సైరన్ మోతల మధ్య మేలుకున్న స్వరం

devipriya

దేవీప్రియ

దేవిప్రియ సాహిత్య ప్రస్థానం గురించి వ్యాసాలను ‘సారంగ’ ఆహ్వానిస్తోంది. 

 

విశాఖ మొజాయిక్ సాహిత్య సంస్థ, ఎస్వీ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో ప్రసిద్ధ కవి, ఎడిటర్ దేవిప్రియ సాహిత్యానుశీలనం ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ వ్యాసం పునర్ముద్రిస్తున్నాం. ఈ వ్యాసం అఫ్సర్ 1992 లో వెలువరించిన సాహిత్య వ్యాసాల సంపుటి “ఆధునికత- అత్యాదునికత” నించి తీసుకున్నాం. ఇది ఇరవై వొక్క సంవత్సరాల కింద రాసిన వ్యాసం కాబట్టి,  ఇందులో అఫ్సర్ చేసిన విశ్లేషణ  అంత సమకాలీనం కాకపోవచ్చు. 

1970లలో వొక సంధికాలానికి సమాధానంగా బయలుదేరిన విప్లవోద్యమం విలువైన  కవిత్వ వారసత్వాన్ని మిగుల్చుకుంది. కవిత్వ ప్రయోజనానికి స్పష్టమైన గిరి గీసింది. అభ్యుదయోద్యమంతో స్థిరపడిన లక్ష్యనిబద్ధతతొపాటు నిమగ్నత అనే మరో ఆచరణాత్మకమైన పదం కవిత్వ విమర్శలో చేరింది. నిబద్ధతకీ, నిమగ్నతకీ మధ్య వొక వూగిసలాట ప్రారంభమైంది. కవికి నిబద్ధత వుంటే చాలదు, నిమగ్నత కూడ అవసరమేనన్న వాదం వొకవైపు సాగుతుండగా, మధ్యతరగతి కవుల్లో ఆశయానికీ, ఆచరణకీ మధ్య అంతరం ఏర్పడింది. ఇక్కడ రెండు అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. మొదటిది విప్లవోద్యమ ప్రత్యక్ష ప్రభావం. రెండవది ఆ ప్రభావాన్ని జీవితంలో అన్వయించుకోగలిగినా భౌతిక పరిస్థితులు లేక పరోక్షంగా విప్లవ భాగస్వామ్యం తీసుకోవడం … శివారెడ్డి, దేవిప్రియలవంటి సీనియర్ కవులనుంచి గుడిహాళం రఘునాధం, నందిని సిద్ధారెడ్డి దాకా ఈ విధంగా ఒక వర్గీకరణ కిందికి వస్తారు. అయితే  శివారెడ్డికీ, ఈ వరసలోని మిగిలిన కవులకీ మరో తేడా వుంది. మిగిలిన కవులతో పోల్చినప్పుడు శివారెడ్డిలో అంతర్ముఖత్వం తక్కువ. వీళ్ళందరితో పోల్చినప్పుడు దేవిప్రియలో అంతర్ముఖత్వం ఎక్కువ. దీని కారణాలు ఆయా కవుల భౌతిక జీవన పరిస్థితుల్ని బట్టి వుంటాయి. వీళ్లందరి మీద పని చేస్తున్న ప్రభావాలు వొక్కటే. కాని వీళ్లలో వొక్కొక్కరిది వొక్కొక్క తరహా జీవితం.

దేవిప్రియ జీవితం వడ్డించిన విస్తరి కాదు. ‘పొగాకు కంపెనీ సైరన్ మోత ‘ జీవితాన్ని శాసించే నేపథ్యంలో దేవిప్రియ పుట్టేరు. ‘ఒక గుడిసె కథ’ కవితలో దేవిప్రియ తన కవిత్వానికి ప్రాధమిక ముడిసరుకులేమిటో చెప్పారు. తన పంచేంద్రియాల ద్వారా సంపాదించుకునే జ్ఞానం కవితకి ఎప్పుడూ ప్రాధమికమైందే. ప్రేరణలు ప్రభావాలుగా స్థిరపడకముందు కవిలో నిక్షిప్తమైన భావసంపుటి అది. వ్యక్తి జీవన సారాన్ని సాంద్రతరం చేసేవి ఈ భావాలేనని ఫ్రాయిడ్ అంటాడు. దేవిప్రియ జీవన తాత్వికతని నిర్దేశించి చూపుడువేళ్లు ‘ఒక గుడిసె కథ’లో కనిపిస్తాయి.

“ఈ ‘గుడిసెలో’ నేనా ప్రపంచం వుదయించింది అని కవి అంటున్నప్పుడు ఆ ప్రపంచం కేవలం భౌతిక ప్రపంచం కాదు. కొత్త వ్యక్తిత్వాన్ని రూపుదిద్దే తాత్విక ప్రపంచం. ఈ కవితలో గతం మీద జాలి, ప్రేమ మాత్రమే కాదు వర్తమానం నుంచి భవిష్యత్తులోకి  సాధికారికంగా నడిచి వెళ్లగల ఆత్మస్థయిర్యం వుంది.

అయితే దేవిప్రియ ఆలోచనల మీద ముద్ర వేసిన పరోక్ష అనుభవాల ప్రస్తావన ‘పుట్టినరోజు గురించి’ అనే కవితలో వుంది.

నా పుట్టినరోజుదేముంది

ఒక కాడ్వెల్ తరువాత

ఒక శ్రీశ్రీ తరువాత

ఒక పాణిగ్రాహి తరువాత

ఒక చెరబండరాజు తరువాత

పుట్టినవాణ్ని నేను” అంటారు.

ఇక్కడ సూచించిన నాలుగు పేర్లు కేవలం   పేర్లు కాదు. ఈ వరస క్రమంలో ఒక చారిత్రక వికాసం వుంది. ఆధునిక కవిత్వంలో సామాజిక చైతన్యం ఎన్ని మలుపులు తిరిగిందో ఈ నాలుగు పాదాల్లో కనిపిస్తుంది.

ఈ రెండు కవితలు ముందు చదివితేగాని కవిగా దేవిప్రియ యేమిటో పూర్తిగా అర్ధమయ్యే అవకాశం లేదు. ‘పైగంబరకవి’గా కన్ను తెరిచిన దేవిప్రియ ‘నీటిపుట్ట’లో ఏ వర్గం భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఈ కవితల్లో స్పష్టంగా కనిపిస్తుంది. “కవిత్వ నిత్య నిబద్ధం” అని ఆయన నమ్ముతారు. అందుకే చిరకాల స్వప్నాన్ని వాస్తవం చేసిన ” ‘శ్రామికస్వర్గం’ నరకంగా మారుతున్నప్పుడు నిస్సంశయంగా నిరసన వ్యక్తం చేయగలిగారు.

తూర్పు యూరప్‌లో సంభవించిన పరిణామాలు ఏ సామ్యవాద కవికైనా ఆశనిపాతం వంటివే. గ్లాస్‌నొస్త్, పెర్రిస్త్రోయికాల ముసుగులో సోవియట్‌లో ప్రవేశించిన పెట్టుబడిదారీ స్వభావం  ఇక సోషలిస్టు వ్యవస్థ స్వప్నప్రాయమేనని భయపెట్టింది. మనిషి ఆనందానికి ఏ వ్యవస్థ సరిపడ్తుందో తెలియని గందరగోళం యేర్పడింది. ‘ఏది నీ మానవాంశని పరిపూర్ణం చేస్తుందో నాకు అంతుబట్టడం లేదు’ అని వేదన వ్యక్తం చేస్తారు. “ఎర్రబల్బుల్లా వెలిగిన కళ్లలో కలర్ టీవీ వర్ణబింబాలు కదలాడుతున్నప్పుడు, తరతరాల ధార్మిక దాస్యాన్ని ధిక్కరించిన చేతుల్లో కోకాకోలాలు చెమ్మగిల్లుతున్నప్పుడు” సామ్యవాది హృదయ ప్రకంపనలు ఇలాగే వుంటాయి.

ఇదే ధోరణిలో రాసిన మరొక అద్భుతమైన కవిత ‘హిట్లర్ నవ్వు’. ఇది ప్రజాస్వామ్య శిలలమీద ఎర్రపూలు రాలుతున్న రుతువు – అంటూ మొదలయ్యే ఈ  కవితలో దేవిప్రియ రాజకీయ భావాల తీవ్రత తెలుస్తుంది. ఒక శ్రీశ్రీ, ఒక చెరబండ రాజు వారసత్వం నుంచి వచ్చిన కవి మాత్రమే ఈ భావాన్ని ఇంత బలంగా వ్యక్తం చెయ్యగలడు. ఈ రెండు సందర్భాల్లో కూడా దేవిప్రియ కవిత్వ సంవిధానం ప్రత్యేకంగా గమనించాలి. ఇక్కడ కవి పదం మీద ఎక్కువ దృష్టి నిలుపుతాడు. సాధారణంగా  దేవిప్రియ కవితకి ఒక రూపపరిమితి వుంది. అలవాటుపడిన గేయ చందస్సుల నడక ప్రతి కవితలో కనిపిస్తుంది. ‘హిట్లర్ నవ్వు’ ‘ఆదిరహస్యం మానవుడు’ కవితల్లో కూడా ఆ నడక వుందిగానీ, భావాల తీవ్రత దాన్ని అధిగమించింది. కవితలో కొసమెరుపులు ఇవ్వడం ‘రన్నింగ్ కామెంటరీ’ లక్షణం. ఆ లక్షణాన్ని మామూలు కవితలో కామిక్ రిలీఫ్‌గా మార్చుకుని నిర్మాణంలో ఒక సౌలభ్యం సమకూర్చారు దేవిప్రియ. దీనివల్ల ఆయన ఇతర ఆధునిక కవుల్ని బాధిస్తున్న నిర్మాణ సంక్లిష్టత నుంచి బయటపడ్డారు.

గొప్ప ఉద్వేగాన్ని కూడా నింపాదిగా చెప్పడం దేవిప్రియ లక్షణం. కార్యకారణ  సంబంధాలు తెలిసి వుండడం వల్ల ఈ కవిలో అకారణమైన ఆవేశం నుంచి పదచిత్రాలు అదేపనిగా రాలవు. ఆయన భావాన్ని ఒక పదచిత్రంతోనే చిత్రిక పడ్తాడు. తాత్విక సంకోచాలు లేనప్పుడు మాత్రమే కవిలో ఈ స్పష్టత సాధ్యపడుతుంది.

వైరుధ్యాల చిత్రీకరణలో దేవిప్రియ కవిత్వ వ్యక్తిత్వం  కనిపిస్తుంది. నిబద్ధత వుండి ఉద్యమాలలో నిమగ్నం కాలేక పోయాననే ఆవేదన చాలా సందర్భాల్లో వ్యక్తమవుతుంది. కాని ఇలాంటి అనేక రకాల వైరుధ్యాల పొరల్ని విప్పి చూసుకునే నిజాయితీ దేవిప్రియలో వుంది. నిజానికి నిబద్ధత విషయంలొ ఏమాత్రం తెలివి వుపయోగించకుండానే ఎవరినైనా ఇట్టే మోసం చెయ్యవచ్చు. కాని లోపల నిజమైన కవి దేవులాడుతున్నవాడు కవిత్వంలో పగటి వేషం వెయ్యలేడు. ఉద్యమం గాలి అయినా సోకని కవులు కూడా ఒక ఫాషన్‌గా ఉద్యమ కవిత్వం రాస్తున్న ఈ కాలంలో ఒక కవి నిమగ్నత గురించి నిజాయితీగా కంఠం విప్పడం విడ్డూరంగానే కనిపించవచ్చు.

 

గార్డెన్ రెస్టారెంట్ చల్లగాలి

రుచిమరిగిన వాణ్ణి నేను

ఫ్యాను విసిరే చల్లగాలిలో

శరీరాన్ని ఆరేసుకోవడానికి

అలవాటు పడ్డవాణ్ని నేను

అయినా అడివీ

నువ్వంటే నాకిష్టం‘ (‘అమ్మచెట్టు’లో)

ఇక్కడ అడవి దేనికి సంకేతమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1970లలో ఒకవైపు ఉద్యమం తీవ్రతని అందుకుంటున్నప్పుడు మరోవైపు మధ్యతరగతి జీవితంలోకి నయా సంపన్న లక్షణాలు ప్రవేశిస్తున్నాయి. ఆర్ధికంగా కొద్దికొద్దిగా స్థిరపడుతున్న ఈ వర్గంలో అసంతృప్తికి తగిన కారణాలు లేవు. సామాజిక చైతన్యం వున్న మధ్యతరగతి మేధావులలో ఈ స్థితిపై అసహనం వుంది. ‘అడవి’ కవితలో దేవిప్రియ ఈ స్థితిని బలంగా వ్యక్తం చేశారు. అంతేకాదు,

ఈ దేశాన్ని

ప్లాస్టిక్ తీగల విషపుష్పాల ఉద్యానవనాల నుంచి కాపాడడానికి,

ఏదో ఒకనాడు,

నేను నీ సాయమే కోరతాను..” అని వాగ్ధానం చేయగలిగారు..

1984లో దేవిప్రియ ఇలాంటిదే మరో కవిత రాశారు. ఇది దాదాపు ‘అడవి’కవితకు ఒకరకమైన కొనసాగింపు. ఎనభయ్యో దశకం వచ్చేసరికి విప్లవోద్యమం మీద పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. గుత్తపెట్టుబడిదారీ మనస్తత్వాల ముందు గొప్ప ఆదర్శాలు కూడా వీగిపోతాయని తీవ్రవాద కమ్యూనిస్టులు కూడా మరోసారి నిరూపించారు. సిద్ధాంతాలను పణంపెట్టి ‘వ్యక్తి’వాద ముఠాలుగా చీలిపోయారు. దేవిప్రియ అన్నట్టు ‘వర్తమానానికి నిన్నటి గుణపాఠాల వర్తమానం అదేమిటో ఇంకా అందలేదు. నేను నడుస్తోన్న ఈ రోడ్డు నా కళ్లు యేరయ్యేదాక నా కాళ్ళు తెడ్లయ్యేదాకా ముగిసేట్టు లేదు.’. ఎదురుచూపులు ఫలించకుండానే కళ్లముందు మళ్లీ చీకటి అలుముకుంది. రాజకీయ, సామాజిక రంగాలలో ఏర్పడిన ఈ స్తబ్దతని కవి ‘అర్ధరాత్రి నిశ్శబ్దంలోని అనిర్వచనీయ శబ్దం’గా అభివర్ణించారు. ఈ ‘నిశ్శబ్దశబ్దం’ తనని భయపెడుతుందనడంలో ఒక మానసిక అంతరాన్ని సూచించారు.

పుస్తకాల పిరమిడ్‌లో మరొక మమ్మీగా మారిపోతానేమోనన్న ఆందోళన వెలిబుచ్చారు. చివరికి ఒక ఆశ. దిగులు  తనని ఎంతగా ఆవరిస్తున్నా నిరీక్షణ ఆగిపోదన్న ధైర్యం. ఉద్యమంలో ఏర్పడిన అవరోధాలు తొలగిపోయి రేపటి చరిత్రని కొత్త రంగుల్లో రాయగలనన్న ధీమా. దేవిప్రియలో Negative element ఏ కోశానా లేదనడానికి ఈ కవిత ఒక్కటే చాలు నిదర్శనంగా.

అఫ్సర్