చీమల వైపే వుండాలి మనం!

 

 చలసాని ప్రసాద్

అది 30వ తేదీ, జనవరి నెల, 1948వ సంవత్సరం. సాయంత్రం ఏడుగంటల సమయం. గాంధీ గారిని కాల్చేశారని ఆకాశవాణి అరిచింది. నేనప్పుడు పదో తరగతి చదువుతున్నా కృష్ణాజిల్లా – చల్లపల్లిలో. మాఊరు అక్కడికి 4 మైళ్ళు. ఆ ఊళ్ళో రేడియో లేదు. హుటాహుటిని సైకిలేసుకుని వెళ్ళి గొట్టాంతో గోడ మీద నిలబడి గాంధీ గారిని కాల్చి చంపారని చెప్పాను. అయితే అప్పటికి ఎవరు చంపారో ఇంకా ఇదమిద్ధంగా తెలియరాలేదు. ముస్లిం చంపాడేమోననుకుని భయపడిపోయి ఎక్కడికక్కడ ముస్లింలు కమ్యూనిస్టు పార్టీ ఆఫీసులకి తరలి వెళ్ళారు. అప్పటికే కోస్తాజిల్లాలలో కమ్యూనిస్టు పార్టీ ఒక రాజకీయశక్తిగా రూపొందింది. బందరు, బెజవాడ, గుడివాడ, ఏలూరు, గుంటూరు, తెనాలి మొదలైన పట్నాల్లో కమ్యూనిస్టు పార్టీ ఆఫీసులు ముస్లింలతో నిండిపోయాయి. అలనాడు మైనారిటీలకు కమ్యూనిస్టు పార్టీ ఒక గొప్ప రక్షణ కవచం.

గాంధీ గారు చనిపోయి ఆరు నెలలు తిరక్కుండానే మా జిల్లాలు పళనియప్పన్ పోలీసు కాంపులతో నిండిపోయాయి. తీవ్రమైన నిర్బంధకాండ కొనసాగింది. కమ్యూనిస్టు కుటుంబాలు ఊళ్ళో ఉండలేని పరిస్థితి. అప్పుడు మా కుటుంబం మా ఊరి నించి చీమలపాడుకి వలస వెళ్ళింది. అది తెలంగాణా సరిహద్దున ఉన్న ఒక చిన్న జమీందారీ గ్రామం. మేము మా ఊళ్ళో ఉండగానే మా ఇంటికొచ్చి రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, రాజబహద్దూర్ గౌడ్ వారం రోజులున్నారు. అప్పటి తెలంగాణా మాకు రష్యాలాగా అనిపించేది.
chalasani1
       చీమలపాడులో ముస్లిం జనాభా ఎక్కువ. అందరూ మమ్మల్ని ఎంతో ఆదరించేవారు. అందరం వరసలు పెట్టి పిలుచుకునేవాళ్ళం. మా నాన్ననీ, అమ్మనీ ఎక్కువమంది అన్నయ్య, వదిన అనేవారు. మా అమ్మ ముస్లిం స్త్రీలాగానే ఉండేది కూడా. మేమూ అలాగే వాళ్ళని బాబాయి, పిన్ని, అత్తయ్య, మామయ్య అనే పిలిచేవాళ్ళం. నేను అలా పిలిచేవాళ్ళలో జంగ్లీ మామయ్య ఒకరు. అతను కష్టజీవి. ఆదరణకీ, ఆప్యాయతకీ పెట్టింది పేరు. జంగ్లీ మామయ్యకి ముగ్గురు కుమార్తెలు. ఒక కూతురు పేరు సాదఖున్. చాలా చలాకీగా ఉండేది. నిరంతరం నన్ను ఆటపట్టిస్తుండేది. మిగతా యిద్దరు మునవ్వర్, హజరా. తర్వాతి కాలంలో జంగ్లీ మామయ్య కూతురు మునవ్వర్ తో కౌముది పెళ్ళి జరిగింది.

పల్లెటూరుకి, పనిపాటలకి సంబంధించిన ఎన్నో విషయాలు అక్కడ నేను గ్రహించాను. నేను పుట్టి పెరిగిన ఊళ్ళలో కన్నా అక్కడ పేదరికం ఎక్కువ. అక్కడ నించి మేము బెజవాడకి వచ్చేశాక కూడా మా అనుబంధం అలాగే కొనసాగింది. మేము మస్తాన్ బాబాయి అని పిలిచే ఆయనకి కౌముది స్వయానా బావమరిది.

       కౌముది ఆ ఊరి వాడే అని విని నా మనసు పొంగులు వారింది. నాకు తెలిసిన కౌముది, మునవ్వర్ ల కన్నబిడ్డే అఫ్సర్ అని తెలిసి మరింత ఆనందం కలిగింది. బెజవాడలో ఒకసారి కలుసుకుని కబుర్లన్నీ కలబోసుకున్నాం. పల్లెపట్టులలో వుండే ప్రశాంతత,  కలుపుగోలుతనం ఇవి అజరామరం. ఇవి ఉద్యమాలకి ఊతం ఇస్తాయి. అలనాటి కమ్యూనిస్టు పార్టీ సాహిత్య, సాంస్కృతిక రంగాలలో సాధించిన విజయాలు ఎప్పటికీ మనకి గర్వకారణమే.

మనం చీమలవైపే ఉండాలని, పాముల పడగనీడలోకి దిగిపోగూడదనీ నేనక్కడే నేర్చుకున్నాను.

  14.01.2010

కౌముది కవిత్వ సంపుటి “అల్విదా” నుంచి …

(నాన్నగారి పుస్తక్తానికి చలసాని గారు రాసిన ఈ మాటల్ని వెంటనే సంపాదించి, టైప్ చేసి పంపిన కవిమిత్రుడు బాల సుధాకర్ మౌళి కి షుక్రియా)