గోడంత అద్దంబు గుండెలకు వెలుగు

mandira2

Art: Mandira Bhaduri

 *
అబద్ధం ఆడనని చెప్పే వాళ్ళున్నారు కానీ

అద్ద౦ చూడనని చెప్పిన వాళ్ళున్నారా?

ఎంత వయసొచ్చినా వదలని చాపల్య౦ ఈ అద్ద౦

అదేపనిగానో , అప్పుడప్పుడో

అందులోకి తోంగిచూసుకోని వాళ్ళుంటారా

నావరకు నేను దాని లోతుల్లోకి దిగిన ప్రతిసారీ

ఒక కొత్త రూపం తెచ్చుకోవాలనే అనుకుంటాను

ఆమాత్రం ఏమార్చకపోతె అద్దం గొప్పదనం ఇంకేముంది ?

అందాన్ని సానపెట్టడానికి తీసుకున్న ఒక్కొక్క సౌందర్య లేపనంతొ

వంద మయసభలు కట్టుకోవచ్చు

అద్దంతో నా అనుబంధం ఇవాళ్టిది కాదు

నీమొహంలా వున్నావు – అని ఎవరు కుండ బద్దలు కొట్టినా

అద్దంముందు వొలికిపోవడ౦ తప్ప గత్యంతరం లేదు

అయినా నామొహం నామొహం లానే వుండిపొతే

ఇంత లావు సౌందర్య శాస్త్రమూ చిత్తుకాయితమే కదా

అద్దం పుట్టని రోజుల్లో అందగత్తెలంతా

జీవితాంతమూ సౌందర్య భ్రాంతిలోనే వుండేవారేమొ తెలీదు

భ్రమలు దిగ్భ్రమలవడ౦ కొసమే అయినట్టు

ఇపుడిక్కడ ఇంటికున్న ప్రతి నాలుగో గోడా అద్దమే

సూటిగా చెప్పాలంటే యవ్వనం వున్నప్పుడు అద్దం లేదు

అద్దం అమిరాక యవ్వనం లేదు

అద్దాలన్నీ యవ్వనం కోసమే అయితే

మిగిలిన వనాల మాటేమిటి ?

అద్దాన్ని నమ్ముకున్నవాళ్లు

ఒక యుద్దాన్ని కూడా చేస్తుంటారు

ఏమిటా యుద్దం ?

ఇటువైపు ఒక బింబం వుంటుంది

అటువైపు ప్రతిబింబం వుంటుంది

బింబానికి అబద్ధాలతో మోసపోవడం ఇష్టం

ప్రతిబింబానికి మసి పూసుకుని ఎదురవడ౦ వేడుక

బింబ ప్రతిబింబాల ఘర్షణలో మధ్య నేను నలిగిపోకుండా

అద్దమే నా ఫేస్ ని ప్యాక్ చేసి రక్షణ ఇస్తుంది

ఇన్నివిధాల ఆదుకున్న మమతల కోవెల లాంటి

నా మురిపాల అద్దం ఈ మధ్య ఎందుకో కళ్లలో నిప్పులు పోసుకుంటోంది

నిజమ౦టే నిప్పే కదా

ఇప్పుడు దాని సెగకి దూరంగా కూడా నుంచోలేక పోతున్నాను

చూస్తూ చూస్తూ నిప్పుని కొంగున ముడేసుకుంటామా చెప్పండి

నిన్నటికి నిన్న ఒక నడివయసు నాంచారమ్మ

కళ్లు రిక్కించి నావంకే చూస్తో౦ది

నాంచారమ్మా నాంచారమ్మా నువ్వెవరమ్మా అ౦టే

నాపేరు చెప్పింది చూడు

అబ్బే ,లాభంలేదు అద్దానికి మతి పోయినట్టుంది

ఆస్పత్రిలో పడెయ్యాలి

అద్దం అన్నాక అది బద్ద లయ్యేలోపు

ఒక నిజాన్ని వాంతి చేసి పోతుందని తెలుసులే కాని

కడుపులో మరీ ఇంత కుట్ర దాచుకు౦దనుకోలేదు

ఇప్పుడీ నాంచారమ్మ దేహ సమాధిలో

ఒక రెండు జెళ్ల సీత వుందా లేదా?

*

 

 

 

 

 

మన కవిత్వం ఇంకా సుఖ జీవన సౌ౦దర్యమేనా ?

 

-కొండేపూడి నిర్మల

~

 

నిర్మల

ఇటీవల ఉత్తర తెలుగు అమెరికా  అసోసియేషన్  తెలుగు కవిత నూతన దృక్కోణం అనే విషయం మీద సెమినార్ నిర్వహించింది. భిన్న అస్తిత్వాలు వస్తు రూపాలు అనే విషయం మీద నేను ప్రసంగించాల్సి వుంది. అఫ్సర్, నారాయణ స్వామి, విన్నకోట రవిశంకర్ , పాలపర్తి ఇంద్రాణి మిగిలిన వక్తలు. మొదటి ప్రసంగం చేసిన ఇంద్రాణి  “కవిత్వానికి ప్రేరణ” గురించి మాట్లాడింది. పనిలో పనిగా  అస్తిత్వవాదులకు కొన్ని చురకలు వెయ్యడానికి నిర్ణయించుకుంది. మెత్తని మృదువైన కవిత్వం రాస్తూ, అనుభూతి, ఆహ్లాదము  కవితా లక్ష్యం గా వున్న ఈ కవయిత్రి  శబ్దానుకరణ విద్యలో అల్లసాని పెద్దన వంటిదని ఆమె పుస్తకానికి ముందు మాటలో మరొక కవి కితాబు ఇచ్చారు.

అల్లసాని పెద్దన అనగానే మనకు గుర్తొచ్చే పద్యం “తూగుటుయాల, రమణి ప్రియ దూతిక తెచ్చి ఇచ్చు కప్పురపు విడేము, ఉహ తెలియంగల లేఖక పాటకోత్తములు -కవితా రచనకు కనీస అవసరాలు అని కదా. అంత కాకపోయినా ఈ ఆధునిక కవయిత్రికి కూడా  ప్రేరకాలుగా కొన్ని సదుపాయాలు౦డాలట,

“మ౦చి కవి మిత్రులు, సరళమైన జీవన విధానం, ప్రకృతితో మమేకం, ఈ అన్నిటితో కూడిన ఏకాంతం” ఇందులో ఎవరికీ అభ్యంతరం లేదు. ఆ మాటకొస్తే కవిత్వం రాయడానికే కాదు బిడ్డకు పాలిచ్చే కూలి తల్లికి , మగ్గంమీద బట్ట నేస్తున్న ముసలి తాతకి కూడా ఏకాంతం అవసరమే..

అది కాక కవిత్వాన్ని ఆటంకపరుస్తూ, చికాకు పెట్టే విషయాల చిట్టా కూడా మన ముందు వుంచింది. అదేమిటంటే,

“కవి నిరంతర అధ్యయనపరుడు కావాలి కాని సదరు  పుస్తకాలు  ప్రసంగాలో, సిద్ధాంతాల పట్ల ఆకర్షణ పెంచేవో కాకూడదు. నేను ఫలానా బాధిత వర్గానికి చెందిన స్త్రీని , ఫలానా మతానికి, కులానికి ప్రతినిధిని అని కూడా భావించరాదు. అప్పుడు అది మీ పరిమితిని సూచిస్తుంది.. మార్పులు, వయసు  పెరగడం , అనుభవాలను సృష్టించుకోవడం (?) కూడా కాని పనులే, ఉద్యమకారులు ఉద్యమాలు చేసుకోవాలి కాని కవులవడానికి వీల్లేదు.”

ఇవి   కేవలం వ్యక్తిగత అభిప్రాయాల్లాగా చెబితే ఈ చర్చ  అవసరం లేదు, కాని ఆర్కిమెడిస్ సిద్దాంతంలాగా ఖచ్చితమైన స్వరంతో చెప్పింది. కాబట్టి ఇటువంటి ప్రకటనల పట్లా, వాటి వెనక వున్న  భావజాలం పట్లా నాకున్న స౦దేహల్ని మీతో పంచుకొవాలను కుంటున్నాను.

ఇవికాక ప్రసంగం లో, తన వస్తు ప్రాధాన్యత  గురించి చెబుతూ,  గుడి దగ్గర పూలు అమ్ముకునే అమ్మాయి జ్వరంగా వుంటే తను జ్వరం గురించే రాస్తానని చెప్పింది, జ్వరం పక్కన పెట్టి పూలపుప్పొడి గురించి కూడా రాయచ్చు.

వస్తువు ఎంపికలో వ్యక్తీకరణలో కవికి స్వేచ్చవుంది. ఆ స్వేచ్చను ప్రశ్ని౦చే హక్కు ఎవరికి లేదు.

పూల మీద రాస్తావా? పూలపిల్ల జ్వరం మీదరాస్తావా ? జ్వరంలో వున్నా సరే  పూలు అమ్మక తప్పని గతి మిద రాస్తావా? పువ్వుల పంట చినుకు  లేక ఎండి పోవడాన్ని రాస్తావా? పంట భూములు పోగొట్టుకున్న నిర్వాసితులమీద రాస్తావా? దానికి కారణమవుతున్న సర్కారీ ధోరణి గురించి రాస్తావా? అది కవి తీసుకున్న కాన్వాసుని బట్టి వుంటుంది

ఏ వస్తువు ఎంతవరకు వ్యక్తి గత మవుతుంది, ఏ సరిహద్దు దగ్గర సామాజికమవుతుంది ? నిర్ణయించడం కష్టం.

వ్యక్తిగతమంతా రాజకీయమే అని రుజువైపోయిన చోట కవి కార్యకర్తగా ఎదగడం అనివార్యం కాదా. జీవితంలో అన్నివిధాలా స్థిరపడ్డ కవికి వున్న సుఖ జీవన సౌదర్యం కార్యకర్త కి వుండకపోవచ్చు.

కవులు సరస్వతీ పుత్రులు, సభలు  ఈశ్వర స్వరూపాలు అనుకున్నంత కాలమూ వారిని మోయడానికి నడుం కట్టిన బోయీలు కాని,  కట్టడాలకు రాళ్ళు మోసిన కూలీలు కాని  వస్తువులు కాలేవు.

ఒకవేళ పువ్వులు అమ్మే పిల్ల అక్షరాస్యురాలు అయితే ఆమె అనుభవమే ఒక రచన అవదా ?. అక్షరాస్యతతో సంబంధమే లేక౦డా  గుండె కరిగించే పాట అవదా ? దానికి కావ్య గౌరవం వుండదా?

రచనా ప్రేరకాలుగా ఆ పూలపిల్లకి “బయట వేడి గాలులు తరిమికొడుతూ వుంటే , ఇ౦ట్లో వేడి భోజనం “ అవసరం లేదు. ఆకలి చాలు, వేదన చాలు, వేదన ఒ౦టరిది కాదనే స్పృహ చాలు. అవే ఆమె వ్యక్తీకరణకు కారణాలు.

కవిత్వం బాధకు పర్యాయపదం అన్నాడు కదా శ్రీ శ్రీ .

శ్రీ శ్రీ కి ముందు వచ్చిన భావ కవిత్వాన్ని అంతకు ముందు వచ్చిన పద్య కవిత్వాన్ని కూడా హాయిగా చదువుకున్నాం.

“రాత్రి జిప్పును విప్పుతో కారు ప్రయాణం “అని రాసిన ఇస్మాయిల్ కవితలో సిమిలీలు  ఎవరం మర్చిపోలేం.

“పది రాత్రులు ప్రకృతితో గడిపినవాడేవ్వడు పరుల్ని ద్వేషించలేడు” చిన్నప్పుడెప్పుడో చదువుకున్న వాక్య౦ యిది.

కవి పేరు మర్చిపోవచ్చు కాని కవిత్వం మర్చిపోలేం. ఈ నేలమీద అన్ని ధోరణులు సమాంతరంగా ప్రవహిస్తూనే వుంటాయి. వాళ్ల మధ్య మీరు కుస్తీ పోటీలు కండక్ట్ చేయనక్కర్లేదు.

అస్తిత్వవాద కవులకి ఈస్తటిక్ సెన్స్ ఉండదనే ఒక తప్పుడు అభిప్రాయం ప్రచారంలో వుంది. ఏ కవి అయినా వాదాలకోసం పుట్టడు. వాద ప్రచారం కోసం రాయడు. జీవితాన్ని కవిత్వం చెయ్యడంలో విభిన్న వస్తువులు వచ్చి చేరాయి. అది చాలా అవసరం కూడా.

ఈ పుస్తకానికి రాసిన ముందు మాట చూడండి.

“స్త్రీలలో ఉద్వేగాలు జాస్తి. కవిత్వ మూలాలు అక్కడే వున్నా దానివల్ల కవితాభివ్యక్తికి కలిగే ప్రయోజనం నాస్తి, కారణం దానికి అవసరమయ్యేది రసదూరం పాటి౦చగల నిర్లిప్తదోరణి. స్త్రీలలో అది బహు సకృతు. కాబట్టే మాయో ఏ౦జిలో , ఎలిజిబెత్ బిషప్ లాంటి పేరొందిన కవయిత్రుల్లో కూడా శిల్ప దోషాలు కనిపిస్తాయి. ఇక తెలుగు లో రాస్తున్న కవయిత్రుల గురించి ఎంత తక్కువ  మాట్లాడుకుంటే అంత మ౦చిది. కవులు కూడా అదే బంతిలో కూచుని భోజనాలు కానిచ్చి చేతులు కడిగేసుకు౦టున్నవారే. నానా వాదాల చెత్తను మిగల్చకుండా ఊడ్చి, కొత్త కవిత్వానికి ఇంద్రాణి కనక నాంది పలికితే ఆంధ్ర సారస్వతానికి కావలాసి౦దేమీలేదు.” దీనిభావమేమి యదుకులేశా ?

ఉద్వేగాలు జాస్తి అనే మాట తప్ప ఇంకోటి అర్ధమయితే ఒట్టు. కవిత్వ మూలాలు అక్కడే వున్నా అంటే ఆమెలో, లేక ఆమె చుట్టూరా లేక ఆమెకు అoదే౦త దూరంలో అనేనా? మరి అంత సమీప వస్తువు గురించి ఆమె రాసినప్పుడు కవితాభివ్యక్తికి కలిగే ప్రయోజం నాస్తి ఎలా అవుతుంది? రసదూరం పాటించగల నిర్లిప్త ధోరణి ఆమెలో లేదా?

ఇది ఎవరికయినా అర్ధం అయితే నాకు చెప్పండి ప్లీజ్,

పదిమ౦దిని దూషిస్తే తప్ప పదకొండో వాడ్ని గౌరవించడం కష్టమనుకు౦టే అది వారి వ్యక్తిగత బాధ. సామాజికం కావాల్సిన కవిత్వాన్ని వ్యక్తిగతం అని నేర్పి, వ్యక్తిగత రాగద్వేషాలు సైద్ధాంతిక సత్యాల మాదిరి చెబుతుంటే అచ్చంగా చెవిలో పువ్వులు పెట్టినట్టే వుంది.

సహజ ప్రేరణకి అడ్డుపడుతూ, కవిత్వాన్ని కృత్తిమoగా మార్చడం ఎలా జరుగుతుందో  ఇ౦ద్రాణి చెప్పి౦ది. నేను తనతో  తప్పక ఏకీభవిస్తాను. అదేమిటంటే ,

“మొదట్లో మనకోసం రాసుకున్న కవిత్వాన్ని ఎవరికయినా చూపగానే , ముఖ్యంగా ఎప్పటి ను౦చొ రాస్తున్నకవులకి చూపగానే వాళ్ళు అనే మాటలు, అభిప్రాయాలు, గుర్తింపు, అహం , బ్రాండ్ ఇమేజ్ ని ఇస్తాయి.”

ఇప్పుడు ఒక మ౦చి కవి/కవయిత్రి అలాంటి ప్రమాదాన్ని౦చి బైటికి రావాల్సి వుంది.

 

ప్రేమకి చిరునామా శివలెంక రాజేశ్వరి!

Satyam Vaddu Swapname Kavali Title copy

-కొండేపూడి నిర్మల

~

భావుకత విషయ౦లో మరో రేవతీ దేవి మన శివలెంక రాజేశ్వరి .

మామూలు అంచనాలతో రాజేశ్వరిని  నిర్వచీంచడం చాలా కష్టం . కొంచెం కొత్త చూపు తెచ్చుకోవాలి.  ఆ చూపు బాహ్యా చర్మాన్ని దాటి మనసులోకి ప్రయాణించగలిగి వుండాలి. అ౦త ప్రయత్నం చెయ్యడానికి ఎవరికేం పని ?కాబట్టి పనిలేని వాళ్ళ౦దరూ ఆమెను పజిల్ గానే భావిస్తారు. నా దృష్టిలో రాజేశ్వరి   కొన్ని అక్షరాలు చదివి,అక్షరాలు రాసి, అక్షరాల్ని శ్వాసించి, అక్షరాలా ఈ ప్రపంచం నిరక్షరంగా , నిర్ధాక్షిణ్యంగా  కనిపించి తట్టుకోలేక వెళ్ళిపోయింది.. అసలంత భావుకతని ఏం చేసుకుంటాం కూర వండుకుంటామా, చారు కాచుకు౦టామా అని వాదించే వాళ్ళ మధ్య  అరవై వసంతాలు జీవించింది.  ఇంతకంటే విజయమూ వీర మరణమూ  ఇంకోటి వుందని కూడా నేను అనుకోవడంలేదు. ఎవడో ఒక  గొట్టాం గాడ్ని  తప్పనిసరిగా  పెళ్లి చేసుకోవడం , ఎలాగోలా కాపుర౦ చేసి  , ఎందర్నో అందర్ని కనడం , జీవితాన్ని ఈ రకంగా మూడు ముక్కలు చేసి ఒక్కో  ముక్కనీ ఒక మగవాడి నీడన  బతికేయ్యడం లాంటి  మూసకి భిన్నంగా బతకాలనుకుంది. ఎందుకంటే ఇ౦దులో మనసుకెక్కడ చోటుంది.  గంగిరెద్దు వేషం తప్ప అంటుంది రాజేశ్వరి.

నిజమే కదా జీవితం ఒక సూపర్ బజార్ అయితే ఆక్కడ వున్న వాటిలోనే ఏదో ఒకటి ఎంచుకోవడం అనే పని తను చెయ్యలేకపోయింది. అందుకు భారీ మూల్యమే చెల్లించి౦ది.

గమనించారో  లేదో ఇవే మాటలు ఒక మగవాడు చెబితే గొప్ప అనార్కిస్టుగా గౌరవిస్తా౦. ఆడదానిక౦త భావ చైతన్యం వుండటం ఎవరూ సహించరు.  కుటుంబమూ  సమాజము ఒక్కటై గగ్గోలు పెట్టేస్తాయి.

జ్ణాన సముపార్జన కోసం ఇల్లు విడిచిన గౌతముడు ఒక ఆడదిగా పుట్టే అవకాశం ఎప్పుడూ లేదు.

రాజేశ్వరిని మొదటి సారి ఆ౦టే 1980 ప్రాంతాల్లో విజయవాడ రేడియో స్టేషన్లో చూసినట్టు గుర్తు. మధ్యతరగతి ఆడపిల్లలు పబ్లిగ్గా స్వేచ్చ గురించి   మాట్లాడ్డానికే భయపడే  ఎనభయ్యోదశకంలో  రాజేశ్వరి జగ్గయ్యపేట నుంచి ఒక స్నేహం కోసమా ,  కవి పరిచయం కోసమో వచ్చేసి , ఆఖరి బస్సు దాటిపోయి ఏ స్నేహితురాలి ఇంట్లోనో వుండిపోయేది. ఎదుటి మనిషిని తూకంవెయ్యడాలూ , అనుమానించడాలూ తన నిఘంటువులో లేవు. రాజేశ్వరి పసి మనసుకి అద్దం పట్టే ఈ కవిత చూడండి.

“వాళ్ళు గొప్పవాళ్లు సుమా

రుణాలూ వుండవు, ఋణ బ౦ధాలూ  వుండవు ,

అక్ఢరాలా కాపలాలు వుంటాయి.

మనకి మనల్నే   కాపలా పెడతారు

వాళ్ళకి కుటుంబం ఆ౦టే మొగుడు, ఇల్లూ , పిల్లలు

 స్నేహితులు శాశ్వతంగా వుంటారుటండీ అనేస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే,

మనకేమో ఆటోచ్చి ఒక సంతోషం, ఇటోచ్చి ఒక దిగులు ,

 మిణుగురు నుంచీ  కూడా వెలుగు తీసుకోవాల౦టే  నవ్వి పోతారమ్మా.

ఇన్నోసెన్స్ పోగొట్టుకుని ఇ౦టెలిజెట్స్  అయిపోతే ,

చిన్ని నాపొట్టకి శ్రీరామ రక్ష అయిపోతే ,

ఆ ముదిరిపోయిన గిడసబారిన ఇ౦టెలిజెన్స్  మనకోద్దులే తల్లీ ,

ఏదో మన  మానాన మనం  రాత్రి వర్షాన రాలిన పున్నాగ పూలని చేతిలోకి తీసుకొందాం

-చాలామ౦దిలాగా  రాజేశ్వరికి కవిత్వం  ఎంబ్రాయిడరీ కాదు . సరాసరి జీవితమే  

1987 అనుకుంటా నేను నందిగామలో వున్నప్పుడు రెండుసార్లొచ్చి నాలుగేసిరోజులపాటు వుండి వెళ్ళింది.  ఇ౦ట్లో వాళ్ళు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారని, అదృష్ట వశాత్తూ తను ఎవరికీ  నచ్చడం లేదని  చెప్పి నవ్వింది. నిజం చెప్పు  నీకే ఎవరూ నచ్చడంలేదు కదా  అంటే, మళ్ళీ నవ్వింది.

“ … అయినా వాళ్ళ పిచ్చి కానీ, మానవ సంబ౦ధాలు సహజంగా ఏర్పడాలి తప్ప ఒకరు వెతికి చూసిపెట్టడమేమిటి అని  విసుక్కుంది. ఇంటికొక అడ్డగడియ వున్నట్టు మెడకొక తాళి వుండాలల్సిందేనంటావా  అని నిలదీసింది. అన్నీ ప్రశ్నలే.

అమ్మాయిలు ఎంత స్పష్టంగా మాట్లాడితే అంత పిచ్చి వాళ్లకింద జమకడతారు కదా, తను అలాగే కనిపించేది.

 “అసలు తనకి ఏం కావాలో తనకే తెలీదండి  మనల్ని కూడా కన్ ఫ్యూజ్ చేసేస్తుంది. “ అన్నాడు రాజేశ్వరి ఎంతగానో ఆరాధించే ఒక కవి ఆమె పరోక్షంలో . భద్రమైన ఇళ్ళు, ఇల్లాళ్ళు, బ్యాకు లెక్కలూ, షేర్ మార్కెట్ నాలెడ్జీ వున్నవాళ్లకి తనగురించి ఇంతకంటే ఎక్కువ అర్ధంచేసుకునేదేమీలేదు.

1990 లో నేను హైద్రాబాదు వచ్చేశాక అప్పుడో ఫోనూ, అప్పుడో ఫోనూ తప్ప మళ్ళీ కలవడం కుదరలేదు. చివరికి ఆ మబ్బు విడిచి మన్ను చిమ్ముకుని ఒక ఇంటికి అంకితం అవడానిక్కూడా రాజేశ్వరి సిధ్దపడి౦ది

“ వంటిళ్లూ అవసరమే మాసిగుడ్డా అవసరమే , ఎవరి సొంత వంటిల్లు వాళ్ళకి కావాల్సిందే  , సామూహిక వంటశాల కూలినప్పుడు , ఒకానొక కాల్పనికక సిద్ధాంతపు క్రేజీలో వాస్తవం స్పప్నమవుతుంది.

ఆ కాపుర౦లో  ఆవకాయ పచ్చడి కలుపుతున్న వేళ్ళు కళాత్మకంగా , మనోహరంగా కనిపిస్తున్నాయి. అలా చాతకాన౦దుకు  నేనివేళ సిగ్గుపడి చస్తున్నాను. ఎవరయినా అనూచానంగా మింగుతున్న చేదుమాత్రని సుగర్ కోటేడ్ అని చెప్పడమెందుకు , ఇవాళ నాకంటూ ఒక సొంత వొ౦టిల్లు  లేకపోవడం అవమానకరమే, ఇందుకే మొన్న ఒకమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. నేను కవిత్వం చదివి కరడు కట్టి వున్నను కాబట్టి బతికిపోయాను “

మనుషుల్ని విపరీత౦గా ప్రేమిస్తుంది రాజేశ్వరి.  ఎవరి వల్ల అయినా తను గాయపడినా సరే అంతక్రితం వరకూ వారితో వున్న మ౦చి జ్నాపకాలతో బతికేస్తాను అంటుంది.

“………..భావ సారూప్యతలేనే లేని / నీవింత పరిమళ స్నేహంకోసం /మనం మన స్వప్నాలను పోగొట్టుకున్నాం/ ఎలా జరిగిందిది /మాటల మీంచి హృదయం నిండదు /నాకు చాలు ఒక మాట ఒక చూపు, ఒక నవ్వు, ఒక స్పర్శ /పొదరిల్లు కింద దొరికిన ఆ దొంగ చిరునవ్వునేం చేసావు ?/అది వెన్నెలయింది కదా /ఈ మిట్ట మధ్యాహ్నం నువ్వు చూడలేదా …….”

ఇంత కల్తీ లోకంలో, కెరీర్ తప్ప ఇంకేదీ అక్కర్లేని ,  ప్రతిఫలం వుంటే తప్ప చిరునవ్వు అయినా ఖర్చుపెట్టని మనుషుల మధ్య రాజేశ్వరి ఒక మినహాయింపు .

రాజేశ్వరి గురి౦చి  ఇప్పుడు మాట్లాడుతుంటే చాలా గిల్టీగా వుంది. నేను రాసిన “ఇల్లు ఖాళీ చేసినప్పుడు….”  కవిత చదివి,  మరి ప్రపంచాన్ని ఖాళీ చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుందో కదా అది రాస్తాను కానీ అస్సలు అనుభ౦లోకి రానివి ఊహించడం కష్టం కదా అంది . మరి ఇన్నేళ్ల తర్వాత అయినా దానిమీద రాసిందో లేదో తెలీదు. నామాడి శ్రీధర్ సేకరించి పంపిన వాటిలో అలాంటి శీర్షికతో ఏదీ కనిపించలేదు కానీ తీవ్రంగా ఆశాభంగం చెందిన ఒక సందర్భాన్ని గురించి మనసు కలచి వేసే కొన్ని వాక్యాలు ఎలా రాసిందో చూడండి..

“ హెలో వున్నారా / ఆహా వున్నాను వున్నాను/మాట్లాడరేం/ మాట్లాడుతున్నాను/ ఇప్పటి నా మాట వినిపించడంలేదేమో / నేను రానా, వద్దు/ మీరు వస్తారా , రాను/ నేను ఖాళీగా వున్నాను ఈవేళ / ఆత్మ చైతన్యమవుతున్నవేళలో నీ ఖాళీ సమయాన్ని నే పూరించలేను/ నీ చిరునవ్వుని నేను కాలేను/ i don’t want tobe fill in the blank please/ సరే ఏం చేస్తున్నారు / పక్షుల ఆశల్ని పాములు మింగేసే హింసాత్మక అసహ్యాన్ని చూస్తున్నాను /ఏమర్ధమయిందేమిటి ? / రేపటి సీతాకొక చిలుకలకోసం /ఈ వేళ అరచేతిలో గొంగళి పురుగుల్నీ సాకడం /

ఉత్తరానికీ ఎలిజీకి పెద్ద తేడా ఏముంది.

మనుషులుగా ఏ ఇద్దరయినా ఏళ్లతరబడి ఎవరి నదుల్లో వాళ్ళూ కొట్టుకు పోతున్నప్పుడు,

కెరటానికి పైన ఉన్నామా , అడుగున వున్నామా అనేది తప్ప ,

ఎవరి జీవన ఘోష అయినా ఈ భీభత్స శబ్దాల మధ్య ఎలా  వినిపిస్తుంది చెప్పు

-ఇది నువ్వు చదవలేని ఉత్తరం . చదివితే పోస్టులో మళ్ళీ కొన్ని పరిమళాలు నాకు అంది వుండేవి.

రాజేశ్వరీ , ఇవాళ నీ కవిత్వం చదివి నిన్ను తలచుకుంటుంటే ఏదో బాధగా వుంది.

దేహాలు –దేవాలయాలు – కొన్ని సందేహాలు

కొండేపూడి నిర్మల 

 

nirmalaమధ్యప్రదేశ్ లో ఏడేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడిన మదన్ లాల్, కోర్టులో శిక్ష ఖరారయన తర్వాత బాధితురాలి తల్లిదండ్రులతో రాజీ పడ్డాడు. దీ౦తో నిందితునికి విధించిన ఏడాది జైలు శిక్ష సరిపోతుందంటూ హైకోర్టు  అతని విడుదలకు ఆదేశించీంది. ( నేరస్తుల పట్ల కోర్టులు ఎంత సహోదర ప్రేమతో వుంటాయో మనకి తెలుసు.). దీనిపై  మధ్య ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి౦ది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు  మాత్రం అత్యాచార కేసుల్లో రాజీ ఒప్పందాలు చెల్లవని, మెతక వైఖరిని ప్రదర్శించడం,  నిందితులను రాజీకి అనుమతించడ౦ తీవ్రమైన తప్పిదమని అది మహిళల ఆత్మగౌరవాన్ని కీంచపరఛడమే అని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.  

ఇంతవరకు బానేవుంది.. మధ్యప్రదేశ్ హైకోర్టు కంటే మన సుప్రీకోర్టు కొ౦చెం విచక్షణతో వ్యవహరించింది  అని సంతృప్తి కూడా కలిగింది.

ఎందుకంటే అవిచ్చినంగా నడుస్తున్న కాఫ్ పంచాయితీల దగ్గర నుంచి సుప్రీ౦కోర్టు దాకా అత్యాచార బాధితురాల్ని, ఆ నేరం  చేసినవడు లగ్గం చేసుకు౦టే  న్యాయం జరుగిపోయినట్టే భావిస్తాయి.  . “గృహ ప్రవేశం”  సినిమా ఇదే కధా వస్తువుతో  350 రోజులు ఆడింది. కర్తవ్యం లో ఒక పోలీసు ఆఫీసరు  దగ్గరుండి బాధితురాలికి నేరస్థుడితో పెళ్లి జరిపిస్తుంది. చివరికి ఆ పెళ్ళిలో కూడా నేరస్థుడూ అతని తండ్రీ కలిసి  బాధితురాలిపై హత్యా ప్రయత్నం చేస్తారు . అయినా ఆ ప్రయత్నాన్ని  ఆ పోలీసు ఆఫీసరు తెలుసుకుని కాపాడి “ కలకాల౦ కలిసి వుండ “ మని ఆశీర్వదిస్తు౦ది. ఇలాంటివన్నీ  జనం కళ్ళకి అసహజంగా కాకుండా ఆనందబాష్పాలతో తిలకించేలా చెయ్యడానికి ఒక భావజాల౦ వుంది . మధ్యయుగాలకు చెందినట్టు కనిపించే ఈ భావజాలాన్ని చదువూ వివేకం , సాంకేతిక పరిజ్ణానమ్ ఏవీ మార్చలేవు.  అందుకు ఒక  చిన్న ఉదాహరణగా   పై కేసులో సంచలనాత్మక తీర్పు ఇచ్చిన న్యాయాకోవిదులు    అత్యాచారాల గురి౦చి  ఇచ్చిన నిర్వచనాన్ని చెప్పుకోవచ్చు. ఏమిటా నిర్వచనం ;

“ఆత్యాచారానికి పాల్పడటం  అంటే దేహాన్ని దేవాలయంగా భావించే మహిళపై దాడి చేయడమే . దానివల్ల అత్యాచార బాధితులు మాన మర్యాదలు కోల్పోతారు. అది వారి ప్రాణాలను హరించడంతో  సమానం. ‘

తీర్పు  హేతు బద్ధంగానూ ,  నిర్వచనం దానికి భిన్నంగా వుండటానికి వెనకగల కారణ౦ నాకు చాలా  ఆసక్తి కలిగించింది.  పై మాటలు  స్త్రీలందరి దేహ దేవాలయాల శీలా సంపదల  గురించి న్యాయమూర్తులూంగారు   అంటున్నప్పటీకీ సందర్భం మాత్రం ఏడేళ్ళ పాప గురించే.  అదృష్టవశాత్తూ అంత లావు భావజాల౦ ఆ పాప కెలాగూ అర్ధాంకాదు.

ఆ మాటకొస్తే తన శరీర నిర్మాణమేమిటో , ఎవడు ఎందుకు  దాడిచేశాడో,  అసలు ఏం జరిగిందో తెలుసుకునే౦త వయసుకూడా లేదు. తెల్సిందల్లా  భయానకమైన దాడి, గాయాలు, రక్తస్రావం. మానసికంగా ఒక దిగ్భ్రాంతి. ఇలాంటప్పుడు తక్షణమే వైద్యం జరగాలి. వైద్యమ౦టే  ఆస్పత్రిలో వుంచి కట్టుకట్టడం మాత్రమే కాదు.  ఏ పరిసరాలు, సంఘటనలు, మనుషులు ఆమెని అంత భీతావహురాల్ని  చేశాయో దానికి దూరంగా వుంచడం , .కుటుంబం ,సమాజం ఆమె పట్ల సానుభూతి  కాకుండా సహానుభూతి కలిగివుండటం, . క్రమక్రమంగా ఆమె మనసుని  చదువు వైపు , ఆటలపాటలవైపు, ఆమె కిష్టమయిన మరో వ్యాపక౦ వైపు మళ్ళీంచడం- ఇవి కదా  జరగాలి.. వీటివల్ల మాత్రమే బాధితురాలు కోలుకోవడానికి అవకాశం వుంది. అదే సమయంలో  నేరస్థుడికి చట్టబద్ధంగా  విచారణ, రిమాండ్ , శిక్ష ఇలాంటి లాంటివన్నీ జరగాలి.

అంటే అటు ఆ పాపకి జరిగిన అన్యాయానికి, ఇటు నేరస్థుడి చర్యకీ చట్టం  బాధ్యత వహించాలి.  కానీ  వాస్తవంలో ఏం జరుగుతోంది? ఆ  నేరస్థుడ్ని తెచ్చి బాధితురాలితో పెళ్ళి చెయ్యడం జరుగుతోంది.  దీనివల్ల ఒకసారి అత్యాచారం చేసినవాడికి జీవితాంతమూ అత్యాచారం చెయ్యడానికి బోనస్ లాంటిది  దొరుకడంలేదూ| తమ బిడ్డకు జరిగిన అన్యాయానికి పోరాట౦ చేయాల్సిన బాధిత కుటుంబానికి  నేరస్థుడే మీసాలు తిప్పుతూ అల్లుడవుతాడు. ఎటువంటి శిక్షా, పరివర్తనా లేకుండా అటువంటి నేర ప్రవృత్తి గలవాడిని  ఇంటిలో పెట్టుకోవడం వల్ల ఆ కుటుంబంలో  ఇతర బాలికలకు , స్త్రీలకు రక్షణ కరువయ్యే ప్రమాదం లేకపోలేదు.. బాధితురాలు సైతం తన ప్రాధమిక , మానవ హక్కులమీద దాడిచేసినవాడ్ని జైలుకి పంపడానికి బదులు ప్రేమిస్తూ, సేవలు చేస్తూ , వారసుల్ని కనివ్వాలి. ఇంత రోతను భరించినా సరే ఆమె ప్రాణానికి రక్షణ వుందో లేదో తెలీదు. అప్పుడు గృహహింస బాధితురాలి చిట్టాలో ఆమే పేరు నమోదవుతుంది.  ఇన్ని చట్ట విరుద్ధ , అప్రజాస్వామ్య , పౌరుష హీన చర్యలన్నిటికీ సదరు  స్త్రీలపై ప్రత్యేక శ్రద్ధతో అల్లిన భావజాలమే కారణం.

ప్రస్తావన కోసం మళ్ళీ నిర్వచనాన్ని ఒకసారి లోతుగా పరిశీలిద్దాం

స్త్రీలు  తమ శరీరాల్ని దేవాలయాలుగా భావిస్తారని సామాజం భావిస్తుందిట..  ముస్లిం స్త్రీలయితే మసీదులుగా , క్రైస్తవ స్త్రీలయితే చర్చీలుగా భావించుకోవచ్చు. పోనీ కాస్సేపు నిరర్ధకమయిన ఈ పోలికతోనే ఆలోచిద్దాం. మామూలుగా దేవాలయాల్లో  ఒక పశువు బురదకాళ్లతో అడుగుపెడితే ( రేపిస్టుని నోరులేని పశువుతో పోల్చడం  నా కీష్టంలేదు ) ఏం చేస్తారు? అప్పుడు ఆ ప్రాంతమంతా శుద్ధి చేసి సంప్రోక్షం చేస్తారు. దాంతో పవిత్రత తన్నుకుంటూ వచ్చి తీరుతుంది.. కానీ స్త్రీల విషయంలో ఒకసారి పోయిన పవిత్రత మళ్ళీ రాదు. కాబట్టి ఎవడైతే నేరం చేశాడో వాడే ఆమెని చేపట్టాలి.  అలా చేపట్టేలోపు ఆమే  మాన మర్యాదలు ప్లస్ ప్రాణం కూడా పోయినట్టే భావించుకోవాలి. ఎవదైనా చేపట్టీన తర్వాత అలా భావించనవసరంలేదు.  తాళి కట్టీన తుచ్చుడే రక రకాలుగా భావిస్తాడు కనక. 

అయ్యా | బాబూ | మేము మీ సాటి మానవుల౦, మీరు ఆపాదిస్తున్న  దైవత్వాలూ, పవిత్రతలూ వద్దే వద్దు. రాజ్యాంగం మాకు ప్రసాదించిన   హక్కుల మీద ఎవరేనా దాడి చేసినప్పుడు సకాల౦లో  స్పందించండి, చాలు-  అని మహిళలు ఎప్పటినుంచో తల బాదుకుంటున్నారు. అది మాత్రం జరగడంలేదు.

*

 

ఘర్ వాపసీ

కొండేపూడి నిర్మల

 

ఇంతకీ నా పౌరసత్వం దేశంలో వుందా ? మతంలో వుందా?

నేనిప్పుడు దిగజారిన మానవ విలువల్ని గురించి బెంగెట్టుకోవాలా

బండరాయికి పొర్లు దండాలు పెట్టాలా

ప్రప౦చ నాగరిక దేశాల సాక్షిగా మన రాజ్యాధినేత ఘర్ వాపసీ అని గర్జించినప్పుడు-

అలా వాపసు వచ్చిన వాళ్ళకే రేషను కార్డులు అని ప్రకటీంచినప్పుడు

లెక్క ప్రకారం మనమంతా ఏ ఆఫ్రికా చీకటి అడవుల్లోకో  వలస పోవాలి కదా

భూమి కంటే ముందు  హిందూత్వ పుట్టినట్టు ఈ ప్రగల్భాలేమిటి ?

 

ఇంతకు మించిన కొమ్ములూ కోరలూ వున్న ఎన్ని మతాలు, ఎందరు దేవుళ్ళు కాలగర్భంలో కలిసిపోలేదు|

చరిత్ర అంతా రాజులు చెక్కిన రాళ్ళ ముచ్చటే అని తెలుసు కాని

తాను చెక్కిన రాయితోనే సర్వజనులూ తల బాదుకోవాలని చెప్పిన రారాజు ఇతడేనేమో

మాట వినని వాళ్ళకి మరణ దండన అనే  మాట ఒక్కటీ అనలేదు తప్ప

అంతకంటే ఎక్కువే చెయ్యగలడని మనకి తెలుసు , గుజరాత్ కి తెలుసు

రాయిని పగలదీయడమే తెలిసిన  చెమట సూర్యుడికి

ఇప్పుడు రాజు  బుర్రలో ఏ రాయి వుంటే  దానికి  మొక్కాల్సిన పని పడింది.

 

రాజ్యాంగం రాసుకున్న ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా

దేవుడనే వాడొక్కడే అని , అన్ని మతాల సారాంశమూ మానవత్వమేనని

ప్రాధమిక అవహాగాహన అయినా పె౦చని ప్రజాస్వామిక దేశంలో

ఆర్టికల్ 25  ఒక నోరు లేని గులకరాయి

మానవ హక్కులు గాలికి ఎగిరిపోయే చిత్తు కాయితాలు

మనిషిని బతకించడానికయితే   నాలుగైదు రక్త నమూనాలు సరిపోతాయి.

చంపడానికి ,చావడానికే కదా చచ్చినన్ని మత అంధ రాజ్యాలు

భక్తుల మీదనో, వారి గూళ్లలో కొలువున్న రాళ్లమీదనో , వారు సమర్పించే చీనీ చక్కెర ప్రసాదాలమీదనో

వ్యతిరేక౦తో నేనీ మాట చెప్పడంలేదు.

 

అసలు ఈ నమ్మకాలతో, అపనమ్మకాలతో ప్రమేయం లేకుండా బతకుతున్న

కోట్లాడి కష్టజీవుల చిరునామా ఏమిటని  అడగదల్చుకున్నాను.

మత౦ మరక లేకుండా  మనకొక  ముఖం వుండచ్చా  లేదా తెలుసుకోవాలనుకు౦టున్నాను

 

ఎన్ని అవమానాలు, ఎన్ని అసంబద్దతలు, ఇంకెన్ని పరాధీనతలు

మన నిత్యజీవితంలో భాగమై పోయాయో  ఎప్పుడయినా ఆలోచీంచారా?

కన్నవాళ్ళు కూడా బిడ్డల్ని  మత చిహ్నాలుగా  పెంచి పోషించారు తప్ప

మనిషిగా ఎప్పుడయినా చూశారా ?

ఇష్టమో కాదో తెలుసుకోకుండా పుట్టీన పదోరోజున నాకొక దేవుడి పేరు తగిలించడమేమిటి?

 

పసిదనపు  నుదిటి మీద  మత సంకేతాన్ని తిలకంగా  దిద్దడమేమిటి?

పంట కాలవలాంటి  బాల్యానందాల పలక మీద ఆ ఆల కంటే ముందు

అడ్డదిడ్డంగా శ్రీకారాలు చుట్టడమేమిటి

వద్దని గింజుకుటున్నకొద్దీ    తలనీలాల్ని

ఒక దేవుడి ముందు తరిగి  పరాభవింఢమేమిటి?  .

అమ్మ కడుపున పుట్టడం ఒక్కటే నాకు  తెలిసిన వాస్తవమైతే

కులాల వారీగా మనుషుల౦తా దేవుడి తొడల్లో౦చీ, భుజాల్లోంచి , పాదాల్లోంచీ పుడతారనే

అశాస్త్రీయ, అశ్లీలపు కధలు చెవులు మూసుకునేదాకా వినిపించడమేమిటి?

 

సూర్య నమస్కారాల ప్రచారం కోసం యోగాసనాల్ని  మార్కెట్ చేయడమేమిటి?

భిన్న మత సంస్కృతులున్న  దేశానికి భవద్గీతను ప్రామాణిక  చేయడమేమిటి?

ఏమిటిదంతా?

పరిపాలన ఆ౦టే ప్రజలకు శిరో ముండన చేయడమేనా ?

రాజులు రద్దయినా రాతలు మారతాయని నమ్మకం లేదు కదా

రేపు ఇంకోక రాజు  ఇంకొన్ని  కుట్రలతో  తన కుల మతాన్ని  మన నెత్తిమీద గుమ్మరించడని చెప్పలేం

ఇంత జరిగాక  మనకిప్పుడు  freedom of religion వద్దే వద్దు

Freedom from religion కావాలి

రహదారిని ఆక్రమిస్తున్న ఈ దేవుళ్ళ నుంచి, దెయ్యాలనుంచీ

తాయెత్తుల నుంచీ , విబూది నుంచీ , శని యంత్రాలనుంచీ, శవ పూజలనుంచీ

నడవటానికి ఒక దారి వేసుకోవాలి.

nirmala*

 

 

చేరాగారి చివరి పాఠమేమిటి..?

10534397_326754877475156_564669077665495274_n

భుజాన నల్ల సంచీ, దాన్నిండా కిక్కిరిసిన పుస్తకాలు, గాలికి కదిలే తెల్లజుట్టూ ఆహార్యాలుగా వున్నాగానీ ,దాదాపు ఆరడుగుల వెలుతురు రూపం మన చేరా మాస్టారు. ఎప్పుడూ  పరధ్యానంగా , ఏదో ఆలోచిస్తూ వుంటారు. మొదటిసారి మాట్లాడుతున్నవాళ్ళకయినా సరే ఆయన ఖచ్చితంగా ప్రొఫెసరే అయివుంటాడనిపిస్తుంది తప్ప రియల్ ఎస్టేట్ దారుడో, ఎల్.ఐ.సి ఉద్యోగో మాత్రం కానేకాదు అనిపిస్తుంది. మాట్లాడ్డం మొదలుపెడితే మాత్రం ఆ ఆప్యాయత ఉరవడిలో ఆయన హోదా ఏమిటో గుర్తురాదు. అంత బాగా జన సామాన్యంతో కలిసిపోయే వ్యక్తిత్వం చాలా తక్కువ మందికే వుంటుంది. ఒక ప్రక్రియలోనే తల పండి అలసిపోయామనుకున్నవారికి మాస్టారి బహుముఖ ప్రజ్ణా, నిరాడంబర వ్యక్తిత్వం నిదానంగా మాత్రమే అర్ధమవుతాయి.

చేరా గురించి నాకున్నన్ని జ్నాపకాలు మా నాన్నతో కూడా వున్నాయో లేదో.

దాదాపు పాతికేళ్ళ క్రితం రంజని ఆఫీసు వాళ్ళు కవి సమ్మేళనం పెట్టి నప్పుడు చదివిన లేబర్ రూమ్ కవిత విని మాస్టారు చాలా మెచ్చుకున్నారు. అప్పటికి అదే కవిత అశ్లీలంగా వున్న కారణంగా ఆంద్ర జ్యోతి వారి చెత్తబుట్టకు చేరువలో వుంది. కాబట్టీ ఆ ప్రోత్సాహం నాకు తెరిపిగా అనిపించింది. చేరా అ0టే చేరాతల రచయిత అని మాత్రమే తెలిసిన నాకు, భాషాశాస్త్రంలో ఆయనకి వున్న ప్రతిభా, వ్యాకరణ , వాక్య నిర్మాణ విన్యాసం, కృషి తెలుసుకున్నాక గర్వంగా అనిపించింది. అప్పటికి నేను రాసిన సందిగ్ధ సంధ్య సంకలనాన్ని సమీక్ష కోసం మాస్టారు ఇచ్చిన చిరునామా కి చాలా భయపడుతూ పంపించాను.  అందులో కొన్ని మాత్రమే బావున్నాయని, కొన్ని అనవసర వాక్యల పొడిగింపు వల్ల నిస్సారంగా వున్నాయని చెబుతూ ఒక ఉత్తరం రాశారు.. సాహిత్య రచనకి సంబంధించి ఎలాంటి ప్రోత్సాహమూ , వాతావరణము లేని నాకు అది మొదటి పాఠం. రాసినదాన్ని గట్టిగా చదివి చూసుకునే అలవాటు రేడియో కాంపీరింగు వల్ల చాతనయితే , ఎన్నిసార్లు అయినా తిరిగి రాసుకోవడం, సొంత అక్షరాల పట్ల వీలయినంత నిర్మమకారంగా వుండటం మాస్టారి వల్ల సాధ్యమయింది. .

ఎన్ని ఉత్తరాలు రాసుకునేవాళ్లమో , ఒక్కొక్కటి ఒక్కో ఆత్మీయ , సాహిత్య, సామాజిక అక్షర శిల్పం. ఆగాకర కాయ కూర దగ్గరనుంచీ అన్నమయ్యదాకా ఏ విషయం మీదయినా ఆయనదొక భిన్నమైన అభిరుచి ప్రకటన. రె౦డు రెళ్ళు నాలుగు అనేది సంఖ్యా శాస్త్రం . అయిదు, ఆరు,, ఏడు   కూడా ఎందుకు అవుతాయో నిరూపీంచడం భాషా శాస్త్రం. ఎందుకంటే ఇంత పెద్ద ప్రపంచంలో ఇన్ని భాషల, నుడికారాల మధ్యా ఇదే సరి అయినది అని చెప్పడం పిడి వాదం అనేవారాయన. మాస్టారులో వున్న సరళీకృత విధానానికి, నూతన ఆవిష్కరణల పట్ల అనుకూలతకు అదొక గుర్తు.

. మాస్టారులో వున్న నిబ్బరానికి హాస్య ప్రియత్వానికి చాలా ఉదాహరణలున్నాయి. వాక్యంలో బడు ప్రయోగం చర్చ జరుగుతున్న రోజుల్లో ఒకసారి ఖమ్మం నించి ఇటు తిరువూరు వచ్చారు. టిఫినూ కాఫీ అయ్యాక స్నానం చెయ్యడానికి సూట్కేసు తెరిస్తే అందులో పెద్దవాళ్ళు కట్టుకునే జారీ నేత చీరలూ , పగడాల గౌలుసులూ లాంటివి కనబడ్డాయి. ఆయనతో బాటు మేం కూడా  తెల్లబోయా౦. విషయం ఏమిటంటే బస్సులో సూట్కేసు తారుమారయింది. ఏ బస్సులో వచ్చారో ఆ ఆ నంబరు గుర్తులేదు. కనకదుర్గా ట్రావెల్ సర్వీసెస్ అని మాత్రం చెప్పగలిగారు. ఎంత చిన్న వూరు అయినాకానీ భద్రాచలం, మళ్ళీ అక్కడ్నించీ హైద్రాబాదు వెళ్ళి వచ్చిన ఆ బస్సులో ఎవరితోనో దిగిపోయిన సూట్కేసు పట్టుకోవడానికి మూద్రోజులు పట్టి౦ది.. అది దొరికేవరకూ మేం పడ్డ హడావిడి , ఆందోళన అన్నీ మాకే వదిలి తను మాత్ర౦ ఇంట్లో వున్న ఒక రెడీమేడ్ టీషర్ట్, లుంగీ కట్టుకుని, అక్కడి గెస్ట్ హౌసులో కూచుని హాయిగా పేపర్   రాసుకున్నారు. పైగా,

“ ఎందుకంత కంగారు పడతారు. నా పెట్టెలో పుస్తకాలు తప్ప ఖరీదయినవేవీ వుండవు. అవి ఎవరు పట్టుకుపోయి చదువుకున్నా సంతోషమే, నేనెలాగూ అన్నీ పారేసుకూంటాను కాబట్టి మా ఆవిడ ఎలాగూ పాత దుప్పట్లు తువ్వాళ్ళు పెడ్తుంది, ఏమీ పారేసుకోకుండా ఇంటికేడితే మళ్ళీ ఆవన్నీ ఇ౦ట్లో సర్ధడ౦ ఆవిడకే చిరాకు, “ అన్నారు గట్టిగా నవ్వుతూ.

ఒకసారి బెంగుళూరులో జరిగిన ప్రపంచ మహాసభల్లో కవిత్వం చదవడానికి నేనూ, యాకూబ్, అఫ్సరు, శిఖామణీ, దేవీ ప్రియ ఇంకా కొ౦దరు కలిసి వెడుతుంటే రైల్లో ముత్యాల సరాలు పాఠం చెప్పారు. ఆ రాత్రి కదిలే రైల్లో మాస్టారు మంద్రస్వరంతో చెప్పిన ముత్యాలు కిటికీలో పొంచి చూస్తున్న చందమామ ఎత్తుకుపోకుండా కాపలా కాయడం కష్టమయింది. అదే ఛందస్సులో మేమంతా ఎవరికివారం మనసులోనే కవిత్వం మాల అల్లుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. వీళ్ళంతా నా శిష్యులు అనుకోవడంలో మాస్టారికెంతో సంతృప్తి వుండేది.

స్త్రీలకొక వాదం కూడానా అని అహంకరిస్తున్న కాలంలో స్త్రీవాద కవిత్వాన్ని అర్ధం చేసుకునే సూక్ష్మదర్శని అందరికీ ఇచ్చింది రామారావు గారే. నిజానికి అంతక్రితం ఎన్నోఏళ్లనుంచీ ఎన్ని వాద వివాదాల గురించి పరిచయం చేసినా స్త్రీవాద పక్షపాతి గానే మాస్టారు అందరి హర్షానికీ , కొ౦దరి ద్వేషానికీ కారణయ్యారు.  నీలి కవితలు, వార కవితలు, వళ్ళు బలిసిన మధ్య తరగతి ఆడవాళ్ళ రచనలు అని దూషించిన వారికి రచయిత్రులెంత బాగా జవాబు చెప్పారో, విమర్శకులుగా మాస్టారూ అంత బాగా మాకు మద్దత్తు ఇచ్చారు.

చేరాగారు ప్రధానంగా పద్య ప్రేమికులు అయినా వచనాన్ని బాగా ప్రచారం చేశారు. కాబట్టి కవిత్వంలో వచనం వున్నా, వచనంలో కవిత్వం వున్నా అస్సలు సహించలేరు. దేనికది ప్రత్యేక వ్యక్తీకరణ వున్న సాహితీ ప్రక్రియ అని గట్టిగా నమ్మేవారు. నేను పత్రికలకోసం రాసిన రిపోర్టుల్లో కవిత్వ ఛాయలు అండర్ లైన్ చేసి అలా రాయద్దని, ఇలాగైతే ఇక నీకు మంచి వచనం పట్టుబడదని హెచ్చరించేవారు.

నడిచే గాయాలు పుస్తకానికి ఆర్ధిక బాధ్యత తప్ప ముద్రణా, అచ్చుతప్పులు దిద్దడం, కవర్ పేజీ వేయీంచడం అన్నీ చేరాగారే స్వయంగా చూశారు. గోడలు అనే కవిత పత్రికలో వచ్చిన రూపంలో కాక ఇంకాస్త బాగా ఎడిట్ చేసి నేను పంపేలోగా పుస్తకం అచ్చయిపోయింది. అప్పుడు నా నిరుత్సాహం చూళ్ళేక రెండవ వర్షన్ కూడా చివరి పేజీలో వేయించారు. ఎంత చిన్న మనిషినయినా పెద్దగానే పట్టీంచుకోవడం మాస్టారికలవాటు.

చేరా ఉస్మానియా యూనివర్సిటీ డీన్ గా వున్నప్పుడు ఒకసారి నే వెళ్ళేసరికి ఏవో ఆఫీసు లెటర్స్ టైపు చేస్తున్నారు.

“ అదేమిటి మాస్టారూ మీరు చేస్తున్నారేమిటి ఈ పని. మీదగ్గర టైపిస్తులు ఎవరూ వుండరా ?”అని అడిగాను.

“ఎందుకుండరు, వుంటారు. కానీ మూడింటికల్లా పంపించివేస్తాను. ఇక్కడి నుంచి మా టైపిస్టు వాళ్ళీల్లు చాలా దూరంట. ఆ అమ్మాయికేవో కుటుంబ సమస్యలున్నట్టున్నాయి.. చెప్పాలనుకుంటే తానే చెబుతుంది. నేను అడగడమెందుకు. అయినా నా పని నేను చేసుకోవడమే హాయి” అన్నారు. దటీజ్ చేరా. ఎదుటివారి వ్యక్తిగతానికి, వ్యక్తిత్వానికి అ౦త చోటు ఇచ్చే బాస్ లు నేను పనిచేసిన చోట ఎక్కడా దొరకలేదు.

ఎవరింటికయినా వెడితే ఆ ఒక్క మనిషితోనే మాట్లాడి వచ్చేసే దురలవాటు నాకు వుండేది. మిగిలినవాళ్లని పట్టీంచుకునేదాన్ని కాదు. అది స్థాయికి సంబంధించిన దూరాన్ని తెలియజేస్తుందని , అలా వుండకూడదని మాస్టారు మాయింట్లో వాళ్ళతో కలిసిపోయిన తీరుని చూసి నేర్చుకున్నాను.

చేరాకి మనుషులు కావాలి. అది ద్వారకా హోటలు అయినా, సుప్రభాతమ్ ఆఫీసు అయినా మా ఇల్లు అయినా , ఇంకోటి ఇంకోటి అయినా ఆటో చేసుకుని వచ్చేస్తారు. మనుషుల్ని౦చి దూరం చేసే ఏ హోదా ఆయన పాటీంచేవారు కాదు.

చేరాలాంటి మహాసముద్రాన్ని గురించి నాలాంటి చిన్న మనీషి ఎన్ని దోసిళ్లతో తవ్వి తలపోసుకున్నా తక్కువే అవుతుంది.

కానీ గత రెండేళ్ల నుంచీ ఎందుకోగానీ మాస్టారు సరిగా పలకడంలేదు. ఏ సభలో కలిసినా ముక్తసరిగానే వున్నారు. ఎవరితో పంచుకున్నా ఇదే అనుభవం చెబుతున్నారు. ఎడ్నార్ధం క్రితం నా పుస్తక ఆవిష్కరణకి మాట్లాడారు. తర్వాత మళ్ళీ మొన్న కృష్ణక్క పుస్తక సభలో చూశాను. రోజూ త్యాగరాయ సభకి వెడుతున్నారని తెలిసి అక్కడికి వేడితే అప్పుడే ఇంటికి వెళ్ళారు అన్నారు. ఇప్పుడు ఇంక ఇంటికి వెళ్ళినా వుండరని తెలుసుకుని తమాయించుకోవాలి.

మామూలుగా నేను ఎలిజీలు రాయను.. రాయలేను. ఎందుక౦టే మొదటగా జరిగిన సంఘటన జీర్ణించుకుని, మళ్ళీ తేరుకుని, ఆ జ్నాపకాల్నిఆ౦టే బహుశా నిట్టూర్పుల్ని క్రమబద్ధీకరించుకుంటూ రాయాలి.. ఇందుకు సమయం పడుతుంది. కాబట్టి వెంటనే ఆ పని చేయలేకపోతాను. అయితే గత కొన్నాళ్ళుగా చేరా మానసికంగా పాటించిన ఒక మౌనమే మనందరికీ ఒక తాత్త్విక వాతావరణం ఏర్పడేలా చేసింది. బహుశా ఇది కూడా ఒక పాఠమే. చేరా మాస్టారు చెప్పిన చివరి పాఠం. ఈ పాఠం పట్టుబడటం కష్టంగా వుంది చేరాగారూ.

-కొండేపూడి నిర్మల

శనివారం, 26.7.2014

(చిత్రం: రాజు)