలు . ఎన్నని చెప్పడం ? ఒకో ఇమేజ్ అలా వాక్యాల్లో వొదిగి కవిత్వంగా మారిందా లేక కవిత్వాన్ని అల్లుకున్న ఆర్తి ఒక ఇమేజ్గా మారి మనల్ని కాలుస్తుందా చెప్పడం నిజానికి చాలా కష్టం.

అలాగే ఎన్ని కంటి చెమ్మలు ఒక పాటగా మారిందో చెప్పడమూ కష్టమే . అనుకుంటా ఇలా ..

ఇళ్ళు: ఇన్నిన్ని ముఖాలేసుకున్న ఇళ్ళు
ఆశలు కూలిన ఇళ్ళు
వంటరైపోయిన ఇళ్ళు
ఇళ్ళ కళ్ళ నిండా నీళ్ళు
భయం భయంగా
తమలోకి తాము
ముడుచుకుపోతున్న ఇళ్ళు

అన్న పదాల వెనక ఉన్న ఊళ్ళు ఇళ్ళు వదులుకొని మొదలు నరికిన పచ్చటి చెట్లని వదిలి ఎగరలేక కుప్పకూలిన రెక్కలపే దిగులు పడతామా

మైదానం కమ్మిన ఇనుప తివాచీ
ఆపాద సంస్కృతి అనగా సాంఘిక ఆటవికత
బ్రతుకు పృథక్కరణ చెందింది
ఒకనాటి రేల పాట పరీవాహకప్రాంతమీది
ఈ ఎడారిలో వనం కోసం అంజనం వేయాలి

అంటూ నిజాల్ని చిన్న పదాల్లో పెద్ద కోతల్లో ముందుకు తెచ్చినప్పుడు ముఖంలో అరచేతులు దాచుకోని సిగ్గుపడాలా ?

పాటలని చంపేసి , ప్రకృతిని చంపేసి , నిలబడడానికి నీడలేకుండా చేసుకుంటూ విస్తరిస్తున్న మైదానపు మోడరన్ మ్యాన్ ఎడారితనంపై పసితనాన్ని పచ్చదనాన్ని వదులుకోలేని అడవిబిడ్డల తరపున దుఃఖపు సూరీడు చిందించిన గోదారి రక్తం గురించి ఎంత చెప్తే సరిపోతుంది అని అసలు ఎంత హృదయానికి అద్దుకున్నా మనం అడ్డుకోలేని నయాకాలపు జల సమాధి లో మునిగిపోతున్న కుంట నాగరికత ముగిసిపోతున్న గదబ సవర లాంటి జాతులు . నిజమే ఇహ వాళ్ళంతా రామాపితికస్ గురించి చదువుకున్నట్లు అంత్రోపాలజీ పాఠాల్లో మాత్రమే మిగులుతారేమో అరుణ్ ప్రిడిక్ట్ చేసినట్లు . లేదా లుప్తమవుతున్న జీవజాతులనీ సంరక్షించుకున్నట్లు ల్యాబుల్లోనో లేక తర్వాత తరాల ఎజ్జిమిషన్టో రీల్లోనో మిగులుతారేమో

కవిత ఆచరణకి సాటిరాదు అయితే గియితే ఒక సహానుభూతి ఒక మద్దత్తు ప్రకటన ఒక నినాదరచన నీ జనం నేల కోసం పోరాడుతున్నచోట కనీసం గొంతయినా కలపకపోవడం నేరం అని డిక్లేర్ చేసిన అరుణ్ వాయిస్కి ఇదంతా ఒక పిచ్చుక తోడు మాత్రమే ఆకరున మాత్రం ఈ మాట చెప్పకుండా ముగించలేను . మీరు నడిచొచ్చిన మట్టికే కాదు అరుణ్ , ప్రపంచానికి ముఖ్యంగా కవిత్వానికి ఒక అద్భుతమయిన మెలాంకలీ అందించారు . చచ్చిపోయిన పాటకి మీదయిన గొంతునిచ్చారు . Kudos, Arun Sagar!  you nailed all those culprit souls with your heart reckoning poetry.

పోడుకోసం గూడుకోసం తునికాకురేటు కోసం అడవిహక్కుల కోసం జెండాలై ఎగిరిన ప్రతిప్రాణానికి మీ సెల్యూట్ పాటు మీ ఆర్తిగీతానికి మాదో సెల్యూట్ .

*

రెండక్షరాల్లో ఇమడని కవి అలిశెట్టి

    

  -బి.నర్సన్

~

        అలిశెట్టి ప్రభాకర్ ను “కవి” అనే రెండు అక్షరాల మధ్య ఇముడ్చుతే ఇంకామిగిలిపోతాడు.  అందరిలా- తన మనసుకు నచ్చిన కవిత్వం రాస్తూ కవిగా గుర్తింపును,సత్కారాలను పొందుతూ పొద్దు గడిపిన మనిషి కాదాయన. రోజూ గుండెలో కొలిమిని రాజేస్తూనిప్పు కణికెల్లాంటి అక్షరాల్ని సృష్టిస్తూ, మంటల జెండాల రెపరెపల వెలుగులో సమాజ తీరుతెన్నుల్ని తెలుసుకొమ్మని తపన పడ్డ కవి.  కొలిమి వేడి తనను దహించి వేస్తున్నా ఖాతరుచేయకుండా అక్షరాల్ని పోత పోస్తూ పోస్తూ అక్షరాల్లోనే మిగిలిపోయిన మనిషి.

అట్ట పర్వతం ఎత్తి పట్టుకున్న వాడు

ఆంజనేయుడూ కాదు

నెత్తిలో నెమలీక పెట్టుకున్నోడు

క్రిష్ణపరమాత్ముడూ కాడు

అదంతా “అట్ట”హాసం- అంటూ నిక్కము లేని రచనలను, జీవితాలను, పాలనను ఎద్దేవా చేసాడు. రాసిన అక్షరాల్ని తమపై ప్రయోగించుకోకుండా సమాజానికి అప్పగిస్తే అది ప్రజాకవిత్వంగా చెల్లుబాటు కాదని నిరూపించిన కవి.

      జనంలో ఒకడిగా మెదలడం ఆయనకి ఎంతో ఇష్టం. చేతి నిండా డబ్బులున్న రోజుల్లోకూడా అతి సాధారణ జీవన శైలిని ఇష్టపడేవాడు. లెక్కలు చూసుకోవడం, రేపటి కోసం దాయడంఆయన మెదడుకి ఎన్నడూ తట్టని విషయం.  పుస్తకాలు కొనే వేళ మిగితా అవసరాలనుఈజీగా వాయిదా వేసుకొనేవాడు. బట్టలు, చెప్పులు లాంటి వస్తువులు కొనేటప్పుడు అతిచౌకవాటిని ఎంచుకొనేవాడు. కోఠి చౌరస్తాలో సెకండ్ హాండ్ దుస్తులు కొని బేఫికర్గా వాడుకొనేవాడు.అందుకే అలిశెట్టి ఎంత సాధారణ మానవుడో అంతటి అసాధారణ కవి.

         ఫోటోగ్రఫీ వృత్తిగా బతికిన ఆయన పట్టుమని పది ఫొటోలు దిగలేదు. ఇప్పుడు ప్రాచుర్యం పొందిన బ్లాక్ అండ్ వైట్ ఫోటో కూడా తన 19వ ఏట ఓ ఫోటో స్టూడియోకి సైన్ బోర్డ్ రాసినప్పుడు ఆ స్టూడియో ఓనర్ ప్రారంభోత్సవం రోజున తీసి ప్రేమతో ఇచ్చిన కానుక. ఇంత కాలం ఆ చిత్రాన్ని భద్రంగా దాచుకున్న భాగ్యం ప్రభాకర్ అభిమానులకందించింది.

      ప్రభాకర్ కవిత్వంలో ఇంత దగడు నెగడు, తెంపరితనం కనబడడానికి కారణం ఆయనలోఉండిన దుస్సాహస లక్షణం. నిజజీవితంలో కూడా ఏనాడూ పర్యవసాలను లెక్కిస్తూ కూర్చోలేదు. తను పోయే దార్లో కష్టజీవిని ఎవరైనా ఇబ్బంది పెడ్తూ ఉంటే కలుగజేసుకునేవాడు,కలహానికి కూడా సిద్ధ మే. తెగింపు ఆయన నైజము.

    లెక్క ప్రకారం మూడు పూటలు తినడం ఆయన జీవితంలో లేదు, తినక తప్పదన్నప్పుడుఏవో నాలుగు మెతుకులు గతకడం తప్ప ఎన్నడూ రుచులు కోరలేదు.  అందుకే ధూమపానంవల్ల దాపురించిన క్షయ ఆయనపై దునుమాడింది. శారీరక బలహీనత వల్ల మెడిసిన్ ప్రభావంఆయన్ని తిప్పి తిప్పి కొట్టింది, తట్టుకోలేని పరిస్థితిలోకి నెట్టివేసింది.

     ఆయన ఆత్మాభిమానం కూడా తాననుభవించిన కష్టాలకు ఆజ్య మే అయ్యింది.సానుభూతిని అస్సలు సహించేవాడు కాదు. 1988లో మేము హైదరాబాద్ నుండి బలవంతంగాజగిత్యాల తీసికెల్లిన వారం రోజుల్లోనే చెప్పకుండా తిరిగి వచ్చేసాడు, కారణం సిటీ లైఫ్ఆగిపోతుందని అన్నాడు కాని, మాకు భారమైనాననే అలోచన కూడా ఉండొచ్చు.

      ప్రభాకర్ కు భాగ్యం అర్ధాంగి అంటే అన్యాయమే అవుతుంది. ఆమె పూర్ణాంగి ఆయన ఒకఅంశ. చిన్ననాడే చదువు ఆపేసిన భాగ్యం బీడీ కార్మికురాలు. పెళ్లి చేయలేని స్థితిలో తల్లి పైడిముడిచి ఆమెను ప్రభాకర్ చేతిలో పెట్టింది. కొన్నాళ్లకే ప్రభాకర్ ఆమె చేతిలో బిడ్డ అయినాడు.పెరుగుతున్న పేదరికం, తరుగుతున్న భర్త ఆరోగ్యం, ఎదుగుతున్న పిల్లల మధ్య ఆమె సుడిగుండంలో నావ.

తెగిన తీగలు

సవరించడానికన్నట్లు

తెల్లవార్లూ పరిచర్యలు చేసే

నా భాగ్యమే

నా కన్నీళ్లను తూచే

సున్నితపు హృదయ త్రాసు – అని చివరి రోజుల్లో భాగ్యం పై రాసిన ఈ కవితకు వేసిన బొమ్మలో ఆర్టిస్ట్ నర్సిం ఆమెను యమధర్మరాజును అడ్డుకుంటున్న సతీ సావిత్రిలా చిత్రించాడు.

సిగరెట్ పీక లాంటి నన్ను

సిగలో పువ్వులా తురుముకొని

గాజుకుప్పెల్లాంటి నా కళ్లలోనే

ఆశల అగరొత్తులు వెలిగించుకుందే తప్ప

తులతూగే ఐశ్వర్యమో

తులం బంగారమో కావాలని

ఏనాడూ ప్రాధేయపడలేదు- అంటూ గుప్పెడు అక్షరాల్తో తన ఋణం తీర్చుకొనే ప్రయత్నంచేసాడు ప్రభాకర్.  నేటికీ ఆమె జీవితం చెదిరిన గూటి పక్షిలా ఇద్దరు పిల్లలతో దరి దొరకని ఎదురీతనే. నాడు ప్రభాకర్ కవిత్వాన్ని నెత్తికెత్తుకున్నవాళ్లు నేడు చెదిరిన మేఘాల్లా చెరోవైపు.

       12 జనవరి 1954 నాడు జన్మెత్తి అదే తేదీన 1993లో కలం విడిచిన ప్రభాకర్ రాసిన ప్రతిఅక్షరం మాత్రం సమాజంపై శర సంధానమే. కష్టజీవికి,కంట నీరుకి, దిక్కు తోచని యువతకిఆయన కవిత్వం సైదోడు.

‘కన్నీళ్లకు కర్తవ్యాన్ని నిర్దేశించే దిక్సూచిని నేను

అగ్ని పద్యం నేను దగ్ధ గీతం నేను అక్షర క్షిపణి నేను

ఆయుధాలుగా రూపాంతరం చెందే ఆకలి నేపథ్యం నేను

అడవి నేను కడలి నేను;- అంటూ సముద్రమంత విశాలమైన సాహితీ క్షేత్రాన్ని నిర్మించి నిరాశలుముంచుకొస్తున్న సమయంలో అందులో సేద తీరమని సాగిపొయాడు.

                                                                                                                               -బి.నర్సన్

“మాటల మడుగు”తో మెర్సీ మరో అడుగు..

 

-అరణ్య కృష్ణ

~

“మేఘాల మీదుగా భూమిపైకి చూడటం నేర్చుకున్నప్పుడే
ఇంద్రధనుస్సు ఆకారం పరిపూర్ణంగా కనబడేది
వర్షంలో తడుస్తున్న భూమిని
కళ్ళారా నింపుకోగలిగేది”
మెర్సీ సరిగానే చెప్పారు.  జీవితాన్ని ఓ కవి అలానే చూడాలి.
మెర్సీ మార్గరెట్! ఎంతో అందమైన ఇంగ్లీష్ పేరు.  “మార్గరెట్ కవిత్వం చదివారా?” అని ఎవరైనా ఇంగ్లీష్ లిటరేచర్ విద్యార్ధినడిగితే “ఓ! బ్రహ్మాండంగా!” అంటాడేమో.  కానీ మెర్సీ మార్గరెట్ పదహారణాల తెలుగమ్మాయి.  వర్తమాన సమాజ బీభత్సాన్ని లలితమైన పదాలతోనే కవిత్వంగా తూర్పారపట్టిన తెలుగమ్మాయి.  ఒక దళితురాలిగా, మైనారిటీగా, స్త్రీగా ఎంతటి వివక్షతను, అశాంతిని అనుభవించాలో అంతటినీ మంజూరు చేసిన వర్తమాన సమాజాన్ని ఒకసారి ఆర్ద్రంగా, మరోసారి కసిగా నిలదీసిన పదహారణాల తెలుగు కవి మెర్సీ.  ఆ మూడు రకాల అస్తిత్వ మీమాంస మెర్సీ కవిత్వం లో కనబడుతుంది.  ఆధునిక కవిత్వం అంటే ప్రధానంగా భావానికి, భావాల సంఘర్షణని వ్యక్తీకరించటానికే  అన్న విషయాన్ని మెర్సీ కవిత్వం మరోమారు నిరూపించింది. వాడ్రేవు చినవీరభద్రుడు, ఎండ్లూరి సుధాకర్, అఫ్సర్ లాంటి ముగ్గురు ప్రసిద్ధుల నుండి ముందుమాటల ద్వారా కితాబులందుకున్న మెర్సీ “మాటలమడుగు” నిజానికి కవిత్వ సెలయేటిలో కొత్తపాయ.
         కవిత్వం కాల్పనిక భావోద్రేకాలకు చెల్లుచీటీ చెప్పాలని ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయింది.  కవిత్వంలో ఏదో ఒక సామాజికాంశ లేకుండా చదవటానికి ఏ పాఠకుడూ సిద్ధంగా లేడు.  సామాజికాంశ అంటే సామాజిక వాస్తవికతే.  వైయుక్తిక స్థాయిలో వ్యక్తీకరించినప్పటికీ సాటి మనుషులతో పంచుకోతగిన ఆవేశమే కవిత్వం కాగలదు. లేకుంటే అదేదో గందరగోళంగానే మిగిలిపోతుంది.  అయితే కేవలం వాస్తవాల కోసమే అయితే ఒక వార్తాపత్రిక చదువుకోవచ్చుగా మరి అన్న ప్రశ్న వస్తుంది.  ఒక అత్యాచార వార్త చదవటం వేరు, దానిమీద కవిత చదవటం వేరు.  నిర్భయ మీద ఎన్నో కవితలొచ్చాయి. తెలిసిన విషయమే కదా. మరెందుకు చదివాం?  కవిత్వం మనలోని మనతనానికి అప్పీల్ చేస్తుంది.  మనం మనుషులుగా హృదయంతో స్పందింపచేస్తుంది.  కనుకే కవిత్వం అంటే వాస్తవికమైన అనుభవాన్నో, పరిశీలననో భాషా మాద్యమం ద్వారా హృదయం నుండి హృదయానికి ప్రయాణింపచేసే కళాత్మక ప్రక్రియ.  సరిగా మెర్సీ ఇక్కడే సఫలమయ్యారు.
అవాస్తవాలకు, అతిశయాలకు పోకుండా సరళంగా వ్యక్తీకరించిన నిండుకుండ లాంటిది మెర్సీ కవిత.  కోపగించుకున్నా, వెటకారం చేసినా, ప్రతీకాత్మకంగా వ్యక్తీకరించినా, మార్మికంగా గుసగుసలాడినా….ఎలా చెప్పినా మొత్తం మెర్సీ కవిత్వం వేదనాపూర్వక అనుభూతి ప్రధానమైనదే.    స్త్రీ లైంగిక స్వేచ్చ వంటి స్త్రీవాద కవిత్వం ప్రతిపాదించిన లోతైన వివాదాంశాల జోలికి వెళ్ళకుండానే స్త్రీ శరీరం మీద అమలయ్యే పురుషాధిక్య భావజాలాన్ని కవిత్వంలో ఎండగట్టడంలో మెర్సీ సఫలమయ్యారు.  ఆమెను ప్రధానంగా స్త్రీవాద కవిగా గుర్తించటం కష్టం.  స్త్రీవాద చాయలు కొంతమేరకు కనబడ్డా ఆమె ప్రధాన దృక్పధం కానీ, లక్ష్యం కానీ స్త్రీవాదం కాదు.  దళితుల మీద వివక్ష, మైనారిటీల వ్యధలు, స్త్రీగా ఎదుర్కునే ఆటంకాలతో పాటు కాలుష్యం, ప్రపంచీకరణ, యాంత్రీకరణ, యాంత్రిక జీవితం, కన్స్యూమరిజం వంటి సమకాలీన అంశాల మీద కూడా ఆమె కవితలు రాసారు.  ముఖ్యంగా చుట్టూ ఆవరించివున్న నిరాశాజనక పరిస్తితులు సృష్ఠించే మనోవైకల్యాల మీద ఒక కవితాత్మక నిరసనగా మెర్సీ కవిత్వాన్ని చెప్పొచ్చు.
     ఆధునిక కవిత్వంలో ఎటువంటి సీరియస్నెస్ నేను కోరుకుంటానో అది మెర్సీ కవిత్వంలో కనబడింది.  అది వస్తువుకి, శిల్పానికి రెండింటికీ సంబంధించినదే.  మెర్సీ కవిత్వం అత్యున్నత స్థాయి కవిత్వమని ఆకాశానికెత్తను కానీ మంచి కవిత్వమని, మంచి అనుభూతి కలగచెయ్యగలదని మాత్రం భరోసా ఇవ్వగలను.  ప్రతి కవిత మీద ఆమె మంచి శ్రద్ధ పెట్టిన విషయం తెలుస్తుంది.  ప్రతి కవితకి ఒక ఎత్తుగడ, నడక, ముగింపుల నిర్వహణ సమర్ధవంతంగా నిర్వహించారావిడ. అందుకే మంచి ప్రామిసింగ్ గా కనిపించారు ఆవిడ.
        మనుషుల్తో మాట్లాడటం విఫలమైనప్పుడలా కవి కవిత్వాన్ని ఆశ్రయించటం జరుగుతుంది.  దీన్నే మెర్సీ కవిత్వం బలపరుస్తుంది.  తన పరిశీలన, తన అనుభవం లోకి వచ్చిన ప్రతి అంశాన్ని ఆమె కవిత్వం చేసారు.  ఎంతటి కర్కశమైన వాస్తవాన్నైనా ఒక మార్దవంతో, ఆర్తితోనే వ్యక్తీకరించారు.  ఆర్తి లేని కవిత్వం పత్రికా సంపాదకీయమే అవుతుంది.  ఈమె కవిత్వం లో మాటలు, ఆలోచనలు, అక్షరాలు అన్న పదాలు ప్రధానంగా కనబడతాయి.  దాన్నిబట్టే చెప్పగలం ఆమె తన కవిత్వం ఆలోచనాస్ఫోరకంగా ఉండాలని బలంగా కాంక్షించారని.   “కొట్టివేతల నుండి కొత్తగా పుట్టుకురావాలి” అన్న వినిర్మాణ (డీకన్స్ట్రక్షన్) స్పృహతో మొదలై సంకలనం చివర్లో చోటు చేసుకొని అన్ లెర్నింగ్ కోసం తపించిన “మైనస్లతో మైత్రి”  వరకు  ఆమె కవిత్వం తన ప్రస్థానమేంటో స్పష్ఠంగా చెబుతుంది.
“ఒకప్పుడు నోటి నిండా మాటలుండేవి
మాటలకు మొలకల వేళ్ళుండేవి
పచ్చగా మొలకెత్తేందుకు అవి
సారవంతమైన నేలలు వెతికేవి” (మాటలమడుగు) తప్పిపోతున్న మనిషిని మాటల్లేనితనం లోనే పట్టుకోగలం కదా!
ప్రతి మనిషిలో ఒక ప్రశ్నలగది వుంటుంది.  అందులోకి ప్రవేశించటానికి అందరికీ భయమే ఆ గదిలో
“ఎండిపోయిన విత్తనాల్లాంటి ప్రశ్నలు
చిక్కులు చిక్కులు గా వుండలు చుట్టి పడేసిన ప్రశ్నలు
మసకబారిన చిమ్నీల్లాంటి ప్రశ్నలు
శ్వాస పీల్చుకోలేక వేలాడుతున్న క్యాలెండర్ లాంటి ప్రశ్నలు” తాండవమాడే అంతరంగ ప్రశ్నలగదిలోకి వెళ్ళాలని చెబుతారు కవి (ఫ్రశ్నల గది) ఎందుకంటే ప్రశ్న అంతరాత్మ మాతృభాష కదా మరి.
వర్ణాల్లో అందాలు చూసే వాళ్ళ పట్ల గొప్ప నిరశన “చీకటిదీపం”లో కనబడుతుంది.
“వర్ణాల బేధం లేకుండా పూలన్నిటినీ హత్తుకునే
చీకటి
ఎంతటి సహృదయ
నిశ్శబ్దాన్ని గుండెల నిండా నింపుకోడానికొచ్చే వారిని
దరిచేర్చుకునే వైద్యురాలు”
“హృదయపు మెతుకు” ఈ సంకలనంలోని ఉత్తమకవితల్లో ఒకటి. స్థూలకాయురాలైన భార్య వంటలో ప్రేమని కాక ఏదో ఒక రకంగా ఎత్తిపొడవటానికి వంకల్ని వెతుక్కునే భర్తల వైఖరిపై నిప్పుల్లాంటి కన్నీళ్ళు విసురుతుందామె.
“”బరువెక్కిన కాళ్ళు కళ్ళు  నదులై ప్రవహించేదాక
అన్నంలా ఉడుకుతుందామే
……………………..
ట్రెడ్ మిల్ పై చిననాటి తప్పటడుగుల్ని జ్ఞాపకం చేసుకుంటూ
తననెవరైనా గంజిలా వార్చమని
ఉబ్బినట్లున్న శరీరావయవాలను నిమురుకుంటుందామె
……………………….
“ఈ మధ్య నీ ధ్యాసెటుంటుది?
అన్నం పలుకుపలుకుంది
పాతబియామే కదా ఇంత లావెందుకున్నయని?”
అతడు చిదిమిన అన్నం మెతుకులో
ఆమె హృదయం కూడా ఉందని
అతడు చూసుకునే లేదు”
మెర్సీ ఊహాశక్తికి తార్కానంగా నిలువగల “కాదంబరి” “తలాష్” “వెన్నెల స్నేహితా” వంటి కవితలు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నాయి. చెట్టులో మనిషితనపు అన్వేషణని ప్రతిబింబించే ‘చిప్కో”, వదిలివెళ్ళిన స్నేహాత్మ కోసం రాసిన “తనతోనే నేను”, విభిన్న జ్ఞాపకాల మీద రాసిన “చీకటిదండెం”, కాలానుగత మార్పులకు సాక్షీభూతమైన “మైలురాయి”, మృత్యువు మనిషి జీవితంలోని వ్యర్ధత్వాన్ని నిరూపించటం మీద వేదాంతంగా రాసిన “ఇంతేనా మనిషంటే”, తండ్రుల నియంతృత్వాన్ని ప్రశ్నించమనే “ఇంటికిరాని వెన్నెల”, స్నేహితురాలి ఆత్మహత్య మీద “గాజుమనసు”, లక్షింపేట మీద రాసిన “ఉలిక్కిపడుతున్న ఊరి తలుపులు” వంటికవితలు కూడా చదవించే కవితలే.
53 కవితలతో అందమైన ముద్రణతో “మాటలమడుగు” రూపొందించారు. మనం చదువుకోవాల్సిన కవిత్వం రాసిన మెర్సీ మనం ఆహ్వానించతగ్గ కవి.
“అక్షరాలు గుండెను చీలుకొని
బయటికొచ్చి పసిపిల్లల్లా నవ్వుతాయి
వాటిని దోసిట్లోకి తీసుకొని
నేను ఏడ్చేప్పుడు
కన్నీళ్ళ లాలపోసుకొని
కాగితపు ఊయల్లో నిద్దరోతాయి”
(“మాటలమడుగు” కవితల సంకలనం. రచన మెర్సీ మార్గరెట్.  వెల రూ.100.  ప్రతులకు అన్ని ప్రముఖ పుస్తకాల దుకాణాలు. హౌ. నం. 1-4-61, రంగ నగర్, ముషీరాబాద్, హైదరాబాద్-500090.)

ఒక్కో అక్షరానికి ఓ నెత్తుటి బొట్టూ ఇచ్చి…

02

– డా.పి.బి.డి.వి.ప్రసాద్ 

~

 

                      వృద్ధజగతి సమాధిపై సమధర్మం ప్రభవించును

                       నిద్దుల చీకటి వెలుపల వేకువ మెళకువ పుట్టును   

                                                                                                                                                    – ఆవంత్స సోమసుందర్

 

నిన్నటికి నిన్న ప్రసాదమూర్తి కవిత్వానికి ఆవంత్స సోమసుందర్ పురస్కారం లభించటం కవిత్వాభిమానులందరికీ సంతోషం కలిగించిన విషయం. శారీరకంగా దాదాపు తొంభై సంవత్సరాలు పైబడిన పితామహుడు, అనేకానేక కవిత్వ పంథాలధిగమించిన సాహితీ పరిణిత మనస్కుడు. మడిగట్టుకుని కూర్చుని పక్వాన్నాలు మాత్రమే భుజింపక కాలంతో నడిచిన సాహిత్య యుక్త వయస్కుడు శ్రీ ఆవంత్స .  ‘పూలండోయ్ పూలు’ ఆయన వయస్సును తగ్గించేసింది. మైమరచిపోయి త్రుళ్ళింతలతో కేరింతలతో ఆ సాహిత్య విహారం చేసి, సమీక్ష పేరిట ఏరిన పూలతో పెద్ద దండే కట్టేసి ప్రసాద మూర్తిని, కవిత్వాన్ని పాఠకులతో కలిపి అలంకరించాడాయన. ఈ పురస్కారంతో చక్కటి చిక్కటి కవిత్వాన్ని వర్థిల్లమని ఓ పెద్ద మనసు దీవించినట్లయ్యింది. కవిత్వానికి ప్రసాదమూర్తి పుష్పాభిషేకం చేస్తే, అదే కవిత్వానికి నేటికి నేడు 2015కి  ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం ప్రకటించటం సాహిత్యానికి మూర్దాభిషేకం చేసినట్లయ్యింది.

‘పూలండోయ్ పూలు’ ప్రసాదమూర్తి నాలుగో కవితాసంపుటి. వీటికన్నా ముందు ప్రసాదమూర్తి పద్యకవి. సాహిత్యాభిమానంతోనే ఓరియంటల్ కాలేజీలో చేరిన వాడవ్వటం చేతనూ, సంస్కృతాంధ్ర ప్రాచీన కావ్యాలను అధ్యయనం చేయడంతోనూ చదువుకుంటున్న రాయప్రోలు, కృష్ణశాస్త్రి, శేషేంద్ర, జాషువ, కరుణశ్రీ ల ప్రభావంతో, భావ కవితా పోకడలతో పుంఖానుపుంఖాలుగా పద్యాలు, ప్రేయసీ శతకాలు మోజుకొద్దీ అవధానాలు చేస్తున్న వాణ్ణి శ్రీశ్రీ కవిత్వం..వామపక్ష భావజాలం పూర్తిగా మార్చేసింది. బాల్య స్నేహితుడు  కూనపరాజు కుమార్ పరిచయంతో విశ్వసాహిత్యపు వినువీధుల్లో విహరించే అదృష్టం దక్కింది.  శ్రీశ్రీని చలాన్ని వామపక్షాలను అభిమానంగా చూస్తూ చదువంటే ఆసక్తి చూపని అమ్మానాన్నలకు సర్ది చెప్పి ఆంధ్రా యూనివర్సిటీలో అడుగుపెట్టాడు. విశాఖ సౌందర్యం కవిత్వ పిపాసను మరింత పెంచింది.

విశాఖ సముద్రం, విశ్వవిద్యాలయంలో గుబురుగా పెరిగిన జీడిమామిడి చెట్లు, రాకాసి లైబ్రరీ, విశాలంధ్ర పుస్తకాలు, అత్తలూరు మాస్టారు, శిఖామణి, గాలినాసరరెడ్డి, రాజేశ్వరి, పిబిడివి ప్రసాద్, జగధాత్రి లాంటి సాహిత్య ప్రేమికుల సావాసాలు విశాఖలోనూ, కేంపస్ లోనూ చాలా తరచుగా కనపడే కారామాస్టారు, రావిశాస్త్రి, చందూగార్లు, ప్రక్కనే భీమిలి బీచ్ లో తడియారని చలం అడుగుజాడలు, యారాడ కొండ లైట్ హౌస్ వెలుగులు, మహారాణిపేట హాస్టల్ డౌన్ లో బీట్లు, శిఖామణి ప్రమూలను ఎంత శాసించాయో, ఏమి ఆశించాయో, మరేది ఆదేశించాయో తెలియదు గాని వీళ్ళిద్దరు కవిత్వాన్నే శ్వాసించటం మొదలుపెట్టారు. చిన్నాచితకా పత్రికలతో పాటు భారతి పత్రికలో చోటు సంపాదించారు.

భావజాలాన్ని కలానికి మాత్రమే పట్టించక తలకు కూడ ఎక్కించుకున్నవాడు కనుక ప్రసాదమూర్తి ఈ మధ్య కాలంలో బాగానే యుద్ధం చేశాడు. ఎంతో మందిని ఎదుర్కొని రాజేశ్వరిని కులాంతర వివాహం చేసుకోవటం. బీహార్ ప్రవాసాంధ్రోద్యోగ జీవితం గడపటం మార్క్సిజం కన్నా లోతైన అంబేద్కరిజం వైపు వచ్చి దళితవాదపు జండాను సమర్థిస్తూ ఎగరేయటం ఈ హీరోయిజాలన్నీ ప్రసాదమూర్తిలోని సహజాతమైన కవిత్వాన్ని సిద్ధాంత నిబిడీకృతం చేశాయి.

ఈ సందర్భంలో తాతకోనూలు పోగు కవిత గురించి చెప్పుకోవాలి. పత్రికలో ప్రచురితమైన ఈ కవిత ఎంతో మంది సాహిత్య విమర్శకుల నాకట్టుకొంది.  తెలుగు సాహిత్యంలో దళితవాద స్త్రీవాద అల్పసంఖ్యాక బహుజన వర్గాల సంఘర్షణల  అంతస్సూత్రాన్ని తీసుకుని, కవిత్వ వర్ణాలు అద్ది, కలనేసి, పడుగుపేకల మధ్య తల్లడిల్లతూ, గోతుల మధ్య మగ్గుతున్న తరాల నాటి దైన్యానికి కప్పిన వస్త్రం ప్రసాదమూర్తి తొలి కవితా సంపుటి కలనేత. అది 1999లో వచ్చింది.

DSC_0593

గుండెకి ఒక కొస నిప్పంటించుకుని

ఒక అక్షరానికి ఓ కన్నీటిచుక్క

ఒక అక్షరానికి ఓ నెత్తుటి బొట్టూ ఇచ్చి – ఒక వేదనగా మొదలై ప్రశ్నిస్తూ, సమాయత్తం చేస్తూ సమైక్య పరుస్తూ  కవిత్వపు రెపరెపలతో కలనేత వర్ణాలు ద్విగుణీకృతమయ్యాయి. సినారె, గోపి, శివారెడ్డి మొదలైన ప్రముఖుల ప్రశంసలే కాదు ఎందరో సాహితీ హితులను కలనేత ప్రసాదమూర్తికి సంపాదించిపెట్టింది.

తర్వాత ప్రమూ రెండో కవితా సంపుటి వెలువడటానికి మధ్య గల అంతరంలో మరో సంపుటి వచ్చి ఉండాల్సింది అని శివారెడ్డిగారు లాంటి కవులూ కవిత్వాభిమానులు అభిప్రాయపడినా, ఈ సమయంలో దళితవాద దృక్పథంతో వచ్చిన సాహిత్యాధ్యయనం చేసి దళిత కవిత్వం  మీద సిద్ధాంత గ్రంథం రాసి డాక్టరేట్ అందుకోవటం విశేషం. కారంచేడు ఘటన తర్వాత సుమారు పదేళ్ళు తెలుగునాట భూకంపం పుట్టించిన దళిత కవిత్వం మీద ప్రసాదమూర్తి రాసిన సిద్ధాంత గ్రంథం త్వరలో పుస్తక రూపంలో రాబోతోంది.

అధ్యయన అధ్యాపకత్వాల వ్యాపకత్వంతో అంతరాయాలేర్పడుతున్నప్పటికినీ, తన కవితా చలమల నుండి పెల్లుబుకుతున్న కవనధారలను కట్టడి చేసుకుంటూ కొంతకాలం పత్రికలకే పరిమితమైనా.. నిదానంగా మెత్తగా బత్తాయిపండు తొనలు విప్పినట్లు కవిత్వమూటని విప్పి వెలుగే కాని చీకటి లేని మాటలతో మాట్లాడుకోవాలన్నాడు.

అట్లా ఆవిష్కరించిన ‘మాట్లాడుకోవాలి’ కవిత్వం మాట్లాడుతూనే అంతరాంతరాల్లోకి చొచ్చుకుపోతూ మనిషి మనిషికి మధ్య విస్తరించిన కారడవిలాంటి మౌనాన్ని చేధించింది. అగ్రరాజ్యాల నుండి సగటు మనిషి హృదయ సామ్రాజ్యం వరకు కొనసాగుతున్న దమన నీతులను నిరసించింది. 2007లో తీసుకొచ్చిన ఈ కావ్యం శివారెడ్డి అద్భతమైన ముందు మాటతో తెలుగు కవితా ప్రపంచంలో దుమ్ము రేపింది. ప్రసాదమూర్తిలో మరింత రాటుదేలిన వస్తుశిల్పాల ఐక్యతను ఈ సంకలనం చాటిచెప్పింది. ఎంత గంభీరమైన  సామాజికాంశమైనా దాన్ని కవిత్వం చేయడంలో ప్రసాదమూర్తి సాధించిన నేర్పును ఈ పుస్తకం పాఠకలోకానికి పరిచయం చేసింది. క్రమంగా ప్రసాదమూర్తి అభిమానుల ప్రపంచం కూడా విస్తరించింది.

కవిత్వమే ఊపిరైన తన ప్రవృత్తికి ఆటంకంగా మారిన ఉద్యోగానికి స్వస్తి చెప్పి జరుగుతున్న జగన్నాటకాన్ని చాలా దగ్గరుండి చూసే మీడియాలోకి వచ్చి అనివార్యంగా స్పందించే దినచర్యగా మారిన జీవితాన్ని అక్షరమయం రసవత్కవితామయం చేసుకున్నాడు ప్రసాదమూర్తి. అరుంధతీరాయ్ లాంటి  ఆధునిక విశ్లేషకులను  చదవటంతో సమస్య మూలాల్లోకి వెళ్ళే దారి దొరికింది. దాంతో తనలో ఎప్పటికప్పుడు తాజాగా ఉబుకుతున్న కవిత్వానికి ఏ రూపం ఇవ్వాలో తెలిసొచ్చింది. అది ముచ్చటగా మూడో సంపుటమై 2010లో   ‘నాన్న చెట్టు’ గా రూపం దాల్చింది.

ఈ పుస్తకానికే నూతలపాటి గంగాధరం సాహితీ పురస్కారం లభించింది. అంతే కాదు. 2012లో ఢిల్లీ తెలుగు అకాడెమీ సాహితీ పురస్కారం కూడా అందుకున్నాడు ప్రసాదమూర్తి. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. అంతలోనే  రెట్టించిన ఉత్సాహంతో ‘కవి నిద్రపోతాడా? నిద్రను కలలకు కాపలా పెడతాడు’ అంటూ మరింత నిబద్ధతతో వెలయించిన కవిత్వమే ‘పూలండోయ్ పూలు’. ఇందులో భావోహల మీదే కవిత్వాన్ని తిప్పుతూ కేవలం పూలవనాన్నే చూపించలేదు. రంగుల కలే సృష్టించలేదు. కవిగా తన భుజాల మీద కెత్తుకున్న సామాజికి బాధ్యతను నెరవేర్చే ప్రయత్నమే చేసాడు.

ఎంత సీరియస్ విషయాన్ని అయినా అసలు సిసలు కవిత్వం చేసే రసవిద్యను ప్రసాదమూర్తి పూర్తిగా సాధించాడని చెప్పడానికి పూలండోయ పూలు కావ్యం ఉదాహరణగా నిలుస్తుంది.  చదివిన వాళ్ళ విన్నవాళ్ళ గుండెల నిండా పూలజల్లు కురిపించే శీర్షిక కవిత పూలండోయ్ పూలు తలచుకుంటేనే సుగంధాన్ని వ్యాపింపజేసే కవిత.  కాగా.

‘హృదయం దొర్లుకుంటూ

ఏ లోయల్లోకో జారిపోయే’ టట్లు చేసే దయామయి. రైల్వేష్టేషనో గుడో ఏ మెట్ల మీంచో మనుషుల్ని రుతువుల్ని కదలని కనురెప్పల మధ్య నుంచి కనికరంగా చూస్తుంటుంది.

పాలకుల నిర్లిప్తతకు చురక అంగన్ వాడీల మీద రాసిన ‘సమరాంగనవాడి’. కొంగు నడుముకు చుట్టడమే కాదు. అవసరమైతే అసెంబ్లీ గొంతు చుట్టూ బిగించగలరనే హెచ్చరికని స్పష్టం చేస్తుంది. విడిపోయిన రెండు ప్రాంతాల మనుష్యుల్ని ఇక ప్రేమించుకుందాం  అంటూ మనసుల్లోంచి సమైక్య సంగీతం ఆలపిస్తూ అనటం ఒక సౌహార్ధ్రభావం.

ఇలా అనుభవించి పులకరించి పలవరించుకుంటూ, ప్రతి కవితనూ ఎంతైనా పరామర్శించుకోవచ్చు. ప్రసాదమూర్తి తనదైన శైలిని నిర్మించుకుంటూ మరింత పదునైన కవిత్వంతో ముందుకు వెళుతున్నాడని నిజాయితీగా ఎవరైనా ఇప్పుడు ఒప్పుకుంటారు.  రానున్న కవితా సంపుటి అందుకు పూర్తి తార్కాణగా నిలుస్తుందని ధీమాగా చెప్పొచ్చు.

కవిత్వరూపమే తానై నిత్యం తనని సమాజాన్ని ఆవిష్కరించుకుంటూ సాహిత్యయానం చేస్తున్న వానికి పురస్కారాలు కొలమానాలు కాదు కాని.. అతడు ఎంత దూరం వచ్చాడో ఏమి సాధించాడో ప్రజలు గుర్తించగలగడానికి అవి సాక్ష్యాలుగా నిలుస్తాయి.

ప్రతిష్టాత్మకమైన ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం  ‘పూలండోయ్ పూలు’ కవిత్వాన్ని మరింత పరిమళభరితం చేయటమే కాక నిఖార్సయిన కవిత్వానికి మెరుగులద్దినట్లయ్యింది.

*

 

ఒక కవి- ఒక భరోసా!

-బద్రి నర్సన్

~

        narsan పూట గడవడమే గండంగా బతుకును నరకప్రాయంగా వెళ్లదీస్తున్న బడుగు జీవులకు ఎంత ధీమాగా కవి ప్రసాదమూర్తి చెప్పారు వారికి బాసటగా కవులున్నారని. కవులు తప్ప ఎవరూ లేరని పలకడం ఎంత సాహసం. కవి గణం నుండి వకాల్తా తీసుకున్నట్లు మేమున్నమని భరోసా మాట ఇవ్వడానికి ఎంత మనోధైర్యం కూడకట్టుకోవాలి.

       కవిత ముగింపుగా కనబడే  “కవులు తప్ప” చదవడానికి ఐదు అక్షరాలే కాని పంచ భూతాల సాక్షిగా పలికిన వాగ్దానమది. పిల్లాడి కన్నీరు తుడవడానికి అమ్మ ఉన్నట్లు, ఆస్తికుడికైతే దేవుడే దిక్కన్నట్లు ఎంత బాధ్యతాయుతమైన తీర్పు ఈ మాట.
       ప్రసాదమూర్తి ప్రజల కష్టాలను కవిత్వీకరించిన తీరు కన్నీటి పర్యంతమానం. పైన ఆకాశం లేక కింద నేల కూడా లేని వాళ్లకు కవులే తోడూ నీడా అన్నప్పుడు కవులు జడుసుకోవలసిందే.
    ‘రోడ్డు పక్కన దేహాలను అమ్మకానికి నిలబెట్టినవారికి,
    కుప్పితొట్టి ఉయ్యాలలో నక్షత్రగోళాలు పాడే జోలపాట వింటూ ఏడుస్తూ నిద్రపోయే అభాగ్య శిశువుకు,
    మట్టి మీద తమను పాతుకొని నాగటి కర్రుకు నెత్తుటి సంతకమై వేలాడే మట్టి మనుషులకు,
    కన్నీటి కాందిశీకులకు ఎవరున్నారు’ అనడం కవిగా తాను వేసిన ఎన్నో అడుగుల్లో ఇది మాత్రం తనకుతాను పునర్ ప్రమాణం చేసే సరికొత్త అడుగు.
       ఎవరున్నా లేకున్నా బాధితులకు తోడుగా నిలబడి అక్షరాలా అక్షరాల ఊరడింపునందించి, వెంటుండి బతుకు బండిని సవరించే బాధ్యత కవులకుందని ఈ కవి ఘంటాపథంగా ప్రకటిస్తున్నాడు.
       మరి కవులంటే ఎవరు? అడగ్గానే చేతులెత్తి నిలబడడానికి చాలా మందే ఉంటారు.  ఫేస్బుక్కు ఖాతాలోకి కిటికీలోంచి నాలుగు పదాలు విసిరేసేవాళ్లకూ కొదువ లేదు. నిందారోపణ కానేకాదు. ‘కవులు తప్ప’  అన్నాక కూడా ధీర్ఘంగా ఆలోచించకుండా ఉంటే ఎలా? ఇన్ని కష్టాలు అనుభవిస్తున్న వాళ్లకు మేమున్నమని ఆశ్వాసం కలిగించడానికి కవులు సాహసోపేతంగానే వ్యవహరించాలి. కవులు ఎవరి కాలువలో వారు ఈదినట్లుకాక సముద్ర అలల ధాటిని తట్టుకోవాలి.
     “రచయితలారా మీరెటువైపు?” అని ప్రశ్నించినపుడు సాహితీ లోకం కంపించినట్లు కష్టాలకు భుజం తోడు ఇచ్చినవాడే కవి అన్నప్పుడు కూడా నేటి కవులు తాము పోషించవలసిన పాత్రను స్థిరీకరించుకోవలసిందే. ఈ గడ్డు కాలంలో కలం పట్టడమే ఓ సాహసిక చర్య,  జీవన్మరణ పరిస్థితి.            
     కత్తి గొప్పదా! కలం గొప్పదా! అన్నప్పుడు కలమే గొప్పదని సోదాహరణంగా చదువుకునే రోజుల్లోనే వాదించాం. శబాష్ అనిపించుకున్నాం. కళ కళ కోసం కాదు, ప్రజల కోసం అని నమ్మినాము కదా. ఇవన్నీ నిరూపించుకోకపోతే ఎలా! 
      వీరులకే వీరగంధం దక్కినట్లు కవిగా నిరూపించుకునే పరీక్షకు సిద్ధపడాలి. అవసరమైతే కాలం కడుపులోకి చొచ్చి కవులుగా మళ్లీ జన్మించాలి.  ప్రసాదమూర్తి మాట దక్కించాలి.      
*

కవిత్వం luxury కాదు!

 

-నిశీధి 

~

Poetry is not a luxury . కవిత్వం ఎపుడు ఒక విలాసం కాదు . మన ఉనికికి అదో ముఖ్యమయిన ఆధారం ,మనుగడ కలకో ఊతనిచ్చే ఆలోచన ముందు భాష గా మారి మార్పు దిశగా పయనించి ఎప్పటికయినా ఆ కల సాత్కారం అవుతుందన్న నమ్మకమే కవిత్వం అంటారు Audre Lorde. ఎంత నిజం కదా కవిత్వం వైయక్తిక భావనగా మనిషికో ఎదుగుదల చూపినా అసలు ఒక సామాజిక కోణంలో , అణగారిన వర్గాల్లో వాక్యం విలువ ఎంత గొప్పదో . అది ఎన్ని  భయాల అనుభవాలను చెక్కితే  అవధులు లేని ఆశగా మార్పు చెందుతుందో అనుభవించని వాళ్లకి తెలియడం కష్టం .

Audre Lorde (1934–1992)  ఉప్పెనైన కవిత్వానికో పూర్తి చిరునామా . కాబట్టేనేమో ఇంత పదును నిజాలు ఈ రోజు మన మధ్య నిలబడ్డాయి . ఇవి చూడండి “ మనమధ్య తేడాలు కాదుమనల్ని నిజంగా  విడదీస్తుంది  అసలా  తేడాలున్నాయని గుర్తించి సాల్వ్ చేసుకోలేని మన  అశక్తత మనల్ని విడదీస్తుంది .”  అలాగే  “నన్ను నేను నిర్వచించుకోక తప్పదు లేకపోతే జనం వాళ్ళ  కల్పనల్లో నా అస్తిత్వాన్ని సజీవంగా నంచుకొని తింటారు. “ఇదే కాదు  “నా ధైర్యాన్నంతా వాడి శక్తివంతంగా ఉంటూ నాకో విజన్ అంటూ ఏర్పడితే అసలు నాకింకా  భయమేముంది  “ అని చెప్పినా అది తను మాత్రమే అవుతుంది . అలాగే తనని తాను  “ బ్లాక్ , లెస్బియన్ , మదర్ , వారియర్ , పోయెట్ “ గా నిర్వచించుకొనే ఈ రైటర్ సాహిత్యలోకపు కుదుపులు కుదపడమే కాకుండా  , రేసిజం , సెక్సిజం , హోమోఫోబియా ఇలా ప్రతి సామాజిక అన్యాయాన్ని తన చివరి శ్వాస వరకు పోరాడి ఎదురునిలిచింది .

a6

లార్డ్ రాసిన  లవ్ పోయెం ఇంకా  , కోల్ తన కవిత్వాన్ని ఉన్నత స్తాయి కి తీసుకెళ్ళిన మాట నిజమే కాని వ్యక్తిగతంగా  నాకెందుకో తను రాసిన “ పవర్ “ కవితలో మొదటి వాక్యం “  కవిత్వం మరియు వాక్చాతుర్యాన్ని మధ్య వ్యత్యాసం మీ పిల్లల బదులు మీరే  చావడానికి సిద్ధంగా ఉండటం  “ అన్నది అసలు మొత్తం ప్రపంచ సాహిత్యానికే సవాలుగా అనిపిస్తుంది . సేఫ్ గేం  ప్లే చేస్తూ సోయగాల గురించొ సొరకాయ దప్పళం గురించో పద్యాలు రాసుకొనే 99% కవులు రచయితలు తర్వాత తరాలని బలిస్తున్నట్లేగా అనిపిస్తింది. కాని ఎక్కడో మన కలబుర్గీలు , Asharaf Fayadh లు పూర్తిగా  అమ్ముడుపోని లిటరరీ ప్రపంచాన్ని ఇంకా నమ్మగలిగే స్థైర్యాన్ని ఇస్తూనే  ఉంటారు .

అస్థిర పరిస్థితులలో వణుకుతున్న స్వరంలో అయినా అసహనాన్ని చూపుతున్న గుప్పెడు మందిని మందలో రచయితలు సైతం ఇంటాలరేన్సా  అంటే ఏమిటీ అని ప్రశ్నిస్తున్న కాలంలో

 

క్వీన్స్ లో  పదేళ్ళ పిల్లవాడి

రక్తంలో బూట్లు తడుపుకున్న పోలీసు

విచారణలో తన సొంత రక్షణకోసమే బాయినేట్ ఎక్కుపెట్టానని

పరిమాణాలు పరిణామాలు ఏవి చూడలేదు

రంగు మాత్రమే  కనిపించిందని చెప్పాడని

కవిత్వంలో జరుగుతున్న చరిత్రని ,జరిగిన ఎన్నో అన్యాయాలని ఆక్రమణలని భయపడకుండా రాయగలిగిన దమ్ము ఆమె కలానిదే . తన కవిత్వానిదే కదా .

అందుకే ఈసారి మనకోసం మరొక్కసారి power పోయెమ్ .

ad1

 

Power

BY AUDRE LORDE

The difference between poetry and rhetoric

is being ready to kill

yourself

instead of your children.

 

I am trapped on a desert of raw gunshot wounds

and a dead child dragging his shattered black

face off the edge of my sleep

blood from his punctured cheeks and shoulders

is the only liquid for miles

and my stomach

churns at the imagined taste while

my mouth splits into dry lips

without loyalty or reason

thirsting for the wetness of his blood

as it sinks into the whiteness

of the desert where I am lost

without imagery or magic

trying to make power out of hatred and destruction

trying to heal my dying son with kisses

only the sun will bleach his bones quicker.

 

A policeman who shot down a ten year old in Queens

stood over the boy with his cop shoes in childish blood

and a voice said “Die you little motherfucker” and

there are tapes to prove it. At his trial

this policeman said in his own defense

“I didn’t notice the size nor nothing else

only the color”. And

there are tapes to prove that, too.

 

Today that 37 year old white man

with 13 years of police forcing

was set free

by eleven white men who said they were satisfied

justice had been done

and one Black Woman who said

“They convinced me” meaning

they had dragged her 4’10” black Woman’s frame

over the hot coals

of four centuries of white male approval

until she let go

the first real power she ever had

and lined her own womb with cement

to make a graveyard for our children.

 

I have not been able to touch the destruction

within me.

But unless I learn to use

the difference between poetry and rhetoric

my power too will run corrupt as poisonous mold

or lie limp and useless as an unconnected wire

and one day I will take my teenaged plug

and connect it to the nearest socket

raping an 85 year old white woman

who is somebody’s mother

and as I beat her senseless and set a torch to her bed

a greek chorus will be singing in 3/4 time

“Poor thing. She never hurt a soul. What beasts they are.”

 

చివరగా ఇంకో మాట లార్డ్ poems  మిస్ అయినా పర్లేదు కాని కవిత్వం అంటే ఏమిటో ఎందుకో లాంటి ప్రతి ప్రశ్నకి సమాధానం కావాలంటే మాత్రం ఇంటరెస్ట్ ఉన్నవాళ్ళు  తను రాసిన Sister Outsider సాహితీ వ్యాసాలు మాత్రం అసలు మిస్ అవ్వకండి .

*

 

అశోక్ : తెలంగాణా కవిత్వంలో కొత్త గొంతుక

-నారాయణ స్వామి వెంకట యోగి 

~

swamy1

అదో అందమైన అబద్దాల ఆదివారం సాయంత్రం. అంతర్జాలంలో ఆంధ్రజ్యోతి వివిధ చూద్దామని తెరిచా.
(ఓ పది రోజుల కింద సౌత్ కెరోలైనా లో చార్లెస్టన్ లో ఒక చర్చ్ లో 9 మంది నల్లజాతి వాళ్ళని ఒక తెల్ల జాతీయుడు నిష్కారణంగా (వాడి కారణమొక్కటే – నల్ల జాతి వారి పట్ల కరడు గట్టిన ద్వేషం) , నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేసిండు.)
 ‘ఓ ప్రభువా హంతకుడిని క్షమించు’ అనే పద్యం కనబడింది. యెవరో అశోక్ కుంబం రాచెస్టర్ మినెసోటా అని ఉంది.
ఓ ప్రభువా
హంతకుడిని  క్షమించు
వాడు అగ్నాని
అహంకారి
మనిషి రంగు తప్ప
మనిషి తనం యెరుగనోడు
జెండాల మీద ప్రేమే తప్ప
జనంతో కలిసి బ్రతుకనోడు
వాడు నీ బిడ్డడే
కాకపోతే మానవవేటకు మరిగినోడు
మనుషుల కాల్చి కుప్పేయడం నేర్చినోడు
వాడిని దయతో దీవించి
కరుణతో లాలించు
ఓ ప్రభువా
మేము హంతకున్ని క్షమిస్తున్నాము
ప్రపంచాన్ని మా చేతులచుట్టూ తిప్పే
మా పిల్లల పోగొట్టుకున్నాము
అలసటొచ్చినప్పుడో ఆపదొచ్చినప్పుడో
తలనిమిరి ధైర్యమిచ్చే
అమ్మా నాన్నల పోగొట్టుకున్నాము
గత వర్తమానాల  కష్టసుఖాల తలపోస్తూ
అభద్రమైన భవిష్యత్తుపై సహితం ఆశలు రేపే
తాత అవ్వల పోగొట్టుకున్నాము
తరతరాల వంతెనలన్నీ ధ్వంసమైపోయి
పారుతున్న నెత్తురు
పొంగుతున్న దుఃఖం
కారుతున్న కన్నీళ్ళు
గడ్దకట్టుకుపోయాక
ఇక చివరకు మిగిలింది
హంతకుడిని క్షమించుడే కదా!
విలువ లేని బతుకులు
ఎప్పుడు పోతవో తెలియని ప్రాణాలు
మృత్యు  రూపాన్ని కనిపెట్టలేని జీవితాలు
ఇవేవీ ముఖ్యం కావు
మేము మనుషులమా కాదా అని అంచనా వేయడానికి
ఇప్పుడు పరీక్షకు నిలిచింది మా మా మానవత్వ నిరూపణే
వాడు శిక్షించాలి
మేము క్షమించాలి
అదే కదా ధర్మం ప్రభూ!
పద్యం మొత్తం ఒక్క సారే ఊపిరి తీసుకోకుండా చదివా . ఒక ప్రార్థనలా బిగ్గరగా చదివా . ఒక కెరటం ఛెళ్ళున చరిచింది ముఖాన్ని. చివరి మూడు వాక్యాలు కుదిపేసాయి. అవును, మళ్లా ఒక నాలుగు నెలల తర్వాత చదివినా  ఈ వాక్యాలంతే కుదిపేస్తున్నాయి. మరింతగా చరుస్తున్నాయి ముఖమ్మీద.
మొత్తం పద్య నిర్మాణం చూస్తే ఈ పద్యంలో అశోక్,  క్రైస్తవ ప్రార్థనా పద్దతి ఉపయోగించినట్టు తెలుస్తూనే ఉంది. అయితే జాలీ కరుణలతో పద్యాన్ని నడిపి చివరికొచ్చేసరికల్లా ఒక రకమైన వ్యంగ్యంతో కూడిన చిరు కోపాన్ని అదీ అశక్తతలోంచీ, మరీ ఎక్కువ అసహనపు కోపమనిపించని సహనత్వంలోంచీ తమకు బోధించబడిన ‘ధర్మాన్ని’  గుర్తు చేస్తూ పలికాడా వాక్యాలను. మా మానవత్వాన్ని నిరూపించుకోవాలంటే వాడెన్ని సార్లు శిక్షించినా మేము క్షమించాల్సిందే కదా ప్రభువా అని అడుగుతున్నాడు చంపబడ్డ ఆ నల్ల జాతీయుల్లోకి పరకాయ ప్రవేశం చేసి. పిల్లలనీ, అమ్మానాన్నలనీ పోగొట్టుకున్నామని చెప్తూ  ‘తరతరాల వంతెనలు ధ్వంసమై’ అన్న వాక్యంతో ఆ మొనొటొనాసిటీ కి కళ్ళెం వేసి యెందుకు హంతకులను క్షమించడం మాత్రమే మిగిలిందో చెప్తాడు. అక్కడ పద్యాన్ని ఒక అద్భుతమైన మలుపు తిప్పాడు. అగ్నానీ అహంకారీ అయిన హంతకుడిని క్షమించడం తప్ప యేమీ మిగలనోళ్ళం అని పాపులను క్షమించమనే నీతిని అభాసు చేసాడు. నల్ల జాతీయులు  మనుషులుగా గుర్తింపబడాలంటే వారికి  న్యాయం జరగడం కన్నా వారు  క్షమించడమే ముఖ్యం చేస్తున్న జాత్యహంకార వ్యవస్థ మీద పదునైన కత్తుల్లాంటి కవితా వాక్యాలను దూసాడు అశోక్. మొత్తం పద్యం సూటిగా ఉన్నట్టనిపించినా అంతా సులభంగా అర్థమయినట్టనిపించినా మళ్లా మళ్లా చదువుతున్న కొద్దీ కొత్త అర్థాలు పరిస్థితి పట్ల కొత్త క్రోధాల్నీ కలుగజేస్తుందీ పద్యం. మొత్తం పద్యం చాలా సూటిగా ఉత్ప్రేక్షలూ, ఉపమానాలూ లేకుండా సాగుతుంది.  కానీ జాగ్రత్తగా చూస్తే మొత్తం పద్యమే ఒక ఉత్ప్రేక్ష. ఈ సమాజంలో మేము మనుషులుగా గుర్తింపబడాలి అంటే మాకు జరిగిన అన్యాయానికి న్యాయం అడగడం కాక, హంతకున్ని క్షమించడం తప్ప మరో మార్గం లేని నిస్సహాయతను చాలా బలంగా సూచించే ఉత్ప్రేక్ష (metaphor). అందుకే పద్యం బలంగా చదివిన కొద్దీ కొత్తగా ఉంటుంది.
పద్యం చదివాక అశోక్ తో మాట్లాడాలనిపించింది. మినెసోటా లోని రాచెస్టర్ లో ఒక వైద్య కళాశాల లో బయోయెథిక్స్ బోధించే ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు తను. తెలంగాణా లో నల్గొండ జిల్లా ఆజంపూర్ లో పేద రైతాంగ కుటుంబంలో పుట్టి హైదరాబాదు నిజాం కళాశాల లో తత్వశాస్త్రం, సామాజిక శాస్త్రం మానసిక శాస్త్రం లో బీయే చేసి, నెదర్లాండులో పోస్టు గ్రాడుయేషన్, కెనడా లో పీయెఎచ్ డీ, డాక్టొరల్ ఫెలోషిప్  చేసినంక యిప్పుడు మేయో క్లినిక్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా బోధిస్తున్నాడు. పలకరించగానే యెంతో ఆప్యాయంగా మాట్లాడి తన ఆసక్తుల గురించి వివరంగా చెప్పిండు. తన ఇతర పద్యాలను కూడా ఒక చోట చేర్చి పంపిండు.
అన్ని పద్యాలూ బాగున్నయి. పద్యాలు కావాలని రాసినట్టో, అందంగా రాయాలని ప్రయత్నించి రాసినట్టో కృతకంగా లేవు. అన్నింటి లోనూ ఒక సహజ త్వం ఉన్నది. అదే వాటి సౌందర్యం. అన్నీ సూటిగా డొంక తిరుగుడు లేకుండ ఉన్నయి.   అన్నీ సామాజిక సమస్యల పట్ల స్పందనలే. అశోక్ తాను అన్యాయమని అనుకున్న వాటికి, సమాజంలో అధికారపు ఆజమాయిషీ దుర్మార్గాల ఫలితాలనుకున్నవాటికీ  వెంటనే స్పందిస్తున్నాడు. క్రౌంచపక్షి మరణానికి వెంటనే స్పందించే వాల్మీకి లాగా. బాధా, దుఃఖమూ వేదనా పరిస్థితుల పట్ల ఆగ్రహ ప్రకటనా, పరిస్థితులు మారాలనే బలమైన ఆకాంక్ష వెంటనే పద్యాల రూపంలో బలంగా సూటిగా డొంకతిరుగుడు లేకుండా ప్రకటిస్తున్నాడు. నీళ్ళు నమలడం లేని, యెక్కువ ఉపమానాలూ ఉత్ప్రేక్షలూ లేని కవితా పద్దతినెంచుకున్నాడు. భాషనూ, వాక్యాలనూ తన ఉద్వేగంతో నింపి కవితా వాక్యాలు చేసి సంధిస్తున్నాడు. పద్య నిర్మాణం లోనూ చెప్పే పద్దతిలోనూ ఉద్వేగాన్ని నింపి తను చెప్పదల్చుకున్న దానిని బలంగా చెప్తున్నాడు. గుర్తుంచుకునేటట్టు చెప్తున్నాడు.
తెలంగాణ ప్రభుత్వం చీప్ లిక్కర్ తీసుకురావాలనుకున్నప్పుడు, ‘బంగారు తెలంగాణ బలికోరుతున్నది/  బలవంతమేమీలేదు/  బారులు తీరండి’ అని అంటాడు. ‘బలవంతమేమీ లేదు’  అని పాదం విరిచి ‘బారులు తీరండి’ అనడంలో ప్రతిభ చూపిస్తాడు. అంతకు ముందే “పుష్కరాలను మించిన పుణ్యకార్యమిది/  ప్రతి పూట మరువకుండ/  మత్తుల,  మందుల / మునిగి తేలండి’ అని వ్యంగ్యం ప్రకటిస్తాడు. అట్లే నల్లజాతీయుల అభద్రత గురించి కూడా ‘మై డియర్ బ్లాక్ అమెరికా’  అని ఒక పద్యం. ‘చేతులెప్పుడూ గాలిలోనె ఉంచు / జీసస్ శిలువ మీద ఉన్నట్టు / అల్లాని వేడుకున్నట్టు/ .. నల్లని నీ రూపం సహితం వాడికి మారణాయుధంగానే కనబడుతుంది / అందుకే నీ చావుకి నువ్వా కారణమని ముందే ప్రకటించు … వాడి నిఘంటువు లో నువ్వొక తప్పిదానివి దారి తప్పిన జీవితానివి పొంచిఉన్న ప్రమాదానివి …’ అంటూ రాస్తాడు.
తెలంగాణ రాష్ట్రం యేర్పడి తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో చురుగ్గా పాల్గొని తర్వాత మావోయిస్టులలో చేరి బూటకపు ఎంకౌంటర్ లో కాల్చి చంపబడిన నిండా ఇరవై నిండని వివేక్ కోసం రాసిన పద్యంలో
 ‘నువ్వెవరో నాకు తెలిసింది/
నీ అమరత్వం బ్రేకింక్ న్యూస్ అయినప్పుడే కదా/ అయినా నువ్వొక గ్నాపకమై నన్ను యెందుకు వెంటాడుతున్నవు? /…నువ్వు నడిచిన దారి పొడువున / నీ పాదముద్రలు వెతికే పనికై/ నా మనసు యెందుకు వెంపర్లాడుతున్నది?/ భద్ర జీవితపు సరిహద్దులు చెరిపి/ యాంత్రిక జీవనాన్ని/మాంత్రిక కాలాన్ని / శాసిస్తున్న నీ త్యాగం/ ఒక మరణాన్ని కాదు / ఒక సమన్యాయ విలువను గుర్తు చేస్తుంది ..అని అంటాడు ఉద్వేగంగా. యాంత్రిక జీవనమూ మాంత్రిక కాలమూ – అశోక్ వాడిన ఈ పదచిత్రాలు సమకాలీన సమాజమూ, కాలమూ, జీవితాన్నీ అద్భుతంగా చిత్రిక పడుతున్నయి.
రైతుల ఆత్మహత్యలగురించి రాస్తూ ‘ఇక ఈ తంతు నాపి నాకు స్వేచ్ఛనివ్వండి / సాలు మీద సాలు దున్నే / ఆ బక్క రైతు / బుడ్డగోసినై రుణం తీర్చుకుంట’  అని తన సంఘీభావాన్ని ప్ర కటి స్తడు.
అశోక్ బలమైన కవి. గొప్ప ఉద్వేగం ఉన్న కవి. సమాజం పట్ల దోపిడీ పీడన, అణచివేతలకు కు గురవుతున్నవారి పట్ల సంఘీభావం ఉన్న కవి. ఉన్న పరిస్థ్తి మారాలనీ కోరుకునే కవి. అది యెట్లా మారుతుందో కూడా స్పృహ ఉండి తెలిసిన కవి. అశోక్ ఇంకా రాయాలి. ఇంకా బలంగా రాయాలి. పద్యాన్ని ఒక శిల్పంలా చెక్కడం పట్ల శ్రద్ద పెట్టి యింకా రాయాలి. ఆవసర వాక్యాలూ, పదాలూ పద్యంలో ఉండకూడదన్న స్పృహ ఉన్న అశోక్ అవి లేకుండా ఇంకా శ్రద్ద పెట్టాలి. వాక్య నిర్మాణమూ, పద్య పాదాలని విరవడమూ, పదాల యెంపికా , సూటిదనం అన్ని సార్లూ పని చేయని చోట ఉపమా నాలూ,  ఉత్ప్రేక్షలూ, allusions, సూచనలతో  పద్యాన్ని బలోపేతం చేయవచ్చు అని బాగా తెలిసిన అశోక్  ఆ పని మరింత చైతన్యయుతంగా చేస్తాడని ఆశ!  తనలో ఉన్న ఉద్వేగ తుఫానులకు సరైన పద్య రూపమిచ్చి మరింత విరివిగా రాయాలని కోర్కె.

*

హృదయాన్ని రగిలించే వాక్యాలు మన కోసం …

 

 

-నిశీధి 

~

కట్టుబట్టలమీద కట్టుదిట్టాలు మరీ మరీ  పెరిగిపోతున్న కాలాల్లో కాంజివరం చీరలొనో కలర్ఫుల్ కమర్షియల్ పేలికల్లోనో ఇరుక్కొన్న జీరో సైజ్ల మీద మాత్రమే జావళీలు రచించగల జాహ్నవి పౌత్రుల చేతిలో శారీరకంగా మానసికంగా సామాజిక శూన్య స్తాయి అనుభవిస్తున్న స్త్రీలకి శరీరం కాకుండా కూడా ఒక అస్తిత్వం ఉంటుందని , ఆ అస్తిత్వాన్ని అందమయిన మోనాలిసా అర నవ్వులో దాగున్న గుబులులో కాకుండా అదే పికాసో ఇంకో అద్బుత చిత్రణ వీపింగ్ వుమన్ చెక్కిళ్ళ గరుకుదనంలో వెతుకమని  సవాలు ఎవరయినా చేసారు అంటే అది ఒక ఒక్క గ్రేస్ నికోల్స్ మాత్రమే అయి ఉండాలి .

ఎందెందు వెతికినా అందందు అందమయిన ఆడతనమే  అని శారీరక సౌందర్య శాస్త్రాలలో పూర్తీ సమాధి చేయబడ్డ అందాల ఆడబొమ్మగా కాకుండా  “ The fat black women poems “ రేసులో ఇమడలేని మేళ్ళు ఫీమేళ్ళు  గా మాత్రమే పుట్టి చావని మనిషి జాతి ఒకటుందని నిరాశతో కూడిన స్లిమ్నెస్ కంటే ఆశ తో కూడిన నిండయిన మాంసం ముద్దలుగా బ్రతకడం మేలని ప్రపంచం మొహం పగలగొట్టి మరీ ఎవరన్నా చెప్పారు అంటే అది ఖచ్చితంగా గ్రేస్ నికోల్సే .

సముద్రం దాటి వచ్చాను మూలలలో కుదురుకున్న నాలుక ఊడిపోయి కొత్త నాలుక సంతరించుకుంది అని సంతోషంగా తనలో కల్చర్ షిఫ్ట్ తెచ్చిన మార్పు గురించి , పుట్టి పెరిగిన గయానా వదిలి బ్రిటిష్ రచనా రంగంలో తనదయిన ముద్ర వేసిన Grace Nichols (born 1950) తన గురించి చెప్పుకున్న మాటలు . మైగ్రేషన్స్లో మానసిక వ్యథలు , కల్చర్ చేంజ్ లో కనిపించని బాధలు తట్టుకోవడం అన్ని కరేబియన్ రైం అండ్ రిథిం లో వాక్యీకరించిన మొట్ట మొదటి సంకలనంలో తన కవిత్వ శైలీకి   కామన్వెల్త్ పోయేట్రీ ప్రైజ్  (198౩) సలాం  చెప్పింది . ఇహను ఆ తర్వాత ఆ కలం ఆగింది లేదు , మేల్ చావ్నిస్టిక్ ప్రపంచాన్ని దులపడం ఆపనూ లేదు .

గ్రేస్ కవితల్లో చాల పదును ఉన్నా తన ప్రతి ఆలోచన అభివ్యక్తీకరించే “Weeping Woman” దీర్ఘకవితలో ఖచ్చితంగా ఒరిజినల్ వీపింగ్ వుమన్ పెయింటింగ్లో కలబోసిన రంగులంత కలర్ఫుల్ గా అన్ని షేడ్స్ తోనూ ఉంటుంది . ఈ కవితలో తనతో , పికాసోతో ఇద్దరితో ఒకేసారి వ్యక్తీకరిస్తున్నట్లు డైరెక్ట్ అటాక్ లో సాగే నాణ్యమయిన ఆకర్షణ ఎదో ధారాళంగా ఆ భావాలని మన హృదిలో నింపుతుంది . ఆడవాళ్ళలో రికవరీ అవ్వనీ స్వయం ప్రతిపత్తుల పై  కొంత కోపం , మతవిశ్వాస మానసిక పాట్లలో బంధించబడ్డ విసుగు ,  self_mockery తో పాటు ఎక్కడోవీటన్నిటిలో ఇరుక్కుపోయిన  స్త్రీ జీవితం పట్ల అయిష్టమయిన అడ్మిరేషన్ కూడా కనిపిస్తుంది . మొత్తం కవిత ని తెలుగీకరించే సాహసం లేదు కాని అక్కడక్కడ కొన్ని పంక్తులలో పెళుసుతనం ఎదో హృదయాన్ని రగిలించే వాక్యాలు మన కోసం .

 

తలలో నిండున్న దైన్యాన్ని

చూసి నా తల మీద టోపీకీ గేలే

నా వంకర తిరిగిన పెదవులు

కటకటలాడుతూ అరిగిన పళ్ళు

రక్తపు తోడుగులనేదో ఇంకా మోస్తూ  

ఈ నా లావయిన మొరటు వేళ్ళు

కనురెప్పల్లోంఛి బయటికి పెరుక్కొచిన గుడ్లు

విదుషకుడికి విరిగిన ముక్కలకి క్రాస్ బ్రీడ్లా

ఇంత వైక్యలానికి నేను మాత్రమే అర్హురాల్ని ఎందుకయ్యాను పికాసో ( సమాధానం ఉందా )

 

కానిప్పుడు నేను చాలా ఫేమస్

ఇన్నేసి విరిగిన గాయాల మధ్య కూడా

జనంలో నాకో గుర్తింపు ఉంది

నేను మోనాలిసా ఏమి కాదు

( ఇప్పటికీ అందర్నీ ఆకర్షించే  ఆమె ముఖంలో ఆ గుప్తమయిన నవ్వేదో తుడిచేయాలన్న కోరికెంతో నాకెప్పటికీ )

ఆమె కి తెలియదా ఏమిటి

ఆర్ట్ అంతా ఆయిల్ పెయింట్స్ కానక్కరలేదు అని

 

నేను మాత్రం అందం లోపించిన అయస్కాంతాన్ని

ఇరవైవ శతాబ్దపు విచార చిహ్నాన్ని

శ్రమ మిశ్రమ అవకాశాల సింబల్ని

నా కళ్ళు కార్చే ఆనంద భాష్పాలు

గనుల్లో దొర్లుతున్న డైమండ్ వజ్రాలే

@ ఈ చివరి నాలుగు పంక్తులలో మొత్తం ఆఫ్రికా ఖండం ఆడవారి జీవితం చదవగలగడము ఒక ఆర్టే కదూ .

 

Weeping Woman 1937 Pablo Picasso 1881-1973 Accepted by HM Government in lieu of tax with additional payment (Grant-in-Aid) made with assistance from the National Heritage Memorial Fund, the Art Fund and the Friends of the Tate Gallery 1987 http://www.tate.org.uk/art/work/T05010

Weeping Woman 1937 Pablo Picasso 

 

From Weeping Woman

(Dora Maar)

Pablo Picasso (1937)

 

2

 

Even my hat mocks me

laughing

on the inside of my grief –

 

My twisted mouth

and gnashing teeth,

my fingers fat and clumsy

as if they were still wearing

those gloves –

the bloodstained ones you keep.

 

What has happened

to the pupils

of my eyes, Picasso?

 

 

Why do I deserve

such deformity?

 

What am I now

if not a cross between

a clown and a broken

piece of crockery?

 

3

 

But I am famous.

People recognise me

despite my fractures.

 

I’m no Mona Lisa

(how I’d like to wipe

the smugness from her face

that still captivates.)

 

Doesn’t she know that art, great art,

needn’t be an oil-painting?

 

I am a magnet

not devoid of beauty.

 

I am an icon

of twentieth-century grief.

 

A symbol

of compositional possibilities

 

My tears are tears of happiness –

big rolling diamonds.

 

14

 

Picasso, I want my face back

the unbroken photography of it

 

Once I lived to be stroked

by the fingers of your brushes

 

Now I see I was more an accomplice

to my own unrooting

 

Watching the pundits gaze

open-mouthed at your masterpieces

 

While I hovered like a battered muse

my private grief made public.

 

15

 

Dora, Theodora, be reasonable, if it weren’t for Picasso

you’d hardly be remembered at all.

He’s given you an unbelievable shelf-life.

Yes, but who will remember the fruits of my own life?

 

I am no moth flitting around his wick.

He might be a genius but he’s also a prick –

Medusa, Cleopatra, help me find my inner bitch,

wasn’t I christened Henriette Theodora Markovitch?

 

Picasso, I want my face back

the unbroken geography of it

 

 

దీర్ఘకవిత కాబట్టి స్పేస్ ప్రాబ్లంస్తో మొత్తం కవిత ఈ కాస్త స్థలంలో కుదించలేక కొన్ని స్టాంజాస్ మాత్రం ఇక్కడ అందించడం జరిగింది .

మళ్ళీ ఇంకోమారు మరో గ్రేస్ఫుల్ కవి/ కవితతో రావడానికి ఇపుడు సెలవు తీసుకుంటూ

*

కవిత్వం : వెంటాడే జ్ఞాపకం

 

         -ఎ . కె . ప్రభాకర్

~

జీవితపు రహదారుల్లో

వేలాడుతున్న నాకు

ఇంత నమ్మకాన్ని పోయండి

దోసిళ్ళతో నన్ను నేను నింపుకొంటాను (శూన్య దేహం )

 జీవితం మన చేతుల్లో వుండదు. వేళ్ళ సందుల్లోంచి యెప్పుడు జారిపోయిందో తెలీదు. స్థలకాలాలు మన అధీనంలో వుండవు. కాళ్ళ కింది నేల  కాపాడుకోవాల్సిన కాలాలు మన ప్రమేయం లేకుండానే మాయమైపోతాయి. మన కలల్నీ కన్నీళ్ళనీ యెవడో శాసిస్తుంటాడు. మనం మనలా కాకుండా యెవరిలానో బతుకుతూ అదే నిజమనే భ్రమలో సైతం వుండిపోతాం. ముఖానికి తొడుక్కొన్న మాస్క్ లే అసలనుకొని మురిసిపోతాం మురిపింప జేస్తాం – నమ్ముతాం నమ్మబలుకుతాం. సమస్త జీవన పార్శ్వాలూ పరాయీకరణకు గురైనపుడు యెక్కడో వొక కవిత్వం తునక వొక వాక్యం వొక భావ శకలం వొక పద చిత్రం గుండెని తాకి నిద్రిస్తోన్న జ్ఞాపకాల తేనె తుట్టెని కదుపుతుంది. వుద్వేగాల్తో మనసు అనేక ప్రకంపనాలకు గురౌతుంది. కాళ్ళు తడబడతాయి. పట్టు దొరకదు.  కోల్పోయింది తెలుస్తుంది. పొందాల్సింది అందదు. ఆసరా కోసం దిక్కులు చూస్తాం. వొక ఆప్త వాక్యం కోసం అలమటిస్తాం.

అప్పుడు – సరిగ్గా అప్పుడే కవిత్వమో కథో భుజం కాస్తుంది. వొక ఆలంబనై నిలుస్తుంది – అండనిస్తుంది – వోదార్పౌతుంది. ‘వెలుపలి అరణ్యాల్నీ లోపలి మృగాల్నీ చీల్చుకుంటూ వెళ్లి అదృశ్యమైన మనిషిని ఆకులమధ్య ప్రత్యక్షం’ గావిస్తుంది.  అలా మిగలాల్సిన మనిషిని మన ముందు ఆవిష్కరింపజేసేదే బండ్ల మాధవరావు ‘అనుపమ’.

‘అనుపమ ఒక జ్ఞాపకాల చెట్టు’. జ్ఞాపకాలు యెప్పుడూ వుద్వేగ భరితంగనే వుంటాయి. సంఘటనలు కావొచ్చు వ్యక్తులు కావొచ్చు స్థలాలు కావొచ్చు వుద్వేగాలతో ముడివడి వున్నప్పుడే బలగా స్థిరంగా వుంటాయి. ప్రేమ వియోగం దు:ఖం క్రోధం భయం యేదో వొక సహజాతం తీవ్ర ప్రకంపనాలకు లోనైనపుడు అందుకు కారణమైన దృశ్యాదృశ్య శక్తులూ వాటి ప్రమేయాలు కూడా మనిషిని వెంటాడుతూనే వుంటాయి. కొన్ని సందర్భాల్లో అవి వైయక్తికాలుగా గోచరిస్తాయి కానీ నిజానికి అవి సామాజికాలు. బతుకు దారిలో వేలాడే ప్రయాణికులకు దిక్సూచికలు. గత వర్తమానాల మధ్య కట్టిన వారధులు.

ఎవర్ని పలకరించినా

గతం నెమరువేస్తాడు

అప్రస్తుతం కాని

వర్తమానాన్నే

ప్రస్తుతించాలిపుడు…

వర్తమానంలోనే

బతుకును వెదుక్కోవాలిపుడు

కొన్ని సమష్టి నిన్నల పునాదుల మీదే

నేను ఈ రోజు నిలబడ్డాను

…   …   …   …

ఇప్పుడు ఇక్కడ ఇలా బతకడం

అన్నికాలాలకూ విస్తరించడమే

మొలకెత్తితేనే కదా విస్తరించేది… ( ఇప్పుడే , ఇక్కడే )

 

తలపోతల తవ్విపోత వలపోత  దానికదే కవిత్వం కాదు; కవి ప్రాపంచిక దృక్పథం దానిలో ప్రతిఫలించాలి. అది  పాఠకుడికి అందాలి. అలా అందినపుడు మాత్రమే కవిత్వ  ప్రయోజనం నెరవేరుతుంది.

మాగిన జ్ఞాపకాల్ని

ఒకటొకటిగా పేర్చుకొంటుంటే

కడుపులో దేవుతున్న బాధ ( మిత్తవ)

ఆ బాధ వొక్కరిదే కాదు; అందరిదీ. అందరిదీ చేయమే కవి కర్తవ్యం. సాహిత్యంలో ప్రతి అనుభూతి వ్యక్తీకరణకీ రాజకీయ ప్రమేయాల్ని ఆపాదించడం తప్పని కేవల కవిత్వ వాదులు అభిప్రాయపడినప్పటికీ స్వీయానుభవాల పరంపరని సామాజికం చేయడంలోనే – వొంటరి వెతల్ని  సామూహిక సంవేదనలుగా సొంత సంతోషాల్ని మంది ఆనందాలుగా   తర్జుమా చేయడంలోనే – వాటికొక తాత్త్వికతని సాధించడంలోనే కవి ప్రతిభ బయట పడుతుంది. అటువంటి ప్రతిభ మాధవరావులో నిండుగా వుందని అతని తొలి మలి కవిత్వ సంపుటులు (చెమట చిత్తడి నేల – 1998,స్పర్శ – 2005) నిరూపించినప్పటికీ అనుపమకి వచ్చేసరికి అది మరింత పదునెక్కింది. అందుకే వూరి చెరువూ , అందులో దిసెమొలతో యీతలూ , జలగలూ , పుస్తకాల్లో దాచుకొనే నెమలీకలూ వంటి  సాధారణమైన బాల్యస్మృతుల్ని మాయమైపోతున్న మనిషికీ మనిషితనానికీ అన్వయించి అసాధారణత్వాన్ని సాధించగలిగాడు.

167fa204c80c3f82202da95bc1c1f63c

ఊరి చెరువులో

దిగంబరంగా ఈదుతున్నప్పుడు

పట్టుకున్న జలగల్లో ఒకటైనవాడు

పుస్తకాల్లో దాచుకొనే నెమలీక కోసం

నెమళ్ళనే వేటాడిన వాడు

దొరక్కపోడు                (అనుపమ)

జీవిక కోసం ఉపాధిని వెతుక్కొంటూ నగరానికి చేరినా పల్లె యీ కవికి నీడలా వెన్నంటే వుంటుంది. ఊరూ వూళ్ళో నడయాడిన స్థలాలూ వూరి పరిసరాలూ చేనూ తోటా కొండా గుట్టా వ్యక్తులూ వారితో స్నేహ బాంధవ్యాలూ వ్యక్తులతో పంచుకొన్న ఆత్మీయానుబంధాలూ  గుండెనిండా కమ్ముకొని వుంటాయి. దూరమైన మూలాలపట్ల వీడని మమకారం – తన నేలకి దూరమైనందుకు పరివేదన –  నగరంలో కొత్త వాతాతావరణంలో యిమడలేనితనం – యాంత్రికంగా తయారైన జీవనవిధానంపట్ల అసహనం …  యివన్నీ వుక్కిరిబిక్కిరి చేస్తాయి. యిదంతా రూరల్ డయాస్పోరా. వొక వొదలని మానేద. కోల్పోయినదాన్ని పొందాలనే వెతుకులాట. వెనక్కి తిరిగి చూసుకొన్నప్పుడు చేజేతులా పోగొట్టుకొన్నాననే అపరాధభావన కూడా ఏదో మూల వెంటాడుతూనే వుంటుంది.

నిజానికి అక్కడ వూరు కూడా వూరిలా లేదు. సామాజికంగానే కాదు భౌగోళికంగా కూడా యెన్నో మార్పులు చోటుచేసుకొన్నాయి. అతని జ్ఞాపకాల్లోని వూరికీ కొత్త చలనాలకి వేదికైన వూరికీ పొంతనలేదు. స్వరూప స్వభావాలన్నీ మారిపోయాయి. వూళ్ళో మానవ సంబంధాల్లో కొత్త సంక్లిష్టతలు చోటుచేసుకోన్నాయి. మనుషులమధ్య కనపడని కొత్త కంచెలు లేచాయి.  పంట పొలాలు రియల్ ఎస్టేటు వ్యాపార దురాక్రమణకి గురౌతాయి. మింగుడుపడని యీ మార్పులు పరాయీకరణ కుట్రలు తెలీని ఆవేదనకి కారణమౌతాయి. నిరసన గళం విచ్చుకొంటుంది.

అనాది ఆక్రమణల్లోనే

నా దేహాన్ని కోల్పోతున్నాను…

నా శరీరం లోంచి

నన్ను తరిమేసి వేలం వేస్తున్నాడు

అన్నం ముద్ద లాగేసుకొని

అక్కడే ఇనుప తోటలు పెంచుతున్నాడు…

నగరం నడిబొడ్డు

నా ఊరి పోలిమేరల దాకా నడిచి వచ్చింది ( దురాక్రమణ )

 

బండ్ల 2006లో రాసిన యీ కవితకి యిప్పుడు ప్రాసంగికత మరింతగా పెరిగింది. ఇందులో పేర్కొన్న ‘నగరం’ ముందు ‘రాజధాని’ విశేషణం తగిలించుకోవాలి. దురాక్రమణ అర్థం మార్చుకొని సమీకరణ కాదంటే  సేకరణ అవుతుంది. చట్టబద్ధమౌతుంది. ఇప్పుడు వూరే మాయమైపోతోంది.  ‘దస్త్రాలు చుట్టేసుకొన్న రాజధాని /నా గుమ్మంలో అడుగుపెట్టింది’ . 2015 నాటికి చివరి పంక్తులు మారిపోయాయి. ప్రైవేటు వ్యక్తుల చేతికి స్వాదుఫలాల్ని పాలకులే కోసి యిస్తారు. దాని పేరు అభివృద్ధి.

విచ్చలవిడి నగరీకరణని మాధవ మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్నాడు. నగరం మనుషుల మధ్య అభేద్యమైన గోడలు కడుతుంది. స్వార్థం కాంక్రీట్ బలంగా స్తంభాలై లేస్తుంది. మానవారణ్యంలో పులులు పంజాలు విసురుతూ తిరుగాడుతుంటాయి.  సమూహంలో కూడా కవి వొంటరౌతాడు.

కొత్తగా మొలుస్తున్న నగరంలో

హఠాత్తుగా అంతెత్తున లేచిన

ఆకాశ హర్మ్యాలలోంచి

జన సంచారం లేని

ఇళ్ళ గుట్టల మధ్య

నేనొక్కడిని నిలిచి

విచ్చుకుంటున్న చేతుల కోసం

అన్వేషిస్తున్నాను… ( వలస పక్షుల గూళ్ళు )

అంటూ మానవీయ స్పర్శకోసం అలమటిస్తాడు. వొక స్నేహ హస్తం కోసం దిక్కులు చూస్తాడు.  లోపలి గదుల్లో మూసి వుంచిన అరల్లోని రహస్యాలు విప్పి చెప్పి కలబోసుకొనే పరిమళం కోసం వెతుకుతాడు. మాటల నిచ్చెనలతో మాటల వంతెనలతో  మాటల ప్రవాహాలతో మనుషులు కలవడాన్ని గురించి కలగంటాడు. కానీ నగరం అన్నిటినీ ధ్వంసం చేసుకొంటూ పెరుగుతుంది. అక్కడ  పచ్చి కట్టే పామై కరవడం చూసి విస్తుపోతాడు. ఇటుకమీద ఇటుక పేర్చినవాడే స్వార్థ ఆయుధాలతో నిలువునా కూల్చేయడంతో విభ్రాంతుడౌతాడు. నిర్మాణానికి రాళ్ళందించిన చేతులే పునాదుల్తో సహా పెళ్లగించివేయడాన్ని జీర్ణం చేసుకోలేడు. సుందర నిర్మాణ ఆకృతులు శిధిలాలై కూలిపోతే దిక్కు తోచక కుంగిపోతాడు.

మూడు కాలాల్లోనూ రక్షించాల్సిన ఇళ్లు

రూపాయల మారకాలయ్యాయి ( నగరం )

అని వాపోతాడు. అయితే అతను కేవలం తన దు:ఖాన్నే మనకు పంచడం లేదు. నిస్సహాయంగా నిరాశలో కూరుకుపోవడం లేదు. మనిషి కూలిన శిధిలాల్లోంచి లేచి నిలబడి శిఖరాల వైపు చేసే ప్రయాణాల గురించిన ఆశని ప్రోదిచేసుకొంటున్నాడు. రహదారుల్లో సేద తీర్చే చెలమలున్నాయని భరోసానిస్తున్నాడు. శోకాన్ని క్రోధంగా మల్చుకొని జరుగుతున్న విధ్వంసానికి జవాబివ్వడానికి బిగించిన పిడికిలౌతున్నాడు. నేలని ఉత్పత్తికి దూరంచేసి విపణి వస్తువుగా మార్చిన వాళ్లకి వ్యతిరేకంగా గొంతు విప్పిన ప్రజా శ్రేణులకి దన్నుగా తన కవిత్వాన్ని నిలబెడుతున్నాడు. దానికొక సామూహిక స్వరాన్నిస్తున్నాడు. పరాధీనపు సంకెళ్ళని తెంచే పనిముట్టుగా కవిత్వానికి సానబెడుతున్నాడు.

 

ఇప్పుడు

మట్టిలో గింజలకు బదులు

రాళ్ళు నాటుతున్నారు

పాతిన రాళ్ళ మధ్య నేల

తల్లి బందీ అవుతుంది

పరధీనమైన దానిని

స్వాధీనం చేసుకోడానికే

పిడికిళ్ళు బిగుస్తున్నాయి

చేతులు కలుస్తున్నాయి

గొంతులు కలిసి లేస్తున్నాయి. ( వామన పాదం )

ఇల్లూ వాకిలీ ముంగిలీ లోగిలీ వూరూ వూరి పొలిమేరా నగరం దాని ఔటర్ రింగురోడ్డూ దేశం దేశ సరిహద్దూ సర్వం అన్యాక్రాంతమయ్యే ప్రక్రియకు వొక ప్రణాళిక వుందనీ స్థానిక వ్యాపార ఆధిపత్య రాజకీయాలకీ సామ్రాజ్యవాద ప్రపంచీకరణ శక్తులకీ విడదీయరాని సంబంధం వుందనీ బండ్లకి స్పష్టంగా తెలుసు. ఆ యెరుకలో నుంచే

ఎవడో

మట్టిని పణంగా పెట్టి

రాజ్యాల్ని కొంటున్నాడు

విశాల సామ్రాజ్యాల మీద కాలుమోపుతున్నాడు

ఆకలిని అవమానిస్తున్నాడు ( దు:ఖ ధూళి )

వంటి కవిత వెలువడింది. మాధవరావులో వున్న యీ రాజకీయ పార్శ్వాన్ని చూడగల్గినప్పుడే అనుపమలోని కవిత్వం యెంత స్థానీయమో అంత సార్వత్రికమనీ యెంత వ్యక్తిగతమో అంత సార్వజనీనమనీ అర్థం చేసుకోగలం. అస్తిత్వవాద సాహిత్యం వైయక్తిక తీరాల అంచుల్లోకి పయనించి అక్కడే విలవిల్లాడుతోన్న సందర్భంలో వ్యక్తి భూమిక మీద నిలబడి సమాజాన్ని ఆవాహన చేసుకోగలిగిన అవగాహన లేకుంటే అనుపమ కేవలం జ్ఞాపకాల చెట్టుగా మిగిలిపోతుంది. చెట్టు ఆకుల్నీ కొమ్మల్నీ మాత్రమే కాకుండా భూమి పొరల్లోకి చొచ్చుకుపోయిన వేళ్ళని కూడా చూడగల్గినపుడే సారాన్ని గ్రహించగలం.

‘చేలను పంటలతోనూ

నేలను మనుషులతోనూ

నింపాలనుకొన్న నాకు

ఇప్పుడు వస్తువులెదురౌతున్నాయి

నా దేహాన్ని ఖాళీ చేసుకొని నన్ను

తిరిగి తిరిగి

వస్తువులతో నింపుకొంటున్నాను’ (శూన్య దేహం)

అన్నప్పటి పరాయీకరణ  ఖాళీతనపు సిండ్రోంతో  సహానుభూతిని పొందగలం. వ్యక్తులు అంగడి సరుకులౌతోన్న విషాద సందర్భాన్ని చీదరించుకోగలం. ‘నింపడం ఎప్పుడూ మరొక ఖాళీకి చిహ్నమే’ అన్న తాత్వికధారలో తడవగలం. అప్పుడు మాత్రమే వొక నేను అనేక నేనుల సమాహారం అవుతుంది. వైయక్తిక సామాజిక స్తరాల  మధ్య యేక కాలంలో ముందుకీ వెనక్కీ షటిల్ చేసే పుష్ అండ్ పుల్ టెక్నిక్ ద్వారా మాధవరావు తన కవిత్వంలో విమర్శనాత్మక సామాజిక వాస్తవికతని సాధించగలిగాడు. ‘అనంతారం’ దానికి పాదయిన అంశాన్ని దేవీప్రియ నిర్దిష్టంగా యెత్తిచూపినప్పటికీ అనంతారం ప్రపంచ పటంలో చిన్న చుక్కే అయినప్పటికీ అది విస్తృతార్థంలో అభివృద్ధి పరుగులో ముక్కలైన మూడో ప్రపంచమౌతుంది.

ముక్కలై రోడ్లు రోడ్లుగా విస్తరిస్తున్న  ‘ముచ్చబోడు’ కొండ మీది ‘జీవన ఉనికి కంకర యంత్రాల శబ్దాల మధ్య రాతి దుమ్ములో కలిసిపోయింది’ అని ఆర్తితో అన్నప్పుడు కేవల పర్యావరణ విధ్వంసాన్ని మాత్రమే మాధవరావు దృశ్యమానం చేయడం లేదు. అభివృద్ధి పేర్న జరిగే  విధ్వంసంలోని అమానవీయ కోణాన్ని సైతం ఆవిష్కరిస్తున్నాడు. ఇది యిలా జరక్కూడదని యెలుగెత్తి అరుస్తున్నాడు. ప్రకృతిలో అనివార్యంగా భాగమైన మనిషినీ మనిషితనాన్నీ కాపాడుకుందాం అని భుజమ్మీద చెయ్యేసి నచ్చచెబుతున్నాడు. మనిషిని యాంకరింగ్ పాయింట్ గా స్వీకరించిన అతని ప్రాపంచిక దృక్పథం  మో , నాగిరెడ్డి , చిన్నమ్మల మీద రాసిన ఎలిజీల్లో ఆర్ద్రంగా యెదను తాకుతుంది. ఆకురాలిన అడవి , ఆత్మహత్యల ఋతువు , కొరివికారం , దు:ఖధూళి , అంతరించిపోతున్న జాతి , బులెట్ , లేపనం  వంటి కవితల్లో అది  దూరాల్ని అధిగమించడానికి విశాలమైన రెక్కలు విప్పి  ఆకాశంలో యెగిరే పక్షవుతుంది. ఆ పక్షి ఫీనిక్స్. చావుల్నీ శిశిరాల్నీ దు:ఖాల్నీ కన్నీళ్ళనీ సమస్త పరాజయాల్నీ జయించే శక్తినిస్తుంది.

మొత్తంగా అనుపమలో ఉద్వేగ భరితమైన స్వీయ జ్ఞాపకాల్ని నెపం చేసుకొని బండ్ల మాధవ రావు దేన్ని గురించి మాట్టాడుతున్నాడో తెలుస్తుంది కదా! మనిషి గురించి మాట్టాడుతున్నాడు. మనిషి లోపలా బయటా జరుగుతున్న విధ్వంసం గురించి మాట్టాడుతున్నాడు. అందుకు కారణమౌతోన్న రాజకీయ శక్తుల గురించి హెచ్చరిస్తోన్నాడు. బహిరంగంగా విచారణ చేసి ఆ శక్తులకి బుద్ధి చెప్పమంటున్నాడు. అందుకు అవసరమైన ఆయుధాలు సమకూర్చుకోమంటున్నాడు. దిగుళ్ళకి వీడ్కోలు పల్కమంటున్నాడు.

బతకడాన్ని గూర్చి ప్రశ్నించినప్పుడల్లా

నాలుగు అన్నం ముద్దల్ని వాడు

అద్దంలో మన ముందుంచుతాడు

ఆయుధాలు మత్తుగా పడివున్నంతకాలం

కుప్పపోసిన జీవితం

కదలదు

మెదలదు.(అకాలం)

అని మేల్కొల్పు గీతం పాడుతున్నాడు. ప్రశాంతంగా కనిపించే యీ కవిలో యింత అగ్గి రాజుకొంటుందా అని మనం ఆశ్చర్యపోతాం. కేవలం జ్ఞాపకాల్లా కనిపించే కవితల వెనక యింత దు:ఖం వుందా యింత క్రోధం వుందా అని ఆలోచనలో పడతాం. మనం కూడా క్రియాశీలులం కావడానికి సమాయత్తమౌతాం. కవీ కవిత్వం కోరుకొనేది అదే కదా!

‘అక్షరమే దిక్కులు పిక్కటిల్లేలా పేలే ఆయుధం

పదం సమూహాన్ని చైతన్యపరిచే పాశుపతం

కవిత్వం అనన్య సాహసోపేత విన్యాసం

ఎప్పటికైనా సమస్త ఆయుధాల్నీ జయించే అంతిమ ఆయుధం

అక్షరమే’

ఆ అక్షరం పేరు అనుపమ. చదివాకా మనమే అక్షరం కాక తప్పదు.

*

 

 

ప్రేమతో “సహ చరణం” — జగద్ధాత్రి కవిత్వం

 

బొల్లోజు బాబా

 

సమకాలీన సాహిత్యంలో ఉత్తరాంధ్రనుంచి బలంగా వినిపించే గొంతు జగద్ధాత్రి గారిది. కథలు, వ్యాసాలు, అనువాదాలు, కవిత్వం, సభానిర్వహణ – ప్రక్రియ ఏదైనా తనదైన శైలి, ముద్ర ఆమె రెండు దశాబ్దాల సాహిత్యసేవ ద్వారా ఏర్పరచుకొన్నారు.

జగద్ధాత్రి గారు ఇటీవల వెలువరించిన కవిత్వ సంకలనం పేరు “సహచరణం”. “కవిత్వంలో కవి తనను తాను బయిల్పరచుకొంటాడు” అంటారు.  ఈ సంకలనంలోని కవితలన్నింటిలో, ప్రేమ, ఆప్యాయతలు, ఆరాధన, ఆత్మవిశ్వాసం, ప్రకృతిసౌందర్యం పట్ల ఆశ్చర్యం, సామాజిక అంశాలపట్ల సహానుభూతి వంటి అనేక జీవనస్పందనలు కన్పిస్తాయి.  ఇవన్నీ మానవవిలువలు.  మానవుల ఉత్తమజీవనానికి సహాయపడే విలువలు. ఇవి ఈ కవయిత్రిని గొప్ప ప్రేమమయిగా నిరూపిస్తాయి. ఈ కవిత్వాన్ని గొప్ప కవిత్వంగా నిలబెట్టాయి.

 

ఇన్నేళ్ళకి ఒక స్వతంత్ర నిర్ణయం

తీసుకొన్న సాయింత్రం

నిర్భీతిగా, నిశ్చలంగా

సంధ్య కెంజాయలోకలిసి

నీరవ నిశీథిలోనికి

ఒక వెలుగు రేఖ కోసం పయనించిన

సాయింత్రం…..!!!

        —   పై వాక్యాలు “పయనం” అనే కవితలోనివి.  జీవితంలో నిస్సహాయ స్థితి ఆవరించాకా, ఆశలన్నీ ఆవిరవగా, మొండి ధైర్యంతో ఒక వెలుగు రేఖకోసం ఒక వ్యక్తి పయనం సాగించటం ఈ కవితకు వస్తువు.  నాకొచ్చిన కష్టమిదీ, నేను తీసుకొన్న నిర్ణయమిదీ అని కవయిత్రి ఎక్కడా చెప్పదు.    అయినప్పటికీ చదువరి, కవయిత్రి దుఃఖంతోను, ధైర్యంతోనూ మమేకమవుతాడు.  మనస్థితిని అక్షరాలద్వారా అందచేసి అదేస్థాయిలో భావతీవ్రతను కలిగించటం అనేది ఉత్తమ కవితా లక్షణం.

 

ఒంటరితనం మనిషికి చాలా అవసరం

మనిషితనం మిగులుందో లేదో అప్పుడప్పుడూ

ఎవరికి వారు చేసుకునే అంతరీక్షణ

 — (వరం) ఈ కవితలో ఒంటరితనం మనల్ని మనకు దర్శింపచేసే సాధనంగా, అంతరంగపు అద్దంలో విశదంగా చూసుకొనే వరంగా అభివర్ణించటం ఒక నూతన అభివ్యక్తి.

 

తనవారి కళ్ళలో తానో జ్ఞాపకంగా మెదిలే

ఈ అశ్రువుల ముత్యాలు ప్రేమకు మానవత్వానికి

సార్వకాలిక ప్రతీకలు

మానవునికి సృష్టి ఒసగిన అపురూప అమూల్య

కానుకలు …. కన్నీళ్ళు..

(ఇవీ).  అపూర్వమైన ఆలోచనతో కూడిన వాక్యాలు ఇవి. కన్నీళ్లని చెలులుగా, స్మృతుల చినుకులుగా, ముత్యాలుగా, సృష్టి ఒసగిన కానుకలుగా వర్ణించటం గొప్ప ఊహ.  ఎంతో రమ్యంగా సాగే కవిత ఇది.

 

రంగురంగుల కాగితాలతో

నన్ను ప్రియంగా అందంగా చేసావు

నాకో అస్తిత్వాన్నిచ్చావు

నీ ఆశలతోక తగిలించి గాలిలోనికి వదిలావు.   (పతంగ్) ……

Jagathi

కారణాలేమైనా తల్లిపై ప్రేమను వ్యక్తీకరిస్తూ వచ్చినంత సాహిత్యం తండ్రి పై రాలేదు. ఇప్పుడిప్పుడే ఈ లోటు భర్తీ అవుతున్నది.  పతంగ్ అనే కవితలో ఈ కవయిత్రి తన తండ్రి తనను ఒక గాలిపటాన్ని చేసి ఎగరేసారంటూ, ఆ గాలిపటం తుఫానుగాలులకు జీవితపుచెట్టుకు చిక్కుకోగా, ఆ తండ్రి ప్రేమను ఏ విధంగా స్పూర్తిగా తీసుకొని జీవితంలో ముందుకు నడుస్తున్నదీ– అంటూ సాగే ఈ కవిత కథనాత్మక శైలిలో ఒక కూతురు తన తండ్రిని ఏ విధంగా దర్శించిందో అక్షరీకరిస్తుంది.  ఈ కోవలో వచ్చిన కవితల్లో ఇది వినూత్నంగా నిలుస్తుంది.

 

అప్పుడే క్షణంలోనే

అంతరాంతరాల్లో

భావ బీజావాపన జరిగే

దివ్య క్షణం లోనే అదాటుగా

అతను నా దేహాన్ని ఆక్రమించుకొన్నాడు

వారించానా….

తగవును వరించానన్న మాటే

అందుకే నిశ్శబ్దంగా

నాలోకి నేను జారుకొన్నా—- (అంతర్యానం).

అంటూ మొదలయ్యే ఈ కవితా వస్తువు చాలా సాహసోపేతమైనది.  సంగమ సమయంలో, వాంఛలేకుండా శరీరాన్ని అప్పగించిన ఒక స్త్రీ ఆలోచనా తరంగాలు ఏవిధంగా సాగాయి అనేదే కవితా వస్తువు.  ఇలాంటి కవితకు ఎత్తుగడ, నడక, ముగింపు ఉత్తమంగా లేకపోతే  ఔచిత్యభంగం ఏర్పడి రసవిభ్రంశం కలుగుతుంది.   చదువరిని కవితలోకి సరసరా లాక్కొనే సరళమైన ఎత్తుగడ, బిగిసడలని నడకా, ఉదాత్తమైన ముగింపు ద్వారా కవయిత్రి తన ప్రతిభ అనన్యమని నిరూపించుకొన్నారు.

 

కలయిక అనే మరో కవిత

దేహాన్ని అర్పించడమంటే

మనసిచ్చినంత సులువుకాదు

మనసుముడి విప్పినంత తేలికగా

రవికె ముడి విప్పలేము ……

అంటూ చాలా బలమైన అభివ్యక్తితో సాగుతుంది.   అటువంటి వ్యక్తీకరణ స్త్రీవాద కవిత్వంలో ఇంతవరకూ కనిపించని ఒక కొత్త కోణాన్ని చూపిస్తూ, కొత్తవెలుగుని ప్రసరింపచేస్తుంది.

 

“వాసన” అనే కవితలో ఈ కవయిత్రి భావనా పటిమ శిఖరాల్ని చేరుకొని ఒక గొప్ప మొజాయిక్ చిత్రాన్ని మనకళ్లముందు నిలుపుతుంది.

కొన్ని దేహాలు మృగాల వాసన వేస్తాయి

కొన్ని ఆకలి వాసన వేస్తాయి

కొన్ని పురుషదేహాలు

వాంఛా సుగంధం వెదచల్లుతాయి

మరికొన్ని ఉన్మత్తతను పెంచుతాయి

 

ఆటవిడుపు అనే కవితలో-  గ్లోబల్ వార్మింగ్, పాలస్తీనాలో పాలుగారే పసిపిల్లల బుగ్గలపైనుంచి జారే కన్నీటి చుక్కలు, అంటార్కిటికాలో కరుగుతున్న మంచు, గోద్రా మంటలు, నందిగ్రామ్, ముదిగొండ పేలుళ్ళు వంటి సమకాలీన అంశాలను స్పృశిస్తూ,  ఇవి మానవాళి శాంతిని భగ్నం చేస్తున్నాయని, వీటినుంచి ఆటవిడుపు తీసుకొని కాసేపు ఆలోచించమని- ఆటవిడుపు అంటే విరామం కాదు,  ఆటగాళ్లుగా మనందరం విశ్వశాంతికై తర్ఫీదు పొందే సార్ధక సమయం అనీ కవయిత్రి అంటారు. సమకాలీన సమస్యలను భిన్న ఇజాలు ఎలా దర్శించినా, ఈ కవిత హ్యూమనిజం దృక్కోణాన్ని వ్యక్తీకరిస్తుంది.

 

ఈ కవితాసంపుటిలోని అనేక కవితలలో ప్రకృతి సౌందర్యం చక్కని అలంకారాలతో, శోభాయమానంగా కన్పిస్తుంది. అందమైన పదచిత్రాలను మనకళ్లముందు నిలుపుతుంది.

సాయింకాలపు గాలికి

అప్పుడే నీళ్ళోసుకున్న మల్లెతీగ

ఈడేరిన మొగ్గలతో నెమ్మదిగా

అటూ ఇటూ కాకుండా ఊగుతోన్నట్లు(సాలోచనగా)

 

మరో కవితలో

ఒక్కో చెట్టూ కొన్నివెల ఎర్ర జండాల సమూహంలా

ప్రపంచ కార్మికులంతా ఏకం కండి అన్నట్టు

వేనవేలుగా ఏకమై ఒక్కో చెట్టును రుధిర తేజస్సుతో నింపుతాయి

తురాయిలంటారట వాటిని (పూల సైనికులు)

51 కవితలు కలిగిన “సహచరణం” జగద్ధాత్రి గారి మొదటి కవిత్వసంపుటి.  ఈ కవితలలో కనిపించే పదునైన అభివ్యక్తి, లౌకిక చింతన, ప్రేమ, మైత్రి, ప్రకృతి పట్ల తాదాత్మ్యత వంటి వివిధ భావనలు మంచి పఠనానుభవాన్ని కలిగిస్తాయి. ప్రముఖ కవి శ్రీ శివారెడ్డి గారు ఈ పుస్తకానికి వ్రాసిన ఆత్మీయవాక్యాలలో అన్నట్లు “She is not a frozen Feminist”.           జీవితంలోని అన్ని పార్శ్వాలకు తలుపులు తెరిచి, లోలోపల జనించే అలజడిని, ఆవేదనల్ని అక్షరాలలోకి వొంపిన గొప్ప “ప్రేమమయి”.  అందుకనే ఈ కవితలలో లోకంపట్ల ప్రేమ, దయ అంతర్వాహినులుగా ప్రవహించాయి.

పుస్తకం లభించు చోటు

చినుకు పబ్లికేషన్స్, విజయవాడ

ఫోన్: 984832208

ఎవ్వలకయినా ఆశ సారూ…!

జయశ్రీ నాయుడు 
jayasriరెండు దోసిళ్ళలోకీ చెమ్మగిల్లిన  మట్టిని తీసుకున్నప్పుడు, అందులోని ఇదమిత్థంగా చెప్పలేని సువాసన ఎరుకవుతుంది. అదే నేలలోని ప్రాణ శక్తి. ఆ మట్టిని నిరంతరంగా ప్రేమించే ప్రేమికుడొకడు. అతని ప్రాణాలను ప్రణయకానుకగా అడిగినా ఇచ్చేసే సాహసి – రెండక్షరాల ప్రేమ లాగే అతడి పేరులోనూ రైతు అనే రెండు అక్షరాలే వున్నాయి.  మట్టికి మనసిచ్చిన రైతుకి పచ్చని మొలకలే కాదు మట్టిపొరల్లో దాగున్న నీటి చెలమల్లాంటి కడివెడు దుఃఖాలెన్నో. విత్తిన విత్తుకీ మొలకెత్తే వరకూ బాలారిష్టాలెన్నో. అలాగే పండిన పంట చేతికొచ్చే లోగా మరెన్నో కాలారిష్టాలు. ఒక మహా సముద్రాన్ని పిడికిట పడతాడు ఆ రైతు.
 దుఃఖం అంటే అదీ సామాన్యమైన కన్నీరు కాదు, గుండె లోతుల్లోంచి భోరుమన్న దుఃఖం — బోరు దుఃఖం . నందిని సిధారెడ్ది  రచించిన  — నదిపుట్టువడి కవితా సంకలనం లో మనం చెప్పుకునే రెండో కవిత ఇది. 
 ఆదీ అంతం వుండని సముద్రం లాగే రైతు కష్టాలకు అంతూ పొంతూ వుండదన్న విషయం మన వ్యవసాయ ఆధారిత ఆర్థిక పరిస్థితిని గమనించే ఎవరికైనా అర్థం అయ్యే విషయమే. ఆకాశం కేసి కళ్ళు చికిలించిన వేళ నీటి చుక్క కోసం చాతక పక్షి అవుతాడు. ఆరుగాలం మొదలయ్యే వేళ తెలిసీ మృత్యువుకి ఎదురెళ్ళే వీర సైనికుడిలా తన సర్వ శక్తులూ ఒడ్డి పచ్చదనాన్ని కాపాడుకునే సైనికుడౌతాడు. కష్టాలన్నీ తెలిసీ నేలని నమ్ముకునే రైతుని మించిన సాహసవంతుడున్నాడా?
నేలని చీల్చుకుని వచ్చే పచ్చని మొలకలా మొదలయ్యే కవితా వాక్యం. మనిషి ప్రయత్నాలకూ మానవ స్వభావానికి తల్లివేరు లాంటి మూలకం – ‘ ఆశ’  తో మొదలయ్యె కవితా వాక్యాలు.
ఆశ సారూ
కష్టమో నిష్ఠురమో
బతకాలె గద
మంట్లె దిగినందుకు
పొర్లాడాలె గద
ప్రేమకు వుండే స్వచ్చత నేలతోటీ నీటితోటీ రైతుకు వుండే మమమతని పలికిస్తుందీ కవిత కొనసాగింపు. మనిషి ప్రకృతికి దగ్గరగా మసిలిన రోజుల్లో రైతు నాగలి పట్టి మట్టి పెళ్ళల్ని పెకలించినప్పుడు నేలని ప్రేమతో పలకరించినట్టుండేది. అతడి మనసులో పొంగే ప్రేమకి గంగమ్మ పరుగులెత్తి వచ్చేదంటా ఆ రోజుల్లో.
అప్పు మీద అప్పు
ఆత్మ మీద అప్పు
మారిన కాలం లో మారని కష్టాలు రైతుని నిలవనివ్వవూ, కూర్చోనివ్వవూ. నిరంతరంగా గంగ ప్రవహించాలనే ఆశలో అప్పు మీద అప్పుచేస్తూ, ఆత్మనీ అమ్ముకున్నంత భారాన్ని మోసే రోజులయ్యాయి. భూమిని నమ్ముకున్నా నీటి జాడ తెలియడం లేదు. ఆకలి విశ్వరూపం ముందు రైతూ అతడి కుటుంబమూ దిక్కుతోచని పరిస్థితిలో పడటం అతడి కష్టాలకి పరాకాష్ట.
 
 మన్నుకు నెనరుండె
మనసుకు నెనరుండె
గట్టిగ లగాయించి పిలిస్తె గంగ పలికేది
వెనువెంటనే వర్తమానపు వికృతుల్ని చెప్తూ
ఎవనికెవడు పలకడు
ఒగనికంటె ఒగడెక్కువ -అంటాడు
పాతకీ కొత్తకీ వెనువెంట బొమ్మా బొరుసుల్లాంటి నిజాల్ని పరచడంలో కవి మూలాలు గ్రామీణం అని సహజ స్వభావంగా అమిరిన పదాలే చెబుతాయి.
ఎదుటి వాడి కష్టాలని చులకనగా మాట్లాడే రాజకీయ నాయకులనీ, ఉన్నత తరగతి మేధావి వర్గాన్నీ నైపుణ్యంగా నాలుగు వాక్యాల్లో చెప్పిన తీరు, కవి లోని నిశిత దృష్టికి ఉదాహరణలు గా అనుకోవచ్చు. ఓడిపోతారని తెలిసినా ఓట్లను అడగడం, వస్తాయో రావో తెలియని ఉద్యోగాల కోసం పిల్లల్ని చదివించుకోవడం ఎంత సహజమో – ఆశతో బోర్లు వేసి, నిరాశతో భోరుమనడమూ అంతే మానవ సహజమంటాడు కవి. ఇది రైతుని కవి ఆత్మతో కౌగిలించుకున్న సందర్భమనుకోవచ్చు.
 
పడదని తెలిసి బోర్లెందుకేసుడంటరు
ఓడిపోతరని 
మీరు ఓట్లకు పోకుంటున్నరా
వొస్తయో రావో తెల్వని నౌకర్లకు 
పోరగాండ్లను నల్వకుంటుంటున్నరా
ఎవ్వలకయినా 
ఆశ సారూ – అంటాడు రైతు
కేవలం నీటి కోసం ఆశపడుతూ  ఊట ఊరని బోరుబావుల పరిస్థితికి ఏమీ చెయ్యలేని అసహాయత రైతుది. అతడినే దురాశాపరుడిగా దూషించే ప్రపంచాన్ని చూసి, విరిగిన మనసుతో బ్రతుకు చావుకన్న హీనమయ్యిందనుకుంటాడు. వాళ్ళ మాటలు బల్లాలుగా గుచ్చుతుంటే, రైతుల ఆకలి చావుల్నీ తేలికగా మాట్లాడే వర్గాలని చూసి వెల వెల పోయే దీనత్వం రైతుది.  బంగారం కోసమూ, బంగ్లాల కోసమూ ఆశపడాలన్న లౌక్యం తెలియని అమాయకత్వం  అతడికి.  కేవలం నీటి మీద నెనరు పలకని గంగమ్మని పలికించాలన్న తాపత్రయం, వున్న డబ్బంతా పోసినా పంట చేతికిరాని పరిస్థితి. ఎప్పటి నుంచో కొనసాగుతున్న మన రైతు అసహాయతకి ప్రతీక యీ కవిత.
 
కవితా సంకలం పేరు: నదిపుట్టువడి
కవి: నందిని సిధారెడ్డి
శీర్షిక: బోరు దుఃఖం 
ఆశ సారూ
కష్టమో నిష్ఠురమో
బతకాలె గద
భూమ్మీద పుడ్తిమ్మరి
మంట్లె దిగినందుకు
పొర్లాడాలె గద
బోరు పడ్తదని
పోరగాండ్లు బతుకుతరని
ఆశ సారూ
అందరి మాదిరి సంసారం ఇంత తెలివిజెయ్యాల్నని
ఆశ సారూ
కాలం పాడుగాను
కంట్లె నిప్పులు వోసుకున్నది
మస్తు కాలాలు జూసిన
ఇసొంటి కాలం జూలె
మన్నుకు నెనరుండె
మనసుకు నెనరుండె
గట్టిగ లగాయించి పిలిస్తె గంగ పలికేది
కాలమే గిట్లొచ్చింది
ఎవనికెవడు పలకడు
 ఒగనికంటె ఒగడెక్కువ
ఒక్క బోరు పడకపోతదా?
 బొంబాయి సంపాదన బోరుపొక్కల వాయె
అప్పు మీద అప్పు
ఆత్మ మీద అప్పు
భూమిల తండ్లాడితే
భూమి లోతు దొరుకకపాయె
రెక్కలుండి ఏం పలం
రేషముంటె ఏం అక్కెర
పోరగాండ్లు ఉపాసం పండే కాలమచ్చె
కన్నీళ్ళు తుడుసుకోవచ్చు
కడుపుసారూ
ఏదూకున్నా అదూకోదు
కట్టుకున్నది
బడుముకు కట్టుకున్న చీర
బిగదీసి కడుపుకు కట్తుకుంటంది
ఏంజేతు
యాడికి కాళ్ళు జాపుదు
పడదని తెలిసి బోర్లెందుకేసుడంటరు
ఓడిపోతరని
మీరు ఓట్లకు పోకుంటున్నరా
వొస్తయో రావో తెల్వని నౌకర్లకు
పోరగాండ్లను నల్వకుంటుంటున్నరా
ఎవ్వలకయినా
ఆశ సారూ
బంగారం గాదు
బంగుల గాదు
బువ్వ సారూ
బుక్కెడు బువ్వ
 మేం తిండిలేక జస్తంటె
తిన్నదర్గక జస్తున్నమంటరు
మీ నాల్కెకు మొక్కాలె
తిట్లకు జస్తున్నం
బతుకు సారూ ఎప్పటికి.

అలవోకగా అక్షర ప్రాణవాయువు!

జయశ్రీ నాయుడు
jayasriఅక్షరాల్లోంచి గుప్పుమనే మట్టి పరిమళం ఎప్పుడైనా నేత్రాలనుంచి నాసికకు చేరిందా
పరిమళం నుంచి ఉద్వేగంలా గుండెకి పాకి, మట్టిని పిడికిట పట్టిన ప్రాణాల పంతపు పంచప్రాణాల్ని చూపించిందా… 
ఈ అక్షరాల అనుభూతికి ఎన్ని మాటల తూకపు రాళ్ళు నింపినా ఇంకా అనుభూతించ వలసింది ఏదోమిగిలే వుందని, మళ్ళీ మళ్ళీ చదువుకున్నాను. నాకు ఎదురైన ప్రతి గాలిపలకరింతలోనూ, పాదాన్ని ఈ తట్టే మట్టి స్పర్శామాత్రపు సంభాషణలోనూ చరిత్రని చదవడానికి ప్రయత్నించాను. ఏ క్షణాన ఈ కవిత నా కళ్ళ గుమ్మం ముందు నిలిచిందో గానీ, నాకు నేనే ఒక నిరంతర అక్షరార్థ యాత్రని అనుభవించాను.
అలవోకగా నన్ను తన ప్రతి రేణువులోనూ కలిపేసుకుంటూ, జాగమీది పానాన్ని బర్వు బర్వుగా చాటి చెప్పే అక్షరమవ్వడం ఒక కొత్త అనుభూతి. ఇప్పటికి నాకు నేనుగా ఎన్ని సార్లు చదువుకున్నా ఏదో తెలియని రిథం వుంది  ఈకవితలో. ప్రతి పదం లోనూ, భావం లోనూ నందిని సిధారెడ్డి కవిగా అలవోకగా అక్షర ప్రాణవాయువుని పరిచిన కవిత  –  పుట్టువడి
ఒక జాతి తీరుతెన్నుల్ని ఒక కవికన్నా మిన్నగా ఎవరూ చెప్పలేరు. తత్సమ తద్భవాల్లేని పదాల్లో మొదటి పంక్తి నుంచే కవిత చెంగు చెంగునా సాగుతుంది.
జాగతీరే అట్ల 
 
ఈ జాగల రేషమున్నది
కుటిలం లేదు 
కువారం లేదు
ఇక కుటిలమూ, కువారమూ లేని చోట సహజత్వానికి కొరతేముంటుందీ?
జివునం పోయినా సరే
జిద్దుకు నిలవడ్తం…
నిలువెల్లా ఉరకలేసే ఉద్యమ స్ఫూర్తికి అద్దాలీ అక్షరాలు. దాదాపు 2007 లో ముద్రణలో విడుదలైన అక్షర పగడాలివి.
ఉద్రాక్ష పూలు పూసినంత  సహజంగా
మాటలు పూస్తుంటయి 
అవును ఉద్రాక్షపూలు అనడం లో ఎంతటి పల్లెతనపు అందముందో అక్షర పగడాలనుకోవడంలోనూ అంతే సహజత్వముందీ. కళ్ళు అక్షరాల వెంట పరుగెత్తినంత సహజంగా భావం మనలో ప్రవహించడం మొదలవుతుంది. మరో అనువాదం అక్ఖరలేని కవితా పాయలివి. పాదాలు తడుపుకున్నంత సహజంగా తడి మనసుని ఆక్రమించడం మొదలవుతుంది.  ఆత్మకు మరో అర్థం చెపుతాడు కవి ఇలా…
nadi
బట్టలు ఇడిసినట్లు 
శరీరాన్ని ఇడిసిపెత్తేది ఆత్మ కాదు
ఎల్లెడల మనిషిని ఎడబాయనిదే ఆత్మ
మరింత చొచ్చుకెళ్ళే పల్లెతనం చూడండీ
దాలిలో పాలు కాగబెట్టినవాండ్లం
అనుభవాలు కాగబెట్టి పోస్తం
ముందువెనుకలు ఆలోచించని ఉడుకుదనపు రక్తం. ఎండల్నీ వానల్నీ కరువు కాటకాల్నీ భరించిన సహనం. ఆ మట్టినుంచి పుట్టుకొచ్చిన జాతి కి చావుని సైతం లెక్ఖచెయ్యని మొండితనమే ఆస్తి. 
చావుదలకు సుత లేసి ఉరుకుడే
గెలిసినా ఓడినా
దిగిన తర్వాత కొట్లాడుడే
దిగుట్లె దీపం ఆరిపోయినా 
నమ్ముకం ఆరిపోదు
 బండెంక బండి కట్టి పోరాటమైన సామాన్యుడు కనిపిస్తాడు. తెలంగాణా ఉద్యమ దినాల్లో వచ్చిన ప్రతి వార్తా ఉద్వేగం అప్పటి ఆకాంక్షా తీవ్రతలకు పునాదుల్నీ ఈ అక్షరాలు చూపిస్తున్నాయి.  తను పుట్టిన మట్టి మీద ఎంత మమకారమంటే, ప్రాణం విడవడానికైనా సిద్ధమే. ప్రాణం విడిచాక కూడా ఆ మట్టిని విడవని ఆత్మలివి. పూర్వీకుల ఆత్మలన్నీ మమేకమైన నేల లో పెరిగిన జాతి తేటదనాన్ని, రోషాన్ని, స్నేహాన్ని, వెనుతిరిగి ఆలోచించని సూటి దనాన్ని పచ్చికలా పరిచిన మాటల వరిచేలిది.
కవితా సంకలం పేరు: నది పుట్టువడి 
కవి పేరు: నందిని సిధారెడ్డి
కవిత శీర్షికపుట్టువడి
 nandini
జాగ తీరే అట్ల
ఈ జాగల రేషమున్నది
కుటిలం లేదు
కువారం లేదు
కుండబద్దలుకొట్టినట్టు
కడిగేసుడే ఎరుక
బాధయినా బరువయినా
ఎత్తుకున్నంక మోసుడే
జివునం పోయినా సరే
జిద్దుకు నిలవడ్తం
ఇటుపొద్దు అటు పొడిసినా
ఇజ్జత్ ఇడిసేది లేదు
బట్టలు ఇడిసినట్టు
శరీరాన్ని ఇడిసిపెట్టేది ఆత్మ కాదు
 ఎల్లెడల మనిషిని ఎడబాయనిదే ఆత్మ
ఉద్రాక్షపూలు పూసినంత సహజంగ
మాటలు పూస్తుంటయి
వరిచేండ్ల మీది గాడ్పువలె
స్వచ్చంగా
వాసన వాసనగా వచ్చిపోతుంటం
దాలిలో పాలు కాగబెట్టినవాండ్లం
అనుభవాలు కాగబెట్టి పోస్తం
పండ్లమ్మెతందుకయినా తండ్లాడుతం
చేదబాయి గిరక లెక్క
ఇరాం లేకుంట గిరగిర తిరుగుతనే ఉంటం
 గవ్వ ఆందాని లేకపోయినా
గాలికతలు ఎరుగం
ఎవలు కారని తెలిసినా
మేం కాకుంట ఉండలేం
ఎత ఎవలదయినా
ఏడ్వకుంట ఉండలేం
కోపం ఆపుకోలేక
నాలికయినా కొరుక్కుంటం
చావుదలకు సుత లేసి ఉరుకుడే
గెలిసినా ఓడినా
దిగిన తర్వాత కొట్లాడుడే
దిగుట్లె దీపం ఆరిపోయినా
నమ్ముకం ఆరిపోదు
జాగ మీద పానం
పానమిడిసినా జాగిడువం
ఈ జాగ తీరే అట్ల
ఈడ పుట్టి పెరిగిన మనిషి తీరే గట్ల
ఈ జాగల
బర్వు బర్వుగ తిరిగే
పూర్వీకుల ఆత్మలుంటయి
*

ఇప్పటికీ గుండెల్లో ఉయ్యాల …

జయశ్రీ నాయుడు 

 

jayasriవేసవి చివరికి వచ్చేశాం. ఋతుపవనాలొచ్చేశాయంటున్నారు. వర్షాకాలం మొదలయ్యే వేళల్లో ఆకాశంలో దట్టమైన మబ్బులు బరువుగా నిలిచి చూస్తుంటే, రాబోయే వానదేవుడికి వింజామరలా చల్లని గాలి హాయిగొలిపే వేళల్లో, ఏదో చెట్టుకొమ్మలకి పొడవాటి వుయ్యాల తాళ్ళు వేలాడుతూ, ఆ ఉయ్యాలలో కూర్చొని కాలిపట్టీలు అందం వెలుగుతుంటే, అలవోకగా ఆ మబ్బుల్ని తాకాలన్న ఠీవిగా ఉయ్యాలలూగే సోయగాల్ని ఊహకు తెచ్చే కవిత,  ఈ వారం కవిత ఇది –  కె శివారెడ్డి గారి ” ఊహల్లోంచి ఊహల్లోకి”

కవికి ఊహ ఒక ఉయ్యాల…

ఆదిశ చివరనుంచి ఈ దిశ చివరిదాకా ఉయ్యాల
వెల్లకిల పడ్డ అరసున్నాలా…
విచిత్రం! ఎత్తైన చెట్ల వేళ్ళు భూమిలో బలంగా
ఉయ్యాల వేళ్ళు చెట్టు కొమ్మను చుట్టుకొని గట్టిగా,
కొత్త పరికిణీ ట్రంకుపెట్టె వాసనలూ
కావిడి పెట్టె బంగారు నగల మాగిన రంగూ –
కొత్తగా వేసుకున్న పైట పాము; జర్రున జారటాలూ

గ్రామీణ దృశ్యాన్ని మనముందుంచే ట్రంకు పెట్టె వాసనలూ, కావిడి పెట్టె బంగారు నగల మాగిన రంగూ – మనకిప్పుడు స్ఫురణకు రావడం కష్టమే. కానీ ఆ వర్ణనతో ఒక దృశ్యం మనోఫలకం మీద ఊపిరి పోసుకుంటుంది. విశాలంగా విస్తరించిన చెట్టు కొమ్మల్లో  కొత్తపరికిణీలో  ఊయలలూగే  నవయవ్వన సౌందర్య సామ్రాజ్ఞి కనిపిస్తుంది మనకిక్కడ.

నా కళ్ళు ఉయ్యాలతో పాటు అటూ ఇటూ
ఇటూ అటూ ఊగీ ఊగీ తూగీ తూగీ తూలిపోతున్నాయి
తూనీగల్లా వాలుతున్నాయి కనిపించే జీవన మైదానమంతా
ఉయ్యాల కొయ్యకి కట్టిన తాడు పట్టుకుని
వరుసైన వాడెవడో ఊపుతుంటాడు …

అచ్చమైన గ్రామీణ సంప్రదాయ ప్రతిబింబాలీ పదాలు. బావా మరదళ్ళ మధ్యన కొంత చనువును పెంచే అనేక సందర్భాల్లో ఆషాఢ మాసంలో ప్రత్యేకత ఇది. వానలే మనకు జీవనామృతాలు.   గ్రామాల్లో తొలకరి వానల మెసెంజర్ తూనీగ. కవి చిన్ననాటి నుంచీ వెంట తెచ్చుకున్న  గ్రామీణ సౌందర్యం, అతని సౌందర్య పిపాస తరువాతి పంక్తుల్లో ఫ్రేము కట్టినట్టు కనిపిస్తుంది.

” బహుశా – ఉయ్యాలతో పాటు ఇప్పటికీ ఊగుతుంటాడు
అప్పుడప్పుడు అరచేతులకేసి చూసుకొని
మురిపెంగా ముసి ముసిగా నవ్వుకుంటుంటాడు ఇప్పటికీ” 

ఇది ఒక తరం తో ఆగిపోయే రమణీయ భావన కాదు. తరతరాలకీ కొనసాగింపు. వర్ష ఋతువు ఆరంభం జీవన పాత్రనూ సౌందర్యంతో నింపుతుంది. ఆకాశపు ఆ కొస నుంచీ ఈ కొసవరకూ తిరగేసిన సున్నా వంటి ఉద్వేగపు తరంగం ఉయ్యాలతో పాటే ప్రయాణిస్తూ వుంటుంది.  ఆ నవయవ్వన శృంగారదృశ్యావతరణాన్ని చూసి దిక్పాలకులకే కన్ను కుడుతుందంటాడు.  ఉయ్యాల ఒక విధంగా కవి హృదయతరంగం కూడా. ఆ పల్లె నుంచీ ఈ పల్లెకీ, ఈ అడవి నుంచీ ఆ అడవికీ ప్రయాణించే అతని లోని సౌందర్యాన్వేషణ. ఎక్కడో ఏ మూలలోనో వెలిగే సౌందర్యాన్ని నింపుకోవాలనే తపన.

అద్దంలో నెలవంక

” ఇప్పటికీ గుండెల్లో ఉయ్యాల కదులుతూనే ఉంది
యాభయ్యేళ్ళప్పుడు కూడ
వెర్రిగా చిన్న పిల్లాణ్ణి చేసి తిప్పుతూనే ఉంది”  అంటాడు.

ఊహ మనలోని సృజనాత్మకతకి ప్రాణాధారం. ఎంతటి సౌందర్య సృజనైనా, యాంత్రిక క్రియాశీలతైనా మర్రి విత్తంటి సూక్ష్మ ఆలోచనా తరంగం – అదే – ఊహతోనే మొదలయ్యేది. ఆ ఊహ ఆలోచనా హర్మ్యాలు నిర్మించుకుని, కార్య రూపంలోకి దాల్చిన తర్వాత సాధించే విజయాలు మనిషిని అందరి గౌరవానికి పాత్రుడయ్యేంత ఎత్తులో నిలబెడతాయి.
” భూమ్యాకాశాల మధ్యనున్న సమస్తాన్ని చూస్తూ
అనుశీలిస్తూ అనుభవిస్తూ ఆకారాన్నిస్తూ
ఊపిరి ఆగవచ్చునేమో కానీ
ఉయ్యాల ఆగకూడదు”  అని కోరుకుంటాడు.

జీవితం ఒక ఎడతెగని ప్రయాణం. వాస్తవాలు నేల మీద నడిపిస్తుంటే ఊహలు ఆకాశాన్నే నేస్తమంటాయి. ఊహలో వున్న ఉద్విగ్నత వాస్తవం లో వుండకపోవచ్చు. అందుకే ఊహకు పట్టం కట్టి, నిరంతర యాత్రికుడివి కమ్మంటున్నాడు. కవి తన వారసత్వం గా తన పద్యాన్ని వదిలి వెళితే, తర్వాత తరాలు ఆ పద్యాల వేళ్ళ చివర్లు పట్టుకుని నిరంతరం ఊగవచ్చంటాడు. ఎంతటి ఆశావహ దృక్పథమో! ఎంతటి సౌందర్యావిష్కరణకైనా మొదలు ఒక చిన్న ఊహలోనే ఉంది. అది కవితైనా, కథ అయినా, మోనాలిసా మందహాసమైనా మైనా మరింకేదైనా. నిరంతరం అన్వేషణే జీవితానికి మనం బహూకరించగలిగే జవసత్వాలు.

కవితా సంకలనం పేరు:  నా కలలనది అంచున
  కవి: కె శివారెడ్డి
  కవిత శీర్షిక  : ఊహల్లోంచి ఊహల్లోకి 

ఊహల్లోంచి ఊహల్లోకి ఉయ్యాల
గాల్లోంచి గాల్లోకి ఉయ్యాల

ఆ దిశ చివర నుంచి ఈ దిశ చివరిదాకా ఉయ్యాల
వెల్లకిలా పడ్డ అరసున్నాలా
ఈ పక్కనుంచి ఆ పక్కకి దూసుకెళ్ళేటప్పుడు
ఒక్క సారి పొడుగాటి జడ భూమిని తాకుతూ వెళిపోతుంది
పరికిణీ కుచ్చిళ్ళు నేలను ముద్దిడుకుంటూ వెడతాయి
ఎక్కడో భూమి గర్భం లో సముద్రం గుండెల్లో
ఒక వణుకు మొదలవుతుంది
లోకమంతా ఉయ్యాలలూగుతుంది

************
 గలగలా పొంగే నవ్వులోంచి కన్నీళ్ళు
విచిత్రం! ఎత్తైన చెట్ల వేళ్ళు భూమిలో బలంగా
ఉయ్యాల వేళ్ళు చెట్టు కొమ్మను చుట్టుకొని గట్టిగా,
కొత్త పరికిణీ ట్రంకుపెట్టె వాసనలూ
కావిడి పెట్టె బంగారు నగల మాగిన రంగూ –
కొత్తగా వేసుకున్న పైట పాము; జర్రున జారటాలూ
 ఏం చేయాలో తోచని కంగారూ పిచ్చి చూపులూ
దయకూడుకుంటున్న కళ్ళ పర్యావరణాలూ
ఎటు చూసినా పూలే పూలు; పూల జాతర్ల జ్ఞాపకాల రవళి
అక్కడ ఉయ్యాల మీద ఆకాశంలో తెలుతూ మా అక్క ఉంది
నా బుల్లి ప్రియురాలు ఉంది

*****
నా కళ్ళు ఉయ్యాలతో పాటు అటూ ఇటూ
ఇటూ అటూ ఊగీ ఊగీ తూగీ తూగీ తూలిపోతున్నాయి
తూనీగల్లా వాలుతున్నాయి కనిపించే జీవన మైదానమంతా
ఉయ్యాల కొయ్యకి కట్టిన తాడు పట్టుకుని
వరుసైన వాడెవడో ఊపుతుంటాడు

బహుశా – ఉయ్యాలతో పాటు ఇప్పటికీ ఊగుతుంటాడు
అప్పుడప్పుడు అరచేతులకేసి చూసుకొని
మురిపెంగా ముసి ముసిగా నవ్వుకుంటుంటాడు ఇప్పటికీ
దిక్పాలకులంతా వచ్చి చుట్టూ నుంచుంటారు
పైనున్న దేవతలంతా
వెర్రి ముఖాలేసుకుని నోట్లో వేళ్ళు పెట్టుకుని చూస్తుంటారు
” ఏమందం ఏమందం ఏమానందం ఏమానందం’ అని;

************

ఇప్పటికీ ఊహల ఉయ్యాలనెక్కి ఊగుతుంటాను
ఈ ఊరునుంచి ఆ ఊరికి ఆ యేటినుంచి ఈ యేటికీ
ఈ అడవి నుంచి ఆ అడవికీ ఈ పల్లెనుంచి ఆ పల్లెకీ
ఆ పల్లె నుంచి ఈ పల్లెకీ
ఇపాటికీ గుండెల్లో ఉయ్యాల కదులుతూనే ఉంది
యాభై యేళ్ళప్పుడు కూడా
వెర్రిగా చిన్నపిల్లాణ్ణి చేసి తిప్పుతూనే ఉంది
ఉన్నన్నాళ్ళు ఊగుతూనే ఉంటాను

నే వెళ్ళిపోయాక
నా పద్యాల వేళ్ళ చివర్లు పట్టుకొని
నిరంతరం ఊగుతుంటారు మీరు హాయిగా
కిందనుంచి పైకీ పైనుంచి కిందకీ;
షేక్స్పియర్ అన్నట్టు
భూమ్యాకాశాల మధ్యనున్న సంస్తాన్ని చూస్తూ
అనుశీలిస్తూ అనుభవిస్తూ ఆకారాన్నిస్తూ

ఊపిరి ఆగవచ్చునేమో కానీ
ఉయ్యాల ఆగకూడదు గుండెల్లోని ఉయ్యాల ఆగకూడదు

*

మట్టి తడిని తట్టిలేపే కవిత..

జయశ్రీ నాయుడు 

 

jayasriశివారెడ్డి గారి కవిత “ఏదో ఒక మొక్క”చదివాక మనసులో మట్టి తడి మేల్కొంది. తడి మట్టి సుగంధం తలపుకి వచ్చింది. అరచేతుల్లోకి తడి మట్టిని తీసుకుని, కళ్ళుమూసి, తన్మయత్వంగా ఆ స్పర్శని అనుభవించి ఎన్ని ఋతువులయ్యింది…? మొక్క వేర్లకీ, నీటి తడికీ మద్య మట్టి రేణువుల మౌన సంభాషణ మరిచిపోయానా…?

ఒక్క క్షణమైనా పచ్చదనం వైపు తల తిప్పనివ్వనంతగా కృత్రిమ జీవిత నాగరికతకు నగర జీవనం మనల్ని బానిసని చేసిందా… అవునేమో … లేకపోతే ఈ ప్లాస్టిక్ పువ్వులూ, ఆర్టిఫిషియల్ మొక్కలూ అమ్మే దుకాణాల రాజపోషకులెవరు??? మనమేగా అని ఒక నిష్టూరపు నిట్టూర్పు గుండెని ఎగదన్నుకు వచ్చిన క్షణాలవి.

మనలో అందరూ ప్రకృతి హరితానికి మిత్రులే. కానీ నగర నాగరికత విస్తీర్ణానికి మొదట అడ్డు అనిపించేవి మొక్కలే, మహా వృక్షాలుగా విస్తరించిన హరిత ఛాయలే. అల్లిబిల్లిగా అల్లుకునే తంత్రీ విస్తీర్ణానికి నిర్దాక్షిణ్యంగా ఎన్ని వృక్షాలు అశువులు బాసాయో.. వేర్లు విస్తరిస్తాయని ఎన్ని మామిడి , వేప, పున్నాగ, రావి చెట్లు గొడ్డలి వేటుకు తలవంచాయో లెక్కలేదు. కవి కె. శివారెడ్డి గారి “పొసగనివన్నీ….” కవితా సంపుటిలోంచి ఈ వారం మనం చర్చించుకుంటున్న కవిత “ఏదో ఒక మొక్క” — నగర నాగరికతకీ, ప్రకృతి పచ్చదనానికి మధ్య సంఘర్షణనీ , మొక్కలకీ మనిషికీ మధ్య ఒక అంతస్సూత్రాన్ని స్పృశిస్తూ సాగుతుంది.

ఇంటి ముందో ఇంటి మీదో
ఎక్కడో ఒక చోట ఒక మొక్క-
పొద్దున్నే పచ్చని ;మొక్కని చూస్తే పాపాలు పోతాయి
ప్రాణాలు లేచి వస్తాయి.”

నగర జీవికి మొక్కని చూస్తే భయం. అది రాగి మొక్కో వేపమొక్కో తనకనవసరం. దాని వేర్లు తన కాంక్రీట్ గోడల్ని బద్దలు చేస్తుందనే భయంతో, మొక్క గానే వేర్లు పట్టుకుని పీకెయ్యడానికి కూడా వెనుదీయడు.
” మొక్కలేకపోతే, బయట మొక్క లేకపోతే
లోపల మొక్క లేకపోతే
మనిషి వేసే చిగురులేముంటాయి
పూసే పూలేముంటాయి…”
అని కవి సూటి గా ప్రశ్నిస్తాడు.

చెమట పట్టని గదుల్లో, అన్ని వైపులా మూసేసిన గదుల్లో జీవించే మనిషికి ప్రకృతి సంగీతం ఎలా వినిపిస్తుందీ?

“కళ్ళమ్మటి కురుస్తున్న వానలున్నాయా
వంటి మీద జారుతున్న చెమటలున్నాయా?”

ఈ ప్రశ్నలు రెండూ మానవ సహజాతాలైన స్పందనా చైతన్యాన్ని గుర్తు చేస్తున్నాయి. తోటి మనిషి కష్టానికో, కృతజ్ఞతా పూర్వకంగానో కన్నీరు పెట్టుకుంటాడు. శరీరం ప్రకృతి తో మమేకమై శ్రమించినపుడు అది వెద జల్లే సుగంధం చెమట. ఈ రెండూ లేని మనిషి అసలు మనిషేనా… మన హడావిడి దైనందిన చర్యలకు సూటిగా ఢీకొనే ప్రశ్నలివి.

మొక్కల కేసి తదేకంగా చూస్తున్నపుడు లోకాంతర లోకాల నుంచి సంగీతం వినపడుతుంది. చిన్నపిల్లల కేరింతలు వినబడతాయి. మొక్కల మధ్య కూర్చున్న కవికి బాల్యం , పూల మధ్య శయనించినపుడు యవ్వనం తప్ప మరోటి లేవు. ఇంతకన్న రీ ఛార్జ్ అయ్యేందుకు మరో మార్గముందా మనకు?

కవిత ముగింపు వాక్యాలివి…

“ఏ పక్కకి వత్తిగిలినా
నీకో మొక్క తగలాలి
తడి తడి గా నువ్వు బతకాలి”
మొక్కల్ని ప్రేమించనిదే మట్టి తడి తెలియదు, మనసు తడీ తెలియదు. అందుకే బైటా లోపలా మనం ఎటు వత్తిగిలినా ఒక మొక్క తగలాలి, కన్ను తడి మనసులో చెమ్మ అవ్వాలి. అవే మనిషి మూలాలు, మనసు లోని తడి ఆనవాళ్ళూ. అవే ప్రకృతి తో మనం మమేకం అవ్వగలిగే అపురూప క్షణాలవుతాయి.

**** ****** ****

పూర్తి కవిత ఇక్కడ…

కవి : కె. శివారెడ్డి
కవితా సంకలనం: పొసగనివన్నీ…
కవిత శీర్షిక: ఏదో ఒక మొక్క

 

ఏదో ఒక మొక్క
రాగి మొక్కో, మర్రిమొక్కో, వేపమొక్కో
గోడ పక్కనో, గోడ మీదనో
ఇంటి ముందో, ఇంటి మీదో
ఎక్కడో ఒకచోట ఒక మొక్క-
పొద్దున్నే పచ్చని మొక్కని చూస్తే పాపాలు పోతాయి
ప్రాణాలు లేచి వస్తాయి-
ఎక్కడ ఇంకిపోయిందో మొలకనవ్వు బయటికొస్తుంది,
ఏమిటీ గోడ పగుల్తుందా
ఇల్లు కూలుతుందా
గోడ పగలనీ, ఇల్లు కూలనీ
మనిషి చుట్టూ అల్లుకున్న రాతిబంధాలన్నీ
బద్దలు బద్దలు కానీ
******

మొక్క లేకపోతే, బయట మొక్క లేకపోతే
లోపల మొక్క లేకపోతే
మనిషి వేసేచిగురులేముంటాయి
పూసే పూలేముంటాయి
అంతా బోసిగా, శూన్యం రాజ్యమేలుతున్నట్టు-
మనుషులున్నారా? మనసులున్నాయా?
కళ్ళమ్మటి కుతుస్తున్న వానలున్నాయా
వంటి మీద జారుతున్న చెమటలున్నాయా-?

చెమట పట్టని గదుల్లో
అన్ని వైపులా మూసేసిన గదుల్లో
ఏం కనబడుతుంది
ఏం వినబడుతుంది,
గదిలో బంధించబడ్డ మనిషి
గదే తానయిన మనిషి

పొద్దున్నే పైనుంచి రాలుతున్న ఆకుని చూళ్ళేడు
గాలిలో తేలుతున్న పావురాయి ఈకను చూళ్ళేడు
కళ్ళ ముందు విరుస్తున్న నెమలి పింఛం
పొద్దుటిపూట నృత్యాన్ని చూడలేడు
తదేకంగా మొక్క కేసి చూడు
అది తొడుగుతున్న కొత్త చివురుకేసి చూడు
చిన్నపిల్లల కేరింతలు వినబడటం లేదూ

ఏదో ఒక మొక్క
బతకనీ, బతకనీ,
మొక్కల మధ్యన కూర్చున్న నాకు
బాల్యం తప్ప మరోటి లేదు
పూల మధ్య శయనించిన నాకు
యౌవనం తప్ప మరోటి లేదు

మొక్క వేళ్ళు గోడలోకే కాదు
నీలోకీ, నాలోకీ జొరబడతాయి
గోడల జాడల్ని, చీకటి నీడల్నీ
బద్దలు చేస్తాయి
ఏ పక్కకి వత్తిగిలినా
నీకో మొక్క తగలాలి
తడితడిగా నువు బతకాలి

**

భావం నుంచి బాహ్యంలోకి ప్రయాణం..

 జయశ్రీ నాయుడు 
jayasriఒక కవిత రూపు దిద్దుకునే క్షణాలు బహు చిత్రమైనవి. ఒక ఘటన లేదా అనుభూతి, ఒక ఆలోచన — అతి సూక్ష్మ తరంగం గా మనసులో స్థిరపడి, మర్రి విత్తు మహా వృక్షమైనట్టు బాహ్యాంతరంగాలను ఆక్రమిస్తుంది.దాని పరిధిని అధిగమించలేని నిస్సహాయత కొంత, అందులోని ఆనందమో, అవేదనో, ఆత్మార్పణో, భావ పరమావధిని తెలుసుకొమ్మన్న అంతర్గత వేధింపో, ఇక తెల్ల కాగితమ్మీద అక్షరాలుగా అనువదించుకోవలసిందే.  కోడూరి విజయ కుమార్ గారి ఒక రాత్రి మరొక రాత్రి కవితా సంపుటం లోని ** తిరిగి జన్మిస్తావు** కవితని ఆయన సిగ్నేచర్ కవితగా తీసుకోవచ్చు.
 
 ఒక కవిత రాసే ముందు ఆయన మనసు పడే తపన, చేసే తపస్సుని వర్ణించారిక్కడ. భావాన్ని పైపైన తేలికగా మోసుకొచ్చే పదాలకీ, అంతరంగాన్ని చీల్చి, తన్ను తాను నిక్కచ్చిగా ఆవిష్కరించుకునే కవితా వేశానికీ – గీతానికి, భగవద్గీతానికి వున్నంత వ్యత్యాసముంటుంది. విషాదం నుంచే మహోన్నత కళావిష్కరణలు జరిగేది. అక్షరాల్లోని ఆవేదనే కవి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే తరుణం, తనలో తానుగా కనుగొనే సత్యం. అదే కవితా తపస్సు.
 ఇక మనం చర్చించుకునే *తిరిగి జన్మిస్తావు*కవిత విషయానికొస్తే…
 “బాధ” అనే  మన: స్థితి ఎప్పుడూ వర్ణనకు అందనిదే. గాయాలు ఎవరు చేసినా తొలి గాయం కవికి తనకు దొరకని ప్రేమని చెప్పుకుంటాడు . తల్లిదండ్రులు,  భార్య , రక్త సంబంధీకులు,  ఎవరు చేసిన గాయమైన తన తొలినాళ్ళ ప్రేమ వైఫల్యపు గాయం తరువాతే.
  ” ఇంతకీ నిన్ను చిద్రం చేస్తూ
బాధ బయటపడే ఆ చిత్రమైన సందర్భం లో ఎలా వుంటావు…”
అని అతని అంతరాత్మే ప్రశ్నించినపుడు…
అతని ఎదురుగా వున్న తెల్ల కాగితం లోతైన బావిలా అనిపిస్తుంది
వేళ్ళ నడుమ వున్న పెన్ను కవిని ముక్కలుగా ఖండించి లోలోని బాధను పెకలించే ఖడ్గంలా వుంటుంది
ఇక యేళ్ళ తరబడి కూడబెట్టుకున్న పద సంపద (కవులకు అవే కదా సంపదలు), బాధని పద్యం చెయ్యగలనన్న అహంకారం నీరవుతుంది.
 ** ఇక అప్పుడేం చేస్తావు నువ్వు?
అన్న ప్రశ్న అంతరాత్మలో సవాల్ చేస్తుంది
“ఇపుడిపుడే భాషని నేర్చుకునే వాడిలా
ఒక్కొక్క వాక్యాన్నే నిర్మిస్తూ….”
తనని తాను అనువదించుకుంటాడు, తనను వేధిస్తున్న బాధనుండి విముక్తుడవుతాడు.
అక్కడితో వృత్తం పూర్తి కాదు. భావాలన్నవి విశ్వజనీనమైనవి కొన్ని వున్నాయి. కవిత్వంగా  అల్లుకునే ఉదాత్త భావాలు కవి లో పుట్టాక, కవిత గా అనువాదమయ్యాక, పఠిత కళ్ళలోనుండి మెదడుకో మనసుకో అనుసంధానం ఐనపుడు ఆ పదావిష్కరణకు పరిపూర్ణత. అదెలా జరుగుతుందో కూడా విజయ కుమార్ గారిలా చెప్తారు..
నీలాంటి ఒకడు
నీ పద్యాన్ని ప్రేమతో హత్తుకున్నపుడు
నీవు తిరిగి జన్మిస్తావు.
ఒక కవి – భావం నుంచి భాహ్యం లో ప్రయాణించి, మళ్ళీ మరో భావం గా లీనమవ్వడంతో ఆ కవిత ఒక సార్థకతని సాధించుకున్నట్టే.
 పూర్తి కవిత ఇక్కడ…
శీర్షిక: తిరిగి జన్మిస్తావు
కవి: కోడూరి విజయకుమార్
ఒక రాత్రి మరొక రాత్రి కవితా సంపుటి నుంచి
 
ఒక్కో సారి నీ స్థితి బహు చిత్రంగా మారిపోతుంది
లోపల సుడులు తిరుగుతోన్న బాధ ఒకటి
ఇంకా లోపలే వుండలేక బయటపడే ప్రయత్నంలో
నిన్ను చిద్రం చేస్తూ వుంటుంది
 
 
బాధ ఏదయితేనేం?
గాయం ఎప్పటిదైతేనేం?
 
***
 
బహుశా, కవిత్వం లోకమైన వాళ్ళ తొట్ట తొలి గాయం
దొరకని ప్రేమ చేసినదే కావొచ్చు
ఇక ఆ తదనంతర గాయాలంటావా…
అవి నీ తలిదండ్రులకు నీవు చేసిన  గాయాలు కావొచ్చు
 లేక, నీ తోడబుట్టిన వాళ్ళకో, నీవు కట్టుకున్న స్త్రీకో, నీ పిల్లలకో
నీవు చేసిన గాయాలు కావొచ్చు
కొన్నిసార్లు వాళ్ళు నీకు చేసిన గాయాలు కూడా…
ఇంతకీ నిన్ను చిద్రం చేస్తూ
బాధ బయటపడే ఆ చిత్రమైన సందర్భంలో ఎలా వుంటావు?
 
 
ఎదురుగా వున్న తెల్ల కాగితం
నువ్వు దూకితే మింగి వేసే లోతైన బావిలా వుంటుంది
వేళ్ళ నడుమ వున్న పెన్ను
నిన్ను ముక్కలుగా ఖండించి
లోన వున్న బాధని పెకిలించే ఖడ్గంలా వుంటుంది
 
 మరీ దయనీయ స్థితి ఏమిటంటే
నీవు యేళ్ళుగా నేర్చుకున్న అక్షరాలు
నీ భాష, నీ పద సంపద, నీ అలంకారాలు
బాధని పద్యం చేయగలనన్న నీ అహంకారాలూ
అన్నీ అన్నీ
నిన్నొక అనాథని చేసి వెళ్ళిపోతాయి
 
అయినా సరే
లోన మెలిపెడుతోన్న బాధ జాలి పడి
ఇక అప్పటికి నిన్ను వొదిలేసి వెళ్ళదు కదా
జోలెలో గుప్పెడు గింజలు వేసేదాకా వొదలక
గుమ్మం ముందు నిలబడి, వొంటిని కొరడా దెబ్బలతో
గాయ పర్చుకునే పెద్దమ్మల వాడి లాగా
నిన్ను కట్టడి చేస్తుంది కదా
 
ఇక అపుడేం చేస్తావు నువ్వు?
ఇపుడిపుడే భాషని నేర్చుకునే వాడిలా
ఒక్కొక్క అక్షరాన్నే కూడబలుక్కుంటూ
ఒక్కొక్క వాక్యాన్నే నిర్మిస్తూ
ఒక్కొక్క ముక్కగా నిన్ను నీవు ఖండించుకుంటూ
అలా ఆ లోతైన బావిలోకి మునిగిపోయి
ఇక ఈ రాత్రికి ఈ బాధ నుండి విముక్తమౌతావు
 
నీలాంటి ఒకడు
నీ పద్యాన్ని ప్రేమతో హత్తుకున్నపుడు
నీవు తిరిగి జన్మిస్తావు
~~

మనలోపలి మరో ప్రపంచం..కోడూరి కవిత!

జయశ్రీ నాయుడు

 

jayaజ్ఞాపకాలనీ, ప్రస్తుత నగర జీవితపు అలుపెరుగని ఆరాటాన్నీ సమాంతర చాయలుగా చిత్రించిన దృశ్య కవిత కోడూరి విజయకుమార్ – అపుడపుడు… (ఒక రాత్రి మరొక రాత్రి కవితా సంపుటి నుంచి). మనసులో మనం మోస్తూ వుండే మరో ప్రపంచపు ప్రతీక ఈ కవిత. ఆ మరో ప్రపంచమే లౌక్యపు లోకంలో కఠినత్వపు నాగరిక చాయల్లో జీవిస్తున్నా మనలో మానవత్వపు గుబాళింపులు జీవింపజేసే అంతర్గత అమృతత్వం. 

కవిత మొదటి పంక్తుల్లోనే రెండు విభేదాత్మక ప్రపంచాలు మనముందు నిలుస్తాయి – ఒకటి నగర జీవితం మరొకటి కవి నిరంతరంగా తన అంతరంగంలో ప్రేమగా తడుముకునే తన వూరి ఆనుపానులు. అయితే ఇక్కడ కవి వర్తమానం లో నుండి గతాన్ని వర్నించుకుంటూ మళ్ళీ తిరిగి వర్తమానం లోకి వస్తూ ఒక వృత్తాన్ని పూరిస్తాడు. ఆ దృశ్యాన్ని చిత్రించుకోవడానికి ఒక కుంచే సరిపడా రంగులూ మన మనసుకు అందించి నిష్క్రమిస్తాడు. భవిష్యత్తుని అసలేమాత్రమూ స్పృశించకుండా అసంపూర్తి కవితా చిత్రాన్ని అందించడం లోనే జీవితపు సత్యం ఆవిష్కృతమవుతుందేమో..

కవిత మొదలయ్యేది  ఇలా …

దేహాత్మలను ఉక్కిరిబిక్కిరి చేసే 

ఈ మహానగర ఉక్కుకౌగిలి నుండి బయటపడి

అపుడపుడూ అలా నీ వూళ్ళో వాలిపోవాలి

ఉక్కు కౌగిలి అన్న పదంలోనే నగర జీవితపు కఠినత్వం ఆవిష్కృతమవుతుంది. నువ్వు అంటూ చదువరిని సంబోధిస్తూ మొదలైన కవిత, కవి తనని మనల్నీ కలిపి మాట్లాడుకుంటున్న ఏకత్వానికి ప్రతీకగా తీసుకోవొచ్చు. ప్రతి చదువరీ తన అంతరాత్మలో తెలియకనే తనకు ఇష్టమైన ప్రదేశాల్లోకి తొంగి చూసుకోవడం మొదలుపెడతాడు.

బాల్యపు దినాలను దాచుకున్న తన ఊరి నేలా, దాహం తీర్చిన చేదబావీ , అప్పటి ఇరికిరుగు మూడుగదుల ఇల్లూ, ఇప్పటికీ కవికి జ్ఞాపకాలుగా అపురూపమే.   వెనువెంటనే, హెచ్చరికగా అవేవీ ఇప్పుడా వీధిలో లేకపోవచ్చునేమో అన్న ఆవేదనా రేఖని జతచేస్తాడు.

తన ఊరికి వెళ్ళినపుడు కళ్ళముందు కదలాడె జ్ఞాపకాలన్నీ అతని మనోఫలకానివి. వర్తమానంలో మాత్రం కుచించుకుపోయిన తన బడి ఆటస్థలం, తన లెక్కల మాస్టారి లెక్ఖ ఈ లోకంలో ముగిసిందన్న స్నేహితుడి కబురూ ఒకేసారి స్ఫురణకు వస్తాయి.

OkaRatriMarokaRatri600

మరో చోట, అదే కవితలో, బెంచీలపై పడుకుని సినిమాలు చూసిన తన వూరి డబ్బారేకుల టకీసు, ఇప్పుడా చోటుని ఆక్రమించిన మల్టీప్లెక్ష్ అడుగున నవ్వుకుంటోందన్న విషయం విషాదాన్ని వినోదంగా మేళవించిన తీరు ఇది. అప్పట్లో “సినిమాకెళ్ళడం ఒక పండగ కదా… “అంటాడు కవి. టీవీలూ, ఇంటర్నెట్లూ లేని కాలం లో బాల్యం గడిపిన తరానికి మాత్రమే తెలిసిన అనుభూతి అది. తన యవ్వన దినాల పరుగులనీ తిరుగుళ్ళనీ దాచిన నేలపై తిరిగి రావడానికే తన మనసు అక్కడికి పరుగులు తీస్తుందన్న రహస్యాన్ని ఆత్మీయంగా వెల్లడించుకుంటాడు.

అవే ఈ మహానగరంలో బ్రతకడనికి అవసరమైన మణిమాణిక్యాలు. కవికి తన ఊరిపైని వ్యామోహాన్ని ప్రశ్నించే నగజీవులెందరికి ఈ విషయం అర్థం అవుతుంది???

నగర జీవనం, నాగరికతా ఊళ్ళను కూడా అబగా కబళించేస్తున్నాయన్న నిజాన్ని ఆర్ద్రత మేళవింపుతో చదువరి కి పంచిన కవిత ఇది.

 

పూర్తి కవిత ఇక్కడ…

 

 అపుడపుడూ… 

కవి: కోడూరి విజయకుమార్

 “ఒక రాత్రి మరొక రాత్రి” కవితసంపుటి నుంచి

 

దేహాత్మలను ఉక్కిరిబిక్కిరి చేసే

ఈ మహానగర ఉక్కుకౌగిలి నుండి బయటపడి

అపుడపుడూ అలా నీ వూళ్ళో వాలిపోవాలి

***

నీ బాల్య దినాల నడకలనీ,

నీ నవయవ్వన దినాల పరుగులనీ

నీ బలాదూరు తిరుగుళ్ళనీ

అట్లా పదిలంగా దాచిపెట్టిన

నీ వూరి నేల పైన తిరిగి రావాలి

ఒకప్పుడు మూడు ఇరికిరుగు గదుల్లో

నీ కుటుంబమంతా తలదాచుకున్న ఆ ఇల్లు

ఎంతో మంది దాహం తీర్చిన ఆ పెద్ద చేదబావి

అవేవీ ఇప్పుడా వీధిలో లేకపోవొచ్చు

కానీ నీవు వెళ్ళినపుడు

ఆ రేగుపళ్ళ చెట్టు కింద పిల్లల కేరింతలు

నీవు దారాలు కట్టి ఎగరేసిన తూనీగలు

వెన్నెల్లో దాగుడుమూతల ఆటలు

లిప్తపాటు నీ ముందు అన్నీ కదలాడతాయి

గొప్ప ఆశ్చర్యంగా వుంటుంది నీకు

ఒకప్పుడు అతి పెద్దగా వుండిన నీ బడి ఆటస్థలం

ఇపుడింత చిన్నదిగా వుందేమిటి అని…

నీ తరగతి గది గోడ పలకరిస్తుంది

లెక్క తప్పు చేసావని ఇక్కడే కదా నిన్ను

లెక్కల సారు గోడకుర్చీ వేయించింది

క్రితం సంవత్సరం ఆయన పోయారని

మిత్రుడిచ్చిన సమాచారం గుర్తుకొస్తుంది నీకు

ఒకప్పటి డబ్బారేకుల టాకీసుని కూల్చివేసి

ఊరి మధ్యలో వెలిసిన మల్టీప్లెక్స్

కళ్ళనీ చెవులనీ మాయ చేసే రంగుల చిత్రాలు

బెంచీలపై పడుకుని సినిమాలు చూసిన

ఆరోజులు గుర్తుకొస్తాయి నీకు

అప్పుడు సినిమాకి వెళ్ళడమొక పండుగ కదా

మల్టీప్లెక్స్ అడుగున పడివున్న నీ

డబ్బరేకుల టాకీసు నవ్వుకుంటుంది

ఆ వీధి మలుపు దాటేక ఎనిమిదో యింట్లోనే కదా

ఒకనాటి నీ ఏంజిల్ వుండేది

తను కనిపించినా వినిపించినా

ఒక దూది పింజమై తేలిపోయేవాడివి

గుర్తుందా… ఏంజిల్ పెళ్ళైన రోజు రాత్రంతా

వూరి రోడ్లపైన నీవు పిచ్చివాడిలా తిరగడం

వీధి మలుపులో తను ఎదురుపడుతుందేమో అని

ఒక క్షణం భ్రమించి నవ్వుకుంటావు

*     *     *

పెద్దగా పరిచయం లేని ఎవరో అడుగుతారు –

చాలా తరుచుగా వూరికి వెళ్ళొస్తావేమని?

ఈ మహానగరంలో బతకడానికి అవసరమైన

కొన్ని మణిమాణిక్యాలని తెచ్చుకునేందుకు

అని అతడికి చెప్పాలనుకుంటావు

మరి, అతడికి అర్థం అవుతుందంటావా?

*

“మరొక రాత్రి “ కావాలి ఈ కవిత్వం కోసం…!

రాజారామ్ తుమ్మచర్ల 

 

రాజారాం తుమ్మచర్ల

“ ఒక రాత్రి “ చాలడం లేదు…అనుభూతించడానికి

“మరొక రాత్రి “ కావాలి కోడూరి విజయ కుమార్ కవిత్వం కోసం..

నగరంలో ఒక ఉదయం తిరిగి అలసిపోయి ‘ ఒక సంభాషణ కోసం’ ‘అతడూ.. నేనూ.. ఒక సాయంత్రం’ బంగారు వాకిలి గుమ్మం ముందు అతిథిలా ఒక పరిచయస్తుడి గురించి, కొత్త స్నేహితురాలు గురించి వాళ్ళ ఇళ్ళలో  జరిగిన ఇటీవలి సంబరం గురించి మాట్లాడుకుండే మెలుకువలో యాకూబ్ విజయ్ కుమార్ ని పరిచయం చేసినట్టు జ్ఞాపకం. ఇంధ్రధనువుపై ఎగిరిన సీతాకోక చిలుక లా ,రాత్రులను వెలిగించే పద్యఋతువులా విజయ్ కవిత్వం ఏ తీరుగ నను దయ చూస్తుందా అనుకుంటున్న సమయంలో రహస్యంగా సంజాయిషీ యివ్వకుండా వచ్చి వాలింది ..ఒక రాత్రి నా ఇంట్లో. పుస్తకం తెరిచి తెరువగానే కనిపించిన వాక్యాలివి .

“ తాము దయతో పండించే

తిండి గింజల్ని తిని

వెర్రి పరుగులు తీసే ఈ నగరం

కాసింతయిన కరుణ చూపిస్తుందని కదా

ఈ మట్టి పాదాలు ఇక్కడి దాకా ప్రయాణించింది “

ఏ మట్టి పాదాలు ..మీద  నగరమంతా మోకరిల్లింది ?.ఎందుకు తిండి గింజల్ని ప్రసాదించండి అని అసహన హారన్ లు మ్రోగిస్తున్నారు  ఈ నగరమంతా.. నగరం రాకాసి బాహువులతో పొలానని అనకొండలా మింగేయ బోతున్నది ఎందుకని ..?ఇదంతా మనకి అర్థం కావాలంటే. విజయ కుమార్ రాసిన” నగరంలో ఒక ఉదయం”

కవిత చదువాల్సిందే. నగర కలుషిత “వాతావరణం “ లో “ అక్వేరియంలో బంగారు చేప “ను రక్షించడానికి ఒక

యుద్ధ “అనంతరం “ “ఒకరాత్రి.. మరొకరాత్రి “ అయిన లెక్కచేయకుండా కవిత్వ కరవాలాన్ని దూస్తున్న కవి కోడూరి విజయ కుమార్ . “ “ డాక్టర్ .రామనాథంని .. చంపేశారు స్కూలుకి సెలవని తెలిసిన రోజున నా జ్వరానికీ తీయటి మందులిచ్చిన డాక్టర్ని ఎందుకు చంపారో” అని తెలియక ఏడ్చిన చిన్నపిల్లాడు విజయ కుమార్ ఆ రోజు. కానీ ఈ రోజు “ దగా పడిన జాతికి అంతిమంగా విముక్తి కలిగించేది ఏదో ఎరుక కలిగిన కవి.తన నేల మరోక పోరాటా నికి సిద్ధమయ్యాక కార్యాలయ రణరంగాలకన్నా “ టీ బల్ల దగ్గరే సంభాషణ ప్రారంభిద్దాం “అని ఆహ్వానించిన కవి  విజయ కుమార్. తనది అయిన నేల కోసం స్వప్నించిన మరొక పూవు వికసించకనే నేల రాలిపోవడాన్ని సహించలేక కరిగిపోయే కవిత్వంరాసిన కరుణార్ధ్ర కవి విజయ్ కుమార్.

విజయ కుమార్ “ ఒకరాత్రి మరొక రాత్రి “ కవితా సంపుటిలో ముప్పై ఆరు కవితలున్నాయి.’ జీవితం భయపెట్టిన గడ్డు కాలం ‘ఇప్పుడు లేకపోయినా అలాంటి స్థితిలో వున్న సామాజిక, కౌటుంబిక ,వైయుక్తిక అనుభవాల తాత్విక సారాన్ని అక్షరాల్లో అందంగా పట్టి బంధించి అతి చిక్కని సాంద్రతా సహిత కవిత్వాన్ని ఈ సంపుటిలో అందించాడు.

IMAG0549_1

విజయ్ కవిత్వంలో నగరపు జీవితపు రొద వుంది. ఆ రొదలో గగ్గోలు పొందే జీవితం వుంది. చావు భయం చుట్టుకున్న దుఃఖం వుంది. లోపల సుడులు తిరిగే బాధ వుంది. పురా జీవితాన్వేషణ , ఆ జీవిత కష్ట సుఖాల చింతన వుంది.అంత కన్నా నిరంతరంగా సంభవించే సామాజిక సం‍క్షోభ సన్నివేశాలను ఒడుపుగా కళ్ళ ముందువుంచే జీవత్వం వుంది.తునిగిపోతున్న కుటుంబ సంబధాల అతికింపు పట్ల అపేక్ష వుంది. నెమలీక వంటి జ్ఞాపకాల సుగంధం వుంది. బంతిపూల , సన్నజాజుల ,పారిజాతాల సహజ సౌకుమార్య లాలిత్య  స్త్రీత్వం విజయ కుమార్ కవిత్వంలో వుంది కాబట్టే  ఈయన పద్యాన్ని ప్రేమతో హత్తుకోవాలనిపిస్తుంది.

“ కనుల అంచులు తాకే నిదుర పడవకై

ఇలా మెలుకువ తీరాన యెదురు చూడవలసిందే

యిక, ఈ రాత్రి నదిని భారంగా ఈదవలసిందే “ ( ఒకరాత్రి మరొక రాత్రి )

ఒకరాత్రి ..కాదు మరొక రాత్రి కాదు..ఏడేడు రాత్రులు అలా రెండు చేతుల నడుమ ముఖాన్ని కప్పుకొని ..దాటుకోవడమే కదా అని మరణ  చింతన ఒక చేతనతో చెబుతాడు.

రాత్రిని  నది చేసి నిద్రని పడవ చేసి మెలుకువని తీరంచేసి  గాయపరిచిన మాటల ముక్కల మధ్య ,పుస్తకాలతో కొంచెం  జీవితాన్ని మరచిపోయి ,విషాద గీతాల అలల మీద జీవితం నుంచి పారిపోయేటప్పుడు జీవ యాత్ర సుఖంగా సాగదని ,చివరకు జీవితం గాయాల గానంతోనే మిగులుతుందనే ఎరుకను తెలుపుతాడు ఈ కవి. ఎప్పటికి వెళ్ళలేవనే సత్యం దేహంలో ఒక కన్నీటి బిందువుగా నిలిచిపోతుందంటూ..ప్రకృతి లోని పావురాల కువకువలు ,వేసవిలో కురిసిన వాన చినుకులు ,చంద మామ,  ఇవన్నీ మాయ అని భ్రమని అంటూ..ఏడు కట్ల సవారీ అంటే ఏమిటి అని ప్రశ్నిస్తూ..ఒక తాత్వికతని రేకెత్తిస్తూ మరణ ఊరేగింపు కూడా ఏ వైభవం లేకుండా కనీసం ఆ మరణానికి విలపించే రెండు కళ్ళు కూడా లేని ఏకాకి తనంతో వెళ్ళపోవల్సిన అనివార్యతను చాల గొప్పగా చెబుతాడు ఈ కవి.  ఎందుకీ ఈ మరణ చింతన ?ఇక ఎప్పటికి వెనక్కి వెళ్ళ లేనన్న సత్యమేదో హృదిని తొలిచిందా?అదేది కాదు ఈ కవి ఒక జీవిత వాస్తవిక సత్యాన్ని చెప్పాలని అనుకోవడమే. క్షణికమైన సుఖాలలో ఓలలాడించే యాంత్రిక సాధనాల వేటలో శరీరాన్ని పరుగులు పెట్టించిన మానవ జీవిత ఆఖరు దశను ఇలా చెబుతాడు విజయ కుమార్.

‘ నీ శరీరమొక మరమ్మత్తులకు వొచ్చిన వాహనం

ఒకప్పుడు రింగులు ,వాచీలతో ఊరేగిన చేతులకు

దొరకని నరాల కొసం గుచ్చినసిరంజి గాయాలు

రంగు రంగుల వస్త్రాల కప్పుకొని ,పౌడర్లు అద్దుకొని

తిరిగిన నీ దేహ నావని అల్లుకొని ప్లాస్టిక్ పైపుల లతలు

నీ తల్లి దండ్రులు జ్ఞాపకం వొస్తారు

వయో భారంతో శుష్కించిన దేహాలకు

ఆసరా ఇమ్మని ప్రాధేయపడిన వాళ్ళ కళ్ళు గుర్తుకొస్తాయి “ ( దేహ యానం )

అదే మనిషి పుటినప్పటినుంచి ముసలి తనం వచ్చే దశకు చేరుకునే వరకు పొందే స్థితిని  ఇలా రాస్తాడు ఈ విజయ కుమార్.

“నూనూగు మీసాలు మొలిచిన నాడు

ఈ శరీరానికే కదా రంగు రంగుల దుస్తులు చుట్టి

పౌడర్లు ,సుగంధ ద్రవ్యాలు అద్ది

వన్నెల సీతా కోకలకై పడిగాపులు గాసింది

వలచిన సీతాకోక ఒకటి చెప్పా పెట్టక ఎగిరిపోయినప్పుడు

గుబురు గడ్డం పెంచి ,మధువు తాగి, సిగరెట్లు పీల్చి

ఈ దేహాన్ని కదా నువ్వు గాయపరిచింది

వయసు పైబడినపుడు ఈ తోలు తిత్తికే గదా

రంగులు వేసి వయసుని దాచచేయాలని ఆరాటపడింది “

ఆ సుదూర విశ్వవీధులలోని  మనిషి ఆదిమ స్థావరానికీ చేరుకోవడం వరకు జరిగే దేహయానం గురించి, అట్లాంటి వ్యక్తికి వచ్చే చివరి రోజు వరకువున్న స్థితికి కవి చేసిన కవితాత్మక వ్యాఖ్యానం ఈ కవిత. దేహమే ఈ భూమ్మీదకు మనల్ని మోసుకొచ్చే పడవ అని ఊహించే పోలికనే చెప్పిన ఈ కవిత ఆరంభం నుండి ముగింపు వరకు ఈ కవి ఏ జ్ఞాపకాలను మిగుల్చుకొకుండా వెళ్ళిపోయే వాళ్ళ దయనీయతను ,రాజ్యాలను జయించే అలెగ్జాండర్ అయినా దేహయాత్ర కు కాలం చెల్లిపోయిన తరువాత ఆసుపత్రి భాషే వింటాడని కన్ను తెరుచుకొని ఆలోచించేవిధంగా చెబుతాడు.

వచన కవిత్వం రాసే వాళ్ళు మరీ ముఖ్యంగా ఇటీవలి కవులు సాధారణ సంభాషణ శైలిలోనే వాక్య విన్యాసాన్ని ఎక్కువగా వాడుతున్నారు.చదువరులను కానీ ,పాత్రలని కానీ సంభోధిస్తూ రాసే సంభాషణ శైలి వచన కవిత్వానికి బాగా నప్పుతుందని కొందరి అభిప్రాయం.

“ఒక రాత్రి మరొక రాత్రి “ లో కూడా ఈ కవి తన కవితల్ని పాత్రల్ని సంభోదిస్తునో ,చదువరులను సంభోదిస్తునో రాశాడు. “రాత్రులను వెలిగించే పద్యాల ఋతువు “ ఇలా మొదలవుతుంది.

“ఒరేయ్ నాయనా .. ఇది ఇలాగే వుంటుందిరా

పగలు నిలకడ వుండదు రాత్రి వుండదు

ప్రేమ దీపం చుట్టూ తిరిగి తిరిగీ

మసై పోయిన శలభాల కథలకు అంతముండదు “

పాత్రను సంభోధిస్తూ అత్యద్భుత ప్రేమను పరామర్శిస్తూ రాసిన కవిత ఇది.ప్రేమకు బలయిపోయిన అతన్ని ఉద్దేశించి సంభోధిస్తూ రాసిన కవిత.ఆకాశంలో నక్షత్రం లాంటి ప్రేయసి కాంతిని వాగ్దానం చేసిన అంటే ప్రేమను ఇవ్వకుండా పోతే ఆమె పోయిన ఆమె జ్ఞాపకాలు పోవు కదా అని ఈ కవి చెబుతాడు.ఒక్కొక్క రాత్రిని ఒక్కొక్క పద్యం చేసి ఆ పద్యాల హారాన్ని కానుకగా పంపు.ఎప్పుడో ఓసారి ఆ కానుకను చూడక పోదు.పోగొట్టుకున్నది తానే అని బాధ పడితే ఓదార్చి,ప్రేమలు పద్యాలు మాత్రమే పెడతాయేమో కానీ బువ్వలు మాత్రం రూకలే పెడతాయని చెబుతూ, నాలొ అలివికాని ప్రేమవుందని నీకే తెలియ చేసిన నీ ప్రేయసికి కృతజ్ఞతలు చెప్పమంటాడు ఈ కవి.అలవి కానీ ప్రేమ వుంటే మరో ఒప్రేమ నక్షత్రం ఒడిలో వాలుతుందని నాలుగు పాదాల్లో గొప్పగా చెప్పాడు.ఆ నక్షత్రాన్ని లాలనగా దగ్గరగా తీసుకొని యుగయుగాల ప్రేమని పంచు అని అంటాడు.

ఎదురుగా వున్న తెల్ల కాగితం నువ్వు దూకితే మింగేసే లోతైన బావి అవుతుందని ,వేళ్ళ నడుమ వున్న పెన్ను లోపల వున్న బాధని పెకిలించే ఖడ్గం అవుతుందని చెబుతూ  అప్పుడు నువ్వు భాషను నేర్చుకొని  ఒక్కొక్క వాక్యాన్నే నిర్మిస్తు పద్యం రాస్తే నీ లాంటి వాడు ఆ పద్యాన్ని హత్తుకుంటే నీవు తిరిగి జన్మిస్తావని అంటు బాధవల్ల పద్యం పుడుతుందని ఆ పద్యమే కవిని పున్ర్జీవితున్న చేస్తుందని పరోక్షంగా ప్రస్తావిస్తాడు. “పగలే కాదు ..రాత్రి కూడా వొకటి వుందన్న చేదు నిజం రాత్రయ్యాకే గుర్తుకొస్తుంది “-అని అనటంలో జీవితంలో సుఖం వున్నప్పుడు కష్టాలు కూడా వుంటాయన్న నిజాన్ని ధ్వనితో చెబుతాడు.

స్త్రీ పురుషుల మధ్య ముఖ్యంగా మూడుకాళ్ళ ముదిమి వయసులో వుండాల్సిన సంబంధాన్ని, ఆ  భార్యలైన స్త్రీలతో భర్తలకు  వుండాల్సిన అనుబంధ సంబంధాన్ని  అద్భుతంగా  చెప్పిన కవిత “ఏ తీరుగ నను ..” అనేది. “యౌవ్వనంలోనైనా, ముదిమిలోనైనా ఒకపాటొ ,పద్యమో ,తోడులేని బతుకు ఎంత దుర్భర్మో కదా ! “అంటూ  “ జీవితాలని బలిగోరిన పురుషులు ,జీవితాంతం పరాన్న జీవులుగా బతికే పురుషులు ,ఒక శ్రావ్యమైన పాటకూ అందమైన పద్యానికీ నోచుకోని పురుషులు ,స్త్రీల వలె జీవితాన్ని కళగా జీవించడం తెలియని పురుషులు “ అంటూ  సాయంకాలాలు పాటలలో మునిగిపోయే స్త్రీల కన్నా పురుషుల జీవితం దుర్భరమని ఒక జీవిత సాదృశ్యాలతో స్త్రీల జీవన వైషిష్ట్యాన్ని గొప్పగా నిరూపిస్తాడు.

“సూర్యుడి కన్నా ముందు నిన్ను నిద్రలేపి ఇక ఆరోజు మొదలయ్యే పరుగు” పెడుతూ గడియారపు రెండు ముళ్ళ మధ్య చిక్కుకొన్న క్రమం తప్పని దిన చర్య  ఎవరికైనా తప్పదని అంత మాత్రానా అందరి తల్లి తండ్రులు లాగానే నిన్ను వారు పెంచారని చెబుతూ ..జీవిత ఆనంద రహస్యాన్ని  తెలుసుకోమని ఇలా చెబుతాడు.

“ఒక భాగవత శ్లోకాన్ని నెమరువేసుకుంటునో

రాత్రి ఆరుబయట వెన్నెల్లో రేడియోలో ముఖేష్ పాట వింటునో

మైమరచి పోయిన నీ తండ్రి రూపం

పగలంతా ఇంటి పనితో అలసిపోయినా

కళ్ళ నిండా కాటుకతో, కాసంత బొట్టు తో

నిండుగా ముస్తాబయ్యే నీ తల్లి రూపం

రెండు కళ్ళు లేకున్నా కంచికి వెళ్ళిన కథలని

నీకు వినిపించి మురిపించిన అమ్మమ్మ రూపం

అన్నీ ఒక్క సారి జ్ఞాపకం తెచ్చుకొని చూడు

ఒక రహస్యమేదో వాళ్ళు నీకు చెప్పినట్టున్నారు “

అంటూ కాంక్రీటు నిర్మాణపు నగరపు విసుగులోంచి బయటపడే గొప్ప ఆత్మ విశ్వాసాన్నిపొందే రహస్యాన్ని కుటుంబ సంబంధాల నుంచే పొందవచ్చనే స్పృహనిస్తాడు.

“ఆమె సమయాలు “ అనే కవిత భార్య పట్ల భర్తకుండాల్సిన బాధ్యాతాయుతమైన ప్రేమను పూల పోలికలతో సౌకుమార్యంగా చెప్పిన కవిత. “ఇటివల సంబరం “ అనే కవిత తన యింటి టెర్రస్ మీదకి కువకువ రాగాలతో కుశలం అడుగుతూ వొయారంగా వాలిన అనుకోని అందమైన అతిథులైన పావురాలకు చేతిలోని గిన్నె లోని గింజెలతో విందు చేస్తున్న తన బిడ్డ చేస్తున్న ఆ పనిని  అపురూప దృశ్యంగా కవిత్వం చేశాడు. ఏ ఆడబిడ్డయినా తన తండ్రిని “ నువ్వు అబ్బాయి పుట్టాలని కొరుకున్నావా నాన్న ? అని అడిగితే ఏం చెబుతాడు ? అవునని అనగలడా? కానీ అవునని చెబుతూ .

. నిజమే కొన్ని బలహీన  క్షణాలలో

నా అనాది మగ దురహంకారాల మైకంలో

అబ్బాయి పుట్టాలనే కోరుకున్నానేమో?

తన తప్పును ఒప్పుకొంటూ ..” కానీ నా బంగారు తల్లీ..! నాలో జీవం నింపి నన్నొక మనిషిని చేసింది స్త్రీలేనని ఎలా మరచిపోగలను “ అని పశ్చాతాపం ప్రకటించడ ప్రకటిస్తూ. “ నా లోలోపలి లాలిత్యాన్ని రక్షించింది స్త్రీలేనని “.స్త్రీల పట్లగల తన కృతజ్ఞతను ప్రకటిస్తాడు.కానీ ఈ నాటి సమాజంలో కట్నాల విలువ కట్టే విఫణి వీధులు, నిర్లజ్జగా దొర్లే యాసిడ్ సీసాలు  వున్న స్థితుల్లో నువ్వు అబ్బాయివైపుడితే బాగుంటుందన్న ఒక సామాజిక వికృత స్వరూపాన్ని ,ఆ సమాజం స్త్రీల పట్ల ప్రదర్శిస్తున్న వివక్షను అద్భుత ధ్వనితో సూచించాడు. ఇది గొప్ప కవిత్వ లక్షణం.

ఈ కవి   నిరుపమాన భావుకతతో పాటు గొప్ప సామాజిక బాధ్యతను గూడా  కలిగివున్నాడు.”ఎన్నికల ఋతువు “  “నగరంలో ఒక ఉదయం “ ఇలాంటివి కవి సామాజిక దృక్పథాన్ని చూపెడతాయి.నగరం లో రైతులు చేస్తున్న ధర్నాలతో రాస్తారోకోలతో కూడళ్ళలో ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయిన నగర ప్రజలు “ పనీ పాటా లేని పల్లె పొద్దున్నే నగరంలోకి జొరబడి విలువైన నగర సమయాన్ని ధ్వంసిస్తుంది “-అని అంటున్నప్పుడు ఈ కవి “ పొలమూ.. విత్తనాలు..ఎరువులూ, ఆకాశం దయతో కురిసే వర్షమూ తప్ప, మరోలోకం , లేని వాళ్ళు కదా తమలోకం విడిచి ఈ నగర మాయాలోకంలోకి యిట్లా బాధల మూటలతో వాళ్ళు మాత్రం యిష్టంగా వస్తారా? “-అని అంటాడు.అంతే కాదు ఆ రైతులను “ఈ నిర్లజ్జ నగరం తన రాకాసి బాహువులు సాపి మిగిలిన మీపొలాలని  కూడా అనకొండ లా మింగివేయబోతుందని “ హెచ్చరిస్తాడు. ఏదో ఒకనాడు ఈ నగరం తిండి గింజల కోసం రైతుల కాళ్ళ మీద పడి మొక్కే కాలం వొస్తుందని ధైర్యమైన ఆశనిస్తాడు.

హైద్రాబాద్ నగరంలో సంభవించిన పేలుళ్ళ పై రాసిన ఉన్నత కవిత”  అతడూ.. నేను.. ఒక సాయంకాలం “ అనేది. “ విధ్వంసంతో మళ్ళీ కొన్ని దేహాలనైతే ధ్వంసం చేసాడు కానీ మా ఇద్దరి నడుమ విశ్వాసాన్ని స్పృశించలేక ఓడ్పోయాడు “. అనే వాక్యంతో చెదరని హిందూ మహమ్మదీయ మైత్రిని సూచించాడు.ఇలా ఎన్నో ఉత్తమ కవితల సమాహారంగా వుండిన ఈ సంపుటిని పరిచయం చేయడానికి “ఒక రాత్రి చాలదని అనుభూతించి రాయడానికి మరో రాత్రి కూడా కావాలని అంటున్నా.

తప్పించుక తిరుగుతావు లోకం నుండి ఈ కవిత్వం చదివితే.చదువకపోతే లోకమే నీ నుండి.. దూరంగా పోతుందంటున్నా.కొన్ని మాటలు లుంగలు చుట్టుకు పోయి ఈ కవిత్వం గురించి ఇంక రాయలేక ఎవరితో ఇంకా పంచుకోలేక గొంతులో లోపల చిక్కుకున్న మాటల్ని ఇక రాయలేక.. పాఠకులు సీరియస్ గా చదువాల్సిన కవిత్వం విజయకుమార్ దని అభినందిస్తున్నా.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

“ తాము దయతో పండించే

తిండి గింజల్ని తిని

వెర్రి పరుగులు తీసే ఈ నగరం

కాసింతయిన కరుణ చూపిస్తుందని కదా

ఈ మట్టి పాదాలు ఇక్కడి దాకా ప్రయాణించింది “

 

ఏ మట్టి పాదాలు ..మీద నగరమంతా మోకరిల్లింది ?.ఎందుకు తిండి గింజల్ని ప్రసాదించండి అని అసహన హారన్ లు మ్రోగిస్తున్నారు  ఈ నగరమంతా.. నగరం రాకాసి బాహువులతో పొలానని అనకొండలా మింగేయ బోతున్నది ఎందుకని ..?ఇదంతా మనకి అర్థం కావాలంటే. విజయ కుమార్ రాసిన” నగరంలో ఒక ఉదయం”

కవిత చదువాల్సిందే. నగర కలుషిత “వాతావరణం “ లో “ అక్వేరియంలో బంగారు చేప “ను రక్షించడానికి ఒక

యుద్ధ “అనంతరం “ “ఒకరాత్రి.. మరొకరాత్రి “ అయిన లెక్కచేయకుండా కవిత్వ కరవాలాన్ని దూస్తున్న కవి కోడూరి విజయ కుమార్ . “ “ డాక్టర్ .రామనాథంని .. చంపేశారు స్కూలుకి సెలవని తెలిసిన రోజున నా జ్వరా

నికీ తీయటి మందులిచ్చిన డాక్టర్ని ఎందుకు చంపారో తెలియక ఏడ్చిన” కవి విజయ కుమార్ ఆ రోజు.కానీ

ఈ రోజు “ దగా పడిన జాతికి అంతిమంగా విముక్తి కలిగించేది ఏదో ఎరుక కలిగిన కవి.తన నేల మరోక పోరాటా నికి సిద్ధమయ్యాక కార్యాలయ రణరంగాలకన్నా “ టీ బల్ల దగ్గరే సంభాషణ ప్రారంభిద్దాం “అని ఆహ్వానించిన కవి  విజయ కుమార్. తనది అయిన నేల కోసం స్వప్నించిన మరొక పూవు వికసించకనే నేల రాలిపోవడాన్ని సహించలేక కరిగిపోయే కవిత్వంరాసిన కరుణామూర్తి కవి విజయ్ కుమార్.

నగరంలో ఒక ఉదయం తిరిగి అలసిపోయి ఒక సంభాషణ కోసం అతడూ.. నేనూ.. ఒక సాయంత్రం బంగారు వాకిలి గుమ్మం ముందు అతిథిలా ఒక పరిచయస్తుడి గురించి ,కొత్త స్నేహితురాలు గురించి వాళ్ళ ఇళ్ళలో  జరిగిన ఇటీవలి సంబరం గురించి మాట్లాడుకుండే మెలుకువలో యాకూబ్ విజయ్ కుమార్ ని పరిచయం చేసి

నట్టు జ్ఞాపకం. ఇంధ్రధనువుపై ఎగిరిన సీతాకోక చిలుక లా ,రాత్రులను వెలిగించే పద్యఋతువులా విజయ్ కవిత్వం ఏ తీరుగ నను దయ చూస్తుందా అనుకుంటున్న సమయంలో రహస్యంగా సంజాయిషీ యివ్వకుండా వచ్చి వాలింది ..ఒక రాత్రి నా ఇంట్లో.