వరికొయ్య కాళ్ళల్లో ఉరుకుడు నేర్చుకున్న
గడ్డి కుప్పల మీద దునుకుడు నేర్చుకున్న
బర్ల తోకలు బట్టి ఈత నేర్చుకున్న.
పంట పొలాల్లోన పరిగె ఏరుకున్న
పాట పాడుకుంట పశుల మేపుకుంట
ఈల కొట్టుకుంట గోల చేసుకుంట
గట్టు గట్టున పచ్చగడ్డి కోసుకుంట
పుట్టపాముల తోటి ముచ్చట్లు పెట్టిన.
ఉడికిన చింత గింజలు ఊరిచ్చుకుంట తిన్నం
గోపన్న మర్రికింద గోదల మేపుకుంట
కొట్లాట లేకుండా కోతికొమ్మలాడినం
చాకలి బూదక్క మంగలి బావ కొండుసత్తన్న
కులం మర్చిపోయి వరుసలతో పిలుసుకున్నం.
చింత గింజలతోటి పచ్చీసులాడినం
రాల్లు జరుపుకుంట పులి మేక లాడినం
ఓడిన గెలిచినా ఆడిన మాట తప్పలే
అవ్వ పిలిచినా గాని అసలే ఇంటికిపోలే.
ఒడ్ల పొక్కల్లోన గడ్డి పోసబెట్టి ఎండ్రిక్కాయలు వడితే ఎంత గమ్మతప్పుడు
ఆనంకాయ బుర్రల అంబలి పోసుకొని
గొడ్ల మేపుకుంట గుట్టలెన్నో తిరిగినం
నెత్తి మీదికి ఎండ రాంగనే అంబలి గట్టగట్ట తాగినం .
గువ్వ గుడ్లకు పోతే తేనే టీగలు కుడితే
నాకేం గాలేదని నవ్వుకుంటురికినం
చింత చెట్టు కింద చిర్రెగోనేలాడినం
మర్రి ఊడలు బట్టి ఉయ్యాలలూగినం
నీడ దొరికినకాడ గోలీలాడినం .
చింత బొర్రల్లోన గోడ సందుల్లోన
మూల మలుపులకాడ తడక సాటునుండి
దాగుడు మూతలాడంగ
సిమ్మ చీకటైన ఇంటికి రాకపోతే
తిట్టు కుంట అవ్వ కట్టే వట్టుకోస్తే
నవ్వుకుంట ఒర్రుకుంట దొరక్కుంట ఉరికినం .
ఇసుక కుప్పల్లోన కట్టె పుల్లను దాసీ
దోసిలితొ మూసేస్తే దొరికిచ్చుకునుడాయే
మెత్తటి ఇసుకలో పిట్టగూల్లు కట్టి
ఎడ్ల బొమ్మలు వెట్టి ఎంతో మురుసుడాయే .
గుట్ట గడ్డి తెచ్చి గుడిసలేసిన్రప్పుడు
పుట్ట మన్ను తెచ్చి పూత పూసిన్రు
జంగలి పోయినప్పుడు ఎంబడి పోయేటోల్లం
తునికి పండ్లు తిన్నం ఊట్ల నీళ్ళు తాగినం .
ఒడిసెలిసురుకుంట చిలుకలు గొడతవుంటే
ఎగిరిపోతుంటే ఎగిరి గంతేసిన
గిరగిర తిరుక్కుంట మంచె కింద పడితే
అడివి పందులు కూడ ఆగకుండురికినయి.
గుట్ట గుట్టకు తిరిగి మొట్ల కొమ్మలు నరికి
కట్టె మోపులు చేసి చెట్లకు ఒరిగించి
బట్ట సుట్టలు జేసి నెత్తినెత్తుకోని
చెప్పులులేకుండనె సేన్లు సెలుకలు దాటి
ఇల్లు చేరక ముందే అవ్వ ఎదురుగచ్చి
సెంబులోని నీళ్ళు చేతికియ్యంగనే
సల్లటి నీళ్లన్నీ గుటగుట తాగినం .
బీర తీగల తోటి బీడిలు తాగినం
చిక్కుడు గింజలతోటి కుడుములు జేసుకున్నం
చింతగింజలు కాల్చి ఉడుకబెట్టుకోని
ఆకలైనప్పుడు పిడికెడు పిడికెడు బుక్కినం.
వాగుల్లో మడుగుల్లో జిమ్మలు పట్టుకొని
కాల్సుకొని తింటే ఎంత కమ్మగుండే
సెలిమే నీళ్ళు తాగి ఇసుకలాడుకొని
తడసిన బట్టలు నెత్తిమీదారేసి
ముచ్చట్లు బెట్టుకుంట ఇంటికి పోయేటోల్లం.
నాలుగు రోజులకోసారి నవ్వుకుంట తానం జేత్తే
అదిగూడ అవ్వ దొరకవట్టి తోముకుంట
సెంబు తోటి నీళ్ళు వోస్తే
సెడ్డి ఏసుకోకుంటనే నీరెండ కురికిన.
కక్కుడు జరమస్తే ఎక్కడికి పోయేదిలేదు
ఎండు మిరపకాయలతోటి ఎంటుకలు పిడికిళ్ల పట్టి
ఆ జిట్టి ఈ జిట్టి ఇరుగు పొరుగు జిట్టంటూ
నా సుట్టు తిప్పి జిట్టి తీసేస్తే
పొద్దుగూకేటికల్ల ఆరాముగుండేది .
పీరీల పండుగస్తే పోరగాండ్లు పెద్దోళ్ళు
అగ్గి గుండంల కెళ్ళి ఆగకుండురుకుడు
అలయి బలయి ఆరతి కాళ్ళ గజ్జల గమ్మతంటూ
కుంకుమ రాగట్ల కొర్రవండిందే అని
సాకలి సంద్రన్న మన్నె సుందరన్న
పాట పాడుకుంట గుండ మాడుతుంటే
గీడుర మొనగాడంటే గీడుర మొనగాడని పోటీలు పెట్టుకొని ఈలలేసిన్రు.
సద్దుల నాడు దొరగారిదే పెద్ద బతుకమ్మ
బెస్తోల్ల పెద్దవ్వ పాట పాడుతుంటే
ఆడోళ్ళందరూ ఆమె తీరే పాడుతుండే
ఆల్లను సుసేతందుకు ఊరు ఊరంతా
అన్మండ్ల కాడికి తయారయి అచ్చెటోల్లు
పెద్దోల్లంత గిట్ల సద్దులు జూస్తుంటే
పడుసు పోరగాండ్లు సిమ్మనకాయ గొట్టాల్తో
నచ్చి నోళ్లకు సక్కగా గురి జూసి కొడుతుండే
పెద్ద మోరివాగులో సద్దులు పడేసినంక
సత్తు పిండి కోసం కొట్లాట తిట్లాట.
అన్మండ్ల గుడికాడ దొరగారి దొడ్డిల
నాటకాలేస్తుంటే సుంకరోడు కావలుండే
పైసల్లేని పోరగాండ్లు పరద కిందికెల్లి సొచ్చుడే.
పరద కిందికెల్లి పోలే టికెటు కొనుక్కోలె
నాటకం మాత్రం నేన్ జూసుడే
అక్కడుండే సుంకరోడు మా నాన్ననో మా సిన్నాన్నో.
జంబినాడు పంబాలోడు మేకపిల్ల గావువట్టి
లొట్ల కొద్ది కల్లు తాగి ఊరవతల పట్టు దాటి
ఊరికి గత్తరాకుంట పేరు పేరున మొక్కుదీర్సే.
దసరానాడు జంబికెళ్తే
ఊరంతా లొల్లిలొల్లి
తెల్లదోతి కట్టుకోని నెత్తికి తువ్వాల జుట్టి
సలాక బాంబు కొట్టే మన్నెపోల్ల అమృతయ్య
ఏడ బండ కనబడితే ఆడ డబిల్ మని కొట్టుడే
మా పనల్ల పొటాసు పొట్లలిచ్చుడే
సిన్న పోరాగండ్లంత సిటుకు సిటుకు తుపాకులతో
పొటాకలు గొట్టుడాయే అందర్నీ బెదిరిచ్చుడాయే.
మూల మలుపులకాడ పెద్ద పులి ఆవులాట
నాగుపాము ముంగీసలు కొట్లాడుకున్నట్లు
పొర్లుకుంట పోరగాండ్లు బిర్రు మీద ఆడుతుంటే
తుపాకి రాముడు పకీర్ సాయెబు దయ్యాలు బూతాలు ఆడోల్ల వేసాలు
అప్పాలు గారెలు కారపూస లాడులు
పల్లిఉండలు బోలుపాలాల ముద్దలు
చిలుకల పేర్లు బొంబాయి మిటాయి
తినుకుంట తిరుకుంట పొద్దుగూకేటి కల్ల
జంబాకునిచ్చి పెద్దోల్ల కాళ్ళు మొక్కుతుంటే
ఆల్లు సంబరపడి ఐదో పదో చేతుల పెడుతుండ్రి.
సుక్కలు జూసుకుంట ఎప్పుడన్నవాకిట్ల పంటే
గప్పటి సంగతులన్నీ యాదికచ్చినప్పుడల్ల
ఎప్పుడు పోతనా మా ఊరికని
ఇప్పటికి పాణం గొట్టుకుంటది .
*
తాజా కామెంట్లు