మాట్లాడ్డం ఎంత ముఖ్యమో రాయడమూ అంతే ముఖ్యం!

AnaamakuduRamasastri_DSC00726

*

అనామకుడి అసలు పేరు రామశాస్త్రి.  రిజర్వ్ బేంక్ లో ఉన్నతాధికారి. ఐఐటీ నుండి డాక్టరేట్. ఆక్స్ఫోర్డ్, కెల్లాగ్స్ లలో మేనేజ్మెంట్ చదువు.  ఫైనాన్స్ రంగంలో రెండు ఆంగ్ల పుస్తకాలు – అందులో ఒకటి చైనీస్ లో ప్రచురితం.  తెలుగులో రమణీయం, శీలమా అది యేమి అనే కథా సంపుటాలు.  కథలతో పాటు పద్యాలూ, నాటకాలూ, నవలలూ. ఓ రెండు నవలల్ని కలిపి ట్విన్నవలలుగా ప్రచురిస్తున్నారు.

చదవాలనుకుంటూ అన్ని రకాల పుస్తకాలూ చదువుతుంటారు. రాయకూడదనుకుంటూ అప్పుడప్పుడు రాస్తూనే ఉంటారు.

అనామకుడిననుకుంటారు కానీ సనామకుడే, సునామకుడే.

నాకు ఆరవ తరగతిలో పరిచయమయ్యాడు ఈ అనామకుడు.  మా ఇద్దరికి తెలుగంటే ప్రాణం అనుకోండి,అది పక్కన పెడదాం.  సాహిత్యం అంటే కూడా చాలా ఇష్టం.  నా సొద తరువాత.  ముందు అతన్ని గురించి చెబుతాను.  అతను వ్రాయడం మొదలు పెట్టింది స్కూల్లోనే.  తొలి రచన నాకు గుర్తున్నది “శివాజి”. చత్రపతి శివాజి గురించి.  వ్యాసం అనుకుంటాను.  జాగృతి లో ప్రచురితం.  తరువాత స్కూల్లోనే ఒక రాతప్రతి పత్రిక ని కూడ ప్రచురించుకున్నాం. దానికి సారధి అతనే.  ఆ వివరాలు కూడా ఇక్కడ చదువుకోవచ్చు. ఇక రామశాస్త్రి అనామకుడుగా సాహిత్యం లోకి ప్రవేశించాడు. వ్రాసినవి తక్కువ. వాసిలో ఎక్కువ.  వచ్చిన బహుమతులు చూస్తేనే తెలిసిపోతుంది.

ఈ ముఖాముఖికి ఒక ప్రత్యేకత ఉంది.  భార్యభర్తలు ఇద్దరు రచయితలు కావడం.  అది మామూలే మనకి.  తెలుగు సాహిత్యం లో భర్తలు వ్రాసేసి ‘భార్య’ పేరుతో ప్రచురించుకోవడం కూడా చెల్లింది. పత్రికా సంపాదకులు 80 లలో “స్త్రీ”లే రచయిత్రుగా ఉన్న రచనలని ప్రోత్సహించారు.  పాఠకులు ఆదరించారు. ఒక ఉదాహరణ – పురాణం సీత.

భార్యలు వ్రాసి భర్తకి అంకింతం ఇచ్చుకోవడం కూడ ఉంది, మనకి. అలాగే భర్తలు వ్రాసి భార్యలకి అంకితం ఇచ్చుకోవడం కూడా ఉంది.

కాని ఇద్దరు కలిసి ఒకే రోజున తమ రచనలని ఒక పుస్తకంగా ప్రచురించుకోవడం అన్నది అరుదే కాదు లేదనే అనుకుంటున్నాను.  ఒకరు కథా సంకలనం వెలువరిస్తుంటే మరోకరు నవలికలు ప్రచురించడం.  రెండూ తమ పెళ్ళి రోజున ప్రచురించుకోవడం.  “అది కాక ఒకరి పుస్తకానికి మరొకరు ముందుమాట రాసుకోవడం”.
గాయత్రీదేవి కి ముందు మాట అనామకుడు, భర్త అనామకుడుకి శ్రీమతి గాయత్రీ దేవి ముందుమాట వ్రాసుకోవడం! మరొక అదనపు ఆకర్షణ – రెండు పుస్తకాలు డిజిటల్ బుక్స్ అంటే ఈబుక్స్ గా మాత్రమే వెలువడటం. దానికి వేదిక కినిగె.కాం కావడం.

అనామకుడు తో ముఖాముఖి ఇదిగో…

అనామకుడితో అనిల్ అట్లూరి వొకానొక అనామక ఆనంద వేళా....

అనామకుడితో అనిల్ అట్లూరి వొకానొక అనామక ఆనంద వేళా….

 

Qప్రశ్న: నువ్వెందుకు రాస్తావ్?

: ఈ ప్రశ్నని నాకు నేను వేసుకుంటూనే ఉంటా. ఐతే సమాధానం కోసం ఆలోచించను. ఆలోచిస్తే రాయడం కష్టం. తోచినప్పుడు తోచింది రాస్తాను. అంతే. ఐతే నా అసలు ప్రశ్న అది కాదు. అసలు ఏ రచయిత ఐనా ఎందుకు రాస్తారు? ఒక్కో సారి నాకు అందరి రచయితల అభిప్రాయం తెలుసుకోవాలనిపిస్తుంది. ఎవరు ఎందుకు రాస్తున్నారు అని. ఏ పత్రికో ఈ విషయం మీద అభిప్రాయ సేకరణ చేస్తే బావుండుననిపిస్తుంది. ఇంతకన్న మౌలికమైన ప్రశ్న – అసలు మనుషులు ఒకరితో ఒకరు ఎందుకు మాట్లాడుకుంటారు అని. దానికి సమాధానం దొరికితే ఎందుకు రాస్తున్నాం అన్న దానికీ సమాధానం దొరకచ్చు.

Qప్రశ్న: ఎందుకు మాట్లాడుకుంటారు?

మాట్లాడ్డం అనేది మనిషికి అనివార్యమైన అవసరమేమోనని అనిపిస్తుంది. మెదడులో మెదిలే ఆలోచనల్నీ, హృదయంలో కలిగే ఆవేదనల్నీ ఆనందాల్నీ పంచుకోకుండా మనిషి ఉండడం సాధ్యం కాదేమో. కొందరికి చెప్తునే ఉండాలని అనిపిస్తుంది. ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు చూడు – వినేవాడు చెప్పేవాడు ఎప్పుడు ఆపుతాడా ఎప్పుడు మనం మాట్లాడుదామా అని ఎదురుచూస్తున్నట్లు ఉంటాడు. అవతల వాడు ఆపగానే మాట్లాడ్డం మొదలెట్టేస్తాడు.

Qప్రశ్న: నువ్వెందుకు రాస్తావో చెప్పు.

: చిన్నప్పట్నుంచీ కధలూ నవలలూ చదవడం ఇష్టం . . .

Qనేను: నువ్వు చెప్పక్కర్లేదు. స్కూలు రోజుల్నుండీ, నువ్వూ, నేనూ, ఆదుర్తీ, కప్పగంతులా – అందరం పుస్తకాలతోనే ఉండేవాళ్ళం. మనం పదో క్లాసులో ఉన్నప్పుడు ఓ రాతపత్రికని కూడా తీసుకొచ్చాంగా.

: గుర్తుంది కదా? అప్పట్నుంచీ అప్పుడప్పుడూ ఏదో ఒకటి రాయాలనిపిస్తుంది. రాసేవరకూ తోచదు. రాసింది ఏం చెయ్యాలి అన్న ఆలోచన తర్వాత వస్తుంది. రాస్తున్నప్పుడు రాయడమే. రాస్తూ ఆనందించడమే. ఆ .. అదీ సమాధానం. రాస్తోంటే ఆనందంగా ఉంటుంది. అందుకనే రాస్తున్నా. రాస్తున్నప్పుడు కలిగే ఆనందం కోసం. పాడ్డం, ఆడ్డంలా రాయడం. ఒక్కో సారి రాయాలని అనిపించదు. అప్పుడు అసలు రాయను. నీకు తెలుసుగా ఇన్నేళ్ళలో రాసింది చాలా తక్కువ.

OmOggaPuvvavutomdiErupuTellapothundi

Qప్రశ్న: ఎప్పుడు రాయలనిపిస్తుంది? ఏదన్నా సామాజిక అన్యాయానికి స్పందించినప్పుడు రాయాలని అనిపిస్తుందా? లేకుంటే ఏదన్నా సంఘటన కలిచి వేసి రాయమని వేధిస్తుందా?

: సామాజిక ప్రశ్నలు లేవనెత్తడం, సమాధానాలు చెప్పడం నా తీరు కాదు. ఏ ఇజానికో కట్టుపడ్డం నా వైఖరి కాదు. ప్రపంచం విషయంలో ఇదే నిజం అని నేను దేన్నీ అనుకోలేను. ఇది మంచి, ఇదే మంచి అని నేను నిర్ణయించలేను. అది నా పెర్సనాలిటీ. అదే నా రచనల్లోకీ వస్తుంది. నా పెర్సనాలిటీలో లేనిది నా రచనల్లోకి రాదు. అంటే ఇలా రాస్తే బావుంటుందేమో ఇది నలుగురికీ ఉపయోగిస్తుందేమో దీన్ని ఎక్కువ మంది మెచ్చుకుంటారేమో అని నేను రాయలేను.

Qప్రశ్న: కానీ బలమైన రచనలు కావాలంటే ఏదో ఒక నమ్మకాన్ని రచన ద్వారా చెప్పాలేమో కదా – విశ్వనాధ ఐనా, శ్రీశ్రీ ఐనా చేసింది అదే కదా?

:  రచన బలంగా ఉండడానికి కావల్సింది చెప్పడంలో నైపుణ్యం. ఆ నైపుణ్యం ఉన్నవాళ్ళే గొప్ప రచయితలు అవుతారు. నువ్వు చెప్పిన వాళ్ళిద్దరికీ అది ఉంది. వాళ్ళందుకే గొప్ప రచయితలు అయ్యారేమో అని అనిపిస్తుంది. ఐతే ఎన్నుకున్న ఇతివృత్తం, అది సమాజంలో అందరికీ కాకపోయినా ఓ వర్గానికి అవసరం అనిపించడం ఆ రచయితలకి పేరు తెచ్చిపెట్టాయంటే కాదనలేం.

Qప్రశ్న: అంటే రచనలకి సామాజిక స్పృహ అవసరం లేదంటావా?

: సామాజిక స్పృహ అందరికీ అవసరమే. రచయితలకి మాత్రమే కాదు. ఐతే రచనల్ని కొలిచే కొలబద్దో తూకంరాయో మాత్రం రచనలో ఉన్న సామాజిక స్పృహ అవకూడదు. అలా ఐతే నినాదాల్లాంటి రచనలూ ప్రకటనల్లాంటి రచనలూ వస్తాయి. ప్రపంచానికి మంచి కావాలని చెప్పడానికి రచనలు వాడుకోవచ్చు. ఐతే వట్టి నీతివాక్యాలు రచనలు అవవు.

Qనేను: కొంచెం వివరించాలి నువ్వు.

: భారతం అంత నీతులు చెప్పే రచన మరొకటి లేదేమో. ఐతే భారతం లో మంచి కధ ఉంది. మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది. వినాలనిపిస్తుంది. చూడాలనిపిస్తుంది. ఎందుకంటే కధ చెప్పే తీరు బావుంటుంది. అదే కాళిదాసులోనూ ఉంది. చక్కని ఉపమాలంకారాలతో హాయిగా సాగిపోయే కధనంతో ఉన్న రచనలు కాళిదాసువి. అందులో ఇజాలూ లేవు. ఐనా ఈ రోజుకీ చదవాలనుకునే వారు ఉన్నారు. ఇంకో ఉదాహరణ పంచతంత్రం. అందులో ఉన్నవన్నీ నీతులే. లోక రీతులే. ఐతే ఏదో ఒక్క దాన్ని పట్టుకు కూచోలేదు విష్ణుశర్మ. అలానే కథల్ని అందరికీ వినోదంగా ఉండేలా జంతువులతో చెప్పించాడు. భర్తృహరి సుభాషితాలూ అంతే. చదవడానికో వినడానికో బావుండాలి. అది అసలైన రచన. ఓ ఇజాన్ని చాటుకుందుకు రాసేవే మంచి రచనలు అనడం సరికాదు.

Q ప్రశ్న:ఐతే నీ కధల్లో సామాజిక స్పృహ లేదంటావా? మరి నువ్వు రాసిన శీలమా అది యేమి మాటేమిటి? దానికి బాగా పేరొచ్చింది కదా?

: శీలమా అది యేమి కధ లోని శైలి విశ్వనాధ శైలికి అనుకరణ ప్రయత్నం. ఆ అనుకరణ పండింది. మాములుగా మనం నమ్మే విషయాన్ని కాదని చెప్పడానికి ఆ శైలిని ఎన్నుకోడం వల్ల అది చాలా మందికి నచ్చింది. ఆడవాళ్ళు శీలానికి ఇవ్వాల్సినంత మర్యాదే ఇవ్వాలన్న విషయం ఎందరికో నచ్చింది. ఇంక నా సామాజిక స్పృహ గురించి. నాకధలు చాలా – ప్రశ్నలతో ముగుస్తాయి. నువ్వు గమనించే ఉంటావు. నాణేనికి రెండు పక్కలా చూపించడానికి నేను చేసే ప్రయత్నం నా కధల్లో కనిపిస్తూ ఉంటుంది. అదే విషయం శీలమా అది యేమి కధా సంకలనం ముందు మాటలో శ్రీకాంత శర్మ గారు రాసారు. అదే విషయాన్ని ఆ పుస్తకం గురించి విమర్శ రాస్తూ అవసరాల రామకృష్ణారావు రాసారు. ఆ ముక్కే గుడిపాటీ ఓ వ్యాసంలో రాసారు.

Q ప్రశ్న: ఏదో ఒకటి తేల్చి చెప్పకపోవడం వల్ల పాఠకులకి అసంతృప్తి కలగదూ?

: పాఠకులు హాయిగా చదువుకుందుకు రచనలు చెయ్యచ్చు. నా రమణీయంలోని కధలు అందుకు ఉదాహరణ. అలాగే పాఠకుల్ని ఆలోచించుకోమని రచనలు చెయ్యచ్చు. అవి నా శీలమా అది యేమి కధలు. ఐతే పాఠకుల్ని ప్రబోధిస్తూ రచనలు చెయ్యడం నాకు చేతకాని పని. అలా చెయ్యకూడదని నేనన్ను కానీ, అది నా వల్ల కాదు. ఏదన్నా రచనలో అంతర్లీనంగా ప్రబోధన ఉంటే అది అనుకుని చేసింది మాత్రం కాదు.

Qప్రశ్న: నువ్వు కధలు రాస్తావు. పద్యాలు రాస్తావు. నాటకాలు రాసావు. నవలికలు కూడా రాసావు. నీకు నచ్చిన ప్రక్రియ ఏది?

: నాకు పద్యం రాయడం అంటే ఇష్టం. అసలు రాయాలన్ని మక్కువ కలిగింది నాకు పద్యంతోనే. నీకు తెలుసుగా నేను తెలుగు పండిత కుటుంబం నుండి వచ్చాను. మా నాన్నగారి నాన్నగారు అవధానం చేసేవారు. అది కాకుండా మనకు పదో క్లాసు లో తెలుగు మాష్టారు గుర్తున్నారు కదా . . .

నేను: ఆ వీరాచారి గారు.

: ఆయన మనకి తెలుగు పద్యాల గురించి బాగా చెప్పారు. అప్పుడే కొన్ని పద్యాలు రాసాను. ఐతే కాలేజీలో చేరాక రచనలు చెయ్యడం కుదర్లేదు. చదువైపోయి ఉద్యోగంలో చేరాక కొంచెం తీరిగ్గా అనిపించి ఓ కధ రాసాను. అంతరాంతరాళం అని. అదే అచ్చైన మొదటి కధ. అదే రాసిన మొదటి కధ కూడానూ.

అది ఓ డైరీ స్టైల్ అనుకుంటా

: అవును. ఓ డైరీ కాదు. నలుగురి డైరీ. చివరగా రచయిత డైరీ. మొదటి కథ కదా – ఏదో ప్రయోగం చెయ్యాలన్న కోరిక బాగా ఉండి ఉంటుంది.

Qనేను: ఆ తర్వాతి కధల్లో కూడా ఈ ప్రయోగం బానే కనిపిస్తుంది. “నల్ల డబ్బులో” ఓ వంద నోటు కధ డైరీ ఉంటుంది. అలానే “మీ” కధ స్వర్గస్తులైన మీ నాన్న గారికి రాసిన ఉత్తరం. పద్యం తర్వాత నీకు నచ్చిన ప్రక్రియ కధేనేమో. అవే ఎక్కువ రాసావు.

: నిజం చెప్పనా? నాకు నచ్చిన మీడియా సినిమా. అందులో ఉన్నంత పరిపూర్ణత ఇంకెందులోనూ ఉండదు. ఐతే అది రచయిత ఒక్కడూ చేసే ప్రక్రియ కాదు. అందులో కథా, మాటలూ, పాటలూ, సంగీతం, నటనా, ఫొటోగ్రఫీ అలా చాలా ఉంటాయి. అందుకే నాకు నచ్చిందే ఐనా, నాకు అనుకోకుండా ఓ అవకాశం వచ్చినా నేనటు వెళ్ళలేదు. ఒంటరిగా చేసుకోడానికి, కావల్సినంత స్వేచ్చ ఉన్నది కధ. అందుకేనేమో అదే రాస్తున్నాను.

Qప్రశ్న:నువ్వు రాస్తున్నవి ప్రచురేంచేందుకు సరిపోయే పత్రికలు తెలుగులో ఉన్నాయా?

: ప్రచురించేందుకు పత్రికలు ఉన్నట్లే ఉన్నాయి. ఐతే వాటిని ఎవరు చదువుతున్నారో తెలియదు. నాకప్పుడప్పుడు అనిపిస్తుంది. కధకులే కధల్ని చదువుతున్నారేమో అని. పాఠకులు అంటూ విడిగా ఉన్నారో లేదో అనుమానమే. అంతకు ముందు పత్రికల్లో సీరియళ్ళు చదివే జనం ఇప్పుడు టీవీల్లో సీరియళ్ళ చూస్తున్నారు. అంతకు ముందు విలక్షణమైన కధల్ని చదివే వాళ్ళు ఇప్పుడు ఇంగ్లిష్ నవలలు చదవుతున్నట్లున్నారు. ఇప్పటి యువతకి తెలుగు కథలు చదవడానికి తెలుగే సరిగ్గా రాదు. ఇప్పుడు మీడియం కూడా మారిపోయింది. టీవీ అంతకన్న ముఖ్యంగా ఇంటర్నెట్ జనంలోకి చొచ్చుకొచ్చేసాయి. పుస్తకాల భవిష్యత్తు ఎలా ఉంటుందో.

Qనేను: అంతర్జాలం అనాలి మిత్రమా, ఇంటర్నెట్ అని కాదు. J

: మై డియర్ ఫ్రెండ్, మరో భాషలోంచి కొత్త మాటలు తీసుకోని భాష ఎదగదు. ఐతే భాష గురించి కాదు కదా మన సంభాషణ. అందుకే దీని గురించి ఏమీ అనడం లేదు. సరేనా?

Q ప్రశ్న: సరే. అంతర్జాలంలో పత్రికలు వచ్చాయి కదా? వాటి భవిష్యత్తు ఏంటి? అవి పత్రికల్ని మింగేస్తాయా?

: టేబ్లెట్లొచ్చి విద్యావిధానాన్ని మార్చేస్తాయేమో. పిల్లలకి రాయడం నేర్చుకునే అవసరమే ఉండకపోవచ్చు. కీబోర్డ్ మీదే అక్షరాలు నేర్చుకోవచ్చు వాళ్ళు. చదవడం రాయడం అంతా కంప్యూటర్ల మీదే జరగచ్చు. తాటాకు గ్రంధాలు పోయి కాయితాలూ, వ్రాతప్రతులు పోయి అచ్చుగ్రంధాలూ వచ్చినట్లే – రాయడం పోయి కీబోర్డులు వచ్చెయ్యచ్చు. రచనలు పోవు. ఎందుకంటే మనిషికి చెప్పాలన్న కోరిక పోదు. ఆ దురద ఉన్నంతకాలం రచనలు ఉంటాయి.

Qప్రశ్న: రచన చెయ్యలన్న దురదా? ఎంత మాట? తోటి రచయితలకి కోపం రాదూ?

: రచయితని రచయిత అర్ధం చేసుకోగలడు. రాసేవాళ్లలో చాలామంది ఒప్పుకుంటారనే అనుకుంటా – అది దురదని. డబ్బుకోసం రాసేవాళ్లని పక్కన పెట్టాలి. అది వాళ్ళకి దురద కాదు. ఓ వృత్తి. అలానే పేరుకోసం రాసే వాళ్ళని కూడా పక్కన పెట్టాలి. ఆనందం కోసం రాసేవాళ్ళకి మాత్రం అది దురదే. గోక్కుంటేనే కదా ఆనందం. అలానే రాస్తేనే.

Q ప్రశ్న: పత్రికలు తగ్గచ్చు. ఈ పత్రికలు పెరగచ్చు. నువ్వు పుస్తకాలు వేసావు కదా?

నేను వేసి ఐదేళ్ళ పైనే ఐపోతోంది.

Qప్రశ్న:నువ్వు పబ్లిష్ చేసావా?

లేదు. అది నాకు చేతకాని పని. వాహిని బుక్ ట్రస్ట్ వాళ్ళు వేసిచ్చారు.

Qప్రశ్న: నీ ఉద్దేశంలో రచయితలు పుస్తకాలు వేసుకోకూడదా?

:   అలా కాదు. ఏ పని ఎవరు బాగా చెయ్యగలరో వాళ్ళు చేస్తే మంచిది. రచయితకి రాయడం వస్తుంది. పబ్లిషర్కి పుస్తకం అచ్చెయ్యడం వస్తుంది. పుస్తకాల షాపులవాళ్లకి అమ్మడం వస్తుంది. పుస్తకం వేసుకోడం, అమ్ముకోడం చేతనైన రచయిత ఆ పనులు చెయ్యచ్చు. నాకు అవి రావు. చెయ్యాలన్న ఆసక్తీ లేదు.

 Qప్రశ్న: అలా చేసుకుంటే డబ్బు మిగుల్తుంది కదా? రచయితకి కావల్సింది అదే కదా?

:   ఇంగ్లిష్ లో పుస్తక ప్రచురణ పెద్ద వ్యాపారం. తెలుగులో నాకు అనుమానమే. అందులోనూ కధల పుస్తకాలకి అంత వ్యాపారం ఉండదు. రచయితలు అందులోకి దిగితే నష్టపోయే అవకాశం ఉంటుంది. అది కాకుండా ఇంకో నష్టం ఉంది. రచయితే పుస్తకం వేసుకుని అమ్ముకోడానికి సిధ్ధపడితే తన ఖర్చు రాడానికి ప్రయత్నించాలి. అంటే రాయడం అమ్మకం కోసం అవుతుంది. అప్పుడు రాసేడప్పుడే ఏది అమ్ముడవుతుందో అని చూసుకుని రాయాల్సి వస్తుంది. సినిమాలకి ఉండే లిమిటేషన్ కధలకి కూడా వస్తుంది. డాక్టర్లకి కలిగే మోజే రచయితలకీ కలగచ్చు. కలుగుతుంది అనడంలేదు. కలగచ్చు అంటున్నా.

Qప్రశ్న: కొందరు రచయితల్ని చూస్తే – కలిగినట్లే ఉందిలే కానీ – నువ్వు ఇంగ్లిష్ లో పుస్తక ప్రచురణ పెద్ద వ్యాపారం అన్నావు. అక్కడ రచనల్లో వాసి తగ్గుతోందా?

:   చెప్పడం కష్టం. ఇంగ్లిష్ కి ప్రపంచం అంతా మార్కెట్ ఉంది. అది పెరుగుతోంది. అందుకే ఇంగ్లిష్ లో రచనలకి వాసికీ రాశికీ ఇబ్బందిలేదు. వాళ్ళు రకరకాల విషయాల మీద రాస్తారు.

Qప్రశ్న: మనకి మార్కెట్ లేకపోవడమే మన కధల్లో వైవిధ్యలోపానికి కారణం అంటావా?

: అలా అనలేం. నువ్వు తప్పుగా అనుకోనంటే ఓ మాట చెప్తాను. తెలుగులో రచనలు చెయ్యడం మొదలెట్టిన వాళ్ళు మధ్యతరగతి నుండి వచ్చినవాళ్ళు. వాళ్ళు వాళ్ళ పరిధిలో చూసినవే కధల్లోకి తీసుకు రాగలిగారు. ఐతే వాళ్ళు మంచి రచయితలు. ఆ కధలు బావుండేవి. ఆ తర్వాత వాళ్ళు వాళ్ళని అనుకరించడంలో వాళ్ళు రాసే పధ్ధతినే కాకుండా ఇతివృత్తాలు కూడా అవే తీసుకున్నారు. తమాషా ఏమిటంటే చదివే వాళ్ళు కూడా ఎక్కువ మధ్యతరగతి వాళ్ళే. పాఠకులకీ, రచయితలకీ ఒకే రకమైన విషయాలమీదా ఆసక్తీ అవగాహనా ఉండడంతో అలాంటి కధలే వస్తున్నాయి. డబ్బున్న వాళ్ళు చెడ్డవాళ్ళు, పేదరికంలో అనుబంధాలు ఉంటాయి లాంటి ఇతివృత్తాలు అలాంటివే. అలానే గ్రామాల్లో అమాయకులుంటారు, పట్టణాల్లో మోసగాళ్ళుంటారు లాంటి మూస అభిప్రాయాలు కధల్లో గుప్పించబడ్డాయి. చెడ్డ అని రచయిత అనుకున్నవాళ్ళకి కధాంతంలో చెడు జరగడం, వాళ్ళు ఎవరినైతే కష్టపెట్టారో వాళ్ళే చివరికి మంచి చెయ్యడం లాంటి నాటకీయత కధల్లో బాగా చోటు చేసుకుంది.

Qనేను: నీ అభిప్రాయాలు ఘాటుగా ఉన్నాయి. మన ఈ సంభాషణ విమర్శల పాలవుతుంది.

: మనుషులన్నాక రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. అందరూ ఒకే దాన్ని నమ్మరు. ఒప్పుకోరు.

Q ప్రశ్న: నీ కధల మీద విమర్శనల్ని నువ్వు ఎలా తీసుకుంటావు?

: రాసినప్పుడు నేను నా ఆనందం కోసమే రాసుకుంటా. ఐతే రాసింది నా దగ్గర ఉంచేసుకోను. అది నలుగురూ చదవాలని ఆశపడతా. అంతే కాదు. అందరికీ నచ్చాలని కూడా అనుకుంటా. ఎవరన్నా బాలేదంటే బాధగానే ఉంటుంది. అది నా బలహీనత. ఐతే నా అభిప్రాయంతో ఏకీభవించకపోతే నాకు బెంగలేదు. ఎందుకంటే నా ఉద్దేశంలో రచనంటే అభిప్రాయం కాదు. ఆ అభిప్రాయాన్ని చెప్పేతీరు. నా చెప్పేతీరుని బాలేదంటే నాకు బావుండదు.

Q నేను: నీ కధల్లో ఆడవాళ్ళు బలంగా కనిపిస్తారు.

: అది నేను కావాలని అనుకుని రాస్తున్నది కాదు. నా మనస్సులో ఏ మూలో ఆడవాళ్ళు చాలా విషయాలలో సమర్ధులు అని బలంగా ఉండి ఉంటుంది. నా రచనల్లో అదే బయటకు వస్తూ ఉండి ఉంటుంది.

 Qనేను: అలానీ నీ కధల్లో కాస్త వేదాంత ధోరణి ఉంటుంది.

: అవును. నాకు చిన్నప్పటుంచీ, శంకరాచార్యులూ, జిడ్డు కృష్ణమూర్తీ, రమణమహర్షీ – వీళ్ళంటే ఇష్టం.  అన్నింటి కన్న మా నాన్న గారు వేదాంత ధోరణి ఉన్న మనిషి. అంటే దేవుడూ భక్తీ  కాదు. తర్కం. ఆయన అనే వారు. వేదాంతం అంటే తర్కానికి పరాకాష్ట అని. నేను చదివిన గణితశాస్త్రమూ నాకు తర్కమే నేర్పింది. తార్కికంగా తాత్త్వికంగా రాసిన బెర్ట్రాండ్ రస్సెల్ నాకు ఇష్టమైన రచయిత. ఆ ప్రభావం నా మీద ఉండే ఉంటుంది.

Qనేను: ఈ వేదాంత ధోరణే నువ్వు అనామకుడు అన్న కలంపేరుతో రాయడానికి కారణమా? నిజంగానే అనామకుడులా ఉండాలని ఉందా నీకు?

: నేను మొదటి కధ రాస్తున్నప్పుడు నిజంగానే అనామకుడుగా ఉందామనే ఆ పేరుతో రాసాను. ఇంక తర్వాత మార్చే ప్రయత్నం చెయ్యలేదు. ఇప్పుడింక అవసరం లేదు.

Q ప్రశ్న: తెలుగులో నువ్వు అనుకరించిన రచయితలు ఎవరైనా ఉన్నారా?

: అనుకరించిన వాళ్ళు లేరు. రమణీయంలో కూడా నేను ముళ్ళపూడిని అనుకరించలేదు. నిజానికి అందులో చాలా కధల్లో ఆయన జాడకూడా ఉండదు. ప్రభావితం చేసిన వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. ఐతే నచ్చిన వాళ్ళు చాలా మంది. తెలియకుండా వాళ్ళ దగ్గర గ్రహించిందేదో నా రచనల్లోకి వచ్చి ఉండచ్చు.

Qనేను: నీకు నచ్చిన రచయితలు మచ్చుకి . . .

: ఒకరా ఇద్దరా పేర్లు చెప్పడానికి? మొదలెడితే చాలా చిన్నప్పుడు చదివిన డిటెక్టివ్ నవలా రచయిత కొమ్మూరి సాంబశివరావుతో మొదలెట్టాలి. ఈ మధ్య చదువుతున్న రచయితల్లో ఐతే కాశీభట్ల వేణుగోపాల్. మధ్యలో వడ్డెర చండీదాసు. వద్దు. పేర్లు చెప్పడం కష్టం. ఎందరో మహానుభావులు. అందరికీ . . .

Qనేను: ఇదేంటి ముగింపులాగుంది మిత్రమా . . .

: ముగిద్దాం, ఇప్పటికే చాలా సేపు సాగింది సంభాషణ, దీన్ని రాతలో పెడితే ఎంతవస్తుందో.

Qనేను: నువ్వు ముగిద్దాం అంటున్నావు – కానీ నువ్వు కొత్తగా రాసేవాళ్లకి ఏదన్నా సందేశం ఇవ్వకుండా ఎలా ముగిస్తాం?

: సందేశం అని అన్ను నేను. ఈ మధ్య కినిగె యువరచయితలకి ఓ పోటీ నిర్వహిస్తోందని చూసి వాళ్ళని ఎంకరేజ్ చెయ్యడానికి నేను కొన్ని మాటలు రాసాను. కొత్త తరంలో ఎన్నో కొత్త సంఘటనలు జరుగుతున్నాయి. కొత్త మార్గాలు కనిపిస్తున్నాయి. వాటిని కధా వస్తువులుగా ఎన్నుకోవాలి. అలానే భాషలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. సాధ్యమైనంతవరకూ మాట్లాడే భాష రాయడానికి ప్రయత్నించాలి. నాలుగు ఇంగ్లిష్ మాటలు కలిస్తే తప్పనుకోకూడదు. అందరూ ఏది మాట్లాడితే అదే వ్యవహార భాష అవుతుంది. అదే రచనల్లోనూ చెలామణి అవ్వాలి. ఆఖరిగా వాళ్ళని కీబోర్డందుకోండి అని చెప్పాను. రాసే సాధనం కీబోర్డే. పెన్నులు మూతపడిపోతున్నాయి. నేను నా రచనలన్నీ ఓ పదిహేనేళ్ళకి పైగా కంప్యుటర్ మీదే చేస్తున్నా.

Qనేను: ఆఖరి ప్రశ్న – కొత్తగా ఏం చేస్తున్నావ్.

: ఏం చేస్తున్నావ్ కాదు – ఏం చేస్తున్నారు అని అడుగు.

Qప్రశ్న: అంటే – నువ్వూ. నీ శ్రీమతీ అనేగా? మిమ్మల్ని విడిగా ప్రస్తావించలేదు. సరే – నువ్వు, డాక్టర్ గాయత్రీదేవి కలిసి ఏం చేస్తున్నారు?

: నవంబర్ పదో తారీకు రాత్రి మా పెళ్ళిరోజు. ఎన్నోది అని అడక్కు.

Qనేను: ఎన్నైనా మీకు మొదటిదాని కిందే కదా?

: జోకులు సరే కానీ – ఆ రోజుకి మేం మా రచనల్ని డిజిటల్ పుస్తకాలుగా రిలీజ్ చేస్తున్నాం. ఇంతవరకూ ప్రింటెడ్ పుస్తకాలే వేసుకున్నాం. అదీ విడివిడిగానే. మొదటిసారి డిజిటల్ పుస్తకాలు వేస్తున్నాం. అదీ ఇద్దరం కలిసి వేస్తున్నాం. నా పుస్తకానికి ఆవిడ ముందు మాట. ఆవిడ పుస్తకానికి నేను ముందు మాట.

Q ప్రశ్న: నీ ప్రయోగాల ప్రయాణం సాగుతోందన్న మాట. నీ పుస్తకం ఏంటి? ఆవిడది ఏంటి?

నాది ట్విన్నవలలు అంటే కవలనవలలు. ఎప్పుడో రాసిన రెండు నవలలలు. ఒకటి “ఓ మొగ్గ పువ్వవుతోంది”. రెండోది “ఎరుపు తెల్లపోతోంది”. గాయత్రిది కధాసంపుటం. పేరు “హాస్యాహాస్య కధలు”. తను రాసిన కొన్ని హాస్య కధలూ. కొన్ని హాస్యం కాని కధలు. నవంబర్ పదికో పదకొండుకో రిలీజ్ అవుతాయి. ఓన్లీ డిజిటల్.

మీరిద్దరూ కలిసి రాయరు. విడివిడిగా రాస్తారు. ఐతే మీ పెళ్ళిరోజు నాటికి కలిసి అచ్చేసుకుంటున్నారు. ఒకొరికొకరు ముందుమాట రాసుకుంటున్నారు. గొప్ప విషయం. ఆల్ ది బెస్ట్.

అనామకుడి  రచనలు ఇక్కడ: http://kinige.com/kbrowse.php?via=tags&tag=anaamakudu

 

—అనిల్ అట్లూరి