నక్షత్ర భరిణ

 

moshe

Art Work: Moshe Dayan

అలా ఒలింపస్ పర్వతసానువుల్లో నువ్వు పచ్చని చెట్ల నీడలో కూర్చుని నీలాకాశం, నీలి తటాకం, ఎర్రని కొండచరియలకేసి చూస్తూ విరబోసిన జుట్టుతో కాటుక కళ్ళతో శరీరాన ధరించిన పల్చటి పట్టు వస్త్రాలతో శిల్పంలా కూర్చుని వుంటే నాకెలా వుంటుంది…?

… ఎప్పుడూ నిన్నే చూడాలనిపిస్తుంది! నీ మాటలే వింటూ నీ పాటలకే చెవులప్పగించి నీ కళ్ళ లోకి చూస్తూ… నీ మనసులోని ఉద్వేగ తరంగాలకి స్పందిస్తూ అలానే ఓ వంద సంవత్సరాలు గడిపేయాలనిపిస్తుంది.

అసలు వంద సంవత్సరాలంటే వంద కెప్లర్ సంవత్సరాలు. పట్టు వస్త్రాలంటే ఈ కెప్లర్ గ్రహంలో పెరిగే పట్టు పురుగుల నుంచి తీసిన దారాలు, నీలి ఆకాశం అంటే కెప్లర్ గ్రహ ఆకాశం లోని వాతావరణం వల్ల వచ్చే రంగే.

అలా ఫెళ్ళుఫెళ్ళున కాసే ఎండలో చెట్ల నీడలో కూర్చుంటాం. నువ్వు కవితావేశంలో పద్యాలు చెబుతావ్. నేను సెలయేళ్ళలో స్నానాలు చేసి ఎండలు వళ్ళు ఆరబెట్టుకుని దగ్గర్లో వున్న నీలి నీళ్ళ తటాకంలో మంచినీళ్ళు తాగి, నీ దగ్గరకి వస్తాను. దూరాన కెప్లర్ గ్రహ ముఖ్య పట్టణం లిబర్టీ నుండి తెచ్చుకున్న ఆహారం – గోధుమలతో చేసిన అన్నం, కూరలు, పళ్ళు, మాంసాలు, మంద్రంగా మత్తెక్కించే ద్రాక్షరసం – ఆ రోజల్లా గడిచిపోతుంది.

రోజంటే రోజూ రోజే! సాయంత్రం ఎప్పటికీ రాదు.

చీకటి ఎప్పటికీ రాదు. నీడలు ఎప్పుడూ పొడుగవవు.

ఎప్పటికీ రాత్రి రాదు. ఆకాశం నీలంగా ధగధగా మెరిసిపోతుంది. నడయాడే తెలిమబ్బులు కనబడినా, ఎప్పుడైనా కాంతితో మెరిసే సూర్యుళ్ళు… ఒకరు ఉదయిస్తూనో మరొకరు అస్తమిస్తూనో ఉంటారు. ఇద్దరూ కలిసి అయినా మెరుస్తారు లేక ఒకరు మెరుస్తుంటే మరొకరు విశ్రమిస్తునే వుంటారు. అందుకే ఎప్పుడూ పగలే కెప్లర్‌లో. ఎప్పుడూ కాంతే, ఎప్పుడూ వెలుగే.

“నాకు చల్లటి రాత్రి కావాలి” అంటుంది. “ఈ సూర్యకాంతి వద్దు. తెల్లటి మబ్బులు, మెరిసే చుక్కలు కావాలి” అంటుంది ఫిలోమీనా.

“నీకెలా తెలుసు? మబ్బులు అంటే ఏమిటి? చుక్కలు ఎలా వుంటాయి? రాత్రి ఎలా వుంటుంది?” అని అడుగుతాను.

“హెరోడోటస్! నాకు తెలుసు. నా కలల్లో రాత్రి నావహించే నీలి నీడలు, తెల్లని చల్లని స్వచ్ఛమైన కాంతి, మెరిసే నక్షత్రాలు, ఆకాశంలో తేలిపోయే నేను…”

నేను నవ్వుతాను. ఎప్పుడూ నవ్వుతూనే వుంటాను. ఈ కెప్లర్‌లో రాత్రి లేదు. చీకటే లేదు. నక్షత్రాలంటే ఏమిటి? మబ్బులంటే ఏమిటి? అంతా సూర్యశక్తే. ఇద్దరు సూర్యుళ్ళ శక్తి నుంచీ ఆహారం సంపాదించి చెట్లు పెంచుతాం. కృత్రిమ వాతావరణంలో మొక్కలు పెంచుతాం. ఎక్కడి నుంచో ప్రవహించి వచ్చే నదుల జలాల నుంచీ నీరు తీసుకుని పంటలు పండిస్తాం. ఇద్దరు సూర్యుళ్ళు ధ్రువాల్లోని అంతులేని మంచుని కరిగిస్తూనే వుంటారు. నీరు సెలయేళ్ళుగా పొంగి పొరలుతునే వుంటుంది. ఇంక ఆకాశం నుంచి వాన ఎందుకు? రాదు కూడా! ఒక సూర్యుడిని మబ్బులు మూసినా మరో సూర్యుడు వెలుగుతూ ఉంటాడు. వాన ఎప్పుడో కాని రాదేమో. ఎప్పుడూ వెలుతురే. ఎప్పుడూ ఆకాశం తళతళా మెరుస్తూంటుంది. నవ్వాను.

“కల కన్నాను” అంటుంది ఫిలోమినా.

కెప్లర్ దాటి అంతరిక్షంలోకి ఎగిరిపోయినట్లు ఏవేవో వింత లోకాలు చూసినట్లు, లక్షల కొద్దీ మినుకు మినుకుమనే చుక్కలు… ఏవేవో వింత స్వరాల పిలుపులు!”

నేను నవ్వాను. “లిబర్టీ నగరంలో అబ్జర్వేటరీలు శాస్త్రజ్ఞులు ఈ విషయంపై ఎప్పుడూ పరిశోధనలు జరుపుతూనే వుంటారు. వాళ్ళకే తెలియనిది నీకెలా, నాకెలా తెలుస్తుంది? మనం వచ్చింది ఈ రెండు రోజులు హాయిగా గడిపి వెళ్ళడానికి అంతే!”

కొండలు తళతళా వెండి వెల్తురుతో మెరుస్తున్నాయి. చెట్ల ఆకులు హరితంతో మిలమిలలాడుతున్నాయి. బాల్యం నుంచి కెప్లర్ చరిత్ర చదువుకున్న రోజులు గుర్తుకొస్తాయి. మూడు శతాబ్దాల కొకసారి చీకటి వస్తుందట. అదేనా ప్రళయం? గ్రహం అంతా అంధకార బంధురమై పోతుందట. ప్రజలందరు ఉన్మాదులై ఒకరినొకరు హింసించుకుని చంపుకొంటారట. ఆకాశంలో మెరుపులు, మెరిసే చుక్కలు, పాములు లాంటి తోకచుక్కలు కనిపిస్తాయి అట. అలా ఒక నాగరకత అంతమయిపోయి దేవుడు ఆకాశంనుంచి దిగివచ్చి పాపహరిహారాలు చేసి శిక్షలు విధిస్తాడట!

ఈ కథ నేను చదువుకున్న చరిత్ర పుస్తకాలలోదే! కాని ఎంతవరకూ నిజమో, అసలు చీకటి ప్రళయం నిజంగా వస్తుందా? వస్తేనే చుక్కలు ఆకాశంలో మొలుస్తాయా?

“నాకు నక్షత్రాలతో నిండిన ఆకాశపు పందిరి కింద పాటలు పాడాలని వుంది” అంది ఫిలోమినా.

“సరేలే పద! వచ్చింది ట్రెకింగ్ చేయడానికి. ఇప్పుడు ఈ నక్షత్రాల గోల ఏమిటి?” అని విసుక్కున్నాను.

 

కొన్నాళ్ళ క్రిందట కొందరు కెప్లర్ యువ శాస్త్రవేత్తలు – మన గ్రహవ్యవస్థ దాటి, ఇంకా గ్రహాలున్నాయనీ, వందల అంతరిక్ష నక్షత్రాలున్నాయనీ వాదించారు. ఒక గుడారంలో చిల్లులు పెట్టిన నల్లటి గుడ్డ కట్టి వేసి అందరినీ దాంట్లోకి ఆహ్వానించి చీకట్లో పైకి చూడమన్నారు. కాంతి చిన్న చిన్న నక్షత్రాల వలె కంతల్లోంచి మెరిసింది.

Kadha-Saranga-2-300x268

“విశ్వాంతరాళపు శక్తి అలా నక్షత్రాల వలె కనిపిస్తుంది. మన సూర్యుళ్ళు కాంతిలో మెరవడం వలనే అవి కనపడడం లేదు. సూర్యుళ్ళు ఆరినా, ప్రకాశించడం మానేసినా ఆ చీకటికి కనిపిస్తాయి సుదూర నక్షత్రాలు. ఇది మా సిద్ధాంతం!” అనేవారు. “అది తెలియక చీకటి ప్రళయం అని కొందరు కెప్లర్ ప్రజలు తరతరాలుగా భయపడి నాగరకతని నాశనం చేసుకున్నారు.”ఆని వాదించేవారు.

ఎవరూ ఒప్పుకోలేదు. మత విశ్వాసులు అసలే ఒప్పుకోలేదు. వాళ్ళిద్దరినీ జైలులో వేశారు. యావజ్జీవ శిక్ష!

ఫిలోమినా నవ్వింది. “నేను ఇప్పటికే ట్రెకింగ్ చేసి వచ్చాను. మళ్ళీ వెళదాం. ఆ దూరపు కొండ చరియలో ఎన్నో నివాసాలున్నాయి. కొండ గుహలు!!! అక్కడ నాకొక ముసలి సాధువు తపసు చేస్తూ కనిపించాడు. ఎన్నో గుహలున్నాయి. వాటిలో వెల్తురు లేదు. ఆ చీకటిలోనే వాళ్ళు ధ్యానం చేస్తున్నారు”.

“నిజమా!” ఆశ్చర్యపోయాను.

“మనకి తెలియని వింతలు ఎన్ని వుంటాయి! పద! నేనూ చూస్తాను”

ఎర్రటి రాతి బండల మీద ఆకుపచ్చని నాచు మొలిచింది. వాటి మీద నడుచుకుంటూ ఇద్దరం బయలుదేరాం. ఎండ ఫెళఫెళమని తలని కాలుస్తోంది. ఆల్ఫా వన్ సూర్యుడు పటమట, ఆల్ఫా టు నడిన కిరణాల వెదజల్లుతున్నారు. వీపు మీది సంచుల్లో నుంచి నీళ్ళు తీసుకుని తాగుతూ నడిచేం.

మూడో గుహ చూపించి “అక్కడ” అంది ఫిలోమినా. ఆమె కళ్ళు ఆతురతతో మెరిసాయి. “ఇద్దర్నీ రమ్మన్నాడు ఆ సాధువు?” అంది.

గుహాంతర్భాగంలో చీకటిలో దూరాకా, ఎత్తయిన రాతి వేదిక మీద కూర్చున్నాడు ఆయన. ఎన్ని సంవత్సరాల వయస్సో వూహించడం కష్టం. తెల్లటి, ఎర్రటి జడలు కట్టిన గడ్డాలు మీసాలు జుట్టు. మాసిన కాషాయ రంగు వస్త్రాలు. నుదుటన తెల్లటి చారలు అడ్డంగా. అది ఒక మత చిహ్నమా? నాకు తెలీదు.

కాగడాలు అతని చుట్టూ వెలుగుతున్నాయి. వాటి నుంచి నూనె వాసనా, నల్లటి పొగలూ వస్తున్నాయి.

ఇద్దరం ఆయన దగ్గరికి వెళితే, సాగిలబడి దండం పెట్టమని  నాకు సంజ్ఞ చేసింది ఫిలోమినా.

“ఓం… శివోహం!” అలాంటి కంఠస్వరం నేనెన్నడూ వినివుండలేదు. ఆయన కళ్ళు తెరిచి చూశాడు.

“హెరోడోటస్, ఫిలోమినా! దీర్ఘాయుష్మాన్ భవ!” అన్నాడు.

ఫిలోమినా చెప్పింది రహస్యంగా – “అది సంస్కృత భాష. ఏదో సుదూర గెలాక్సీ గ్రహంలోనిది!”

“ఆమె నన్నడిగింది ప్రళయం ఏమిటని? ఎలా తప్పించుకోవాలి అని!” సాధువు గంభీర స్వరంతో చెప్పసాగాడు.

“చీకటి ఏర్పడుతుంది. ఇద్దరు భానులు ఆరిపోతారు. ఈ కెప్లర్ గ్రహం అంతటా చీకటి ఏర్పడుతుంది. అది ప్రళయం కాదు. సహజమైన ఖగోళ పరిణామం. కాని ఈ అంధ విశ్వాసులు, ఒకరినొకరు భయంతో చంపుకొంటారు, గృహదహనాలు చేస్తారు. సైతాను వచ్చిందని నమ్ముతారు. నాగరకత నాశనమవుతుంది. మళ్ళీ కాంతి వస్తే మళ్ళీ మొదలవుతుంది! మీరిద్దరూ ఆ ప్రళయాన్ని తట్టుకోండి. ఈ గుహల్లో దీపాలున్నాయి. అవే కాంతిని ఇస్తాయి…”

ఫిలోమినా చేతులు జోడించి, “ఈసారి చీకటి ప్రళయం ఎప్పుడు వస్తుంది స్వామీ?” అన్నది.

నిశ్శబ్దం. టపటపా మండే కాగడాల చప్పుళ్ళు తప్ప.  ఎక్కడి నుంచో హోరు గాలి.

ఆయన చేతిలో హఠాత్తుగా ఒక భరిణ ప్రత్యక్షమయింది. నీలంగా వుంది. దాని మూత వెల్వెట్‌తో కప్పబడి వుంది. ఆ మూత నిండా వేలకొద్డీ వజ్రాల లాంటి కాంతిని చిమ్మే రాళ్ళు పొదగబడి మెరుస్తున్నాయి. అది ఒక కూజా ఆకారంలా వుంది. దాని లోపల ఎర్రటి ఇసుకలాంటి పదార్థం అణువులు అణువులుగా భరిణలోకి క్రింది అరలోకి జారుతోంది. అది పారదర్శకంగా కనిపిస్తోంది.

“అవర్ గ్లాస్! ఒక రకమైన కాలయంత్రం!”’ నేను విజ్ఞాన పురాతన దర్శినిలో చదివాను” అంది ఫిలోమినా. క్రింద అర పూర్తిగా నిండిపోయింది. కొంచెమే ఖాళీ!

“మూడు వందల ఏళ్ళ కొకసారి ఆల్ఫా వన్, ఆల్ఫా టు సూర్యులు కెప్లర్ గ్రహమూ, దాని ఉపగ్రహాల నీడలలో పడి గ్రహణానికి గురి అవుతారు. అప్పుడు సంపూర్ణ ద్విసూర్య గ్రహణం ఏర్పడి గ్రహం అంతా చీకటి అవుతుంది. అది ప్రళయం అని, సైతాను ఆకాశంలోంచి చుక్కల రూపంలో వస్తాడని మూఢ మత విశ్వాసులు నమ్ముతారు. నాగరకతని నిర్మూలిస్తారు.

అవి ఆకాశంలో మెరిసే నక్షత్రాలు. అవన్నీ సుదూర గెలాక్సీలలోని గ్రహాలు, నక్షత్రాలు. వాటి నుంచి వచ్చే కాంతి! సూర్యకాంతి లేకపోతేనే అవి కనిపిస్తాయి. రాత్రి లేని గ్రహంలో అదే ఒక వింత! వింత భయం! కింది అర నిండగానే సూర్యగ్రహణాలు మొదలవుతాయి. మీరు ఆ గొడవలకి దూరంగా పోయి మిమ్మల్ని మీరు రక్షించుకోండి!”

“మీకు… ఎలా తెలుసు స్వామీ?”

“అనేక వందల సంవత్సరాల నుంచి మా పూర్వీకులు గణితంలో ఈ లెక్కలు నేర్చుకుంటూ వున్నారు. అంతం, ఆరంభంల నుంచే నేను ఇక్కడ తపస్సులో మునిగిపోయాను. నిజంగా ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు! శివోహం.”

కాగడాల వెలుతురులో గుహలోని అల్మారాలు పాత డిజిటల్ కంప్యూటర్లు, కాగితంతో కూడా చేసిన గ్రంథాలు ఇప్పుడు స్పష్టంగా కనిపించాయి.

“ఫిలోమినా! దైవం నిన్ను నా దగ్గరకి పంపింది.  తీసుకో! శుభం భూయాత్!”

నక్షత్ర భరిణని కళ్ళకద్దుకుంది ఫిలోమినా.

నేను అనుమానంగానే ఆయనకి నమస్కరించి బయటకి నడిచాను.

***

కాలం గడుస్తోంది. నక్షత్ర భరిణలోని పై అర లోంచి ఇసుక రేణువులు చాలావరకు క్రింది అరలో నిండిపోతున్నాయి.

లిబర్టీ నగరంలో మా ఇంట్లో కూర్చుని వున్నాం. క్రమంగా ఆల్ఫా వన్ సూర్యుడు పడమట పసుపురంగులోకి, ఆ తర్వాత సగం నలుపు, సగం పలచటి ఎరుపులోకి మారిపోతున్నాడు. నడినెత్తిన ఆల్ఫా టు సూర్యుడు సూర్యకాంతి నల్లగా అయి అంచుల్లో తెలతెల్లగా మెరుస్తున్నాడు.

ఫిలోమినా, నేను – ఆహారం, చీకటి రోజుల కోసం కాగడాలు, తాగడానికి నీళ్ళూ, చలి తట్టుకోడానికి దుస్తులు అన్నీ సర్దుకున్నాం.

“కొండల్లోకి పోదాం” అన్నది ఫిలోమినా.

లిబర్టీ నగర వీధుల్లో కలకలం. “ప్రళయం… ప్రళయం” ఎవరి నోట విన్నా అదే మాట.

‘ఇండిపెండెంట్ స్క్వేర్’ లో వున్న ఖగోళ పరిశోధనాలయం దగ్గర ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతోంది.

శాస్త్రజ్ఞులు నలుగురు ఓపికగా సమాధానాలు ఇస్తున్నారు.

“కాదు. ఇది ప్రళయం కాదు. మన దైవం మరణించదు. సైతాను చుక్కల రూపంలో రాడు. ఇది ఒక గ్రహణం మాత్రమే. నమ్మండి.”

మత చిహ్నాలు ఒంటినిండా పూసుకున్న గడ్డాలు మీసాల విలేకరి హుంకరించాడు.

“ఎలా చెప్పగలరు? ఇది దైవ లిఖితం. ఈ నాగరకత నశించాలని రాసి పెట్టివుంది. ఇది ఎన్నో సార్లు జరిగింది. అందరినీ మీరు మభ్యపెడుతున్నారు.”

మేము జనసమూహంలోంచి తోసుకుంటూ వూరి బయటకి నడిచాం.

నక్షత్ర భరిణ పూర్తిగా ఖాళీ అయిపోయింది. క్రింది అర పూర్తిగా నిండింది.

ఇంకా నడిచాం. దూరాన కొండల మీద నీడలు అలముకుంటూ వున్నాయి.

చీకటి నాకు కొత్త. చలి నాకు కొత్త. ఆల్ఫా వన్, ఆల్ఫా టు ఇద్దరూ పూర్తిగా ఆరిపోయారు. ఒక్కసారిగా అంధకారం అలముకుంది.

ఆ సరికి మేం ఒలింపస్ కొండ గుహల దగ్గరికి వచ్చేశాం.

సాధువులంతా గుహల బయటకి వచ్చి ఆకాశానికేసి చూస్తూ – ఏదో వింత భాషలో – ప్రార్థనలు చేస్తున్నారు.

ఒక్కసారి ఆకాశం దేదీప్యమానంగా వెలిగింది. లక్ష దీపాలు వెలిగాయి. ఆకాశంలో చుక్కల పందిరి వెలిసింది. నీలం, పసుపు, తెలుపు, పెద్దవి, చిన్నవి, తోకలతో కొన్ని, తెలిమబ్బులతో కొన్ని అసంఖ్యాకంగా మినుకు మినుకుమని మెరుస్తూ వెలుస్తున్నాయి. అవి వెలిగే దీపాల్లా సువాసన లేని పువ్వుల్లా మెరిసే నక్షత్ర మాలికలు.

వాటి కాంతితో అస్పష్టంగా మెరుస్తున్నాయి కొండలు.

సాధువులు చేతులు ఆకాశం వైపు ఎత్తి పెద్ద గొంతులతో అనేక వింత భాషలలో ప్రార్థిస్తున్నారు.

ఒక వింత చలి ఎముకలని ఒణికిస్తూ ఆరంభమైంది. ఎక్కడి నుంచో కొన్ని పక్షులు అరుస్తూ చెట్ల నుంచి ఎగిరిపోయాయి. కొన్ని అడవి జంతువులు అరవడం వినబడుతోంది.

“ఇద్దరం కొండ మీదకి ఎక్కేద్దాం. ఉన్ని దుస్తులు వేసుకో! భయపడక! ఇదంతా త్వరలో ముగిసిపోతుంది!”

కొండ సగం ఎక్కినాక ఇద్దరం దక్షిణం వైపు లోయలో వున్న లిబర్టీ, కెప్లర్ గ్రహ ముఖ్య పట్టణం వైపు చూశాం.

చీకటి, బొమ్మరిళ్ళ లాంటి ఇళ్ళని కప్పేసింది. చుక్కల వెలుగురు అస్పష్టంగా వాటి మీద పడి అది ఒక భీతి గొలిపే దృశ్యంలా ఉంది.

ఎందుకంటే హఠాత్తుగా మంటలు చెలరేగాయి. పట్టణంలోని భవనాలు నిప్పు అంటుకున్నాయి. బహుశా ఖగోళ పరిశోధనాలయం కూడా అంటుకుంటుంది.

గాలిలో అలలు అలలుగా కేకలు, నినాదాలు వినబడుతున్నాయి. అవి మాకు తెలిసిన కెప్లరీ భాషలో ‘దేవుడి శాపం, దేవుడి శాపం, అంతా నశించిపోవాలి’ అన్న అరుపులు మిన్నుముట్టాయి.

అప్రతిభులమై, ఆశ్చర్యంతో, భయంతో దూరాన వున్న ఆ దృశ్యాన్ని చూడసాగాం నేనూ ఫిలోమినా.

కెప్లర్ గ్రహపు ఇద్దరు సూర్యుళ్ళు ఆరిపోయిన వేళ దీర్ఘరాత్రిలో చీకటి ప్రళయం మొదలయింది.

 

(ఈ రచనకు ఐజాక్ అసిమోవ్ వ్రాసిన “నైట్‌ఫాల్ అనే కథ స్ఫూర్తి. నక్షత్ర భరిణ అనే పదం ఉష మరువం రాసిన కవిత్వంలో చదివి ఈ కథ వ్రాశాను. ఆమెకీ, అసిమోవ్‌కి కృతజ్ఞతలు!)

 

జాలం

 

తెల్లవార్లూ ప్రయాణంతో పట్టీపట్టని నిద్ర…ఒళ్ళు తెలీలేదు. విమానం అడ్రెస్ సిస్టమ్ లో స్పీకర్స్ నుంచి వచ్చే అమ్మాయి గొంతుతో మెలకువ వచ్చింది.

“కొద్ది నిమిషాల్లో గన్నవరం – విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో దిగబోతున్నాం. బయట ఉష్ణోగ్రత 40 డిగ్రీస్ సెంటిగ్రేడ్. వాతావరణం వేడిగా ఉంది. ల్యాండింగ్ కి అనువుగా, విజిబిలిటీ పది కిలోమీటర్ల వరకూ స్పష్టంగా ఉంది.”

బోయింగ్ 747 న్యూయార్క్ నుంచి బయలుదేరి పన్నెండు గంటల్లోనే నాన్ స్టాప్ గా విజయవాడలో దిగాబోతోంది. భుజం మీద వాలి గాఢంగా నిద్రపోతున్న శైలజను తట్టిలేపాడు, శివ.

“శైలూ! లే! దిగిపోతున్నాం.”

రోజులు మారాయి, కాలం మారింది. రెండు రాష్ట్రాలు ఇప్పుడు. విజయవాడ గన్నవరంలో ఒక పెద్ద అద్భుతమైన ఎయిర్ పోర్ట్!

బయటకడుగు పెట్టగానే వేడి గాలి, నిప్పుల కొలిమి లోంచి వచ్చినట్టు! జేబులో మొబైల్ ఫోన్ ‘టింగ్’ మని చప్పుడు.

“విజయవాడకి స్వాగతం! మీరిప్పుడు సన్ షైన్ రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో దిగారు! ఇదిగో ఎయిర్ పోర్ట్ మ్యాప్. ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్, కాంటీన్, టూరిస్ట్ డెస్క్, టాక్సీలు, బస్సులు ఎక్కడెక్కడుండేదీ వివరంగా మ్యాప్ ప్రత్యక్షం అయింది.

ఎయిర్ పోర్ట్ కి తీసుకెళ్ళే బస్ కదిలింది. దాని లోపల చల్లగా ఉంది.

‘టింగ్’ మళ్ళీ ఇద్దరి ఫోనులు చెప్పాయి. “విజయవాడలో స్వాగత్ ఐదు నక్షత్రాల హోటల్ కి స్వాగతం! మీకోసం హోటల్ కారు వేచి వుంది. డ్రైవర్ నంబర్ ఇదిగో…”

“ఓ! అద్భుతం!” అన్నాడు శివ.

‘టింగ్! మీ బ్యాగేజి బెల్ట్ నంబర్ రెండుకు వచ్చి వుంది.”

‘టింగ్! మీరు అమెరికన్ సిటిజెన్ కనుక గ్రీన్ లైన్లో కస్టమ్స్ నుంచి బయటకు రాగానే త్వరగా వీసా స్టాంప్ ఇవ్వగలము! స్వాగతం!’

‘టింగ్! మీరు విజయవాడలో వుంటే ప్రఖ్యాత బాబాయ్ హోటల్ కి విచ్చేయండి. మరచిపోలేని ఇడ్లీ, పెసరట్ లోయ్!’

‘టింగ్! కొండపల్లి బొమ్మలు విజయవాడకి 20 కిలోమీటర్ల దూరంలో. ఆర్డర్ చేయండి!’

“ఇదేమిటి బాబూ, అప్పుడే ఇన్ని మెసేజిలా?” విసుక్కుంది శైలజ.

“స్మార్ట్ సిటీ శైలూ!” అన్నాడు శివ. “విజయవాడ ఏమిటి? మొత్తం రాష్ట్రం అంతా ఆఖరికి మనూరు మామిడిపూడి కూడా స్మార్ట్ విలేజ్ గా మారిపోయింది తెలుసా?”

ట్రింగ్ ట్రింగ్ మెసేజీలు వస్తూనే ఉన్నాయి. టాక్సీలనీ, టూరిస్ట్ ప్యాకేజీలు, కూచిపూడి నాట్యానికి, దగ్గరలో బీచ్ మచిలీపట్నానికీ, విశాఖ సైట్ సీయింగ్, అరకు లోయలో మూడు రోజులు…

“అది సైలెంట్ లో పెట్టండి, లేదా ఆఫ్ చేయండి!” అంది శైలూ కోపంగా.

గన్నవరం నుంచి విజయవాడకి పొలాల మధ్యగా ఆరులైన్లలో రోడ్డు. అటూ ఇటూ ఎండిపోయిన పంట పొలాలు దర్శనమిస్తున్నాయి. వేసంకాలం రాకముందే బయట చాలా వేడిగా వుంది. దూరాన ఎక్కడో ఒక వారి కుప్ప చుట్టూ ఒక ట్రాక్టర్ నీరసంగా తిరుగుతోంది. కొంచెం దూరం తర్వాత ఇక పొలాలు లేవు. అటూ యిటూ క్రమంగా పెద్దవవుతున్న బహుళ అంతస్థుల భవంతులు, మధ్యలో పెద్ద పెద్ద ప్రకటనలు వున్న బోర్డులూ కనిపిస్తున్నాయి.

“ఓ!! వాల్ మార్ట్! స్పెన్సర్స్… అన్నీ వున్నాయిక్కడ!” అంది శైలూ.

“ఔను! కొత్తరాష్ట్రం డిజిటల్ రాష్ట్రం. చాలా మార్పు వచ్చింది.”

కారు రామవరప్పాడు దాటి బెంజ్ సర్కిల్ దారిలో ఒక చోట ఆగింది. ‘హోటల్ స్వాగత్’ ఐదు నక్షత్రాల సౌకర్యం.

రూమ్ కి చేరుకోగానే, “నన్ను రెండుగంటల వరకూ నిద్ర లేపకండి! బడలికగా వుంది. పడుకోవాలి.” అని శైలూ నిద్రలో మునిగిపోయింది.

శివ కూడా బట్టలు మార్చుకొని, టేబుల్ మీదనున్న చల్లని మినరల్ వాటర్ తాగి, ఆనాటి న్యూస్ పేపర్ చదివి నిద్రలోకి జారాడు.

***

“ఆళ్ళు ఒచ్చారంటావా?” అడిగాడు రామకోటయ్య. ల్యాప్ టాప్ మీద, మొబైల్ తెర మీద రెండు చుక్కలు మెరుస్తున్నాయి.

“ఆ, ఒచ్చారు! హోటల్లో దిగారు.” చెప్పాడు నవీన్.

రామకోటయ్య గుబురు మీసాలు తెల్ల గడ్డంలోంచి “హ” అని చప్పుడు చేసి, వెక్కిరింతగా నవ్వేడు.

“రేపు మధ్యాన్నం కేతారంలో రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారంట! జరగడానికి ఈల్లేదు! జరగదు!” కాసేపు ఆగి మళ్ళీ అన్నాడు.

“అది నీ డూటీ! మరి చూసుకో!” నవీన్ జీన్ ప్యాంటు, తెల్ల టీ షర్టు వేసుకున్నాడు. మాసిన గడ్డం, చురుకైన కళ్ళు, నుదుటి మీద కొద్దిగా, కొద్దిగా ఏమిటి ఈ వాతావరణానికి ఒళ్ళంతా చెమటే!

“చూద్దాం! కానీ గ్యారంటీ చెప్పలేను!” రామకోటయ్య వెళ్ళిపోతున్న వాడల్లా వెనక్కి తిరిగి చూసి ఖాండ్రించి ఉమ్మేశాడు.

“పని కాకపోతే డబ్బులుండవ్! నువ్వొక్కడివే  అనుకోబాక! ఇంకా నలుగురున్నారు ఈ పని మీద!” నవీన్ కి అంత వేడిలోనూ చలి పుట్టుకొచ్చింది.

“కోటయ్య తాతా! ఒక కష్టమైన పని పెట్టుకొంటే ఈ కంప్యూటర్ లతో ఖచ్చితంగా చెప్పలేం మరి. మాగ్జిమం ట్రై చేస్తా!”

అతనొక ఎమెచ్యూర్ హ్యాకర్.

***

 

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

సాయంత్రం నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి టీ తాగారు ఇద్దరూ. ల్యాప్ టాప్ ఆన్ చేసి ఆంధ్ర ప్రదేశ్ ల్యాండ్ సర్వే మ్యాప్ లు చూడటం మొదలుపెట్టాడు, శివ. సర్వే నంబరు, వూరిపేరు కొట్టగానే మ్యాప్ వచ్చింది.

“ఎకరం రెండు కోట్లు. ఐదు ఎకరాలు అమ్మేస్తే ఈ వూరితో బంధం తెగిపోతుంది!”

“ఎందుకు ఇక్కడ? ఆ డబ్బుతో రాగిణి మెడిసిన్ చదువు మొత్తం అయిపోయి, అమెరికా లో సెటిల్ కూడా అయిపోవచ్చు అని ఎందుకనుకోరు?” అంది శైలూ.

అతి కష్టం మీద రెండెకరాలు కొనడానికి ఒప్పుకున్నారు. ఇవాళ  సగం డబ్బు క్యాష్ ఇస్తారు. ఈ దేశంలో సగానికి సగం బ్లాక్ మనీ లావాదేవీలు! రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మిగిలిన సగం రేపు చెక్కు ఇస్తారట…”

“అంటే ఇంకా మూడెకరాలు…అమ్ముడుపోవా?”

“మార్కెట్ డల్ గా వుంది శైలూ. ఇప్పటికి నాలుగు కోట్లు చదువుకి సరిపోతాయిగా? అది కూడా కొత్త క్యాపిటల్ రావడం, కొత్త రాష్ట్రం అభివృద్ధి వల్ల ఈ మాత్రం రేట్లు! కొనే వాళ్ళు వుండద్దూ? వాళ్లకి కూడా అంత డబ్బు పెట్టాలంటే ఏదో వ్యాపారం ఉండాలిగా?”

“అంతే మీరు! ఏది చేసినా సగం సగమే!” మూతి ముడిచింది శైలూ.

ఆమెను సంతృప్తి పరచటం బ్రహ్మతరం కూడా కాదు.

***

కంకిపాడు నుంచి ఆరులైన్ల రోడ్డు సిగ్నల్ దగ్గర నల్లరంగు ఇన్నోవా కారు.

కంప్యూటర్ లో కనిపిస్తోంది. “ట్రాఫిక్ జామ్. అది కదలడం లేదు.” అన్నాడు నవీన్. అన్ని చోట్లా సీసీ కెమెరాలు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లలో తెరలు. అక్కడినుంచి తనకి సమాచారం. ఏ క్షణం, ఏ వస్తువు, ఏ వాహనం, ఏ మనిషినైనా ఎక్కడున్నాడో తెలుపుతుంది సమాచార వ్యవస్థ.

స్టోర్ రూమ్ లో ఎన్ని వస్తువులున్నాయి, బస్ లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాయి, రైల్లో ఎంత మంది దిగారు, ఏ హోటల్లో ఎవరున్నారు, ఎవరి బ్యాంక్ లో క్రెడిట్ కార్డ్ లలోంచి ఎంత డబ్బు స్వైప్ అవుతోంది, ఎక్కడ సమావేశాలు, ఆందోళనలు జరుగుతున్నాయి – ఒకటేమిటి వస్తువులు, మనుష్యులు వాహనాలు అన్నీ అనుసంధానమైన డిజిటల్ రాష్ట్రం – స్మార్ట్ రాష్ట్రం. దాంట్లోకి ప్రవేశించాడు, నవీన్ హ్యాకరు.

“ఆ కార్లో రెండు కోట్లున్నాయ్. అవి ఆడికి చేరడానికి వీల్లేదు.” అన్నాడు రామకోటయ్య.

నవీన్ అన్నాడు, “ఆకారును ఆపటానికి అన్ని విధాలా ప్రయత్నించాను సార్. ఇక ఒక్కటే మార్గం.” ఉన్నట్టుండి ఒకేసారి కంకిపాడు జంక్షన్ దగ్గర వాహనాలు అన్నీ రెండు వైపులా కదలసాగాయి. సంక్షోభం! జామ్!! అటూ యిటూ ఒకేసారి గ్రీన్ లైట్లు వెలిగాయి. కార్లు ఒకదాన్ని ఒకటి గుద్దుకోకుండా ఉండటానికి అడ్డదిడ్డంగా తిరుగుతున్నాయి. అవి ఎర్ర చుక్కల రూపంలో స్క్రీన్ మీద.

రామకోటయ్య సంతృప్తిగా నవీన్ కేసి చూసి, “గట్టోడివే, నువ్వా పనిమీదుండు, నేనింటికి వెళ్లి వొస్తా…” అన్నాడు.

ఇల్లు అంటే రెండో ఇల్లు. రామకోటయ్య కోసం మేరీ ఎదురు చూస్తోంది.

“అయ్యిందా?”

“అయినట్టే. నా కడుపు కాడ కూడా కొడితే నేనూరుకుంటానా? ఎంత మేనల్లుడైతే మాత్రం? సంవత్సరం తిరిగేసరికి పది లక్షలు ఆదాయం వస్తా వుండేది. అమెరికా వెళ్లి అక్కడి పౌరసత్వం పుచ్చుకొన్నోడికి ఈ మామిడిపూడి పొలాలే కావలసి వచ్చాయా?”

వృద్ధుడంటే వృద్ధుడు, మధ్య వయస్కుడంటే మధ్య వయస్కుడు రామకోటయ్య. మేరీ మామిడిపూడి ఇంట్లో ఉంటోంది. నాలుగేళ్ళక్రితం భార్య పోయిన దగ్గర్నుంచి మేరీ నే తోడూ, సహచరీ! అసలు అతనుండేది మామిడిపూడి పక్కనే పది కిలోమీటర్ల దూరంలోని గుడివాడ పట్టణంలో. అమెరికా లో ఉన్న మేనల్లుడి పొలాలు చూడటానికి ఈ వూరు వస్తుంటాడు. రాజధాని కోసం ఈ వూరు గుర్తించి, ఆ ప్రాంతం కలిపేసరికి కోట్ల విలువయ్యింది. న్యూయార్క్ లో, న్యూజెర్సీలో ఇళ్ళు కట్టుకొని వందల కోట్లు సంపాదించిన శివ గాడికి ఈ మారుమూల గ్రామంలోని పొలాలే కావాలా? ఎంత వద్దని చెప్పినా అమ్మాలని పట్టు పట్టుక్కూర్చున్నాడు. తనకి చెప్పకుండానే బేరం కుదుర్చుకున్నాడు. రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాడు. గుంటూరోళ్ళు  ఎకరా రెండు కోట్లకి బేరం కుదిర్చారు. రామకోటయ్య ఆలోచిస్తున్నాడు. ఈ రిజిస్ట్రేషన్ ఆగిపోవాలి, ఏమైనా సరే. ఆగిపోతుంది. చాకుల్లాంటి కుర్రాళ్ళు చేతిలో వుండగా పదిలక్షల ఖర్చుతో పదికోట్ల ఆస్థి తన చేతుల్లోనే ఉండిపోతుంది.

***

ఇన్నోవా వేగంగా అడ్డదిడ్డంగా తిరుగుతోంది. కారులో వ్యక్తులకి విసుగ్గా వుంది.

“ఏందీ ట్రాఫిక్ జాములూ? సిగ్నల్లో అన్నీ ఒక్కసారే వెలిగాయి. అందరూ అన్ని వైపులనుంచి వొస్తన్నారు! ఎలా? నీ…”అతనికి కోపంలో బూతులు వస్తున్నాయి.

ఎదురుగా లారీ మచిలీపట్నం వైపు ఓడరేవుకు పెట్రోల్ ట్యాంకర్లని మోసుకొని వేగంగా వస్తోంది. ఇటు గరుడా  బస్సు విజయవాడవైపు వెళుతోంది. మీద మీదకి వస్తోంది. ఎలా వచ్చాడో, ఒక గడ్డి మోపు కట్టి వున్నా రెండు చక్రాల సైకిల్ తొక్కుకుంటూ తలపాగా ముసలోడు కారుకి అడ్డంగా వచ్చేసాడు. అట్నుంచి ఎడ్లబండి ఒక్కసారి మీదికి దూకింది.

రెండు ఎద్దుల మేడలో గంటలు గణగణా మోగాయి. శివుడి వాహనం నందిలా. అపుడు చేసే సాయంత్రపు నాట్యంలా బండి గెంతింది. ఒక్క మెరుపు మెరిసి, ట్యాంకరూ, ఇన్నోవా ఢీ కొట్టాయి. ప్రళయంలా మంటలు చెలరేగాయి.

***

“ఏదో భయంగా ఉందండీ…” అంది శైలు.

ఏడున్నరకి ‘కూచిపూడి’ రెస్టారెంట్ లో అసలైన ఆంధ్రా రుచులు అన్న బోర్డు. ఇద్దరూ చాలా కాలం మిస్ అయిన వంటకాలు తింటున్నారు.

“డబ్బు ఇస్తానని వస్తానన్న వాళ్ళు ఇంకా రాలా!” అన్నాడు శివ.

“అది కాదు. ఎక్కడ కోర్చున్నా, ఎవరో నన్నే గమనిస్తున్నట్లు, నా వంకే చూస్తున్నట్లు, ఇందాక కార్లో కూడా వెంక ఇంకేదో కారు వెంబడిస్తున్నట్టు..”

“నీ మొహం!” భార్యని తిట్టడానికి అవకాశం దొరికింది శివకి. “అంతా నీ భయం. ఇన్ సెక్యూరిటీ… అభద్రతాభావం!”

టీవీలో తాజావార్తలు డైనింగ్ రూమ్ లో అందరికీ వినబడేట్లు, కనబడేట్లు, “కంకిపాడు దగ్గర ఘోర ప్రమాదం. ఇన్నోవా, ఆయిల్ టాంకర్ ల ఢీ! నలుగురి దుర్మరణం. కారులో కాలిపోయిన కరెన్సీ నోట్లు లభ్యం!”

“అయ్యో…” అంది శైలూ.

“బ్లాక్ మనీ…” అన్నాడు శివ.

***

హోటల్ సీసీ కెమెరాల్లో ఇద్దరూ స్పష్టంగా కనిపిస్తున్నారు. నవీన్ నవ్వి ఈల వేయసాగాడు.

“ఆంధ్రా చికెన్ కర్రీ, గోంగూర పచ్చడి, సాంబారులో ములక్కాడలు కూడా కనిపిస్తున్నాయి. హ! హ! హ!”

శివ, శైలూ బిల్ తీసుకొచ్చిన వెయిటర్ కి క్రెడిట్ కార్డు ఇవ్వడం, సంతకం పెట్టడం, కొంత డబ్బు టిప్ కింద ఇవ్వడం లేచి లాబీలోకి రావడం అన్నీ కనిపిస్తున్నాయి.

“హోటల్ అధునాతనమైనది. మొత్తం కెమెరాలే! వస్తువులకి కూడా ఇంటర్నెట్. స్టోర్ రూమ్ లో సరుకులెంత ఉన్నాయో కూడా తెలుసుకోవటానికి సెన్సర్ లు. ఏసీలో టెంపరేచర్ ఎంతో, రెస్టారెంట్ లో, బార్ లో జిమ్ లో, బ్యూటీ పార్లర్ లో అన్ని చోట్లా సెన్సార్లు “ నవ్వాడు.

“రామకోటయ్య గారూ, అన్న మాట నిలబెట్టుకున్నా…” అన్నాడు. లోపల మాత్రం “IOT – ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్” అనుకున్నాడు. ఆ సాఫ్ట్ వేర్ ప్రోగ్రాం లోకి హోటల్ ఇంటర్నెట్ సిస్టం ద్వారా ప్రవేశించాడు.

“ఆళ్ళు ఆగరు. మళ్ళీ ఇంకో బేరం మొదలుపెడతారు. అదీ చూడు!” అన్నాడు రామకోటయ్య. “ఇదిగో ఐదు. పని అయినాక మిగిలిన అయిదు…” కరెన్సీ నోట్లున్న బ్రీఫ్ కేస్ నవీన్ హ్యాకర్ పక్కన నల్లటి నీడలా  నిలబడింది.

దుష్టుడి దురాశలా.

***

“హలో! హలో!”

“హలో?” అన్నాడు శివ విసుగ్గా అర్థరాత్రి.

“సారీ సార్, నాన్నగారి కారు యాక్సిడెంట్ అయింది. ఆయనతో పాటుగా నలుగురు పోయారు. మీకందుకే డబ్బు అందలేదు. రిజిస్ట్రేషన్ రేపు చెయ్యలేం.” ఎడుపుగొంటుతో యువకుడు.

“ఓ!! సారీ!” తలపట్టుకున్నాడు శివ.

“ఇంకెవర్ని అయినా చూడండి. మాకసలే సెలవు లేదు. అర్జెంటు!”

ఇదేం క్రూరత్వం? సాటి మనిషి ప్రాణాలు పోతే? అని శైలుకి అనిపించలేదు.

“అనుకొంటూనే ఉన్నా. వీళ్ళకి డ్రైవింగ్ రాదు. ట్రాఫిక్ కంట్రోల్ లేదు. డబ్బు ఇవ్వడం, సంపాదించడం రాదు!” విసుగ్గా అంది.

“ఇంకెవరైనా కొనాలనుకొంటున్నారేమో అడగండి. మన ప్రోగ్రాం అంతా ఖరాబు అయింది! ఛీ! బ్యాక్ వర్డ్ కంట్రీ అండ్ పీపుల్!! ఏసీ పెంచండి చల్లగా లేదు, ఈ విజయవాడ వేడికి!”

శివ ఏసీ రిమోట్ తో టెంపరేచర్ పదహారు సెంటిగ్రేడ్ పెట్టి కళ్ళు మూసుకున్నాడు.

ఏసీ గాలి వేగంగా చల్లగా భారంగా రాసాగింది.

నిద్రలోకి జారుకున్న వాళ్ళిద్దరికీ క్రమంగా ఊపిరి భారం అవుతోంది. వచ్చేగాలిలో ఏదో తేడా వస్తోంది. ఊపిరి ఆడటం లేదు. కళ్ళు మండుతున్నాయి. శ్వాస భారంగా … ఆక్సిజన్ అందనట్టు… ఎనాక్సియా. ఏసీ గాలిలో మిథైల్ ఐసో సైనేట్? విషపుగాలి ఎలా కలిసింది?ఇందాక రూమ్ లోంచి బయటకొస్తున్న ఏసీ మెకానిక్ రూమ్ సర్వీస్ అంటూ… పాడయిందా?

అలసిన శివ మస్తిష్కంలో మామిదిపూడిలో కొబ్బరి చెట్ల మధ్య తూర్పు పొలం, ఐదు ఎకరాలు పచ్చని చేలతో కనిపించింది. చిన్నప్పటి తను ట్రాక్టర్ తో పొలం దున్నటం, తండ్రి తలపాగా చుట్టుకొని మోకాలి లోటు నీళ్ళలో కూలీలతో పాటు నాట్లు వెసూ…

తర్వాత, శరదృతువులో ఏపుగా పెరిగిన పొలాలు గాలికి ఊగుతూ, ఆ తర్వాత సంక్రాంతికి బంగారు రంగులో కుప్పలు రాశులుగా పోసిన ధాన్యం…మరుక్షణం తండ్రి చితిలో మంటలు.. ఆ వెనక మీసాలు గడ్డాలతో నిండిన రామకోటయ్య ముఖం త్రీడీ బొమ్మలా “నీకెందుకురా! నువ్వు అమెరికా ఎల్లి రా.. పొలాలన్నీ నే జూసుకుంటా…” అంటోంది.

గదిలో ఆక్సిజన్ కరువైంది. శివ, శైలూ ఇద్దరికీ ఊపిరి ఆడటం లేదు. చల్లగాలిని ఇవాల్సిన ఏసీ కంప్రెసర్ లోకి ఎవరో విషవాయువు పంపించారు.

మరో గంటలో కలలన్నీ కరిగిపోతాయి. నిశ్శబ్దం. వస్తువులని, మనుషులని, మనసుల్నీ ఆవహించిన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్…

మామిడిపూడిలో నవీన్ రామకోటయ్య కేసి చూసి తలవూపాడు.

“గట్టోడివే.”మెచ్చుకున్నాడు రామకోటయ్య.

రెండో సూట్ కేస్ చేయి మారింది.

నవీన్ చేతిలో చల్లటి చెమట. సగం ఏసీ మెకానిక్ కి ఇస్తే సగం తనకీ. ఏం సరిపోతుంది? ఫ్లాట్ కొనటానికి ఇంకా కావాలి. కనీసం రెండు కోట్లయినా కావాలి. బయటకు నడిచాడు నీరసంగా. బయట వెన్నెల లేదు. చీకటి వేడిగా కూడా వుంది.

***

ఓ సామాన్యుడి సాహసయాత్ర

kolluri

-మధు చిత్తర్వు 

~

ప్రయాణాలంటే చాలామందికి ఇష్టం. అయితే మనం సౌకర్యవంతంగా రైలులోనో విమానంలోనే ఆ ఊరు చేరుకుని స్థానికంగా దొరికే టాక్సీ మాట్లాడుకుని చుట్టూ ఉన్న ముఖ్యమైన ప్రాంతాలు చూడడం, ఫోటోలు తీసుకోవడం చేసి సావనీర్‌లు కొనుక్కుని తిరిగి వస్తాం. ఇది చాలా మాములుగ చేసే యాత్ర. మహా అయితే ఒక పోస్ట్ కార్డ్ కొంటాం. లేదా బ్లాగ్‌లోనో ఫేస్‌బుక్ లోనో ఓ పోస్ట్ పెడతాం.

అయితే గమ్యం కంటే గమనమే ముఖ్యం, ప్రయాణానికే జీవితం, సాహసమే ఊపిరి అనుకునే వాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు.

ఈ పుస్తకం రాసిన అజిత్ హరిసింఘాని అలాంటివాడే. పూనెలో స్పీచ్ థెరపిస్ట్‌గా పనిచేసే ఇతనికి, పక్షవాతం వచ్చి మాట పడిపోయిన “డీకోస్టా” గారికి చికిత్స చేయడమనేది ఒక గొప్ప స్ఫూర్తి అయింది. డీకోస్టా జె.ఆర్.డి. టాటాకి వీరాభిమాని. ఆయనకి బి.ఎం.డబ్ల్యూ కారంటే ఇష్టం. అజిత్‌కి మోటార్ సైకిల్ ఇష్టం.  జె.ఆర్.డి. టాటా రాసిన “కీ నోట్” అనే పుస్తకంలో గుర్తు పెట్టుకున్న వాక్యం…

“…జీవితాన్ని కాస్త ప్రమాదకరంగా గడిపితే… ఆనందం, ఆత్మఫలసిద్ధి…” అనే వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ “ఎప్పుడైనా నా కోసం… సాహసం… మోటార్ సైకిల్… ” అని అడుగుతారు డీకోస్టా.

అదే ఈ యాత్రకి నాంది. ఈ అజిత్ హరిసింఘాని యాభై నాలుగేళ్ళ వయస్సు.. నెరసిన జుట్టుతో అసలు హీరోలానే లేడు. కానీ ఈ పుస్తకం ముగిసే సరికి అతన్ని ఆరాధించడం మొదలుపెడతాం. అతనితో పాటు మోటార్ సైకిల్ మీద ప్రయాణిస్తాం.

ప్రమాదం అంచుకి రమ్మని పిలిస్తే భయపడతాం. పడిపోతామని భయపడతాం. చివరికి కొండ మీద నుంచి తోస్తే ఆకాశానికి ఉజ్వలంగా ఎగిరి పోతాం.

పూనె నుంచి జమ్ము దాకా కేవలం మోటార్ సైకిల్ మీద ప్రయాణించాడు అజిత్ – చాలా తక్కువ బడ్జెట్‌తో. దారిలో అతని అనుభవాలు భారతదేశపు అసలైన ఆత్మని చూపిస్తాయి. అహ్మదాబాదు, మౌంట్ అబూ, ఆజ్మీర్, పుష్కర్ లాంటి ఎడారి ప్రాంతాల నుంచి సాధారణ వ్యక్తుల ఆతిథ్యం తీసుకుంటూ మనం కూడా ప్రయాణిస్తాం. రోడ్డు పక్కన సూఫీ బాబా సైకిల్ మీద మక్కా బయల్దేరానని చెబితే అతని కథ వింటాం. “భగవంతుడిచ్చిన రాజప్రాసాదంలాంటి భూమి మీద పడుకోడానికి రెండు గజాల స్థలం ఎక్కడైనా దొరుకుతుంది” అంటాడు సూఫీ బాబా. అతను చెప్పిన కథలో అమాయకుడైన యువభిక్షువు.. “ఒక్కరోజుకి ఆహారం చాలు. రేపటి గురించి భగవంతుడు చూసుకుంటాడ”ని ఎందుకు నమ్ముతాడో గ్రహిస్తాం. గురుద్వారాలో ఉచితంగా మకాం వేస్తాం. ఇనుప వంతెనని దాటుతుంటే పిట్టల గుంపులు తల మీదుగా ధ్వనులు చేసుకుంటూ వెళ్తాయి. అస్తమిస్తున్న సూర్యుడి బంగారు రంగు కాంతిలో గురుద్వారాలో కీర్తనలు వింటాం.

ఆ తర్వాత రోహతాంగ్ కనుమ దాటి నీలాకాశంలో ఎగిరే గద్దలను చూస్తాం. అజిత్‌తో రోడ్లు మాట్లాడుతాయి, వంపులు తిరిగే రోడ్డు మీద ఉన్నత పర్వత మార్గాలు దాటి ఎముకలు ఒణికించే రక్తం గడ్డకట్టే చలిలో ప్రయాణిస్తాం. “వెండి అనకొండ”లాంటి నదులనీ, ఆకాశంలో చందమామని చూస్తూ రాత్రుళ్ళు గడుపుతాం.

లేహ్ అంటే.. లడాఖ్ రాజధానిలో 3520 మీటర్ల ఎత్తులో బౌద్ధ మతస్థుల పండగలు, ఆరామాలను దర్శిస్తాం. విదేశీ యాత్రికులతో పరిచయాలు చేసుకుంటాం. టైగర్ హిల్ దగ్గర ద్రాస్ లోయ చూస్తాం. ఇంటి బెంగతో ఉన్న సైనికులతో స్నేహం చేస్తాం.

ఇంతెందుకు, ఈ అద్భుతమైన అనుభవాలు అన్నీ మాటల్లో చెప్పలేనివి. ఈ పుస్తకాన్ని చక్కగా అనువదించిన కొల్లూరి సోమ శంకర్ తన అద్భుతమైన భావుకతతో కథనాన్ని మరింత రక్తి కట్టించారు.

అజిత్ హరిసింఘాని గారు జమ్మూ దాకా విజయవంతంగా యాత్ర చేసి తిరిగి ఇంటికి రైల్లో వస్తుంటే.. మనకీ అదే సాహసం చేసి తిరిగి వచ్చిన “హమ్మయ్య” అనే అనుభూతి కలుగుతుంది.

జోరుగా ప్రవహించే పార్వతి నది గలగలలు, మనాలి లోని దేవదారు అడవులలోంచి వీచే చిరుగాలులు, బౌద్ధారామాలలోని గంటల చప్పుడు, మంచులో కూరుకుపోతే వచ్చే ప్రాణభయం, ప్రపంచంలో కెల్లా ఎత్తైన రహదారిలో వెచ్చగా పలకరించే సూర్యకిరణాలని అనుభవించాలంటే ఈ పుస్తకం చదవండి.  ఎందుకంటే ఇది కథ కాదు, కల్పితం కాదు. ఒక సామాన్యుడు చేసిన సాహసయాత్ర. నిజంగా నిజం.

 

***

“ప్రయాణానికే జీవితం” పుస్తకం హైదరాబాద్‌లో నవోదయ బుక్ హౌస్‌లోనూ, విజయవాడలో నవోదయ పబ్లిషర్స్ వద్ద దొరుకుతుంది. షాపులకి వెళ్ళలేని వాళ్ళు కినిగె ద్వారా పుస్తకాన్ని ఇంటికే తెప్పించుకోవచ్చు. కినిగెలో ఈబుక్ (http://kinige.com/book/Prayananike+Jeevitam) కూడా లభిస్తుంది. 176 పేజీల ఈ పుస్తకం వెల రూ. 120/-