ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా…

Missamma

ఒకప్పటి సినిమాల్లో పాటలుండేవి. అంతే కాదు పాటకు సినిమా కథకి సినిమా మొత్తం నిర్మాణానికి ఒక అంగాంగి సంబంధం ఉండేది. సినిమా మొత్తాన్ని ఒక కావ్యంగా అంటే సుష్ఠు నిర్మితితో చేయాలని పాటల్ని దానిలో విడతీయలేని భాగం చేయాలనే తపన ఒకటి కూడా ఉండేది. తెలుగు సినిమాహాళ్ళల్లో పొగరాయుళ్ళు సినీమాలో పాట మొదలు కాగానే బయటికి పోయి ఆవురావురు మంటూ ఒక సిగరెట్ లాగించేసి తిరిగి పాట అయి పోయే సరికే లోనికి వస్తూ ఉండేవారు. ఇక్కడ తాత్పర్యం ఆ పాట వినకపోయినా చూడక పోయినా సినిమా అర్థం కాని పరిస్థితి కాని వచ్చే లోపం ఏమీ లేదని.

కాని ఒకప్పటి సినిమాల్లో పరిస్థితి ఇలా ఉండేది కాదు. సినిమాలో పాటకు సినిమా కథకు కథ నడిచే పద్ధతికి అంత విడదీయరాని సంబంధం ఉండేది. పందొమ్మిది వందలో ఏభై దశకంలో వచ్చిన సినిమాల్లో చాలా వాటిల్లో చందమామ పాటలు ఉండేవి. అంటే చందమామా అని వంత వచ్చే జానపద గీతాల గురించి కాదు చెప్పేది. ప్రణయ సందర్భంలో కాని విషాద సందర్భంలోగాని ఇంకో సందర్భంలో కాని నాయికా నాయకులు ఇతరులు కూడా చందమామని పాటలో పెట్టి లేదా అతన్ని ఉద్దేశించి పాటలు పాడేవారు. మనకి 1931లో మాట్లాడే సినిమా మొదటిది భక్త ప్రహ్లాద రాగా 1937 దాకా పౌరాణిక సినిమాలే వచ్చాయి. మొదటి సాంఘిక సినిమాగా మాలపిల్ల వచ్చింది అదే సంవత్సరంలో వచ్చింది దేవత సినిమా. ఇక అక్కడనుండి సాంఘిక సినిమాలు రావడం ఎక్కువైంది. ఈ సాంఘిక సినిమాల్లో పైన చెప్పినట్లుగా చందమామను తలచుకునే పాటలుండేవి. వీటిలో అద్భుతమైన సాహిత్యం ఉండేది. తొలినాటి నుండి ఇటీవలి సినిమాల దాకా చందమామ పాటలు చాలా వచ్చాయి. వాటిలో మంచి వాటిని తీసుకొని ఇక్కడ వివరించి చెప్పాలనే ఉద్దేశం ఈ వరుస వ్యాసాలు రాస్తున్నాను.

మిస్సమ్మ సినిమా 1955 లో వచ్చింది. అంటే ఇప్పటికి దాదాపు అరవై సంవత్సరాలు అయింది. కాని తెలుగు వారు ఈ తియ్యటి సినిమాని మర్చిపోలేదు. ఇప్పటికీ ఏ ఛానల్లో వచ్చినా దాన్ని నూరు శాతం ఆనందిస్తున్నారు. ఇందులోని ప్రతిపాట ఒక ఆనంద రసగుళిక. ఇందులో రెండు చందమామ పాటలున్నాయి. వీటినే నేను వెన్నెల పాటలు అని అంటాను. మిస్సమ్మలో లీల పాడిన రావోయి చందమామ మా వింత గాథ వినుమా అనే పాట ఇప్పటికీ ఎంత బహుళ వ్యాప్తంగా అందరికీ  ఆనందాన్ని కలిగిస్తుందో చెప్పవలసిన పనిలేదు. దానికన్నా నాకు నచ్చిన వెన్నెల పాట ఇంకొకటి ఉంది. దాన్ని కింద ఇస్తున్నాను. చదవండి వినండి తర్వాత దీన్ని చదివితే  మీ ఆనందం మిన్నుముట్టుతుంది.

 

ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా

ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా

ఏమిటో నీమాయ.

వినుటయె కాని వెన్నెల మహిమలు

వినుటయె కాని వెన్నెల మహిమలు

అనుభవించి నేనెరుగనయా

అనుభవించి నేనెరుగనయా

నీలో వెలసిన కళలు కాంతులు

నీలో వెలసిన కళలు కాంతులు

లీలగ ఇపుడే కనిపించెనయా

ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా

ఏమిటో నీమాయ.

 

కనుల కలికమిడి నీకిరణములే

కనుల కలికమిడి నీకిరణములే

మనసును వెన్నగ చేసెనయా

మనసును వెన్నగ చేసెనయా

చెలిమికోరుతూ ఏవో పిలుపులు

నాలో నాకే వినిపించెనయా

ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా

ఏమిటో నీమాయ.

ఈ పాట వినడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

http://www.raaga.com/player4/?id=2159&mode=100&rand=0.2477618893608451

 

ఈ పాట మాధుర్యం వింటే బాగా తెలుస్తుంది. అంతే కాదు సినిమా చూస్తే ఈ పాటలోని గొప్పతనం తియ్యదనం ఏమిటో తెలుస్తుంది. ఇందులో నాయకుడు ఎన్టీఆర్, నాయిక సావిత్రి ఇద్దరూ 1950ల్లో బి.ఎ పాసయ్యారు. ఆనాటికి బి.ఎ పాసు కావడమంటే నేడు పి.హెచ్.డి చేసిన వారికున్నంత స్థాయితో లెక్కవేసేవారు. అయితే ఉద్యోగానికి వచ్చిన అడ్వర్టైజ్ మెంట్లో స్కూలు పంతులు గార్ల ఉద్యోగాలు పడ్డాయి. అందులో మెలికేమిటంటే ఒక ఆడ బి.ఎ ఒక మగ బి.ఎ కావాలని ఇద్దరూ భార్యాభర్తలు అయి ఉండాలని ప్రకటనలో ఉంది. సావిత్రి ఎన్టీఆర్ ఉద్యోగాలకోసం తిరిగి తిరిగి విసిగి పోయారు. దీన్ని చూచి పెళ్ళికాని వాళ్ళిద్దరూ మాకు పెళ్ళి అయిందని అబద్ధం ఆడి, రాసి ఉద్యోగంలో చేరారు. కథలో గమ్మత్తు ఏమిటంటే అప్పటిదాకా వాళ్ళిద్దరికీ పరిచయం లేదు. పరిచయం అయిన రెండు మూడు రోజులకే ఈ ఉద్యోగానికి అప్లై చేశారు. ఆ అమ్మాయి క్రిస్టియన్ అతను హిందూ, ఇద్దరికీ పెళ్ళి కావడం అప్పటి పరిస్థితిలో సాధ్యం  అయ్యే పని కాదు. రెండు నెలలు పని చేసి గొంతు మీద ఉన్న బాకీ తీర్చుకొని పోదామని ఆమె చేరింది.

aVy3KQJ9_592

అబద్ధాలతో బతుకుతుంటారు. భార్యాభర్తలు గా నటించడానికి చాలా కష్టపడుతుంటారు. బయటివాళ్ళు వరుస పెట్టి పిలిస్తే ఆమెకు నచ్చదు. ఒకే ఇంటిలో ఇద్దరు వేరు వేరు గదుల్లో ఉంటారు. ఎవరి వంట వారే చేసుకుంటారు. వీరి రహస్యం వీళ్ళ నౌకరు దేవయ్యకే తెలుసు. వాళ్ళు పనిచేసే బడి యజమాని జమీందారు ఆయన భార్య వీరిద్దరినీ తమ కూతురు అల్లుడూ లాగా చూసుకుంటారు. అలాగే పిలుస్తుంటారు. అలా వరుసలు పెట్టి పిలవడం ఆమెకు ఇష్టం ఉండదు. జమిందారు కూతురు, జమున ఎన్టీఆర్ కి దగ్గర కావడం కూడా సావిత్రికి నచ్చదు. ఆమెకు ఎన్టీఆర్ పైన తనకే తెలియని ప్రేమ కలుగుతున్న కొద్దీ జమిందారు కూతురు జమున పైన అసూయ నానాటికి పెరుగుతుంటుంది. క్రమంగా ఎన్టీఆర్ (రాజారామ్ నాయుడు)ని గాఢంగా ప్రేమిస్తుంది. ఆ విషయాన్ని ఆమె కూడా సరిగ్గా గమనించదు. కాని ప్రవర్తనలో అది అడుగడుగునా అసూయ రూపంలో బయట పడుతుంది. ఈ అసూయతో ఎన్టీ ఆర్ పైన జమునపైన విపరీతమైన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తుంది.

ఈనాటి సినిమాల్లో ఐ లవ్ యూ చెప్పడం ఒక తప్పని సరి ఫార్ములాగా నిలిచింది. ఎన్నో సార్లు ఎంత మంది సమక్షంలోనో చెప్పాలి. ప్రేమ కోసం యుద్ధాలు చేయడాలు వగైరా ఫార్ములాల గురించి ఇక్కడ చెప్పవలసిన పని లేదు. కాని ఇక్కడ సావిత్రి పాత్రను తీర్చిదిద్దిన తీరు గురించి బాగా చెప్పాలి. ఒక కావ్యంలోనో నవలలోనో నాయిక పాత్రను ఒక మంచి నిపుణుడైన కవి ఎలా తీర్చి దిద్దుతాడో సినిమాలో ఈ పాత్రలను అలా తీర్చాడు దర్శకుడు ఎల్వీ ప్రసాద్. నాయిక సావిత్రి ఎన్టీఆర్ ని అంత గాఢంగా ప్రేమించినా అది ఆమె వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దడంలో సహజమైన ఒక పద్ధతిలో చూపుతాడు ఒక మానసిక స్థితిని ఒక నవలలో అద్భుతంగా వర్ణించిన పద్ధతిలో ఆ పాత్ర ప్రవర్తనని చూపుతాడు. కాని ఎక్కడా సావిత్రి నాయకుడిని ప్రేమిస్తున్నానని చెప్పదు. ప్రవర్తనలో కనిపిస్తుంది అదీ వ్యతిరేక రూపంలో. ఇలా సాగే క్రమంలో నాయికతో ఎలా గైనా కాలం గడపాలని కడుపుకోసం నానా కష్టాల పడుతుంటాడు ఎన్టీఆర్. ఈ కష్టం చివరి దశకు వచ్చింది. సావిత్రి గర్భవతిగా పొరపాటు పడి ఆమెకు సీమంతం చేస్తారు జమీందారు దంపతులు వాళ్ళింట్లోనే. అప్పటికే చాలా అసూయని ఆగ్రహాన్ని ఎన్టీఆర్ పైన చూపిస్తూ ఆయన చేస్తున్న తప్పులను తిడుతూ వచ్చిన సావిత్రికి తను అతనిపట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నానని అనుకుంటూనే ఉంటున్నా అదే కొనసాగిస్తుంది. సీమంతం చేసిన తర్వాత ఆరాత్రి అక్కడే నిద్రపోవాలని వాళ్ళిద్దరినీ ఒక గదిలోనికి పంపిస్తారు. ముందుగా గదిలో ఉన్న నాయకుడు తర్వాత సావిత్రి లోనికి వచ్చి ఇదంతా అతని కుట్ర అని తనను ఇలా మోసం చేయడానీకే ఇదంతా చేస్తున్నారని తిడుతుందని నాయకుడు తెరచాటున దాక్కుంటాడు. తర్వాత సావిత్రి లోనికి వచ్చిన తర్వాత ఆమెను భయపెట్టి కిటికీలోనుండి బయటికి దూకి ఇంటికి పోతాడు ఆమెను ఇబ్బందికి గురిచేయడం ఇష్టం లేక.

images

సావిత్రి ఇంట్లో వాళ్ళని పిలిచి తనను తన ఇంటికి పంపించమంటుంది. ఆమె అలా ఇంటికి పోయేసరికే కిటికీ లోనుండి దూకి కాలు విరగ కొట్టుకొని (నాటకం) మంచంలో దీనంగా పడి ఉన్న నాయకుడు కనిపిస్తాడు. ఆమెకు అతనిపైని ప్రేమ అతని పట్ల సానుభూతి ఒక్కసారిగా పొంగాయి. అతన్ని మోసుకొని పోయి లోపలున్న తనుపడుకునే పందిరిమంచం మీద పడుకో బెడుతుంది. కాలి బాధతో నిద్రపోలేనంటాడు. తనకు తెలియకుండానే తనలో ఆతని పట్ల ఎంతో గాఢమైన ప్రేమ ఉందని ఆమె తెలుసుకుంటుంది. అతన్ని నిద్రపుచ్చడానికి పాట అందుకుంటుంది. ఇంత కథా సందర్భాన్ని గర్భీకరించుకొని వచ్చిన పాట పైన చెప్పిన వెన్నెల పాట. తన ప్రవృత్తిని తన మనఃస్థితిని ఈ పాటలో కవి వెల్లడిస్తాడు. సినిమా మొత్తానికి కథని మాటలని అందించిన కవి ఒక్కడే కావడం వల్ల కథా సందర్భాన్ని తెలుసుకొని దానికి ఇమిడేలా పాటనురాసాడు పింగళి నాగేంద్రరావు.

ఇప్పడు పాటని చూస్తే విషయం మనకు తెలుస్తుంది. తనలో కలిగిన ప్రేమను ఆ స్థితిని ఏమిటో ఈ మాయ అని అనుకుంటుంది గదిలోనుండి బయటికి వచ్చి బల్లమీద కూర్చుని నింగిలోని చందమామ వైపు చూస్తూ పాడుతుంది సావిత్రి ఈ పాటని. ముఖంమీద వెన్నెల పడే తీరును కెమేరా కళతో చిత్రించిన తీరు కూడా ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఓ చల్లని రాజా వెన్నెల రాజా ఏమిటో ఈ మాయ అని చందమామతో చెప్పుకుంటుంది. ఈ స్థాయిలో కూడా నాయిక తన ప్రేమని నాయకుడి ఎదురుగా కూర్చుని చెప్పదు. కుస్తీపట్లుపట్టే లా ఉండే కొరియోగ్రఫీతో నాయికా నాయకులు ఒకరిమీద ఒకరు యుద్ధం చేస్తూ ఉండేలా ఉండే నేటి రోమాంటిక్ డ్యుయెట్లని తలచుకొని ఆ పాటల్ని చూస్తే ప్రేమని ఎంత సున్నితంగా నిజమైన శృంగరంగా చిత్రించారో తెలుస్తుంది.  వినుటయె కాని వెన్నెల మహిమలు అనుభవించి నేనెరుగనయా. అంటుంది. వెన్నెల మహిమ తనపైన ఎలాఉందో అర్థం అయింది. ఇక్కడ వెన్నెల తనలోని ప్రేమకి ప్రతీక చందమామ శైతల్యం ఇక్కడ ప్రణయానికి చిహ్నం. నాయికా నాయకులు కలిసి ఉన్నప్పుడు చందమామ చల్లని రాజు, అదే విరహంలో చందమామ చల్లని వెన్నెలే నాయికకు వేడి మంటలుగా తోస్తుంది. విప్రలంభ శృంగారంలో, విరహంలో  చంద్రుడిని తిట్టడం అప్పటి కావ్యాల నుండి ఇప్పటి దాకా వస్తూనే ఉంది. వెన్నెల మండెడిదీ అని ఒక పాటలో అన్నమయ్య కూడా రాసాడు. వెన్నెల మహిమ ఎలా ఉంటుందో ప్రణయంలో అది ఎంత చల్లాగ ఉంటుందో తనకు ఇప్పటి దాకా తెలియదని చెబుతూ తనకు నీపై ప్రేమ కలిగిందని నాయకుడికి నర్మగర్భంగా చెబుతుంది ఇక్కడి నాయిక సావిత్రి.

13909646434184550535-1

కనుల కలికమిడి నీకిరణములే మనసును వెన్నగ చేసెనయా అని అంటుంది. కనులకలికమిడి అని చెప్పడం అద్భుతమైన తెలుగు పలుకుబడి. తల నెప్పి కలిగినప్పుడు సొంటితో కలికం చేసి కంట్లో రాస్తారు. మొదట భగ్గున మండుతుంది. తర్వాత అద్భుతమైన చల్లదనాన్ని ఇచ్చి తలనొప్పిని పోగొడుతుంది. ఇక్కడ చందమామ కిరణాలే కంట్లో కలికం పెట్టినట్లుగా చేసి మనసును వెన్నెగ చేసాయట. ఇది కవి చేసిన అద్భుతమైన ఊహ. ఆమె మనస్సు వెన్నలా కరిగి ప్రియుడిపైన ప్రేమను వర్షించే స్థితికి చేరిందని చెబుతుంది ఆమె. ఇక చివరిగా చెలిమి కోరుతూ ఏవో పిలుపులు నాలో నాకే వినిపించెనయా అని అంటుంది. ఏమిటో  ఈ మాయ అని చివరిగా పాటని ముగిస్తుంది. తనలో అతనిపైని ప్రేమని పూర్తిగా తెలుసుకున్నానని నాయకుడికి చెప్పే తీరుని వర్ణించిన ఈ పాట ఒక మంచి శృంగార రసగుళిక. వెన్నెలని ప్రేమకి ప్రతీకగా చెప్పిన తీరు చాలా బాగుంది.

పింగళి నాగేంద్ర రావు రాసిన ఈ పాటకి సాలూరు రాజేశ్వరరావు కూర్చిన సంగీతం మరింత మాధుర్యాన్ని తెచ్చింది. అంతే కాదు సినీమా ఈ ఘట్టానికి వచ్చే సరికే ఈ పాటని చూసిన ప్రేక్షకులకి మనస్సంతా ఆనందం ప్రేమ నిండిపోతాయి. ప్రేక్షకులు పాత్రలతో తాదాత్మ్యం చెందుతారు. సింధుభైరవి రాగంలో వచ్చిన ఈ పాట మనస్సుకు హత్తుకునే తీరులో ఉంటుంది. ఈ రాగానికి కూడా ప్రణయాన్ని పలికించే గుణం ఉంటుంది.

ఇలాంటి అద్భుతమైన వెన్నెల పాటలు తెలుగు సినిమాల్లో ఆనాటి వాటిల్లో చాలా ఉన్నాయి. వరుసగా వాటి సాహిత్య ఔన్నత్యాన్ని పరిచయం చేస్తాను.

పులికొండ సుబ్బాచారి

subbanna

 

 

 

నిత్య నూతనం అన్నమయ్య పాట !

కాలంతో పాటు పాత బడేవి ఉంటాయి. కాని కాలంతో పాటు నడచి వస్తూ ఎప్పుడూ సరికొత్తగా కనిపిస్తూ ఆనందాన్ని కలిగించేవి కొన్ని ఉంటాయి. సూర్యుడు ఎంత పాత వాడో ఎప్పుడూ అంత సరికొత్త వాడు కూడా. నేను ఇటీవలే ఒక మంచి పాట విన్నాను. అందులోని భావ సౌకుమార్యం, కొత్తదనం చూస్తే ఇది ఆరువందల ఏండ్ల నాడు కట్టిన పాటా, కాని ఇంత సరికొత్తగా ఉందే అని ఆనందం ఆశ్చర్యం కలిగాయి. అది అద్భుతమైన భావనా శక్తిని దాచుకున్న పాట అనిపించింది. పరమానందం కలిగింది అదీ గొప్ప గాయనీమణుల నోట వింటుంటే. ముందు పాటను ఇక్కడ చూపి దాన్ని గురించి రాస్తా.

పొద్దిక నెన్నడు వొడచునే పోయిన చెలి రాడాయెను

నిద్దుర కంటికి దోఁపదు నిమిషంబొక ఏడు                   || పొద్దిక ||

 

కన్నుల నవ్వెడి నవ్వులు, గబ్బితనంబుల మాటలు

నున్నని ఒయ్యారంబులు, నొచ్చిన చూపులును

విన్నఁదనంబుల మఱపులు, వేడుక మీరిన వలపులు

సన్నపు చెమటలు దలచిన, ఝల్లనె నా మనసు                     || పొద్దిక ||

 

ఆగిన రెప్పల నీరును, అగ్గలమగు పన్నీటను

దోగియు దోగని భావము, దోచిన పయ్యెదయు

కాగిన దేహపు సెగలును, కప్పిన పువ్వుల సొలపులు

వేగిన చెలి తాపమునకు, వెన్నెల మండెడిని                || పొద్దిక ||

 

దేవశిఖామణి తిరుమల, దేవునిఁ దలచిన బాయక

భావించిన ఈ కామిని భావము లోపలను

ఆ విభుడే తానుండిక ఆతడె తానెరుగగవలె

ఈ వెలదికి గల విరహంబేమని చెప్పుదము.               || పొద్దిక ||

 

పైన పాట నిర్మాణాన్ని చూస్తేనే ఇది అన్నమయ్య పాట అని తెలిసిపోతుంది. పైన చెప్పిన పాటలో ప్రత్యేకతని గురించి ఇందులోని నేటికీ కనిపించే కొత్తదనాన్ని గురించి చెప్పే ముందు. అన్నమయ్యపాటను గురించి నాలుగు మాటలే చెప్పాలి.

annamayya-telugu-movie1

అన్నమయ్య పాటలో రెండు పాదాల పల్లవి ఉంటుంది. మూడు చరణాలు ఉంటాయి ప్రతి చరణంలో నాలుగు పాదాలుంటాయి వాటిలో యతి మైత్రి ఉంటుంది, కాని ఎక్కడ అనే నియమం లేకుండా ఏదో ఒకచోట తప్పని సరిగా ఉంటుంది. అంతే కాదు పాదాలు నాలుగింటిలో ప్రాసనియమం ఉంటుంది. ఎంచుకున్న ఈ పాట నిర్మాణం పాడడానికి చాలా బాగా ఒదిగి పోతుంది. లయ సాధ్యం అవుతుంది. అయితే మూడు చరణాలకంటే ఎక్కువ ఉన్నవి లేదా తక్కువ ఉన్నవి ఎక్కడో ఒకటి కనిపిస్తాయి. కాని సాధారణంగా అన్నమయ్య పాటలు అత్యధికంగా ఒక పల్లవి మూడు చరణాలు పెన చెప్పిన పద్ధతిలో ఉంటాయి.

ఇది సుమారు ఆరు వందల ఏండ్ల నాడు కట్టిన పాట.  ఇక్కడ నేను రాసిన పాట అని అనలేదు. కారణం అన్నమయ్య కూర్చుని పాటలు రాయలేదు. ఆయన పాటకట్టి పాడుకుంటూ పోయాడు. తర్వాత వాటిని ఆయన కుమారులు శిష్యులు రాసారు. అంతే కాదు వాటిని రాగిరేకుల మీద చెక్కించారు. ఈ కీర్తి ఎక్కువ ఆయన మనవడికి దక్కుతుంది. అన్నమయ్య 32 వేల పాటలు కడితే నేటికి మనకు పద్నాలుగు వేలకు పైగా దొరుకుతున్నాయి. వీటిలో ఏ పాటను పట్టుకున్నా తియ్యదనం జలజలలాడుతుంది.

పై పాటలో ఒక స్త్రీ దూరంగా వెళ్ళిన చెలికాని గురించి బాధపడుతూ విరహాన్ని అనుభవించే ఘట్టాన్ని వర్ణించాడు. ఇందులో పోయిన చెలి రాడాయెను అని అన్నాడు. ఇక్కడ చెలి అనే మాటను చెలికాడు ప్రియుడు భర్త అనే అర్థంలో వాడాడు. చెలి అనగానే స్త్రీ అని అనుకుంటాము. పురుషుని కూడా చెలి అనిడం ఉందని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ స్త్రీ తన భర్త దూరంగా వెళ్ళి ఉన్నాడు అతనినే తలుస్తూ ఉంది ఈమె. ఆమె ఈ స్థితిలో ఉన్న బాధని లోతైన భావాన్ని వర్ణిస్తున్నాడు కవి.

రాత్రి సమయంలో ఉన్న ఆమెస్థితిని చెబుతూ  పొద్దిక (పొద్దు ఇక) ఎన్నడు వొ (పొ)డచునో పోయిన చెలి రాడాయెను. ఈ పొద్దు ఎప్పుడు పొడుస్తుందో రాత్రి ఎలా ఎప్పటికి గడుస్తుందో పోయిన చెలికాడు రాలేదు అన్నాడు పల్లవి లో, తర్వాత ఏ మంటాడో చూడండి. నిద్దుర కంటికి తోపదు నిమిషంబొక ఏడు. నిద్ర రావడం లేదు నిముషమే ఒక ఏడాదిగా గడుస్తూ ఉంది.

మొదటిపాదంలో  కన్నుల నవ్వెడి నవ్వులు గబ్బితనంబుల మాటలు. నవ్వులు ఆమె నోటి తో కాకుండా కన్నులతో నవ్వుతూ ఉంది అనడం అన్నమయ్య కాలంనాటికి ప్రచలితంగా కావ్య ప్రబంధ వర్ణనలలో ఎక్కడా కనిపించదు. పాటలో సరికొత్తగా కన్నులతో నవ్వడం అని చెప్పాడు. ఇది ఈనాటికీ కొత్తగా కనిపిస్తూ ఉంది. గబ్బితనంబుల మాటలు అంటే పైకి గంభీరంగా పలికే పలుకులు అని ఇక్కడి భావం. గబ్బితనం అంటే కపటపు మాటలు అనే అర్థం కూడా ఉంది వీరోచితమైన మాటలు అని కూడా ఉంది. కాని ఇక్కడ లోపలి బాధను వ్యక్తం చేయకుండా పైకి గంభీరంగా చెప్పే మాటలు అనే భావం. నున్నని ఒయ్యారంబలు నొచ్చిన చూపులను అనే పాదంలో రెండూ కొత్త భావనలే ఒయ్యారం అంటే అందం దాని హొయలు.  నున్ననిది అని చెప్పడం అంతే కాదు రెండిండిని తెలుగు పదాలను వాడడం తర్వాత చూపులు గురించి చెబుతూ నొచ్చిన చూపులు అని అనడం బాధను అంటే విరహాన్ని వ్యక్తం చేసే కళ్ళను గురించి చెప్పడం ఆనాటికి సాహిత్యంలో చాలా కొత్త భావన. తర్వాత విన్నతనంబుల మఱపులు వేడుక మీరిన వలపులు అనే పాదం గురించి స్పష్టం. దీని తర్వాతి చరణంలోని నాలుగో పాదం చూడండి సన్నపు చెమటలు దలచిన ఝల్లనె నామనసు. అన్నాడు. సన్నపు చెమటలు. అవి ధారగా కారుతున్న చెమటలు కావు. సన్నగా ఆ విరహస్థితిని చూపే చెమటలు వాటిని తలచుకుంటే మనసు ఝల్లుమందట.

తర్వాతి చరణం మరింత బాగుంటుంది. మొదటి పాదంలో ఆగిన రెప్పల నీరును అగ్గలమగు పన్నీటను దోగియు దోగని భావము, దోచిన పయ్యెదయు అని రెండుపాదాలలో ఒక భావాన్ని చెప్పాడు. కన్నీరు రెప్పల వెనుకే ఆగింది కాని చెక్కిలి మీదికి జారలేదు. చాలా అధికమైన పన్నీటిలో చల్లదనం కోసం మునిగినా అంటే దోగినా తన లోపలి విరహం ఆ పన్నీటిలో మునగలేదు అంటే ఆమె భావన  చల్లారలేదు. ఆతర్వాత చూడండి. కాగిన దేహపు సెగలు కప్పిన పువ్వుల సొలపు, దేహం కాగుతుంటే పువ్వులను కప్పారట ఇది ఆనాటి ప్రబంధ ధోరణి వర్ణనే కాని తర్వాత వేగిన చెలి తాపమునకు వెన్నల మండెడిని అన్నాడు. వెన్నెల చల్లదనాన్ని ఇవ్వకుండా వేడి సెగలు పుట్టిస్తున్నాడు అని చెప్పడం ప్రబంధాలలో ఆయన కాలానికి ఉన్నది. కాని వేగిన చెలి తాపానికే వెన్నల మండుతూ ఉంది అని చెప్పడం మరొక తీరు. ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది.

దోచిన పయ్యెద అని చెప్పడం అద్భుతం. ఆమె పయ్యెదను అంటే పైటను దోచుకున్నాడట. ఇక్కడ దోచుకున్నది పైటను కాదు మరేదో అని  ఎంత సున్నితంగా శృంగారాన్ని వర్ణించడో గమనించవచ్చు. ఇప్పటికి ఎంత మంది చేస్తున్నారు ఇలా. అదృష్టవంతులు అనే సినిమాలో చింతచెట్టు చిగురు చూడు అనే పాటలో ఒక సినిమా కవి (ఆత్రేయ) పాలవయసు పొందు కోరి పొంగుతున్నది, నా పైట కూడ వాడి పేరే పలవరిస్తది. అని చరణంలో రాసాడు. వింటే వాహ్ ఎంత అద్భుతంగా చెప్పాడు అని అనిపిస్తుంది. ఇక్కడ అన్నమయ్య పాట కూడా దోచిన పయ్యెద అని అనగానే వాహ్ ఎంత అద్భుతం అని అనిపిస్తుంది.

ఇక చివరి చరణంలో అన్నమయ్య తన ముద్రను వేంకటేశ్వరుని పేరిట ఏదో ఒక తీరులో వేస్తాడు. దాన్ని దేవశిఖామణి తిరుమల దేవుని తలచిన బాయక, భావించిన ఈ కామిని భావము లోపలను ఆవిభుడే తానుండి అతడే తనను  గురించి తెలుసుకోవాలని అని అనడమే కాకుండా ఈ వెలదికి కమ్మిన ఈ మాయను ఏమని చెప్పాలి అని అంటాడు.

ఇక్కడ ఏ స్త్రీవిరహాన్ని గురించీ అన్నమయ్య వర్ణించలేదు. ఇక్కడ కవే స్వయంగా ఆ స్త్రీ అన్నమయ్య వేంకటేశ్వరుని పరమ పురుషుడుగా తన నాథుడుగా భావించడం ఆ విరహంలో (భక్తికి చెందిన విరహం)  తనను తాను ఒక స్త్రీగా భావించి వర్ణించడం ఉంది. భగవంతుడే పురుషుడు అని తమను తాము భగవద్విరహంలో ఉన్న స్త్రీ అని చెప్పుకోవడం భక్త కవులు అన్నమయ్యలా చెప్పినవారు ఇంకా ఉన్నారు. ఈయన కూడా ఇంకా వేరే పాటల్లో చెప్పడం ఉంది. కాని ఈపాటలో చేసిన వ్యక్తీకరణలు తెలుగు పదాల సొంపు సరికొత్త సమాసచాలనం గమనిస్తే దీనిలో ఈనాటికీ నిలిచిన కొత్త దనం కనిపిస్తుంది.

ఈ నాటి వచన కవులు భావించేలా అతి నవ్యమైన తాజాగా ఉండే భావనలు ఈ పాటలో ఉన్నాయి. కన్నులతో నవ్వే నవ్వులు, నున్నని ఒయ్యారాలు, విన్నతనంబుల మరపులు, సన్నని చెమటలు, ఆగిన రెప్పల నీరు, దోచిన పయ్యెద అని చెప్పడం అన్నీ కూడా వాహ్ వాహ్ అనే అద్భుతమైనవే కాదు, ఆనాటికి లేనివి తాజావి. తర్వాత ఈనాటికి ఇలాంటివి సరికొత్త సృజనకు ప్రతీకలుగా ప్రతిభావంతంగా కనిపించిడం ఈ పాటలోని విశేషం. ఇటీవల హైదరాబాదులోని ఒక సంగీత కార్యక్రమంలో ప్రియ సోదరీమణలు (ప్రియసిస్టర్స్ అని పిలిచే హరిప్రియ షణ్ముఖ ప్రియలు) ఈ పాటని పాడారు. పాటలోని విరహాన్ని అత్యంత మధురంగా పాడి కొన్ని వందలమందిని మంత్రముగ్ధుల్ని చేశారు. విన్నవారికి ఆ పరవశంలోనుండి బయటికి రావడానికి చాలా సేపు పట్టింది. ఆరువందల ఏండ్లనాడు కట్టిన అచ్చతెలుగు పాటకి మాటకి ఇంత శక్తి ఇంత కొత్త దనం ఉందా అని ఆశ్చర్యపోవడం, దాని ఫలితమే ఈ వ్యాసం.

పులికొండ సుబ్బాచారి

చిత్రరచన: బాపు (తాడేపల్లి  పతంజలి గారి పుస్తకానికి వేసిన బొమ్మ)

శేషేంద్ర అద్భుత సృష్టి – స్వర్ణోత్సవ కావ్యం ‘ఋతుఘోష’

87648618-seshendrasharma-the

సాత్యకి (శేషేంద్ర కుమారుడు)కి గుర్తుందేమో, తెలుగు సాహిత్య ప్రపంచం మాత్రం ఒక విషయాన్ని మర్చి పోయింది. అదేమంటే ఋతుఘోష కావ్యం పుట్టి 50 సంవత్సరాలు అయిందని. అంటే స్వర్ణోత్సవ సంవత్సరం అన్నమాట. పట్టుమని పది సంవత్సరాలు బతకని కవితలు లేదా కవితా సంకలనాలు రాసి, పైరవీలతో పురస్కారాలు పొందుతున్న కవులూ, వారి సాహితీ జీవిత రజతోత్సవాలు ఇంకా ఇతర ఉత్సవాలు చేసుకుంటున్న కాలం ఇది. కాదు చేయించే సాహిత్య సంస్థలున్న ఈ కాలంలో తెలుగు సాహిత్య ప్రపంచం ఋతుఘోష వంటి కావ్యానికి స్వర్ణోత్సవ ఋతువు వచ్చిందన్న సంగతి మర్చి పోవడంలో ఆశ్చర్యం లేదు. సరే. ఈ ఋతు ఘోష కావ్యాన్ని రాసినవాడేమన్నా మామూలు ఆషామాషీ కవా. అంటే కాదు సాక్షాత్తు గుంటూరు శేషేంద్ర శర్మ నోబెల్ బహుమతి కోసం పేరును ఒక ఎంట్రీగా పంపబడినంతటి గొప్పకవి.

ఈతరం కవులకు అంటే నా ఉద్దేశంలో 30 లేదా నలబై సంవత్సరాల లోపున ఉన్న వారికి, ఒక సాహిత్య జిజ్ఞాసతో వెనక్కు పోయి పెద్దల దగ్గర తెలుసుకుంటేతప్ప, గుంటూరు శేషేంద్ర శర్మ మంచి ప్రౌఢనిర్భర వయఃపరిపాకంలో కవిత్వం రాస్తున్న కాలం తెలియదు. అందుకే శేషేంద్ర వారికి కేవలం వచన కవిగా లేదా సాహిత్య విమర్శకుడుగా మాత్రమే తెలిసి ఉండే అవకాశం ఉంటుంది. శేషేంద్ర ఎంత గొప్ప కవి అంటే నన్నయ కన్నా ప్రాచీన కవి అయిన తెలుగు వారి గోల్డు నిబ్బు విశ్వనాథ సత్యనారాయణ గారే ఆయన పద్యాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు. అంతే కాదు, పద్యాన్ని శేషేంద్ర లాగా రాయగలిగిన వారు నేడు ఆంధ్ర దేశంలో పట్టు మని పది మంది అయినా లేరు అని చెప్పారు. అంతే కాదు విశ్వనాథ రాసిన కావ్య పీఠికల్లో రెండు చాలా ఉత్తమోత్తమమైనవి అని మా గురుపరంపరలో ఉన్నతులైనవారు చెప్పేవారు. ఒకటి శేషేంద్ర శర్మ ఋతు ఘోష కావ్యానికి, రెండు వి.వి.యల్. నరసింహారావుగారు రాసిన ఆనంద భిక్షువు కావ్యానికి రాసిన పీఠికలు. ఋతు ఘోష మొదటి సారి 1963లో అచ్చు అయింది. తర్వాత చాలా సార్లు ముద్రించబడింది. ఇటీవలే ఆయన కుమారుడు సాత్యకి తిరిగి ముద్రించాడు. ఒక ప్రౌఢమైన పద్య కావ్యం అదీ ఈ కాలంలో ఇన్ని సార్లు అచ్చు కావడం విశేషమే.

ఋతువులను గురించి కావ్యాగానం చేయడం ఈనాటిది కాదు. అలనాటి వాల్మీకి, కాళిదాసుల దగ్గరనుండి ఈనాటి నారాయణ రెడ్డిగారి ఋతు చక్రం దాకా వస్తూనే ఉంది. ఆచరిత్రలోకి పోయే సందర్భం కాదు  కాబట్టి ఆ చర్చను వదిలేస్తున్నాను.  శేషేంద్ర ఋతు ఘోష కావ్యానికి చాలా ప్రత్యేకతలున్నాయి. అది ఒక అనుపమాన (యునీక్) ఋతు కావ్యం. కవి పద్యరచనలో చూపిన ప్రౌఢిమ మాత్రమే దీనికి ప్రధాన కారణం కాదు. శేషేంద్ర ఎంత గొప్ప కవో అంతటి పండితుడు. సంస్కృతాంధ్రాలలో ఆయనుకున్న పాండిత్యం ఆయన కాలంలో పుట్టిన వారికి ఉండడం చాలా అరుదైన విషయం. ప్రచారంలోనికి రాలేదు. ఆయన కూడా తనను తాను అత్యంత ఆధునికుడుగా చెప్పుకోవడానికి ప్రయత్నించడం వల్ల శేషేంద్ర పద్యరచనకు అందవలసిన గౌరవం అందలేదు. లేకుంటే శేషేంద్ర సంప్రదాయ పద్యరచనలో పద్య ఛందోనిర్మాణ సంవిధానంలో మరొక విశ్వనాథ అయిఉండేవాడు.

ఋతుఘోష కావ్యం ఇంత గొప్పది అని చెప్పడానికి మొదటి కారణం దీనిలో ఎక్కడా కృత్రిమత్వం లేకపోవడం. అంటే కవి ఋతువుల్ని తాను చదువుకున్న ప్రాచీన కావ్యాల అనుభవంతో దాని ప్రభావంతో మరికొన్ని పద్యాలను ఋతువుల గురించి రాయడం లేదా మరికొన్ని కొత్త వర్ణనలు చేయడం. ఇలా కాక ప్రతి ఋతువును ప్రతి ఋతువులో వచ్చిన ప్రకృతి రామణీయకాన్ని తను గొంతునిండా అనుభవించి పుడిసిలించిన పద్యాలు ఇవి. అందుకే ప్రతి పద్యం గుండెని సూటిగా తాకుతుంది. ఇందులో మరీ ఎక్కువ పద్యాలు లేవు. ప్రతి ఋతువుకూ ఇన్ని పద్యాలు రాయలనే నియమాన్ని కూడా కవి పెట్టుకోలేదు. రెండు ఋతువులగురించి అయితే ఆరు పద్యాలే రాశాడు. కాని ప్రతి ప్రకృతి పరిణామాన్ని ఒంటి నిండా గుండె నిండాఅనుభవించి రాసిన పద్యాలు ఇందులో ఉన్నాయి. (వసంత 18, గ్రీష్మ 7, వర్ష 10, శరత్తు 7 పద్యాలు 5 గేయాలు, హేమంతం 6, శిశిరం 6). మొత్తం 59 పద్యాలే ఉన్నాయి. కాని ప్రతి పద్యం ఒక ఆణిముత్యం, మరువలేనిది. వెంటాడే గుణం కలిగింది.

శేషేంద్ర పద్యాలలోని భాష అత్యంత ప్రౌఢంగా ఉంటుంది. అది అలనాటి ప్రాచీన తత్సమ బహుళ కావ్యభాష. ఇలాంటి భాష రాయగలిగిన పండితులు మనకు ఆంధ్ర దేశంలో అప్పటికి చాలా మందిఉన్నారు. కాని శేషేంద్ర వంటి భావనా ప్రతిభ ఉన్నవారు ప్రాచీన పద్య ప్రక్రియలో అత్యంత ఆధునిక భావాలను అనుభూతిని రంగరించిన కవి ఆనాటికి లేడు. నేటికీ వెదికి పట్టుకోవలసిందే లేరనే చెప్పవచ్చు. నేడు పద్యరచనలు ఈ స్థాయిలో చేసే వారు లేరు అని చెప్పడం తెలుగు వారికి అవమానమే కాని అలా చెప్పాలంటే మరికాస్త శోధన చేయాలి. సాంప్రదాయికమైన అలంకారాలతో పద్యాలను నడపడం అందరూ చేయగలిగిన, చేసిన పనే. కాని చంపకమాల, ఉత్పలమాల, మత్తేభం, శార్దూలం, సీస పద్యం, కందం వంటి ఛందాలను రాస్తూ పైగా ఋతువుల్ని గురించి రాస్తూ ఆయా ఋతువుల్లో సామాన్య మానవుడు, పేదవాడు పడే బాధల్ని గురించి రాయడం శేషేంద్ర మాత్రమే సాధించిన చూపిన ప్రతిభ, అంతే కాదు సామాజిక చింతన. వృత్త పద్యాలను రాసేటప్పుడు ఏ కవి అయినా ఆగణాలను తప్పనిసరిగా పాటించవలసిందే ఎందుకంటే అవి అక్షర గణాలు కాబట్టి. కాని కవి ఆ పద్యాన్ని ఏ సమాస చాలనంతో ఏ సృజన శక్తితో నడిపాడుఅన్నది ఆ కవికి ఉన్న స్వీయ ప్రతిభను బట్టి ఉంటుంది. ఇక జాతి ఉపజాతి పద్యాలు రాయడం లో కవికి స్వేచ్ఛ ఉంటుంది. కారణం ఇందులో ఇంద్రగణాలు చంద్ర సూర్య గణాలుంటాయి. ఇవి అక్షర గణాలు కాదు మాత్రాగణాలు అంటే కవి తనకు ఇష్టమైన గణాలు ఎంచుకోని రాయవచ్చు. తను ఏవిధమైన లయ సృష్టించాలనుకుంటే దానికి అనువైన గణాలను ఎంచుకోవచ్చు. అంతే కాదు ప్రత్యేకమైన వాక్య నిర్మాణాన్ని అంటే ఇక్కడ పాదనిర్మాణాలను సృష్డించుకోవచ్చు. ఈ పని శేషేంద్ర కంటే ముందు చాలా మంది చేశారు. ఆధునికుడైన కృష్ణశాస్త్రి కూడా పద్యాలలో గణాలను ప్రత్యేకంగా ఎంచుకొని తను కావాలనుకున్న లయను తెచ్చుకున్నాడు. “ఎలదేటి కెరటాల పడిపోవు విరికన్నె వలపు వోలె” ఈ పాదంలో గణాలు చూడండి అన్నీ సలము అనే గణాలను పాదాలలో వాడాడు. కవి ఇంద్రగణాలు ఆరింటిని వాడుకునే స్వేచ్ఛ ఇక్కడి సీస పద్య రచనలో ఉంది. కాని ఒకే గణాన్ని వాడి ఒక ప్రత్యేకమైన లయను ఈ పాదంలో సాధించాడు కవి. శేషేంద్ర సీస పద్య రచనలో ఈ తరహా పాద నిర్మాణ కళను చూపించి సీస పద్యానికి కొత్త అందాన్ని పట్టుకొచ్చాడు, చూడండి.

దుర్నీక్ష్య ప్రభా ధూర్ధరచ్ఛటలతో

క్షేత్ర జీవనుల శిక్షించినాడు

పటు రోష కషాయ కుటిలాంశు కశలతో

గోగణంబుల చావగొట్టినాడు

ఖరమయూఖ క్రూర ఘన కాండ పటలితో

విహగ జాతుల క్షోభవెట్టినాడు

గ్రీష్మకాలప్రాంశు కింశుక ద్యుతులతో

తరువల్లికల కగ్గి దార్చినాడు

గగన ఘనఘోట ఖుర నిరాఘాటధాటి

నలఘు బ్రహ్మాండంబునలగద్రొక్కి

చటుల దుర్జన రాజ్య శాశనమువోలె

సాగె మార్తాండ చండ ప్రచండ రథము.

 

వివిధ నిమ్నోన్నత వీధులం బరుగెత్తి

వైశాఖలో మేను వాల్చె నొకడు

ద్రాఘిష్ఠ ఘంటాపథమ్ములం దిరుగాడి

బెజవాడ కన్నీరు బెట్టె నొకడు

మధ్యాహ్న పరితప్త మార్గమ్ములంబోయి

గుంటూరులో కుప్పగూలె నొకడు,

కాలాహి కుటిల శృంగాటకమ్ములు జుట్టి

నెల్లూరిలో సొమ్మసిల్లెనొకడు

క్రూర దారిద్ర్య దుర్విధి కారణమున

తన భుజాగ్రమునెక్కు భేతాళ మూర్తి

సర్వకాలాను వర్తి రిక్షా ధరించి

లాగలేకను వేసవికాగాలేక.

పైన రెండు సీస పద్యాలలలో గ్రీష్మఋతువును వర్ణించాడు. ఎండా కాలం ఎంత తీక్షణంగా ఉంటుందో అంత ప్రతిభతో రాశాడు ఈ రెండుపద్యాల్ని మొదటి పద్యంలో ఎండ తీవ్రత ఎలా ఉందో చెప్పడం దాని ప్రభావంతో ఏ జనం ఎలా బాధపడుతున్నారో చెప్పడం చేశాడు. సీసపద్యంలో ఒక్కొ పాదానికి  రెండు భాగాలున్నాయి. వాటిలో మొదటి భాగంలో ఒకరమైన నిర్మాణ రీతిని రెండో దానిలో ఒకరమైన నిర్మాణ రీతిని అంటే రెండు భాగాలు కలిపి ఒక పాదానికి ఒక నిర్మాణ రీతిని పెట్టాడు. నాలుగు పాదాలు ఇలాంటి సమమైన నిర్మాణంతో నిర్మించాడు. అందుకే దీనికి అంతటి చక్కటి లయ అమరింది.

ఒక పాదాన్ని చూద్దాం. 1 దుర్నీక్ష్య ప్రభా ధుర్ధరచ్ఛటలతో 2 క్షేత్ర జీవనుల శిక్షించినాడు ఇవి పాదంలో రెండు భాగాలు ఒకటి సూర్యుడి గుణాన్ని చెబుతుంది రెండోది దాని ప్రభావం వల్ల కలిగిన ప్రజల ఇబ్బంది గురించి చెబుతుంది. కన్నెత్తి చూడడానికి ఏమాత్రం వీలుకాని కాంతితో తీక్షణమైన ఎండతో పొలంలో పనిచేసుకునే వారిని శిక్షించాడు అని దీనికి సులభమైన అర్థం. కాని ఈ నిర్మాణ పద్ధతిని నాలుగు పాదాలలో ఒకే విధంగా చేశాడు. నాలుగు పాదాల నిర్మాణంలో సామ్యం చూడండి ప్రతి పాదం చివరలో ఒక క్రియా పదంతో ముగిసింది. శిక్షించినాడు, చావగొట్టినాడు, క్షోభవెట్టినాడు అగ్గిదార్చినాడు అనేవి పాదాంతంలోని నాలుగు క్రియాపదాలు, అలాగే పాదంలోని మొదటి భాగం ముగింపులు అన్నీ ‘తో’  అనే క్రియా సంబంధాన్ని చెప్పే విభక్తితో ముగిసాయి. ఇది పద్య నిర్మాణంలో చూపిన తనదైన కళ. పొలంలో పనిచేసుకునే పనివారిని శిక్షించాడు, గోగణాలను చావగొట్టాడు, విహగజాతుల్ని క్షోభపెట్టాడు, తరువల్లికలకు అగ్గితార్చాడు అలఘు బ్రహ్మాండాన్ని నలగ దొక్కిన సూర్యుడు ఎలా ఉన్నాడంటే అతని రథం దుర్జన రాజ్య శాసనం లాగా కదిలిందట. ఒక మామూలు పద్యకవి అంటే పద్యం రాయడంమాత్రమే వచ్చిన మామూలు కవి గణాలు కిట్టించి సరిపెట్టి పద్యం వచ్చింది అని చెప్పుకోవచ్చు కాని ఉన్న పద్య నియమానలతోనే ప్రత్యేకమైన నిర్మాణ కళని చూపెట్టడం ఛందస్సులో మంచి ప్రభుత ఉన్న కవి మాత్రమే చేయగలడు. అది శేషేంద్ర చేశాడు.

ఇక పైన చూపిన రెండో సీస పద్యంలో కూడా ఇలాంటి ప్రత్యేకమైన నిర్మాణ కళని చూపెట్టాడు.  ఈ పద్యాన్ని రిక్షాకార్మికులు ఎండా కాలంలో పడే బాధను వర్ణించడానికి అంకితం చేశాడు కవి. ఒక్కో పాదాన్ని గమనిస్తే వీటిలోని నిర్మాణ కళ తెలుస్తుంది. పాదం మొదటి భాగంలో ఒక క్రియాపదంతో ముగుస్తుంది రెండో భాగం పడిన బాధతో ముగుస్తుంది. పరుగెత్తి, తిరుగాడి, పోయి, చుట్టి అనే క్రియాపదాలు ఒక్కో పాదం మొదటి భాగంలో చివరిలో వచ్చి కూర్చున్నాయి. అలాగే మేనువాల్చె, కన్నీరు పెట్టె, కుప్పగూలె, సొమ్మసిల్లె అనే నాలుగు బాధను తెలిపే పదాలు అన్నీ ఒక్కో పాదంలో సరిగ్గా ఒకే చోటికి వచ్చేలాగా పాదాలలో వాక్యనిర్మాణాలు చేశాడు కవి. ఇది పద్యరచనలో అత్యుత్తమ నిర్మాణ కళ. అందుకే ఈ పద్యాన్ని చదివితే అత్యంత రమ్యమైన లయ వినిపిస్తుంది. నెల్లూరు, గుంటూరు, బెడవాడు, విశాఖపట్నం నగరం ఏదైతేనేం ఎండకి రిక్షాకార్మికుడు పడిన బాధ కవి తన బాధగా భావించి వర్ణించాడు. ఇలా ప్రతి ఋతువును వర్ణించిన సందర్భాలలో ఆఋతువు పేదవాడికి ఎంత కష్టాన్ని తెచ్చి పెట్టింది అలాగే సంపన్నుడికి ఎలా సుఖాన్ని అమర్చింది అనే విచక్షణతో ఋతువులను వర్ణించాడు శేషేంద్ర. ఋతువుల ప్రభావాన్ని ఇలా వర్ణించిన కవి అంటే ప్రజల బాధన్ని వర్ణించిన తీరు ఇంకా ఏ కవి చేశాడని వెదకాలి.

ఇక పద్యాలలో ఉన్న భాష అత్యంత ప్రాచీన భాష కాని భావాలు అత్యంత నూతనం, సృజన శక్తి భావశబలత సరికొత్తగా మనసుకు హాహి గొలిపే రీతిలోఉంటాయి. కొన్ని పద్యాలు చూద్దాం.

ఈ ఆకాశము నీ మహాజలధులు న్నీధారుణీ మండలం

బీ యందాల తరుప్రపంచనిచయం బీ విశ్వవైశాల్యమెం

తో యంతస్సుషమా సముల్బణముతో నుఱ్ఱూతలూగించె నా

హా యూహా విహగమ్ము తా నెగిరిపో నాశించె నుత్కంఠతో.

 

ఏ మాకంద తకరు ప్రవాళములనో హేలాగతిం గోకిలా

భామాకంఠము శంఖమై మొరసె శుంభత్ కీర నారీ దళ

శ్యామంబై మెరసెన్ నభంబు, భ్రమర జ్యావల్లి మల్లీ సుమ

శ్రీమీనాంక శరమ్ములం గురిసె వాసిం జైత్రమాసమ్మునన్.

రాసింది శార్దూల పద్యాలు భాష కూడా చాలా ప్రౌఢమైంది కానీ భావం అత్యంత సున్నితమైంది. అంతే కాదు కవి ప్రకృతిలో పరవశించి తన స్వీయభావాన్ని ఆవిష్కరించిన తీరు సరికొత్తగా, ఫ్రెష్ గా కనిపిస్తుందీ పద్యంలో. అంతే కాదు పద్యరచనలో పదాలను వెదికినట్లు ఏ పద్యంలో కనిపించదు ఒక్కో పదం దానంతట అదివచ్చి తనకు సరిపడేగణంలో అదే వచ్చి కూర్చున్నంత స్వతంత్రంగా ఉంటుంది శైలి పై పద్యంలో ఇదే కనిపిస్తుంది. భాషలో అంతటి ధార, భావంలో అంతటి ఆవేగం పై పద్యంలో లాగే అన్నంటిలో కనిపిస్తుంది. చైత్ర మాసాన్ని గురించి చెప్పిన పైని రెండో పద్యాన్ని చూడండి ఎక్కడా నట్టుపడదు ధార. నాలుగు పాదాలలో వాక్యం ఏకధాటిగా తిరిగి వచ్చింది ఇది అసాధారణమైన ప్రతిభ ఏ నన్నయ ఏ పోతన ఏ శ్రీనాథుడు వంటి స్థాయి కవులు మాత్రమే చేయగలిగిన పద్యనిర్మాణ శక్తి ఇది. ఇక భావాలు చూద్దాం.

ఇచ్ఛ ప్రకృతిలో రెక్కవిచ్చెనేమొ, యెడద పురుషునిలో మొగ్గ దొడిగె నేమొ విశ్వమందిర కుడ్యముల్ విరగ గొట్టి మోహకల్లోల వీచిక ముంచి వైచె అని తన అనుభూతిని పలికిస్తాడు కవి. ప్రకృతి పట్ల ఒక మోహ కల్లోల వీచిక తనను ముంచి వేసిందని తాను మునిగిపోయిన రీతిని చెప్పాడు. ఏ అంతర్గత సృష్టి సూత్ర మహిమా హేవాకమో అంటాడు ఒక చోట. పొదంల తోటల బాటలాధరలతో పోలేని కూలీ జనుల్ మదిలో గుందుచు చేలలో దిరిగిరా మధ్యాహ్న కాలంబులన్ అంటాడు మరొక చోట. శరీరమొక కారాగారమై తోచగన్ అని అంటాడు ఒక పద్యం చివరిలో ఆసల్ దీరునె దృష్టిచే, మహిత గాఢాలింగనాయుక్తిచే అని సరికొత్తగా చెబుతాడు మత్తేభ పద్యంలో. ప్రకృతి నంతా ఒక పద్యంలో వర్ణించి చివరిలో ఒక శ్రామికుడు ఇంతటి అందమైన ప్రకృతిలో సాయంత్రం దాకా పనిచేసి ఇంటికి బోయేసరికే చీకటి దిక్కులు పిక్కటిల్లింది అని చెబుతాడు. శ్రామికునికి ఈ అందాల ప్రకృతి ఆనందాన్ని ఇవ్వలేకపోయిందని చీకటే మిగిల్చిందని బాధపడతాడు ఒక పద్యపాదంలో.. దూరగ్రహాంతరాగతవినూతన జీవిగ గ్రుమ్మరిల్లి యిల్ సేరగబోవు శ్రామికుడు చీకటి దిక్కుల పిక్కటిల్లగన్ అని రాస్తాడు. ప్రతి పద్యంలో అందం వెనుక ఈ వేదనను చూపుతాడు శేషేంద్ర. ఒక పేద కుటుంబం పడే బాధను ఒకే చోట రెండు పద్యాలలో కూరుస్తాడు. ఇక ఆయన వర్ణించిన ప్రకృతి అందాలు కమనీయం కొన్ని ఇక్కడ గమనిద్దాం.

కనరాదు యామినీ కబరీభరమ్ములో బెడగారు కలికి జాబిల్లి రేక

సికతరీతిగ తమశ్చికురనికరమ్ములో నలతి చుక్కల మోసులలముకొనియె

జిలుగు వెన్నెల చీర చిరిగిపోయినదేమొ కాఱు మబ్బులు మేన గమ్ముకొనియె

యెడదలో నేదేని సుడియుచుండెనొ యేమొ కాకలీ నినదముల్ క్రందుకొనియె

మేను విరిచె నేమె మెల్లగా నిట్టూర్చి

విధురవాయు వీచి విస్తరించె

నాత్మవేదన కొక్క యాకారమై తోచి

నేటి రేయి నన్ను కాటువేసె.

పైది సీస పద్యం కాని ఇందులో సంప్రదాయికమైన అలంకారాలు రాయాలని కవి భావించడు. ప్రతి వర్ణననీ సరికొత్తగా దిద్ది తీర్చాడు కవి. యామిని అంటే రాత్రి కబరీభరం అంటే కొప్పు రాత్రి అనే స్త్రీ కొప్పులో జాబిల్లి రేక కనిపించడం లేదట. తమశ్చికుర నికరం అని అన్నాడు ఇలాంటి సమాసాన్ని ఇంతకు ముందు ఎవరూ సష్టించలేదు. తమస్సు అంటే చీకటి చికురము అంటే వెంట్రుకలు పైన తమశ్చికుర నికరం అనిఅన్నాడు. అంటే వెండ్రుకలు చీకటిలా ఉన్నాయని చెప్పడంకాదు ఆ చీకటి వెంట్రుకల గుంపులా గుబురులా ఉంది అని ఈ సమాసంలో సరికొత్తభావాన్ని సృష్టించాడు కవి. ఇదీ శేషేంద్ర ప్రతిభ. జిలుగు వెన్నెల చీర చిరిగి పోయింది కాబట్టి మేనిమీద కారుమబ్బులు కమ్ముకున్నాయి అన్నాడు. జిలుగు వెన్నెల చీర చినిగి పోయిందేమో అని చెప్పిన కవి ప్రతిభని ఏమని పొగడాలి వాహ్ వాహ్ అని వందసార్లు అనాలి. ఇది అత్యంత నవ్యమైన భావన కాని సంప్రదాయికమైన సీస పద్యంలో రాయగలగడం శేషేంద్ర సాధించిన ఆధునికత. విధుర వాయు వీచి అనడం,  నేటి రేయి ఆత్మవేదన కొక్క ఆకారమై తోచింది అని చెప్పడం అత్యంత నవ్యమైన భావాలు.

ఇక వర్షఋతువను గురించి రాసిన కొన్ని పద్యాలు అత్యంత ప్రౌఢమైనవి గాఢమైన సంస్కృతభాషా పరిజ్ఞానం ఉంటే తప్ప అర్థం కావు. కాని భావాలు అంత్యంత నవ్యం. ప్రకృతి అందాలను ఇంత వర్ణించే కవి పద్యం చివరిలో ఏమంటాడో ఒక చోట చూడండి.

యేమి ధర్మంబు భాగ్యవిహీన దీన

జనులమీదనె దౌర్జన్య చర్యగాని

హేమధామ సముద్దామ సీమలందు

అడుగు వెట్టంగ పర్జన్యుడైన వెఱచు.

అని అంటాడు. పర్జన్యుడు అంటే వర్షాధి దేవతను అదుపులో ఉంచుకునే ఇంద్రుడు కూడా భాగ్యవిహీనులు మీద దౌర్జన్యం చూపిస్తాడు కాని హేమధామ సముద్దామ సీమలలో అంటే కలిగిన వారి బంగారు లోగిళ్ళలో అడుగు పెట్టడానికి ఆయన కూడా భయపడతాడట. నిన్నటి ఫైలిని తుఫాను చేసిన భీభత్సం గుర్తుకు వచ్చేంత నవ్యంగా ఉందీ భావన.

ఇన్ని పద్యాల మధ్యలో నాలుగైదు గేయాలు వాడాడు శేషేంద్ర కొన్ని చూద్దాం.

ముల్లోకములు ఏలు ముద్దు హరిణాంకుడు

విరజాజి తీవలకు విరహిణీ జీవులకు

తరిపి వెన్నెలపాలు తాగించుచున్నాడు

 

ఏగాలికెగసెనో యీ చికిలి తారకలు

అందాల తళుకుతో అప్సరసలకుమల్లె

ఆకాశ రంగానికవతరిస్తున్నాయి.

 

నిర్మాలాకాశంపు నీలాటి రేవులో

పండువెన్నెల నీట పిండి ఆరేసిన

తెలిమబ్బు వలువలు తేలిపోతున్నాయి.

పైభావాలు శేషేంద్ర సృజన శక్తికి మచ్చుతునకలు ముల్లోకములు ఏలే చంద్రుడు విరజాజితీవలకు విరహిణీ జీవులకు తరిపి వెన్నల పాలు తాగిస్తున్నాడంట. వెన్నలను తరిపి పాలు అనిచెప్పడం, నిర్మాలాకాశం అనే నీలాటి రేవులో పండువెన్నెలఅనే నీటిలో పండి ఆరేసిన బట్టలు తెలిమబ్బులు అట అవి తేలి పోతున్నాయట. ఏం చెప్పాలి ఈ భావాల్ని, వాహ్ వాహ్ అంతే. ఇలాంటి మధురమైన వర్ణనలు ప్రతి పాదంలో రంగరించిన అత్యధ్భుత కావ్యం ఋతుఘోష దీన్ని చదవడం అందునా భాషను బాగా అర్థంచేసుకొని చదవడం ఒక అపూర్వమైన, అనుపమానమైన అనుభూతి. ఈ అనుభూతిని ఈ తరం కవులు, పాఠకులు పొందాలి. ఈ నాటి యువతరం కవులు కూడా ఈ ఋతుఘోష కావ్యాన్ని చదివి ఎన్నో నేర్చుకోవచ్చు. అంతే కాదు కవులు అలసత్వాన్ని వదిలిపెట్టాలి. స్నేహించడం, అని ఇంకా రకరకాల కొత్త పదాల్ని కొత్త కవులు ప్రతిభా వంతులు చేస్తున్నారు. నిజమే చేసేటప్పుడు వ్యాకరణం పట్టదు. వ్యాకరణం గురించి మాట్లాడితే మాట్లాడిన వాడు ఛాదస్తుడు. అంతే కాదు శబ్ద స్వరూపం తెలుసుకునే ప్రయత్నం చేయరు. అంటే పుస్తకాలు చదివే బుద్ధి శ్రమపడే లక్షణం అలవరచుకునే వారు తగ్గారు. ఎంత ప్రాచీన భాషలోనైనా ఎంత ప్రాచీన ఛందస్సులోనైనా అత్యంత ఆధునికతని అత్యంత నవ్యమైన సృజన శక్తిని కవి చూపవచ్చు అని చెప్పడానికి ఋతుఘోష కావ్యం మంచి ఉదాహరణ. నేటికవులు దీన్ని చదవాలి శ్రద్ధగా చదవాలి. దీనికి స్వర్ణోత్సవం జరుపుకునే ఈ సంవత్సరంలో మరోసారిదీన్ని ముద్రించాలి. చాలా ఎక్కువ ప్రతులు ఎక్కుమందికి చేరాలి.

పులికొండ సుబ్బాచారి.

subbanna