ఛాయ! 

 

damayanti

ఒక్కఉదట్న నిద్రలోంచి  లేచి కుర్చుంది వర్ధనమ్మ.  మంచంపట్టీల  మీద చేతులు  ఆన్చి,  కాసేపటి దాకా అలానే  తలొంచుకుని వుండిపోయింది.   పీడకలకి గుండెలు దడదడా కొట్టుకుంటోంటే,  కళ్ళు నులుముకుంటూ ఆత్రంగా చూసింది – ఎదురుగా  వున్న బెడ్ కేసి.

కోడలు అటుపక్కకి తిరిగి, పొట్టలోకి   కాళ్ళు ముడుచుకు పడుకుని కనిపించింది !  హమ్మయ్య అనుకుంది.

ఒకప్పుడు – మెలి తిరిగిన ఏటి పాయలా  థళథళామంటుండేది.  మిలమిలా మెరిసిపోతుండేది. ఈ నాడు –  గ్రీష్మతాపాగ్నికి   ఇంకిపోయిన  జీవ నది కి తాను ఆన వాలు అన్నట్టు – ఒక   ఇసుక చారలా మిగిలిపోయింది.

  వసంతాన్ని చూసిన రెండు కళ్ళే, శిశిరాన్నీ చూస్తాయి.  కానీ, ఒక్క హృదయమే భిన్నంగా స్పందిస్తుంది.

 అవును మరికన్నీళ్ళుఖేదంలో వస్తాయి. సంతోషం లోనూ వస్తాయి. అయినా, రుచి వేరు కాదూ?

కలల్లోనూ, కనులెదుటనూ కోడలి దీన రూపం  – ఒక  వీడని  వెతలా  ఆవిణ్ని వెంటాడుతూనే వుంది.   ఒక్కోసారి  ఆ కల ప్రభావం ఎంత తీవ్రంగా వుంటుందంటే  – ఆ  ధాటికి    ఊపిరి అందక ప్రాణం ఉక్కిరిబిక్కిరైపోతుంది.  ఇప్పుడామె ఉన్న పరిస్థితి అదే!  ముఖాన పట్టిన చెమటని చీర కొంగుతో అద్దుకుని,    వొణుకుతున్న కాళ్ళతో మెల్లగా మంచం మీంచి లేచింది.  తలుపు తీసుకుని, ప్రధాన ద్వారం బయట..  మెట్ల పక్కని అరుగు మీద కొచ్చి చతికిలబడింది.

భాద్రపద మాసం,  కృష్ణ పక్షం .   కాంతిని కోల్పోతున్న చంద్రుడు – ఆకాశంలో నిశ్శబ్దంగా వెలుగుతున్నాడు.  కొడికడుతున్న  దీపంలా.  అసలే జారిపోతున్న ప్రాణం. పై నించి, నల్లమేఘాల వధం లో కొట్టుమిట్టాడుతున్నట్టుంది  అతని పరిస్థితి.

వుండుండి విసరిసరి  వీస్తున్న  కొబ్బరి చెట్ల   గాలొచ్చి ఒంటికి తాకడంతో  కాస్త నిదానించింది ఆ పెద్ద ప్రాణం.

అప్పటికి – కాస్త  గుండె వేగం గా కొట్టుకోవడం ఆగింది. కానీ, శరీరం కుదు టపడినంత  తేలిక గా  మనసు కుదుటపడుతుందా? లేదు.

ఎవరికి చెప్పుకోలేని  మానసిక వ్యధ. ఆ ముసలి గుండె ఒంటరిగా మోయలేని  భారపు మూట గా మారింది.

పెళ్ళి కాని కూతురు – తల్లి గుండెల మీద కుంపటంటారు! కానీ, నరకమనుభవించే కోడలు గుండెల మీద నిప్పుల గుండం అని ఎంతమందికి  తెలుసు?  అనుభవించే తనకు తప్ప!

వొద్దువొద్దనుకున్నా మరచిపోలేని గతం మళ్ళీ కళ్ళముందుకొచ్చింది.

ఆ రోజు ఎంత చేదైనా రోజంటే – తమ జీవితాల్ని చిందరవందర చేసిన రోజు. ఒక పూల తోటలాంటి ఈ ఇంటిని  అమాంతం   శ్మశానం చేసి పోయిన రోజు!

ఆవాళ ఏమైందంటే!

*****

ఊరంతా గుప్ఫుమ్మన్న  ఆ వార్త  వాళ్ళ చెవుల కీ సోకిన  క్షణం – తల కొట్టేసినంత పనయింది  వర్ధనమ్మకి. నిలువునా నరికిన చెట్టులా కూలిపొయింది.  రేపు బయట నలుగురిలో మొఖమెత్తుకుని తిరగడం ఎలా అనే మాట అలా వుంచి, ఈ క్షణం  ఇప్పుడు..తను –  కోడలి వైపెలా కన్నెత్తి ఎలా చూడగల ద నేది పెద్ద ప్రశ్న గా మారింది.  సిగ్గుతో కాదు. భయం తో అంతకంటే కాదు. ఇంకొకటి..ఇంకొకటుంది అదే..సాటి స్త్రీగా ..  ఆమెకేమని జవాబివ్వగలదని?  ఏం సమధానపరచి ఓదార్చగలదనీ?

వెంటనే పూజ గదిలోకెళ్ళి తలుపులుమూసుకుంది. అలా ఏడుస్తూ..ధ్యానిస్తూ..దేవుణ్ణి శపిస్తూ..ఎలా గడిచిందో కాలం!’ తనే ఇలా డీలా పడిపోతే, పాపం! దాన్నెవరు సముదాయిస్తారూ?’ అనుకుంటూ మెల్లగా లేచి హాల్లోకొచ్చింది. మిట్ట  మధ్యాహ్న మైనట్టు చూపిస్తోంది గడియారం. ఆమె కళ్ళు –  కోడలి కోసం ఇల్లంతా వెదుకుతున్నాయి. ఏ మూల ముడుచుకునిపోయి, శోకభారంతో కుంగుతోందా అని!

అంగుళంగుళం కటిక నిశ్శబ్దాన్ని ముసుగేసుకున్న ఆ బంగళా  ఆమెకాక్షణంలో భూతాల కొంపలా అనిపించింది.

అందుకే అంటారు.ఇల్లంటే ప్రేమిచిన హృదయం. అదే మనిషిలోంచి వెళ్ళిపోయినప్పుడు ఏం మిగులుతుందనీ?  ఇప్పుడిక – పాడుపడ్డ గూడేనా?

‘జ..ము..నా..’ పిలిచాననుకుంది. గొంతు పెగలందే!

“ఏమిటత్తయ్యగారూ? ఇలా నిలబడిపోయారు?” వెనకనించి వినిపిస్తున్న కోడలి మాటలకి గిరిక్కున అటు తిరిగి చూసింది.

జమున తల స్నానం చేసి,  నీళ్ళు కారుతున్న తడి బట్టలతో పూజ గదిలోకెళ్తోంది.

ఇంత మిట్ట మధ్యాన్నపు వేళ..తల స్నానమా? ఏదో చావు కబురు విన్నట్టు…మైల విడిచినట్టు..?  ఆమెకర్ధమైంది. పూర్తిగా అర్ధమైంది. ముడుచుకున్న  భృకుటి విడివడ్డాక నిస్సత్తువగా  సోఫాలో కూలబడిపోయింది. కోడలి ప్రవర్తన అంతుబట్టడం లేదు.

లేదు..ఈ ప్రశాంతత ఎంత భయానక ప్రళయానికి దారితీస్తుందా అని వొణికిపోతోంది !

తన నింత వేదన కి గురిచేసిన  కొడుకు మీద ఆమెకి మొట్టమొదటి సారిగా విరక్తి కలిగింది.

అది మామూలు విరక్తి కాదు. జుగుప్సతోకూడిన విరక్తి కలిగింది.

బంగారం లాంటి పిల్లని వెదికి వెదికి తీసుకొచ్చి పెళ్ళి చేసింది. ఈ ఇల్లు తనదని, వీళ్లంతా తన వాళ్ళని తమని కలుపుకుని,  తమతో కలిసి, ఈ ఇంటిని తన మమతానురాగాలతో బంగారు దీపాలు వెలిగించిన పుత్తడి బొమ్మ-  జమున! చందమామ లాంటి  కొడుకుని కని ఇచ్చింది. అలాంటి   ఇల్లాలికా వీడు  – ఇంత ద్రోహం చేసిందీ?

ఎవర్తినో  తీసుకొచ్చి, నడి బజార్లో కాపురం పెడతాడా? సిగ్గు లేదు? తమ బ్రతుకులేమౌతాయనే ఆలోచనా జ్ఞానం లేదూ? కుల యశస్సును, వంశ ప్రతిష్టను కాలరాచే పుత్రుణ్ని కలిగి వుంటం కన్నా, అసలు కొడుకే లేకపోవడం మేలేమో!   కంటి తడి  ఆరకుండా ఏడుస్తోంది – కోడలి గురించి పరితాపం చెందుతోంది. ‘పిచ్చిది ఏమౌతుందా ‘అని.

ఒక అత్త గారు ఇలా తన  కోడలి కోసం దుఖించడం..వింతే కదూ?

***

వర్ధనమ్మ కొడుకు పేరు – చక్రవర్తి. అతనిది  గిల్ట్ నగల వ్యాపారం. తయారు చేసిన నగలను చిన్నా చితకా దేవాలయాల నించి పెద్దపెద్ద క్షేత్రాల కు సరఫరా చేస్తుంటాడు.   పర్వ దినాల్లో దేవుళ్ళ ప్రత్యేక అలంకరణల కై ఘనమైన నగల్ని స్పెషల్ గా తయారు చేసి సప్లై చేస్తుండేవాడు. అందుకు తగిన వర్క్ షా ప్, వూళ్ళొనే వుంది.  చేతికింద పనివాళ్ళుండేవాళ్ళు.  నగల తయారీ దనం లో కొత్తదనం, కళాత్మకత ఉట్టిపడుంటం తో  ఇతని పేరు –  ఊరూ వాడలతో బాటు చుట్టుపక్క ప్రాంతాలలోనూ మారుమ్రోగింది.  వ్యాపారాన్ని వృధ్ధి చేసుకునే ప్రయత్నం లో అనేక నాటక సంస్థల నిర్వాహకుల దగ్గర కు వెళ్ళి స్వయంగా  పరిచయం చేసుకుని, బిజినెస్ తెచ్చుకునేవాడు నటులు ధరించే  .  ఆ యా  పాత్రలను  దృష్టిలో వుంచుకుని   తన సృజనాత్మకత  ఉట్టిపడేలా నగలను డిజైన్ చేసిచ్చేవాడు.  రెఫెరెన్సుల  కోసం పుస్తకాలు వెదికి పట్టుకునే వాడు.  కిరీటాలు, గదలు, మెడ లో ధరించే రకరకాల  రంగు రాళ్ళ హారాలు,  ఉంగరాలు, పతకాలు, వడ్డాణాలు, కంకణాలు, వంకీలు నెక్లెస్సులు, అన్నీ  ఆర్భాటం గా గొప్ప హంగుతో  కనిపించి, మెరిపించేవి గా వుండేవి.

వ్యాపారం నిమిత్తమై  వూళ్ళు తిరుగుతుండే వాడు. అలా అలా ఇతని ప్రాభవం సినిమాలకూ పాకింది.  వాళ్ళ తో పరిచయాలేర్పడ్డాయి.మద్రాస్ లో –  అక్కడే ఒక ప్రధాన షో రూం ఓపెన్ చేసాడు. నిర్మాత దర్శకులు తాము నిర్మించే  పౌరాణిక , జానపద చిత్రాల కు చక్రవర్తి నే ఎంచుకునే స్థాయికి ఎదిగాడు. అతని పనితనం అంత  ప్రత్యేకం గా వుండేది. సినిమా షూటింగ్ లకు  సెట్స్ మీద కి వెళ్తుండేవాడు.

ఎలా పరిచయమైందో ఏమో, దేవమ్మ ట..ఏకంగా పెళ్లి చేసుకుని తీసుకొచ్చేశాడు ఊళ్ళోకి. తీసుకొచ్చి,  సరిగ్గా   ఊరి నడిబొడ్డున  ఇల్లు తీసుకుని కాపురం పెట్టాడు.

ధనం వల్ల కలిగే అహం ఎంత బలమైనదంటే – తన పతనానికి తానే  కారణమయ్యేంత!

కన్నూ మిన్నూ కానరాని తొందరపాటు నిర్ణయాల వల్ల తనని అంటిపెట్టుకుని జీవించే వారి జీవితాలెంత అతలాకుతలమౌతాయో అప్పుడా అవేశంలో వారికి అర్ధంకాదు. వాటి విషఫలితాలు అనుభవించేటప్పుడు  తప్ప!

మిన్ను విరిగి మీదపడ్డ వార్త తో వర్ధనమ్మ వొంగిపోతే, చిత్రంగా, జమున మాత్రం నిఠారై నిలబడింది.  శరీరమైనా, మనసైనా భరించే స్థాయికి మించి గాయమైనప్పుడు ఆ నొప్పి వెంటనే తెలీదు.

గొడ్డలి దెబ్బలు తింటూ కూడా వృక్షం నిలబడే వుంటుంది.

‘వీడు చేసిన వెధవ పనికి  ఆమె ఇల్లు విడిచి వెళ్ళిపోతుందేమో, తల్లి తండ్రులు వచ్చి  తీసుకెళ్ళిపోతారేమో, లేక ఆమే విడాకులు తీసుకుని   శాశ్వతంగా  విడిపోతుందేమో..లేదా నలుగురిలో అల్లరి చేస్తుందేమో,  వీధికెక్కుతుందేమో !’అని   తలదిరిగే   గందరగోళ  ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరౌతున్న వర్ధనమ్మకి – పెరటి  బావి దగ్గర తల స్నానం చేసొచ్చిన కోడలు ఒక   ఆశ్చర్యార్ధకంగా , కాదు అర్ధం కాని జవాబులా తోచింది. అమెనలా చూసి నిర్వుణ్ణురాలైంది!   మాట రాని కొయ్యబొమ్మైంది.

క్రమం గా – కోడలి మనసుని చదవడానికి ప్రయత్నించ సాగింది.

***

అనుకున్నట్టుగానే ఆమె తరఫు  పెద్దలొచ్చారు.  ఇంట్లో జనం మూగారు. చిన్న పంచాయితీ పెట్టారు.

వర్ధనమ్మ చూస్తుండిపోయింది. న్యాయం చెప్పాలంటూ ఆవిణ్ణి నిలదీస్తూ.. కొడుకు మీద నిప్పులు కురిపించారు మాటలతో.

అప్పుడు జమున అడ్డొచ్చి, “ఆవిడ కి ఈ గొడవతో సంబంధం లేదు. ఆవిణ్ణి మీరేమీ అడగడానికి వీల్లేదు” అంటూ జవాబిచ్చింది.   ఆ మాటలకి –  ఆమె కళ్ళల్లోకి చూసింది కన్నీళ్ళతో. అది కృతజ్ఞతో..ఏమో..తెలీదు.

కన్న పిల్లలు తల్లి తండ్రులకి గర్వ కారణం గా నిలవకపోయినా ఫర్వాలేదు కానీ, ఇలా నలుగురిలో నిలదీయించే దుస్థితికి తీసుకురాకూడదు.

అప్పుడే వచ్చాడు చక్రవర్తి.  అతన్ని చూస్తూచూస్తూనే  ఆ తల్లి తలొంచుకుంది. జమున  చూపులు తిప్పుకుని, తన నిర్ణయం చెప్పింది. స్థిరంగా, చాలా బిగ్గర గా కూడా!

“ – నేనీ గడప దాటి ఎక్కడికీ వెళ్ళను. వెళ్ళలేను. ఇదే నా ఇల్లు.  నా చివరి ఊపిరి దాకా ఇక్కడే వుంటాను. ఎలా పోయినా ఫర్వాలేదు  నా ప్రాణం మాత్రం ఇక్కడ పోవాల్సిందే. నేను ఏ తప్పు చేయలేదు. నాలో ఏ దోషమూ లేదు.  నేనెందుకు  విడాకులు తీసుకోవాలి? ’ జమున డైవోర్సీ’అని అనిపించుకోవడానికా  నేనీ వివాహం చేసుకుందీ?

నా జీవితంలో జరగరాని ఘోరమే జరిగింది.  అన్యాయమే జరిగింది.  తిరిగి ఎవ్వరూ న్యాయం చేకూర్చలేనంత  అన్యాయమే జరిగింది. నేను తట్టుకులేని గా..య మే ఇది.” ఆమె గొంతు లో సుడి రేగి ఆగింది.

అయినా వదలి పోలేను.   ఎందుకంటే,  నా  కన్న బిడ్డ వున్నాడు. వాడి పేరుకి ముందు  ఈ  ఇంటి పేరుంది. వాణ్ణి చూసి మురిసే బామ్మ వుంది.  ముద్దు చేసే మేనత్తలున్నారు.  ఈ కుటుంబం  చాలు. వాడు ఆనందంగా బ్రతకడానికి. నాకింతే ప్రాప్తమనుకుంటాను. దయచేసి, ఇంకెవ్వరూ నన్నేమీ అడగొద్దు. ఏ తీర్పులూ చెప్పొద్దు.” ఉబి కొస్తున్న  దుఖాన్ని  ఆపుకుంటూ,  చీర చెంగుని నోటికడ్డుపెట్టుకుంది.

వర్ధనమ్మ తలొంచుకుని  తదేకంగా నేలని చూస్తోంది.   భూమి రెండుగా చీలితే బావుణ్ణు.  ఉన్నపళం గా  ఎవరికీ కనిపించకుండా అందులోకెళ్ళి దాక్కోవాలనుంది.  ఇంట్లో  పెద్దవాళ్ళకి   న్యాయాన్యాయాల జ్ఞానం వున్నప్పుడే –   కుటుంబంలో స్త్రీలకి నైతిక న్యాయం జరుగుతుంది.  అందుకే, ఆ దేవుడు –  ధర్మానికి స్త్రీ పేరు పెట్టి, ‘ధర్మ దేవత’ అని పిలిచాడు.

స్త్రీ మానసిక అశాంతుల్ని కుటుంబమే అర్ధం చేసుకోక పోతే,  ఇక సమాజమేం అర్ధం చేసుకుని ఆదరిస్తుంది?

ద్రౌపది అవమానం అన్యాయమని పెద్దలు ధిక్కరించి  అడ్డుకోనందుకే కదూ?  కురుక్షేత్ర యుధ్ధం జరిగిందీ?

సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం అలుముకుంది అక్కడ.

ఇక వినాల్సిందేమీ లేదు, అన్నట్టు ముందుగా –  చక్రవర్తి లేచాడు అక్కణ్ణించి.  గెలిచిన వాడిలా ఛాతీ విరుచుకుని,    తలెగరేసుకుంటూ  లోపలకెళ్ళిపోయాడు. తనెవరికీ జవాబు చెప్పాల్సిన పని లేదని అంతకు  ముందే సెలవివ్వడం తో ఎవ్వరూ అతన్ని ప్రశ్నించే సాహసం చేయలేదు.

తల్లితండ్రులు కూడా, ఆమెని వచ్చేయమంటున్నారే తప్ప, ఆమె  గాయానికి బాధ్యులైన వారికి శిక్ష ఏమిటన్నది ఎవరూ నోరిప్పి అడగడం లేదు. మన  వివాహ వ్యవస్థ లో మొగుడూ పెళ్ళాలిద్దరూ సమానమే అయినా అధిక అసమానురాలు  మాత్రం భార్యే!  ఇప్పటికీనూ ఇంతే!

వచ్చినవాళ్ళందరూ మెల్ల మెల్లగా  ఎక్కడి వాళ్లక్కడ సర్దుకున్నారు. వెళ్తూ వెళ్తూ జమున తల్లి – వర్ధనమ్మకి అప్పచెబుతూ  “వదిన గారు! దాని ఖర్మ అది అనుభవిస్తానంటోంది..బంగారం లాటి పిల్ల ని ఇలాటి.. వాడి..” అంటూ ఆగి,  తనని తాను  సంబాళించుకుంటూ , మళ్ళీ చెప్పింది అభ్యర్ధన గా.. “అమ్మాయిని ఒక కంట కనిపెట్టుకునుండండి వదిన గారు! దానికేదైనా అయితే ఈ కన్న కడుపు తట్టుకోలేదు.  మీరెప్పుడు కబురు పెడితే అప్పుడొచ్చి అమ్మాయిని తీసికెళ్తాను..” ఏక ధాటిగా ఏడుస్తూ చెప్పింది.

తలూపింది వర్ధనమ్మ. అలాటి దుర్భర పరిస్థితుల్లో కన్నతల్లి పడే క్షోభ ఏమిటొ, ఎలాటిదో ఆమె అర్ధం చేసుకోగలదు. ఆమె కూడా ఆడపిల్లను కన్న తల్లే కాబట్టి.

చిత్రమేమిటంటె – ఇంత జరుగుతున్నా, ఆవిడ పన్నెత్తి ఒక్క మాటా మాట్లాడలేదు. నోరేసుకుని,  డబాయించి, కొడుకుని వెనకేసుకొచ్చే ప్రయత్నమేమీ చేయలేదు. అందరి అత్తల్లా..కొడుకు చేసిన పాపపు పనికి కోడలే కారణమని దుమ్మెత్తి ధూళిపోసే  దుర్మార్గపు యోచనైనా  చేయలేదు.

పైపెచ్చు, రేపట్నించి కోడలు   తమతో కలిసి వుంటుందని తెలిసాక మాత్రం పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టైంది ఆవిడకి.  కానీ అప్పుడామెకి తెలీలేదు.  కోడల్ని చూడరాని స్థితిలో  చూస్తూ   మానసిక క్షోభని అనుభవించాల్సిన నరకపు స్థితి ఒకటి ఎదురవ్వబోతోందని. అదే  గనక ఊహించి వుంటే ఆవిడ ఈ ఒప్పందానికి అంగీకరించేది కాదేమో. అయితే ఆ విషయం –  ఆ తర్వాత గడిచిన రోజులకి  కదా, ఆవిడకి తెలిసింది!

***

జమున జీవన విధానం మారింది. రాత్రి మూడో ఝాము కంటె ముందే నిద్రలేచి స్నానం, పూజలు, నైవేద్యాలు కానిచ్చేస్తోంది. ఎంత చలి కాలమైనా, వడగళ్ల వానా కాలమైనా ఆమె పధ్ధతి  ఆమెదే!

ప్రతిరోజూ తల స్నానాలే! తడిజుట్టు ముడి –  వీపు మీదొక అలంకారమైపోయింది.  ఏదో సాకు చెబుతుంది, ఏకాదశనో, ద్వాదశనో, ఉత్తారాయణారంభమనో దక్షిణాయనానికి అంతిమ దినమనో .. వంకలకి అర్ధం వుండేది కాదు.  పౌర్ణమీ అమావాస్య ల దీక్షలు కఠినంగా పాటించేది.  ఉపవాసాలతో – శరీరం సగమైంది.

రాత్రిళ్ళు తనతో పాటు పిండి తింటుంటే..అడిగింది. “నీకెందుకే, ఈ చప్పటి తిండి? కమ్మగా అన్నం లో ఇంత   పప్పేసుకుని,   ఆవకాయ ముద్దతో పెరుగు నంజుకుని తినరాదూ? “ అంటూ ప్రేమగా కోప్పడింది.

కొన్ని క్షణాల  తర్వాత చెప్పింది జమున. “మీకూ నాకూ తేడా లేదు అత్తయ్యగారు. మీరూ నేనూ ఒకటే..” అంటూ ఒక పిచ్చి నవ్వు నవ్వింది.

తెల్లబోయి చూసింది కోడలి వైపు, రంగు వెలిసిన ఆ నవ్వువెనక  అంతర్భావం ఏవిటో  ఆ రాత్రి జరిగిన సంఘటనతో కానీ పూర్తి అవగాహన కాలేదు.

*****

ఆ రాత్రీ ఇలానే…నల్ల రాతి అరుగుమీదకొచ్చి కుర్చుంది. ఎంతకీ నిద్ర పట్టక.

చుట్టూ చీకటి.  గుయ్ గుయ్ మని శబ్దమేదో తనకు తోడుగా వచ్చి నిలిచింది.  వీధి దీపం ఆరిపోవడం తో కన్ను పొడుచుకున్నా బయటేమీ  కానరావడం లేదు. దూరం నించి  కుక్కల అరుపు  లీలగా వినిపిస్తోంది.  వీస్తున్న గాలి కూడా నల్లగానే వుంది.  తన మనసులా దివులుదివులు గా. ప్రకృతిలోని ఎంతటి సౌందర్యాన్నీ నిర్వీర్యం చేసి చూపించే శక్తి వెతచెందిన  మన మనసుకుంటుంది.

ఇంతలో గేట్లోంచి కారొచ్చి ఆగింది.  ‘ఈ సమయంలో వచ్చేది ఇంకెవరు? వాడే. ఆ రాక్షసుడే. ‘    గబగబా మెట్లెక్కి తన పక్కనించి   లోపలకెళ్ళిపోయాడు.  ‘తనని చూసినట్టు లేడు. అదే మంచిదైంది. లేకపోతే పలకరిస్తే ‘ఊ ‘అనాల్సొచ్చేది..ఆ బాధ తప్పింది. ’ –  అనుకుంది మనసులో.

అతని  మీంచి  గుప్ఫుమన్న సెంటు వాసన కి  చప్పున వాంతికొచ్చిన పనైంది.

“హు. ఎన్నాళ్ళైందీ, జమున జడలో మల్లెపూవు చూడక. ఇంత బారెడు జడేసుకుని,   నాలుగు వరసల

ఇంత బారు విరజాజుల  దండ ని గుత్తం గా తురుముకుని, నలగని చీరలో, చెదరని చిరునవ్వుతో నలుమూలలా తిరుగుతుండేది. పాదాలు కదిలినప్పుడల్లా కాలి మువ్వల శబ్దం సంగీతం లా వినిపించేది.  నట్టింట తిరిగిన  నా ఇంటిలక్ష్మి నేడు నిదురబొయింది..నిదురబోయింది..” వర్ధనమ్మ గుండె మరో సారి భోరుమంది.

ఒక స్త్రీ మానసిక దుఃఖ స్థితిని  సరిగ్గా అర్ధం చేసుకొనే  సహృదయత  కేవలం మరో స్త్రీకి మాత్రమే వుంటుంది. అందులో అత్తగారికి  మరింత బాగా అర్ధమౌతుంది ఏ కోడలి కష్టమైనా! కానీ,  చాలామందిలో స్వార్ధం, కపటం,  అడ్డుపడి  నీతి నిజాయితీల్ని కప్పేస్తాయి. అందుకే ఈ రోజుల్లో కాపురాలు వీధిన పడి న్యాయాన్ని  అడుక్కుంటున్నాయి.

కానీ ఈ లోపాలేవీ  వర్ధనమ్మ లో లేవు. కంటేనే కూతురా?  కోడలూ కూతురే. ఆ మాట కొస్తే వర్ధనమ్మకి ఇంకా ఎక్కువే. ఎందుకంటే,  ఆమెలో-  సగభాగం కొడుకు కూడా వున్నాడనే భావనకు,  ఆ ఫలం  – వంశోధ్ధారకుడై ఇంట వెలిసినందుకు.

ఎంత మాత్రమున ఎవ్వరు ఎలా  ఎంచుకుంటే, అంతమాత్రమే మరి ప్రేమానుబంధాలునూ. ఆత్మ సంస్కారాల ఔన్నత్యాన్ని అనుసరించి కుటుంబానుబంధాలు ఉన్నత స్థాయిని అలరిస్తాయి.  ఎప్పటికైనా కోడలి ముఖం లో మునపటి కళ చూడాలనే ఆమెలోని  ఆశా దీపం – ఇక కొండెక్కినట్టే అన్నట్టు..వినిపించింది లోపల్నించి ఓ పెనుకేక!  గోడకున్న నిలువెత్తు అద్దం భళ్లున పగిలి ముక్కలైన పెంకల శబ్దాలు ఆవిడ చెవి లోపలకొచ్చి  గుచ్చుకున్నాయి.  కొడుకు మాటలు  కర్కశం గా వినొస్తున్నాయి. “రాక్షసి..రాక్షసి..(ఎడిట్) ..అమ్మా! అమ్మా..త్వరగా రా..” కొంపలంటుకుపోతున్న ఉద్రేక స్వరం. “త్వరగా రా..ఇది చ..స్తోం..ది.. ఈ (…ఎ.) ..చస్తోంది..”

‘జరగరానిదేదో జరుగుతోంది లోపల..’ అదురుతున్న గుండెలతో  పరుగుపరుగున కోడలి గదిలోకెళ్ళింది.

పగిలిన అద్దం ముక్క పదునుకోణాన్ని తన పొట్టలోకి  నొక్కిపెట్టి,  పట్టరాని ఆవేశం తో  ఊగిపోతోంది జమున.   రక్తహీనమైన ముఖం మరింత తెల్ల గా పాలిపోయి, కళ్ళు ఎరుపెక్కి , అధరాలు వొణికిపోతూ..అరచేతుల్లోంచి కారుతున్న  రక్తాన్ని కూడా  లెక్క చేయనంత  మతిలేని స్థితిలో వుంది.

ఒక్క అంగలో   కోడలి దగ్గరకెళ్లి,  చేతుల్లోంచి గాజు ముక్కని లాగి అవతల పడేసింది. ధారలా కారుతున్న రక్తాన్ని తుడుస్తూ…“ఏమిటీ అఘాయిత్యం? ..ఆ?” అంది. కంపన స్వరంతో

తుఫానుకెగిసిన సముద్ర కెరటాల్లా  ఎగసిపడుతున్న గుండెలతో,  “నా దగ్గరకి రావద్దని చెప్పండి అత్తయ్యా..నన్ను     ముట్టుకుంటే కాల్చుకు చస్తానని చెప్పండి..”రొప్పుతూ  చెప్పింది.

అతన్లో అహం దెబ్బతింది.  “అంత చచ్చేది ఇక్కడెందుకు చావడం..ఫొమ్మను..ఎవడితో..పోతుందో..” అతని మాట పూర్తికాకముందే వర్ధనమ్మ – “నోర్మూయ్..” రౌద్రంగా అరిచింది.  –  “ఇంకొక్క మాట దాన్నేమైనా అన్నావంటే ఈ ఇంట్లోంచి దాన్ని కాదు నిన్ను వెళ్లగొడతా. జాగ్రత్త. “ మాటల్లోనే ఆమెకి ఏడ్పొచ్చేసింది. “అయినా,  దాన్ని నువ్వెప్పుడోనే చంపేసావ్ గదంట్రా? ఆ శవంతో..ఇక  నీకేం పని?..ఫో..ఫో..” హిస్టీరిక్ గా అరుస్తూ ఏడుస్తున్న తల్లి వైపు పిచ్చి చూపులు చూసాడు. ఏమీ అర్ధం కానివాడిలా  “మీ చావు మీరు చావండి ‘ అని అంటో, అక్కణ్ణించి విస్సురుగా  వెళ్ళిపోయాడు.

మరో పెళ్ళి చేసుకున్న భర్త మోసాన్ని భార్య క్షమిస్తే క్షమించవచ్చు.

కానీ, ఆ భర్తని మరిక నమ్మలేదు.

మరోసారి ప్రేమించనూ లేదు.

 

****

జమున తన మంచాన్ని   అత్తగారి గదిలోకి మార్చేసుకుంది.   “ఇవాళ్టినించీ  మీరూ నేనూ రూమ్మేట్స్ మి అత్తయ్య గారూ!” అని అంటున్న కోడలి మాటలకు బాధపడుతూ  “నన్నెందుకే ఇలా బాధపెడతావూ? నీ పిల్లాణ్ణి తీసుకుని  నువ్వు మీ వాళ్ళింటికెళ్ళిపోరాదూ? ఈ వయసులో నే నివన్నీ చూడలేనే జమునా..” అంటూ కళ్ళొత్తుకుంటుంటే..  మెల్లగా   ఆవిడ దగ్గరకొచ్చి చెప్పింది జమున.  “నన్ను క్షమించండి అత్తయ్యా..అ..ది నా వల్ల కాదు..దాని కంటే నూ నాకు మరణమే..” అంటూ తలొంచుకుని  ఏడ్చేసింది.  ఆ అబల  అసహాయతకి ఉప్పెనలా జాలి ముంచుకొచ్చింది.    గబుక్కున కోడల్ని రెండు చేతులతో దగ్గరికి  తీసుకుంది. కరిగిన రెండు గుండెల మధ్య జరిగిన సంభాషణేమో తెలీదు కానీ, ఇన్నాళ్ళు పేరుకునిపోయిన దుఖం, కట్టలు తెంచుకుని ప్రవహించింది

ఆవిడకి బాగా అర్ధమౌతోంది. ఆ కన్నీళ్ళ ప్రవాహం లో  ప్రతి బొట్టూ అవగతమౌతోంది.

***

కాలం వేగం గా కదుల్తోంది.  అంతే వేగం గా జమున చుట్టూ చీకటి కూడా – పొరలుపొరలుగా చుట్టుకుని,  మరింత దట్టమౌతోంది.

సరైన ఆహారం అందక శరీరం అంతకంతకూ క్షీణించిపోయింది. ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తింది. వంట చేయడం మానేసింది. పూజలూ ఆపేసింది. అయితే  – ధ్యానం లో మునిగి,  ఒక ట్రాన్స్ లోకెళ్ళిపోతుంది. కాదంటే –   బెడ్ మీద అలా,  అటు వైపుకి తిరిగి , డొక్కలో కాళ్ళు ముడుచుకుని పడుకునుంటుంది.

ఎవరితోనూ పెదవి విప్పి మాట్లాడదు. కన్ను తెరిచి చూడదు. ఒక్క అత్త గారితో తప్ప.

డాక్టర్లూ ఏమీ చేయలేకపోయారు. మనోవ్యాధి కి మందేదీ?

జీవితం – ఒక కళాత్మకమైన వర్ణ చిత్రం. తుడిపివేతలుండకూడదు. వుంటే, ఆ బొమ్మ పనికిరాదు.

వైవాహిక జీవితాన్ని పవిత్రం గా భావించి  ప్రే మించే స్త్రీ జీవితంలో-  భర్త స్థానం కూడా అంతే.

‘తను తుడిచేయలనుకున్నా చెరగని మచ్చ పడిపోయింది. ఇక ఈ జీవి తానికి’ ఆ బొమ్మ’ పనికిరాదు. అంతె. అదంతే.’

చెప్పకనే చెబుతోంది కోడలు.

ఆవిడ లోలోన కుమిలికుమిలి కృశిస్తోంది. తనేమీ చేయలేని తనానికి, చేతకాని తనానికి.

ధనాన్ని  ఆశించే  కోడలై వుంటే –  సగం ఆస్తి  ఆమె పేర రాయించి  సరిపెట్టించేది.

విలాసాలని వాంఛించేది  అయితే –  భోగాలను సమకూర్చేది.

అధికారం కావాలనుకున్నది అయితే  – సంతోషంగా తాళం చేతులు అప్పచెప్పేది.

వాడి కాళ్ళు విరగ్గొట్టి ఇంట్లో పడేసి, ఆ పాపిష్టి దాన్ని  ఊళ్లోంచి తరిమించేస్తానంటే అందుకూ సహకరించేది.

కానీ..కానీ..దీనికి అలాటి బుద్ధుల్లో  ఒక్కటైనా లేకపోవడం తను చేసుకున్న పాపం కాదూ? తాళి కట్టిన వాణ్ణి ప్రాణం గా ప్రేమించి, వాడే జీవితమని నమ్మిన ఈ పిచ్చిదానికి – ఎలా తెచ్చిస్తుంది  కొడుకుని  మునపటి వాణ్ణి చేసి?  ఆ వెధవ  తన ద్రోహాన్ని అంత  బాహాటంగా ప్రజల కు  ప్రకటించుకున్నాక, మోసగాడిగా  పట్టుబడ్డాక –  విరిగిన దాని మనసుని ,    ఏ అబద్ధం చెప్పీ అతుకేస్తుందీ?  ఏ నాటకమాడి ఈ అమాయక జీవిని కాపాడుకుంటుందీ?

అసలు తను – కోడలి కోసం ఏం చేయగలదు? ఏం చేసి దాని ఆత్మ క్షోభని తగ్గించగల్దూ? రేయీ పగలూ ఇదే కలత. ఇదే నలత.  మనసున్న మనుషుల మధ్య హార్ధిక  సంక్షోభాలు ఇలానే వుంటాయి.

జమున ఇంకెన్నో రోజులు బ్రతకదన్న సంగతి అందరికంటే ముందే గ్రహించిన మొదటి వ్యక్తి – వర్ధనమ్మ.  దానికి మించి,

ఆమె ఆత్మ దేనికోసమో కొట్టుకులాడుతోందని,  ఏదో చెప్పాలనీ, చెప్పలేక విలవిల్లాడుతోందని పసిగట్టిందీ ఆవిడే!     ఆ వెంటే, విహ్వలితురాలై కంపించిపొతూ  కోడలి పక్కలో కుర్చుని, మంచానికంటుకుపోయిన ఆ శరీరాన్ని    పసిదాన్ని ఒళ్ళోకేసుకున్నట్టు వేసుకుంది. కళ్ళు తెరిచి చూస్తున్న జమున చెవిలో రహస్యం గా అడిగింది. “బంగారం! నీ మనసులో ఏవుందో, ఈ అమ్మకి చెప్పవూ? నీ బిడ్డ మీద ఒట్టు. నే తీరుస్తా. ” అంది పొంగుకొస్తున్న కన్నీళ్ళ మధ్య.

ఆమె కళ్ళు మెరిసాయి. పెదాలు కదిలాయి. నూతిలోంచి వినిపిస్తున్న ఆ బలహీన స్వరాన్ని ఒళ్ళంతా చెవులు చేసుకుని వింది. విన్నాక, వర్ధనమ్మ చలనం లేనిదై పోయింది.

****

ఆవిడ అనుకున్నట్టే – జమున తనువు చాలించి వెళ్ళిపోయింది.

ముత్తైదువుగా పోయింది..పుణ్యవతంటూ ఆమెని పొగుడుతున్నారు ఎవరో..ఏకాదశి పూటా వెళ్ళిపో యింది…దివ్యలోకాలకి చేరుతుంది అని  అంటున్నారు ఇంకొందరు.

వర్ధనమ్మ మౌనంగా చూస్తుండిపోయింది.

వార్త తెలిసి చక్రవర్తి ఊరునించి అప్పుడే దిగాడు. గబ గబా అడుగులేసుకుంటూ భార్య శవం దగ్గరకొచ్చి ఆగాడు.  కళ్ళు మూసుకుని ప్రశాంతంగా పడుకున్న ఆమె ముఖం లొ ఏ గత కాలపు జ్ఞాపకాలు కదిలాయో..అతని చేయి కదిలి ఆమె నుదుట్ని తాకబోతుండగా… ఒక్క తోపు తోసిన ఆ విసురుకి విస్తుబోయి చూశాడు.   వర్ధనమ్మ కఠినంగా   చెప్పింది. “వొద్దు. ముట్టుకోవద్దు. “ చేయి అడ్డంగా ఊపుతూ  ” నువ్వేం చేయొద్దు. అవన్నీ దాని కొడుకు చేస్తాడు. “ అంది.

ఆ మాటలు అతన్ని శాసిస్తున్నాయి.

చక్రవర్తి కి తలకొట్టేసిన ట్టు అయింది. అవమాన భారంతో తలొంచుకుని మెల్లగా  అడుగులేసుకుంటూ వెనకెనక్కెళ్ళాడు.

అందరూ చూస్తూనే వున్నారు. చెవులు కొరుక్కునే వాళ్ళు కొరుక్కుంటూనే వున్నారు. బ్రాహ్మలొచ్చారు. తతంగమంతా   పూర్తి చేసారు. మనవడు కుండ పట్టుకుని ముందు నడుస్తుంటే…వెనక  మోసుకెళ్తున్న పాడె, పూల జల్లుల మధ్య వూరేగి పోతున్న పుష్పపల్లకిలా కనిపించింది ఆ అత్తగారికి.  వెళ్ళిపోయింది..కనుమరుగై వెళ్ళిపోయింది.

‘అయిపోయింది. విముక్తురాలైపోయింది. ఏ జన్మ ఋణానుబంధమో ఇలా తీర్చుకున్నానా, జమునా!’ ఆవిడ మనసు ఒక్కసారిగా గొల్లుమంది.’

పని వాళ్ళ చీపుళ్ళ చప్పుళ్ళు,  పరివారం గుసగుసలతో ఇల్లు కల్లోలంగా  వుంది.

వర్ధనమ్మ నిశ్శబ్దం గా కదిలి, లోపలకొచ్చింది. ఇల్లంతా ఖాళీ అయిపోయినట్టు..తన ఉచ్వాశ నిశ్వాసలు ఈ గుహంలోంచి    భయంకరం గా ప్రతిధ్వనిస్తున్నట్టు వినిపించింది. ‘ భ్రమ..భ్రమా..అంతా భ్రమ? కాదు నిజం. నిజం. అంతా నిజం!! ‘కళ్ళు తిరిగాయో, ఏమో! సోఫాలో పడిపోయింది..గోడ మీద జమున పెళ్ళి కూతురి ఫోటో మసకమసగ్గాకనిపిస్తుంటే..

***

ఆ నాటి నించీ ఈ రోజు దాకా రాత్రిళ్ళు వర్ధనమ్మకు నిద్రుండదు. కునుకు పట్టినా, అంతలో నే భయపెట్టే పీడ కలలకి    గాభరగా లేచి కుర్చుంటుంది.  ఊపిరాడని తనానికి ఇలా పోర్టికో మెట్ల పక్కని, అరుగుమీదకొచ్చి గాలిపోసుకుని వెళ్తుంది. గతాన్ని తలచుకుతలచుకుని విలపించి  మరీ వెళ్తుంది.

గదిలోకి వచ్చి అలవాటుగా  ఎదురుగా వున్న మంచం వైపు చూసింది.  ఇందాక,  అటు తిరిగి పడుకున్న జమున ఇప్పుడు వెల్లకిలా పడుకుని, తనని చూసి నవ్వుతోంది.

గబుక్కున మంచం దగ్గరకెళ్ళి,  ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ లాలనగా అడుగుతోంది వర్ధనమ్మ.

‘ఇందుకేనా?….కొడుక్కి ఒడుగు చేయమని తొందరపెట్టావూ?..నీ కోరిక తీర్చాను కదూ?..నువ్వు సంతోషం గానే

వెళ్ళిపోయావు కదూ? నీ ఆత్మ శాంతించింది కదూ? చెప్పవూ, మా అమ్మ కదూ,  నాకు చెప్పవూ? ” పరుపు మీద తలానించి, తనలో తాను మాట్లాడుకుంటున్న తల్లి పిచ్చి చేష్టలకు కనుబొమలు ముడిచి చూసాడు చక్రవర్తి.  ‘ఇది ఎప్పుడూ వున్నదేగా’ అని విసుక్కుంటూ వెళ్ళిపోయాడు.

వర్ధనమ్మ ఇంకా ఏవేవో మాట్లాడుతూనే వుంది కోడలితో. ఆ కోడలు  ఎవరో కాదు. ఆవిడ ఛాయే!  ఒకప్పడు తను అనుభవించిన నరకానికి ప్రతి  రూపం.  ప్ర త్య క్ష్య  సాక్ష్యం. అందుకే జమున అంతరంగాన్ని అంత గా చదివి అర్ధం చేసుకోగలిగింది.

కుటుంబం నించి తను పొందలేని సాంత్వన తన వల్ల కోడలు పొందాలని తాపత్రయపడింది. శక్తికి మించినదే అయినా కోడలి ఆఖరి కోరిక తీర్చే సాహసం చేసింది.

 

*****

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. స్వాతీ శ్రీపాద says:

    కధ కాని ఈకధ ఎన్ని ఇళ్ళలో కధో… అత్తా , కోడలో,కూతురో , తల్లో ఒక స్త్రీ జాతి ప్రతినిధి అనుకున్నప్పుడు ఒకరి ఆదిక్యతో ఒకరి బలహీనతో ఒకరి అల్పత్వమో ఒకజాతిని కుదిపి వేస్తున్న ఈ క్షణాల్లో ఒక ఉనికి గుర్తి౦పు ఎంతో అవసరం అని వాక్యాల మధ్య , పదాల మధ్య , అక్షరాల వెనక ఆర్తిని వెలిగిస్తు౦ది ఛాయ.
    ఇప్పటికీ ఎం బీ ఏ లు ఇంజనీరింగ్ డిగ్రీలు తెచ్చుకుని ఇంటికి దిష్టిబొమ్మల్లా ఉన్న అమ్మాయిలను చూస్తే మనసు కు౦గిపోతు౦ది , మెల్ చావినిస్టిక్ గ్రిప్ ను౦ది ఎప్పటికి బయట పడతారు.
    ఇలాటి సమాజం లో పెల్లెందుకు అనుకు౦టె వచ్చిన నష్టమేమిటి?
    ఇప్పటికీ అన్ని౦టికే ఒక స్త్రీ దే తప్పని మాట్లాడే స్త్రీమూర్తులున్న కాలంలో వర్ధనమ్మ లాటి వారు ఎందరు ఉన్నారు?

    ఆలోచి౦ప జేసే రచన దమయంతీ అన్ని భావాలూ చెప్పడానికి మనసు మోగవోయి౦ది

    • ఆర్.దమయంతి. says:

      స్వాతీ గారు,
      ‘అన్ని భావాలూ చెప్పడానికి మనసు మూ గవోయి౦ది..’ అన్న మీ స్పందన కి నా హ్రదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండీ.

  2. G.S.Lakshmi says:

    మనసులోతుల్లోకి చొచ్చుకుపోయింది చెప్పరాని గుండె మంట. మంటలోని వేడికి మనసు కరిగి నీరైపోయి వర్ధనమ్మగా రూపాంతరం చెందింది. ఎంత లోతైన భావం. చాలా బాగుంది దమయంతీ.. అభినందనలు..

    • ఆర్.దమయంతి. says:

      కథలోని పాత్రలు మిమ్మల్ని కదిలించాయని మీ స్పందన ద్వారా తెలియచేసినందుకు ధన్యవాదాలు అక్కా!
      సదా మీ ఆశీస్సులను సదా మీ ఆశీస్సులను ఆశిస్తూ..
      నమస్సులతో..
      మీ
      సోదరి.

  3. renuka ayola says:

    Lotaina bhavam chaalaa bagundi kaani endukantala striki dukham?
    Btakaledaa samajamlo ?maranme priskrama?

    • ఆర్.దమయంతి. says:

      ఒక స్థితిలో బ్రతకడమొకటే మార్గం కాదనుకుంటారేమోనండీ,
      ముఖ్యంగా ప్రేమించిన భర్త చేతిలో మోసపోయిన ఇల్లాళ్ళు.
      మీరు చెప్పిందీ కరెక్టే. మీ సూచనా సదా అనుసరణీయమే. నాకూ అలానె అనిపించింది రేణుక గారు.
      ధన్యవాదాలు,

  4. ఆర్.దమయంతి. says:

    వర్ధనమ్మ పాత్ర మిమ్మల్ని కదిలించినందుకు చాలా సంతోషం గా వుంది అక్కా!
    మీ విలువైన అభిప్రాయాన్ని వ్యక్తపరచినందుకు నా మనః పూర్వక ధన్యవాదాలు.
    సదా మీ ఆశీస్సులు కోరుకుంటూ
    మీ
    సోదరి.

  5. Venkat Suresh says:

    కధ, కధనం ఎప్పటిలాగే అద్భుతంగా ఉన్నాయి. కొన్ని చోట్ల కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ, ఎదో ఇబ్బంది.. జమున పాత్ర అలాంటి మార్గాన్ని ఎంచుకోవటం …

    • ఆర్. దమయంతి says:

      గుండె దిగులు మనిషిని మింగేసిందేమో Suresh!
      ధన్యవాదాలు, మీ స్పందన తెలియ చేసినందుకు

  6. శ్రీమతి దమయంతి గారు ,
    చాలా హృద్యంగా ఉంది మీ రచన.
    వివాహ వ్యవస్థ కుటుంబవ్యవస్థలని నిలబెట్టడానికి సమాజం ఆడవారిపై పెనుభారం మోపింది,
    వైవాహికజీవితంలో ప్రకృతి పెట్టిన భారాలు చాలవన్నట్టు సమాజం పాతివ్రత్యం శీలం అని ఇనపకచ్చడాల్లో ఉంచి వాటన్నిటికీ తన నీడ అవసరమన్న భావనపెంచి పరపీడనపరాయణత్వానికి పరాకాష్టకు మగాడు వంటింటి కుందెల్ని తీసుకెళ్లాడు.
    ఇవాళ కాసింత వంటిల్లు వీడి వీధిలోకొస్తే రొమాంటిక్ ప్రేమ మాటున వేటాడివేధిస్తున్నాడు
    మీకథలో అర్ధం చేసుకునే అత్తలుంటే ఆడదానికి ఆడదే శత్రువన్న నానుడు ని తప్పని నిరూపిస్తే ఆడబతుకులు బాగుపడవు
    మొగుడు పిల్లలే లోకమన్న తీరునుంచి బయటకొచ్చే రోజువచ్చే వరకుఆడవారికి మోక్షంలేదు
    ఆడవారుకూడా తాము తమ ఆడతనం తమకున్న ఆస్తిగా తలచడం మాని అదంతా సృష్టి కార్యక్రమానికి పనికొచ్చే ఒక సాధనం మాత్రమే అని గుర్తెరిగి ఉంటేనే వారి విలువపెంచుకుంటారు మొగాడితో సమాన భాగస్వాములవుతారు
    అంతవరకూ సీత,సావిత్రి,మండోదరి మహా పాతివ్రతలని చదువుకుంటూ ఆమత్తులో మూలుగుతుంటాము
    మతాన్ని మనుగడకి ఆడతానంపై ఆమెని కట్టడిచేయడానికి వాడడం రుద్దడం ఆపాలి
    మీవంటివారు చేస్తున్న మంచి రచనలు అందుకు సాధనం కావాలి

  7. ఆర్. దమయంతి says:

    మీ ఆవేదన నాకు పూర్తిగా అర్ధం కాకున్నా,
    కథ హృద్యం గా వుందన్నందుకు ధన్యవాదాలు శాస్త్రి గారు.
    కథ కానిది కథలు చదివి, మీ అమూల్యమైన అభిప్రాయాలను పొందుపరుస్తున్నందుకు
    మీకు నా మనః పూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
    నమస్సులతో..

  8. దేవరకొండ says:

    నమ్మినవారి చేత మోసగించబడ్డామన్న భావం నిజంగా దుర్భరం! దాన్ని అధిగమించి మనకంటూ ఒక జీవితం ఉంటుందని స్త్రీలు (కూడా) అవగాహన పెంచుకోవాలి. శరీరాన్ని శుష్కింప చేసుకోవడం, ఆత్మహింస ల నుండి బయట పడే ప్రయత్నాలు చేసుకోవాలి తప్ప మరణాన్ని ఆహ్వానించకూడదు. మేఘసందేశం సినిమాలో జయసుధ పాత్రను ఈ జమున పాత్ర గుర్తుతెచ్చింది. దమయంతి గారు బాగా రాశారు. అభినందనలు.

  9. ఆర్.దమయంతి. says:

    ధన్యవాదాలండీ!
    మీ అభినందనలు తెలియచేసినందుకు!
    :-)

  10. ఒడుగు ఎందుకు చేయాలి? తలకొరివి పెట్టడానికా? నాకు నిజంగా తెలియకే అడుగుతున్నా. ఒక వేళ అందుకే అయితే అది శక్తికి మించిన పని ఎందుకైంది?

    అంత చిన్న పిల్లవాడి గురించి ఆలోచించకుండా, జీవితాన్ని ఒక అనర్హుడి గురించి వ్యర్థం చేసుకునే ఇలాంటి వాళ్ళని చూస్తే విసుగేస్తుంది

    నేను తనని విధవరాలిలాగా పంపమని కోరుతుందేమో అనుకున్నా..

  11. దమయంతి గారు!
    మీరు ఈ కథ రాసిన కొత్తలో చదివి – అబ్బా! ఈవిడ కథల్లో పాత్రలు haunt చేస్తాయి – బాగా రాస్తారు – అనుకుని మీ కథలపై నా ఇష్టాన్ని తెలియచేయడానికి comment పెడదామని అనుకుంటూనే మర్చిపోయాను. ఇదిగో – ఇవాళ గుర్తొచ్చి ఇలా వచ్చాను. చెప్పాను :)

మీ మాటలు

*