ఆకలి (1973 – 1991)

 

 

తొలిసూరి  కానుపని మా అవ్వను వాళ్ల పెద్ద మేనమామ నర్సయ్యచ్చి వాళ్ళ తల్లిగారింటికి కాన్పుకు తీస్కపోయిండట. అప్పుడు నేను మా అవ్వ కడుపులున్న. మా అవ్వ తల్లిగారూరు కాజీపేట జంక్షన్ పక్కన శిన్న పల్లెటూరు. మా అవ్వకు ముగ్గురు మేనమామలు. మా అవ్వ చిన్నగున్నప్పుడే మా అవ్వోళ్ళ తల్లి సచ్చిపోయిందట. అయ్యో  తల్లి లేని పిల్లాయే అందునా అక్క బిడ్డాయె అని మా అవ్వను మేనమామలు, వాళ్ళ భార్యలు మస్తు గార్వంగ సూసుకునేదట. మా అవ్వోళ్ళ పెద్ద మేనమామ నర్సయ్య ఇంట్ల 1973ల మా అవ్వ పసిద్దకాంగనె (డెలివరి) నేను పుట్టిన్నట. వెంటనే బాపనాయినను పిలుస్తే ఆయనచ్చి పిలగాడు పుట్టిన గడియ మంచిదిగాదు. మూడొద్దులు (3 రోజులు ) తల్లి మొఖం పిలగాడు, పిలగాని మొఖం తల్లి సూడద్దు, సూత్తె మంచి జరుగదన్నడట. మావోళ్ళు భయపడి నన్నో అర్రల, మా అవ్వనో అర్రలపండుకోబెట్టిండ్లట. నేను ఆకలయి పాలకోసం మస్తు ఏడిషేదట. ఎంత ఊకుంచిన ఊకోకపోయేదట. ఏడిషి ఏడిషి ఊపిరి పట్టేటోన్నట. మా అవ్వోళ్ల మేనమామలు వాళ్ల భార్యలు ఊళ్ళెకు బోయి ఆవుపాలు, మేకపాలు, బర్రె పాలు ఏవ్వి దొరికితే అవ్వి తెచ్చి నాకు తాపిచ్చెటోళ్ళట. అగో.. అప్పడిసంది నా ఎంటబడ్డది ఈ ఆకలి…

మాది తాలుకా హెడ్‌క్వాటర్‌కు ఓ ఐదు కిలోమీటర్ల దూరంల వుండే చిన్న పల్లెటూరు. మేము కుమ్మరోళ్ళం. కూటికి గతిలేనోళ్ళం. మూడు పూటల కడుపునిండ బువ్వ తినే ఔషత్ లేనోళ్ళం. మాకు రాగడి మట్టిగోడల్తోని కట్టిన ఒక గడ్డి గుడిసె ఒక కుమ్మరి గూనపెంక ఇండ్లుండేటియి. నాకు ఏడెనమిది సంవత్సరాల వయసచ్చి కొంచెం తెలివచ్చేసరికి మా తాత మా ఇంటిముందు సాయబాన్ల కూసోని కుండలు జేస్తుండెటోడు. మా ఇంటి ముందు చిన్న “కుంట” వుండేది. ఎడ్లబండి కట్టుకోని కుంట్లకుబోయి తట్టతోని రాగడి మట్టి ఎత్తి బండి నింపుకోనచ్చి, మట్టిపెళ్ళలను ఎండల  ఎండబెట్టి, ఎండినక్క ఆ పెళ్ళలను పలుగగొట్టిమెత్తగ పొశిపొశి జేసి తరువాత నీళ్ళు బోసి నానబెట్టి, తొక్కి తొక్కి మెత్తగ గ్రీస్ లెక్క జేసి మట్టిముద్దను “సారె”మీద బెట్టి కోలకట్టెతోని సారెను తిప్పి , పేర్పులు, అటికెలు, ఎసులలు, మంచి నీళ్ల కుండలు, ఐరేని కుండలు, కూర కంచుల్లు, కూరాడు కుండలు, ముంతలు, దొంతులు, బోనం కుండలు, పటువలు, గురుగులు, దీపంతలు జేసి “వాము”ల కాలబెట్టి అమ్మెటోడు. పెయ్యంత మట్టి బూసుకొని కాయకష్టం జేషినా ఈ కులం పనిల అర్కత్ లేదు, బర్కత్ లేదని ఒక్క శిత్తం జేసుకోని కుండలు వానుడు ఇడిషిబెట్టి వున్న రెండెకరాల బూమిల వ్యవసాయం జేసుడు షురువు జేషిండు.

మా నాయినను ఊళ్ళె ఓ పటేలుకు  జీతముంచిండు. ఆ పటేళోళ్లు మా నాయినకు జీతం కింద మక్కజొన్నలు కుంచాలతోని కొలిశి ఇచ్చెటోళ్ళు. అప్పుడు మా ఇంట్ల పొద్దున, రాత్రి గడుక వండెటోళ్ళు. పండుగలప్పుడు యాటపోగు తెచ్చుకున్నప్పుడు లేకపోతే ఇంటికి ఎవ్వలన్న సుట్టాలచ్చినప్పుడు బువ్వ వండేది. ఆ పూట నేను మస్తు కడుపునిండ తినెటోణ్ణి. తతిమ్మరోజులు సగం సగం తిండే. మస్తు ఆకలయ్యేది. ఆ మక్కజొన్న గడుక పాడుగాను మూడుపూటల అదే తినేవరకు అరుగక శెంబడుక (విరేచనాలు) పెట్టేది. గడుక పెద్దగ రుశుండకపోయేది కాని తినక తప్పకపోయేది. తినకపోతే ముడ్డెండుతది. ఆకలిగదా ఆకలి.. అందుకే పెద్దోళ్ళు అన్నట్టున్నది “ఆకలి రుశెరుగది, నిద్ర సుఖమెరుగది” అని.

మక్కజొన్న గడుకల ఇంతంత పెరుగు బోసుకొని పల్చగ పిసుక్కోని పక్కకింత మామిడికాయ తొక్కేసుకోని తింటే మంచిగనె అరిగేది కని పెరుగు కొందమంటే పైసలుండకపోయేది. పైసలున్నప్పుడు పెరుగు దొరుకకపోయేది. ఎందుకంటే ఏగిలిబారంగనె లేసి పాలు, పెరుగు, కూరగాయలు, ఆకుకూరలు గంపలల్ల పెట్టుకోని మండలంకు బోయి అన్ని అమ్ముకొని వచ్చేటోళ్ళు మా ఊరోళ్ళందరు. బారతదేశంల పల్లెల పరిస్థితి గమ్మతిగుంటది. ఒంట్లె బొక్కలరిగెదాక, మాంసం కరిగెదాక కాయకష్టం జేసి పండిచ్చిన పంటలను అన్నిటిని తీస్కపోయి అడ్డికి పావుశేరు పట్నపోల్ల దినాలకు పెట్టత్తరు కని పండిచ్చినవాళ్లు కూడా తినాలె. వాళ్లది కూడ పానమే, వాళ్లు గూడ ఆరోగ్యంగా వుండాలే అని అస్సలే ఆలోసించరు. మళ్ల రోగమత్తె హాస్పటలల్ల శెరీకయ్యి బాగు శేయించుకోనికి అప్పులు మస్తు జేస్తరు. మంచి తిండి తినండ్లయ్యా నాయిన అసలు రోగమే రాదు అంటే అరికీస్ ఇనరు..

యాభై సంవత్సరాలకె అస్థిపంజరాల లెక్క అయితాండ్లుపల్లెజనం కని అదే అరవై ఏండ్ల చిరంజీవి తెల్లబూరుకు కర్రె రంగేసుకోని 150వ సిన్మా సురువు జేషిండు. పల్లెటూరోళ్ళు పండిచ్చుడు బాగనే నేర్సుకున్నరు. ఇగ పండిచ్చినదాన్ని తినుడు కూడ అలవాటు శేస్కోవాలె.

అట్ల మూడు, నాలుగు ఏండ్లు మక్కజొన్న గడుక అరిగోసబెట్టి నన్ను ఆకలితోని సంపింది. తరువాత మా ఇంట్ల పొద్దున మక్కజొన్న గడుక, రాత్రి బువ్వ వండుడు సురువు జేషిండ్లు. మా నాయినమ్మ ఒక పెద్ద కురాడు కుండ బెట్టి దాంట్లె గంజిని బోషి పులుసబెట్టి “కలి” తయారుజేశేది. పెద్ద బువ్వ కుండల బియ్యంబోసి ఆ “కలి”ని బొశి బువ్వ వండేది. ఎసరు వచ్చి బియ్యం కుతకుత వుడుకుతాంటె పలుకు మీద వున్నప్పుడే సన్నటి, గుండ్రటి శిల్లులు శిల్లులున్న వెదురుబద్దల “శిబ్బి”ని కొంచెం వంచి బువ్వకుండ మూతిలకెళ్లి లోపలికి సొర్రిచ్చి బువ్వకుండను తలకిందులు జేశి గంజి వారబెట్టేది. కొంచెంశేపు వుంచంగనే గంజి కిందబెట్టిన గిన్నెలకు కారేది. ఈ కారిన గంజి వేడి ఆవిరితోని బువ్వ  “ఉమ్మగిల్లేది” కారిన గంజిని మళ్ళా తీస్కపోయి కొంత కలిల కలిపేది. మిగిలిన గంజిల మేము ఉప్పు ఏసుకోని తాగేది. అట్ల కలితోని వండిన బువ్వ పుల్లగ గుమగుమ వాసనచ్చేది. అదో శిత్రమైన పుల్లని పరిమళం. ఆ పరిమళాన్ని నా జిందగీబర్ నేను మల్లెక్కడ పీల్చలే. అది ప్రపంచ వింతలల్ల ఎనమిదో వింత. సచ్చి ఏ సర్గంల వున్నదో  మా ముసల్ది ( నాయినమ్మ). ఆ వాసనతోని సంపేది. ఆ వాసన పీల్వంగనే ఆకలి కొరివి దయ్యమై అదాట్న మీద దునికేది. జెల్ది బువ్వెయ్యె ముసల్దాన అంటె “ఎహె పులిగండు గుంజిగ బువ్వ ఉమగిల్లద్దారా అగడుబడ్డ పోచమ్మ మొగుణ్ణి మింగినట్టు” శేత్తవేందిరా అరుగుడు పేగు వున్నదా నీకు అని తిట్టేది నవ్వుకుంట. రొండు మూడు రోజులున్నా గూడ ఆ బువ్వ పాశిపోయేది గాదు. మళ్ళా మస్తు పుల్లలు, పుల్లలుండేది. ఈ హీరోయిన్ సుహాసిని రోజు T.V. యాడ్‌ల  శెప్పుతాంటదిగదా.. లలిత బ్రాండ్ రైస్ .. సన్నగా సమానంగా 48 గంటలపాటు ఫ్రెష్‌గా వుంటది అని. కని మా ముసల్ది కుండల వండిన కలిబువ్వ ముందు ఈ లలిత బ్రాండ్ రైస్ బలాదూరె. బల్లగుద్ది శెప్తా. పొద్దుందాక మక్కజొన్న గడుక తినలేక ఆకలికి సచ్చినాగాని రాత్రికి బువ్వ మాత్రం కమ్ముగ తినేది.

మా ఊరిబళ్ళె నాలుగో తరగతిదాకనే వుండేది. నాలుగు ప్యాసై అయిదో క్లాసు సదువనీకి మండలం హెడ్‌క్వార్టర్ స్కూళ్ళ శేరికయిన. రోజు పొద్దుగాల లేశి పిడిక బొగ్గుతోనన్న, యాపపుల్లతోనన్న లేకపోతే ఇటుకపొడి పరంతోనన్న పండ్లు తోముకొని,  ఒత్తుల వేడినీళ్లతోని పెయ్యి కడుక్కోని గడుకుంటె గడుక, బువ్వుంటె బువ్వా ఇంతంత తిని పగటికి సద్దిబెట్టుకొని పోను ఐదు, రాను ఐదు మొత్తం పది కిలోమీటర్లు నడుసుకుంట బోయచ్చి సదువుకునెటోణ్ణి. గడుక వండిన నాడు పగటికి సద్దిపెట్టుకపోయెటోణ్ణిగాదు. ఎందుకంటె బళ్ళె అందరం పగటీలి ఒక్కదగ్గర్నే కూసోని తినేటోళ్ళం. అప్పుడు కడుమ పోరగాండ్లు నా గడుక సూత్తె నా ఇజ్జత్ పోతదని పొద్దటిబడి ఇడిషిబెట్టినంక అరేయ్ నువ్వు సద్ది తెచ్చుకోలేదార అని ఎవ్వలన్న దోస్తుగాండ్లు నన్నడిగితె నేనత్తానప్పటికి మా అవ్వ ఇంకా బువ్వ వండలే. రాత్తిర్ది సలిబువ్వుంటె ఇంత తినచ్చిన అని నేను అబద్ధమాడెటోణ్ణి. దోస్తుగాండ్లు వాళ్ల సద్దిగిన్నె మూతల న పరింత బువ్వేశి ఇంతంత కూర ఏత్తె నేను తినేటోణ్ణి. అట్ల రోజు ఒగలుపెట్టేది. తినాల్నంటె తలకాయ తీశినంత పనయ్యేది. పొద్దటిబడి ఇడిషిబెట్టంగనె ఆ గంటశేపు అటుఇటు తిరిగచ్చెటోణ్ణి. మా కింది కులాలోళ్ళ బతుకులల్ల ఇదో పెద్ద పరేషానున్నది. మా ఇండ్లళ్లకు చెప్పు ఇసిరేత్తె కుండ తలుగకపోవచ్చు కని మాకు రేషం ఎక్కువ. జేబుల శిల్లిగవ్వ లేకపోయిన పెయ్యి మీద అయిమనంగ బట్టలేకపోయిన, ఆత్మాభిమానాన్ని మాత్రం అరికీస్ సంపుకోం. ఒకల మోశేతికింది నీళ్ళు తాగి బతుకం.

బొండిగల పాణం పోయెదాక కొట్లాడతనే వుంటం. కిందబడ్డా, మీదబడ్డా పిడికిలి పైకే లేపుతం. శరం దప్పిన రండ బతుకు మేం బతుకం. మా తాతల తండ్రుల జీన్స్‌లల్లకెళ్ళి ఆ గుణం తబాదాలవుకుంట (ట్రాన్స్‌ఫర్) వస్తాంది. అందుకే మేం ఆర్ధికంగా బలపడుతలేమో ఏమో అనిపిస్తది. మా బడి పక్కనే ఒక సౌండ్‌సెంటర్ వుండేది. అప్పుడు రికాడ్లు వుండేటియి. అవి నల్లగ గుండ్రగ పెద్ద పెద్ద జొన్నరొట్టేలున్నట్టుండేటియి. బయిటికి ఇనబడేటట్టు అక్కడ పాటలేశేటోళ్ళు.  నేను రోజు పగటీలి అక్కడ పాటలు ఇనుకుంట ఆకలి మర్శిపోయెటోణ్ణి. పాటలల్ల శానా బలముంటది, ఎగిరిపిస్తది, దునికిపిస్తది, ఏడిపిస్తది, నవ్విపిస్తది, ఉరికిపిస్తది, ఉద్యమాలు చేపిస్తది, నరాలల్ల రకుతాన్ని మరిగిపిస్తది, ఆకలిని మరిపిస్తది, ఆకలి ఎందుకయితాందో ఎరుక కలిగిపిస్తది. సాయంత్రం బడి ఇడిషిబెట్టంగనేనేను ఐదు కిలోమీటర్ల చిల్లర నడుసుకుంట బోయెటోణ్ణి. అసలే ఆకలి, అంత దూరం నడువాల్నంటె ఏడుపచ్చేది. మా ఊరి సడుగు (రోడ్డు ) పెద్ద పెద్ద కంకర్రాల్లతోని ఏశిండ్లు. నా కాళ్ళకేమో చెప్పులుండకపోయేది. నడుత్తాంటె నడుత్తాంటె పోట్రవుతు నా కాలు ఏల్లకు ఊకె తాకి గోర్లు లేశిపొయ్యేటియి. రక్తం కారుతాంటె మట్టి సన్నగ శెరిగి మట్టి పరాన్ని దెబ్బమీద పోస్తే దెబ్బకే రక్తం కారుడు ఆగేది. ఎండకాలంల్నయితే మస్తు దూప అయ్యేది. వాగుకాడికి పోంగనే వయ్యిలు పక్కనబెట్టి శెలిమెతోడి నీళ్లూరంగనే వంగి మూతితోని కడుపునిండ తాగేది. ఆ నీళ్లు తేటగ సల్లగ పిర్జిల పెట్టినట్టుండేటియి కని ఇప్పుడు మా వాగుల నీళ్లు తాగుతే మారుమాట్లాడకుంట సచ్చుడే.. ఎందుకంటే సుట్టు పొలాలల్ల శితం ఫెస్టిసైడ్ మందులు కొడుతాండ్లు. అడ్డగోలుగా యూరియా పిండి బస్తాలు సల్లుతాండ్లు. ఆ పొలాలల్ల నీళ్లు వాగులకి వచ్చి కలుత్తాంటయ్.అప్పుడు మందులు వాడుకమే లేకుండె ఏదో అడపాదడపా తప్ప.

ARIF6

ఇగ రోజు ఈ ఆకలి, ఈ నడుసుడు నావల్లగాక మా నాయిన బుష్కోట్ కీస(అంగిజేబు)ల కెల్లి పైసలు ఎత్తుకపోయి పావులబెట్టి హాస్టల్ ఫాం, ఆటాన బెట్టి కులం, ఆదాయం, నివాసం సర్టిఫికెట్లు, ఇంకో రూపాయిబెట్టి రెవెన్యూ టిక్కట్లు కొని అన్ని ఫాముల మీద నా వివరాలు నింపి తహసిల్దారుతోని సంతకాలు బెట్టిచ్చి, సోషల్ వెల్ఫర్ ఆఫీసుల ఫాంస్ ఇత్తే మేము కుమ్మరోళ్ళమని నాకు B.C. హాస్టల్ల సీటిచ్చిండ్లు. మా ఇంట్ల “గుమ్మి”ల ఓ పాత ఇనుప సందూగ వుండేది. దాన్ని బయటికి దీసి దాని లోపలున్న “పాశిట్టు” దులిపి ఓ తడిగుడ్డతోని తుడిశి దాంట్లె నా వయ్యిలు, అంగిలాగులు, పండుకునెటప్పుడు కప్పుకునెదానికి ఓ చెద్దరి కిందేసుకునె దానికి ఓ తట్టు పెట్టుకోని B.C  హాస్టల్‌కు పోయిన. హాస్టల్ల పొద్దటి8.30కు , రాత్రి బువ్వ5.30 కు పెడుతరు. సొట్లుబోయిన పల్లాలు బట్టుకోని లైనుకు నిలబడి బువ్వ పట్టుకోని సకిలమ్ముకిలం బెట్టుకోని తినేది. రోజు పొద్దున కందిపప్పన్న, పెసరపప్పన్న, శెనిగెపప్పన్న, మైసూరుపప్పన్న పెట్టేది. పప్పంత నీళ్ళు నీళ్ళు పలుచగ వుండేది. పొద్దున మాపున పచ్చిపులుసు గూడ శేశేది. పచ్చిపులుసు నల్ల శింతపండుతోని శేశేది. కర్రెగ పాడయేది. సూడంగనే “ఒకారం” వచ్చేది. అడిగెటోడులేడు, నుడిగెటోడు లేకుండె.

మా బతుకులు “ఎవ్వనికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడుస్తాంది” అన్న బాలగంగాధర్ తిలక్ కవిత లెక్కుండేది. మాకు పొద్దటిబడి మధ్యాహ్నం ఒంటిగంటకు ఇడిషిబెట్టంగనే నా తోటోళ్ళందరు పోరగాండ్లు వాళ్ళ వాళ్ల ఇండ్లళ్ళకు ఉరికి బువ్వ తినచ్చేది. నాకేమో పగటీలి హాస్టల్ల బువ్వ పెట్టకపోయేది. నాకు మస్తు ఆకలయ్యేది. హాస్టల్ల కొంచెంసేపు కూసోని, లైఫ్‌బాయ్ సబ్బుతోని మొఖం కడుక్కునేది. అప్పుడు నాకు వేరే సబ్బులు తెల్వయి. ఎర్ర లైఫ్‌బాయ్ సబ్బు తప్ప. మళ్లా నాలుగున్నరకు సాయంత్రం బడి ఇడిషిబెట్టంగనే దనదనా ఆకలితోని హాస్టల్‌కు ఉరికచ్చేది. ఓ గంట అటు ఇటు టైమెల్లదీయ్యంగనే 5.30 కు రాత్రి బువ్వ కూరగాయల్తోటి పెట్టేది. పచ్చిపులుసు సాయంత్రం గూడ పోశేది. ఒక స్టీలు “రికాబు”తోని హెడ్ కుక్ పెద్ద అండ ముందటబెట్టుకోని మాకు బువ్వ పెట్టేది. ఆకలిమీద మంటర మంటర దనాదనా తిని సరిపోక “మారు”కు మల్లబోతె బువ్వ పెట్టకపోయేది. సరిపోలే అన్న ఆకలయితాంది ఇంకొంచెం బువ్వ ఎయ్యి అంటే ఏంచెల్లి తెచ్చిపెట్టాలె  మా ఇండ్లల్లకెళ్లి తెచ్చిపెట్టాల్న అని వంటమనిషి మొఖమంత ఖండిచ్చుకుంట గదిరిచ్చిపెట్టేది. అవాజ్ ఎత్తుతే ఏదో వంకతోని వార్డన్‌తోని కొట్టిపిచ్చేది. రాత్రి ఎనమిది గంటలకల్లా సాయంత్రం 5.30 కు తిన్న బువ్వ అరిగిపోయి ఆకలయి రాత్రి నిద్ర పట్టకపోయేది.

రూంలల్ల ఫ్యాన్లులేక దోమలు కుట్టి సంపేటియి. వానకాలం వస్తెనయితె ఆ దోమల బాధ శెప్పవశంగాదు. ఆ గోస శెపుకుంటబోతె ఓ రామాయణం ఓ మహాభారతమె అయితది. మాకు హాస్టల్ల సరైన పోషక విలువలున్న బలమైన తిండి లేక రకరకాల రోగాలచ్చేటియి. అవి తిండిలోపం వల్ల వస్తానయని అప్పుడు మాకు తెల్వది. నోరు,నాలుక, పెదవులు, పెదవుల శెలిమెలల్ల తెల్లగ పూశేది. పలిగేది పుండ్లయేటియి. ఒంట్లె చెటాక్ మాంసం వుండకపోయేది. మాకు ప్రొటీన్ ఫుడ్డు సరిగ్గ దొరకకపోయేది. ఎవన్ని సూశిన బక్కపలుసగ, ఎండుకపోయి, బరిబాతబొక్కల్లెల్లి వాయిలు చెట్ల బరిగెల లెక్క, చిన్నపాటి జామాయిలు చెట్ల లెక్కుండేది. శానామందికి నెత్తి ఎంటికలు వూడిపోయేటియి. మేము నెత్తికి కొబ్బరి నూనె పెట్టుకోకపోయేది. మంచినూనె పెట్టుకునేది. చలికాలంల కాళ్లు రెక్కలు పలుగుతె మంచి నూనెనే రాసుకునెటోళ్ళం. మాయిశ్చరైజర్లా మన్నా. పోరగాండ్లందరు మంచినూనెకు ఎగబడుతాండ్లని కూరలల్ల పోశెదానికి తక్కువబడుతాందని మా వంటమనుషులు మంచినూనెల పసుపు కలిపి ఆ నూనె నెత్తికి రాసుకుంటె పెయ్యికి పూసుకుంటె తెల్ల ఎంటికలు వత్తయని బెదిరిచ్చేది. ఇగ మంచినూనె జోలికి ఒక్కడు పోకపొయ్యేది.

సర్కారు హాస్టల్లల్ల వుండి సదువుకునే పోరగాండ్లమంటే అందరికీ అలుసే. బువ్వ సరిపోతలేదంటె వంటమనుషులు వార్డన్లు బెదిరిచ్చేది. బళ్ళెకుపోతె మాతోనిపాటుగ సదువుకునె బాగ పైసబలుపు వున్న పోరగాండ్లు మమ్ముల అంటిముట్టనట్టు వుండుకుంట చిన్న సూపు సూశేది. ఆఖరికి పంతుళ్ళుగూడ మమ్ముల జిల్లపురుగుల సూశినట్టు సూశేది. “సర్కారు బువ్వ తింటాంటె బాగ బలుపులచ్చినాయిరా” అనుకుంట కొట్టేది, తొడపాశం బెట్టేది. నాకయితే “అసలు బువ్వే సరిపోత లేదురా నాయినా” అని అనాల్ననిపిచ్చేది కని ఎందుకచ్చిన లొల్లి అట్లంటె ఇంక నాలుగు ఎక్కువ సప్పరిత్తడని కుక్కినపేనులెక్క కూసునేది.

హాస్టల్ల వుండి సదువుకునే పోరగాండ్లం మాతోని మేమే దోస్తాన్ జేశేటోళ్ళం. S.C హాస్టల్ల వుండే మాదిగోల్ల సామ్రాట్‌గాడు, సంపత్‌గాడు, మాలోల్ల సురేందర్‌గాడు, B.Cహాస్టల్లవుండే నేను, ముత్రాశోల్ల శీనుగాడు, బెస్తోల్ల రమేశ్‌గాడు, గౌలోళ్ల అశోక్‌గాడు, గొల్లోల్ల బిక్షపతిగాడు, కాపోల్ల భాస్కర్‌గాడు మేమంతా ఒక గ్యాంగ్‌గ వుండెటోళ్ళం. హైస్కూళ్ళ మాజోలికి ఎవడన్న రావాల్నంటె “కాకి నెక్కర్ల” వుచ్చ పోసుకునేది.

 

ఆదివారం వచ్చిందంటె మాశిపోయిన అంగి లాగులు, స్కూలు డ్రెస్సులు పట్టుకోని పొద్దుగాల్నే లేశిపెద్ద కాలువకు పోయెటోళ్ళం. అక్కణ్ణే “బర్రెంక” పుల్లతోణి పండ్లు తోముకోని బట్టలు పిండుకోని తానాలు జేసి వచ్చేటోళ్ళం. అప్పుడు మాకు సబ్బులు కొనుక్కునెదానికి హాస్టల్ల నెలకు 10 రూపాయలు సర్కారు ఇచ్చెది. ఆ పైసలు దాసుకోని ఆదివారం సిన్మాకు పోయెటోళ్ళం. నా శిన్నతనంల సూశిన  సిన్మాలల్ల కమల్‌హాసన్ సత్య (1988), నాయకుడు (1987), నాకు మస్తు నచ్చినయ్. నేనొక్కణ్ణే మళ్లా మళ్ళా బోయి ఆ సిన్మాలు సూశెటోణ్ణి. శనివారం నాడు పొద్దుగూకంగనె చిత్రలహరి సూశేదానికి పోయెటోళ్లం. అంగడి రోడ్డు పక్కన గ్రందాలయం ముందట, దీపక్ ఫోటో స్టూడియోల్లకు ఒక్కలకే అప్పుడు “డిష్ ఆంటేనా” T.V  వుండేది. T.V.ల వారానికో సిన్మాగూడ వచ్చేది. “కోకిలమ్మ” సిన్మా నేను T.Vల సూసుకుంట హీరోగాడు హీరోయిన్ సరితను మోసం జేసినప్పుడు నేను దుఃఖం ఆగక ఏడిసిన.

మేము హాస్టల్ల ఏం తక్కువ 200 మందిమి వుండెటోళ్ళం. అందరం ఒక్క దగ్గర్నె తానాలు జేసుడు, మొఖాలు కడుగుడు. తిన్న పిలేట్లు కడుక్కునేవరకు అక్కడ పెద్ద బురద మడుగు తయారయ్యేది. దాంట్లెకు పందులచ్చి బొర్రేటియి. పందుల పక్కనుంచెల్లి మేము మా పక్కనుంచెల్లి పందులు పొయ్యేటియి. వాటిని మేము మమ్ముల అవ్వి పట్టిచ్చుకోకపోయేటియి.నాకు ఇప్పుడు ఆలోసిస్తే నవ్వస్తది. మమ్ముల సర్కారోల్లు మనుసుల లెక్క గుర్తించకపోతే గుర్తించకపోనీయి. కాని ఆఖరికి పందులు కూడ మమ్ముల మనుషుల లెక్క గుర్తించలె.

ఇట్ల హాస్టల్ల ఆకలి నన్ను ఐదు సంవత్సరాలు సంపింది. ఇంటికాడ వుంటెనేమో నడుసుడు బాధ, ఆ మక్కజొన్న గడుక తినలేక ఆకలి బాధ, హాస్టల్ల వుంటెనేమో మద్యాహ్నం, రాత్రి ఆకలి బాధ, నిద్రబాధలు. ఎనుకకుబోతె నుయ్యి ముందుకుబోతె గొయ్యి లెక్కుండేది బతుకు. కాని హాస్టలే నయ్యమని హాస్టల్లనే వుండేది. బాధాకరమైన విషయమేందంటె ఈ దళిత బహుజనుల బతుకులల్ల కష్టాలకు, కన్నీళ్లకు రొండు రకాల పరిష్కారాలుంటయ్. మళ్లా రొండీట్లల్ల దు:ఖమే వుంటది. కాకపోతె ఒకదాంట్లె ఎక్కువ, ఒకదాంట్లె తక్కువ. ఎటుబడి ఏడుస్తానే వుండాలె.నలుభై ఏండ్ల బతుకును ఎనుకకెనుకకు తవ్వుకుంట తవ్వుకుంట పోతాంటె అడుగడుగునా అన్నీ ఆకలి గాయాలే. ఆకలి జ్ఞాపకాలే. ముడ్డి మీద సరిగ్గ లాగు ఏసుకునుడు శాతగాని పసిపోరగాణ్ణి గంత ఆకలిని ఎట్ల బరించిన్నో తలుసుకుంటాంటే అఫ్సోస్ అయితాంది.

*

జన్నెకిడిశిన గిత్తగుండెల ప్రేమజనించింది

 

 

-కందికొండ

~

 

ఒక్క తల్లి గర్బంల నా బుజం మీద వాడు వాని బుజం మీద నేను శేతులేసుకోని ఉమ్మనీరులో తేలాడుకుంట, నేను ముందు వాడు ఎనుక అముడాళోళ్ళమై(కవలపిల్లలు) పుట్టినట్టు వాడు నన్ను అన్న.. అన్న… అని మస్తు ప్రేమతోని పిలిశెటోడు. నోట్లె అన్నను బయటికి తీశెటోడు కాదు. గుండెకే గుండె వుంటే ఆ గుండెకే పెదవులుంటే ఆ పెదవులు అన్న.. అని పిలుస్తె ఎంత డెప్త్‌గుంటది. ఎంత ప్రేమగుంటది. ఎంత పావురంగుంటది అట్లుండేది. ఒక్క ముక్కల జెప్పాల్నంటే వాడు అన్న. అనంగనే ఆ మాట నా కర్ణభేరిని తాకంగనే నా చెవులల్ల అమురుతం(అమృతం) పోషినట్టుండేది. వాని పేరు రాజు. వాంది మా పక్కిల్లు. వాడు మా అవ్వోడో, అయ్యోడో గాదు. మా కులపోడో, తలపోడో గాదు కాని మేం ఒకలంటే ఒకలకు మస్తిష్టం. ఎంతిష్టమంటె గుండె కోషి ఇచ్చుకునేంత ఇష్టం. మేము ఈ ఫేసులే తెలువని ఫేస్‌బుక్కు ఫ్రెండ్సు గాదు, మాకు తెలువులచ్చి, ఊహ తెలువకముందు నుంచెల్లే మేము ఒకలకొకలం తెలుసు.

వాళ్ళ అవ్వ, మా అవ్వ మా ఊరి పొలాలల్ల నాటేసెదానికి, కలుపు తీసెదానికి పోయెటప్పుడు మమ్ముల్నిద్దర్ని ఒక ముసలవ్వకు అప్పజెప్పి ఆ ముసలవ్వకు ఎంతో కొంత పైసలిచ్చి మా ఇంటి ముందు యాపశెట్టు కిందనన్నా, వాళ్ళింటి ముందు చింతశెట్టు కిందనన్నా వాకిట్ల ఇడిషిబెట్టి పోయెటోళ్ళట. నేను, రాజుగాడు అంబాడుకుంట (పాకుకుంట), పడి లేసుకుంట, నవ్వుకుంట, తుళ్ళుకుంట పొద్దుగూకెదాక మా అవ్వలు నాటుకు, కలుపుకుబోయి వచ్చెదాక వాకిట్ల ఆడుకునెటోళ్ళమట. అగో… మేము అప్పడిసంది ఫ్రెండ్స్..

మాది వరంగల్ జిల్లాల చిన్న కుగ్రామం. మా ఊళ్లె మాకత్తు పోరగాండ్లం శానామందిమె వుండెటోళ్ళం కని మేం ఇందరమే మంచి సాయితగాండ్లం (ఫ్రెండ్స్) అయినం..మా ఊరి బడిల ఐదో తరగతి వరకే వుండేది. మేము 1978ల బడికి పోవుడు మొదలుబెట్టినం. ఒక పెద్ద తాటాకు కమ్మల కొట్టంల ఏక్లాసోల్లను ఆక్లాసుల లెక్కన కొంచెం దూరం దూరంగా కూసుండబెట్టేటోళ్ళు. రాజుగాడు నేను పక్కపక్క పొంటి కూసునెటోళ్ళం. అప్పుడు షాబద్ బండలా… ఏమన్ననా.. న్యాల(నేల)మీద మట్లె(మట్టి)నె కూసోవాలే. లాగులు రాకిరాకి పిర్రలకాడ శినిగిపోయేటియి. లాగులు షినిగిపోకుంట వుండాల్నని యూరియ పిండి బస్తాల సంచులు తీసుకపోయి ముడ్డికిందేసుకోని కూసునెటోళ్ళం. అట్లా అందరు ఎవ్వల బస్తా వాళ్ళేసుకొని కూసుంటాంటె రాజుగాడు మాత్రం అన్న.. మన రొండు బస్త సంచులు ఒకదానిమీద ఒకటేసుకుని కూసుందమే అనెటోడు. కూసున్నంక నాకు ఎక్కువ జాగిచ్చి  వాడు సగం మట్టిల్నే కూసునెటోడు “ఎహె బత్తమీద కూసోర రాజుగా మట్టంటుతాందికాదుర నీ కాళ్లకు” అని నేనంటే “ఎహే నాకేంగాదు లేవె నువ్వు మంచిగ గూకో”అనెటోడు. పిచ్చి గాడిది రాజుగానికి నేనంటె శాన ప్రేమ.

ఎండకాలంల మా ఊరి చెరువులకు ఈతకు బోయెటోళ్ళం. మాకు ఈత ఎవ్వలు నేర్పలే. మాకు మేమే నేర్చుకున్నం. మేము నీళ్ళల్ల ముంచుకునుడు ఆట ఆడుకునెటోళ్ళం. ఎవ్వల వంతచ్చినప్పుడు వాళ్ళు  తతిమ్మోళ్ళను (మిగతావాళ్లను) ముంచాలె. ముంచుతాంటె తతిమ్మోళ్ళు తప్పిచ్చుకోవాలె. నావంతు వచ్చినప్పుడు రాజుగాడు దొరికినా నేను వాణ్ణి ముంచకపోయేది. వాని వంతచ్చినప్పుడు వాడు నన్ను ముంచకపోయేది.

మేము తాడిచెట్టు అంత ఎత్తునుంచెల్లి చెరువుల దునుకెటోళ్ళం. రాజుగాడైతే డై కొట్టెటోడు. ఇప్పటి పోరగాడ్లను సూతె నవ్వత్తది. స్విమ్మింగు పూల్లకు నడుముమంటి లోతులకు దిగెదానికి కూడా నడుము సుట్టు ట్యూబ్ వుండాలె. అంత నాపగాండ్లు బాయిలర్ కోడీ బతుకులయిపోయినయ్. “జిసం మే తాకత్ నియే దిల్‌మే దమ్ బీ నియే”. మా కత్తు (వయసు) పోరగాండ్లం అందరం గలసి తలా (ఒక్కొక్కరు) పది పైసలు కలేసుకొని టౌన్‌కుబోయి ఒక లబ్బరు  శెండు(బాల్)కొనుకచ్చుకున్నం. పెంకాసులు ఒకదాని మీద ఒకటి పెట్టి పల్లి ఆట ఆడెటోళ్లం.శెండుతోని కొట్టుకునుడు ఆట ఆడుకునెటోళ్లం. నన్ను రాజుగాడు, రాజుగాణ్ని నేను చిన్నగ కొట్టుకునెటోళ్ళం. వేరేటోళ్ళనయితే ఈడిషికొట్టేటోళ్ళం. తతిమ్మా పోరగాండ్లందరూ మమ్ములిద్దరిని తొండి బాడుకావ్‌లు అని తిట్టెటోళ్ళు.

మా ఊళ్ళె ఐదో తరగతి అయిపోంగనే మాకు T.C.లిచ్చిండ్లు. మేము వరంగల్‌కు పోయి U.P.S. బళ్ళె శేరికయినం. దీంట్లె 6th, 7th సదవాలె తరవాత హైస్కూల్ అది వేరే బడి మళ్ళా.

ఏడు గంటలకే ఒత్తుల వేడినీళ్ల తోటి తానం జేసి(స్నానం) రాజుగాడు, నేను తయారయ్యెటోళ్ళం. అప్పుడు మా అవ్వలు కట్టెల పొయ్యి మీద అన్నం, కూర వండతాంటెనే ఓ పక్క(వైపు) ఒత్తుల (కుండ)నీళ్లు కాగేటియి. ఏడుగంటలకే బువ్వ తిని రాతెండి టిపిని గిన్నెల (లంచ్ బాక్స్)అన్నం బెట్టుకొని ఐదు కిలోమీటర్లు కంకరరోడ్డు మీద చెప్పులు లేకుంట వట్టికాళ్లతోటి నడుసుకుంట బోయెటోళ్ళం. సాయంత్రం నాలుగ్గొట్టంగ  బడి ఇడిషిబెట్టేది. నాలుగునుంచెల్లి నాలుగున్నర దాక డ్రిల్లు (ఆటలు) పీరియడ్. బడి ఇడిషిబెడుతరు కాని గేటుదాటి బయటికి పోవద్దు. అక్కణ్ణె ఆడుకోవాలే. రాజుగాడు నేను గోడ దునికి ఇంటిబాట బట్టేది. టౌన్ నుంచెల్లి మా ఊరికి ఐదు కిలోమీటర్లు నడువాలే. అక్కడ ఆటలాడుకుంట కూకుంటే మాకు కుదురది గదా. ఎండకాలంల బుజాలమీద వయ్యిలు(పుస్తకాలు) పెట్టుకొని పోతాంటే చేతుల చెమట వయ్యిలకంటి (బుక్స్‌కు అంటి) చేతుల పదను(తడి)తోటి పుస్తకాలు కరాబయ్యేటియి. అప్పుడు వయ్యిలకు (బుక్స్‌కు) అట్టలేసుకుందామంటే న్యూస్‌పేపర్లు దొరుకకపోయేటియి. ఇట్లయితే కుదరదని మా ఊళ్ళె టైలర్”ఖాదర్” దగ్గర యూరియా పిండి బస్తాల సంచులతోటి చెరో (ఒక్కొక్కరం) వయ్యిల సంచి కుట్టించుకున్నం. ఇగ వయ్యిలు, కాపీలు,ఆ సంచులల్ల ఏసుకోని సంచి బుజానికేసుకోని పోయెటోళ్ళం. ఇప్పటి పొట్టెగాండ్లకు అన్ని సౌలతులు(సౌకర్యాలు) వున్నా సదివి సావరు. “సదువు సారెడు బలుపాలు దొషెడు” అయిపోయింది ఇప్పటి సదువు. యాసంగి సదువులు.

మా అప్పర్ ప్రైమరీ స్కూల్  హెడ్ మాస్టర్ పేరు బాలయ్య సారు. మేం ఆ బడిల శెరీకయ్యినప్పుడే ఆ సారు ఓ కొత్త ఇల్లు కట్టుడు సురువు జేషిండు(మొదలు చేశారు). ఆ కొత్తింటికాడ శానా చిల్లర పనులుండెటియి. మిగిల్న కంకర ఒక దగ్గర నుంచెల్లి ఇంకోదగ్గర కుప్పబోసుడు. ఇంటిముందు పోషిన మొరం కుప్పల  నేర్పుడు (సమాంతరంగ చేయడం), ఇటుకలు ఇరిగిన ముక్కలు ఒక దగ్గర, మంచి ఇటుకలు ఒక దగ్గర పేర్సుడు, గిలాబు కోసం దొడ్డు వుషికెను(లావు ఇసుకను) సన్నగ జల్లెడబట్టుడు, పదను(క్యూరింగు) కోసం గోడలకు, స్లాబ్‌కు నీళ్లుగొట్టుడు, అర్రలల్ల (రూమ్స్) బోసిన మట్టి అణుగాల్నని “దిమ్మీస”గుద్దుడు ఇసొంటియి.

మేం పల్లెటూరోళ్ళం మంచిగ పనిజేత్తమని తెల్లబూరు (White Hair) చెప్రాశి(ప్యూన్) యాకుబ్‌ని పంపిచ్చి మమ్ముల పిలిపిచ్చెటోడు బాలయ్య సారు. మేము సంకలు గుద్దుకుంట సంబురంగ సారు కడుపు సల్లగుండ అనుకొని సారు కొత్తింటి పని జేసెటానికి పోయెటోళ్ళం. మా లెక్కల (మాత్స్) సారు చెయ్యబట్టి మాకు బడంటె బయ్యమయ్యేది. లెక్కలేమో అర్ధం గాకపోయేది. a2+b2=2ab..అని ఏందేందో శెప్పేది. ఇంటి పనిచ్చేది(హోం వర్క్).  చేసుకరాకపోతే మా శేతులు తిర్లమర్ల జేపించ్చి బ్లాక్‌బోర్డ్ తుడిసేటి చెక్క డస్టర్‌తోటి పటపట కొట్టేది. ఒక్కొక్కసారి మాకు మస్తు కోపమచ్చి అరె.. మాకు అర్ధమైతలేవు సారు ఏంజెయ్యాలే అనాల్ననిపిచ్చేది. నోటిదాకచ్చేది కని ఆపుకునేది. అందుకే ఆ దెబ్బలకన్నా ఈ పనే నయ్యమనిపిచ్చేది.

మాకు కష్టం జేసుడంటే సంబురం. మేము పల్లెటూరోళ్లం, ఉత్పత్తి కులాలోళ్లం గదా,మా బతుకుల నిండా కష్టముంటది, కన్నీళ్లుంటయి, ఆకలుంటది, అవమానముంటది, పోరాటముంటది. అందుకే గద్దరన్న పాట రాయలే. “కొండ పగలేసినాం, బండలను పిండినాం, మా నెత్తురు కంకరగా ప్రాజెక్టులు గట్టినాం, శ్రమ ఎవడిదిరో సిరి ఎవడిదిరో” అని.. మేం బిచ్చగాండ్లకు ఎక్కువ, మధ్య తరగతోళ్లకు తక్కువ. దిగువ మధ్య తరగతోళ్లం. బతుకు దినదిన గండమయినోళ్లం, దిగులే బతుకయినోళ్ళం ఇప్పటికి కూడా అట్లనే వున్నయ్ మా బతుకులు. పనిజేసి పగటాల్ల   కాంగనే కాళ్లు రెక్కలు కడుక్కొని మా రాతెండి టిపిని గిన్నెలల్ల తెచ్చుకున్న  అన్నం తినెటోళ్ళం.

తింటాంటె బాలయ్య సారు భార్య మాకు రొండు బొక్క పిలేట్లిచ్చి (పింగాణి ప్లేట్స్) వాళ్ల ఇంట్ల కూరలు తెచ్చిచ్చేది. ఆమె చేతికి మొక్కాలే. ఏమేషి వండేదో ఏమోగాని, మస్తు రుసుండేటియి. అప్పుడప్పుడు ఆమె “సాంబార్” బోశేది. మాకు పప్పుశారు, పచ్చి పులుసు తెలుసుకని ఈ సాంబార్ తెల్వది. మా ఇండ్లళ్ల అప్పుడు సాంబార్ శెయ్యకపొయ్యేది. దాని పేరు సాంబార్ అని కూడా మాకు సరిగ్గ తెల్వది. ఆ సాంబర్ పోసుకొని తింటాంటే శానాసార్ల రాజుగాని తోటీ నేననేది “అరె రాజుగా ఈ సాంబారేందిరా గింత రుశి పాడుబడ్డది” అని వాడనేది అన్న.. ఇంకింత బోసుకోవే…. పోసుకో అని మొత్తం నా పల్లెంల కుమ్మరించెటోడు లంగగాడు. నేనంటె వాణికి సచ్చేంత ఇష్టం. మొత్తం నాకే పోషినవేందిర పిచ్చిగాడిది అని తిడితే నవ్వేది. అన్న నువ్వు పిచ్చిగాడిది అంటె నాకు మంచిగనిపిస్తదన్న అని మళ్ళా తిట్టిపిచ్చుకునేటోడు.

మా ఊరినుండి టౌనుకు పోతాంటే కుడిచెయ్యిరోకు (రైట్ సైడ్)”లంజపుట్నాల” చెట్టుండేది. ఈ చెట్టు ప్రత్యేకతేందాటంటే ఆ చెట్టు పుట్నాలు (పండ్లు) సప్పుడు జెయ్యకుంట, మాట్లాడకుంట, సైలన్స్‌గా, చీమె చిటుక్కుమన్నంత సప్పుడుగూడ జెయ్యకుంట తెంపుకొని తింటె మస్తు తియ్యగ వుంటయంట. తెంపుకుంట మాట్లాడినా, నోట్లెబోసుకొని నమిలేముందు మాట్లాడినా, గుసగుస పెట్టినా, నవ్వినా, దగ్గినా, తుమ్మినా, చేదు అయితయట. అందుకే వాటికి లంజపుట్నాలు అని పేరొచ్చిందట అని ప్రచారంల వుండేది. ఇసొంటి చెట్లు చానా ఊళ్లల్ల వుంటయ్. ఈ ఇత్తునం (విత్తనం) ఇప్పుడు శానా తగ్గింది. ఇప్పటి పొట్టెగాండ్లకు తెల్వకపోవచ్చుకని మా కత్తోళ్ళ (వయసు)కు తెలుసు.

రాజుగాడు నేను ప్రతిరోజు బడికిపోయెటప్పుడు వచ్చెటప్పుడు తప్పకుంట “లంజపుట్నాల” శెట్టు పుట్నాలు(పండ్లు) తెంపుకునెటోళ్లం. రాజుగాడు వుస్తు కోతిగాడు, ఎచ్చిడోడు, వుచ్చిలి మనిషి. తెంపుతానంటెనన్న నవ్వేది, లేకపోతే దగ్గేది, తుమ్మేది. నోట్లెబోసుకోని నవులేముందన్న నవ్వేది, గుసగుసబెట్టేది. ఏదో ఒకటి మాట్లాడేది. రోజులు, నెలలు, సంవత్సరాలు వాంది ఇదే కత. “అరె రాజుగా నీకు దండం బెడుత ఈ రోజన్నా మాట్లాడకురా, ఇగిలియ్యకురా, దగ్గకురా, తుమ్మకురా అని వాణి గదువపట్టుకోని బతిలాడెటోణ్ణి (రిక్వెస్ట్) సరే.. అన్న.. అనేటోడు.. తీరా…పుట్నాలు తినేముందు మళ్లా ఏదో ఒకటి చేశెటోడు.

అప్పుడు మా దగ్గర పైసలు అసలే వుండేటియి కాదు. మాకు మా అవ్వనాయినలు కూడా పైసలిచ్చెటోళ్ళు గాదు. పాపం వాళ్ల దగ్గరకూడా వుండేటియిగాదు. మాయి మస్తు లేమి కుటుంబాలు కని మాకు తొవ్వ ఖర్సులు, శేతి ఖర్చులుంటయిగద, మాకు కోముటోళ్ళ దుకాండ్ల కొబ్బరి శాకిలేట్ళు, ఉప్పు బిస్కీట్లు కొనుక్కోవాల్నని వుండేది. సిన్మాలు సూడాల్నని వుండేది. మేం పైసలు సంపాయించుడు కోసం “పెంట బొందలమీద  సీసవక్కలు ఏరుకునెటోళ్ళం” చెరో యూరియా బస్తసంచి పట్టుకొని మా ఊరంత తిరిగి ఏరుకునెటోళ్ళం. అప్పుడు మా ఊళ్ళె ఖాళీ జాగాలల్ల  ఎక్కువ చిలుక పర్రాకు చెట్లు, ఎంపలిచెట్లు, బోడసరం చెట్లు, జిల్లేడు శెట్లు, శెవుకచెట్లు వుండేటియి.

ఎంపలి చెట్లల్ల ఎక్కువ సీసవక్కలు దొరికేటియి. మా బస్తాలు నిండంగనే తువ్వాలలు  సుట్టబట్ట చేసుకొని నెత్తిన బెట్టుకోని టౌన్‌కు బోయేటోళ్ళం. రాజుగానికి నేనంటె ఎంత ప్రేమంటే పెద్ద సీసవక్కల బస్త వాడెత్తుకొని చిన్న సీసవక్కల బస్త నాకు ఎత్తెటోడు.” అరె… పెద్దది నేనెత్తుకుంటరా అని నేనంటె ఎహె.. ఊకో అన్న.. నీది సుకాశి పాణం(సుకుమారమైన). నువ్వు నా అంత కష్టం జెయ్యలేవే. నేనే పెద్దది ఎత్తుకుంటలే అనెటోడు. అంతంత బరువులు ఎత్తుకొని పోతాంటె కూడా ఆ “లంజపుట్నాల” చెట్టుకాడ మాత్రం ఆగెటోళ్లం. పుట్నాలు తెంపుకొని తినేముందు మళ్లా రాజుగాడు నవ్వుడో, తుమ్ముడో, దగ్గుడో చేసెటోడు. అరెయ్… రాజుగా లుచ్చ బాడుకావ్ గిట్ల జేసేదనికేనార ఆపింది అని నేను తిడితె ఏం జెయ్యాల్నన్నా నవ్వు ఆగుతలేదే అని మళ్లా కిలుక్కున నవ్వెటోడు. టౌన్‌కుబోయి సీసవక్కలు జోకి(తూచి) అమ్మి వచ్చిన పైసలు చెరిసగం పంచుకునెటోళ్లం. కని ఇప్పటి శాతగాని దొంగనాకొడుకులు ఆడోళ్ళ మెడలల్ల బంగారు గొలుసులు తెంపుకపోతాండ్లు. మళ్ళ వాళ్లకు ఈ పోలీసోళ్ళు మస్త్ పోష్(Posh)గా స్టైల్‌గా ఓ పేరు బెట్టిండు చైన్ స్నాచర్లట.. చైన్ స్నాచర్లు.

ప్రతిరోజు ఈ పది పన్నెండు కిలోమీటర్లు బడికి నడువలేక మేం సాంఘిక సంక్షేమ హాస్టల్ల  చేరినం. మాకు పొద్దున 8.30కు పప్పుతోని, మళ్లా సాయంత్రం 5.30 గంటలకు కూరగాయలతోటి అన్నం బెట్టేటోళ్ళు  పొద్దున, సాయంత్రం. పచ్చిపులుసు మాత్రం రొండు పూటల వుండేది. మేము లైన్ల నిలబడి రాతెండి పల్లాలల్ల అన్నం బట్టుకోని తినెటోళ్ళం. అప్పుడప్పుడు అన్నంల పురుగులత్తె పక్కన పారేశి తినేటోళ్ళం. వారానికోసారి మాకు హాస్టల్ల ఉడుకబెట్టిన కోడిగుడ్డు బెట్టేటోళ్ళు. రాజుగాడు వాణి గుడ్డు గూడ నాకేసెటోడూ. అరె లంగగాడిది నీది నువ్వు తినరాదురా అని నేనంటే “అన్న… నువ్వొకటి నేనొకటానే” అనెటోడు. బళ్లెగాని రాజుగాణ్ని ఎవ్వలన్న కొడితె ఉరికచ్చి నాకు శెప్పెటోడు.

రాజుగాడు జెర దైర్నం (ధైర్యం) తక్కువ మనిషి. నా అంత మొండోడుగాదు. నేను మోర్‌దోపోణ్ణి. రాజుగాణ్ణి కొట్టినోణ్ణి రాజుగాడు నాకు సూపియ్యంగనే నాకు సింహాద్రి సిన్మాల NTRకు వత్తదిగదా కోపం BP, BP అని కుడిశెయ్యితోని తలకాయ కొట్టుకుంటడు సూడుండ్లి గట్లచ్చేది కోపం.  వాని గల్లబట్టి తెరి బహెన్ కీ, అని గిప్ప… గిప్ప… గుద్దెటోణ్ణి మళ్లా రాజుగాడే ఏ వద్దు ఇడిషెయన్న ఇడిషెయ్ అని బతిలాడేటోడు నన్ను గుంజుకపొయెటోడు. అరాజుగాడు చానా ప్రేమ మనిషి ఎదుటోళ్లు బాధపడితే సూడలేదు. మేం హాస్టల్ల ఒకటే రూంల పక్కపక్కన ఇనుప సందూగలు పెట్టుకొని ప్యాన్లులేని రూంల పండుకొని సదువుకునెటోళ్ళం… అట్లా.. పదో తరగతికి వచ్చినంక వాణికి సదువు అబ్బలే పది పేలయ్యిండు. ఎవుసం (వ్యవసాయం) పనులల్లబడ్డడు. నేను పది పాసై ఇంటర్‌ల మళ్ళా  ఇంటర్ డిగ్రీల చేరిన. రోజు ఊళ్ళె కలుసుకునుడు, తిరుగుడు… అన్నీ మామూలే…

రాజుగాడు శిన్నప్పుడు కర్రెగ, పొట్టిగ, బక్కగ, మట్టసన్నంగ వుండెటోడు కని ఇరవై సంవత్సరాలు దాటినంక మంచి ఎత్తు పెరిగిండు. మంచి శలీరం(శరీరం) వచ్చింది. మా ఊళ్ళె రాజుగాణికి సుజాత అనే పిల్లతోని జత కుదిరింది. ఆ పిల్లకు ఓ పదిహేడు సంవత్సరాల వయసుంటది. వాళ్ళిద్దరికి ఎట్లా కుదిరిందో ఏమోగాని ఇద్దరు గలిసి బాగ తిరిగెటోళ్ళు. ఒకల్ను సూడకుంట ఒకలు వుండేటోళ్ళుగాదు. రాజుగాడు రోజూ రాత్రి నా దగ్గరికచ్చి ఆ పిల్లతోణీ ఎక్కడెక్కడ తిరిగింది ఏమేం తిన్నది ఏమేం జేసింది అన్ని శెప్పెటోడూ. ఆఖరికి ఎన్నిసార్లు సెక్స్‌లో పాల్గొన్నది ఎట్లెట్ల పాల్గొన్నది, ఎక్కడెక్కడ పాల్గొన్నది కూడా శెప్పెటోడు. మా ఇద్దరి మధ్య శిన్నప్పన్నుంచి పెద్ద దాపరికాలుండేటియి కావు. వాడు ఇవ్వన్ని శెప్పంగనే నేను అఫ్సోస్(ఆశ్చర్యం) అయ్యెటోణ్ణి కాదు. అట్లాంటియి వాడు నాకు గతంల శానా జెప్పిండు. వాణి అక్రమ సంబంధాల గురించి.

ఇది ఏడవది. ఈ ఏడుగురిల నలుగురు పెండ్లయినోళ్ళు.. ముగ్గురు పెండ్లిగానోళ్ళు.ఈ సుజాతకు కూడా ఇంకా పెండ్లిగాలే. రాజుగాడు సిన్నప్పుడు మస్తు అమాయకుడు. వాణికి ఈ పాడు గుణం ఎక్కణ్ణుంచి వచ్చిందో ఏమోగాని ఆడోళ్ళను బెండుగాలాలు ఏషి మొట్టపిల్ల( బురుద మట్టలు) చాపల పట్టినట్టు పట్టెటోడు. ఒకరోజు పగటీలి ఎండల వగిరిచ్చుకుంట(ఆయాసపడుకుంటా) ఉరికచ్చి అన్న.. కొంచెం మంచినీళ్ళియ్యె దూపయితాంది అని చెమటలు తుడుసుకుంట నా పక్క పొంటి గాడంచల కూసున్నడు. నేను ఇంట్లకుబోయి శెంబుల నీళ్లు తెచ్చిచ్చిన. ఏందిర రాజుగ మొత్తం చెమటతోని తడిసిపోయినవ్ అంటే ఆ గంగ లేదా అన్న … ఆమెతోని సెక్స్‌ల పాల్గొంటాంటె ఆమె మొగడచ్చిండు. సైకిల్ సప్పుడు ఇనబడంగనే దన.. దన ఎనుక తలుపు తీసుకొని నిమ్మలంగ రౌతుల గోడ దునికి వచ్చిన అని ఒకటే నవ్వుతాండు. “అరె ఒకవేళ వాడు సూత్తె ఏందిరా పరిస్థితి అంటే  ఎహె.. నా జాగర్తల నేనుంటా అన్న.. ఏడుగురిని ఎట్ల మెంటన్ జేత్తాననుకుంటానవ్ అని జెరంత గర్వంగ నవ్వెటోడు.

ఒకరోజు రాజుగాడు నేను మా ఊరి చెరువు కట్టకు పోయినం. అక్కడ కల్లు తాగినం. మాకు మంచిగ కిక్కెంకింది. ఏవేవో ముచ్చట్లు మాట్లాడుకుంట నడుసుకుంట వత్తానం. “అన్న.. గామధ్య ఒక సిత్రం జరిగిందే శెప్పనా” అన్నడు. “నీ గురించి నాకు తెలువని శిత్రమేందిరో అని నేనన్నా. టౌన్‌ల “నవత” లేదా అన్న.. అన్నడు. ఆ పిల్ల ముచ్చట నాకు తెలుసుకదరా అన్నా. ఎహె.. ఇనన్నా శెప్పెదాక అన్నడు. సరె శెప్పరా అన్నా. మొన్న ఆ పిల్ల వాళ్ల అమ్మను లైన్లకు తెచ్చి సెక్స్‌ల పాల్గొన్న అన్నడు.

నాకు ఎంటనే చలం మైదానంల నవలల నాయకుడు అమిర్ గుర్తుకచ్చిండు. ఇంక నయ్యం అమిర్‌కు నచ్చిన  తుర్కోల్ల పిల్లను నాయిక రాజేశ్వరితోనే మాట్లాడించి ఒప్పిచ్చినట్టు, పిల్లను పంపిచ్చి తల్లితోని మాట్లాడిచ్చి ఒప్పియ్యలె అనుకున్న మనసుల. మరి నవతకు తెలుసార అని అడిగిన. అన్న. నేను పిచ్చోనిలెక్క  కనిపిస్తాన్నానె నీకు అన్నడు. నాకు కొంచెం ఇబ్బందిగా బాధగా అనిపిచ్చింది.నేను రాజుగాణి మీద చానా కోపం జేసిన అరెయ్ రాజుగా నువ్వు జన్నెకు ఇడిషిన కొల్యాగవు అయిపోయినవ్‌రా ఊళ్ళె. ఏందిరా ఈ ఆంబోతు చేష్టలు. మనిషివా, పశువువురా అన్న. అరె ఏందన్న కోపంజెత్తవ్ అన్నడు. లేకపోతే ఏందిరా జన్నెకిడిషిన కోడె ఊరిమీద పడి దొరికిన శేను దొరికినట్టు మేసి బాగ బలిసి “మదం”బట్టి కంట్లెబడ్డ ఆవునల్లా ఎక్కినట్టు (సెక్స్ చేసినట్టు) శేత్తాన్నవ్ ఎట్లుండెటోనివి ఎట్లయ్‌నవ్‌ర అన్నా. అరె ఊకో అన్న.. శిన్నశిన్న ముచ్చట్లను పెద్దగజేత్తవ్ సప్పుడుజేకపా అని హ..హ..హ… అని నవ్వుతాండు. అరె! నేనింత సీరియస్‌గా తిడుతాంటె నవ్వుతానవేందిరా అంటె నువ్వు కోపంజెత్తె నాకు నవ్వత్తదన్న అనెటోడు.

అరెయ్ రాజుగా నీకు మాంసం ముద్దల రాపిడిల వున్న మజా తగిలింది. అది నిన్ను మాయజేసింది. ఏదో ఓ రోజు అది నిన్ను మాయంజేసి నీ పేరు మాపుంది. కత్తిపట్టినోడు కత్తితోనే పోతడు. మందు తాగెటోడు మందుతోనె పోతడు. అక్రమ సంబంధాలు పెట్టుకునెటోడు అక్రమ సంబంధాలతోనే పోతర్రా అన్నా.. అన్న..నువ్వు చీమను గూడ బూతద్దములబెట్టి సూత్తవ్. ఏంగాదుకని పావే అన్న.. అని నాలును తిప్పిండు.. లైట్ తీసుకో అన్న .. అన్నట్టుగ..

ఇంటికచ్చినంక ఇంతంత బువ్వతిని మా  యాపశెట్టు కింద గాడంచ వాల్చుకోని పడుకున్నా. కల్లుతాగి ఇంత తింటే మస్తు నిద్రస్తది. పొద్దాటి కల్లయితే ఇంకా మస్తు నిద్రస్తది. ఆ రోజు తాగింది పొద్దాటి కల్లే. బలిమీటికి కండ్లు మూసుకున్న నిద్రత్తలేదు. రాజుగాని మాటలే యాదికత్తానయ్. పిచ్చిగాడిది గిట్ల తయారయ్యిండేంది అని బాదనిపిచ్చింది. శిన్నప్పటినుంచెల్లి వాడంటె నాకు బొచ్చడంత పావురం. మెల్లంగ నా మనసు సెక్స్ గురించి ఆలోసించుడు మొదలుబెట్టింది. అవును సెక్స్‌ల ఏమున్నది. ఆడోళ్ళ యోనిల మాంసం ముద్దలు, మొగోళ్ళ అంగంల మాంసం ముద్దలు ఓ ఐదు నిమిషాలో, పది నిమిషాలో , మా అంటె ఓ అర్ధగంట ఒకదానికోటి రాపిడి చేసుకునుడే గదా. దీనికి రాజుగాడు ఎందుకు ఇంత బరితెగిచ్చిండు.

రాజుగాని తోని పండుకునే ఆడోళ్ళు ఒకలా, ఇద్దరా, ఇయ్యాల కట్టమీద జెప్పిన నవత తల్లితోని గలిపి ఎనమిది మంది వాళ్ళవాళ్ల తల్లితండ్రులను ఆడిపిల్లలు, భార్యలు భర్తలను, తల్లి పిల్లలను ఎందుకు మోసం జేత్తాండ్లు అని ఆలోసిత్తే నా బేజ గరమెక్కి గుండె గాబరయ్యింది. మరి ఈ పెద్దపెద్ద సార్లు, మేధావులు, సిన్మాలల్లా, కథలల్ల, మీటింగులల్ల, ప్రేమే గొప్పది, సెక్స్‌ది ఏముది అని సెక్స్‌ను గంజిల ఈగను తీసి పారేషినట్టు తీసిపారేత్తరేంది అనిపిచ్చింది. ప్రేమ గొప్పదే కాని సెక్స్‌కు జిందగిల ప్రాముఖ్యతే లేదనుడు ఏ గలత్ బాత్‌హై ఎందుకంటె ఇంట్ల ముసలి అత్తమామలుంటె, అమ్మ నాయినలుంటె సెక్సువల్ జీవితానికి ఇబ్బందిగ వుంటాందని “ప్రైవసి” మిస్సయితాందని వృద్ధాశ్రమాలల్లకు  అత్తమామలను, అమ్మనాయినలను తోలిన కోడండ్లను, కొడుకులను నేను జూసిన.

పసి పోరగాండ్లను హాస్టలల్ల పారేసిన తల్లితండ్రులను జూసిన, మొగుడు నాపగాడని, ఆడిబట్ల శెకల్ ఎక్కువున్నయని సెక్స్‌గ్యానం (గ్నానం) సరిగ్గలేదని మొగోళ్లనొదిలేసి లేచిపోయిన పెండ్లాలను జూసిన. పెండ్లం పెయ్యిల (ఒంట్లో) చెటాక్ మాంసం లేదని, సెక్స్ సుఖం సరిగ్గా ఇత్తలేదని అమాయకమైన ఆడిపోరగాండ్లకు ఇడుపు కాయితాలిచ్చిన మొగండ్లను జూసిన, కొందరు బీద తల్లితండ్రులయితే అల్లుని కాళ్లమీదపడి ఆడిపొల్ల బతుకుమీద మచ్చపడుతది మళ్ళ ఎవరు పెండ్లి జేసుకోరు అని ఏడిషిన ఇనకపోయేది. నాకయితె మస్తు కోపం, దుఃఖమచ్చి వాణిగల్లబట్టి అరె.. ఓ మాకే.. అర కిల మాంసం అటో ఇటో ఎందుకురా పొల్ల బతుకు ఆగం జేత్తాన్నవ్  అని అడుగాల్ననిపిచ్చేది. “కండకావురం గుండె పావురాన్ని” డామినేట్ చేస్తాంది. చానాదిక్కుల  చానాసార్ల ప్రేమ గొప్పదే, సెక్స్ కూడా గొప్పదే అది మనుషుల బతుకులల్ల బలమైన రోల్‌ను ప్లేజేత్తాంది. నాకనిపిస్తది. పెండ్లం మొగల బతుకు సర్కస్ అయితే సెక్స్ రింగ్ మాస్టర్ అసొంటిది. అది కనిపియ్యది. కనిపించకుంట కథ నడిపిత్తాంటది. రింగ్ మాస్టర్ లేకపోతే సర్కస్ ఆగిపోద్ది. అక్కణ్ణే వున్నది అసలు కథ. “ఏడేడు సముద్రాల అవుతల మర్రిశెట్టు తొర్రల మాయల ఫకీరు పాణం వున్నట్టు” కని బయిటికి ఒప్పుకోరు ఎవలు. పెద్ద పెద్ద సార్లు.

చిన్నగ మెల్లగ రాజుగాడు ఎక్కువ టయిము(టైం) సుజాతతోనే గడుపుతాండు. వాళ్ల బంధం రోజురోజుకు బలపడుతాంది అన్ని విధాలుగా, ఒక దినం వీళ్ల ముచ్చట సుజాతోళ్ళ ఇంట్ల తెలిసింది. ఆ పొల్లోల్ల అవ్వ, అయ్య ఆ పొల్లను బాగ తిట్టి కొట్టిండ్లట ఎందుకంటె సుజాత గర్భవతి అయిందట. ఇంక ఆ ముచ్చట బయటికి పొక్కలే (రాలేదు). సుజాత అవ్వ, అయ్యకె తెలుసు”నా కడుపుల శెడబుట్టినవ్ కదనే, ఇంతంత పురుగుల మందు తాగి సావరాదే” అని సుజాతోల్ల నాయిన అన్నడట.

ఇజ్జతికి సుజాత నిజంగనె పురుగుల మందు తాగింది. టౌన్‌కు  తీసుకపోతే సర్కారు దవాఖాండ్ల సచ్చిపోయింది. సుజాతను కోతకాండ్ల (పోస్ట్‌మార్టం రూం) ఏషిండ్లు. మా ఊరు ఊరంతా దవాఖాన కాన్నే వున్నది. డాక్టర్లచ్చి సుజాతను కోషి పోస్ట్ మార్టం జేషిండ్లు. సుజాత కడుపుల సచ్చిపోయిన ఏడు నెలల పిండం ఎల్లింది. ఆడిపిల్లో, మొగపిలగాడో తెల్వది ఎవలం అడుగలేదు. మళ్లా కడుపుల్నే పెట్టి కుట్లేషిండ్లు. పాపం పదిహేడేండ్ల సుజాత ఇంకా లగ్గం గూడా కాని సుజాత, సూడసక్కని గుండ్రని మొఖపు సుజాత బతుకే సూడని సుజాత మస్త్ బౌషత్(ఫ్యూచర్) వున్న సుజాత సచ్చిపోవుడే భరించలేని బాధ అయితే సుజాత కడుపుల ఇంక కండ్లు తెరిశి లోకమే సూడని ఏడు నెలల పసిగుడ్డు కూడా సచ్చిపోవుడు మా ఊరోళ్ళు తట్టుకోలేకపోయిండ్లు. అందరి గుండెలు అవిషిపోయినయ్. ఆడోళ్ళయితే రొంబొచ్చెలు గుద్దుకుంట ఏడిషిండ్లు. మా ఊరోళ్ళ కండ్లు కట్టలు తెగిన కరిమబ్బులయినయ్. ఒక్కొక్కల ఒక్కొక్క కన్ను ఒక్కొక్క నయగార జలపాతమైంది. మా ఊరు కన్నీటి బంగాళాఖాతమైంది. సుజాత శవాన్ని తీసుకపోయి మా ఊరి చెరువాయకు బొందబెట్టిండ్లు.

సుజాత సచ్చిపోయిందని తెల్వంగనే రాజుగాణ్ణి  ఊళ్ళకు రావద్దని వాళ్ల సుట్టాల(బంధువుల) ఇంటికి వాళ్ళోళ్ళు పంపిచ్చిండ్లు. రొండు రోజుల తరువాత రాజుగాడు మళ్లా ఊళ్ళెకు వచ్చిండు సుట్టాలింట్ల వుండలేక. పాపం సుజాత అవ్వ, అయ్య రాజుగాని మీద కేసుపెట్టలే. రాజుగాని ఇంటిమీదికచ్చి లొల్లిగూడ చెయ్యలే. రాజుగాణ్ణి తిట్టలే, కొట్టలే. నల్లా అండ్లె తెల్లా అండ్లే మా సుజాత అవుసు(ఆయుస్సు)గాడికే వున్నది గాడికే బతికింది. అవుసు గూడి సచ్చిపోయింది అన్నరు ఊకున్నరు.

రాజుగాడు నాదగ్గరకొచ్చి నన్ను అమురుకొని బాగ ఏడిషిండు. ఊకోర రాజుగ ఊకో దైర్నం (ధైర్యం) చెడకు అని ఊకుంచిన. సుజాత కడుపుల ఏడు నెలల పిండం ఎల్లిందట అన్న. అనుకుంట ఒకటే ఏడుసుడు, ఊకోర పిచ్చిగాడిది ఊకో అన్ని తలుసుకోకు, తలుసుకుంటాంటె ఏడుపు ఎక్కువైంది. మరిషిపో అని మళ్ళా ఊకుంచిన. ఏడిషి ఏడిషి ఆగి కొంచెం సేపటికి కడుపుల ఏడు నెలల పిండం ఎల్ల్లిందట అన్న. రొండు పాణాలు తీసినట్టయ్యిందే అని మళ్ళా ఏడిషెటోడు. అట్లా ఐదు రోజులు ఏడిషి ఊకున్నడు. బాయికాడికి బోయి ఎవుసం (వ్యవసాయం) పనులు చేసుకుంటాండు. జెర మామూలు మనిషయ్యిండు.

సుజాతోళ్ళ అవ్వ, అయ్య రాజుగాణ్ణి ఒక్క మాటనకపోవుడు, పోలీస్ కేసుబెట్టి జెయిల్ల ఏపియ్యకపోవుడు,  కండ్లు మొత్తె, కండ్లు తెరిత్తె సుజాత గుండ్రని మొఖం రాజుగానికి గుర్తుకచ్చుడు, తిరిగిన జాగాలు , సూశిన సిన్మాలు, శేషిన షికార్లు, మాట్లాడుకున్న ముచ్చట్లు, ఏసుకున్న జోకులు, చేసుకున్న బాసలు, తిన్న తిండి, తిరిగిన బండి, బరిబాత(నగ్నంగ) కావలిచ్చుకొని (కౌగిలించుకొని) పట్టెమంచం మీద పండుకున్న రాత్రులు అన్నిటికన్నా ముఖ్యంగా సుజాత కడుపుల కండ్లు తెరువకుంటనే కండ్లు మూసిన ఏడునెలల పిండం అన్ని కలెగలిసి రాజుగాణి గుండెను యాక్సా బ్లేడై(Acsa Blade) రప్ప్రరప్ప… రప్పరప్ప.. రప్పరప్ప కోశినయ్.

సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు కోత్తాంటే… కోత్తాంటె… కొత్తాంటె.. ఇనుప పైప్‌ను ఆక్సాబ్లేడ్ కొత్తాంటె నిప్పులెట్ల చిల్లుతయ్ అట్లా.. సుజాత సచ్చిపోయినంక ఏడో రోజున ఆ పిల్ల జ్ఞాపకాల యాక్సాబ్లేడ్ (Acsa Blade) కోతకు, రాపిడికి జన్నెకిడిషిన కోల్యాగ(గిత్త) అసొంటి రాజుగాణి గుండెల ప్రేమాగ్ని జనించింది. అది పశ్చాతాపమై ప్రజ్వరిల్లి వాణి గుండెకు అగ్గంటుకున్నది. ఎండకాలం మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండల రాజుగాడు  వాళ్ళ చెలుకకాడ “నవక్రాన్” పురుగుల మందు డబ్బా మూత తీసి గటగట గటగటా తాగిండు.

అదే సర్కార్ దవాఖాండ్ల సుజాత సచ్చిపోయిన సర్కార్ దవాఖాండ్ల మూడు రోజులు సావుతోని కొట్లాడి, కొట్లాడి, అవస్థ  అవస్థ.. అవస్థయితాంది, కడుపుల మండుతాంది అనుకుంట ఏడిషి, ఏడిషి, ఇనుప మంచం మీద తండ్లాడుకుంట, తండ్లాడుకుంట.. మూడోరోజు తలకాయ కుడిపక్కకు వాల్చి కండ్లల్లకెల్లి కన్నీళ్ళూ కార్సుకుంట సచ్చిపోయిండు. “లంజపుట్నాలల్ల” చేదును నాకు మిగిలిచ్చి తీపిని వాడు తీసుకొని తిరిగిరాని లోకాలకు మా రాజుగాడు పిచ్చిగాడిది నన్ను ఒంటరిని జేసి బయిలెల్లిపోయిండు.

*

మా అనసూర్యక్క ఓ కన్నీటి జీవనది

ARIF4

చిత్రం: సృజన్ రాజ్

-కందికొండ 

~

kandiగామధ్య మాచెల్లెకు ఆపరేషనయ్యిందంటే చూసొద్దామని నేను మా భార్య, మా పిల్లలు కలిసి వరంగల్లుకు పోయినం. మాచెల్లె అత్తగారూరు ‘‘రేకంపల్లి’’ నర్సంపేట మండలానికి పడమర దిక్కున ఓ ఏడెనిమిది కిలోమీటర్లుంటది. ఉత్తశేతుల్తోటి పోతె మంచిగుండదని పోతాంటె పోతాంటె హన్మకొండల ఓ రొండుమూడు రకాల పండ్లు తీసుకున్నం. ‘‘రేకంపల్లి’’కి పోయేసరికి పొద్దుగూకింది. మా చెల్లోల్ల ఇంటిముందుకు పోంగనే ఇంట్ల నుంచి మా అవ్వ (అమ్మ) బయిటికచ్చింది. మా అవ్వ మా చెల్లెకు ఆపరేషనయినకాన్నుంచి మంచి శెడు అర్సుకునెదానికి మా చెల్లె దగ్గెర్నె వుంటాంది. మమ్ములజూసి కాళ్ళు శేతులు కడుక్కోండ్లన్నది. మేం ‘‘గోలెం’’ కాడికిబోయి కాళ్ళు రెక్కలు కడుక్కున్నం. ఇంట్లకుబోయి మా చెల్లె పండుకున్న మంచంపక్క కుర్సీలల్ల కూసున్నం. మా చెల్లెతోని మంచిశెడు ఇసారిచ్చినం. తీసుకపోయిన పండో, ఫలమో ఇచ్చినం. ఇంతల్లకే మా అవ్వ నాలుగయిదు ‘‘గిద్దెల’’ బియ్యం ఉడుకబెట్టి ఇంత పప్పుశారు జేసింది. నపరింత సల్లబడ్డం. పప్పుశారు మస్తు రుచున్నది, అది కిరాణందుకాండ్ల కొన్న కందిపప్పుకాదు మా చెల్లోల్ల చేన్ల పండింది. పట్టిచ్చి పొట్టుతోనే వండింది. అందుకే అంత రుశున్నది.

రాత్రి పది గంట్లకు పండుకునే ముందు  ఎగిలిబారంగనే (ఎర్లిమార్నింగ్‌) లేశి మేం హైదరాబాదుకు పోతమని మా అవ్వతోని శెప్పినా. హైదరాబాదుకు వద్దు ‘‘నాగూర్లపల్లె’’కు పోదాం అందరం కలిసి ఊళ్ళె ‘‘బద్దిపోచమ్మ’’ను చేసుకుంటానం’’ అని మా అవ్వన్నది. ‘‘నాగూర్లపల్లె’’ మా ఊరు ఇది ‘‘నర్సంపేట’’ మండలానికి ఉత్తరం దిక్కున నాలుగు కిలోమీటర్ల దూరం వుంటది. ‘‘చెల్లెకు ఆపరేషనయి మీ పరేషాన్ల మీరే వుంటిరి. ఇప్పుడు ఈ ‘‘బద్దిపోచమ్మ’’ను ఎందుకు జేత్తాండ్లే’’ అన్న. అప్పుడు మా అవ్వ ‘‘మన అనసూర్యక్కకు నాలుగయిదు నెలల నుంచెల్లి పానం మంచిగుంటలేదు తిరుగని దవాఖాన లేదు, వాడని మందు లేదు. ఎంతకు నయం అయితలేదు, మనిషి మస్తు గుంజింది, రాత్రిపూట నిదురబోతలేదు, ఆయిమనంగ నాలుగు బుక్కల బువ్వ తింటలేదు, అంత భయం భయం అయితాందట, గుండె దడచ్చినట్టయితాందట, మనిషి మనకాలి వుంటలేదు, ఊకె ఏడ్తాంది. అనుమానమచ్చి దేవున్నడిగిత్తె ‘‘బద్ది పోచమ్మ’’ కొంటెతనమన్నరు. అందుకే అందరంగలిసి ఓ యాటను తెచ్చి ‘బద్దిపోచమ్మ’’కు శేత్తానం అని విషయం మొత్తం ఇగురంగ జెప్పింది.

నాకు ఎంటనే మా ‘‘అనసూర్యక్క’’ యాదికచ్చి, నా కండ్ల్ల మెరిసింది. ఆమె మా మేనత్త మా నాయిన చెల్లె. మా తాత పేరు కట్టయ్య. ఆయనకు మొత్తం అయిదుగురు సంతానం. మొదటాయినే మా నాయిన, రొండొ ఆయినే ఇంకో చిన్నాయిన. మూడో ఆమే మా ‘‘అనసూర్యక్క’’, నాలుగో ఆయినె, ఐదో ఆయినే ఇంకో ఇద్దరు చిన్నాయినున్నరు. మా మేనత్త అసలు పేరు ‘‘అనసూయ’’ కాని అందరం అనసూర్యక్క అని పిలుస్తం. మా నాయిన, మా తాత, మా నాయినమ్మ, మా నాయిన ఎనుకాయినె మా బాబాయి ఈ నలుగురే ఆమెను ‘‘అనసూర్య’’ అని పేరుబెట్టి పిలుస్తరు. మా అక్కంటె అందరికి అంత గౌరవం.

మేం పొద్దున్నే చీకటితోటి లేశి మా ఊరికి పోయినం. మా ఇంటికి తూర్పు దిక్కున మా తాత కట్టయ్య ఇల్లుంటది. రొండురూముల బెంగుళూరు పెంకుటిల్లు. దానికి ఆనిచ్చి ఇంటి ముందుకు చిన్నరేకు షెడ్డు ఏషిండ్లు. ఆ రేకు ‘‘సాయబాను’’ కింద కూసునెదానికి పొడుగుగా ఓ అరుగుంటది. నేనెప్పుడు మా ఊరికిపోయిన రోజుల ఎక్కువసేపు ఆ అరుగుమీదనే కూసుంటా. మా కట్టయ్య తాత సచ్చిపోయి మూడు సంవత్సరాలయితాంది.ఆ తరువాత సంవత్సరంనర్థానికి మా నాయినమ్మ కూడ సచ్చిపోయింది. ఇప్పుడు ఆ ఇంట్ల మా ‘‘అనసూర్యక్క’’ ఒక్కతే వుంటాంది. ఎప్పటి లెక్కనే పోయి మా కట్టయ్య తాతోల్ల రేకు షెడ్డు కింద అరుగుమీద కూసున్న. నన్ను సూశి మా అనసూర్యక్క వచ్చి నా పక్కపొంటి కూసున్నది. ఆమెను సూడంగనే నాకు చానా బాధయ్యింది. మనిషి మొత్తం బక్కగయ్యింది. రొండుమూడు సంవత్సరాలకిప్పటికి సగమయ్యింది. ‘‘ఎప్పుడచ్చిండ్లురా బిడ్డ అంత మంచేనా’’ అన్నది. ‘‘ఆ… అంత మంచే అక్కా రాత్రొచ్చినం’’ అన్న. మంచిశెడు మాట్లాడుతానం. మాట్లాడుతాంటె, మాట్లాడుతాంటెనె ఆమె కండ్ల్ల నీళ్ళూరుతానయ్‌, నిమ్మలంగ నిమ్మలంగ ఆమె కండ్ల్లకెళ్ళి నీళ్ళు వడుత్తానయ్‌. అరె ఎందుకు ఏడుత్తానవ్‌ ఊకో అక్క… అన్న. ఆమె దు:ఖం ఆపుకోలేక బాగ ఏడుస్తాంది. కండ్ల అద్దాు తీసి పక్కన బెట్టింది, ఊకో అక్క ఊకో అని కండ్లనీళ్ళు తుడిసినా ఆమెకు దు:ఖం అసలే ఆగుతలేదు. ఆమె కండ్లపొంటి నీళ్ళు కారుతనే ఉన్నయ్‌. కారెనీళ్ళను కొంగుతోని తుడుసుకుంట ఏడుస్తాంది. ఆమె అట్ల ఏడుస్తాంటె నాక్కూడ మస్తు ఏడుపచ్చింది, ఆమెను ఎట్ల ఊకుంచాల్నో అర్దంగాక నాకండ్లకెళ్ళి గూడ వట్ట వట్ట నీళ్ళు వడుత్తాంటె నాకు అప్సోస్‌(ఆశ్చర్యం) అనిపిచ్చింది. ఎందుకంటె గుండెను కాలిసె ‘‘ఎత’’ నా లోపల వున్న కూడ నా కండ్లకు నీళ్ళురావ్‌. అసొంటి నేను గూడ ఏడిసిన. అట్ల శానాసేపు ఆమె ‘‘సొద’’ సల్లారెదాక ఏడిసింది. ‘‘కొంచెం ఏడుసుడు ఆపినంక ‘‘ఎందుకు ఏడుస్తానవ్‌ అక్క నీకేం తక్కువయ్యింది మేమంత లేమా’’ అన్న ‘‘కంటిమీద రెప్పవాల్తలేదురా బిడ్డ. తిండసలే సయించుతలేదు. పాణం మన కాలి వుంటలేదు.. ఎటోపోతాంది, కయాల్‌ తప్పుతాంది, గుండెదడత్తాంది, అంత భయంభయమయితాంది, ఒంటరి బతుకయిపోయిందిర. సచ్చిపోవాలెననిపిస్తాంది’’ అనుకుంట కొంగుతోని కండ్లనీళ్ళు తుడుసుకున్నది. అంతట్లకే మా నాయిన ఒక పాత ‘‘ఐరోండ్లకుండ’’ల సున్నం కలుపుకొని దాంట్లె ‘‘బ్రెష్‌’’ ఏసుకొని వచ్చిండు. అరుగు పక్కన ఎడమరోకు అంతకుముందు రోజే ‘‘బద్ది పోచమ్మ’’ కు ఒక చిన్న గుడి కట్టిండు, మా నాయిన సుతారి పనిశేత్తడు అందుకే ఆయినే కట్టిండు, ఆ గుడికాడ కూసోని గుడికి సున్నం ఏసుకుంట ‘‘ఊకోవే అనసూర్య. ఇగ బద్ది పోచమ్మకు గూడ శెయ్యబడితిమి కొంటెతనంబోయి అంత మంచే జరుగుతది తియ్‌ ఊకె ఏడువకు బాధపడకు’’ అన్నడు.

పొద్దుగూకుతాంది చిన్నగ మెల్లగ చీకటయితాంది. టైము ఐదారున్నరయితాన్నట్టున్నది ఇగ గొర్రెను కోద్దామని అందరు గుమిగూడిండ్లు. ఇంటిముందు యాపశెట్టుకు గొర్రెను కట్టేసి ఇంతంత పచ్చగడ్డేశిండ్లు. అది పొద్దటిసంది పచ్చగడ్డి నములుతనే వున్నది. మా చిచ్చ ‘‘నర్సింహస్వామి’’ యాటను కోశెదానికి కత్తి పట్టుకొని వచ్చిండు.  వీళ్లు మా పాలోళ్ళు.  నాకు ఆయినె చిన్నాయినయితడు. ‘‘గొర్రెను రొండు కాళ్ళసందు పెట్టుకొని గొర్రె కడుపుకింద శేతులేసి లేపి బరువు సూశిండు. ఓ పది కిలో కూర ఎల్తది కావచ్చు, బోటి, కాళ్ళు ,తలకాయ కలిపి ఓ మూడు మూడున్నర కిలోలు ఎల్తది, మొత్తం పదమూడు చిల్లరే ఎల్తది కూర అన్నడు. ఆ గొర్రె రొండు మూడు ఈతలు ఈనిందట.  ‘‘బద్దిపోచమ్మ’’కు మగ గొర్రెపోతును కొయ్యద్దట. ఆడ గొర్రెను అది ఓ రొండు మూడు ఈతు ఈనిన పిల్ల తల్లిని కొయ్యాల్నట. ఇవన్ని ఇంటాంటె గమ్మతనిపిచ్చింది. ఈ రూల్స్‌, పద్దతు ఎవ్వు పెట్టిండ్లు, ‘‘బద్దిపోచమ్మ’’ వచ్చి వీళ్ళకు శెప్పిందా అనిపిచ్చింది. గొర్రెను బద్దిపోచమ్మ గుడికాడికి  తీసుకచ్చిండ్లు, గొర్రెకు బవంతంగా కొంచెం కల్లు తాపిచ్చిండ్లు. మా అనసూర్యక్కచ్చి గొర్రె ‘‘నొసు’’(నుదురు) మీద కుంకుమ బొట్టు పెట్టి పసుపు రాసింది. గొర్రె కాళ్ళు మొక్కింది. పక్కనున్న మా చిన్నమ్మ ‘‘ఇగ అనుమానమద్దు తల్లీ మంచి జరుగుతె మళ్ళా వచ్చే ఏడు శేత్తం ‘‘జడత’’ ఇయ్యి అన్నది. ఒగలెనుక ఒగలు పోయి కుంకుమబొట్టు, పసుపుబొట్టు పెట్టి గొర్రె కాళ్ళు మొక్కిండ్లు. మా నర్సింహస్వామి చిచ్చ దాని ఈపు(వీపు) మీద నీళ్ళు సల్లి దువ్విండు యాట ‘‘జెడుత’’ ఇయ్యంగనే కోషిండ్లు, ఒక ఎనుకకాలు సప్ప(లెగ్‌) తీసి దాషిండ్లు. మిగతది వండిండ్లు అందరు తిని పండుకున్నరు.

నేను ‘‘ఎగిలిబారంగనే’’ (ఎర్లిమార్నింగ్‌) లేశి హైదరాబాదుకు రావాల్నని తయారయితాన. సాయత్రం కోశి దాశిన ఎనుకకాలు సప్ప వండెదానికి మావోళ్ళు మాల్ మసాల తయారుజేత్తాండ్లు. ‘‘మీరు కూడ ఇంత సల్లబడిపోండ్లి. హైదరాబాదుకు పొయ్యెటాలకు ఏ టైం అయితదో ఏందో’’ అన్నది మా అనసూరక్క. నేను సరేనన్నా. అన్నం తిని బయుదేరే ముందు మా భార్య నాదగ్గరికచ్చి ‘‘అనసూర్యక్కను హైదరాబాదుకు తీసుకపోదం అక్కడ ‘‘కిమ్స్‌’’ హస్పటల్ల సూపిద్దం, ఆమె పరిస్థితి మంచిగలేనట్టనిపిస్తాంది రాత్రి మూడు నాలుగు గంట్లకు మీ చెల్లె దగ్గరకచ్చి ఏడిసిందట, నేను సచ్చిపోతనంటాందట. అసలే నిదురత్తలేదట ‘‘సైక్రియాటిస్ట్‌’’ డాక్టర్‌కు సూపిద్దం’’ అన్నది. సరేనన్నా మరి వత్తదో, రాదో అడుగన్న. అడుగుతె వత్తనన్నది, హైదరాబాదుకు మాతోని తీసుకచ్చినం. తెల్లారి ‘‘కిమ్స్‌’’కు సైక్రియాటిస్ట్‌ డా॥ నాగలక్ష్మి దగ్గరికి తీసుకపోయినం. డాక్టరమ్మ మా అనసూర్యక్క తోటి శానసేపు మాట్లాడిరది. డాక్టరమ్మతోని తన బాధ శెప్పుకుంట మా అక్క ఏడిసింది. డాక్టరమ్మ పరిక్షచేసి ‘‘ఈమె చాలా డీప్‌ డిప్రెషన్‌లో వున్నది. 20 రోజులకి మెడిసన్‌ కోర్స్‌ రాస్తున్నా, 20 రోజుల తరువాత మళ్ళీరండి ఆమెను జాగ్రత్తగా చూసుకొండి. మీ దగ్గరే ఓ నెల రోజులు వుంచుకొని జాగ్రత్తగ సూసుకోండి’’ అన్నది సరేనన్నాం, మా దగ్గర మూడురోజులున్నది, నాలుగో రోజు అమ్మటాల్లకు (ఉదయం ఎనిమిది, పది గంట మధ్య) ఇగ నేను పోతర బిడ్డ అన్నది ‘‘వుండరాదక్క ఊళ్ళెకు బోయి ఏం జేత్తవ్‌’’ అన్న. ‘‘లేదుర బిడ్డా పోత’’ అన్నది మా కొడుకును ఆమెను ఊళ్ళె తోలిరమ్మని ఆమె ఎంట పంపిచ్చిన. నేను నా రాసుకునే, చదువుకునె రూముకు పోయి తలుపు మూసుకొని కూసున్న ఏందోత్తలేదు. గుడిపాటి వెంకటాచంగారి గీతాంజలి (ఠాగూర్‌ అనువాదం) మళ్ళా ముందటేసుకున్న నా పుస్తకాల ర్యాక్‌ల  శాన్నే పుస్తకాలుంటయ్‌ సదివినయి, సదువనియి. కాని నా చెయ్యి చలం పుస్తకాలకాడికే పోతది. ‘‘చలం నన్ను మింగిండు’’ చలం పుస్తకాలు సదువుతాంటె బతుకు రుచనిపిస్తది, పెద్ద పెద్ద బాధలు చిన్నగనిపిస్తయ్‌. మనుషులను ప్రేమించాలనిపిస్తది, కష్టాలను కావలిచ్చుకోబుద్దయితది, ‘‘లేకిడి’’ తనం పోయి గుండె బారిదయితది. ఎట్ల బతుకాల్నో, ఎందుకు బతుకాల్నో ఎరుకయితది. బతికే రీతిని చలం గుండెకు ‘‘ఇంజెక్ట్‌ చేస్తడు’’. గీతాంజలి సదువుకుంటపోతాన ‘‘ప్రేమ ఏకం. ఏకమైన ప్రేమ ఐక్యం కావాలనే కాంక్షలో రెండు రూపాల విభాగమై తనని తాను వ్యక్తం చేసుకుంటోంది. ఒకటే విద్యుచ్చక్తి ఆకాశాన ఈ మూల ఒక మెరుపుగా, ఆ మూల ఒక మెరుపుగా చలించి పెనవేసుకుని ఐక్యమై తేజస్సుని మించిన అంధకారంలో లీనమౌతుంది. విద్యుచ్చక్తి అంతా ఒకటే కాని పాజిటివ్‌ మరియు నెగిటివ్‌ అని విభాగమై ఇన్ని గృహాల్ని, ఉత్సవాల్ని వెలిగించి ఐక్యమై ఇన్ని చిత్రాలుగా దీపాలుగా నవ్వుతోంది.’’ ఇట్లా… దనాదన సదువుకుంటపోతానే వున్నా. పుట సంఖ్య.65

36 వ గీతం సదువుతాన

‘‘ఇదే నీకు నా ప్రార్థన, ప్రభో!

నరుకు నరుకు

నా హృదయంలోని దరిద్రాన్ని సమూలంగా నరకు.

నా సుఖదు:ఖాల్ని తేలికగా తీసుకునే బలాన్ని నాకియ్యి.

సేవలో నా ప్రేమను సఫలం చేసుకునే శక్తిని ప్రసాదించు.

దీనుల్ని నిరాకరించే దుర్గతి నించి నన్ను తప్పించు.

మదాంధుల ముందు మోకరించనీని అభిమానాన్ని నాలో పెంపొందించు.

నిత్య జీవనంలోని అల్ప విషయాల నించి

నా మనసుని తప్పించే నేర్పునియ్యి.

ప్రేమలో నీ సంకల్పానికి

నా శక్తిని అర్పించుకునే బలాన్ని కటాక్షించు.’’

ఈ గీతం సదువుడు అయిపోంగనే మా అనసూర్యక్క గుర్తుకచ్చింది. నేను దేవున్ని నమ్మాల్నని మస్తనుకుంట కాని నమ్మ, కాని… ‘‘ఈ భూలోకాన్ని, మనిషిని, మాకును, పుట్టను, పురుగును, నిప్పును, నీటిని, గాలిని, ధూళిని నడిపించే శక్తి ఏదో వున్నదట. ఆత్మ అవినాశి, బహిర్గత సౌందర్యం కన్న ఆత్మ సౌందర్యం గొప్పది. అని నేను నా చిన్నప్పుడు ‘‘సొక్రటీస్‌’’ పుస్తకంల చదివిన ఆ మాటలు నా గుండెలకు గుసాయించి, నా దమాక్‌ల జమాయించి కూసున్నయ్‌. ఆ‘‘శక్తి’’ని లేదా ఈ లోకులు పూజించే ‘‘దేవున్ని’’ కన్నీళ్ళతోని నేను రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ లెక్క ప్రార్దించిన. మా అనసూర్యక్క ఇప్పుడు పుట్టెడు దు:ఖంలున్నది. ‘‘సుఖదు:ఖాల్ని తేలికగా తీసుకునే బలాన్ని ఆమెకియ్యి. నీ సేవలో ఆమె ప్రేమను సఫలం చేసుకునే శక్తిని ఆమెకు ప్రసాదించు. ఈ మూర్ఖపు లోకం ముందు మోకరించనీని అభిమానాన్ని ఆమెలో పెంపొందించు. నిత్యజీవనంలోని అల్పవిషయాల నించి తప్పించుకునే నేర్పుని ఆమె మనసుకియ్యి, ప్రేమలో నీ సంకల్పానికి ఆమె శక్తిని అర్పించుకునే బలాన్ని మా అనసూర్యక్కకు కటాక్షించు’’ అని దిల్‌సే ఏడిసిన.

Kadha-Saranga-2-300x268

ఆమె దు:ఖం చెప్పుకునేది కాదు. చెప్పుకుంటె తీరేదికాదు. ఆమెకు అన్నీ వున్నయ్‌… ఇల్లు, జాగ, ఎద్దు, ఎవుసం, పైసలు కాని… ఆవ్వెవీ ఆమెకు సంబురాన్నియ్యయి, సంతోషపెట్టయి. ఆమెకు అందరున్నరు. బలుగం, బంధువు, అన్నలు, తమ్ముళ్ళు, మనుమలు, మనువరాండ్లు కాని… ఎవలు ఆమె వాళ్ళు కాదు. అన్నీ వున్నట్టె అనిపిస్తయ్‌ కాని బతుకంత ఎల్తి ఎల్తి వుంటది. అందరు వున్నట్టె అనిపిస్తరు కాని ఎనుకకు తిరిగి సూసుకుంటె ఎవరుండరు. ఆమె తట్టుకోలేని ఒంటరితనం వుంటది. ఈ పరిస్థితిని ఆమె ఎవ్వలకు చెప్పుకోలేదు, ఆమె పరిస్థితి ఇదని బహిరంగంగ ఒప్పుకోలేదు. చెరువుతెగి చెర్లనీళ్ళు చెరువెనక పడ్డయ్‌. ఇప్పుడు శెప్పుకొని ఏంలాభం అని సప్పుడుజేక వూకుంటది. అప్పుడప్పుడు బాధలు, ఒంటరితనం ఆమె గుండెను ‘దబ్బుడుకం’ (గోనె సంచు కుట్టె సూది) లెక్క పొడిశినప్పుడు అవస్థను తట్టుకోలేక సాటుకో, నేటుకో, అయినోళ్ళతోని శెప్పుకొని ఏడుస్తది.

మా అనసూర్యక్కకు ఇప్పుడు దగ్గరదగ్గర ఓ యాభైఅయిదు సంవత్సరాల ఉమర్‌(వయసు) వుంటది. నాకు ఊహ తెలిసి తెలవకముందే ఓ పది పదకొండు సంవత్సరాల వయసునే ఆమెకు పెండ్లయ్యింది. పెండ్లయ్యినంక కొన్ని రోజులు అత్తగారింటికి పోయింది. తరువాత పోనని ఏడుసుడు మొదలుబెట్టి వచ్చి మా ఇంటికాన్నే వున్నది. అట్లా శానా దినాలు గడిశినయ్‌. మా అనసూర్యక్క చానా ‘‘కష్టబోతు’’. మొగోళ్ళతోని సమానంగా పనిజేత్తది. అత్తగారింటికి పోకుంట ఇంట్లనే వున్నప్పుడు, ఇంటికాడ, అన్నం, కూర వండుడు. ఇల్లు, వాకిలి ఊడుసుడు, అంట్లుతోముడు, అలుకుసల్లుడు దగ్గర్నుంచి, వ్యవసాయం పనులు ఎక్కువ చేసుడు మొదలుబెట్టింది. ఎందుకంటె మాఅక్కోళ్ళ అవ్వ, నాయిన, అరె బిడ్డ మస్తు పనిచేత్తాంది, మంచిగ ఆసరయితాందని, అత్తగారింటికి పంపియ్యరని ఆమె ఉపాయమేసింది. ఆమె ఉపాయం కరక్టే అయ్యింది. ఇంటిపని, వంటపని, వ్యవసాయం పని అన్నీ మా అక్క  ఒక్కతే ఒంటిశేతి మీద శేత్తాంటే మా తాతకు శానా ఆరామ్‌(రిలాక్సేషన్‌) దొరికింది. శానా సుఖానికి అవాటుపడ్డడు. వుంటాంటె వుంటాంటె కొంత కాలం తరువాత మా తాత పని శెయ్యాల్సిన అవసరం కనిపించకుంట పోయింది. ఓ నాలుగురోజులు కనుక ఏ పెండ్లికో, పేరంటానికో మా అనసూర్యక్క పోతే ఎక్కడి పనులు అక్కణ్ణే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. వుండంగ వుండంగ మా అక్క మనసు మారింది. మనిషిలో మార్పు మాములే కదా. అత్తగారింటికి పోవాల్నని నిర్ణయించుకున్నది. మా అక్కను పెండ్లిశేసుకున్నాయినే కూడా శానా మంచి మనిషే ఈమెను బతిలాడో, బామాడో తీసుకపోయెటానికి శానాసార్ల వచ్చెటోడు. అత్తగారింటికి పోవాల్నని మా అక్క మనసు కూడా వుండేది. కాని మా తాత పంపించెటోడు కాదు. ఈమె మా అత్తగారింటికి నేను పోత అని  శెప్పలేని పరిస్థితి. మా తాత, మా అక్క భర్తను తిట్టి, బెదిరించి పంపించెటోడు. ఎందుకంటె ఈమె అత్తగారింటికి పోతే ఎక్కడ పనులు అక్కణ్ణే పంటయ్‌ అని మా తాత బాధ. కొంతకాలం తరువాత మా అక్కకు విడాకులు కూడా చేసేసిండు మా తాత. ఇంట్ల ఏ పని చెయ్యాల్నన్న, ఏ నిర్ణయం తీసుకోవల్నన్న అంతా మా తాత శేతుల్నే వుండేది.

ARIF4‘‘మా అనసూర్యకు మళ్ళా పెండ్లిశెయ్య ఎందుకంటె దానిమీద దేవుడున్నడు దాన్ని దేవునికి ఇడిసిపెడుతాన’’ అని మా తాత మా బందువులకు శెప్పిండు. మా నాయినమ్మ, మా నాయిన, బాబాయి, కోడళ్ళు అందరూ మా తాత మాటను ఎదురించలేక తలకాయూపిండ్లు. ఆ కాలంల అది మంచా, చెడా, అని ఆలోసించె తెలువులు వాళ్ళకు కూడా లేవు. పాపం మా అనసూర్యక్క పరిస్థితి గోరంగ తయారయింది. ‘‘నాకు పెండ్లి శెయ్యిండ్లి అని అడగలేని పరిస్థితి, నాయినను ఎదురించలేని స్థితి’’ ఆడోళ్ళు ఈ కాలంల్నే నాకు పెండ్లి శెయ్యిండ్లి అని అడగలేని పరిస్థితి. ఆ కాలంల ఆ స్థితే లేదు. కాని మా అనసూర్యక్కకు నాది అనే ఒక కుటుంబం వుండాల్నని, ఆమె కడుపు పుట్టిన పిల్లలు, ఓ సంసారం వుండాల్నని శానా‘‘కాయిశు’’ వుండేది. నేను పసిపోరణ్ణయిన ఆమె కండ్లల్ల  ఆ బలమైన ‘‘కాయిశు’’ను పసిగట్టిన శానాసార్ల. మా అక్కకు ఇడుపుకాయితం (విడాకులు) అయినంక కూడా మా అక్క ఆమె మెడ తాళిబొట్టు తియ్యలే….దేవుని పేరుమీద అట్లనే ఏసుకునేది. శానా రోజుల తర్వాత ఆ పసుపుతాడు రంగు ఎలిసి పోయి షీకిపోయే దశకు రాంగనే, మా ఊరుపక్క నర్సంపేటల ఆదివారం నాడు అంగడి జరుగుతది, ఆ అంగట్లకుపోయి పూసబెర్లోల్ల దగ్గర కొత్త పసుపుతాడు కొనుకచ్చుకునేది, మెడల్నుంచి పాత పసుపుతాడు తీసి దాని ముళ్ళిప్పి, సకిలముకిలం పెట్టుకొని కూసోని ఆమె ఒళ్ళె (ఒడిలో) ఆ పాత పసుపుతాడుకున్న నల్లపూసలగుండ్లు, బంగారుగుండ్లు, బంగారు చింతాకుపువ్వు, తాళిబొట్టు అన్నీ….పోసుకొని, కొనుక్కచ్చుకున్న కొత్త పసుపుతాడుకు సంటర్ల (నడుమ) తాళిబొట్టునుకట్టి నల్లపూస గుండ్లను, బంగారుగుండ్లను, చింతాకు ఆకారంల వుండే బంగారు పువ్వును, వరుసగా లెక్కతప్పకుంట ప్రేమగా, సుతారంగా కుచ్చి మళ్ళా మూడుముళ్ళేసుకొని మెడలెసుకొని పొగసూరి మసకబారిన పాత చిన్న అద్దంల మంచిగున్నదా…. లేదా… అని సూసుకునేది అప్పుడు నేను శానా చిన్న పోరగాణ్ణి.

పినిశెట్టి రామస్వామి అని మా నాయినమ్మోళ్ళ తమ్ముడు వుండెటాయినె ఆయిన మా అనసూర్యక్కకు మేనమామ.  ఓసారి నోరిడిషి మా అక్క మా రామస్వామి తాతకు చెప్పింది. ‘‘మామ నేను పెండ్లి శేసుకుంటనే నాకూ సంసారం, పిల్లో, జెల్లో, ఇల్లు, వాకిలి ఉండాలె కదనే. రేపు నాకు కాళ్ళు, రెక్కలు దగ్గరబడి పురాగ శాతగాక మంచంబడితే నన్ను ఎవ్వరు అర్సుకుంటరు. నా కడుపు పుట్టిన పిల్లలుంటె నన్ను సూసుకుంటరు. ఇట్ల ఇంటిమీద ఎన్నిరోజుండాల్నే అన్నది’’ పాపం మా రామస్వామి తాత ఆమె దు:ఖం అర్దం శేసుకొని “అనసూర్యవ్వ నేను చెప్తా ఆగు టైం వచ్చినప్పుడు” అన్నడు.

కొన్ని రోజుల తరువాత మా రామస్వామి తాత ఓ మంచి సంబంధం సూశిండు. పిలగాడు మంచి బుద్దిమంతుడు. మా కుమ్మరి పని మంచిగ శేత్తడు కాని ఎనుకముందు ఎమీ లేరు. పిలగానికి మా అనసూర్యక్క గురించి చెప్తె చేసుకుంటనన్నడు. మా అక్కకు కూడా పిలగాని గురించి చెప్తె సరే మామ చేసుకుంటనన్నది. ఓ రోజు మా కట్టయ్య తాత దగ్గరికి మా రామస్వామి తాత పోయి ‘‘అనసూర్యకు ఓ మంచి సంబంధం తెచ్చిన్నే బావ! అని పిలగాని గురించి శెప్పిండు, ఎంటనే మా కట్టయ్య తాత మస్తు సీరియస్‌ అయ్యి ‘‘ఎడమకాలు చెప్పుదీసి కొడుత బాడుకావ్‌ అని ఎడమకాలు శెప్పు దీసిండు. బామ్మర్ధివి బామ్మర్ధి లెక్కుండు. నా బిడ్డకు నువ్వు పెండ్లి సంబంధం సూశెటోనివి అయినావురా? అని అనరాని మాటనుకుంట, దానికి పెండ్లిజెయ్య ఏంజెయ్య దేవునికి ఇడిషిపెట్టిన’’ అన్నడు. ఎందుకంటే మా అక్కకు మళ్ళ పెండ్లిజేత్తె కట్నం, కానుకలు, బట్టు, బాతు, బోజనాల ఖర్సు ఎటులేదన్నా ఓ యాభైవేల రూపాలన్న ఖర్చుయితయి ఆ రోజుల్ల, మళ్ళా మా అనసూర్యక్క పెండ్లి శేసుకొని అత్తగారింటికిపోతె ఎక్కడి పనులు అక్కణ్ణే ఆగిపోతయ్‌ అని మా కట్టయ్య తాతకు మనసు వుండేది కాని….బయటికి శెప్పెటొడు కాదు. మా రామస్వామి తాత చేసేదేమి లేక జరిగిన సంగతి మా అక్కతోని చెప్పిండు. ఏం జెయ్యాల్నో అర్దంగాక మా అక్క బాగా ఏడిషింది. ఆడపిల్లకు కష్టమస్తె కన్నోళ్ళముందో, తోడబుట్టినోళ్ళముందో, అయినోళ్ళముందో వాళ్ళ కష్టం ఎల్లబోసుకుంటరు. కాని కన్న తండ్రే కన్న బిడ్డ రెక్క కష్టానికి అలవాటుపడి, బిడ్డ కాయకష్టం నుంచి పొందే సుఖానికి మరిగి, పరాణ్ణజీవి ‘అమీబా’ లెక్క మారినప్పుడు… కన్నతల్లి, అన్నదమ్ములు, వదినొ నవారుపట్టె మంచం నల్లులలెక్క నిమ్మకు నీరెత్తనట్లు సప్పుడు జేకుంట, మాటగూడ మాట్లాడకుంట ఊకుంటె పాపం ఒక ఆడిమనిషి ఏంజెయ్యగలుగుతది. కొంగునోట్లె కుక్కుకొని సప్పుడు గాకుంట సాటుకు ఏడుసుడు తప్ప. అప్పుడు మా అక్క అట్లనే ఏడిసింది. ‘‘ఈ వదిన తోని, మరుదళ్ళతోని, అన్నదమ్ములతోని, అయినోళ్ళతోని, కానోళ్ళతోని నేను మాటు పడలేను. నన్నొక అయ్య శేతుల పెట్టుండ్లి, నా బతుకేదో నేను బతుకుతా… అని సాటుంగ, నేటుంగ శానాసార్ల అడిగింది, కాని అప్పటికే మా అనసూర్యక్క మీద దేవుడున్నడు, ఆమెను దేవునికి ఒదిలేశిండ్లు అనే ముచ్చట ఆ నోటా, ఈ నోటా మా చుట్టాందరికి తెలిసింది. వుండంగ వుండంగ ఆమె పెండ్లిగురించి మాట్లాడే మనుషులే కరువయ్యిండ్లు. ఆమెకు పెండ్లి మీద ఆశ సచ్చిపోయింది. మా అక్కమీద దేవుడున్నడట. కనీసం ఆ దేవునికి కూడ మా అక్క మీద జాలి కలుగలే. ఆఖరికి మా అక్కమీద కూడా మా అక్కకే జాలిపోయింది. ఆమె కసిగా పెండ్లి అనే మాటను తన ఎడమకాలి బొటనఏలు(మే)తో  ఎర్రచీమను నలిపేసినట్టు నలిపేసింది.

ARIF4ఇప్పుడు మా అక్కకు యాభై అయిదు సంవత్సరాలపైనే వయసుంటది. కూలికో, నాలికో పోతది, ఆమెకు వున్న బుంతంత చొక, ఇంత కోతిమీర, ఇంత ఉల్లాకు, ఇంత గోగ్గూర, ఇంత సుక్కకూర, ఇంతంత పాలకూర సీజన్‌ను పట్టి చిన్నచిన్న ‘‘మడులు” అలుకుకుంటది. సాయంత్రం కోసుకస్తది. వాకిట్ల సాపపరుసుకొని కూసోని, కోసుకచ్చిన ఆకు కూరలు, చీరిన తాటాకు ఈనెతోని కట్టు కట్టుకుంటది, పెద్ద గంపల వరుసగా బతుకమ్మను పేర్సుకున్నట్టు పేర్సుకుంటది. తెల్లారి మబ్బుల లేత్తది. యాపపుల్లతోనన్న లేకపోతే బొగ్గుతోనన్న (ఎనుకటయితే ‘‘పిడిక’’ బొగ్గుతోని తోమేది ఇప్పుడు పిడికలు లేవు) పళ్ళు తోముకొని మొఖం కడుక్కుంటది. గంపనెత్తి పెట్టుకొని నర్సంపేటకు నాలుగు కిలోమీటర్లు నడుసుకుంట పోతది, అక్కడ కూరగాయల అడ్డమీద కూసోని అమ్ముకుంటది. పాణం పురాగ శాతగానినాడు మారుబేరపోళ్ళకు ఎంతకో ఒగంతకు అడ్డికి పావుశేరు గుత్తకు అమ్ముతది. వచ్చిన పైసలు బొడ్లె సచ్చిల పెట్టుకొని ఇంటికత్తది. అన్నం కూర వండుకొని తిని, అరుగుమీద కూసోని బొడ్లె సంచిల పైసలు అరుగుమీద కుమ్మరిత్తది, రూపాయి, రెండు రూపాయలు అన్నీ లెక్కేత్తది, ఒక పాత చెక్క బొట్టుపెట్టెల పైసలు దాసుకుంటది, ఓ బర్రెను కొనుక్కున్నది. దాని పాలు పిండి అమ్ముకుంటది, సగంపాలను పెరుగు తోడేత్తది, పెరుగు అమ్ముకుంటది. పైసలు అసలే ఖర్సుపెట్టది. కడుపుకు ఆయిమనంగ తినది. రాతెండి టిఫిని గిన్నెల (లంచ్‌బాక్స్‌) ఇంతంత అన్నం బెట్టుకుంటది. చిన్న స్టీలు కటోరల ఇంతంత కూర, లేకపోతే మామికాయ తొక్కో, టమాట తొక్కో పెట్టుకుంటది. ఆ కటొరను టిపిని బాక్స్‌ల పెట్టుకుంటది. ఎడ్ల బండి కట్టుకొని బాయికాడికి పోతది. ఎడ్లబండి నొగుల బట్టి ఒక్కతే లేపుతది, ఎడ్లు వచ్చి బుద్దిగా ‘‘కాణి’’ కింది మెడలు పెడుతయ్‌, సతాయించయ్‌. ఎడ్లకు కూడా మా అనసూర్యక్కంటె అంత ప్రేమ, జాలి. ఈ ప్రేమ, జాలి, పావురం మా కట్టయ్య తాతకు మా అక్కమీద వుండివుంటే మా అక్క బతుకిట్ల ఒంటరిదయ్యేదికాదు. గత యాభై సంవత్సరాలుగా మా అనసూర్యక్కది ఇదే దినచర్య. ఎసొంటి మార్పు శేర్పు లేవు. అప్పుడప్పుడు బతుకు రోటీన్‌గా, రోతగా అనిపిచ్చినప్పుడు ‘‘నా పెండ్లయినప్పుడు నేను చిన్నదాన్ని. అవ్వగారి ఇంటిమీద మనుసుగుంజి అత్తగారింటికి పోనని మంకుపట్టు బట్టిన. నాలుగు బుద్దిమాటలు జెప్పి తోలియ్యాలె, మా అత్తగారోళ్ళు వచ్చినప్పుడన్న తోలియ్యాలె గదా? ఆ సంబంధం ఇడుపుకాయితం (విడాకు) అయ్యినంకనన్నా మళ్ళా నన్నో అయ్యశేతులబెట్టాలే కదా, మా రామస్వామి మామ తెచ్చిన సంబంధాన్ని కూడా శెడగొట్టె,  పని చేసి చేసి నా బొక్కలు షీకిపోయినయ్‌. నేను బండెడు కష్టం జెత్తాంటే తిని కూసోని సుఖానికి మరిగి నాది ఇట్లా ఎటుగాని ఒంటరి బతుకుజేసిండు మా నాయిన ‘‘లంజకొడుకు’’ అని ఆమె ఎత తీరెదాకా ఏడుస్తది.

ఇప్పుడు మా అక్క అన్నదమ్ములందరు ఏరుబడ్డరు, అన్నదమ్ముల పిల్లలకు పిల్లలయిండ్రు, ఎవ్వల కుటుంబాలు వాళ్ళకున్నయ్‌, పాపం మా అనసూర్యక్కకే ఓ కుటుంబం లేకుంటయ్యింది. ఏదయిన పండుగకో, ప్రభోజనాకో మా చెల్లెండ్లు, మా తమ్ముండ్లు, మేము, మా పిలగాండ్లను తీసుకొనిపోతం, ఆ రొండు రోజులు సంబురంగనే వుంటది. ఎక్కడోళ్ళక్కడ పోంగనే బెంగట్నీట్టయితది. ‘‘సముద్రం కెరటాలు ఉవ్వెత్తున ఎగిరెగిరి పడుకుంటొచ్చి తీరాన్ని ముంచినప్పుడు, తీరానికి సంబురమయితది. బతుకు సుట్టూరంగా మస్తుతోడు భద్రతునట్టనిపిస్తది. అవే కెరటాలు ఎనుకకు మర్లిపోయినప్పుడు తీరం ఒంటరితనంతోటి ఏకాకై బెంగటిల్లి ఏడుస్తది’’ ఇప్పుడు మా అనసూర్యక్క బతుకు ఆ ఒంటరి తీరం లెక్కున్నది.

ఆమె బాల్యం, ఆమె యవ్వనం, ఆమె గుండెల పురుడుపోసుకున్న ఆశలు, కోరికలు, అమె జీవితం, అన్నీ… ‘‘వానలు బాగ కొట్టినప్పుడు మా ఊరి చెరువునిండి మత్తడి పడ్డప్పుడు రువ్వడిగ (అతి వేగంగా) ఉరికే మా ఊరి పెద్ద వాగు పడి కొట్టుకపోయినయ్‌. కాదు, కాదు, మా తాత ‘‘మాదర్‌చోద్‌’’గాడు మా అక్క బతుకును ఆ వాగు పారబోషిండు’’. ఎవ్వులు తెచ్చిత్తరు ఆమె బతుకును ఎనుకకు. ఏ నడిజామ్‌ రాత్రో ఆమెకు నిద్ర రాక జారిపోయి మట్లె గలిసిన జీవితం యాదికచ్చి, ‘‘కష్టమస్తె గుండెకు అమురుకొని ఏడిసెదానికి కడుపు పుట్టన బిడ్డలు లేరని, కండ్లనీళ్ళు తుడిసెదానికి ఓ తోడు లేదని, ఎక్కెక్కి ఏడుస్తాంటే మావోళ్ళు ఇది బద్దిపోచమ్మ కొంటెతనమంటాండ్లు మావోళ్ళు పిచ్చోళ్ళు. కాని…..మా అక్క గుండె యాభై సంవత్సరాలుగా మండుతున్న ఒక ఒంటరి బాధ సూర్యగోళం, ఆమె కండ్లు గడ్డకట్టిన కన్నీటి హిమాలయాలు. ప్రతిరోజు ఆమెకు ఆమె ఒంటరి బతుకు మీద రోతపుట్టి బాధను ‘‘బర్ధాష్‌’’ చెయ్యలేక గుండె భగ్గున మండుతాంటే ఆ మంట శెక (సెగ) ఆమె కండ్ల కన్నీటి హిమాలయాలను తాకి అవి కరిగి ఆమె కండ్లు కన్నీటి నదులై ప్రవహిస్తాంటయ్‌, పాపం మా అనసూర్యక్క ఓ కన్నీటి జీవనది.

*

 

 

ఏంజేత్తదో ఎవలకెరుక..

-కందికొండ

(సినీ గేయ రచయిత)

~

IMG-20151112-WA0010

 

kandiమా అవ్వ బతుకమ్మ పండుగకు ఊరికి రమ్మని ఫోన్ జేసింది . నేనన్నా ‘మా ఇద్దరిపోరగాండ్లకు మాకు ఇంటినలుగురికాకం కలిపి రానుపోను,ఇంటికచ్చినంక పండుగ ఖర్సు కలిపి ఓ నాలుగైదు వేలయితై ఎందుకులే ’  అన్న. ‘రేపు మేం సచ్చినంక మీరు వచ్చేది రాంది మేం సూత్తమాగని  మా జీవి వున్న నాల్గు రోజులన్నవచ్చిపోరాదుండ్లి, మీ పోరగాండ్లు కండ్లల్ల మెరుత్తాండ్లు’ అన్నది. మారు మాట్లాడకుంట ఊరికిపోయినం!

బతుకమ్మ పండుగ బాగనే జరిగింది. దసరా పండుగనాడు ఓ యాటపోగు తీసుకున్నం . మా మచ్చిక లక్ష్మణ్ గౌడ్ చిచ్చా ఇద్దరు రెగ్యులర్ “వాడిక” దార్లకు ఎగ్గొట్టి వాళ్ళ బాపతి కల్లు నాకు పోషిండు. తాగి అబద్దమెందుకు ఆడాలె గని ఉన్న నాలుగు రోజులు కడుపునిండ కల్లు తాగిన. పండుగ సంబురంగనే జరిగింది . కానీ, ఒక్కటే బాధ! ఈ బాధ ఇప్పడిదికాదు ఆరేడు సంవత్సరాలనుంచైతాంది . మా ఇంట్లనుంచి బయటికెల్లంగనే కుడిచేయి రోకు పెసరు కొమ్మాలు ఇల్లు ఉంటది. నేను ఆయనను పెద్దనాయిన అని పిలుస్త. మా నాయిన కన్నా రెండు మూడు సంవత్సరాలు వయసులో పెద్దోడు. వాళ్ళు మా కులపోళ్ళో,సుట్టాలో కాదుగనీ మంచి కలుపుగోలు మనుసులు.వాళ్ళ శిన్నకొడుకు శీనుగాడు నేను సాయితగాండ్లం .

ఆయనకు ఆరేడు సంవత్సరాల కిందట పక్షవాతం (పెరాలసిస్) వచ్చి నోరు కాళ్ళు  చేతులు పడిపోయినై . ఊళ్లే ఆ పెద్దనాయిన తోటోళ్లే కాదు ఆయనకన్నా పెద్దోళ్ళు కూడా ఎవల పని వాళ్ళు చేసుకుంటాండ్లు,మంచిగనే ఉన్నరు.  పాపం పెద్దనాయిన పరిస్తితి అట్లయ్యింది .కొంచం దూరం కూడా నడువలేడు .ఆయన పనులుగుడ ఆయన శేసుకోలేడు. మూత్రం దొడ్డికి అన్నీ మంచం పక్కేనే… ఖాళీ స్థలం లో . అది కూడా ఎవలన్నఆసరుండాల్సిందే,లేకపోతే అన్నీ మంచంలనే. పాపం పెద్దవ్వ పెసరు ఈరలచ్చమ్మ భూదేవసొంటిది,మస్తు ఓపికతోని దొడ్డికి ఎత్తిపోసేది. సుట్టుపక్కల ఊడ్సేది,బట్టలల్ల మూత్రమో దొడ్డికో పోతే బట్టలన్నీ తెల్లగ పిండేది. రెండు మూడు సంవత్సరాల కిందట ఆ పెద్దవ్వ సచ్చిపోయింది. కొడుకులు కోడండ్లు మనవండ్లు మనవరాండ్లు ఉన్నరు,బాగానే అర్సుకుంటరు . కానీ, అన్నీ వుండిలేమి  కుటుంబాలే కదా..కూలికో నాలికో పోకపోతే ఇంట్లకెట్లెల్లుద్ది . వాళ్ళు పనికిపోయేటప్పుడు ఇంత అన్నం, మంచినీళ్లు పెట్టిపోతరు.

పెద్దనాయిన పాత కుమ్మరి గూనపెంక ఇంటి ముందు,చింతచెట్టుకింద ఓ పాత నులక మంచమేసుకుని వచ్చి  పోయేటోళ్లను సూసుకుంట మందలిచ్చి మాట్లాడుకుంటా రోజును ఎళ్లదీత్తడు .రోజెళ్లదీసుడేంది అట్లా ఏడు సంవత్సరాలనే ఏళ్లదీసిండు. ఒకవేళ, ఆదాట్నవానత్తె  తడవాల్సిందే,బాగా ఎండత్తే  ఎండాల్సిందే,సలిపెడితే వణుకాల్సిందే.ఇంకొకల ఆసరా లేకుండా కదలలేడు. పెద్దనాయిన పరిస్తితి సూత్తాంటే నాకు శ్రీ శ్రీ “జయభేరి” కవితల “ఎండాకాల మండినప్పుడు గబ్బిలం వలె క్రాగిపోలేదా! వానకాలం ముసిరిరాగా నిలువు నిలువున నీరు కాలేదా ! శీతాకాలం కోతపెట్టగ కొరడు కట్టి ఆకలేసి కేకలేశానే!” అనే పంక్తులు గుర్తుకచ్చి అవి పెద్దనాయిన కోసమే శ్రీ శ్రీ రాసిండా ఏంది ! అనిపిచ్చేది.

ఒకప్పుడు ఇరవై అయిదు ముప్పై సంవత్సరాల కిందట… నేను చిన్నపోరగాన్ని, టూపులైటు లాగులేసుకుని ఎగిడిశిన భూతంలెక్క ఊళ్లె  తిరిగేటోన్ని. అప్పుడు పెద్దనాయిన ఎట్లుండేటోడు పులి లెక్క ! పెసరు కొమ్మయ్య అంటే ఒక ఆట, పెసరు కొమ్మయ్య అంటే ఒక పాట,పెసరు కొమ్మయ్య అంటే ఒక కోలహలం …ఒక కోలాటం. అప్పటి రోజులు నాకింకా గుర్తున్నాయి. ఎండాకాలం,సలికాలం,ఎన్నెల ఎలుగులల్ల నాలుగుబాటల కాడ కమ్యూనిష్టు పార్టీ జెండా గద్దె ముందు రాత్రి ఏడెనిమిది గంటలకు ఊరోళ్ళంతా ఇంత తినచ్చి కూసునేది .

పెద్దనాయిన రాంగనే సందడి మొదలయ్యేది. అందరూ పక్కన పెట్టుకున్న ‘పట్నం తుమ్మ’ కోలలు తీసుకుని గుండ్రంగా నిలబడేటోల్లు ,పెద్దనాయిన కాళ్ళకు గజ్జెలు కట్టుకుని, చేతిల చిరుతలు పట్టుకుని మధ్యల నిలబడి పాట పాడుకుంటూ చిందేసేది. నాకయితే సినిమాలల్ల కైలాసంల శివుడు నాట్యం శేత్తానట్టు అనిపిచ్చేది.ఆ చిందేసే కాళ్ళు అసలే ఆగకపోయేది. చేతుల చిరుతలు రికాం లేకుండ (నాన్ స్టాప్ గా) మోగేటియి . పెద్దనాయిన పాడుతాంటే సుట్టున్నోళ్ళు కోరస్ పాడుకుంట ఎగిరేటోళ్లు . గుండ్రగ నిలబడి కోలాటమెసేటోళ్ళల్ల ఎవ్వలకన్న దమ్మత్తే(ఆయాసం)వాళ్ళ కోలలు వేరేటోళ్లకిచ్చి వాళ్ళు కూసోని మొస్స తీసుకునేటోళ్లు .కానీ పెద్దనాయిన కాలు నిలవకపోయేది. నోటెంట పాట ఆగకపోయేది. అట్ల ఆగకుండా గంటలకొద్ది చిందులేసిన కాళ్ళు ఇప్పుడు సచ్చుబడిపోయినాయి. గల్లుగల్లున చిరుతలు మొగిచ్చిన చేతులు ఆయన పని ఆయనే చేసుకోవటానికి సహకరిస్తలేవు.

నాలుగు బాటల కూడలిలో గొంతెత్తి పాటపాడితే వాడకొసలకు ఇనచ్చేది,ఊరు మారు మొగిపోయేది. అసోంటి గొంతు బాధైతే చెప్పుకునేదానికి,ఆకలైతే అన్నమడగటానికి కూడా లేత్తలేదు. పెద్దనాయిన పరిస్తితి పగోనికి కూడా రావద్దనిపిస్తది. ఆయన బాధ సూత్తాంటె సూత్తాంటనే నాకు తెలవకుంటనే నా కండ్లల్ల నీళ్ళు కారినయి. ఏడుపచ్చింది. అట్లాంటి పెద్ద నాయినలు ఊరికి ఎంతమంది ఉన్నారో కదా…

జీవితం ఎప్పుడు ఎవల్ను ఏంజేత్తదో ఎవలకెరుక. అందుకే రిచర్డ్ డేవిడ్ బాక్ అనే రచయత ఇట్లన్నట్టున్నది…. “Life does not listen to your logic; it goes on its own way, undisturbed. You have to listen to life”.

*