జైలు

 Kadha-Saranga-2-300x268

అనగనగా ఒక నేను…

ఆ నేను ఒకప్పుడు బ్రతికుంటుండే.. అంటే అప్పట్ల నాకు “పానం” ఉండేదన్నట్టు.. ఉన్నప్పుడు దాని విలువ తెల్వలే.. ఇప్పుడు తెల్శినా తిరిగి తెచ్చుకునుడెట్లనో సమజ్ కాదాయే.. అయినా, అసలది ఎట్లుంటదో ఏర్పాటైతెనే కదా తిరిగి తెచ్చుకునుడు ముచ్చట!

చిన్నప్పుడెన్లనో చదువుకున్నా- “భూమ్మిద ఏదైన మూడంటే మూడు స్థితుల్లోనే ఉండును- ఘన, ద్రవ, వాయు స్థితులు.. ఈ మూడు తప్ప ‘దేనికైనా’ ఇంకో స్థితనేది ఉండనే ఉండదు” అని..

అయితే “పానం” ఈ మూడు స్థితుల్ల దేన్ల ఉంటదో మాత్రం నాకస్సల్ సమజైతలేదు…

గట్టిగనా, మెత్తగనా, గాలిలెక్కనా!! అసల్ పానం ఎట్లుంటదో ఎవలనడిగినా మాకెర్కలేదనే అంటున్నరు..

స్వర్గంల ఉంటున్నోడు పోయిన పానం గురించి ఇంతగనం చర్చపెట్టడు కాబట్టి ఇప్పుడు నేనున్నది నరకంల అని చానమంది ఈపాటికే అనుకుంటానట్టున్నరు… మీరనుకునేది దాదాపుగా నిజమే, కాపోతే.. దీన్ని మొత్తానికి మొత్తం నరకం అన్లేంగని “త్రిశంకు స్వర్గం” అంటె బాగ నప్పుతది..

నా పెయ్యిప్పుడు కట్టెసర్సుకపోయి ఇగో ఈ చీకటి కొట్టంలో ఓ మూలకు. ముడుచుకోని పడున్నది.. కొట్టానికి అవుతల ఏవేవో చప్పుళ్లూ, మనుషుల గొంతులూ వినపడుతున్నయి..

ఈ చీకటికొట్టాన్నే కొందరు “సెల్” అంటరు. సెల్ అంటే పుస్తకంల ‘కణం’ అని రాశుంటది. నేనున్న ఈ కణం చుట్టూత అన్ని దిక్కుల్ల అచ్చం ఇసొంటియే కొన్నివందల కణాలు ఉన్నయి. అందరి సెల్లులనీ కలిపి ఉంచేటియీ/ విడగొట్టేటియీ ఈ గోడలే. తేనె తుట్టను చూశుంటరు కదా. అగో అట్ల. ఒక్కో కణంల ఒక్కో మనిషి.. ఈ కణాల ‘కుప్ప’ను పుస్తకంభాషల కణజాలం అంటారుగానీ మామూలు భాషల మాత్రం “జైలు” అంటరు.. ఇంత పెద్ద జైలు మొత్తానికి సరిగ్గా మధ్యల నా సెల్లున్నది….

ఇప్పుడంటే నేనీ కొట్టంల బందీనై పీనుగు వేరం పడున్నకనీ.. బతికున్న రోజుల్ల నా కథే వేరు..

మునుపు నా జిందగే అలగుంటుండే. చిన్నప్పుడు పొద్దుగాల లేశుడుతోనే తెల్లని లేగదూడల ఎగురుడు దుంకుడు సూశి వాటితోనీ పోటీ పడుడు.. ఎర్రటెండల కప్ప గాలాలు పట్టుకుని చాపలకు పోవుడు.. పచ్చటి పొలాల గెట్లమీదనో, చల్లటి చెట్ల నీడలనో నెరివడేదాకా ఆడుకునుడు.. ఆయిటిపూని మొదటి వాన కొట్టినప్పుడు వచ్చే మట్టివాసన పీలుస్తూ ఆరుద్ర పురుగుల జాడకోసం వెతుకుడు.

ఉడుకపోసే ఎండాకాలం రాత్రుల్ల వాకిట్ల గడంచెల పండుకోని చల్లటి గాలికి చుక్కల్నిచూస్తూ కథలు అల్లడం..

వరదగూడు కానొస్తే వాన రాక చెప్పడం.. చుక్కతెగిపడితే ఠక్కుమని దేవునికి మొక్కుకోవడం..

 

తెల్లార్తే మళ్ల దోస్తులతోటి తిరగడం…

పొద్దుగూకినంకే ఇంటికి చేరడం..

అవ్వనాయినలు తిడుతే అలగడం..

అటేంక బతిమాలుతే కరగడం…

కన్నీళ్లుగా కారడం….

కాసేపటికే కడుపారా నవ్వడం...

ఒకటా రెండా… కొన్ని వందల యాదులు నా కండ్ల ముంగటనే మెదులుతున్నయి.. కానీ అదంతా గతం..

అటు పెద్దా ఇటు చిన్నాకాని ఈడుల, ఎవలేది చెప్పినా నిజమని నమ్మే కాలంల… ఎవడో చెప్పిన చెడుపుమాటలు విన్నందుకు ఫలితంగా ఇయ్యాల.. ఇప్పుడు.. ఇక్కడ.. ఈ చీకటి కొట్టంల.. నాలుగు గోడల మధ్యన ముక్కుత మూలుగుత ఓ మూలకు ఒరగాల్సచ్చింది.. ఈడ..

గాలి ఉన్నదికానీ నాకు మొస మర్రదు..

ఆకలి ఉన్నది.. కానీ అన్నం సైపదు….

రోజులూ ఉన్నాయి.. కానీ పొద్దుమాపుల తేడానే లేదు..

నిద్ర ఉన్నది.. కాని నేనున్నది కలలోనా, మెలుకువలోనా అన్నదే సమజుకాదు..

‘చెయ్యని తప్పుకు బలైన’ అని ఎరుకే కనీ, ఇంకొకర్ని వేలెత్తి చూపేటందుకు వీలులేని విచిత్ర పరిస్థితి నాది… ఈ జైలు కథే అంత.. అవుతల ఉండేటోళ్లకు జైలు లోపట ఇట్లుంటది, అట్లుంటది అని ఎంత చెప్పినా సమజవుడు జర కష్టమే.

ఈడ నా మొదటిరోజు నాకింకా మతికున్నది..ఆరోజు..నేనిక్కడికి వచ్చిపడుటానికి ఎవలైతే కారకులో వాళ్ళంతా ఈన్నే ఉన్నరు.. బిక్కుబిక్కుమనుకుంట లోపటికి అడుగుపెట్టిన నాతోని.. వాళ్ళంత అన్నది ఒకే ఒక్క మాట..

“ఏంది నువ్వుకూడా వచ్చినవా??” అని…

…అందరు అడిగింది అదొక్కటే ప్రశ్నగని అడిగిన తరీకనే వేరు.. ఒకడు ఆశ్చర్యంతోటి అడుగుతె, ఒకడు సంబురంగ అడిగిండు, ఓడు జాలి పడుకుంట అడిగితే, ఇంకోడు తిడ్తానట్టు అడిగిండు.. “ఏంది నువ్వుకూడా వచ్చినవా??” అని..

వాళ్ళ “తరీక” ఏదన్నాగానీ… నాది మాత్రం సాఫ్ సీదా ఒకటే జవాబు.. “ఆ.. నేను కూడా వచ్చిన..” నాకింకేదో చెప్దామని మా ఉండేగనీ, నాకు తెల్వని కొత్తోళ్లు చానామంది నా మొఖంల మొఖం పెట్టి నన్నే చూస్తుండేసరికి అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేకపేన…

నేను నా సెల్లులకు ఇట్లా అడుగుపెట్టుడుతోటే నా యెనుక తలుపులు మూతవడ్డయ్.. మొత్తం చిమ్మ చీకటి.. కండ్లు పొడుసుకున్నా వెలుతురు కానరానంత చీకటి…

******

మొదట్ల నా సెల్లుల నేను ఖాళీగా కూసునుడు, లేకుంటె మనసు గుంజిన దిక్కు పోవుడు తప్పుతె ఎవరితోటి పెద్దగ ముచ్చటపెట్టింది లేదు.. పక్క సెల్లులల్ల ఉండేటోళ్లు మాట్లాడుకునేటియి వక్కల్ ముక్కల్  వినపడుతున్నా నేనా ముచ్చట్లు పెద్దగా పట్టించుకోకపోతుండే..

ఎప్పుడన్నోసారి నాకు తెల్సినోళ్లో, నేనిక్కడ పడుటానికి కారణమైనోళ్లో మతికుంచుకుని మందలిస్తే మాత్రం, “నమస్తే” అనో “అంత మంచే” అనో జవాబిచ్చి ఊకునేటోన్ని..

ఏo పనీ లేనందుకో, ఒక్కణ్నే ఉన్నందుకోగానీ నాకు జైలంటే జెప్పన్నే విసుగుపుట్టింది..

అయితే.. రాను రాను ఆ చీకటి అలవాటయ్యేకొద్ది ఆ మాటలు ముచ్చట్లు ఇంకింత సొచ్చంగ వినిపించడం షురూ అయింది.. ఇగ అప్పటికేంచి, దొంగసాటుగా ఈ మూలకు నక్కికూసోని వాళ్ల ముచ్చట్లన్ని “రహస్యంగ”’ వినుడు అలవాటైంది…

ముక్కూమొహం తెలువనోళ్ల “సొంత విషయాలు” వినుట్ల గింత మజా ఉంటదనుకోలే..!! వింటున్నా కొద్దీ వినబుద్ధైతాంది.. ఇప్పుడు ఒక్క పూట ఆ మాటలు వినకున్నా నిద్రపడ్తలేదంటే నమ్ముండ్రి..    అబ్బబ్బబ్బా.. ఏం మాటలు ఏం మాటలు!! ఒక్కతీరు మాటముచ్చట్లా అయ్యి??

ఒకడు రావిగింజ గురించి చెప్తాంటె, ఇంకోడు రాజకీయాల గురించి మాట్లాడ్తడు.. ఒకలు సినిమా అంటే, ఇంకోలు

క్రికిటూ అంటరు.. ఓ కాడ కులం మతం గురించి కొట్లాడుకుంటాంటే, ఇంకోకాడ దేవుడు దయ్యమని వాదిచ్చుకుంటాంటరు.. ఓదానికోదానికి సంబంధం లేకుంట, ఒక్కొక్కనిది ఒక్కో మాట…

నదులన్నిపొయ్యి సముద్రంల కల్శినట్టూ, ఆ తీరొక్క ముచ్చట్లన్ని ఆఖిరుకు నా చెవులల్ల పడి.. మెదట్లకి ఇంకుతున్నయి..

చుట్టూ చీకటి, ఈణ్నుంచి తప్పించుకోలేని ఇసొంటి పరిస్థితి ఉన్నప్పుడు నాకు చాతనయ్యేది రెండే రెండు పనులు.. అయితేనా నేనే మాట్లాడుడు, లేకుంటె వాళ్లు మాట్లాడుతుంటే వినుడు… నేనీ రెండో పనినే నా మొదటి పనిలెక్క పెట్టుకున్న… ఈమధ్య ఉన్నోన్ని ఉండనియ్యకుంట నన్నుకూడా ఏదన్నొటి చెప్పమని అడుగుడు కొత్తగ షురూచేశిన్లు..

నాకు వద్దనున్నా, వాళ్లు మాత్రం ఇడ్శిపెట్టకుండా ఊకె నా గోడపై కొట్టో, తట్టో నన్ను పిలుస్తనే ఉన్నరు… తప్పుతదా మరి.. చేసేదేoలేక వాళ్లు మాట్లాడుకునే వాటికి “ఊ..” “ఊ..” అని ఊ కొట్టుడు అలవాటు చేసుకున్న…

పోను పోను ఒకదానితర్వాత ఒకటి ఇట్లనే కొత్తకొత్త అలవాట్లు అనేకం అంటుకున్నాయి.. మొదట్ల అయన్ని కొత్త కాబట్టి పెద్దగా ఏమనిపించలే..కనీ.. నాకు పుట్టుకతోటి వచ్చిన పాత అలవాట్లన్నీ మెల్లమెల్లగా గాయబైపోయాయి.. అగో అక్కడే మొదలైంది నా పతనం… కొన్నిరోజులకే ఈ కొత్త అలవాట్లకు పూర్తిగా బానిసనై వాటిని దురలవాట్లుగా నా అంతట నీనే మార్చుకున్న..

పక్కోని జీవితం గురించి తెలుసుకోవాలనే కుతుహలం నాలోపట కొండపెరిగినట్టు పెరిగిoది… వానిగురించి తప్పుతే నా గురించి పట్టించుకోవాలన్న సంగతే మతికిలేనంతగా మారిపోయాను.. అసల్ నేన్ తింటాన్నో ఉపాసముంటాన్నో తెలుస్తలేదు.. నా నాలికె మంచిగ రుచుల్ని చూసి నిజంగా ఎన్ని దినాలైన్దో!! ఏది తిన్నా ఒకే రుచి… ఏది చూసిన ఒకే వాసన… సప్పటి బతుకు.. ఏమి తిన్నట్టే అనిపిస్తలేదు కనీ పెయ్యి మాత్రం బరువెక్కుతాంది.. బరువెక్కుతాంది అనే కంటే నాకు నేను భారమైతున్న అంటె కరెక్టు.. ఇగ నిద్ర ముచ్చట ఆ దేవునికే తెల్వాలె.. ఎప్పుడు పంటాన్నో, ఎప్పుడులేత్తాన్నో ఏం సమజ్ గాని అయోమయం… ఆగమాగం…

చిత్రం: కార్టూనిస్టు రాజు

చిత్రం: రాజు

******

ఈడున్నోళ్ళు సరిపోనట్టు ఈ మధ్య పెద్దపెద్దోళ్ళు సుత ఈడికే బందీలుగా వచ్చి చేరుతున్నరు… కాదెవరు తప్పులు చేయటానికనర్హం అన్నతీరంగ.. రాజకీయాలోళ్లు, సినిమావోళ్లు, ఆటలాడేటోళ్లు, పాటలు పాడేటోళ్లు.. అందరిటే వరుసకట్టిన్లు.. టివీలనో పేపర్లోనో చూశే ఉంటరు మీరు.. మీకు ఎరుకయ్యే ఉంటదికదా?

గొప్పగొప్పోళ్లు కూడా ఈడికచ్చుడు.. వాళ్ళుసుత మాతోటే, మావేరంగనే ఇట్ల చీకటికొట్టాల్ల బందీ అయిపోవుడు జర ముక్కుమీద వేలేస్కోవాల్సిన ముచ్చట్నే అయినా, ఇప్పుడు వాళ్లూ-నేనూ అందరం సరిసమానంగ ఉన్నమని యాదొచ్చినపుడు సంబురంతో ఒళ్లు పులకరించి పోతాంది.. ఈ సంబరం నేను “వాళ్ళంత” అయినందుక్కాదు, వాళ్ళు నా అంత అయినందుకు…

బయట జిందగీల వాళ్లను కలుసుడు, మాట్లాడుడు అనేది కలల కూడా ఊహించలేని నేను, ఈడ మాత్రం వాళ్లతోటి ముచ్చటపెట్టేతందుకు ఏ చిన్న సందు దొరికినా ఇడిశిపెట్టద్దని నిర్ణయం జేస్కున్న.. ఇంకేందిగ, ఈ చీకట్లె ఎప్పుడన్న వాళ్లల్ల ఎవరి గొంతన్న వినపడ్డదంటే ఖతమే.. ఠక్కున నేనుసూత వాళ్లతోని చేరి వదురుడు షురూ జేశిన…

వాళ్లు “ఆc..” అని ఆవులిస్తే….. నేను “వాహ్..” అని తాళం కొడుతాన…

వాళ్లు “క్యా” అంటే….. నేను “క్యా బాత్ హై” అంటున్నా..

జైలంటే వాళ్ళకేడ విరక్తి పుట్టి వెళ్లిపోతరో ఏందోనని, నాకు అక్కెరున్నా లేకపోయినా ఎప్పుడూ ఏదో ఒకటి వాగుడూ.. వాళ్ళు దగ్గినా తుమ్మినా పొగుడుడు చేస్తనే ఉన్న.. అమాసకో పున్నానికో వాళ్ళు నన్ను మతికుంచుకోని మందలిస్తే ఇంక నాకా పూట దసరా దావతే..

అంతంత పెద్దోళ్లు పరిచయమైనందుకు నిజంగా నాకు మస్తు గొప్పగ అనిపిస్తాంది.. పైకెళ్లి ఇప్పుడు నేనుసూత గొప్పోణ్ని కాబట్టి, నాకూ నాలుగు పెద్ద పరిచయాలున్నయి కాబట్టి, చుట్టూత ఉన్న ఇంకో నలుగురితోటి కలవడం, కలుపుకుపోవడం నా అసంటోనికి తప్పదనిపించింది.. అనిపించుడే ఆలిశం.. చీకట్ల కనీసం వాళ్ళ మొఖాలుకూడ చూడకుండా బొచ్చెడుమందితో మాట్లాడుడు షురూ చేశిన…

ఒకప్పుడు ఓ మూలకు సప్పుడు జెయ్యకుండ కూసునే నేను ఇప్పుడు అందర్తోని ముచ్చట పెడ్తూ నా కొట్టంలో మూల మూలకు కలెతిరుగుతున్నా.. పొద్దుమాపు తేడాలేకుండా ఎవడు పడితె వానితో ఏది పడితే అది ఒర్రుడే ఒర్రుడు.. అసలు, “ముచ్చటుంటెనే” కడుపునిండుతానట్టు అనిపిస్తాంది… వందల మందితో పరిచయమయ్యేసరికి అసలు నా అంత మొగోడు లేడనిపిస్తాంది.. ఆ తర్వాత్తర్వాత.. వాళ్లతో మాట్లాడే ‘తరీక’ దానిచ్చ అదే మారింది.. “వాళ్లు” అన్న పదం మనోళ్లు, వేరేటోళ్లుగా ముక్కలైంది..

మొదట్ల..                వాళ్ళు- “రాజకీయాలు చెత్తా” అంటే…

నేను – “ఔ.. ఏ చీపూరుకట్టకూ ఊడువ రానంత చెత్త” అనేటోన్ని…

తర్వాత కొన్నిరోజులకు… వాళ్ళు – “రాజకీయాలు చెత్తా” అనంగనే

నేను – “వాటిల ఉన్న మావోళ్లు తప్ప.. మిగిలినోళ్లు చెత్త” అనేటోన్ని

ఆ తర్వాత ఇంకొన్నిరోజులకు… వాళ్ళు- “రాజకీయాలు చెత్త” అనంగనే

నేను – “మీరు ఉత్త చేత కాని దద్దమ్మలు.. అందుకె మీకు రాజకీయాలు చెత్తగా కనవడ్తున్నయీ”

ప్రస్తుతం..              వాళ్ళు- “రాజకీయలు చెత్త” అంటే..

నాకు ఓపిక తగ్గో, మరి గడ్డ బలిశోగని – “మీరే చెత్త… మీ అయ్య చెత్త.. మీ తాత చెత్త… మీ కులం.. మీ ఖాందాన్ మొత్తం చెత్త చెత్తా” అని తిట్టేదాక పోయింది..

“మాటల” దగ్గర మొదలైన ఈ యవ్వారం…

మాటలు చాడీలుగా.. చాడీలు వాదనలుగా.. వాదనలు లొల్లులుగా.. లొల్లులు పదాన్ని మించిన బండ బూతులుగా… ఇట్ల క్రమక్రమంగా మారుకుంట వచ్చి ఓ కొత్త “పరిణామ క్రమమే” పుట్టిందీ చీకట్లో..  

అందరి సంగతేందోకని నేనింతగనం రెచ్చిపోడానికి కారణం మాత్రం “మావోళ్లు” నా పక్కసెల్లుల్లొ చేరిన్లనే.. అయితే, నాకెంత మావోళ్ల అండదండ ఉన్నా, చానాసార్లు వేరేటోళ్లు నన్నుకూడ పచ్చిబూతులు తిడ్తనే ఉన్నరు.

చేతుల్తోని కొట్టిన దెబ్బలు జెప్పన్నే మగ్గుతయి కావచ్చుగని, మాటల్తోటి కొట్టిన దెబ్బలు పచ్చిపుండ్లై ఎప్పుడు సలుపుతనే ఉంటయ్..

అవతలున్న రోజుల్ల.. పిడుగులు పడ్డా తెలివిపడనంత సోయిలేకుండ నిద్రపొయ్యేనేను.. ఇప్పుడు మాత్రం చీమ చిటుక్కుమన్నా ఉలిక్కిపడిలేచి కూచునుడైతాంది… ఏ నిమిషంల ఎవలు మీదపడుతరో అని భయం.. వెన్నుల నుంచి వణుకు.. నన్నెవరో తిడుతానట్టూ, నా గోడల్ని బండలతోటి కొడుతనట్టు… గోడలు కూలి నామీదే పడుతానట్టూ పిచ్చిపిచ్చికలలు వచ్చి గజ్జుమని ముడుచుక్కూచుంటాన.. అసలు మనసు మనసుల ఉంటలేదు..

ఇసంటప్పుడే నాకు ధైర్నం మాటలు చెప్పి పక్కకుండాల్సిన మావోళ్ళు, చిత్రంగా నాతోనే మాట్లాడుడు బంజేషి, నా వెనక గుసగుసలు మొదలుపెట్టిన్లు…

“వీడిమధ్య ఉట్టుట్టిగనే గరమైతాండు” అని ఒకడంటే..

“గరం కాదు… గర్ర పెరిగింది వానికి” అని ఇంకోడు…

“గరంలేదు, గర్రలేదు.. పిస్స లేశింది వానికి, అందుకే అట్ల పిస్స పిస్స ఒర్రుతాండు” …

“నాకు మొదాల్నుంచే వాని మోర అంత ఎరికే గనీ.. మీరే నెత్తిల వెట్టుకోని ఊరేగుతాన్లని సప్పుడు జేకుంట ఉన్న..” అని ఇంకొకడెవరో అంటాండంగనే నాకు తిక్క రేగింది…

“ల.. ల్లారా.. మీరెవలుబే నా గురించి అనుటానికి.. ల.. ల్లారా.. మావోళ్ళుగదాని మీ సోపతికస్తే నా నోట్లెనే… ల.. ల్లారా.. అసలు మిమ్ముల మావోళ్లనుకోడం నాదే తప్పు.. ల… మళ్ల నా గురించిగిన ఇంకొక్క మాటిడిశిన్లో..” అని ఇర్గమర్గ దులుపుడు దులిపి జరసేపటికి దమ్మచ్చి ఆగిన…

నా నోరైతె ఆగిందిగని.. మనసు మాత్రం ఆగలే.. ఓదిక్కు మొస ఆడుతలేదు.. గుండె గబగబ కొట్టుకుంటాంది.. కోపంతోటి గోడని గట్టిగ గుద్దిన.. ఏం లాభం, మళ్ల నాకే దెబ్బతాకి నొప్పి లేశే…

పిచ్చి పిచ్చిగా అనిపిస్తోంది.. బొండిగ నరాలు తెగుతయా అన్నంతగా ఒర్రీ ఒర్రీ ఇగో.. ఈ మూలకు కూలవడ్డ… నిశ్శబ్దంగా.. నిస్సహాయంగా..

అగో సరిగ్గ అప్పుడచ్చింది.. ఏడికెళ్లి వచ్చిందో ఎర్కలే గనీ సర్రున వచ్చి నా చెవులల్లకు సూటిగా సొర్రింది..

“నమస్తే భయ్ సాబ్… నేనూ.. డాక్టర్ ని…”

అయితే?

“నేను చాన రోజులసంది నీ మీద నజర్ పెట్టిన…”

ఏమిటికి??

“ఉట్టిగనే.. నువ్వేమనుకోనంటే నీతోటొక ముచ్చట చెప్పాలె భయ్.. ”

నాకెవ్వరు ఏం జెప్పుడద్దు.. చల్..

“నా గురించి కాదు.. నీ గురించే చెప్పాలె”

నా గురించి చెప్పేతందుకు నువ్వెవరయా.. ఔసరంలే.. నా మానాన నన్నిడ్శిపెట్టిపో.. నడూ.. చల్..

నేను వద్దంటున్నా వాడి ఇడ్శిపెట్టేటట్టులేడు… “చెప్పాల్నా.. చెప్పాల్నా..” అని అడుక్కుంటనే ఉన్న ముచ్చట బయటవెట్టిండు –

“నీకు మెల్లమెల్లగ ‘షిజోప్రీనియా’ వస్తాందని నాకు చిన్న అనుమానం కొడ్తాంది భాయ్ సాబ్ ”

ఏందీ???? షీ…. జో.. ప్రీనియానా??? అంటేందీ??

“అంటే.. భయ్యా.. అదీ…. అదీ… నీకు సైకో అంటె ఎర్కే కదా?? అగో.. అట్ల తయారవుడన్నట్టు..”

వాడామాటనంగనే నాకు మళ్ల సర్రుమని పొడుసుకచ్చింది..

“అరె.. భయ్యా.. నా ఉద్దేశంనువ్వు సైకో అనిగాదు.. కాపోతె ఇట్లనే పట్టించుకోపోతే….” అని ఇంకేందో చెప్తాండంగనే వానిమీదికి ఒంటికాలుమీద లేచిన..

సువ్వర్ కే.. నువ్వేరా సైకోగానివి.. మీ అందరికే రోగం ముదిరి, నన్ను అంటాన్లు.. లమిడికొడకా.. పో బే.. పో.. సైకో అట సైకో.. నువ్వే పెద్ద సైకో గానివి.. అసల్ నిన్నీడికి ఎవడ్రమ్మన్నడ్రా??

ఏమనుకున్నడో ఏందోగని సప్పుడుచెయ్యకుండ ఎట్లచ్చినోడు అట్ల ఎళ్ళిపేండు.. వాడు సప్పుడుచెయ్యకుంటేంది, వాడన్న “సైకో” అనే మాటలు ఇంకా నా చెవుల్లో వినపడ్తున్నాయి…

నిజంగ నేను సైకోలెక్క చేస్తున్ననా?? నేన్ శాడిష్టుగాన్నా??

అసలు ఏందిదంతా?? దేనికోసం ఇదంతా?? వాడెవడో అచ్చి నాకు చెప్పుడేంది??

వాడు నన్ను చానరోజులసంది గమనిస్తానా అన్నడు.. అంటే అప్పటికీ ఇప్పటికి నేన్ మారిన్నా??

ఆలోచిస్తే అవుననే అనిపిస్తాంది..

అవుతల ఉన్నప్పుడు నవ్వుకుంట నలుగురిల కలిశే నేను.. ఇయ్యాల ప్రతీ ఒక్కణ్ని విమర్శించుడు, తిట్టుడు.. మాట్లాడ్తె లొల్లి.. కనిపిస్తె కొట్లాట.. మునుపు నేనెట్లుంటి, ఇప్పుడు ఎట్లయినా??

******

అసలు నేను చచ్చిపోయి చాన దినాలైనట్టుంది.. నా పానం పొయ్యిందన్న ముచ్చటే నాకిప్పటిదాకా సమజ్ కాలే చుషిన్లా!!

మస్తు బాధైతుంది.. ఒక్కణ్ణే కూసోని ఏడవాలని ఉంది.. కాదు కాదు నాకు మళ్ల బతకాల్నని ఉంది… బయటికి పోతే బతుకుత కావచ్చు… కానీ ఎట్లపోవాలె? అసలు బయటికి పొయ్యే తొవ్వేది………….!!!!

ఈడ నా చావు నేను చస్తుంటే.. ఎక్కడ్నో ఓ మూలకు ఒకడు వాడు ప్రేమించిన పిల్లను యాదిచేసుకుని కలవరిస్తున్నడు.. ఇంకోచోట ఒకడు సినిమా పాటలు పాడుకుంట పిల్లకూతలు కూస్తాండు.. ఒకడు, బైటికిపేనంక మీ ఓటు మావోనికే గుద్దాల్నని బతిమాల్తాంటె, ఇంకొకడు అదేపనిజెయ్యమని ఎవన్నో బెదిరిస్తాండు.. ఓ దిక్కు కడుప్పలిగేటట్టు కొందరు నవ్వుకుంటాంటే, ఇoకోదిక్కు కష్టాల్ల ఉన్నం కాపాడున్లని కొందరు శోకాలు పెడ్తాన్లు..

ఒక్కో మూలకు ఒక్కోనాత్మ.. ఒక్కో ఆత్మకు ఒక్కో కథ.. ఆశలు, ఆశయాలు… బాధలు, బంధాలు.. కోపం, ప్రేమ.. క్రూరత్వం, కరుణ.. జాలీ, ఆకలీ.. నవ్వులూ, ఏడుపులూ.. చిలిపిసర్సాలు, చిరాకుపడటాలు.. కలలు, కళలూ.. అనుభవాలు, అభిప్రాయాలు… ఆవేశాలు, ఆలోచనలూ.. కొట్లాటలు, కౌగిలింతలు.. ఒకటారెండా దేన్నీ విడిచిపెట్టకుండా ఎవనికి వాడు ఏదనిపిస్తే అది చెప్తనే ఉన్నరు.. ఇయన్నీ నా చెవుల్ల దూరి మనసుల తుఫాను లేపుతున్నయి..      ఈ తుఫాను పేరు అశాంతి..

అందర్ని దొరికిచ్చుకోని కొట్టాల్ననుంది.. దొరికినోన్ని దొరికినట్టు కొరుకబుద్ధైతాంది.. గోర్లతోని గీరి, మీదపడి గిబ్బ గిబ్బ గుద్దబుద్దైతాంది.. నన్ను నేను ఆపుకోవశమైతలేదు కానీ కొడ్దామంటే చేతికందరాయె..

అందుకే నా గొడల్ని నేనే గుద్దుడు మొదలువెట్టిన… చేతులిరిగినయ్.. అయితేంది కాళ్ళున్నయ్ కదా… ఎగిరెగిరి తంతాన… కాళ్ళిరిగి కూలవడ్డ.. అయితేంది నోరున్నదికదా.. కొరుకుడు షురూ చేష్న… పండ్లిరిగి నోరంత నెత్తురు ముద్దైంది… అయితేంది తలకాయున్నదికదా.. నెత్తిని గోడకేశి కొట్టుకున్నా.. పుర్రెకు పొక్కవడి నెత్తురు ధారలు కట్టింది…. ఒళ్ళంత మాంసం ముద్దయింది.. అయినా నా కోపం సల్లార్తలేదు.. పిస్సలేత్తాంది.. ఇక్కడ ఒక్క నిమిషంసుత ఉండబుద్ధైతలేదు… పోవాలె నేనేడికన్న పోవాలె…

*****************

అంతే.. జైలు నుండి పారిపోయి అవుతలికచ్చేశ్న….

ఇక్కడంతా వెలుగే.. చాన రోజులు ఆ చీకట్లో మగ్గినందుకో ఏందోగనీ ఇంత వెలుతుర్ని అస్సల్ చూడ వశమేఐతలేదు..  జరసేపు ఓపికవడ్తె నా కండ్లకు అలవాటయ్యి అంతా మాములుగా ఐపోతదనుకున్నగని అట్లా అయితలేదు..

“నీళ్ళల్ల నుంచి ఒడ్డుకు దూకిన చాప పిల్ల లెక్క ఉంది నా యవ్వారం..”

నా కనురెప్పలు కాలిపోతయన్నంత వెలుతురు..

ఎంత కష్టమైనా తప్పదు కాబట్టి అరచేతుల్ని కండ్లకు అడ్డంపెట్టుకోని మళ్ళీ బ్రతకాడానికి నా తిప్పలేవో నేను పడుడు అలవాటు చేసుకున్న……

కనీ… కనీ.. ఈడ.. కూచున్నా, నిలుచున్నా, పనిలో ఉన్న, పడుకోనున్నా.. ఏ చోటున్నా, ఏం పని చేస్తున్నా.. ఆ జైలూ.. అక్కడి మనుషులే యాదికొస్తున్లు.. ఆ జైల్ల ఊకె ఎప్పుడు ఎవడో ఒకడు ఏదో ఒకటి మాట్లాడ్తుండేది.. కాని ఇక్కడ నేను మందలించినా మాట్లాడేమనిషే కరువైండు…

ఇయన్నీ కానట్టు, నేను జైల్ నుంచి పారిపోయొచ్చానని తెలిసినోళ్లు చానమంది నన్ను మళ్ళి అక్కడికే పొమ్మని.. లొంగిపొమ్మని చెప్తున్నరు..

“భయపడుకుంట బతికేదానికంటే” అదే మంచిదని సలహా ఇస్తున్నరు..

ఇదేమాట ఆ జైలు చీకట్ల ఎవలన్న అనుంటే ఈపాటికి సర్రసర్ర నాలుగు మాటలిడ్సిపెట్టి వాళ్లకు మాట రాకుంట చేశెటోన్ని.. కానీ ఇక్కడ ఈ వెలుతురుల అసల్ నాకు “కూతే” ఎల్తలేదు.. దానిక్కారణం నా అవతారం, నా ఆకారం, నా ఒంటి రంగు, నా చిల్లి కీస.. చీకట్ల ఉన్నప్పుడు వీటినెవడు చూడలేడు కాబట్టి అప్పుడు నాకు మస్తు ధైర్నం ఉండే… కానీ ఈ వెలుతుర్ల నా బతుకు మొత్తం బజార్లో బరివాత కనిపించవట్టె!! ఇంత “చిన్నోన్నని” ఎదురుంగ కనవడ్తనే ఉంటే, ఇంక నన్నెవరన్న కానుతరా ఈడ..!!

అసల్ ఆ చీకట్లనే మంచిగ బతికినట్టున్నకదా??

ఏదన్న పోయినంకనే దాని విలువ ఎర్కైతదంటరు.. నిజమే.. నాకిప్పుడు ఆ చీకటే మంచిగనిపిస్తాంది..

ఆ చీకట్లనే నాకు నచ్చినట్టు నేను బతకచ్చు.. మంచిగ.. గొప్పగా..

“గొప్పగా” అంటె మతికచ్చింది.. నాకున్న గొప్ప పరిచయాలన్నీ ఆన్నే ఉన్నయ్..

అసల్ వాటిని కొసెల్లదియ్యకుంట మధ్యల్నే ఇడ్శిపెట్టొచ్చి మస్తు పెద్ద తప్పు చేశ్న!!! అరెరే.. ఎంత పెద్ద పొరపాటయిపాయె..! ఈ ఆలోచన పుట్టుడే ఆలిశం గబగబ బయలెల్లి మళ్ల ఈ చీకటి జైలుకు లొంగిపోయిన..

ఈసారి మాత్రం మొదాలచ్చినప్పుడు ఉన్నన్ని అనుమానాలు, భయాలూ లేవు… ఎంత జైలైనాగాని బాగా అలవాటైన జాగ కదా!! నా సెల్లులకు అడుగెయ్యంగనే “ఇంట్లకు” వచ్చినట్టే ఉంది….

మస్తు ఖుషీల అందర్ని ఓసారి మందలిద్దామని – “ఏమాయ్..అంత మంచేనా.. నీను మళ్లచ్చిన గాదుల్లా..” అని అందరికి వినపడేతట్టు గాట్టిగ కీకేశిన..

కని ఎవ్వలు జవాబియ్యలే…

అరే!! ఇనిపియ్యలేదా ఏందని.. “నేను మళ్లచ్చిన్నే..” అని ఈసారింకింత గట్టిగ కీకేశిన..

మళ్ల గంతే…. జవాబులేదు..

అసల్ ఈడ మొత్తం అందరు నాకోసం చూస్కుంట కూసోనుంటరు, నేన్ అచ్చుడుతోటే-

“ఎమాయెనే, ఎట్లున్నవ్, ఏడికిబోతివి, అంత మంచేనా, నువ్వు లేకపోతె అస్సల్ పొద్దుగడవలే, దినాము నువ్వే మతికచ్చినవ్” అనిచెప్పుకుంట నాకు మొసమర్రకుంట జేత్తరనుకున్నగనీ.. ఈడ సూత్తె అసలు ఒక్కడుసుత నా రాకను, కీకను పట్టించుకోకుండ మళ్ల గదే ఎవని ముచ్చట్ల వాడున్నడు..

“ఇదేంది ఇట్లైందను”కుంటున్నంతల ఎవరో ఒకలు-

” యేడికి పేనవని మళ్లచ్చినా అంటున్నవ్??” అని పుర్సతుగ అడిగిండు..

ఇదేంది!! గిట్లంటుండు?? అసల్ ఇన్నిరోజులు నీనిక్కడ లేనన్న సంగతే వీళ్లకు ఏర్పాటుపడలేదా!! అంటే నేన్ సచ్చిన్నా బతికిన్నా కూడా వీళ్ళకు పెద్ద ఫరఖు పడేదేం లేదన్నట్టేగదా అర్థం!! ఈ గాడిదికొడుకుల కోసమనే నేన్ వెనుకకు మర్రచ్చింది??

ఇంక లాభం లేదు.. ఏదన్నొకటి చేసి మళ్ళ అందరు నన్ను పట్టించుకునేటట్టు చేస్కోవాలె.. అందరు నేనంటే పడి సచ్చిపోవాలె…. నన్ను జబ్బలమీదికెత్తుకోని జై కొట్టాలె.. ఏం జెయ్యాలె.. దానికోసం నేనేంజెయ్యాలె..

ఠక్కున ఒక ఉపాయం తట్టింది.. ” పెద్దోళ్ళ”తోటి నాకున్న పాత పరిచయాలను మళ్ల పెద్దగ చెయ్యాలె.. గంతే.. గా ఒక్క పని చేస్తె చాలు… చేత్తెసాలు.. కిస్సా ఖతమైనట్టే.. పెద్దోళ్ల పరిచయాలు మనల్నిసుత పెద్దోళ్లలెక్కనే సూపెడ్తయిఅన్నదే ఇండ్ల సూత్రం..

ఒక్క నిమిషం ఆలిశం చెయ్యకుండా పెద్దోళ్లందరినీ వరుసబెట్టి -“నమస్తే అన్నా.. ఎట్లున్నవే.. చాన రోజులైంది మాట్లాడి.. పురాగ సప్పుడుజేత్తలెవ్వేందన్నా.. ఈ మద్య అసల్ నాతోని మాట్లాడ్తనే లెవ్వు.. అంతేలే అన్నా మేమెందుకు యాదికుంటం..?? అదన్నా.. ఇదన్నా…” అనుకుంట దొర్కిన ప్రతీ ఒక్కన్ని పేరుపేరున పలకరించిన…

కనీ ఈడ సుత నన్నొక్కడూ గుర్తుపట్టలే..

వాళ్లతోని ఇంకింత చనువుగ మాట్లాడ్తెనన్న మతికొస్త కావచ్చునని ఆ ప్రయత్నమూ చేశినకనీ ఈసారి బూతులు తిట్టించుకునేదాకా వచ్చిందీ.. ఏం చేసినా వాళ్లు నన్ను అస్సల్ గుర్తే పడ్తలేరు..

పుండుమీద కారం చల్లినట్టు, పాత దోస్తులు కొందరు నా ఈ చిల్లర చాష్టలన్ని గమనిస్తూ చాటుగా నవ్వుకునుడు వినపడ్తాంది.. పెద్దపరిచాయాలు నన్నుసుత పెద్దగ చేస్తయనుకున్నగనీ, ఇట్ల చిన్నబుచ్చుకునేటట్టు చేస్తరనుకోలే… వాళ్లు చూసే చిన్నచూపుకు నాది నాకు మళ్ల చిన్నగా అవుపిస్తున్న.. ఇంత విశాలమైన విశ్వంల నేనో గడ్డిపొరకను.. ఈడ నేనున్నా లేకున్నా ఎవ్వనికివట్టదు..

అసల్ ఏ తప్పు చెయ్యని నన్నీడ బందీగ పెట్టుడే కాకుంట, మళ్ల నాకు కొత్త కొత్త అలవాట్లు నేర్పించి వాటికి బానిసను చేస్తిరి.. వెలుగుల పుట్టి పెరిగిన నన్ను ఆ వెలుతురంటేనే బెదురుకసచ్చేటట్టు మారిస్తిరి… నన్నెటుకాకుండ చేశి “త్రిశంకు స్వర్గంల” కూసోబెట్టిన మీరె మళ్ల నన్ను దూరంగొట్టి పగోని లెక్క సూడవడ్తిరి.. గింత అన్నాలముంటదా ఏణ్నన్న??? మనిషులన్నంక కొద్దిగన్న నియ్యత్ ఉండద్దా..

ఇయన్ని మతికచ్చి గుండె చెరువైతాంది, కండ్లు బరువయితానయ్..

ఊకోమ్మన్ని ఓదార్చటానికి పక్కకు ఓ భుజం లేదు.. అయ్యో పాపం అన్న నోరే కానొస్తలేదు..

ఏడవాల్నని ఉన్నా ఏడుపురాకుంటే.. ఆ నొప్పంతా మనస్సులనే పెట్టుకోని, బాధను పంటికింద ఒత్తిపట్టి, కన్నీళ్ళను కండ్లల్లనే బలిమీటికి దాచిపెడ్తే అప్పుడు మన కoడ్లుగుంజినట్టయ్యి ఒక భయంకరమైన బాధ ఐతది చూడు…. అగో, అచ్చం గసొంటి బాధే ఇప్పుడు నా పెయ్యి చుట్టుత కమ్మింది..

పెయ్యంత బాధే.. దీన్ని ఓర్చుకునుడు నాతోని కాదు.. అబ్బా… వశపడనంత నొప్పి…

“వావ్వో.. ఎవలన్న రాండ్లి.. బాంచెన్… కాపాడున్లి.. మీకు పున్నెముంటది.. జెప్పనరాండ్లి బాంచెన్… కాపాడున్లి.. కాపాడున్లి..” అని కలవరిస్తాంటే.. చప్పున తెలివివడ్డది.. ఉలిక్కిపడి లేసి కూసున్నా.. చుట్టూత గదే చీకటి..

అంటే నేను జైలునుంచి పారిపోకట, మళ్ళ రాకట ఇదంత కలల్నా!!!

*****************

ఇప్పుడా డాక్టర్ తోని ఒక్కపారి మాట్లాడ్తె మంచిగుండనినిపిస్తాంది.. “కానీ ఏ మొఖం పెట్టుకోని మాట్లాడ్త! ఆయినెను సుత తిట్టినగదా..” నేనింట్ల అనుకుంటానంతట్లనే మళ్ల అదే గొంతు సర్రున నా చెవుల్లకు సొర్రింది…..

“నాతోటి మాట్లాడుటానికి గంత సోచాయించవడ్తివేందే?” అని నవ్వుకుంట అన్నడు…

అగ్గో!! అసల్ నేన్ నిన్నే యాది జేస్కుoటాన అని నీకెట్ల ఎర్కయిందయ్యా??

“నాకన్ని ఎర్కైతయ్.. నువ్వు నాతోని ముచ్చట పెడ్తా అనుకున్నవ్గదా.. అందుకే అచ్చిన..”

ముచ్చటంటె ముచ్చట కాదుగనీ.. నేను గుణుగుడు పెట్టిన..

“”అవుతలికిపోవుడు” మీద మనసుగొట్టుకుంటందా??”

అంటే.. అదీ.. బయటికి పోదామని మా ఉన్నదిగనీ… పోతె ఆడ బతుకలేనని భయం సొచ్చిందే…

“ఇప్పుడు నువ్వు బతికే ఉన్నా అనుకుంటున్నవా ఏంది?? సచ్చే ఉంటివిగదా.. ఇంక మళ్ల సస్తా అన్న భయమేమిటికి?? బేఫిఖర్ బయటికిపో..”

ఈనెకు నా బాధ అర్థంకాలేదని.. నాకచ్చిన కల మొత్తం చెప్పిన….. ఆయినె కల మొత్తం విని….

“అచ్చా ఒక్కటి చెప్పు.. కలలో బయటికిపెయ్యచ్చినవ్ కదా..”

ఆ..

“నువ్వు వెనక్కు మర్రచ్చింది ఆ వెలుతురు తట్టుకోలేకనా?? ఈ జైలు యాదిమర్చిపోలేకనా???

నేను ఆలోచనలవడి ఖామోష్ అయిన.. ఆయినె మళ్ళడిగిండు-

“నువ్వు వెనక్కు మర్రచ్చింది ఆ వెలుతురు తట్టుకోలేకనా?? ఈ జైలు యాదిమర్చిపోలేకనా???

రెండూ.. నేనన్న…

“లేద్ లేదు.. దేంది దానికే ఉంటదిగని రెండెట్లైతయి.. ఐతే చిత్తు?? లేకుంటె బొత్తు?? ఏదన్నొక్కటె ఉంటది… చిత్తా, బొత్తా అన్నది నీకే తెల్వాలె..”

ఆయినె తర్కానికి ఈసారి బేహోషైనంత పనైంది.. నేన్ ఆలోచన్లవడ్డ!!

ఇంతల మళ్ళ ఆయినే-

“సరే.. నీ జవాబు చిత్తేగానియ్, బొత్తేగానియ్.. ఆటల గెల్వాల్సింది మాత్రం నువ్వే అని యాదికిపెట్టుకో సాలు..”

బయటికి పోతె గెలుస్తా అని మాగనిపిస్తాందికని బయటోళ్ళు నన్ను దేకనుకూడ దేకరనే నా బాధ.. అని నాకున్న అసలు సమస్య చెప్పేశ్న….

అప్పుడు ఆయినె చిరునవ్వు నవ్వుకుంట-

“అందుకే గాంధి తాత ఓ మాట చెప్పిండు – Be the Change that You Wish To See in the World అని”…

అంటే??

వాళ్ళు ఎట్లుండాల్నని నువ్వు ఆశపడ్తానవో.. నువ్వే అట్ల మారుమని..

వాళ్లు నిన్ను నిన్నుగా మెచ్చుడనేది నీ చేతుల్ల లేకపోవచ్చు కనీ… వాళ్లను వాళ్లుగా ప్రేమించడనేది నీ చేతుల్లనే ఉందికదా… వాళ్ళు నిన్ను కలుపుకోకపోతె ఏంది, నువ్వే పొయ్యి వాళ్లతోని కలువు..

చీకటిపోగొట్టేతందుకు సూర్యుడినే పట్టుకరావల్సినపనిలేదు.. చిన్న దీపం ముట్టించినా సాలు…”

ఈ మాటలిన్న మరుక్షణం..

నాకున్న ప్రశ్నలన్నీటికి ఇన్నాళ్లకు జవాబు దొరికిందనిపించింది.. అందుకే ఒక్కసారిగ ‘అశాంతి’ తుఫాను విచ్చుకపొయ్యి మనసంత ప్రశాంతంగయ్యింది.. మనసింత నిమ్మలంగుండి ఎన్ని రోజులైందసలు!!

ఒక్క ముక్కల జిందగి మొత్తం సముజాయించిండు డాక్టర్ సాబ్.. ఆయిన్ను గట్టిగ కౌగిలించుకోని “షుక్రియా భాయ్ సాబ్” అనాల్నని ఉన్నదికని ఆయినె లేడు.. ఎళ్లిపేండు….

పొయ్యేటోడు ఉట్టిగ పోకుంట… నా కోపం, దుఃఖం, బాధలు, భయాలు, గుబులు, దిగులు మొత్తం అన్నీట్నీ తనతోటే కొంటవోయిండు.. పోంగ పోంగ ఒక్కటి మాత్రం నాకోసం ఇడిశిపెట్టి పోయిండు.. అది మిణుగురుపురుగు లెక్క మిణుకు మిణుకు మంటాంది. దాని వెలుగు కొద్ది కొద్దిగ పెద్దగ అవుతూ నా దగ్గరికి.. నా లోపటికే వస్తాంది..

సొచ్చమైన మా అవ్వ ప్రేమలాగా..

నాయిన్ను చూస్తే కలిగే కొండంత ధైర్నంలాగా..

నాకో భుజాన్నిచ్చి ఎంబడుండే మా అన్న తోడులాగా…

నన్ను నన్నుగా చూశే నా దోస్తుల సోపతిలాగా…. అచ్చంగ నాకోసమే వచ్చిందా వెలుగు…..

అప్పుడే విచ్చుకున్న పువ్వులాగా.. పసి పాప బోసినవ్వులాగా ఎంత అందంగున్నదా వెలుతురు.!

తృప్తిగ కండ్లుమూసుకుంటే నా లోపట కూడ అదే వెలుగు వెలుగుతాంది..

“పానం” ఎట్లుంటదనే నా అనుమానం ఇప్పుడు తీరింది..

“వెలుగే పానం”..

ఆ వెలుగుల, నా కొట్టానికోకొసకున్న జైలు తలుపులు.. బయటికి నడిచే తొవ్వ కనిపిస్తున్నయి..

మెల్లగా అటుదిక్కు నడిచి తలుపులు తెరిచి, అవుతలికి అడుగుపెట్టాను……

                                                  

“Your Facebook Account Has Been Deactivated….. Successfully…..”

 

నేనిప్పుడు మళ్లీ పుట్టిన.. నాకిప్పుడు ఓ బతుకుంది……….

 

-అల్లం కృష్ణ వంశీ