అసలు కోణం

 

 

– రాణి శివశంకర శర్మ

~

 

ఆ మహా వ్యాపార దిగ్గజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలని వొక్క దెబ్బతో ఎగరగొట్టేశాడు సిద్ధార్థ. అతనికి అంత శక్తి ఉందని డాక్టర్ కోణార్క్ ‍కు కూడా తెలియదు. డాక్టర్ కోణార్క్ పెద్ద విద్యా వ్యాపారి. కోణార్క్ ఎడ్యుకేషనల్ ఇన్‍స్టిట్యూషన్స్ అనే సంస్థని స్థాపించి శరవేగంతో దూసుక పోతున్న పెద్దమనిషి.

కోణార్కకు ఎదురుగా ప్రిన్సిపాల్ కూర్చొని ఉన్నాడు. “సిద్ధార్థ మంచి లెక్చరర్ కాదు. అతన్ని తీసెయ్యాలి”, అన్నాడు.

“సరే ఆ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళండి”, అన్నాడు కోణార్క్. బయటకి వెళ్తుండగా మళ్ళీ పిలిచాడు. “చూడండీ, మంచి లెక్చరర్లు చాలా మందే ఉంటారు. సిద్ధార్థ లాంటి బ్రిలియంట్స్ కొంత మందే ఉంటారు. అతడు మనకు కావలసిన వాడు. తన గురించి ఎక్కడా నెగటివ్ కామెంట్ చేయొద్దు. అలా చేస్తే నీ ఉద్యోగం ఊడుతుంది” హెచ్చరించాడు కోణార్క్.

సిద్ధార్థ అంటే అంత అభిమానం ఎందుకు కోణార్కకీ?

కోణార్క గుంటూరు జిల్లాలోని వొక కుగ్రామంలో భూస్వామిగా వెలుగొందుతున్న రోజుల్లో సిద్ధార్థ తండ్రి కోణార్కకి నమ్మిన బంటుగా వుండేవాడు. దాని వల్లే తను విద్యావ్యాపారంలో అడుగు పెట్టిన వెంటనే సిద్ధార్థకి ఉద్యోగం యిచ్చాడు. సిద్ధార్థ తన తండ్రిలాగే కోణార్కకి ఆంతరంగికునిగా మారిపోయాడు.

గిట్టని వాళ్ళ ప్రోద్భలం వల్ల ఇన్‍కంటాక్స్ అధికారులు కోణార్కపై దాడి మొదలు పెట్టారు. అప్పుడు సిద్ధార్థ వెంటనే ఎలర్ట్ అయ్యాడు. నల్ల ధనాన్ని కారులో డంప్ చేసి తరలించేసాడు. దాడులు ముగిసాక భద్రంగా తిరిగి అప్పజెప్పాడు.

అంతేకాదు. వొక కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నప్పుడు, కాలేజీ ప్రతిష్టని కాపాడాడు. నిరసన తెలుపుతున్న తల్లితండ్రులనీ, బంధువులనీ బుజ్జగించాడు. విద్యార్థి రాసిన ఉత్తరం మాయం చేసాడు.

సహజంగానే డాక్టర్ కోణార్క్ సిద్ధార్థ ప్రతిభని గుర్తించాడు. నిజానికి సిద్ధార్థ చాలా  ఙ్ఞానం కలిగిన వాడు. కానీ అతని ప్రతిభ క్లాస్ రూమలకు సంబంధించినది కాదు. పౌరులు తరగతి గదుల్లో తయారవుతారు. సమాజాన్ని శాసించేవాళ్ళు క్లాస్ రూం బయట రూపొందుతారు, అనే రహస్యాన్ని గుర్తించిన ప్రతిభాశాలి సిద్ధార్థ.

అతడు పేరుకే లెక్చరర్. రాష్ట్రమంతా వ్యాపించిన కోణార్క్ విద్యా సంస్థలలో యెటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా అక్కడ వాలుతాడు. విషయాన్ని బయటకు పొక్కనీయడు. సమస్యని లోపల్లోపలే ఖతం చేస్తాడు. వొక విద్యార్థినిపై లెక్చరర్లే అత్యాచ్వారం చేసారు.  ఆ సంఘటనని బయటకి పొక్కకుండా , చివరకు మీడియాకి కూడా చిక్కకుండా చేయడంలో సిద్ధార్థ చూపిన ప్రతిభకి కోణార్క్ ఆశ్చర్యపోయాడు. అతని భుజాల మీద తడుతూ అన్నాడు, “యు ఆర్ ఇంటిలిజెంట్ దేన్ ఐనిస్టీన్”.

’ఇతనికి ఐనిస్టీన్‍కీ పోలికా?” అని చెవులు కొరుక్కున్నారు ఉత్తమ పౌరులైన ఉపాధ్యాయులు. అలా పోల్చడానికి కారణం ఉంది. సిద్ధార్థ ప్రతీదీ సాపేక్షకం అంటాడు. విలువలేమీ లేవంటాడు. ప్రతీదీ అనేక కోణాలలోంచీ ఆలోచించాలి అంటాడు. విద్యార్థినిపై అత్యాచారం జరిగినప్పుడు, రెండు చేతులూ కలిసినప్పుడే కదా చప్పట్లూ అని వాదించిన ఘనుడు సిద్ధార్థ. యిప్పుడు అమ్మాయిలు వేసుకునే దుస్తులూ, వాళ్ళ ప్రవర్తన కూడా బాగుండడం లేదన్నాడు.

rafi

Art: Rafi Haque

యిలా అనేక కోణాలని దుమ్ములా రేగగొట్టి సమస్యని చల్లార్చేయ్యడంలో అతడు నిపుణుడు.

అతడు చాలా చదివిన వాడు, చాలా విఙ్ఞానం కలవాడు. మంచి అభిరుచులు కలవాడు కూడా. అది కోణార్కకీ బాగా తెలుసు. వొక సారి కోణార్కకీ జపాన్ దర్శకుడు కురసోవా తీసిన రషోమన సినిమాను చూపించాడు సిద్ధార్థ. ఆ సినిమాలో ఒక హత్యని గురించి నలుగురూ నాలుగు రకాలుగా వ్యాఖ్యానిస్తారు. వారి వారి నేపథ్యాలని బట్టి అలా వ్యాఖానిస్తారు. వొకరి వ్యాఖానానికీ మరొకరి వ్యాఖ్యానానికీ పొంతన ఉండదు. సినిమా అయ్యాక సిద్ధార్థ అన్నాడు. “కోణాలు విభిన్న కోణాలు అంతే. సత్యం అంటూ ఏమీ లేదు. కనుక మనకు కావలసిన సత్యాన్ని మనం సృష్టించుకోవచ్చు. అవసరమైన లాభసాటియైన సత్యాన్ని మనమే క్రియేట్ చెయ్యచ్చు. అల్లచ్చు”.

“సిద్ధార్థా! ఆ అమ్మాయిపై అత్యాచారం సంగతి ……? ”

“ఊరుకోండి సార్, అది నిన్నే సద్దు మణిగి పోయింది”, అన్నాడు సిద్ధార్థ.

“అసలు ఏమి జరిగింది?”

“అసలు ఏమీ జరగలేదు. వట్టి పుకారుగా తేల్చేసాను. మీరు హాయిగా యింటికి వెళ్ళి ఫేమిలీతో గడపండి. యీ రొచ్చంతా మీకెందుకు”, అన్నాడు సిద్ధార్థ.

నిజమే, కోణార్క చాలా స్వచ్చంగా కనిపిస్తాడు. అతనికి యే చిన్న మచ్చయినా అంటగలదా అన్నంత తెల్లగా, తెల్లని దుస్తుల్లో ధవళ హాసంతో తాపీగా ఉంటాడు. తను కోణార్క సూర్యాలయాన్ని దర్శించి వచ్చిన వెంటనే పుట్టాడట. అందుకే అంత అరుదైన పేరును పెట్టారు. ఆయన ఏం చదివాడో యెవరికీ తెలియదు. ప్రపంచాన్ని చదివాను అని చెప్పుకుంటాడు. ఆయన నడుపుతున్న సంస్ఠలన్నీ యింగ్లీషు మీడియంవే.

సిద్ధార్థ సలహాతో తెలుగు భాషా వుద్ధరణ కోసం వొక సంస్థని స్థాపించాడు. పత్రిక నడుపుతున్నాడు. అవార్డులు యిప్పిస్తున్నాడు. అందువల్ల వొక విశ్వవియాలయం వాళ్ళు ఆయన పేరుకి డాక్టర్ తగిలించారు. సిద్ధార్థ నవ్వుతూ అన్నాడు. ” చూసారా నా సలహా యెంత మేలు చేసిందో. మనం అన్ని కోణాలలో ఆలోచించాలి”.

“మనం డబ్బు కోసం కొన్ని పనులు చెయ్యాలి. అధికారం కోసం మరికొన్ని. దాంతోపాటూ సమాజసేవ, పేరు, కీర్తి ప్రతిష్టలు అన్నీ అవసరమే కదా? అవి మీ అధికారానికీ, డబ్బుకీ మరింత వన్నె తెస్తాయి. మీ తెల్లని దుస్తుల్లాంటివే అవీ”, అన్నాడు సిద్ధార్థ.

మాతృ భాషాదినోత్సవం జరపడానికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసాడు కోణార్క.  అదే సమయంలో సిద్ధార్థని వొక ప్రశ్న అడిగాడు. “విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. నువ్వెలాగో మేనేజ్ చేస్తున్నావు సరే, అసలు వీటిని ఆపలేమా?”

“ఎందుకు ఆపడం?”

“వీటి వల్ల మనకి ఎప్పుటికైనా చెడ్డపేరే కదా? అని ప్రశ్నించాడు కోణార్క.

“బహుశా పేరెంట్స్ కూడా ఇటువంటి వ్యవస్థనే కోరుకుంటూన్నారేమో. యిది మాసోచిజం కావొచ్చు. అంటే తమని తాము స్వయంగా హింసించుకోవడం. ఆధిపత్యాన్ని ఆరాధిస్తారు వీళ్ళు. తెలియని యే తీవ్ర శక్తులో నడిపిస్తే నడిచే మనుషులు”, అన్నాడు సిద్ధార్థ తాపీగా.

సిద్ధార్థ అన్న మాటే నిజమైంది. ఆత్మహత్యలే కాదు. విద్యాసంస్థలు కూడా మరింత విస్తరించాయి. బలపడ్డాయి. యితర విద్యా సంస్థలు వీటిలో విలీనమై పోయాయి.

సిద్ధార్థలో గొప్ప దార్శనికుడు కనిపించాడు కోణార్కకి. అనేక కోణాలని ఏక కాలంలో దర్శించగల మేధావి సిద్ధార్థ అనుకున్నాడు ఆయన. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కూడా పెరిగిపోయాయి. కోణార్కకి ప్రభుత్వంలో మంచి పరపతి. అతని బంధువులు మంత్రులుగా వున్నారు. ఉన్నత పదవుల్లోనూ ఉన్నారు. యీ క్లిష్ట సమయంలో ప్రతిపక్షం నోరు మూయించగల మేధావి కావాలన్నారు. సిద్ధార్థని పంపించాడు కోణార్క.

సిద్ధార్థ ఒకటే మాట అన్నాడు. “రైతుల ఆత్మహత్యల వెనుక ఉన్న అనేక కోణాలని లాగండి. వాళ్లకి గల మానసిక వైకల్యాలు, ప్రేమ సమస్యలు, సెక్స్ సమస్యలు, వాళ్ళ బాల్యం, తల్లితండ్రుల కలహాలు, వాళ్ళ పునర్జన్మ, జాతకం… యిలా అన్ని కోణాల గురించీ రకరకాల నిపుణుల చేతా, నిపుణుల్లా ఫోజు యిచ్చే వారి చేతా  మీడియాలో చర్చలు చేయించండి.  రకరకాల కోణాల్ని దుమ్ము లేపండి. ఆ గందరగోళంలో అసలు కోణాలు కప్పడిపోయేలా చేయండి”.  ఆ ప్రాజెక్టుని సిద్ధార్థకే అప్పగించింది ప్రభుత్వం. దాంతో అతని పరపతి వొక్కసారిగా పెరిగిపోయింది.

రైతుల ఆత్మహత్యల వెనుక గల కారణాలను సర్వే చేయించడం మొదలు పెట్టింది ప్రభుత్వం. చాలా చావులకి వ్యక్తిగత సమస్యలే కారణాలుగా తేల్చేసింది. దాంతో ప్రభుత్వానికి నష్ట పరిహారం చెల్లించాల్సిన బాధ్యత తప్పింది. దానికి బదులుగా, తమకు అనుకూలంగా మాట్లాడినందుకు  సైకాలజిష్టులకీ, ఆధ్యాత్మిక వేత్తలకీ డబ్బు చెల్లించింది.

ఈలోగా గ్లోబలైజేషన్ యుగం విజృంభించింది. వ్యక్తికి ప్రాధాన్యం పెరిగిపోయింది. ఎవడి బతుక్కీ, ఎవడి చావుకీ వాడే కారణం అన్న భావన బలపడింది. రైతులు వ్యవసాయాన్ని నమ్ముకోవడం మానేసారు. తమ పిల్లల్ని ప్రయోజకులు చేయాలనుకున్నారు. కోణార్క్ విద్యా సంస్థల్నే నమ్ముకున్నారు. రియల్ ఎస్టేట్‍ని కూడా విశ్వసించారు. లాభపడిన వాళ్ళు లాభపడ్డారు.

యీ పరిస్థితుల్లో కోణార్కని సిద్ధార్థ కలిసాడు. కోణార్క సిద్ధార్థ ముందు ఒక నివేదిక ఉంచాడు. “యిది చూసారా, యీ నెల రోజుల్లో ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వొక విద్యార్థి తోటి విద్యార్థిని హత్య చేసాడు. యిప్పుడు ఆత్మహత్యలకి హత్యలు కూడా తోడయ్యాయి మన సంస్థల్లో.  మనమేమైనా అమెరికాలో ఉన్నామా? అక్కడ తోచుబడి కాక బోర్‍డమ్ వల్ల తోటీ విద్యార్థుల్ని తుపాకితో కాల్చి చంపేసిన వార్తలు చదివి విస్తుపోతుంటాం”, కోపంగా అన్నాడు కోణార్క.

“మనం కూడా అభివృద్ధి చెందుతున్నాం, అంతే” , అన్నాడు కూల్‍గా సిద్దార్థ.

“ఏమంటున్నావ్ నువ్వు?”, గద్దించాడు కోణార్క.

“నేను అన్నది మీరు సరిగానే విన్నారు. మన విద్యాసంస్థలు తామర తంపరగా పెరిగిపోతూ ఉన్నాయి. ప్రపంచం కూడా వేగంగా మారిపోతోంది. టెక్నాలజీ పెరుగుతోంది. సెక్సూ, క్రైమూ రంగుల దృశ్యాలుగా ముందుకొస్తున్నాయి. దాంతో పాటూ డబ్బు విలువ, సంపాదన కోసం పరుగు వొక ఐదు సంవత్సరాల కంటే బాగా పెరిగింది. వెలుగు వెనుక నీడ ఉంటుంది. తప్పదు,” అన్నాడు సిద్ధార్థ.

“మరి మనమేమి చేయాలి?”

సమస్యలు ఉంటాయి. ఉండనీండీ. వాటి నుంచీ దృష్టి మరల్చాలి.” అన్నాడు టీవీ ఆన్ చేస్తూ సిద్ధార్థ.

“నిజానికి విద్యార్థులందరినీ  ఉద్ధరించడం మన పని కాదు. యికపైన బాగా చదివే విద్యార్థులని ఏరదాం. వాళ్ళని ఒక గ్రూపుగా చేద్దాం. యిలా వర్గీకరిస్తూ పోదాం. బాగా చదివే వాళ్ళకి మంచి లెక్చరర్లని నియమిద్దాం. మంచి జీతాలనిద్దాం. మిగిలిన వాళ్ళకి తక్కువ జీతాల లెక్చరర్లని నియమిద్దాం. కానీ అందరినీ వొకే రకంగా టెన్షన్లో వుంచుదాం.”

“ఈ  టెన్షన్‍కి పిల్లలు చస్తున్నారు”, అన్నాడూ విసుగ్గా కోణార్క.

“చావనీండీ, ఆసంగతి నేను చూసుకుంటాను”, అంటూ వెళ్ళిపోయాడు సిద్ధార్థ.

సిద్ధార్థ రావడంలో గానీ పోవడంలో గానీ ఎంతో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంటుంది. అదే కోణార్కకి నచ్చింది. అతడు సమస్యలకి భయపడడు. సమస్యలని పరిష్కరించాలని కూడా అనుకోడు. మానవ జాతి ఉన్నంత వరకూ సమస్యలు ఉంటాయి. యింకా పెరుగుతాయి. వాటిని ఎదుర్కోవడం కాదు. సమర్ధంగా మరుగు పరచడమే తెలివి అంటే. అభివృద్ధి అంటే ఇదే అని సిద్ధార్థ ఫిలాసఫి.

ఈ ఫిలాసఫీ కోణార్కకి కూడా ఇష్టమే. నిజానికి అది ఆయన తత్వమే. అసలు అనుచరులెప్పుడూ నాయకుని  తత్వాన్ని ఆచరించడంలో దూకుడు ప్రదర్శించాలి. రాజుని మించిన రాజభక్తిని ప్రదర్శించాలి.  సరిగ్గా అలాంటి అనుచరుడే దొరికాడు కోణార్కకి.

కోణార్క విద్యా సంస్థలో వొక విద్యార్థి మరో విద్యార్థిని చంపేసాడు. దానికి కారణం గర్ల్ ఫ్రెండ్. ఆమె పుట్టిన రోజుని వొక గొప్ప రెస్టారెంటులో జరపడం కోసం డబ్బు కావలసి వొచ్చి తోటి విద్యార్థిని చంపేసాడు. హంతకుడు చదువులో ఫస్ట్ ర్యాంకర్.

విద్యార్థుల ఆందోళనలు మొదలయ్యాయి. సిద్ధార్థ అన్నాడు.

” యీ విద్యార్థిని కేసుల నుంచీ బయట పడెయ్యాలి. అతడు మన కాలేజీకే మంచి పేరు తెస్తాడు.”

“ఎలా? బయట ఇంత గొడవగావుంటే,” ప్రశ్నించాడు కోణార్క.

డబ్బిచ్చి కొంత మందిని కొనుక్కొచ్చి కౌంటర్ యాజిటేషన్ చేయించాడు సిద్ధార్థ. అవతలి వాళ్ళు చర్చలకి సిద్ధపడ్డారు. నిజానికి ఉద్యమిస్తున్న వాళ్ళని భయభ్రాంతుల్ని చేసారు. గాయపరిచారు. గొడవలు క్రమేపీ చల్లారి పోయాయి. పోలీసులు కూడా డబ్బులు తీసుకొని మిన్నకున్నారు. పేరెంట్స్ కి కూడా కొంత డబ్బు ముట్టజెప్పారు. చనిపోయిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని కేసు మూసేసారు. హంతక విద్యార్థికి ఫస్ట్ ర్యాక్ వొచ్చింది. టీవీలలో, వొత్తిడిలో కూడా రాణించిన చదువరని అతని పేరూ, విద్యా సంస్థల పేరూ మారు మోగిపోయింది.

“సమస్యలు వుంటాయి. వాటికి అనేక కోణాలు ఉంటాయి. మనకు కావలసిన కోణాన్ని మనం బయటకి లాగి ప్రొజెక్ట్ చెయ్యాలి”, అన్నాడు సిద్ధార్థ మందు తాగుతూ. అభినందనగా భుజం తట్టాడు కోణార్క.

వొక కోణార్క విద్యాసంస్థలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అది మామూలే. నిజానికి అదొక వార్త కాకుండా పోవును. ఎందుకంటే కోణార్క విద్యా సంస్థలు చాలా బలపడి పోయాయి యెప్పటి కంటే. ఆత్మహత్యలు, హత్యలు, అత్యాచారాలూ యేవీ వార్తలు కాకుండా పోయాయి. అన్ని విద్యా సంస్థల కంటే ర్యాకులు ఎక్కువగా వచ్చేది అక్కడే. ర్యాంకుల స్కోరు టీవీల్లో మారుమోగి పోయేది.

విద్యార్థులకు తిండి సరిగా ఉండదు. సౌకర్యాలు సరిగా ఉండవు. కోళ్ళ ఫారాల్లా ఉంటాయి. అయినా ఆ విద్యా సంస్థలే ముందుకు దూసుక పోతున్నాయి. యింక క్రైము రేటు కూడా ఎక్కువే. ఆత్మహత్యలూ ఎక్కువే.

కానీ ఆ ఆత్మహత్య రాష్ట్రాన్ని కుదిపేసింది. సిద్ధార్థకి కునుకు లేకుండా చేసింది. సిద్ధార్థ కూడా అశక్తుడుగా మారిపోవడం వల్ల డాక్టర్ కోణార్క కుదేలు అయిపోయాడు. అసలు సమస్య ఆత్మహత్య కాదు. ఆత్మహత్యల్ని మేనేజ్ చేయడం చాలా సులభం. కానీ ఆ విద్యార్థి చస్తూ చస్తూ లేఖ రాసి పోయాడు. దాన్ని ఔత్సాహికులైన వార్తాపత్రికల వాళ్ళు ప్రచురించేసారు. కుల వివక్ష వల్లే ఆ విద్యార్థి చనిపోయాడని దేశమంతా మారుమోగిపోయింది. రాజకీయ నాయకులు కూడా దిగి  పోయారు. ఇక ఏం చేయాలి?

“సిద్ధార్థ యిప్పుడేం చెయ్యాలి? నీ అనేక కోణాల ఫిలాసఫీ వొట్టిపోయిందేమీ?”అని అడిగాడు కోణార్క.

“లేదు. అదెప్పటికీ పని చేస్తుంది. కొంచెం ఆలస్యం కావొచ్చు అంతే. సైకాలజీ, ఫిలాసఫీ, వాస్తు శాస్త్రం, న్యూమరాలజీ యిలా అన్ని రంగాలలో నిపుణుల చేత టీవీల్లో చర్చలు ఏర్పాటు చేయండి. ఆ విద్యార్థి చనిపోవడానికి కారణాలను రకరకాలుగా వదరమనండి. మన వ్యాపారాలకు సంబంధించిన ప్రకటనలు ఇప్పించండి. ప్రస్తుతం ఇంతే. తర్వాత సంగతి ఆలోచిద్దాం”,  అన్నాడు   సిద్ధార్థ.

సైకాలజిస్టులు, అతడు బాల్యం నుంచీ కుటుంబంలో ఎదుర్కొన్న కష్టాలే చావుకు కారణం అన్నారు. ఆ లేఖలో బాల్యం ప్రసక్తి ఉందన్నారు. ఆధ్యాత్మికవేత్త వొకరు ఆ విద్యార్థి తన లేఖలో దేహం, ఆత్మ వేరు పడి పోయిందని ప్రకటించాడు. కనుక ఆధ్యాత్మిక సమస్యలే కారణమన్నాడు. న్యూమరాలజిస్టు అతనికి పేరులో అక్షరాల సంఖ్య ఆత్మహత్యకు కారణమన్నాడు. జ్యోతీష్యుడు గ్రహబలం సరిగా లేదన్నాడు.  బ్రేకులూ, ఎడ్వర్టయిజ్‍మెంటులూ మధ్య చర్చలు సాగుతున్నాయి. కుల వివక్ష నుండీ దృష్టి మళ్ళించడానికి శాస్త్ర పాండిత్యాలన్నీ భేషుగ్గా ఉపయోగపడుతున్నాయి.

“ప్రపంచం అన్న తరవాత అన్నీ ఉంటాయి. కుల వివక్షో మరో వివక్షో యెలాగూ ఉంటుంది. దాన్ని పెద్ద యిష్యూ కాకుండా యెలా అడుక్కి నెట్టాయలన్నదే మనం ఆలోచించాలి. అదే తెలివి అంటే”, అన్నాడు సిద్ధార్థ.

కానీ తాను స్వారీ చేసే పులి తననే బలి కోరినట్లైంది కోణార్క పరిస్థితి. కోణార్క కూతురునే ప్రేమలో పడేసాడు సిద్ధార్థ. “మీరే సిద్ధార్థ చాలాతెలివైన వాడని మెచ్చుకుంటారు కదా”, అని ఎదురు ప్రశ్న వేసిందా అమ్మాయి.

“యే రకంగా సరి తూగుతాడు మనతో”, అని అడిగాడు కోణార్క. అతనికి ఆస్తులు లేకపోవచ్చు. తెలివి ఉంది. అతని తెలివి వల్లే మన ఆస్తులూ, డబ్బూ ఎదుగుతూ వొచ్చాయి. అతని బుర్ర కన్నా వేరే ఆస్తేం కావాలి?” అని అడిగింది.

“బుర్రలెన్నయినా కొనొచ్చు డబ్బుంటే. కానీ కులాన్ని ఎక్కడ కొంటాం? అతని కులం నీకు తెలుసా?

“కులం అంత ముఖ్యమా?”

“కులమే ఆస్తి”

“నాన్నా, నేను  అతన్నే పెళ్ళాడతాను. నిర్ణయించేసుకున్నాను”,  అని కుండలు  బద్దలు కొట్టింది ఆ అమ్మాయి.

కోణార్క మౌనంగా ఊరుకున్నాడు. సిద్ధార్థ చెప్పినట్లూ సమస్యలు అన్ని చోట్లా ఉంటాయి. యెప్పుడూ ఉంటాయి.

తర్వాతి రోజు సిద్ధార్థ ఉత్సాహంగా కోణార్క ఆఫీసుకొచ్చాడు.

“చాలా ఎదిగి పోయావు నువ్వు. నన్ను మించి పోతున్నావు” , అన్నాడు కోణార్క. సిద్ధార్థ చిరునవ్వు నవ్వాడు. కొద్ది సేపు ముచ్చట్ల తర్వాత బయలు దేరాడు. కోణార్క అన్నాడు, ” నువ్వు చాలా పైకి వెళ్తావు”.

ఆ రోజే సిద్ధార్థ చనిపోయాడు. అది రోడ్డు యాక్సిడెంటా, ఆత్మహత్యా   లేక హత్యా? నల్లుగురూ నాలుగు రకాలుగా చెప్పుకున్నారు.కురసోవా సినిమాలాగే రకరకాల కథలు వ్యాపించాయి.

వొక రోజున కోణార్క తన కొడుక్కి హిత బోధ చేసాడు.

“నేను పెద్దవాన్ని అయిపోయాను. వ్యాపారాలన్నీ ఇక నువ్వే చూసుకోవాలి. అన్ని విషయాలనీ అన్ని కోణాలనుంచీ అర్థం చేసుకోవాలి. కానీ మనకు కావలిసిన కోణాన్నే బయట పెట్టాలి. చూడూ తెలుపులో అన్ని రంగులూ ఉంటాయి. అన్ని రంగులనూ తొక్కేసి తెలుపే తెల్లగా రాజ్యం చేస్తుంది. నలుపుని కూడా తెలుపు చేస్తుంది. ఎరుపుని కూడా తెలుపు చేసేస్తుంది. బుర్ర ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ బుర్రల్ని అన్నింటినీ కొని ఆధిపత్యం చెలాయించగల వాడు ఒకడే ఉంటాడు. యీ వొక్క రహస్యం గుర్తుంచుకో. యీ వొక్క కోణాన్ని మరచిపోకు”

*

మన చరిత్రలో చీకటీ వెలుగూ!

 

-రాణి శివశంకరశర్మ

~

 

Rani sarmaభారతీయులు కార్యకారణ సంబంధాన్ని అర్ధం చేసుకోలేక చీకటిలో కూరుకు పోయారనే వాదం ఆధునిక కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. కార్యకారణ సంబంధం, విశ్వాసం, వేరు వేరు.. ఈ రెండూ ఎక్కడా కలవవు అని వారు వాదించారు. భారతీయులు విశ్వాసమనే చీకటిలో కూరుకుపోయి, కార్యకారణ సంబంధాన్ని విస్మరించారు. క్రైస్తవ వలసవాదులు వాళ్ళ కళ్ళు తెరిపించారు. కార్యకారణ సంబంధం లోకి, హేతుబద్ధతలోకి వాళ్ళని మేల్కొలిపారు అని వీరి వాదన.

కన్నుగానని వస్తుతత్త్వము

కాంచగలుగుదురింగిలీజులు (గురజాడ)

కంటికి కనబడని వస్తుతత్త్వం అంటే ఏమిటి? కార్యకారణ సంబంధమే!

కార్యకారణ సంబంధమే కాదు, దేవుడు కూడా కంటికి కనబడడు. దేవుడు కూడా కార్యకారణ సంబంధం నుంచే పుట్టాడు. దేవుడు మూఢవిశ్వాసమైతే, కార్యకారణ సంబంధం పట్ల ఆధునికులకు గల తిరుగులేని విశ్వాసం కూడా మూఢవిశ్వాసమే!

కార్యకారణ సంబంధం పట్ల తిరుగులేని విశ్వాసమే సైన్సుకి మూలాధారం. అంటే కార్యకారణ సంబంధాన్ని పరిశీలించడం ద్వారా వస్తుతత్త్వాన్ని గుర్తెరగవచ్చనే విశ్వాసం అన్నమాట.

ఐతే కార్యకారణ సంబంధం గురించి మనుషులకే కాదు, జంతువులకీ పక్షులకీ చివరికి మొక్కలకి కూడా తెలుసు. పక్షి గూడుని నిర్మిస్తోందంటే ఈ కార్యకారణ సంబంధం తెలియడం వల్లే!

కాని కార్యకారణ సంబంధం పట్ల తిరుగులేని విశ్వాసం మనిషిలో మాత్రమే వుంది. దీని నుంచే దేవుడూ సైన్సూ పుట్టుకొచ్చాయి. అంటే మతమూ సైన్సూ కూడా ఒకే మూలం నుంచి ఒకే రకమైన విశ్వాసం నుంచి పుట్టాయి. కుండకి కుమ్మరి నిమిత్త కారణం. అట్లాగే విశ్వానికి దేవుడు. యింత సింపుల్ లాజిక్ మీద ఆధారపడి దేవుడు పుట్టాడు. యిక్కడ కార్యకారణ సంబంధమే పనిచేసింది.

కుండ చేయడానికి కుమ్మరి ఉన్నాడు. అలాగే వివిధ వృత్తి పనులు చేయడానికి మనుషు లున్నారు. ప్రకృతిలో కూడా కార్యకారణ సంబంధం యిలా సహజంగా పనిచేస్తుండగా వేరే దేవుడెందుకు? అని ప్రశ్నించినవాడు కుమారిలుడు. ఈయన మీమాంసా శాస్త్రవేత్త, వైదికధర్మ వ్యాఖ్యాత. దేవుడు చనిపోయా డంటూ యూరప్ గగ్గోలు పెట్టింది కానీ, భారతదేశంలో దేవుడసలు పుట్టనే లేదు.

బుద్ధుడు కార్యకారణ శృంఖల అన్నాడు. కార్యకారణాలు గొలుసు లాంటివి. అంటే ఒకదాని మీద మరొకటి లింకై అనంతంగా ఉంటాయన్నమాట. ఈ ఆలోచనకు ప్రాచీన సాంఖ్యతత్త్వం మూలం. దేవుడనేవాడుంటే వాడికి కూడా మరొక కారణం వుండాలి అంది సాంఖ్యం. కార్యకారణ అభేదాన్ని చెప్పింది సాంఖ్యం. కారణంలోనే కార్యం వుంటుంది. విత్తులోనే చెట్టుంటుంది. అంటే కర్త క్రియ వేరు కాదు, రెండూ ఒకటే. యింక దేవుడు ఎక్కడ దొరుకుతాడు?

నిజానికి దేవుడు యూరప్ లో పుట్టాడు. క్రైస్తవంలో పుట్టాడు. యూరపియన్ క్రైస్తవంలో పుట్టాడు. నిజానికి మూల క్రైస్తవం గురించి మనకేం తెలుసు? బిగ్ బ్యాంగ్ థియరీకి, బైబిల్ విశ్వాసానికి సంబంధం వుంది. అందుకే రోమన్ చర్చి ఆ సిద్ధాంతాన్ని సమర్ధించింది. ఈమాట ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ చెప్పనే చెప్పాడు. ఐతే విశ్వానికి మొదలు ఉంటేనే దేవుడు ఉండే అవకాశం ఉంది. కాని విశ్వం అనాది, అనంతం కనుక దేవుడు లేడు పొమ్మన్నాడు (బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం). భారతీయుల విశ్వాసాల ప్రకారం అంతా అనాది. యింక దేవుడెక్కడ?

ఆధునిక సైంటిస్టులు క్రమేపీ పాంథీయిజం వైపు ప్రయాణించారు. దేవుడే యీ విశ్వంగా రూపాంతరీకరించబడ్డాడనేదే పాంథీయిజం. అటువంటి విశ్వాసంలో మాత్రమే అనంతం అనేది సాధ్యమౌతుంది.

భారతీయులకి అనంతం అంటే ముద్దు. దాన్ని గ్రీకులు చీకటిగా భావించారు. అనంతంలో నామ రూపాలు ఏర్పడవనీ, పరిధి కల చోట మాత్రమే అవి ఏర్పడతాయని అరిస్టాటిల్ అన్నాడు. కాని హెగెల్ ‘అనంతం’ అనేది ఆధునిక కాలపు విప్లవంగా భావించాడు. ఎందుకంటే… గణితంలోనూ, భౌతికశాస్త్రంలోనూ, తత్త్వశాస్త్రంలోనూ అనంతం ఆవిష్కరించ బడుతూ వచ్చింది (రీజన్ ఇన్ రివోల్ట్).

గ్రీకులు చీకటిగా భావించిన ‘అనంతం’ అనే కాన్సెప్టులో భారతీయులు వీరవిహారం చేశారు. అనంతం అనేది అనంతుడైన పరమాత్మ వంటిది. పరమాత్మ కూడా జీవసృష్టి వల్లగానీ, లయము వల్లగానీ మార్పు చెందడు అంటాడు ప్రాచీన గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్యులు (సిద్ధాంత శిరోమణి).

సృష్టి ప్రళయాలు కూడా తుదీ మొదలూ లేకుండా సాగుతాయి. అది అనంతమైన ప్రాసెస్. అందువల్ల సృష్టికర్త లేడు, ఉన్నా నామమాత్రుడు. మొదలూ తుదీ లేని చోట కర్తని ఎక్కడ నిలబెడతావు? బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం నిజమైతే, భారతీయ తత్త్వం ప్రకారం అనంతమైన బిగ్ బ్యాంగ్ ల గొలుసు మాత్రమే ఉంది. ఆ గొలుసుకి మొదలు లేదు. అదే బుద్ధుడు చెప్పిన కార్యకారణ శృంఖల. నిజానికి అనంతంలో యిది కూడా సాధ్యం కాదు. ఎందుకంటే బిగ్ బ్యాంగ్ లో కాలమూ స్థలమూ కూడా కుదించబడతాయి. బిగ్ బ్యాంగ్ కీ దేవుడికీ గల అక్రమ సంబంధాన్ని గుర్తించిన కొందరు కమ్యూనిస్టులు యీ సిద్ధాంతాన్నే తిరస్కరించారు (Reason in Revolt-Marxist Philosophy and Modern Science by Alen Woods and Ted Grant).

అనంత విశ్వాలు ఉన్నాయన్నందుకే బ్రూనోని దహనం చేశారు. బ్రూనో పునర్జన్మపై విశ్వాసాన్ని కూడా ప్రకటించాడు. జన్మ పరంపర అనేది కూడా అనంతమే. అంటే విశ్వాన్ని గురించి, జన్మల గురించి అతని దృక్పథం క్రైస్తవానికి విరుద్ధం. బ్రూనో నాటికి ప్రసిద్ధంగా ఉన్న ‘టోలమీ నమూనా’ ప్రకారం విశ్వం పరిమితం, కాలం పరిమితం. దాన్ని బ్రూనో విశ్వాసాలు బద్దలు చేస్తుండడంవల్లనే ‘పేగన్’ అని ముద్ర వేసి చంపేశారు. యిది అనంతం అనే భావనపై వేటు.

నిజానికి ఆధునిక సైన్సుకి మూలాలు చాలావరకు క్రీస్తు పూర్వం లోనే ఉన్నాయని అనేకమంది మేధావులు భావించారు. సూర్యకేంద్రక సిద్ధాంతానికి ప్రేరణన్ గ్రీకుల సూర్యారాధనలో వుంది అన్నాడు బెర్ట్రాండ్ రసెల్. విశ్వం కొన్ని నియమిత సూత్రాల ప్రకారం పని చేస్తుందన్న సైన్సు నమ్మకానికి మూలం గ్రీకుల FATE లో ఉంది అని ఆయన చెప్పాడు (Is Science Superstitious).

ఇదంతా ఎందుకు చెప్పాల్సొస్తోందంటే సైన్సూ విశ్వాసమూ వ్యతిరేక దిశలో ప్రయాణిస్తాయన్నది తప్పు. సైన్సు కూడా విశ్వాసాల పుట్ట. విశ్వాసం లేనిదే విశ్వం లేదు. అందుకే ఆస్ట్రానమి, ఆస్ట్రాలజీ కవలలు గా జన్మించాయి. రసవిద్య రసాయనిక శాస్త్రం కవలలు. తంత్రశాస్త్రం దేహంపై తీవ్ర విశ్వాసం కలిగింది కావడం వల్లే మెదడుకి గల ప్రాధాన్యాన్ని యేనాడో గుర్తించగలిగిందని దేవీప్రసాద్ చటోపాధ్యాయ అన్నారు (లోకాయత).

కనక సైన్సు కూడా విశ్వాసజనితమే. ఏమిటా విశ్వాసం? కార్యకారణ సంబంధం పై విశ్వాసం. యీ విశ్వాసం చేసిన పనేంటంటే … కాన్సెప్టులని సృష్టించడం. దేవుడిపై నమ్మకం మతాన్ని సృష్టిస్తే, కార్యకారణ సంబంధం పై తిరుగులేని నమ్మకం కాన్సెప్టులని సృష్టించింది. థియరీలని సృష్టించింది.

పక్షి గూడు కట్టుకుంటుంది. కాని ‘గూడు’ అనే భావాన్నీ కాన్సెప్టునీ అది సృష్టించలేదు. అందుకే ప్లేటో ‘భావాలే మూలం’ అన్నాడు. ఒక ఇమేజి, వొక కాన్సెప్టు, వొక భావం వీటిని మనిషి మాత్రమే సృష్టిస్తాడు. క్రిమి కీటకాలూ, పక్షులూ, జంతువులూ కూడా గూళ్ళు బోరియలు లాంటి వస్తువులను సృష్టించగలవు. కాని భావాలని కాన్సెప్టుల్ని మనిషి మాత్రమే సృష్టించగలడు. అంటే మనిషి ప్రాధమిక లక్ష్యం వస్తువుల్ని సృష్టించడం కాదు, భావాల్ని సృష్టించడం. యీ భావాల్ని సంస్కారాలుగా తర్వాతి తరానికి అందజేస్తాడు. ‘యద్భావం తద్భవతి’ అన్నది అందుకే. నువ్వెలా భావిస్తే, ఊహిస్తే అలా ఉంటుంది ప్రపంచం.

ఇల్లూ పక్షి గూడూ ఒకటి కాదు. రెండూ కార్యకారణ సంబంధం నుంచే పుట్టాయి. కాని ఇల్లు అనేది మనిషి సృజించిన భావం. అదొక వస్తువు కాదు. అదొక ఇమేజి, కాన్సెప్టు. అందుకే అది వినూత్న రూపాల్ని ధరిస్తుంది. మనుషుల ఊహలూ, భావాలూ ‘ఇల్లు’ అనే పదార్ధంలో తీవ్రమైన మార్పులు తెస్తాయి.

ఇల్లు ఎలా ఉండాలి? ఏది మంచి ఇల్లు, ఏ మోడల్ మంచిది అనేదాన్ని మనిషి సంస్కృతీ సంస్కారం నిర్ణయిస్తుంటాయి. అంటే సింపుల్ కార్యకారణ సంబంధం మనిషిలో స్మృతి పరంపరగా పదిలం చేయబడుతుంది.

యీ స్మృతులు ఆయా స్థలకాలాల్లో విభిన్నంగా ఉంటాయి. వీటినుంచి అక్కడి సంస్కృతి నిర్మించ బడుతుంది. ఈ సంస్కృతే లేకపోతే మనిషి లేడు. ఇంత వివరణ తర్వాత నేను సాహసించి ఒక ప్రశ్నని సంధిస్తాను. ఆధునిక సైన్సుని యూరోపీయ క్రైస్తవం శాసిస్తోందా? బిగ్ బ్యాంగ్ థియరీ వెనక క్రిస్టియన్ మోటివేషన్ ఉందా? అదే నిజమైతే కార్యకారణ సంబంధాన్ని సంస్కృతీ మతమూ శాసిస్తుందన్నమాట. అలాంటప్పుడు కార్యకారణ సంబంధం పై విశ్వాసం మతవిశ్వాసం కంటే నిష్పాక్షికమైనదని, పారదర్శక మైనదని యెలా చెప్పగలం!?

బిగ్ బ్యాంగ్ థియరీని అంటుకొని గాడ్ పార్టికిల్ కోసం చేసిన అన్వేషణను క్రైస్తవ అన్వేషణ అనొచ్చా? యీ మెగా సైంటిఫిక్ ప్రాజెక్టుల వెనక మతపరమైన పాక్షిక దృష్టి పనిచేయడం లేదని ఎలా చెప్పగలం? యద్భావం తద్భవతి. నువ్వలా చూడాలనుకొన్నావు గనక, ప్రపంచాన్ని నువ్వలా నిర్వచించాలనుకొన్నావు గనక నీకలా కనిపిస్తోందా?

మొత్తంగా సైన్సు చరిత్రని పరిశీలిస్తే దాని కార్యకారణ సంబంధం వెనక పాంథీయిజం, పేగనిజం, హెలెనిజం చాలావరకూ పనిచేశాయి. బ్రూనో లాంటి వాళ్ళ మీద దాడి నిజానికి సైన్సు మీద దాడి కాదు. యూరోపీయ క్రైస్తవ వ్యతిరేక భావాల మీద దాడి.

బిగ్ బ్యాంగ్ థియరీ విజయం ద్వారా యితర ప్రాపంచిక దృక్పథాల్ని క్రైస్తవ సైంటిస్టులు వెనక్కి నెట్టేశారు. సైన్సు పేరుతో జరిగిన క్రూసేడు యిది. ఈ క్రూసేడులో భరతఖండం కూడా బాధితురాలే. ఎందుకంటే, క్రైస్తవమత పూర్వపు యూరప్ కీ మనకీ పోలికలు ఉన్నాయి. ఆ ప్రాచీన గతం నుంచే బ్రూనో, గెలీలియో వంటి వారు స్ఫూర్తిని పొందారు. అలాంటి స్ఫూర్తిని వాళ్ళు ప్రాచ్యం నుంచి కూడా పొంది ఉండవచ్చు.

బ్రూనోని ఇటాలియన్ కాథలిక్ క్రైస్తవులు సజీవ దహనం చేసి అతని చితాభస్మాన్ని టైబర్ నదిలో కలుపు తున్నప్పుడు మనదేశంలో యమునా నది ఒడ్డున అక్బర్ చక్రవర్తి సర్వమత సమానత్వాన్ని పెంపొందింప జేయడానికి ప్రయత్నిస్తున్నాడు. విభేదాల్ని సంవాదాలుగా మార్చడానికి కృషి చేస్తున్నాడు.

యిక్కడ నేనొక ప్రాచీన కథని ఉటంకించకుండా  ఉండలేను. దేవదానవులందరూ స్త్రీ పురుష భేదం లేకుండా యుద్ధానికి సిద్ధమయ్యారు. ఒక్క సరస్వతీదేవి మాత్రం దూరంగా వుంది. ఆమెని దేవతలూ రాక్షసులూ కూడా తమవైపుండి పోరాడమని ప్రార్థించారు. అప్పుడు సరస్వతీదేవి వారికి ఒక సత్యాన్ని బోధించింది. “యుద్ధానికి ముగింపు ఉండదు. సంవాదం చర్చల ద్వారా వివాదాల్ని పరిష్కరించుకోండి.” యిటీవల అసహనం చర్చనీయాంశమైన సందర్భంలో వొక కన్నడ రచయిత యీ కథని స్మరించాడు. అక్బర్ ఈ మార్గాన్నే ఎంచుకున్నాడు. బ్రిటీష్ వాళ్ళు పూర్తిగా ఆధిపత్యం చెలాయించేంతవరకు సంవాద పద్ధతి కొనసాగిందని వెండీదోనిగర్ రాశారు (Hinduism – An alternative history).

క్రైస్తవవలసకు పూర్వం భారతదేశంలో ఉన్న స్థితిని చీకటియుగంగా భావించారు మన మేధావులు. ఇది లెఫ్టిస్టులకీ రైటిస్టులకీ కూడా చీకటిచరిత్రే. లెఫ్టిస్టు లేమంటారు? ఆకాలం కులతత్వపు చీకటితో నిండి ఉందంటారు. రైటిస్టులేమంటారు? అది ముస్లిం మతపు చీకటి అంటారు. ‘కసాయిబు’ల కాలం అంటారు. వీరిద్దరూ ఒకచోట కలుస్తారు. అది చీకటి. భారతీయులది చీకటి చరిత్ర.

భారతీయుల గతం చీకటి చరిత్రగా ఎందుకు కనిపించింది? దాని వెనక వున్న కార్యకారణ సంబంధం ఏమిటి?

మార్క్సు భారతీయుల గతం గురించి మూడు రకాలుగా చెప్పాడు. 1) నిరంతర ఓటమి 2) అంతులేని వైరుధ్యాల పుట్ట 3) అధమ మతం, ప్రకృతి ఆరాధనతో కూడిన పేగన్ మతం (ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం). వీటికి పరిష్కారం ఏమిటి? తిరిగి ఓటమి. బ్రిటిష్ చేతిలో ఓటమి. మార్క్సు మాటల్లో భారతీయులకు ఓటమి కొత్తేమీ కాదు. ఏ తురక చేతుల్లోనో కాకుండా బ్రిటిష్ వాడి చేతిలో ఓడిపోవడం మంచిదైంది. దీనికి కొనసాగింపే శ్రీ శ్రీ రాసిన దేశచరిత్రలు. ముస్లిం నియంతల పేర్లు తప్ప ఇంగ్లీషు నియంతల పేర్లు ఆ కవితలో కనబడవు. ఎందుకంటే భారతదేశాన్ని ఇంగ్లీషువాడు ఓడించడమే మంచిదైం దని మార్క్సు అన్నాడు కనుక. బంకించంద్ర చటర్జీది కూడా అదే పాట. ముస్లిం నియంతృత్వపు చీకటి నుంచి బ్రిటిష్ వాళ్ళు మనల్ని బయట పడేశారన్నాడు. జార్జి చక్రవర్తి హింసాత్మక విజయాన్ని గురజాడ కూడా శ్లాఘించాడు. ఈ ఆధునిక కవుల అభిప్రాయాలన్నీ ‘బ్రిటిష్ యుగం హింసాత్మకమైనప్పటికీ అది భారతదేశాన్ని గ్రామీణ చీకటి నుంచి విముక్తి చేసిన యుగం’ అన్న మార్క్సు మాటలకు ప్రతిధ్వనులే!

ఇప్పటికీ భారతీయ గతాన్ని మూడు రకాల చీకటిగా చూడడం జరిగింది. 1) గ్రామీణత 2) కులం 3) ముస్లిం సంస్కృతి. ఈ మూడూ విమర్శకుల దృష్టిలో చీకట్లే. విప్లవ మేధావి కెవిఆర్ బ్రిటిష్ పూర్వ యుగాన్ని ‘నిశీధిని’ అన్నాడు.

భారతదేశాన్ని చరిత్ర పూర్వ యుగంగా భావించాడు హెగెల్. అలాగే భావించాడు మార్క్సు. క్రైస్తవ పూర్వ సమాజంగా భావించారు క్రైస్తవులు. వీరి భావాలే కమ్యూనిస్టుల్నీ, ఆధునికుల్నీ, హిందూవాదుల్నీ ప్రభావితం చేశాయి. ఈ అన్ని దృక్పథాల వెనక కార్యకారణ సంబంధం పనిచేస్తోంది. అది క్రైస్తవ యూరోపీయ కార్యకారణ సంబంధం. దృష్టే సృష్టి.

అన్ సర్టైనిటి థియరీ, కేయాస్ థియరీ, క్వాంటం ఫిజిక్స్ ద్రష్టకి ప్రాధాన్యాన్ని పెంచాయి. దేవుడు పాచిక లాడడని ఐన్ స్టీన్ అన్నాడు. క్వాంటం ఫిజిక్స్ గురించి మాట్లాడే సందర్భంలో ఈ మాటలన్నాడు. భారతీయ దృక్పథం ప్రకారం ప్రపంచం దేవుడి లీల, క్రీడ మాత్రమే. అతనికి తోచుబడి కాక యీ క్రీడ మొదలు పెట్టాడు. మొదట తనని తాను రెండుగా స్త్రీ పురుషులుగా విభజించుకొన్నాడు. మైథునక్రీడ జరిపాడు. అప్పుడు సృష్టి మొదలైంది. దీన్ని సృష్టిక్రీడ లేక ఇంద్రజాలం అంటారు. క్రీడల్లో లాగే ఇంద్రజాలం సూత్రాలు కూడా కల్పితం. ఎవడా సూత్రాల్ని కల్పిస్తాడో, ఏ దృక్పథంతో కల్పిస్తాడో, ఆ రూపం ధరిస్తాయి. అటువంటి సూత్రాలు ఏర్పడతాయి. నువ్వు దేవుణ్ణి ఏరూపంలో చూడాలనుకొంటే ఆ రూపంలో కనబడతాడు. ప్రపంచం ఏరూపంలో కనబడాలనుకుంటావో అలా కనబడుతుంది. నిశ్చల సూత్రాలు లేవు. నువ్వు యూరోపీయ క్రైస్తవ దృక్పథంతో చూడాలనుకుంటే ప్రపంచం అలాగే కనబడుతుంది. భారతదేశానికి ఓటమి సహజాతం అని మార్క్సు అన్నాడు. అది అతని దృష్టి. అసలు ఓటమి అంటే ఏమిటి? భరతఖండ స్వరూప స్వభావాలు ఎటువంటివి? దీన్ని మనం తులనాత్మక పద్ధతిలో నిర్వచిద్దాం.

చైనా చాలాకాలం పాటు మిగిలిన ప్రపంచానికి దూరంగా ఉండిపోయింది. ఒకే భాష ఒకే లిపి అందుకే అక్కడ సాధ్యమయ్యాయంటారు. బ్రిటిష్ వాళ్ళు మత్తు మందు యుద్దాలతో లొంగదీసేవరకు చైనా తన మానాన తాను బతికింది. అమెరికా సంగతి చెప్పక్కర్లేదు. సుదీర్ఘకాలం పాటు ఏకాంతంలో జీవించింది. యూరోపియన్ల ప్రవేశంతో వారితో వచ్చిన సూక్ష్మక్రిములు స్థానికుల్ని చంపేశాయి. మిగిలినవారిని గన్నులు వేటాడాయి. చరిత్ర లేని, బలమైన స్మృతులు లేని కొత్తజాతి పుట్టుకొచ్చింది.

భారతదేశానికొస్తే, యిక్కడ అడుగు పెట్టని జాతి లేదు. యిక్కడ దొరకని భాష లేదు. ముక్కోటి దేవతలు. యిక్కడ ఎవరు ఎవర్ని జయించారు, ఎవరు ఓడిపోయారు!? సుదీర్ఘమైన గతం. యింకా చదవబడని హరప్పా లిపి. భరతఖండం ఎప్పుడూ ఒంటరిగా లేదు. అతిధులు ఎక్కువ. అందుకే ఆతిధ్యం భారతీయుల ప్రత్యేకత అయ్యింది. నిజానికి అతిధుల్నీ స్థానికుల్నీ వేరు పరచడం అసాధ్యం. ఇది అతిధుల దేశం.

అందువల్లనే అమెరికాకి చరిత్రని వెతకలేం. ఇండియా చరిత్రని గుర్తుపట్టలేం. ఎందుకంటే అమెరికాకి చరిత్ర లేదు. ఇండియాకి గుర్తించగలిగే చరిత్ర లేకున్నా గాఢమైన స్మృతులున్నాయి. యిక్కడ చరిత్రని వెతికే వాడు మూర్ఖుడు. స్మృతుల్ని వెదికేవాడు ఋషి. ఆ స్మృతులు ఎక్కడుంటాయి. ప్రజల నాల్కల మీద ఉంటాయి. స్థానిక సంస్కృతుల్లో ఉంటాయి. ఎవరో మనకి అశోకుడి పుట్టు పూర్వోత్తరాలు తెలియవని బాధ పడ్డారు. కానీ మనకి సూఫీ గురువుల బోధలు తెలుసు. కబీర్ దోహేలు తెలుసు. వేమన పద్యాలు నోటికొస్తాయి. అతి ప్రాచీనమైన వేదాలు కంఠతా వచ్చు. ఇవి స్మృతులు, గాఢమైన స్మృతులు. ఈ స్మృతుల్ని అధ్యయనం చెయ్యడం వల్ల మనుషుల మధ్య అనుబంధాలు దృఢమౌతాయి. మనకి అశోకుడి పుట్టుపూర్వోత్తరాలు తెలియకపోయినా, హరప్పా లిపి చదవలేకపోయినా, వర్తమానంలో మిగిలి ఉన్న సజీవ సంస్కృతులలో కులపురాణాలలో మన గత సంస్కృతి అందుతూనే ఉంది.

ఇంతకీ చరిత్ర మనకి ఓడిపోవడం గెలవడం అనే భావాల్ని నేర్పింది. ఎప్పుడూ మనం ఓడిపోలేదు, ఎప్పుడూ గెలవనూ లేదు. భరతఖండానికి సంబంధించినంతవరకూ గెలుపోటములు వలస క్రైస్తవులు కనుగొన్న విషయాలు మాత్రమే. ఎందుకంటే వాళ్ళు మనలో ఒకరుగా ఉండదలుచుకోలేదు. దూరంగా ఉంటూ బిజినెస్సు చెయ్యదలుచుకున్నారు. అందుకని మనని ప్రాచీన ఆర్యుల దగ్గరినుంచి అందరూ ఓడిస్తూ వచ్చారని గెలుపు చరిత్ర మనకు లేదని నూరిపోశారు. ఆర్యుల దండయాత్ర కథ కట్టుకథ అని తేలిపోయినా మనం దానినే అంటిపెట్టుకొని ఉన్నాం. చరిత్ర దయ్యంలా మనల్ని వెంటాడుతోంది. చరిత్ర అంటే గెలుపు అని, ఒక జాతి మరొక జాతి మీద జెండా ఎగరెయ్యడమనీ బ్రిటిష్ వాడు మనకి నూరి పోశాడు. మన సంస్కృతినీ సంప్రదాయాల్నీ కళల్నీ మొత్తం మన జీవితాలనే తాను గెల్చుకున్నానని చాటాడు. యీ వలసవాద దృష్టితోనే భరతఖండాన్ని నిరంతరం వోడిపోయే దేశంగా మార్క్సు వర్ణించాడు.

తెల్లవాడు వచ్చాక తెల్లారింది. అంతకుముందు అంతా చీకటే. అందుకే మరో వందేళ్ళు మనదేశాన్ని ఇంగ్లీషు వాడు పాలిస్తే బాగుండునని కంచ ఐలయ్యగారు అన్నారు. యిటువంటి భావాలు పాశ్చాత్య క్రైస్తవ అభివృద్ధి నమూనాకీ, టెక్నాలజీకి తిరుగులేని ఆధిపత్యాన్ని కట్టబెడుతున్నాయి. వలసవాదుల గెలుపు భావన, రాజ్యాధికార భావన మనల్ని వెంటాడుతోంది. అందరూ రాజ్యాధికారమే తమ లక్ష్యమని ప్రకటించుకుంటున్నారు.

(రెండో భాగం వచ్చే గురు వారం)