గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్- 7

ఆన్ ప్రార్థన

ఆన్ ని నిద్రపోయేందుకు తీసుకువెళ్ళింది మెరిల్లా.
” ఇదిగో చూడు, నిన్న రాత్రి నువ్వు నైట్ గౌన్ వేసుకుంటూ విప్పిన బట్టలన్నీ చిందరవందరగా పడేశావు. అది అస్సలు మంచి అలవాటు కాదు, నేను ఊరుకోను ”
” అయ్యో…అవునా ? రాత్రి నా బాధలో ఏమీ పట్టించుకోలేదండీ. ఇంకనుంచీ అన్నీ శుభ్రంగా మడత పెట్టి కుర్చీలో సర్దేస్తాను. అనాథాశ్రమం లో అలాగే చేయించేవారు…కాకపోతే కొన్నిసార్లు మర్చిపోతుండేదాన్ని, తొందరగా పక్క ఎక్కి ఏదైనా మంచి సంగతి ఊహించుకోవాలనే హడావిడిలో ”
” ఇక్కడ అలా కుదరదు. సరే, ప్రార్థన చేసుకుని నిద్రపో ఇంక ”
” నాకే ప్రార్థనలూ రావు ” ఆన్ ప్రకటించింది.
మెరిల్లాకి కంగారు పుట్టింది.
” అదేమిటీ ? నీకు దేవుడికి దణ్ణం పెట్టుకోవటం నేర్పలేదూ అక్కడ ? చిన్న పిల్లలు తప్పనిసరిగా రోజూ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి …దేవుడంటే ఎవరో తెలీదా నీకు , కొంపదీసి ? ”
” దేవుడు అనగా అనాదిఅయి న, అనంతమైన, అవ్యయమైన శక్తి. ఆయన మంచితనమునకు, సత్యమునకు, జ్ఞానమునకు, పవిత్రతకు నిలయమైనవాడు ” ఆన్ వల్లించింది.
మెరిల్లా ఊపిరి పీల్చుకుంది. ” అమ్మయ్య ! నీకు కొద్దో గొప్పో తెలుసు – మరీ ఏబ్రాసిదానివి కాదు. ఎక్కడ నేర్చుకున్నావు ఇది ?”
” ఆదివారం చర్చ్ లో. పవిత్రగ్రంథం లో ప్రశ్నలూ జవాబులూ కంఠస్తం చేయించేవారుగా. నాకు ఆ పదాలు పలకటం బావుండేది- ‘ అనాది, అనంతం, అవ్యయం…పాటలో మాటల్లాగా లేవూ ? అంటే అది పూర్తిగా కవిత్వం కాదనుకోండీ..”
” ఇప్పుడు కవిత్వం సంగతి అవసరమా ? రోజూ రాత్రి ప్రార్థన చేసుకోనివాళ్ళు ఖచ్చితంగా చెడ్డపిల్ల లే…నువ్వూ అలాంటిదానివేనా ఏమిటి ? ”
” నాలాగా ఇలా ఎర్ర జుట్టు ఉన్నవాళ్ళు చెడ్డగానే ఉంటుంటారు ” ఆన్ ఖిన్నురాలైపోయింది ..” దేవుడు కావాలనే నాకు ఎర్ర జుట్టు పెట్టాడట- థామస్ చెప్పాడు నాకు. అప్పట్నుంచీ దేవుణ్ణి పట్టించుకోవటం మానేశాను. అయినా – రోజంతా పిల్లల్ని ఆడించి బొత్తిగా అలిసిపోయాకగానీ నన్ను నిద్రపోనిచ్చేవాళ్ళు కాదు. అప్పుడింక ప్రార్థన చేసే ఓపికెక్కడుంటుంది చెప్పండి ? ”
ఆన్ కి మతశిక్షణ ని తక్షణమే మొదలుపెట్టాలనీ ఎంతమాత్రం ఆలస్యం చేసేందుకు లేదనీ మెరిల్లా గ్రహించింది.
” ఈ ఇంటి కప్పుకింద నువ్వు ఉన్నంత కాలమూ ప్రార్థన చేసి తీరాలి ” – నిష్కర్ష గా చెప్పేసింది.
” మీరు చెయ్యమంటే ఎందుకు చెయ్యను ? తప్పకుండా చేస్తాను. ఈ ఒక్కసారికీ ఎలా చెప్పాలో చెప్పండి. రాత్రికి ఊహించుకుంటాను, మంచి అందమైన ప్రార్థన ని, రోజూ చేసుకుందుకు ”
” ముందు మోకాళ్ళ మీద కూర్చో ” – ఆ సంగతి కూడా చెప్పాల్సివస్తున్నందుకు మెరిల్లా ఇబ్బందిపడింది.
మోకాళ్ళ మీద కూర్చున్న మెరిల్లాకి ఎదురుగా ఆన్ తనూ మోకరిల్లి గంభీరంగా మొహం పెట్టింది.

Mythili1
” అసలు ప్రార్థన ఇలాగే ఎందుకు చెయ్యాలో ? నేనైతే ఎలా చేస్తానో చెప్పనా – పె..ద్ద విశాలమైన పొలం లోకో, లేకపోతే దట్ట..మైన అడవి లోపల్లోపలికో- వెళ్ళి, తల పై..పై..కి ఎత్తి- అంతులేని ఆకాశపు నీలిరంగుని చూస్తూ – అప్పుడు, ప్రార్థన దానంతట అదే వచ్చేస్తుంది. సరే, నేను సిద్ధం- చెప్పండి ఏం చెప్పాలో ? ‘’
మెరిల్లా ఇంకా ఇబ్బంది పడిపోయింది. బాగా చిన్నపిల్లలు చెప్పుకునే ” నన్ను నిద్రింపనీ దేవా ” నేర్పుదామనుకుంది ముందు. కాని , తల్లి ఒళ్ళోంచి భద్రంగా పక్కమీదికి దొర్లే పాపాయిల ప్రార్థన అది – ఈ పిల్లరాకాసికి తగదనిపించింది ఆమెకి. ఆ పైనున్న దేవుడి ప్రేమ గురించి ఆన్ కి ఏమీ తెలీదు, ఏ లెక్కా జమా లేదు…ఎందుకంటే మనుషుల ఆప్యాయత రూపం లో దాన్ని ఆమె పొందలేదు కనుక – ఈ సంగతి మెరిల్లాకి అర్థమైంది. … ” నీ అంతట నువ్వు ప్రార్థన చేసుకునే వయసు వచ్చింది నీకు. దొరికిన వాటికోసం దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుని, ఇంకేం కావాలనుకుంటున్నావో వినయం గా అడుగు, చాలు ”
” సరే. నాకు వచ్చినట్లు చెప్తాను అయితే ” – మెరిల్లా ఒళ్ళో చెక్కిలి అనించుకుని అంది ఆన్. ” పరలోకమందున్న మా ఘనమైన తండ్రీ ”… తలెత్తి , ” చర్చ్ లో ఇలాగే కదా చెబుతారు, ఇంట్లోనూ అలాగే అనచ్చా ? ” అడిగి, జవాబుకోసం చూడకుండా కొనసాగించింది.

Mythili2
” పరలోకమందున్న మా ఘనమైన తండ్రీ ! ఆహ్లాద శ్వేత మార్గాన్నీ, ప్రకాశమాన సరోవరాన్నీ, బోనీ [ జెరేనియం ] నీ[ చెర్రీ చెట్టు ] హిమరాణినీ – నాకు ఇచ్చినందుకు అనేకానేక ధన్యవాదాలు. నిజంగా నేను ఎంతో కృతజ్ఞురాలిని. ఇకపోతే, నాకు కావల్సినవి చాలా చాలా ఉన్నాయి , ఇప్పుడే అన్నీ అడిగెయ్యలేను, . రెండు ముఖ్యమైనవి మాత్రం అడుగుతున్నాను- ఒకటి- నన్ను గ్రీన్ గేబుల్స్ లో ఉండిపోనియ్యాలి . రెండు – నేను పెద్దయాక అందంగా అయిపోవాలి. ఇప్పటికి ఇంతే- ఇట్లు మీ విధేయురాలు, ఆన్ షిర్లే. ”
లేచి నిల్చుంటూ ఆత్రంగా అడిగింది-” బాగా చెప్పానా ? ఇంకొంచెం తీరిగ్గా ఆలోచిస్తే చక్కటి మాటలు వచ్చి ఉండేవి ..”
ఆన్ చేత ఆ అసాధారణమైన ప్రార్థన చేయించింది అజ్ఞానమే గానీ దేవుడి పట్ల ఆమె కి అమర్యాదేమీ లేదని గట్టిగా గుర్తుచేసుకుంది గనుక, మెరిల్లా తేరుకుంది. ఆన్ ని పడుకోబెట్టి దుప్పటి కప్పి కొవ్వొత్తి తీసుకుని వెళ్ళబోతూ ఉంది….వెనక నుంచి ఆన్ పిలిచింది.
” ఇప్పుడే గుర్తొచ్చిందండీ…మీ విధేయురాలు అనే చోట ఆమెన్ అని ఉండాలేమో కదా ? చర్చ్ లో అలాగే అంటారు…ఇందాక మర్చిపోయాను. ప్రార్థన ఎలాగోలా పూర్తిచెయ్యాలి గదా అని, ఉత్తరాలు రాసేప్పుడు లాగా అన్నాను- ఏం పర్వాలేదంటారా ? ”
” ఆ.పర్వాలేదులే. ఇంక నిద్రపో, మంచి పిల్లలాగా. గుడ్ నైట్ ”
”నిన్న చెప్పబుద్ధి కాలేదు… ఇవాళ మటుకు మనస్ఫూర్తిగా గుడ్ నైట్ చెబుతున్నా…” – ఆన్ సుఖంగా దుప్పటి ముసుగుపెట్టుకుంది.
మెరిల్లా వంటింట్లోకి వెళ్ళి కొ వ్వొ త్తిని బల్లమీద పెడుతూంటే మాథ్యూ అక్కడే ఉన్నాడు.
” ఇది విన్నావా మాథ్యూ కుత్ బర్ట్ ? ఈ పిల్లకి తక్షణం మతవిజ్ఞానం ఇవ్వాలి. ఏనాడూ సరిగ్గా ప్రార్థనే చెయ్యలేదట …ఎంత ఘోరమో ! కావల్సిన పుస్తకాలన్నిటినీ రేపు పాస్టర్ ఇంటినుంచి పురమాయిస్తాను…రోజూ నూరిపోస్తేగాని లాభం లేదు. ఆదివారం చర్చ్ కి పంపితే ఇంకా నేర్చుకుంటుంది ..కాని చర్చ్ కి మంచిబట్టలు వేసుకోవాలి కదా , దీనికేమో సరైనవి లేవు…త్వర త్వరగా కుట్టించాలి. నాకిప్పట్లో తీరికన్నది ఉండదనిపిస్తోంది. ఇన్నాళ్ళూ తేలిగ్గా గడిచింది నా జీవితం, ఇప్పుడు నేనేం చెయ్యగలనో పరీక్ష పెట్టినట్లుంది . కానీలే, కష్టపడద్దూ మరి, లేకపోతే ఎంత అప్రతిష్ఠా..బరువు నెత్తికెత్తుకున్నామాయె ! ”
మాథ్యూ చిద్విలాసంగా చూస్తుండిపోయాడు.
[ ఇంకా ఉంది ]

మీ మాటలు

  1. అనువాదమైనా, మీకే సాధ్యమైన శైలిలో చాలా బాగా రాస్తున్నారు మైథిలి గారూ! అభినందనలు!

  2. Mythili abbaraju says:

    ధన్యవాదాలండీ :)

  3. Kuppili Padma says:

    మైథిలి గారు, యెంత చక్కని చిక్కని సహజమైన అచ్చమైన రచన. Thank You.

  4. :) వావ్ , హాయిగా సాగుతోంది :) ‘ వచ్చే గురువారం త్వరగా వచ్చేస్తే బాగుణ్ణు ‘ !!

  5. subbalakshmi says:

    అనువాదంలాలేదు. స్వతంత్ర రచనలా చక్కని తెలుగు. మాలతీచందూర్ గారి లా రాస్తున్నారు

  6. Mythili abbaraju says:

    ధన్యవాదాలు సుబ్బలక్ష్మి గారూ !

  7. umaravi neelarambam says:

    శైలి అద్భుతం! ఉత్కంఠ అమోఘం! చిన్నపిల్లలం అయిపోతున్నాం మళ్ళీ! ఎదురు చూడ్డం చాలా కష్టంగా ఉంటోంది.

  8. పనుల వత్తిడి వల్ల 8 వ భాగం లో ఆగిపొయాను. ఇప్పుడు నా చేతిలో 12 భాగాలు…ఎంత ఆనందంగా ఉందొ !! :)

మీ మాటలు

*