స్పీడ్ ఇన్ టు టైమ్!

 

sidhareddiచీకటి .

ఇది ఎప్పటికీ ఇలానే ఉండిపోతే ఎంత బావుణ్ణో! ఈ చీకటిలో ఎవరూ లేరు. నేనూ లేను! అంతా శూన్యం. ఈ శూన్యం నుంచి ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ ఎక్కడికో వెళ్లిపోవాలనే తీవ్రమైన కోరిక. అలా వెనక్కి వెనక్కి వెళ్లిపోతూ, బిగ్‍బ్యాంగ్ కంటే ముందు కి వెళ్లిపోతే ఇంకా బావుంటుందేమో. తను, నేను, ఈ విశ్వం, భూమి – అసలేమీ లేనప్పుటి రోజులకి.

లేడీస్ అండ్ జెంటిల్మెన్, టుడే వుయ్ ప్రౌడ్లీ ప్రెజ్ంట్ టు యూ…

వెలుగు.

ఫోకస్ లైట్ వచ్చి మీద పడింది. భరించలేని వెలుతురు. మోయలేని భారం. హాలు నిండా జనాలు. ఎవరు వీళ్లంతా? తండ్రి కి దూరమైన కొడుకు, ప్రియురాలిని పోగొట్టుకున్న ప్రియుడు, ప్రేమించడం చేతకాని అసమర్థుడు, ఓడిపోయి గెలవాలనుకునే తపనతో రగిలే యోధుడు, మోసగాడు, ఎత్తుకు పై ఎత్తు వేసేవాడు, అన్నీ పోగొట్టుకున్న పనికిరాని వాడు – జీవితంతో పోరాటానికి దిగిన సైనికుల సమూహం.
…ది ఒన్ అండ్ ఓన్లీ , రఘురామ్.

చప్పట్లు. ఫ్లాష్ లైట్లు. జనాలు.

స్టేజ్ మధ్యలోకి నడిచాను. ఫోకస్ లైట్ నన్నే ఫాలో అయింది. రెండు చేతులెత్తి ఆడియన్స్ వైపు చూశాను. ట్రేడ్‍మార్క్ విన్యాసం. రేపు హెడ్‍లైన్స్ లో ఇదే ఫోటో. రఘు రాక్స్ ది టెక్నోకాన్ఫరెన్స్.

ఆడిటోరియంలో కూర్చుని ఎదురుచూస్తున్న జనాలు.

స్టేజ్ మీద నేను. నా జీవితం ఇంకెక్కడో నాకు సంబంధం లేకుండా గడిచిపోతోంది.. ప్రపంచంలో ఏదో మూల ఎవరో ఇప్పుడే కంప్యూటర్ ముందు కూర్చుని నా కంపెనీ షేర్స్ కొందామా వద్దా అని ఆలోచిస్తుంటారు. కొంటే నా మీద మరి కొంత భారం. ఇంత భారం నేనెలా మొయ్యాలి? మోయగలనా?

ఒక క్షణం కళ్లు మూసుకున్నాను. ఒక జ్ఞాపకం ఫ్లాష్ లా మెరిసింది. హాయిగా నిద్రపోతున్నట్టుగా బెడ్ రూంలో పడుకునొందొక ఆవిడ. పక్కనే డాక్టర్లు. వాళ్లని పట్టుకుని భోరున ఏడుస్తున్న ఒక పిల్లవాడు. అతని పక్కనే నిల్చుని వాడిని పట్టుకుని ఏడుస్తోన్న ఇద్దరు ముసలివాళ్ళు. పక్కనే మరొక బెడ్ రూంలో బెడ్ పై పడుకుని ఫ్యాన్ వైపే చూస్తోన్న ఒక వ్యక్తి.

గొంతు సవరించుకున్నాను. ఆడిటోరియంలో మసగ్గా కనిపిస్తున్న ప్రేక్షకుల వైపోసారి చూశాను. ఎంతమంది జనాలు! నా పేరు రఘురామ్. అది అందరికీ తెలుసు. కానీ నేను ఎవ్వరికీ తెలియదు; చివరికి నాక్కూడా!

వీళ్లల్లో ఏ ఒక్కరికైనా నేను తెలిసుంటే ఈ వేషం తీసేస్తాను. ఈ జీవితం చాలించేస్తాను. ఎక్కిన మెట్లన్నీ దిగేసి, కాలం అద్దిన రంగులన్నీ కడిగేసి, వెనక్కి, ఇంకా వెనక్కి వెళ్లిపోతాను. బిగ్‍బ్యాంగ్ అంత వెనక్కి కాకపోయినా, యూనివర్శిటీ కారిడార్లో నా వైపు నడిచొస్తూ ఆమె చూసిన ఓర చూపులో కాలి బూడిదైపోతాను. ఆ బూడిదలోనుంచి ఏక కణ జీవిగా గా ఆవిర్భవిస్తాను. జీవితాన్ని మళ్లీ మొదట్లో ఆరంభిస్తాను.

మరి ఇన్నాళ్ల నీ కష్టం సంగతేంటి? – వెయ్యి గొంతుకలు ఒక్కసారే అడిగాయి.

పది సంవత్సరాల్లో మూడు స్టార్టప్స్. మల్టీ మిలియన్ డాలర్స్. క్లోజ్ టు బిలియన్.

సాధించింది కొండంత. కోల్పోయింది విశ్వమంత.

 

…టుడే ఇండియా హాజ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్. ఫ్రమ్ ధ్రీ ధౌజెండ్ స్టార్టప్స్ యాన్ ఇయర్ బ్యాక్, టు ఏ ప్రొజెక్టెడ్ ఫిఫ్టీన్ థౌజెండ్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్… ఏ న్యూ ఎరా ఫర్ స్టార్టప్స్ హాజ్ బిగన్.

స్పీచ్. అంతా ప్రిపేర్డ్. ఎవరో రాసిచ్చింది. ఇంతకుముందు ఇంకో దగ్గర మాట్లాడిందే!

మాట్లాడ్డం మొదలుపెట్టగానే తను నడిచొచ్చింది. ఎదురుగా కూర్చుంది. అంత ఎత్తులో ఎలా కూర్చుంది? ఎదురుగా మరొక స్టేజ్ ఉందా? బ్యాగ్ లోనుంచి ఫ్లాస్క్ తీసి బయట పెట్టింది. అందులో వేడి నీళ్లు. ఇంకో పక్కన రేడెల్ శృతి బాక్స్ పెట్టుకుంది.

నాకిప్పుడు ముప్ఫై ఐదు. తనింకా అప్పట్లానే ఉంది.

ఫరెవర్ ట్వంటీ వన్. పడి పడి లేచే వయసు.

తను పాడడం మొదలుపెట్టింది.

రాగం మోహనం. తాళం ఆది. రచన పూచి శ్రీనివాస అయ్యంగార్.

నిన్ను కోరి యున్నానురా,
నిఖిల లోక నాయకా.
నన్ను పాలింప సమయము రా.

నువ్వు తాళం సరిగ్గా వేయటం లేదు. ఎన్ని సార్లు చెప్పాలి. ఇంత సింపుల్ విషయం ఎందుకు అర్థం కాదు నీకు? పేరుకి పెద్ద మ్యాథ్స్ జీనియస్. ఇంకోసారి చెప్తాను. ఇదే లాస్ట్ టైం. సంగీతానికి శృతి, లయ ప్రధానం.
ట్యాప్. ఒన్ టూ థ్రీ. ట్యాప్. టర్న్. ట్యాప్. టర్న్. అర్థమైందా? ఇది ఆది తాళం. ఏంటా తలూపడం? నీతో సమస్య ఏంటో తెలుసా? నువ్విక్కడ ఉండవు. ఉంటే గతంలో లేదా భవిష్యత్తులో. ప్లీజ్ బి విత్ మి. రైట్ హియర్. రైట్ నౌ.

ట్యాప్. ఒన్ టూ థ్రీ. ట్యాప్. టర్న్. ట్యాప్. టర్న్.

Kadha-Saranga-2-300x268

పోడియం మీద మెల్లగానే ట్యాప్ చేశాను. కానీ మైక్ క్యాచ్ చేసేసింది. చప్పట్లు కొడుతున్నారనుకున్నారో, చప్పట్లు కొట్టమని సిగ్నల్ చేస్తున్నాననుకున్నారో, ఆడిటోరియం మొత్తం చప్పట్లతో మారుమ్రోగింది.

తను నన్నే చూస్తోంది. నవ్వుతోంది.

ఆ నవ్వులో ఎన్నో ప్రశ్నలు. విన్నావా? వింటున్నావా? ఈ చప్పట్లకోసమేగా నువ్వింత వేగంగా పరిగెత్తుకు వెళ్లిపోయింది? కానీ ఈ చప్పట్ల శబ్దం వెనుక ఏం వినిపిస్తోంది? ఔట్ ఆఫ్ ట్యూన్, ఔట్ ఆఫ్ పిచ్, ఔట్ ఆఫ్ రిథమ్ – అర్థమవుతోందా? అందుకే తాళం ఎలా పెట్టాలో ప్రాక్టీస్ చెయ్యమనేది. గుర్తుందా?

సంగీతానికే కాదు, జీవితానికి కూడా శృతి, లయ ఉండాలని తను నాకెందుకు చెప్పలేదో?

… రేపు లేదు. ఏదేమైనా, ఇవాళే మొదలు పెట్టండి. మీరు చెయ్యకపోతే ఇంకొకరు మీ అవకాశాన్ని దోచేస్తారు. ఎప్పుడూ లేనంత కాంపిటీటివ్ ప్రపంచం ఇది. స్టార్ట్ సమ్‍థింగ్ గుడ్. అండ్ లెట్ టుడే బి దట్ డే.

స్పీచ్ అయిపోయింది. స్టాండింగ్ ఒవేషన్.

ట్యాప్. ఒన్ టూ థ్రీ. ట్యాప్. టర్న్. ట్యాప్. టర్న్. ఆది తాళం. తను నాకు నేర్పించిన మొదటి సంగీత పాఠం.

లైట్సాగిపోయాయి. తనూ చీకట్లో మాయమైంది. తన పాట మాత్రం ఆగలేదు.

తనిక్కడ లేదని తెలుసు. కానీ ఎక్కడ చూసినా తనే ఎందుకు ఉంది?

*****
సర్ వి హావ్ టు ఫ్లై టు చెన్నై, ఫ్రమ్ దేర్ టు అబుదాబీ అండ్ దెన్ టు జోహెనెస్‍బర్గ్.

చెన్నై?

యెస్ సర్. ఇక్కడ్నుంచి బిజినెస్ క్లాస్ దొరకలేదు. సో…, ఇబ్బందిగా చెప్పాడు మిస్టర్ శివరామ్.

ఇట్సాల్‍రైట్ అన్నాను.

నిజానికి ఇట్ ఈజ్ నాట్ ఆల్రైట్. చెన్నై. ఆ ఊరి పేరు వింటేనే పాత జ్ఞాపకాలేవో అలల్లా ఎగిసిపడతాయి. ఊపిరాడకుండా చేస్తాయి. కానీ ఇప్పటికిప్పుడు ట్రావెల్ ప్లాన్ మార్చడం ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకే సరే అన్నాను. లండన్ టు బెంగుళూర్. ఒక రెండు గంటలు హోటల్లో నిద్ర. టెక్నోకాన్ఫరెన్స్. ఆఫ్టర్ పార్టీ. మరో గంట నిద్ర. ఇంకాసేపట్లో బెంగుళూర్ టు చెన్నై ఫ్లైట్. అక్కడ్నుంచి ఇంకో రెండు ఫ్లైట్స్.

48 గంటల్లో నాలుగు ఫ్లైట్స్. జీవితం ఎంత ఫాస్ట్ గా గడిచిపోతుందో? పగలు, రాత్రి తేడా తెలియకుండా ఉంది. క్యాబ్ లో వెనుక సీట్లో కూర్చుని కళ్లు మూసుకున్నాను.

ఒక పెద్ద సూట్‍కేస్ ని లాక్కుంటూ చెన్నై ఎయిర్‍పోర్ట్ దగ్గర త్రిశూలం రైల్వే స్టేషన్ లో దిగాడొక యువకుడు. మరో చేతిలో క్యాబిన్ బ్యాగేజ్. మోయలేని బరువు. అరకిలోమీటర్ దూరం. సబ్‍వే లో ఆ లగేజ్ లాక్కుని వచ్చేసరికి చెమటలు పట్టిపోయాయి. ఎయిర్‍పోర్ట్ లో జనాలు చాలామందే ఉన్నారు. ప్రయాణం చేసే వాళ్లకంటే వాళ్లని సాగనంపడానికి వచ్చిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. అమ్మలు, నాన్నలు, అత్తలు, మామయ్యలు, బాబాయిలు, పిన్నిలు, పిల్లలు, పెద్దలు – తను మాత్రం ఒంటరిగా! ఏడుపొచ్చిందతనకి.

కళ్లు తెరిచాను. బెంగుళూర్ ఎయిర్‍పోర్ట్ ఎక్స్‌ప్రెస్‍వే మీద కారు వేగంగా వెళ్తోంది.

కళ్లు మూస్తే చాలు. ఏదో ఒక పాత జ్ఞాపకం వరదలా తడిపేస్తోంది. అసహనంగా సీట్లో కదిలాను.

శివరామ్ వెనక్కి తిరిగి, ఆర్యూ కంఫర్టబుల్ సర్? అన్నాడు.
ఐ యామ్ ఆల్రైట్ అని చెప్పి సీట్లో వెనక్కి వాలాను. బెంజ్ కార్లో ఏసి వేసుకుని కూర్చున్నా ఇబ్బందిగా కదుల్తుంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. కానీ నా గురించి ఇతనికేం తెలుసు. పాపం అనుకున్నాను.

పదిహేనేళ్ల క్రితం. జనాలతో నిండిపోయిన నెల్లూరు స్టేషన్ లో ఒంటరిగా నేను. హౌరా ఎక్స్‌ప్రెస్. ఓ కొన్ని గంటలు లేటుగా వచ్చింది. దూసుకెళ్లే అలవాటు లేదు. అంతటి దూకుడూ లేదు. అందరికంటే వెనుక. కష్టపడి ఒక చేత్తో గేట్ దగ్గర ఒక కాలు పెట్టుకునేంత స్థలం. ఒక చేతిలో చిన్న సూట్‌కేస్. మరొక చేతిలో ప్రాణాలు. ఎంతసేపు అలా నిలబడ్డానో తెలియదు. కావలి చేరుకునే లోపలే ఎక్కదో దగ్గర పడిపోయి చచ్చిపోతానేమోనంత భయం. నాన్నంటే విపరీతమైన అసహ్యం వేసింది. ట్రైన్ స్టేషన్ దాటి వెళ్లినంత సేపూ రిజర్వేషన్ కంపా‌ర్ట్‌మెంట్ లో కంఫర్టబుల్ కూర్చున్న వాళ్లు, తమని సాగనంపడానికి వచ్చిన వాళ్లకి టాటా చెప్తూనే ఉన్నారు.

రిజర్వేషన్ చేపించడానికి డబ్బులు లేవు. అమ్మని హాస్పిటల్ లో చూపించడానికి డబ్బులు లేవు. ఇంట్లో టీవి కొనడానికి డబ్బులు లేవు. నాకు సైకిల్ కొనడానికి డబ్బులు లేవు. ఎందుకో, నాన్న దగ్గర దేనికీ డబ్బులుండవు?

నీతో సమస్య ఏంటో తెలుసా?

నేనేదో చెప్దామనుకునే లోపలే తనే మళ్లీ మొదలుపెట్టింది. ఎందుకిలా కష్టపడి వేళ్లాడ్డం. చేతిలోని ఆ బరువు ని పడేసెయ్. కొంచెం ఈజీగా ఉంటుంది – అంది.

నాకున్నవి ఇవే బట్టలు. ఎలా పడెయ్యగలను?

భారమైనప్పుడు దేన్నైనా వదిలెయ్యడమే!

ట్రైన్ వేగంగా వెళ్తోంది.

నీకేం. ఎన్నైనా చెప్తావు. అసలు నువ్వు ఎలా గాల్లో ఎగరగలుగుతున్నావు?

బికాజ్ ఐ యామ్ ఫ్రీ.

తను ఎగిరిపోయింది. నేనింకా అక్కడే ఉన్నాను. పదిహేను సంవత్సరాల క్రిత్రం నేను పట్టుకుని వేలాడిన ట్రైన్ రాడ్ ఇంకా చేతిలోనే ఉంది. భుజాలు లాగేసే నొప్పి ఇప్పటికీ తెలుస్తుంది. చెమటలు పట్టి చెయ్యి జారిపోయి చచ్చిపోతానేమోనన్న భయం వెంటాడుతూనే ఉంది. ఎలాంటి సందర్భంలోనైనా జీవితం కంఫర్టబుల్ ఉండగలిగేంత డబ్బు సంపాదించాలన్న కసి ఇంకా రగులుతూనే ఉంది.

SpeedIntoTime (1)ఎక్స్‌ప్రెస్ వే మీద కారు ఆగింది. ముందెక్కడో యాక్సిడెంట్ అయినట్టుంది. ట్రాఫిక్ జామ్. ఉదయం మూడు దాటింది. కారు కిటికీ అద్దాలను మంచు మసగ్గా కప్పేసింది. కారులో హోటల్ కాలిఫోర్నియా పాట ప్లే అవుతోంది.

Up ahead in the distance, I saw a shimmering light
My head grew heavy and my sight grew dim
I had to stop for the night
There she stood in the doorway;

ఆమె రోడ్ పక్కన నిలబడి ఉంది.

ఒక చేతిలో క్యాండిల్ లైట్. మా కారు దగ్గరకి నడిచొచ్చింది. ముందు సీట్లో క్యాండిల్ లైట్ వెలుతురులో ఎవరికోసమో చూసింది. ఆ వెలుగులో తనెవరో అర్థమైంది. మసక వెలుతురులోనూ ఆమె సన్నటి ముక్కు, పొడవాటి మొహాన్ని గుర్తుపట్టాను. నాకు మాత్రమే తెలిసిన తను, వెనక కిటికీ దగ్గరకొచ్చి ఆగింది. అద్దం పైకెత్తి ఆమెను చూడాలనిపించింది. కానీ ఆమె నా కళ్లల్లోకి చూడగానే బిగుసుకుపోయాను. ఆమె తన వేలితో కిటికీ అద్దం పై కప్పిన మంచులో వేలితో మెల్లగా ఏదో రాసింది. తన మరో చేతిలో ఉన్న క్యాండిల్ ని ఎత్తి ఆ అక్షరాలకు వెలుగు చూపించింది.
మైత్రేయి
*****
ఆమె చూపు, ఆమె జ్ఞాపకం చుట్టూ నా జీవితమంతా ఘనీభవించుకుపోయిందని ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది.

చెన్నై విజయ హాస్పిటల్ లో కారిడార్లో నిల్చుని ఉంది తను. వీసా పేపర్స్ పట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చాను. లాస్ట్ మినిట్ వరకూ ఏమీ తేలలేదు. రాత్రి ఫ్లైట్ కి బయల్దేరి వచ్చెయ్యమని లండన్ నుంచి ఆర్డర్స్.
ఇప్పుడెలా? అంది.

నేను వెళ్లాలి.

అంకుల్ ని ఈ పరిస్థుతుల్లో వదిలేసి?

నన్నేం చెయ్యమంటావు మైత్రేయి? ఎప్పుడూ ఇంతేనా! నా జీవితంలో అడుగడుగునా అడ్డంకులేనా. నన్ను ముందుకెళ్ళకుండా కాళ్లకు వేసుకున్న గుదిబండ నాన్న. ఎగరనీయకుండా రెక్కలు విరిచిన రాక్షసుడు నాన్న.

ఫర్ గాడ్ సేక్. హి హాడ్ ఏన్ హార్ట్ ఎటాక్. యూ కాన్ట్ స్పీక్ లైక్ దట్. హి ఈజ్ యువర్ ఫాదర్.

అద్దాల కిటికీలోనుంచి సాయంకాలపు ఎండ నా కళ్లల్లో పడుతోంది. ఏంటీ బంధాలు? వీటిని వదిలించుకోలేమా? కళ్లు మూసుకున్నాను. ఈ చీకటి నయం. ఇక్కడ ఎవరూ ఉండరు. రెండేళ్లు, పగలూ రాత్రి కష్టపడితే వచ్చిన ఆన్‍సైట్ ఆఫర్. నా కలల ప్రపంచంలోకి మొదటి మెట్టు. కానీ ఇదే ఆఖరి మెట్టు కాబోతోందా? భరించలేని బాధ. ఒక్కసారిగా గట్టిగా అరిచేశాను. కష్టపడడం, బాధపడడం తప్ప నాకింకేమీ తెలియదు. ఎందుకు నాకే ఇలా జరుగుతోంది? ఏంటీ శాపం?

మా బంధువులంతా నన్నే చూస్తున్నారు. తను నన్ను దగ్గరకు తీసుకుంది. ఏంటి రఘు, చిన్న పిల్లాడిలా. నువ్వు బయల్దేరు. అంకుల్ ని నేను చూసుకుంటాను, అంది. థాంక్స్ చెప్పాలో, సారీ చెప్పాలో కూడా తెలియని దయనీయ స్థితి నాది. ఆమె కళ్ళల్లోకి చూశాను. ఆమె చూపుకి అర్థం తెలియదు. ఐసియూ లో ఉన్న నాన్న మొహం కూడా చూడకుండా బయల్దేరాను. వెనక్కి తిరిగితే, వెనకడుగు వేస్తాననే భయం. పరుగులాంటి నడకతో హాస్పిటల్ నుంచి భయటపడ్డాను.

వీటన్నింటిని మర్చిపోవడానికి ఇంకెన్ని జన్మలు పడుతుందో! కాలంలోకి వేగంగా వెళ్లిపోతే దూరం పెరిగి ఈ జ్ఞాపకం కనుమరుగవుతుందనుకున్నాను. కానీ ఒక రాత్రి లండన్ లో అది ఎంత అబద్ధమో తెలిసి వచ్చింది.
*****
అమ్మకి ఒకటే కోరిక ఉండేది. మీ నాన్నను ఎప్పటికైనా ఒక్కసారి ఫ్లైట్ ఎక్కించరా అని అడిగేది. ఏం నువ్వు ఎక్కవా? అని అడిగితే, అమ్మో నాకు భయం అనేది. అమ్మ అందరికంటే ముందే ఎగిరిపోయింది.
నా చిన్నప్పుడు, ఇందిరాగాంధీ, ఎలక్షన్ క్యాంపైన్ కి హెలికాప్టర్ లో నెల్లూరు వస్తుందని తెలిసి, నన్ను కూడా తీసుకెళ్లాడు నాన్న. అందరూ ఇందిరాగాంధీ ని చూడ్డానికి వెళ్తే నాన్న మాత్రం గ్రౌండ్ దగ్గర నిల్చుని, నన్ను భుజం మీద ఎక్కించుకుని చాలా సేపు నాకు హెలికాప్టర్ నే చూపించాడని చెప్పేది అమ్మ.

మరి ఎందుకు నాన్నా? ఎగిరిపోవాలనే నా ప్రతి ప్రయత్నానికీ అడ్డు తగిలావ్?

నాన్న నాకు ఎప్పటికీ అర్థం కాడు. బహుశా నేను కూడా నాన్నకు ఎప్పటికీ అర్థం కానేమో! టైం చూసుకున్నాను. ఐదున్నరైంది. ఫ్లైట్ చెన్నై చేరడానికి ఇంకో పదిహేను నిమిషాలు పడ్తుందేమో! ఎన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ చెన్నై లో అడుగుపెట్టడం? ఆ రోజు విజయ హాస్పిటల్ నుంచి బయల్దేరింది, మళ్లీ వెనక్కి తిరిగి చూసింది లేదు. ఇండియాకి చాలా సార్లే వచ్చాను. కానీ చెన్నై కి రావాలంటేనే ఏదో భయం.

నా భయం వృధా పోలేదు. చెన్నై లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెన్నై ఎయిర్‍పోర్ట్ రన్ వే మొత్తం నీటితో నిండిపోయింది. అతి కష్టం మీద ల్యాండింగ్ అయింది. వర్షంలో తడుస్తూనే అందరం ఎయిర్‍పోర్ట్ లౌంజ్ లోకి చేరుకున్నాం.

అన్ని ఫ్లైట్స్ లేట్ గా నడుస్తున్నాయని ప్రకటించారు. కొన్ని గంటల తర్వాత కొన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయని చెప్పారు. బిజినెస్ క్లాస్ కాబట్టి మహారాజా లౌంజ్ లో మమ్మల్ని కూర్చోబెట్టారు. మెల్లిగా ఎయిర్‍పోర్ట్ లోపలకి కూడా నీళ్లు రావడం మొదలయింది. అప్పటివరకూ మమ్మల్ని సౌకర్యవంతంగా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్న స్టాఫ్ కూడా కాసేపట్లో మొదటి ఫ్లోర్ లోకి చేరుకున్నారు. మమ్మల్నీ అక్కడికే వెళ్లమని సలహా ఇచ్చారు. కాసేపట్లో ఎయిర్‍పోర్ట్ లోని జనాలంతా ఒకే దగ్గరకు చేరుకున్నారు.

చాలా సేపటి వరకూ, వర్షమే కదా; సునామీ కాదు అనుకున్నాం అంతా! చిన్నప్పుడు కాగితం పడవలు నడిపించిన వర్షం, కాలేజ్ రోజుల్లో తడిసి ముద్దవుతూ కూడా గంతులేసిన వర్షం. వర్షం కూడా ఇంత విధ్వంసకరంగా ఉంటుందని చాలా రోజులకి గుర్తు చేసింది. గత వందేళ్లల్లో లేనంత వర్షం.

చెన్నై పరిసర ప్రాంతాలన్నీ వరదనీటిలో మునిగిపోయాయి. అందరూ లౌంజ్ లో ఉన్న టివి ముందు కూర్చుని కళ్లార్పకుండా చూస్తున్నారు. అందరి మొహాల్లో టెన్షన్. నాకు మాత్రం నవ్వొచ్చింది. ఇంకో కొన్ని గంటల్లో నేను జోహెనెస్‍బర్గ్ లో లేకపోతే ఒక పెద్ద ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుంది. జీవితంలో నాకు ఏదీ ఈజీగా దొరకదేమో! ప్రతి దాని కోసం ఇలా తీవ్రమైన పోరాటం తప్పదేమో!

జీవితం నాతో ఆటలాడుతూనే ఉంది. నేను ఆడి గెలుస్తూనే ఉన్నాను.

కానీ మనుషులతో, మనసులతో పోరాడొచ్చు. ప్రకృతితో పోరాడడమెలా?

ఆమె పోరాడుతోంది. వరదలో చిక్కుకుపోయిన లక్షలమందిని కాపాడడానికి వేలమంది యువతీ యువకులు స్వచ్ఛంధంగా బయటకొచ్చారు. ఎవరికి తోచిన రీతిలో వారు సాయం చేస్తూనే ఉన్నారు. వాలంటీర్స్ లో ఒకరిగా టివిలో కనిపించింది మైత్రేయి.

పధ్నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఆమెను చూడ్డానికి ఇన్ని దేశాలు తిరగాలా? ఇన్ని మిలియన్ డాలర్లు సంపాదించాలా? ఇన్ని కష్టనష్టాలకోర్చాలా? చివరికి టివిలో వార్తల్లో ఆమెను చూడాలా?

తను ఇప్పటికీ అలానే ఉంది. ఫరెవర్ యంగ్. ఫరెవర్ మైత్రేయి.

నేనే! ఎన్ని రంగులు మార్చాను. ఎన్ని డీల్స్ క్లోజ్ చేశాను.

లండన్ వెళ్లిన చాలా రోజుల వరకూ మైత్రేయి తో ఫోన్ లో మాట్లాడుతూనే ఉండేవాడిని. ఏదో ఒక రోజు తను కూడా నా దగ్గరకు వచ్చేస్తుందనే ధైర్యం. చాలా రోజుల వరకూ వస్తాననే చెప్పింది కూడా!

తనకి ఇష్టమని నేను ఉన్న ప్రతి ఇంట్లోనూ బెడ్ రూం కిటికీ తూర్పు దిక్కుగా ఉండేలా చూసుకున్నాను. ఆమె వస్తుందని, నన్ను హత్తుకుని పడుకుంటుందని, ఉదయాన్నే సూర్యుడి కిరణాలు ఆమె మొహం పై పడి అల్లరి చేస్తుంటే, నా చేతిని అడ్డు పెట్టి ఆపాలని…

ఆ రోజు ఎప్పటికైనా వస్తుందా?

*****
ఎక్స్‌క్యూజ్ మీ. హలో, ఎక్స్‌క్యూజ్ మీ, అంటూ నా భుజం తట్టాడతను.

చాలా సేపట్నుంచే నన్ను పిలుస్తున్నట్టున్నాడు. మీరేం అనుకోకపోతే కొంచెం సేపు నా ఫోన్ ఛార్జ్ చేసుకుంటానని అడిగాడు.

ప్లగ్ లోనుంచి నా ఛార్జర్ తీసి, ప్లీజ్ అన్నాను. అతను నా పక్కనే కూర్చున్నాడు. హై. ఐయామ్ క్రిస్ పుల్లిస్ అని చెయ్యందించాడు. నేను హలో అని హ్యాండ్ షేక్ చేశాను.

ఫోన్ స్విచాన్ చేశాను. ఫోన్ లో యాభై కి పైగా నోటిఫికేషన్స్. వాట్సాప్, మిస్డ్ కాల్స్, మెసెజేస్, మైల్స్, ఫేస్ బుక్.

దాదాపు చాలా వరకూ థియోదోరా నుంచే!

ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? జోహెనెస్‍బర్గ్ నుంచి కాల్ చేస్తున్నారు. ఏం చెప్పాలి వాళ్లకి? – అన్నీ ప్రశ్నలే. నా దగ్గర సమాధానం లేని ప్రశ్నలు. చెన్నై ఎయిర్‍పోర్ట్ లో ఇరుక్కుపోయున్నానని మెసేజ్ పంపిద్దామనుకున్నాను. ఆ విషయం కూడా తెలిసిపోయినట్టుంది. వాట్ ఈజ్ ది స్టేటస్ ఇన్ చెన్నై? అని మెసేజ్.

థియోదోరా. ముద్దుగా థియో. రొమేనియన్ అమ్మాయి. మై లివిన్ పార్టనర్ ఇన్ లండన్. నన్ను తట్టిలేపిన థియో!

*****

SpeedIntoTime (1)

లండన్ లో ఒక వారం క్రితం. థియో ఇంట్లో పార్టీ. చాలా రాత్రయిపోయింది. ఒక్కొక్కరూ వెళ్లిపోయాక ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రం మిగిలారు. వాళ్లకి నన్ను పరిచయం చేసింది.

మీట్ మిస్టర్ రఘు. ఎవ్రీధింగ్ ఈజ్ గోయింగ్ వెల్ ఫర్ హిమ్. బట్ హి ఈజ్ కైండ్ ఆఫ్ శ్యాడ్.

నాకర్థం కాలేదు. థియోకెలా తెలుసు? నేను ఆనందంగా లేనని నీకెలా తెలుసు, అని అడిగాను.

తెలుసు. నువ్వు నాకు ఏడేళ్లుగా పరిచయం. ఈ ఏడేళ్లలో నువ్వొక కన్నీటి బొట్టు రాల్చిందీ లేదు. మొహంలో ఏ ఒక్కసారైనా విషాదపు ఛాయలు తొణికిన ఆనవాళ్ళూ లేవు.
దట్స్ బీకాజ్ ఐ యామ్ హ్యాపీ.

నో. దట్స్ బికాజ్ యూ యార్ క్యారీయింగ్ ఏన్ ఓషన్ ఆఫ్ టియర్స్ ఇన్ యువర్ హార్ట్.

నిజమే. పాతవన్నీ ఉపేక్షిస్తూ వేగంగా ముందుకెళ్తుంటే, కాలం తనలో కలిపేసుకుని, వెనక్కి వెనక్కి వెళ్ళిపోతుందనుకున్నాను. భవిష్యత్తుకేసి మొహం పెట్టి గతాన్ని కాలగర్భంలో కలిసిపోనీ అని ముందుకు సాగాను. బట్ ఐ యామ్ రాంగ్. ఇటీజ్ ఆల్ హియర్. రైట్ హియర్.

ఆ రాత్రి. బహుశా, జీవితంలో అంత ఏడ్చింది ఎప్పుడూ లేదు. హఠాత్తుగా అమ్మ పోయినప్పుడు కూడా నేనంత ఏడవలేదు. నాన్నతో గొడవ పెట్టుకున్నప్పుడు కూడా నేనంత ఏడవలేదు. మైత్రేయి ని హాస్పిటల్ లో నాన్న దగ్గర వదిలి వెళ్లిపోయినప్పుడు కూడా అంత ఏడవలేదు. బహుశా చాలా ఏళ్ల తర్వాత ఇండియా వస్తున్నందుకో, లేక థియో అచేతనంగా ఉన్న నా చైతన్యమనే బావిలో రాయి విసిరి జ్ఞాపకాలను తరంగాలుగా రేకెత్తించినందుకో – ఏమో, ఎప్పుడో తెగిన తీగలేవో తిరిగి నన్ను చుట్టుముట్టి, ఉక్కిరిబిక్కిరి చేసి కన్నీళ్లగా ఉబికివచ్చినట్టున్నాయి.

దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.

ఆ రాత్రి అందరూ వెళ్ళిపోయాక థియో నన్ను దగ్గరకు తీసుకుంది. ఓదార్చింది. చూడు రఘు, తనని మర్చిపోమని నేను చెప్పటం లేదు. నన్ను గుర్తించు అని వేడుకుంటున్నాను అంది.

నా కోసం తెలుగు కూడా నేర్చుకుని, నాకు తెలుగులో కవితలు రాసే ఓ థియో! ఓ నా ఐరోపా సుందరీ! ఏడు సముద్రాలు దాటినా, ఓ కన్నీటి సముద్రాన్నే గుండెల్లో దాచుకున్నానని ఎందుకు గుర్తు చేశావు? తనకు చాలా చెప్పాలనుంది. గుండె లోపల అగ్ని పర్వతం బద్దలవుతోంది. లావా పొంగబోతోంది. కానీ ఏమీ మాట్లాడలేదు.

ఏం చెప్పగలను. ఎన్నని చెప్పగలను. నా మీద ప్రేమ పెంచుకున్నందుకు ఆమె సాన్నిహిత్యంలో కన్నీళ్లు మనసారా ప్రవహింపజేయగలను. కానీ యెదలోని ఈ రోదన ఆమెకు విప్పిజెప్పగలనా?

చిన్నివెన్నెల మూటను మరిచివచ్చితినేనాడో, నా తప్పటడుగులు తిరిగి నన్నచటికే గొనిపోయెనేడు. నేనేమి చెయ్యను థియో.
ప్రతి రోజూ ఆరుబయట పచ్చికలో నడవాల్సిన నా జీవితంలో, తను లేకుండా ప్రతి రోజూ అఫీస్ క్యాబిన్స్ లో గడిచిపోతుందని; ఏ దేశంలో ఏ కెఫెలో కాఫీ తాగుతున్నా, తను లేకుండా తాగిన ప్రతి కాఫీ రుచి ఎంత చేదుగా ఉంటుందోనని; ఎన్ని మిలియన్ డాలర్లు సంపాదించినా, తను లేకుండా ఖర్చు పెట్టిన ఏ ఒక్క రూపాయికి కూడా విలువలేదని; ఎక్కడో ఆల్ప్స్ పర్వతాల్లో విహరిస్తున్నా, తను లేకుండా గాలి సైతం అలకబూనిందని; పున్నమి వెలుగులో చల్లని వాతావరణంలో కూర్చున్నా, తను లేదని వెన్నెలమ్మ కినుక బూని నిప్పులు చెరిగిస్తుందని- ఇవన్నీ చెప్పగలనా? తనే లేకపోతే నేను లేనని ఎలా చెప్పను. ఇంత ప్రేమ సాధ్యమా అని అడిగితే చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు. నా కన్నీటి జడి వానలు, ఆ సెలయేట జారిన నా కలలూ – ఎవరికీ కనిపించవు. మూసుకుపోయిన నా హృదయ ద్వారాల లోపల ప్రతిధ్వనించే ఆర్తనాదాలూ, రోదన ధ్వనులూ ఎవరికీ వినిపించవు. తనులేకుండా భగ్నమైన కలలు నావి; తను లేకుండా ఆగిపోయిన కలం నాది. థియో, నువ్వు మళ్లీ గడ్డి పూలను కూర్చి, కలము చేసి, చేతికిచ్చి, జోల పాడి, నిద్ర పుచ్చి – మళ్లీ తనని గుర్తుకు తెచ్చి…

…మాటల్లోనూ చెప్పలేను. కవితల ముసుగుల్లోనూ కప్పలేను. నీ నుంచీ దాచలేను! నేను ఆమెని తప్ప వేరొకరని ప్రేమించలేను. తను లేకుండా నాకు పగలు లేదు, వెలుగు లేదు. రాత్రి లేదు, చీకటి లేదు. సముద్రం లేదు. అలలూ లేవు. శృతి లేదు, లయ లేదు.

నేను ఇండియా కి బయల్దేరుతుంటే ఎయిర్‍పోర్ట్ కి వచ్చింది థియో.

మళ్లీ తిరిగి వస్తావా? అని అడిగింది.

పిచ్చి ప్రశ్న అది. నా జీవితమంతా ఇక్కడే ఉంది. నా జీవితాన్ని పూర్తిగా ఇక్కడే నిర్మించుకున్నాను. ఇవన్నీ అంత సులభంగా వదిలేసుకోలేను. తప్పకుండా తిరిగివస్తానన్నాను.

థియోకిచ్చిన మాటను నిలబెట్టుకోగలనా?
*****
మిస్టర్ రఘు, హలో మిస్టర్ రఘు!

క్రిస్ మళ్లీ భుజం తట్టి నన్ను జ్ఞాపకాల్లోంచి బయటకు తీసుకొచ్చాడు. యూ కెన్ యూజ్ యువర్ ఛార్జర్ నౌ, అన్నాడు.
థ్యాంక్యూ అన్నాను.

మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలి. కానీ మీరు చాలా ప్రీ ఆక్యుపైడ్ గా ఉన్నారు. ఏదైనా ప్రాబ్లమా? ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్? అడిగాడు క్రిస్.

ఏం చెప్పాలి? పాపం అతనేం చేస్తాడు? నా మొహం చూస్తే చాలు, బాధలో ఉన్నానని ఎవరికైనా ఇట్టే తెలుస్తుంది. కనీసం మాట సాయమైనా చేద్దామనుకుంటున్నాడు అతను. ఐ యామ్ ఆల్రైట్ అని చెప్దామనుకున్నాను. కానీ అతను నమ్మడు. అందుకే, జ్ఞాపకాల వరదలో తడిసి ముద్దవుతున్నానని చెప్పాను.

అవునా? కానీ అది చాలా ప్రమాదకరం కదా, అన్నాడు.

నాకర్థం కాలేదన్నట్టు తలూపాను.

కాఫీ తాగుతారా? అడిగాడు.

ఫర్వాలేదన్నాను.

కాఫీ డే కి వెళ్లి రెండు లాటే తీసుకొచ్చి, ఒకటి నా చేతిలో పెట్టాడు. థాంక్ గాడ్! ఫ్లైట్స్ లేకపోయినా కనీసం కాఫీ అయినా దొరుకుతోంది. మాటలు కలిపే ప్రయత్నం. నేను అడ్డు చెప్పలేదు. కానీ కాఫీ కోసం వెళ్లకముందు అతనన్న మాట నా చెవిలో మ్రోగుతూనే ఉంది. అందుకే అడిగాను – ఎందుకు జ్ఞాపకాలు ప్రమాదకరమన్నారు?

ఎందుకంటే, జ్ఞాపకాలు ప్రమాదకరమైన ఉచ్చులు, వాటిలో చిక్కుకుంటే అంతే!

నిజమే! ఇది ఇంకొకరు చెప్పక్కర్లేదు. నాకు ప్రత్యక్షంగానే అనుభవమవుతోంది.

కాఫీ తాగుతూ మాట్లాడ్డం మొదలుపెట్టాడు క్రిస్. అయిష్టంగానే నేనూ అతను చెప్పేది వినడం మొదలుపెట్టాను. నిజానికి నాకూ వేరే పని లేదు. ఎయిర్‍పోర్ట్ లో ఉన్న వాళ్లకి సాయం అందడానికి మరో ఇరవై నాలుగు గంటలు పైనే పట్టవచ్చని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
నేను ఫ్రాన్స్ నుంచి రెండేళ్ల క్రితం ఇండియా వచ్చాను. దాదాపుగా ఈ రెండేళ్లు అండమాన్స్ లో గడిపాను. మీకు తెలుసా? నేను ఎన్నో ఏళ్ల నుంచి, జ్ఞాపకాల యొక్క నిర్మాణాత్మక స్వభావం గురించి పరిశోధన చేస్తున్నాను. అందుకు సరైన శాంపిల్ కోసం నేను ప్రపంచంలోని ఎన్నో ప్రదేశాలు పర్యటించాను. కానీ అండమాన్ దీవుల్లోని తెగలకంటే సరైన నమూనా నాకెక్కడా దొరకలేదు. అందుకే గత రెండేళ్లుగా అక్కడే ఉంటున్నాను. ఇప్పుడు క్రిస్‍మస్ హాలిడేస్ కోసం ఫ్రాన్స్ బయల్దేరాను – చెప్పుకొచ్చాడు క్రిస్.

జ్ఞాపకాల గురించి అతని పరిశోధన కోసం అండమాన్ వరకూ రావడమేంటో నాకర్థం కాలేదు. అదే విషయం అతన్ని అడిగాను. సర్ ఫ్రెడెరిక్ ఛార్ల్స్ బార్ట్లెట్ అని ఒక బ్రిటీష్ మానసిక శాస్త్రవేత్త గురించి చెప్పాడు క్రిస్. అతను చెప్పింది చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించింది.

మెమురీస్ ఆర్ డేంజరస్ బీయింగ్స్. దే హావ్ ఏ లైఫ్ ఆఫ్ దైర్ ఓన్. మనం ఏదైనా విషయాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రతి సారీ అది ఒక్కో రూపం సంతరించుకుంటుంది. మన గత జీవిత అనుభవాలు, పెంపొందించుకున్న జ్ఞానం, భవిష్యత్తు పట్ల అంచనాలు – వీటన్నింటి బట్టి ఆ జ్ఞాపకం ఎప్పటికప్పుడు మార్పు చెందుతూనే ఉంటుంది. అందుకే జన జీవన స్రవంతికి దూరంగా – మనకంటే తక్కువ ఎక్స్‌పీరియన్స్, నాలెడ్జ్ మరియు ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న అండమాన్ ఆదిమవాసులతో సహజీవనం చేస్తూ – ది కన్స్‌ట్రక్టివ్ నేచర్ ఆఫ్ మెమరీ గురించి క్రిస్ పరిశోధనలు చేస్తున్నాడని చెప్తే ఆశ్చర్యం వేసింది.

జీవితం ఎవరిని ఎక్కడెక్కడికి తీసుకెళ్తుందో కదా అనిపించింది.

మెమురీస్ కి కన్స్‌ట్రక్టివ్ నేచర్ ఉన్నట్టు, డిస్ట్రక్టివ్ నేచర్ కూడా ఉంటుందా? ఈ సారి నిజంగానే ఆసక్తిగా అడిగాను.

నిజం చెప్పాలంటే – జ్ఞాపకాలకు నిర్మాణాత్మక, విధ్వంసక స్వభావాలు ఉన్నాయనడంకంటే, పునర్నిర్మాణ స్వభావం ఉందని చెప్పడం కరెక్ట్, అన్నాడతను.

అతనితో మాట్లాడుతుంటే టైమే తెలియలేదు. మధ్యాహ్నం అందరికీ ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చారు. అందరూ తిని మెల్లగా కుర్చీల్లో నడుం వాల్చారు. ఏ మూడింటికో నాకూ నిద్రపట్టింది.
*****
ఒక జ్ఞాపకం.

అదే ఇల్లు. ఒక బెడ్ రూం ఖాళీగా ఉంది. ఇప్పుడక్కడ డాక్టర్లు లేరు. వాళ్లని పట్టుకుని భోరున ఏడ్చిన పిల్లవాడు హాల్లో కూర్చుని ఆటలాడుకుంటున్నాడు. అతని పక్కనే కూర్చుని టివి చూస్తున్నారు ఇద్దరు ముసలివాళ్ళు. పక్కనే మరొక బెడ్ రూంలో, బెడ్ మీద పడుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్నాడొక వ్యక్తి. హాల్లో కూర్చున్న పిల్లవాడికి ఆ ఏడుపు వినిపించింది. మెల్లగా బెడ్ రూంలోకి నడిచాడు. ఆ వ్యక్తి పక్కనే కూర్చున్నాడు. అతని తలపై చెయ్యి వేశాడు. పక్కనే కూర్చున్న తన కొడుకుని చూసుకున్నాడా వ్యక్తి. ఆ పిల్లవాడిని దగ్గరకు తీసుకున్నాడు.

మరొక జ్ఞాపకం.

ఒక యువకుడు వేగంగా విజయా హాస్పిటల్ మిట్లు దిగి నడుస్తున్నాడు. అతనికి వెనక్కి తిరగాలనే ఉంది. కానీ చూడాలంటే ఏదో తెలియని భయం. ఇంకో రెండడగులు వేస్తే రోడ్డు మలుపు తిరుగుతుంది; హాస్పిటల్ కనుమరుగవుతుంది. ఒక అడుగు ముందుకు వేశాడు. ఇంకో అడుగు ముందుకు వెయ్యబోతూ వెనక్కి తిరిగి చూశాడు. మూడో అంతస్థులో కిటికీలోనుంచి, అతనివైపే చూస్తూ, దుమ్ము పట్టిన కిటికీ అద్దం మీద పెద్ద లవ్ సింబల్ గీసిందొక అమ్మాయి.

ఇంకొక జ్ఞాపకం.

హౌరా ఎక్స్‌ప్రెస్ నెల్లూరు స్టేషన్ దాటి, పెన్నా నది బ్రిడ్జి మీద మెల్లగా సాగిపోతోంది. జనరల్ కంపార్ట్‌మెంట్ గేట్ దగ్గర ఒక చేత్తో రాడ్ పట్టుకుని వేలాడుతున్నాడొక యువకుడు. బాబూ, ఏం ఇంత కష్టపడి వేలాడకపోతే. ఎవరైనా ఈ సూట్‌కేస్ తీసుకోండి పాపం. లోపల్నుంచి ఎవరో సూట్ కేస్ తీసుకున్నారు. మరొకరు చెయ్యందించి కష్టపడి లోపలకి లాగారు. టాయిలెట్స్ పక్కనే న్యూస్ పేపర్ పరుచుకుని కూర్చున్న ఒకతను, రా బాబూ కూర్చో అని కొంచెం చోటిచ్చాడు.

మరింకొక జ్ఞాపకం.

ఒక యువకుడు చెమటలు కక్కుతూ, చెన్నై ఎయిర్‍పోర్ట్ లోకి పెద్ద సూట్‍కేస్ లాక్కుంటూ వచ్చాడు. దూరంగా ఒక ట్రావెల్ బ్యాగ్ మాత్రమే భుజానికి తగిలించుకున్న ఒక మధ్య వయస్కుడు, కొంచెం దూరంగా ఉన్న ట్రాలీ ని లాక్కొచ్చి లగేజ్ దాని మీద సర్దాడు. ఈజిట్ యువర్ ఫస్ట్ టైం అన్నాడు. సిగ్గుగా తలూపాడా యువకుడు. దేర్ ఈజ్ ఏ ఫస్ట్ టైం టు ఎవ్రీథింగ్ అన్నాడాయన. కమ్ లెట్స్ గో అని ఎయిర్‍పోర్ట్ లోపలకి తీసుకెళ్లాడు.

ఒకదాని వెనుక ఒకటి జ్ఞాపకాలు కొత్త రంగులద్దుకుంటున్నాయి.

*****

ఫోన్ మోగింది. నిద్ర లేచాను. టైం చూస్తే రాత్రి రెండయింది.

ఎయిర్ పోర్ట్ లో చాలా భాగం వరకూ చీకటి. పవర్ సప్లై కట్ అయిపోయిందన్నారు.

ఫోన్లో థియో.

జోహెనెస్‍బర్గ్ లో కాన్ఫరెన్స్ క్యాన్సిల్ అయిందని, వచ్చే నెలలో తిరిగి ఏర్పాటు చేస్తారనీ చెప్పింది. ఇప్పుడు వాటన్నింటి గురించి నాకు ధ్యాస లేదు. ఈ ముప్ఫై ఆరు గంటలు నాలో నేను, నాతో నేను గడిపిన క్షణాలు – గత పదేళ్లల్లో నాతో నేను ఇంత ఆప్యాయంగా గడిపిన క్షణాలు ఇవేనేమో! ఎన్నో గీతలు, ఎన్నో వ్యత్యాసాలు తొలిగిపోయి – ఏదో జీవిత సత్యం కనుగొన్న అనుభవం. ఒక్కోసారి మనిషి విచ్చలవిడి తనాన్ని అదుపులో పెట్టడానికే ప్రకృతి ఇలా మనపై తిరగపడుతుందేమో! కొత్త పాఠాలు నేర్పిస్తుందేమో!

థియో మాటలేవీ నాకు వినిపించడం లేదు.

చీకటి లోనుంచి మైత్రేయి నావైపే నడిచొస్తోంది.

నువ్విక్కడికెలా వచ్చావు?

దూరం తొలిగిపోయింది.

నాకర్థం కాలేదు.
మిస్టర్ జీనియస్. ప్రస్తుతం నువ్వు జీరో స్పీడ్ లో వెళ్తున్నావు. ఇండియాలో గడిపిన ఈ నలభై ఎనిమిది గంటలు, అందులో ఇక్కడ ఎయిర్‍పోర్ట్ లో గడిపిన ఇరవై నాలుగు గంటలు -దటీజ్ యువర్ టైం. చిన్నప్పుడు ఫిప్త్ క్లాస్ లో చదువుకోలేదా? స్పీడ్ ఇన్‍టూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అని. ది డిస్టెన్స్ ఈజ్ జీరో నౌ. నువ్వు మళ్లీ బయల్దేరిన చోటికే చేరుకున్నావు. పద వెళ్దాం అంది.

*****
మేము తిరువాన్నమళై లో బస్ దిగాం. ఇదే అరుణగిరినాథర్ గుడి అని చూపించింది. అది చూసే లోపలే వేగంగా ముందుకు కదిలింది. కొంచెం దూరం వెళ్లగానే ఇదే రమణ మహర్షి ఆశ్రమం అని చూపించింది. లోపలకి తొంగిచూడబోయాను. చలం చివరి రోజుల్లో గడిపిన ప్రదేశం. లోపల చాలామందే ఉన్నారు.

ఆగి చూద్దామంటే, తను నాకంటే కొంచెం ముందు నడుస్తోంది. నేను ఎప్పుడూ ఇంతే. చాలా వేగంగా ముందుకు వెళ్లిపోదామనే అనుకుంటాను, కానీ ఎప్పుడూ వెనకపడిపోతుంటాను . తను వెనక్కి తిరిగి చూసి, ఓ క్షణం పాటు ఆగి రమ్మన్నట్టు చెయ్యి అందించింది. ఇద్దరం అలా చాలా సేపు మౌనంగానే నడుస్తున్నాం. ఇది ఫలానా వాళ్ళు నడిపే స్కూల్, అది ఫలానా వాళ్లు పండించే పళ్లతోట – చూపిస్తూ ఆగకుండా వెళ్తూనే ఉంది.

కాసేపటికి చుట్టూ ఉన్న బిల్డింగ్స్ అన్నీ మాయమయ్యాయి. చుట్టూ పల్లెటూరిలా ఉంది. రోడ్ కి కొంచెం దూరంలో ఒక తోటలా ఉంది. తోట బయట ఒక ముసలి జంట చిక్కుడు కాయలు తెంపుతున్నారు. అంకుల్ ఈ తోటలోనే ఆర్గానిక్ ఫార్మింగ్ లో హెల్ప్ చేస్తుంటారు అని అంది. లోపలకి వెళ్లి నాన్నను చూడాలనిపించింది. కానీ తను ఆగటం లేదు.

కొంచెం దూరం వెళ్లగానే ఒక దగ్గర పిల్లలు కొంతమంది వీధిలో ఆడుకుంటున్నారు. పక్కనే ఒక చిన్న బిల్డింగ్ ఉంది. ఈ స్కూల్ లోనే నేను సంగీతం నేర్పిస్తుంటాను అని ఆ బిల్డింగ్ వైపు చూపించింది. లోపలకి వెళ్దామా? అడిగాను. ఇప్పుడు కాదని చెప్పింది.

ఏం, అన్నాను? మళ్లీ వచ్చినపుడు అంది.

పిల్లలు కొంతమంది రోడ్ పక్కనే ఉన్న ఒక పంపు కింద నీళ్లు తాగుతున్నారు. నేను కూడా అక్కడికెళ్లి నీళ్లు తాగాను. తను నన్నే చూస్తోంది. ఆమె దగ్గరకు నడిచాను. మైత్రేయి, నీకో విషయం చెప్పాలి. చెప్పమని కళ్లతోనే సైగ చేసింది. ఇప్పుడు ఇక్కడ నీ చెయ్యి పట్టుకుని నిలబడి ఉంటే నాకేమనిపించిందో తెలుసా? అనంతమైన ఈ విశ్వంలో దుమ్ము ధూళి కి ఉన్న ప్రాముఖ్యత కూడా లేని నా జన్మకు సార్థకం కలిగింది నీ వల్లనే!

తను ఏమీ మాట్లాడలేదు. వెళ్దామా అన్నట్టు చెయ్యందించింది. నేనామె చెయ్యిపట్టుకుని ముందుకి నడుస్తున్నాను. నన్ను వెనక్కి తీసుకొచ్చి చెన్నై వెళ్లే బస్ ఎక్కించింది . నాకు వెళ్లడం ఇష్టం లేదని చెప్పాని. నేనిక్కడే ఉండిపోతానని ప్రాథేయపడ్డాను .

బస్సు వెళ్లిపోతోంది.

The Sun had not yet risen. The doors are not yet open.

SpeedIntoTime (1)గుండె మీద చెయ్యి పెట్టి, యూ కెన్ కమ్ హియర్ వెన్ యూ ఆర్ రెడీ అంది.

హలో మిస్టర్ డ్రీమర్. మనమింక బయల్దేరవచ్చు. నిద్రలేపి చెప్పాడు క్రిస్.

నాకు తేరుకోడానికి ఒక్క నిమిషం పట్టింది. నేనింకా ఎయిర్‍పోర్ట్ లో లౌంజ్ లో కుర్చీలో కూర్చుని నిద్రపోతున్నాను.

ఆర్మీ హెలికాప్టర్స్ వచ్చాయి. అర్జెంట్ గా వెళ్లాల్సిన వాళ్లని బెంగుళూరు కి ఎయిర్‍లిఫ్ట్ చేస్తున్నారు. మీరు కూడా వస్తున్నారా? అడిగాడు క్రిస్.

ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. గత పదేళ్లల్లో నాకు ఎప్పుడూ ఇలాంటి ప్రశ్న ఎదురవ్వలేదు. వెన్ రఘు ఈజ్ హియర్ ఎవ్రీధింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. హి ఈజ్ ఏ ఫైర్ ఫైటర్. కానీ ఇప్పుడు ఏదీ నా కంట్రోల్ లో లేదు. వెళ్లిపోవచ్చు. వెళ్లాలి కూడా. లేకపోతే సౌత్‍ఆఫ్రికా డీల్ క్యాన్సిల్ అవుతుంది. ఐదువందల కోట్ల ఇన్వెస్ట్మెంట్. ఆల్రెడీ అది ఇంకొకరికి ఇచ్చేసి ఉండొచ్చు. డీల్ క్యాన్సిల్ అయిందని న్యూస్ బయటకు వచ్చేసి ఉండొచ్చు. అల్రెడీ కంపెనీ షేర్ వాల్యూ పడిపోయి ఉండొచ్చు. ఏమైనా జరగొచ్చు.

ది పాజిబిలిటీస్ ఆర్ ఎండ్‍లెస్.
కానీ, ఒకటి మాత్రం నిజం. నేనిక్కడ్నుంచి బయటకు అడుగుపెడ్తే ఇంకే రోజూ ఈ కల మళ్లీ రాదు. అయినా ఆ కళ్లు దాని కోసం వెతుకుతూనే ఉంటాయి. అదే కలను తెచ్చే రాత్రికోసం ఎదురు చూస్తూనే ఉంటాయి. కానీ నాకిప్పుడు కావాల్సింది కల కాదు. ఆ కలలను తెచ్చే రాత్రి కాదు. నిజం కావాలి. ఆ నిజాన్ని తీసుకొచ్చే వెలుగు కావాలి; నా మైత్రేయి నాకు కావాలి.

ఆర్యూ కమింగ్, అడిగాడు క్రిస్.

ఐ థింక్, ఐ విల్ వెయిట్, అన్నాను.

ఫర్ వాట్ అన్నాడు.

ఫర్ ది సన్ టు షైన్ అండ్ ది డోర్స్ టు ఓపెన్ అన్నాను.

ఏమనుకున్నాడో, ఏమో అతను తన బ్యాగ్ తీసుకుని వెళ్లిపోయాడు.

బయట వర్షం ఆగింది. ఆకాశంలో సూర్యుడు జాడ తెలుస్తోంది. ఒక్కొక్కరూ ఎయిర్‍పోర్ట్ లోనుంచి వెళ్లిపోతున్నారు. నేను మాత్రం అక్కడే కూర్చున్నాను – ఆమె రాక కోసం ఎదురుచూస్తూ!

*

కాక్ అండ్ బుల్ స్టోరీ

sidhareddi

 

చీకట్లో ఏందో మెరస్తా ఉండాది. ఏందదని నేను చూస్తా ఉండంగానే అది కొంచెం కొంచెం పెద్దదవతా దగ్గిరికి వస్తా ఉండాది. ఏందో మంటలాగుంది. మంటే. మంట పెద్దదవతా ఉండాది. ఎవురో గట్టిగా అరస్తా ఉండారు. నేను దగ్గిరికిపోతా ఉన్నాను. మంట గూడా దగ్గిరికి వస్తా ఉండాది. భోగిమంట లా ఉంది. బరికె ని అంచులో పట్టుకుని తాటాకు ని కాలస్తా ఉండాడు ఒకాయన. తాటాకు బగ్గున మండింది. మంట పదడుగులు లేసింది. చుట్టూ కూచున్న పిలకాయలు దూరంగా జరిగారు. ఎవురో పరిగెత్తుకోని వస్తా ఉండాడు.

నిప్పుల మీద పరిగెత్తుకుంటా ఎళ్ళిపోయాడు. ఇంకా చానా మంది వస్తున్నారు. నిప్పుల్ని లెక్కజేయకుండా పోతానే ఉన్నారు. నేనాడకి దూరంగా నిలబడి చూస్తా ఉండాను. మా పిల్లోడు బోగిమంటకి తాటాకులు కావాలని నన్ను అడగతా ఉన్నాడు. పీర్లు పట్టుకోని సాయిబులోళ్లు గుండాం తొక్కతా పోతున్నారు. నాకా పూసలు తెచ్చీ. చీరక్కుట్టుకుంటా అని అడగతా ఉంది మా ఆడోల్లు. చాకలోళ్ళ పిల్లోడు గొంతులో కత్తి గుచ్చుకోని అడతా ఉండాడు. విజియుడు పులేషం ఏసుకుని డ్యాన్సాడతుండాడు. గంగిరెద్దులోళ్లు ఎద్దుని పులి సుట్టూ తిప్పతా ఉండాడు. ఆడోళ్లంతా మిద్దెల మీద నిలబడి నవ్వతా చూస్తుండారు. నేను మా పిల్లోన్ని భుజం మీద ఎక్కించికోని పెద్ద బాయి చుట్టూ తిరగతా ఉండాను. మంట పెద్దదవతా ఉంది. ఎవురూ చూట్టంలే. జనాలు కాలిపోతుండారు. మంట మంట అని నేనరస్తా ఉండాను. ఎవురికీ నా మాటలు ఇనిపీటంలే. నా కాడికి పోయి భుజం తట్టి పిల్లోడ్ని తీసుకుని ఇంటికి పో అన్నా. నేను ఎనక్కి తిరిగి నా సాయి చూసుకుంటే మొహం కాలిపోయి నల్లంగా ఉంది. భయమేసి గట్టిగా కేకేసి లేచినా.
ఒకసారి లేస్తే నాకింక నిద్రపట్టదు. పండగ నెల. భలే చలి పెడ్తా ఉనింది. మేము పిలకాయలిగా ఉన్నప్పుడైతే, చేలకాడ సలిమంట యేసుకుని రాత్రంతా కుశాలుగా మాట్టాడుకుండా ఉండేవాళ్లం. మేం నిద్దరపోతే అడివి పందులొచ్చి చేలల్లో పడిపొయ్యేవి. ఇప్పుడు చేను లేదు. చేలల్లో పందులూ లేవు. పెద్ద పండగనే గానీ ఊళ్లో పండగనేదే లేదు. మా పిల్లోడు ఐదరాబాద్ లో ఏడో ఉజ్జోగం జేస్తుండాడు. పండక్కి రారా అని పోన్జేస్తే, రానూ పోనూ కర్చులెందుకన్నాడు.

నాకు నిద్దర పట్టక పీర్లచావిటి కాడికొచ్చి కూకున్నాను. అరుగు మీద పడుకోని ఆకుల్లోనుంచి సుక్కల్ని జూస్తుంటే పీర్ల పండగ గుర్తుకొచ్చింది. ఏందో ఈ ఊళ్లో పండగలనే లేకుండా పొయినై. మబ్బుల్లో సుక్కలు పీర్లకి కట్టే పూసల్లా మెరిసిపోతుండాయి. చుక్కలన్నీ పక్కపక్కన చేరి పీరుకి అంచున కుట్టే తలుకుల్లా మిలమిల్లాడతుండాయి. ఆ సుక్కలకాడ దేవుడుంటాడని చెప్పేది మాయమ్మ. ఇంకా దేవుడాడే ఉండాడో ఏడికన్నా ఎళ్లిపోయుండో? నా చిన్నప్పట్నుంచి చూస్తా ఉండా. ఆకాశం అట్టే మెరిసిపోతా ఉండాది. ఊరు మాత్రం గొడ్డుపోయింది. వానల్లేక చెరువు ఎండిపోయింది. వానలు పడుంటే ఇంకో నెల్లో కుప్పలేసుండేవాళ్లం.

నిద్రపట్టక ఇట్టా ఆలోచిస్తా ఆకాశంలోకి చూస్తా ఉన్నానా, ఎవురో గట్టిగా అరస్తా ఉన్నట్టనిపిచ్చి లేసి కూర్చున్నా. బేట్రీ లైట్ ఏసి చూశా. ఎవురూ లేరు. ఏందోలే అనుకుని పడుకున్నా. కొంచెం సేపిటికి కుమ్మరోళ్ల పిల్లోడు అటు పోతా, ఏమనా ఈడ పొడుకున్నావు? అని అడిగాడు. ఊరికే నిద్రపట్టక అన్జెప్పి, నువ్వేడికి ఈ జామున అని అడిగా. పంచాయితీ ఆఫీస్ కాడ గలభాగా ఉంటే పోతున్నా అన్నాడు. ఆ పిల్లోడు పిలవకుంటే అసలా యవ్వారం అంతా నాకు తెలియకపోను. ఊర్లో పిలకాయలకి ఏం పనిలేదు, ఏందో ఈ కొత్త గలభా అనుకున్నా. ఆడికి పొయ్యి చూస్తే గలభా పిలకాయలది కాదు- యానాది రెడ్డి ది.

అబ్బుసాయబు కొడుకు పళ్ల భాషా, యానాది రెడ్డి ని గట్టింగా పట్టుకోనుండాడు. ఏందిరా గోల అంటా నేనాడకి రాంగానే, చూడు మామా నా పాటికి నేను పొద్దున్నే దొడ్డికి పోతా వుంటే నన్ను పట్టుకోని దొంగంటున్నారా అని యానాది రెడ్డి మొదలుపెట్టిండు. రెడ్డీ ఈయన మాటల నమ్మబాకు. ఈ పెద్ద మనిషి నా కోడిపుంజుని దెంకపోతుంటే పట్టుకున్నా అన్నాడు పళ్ల భాషా.

నాకసలేం అర్థం కాలా. టైము చూస్తే రేత్రి రెండైంది. కొత్త గవర్మెంట్ వచ్చినాక గుడ్డిగా ఎలిగే ఈది లైట్లు కూడా పోయినై. అంతా చీకటిగా ఉంది. పొంగళ్లప్పుడు పిలకాయలు కొట్టుకోబొయ్యి పోలీసుల దాకా పోయింది. ఆ గొడవ లోడుకోని మళ్లీ ఎవురన్నా కొట్టుకుంటుడారేమోనని అదరా బదరా నేనాడికి పోతే – ఆడ ఇంకేందో జరగతా ఉండాది.
నేను లేచొచ్చినట్టే పరమటీది నుంచి, పాతర్ల మిట్ట కాడ్నుంచి ఒక్కొక్కరూ బ్యేట్రీ లైట్లేసుకుని వస్తా ఉండారు. వచ్చినోళ్లకళ్లా మళ్లా మళ్లా జరిగింది చెప్పలేక అరస్తా ఉండాడు పళ్ల భాషా. అసలు భాషా గాబట్టి యానాది రెడ్డి ని అంత సేపు పట్టుకున్నాడు గానీ, ఇంకోడైతేనా!

ఏందయ్యా ఈ దౌర్జన్యమా? సందకాడ ఏం తిన్నానో ఏమో ఒకటే కడుపుబ్బరగా ఉంటే, ఆపుకోలేక వంకకాడికి వచ్చి పోతుంటే ఈ భాషా నా మీద పడి దొంగా దొంగా అని అరస్తా పట్టుకునే. ఉరే, నేనేం జేసాన్రా అని గంటనుంచి అడగతా ఉంటే – కోడి కోడి అని అరస్తా ఉండాడు. ఏందీ అన్యాయం. సుబ్బాడ్డే, నువ్వన్నా చెప్పబ్బా అన్నాడు యానాది రెడ్డి.
రెడ్డా, అబద్ధాలు చెప్పబాకు. ఇంట్లో లెటిన్ కట్టుకుళ్లా. ఆడ పోకుండా వంక కాడ ఏం పని నీకు?
చీకట్లో ఎవురో అడిగారు.

నిజిమే. గవర్మెంట్ డబ్బులు కూడా ఇచ్చుళ్లా. ఇంకా వంక కాడికి ఎవురుపోతుండారు?
వానలు బడి నాలుగేళ్లయితే, అసలు వంకలో నీళ్లేడేడుండాయని?
యానాది రెడ్డి ఏం చెప్పలా.
అడగతా ఉంటే చెప్పవేందబ్బా? అసలు ఈ రేత్రి నీకు వంక దాక వచ్చే పనేముందని? – అడిగారెవరో.

యో! ఏంది మీరంతా. భలే పెద్ద మనుషుల్లా ఉన్నారే! అందరు నామీదే డౌట్ పడతుండారు? అని గట్టిగా అరస్తా భాషా ని ఇదిలించి బయట పడ్డాడు యానాది రెడ్డి. యాడికి నువ్వు పోయేది అంటా మళ్లీ యానాది రెడ్డి ని కతక్కన పట్టుకోబోయాడు భాషా. ఏడికి పోతాడు. నువ్వుండు భాషా అన్నాను.
అప్పుటికి చానా మంది పంచాయితీ ఆఫీస్ కాడికి జేరి తమాషా జూస్తుండారు. నైటాల్ట్ బస్ లో గురక పెడ్తా నిద్రపోతున్న కండక్టర్ గూడా ఈ గోలకి నిద్ర లేచి, ఏం ఊరబ్బా మీది. గంట సేపన్నా నిద్రపోనీరా? అంటా బస్ దిగాడు. మా ఊళ్లో ఇయన్నీ టైమ్ పాస్ లే సుధాకరా, నువ్వు పొడుకో – అన్నా యినకుండా వచ్చి, దుప్పటి కప్పుకుని కూచుని, ఏంది మందల అన్నాడు.
కండక్టర్ కి ఇదంతా పల్లెటూరి ఏళాకోళంగా ఉంది. ఈ టైంలో మస్తానమ్మ బంకు తెరిసుంటే టీ తాగతా చూస్తా ఉంటే భలే తమాషగా ఉంటది కదా సుబ్బాడ్డీ? అన్నాడు. ఈడ ఇంత రచ్చరచ్చవుతుంటే ఈ కండక్టర్ కి టీ గావాల్సొచ్చిందా? వీడి పాసుగాల అనుకున్నాను.

ఈ లోపల ఏందబ్బా గోల అంటా కామేశ్వరయ్య వచ్చాడు. భాషా వచ్చి చెప్పడం మొదలు పెట్టాడు.
తెల్లారితే కనుమ కదా. ఊర్లో అందరికీ కొయ్యడానికి కోళ్లు కాబళ్లే. టౌన్ కి పొయ్యి బుట్టనిండా ఫారమ్ కోళ్లను తెచ్చానా? కోళ్లకు మేతేసి సందకాడే పడుకున్నానా.మాంచి నిద్రపోతుండా. కోళ్లు కొక్కొక్కొ అని అరస్తుంటే ఏందని చూశా. ఎవురో ముసుగు కప్పుకోని, బుట్టెత్తి కోళ్లు దెంకోపోతున్నారు. ఎవుర్రా అది అని వెనకనే పరిగెత్తా. చేలల్లో పడి పరిగెడ్తా పరిగెడ్తా ఉంటే లాస్ట్ కి దొరికాడు. లైటేసి చూస్తే ఇదిగో ఈయన. యానాది రెడ్డి వైపు చూపించాడు.
ఒరేయ్ భాషా. కొట్టానంటే నీ మూతి పళ్లు రాలతాయి. నేను కోడినెత్తుకుపోతే ఆ కోడేది? ఉత్త మాటలు చెప్పబాక. నాకు మండద్ది.
నిజిమే కదా! అసలు కోడేది? చీకట్లో ఎవరో అడిగారు.
భాషా ఏం చెప్పలా.

Kadha-Saranga-2-300x268

యానాది రెడ్డి కోడి కోసమొస్తే, కోడుండాలి గదా చేతిలో. భాషా నువ్వే ఏదో కావాలని చేస్తుండావబ్బా అన్నాడు కామేశ్వరయ్య.
యో! అసలు నిన్ను పంచాయితీ చెయ్యమని ఎవురడిగింది? నేను పొద్దున్నే ఎస్సై కి ఫోన్ జేస్తా. ఆయనే వచ్చి చూసుకుంటాడు అన్నాడు భాషా.
ఏందిరే నువ్వు ఫోన్ చేసేది? నా మొబైల్ లో ఇప్పుడే ఫోన్ జేస్తా ఎస్సై కి. రానీ ఏదో ఒకటి తేల్చుకుందాం అన్నాడు యానాది రెడ్డి
పోలీసుల్దాకా ఎందుకులేబ్బా! మొన్నే వార్నింగ్ ఇచ్చి పోయిళ్లా. మళ్లీ పిలిచి దెంగుల్తినాలా? ఏదో అయిపోయింది. ఈడకి వదిలైండిలేబ్బా అని ఇద్దరి మీద పెత్తనం చెయ్యబొయ్యాడు కామేశ్వరయ్య.
జీన్స్ ప్యాంట్, పైన ఖద్దరూ ఏసుకుని ఉన్న కామేశ్వరయ్య ని చూస్తా, బస్సులో పిలకాయల్నేసుకుని తిరుగుతుంటాడు. ఎవురబ్బా ఈ పిల్లోడు? అడిగాడు కండక్టర్ సుధాకర్. ఈ ఊరోడే. రాజకీయం పిచ్చిలే. ఎమ్మెల్యే మనిషి అని చెప్పాను.

పెద్ద పెద్ద తలకాయలంతా ఈడుంటే ఈ పిల్లోడి పెత్తనం ఏంది? అన్నాడు కండక్టర్.
ఉడుకు రకతమబ్బా. ఊర్లో చదువుకున్న పిలకాయలంతా ఏడో ఉండే. ఇప్పుడీ ఊర్లో ఉన్న పిలకాయలదే రాజ్జెం.
ఎవురిది రాజ్యమైతే ఏముంది లేబ్బా. ఇరవై ఏళ్ల నుంచి వస్తా ఉండా ఈ ఊరికి? ఇప్పుటికీ తార్రోడ్డు ఏపిచ్చుకోలేకపోయేరే!
మీ ఆర్టీసీ వోళ్లు బస్సే క్యాన్సిల్ చేస్తామని చూస్తుంటే ఇప్పుడు రోడ్ ఎవరికి కావాలా? మా ఊరోళ్లకి ఏమీ వద్దబ్బా. ఇట్టా కొట్టుకుంటా చతుర్లాడుకుంటా ఉంటే చాలు.అజ్జూడు ఏమి మునిగిపోయిందని ఇంత మంది కట్టకట్టుకుని వస్తుండ్రో? అదే మొన్న వానలు పడేలా ఉంది. చెర్లో నీళ్లన్నీ పోకుండా తూము రిపేర్ చేసుకుందా పాండ్రా అని అడిగితే వచ్చిన్నా కొడుకు లేడు.
మేమిట్టా చెడీ బొడీ మాట్టాడుకుంటా ఉండాం. టైమ్ నాలుగయిపోయింది. కాలేషా భార్య వచ్చి టీ బొంకు తెరిచింది. తలా ఒక టీ తాగి అందరూ ఇంటికి పోయిండ్రు.అసలు భాషా కోడి నిజంగానే పోయిందా? పోతే అది యానాది రెడ్డే కొట్టేసిండా? కొట్టేస్తే అది ఏడ దాచి పెట్టిండు? ఈ ఇషయాలు మాత్రం ఎవురికీ అర్థం కాలా!

*****

పండగ పోయి వారమైంది. పండక్కి మా పిల్లోడు హైదరాబాద్ నుంచి అనవసరం ఖర్చని రాలా. కూతురు వైజాగ్లో అల్లుడుతో ఉండే. వద్దే అన్జెప్పినా ఇనకుండా దేవుడింటినిండా నిప్పట్లు పేర్చింది మా ఆడది. ఎవుడయ్యి తినేది? నాకేమో డాక్టర్ అట్టాంటి చెడీ బొడీ తినొద్దని చెప్పే. పక్కింటి రామిరెడ్డి పిలకాయలు కూడా పండక్కి రాలా. వాడి కొడుకులిద్దరూ మధ్యప్రదేశ్ లో ఏందో కాంట్రాక్ట్ లు చేస్తుంటారు. పిలకాయలు రాకపోతే ఏమే, నిప్పట్లు, కొబ్బిరొడలు, మనుబూలు, ఉప్పుచెక్కలు బస్ లో పెడదామని నెల్లూరికి బయల్దేరిండ్రు మా ఆడోళ్లు.

టిఫిన్ జేసి పేపర్లన్నీ ముందేసుకుని కూసుని ఉన్నానా, అయ్యోరోళ్ళ పిల్లోడు పేపర్ చదవడానికి వచ్చిండు. ఏందయ్యోరా, చాన్రోజులకి అవపడ్డావే అని అడిగా.
పండక్కి అత్తగారింటికి పొయ్యాలే. ఈ ఊళ్లో ఉన్నా ఏం లాభం, అప్పచ్చులు ఇచ్చేవాళ్లు కూడా లేకుండా పొయ్యే అన్నాడు.
అట్టనబాకు. నీకెన్ని నిప్పట్లు గావాలో చెప్పు. మా ఇంట్లో చానా ఉండాయి.
ఇప్పుడు అప్పచ్చులు ఎందుకులేగానీ, పేటలో దిగి ఒక ఆఫ్ ఎత్తుకొచ్చా. చెరువుకాడికి పోదాం పా రెడ్డా, అన్నాడు అయ్యోరోళ్ల పిల్లోడు.

అయ్యోరు నా కంటే చానా చిన్నోడు. అయినా చానా ఇషయాలు తెలిసినోడు. మందు తాగితే భలే సంగతులు చెప్తాడు. అందుకే నాకేం పెద్ద అలవాటు లేకున్నా అప్పుడప్పుడు ఆ పిల్లోడితో కూకోని మందు తాగతుంటా. మా ఆడోళ్లకి తెలిస్తే చీపరకట్ట తీసద్ది. అందుకే వాళ్లట్ట ఊళ్లోంచి పోంగానే మేము బండి స్టార్ట్ చేస్తాం.
ఇద్దరం చెరువుకట్టకాడ చెట్టుకింద కూసున్నాం. నేను లేనప్పుడు భలే గొడవలు జరిగినయంట. బస్ దిగి కొంచెం సేపు బంకు కాలేషా కాడ కూచున్నా. మొత్తం చెప్పిండు, అని చెప్తా గ్లాసుల్లో మందు పోసిండు.

ఈ అయ్యోరితో వచ్చిన గొడవేందంటే మనల్నేం మాట్టాడనీడు. అంతా వోడే. అది తెల్సిన ఇసయమే కాబట్టి నేను గమ్ముగా ఇంటా కూసున్నా.
కాలేషా చెప్పిననక నేను యానాది రెడ్డి కాడికి పొయినా. తర్వాత భాషా కాడిక్కూడా పోయినా. ఎవురి కథ వాళ్ళు చెప్పిండ్రు.యానాది రెడ్డి నాకేం తెలియదంటాడు. భాషా ఏమో నల్లపుంజు పొయింది మాత్రం నిజిమే అంటాడు. కానీ అసలు కథ వేరే. అది నేను చెప్తా ఇప్పుడు. ఇది నీకు తెలియందేం గాదు. అయినా కూడా ఇను, అని మొదులుపెట్టాడు.

అసలు భాషా ఎవురు? యానాది రెడ్డి కాడ ఒకప్పుడు ట్రాక్టర్ డ్రైవర్. ఆడ ఈడా చేను దున్నతా ఇద్దరూ ఒద్దిగ్గా బాగా డబ్బులు సంపాదిస్తా ఉంటిరి. మధ్యలో యానాది రెడ్డి కొడకు మల్లయ్య వచ్చిండు. నాయనా ట్రాక్టర్ అమ్మిపారినూకి నాకొక లారీ కొనీమని పట్టు పట్టాడా? సరే లేబ్బా చానా మంది ఓబులాపురం నుంచి నెల్లూరుకి లారీలు తిప్పతా దండిగా సంపాదిస్తున్నారని యానాది రెడ్డి కొడుక్కి ఒక లారీ కొనిచ్చాడు. సంవత్సరం రోజులు డబ్బులు గుల్లగుల్లగా రాలేటప్పటికి భాషా కి ట్రాక్టర్ చీప్ గా అమ్మేసి, పెంకుటిల్లు పీకి మిద్దె గట్టి ఎచ్చులుకి పొయ్యాడు యానాది రెడ్డి్. ఈ లోపల ఓబులాపురం సంకనాకిపోయే! లారీ అమ్మితే సగం డబ్బులు కూడా రాకపొయ్యే. ఇప్పుడు మల్లయ్య వచ్చి నా ట్రాక్టర్ నాగ్గావలని భాషా ని పోరుపెట్టిండు. ఒరే అది మీ నాయన నాకమ్మిండని చెప్పినా ఇనకుండా మల్లయ్య రెటమతంగా పోతుంటే భాషా పొయ్యి పేట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు.

cock1కరెస్టే అయ్యోరా. కానీ ఇదంతా ఎప్పుడిదో గోల గదా? ఆ కేసు కొట్టేసి తీర్మానం కూడా జరిగిపోయుళ్లా! ఇప్పుడు దానికీ దీనికీ ఏం సంబంధం.
ఉంది రెడ్డా. ఆడికే వస్తున్నా. అసలీ భాషా ది ఏ ఊరు? పక్కనున్న రంతాబాద్. యానాది రెడ్డి ట్రాక్టర్ కి డ్రైవర్ కావాలంటే ఆడ చికెన్ కొట్టు మూసి మన ఊరికొచ్చిండు. ఎవురో పక్కూరోడొచ్చి, సల్లంగా ట్రాక్టర్ కొట్టేసి సుఖంగా ఉన్నాడని యానాది రెడ్డి కి కడుపుమంట. అందుకే ఈ గొడవంతా. భాషా ని ఎట్టైనా ఇరకాటంలో పెట్టాలా అని యానాది రెడ్డి ప్లాన్.
అదేమో గానీ, భాషా అంటే ఊర్లో వాళ్లకి చాలామందికి కోపమేబ్బా! అప్పుడొకసారి నేను గడ్డి తోలుకోని రావాలా, బుచ్చి దాకా పోదాం రాబ్బా అంటే నేను రానన్నాడు. సరేలే అని వొదిలేశా. మొన్న ఏదో తెగులొచ్చిన కోళ్లు తెచ్చి ఊర్లో చికెన్ అమ్ముతున్నాడు తెలుసా నీకు? సరేబ్బా. భాషా ఎట్టాంటోడైనా గానీ, అసలు మనూరోళ్లకే దిక్కులేకుంటే ఏడో పక్కూరోడొచ్చి మనమీద పడి తింటుంటే ఎవురికైనా కోపం వస్తదా రాదా? అని అడిగాను.

ఎందుకు రావాలి రెడ్డా కోపం? అసలు ఈ ఊరు ఏమన్నా నీ సొంతమా? మీ నాయన రమణాడ్డి ది ఏ ఊరు? సరే ఈడే పుట్టిండు కాబట్టి ఈ ఊరే అనుకుందాం. మీ తాత రెడ్డయ్యది? ఈ ఊరా? సంగం దగ్గర కోలగట్ల గదా ఆయన పుట్టింది. వేర్లు పొయిన తర్వాత ఈ ఊరికి కాపరమొచ్చా. అప్పుడు ఈ ఊరు మీదెట్టవుద్ది. అయితే గియితే మీది కోలగట్ల అవ్వాలా. అసలు మాదే ఊరు? గంగారం. మా నాయన కి ఏం పనిలేక ఈ ఊరొచ్చాడు. మమ్మల్ని సంకనాకిపిచ్చాడు. అట్టే భాషా కూడా ఏ ఏడ్నుంచో ఈ ఊరికొచ్చా. ఇప్పుడు ఈడే బతకతుల్లా. అప్పుడు మనకి ఈ ఊరు మీద ఎంత హక్కుందో భాషా కి కూడా అంతే ఉంటుళ్లా?

ఆఖరి పెగ్ పోసిండు. ముందే చెప్పుళ్లా! మందుకొడ్తే మాట్టాడేదంతా మా అయ్యోరే అని. సరే ఏదో వాగతుండాడులే అని ఇంటా ఉండా. అయ్యోరు ఈ సారి కొంచెం డోస్ ఎక్కువేశాడు.
అసలు మనిషి చేస్తున్న తప్పేందో తెల్సా? మనోళ్ళు-పరాయోళ్లు అని చూడ్డం.హిట్లర్ అని ఒకాయనున్నాడు తెలుసా నీకు? ఏం చేసిండా ముండనాయాలు. మనోళ్లు కానోళ్లని కాల్చిపారేయమన్నాడు. సరే లక్షల మందిని సంపి పారినూకారు. ఇప్పుడు అక్కడ సమస్యలే లేవా? అసలు మనోళ్ళు ఎవురు? పరాయోళ్లు ఎవురు? సరే మీ కులపోళ్ళంతా ఒక పక్కనేమన్నా ఉన్నారా? సర్పంచ్ ఎలక్షన్లకి మీరూ మీరు తలకాయలు పగలగొట్టుకుంటిరి. మీలో మీకే పడదు. సరే మీ ఇంట్లో వాళ్లతో మీకు పడుద్దా? ఏడుగురు అన్నాదమ్ముళ్ళు వేర్లు పొయ్యిననక కూడా ఇంకా కొట్టుకుంటా ఉంటిరి. సరే. మీ ఆడోళ్లతో కూడా రోజూ గొడవే కదా నీకు? నీ కొడుకు నీ మాట ఇనకుండా ఏడో ఉండే. అన్నీ వదిలెయ్యబ్బా. కనీసం నీతో నీకన్నా పడుద్దా చెప్పు? ఎలక్షన్లో మీ ఎమ్మెల్యే క్యాండేట్ ఓడీపోయినాక ఏం ఆలోచిచ్చావు? ఒరే ఆ గెలిచిన క్యాండేట్ కి సపోర్ట్ చేసున్నా ఏదో ఒక కాంట్రాక్ట్ వచ్చుండేదని బాధపడుతున్నావా? లేదా? నేను చెప్పేదేంటంటే. – మనతో మనకే పడనప్పుడు ముందు మనది మనం కడుక్కుని గెటాన్ అయిపోవాల- అని గుక్క తిప్పుకోకుండా చెప్పి నీళ్లు కూడా కలపుకోకుండా మిగిలిన మందు అట్టే తాగేసిండు అయ్యోరు.
ఈడమ్మ బొడవ. ఎవురిదో గొడవ నామీదకొచ్చిందా? సరేలే అయ్యోరికి మందెక్కువైతే ఏం మాట్టాడుతాడో తెలియదు. ఇదేం చూశాం లే. అసలు ఫుల్ బాటిల్ ఏస్తే దేవుడి తోనే వాదిస్తాడు. తెచ్చిన ఆఫ్ బాటిల్ అయిపోయింది. మేము చిన్నంగా ఇంటికి వచ్చాం. నిద్రపోతుంటే నాకేమనిపించిందంటే అయ్యోరు చెప్పిందాంట్లో నిజిమైతే ఉంది. యానాది రెడ్డి పాపం భాషా ని అనవసరంగా గెలుకుతున్నాడు. ఈ సారి కనిపిస్తే ఆ భాషా ని ఇబ్బంది పెట్టబాకులే అని యానాది రెడ్డి కి చెప్దాం లే అనుకున్నా.

*****

అప్పుడే సెప్టెంబర్ బొయ్యి అక్టోబర్ కూడా వచ్చింది. వానలు పడినట్టే పడి ఆగిపోయ్యే. మళ్ళీ చుక్క పడలా. ఈ సారన్నా ఒక తడి నీళ్లొస్తే ఎమ్మెల్లే తో మాట్లాడి చెర్లోకి సోమశిల నీళ్లన్నా తెప్పించుకుందామంటే అది కూడా జరిగేతట్టు లేదు. మా కొడుకేమో ఇంకా ఆ ఊర్లో ఏంపనని? అంతా అమ్మిపారినూకు ఐద్రాబాద్ కి రాండి అంటాడు. పండినా పండకపోయినా చేలు ఎట్టా అమ్మేది? అమ్మినా ఇప్పుడెవురు కొనేది? ఎట్టో నాలుగు బర్రెలుంటే పాలన్నా తీసి అమ్ముకుంటా బతకతా ఉంటిమి. నెల్లూరు పొయ్యి ఏమడక్కనూకను? నువ్వు ముందు ఉజ్జోగం చేసి డబ్బులు సంపాదీ. నీకు పెళ్లి చేస్తే మేము గూడా వచ్చి నీతోనే ఉంటం అని వాడికి సమాధానం జెప్తే మాత్రం ఏం మాట్లాడడు. వాడు నాలుగేళ్లు ఇంజినీరింగని సరిగ్గా చదివకుండా ఎందుకు గాలి తిరుగుళ్లు తిరిగిండో, నాలుగేళ్ల నుంచి మాఊళ్లో ఎందుకు వానలు పట్టంలేదో – ఈ ఇసయాలు మాత్రం నాకస్సలు అర్థం కావు.

గంగమ్మ పొంగళ్ళు పెడితే వానలు పడతాయని ఎవురో పెద్దమనిషి చెబ్తే అది కూడా చేస్తిరి. ఆడ కూడా ఈ ఊరోళ్లు ఒక మాట మీదున్నారా అంటే అదీ లేదు. ఆడ కూడా తలలు పగలకొట్టుకునే దాకా తెచ్చిండ్రు. అసలు గంగమ్మ పొంగళ్లు సరిగ్గా పెట్టుంటే వానలు పడుండేయేమో! ఏమో, ఇదంతా పైన కూచుని చూస్తుండే దేవుడికే తెలియాల. ఊళ్లో వాళ్ళకి మాత్రం ఎవురికీ పనిలేక పెంచలయ్య అంగడి కాడో, బైసానోళ్ల అరుగుమీదో, సర్పంచి ఆఫీస్ కాడో, ఇయన్నీ కాకపోతే పీర్ల చావిటి కాడ కూసుని ఉత్తమాటలు చెప్పుకుంటా ఉండారు. సరే, కనీసం ఈ మజ్జెన ఏం తకరాదులు లేవు, ఊరన్నా ప్రశాంతంగా ఉందిలే అనుకున్నానా, అంతే ఆ రాత్రికి స్టార్ట్ చేసిపారినూకిండ్రు.

*****

ఎమ్మారో ఆఫీస్ లో పన్జూసుకుని, ఆరుగంటల బస్ లో సుధాకర్ తో మాట్లాడతా ఉంటే, వాక్కాడ కాలనీ దగ్గిర బస్ ఆపిందాక టైమే తెలియలా. రేప్పొద్దున్నే మళ్లీ రావాల్లేబ్బా. పని గాలేదింకా అని సుధాకర్ కి చెప్పి బస్ దిగా. దిగంగానే నాకు భలే భయమేసింది. మాలకొండ కత్తి పట్టుకుని నా కాడికే వస్తుండాడు. ఈడి కాష్టం కాలా, ఈడు నామీదకొస్తున్నాడేందని నేను కొంచెం బెదిరా. రెడ్డా ఏడికి పొయినువా? ఫోన్ జేస్తే సిచాఫ్ వస్తుంది, అన్నాడు.

అది బ్యాటరీ పొయిందిలే గానీ, ఈ రేతిరిలో ఆ కత్తేంది? ఎవుర్ని పొడవడానికి?
ఆ భాషా గాడిని.
మా ఊరి ముండనాయాళ్ళు మళ్లీ ఏందో కొత్తది లొడబెడ్తున్నారని నేననుకుంటానే ఉన్నా. అట్టే జరిగింది.
అసలేంది మందల?
చెప్తాలే గానీ నువ్వురా ముందాడికి, అని నన్ను బరబరా లాక్కోని పొయ్యాడు మాలకొండ.
ఆడకి పొయ్యేసరికి అంతా చిందరబందర చేసేసున్నారు. భాషా చికెన్ షాప్ పీకి తుక్కు చేసేశారు.

భాషా నీకు ఎప్పుట్నుంచో చెప్తావుండా. నువ్వు ఇట్టే రెటమతంగా ఉంటే ఇది చాందూరం పోద్ది. నా మాటిని షాపు తీసెయ్, అని చెప్తున్నాడు కామేశ్వరయ్య. ఆ పిల్లోడితో ఎప్పుడూ పడని మా రెడ్డి గారి పిలకాయలు తిరపతరెడ్డి, నారప రెడ్డి కూడా ఇదే మాట చెప్తుండారు. భాషా కి వాళ్ల సాయిబులోళ్ళ పిలకాయలంతా సపోర్టింగ్ గా నిలబడి ఉండారు.
మీరేందయ్యా చెప్పేది? ఎవురు అసలు ఈ రూల్ పెట్టింది? నేను అమ్మతా మీరేం చేస్తారో చేసుకోండి, అని భాషా అరస్తుండాడు.
ఏందిరా మీరు. రోజు ఏదో ఒక తకరాదు లేకుండా వగదెగదా మీకు? టైంపాస్ కాకపోతే అట్టపొయ్యి ఏమన్నా పనికొచ్చే పని చెయ్యండి. అసలు ఎందుకు కొట్టుకుంటున్నారు మీరు? అని కోపంగా అడిగా.
అబ్బా రెడ్డొచ్చిండు. మళ్లీ మొదులుపెట్టండి, చీకట్లో ఎవురో అన్నారు.

cock1అదన్నది యానాది రెడ్డని నాకు ఖచ్చితంగా తెలుసు. అయినా నేను గమ్ముగున్నా. మనది మనం కడుక్కుంటే చాలని అయ్యోరు చెప్పినకాడ్నుంచి ఎవురి ఇసయాల్లో ఏలు బెట్టకుండా ఉన్నా. ఈడ ఎవురిగోల వాడిది. మజ్జెలో నాకెందుకులే అని పోబోతుంటే, నా, మీ పిలకాయలకి చెప్పనా. లేకపోతే ఈ రాత్రికి ఈ ఊర్లో ఎవురికీ మెడకాయల మీద తలకాయలుండవ్ అని సున్నేసాయిబు నా దగ్గరకొచ్చాడు.

అయన్నీ ఎందుకుగానీ, తకరాదు జరగతాఉందని పోలీసులకి తెలిస్తే వచ్చి అందర్నీ జైలుకి లాక్కోపోయి గుద్దమీద తంతారు. అందరు మూసుకోని ఇంటికి పోండి, అని చెప్పి నేనాడనుంచి సక్కా పోతావున్నా. వాళ్లంత వీజీగా వదిలిపెడ్తారా నన్ను? కూసోబెట్టి బారతమంతా చెప్పారు.
మాల్యాద్రి ఇంట్లో ఎద్దుకి కుడితినీళ్లు పోసే వాళ్లు కూడా లేరు. మాల్యాద్రి టౌన్ లో పళ్లంగడి పెట్టిండు. ఎప్పుడో వారినికొకసారి గానీ రాడు. వాళ్ల నాయన శంకరయ్య మంచంలో పడుండే. అప్పుడప్పుడు పక్కింటి రామిరెడ్డి కొంచెం ఎండు గెడ్డేసి దాన్ని సాకతా ఉన్నాడు. రామిరెడ్డి పిలకాయల దగ్గరకి పోయినకాడ్నుంచి పట్టించుకునే వాళ్ళు లేక ఎద్దు నీలక్కపోయింది. అది ఇంక చసద్ది అని తెలిసిపోయింది మాల్యాద్రికి. అందుకని కాలనీ కాడికి పోయి అంకయ్య ని రమ్మంటే అది మాకేం బళ్లే అని చెప్పిండు. ఏం జెయ్యాలబ్బా అని కాలనీ కాడ్నుంచి నడుచుకోనస్తుంటే భాషా కనిపించిండు.పొద్దు పొద్దున్నే ఏడికో పొయ్యుస్తుండావే మాల్య్రాది? అని భాషా అడిగితే విషయం చెప్పాడు. సరేలే ఇప్పుడది చస్తే పీనిగ తీయడానిక్కూడా ఎవురు రారు. నేను ట్రాక్టర్ ఏసుకొస్తా, దాన్ని తొట్లో ఏస్తే నేనే దాన్ని తీసుకుపొయ్యి ఏదో ఒకటి చేస్తాలే, అని భాషా అంటే, సరేనని ఒప్పుకున్నాడు మాల్యాద్రి. కానీ భాషా ఆ ఎద్దుని తోలుకొచ్చి, హలాల్ చేసి చికెన్ షాప్ లో కేజీల లెక్కన మాంసంగా అమ్మతాడని అనుకోలేదు. అక్కడ నుంచి గొడవ పెద్దదై, ఊర్లో పిలకాయలందరూ భాషా చికెన్ కొట్టుని పగలగొట్టే దాకా వచ్చింది. ఇద్తెలిసి సాయిబులోల్ళ పిలకాయలు కూడా ఎదురుతిరుక్కున్నారు.

అంతా ఇని, ఏందో ఈ జనాలు అనుకున్నా. ఈళ్లకి కొట్టుకోడానికి రోజుకొక కారణం దొరుకుద్ది గానీ గమ్ముగా ఉండడానికి అసలు కారణమే కనిపిచ్చదా, అనుకున్నాను. అసలీ గొడవ తేల్చాలంటే ఎవురి చేతా కాదని నాకనిపిచ్చింది.
చంపతా, పొడుస్తా అని ఒకరి మీదికి ఒకరు పోతానే ఉండారు. ఎవురో పోలీసులకి ఫోన్ జేసినట్టున్నారు. పోలీసుల్ని చూడగానే మా పిలకాయలంతా ఉచ్చపోసుకుంటా ఎళ్ళబారారు. పోలీసోళ్ళు ఒక్కొక్కడిని పట్టుకోని జీబ్ లో ఎక్కించి ఆత్మకూరు జైల్లో ఏశారు. ఆ తర్వాత రోజు నేనే ఎమ్మెల్లే దగ్గరకు పొయ్యి, వకీల్ తో మాట్లాడి మా పిలకాయల్ని ఇడిపిచ్చి తీసుకొస్తుంటే బస్ లో అయ్యోరు కనిపిచ్చాడు. ఏంది రెడ్డీ కొత్త కేసంట అన్నాడు. అసలు ఈ ఊరికేదో శని పట్టింది అన్నాను.
అదేం కాదులే. జనాలకి ఈ మధ్య కోపాలు ఎక్కువైపొయినయి. ఈ జీవితం చానా చిన్నది రా నాయినా అని తెలుసుకుంటే ఇయన్నీ ఉండవు. ఈళ్ళకి ఇదెందుకు అర్థం కాదో నాకు తెలియదు. పక్కనోడినతో కలిసుండడం ఎందుకంత కష్టం? ఒక రోజు కోడి కోసం కొట్టుకునే. ఇంకో రోజు గొడ్డు కోసం కొట్టుకునే. కొట్టుకోడానికి కారణాలు గావాలా? కొట్టుకోవాలనే ఉంటే ఎందుకైనా కొట్టుకోవొచ్చు.
అయ్యోరా, అన్నీ తెలిసినోడివి. నాకీ ఇసయం చెప్పు. అసలు గొడ్డు మాంసం గురించి నువ్వు సదువుకున్న పుస్తకాల్లో ఏమి రాసున్నారు?
ఏడా ఎవురూ ఇదీ అని రాయలేదబ్బా. ఒకేళ రాసున్నా అది అప్పుటి రోజులకి సరిపోద్ది. అప్పుడూ ఇప్పుడూ ఒకేగా ఉన్నామా ఏంది మనం? మా నాయన రోజుకి ఒక్క పూటే తింటా, యాభై ఏళ్లు దేవుడికి పూజ చేసి క్యాన్సరొచ్చి కుక్క చావు చచ్చాడు. మా నాయన చావడం చూసి నాకు జీవితం మీద విరక్తొచ్చి ఏడికో పోతే, నన్ను ఎతుక్కోని వచ్చి మరీ ఈ ఊర్లో పూజారిని చేసుళ్లా మీరు? నేనేమన్నా మా నాయన లాగున్నానా? నేను మాంసం తింటున్నా. మందు తాగుతున్నా. అయినా ఎందుకు నాతో ఏగతున్నారు? మీ ఊళ్లో గుళ్లో దీపం బెట్టే పూజారి లేక. నన్నేమన్నా అంటే నేను అలిగిపోతానని గుద్ద మూసుకోనుళ్లా మీరంతా. అట్టే ఎవురిపాటికి వాళ్లని వదిలెయ్యండి. వాళ్లేమన్నా మిమ్మల్ని తినమని బలవంతం జేస్తున్నారా ఏంది?
నేనే ఆపుకోలేక అడిగా. అది కాదు అయ్యోరా. గవర్మెంట్ కూడా గొడ్డు మాంసం బ్యాన్ చేసుళ్లా, అన్నాను.

గవర్మెంట్ ఏందయ్యా బ్యాన్ చేసేది? మనకి బుద్ధుండబళ్లే! బంగారం లాంటి ఎద్దుని చంపకతినిందేమో మాల్యాద్రి. దాన్ని భాషా కోసి తింటే మాత్రం తప్పయిపోయిందే! మనూర్లో ఒక శెట్టి గారు రోజూ పంది మాంసం తింటుళ్లా. సరే డాక్టర్ చెప్పిండు, తింటే బాగా ఊపిరాడద్దని చెప్తే మందులా తింటున్నాడు. వాళ్లని ఎవురన్నా ఏమన్నా అన్నారా? అట్టే మానూరి సాయిబులు వాళ్లకిష్టమొచ్చింది తింటారు. మజ్జెలో మీకేంది? ఇట్టే పోతే, కొన్ని రోజులకి ఈ కోళ్లు, బర్రెలు గాదు. ఇట్ట కొట్టుకోని మిమ్మల్ని మీరే చంపుకోని పీక్కు తింటారు.
మరి గొడ్డుని చంపడం తప్పు కాదా? అడిగాను.

ఎవురు చెప్పారబ్బా ఇది తప్పు. ఇది కాదు అని. ఆ దేవుడా? అసలు దేవుడే మనిషి ని పుట్టిచ్చాడో లేదో ఎవురికి తెలుసు? కానీ దేవుణ్ణి మాత్రం మనమే పుట్టిచ్చాం. ఈ విషయం నాకెవురు చెప్పారని అడగబాకండి. నిన్న రాత్రి దేవుడితో మాట్టాడతుంటే చెప్పాడని చెప్పినా నువ్వు నమ్మవు. నమ్మినా నమ్మకపోయినా ఈ మాట మాత్రం నీకు చెప్పాల. దేవుడేమన్నాడంటే, నీ పని నువ్వు చూసుకో. పక్కనోడిని గెలకబాకు. ఇది తెలుసుకుంటే చాలు మనం.

అదేదో వేదాల్లో రాసున్నారు కదా! ఆవు దేవుడని, ఏదో చెప్పబోతుంటే ఆపాడు ఆయ్యోరు.
వినాయకుడి వాహనం ఏంది? ఎలుక. దాన్ని చంపటంలే? సుబ్రమణ్యస్వామి వాహనం ఏంది? నెమలి. దాన్ని చంపి తినటం లే? విష్ణుమూర్తి వాహనం ఏంది? పాము. దాన్ని చంపటంలే? ఇయన్నీ పురాణాల్లో అప్పుడెందుకు రాశారో ఏమో? వాటిల్లో ఏదో నిజముండే ఉంటది. కానీ వాటిల్ని అప్పుట్లాగే చూడ్డం తప్పు. అసలంతెందుకు? నేను చిన్నప్పుడు మన శిద్దాడ్డోళ్లింట్లో యాభై ఆవులుండేయి.వాటిల్ని సాకలేక అమ్మేస్తిరి. మీకంత ముఖ్యమైతే మీరే సాక్కోకూడదా? ఎందుకమ్మేయడం? – అని కోప్పడ్డాడు.

అయ్యోరు చెప్పిందైతే పాయింటే. ఇది అందరికి తెలిసిన ఇసయమే. అయినా ఏందీ గొడవలు?
రెండ్రోజులుకి సాయిబులోళ్ల పిలకాయలు కూడా బయటకొచ్చిండ్రు. మళ్లీ ఏం గలభా చేస్తారో అని, నాయకులంతా అందర్నీ పంచాయితీ బోర్డ్ కాడికి పిలిపిచ్చాం. ఇంక ఈ ఊర్లో గొడవలు పెట్టుకోకుండా సక్కంగా ఉండమని నేను చెప్తున్నానా, మధ్యలో యానాది రెడ్డి పుల్లేశాడు.

అంటే ఏంది సుబ్బాడ్డే నువ్వు చెప్పేది? అయినా నువ్వేంది ఎప్పుడూ వాళ్లకే సపోర్ట్ వస్తుండావు? అడిగాడు యానాది రెడ్డి.
యానాది రెడ్డి, ఏందంటే అది మాట్టాడబాకు. నేను చెప్పిందాంట్లో తప్పేంది? అన్నాను.
అంటే ఏదయ్యా మీరు చెప్పేది? పెద్ద మనుషులని పోనీలే అనుకుంటే అన్యాయంగా మాట్లాడుతున్నారే. ఈ ఊర్లో గొడ్డు మాంసం తింటానికి లేదు, అని కోపంగా అన్నాడు తిరపతరెడ్డి.
మేం తింటాం, ఎవురాపేది మమ్మల్ని. రాండి చూసుకుందాం, అని కాలేషా ఇంకా కొంతమంది ముందుకు దూకారు.

మీ పోసుగాల. ఉండండ్రా, అని నేనోళ్లని ఆపాను. భాషా నా మాటిని నువ్వొక పన్జెయ్యి. ఆ చికెన్ షాప్ లో బీఫ్ అమ్మబాకు. దానికి పక్కనేడన్నా ఇంకొక అంగడి పెట్టుకో. ఎవురికీ ఇబ్బంది లేకుండా ఉంటది అని సర్ది చెప్పబోతుంటే- అసలు ఈ ఊర్లో గొడ్డు మాంసం అమ్మడానికి లేదు అని మాల్యాద్రి ముందుకొచ్చి అరిచాడు.
ఒరేయ్ సిగ్గు లజ్జా ఉందా నీకు? గొడ్డు చస్తా ఉంటే కనీసం చెంబుడు నీళ్ళయినా పోసినా? వాళ్ళ కొట్టాం లో ఉంటుందని రామి రెడ్డి చూడకపోతే అదెప్పుడో చచ్చుండును. ఎద్దు పోతే దాని మాంసం అమ్ముతుండాడు భాషా. అసలు దాన్ని చంపిందెవురు? నువ్వు కాదా? అప్పుడు నిన్నేం చెయ్యాలా? నువ్వు మూసుకోనుండు, అని నేను కోపంగా మాల్యాద్రి మీదకు పొయ్యా.
యో, ముసిలాయనా! ఏందో పెద్ద మనిషవని చూస్తావుంటే రెచ్చిపోతుండావే! నువ్వు మూసుకోని ఆడ కూర్చో అని గదిమాడు. అట్ట చెప్పు ఆయనకి ఏందో పెద్ద నీలగతా ఉన్నాడు, అని యెటకారంగా అన్నాడు యానాది రెడ్డి. అట్ట ఎవురికిష్టమొచ్చినట్టు వాళ్ళు మాట్లాడతా, సందకాడ మొదలైంది రేత్రంతా పోతానే ఉంది. ఈ రోజు ఎట్టైనా ఏదో ఒకటి తేల్చందే నిద్రపొయ్యేలా లేరు జనాలు. ఏదో నా మాట ఎట్టా ఇనకపోయే. మజ్జెలో నాకెందుకులే అని పీర్లచావిటి కాడికొచ్చి కూసున్నా.

మొన్న బస్సులో అయ్యోరు చెప్పిన మాటలు గుర్తుకొచ్చినయి.
చూడు సుబ్బాడ్డీ. ఈ ఊరు ఇట్టా ఎందుకు ఉందని కదా నీ బాధ? ఈడ చెరువుల్తో పాటు మనుసుల గుండెలు కూడా ఎండిపోయాయబ్బా. పక్కనోడి బాధ మన బాధ అయితే మనకీ కన్నీళ్లొస్తాయి. గుండెల్లో వాన కురుసుద్ది. గుండెల్లో పైరు మొలుసుద్ది. అప్పుడు మనిషీ పచ్చగా ఉంటాడు. ఊరూ పచ్చంగా ఉంటది. సర్వే జనా: సుఖినోభవంతు! సమస్త సన్ మంగళాని భవంతు! ఓం శాంతి !శాంతి! శ్శాంతి!
శాంతి? ఏడుందది? ఇప్పుడందరికీ కోపాలే!

గొడవ ఆపలేకపోయినందుకునాక్కూడా కోపమొస్తా ఉంది. గమ్ముగా అరుగు మీద పొడుకున్నా. గాలే లేదు. ఉక్క బోస్తా ఉంది.

ఆకాశంలో సుక్కలు కనిపీటంలే. చీకట్లో ఏందో మెరస్తా ఉండాది. ఏందదని నేను చూస్తా ఉండంగానే అది కొంచెం కొంచెం పెద్దదవతా దగ్గిరికి వస్తా ఉండాది. ఏందో మంటలాగుంది. మంటే. మంట పెద్దదవతా వచ్చి కాష్టాల మిట్ట కాడ ఆగింది. మంట పెద్దదయింది. భోగిమంట అంత పెద్ద మంట. మంట కింద నిప్పులు పీర్లపండక్కేసే గుండాంలా మెరిసిపోతుండాయి. మంట ఇంకా ఇంకా పెద్దదవతా ఉండాది. నేను దగ్గరకి పోతా ఉండాను. పొగ పైకి లేచి ఆకాశాన్ని కమ్ముకుంది. ఆకాశంలో సుక్కలు కూడా మాయమైపోతుండాయి.
ఊళ్లో వాళ్లంతా ఒకొరకరిగా మంటల్లోకి దూకతుండారు.

చూళ్ళేక కళ్ళు మూసుకున్నా. ఏందో తెలియలా. చాన్రోజులకి కళ్లల్లో నీళ్లు అట్టే కారిపోతా ఉండాయి.

*

కైలాసం బాలచందర్ తో కాసేపు…!

kb

దాదాపు పదేళ్ల క్రితం…

అప్పటికింకా నేను సినిమా ఇండస్ట్రీ కి రాలేదు. ఆ రోజుల్లో సినిమా అంటే విపరీతమైన అభిమానం తప్పితే మరే ఆలోచన లేదు. అప్పట్లో బెంగుళూరు లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను. ఆ రోజుల్లో హైదరాబాద్ లో అంటే సినిమా పారడైజో అనే డీవిడి లు దొరికే షాప్ ఉండేది; అక్కడ్నుంచే నాకు ప్రపంచ సినిమా పరిచయం. అలాగే హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ ఉండేది. కొద్దో గొప్పో అక్కడ కూడా సినీ అక్షరాభ్యాసం చేశాను. బెంగుళూరు లో అంతా కొత్త. కొన్నాళ్ళకు అక్కడ సుచిత్రా ఫిల్మ్ క్లబ్ పరిచయం అయింది. కన్నడంలో సినిమాలు మన కంటే దారుణమైన పరిస్థితిలో ఉన్నా అక్కడొక గొప్ప సౌలభ్యం ఉంది – అక్కడ కమర్షియల్ సినిమాతో బాటు ప్యారలల్ సినిమా ఏదో ఒక విధంగా సజీవంగానే ఉంటుంది. అందుకు కారణం కొంతమంది కన్నడ చిత్ర దర్శకులు చేసిన అవిరామ శ్రమ అని చెప్పుకోక తప్పదు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు పుట్టన కనగల్.

అయితే ఈ విషయం నాకు బెంగుళూరు కి వెళ్లి సుచిత్రా ఫిల్మ్ క్లబ్ లో చేరే వరకూ తెలియదు. అయితే మనం వయసులో ఉన్నప్పుడు మనకన్నీ తెలుసనే భ్రమలోనే ఉంటాము. అది తప్పు కాదు. అయితే ఒక రోజు పుట్టన కనగల్ దర్శకత్వం లో వచ్చిన “గజ్జ పూజ” అనే సినిమా స్క్రీనింగ్ అవుతోందని తెలిసి వెళ్లాను. సినిమా బాగానే ఉంది. ఆ సినిమా అయ్యాక ఎవరెవరో పెద్ద వాళ్ళు పుట్టన్న గురించి మాట్లాడుతూ, వయసులో తనకంటే చిన్నవాడైనా బాలచందర్ గారు ఆయన్ని గురువుగా భావించేవాడని అన్నారు. అప్పటి వరకూ బాలచందర్ అంటే మనకంతా తెలుసనే భావన. తెలుగులో ఆతన చేసిన సినిమాలన్నీ చూసేయ్యడమే కాకుండా, మళ్లీ మళ్ళీ చూసే అలవాటు కూడా! అయితే బాలచందర్ గారి గురించి కొత్తగా తెలిసిన విషయం అది. దాంతో కేబి అనబడే కైలాసం బాలచందర్ గురించి సరికొత్త అసక్తి మొదలైంది.

10881662_755155524574112_1367463442407730471_nబాలచందర్ అంటే మనకి తెలిసిన “ఇది కథ కాదు”, “అంతు లేని కథ” లాంటి సినిమాలే కాదు, తమిళంలో మన తెలుగు వాళ్లకి పరిచయం లేని చాలా సినిమాలే చేశారని అప్పటిదాకా తెలియదు. ఆ క్రమంలో ఒక రోజు బాలచందర్ గారి దర్శకత్వంలో వచ్చిన “తనీర్ తనీర్” సినిమా స్క్రీనింగ్ చేస్తుంటే వెళ్ళాను. అప్పటికి నేను సినిమాల గురించి రాయాలన్న ఆలోచనే లేదు. కానీ సుచిత్రా ఫిల్మ్ క్లబ్ లో ఉన్న సినిమా పుస్తకాలు, ఆ రోజు అయన తో గడిపిన కొంత సమయం – ఆ తర్వాతే వాకు తెలుగులో కూడా ఎవరైనా బయోగ్రఫీ, ట్రివియా కి మించి ఏదైనా రాస్తే బావుండనిపించింది . ఒక విధంగా అయనతో మాట్లాడిన తర్వాతే నాకు నవతరంగం ఐడియా పుట్టింది. బాలచందర్ గారితో ఆ రోజు మాట్లాడిన ప్రతి క్షణమూ నాకు ఇంకా గుర్తుంది.

బాలచందర్ గారిని నేను కలిసేటప్పటికి దక్షిణ భారత సినిమా మొత్తం అట్టడుగు స్థాయిలో ఉందని ఆ రోజు అక్కడికి వచ్చిన ప్రేక్షకులందరి అభిప్రాయం. నేను కూడా వారందరి అభిప్రాయంతో ఏకీభవించాను కూడా! కానీ బాలచందర్ ఒక్కరే ఆ రోజు మా అందరి అభిప్రాయంతో విబేధించారు. సినిమా అనే కళ అభివృద్ధి చెందడంలో సినిమా నిర్మాత, దర్శకుల భాధ్యత ఎంత ఉందో, ప్రేక్షకుల పాత్ర కూడా అంతే ఉందని ఆయన అన్నారు. మంచి సినిమాని అభిమానించే ప్రేక్షకులు ఉన్నారు కాబట్టే, అలాంటి సినిమాలను నిర్మించే నిర్మాతలు తనకు దొరికారని, లేదంటే “తన్నీర్ తన్నీర్” లాంటి సినిమా ప్రస్తుత పరిస్థుతుల్లో తను చేయలేకపోయుండే వాడినని అన్నారు ఆ రోజు.

ఒక విధంగా బాలచందర్ గారి మాటల ద్వారా “నవతరంగం” మొదలైతే, ఆయన నన్ను మరో విషయంలో కూడా ఆసక్తిని ప్రేరేపించారు. ఆ విషయం గురించే నేను ప్రస్తుతం కొన్ని బహుళజాతీయ సంస్థలతో కలిసి పనిచేసే ఆలోచనలో ఉన్నాను . అది – ఫిల్మ్ ఆర్కైవల్ గురించి.

ఆ రోజు నేను బాలచందర్ గారితో మాట్లాడుతూ తెలుసుకున్న ఒక బాధాకరమైన విషయమేమిటంటే , ఆయన తీసిన చాలా సినిమాల నెగిటివ్ లు ఇప్పుడు లేకపోవడం. ఆ విషయం గురించే మేము మాట్లాడుకున్నాం ఆ రోజు. ముఖ్యంగా ఆయన తీసిన సినిమాల్లో చాలా ముఖ్యమైన “తన్నీర్ తన్నీర్” లాంటి సినిమా కాపీలు కేవలం సిడి కో లేదా విహెచెస్ టేప్ కి మాత్రమే పరిమితమయ్యాయి . సినిమాని ప్రజలు కానీ, ప్రభుత్వం కానీ ఒక కళ గా గుర్తించనంతవరకూ మనకీ దౌర్భాగ్యం తప్పదని ఆ రోజు ఆయన అన్నారు. అయితే ఈ రోజు దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే…మొన్నీ మధ్య ఒక ఫిల్మ్ స్కూల్ లో క్లాసులు చెప్తూ బాలచందర్ గారు ఎంతమందికి తెలుసని అడిగితే…సగం మందికంటే తక్కువ మంది చేతులెత్తగా…అందులో ఇద్దరో ముగ్గురికి మాత్రమే ఆయన సినిమాలు చూసిన గుర్తుంది.

ఒక గొప్ప కళాకారుడు, రచయిత, దర్శకుడు… ఇలాంటి వాళ్ళు ఒకప్పుడు ఉండేవాళ్ళని ఇప్పుడు చెప్పుకోవాల్సిన పరిస్థితి. అంతరించి పోయిన జీవుల్లా, బాలచందర్ లాంటి వాళ్ళు కూడా అంతరించినపోయిన గొప్పదర్శకుల జాతికి చెందుతారేమో!

ఎందుకంటున్నానంటే …నాకిప్పటికీ బాగా గుర్తు. రంజని తో పెళ్ళాయ్యాక మొదటి సారి మద్రాస్ వెళ్లి ఏదో పని మీద లజ్ ఏరియా లో నడూస్తుండగా ఒక ఇల్లు చూపించి ఇది బాలచందర్ గారి ఇల్లు అని చెప్పింది రంజని. ఇక భవిష్యత్ లో ఇలాంటి అనుభవాలు మనకి ఉండవేమో! ఒకటి అంతా అపార్టెమెంట్ల మయమైన ఈ చోట ఎవరి ఇళ్లు ఎక్కడో గుర్తుపెట్టుకోవాల్సిన గొప్పతనం లేకపోవడం ఒక కారణమైతే, అంత గొప్పగా ఫలానా దర్శకుడి ఇళ్లు, ఫలానా దర్శకుడు ఇక్కడే కూర్చుని కాఫీ తాగుతూ కథలు రాసుకునే వారనో చెప్పుకోగలిగినంత గొప్ప వాళ్ళు ఇక లేరనే నా నమ్మకం. అలాంటి వారిలో చివరి తరానికి చెందిన కైలాసం బాలచందర్ ఈ రోజు మనతో లేరంటే…తలుచుకుంటేనే మనసంతా ఒకరకమైన శూన్యంతో నిండిపోతోంది.

బాలచందర్ గారి గురించి, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయన గురించి తలుచుకుంటే…ఒక విషయం గుర్తొస్తుంది. ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలు తీయలేదు… కానీ ఆయన చూసిన మంచి సినిమాల గురించి మెచ్చుకుంటూ లేఖలు రాశారు. ఒక గొప్ప కళాకారుడు మాత్రమే మరొకరి కళ ను అభినందించగలడు.

ఆయన గురించి రాయాలంటే ఇంకా చాలా రాయొచ్చు. ఆయన సినిమాల గురించి, ఆయన గురించీ…ఇలా ఎంతో రాయొచ్చు. కానీ ఆయన గురించి తెలిసిన వాళ్ళకి మనం ఎంత రాసినా వృధా ప్రయాసే! వందకి పైగా సినిమాలు చేసిన ఆయన గురించి ఈ రెండు పేజీలు ఏం సరిపోతాయి? ఆయన గురించి తెలియని వాళ్ళకి కూడా అంతే! ఈ రెండు పేజీల్లో సంక్షిప్తం చేయగలిగింది కాదు ఆయన చరిత్ర.

మనం అప్పుడప్పుడూ అంటుంటాం, “ఆ రోజుల్లో…రాజులుండే వాళ్ళు, వాళ్ళు గుర్రాలెక్కి, కత్తి పట్టి యుద్ధాలు చేసేవారు,” అని…ఇప్పుడూ అంతే…ఆ రోజుల్లో “బాలచందర్ అని గొప్ప దర్శకుడు ఉండేవాడు. ఆయన మార్కెట్, బాక్సాఫీస్, ప్రేక్షకులు అని ఆలోచన లేకుండా, కాలం కంటే ముందుండే కథల్ని ఎన్నుకుని సినిమాలు తీసేవాడు,” అని చెప్పుకోవాల్సి వస్తుంది.

ఎంతైనా పేరులోనే కైలాసం ఉన్నవారాయన. ఇంత గొప్ప సినిమాలు తీసినందుకైనా ఆయనకి కైలాసంలోనో లేదా మరింకెక్కడో ఆయన ఆత్మకి శాంతి కలిగే అవకాశం దక్కే ఉంటుందనో లేదా, ఆయన సినిమాల ద్వారా ఇప్పటికీ మన మధ్యనే ఉన్నారు, ఇంకా జీవిస్తూనే ఉన్నారనో మాయమాటలతో , బూటకపు పదజాలంతో ఆయన్ని వర్ణించవచ్చు. కానీ అలా రాయడం ఆయనకి ఎంత నచ్చి ఉండేదో నాకు తెలియదు.

కానీ ఒకటి మాత్రం నిజం. ఇవాళ బాలచందర్ గారు లేకపోవడం సినీ ప్రేమికులందరికీ తీరని లోటు.

-వెంకట్ సిధారెడ్డి

అమ్మ, నేను, సినిమా!

memories-1

నేను ఏడో తరగతి లో ఉన్నప్పుడు మా ఊరికి కరెంట్ వచ్చింది. ఆ తర్వాత రెండేళ్ళకి మా ఊరికి టివి వచ్చింది. కానీ అంతకంటే ముందే నేను చాలా సినిమాలు చూసినట్టు గుర్తు. మా ఊర్లో స్కూల్ కి శెలవులు ఇవ్వగానే అమ్మ మమ్మల్ని అమ్మమ్మ ఊరికి తీసుకుళ్లేది. బహుశా, ఈ సమయానికి నేను స్కూల్ లో రెండో మూడో తరగతి లో ఉండి ఉంటాను. అప్పటికే మా అమ్మను ఎదిరించే ధైర్యం వచ్చింది. అప్పటి రోజుల కొన్ని సినిమా జ్ఞాపకాలు ఇవి.

ఒక రోజు రాత్రి నేను మా పెద్దమ్మ వాళ్లింట్లో నిద్రపోతున్నాను. కొంచెం హడావుడి అవుతుండడంతో లేచి చూశాను. ఏమీ లేదని చెప్పి మా అమ్మ నన్ను పడుకోబెట్టింది. కానీ కాసేపటికి లేచి చూస్తే ఇంట్లో మా అమ్మ లేదు; అలాగే మా ఇద్దరు అక్కలు లేరు. లేచి ఏడవడం మొదలు పెట్టాను. మా పెద్దమ్మ నిజం చెప్పేసింది. నన్ను పడుకోబెట్టి మా అమ్మ వాళ్లు సినిమాకెళ్లిపోయారు. నేను ఊరుకోలేదు. అంత రాత్రి పూట రోడ్డు మీద కి పరిగెత్తాను. కొంచెం దూరం వెళ్లగానే వాళ్ళు వెళ్తున్న రిక్షా కనిపించింది. గోలగోల చేశాను. రోడ్ మీద పడి దొర్లాడాను. మా అమ్మ నన్ను చితక్కొట్టింది. చివరకు మా అక్కవాళ్ళు జాలిపడి నన్ను సినిమాకి తీసుకెళ్లారు. ఆ సినిమా “అందరూ దొంగలే”.

అయితే సినిమా థియేటర్ వెళ్లేలోపే మళ్లీ నిద్రలోకి జారుకున్నాను. ఏమైందో తెలియదు. ఆ సినిమా కథేంటో కూడా గుర్తులేదు. కానీ ఎందుకో రమాప్రభ, పద్మనాభం ఇమేజ్ మాత్రం పోస్టర్ మీద చూసిన గుర్తు. సినిమా అయ్యాక థియేటర్ కి దగ్గర్లో ఉన్న మా బంధువుల హోటల్ కి వెళ్లి ఫ్రిజ్ లోని కూల్ వాటర్ తాగిన విషయం మాత్రం నాకు ఇప్పటికే గుర్తు. అదే మొదటి సార్ నేను చిల్డ్ వాటర్ తాగడం.

*****

ఇలాంటిదే మరో వయొలెంట్ సినిమా అనుభవం గుర్తుంది. మా అమ్మమ్మ వాళ్లందరూ కలిసి నెల్లూరికి దగ్గర్లో ఉన్న పెంచల కోన కి దేవుని దర్శనం కోసం బయల్దేరారు. కానీ నాకు వెళ్లడం ఏ మాత్రం ఇష్టం లేదు. అంతకు ముందు రోజే ఊరిలో సినిమా మారింది. నేను రానని మొండికేశాను. కొట్టారు. తిట్టారు. అయినా చివరికి నా మాటే నెగ్గింది. అందరూ వెళ్ళారు కానీ, మా తాతను నాకు కాపలాగా పెట్టారు. మా తాత కి సినిమాలంటే ఇష్టముండేది కాదో లేక టికెట్ కొనడానికి డబ్బులుండేవి కాదో తెలియదు కానీ నన్ను సినిమా హాల్లో కి పంపించి సినిమా అయ్యాక నన్ను పికప్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చేవాడు మా తాత. అలా మా తాత నన్ను తీసుకెళ్ళిన మొదటి సినిమా పార్వతీ పరమేశ్వరులు.

ఈ సినిమా కథ పెద్దగా గుర్తు లేదు కానీ సత్యనారాయణ, చిరంజీవి ఉంటారని మాత్రం గుర్తుంది. చిరంజీవి వంటింట్లో పాడే ఒక పాట తాలూకు చిత్రాలు లీలగా గుర్తుకున్నాయి.

బహుశా ఆ రోజు పెనుశిల నరసింహ స్వామి నాకు శాపం పెట్టి ఉంటాడు – తనకంటే సినిమానే ఎక్కువైందని. అప్పటి నుంచి ఇప్పటివరకూ చాలా సార్లు పెంచలకోనకి వెళ్దామనుకున్నా ఎప్పుడూ కుదర్లేదు.

29085.png

ఇలాగే మా అమ్మతో గొడవపడి, ఏడ్చి చివరకి మా తాత నన్ను ఓదారుస్తూ తీసుకెళ్ళిన మరో సినిమా శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం.  అప్పటికే మా ఎదురింట్లో ఉండే చంద్రశేఖర్ రెడ్డి అనే పెద్దయన చెప్పగా కొద్దో గొప్పో రామాయణం, భారతం కథలు విని ఉన్నాను. అందుకే రామాయణభారతాలను కలిపిన ఆ సినిమా టైటిలే నాకు గమ్మత్తుగా అనిపించింది. కానీ సినిమాకి సంబంధించిన ఏ విషయాలూ గుర్తులేవు.

నేను చూసిన సినిమాల్లో నాకు బాగా గుర్తున్న మొదటి సినిమా శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. బహుశా అప్పటికే చాలా సార్లు బ్రహ్మం గారి జీవిత చరిత్ర నాటక ప్రదర్శన చూడడం వల్ల, కక్కయ్య, సిద్ధయ్య కథలు కాస్తా తెలిసి ఉండడం చేతనేమో ఈ సినిమా లో సన్నివేశాలు ఇప్పటికీ గుర్తున్నాయి.

అయితే ఈ సినిమా లోని సన్నివేశాలు మాత్రమే కాదు ఆ రోజు సినిమా చూసిన అనుభవం కూడా నాకు బాగా గుర్తుంది.

అప్పట్లో ఈ సినిమా చూడ్డానికి జనాలు బండ్లు కట్టుకుని టౌన్ కెళ్లేవారని మీరెక్కడైనా వినుంటే అది నిజం. అందుకు నేనే సాక్ష్యం. కాకపోతే మరీ ఎద్దుల బండి కాకపోయినా, మా ఊరికొచ్చే డొక్కు ఆర్టీసీ బస్సు లో ఈ సినిమా చూడ్డానికి నేను, మా చెల్లి, అమ్మ, పిన్ని, తమ్ముడు అందరం కలిసి మా అమ్మమ్మ వాళ్ల ఊరికి వచ్చాం. ఎలాగూ వచ్చాం కాబట్టి రెండు సినిమాలు చూసి వెళ్దామనుకున్నాం. కానీ మధ్యలో అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్ళేంత టైం ఉండదు కాబట్టి టిఫిన్ లో పెరుగన్నం, పులిహోర పెట్టుకుని బయల్దేరాం.

టౌన్ కి చేరుకోగానే  మార్నింగ్ షో  బ్రహ్మం గారి సినిమా చూశాక, మధ్యాహ్నం దగ్గర్లోనే ఉన్న పార్క్ లో కూర్చుని భోజనం చేస్తుండగా మాకు తెలిసిన వారెవరో చూసి మా వాళ్లకి విషయం చేరవేశారు. విషయం తెలుసుకున్న మా పెద్దమ్మ కూతుళ్లిద్దరూ పార్క్ కి వచ్చేశారు. మేమింకా బతికే ఉన్నాం, ఇలా పార్క్ లో కూర్చుని భోజనం చెయ్యడమేంటని వాళ్ళు నానా గొడవ చేశారు. మా అమ్మ తో పెద్ద గొడవే పెట్టుకున్నారు. చివరికి వాళ్లమాటే నెగ్గింది. రెండో సినిమా ప్లాన్ క్యాన్సిల్ అయింది. అందరం వాళ్లింటికి వెళ్ళాం. రెండో సినిమా మిస్సయినందుకు నాకు భలే బాధ వేసింది; ఏడుపొచ్చింది. కానీ అప్పటికి కాస్త పెద్దాడయ్యాను కాబట్టి బయటకు ఏడవలేదు.

marana_mrudhangam_Songs

కొన్నాళ్ళకు నన్ను హాస్టల్లో చేర్పించారు. అప్పట్నుంచీ అమ్మతో సినిమా గొడవలే లేవు. అంతా నా ఇష్టమే. కానీ హాస్టల్లో ఉండగా ఒక రోజు నన్ను చూడ్డానికి వచ్చారు అమ్మా, నాన్న. వాళ్లు వెళ్లిపోతుంటే దిగులుగా మొహం పెడితే వెళ్తూ వెళ్తూ విజయనగరంలో మరణ మృదంగం సినిమా చూపించారు. బహుశా అమ్మతో చూసిన చివరి సినిమా ఇదే అనుకుంటా! ఇరవై ఏళ్ల తర్వాత నేను తీసిన సినిమా విడుదలైనప్పుడు చూసి ఫోన్ చేసింది. తీసుకున్న కాన్స్పెప్ట్ కి న్యాయం చేశానని చెప్పి మెచ్చుకుంది.

 

 –వెంకట్ సిద్దారెడ్డి