చేరతాను, కానీ..

Ghar-wapsi

అయ్యలారా!

మరీ సిగ్గులేకుండా అడుగుతున్నారు కదా

సరే, మీ కోరిక ప్రకారం మీ మతంలో చేరతా,

మీరు చేయమన్నవన్నీ చేస్తా..

కానీ, ముందు కొన్ని విషయాలు తేలాలి

కొన్ని గట్టి హామీలు కావాలి..!

ఇప్పటికే ఏన్నో దగాలు పడినవాడిని కదా,

ఇప్పటికే ఎన్నో చేతుల్లోపడి అసలు రూపు కోల్పోయినవాడిని కదా,

అందుకే ముందు జాగ్రత్త..!

ముక్కోటి దేవతల భక్తులారా!

ఇంతవరకు ఒక్క దేవుణ్నే కొలిచిన వాడిని కదా,

మీ మతంలో చేరాక, ఏ దేవుణ్ని కొలవాలి?

పంగనామాలు పెట్టుకోవాలా, పట్టెనామాలు పెట్టుకోవాలా?

మనుధర్మ మార్గీయులారా!

కులం లేని వాడిని కదా,

మీ మతంలో చేరితే ఏ కులంలో చేర్చుకుంటారు?

బ్రాహ్మణులు గొప్పవాళ్లంట కదా, వాళ్లలో చేర్చుకుంటారా?

మీ దేవతల గుళ్లలోకి కాదు, గర్భగుళ్లలోకి రానిస్తారా?

ఆ దేవతలకు నా చేతులతో స్నానాలు, పూజలు చేయనిస్తారా?

మంత్రాలదేముండిలెండి..

చిలకలు పలకడం లేదా, తంటాలుపడి నేర్చుకుంటాను

కులగోత్రాల పరాయణులారా!

ఇంతవరకు వాటి సొంటులేని వాడిని కదా,

మీ మతంలో చేరితే ఏ కులం వాళ్లను పెళ్లాడాలి?

నాకు పుట్టబోయే పిల్లలు ఎవరిని పెళ్లాడాలి?

గోవధ వ్యతిరేకురాలా!

గొడ్డుమాంసం తినేవాడిని కదా,

మీ మతంలో చేరాక ఏ మాంసం తినాలి?

గొడ్డుమాంసం మానుకుంటే పొట్లి మాంసం తినడానికి డబ్బులిస్తారా?

అసలు మాంసమే తినొద్దని అంటారా?

ఆ మాట మాత్రం అనకండి,

తరతరాలుగా ముక్కరుచి మరిగిన వాడిని కదా!

సంతాన సంఖ్యా నిర్దేశకులరా!

పిల్లలను కనడంపై ఆంక్షలెరగని వాడిని కదా,

మీ మతంలో చేరాక ఎంతమంది పిల్లలను కనమంటారు?

మీకు పడని మతం వాళ్ల సంఖ్యను దాటిపోడానికి

మీ మతం వాళ్లను గంపెడు పిల్లలను కనమని అంటున్నారు కదా

ఎక్కువ మందిని కంటే వాళ్లను సాకడానికి డబ్బులిస్తారా?

తక్కువ మందిని కంటే మీ మతంలోంచి తన్ని తగలేస్తారా?

మనిషికంటే మతమే గొప్పదనే మహానుభావులారా!

మనుషుల తర్వాతే మతాన్ని పట్టించుకునేవాడిని కదా,

మీ మతంలో చేరితే మనుషులనెట్లా చూడాలి?

కులాలుగానా, మతాలుగానా?

అంకెలుగానా, కోటాలుగానా?

కోటాగాడిని కదా,

కోటాలో ఉజ్జోగమొస్తే చేరాలా, చేరొద్దా?

చేరొద్దంటే బతికేదెట్లా?

అయ్యలారా!

ఇవన్నీ, ఇలాంటివన్నీ బతుకుపై ప్రశ్నలు..

చావుపై ప్రశ్నలూ ఉన్నాయి

చచ్చాక  పూడ్చడం మా ఆచారం

మీ మతంలో చేరాక

నేను చస్తే నా శవాన్ని ఏం చేస్తారు?

పూడ్చేస్తారా, కాల్చేస్తారా…?

ఆహ్వానితుడు