అవును నిజమే… స్వప్నమే కావాలి!

 

 శివలెంక రాజేశ్వరీదేవి  రాసిన కవితల పుస్తకం “సత్యం వద్దు స్వప్నం కావాలి” ప్రచురణని గురించిన వార్త  కనిపించిన ప్రతి సారి తప్పకుండ ఆ బుక్ చదివి తీరాలన్న కోరిక బలం గా పాతుకుంది. అలాగే సాయంకాలపు వడగాలుల్ని మహా నగరపు దూరాభారాల్నీ దాటి తార్నాక నుండి  అబిడ్స్ లోని  గోల్డెన్ థ్రెషోల్డ్ లో అడుగు పెట్టి బుక్ కొన్న తర్వాత గానీ ఆ లోలోపలి అశాంతి తగ్గలేదు. ఏదో అపురూపమైంది చదవడానికి దొరుకుతుందన్న నమ్మకం.  అప్పటికి అక్కడ వీర లక్ష్మి గారి ఉపన్యాసం వినిపిస్తోంది. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి ఉపన్యాసం ముగిసిందీ. అక్కడి వక్తల ప్రసంగాలేవీ చెవికెక్కలేదు. అప్పటికి ఒక పాతిక పుస్తకాల దాకా సేల్ అయినట్టున్నాయి. తెలిసిన వారందరికి హెల్లోలూ హాయ్ లు చెప్పేసి ఇంటికి వచ్చేసి, డిన్నరయ్యాక, స్థిమితంగా వెనక పరిచయాల వివరణల నుంచీ మొదలు పెట్టాను చదవడం. ముట్టుకుంటే చిట్లిపోతుందేమో అనిపించే గాజు బొమ్మ, రాత్రిని పగలు గా పగటిని రాత్రిగా మలుచుకున్న స్వాప్నిక, ప్రేమార్త హృదయం – ఇవీ అందులో అందరూ కామన్ గా రాజేశ్వరి గురించి ఉదహరించిన విశ్లేషణలు. మొదటి కవిత “ఊరికెనే” చదవడం మొదలు పెట్టాను.

 

ఎంతో మామూలుగా సామాన్య ధోరణిలో తేలికగా ఉపయోగించే పదం అది. చిన్న సంభాషణా పూర్వక దృశ్యాన్ని ఆవిష్కరించిన కవిత అది. వాక్యం తర్వాత వాక్యం చదివే సరికి, నా చుట్టూ ప్రపంచపు కోటి గొంతులు ప్రతిధ్వనించాయి. ప్రతి వాక్యమూ ప్రపంచపు కఠినత్వపు ధోరణి, మూగగా స్పందించే కవితాత్మక సుకుమారత్వమూ, కొంత బేలతనమూ, ఒక హృదయపు కోమలత్వమూ సాక్షాత్కరించాయి. మొదటి కవిత చదవడం పూర్తయ్యే సరికి, తెలియని గుండె భారం కళ్ళకు కమ్మి, పేజీలని ముందుకు కదలనివ్వలేదు.
 
ఈ కవితకి యే వ్యాఖ్యానమూ అక్కరలేదు. ప్రపంచపు పోకడలకీ కవయిత్రి పసి మనసుకి జరిగిన సంవాదమిది. అతి సులభంగా ప్రతి సున్నిత హృదయమూ తనని తాను చూసుకునే అద్దం. అందుకే యే వివరణ ఇవ్వకుండా – సూటిగా కవితనే ఇక్కడ పొందు పరుస్తున్నాను. అద్దం లో నెలవంక శీర్షికని తిరిగి మొదలు పెడదామని గత మూడు నెలలుగా చాలా ప్రయత్నిస్తున్నాను. రఫ్ స్కెచెస్ రాసుకున్న కవితలున్నాయి. కానీ తనను తాను గా ప్రవహింప చేసుకున్న చిక్కని భావాన్ని, తేట దనపు ప్రవాహాన్నీ ఒకే చోట చూసిన యీ కవిత చదవాక యీ కవితా సంపుటి గురించి తప్పక రాయాలి అనిపించింది. పరిమళానికి చిరునామాలు అవసరం లేదు. వ్యాపించడమే దాని పని. రాజేశ్వరి పరుచుకుంటూ వెళ్ళీన అక్షరాల వెంటా మన కళ్ళు పరుగెత్తిస్తే చాలు, అనేక అమూర్త భావాల మల్లెల పారిజాతాల పరిచయాలవుతాయి, నైట్ క్వీన్ డాఫోడిల్స్ ఆమె వెన్నెల ఏకాంతాల రహదారుల్లో సాక్షాత్కరిస్తాయి. వేదనా భరితమైనా, ఏకాంతమే స్వాంతన ఆ కవితాత్మక మూర్తికి!  ఆలస్యం గా నైనా ఆమె కవితలు ఇలా ఒక సంకలనంగా చదువరుల చేతికి అందించిన విషయమై  తెలుగు కవితాత్మక ప్రేమికులు నామాడి శ్రీధర్ గారికి ఋణపడివుంటారు!
 
అక్షరాల నిండా పరుచుకున్న రాజేశ్వరీదేవి వేదనాత్మక ప్రణయ పూరిత భావాల గాలుల్ని మనస్ఫూర్తిగా శ్వాసించిన మనసులన్నీ  ఆమెతో యీ విషయంలో ఏకీభవిస్తాయి…
  అవును నిజమే… సత్యం వద్దు, స్వప్నమే కావాలి!

 
“ఊరికేనే”

 
కవితా సంకలనం: సత్యం వద్దు స్వప్నమే కావాలి
కవయిత్రి: శివలెంక రాజేశ్వరీదేవి
ఎందుకలా వర్షం లో
డాబా మీదకి వెళతావ్ పాపా?
“ఊరికేనే”
ఎందుకలా పని ఆపేసి
పాట వింటావ్ పాపా
“ఊరికేనే”
ఎందుకనవసరంగా
వాళ్ళ దిగులు నీకు పాపా
“ఊరికేనే”
ఎందుకా టెలిఫోన్ టాక్ పాపా
“ఊరికేనే ఆ స్వరం తీయగా వుంటేను”
ఇక్కడ ఆగి అక్కడ ఆగి పనేమైనా వుందా?
“ఊరికెనే, పనేం లేదూ పలకరించి పోదామని”
ఇదిగో ఇదే చెపుతున్నా గుర్తుంచుకో పాపాయ్
పనేం లేకపోతే
ఊరికేనే పలుకరించకూడదు ఎవరినీ-
ఆ అలా చూడకు నా కళ్ళలోకి “ఊరికేనే”
అదో ప్రశ్నార్థకమై నన్ను భయపెడుతుంది
***

అంతా కాల కోలాహలమే!

 

-జయశ్రీ నాయుడు

~

 

తన సిరాను తనే తయారు చేసుకుని

జీవితపు కాగితాల మీదకు వొంపుతుంది

వ్యక్తి వాదమై జీవిస్తుంది

ప్రతి కలమూ కాలమే అయినా

సిరాల రంగులు రాతల రీతులూ వేరు వేరవుతాయి

రీతులన్నీ పరుగులు తీస్తూ

కొన్ని దారులు చేస్తాయి

ఇక మాటల గోదారి ఉరకలేస్తుంది

మాగాణి పైరులా పచ్చని బంధాలు

కొన్ని కోతల కరుకు గరుకు గళాలు

మరి కొన్ని అంతా కాల కోలాహలమే

బిందువులా జాలువారుతూ

అక్షరాల గళం లా కాగితం పై పరుచుకుంటు

జీవిత సేద్యం చేస్తావు

దెన్ హాపెన్స్

ది కాల్ బాక్

కొత్త కలాన్ని సిద్ధం చేసిందేమొ

పెన్ డౌన్ చేసి

ప్రపంచానికి శెలవు ఇవ్వమంటుంది

ఇంకి పోయిన సిరాని

తిరిగి కలం లోకి ఇంజెక్ట్ చెయ్యలేక

జ్ఞాపకాలైన అక్షరాల్నే చదువుకుంటూ

వ్యక్తి గా నిలబడే రూపాన్ని

మనసు మీద ప్రతి పూట కొత్తగా చిత్రించుకోవడం ఇదే…

మా ఆలోచనల కాన్వాస్ లకు

నువ్వు అరువిచ్చిన మేల్కొలుపు

ది మ్యూజిక్ నెవర్ డైస్!

*

ఒక్కో క్షణాన్నీ ఈదుతూ…

 

– జయశ్రీ నాయుడు
~

jayasri

 

 

 

 

 

చిక్కటి చీకటిని జోలపాటల్లో కలుపుతూ
ఒక వల తనను తాను పేనుకుంటుంది
అడుగులు ఆనని భూమిలోతుల్ని పరుచుకుంటూ
ఒక సముద్రం ఆరంభం
చుక్కల్లా మినుకుమనే అలల నీడలు
ఆ వెలుగులో కొన్న్ని ధైర్యాల క్రీడలు
పంటి బిగువున లోలోని వాదాల తుఫాన్లు కుదిపేస్తున్న
ఒక్కో క్షణాన్నీ ఈదుతూ ఓ ఈత ఆరంభం
తెలియనితనాల్లా దాటిపోతున్న నావలు
ఏది నాదో తెలియని సమయాలు
ఏ తెరచాప నీడ ఓ స్థిమితపు కునుకు దాచుకుందొ
ఎవరూ చెప్పలేని అవిశ్రాంత ప్రయాణం ఆరంభం
అంతం వెతకని ఆరంభాలే జీవించడం నేర్పేది
నావ కాదు ఈతే గమ్యం
చెళ్ళుమని వెన్ను చరిచే అలలే సావాసం
బారలు చాపుతూ వేలి చివరికంటా లాక్కునే శక్తి
దేహమంతటా నిరంతరం ప్రవహిస్తూ ఓ అనుభూతి

ఎక్కడ కొత్త చూపు ఆరంభమో
అదే పాతకు అంతం
వలలను చీల్చుకు సాగేందుకు
చిరుచేపలకు సైతం
ఈత నేర్పే జీవన పోరాటం!

*

మూసిన కనురెప్పల్లో…

 
– జయశ్రీ నాయుడు
కొన్ని ప్రవాహాల్లో తడుస్తుంటాం
కొన్ని వెచ్చదనాలై కరిగిపోతాం
అడవిలా అగమ్యగోచరమైన కాలం లో
గాలివాటుగా పెనవేసుకున్న అడవి మల్లెలం
వెచ్చదనంలా ప్రవహిస్తూ
ఊపిరి పలకరింపులైనప్పుడల్లా
కాలం అనుభూతుల గలగలల్ని
కొన్ని హృదయపు శృతుల్లో బంధించుకుంటుంది
చిగుళ్ళు కనిపించని పరిచయాల మొక్కల్లో
పూయని పూల సొగసులు దాచుకున్న మనసు మోహంలా
ఏరుకొచ్చిన క్షణాల్ని పోగేసుకుని
ఆనందాల్ని అత్తరులా
మూసిన కనురెప్పల్లో అద్దుకుంటాము!
పరిమళాలే పాటలౌతూ
గడియల్లా ఘడియలో పెనవేసుకుంటాయి
అడుగుల జాడలు మిగలని దారిలా జీవితం వున్నా
నడకలో తోడుకూడిన గుండె చప్పుళ్ళు చాలవూ
శ్వాసగా ఆశని నింపుకుంటూ
ఎన్నో అక్షరాలుగా కలల్లో గుబాళించేందుకు!
*
jayasri

ఎవ్వలకయినా ఆశ సారూ…!

జయశ్రీ నాయుడు 
jayasriరెండు దోసిళ్ళలోకీ చెమ్మగిల్లిన  మట్టిని తీసుకున్నప్పుడు, అందులోని ఇదమిత్థంగా చెప్పలేని సువాసన ఎరుకవుతుంది. అదే నేలలోని ప్రాణ శక్తి. ఆ మట్టిని నిరంతరంగా ప్రేమించే ప్రేమికుడొకడు. అతని ప్రాణాలను ప్రణయకానుకగా అడిగినా ఇచ్చేసే సాహసి – రెండక్షరాల ప్రేమ లాగే అతడి పేరులోనూ రైతు అనే రెండు అక్షరాలే వున్నాయి.  మట్టికి మనసిచ్చిన రైతుకి పచ్చని మొలకలే కాదు మట్టిపొరల్లో దాగున్న నీటి చెలమల్లాంటి కడివెడు దుఃఖాలెన్నో. విత్తిన విత్తుకీ మొలకెత్తే వరకూ బాలారిష్టాలెన్నో. అలాగే పండిన పంట చేతికొచ్చే లోగా మరెన్నో కాలారిష్టాలు. ఒక మహా సముద్రాన్ని పిడికిట పడతాడు ఆ రైతు.
 దుఃఖం అంటే అదీ సామాన్యమైన కన్నీరు కాదు, గుండె లోతుల్లోంచి భోరుమన్న దుఃఖం — బోరు దుఃఖం . నందిని సిధారెడ్ది  రచించిన  — నదిపుట్టువడి కవితా సంకలనం లో మనం చెప్పుకునే రెండో కవిత ఇది. 
 ఆదీ అంతం వుండని సముద్రం లాగే రైతు కష్టాలకు అంతూ పొంతూ వుండదన్న విషయం మన వ్యవసాయ ఆధారిత ఆర్థిక పరిస్థితిని గమనించే ఎవరికైనా అర్థం అయ్యే విషయమే. ఆకాశం కేసి కళ్ళు చికిలించిన వేళ నీటి చుక్క కోసం చాతక పక్షి అవుతాడు. ఆరుగాలం మొదలయ్యే వేళ తెలిసీ మృత్యువుకి ఎదురెళ్ళే వీర సైనికుడిలా తన సర్వ శక్తులూ ఒడ్డి పచ్చదనాన్ని కాపాడుకునే సైనికుడౌతాడు. కష్టాలన్నీ తెలిసీ నేలని నమ్ముకునే రైతుని మించిన సాహసవంతుడున్నాడా?
నేలని చీల్చుకుని వచ్చే పచ్చని మొలకలా మొదలయ్యే కవితా వాక్యం. మనిషి ప్రయత్నాలకూ మానవ స్వభావానికి తల్లివేరు లాంటి మూలకం – ‘ ఆశ’  తో మొదలయ్యె కవితా వాక్యాలు.
ఆశ సారూ
కష్టమో నిష్ఠురమో
బతకాలె గద
మంట్లె దిగినందుకు
పొర్లాడాలె గద
ప్రేమకు వుండే స్వచ్చత నేలతోటీ నీటితోటీ రైతుకు వుండే మమమతని పలికిస్తుందీ కవిత కొనసాగింపు. మనిషి ప్రకృతికి దగ్గరగా మసిలిన రోజుల్లో రైతు నాగలి పట్టి మట్టి పెళ్ళల్ని పెకలించినప్పుడు నేలని ప్రేమతో పలకరించినట్టుండేది. అతడి మనసులో పొంగే ప్రేమకి గంగమ్మ పరుగులెత్తి వచ్చేదంటా ఆ రోజుల్లో.
అప్పు మీద అప్పు
ఆత్మ మీద అప్పు
మారిన కాలం లో మారని కష్టాలు రైతుని నిలవనివ్వవూ, కూర్చోనివ్వవూ. నిరంతరంగా గంగ ప్రవహించాలనే ఆశలో అప్పు మీద అప్పుచేస్తూ, ఆత్మనీ అమ్ముకున్నంత భారాన్ని మోసే రోజులయ్యాయి. భూమిని నమ్ముకున్నా నీటి జాడ తెలియడం లేదు. ఆకలి విశ్వరూపం ముందు రైతూ అతడి కుటుంబమూ దిక్కుతోచని పరిస్థితిలో పడటం అతడి కష్టాలకి పరాకాష్ట.
 
 మన్నుకు నెనరుండె
మనసుకు నెనరుండె
గట్టిగ లగాయించి పిలిస్తె గంగ పలికేది
వెనువెంటనే వర్తమానపు వికృతుల్ని చెప్తూ
ఎవనికెవడు పలకడు
ఒగనికంటె ఒగడెక్కువ -అంటాడు
పాతకీ కొత్తకీ వెనువెంట బొమ్మా బొరుసుల్లాంటి నిజాల్ని పరచడంలో కవి మూలాలు గ్రామీణం అని సహజ స్వభావంగా అమిరిన పదాలే చెబుతాయి.
ఎదుటి వాడి కష్టాలని చులకనగా మాట్లాడే రాజకీయ నాయకులనీ, ఉన్నత తరగతి మేధావి వర్గాన్నీ నైపుణ్యంగా నాలుగు వాక్యాల్లో చెప్పిన తీరు, కవి లోని నిశిత దృష్టికి ఉదాహరణలు గా అనుకోవచ్చు. ఓడిపోతారని తెలిసినా ఓట్లను అడగడం, వస్తాయో రావో తెలియని ఉద్యోగాల కోసం పిల్లల్ని చదివించుకోవడం ఎంత సహజమో – ఆశతో బోర్లు వేసి, నిరాశతో భోరుమనడమూ అంతే మానవ సహజమంటాడు కవి. ఇది రైతుని కవి ఆత్మతో కౌగిలించుకున్న సందర్భమనుకోవచ్చు.
 
పడదని తెలిసి బోర్లెందుకేసుడంటరు
ఓడిపోతరని 
మీరు ఓట్లకు పోకుంటున్నరా
వొస్తయో రావో తెల్వని నౌకర్లకు 
పోరగాండ్లను నల్వకుంటుంటున్నరా
ఎవ్వలకయినా 
ఆశ సారూ – అంటాడు రైతు
కేవలం నీటి కోసం ఆశపడుతూ  ఊట ఊరని బోరుబావుల పరిస్థితికి ఏమీ చెయ్యలేని అసహాయత రైతుది. అతడినే దురాశాపరుడిగా దూషించే ప్రపంచాన్ని చూసి, విరిగిన మనసుతో బ్రతుకు చావుకన్న హీనమయ్యిందనుకుంటాడు. వాళ్ళ మాటలు బల్లాలుగా గుచ్చుతుంటే, రైతుల ఆకలి చావుల్నీ తేలికగా మాట్లాడే వర్గాలని చూసి వెల వెల పోయే దీనత్వం రైతుది.  బంగారం కోసమూ, బంగ్లాల కోసమూ ఆశపడాలన్న లౌక్యం తెలియని అమాయకత్వం  అతడికి.  కేవలం నీటి మీద నెనరు పలకని గంగమ్మని పలికించాలన్న తాపత్రయం, వున్న డబ్బంతా పోసినా పంట చేతికిరాని పరిస్థితి. ఎప్పటి నుంచో కొనసాగుతున్న మన రైతు అసహాయతకి ప్రతీక యీ కవిత.
 
కవితా సంకలం పేరు: నదిపుట్టువడి
కవి: నందిని సిధారెడ్డి
శీర్షిక: బోరు దుఃఖం 
ఆశ సారూ
కష్టమో నిష్ఠురమో
బతకాలె గద
భూమ్మీద పుడ్తిమ్మరి
మంట్లె దిగినందుకు
పొర్లాడాలె గద
బోరు పడ్తదని
పోరగాండ్లు బతుకుతరని
ఆశ సారూ
అందరి మాదిరి సంసారం ఇంత తెలివిజెయ్యాల్నని
ఆశ సారూ
కాలం పాడుగాను
కంట్లె నిప్పులు వోసుకున్నది
మస్తు కాలాలు జూసిన
ఇసొంటి కాలం జూలె
మన్నుకు నెనరుండె
మనసుకు నెనరుండె
గట్టిగ లగాయించి పిలిస్తె గంగ పలికేది
కాలమే గిట్లొచ్చింది
ఎవనికెవడు పలకడు
 ఒగనికంటె ఒగడెక్కువ
ఒక్క బోరు పడకపోతదా?
 బొంబాయి సంపాదన బోరుపొక్కల వాయె
అప్పు మీద అప్పు
ఆత్మ మీద అప్పు
భూమిల తండ్లాడితే
భూమి లోతు దొరుకకపాయె
రెక్కలుండి ఏం పలం
రేషముంటె ఏం అక్కెర
పోరగాండ్లు ఉపాసం పండే కాలమచ్చె
కన్నీళ్ళు తుడుసుకోవచ్చు
కడుపుసారూ
ఏదూకున్నా అదూకోదు
కట్టుకున్నది
బడుముకు కట్టుకున్న చీర
బిగదీసి కడుపుకు కట్తుకుంటంది
ఏంజేతు
యాడికి కాళ్ళు జాపుదు
పడదని తెలిసి బోర్లెందుకేసుడంటరు
ఓడిపోతరని
మీరు ఓట్లకు పోకుంటున్నరా
వొస్తయో రావో తెల్వని నౌకర్లకు
పోరగాండ్లను నల్వకుంటుంటున్నరా
ఎవ్వలకయినా
ఆశ సారూ
బంగారం గాదు
బంగుల గాదు
బువ్వ సారూ
బుక్కెడు బువ్వ
 మేం తిండిలేక జస్తంటె
తిన్నదర్గక జస్తున్నమంటరు
మీ నాల్కెకు మొక్కాలె
తిట్లకు జస్తున్నం
బతుకు సారూ ఎప్పటికి.

అలవోకగా అక్షర ప్రాణవాయువు!

జయశ్రీ నాయుడు
jayasriఅక్షరాల్లోంచి గుప్పుమనే మట్టి పరిమళం ఎప్పుడైనా నేత్రాలనుంచి నాసికకు చేరిందా
పరిమళం నుంచి ఉద్వేగంలా గుండెకి పాకి, మట్టిని పిడికిట పట్టిన ప్రాణాల పంతపు పంచప్రాణాల్ని చూపించిందా… 
ఈ అక్షరాల అనుభూతికి ఎన్ని మాటల తూకపు రాళ్ళు నింపినా ఇంకా అనుభూతించ వలసింది ఏదోమిగిలే వుందని, మళ్ళీ మళ్ళీ చదువుకున్నాను. నాకు ఎదురైన ప్రతి గాలిపలకరింతలోనూ, పాదాన్ని ఈ తట్టే మట్టి స్పర్శామాత్రపు సంభాషణలోనూ చరిత్రని చదవడానికి ప్రయత్నించాను. ఏ క్షణాన ఈ కవిత నా కళ్ళ గుమ్మం ముందు నిలిచిందో గానీ, నాకు నేనే ఒక నిరంతర అక్షరార్థ యాత్రని అనుభవించాను.
అలవోకగా నన్ను తన ప్రతి రేణువులోనూ కలిపేసుకుంటూ, జాగమీది పానాన్ని బర్వు బర్వుగా చాటి చెప్పే అక్షరమవ్వడం ఒక కొత్త అనుభూతి. ఇప్పటికి నాకు నేనుగా ఎన్ని సార్లు చదువుకున్నా ఏదో తెలియని రిథం వుంది  ఈకవితలో. ప్రతి పదం లోనూ, భావం లోనూ నందిని సిధారెడ్డి కవిగా అలవోకగా అక్షర ప్రాణవాయువుని పరిచిన కవిత  –  పుట్టువడి
ఒక జాతి తీరుతెన్నుల్ని ఒక కవికన్నా మిన్నగా ఎవరూ చెప్పలేరు. తత్సమ తద్భవాల్లేని పదాల్లో మొదటి పంక్తి నుంచే కవిత చెంగు చెంగునా సాగుతుంది.
జాగతీరే అట్ల 
 
ఈ జాగల రేషమున్నది
కుటిలం లేదు 
కువారం లేదు
ఇక కుటిలమూ, కువారమూ లేని చోట సహజత్వానికి కొరతేముంటుందీ?
జివునం పోయినా సరే
జిద్దుకు నిలవడ్తం…
నిలువెల్లా ఉరకలేసే ఉద్యమ స్ఫూర్తికి అద్దాలీ అక్షరాలు. దాదాపు 2007 లో ముద్రణలో విడుదలైన అక్షర పగడాలివి.
ఉద్రాక్ష పూలు పూసినంత  సహజంగా
మాటలు పూస్తుంటయి 
అవును ఉద్రాక్షపూలు అనడం లో ఎంతటి పల్లెతనపు అందముందో అక్షర పగడాలనుకోవడంలోనూ అంతే సహజత్వముందీ. కళ్ళు అక్షరాల వెంట పరుగెత్తినంత సహజంగా భావం మనలో ప్రవహించడం మొదలవుతుంది. మరో అనువాదం అక్ఖరలేని కవితా పాయలివి. పాదాలు తడుపుకున్నంత సహజంగా తడి మనసుని ఆక్రమించడం మొదలవుతుంది.  ఆత్మకు మరో అర్థం చెపుతాడు కవి ఇలా…
nadi
బట్టలు ఇడిసినట్లు 
శరీరాన్ని ఇడిసిపెత్తేది ఆత్మ కాదు
ఎల్లెడల మనిషిని ఎడబాయనిదే ఆత్మ
మరింత చొచ్చుకెళ్ళే పల్లెతనం చూడండీ
దాలిలో పాలు కాగబెట్టినవాండ్లం
అనుభవాలు కాగబెట్టి పోస్తం
ముందువెనుకలు ఆలోచించని ఉడుకుదనపు రక్తం. ఎండల్నీ వానల్నీ కరువు కాటకాల్నీ భరించిన సహనం. ఆ మట్టినుంచి పుట్టుకొచ్చిన జాతి కి చావుని సైతం లెక్ఖచెయ్యని మొండితనమే ఆస్తి. 
చావుదలకు సుత లేసి ఉరుకుడే
గెలిసినా ఓడినా
దిగిన తర్వాత కొట్లాడుడే
దిగుట్లె దీపం ఆరిపోయినా 
నమ్ముకం ఆరిపోదు
 బండెంక బండి కట్టి పోరాటమైన సామాన్యుడు కనిపిస్తాడు. తెలంగాణా ఉద్యమ దినాల్లో వచ్చిన ప్రతి వార్తా ఉద్వేగం అప్పటి ఆకాంక్షా తీవ్రతలకు పునాదుల్నీ ఈ అక్షరాలు చూపిస్తున్నాయి.  తను పుట్టిన మట్టి మీద ఎంత మమకారమంటే, ప్రాణం విడవడానికైనా సిద్ధమే. ప్రాణం విడిచాక కూడా ఆ మట్టిని విడవని ఆత్మలివి. పూర్వీకుల ఆత్మలన్నీ మమేకమైన నేల లో పెరిగిన జాతి తేటదనాన్ని, రోషాన్ని, స్నేహాన్ని, వెనుతిరిగి ఆలోచించని సూటి దనాన్ని పచ్చికలా పరిచిన మాటల వరిచేలిది.
కవితా సంకలం పేరు: నది పుట్టువడి 
కవి పేరు: నందిని సిధారెడ్డి
కవిత శీర్షికపుట్టువడి
 nandini
జాగ తీరే అట్ల
ఈ జాగల రేషమున్నది
కుటిలం లేదు
కువారం లేదు
కుండబద్దలుకొట్టినట్టు
కడిగేసుడే ఎరుక
బాధయినా బరువయినా
ఎత్తుకున్నంక మోసుడే
జివునం పోయినా సరే
జిద్దుకు నిలవడ్తం
ఇటుపొద్దు అటు పొడిసినా
ఇజ్జత్ ఇడిసేది లేదు
బట్టలు ఇడిసినట్టు
శరీరాన్ని ఇడిసిపెట్టేది ఆత్మ కాదు
 ఎల్లెడల మనిషిని ఎడబాయనిదే ఆత్మ
ఉద్రాక్షపూలు పూసినంత సహజంగ
మాటలు పూస్తుంటయి
వరిచేండ్ల మీది గాడ్పువలె
స్వచ్చంగా
వాసన వాసనగా వచ్చిపోతుంటం
దాలిలో పాలు కాగబెట్టినవాండ్లం
అనుభవాలు కాగబెట్టి పోస్తం
పండ్లమ్మెతందుకయినా తండ్లాడుతం
చేదబాయి గిరక లెక్క
ఇరాం లేకుంట గిరగిర తిరుగుతనే ఉంటం
 గవ్వ ఆందాని లేకపోయినా
గాలికతలు ఎరుగం
ఎవలు కారని తెలిసినా
మేం కాకుంట ఉండలేం
ఎత ఎవలదయినా
ఏడ్వకుంట ఉండలేం
కోపం ఆపుకోలేక
నాలికయినా కొరుక్కుంటం
చావుదలకు సుత లేసి ఉరుకుడే
గెలిసినా ఓడినా
దిగిన తర్వాత కొట్లాడుడే
దిగుట్లె దీపం ఆరిపోయినా
నమ్ముకం ఆరిపోదు
జాగ మీద పానం
పానమిడిసినా జాగిడువం
ఈ జాగ తీరే అట్ల
ఈడ పుట్టి పెరిగిన మనిషి తీరే గట్ల
ఈ జాగల
బర్వు బర్వుగ తిరిగే
పూర్వీకుల ఆత్మలుంటయి
*

ఇప్పటికీ గుండెల్లో ఉయ్యాల …

జయశ్రీ నాయుడు 

 

jayasriవేసవి చివరికి వచ్చేశాం. ఋతుపవనాలొచ్చేశాయంటున్నారు. వర్షాకాలం మొదలయ్యే వేళల్లో ఆకాశంలో దట్టమైన మబ్బులు బరువుగా నిలిచి చూస్తుంటే, రాబోయే వానదేవుడికి వింజామరలా చల్లని గాలి హాయిగొలిపే వేళల్లో, ఏదో చెట్టుకొమ్మలకి పొడవాటి వుయ్యాల తాళ్ళు వేలాడుతూ, ఆ ఉయ్యాలలో కూర్చొని కాలిపట్టీలు అందం వెలుగుతుంటే, అలవోకగా ఆ మబ్బుల్ని తాకాలన్న ఠీవిగా ఉయ్యాలలూగే సోయగాల్ని ఊహకు తెచ్చే కవిత,  ఈ వారం కవిత ఇది –  కె శివారెడ్డి గారి ” ఊహల్లోంచి ఊహల్లోకి”

కవికి ఊహ ఒక ఉయ్యాల…

ఆదిశ చివరనుంచి ఈ దిశ చివరిదాకా ఉయ్యాల
వెల్లకిల పడ్డ అరసున్నాలా…
విచిత్రం! ఎత్తైన చెట్ల వేళ్ళు భూమిలో బలంగా
ఉయ్యాల వేళ్ళు చెట్టు కొమ్మను చుట్టుకొని గట్టిగా,
కొత్త పరికిణీ ట్రంకుపెట్టె వాసనలూ
కావిడి పెట్టె బంగారు నగల మాగిన రంగూ –
కొత్తగా వేసుకున్న పైట పాము; జర్రున జారటాలూ

గ్రామీణ దృశ్యాన్ని మనముందుంచే ట్రంకు పెట్టె వాసనలూ, కావిడి పెట్టె బంగారు నగల మాగిన రంగూ – మనకిప్పుడు స్ఫురణకు రావడం కష్టమే. కానీ ఆ వర్ణనతో ఒక దృశ్యం మనోఫలకం మీద ఊపిరి పోసుకుంటుంది. విశాలంగా విస్తరించిన చెట్టు కొమ్మల్లో  కొత్తపరికిణీలో  ఊయలలూగే  నవయవ్వన సౌందర్య సామ్రాజ్ఞి కనిపిస్తుంది మనకిక్కడ.

నా కళ్ళు ఉయ్యాలతో పాటు అటూ ఇటూ
ఇటూ అటూ ఊగీ ఊగీ తూగీ తూగీ తూలిపోతున్నాయి
తూనీగల్లా వాలుతున్నాయి కనిపించే జీవన మైదానమంతా
ఉయ్యాల కొయ్యకి కట్టిన తాడు పట్టుకుని
వరుసైన వాడెవడో ఊపుతుంటాడు …

అచ్చమైన గ్రామీణ సంప్రదాయ ప్రతిబింబాలీ పదాలు. బావా మరదళ్ళ మధ్యన కొంత చనువును పెంచే అనేక సందర్భాల్లో ఆషాఢ మాసంలో ప్రత్యేకత ఇది. వానలే మనకు జీవనామృతాలు.   గ్రామాల్లో తొలకరి వానల మెసెంజర్ తూనీగ. కవి చిన్ననాటి నుంచీ వెంట తెచ్చుకున్న  గ్రామీణ సౌందర్యం, అతని సౌందర్య పిపాస తరువాతి పంక్తుల్లో ఫ్రేము కట్టినట్టు కనిపిస్తుంది.

” బహుశా – ఉయ్యాలతో పాటు ఇప్పటికీ ఊగుతుంటాడు
అప్పుడప్పుడు అరచేతులకేసి చూసుకొని
మురిపెంగా ముసి ముసిగా నవ్వుకుంటుంటాడు ఇప్పటికీ” 

ఇది ఒక తరం తో ఆగిపోయే రమణీయ భావన కాదు. తరతరాలకీ కొనసాగింపు. వర్ష ఋతువు ఆరంభం జీవన పాత్రనూ సౌందర్యంతో నింపుతుంది. ఆకాశపు ఆ కొస నుంచీ ఈ కొసవరకూ తిరగేసిన సున్నా వంటి ఉద్వేగపు తరంగం ఉయ్యాలతో పాటే ప్రయాణిస్తూ వుంటుంది.  ఆ నవయవ్వన శృంగారదృశ్యావతరణాన్ని చూసి దిక్పాలకులకే కన్ను కుడుతుందంటాడు.  ఉయ్యాల ఒక విధంగా కవి హృదయతరంగం కూడా. ఆ పల్లె నుంచీ ఈ పల్లెకీ, ఈ అడవి నుంచీ ఆ అడవికీ ప్రయాణించే అతని లోని సౌందర్యాన్వేషణ. ఎక్కడో ఏ మూలలోనో వెలిగే సౌందర్యాన్ని నింపుకోవాలనే తపన.

అద్దంలో నెలవంక

” ఇప్పటికీ గుండెల్లో ఉయ్యాల కదులుతూనే ఉంది
యాభయ్యేళ్ళప్పుడు కూడ
వెర్రిగా చిన్న పిల్లాణ్ణి చేసి తిప్పుతూనే ఉంది”  అంటాడు.

ఊహ మనలోని సృజనాత్మకతకి ప్రాణాధారం. ఎంతటి సౌందర్య సృజనైనా, యాంత్రిక క్రియాశీలతైనా మర్రి విత్తంటి సూక్ష్మ ఆలోచనా తరంగం – అదే – ఊహతోనే మొదలయ్యేది. ఆ ఊహ ఆలోచనా హర్మ్యాలు నిర్మించుకుని, కార్య రూపంలోకి దాల్చిన తర్వాత సాధించే విజయాలు మనిషిని అందరి గౌరవానికి పాత్రుడయ్యేంత ఎత్తులో నిలబెడతాయి.
” భూమ్యాకాశాల మధ్యనున్న సమస్తాన్ని చూస్తూ
అనుశీలిస్తూ అనుభవిస్తూ ఆకారాన్నిస్తూ
ఊపిరి ఆగవచ్చునేమో కానీ
ఉయ్యాల ఆగకూడదు”  అని కోరుకుంటాడు.

జీవితం ఒక ఎడతెగని ప్రయాణం. వాస్తవాలు నేల మీద నడిపిస్తుంటే ఊహలు ఆకాశాన్నే నేస్తమంటాయి. ఊహలో వున్న ఉద్విగ్నత వాస్తవం లో వుండకపోవచ్చు. అందుకే ఊహకు పట్టం కట్టి, నిరంతర యాత్రికుడివి కమ్మంటున్నాడు. కవి తన వారసత్వం గా తన పద్యాన్ని వదిలి వెళితే, తర్వాత తరాలు ఆ పద్యాల వేళ్ళ చివర్లు పట్టుకుని నిరంతరం ఊగవచ్చంటాడు. ఎంతటి ఆశావహ దృక్పథమో! ఎంతటి సౌందర్యావిష్కరణకైనా మొదలు ఒక చిన్న ఊహలోనే ఉంది. అది కవితైనా, కథ అయినా, మోనాలిసా మందహాసమైనా మైనా మరింకేదైనా. నిరంతరం అన్వేషణే జీవితానికి మనం బహూకరించగలిగే జవసత్వాలు.

కవితా సంకలనం పేరు:  నా కలలనది అంచున
  కవి: కె శివారెడ్డి
  కవిత శీర్షిక  : ఊహల్లోంచి ఊహల్లోకి 

ఊహల్లోంచి ఊహల్లోకి ఉయ్యాల
గాల్లోంచి గాల్లోకి ఉయ్యాల

ఆ దిశ చివర నుంచి ఈ దిశ చివరిదాకా ఉయ్యాల
వెల్లకిలా పడ్డ అరసున్నాలా
ఈ పక్కనుంచి ఆ పక్కకి దూసుకెళ్ళేటప్పుడు
ఒక్క సారి పొడుగాటి జడ భూమిని తాకుతూ వెళిపోతుంది
పరికిణీ కుచ్చిళ్ళు నేలను ముద్దిడుకుంటూ వెడతాయి
ఎక్కడో భూమి గర్భం లో సముద్రం గుండెల్లో
ఒక వణుకు మొదలవుతుంది
లోకమంతా ఉయ్యాలలూగుతుంది

************
 గలగలా పొంగే నవ్వులోంచి కన్నీళ్ళు
విచిత్రం! ఎత్తైన చెట్ల వేళ్ళు భూమిలో బలంగా
ఉయ్యాల వేళ్ళు చెట్టు కొమ్మను చుట్టుకొని గట్టిగా,
కొత్త పరికిణీ ట్రంకుపెట్టె వాసనలూ
కావిడి పెట్టె బంగారు నగల మాగిన రంగూ –
కొత్తగా వేసుకున్న పైట పాము; జర్రున జారటాలూ
 ఏం చేయాలో తోచని కంగారూ పిచ్చి చూపులూ
దయకూడుకుంటున్న కళ్ళ పర్యావరణాలూ
ఎటు చూసినా పూలే పూలు; పూల జాతర్ల జ్ఞాపకాల రవళి
అక్కడ ఉయ్యాల మీద ఆకాశంలో తెలుతూ మా అక్క ఉంది
నా బుల్లి ప్రియురాలు ఉంది

*****
నా కళ్ళు ఉయ్యాలతో పాటు అటూ ఇటూ
ఇటూ అటూ ఊగీ ఊగీ తూగీ తూగీ తూలిపోతున్నాయి
తూనీగల్లా వాలుతున్నాయి కనిపించే జీవన మైదానమంతా
ఉయ్యాల కొయ్యకి కట్టిన తాడు పట్టుకుని
వరుసైన వాడెవడో ఊపుతుంటాడు

బహుశా – ఉయ్యాలతో పాటు ఇప్పటికీ ఊగుతుంటాడు
అప్పుడప్పుడు అరచేతులకేసి చూసుకొని
మురిపెంగా ముసి ముసిగా నవ్వుకుంటుంటాడు ఇప్పటికీ
దిక్పాలకులంతా వచ్చి చుట్టూ నుంచుంటారు
పైనున్న దేవతలంతా
వెర్రి ముఖాలేసుకుని నోట్లో వేళ్ళు పెట్టుకుని చూస్తుంటారు
” ఏమందం ఏమందం ఏమానందం ఏమానందం’ అని;

************

ఇప్పటికీ ఊహల ఉయ్యాలనెక్కి ఊగుతుంటాను
ఈ ఊరునుంచి ఆ ఊరికి ఆ యేటినుంచి ఈ యేటికీ
ఈ అడవి నుంచి ఆ అడవికీ ఈ పల్లెనుంచి ఆ పల్లెకీ
ఆ పల్లె నుంచి ఈ పల్లెకీ
ఇపాటికీ గుండెల్లో ఉయ్యాల కదులుతూనే ఉంది
యాభై యేళ్ళప్పుడు కూడా
వెర్రిగా చిన్నపిల్లాణ్ణి చేసి తిప్పుతూనే ఉంది
ఉన్నన్నాళ్ళు ఊగుతూనే ఉంటాను

నే వెళ్ళిపోయాక
నా పద్యాల వేళ్ళ చివర్లు పట్టుకొని
నిరంతరం ఊగుతుంటారు మీరు హాయిగా
కిందనుంచి పైకీ పైనుంచి కిందకీ;
షేక్స్పియర్ అన్నట్టు
భూమ్యాకాశాల మధ్యనున్న సంస్తాన్ని చూస్తూ
అనుశీలిస్తూ అనుభవిస్తూ ఆకారాన్నిస్తూ

ఊపిరి ఆగవచ్చునేమో కానీ
ఉయ్యాల ఆగకూడదు గుండెల్లోని ఉయ్యాల ఆగకూడదు

*

మట్టి తడిని తట్టిలేపే కవిత..

జయశ్రీ నాయుడు 

 

jayasriశివారెడ్డి గారి కవిత “ఏదో ఒక మొక్క”చదివాక మనసులో మట్టి తడి మేల్కొంది. తడి మట్టి సుగంధం తలపుకి వచ్చింది. అరచేతుల్లోకి తడి మట్టిని తీసుకుని, కళ్ళుమూసి, తన్మయత్వంగా ఆ స్పర్శని అనుభవించి ఎన్ని ఋతువులయ్యింది…? మొక్క వేర్లకీ, నీటి తడికీ మద్య మట్టి రేణువుల మౌన సంభాషణ మరిచిపోయానా…?

ఒక్క క్షణమైనా పచ్చదనం వైపు తల తిప్పనివ్వనంతగా కృత్రిమ జీవిత నాగరికతకు నగర జీవనం మనల్ని బానిసని చేసిందా… అవునేమో … లేకపోతే ఈ ప్లాస్టిక్ పువ్వులూ, ఆర్టిఫిషియల్ మొక్కలూ అమ్మే దుకాణాల రాజపోషకులెవరు??? మనమేగా అని ఒక నిష్టూరపు నిట్టూర్పు గుండెని ఎగదన్నుకు వచ్చిన క్షణాలవి.

మనలో అందరూ ప్రకృతి హరితానికి మిత్రులే. కానీ నగర నాగరికత విస్తీర్ణానికి మొదట అడ్డు అనిపించేవి మొక్కలే, మహా వృక్షాలుగా విస్తరించిన హరిత ఛాయలే. అల్లిబిల్లిగా అల్లుకునే తంత్రీ విస్తీర్ణానికి నిర్దాక్షిణ్యంగా ఎన్ని వృక్షాలు అశువులు బాసాయో.. వేర్లు విస్తరిస్తాయని ఎన్ని మామిడి , వేప, పున్నాగ, రావి చెట్లు గొడ్డలి వేటుకు తలవంచాయో లెక్కలేదు. కవి కె. శివారెడ్డి గారి “పొసగనివన్నీ….” కవితా సంపుటిలోంచి ఈ వారం మనం చర్చించుకుంటున్న కవిత “ఏదో ఒక మొక్క” — నగర నాగరికతకీ, ప్రకృతి పచ్చదనానికి మధ్య సంఘర్షణనీ , మొక్కలకీ మనిషికీ మధ్య ఒక అంతస్సూత్రాన్ని స్పృశిస్తూ సాగుతుంది.

ఇంటి ముందో ఇంటి మీదో
ఎక్కడో ఒక చోట ఒక మొక్క-
పొద్దున్నే పచ్చని ;మొక్కని చూస్తే పాపాలు పోతాయి
ప్రాణాలు లేచి వస్తాయి.”

నగర జీవికి మొక్కని చూస్తే భయం. అది రాగి మొక్కో వేపమొక్కో తనకనవసరం. దాని వేర్లు తన కాంక్రీట్ గోడల్ని బద్దలు చేస్తుందనే భయంతో, మొక్క గానే వేర్లు పట్టుకుని పీకెయ్యడానికి కూడా వెనుదీయడు.
” మొక్కలేకపోతే, బయట మొక్క లేకపోతే
లోపల మొక్క లేకపోతే
మనిషి వేసే చిగురులేముంటాయి
పూసే పూలేముంటాయి…”
అని కవి సూటి గా ప్రశ్నిస్తాడు.

చెమట పట్టని గదుల్లో, అన్ని వైపులా మూసేసిన గదుల్లో జీవించే మనిషికి ప్రకృతి సంగీతం ఎలా వినిపిస్తుందీ?

“కళ్ళమ్మటి కురుస్తున్న వానలున్నాయా
వంటి మీద జారుతున్న చెమటలున్నాయా?”

ఈ ప్రశ్నలు రెండూ మానవ సహజాతాలైన స్పందనా చైతన్యాన్ని గుర్తు చేస్తున్నాయి. తోటి మనిషి కష్టానికో, కృతజ్ఞతా పూర్వకంగానో కన్నీరు పెట్టుకుంటాడు. శరీరం ప్రకృతి తో మమేకమై శ్రమించినపుడు అది వెద జల్లే సుగంధం చెమట. ఈ రెండూ లేని మనిషి అసలు మనిషేనా… మన హడావిడి దైనందిన చర్యలకు సూటిగా ఢీకొనే ప్రశ్నలివి.

మొక్కల కేసి తదేకంగా చూస్తున్నపుడు లోకాంతర లోకాల నుంచి సంగీతం వినపడుతుంది. చిన్నపిల్లల కేరింతలు వినబడతాయి. మొక్కల మధ్య కూర్చున్న కవికి బాల్యం , పూల మధ్య శయనించినపుడు యవ్వనం తప్ప మరోటి లేవు. ఇంతకన్న రీ ఛార్జ్ అయ్యేందుకు మరో మార్గముందా మనకు?

కవిత ముగింపు వాక్యాలివి…

“ఏ పక్కకి వత్తిగిలినా
నీకో మొక్క తగలాలి
తడి తడి గా నువ్వు బతకాలి”
మొక్కల్ని ప్రేమించనిదే మట్టి తడి తెలియదు, మనసు తడీ తెలియదు. అందుకే బైటా లోపలా మనం ఎటు వత్తిగిలినా ఒక మొక్క తగలాలి, కన్ను తడి మనసులో చెమ్మ అవ్వాలి. అవే మనిషి మూలాలు, మనసు లోని తడి ఆనవాళ్ళూ. అవే ప్రకృతి తో మనం మమేకం అవ్వగలిగే అపురూప క్షణాలవుతాయి.

**** ****** ****

పూర్తి కవిత ఇక్కడ…

కవి : కె. శివారెడ్డి
కవితా సంకలనం: పొసగనివన్నీ…
కవిత శీర్షిక: ఏదో ఒక మొక్క

 

ఏదో ఒక మొక్క
రాగి మొక్కో, మర్రిమొక్కో, వేపమొక్కో
గోడ పక్కనో, గోడ మీదనో
ఇంటి ముందో, ఇంటి మీదో
ఎక్కడో ఒకచోట ఒక మొక్క-
పొద్దున్నే పచ్చని మొక్కని చూస్తే పాపాలు పోతాయి
ప్రాణాలు లేచి వస్తాయి-
ఎక్కడ ఇంకిపోయిందో మొలకనవ్వు బయటికొస్తుంది,
ఏమిటీ గోడ పగుల్తుందా
ఇల్లు కూలుతుందా
గోడ పగలనీ, ఇల్లు కూలనీ
మనిషి చుట్టూ అల్లుకున్న రాతిబంధాలన్నీ
బద్దలు బద్దలు కానీ
******

మొక్క లేకపోతే, బయట మొక్క లేకపోతే
లోపల మొక్క లేకపోతే
మనిషి వేసేచిగురులేముంటాయి
పూసే పూలేముంటాయి
అంతా బోసిగా, శూన్యం రాజ్యమేలుతున్నట్టు-
మనుషులున్నారా? మనసులున్నాయా?
కళ్ళమ్మటి కుతుస్తున్న వానలున్నాయా
వంటి మీద జారుతున్న చెమటలున్నాయా-?

చెమట పట్టని గదుల్లో
అన్ని వైపులా మూసేసిన గదుల్లో
ఏం కనబడుతుంది
ఏం వినబడుతుంది,
గదిలో బంధించబడ్డ మనిషి
గదే తానయిన మనిషి

పొద్దున్నే పైనుంచి రాలుతున్న ఆకుని చూళ్ళేడు
గాలిలో తేలుతున్న పావురాయి ఈకను చూళ్ళేడు
కళ్ళ ముందు విరుస్తున్న నెమలి పింఛం
పొద్దుటిపూట నృత్యాన్ని చూడలేడు
తదేకంగా మొక్క కేసి చూడు
అది తొడుగుతున్న కొత్త చివురుకేసి చూడు
చిన్నపిల్లల కేరింతలు వినబడటం లేదూ

ఏదో ఒక మొక్క
బతకనీ, బతకనీ,
మొక్కల మధ్యన కూర్చున్న నాకు
బాల్యం తప్ప మరోటి లేదు
పూల మధ్య శయనించిన నాకు
యౌవనం తప్ప మరోటి లేదు

మొక్క వేళ్ళు గోడలోకే కాదు
నీలోకీ, నాలోకీ జొరబడతాయి
గోడల జాడల్ని, చీకటి నీడల్నీ
బద్దలు చేస్తాయి
ఏ పక్కకి వత్తిగిలినా
నీకో మొక్క తగలాలి
తడితడిగా నువు బతకాలి

**

భావం నుంచి బాహ్యంలోకి ప్రయాణం..

 జయశ్రీ నాయుడు 
jayasriఒక కవిత రూపు దిద్దుకునే క్షణాలు బహు చిత్రమైనవి. ఒక ఘటన లేదా అనుభూతి, ఒక ఆలోచన — అతి సూక్ష్మ తరంగం గా మనసులో స్థిరపడి, మర్రి విత్తు మహా వృక్షమైనట్టు బాహ్యాంతరంగాలను ఆక్రమిస్తుంది.దాని పరిధిని అధిగమించలేని నిస్సహాయత కొంత, అందులోని ఆనందమో, అవేదనో, ఆత్మార్పణో, భావ పరమావధిని తెలుసుకొమ్మన్న అంతర్గత వేధింపో, ఇక తెల్ల కాగితమ్మీద అక్షరాలుగా అనువదించుకోవలసిందే.  కోడూరి విజయ కుమార్ గారి ఒక రాత్రి మరొక రాత్రి కవితా సంపుటం లోని ** తిరిగి జన్మిస్తావు** కవితని ఆయన సిగ్నేచర్ కవితగా తీసుకోవచ్చు.
 
 ఒక కవిత రాసే ముందు ఆయన మనసు పడే తపన, చేసే తపస్సుని వర్ణించారిక్కడ. భావాన్ని పైపైన తేలికగా మోసుకొచ్చే పదాలకీ, అంతరంగాన్ని చీల్చి, తన్ను తాను నిక్కచ్చిగా ఆవిష్కరించుకునే కవితా వేశానికీ – గీతానికి, భగవద్గీతానికి వున్నంత వ్యత్యాసముంటుంది. విషాదం నుంచే మహోన్నత కళావిష్కరణలు జరిగేది. అక్షరాల్లోని ఆవేదనే కవి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే తరుణం, తనలో తానుగా కనుగొనే సత్యం. అదే కవితా తపస్సు.
 ఇక మనం చర్చించుకునే *తిరిగి జన్మిస్తావు*కవిత విషయానికొస్తే…
 “బాధ” అనే  మన: స్థితి ఎప్పుడూ వర్ణనకు అందనిదే. గాయాలు ఎవరు చేసినా తొలి గాయం కవికి తనకు దొరకని ప్రేమని చెప్పుకుంటాడు . తల్లిదండ్రులు,  భార్య , రక్త సంబంధీకులు,  ఎవరు చేసిన గాయమైన తన తొలినాళ్ళ ప్రేమ వైఫల్యపు గాయం తరువాతే.
  ” ఇంతకీ నిన్ను చిద్రం చేస్తూ
బాధ బయటపడే ఆ చిత్రమైన సందర్భం లో ఎలా వుంటావు…”
అని అతని అంతరాత్మే ప్రశ్నించినపుడు…
అతని ఎదురుగా వున్న తెల్ల కాగితం లోతైన బావిలా అనిపిస్తుంది
వేళ్ళ నడుమ వున్న పెన్ను కవిని ముక్కలుగా ఖండించి లోలోని బాధను పెకలించే ఖడ్గంలా వుంటుంది
ఇక యేళ్ళ తరబడి కూడబెట్టుకున్న పద సంపద (కవులకు అవే కదా సంపదలు), బాధని పద్యం చెయ్యగలనన్న అహంకారం నీరవుతుంది.
 ** ఇక అప్పుడేం చేస్తావు నువ్వు?
అన్న ప్రశ్న అంతరాత్మలో సవాల్ చేస్తుంది
“ఇపుడిపుడే భాషని నేర్చుకునే వాడిలా
ఒక్కొక్క వాక్యాన్నే నిర్మిస్తూ….”
తనని తాను అనువదించుకుంటాడు, తనను వేధిస్తున్న బాధనుండి విముక్తుడవుతాడు.
అక్కడితో వృత్తం పూర్తి కాదు. భావాలన్నవి విశ్వజనీనమైనవి కొన్ని వున్నాయి. కవిత్వంగా  అల్లుకునే ఉదాత్త భావాలు కవి లో పుట్టాక, కవిత గా అనువాదమయ్యాక, పఠిత కళ్ళలోనుండి మెదడుకో మనసుకో అనుసంధానం ఐనపుడు ఆ పదావిష్కరణకు పరిపూర్ణత. అదెలా జరుగుతుందో కూడా విజయ కుమార్ గారిలా చెప్తారు..
నీలాంటి ఒకడు
నీ పద్యాన్ని ప్రేమతో హత్తుకున్నపుడు
నీవు తిరిగి జన్మిస్తావు.
ఒక కవి – భావం నుంచి భాహ్యం లో ప్రయాణించి, మళ్ళీ మరో భావం గా లీనమవ్వడంతో ఆ కవిత ఒక సార్థకతని సాధించుకున్నట్టే.
 పూర్తి కవిత ఇక్కడ…
శీర్షిక: తిరిగి జన్మిస్తావు
కవి: కోడూరి విజయకుమార్
ఒక రాత్రి మరొక రాత్రి కవితా సంపుటి నుంచి
 
ఒక్కో సారి నీ స్థితి బహు చిత్రంగా మారిపోతుంది
లోపల సుడులు తిరుగుతోన్న బాధ ఒకటి
ఇంకా లోపలే వుండలేక బయటపడే ప్రయత్నంలో
నిన్ను చిద్రం చేస్తూ వుంటుంది
 
 
బాధ ఏదయితేనేం?
గాయం ఎప్పటిదైతేనేం?
 
***
 
బహుశా, కవిత్వం లోకమైన వాళ్ళ తొట్ట తొలి గాయం
దొరకని ప్రేమ చేసినదే కావొచ్చు
ఇక ఆ తదనంతర గాయాలంటావా…
అవి నీ తలిదండ్రులకు నీవు చేసిన  గాయాలు కావొచ్చు
 లేక, నీ తోడబుట్టిన వాళ్ళకో, నీవు కట్టుకున్న స్త్రీకో, నీ పిల్లలకో
నీవు చేసిన గాయాలు కావొచ్చు
కొన్నిసార్లు వాళ్ళు నీకు చేసిన గాయాలు కూడా…
ఇంతకీ నిన్ను చిద్రం చేస్తూ
బాధ బయటపడే ఆ చిత్రమైన సందర్భంలో ఎలా వుంటావు?
 
 
ఎదురుగా వున్న తెల్ల కాగితం
నువ్వు దూకితే మింగి వేసే లోతైన బావిలా వుంటుంది
వేళ్ళ నడుమ వున్న పెన్ను
నిన్ను ముక్కలుగా ఖండించి
లోన వున్న బాధని పెకిలించే ఖడ్గంలా వుంటుంది
 
 మరీ దయనీయ స్థితి ఏమిటంటే
నీవు యేళ్ళుగా నేర్చుకున్న అక్షరాలు
నీ భాష, నీ పద సంపద, నీ అలంకారాలు
బాధని పద్యం చేయగలనన్న నీ అహంకారాలూ
అన్నీ అన్నీ
నిన్నొక అనాథని చేసి వెళ్ళిపోతాయి
 
అయినా సరే
లోన మెలిపెడుతోన్న బాధ జాలి పడి
ఇక అప్పటికి నిన్ను వొదిలేసి వెళ్ళదు కదా
జోలెలో గుప్పెడు గింజలు వేసేదాకా వొదలక
గుమ్మం ముందు నిలబడి, వొంటిని కొరడా దెబ్బలతో
గాయ పర్చుకునే పెద్దమ్మల వాడి లాగా
నిన్ను కట్టడి చేస్తుంది కదా
 
ఇక అపుడేం చేస్తావు నువ్వు?
ఇపుడిపుడే భాషని నేర్చుకునే వాడిలా
ఒక్కొక్క అక్షరాన్నే కూడబలుక్కుంటూ
ఒక్కొక్క వాక్యాన్నే నిర్మిస్తూ
ఒక్కొక్క ముక్కగా నిన్ను నీవు ఖండించుకుంటూ
అలా ఆ లోతైన బావిలోకి మునిగిపోయి
ఇక ఈ రాత్రికి ఈ బాధ నుండి విముక్తమౌతావు
 
నీలాంటి ఒకడు
నీ పద్యాన్ని ప్రేమతో హత్తుకున్నపుడు
నీవు తిరిగి జన్మిస్తావు
~~

మనలోపలి మరో ప్రపంచం..కోడూరి కవిత!

జయశ్రీ నాయుడు

 

jayaజ్ఞాపకాలనీ, ప్రస్తుత నగర జీవితపు అలుపెరుగని ఆరాటాన్నీ సమాంతర చాయలుగా చిత్రించిన దృశ్య కవిత కోడూరి విజయకుమార్ – అపుడపుడు… (ఒక రాత్రి మరొక రాత్రి కవితా సంపుటి నుంచి). మనసులో మనం మోస్తూ వుండే మరో ప్రపంచపు ప్రతీక ఈ కవిత. ఆ మరో ప్రపంచమే లౌక్యపు లోకంలో కఠినత్వపు నాగరిక చాయల్లో జీవిస్తున్నా మనలో మానవత్వపు గుబాళింపులు జీవింపజేసే అంతర్గత అమృతత్వం. 

కవిత మొదటి పంక్తుల్లోనే రెండు విభేదాత్మక ప్రపంచాలు మనముందు నిలుస్తాయి – ఒకటి నగర జీవితం మరొకటి కవి నిరంతరంగా తన అంతరంగంలో ప్రేమగా తడుముకునే తన వూరి ఆనుపానులు. అయితే ఇక్కడ కవి వర్తమానం లో నుండి గతాన్ని వర్నించుకుంటూ మళ్ళీ తిరిగి వర్తమానం లోకి వస్తూ ఒక వృత్తాన్ని పూరిస్తాడు. ఆ దృశ్యాన్ని చిత్రించుకోవడానికి ఒక కుంచే సరిపడా రంగులూ మన మనసుకు అందించి నిష్క్రమిస్తాడు. భవిష్యత్తుని అసలేమాత్రమూ స్పృశించకుండా అసంపూర్తి కవితా చిత్రాన్ని అందించడం లోనే జీవితపు సత్యం ఆవిష్కృతమవుతుందేమో..

కవిత మొదలయ్యేది  ఇలా …

దేహాత్మలను ఉక్కిరిబిక్కిరి చేసే 

ఈ మహానగర ఉక్కుకౌగిలి నుండి బయటపడి

అపుడపుడూ అలా నీ వూళ్ళో వాలిపోవాలి

ఉక్కు కౌగిలి అన్న పదంలోనే నగర జీవితపు కఠినత్వం ఆవిష్కృతమవుతుంది. నువ్వు అంటూ చదువరిని సంబోధిస్తూ మొదలైన కవిత, కవి తనని మనల్నీ కలిపి మాట్లాడుకుంటున్న ఏకత్వానికి ప్రతీకగా తీసుకోవొచ్చు. ప్రతి చదువరీ తన అంతరాత్మలో తెలియకనే తనకు ఇష్టమైన ప్రదేశాల్లోకి తొంగి చూసుకోవడం మొదలుపెడతాడు.

బాల్యపు దినాలను దాచుకున్న తన ఊరి నేలా, దాహం తీర్చిన చేదబావీ , అప్పటి ఇరికిరుగు మూడుగదుల ఇల్లూ, ఇప్పటికీ కవికి జ్ఞాపకాలుగా అపురూపమే.   వెనువెంటనే, హెచ్చరికగా అవేవీ ఇప్పుడా వీధిలో లేకపోవచ్చునేమో అన్న ఆవేదనా రేఖని జతచేస్తాడు.

తన ఊరికి వెళ్ళినపుడు కళ్ళముందు కదలాడె జ్ఞాపకాలన్నీ అతని మనోఫలకానివి. వర్తమానంలో మాత్రం కుచించుకుపోయిన తన బడి ఆటస్థలం, తన లెక్కల మాస్టారి లెక్ఖ ఈ లోకంలో ముగిసిందన్న స్నేహితుడి కబురూ ఒకేసారి స్ఫురణకు వస్తాయి.

OkaRatriMarokaRatri600

మరో చోట, అదే కవితలో, బెంచీలపై పడుకుని సినిమాలు చూసిన తన వూరి డబ్బారేకుల టకీసు, ఇప్పుడా చోటుని ఆక్రమించిన మల్టీప్లెక్ష్ అడుగున నవ్వుకుంటోందన్న విషయం విషాదాన్ని వినోదంగా మేళవించిన తీరు ఇది. అప్పట్లో “సినిమాకెళ్ళడం ఒక పండగ కదా… “అంటాడు కవి. టీవీలూ, ఇంటర్నెట్లూ లేని కాలం లో బాల్యం గడిపిన తరానికి మాత్రమే తెలిసిన అనుభూతి అది. తన యవ్వన దినాల పరుగులనీ తిరుగుళ్ళనీ దాచిన నేలపై తిరిగి రావడానికే తన మనసు అక్కడికి పరుగులు తీస్తుందన్న రహస్యాన్ని ఆత్మీయంగా వెల్లడించుకుంటాడు.

అవే ఈ మహానగరంలో బ్రతకడనికి అవసరమైన మణిమాణిక్యాలు. కవికి తన ఊరిపైని వ్యామోహాన్ని ప్రశ్నించే నగజీవులెందరికి ఈ విషయం అర్థం అవుతుంది???

నగర జీవనం, నాగరికతా ఊళ్ళను కూడా అబగా కబళించేస్తున్నాయన్న నిజాన్ని ఆర్ద్రత మేళవింపుతో చదువరి కి పంచిన కవిత ఇది.

 

పూర్తి కవిత ఇక్కడ…

 

 అపుడపుడూ… 

కవి: కోడూరి విజయకుమార్

 “ఒక రాత్రి మరొక రాత్రి” కవితసంపుటి నుంచి

 

దేహాత్మలను ఉక్కిరిబిక్కిరి చేసే

ఈ మహానగర ఉక్కుకౌగిలి నుండి బయటపడి

అపుడపుడూ అలా నీ వూళ్ళో వాలిపోవాలి

***

నీ బాల్య దినాల నడకలనీ,

నీ నవయవ్వన దినాల పరుగులనీ

నీ బలాదూరు తిరుగుళ్ళనీ

అట్లా పదిలంగా దాచిపెట్టిన

నీ వూరి నేల పైన తిరిగి రావాలి

ఒకప్పుడు మూడు ఇరికిరుగు గదుల్లో

నీ కుటుంబమంతా తలదాచుకున్న ఆ ఇల్లు

ఎంతో మంది దాహం తీర్చిన ఆ పెద్ద చేదబావి

అవేవీ ఇప్పుడా వీధిలో లేకపోవొచ్చు

కానీ నీవు వెళ్ళినపుడు

ఆ రేగుపళ్ళ చెట్టు కింద పిల్లల కేరింతలు

నీవు దారాలు కట్టి ఎగరేసిన తూనీగలు

వెన్నెల్లో దాగుడుమూతల ఆటలు

లిప్తపాటు నీ ముందు అన్నీ కదలాడతాయి

గొప్ప ఆశ్చర్యంగా వుంటుంది నీకు

ఒకప్పుడు అతి పెద్దగా వుండిన నీ బడి ఆటస్థలం

ఇపుడింత చిన్నదిగా వుందేమిటి అని…

నీ తరగతి గది గోడ పలకరిస్తుంది

లెక్క తప్పు చేసావని ఇక్కడే కదా నిన్ను

లెక్కల సారు గోడకుర్చీ వేయించింది

క్రితం సంవత్సరం ఆయన పోయారని

మిత్రుడిచ్చిన సమాచారం గుర్తుకొస్తుంది నీకు

ఒకప్పటి డబ్బారేకుల టాకీసుని కూల్చివేసి

ఊరి మధ్యలో వెలిసిన మల్టీప్లెక్స్

కళ్ళనీ చెవులనీ మాయ చేసే రంగుల చిత్రాలు

బెంచీలపై పడుకుని సినిమాలు చూసిన

ఆరోజులు గుర్తుకొస్తాయి నీకు

అప్పుడు సినిమాకి వెళ్ళడమొక పండుగ కదా

మల్టీప్లెక్స్ అడుగున పడివున్న నీ

డబ్బరేకుల టాకీసు నవ్వుకుంటుంది

ఆ వీధి మలుపు దాటేక ఎనిమిదో యింట్లోనే కదా

ఒకనాటి నీ ఏంజిల్ వుండేది

తను కనిపించినా వినిపించినా

ఒక దూది పింజమై తేలిపోయేవాడివి

గుర్తుందా… ఏంజిల్ పెళ్ళైన రోజు రాత్రంతా

వూరి రోడ్లపైన నీవు పిచ్చివాడిలా తిరగడం

వీధి మలుపులో తను ఎదురుపడుతుందేమో అని

ఒక క్షణం భ్రమించి నవ్వుకుంటావు

*     *     *

పెద్దగా పరిచయం లేని ఎవరో అడుగుతారు –

చాలా తరుచుగా వూరికి వెళ్ళొస్తావేమని?

ఈ మహానగరంలో బతకడానికి అవసరమైన

కొన్ని మణిమాణిక్యాలని తెచ్చుకునేందుకు

అని అతడికి చెప్పాలనుకుంటావు

మరి, అతడికి అర్థం అవుతుందంటావా?

*

నాలోని వాక్యానివి..

జయశ్రీ నాయుడు 

 

నువ్వొచ్చి వెళ్ళావు అన్నది ఒక వాక్యమే

కొన్ని జ్ఞాపకాల రూపు

ఆ గొంతుల్లో మెదులుతూనే వుంది

కొన్ని గుండె చప్పుళ్ళ అవ్యక్తానికి

కాలం చినుకుల్ని చేరుస్తూనే వుంది

అవును… నువ్వొచ్చి వెళ్ళావు…

గలగల మన్న ఒక నాదానంద ఝరి

 కళ్ళలోంచి మెరుపల్లె దూకి

పెదవుల్లో నవ్వై ఒదిగీ

అనిర్వచనీయ ఆత్మీయతగా

 ఎన్నిసార్లైనా పుడుతూనే వుంటుంది.

అవును… నువ్వొచ్చి వెళ్ళావు.

లోకపు ఆలాపనలెన్నున్నా

ఆ స్వర లహరి మళ్ళీ అంతర్ముఖం అవుతుంది.

అదృశ్య ప్రవాహం అన్వేషణా ధరిత్రిని శోధిస్తుంది.

వెళ్ళినా నువ్వొచ్చినట్టే వుంటుంది

శోధించిన దారులన్నీ అస్పష్ట దృశ్యాలే

 ఆలోచనా అంతర్జాలంగా

మెదడుకీ గుండెకీ లాగిన్ అవుతూనే వుంటాను

ప్రశ్న నీదైనా

సమాధానం వెతికేలోగా

 నాలో ఆత్మీయ అనంతాలు

తమని తాము ఆవిష్కరించుకుంటాయి

ఆవెలుగులే

ఇప్పటికీ చెప్తూనే వున్నాయి.

నువ్వొచ్చావు… కానీ వెళ్ళలేదు సుమా…

jaya

 *

నీలాంటి నిజం

jaya

 

 

 

 

 

 

నిజం నీలాంటిది

వేళ్ళూనుకున్న మర్రిలా

వూడల వూహలు వేలాడేస్తుంది

కొన్ని ఇంద్రజాలాలు మొలకెత్తుతాయి

పాలపుంతల ఆకాశమిస్తాయి

అదే గొడుగని

పరవశపు పచ్చిక కి నారు వేసే లోగా

అరచేతిలో వేపవిత్తు ఫక్కుమంటుంది!

చేదు మంచిదే….

కొంత బాల్యాన్ని అట్టిపెట్టుకో

కొద్ది దూరమైనా నమ్మకానికి అమ్మవుతుంది

లోపలి దారుల్లో తచ్చాడే కృష్ణబిలాన్ని పలకరించు

దానికి తెలిసిందల్లా

వటపత్రశాయిలా

అరచేత్తో పాదాన్ని నోటపెట్టుకున్న ఆ’మాయ’కమే…

మరపు మన్ను చల్లుకొచ్చే కాలం

యే విశ్వరూపం కోసం సిద్ధమవుతోందో…

బాలకృష్ణుడవ్వని మనసు

భూగోళమంతటి నిజాన్ని

పుక్కిటపట్టగలదు…

చేదుకీ నిజానికీ చెదలు పట్టదన్నంత నిజం ఇది..

-జయశ్రీ నాయుడు

సాయంత్రపు సరిహద్దు

jaya

 

ఉదయమంత ఆశ

జీవితపు దేశాన్ని వెలిగిస్తూనే వుంటుంది
 అక్షరాల కొమ్మలకు
భావాల నీటిని తాగిస్తూ
వొక కల అతకని చోట…
ఒంటరితనం ఏకాంతమవని పూట
కొన్ని సాయంత్రాలు వొస్తాయి..
నన్నిలా వొదిలేస్తూంటాయి
2.
వదిలేస్తున్నాను… వొదిలొస్తున్నానూ..
అంటూనే వెంట చాలా తెచ్చేశాను
గింజల్లో మొలకెత్తని పచ్చదనాన్నీ
పువ్వుల్లో కనిపించని పళ్ళనీ
మట్టిలో ఆవిరవుతున్న నీటిని
నీటిని దాటిన నివురునీ..
వెంటొచ్చాయనుకుంటునే
నన్నొదిలేశాయి చాలా..
వెలుగునంటుకున్న చీకట్లూ
తోడు జోడవుతున్న ఒంటరితనాలూ
నిలదీయాలనుకున్న నెమ్మది నీడల్లో
ఆటలాడుకుంటున్న ప్రశ్నా పతకాలు
3.
వాటేసుకున్న విరాగాలు
జోల పాడతాయి ఏకాంతానికి
రాత్రంతా నిద్ర మేల్కొంటుంది
మెలకువ కలగంటుంది
ఉదయాన్నే ఊపిరి పీల్చిన ఊహలు
గాలిలో గంధంలా
మొదటి మెలకువతో పాటు
ఊపిరితిత్తుల్లోకి జొరబడతాయి..
భుజాన మోస్తున్న జీవితాన్ని
ప్రేమగా సర్దుకుని
మళ్ళీ మొదలెడతా…
సాయంత్రపు సరిహద్దుకు ఓ నడక..
-జయశ్రీ నాయుడు

స్త్రీలున్నంత కాలం స్త్రీవాదమూ ఉంటుంది: ఓల్గా

IMG_1530

తెలుగు సాహిత్య లోకం లో స్త్రీవాదం లో తనదంటూ ఒక ముద్ర వేసుకున్న ఓల్గా గారిని కలవడానికి వెళ్ళడం అతి ముఖ్య విషయంగా మూడు వారాలుగా నాలో నేను తర్కించుకుంటూ, నాకు నేను సలహాలిచ్చుకుంటూ గడిచింది. హైదరాబాద్ లో ఈస్ట్ మారేడ్ పల్లి లోని ‘అస్మిత’ కు వచ్చి కలవమంటూ ఓల్గా గారు ఫోన్ లో టైం ఇచ్చాక,  మొదటిసారిగా ఆమెను కలుస్తున్న అనుభూతి కొంచెం భయపెట్టిన మాట నిజమే. అస్మిత కు వెళ్ళే ఓల్గా గారి గురించి వెయిట్ చేస్తు, ఎంత గంభీరంగా వుంటారో, ఎలా ప్రశ్నలు వెయ్యాలో, యేం చెపుతారొ అన్న గుంజాటన మనసులో !

ఎప్పుడు లిఫ్ట్ తెరుచుకున్నా చేతిలోని ప్రశ్నల పేపర్ సరి చేసుకుంటూ, ఆమే నేమో అని అటన్షన్ లోకి రావడం… వేరే ఎవరో రావడం… ఒక అరగంట గడిచాక, ఓల్గా గారిని లిఫ్ట్ లోనుండి రావడం చూసి, సాహితీ వనంలో విచ్చుకున్న గులాబి గుర్తొచ్చింది. విష్ చేశాను. ఇంటర్వ్యూ ఎంత సేపు పడుతుంది అన్నారు. ఒక గంట పట్టొచ్చన్నాను. నా చేతిలో అప్పటికే వున్న పేపర్ తీసుకుని, చూసి, “ఓ ప్రిపేర్డ్ గా వచ్చారా?” అని చిన్నగా నవ్వి, ప్రశ్నలన్నీ చూసి, లోపలికి వెళ్ళి ఆఫీస్ రూం లో కూర్చుందామన్నారు. అలా మొదలైన ఇంటర్వ్యూ శీతల సెలయేరులా ప్రశ్న తరువాత సమాధానం లా సాగిపోయింది.

ప్రతి పదం లోనూ ఒక పట్టుదల, జీవితాన్ని చదివిన అనుభవం, పదాల్లో పలుకుతున్న ఉద్విగ్నత, స్త్రీవాదం పట్ల విపరీతమైన నిబద్ధత — వీటి ప్రతి రూపమే ఓల్గా గారి సాహితీ సృష్టి అనిపించింది. ఆమె జవాబులు చదివితే మీరు కూడా నాతో అంగీకరించక తప్పదు.

 

Q ఒక రచయిత్రిగా మీది సుదీర్ఘమయిన ప్రయాణం. ఈ ప్రయాణం మొదలు పెడ్తున్నప్పుడు సాహిత్యం పట్ల వున్న అభిప్రాయాలూ, ఆకాంక్షలూ ఇప్పుడు ఏ విధంగా మారాయి?

అపుడు ఇప్పుడు కూడా మౌలికమైన తేడాలు లేవు. నేను రాయడం మొదలుపెట్టినప్పుడు సమాజం సాహిత్యం పై ప్రభావం చూపిస్తుంది,  సాహిత్యానికి ఒక ప్రయోజనం వుంది,  ఆ ప్రయోజనం నెరవేర్చడం కోసం రచయితలు రాయాలి అనే ఒక సామాజికమైన అవగాహనతోనే వుండేదాన్ని. నేను చదువుకునే రోజుల్లో కూడా సమాజం తో ముడివేసుకున్న సాహిత్యం ఎక్కువ ఇష్ట పడే దాన్ని. కేవలం కాల్పనిక నవలలే కాకుండా వాస్తవిక జీవితం, సమాజం, వాటిలో రావాల్సిన మార్పులు, వీటిని గురించి ఆలోచించే సాహిత్యాన్నే ఇష్ట పడేదాన్ని.

అటువంటి సాహిత్యాన్ని రాయాలనే నా రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టాను. ఇప్పుడుకూడా అదే కొనసాగుతోందీ.  ఈ ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుండీ అప్పటికీ ఇప్పటికీ సాహిత్యం పట్ల నాకున్న అభిప్రాయాల్లో  మౌలికమైన భేదాలేమీ లేవు

Q మీరు వొక మార్క్సిస్టు శిబిరం నించి వచ్చారు. ‘నేను స్త్రీవాదిని కావాలి ’ అనే భావన మీలో బలంగా ఎప్పుడు కలిగింది?

నేను మొదటి నుంచి మార్క్సిస్ట్ ని .  విద్యార్థి గా వున్నప్పుడు  స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తర్వాత CPM CPML PARTY వీటితోటి సంబంధాలు కలిగి వుండటం ఇవన్నీ నన్ను మార్క్సిస్ట్ దారిలో నడిచేలా చేశాయి. వాటినన్నింటిని  తలుచుకుంటే ఇప్పటికీ ఇష్టమే. నాకు ఆ పునాది చాలా ఉపయోగపడింది.

ఆరోజుల్లోని సమాజాన్ని అర్థం చేసుకోవడానికి నాకు మార్క్సిజం చాలా ఉపయోగపడింది. విప్లవ రచయితల సంఘం లో గానీ, జనసాహితీ సంఘం లో పనిచేసినపుడు గానీ విప్లవ పార్టీల్లో వున్న వాతావరణాన్ని చూసినప్పుడు కానీ అక్కడ కూడా స్త్రీల సమస్యల పట్ల అవగాహన సరిగ్గా లేదని అర్థమయింది . స్త్రీ పురుష సమానత్వమనేది ఆ సంఘాలలో కూడా లేదు. మొత్తం సమాజాన్ని ఒక సమ సమాజం వైపు నడిపించాలనే ఆశయం తో బయల్దేరినటువంటి పార్టీలలో గానీ సంఘాలలో గానీ సమానత్వాన్ని గురించిన స్పృహ లేకపోతే వాళ్ళు యేం చేయగలుగుతారు అని నాకు ఆలోచన కలిగింది. అప్పుడు నేను,  నాలాంటి కొంతమంది ఈ విషయాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టాం.

ఆ ప్రశ్నల్ని వాళ్ళూ సహించలేక పోయారు. పురుషాధిపత్యం వంటి పదాలను కూడా అక్కడ వాడకూడదు. ” అలాంటి మాటలు వాడటం వల్ల  ప్రధాన విప్లవం అంతా పెడత్రోవ పడుతుంది. మనం ముందు విప్లవం తెస్తే తర్వాత స్త్రీ పురుష సమానత్వం దానితో పాటే వస్తుంది”  అనే సమాధానాలు తప్ప, స్త్రీల సమస్య ఒక ప్రత్యేకమైనటువంటిదనీ, స్త్రీల అణచివేత పితృస్వామిక సమాజం లో ఎలా జరుగుతుందన్న చర్చగానీ, అసలిది పితృస్వామిక సమాజమనే గుర్తింపు గాని, ఇవేమీ అస్సలు లేవు. అటువంటి సమయం లో నేను వాటి గురించి ప్రశ్నించాను.  వాళ్ళ సమాధానాలతో తృప్తి పడకపోవడంతో అక్కడ ఇమడలేకపోయాను. రాజీనామా చేసి ఆ సంఘాలు అన్నిటి నుంచీ బయటకు వచ్చాను.

అలా విడిగా వచ్చిన తర్వాత, నాకు ఒకసమస్య. నేనేమిటి అనే నా అస్తిత్వ సమస్య . ఇంతకాలం నేను ఒక సిద్ధాంతానికి పని చేశాను. ఒక పార్టీని ఇష్టపడ్డాను. కొన్ని సంఘాల్లో పని చేసాను. వాటన్నిటినుంచీ బైటకు వచ్చి నిలబడ్డాను. మామూలుగా నా ఉద్యోగాన్నిచేసుకుంటూ.. మామూలు గా బ్రతికేసెయ్యొచ్చు. లేదా  స్త్రీల సమస్యల పునాదులు అన్వేషిస్తూ, విశ్లేషణ గురించి ఆలోచిస్తూ నా దారి నేను వేసుకోవాలా ? అనే ఆలోచనలు. దాదాపు ఒంటరితనమే వుంది. ఏది యేమైనా స్త్రీల సమస్యల ను గురించి దాని విశ్లేషణా పద్ధతుల గురించి ఆలోచించాను. వున్న మార్గాలన్నిటిలోంచి స్త్రీ వాదాన్ని ఎంచుకున్నాను. అంతకు ముందుఉన్నది  వామపక్ష రాజకీయాలైతే,  బయటకు వచ్చాక నేను స్త్రీ వాద రాజకీయాల వైపు వచ్చాను. స్త్రీ వాదిగానిలబడ్డాను.

అది ఒక సంఘర్షణ. అది ఒక రోజులో అకస్మాత్తుగా వచ్చింది కాదు. సంఘాల్లో పనిచేసిన రోజుల్లోనూ సంఘర్షణ వుంది. బైటికి వచ్చాకా సంఘర్షణ వున్నది. స్త్రీవాదిగా మారుతూ.. క్రమంగా ఆ రాజకీయాల్లోకి లోతుగా వెళుతూ వుండటం లోనూ ఆ సంఘర్షణ వున్నది. అది ఒక ప్రాసెస్. ఆ క్రమం లో నేను స్త్రీ వాదినయ్యాను.

Q రచన విషయంలో స్త్రీ-పురుష తేడా పనిచేస్తుందని మీరనుకుంటున్నారా?

స్త్రీలు తమ వేదనల్ని చాలా కాలం పాటూ వ్రాయ లేదు. పురుషులే స్త్రీల తరుఫున చాలా కాలం పాటు వ్రాశారు. ఒక్క సారి స్త్రీలు గొంతు విప్పిన తరువాత స్త్రీలు రాస్తే ఎలా వుంటుందీ అనేది తెలిసింది కదా. పురుష రచయితల్లో కూడా స్త్రీల పట్ల చాలా సానుభూతితో రాసిన వాళ్ళున్నారు. మన చలం గారు, గురజాడ, కొడవటిగంటి ఇలా అనేకమంది వున్నారు. అలాగే స్త్రీ రచయితలూ చాలా మంది వున్నారు. ఐతే వీళ్ళల్లో చూసినప్పుదు స్త్రీలు తమ స్వీయానుభూతిని చెప్పుకునేటప్పుడు వచ్చే  ఒక ఆర్తి,  తమకేం కావాలో స్వయంగా ఆలోచించుకుని వ్యక్తం చేస్తున్నప్పుడు ఆ తేడా వుంటుంది. ఒక్కొక్కసారి పురుషులు కూడా ఆ తేడాను జయించి రాసినటువంటి సందర్భాలూ కొన్ని రచనల్లో వుంటాయి.

స్త్రీలు తాము స్త్రీలుగా కాకుండా పురుషులు ఆలోచించినట్లు రాసిన సందర్భాలూ వుంటాయి.

స్త్రీ వాదిగా రాస్తున్నామా లేక పోతే మామూలు రచయితగా రాస్తున్నామా – అలాంటప్పుడు మామూలుగా పురుషులుగా రాస్తున్నట్లే రాయొచ్చు. మామూలు నవలలు రాసే రచయిత్రులుంటారు కదా! వాళ్ళకీ పురుష రచయితలకీ పెద్ద తేడా లేదు. వాళ్ళు స్త్రీని అర్థం చేసుకుంటూ వర్ణించినట్లే వీళ్ళు కూడ వుంటారు. స్త్రీ వాది గా రాసినప్పుడు, రాసినది స్త్రీ అయినా పురుషుడైన ఒక స్త్రీ వాది రాసినట్టుగా తెలుస్తుంది. పురుషులు కూడా స్త్రీ వాదులు కావొచ్చు. ఫెమినిస్ట్ అనేది స్త్రీలే అవ్వాలని లేదు. పురుషులు కూడా ఫెమినిస్టులు అవ్వొచ్చు. అలా ఫెమినిస్ట్ దృక్పథం తో రాసినప్పుడు ఆ రచన ఒక ప్రత్యేకమైన రచనగా కనపడుతుంది.

Qమీరు మొదట కవిత్వం రాశారు, తరవాత వచనంలోకి మళ్ళాలి అన్న ఆలోచన మొదట ఎప్పుడు కలిగింది?ఎందుకు కలిగింది?

రాయడం కవిత్వం తోనే ప్రారంభమైనా, నేనేదో గొప్ప సాహిత్య కారిణి కావాలని నాకెప్పుడూ వుండేది కాదు. సాహిత్యం అంటే ఇష్టం.  ఏదో రాసేస్తాను. నేను నమ్మినది స్త్రీ వాదాన్ని. అప్పట్లో ఆంధ్ర దేశంలో స్త్రీవాదమంటే పెద్దగా తెలియదు. ఎనభయ్యవ దశకం లో అప్పుడప్పుడే స్త్రీవాద ఆలోచనలు మొలకెత్తుతున్నాయి. ఎప్పుడైతే నేను బయటకు వచ్చేసి స్త్రీ వాదిగా నిలబడ్డానో నాకుగా నేను సమాధానాలు వెతుక్కుని, దొరికిన సమాధానాలు నలుగురితోటి పంచుకోవాలి. అందుకు సాహిత్యం మంచి సాధనం. అందులో నాకు ప్రవేశమూ వుందీ. ఆసక్తీ వుందీ. అభినివేశమూ వుంది. కాబట్టి, దాన్ని ఒక సాధనం గా తీసుకుని పని చెయ్యాలనే ఆలోచన కలిగింది. అప్పుడు నేను ఎన్నుకున్నది వచనం. కవిత్వం రాస్తున్నా కూడా వచనం ఎన్నుకోవడానికి కారణం నేనెన్నుకున్న పని చాలా పెద్దది. స్త్రీ వాద సిద్ధాంత ప్రతి పాదన చెయ్యాలి. సిద్ధాంతాన్ని తెలుగులో తీసుకురావాలి. అప్పటికింకా తెలుగులో స్త్రీవాద సిద్ధంతాన్ని ప్రతిపాదించే పుస్తకాలు లేవు.

ఇంకొకటి స్త్రీ వాద సాహిత్య విమర్శ చెయ్యాలి. స్త్రీ వాద నవలలూ కథలూ రాయాలి. ముఖ్యంగా సిద్ధాంత రచనకీ, సాహిత్య విమర్శకీ వీటన్నిటికీ వచనం బాగా ఉపయోగ పడుతుంది. అందువల్లే కవిత్వం ప్రక్కన బెట్టి, వచనం లో కథలు, నవలలూ, సాహిత్య విమర్శ, సిద్ధాంత రచన ఇంకా రకరకాల రచనా ప్రక్రియలనన్నిటినీ వాడుకున్నాను. వచనమంటే ఇష్టమని కాదు. అసలు నాకు కవిత్వమంటే ఇష్టం. వచన ప్రక్రియలోని విభిన్న అవకాశాలు నన్ను అటు మొగ్గు చూపేలా చేశాయి. అందులో ఒక సిద్ధాంత వ్యాసం రాయొచ్చు, ఒక సాహిత్య వ్యాసమూ రాయొచ్చు. ఇంకా సామాజిక విషయాల మీద వ్యాసాలు రాయొచ్చు. కథలూ నవలలూ రాయొచ్చు. ఇలా వీటన్నిటి కోసం నేను వచనాన్ని వాడుకున్నాను కాబట్టి నేను వచనం లో ఎక్కువ వ్రాసినట్టు కనబడుతుంది.

Qకథ, నవల; ఈ రెండు ప్రక్రియల్లో ఏది మీకు సౌకర్యంగా అనిపించింది?

నవల కన్నా కథ ఎక్కువ సౌకర్యవంతం గా ఫీలయ్యాను.

Qనవలలో కంటే కథలో మీరు మీ సైద్ధాంతిక వాదనని ఎక్కువ బలంగా పెడ్తున్నారని ఇటీవలి ‘విముక్త’ కథల్ని బట్టి అర్థమవుతోంది? అంటే, కథని మీరు మీ సైద్ధాంతిక వాదనకి సాధనంగా చూస్తున్నారా?

‘విముక్త’ కథలు చూస్తేనే అనిపించనవసరం లేదు. విముక్త కథలు ఇటీవల వచ్చినవి. నా మొట్ట మొదటి కథా సంకలనం రాజకీయ కథలు చూశారా? అందులో నా సైద్ధాంతిక ప్రతిపాదనకు రాజకీయ కథలను శక్తివంతమైన ప్రక్రియగా వాడుకున్నాను. అవి స్త్రీ శరీరాన్ని పితృస్వామిక సమాజం ఎలా అణచి వేస్తుందో, స్త్రీ శరీరం లో ఒక్కొక్క భాగం — జుత్తు, కళ్ళు, ముక్కు, నోరు, స్తనాలు, యోని — అన్నిటినీ ఎలా అణిచి వేస్తుందో ఒక్కొక్క భాగానికీ ఒక్కొక్క కథ రాసుకుంటూ వచ్చాను.

పునరుత్పత్తి రాజకీయాల గురించి భిన్న సందర్భాలనే కథా సంకలనం తీసుకొచ్చాను. అందులో కూడా పునరుత్పత్తి రాజకీయాలేమిటి, పునరుత్పత్తి ప్రక్రియ స్త్రీని అణిచివేయడానికి ఎలా ఉపయోగించబడింది, మాతృత్వం అంటే,  లైంగికత్వం అంటే యేమిటి, మానభంగాలు, ఇంకా చిన్నపిల్లల మీద అత్యాచారాలు, కుటుంబ నియంత్రణ పేరుతో జరిగే రాజకీయం వీటన్నిటినీ ఎక్స్ ప్లోర్ చేస్తూ రాసిన కథలే ‘భిన్న సందర్భాలు ‘. అప్పటి నుండీ విముక్త వరకు కూడ ఒక్కొక్క అంశాన్నే ఎక్స్ ప్లోర్ చేస్తూ రాయడానికి నాకు కథా ప్రక్రియ బాగా తోడ్పడింది.

రాజకీయ కథలు నుండీ విముక్త వరకూ ఒక ప్రయాణం. ఒక కథా ప్రయాణం. దానిలో అప్పటి నుండీ ఒక్కో కథా సంకలనంలో నా కథా సిద్ధాంతాన్ని ఒక్కో కోణం లో బలపరుచుకుంటూ వస్తున్నా.

Q సమకాలీన స్త్రీవాద సాహిత్యం నిశ్శబ్దంలోకి వెళ్లిందని అనుకుంటున్నారా? మీ తరం రచయిత్రులు, కవయిత్రులూ వున్నంత బలంగా ఇప్పటి రచయిత్రులు ఎందుకు రాయడం లేదు?

ఏం తగ్గలేదు . స్త్రీ వాద సాహిత్యం చాలా బలంగా వస్తోంది. అటు కవిత్వం లోనూ, కథల్లోనూ వస్తోంది. నవలలు ప్రచురించేందుకు చోటు లేకపోవడం , పెద్ద కధకి అవకాశం లేకపోవడం వేరే ఇతరేతర కారణాల వల్ల నవలలు జనరల్ గానే తగ్గినాయి. కథలూ కవిత్వం వ్రాసే కొత్త రచయిత్రులు చాలా మందే వస్తున్నారు. అనేక వర్గాల నుండి వస్తున్నారు. అంతకు ముందు అగ్ర వర్ణస్తులు రాసే వారు. ఇప్పుడలా లేదు. దళిత స్త్రీలు రాస్తున్నారు

అంటే స్త్రీ వాదం చాలా విస్తృతమౌతోంది. ఒకప్పుడు స్త్రీ పురుష తేడాల గురించే స్త్రీ వాదం ఎక్కువ పట్టించుకుంది. ఇప్పుడు అలా కాకుండా దళిత స్త్రీ వాదం, మైనారిటీ స్త్రీల గొంతులేమిటీ, వాళ్ళ అణచివేత ఎలా వుంటుంది, వీటన్నిం టి కీ వున్న తేడా ఏమిటి, వీళ్ళందరూ ఎవరి అస్తిత్వాలను నిరూపించుకుంటున్నారు. ఇవన్నీ ఇప్పుడొచ్చినాయి. అనేక పాయలుగా విస్తరించింది. ఇప్పుడే పవర్ ఫుల్ గా వుందీ అనిపిస్తోంది. చాల మంది దళిత కవయిత్రులు రచయిత్రులూ చాలా పవర్ ఫుల్ గా రాశారు. గోగు శ్యామల కవితా సంకలనం చూస్తే అనేక మంది దళిత కవయిత్రులు రాశారు. వాళ్ళు రాసింది ఒకటి రెండు కవితలైనా వాళ్ళ గొంతు వినిపిస్తున్నారు. సుభద్ర, శ్యామల, షాజహాన మొదలైన వాళ్ళ గొంతులు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఇలా వీళ్ళందరూ రావడానికి స్త్రీ వాదం దోహదం చేసింది. దళితవాదమూ, అస్తిత్వ స్పృహ రావడానికి కూడా స్త్రీ వాదం తోడ్పడింది.

Q ఈ తరం రచయిత్రుల్లో మీకు కనిపిస్తున్న బలమూ, బలహీనతా ఏమిటి?

ఇప్పటి రచయిత్రుల్లో తమను తాము గుర్తించుకోవాలన్న తపన, సమాజం లో తమ అస్తిత్వాన్ని గుర్తించాలన్న తపన — అదీ వాళ్ళ బలం. బలహీనత ఏమిటంటే, తమ అస్తిత్వాన్ని గురించిన తపన తో పాటు, సమాజం లో వున్నటువంటి ఇతర అస్తిత్వాల గురించిన ఆసక్తి, వాటిని తమ అస్తిత్వం తో సరి చూసుకుని (బాలెన్స్ చేసుకుని) తమతో కలిసి వచ్చే శక్తులేంటీ అనే విషయాన్ని గమనించి ఇంకా తమ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించవచ్చు.

అది బలహీనత అని కూడా అనను. బలహీనతలని చెప్పుకోవడానికి ఎన్నైనా చెప్పుకోవచ్చు. అవన్నీ బలహీనతలా కావా అని నేను చెప్పలేను. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ వాళ్ళ పరిస్థితులూ, నేపథ్యం, సామాజిక అస్తిత్వం, స్వీయ అస్తిత్వం ఇన్ని వుండీ అన్నిట్లోనుండి రాస్తున్నారు. అన్ని సంఘర్షణల్లోంచీ రాస్తున్నరు. అలా రాసేటప్పుడు వాళ్ళ ప్రయాణం లో ఒక్కొక్క సారి బలాలు బలహీనతలవుతాయి. అలాగే బలహీనత అనుకున్నది బలమూ కావొచ్చు. అందువల్ల మనం ఈ విషయాల్లో జడ్జిమెంటల్ గా వుండకూడాదు. ఇలాంటి పరిస్థితుల్లో బలహీనత ఎప్పుడైన బలహీనపడిపోతుంది. బలం ఇంకా పెరుగుతూ పోతుంది.

Q ఈ సుదీర్ఘ సాహిత్య యాత్ర మీకు తృప్తినిచ్చిందా? వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదయినా నిరాశగా అనిపిస్తున్నదా?

నా సాహిత్య ప్రయాణం నాకు తృప్తి గానే వుంటుంది.నేను కేవలం రచనే కాదు విడిగా సమాజం లో స్త్రీల కోసం పని చేస్తున్న సంస్థలు — ఫెమినిస్ట్ స్టడీ సర్కిల్, ఇంకా స్త్రీల కోసం పని చేసే అనేక సంఘాల్లో కార్యకర్తని. అందువల్ల నాకు దొరికిన సమయంలో ఇంతే రాయగలిగాను అన్న తృప్తి వుంది. ఇంకా సమయం దొరికి వుంటే ఇంకా రాసివుండేదాన్ని.

ఒక్కో సారి అవసరం అలా రాయిస్తుంది. ఒక విషయం మీద ఫలానా వ్యాసం రాసి పంపాలీ అంటే రాసేయడం. దాన్ని చెక్కడం, శిల్పం ఇలా చూడటానికి సమయం వుండదు. కథలు అంటే రీడర్స్ ఆసక్తిగా చదవాలి అని వుంటుంది. ఎవరినుంచీ ఈ కథ ఆసక్తిగా చదివించ లేదు అన్న ఫిర్యాదు రాలేదు. ఎప్పుడూ మీ కథ మొదలు పెడితే ఆపలేము, అనే అందరూ అన్నారు  కానీ ఫలాని కథ చదవలేకపోయాము అని ఎవ్వరూ అనలేదు. నా రచనలని చూసుకుని చాలా బాగా రాశాను అనే తృప్తి కంటే నాకు దొరికిన సమయానికి తగినట్లు రాయగలిగాను అన్న తృప్తి ఉంది.

నా కథల్ని హాయిగా చదువుకోగలిగారు, ఆలోచించగలిగారు, మారగలిగారు. అది నాకు చాలా తృప్తినిచ్చిన విషయం.

Qమీ రచనల్ని గురించి క్లుప్తంగా ‘ఇదీ’ అని అడిగితే ఏమంటారు?

నా రచనల గురించి నేనేం చెప్పుకుంటాను…(నవ్వు)

నాకు స్త్రీ వాదమే సందర్భం. స్త్రీ వాద ఉద్యమమే సమయం. అదే సమయం అదే సందర్భం. అదే నేపథ్యం. స్త్రీ వాదాన్ని తెలుగు సాహిత్యం లోనూ తెలుగు సమాజం లోనూ బలమైన వేళ్ళూనాలి అనే సంకల్పంతోనే నా రాజకీయ కథలు, స్త్రీల అణచివేత, పునరుత్పత్తిరాజకీయాలు, పురుషాహంకారం, లైంగిక సంబంధాలూ, ఇలా వీటన్నిటి గురించీ, స్త్రీల పౌరసత్వ భావనలూ, వాళ్ళ మానవ హక్కులు, వీటన్నిటి గురించి రకరకాల రూపంలొ రాయడం అనేది నాకు అవసరం. కథలూ నవలలూ రాస్తే అవి చదువుకునే వాళ్ళకే చేరతాయి. అలాకాకుండా మామూలు పల్లెటూరి వాళ్ళ కోసం జానపద ట్యూన్స్ తో పాటలు,వీధి నాటికలు , రాశాను. సినిమా స్క్రిప్ట్స్ రాశాను. యుద్ధమూ-శాంతీ, లక్ష్మణ రేఖ, ద్రౌపది వంటి నృత్య నాటికలు, పిల్లలకు వుండే సమస్యల్ని చూపించే బాలల చిత్రాలకు మాటలు  రాశాను. ఉషా కిరణ్ సంస్థ లో  పని చేస్తున్నప్పుడు స్త్రీల సమస్యల్ని చూపించే సీరియల్స్ రాశాను.

కొకు బకాసుర కథని తీసుకుని దాన్ని నాటకం చేశాను. చలం గారి నవలల్లోని ఆరు పాత్రలు తీసుకుని వాళ్ళు ఒకచోట కలిస్తే ఎలా వుంటుందీ అన్న భావన ఆధారంగా రాసినది “వాళ్ళు ఆరుగురు.”

కథ, నవలలు, సినిమా, పాటలు, నృత్యం, రూపకం – ఇట్లా నేను ఉపయోగించుకోని ప్రక్రియ లేదు. ఇది నాకు తృప్తిగా కూడా వుంటుంది. చాల కష్టపడ్డాను, సంతోష పడ్డాను, బోలెడన్ని విమర్శలూ ఎదుర్కొన్నాను. కొన్నిసార్లు నా రచనల్లో నా వ్యక్తిగత జీవితాన్ని విమర్శించడం జరిగింది. ఇట్లాంటివి జరిగినపుడు బాధగా వుంటుంది. కానీ సమాజాన్ని ఎదుర్కొని , సంస్కృతికి భిన్నంగా చూడాలనుకున్నప్పుడు రచయిత్రులు ఇట్లాంటివి ఎదుర్కోవాల్సి  వుంటుంది. ఇలాంటి సమస్యను ప్రపంచం లోని అన్ని భాషల్లోని రచయిత్రులూ ఎదుర్కోన్నారు. నేను కూడా అందులో భాగమనుకుని అలా ముందుకు సాగిపోతున్నాను.