యెమ్టీ ఫెలో

sasisri

తెలుగునాట నిబద్ద కథారచయితల్లో శశిశ్రీ ముఖ్యులు. కడప జిల్లాకు చెందిన శశిశ్రీ 1976 నుంచి కథా రచనే కాకుండా కవిత్వం, సాహిత్య  విమర్శ వ్యాసాలు, ఆకాశవాణి నాటికలు రచిస్తున్నారు.  శశిశ్రీ అసలు పేరు షేక్ బెఫారి రహమతుల్లా. ఈయన 1973 ప్రాంతంలోనే “మనో రంజని” లిఖిత మాస పత్రిక నడిపి ఆనాటి యువతరం లో స్పూర్తిని రగిలించారు. 1995 నుంచి  “సాహిత్య నేత్రం” పత్రికని తన ప్రధాన సంపాదకత్వంలో నిర్వహిస్తున్నారు.  ప్రతిష్టాత్మక “యునిసెఫ్ అవార్డు” తో పాటు మరెన్నో పురస్కారాలు అందుకున్నారు. “దహేజ్” , “రాతిలో తేమ” వీరి కథా సంపుటాలు. దాదాపు 16 పుస్తకాలను రచించారు.  ప్రస్తుతం కడపలో  సీనియర్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.–వేంపల్లె షరీఫ్

***

నెల నెలా వేల రూపాయిలందించే గంగిగోవులాంటి అసిస్టెంటు ప్రొఫెసర్‌ ఉద్యోగం వదులుకోవాలనుకున్నాడు ఆనందం.

ఉద్యోగంలో చేరిన ఆరు నెలలకే రాజీనామా చేయాల్సి వస్తుందని అతను యెంత మాత్రం ఊహించలేదు. అలా విడిచి పెట్టాల్సి వస్తుందంటే ఆ అసిస్టెంటు ప్రొఫెసర్‌ పోస్టుకు అప్లికేషన్‌నే పెట్టేవాడు కాదు. పోటీ ఉందని తెలిసినప్పుడే జిల్లా మంత్రితో గట్టిగా సిఫార్సు చేయించే వాడుకాదు.

సిఫార్సులకేం కొదువ-పోటీలో ముఖ్యమంత్రి పేషీ నించే వైస్‌ఛాన్సలర్‌కు ఫోన్‌ చేయించాడు. ఆ నాటి పరిస్థితి అదైనప్పుడు ఆ ఉద్యోగం ఖచ్చితంగా తనకే దక్కాలని ఆరాటపడినాడు ఆనందం. అప్పుడు వైస్‌ఛాన్స్‌లర్‌ శిష్యుడు వీరయ్యను కలుసుకొని యిచ్చుకోవాల్సింది యిచ్చుకుంటే పోస్టు వస్తుందని యెవరో చెప్పారు. చివరికి ఆ వీరయ్యను పట్టుకుని- పది ‘ల’కారాలు సమర్పించుకున్నాడు ఆనందం.

ముప్పయ్‌ యేళ్ళ పాడికోసం ఆ మాత్రం పెట్టుబడి పెట్టడం తప్పేకాదని వీరయ్య ఆనందానికి చెప్పినాడు. దీనితో తాను సార్థకనామ ధేయుడ్ని అయ్యానని సంతోషించాడు.

ఉద్యోగంలో చేరగానే యుజిసి స్కేళ్ళు పెరిగాయి. కలిసి వచ్చే అదృష్టం అంటే యిదేననుకున్నాడు. నెల నెలా వేలకు వేలు సంవత్సరానికి… ఓ మంచి సంపాదనే!!  ఆ ఊహే ఆనంద్‌కు తన స్థాయి యెంత యెదిగిపోతుందో అర్థమై మురిసిపోయాడు.

యూనివర్శిటీ కాంపస్‌లో లక్షకు ఒకటి వచ్చే నానో కార్లు చూసి – తానూ ఒకటి తీసుకోవాలనుకున్నాడు. నలుగురితో పాటు నారాయణ అయిపోతే యెట్టా? ప్రత్యేకత ఉండాలి కదా అనుకున్నాడు. అప్పుడే తన ఆలోచనల్లో ప్రత్యేకత అనేది ఒకటి చోటు చేసుకుంటోందని గ్రహించాడు. ఫలితంగా ఆరులక్షల కారు కొని – కాంపస్‌లో పార్క్‌ చేసినాడు. నలుగురి కంట్లో తాను యేమిటో తన ప్రత్యేకత యేమిటో ఫస్ట్‌ ఎంట్రీలోనే నిరూపించుకున్నాడు ఆనందం.

కానీ, ఇవన్నీ ఉద్యోగం వచ్చిన కొత్తలో ఆనందంలోని ఆలోచనలు. ఇప్పుడు ఈరోజు అంతే భిన్నంగా ఆలోచించసాగాడు.

తన రాజీనామా రిజిస్ట్రార్‌కు ఇచ్చి,  వైస్‌ఛాన్స్‌లర్‌ దృష్టికి తీసుకెళ్ళి రిలీవ్‌ చేయమన్నాడు. రిజిస్ట్రార్‌ గోపాలయ్య దిగ్భ్రాంతికి గురి అయ్యాడు. ఆలోచించుకుని వారం రోజుల తరువాత చెప్పమన్నాడు. అమెరికాలో జరిగే సెమినార్‌ నుంచి వీసీ రావడానికి వారం గడువుందని – అందాక ఓపికతో నిలకడగా ఆలోచించి చివరి నిర్ణయం తెల్పమన్నాడు.

ఆనందం మాత్రం తాను అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నానని తదుపరి చర్యలు తీసుకుని రిలీవ్‌ చేస్తే అదే సాయం అవుతుందని చెప్పి – మరో ఆస్కారం రిజిస్ట్రార్‌కు యివ్వకుండా ఆయన చాంబర్‌లోంచి బయటికొచ్చాడు.

వెయ్యి యెకరాలలో ఆకాశం అంటే భవనాలు… రకరకాల పేర్లతో యేర్పాటైన ఆకుపచ్చని ల్యాండ్‌ స్కేప్‌లు… చెట్లూ… ఆర్చీలు… డా. రాజశేఖర్‌రెడ్డి, అన్నమయ్య, వేమన, అంబేద్కర్‌, సివిరామన్‌ విగ్రహాలు… చూస్తూ తన కారులో క్యాంపస్‌ బయటికి వస్తున్న ఆనందం – యెందుకో బొటానికల్‌ గార్డెన్‌వైపు కారును మలుపు తిప్పాడు.  అక్కడైతే ఆ రాక్‌పాండ్‌ దగ్గర, తెలుగుతల్లి విగ్రహం దగ్గర వున్న చిన్నపాండ్‌లో హాయిగా అటు ఇటూ ఈదుతున్న రంగురంగుల చేపల్ని చూస్తూ కొంత ఉపశమనం పొందాలనుకున్నాడు ఆనందం. అక్కడ రోజుకు అరగంట సేపైనా గడపడం ఆనందంకు ఇష్టమైన అలవాటే. ఆ అరగంట అక్కడ గడిపితే చాలు – యెంతో ఉల్లాసం, ఉత్సాహం శరీరం అంతా నిండి తాను ఎన్‌రిచ్‌ అయినట్లు, రీచార్జ్‌ అయినట్లు అనుభూతించేవాడు.

ఇప్పుడు మాత్రం అందుకోసం కాదు- ఎవరూ రాని అక్కడ – ఎవరూ గమనించని అక్కడ తనివితీరా గట్టిగా యేడ్చేయాలని వచ్చాడు ఆనందం. నలుగురి ముందు యేడ్చడం నాగరికతకాదు. ఒంటరిగా స్వేచ్ఛగా – తృప్తి మీర-మనసులోని కల్మషమంతా కన్నీటి రూపంలో బయటపడిపోయేదాక యేడ్వాలనే వచ్చాడు ఆనందం.

కారుదిగి, రంగు రంగుల చిన్ని చేపలున్న ఆ చిన్న కొలను దగ్గర- కదలకుండ ఒకదానికి యింగొకటి అంటిపెట్టుకొని వున్న ఆ గుండ్రాళ్ళ పైన కూర్చోడానికి వేసిన కాంక్రీటు దిమ్మెమీద కూర్చున్నాడు ఆనందం.

రంగురంగుల చేపలు – కళ్ళు – నోళ్ళు తెరిచి ఆనందాన్ని చూశాయి. యేదో అర్థమై గబుక్కున దూరంగా పోతున్నాయి. మళ్ళీ మెల్లిగా వస్తున్నాయ్‌. ఎవరో ఆ కొలనులో బొరుగులు (మర్మరాలు), పప్పులు చల్లినారు.  అవి నీటిపై తేలుతున్నాయ్‌. చేపలు మూతులు సాచి చటుక్కున నోట పట్టుకుని సర్రున వెళ్తున్నాయి. మళ్ళీ వస్తున్నాయి. నోట పట్టుకుని సర్రున పోతూనే వున్నాయ్‌.

చేపలపై నుంచి దృష్టి పైకి మరల్చినాడు ఆనందం. అందమైన గ్రీకు యువతి తన చంకలోని కడవలోంచి నీరు ఆ కొలనులోకి వొంపుతోంది. కడవలోంచి కొలనులోకి నీరు నెమ్మదిగా పడేట్లు యేర్పాటుచేశారు. నీళ్ళు కడవతో వొంపుతున్న ఆ గ్రీకు యువతి తన నీలికళ్ళతో ప్రశాంతంగా పలకరించినట్లు అనుభూతించాడు- ఆనందం.

ఆనందానికి బాధతో కాదు- పశ్చాతాపంతోను ప్రాయశ్చిత్యంతోను రెండుకండ్లలో రెండు ధారలు ఉబికి చెంపలపై నుంచి జారాయి. మీసాలు పై నించి పైపెదవినించి మెల్లిగా నోటిలోకి వెళ్తున్నాయ్‌. కన్నీటి రుచి – ఉప్పగా నాలుకకు తగిలింది. తన కన్నీరు అందరి కన్నీటి మాదిరే ఉప్పగా ఉండటం ఆశ్చర్యమేసింది. ఆశ్చర్యం యెందుకంటే తాను చేసిన పనికి తన కన్నీరు చేదుగా వుండాల్సింది కదా అనుకున్నాడు. చేదుగా ఉండి ఉంటే కొంత తృప్తిగా ఉండేది. ఆ ఆలోచన నోరు అర్థం చేసుకున్నదానిలా వుంది. నోరంతా చేదుగా తోచింది  ఆనందానికి. నోరు చేదెక్కడం అంటే ఇదేనేమో అనుకున్నాడు.

తాను ఈ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగం కోసం యింతగా దిగజారాల్సి వుండకూడదేమో! ఒక వేశ్య దగ్గరికి ఎవడు పోతాడో వాడు ఒక్కడే చెడిపోతాడు.  కానీ తను!? తన దగ్గర చదువుకునే ముప్పయ్‌ మంది పిల్లలు చెడిపోతారు. ఈ లెక్కా తప్పే!! ఎందుకంటే ఎంతలేదన్నా తను ముప్పయ్‌ యేళ్ళు కదా సర్వీసు చేయాల్సింది? ఆ ముప్పయ్‌ యేళ్ళలో యెందరెందరు చెడిపోతారో… ఎందరెందరి భవిష్యత్తులు నాశనమైపోతాయో?

ఒక్క వేస్టు ఫెలోని… ఒక ఎమ్టీ ఫెలోని అసిస్టెంట్‌  ప్రొఫెసర్‌గా తీసుకుంటే ముప్పయ్‌ యేళ్ళ సుదర్ఘీకాలం యూనివర్శిటీ చెడిపోవడమేకదా. ముప్పయ్‌ యేళ్ళ పాటు ఒక ”నీచ్‌ కమీనే కుత్తే”ను భరించడమే కదా అనుకున్నాడు ఆనందం.

అసలు ఈ ఆలోచన తనకు ముందుగా ఎందుకు రాలేదని కుమిలిపోయాడు. ఎంతసేపు తన భవిష్యత్తు గురించే ఆలోచించినాడే కానీ, తను అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులో చేరిన తరువాత యెందరెందరి  భవిష్యత్తు తన  చేతిలో వుంటుందనే విషయం యెందుకు ఆలోచించలేదని పొరలి పొరలి దుఃఖం ముంచుకొచ్చింది ఆనంద్‌కు.

ఉద్యోగంలో చేరిన ఆరు నెలలకే తనవల్ల జరిగే తప్పు ఏమిటో తనకు తెలిసిరావడం కూడా ఒక వరమే! అదృష్టమే!! కాదు కాదు తన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం కొద్ది ప్రాయశ్చిత్యం చేసుకునే అవకాశం దొరికిందనుకున్నాడు ఆనంద్‌ చెంపలపై కన్నీటిని చేతులతోనే తుడుచుకుంటూ.

జేబులోంచి రుమాలు తీసుకొని కళ్ళు  వత్తుకోవచ్చు కానీ, ఆ కన్నీరు… ఆ కన్నీటిలో కరిగి వెలకివస్తున్న, చేసిన తప్పు తాలూకూ సూక్ష్మ అణువులు సరాసరి చేతులకు తాకనీ అనుకున్నాడు. ఈ చేతులు ఇక మీదట జీవితకాలం మళ్ళీ ఆ తప్పు చేయవు? కదా అనుకున్నాడు.

ఈ చేతుల్తోనే కదా టెన్తు నుండి పీజీ వరకు పీజీ నుండి పిహెచ్‌డి వరకు మొత్తం  అడ్డుదారుల్లో సంపాదించాను. ఈ చేతుల్తోనే కదా డబ్బులు యిచ్చి చదువు కొనుక్కున్నాను. ఈ చేతుల్తోనే కదా ఆ వీరయ్య ద్వారా పది లకారాలు లంచం ఇచ్చాను. ఈ చేతుల్తోనే కదా యెవరికి సిఫార్సు చేయాల్నో స్లిప్పులురాసి మంత్రికి, మంత్రి పిఎకు ఇచ్చాను. ఈ చేతుల్తోనే  కదా ఫోన్‌ నెంబరు నొక్కి మొబయిల్‌ ఫోన్‌ని మంత్రికి ఇచ్చాను. ఈ చేతుల్తోనే కదా మంత్రికి దండాలు పెట్టాను. ఈ చేతుల్తోనే కదా సిఫార్సు లెటరు మోసుకెళ్ళి – మద్రాసులో మకాంలో ఉండిన ఈ వీసీ కిచ్చాను. అని అనుకొనే కొద్ది ఆనందంకు కన్నీరు వస్తూనే ఉంది. ఎంతెంతగా కన్నీరు బయటికొస్తుంటే అంతగా మనసు తేలిక అవుతున్నట్లు అనుభూతిస్తున్నాడు ఆనందం.

మెదడుపొరల్లోంచి ఈ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకోసం తాను చేసిన తప్పులన్నీ ఒకటొకటి వెలికి వస్తుంటే కళ్ళు వెలికి వూసేస్తున్నాయ్‌ – అనుకున్నాడు ఆనందం.

ఆరోజు ఇంటర్‌వ్యూకి వచ్చిన వాళ్ళలో భార్గవ అని ఒక క్యాండెటు వచ్చాడు. ఇంటర్‌వ్యూ జరిగే గది  లోపలికి పోకముందు తాను అతని పక్కనే కూర్చున్నాడు. అప్పుడు చూశాడు. ఆ భార్గవ ప్రొఫైల్‌ ఎంత గొప్పగా ఉండింది!

నృత్యంలో, నటనలో, సంగీతంలో జాతీయస్థాయిలో యిచ్చిన ప్రదర్శనల ఫొటోలు తను చూశాడు. దేశ ప్రధాని చేతుల మీదుగా తీసుకున్న మెమొంటోలు, కేంద్ర మంత్రులు చూస్తుండగా చేసిన నృత్యభంగిమల ఫొటోలు – జాతీయస్థాయి గుర్తింపు వున్న సంస్థలు యిచ్చిన సర్టిఫికెట్లు- లలిత కళల్లో వృత్తి శిక్షణ తీసుకొన్న సర్టిఫికెట్లు ఇలా యెన్నో ఈ చేతులు మార్చి మార్చి చూశాడు. ఈ కళ్ళు విచ్చుకుని విచ్చుకుని చూశాయి. ఆరోజు ఇంటర్‌వ్యూకు భార్గవనే తనకంటే ముందులోనికి పిలిచిన సంగతి కూడా ఆనందంకు గుర్తుకొచ్చింది.

ఇంటర్‌వ్యూనించి బయటికొచ్చాక – ఇంటర్‌వ్యూ యెలా ఫేస్‌ చేశారని తను అడిగింది కూడా గుర్తుకొచ్చింది. ఇంటర్‌వ్యూ చేసిన ఎక్స్‌పర్ట్స్‌ తన డెమో చూసి సంతృప్తి వ్యక్తం చేశారని భార్గవ చెప్పిందీ గుర్తుకొచ్చింది ఆనందంకు.

కానీ ఆ భార్గవకు ఆ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టు రాలేదు. నాన్‌ లోకల్‌ అనే ఒక నెపాన్ని చూపి తీసుకోలేదనే విషయమూ గుర్తుకొచ్చింది ఆనందంకు.

ఆ ఒక్క నాన్‌లోకల్‌ అనే ఎర్ర ముద్ర భార్గవపై పడకపోయివుంటే – తనకు ఈ పోస్టు ఎందుకొస్తుందనే విషయం కూడా గుర్తుకొచ్చి కన్నీరు వచ్చింది ఆనందంకు.

గుండెలోతుల్లో ప్రక్షాళన ఊట పుట్టింది ఆనందంకు. ఎక్కడో గుండె చివర దాగివున్న మానవత్వం చెమ్మ పొర వూడదీసుకున్నట్లుంది.

ఇన్ని తప్పులుచేసి – తీరా ఉద్యోగంలో చేరిన కొన్ని నెలలకు – ఈ రోజు ఆ ఘటన చోటుచేసుకుని వుండకపోయి వుంటే ఇంత పెద్ద నిర్ణయం  తీసుకొని వుండడు ఆనందం.

ఉదయం యెప్పటిలా క్లాసుకు వెళ్ళాడు ఆనందం.

లలితసంగీతం క్లాసు అది.

సంగీతం పుట్టుక, దాని నేపథ్యం అనే అంశం మీద విద్యార్థులకు చెప్పాల్సి వుంది. సంగీతం గురించి ఉద్యోగం రాక ముందు ఆనందంకు ఏమీ తెలియదు. ఉద్యోగ అవసరార్ధం – ఏ రోజు పాఠం ఆ రోజు ముందు పుస్తకం చూసి నోట్సు రాసుకుని వచ్చి చెప్తున్నాడు.

నిన్నరాత్రి రాసుకున్న నోట్సు కాగితం తీసి ఒకసారి చూసి టేబుల్ మీద పెట్టి దానిపై మొబయిల్ ఫోన్ పెట్టాడు. చాక్‌పీసు తీసుకొని బ్లాకుబోర్డు మీద ‘సంగీతం పుట్టుక కథ’ అని రాశాడు. దాని కింద సప్తస్వరాలైన ‘సరిగమపదనిస’ రాశాడు.

“సంగీతం గురించి తనకు తెలిసింది చెప్పసాగాడు. చెప్తూ… చెప్తూ .. సంగీతంలోని సప్తస్వరాలు యేడింటిని ఔడవ రాగాలు అంటారు. మోహన హంసధ్వని రాగాలులోనే తొలుత వేదపఠనం జరిగేది” అని చెప్తుంటే కిషోర్ అనే విధ్యార్ధి “సార్” అని  అడ్డుతగిలాడు.

తన వాగ్ధాటికి అడ్డువచ్చిన కిషోర్‌ని తీక్షణంగా చూసి “ఏమిటి ఈ అవాంతరం” అన్నాడు నాటక ఫక్కీలో ఆనందం.

“అవాంతరం కాదు సార్ అనుమానం” అన్నాడూ చాలా వినయంగా కిషోర్.

“ఇప్పుడే తీర్చుకోవాల్సిన అనుమానమా? లెక్చర్ ఆఖర్న తీర్చుకోవాల్సిందా?” కాస్త అసహనంగా అన్నాడు.

“మీరు మరోలా భావించకుంటే ఇప్పుడే తీరుస్తే మంచిది సార్!” అన్నాడు విద్యార్థి కిషోర్ చాలా వినయంగా.

“సరే చెప్పు. నీ అనుమానం పెనుభూతం కాకముందే” అన్నాడు చాలా స్థిరంగా.. క్షణంలో తీర్చి నోరు మూయించేస్తానన్న ధోరణిలో.

“సప్తస్వరాలను ఔడవ రాగాలు అనరని నా అనుమానం. మరొకటి వేదపఠనం మోహన, హంసధ్వని రాగాలలో తొలుత జరిగేది కాదేమోనని సార్” అన్నాడు కిషోర్. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆనందం ముఖంలో మారుతున్న కవళికలను గమనిస్తూ.

ఆ రెండు అనుమానాలు ఆ విద్యార్థికి కాదు కానీ ఆనందంకు రెండు భూతాలుగా యెదురుగా నిలిచినట్లు తోచింది. కొంచెం అహం దెబ్బతిన్నట్లూ అనిపించింది.

“అంటే! నేను చెప్పింది రాంగ్ అనేనా నీ అభిప్రాయం?” అంతకంటే తన దగ్గరేం జవాబు లేకపోయేసరికి వచ్చిన మాటలు అవి.

“మీరు రాంగ్ అని కాదు సార్. ఎక్కడో పొరపాటు జరిగి వుంటుందని అనుకుంటున్నాను” కిషోర్ వినయంగానే ఆనందం చేసిన తప్పును గుర్తించమని తెలిపాడు.

“అలానా! అయితే నీవే ఈ డయాస్ పైకి వచ్చి రైట్ ఏదో చెప్పు మరి” అనేశాడు అహం దెబ్బతిన్న స్వరంతో ఆనందం

“అదికాదు సార్..” అని కిషోర్ సర్ది చెప్పబోయాడు.

“నన్ను కన్విన్స్ చేయక్కర్లేదు. ముందు నీవు ఇక్కడికి వచ్చి రైట్ యేదో చెప్పు. కమాన్.” అని డయాస్ దిగి స్టూడెంట్స్ కూర్చునే డెస్క్‌లో కూర్చున్నాడు ఆనందం.

క్లాస్‌లో అనుకోకుండా చోటు చేసుకున్న ఆ దృశ్యం విద్యార్థులకు కొంచెం చేదుగా అన్పించినా విషయం ఆసక్తిగా గమనించసాగారు.

కిషోర్  తనకు తప్పదన్నట్లు డయాస్ పైకి వెళ్లాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆనందం వైపు తనతోటి విద్యార్థుల వైపు చూశాడు.

విద్యార్థుల మొహాల్లో ఉత్కంఠ. ఆనందం మొహంలో ఓ నిర్లక్ష్య,  అసహన భావం కమ్ముకుని కనిపించింది.

“టైం వేస్ట్ చేయకు. కమాన్ చెప్పు. అవసరం అనుకుంటే బ్లాక్ బోర్డు కూడా యూజ్ చేయి” అన్నాడు ఆనందం. కిషోర్‌ని కంగారుకు గురిచేస్తూ.

కడుపులోంచి తన్నుకొస్తున్న కంగారు , తను రైట్, ప్రొఫెసర్ రాంగ్ అని తేలిపోయాక తననేం చేస్తాడోననే భయం తటపటాయించేట్లు చేసింది కిషోర్‌కు. ఇంతదాకా వచ్చేశాక, యిక వెనుకడుగు వేసినా తీరని అవమానమే యెదురు అవుతుంది. తన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆనందం చేస్తున్న టీచింగ్ పూర్తి అసంబద్ధమని నిరూపించడమే మంచిదనిపించింది కిషోర్‌కు. కాకపోటే ఆనందం గౌరవానికి భంగం వాటిల్లకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే సరి అంది మనసు. మనసు తల్లి అంటారు . తల్లి బిడ్డకు యెప్పుడు తప్పుడు బోధ చేయదనుకున్నాక కిషోర్ మనసులో ఒక స్థిర ప్రశాంతత ప్రకాశమానంగా వెలిగింది.

బోర్డుపై చాక్‌పీస్‌తో ‘సంగీతం పుట్టుక్’ అని రాశాడు. పైనించి కిందికి ఒకటీ నుండి యేడు అంకెలు రాసి ఆ ప్రతి అంకె పక్కన స్వరం స్వరం అని రాశాడు. ఆ తరువాత షడ్జస్వరం అని రాశాడు.

ఆ తరువాత ‘సరిగమ పదనిస’ అనే అక్షరాలను విడివిడిగా పైనించి కిందికి ఒకో అక్షరం రాసి –  ‘స’ పక్కన 240, ‘రీ పక్కన 270, ‘గ’ పక్కన 300, ‘మ’ పక్కన 320, ‘ప’ పక్కన 360, ‘ద’ పక్కన 405 చివరి ‘స’ పక్కన 480 అని చాక్‌పీస్‌తో రాశాడు.

ఆ తరువాత ‘ఔడవరాగాలు – 5’ అని రాసి, ప్రాచీన రాగాలు మోహన, హంసధ్వని అని రాశాడు కిషోర్.

ఈ మాత్రం చాలు అనుకుని, గొంతు సవరించుకొని ఇలా చెప్పుకుని పోసాగాడు.

“మనిషి సంగీతాన్ని ప్రకృతి నించే నేర్చుకున్నాడు. పక్షులు, పశువులు, జంతువులు, మృగాలు, సెలయేర్లు, గాలి, నీరు, ఇలా ప్రకృతి నించి జనించే సహజ శబ్ద సుందరాలను మనిషి విని వుద్దీపన చెందాడు. ప్రకృతి శబ్ద స్వరాలనే ధ్వని శాస్త్రమని మేధావులైన సంగీత శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. తొలుత మనిషి కనుకొన్న స్వరానికి షడ్జస్వరమని పేరు పెట్టుకున్నాడు. ఆ స్వరానికి మనసును రంజింపచేసే స్వభావం వుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే ఈ షడ్జస్వరం వుందే.. 240 ప్రకంపనలు కలిగి వుంటుంది. అంటే ఒక సెకను కాలంలో 240 ప్రకంపనలు సృష్టించే షడ్జస్వరం అయ్యిందన్నమాట.

ఈ ఒకే ఒక్క స్వర ఆధారంగానే ఒకే స్వరంలో ఆలపించే సంగీతం ప్రచారంలోకి వచ్చింది. మీకు తెలుసా.. అసలు వేద పఠనం తొలుత ఏక స్వరం గాయన పద్ధతిలోనే వుండేది. సంగీత పట్ల మనుష్యుడు ఆసక్తి తద్వారా సంశోధన చేస్తూ ద్విస్వర, త్రిస్వర గాన పద్ధతిని మనిషి సాధించుకున్నాడు.

సామవేదం కాలం నాటికి ఉదాత్త, అనుదాత్త స్వరాలతో సోయగానం అయ్యింది. మరి కొంతకాలం మనిషి చేసిన అన్వేషణ ఫలితంగా అయిదు స్వరాలు అయ్యాయి. ఆ అయిదు స్వరాలనే ‘ఔడవ రాగాలు’ అంటారు”-అని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆనందంవైపు – తన తోటి విద్యార్థుల వైపు చూశాడు కిషోర్‌.

విద్యార్థులతోపాటు ఆనందం కూడా ఆశ్చర్య చకితుడైపోయాడు. ముందువున్న అహం, అసహనం, దర్పం అతనిలో పటాపంచలై పోయాయి.

”ఎసెస్‌. కమాన్‌ గో అహెడ్‌” అని ప్రోత్సహించాడు ఆనందం.

ఈ అయిదు ఔడవ రాగాలలో మోహన, హంసధ్వని రాగాలున్నాయి. ఇవి ప్రాచీన రాగాలు.

ఈ అయిదింటితో తృప్తి చెందని మనుష్యుడు మరో రెండుస్వరాలను కూడా కనుగొన్నాడు. అప్పుడుయేర్పడినవే సప్తస్వరాలు – ‘సరిగమపదనిసలు’  ఈ ప్రతి స్వరం ఇక్కడ నేను రాసిన ప్రకారం ప్రకంపనలు కలిగి వుంటాయి. అంటే ముందే చెప్పినట్లు సెకనుకాలంలో ఆయా స్వరానికి ఆయా ప్రకంపనలు వుంటాయి. ఉదాహరణకు సరిగమపదనిసలోని ‘ద’ స్వరానికి 405 ప్రకంపనలుంటాయన్నమాట. ఇదీ నేను చెప్పదల్చింది. ఈ విషయాలు అన్నీకూడా ఆనందం సార్‌కు తెలియవని కాదు.నాకు తెలిసినవి ఇలా మీముందు చెప్పించడానికే  యిలా చేశారు. అంతే కదా సార్‌” అని డయాస్‌ దిగాడు కిషోర్‌.

ప్రతిభావంతుడైన కిషోర్‌లాంటి విద్యార్థికి తనవంటి ‘యెమ్టీ ఫెలో’ లెక్చరర్‌ కావడం ఘోరం అనిపించింది ఆనందంకు. మరోరకంగా చూస్తే అటువంటి సరుకు వున్న విద్యార్థికి తాను గురువు కావడం గర్వంగా అన్పించింది ఆనందంకు.

కిషోర్‌ డయాస్‌ దిగి – తన డెస్కులో కూర్చున్నాక కాసేపు నోటమాట రాలేదు ఆనందంకు. తేరుకుని లేచి, డయాస్‌ మీది కెళ్ళి క్లాప్స్‌ కొట్టి నిజంగానే హృదయపూర్వకంగా అభినందించాడు. ఇలాటి విద్యార్థులు రాష్ట్రంలోని ప్రతి యూనివర్శిటీల్లో పదేసి మంది వుంటే చాలు అని- గొప్ప భవిష్యత్తు వుందని మెచ్చుకున్నాడు ఆనందం.

క్లాసు అయిపోయిందనే అలారం బెల్లు మోగగానే బయటికొచ్చిన ఆనందం దగ్గరికి కిషోర్‌ పరుగున వచ్చాడు.

ఆనందంను అనుసరిస్తూ – ”సార్‌. నేను క్లాస్‌లో ఓవర్‌ ఆక్షన్‌ చేసినాను సార్‌. మనసులో ఏం పెట్టుకోకండి. మళ్ళీ అలా యెప్పుడు ప్రవర్తించను సార్‌” అని వేడుకోలుగా చెప్పుకొన్నాడు కిషోర్‌. ప్రొఫెసర్లు మనసులో పెట్టుకుని యెలా తొక్కేస్తారో అనే విషయం పూర్వ విద్యార్థుల అనుభవాలు కిషోర్‌కు తెలిసి వుండటంతో – జరిగింది యేదో జరిగింది తొలి తప్పుగా  నన్ను క్షమించి వదిలేయ్‌మన్న ధోరణి చూపాడు కిషోర్‌.

”కాదు కిషోర్‌! నీవు క్లాసు తీసుకోక ముందు నిజంగానే నా ఆలోచనలు వేరేగా వుండేవి. కానీ, నీ ఇన్‌డెప్త్‌ నాలెడ్జ్‌ విన్నాక నా మనసులో నీవు యెంతో యెత్తుకు యెదిగిపోయావ్‌.  ఎస్‌. ఇట్స్‌ ట్రూ. మనసారా నిన్ను అభినందిస్తున్నాను ” అన్నాడు ఆనందం హృదయపూర్వకంగా స్పందిస్తూ.

”చాలా థ్యాంక్స్‌ సార్‌. నిజంగా చాలా కంగారుపడిపోయాను. ఇకమీద చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాను సార్‌. నాకు ఈ ఫైన్‌ ఆర్ట్స్‌ పీజీ చాలా అవసరంసార్‌.” తన పరిస్థితిని కొద్దిగా వ్యక్తం చేస్తూ చెప్పాడు కిషోర్‌. ”పీజీ నీకు రావడమే కాదు – గోల్డ్‌ మెడల్‌ కూడా కొట్తావ్‌. ఆఁ ఇంతకు ఎవరి అబ్బాయివి నీవు, నేటివ్‌ ప్లేస్‌ ఏది నీది” కిషోర్‌ వ్యక్తిగతం తెలుసుకోవాలనుకున్న ఆసక్తితో అడిగాడు ఆనందం.

”మాది బళ్ళారి జిల్లా సార్‌. మా చిన్నాన మీకు తెలిసే ఉంటారు – భార్గవ అని ఫైన్‌ ఆర్ట్స్‌లోను ఫర్‌ఫార్మింగు ఆర్ట్స్‌లోను మంచి పేరు తెచుకున్నాడు. ఇండియన్‌ కల్చర్‌ ఫెస్టివల్‌లో ప్రయిమ్‌ మినిష్టర్‌తో అవార్డు తీసుకున్నాడు” అని యింకా యేదో చెప్పబోయాడు కిషోర్‌ -కానీ ఆనందం యేదో గుర్తుకొచ్చిన వాడల్లా అడిగాడు అతని మాటలకు అడ్డువస్తూ- ”అంటే! ఆర్నెల్ల క్రితం ఈ యూనివర్శిటీ ఇంటర్‌వ్యూకి వచ్చి వుండిన భార్గవ కాదు కదా!?” ప్రశ్నించాడు ఆనందం.

”అవున్సార్‌! ఆయనే!! మీకు తెలుసా?  ఇప్పుడు హైదరాబాదులో స్వంత ఇన్సిటిట్యూట్‌ నడుపుకుంటున్నాడు” అన్నాడు కిషోర్‌.

”తెల్సు తెల్సు! హైదరాబాద్‌లో ఇన్సిటిట్యూట్‌ రన్‌ చేస్తున్నారా! రైట్‌!! సరే నీవెళ్ళు” సంభాషణ కొనసాగించడం ఇష్టంలేక కిషోర్ ని పంపేశాడు ఆనందం.

జరిగిన ఈ ఘటనంతా గుర్తుకొచ్చింది ఆనందంకు. తన బోటివారు ప్రస్తుత అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అసలు అర్హుడు కాడన్న విషయం ధృడం చేసుకున్నాడు. బొటానికల్ గార్డెన్‌లో ఎవరూ చూడని ఆ ప్రాంతంలో మనసు తేలిక అయ్యేవరకూ, కన్నీరు అంతా అయిపోయేంతవరకు అనుభూతితో ఏడ్చేసి తన కారు వున్న చోటికి బయల్దేరాడు.

ఇంతలో ఫోన్ రింగైంది. డిస్‌ప్లేలో వీరయ్య పేరు కనిపించింది. ‘హలో’ అన్నాడు ఆనందం. అవతల వీరయ్య  యేదేదో చెబుతున్నాడూ. సర్ది చెప్తున్నాడు. ఇక కాదు కూడదంటే ఇచ్చిన డబ్బులు వాపసు ఇవ్వడం కష్టమేనన్నాడు.

ఆ మాటకు ఆనందంకు ఒక విషాదపు నవ్వు వచ్చింది. అతనికీ చెప్పేశాడు. రాజీనామా వెనక్కు తీసుకోనని.. తనవల్ల యేలాటి లిటిగేషన్స్ కల్పించబోనని కూడా చెప్పేశాడు.

ఆ రాత్రి ఆనందంకు మొద్దునిద్ర హాయిగా పట్టింది.

మరుసటిరోజు ఆలస్యంగా నిద్రలేచి పేపర్ తిరగేస్తున్నాడు ఆనందం. తన క్లవర్ స్టూడెంట్ కిషోర్ తన మనసులో ఎంత కల్లోలం సృష్టించాడో కదా అనుకున్నాడు. ప్రాయశ్చితంగా తాను రాజీనామా చెయకపోయినా తన మనసు కలలో మాత్రం ఆ పని చేసిందనుకున్నాడు.

అంతలోనే ఇంటి పనిమనిషి వచ్చి బయట ఇద్దరు వ్యక్తులు వచ్చి ఉన్నారని చెప్పడు. ఎవరై వుంటారో అనుకుంటూనే రమ్మనమని చెప్పేసాడు.

వచ్చింది ఎవరో కాదు తన స్టూడెంట్ కిషోర్, వాళ్ల చిన్నాన్న భార్గవ ఏదో ఇన్విటేషన్ చేత పట్టుకొచ్చారు. ఆత్మీయంగా లోనికి ఆహ్వానించాడు ఆనందం.

 

–  శశిశ్రీ