అమెరికా తెలుగు కథ తొలి అడుగు వివాహ బంధాలు

imagesX3953B67

కథ అన్నాక దానికి ఏదో ఒక వస్తువు ఉంటుంది. ఆ వస్తువుకి ఓ నేపథ్యం ఉంటుంది. అమెరికా తెలుగు కథకి యాభయ్యేళ్ళు నిండాయని వంగూరి ఫౌడేషన్ వారు జరుపుతున్న స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఈ అమెరికా తెలుగు కథల్లో ఏ విషయాల మీద రాశారు అని పరిశీలిస్తే తరచూ కనబడిన సబ్జక్టు వివాహ బంధం. అమెరికా నేల మీద రాయబడిన మొదటి కథ (“పుట్టిల్లు” – చెరుకూరి రమాదేవి గారి రచన) కూడా వివాహ బంధం ఇతివృత్తంతోనే ఉండడం యాదృఛ్ఛికం కాదు. భారతీయులకి, అందునా తెలుగువారికి పెళ్ళీ, తద్వారా ఏర్పడే కుటుంబమూ జీవితంలో, మనుగడలో అతి ముఖ్యమైన అంశాలు. దానికి తోడు తొలి రోజుల్లో ఎక్కువగా కథలు రాసినది స్త్రీలు. అందుచేత ఈ కథల్లో వివాహ బంధాల చిత్రణ ముఖ్య వస్తువుగా ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు.

తొలి తరం కథల్లో ఎక్కువగా ఈ మహిళా రచయితలు తమ అనుభవాలనే కథలుగా మలిచారు అనిపిస్తుంది. ఒక మధ్య తరగతి తెలుగమ్మాయి పెళ్ళి చేసుకుని భర్త వెనకాల అమెరికా రావడం. ఆమె పెద్ద చదువులు చదివి ఉండక పోవచ్చు, ఒక వేళ చదివి ఉన్నా ఈ అమెరికా పరిజ్ఞానం అంతగా ఉండక పోవచ్చును. అంచేత వచ్చిన కొత్తల్లో కొంచెం బిక్కుబిక్కుమంటూ ఉన్నా నెమ్మది మీద ఏదో ఒక విద్య నేర్వడం, సంపాదన పరులు కావడం, పిల్లల పెంపకం, దానిలో ఉండే పరీక్షలు, మాతృదేశంలో తమవారిని మిస్సవడం – ఇలాంటివన్నీ దినుసులుగా వీళ్ళు కథలు రాశారు. ఈ కథల్లో భర్త ఒక్కో సారి అస్సలు ఇంటి విషయాల్ని పట్టించుకోని బుద్ధావతారం లాగానూ, అప్పుడప్పుడూ భార్య కష్టాలని ఇబ్బందుల్ని పట్టించుకుని, కొంచెం ఇంటి పనిలో సాయం చేస్తూ భార్యని ప్రోత్సహించే స్నేహితుడిలానూ కనిపిస్తుంటాడు, కానీ ఈ కథలు ప్రధానంగా స్త్రీ పాత్రల ఆత్మకథనాలు, వారి ఆశయాలకూ భయాలకూ ప్రతిబింబాలు. అమెరికా ఇల్లాలు (కమల చిమ్మట), అమెరికా ఇల్లాలి ముచ్చట్లు (శ్యామల దశిక) వీటికి మంచి ఉదాహరణలు.

కొన్నేళ్ళు గడిచాక మన కథల ఫోకస్ పిల్లల పెళ్ళిళ్ల మీదికి తిరిగింది. అమెరికాలో పుట్టి పెరుగుతున్న తెలుగు పిల్లలకి పెళ్ళిళ్ళు చెయ్యడం అంటే ముచ్చటగా మూడు ప్రత్యామ్నాయాలు కనబడుతున్నాయి. 1) తమలాగా ఇక్కడే పుట్టి పెరిగిన తెలుగువారో భారతీయ సంతతివారో, 2) మాతృదేశం నుండి వెదికి పెళ్ళి చెయ్యడం, 3) భారతీయేతరులు. చివరి రెండిటిలో దేనిని ఎంచుకున్నా దానిలో మేలూ కీడూ రెండూ ఉన్నాయని మనవారు గుర్తించారు. ఈ బాగోగుల తులనాత్మక పరిశీలన, చర్చ మనకి చాలా కథల్లో కనిపిస్తాయి. ఈ కథలు శిల్పపరంగా గొప్ప ఆసక్తికరం కాక పోవచ్చునుగానీ ఆ రోజుల్లో ప్రబలంగా ఉన్న సామాజిక ధోరణులకు ఇవి అద్దం పడుతున్నాయి. తద్వారా ఒక సోషల్ డాక్యుమెంటరీగా ఈ కథలు ముఖ్యమైనవి.

మేడ్ ఇన్ అమెరికా (సత్యం మందపాటి), పెళ్ళి చేసుకుంటే చూడు (శేషుశర్మ పూడిపెద్ది), అబ్బాయి పెళ్ళి (రాధిక నోరి), ఇ – అ పెళ్ళి (సాయిలక్ష్మి కాళ్ళకూరి) కథలలో పెళ్ళి చేసుకోవలసిన పాత్రల ప్రమేయం నేరుగా లేకుండా, తలిదండ్రుల తరంలో జరుగుతున్న చర్చలాగా ఈ పెళ్ళి సమస్యయొక్క వివిధ రూపాలని ఆవిష్కరించారు. బయటి వారిని (తమ కుల, భాష, ప్రాంత, జాతికి చెందని వారిని) పెళ్ళి చేసుకోవడం అనుకోగానే, తల్లిదండ్రుల తరంలో – నా సాంప్రదాయమో, నా భాషో, నా సంస్కృతో .. అనే ఆక్రోశం పెద్దగా వినిపిస్తుంది. ఒక చోట పెళ్ళి కావలసిన అబ్బాయి తల్లితో అంటాడు – నువ్వు మాత్రం నీ భాషా సంస్కృతులని ఏ మాత్రం పాటిస్తున్నావని వాటిని నా మీద రుద్దటానికి చూస్తున్నావు – అని! ఇది ఆలోచించవలసిన ఆరోపణే!

ఈ వరుసలో కాగల కార్యం (రాధిక నోరి) కథ భలే ఆసక్తికరంగా ఉన్నది. ఇందులో పెళ్ళి కొడుకు ఒక తెల్లమ్మాయిని ఇష్టపడి, ఆమెకి తన కుటుంబం పరిచయం కావాలని ఒక వారం రోజుల పాటు ఆమెతో సహా తలిదండ్రుల ఇంట్లో ఉంటాడు. ఆ వారం రోజుల్లో ఆ తెల్లమ్మాయి ఈ పెళ్ళి తనకు అచ్చిరాదని గ్రహించి (మృదువుగానే) తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోతుంది. కథ ముగిసే సమయానికి అబ్బాయికి వేరే హీరోయిను ఎవరూ దొరకదు గానీ తల్లిదండ్రులు మాత్రం కొంచెం హాయిగా ఊపిరి పీల్చుకున్నట్టే చిత్రించారు. ఈ కథలో తెల్లమ్మాయి లారా పాత్రని నిర్వచించిన తీరు ఆసక్తి కరంగా ఉన్నది. పెళ్ళికాని టీనేజ్ తల్లికి పుట్టిన లారా, తల్లిదండ్రుల ప్రేమ లేక అమ్మమ్మ దగ్గర పెరిగింది. ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కొంత చదువుకుని ఒక మాదిరి ఉద్యోగం చేస్తోంది. ఆ పిల్లకు తన క్రిస్టియన్ మతం పైనా పెద్దగా శ్రద్ధ లేదు. ఉద్యోగం పట్ల కానీ కెరీర్ పట్ల కానీ ఒక ఉత్సాహం, ఏంబిషన్ లేవు. హీరో పట్ల కూడా ఏదో కొంత ఆకర్షణ తప్ప గాఢమైన ప్రేమ లేదు – అని హీరో తల్లి గమనిస్తుంది. మొత్తానికి ఆ పిల్ల – ఈ పెళ్ళి చేసుకుంటే సుఖం సంగతి పక్కన పెట్టి, ఈ అత్తారి కుటుంబంలో ఇమడ్డం లేని కష్టాన్ని తెచ్చుకోవడం అవుతుందన్న ఆలోచనతో – హీరోతో తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోతుంది. కేవలమూ వ్యక్తిగత స్థాయిలో చూస్తే ఆ తల్లిదండ్రుల స్థానంలో నేను ఉంటే నేనూ బహుశా వాళ్ళు ప్రవర్తించినట్టే, వాళ్ళు ఆలోచించినట్టే చేసి ఉండేవాణ్ణి. అభ్యుదయ ప్రగతి శీల ఆలోచనలను గురించి కబుర్లు ఎన్నైనా చెప్పొచ్చు, తనదాకా వస్తే కానీ తెలియదు కదా!

అంచేత, పాఠకులకి హీరో తల్లిదండ్రుల ప్రవర్తన చాలా రీజనబుల్ గా ఉన్నట్టే తోస్తుంది. ఒక వేళ లారా ఈ కథలో చిత్రించినట్లు కాకుండా, స్థిరమైన ఎగువ మధ్యతరగతి తల్లిదండ్రుల సంతానమై ఉండుంటే, తన కెరీర్ పట్ల ఏంబిషన్తో ఉండుంటే అప్పుడీ కథ ఎలా ఉండేదో అని ఒక ఆసక్తికరమైన ఆలోచన. హీరో తన ఆశయాలకు తగినట్టు పెద్ద చదువులు చదవలేదనీ, డాక్టరు కాలేదనీ హీరో తండ్రి బాధ పడతాడు. దానికి తగినట్టు చివరికి హీరో ఇక ప్రేమా దోమా అన్నీ మరిచిపోయి లా కాలేజీలకి అప్లై చేస్తానని ప్రకటించడంతో కథ సుఖాంత మవుతుంది. వివాహానికి సంబంధించిన విషయాలతోబాటు సక్సెస్ అంటే ఫలాని చదువులు చదవాలి అనే ఉద్దేశం మనకి కనిపిస్తున్నది. కథలో పాత్రల ప్రవర్తన ఆయా పాత్రలకి వ్యక్తిగతం అనుకోవడం బాగానే ఉంటుంది కానీ ఇటువంటి పరిస్థితుల్లో – ముఖ్యంగా స్వ-పర భేదాల్ని చిత్రించే కథల్లో – ఈ పాత్రలు నిజజీవితాలకి, ఆశయాలకి, ఆలోచనలకి ప్రతీకలు అవుతుంటాయి.

భారత్ నించి అమ్మాయినో అబ్బాయినో వెతికి తెచ్చి పెళ్ళి చెయ్యడం ఇంకో ప్రత్యామ్నాయం. ఈ విషయం మీద కూడా కొన్ని కథలు వచ్చాయి. వీటిల్లో అబ్బాయి పెళ్ళికీ అమ్మాయి పెళ్ళికీ ఉన్న తేడా ఒకటి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. వధువు అమెరికా అమ్మాయి ఐతే, ఇండియానించి తెచ్చిన వరుడితో సర్దుబాటు అవడం కష్టం – ఆమె అలవరుచుకున్న స్వతంత్ర భావాలకీ, అతని పురుషాధిపత్య భావాలకీ పొసగదు అనేది ఇక్కడ సాధారణంగా చిత్రించబడిన ఆరోపణ – అంచేత ఇలాంటి పెళ్ళిళ్ళు ఎక్కువగా పెటాకులే అవుతున్నాయి. అమెరికా వరుడికి ఇండియానించి వధువుని తెచ్చుకుంటే మాత్రం పరవాలేదు – ఎందుకంటే, ఆ వచ్చే అమ్మాయి అమెరికా జీవితం కోసం తప్పకుండా సర్దుకుపోతుంది – ఈ ఆలోచనా ధోరణి కథల్లోనే కాదు, నేను నిజజీవితంలో చూసిన అనేక సందర్భాల్లోనూ స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నది. పరిస్థితి ఏదయినా అమ్మాయే సర్దుకు పోవాలి అనేది ఇందులో అంతర్లీనంగా, అవాచ్యంగా మనకి అందే సందేశం. దేశాన్ని విడిచి వచ్చామే కానీ మనం వదులుకోవాలనుకున్నా కొన్నికొన్ని భావాలు మనలని అంత తేలిగ్గా వొదిలిపెట్టవేమో!

అమెరికాలోనే సంబంధాలు వెతుక్కోవడంలో – భారతీయులు, శ్వేతజాతీయులు కాకుండా ఇతర జాతులనుండి భాగస్వామిని వెతుక్కోవడం ఉంది. కానీ భారతీయులు ఈ దిశగా దృష్టి సారించినట్టు లేదు. మన కథల్లో కూడా ఇటువంటి ప్రస్తావన ఎక్కడా కనబడలేదు కానీ ఆరి సీతారామయ్యగారు దూరపు కొండలు అని ఒక మంచి కథ రాశారు. అందులో అమెరికాలో ఉంటున్న ఒక భారతీయ సంతతి పిల్, అందులోనూ ఆలయపూజారి గారి అమ్మాయి, కెన్యా నుండి వలసవచ్చిన పిల్లాణ్ణి చేసుకోవడానికి ఇష్టపడుతుంది. ఈ కథలో కూడా అసలు వధూవరులు మనకి కనబడరు – కథ మొత్తం అటు కెన్యా తల్లిదండ్రుల దృక్కోణం నించీ, ఇటు తెలుగు తల్లిదండ్రుల కోణం నించీ చెబుతూ – ఆ వూరికి ఈ వూరెంత దూరమో, ఈ వూరికి ఆ వూరూ అంతే దూరం అనే సత్యాన్ని సమర్ధవంతంగా ఆవిష్కరించారు. ఈ ఒక్క కథే కాదు, మారుతున్న సామాజిక నేఫథ్యంలో, అమెరికా ప్రవాసంలో వైవాహిక జీవితంలో అతి సాధారణంగా తలెత్తే అసమానతలని తన కథల్లో ప్రతిభావంతంగా చిత్రించారు సీతారామయ్యగారు.

వివాహం విఛ్ఛిన్నం కావటం కూడా మన కథల్లో తరచు కనిపిస్తున్న కథాంశం. భర్తకు వేరే స్త్రీ (సాధారణంగా వయసులో చిన్నదైన శ్వేత జాతి వనిత) పట్ల ఏర్పడిన మోజు విడాకులకు దారి తీసినట్లుగా చాలా కథలలో చిత్రించబడింది. ఉద్యోగంలో పై అంతస్తులకు చేరడం, లేదా స్వంత వ్యాపారంలో అపారంగా గడించడం ఆ మగవారికి ఈ ధైర్యాన్ని ఇచ్చినట్లుగా కూడా చిత్రించబడింది. ఐతే, ఈ సబ్జక్టుని డీల్ చేసిన కథల్లోనూ కొన్ని విలక్షణమైన కథలున్నాయి. నిడదవోలు మాలతి గారి నిజానికీ ఫెమినిజానికీ మధ్య అనే కథలో భర్త అభ్యుదయ భావాలు కలిగినవాడిగా తనను తాను భావించుకుంటూ ఉంటాడు. ఆదర్శాల ముసుగులో ఇతర స్త్రీలతో ప్రేమకలాపాలు సాగిస్తూ, భార్యను మోసం చేస్తూ ఆత్మవంచన చేసుకుంటున్నాడనే నిజం భార్య అతన్ని నిలదీసేదాకా గ్రహింపుకు రాదు. కాపురం చక్కబెట్టుకోవాలనే తాపత్రయం వేరు, ఒక స్త్రీ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం వేరు. ఆ తేడా స్పష్టంగా చూపించారు మాలతిగారు ఈ కథలో. మరొక కథలో (రచయిత, కథ పేరు రిఫరెన్సు అందుబాటులో లేదు) ఇరవయ్యేళ్ళుగా అమెరికాలో ప్రవాసం ఉండిపోయిన భార్య భారత్ లో జరుగుతున్న ఎన్నో పెళ్ళిళ్ళు మిస్సై పోతున్నానని బాధపడుతూ ఉంటుంది. ఇంకో అమ్మాయితో వెళ్ళిపోతాను, విడాకులివ్వు అనడిగిన భర్తతో – ఎక్కడికో వెళ్ళడం ఎందుకు, మన ఊరి గుళ్ళోనే పెళ్ళి చేసుకోండి. కనీసం ఓ పెళ్ళి చూసిన ఆనందమైనా నాకు దక్కుతుంది – అంటుందామె. ఇది కూడా తనకి చేతనైన విధంగా ఆమె తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడమే!

ప్రమీల సూర్యదేవర రాసిన తోడునీడా అనే కథలో విడాకులు, తదనంతరం ఆ మహిళ సమాజంలో ఎదుర్కొనే వివక్ష, ఇంకా మళ్ళి పెళ్ళి చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఎదురయ్యే సమస్యలను చిత్రించే ప్రయత్నం చేశారు. ఈ కథలో వర్ణించిన సన్నివేశాలు ఎంతో సహజంగా ఉన్నా, కథా నిర్మాణంలో రచయిత్రి తగిన శ్రద్ధ చూపక కొంత అయోమయంగా తాయారయింది. సోమసుధేష్ణ రాసిన చైతన్యం అనే కథ కూడా విలక్షణమైనది. ఈ కథని నేను పది పన్నెండేళ్ల క్రితం మొదటి సారి చదివాను. శ్వేతవనిత మోజులో భర్త విడాకులు తీసుకుని వెళ్ళిపోతే ఆ స్త్రీ నిలదొక్కుకుని, అవసరమైన చదువు నేర్చుకుని మంచి ఉద్యోగమూ, ఇల్లూ సమకూర్చుకుని హాయిగా బతుకుతున్న సమయంలో ఒంటరి అయిన ఆ మాజీ భర్త మళ్ళీ ఆమెకి దగ్గరవాలని ప్రయత్నాలు మొదలు పెడతాడు. పెద్దవారైన కూతుళ్ళిద్దరూ కూడా ఆయనకి సాయం చెయ్యడానికి ప్రయత్నిస్తారు. స్త్రీ పురుష సంబంధంలా వొద్దుకానీ ఒక స్నేహితుడిగా నీతో స్నేహం చెయ్యడానికి నాకు అభ్యంతరం లేదు – అని ఆ స్త్రీ అన్నట్లు చిత్రించిన ఈ కథని మొదటి సారి పది పన్నెండేళ్ళ కిందట చదివినప్పుడు నాకు ఆ స్త్రీ పాత్ర మీద పిచ్చి కోపం వచ్చింది. కథ చివర్లో ఆమె అలా అనడం ఒక బలహీనతగా నాకు అప్పట్లో అనిపించింది. కానీ రచయిత్రి ఆ స్త్రీమూర్తిని ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వంతో, మానసిక స్థైర్యంతో తీర్చి దిద్దారని తోచింది ఇప్పుడు మళ్ళీ చదివితే. మొత్తానికి విడాకుల అనంతర జీవితంలోని సంక్లిష్టతని పలుచన చెయ్యకుండా రాసిన ఒక మంచి కథ ఇది.

యువతీయువకులు తమంత తాము జీవితభాగస్వాములను వెతుక్కునే ప్రయత్నాలను గురించి రెండు తమాషా కథలు నా దృష్టిలో పడ్డాయి. విప్లవ్ రాసిన ఎంగేజిమెంట్ అనే కథలో అమెరికాలో పుట్టిపెరిగిన జంట తొలిచూపులో నచ్చారులే అనుకుని, ప్రధానం జరుపుకుని, దూరాభారపు సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి కొంత ప్రయత్నం చేసి ఇహ లాభం లేదని చేతులెత్తేయడం కనిపిస్తుంది. దీనికి జవాబుగా రాశారేమో అన్నట్టు నోరి రాధిక రాసిన తోడు అనే కథలో భారత్ నించి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్న జంట, ముందు స్నేహితులుగా ఉండి, పెళ్ళి గురించి రకరకాల అపోహలతో భయపడుతూనే ఒకరిని విడిచి ఒకరు ఉండలేమనే నిశ్చయానికి వచ్చి పెళ్ళి చేసుకోవడం చూపారు. రెండు కథలలోనూ పాత్ర చిత్రణ సహజంగా ఉన్నా, అమెరికా జంట పైపై విషయాలకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చినట్టు చిత్రించడం ఒక ప్రతీకయేమో అనే అనుమానం రాకమానదు, అందులోనూ ఈ రెండు కథలనూ పక్కపక్కన పెట్టి చూస్తే.

అలాగని అన్నీ సమస్యలూ బాధలే కాదు, చక్కని వైవాహిక జీవితాలను చిత్రించిన కథలు కూడా చాలా ఉన్నాయి. చంద్ర కన్నెగంటి రాసిన సత్యం అనే కథలోనూ, లలిత జొన్నాళ్ రాసిన అభ్యాగతుడు కథలోనూ అన్యోన్యమైన దాంపత్యం కనిపిస్తుంది. వివాహం కాక ఇంకేవో విషయాల గురించి రాసిన కథల్లో నేపథ్యంగా హృద్యమైన దాంపత్య జీవన చిత్రణలు మనకు కనిపిస్తాయి. చిన్నపిల్లల్లాగా కీచులాడుకోవడం, అలకలు, బతిమాలడాలు, సర్దుకుపోవటాలు, ఒకరినొకరు అర్ధం చేసుకుని, అవతలి వాళ్ళకి ఏదైనా సమస్య మీద పడినప్పుడు ఆసరాగా ఓదార్పుగా ఉండడం – ఈ వెరైటీలన్నీ మనకి ఈ కథల్లో కనిపిస్తున్నాయి, నిజజీవితంలో లాగే.

చివరిగా అసలు వివాహ వ్యవస్థనే ప్రశ్నించిన ధీర వనిత నందిని కథని గురించి చెప్పుకోవాలి. భారత్ లో సాంప్రదాయక కుటుంబంలో పుట్టి పెరిగినా, చిన్నప్పటినించీ చదువే ధ్యేయంగా, అటుపైన తన పనే ఆరాధ్య దైవంగా పెరిగిన నందిని ఎప్పుడూ ప్రేమ గురించీ పెళ్ళి గురించీ పట్టించుకోలేదు. ఉద్యోగం కోసం అమెరికావచ్చి స్థిర పడటం ఆమెకి అంతకు మునుపులేని ఒక స్వేఛ్ఛని ఇచ్చింది. ఆమె వ్యక్తిత్వం స్థిరపడిన కొద్దీ ఆమెకు పెళ్ళి పట్ల విముఖత దృఢమవుతుంది. అలాగని ఆమె ఫెమినిస్టు సిద్ధాంతాలను గుప్పించదు. అన్ని విషయాల్లోనూ చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది. కథ ముగింపు అంత కన్విన్సింగ్ గా అనిపించదు గానీ, ఒక మధ్య తరగతి ఆధునిక యువతి పెళ్ళిని గురించి ఎదుర్కునే సందిగ్ధాల సంక్లిష్టతని నందిని పాత్ర ద్వారా అద్భుతంగా ఆవిష్కరించాడు మిత్రుడు అక్కిరాజు భట్టిప్రోలు.

అమెరికా జీవితం వల్ల వివాహ బంధం మీద విచిత్రమైన వత్తిళ్ళు వస్తున్నాయన్నది నిజం. ఈ వత్తిళ్ళ ప్రభావాలను అమెరికా తెలుగు కథకులు బాగానే పట్టుకున్నారు. ఐతే ఈ సమస్యలను అర్ధం చేసుకుని విశ్లేషించే ప్రయత్నంలోనే కొన్ని సంచిత భావజాల ప్రభావాలు మనలను వదిలి పెట్టడం లేదు. పక్కనున్న సమాజాన్ని గురించి లోతైన అవగాహన కంటే స్టీరియోటైప్ లతో కూడిన అపోహలే మన కథనాలను ప్రభావితం చేస్తున్నట్లు కనిపిస్తున్నది. అలాగే కథలు రాసేది సాధారణంగా తొలితరం వలసవారు కాబట్టి మలితరం పాత్రల చిత్రణ కూడా అపోహల నీడలో మసకబారుతున్నాయి. జీవితంలోని సహజ సంక్లిష్టతలను పలుచన చెయ్యకుండా కొన్ని మంచి కథలు వచ్చాయి. ఏదేమైనా ఈ కథలు ఒక రెండు తరాల వలస ప్రజల ఆశలను ఆశయాలనూ అక్షరబద్ధం చేసిన సోషల్ డాక్యుమెంటరీలు.

 -ఎస్. నారాయణస్వామి

 nasy

పర్యావరణం తెల్లదుప్పటి కాదు!

ఎస్. నారాయణస్వామి

ఎస్. నారాయణస్వామి

అమెరికా వచ్చి నేను తెలుసుకున్న విషయాల్లో పర్యావరణ స్పృహ కూడా ఒకటి. ఎనభైలలో వరంగల్లో బి.టెక్ చదువుతున్న రోజుల్లో, అప్పటికే భారత్‌లో కూడా కొన్ని పర్యావరణ సంరక్షణ ఉద్యమాలు జరుగుతూ ఉన్నా, ర్యాడికల్ నక్సలిజం నా దృష్టిని ఆకట్టుకున్నంతగా పర్యావరణాన్ని గురించిన ఆలోచన ఆకట్టుకోలేదు. ఐనా మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన పుణ్యానికి, అందునా ఇంటర్నల్ కంబస్చన్ నా అభిమాన శాస్త్రం కావడం వల్లనూ, ఇంజన్లద్వారా జరిగే వాతావరణ కాలుష్యాన్ని గురించి కొంత అధ్యయనం చేస్తూ వచ్చాను. అమెరికా వచ్చిన కొత్తల్లో ఒక రోజు మా విశ్వవిద్యాలయం నడిబొడ్డున ఏదో నిరసన ప్రదర్శన జరుగుతున్నది. అప్పటికి ఎక్సాన్ వాల్డెజ్ దుర్ఘటన జరిగి ఒక యేడో, రెండేళ్ళో పూర్తయి (ఏనివర్సిరీ అనడానికి తెలుగులో వార్షికోత్సవం అని తప్ప ఇంకో మాట లేదా? దుర్ఘటనల ఏనివర్సరీలని ఏమనాలి? సాంప్రదాయకంగా తద్దినం అంటే పోతుందేమో?) ఆ సందర్భంగా ఎక్సాన్ కంపెనీని ఉద్దేశించి ఆ నిరసన ప్రదర్శన జరుగుతున్నది. పర్యావరణ సంరక్షణ ఉద్యమంతో అదే నాకు తొలి పరిచయం. ఆ తరవాత ఈ సంఘటనని తలుచుకుని నిరసన అనే పేరుతో నేనొక చిన్న సెటైరు రాసుకున్నాను.

అటుపైన పుస్తకాల ద్వారా, మిత్రులతో చర్చల ద్వారా, ఇంకా ఆ తరవాత ఇంటర్నెట్ ద్వారా చాలా ఉద్యమాలు పరిచయమయ్యాయి. కొన్నిటితో అనుబంధాలు పెరిగాయి, నేను కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే వరకూ. చాలా మట్టుకు పబ్లిగ్గా జరిగే ఈ నిరసన కార్యక్రమాలు ఏదో ఒక కంపెనీని వ్యతిరేకిస్తూ నడిచేవి. కంపెనీలకి ముఖ్య బలం వాటి లాభాలు కాబట్టి, దుష్టకంపెనీలకి బుద్ధి చెప్పాలంటే వాటి ఉత్పత్తులని కొనడం మానెయ్యాలనే సిద్ధాంతం ఒకటి అప్పుడే బయల్దేరింది. ఇది నిజమేనని నమ్మి (ఎంతైనా మొదట మార్క్సు శిష్యుణ్ణి కదా! సంబంధాలన్నీ ఆర్ధికమే!!) కొన్ని ఉత్పత్తులని బహిష్కరించాను ఆ రోజుల్లో. ఆయా కంపెనీలని తీవ్రంగా శిక్షిస్తున్నానని దృఢంగా నమ్మాని. అంతేకాక ఇదే సరైన మార్గమని మిత్రులతో చాలా తీవ్రంగా వాదిస్తుండేవాణ్ణి కూడాను. ఐతే, మెల్లమెల్లగా ఇంకొక స్పృహ మేలుకోవడం మొదలుపెట్టింది. ఇంధన జ్వలనం మీద రీసెర్చి చేసే పూరిండియన్ గ్రేడ్యువేట్ స్టూడెంటుగా నేను అందుకుంటున్న గొర్రెతోక ఉపకారవేతనం ఒక చమురు కంపెనీ చలవ. వారమంతా కోకు పెప్సీ ఉత్పత్తులేవీ ముట్టకుండా పవిత్రంగా గడిపి వారాంతానికి బీరు తాగబోతే ఆ బీరు తయారుచేసే కంపెనీ తాగునీటిని విపరీతంగా కలుషితం చేస్తోందని తెలియవచ్చింది. ఒక బయాలజీ మిత్రుడితో చర్చిస్తున్నప్పుడు, అప్పటి నా తీవ్రమైన నమ్మకాలకి వ్యతిరేకంగా, జన్యుమార్పిడి పంటలు మంచివేననీ, వాటివల్ల చాలా ఉపయోగాలున్నాయనీ నన్ను ఒప్పించాడు ఆ మిత్రుడు. ఇలా తగిలిన ఎదురు దెబ్బలతో పర్యావరణ సంరక్షణ అంతా తెలుపూ, కాలుష్యం నలుపూ కాదనీ, మధ్యలో ఓ యాభై రంగులు పట్టేటంత ‘గ్రే” ఉన్నదనీ తెలియవచ్చింది.

 

ఖాండవ దహనం అని ఒక కథ రాశాను 2005 లో. అప్పట్లో తానా సావనీరులో వచ్చిందది. ఆ కథ పర్యావరణ రక్షణ గురించి కాదుగానీ, నల్లమల అడవుల్లో చెంచు గూడేలలో నేను చూసిన కొన్ని విషయాలు అందులో చర్చకి వచ్చాయి. ఉదాహరణకి అడివంతా పర్యావరణ పరిరక్షణ అనీ, పులుల అభయారణ్యం అనీ చెంచువారి వేట మీద సవాలక్ష ఆంక్షలు విధించారు. దానికి పరిహారంగా చెట్లు నాటమనీ, గోతులు తవ్వమనీ, ఇంకా ఇలాంటివే ఏవో పది రకాల పనులు కల్పించి (ఇది ఉపాధి కల్పన అన్న మాట) ప్రతి ఫలంగా జొన్నలో సజ్జలో ఇప్పిస్తున్నారు. పర్యావరణ సంరక్షణ ఎప్పుడూ ఆ పర్యావరణానికి అతి చేరువులో ఉన్న మనిషి మనుగడని దెబ్బతీస్తూ వస్తున్నది. అంతే కాక, ఆ సంరకషణ కోసం చేపట్టే కార్యక్రమాలు ఎంత అనాలోచితంగా, ఎంత అశాస్త్రీయంగా ఉంటాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

images

నిజానికి తెలుగు సాహిత్యంలో పర్యావరణ స్పృహ కొంచెం తక్కువనే అనిపిస్తోంది. గట్టిగా చూస్తే చంద్రలతగారి దృశ్యాదృశ్యం నవల ఒకటి కనబడుతున్నది, భారీ ఆనకట్టలు అటు సహజ వనరులకీ, ఇటు ఆ ప్రాంత ప్రజల జీవనానికీ రెండిటికీ ముప్పు తెస్తాయనే అంశంతో. డా. చంద్రశేఖర్రావు గారి కథలు కొన్నిట్లో ఈ అంశాలు అక్కడక్కడా తొంగి చూస్తుంటాయి. దాదాహయత్ రాసిన మురళి ఊదే పాపడు కథ మనుషుల దురాశకి బలై పోతున్న సహజవనరుల్ని గురించి ఒక ఫేంటసీ ధోరణిలో ఆర్ద్రంగా చెప్పిన కథ. చంద్రలత గారే జన్యుమార్పిడి విత్తనాలను గురించీ, మరికొన్ని ఇతర పర్యావరణ సంబంధిత అంశాలను గురించీ ఇతర పుస్తకాలు కూడా రాశారు. కవిత్వంలోనైనా ఇటువంటి అంశాలు సూచనప్రాయంగా దర్శనమిచ్చాయే తప్ప, కేవలమూ పర్యావరణ స్పృహ సాహిత్యాన్ని డిక్టేట్ చేసిన సందర్భాలు తక్కువే.

 

ఉద్యమ కారణం ఏదైనా – అంతరించి పోతున్న పక్షి జంతు జాతులని రక్షించడం కావచ్చు, సహజ వనరుల సంరక్షణ కావచ్చు – అక్కడ రక్షించవలసిన అంశాన్ని బహు సున్నితమైనదిగా, నాజూకైనదిగా వర్ణించడం, ఆ రక్షణ ఉద్యమాన్ని ఒక యుద్ధంగా అభివర్ణించడం పరిపాటి అయింది. అంతే కాదు, రక్షణని సపోర్ట్ చెయ్యని సామాజిక శక్తి ఏదైనా (ప్రజలు, సంస్థలు, వ్యాపారాలు, ప్రభుత్వాలు) దాన్నొక కౄరమైన శత్రువుగా చిత్రించడం కూడా వారి వ్యూహంలో భాగమే. కానీ పర్యావరణ సంరక్షణ ఏ కొద్దిమంది జన్మహక్కో కాదు. నిజానికి ఇక్కడ గమనించాల్సిన ధర్మసూక్ష్మం ఒకటున్నది. మానవులు చేస్తూ ఉండిన అకృత్యాలవల్ల పర్యావరణానికీ, భూగోళానికీ వచ్చిన ముప్పు ఏమీ లేదు. వాటి బాగుకోసం అవసరమైన సవరణలు అవి చేసుకోగలవు. ఎటొచ్చీ అవి చేసే సవరణలు మానవజాతికి అంత సౌకర్యంగా ఉండవు. అంచేత పర్యావరణ సంరక్షణ, భూగోళ సంరక్షణ అంటూ జరిగే ప్రయత్నాల్లో ముఖ్యమైన ఉద్దేశం మానవజాతి తమని తాము రక్షించుకోవడమే. అంటే, ఈ ప్రయత్నం అంతా మొత్తం మానవజాతి మనుగడకి సంబంధించినది కాబట్టి ఇందులో అందరికీ భాగస్వామ్యం ఉండాలి, అందరికీ బాధ్యత కూడ ఉండాలి. అంతేకాని, ఏ నూటికి ఒక్కరో మేమే హీరోలం, మేమే రక్షణ కార్యకర్తలం అని (వారికి వారు ఎంత ఫీలైపోయినా సరే) ఉప్పొంగిపోతే పెద్దగా ఉపయోగపడే పనేమీ అక్కడ జరగదు.
వెరసి ఈ యుద్ధ కథాకథనంలో పర్యావరణ కార్యకర్త ఒక ఉదాత్తుడైన హీరోగానూ, అంతర్జాతీయ వ్యాపారవేత్త ఒక భయంకరమైన విలన్ గానూ ముద్ర పడిపోతారు. ప్రజల ఊహల సంగతి యెందుకూ, ఆయా రక్షణ సంస్థలే తమ ప్రత్యర్ధులని ఎంత ఏహ్యభావంతో చూస్తాయంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళతో కలిసి మాట్లాడ్డానికి కానీ, కనీసం వాళ్ళతో ఒకే గదిలో కూర్చోవటానికి కూడా ఇష్టపడరు. తీవ్రవాద పద్ధతులలో పనిచేసే గ్రీన్ పీస్, ఎర్త్ ఫస్ట్ వంటి సంస్థలే కాక సంయమనంతో వ్యవహరిస్తాయని ప్రపంచ వ్యాప్తంగా పేరున్న సంస్థలు, సాధారణ పౌరులవద్ద మంచి ఇమేజి ఉన్న సంస్థలు కూడా తమ సంరక్షణ కార్యకలాపాల దగ్గరికి వచ్చేసరికి ఇటువంటి మొండి వైఖరి అవలంబించడం స్పష్టంగా కనిపిస్తూన్నది, సంరక్షణ ఉద్యమాల చరిత్రని చూస్తే.

 

కానీ నిజంగా పనికొచ్చే పని జరగాలంటే, అందులో కౄర పరమ నీచనికృష్టులని పేరుబడిన వారు కూడా ఉండక తప్పదు. ఒకానొక కాలంలో ఆరోగ్యకరమైన ఆర్గానిక్ ఆహారం అంటే చిన్న విక్రేతల దగ్గర మాత్రమే దొరికేది ఇప్పుడు సర్వత్రా లభ్యమవుతున్నట్లే, పర్యావరణ సంరక్షణ మీద కూడా ఉద్యమకారుల మొనాపలీ వెనుకబడిందని చెప్పుకోవాలి గత పాతికేళ్ళలో. అనేక బహుళజాతి కంపెనీలు సహజ వనరుల నిలకడ గురించి, మారుతున్న వనరుల వాతావరణ పరిస్థితులలో తమ తమ కంపెనీల మనుగడని గురించీ తీవ్రంగా కృషిచేస్తున్నాయి. నేరుగా విద్యుత్, చమరు, బొగ్గు రంగాలలో ఉన్న కంపెనీల విషయంలో ఈ కృషి నేరుగా కనిపిస్తున్నది. ఉత్పత్తి రంగంలో – ఉదాహరణకి ఆటో, ఎలక్ట్రానిక్ రంగాలలో, ఉత్పత్తిదారులైన కంపెనీలు ఈ విషయమై చాలా పట్టుదలగా ఉన్నాయి. వనరుల నిలకడ విషయమే కాకుండా పెద్ద కంపెనీలన్నీ తమ తమ కార్బన్ ఫుట్ ప్రింట్ (ఒక సంస్థ కార్యకలాపాల వల్ల ఎంత కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో విడుదలవుతున్నది తెలిపే ఒక కొలమానం) గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నాయి. అంతేకాక ఏ జెనరల్ మోటర్స్ వంటి కంపెనీనో ఉదాహరణకి తీసుకుంటే .. ఎన్ని దేశాలలో ఎన్ని లక్షలమంది ఉద్యోగులతో, ఎంత భారీ యెత్తున వారి కార్యకలాపాలు సాగుతున్నాయి? వాళ్ళు తయారు చేసే కార్లు కాలుష్యాన్ని పెంచుతున్నాయి, వారి ఉత్పాదన పద్ధతులు బాగులేవు అని చెప్పి, అసలు వాళ్ళతో మాట్లాడం పొమ్మంటే ఎవరికి నష్టం?

ఇంకొక కీలకమైన విషయం, పర్యావరణం దగ్గరికొచ్చేసరికి అన్ని రకాల విషయాలూ కలగలిసి తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీనికి సంబంధించిన శాస్త్రీయ పరిజ్ఞానం కూడా ఎప్పటికప్పుడు మారుతున్నది, ఎప్పటికప్పుడు విస్తరిస్తున్నది. ఇప్పుడున్న అవగాహన పదేళ్ళ కిందట లేదు. ఏ విషయాన్నీ, ఏ అంశాన్నీ వేరువేరుగా డిఎస్క్ట్ చేసి పరిశీలించడానికీ, అదుపు చెయ్యడానికీ వీలుపడదు. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకునే కార్యాచరణ కావాలి. ఈ ప్రణాళిక ఎప్పటికప్పుడు ఎదుగుతూ ఉండాలి. ఇదంతా సాధ్యపడాలంటే ఉద్యమకారులు మడికట్టుకుని కూర్చుంటే సరిపోదు. అటు వివిధ ప్రాంతాల ప్రభుత్వాలతోనూ, ఇటు వివిధ వాణిజ్య సంస్థలతోనూ చేతులు కలిపి పని చెయ్యాలి.

ఒకటి గుర్తుంచుకోవాలి. మనుషులు రాకముందూ భూమి ఉంది. మనుషులు పోయాకా ఉంటుంది. భూమికేం ఢోకాలేదు. వచ్చిన బాధల్లా మనుషుల మనుగడకే. ఇకనైనా మనం తెలివిన బడితే మంచిది.

 

References:

Exxon Valdez

http://en.wikipedia.org/wiki/Exxon_Valdez_oil_spill

My satire

http://eemaata.com/em/issues/199911/867.html

My Story

http://kinige.com/kbook.php?id=58

Works of Chandralatha

http://kinige.com/kbrowse.php?via=author&name=Chandra+Latha&id=19

 

‘ఆర్గానిక్’ కూడా ఒక మార్కెట్ మాయ!

ఎస్. నారాయణస్వామి

ఎస్. నారాయణస్వామి

 

సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథల్లో భోజనచక్రవర్తి అని ఒక కథ ఉన్నది. అప్పంభొట్లు అసామాన్యమైన తిండిపుష్టి కలవాడు. ఒకసారి పోటీమీద రెండు గంగాళాల ఆవడలు పెరుగుతోసహా జుర్రిపారేసి ఊరి ప్రజలందరినీ దిగ్భ్రాంతుల్ని చేసిన మూర్తీభవించిన జఠరాగ్ని అతను. ఇంకో కథలో బావగాడు అనబడే కనకారావు కార్తీకసమారాధన వనభోజనాలలో రకరకాల తెలుగు వంటల్ని, కాయల సెలెక్షన్ దగ్గర్నించీ, ఏ కూర ఎలా వండాలో, ఏ రుచి ఎలా ఉండాలో దగ్గరుండి వండించి, స్వహస్తాలతో అందరికీ వడ్డించి పరవశించినవాడు. 

రెండు మూడు తరాల కిందట గోదావరి జిల్లాల సంపన్న బ్రాహ్మణ కుటుంబాల్లో పంక్తిభోజనాల పద్ధతుల్నీ మర్యాదలనీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు అనేక రచనల్లో చాలా విపులంగా వర్ణించారు. అడివి బాపిరాజు గారి నారాయణరావు నవల్లో ఆంగ్లో ఇండియన్ వారి దగ్గర్నుండీ వివిధరకాల ప్రజల ఆహారపు పద్ధతుల్ని వర్ణించారు. అంతదాకా ఎందుకు, ఈ మధ్యకాలంలో సినిమా ద్వారా కూడా తెలుగువారికి బాగా దగ్గరైన కథ ‘మిథునం’ (శ్రీరమణ)లో అప్పాదాసు మొదణ్ణించీ చివరిదాకా వంటకి సంబంధించిన ఏదో ఒక విషయం మీద భార్యతో గొడవపడుతూనే ఉంటాడు. 

timthumb.php

ఇదంతా చెప్పుకు రావడం ఎందుకంటే ఒక జాతి సాంస్కృతిక అస్తిత్వంలో భోజనానికీ, భోజన పద్ధతులకీ చాలా ముఖ్యమైన భూమిక ఉన్నది అని చెప్పడానికి. మా అమ్మానాన్నల పెళ్ళైన కొత్తలో అప్పుడు బాగా కరువురోజులు. మా నాన్నగారు అత్తారింటికి వెళ్ళిన సందర్భంలో భోజనంలోకి నెయ్యి లేకపోయేటప్పటికి – ఇంటికొచ్చిన కొత్తల్లుడికి నెయ్యి లేకుండా భోజనం పెట్టాల్సొచ్చిందని మా అమ్మమ్మా తాతయ్యా మహా గుంజాటన పడిపోయారుట. కేవలం ఒక్క తరం కిందట నెయ్యి లేకుండా భోజనం చెయ్యడం, పెట్టడం అమర్యాదయే కాదు, అనాగరికం కూడా అనిపించుకునేది. అదే ఇవ్వాళ్టి రోజున – విందుభోజనాల సంగతి పక్కన పెట్టండి – ఆంధ్రదేశంలోనే ఎవరైనా బంధుమిత్రుల ఇంటికి భోజనానికి వెళ్తే, నెయ్యి వడ్డించడం సంగతి దేవుడెరుగు, అసలు ఇంట్లో నెయ్యి ఉన్నదో లేదో అనుమానించవలసిన పరిస్థితి. అలాగే ఆచారాల ప్రకారం మన వంటల్లో విరివిగా వాడుతూ ఉండిన కొబ్బరి, నువ్వులు, బెల్లం, ఇవన్నీ కూడా మరుగున పడిపోయాయి – ఏవిటయ్యా అంటే, ప్రతీ వాళ్ళకీ షుగరు, బీపీ, కోలెస్టరాలు భయం.
తమాషాగా, మెక్డొనాల్డ్స్, పిజ్జా హట్, కెంటకీ ఫ్రైడ్ చికెన్ వంటి మెగా ఆహార వ్యాపారాలకి పుట్టినిల్లైన అమెరికాలోనూ గత ఇరవయ్యేళ్ళగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని గురించి అవగాహన పెరుగుతూ వచ్చింది. ఆ అవగాహన అందోళనగా పరిణమించి, కొండకచో ఉద్యమంగా ఎదిగి ఇంతింతై అన్నట్టు అదొక విశ్వరూపాన్ని దాల్చిందిప్పుడు. ఈ విశ్వరూపానికి బహుముఖాలున్నాయి. స్థానికంగా పెంచిన ముడిపదార్ధాలని వాడడం, ఆర్గానిక్ గా పెంచిన ముడిపదార్ధాలని వాడడం, తినుబండారాల ఉత్పత్తిలో భారీ యంత్రాలని ఉపయోగించకపోవడం, అన్నీ “సహజమైన” ముడిపదార్ధాలని వాడడం .. ఈ ముఖాలలో కొన్ని. అమెరికా ఎప్పుడూ Meat and Potatoes దేశమే. తరతరాలుగా తక్కువ ఖరీదుకి బర్గర్లు, పిజ్జాలవంటి జంకు ఫుడ్డు తినడం మరిగి, వొళ్ళు కొవ్వు పట్టి ఉన్న అమెరికను ప్రజానీకానికి ఒక్కసారిగా జ్ఞానోదయమైనట్టు, దేశం మొత్తం ఒక్క మనిషిలాగా ఈ ఆరోగ్యకరమైన ఆహార విశ్వరూపాన్ని ఆహ్వానించింది. ఎటొచ్చీ ఎంత ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటున్నా దేశపు ఆరోగ్యం మెరుగుపడ్డం లేదట.
జంకు ఫుడ్డు వొంటికి మంచిది కాదు అని ప్రత్యేకంగా పనిగట్టుకుని చెప్పక్కర్లేదు – విపరీతమైన కొవ్వు, ఉప్పు, చక్కెరతో నిండి ఉన్న ఈ తిండి సంగతి స్పష్టంగా తెలుస్తూ ఉన్నదే. పైగా అవన్నీ ఎక్కడో ఫేక్టరీలో తయారై, ఎన్నెన్నో రోజులు ఫ్రీజర్లలో నిలవచెయ్యబడి, అప్పటికప్పుడు వేడిచేసి వడ్డిస్తున్న వ్యవహారం. దీనికి పూర్తి వ్యతిరేకంగా స్థానికంగా పండించిన కూరగాయలు, పండ్లు, ఇతర ముడి పదార్ధాలు, సహజ ఉత్పత్తులు, .. ఆహా ఎంత స్వఛ్ఛంగా, ఆరోగ్యంగా ఉంటుందో ఆ వంట! అనిపించక మానదుగదా! అసలే కేలిఫోర్నియాలో ఆ ఆరోగ్యం పిచ్చ బాగా ఎక్కువ. హాలీవుడ్ ప్రాంతాల్లో ఆరోగ్యకరమైన స్వఛ్ఛమైన భోజనానికి బాగా పేరుపడ్డ రెండు రెస్టారెంట్లలో బాగా జనాదరణ పొందిన కొన్ని వంటకాలని ప్రయోగశాలల్లో విశ్లేషించినప్పుడు కొన్ని ఆసక్తి కరమైన సత్యాలు బయటపడ్డాయి. వొళ్ళు పెరగడానికి బాగా దోహదం చేసే కొవ్వూ, పిండిపదార్ధాలూ ఈ వంటకాల్లో చాలా హెచ్చుగా ఉన్నాయి. ఇందులో వాడిన ముడి సరుకు స్థానికమైనదీ, తాజాదీ అయితే అయుండవచ్చునుగానీ, శరీరానికి కొవ్వు పట్టకుండా ఉంచడానికి మాత్రం ఎటువంటి సహాయమూ చెయ్యదు ఇటువంటి ఆహారం.
images12
ఇదే కాదు, మంచి ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం అని విపరీతంగా ప్రకటనలు గుప్పించే అనేక సూపర్ మార్కెట్లలో షెల్ఫుల మీదున్న ఉత్పత్తులని చూసినా మనకి ఈ విషయం తెలుస్తూనే ఉన్నది. ఈ మాత్రానికి ఏ లేబరేటరీకో వెళ్ళనక్కర్లేదు – రకరకాల పొటేటో లేక వెజెటబుల్ చిప్సు, రకరకాల తీపి వంటకాలు, చాక్లెట్లు, మరెన్నో రకాల పాస్తా వంటి పిండిపదార్ధాలు – వాటి మీద “సహజం, ఆర్గానిక్, ఫలానా ఆరోగ్యకరమైన అంశాలతో  వృద్ధి చెందినది” ఇత్యాది పదజాలంతో మన కళ్ళనూ మనసునూ మాయజేసే వర్ణప్రపంచం కనిపిస్తుంది, కానీ లేబుల్ ని కాస్త విశదంగా పరీక్షిస్తే – ఔన్సుకి ఔన్సు, కేలరీకి కేలరీ – ఇవన్నీ మెక్డనాల్డ్సు వాడు అమ్మే బర్గరు + ఫ్రెంచి ఫ్రై భోజనానికి తీసిపోకుండా ఉన్నాయి. ఇంకా గట్టిగా మాట్లాడితే, కొన్ని సందర్భాల్లో జంకు ఫుడ్డే మెరుగ్గా ఉన్నదేమో కూడాను. మొత్తానికి తెలుస్తున్నదేవిటంటే – వొళ్ళు పెరగడానికి ముఖ్య కారణం భోజనంలో ఉండే కొవ్వు, పిండిపదార్ధాలూ కాగా, ఇప్పుడు మంచి ఆహారం పేరిట చెలామణి అవుతున్నదానిలో చాలా భాగం ఆ విషయంలో తినేవారి ఆరోగ్యానికి దోహదం చేసేలా లేదు.
సహజమైన ఆహారంకూడా జంకు ఫుడ్డు లాగానే వ్యాపార సంస్థల వ్యాపార సూత్రం మాత్రమే అయుంటే అదొక తీరుగా ఉండును. కానీ, ఈ విషయం, ఈ సూత్రం వ్యాపారాన్ని మించి – వ్యాసం మొదట్లో చెప్పినట్టు – ఒక ఉద్యమంగా, ఇంచుమించు ఒక సరికొత్త మతంగా పరిణమించింది. కొందరు పేరు పొందిన పాత్రికేయులు (E.g. Michael Pollan) ఈ మతానికి ప్రధాన మతాచార్యులు. టీవీలోనూ పత్రికల్లోనూ తారలుగా వెలుగుతున్న వంటవారు (Chefs, e.g. Mark Bittman) ప్రధాన అర్చకులు. పుస్తకాల ద్వారా, పత్రికల ద్వారా, టీవీలో, విడియోల్లో వీరందరూ కలిసి చేస్తున్న ప్రబోధాలు మధ్యతరగతి అమెరికన్ల మనసుల్ని చాలా ప్రభావితం చేస్తున్నాయి. తద్వారా వారి అలవాట్లని ఎంత ప్రభావితం చేశాయో తెలియదు గానీ వారి కొనుగోళ్ళని మాత్రం చాలా మార్చివేశాయి.
గత ఇరవయ్యేళ్ళలో ఈ “సహజ ఆహారం” ఒక స్వతంత్రమైన ఇండస్ట్రీగా ఎదిగింది. వచ్చిన తంటా ఏవిటంటే ఈ ప్రవచనాలు చెప్పే మహానుభావులెవ్వరూ వైద్యంలో కానీ, శరీరతత్వ శాస్త్రంలో కానీ, ఆహార శాస్త్రం (Nutritional science)లో కానీ పట్టభద్రులు కారు. ఆహారపు అలవాట్లు, శరీరతత్వం మీదనూ, ఆరోగ్యం మీదనూ వాటి ప్రభావాన్ని గురించి కొన్ని పరిశోధనలు జరిగాయి కానీ శాస్త్రీయమైన గమనికలు గానీ, ఇతర నిర్ణయాలు కానీ బయటికి రాలేదు. ప్రజల జీవితాలని ప్రభావితం చేసే అనేక సమస్యలకి శాస్త్రీయంగా జవాబులను వెతెకడానికి ఇష్టపడే అమెరికను సమాజం, ఆధునిక టెక్నాలజీలని ఒక ముఖ్యమైన సాధనంగా వాడుకునే అమెరికన్ సమాజం ఇలా ఆహారం విషయంలో మాత్రం ఎక్కడో వెనకబడిన ప్రాంతాల్లో మూఢనమ్మకాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆదిమ సమాజం మాదిరిగా ఈ ఆరోగ్య ఆహార మతాన్ని నమ్ముకుంటున్నది, తన అమిత బరువు సమస్యని పరిష్కరించడానికి.
స్వఛ్ఛమైన, సహజమైన ముడి సరుకు మంచిదే – కాదనడం లేదు. జంకు ఫుడ్డు చెడ్డదే – అదీ కాదనడం లేదు. కానీ శరీరపు బరువుని గురించీ, ఆరోగ్యాన్ని గురించీ సైన్సు చెబుతున్న మౌలికమైన విషయాలను పట్టించుకోకుండా సహజమైనది కదా అని ఏది పడితే అది, ఎంత పడితే అంత తింటూ పోతే వచ్చేది ఆరోగ్యం కాదు, అకాల మృత్యువే. మా మిత్రుడు ఒకడు అంటూ ఉంటాడు –  పాము విషంకూడా సహజమైనదే, ఆర్గానిక్‌గా, ఎక్కడా ప్రాసెస్ చెయ్యకుండా ఉత్పత్తి అయినదే – అలాగని, విషం తింటామా? అది విషమే అయినప్పుడు, అది ఆర్గానిక్ అయితేనేమి, ఏదో యంత్రాల్లో తయారైనది అయితేనేమి ప్రాణం తియ్యడానికి.

organic garden

మన ఇంటి వెనకాల పెరడులో పెద్దగా ఎరువులూ, క్రిమిసంహారకాలూ అవీ వాడకుండా మనం పెంచుకున్న కూరగాయల్ని మన చేత్తో కోసుకొచ్చి వండుకుని (అదీ ఎక్కువ ఉప్పూ, నూనెలూ లేకుండా) తింటే – అది కచ్చితంగా జంకుఫుడ్డు కంటే ఆరోగ్యంగా ఉంటుందని ఒప్పుకోవచ్చు. అంతేగానీ “సహజ సూపర్ మార్కెట్”లో షెల్ఫుల మీద అమ్మబడుతున్న సహజ పాస్తాలు, సహజ చిప్సు, సహజ ఐస్ క్రీములు తింటూ ఉండడం ఆరోగ్యం కాదు. అది మన మనసును .. కాదు కాదు – శరీరాన్ని – మనమే వంచన చేసుకోవడం.
References:

“The cure for Obesity”, David H. Freedman, The Atlantic (monthly) July 2013

 

– ఎస్. నారాయణ స్వామి

పెళ్ళా? చేసుకుందాం, ఎప్పుడో .. ఏం తొందర?

పేరున్న సీనియర్ రచయిత్రి పి. సత్యవతిగారు 90లలో పెళ్ళి ప్రయాణం అని ఒక గొప్ప కథ రాశారు. రకరకాల మధ్య తరగతి మనస్తత్వాలని అద్భుతంగా ఆవిష్కరించారు ఆ కథలో. నాకు బాగా గుర్తున్న ఒక దృశ్యం – ఇద్దరు విద్యావతులైన అమ్మాయిలు, వరసకి అక్క చెల్లెళ్ళు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరికీ ఇంకా పెళ్లి కాలేదు. ఒకామె పోస్టు గ్రాడ్యుయేటు. లెక్చరరుగా ఉద్యోగం చేస్తోంది. మంచి జీతం తెచ్చుకుంటోంది. అయినా పెళ్లి చూపులు అనేటప్పటికి అమ్మ చెప్పినట్టల్లా అలంకరించుకుని ఆ చూడ్డానికి వచ్చిన వాళ్ళ ముందు తలదించుకుని కూర్చోవడానికి సిద్ధపడుతూనే ఉంది. వయసు మీరిపోకపోయినా, మీరి పోతోందేమో అనే భయం తల్లి దండ్రుల్లోనూ, కొద్దికొద్దిగా ఆమెలోనూ ప్రవేశిస్తూన్న తరుణం. కథ చెబుతున్న చిన్న చెల్లెలు అకస్మాత్తుగా అడుగుతుంది ఆమెను – నీకన్న కాస్త చిన్నవాణ్ణో, పోనీ నీకన్న తక్కువ జీతం తెచ్చుకునే వాణ్ణో – నీ మనసుకి నచ్చిన వాడైతే – చేసుకోవచ్చుగా? అని. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ పెద్దక్కయ్య, “అలా ఏం బావుంటుందోయ్?” అనేస్తుంది, తేలిగ్గా తీసి పారేస్తూ.

ఇప్పుడు అమెరికాలో పెళ్ళి విషయంలో సరిగ్గా అదే పరిస్థితి. ఈ పరిణామం కొన్నేళ్ళుగా జరుగుతూ ఉన్నా, 2008 ఆర్ధిక సంక్షోభంలో, తద్వారా ఉద్యోగాలు హుష్ కాకీ అయిపోయి, నిరుద్యోగ నిష్పత్తి మింటి కెగరడంతోనూ అమ్మాయిలకి ఈ పెళ్ళి సమస్య స్పష్టమైన భీకర రూపంతో ప్రత్యక్షమై భయపెడుతున్నది.

కనీసం గత వంద, నూటయాభయ్యేళ్ళుగా స్త్రీలు సామాజిక జీవితంలో ఎటువంటి ప్రతిపత్తి సాధించాలన్నా సరైన మగవానితో – అంటె అన్ని విధాలా తనకంటే హెచ్చు స్థాయిలో ఉన్న పురుషునితో – పెళ్ళి ఒక్కటే మార్గంగా ఉంటూ ఉన్నది. అరవైలలో పెరిగిన హిప్పీతరంవారు కూడా, కొందరు ఆ సమయంలో ఏదో కొంత స్వేచ్ఛాగీతాలు ఆలపించినా, మొత్తమ్మీద పెళ్ళిళ్ళు చేసుకుని, పిల్లల్ని కని, ఉద్యోగాలు చేసి, అమెరికను సామాజిక జీవనస్రవంతిలో పాయగానే ఉన్నారు తప్ప వేరు పడినది లేదు.  స్త్రీ విమోచనము, స్వేచ్ఛ, సమానత్వమూ అని ఎంత మొత్తుకున్నా, ఆ తరంవరకూ దంపతులైనవారిని పరికిస్తే, విద్యలో, ఉద్యోగంలో, ఆదాయంలో భర్తదే పైచెయ్యిగా ఉంటూ వచ్చింది. స్త్రీలు ఎక్కువగా “నర్చరింగ్” ఉద్యోగాలైన నర్స్, టీచర్ వంటి ఉద్యోగాలకు గానీ, లేక సెక్రటరీ, ఆఫీస్ మేనేజర్ వంటి సహాయక ఉద్యోగాలకు గానీ పరిమితమయ్యారు. లేదా, కాలేజి చదువులు చదివి కూడా ఇల్లు చూసుకుంటూ గృహిణిగా ఉండిపోయారు. ఆ కాలంలో టీవీలో బాగా ప్రసిద్ధికెక్కిన సీరియళ్ళలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. Leave it to Beaver, All in the family వంటి సీరియళ్లలో ఈ స్థితిగతులని చిత్రించారు. అక్కడక్కడా కొన్ని ఉదాహరణలు దీనికి భిన్నంగా ఉండొచ్చును గానీ సగటున అర్బన్ మధ్యతరగతి అమెరికాలో ఉంటూ ఉన్న పరిస్థితి ఇది.

స్త్రీలు పెద్ద చదువులు చదవడము, ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఉన్నతస్థాయి మేనేజిమెంటు ఉద్యోగాలలో స్థిరపడడము, లేదా స్వంత వ్యాపారాలు మొదలు పెట్టడమూ మొదలై వృద్ధి చెందుతూ వస్తున్నది. ఈ పరిణామాలు జరగడానికి అనేక రాజకీయ, సామాజిక, ఆర్ధిక కారణాలు ఉన్నాయి. అలాగే అంతకు ముందే జరిగిన ఉద్యమాలు, మేలుకున్న చైతన్యాలు కూడా. ఏదేమైనా, 80లలో పెరిగిన జెనరేషన్ ఎక్స్ (Generation X) కాలేజికి వెళ్ళేసరికి, ఆ తరం స్త్రీలలో పెళ్ళి చేసుకోవడం అనే ఆలోచన బాగా వెనకబడిపోయింది. భవిష్యత్తుని గురించిన వారి ఊహల్లో పెళ్ళి ఎక్కడా కనుచూపు మేరలో లేదు. అలాగని అస్సలు పెళ్ళి చేసుకోరనీ కాదు, పెళ్ళంటే విముఖత లేదు. కానీ ముందు కాలేజి చదువు, తరవాత తమ మనసుకి నచ్చిన ఉన్నత విద్య, ఏతన్మధ్య తనని తాను అర్ధం చేసుకోవడం (అంటే ఆసియాకో దక్షిణ అమెరికాకో ఒక విహార యాత్ర, అధమాధమం యూరపు యాత్ర), అటుపైన మంచి జీతం, అధికారం, తృప్తినిచ్చే ఉద్యోగంలో చేరడం, ఊరికినే ఉద్యోగంలో చేరి ఊరుకోవడమే గాక ఉద్యోగసోపానంలో తన శక్తియుక్తులని వృద్ధి చేసుకుంటూ పైకెదగడం – ఇవన్నీ వాళ్ళ ఊహల్లో ప్రతిఫలించిన స్పష్టంగా పెళ్ళి, వైవాహిక కుటుంబ జీవనము కనబళ్ళేదు. పెళ్ళా? చేసుకుందాం, ఎప్పుడో .. ఏం తొందర? ఇంకా చాలా టైముందిగా!
జరిగింది ఏవిటంటే, వీళ్ళు ఈ జీవిత ప్రయాణంలో సోలోగా జాలీగా ప్రయాణిస్తూ ఉండగా, వారికి ఈడైన వయసువారు, వారి విద్యా ఉద్యోగ ఉన్నతికి సరిదూగగలవారు అయిన పురుషుల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. ఆ స్థాయిలో ఉన్న మగవారు అప్పటికే పెళ్ళిళ్ళై ఉన్నవారు. అలాగ పెళ్ళంటూ చేసుకోవాలని తోచే సమయానికి తమకన్న చిన్నవయసువాడిని చేసుకోవడమో, లేక ఉద్యోగ ఆర్ధిక స్థాయిలో తక్కువగా ఉన్నవాడిని చేసుకోవడమో ఈ స్త్రీలకి మిగులుతున్నది. అంతే కాక గత రెండు దశాబ్దాలుగా వస్తు ఉత్పత్తి తయారీలకి సంబంధించిన అనేక ఉద్యోగాలు అమెరికానించి తరలిపోవడంతో, అమెరికను మధ్యతరగతికి జీవగర్రగా ఉన్న మగవారి ఉద్యోగాలు మాయమైపోతూ వచ్చాయి. కేవలం హైస్కూలు డిప్లొమాతో, లేక ఎసోసియేట్ డిగ్రీతో మంచి జీతం పొందగలిగే ఉపాధులు, ముఖ్యంగా మగవారికి, కనుమరుగైపోయాయి.
జెనరేషన్ ఎక్స్ స్త్రీ పురుషుల వివాహ విముఖత, కొంత విశృంఖలమైన శృంగార జీవితమూ సినిమాల్లో సాహిత్యంలో చిత్రించబడినంతగా పైన చెప్పిన ఆర్ధిక సామాజిక పరిణామాలు చిత్రించబడలేదు. సైన్ ఫెల్డ్, ఫ్రెండ్స్ వంటి టీవీ సీరియళ్ళు, వెన్ హేరీ మెట్ శాలీ వంటి సినిమాలు ఈ మనస్తత్వ చిత్రణకి అద్దం పడుతూ వచ్చాయి, కానీ అక్కడ వినోదమే ముఖ్యం కావడంతో, ఈ ఫలితాలకి పునాదిగా ఉన్న పరిణామాల చర్చ ఎక్కడా కనబడదు. సాహిత్యం కూడా ఈ తరాన్ని నిర్లక్ష్యం చేసిందనే చెప్పుకోవాలి. ఐతే, సమాజాన్ని గమనిస్తూ, అధ్యయనం చేస్తూ ఉండే కొందరు సామాజిక శాస్త్ర పరిశోధకుల, జర్నలిస్టుల దృష్టి ఈ పరిణామాలని గమనించింది. తద్వారా non-fiction పుస్తకాలలోనూ, కొన్ని పత్రికల వ్యాసాలలోనూ ఈ విషయాలు చర్చకి వచ్చాయి.
ఉదాహరణకి న్యూయార్కు విశ్వవిద్యాలయంలో సోషియాలజీ ప్రొఫెసరు, ఎరిక్ క్లైనెన్బర్గు (Eric Klinenberg) ఒంటరిగా జీవించడం అనే జీవన విధానాన్ని పరిశోధిస్తూ, ఒంటరి జీవితం గడపటానికీ, స్త్రీ పురుషుల వైవాహిక వాంఛకీ మధ్య ఉన్న పరస్పర ప్రభావాన్ని కొంత లోతుగానే పరిశోధించారు. ఆయన పరిశోధనలో ఒంటరిగా ఉండడం అంటే తన నివాస స్థానంలో నిజంగా ఒంటరిగా ఉండడం – ఇతరంగా రూమ్మేట్లు కానీ, లేక ఇతర కుటుంబ సభ్యులు కానీ లేకుండా. మొదటగా అతను గమనించిన విషయం ఒక మనిషి ఒంటరిగా జీవించడమనేది ఖర్చుతో కూడుకున్న పని. ఉదాహరణకి కలిసి ఉన్న ఒక జంట (పెళ్ళయ్యో, కాకుండానో) విడిపోయారు అనుకుందాం. వెంటనే, ఉండడానికి ఇల్లో, అపార్టుమెంటో ఒక నివాస స్థానం దగ్గర్నించి, పడక, వొండుకోడానికి, తినడానికి అవసరమైన పాత్రలు, తప్పేళాలు, అన్నీ రెండేసి సెట్లు అవసరమవుతాయి. అంచేత, దారిద్ర్య రేఖకి దగ్గర్లో ఉన్నవాళ్ళు ఈ సాహసం చెయ్యలేరు. అతను గమనించిన ఇంకొక విషయం ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని పొందిన స్త్రీలు తమ స్వంత నివాసాలని కొనుక్కోవడం.
ఇదివరకల్లా ఇల్లు కొనుక్కోవడం అంటే, అది జంటగా కలిసి చేసే పని అనే దృక్పథం ఉండేది. గత పది పన్నెండేళ్ళలోనూ ఇల్లు కొనుక్కోవడాన్ని ప్రభుత్వమూ, బేంకులూ బాగా ఆకర్షణీయంగా చెయ్యడం వల్లనూ, మంచి కెరీర్‌లో ఉన్న యువతులు ముప్ఫై వయసుకొచ్చే లోపలే అవసరమైనంత తొలి పెట్టుబడి సంపాదించుకోవడం వల్లనూ తమ స్వంత ఇల్లు కొనేసుకోవడానికి ఉత్సాహం చూపిస్తూ వచ్చారు. ఎప్పటికి వస్తాడో, అసలు వస్తాడో రాడో తెలియని మొగుడి గురించి తన జీవితాన్ని “పాజ్” లో ఉంచడానికి ఇష్టపడ్డం లేదు ఈ నాటి యువతి. అదలా ఉండగా, స్త్రీని కలిసే సమయానికే ఆమె ఒక ఇంటి యజమానురాలై ఉండడం పురుషుడికి ఒక పక్కన సహజంగా భీతి కలిగించే లక్షణం, మరొక పక్క ఆత్మ న్యూనత ప్రశ్న. ఇలా ఒకదాన్నొకటి ప్రభావితం చేస్తున్నాయి ఈ ఆర్ధిక సామాజిక అంశాలు.
ఐతే, తన నివాస స్థలంలో ఒంటరిగా ఉన్నంత మాత్రాన, జీవితంలో ఒంటరిగా లేరు ఈ స్త్రీలు (ఆ మాటకొస్తే పురుషులు కూడా). కాలమిస్టు కేట్ బాలిక్ (Kate Bolick) ఒక పత్రిక వ్యాసంలో రాసినట్టు వీళ్ళు ఎప్పటికంటే బలమైన స్నేహ బంధాల్ని ఏర్పరుచుకుంటున్నారు. ఇదివరకటి తరానికి చెందిన సాహిత్యంలోనూ, సినిమాల్లోనూ తన తోటి వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుని సెటిలైపోతుంటే తానొక్కతే ఒంటరిగా మిగిలిపోతున్నానే అనే మనోదౌర్బల్యాన్ని, దుఃఖాన్ని ఒంటరి స్త్రీపాత్రల మీద మోపుతుండేవారు. అలాంటిది, మందిలోనే ఉంది శక్తి అన్నట్టు, సింగిల్ గా ఉన్న స్త్రీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఏ స్త్రీకయినా తోటి సింగిల్ స్నేహితురాళ్ళు తగినంత మంది ఉండే అవకాశం ఎక్కువగా ఉంటోంది. చిన్నప్పటి స్నేహాలే కాక, ఇప్పుడు కొంత వయసూ అనుభవమూ ఏర్పడినాక చేసుకుంటున్న, బలపడుతున్న ఈ స్నేహాల్లో మరింత తృప్తిని పొందుతున్నామని యువతులు భావిస్తున్నారు. ఇటువంటి జీవితానుభవాలు, ఆలోచనా దృక్పథమూ ఇటీవలి సినిమాల్లో – ఉదాహరణకి, బ్రైడ్స్‌మెయిడ్స్, ఫైవ్ యేర్ ఎంగేజిమెంట్, యాయా సిస్టర్హుడ్ వంటి సినిమాలు – బలంగా కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, అంధ్రాలో మధ్యతరగతి అబ్బాయిలకి పెళ్ళి చేద్దామంటే పిల్లే దొరకడం లేదట! ఆ ముచ్చటేవిటో మరోమాటు చూద్దాం.

–ఎస్.నారాయణస్వామి

నే రాసేది సమకాలీన కథ అన్న భ్రమ లేదు : శ్రీరమణ

saaranga2‘మిథునం’ శ్రీరమణగారు అమెరికా పర్యటిస్తూ మా వూళ్ళో (డెట్రాయిట్) కూడా నాలుగు రోజులున్నారు. మూడు పూటల పాటు ఆయనతో గడిపి తీరిగ్గా సంభాషించే అవకాశం చిక్కింది. ఎలాగూ మాట్లాడుకుంటారు కదా, ఆ మాట్లాడుకున్నదాన్ని ‘సారంగ’కి రాసివ్వమని అఫ్సర్ గారి ఆదేశం. రాస్తామన్న స్పృహ మనసులో ఉన్నా, జరిగింది సంభాషణే కానీ ఇంటర్వ్యూ కాదు. శ్రీరమణ గారిని ఎవరూ ఇంటర్వ్యూ చెయ్యలేరు. ఎందుకంటే ఆయన నడిచే అనుభవాల, జ్ఞాపకాల పుట్ట. ఏదో యథాలాపంగా అడిగిన ప్రశ్నకి ఆయన మొదలు పెట్టిన జవాబు అరగంట తరవాత ఎక్కడో తేలుతుంది. శ్రీరమణగారితో కాస్త తీరిగ్గా సంభాషించిన వారికెవరికైనా ఇది అనుభవమే. ఇంతకీ ఇంత సుదీర్ఘమైన ముందు మాట ఎందుకంటే ముందస్తుగానే కొన్ని షరాలు చెప్పుకుంటే మంచిదని. అంచెలంచెలుగా సాగిన తీరిక సంభాషణని పత్రిక కోసమని ఇంటర్వ్యూ రూపంలోకి కుదిస్తున్నాను. ఆ ప్రయత్నంలో ఆయన మాటల్ని శుకానువాదం చెయ్యడమే తప్ప మొదలంటా మార్చకుండ ఉండడానికి నా యథాశక్తి ప్రయత్నించాను. ఓపిగ్గా నాతో మాట్లాడినందుకు శ్రీరమణగారికీ, ఈ ఎసైన్మెంటు నా నెత్తికెత్తినందుకు అఫ్సర్‌కీ ధన్యవాదాలు.

Q 1970లలోనే అంధ్రజ్యోతిలో ఫీచర్లతో బాగా పేరు తెచ్చుకున్నారు, పుస్తకాలు కూడా వేశారు కదా, ఒక కథ బయటికి రావడానికి ఇంత సమయం పట్టిందేం?

ఫీచర్లు రాయడం చాలా శ్రమతో కూడుకున్న పని. ఆలోచనలు, చమక్కులు, భాష – ఇలా రచనకి అవసరమైన శక్తులన్నీ కూడా ఆ ఫీచర్ల మీదనే కేంద్రీకృతమై ఉండేవి. ఆ తరవాత పది పదిహేనేళ్ళు సినిమాల్లో మునిగి తేలాను. ఒక సినిమాకి రాయడమంటే ఒక యాభయ్యో వందో కథలకి కావలసిన సృజన శక్తి ఖర్చవుతుంది. ఈ రెండింటి మధ్యలో ఇంక కథలు రాయడానికి కుదిరేది కాదు. తీరిక చిక్కలేదు అనడం కంటే, ఆ రాసే శక్తి మిగిలేది కాదు. సినిమాల్లో పని చేస్తున్నప్పుడు కూడా ఫీచర్ ‘కాలం’ రాస్తూనే ఉండేవాణ్ణి. రంగుల రాట్నం (అంధ్రజ్యోతిలో రాసిన వ్యంగ్య రచనల శీర్షిక, పుస్తకంగా వచ్చింది) చూస్తే, అందులో ఒక్కో రచనా ఒక్కో కథ కావచ్చు. కథగా రాస్తే పది పన్నెండు పేజీలు వచ్చే మెటీరియల్ ని ఒకట్రెండు పేజీల కాలంలోకి కుదిస్తున్నామంటే ఒక విధంగా ఆ కథని శేక్రిఫైస్ చెయ్యడమే. కానీ ఆ పేరిట ‘కాలమ్’కి మంచి పేరొచ్చింది. తరవాత ఎప్పుడైనా ఆ పాయింటు ఒకటి తీసుకుని కథగా రాస్తే, చూడు, తన కథనే మళ్ళీ రీసైకిల్ చేస్తున్నాడు అంటారు.

Qఅలా కథ అనే రూపంలో రాయడానికి వీల్లేకుండా పోయిందన్న మాట. మరి ఈ కథలు ఎలా రూపు దిద్దుకున్నాయి?

అంటే, 90లలో కొద్దిగా గేప్ వచ్చింది. అలా మొదట బంగారు మురుగు రాశాను. ఆ రోజుల్లో ఇండియాటుడే తెలుగు పత్రిక వాళ్ళు సక్రమంగా తెలుగు కథల్ని ప్రచురిస్తూ ఉండేవారు. వాళ్ళు అడగడం మీదట, ఆ వొరవడిలో ఈ అయిదారు కథలు రాశాను. ఎప్పుడైనా, ఎవరన్నా అడిగితేనే రాయడం.
అదీ కాకుండా, నా కథలని గురించి నాకో దృష్టి ఉంది. అవేవీ కొద్ది రోజుల ఇతివృత్తాలతో నడిచేవి కాదు. బంగారు మురుగు ఉందంటే ఆ అబ్బాయి పుటకల నించీ అతని పెళ్ళిదాకా అంటే పాతిక ముప్పయ్యేళ్ళ కథ. మిథునం అయితే సుమారు అరవయ్యేళ్ళ కథ. కథలో దృశ్యం చిన్నదే అయినా, అక్కడ బుచ్చిలక్ష్మీ దాసు, వాళ్ళ పెళ్ళిలో పల్లకీలో ఊరేగడం గురించి మాట్లాడుకున్నప్పుడు, ఇక్కడ రచయితగా నేను ఆ కాలంలోకి వెళ్ళిపోవాలి. ఆ రోజుల్లో పల్లకీ ఊరేగింపు అంటే అక్కడ ఏమేం ఉండేవి, ఎలా ఉండేది వాతావరణం అంతా .. అది జాగ్రత్తగా పట్టుకోలేక పోతే, ఇంత కథా ఒక లిటరరీ జోకై కూర్చుంటుంది. పైగా, పత్రికలో ఉద్యోగం రీత్యా వందలకొద్దీ కథలు చదివే వాళ్ళం కాబట్టీ, ఆ రోజుల్లో రావిశాస్త్రి, కాళీపట్నం లాంటి మహామహులు రాస్తూండేవారు కాబట్టీ, మనం కూడా కథ అంటూ రాస్తే అది ఒక స్థాయికి తగ్గ కూడదు. నిలబడేలా ఉండాలి, పేరు నిలబెట్టేలా ఉండాలి అని ఒక పట్టుదల. కథ ఎత్తుగడ కానీ, పాత్ర చిత్రణ కానీ, భాష కానీ సజీవంగా ఉండాలి. ఇదిగో ఇలాంటి పట్టుదల వల్ల మునుపు రాయలేదు. ఇప్పుడైనా రాసింది ఆ గుప్పెడే కథలు.

Q బాగా పేరు తెచ్చుకున్న మీ కథలన్నీ – మిథునం, ధనలక్ష్మి, బంగారు మురుగు – అన్నీ గతాన్ని ఆధారంగా చేసుకున్నవే. ఎందుకలాగ?

నేనేదో కాంటెంపరరీ కథని, ఈ నాటి, ఈ కాలపు కథని రాస్తున్నాననే భ్రమ నాకెప్పుడూ లేదు. నేను నా చిన్నప్పటి విషయాలే, అంటే యాభయ్యేళ్ళ కిందటి విషయాలే రాస్తున్నాననే విషయం నాకు బాగా తెలుసు. అంటే, ఆ కాలంలోనే బతకమనీ కాదు, అది గొప్పది – ఇది చెడ్డది అని కాదు. అప్పట్లో ఉన్న జీవితం కనుమరుగై పోయింది. ఆ రోజుల్లో ప్రసిద్ధంగా రాసిన రచయితలు ఈ విషయాల్ని పట్టించుకోలేదు. వాళ్ళు వేరే ఇతివృత్తాలతో రాశారు. నేను దగ్గరగా చూసి అనుభవించిన జీవితాన్ని వాళ్ళెవరూ రాయలేదు. ఐతే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ జీవనవిధానం, అప్పటి పరిస్థితులూ, అలాంటి మనుషులూ – ఇప్పుడు మాయమై పోయినాయి గనక వాటిని తలుచుకోవడం, రికార్డు చేసుకోవడం ముఖ్యమని నాకు తోచింది. ఆ తలుచుకోవడమే ప్రయోజనం. కొన్నేళ్ళ కిందట జీవితం ఇలా ఉండేది, మనుషులు ఇలా ఉండేవాళ్ళు అని చెప్పుకోవడమే ప్రయోజనం. అది జరిగితే చాలు.

Q కాసేపు ప్రత్యేకంగా మిథునం గురించి మాట్లాడుకుందాం.
తెలుగు కథల్లో కనీ వినీ ఎరుగని ప్రజాదరణ పొందింది కదా ఈ కథ. ఐతే దీని మీద వ్యాఖ్యానాలు, విమర్శలు కూడా చాలానే వచ్చాయి. ఏముంది ఇందులో తిండియావ ఉన్న ఒక బ్రాహ్మడి కథ అన్నారు, బ్రాహ్మినిక్ కల్చర్ని గ్లోరిఫై చేస్తోంది అన్నారు. దానితో కొంత ఐడెంటిఫై చేసుకున్న వాళ్ళేమో ఇది మన అమ్మానాన్నల, లేదా తాతా బామ్మల ప్రేమ కథ అనుకున్నారు. మీ దృష్టిలో, ఈ కథలో ఈ పై పై విషయాలని దాటి లోతైన తాత్త్విక విషయం ఏమన్నా ఉన్నదా?
తప్పకుండా ఉన్నది. బ్రాహ్మడి కథ, బ్రాహ్మినిక్ కల్చర్ అంటే, మరి నేను ఎరిగిన వాతావరణం అది. ఏ రచయిత అయినా వాళ్ళకి గాఢంగా తెలిసిన విషయాన్ని రాయాలి తప్ప, తెలిసీ తెలియని విషయాన్ని రాయబూనుకుంటే అది హాస్యాస్పదమే అవుతుంది. నాకు గాఢంగా లోతుగా అనుభవమైనదే నేనా కథలో రాశాను. ఇక తాత్త్విక చింతన అంటే .. మన సాంప్రదాయంలో దాంపత్యాన్ని గురించిన ఒక కామెంటరీ. మన దాంపత్యమనే కాదు, చాలా కాలం జంటగా ఉన్న ఏ దంపతులైనా .. వయసులో ఉన్నప్పుడు ఒక ఆకర్షణ, మోహం, అటుపైన సంసార బాధ్యతలు. ఆ బాధ్యతలన్నీ తీరిపోయాక ఒక స్నేహం, ఒక ఆప్యాయత, ఒక కంపేనియన్షిప్ మిగులుతాయి. ప్రధానంగా చెప్పాలనుకున్నది ఇది.
ఈ కథ ఎన్నో భారతీయ భాషల్లోకీ కొన్ని పాశ్చాత్య భాషల్లోకీ అనువదించబడింది. అలా ఢిల్లో జరిగిన ఒక సదస్సులో ఒక జర్మనీ ఆయనతో సంభాషిస్తుంటే ఆయనన్నాడూ – ఆ దంపతుల చేష్టలు, రహస్యాలు అన్నీ రాశారు కదా, వారి సెక్స్ లైఫుని గురించి కూడా రాయవలసిందీ అని. అంటే నేనన్నానూ – మా సాంప్రదాయంలో అదసలు మర్యాద కాదు. అదలా ఉండగా ఇక్కడా కథలో అసలు విషయం వారిద్దరి మధ్యనా మిగిలింది ఆ స్నేహం అని చెప్పడమే. ఆ స్నేహానికి పునాది వారు గడిపిన యాభై అరవయ్యేళ్ళ జీవితం. అంతేకానీ వేరే కోరికలేమీ లేవు.
Q అంటే, ఒక విధంగా చూస్తే, పెళ్ళిలో చేసే ప్రమాణాలు .. ధర్మేచ, అర్ధేచ, కామేచ నాతి చరామి; సఖా సప్తపదీ భవ – ఇలా పరస్పరం చేసుకున్న ప్రమాణలని చివరిదాకా పాటించడం.
కరక్ట్. వాళ్ళ మధ్యలో నడిచే వ్యవహారం అంతా .. పోట్లాడుకోవడం ఒక టైం పాస్. పాత విషయాలని గురించి దెప్పి పొడుచుకోవడం ఆ పాత విషయాల్ని గుర్తు చేసుకోవడం. అలా షేర్ చేసుకుంటున్నారు, మళ్ళీ కాసేపు ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అలాగే ఇదంతా చూస్తున్న ఆ మేనల్లుడూ పిల్లవాడు – వాడో పది పన్నెండేళ్ళ పిల్లవాడు. అంటే వయసులో చూస్తే అప్పాదాసు మనవళ్ళ తోటివాడు. ఆ పిల్లవాడు వీళ్ళిద్దరి జీవితాన్నీ చూస్తున్నాడు, గమనిస్తున్నాడు అంటే .. దీనికి సూచనలు కూడా కథలో స్పష్టంగా ఉన్నై .. వాడూ ఆవు పాలు ఇవ్వడానికని రెండు పూటలా వాళ్ళింటికి వస్తూ ఉన్నాడు, అప్పాదాసు వాణ్ణి పట్టుకుని ఏరా నేను మా లేడీసుకి జడేశానని నువ్వు ఊళ్ళో చెబుతున్నావా అని గద్దిస్తాడు – ఇవన్నీ ఆ పిల్లవాడు చూస్తున్నాడు. అంటే రేపు వాడూ పెద్దవాడయ్యాక, ఆహా, దాంపత్యమంటే ఇలాగ కూడా ఉంటుందని వాడు తెలుసుకుంటున్నాడు అని నా ఉద్దేశం.
Q ఈ కథని కొంత అకస్మాత్తుగా ముగించేశారు అని మరో విమర్శ విన్నాను. అప్పాదాసు పోతే బుచ్చి లక్ష్మికి దిక్కేవిటి ఇప్పుడు?
ఈ కథని చదివిన చాలా మంది పాఠకులు బహుశ ఆ దంపతుల పిల్లల వయసు వారై ఉంటారు. ఎక్కడో నేటివ్ ప్లేసులో వృద్ధురాలైన తల్లి ఉండిపోయింది అనే ఆలోచన చాలా బాధ కలిగిస్తుంది విడవకుండా.
నిజానికి బుచ్చిలక్ష్మిని గురించి వర్రీ అవాల్సిందేమీ లేదు. ఆమే చెబుతుంది కదా చివర్లో, నాక్కావలసిన వన్నీ మామయ్య నేర్పే వేళ్ళాడురా అని. అదీ కాక కథలో తోటకి ఒక ముఖ్య పాత్ర ఉన్నది. కని పెంచి పెద్ద చేసి సమాజంలోకి పంపేసిన పిల్లలు కాక, ఆ దంపతులిద్దరూ కలిసి సృష్టించిన మరో అద్భుతమైన సృష్టి ఆ తోట. అది వాళ్ళిద్దరి కలిసిన జీవితాల తీపి జ్ఞాపకాలతో నిండి ఉన్నది.
బాగా లోతుకి వెళ్లి చూడాలంటే, వాళ్ళిద్దరూ వేరు వేరుగా కనిపిస్తున్న రూపాలే తప్ప నిజానికి వాళ్ళిద్దరూ ఒకటే ప్రాణం అనే అద్వైత దృష్టి దీనికి ప్రాణం. నాకు స్వతహాగా ఆ అద్వైతం అంటే చాలా ఇష్టం. అదే ఇక్కడ ఈ రూపంలో దర్శనమిచ్చింది. ఐతే, మన తెలుగు కథల్లో అట్లాంటి బరువైన తాత్త్విక చర్చలూ అవీ ఇమడవు. అక్కడ మనం ఆత్మ పరమాత్మ లాంటి చర్చల్లోకి వెళ్తే కథ పండదు సరిగదా ఏవిటీ చెత్త అని పాఠకుడు పక్కన పెట్టేస్తాడు. ఐతే ఇవన్నీ కాదు. నామట్టుకి నాకు బాగా తృప్తినిచ్చేదేవిటంటే .. ఆ పల్లె జీవితంలో, ఆ రైతు జీవితం నేపథ్యంలో .. నేను రైతు కుటుంబం నించే వచ్చాను. ఆమె పేరంటానికి వెళ్ళి శనగలు పట్టుకొస్తే, ఒక గుప్పెడు శనగలు ఆవుకి తినిపిస్తాడు చేత్తో. తినేసిన ఆవు అతని చేతిని నాకితే ఆ యజమానికి ఎంత తృప్తిగా ఉంటుందో, అతను దాని గంగడోలు దువ్వితే ఆ ఆవుకి ఎంత పరవశంగా ఉంటుందో .. ఇలా నేను నా చిన్నతనంలో చూసి అనుభవించిన విషయాలు రాశాను కథలో. ఆ రాసే సమయానికి నాకీ సంఘటనలు, దృశ్యాలు గుర్తుకొచ్చి, అవి కథలో రాయగలిగానని .. అది నాకు చాలా తృప్తినిచ్చే విషయం. ఇలా జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలున్నై. అవన్నీ వదిలేసి .. ఇది కేవలం తిండి గురించే అంటే .. (నవ్వేశారు)
Q ఈ కథలో నేను అని కథ చెబుతున్న కుర్రవాడు బహుశా పది పన్నెండేళ్ళ వాడు. ఇంకా జంఝప్పోగు పళ్ళేదేవిరా అని అప్పదాసు వాణ్ణి గదమాయిస్తాడు. కానీ కథని నేరేట్ చేస్తున్న గొంతు పసి గొంతు కాదు.
అవును. ఆ పిల్లవాడు పెద్దయినాక ఫ్లేష్ బేక్ గా చెబుతున్నాడు అనుకోవచ్చు. ఐతే, కథలో ఉన్నంత మట్టుకు ఆ పిల్లవాడు పిల్లాడిగానే ఉంటాడు తప్ప ఆరిందాగా ఉండడు. అదీ కాక ప్రతి రచయితకీ రచనలో ఒక ఆల్టర్ ఈగో ఉంటుంది. నేను మిత్రులతో వాదిస్తూ ఉంటాను, వాల్మీకి రామాయణంలో వాల్మీకికి ఆల్టర్ ఈగో సీతలో ఉన్నది. ఒక్కోచోట సీత మాట్లాడినప్పుడల్లా, అదిగో వాల్మీకి మాట్లాడిస్తున్నాడూ అనిపిస్తుంది. అలాగే కన్యాశుల్కంలో అప్పారావుగారి ఆల్టర్ ఈగో మధురవాణిలో ఉన్నది. వేయిపడగలులో ధర్మారావు విశ్వనాథవారే.
Q మిథునం కథ ఎందుకింత ప్రాచుర్యం పొందింది అనుకుంటున్నారు?
ఎవరికైనా పోగొట్టుకున్న దానిమీద మోజెక్కువ కదండీ. ఆ కథలో చూపించిన జీవితం ఐపోయింది, ఇప్పుడు లేదు, దొరకదు అనే విషయం గ్రహింపుకొచ్చింది.
Qపెళ్ళి అనే కథలో చాలా గాఢమైన సెటైరు రాశారు. ఆ తరవాత నాయుడిగారి పాలనలోనూ, రెడ్డిగారి పాలనలోనూ, ఏతన్మధ్య తెలంగాణ ఉద్యమాల నేపథ్యంలోనూ సెటైరుకి చాలా అవకాశాలే ఉండి ఉండాలి. మరో సెటైరు కథ రాలేదేమి?
మళ్ళీ అసమయానికి కాలంస్ రాస్తూ వచ్చాను. ఒకే వ్యవధిలో రెండు మూడు పత్రికలకి కాలమ్స్  రాసిన పరిస్థితికూడా కొన్నాళ్ళు నడిచింది. అందుకని అప్పటి రాజకీయ పరిస్థితుల ముచ్చట్లన్నీ ఆ కాలమ్స్ రాయడంలో ఖర్చయిపోయేయి. ఆయా కాలమ్స్ కి రెగ్యులర్ గా ఫాలో అయిన పాఠకులుండేవారు. వార్తాపత్రికలో పని చెయ్యడం వల్ల అదొక ఎడ్వాంటేజ్ ఉండేది. ఆ న్యూస్ ఐటంకి సంబంధించిన సమాచారం అంతా వార్తా విభాగంలో ఉండేది, ఫొటోలతో సహా. అది తరవాత కాలంకి ముడిసరుకయ్యేది. సంఘటన జరిగిన మరునాడే దాని మీద సెటైరుగా కాలం వచ్చేది. పాఠకులు కూడా అప్పుడే టీవీలో చూసి, పేపర్లో చదివి ఉంటారు కదా .. వెంటనే కాలం రావడంతో త్వరగా దానిలోని వ్యంగ్యంతో కనక్ట్ అవుతుండేవారు. ఆ రోజుల్లో పురాణం గారు (పురాణం సుబ్రహ్మణ్య శర్మ) ఇల్లాలి ముచ్చట్లని కాలం రాశారు, పురాణం సీత పేరుతో. దానికోసమని ఒక ప్రత్యేకంగా ఒక గొంతుని రూపొందించుకుని .. ఇంకా ఫెమినిజం అని సాహిత్య ధోరణిగా రాని రోజుల్లోనే కొన్ని ఫెమినిస్టు ఐడియాలు అక్కడ పరిచయం చేశారు. న్యూసులో ఏదో అమెరికాలో ఎగిరే పళ్ళేలు (ఫ్లయింగ్ సాసర్లు, UFO) అని వచ్చింది. మర్నాడు ఈయన ఎగిరే పెళ్ళాలు అనే పేరిట కాలం రాశారు. ఆ పంచ్‌కీ, సమయస్ఫూర్తికి పాఠకులు సంతోషిస్తారు.
ఆ రోజుల్లో బెజవాడకి ఏదో సర్కసు వచ్చింది. వెంటనే సర్కసు డేరా అని రాశారు. అందులో సర్కసులో కనబడే జంతువులన్నీ ఇంట్లో మనుషులని .. పిల్లలు కోతులనీ, మామగారు సింహమనీ .. ఇలాగు అందర్నీ చెప్పుకొచ్చి, చివరికి నీటియేనుగు (హిప్పోపోటమస్) ఎవరంటే చెప్పనంటుంది – అంటే మొగుడన్న మాట (నవ్వారు). ఇలాగు ఆ సమయానికి పండే కొన్ని కొన్ని విషయాలు ఎప్పుడూ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆధార్ కార్డులని ఉన్నాయి. ఎవరిద్దరు కలుసుకున్నా తెచ్చుకున్నారా? ఎంత సేపు పట్టింది, ఎంత ఖర్చయింది – ఇవే కబుర్లు. మళ్ళి వాటి చుట్టుతా కొన్ని రూమర్లు. అలాగే ఇప్పుడూ సమ్మర్లో పవర్ కట్. ఇలాంటి విషయాల్లో ఏదైనా ఒక కొత్త పాయింటుని పట్టుకుని రాస్తే .. విషయం అప్పటికే మనుషుల్లో చర్చలో ఉంది కదా అందుకని ఎక్కు పెట్టి ఉన్న విల్లులాగా .. బాణం తగిలించి వదలడమే మనం చెయ్యాల్సింది.
ఇంకోటేవిటంటే హాస్యానికి ఒక లక్షణం ఉన్నది. అంతకు మునుపు నవ్వు అనేది లేని చోట రచయిత నవ్వు పుట్టిస్తాడు. కన్యాశుల్కంతోటే తెలుగు వాళ్ళకి నవ్వడం తెలిసిందన్నారొక పెద్దాయన. అలాగే ఈ వ్యంగ్య రచన, కాలం రాసేటప్పుడు, సాధారణ వ్యవహారాలనించి రచయిత నవ్వు పుట్టిస్తున్నాడు. విసుగు కలిగించే విషయమే, కాలం రూపంలో పాఠకుడికి నవ్వు పుట్టిస్తున్నది. దాంతో పాటే పాఠకుడి అంచనాలు కూడా పెరుగుతాయి. వచ్చే వారం కాలం దీనికంటే బావుంటుందని ఆశిస్తాడు. ఆ అంచనా అందుకో లేకపోతే, ఏవిటి రమణగారూ ఇది వరకు బాగా రాసేవారు అనేస్తాడు. ఒక ఇరవై వారాలు వరసగా రాశాక, అదే స్థాయి మేంటేన్ చెయ్యడం సాధ్యం కాదు.
Q 90లలో తెలుగు కథల వేదిక మీద రాజ్యమేంలింది ప్రధానంగా మూడు విషయాలు – సరళ ఆర్ధిక విధానాలు, ప్రపంచీకరణ, అస్తిత్వ వాదాలు. మీరు కథ అంటూ రాసిందే 90ల మధ్యలో మొదలు పెట్టి అసలు ఈ మూడు విషయాలనీ ఏ మాత్రం లక్ష్య పెట్టలేదు. ఏవిటి దీనర్ధం?
ఈ విషయంలో నాకో కంప్లెయింట్ ఉన్నది. ఉదాహరణకి మిథునాన్నే తీసుకుందాం. ఏవిటి దీనిలో ఉన్న సామాజిక స్పృహ, మెసేజి ఏవిటి అన్నారు. మెసేజి అంటే ఏవిటి, ఆర్ధిక సూత్రాలు చెబితేనో, లేక స్లోగన్లు చెబితేనేనో మెసేజి అవుతుందా? దాంపత్యం అంటే ఇలా ఉండాలి, జీవితాన్ని హాయిగా, ఆనందంగా గడపాలి, ఇలా జీవించవచ్చు అని చెబితే అది మెసేజి కాదా? ఒక boy meets girl ఒక sweet lover story ఎందుకు రాయకూడదు? ఇలా విరసం కానీ, ఇంకో సంఘం కానీ, ఇదే సాహిత్యం, ఇటువంటిదే కథ అని సంకుచితమైన నిర్వచనాలు పెడుతున్నారు. ఎందుకా సంకుచితత్వం?  కాళీపట్నం రామారావుగారు సంకల్పం అనే కథ రాస్తే వీళ్ళంతా చొక్కాలు చించుకున్నారు. ఎందుకుట? అందులో ఒక పాత్ర కాశీకి పోయి గంగలో స్నానం చేసి .. ఇలాంటి తతంగమేదో జరుగుతుంది. రామారావు గారేవిటి, ఇల్లాంటి కథ రాయడమేవిటి అని ఇక్కడ వీరంగాలు. ఆయనేమి పోనీ ఇలా చెయ్యాలని దాన్ని ఎండోర్సు చెయ్యడం కానీ ఏం చెప్పలేదే. కథలో ఒక పాత్ర అలా చేసిందని రాశారు. దానికి పెద్ద అలజడి. వీళ్ళ బుర్రలు తీసుకెళ్ళి చిలక్కొయ్యకి తగిలించేసి, ఎవడో నొక్కే రిమోట్ కంట్రోలుతో కదుల్తూ ఇదే కథ, ఇదే సాహిత్యమని వంత పాడ్డం.
పాఠకుల్ని రీచవ్వాలి, టచ్ చెయ్యాలి. నా మట్టుకి నాకు అది ముఖ్యమైన క్రైటీరియానే. ఏ రూపంగా అయినా కానీ, మిథునం కథ మూడులక్షల ఇరవై వేల కాపీలు సర్క్యులేట్ అయింది. సినిమాగా తీస్తే, మెచ్చుకోడానికి మెచ్చుకున్నారు, డబ్బు కూడా నష్టపోకుండా కొద్దిగా లాభమే వచ్చింది. దాందేవుంది, గడ్డం గీసుకునే బ్లేడు కూడా లక్షల్లో అమ్ముడు పోతుంది, అదొక గొప్పనా అంటారు. తెలుగు సాహిత్యం అచ్చవడం మొదలెట్టాక గయోపాఖ్యానం పద్యనాటకం లక్షకాపీలు అమ్ముడు పోయింది. జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి ఉదయశ్రీ ఇప్పుడు యాభై నాలుగో ఎడిషను నడుస్తోంది. అలాగే శ్రీశ్రీ మహాప్రస్థానం కూడా. ఇదే గొప్పది, అది గొప్పది కాదు అనడానికి మనమెవరం? రాయగలిగిన వాడు రాస్తాడు. అది బాగా అమ్ముడు పోతుందో పోదో ముందు రాస్తే గదా? ఇట్లాంటివి రాయకూడదు అంటే . .. ఐదొందల కాపీలు మాత్రమే అమ్ముడుపోయిన చాలా గొప్ప రచనలు ఉన్నాయి. వేలల్లో అమ్ముడు పోయినవీ ఉన్నాయి.
Qరచయితగా తరవాతి అడుగు ఏవిటి మీకు?
రాసినవి పుస్తకాలుగా రావలసిన మెటీరియల్ చాలా ఉంది. ఆ పని కొంత జరుగుతోంది. సి.పి. బ్రౌన్ ఎకాడమీ తరపున కొన్ని మంచి పుస్తకాలు, అనువాదాలు వేశాము. సరే, కథలు రాస్తూనే ఉంటాను. ఉద్యోగపు తొలి రోజుల్లో నండూరి, పురాణం వంటి గొప్ప పాత్రికేయులతో, అటుపైన సినిమాల్లో బాపు రమణలతో కలిసి, సన్నిహితంగా పనిచేసిన అనుభవం. అదీ అదృష్టమంతే. నా జీవితంలో గుర్తు పెట్టుకోదగినది, చెప్పుకోదగినదీ ఏమన్నా ఉందీ అంటే, ఇదే చెప్పుకుంటాను నేను.
ఇంటర్వ్యూ : ఎస్.నారాయణస్వామి

మనిషి వోడిపోతున్నాడు, తుపాకి గెలుస్తోంది!

March_on_Washington_for_Gun_Control_032 (2)

1999లో ‘తుపాకి’ అని ఒక కథ రాశాను. అందులో అమెరికా దక్షిణ రాష్ట్రాల్లో పెరుగుతున్న కిరణ్ అనే ఒక తెలుగు పిల్లవాడు, పదేళ్ళ వాడు, తనతోటి తెల్ల స్నేహితుల ప్రోద్బలంతో తనక్కూడా ఒక తుపాకి కొనిమ్మని వాళ్ళ నాన్నని అడుగుతాడు. కథ కొన్ని మలుపులు తిరిగాక, తుపాకి ఎటువంటి ఘాతుకాన్ని సృష్టిస్తుందో కళ్ళారా చూసి, తన కళ్ళముందే తన బడిలోనే తన ప్రాణ స్నేహితుడు ఆ మారణహోమానికి బలైపోవడం చూసి, కిరణ్ – నాన్నా, నాకు తుపాకి వద్దు – అనడంతో కథ ముగుస్తుంది. ఈ కథని నేను 1999 ఫిబ్రవరి ప్రాంతాల్లో రాశాను.

ఈ కథ రాసి, వంగూరి ఫౌండేషను వారి ఉగాది కథల పోటీకి పంపించాను. పంపిన కొద్ది రోజులకి (ఏప్రిల్ 20న) కొలరాడో రాష్ట్రంలో కొలంబైన్ హైస్కూలు మారణహోమం జరిగి ఈ దేశం మొత్తాన్నీ అచేతనం చేసేసింది కొన్నాళ్ల పాటు. ఆ మారణహోమానికి కారణం నా కథలో చెప్పినలాంటి జాతి విద్వేషం కాదు కానీ, మారణహోమాన్ని జరిపింది బడి విద్యార్ధులే, నా కథలో సూచించినట్టుగా కొంత మానసిక అనారోగ్య బాధితులే. నా కథకి మొదటి బహుమతి వచ్చింది. ఆ తరవాత అనేక తెలుగుకథల సంకలనాల్లో చోటు చేసుకుంది. కానీ ఈ కథని తలుచుకున్నప్పుడల్లా నాకు ఆ బహుమతి గుర్తు రాదు. కొలంబైనే గుర్తొస్తుంది. బాధే మిగుల్తుంది.

అమెరికాకి తుపాకులు కొత్తకానట్టే తుపాకుల వల్ల జరిగే హింస, ప్రాణనష్టం కూడా కొత్త కాదు. వ్యక్తిగతంగా ఆయుధాలను కలిగి ఉండే హక్కు, వాటిని వాడగలిగే హక్కు అమెరికను రాజ్యాంగములో రెండవ సవరణద్వారా ఇవ్వబడింది. ప్రాథమిక పౌరహక్కులను నిర్వచించి ఆమోదించడంలో వాక్-స్వాతంత్ర్యాన్ని ఇచ్చిన మొదటి సవరణ వెనువెంటనే ఈ సవరణ ఉండటం వలన ఆయుధధారణకి పౌరుల ఆలోచనా పరిధిలోనూ, అమెరికను రాజకీయ పరిధిలోనూ ఉన్న ప్రాముఖ్యత మనకి అర్ధమవుతున్నది.

రిపబ్లికన్ పార్టీ అంటే ప్రభుత్వపు చొరవని తగ్గించాలని ప్రయత్నించే పార్టీగా, తద్వారా ప్రజల వ్యక్తిగత హక్కుల్ని (ఆయుధ హక్కులతో సహా) కాపాడే పార్టీగా పేరుబడింది ఇటీవలి కాలంలో. ఆయుధాలని నిరోధించాలి, లేదా కనీసం నియంత్రించాలి అనేది లిబరల్ ఎజెండాగా ముద్ర బడింది. ఐతే సాధారణంగా లిబరల్ ఉద్యమాలని నెత్తికెత్తుకునే డెమోక్రాటిక్ నాయకులు కూడా ఈ ఆయుధ నియంత్రణని చేపట్టేందుకు సిద్ధంగా లేరు.

ఇరవయ్యో శతాబ్దపు చివరి భాగంలో రిపబ్లికన్ పార్టీకి జీవం పోసిన అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్పై జరిగిన హత్యాప్రయత్నంలో ఆయన సహచరుడు జేంస్ బ్రేడీ తీవ్రంగా గాయపడ్డారు. ఆ గాయాల వలన ఆయనకు పక్షవాతం వచ్చింది. గాయాలనుండి కోలుకున్న తరవాత ఆయన చిన్న తుపాకుల నియంత్రణ కోసం తీవ్రంగా శ్రమించారు. ఆ సంఘటన జరిగిన ఎనిమిదేళ్ళ తరవాత ఒక డెమొక్రాట్ అధ్యక్షుడు, బిల్ క్లింటన్ ఈ చట్టాన్ని అమలు చేశారు. దాన్ని బ్రేడీ చట్టమని వ్యవహరిస్తారు.

ఒక రిపబ్లికన్ అధ్యక్షుడి సహచరుడికి జరిగిన దుర్ఘటనకి సుమారు పదేళ్ళ రిపబ్లికన్ పార్టీ పరిపాలనలో రాజకీయ ప్రతిచర్య జరగలేకపోయింది అంటే అర్ధమవుతుంది ఈ వ్యవస్థ ఎంత పటిష్ఠంగా ఉన్నదో! ఇదొక రాజకీయ వింత. బ్రేడిలా లో భాగంగా పెద్ద తుపాకులు, రైఫిళ్ళు, ఎక్కువ సంఖ్యలో తూటాలని నింపుకునే తుపాకులు (వీటన్నిటినీ కలిపి ఎసాల్ట్ వెపన్స్ అని వ్యవహారిస్తుంటారు) 1994లో నిషేధించబడినాయి. ఆ నిషేధపు గడువు 2004లో ముగిసిపోయింది, రిపబ్లికన్ పరిపాలనలో. దాన్ని తిరిగి ధృవీకరించే ప్రయత్నం చెయ్యలేదెవరూ. అప్పటికి అందరి దృష్టీ ఇరాకుయుద్ధం మీదా, తీవ్రవాదంపై యుద్ధమ్మీదా కేంద్రీకృతమై ఉంది.

చారిత్రికంగా రాజకీయంగా జరిగిన సంఘటనలు అలా ఉంచితే, ఇటీవలి కాలంలో, అంటే గత మూడు నాలుగేళ్ళలో జరిగిన తుపాకి కాల్పుల దాడులు, ఒకదాన్ని మించి మరొకటి దేశప్రజలందరిలో భయాందోళనలని రేకెత్తించాయి.

  • వర్జీనియా టెక్ (2007) 32 మంది మరణించారు, 17 మంది గాయపడ్డారు. జరిగింది యూనివర్సిటీ కేంపస్ లో, చేసింది ఒక యూనివర్సిటీ విద్యార్ధి, అతనికి చిన్నప్పటినించి మానసిక రుగ్మతలున్నాయి.
  • ఫోర్ట్ హుడ్, టెక్సస్ (2009) 13 మంది మరణించారు, 29 మంది గాయపడ్డారు. జరిగింది ఆర్మీ బేస్ మీద మెడికల్ సెంటర్లో. చేసింది ఆర్మీలో మేజర్ గా ఉన్న 39 ఏళ్ళ సైకయాట్రిస్ట్. ఇతనికీ దారుణమైన మానసిక సమస్యలున్నాయని దర్యాప్తులో తెలిసింది.
  • ట్యూసాన్, అరిజోనా (2011) కాంగ్రెస్వుమన్ గేబ్రియేల్ గిఫర్డ్స్ తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురు మరణించారు, మరో 13 మంది గాయపడ్డారు. జరిగింది ఒక సూపర్ మార్కెట్లో, చేసింది 22ఏళ్ళ యువకుడు. అరెస్టయిన తరవాత అతను తీవ్రమైన మానసిక అనారోగ్యంతో ఉన్నాడని తేలింది.
  • ఆరోరా, కొలరాడో (జూలై 2012) పన్నెండు మంది మరణించారు. డెబ్భై మంది గాయపడ్డారు. జరిగింది సినిమాహాల్లో, సినిమా జరుగుతుండగా. చేసింది 24 ఏళ్ళ యువకుడు, కాలేజి విద్యార్ధి. ఇతనికీ మానసిక రుగ్మత అని డిఫెన్సు లాయర్లు వాదిస్తున్నారు.
  •  విస్కాన్సిన్ గురుద్వారా (ఆగస్టు 2012) ఆరుగురు మరణించారు, నలుగురు గాయపడ్డారు. జరిగింది గురుద్వారా సిక్కు మతాలయంలో ఆదివారం ప్రార్ధనలు జరిగే సమయంలో. చేసింది నలభయ్యేళ్ళ ఆర్మీ వెటరన్. ఇతనికి జాత్యహంకార నేపథ్యం ఉన్నది.
  • న్యూటవున్, కనెక్టికట్ (డిసెంబర్ 2012) 27 మంది మరణించారు. అందులో ఇరవైమంది ఒకటో తరగతి చదువుతున్న ఆరేడేళ్ళ పిల్లలు. చేసింది 20 ఏళ్ళ యువకుడు. ఇతనికి మానసిక అనారోగ్యాలు ఉన్నవా లేదా అని ఇంకా తేలలేదు.

కొద్ది వ్యవధిలోనే చాలా మంది బలవ్వడం, ఇటువంటి సంఘటన జరుగుతందేమోనని ఊహించలేని చోట్ల ఇవి జరగడం, ఈ ఘాతుకాలకి ఒడిగట్టినవారు యువకులు కావడం ఈ సంఘటనల అన్నిటి మధ్యా సామాన్యంగా ఉన్న లక్షణాలు. అంతే కాదు, ముద్దాయిలు అందరూ ఏదో ఒక తీవ్రమైన మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్టు తెలుస్తున్నది.

తుపాకి చెడ్డదా? తుపాకి పట్టుకున్న మనిషి చెడ్డవాడా? తుపాకి పట్టుకున్న మనిషిలో ఉన్న బుర్ర చెడ్డదా? అమెరికను సమాజం ఈ ప్రశ్నలతో కుస్తీ పడుతోంది ప్రస్తుతం.

కనెక్టికట్ రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇదివరకెన్నడూ లేనంతగా తుపాకులని నియంత్రించాలనే డిమాండ్ మిన్నుముట్టింది. దేశ ప్రజలు ఇంకా ఆ విస్మయాన్నించి తేరుకోకముందే రాజకీయులూ, అరాజకీయులూ అరుపులు మొదలెట్టేశారు. వారికి తోడు మీడియా వారు శాయశక్తులా హోరెత్తిస్తున్నారు. మధ్యలో మామూలు ప్రజలు కూడా తమ గొంతు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ అర్జంటుగా తుపాకుల అమ్మకాల్ని అరికట్టాలి అన్నారు. లేదు లేదు, రిజిస్టరు చేసి ఉన్న దుకాణాలైతే పరవాలేదు, అక్కడక్కడా ఎగ్జిబిషన్లలాగా పెట్టి అమ్మేస్తున్నారు, వాళ్ళని అరికట్టాలి ముందు అన్నారు.

వారంరోజుల పాటు ఉగ్గబట్టుకుని నిశ్శబ్దంగా ఉన్న ఎన్నార్యే సింహం అప్పుడు గొంతు విప్పింది. తుపాకులు కాదు చంపేది, తుపాకుల్ని పట్టుకున్న మనుషులు అంది. గన్ను పట్టిన చెడ్డవాణ్ణి ఆపాలంటే అక్కడ గన్ను పట్టుకున్న మంచోడు ఉండాలన్నది. ముందు మానసిక ఆరోగ్య వ్యవస్థని చక్కబరచాలన్నది. చివరికి తప్పంతా వినోద పరిశ్రమదే, పిచ్చి పిచ్చి హింసతో నిండిన సినిమాలు, టీవీ షోలు, విడియో గేములు ప్రజలమీదికి వదిలేసి మన యువతని తప్పుదారి పట్టిస్తున్నారు వీళ్ళన్నది, ఉరుమురిమి మంగలం మీద పడినట్టు. ఐతే ఈ సందడి అంతటిలోనూ అసలు కొన్ని మౌలికమైన విషయాలు వినబడకుండా పోతున్నాయి.

గేలప్ పోల్ ఒకదాని ప్రకారం 47 శాతం అమెరికను పౌరులు కనీసం ఏదో ఒకరకమైన తుపాకిని కలిగి ఉన్నారు. ఇంచుమించు వీరందరూ ఆయుధధారణ విషయంలో ప్రభుత్వ జోక్యాన్ని సహించబోమని తెగేసి చెప్పారు. కేవలం 26 శాతం మంది మాత్రమే సభ్యసమాజంలో తుపాకులకి స్థానం లేదనీ, తుపాకులని పూర్తిగా నిషేధించాలనీ అభిప్రాయపడ్డారు. ఆయుధ హక్కులని తలకెత్తుకునే ఎన్నార్యే వంటి సంస్థలు రాజకీయంగా బలమైనవే, సందేహం లేదు. కానీ వాటికి ఆ బలం ఎలా వచ్చిందో పైన చెప్పిన గణాంకాలని బట్టి కొంత అర్ధం చేసుకోవచ్చు. రాజకీయ పార్టీలకి అతీతంగా అనేక రాజకీయ నాయకులే స్వయంగా తుపాకి ధారులైనప్పుడు, రెండవ సవరణని అంతర్గతంగా నమ్మేవారై యున్నప్పుడు ఆ బలగాలని అధిగమించి తుపాకి నిషేధ ఉద్యమాలు ఏవో సాధిస్తాయని ఆశించడం అత్యాశే అవుతుంది.

పైగా, ఇప్పుడూ కొత్త అమ్మకాలని నిషేధించడమో, వాటిపై మరిన్ని ఆంక్షలు విధించడమో ఈ సమస్యని పరిష్కరించలేదు. ఎందుకంటే, ఇప్పటికే సుమారు 30 కోట్ల తుపాకులు అమెరికను పౌరుల చేతుల్లో (ఇళ్ళల్లో) ఉన్నాయని అంచనా. అంటే, దేశంలో వివిధ మిలటరీ, పోలీసు, తత్సంబంధ యూనిట్ల తుపాకులు కాక, కేవలమూ పౌరుల ఆధీనంలో ఉన్నవి.

30 కోట్లు! అమెరికా జనాభా 32 కోట్లలోపే. అంటే ఇంచుమించు ప్రతి అమెరికనుకీ – అప్పుడే పుట్టిన పసిబిడ్డ నించీ కాటికికాళ్ళు చాచుకునున్న వృద్ధునివరకూ తలా ఒక తుపాకి ఉన్నదన్నమాట. ఇది కాక ఏటా సుమారు 40 లక్షల కొత్త తుపాకులు మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి. అందుచేత, ఏదో రాజకీయ మాయాజాలం జరిగి అకస్మాత్తుగా రెండవ సవరణ ఉపసంహరించబడినా కూడా ఇప్పటికే పౌరుల ఆధీనంలో ఉన్న ఈ 30 కోట్ల తుపాకులని నియంత్రించడం అసంభవమైన పని. న్యూటవున్ కేసులో నిందితుడు ఏడం లాన్జా తన తల్లికి చెందిన తుపాకులని ఉపయోగించాడు తన మారణహోమానికి – కొత్తగా కొనలేదు.

ఇక్కడ నా అనుభవంలోనించి ఒక చిన్న పిట్టకథ. టీనేజి వయసులో పిలిస్తే పలికినట్లు వస్తుండేది కోపం నాకు. సమాజం మీద, మనుషుల మీద, వారు వీరని లేదు. అవ్యాజమైన ప్రేమలాగానే ఈ అవ్యాజమైన కోపం. కాలేజి ముగిశాక క్రిక్కిరిసిన సిటీబస్సులో వస్తుంటే, మధ్యలో ఏదో స్టాపులో వాళ్ళు బస్సు ఆపి ఎంతకీ కదలకపోతే ఆ ఉక్కలో, చిరాకులో ఆ బస్సు డ్రైవరు కండక్టర్ల మీద విపరీతమైన కోపం వచ్చేది. నా చేతిలో గనకా ఆక్షణాన ఒక తుపాకి ఉంటే వాళ్ళని బెదిరించి వెంటనే బస్సు కదిలేలా చేసేవాణ్ణి. అప్పటికీ వాళ్ళు నా మాట వినకపోతే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేసి, నేనే బస్సుని నడిపించుకు పోయేవాణ్ణి (నాకు డ్రైవింగు రాకపోయినా) నా కలల్లో.

kottapaliఅదృష్టవశాత్తూ నా దగ్గర తుపాకి లేదు. నా తరం తోటి విద్యార్ధులు, కొన్ని వేలమంది విజయవాడ బస్సుల్ని ఉపయోగించి ఉంటారు. ముందటి తరవాతి సంవత్సరాల్లో లక్షలమందో, కోట్లమందో అవే బస్సుల్లో ప్రయాణించి ఉంటారు – వాళ్ళెవ్వరి దగ్గరా తుపాకులు లేవు. ఐతే ఇప్పటికీ ఒక ప్రశ్న. నా దగ్గరే గనక ఆ పూట తుపాకి ఉండి ఉంటే ఆ డ్రైవరు ప్రాణాలతో ఉండేవాడా?

వ్యక్తిగత బాధ్యత, దానికి తగిన ప్రవర్తన – పైన జరిగిన సంఘటనలు అన్నిటిలోనూ, తరవాత జరిగిన చర్చలో ఎక్కడా ఈ వ్యక్తిగత బాధ్యత గురించిన మాట వినబడలేదు. అతగాడికి మానస రుగ్మత అట .. అంతే, అదొక మంత్రం. ఆ మాట అనేస్తే అంతా అర్ధమైపోతుంది. ఇంక ఎవ్వరూ దాన్ని గురించి బాధపడక్కర్లేదు. ముద్దాయి ప్రాణాలతో ఉన్నసందర్భంలో అతను వ్యక్తిగతంగానే నేరారోపణ ఎదుర్కున్నప్పటికీ, తత్సంబంధ విశ్లేషణలో ఆ వ్యక్తికి సంబంధించిన కోణం దాదాపుగా కనుమరుగై ఉన్నది. ఇతరత్రా వ్యక్తిగత స్వేఛ్ఛనీ, వ్యక్తిగత హక్కుల్నీ, బాధ్యతల్నీ పరమ ప్రమాణంగా భావించే అమెరికను సమాజం, అమెరికను మీడియా, ఈ విషయంలో పరమ సైలెంటయిపోయింది. ఎందుకంటే – భయం. వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలి అంటే, ఎవరికి వాళ్ళే తమని తాము అద్దంలో చూసుకోవాలి గనక.
పోయిన వారం ఇక్కడ మావూళ్ళో (డెట్రాయిట్లో) ఒక రేడియో షో వింటున్నాను. మాట్లాడుతున్న అతను మాజీ గేంగ్ మెంబర్. ప్రయత్న పూర్వకంగా అవన్నీ విడిచిపెట్టేసి ఇప్పుడు చిన్న వ్యాపారం చేసుకుంటూ, తన చుట్టు పక్కల వాళ్ళకి సహాయం చేసేట్టు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడట గత ఐదేళ్ళగా. అతను చెప్పాడు, ఈ సంఘటనని గురించి మాట్లాడుతూ – నిజమే తుపాకులున్నై. నిజమే మానసిక రుగ్మత కూడా ఉంది. ఐనా మనిషిగా నీకంటూ ఒక విలువుంది, ఒక ఛాయిస్ ఉంది. నువ్వు తుపాకి వాడక్కర్లేదు. ఆ రోజు ఆ బడికి పోయి ఆ పిల్లలందరినీ చంపనక్కర్లేదు. మనిషిగా నీకా ఛాయిస్ ఉంది. బాధ్యత కూడా. కానీ ఇది ఎవరికీ పట్టటంలేదు.

వినోదం వినోదం కోసమే. సినిమాలో చూపించే కాల్పుల్ని, చంపడాలని, నరుక్కోవడాలని ఎవరూ నిజమనుకోరు. చిన్నప్పుడు కత్తులు, బాణాలు, తుపాకుల వంటి ఆటవస్తువులతో ఆడుకున్నట్టే పెద్దయినాక ఈ వినోద సాధనాలు. అంతదాకా ఎందుకు – పరమశాంత స్వభావుడినైన నాకు విపరీతమైన రక్తపాతంతో నిండి ఉండే క్వెంటిన్ టరంటీనో సినిమాలంటే చాలా ఇష్టం. మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళేవరైనా – అమ్మో, అంత వయొలెన్సు మేం భరించలేం అంటే, నాకు నవ్వొస్తుంది. అది సినిమా, వినోదం కోసం తీసినది అనే విచక్షణ తెలియదా అని విస్తుపోతుంటాను.

న్యూటవున్ సంఘటన వంటి మహాఘాతుకచర్య తరవాత మొట్టమొదటి ప్రకటనలోనే ఎన్నార్యే వినోద పరిశ్రమ మీద విరుచుకు పడేప్పటికి సినిమా-టీవీ-విడియోగేంల వాళ్ళు మ్రాన్పడిపోయారు. ఈ హింస మా వల్ల రావడం లేదు అని గట్టిగా చెప్పలేరు. ఏమో ఎక్కడన్నా లింకున్నదేమో అని భయం. దీనికీ మాకూ ఏమీ సంబంధం లేదని అసలే చెప్పలేరు – మనసులేని కౄరులుగా కనిపిస్తామేమో అని మరింత పెద్ద భయం. మింగలేకా కక్కలేకా తలకిందులవుతున్నారు. ఏమాటకామాట – పరిశ్రమలో అతిహింస, తుపాకుల సంస్కృతికి సంబంధించిన సబ్జక్టులతో పని చేస్తున్న రచయితలూ, దర్శకులూ, నిర్మాతలూ అందరూ భుజాలు తడుముకుంటున్నారు.

ఇప్పటిదాకా బయటికి వచ్చిన ఇంటర్వ్యూలలో ఎవరికి వారు – నా సినిమా వరకూ, లేక నా టీవీషో వరకూ నేను బాధ్యతాయుతంగానే రాస్తున్నాను, నిర్మిస్తున్నాను, హింసని కథకి అవసరమైన మేరకే వాడుతున్నాను – అంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు. రెండు చిన్న నిజాలు మనవి చేస్తాను. భీకరమైన తుపాకి కాల్పులు, పేలుళ్ళు చూపించిన జేంస్ బాండ్ సినిమా అమెరికాలోకంటే విదేశాల్లో కొన్ని రెట్ల వసూళ్ళు చేసింది. మరి ఇలాంటి వయొలెన్సు ఇతర దేశాల్లో జరగదేం? జపాను, కొరియా వంటి దేశాల్లో అమ్ముడయ్యే వీడియో గేముల్లో విపరీతమైన హింస ఉంటుందట. మరి అక్కడ ఇట్లాంటి సంఘటనలు జరగడం లేదేం?

ఏమన్నా అంటే .. దాన్ని గురించి మనకి పూర్తిగా తెలీదు, సరైన సమాచారం లేదు, గాడిద గుడ్డు లేదు అంటారు. తుపాకి సంస్కృతి అమెరికా సంస్కృతిలో ఒక భాగం. అది మనం ఒప్పుకుని తీరవలసిందే. అది ఒప్పుకున్నాక, రెండవ సవరణని గురించి తీవ్రంగానూ లోతుగానూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండవ సవరణ తుపాకులు ధరించే హక్కుని ఆటపాటలకోసం చెప్పలేదు, మిలీషియాల మనుగడకోసం అని స్పష్టంగాచెప్పింది. మిలీషియా అంటే పౌర సైన్యం. ప్రభుత్వ సైన్యంలో చేరాలి అంటే సవాలక్ష ప్రశ్నలు అడుగుతారే, మరి పౌరసైన్యానికి అర్హులుగా ఉండాలంటే కనీసార్హతల ప్రస్తావన ఉండవద్దా? కచ్చితంగా మానసిక ఆరోగ్యాన్ని గురించి ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి – అందులో సందేహమే లేదు.

సమాజంలో ఈ రుగ్మతల పట్ల ఉన్న దురభిప్రాయాలు అలా ఉండగా, మంచి ఆరోగ్యబీమా పాలసీలు కూడా ఈ రుగ్మతలకి అవసరమైన ట్రీట్మెంటుని చిన్నచూపు చూస్తున్నాయి. ఇక్కడ శ్లేషని తమరు మన్నించాలి – ఈ తుపాకుల సమస్యని ఛేదించడానికి సిల్వర్ బులెట్ ఏదీ లేదు. అన్ని వైపులనించీ ఈ సమస్యని ఎదుర్కోవలసిందే. కానీ అన్నిటికంటే ముఖ్యం, మన బిడ్డల పైన, వారి పెంపకం పైన, వారికి మనమిచ్చే శిక్షణ పైన ఉండాలి మన దృష్టి. వారికి తుపాకి ధరించడానికి హక్కే కాదు, బయటి పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా, తుపాకి ముట్టుకోకుండా ఛాయిస్ కూడా ఉన్నదని వాళ్ళకి తెలియాలి.

‘తుపాకి’ కథలో పిల్లవాడు కిరణ్ కి  ఆ ఛాయిస్ తెలిసింది. మరి అమెరికన్ పౌరులకి ఎప్పుడు తెలుస్తుందో?

Above Image by Slowking4 (Own work) [CC-BY-SA-3.0 (http://creativecommons.org/licenses/by-sa/3.0)], via Wikimedia Commons Gun image by INVERTED (Own work) [Public domain], via Wikimedia Commons