యానాంలో ఒక వేమన…

memory

రోహిణి కార్తె.

ఎండ పేట్రేగి పోతుంది.

పెద్ద గోళెంలో బెల్లం తయారయేటపుడు ఉడుకుతూ పొంగుతున్నట్లు..అలల గతులు!
చెరకు రసం కోకోకోలా ఉత్తుత్తినే గొంతులు తడుపుతున్నాయి. క్షణ తర్వాత మామూలే. తలలు చురుక్కుమంటున్నాయి.
చెమటతో శరీరం తడిసి ముద్దవుతోంది. ఆహా …ఏమి ఎండరా బాబూ…మలమలా మాడ్చేస్తోంది.

అట్లాంటి సమయంలో తీరని దాహంతో ….అలమటిస్తున్న కవులేం చేస్తారు. ? సేద తీరే మార్గాలు వెతుక్కుంటారు. చల్లబడే దిక్కుల కోసం కలియ దిరుగుతారు. నీడల చుట్టూ అల్లుకుపోతారు. కవి సందర్భాలకోసం వెంపర్లాడతారు. ఊహాలోకంలో సేదతీరుతారు. వీళ్లు మామూలు వాళ్లు కారు. అక్షర జ్ఞానులు….రాబోవు తరం దూతలు. ఇరవై ఏళ్లనాటి జ్ఞాపకాన్ని దృశ్యమానం చేయడం ఇది. వారంతా పదిమంది కవులు శివారెడ్డితో కలిపి. లుంగీ తలపాగాగా చుట్టి…బండి వాడిని పక్కన కూచోబెట్టుకుని. అదొక పసందైన ముచ్చట. కవుల బండి గోదావరి కేసి పరుగులు తీసింది.

మిట్టమధ్యాహ్నం….యానాం ఫెర్రీ రోడ్డు. సందడి లేదు. నిర్మానుష్యం. చిటపటలాడుతున్న ఎండ. వేళకాని వేళ. ఈ సమయంలో జలవిహారం కోరిక కడువిడ్డూరం. అల్లదివో గ్రీష్మ గోదావరి పరవళ్లు తొక్కుతోంది. పడవ సిద్ధం. వొక్కొక్కరూ ఎక్కారు. గోదావరి మధ్యగా ఇసుకమేటల లంక. చుట్టూ నీరు. గమ్మత్తైన అనుభవం కోసం ఎదురుచూపు. చండ్ర నిప్పులు చెరుగుతూ ఆకాశంలో వొంటరి సూర్యుడు. నీటి మేఘాల్ని చొచ్చుకుంటూ…పడవ కదిలింది. కవులేం చేస్తారు. ? సమయాసమయాలు లేకుండా పరవశంగా కవిత్వంలో మునిగిపోతారు. సుమధుర రాగాలాపన చేస్తారు. రసస్వాదనకు గంగవెర్రులెత్తుతారు. వీళ్లదే అదే బాపతు. వేడి నీళ్లతో ముఖాన కళ్లాపిచల్లినట్లు…ఆవిరి సెగలు ఎగజిమ్మినట్లు వేడిగాడ్పు…సూర్యకిరణాల ఏటవాలు తనం కోల్పోయి నిట్టనిలువుగా ప్రసరిస్తున్నాయి. వొళ్లంతా చెమటలు. రెప్పలు మూస్తూ తెరుస్తూ.. చెయ్యి అడ్డం పెట్టుకుని చూసే సన్నని చూపులు.
ఉక్కిరి బిక్కిరి అవుతూ కవులేం చేస్తారు. అసహనంగా గెంతులు వేస్తారు. ఆశువుగా నిరసన పాటలు కడతారు. ఉద్రేకంతో గొంతు చించుకుంటారు. కొత్త అనుభవం కోసం ఉర్రూతలూగుతారు. వీళ్లు మామూలు వాళ్లు కారు. చరిత్ర గర్భాన రేపటి గుర్తు సంభాషణలు ముగింపు పలకకుండానే…లంక వచ్చేసింది. దిగారు. సరంజామా వొక చోటకు చేర్చారు. హాయిగా ఆనందించే వెన్నెల సమయమా ఇది…?
మబ్బు తెరలు అడ్డు రాకుండా సూర్యుడు చూస్తున్నాడు. ఇసుకనేల కూర్చోవడానికి గోనె సంచులు కింద పరిచారు.  ఆతృతగా గొంతులోకి జారుతున్న ద్రవం. దేహాన్ని చల్లబరిచే పని మొదలు పెట్టింది. కాసింత స్థిమిత పడ్డారు. ఉపశమనం. సరిగ్గా ఇప్పుడే…  సృజనకారులు తెరచిన పుస్తకాలవుతారు. నచ్చిన లేదా నచ్చని విషయాలు జంకు గొంకు లేని మాటలుగా నాభిలోంచి తన్నుకు వస్తాయి. ఎవరినైనా ఏమైనా అనగలధైర్యం సాహసాలు ఛాతీ కొట్టుకుంటూ వస్తాయి. ఇప్పటి పరిస్థితి వేరే. రసవత్తర సంఘటన పురులు పోసుకునే సంధి సమయం.

అధ్యయన శోభతో ఇంకించుకున్న కవిత్వ పోహళింపులని విప్పుకున్నారు. యువకవులు ఆస్వాదిస్తున్నారు. కొత్త పాఠాలు నేర్చుకుంటున్నారు. కవిత్వ శిక్షణలో కొత్తదారి. అంత ఎండలోనూ శాలువా కప్పుకుకున్న శివారెడ్డి రైలు బండి పాట అందుకున్నారు. అందరూ చప్పట్లు. మద్దూరి నగేశ్ బాబు చిత్రమైన గొంతు జీరతో పల్లెవాటు పదాలతో పాడిన పాట మనసుల్ని మరింత చల్లబరిచింది. వాతావరణం నిశబ్దంగా మారిపోయింది. లయబద్దంగా ప్రశంసల జల్లులు. కలకలిగిన వారంతా గొంతు విప్పారు. ఎండ వేిడ చల్లని వెన్నెలయ్యింది.
గుంపులో కవికాని వాడు వొకడున్నాడు.

అతను లేకపోతే ఈ కథే లేదు.

అతను మౌనంగా బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు.
గూడ పంచె..చిరిగిన బనీను. పెరిగిన గడ్డం. ముంజేతికి తెల్లబారిన కాశీ తాడు. తెల్లని దువ్వని చింపిరి జుట్టు. చేతులు కట్టుకుని మూలగా మాజేటి సుబ్రమణ్యం . వాడి చూపులతో గోదావరిని చూస్తున్నాడు. కవి గుంపులోకి ఎలా చొరబడ్డాడో తెలీదు. శీవారెడ్డి దృష్టి అతని మీద పడింది. అంతే. కందిరీగ తుట్టె రేగింది.
”ఏం  పెద్దాయన. గమ్మునుండిపోయావ్. నువ్వ పాడొచ్చు. మాట్లాడొచ్చు. అంతా మనవాళ్లే. మనుషులే”. శివారెడ్డి పలకరించారు. ఆయనకే చెల్లిన దోర నవ్వుతో.
”మనుషుల్లో పెద్ద మనుషులు బాబు మీరు. నానేం మాట్లాడగలను. బాబయ్యా. ? పొట్ట చింపితే కలికంలోకి కూడా అచ్చరాలు ఆనవు. చిత్తం బాబు.”
”మీకేమైనా పద్యాలొచ్చా..? విని వొంటబట్టించుకున్నయి ఏమన్నా ఉంటే చెప్పండి.” ఆతరంలో చదువుకోకపోయినా పద్యాలు రాని వారు ఎవరూ లేరు.
”వచ్చు గానండీ…తమ బోంట్లు వింటే కిసుక్కున నవ్వేస్తారు. ఏమన పద్యాలు , బ్రహ్మం గారి తత్వాలు బుర్రలో తిరుగుతూనే ఉంటాయి. ఏదో కాలక్షేపం కోసం.”
”చెప్పు తాతా..?” అంటూ ముచ్చట పడ్డారు కుర్ర కవులు.
సుబ్రమణ్యం ఎత్తుకున్నాడు ముందుగా వేమన పద్యాలు.

” తేనె పంచదార తీయ మామిడిపండు
తిన్నగాని తీపి తెలియరాదు.
కన్న నింపు బుట్టు  కామిని అధరంబు
విశ్వదాభి రామ వినుర వేమ. ”
అంటూ పద్యాలు మొదలెట్టాడు.

చెవులు రిక్కించి విన్నారు. వొక్కో పద్యం విని అదిరిపోయారు. ”అద్భుతం…”అంటూ సంబరపడ్డారు. శివారెడ్డి చప్పట్లతో ఉత్సాహ పరుస్తున్నారు. వారెవ్వా అంటున్నారు.
గోపి గారికి అందని పద్యాలులా ఉన్నాయి.” ఏదీ మళ్లీ చెప్పండి.” బీరు కేసుల అట్టపెట్టి…కాగితం చింపి దాని మీద రాయడానికి ఉపక్రమిస్తూ సీతారాం చిన్నపిల్లాడై జాగ్రత్తగా నాలుగైదు పద్యాలు రాసుకున్నాడు.
”మా వోడే మా బంధువే. ….. ”మెరుపు కళ్లతో శిఖామణి అన్నాడు.
”మీరు కాసిన్ని ఈ చుక్కలతో గొంతు తడుపుకుని మరికొన్ని పద్యాలు లాగిస్తే తరిస్తాం. ఇన్నాళ్లూ ఎక్కడ దాగి ఉన్నావయ్యా మహానుభావా…?”చేతులు జోడించి చిరునవ్వు  అందించాడు యాకూబ్.
”అబ్బాయిలూ….ఏమనుకోకండి. మనకిది ఎక్కదండీ. వొళ్లు తమాయించుకోలేదండి. కిక్కు సరిపోదండీ. సరిపోక పోత అదోరకం బాధండి.”సున్నితంగా తిరస్కరించాడు సుబ్రమణ్యం. ఎంత బతిమాలినా సీసా తాక లేదు.
సుబ్రమణ్యం కేసి సంబరంగా చూస్తున్నాడు అఫ్సర్. మౌనంగా మనసులో రేగుతున్న భావ శకలాల్ని పోగు చేసుకుంటూ  బహుశా యానాం ఏమన ఏమనే… కైత కట్టుకుంటున్నాడేమో.
”వీర బ్రహ్మంగారి తత్వాలు కూడా అందుకోండి. సుబ్రమణ్యం గారూ….”నిషా ముసుగులేకుండా ఎండ భరిస్తున్న ఏకైక వ్యక్తి దర్భశయనం అడిగాడు. సుబ్రమణ్యం ఇక బతిమాలించుకోలేదు.
” ఏ కులమబ్బీ… నీదే కులమబ్బీ….అని అడిగితే ఏమని చెప్పుదు లోకులకు. పలు గాకులకు.
చెప్పలేదంటనక పోయేరు. నరులారా గురుని చేరి మొక్కితే బతక నేర్చేరు.”

మంద్ర స్థాయిలో మొదలెట్టి ధారాళంగా పాటలు, తత్వాలు అందుకున్నాడు. మనిషి జీవితంలోని దశల్ని, పుట్టుకనుంచి మరణం దాకా చెప్పేవన్నీ ఆలపించాడు. కొన్ని తత్వాలు సుఖ దుఃఖాల అనివార్యతను తెలియ జేశాయి. కొన్నేమో జీవన తాత్వికతలను బోధిస్తూ..వైరాగ్య భావనలోకి తీసుకెళ్లాయి.
కవి మిత్రులు సంతృప్తి పడలేదు. సుబ్రమణ్యాన్ని వదలలేదు. బతిమాలి, బతిమాలి పాడించుకున్నారు.” మరిన్ని పాడండి. మీకొచ్చినవన్నీ వినిపించండి సుబ్రమణ్యం గారూ. ….. ” తనివి తీరనట్లుగా అడిగారు.
”నన్ను అండీ…గిండీ అంటూ మన్నన చేయకండి బాబూ. నాక్కోపం వస్తుంది. నేను అంటరానోన్ని. మీరు చదువుకున్న మారాజులు. వొరేయ్, గిరేయ్ అంటేనే బాగుంటుందండీ. అలవాటైన ప్రాణానికి. ”
”అలాంటి తేడాలు లేవు. అందరూ వొకటే…ఇక చదువంటారా. మేం పుస్తకాలు పట్టుకున్నాం.మీరు లోకాన్ని చదివారు. మీ జ్ఞానం తక్కువేమీ కాదు. మా దగ్గరలేని వేమన పద్యాలు…మీ నోటి నుంచి విన్నాము. మీకు మాకూ తేడా లేదు. మనమంతా వొకేలాంటి మనుష్యులం. ”వొంటి మీద శాలువా తీసి పక్కన పెట్టి అన్నారు శివారెడ్డి.
”సరే వొక మాట. మొత్తం ఈ గోదావరి మీద మత్స్యకారులొక్కరేనా బతికేది. చేపలు పట్టుకుని జీవనం సాగించేవారు వేరెవ్వరూ లేరా. ? ” గుంపులోంచి వేరెవరో అడిగారు. ఎవరడిగారు చెప్మా. ..!
” మా వాళ్లలోనూ ….రకరకాలుగా గోదావరి మీద బతుకుల్ని లాగించేవాళ్లున్నారు. పడవల్లోకి ధాన్యం బస్తాలు, కొబ్బరి కాయలు ఎగుమతి చేయడం, అర్థరాత్రి ఇసుక దేవుకుని పడవల్ని నింపడం సేత్తారండీ. ఇక చేపలంటారా…? పట్టుకునే వారు తక్కువే కానీ మా వూళ్లో ముత్యాలని వొక ఆడది ఉందండీ. దానిది మాకులమే. అది ఆడది కాదండీ బాబు. పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వీపు వెనకాల పల్లె గంప మోచేతిమీద వల చుట్టుకుని …గంపెడు చేపల్ని ఇట్టే పట్టుకుంటుందండి. బతుకు తెరువు అలవాటు చేసుకోవాలిగానీ ఏ పనైనా ఎవరికైనా లొంగుతుంది. అంతే కదండీ.” సుబ్రమణ్యం బదులిచ్చాడు.
మద్దూరి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. సుబ్రమణ్యం కోసి తీక్షణంగా చూస్తున్నాడు. ఆ చూపులు తగిలినట్లున్నాయి. సుబ్రమణ్యం అసహనంగా కదిలాడు. మద్దూరి మాత్రం ఇంకా అతను ఏం చెబుతాడో అని ఎదురుచూస్తూ దోసిలిలోకి ఇసుక తీసుకుని ఎగరేస్తున్నాడు. గవ్వల్ని దూరంగా విసిరేస్తున్నాడు.
సుబ్రమణ్యం ఆకాశం చేసి చూశాడు. చుట్టూ ఉన్న గోదావరిని చూశాడు. ఉస్సూరని నిట్టూర్చాడు. కాసేపు బీరు సేవనంలో మనిగిపోయారు. అక్కడి వారందరి మనసుల్లో సుబ్రమణ్యం….. సుబ్రమణ్యం.
” ఏమయ్యా సుబ్రమణ్యం. నిన్నీపళంగా ఇక్కడ వదిలేసి చక్కగా పడవెక్కి ఉడాయిస్తే….ఏం చేస్తావోయ్…”గమ్మత్తుగా శివారెడ్డి అడిగాడు.
”నాకేటి భయం. నాకేటి భయం. నీటిమీద నడుచుకుంటూ వచ్చేత్తా.”
” విన్నారా ..? అంతకంటే కవిత్వం ఏమిటి..? నిర్మలంగా మైదానంలా గోదావరి ఉందని చెప్పక చెపుతున్నాడు.  తలచుకుంటే మార్గం దొరుకుతుందని అంటున్నాడు.
శభాష్ సుబ్రమణ్యం. అన్నాడు శివారెడ్డి. కోపగించుకోకండీ మరండీ..మరండీ… నన్నేమైనా అనేయమంటారా..? నాకు తోచింది మాట్లాడేయమంటారా..? ” ముందుగా అనుమతి కోరాడు.
”శుభ్రంగా అనవయ్యా… ఈ వేళ నీకేం అడ్డు లేదు. ”
మాటలు కూడదీసుకోవడానికి అన్నట్టు కాసేపు ఆగాడు సుబ్రమణ్యం.” అందరి రక్తం ఎర్రగానే ఉంటుంది. అందరూ అమ్మానాన్నల సంతోషంలోంచే..రెండుకాళ్ల మధ్య గుండానే కెవ్వుమని ఏడ్చుకుంటూ పుట్టాం గందా. ఇన్నాళ్లూ రాత్తుండారు. మా కట్టాలు కన్నీళ్లు మీకు ఆపడ్డాయా..అయ్యలారా. వొకే దారి గుండా వచ్చాం సరే. మరి మా ఆకు (విస్తరి) ఎందుకు ఎడం. (దూరం. ) అయింది బాబయ్యా..?” అన్నాడు.
కవుల జేబుల్లోని కలాలూ  దడదడలాడాయి. నిశ్చేష్టులయి తమ అనుభవాల్ని తవ్వుకుంటున్నారు. తాము అధ్యయనం చేసిన అంశాలు గుర్తుకొచ్చాయి.
కవులేం చేస్తారు..? కవులేం చేస్తారు.
దిక్కులు పిక్కటిల్లేట్టు గుండె బద్ధలై..వెలువడిన ప్రశ్నకు సమాధానం ఏది..?
ఈ ప్రశ్నను సజీవ సాహిత్యంగా మలచాలి.

*

కొత్త కవిత్వానికి చిరునామా తెలంగాణా: సోమసుందర్

 

sosu1

‘ వజ్రాయుధం ‘ – నేను చదివిన ఆవంత్స సోమసుందర్ గారి కవిత్వం. శ్రీశ్రీ కవిత్వం తర్వాత లయాత్మకతతో నన్ను చదివించిన కవిత్వం అది. వడివడిగా సాగుతూ, గుర్రపు కాలిగిట్టలు చేసే ధ్వనిలా అనిపించింది.

నా కవితా సంపుటి ‘ఎగరాల్సిన సమయం’ సోమసుందర్ గారికి నేను పంపిన తర్వాత – చదివి – వొక రోజు ఫోన్ చేసారు. ‘ పిఠాపురం ఎప్పుడొస్తావు ‘ అన్నారు. ‘ వస్తాను గురువు గారూ.. మిమ్మల్ని చూడాలని – మీతో దగ్గరగా వుండి మాట్లాడాలని వుంది ‘ అన్నాను. ఫలానా రోజున వస్తాను – అన్నాను. మళ్లీ కొన్ని రోజులు పోయాక ఫోన్ చేసి.. ‘ ఎప్పుడు వస్తావు ? ‘ అని అన్నారు. ఆ ఫలానా వెళ్తానన్న రోజు నేను వెళ్లలేదు. ‘ మళ్లీ సెలవుల్లో వస్తాను గురువు గారూ… ! ‘ అని అన్నాను. కానీ వేసవి సెలవుల్లో గానీ, దసరా సెలవుల్లో గానీ – వెళ్లలేకపోయాను. మళ్లీ ఆ తర్వాత మూడు నాలుగు సార్లు ‘ ఎప్పుడు వస్తావు ! ‘ అంటూ ఫోన్ చేసారు.

నా కవిత్వం మీద – ప్రేమగా, ఆప్యాయంగా, విశ్లేషనాత్మకంగా – నాకు చాలా ప్రేరణను యిచ్చే వ్యాసం వొకటి రాసారు గురువు గారు. నా కవిత్వం ఎదుగుదలకు విలువైన సూచనలు చేసారందులో. ఎదిగే క్రమంలో సాధించాల్సిన కవిత్వాంశాలను చెప్పారు. లోపాలను – ప్రేమతో ఎత్తి చూపారు.

ఆ వ్యాసం పదేపదే చదువుకుని – నన్ను నేను దిద్దుకోవాల్సిన వ్యాసంగా మారింది.

చిన్నప్పుడు – తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ ఆయన కవిత్వం చదివి – గొప్పగా భావించిన నాపై, నా కవిత్వం పై ఆయన వ్యాసం రాయడం గొప్ప ఆనందంగా అనిపించింది.

మళ్లొకసారి ‘వజ్రాయుధం’ చదివాను.

ఈ సంవత్సరం జనవరి 9, శనివారం – తెల్లారిజామున – కవిత్వం రాస్తున్న నా పాఠశాల విద్యార్థిని వెంట తీసుకుని – పిఠాపురం బయలుదేరాను.

మాధవస్వామి గుడి వీధిలో వున్న ఆయన ఇంటికి వెళ్లాము.

ఆయన గదిలోకి అడుగుపెట్టాం.

మంచం మీద వెల్లకిలా పడుకుని వున్నారు. మెలకువగానే వున్నారు. వాళ్ల అబ్బాయితో మాట్లాడుతున్నారు.

నేను వెళ్లి..

‘ గురువు గారూ…. ! ‘  అని పిలిచి – నా పేరు చెప్పాను. నా రెండు చేతులతో ఆయన చేతిని పట్టుకున్నాను. ఏదో ఆప్యాయత అసంకల్పితంగా నన్ను అలా చేయించింది. మహా మృదువైన ఆ చేతి అనుభూతికి లోనయ్యాను. పక్కన కూర్చున్నాను. ‘ నువ్వా… ! ‘ అని చాలా ఆనందపడ్డారు. కళ్లు ఆనందానికి లోనయ్యాయి. వస్తున్నానని ముందుగా తెలియజేయలేదు నేను. నన్ను వాళ్ల అబ్బాయికి పరిచయం చేసారు.

సొసు౨

పక్కనే వున్నాను. నా చేతుల్లోనే ఆయన చేయి వుంది. ఆ మృదుత్వం నాకు తెలీకుండానే నా లోపలకి అనుభూతమవుతుంది.

ప్రేమగా మాట్లాడారు.

తర్వాత లేచి – ఆయన మంచానికి ఆనుకుని వున్న కుర్చీలో కూర్చున్నాను.

ఆయన జీవితానుభవాలు, కవిత్వానుభవాలు, జైలు అనుభవాలు, పోలీసులు ఇంటికొచ్చి అరెస్టు చేసినప్పుడు.. ఇంటందరూ ఏడ్వవడమూ ; మిగిలిన సాహిత్యజీవులతో అనుబంధాలు.. ఇంకా పాత జ్ఞాపకాలను అనేకం నెమరువేసుకోవటం ; సామ్యవాదం గురించి – కులం గురించి – హైందవభావజాలం గురించి – ఆ నాలుగు గంటలూ చాలా విషయాలను చెప్పారు. మాట్లాడానికి కష్టపడుతూ.. అయినా కవిత్వం – సాహిత్యం యిస్తున్న బలంతో చాలా సూటిగా, స్పష్టంగా మాట్లాడారు. చాలా అభిప్రాయాలను వ్యక్తం చేసారు. కల్బుర్గి గురించి మాట్లాడారు . ‘కబుర్గి’ని దగ్గర నుంచే చంపారట ! రచయితలని కూడా బతకనివ్వటలేదా.. ‘ అని బాధతో, ఆగ్రహంతో – అన్నారు.

అప్పటికి నేను రాసిన కొత్త కవితలు చదివాను. కళ్లు మూసుకుని చాలా శ్రద్ధగా విన్నారు. నచ్చిన చోట ‘ బాగుంది ‘ అని అంటూ.. నిమగ్నతతో విన్నారు. అంత గొప్ప కవి, గొప్ప జీవితానుభవం వున్న మనిషి ముందు – కవిత్వం చదవటం.. నేను నా జీవితంలో మరిచిపోలేని అనుభవం.

‘ పద్యం గురించి కాస్తా మాట్లాడుతా ‘ కవిత చదివాను. ‘ పద్యాన్ని అరచేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా నిమిరితే అట్టే అంటిపెట్టుకుని వుంటుంది ‘ అన్న స్టాంజాని విని.. ఆగమని చెప్పి నెమ్మదిగా కళ్లు మూసుకున్నారు… ఆరేడు సెకెన్లు తర్వాత కళ్లు తెరిచి ‘ కానీ… ‘ అన్నారు. ‘ వేళ్లు గురించి.. ‘ కవిత చదివాను. ‘ అమ్మ నన్ను చంకలో ఎత్తుకునేటప్పుడు కిందకు జారిపోకుండా ఆ వేళ్లతోనే గట్టిగా దేహానికి అదుముకునేది ‘ అన్న దగ్గర.. ఆగి.. ” మా పెద్దబ్బాయిని నా గుండెల మీద వేసి పెంచాను ” అని అంటూ.. కాసేపు కళ్లు మూసారు.

అప్పుడు తెలిసింది ‘ ఆయన కవిత్వంతో తాదాత్మయం చెందుతున్నారని ‘. అంత పెద్ద వయసులోనూ కవిత్వం కోసం ఆవురావురమనడం నాకు గొప్ప ప్రేరణనిచ్చింది.

ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు అతనితో నేను గడిపిన కాలం అమూల్యమైనది. ‘ మళ్లీ మళ్లీ చూసిరావాలి. మాట్లాడాలి ‘ అని అనిపించే మనిషి. క్రిష్టోఫర్ కాడ్వెల్ ‘ ఇల్యూజన్ అండ్ రియాలిటీ ‘ పుస్తకం ఇస్తూ.. ” మళ్లీ వచ్చినప్పుడు ప్రతీ భాగం గురించి నువ్వు నాకు చెప్పాలి. ఉత్తరాల్లోనూ రాయాలి ” అని అన్నారు. ఆయన ఆత్మకథ రెండో భాగం ‘ పూలు – ముళ్ళు ‘ ఇచ్చారు. ఇంకా ఆయన సాహిత్యం చాలా ఇచ్చారు. ‘ నిద్రపోకు అనుభవాలు జారిపోతాయి.. మేలుకోకు కలలు పారిపోతాయి ‘ పుస్తకం పేరు ప్రత్యేకంగా వుందండి – అని అన్నాను. నవ్వి.. అలాంటివే మరికొన్ని తన పుస్తకాల పేర్లు చెప్పారు. ఆయన తన పుస్తకాలును ఇస్తూ.. వొక మాట అన్నారు : ‘ ఇంత వరకు నా సాహిత్యం మొత్తం చదివిన వాళ్లు వొక్కరూ కనిపించలేదు.. ‘ అని.. కొనసాగిస్తూ…..  ‘ మళ్లా కొత్త పుస్తకం వేస్తున్నాను ‘ అని చెప్పారు. ‘ అందులో వర్తమాన కవుల మీద నేను రాసిన వ్యాసాలు వుంటాయి , నీ కవిత్వం మీద రాసింది కూడా వుంటుంది ‘ అని అంటూ….  ఆ పుస్తకం పేరు చాలా గమ్మత్తుగా వున్నది.. చెప్పారు. ‘ ఎలా వుంది పుస్తకం పేరు ? ‘ అని అన్నారు. ‘ చాలా ప్రత్యేకంగా పెట్టారండీ ‘ అని అన్నాను. ఆ పేరు వైవిధ్యంగా వుంది.. యిప్పుడు గుర్తుకురావటం లేదు.

ఇలా ఆత్మీయసంభాషణ సాగుతున్నప్పుడే మధ్య మధ్యలో నేను వేసిన కొన్ని ప్రశ్నలకు స్పందించారు :

ప్రశ్నలు – జవాబులు

* ఇప్పడు వస్తున్న కవిత్వం మీద మీ అభిప్రాయం ?

ఇప్పటితరం యువకవులు బాగా రాస్తున్నారు. తెలంగాణా నుంచి మంచి కవిత్వం వస్తుంది. స్ట్రగుల్ వుంది. ఆధునికం కవిత్వం మలుపు తిరగాలి.

* ఇంగ్లీష్ కవిత్వం అధ్యయనం అవసరం గురించి చెప్పండి ?

చదవాలి. కచ్చితంగా చదవాలి. ప్రపంచ కవులను చదవడం అవసరం.

* కులం గురించి… ?

కులం పోవాలి. పేర్లులో వున్న కులం అస్తిత్వం కూడా పోవాలి.

* శ్రీశ్రీ తో మీ అనుబంధం ?

1945 లో ఇంటర్ పూర్తి అయ్యాక.. శ్రీశ్రీని కలవటానికి శ్రీశ్రీ కోసమే మద్రాసు వెళ్లాను. ఇంటికి వెళ్లాను. ఇంటిలో ఆ పూట తినడానికి లేదు. బయటకు వెళ్లి.. టీ, బిస్కెట్స్ తిన్నాము.

అప్పుడు నా దగ్గర వున్న డబ్బులతోనే వండుకోవడానికి కావాల్సిన సామాన్లు కొన్నాం.

మొదట శ్రీశ్రీ కవిత్వం పరిచయం లేదు. ఎలా కవిత్వం రాయాలి ? దారి ఏమిటి ? అని సంశయం వుండేది. కానీ కవిత్వం రాయటం అప్పటికే మొదలుపెట్టాను. శ్రీశ్రీ కవిత్వంలో… ‘ కవితా! ఓ కవితా !, జగన్నాథుని రథచక్రాలు ‘ ఎక్కువుగా పదే పది చదివేవాడిని.

* శివారెడ్డి గారితో మీ అనుబంధం ?

శివారెడ్డి నమ్మే రాజకీయాల గురించి మేమెప్పుడూ మాట్లాడుకోలేదు. శివారెడ్డి నన్ను బాగా ప్రేమిస్తాడు. నేనూ అంతే. బలాఢ్యుడు కాడనిపిస్తుంది కానీ గట్టివాడే. శివారెడ్డి కొడుకుని వొకరోజు వాళ్ల ఇంటి దగ్గర నా రెండు చేతుల్లో పెట్టాడు.. చాణ్ణాళ్ల క్రితం.

* భారతదేశంలో సామ్యవాదం గురించి… ?

సామ్యవాదం ఎప్పుడొస్తుందో చెప్పలేం. స్పాంటేనియస్ గా వస్తుంది – యాక్సిడెంటల్ గా వస్తుంది. సామ్యవాదం వచ్చితీరుతుంది.

ఆ రోజు ఆ సాహిత్యపిపాసిని వదిలి వచ్చేసానే గానీ..  మళ్లీ మళ్లీ వెళతాను… కలుస్తాను… మాట్లాడుతాను… అని అనుకున్నాను. నమ్మాను. పిఠాపురం ఏమాత్రం.. దగ్గరే… ఎప్పుడు పడితే అప్పుడ వెళ్లి వచ్చేయవచ్చు.. అని అనుకున్నాను. నా కొత్త కవిత్వ సంపుటి వచ్చిన వెంటనే పిఠాపురం వెళ్లి.. ప్రత్యక్షంగా యిచ్చి రావాలి – అనీ అనుకున్నాను. నాలుగు రోజుల కిందట హాస్పిటల్లో చేరారు.. అన్న వార్త పేపర్లో చదివి ఫోన్ చేసాను.  ‘ కోలుకుంటున్నారు.. బాగున్నారు – రేపే డిస్చార్జ్ ‘ అని గురువు గారి అబ్బాయి చెప్పారు. ఈ రోజు యిలాంటి వార్త వినాల్సిరావడం పూడ్చుపెట్టుకోలేని దుఃఖాన్ని మిగిల్చింది. మళ్లీ  పిఠాపురంలో నేను ఎవరిని కలవాలి ? నా కవిత్వం మీద మరెన్నో ఎదుగుదలకు తోడ్పడే ఆయన మాత్రమే ఇవ్వగల సూచనలు యింకెవరిస్తారు ?

*

ఒకానొక రూఫ్‌ గార్డెన్‌ కథ

 

– ఒమ్మి రమేష్‌బాబు

~

ఇటీవల ఒక ఉదయంపూట తుమ్మేటి రఘోత్తమరెడ్డిగారి ఇంటికి వెళ్లాను. చాన్నాళ్ల తర్వాత ఆయన కరస్పర్శ… స్నేహపూర్వక స్వాగతం పలికింది. ఆత్మీయ పలుకరింపు ఆతిథ్యపు మర్యాదలు చేసింది. ఆయన సామీప్యంలో నా మానసం కొత్త చివుర్లు తొడిగింది. కొన్ని కుశల ప్రశ్నలు. మరికొన్ని తేరిపార పరామర్శించుకునే చూపులు. తదేకంగా ఆయన్ని చూస్తున్నంత సేపు తొలి పరిచయం నాటి గురుతులు… జ్ఞాపకాల దొంతరలు. రెండు దశాబ్ధాల కాలచక్రం తెచ్చిన మార్పులను పోల్చుకునే ప్రయత్నం చేశాను. చెట్టులాంటి మనిషి కనుక ఎదుగుదల సహజమే. నా కనుల గ్రహణశక్తికి హరిత సొబగుల అందమేదో లీలగా మెదిలింది కూడా. అది భ్రమ కాదు కదా అని ప్రశ్నించుకున్నాను. ఆ ప్రశ్నని నేను అడగకపోయినా దానికాయన ఆచరణాత్మక శైలితో బదులిచ్చారు.

హైదరాబాద్‌లో కొత్త చిరునామాని చేరుకోవడం కొంత కష్టమే. కానీ రఘోత్తమరెడ్డిగారి విషయంలో ఆ సమస్య రాలేదు. నారపల్లె… నల్లమల్లారెడ్డి కాలేజి రోడ్డులో సుమారు కిలోమీటరు సాగింది ప్రయాణం. రోడ్డుకి కుడివైపున ఎర్రటి సున్నం వేసిన ఇల్లు. మిద్దె మీద ఆకుపచ్చటి కుచ్చుటోపీ. ఆ ఇల్లే ఆ ప్రాంతపు కొండగురుతు. ఎవరికైనా సరే తొలి చూపులోనే ఆకట్టుకనే తీరు. నేను ఆ ఇంట ప్రవేశించగానే మనసు నెమ్మదించింది. వాతావరణంలో చల్లదనం నాలోకి కూడా ప్రవహించింది. ఆ అనుభూతి గొప్ప కథ చదివినప్పుడు కలిగే అనుభూతికి సరిసాటి అనే చెప్పాలి.

రఘోత్తమరెడ్డిగారి నట్టింట కూర్చుని పలహారం తింటూ నలు మూలలూ పరికించాను. అంతటా నిరాడంబరత పరివేష్టించి ఉంది. దరహాస వదనంతో ఎదురుగా ఆయన జీవిత సహచరి రూప. ఆ ఇంట కుటుంబ సభ్యుడిగా మారిపోయిన గూఫీ అనే కుక్క కూడా పరిచితగా మారిపోయింది. ఇల్లు బాగుంది అన్నాను అభినందనపూర్వకంగా. “అప్పుడే ఏమైంది.. ఇంకా చూడాల్సింది చాలా ఉంది” అన్నారు రఘోత్తమ్‌. ఆయనకి ఇష్టమైన పుస్తకాలో, సంగీతం సీడీలో చూపిస్తారనుకున్నాను. రఘోత్తమ్‌ తమ వాకిట్లో మెట్ల దారివైపు నడిచారు. నేను అనుసరించాను. ఒక్కో మెట్టు ఎక్కుతూ మొదటి అంతస్తులోకి చేరుకోగానే అక్కడ అకుపచ్చనిలోకం పలుకరించింది. అదొక చిట్టి వనం. రూఫ్‌ గార్డెన్‌! అందులోనే కూరగాయల పెరడు. పందిళ్లకు పాకిన రకరకాల పాదులు. అక్కడక్కడ పూల మొక్కలు. ఏపుగా పెరిగిన పళ్ల చెట్లు. మధ్యమధ్యలో ఆకుకూరల మడులు. ఒక్క మాటలో చెప్పాలంటే అదొక అందమైన పార్క్‌. చెట్ల మధ్య కూర్చోవడానికి వీలుగా చిన్న ఏర్పాటు. ఆకర్షణ కోసం పెట్టిన టెర్రకోట బొమ్మల కొలువులు. చూపు ఎటు తిప్పినా చిత్రవర్ణాల కూర్పులు!

raghu1

రఘోత్తమరెడ్డిగారి రూఫ్‌గార్డెన్‌లో జామ, పంపరపనస, బొప్పాయి, సపోటా, సీతాఫలం, బత్తాయి, దానిమ్మ, నిమ్మ వంటి చెట్లను చూస్తే చకితులమైపోతాం. ఆకాశపు నిచ్చెనమెట్లు ఎక్కినట్టుగా కొన్ని చెట్లు నిటారుగా ఎదిగిపోయాయి. నేల విడిచి చేసే సాగులో ఇదెలా సాధ్యమని ప్రశ్నిస్తే… రఘోత్తమ్‌ నవ్వారు. చేయాలనుకుంటే సాధ్యంకానిదేముంది అన్న అర్థముంది ఆయన నవ్వులో. రోజూ ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట మొక్కలతో గడుపుతారు. నీరు పెడతారు. వాటిని పరిశీలించి బాగోగులు తెలుసుకుంటారు. ఇదీ ఆయన తన మాటల ద్వారా చెప్పిన దినచర్య. కానీ ఆ క్షణాన నాకు ఆయన “మొక్కల నాడి చూడగల వైద్యుడిలా” అనిపించారు. అంతేకాదు.. ఆ తోట అంతటి హరితశోభని సంతరించుకోవడానికి ఆయన పంచే ప్రేమ కూడా కారణమని అనిపించింది.

మిద్దెపైన రఘోత్తమ్‌ సృష్టించిన ఈ తోట.. ఆయన అభిరుచికి ఆవిష్కరణ. నిజానికి ఈ వర్ణన బట్టి ఇదంతా విశాలమైన జాగాలో పెంచిన తోట అని మీరనుకుంటే పొరపాటే. నారపల్లెలో ఆయనకున్నది సుమారు 170 గజాల స్థలమే. అక్కడే ఇల్లు కట్టుకుని, అందులోనే చిరకాల స్వప్నమైన సాగుపనులు చేసుకోవడం కొంత కష్టతరమే. కానీ రఘోత్తమ్‌ తన ఆలోచనకి పదునుపెట్టి… రూఫ్‌ గార్డెన్‌ ఏర్పాటుతో తన కల నెరవేర్చుకోవచ్చునని భావించారు. ఐదేళ్ల క్రితంనాటి ఆయన పూనికే ఇప్పుడు హరిత సౌందర్యానికి నిలయంగా మారింది. తోటల్లో ఎంత చేవగా పెరుగుతాయో అంతే మిసమిసతో, ఆరోగ్యంతో పెరిగాయి ఈ రూఫ్‌గార్డెన్‌లో చెట్లు, మొక్కలు..!

పాడైపోయిన కూలర్ల కింద ఉండే ఇనుప చట్రాలే కొన్ని మడులకు ఆధారం. శ్లాబ్‌ మీద బండరాళ్లు పేర్చి.. వాటిపై ఇటుకల కూర్పుతో కొన్ని మడులు తయారుచేశారు. వాటిలో మట్టి నింపారు. విత్తు నాటారు. పెద్దపెద్ద కుండీల్లో చెట్లను నాటారు. రెక్కల కష్టంతోనే అన్నీ చేశారు. నీటికి లోటు రాకుండా తగిన జాగ్రత్తలు పాటించారు. అవసరమైన కాలువలు ఏర్పాటుచేశారు. ఇలా నగరపు నడిమధ్యన రైతుగా మారి సాగుబడితో జీవితానందం పొందుతున్నారు. ఇప్పుడు వారు తమ అవసరాల కోసం కూరగాయలు, ఆకుకూరలు కొనడం లేదు. (దుంప కూరలు ఒక్కటే ప్రస్తుతానికి మినహాయింపు) వారి పంట దిగుబడే ఇంటి అవసరాలకు మించి వస్తోందని చెప్పారు. అప్పుడప్పుడు ఇతరులకూ పంచుతున్నారు. పెరటి మొక్క వైద్యానికీ, కూరకీ కూడా పనికొస్తుందని ఆచరణపూర్వకంగా నిరూపించారు. 30 శాతం వరకూ పళ్లు తమ తోటలోనే పండుతున్నాయట. మరికొన్ని పళ్ల చెట్లు కాపుకి వస్తే.. ఆ లోటు కూడా పూడుతుందని నమ్మకంగా చెప్పారు రఘోత్తమ్‌. ప్రతిచెట్టునీ ఆయన బిడ్డ మాదిరే పరిపోషిస్తున్నారు. ఆ చిట్టి వనాన్ని చూసి మురిసిపోయి పిట్టలు అక్కడక్కడే సందడి చేస్తున్నాయి. సీతాకోకచిలుకలు పూవ్వుపువ్వునీ పలుకరిస్తూ సంబరపడుతున్నాయి. తేనెలూరు ఆ దృశ్యాలు కన్న కనులకి అంతకంటే ఏముంటుంది సార్ధక్యం..!?

ఎడాపెడా పురుగుమందులు వాడటం, కృత్రిమంగా నేల సారాన్ని పెంచాలన్న యావతో యద్ధేచ్చగా ఎరువులు వెదజల్లడం వంటివి రఘోత్తమ్‌కి నచ్చవని ఆయన సాగు పద్ధతిని చూస్తే అర్థమవుతుంది. అలాంటి ఆహార పంటల వల్ల ఆరోగ్యం ఎంతగా కలుషితమవుతుందో ఆయనకు తెలుసు. గతంలో అనారోగ్య చీడపీడల బారిన పడినవారే ఆయన కూడా. అందుకే ప్రకృతికి చేరువగా ఉండే సహజ సాగుపద్ధతులనే తన రూఫ్‌గార్డెన్‌కి పెట్టుబడిగా మార్చుకున్నారు. ఒక రచన చేసేటప్పుడు ఎంత దీక్ష, ఒడుపు, నిబద్దత, నిజాయితీ పాటించేవారో రూఫ్‌గార్డెన్‌ విషయంలోనూ రఘోత్తమరెడ్డి ఇదే పంథాని అనుసరిస్తున్నారు. ఆయన ముఖంలో తాండవిస్తున్న ప్రశాంతతకీ, ఆ ఇంట పరుచుకున్న చల్లదనానికీ కారణం ఏమిటో నాకప్పుడే బోధపడింది. ఒకానొకనాడు సాహితీ సేద్యం చేసిన ఆయన ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు. అంతే తేడా! ఇల్లు పీకి పందిరేసినట్టు అన్న ఎత్తిపొడుపుని తిరగరాసి… ఇల్లు కట్టి, ఆ పైన పందిరి కూడా వేశారు.

raghu2

వ్యవసాయం చేయాలన్న కోరిక రఘోత్తమ్‌కి ఈనాటిది కాదు. చిన్ననాటిది. చదువుకునే రోజుల్లోనే తమ పెరటిలో కూరగాయలు పండించేవారు. అయితే ఆనాడది ఆటవిడపు వ్యాపకం మాత్రమే. హైదరాబాద్‌ వచ్చి ఇల్లు కట్టుకున్న తర్వాత సాగుని పూర్తికాల విధిగా మార్చుకున్నారు. ఇందులో ఉన్న ఆనందం, ఆరోగ్యం మరెక్కడా దొరకదని చెబుతున్నారు. అంతేకాదు.. హైదరాబాద్‌ వంటి నగరాల్లో వాతావరణం చక్కబడాలంటే… రూఫ్‌గార్డెన్‌ల ఏర్పాటును తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిబంధన విధిస్తే మేలని రఘోత్తమరెడ్డి సలహా ఇస్తున్నారు. ఆకుపచ్చదనం మనసుని ఆహ్లాదపరుస్తుంది. హరిత సంపదే కాలుష్యానికి నిజమైన విరుగుడుమంత్రం. ఈ సూత్రం కూడా రఘోత్తమ్‌ మాటల్లో అంతర్లయగా ధ్వనించింది.

ఐదేళ్లుగా రూఫ్‌గార్డెన్‌ వ్యవసాయం ద్వారా రఘోత్తమ్‌ మంచి ఉపాధ్యాయుడిలా మారారు. అందులో ఉన్న సాధకబాథకాలను తేలిక మాటల్లోనే ఆయన ఇతరలతో పంచుతున్నారు. ఇలాంటి విషయాలను ప్రోత్సహించే విషయాల్లో మన వ్యవసాయశాఖకి ఆయన వేసింది సున్నా మార్కులే. “మనది వ్యవసాయిక దేశం కదా.. ఇన్నేళ్ల బట్టి వ్యవసాయం చేస్తున్నాం కదా…? తమ తమ భూముల లక్షణాలను కొలిచే చిన్నపాటి పరికరం కూడా రైతులకు తయారుచేసి ఇవ్వలేకపోయాం..” అని రఘోత్తమ్‌ అన్నారు. నేల సారం కొలిచే పరికరం ఉంటే రైతులకు తమ పొలంలో ఏ పంట వేస్తే మంచిదో గ్రహించగలుగుతారు. తద్వారా అనవసరపు ఖర్చులు, జంజాటాలు, నష్టాలు తప్పుతాయి అన్నది ఆయన భావన. ప్రభుత్వాలు, వ్యవసాయరంగ నిపుణులు తలుచుకుంటే ఇదేమంత కష్టమైన ఆవిష్కరణ కాదు. కానీ తలుచుకోరు అంతే!

తమ ఇంటికొచ్చే మిత్రులు, బంధువులకు తన రూఫ్‌గార్డెన్‌ని చూపిస్తున్నప్పుడు ఆయన ముఖంలో తొంగిచూసే ఆనందం వర్ణనాతీతం. చివరిగా వారి అభిప్రాయం రాయడానికి ఒక నోటుబుక్కు అందిస్తారు. ఆ పుస్తకం పుటలు తెరిస్తే అపురూప స్పందనలెన్నో! గ్రామసీమలు స్వయంపోషకత్వం సాధిస్తేనే దేశం సుభిక్షమవుతుందని పాలకులు చెబుతారు. నిజానికి ఎవరికి వారు కూడా స్వయంపోషకత్వం సాధించాలన్నది ప్రస్తుతం రఘోత్తమ్‌ తన జీవితాచరణ ద్వారా చాటిచెబుతున్న సిద్ధాంతం. “ఎటువంటి ఆహారం భుజిస్తే సుఖ విరేచనం అవుతుందో అదే నీ ఆహారం” అన్న ఆయన మాట కూడా అక్షర సత్యం! నిజానికి రఘోత్తమ్‌గారి ఇంటినీ, సాగునీ దర్శించక ముందు వరకూ నాతో సహా చాలామందికి ఆయన కేవలం సాహిత్యకారుడిగానే సుపరిచితులు. రైతుగా మారిన రఘోత్తమ్‌ని కూడా చూస్తేనే ఆయన సంపూర్ణ వ్యక్తిత్వ దర్శనం అవుతుందేమోనని ఇప్పుడు నాకనిపిస్తోంది.

ఇక రఘోత్తమరెడ్డి సాహిత్య జీవిత విశేషాలకు వస్తే… తెలుగు కథాసాహిత్యం గర్వకారణంగా భావించే విలక్షణ రచయితలలో ఆయనొకరు. పరిచయం అక్కరలేనంత దొడ్డవారు. రాసినవి ఇరవై మూడు కథలు. అందులో పనిపిల్ల కథమీద సుదీర్ఘ చర్చ జరిగింది. నల్లవజ్రం అనే నవలిక రాశారు. కొత్త తరానికి కథలపై మక్కువ పెంచే ప్రయోగంగా “తుమ్మేటి రఘోత్తమరెడ్డి చెప్పిన ఏడు ఆశు కథలు” పేరుతో ఒక డీవీడీ వెలువరించారు. అందులో ఉన్న సెజ్‌ కథ మీదకూడా చర్చోపచర్చలు సాగాయి. అల్లం రాజయ్య, తుమ్మెటి రఘోత్తమరెడ్డి సృజించిన సాహిత్యాన్ని చదువుకుని పెరిగిన ఒక తరం ఉంది తెలుగునాట. వారుగానీ, వీరుగానీ ఒప్పినా ఒప్పకున్నా ఈ మాట నిజం. అంతటి చేవకలిగిన, చేయి తిరిగిన రచయిత ఈ మధ్య ఏమీ రాయడం లేదు. అదీ నా లోపల గూడుకట్టి ఉన్న బెంగ. ఎప్పుడేనా ఆయన ఎదురుపడితే తప్పక అడగాలనుకున్న ప్రశ్న. నిజంగానే ఈ రోజున ఆయన ముందు నేను.. నా ఎదుట ఆయన ఉన్నాం. అయినా అడగటానికి ఎక్కడో నాలో బెరుకు. తోటలో ఆహ్లాదంగా గడిపి వచ్చిన తర్వాత ఆ మహిమ వల్ల కాబోలు- నాలో బెరుకుపోయింది. “ఈ మధ్య ఏమీ రాయడంలేదెందుకు..?” అని అస్త్రం సంధించా.

raghu3మితభాషి కనుక తన తాజా వ్యాసంగం గురించి క్లుప్తంగా వివరించారు. పుస్తక రూపం దాల్చిన ఆ రచనలు నాచేతికిచ్చారు. అవి చూసిన తర్వాత నా ఆనందానికి అవధులు లేవు. జీవన తరుశాఖల నుంచి ఫలసేకరణ చేస్తున్న వనమాలిలా నా కనులకు కనిపించారు. తన జీవితాన్ని మధించి… వచ్చిన సారాన్ని… మహావాక్యాలుగా తీర్చి సూక్తులు రచిస్తున్నారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి స్వతంత్ర కోట్స్‌ రచన చేపట్టి… దానిని ఒక యజ్ఞంలా కొనసాగిస్తున్నారు. “జీవించు- నేర్చుకో- అందించు” శీర్షికన 2011లో తొలి పుస్తకం విడుదల చేశారు. దరిమిలా రెండవ సంపుటి వెలువడింది. మరో నాలుగు సంపుటాలకు సరిపడా కొటేషన్స్‌ తయారుచేశారు. గత నాలుగేళ్లుగా తొమ్మిదివేలకు పైగా కొటేషన్స్‌ రాశారు. ఆయన నిరాడంబరుడు కావడం వల్ల ఈ ప్రయోగానికి రావాల్సినంత ప్రచారం రాలేదేమో అనిపించింది.

గోదావరిఖని బొగ్గుగనుల్లో కూలీగా చేరి సూపర్‌వైజర్‌ ర్యాంకులో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు రఘోత్తమరెడ్డి. అది కూడా పదమూడేళ్ల సర్వీసు ఉండగానే. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేసిన కొడుకు సీషెల్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం రఘోత్తమ్‌, రూప దంపతులు నారపల్లిలోని సొంత ఇంటిలో సొంత వ్యవసాయం చేసుకుంటూ ఉన్నంతలో హాయిగా, ఆనందంగా బతుకుతున్నారు. ఉన్న దానితో తృప్తిపడే విశాల మనసు ఉంటే అనవసరపు ఆరాటాలకు తావుండదని నిరూపిస్తున్నారు.

ఆయనని ఉపాధ్యాయుడు అని మధ్యలో ఎందుకు సంబోధించానంటే రఘోత్తమ్‌ మాటల నుంచీ, చేతల నుంచీ నేర్చుకోవలసింది ఎంతో ఉందని తెలియచెప్పడానికే!

*

 

తుమ్మేటి రఘోత్తమరెడ్డి రచయితగా సాహిత్య వ్యవసాయం చేస్తుంటారు. వ్యవసాయం కూడా ఎంత సౌందర్యవంతంగా, ఈస్టటికల్‌గా చేస్తారో ఈ డాబా (రూఫ్‌గార్డెన్‌) చూస్తే తెలుస్తుంది. ఒక ఎకరంలో ఎంత వైవిధ్యంగా పెంచవచ్చో… ఇంత చిన్న స్థలంలో చేసి చూపిస్తున్నారు… ప్రకృతి వ్యవసాయం…. ప్రకృతితో సహజీవనం… ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా సేదదీరడం… ఎంత చల్లని నీడో..! ఇందుకు పడే కష్టంలో ఎంత ఆనందం ఉంటుందో అభిరుచి ఉన్నప్పుడే తెలుస్తుంది…
– బి.ఎస్‌. రాములు
(రూఫ్‌ గార్డెన్‌పై స్పందన)

అరుణ్ ఇదిగో ఇక్కడే!

 

 -నర్సిం

~

 

narsim“అన్నా! నేను సాగర్ని, రేపు 27న నా కొత్త పుస్తకం మ్యూజిక్ డైస్ ఆవిష్కరణ, ఖమ్మంలో- రాకూడదు”

“చంపేశావ్ ఆరుణ్, నేను ఛెన్నై వెళ్తున్నాను,  ట్రైన్లో  ఉన్నాను – వరదలొచ్చాక వెళ్ళనేలేదు, వారం దాక రానేమో. మనం తీరిగ్గా కలిసే ఛాన్స్ మిస్స్ అవుతున్నానే!”

తీరికగానే కాదు అసలుకే కలవలేమని, మొత్తంగా మిస్స్ అవుతానని, ఆ మాటలే ఆఖరి మాటలని కల్లో కూడా అనుకోలేదు. కాని అరుణ్ కు అన్ని తెలిసే,  చివరిసారిగా మిత్రులందరినీ కలుసుకునే  అన్ని ఏర్పాట్లను నిబ్బరంగా   చేసుకున్నాడు.

ఏబీకే  గారు పిలిస్తే సుప్రభాతం  మేగజైన్లో చేరడానికి ఆంధ్రజ్యోతి నుంచి నేను, కె. శ్రీనివాస్, సురేంద్ర  రాజు, జింకా నాగరాజు,  రవి అనే లే అవుట్ ఆర్టిస్ట్, ఇంకా కొంతమంది సీనియర్లం వెళ్లాం. అర్టిస్ట్ చిత్ర కూడా చేరాడు.  అప్పుడే జర్నలిజంలోకి అడుగుపెడ్తున్న కొత్తతరం చాకులాంటి కుర్రాళ్ళ గ్యాంగ్ కూడా మాతో పాటు జాయినయ్యింది. అందులో రవిప్రకాష్ (ఇప్పటిTV9 CEO), చంద్ర మౌలి, MV రామిరెడ్దిలతో పాటు అరుణ్ సాగర్ కూడా ఉన్నాడు. ఏబీకే  తర్వాత వాసుదేవ రావు గారు టీం లీడర్. రవిప్రకాష్ రిపోర్టింగ్ లొ ఉంటే అరుణ్, మిగతా వాళ్లు  డెస్క్ లో ఉండేవాళ్లు. మల్లెపల్లి లక్ష్మయ్య, ప్రభంజన్ కుమార్ లు రిపోర్టింగ్ లో తిరిగే వాళ్లు. తెలుగు ‘ఇండియా టుడే’ కు పోటీగా వస్తున్న మేగజైన్ అని మొదటి నుంచే ప్రచారం లో ఉన్నందునా సీనియర్లు, జూనియర్లతో పూర్తిస్థాయి టీంతో బాబూఖాన్ ఎస్టేట్లోని  సుప్రభాతం  ఆఫీస్ కళ కళ లాడేది.

అప్పుడే కాలేజి నుంచి బయటకొచ్చిన జోష్ తో బక్క పల్చగా ఉండే అరుణ్ సాగర్ చేసే అల్లరి,  వేసే జోకులతో ఆఫీస్ నిండా ‘వార్తా’వరణం నవ్వుల పువ్వులు పూచేది. ఈ కొత్త పిల్లలంతా టీలు, బిస్కట్లే కాదూ, మా టిఫిన్  బాక్సులకెగబడి షేర్ చేసుకునేవాళ్లు. అరుణ్ మాటి మాటికి నా టేబిల్ దగ్గరికొచ్చి, “అన్నా! సోనాలి బింద్రే-మళ్లీ నా గుండె తలుపు  తట్టేసిందన్నా-ఘంట కొట్టేసిందన్నా, హే భగవాన్! మై క్యా కరూం” అంటూ ఓ భగ్న ప్రేమికుడులాగా ఓ ఫోజు పెట్టేవాడు. అందరికంటే నాతో, చిత్రతో చాలా చనువుగా ఉండే వాడు. నేనూ అదే అదనుగా  రయ్యుమని ఓ క్యారికేచర్ గీసిచ్చే వాణ్ణి. (అవన్నీ దాచి పెట్టుకున్నాడని తర్వాత  తెలిసింది). అలా సీనియర్లతో జోవియల్ గా ఉంటూనే రాతను, ఆలోచనా విధానాన్ని పదును పెట్టుకున్నాడు. ఆర్నెళ్ల తర్వాతేమో -అంతగా  గుర్తుకు లేదు –  ఆంధ్ర జ్యోతి మళ్లీ తెరిచారు, కె. శ్రీనివాస్ జాయిన్ అయ్యారు.

 

ఒకరోజు నాదగ్గరికొచ్చి “అన్నా! కె.శ్రీనివాస్ గారు, ఆంధ్ర జ్యోతి కి రమ్మంటున్నారు, ఏం చెయ్యమంటావ్? ఏమి అర్ధం కావట్లేదు” అని చేతులు నలుపుకుంటుంటే, “నీకు జర్నలిజంలోనే కంటిన్యూ కావాలనుకుంటే ఇంకేమి ఆలోచించకుండా, వెంటనే మూటా ముళ్లే సర్దుకుని ఆంధ్ర జ్యోతికెళ్లిపో, కెరీర్ బాగుంటుంది” అని చెప్పడం, తను వెళ్లి ఆంధ్ర జ్యోతిలో చేరిపోవడం అన్నీ చక చకా జరిగిపోయాయి. ఆ తర్వాతి ఏడాది నేను ఇండియా టుడే  కోసం మద్రాస్  కెళ్లిపోవడం..అలా కొంత గ్యాప్ వచ్చినా, ఆరుణ్ అంచెలంచెలుగా ఎదగడం చూస్తూనే ఉన్నాను.

సుప్రభాతం లో నాకు తెలిసిన యువకెరటం అరుణ్, ఆంధ్ర జ్యోతి మీదుగా టీవీ 9 లో ఉత్తుంగ తరంగమై ఎగిసిపడడం కళ్లింతలు చేసుకుని చూసేలా చేసింది. రవిప్రకాష్, తను TV 9 CEO గా వెళ్తూ, అరుణ్, చంద్రమౌలి తో పాటు  స్పార్క్ ఉన్న తన సుప్రభాతం మిత్రులందరినీ తీసుకెళ్లాడు. నవన్వోన్మేష భావ సారుప్యత కలిగిన తన ఈ టీం తో రవి TV9 ను టాప్ లో నిలబెట్టాడు. అరుణ్ సెకండ్ పొజిషన్లో ప్రదర్శించిన  దూకుడు, ఆ ఛానెల్ కొక ప్రత్యేకతను తీసుకొచ్చింది. 23 ఏళ్లు నేను దూరంగా మద్రాస్ లో ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నాం, మాట్లాడుకుంటూనే ఉండే వాళ్లం, కార్టునిస్టులకు, ఆర్టిస్టులకి సంబందించి ఎదైయినా బైట్ కావలిస్తే తప్పకుండా ఫోన్ చేసేవాడు. 10టీవీ లోగో మ్యూజిక్ ఇళయరాజాతో చేయించుకోవడం కోసం మద్రాస్ వచ్చినప్పుడు, టైం కెటాయించుకుని ప్రత్యేకంగా నన్ను కలవడానికి ఇండియా టుడే ఆఫీస్ కొచ్చాడు. టీవీ 9 నుండి 10 టీవీ  సియీఓ గా జాయిన్ అయ్యానని చెప్పాడు,  అదే అన్నాను- తొమ్మిది తర్వాత పది- “నంబర్స్ కూడా కూడా నీ విలువను పెంచుతున్నాయి ఆరుణ్” అని.

అలా ప్రింట్ మీడియా నుండి ఎలక్ట్రానిక్ మీడియాకు ఒక మెరుపులా దూసుకొచ్చి ‘వీడెవడ్రా బాబూ, దడ దడ లాడించేస్తున్నాడూ అని ప్రత్యర్ధులు విస్తుపోయి చూసే రేటింగ్ ను సాధించిన అరుణ్ ను తలచుకుని  పొంగి పొవడం నాకింకా గుర్తుంది. ఇక పదిమందిలో ప్రత్యేకంగా తనను తాను పోతపొసుకొడంలో అరుణ్ తడబడం మన చూడం. సొనాలి బింద్రేను చూసి గుటకలు మింగే అల్లరి పిల్లడు అరుణ్ సాగర్, ఎదుగుతూ ఎదుగుతూ ఫెమినిజానికి ధీటుగ మగవాణ్ని అంతెత్తున నిలబెట్టాలనుకునే లక్ష్యం తో మేల్ ఛావనిస్ట్ గా  పెద్దమనిషయ్యాడు. తన సొంత డిక్షనొకటి తయారు  చేసుకుని, ‘మేల్’ కొలుపంటూ నిటారుగ నిలబడ్దాడు. తెలుగులో మొదటిసారి ఆ వైపు నుంచి దూసుకొచ్చిన ప్రోజ్-పోయెట్రి, తెలుగూ-ఇంగ్లీష్ కలగలిసిన అరుణ్ రాతలు మర్యాదగ రాసుకునే వాళ్లలొ అలజడి రేపింది. (ఈ మేల్ కొలుపు ను ఇండియా టుడే తెలుగు లో నేను రివ్యూ చేశాను-అసలే అరుణ్ సాగర్ లాగ నిట్ట నిలువుగా ఉన్న పుస్తకం-తలకిందులుగ తపస్సు చెయ్యాల్సొచ్చింది.)

Arun (1)

ఇక మియర్ మేల్, మ్యాగ్జిమం రిస్క్…  మిగత కవిత్వ సంకనాలు అదే దారిలో సాగాయి. ఆ  తర్వాత సామాజిక అంశాల మీద కూడా అనేక వ్యాసాలూ రాసి, అవగాహన, బాధ్యత కలిగిన జర్నలిస్ట్ గా, పౌరుడిగా మారాడు అరుణ్. అవతార్ సినిమాను ఒక సాంకేతిక అద్భుతం గా అందరూ కీర్తిస్తున్న సందర్భం లో, అది ప్రక్రుతి బిడ్డలైన ఆదివాసుల జీవన వనరుల్ని కొల్లగొట్టడానికి బలిసిన సంపన్న దేశాలు చేస్తున్న కుట్రని, టెక్నాలజీ అట్టడుగున దాగిన విశయాన్ని తెటతెల్లం చేస్తూ వ్యాసం రాశాడు, పోలవరం ముంపు, పాపి కొండలు మాయం కావడం మీద “మ్యుజిక్ డైస్” రాసి, పుస్తకాన్ని  నిన్న మొన్ననే రిలీజ్ చేశాడు. ఇలా తనను తాను సాన పట్టుకుంటూ ఒక పరిపూర్ణ మనవుడుగా, విజయుడుగా రూపుదిద్దుకుంటున్న సమయంలో ఈ విస్ఫోటనాలేమిటీ?

రెండేళ్ల క్రితం – మద్రాస్ నుంచి హైద్రబాద్ వచ్చినప్పుడు కలిశాను, తను 10TV CEOగా ఉన్నాడు. ఆఫీస్, స్టుడియో అంతా తిప్పి చూపింఛాడు- “ఇదంతా నేను దగ్గరుండి నా టేస్ట్ కు తగ్గట్టుగ  చేయించుకున్నానన్నా” అంటూ మురిసిపోయాడు. అరుణ్ ఈ వర్టికల్ ఎదుగుదలలో పక్కనే లేకున్నా, నిరంతరం  ఎరుకలోనే ఉన్నాననిపిస్తుంటుంది.  “మ్యుజిక్ డైస్” రిలీజ్  సందర్భాన్ని మిస్స్ కావడం వల్లనేమో, అరుణ్  ఇక మనకు లేడు, ఉండడు, మాట్లాడడు అనేది ఇంకా నా మైండ్ లో రిజిస్టర్ కావట్లేదు.  ఆ అరుణ్ స్రుజన  అయిన 10TV ఆఫీస్,  నేను కార్టూన్ ఎడిటర్ గా ఉన్న నవతెలంగాణ ఆఫీస్ ఒకే బిల్డింగ్ లో ఉన్నాయి . అరుణ్ నాకేమి దూరం కాలేదు, అరుణ్ 10TV కోసం తయారు చేయించిన ఆ లోగో లోను, అట్ట కెమెరా పట్టుకున్న ఆ బుడ్డోడిలోనూ, News is people లోనూ రోజూ తనను చుస్తూనే ఉంటాను. నేను ఇండియా టుడే లో మియర్ మేల్ రివ్యూ కు వేసిన క్యారికేచర్ అరుణ్ కు చాల ఇష్టం, అదే ఈ క్యారికేచర్.

*

 

దాస్ ఈజ్ మై బాస్‌!

 

-శ్రీచ‌మ‌న్

~

madhu“దాస్ ఈజ్ ఫోర్త్ ఫ్లోర్ బాస్‌“ అని పిలిస్తే ఉలిక్కిప‌డ్డాడు ఆఫీస్ బోయ్ దాస్‌. అలా పిల‌వొద్దు సార్ అన్నాడు. గ‌తంలో రెండు మూడు సార్లు పిలిస్తే న‌వ్వి ఊరుకునేవాడు. ఇప్పుడేంటి ఇలా చివుక్కుమ‌న్నాడు.

అనుకున్న‌లోపే..అలా పిలిస్తే..అరుణ్ సాగ‌ర్ సార్ గుర్తొస్తాడు.  ఆయ‌న ఎప్పుడూ అలాగే పిలిచేవాడు అని చెప్పుకొచ్చాడు. అలా పిల‌వొద్దు సార్ అని చికాగ్గా స‌మాధానం చెప్పాడు. ఎందుకు అని అడుగుదామ‌నుకున్నా! కానీ దాసులో అరుణ్ సాగ‌ర్‌పై ప్రేమ స‌న్న‌ని క‌న్నీళ్ల పొర‌లా క‌నిపించింది.

ఆఫీస్ బాయ్ దాస్ అరుణ్‌సాగ‌ర్‌కు బాసెందుకు అయ్యాడు?  బాస్ ఎలా వుండాలో తెలియ‌ని అరుణ్ సాగ‌ర్‌కు ఆఫీస్ బాయ్ దాసు కూడా బాసులాగే క‌నిపిస్తాడు. ఇది నిజం కావాలంటే దాస్‌ని అడ‌గండి. మీలో ఎవ‌రైనా, పోనీ మీరైనా అమెరికా వెళ్లొస్తే..పెళ్లాంకి ఓ గిఫ్ట్‌. పిల్ల‌ల‌కు చాక్లెట్లు, ఫ్యూచ‌ర్‌లో మ‌న‌కు ఏమ‌న్నా ప‌నికొచ్చే పైర‌వీగాళ్ల‌కు ఓ గిఫ్ట్  కొని తెస్తారు. అమ్మెరికా నుంచి తెచ్చామ‌ని గొప్ప‌లు చెబుతారు. కంటోన్మెంట్ గోడ వార‌గా పేవ్‌మెంట్ మీద కొన్నా యూఎస్ క‌ల‌రిచ్చి కానుక‌గా ఇస్తారు.

కానీ అరుణ్ సాగ‌ర్ అలా కాద‌ని దాసు చెబితే తెలిసింది. అమెరికానో, ఇంకో దేశ‌మో వెళ్లొచ్చిన సాగ‌ర్‌. దాసు అన‌బ‌డే ఆఫీస్ బోయ్‌..దాస్ ఈజ్‌ బాస్‌కు ఓ టీష‌ర్ట్ తెచ్చాడ‌ట‌. ఈ విష‌య‌మూ దాసే చెప్పాడు. పండ‌క్కి బ‌ట్ట‌లు తీసుకోమ‌ని డ‌బ్బులు కూడా ఇచ్చేవాడ‌ట‌. బాస్‌ను అదేనండి ఆఫీస్‌బోయ్ దాసును ఇలా గౌర‌వించుకున్న ఎడిట‌ర్లు , మ‌హా క‌వులు, మ‌హా ర‌చ‌యిత‌లను..మీరు మ‌హా అయితే సినిమాల్లో చూసుంటారు. లేదంటే మ‌న త‌రం ప్ర‌ముఖులు రాసిన క‌థ‌ల్లో చ‌దివి ఉంటారు. అరుణ్ సాగ‌ర్ కు  త‌న బాసు, దాసు ఒక్క‌టే. ఎందుకంటే ఇద్ద‌రూ మ‌నుషులే కాబ‌ట్టి. ఒక్క దాసునే కాదు. ప్ర‌తి ఒక్క‌రినీ త‌మ్ముడూ! అని గాఢంగా పిలిచే ఆత్మీయుడు అరుణ్‌సాగ‌ర్‌.

ఏ గాడ్‌ఫాద‌ర్ లేకుండా జ‌ర్న‌లిజంలోకి వ‌చ్చిన కొంద‌రికి దేవుడిచ్చిన అన్న‌య్య. అరుణ్ సాగ‌ర్ చ‌నిపోయిన నుంచీ బాగా డిస్ర్ట‌బ్ అయ్యాను. ఆయ‌నతో పెద్ద‌గా పరిచ‌యం లేదు. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయాలనే కోరిక బ‌లంగా ఉండేది. 2003లో ఆంధ్ర‌జ్యోతి జ‌ర్న‌లిజం క‌ళాశాల‌లో మాకు లైఫ్‌స్టైల్ జ‌ర్న‌లిజం పాఠాలు చెప్పిన‌ప్ప‌టి నుంచే నాకు ఆయ‌నంటే ఒక అభిమానం.

ఫీచ‌ర్ రైటింగ్ గురించి మాకు అరుణ్‌సాగ‌ర్ చెప్పిన క్లాసు ఇప్ప‌టికీ గుర్తే. ఎవ‌రు ఏ అంశంపై రాస్తారు అని అడిగాడు. ఒక్కొక్క‌రు ఒక్కోటి చెప్పారు. ఆయ‌న కూడా క‌లాం హెయిర్ స్టైల్ మీకు ఫీచ‌ర్ రైటింగ్‌కు ప‌నికి రాదా? అని అడిగాడు. అప్ప‌టిక‌ప్పుడు క‌లాం వెండి జ‌ల‌తారు జుత్తుపై ఇన్‌స్టంట్‌గా ఏదో ఒక‌టి రాసి చూపించి నా ఆస‌క్తిని బ‌య‌ట‌పెట్టాను. ఆ త‌రువాత టీవీ9లో చేరాల‌ని మా మిత్రుడి రిక‌మెండేష‌న్‌తో ఒక‌సారి క‌లిశాను.

క‌ర్నూలులో ఆంధ్ర‌జ్యోతి ఎడిష‌న్ ఇన్‌చార్జిగా ఉన్న‌ప్పుడు క‌ప్ప‌ట్రాళ్ల వెంక‌ట‌ప్ప‌నాయుడు హ‌త్య ఘ‌ట‌న గురించిన స‌మాచారం కోసం ఫోన్ చేశారు. నెక్ట్స్ ఆంధ్ర‌జ్యోతి ఎడిట‌ర్ కె శ్రీనివాస్ పుస్త‌క ప‌రిచ‌య స‌భ కోసం ఖ‌మ్మం వ‌చ్చిన‌ప్పుడు క‌లిశాను. ఇంతే! ఇంత‌కుమించిన ప‌రిచ‌యం లేదు. 10 టీవీలో ఉద్యోగం కోసం వెళ్లాను. మ‌ధు నీకు ఉద్యోగం క‌న్‌ఫ‌ర్మ్. జీతం మాత్రం హెచ్ ఆర్ వాళ్ల‌తో మాట్లాడుకో అని చెప్పాడు. వాళ్ల‌తో బేరం కుద‌ర్లే! చెప్పి వ‌చ్చేశా! ఇంకెప్పుడూ క‌ల‌వ‌లే!

ఓ నెల‌రోజుల క్రితం ప్రెస్‌క్ల‌బ్‌లో ఎదురుప‌డితే న‌మ‌స్తే సార్ అన్నా! ఎవ‌రు నువ్వు అని అడ‌గ‌లేదు. తాగిన మ‌త్తులో ఉన్న నేను సార్‌! న‌న్ను గుర్తుప‌ట్టారా? అని అడిగా. నువ్వు చ‌మ‌న్‌వి క‌దా! అన్నాడు. ఉద్యోగం ఇవ్వ‌క‌పోయినా, గుర్తుంచుకున్నారు చాలా సంతోషం అని చెప్పి..మ‌త్తుగా ఒత్తుల‌తో కూడి వ్యాక‌ర‌ణ దోష సంభాష‌ణ‌కు దిగినా..చిరాకు ప‌డ‌ని స‌హ‌న‌శీలి. ఆ రోజు ప్రెస్‌క్ల‌బ్ నుంచి వెళ్లిపోయాడు. నాకిష్ట‌మైన క‌విని చూడ‌టం అదే చివ‌రిసారి. నాకిష్ట‌మైన జ‌ర్న‌లిస్టుతో మాట్లాడ‌టం అదే ఆఖ‌రిసారి. అరుణ్‌సాగ‌ర్ ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నే కోరిక నెర‌వేర‌లేదు. ఆయ‌న రాసే క‌విత‌ల‌కు కామెంట్‌గా మ‌రో క‌విత రాస్తే.. గో ఎ హెడ్ అంటూ ప్రోత్స‌హించిన మ‌న‌త‌రం మ‌హా మ‌నీషితో నా పుస్త‌కానికి ముందుమాట రాయించుకోవాల‌నే ఆశ తీర‌లేదు.

బ‌య‌టి ప్ర‌పంచంలో దృష్టిలో అరుణ్ సాగ‌ర్ అత్యంత ఆధునికుడు. బాగా ద‌గ్గరున్న వారి దృష్టి కోణంలో సున్నిత మ‌న‌స్కుడు.

అరుణ్ సాగ‌ర్ నాకు తెలిసి ఆదివాసీల‌ ఆత్మ‌బంధువు. గాడ్‌ఫాద‌ర్ లేని వాళ్ల‌కు గాడ్ బ్ర‌ద‌ర్‌. క‌విత్వాన్ని ప్రేమించేవాళ్ల‌కు ఓ తాజ్‌మ‌హ‌ల్ లాంటి వాడు. న‌మ్మ‌క‌ద్రోహుల‌పై క‌క్ష తీర్చుకోవాల‌నే క‌సి లేని చేత‌గానివాడు. స్నేహం అరుణ్‌సాగ‌ర్ బ‌ల‌హీన‌త‌. మంచిత‌నం అరుణ్ సాగ‌ర్ మ‌రో వీకెనెస్‌. ఓవ‌రాల్‌గా మ‌నిషిత‌న‌మ‌నే దీర్ఘ‌కాల వ్యాధితో బాధ‌ప‌డుతూ ..స‌మాజ‌మ‌నే వైద్యాల‌యంలో చికిత్స పొందుతూ క‌న్నుమూశాడు.

దాస్ ఈజ్ మై బాస్‌..అన్న మంచిత‌నం, మ‌నిషిత‌నం వున్న అరుణ్‌సాగ‌ర్ ద‌గ్గ‌ర ప‌నిచేసే అవ‌కాశం ఒక్క‌రోజు కూడా రాక‌పోయినా ..అరుణ్ సాగ‌ర్ ఈజ్ మై బాస్‌. అరుణ్‌సాగ‌ర్ బాస్ మాత్రం దాసే.

*

అడివిలోంచి దూసుకొచ్చిన అక్షరం..

 

-అరణ్య కృష్ణ

~

 

“అన్నా! నేనిప్పుడు బతుకుతున్నది నా బోనస్ లైఫ్.  నేనో మెడికల్ వండర్ని”..ఇదీ అరుణ్ సాగర్ కొన్నాళ్ళ క్రితం నాతో అన్న మాటలు.

తన సున్నితమైన గుండెకున్న ఒక్క ఊపిరితిత్తితోనే కవిత్వాన్ని, జీవితాన్ని శ్వాసించినవాడు అరుణ్.  పైకి హాండ్సం గా, హుషారుగా మాట్లాడే అరుణ్ లోపల కొన్ని ముఖ్యమైన అవయవాలు శిధిలమైపోయాయి.  గాజుబొమ్మలాంటి శరీరంతో తరుచూ అస్వస్థతకు గురౌతూ కూడా జీవితాన్ని అద్భుతంగా ప్రేమించినవాడు.  మృత్యువు గుమ్మం ముందు కూర్చొని వుంటే దాన్ని కన్నుగీటి తోసుకుంటూ వెళ్ళినవాడు.  2012 నుండి అదనపు జీవితాన్ని గడుపుతున్నానన్న సంబరంలోనే వుండేవాడు కానీ చావు తనచుట్టూ తారట్లాడుతుందనే భయంలో మాత్రం వుండేవాడు కాదు. ఆకర్షణీయంగా వుండటం, అంతే ఆకర్షణీయంగా రాయటం అరుణ్ వ్యక్తిత్వంలో భాగమే.  ఎంత విభిన్నంగా కనిపించేవాడు.  ఫార్మల్ గా డ్రెస్ చేసుకున్నా, లేదా క్యాజువల్గా జీన్స్ వేసుకున్నా అతని స్టైలిష్ యాటిట్యూడ్ కనిపిస్తుంది.   ఫ్రెంచ్ కట్ బియర్డ్ తో, కళ్ళజోడులోంచి చూస్తూ చేసే మందహాసం మనోహరంగా వుండేది.  విభిన్నంగా ఆలోచించటం,  కళనీ, కౌశలాన్ని ఒకే స్థాయిలో మిళితం చేసి వైవిధ్యంగా వ్యక్తీకరించటం అరుణ్ కే చెల్లింది.

ఒక కవిగా, కాలమిస్టుగా, పాత్రికేయుడిగా “బుల్స్ ఐ” లోకి గురిచూసి కొట్టే మాట అతనిది.  పాలకులు సామాన్య ప్రజలకు పెట్టే భ్రమల గుట్టు విప్పి చెప్పటంలో కానీ, అభివృద్ధి పేరుతో సిద్ధం చేస్తున్న విధ్వంస ప్రణాళికల్ని బట్టబయలు చేయటంలో కానీ తిరుగులేని నిబద్ధత చూపిన వ్యక్తి, శక్తి అరుణ్!  అతను స్పర్శించని అంశం ఏమిటి?  సినిమా, జెండర్, సామాజికాభివృద్ధి, మానవ వికాసం, కృంగిపోతున్న పల్లెలు, “అభివృద్ధి” చెందుతున్న నగరాలు, రాజకీయాలు, బాల్యం, ఆర్ధికాంశాలు, ప్రపంచపరిణామాలు, యుద్ధాలు…ఇలా అతను ముట్టుకోని అంశం ఏదీ లేదు.  సృజనాత్మక పద ప్రయోగంతో, లలితతమైన భాషద్వారా దారుణవాస్తవాల్ని వొక ప్రవాహవేగంతో సాగిపోయే అతని శైలీవిన్యాసం మనల్ని చకచ్చకితుల్ని చేస్తుంది.  దిగ్భ్రాంతికి గురిచేస్తుంది.  జ్ఞానాన్నిస్తుంది. ఆలోచింపచేస్తుంది. ఉడుకెత్తిస్తుంది.  ప్రేరేపిస్తుంది.

“హైదరాబాద్ ని నేనే అభివృద్ధి చేసా” అని చంద్రబాబన్నప్పుడు ఆ అభివృద్ధి ధనవంతుల ఇళ్ళల్లో వాటర్ ఫౌంటేయిన్ల నుండి వారి ప్రహరీలు దాటి బైటకొచ్చే నీటి జల్లని తేల్చిపారేసాడు.  నగరాల స్త్రీల వెతల్ని మాత్రమే ఫోకస్ చేసే మీడియా టీ.ఆర్.పి. లేని కారణంగా నిర్లక్ష్యం చేస్తున్న గ్రామీణ స్త్రీల గురించి పట్టించుకోదని ఈసడించాడు.  స్మశానవాటికకు ఎదురుగా అందమైన అమ్మాయి హోర్డింగుని చూసి నవ్వుకున్నాడు.  బాహుబలి గురించి అంతర్జాతీయ స్థాయని తెగ ఊదరగొడుతుంటే “ఈ బూటకపు కబుర్లని కట్టిబెట్టండి, సీరియస్లీ” అని హెచ్చరించాడు.  “అవతార్” సినిమా పరమార్ధాన్ని అద్భుతంగా విశదీకరించాడు.  పురుషుడంటేనే దుర్మార్గుడని, నయవంచకుడన్న ముద్రని నిరసిస్తూ “మేల్ కొలుపు”, “మియర్ మేల్” సంకలనాలు రాసాడు.  అందరూ అమ్మని కీర్తిస్తారే కానీ నాన్న శ్రమని, బాధ్యతని గుర్తించరని ఎత్తిచూపాడు.  “ఓ తండ్రీ నిను దలంచి” అని నాన్నను స్మరించుకున్నాడు.  ఆధునిక సమాజంలో నాన్న పాత్రకున్న విలువని ఎలిగెత్తి చాటాడు.  దేని గురించి రాసినా, ఎలా రాసినా, వచనం రాసిన, కవిత్వం రాసినా అందులో తనదైన విశిష్ఠ వాక్యంతో  కవిత్వమే రాసేవాడు. ఇంగ్లీష్, తెలుగుల సమ్మేళనంతో అతని వాక్యం పరిమళించేది.

ఇంక అరుణ్ కవిత్వం గురించి కొత్తగా చెప్పేదేముంది?  అదో జీవధార.  సామాన్యుడి కడుపుమంట అది.  అతని తాజా సంకలనం “మ్యుజిక్ డైస్” అతను మనకిచ్చిన చివరి కానుక.  పోతూ పోతూ ఒక సాహిత్య ఉద్యమ బాధ్యతని మన చేతుల్లో పెట్టిపోయాడు.  ఇంకా ఆ పుస్తకం గురించి “అరుణ్ చాలా బాగా రాసావు. ధన్యవాదాలు భాయి” అని మనం చెప్పే లోపలే తన బోనస్ జీవితాన్ని కత్తిరించేసుకొని వెళ్ళిపోయాడు.  బహుశ “మ్యుజిక్ డైస్” గురించే జీవితాన్ని పొడిగించుకున్నాడేమో! ఇంకా కొన్నాళ్ళ తరువాత ఈ పుస్తకం తెచ్చుండాల్సింది అరుణ్, నువ్వింకా కొన్నాళ్ళుండేవాడివేమో!  “మ్యుజిక్ డైస్ అను ఒక మరణవాంగ్మూలము” అన్న ఈ సంకలనంలో పోలవరం ప్రాజెక్ట్ కారణంగా నశించిపోనున్న ఆదివాసీలందరి తరుపున వాంగ్మూలం ఇచ్చి తను మరణించాడు అరుణ్.

జాతుల్ని, వాటి సంస్కృతుల్నే కాదు ప్రకృతిని, పర్యావరణాన్ని అభివృద్ధి పేరుతో ధ్వంసించే పాలకుల దళారీ చర్యల మీద ఏదో ఒక కవిత రాసి ఊరుకోలేదు.  ఒక కవితల సంకలనమే తెచ్చాడు అరుణ్.   ఇది అరుణ్ సాగర్ మాత్రమే చేయగల మహత్కార్యం. ఎంత ఆవేదన, జ్ఞానం, అవగాహన, నిబద్ధత, పోరాట పటిమ లేకపోతే ఇంత గొప్పపని చేయగలడు?  అమరవీరుల స్తూపం ముందు ఎగురుతున్న ఎర్రజెండాకి పిడికిలెత్తి లాల్ సలాం చెబుతూ సగర్వంగా ఫోటో వేసుకొని తన పుస్తకాన్ని “పోడు కోసం గూడు కోసం తునికాకు రేటుకోసం అటవీహక్కుల కోసం జెండాలై ఎగిరిన తల్లులకు తండ్రులకు అక్కలకు అన్నలకు” అంకితమిచ్చిన అరుణ్ ప్రాపంచిక దృక్పధం తేటతెల్లమే.

 

“చెట్టుపుట్టలు కూలుస్తున్న ఒక పొక్లయిన్

గుండె బరువెక్కి మొరాయించినది

కానీ ఒక్క మట్టిపెళ్ళా పెకిలించలేక కూలబడినది

కాంక్రీటు మర ఒకటి నిస్సహాయంగా  తిరుగుతూనే ఉన్నది

ఆ శబ్దము దుప్పిపిల్ల అరణ్య రోదనలాగున్నది

సాయిల్ టెస్ట్

మట్టినింపిన పరీక్ష నాళిక రక్తముతో చెమ్మగిల్లినది

 

నది దిగులుపడి లుంగలు చుట్టుకు పోతున్నది

అమ్మ ఒడిలో చేరి 

వాగులు వంకలు ఏరులు పారులు

భోరున సుడులు తిరిగి

దుఖపడి పెగిలిపోతున్నవి”...అంటూ అడవితల్లి తరపున, ఆ తల్లి బిడ్డలకోసం మరణశోకాన్ని ఆలపించినవాడు అరుణ్.  “అరణ్యాన్ని ఆవాసాన్ని ఆవరణాన్ని లేడిపిల్లల్ని అడవి బిడ్డల్ని రెవిన్యూ రికార్డుల్నుండి తొలగించే” పాలక ముష్కర చర్య గురించి మనల్ని హెచ్చరించాడు.

“కథలు కన్నీళ్ళు

కూలిపోతున్న ఇళ్ళు

ఇళ్ళ నిండా  నీళ్ళు

ఇళ్ళ కళ్ళ నిండా నీళ్ళు

లక్ష టియంసీల నీళ్ళు

వెల్లికిలా తేలియాడుతున్న

కోటానుకోట్ల కళ్ళు

ఇంతింత కళ్ళేసుకున్న ఈళ్ళు

కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న గాధలు

అన్నా…మన కథలు“…అంటూ బావురుమన్నవాడు మనవాడు అరుణ్!

నశించబోతున్న నది మెరిసేలా నవ్వే సీదర సెంద్రయ్య గురించి, ఒడ్డున బతుకుతున్న రావిచెట్టు గురించి, ఒక పోరగాడు విసిరిన గులకరాయి గురించి, ఒక పోరి చూసిన పచ్చని, వెచ్చని చూపు గురించి బెంగ పెట్టుకున్నాడు అరుణ్. భోరుమన్నాడు అరుణ్.  కోపగించాడు అరుణ్. మనల్ని రెచ్చగొడుతూ దుడుకుగా తనెళ్ళి పోయాడు అరుణ్.  ఎక్కడికెళ్ళాడు అరుణ్?  ఈ మనుషులు, నేల, దేశం, ఖండం, మొత్తం భూమి, ఈ సౌరకుటుంబం, ఈ పాలపుంత చాలక అంతరిక్షంలో మన పొరుగున వున్న గెలాక్సీ “ఆండ్రొమెడా”ని కూడా ప్రేమించిన అరుణ్ తన పుస్తకాలన్నీ “ఆండ్రొమెడా ప్రచురణలు” కింద ముద్రించి మురిసిపోయాడు. బహుశ అక్కడ సేద తీరుతున్నాడేమో!

సమాజానికి అతనో మేధావి, కవి, కాలమిస్ట్, జర్నలిస్ట్ కావొచ్చు.  అతని పరిచయస్థులకు మాత్రం అతనో గొప్ప మానవీయ వనరు.  అద్భుత స్నేహశీలి.  నిరాడంబరుడు.  అతనికి నేను గొప్ప ఆప్తుణ్ని కాను కానీ చాలా మంచి పరిచయం వుంది.  కవి శ్రీకాంత్ పెళ్ళిలో నాకు పరిచయం అయిన మొదటి సారి నుండి “అన్నా” అనే పిలిచే వాడు.  “మీ సంకలనం నాకెవరు ఇచ్చారో తెలుసా? త్రిపురనేని శ్రీనివాస్ ఇచ్చాడు. అది మీ కవిత్వమనే కాదు త్రిశ్రీ ఇచ్చినందుకు కూడా భద్రంగా ఉంచుకున్నాను” అంటూ చెప్పాడు.  ఆ రకంగా ఒక ఆపేక్ష బంధం ఏర్పడింది అతనితో.  మధ్యలో చాలా గ్యాప్ వచ్చినప్పటికీ ఈ మధ్యకాలంలో ఆవిష్కరణ సభలు, సాహిత్య సమావేశాల్లో తరుచూ కలిసాను.

చివరిసారిగా మొన్న జనవరి 24న తెలుగు యూనివర్శిటీలో కలిసాను.  అప్పుడే “అన్న అరణ్యకృష్ణకు” అంటూ రాసి “మ్యుజిక్ డైస్” ఇచ్చాడు.  అరుణ్ ఎప్పుడూ ఒంటరిగా ఉండడు.  చుట్టూ పెద్ద స్నేహబృందం ఉంటుంది.  ఒక టీవీ చానెల్కి సీయీవో స్థాయిలో వున్నా ఎక్కడా ఆ దర్పం కనిపించనిచ్చేవాడు కాదు. సాహిత్య సమావేశాల తర్వాత ప్రెస్ క్లబ్ కి తీసుకెళ్ళి అక్కడ ముచ్చట్లు పెట్టేవాడు.  అటువంటి ఆత్మీయ జ్ఞాపకాలు నాబోటి మిత్రులెందరికో పంచాడు.  వాళ్ళ ఆఫీసుకి రమ్మంటే ఒకసారి వెళ్ళాను.  నేనో మామూలు గుమస్తాని.  సాంఘికంగా నాకంటే ఎన్నో రెట్ల పరపతి ఉన్న పొజిషన్లో వున్నా ఎక్కడా అది కనిపించలేదు.  చాలా సహజంగా వుండేవాడు.  వాళ్ళాఫీసులో కాసేపు కూర్చొని తిరిగి వెళ్ళిపోతుంటే కింద దాకా వచ్చి సాగనంపాడు.  ఎంతమందికుంటుంది అంతటి డీక్లాసిఫైడ్ ప్రవర్తన, నిరాడంబరత?  అరుణ్, నువ్వు నీ సాహిత్యాన్నే కాదు ఒక ప్రవర్తనని కూడా ఇచ్చి వెళ్ళావు.

ఇంక ఆపేస్తున్నాను.  నీ కడపటి చూపు కోసం వెళ్తున్నాను. నిన్ను కడసారి చూసాక నేనీ నాలుగు ముక్కలు కూడా రాయలేనేమో! అందుకే ఇప్పుడే హడావిడి పడుతున్నాను. క్షమించు అరుణ్, ఇంతకు మించి ఏమీ చెప్పలేకపోతున్నందుకు.

“పుష్ప విలాపమో, బతుకు విషాదమో నీ జనమే పోరాడుతున్న చోటా కనీసం గొంతైనా కలపకపోవటం నేరం! కవిత ఆచరణకు సాటిరాదు.  అయితేగియితే ఒక సహానుభూతి. ఒక మద్దతు ప్రకటన. ఒక విధాన అనుసరణ.  ఒక ధైర్యవచనం.  ఒక నినాద రచన. ఇది మరణిస్తున్న పాటని చూసి వ్యధ లోతుల్లోకి కూరుకుపోతున్న హృదయం. ఇది మరణవాంగ్మూలం వినిపించడం మాత్రమే.  మిలార్డ్!  ఆపై రేలపాట ఫీనిక్స్ వలె ఆకాశం నుండి మళ్ళీ ధ్వనిస్తుంది. దిక్కులు పిక్కటిల్లి దేహాలు దద్దరిల్లి జలాశయం గజగజ వణుకుతుంది. ఎప్పుడో ఒకప్పుడు అభివృద్ధి నమూనా మిమ్మల్ని కూడా ముంచేస్తుంది. గోదాట్లో కలిసిపోతారొరేయ్. ఇది డెత్ సెంటెన్స్.” (అరుణ్ సాగర్ “మ్యుజిక్ డైస్” కి రాసుకున్న ముందుమాట నుండి)

*

 

‘అరుణ’గ్రస్త సాగరం

 

-సాయి పద్మ

~

 

వైజాగ్లో బీచ్ ని చూసినప్పుడు , చాలా సార్లు నాకు గుర్తొచ్చేది, పైడి తెరేష్ బాబు “హిందూ మహా సముద్రం’ అరుణ్ సాగర్ వాక్యం .. మొదటిది ఆవేదననీ, రెండోది ఊపిరాడని ఉత్తేజాన్నీ కలిగిస్తుంది.

అరుణ్ సాగర్ గారు నాకు తెలియదు, ఆయనకి ఉన్న భీకరమైన ఫాన్స్ తెలుసు. అక్షరాలద్వారా, ఉన్న పరిచయంతోనే వొక కవికి ఎక్కువ దగ్గరవుతాం, నేను కలుసుకోవద్దు అనుకున్న కవుల్లో కూడా ఆయనొకరు. అయినా ఇంక కలవలేం కదా అనుకుంటే ఎలా ఉందంటే …

“ వొక నిర్వాసిత ప్రదేశంలో, ఎటూ కాని మెలాంకలీ, ఇదీ అని చెప్పలేని వొక జీవిత వీరుణ్ణి మాటల్లో, వొక జీవితాన్ని గ్రాటిట్యూడ్ తో బ్రతికి, విలాసంగా మరణ వాంగ్మూలం మీద, తెలుగు వాక్యం మీద టోర్న్ జీన్స్ వేసుకొని సంతకం పెట్టిన ఒక నాన్నని మిస్ అయిన ఫీలింగ్..”

అందరు కవులూ జీవితాన్ని బ్రతికేస్తారు, తడిగా కొందరు, పొడి పొడి మాటల వొంటరితనాల్లో మరికొందరు. కానీ, వొకరో, ఇద్దరో.. జీవితాన్ని, సెలబ్రేట్ చేస్తారు.

ఊపిరాడని సంధ్యల్లో, ఎటూ కాని ఆరోగ్యంతో బ్రతకటం ఏమిటో నాకు తెలుసు, అరుణ్ గారు, మెడికల్ వండర్ గా బ్రతకటానికి కారణం ఆయనలో ఉన్న అర్బన్ disguise లో ఉన్న ట్రైబల్నెస్ అనుకుంటూ ఉంటాను.

మరో విచిత్రం ఏమిటంటే, ఆయన కవిత్వం ఆశువుగా చెప్పలేం .. కనీసం ఆయన వాక్యాలు కూడా..

కానీ.. తెలుగు కవిత్వం మీద ఆయన సంతకపు సిరా ..ఇంకా ఆరనిదే.. ఇప్పటికే కాదు ఎప్పటికీ

కవిగా కంటే , స్నేహశీలి గా బ్రతికి , నాన్నగా ఇంకా బ్రతికుంటే బాగుణ్ణు అని మీ హితుల్నీ, స్నేహితుల్నీ కరడుగట్టిన దుఖం లో ముంచి వెళ్ళిపోయారు అరుణ్ గారూ..

నిజానికి, నాకు బాధ కంటే , గర్వంగా ఉంది .. జీవితంతో, ఆరోగ్యంతో, కూడా .. దుష్ట రాజకీయాలపై పోరాడినంత ధైర్యంగా పోరాడి, నవ్వుతూ మ్యూజికల్గా మేజిక్ లా వెళ్ళిన వొక కవిని చూస్తే..

అయ్యా.. ప్రభూ.. మీ మ్యూజిక్ కి మరణం లేదండీ.. జీవన్మరణాల స్మరణ వదిలి.. heading towards a desired target of utopian humanity.. that lives and marches taking along vulnerable, sick, and underprevilaged along with it.. Its a song of life.. carefully orchestrated by your sentenses like musican arrows..!!

you are an inspiration Arun Ji.. a True Inspiration for mediocre human race drowning in life.. you are an achoring inspiration for all of us..!

అభ్యుదయ కవుల్లో భిన్న స్వరం!

alvidaa

-ఇంద్రగంటి శ్రీకాంత శర్మ

~

 

indraganti 1970ల దశాబ్దిని “కల్లోల దశాబ్ది” అనే వారు. అలనాటి మిత్రులు కౌముది గారు అప్పుడే పరిచయం.

కచ్చితంగా చెప్పాలంటే, పరిచయమైతే 1969 నుంచి- దాశరధి పాటలో పాదంలాగా – “మాట్లాడని మల్లె మొగ్గ  మాదిరిగా నడిచి వచ్చి”- పలకరించే ఆయన స్వరం నాకిప్పటికీ గుర్తు. ఆ కాలంలో తరుచూ ఆయన గేయ కవిత్వం వ్రాస్తుండే వారు. కవిత్వ ప్రసంగాల మధ్య ఆయన కమ్యూనిస్టు నిబద్ధత నాకు తెలిసేది కాదు. బుగ్గన పరిమళించే జరదా పాన్ వుండేది. ఉద్విగ్నంగా ఉపన్యాసాలిచ్చే స్వభావం కాదేమో అనిపించేది. ఆనాటికి నేనెరిగిన మల్లారెడ్డి అభ్యుదయ గీతాలకు వేరుగా కౌముది రచనలు నాకు తోచేవి.

అలాగే, అలనాటి ఇతర అభ్యుదయ రచనల్లో కనిపించే “మొనాటనీ”కి కౌముది దూరంగా కనిపించే వారు. ఆయన్ని సమకాలీన “చప్పుడు కవులు” చెడగొట్టకుండా ఉర్దూ కవులు ఆయన్ని రక్షించారనుకుంటాను. శబ్దం ఎంపికలో శ్రద్ధ, లాలిత్య విషయంలో ఔచిత్యం ఎరిగిన సాహిత్యవేట్టగా కౌముది గారంటే నాకు గౌరవం. వూరికే నోరు చేసుకోవడం కంటే కవిత్వాన్ని అనుభవించడంలో ఆయన చూపే శ్రద్ధ చాలా తక్కువ మందిలో చూశాను. ఆలోచనా శీలి అయిన కౌముది గారు తక్కువగా రచనలు చేశారంటే నేను ఆశ్చర్య పడను. ఆయన అంతర్ముఖీనత ఆయన ఇంటర్వ్యూల్లో స్పష్టంగానే కనిపిస్తుంది.

“రత్నం వెదకదు: వెదక బడుతుంది” అన్నాడు కాళిదాస కవి ఒక చోట. అలాగే, కవిత్వం కూడా వెల్లడి కాదు; వెల్లడింపబడుతుంది. దాని కోసం అన్వేషణ, అధ్యయనంలో వుందనే కిటుకు కౌముది గ్రహించడం వల్లనే బహుశా కవిత్వం పేరిటా, అభ్యుదయం పేరిటా వట్టి మాటలు ఉద్రేకాలను ఆయన వెలిగక్కలేదు.

లోకం తీరు, అందులో మనుషుల ప్రవర్తనల్లో ఎగుడు దిగుళ్ళూ, అందుకు కారణాలూ కౌముది వెల్లడిగా చూడగలిగారు. పైగా మాట్లాడ్డంలో నిదానం, స్పష్టత విశిష్టంగా ఎరిగిన వారు. ఆయన కవిత్వమంతా ఇవాళ వరసగా చదువుతూంటే, పాతగా పొగలాగా అనిపించదు. ఆ వాక్యాలకు, పదసంపుటికి పాతదనం లేదు. పునరుక్తి కాదు, కవిత్వ రహస్యమెరిగిన వ్యక్తి పడే జాగ్రత్త అది.

మరీ ముఖయ్మ్గా “ఏకాంత”, “ఒక వృక్షం”, “ఇంతకూ నేనెవర్ని?” అనే వచన పద్యాలూ, “కవినైతిని”, “వసంత గీతి” “విశ్వ శాంతి” “దీపావళి” “వికృత ప్రాకారాలు” – పద్యాలూ, “ఒక అనుభవం” రచన వంటివి కౌముది గారి కవిత్వాన్ని పాతబడనివ్వవు.

ఏకాంతం – కవితలో కౌముది అంటారు:

గుండెల మీద

ఘనీభవించిన దూరాలు

 

నిట్టూర్పుల నిప్పు కణికల మీద

ఉచ్చ్వాస నిశ్వాసాల పరిమళాల నివురు.

ఎక్కడో  ఎందుకో

మంచులా కురుస్తున్న చూపులు.

దిగంతాల దగ్గిర

అప్పుడే ముత్యాల పల్లకీ దిగిన సంధ్య

ఎర్ర దుమ్ము ఎగరేసుకుంటూ

సరుగుడు చెట్ల వెనక

నిష్క్రమించిన రథం

 

అప్పుడే

నిప్పుల నది ఈది ఈది

తీరం ఎక్కి

వగర్చుతూ ఒళ్ళు ఆరబెట్టుకుంటున్న ఒంటరి చుక్క.

 

మిణుగురు పురుగు రెక్కల మీద ఎగిరి వచ్చి

మెల్లగా వ్యాపించే

నీ

ఆలోచన.

*

తన కాలంలో మిగతా కవుల కంటే వేరుగా మాట్లాడగలిగితే – ఒక కవి తన గొంతులో మాట్లాడుతున్నాడని అర్థం.

కౌముది గారు అభ్యుదయ కవుల్లో సొంత గొంతున్న కవి.

నా మిత్రుని కవిత్వానికి నమస్కరిస్తున్నాను.

*

 

కౌముది కవిత్వ సంపుటి “అల్విదా” కోసం సంప్రదించండి: సాహితీ మిత్రులు, 28-10-26/1, అరండల్ పేట, విజయవాడ- 520 002. 

ఎదురు చూస్తున్న పుస్తకం…

12 001

కూనపరాజు కుమార్

~

2004 అగస్టులో మిత్రుడు శంకర్‌తో కలిసి జె.ఎఫ్.కె విమానాశ్రయానికి బయలుదేరాను. ఓ అరగంట ఎదురుచూపులు తరువాత వాళ్లిద్దరూ బయటికి వచ్చారు..” న్యూయార్క్ నగరానికి స్వాగతం” అని ఓ పూలగుత్తిని ఎం.ఎస్ గారికి ఇచ్చి కౌగలించుకొన్నాను. ప్రక్కనే వున్న “సయాజీ షిండే’గారికి షేక్‌హ్యాండ్! ఇక పండుగ ప్రారంభం అయ్యింది. అప్పటి దేవదాసు(కొత్తది) సినిమా షూటింగ్ కోసం ఇద్దరూ వచ్చారు. వాళ్లు అప్పటికే ‘శాన్‌ఫ్రాంసిస్కో’, ‘వాషింగ్‌టన్ డి.సి నగరాలలో షూటింగ్ పూర్తి చేసుకొని న్యూయార్క్ వచ్చారు.

ఖాళీ దొరికినప్పుడల్లా ఎంజాయ్‌మెంటు. ముందు వర్జీనియాలో గల “లూరే కేవరిన్స్” కు వెళ్లాం. అవి బుర్రా గుహలు కంటే చిన్నవే కాని వాటి నిర్వహణ చూసి ముచ్చటపడ్డారు.  రోడ్లు, రైల్వే, వీధులు, పార్కులు ఇవన్నీ చూసి “మన దేశం కూడా ఇంత అభివృద్ధి ఎప్పుడౌతుందో” అని నిట్టూర్చారాయన. “బఫెలో”లో విమానం దిగి ఓ వ్యాన్‌ను అద్దెకు తీసుకొని బయలుదేరాం. ఇంతలో ఓ వంతెన దాటుతుంటే ఇదేంటి అని అడిగారు. ఇది జలపాతం వైపు ప్రయాణం చేస్తున్న నీరు.తరువాతే నయాగరా అన్నాను. అక్కడకు చేరి ఆ దృశ్యాన్ని ఆస్వాదించి పరవశించిపోయారు. మరల న్యూయార్క్ వచ్చాక టి.ఎల్.సి.ఏ వాళ్లు ఓ సాయంత్రం ఎం.ఎస్ కు సన్మానం ఏర్పాటు చేసారు. ఎం.ఎస్ గారు వెంటనే అప్పటికప్పుడు ఓ “స్కిట్” తయారు చేసి మా అందరితో వేయించారు. అందులో షిండే, మేం కొంతమంది పాల్గొన్నాం. సూపర్ హిట్ అయ్యింది. తెలుగువారితో హాలు కిటకిటలాడింది. ఆయన్ జోకులు కడుపుబ్బ నవ్వించాయి. ఆయనసాహిత్య జ్ఞానం వినిపెద్దలు ఆశ్చర్యపోయారు.

ముందొకసారి అమెరికా వచ్చినప్పుడు 179 స్ట్రీట్  సబ్‌వే స్టేషన్‌లో  రైలెక్కి మన్‌హటన్ వెళుతున్నాం. ట్రైన్‌లో ఓ నల్లజాతి అతను పరిచయం అయ్యాడు. మీరు ఇండియన్సా? అని ఎం.ఎస్‌ను అడిగాడు. మీకు ఎలా తెలుసు? అంటే పోలికలు బట్టి తెలుస్తోంది అన్నాడు. మీకు మాదేశం వాళ్లు ఎవరైనా తెలుసా? అని ఆయన అడిగారు. “తెలుసు.. గాంధీ, గవాస్కర్, ఈ మధ్య సచిన్” అన్నాడు. ఎం.ఎస్.కు ఆశ్చర్యం వేసింది. “నేను కరీబియన్ నుంచి వచ్చా! అందుకే క్రికెట్ అంటే ఇష్టం. మీ దేశానికి శాంతియుతంగా స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీ కూడా ఇష్టం” అన్నాడు. ఎం.ఎస్ నా వంక టర్న్ ఇచ్చి “చూడవయ్యా.. ప్రపంచం గాంధీని నెత్తిన పెట్టుకుంటే మనవాళ్ళేమో అవహేళన చేస్తున్నారు” అన్నారు.

కట్ చేస్తే.. 2011 ఫిలిం చాంబర్ వద్ద ఎదురు చూపులు. కొద్ది సేపటికి గచ్చకాయ రంగు ఇన్నోవా కారు వచ్చింది. లోపల ఎం.ఎస్ గారితోపాటు నల్ల కళ్ళజోడు పెట్టుకొన్న సుబ్బరాజు, గుంటూరు నారాయణగారు వున్నారు. నేను కూడా ఎక్కాను. నా చేతిలో’సోనీ వాయిస్ రికార్డర్’. కారు కదలగానే ‘ఇక ప్రారంభిద్దామా? గురూజీ!’ అన్నాను. ఒక్క నిమిషం ఆగవయ్యా బాబూ! అని కొంచెం సర్దుకొని ప్రారంభించారు.ఆయనతో కలిసిన ప్రతీసారి అనేక అనుభవాలు చెప్పేవారు. ఓసారి గురూజీ మీ స్వీయ చరిత్ర వ్రాస్తే బావుంటుంది అని అడిగా! ‘నాది అంత గొప్ప చరిత్ర కాదు. నేను అంత గొప్పవాణ్ని కూడా కాదు’ అన్నారు. కనీసం మీ అనుభవాలు అయినా వ్రాయండి అన్నా..! సరే అలాగైతే నువ్వే రాయి అన్నారు. అలా ప్రారంభం అయింది ఈ రికార్డింగ్. ఈ వంకతో ఖాళీ దొరికినప్పుడల్లా మాకో సంబరంలా కొనసాగింది. ఎంతవరకు వచ్చాం అన్నారు. “మీ మొదటి ప్రేమ వరకు” అన్నాను. నీకో విషయం తెలుసా నాకు మూడుసార్లు పెళ్లయింది అన్నారు. నేను ఆశ్చర్యంతో “సార్” అని అరిచాను. కంగారుపడకు.. మా ఆవిడతోనేలే! అన్నారు తాపీగా.”చూడు దేవుడికి ఏటేటా పెళ్లి చేస్తారు. ఆయన ఏమైనా కలలోనికి వచ్చి నాకు పెళ్లి చేయండి! నాకు పెళ్లి చేయండి!! అని అంటాడా? ఏదో భక్తుల అభిమానం. అలాగే మొదట నేను చేసుకొన్నాను. తరువాత ప్రజలకోసం” అన్నారాయన. టెన్షన్ పెట్టకండి. వివరంగా చెప్పండని వేడుకున్నాను.

రచయిత కూనపరాజు కుమార్ తో ఎమ్మెస్

రచయిత కూనపరాజు కుమార్ తో ఎమ్మెస్

నేను పత్తేపురంలో భాషాప్రవీణ చదివే రోజుల్లో నా జూనియర్ కళాప్రపూర్ణను ప్రేమించాను. చదువు పూర్తి అవ్వగానే తనను తీసుకుని ఇంటికి వచ్చాను. మా నాన్న ఓ లెంపకాయ ఇచ్చి బయటకు పంపేసాడు. ఇక దిక్కు తోచక ‘చిన తిరుపతి’ వెళ్లాం. అప్పటికి తెల్లవారుజాము నాలుగు గంటలు అయ్యింది. గుడిద్వారాలు తెరిచేటప్పటికి ఇంకా చాలా సమయం పడుతుంది. సరే అని ఆ సింహద్వారం గుమ్మంపై కూర్చుని కళాప్రపూర్ణకు తాళి కట్టేసా!. వెంటనే బయలుదేరి మా గురువుగారు పరుచూరి గోపాలకృష్ణగారింటికి వెళ్లిపోయాం. ఆయన అన్నారు… ఇలా కాదని మాకు రెండోసారి దండల పెళ్లి చేసి రిజిష్టర్ చేయించారు. ఇక మూడోసారి, నా మొదటి టీచర్ ఉద్యోగం ‘వేండ్ర’ స్కూల్లో చేసాను. అక్కడొకసారి గ్రామ పెద్దలు నన్ను పిలిపించి, ఏమయ్యా ఎవరినో లేపుకొచ్చి ఇక్కడ కాపురం పెట్టావంట. ఇది సబబా? అని అడిగారు. ముందు కోపం వచ్చి అడ్డం తిరిగాను. తరువాత తాపీగా జరిగింది చెప్పాను. వాళ్లు మెత్తబడ్డారు. ఈ పెళ్లిల్లేమి ఒప్పుకోం. మరల శాస్త్రోక్తంగా మేమే చేస్తాం అన్నారు. నేను ఒప్పుకోనన్నారు. మా స్కూలులో టీచర్లు అన్నారు కాదు మేం చేస్తాం అని. ఇలా నా మూడో పెళ్ళి భీమవరం గుళ్ళో వైభవంగా జరిగింది. అన్నారు. ఇలా చాలా రోజులు,నెలలూ గడిచాయి.

క్యారేజీలు పట్టుకొని కొల్లేరు ‘గాబు కోత’కు వెళ్లడం, వ్యవసాయ పనులకు వెళ్లడం, స్కూల్‌లో చదువుకోవటం, చిన్న చిన్న దొంగతనాలు, చిలిపి చేష్టలు, పత్తెపురంలో భాషాప్రవీణ చదివే రోజులు, గాంధీ, కాళిదాసు, శరత్‌బాబు పుస్తకాలు.. కాలేజీలో పరుచూరిగారు రచించిన నాటకం వేయడం. స్కూల్ టీచర్‌గా, కాలేజీ లెక్చరర్‌గా ఆంధ్రా యూనివర్సిటీలో నాటకం, మద్రాసు ప్రయాణాలు, సినిమా కష్టాలు, మొదటి సినిమా, మొదటి నంది. ఆయన జీవన ప్రయాణవీచికలో ములిగితేలాం.. అనుభవించి పలవరించా. ఇదో మహా ప్రహసనంలాగా సాగింది. చివరికి సినిమా లిష్టులు, ఫోటోలు సేకరించి పుస్తకం తయారయ్యింది.

కానీ, సంక్రాంతి పండుగ వచ్చేసింది. గురూజీ! నా రొయ్యల చెర్వు దగ్గర ఓ బుల్లి ఫారం హౌస్ కట్టాను. మీరొచ్చి ఓపెన్ చెయ్యాలి అని రిక్వెస్ట్ చేసాను. ఆయన ఒప్పుకొని జనవరి 13న వచ్చి రిబ్బన్ కట్ చేసారు. పూర్తి ఇంటి భోజనం చేసారు. ఆనందంగా గడిపి భీమవరం వెళ్లిపోయారు. ఎక్కడెక్కడో తిరిగి అనారోగ్యంతో భీమవరం హాస్పిటల్‌లో చేరారు. చివరకు గుండె, కిడ్నీలు సరిగా పని చేయడం లేదని హైదరాబాద్ తీసుకువెళ్లారు. ఇంకేముంది. 23న చెట్టు  నుండి చిరుగాలికి రాలిన పువ్వులా సునాయాసంగా వెళ్లిపోయారు. గతించిన కాలపునీడలు మా చుట్టూ తిరుగుతున్నాయి. ఆయన స్నేహసౌరభాన్ని అనుభవించిన వారమంతా దిక్కులేని పక్షుల్లా విలవిలాడుతున్నాం.

ఆయన అనుభవాల జ్ఞాపకాలను గుండెల్లో పెట్టుకొన్న “ఎం.ఎస్.నారాయణ జీవన పోరాటం” పుస్తకం విడుదల కోసం ఎదురుచూస్తోంది. జనవరి 23న (ఆయన ప్రధమ వర్ధంతి) బరువుకళ్లతో, రిక్తహస్తాలతో, నిట్టూర్పులతో మిత్రులందరూ మరోసారి కలుసుకోవాలి.

(కూనపరాజు కుమార్ ..ఎం.ఎస్.నారాయణగారి జీవిత చరిత్ర రచయిత)

 

ఆమె మాట ఎప్పటికీ బంగారు మాటే !!

 

-పి. విక్టర్ విజయ్ కుమార్ 

 

ఆకాశం లో అర్ధ భాగం ను తెంపుకుని వచ్చి కొడవంటి కుటుంబ రావు గారి  జీవితం లో అర్ధ భాగం పంచుకున్నది వరూధిని అమ్మ. తొంభై ఒక్క ఏడు దాటినా – ఏ మాత్రం సడలని నిబ్బరం, ఏ మాత్రం వీగిపోని సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఇంకా వికసిస్తున్న ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇవన్నీ చూస్తే – ఆమె పెరిగిన సిద్ధాంతాల వాతావరణ ప్రభావం అంత గట్టిగా ఉంటుందేమో అనిపిస్తుంది.

వ్యక్తిగా నిలదొక్కుకోవడం ఒక ఎత్తైతే – ఒక సామాజిక జీవిగా ఇంకా చేతనం కలిగి ఉండడం అంత సులభ తరం కాదు.

పెదనాన్న స్త్రీ వాది చలం, నవలా రచయిత కొమ్మూరి సాంబశివ రావు తమ్ముడు,  తురగ జానకి రాణి, ఇస్మాయిల్, వజీర్ రెహ్మాన్ అందరూ చుట్టూ దగ్గరి బంధువులు. కూతురు కేంద్ర సాహితీ పురస్కార గ్రహీత. కొడుకు, రోహిణీ ప్రసాద్,  భారత దేశం లో పేరెన్నిక గన్న న్యూక్లియర్ శాస్త్ర వేత్త కావడమే కాక, ప్రజల భాషలో సైన్స్ ను వివరించాలనుకునే ‘ స్టిఫెన్ హాకింగ్ ‘ లాంటి వాడు అంతే అతిశయోక్తి కాదు. ఇంత మంది మధ్యలో 90 ఏళ్ళ నుండి పెరిగాక , ఆమెకు వయో భారం వలన వచ్చే మానసిక దైన్యం దాదాపుగా కనిపించదు.

రోహిణీ ప్రసాద్,    BAARC    లో సైంటిస్టుగా ఎన్నో పేటెంట్లు సాధించడానికి కారకుడు. వ్యక్తిగా తన సైన్స్ విజ్ఞానాన్ని పదిలపరుస్తూ ఎన్నో సైన్స్ పుస్తకాలు – వీక్షణం, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ , ప్రజా సాహితీ సంస్థల సహాయం తో ముందు తీసుకు రాగలిగాడు. విశ్వ రహస్యాన్ని ఎంత సింపుల్ గా ప్రముఖ శాస్త్ర వేత్త స్టిఫెన్ హాకింగ్ పాఠకుల ముందు ఉంచాడో – అలా తెలుగులో అటువంటి ప్రయత్నం ఆ స్థాయిలో చేయగలిగింది రోహిణి ప్రసాద్ గారే. నేను, అతడు ఒకే వెబ్ మేగజైన్ కు ఆర్టికల్స్ రాసేవాళ్ళం. చిన్న పత్రిక, పెద్ద పత్రిక అనే స్థాయి లేకుండా – అదే ‘ ఇంటలక్చువల్ మోతాదులో ‘ సైన్స్ ఆర్టికల్ రాసి ఇచ్చేవాడు. తన ఆరోగ్యం పాడవుతుంటే – తనే రీసర్చ్ చేసి వ్యాధి, దానికి చికిత్స గురించి పరిశొధించి డాక్టర్లకు అడ్వైజ్ చేసేవాడు. ఆయన్ డాక్టర్ రోహిణీ ప్రసాద్ అంటే – నిజంగానే డాక్టర్ ఏమో అని వైద్యులు నమ్మేసేంత అమాయకానికి వారిని గురి చేసాడు. సైంటిస్టుగా నిజాయితీ కలిగిన ‘ సైంటిఫిక్ టెంపర్ ‘ కలిగిన వ్యక్తి. సంగీతం లో విద్వాంసుడు.

స్వంతంగా ఎన్నో స్వరాలను సురచించిన వాడు కావడం తో ఆయన రిటైర్ అయ్యాక, ఎవరో సాయి బాబా భక్తులు , సాయి బాబా కోసం స్వరాలు సమకూర్చమంటే – చప్పున ముగించి ఇచ్చేసాడు. వరూధిని అమ్మ ‘ ఏంటీ ? నీకు సాయి బాబా అంటే నమ్మకమా ? ‘ అంటే ‘ కాదు వాళ్ళిచ్చే డబ్బు మీద నమ్మకం ‘ అన్నాడు.  చాలా మంది హేతువాదులు, కుల నిర్మూలనా వాదులు – ఈ సందర్భాన్ని తప్పు పట్టొచ్చు. వాళ్లందరూ కూడా ‘ డబ్బు మీద నమ్మకం లేని వాళ్ళైతే ‘ బాగుణ్ణు. విప్లవ సాహిత్యం లో ఉన్న వాళ్ళ పై జరిగే విపరీతమైన దాడి ఏంటంటే – వాళ్ళు సౌకర్యమైన జీవితాలు గడుపుతున్నారని. నిజానికి కొడవటిగంటి కుటుంబ రావు , రోహిణీ ప్రసాద్ లు సంపాదన మాత్రమే లక్ష్యం పెట్టుకుని ఉంటే – వారు సంపాదించింది చాలా తక్కువే. ఒక ఊహాత్మక ఆదర్శం లో – ప్రగతి వాదులను ఇరికించి ‘   impractical expectations     ‘ పెట్టుకోవడం  ఒక రకమైన ‘   totalitarianism    ‘ అవుతుంది తప్ప ఇందులో గొప్పగా ప్రశంసించ  దగ్గ విషయం ఏమీ లేదు. ఒక మనిషి సాధించిన దేమిటో వదిలేసి, సాధించనిది ఏమిటో ఆలోచించడం మధ్య తరగతి    frustration     లో భాగం తప్ప మరేమీ కాదు.

కలాం లాంటి సైంటిస్ట్ – సైన్స్ నే కాదు, అత్యున్నత రాష్ట్రపతి పదవి స్థానం యొక్క ఆత్మ గౌరవాన్నే వదిలేసాడు. అది పక్కా  ‘  careerism ‘.  ప్రతి విప్లవ కళా కారుడి కుటుంబాన్ని ‘   full time revolutionary   ‘  జీవితం నడపాలని ఆశించడం లో తప్పు లేదు గాని , అలాగే ఉండాలనే ‘ ఆంక్షల జీవితాన్ని ‘ డిజైన్ చేయడం సరి అయిన దృక్పథం కాదు. శ్రీ శ్రీ – సినిమా రచనలు చేసాడు అని విమర్శిస్తే  మనమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ? సినిమాలు అసలు ఉండవద్దనా , సినిమాలు ఉన్నా పర్లేదు శ్రీ శ్రీ మాత్రం రచనలు చేయవద్దనా ? ఈ రకమైన విమర్శ మనలో ప్రతి ఒక్కరు అసలు ఎటువంటి సినిమాలూ ఉండకూడదు , మనం ( మన లాంటి మధ్య తరగతి ప్రజలు )  కూడా ఎటువంటి ‘ బాహుబలి సినిమాలకు ‘ టెంప్ట్ కాకూడదు అనుకున్నప్పుడు సద్విమర్ష అవుతుంది. ఈ డిబేట్ – పక్కన పెడితే – రోహిణీ ప్రసాద్ గారు ఖచ్చితంగా  ‘ సైంటిఫిక్ టెంపర్మెంట్ ‘ కలిగిన నిజాయితీ శాస్త్రవేత్తగానే జీవితాంతం ఉన్నాడు.

వరూధిని అమ్మ , కొకు గారి రచనల ప్రచురణార్థం , ఎటువంటి ఆర్థిక ప్రతిఫలం ఆశించలేదు. అదే శ్రీ శ్రీ రచనల విషయం లో ఏం జరిగిందో చాలా మందికి తెలుసు.

మన పరిస్థితులు మన    conviction    ను ఛాలెంజ్ చేయొచ్చు కాని దిగజారకుండా నిలబడ్డం లో గొప్ప తనం ఉంది.

కుటుంబ రావు గారికి వరూధిని అమ్మకు – వయసులో చాలా వ్యత్యాసం. కుటుంబ రావు గారు , వరూధిని అమ్మ వాళ్ళ నాన్న అప్పట్లో నడిపే తెలుగు సినిమా పత్రికకు రివ్యూలు రాసే వాళ్ళు.  శ్రీ శ్రీ, ఆరుద్ర, మొక్క పాటి నరసింహ శాస్త్రి – వాళ్ళ కుటుంబ మిత్రులుగా మెదిలే రోజులు. కొ కు గారు, తనకున్న ఆర్థిక పరమైన కారణాల వల్ల , చదువు పూర్తి చేయలేక – బోంబే లో ఎయిర్ ఇండియా టికెటింగ్ క్లర్క్గా పని చేస్తున్న రోజుల్లో, వరూధిని అమ్మ వాళ్ళ నాన్న గారు, కొ కు గారు తమ అమ్మాయికి సరి అయిన జీవన సహచరుడవుతాడని ప్రతిపాదించాక – ఇద్దరి సమ్మతం తో ఏ తంతూ లేకుండా వివాహం జరిగింది.

కొకు గారు దినమంతా రచనల్లో తల మునకలైతే – ఇళ్ళు మేనేజ్ మెంట్ అంతా వరూధిని గారిదే. కోపం తో అందరికీ వడ్డించి ‘ మీ వంట మనిషి భోజనానికి పిలుస్తుంది..రండి  ‘ అంటే ‘ నేను వంట మనిషితోనే  కలిసే భోజనం చేస్తాను ‘ అంటు మనసు తేలిక చేయగలిగే వారు కొకు గారు.

వరూధిని అమ్మ ” ఈ రోజుల్లో డబ్బు పిచ్చిలో పడి మనుష్యులకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ తగ్గి పోయింది ”  అంటారు. చిన్న జ్వరం వచ్చినా తనను వదిలి వెళ్ళని కొకు గారు గురించి తెలుసుకుంటే  – విప్లవ సాహిత్యం లో ఉండే కఠినత్వం , మనుష్యుల విషయం దగ్గర ఎంత సున్నితంగా మారిపోతుందో తెలుస్తుంది.

ఇది ఆయన జీవితాన్ని ‘ గ్లోరిఫై ‘ చేయడం కాదు కాని, కుటుంబం  లో ప్రజాస్వామ్యం ఉండాలనే పేరుతో ‘ యాంత్రికత ‘ ను ప్రవేశ పెడుతున్న ఎంతో మంది ప్రగతి వాదులు ఆలోచించుకోవాల్సిన విషయం.

వరూధిని అమ్మ ‘ ఏంటి ? ఎవరాయన చాగంటి అట ? స్నానం ఎలా చేయాలో చెప్తాడేంటి ? ‘ అని పుష్కర స్నానాలను సున్నితంగా అపహాస్యం చేసినా,  ‘ వీళ్ళు పాపాలు చేయొద్దని చెప్పాలి గాని, స్నానం చేస్తే పాపాలు పోతాయంటారేంటి వెధవలు ?! ‘ అని  విసుక్కున్నా – అ    momentary reaction   ఆమె కుటుంబం నమ్ముకుంటూ వచ్చిన విలువల ప్రతిబింబమే.

చలం , వాళ్ళ అక్క ఇంటి కెల్తే ‘ మాల మాదిగల ఇంట్లో తిరిగొచ్చాడని ‘ వరండాలోనే విస్తరి వేసేది. వరూధిని అమ్మ – ఇది ప్రత్యక్షంగా చూసింది.  ప్రజాస్వామిక వాదుల జీవితాలు ఆకాశం నుండి రాలి పడవు. వీళ్ళు నలుగురి మధ్య ఉండి జీవనం నడుపుతూ ఒక ‘ ప్రజల గొంతు ‘ వినిపించాలి. అందుకు కుటుంబం ప్రతిబంధకం అవుతుంది, కుటుంబం లో వ్యక్తుల   aspirations   కూడా ప్రతిబంధకం అవుతుంది. వీరి చుట్టూ ‘  utopian world  ‘ ను విమర్శకులు కట్టి,  positivity     ని తక్కువ చేస్తూ చూడ్డం లో సరి అయిన ప్రమాణం లేదు.

ఒక సారి కొకు గారి మీద , మా రంగ నాయకమ్మ గారు యథావిధిగా ఏదో తనకు తెలిసిన విమర్శ రాసారు. అది వరూధిని అమ్మ చదివింది. అది తప్పుల తడక అని కూడా తెలుసు. రంగ నాయకమ్మ తో కుటుంబ మితృత్వం  ఉన్నందుకు ఆ మాత్రం ఇబ్బంది పడక తప్పదు మరి. ఆ వ్యాసం రాసాక – చాలా రోజుల వరకు , రెగ్యులర్ గా ఫోన్ చేసి పలకరించే రంగనాయకమ్మ వద్ద నుండి వరూధిని అమ్మకు ఫోన్ లేదు. ఒక రోజు అకస్మాత్తుగా ఆమె నుండి ఫోన్ వచ్చింది.

వరూధిని అమ్మ ఫోన్ లో యథాలాపంగానే పలకరించాక, ఉండబట్టలేక రంగ నాయకమ్మ ” మీకు చూపు సరిగ్గానే ఉందా ? ”  అని ఆడిగింది.

వరూధిని గారు ” ఆ ..పర్లేదు …పత్రికలు చదువ గలుగుతున్నాను ”  అని సమాధానం ఇచ్చింది ఆమె ఎందుకు వాకబు చేస్తుందో తెలిసి.

” మరి నే కుటుంబ రావు గారి గురించి వ్యాసం రాసాను చదవలేదా ? ” అని ప్రశ్నించింది.

వరూధిని అమ్మ ఏ మాత్రం హావ భావాలు లేకుండా ” ఆయన పబ్లిక్  పర్సనాలిటి. ఎందరో ఆయన్ను విమర్శిస్తుంటారు. పొగుడ్తుంటారు. అవన్నీ నేనెక్కడ పట్టించుకోను ? ” అన్నది.

అటు పక్క ఫోనులో ఎక్స్ ప్రెషన్  ఇక్కడ ప్రస్తావించడం అప్రస్తుతం. ప్రజల గురించి రాసిన రచనల మీద – ఇక రాసిన వ్యక్తికి ఏం హక్కు ఉంటుంది ?  అదొ ప్రజల ఆస్తిగా మిగిలాక ,  రచయితగా ఆ వ్యక్తి ఏం చేయాలి ఇక ? వ్యక్తులను, రచనలను వేరు చేసి తమపై వస్తున్న విమర్శ ను స్వీకరించాలని ఈ రోజుల్లో ఎంత మంది ప్రగతి వాద రచయితలు తెలుసుకున్నారు ? తమ రచనకు ఎటువంటి విమర్శ రాకుండా, పూర్తి స్థాయిలో , ఫుల్ టైం బేసిస్ మీద – లాబీయింగ్ – చేస్తున్న రచయితలను మనమెంత మందిని చూడ్డం లేదు ?!

ఇదే విషయమై – వరూధిని అమ్మను తట్టి చూస్తే అంటుంది ” ఈ రోజుల్లో రచయితలకు వ్యక్తిగత ప్రతిష్ట యావ ఎక్కువయ్యింది. ఒకరి భుజాల మీద ఇంకొకరు శాలువాలు కప్పుకుందామనుకుంటారు. ఇదంతా ఒక రొచ్చు లా అయ్యింది ” అంటారు. తనను – కొకు గారి గురించి ఏవన్నా చెప్పమని టీ వీ ఛానల్స్, పత్రికల వాళ్ళు ఎగబడి ఆహ్వానిస్తున్నప్పుడు తను వాళ్ళతో అన్న మాట – ” కుటుంబ రావు గారి రచనలు నేనెంత చదివానో మీరూ అంతే చదివారు. ఇక వ్యక్తిగతమైన విషయాలు , మీతో  నేను పంచుకోవాలనుకుంటే మీరు అర్థం చేసుకోవాల్సింది – అది నా పర్సనల్ వ్యవహారం. పది మందికి చెప్పుకుని పేరు తెచ్చుకునే వ్యవహారం కాదు ” అని.

‘ అమ్మా ! మీరు ఇంత మంది సాహితీ వేత్తల మధ్య పెరిగారు . మీరెందుకు రచనలు చేయలేదు ? ‘ అని ప్రశ్నిస్తే వరూధిని అమ్మ ” కుటుంబ రావు గారు రాసిన సాహిత్యం చదివి విమర్శించాల్సింది మొదట నేనే కదా ? నేను బాగో లేదన్న కథను ఆయన వెంటనే పారేసే వారు. మార్పులు కూడా చేసే ప్రయత్నం చేసే వాళ్ళు కారు. ” అంటారు.

పేరు ప్రతిష్టల  గొడవలో కొట్టుకు పోతున్న ఈ తరం ప్రగతి వాద రచయితలు –   identity crisis    అన్నది లేకుండా బతకడం ఒక ఆచరణే కాదు, మనం నమ్ముకున్న కొన్ని సామాజిక విశ్వాసాలపై ఉన్న     confidence  , మన రచనల్లో అంతర్లీనంగా మనం ప్రకటించిన ఆత్మ విశ్వాసం  అన్న విషయం తెలుసుకోవాలి.

ఈ రోజుకూ రాజకీయ వార్తలను శ్రద్ధగా చదవడం , అర్థం చేసుకోడానికి ప్రయత్నించడం ఆమెకు షరా మామూలుగానే ఉంది. ” అలా కాదు..చంద్ర బాబు, వేరే దేశాలకెళ్ళి, మన దేశం లో వ్యాపారం చేయమని అడుగుతున్నాడేంటి ? మరి మన వ్యాపారస్తులు ఏమైపోతారు ? ” అమాయకంగా అడిగినట్టు ఉంటుంది కాని, ఈ దేశం లో పాతుకుపోతున్న సామ్రాజ్య వాద వ్య్వస్థ పై ఇంకా ఆ ఆక్రోషం ఉంది ఆమెలో. ” మనం సింగ పూర్ లా మారడం ఏంటి ? మనం మన దేశం లా ఉండాలి కాని ” అంటుంది. ” విప్లవం రావ డానికి ఇంకా చాలా కాలం పడుతుందనుకోండి. అంత వరకు వీటిని ఇలానే భరించాలి మనం ‘ అని లీలగా  నిరాశ  పడుతుంది.

కుటుంబ రావు గారు ఎప్పుడూ అవసరానికి మించిన ధనం ఉండ రాదు అని నమ్మే వారు. ఆయనకు నచ్చేది    classical music  .  కచేరీ ఎక్కడ జరిగినా ఫేమిలీ మొత్తం వెళ్ళే వాళ్ళు. అందుకేనేమో రోహిణీ ప్రసాద్ గారికి కు చిన్నప్పటి నుండి సంగీతాభిమానం. నిజానికి కొ కు గారికి ఫేమిలీ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ. కూరగాయలైనా, ఇంట్లో ఏవన్నా కొనాలన్నా అంతా వరూధిని అమ్మనే చూసుకునేది.  ఆయన సమయం మొత్తం రచనల్లోనే గడిచిపోయింది. చంద మామ ను అందంగా తీర్చి దిద్దడం లో కుటుంబ రావు గారి పాత్ర ఎనలేనిదనే చెప్పుకోవాలి.

చలసాని గారి లాంటి ఆప్త మితృలను కొల్పోతుంటే – వరూధిని అమ్మ కళ్ళల్లో పటుత్వం సడలదు గాని, బాధ ఒక గీతలా గీసినట్టు ఉంటుంది.

ఎప్పుడన్నా వృద్ధాప్యం వలన మనసు బలహీనమైనప్పుడు , వరూధిని అమ్మ కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటే – ఆమె ఆప్తులు ‘ నీవు మర్రి చెట్టు నీడలో పెరిగావు. నీవు ఇలా కన్నీళ్ళు పెట్ట రాదు  ‘ అని తనను  ఓదార్చుతారని చెప్తుంది.  నేను ఆమెలో బలహీనతను చూడ్డం ఇష్టం లేకనో, ఆమెలో బలం ఎలాగన్నా అలాగే కొన సాగాలనే   దురాశ వల్లనో  ” అంతే కదమ్మా ? ” అనబోతాను కాని ” అందరూ మామూలు మనుష్యులే. అందులో విలక్షణత ప్రతి క్షణం, ప్రతి ఒక్కరికీ సాధ్య పడదు  కదా !  ” అని సర్దుకుంటాను.

*

ముస్లిం జీవితంపై నవల రాయాలని వుంది: ఖదీర్

 

 

కృష్ణ మోహన్ బాబు 

 

సెప్టెంబర్  6 , ఆదివారం సాయంత్రం జరిగిన’ ఛాయా’ సంస్థ నాలుగో సమావేశం విశేషాలు ఇవీ. 

“పరిచయం అక్కరలేని కథకుడు, ప్రతీ వారం మెట్రో కథలతో మనకి కనిపిస్తున్న కథకుడు, ప్రత్యక్షంగా తన కథని మనకి వినిపించడానికి వచ్చిన కథకుడు, మహమ్మద్ ఖదీర్ బాబుని తన కథ వినిపించాడానికి వేదిక మీదికి పిలుస్తున్నాం”

అన్న అనిల్ బత్తుల పిలిపుతో ఖదీర్ మైక్ అందుకున్నాడు.

“ గత 20 యేళ్లలో నేను యెప్పుడూ వేదికల మీద మాట్లాడలేదు. ఈ సంస్థ సభ్యులు మిత్రులు, సన్నిహితులు కావడంతో, పరోక్షంగా నేనూ ఈ సంస్థలో భాగమేగా అనుకోవడం చేత ‘పెన్సిల్ బాక్స్’ అనే నా కొత్త కథని వినిపిద్దామనుకొన్నా.  వూహించని కారణాల వల్ల ఆ కథ మెరుగులు దిద్దడం పూర్తి కాలేదు.  అందుకనే కథకుడుగా నా ప్రయాణాన్ని మీకు చెప్పదలుచుకున్నాను.  ‘పెన్సిల్ బాక్స్’ కథ యెప్పుడు పూర్తి అయితే అప్పుడు “ఛాయా” కే ఇస్తాను.  వాళ్ళు దాన్ని యెలాగైనా వాడుకోవచ్చు” అంటూ ఖదీర్ తన కథ చెప్పడం మొదలు  పెట్టాడు.

“నా చిన్నప్పుడు యెప్పుడూ నేను యేదో కోల్పోయినట్లుండే వాడిని.  మా నాన్న ఎలెక్ట్రీషియన్. 7 వ తరగతి దాకా చదువుకున్నాడు.  యెంతో ఒద్దికైన పనిమంతుడు.  నాన్నకి కోపం చాలా యెక్కువ.  అందుకే అమ్మ యెప్పుడూ యేదో తెలియని కంగారులో  వుండేది.  నాకు ఇంట్లో వుండాలనిపించేది కాదు.  మా చుట్టుపక్కల వున్న వైశ్యుల  ఇళ్ళకి వెళ్ళి, “చందమామ” లో  కథలు చదువుతూ వుండేవాడిని.  నాకూ అలా కథలు రాయాలనిపించేది.  10 వ తరగతిలో  వుండగా ఆంజనేయ నాయుడుగారు అనే మాస్టారు వీరపల్లె వీణా వాణి పేరుతో రచనలు చేస్తూవుండేవారు.  రాయాలంటే కలం పేరు వుండాలని చెప్పి, నాకు ‘అగ్ని మిత్ర’ అనే మారు పేరు తగిలించారు.  ఆ పేరు మీద రాసిన ఒక కథ పత్రికలో  అచ్చు అయి 150 రూపాయల పారితోషికం కూడా కలం పేరు మీదే వచ్చింది.

ఆ తర్వాత యెన్ని కథలు పంపినా తిరుగుటపాలో వచ్చేవి .  కథలు పంపడానికి స్టాంపులకి కూడా డబ్బు లేకపోతే, వాళ్ళనీ వీళ్ళనీ మెప్పించి తీసుకొనేవాడిని.  పత్రికలలో పనిచేస్తేనే కథలు పడతాయని గట్టిగా నమ్మి, డిగ్రీ అయిన వెంటనే ‘ఈనాడు’ లో  జేరా.  అలాయినా ‘ఈనాడు’ ఆదివారం అనుబంధంలో ఒక్క కథైనా అచ్చుకాలే.  అది వదిలేసి ‘ఆంధ్ర జ్యోతి’ తిరుపతి యెడిషన్ లో  జేరా.  నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, జి. ఆర్. మహర్షి, మేర్లపాక మురళి, యిలా సీనియర్ రచయితలు అందరూ అక్కడ వుండేవారు.  ‘పుష్ప గుచ్ఛం’ పేరుతో ఒక కథ అచ్చైనది కాని, అంతకు మించి బండి ముందుకు వెళ్లలేదు.  ఏదో సాహిత్య వ్యాసంలో నా పేరు కూడా వుందని సీనియర్లు ఏడిపించారు కూడా.  కానీ ఏదో రోజు నా రచనల మీద చర్చ వుంటుందని ఆ రోజు గట్టిగా అనుకున్నాను.  నేను హైదరాబాద్ కు బదిలీ అయి వచ్చా.  అప్పుడే నాన్న పోయాడు.  నాన్న కష్టపడి కూడా బెట్టిన 25,000/- అమ్మ పక్షవాతం కోసం ఖర్చై పోయింది.  అయిన అమ్మకి పూర్తిగా నయం కాలేదు.  పిల్లలు ఇంకా చేతికంది రాలేదు, రాబోయే  రోజులెలాగో అనే బెంగ తో, దిగులు తో పోయాడు.

khadeer bookనాన్న చావు నా మీద చాలా ప్రభావం చూపించింది.  నేను చెప్పవలసిందేమిటో, రాయవలసినదేమిటో  స్పష్టంగా తెల్సింది.  నే పెరుగుతూ చూసిన పేద ముస్లిం కుటుంబాల గురించే చెప్పాలని తీర్మానించుకున్నాను.  అప్పుడు రాసిన కథలే ‘దావతు, జమీను.’  ఆ సమయంలోనే  నామిని ‘ఆంధ్ర జ్యోతి’ హైదరాబాద్ కు వచ్చాడు.   ‘దర్గా మిట్ట ‘ కథలు రాస్తావా అని అడిగాడు.  రాస్తాను అని చెప్పా.  ఏమి రాస్తావు అని ఆయన అడగలేదు, ఎలా రాస్తానూ అని నే చెప్పలేదు.  నా మీద నమ్మకంతో ప్రకటన యిచ్చేశాడు.  వారం వారం రాయాలి.  రాశాను. ఆ తర్వాత తిరిగి చూసుకున్నది లేదు.  హైదరాబాద్ లో ‘ అనంతు’ లాంటి మిత్రుల నుంచి చాలా నేర్చుకున్నాను.

కథా వస్తువు విషయం లో  కూడా నా లో చాలా మార్పులు వచ్చాయి.  నేను దగ్గర నుంచి చూస్తున్న ఎగువ మధ్య తరగతి, సంపన్న వర్గాలు, సిటీ బతుకులు నా ‘బియాండ్ కాఫి, మెట్రో కథలకి’ ఆలంబన అయ్యాయి.  ఇన్నేళ్లు పత్రికలలో పనిచేసిన అనుభవం నా రచనలకి బ్రీవిటీ నిచ్చింది.  అందుకనే ‘మెట్రో కథలలో’ పాత్రలకి పేర్లు వుండవు.  అతడు, ఆమె అని కూడా వుండవు.  అయినా పాఠకులు కనెక్ట్ అవుతున్నారు.  ‘సెల్ఫీ, షి’ లాంటి కథలు ఎలాంటి చర్చను రేకెత్తిస్తున్నాయో మీకు తెల్సు. కథ రాయడానికి క్రాఫ్ట్ చాలా అవసరం.  వుదాహరణకి’ ఆవిడ పిల్లలకి బ్రెడ్ మీద జామ్ రాసింది’ అనటం కన్నా’ న్యూటెల్లా రాసింది’ అంటే పాఠకుడు వెంటనే కనెక్ట్ అవుతాడు.  అదే క్రాఫ్ట్.   అయితే ‘దర్గా మిట్ట’ కథలు మళ్ళీ ఇప్పుడు రాయమంటే రాయలేను. నాన్నకి హిందీ పాటలన్నా, సినిమాలన్నా చాలా ఇష్టం.  వాటి గురించి మాకు ఎప్పుడూ చెప్తూవుండేవాడు.  ఆ బాగ్రౌండ్ నుంచి వచ్చినవే ‘మన్ చాహే గీత్, బాలీవుడ్ క్లాస్సిక్స్ .’  నాకు ఒక నవల రాయాలని వుంది ముస్లిం జీవితాలను గురించి.  రాస్తాను” అంటూ ముగించాడు.

ఆ తర్వాత ఖదీర్ తనకు బాగా నచ్చిన కథ, ‘ వహీద్,’ మరో చిన్న కథ చదివి, కొందరు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పి,  తన కథ ముగించాడు.

*

స్నేహమే ఉద్యమం, ఉద్యమమే ప్రాణం!

 

ఒక గుండెతడి మనిషి

 

పి.మోహన్

P Mohan‘‘మీ రాయలసీమ వాళ్లు మీరూ, గారూ అని పిలవరు కదా. మరి నువ్వేమిటోయ్ నన్ను మీరూ, గీరూ అంటావు? చక్కగా మీ కడపోళ్ల మాదిరి నువ్వు అనో, లేకపోతే అందర్లా సీపీ అనో ఏకవచనంలో పిలవబ్బాయ్!’’

చలసాని ప్రసాద్ పదేళ్ల కిందట వాళ్లింట్లో నాతో అన్నమాటలివి. అప్పటికి ఆయన వయసు 73, నా వయసు 26. చలసాని స్నేహం, ప్రేమానురాగాలు ఎంత కమ్మనివో ఈ ఒక్క ఉదాహరణ చాలనకుంటా. అలాంటి చలసాని శాశ్వతంగా దూరం కావడం తెలుగు సాహిత్య ప్రేమికులకు, వ్యవస్థలో మార్పు కోరేవాళ్లకు తీరని లోటు. అదృష్టంపై నాకు నమ్మకం లేదు కాని, ఆయన ప్రేమానురాగాలు పంచుకున్న వాళ్లంత అదృష్టవంతులు ఈ లోకంలో ఉండరు. ఆ అదృష్టం నాకు కాసింతే దక్కింది.

కాలేజీ రోజుల్లో శ్రీశ్రీ సాహిత్య సర్వస్వ సంపుటాలపై చలసాని, కృష్ణాబాయిల పేర్లు చూసి వాళ్లను కలవాలని ఆరాటపడేవాడిని. వాళ్లు విరసం సభల్లో పరిచయమైన కొత్తలో నాకు మామూలుగానే తొలుత వయోవృద్ధుల్లా కనిపించారు. అందుకే గౌరవంతోనే కాకుండా కాస్త భయంతోనూ ఉండేవాడిని. తర్వాత అర్థమైందేమంటే వాళ్లు కల్మశం లేని చిన్నపిల్లలని, మా తరానికంటే ఆధునికులనీ. అప్పట్లో కృష్ణక్కకు రాసే ఉత్తరాల్లో కృష్ణాబాయి గారూ అని రాసేవాడిని. ఆమె ‘‘నాపేరు ‘కృష్ణాబాయి గారూ’ కాదు కృష్ణాబాయి మాత్రమే. అలాగే రాయి’’ అని రాసింది. చలసానికి కూడా ఉత్తరాలు రాసేవాడిని కానీ చాలా తక్కువ. ఆయన ఉత్తరాలు బ్రహ్మరాతలో ఉండేవి. అందుకే అవసరమైతే ఫోన్లో మాట్లాడేవాడిని.

2004లో పుస్తకాల పనిపై విజయవాడ వెళ్లినప్పుడు ఆయన కూడా అక్కడికి వచ్చాడు. ఎవరిదో స్కూటర్ పై వాళ్లింటికీ వీళ్లింటికీ తిప్పాడు. 2006లో విరసంపై నిషేధం ఎత్తేశాక విజయవాడలో సర్వసభ్య సమావేశం జరిగింది. నిర్బంధపు పచ్చి గాయాలు, హాస్టల్ తిండి తెచ్చిన అల్సర్ తో వెళ్లాను. సమావేశం తర్వాత మిత్రుల సలహాపై చికిత్స కోసం విశాఖ వెళ్లాను. చలసాని ఇంట్లో వారం రోజులున్నాను. చలసాని నన్ను స్కూటర్ పై మూడు, నాలుగు రోజులు వరుసగా కేజీహెచ్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్లకు, తెలిసినవాళ్లకు ఫోన్లు చేశాడు. ఆస్పత్రిలో వార్డువార్డూ తిప్పి ఎండోస్కోపీ, రక్తపరీక్షలు వగైరా చేయించాడు. ఓ పక్క పరీక్షలు.. మరోపక్క  వెయింటింగ్ బల్లపై కూచుని ఏవోవో ఎర్ర పాటలు పాడుతూ ఆయన. మధ్యలో మందులు తీసుకొస్తూ, మా వాణ్ని జాగ్రత్తగా చూడాలని డాక్టర్లతో చెప్పిందే చెబుతూ. నాకు కళ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆయన నాకు పెద్ద రచయితలా, నాయకుడిలా కాకుండా మనసెరిగి మసలుకునే బాల్యమిత్రుడిలా కనిపించాడు. అప్పట్లో నేను కావాలని దూరం చేసుకున్న నాన్న, అన్నయ్యలు ఆయన రూపెత్తినట్లు అనిపించింది.

చలసాని ఇంట్లో ఉన్నవారం రోజులూ ఆయన తెచ్చిపెట్టే టిఫిన్లు, ఇంటి భోజనంతోపాటు  ఆయనింట్లోని పుస్తకాలతో విందుభోజనం చేశాను. ఇళ్లంతా ఎక్కడ చూసినా పుస్తకాలే. మేడ అయితే లైబ్రరీనే. వేలాది ఇంగ్లిష్, తెలుగు పుస్తకాలు. ఆర్ట్ అంటే పిచ్చి కనుక ఆ పుస్తకాల కోసం అరలన్నీ గాలించి 15 ఆర్ట్ పుస్తకాలు, 10 చరిత్ర, రాజకీయాల పుస్తకాలు ఏరుకున్నాను. ఒక అరలో కొక్కోకం వంటి పుస్తకాలు కనిపించాయి. ‘ఇవేంటి, ఇక్కడా?’ అని ఆశ్చర్యంగా అడిగితే, ‘ఏం, వాటిలో జ్ఞానం లేదా?’ అంటూ నవ్వాడాయన. ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చాక మేడపైకెళ్లి లైబ్రరీని గాలించేవాడిని. నేను అక్కడ ఉన్నప్పుడు చలసాని అక్కగారు వచ్చారు. ఆమెతో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ముచ్చట్లు చెప్పించుకోవడం మరో ముచ్చట.

తిండిలో, బట్టల్లో చలసాని నిరాడంబరత గురించి అప్పటికే కొంత విన్న నేను ఆ వారం రోజులూ ప్రత్యక్షంగా చూశాను. రచయితలంటే మడత నలగని ఖద్దరు బట్టలు వేసుకునేవాళ్లని అనంతపురంలో ఓ వెటకారం ఉండేది. ఇప్పుడూ ఉందేమో. ఇస్త్రీ చేయని బట్టల చలసానిని చూస్తూ ఉంటే ఆ రచయితలు కళ్లముందు కదిలేవారు. వస్త్రధారణ వ్యక్తిగతం కావొచ్చు కానీ, వ్యక్తిగతానికి, రాజకీయాలకు అణువంత తేడా చూపని చలసాని నిబద్ధత గురించి చెప్పడానికే ఈ పోలిక.

ఆస్పత్రిలో చూపించుకున్న తర్వాత తిరిగి అనంతపురం బయల్దేరాను. దాదాపు 30 పుస్తకాలను కర్రల సంచిలో సర్దుకున్నాను. పుస్తకాల విషయంలో చలసాని గట్టి లెక్కల మనిషి. ‘పుస్తకాలతో పనైపోయాక తిరిగి పంపిస్తేనే తీసుకెళ్లు. ముందు ఆ పుస్తకాల పేర్లు, రచయితల పేర్లు ఓ కాగితంలో రాసివ్వు’ అని అడిగాడు. సరేనని రాసిచ్చాను. మందులు కొనిచ్చి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి, చేతిలో ఐదొందలు డబ్బు పెట్టాడు. తర్వాత స్కూటర్ పై ఎక్కించుకుని రైల్వే స్టేషన్కు తీసుకెళ్లి, తనే టికెట్ కొని, రైల్లో కూర్చోబెట్టాడు. రైలు కదులుతుండగా టాటా చెప్పాడు. నేనూ టాటా చెప్పాను. ఆయన ఫ్లాట్ ఫామ్ పై కనుమరుగు అవుతూ ఉంటే అప్పటి వరకు ఉగ్గబట్టుకున్న కన్నీళ్లు మౌనంగా గట్లు తెంచుకున్నాయి.

తర్వాత ఆయనను హైదరాబాద్ సభల్లో చూశాను కానీ మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం లేకపోయింది. తన పుస్తకాలు తనకివ్వలేదని అలిగాడు కూడా. అలక తీర్చడానికి ఆ పుస్తకాలను సీతమ్మధార ఇంటి అడ్రసు పంపించాను. నేను గతంలో ఇస్తానని చెప్పిన నా సినిమా ఎన్సైక్లోపిడియా పుస్తకాలను ఇవ్వలేదని చాలాసార్లు నిష్టూరమాడాడు. సెట్టి లక్ష్మీనరసింహం ‘రవివర్మ చిత్రమాలికలు’ పుస్తకం జిరాక్సు కాపీని ఆయనకు గత ఏడాది పంపించాను. దాన్ని పునర్ముద్రిస్తే ఎలా ఉంటుందని, మీరు టీకా టిప్పణీ రాస్తారా అని అడిగాను. ముందు పుస్తకం చూద్దామని, సెట్టి వారసులు విశాఖలో ఉన్నారని, వారి సాయం తీసుకుందామని అన్నాడు. నెలకిందట ఆ పుస్తకం గురించే ఆయన కృష్ణక్కతో మాట్లాడాడట. కృష్ణక్క ఫోన్ చేసి.. ‘నువ్వు చలసానితో ఏదో పుస్తకం గురించి చెప్పావుట. ఏంటా పుస్తకం? తనకు గుర్తుకురావడం లేదు’ అని చెప్పింది.

ప్రేమానురాగాలకు కొనసాగింపు ఇవ్వని పరమయాంత్రికతలో కొట్టుకుపోవడం వల్ల చలసానితో కలిసి తిరిగే భాగ్యం దక్కలేదు. కృష్ణక్క పుస్తకావిష్కరణ సభలో ఆయనను చివరిసారిగా చూసి, నా ‘డావిన్సీ’ పుస్తకం ఇచ్చాను. జాగ్రత్తగా సంచిలో వేసుకున్నాడు, భిక్ష అందుకునే బౌద్ధసన్యాసిలా.

బతుకు తెరువు సుడిలో కొట్టుపోతూ ఆయనను కడసారి చూసుకునే భాగ్యానికి కూడా నోచుకోలేకపోయాను. వీలైతే ఇప్పుడే ఆయన మరీమరీ కోరిన సినిమా ఎన్సైక్లోపిడియా పుస్తకాలను విశాఖ తీసుకెళ్లి ఆయన చెంత ఉంచాలనిపిస్తోంది. దేని విలువైనా అది ఉన్నప్పటికంటే లేనప్పుడే బాగా తెలుస్తుంది. చలసాని కూడా అంతే. ఆయన విలువేమిటో విరసానికి, తెలుగు సాహిత్యలోకానికి, సమాజానికి ఇకపై మరింత బాగా తెలుస్తుంది. చలసాని పేరుప్రతిష్టల కోసం పాకులాడలేదు. శ్రీశ్రీ, కొ.కొ. సాహిత్యసర్వస్వాల కోసం తన రచనావ్యాసంగాన్ని త్యాగం చేసి, విరసం, ప్రజాపోరాటాల కోసం తన జీవితాన్ని కొవ్వొత్తిగా కరిగించుకున్నాడు. ఆ పని చేస్తే నాకేంటి లాభం? అని ఆలోచించే వర్తమానంలో చలసాని లాంటి వ్యక్తులు అరుదు. చలసాని విరసం నాయకుడు, కార్యకర్త, దాహం తీరని సాహిత్యపిసాసి. ఇంకా ఏమిటేమిటో కావచ్చు. కానీ తొలుత ఆయన సాటిమనిషిని ప్రేమగా దగ్గరికి తీసుకునే గుండెతడి మనిషి. ఇప్పుడు ఆయన లేరు. కానీ ఆయన నన్ను వెంటేసుకుని తిరిగిన కేజీహెచ్ ఆస్పత్రి జ్ఞాపకాలు మాత్రం నిత్యనూతనంగా ఉన్నాయి.

*

చావుపుటక లేనిదమ్మ నేస్తమన్నది…!

 

వంగూరి చిట్టెన్ రాజు

chitten raju“మామా” అని నన్ను అతనూ, “దాసూ” అని నేను అతన్నీ ఆత్మీయంగా సంబోధించుకోవడం 1970 కంటే ముందే ప్రారంభం అయి నలభై ఏళ్ల పైగానే కొనసాగింది. అప్పటికి అతను ఇంకా సినిమాలలో పాడ లేదు. ఆతని మేన మామ పి.ఆర్.కె. రావు అనే కిష్టప్ప, నేనూ బొంబాయి ఐ.ఐ.టి.లో క్లాస్ మేట్స్ మాత్రమే కాక అత్యంత సన్నిహితులం. ఆ కిష్టప్ప గాయని పి. సుశీల తమ్ముడు అని మా స్నేహం బాగా కుదురుకున్న ఆరు నెలల తరువాత ఏదో మాటల సందర్భంలో తెలిసింది. అతని పెద్దక్క రత్తక్క గారి అబ్బాయే ఈ రామకృష్ణ దాసు.

హైదరాబాదు వెళ్ళినప్పుడు రావుతో రత్తక్క, బావ గారు రంగ సాయి వాళ్ళింటికి వెళ్ళినపుడు మా కంటే కొంచెం చిన్నవాడే అయిన దాసు పరిచయం అయ్యాడు. ఆ క్షణం నుంచీ రావు తో పాటు నన్ను కూడా “మామా” అనే పిలవడం మొదలుపెట్టి మా కుటుంబంలో కలిసిపోయాడు. అప్పటికే ఘంటసాల బాణీ అలవాటు చేసుకుని, పునాదులు గట్టిపడడం కోసం శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టాడు. నిజానికి అతని చెల్లెలు (పేరు మర్చిపోయాను) అచ్చు సుశీల గారి లా బాగా పాడేది. ఆ రోజుల్లో మరో మిత్రుడు టి.పి. కిషోర్ గాడి పెళ్ళికి నేనూ, రావూ, దాసూ మగ పెళ్లి వారి తరఫున ఏదో ఊరు వెళ్లాం. (మంచి రచయిత, నటుడు అయిన ఈ కిషోర్ పదిహేనేళ్ళ క్రితం హఠాత్తుగా పోయాడు). ఆ పెళ్ళిలో దాసు ఘంటసాల గారి “శేషశైలా వాస” తో మొదలుపెట్టి చాలా పాటలు హాయిగా పాడాడు. అది ఇప్పటికీ నాకు మరపురాని జ్ఞాపకమే!

ఆ తరువాతో, ముందో గుర్తు లేదు కానీ రావు పెళ్ళికి నేనూ, కిషోరు గాడూ మద్రాసు వెళ్లాం. మేనరికమే కాబట్టి ఆ పెళ్లి పి. సుశీల గారి ఇంట్లోనే జరిగింది. మే ఇద్దరం పెళ్లి కొడుకు స్నేహితులమే అయినా భయం, భయంగా కూచుంటే దాసు మమ్మల్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకున్నాడు.

ఆ తరువాత ఘంటసాల గారు బతికున్న రోజులలోనే (1972 అనుకుంటాను) అతను సినిమాలలో పాడడం మొదలు పెట్టి “అపర ఘంట సాల” గా పేరు తెచ్చుకున్నాడు. “మా రామకృష్ణయ్య ఉన్నంత కాలం నా పాటని ఎవరూ మర్చిపోలేరు” అని ఘంటసాల వారే స్వయంగా అన్నారంటే రామకృష్ణ ప్రతిభ ఎంతటిదో తెలుస్తోంది. “ఘంటసాల గారు పోయినప్పుడు మొదటి దండ వేసిన వాణ్ణి నేనే” అని నాతో ఎంతో బాధపడుతూ చెప్పాడు దాసు ఒక సారి. ఘంటసాల గారి లాగానే రామకృష్ణ కూడా గొంతు కేన్సర్ తోటే మరణించాడంటే నమ్మబుద్ది కావడం లేదు.

playback_singer_0

అతను సినిమాలలో బాగా పేరు తెచ్చుకుని బిజీగా ఉంటున్నా, నేను ఎప్పుడైనా మద్రాసు వెళ్ళినప్పుడు వాళ్ళింటికి వెళ్ళేవాడిని. ఆ విధంగా మా పరిచయం అడపా , తడపా చాలా ఏళ్ళే కొనసాగింది. 1989 లో హ్యూస్టన్ లో తానా కి ఫై.సుశీల తో రామకృష్ణ ప్రధాన గాయకుడి గా పూర్తి ఆర్కేష్ట్రా తో వచ్చాడు. నాకు తెలిసీ అదే అతను మొదటి సారి అమెరికా రావడం అప్పుడు “చెయ్యెత్తి జేకొట్టు తెలుగోడా” తో కార్యక్రమం ప్రారంభించి సుశీల గారితో చాలా బాగా పాడాడు రామకృష్ణ. అప్పటి నుంచీ కాస్త రెగ్యులర్  టచ్ లోనే ఉండే వాళ్ళం. ఎప్పుడు అమెరికా వచ్చినా ఎక్కడి నుంచో ఫోన్ చేసే వాడు.

1998 లో అనుకుంటాను. ఓ రోజు దాసు నుంచి ఫోన్ వచ్చింది.”మామా, నేనూ నీ అభిమాన గాయకుడు దాసు ని” అనుకుంటూ.
ఎక్కడి నుంచి, దాసూ, అమెరికా లో ఉన్నావా” అని అడిగాను.” అవును మామా. డిట్రాయిట్ లో మన చెరుకూరి రమా దేవి గారి ఇంట్లో ఉన్నాను.” అన్నాడు. “ఎన్నాళ్లుంటావు. టూర్ మీద వచ్చావా?” అని అడిగాను. “అక్కడే కొంప ములిగింది మామా, అందుకే నిన్ను పిలుస్తున్నాను. నీట ముంచినా, పాల ముంచినా నీదే భారం” అని అసలు సంగతి వివరించాడు.

అసలు ఏం జరిగింది అంటే తానా లో పాడడానికి అతన్ని ఒక మ్యూజిక్ ట్రూప్ వాళ్ళు ప్రధాన గాయకుడి గా తీసుకొచ్చారు. ఆ కార్యక్రమం అయ్యాక అమెరికాలో ఇతర నగరాలలో కూడా జరిగే కార్యక్రమాలకి కూడా ఇతన్ని తీసుకెళ్ళాలి కానీ ఎందుకో రామకృష్ణ ని డ్రాప్ చేసి ఇండియా వెళ్ళిపో అన్నారుట. దానికి అసలు కారణం ఆ ట్రూప్ నాయకుడు కూడా పాటగాడే కాబట్టి ఇతనికి ఇవ్వాల్సిన డబ్బులు మిగుల్చుకోవచ్చును కదా! “చచ్చేటంత ఖర్చు, శ్రమా పడి వచ్చాను మామా, నాలుగు ప్రోగ్రాములు కూడా చేసుకోకుండా వెనక్కి పోడం ఎలా?” అని దాసు నా సలహా అడిగాడు.” సరేలే, ముందు మా హ్యూస్టన్ వచ్చేసి మా ఇంట్లో ఉండు. ఎన్ని ప్రోగ్రాములు పెట్టించగలనో అప్పుడు చూద్దాం” అని రామకృష్ణ ని హ్యూస్టన్ ఆహ్వానించాను.

అప్పుడు మా ఇంట్లో మూడు నెలలు ఉండి, మా కుటుంబంలో ఒకడుగా, మా పిల్లలకి “రామకృష్ణ అంకుల్” గా స్థిరపడిపోయాడు రామకృష్ణ దాసు.  ఆ రోజుల్లో అతనికి మా ఊళ్లో ఉన్న ఔత్సాహిక గాయనీ మణులు మణి శాస్త్రి, శారద ఆకునూరి, ఉమా మంత్రవాది మొదలైన వారికి పరిచయం చేసి రక రకాల కారణాలతో టెక్సస్ లోనూ ఇతర చోట్లా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చెయ్యగలిగాను. చంద్ర కాంత, డేవిడ్ కోర్ట్నీ లు ఎంతో సహకరించారు. వాటిల్లో ఓ చిన్న హౌస్ కాన్సెర్ట్ ఫోటో ఒక్కటే నా దగ్గర ఉంది. ఇందుతో జత పరుస్తున్న ఆ ఫోటోలో రామకృష్ణ కి తబలా సహకారం అందిస్తున్నది రఘు చక్రవర్తి.  ఆ మూడు నెలల సహవాసం లోనూ రామకృష్ణ ఎన్నెన్నో సినిమా సంగతులు నాతో పంచుకునే వాడు.

V. Ramakrsihna

కానీ ఎన్నడూ అతని నోట తప్పుడు మాటలు విన లేదు. “దాన, వీర, శూర కర్ణ” సినిమాలో పాడినప్పుడు ఎన్టీ ఆర్ తో అనుభవాలు, ఎస్. రాజేశ్వర రావు గారి తో మహా బలిపురం పిక్నిక్ వివరాలు మొదలైనవి మంచి రసవత్తరంగా వివరించే వాడు..తను కూడా మళ్ళీ , మళ్ళీ ఆ జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ. ఒక సారి రామకృష్ణ నీ, ముత్యాల పద్మశ్రీ , సుప్రసిద్ద గాయని అవసరాల అనసూయ గారిని నేను అప్రస్తుత ప్రసంగం చేసిన నాగఫణి శర్మ గారి అష్టావధానం కార్యక్రమానికి డాలస్ తీసుకెళ్ళాను. ఆ మూడు గంటలూ రామకృష్ణ’ ఓపికగా కూచుని “మామా, ఈ ఒక్క రోజునే చాలా తెలుగు నేర్చేసుకున్నాను. అష్టావధానం గురించి వినడమే కానీ చూడ్డం ఇదే మొదటి సారి. ఇంకా నయం. నన్ను ఆ పైన కుర్చీలో పృచ్చకుడిగా  కూచోబెట్టావు కాదు. కొంప ములిగిపోవును.” అన్నాడు నవ్వుతూ. అంత సింపుల్ మనిషి అతను. మొత్తానికి ఆ మూడు నెలలూ అయ్యాక, ప్రోగ్రాములు పూర్తి చేసుకుని ఇండియా వెళ్తున్నప్పుడు “ఏం దాసూ, ఇప్పుడు పరవా లేదా, నాలుగు రాళ్ళు సంపాదించుకున్నావా?” అని నేను అడగగానే “పరవా లేదు మామా, మా ఇంట్లో ఓ కిటికీకి నీ పేరు పెట్టుకుంటాను” అన్నాడు. ఆ రోజుల్లోనే అనుకుంటాను దాసు కొత్త ఇల్లు హైదరాబాదు లో కట్టుకున్నది. అందుకే ఆ చమత్కారం.

ఆ తరువాత మేము ఒక సారి ఇండియా వెళ్ళినప్పుడు మా అబ్బాయి, అమ్మయిలు “రామకృష్ణ అంకుల్ ని చూద్దామ్” అనగానే వెతుక్కుంటూ అతని ఇంటికి వెళ్లి, భార్య జ్యోతి ని, కొడుకు హీరో సాయి కిరణ్ నీ కూడా కలిశాం. అప్పుడు త్యాగరాజ గాన సభలో మా అమ్మాయిలు చేసిన కూచిపూడి కార్యక్రమానికి దాసు నెల్లూరు లో ప్రోగ్రాం ఉండి రాలేక పోయాడు కానీ జ్యోతి, సాయి కిరణ్ వచ్చారు.

ఈ మధ్య ఫేస్ బుక్ వచ్చాక మరి కాస్త రెగ్యులర్ గానే మాట్లాడుకుంటున్నాం కానీ రామకృష్ణ అనారోగ్యం సంగతి గురించి తెలియ లేదు. “మాంచి అమెరికా టూర్ పెట్టించు మామా” అన్నది ఆ మధ్య అతని ఆఖరి కోరిక. ఆ కోరిక తీరకుండానే నా అభిమాన గాయకుడు, చిరకాల మిత్రుడు రామకృష్ణ దాసు వెనక్కి తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోవడం ఎంతో బాధాకరం. అతని ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నాను.

*

ఆ అడివిలో వెన్నెలా వుంది!

10979273_10205663055756776_1692790498_n

లోగో: బంగారు బ్రహ్మం

 

అప్పుడప్పుడు వాక్యం తడబడుతుంది. గడబిడిగా నడుస్తుంది. వదులుగా వేలాడుతుంది – కాని వాక్యం యెప్పుడూ తడబడకుండా గడబిడిగా నడవకుండా వదులుగా వేలాడకుండా వుంటుందో ఆ వాక్యమే కేశవరెడ్డి గారిది. యెండలో తడిసిన రానెస్, వర్షంలో ఆడిన ఫ్రెష్ నెస్, మంచులో మునిగిన తేమ నిండిన అతని వాక్యం మనలని చుట్టుకుంటుంది. వాక్యాలు వాక్యాలుగా చుట్టుకుపోతుంది. అతని వాక్యాలని మనం వదిలించుకోలేం. పెనవేసుకోనూలేం. వుక్కిరిబిక్కిరవుతాం. మళ్ళిమళ్ళి కావాలనిపించే సొగసుకాఠిన్యం పెనవేసుకున్న ఆ వుక్కిరిబిక్కిరి రాతగాడు మనలని అడవులని జయించమంటారు.

కనిపించినవాటినల్లా  పిప్పరమెంట్స్ లా చదివే అలవాటున్న నాకు వొక రోజు మా యింటి లైబ్రెరిలో అనుకోకుండా వో రోజున వో పుస్తకం చేతుల్లోకి తీసుకొన్నాను. ఆంధ్ర పత్రిక లో సీరియల్ గా వచ్చినప్పటి కాగితాలని చక్కగా కుట్టి మామిడిపండు రంగు అట్ట వేసుంది. పుస్తకం పైన ‘అతడు అడివిని జయించాడు’ అని పైన నీలి సిరాతో గుండ్రని చేతిరాత. పుస్తకం తిరగేస్తుంటే బొమ్మలు ఆకర్షించాయ్. చాల యిష్టాన్ని పుట్టించాయి. ఆ బొమ్మలు కేతినీడి భాస్కర్ గారివి. వాటిని అలానే వెయ్యాలని ప్రయత్నిస్తూ వో రెండు రోజులు గడిపాను. చదవటం వదిలేసి- అసలు యింత అందమైన బొమ్మలున్న యీ కథ యేమిటో చూడాలన్న కుతూహలం కలిగింది. చదివాను. మళ్ళి చదివాను. యిప్పటిలానే నన్ను అడివి వెన్నెల పట్టుకున్నాయి.

చలం గారి మైదానం మొదటిసారి చదివినప్పుడు అందులోని చింత చెట్టు అల్లిక నుంచి జల్లులు జల్లులుగా కురిసే మధ్యాన్నపు  యెండ మైమరపించినట్టుగా యిప్పుడు ఆ అడివిలో వెన్నెల్లోని నడకలు  భలే హత్తుకున్నాయి. ఆ తరువాత చాలా కాలానికి కేశవరెడ్డి గారు పరిచయం అవ్వగానే ‘ ఆ వెన్నెల అడివి భలే రాసారు’ అని చెప్పాను. అప్పుడు ఆయన నవ్వారు. మళ్ళి నవ్వారు. నవ్వటం ఆపి ‘ యింత అందంగా, కొత్తగా ఆ పుస్తకం గురించి నాకు యెవ్వరు చెప్పలేదు. యిప్పటి వరకు అంతా చాల గాంభీర్య మైన ఫీడ్ బ్యాక్ చెప్పారు. కుప్పిలి పద్మ అంటేనే అడివి, వెన్నెల, మంచు పువ్వులు, వాన ‘అని నవ్వారు. నేను నవ్వాను. అది మొదటిసారి కలిసినప్పటి సంభాషణ.

కేశవరెడ్డి గారి  యే నవల్లోనైన యితివృతం యీ సమాజం పెద్దగా పట్టించుకోని మనుష్యులు, వర్గాలు, ప్రాంతాలు, వృత్తులు. మనకి అసలు పరిచయం లేని సమాజపు వ్యక్తులు కావొచ్చు లేదా కొద్దిపాటిగా తెలిసిన జీవితాలు కావొచ్చు. కాని మనం ఆయన రచనలు చదివితే ఆ మనష్యులు మన మనుష్యులైపోతారు. ఆ అనుభవాలన్నీ మనవైపోతాయి. నవలలు, కొన్ని కథలు అని లెక్కలు తీయవచ్చు కాని ఆయన వొక నవలనో కథనో రాయరు. రాయలేదు. జీవితాలని ఆవిష్కరించారు . కులం మతం వర్గం వృత్తి, ప్రాంతాల నడుమ మనుష్యుల జీవితానుభవాల వైవిధ్యాల నీడల్ని ఛాయల్ని మన చూపులకి వినమ్రంగా సమర్పిస్తారు. ఆ యా జీవితాల్లోని అంతర్గత సంఘర్షణలు బహు పార్శ్వాలుగా మన మనో రెక్కలపై వాల్తాయి. అవి మనలని సమీపించగానే మనం మనంగా వుండం. వుండలేం. యిలాంటి సమర్పణ అందరు చెయ్యలేరు.

అనేకంగా కనిపించే యింత పెద్దప్రపంచంపు జీవనసారపు అంతస్సారం వొక్కటే అనే అపారమైన అర్ధవంతమైన మానవీయమైన తాత్వికత వుంటేనే అలా సమర్పించగలరేమో… మనకి ఆ పాత్రల ఆలోచనలు, ఆశలు, కోరికలు సమస్త భావోద్వేగాలు వాటి స్వభావస్వరూపాలు అన్ని అర్ధమైపోతున్నట్టే వుంటాయి. అంతలోనే అర్ధం కానట్టనిపించి అసలు ఫలానా పాత్ర యేమంటుంది… యిలా అనలేదా అనిపిస్తుంది. మళ్ళి మరోలా అనిపిస్తుంది. ‘రాముడుండాడు రాజ్జి వుండాది’ చివరి గుడిసె ‘ మూగవాని పిల్లన గ్రోవి, ‘మునెమ్మ’ యే నవలైనా సరే చదువరి యిమేజినేషన్ కి బోలెడంత స్పేస్ యిచ్చిన రచయత కేశవరెడ్డి గారు. అలానే విషయం ఏమైనా కావొచ్చు ఆయన యెప్పుడు ఆ  అంశాలకి సంబంధించిన యీస్థటిక్స్ ని అలవోకగా గుమ్మరించారు. తను తీసుకున్న జీవితాల పట్ల తను నమ్మిన సారవంతమైన సమాజం పట్ల వొక నిబద్ధత వుండటం వల్లే ఆయన రచనలు జీవితాలకి దగ్గరగా వుంటాయి. కొన్ని సందర్భాలల్లో రస్టిక్ బ్యూటీతో మనలని మెస్మరైజ్ చేస్తుంటాయి.

యిలా యెన్నెన్నో విషయాలు కేశవరెడ్డి గారి రచనల్లో నల్లని నీళ్ళ ప్రవాహంలా జరజరా పారుతుంటాయి.

యివన్ని వొక ఎత్తు అయితే,  కేశవరెడ్డి గారికి సినిమాల పై బోలెడంత యిష్టం, ఆసక్తి వున్నాయి. అప్పుడప్పుడు ఆ విషయాలని మాట్లాడుకొనేవాళ్ళం. ‘చిక్కని స్క్రీన్ ప్లే రైటర్ మీరు’అన్నానోసారి. అప్పుడు మాత్రం కేశవరెడ్డి గారు సినిమాలు సినిమా కథలు స్క్రీన్ ప్లే యిలాంటి విషయాలపై ఆగకుండా మాటాడేవారు. సంభాషణ చక్కగా సాగేది. ఆయన రెండు నవలలూ   త్వరలో సినిమాలుగా రూపొందుతాయని ఆశ. తన రచనల గురించి కానీ  తన ఫలానా నవల చదివేరా అని కానీ  ఆయన అడగటం నేనైతే వినలేదు. మనకి అనిపించినవి చెపితే శ్రద్ధగా వింటారు. అవసరమైతే తప్పా తన రచనల గురించి మాటాడరు. అసలు మనం వో విశిష్ట మైన సుసంపన్న మైన రచయతతో మాట్లాడుతున్నామనే భావన కలగదు. ఆయనెప్పుడూ యెదుటివాళ్ళ మీదకి తనలోని రచయితకి సంబంధించిన బలం, బరువు అనే వలలని విసిరేయడం  నేను చూడలేదు. వినలేదు.

నేను కొత్తగా రాస్తున్నప్పుడు తను చదివినప్పుడు కేశవరెడ్డి గారికి నచ్చితే ఆ విషయం చెప్పేవారు. అంత పెద్దాయన చెపితే యెంత సంతోషంగానో అనిపించేది. ‘మైదానం’ కాలమ్ బాగుంది, కొత్తగా అన్నారు. ఆయనెప్పుడూ కొత్తగా express చెయ్యాలనే వారు. కొత్త గా చెప్పేవి ఆయనకి చాలా నచ్చుతాయి. అలా యిప్పటికి ఆయన కొత్త రచయితలవి చదివినప్పుడు నచ్చితే ఆ విషయాన్ని కమ్యూనికేట్ చేస్తారు. ఆ మధ్య సామాన్య  ‘మహిత’ గురించి చెప్పారు. సంతోషాన్ని, బలాన్ని యిచ్చే మంచిని వొకరి నుంచి మరొకరికి మృదువైన మంచి నీటి ప్రవాహంలా ప్రవహించాలని నమ్మే నేను ఆ విషయం ఆమెకి చెప్పాను.

కేశవరెడ్డి గారు నన్ను అప్పుడప్పుడు ఆశ్చర్యఆనందాలకి లోనుచేసేవారు.’ యే అడివి వెన్నెలా మీరు రాసింది’ అని అడిగాను వొకసారి. ‘మీరు చూసిన అడివి వెన్నెల చెప్పండి’ అన్నారు కేశవరెడ్డి గారు. నన్ను మేస్మరైజ్ చేసిన వో అడివిలో వెన్నెలని ఆయన ముందు మాటలతో కుప్పపోసేను. ఆయన తనెప్పుడు అడివిలో వుండి వెన్నెలని చూడలేదన్నారు. ‘నిజమా’ అంటే చిన్నగా నవ్వేరు.

కేశవరెడ్డి గారు అప్పుడప్పుడు ‘మా వూరిలో వెన్నెల వచ్చింది.’- ‘ మీరు మీ వూరి వెన్నెలతోనే వున్నారా’ అనో ‘వెన్నెల్లాంటి మీ అక్షరాలని చదివాననో ‘ యిలా పలకరించేవారు. పోయినసారి కేశవరెడ్డి గారు ‘ వూరు వూరంతా వెన్నేలేనండి. మీరు వెన్నెల్లో వున్నారా?’ అని పలకరించారు. ఆ రోజు వాసంతోత్సవం. నేను ఫాం హౌస్ లో వున్నాను. అవునండి యిక్కడ తెల్లగులాబీల నిండుగా వెన్నేలేనండి ‘ అని చెప్పాను. ‘చూడండి ‘ నేను రాసిన అడివిలో వెన్నెలకంటే బాగుంది కదా… నిజానికి మీరు రాసే వెన్నెలా ,వాన నాకు నచ్చుతాయి’ అన్నారు కేశవరెడ్డి గారు. వో అద్భుతమైన తన రచనలో అడివిలో వెన్నెల బాగుంది అని అమాయకంగా చెప్పటం ఆ విశిష్ట మైన రచయిత యెప్పుడు మరచిపోలేదు. తన రచనల నిండుగా యెవ్వరు పట్టించుకోని సమాజం వైపు స్థిరంగా నిలబడిన కేశవరెడ్డి గారు మనుష్యుల పట్ల మృదువుగా, ప్రేమగా వుంటూ ఆత్మీయంగా పలకరిస్తూ యెందరో అభిమానుల హృదయాలని జయించారు వెన్నెలంత తేటగా.

నమస్సులు కేశవరెడ్డి గారు.

-కుప్పిలి పద్మ

Kuppili Padma Photo

“రేడియో అక్కయ్య” ఇక లేదు!

” రారండోయ్ …రారండోయ్    బాలబాలికలు రారండోయ్ బాల వినోదం కనరండోయ్ ”

అరవై ,దెబ్భయ్  దశకాల్లో అత్యంత ప్రాచుర్యం కలిగిన ఆకాశవాణి  శీర్శికా గీతం.ఆదివారం మధ్యాహ్నం రేడియో చుట్టూ మూగి ,ప్రసారమయిన మాటలు పాటలు ,నాటికలు, అన్నయ్య అక్కయ్య ల సంభాషణలు అన్నీ  “చాలిక మాటలు చాలిక పాటలు …చెంగున పోదాము ..చెంగుచెంగునా పోదాము ” అనేదాకా విని అదో లోకం లోకి  వెళ్లి పోయిన రోజులు ఒక్క సారిగా కళ్ల ముందు డేరాలు వేసుకున్నాయి. ఆ జ్ఞాపకాలన్నీ ఒక్కటొక్కటే గుర్తుకు రావటానికి కారణం రేడియో అక్కయ్య ఇకలేరు అన్న ఎఫ్బీ పోస్టింగ్  చూసి.

నాకు ముందు తురగా జానకీ రాణిగా తెలిసిన తరువాతే ఆ తరువాత ఆకాశవాణి  బాలానందం కార్యక్రమం  నిర్వహించే అక్కయ్యగారు ఈవిడేనని తెలిసింది. నా త్రిపదుల సంకలనం “మువ్వలు”  త్యాగరాయ గాన సభలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత  డా. సి.నారాయణరెడ్డి గారి చేతుల మీదుగా జరిగింది. ఆ సభలో సీనియర్ జర్నలిస్టు  శ్రీ పెండ్యాల వామన రావు గారు (న్యూ స్వతంత్ర టైమ్స్  ఎడిటరు, మా నాన్నకు మేనత్త కుమారుడు , మాకు గాడ్ ఫాదర్ )ఉన్నారు. వారికి అందజేసిన పుస్తకాన్ని  తమ పత్రికలో బుక్ రివ్యూకై తురగా జానకీ రాణి కిస్తే  రివ్యూ రాసారు. మామయ్య పంపిన పుస్తకం చూసి  అందులో నా రివ్యూ రాసిన జానకీ రాణి గారికి  ఫోను చేశాను. అప్పుడు (2007లో ) నేను ఆదిలాబాదు జిల్లా కాగజునగరులో  ఉండేవాణ్ని. నా పరిచయం చేసుకుని మాటలు మొదలు పెట్టగానే ఎంతో ఆత్మీయంగా స్పందించి  చాలా సేపు మాట్లాడిన  సందర్భం  కనుల ముందు తారట్లాడింది. చివరగా ‘మీ మామయ్యా వాళ్లింటివద్దనే మా ఇల్లు ఈసారి వచ్చినప్పుడు తప్పక రమ్మని  ‘ఆహ్వానించడం  నేను పోలేక పోవడం  గుర్తుకు వచ్చి  నిన్నంతా  ఒకటే ఆవేదన. వామన్ రావు మామయ్యంటే ఆమెకు ఎనలేని గౌరవం అభిమానం అని మాటల వల్ల తెలిసింది. ఆ  తరువాత మా పైడిమర్రి రామక్రిష్ణ ద్వారా తెలిసింది ఆమే రేడియో అక్కయ్య అని. ఓసారి ఏదో పుస్తకావిష్కరణ సభ త్యాగరాయ గాన సభలో జరిగితే వచ్చారు. దగ్గిరగా వెళ్లి పలకరిస్తే ఎంతో ప్రేమ పూర్వకంగా మాట్లాడారు.

1936 లో 31 ఆగస్టున రాజ్యలక్ష్మి వెంకటరత్నంలకు మచిలీ పట్నంలో  జన్మించిన జానకీ రాణి ఎం.ఏ  ఎకనామిక్స్ చేసి పిహెచ్.డి మధ్యలో వదలి వేశారు. జానకి రాణి గారికి నృత్యం అంటే చాలా ఇష్టం. నాట్యం నేర్చుకోవడమే కాదు  ‘నాట్య కళా భూషణ ‘అనే బిరుదు పొందినా,కొన్ని అనుకోని పరిస్తితులవల్ల జానకీ రాణి గారు 1974  లో ఆకాశవాణి లో  చేరాల్సి వచ్చింది  జీవిక కోసం పిల్లల భవిష్యత్తు కోసం .భర్త తురగా కృష్ణ మోహన్ రావు గారు ఆకాశవాణి లో జర్నలిస్టుగా  పని చేస్తూ ప్రమాదంలో ఆకస్మిక  మరణం పాలు కావటం  తురగా జానకీ రాణి  గారి జీవితం లో ఒక పెద్ద విషాదం.

ఆకాశవాణి లో చేరిన తరువాత బాలల కార్యక్రమాల్ని రూపొందించడంలో తనకు ఇష్టమయిన నృత్యాన్ని పక్కనబెట్టి  బాల రచయిత్రిగా తమ శక్తి యుక్తుల్ని వినియోగించి అచిర కాలం లోనే  తగిన గుర్తింపు పొందారు. చేపట్టిన పనిని తపస్సులా భావించే జానకీ రాణి పిల్లకోసం అనేక నాటికలు రాశారు.ఆకాశవాణిలో బాలానందం, బాలవినోదం, బాలవిహారం వంటి కార్యక్రమాల్లో అక్కయ్య కృషి  అంతా ఇంతా కాదని సన్నిహితులు చెప్తారు.

unnamed

గమ్మత్తయిన విషయ మేమిటంటే జానకీ రాణి గారు  ఆకాశవాణి ఉద్యోగం లో చేరక మునుపు    రేడియో ఆర్టిస్టు  గా పని చేశారట. సాయంత్రం  7 నుండి 7.50 వరకు  కథానికా పఠనం చేసే వారు.     ఆకాశవాణిలో  ఆమె అనేక కొత్త ప్రయోగాలు చేశారు.చొప్పదంటు ప్రశ్నలు,బాలవాణి వంటి  కార్యక్రమాలు, కంగారు మామయ్య,కొంటె కృష్ణయ్య,వెర్రి వెంగళప్ప  వంటి పాత్రలు ప్రవేశపెట్టి చిట్టి పొట్టి చిన్నారి శ్రోతలకు దగ్గరయ్యారు.పలు పత్రికల్లో వీరు రచించిన కథలు ప్రచురించబడి  వీరికి బాల సాహిత్య నిర్మాతల్లో ఒకరిగా స్థానం లభించింది. సన్మానం,మంచిమనస్సు,ఉపాయం,వాదన,ఆడపిల్ల వంటి కథలతో వీరి ‘మిఠాయి పొట్లం ‘కథల సంపుటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘పబ్లికేషన్స్ డివిజన్’ ప్రచురించింది.పిల్లలు పూర్తిగా చదివి  ఆనందించాలంటే సరదా,హాస్యం తప్పని సరిగా ఉండాలనే నిత్యసత్యాన్ని దృష్టిలో ఉంచుకుని  వీరు కథలు రాశారు.వీరి  బి. నందం గారి ఆసుపత్రి అనే హాస్య నాటిక  సున్నితమైన హాస్య ధోరణి తో పిల్లలని మార్చవచ్చని సూచిస్తుంది. బాలానందాన్నే  బి. నందం డాక్టరుగా  సృష్టించారు. ఐ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ బాలల అకాడెమీ వారు ప్రచురించారు. వీరి మరో కథల సంపుటి ‘బంగారు పిలక ‘ని నేషనల్ బుక్  ట్రస్టు  వారు ప్రచురించారు.రెడ్ క్రాస్ కథను అనువదించారు.ఇవే కాక ఐ దేశం ఒక హిమాలయం,చేతకాని నటి  వంటి  రచనలు చేశారు.

రేడియో కార్యక్రమానికి మానవ కంఠ ధ్వని, ఇతర శబ్దాలు, విరామం ఎంతో ముఖ్యం. అలాగే రేడియోలో పాల్గొనే వారు ఎక్సపర్ట్స్ కానవసరం లేదు. ఏక్స్‌పీరియన్స్ ముఖ్యం. చెప్పదలచిన విషయాన్ని ఇచ్చిన సమయానికి సమయపాలన పాటించి చెప్పగలగాలి. వృద్ధులు చెప్పే దాంట్లోనూ విలువలుంటాయి. “రేడియో అనేది స్టూడియో నాలుగు గోడల మధ్య ఉండేది కాదు. ప్రజల మధ్యకి వెళ్ళి వారి అనుభవాలు, వాళ్ళ నాలెడ్డ్ తెలుసుకోవాలి “అని గోదావరిఖని, జడ్చర్ల, కరీంనగర్, శ్రీశైలం….ఇలా ఎన్నో ప్రదేశాలు తిరిగి కార్యక్రమాలు ప్రజల వద్దకి వెళ్లి చేశారు.ఆ విధంగా  సాధారణ ప్రజలని కూడా ఇందు భాగస్వామ్యులని చేయటం ద్వారా వారి అనుభవాలు నలుగురికీ తెలిసేవి. మహిళలకోసం కూడా కొత్త ప్రయోగాలు చేసాము.

“ఇది నా సమస్య” అని స్త్రీల కార్యక్రమం   ప్రసారం చేసి స్త్రీలు తమ సమస్యలు ఉత్తరాల ద్వారా తెలియ పరిస్తే వాటి పరిష్కారాలు నిపుణులైన డాక్టర్లు, లాయర్లు మొదలైన వారిచేచెప్పే కార్యక్రమాలకు  మంచి స్పందన వుండేది. వృద్ధుల కోసం తమ జీవితానుభవాలు తెలిపే “స్రవంతి” అనే కార్యక్రమం కూడా  అలాంటిదే. వీటి వెనుక జానకీ రాణి గారు ఉన్నారు . ప్లానింగ్ ,ప్రొడక్షన్,ప్రెజంటేషన్  పకడ్బందీగా ఉంటే కార్యక్రమాలు ఫలవంతంగా ఉంటాయనే తురగా జానకీ  రాణి గారు ఆ విషయంలో ఎల్లప్పుడూ  శ్రద్ధ వహించేవారు. వీరి ఉద్యోగ నిర్వహణలో భాగంగా దేవులపల్లి కృష్ణశాస్త్రి ,స్థానం నరసింహారావు,గోపీచంద్ ,వేలూరి శివరాం,అక్కినేని, ఎస్. పి.బాలసుబ్రహ్మణ్యం, జె.వి.సోమయాజులు , మంజుభార్గవి వంటి అనేకమంది ప్రముఖులతో కలిసి పని చేశారు.

దృశ్యశ్రవణ విధానంతో విజ్ఞానం అందించవచ్చని  అమ్మ-పాప,చిలుక పలుకులు, ఉదయబాల, అమ్మా నేను బడికి పోతా,బంగారు పాప వంటి  పలు సిడిలను  రూపొందించారు జానకీరాణి. సేవలకు గుర్తింపుగా ‘సనాతన ధర్మ ‘,బాలసాహిత్య పరిషత్ ‘ వంటి పలు సంస్థలు వీరిని సత్కరించాయి. వీరికి 1991,1992లో వరుసగా రెండు సార్లు  నేషనల్ బెస్ట్  బ్రాడ్ క్యాస్టరుగా అవార్డు పొందారు. జీవితంలోని ఒడి దుడుకులను ఎదుర్కొంటూ  ప్రతీ విషయాన్ని ఒక  ఛాలెంజ్  గా తీసుకున్న విదుషీమణి శ్రీమతి తురగా జానకీ రాణి ఎనభై సంవత్సరాల వయస్సులో కొంతకాలంగా అస్వస్థులుగా ఉండి  కన్ను మూయటం  ఇటు సాహితీ లోకానికీ ,అటు ఆకాశవాణి ,దృశ్య మాధ్యమ రంగానికి  తీరని లోటు.

                                                                                                                – వాధూలస  

చేరా అంటే మంచి సంభాషణ!

10534397_326754877475156_564669077665495274_n

చేరాగారు ఇక లేరన్న దుర్వార్త వినడానికి రెండురోజుల ముందే హఠాత్తుగా ఆయన గుర్తొచ్చారు. అప్పుడప్పుడు పరిచితుల విషయంలో నాకు అలాంటి అనుభవం ఎదురవుతూ ఉంటుంది. అదెలా జరుగుతుందో నాకు తెలియదు. ఆయన ఎలా ఉన్నారో అనుకున్నాను. ఆయన ఆరోగ్యంగా లేరని తెలుసు కనుక ఎక్కువగా తిరగడం లేదని అనుకునే వాడిని. కానీ సభలకు, కచేరీలకు వెడుతూనే ఉన్నారని ఇప్పుడు తెలిసి అవునా అనుకున్నాను. నాకు సభలకు వెళ్ళే అలవాటు పెద్దగా లేకపోవడం వల్ల ఆయనను మిస్ అయినందుకు బాధపడ్డాను.

నగరజీవితం విచిత్రంగానూ, వైరుధ్యవంతంగానూ ఉంటుంది. నగరంలో మనుషుల మధ్య ఉన్నప్పటికీ మనుషుల సంపర్కాన్ని కోల్పోతూ ఉంటాం. ఎవరికి వారం మనలో మనం ఒంటరి జీవితం గడుపుతూ ఉంటాం. ఏదో ఒక రంగంలో అభిరుచిని పంచుకునేవాళ్లు అందరూ ఒకే కాలనీలో ఉండే ఏర్పాటు ఉంటే ఎంత బాగుండుననిపిస్తుంది.

నేను చదువుకునే రోజులలోనే చేరాగారితో పరిచయం. హైదరాబాద్ లోని ఒక సాంస్కృతిక సంస్థవారు నిర్వహించిన వ్యాసరచన పోటీలో బహుమతిగా వచ్చిన కప్పును నాయని కృష్ణకుమారిగారి చేతుల మీదుగా పుచ్చుకుని విద్యానగర్ వెళ్లడానికి బస్సు ఎక్కాను. బస్సులో ఒకాయన పక్కన సీటు ఉంటే కూర్చున్నాను.

ఆయన నన్ను చూసి చిరునవ్వుతో పలకరించారు. తను కూడా ఆ సభకు వచ్చానని చెప్పారు. కొంత సంభాషణ జరిగాక, నేనే అడిగానో, ఆయనే చెప్పారో గుర్తులేదు కానీ నా పేరు చేకూరి రామారావు అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ‘భారతి’లో ఆయన రాసిన భాషాశాస్త్ర వ్యాసాలు చూశాను కనుక వెంటనే ఆ పేరు గుర్తుపట్టాను.

అంతలో బస్సు విద్యానగర్ స్టేజ్ లో ఆగింది. ఇద్దరం దిగాం. ఇళ్ల వైపు నడుచుకుంటూ వెళ్ళాం. ఆయన సమవయస్కునిలా, ఒక మిత్రుడిలా నాతో చనువుగా మాట్లాడడం ఆయన వ్యక్తిత్వంలోని ఒక కోణాన్ని అప్పుడే నాకు పరిచయం చేసింది. తన ‘భారతి’ వ్యాసాలు అర్థం కావడం లేదన్న ఫిర్యాదుపై అప్పట్లో ఆయన బాగా ఆలోచిస్తూ ఉండేవారు కాబోలు, దాని గురించి నన్ను గుచ్చి గుచ్చి అడిగారు. అర్థమయ్యాయని చెప్పగల స్థాయి నాకు అప్పుడు లేదు. నిజానికి ఇప్పుడూ లేదు. అది నా రంగం కాదు. అప్పుడు ఆయనకు ఏం సమాధానం చెప్పానో గుర్తులేదు.

అంతలో ఆయన ఇంటికి దారి తీసే సందు వచ్చింది. ‘రా, మా ఇల్లు చూపిస్తాను’ అంటూ తీసుకెళ్ళారాయన. అది రోడ్డుకు ఆట్టే దూరంలో లేదు. ఆ పక్క సందులోనే మా అన్నయ్య ఉంటున్న ఇల్లు.

ఆ తర్వాత కొన్నిసార్లు ఆయనింటికి వెళ్ళాను. సాహిత్యం గురించి మేము మాట్లాడుకునేవారం అనే సాహసం నేను చేయను. ఆయన మాట్లాడుతుంటే వినేవాణ్ణి. దిగంబర కవిత్వం పట్ల, అందులోని భావజాలం పట్ల ఆయనకు అభ్యంతరం ఉండేది కాదని మాత్రం తెలిసేది. అప్పటి సాహిత్యరాజకీయాలపై కూడా ఆయన చాలా ఆసక్తిని చూపుతూ ఉండేవారు. వాటి గురించి మాట్లాడేవారు. ఫలానా పత్రికలో ఫలానా వ్యాసం వచ్చింది చూడు అనేవారు. తన దగ్గర ఆ పత్రిక ఉంటే ఇచ్చేవారు. అప్పుడే అరసంలో చీలిక, సెవెన్ స్టార్ సిండికేట్ రభస వగైరాలు, శ్రీ శ్రీ, దాశరథి లాంటి కవుల వ్యక్తిగత వైరాలు, శ్రీ శ్రీ వారిపై గుప్పించిన కవితాత్మక దుర్భాషలు ఏదో పత్రికలో అచ్చవుతూ ఉండేవి. చేరాగారు వాటి గురించి ఎంతో కుతూహలంగా మాట్లాడుతూ ఉండేవారు.

అప్పట్లో ఆయన చెప్పిన ఒక పాఠం నాకు గుర్తుండిపోయింది.

అప్పటికి సాహిత్యాన్ని ఐడియలిస్టు వ్యూతో చూసే వయస్సు నాది. సాహిత్యరాజకీయాలు నాకు నచ్చలేదు. సాహిత్యంలో రాజకీయాలేమిటి అంటూ నేను ఆవేశపడ్డాను. చేరాగారు చిరునవ్వు నవ్వి ‘ఏం, సాహిత్యంలో రాజకీయాలు ఎందుకు ఉండకూడ’ దంటూ ఎంతో సౌమ్యంగా ఒక పాఠం చెబుతున్నట్టు నాకు వివరించుకుంటూ వచ్చారు. సాహిత్యమే కాదు, జీవితంలో రాజకీయం కానిదేదీ లేదని తేల్చారు.

సాహిత్యంపై నాకు అలా భిన్నదృక్పథాన్ని పరిచయం చేసింది ఆయనే.

ఆ తర్వాత కొన్నేళ్లు గ్యాప్ వచ్చింది.

‘ఆధునిక సాహిత్యంలో కాలికస్పృహ’ అనే పేరుతో నా వ్యాసం ఒకటి ఉదయం పత్రికలో వచ్చినప్పుడు, చేరా గారు తన చేరాతలలో దాని గురించి రాశారు, సాహిత్యవివేచనకు కొత్త పనిముట్టుగా దానిని పరిచయం కేసారు. కొత్త కవులను, వారి ధోరణులను పట్టించుకోవడంలో చేరాతలు ముందున్న సంగతిని ప్రస్తావిస్తూ , వచనరచనలు గుర్తించడంలో వెనకబడినట్టు ఒప్పుకుంటూ ఆ వ్యాసం ప్రారంభించారు. ఆపైన కొత్త తరంలో గుర్తించదగిన వచనరచనా ధోరణులు లేకపోలేదన్నారు.

నేను ఒకింత వచన పక్షపాతిని కనుక ఈ వ్యాసప్రారంభం నాకు సంతోషం కలిగించింది.

నేను ఆంధ్రప్రభ దినపత్రికలో ఉన్నప్పుడు సాహిత్యం పేజీ చూస్తున్న రోజుల్లో ఆయన అప్పుడప్పుడు మా కార్యాలయానికి వస్తుండేవారు. ఆయన వెంట తరచు హరి పురుషోత్తమరావుగారు ఉండేవారు. ఇద్దరి స్వభావాలలో తేడా ఉండేది. చేరాగారు సంభాషించేవారు, హరిగారు చర్చించేవారు.

చేరాగారు(భాషా)శాస్త్రం నుంచి సాహిత్యంలోకి వచ్చారు. ఆయనలో శాస్త్ర, సాహిత్య దృక్కోణాలు వేటికవే విడివిడిగా ఉండిపోయాయని నాకు అనిపించేది. భాష గురించి పరిశీలించేటప్పుడు ఆయనలో కనిపించే శాస్త్రవేత్త, సాహిత్యపరిశీలనకు వచ్చేసరికి తప్పుకుంటాడనిపించేది. సాహిత్యపరిశీలనలో ఆయనలోని భావుకుడు, అనుభూతివాది పైకి వచ్చేవాడు. చేరాగారితో నన్ను పోల్చుకునేంత సాహసం చేయను కానీ, నాది భిన్నమైన అనుభవం. నాది సాహిత్యదృష్టినుంచి శాస్త్రదృష్టికి పయనించే ప్రయత్నం. భావుకత, అనుభూతి ఒక్కటే నాకు సరిపోవు. వాటితోపాటు కాలికతా, సమాజమూ, చరిత్రా వగైరాలు మరికొన్ని కావాలి. చేరాగారే నాకు చెప్పిన పాఠం ప్రభావం కూడా దీని వెనుక గుప్తంగా ఉందేమో తెలియదు. అలాగని నేను విరివిగా రాసింది కూడా ఏమీలేదు.

నేను ఆంధ్రప్రభలో పద్య ప్రాసంగికత(రెలెవెన్స్) గురించి లేవనెత్తిన చర్చ సందర్భంలో ఈ దృక్పథ భిన్నత్వం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆధునిక లేదా ఆధునికోత్తర భావసంక్లిష్టతను వ్యక్తం చేయడానికి పద్యం తగిన వాహిక కాగలదా అన్నది స్టూలంగా అప్పుడు నేను లేవనెత్తిన ప్రశ్న. నా ప్రశ్నను వ్యతిరేకిస్తూ, అన్ని కాలాలలోనూ పద్యం సమర్థ వాహికే అవుతుందని నొక్కి చెబుతూ చేరాగారు చేరాతలలో రెండు వ్యాసాలు రాశారు. బేతవోలు రామబ్రహ్మంగారు తదితరులు కూడా ఆ చర్చలో పాల్గొన్నారు. ఇప్పుడు చూస్తే, పద్యం గురించి నేను చేసిన చర్చలో అసమగ్రత, అవ్యాప్తి, అతివ్యాప్తి లాంటి దోషాలు ఉన్నాయనే అనిపిస్తుంది. అయితే, పద్యం ఆధునిక, లేదా ఆధునికోత్తర భావసంక్లిష్టతను వ్యక్తం చేయగలదా అన్న నా మౌలిక సందేహం మాత్రం ఇప్పటికీ అలాగే ఉండిపోయింది.

ఇన్నేళ్లలోనూ చేరాగారిని తరచు కలుస్తూ మాట్లాడి ఉంటే ఈ సందేహంపై మరికొంత చర్చ చేసి ఉండేవారమేమో! నగరజీవితం, వృత్తి జీవితం నాకా అవకాశమూ, తీరికా ఇవ్వలేదు.

ఆయన జ్ఞాపకాలను చరిత్రబద్ధం చేసే ప్రయత్నంలో ఈ నాలుగు మాటలూ. ఆయనకు నా నివాళి.

                                                                                                                       -కల్లూరి

ప్రియమైన శేఖర్ గారికి…

శేఖర్గారి ది ఒక చిన్న కోరిక వుండేది, తన గురించి నేనేదైనా వ్రాయాలని.

మేమిద్దరం కలిసి ఒక చోట పనిచేసిన వాళ్ళం కూడా తీర్చాల్సిన కోరికే అది, అయినా నేనేం వ్రాయలేదు.

వ్రాయాల్సిన తరహా నాకు చేత కాకపొవడం ఒకటైతే, వీడ్కోలు కోసమన్నట్టుగా వ్రాయడం అనేది సహించలేక కూడా.

నిజానికి వీడ్కోలుఎక్కడుంటుంది? తలవంచుకు మాట్లాడుకుంటూ నడుస్తుంటాం, వింటున్నవాడు ఎప్పుడాగిందోకూడా తెలువదు. మనం మాట్లాడుతూనే వుంటాం ఖాలీ అయిన స్థానం లోమరొకరెవరో వుంటారు.

మాటలు, నడక సాగుతూనే వుంటాయి ఖాలీలు పూరించబడుతూవుంటాయి.

నాకు తెలిసి శేఖర్ గారికి నేను ఇవ్వాల్సింది అక్కడ వీడ్కోలు కాదు ఆనందం, గత ఆరు నెలలుగా చిన్ని చిన్ని వాక్యాలతో నేనాయనకు ఆనందం ఇవ్వడానికి ప్రయత్నించాను ఇలాంటి వుత్తరాలతో , ఇది శేఖర్ గారికివ్రాసిందే కాదు నాకు నేను వ్రాసుకుంది కూడా. నా కున్న వారందరికి వ్రాస్తుందికూడా.

10402885_10202779443520617_4356749740251472669_n

 

6 December 2013

 

ప్రియమైన శేఖర్ గారు,

 

రెండురోజులుగా మీకు మెయిల్ చేద్దామనే అనుకుంటున్నా చేతులు ఆడలేదు. మూగగా వుంది.

చంద్రం గారి సభ లో నా చొరవ ఏమీ లేదు దీన్నంతాచేస్తున్న వారు భాస్కర్ గారు వారి మిత్రులు. ఆయన తో కలిసి కొంత కాలంప్రయాణం చేసిన సాటి చిత్రకారుడిగా ఒక కనపడని దుక్కం అంతే. మీరు మీ ఇంట్లొ “బొమ్మల్లో ఇంకా ఏమీ సాధించలేక పొయానని దిగులుగా వుంద”ని అన్నారు, మనకున్న, మనముంటున్న బొమ్మల ప్రపంచం వేరు, ఎంత సాధించినా గుర్తించడానికి, గుర్తుపెట్టుకొడానికి నిరాకరించే ప్రపంచానికి మన అమాయకత్వం సరిపోదు, నాకు తెలిసినఇద్దరు పిల్లలు వున్నారు, ప్రపంచంలో అందరు తండ్రుల కన్నా గొప్ప తండ్రివారికి వున్నాడు, ఆ పిల్లల తల్లికి తెలుసు తన భర్త ఏం సాధించాడో.భగవంతుడ్ని నేను కొరుకునేది అదే, ఆ పిల్లల దగ్గర్నుంచి, ఆ తల్లిదగ్గర్నుంచి వారి జీవితాల్లొకెల్లా అతి విలువైన దాన్ని ఒకదాన్ని వారితోనేవుంచమని. మీరు మీ కోసం కోరుకొవద్దు, మీ వాళ్ళ కోసం కోరుకోండి .

 

ఈ మధ్యేమేము ఇల్లు మారాము,మూడో అంతస్తు పెంట్ హౌస్, వచ్చిన రోజు నుంచి ఒక తల్లిపిల్లి పరిచయం అయింది, తర్వాత్తర్వాత మాలో ఒక భాగం అయింది నిజంగానే పిల్లుభలే ప్రేమాస్పదం ఐనవి. మా ఫ్యామిలికి బహూశ ఇది ఐదో పిల్లి, పిల్లులు మనకు ప్రేమ ఇవ్వవు గాని మన దగ్గరి నుంచి తమకు కావాల్సిన ప్రేమ హాయిగా తీసేసుకుంటాయి.

 

ఇవ్వాల్టి రోజు తొలిఎండను కాచుకుంటూ దాని హొయలు చూడతగినవేకాని చెప్పలేం. నడుస్తూ నడుస్తూ అట్టా కూలబడింది అచ్చు కోతిలా – ముందుకాళ్ళల్లో ఒకదాని చేతిలా చాచి వెనుక కాలు కాక్కుని దాన్ని గట్టిగాపట్టుకుంది ఎంటో! ఎందుకో? ఆ పై వల్లు విరుచుకుని వెల్లికిలా పందుకుని ఎండనుకాగుతూ దాని పలుచని బూడిద రంగు కడుపు, లేత గులాబి రంగు చిన్న చనుమొనలుదాన్నెంత వింతగా చూస్తూ నేనెట్లా వున్నానో అంతే వింతగా నన్ను చూస్తూ అదీ.

 

దేవుడికి నా పై ఎంత ప్రేమ లేక పొతే ఇదంతా చూడ్డానికి నాకు రెండుకన్నులిచ్చి ఈ భూమి పైకి పంపుతాడు శేఖర్ గారు, ఎంత అందం వుంది మనచుట్టూ అదిపదే పదే మనల్ని చూడమంటుంది, తెలియని దిగులుని నింపుకుని మనం దీన్నంతా దూరంపెడుతున్నామేమో!

 

బహూశా మీ నందూ చిన్నప్పుదో చేతన బాల్యంలొనో ఆ బంగారుపిల్లలు అన్నపు మెతుకు రుచి తెలుసుకుంటున్న తొలిరోజుల్లొ మూతికి అంటిన ఆపాల బువ్వ మీరు సుతారంగా తుడిచే వుంటారు , “సవాలక్ష మామూలు విషయంలా”అగుపించే ఆ పని ఒక కళ్ళు లేని తండ్రి గాని, తల్లి గాని అంతటి అపురూపాన్నివూహించగలరా ?

 

మనం పేపర్ పై వాడుతామే స్కార్లెట్ ఫొటొ కలర్ని నీళ్ళల్లోకలిపి పలుచగా చేస్తే వచ్చిన గులాబి రంగులాంటి పెదాల చుట్టూ తెల్లని పాలమరకలు. వూహించుకుంటే నాకు ఏడుపు వస్తుంది , ప్రపంచంలో ని గ్రుడ్డి వారందరుసామూహికంగా ఎందుకో ఒక తెలీని త్యాగం చేసి మనకందరికి చూపు వుండేలాచేసారనిపిస్తుంది.

 

నిజంగా మనం ఎంత అదృష్టవంతులమో తెలుసుకోలేని దురదృష్టవంతులమేమో? అద్భుతాలు ఆశించే వాణ్ణి, నా చుట్టూ ఎన్నో అద్భుతాలుచూస్తున్న వాణ్ణి, తను స్వయం కొన్ని అద్భుతాలు కోసం పరిశ్రమించిన ఒకఅద్భుత వ్యక్తి, తన జీవితంలో అతిపెద్ద అద్భుతాన్ని చేయబోతున్నాడని గట్టిగాఎదురుచూస్తున్న వాణ్ణీ. రేపొ ఎల్లుండో మళ్ళీ మీతో వుంటాను.

 

మీ

 

అన్వర్

 

ఇప్పుడు యాది అన్న మాట వింటేనే సదాశివ!

2 (2)
(సదాశివ గారి పుట్టినరోజు మే 11 )
ఆదిలాబాదు  పేరు  తలువంగనె  సదాశివ  సారు యాదికి వస్తుండె  ఇదివరకు .
ఇప్పుడు యాది  అని  ఎక్కడ్నన్న విన్నా  చదివినా  సదాశివ పేరు, యాది సదాశివ  అనే పదబంధం  గుర్తుకు వస్తయి.
మా ఆదిలాబాదు  జిల్లాలనేమొ  సారు దగ్గర  చదువు నేర్చుకున్న  శిష్యులు ,చుట్టాలు పక్కాలు  చాలమంది  ఉన్నరు గని  అందులో  సారు సాహిత్యపు లోతులు తెలిసినోళ్లు  మాత్రం చాల తక్కువమందనే చెప్పాలి.  సదాశివ  సారు తన జీవిత కాలం లో  చాల ఎక్కువ కాలం  ఆదిలాబాదు జిల్లాలో గాని  ఆదిలాబాదు పట్టణంలో గాని  గడిపిండు.చదువుకునే రోజుల్లొ  కొంతకాలం  వరంగల్,హైదరాబాదులో  ఉన్నరు.ఉద్యొగం  ఆదిలాబాదు జిల్లాలనే దొరికింది. కొన్నిరోజులు  ఉపాధ్యాయునిగా ,ఆ తరువాత  పాఠశాలల  తనిఖీ  అధికారిగా ,ఆతరువాత ఉపాధ్యాయ శిక్షణా  కేంద్రంలో  బోధకునిగా  పనిజేసిన్రు. పదవీ  విరమణకు ముందు  పదోన్నతి  పై  భద్రాచలం  జూనియరు  కళాశాల  ప్రిన్సిపాలుగా  పనిచేసి  అక్కడనే  పదవీ విరమణ  పొంది  ఆదిలాబాదు  పట్టణంల  స్థిరపడ్డరు.
ఇదంతజెప్పుడెందుకంటె సారు ఎక్కడికి గదలకుండనె ఎక్కడెక్కడివాళ్లకోబాగాఎరుకయిండు.
 ఎంతోమందిఅభిమానంసంపాయించుకున్నడు.ఆయన పుసకాలు జదివి  ఆయన  పరిచయం సంపాదించుకున్నవాళ్లు  కొంతమంది ,ఉద్యోగ రీత్యా  ఆదిలాబాదుకు వచ్చి  సారు గురించి తెలిసి ,సారును కలుసుకొని  అనుబంధాన్ని  పెంచుకున్నవాళ్లు  మరి కొంత మంది.సారూ ఊరికె చెప్పుతుండె  రాసే వాళ్లు  వాళ్ల పాఠకులను గూడా తయారుజేసుకోవాలె  అని.అది ఎట్లా అన్న  ప్రశ్నకు  సారు జీవితం నిడివంత  సమాధానం  చెప్పాలె.
సారు బుట్టిన  తెనుగుపల్లె  మా కాగజునగరుకు పది పన్నెండు కోసుల దూరముంటది.నేను  సారు చనిపోయింతరువాత  వారం రోజులకు  కొంతమంది  ఉపాధ్యాయులు  సారు  సంస్మరణ సభ ఏర్పాటు జేస్తే  వెళ్లిన.ఇప్పటికి అది చాల చిన్న పల్లెనే.అక్కడా,  కొత్తపేట (కాగజునగరు )పక్కనే ఉన్న  నవుగామలో సారు  బాల్యం గడిచిందట.తండ్రి  నాగయ్య పంతులు  బడిపంతులు. అప్పట్లో  అన్నీ  ఉరుదూ మాధ్యమం  బళ్లు .జిల్లాకు ఒకటో రెండో  ఉన్నత పాఠశాలలు. సారు ఉరుదూ  బాగా ఒంటబట్టిచ్చుకున్నడు .అట్లనే తెలుగులో మంచి  ప్రావీణ్యం  సంపాదించిండు.
 మొదట్లో  పద్య కవిత్వం  రాసిండు,ఆ  కాలంల  భారతి  పత్రికల  సారు రచనలు వస్తుండె.అట్ల సాహిత్యవ్యాసంగం దిన దినాభివృద్ధి చెందింది.వేలూరి శివరామశాస్త్రి ,కప్పగంతుల లక్ష్మణశాస్త్రి  వంటి ప్రముఖులతో  పరిచయాలు పెంచుకున్నరు  ఉత్తరాల ద్వారా.సురవరంప్రతాపరెడ్డి  సూచన తో  పద్య ప్రక్రియ పక్కకుబెట్టి  తనకున్న ఉరుదూ, ఫారసీ,అరబ్బీ,మరాఠీ  భాషల పట్టుతో  వచన రచన ,అనువాద ప్రక్రియలకు  ఉపక్రమించిన్రు.అనేక మంది తెలుగు కవులను  ఉర్దూ  వారికి పరిచయం చేసిన్రు.ఉర్దూ కవుల గురించి తెలుగువారికి పరిచయం చేసిన్రు.ఉర్దూ సాహిత్య చరిత్ర  తెలుగు వారికి  తెలియ జేసిన్రు.ఇదంత ఒక ఎత్తయితే హిందుస్తానీ  సంగీతం  ముచ్చట్లు  ఇంతవరకు ఎవ్వరు జెప్పని రీతిలొ  చెప్పిన్రు .
 ఎంత గొట్టు విషయమైనా  అరటి పండు వొలిచి పెట్టినట్లు  సుతారంగా చెప్పుడు  సారుకే  చాతనయితది.అదిగూడా  ముచ్చట్ల  మాదిరిగ  చెప్పుడు  సారు ప్రత్యేక శైలి. అది చాల మందిని ఆకర్శించింది .ఇంకో  గమ్మత్తయిన విషయం ఏందంటే  సారు దృష్టిల బడ్డ  ఏ  మంచి విషయమైనా  ప్రస్తావనలోకి రావడం.చిన్న వారిలోనైనా పెద్దవారిలో నైనా మానవతావిలువల్ని పసిగట్టి  పనిగట్టుకొని  వాటిని  పదిమందికి తెలియజేయడం  సారు అలవాటు .గురజాడ  మంచి అన్నది పెంచుమన్నా  అన్న మాటకు  సారూ ఎన్నుకున్న  మార్గం అది .
 నాకు సారుతో  ఉన్న  మూడు దశాబ్దాల  సాన్నిహిత్యంతో  అయన మార్గం  మంచి ఫలితాలను  సాధించిన విషయం నేను  ఎరుగుదును. సారుతో  ఒక సారి పరిచయం  ఏర్పడిందంటే  అది కొనసాగాల్సిందే. సంబంధాలన్నీ  నిత్య నూతనంగా ఉండాల్సిందే .పని ఒత్తిడి వల్లనో,మరేదైనా కారణాల వల్లనో  పొరపాటున ఎవరి సమాచారం కుంటు పడినా  సరే స్వయంగా ఫోను  చేయించి  తెలుసుకునే వారు .ఎప్పుడు కలిసినా ఏదో ఒక కొత్త విషయం చెప్పేవారు. ఆ విధంగా  మనసుకు దగ్గరగా  చేసుకునే వారు .వినయం  సారుకు ఇష్టమయిన  లక్షణం .అలాగే  ఏ చిన్న  ప్రతిభ  ఉన్నా ప్రోత్సాహం  కలిగించడం  సారు ప్రత్యేకత .
 దాదాపు  ఆరున్నర  దశాబ్దాల పాటు  పరిమిత  సాహితీ  వర్గానికి  మాత్రమే తెలిసిన  సదాశివ  యాది ధారావాహికతో,అంతకు ముందు మలయమారుతాలు తోనూ  తెలుగు  చదువరులను  తన వైపుకు తిప్పుకున్నారు .యూనివర్సిటీలు  ఒకదాని వెంబడి  ఒకటి ఆయన  ప్రతిభను  గుర్తించి  ప్రతిభా పురస్కారాలు,గౌరవ  డాక్టరేట్లు  ప్రదానం  చేసి  వాటి  విలువల్ని  పెంచుకున్నాయి. సహస్ర చంద్ర దర్శన దశలో  కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు  రావడం  సామల సదాశివ  సాహిత్య కృషికి సముచిత  గౌరవ ప్రదమైనదిగా,జీవన  సాఫల్యంగా  ఎంచవచ్చు. హిందుస్తానీ  సంగీతానికి సంబంధించిన  ముచ్చట్ల పుస్తకం  ‘స్వర లయలు ‘ కు  ఐ అరుదైన  పురస్కారం
లభించటంగొప్పవిశేషం.ముచ్చట్లకుసాహిత్యస్థాయి  కల్పించిన ఘనత  సదాశివ సారుదే.
ఎంతటిగహనమైన విషయాన్నైనా  అతిసరళంగాచెప్పగలగటం  ఆయనకు  వెన్నతో పెట్టిన విద్య .ఆయన  వచన రచన  విలక్షణమైనది.అంతర్లీనంగా  ఒక  సమ్మోహన  శక్తి ఉంటుంది  రచనల్లో. ముఖ్యంగా  ఆయన మాటలు ఒక సారి విన్న వాళ్లు  ఆయన రచనలు  చదివినప్పుడు  ఎదురుగా కూచొని  మాట్లాడుతున్న అనుభూతిని పొందుతారు .ఈ  సందర్భంగా  ఆయన తో  నా తొలి పరిచయ సందర్భం  విన్నవించుకుంటాను .
 కాగజునగరులో  సర్సిల్కు  మిల్లు  ఆద్వర్యంలో  నడిచె ఒక ఉన్నత పాఠశాల  రజితోత్సవ  సందర్భంగా  సావనీరు తీశారు .శ్రీమతి  అందులో ఉపాధ్యాయిని  కావడంతో  ఆ సంచిక  చదవటం ,తెలుగు విభాగంలోని  ఒక వ్యాసం  నన్ను బాగా  ఆకర్షించడం జరిగింది.వ్యాసం శీర్శిక ‘ముఝే  మెరే దోస్తోంసే బచావో  ‘ వ్యాసం చివర  సదాశివ  అని మాత్రమే  ఉన్నది .అప్పటికి  నాకు  నారాయణ గౌడుతో  ఇంకా పరిచయం ఏర్పడలేదు .మా శ్రీమతి  ద్వారా  ప్రయత్నిస్తే  ఆయనెవరో  ఆదిలాబాదులో  ఉంటారట,పాఠశాల  ప్రధానోపాధ్యాయిని శ్రీమతి మాలినీ చాందోర్కరు గారికి  తెలిసిన వ్యక్తి అని మాత్రం  తెలిసింది.ఆ ఒక్క  ఆర్టికిల్  చాలు  మచ్చుకి సదాశివ  రచన ఎంత ప్రభావ వంతమైందో  చెప్పడానికి.కాగజునగరులోనే  ఉండే  నారాయణ గౌడు  సారు ప్రియశిష్యుడు.వారిరువురి  మధ్య  ఉత్తర ప్రత్యుత్తరాలు  చాలా ఏళ్లపాటు  నడిచినై.
 కొన్ని రోజుల  తర్వాత  నారాయణ గౌడుతో  పరిచయం  అయింది .సారు ప్రస్తావన రావటం ,ఆయనద్వారా  అనేక విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఆ తరువాత సారును కలువడానికి  ఆదిలాబాదు వెళ్లాను.బస్సుదిగి  బస్సు స్టాండు బయటికి వచ్చాను .పక్కనే  పాన్ ఠేలా  దగ్గర  ఒకాయన గనిపించిన్రు.ఎందుకో ఆయినెను  జూడంగనే  ఆయిన్నే  సదాశివు సారు గావచ్చుననిపించింది.  దగ్గరికి బొయ్యి  నమస్కారం సార్ అన్న. ఏ వూరు బాబూ  అన్నడు.కాగజునగరు అనిచెప్పిన.ఇగ అట్లనే ముచట్లువెట్టుకుంటు ఇంటి దాక బోయినం.అప్పట్నుంచి  ఎప్పుడు ఆదిలాబాదు వెళ్లినా  సారును కలిసివచ్చేవాణ్ని. మొన్నమొన్నటిదాక సారువాళ్ల ఇల్లు పర్ణ కుటీరం లాగుంటుండె. వాలు కుర్చీలో  కూచోని గంటలకు గంటలు  ముచ్చట్లు  చెప్పుతుండె.మేం  తెలుగు సాహితీ సదస్సు  ఏర్పరచుకున్నం  కాగజునగర్ల.డాక్టరు  విజయ మోహన్ రావు  అధ్యక్షుడు ,నారాయణ గౌడు  కార్యదర్శి. మొదటి కార్యక్రమానికి  సారు వచ్చిన్రు. ఆ తరువాత  నామొదటి పుస్తకం  గోంతెత్తిన  కోయిల ఆవిష్కరణ  కోసం వచ్చిన్రు.దానికి ముందు మాట  కూడా రాసిన్రు.నా రెండో పుస్తకం మువ్వలు(హైకూలు )  సారూ ప్రోద్బలం తోటే వేసుకున్న. దానికి గుడ  సారు మురిపించే  మువ్వల సవ్వడి  అని  అభిప్రాయం  తెలిపిన్రు.గత  ముఫ్ఫై  సంవత్సరాల్లో  ఏడెనిమిది  సార్లయినా  వచ్చుంటరు కాగజునగరుకు.  వచ్చినప్పుడల్లా  రెండు మూడు రోజులుండి  చుట్టాల నందర్నీ కలిసి వెళ్లేవారు.సాయంత్రాలు  నారాయణ గౌడు ఇంట్లనో  భీమయ్య  సారూ ఇంట్లనో లేకపోతె  మా  ఇంట్లనో భేటీ.అర్ధ రాత్రి దాకా  ముచ్చట్లు.ముచ్చట్లతోపాటు  నాలుగు  మందు చుక్కలు.గోలేటి నుంచి చమన్ వస్తుండె.కాగజునగరు సాహితీ మిత్రులకు  సారు వచ్చిండంటె  పండుగ.
photo (2)
 వరంగల్లు  విశ్వేశ్వర  సంస్కృతాంధ్ర  కళాశాల  వాళ్లు  తెలంగాణా సాహిత్యం మీద వరుసగ మూడు సంవత్సరాలు  సంగోష్టి జరిపిన్రు.దానికి  ఆదిలాబాదు ప్రతినిధిగా  నన్ను పిలిచిన్రు.అప్పుడు సారు దగ్గరికి వెళ్లి  చాలా విషయాలు  తెలుసుకుని  పత్రసమర్పణ చేసిన.వాళ్లు  మూడు సంవత్సరాలు  మూడు  పుస్తకాలు  ప్రచురించిన్రు .ప్రాచీన,అర్వాచీన ,ఆధునిక సాహిత్యాల పేరిట.
నా వచన కవితా సంపుటి  పెన్ గంగ  ప్రాణ హిత  సారింట్లో సారు చేతుల మీదుగా ఆవిష్కరించబడింది.మా అదృష్టం సారు యాదిలో  మాగురించి రాయడం. పోయిన  మే  11 న  న్యూజెర్సీ  నుంచి  జన్మదిన శుభా కాంక్షలు  తెలిపితే  నీదే మొదటి ఫోను  అన్న సారు ఈ 11 కు లేకుండపొయిన్రు.సారుతో పరిచయం  నా జీవితంలో  ఒక అతి ముఖ్యమైన సంఘటనగా  తలచుకొంటాను.ఎన్నో యాదులు  మిగిల్చిన  మా సదాశివ సారును  యాది దెచ్చుకుంటూ.

స్నేహాలూ, ప్రయాణాలూ, పుస్తకాలూ …ఇదే నా లోకం!

Dasari Amarendraఅక్షరాలు ముందు నేర్చుకొన్నానో, పుస్తకాలు ముందు తిరగేశానో గుర్తులేదు. అక్షరాలతోనూ, పుస్తకాలతోనూ పని లేకుండా కథల మీద మక్కువ పెంచుకొన్నది నాలుగేళ్ల వయసులో. తాతయ్య కథా జగత్తులో, జానపద గాధల ఊహాలోకంలో, జంతుజాలాల మార్మిక గాథలలో.

బంటుమిల్లి పిల్లల గ్రంథాలయం, విజయవాడ జిల్లా కేంద్ర గ్రంథాలయం,  హైస్కూలులో తెలుగూ, ఇంగ్లీషు పాఠ్యపుస్తకాల్లోని చక్కని కథలూ, కవితలూ, పద్యాలూ, వ్యాసాలూ నాకు సాహిత్యమంటే స్వతఃసిద్ధంగా ఉన్న ఆసక్తికి నీరు పోశాయి. ఆ ఆసక్తి మారాకు వేసి మొగ్గ తొడగడానికి కాకినాడ కాలేజీ రోజులు సాయపడ్డాయి. సాంస్కృతిక సమితి సహాయ కార్యదర్శిగా ఎంతోమంది సాహితీకారులనూ, కళాకారులనూ అతి దగ్గరగా చూడటం, వినడం, మాట్లాడటం.. అదో మైమరపు, ఎడ్యుకేషన్! టౌన్‌హాల్లోని సాహితీ సదస్సులు, జిల్లా గ్రంధాలయంలోని కార్యక్రమాలు, సూర్యకళామందిరంలోని నాటకాలు, మేం ఏర్పరచుకున్న సాహితీవేదిక సమావేశాలు .. అన్నం కన్నా మిన్న అయ్యాయి. జీవితానికి సాహిత్యానికి మధ్యనున్న పేగుబంధం బోధపడింది.

1975లో ఉద్యోగంలో చేరాక చేసిన మొట్టమొదటి పని పుస్తకాల సేకరణ. కొడవటిగంటి, రావిశాస్త్రి, చలం, రంగనాయకమ్మ, విశాలాక్షి లాంటి వాళ్ల పుస్తకాలే కాకుండా సాహిత్య అకాడెమీ వాళ్లూ, విశాలాంధ్ర వాళ్లూ, ‘రాదుగ’ వాళ్లూ, నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్లూ వేసిన అనువాద సాహిత్యమూ సేకరించాను. రెండు మూడేళ్లు గడిచేసరికి మూడు నాలుగు వందల పుస్తకాలు. అదో పెన్నిధి. పుస్తకాలు  చదువుకోవడం ఓ వ్యవసనమయిన రోజులవి. ఇప్పటికీ వదలని వ్యసనమది.

రాయాలనే కోరికెప్పుడు కలిగిందీ? 1976 ప్రాంతాలలో ఒకటీ రెండు కథలు ప్రజాతంత్ర లాంటి పత్రికల్లో వచ్చాయి. అప్పట్లో ఆంధ్రప్రభలో నడిచిన ‘ఇదీ సంగతి’ శీర్షికలో నాలుగయిదు లఘు వ్యాసాలు వచ్చాయి. కానీ ఆదే సమయంలో ‘నేను రాయకపోయినా ఎవరికీ ఏమీ నష్టం లేదు’ అన్న స్పృహ. దాని పుణ్యమా అని రాయడం కట్టిపెట్టి చదువుకోవడం మీదే దృష్టి పెట్టాను. స్నేహితులకు మాత్రం పేజీలకు పేజీలు ఉత్తరాలు రాసేవాడిని. “నీ ఉత్తరాలు చక్కగా కథల్లా ఉంటాయి. కథలే రాయవచ్చు కదా” అని ఒకరిద్దరు అన్నారు గానీ నేను పెద్దగా పట్టించుకోలేదు.

మన అనుభవాలు పంచుకోవాలన్న తపన రచనలు చేయడానికి ఉన్న అనేకానేక ప్రేరణలలో అతి ముఖ్యమైనది. నేనో ప్రయాణాల పక్షిని. ఊళ్లు తిరగడం, కొండలెక్కడం, అడవులు గాలించడం, నదులు దాటడం.. నా అభిమాన విషయాలు, అలాంటి నాకు 1989 అక్టోబరులో ఓ పదిరోజులపాటు యూరప్ వెళ్ళే అవకాశం ఆఫీసు ద్వారా దొరికింది. మూడు దేశాలు, మూడు నగరాలు తిరిగాను. పది గంటలు ఆఫీసు పనీ, మరో ఆరేడు గంటలు ఊళ్లు చూడటం.. ఆ పది రోజులూ నిర్విరామంగా గడపగా అనేకానేక అనుభవాలు మనసును నింపేశాయి. వాటిల్ని కాగితం మీద పెట్టకుండా ఉండలేని స్థితికి నన్ను నెట్టాయి. అలా రాసుకుంటూ వెళ్లాను. రాతలో అరవై డెబ్భై  పేజీలు.

మా తమ్ముడు శైలేంద్ర సీనియర్ జర్నలిస్టు హనుమంతరావుగారి అల్లుడు. ఆ కాగితాలు ఆయన కంటబడ్డాయి. ఆయన ముచ్చటపడ్డారు. అప్పట్లో ‘ఉదయం’ దినపత్రికలో పనిచేస్తోన్న దేవీప్రియగారికి అందించారు. 1990లో కొన్ని వారాల పాటు ఆదివారం అనుబంధంలో సీరియల్‌గా వచ్చింది ఆ మూడు నగరాల ట్రావెలాగ్. తెలుగుదేశం మీద నా అక్షరాల దాడికి అది నాందీ ప్రస్తావన. దాదాపు అదే సమయంలో నా అనుభవాల నేపథ్యంలో చిన్న చిన్న ఇంగ్లీషు మేనేజ్‌మెంటు వ్యాసాలు రాయగా అవి ఫైనానిషియల్ టైమ్స్, ఎకనమిక్ టైమ్స్ లాంటి దినపత్రికల్లో వచ్చాయి. అలా నాకు తెలిసి తెలియకుండానే సాహితీయాత్ర మొదలయింది.

కాకినాడ రోజుల్లోనే గొప్ప గొప్ప రచయితలను దగ్గరగా చూసి, వ్యవహరించిన అనుభవం ఉన్నా నాకు సహజంగానే ఉండే సంకోచం వల్ల గాబోలు, మళ్లా రచయితల దగ్గరికి వెళ్లలేదు. ‘వాళ్లు మనకు అందని చందమామలు. దేవలోకపు జీవులు’ అన్న గౌరవంతో కూడిన బెరుకు ఉండేది. అది దేవీప్రియగారి పరిచయంతో తగ్గింది. వాసిరెడ్డి నవీన్ కథా సంకలనాలను వెలువరించడం మొదలుపెట్టిన సమయమది. ‘అదిగో ద్వారక, కవుల మందలవిగో’ అని సాహిత్యం తెలిసినవాళ్లు సరదాగా పాడుకొంటున్న రోజులవి. అలాంటి ద్వారకా హోటల్లో ఓ సాయంత్రం పూట అడుగుపెట్టాను.

కథలతో పాటు సాహితీ వ్యాసాలూ, సమీక్షలూ నా అభిమాన విషయాలయ్యాయి. అడపా దడపా కవితలూ, విరివిగా అనువాదాలూ. మధ్యమధ్యలో ఇంటర్వ్యూలు. నాకు అతిప్రియమయిన యాత్రారచనలు సరేసరి. సాహితీ మిత్రుల పరిచయాలు అన్న వ్యాపకం మెల్లగా సాహిత్య సదస్సులకు దారి తీసింది. వేదగిరి రాంబాబు గారి ‘సరికొత్త కథ’ ఆవిష్కరణలో ఇరవై ముప్పై మందితో ముచ్చట్లు, కేశవరెడ్డి గారి నవలల ఆవిష్కరణలో ఆయనతో ఆత్మీయ పరిచయం. సాహిత్య అకాడెమీ వల్ల తెలుగు కథా సదస్సు కోసం హైదరబాదు- ఇవన్నీ ఒక ఎత్తు. అప్పాజోశ్యుల -విష్ణుభొట్ల వారు  రాజారామ్ గారికి అవార్డు ఇస్తూ మంజుశ్రీ గారి సారధ్యంలో విజయవాడలో 1996లో జరిపిన రెండు రోజుల సాహితీ సదస్సు మరో ఎత్తు. సుమారు యాభై మంది ఇష్టమయిన సాహితీకారులతో రెండు రోజులు గడపడం ఎంత అదృష్టం! తిరుమల రామచంద్ర, బలివాడ కాంతా రావు, పెద్దిభొట్ల లాంటి గొప్పవారి కొత్త పరిచయం కలిగిందక్కడే!

ఈ లోపల ఢిల్లీలోని మా సాహితీ అనుబంధానికి క్రమరూపం కల్పించాం. నేనూ, లక్ష్మీరెడ్డి గారూ, రంగారావు గారూ, సంపత్, తోలేటి – మేం అయిదుగురమే కాకుండా మాలాంటి సాహితీ ఆసక్తి వున్న మరో పదిమందిని కూడదీసి, నెలకోసారి – ఒక్కొకసారి ఒక్కొక్కరి ఇంట్లో- ఒక్కో ఆదివారం కలిసి గడిపే ఏర్పాటు చేసుకున్నాం. ఒకరి సాహిత్యకృషిలో ఇంకొకరు సాయపడడం, రాసినవి చదవడం, ముఖ్యమయిన సాహితీ వార్తలు అందరూ పంచుకోవడం, ఢిల్లీ వచ్చే రచయితలతో గోష్టి ఏర్పాటు చేసుకోవడం – ఇలా సాగింది మా బృందపు కార్యక్రమం. దాదాపు ఏడేళ్లు నిరాటంకంగా సాగిన వేదిక ఇది.

శ్రీపతి గారికి చలంగారంటే భక్తి. ఆయన శతజయంతి సభ ఢిల్లీలో కూడా నిర్వహించాలని భగీరధులయ్యారాయన. అదో గొప్ప సంఘటన. ఆయన నిర్విరామ కృషి, మా బృందపు చేయూత – సభని దిగ్విజయం చేశాయి. మహీధర, వాడ్రేవు వీరలక్ష్మి దేవి, కుప్పిలి పద్మ, అంపశయ్య నవీన్, వావిలాల సుబ్బారావు, పీ. సత్యవతి, మరో అయిదుగురు కవులూ రచయితలూ ఈ సభల కోసమే ఆంధ్ర నించి వచ్చారు. అప్పుడు రాజ్యసభ సెక్రెటరి జనరల్ గా వున్న వీ. యస్. రమాదేవి గారు ఉత్సాహంగా సభల్లో పాల్గొన్నారు.

శ్రీపతి గారి పూనిక పుణ్యమా అని ఢిల్లీ ఏపీ భవన్ సిబ్బంది యావత్తూ సభలకు ఉతమిచ్చారు.  ‘ తెలుగు సాహితి ఢిల్లీ’ రథసారథి రామవరపు గణేశ్వర రావు గారు సరే సరి. వెరసి రెండు మూడు వందల మంది ప్రేక్షకులతో సభ చక్కగా జరిగింది.అదే ఒరవడి లో నేనూ, లక్ష్మీరెడ్డి గారు చలం సభలకు విజయవాడ, హైదారాబాద్ లాంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడా పాల్గొన్నాము.

ఇది మా బృందం లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. ఈ ఒరవడి కోనసాగించాలనిపించింది. కథాసాహితీ నవీన్ తో అప్పటికే అంటూ వచ్చాను –” మీ పుస్తకం ఆవిష్కరణ సభ ఒకటి మా వూళ్ళో కూడా ఒకటి ఉండాలి ,”అని. అలా  ‘కథ96’ ఆవిష్కరణ అక్టోబర్ 1997 లో ఢిల్లీ లో అని నిర్ణయించుకున్నాము. అప్పుడు సాహిత్య అకాడమీ కి కార్యదర్శి గా మళయాళీ కవి సచ్చిదానందన్ ఉండేవారు. అంతకు ముందు ఆయన ‘ ఇండియన్ లిటరేచర్ ‘ కు ఎడిటర్ గా పని చేశారు. పుస్తకం ఆవిష్కరించడానికి ఆయన సంతోషంగా అంగీకరించారు. ఇది పెద్ద ప్రయత్నం కాబట్టి ఒక స్థిరమైన సంస్థ అండదండలుండాలనిపించి ఇటు గణేశ్వర రావు గారి ‘ తెలుగు సాహితి’ నీ, అటు ఢిల్లీ ఆంధ్రా ఆసోసియేషన్ కృష్ణమూర్తి గారినీ, గోవర్థనరావు గారినీ సహాయం అడిగాము. ‘ ఆర్థిక భారం మాది, ఆర్గనైజేషన్ భారం మీది, ‘ అని ఫ్రీహాండ్ ఇచ్చారు. నవీన్, శివారెడ్డి, దేవీప్రియ, కాళీపట్నం, శివశంకర్ పాపినేని , ‘కథ96’ లో ఎన్నికైన కథారచయితలు ఆరేడు మంది – అదో పండుగ. ఆవిష్కరణ తో పాటు పూర్తి రోజు కథాసదస్సు పెట్టుకున్నాము. వాకాటి ప్రత్యేక అతిధి. కళింగ కథ గురించి మాట్లాడారు కాళీపట్నం.

ఢిల్లీ లో ఉండటం వల్ల అందివచ్చిన మరో సాహితీ అవకాశం -గీతా ధర్మరాజన్ నడిపే కథాసంస్థ కు నాలుగయిదేళ్ళు తెలుగు కథల నామినేటింగ్ ఎడిటర్ గా వ్యవహరించటం. నవీన్ వాళ్ళు ఆ ఏడాది వచ్చిన మంచి తెలుగు కథలను ఏర్చికూర్చి తెలుగు కథా సంకలనాలు వెలువరిస్తే , గీతా ధర్మరాజన్ వాళ్ళు ఆ ఏడాది వివిధ భాషలలొ వచ్చిన మంచి కథలను నామినేటింగ్ ఎడిటర్ల సాయంతో గుర్తు పట్టి, వాటిల్ని ఇంగ్లీష్ లోకి అనువదింపచేసి వార్షిక సంకలనాలు వెలువరించారు. ఖదీర్ బాబు, డా. వి.చంద్రశేఖరావు, గోపిణి కరుణాకర్, శ్రీరమణ  లాంటి వాళ్ళ కథలను ఇంగ్లీష్ లోకి పంపి పదిమందికి అందించే ప్రక్రియ లో నేనూ భాగస్వామినయ్యానన్న సంతృప్తి మిగిలింది. కానీ ‘ కరడు కట్టిన పురుషాధిక్జ్య మనోహరపు పురాణశ్రేణి గాథ కు పంచదార పూత పూసి వదిలిన ” మిథునం” ను నామినేట్ చేయకుండా ఉండలేకపోయానే , అన్నచింత మాత్రం ఇప్పటికీ వదలలేదు.

ఇలా నా సాహిత్యీ యాత్రలో రకరకాల ఘట్టాలు…

ఇంతకూ నేను పాఠకుడినా? రచయితనా? సాహితీ కార్యకర్తనా?

చదివేసి వూరుకోకుండా మంచి సాహిత్యాన్ని పదిమందికీ  పంచే ప్రయత్నం చేసే పాఠకుడి ని.

సాహిత్యామూ, సాహిత్య కారులూ ఎక్కడ కనిపించినా వాళ్లను పదిమందితోనూ కలిపే వ్యసనమున్న కార్యకర్త ను.

అంతా కలిసి ఓ రెండు వేల పేజీలు రాసిన మాట నిజమే కానీ, అదంతా సాహిత్యమనీ, నేను రచయితననీ అనుకోవడానికి ధైర్యం చిక్కడం లేదు.

( దాసరి అమరేంద్ర 60 ఏళ్ల జీవన యాత్రా  సంరంభోత్సవాల సందర్భంగా హైదరాబాద్ లో మార్చి 14 న విడుదల కానున్న పుస్తకం నుంచి కొన్ని జ్ఞాపకాలు)

Image by Pinisetti