నక్షత్రాల్లాంటి ఆ కథలు…

kathana

రిత్రయుగం ఇప్పటికి అయిదువేల ఏళ్ళకిందట మొదలయ్యిందనుకుంటే, తాత్త్వికయుగం క్రీ.పూ 6-5 శతాబ్దాల్లో మొదలయ్యింది. చైనాలో, భారతదేశంలో, గ్రీసులో తలెత్తిన ఈ కొత్తధోరణి పురాణగాథలమీదా, పురాణక్రతువులమీదా, పురాణవిశ్వాసాలమీదా తలెత్తిన తిరుగుబాటు.

గ్రీసులో సోక్రటీస్ కి పూర్వపు తత్తవేత్తలు గ్రీకు పురాణకవులైన హోమర్ నీ, హెసియోద్ నీ  ధిక్కరించడంద్వారా, సాహిత్యంకన్నా, తత్త్వశాస్త్రం సత్యానికి ఎక్కువ సన్నిహితంగా ఉంటుందని వాదించారు. ఆ క్రమంలో పురాణకథల్లోని సంక్లిష్టతను తొలగించి మనిషికి మార్గనిర్దేశనంచెయ్యడానికి మంచిచెడుల్నివిడదీసిచూపించి, మంచికి ఉదాహరణలు చూపించడంకోసం బుద్ధుడుకథలు చెప్పడంతో ఉదాహరణకథలు( ఎగ్జంప్లం) వికసించాయి.

కాని మనిషి కేవలం సత్యంమీదా, నీతిసూత్రాల మీదా మాత్రమే బతకలేడు. మనిషికి సత్యంకన్నా సమగ్రత ముఖ్యం. తనజీవితానికీ, తన జాతిజీవితానికీ కూడా సమగ్రత సిద్ధిస్తుందంటే అతడు అబద్ధాలు చెప్పుకోవడానికి కూడా సంకోచించడు.

ఆసమగ్రతని ప్రతిష్టించుకోవడంలోఅతడికొక సంతోషముంది. ఆ సంతోషాన్నిగ్రీకునాటకకర్తలు play wisdom అన్నారు.

మనిషి తొలినాళ్ళల్లో నీతినియమాలతో సంబంధంలేకుండా కథలు చెప్పుకుంటున్నప్పుడు, చతురపాత్రలు సృష్టించుకుంటున్నప్పుడు అనుభవిస్తున్నది ఆ play wisdom నే. తాత్త్వికులు ఇవ్వలేకపోతున్నఆ play wisdom ని తిరిగి జానపదకథాధోరణిలో అందివ్వాలని నీతికథ ముందుకొచ్చింది. అయితే ఈ నీతికథ జాతకకథల తరహా నీతికథ కాదు. ఇది ఈసోపు తరహా నీతికథ. దీని మూలాలు చరిత్రపూర్వకాలంలోనే ఉండిఉండవచ్చు. కాని తన కాలానికి తగ్గట్టుగా ఈసోపు ఆ ప్రక్రియకు ప్రాణం పోసాడు.

ఈసోపు వల్ల మరొకసారి కథ ఎంత సముజ్జ్వలంగా భాసించిందంటే, సాహిత్యాన్నీ, కవుల్నీ, కథకుల్నీద్వేషించిన ప్లేటో కూడా చివరికి సోక్రటీస్ నోటి  వెంట ఒక ఈసోపు తరహా కథ చెప్పించకుండా ఉండలేకపోయాడు.

ఈసోపు తరువాత కథ రెండుదారులు తీసుకుంది. ఒకటి, పురాణగాథల్లాగ భౌతిక, అభౌతికప్రపంచాల మధ్య సేతువు నిర్మించడం. కాని అందుకోసం పురాణకథల్లాగా అభూతకల్పనల మీద ఆధారపడకుండా, ఈలోకాన్నీ, ఇక్కడి దైనందిన జీవితాన్నీకథావస్తువు చేసుకోవడం. చక్కటి రూపకాలంకారంలాగా, చూస్తున్నదాన్నిదృష్టాంతంగా చూపిస్తూ మనంచూడలేనిదాన్నీ, చూడవలసినదాన్నీచూపించడం.

బహుశా ఈ కఠినబాధ్యతని పారబుల్స్ చెప్పడం ద్వారా క్రీస్తు నిర్వహించినంతగా మరే కథకుడూ నిర్వహించలేకపోయాడని చెప్పాలి.

ఈసోపుకథలు తీసుకున్నమరొకదారి, ఈ ప్రపంచం లోనే వివిధ సామాజికవాస్తవాల మధ్య సేతువు నిర్మించడం. పురాణగాథల్లాగా ఆధికారికవిశ్వాసాలుగా స్థిరపడ్డ సామాజికవిశ్వాసాల్నీ, కథల్నీ, కల్పనల్నీ ప్రశ్నించడం. దీన్నివ్యంగ్యకథ అనవచ్చు. గ్రీకు, రోమన్ బానిస రచయితలు ఇందుకు  మానవాళికి తోవ చూపించారు.

ముఖ్యంగారోమన్ బానిసగా జీవితం ప్రారంభించి రోమన్ చక్రవర్తులతో సమానమైన గౌరవానికి పోటీపడ్డ ఫయాడ్రస్. పురాణగాథకి పూర్తి వ్యత్యస్తరూపం వ్యంగ్యకథ.

ఒక సామూహికవిశ్వాసాన్ని ఇవ్వడం ద్వారా సమాజాన్ని సమగ్రంగా నిలిపి ఉంచుతుందని ఆశ కల్పించిన పురాణకథ, వాస్తవంలో సమాజాన్నిచీల్చడానికే ఉపకరించిందని ఎత్తిచూపడమే వ్యంగ్యకథ ప్రయోజనం.

ఏ అతీతకాలం లోనో ఎన్నోసహస్రాబ్దాలకు పూర్వం గుహలముందు  నెగడి చుట్టూ కూచుని చరిత్రపూర్వయుగ మానవుడు, అక్షరపూర్వయుగ మానవుడు తాను చూసినదాన్నీ, చూడనిదాన్నీకూడా కథలు చెప్పుకోవడం మొదలుపెట్టాడు.

బహుశా వినోదం కోసమే ఆ కథలు పుట్టి ఉండవచ్చు. కాని కాలక్రమంలో అవి సామాజిక, సాంస్కృతిక అవసరాలుగా మారిపోయాయి. కథలే లేకపోతే, సుమేరియన్, ఈజిప్షియన్, గ్రీకు, చీనా, భారతీయ, పారశీక సంస్కృతులిట్లా రూపొంది ఉండేవా అన్నది ప్రశ్నార్థకమే. కథ ఒక సామాజికఅవసరమే కాకపోయుంటే హోమర్, హెసియోద్, వర్జిల్, వ్యాసవాల్మీకులు ప్రభవించి ఉండేవారే కాదు. కథలుగా  చెప్తేనే మనుషులు తమ మాటలు మరింత బాగా వింటారని గ్రహించినందువల్లనే బుద్ధుడూ, క్రీస్తూ వంటి ప్రవక్తలు కూడా కథకులుగా, ఇంకా చెప్పాలంటే అద్వితీయకథకులుగా, మారారు. ఒకవేళ కన్ఫ్యూషియస్ వంటి గురువులు కథలు చెప్పకపోతే, వాళ్ళ జీవితంలోని చిన్నచిన్నసంఘటనల్నేవాళ్ల శిష్యులు కథలుగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. సామాజికసమగ్రతని కాపాడటంకోసం తమ చక్రవర్తుల్నిదైవాంశసభూతులుగా ప్రతిష్టిస్తూ పురోహితులు చెప్పిన కథల్లోంచి చరిత్రయుగం మొదలైతే, మళ్లా ఆ పురాణగాథల నుంచి సామాజికసమగ్రతను కాపాడుకోవడం కోసం నిరక్షరాస్యులైన బానిసలు చెప్పుకున్నకథలతో చరిత్ర మరో మలుపు తిరిగింది.

ఈ పరిణామమూ, ప్రయాణమూ సవివరంగా ముందుముందు.

 

***        ***        ***

ప్రాచీనకథారూపాలు: పురాగాథ

 

మా ఊళ్లో ఒక కొండ ఉంది. దాన్నిజెండాకొండ అంటాం. మాది గిరిజనగ్రామం కాబట్టి పండగలప్పుడు ఊళ్లో వాళ్లంతా ఆ కొండ ఎక్కడం ఒక అలవాటు. ఆ కొండ కింద పెద్ద బండరాయి ఉండేది. ఆ రాయి పెద్దపాదం ఆకారంలోఉండేది. అది మధ్యలో పగిలిపోయికూడా ఉండేది. మా చిన్నప్పుడు మా ఊళ్లోవాళ్లు ఆ రాతి గురించి ఓకథ చెప్పేవారు. ఒకప్పుడు భీమసేనుడు ఆ కొండమీంచి కిందకి దిగాడనీ, అతడు పాదం మోపగానే ఆ బండరాయి పగిలిపోయిందనీ చెప్పేవారు. మా చిన్నప్పుడు మాకు అదంతా నమ్మదగ్గట్టే ఉండేది. ఆ శైశవం నుంచి బయటపడ్డాక, ఆ ఊరు వదిలాక, ‘విద్యావంతులం’అయ్యాక ఆ కథను నమ్మడం మానేశాం. కానీ ఇప్పటికీ ఆ కొండ దగ్గరికి వెళ్తే, ఆ బండరాతిని చూస్తే అది భీమసేనుడి అడుగే అని ఎక్కడో మానసికఅగాధాల్లో ఒక జలదరింపుకు లోనవుతూనేవుంటాం. ఆ రాతిచుట్టూ అల్లినకథా, ఆ కథ వినగానే మనసులో రేకెత్తకుండా ఉండలేని జలదరింపూ వీటినే మనం లెజెండ్ అంటాం.

చాలాకాలం పాటు పురాగాథ (లెజెండ్), పురాణగాథ (మిత్), జానపదగాథ (ఫోక్ టే ల్) ల మధ్య తేడా గమనించేవారు కాదు. కానీ వాటి మధ్య సున్నితమైన సరిహద్దురేఖలున్నాయని అత్యంత ప్రాచీనతెగలకు కూడా తెలుసని మానవశాస్త్రజ్ఞులు గుర్తుపట్టడం మొదలుపెట్టారు. ప్రసిద్ధ మానవశాస్త్రజ్ఞుడు మాలినోవస్కీ తన ‘Myth in Primitive Psychology’ (1926) లో టోబ్రియాండ్ ద్వీపవాసులు గురించి రాస్తూ, వాళ్లకి మూడు రకాల కథనరూపాలున్నాయని వివరించాడు.

painting: Annavaram Srinivas

painting: Annavaram Srinivas

  • జానపదకథలు: కల్పితకథలు, నాటకీయంగాచెప్పుకునేకథలు. వ్యక్తులూ, కుటుంబాలూ చెప్పుకునే కథలు. హేమంతకాలంలో పంటలకోతల కాలానికీ, చేపలుపట్టే కాలానికీ మధ్యకాలంలో చెప్పుకునే కథలు. ఆ కథలు చెప్పుకుంటే పంటలు బాగా పండుతాయని నమ్మే కథలు.
  • పురాగాథలు: యథార్థంగా జరిగాయని నమ్మేకథలు. వాటిలో యథార్థమైన సమాచారం ఉంటుంది. అవి ఏ ఒక్క వ్యక్తికో, కుటుంబానికో సంబంధించినవి కావు. తెగ మొత్తానికి చెందినవి. వాటిని చెప్పుకోవడంలో కూడా ఒక మూసపద్ధతి ఉంటుంది. వాటికి మంత్రశక్తికూడా ఉందని నమ్ముతుంటారు.
  • పురాణగాథలు: అవి యథార్థమైన కథలే కాకుండా, పవిత్రమైన కథలు కూడా. వాటి పట్ల ఆ తెగమొత్తానికి  ఆరాధన, గౌరవం, సమర్పణభావం ఉంటాయి. తెగ మొత్తం పాల్గొనే సామాజిక, సామూహికక్రతువుల్లో ఆ పురాణగాథలదే ప్రధానస్థానం.

వీటిలో , పురాగాథని (లెజెండ్) జానపదకథ (ఫోక్ టేల్) నుంచి విడిగాతీసి, శాస్త్రీయంగా అధ్యయనం చేయడం 1975 నుంచి మొదలయ్యింది. మొదట్లో జానపద కథలకి ఉన్నంత నిర్మాణస్పష్టత పురాగాథలకి లేదనుకునేవారు. కానీ పురాగాథల్నిజానపదగాథలతో పోల్చిచూడటం మొదలైన తర్వాత పురాగాథలకు కూడా కొన్నిస్పష్టమైన, నిర్మాణపరమైన లక్షణాలున్నాయని భావిస్తున్నారు. వాటిని మనమిట్లా చెప్పుకోవచ్చు:

  • జానపదకథలు యథార్థవాస్తవాన్నివ్యంగ్యంగా చిత్రించడానికి ప్రయత్నిస్తే, పురాగాథలు యథార్థవాస్తవాన్నినమ్మదగ్గట్టుగా పునర్నిర్మిస్తాయి.
  • జానపదకథలు అంతరంగవాస్తవం గురించి పట్టించుకుంటే పురాగాథలు బాహ్యవాస్తవం గురించి ఆలోచిస్తాయి.
  • జానపదకథలు మనిషి గురించి ఆలోచిస్తే, పురాగాథలు మనిషికి ఏం జరుగుతోంది, మనిషి ఏమౌతున్నాడు ఆలోచిస్తాయి.
  • జానపదకథలు తమ సాంస్కృతిక వాతావరణం నుంచి కూడా బయటికి ప్రయాణించగలుగుతాయి.
  • కానీ పురాగాథలు చాలా స్పష్టంగా తమ సంస్కృతికి మాత్రమే పరిమితమై మనగలుగుతాయి. అవి ఆ సంస్కృతికి సంబంధించిన సంప్రదాయంతో, విశ్వాసాలతో, ఆ మానవసమూహం తాలూకు మానసికసంవేదనలతో ముడివడి ఉంటాయి. పురాగాథలు సాధారణంగా ఏదో ఒక్క సంఘటన మీంచి నిర్మాణమవుతాయి. అవి ఆ మానవసమూహం తాలూకు బాహ్యస్థలాన్నిఆంతరంగికస్థలంతో ముడివేస్తాయి. ఆ సామూహికగతం గురించిన జ్ఞాపకాల్నితరం నుంచి తరానికి అందిస్తూ, ఆ జాతికొక చారిత్రక అంతర్దృష్టి ని  సమకూరుస్తాయి.

పురాగాథల్నీ, జానపదకథల్నీపోల్చిచూసి, తిమోతి.ఆర్. తంగ్హెర్లేని అనే ఆధునిక జానపదవాజ్మయ పండితుడు లెజెండ్ ని  ఇట్లా సమగ్రంగా నిర్వచించడానికి (1990) ప్రయత్నించాడు:

‘లెజెండ్ అంటే సాంప్రదాయిక కథ. ఏక సంఘటనాత్మక కథ. నిర్దిష్టవాతావరణానికి తగ్గట్టుగా, చారిత్రకస్వభావాన్నిసంతరించుకున్నకథనం. సంవాదరూపంలో సాగే అభినయం. ఒక తెగ నమ్మకాల్నీ వారి సామూహికఅనుభవాల్నీమానసికస్థాయిలో నెమరువేసుకుంటూ ప్రతీకాత్మకంగా చెప్పే కథ. ఒక సమూహం తాలూకు సాంప్రదాయికవిలువల్నిపునరుద్ఘాటించడం కోసం చెప్పుకునే కథనం’

నిజానికి పురాగాథలు అచ్చుపుస్తకాల్లో చదువుకునేవి కావు, అవి అభినయరూపాలు. వాటికి నిర్ణీతవేళలుంటాయి. వాటి చుట్టూ కొన్ని నమ్మకాలుంటాయి. ఉదాహణకి సెనెకా ఇండియన్ తెగల్లో, ఇరోకో తెగల్లో ఏ కథలూ వేసవిలో చెప్పుకునేవి కావు. అట్లా చెప్పుకుంటే రెండు రకాల అనర్థాలు వాటిల్లుతాయని వాళ్ళు నమ్ముతారు. మొదటిది, వేసవిలో జంతువులకి పనీపాటా ఉండదు కాబట్టి, అవి మనుషులు చెప్పుకునే కథలు వింటాయనీ, అలా వింటున్నప్పుడు మనుషులు తమని తాము మరీ అతిగా పొగుడుకుంటే విని ఆగ్రహిస్తాయనీ ఒక నమ్మకం. రెండవది, అవి ఆ కథలు వింటూ మైమరచిపోతే ప్రకృతిలో వాటిచోటు తప్పిపోతుందనీ, ప్రకృతి నడక మారిపోతుందనీ మరొక భయం.

అందుకని ఆ కథలన్నీశీతాకాలంలో ప్రకృతి కునికిపాట్లు పడేటప్పుడు  చెప్పుకోవలసిందే.

సెనెకా తెగలో ఈ కథలు చెప్పడానికొక కథకుడుంటాడు. అతణ్ణి ‘హగెఓతా’అంటారు. కథలు చెప్పడాన్ని ‘ఎసెగెఒడె’అంటారు. అతడి దగ్గరుండే కథాభాండాగారాన్ని ‘గనొండసహగొ’అంటారు. కథలు చెప్పేటప్పుడు శ్రోతలు నిద్రపోయినా, ఊకొట్టకపోయినా కథకుడు అమర్యాదగా భావిస్తాడు. ఒకవేళ శ్రోతకి నిద్రొస్తుంటే అతడు కథకుణ్ణి కొంతసేపు ఆకథ కట్టెయ్యమని అడుగుతాడు. కథవిన్నాక శ్రోతలు కథకుడికి పూసలో, పొగాకో, ఏదో ఒక చిన్నకానుక ఇవ్వడం తప్పనిసరి.

ఒక జాతి తన సామూహిక, సమష్టిఅనుభవాల్నిఅర్థంచేసుకునే క్రమంలో, గుర్తుపెట్టుకునే క్రమంలో ప్రతీకాత్మకంగా మిగుల్చుకునే ఆనవాళ్లు పురాగాథలు. ఉదాహరణకి  ‘కథలుఎలాపుట్టాయి’అనే ఈ పురాగాథ చూడండి. సెనెకాఇండియన్లు చెప్పుకునే ఈ పురాగాథలో రాయి కథలు చెప్పటం చూస్తాం.

kesavareddyరాయి కథలుచెప్పడం ఆధునికమానవుడి దృష్టిలో, అయితే, ఒక మెటఫర్, లేదంటే, ఒక ఫాంటసి. కానీ సెనెకాఇండియన్లకి తమ చుట్టూ ఉండే ప్రకృతిలో ప్రతి ఒక్కటీ సజీవపదార్థమేనని మనం గుర్తిస్తే, ఈ పురాగాథ వాళ్ల సామూహికవిశ్వాసంతో ఎంతగా పెనవేసుకుపోయిందో మనకు అర్థమవుతుంది.

రామాయణంలోనూ, మహాభారతంలోనూకూడాఎన్నోపురాగాథలున్నాయి. ఐరోపీయ సాహిత్యంలో ఆర్థరియన్ లెజెండ్లు సుప్రసిద్ధం. తెలుగులో డా.కేశవరెడ్డి ‘మూగవానిపిల్లంగోవి’, ఆర్. వసుంధరాదేవి ‘రెడ్డెమ్మగుండు’కథలు లెజెండ్ తరహాలోచెప్పినవే.

 

 

***        ***        ***

సెనెకాఇండియన్లు1చెప్పుకునేకథ:  కథలుఎలాపుట్టాయి?

ఒకానొక కాలంలో ఒక అనాథ పిల్లవాడుండేవాడు. అతణ్ణి అతడి తల్లిదండ్రులకి బాగా దగ్గరగా తెలిసిన ఒక ఆడమనిషి పెంచింది. అతడు పెరిగి పెద్దవాడయినప్పుడు బలవంతుడు గానూ, బుద్ధిమంతుడు గానూ రూపొందాడు. అతడికి తగిన వయసు రాగానే ఒకరోజు ఆమె అతని చేతికి విల్లంబులు ఇచ్చి, ‘ఇక నువ్వు వేటాడడం నేర్చుకునే వయసు వచ్చింది. అడవికి పోయి వేటాడి ఆహారం తీసుకురా’ అని చెప్పింది. ఆ మర్నాడు పొద్దున్నే అతడు వేటకు వెళ్లాడు. మూడు పక్షులను కొట్టాడు. మధ్యాహ్నానికల్లా అతడి అమ్ములపొది వదులైంది. అల్లెతాడు బిగించుకోవడం కోసం అతడొక చాపరాయి మీద కూర్చున్నాడు.

ఇంతలో ఉన్నట్టుండి హటాత్తుగా అతణ్ణి ఎవరో ‘నీకో కథచెప్పమంటావా’అని అడిగారు.

అతడు తన ఎదురుగా ఒక మనిషి నించొని తనని అడుగుతున్నాడనుకుని తలపైకెత్తి చూశాడు. కాని ఎదురుగా ఎవరూ కనిపించలేదు.

‘నీకో కథ చెప్పమంటావా?’ మళ్లీ వినిపించిందాగొంతు.

ఆ కుర్రవాడికి భయమేసింది. అతను అన్నిదిక్కులా చూశాడు. కాని ఎవరూ కనబడలేదు. మళ్లా ఆ గొంతు వినబడేసరికి అప్పుడతనికి అర్థమైంది, ఆ గొంతు తాను కూర్చున్న బండ లోంచి వినబడుతోందని.

‘నీకో కథ చెప్పమంటావా?’

‘కథలంటే ఏమిటి?’ అని అడిగాడు ఆ పిల్లవాడు.

‘కథలంటే చాలాకాలం కిందట జరిగిన సంగతులు. నా కథలు నక్షత్రాల్లాగా ఎప్పటికీ చెక్కు చెదరవు.’

ఆ రాయి కథ చెప్పడం మొదలుపెట్టింది. ఒక కథ పూర్తిచేస్తూనే మరో కథ మొదలుపెట్టింది.

అది కథలు చెప్తున్నంతసేపూ ఆ కుర్రవాడు తలవంచుకుని శ్రద్ధగా ఆ కథలే వింటూ కూర్చున్నాడు. సూర్యాస్తమయవేళకి ఆ రాయి హటాత్తుగా ఇలా అంది.

‘ఇక మనం ఇప్పటికి చాలిద్దాం. రేపు మళ్లారా. మీ వాళ్లందరినీ కూడా తీసుకురా. వాళ్లంతా కూడా నా కథలు వింటారు. వచ్చేటప్పుడు వాళ్లందరినీ నాకోసం తలా ఒక కానుక తీసుకురమ్మని చెప్పు’అంది.

ఆ కుర్రవాడు ఆ సాయంకాలం తన వాళ్లందరికీ ఆ కథలు చెప్పే రాయి గురించి చెప్పాడు. దాంతో మర్నాడు పొద్దున్నే ఆ ఊరిజనమంతా అతడి కూడా అడవిలోకి దారితీశారు. ప్రతిఒక్కళ్లూ రొట్టెలో, మాంసమో, పొగాకో ఏదోఒకటి తలా కొంత తీసుకువచ్చి ఆ రాతి ముందు పెట్టి కూర్చున్నారు.

అంతా నిశ్శబ్దంగా కూర్చున్నాక రాయి మాట్లాడడం మొదలుపెట్టింది.

‘నేనిప్పుడు మీకు చాలాకాలం కిందట జరిగిన కథలు చెప్పబోతున్నాను. మీలో కొంతమందికి నేనుచెప్పే ప్రతి ఒక్కమాటా గుర్తుంటుంది. కొంతమందికి కొంతే గుర్తుంటుంది. తక్కినవాళ్లకి అసలేమీ గుర్తుండదు. శ్రద్ధగా, జాగ్రత్తగా వినండి.’

ఆ ప్రజలంతా శ్రద్ధగా శిరస్సు వంచి విన్నారు. రాయి కథ చెప్పడం పూర్తిచేసేటప్పటికి పడమట పొద్దుకుంకింది. అప్పుడు ఆ  రాయి ఇట్లా అంది.

‘నా దగ్గరున్న కథలన్నీ చెప్పేశాను. మీరు వాటిని మీ పిల్లలకి చెప్పండి. మీ పిల్లలపిల్లలకి చెప్పండి. అలా తరతరాలపాటు చెప్పుకుంటూనే ఉండండి. మీరెవరినైనా కథ చెప్పమని అడిగినప్పుడు మర్చిపోకుండా వాళ్లకిట్లా ఏదో ఒక బహుమతి ఇవ్వండి.’

అదీ, అలా జరిగింది. మనకి తెలిసిన కథలన్నీఆ రాయి మనకి చెప్తే విన్నవే. మన తెలివితేటలన్నీ ఆ రాతినుంచి మనకు దొరికినవే.

 

_________________________________________________________________________

1: సెనేకా ఇండియన్లు: అమెరికన్ఇండియన్లుగా పిలువబడే రెడ్ఇండియన్లు సుమారు 60 వేలఏళ్ల కిందట ఉత్తరఅమెరికాలో అడుగుపెట్టారు. మధ్యఆసియా మైదానాల నుంచి ఈశాన్యదిశగా సైబీరియాసరిహద్దులు దాటి వాళ్లు అమెరికాలో అడుగుపెట్టారు. వేటాడుతూ, ఆహారం ఏరుకుంటూ ఆ సమూహాలు కొలంబియానది పొడవునా రాకీలు దాటి దక్షిణంవైపు మెక్సికన్ మైదానాల మీదుగా సతతహరితారణ్యాలు దాటుకుంటూ యుకాటన్ అడవుల దాకా విస్తరించారు. ఆకాశంలో ఎన్నినక్షత్రాలున్నాయో అన్ని ఇండియన్ తెగలున్నాయని నానుడి. వాళ్లు దాదాపు 300 భాషలు మాట్లాడతారు.

 

1492 లో క్రిస్టఫర్ కొలంబస్ అమెరికాలో   అడుగుపెట్టినప్పటినుండి 1890 దాకా నాలుగు శతాబ్దాల పాటు సభ్యప్రపంచం అమెరికన్లను వేటాడి, వాళ్ల సంస్కృతినీ, నాగరికతనీ ధ్వంసం చేసేసింది.

 

కానీ 19 వశతాబ్దపు ప్రారంభం నుండీ అంటే, 1830 ల నుంచి అమెరికన్ తెగల సంస్కృతి , మౌఖికసాహిత్యం, జీవనశైలి గురించి విరివిగా అధ్యయనాలు మొదలయ్యాయి.

అట్లా సమగ్రంగా అధ్యయనం జరిగిన తెగల్లో సెనెకాతెగ కూడా ఒకటి. సెనకా ఇండియన్లు న్యూయార్క్ ప్రాంతంలో జెనెసె నదికి కేనాన్ డైగువాసరస్సుకీ మధ్యప్రాంతంలో నివసిస్తారు.

ఆ తెగ ఒకప్పుడు చాలా పెద్దసమూహంగా ఉండేది. సెనెకా ఇండియన్లు ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడ్డ జాతి. ఒకరకంగా మాతృస్వామికతెగ అని కూడా చెప్పవచ్చు.

సెనెకాఇండియన్ తెగలు చెప్పుకునే కథల్నిజెరిమియా కర్టిన్, జె.ఎన్.బి. హ్యూవిట్ నేవారు  Seneca Fiction Legends and Myths’ (1918)  పేరిట ప్రచురించారు.

సాంప్రదాయికఅమెరికన్ తెగల కథలు, పురాగాథల్ని ‘The Story Telling Stone’ (1965) పేరిట సుసాన్ ఫెల్డ్ మాన్  వెలువరించిన సంకలనంలోని కథ ఇది.  ఈ కథను కెనడాలో టొరంటొ దగ్గర సేకరించారు.

***        ***        ***

మన కథల తొలి ఆనవాళ్ళు

kathana

 

 

vadrevuప్రాచీనకాలంలోకథఎప్పుడుపుట్టిఉంటుంది? కఠినమైనప్రశ్న. మనంహోమోసెపియన్స్ గా  పిలుచుకునే ప్రస్తుతమానవజాతి రెండులక్షల సంవత్సరాల కిందట ఆఫ్రికాలో తలెత్తింది. 1,70,000 సంవత్సరాలకిందట మనుషులు దుస్తులు ధరించడం మొదలుపెట్టారు. 82 వేల సంవత్సరాల కిందట సముద్రపుగవ్వలతో ఆభరణాలు ధరించినట్టు ఆధారాలుదొరుకుతున్నాయి. 77 వేలసంవత్సరాల కిందట దక్షిణాఫ్రికాగుహల్లో గీసిన చిత్రలేఖనాలు కనిపిస్తున్నాయి. 40 వేలసంవత్సరాల కిందట స్పెయిన్ లో అల్టామీరాగుహల్లో చిత్రించిన ఆదిమగుహాచిత్రాల్లో జంతువులతోపాటు, మనిషిబొమ్మలు కూడా దర్శనమిస్తున్నాయి. భారతదేశంలో మధ్య ప్రదేశ్ లో వింధ్యపర్వతశ్రేణిలోని భీం భేట్క గుహలు పదిచదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు ఎనిమిదివందలశిలాశ్రయాలతో 500 పైగా చిత్రలేఖనాలతో అతిపెద్ద ప్రాచీనమానవనివాససముదాయంగానిలబడుతున్నాయి.40వేల సంవత్సరాలనుంచి మానవుడిఆలోచనలో ప్రపంచాన్నిగుర్తించి,తిరిగిదాన్నితనకోసంతాను చిత్రించుకునే క్రమంలో గణనీయమైన మార్పు కనిపిస్తున్నదని మనం అంగీకరిస్తే, క్రీ.పూ. 3,200 నాటికి సుమేరియన్లు రాయటం మొదలుపెట్ట్టినదాకా దాదాపు 30-40 సహస్రాబ్దాలపాటు మానవుడు తనకోసంతాను ఎటువంటి కథలు చెప్పుకుని ఉంటాడు?

మనిషి రాయడం మొదలుపెట్టినప్పటినుంచి మానవచరిత్రలో చారిత్రకయుగం మొదలయ్యిందని మనం చెప్పుకుంటున్నాం. అంతకు పూర్వం ఉన్నదంతా చరిత్రపూర్వయుగం. దాన్నికూడా మనం పాతరాతియుగంగా, కొత్తరాతియుగంగా కాలమానంతో గుర్తించుకుంటున్నాం. 2,00,000 నుంచి 70 వేల సంవత్సరాలదాకా మధ్యపాతరాతియుగంగా, 50 వేలనుంచి 21 వేల సంవత్సరాలదాకా కొత్తపాతరాతియుగంగా, 20 వేలనుంచి 10 వేల సంవత్సరాలదాకా మధ్యరాతియుగంగా గుర్తిస్తున్నాం. కొత్తరాతియుగం 10 వేలసంవత్సరాల కిందట, అంటే, క్రీ.పూ. 8,000 కాలంలో మొదలయ్యిందనుకుంటే, అప్పుడే మెసొపొటేమియాలో వ్యవసాయంమొదలయ్యిందనీ, దాదాపుగా పట్టణనిర్మాణం కూడా మొదలయ్యిందనీ మనం చెప్పుకుంటున్నాం. క్రీ.పూ. 6,000 సంవత్సరాల కాలంలో భూతాపం  చల్లారి మానవుడు జీవించడానికి మరింత సానుకూలమైన వాతావరణంఏర్పడిందనీ, క్రీ.పూ. 3,300 నాటికి కాంస్యయుగం మొదలయ్యిందనీ చరిత్ర రాసుకున్నాం. కొత్తపాతరాతియుగం నుంచి కాంస్యయుగం దాకా మానవుడు జీవించిన జీవితం అత్యంతనాటకీయమైన, ఉత్కంఠభరితమైన, తీవ్రసంగ్రామసంక్షుభితమైనకాలం. ఆ  కాలమంతటా తనచుట్టూ ఉన్న ప్రాకృతికశక్తులతో తలపడుతూ మనిషి తనను తాను ఒక సాంఘికజీవిగా తీర్చిదిద్దుకునే క్రమంలోఅగ్ని,  ధనుర్బాణాలు,  బండిచక్రం అతడికి ఎంత సహకరించాయో అంతకన్నాకూడా కథ అతడికి ఎక్కువ దోహదపడిందని ఇప్పుడిప్పుడే  మనం గ్రహించగలుగుతున్నాం.

తక్కిన జంతువుల నుంచి మానవుణ్ణి వేరుచేసే అద్వితీయసామర్థ్యాల్లో అత్యంత అద్వితీయసామర్థ్యం కథలు చెప్పుకునే సామర్థ్యమే. మానవుడి మెదడు కుడి ఎడమ భాగాలుగా విడివడి ఉంటుందని మనకు తెలుసు. అందులో ఎడమ భాగంలోని ‘ఇంటర్ ప్రెటర్ ’ మానవుడి అనుభవాల్నీ, జ్ఞాపకాల్నీకథలుగా అల్లుతుందనీ, అనువదిస్తుందనీ ప్రసిద్ధన్యూరోశాస్త్రవేత్త మైఖేల్ గజానిగ అంటున్నాడు. మానవుడి గ్రహణసామర్థ్యాల్లోనూ, ప్రజ్ఞానసామర్థ్యంలోనూ కథలుచెప్పేవిద్య అన్నిటికన్నా ప్రత్యేకమైన సామర్థ్యమని విజ్ఞానశాస్త్రం చాలాకాలం కిందటే గుర్తించింది. మన జ్ఞాపకాల్ని ఒక కాలక్రమంలో గుర్తుపెట్టుకోవడంలోనూ, గుర్తుకుతెచ్చుకోవడంలోనూ మనిషి ఉపయోగించే సామర్థ్యం కథనసామర్థ్యమే. అంతేకాదు, ఆ జ్ఞాపకాల్ని గుర్తుతెచ్చుకునేటప్పుడు మధ్యలోఉండే ఖాళీల్ని పూరించడానికి జరగని విషయాలుకూడా జరిగినట్టుగా తనకుతాను చెప్పుకునే నేర్పు కూడా మానవుడి మెదడుకి ఉంది. ఇట్లా లేనిదాన్నికల్పించగలిగేశక్తి బహుశా ఈ మొత్తం జీవజాలంలో మనిషికి మాత్రమే సొంతం.  ఈ సామర్థ్యం వల్లనే మనిషి మానవుడుగా మారుతున్నాడు.

తనకు సంభవించిన అనుభవాల్నీ, జ్ఞాపకాల్నీ మళ్లా గుదిగుచ్చుకోవడంలో అక్కడక్కడా మధ్యలో ఉన్నఖాళీల్ని పూరించడానికి లేనిదాన్ని కూడా జరిగినట్టుగా మానవుడు ఎందుకు ఊహించుకుంటాడు? దానికి ప్రధానమైన కారణం, మానవుడికి యథార్థాల్నిశకలాలుగా తిరిగి గుర్తుకుతెచ్చుకోవడంకన్నా, ఆ యథార్థాలను సమగ్రంగా తిరిగి తనకైతాను చిత్రించుకోవడం ముఖ్యం. అటువంటి సమగ్రచిత్రణ మానవుడి మెదడును తృప్తిపరుస్తుంది. అట్లా చిత్రించుకునేటప్పుడు మానవుడిలో ఒక ఉద్దీపన కలుగుతుంది. మామూలుగా జరిగిన సంగతులు జరిగినట్టుగా లెక్కవేసుకోవడంలో మానవుడి మెదడులోని ‘బ్రోకా’ భాగమూ, ‘వెర్నిక్’ భాగమూ మాత్రమే సంచలిస్తాయి. దుకాణం ముందు రాసిఉన్న ధరలపట్టిక చూసినప్పుడు మానవుడి మెదడులో ఆ రెండుభాగాలు మాత్రమే సంచలించి ఊరుకుంటాయి. కాని ఆ జాబితాను తన దగ్గరున్న సొమ్ముతో పోల్చి చూసుకోగానే మానవుడి మెదడు ఊహించలేనంతగా ఉద్దీప్తమవుతుంది. ఒక సాధారణ వార్త విన్నప్పటికన్నా ఒక రూపకాలంకారాన్ని విన్నప్పుడు మనిషి మెదడు మరింత ప్రజ్వలిస్తుంది.

ఇట్లా ప్రజ్వలించడానికిగల కారణాల్నిపరిశోధిస్తున్నన్యూరోసైంటిస్టులు ఇప్పుడు’న్యూరోఈస్తటిక్స్’ అనే కొత్త అధ్యయనాన్నిమొదలుపెట్టారు. ఈ అధ్యయనంలో విశేషమైన కృషిచేస్తున్న వి.ఎస్. రామచంద్రన్ మన మెదడులో, ముఖ్యంగా, దృష్టికి సంబంధించిన భాగంలోని న్యూరాన్లను ఉద్దీపింపజేసేపదిలక్షణాల్నిపేర్కొన్నాడు. వాటిలో ముఖ్యమైన ఒక లక్షణాన్ని ‘పీక్ షిఫ్ట్’ గాగుర్తిస్తున్నారు. 1950 ల్లో నికోటింబర్గన్ అనే శాస్త్రవేత్త సముద్రపక్షుల మీద కొన్ని ప్రయోగాలు చేశాడు. అందులో ఆ పక్షులు తమ కూనలకి ఆహారం తినిపించేటప్పుడు ఆ చిన్నికూనలు ఆ పక్షులముక్కుల్ని తాడిస్తుండటం చూసాడు. టింబర్గన్ ఆ పక్షుల ముక్కుల్ని పోలిన చిన్నచిన్నపుల్లలకి చివర ఎర్రటిచుక్కపెట్టి ఆ పక్షికూనలకు చూపించినప్పుడు అవి ఆ పుల్లల్నికూడా తాడించడం మొదలుపెట్టాయి. అప్పుడతడు ఆ పుల్లలమీద మూడు ఎర్రటిచుక్కలు చిత్రించి చూపించాడు. అశ్చర్యంగా, ఆ పిల్లలు మరింత ఉద్రేకంగా ఆ పుల్లల్నితాడించడం మొదలుపెట్టాయి. దాన్నిబట్టి ఆ శాస్త్రవేత్త రాబట్టిన ప్రతిపాదన ఏమిటంటే బయటప్రపంచంలో మనని ఉద్రేకించే విషయాలు వాటిని వక్రీకరించేకొద్దీ (డిస్టార్ట్) మనని మరింతగా ఉద్రేకిస్తాయనేది .

ఆదిమ మానవుడు తనకళలోనూ, తనప్రజ్ఞానంలోనూ కూడా ఈ సూత్రాన్నేపాటించాడని రామచంద్రన్ ప్రతిపాదిస్తాడు. అంటే మనిషి తనకు సంభవిస్తున్నఅనుభవాల్నిపొదువుకునే క్రమంలో తనను మరింత ఉద్రేకిస్తున్నఅనుభవాలను మరింతగా పొదువుకుంటాడనీ,  తిరిగి వాటిని గుర్తుచేసుకునేటప్పుడు వాటిలో తనను బాగా ఉద్రేకించినవాటిని మరింతగా గుర్తుచేసుకుంటాడనీ మనం భావించవచ్చు. తన అనుభవాలకీ, జ్ఞాపకాలకీ ఒక సమగ్రత సంతరించుకునే క్రమంలో మనిషి వాటిని ఒక కథగాపునర్నిర్మించుకుంటున్నప్పుడు, అవసరమైతే వాటి వరుసక్రమాన్నీ, యథార్థాన్నీ కూడా వక్రీకరించి చెప్పుకుంటాడు. అట్లా చెప్పుకునేటప్పుడు జరిగిన యథార్థాన్నిపక్కనపెట్టి జరగనిదాన్ని జరిగినట్టుగా చెప్పుకోవడానికి కూడా వెనుకాడడు. ఆ వక్రీకరణలో అతడు చూసేది మొత్తం వాస్తవాన్నితిరిగి మెనూకార్డు లాగా గుర్తుచేసుకోవడం కాదు. అందుకు బదులు ఆ జరిగిన సంఘటనలో తనను ఉద్రేకించిన రంగునీ, రుచినీ, సువాసననీ మరింత పెద్దవిచేసి, వాటిని మరింతగా తలచుకోవడం ద్వారా తననుతాను ఉద్దీపింపచేసుకోవడం. ఆ ఉద్దీపనలో అతడి మెదడు ఉద్దీప్తమై తద్వారా సంతోషాన్నిఅనుభవిస్తుంది. తన మెదడు పొందే సంతోషాన్నిఅతడొకప్రాణిగా, తన సంపూర్ణఅస్తిత్వంతో స్వీకరించి, సంతోషిస్తాడు.

ఇలా ఒక మనిషి ఉద్దీపన చెందుతున్నప్పుడు ఆ మనిషిని చూస్తున్న మరొక మనిషి కూడా అటువంటి ఉద్దీపనకే లోనవుతున్నాడు. దానికి కారణం మనిషి మెదడులోఉండే ‘మిర్రర్ న్యూరాన్లు’ అని న్యూరోసైంటిస్టులు చెప్తున్నారు. మిర్రర్ న్యూరాన్ల వల్ల ఒక మనిషి తనకు కలుగుతున్నబాధను గ్రహించడమేకాక, అదే పరిస్థితుల్లో ఎదుటిమనిషికి కలుగుతున్నబాధకికూడా అంతే తీవ్రంగా స్పందించగలుగుతున్నాడు. న్యూరాన్లకు స్వపరభేదం లేదు.

అందువల్ల ఒక మనిషి తాను పొందే సంతోషాన్నిమొత్తం తెగకీ, జాతికీ, తన చుట్టూ ఉంటే మానవసమూహమంతటికీ కూడా అందించడానికి ఉత్సాహపడటమే ప్రాచీనకళాస్వభావం, కథాస్వభావం. అందుకనే, ప్రాచీనమానవుడి కళారహస్యానికి అత్యంతసమీపంగా ప్రయాణించగలిగిన ఆధునికచిత్రకారుడు పికాసో  ‘అసత్యం ద్వారా సత్యాన్ని వెల్లడిచేయడమే కళ’ అన్నాడు.

ప్రాచీనగుహాలయాల్లో, స్పెయిన్ నుంచి ఆస్ట్రేలియా దాకా మానవుడు చిత్రించిన చిత్రలేఖనాల్లో ఈ కథనస్వభావాన్ని మనం గుర్తుపట్టవచ్చు. ఆ చిత్రలేఖనాల్లోని అడవిదున్నల కాళ్లు సన్నగా ఉంటాయి. కానీ మాంసపరిపుష్టమైన వాటి దేహాలు మాత్రం పరిపూర్ణవికాసంతో కనిపిస్తాయి. ఖడ్గమృగాలంటే కొమ్ములే. ఎలుగుబంట్లు బాగా బలిసి కనబడతాయి. మానవుల్ని చిత్రించడంలోనూ ఇదే ధోరణి. ప్రాచీన స్త్రీప్రతిమల్నిచూడండి, వాటిలో బాగా పరిపుష్టంగా ఊగే వక్షోజద్వయం, పెద్ద కడుపులు, కొట్టొచ్చినట్టు కనబడే స్త్రీజననేంద్రియాలు. ఆ ప్రతిమలకు కాళ్లూ, చేతులు, తల ముఖ్యంకావు. 25 వేల సంవత్సరాల కిందట మానవుడి దృష్టిలో స్త్రీ అంటే రతి, ప్రత్యుత్పత్తి, పుష్కలత్వం. అంతే. ఆ స్త్రీప్రతిమను చూడగానే ఆ మానవుడికి అతడి తెగకీ కూడా అవిచ్ఛిన్నసంతానక్రతువూ, ఆశావహమైన భవిష్యత్తు సాక్షాత్కరించేవి.

మానవుడి మెదడులోని కుడిభాగం విషయసేకరణకు సంబంధించింది కాగా, ఎడమభాగం ఆ విధంగా సేకరించినవిషయాల్నిబట్టి మానవుడికొక కథ అల్లిపెడుతుందని గమనించిన న్యూరోసైంటిస్టులు మరొకవిషయం కూడా గమనించారు. అదేమంటే, రకరకాల సందర్భాల్లో మానవుడిమెదడు దెబ్బతిన్నప్పుడు లేదా మెదడులోని రెండుభాగాల మధ్య పరస్పరసంకేతాలు తెగిపోయినప్పుడూ కుడిభాగంనుంచి సంకేతాలు అందినా అందకపోయినా ఎడమభాగం ఏదో ఒక విధంగా ఆ ఖాళీల్నితనకైతాను పూరించుకుని ఏదో ఒక విధంగా తన ముందున్న ప్రపంచాన్ని లేదా తాను లోనవుతున్నఅనుభవాల్నీఏదో ఒక విధంగా వివరించడానికి ప్రయత్నిస్తుంది. కనుకనే ప్రసిద్ధరచయిత జొనాథన్ గాడ్షాల్ మనిషిని ‘ద స్టోరీటెల్లింగ్ ఏనిమల్’ అన్నాడు. అతడిట్లారాశాడు:

‘పరిణామక్రమం మనకి కాలక్రమంలోమన మెదడు లోపల ఒక షెర్లాక్ హొమ్స ని రూపొందించింది. ఎందుకంటే ఈప్రపంచం (ఇతివృత్తాలు, సమస్యలు, సంఘటనలు, కార్యకారణసంబంధాలుమొదలైనవాటితో) పూర్తిగా కథామయం. కారణాల్నీ, కథల్నీవెతకడంలో ఒక ప్రయోజనంఉంది. మానవుడు పరిణామక్రమంలో స్థితిగతులకు తగ్గట్టుగా తనను తాను సర్దుబాటు చేసుకునే క్రమంలో కథలు చెప్పేమనస్సు కూడా ఒక ప్రాకృతికఅవసరంగా రూపొందింది. దానివల్ల మనం మన జీవితాల్నీ, సువ్యవస్థితంగానూ, సార్థకంగానూ అర్థంచేసుకునే అవకాశం లభిస్తున్నది. జీవితం తెంపులేని రణగొణధ్వనిగానూ, సంక్షోభంగానూ కాకుండా మనను కాపాడుతున్నది.

అయితే కథలు చెప్పేమనస్తత్వం పూర్తిగా పరిపూర్ణమైనది కాదు. మానవుడి మెదడులోని ఎడమభాగంలో కథలల్లేభాగాన్ని దాదాపు ఐదుదశాబ్దాలపాటు పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత, మనలోని ఈ చిన్నమానవుడు నిజంగానే ఎంతో విలువైనవాడే అయినప్పటికీ, చతురుడు, కట్టుకథలల్లేవాడు కూడానని మైఖేల్ గజనిగ భావించాడు. ఎందుకంటే మానవుడిలోని కథలల్లే మనస్తత్వం అనిశ్చయాన్నీ, యాదృచ్ఛికతనీ, కాకతాళీయతనీ భరించలేదు. దానికి ఏదో ఒక అర్థంకావాలి. అట్లా అర్థంచేప్పుకోవడానికి అది అలవాటు పడిపోయింది. ఈ ప్రపంచంలో కనిపిస్తున్న వివిధవిషయాల మధ్య సార్థకమైన అమరికక నిపించకపోతే అది దాన్ని తనంతటతనుగా ప్రపంచం మీద ఆరోపించడాని కివెనుకాడదు. క్లుప్తంగా చెప్పాలంటే, కథలు చెప్పేమనస్సు ఎంత వీలయితే అంత నిజమైన కథలు చెప్తుంది. అట్లా చెప్పలేనప్పుడు అబద్ధాలు కూడా చెప్తుంది.

ఇట్లా తనముందు కనిపిస్తున్నవాటికి ఏదో ఒక అర్థంచెప్పుకోవడానికి ప్రయత్నించడంలోనూ, అటువంటి అర్థం స్పష్టంగా గోచరించనప్పుడు తానే ఏదో ఒక అర్థాన్నిఆరోపించి చెప్పడంలోనూ, మానవుడు తొలికథకుడుగా రూపొందాడని మనం ఊహించవచ్చు.

అటువంటి తొలికథలు ఎలా ఉండేవో తెలుసుకోవాలంటే, మనం చరిత్రపూర్వయుగంలోకి,  అంటే ఇప్పటికి ఐదువేలసంవత్సరాలువెనక్కివెళ్లాలి.  ప్రపంచమంతటా నేడు అన్నిజాతుల్లోనూ లిఖితవాఙ్మయానికి సమాంతరంగా మౌఖికవాఙ్మయం కూడా ప్రచలితంగా కనిపిస్తున్నది. దీన్ని మనం ‘ఫోక్ లోర్’ అని పిలుస్తున్నాం. కానీ ఈ ఫోక్ లోర్ మీద చరిత్రయుగపు మానవుడిభావజాలం, లిఖిత వాఙ్మయప్రభావం కూడా గణనీయంగా ఉన్నందువల్ల ఈ మౌఖికవాఙ్మయం ఆధారంగా మనం ఆదిమానవుడి తొలికథల్నిగుర్తుపట్టడం కష్టం. ఇటువంటి ప్రభావాలకు అతీతమైన తొలికథల్నిగుర్తుపట్టాలంటే నాగరికమానవుడి నీడ పడని ఆదిమమానవసమూహాలకథల్నిఅన్వేషించాలి. కానీ ఆ కథలు రాతపూర్వకంగా మనకు లభ్యంకావడంలేదు కాబట్టి, మనం చేయగలిగిందల్లా ఆనాటి మానవుడు జీవించిన జీవితానికి సన్నిహితంగా ఉండే జీవనసరళితో జీవిస్తున్న వివిధ మానవసమూహాల కథల్నిఅధ్యయనం చేయడం. ప్రపంచమంతటా అక్షరపూర్వ జీవనవిధానాన్ని అనుసరిస్తున్నఅనేకఆదిమజాతులు చెప్పుకునే కథల్లో మనకు చరిత్రపూర్వయుగం నాటి మానవుడు చెప్పుకున్నకథల తాలూకు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆఫ్రికాలోని బుష్ మన్లు, జపాన్ లోని ఐనూలు, ఆస్ట్రేలియాలోని వార్లిపిరి, నర్రిన్యేరి తెగలు, పసిఫిక్ మహాసముద్రద్వీపాల్లోనివసించే టికోపియా, ఇఫలుక్ తెగలు, తూర్పుదీవుల్లోని రాపానుయి తెగ, ఆనవాళ్లులేకుండా అంతరించిపోయిన టాస్మేనియన్లు, యమానవంటి మానవసమూహాల కథల్లో మానవుడి తొలికథల పోలికలు కనిపిస్తాయి.

గత రెండుశతాబ్దాలుగా మానవశాస్త్రజ్ఞులు, భాషాశాస్త్రజ్ఞులు, అన్వేషకులు చేస్తూ వచ్చిన వివిధ పరిశోధనలద్వారా, అధ్యయనాల ద్వారా, తులనాత్మక అధ్యయనాల ద్వారా మనకు అటువంటి కథల ప్రాథమికరూపాల గురించి స్థూలమైన అవగాహన లభిస్తున్నది. ఆంద్రేజోల్స్ అనే ఒక కళాచరిత్రకారుడు వీటిని ‘సరళరూపాలు’ అన్నాడు. అతడి ప్రకారం ఆ సరళరూపాలు పురాగాథ, వీరగాథ, పురాణగాథ, పొడుపుకథ, సుభాషితం, ప్రామాణికగాథ, స్మృతి కథ, జానపదకథ, ఛలోక్తీను.

 

(కథలో  సంక్లిష్టత…వచ్చే  నెల)

అవధూత గీత

dhyanam

ఆప్త చైతన్య గా ప్రసిద్ధి చెందిన దొడ్లంకి వెంకటరావు కవి, చిత్రకారుడు, పిల్లల ప్రేమికుడు, అన్నిటికన్నా మెహెర్ చరణాలముందు మోకరిల్లినవాడు. సహజంగానే ఉపాధ్యాయుల హృదయాలు చాలా విశాలంగా ఉంటాయి. ఇక ఆ ఉపాధ్యాయుడు కళాకారుడు కూడా అయితే చెప్పవలసిందేముంది? ఆ కళాకారుడు ‘ధూళిగా మారే’ ‘ప్రేమ పథికుడు ‘అయితే ఆ జీవితం నిత్యం దీపం వెలిగే కోవెలనే కదా.

ఇప్పుడు ఈ ‘కవితాధ్యానం ‘ చేతుల్లోకి తీసుకోగానే మనమట్లాంటి ఒక మందిరంలో అడుగుపెట్టినట్టు అనుభూతి చెందుతాం. అసలు కవిత, ధ్యానం రెండూ ఒకటే, ‘కవితా ధ్యానం ‘ ఒకరకంగా పునరుక్తి పదమే. కాని అర్థవంతం కాకపోతే కవి ప్రయోగించడు కదా. పుస్తకం ఒక పఠనం ముగించేటప్పటికి నాకేమనిపించిందంటే, ఇది కవిత ద్వారా చేసిన ధ్యానమని.

ధ్యానమంటేనే, మరే విషయం మీదా మనసు పోకుండా ఒకే అంశం మీద మనసుని లగ్నం చెయ్యడం కదా. అది నేరుగా జరగవలసిందే కదా. మధ్యలో కవిత్వమెందుకు?

ఇది చాలా సూక్ష్మమైన విషయమనిపించింది. దీని వెనక ఎంతో యోగశాస్త్రముందేమో కూడా. కాని, అనాది కాలంనుంచీ భక్తి కవులు చేస్తూ వచ్చింది ఇదే కదా. ఒక చోట తుకారాముడిట్లా అంటాడు:

‘తుకా అడిగేదొక్కటే, ఏదో ఒకటి మాటాడు నాతో
అప్పుడు ఈ కవిత కూడా ఏదో ఒకటి మాటాడుతుంది.’

కవిత మనకి అద్దం లాంటిది. అద్దం నిశ్చయాత్మకతకు చిహ్నం. మనమున్నామని మనకు ధైర్యం చెప్తుంది. కవిత కూడా అంతే. మన అంతరంగ ప్రయాణానికి అదొక అక్షరసంకేతం.

నిజమైన సాధకుడికి జీవితమంతా తనకీ దేవుడికీ మధ్య ఎడతెగని ఒక సంభాషణ. కొందరు సాధకులు తాము నిత్యం దేవుడి ముందు ప్రసంగిస్తూ, సంకీర్తన చేస్తూ ఉంటారు. అన్నమయ్య లాగా. కొందరు దేవుడి ప్రసంగాన్ని మౌనంగా వింటూ ఉంటారు, రామకృష్ణ పరమహంసలాగా, రమణ మహర్షి లాగా. కాని చాలామంది సాధకులకి అది తమకీ దేవుడికీ మధ్య సంభాషణ. తమ మాటలు దేవుడు వింటున్నాడనీ,తాము దేవుడి మాటలు వింటున్నామనీ తమని తాము గిల్లి చూసుకున్నట్టుగా వాళ్ళు అప్పుడప్పుడు కవిత్వం చెప్తుంటారు.
ఈ కవితా ధ్యానం కూడా అట్లాంటి సంభాషణ. అన్ని సంభాషణల్లోలానే ఇందులో కూడా కొంత కలకలం, కొంత కలవరం, చివరికి ఆ కల వరంగా మారేదాకా-

‘నీవు చెప్పేదంతా గందరగోళంగా కనిపిస్తాది నాకు
పరీక్ష పెట్టేవాడే తట్టుకునే శక్తినిస్తాడంటావు
పరీక్ష ఎందుకో, తట్టుకుని నిలబడ్డవెందుకో
నేనెంత తలబద్దలు కొట్టుకున్నా అర్థం కాదు
కల గనడమెందుకొ,ఆ కలను బాధల ఒత్తులతో చెరపటమెందుకో ‘ (పే.7)

మామూలుగా ధ్యానం మౌన వ్యాసంగం. కాని కవితాధ్యానం కాబట్టి నాదమూ,రాగమూ, అనురాగమూ తప్పనిసరి. కాని ఆ ప్రయాణం దారితీసేది చివరికి మౌనానికే.

మౌనం నుంచి మౌనానికి చేసే ఈ ప్రయాణంలో సాధకుల మానసికావస్థలన్నీ గోచరమవుతున్నాయి కాబట్టి ఈ కవిత్వం మనకొక సాధకుడు అయాచితంగా తన ఆత్మరహస్యాన్ని విప్పి చెప్పినట్టుంది.

ఒక సూఫీకీ ఈశ్వరుడికీ మధ్య అనుబంధం మూడు దశల్లో బలపడుతుందని ఒక సూఫీ సాధువు చెప్పాడు. అందులో మొదటిదశలో సూఫీకీ, ఈశ్వరుడికీ మధ్య ఉన్న అనుబంధాన్ని ఆయన ఒక క్లయింటుకీ, అతడి లాయరుకీమధ్య ఉండే సంబంధంతో పోల్చాడు. ఆ క్లయింటు తన లాయరుతో మొత్తం మొరపెట్టుకుంటాడు. ఏ చిన్న వివరం, రహస్యం, విశేషం ఏదీ అతణ్ణుంచి దాచడు.

‘ప్రీయమైన తండ్రికి,
ఆ ఒక్కటీ నీకు చెప్పేశాక
ఇంక నా దగ్గర ఏవీ మిగల్లేదు
నావన్నీ నువ్వు లాక్కుంటావని
ముందస్తుగా నన్ను హెచ్చరించిన నీకు
నా కృతజ్ఞతలనెలా తెలుపుకోవాలో నాకు తెలీదు.’ (పే.21)

అనే మాటలు ఆ దశకి చెందినవే.

రెండవ దశలో, సాధకుడికీ, ఈశ్వరుడికీ మధ్య అనుబంధం పసిపాపకీ, తల్లికీ మధ్య ఉండే హృదయబంధం. పసిపాప ఒక క్లయింటులాగా ఏదీ చెప్పుకోలేదు. అసలు మాట్లాడనే లేదు. తన సంతోషం, దు:ఖం ఏదైనా సరే, గుక్క పట్టి ఏడుస్తుంది. ఆ బాధ ఏమిటో ఆ తల్లికే తెలుస్తుంది, ఆ రోదన వినగానే, ఆ తల్లి పరుగు పరుగున వచ్చి ఆ బిడ్డను ఎదకు హత్తుకుంటుంది.

‘నేనెవరిమీద కేకలేస్తున్నాను?
నీ మీదేకదా!
నేనెవరిని కావలించుకుంటున్నాను?
నిన్నే కదా!
నా చుట్టూ నువ్వు తప్ప
వేరే ఎవరున్నారు?
నువ్వు కోపించడం చూసాను
నువ్వు ద్వేసించడం చూసాను
నువ్వు లాలించడం చూసాను
నువ్వు ప్రేమించడం చూసాను
నువ్వు మథన పడటం చూసాను
నువ్వు దు:ఖించడమూ చూసాను
నువ్వు పీకలు కోయడమూ చూసాను
నువ్వు నీ కుత్తుకను కత్తికి బలివ్వడమూ చూశాను
నువ్వు మోసగించడం చూసాను
నువ్వు మేల్కొల్పటమూ చూసాను ‘ (పే.86)

అట్లాంటి రోదన.

ఇక చివరి దశలో, సాధకుడికీ, ఈశ్వరుడికీ మధ్య ఉండే అనుబంధం ఒక మాసిన వస్త్రానికీ, ఒక రజకస్త్రీకీ మధ్య ఉండే సంబంధం లాంటిదట. ఆ మాసిన గుడ్డ కనీసం ఏడవను కూడా ఏడవదు. తనని తాను ఆ రజకస్త్రీ హస్తాలకు మౌనంగా సమర్పించుకుంటుంది. తన మురికి వదిలేదాకా, ఆ హస్తాలు తనని బండకేసి బాదుతుంటే, వళ్ళప్పగించేస్తుంది.

‘కొట్టేది నువ్వే!
కౌగలించుకునేది నువ్వే!’ (పే.6)

అనే మాటలు అప్పుడే వస్తాయి.

ఆప్త చైతన్య ఈ మూడు దశలూ దాటాడు అనటానికి, ఈ కవిత్వం ఒక ఆనవాలు. కనుకనే ఇట్లా అంటున్నాడు:

‘నా దృష్టి ఇప్పుడు దేనిమీదా లేదు
సూర్యుని మీదా లేదు
సుందరమైన ప్రకృతిమీదా లేదు.
భ్రమర ఝుంకారానికీ, ఝుమ్మన్న ఈగల శబ్దానికీ
తేడా నాకు తెలియడం లేదు
స్త్రీ వక్షానికీ, శరాఘాతానికీ తేడా నాకు తెలియడం లేదు.’

ఎట్లాంటి కవిత ఇది! నేను చదివిన అత్యున్నత ఆధ్యాత్మిక సాహిత్యానికి సరితూగే వాక్యాలివి, ఇంకా వినండి:

‘నా దృష్టి ఇప్పుడు సంతోషం మీదా లేదు
సంకట స్థితి మీద లేదు
మలయమారుతానికీ, మండే జ్వాలకీ
తేడా నాకు తెలియడం లేదు
వలపులు విసిరే నవ్వుకీ, వల విసిరే జాలరికీ
తేడా నాకు తెలియడం లేదు.
నా దృష్టి ఇప్పుడు కలమీదా, వాస్తవం మీదా లేదు
పగటికీ, రాత్రికీ తేడా నాకు తెలియడం లేదు
వగలకీ, పగలకీ తేడా నాకు తెలియడం లేదూ

‘నా దృష్టి ఇప్పుడు నవ్వుల పడవ మీదా లేదు
కెవ్వుమన్న ఏడ్పుల పాడె మీదా లేదు
పకలరింపులకీ, పరనిందలకీ తేడా నాకు తెలియడం లేదు
తీయని మాటలకి, తేనె పూసిన కత్తులకీ తేడా నాకు తెలియడం లేదూ

‘నా దృష్టి ఇప్పుడు సముద్రం మీద గాని, అలలమీదగానీ
నురుగుమీదగానీ, బుడగమీద గానీ లేదు
నీ మీదే ఉంది!
ఒక్క నీ మీదే ఉంది! (పే.28)

మన కాలంలో మన మధ్య సంచరిస్తున్న మన మిత్రుడొకరు రాసిన అవధూత గీత ఇది. ఇతడూ, నేనూ కలిసి కొన్నాళ్ళు ఒకచోట పనిచేసామని తలచుకుంటే నన్ను నేను అభినందించుకోకుండా ఉండలేకపోతున్నాను.

*

రియలిజం నుంచి వర్చువల్ రియలిజంకి…!

మీ చేతుల్లో ఉన్న మూడు కథలకీ ఒక ప్రత్యేకత ఉంది. ఇవి ఫోను కథలు. అది కూడా మొబైలు ఫోను. ఒక విధంగా చెప్పాలంటే ఇవి సాహిత్యాన్ని రియలిజం నుంచి వర్చువల్ రియలిజంకి తీసుకువెళ్తున్నాయని కూడా చెప్పవచ్చు. అంతేనా? అంత మాత్రమే అయితే వీటి గురించి మాట్లాడడానికి నాకేమంత ఉత్సాహముండేది కాదు. పైకి పూర్తిగా ఇప్పటి కథల్లా కనిపిస్తున్నప్పటికీ, వీటిలో కాలానికి అతీతమైన కొన్ని మూల్యాల ప్రతిపాదన వుందనిపించింది. అదేమిటో నాకు నేను అర్థం చేసుకునే ప్రయత్నంలోంచే ఈ నాలుగు మాటలూ.

2
స్కైబాబ గురించి నాకట్టే తెలియదు. ఆయన రచనలు కూడా నేనేమంత పెద్దగా చదవలేదు. ఈ కథలు చదవమని ఇచ్చినప్పుడు ఆయన తక్కిన రచనలు కూడా ఇమ్మని అడిగాను. ‘జగనే కీ రాత్: ముస్లిం కవిత్వం’ (2005), ‘అధూరె: ముస్లిం కథలు’ (2011)తో పాటు అతడు సంకలనం చేసిన ‘వతన్ : ముస్లిం కథలు’ (2004) పుస్తకాలు ఇచ్చాడు. అతడి కవిత్వం, కథలతో పాటు వాటిమీద నేటికాలపు తెలుగు కవులూ, రచయితలూ, విమర్శకులూ రాసిన అభిప్రాయాలన్నీ చదివాను. ముఖ్యంగా వతన్ సంకలనానికి రాసిన విపులమైన సంపాదకీయం కూడా చదివాను. ఇవన్నీ ఆయన ఆవేదననూ, అభిప్రాయాల్నీ చాలా సూటిగా వివరిస్తున్నవే. అయితే ఈ సంకలనంలో ఉన్న మూడు కథల్నీ అర్థం చేసుకోవడానికి ఇవేవీ నాకు చాలవనిపించింది.
నాకు స్కైబాబ గురించి మరింత తెలుసుకోవాలనిపించింది. జగనే కీ రాత్ సంపుటిలో ఖదీర్‌బాబు రాసిన ఒక వ్యాసముంది. అందులో ఖదీర్ ఇలా రాసాడు:
”స్కైబాబది నల్గొండ. అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే కేశరాజుపల్లి. దారుణమైన పేదరికం. ఏదైనా పని చేసి ఇంటికి సాయపడదామనుకుని స్నేహితుడితో కలిసి బట్టల వ్యాపారం చేసాడు. కిరాయి సైకిళ్లు తిప్పాడు. సోడాలు కొట్టాడు. పీర్‌లెస్ ఏజెంట్ అయ్యాడు. అద్దె పుస్తకాల షాపు నడిపాడు. పాన్‌లు కట్టాడు… ఎక్కడా ఆదాయం రాలేదు. పైగా ఎదురు నష్టం, అప్పులోళ్ళకు మొఖం చూపించలేక దాక్కుని తిరగడం, ఇంటికెళ్ళడానికి మొఖం చెల్లకపోవడం.
ఈ పేదరికం కంటే కూడా స్కైబాబను ఎక్కువ బేచైనీకి గురి చేసింది తమ ఇళ్ళల్లో ఉండే ఆడబిడ్డలు. వీళ్ళందరూ చదువుల్లేక జ్ఞానం లేక తినడానికి తిండి లేక చేయడానికి కుదురైన పనిలేక పెళ్ళిళ్ళు లేక ఈసురోమంటూ ఉండేవాళ్ళు. వాళ్ళను చూసే కొద్దీ స్కైబాబలో దుఃఖం సుడి తిరిగేది. దానిని బలంగా వ్యక్త పరచాలని అనిపించేది..”
ఈ నేపథ్యం స్కైబాబమీద నాకెంతో గౌరవాన్ని కలగచేసింది. ఇటువంటి నేపథ్యాలు ఎంతోమందికి ఉన్నా అందరూ రచయితలు కాలేరు. కొద్దిమంది మాత్రమే గోర్కీలూ, భరద్వాజలూ, స్కైబాబలూ కాగలుగుతారు.
ఇటువంటి నేపథ్యం ఉన్న రచయిత రాసిన కథలు కావడంతో ఈ మూడు కథలూ నాకెంతో విలువైన కథలనిపించాయి. ఆ విలువ కేవలం సాహిత్య విలువ కాదు, లేదా అతడి కథలమీదా, కవిత్వం మీదా అభిప్రాయాలు రాసిన రచయితలు భావిస్తున్నట్టుగా సమకాలీన ముస్లిం జీవిత సందర్భాన్ని చిత్రించడంలోని వాస్తవికత వల్ల మాత్రమే కాదు.
అసలు ఏ రచయిత అయినా తనకు తెలిసిందీ, తన అనుభవంలోకి వచ్చిందీ రాసినప్పుడు మాత్రమే విశ్వసనీయంగా ఉంటాడు. అది రచయిత ప్రాథమిక కర్తవ్యం. కాబట్టి అటువంటి వాస్తవికతకి నేనెటువంటి అదనపు విలువనూ ఆపాదించలేను. మన సమాజంలో అల్పసంఖ్యాకులుగా, బీదరికంలో, సామాజికంగా అప్రధానీకరణకు లోనవుతున్న తెలుగు ముస్లిం జీవితాల్ని ఆ సమాజం నుంచే వచ్చిన ఒక రచయిత స్వానుభవంతో చిత్రించడం మనం రెండు చేతుల్తోనూ స్వాగతించదగ్గ విషయమే కానీ, ఆ ఒక్క కారణం వల్లనే ఆ సాహిత్యం ప్రీతిపాత్రం కానేరదు.
రచయిత ఏదైనా చెప్పనివ్వు. ఏదైనా చిత్రించనివ్వు. కాని ఒక కథ వార్తా కథన స్థాయిని దాటి సాహిత్య స్థాయిని అందుకోవడానికి నిలబడవలసిన ప్రమాణాలు వేరే ఉన్నాయి. ఆ ప్రమాణాల్లో అందరూ మాట్లాడేది శిల్పం గురించి. శిల్పమంటే, ఒక కథలో ఉండే వివిధ అంశాలు ఒకదానికొకటి ఎంత సౌష్టవంగా అమరాయన్నది. సాంకేతికంగా ఆ కథ ఎంత శక్తివంతంగా ఉందనేది. నిస్సందేహంగా తక్కిన కథల్నుంచి గొప్ప కథకుల్ని వేరు చేసేది, ఈ శిల్ప సామర్థ్యమే, సందేహం లేదు. కాని గొప్ప కథలన్నీ మనల్ని ముగ్ధుల్ని చేయాలని లేదు. మంచి కథలన్నీ మనని వెంటాడే కథలు కాలేవు. ఒక కథ మనల్ని మరీ మరీ మరీ వెన్నాడుతోందంటే అందులో ఏముందన్నట్టు?
ఒక కథ మనల్ని వెంటాడుతోందంటే, ఆ కథ చదివినప్పుడు మనలో ఏదో జరిగినట్టు. అది మనలో ఏదో సున్నితమైన రసాయనాల్ని విడుదల చేస్తుంది. దాన్నే జాయిస్ ‘ఎపిఫనీ’ అన్నాడు. ఎపిఫనీ యథార్థానికి మతపరమైన, ఆధ్యాత్మికమైన అర్థంలో వాడబడే పదం. దానికి జాయిస్ ఒక లౌకిక, సాహిత్యార్థాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాడు. ‘..అది మనిషిలో అకస్మాత్తుగా సంభవించే ఆత్మిక పరివర్తన’ అన్నాడతడు.
మరో విధంగా చెప్పాలంటే దాన్ని సాక్షాత్కారం అనవచ్చు. మానవ సంబంధాల్లోనో, జీవిత గమనంలోనో ఒక సంఘటన లేదా ఒక సంభాషణ మనల్ని అకస్మాత్తుగా జీవిత మూలాలకు చేరువగా తీసుకుపోతుంది. దాన్నే జాయిస్ The whatness of a thing  అన్నాడు. అతడిట్లా రాసాడు:
This is the moment which I call epiphany.. when the relation of the parts (of an art object) is exquisite…its soul, its whatness leaps to us from the vestment of its appearance. The soul of the commonest object, the structure of which is so adjusted, seems to us radiant. The object achieves its epiphany.
ek kahaani ke theen rang
స్కైబాబ మనముందుంచిన మూడు కథల్లోనూ ఇటువంటి ఎపిఫనీనే మనం పొందుతున్నామని అర్థమవుతుంది. ‘మౌసమీ’ లో కథకుడు ఆఫ్రీన్‌ను చూసినప్పుడూ ‘జమీలా’ లో జమీలా కథకుడితో తన జీవితం మళ్ళా చిగురిస్తోందని చెప్పినప్పుడూ, ‘మిస్ వహీదా’లో వహీదా కూతురు ఫొటోలో ఉన్నామె తన తల్లి వహీదా అని చెప్పినప్పుడూ కథకుడు ఏ సాక్షాత్కారానికి లోనయ్యాడో ఆ సాక్షాత్కారానికి మనం కూడా లోనవుతాం.
కథల్లో ప్రధానంగా ఉండవలసింది ఇది. తక్కిన ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల గురించిన చర్చ, ఆవేదన కథకి అదనపు బలాన్నివ్వగలవు తప్ప నేరుగా మనలో అటువంటి హృదయ పరివర్తనను తేలేవు.
3
ఇక అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పవలసిన విషయమొకటి ఉంది. అది ఈ కథల్లో కనవచ్చే ఆదర్శలక్షణం. ఈ కథలు చదవగానే నాకు వెంటనే ప్రేమ్‌చంద్ రాసిన ‘సాల్ట్ ఇన్సపెక్టర్’ (1910) గుర్తొచ్చింది. దుర్భరమైన జీవిత వాస్తవం ఎదట దాన్ని ఉన్నదున్నట్టుగా చిత్రించవలసిన బాధ్యత తెలిసినవాడై కూడా ప్రేమ్‌చంద్ ఆ కథని ఎంతో ఆదర్శవంతంగా ముగించాడు. ఎందుకని? బహుశా అది రచయిత జీవస్వభావం వల్ల అనుకోవలసి ఉంటుంది. మానవుడి పట్ల అపారమైన ప్రేమ, దయ ఉన్నందుకు వాళ్ళు ఆ కథల్ని మరోలా రాయలేదు.
గోర్కీ రాసిన ‘ఇరవయ్యారు మంది పనివాళ్ళూ, ఒక స్త్రీ’ (1899) కథ చూడండి, అది భయంకరమైన జీవిత వాస్తవం మనుషుల్నెట్లా మృగాలుగా మారుస్తుందో చెప్పిన కథ. కాని ప్రేమ్‌చంద్ అట్లా రాయలేకపోయాడు. ఎందుకని? గోర్కీకి మనుషుల పట్ల ప్రేమ, దయ తక్కువేమీ కాదే! నేనేమనుకుంటానంటే, గోర్కీ వ్యక్తుల్ని ద్వేషించకుండా వ్యవస్థని ద్వేషిండమెట్లానో నేర్చుకున్నాడు. ప్రేమ్‌చంద్ వ్యక్తుల్ని ద్వేషించలేక పోతున్నాడు కాబట్టి వ్యవస్థను సంస్కరించడమెట్లా అని ఆలోచిస్తున్నాడు.
ఈ కథల్లో స్కైబాబ చేసింది కూడా ఇదే. ఇప్పటి సమాజంలో మొబైల్ ఫోను మనుషుల్లోని అతృప్త ఆకాంక్షలను చల్లార్చే ఒక కన్స్యూమరిస్టు సాధనం. కాని చాలామందికి అది విముక్తి సాధనం కూడా. అది నువ్వున్నచోటే, నీ పరిమితుల్ని దాటి విశాల ప్రపంచంతో కనెక్ట్ కాగలిగే అవకాశాన్నిస్తుంది. అటువంటి అవకాశాల్లో రిస్క్ కూడా ఉంటుంది. మౌసమీ, జమీలా, వహీదాలతో మాట్లాడే అవకాశం దొరికిన ప్రతి ఒక్కరూ ఈ కథల్లో కథకుడు ప్రవర్తించినట్టే ప్రవర్తిస్తారన్న హామీ ఏమీ లేదు. కాని కథకుడు ఆయా అభాగ్య స్త్రీల పట్ల తన ప్రవర్తనలో అపారమైన ఆదర్శభావాన్ని చూపడమే ఈ కథల్లోని అత్యంత విలువైన అంశం. శతాబ్దం కిందట ప్రేమ్‌చంద్ కనపరచిన ఆదర్శవాదమే ఇప్పటి సమాజంలో ఎదట కూడా కథకుడు కనపర్చడం నన్నెంతో విస్మయపరిచిన మాట నిజమే కాని అంతకన్నా ఎక్కువ సంతోషమే కలిగించిందనాలి.
                                    వాడ్రేవు చినవీరభద్రుడు