అలరుల నడుగగ …

untitled

అనువాద కవిత, మూలము – వైరముత్తు

 

కొన్ని రోజులకు ముందు యూట్యూబ్‌లో పాటలను వింటున్నప్పుడు ఈ పాటను వినడము తటస్థించింది.  పాట నడక, అందులోని కవితకు నేను పరవశుడిని అయ్యాను. ఈ పాటను “ఓ కాదల్ కణ్మణి” (OK కణ్మణి లేక ఓ ప్రేమ కంటిపాప) అనే తమిళ చిత్రములో  ఏ ఆర్ రహ్మాన్ సంగీత దర్శకత్వములో గాయని చిత్రా పాడినారు.  కొన్ని అన్య స్వరములతో కూడిన బేహాగ్ రాగములోని యీ పాట చివర రహ్మాన్ గొంతుక కూడ వినబడుతుంది. గీత రచయిత వైరముత్తు. పాటను వినిన తత్క్షణమే తెలుగులో అదే మెట్టులో దానిని అనువాదము చేయాలని నాకనిపించింది. ఈ పాటకు, తమిళ మూలము, ఆంగ్లములో, తెలుగులో (అదే మెట్టులో పాటగా, పద్యరూపముగా) నా అనువాదములను మీ ఆనందముకోసము అందిస్తున్నాను. పాటను క్రింది లంకెలో వినగలరు –

மலர்கள் கேட்டேன் வனமே தந்தனை

தண்ணீர் கேட்டேன் அமிர்த்தம் தந்தனை

எதை நான் கேட்பின் உனையே தருவாய்

 

మలర్‌గళ్ కేట్టేన్ వనమే తందనై

తణ్ణీర్ కేట్టేన్ అమిర్దమ్ తందనై

ఎదై నాన్ కేట్పిన్ ఉనైయే తరువాయ్

 

అలరుల నడుగఁగ వని నొసఁగితివే

జలముల నడుగఁగ సుధ నొసగితివే

ఏమడిగినచో నిన్నొసఁగెదవో

 

When I wished for flowers,

I received from you the whole garden

When I wished for water,

I received from you the drink of immortality

What should I wish for,

so that you  give yourself to me?

 

காட்டில் தொலைந்தேன் வழியாய் வந்தனை

இருளில் தொலைந்தேன் ஒளியாய் வந்தனை

எதனில் தொலைந்தால் நீயே வருவாய்

 

కాట్టిల్ తొలైందేన్ వళియాయ్ వందనై

ఇరుళిల్ తొలైందేన్ ఒళియాయ్ వందనై

ఎదనిల్ తొలైందాల్ నీయే వరువాయ్

 

కానను దప్పితి బాటగ వచ్చితి

విరులున దప్పితి వెలుగుగ వచ్చితి

వెటు దప్పినచో నీవిట వత్తువొ

While I was lost in the woods,

I saw you as the path forward

While I was lost in the darkness,

I saw you as the illuminating light

Where should I get lost,

so that you reveal yourself before me?

 

பள்ளம் வீழ்ந்தேன் சிகரம் சேர்த்தனை

வெள்ளம் வீழ்ந்தேன் கரையில் சேர்த்தனை

எதநில் வீழ்ந்தால் உந்நிடம் சேர்பாய்

 

పళ్ళమ్ వీళ్‌న్దేన్ శిగరమ్ శేర్తనై

వెళ్ళమ్ వీళ్‌న్దేన్ కరైయిల్ శేర్తనై

ఎదనిల్ వీళ్న్దాల్ ఉన్నిడమ్ శేర్పాయ్

 

పల్లములోఁ బడ నగ మెక్కింతువు

వెల్లువలోఁ బడ దరిఁ జేర్పింతువు

ఎందుఁ బడినచో నిను జేరుటయో

 

When I fell into the pits,

you carried me to the summit

When I fell into the whirlpool,

you rescued me to the safety of the shore

Where should I fall,

so that you become one with me?

(తందనై, కరై మొదలైన పదాలను పలికేటప్పుడు తమిళములో ఐ-కారమును ఊది పలుకరు, అది అ-కారములా ధ్వనిస్తుంది. ఛందస్సులో కూడ వాటిని లఘువులుగా పరిగణిస్తారు.)

పద్యములుగా మూడు పంచమాత్రల సంగమవతీ వృత్తములో  స్వేచ్ఛానువాదము –

సంగమవతీ – భ/జ/న/స UIII UIII – IIIU
12 జగతి 2031

సూనమును నేనడుగ – సొబగుగాఁ
గాననము సూపితివి – కనులకున్
పానమున కంభువును – బసవఁగా
సోనలుగ నిచ్చితివి – సుధలనే

ఆవిపినమం దెఱుఁగ – కలయఁగాఁ
ద్రోవగను వచ్చితివి – తురితమై
పోవఁగను జీఁకటులఁ – బొగులుచున్
నీవు వెలుఁ గిచ్చితివి – నెనరుతో

పల్లమున నేనెటులొ – పడఁగ రం-
జిల్లగను జేర్చితివి – శిఖరమున్
వెల్లువల నేనెటులొ – ప్రిదిలి కం-
పిల్ల దరి చేర్చితివి – వెఱువకన్

ఇచ్చుటకు నేమడుగు – టికపయిన్
వచ్చుటకు నేమగుట – వసుధపై
ఇచ్చ నిను జేరఁ బడు – టెచటనో
ముచ్చటగ రమ్ము మది – ముదమిడన్

*

 

సముద్రము

 

నేను సముద్రాన్ని

నదులు ఈనాలో సంగమించి
ఏకాంతమనే దేనాటికి లేకుండా
ఆనందముతో రమించి
ఐక్యము అవుతాయ్

నేనొక మహా సముద్రము
నింగి నేను మాటలాడి
ఆ నీలము
మాది చేసికొని మురిసినాము
నవ్వింది కొంటె తార
చంద్రుడు కనిపిస్తే పోటు
చాల హాయి

మణులు పగడాలు
కెంపులు మరకతాలు
సృష్టికర్త నాకిచ్చిన
సిరుల పెట్టె
నత్తగుల్లలు గవ్వలు
నాగనాగినులు తిమింగలాలు
వసించు స్థలము నేను

పొంగిపోయి
తేల్చగలను
ముంచగలను
కోపగించి
చీల్చగలను
కూల్చగలను
నేను మొదటి శిశువు తల్లి
నేననంతమగు సముద్రాన్ని
స్త్రీ
నాకు మరొక పేరు.

 

వాళ్ల పేరు “ఈ రోజు, ఇప్పుడు” !

 

గాబ్రియేలా మిస్త్రాల్ ( http://en.wikipedia.org/wiki/Gabriela_Mistral ) అసలు పేరు లూసిలా (లూచిలా). ఆమె చిలీ దేశమునకు చెందిన కవయిత్రి. ఆమె జీవిత కాలము 1889 – 1957. ఆమెకు 1945లో నోబెల్ బహుమతి లభించినది. ఆమె చిన్నప్పుడు బడిలో చదువుచుండగా బడి పంతులు నీకు ఇక చదువు రాదు అని ఇంటికి పంపాడట. ఆమె తానే స్వయముగా చదువు నేర్చుకొన్నది. ఒక బడి పంతులమ్మగా పని చేసినది. పెండ్లి ఐన తఱువాత ఆమె భర్త ఎందుకో ఆత్మ హత్య చేసికొన్నాడు. ఆ సంఘటన ఆమె జీవితములో ఒక పెను తుఫాను రేపినది. తాను ఇకమీద నెప్పుడు తల్లి అవజాలననే కొఱత ఆమెను దహించినది. ఏ హృదయములో అగాధమైన శోకము దాగి ఉంటుందో అది కవితకు జన్మస్థానము అవుతుంది ఒక్కొక్కప్పుడు. గాబ్రియెలా అను పేరుతో పద్యములను వ్రాయుటకు ప్రారంభించినది ఆమె. మిస్త్రాల్ అనగా తేమ లేని చలి గాలి. ఆమె కవితా వస్తువు గర్భిణి స్త్రీ, పిల్లలు, పిల్లల లేమి, ఇత్యాదులు. ఆమె కవితలను కొన్ని తెలుగులో ఆంగ్లమునుండి చేసిన నా అనువాదాల రూపముగా మీతో పంచుకొంటున్నాను. ఇందులోని తప్పులన్ని నావే, కాని ఇవి మీ కవితాహృదయాలను తాకితే ఆ ఘనత మిస్త్రాల్‌కు చెందుతుంది. ఆమె విద్యారంగములో చేసిన కృషి మహత్తరమయినది. పన్నెండేళ్లకే బడి ముగించిన ఆమెను స్పానిష్ ప్రొఫెసర్‌గా నియమించారు. ఆమెకు చిన్న పిల్లలంటే ఎంతో ప్రేమ, తన యావజ్జీవితాన్ని వారి సంక్షేమముకోసము అంకితము చేసినది. పసి పిల్లలను గురించి ఆమె నాడు చెప్పిన పలుకులు నేటికి కూడ స్మరణీయమే
మనలో ఎన్నో లోపాలు ఉన్నాయి, మన మెన్నో తప్పులు చేస్తాము. కాని వాటిలో అతి ఘోరమైన నేరము పిల్లలను నిర్లక్ష్యము చేసి వదలి వేయడము, ఎందుకంటే పిల్లలు మానవజీవితానికి ఊట. ఎన్నో కార్యాలలో మనము తాత్సారము చూపవచ్చును. కాని పిల్లల విషయములో వాయిదా వేయడము తప్పు. బాల్యములో వాళ్ల శరీరము ఎదుగుతుంది, రక్తమాంసాలు నిండుకొంటాయి, వారి మేధస్సు పెరుగుతుంది. వాళ్లకు రేపుఅని మనము బదులు చెప్పరాదు. వాళ్ల పేరు ఈ రోజు, ఇప్పుడు” “.

mistral

1)  నటన మాడు టెటులో – Those Who Do Not Dance – Women in Praise of the Sacred, p 214, ed. Jane Hirshfield, Harper Perennial, New York, 1995.

 

అడిగె నామె యడిగె – ఒక

కుంటి పిల్ల అడిగె

నటన మాడు టెటులో – నే

నటన మాడు టెటులో

నటన మాడు నీదు హృది

నటన మాడు మురిసి

 

అడిగె నామె యడిగె – ఒక

చిన్న పిల్ల యడిగె

పాట పాడు టెటులో –  నే

పాట పాడు టెటులో

పాట పాడు నీదు హృది

పాట పాడు మురిసి

 

ఎండు గడ్డి యడిగె – ఒక

ఎండు గడ్డి యడిగె

నటన మాడు టెటులో – నే

నటన మాడు టెటులో

నటన మాడు నీదు హృది

గాలిలోన తేలి

 

అడిగె దైవ మడిగె – నీల

గగనమందు నుండి

ధరకు దిగుట యెటులో – నే

ధరకు దిగుట యెటులో

వెలుగులోన రమ్ము – మాతో

నటన మాడ రమ్ము

 

వనములోన జనులు – నగుచు

నటన మాడి రెల్ల

వెలుగులోన జనులు – పాడి

నటన మాడి రెల్ల

రానివారి హృదయములు

అంధకార మాయె

రానివారి హృదయములు

చేరె ధూళి తోడ

mistral2

2) ఉయ్యాల  – Rocking – Selected Poems on Gabriela Mistral, translated and edited by Doris Dana, p 43, Johns Hopkins Press, Baltimore, 1971.

 

దివ్యమైనది యా సముద్రము

అలల నూపుచునుండె డోలగ

ప్రేమసంద్రపు టలల వింటిని

ప్రేమతో నిన్నూపుచుంటిని

 

అటుల నిట్టుల వీచు గాలియు

నూపె నాకుల రేయిలో మెల

ప్రేమపవనపు రొదను వింటిని

ప్రేమతో నిన్నూపుచుంటిని

 

నీరవమ్ముగ నిఖిల మంతటి

నూపుచుండెను తండ్రిదేవుడు

అతని జేతులు నను స్పృశించగ

ప్రేమతో నిన్నూపుచుంటిని

 

3) నెమ్మది – Serenity, p 71 of the reference in (2)

 

నీకోసము పాడగా జగమందున చెడు కనబడదు

కనుమదారి, ముండ్లకంపమృదువగు నీ ఫాలమే

 

నీకోసము పాడగా క్రూరత లేదీ భూమిలోన

సింహములు నక్కలు కరుణార్ద్ర నయనములే

 

4) సౌందర్యానికి దశ ముఖాలు  – Decalogue of the Artist, p37 of the reference in (2)

 

1 – విశ్వముపైన దేవుని నీడ

ఆ అందమునే ప్రేమించు సదా

 

2 – సౌందర్యమ్మో దేవదత్తము

సౌందర్యమ్మో వాని ప్రతీక

సృష్టికర్తను ప్రేమించకున్నను

వాని సృష్టికి నీవే సాక్షి

 

3 – ఇంద్రియాలను ఉద్రేకించుట

కాదెప్పుడుగా కామనీయకము

ఆత్మను విరియగ జేయునదేగా

నిజముగ నౌను సౌందర్యమ్ము

 

4 – భోగముకోసము వలదా యందము

ఆడంబరమున కది ఆమడ దూరము

 

5 – వెదకకు దానిని బజారులోన

వెదకకు దానిని సంతలలోన

అక్కడ లేదు స్వచ్ఛపు టందము

అక్కడ లేదు అచ్చపు టందము

 

6 – అందమ్మనునది సుందరగీతి

హృదయములోన జనియించే నది

హృదయములోన పెఱుగును పూయును

నిన్ను పునీతుని జేయును తథ్యము

 

7 – హృదయములోగల వెతలను ద్రోసి

శాంతిని నింపును సౌందర్యమ్మది

 

8 – తల్లి రక్తమును పంచుకొన్న యా

బిడ్డవోలె గావించుము సృష్టిని

 

9 – అందము కాదొక నల్లమందు, అది

కల్గించదు మత్తును నిద్రను

చైతన్యమును పెంపొందించుచు

పొంగెడు మదిరయె సౌందర్యమ్మది

స్త్రీయే యైనా పురుషుండైనా

కాలేవొక్క కళామూర్తిగ

ఆత్మనిగ్రహము లోపించిన నీవు

 

10 – సృష్టిని గాంచి గర్వపడకుమా

నీవు కన్న యా కలల శిఖరమును

చేరలేదు నీ సృష్టియు యెన్నడు

దేవదేవుని పూర్ణస్వప్నమౌ

ప్రకృతి కన్నను  మిన్నయు కాదు

 

5) పాల చుక్కలు – Prayer, p212 of the reference in (1)

 

మంచు చుక్కల సేకరించెడు కలశములవలె నే

నుంచినా నీ నాదు స్తనముల వాని ముందర పూ-

రించు నాతడు వీని జీవన గంగ ధారల సే-

వించ వత్తురు పాల చుక్కల నా తనూభవులు

 

6) అమ్మ – Birth Poetry, Ed. Charlotte Otten, p 4, Virago Press, London, 1993.

 

ఈ రోజు అమ్మ నన్ను చూడడానికి వచ్చింది, నా పక్కన కూర్చుంది.  మేమిద్దరము అక్కాచెల్లెళ్లవలె మాట్లాడుతున్నాము జరగబోయే విశేషమైన విషయాన్ని గురించి.

 

అలాగే కదలాడే నా కడుపుపైన చేతులనుంచి నా రొమ్ముపైన బట్టలను తొలగించింది. ఆమె కోమలమైన హస్తస్పర్శకు నా హృదయము మెల్లగా తెరచుకొన్నది. నాకు తెలియకుండా అక్కడినుండి ఉన్నట్లుండి చిమ్ముకొంటూ పాలు పొంగింది.

 

సిగ్గు, తొట్రుబాటు నన్ను ముంచెత్తింది.  నా దేహంలోని మార్పులను, అవి రేకిత్తించే భయాన్ని గురించి ఆమెతో మాట్లాడసాగాను.  ఆమె రొమ్ముపైన నా ముఖాన్ని ఉంచాను.  ఆక్షణంలో నేను మళ్లీ నా తల్లికి చిన్న పిల్లనైపోయాను, ఆమె చేతుల్లో ముఖాన్నుంచుకొని దిగులుతో, భయముతో  జీవితము కలిగించిన ఈ కొత్త మలుపును  తలుస్తూ ఏడవడానికి మొదలుపెట్టాను.

 

– జెజ్జాల కృష్ణ మోహన రావు

మిగిలిందిక కృష్ణుని వేణువు సడి!

murali1

సుమారు 50 సంవత్సరాలుగా రెండు పాటలు నా చెవులలో మారు మ్రోగుతూ ఉన్నాయి.  ఎన్ని మారులు విన్నా మళ్లీ వినాలని తహతహ పడుతూ ఉంటాను. రెండు పాటలకు రాగము ఒక్కటే – సింధుభైరవి.  రెండింటిని శాస్త్రీయ సంగీతములో ప్రావీణ్యము గడించిన వాళ్లే పాడారు.  రెండు చిత్రగీతాలే.  మొదటిది మీరా చిత్రములో ఎం. ఎస్. సుబ్బులక్ష్మి పాడిన పాట, రెండవది శ్రీరంగం గోపాలరత్నం సుబ్బాశాస్త్రిలో పాడిన పాట. 

 

మొదటి పాట – కాట్రినిలే వరుం గీతం, దీని రచయిత కల్కి, సంగీత దర్శకుడు ఎస్. వి. వెంకటరామన్.  ఆ పాట –

 

காற்றினிலே வரும் கீதம்

கண்கள் பனித்திட பொங்கும் கீதம்

கல்லும் கனியும் கீதம்

காற்றினிலே வரும் கீதம்

 

కాట్రినిలే వరుం గీతం

కణ్గళ్ పనిత్తిడ పొంగుం గీతం

కల్లుం కనియుం గీతం

కాట్రినిలే వరుం గీతం

 

మందమారుతములో తూలుతూ తేలుతూ ఒక పల్లవి

కళ్లల్లో తుషార బిందువులు ఒక తెరను కల్పించింది

రాల్గరగించు గంధర్వగానమంటే యిదేనేమో?

 

பட்டமரங்கள் தளிர்க்கும் கீதம்

பண்ணொலி பொங்கும் கீதம்

காட்டு விலங்கும் கேட்டே மயங்கும்

மதுரமோஹன கீதம்

நெஞ்ஜினிலே

நெஞ்ஜினில் இன்பக்கனலை எழுப்பி

நினைவழிக்கும் கீதம்

காற்றினிலே வரும் கீதம்

 

పట్ట మరంగళ్ తళిర్కుం గీతం

పణ్ణొలి పొంగుం గీతం

కాట్టు విలంగుం కేట్టే మయంగుం

మదుర మోహన గీతం

నెంజినిలే

నెంజినిల్ ఇన్బక్కనలై ఎళుప్పి

నినైవళిక్కుం గీతం

కాట్రినిలే వరుం గీతం

 

ఆ స్వరాల జల్లు అలా కురుస్తుంటే

మ్రోడువారిన చెట్లు చిగురించాయి

అడవి మృగాలు కూడ స్థంబించి నిలిచాయి

అవి నా హృదయములో తీపి మంటలను లేపి

పూర్వ స్మృతులను సమూలముగా తొలగించాయి

 

சுனை வந்துடன் சோலைக்குயிலும்

மனம் குவிந்திடவும்

வானவெளித்தனில் தாரா கணங்கள்

தயங்கி நின்றிடவும்

ஆ, என் சொல்வேன் மாயப்பிள்ளை

வேங்குழல் பொழி கீதம்

காற்றினிலே வரும் கீதம்

 

శునై వందుడన్ శోలైక్కుయిలుం

మనం కువిందిడవుం

వానవెళిత్తనిల్ తారా గణంగళ్

తయంగి నిండ్రిడవుం

ఆ, ఎన్ శొల్వేన్ మాయప్పిళ్ళై

వేంగుల్ పొళి గీతం

కాట్రినిలే వరుం గీతం

 

వానల తఱువాత సెలయేరులు నీటితో నిండగా

పక్షులు పరవశముతో పాడసాగాయి

తారాగణములు ఆకాశములో నిశ్శబ్దముగా మెరుస్తున్నాయి

ఆ పిల్లనగ్రోవి గారడి పాటను గుఱించి నేనేమని చెప్పగలను

 

நிலா மலர்ந்த இரவினில் தென்றல்

உலாவிடும் நதியில்-

நீல நிரத்து பாலகன் ஒருவன்

குழல் ஊதி நின்றான்

காலெமெல்லாம்

காலமெல்லாம் அவன் காதலை எண்ணி

உருகுமோ என் உள்ளம்–

காற்றினிலே வரும் கீதம்

 

murali2

నిలా మలర్న్ద ఇరవినిల్ తెండ్రల్

ఉలావిడుం నదియిల్

నీల నిరత్తు బాలగన్ ఒరువన్

కుల్ ఊది నిండ్రాన్

కాలమెల్లాం

కాలమెల్లాం అవన్ కాదలై ఎణ్ణి

ఉరుగుమో ఎన్ ఉళ్ళం

కాట్రినిలే వరుం గీతం

 

విరిసిన వెన్నెలలో నదిలోని అలలు

తెమ్మెరలో కదలాడుచుండగా

ఆ నల్లని చిన్నవాడు వేణువూదుతున్నాడు

ఆ మాయలో అలాగే కలకాలము

వాడి ప్రేమను తలుస్తుండగా

నా గుండె కరిగిపోతుంది

 

ఈ పాటకు అదే మెట్టులో నా అనువాదమును క్రింద ఇస్తున్నాను –

 

తెమ్మెరలో నొక పాట

కనులఁ జెమర్చెడు కమ్మని పాట

రాల్గరగించెడు పాట

 

మ్రోడగు మ్రాకుఁ జిగిర్చెడు పాట

నాదము నిండిన పాట

అడవి జంతువులు ఆనందించెడు

అందమైన ఆ పాట

హృదయములో …

హృదయములో తీపి మంటల రేపుచు

పరవశ మొనర్చు పాట

తెమ్మెరలో నొక పాట

 

నీరామనిలో వనమయూరములు

రమించి కులుకంగ

ఆకాశములో తారాగణములు

భ్రమించి వెలుగంగ

ఏమని చెప్పను మాయాకృష్ణుని

వేణు నాదముల గీతం

తెమ్మెరలో నొక పాట

 

వెన్నెల విరిసిన రాతిరి గాలికి

కదలు తరంగిణిలో

నీలదేహుడగు బాలకుఁ డొకఁడు

మురళి నూది నిలిచె

బ్రదుకంతా …

బ్రదుకంతా వాని బ్రేమ దలంచి

కరుగు నీ నా హృదయం

తెమ్మెరలో నొక పాట

 

ఇక నన్ను ఆకట్టుకొన్న రెండవ పాట సుబ్బాశాస్త్రి అనే చిత్రములో శ్రీరంగం గోపాలరత్నం పాడిన పాట. పు. తి. నరసింహాచార్యులు వ్రాసిన ఈ పాటకు స్వర కల్పన చేసినది వీణా దొరైస్వామి అయ్యంగారులు.  ఇందులో మిగిలిన పాటలను బాలమురళీకృష్ణ పాడారు.

 

ಕೃಷ್ಣನ ಕೊಳಲಿನ ಕರೆ

ಆಲಿಸು

ಕೃಷ್ಣನ ಕೊಳಲಿನ ಕರೆ

ತ್ವರೆ ತ್ವರೆ

 

కృష్ణన కొళలిన కరె

ఆలిసు

కృష్ణన కొళలిన కరె

త్వరె త్వరె

 

కృష్ణుడి ఆ మురళి పిలుపును త్వరగా ఆలకించండి

ఆలస్యము చేయకండి

 

ತೊಟ್ಟಲಿನ ಹಸುಗೂಸ  ಮರೆ ಮರೆ

ಪಕ್ಕದ ಗಂಡನ ತೊರೆ ತೊರೆ

ಬೃಂದಾವನಕೆ ತ್ವರೆ ತ್ವರೆ

ಕೃಷ್ಣನ ಕೊಳಲಿನ ಕರೆ

 

తొట్టలిన హసుగూస  మరె మరె

పక్కద గండన తొరె తొరె

బృందావనకె త్వరె త్వరె

కృష్ణన కొళలిన కరె

 

ఉయ్యాలలోని పసి పాప ఏడుపును మఱవండి

పక్కలో మగడి ఆతురతను మఱవండి

కృష్ణుడు పిలుస్తున్నాడు

బృందావనానికి పదండి త్వరగా

 

ಮುತ್ತಿನ ಕುಪ್ಪುಸ ಹರಳೊಲೆ

ಮಲ್ಲಿಗೆ ಜಾಜಿ ಮುಡಿ ಮಾಲೆ

ಹೆಜ್ಜೆಯ ಮೇವುರ ಗೆಜ್ಜೆಯಪಿಲ್ಲಿ

ಮರೆತೇ ಬಂದೇವೆ  ಮನೆಯಲ್ಲೇ ಸಖಿ

ಕೃಷ್ಣನ ಕೊಳಲಿನ ಕರೆ

 

ముత్తిన కుప్పుస హరళొలె

మల్లిగె జాజి ముడి మాలె

హెజ్జెయ మేవుర గెజ్జెయపిల్లి

మరెతే బందేవె మనెయల్లే సఖి

కృష్ణన కొళలిన కరె

 

చెలీ, నా అదరాబదారాలో

మంచి బట్టలను కూడ తొడగడలేదు

పూలను తురుముకోలేదు

కాళ్లకు గజెజ్లను కట్టుకోలేదు

అన్నీ ఇంటిలోనే మఱచిపోయాను

 

ಹೊತ್ತಾರೆ ಹೊರೆ ಗೆಲಸ ಮಿಕ್ಕರೆ ಮಿಗಲಿ

ಪಕ್ಕದ ನೆರೆಹೊರೆ ನಕ್ಕರೆ ನಗಲಿ

ಬೃಂದಾವನದೊಳ್ ಆಲಿಸಿ ಗೋಮುರಳಿ

ಕೃಷ್ಣನ ಕೊಳಲಿನ ಕರೆ

 

హొత్తారె హొరె గెలస మిక్కరె మిగలి

పక్కద నెరెహొరె నక్కరె నగలి

బృందావనదొళ్ ఆలిసి గోమురళి

కృష్ణన కొళలిన కరె

 

ఇంటిలో పుట్టెడు పనులు ఉండిపోనీ

నా వెనుక ఇరుగుపొరుగులు ఏమైన మాట్లాడుకోనీ

నేను వీటిని పట్టించుకోను

తిన్నగా బృందావనానికి వెళ్తున్నాను

ఆ మురళి పాటను వినడానికి

 

[పిల్లలేమైనా గాని, భర్త ఏమైనా గాని, పక్కింటివాళ్లు ఎదురింటివాళ్లు ఏమైనా అనుకోనీ నేను మాత్రము బృందావనములోని మాయలవాని మురళి పిలుపును విని వాడిని చేరుకోకుండా ఉండలేను అనే ఈ వాక్యాలు క్షేత్రయ్య వ్రాసిన క్రింది పదమును నాకు జ్ఞప్తికి తెస్తుంది –

 

నీ పొందు సేయక మాన మువ్వగోపాల నీ పాదమాన

నా పొందు నీవెడ బాయకురా చాల

నమ్మితిరా నిన్ను నా ప్రాణనాథ

 

ఎవ్వరాడిన నాడనీ మగడేమి సేసిన జేయనీ

నవ్వేవారెల్ల నవ్వనీ, యత్త

నన్ను దూరితే దూరనీ సామి

 

కన్నవారు రవ్వ సేయనీ నా కాపురమేమైన గానీ

అన్నదమ్ము లెడబాయనీ చాల

ఆరుదూరైతే కానీ నా సామి

 

నీవు నే గూడగా జూడనీ మామ నేరము లెంచిన నెంచనీ

బావ చాల రట్టు చేయనీ చుట్ట

పక్కాలు దిట్టిన దిట్టనీ సామి]

 

ನೇಸರ ಕಿರಣ ಆಗಸದಿರುಳ ತೊರೆಯಿಸುವ ರೀತಿ

ಮುರಳೀಧರನ ಮುರಳೀ ಮಾಯದಿ ಮನ ಬಿಟ್ಟಿದೆ ಭೀತಿ

ಇನ್ನಾಯಿತೆ ಪ್ರೀತಿ ಇನ್ನಾಯಿತೆ ಪ್ರೀತಿ

ಕೃಷ್ಣನ ಕೊಳಲಿನ ಕರೆ

 

నేసర కిరణ ఆగసదిరుళ తొరెయిసువ రీతి

మురళీధరన మురళీ మాయది మన బిట్టిదె భీతి

ఇన్నాయితె ప్రీతి ఇన్నాయితె ప్రీతి

కృష్ణన కొళలిన కరె

 

ఆకాశములోని చీకటిని ఎలా ఆ

మొదటి వెలుగు రేక దూరము చేస్తుందో

అలాగే నాలోని భయాన్ని ఆ

మనోహరమైన మురళి పిలుపు తొలగించింది

నా మనసులో మిగిలిందల్లా

ప్రేమ ఒక్కటే, ప్రేమ మాత్రమే

 

ఈ పాటకు అదే మెట్టులో నా అనువాదమును క్రింద ఇస్తున్నాను –

 

కృష్ణుని వేణువు సడి (కృష్ణూని)

విను వడి

కృష్ణుని వేణువు సడి

వడి వడి (వడీ వడీ)

 

ఊయెలలో పసికందు విలాపము (విలా పమూ)

పక్కన ఆ మగని విలాసము (విలా సమూ)

బృందావనికి వడి వడి

కృష్ణుని వేణువు సడి

 

చీరల రవికల కమ్మలను

జాజుల మల్లెల మాలలను

అందము జిందెడు యందెల గజ్జెల

మఱచివచ్చితిమి మన యింటనె చెలి

కృష్ణుని వేణువు సడి

 

పుట్టెడు పనులెల్ల ఉండనీ యింట (పుట్టేడూ పనులెల్లా ఉండానీ)

పక్కింటి వారంతా నవ్వనీ మనకేం (పక్కింటీ వారంతా నవ్వానీ)

బృందావనమున విను ద్వర వేణువును

కృష్ణుని వేణువు సడి

 

సూర్యకిరణము కారుచీకటిని తొలగించు రీతి

మురళీధరుని మురళీమాయయు తొలగించు భీతి

మిగిలిందిక ప్రేమే మనసందున ప్రేమే

కృష్ణుని వేణువు సడి

 

 

కాట్రినిలే వరుం గీతం –  http://www.youtube.com/watch?v=jtlafCRhTB4

కృష్ణన కొళలిన కరె –  http://www.youtube.com/watch?v=fAfGouXTAzg

నీ పొందు సేయక – http://www.telugulyrics.org/Songs.aspx?Source=Movies&ID=494&Name=Kshetrayya%20Padamulu

 

 – జెజ్జాల కృష్ణ మోహన రావు

222121_10150170989267886_3694186_n

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

అందం, ప్రతిభా, వ్యక్తిత్వం = సుచిత్రా సేన్!

 suchitra-sen-best-bengali-bollywood-movies-list

మొన్న శుక్రవారము 17 జనవరి 2014 బెంగాలీ చిత్రతార ఒకటి అస్తమించినది.  82 ఏళ్లు నిండిన సుచిత్రా సేన్ ఇక లేరు. ఆమె నేటి బంగ్లాదేశ్‌లోని పాబ్నాలో 1931లో రొమా (రమ) దాస్‌గుప్తాగా జన్మించినది. ఎనిమిది పిల్లలలో (మూడు మగ, ఐదు ఆడ) ఆమె ఐదవది. ఆమె అసలు పేరు కృష్ణ, కాని బడిలో చేర్పించేటప్పుడు, వాళ్ల నాన్నగారు రమ అని పేరిచ్చారట. కొందరు ఆమె శాంతినికేతనములో విద్యాభ్యాసము చేసినదంటారు.

 

అతి రూపవతియైన ఆమెకు పదహారవ ఏడే పెళ్లయినది.  ఆమెకు సంగీతమంటే యిష్టము.  చలనచిత్రాలలో పాడాలని ఆమె కోరిక.  కాని ఆమె అదృష్టము మరొక విధముగా పరిణమించినది.  వెండి తెర మరుగున గాక, వెండితెర మీదనే ఆమెకు అవకాశము లభించినది. ఆమె మొదటి చిత్రము 1953లో విడుదల అయినది.  ఆమెకు దర్శకుడు నితీశ్ రాయ్ సుచిత్ర అని పేరు నిచ్చాడట. తరువాత ఆమె వెండితెరపైన సుచిత్రా అనే పేరుతో స్థిరపడినది. ఆమె తన నాన్నమ్మను నటనవిద్యలో గురువుగా భావించింది. ఆమె సుచిత్ర నటనను ప్రోత్సహించడము మాత్రమే కాక విమర్శించేది కూడ. ఆమెతో నాయకుడుగా ఉత్తం కుమార్ నటించాడు.  ఉత్తం, సుచిత్రాల జోడీ అలా 1953లో ఆరంభమైనది.  వాళ్లిద్దరు తరువాత ఎన్నో చిత్రాలలో కలిసి నటించారు.  పెళ్లికి పిదప నటన ప్రారంభించి కొనసాగించిన నాయికలు అరుదు.  అట్టి అరుదైన నాయికలలో ఆమె ఒకతె, మరొకరు గడచిన వారము మరణించిన తెలుగు నటి అంజలీదేవి.

 

సుచిత్రా సేన్ బెంగాలీ చిత్రములో వహించిన పాత్రలను తెలుగులో సావిత్రి, హిందీలో వహీదా రహ్మాన్ పోషించారు. దీనిని బట్టి మనము బెంగాలీ చిత్రాలను చూడకపోయినా ఆమె నటనను గురించి ఊహించుకోవడానికి అవకాశము ఉంటుంది.  ఉత్తంకుమారుతో ఆమె జోడీ హిందీలో రాజ్‌కపూర్-నర్గీస్, తెలుగులో నాగేశ్వరరావు-సావిత్రి లాటిది. వారిరువురు నటించిన చిత్రాలను ప్రేక్షకులు అమితముగా ఆదరించారు.  ఏ కళాకారులకైనా ఆ కళను అనుభవించే రసికులు ఆదరిస్తే అంతకన్న కావలసినదేముంది?

 

ఆమె 52 బెంగాలి, ఏడు హిందీ చిత్రాలలో నటించింది. అందులో 30 చిత్రాలలో ఆమెతో కూడ ఉత్తంకుమార్ నటించాడు. అలా వారిరువురు నటించిన మొదటి చిత్రము సారే చూయతర్, చివరి చిత్రము ప్రియ బాంధవి.  ఆమె నటించిన కొన్ని గొప్ప చిత్రాలు – అగ్నిపరీక్ష (తెలుగులో మాంగల్యబలం), ఉత్తర్ ఫల్గుని (హిందీలో మమత), దీప్ జ్వేలే జాయ్ (హిందీలో ఖామోషీ, తెలుగులో చివరకు మిగిలేది), సాత్ పా కే బంధా, హిందీ చిత్రములు దేవదాస్, ఆంధీ. ఇందులో సాత్ పా కే బంధా చిత్రములోని నటనకు ఉత్తమ నటి పురస్కారము మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవములో దొరికింది.  అంతర్జాతీయ రంగములో అలాటి ఉత్తమ నటనా పురస్కారమును నర్గీస్ తరువాత అందుకొన్న భారతీయ మహిళ ఆమెయే.

 

ఆమె కుమార్తె మూన్ మూన్ సేన్, మనుమరాళ్లు రైమా, రియా. ఆమెకు పద్మశ్రీ, బంగభూషణ్ పురస్కారములు ఇవ్వబడినవి. చిత్రజగత్తునుండి విరమించిన పిదప హాలీవూడ్ నటి గ్రెటా గార్బోవలె ఆమె ఎవరి కళ్లకు కనబడక ఏ కొద్దిమందితో మాత్రమే సంబంధము నుంచుకొని రామకృష్ణ ఆశ్రమపు కార్యక్రమాలలో కాలము గడిపినది. బంగభూషణ్ బహుమతిని ఆమె తరఫున ఆమె కుమార్తె మూన్ మూన్ అందుకొన్నది.  ఢిల్లీలో బహుమతిని అందుకొనవలసి వస్తుందని భారత చిత్ర జగత్తులో అతి ప్రశస్తమయిన దాదాసాహేబ్ ఫాల్కే బహుమతిని కూడ నిరాకరించినదట.

 

ఆంగ్లేయ చిత్ర విమర్శకుడు Derek Malcolm అంటాడు – ” ఆమె నిజంగా చాల అందగత్తె, ఆమెలో ఒక స్థిర చిత్రములాటి భంగిమ ఉన్నది, ఆమె ఎక్కువగా నటించ నక్కర లేదు.”  సుచిత్రా సేన్‌ను ఒక గొప్ప “మహానాయిక”గా అందరు ఎందుకు పరిగణిస్తున్నారు?  దీనికి గల కొన్ని కారణములను మనము తెలిసికోవాలి.  ఆమె సౌందర్యవతి, అందులో సందేహము ఏమీ లేదు.  కానీ చలన చిత్ర నాయికలు చాల మంది అందగత్తెలే, కుందనపు బొమ్మలే. అందమొక్కటే చాలదు, నటనాకౌశల్యము కూడ కావాలి.  ఆ నటన సంభాషణలను హావభావములతో వల్లించుట మాత్రమే కాదు.  ఒక చూపుతో, ఒక శిరఃకంపనముతో, ఒక సైగతో, ఒక నిట్టూర్పుతో, ఒక చిన్న పెదవి విరుపుతో గుండె లోతులలో ఉండే అనుభూతులను బయటికి తేవాలి. రచయిత కల్పించిన పాత్రలో మమైకము కావాలి. దర్శకుని భావాలను అర్థము చేసికొని వాటికి తన ముఖమునే అద్దముగా పెట్టాలి.  సుచిత్ర గ్లిసరిన్ వాడదని చెబుతారు.  సెట్టుపైన వెళ్లినప్పుడు కన్నీళ్లు తనంతట వచ్చేవట.

ఆమెకు ఆత్మవిశ్వాసము ఎక్కువ.  అందుకే నాయకుల ఆధిక్యత ఉండే చిత్రరంగములో తన పేరును నాయకునికి సమానముగా ప్రదర్శించమని దర్శకులను, నిర్మాతలను అడిగి వారిని ఒప్పించినది.  అందుకే చిత్రములలో సుచిత్రా సేన్, ఉత్తం కుమార్ అని నాయకీనాయకుల పేరులను చూపేవారు, ఉత్తం కుమార్, సుచిత్రా సేన్‌లని కాదు. సత్యజిత్ రాయ్ ఆమెను తాను తీయాలనుకొన్న ఛౌధురాణి చిత్రములో నాయికగా ఎన్నుకొన్నాడు. కాని రాయ్ తన చిత్రములోతప్ప మిగిలిన వాటిలో ఆ చిత్రము పూర్తి అయ్యేవరకు నటించరాదన్నాడట. మిగిలిన దర్శకనిర్మాతల చిత్ర నిర్మాణమునకు అది అడ్డవుతుంది కనుక అందుకు సుచిత్ర ఒప్పుకోలేదు. ఒక వేళ అలా సత్యజిత్ రాయ్ చిత్రములో ఆమె నటించి ఉంటే అది ఎలా ఉండి ఉంటుందో అన్నది ఇప్పుడు ఊహాతీతమయినది. రాజ కపూర్ చిత్రములో నటించడానికి కూడ ఆమె నిరాకరించినదట.

Suchitra-sen6-400-x-300

ఆమె నటించిన కొన్ని చిత్రములను సంక్షిప్తముగా పరిశిలిస్తే ఆమెను ఎందుకు గొప్ప నటి అంటారో మనకు తెలుస్తుంది,  కథా పాత్రల వైవిధ్యమును మనము అర్థము చేసికొనవచ్చును. ఇందులో ఎన్నో చలన చిత్రాలు యూట్యూబులో చూచి ఆనందించవచ్చును.

 

అగ్నిపరీక్ష (1954) – మాంగల్యబలం తెలుగు చిత్రము చూసిన వారికి ఈ కథ విదితమే. చిన్నప్పుడు బొమ్మల పెళ్లిలా జరిగినదానిని తండ్రి నిరాకరించాడు.  పెద్దైన తరువాత ఒక యువకుడిని చూసి ప్రేమించింది తపసి.  అతనిని పెండ్లాడుట సరియా కాదా అనే సందిగ్ధములో నున్నప్పుడు, ఆమె నాన్నమ్మ ఆమెకు సీతలా నీవు కూడ నీ అగ్ని పరీక్షలో కృతార్థురాలవుతావు అని చెప్పింది. చిన్నప్పటి గ్రామానికి వెళ్లగా అక్కడ తన ప్రేమికుడినే చూసింది.

 

దేవదాస్ (1955) – దేవదాసు కథ అందరికీ తెలిసినదే. ఇందులో పార్వతి పాత్రకు జీవం పోసింది సుచిత్ర. ఆ పాత్రలోని గాంభీర్యము, ఔన్నత్యము, ప్రేమ, ఆవేదన చక్కగా తన నటనలో  ప్రతిబింబము చేసినది. నాయకుడు దిలీప్ కుమార్‌తో సరిసమానముగా నటించి అతని ప్రశంసలు మాత్రమే కాక దర్శకుడు బిమల్ రాయ్‌చేత కూడ మన్ననలను అందుకొన్నది. ఉత్తమ నటిగా ఆమెకు బహుమతి దొరికినది.  చంద్రముఖిగా నటించిన వైజయంతిమాలకు ఉత్తమ సహాయనటిగా బహుమతి లభించినా, ఆమె తనకు కూడ ఉత్తమ నటి బహుమతి ఇవ్వలేదని తన బహుమతిని నిరాకరించినది.

 

రాజలక్ష్మి శ్రీకాంత (1958) – దీని కథ శరత్ వ్రాసిన శ్రీకాంత్ నవలలోని ఒక భాగము.  ఈ శ్రీకాంత్ నవల కొందరు శరత్ ఆత్మకథపైన ఆధారపడినదని చెబుతారు.  శ్రీకాంత్ నవలను నాలుగు భాగములుగా విడదీయవచ్చును.  శ్రీకాంత్ నవల అందులోని కథానాయకుడు తన జీవితములో ఎదుర్కొన్న నాలుగు స్త్రీలను గురించిన కథ.  వాళ్లు – అన్నదా, రాజలక్ష్మి, అభయ, కమలలత.  ఇందులో రాజలక్ష్మిని గురించిన ఉదంతము ఈ చిత్రము. శ్రీకాంత్ ఒక చోట నిలకడగా ఉండడు, ఒక విధముగా దేశదిమ్మరి. అలా ప్రయాణం చేసేటప్పుడు ప్యారిబాయి రూపములో తన చిన్ననాటి స్నేహితురాలైన రాజలక్ష్మిని మళ్లీ చూస్తాడు. వారి రాగద్వేషాలు ఈ చిత్రపు కథ.  ఇందులో రాజలక్ష్మి తపన, ఆసక్తి, ప్రేమానురాగలను సుచిత్ర చాల చక్కగా తన నటనలో చూపినది.

 

దీప్ జ్వేలే జాయ్ (1959) – ఈ చిత్రము తెలుగులో చివరకు మిగిలేది, హిందీలో ఖామోషీ అనే పేరుతో విడుదల అయినది. మానసిక రోగముతో బాధపడే ఒక వ్యక్తిని కాపాడబోయి అతనికి ప్రేమికురాలుగా నటించి నిజముగా ప్రేమలో పడినది ఒక నర్సు.  అతడు చికిత్స పొంది వెళ్లిపోయిన తరువాత అలాగే ఇంకొక రోగితో నటించినప్పుడు మళ్లీ ప్రేమలో పడి తాను కూడ చిత్త భ్రమను పొందుతుంది.  ఖామోషిలో నటించిన వహీదా తన నటన సుచిత్రా సేన్ నటనకు సరి తూగదని తానే చెప్పినదంటే సుచిత్ర ఎంత గొప్పగా నటించినదో ఈ చిత్రములో!

 

ఉత్తర్ ఫల్గుని (1963), మమతా (1966) – ప్రేమికుడు విదేశాలకు వెళ్లగా, పరిస్థితులవల్ల తండ్రి మరొకనితో పెళ్లి జరుపుతాడు. ఆ భర్త త్రాగుబోతు, తన భార్యనే అమ్మడానికి సందేహించడు, వాడిని వదలి పారిపోయి పన్నాబాయిగా మారుతుంది. తన కూతురిని ఒక క్రైస్తవ మొనాస్టరీలో వదలి వెల్లిపోతుంది. విదేశాలకు వెళ్లిన ప్రేమికుడు ఆమెను ఒక రోజు చూస్తాడు.  ఆమెను తన యింటికి పిలిపించుకొని పాట పాడిస్తాడు, కాని తన ముఖము చూపడు. పారితోషికాన్ని అతని కార్యదర్శి ఇవ్వబోగా ముఖముచూపని వారిచే పారితోషికము గ్రహించనని చెప్పుతుంది. తరువాత అతడే ఆమె కూతురు సుపర్ణ బాధ్యతలు వహించి ఆమెను విదేశాలకు పంపుతాడు. ఆమె కూడ బారిస్టరుగా తిరిగి వస్తుంది. తన మాజీ త్రాగుబోతు భర్త బ్ల్యాక్మెయిల్ చేస్తుంటాడు, అప్పుడు తన కూతురి భవిష్యత్తు పాడవ కూడదని వాడిని హత్య చేస్తుంది. ఆమెను తప్పించడానికి ఆమె ప్రేమికుడే వాదిస్తాడు, అప్పుడు ఆమె కూతురు ఆమె అపరాధి ఆమె శిక్షార్హురాలు అని చెప్పగా, అతడు ముద్దాయి ఎవరోకాదు, సుపర్ణ తల్లి అని చెబుతాడు.  తల్లిగా, కూతురిగా రెండు పాత్రలను సుచిత్ర ఈ చిత్రములో పోషించింది. తల్లి పాత్రలోని ఆవేదన, కూతురి పాత్రలోని చలాకీదనము రెంటిని బింబప్రతిబింబాలుగా ప్రదర్శించింది ఇందులో.

 

ఉత్తమ్ కుమార్ తో సుచిత్ర

ఉత్తమ్ కుమార్ తో సుచిత్ర

సాత్‌పాకే బంధా (1963)  (హిందీలో కోరా కాగజ్) – పెళ్లి అనేది ఏడడుగుల బంధమే కదా? దానినిగురించిన కథ ఇది.  తండ్రి ఒక విద్యాధికారి, తల్లి మామూలు మనిషి, కూతురు అర్చనకు ఒక కళాశాల ప్రాధ్యాపకుడు సుఖేందుతో ప్రేమ. తండ్రి ఒప్పుకొంటాడు, తల్లికి ఇష్టము లేదు. పెళ్లి అవుతుంది. అర్చన తన భర్త సుఖేందును సంతృప్తిపరచడానికి ఎంతో కష్టపడుతుంది. కాని సుఖేందుకు భార్యను అర్థము చేసికోలేక పోయాడు.  వాళ్లిద్దరి మధ్య దూరము పెరుగుతుంది. తల్లి తన కూతురు ఒక పేద అధ్యాపకునితో కష్టపడుతుందని తాను వాళ్లిద్దరి మధ్య జోక్యము కలుగజేసికొంటుంది. చివరకు ఇద్దరు ఒకరినొకరు ఇంకా ప్రేమించుకొంటున్నా కూడ విడాకులు తీసికొంటారు. ఐనా సుఖేందు రాకకోసం అర్చన ఎదురుచూస్తూనే ఉంటుంది.

 

ఆంధీ (1975) – సుచిత్రా సేన్ ఆఖరి చిత్రాలలో ఇదొకటి. ఇందులో ఆమె పాత్రకు, ఇందిరా గాంధీ జీవితానికి లంకె ఉన్నదని ఒక ప్రచారము ఉండేది. ఇందులో ఆమె వస్త్రాలంకారము, కేశాలంకారము మున్నగునవి కూడ దీనిని బలపరిచింది. ఇరవై వారాల తరువాత ఈ చిత్ర ప్రదర్శనను ఆపారు. అవి ఎమర్జెన్సీ రోజులు, ఈ తరము వారికి ఆ విషయాలు తెలియవు. కొద్దిగా సందేహము కలిగినా ఇలాటివి సర్వసామాన్యము ఆ కాలములో. కిశోర్ కుమార్ కాంగ్రెస్ మహాసభలో పాడడానికి నిరాకరించాడని అతని పాటల ప్రసారమునే ఆకాశవాణిలో ఆపిన దినాలు అవి!  తనకు  ఆదర్శవంతురాలైన నాయకురాలు ఇందిరా గాంధి అని సుచిత్ర పాత్ర ఇందిరా గాంధి చిత్రపటము ముందు చెప్పిన మాటలను చిత్రముతో జత చేసిన తరువాత మళ్లీ చిత్రాన్ని విడుదల చేయుటకు అనుమతించారు. తన తండ్రిచే ప్రోత్సహించబడి రాజకీయాలలో చేరి ఎన్నికలలో పోటి చేస్తున్న ఒక రాజకీయవాదిగా సుచిత్ర ఇందులో నటించినది. విడాకులు పొందిన భర్తను మళ్లీ కలిసినప్పుడు పాత జ్ఞాపకాలు ప్రేమ మళ్లీ చిగిరింది. ఇందులోని ఆరతీదేవి పాత్ర నెరసిన వెండ్రుకలు, ఆమె కట్టుకొన్న చీరలు ఇందిరా గాంధీకి సరిపోయేటట్లు ఉండడము ఒక విశేషము.

 

ఆమె నటించిన చిత్రములలో నాకు నచ్చిన రెండు పాటలను మీకు జ్ఞాపకము చేస్తున్నాను –

 

(1) అగ్నిపరీక్ష చిత్రములోని కే తుమి ఆమారే డాకో అనే పాట ( – http://www.youtube.com/watch?v=xR6OllPrZ_U&list=PLE0072797BFB1F116 ). మాంగల్యబలములోలోని పెనుచీకటాయె లోకం పాట ఈపాటపై ఆధార పడినదే.

 

(2) మమత చిత్రములోని ఛుపాలో దిల్ మే యూఁ ప్యార్ మేరా (  http://www.youtube.com/watch?v=lZCHYFkED5M ). ఈ పాట పారసీక ఛందస్సు ముతకారిబ్ ముసమ్మన్ ముజాఫ్ మక్బూజ్ అస్లం ముజాయిఫ్ పైన ఆధారపడినది.  దీనిని గురించి అంతర్జాల పత్రికయైన మాలికలో నేను చర్చించియున్నాను.

 

ఒక తార భూమిపైన అస్తమయమై ఆకాశములో ఉదయించింది.  మరో ప్రపంచము అనేది ఉంటే అక్కడ దివంగతుడైన ఉత్తం కుమార్‌తో మళ్లీ నటించడానికి నాందీవాక్యమును సుచిత్రా సేన్ పలుకవచ్చును.

– జెజ్జాల కృష్ణ మోహన రావు

222121_10150170989267886_3694186_n