తెలంగాణ కథల వెలుగు “అలుగు”

alugu-title-2

 

ఇండియాలో ఏండ్లుగా వేళ్లూనుకున్న జఠిలమైన సమస్యలకు, కొత్తగా ముందుకు వస్తున్న సమస్యలకూ ఇవ్వాళ ప్రజలు అస్తిత్వవాదం/భావజాలం సోయితో పరిష్కారాన్ని వెతుక్కుంటున్నారు. ఈ ప్రజల్లో చైతన్యం నింపుతున్న అస్తిత్వవాదులు ఎవరికి వారు ఆత్మగౌరవంతో తమ స్వీయ అస్తిత్వాన్ని నిబెట్టుకుంటూనే తమతోటి వారి పట్ల కన్సర్న్‌తో వ్యవహరిస్తున్నారు. తమ పొరపాట్లను సరిదిద్దుకుంటూ ‘సమానత్వ’ భావనకు దారులు వేస్తున్నరు. ఇది అంత ఈజీ టాస్క్‌ ఏమీ కాదు. అయినా కూడా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అట్లాంటి ప్రయత్నాల్లో ఒకటి ఈ సంకలనం.

నిజానికి అస్తిత్వ వాదం విజయవంతం కావడానికి స్థూలంగా రెండు మార్గాలున్నాయి. మొదటిది చట్టబద్ధంగా లేదా రాజ్యాంగ బద్ధంగా అమల్లో ఉన్న చట్టాలను తూ.చ. పాటించడం ద్వారా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఈ మార్పును తీసుకురావడానికి అవకాశమున్నది. అయితే ఇది ఫెయిల్యూర్ గా  మిగిలిపోయింది. ఇక రెండోది సామాజిక చైతన్యం ద్వారా కుల, మత, జెండర్‌, పేదరికం, వ్యవసాయం, చేతివృత్తులు, సామాజిక అణచివేత, ప్రభుత్వాల  నిర్లక్ష్య ధోరణి, గ్రామీణ ప్రాంత సంక్షోభం, పట్టణీకరణ లాంటి సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం. సామాజిక చైతన్యానికి సాహిత్యం ఒక ప్రధానమైన ఇరుసు. ఆ ఇరుసుకు కందెన పూసే పనిని ఈ సంకలనం ద్వారా చేస్తున్నాం.

అస్తిత్వోద్యమాలకు వెన్నుదన్నుగా నిలబడడానికి, ప్రచారం చేయడానికి సాహిత్య రంగానికి వెసులుబాటుతో పాటు మంచి అవకాశమున్నది. నిజానికి అస్తిత్వాలకు బలం చేకూర్చేది సాహిత్యం. ఇక్కడ అస్తిత్వమంటే ఒక్క ‘ప్రాంతీయ’ అంశం మాత్రమే కాదు. సమస్య మనిషికి సంబంధించినది. మనిషికి – సమాజానికి ఉండే ఘర్షణకు సంబంధించినది. మనిషికి-మనిషికి మధ్య ఉండే ఆధిపత్యాలకు సంబంధించినది. ఈ ఘర్షణను అర్థం చేసుకొని సాహితీ సృజన చేసినట్లయితే అది అస్తిత్వ సాహిత్యమవుతుంది. అట్లాంటి అస్తిత్వ సాహిత్యానికి ఆనవాలు ఈ అలుగు.

katha-2015-invitation

అరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తరువాత తెలంగాణ తల్లి విముక్తం అయింది. ఆధిపత్యం సంకెళ్లు పటాపంచలయ్యాయి. మన నేల, మన రాష్ట్రం, మన బతుకు, మన బొట్టు, మన బోనం, మన బతుకమ్మ వైపు ఆత్మగౌరవంతో, గర్వంగా అడుగులు వేస్తున్నాం. ఈ అడుగులు మిగిల్చిన పాద ముద్రలు ఏవి అని అవలోకించినపుడు ఈ కథా సంకలనం సమాధానం చెబుతుంది. ప్రతి మట్టి రేణువును పట్టి చూపి స్వరాష్ట్రంలో మనం ఏం సాధించామో, ఇంకా ఏం సాధించాల్సి ఉందో కొన్ని స్పష్టంగా, కొన్ని మౌనంగా చెప్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రైతు, నేత కార్మికులు, స్వర్ణకారులు ఇతరత్రా వృత్తిదారులు ఆత్మహత్యలు పెరిగిపోయాయని బాధ పడ్డం. స్వరాష్ట్రంలో కూడా ఈ పరిస్థితిలో పెద్దగా మార్పులేదు. ప్రపంచమంతా మెతుకు చుట్టూ ప్రదక్షణం చేస్తోన్నా రైతు ప్రయాణం మాత్రం ఆగిపోతోంది.

అప్పు, కరువు, సాగునీటి సమస్య, ఆధిపత్యుల దౌర్జన్యం ముందు రైతు కుప్పకూలి పోతున్నాడు. ఉన్న భూమి అమ్మలేక, దాన్నుండి పంట తీయలేక, అడ్డామీది కూలీగా మారలేక చివరాఖరికి ఉరికొయ్యకు వేలాడుతున్నాడు. కుటుంబ బరువును పిల్లల  లేత భుజాలఫై  వదిలేసి తన దారి తాను చూసుకుంటున్నాడు. అతనితో వెళ్లలేక ఇక్కడే మిగిలిపోయిన రైతు ఆనవాళ్లు దిక్కు, దారి లేక భవిష్యత్తును తల్చుకుంటూ భయం  భయంగానే బతుకుపోరుకు సిద్ధం అవుతున్నారు. (ప్రయాణం ఆగింది) ఒక్కోసారి ఈ పోరాటంలో పూర్తిగా ఓడిపోతున్నారు కూడా. ఎంతగా ఓడిపోతున్నారంటే కనీసం తన తల్లి సమాధికి కాస్త నీడనిచ్చే, పండ్లనిచ్చే తన పొలం గట్టు మీది మామిడిచెట్టును కూడా రక్షించుకో లేనంతగా. అగ్రవర్ణపు దౌర్జన్యానికి జడుసుకొని అశక్తతతో, శాపనార్థాలు పెట్టుకుంటూ ఎవరూ సహాయం చేయలేని దుర్భర స్థితిలో తనలో తానే ముడుచుకు పోతున్నాడు. కాని ఈ దౌర్జన్యాన్ని ఎట్లా దెబ్బతీయాలో లేదా  ఎట్లా  ధిక్కరించాలో ఆ రైతుకు తెలుసు. (ఆకుపచ్చ నెత్తుటి జాడ)

ప్రభుత్వం లేదా ఈ వ్యవస్థ తప్పుడు ప్రవర్తనల  వల్ల అనేక మంది సామాన్యులు బలవుతున్నారు.  వ్యవస్థలోని ఏ వ్యక్తీ తన వల్ల జరిగిన తప్పును ఒప్పుకోడు ఆ తప్పును పక్కవాని మీద రుద్దే ప్రయత్నం చేస్తాడు. మొత్తంగా ఏడుచేపల కథను గుర్తుకు తెస్తారు. రాజ్యం  దృష్టిలో  సామాన్యులెప్పుడూ చీమలే. చీమలన్నీ కలిసి కట్టుగా తిరుగుబాటు చేసేదాకా ఎంతో మంది అనామకంగా చీమల్లా పుడుతుంటారు. గిడుతుంటారు. (‘చీమా చీమాఎందుకు పుట్టావ్‌?)

బహుజనులు  అధికారంలో వున్న వారికి లేదా సాటి మనిషికి ఆపత్కాలములో అప్పు ఇవ్వడం కూడా తప్పే. వాటిని వసూలు చేసుకోవడం అంతకంటే పెద్ద తప్పు. అందుకే పందులుగాసుకునే ఎరుకల బక్కని జీవితం పందులు సొచ్చిన ఇల్లులాగా ఆగమవుతుంది. వాని పందులన్నీ అధికార మదానికి బలైపోతాయి. వాడు మాత్రం పోలీసు దోపిడీకి, బలవంతుని పీడనకు ప్రతీకగా బక్క పల్చని మనిషిగా అలా నిబడిపోతాడు. (బక్కడు).

వలస పాలనలో, ప్రపంచీకరణలో తెలంగాణ ఆటలన్నీ పారిపోయి స్వర్గంలో దాక్కున్నాయి. అలాంటి స్వర్గం నుండి మనం మరచిపోయిన ‘పచ్చీసు’ను తీసుకొచ్చి దానికి బాల్యాన్ని అద్ది, జీవితాన్ని ముడివేసి తెలంగాణ సంస్క ృతిని తడిమిన కథ మళ్ళీ మనల్ని ఆరు దశాబ్దా వెనకకు తీసుకెళ్తుంది.

స్వీయ పాలనలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్‌ భగీరథ’ కాస్త సఫల మైనట్టుంది. ప్రజల ముఖాల్లో, జీవితాల్లో నీటి మెగులు, తెలంగాణ నేలలో ఆకుపచ్చని వర్ణం కనిపిస్తోంది. అయితే రియలెస్టేట్‌ రంగం చెరువును కూడా వదలకుండా ఆక్రమణలు, అక్రమంగా భవనాలు నిర్మించి నీటి తల్లికి సమాధులు కడుతున్నారు. అలాంటి కుట్ర మీదికి ‘ఏరువాక’ సాగాలని ఇప్పుడు తెంగాణ ప్రజల ఆకాంక్ష.

మైళ్ల దూరం నుండి నీటినీ, భూమినీ వెతుక్కుంటూ తరలి వచ్చి తెలంగాణ అంతటా కాలువల పక్కన విస్తరించిపోయిన ‘వసపక్షులు’ మనస్తత్వాన్ని, సుతిమెత్తని, నిర్మాణాత్మక దోపిడీని పసిగట్టకపోవడం తెలంగాణ రైతు అమాయకత్వం. కాళ్లకింది నేలను జారవిడుచుకొని, ఎముకల్లోని మూలుగులను కూడా కోల్పోయి తెలంగాణ ప్రజలు దశాబ్దాలపాటు ఏ ఆదరణా లేక ఒచ్చొరకు నిల్చుండిపోయారు.

బీజేపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆరెస్సెస్‌ భావజాలం, విపరీత హిందుత్వం తెరమీదికి వచ్చి దేశ లౌకికత్వాన్ని బోనులో నిలబెడుతుంది. మైనార్టీలు అభద్రతలోకి జారుకుంటారు. రాజ్యం పోలీసు విధులను నిర్వర్తించకుండా మనం అడక్కుండానే ప్రజల అవాట్ల, భోజన విషయాల్లోకి కూడా చొరబడి ఈ దేశంలో ఉండాలంటే ఫలానా పదార్థాన్నే తినాలని పరోక్షంగా ఆదేశాలిస్తుంది. పేదవాడు తనకు తోచిన ‘బుక్కెడుబువ్వ’ ను తినే స్వేచ్ఛ ఈ దేశ ప్రజాస్వామ్యం కల్పించలేకపోతోంది. అటు ముస్లిం మైనార్టీలను, ఇటు దళితులను టార్గెట్‌ చేసి మత విద్వేషాలను రెచ్చగొట్టి  అధికారాన్ని నిలుపుకోవాలనుకుంటారు.

ముస్లీం మైనార్టీలు ఒకే సమయంలో అటు హిందుత్వవాదులతో ఇటు పేదరికంతో ‘యుద్ధం’ చేయాలి. హైదరాబాద్‌, ముంబయి ఆ మాట కొస్తే ప్రపంచంలో ఎక్కడ బాంబు పేలుళ్లు జరిగినా ముందుగా కనిపించే అనుమానితులు ముస్లీంలే. ఆ బాంబు దాడుల్లో ముస్లింలు కూడా తమ జీవితాలను కోల్పోతున్నారనే విషయాన్ని బుద్ధిజీవులు ఆలోచించరు. అట్లాంటి ఘర్షణల్లో తండ్రులను కోల్పోయిన కొడుకు  బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన వయసులో జీవిత పాఠశాలలో అనుభవాల చేదు పాఠాలను వళ్లిస్తూ  కుటుంబ భారాన్ని భుజానికేసుకొని జీవన పోరాటం చేస్తూనే ఉంటారు. బతికినంత కాలం ఎంత నిజాయితీగా బతికినా విధి ఘోరంగా దెబ్బతీస్తూనే ఉంటుంది.

జీవితం ఇంత సంక్లిష్టం అయిపోయిన సందర్భంలో బతుకు ‘ఆవలితీరం’ చేరడం చాలా కష్టం. ఫేస్‌బుక్‌ వేదికగా దోస్తాని చేసే వ్యక్తుల పరిచయాలు చాలా వరకు మోసపూరితంగానే ఉంటాయి. అయితే కొంత పరిణతి చెందిన స్త్రీ, పురుషుల పరిచయాలు నిజ జీవితంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ఉపయోగపడవచ్చు. మానవ సంబంధాలు స్వచ్ఛమైన పూ పరిమళాలను వెదజల్లాలి కాని అలంకార ప్రాయంగా మెడలో నిలిచే ‘గంధపు దండ’ కాకూడదు. ఒక తరంలో వివాహం నాన్న స్థానాన్ని రెండో స్థానానికి దిగజార్చుతే, మరో తరంలో కూడా అదే రిపీట్‌ అవుతుంది. కొసకు నాన్న తాలూకు ఫోటోకు కూడా ఇంట్లో స్థలం దొరకని పరిస్థితి. ఇప్పుడు నాన్న స్థానం గుండెలోనే. తరాలు మారినా ఇదే నిఖార్సయిన నిజం.

సంక్షోభ భరితమైన, సంఘర్షణాయుతమైన జీవితాన్ని వ్యాఖ్యానించడానికి ఇన్ని పేజీలు అవసరమా? పది పదిహేను వాక్యాలు సరిపోవా? అసలు పది పదిహేను వాక్యాలైనా ఎందుకు? ఒక పొడవాటి వాక్యం సరిపోదా? కాదు ఇంత పొడవాటి వాక్యం కూడా వద్దు. ‘ఒక్క పదం చాలు’. ఒక్క పదమైనా ఎందుకు? పెళ్లలు పెళ్లలుగా కూలిపోతున్న జీవితపు శిథిలత్వాన్ని మన హృదయంలోకి నిశ్శబ్దంగా చేరవేయడానికి ఎన్నో భావాలను మోస్తున్న అనంతమైన ఒక్క మౌనం చాలు.

* * *

స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరినీ కొత్త బంగారు లోకంలోకి తీసుకు వెళ్తామని వాగ్దానం చేసి బంగారు తెలంగాణ నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇంకా ఎన్నో సంస్కరణలను ఆచరణలోకి తేవాల్సి ఉంది. ప్రతి పేద దళిత కుటుంబానికి మూడెకరాల భూమి అన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు. రైతుకు 12 గంట కరెంటన్నారు. రైతులు, చేనేత కార్మికులు, వృత్తికులాల వాళ్ళ ఆత్మహత్యల్ని ఆపుతామన్నారు. ఇవన్నీ కలగానే మిగిలాయి. పల్లెతో పాటు అనేక వృత్తులు కూడా ధ్వంసమైపోతూనే   ఉన్నాయి. నగరాల్లో యంత్రాలతో చేయించాల్సిన మ్యాన్‌హోల్స్‌ క్లీనింగ్‌ మనుషుతోనే చేయించడం మూలానా 2015లో దాదాపు డజన్‌ మంది పారిశుద్ధ్య కార్మికులు మృత్యువాత పడ్డారు. తెలంగాణలో కళాశాల విద్య కూడా గందరగోళంగా మారిపోయింది. స్కాలర్‌షిప్‌లు ఎవరికి ఇస్తున్నారో, ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ ఎవరికి కల్పిస్తున్నారో ఏదీ అర్థం కాని పరిస్థితి. తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష మూడు సార్లు నిర్వహించారు. వీటిలో వేటినీ తెలంగాణ కథకులు పెద్దగా ప్రశ్నించే కథలు రాయలేదు. ప్రపంచ చరిత్రలోనే చారిత్రాత్మకమైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంపై రావాల్సినన్ని కథలు గాని, నవలలు గానీ ఇంకా రాలేదు. అయితే సీనియర్‌ కథకులు (అల్లం  రాజయ్య, తుమ్మేటి రఘోత్తంరెడ్డి, ఆడెపు లక్ష్మీపతి, నందిని సిధారెడ్డి, జూకంటి జగన్నాథం, డా. నలిమెల భాస్కర్‌…లాంటి వారు) మౌనముద్రలో ఉన్న సందర్భంలో కొత్త కథకులు తెలంగాణ కథా ప్రాంగణంలోకి అడుగుపెట్టడం కొంత ఆశావహ దృక్కోణం.

శిల్ప పరంగా కూడా తెలంగాణ కథకులు ఇంకా రాటుదేలాల్సే ఉంది. కేవలం తెలుపు నలుపు స్టిల్‌ ఫోటోగ్రఫీ లాంటి కథలే కాదు. తెంగాణ ‘సింగిడి’లోని ఏడు రంగుతో మిళితమైన శైలీ, శిల్పాల కథలు రావాలి. ఎలాంటి ప్రయోగాలు లేకుండా, వాఖ్య విన్యాసం లేకుండా ప్లేన్‌ కథలే ఎక్కువ వచ్చాయి. తెలంగాణ తెలుగు మాధుర్యతను కూడా కథల్లో చూపించాల్సి ఉంది.

కథంటే ఏదో మానసిక వికాసం కల్గించాని, కథ సాంతం చదివి మూసేసిన తరువాత ఏదో కదలిక తేవాలని, సంక్షోభిత జీవితాన్ని చిత్రించేదిగా ఉండాలని, తెలంగాణ నేటివిటీని పట్టి చూపేదిగా ఉండాలని, మానవ సంబంధాలను పునర్వ్యాఖ్యానించేదిగా ఉండాలని ఇలాంటి కొన్ని నియమాల్ని పెట్టుకొని ఎంతో సమయాన్ని వెచ్చించి, అనేక కథల్ని జల్లెడ పట్టి ఈ 12 కథల్ని ఎన్నిక చేశాము. ఎంపికలో వస్తు వైవిధ్యం, భాషా వైచిత్రి, శిల్ప నైపుణ్యాన్ని లెక్కలోకి తీసుకున్నం. ఎలాంటి రాగద్వేషాలకు పోకుండా, కథకుల్ని పట్టించుకోకుండా కేవలం కథలను మాత్రమే పట్టించుకొని ప్రజాస్వామ్యయుతంగా ఎంపిక చేయడం జరిగింది. మేం పెట్టుకున్న గీత మీద నడవలేక కొన్ని సార్లు జారిపడిపోయాం కావచ్చు. (ఈ విషయం విమర్శకులు, పరిశీలకులు, పాఠకులే చెప్పాలి.) ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో కథల భాగస్వామ్యం చాలా పెరిగింది. ప్రతి సంవత్సరం ఉత్తమ కథల్ని(?) పాఠకులకు అందించడానికి అనేక కథా సంకలనాలు

వెలువడుతున్నాయి. ఆ కోవలోనే మేము ఈ సంకలనాలను 2013 నుండి తెస్తున్నాము. మా ప్రయత్నం ఏ మాత్రం సఫలీకృతమైనా మేము విజయవంతం అయినట్లే. ఈ ప్రయత్నాలన్నీ  మరిన్ని  ‘మంచి’ కథల్ని పాఠకులకు చేరవేయడానికి, లేదా రికార్డు చేయడానికి ఉపయోగ పడతాయని భావిస్తున్నాం. ఈ దిశలో సహృదయ పాఠకులు, విమర్శకులు సలహాను, సూచనలను ఆహ్వానిస్తున్నాం. ఎప్పటిలాగే ఈ తెలంగాణ కథ ` 2015ను కూడా ఆదరించి మాకు మరింత బలాన్నందిస్తారని ఆశిస్తున్నాం.

(అలుగు తెలంగాణ కథ -2015 రాసిన ముందుమాట)

 

మంచి చెడ్డలు పట్టించుకోండి!

ఏడాది కోసారి ఆ సంవత్సరం ప్రచురితమైన కథల్లోంచి తెలంగాణ దృక్కోణంతో మెరుగైన కథల్ని ఎంపిక చేయడం శక్తికి మించిన పని అని అనుభవ పూర్వకంగా అర్థమయింది. అయినా ఇది థ్యాంక్‌లెస్‌ జాబ్‌. థ్యాంక్స్‌ కోరుకొని ఈ పని చేయడం లేదు. తెలంగాణ సాహిత్యంఫై ఇష్టంతో ఈ పని జేస్తున్నాం. అయితే ఇంత జేసినా ఎక్కువ మందికి కంటు అయితున్నం. తెలుగు సాహిత్యంలో తెలంగాణ వస్తువు, శిల్పం, భాష ముద్ర ఉన్న 12 కథలను ఈ సంకలనం ద్వారా ఒక్క దగ్గరికి తెస్తున్నం. ఆయా పత్రికలు, అంతర్జాల మాధ్యమాలు వీటిని ప్రచురించే ముందు కొంత వడపోత పోసే వాటిని మలుగులోకి తెచ్చాయి. వాటిల్లోంచి మళ్ళీ వస్త్రగాలం బట్టి ఈ కథలను అందిస్తున్నాం. వివిధ వార్షిక కథా సంకనాల్లో చేరిన కథలను ఈ సంకలనం కోసం పరిశీలించలేదు. ఎక్కువ కథల్ని తెలుగు పాఠకులకు అందించడం ధ్యేయంగా ఈ పని చేయడం జరిగింది. ఇక నుంచి ప్రతి యేటా జూన్‌ నెలలో వార్షిక తెలంగాణ కథా సంపుటాలు తీసుకు రావాలని నిర్ణయించాం. ఈ సంకనలంలోని కథల ఎంపికలోని మంచి చెడ్డలు  పట్టించుకొని మాకు అండగా నిలవాలని మీ అందరినీ కోరుతున్నాం.

-సంగిశెట్టి శ్రీనివాస్‌

మంచి కథలకు గట్టి హామీ

కోర్టు బెంచీ మీద కూర్చొని తెలంగాణ కథపైన అలవోకగా ఏదో తోచిన తీర్పు చెప్పడం కాదు. ఈ అలుగులో చేరని కథలు మంచి కథలు కావనీ కాదు. నిజానికి ఇందులో చేరని ఎన్నో మంచి కథలు మా దృష్టి నుంచి జారిపోవచ్చు కూడా. ఇవీ ‘మంచి’ కథలు అని తూచడానికి మా దగ్గర ఎలాంటి ‘తరాజు’ లేదు. అయితే సహృదయ పాఠకుల మనసులో ఏదో మార్పు, కథంతా చదివి మూసేసిన తరువాత పాఠకుని గుండెకు ఏదో జ్వరపీడిత భావన, కాస్తయినా పెయిన్ ఫీలవ్వాలని అనుకున్నాము. దానికి శైలీ, శిల్పమా, కథనమా,  భాషా, నేటివిటీనా లేదూ ఇవన్నీ కలిసిన మరో పేరేదేయినా పెడతారేమో కూడా తెలియదు. ఒకటి మాత్రం చెప్పగలం. తెలంగాణ మట్టి (కథా వస్తువు) చాలా సారవంతమైనది. ఈ మట్టితో చాలా అందమైన, జీవితాన్ని వడగట్టిన శిల్పాలను (కథలను) తయారు చేయవచ్చు. అలాంటి శిల్పాలను మలిచే నాజూకు చేతుల  కోసమే మా తన్లాట. ఆ నాజూకు చేతి వేళ్ల నుండి ఏదో రూపాన్ని సంతరించుకొని మీ ముందు నిల్చున్నవే ఇందులోని కథలు. అన్నీ నచ్చుతాయని కాదు. ఒక్క కథైనా మీకు తప్పకుండా నచ్చుతుందని, తెలంగాణ నుండి మంచి కథలు వస్తున్నాయని, వస్తాయనీ హామీ ఇవ్వగలం. అయితే ఒక సంవత్సరంలో వెలువడిన కొన్ని వేల కథల్లో మంచి కథలను పట్టుకోవడం మాత్రం కొంచెం కష్టమైన పనేనని చెప్తూ మా ప్రయత్నం సఫలం అయిందో, విఫలం అయిందో పాఠకులు కథలన్నీ చదివి తమ విలువైన అభిప్రాయం చెప్తారని ఆశిస్తున్నాం.

                                                                                      -వెల్దండి శ్రీధర్