పిట్ట మనసులో ఏవుందీ ?

SAM_0344

“ఓరి నీ అఘాయిత్యం కూలా ….ఎంత తోస్తే అంతా చేసేయడవే ! ఆలోచనుండొద్దూ ?” అంటూ అబ్బులుగాడి మీద అంతెత్తున  విరుచుకు పడ్డారు  అత్తగారు .

మరి, అబ్బులు చేసుకొచ్చింది ఆషామాషీ ఆగడం కాదు . పొగాకు బేరన్ కి పుల్ల కోసం ట్రాక్టరు తోలుకుని మన్యం వెళ్ళినవాడు పుల్లతోపాటు పిల్లనీ దింపేడు మా వాకిట్లో .

” ఆయ్..ఈ పిల్లపేరు తలుపులమ్మండీ ” అంటూ కొంగు ముడేసి తీసుకొచ్చిన కొత్తపెళ్ళాన్ని  పరిచయం చేసినట్టూ  బోర విరుచుకుని గర్వంగా  చెప్పేసరికి ,  అత్తగారు  సందేహంగానూ, నేను ఆశ్చర్యంగానూ చూస్తూ నిలబడిపోయాం. ” అడ్డతీగలండీ…అమ్మాబాబూ లేరంటండీ పాపం . అడివిలో పురుగూ పుట్టా మధ్య  బతకటం సేనా కట్టంగా  వుందనీ, మనూర్లకేసి వచ్చేసి ఏదో పనిసేసుకు బతుకు దారని పాపం ఒకటే గోలండి. ఆడకూతుర్ని అడవిలో వదిలేలేక ఎమ్మట ఎట్టుకొచ్చేసేనండీ  ” అంటూ వట్రంగా ఒక్కోమూడీ విప్పేసరికి,  చెప్పొద్దూ..  మా అత్తగాకీ నాకూ ఫ్యూసులు ఎగిరిపోయాయి.

వెనకటికి ఇలాగే … మారేడుమిల్లి అడవుల్లో దొరికిందని  దెబ్బతిన్న నెమలి  పిల్లని  ఒకదాన్ని చంకన పెట్టుకొచ్చాడు . మురిసిపోయిన మాంగారు అబ్బులుగాడికి ఒకబుట్ట పుగాకు బహుమానంగా ఇచ్చేసి, దాని పెంపకం బాధ్యత కూడా వాడికే అప్పచెప్పారు . వాడేమో మిగతా పనులన్నీ వదిలేసి, దాన్నే  కనిపెట్టుకుని కూర్చునేవాడు  . అది మకాంలోని   గిన్నీకోళ్ళు, డింకీకోళ్ళు, టర్కీ కోళ్ళు వంటి , పెంపుడు జాతులతో కలవలేక పోయేసరికి  ఇంటిపెరట్లో   దాని పెంపకానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసారు . తనపెంపకంలో చక్కని ఈకలు తొడిగి దినదినప్రవర్ధమానమవుతున్న ఆ నెమలి ని చూసి తెగ పొంగిపోయేవాడు అబ్బులు .దాంతో ఉత్సాహం తీరక  నలుగురి కంటా పడకుండా మా ఇంటి ప్రహారీ మధ్య తన హయాంలో గుట్టుగా  పెరుగుతున్న ఆ నెమలి వయ్యారాలని ఊరందరికీ వర్ణించి చెప్పుకోవడం మొదలుపెట్టాడు . ఆ కబుర్లు ఆనోటా ఈనోటా పాక్కుంటూ ఎక్కడో టౌను  స్టేషన్ లో నిద్రపోతున్న ఎస్సై చెవుల్లో పడిపోయాయి .” కేసవుతుందండీ రాజుగారు ”   అని ఆ పోలీసు బాబు ఒళ్ళువిరుచుకుంటూ వచ్చి పడేసరికి   , “ అమ్మమ్మా..అంతపనిచెయ్యకండి  ఏదో తెలీక ..” అంటూ బాబుని బుజ్జగించి  అబ్బులు చేతుల్లో అల్లారుముద్దుగా  పెరుగుతున్న ఆ నెమలిని దాని  పుట్టింట్లో  వదిలిరావడానికి  అప్పటికప్పుడు చిన్నకారు కట్టించుకుని అడవులకి దౌడుతీయాల్సి వచ్చింది మాంగారు .

“ఏటేస్ … నాటుకోడిని నీటుగా  నవిలేత్తే  కేసవ్వదుకానీ, నెమలికోడిని గారంగా పెంచుకుంటుంటే కేసేసేత్తారా ” అంటూ ఓనాడెప్పుడో   లోగిట్లో కోడిపులావ్ లొట్టలేసుకుంటూ తినెళ్ళిన ఆ ఎస్సైమీదకి తూగుతూ తగూకి  కి వెళ్ళబోయిన  అబ్బుల్ని ”  ఓరిబాబూ ఊరుకోరా … గవర్నమెంటోడి రూలంటే రూలే ..ఆడికంటే మనకెక్కువ తెలుసేటీ  . అదీగాపోయినా నువ్వు ఎన్నముద్దలెట్టి ఎన్నాళ్ళు  పెంచినా అది ఏదో ఓనాడు   జతకోసం అడివిలోకి ఎల్లిపోయీదే . ఆ మాత్రం దానికి ఓ ఇదయిపోటవెందుకూ ”  అని నచ్చచెప్పటానికి నానా కష్టాలు పడ్డాడు చేలో మకాం ఉండే కన్నప్పడు .   తన గారాలపట్టి ని తలుచుకుని తలుచుకుని కొన్నాళ్ళు బెంగపడ్డ  అబ్బులు , ఎంత దూరాన్ని వదిలేసినా అది తనని వెతుక్కుంటూ ఎగిరొచ్చేస్తుంద న్న  భ్రమలో  మరి కొన్నాళ్ళు గడిపేసాడు.. అదెక్కడున్నా సుఖంగా ఉండాలని గాల్లో దణ్ణాలు పెడుతూ   చాన్నాళ్ళకి ఆ సoగతి మర్చిపోగలిగాడు .

పుణ్యానికి పోతే పాపం ఎదురయ్యిందన్న సామెత అబ్బులు విషయంలో చాలా సార్లు రుజువయ్యింది. నేలన పోయేదాన్ని నెత్త్తికి రుద్దుకోవడంలో కూడా వీడు సిద్దహస్తుడు.

ఒకసారి మేం చూస్తుండగానే   ఇంటి చూరునించీ జారి నీళ్ళగోళెంలో పడిన ఎర్రతేలు మునగాలో తేలాలో తేల్చుకోలేక అవస్థ పడుతుంది  .   అత్తగారూ నేనూ గోళెం చూట్టూ  ప్రదక్షిణ చేస్తూ  ఎవడి చెప్పుకిందో పడి చావకుండా నీళ్ళలో ములిగి ఉత్తమ మరణం పొందబోతున్న ఆ పుణ్యాత్మురాలయిన తేలుకు పుణ్యలోకాలు ప్రాప్తించాలని ప్రార్ధిస్తుంటే అటుగా వచ్చిన అబ్బులు ” అదేం పనండి అయ్యగారు ” అంటూ ఉత్తిపుణ్యానికే మమ్మల్ని  కోప్పడ్డాడు    . అక్కడికి  మేవేదో  దాని తోక పట్టుకుని నీళ్ళలో తోసేసినట్టు  .

“ అంతగా అయితే పైకి తీసి ఒక్కదెబ్బెయ్యాలిగానండీ  అలా పేణాలకోసం గిలగిలా కొట్టుకుంటుంటే సూత్తా ఊరుకో కూడదంటండీ…సేనా పాపవంట మా తాత సెప్పీవోడు”  అంటూ  తాతోపనిషత్ తిరగేసాడు. అక్కడే వున్న పుల్లని నీళ్ళలోకి జారవిడిచి వస్తాదులా నిలబడ్డాడు .” ఏడ్చావులే రా ! నీ దారిన నువ్వుఫో … దాని చావు అది చస్తుంది” అన్న అయ్యగారోపనిషత్  వాడి చెవికి చేరేలోగానే    , పుల్లమీంచీ మేం ఊహించని స్పీడులో పైకి  పాక్కుంటూ  వచ్చిన ఎర్రతేలు అదే స్పీడులో అబ్బులుగాడి చేతిమీదికి  చేరిపోయి  తన ప్రాణాలకు పుల్ల అడ్డేసిన  పెద్దమనిషన్న కనికరం అయినా లేకుండా తోకతో టపీ టపీమని కొట్టేసింది .  ఇంకేవుంది  .. చెయ్యి గాల్లో గింగిరాలు తిప్పేస్తూ  లబోదిబోమంటూ తేలుమంత్రం వేయించుకోడానికి   పరిగెత్తాడా    ఆపద్భాంధవుడు   .

ఆపదలోవున్నవారిని  అక్కున చేర్చుకోవాలని తహతహలాడిపోతుంటాడు పిచ్చి సన్నాసి   . అవతల ఉన్నది  మనిషయినా ,మానయినా –పురుగయినా, పిల్లయినా వాడికొక్కటే .

మరి అలాగే కదా , చెరుకు లోడుతో చెల్లూరు వెళ్ళినవాడు అక్కడా ఆపధ్భాంధవుడి అవతారం ఎత్తి అడకత్తెరలో పడ్డాడు . ఇప్పటికీ నలుగుతూనేవున్నాడు   .

అమ్మానాన్నా, అత్తామావా అందరూ  ఎంతగా  బతిమాలుతున్నా వినకుండా నక్కబావని నేను చేసుకోనంటే చేసుకోను అని మంకుపట్టుతో పంటకాలవలో దూకేసిన సత్యవతిని అటుగా వెళుతున్న అబ్బులు పైకి లాగి నీళ్ళు కక్కించాడట . కళ్ళుతెరిచిన ఆ పిల్ల  అబ్బులుని  పరీక్షగా చూసి , నా  వంటిమీద చెయ్యేసిన నువ్వే  నన్ను ఏలుకోవాల్సిన జగదేకవీరుడివి అంటూ వెంటపడిందట సతీ సత్యవతిలా  .    ‘ నాకు పెళ్ళయిపోయింది పిల్లో ‘ అని వాడు మొత్తుకుంటున్నా వినకుండా  వీడు చెరుకు లోడుతో వెళ్ళేసరికల్లా   షుగరు ఫేక్టరీ గేటు దగ్గరే ఎదుపడి వగలుపోయేదట    .  ఒకసారి,  శారదా వాణిశ్రీల మధ్య విలాసంగా నిలబడ్డ శోభన్ బాబు వాల్ పోస్టరు చూపించి , నువ్వాపాటి చెయ్యవా నీకేం తక్కువా అని ఎగేసిందట . అప్పటికీ వీడు చిక్కకపోయేసరికి ,   ఒక సుభలగ్నాన  వాళ్ళూరు పుంతరోడ్డులో సత్తెమ్మ తల్లి గుడిదగ్గర కాపుకాసి, ఈరోజుతో తాడో పేడో తేలిపోవాల్సిందే నుంచున్నపళంగా నా మెళ్ళో తాళికడతావా లేకపోతే , మా నక్కబావని  పెళ్ళిచేసుకుని ఈ రాత్రికే చచ్చిపోమంటావా అని నిలేసేసిందట , ఆపిల్ల మంకుపట్టుకి  అంతటి మొగోడు  కళ్ళనీళ్ళుపెట్టేసుకుని , ఏవయితే అదే అయిందని తలొంచుకుని సత్యవతి మెళ్ళో మూడుముళ్ళూ వేసేసాడట.

ఇంత జరిగాకా ఆ పిల్ల అమ్మానాన్నా  ఏడ్చి ఏడ్చి మొఖం కడుక్కుని  అబ్బులుని ఇంటికి పిలుచుకెళ్ళి ,   మా పిల్లనొదిలేసి మేం వుండలేం   మాకున్న అరెకరం పొలం, మేం వుంటున్న ఈ డాబా ఇల్లూ మా పిల్లవే అంటే ఇకనుంచీ  మీవే . మీ ఇబ్బంది మాకు తెలుసనుకోండి  అయినా   వీలు చిక్కినప్పుడలా  వచ్చిపోతుండండి అల్లుడుగారు అనేసారట .

అబ్బులు చేసిన ఈ ఘనకార్యం ముందు చెల్లూరులోనూ  ఆనక మా ఊర్లోనూ షికారు చేసి చివరికెప్పటికో అబ్బులు పెళ్ళానికి చేరింది . ముందు మొగుడనే  మమకారం లేకుండా  చితక్కొట్టేసినా  …ఆనక అరెకరం పొలం -డాబా ఇల్లు సంగతీ తెలిసి ” సర్లే ….ఏదో సామెత చెప్పినట్టూ పుణ్యానికి పోతే పాపం ఎదురయ్యింది . ఆడది అంతకి తెగించాకా ఆయన మాత్రం ఏం చేత్తాడు . రాముడు దేవుడు కనకా  శూర్పణకకి చిక్కకుండా తప్పించుకోగలిగేడు . మా అబ్బులు మాయ పాపం అమాయకుడు దొరికిపోయేడు . ఇకనుంచీ నేనెంతో ఆవిడా అంతే  ” అని సర్దేసుకుందట.  అలా అని   మొగుణ్ని  ముక్క బద్దా కింద  పంచేసుకోలేరు కదా ! అందుకే ఇద్దరూ గొడవ పడకుండా ఒక పద్ధతి ప్రకారం పోతూ   అబ్బులుని ఇక్కడ ఈవిడ  ఉతికి  ఆరేస్తే , అక్కడ ఆవిడ మడతేసి ఇస్త్రీ చేస్తుందనీ  జనం నవ్వుకుంటారు .   అబ్బులు మాత్రం అసలేం జరగనట్టూ ఎక్కడవక్కడే మర్చిపోయి  తన మానాన తను న్యాయమనుకున్న పనులు  చేసుకుపోతుంటాడు .

ఇక ఈ పిట్టకథలు , పీత కథలు పక్కనపెట్టి అసలు కథకొస్తే   ….. అబ్బులు చేసుకొచ్చిన ఘనకార్యానికి అయోమయంలో పడిపోయిన అత్తగారు అప్పటినుంచీ అదే పాట పాడుతున్నారు. బాగాచెప్పారు అంటూ నేను అలవాటుగా అత్తగారి వెనక నిలబడి  తాళం వేస్తున్నాను.

” నీకు బుర్రా బుద్ధీ లేదటరా…. ఇదేం చోద్యం రా . అడవిలో దొరికిందని  లేడి పిల్లని తెచ్చినట్టూ  ఆడపిల్లని తీసుకొచ్చేస్తావా ! ఇదేం అఘాయిత్యపు పనిరా ….ఆలోచనుండొద్దూ  !!

” అదికాదండి అయ్యగారూ …” అని తలొంచుకుని నీళ్ళు నములుతూ అబ్బులు, ఆ పక్కనే అదురూ బెదురూ లేకుండా నిట్రాటలా నిలబడి పరిసరాలు పరిశీలిస్తూ ఆ పిల్ల .

ఏగేసి మోకాళ్ళ కిందికి కట్టిన  ముదురాకుపచ్చ రంగు చీరలో బోసిమెడతో ఉన్న తలుపులమ్మ అడ్డూ ఆపూ లేకుండా తన ఇష్టానికి పెరిగిన అడవిమల్లెతీగలా సన్నగా బలంగా  వుంది . మెడలో పసుపుతాడులాంటిదేదీ కనిపించక పోవడంతో మేం కొంచెం ఊపిరి పీల్చుకున్నాం .

” అదేపోన్లెండి  …మీకు నచ్చాపోతే  రేపొద్దుగాలే  ఆ అడివిలో దిగబెట్టేసొత్తాను . మాపిటికి ఇక్కడే మీ లోగిట్లోనే ఉండనీయండి . సాకిరీ సెయ్యలేక సీపురు పుల్లలా అయిపోయేరు గదా సిన్నయ్యగారు, చేతికింద సాయానికో మడిసుంటే ఆరికీ మీకూ కుంత కులాసాగా వుంటదని అలోచించేనండీ . మీరు వొద్దంటే ..నాకేం పట్టిందిలెండి “ అని   అబ్బులు నిష్టూరంగా అంటుంటే,  అన్నంత పనీ చేసేయడు కదా అన్నట్టు అబ్బులుకేసి దిగులు చూపులు చూస్తుంది తలుపులమ్మ . ‘ మా నాయనే ..నా కష్ట సుఖాల గురించి నీకెంత అక్కరరా ‘ అని  నా మనసు సంతోషంతో గంతులేసింది .

అత్తగారు మాత్రం అబ్బులు మాటకి “ హవ్వ… “ అంటూ బుగ్గలు నొక్కుకుంటూ  వాడ్ని పక్కకి పిలిచి, “  నీ తెలివి తెలారినట్టేవుంది . ఇలా ముక్కూ మొహం తెలీని వాళ్ళని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే ఇంకేవన్నా ఉందట్రా   ! ఆ పిల్ల చూపూ వాలకం చూస్తే  పని తెలిసినదానిలా వుందా ? అసలే అడవుల్లోంచీ వచ్చింది అక్కడెవరితో ఏం సంబధాలున్నాయో ….ఈ సంగతి రాజుగారికి తెలిస్తే చీల్చి ఎండేస్తార్రోయ్  “ అంటూ  పళ్ళు నూరేసరికి   బెకబెకమంటూ నవ్వేసిన అబ్బులు , “ అబ్బే మీరూరికే అనుమానపడతనారండీ… ఆయమ్మి అలాటిది కాదండీ పాపం.  సేనా మంచిదండీ”  అంటూ వాదించబోయాడు . అప్పటికే విసిగిపోయి ఉన్న అత్తగారు ‘ ఠాట్ ‘ అంటూ కళ్ళెర్రజేసి గద్దించేసరికి కొంచెం బెదిరినట్టూ  వెనక్కి తగ్గి,  “ అయ్ బాబూ  అలాకోప్పడతారేటండీ…అలాగే అంపిచ్చేద్దారిలెండి “ అంటూ దారికొచ్చాడు .

ఆ మాటతో  సమాధానపడ్డ  అత్తగారు ” అలాగే  అఘోరించు . పొద్దున్నే రా ఫో “అ ని అబ్బుల్ని కేకలేసేసరికి వాడు కాల్లో ముల్లు  దిగబడ్డవాడిలా  బాధపడుతూ ఒక్కో అడుగూ అతికష్టం మీద వేసుకుంటూ వెనక్కి చూసుకుంటూ  వెళ్ళిపోయాడు. పోతూ పోతూ ” పొద్దుగాలెప్పుడో తిన్నాది. పాపం ఆకలేత్తది కదండీ . మీరు తిన్నాకా కుంత ఒణ్ణం ఎట్టండి  ” అంటూ పరమాయించి పోయాడు.

తలుపులమ్మ  అన్నంతిని ఆకు పారేసొచ్చాకా  తుంగచాపా దుప్పటీ ఇచ్చి పడుకోటానికి చోటు చూపించారు అత్తగారు  .” ఈ రాత్రి మనకెలాగూ జాగారం తప్పదు అనుకుంటూ అత్తగారూ నేనూ  సావిట్లోనే  కూలబడ్డాం .  మేం నిద్రపోతే ఆ అపరిచితురాలు ఎక్కడ కొంప తవ్వుకుపోతుందో అన్నంత ఇదిగా రెప్పవేయకుండా జాగ్రత్తగా వుండాలనుకుంటూ ” ఇదిగో వెనకటిలాగే…” అని ఎక్కడెక్కడి పాత కథలో తవ్వుకుంటూనే  ఆవులింతలతో   ఒకరిమీద ఒకరు వాలిపోయాం .

ఎండ మొఖం మీద పడటంతో మెలకువొచ్చిన మాకు నారింజరంగు చీరలోకి మారిపోయిన తలుపులమ్మ గుమ్మంలో ముగ్గేస్తూ కనిపించింది . వాకిట్లో పొయ్యిమీద నీళ్ళు కాగుతున్నాయ్ .  నవ్వుతూ వచ్చిన తలుపులమ్మ  గోళేల్లోకి  నీళ్ళు తోడేసిన సంగతి,  మంచినీళ్ళబిందెలూ, పాలతెపాళాలూ తోమేసి బోర్లించిన  సంగతీ చెప్పి ఇంకేవన్నా పనుంటే చెప్పండి అనేసరికి మేం  తెల్లమొఖాలేసుకు  నిలబడిపోయాం .

పొద్దున్నే వస్తానన్న అబ్బులు  మధ్యాహ్నవయినా అజాపజాలేడు. చూసినవాళ్ళు ఎవరూ ఏవిటీ అని ఆరాలు తీస్తారనే భయంతో అత్తగారు తలుపులమ్మని పెరడు దాటి రావద్దని  ఆజ్ఞాపించేసారు  . మoచినీళ్ళు దగ్గరినుంచీ అన్నీ కాళ్ళదగ్గరికే అందిస్తూ మాంగారు, మా రాజుగారు కూడా సావిడి దాటి వంటింటివైపు రాకుండా చూసుకుంటున్నాం.

చూస్తుండగానే సాయంత్రవయిపోయింది . ఆ పనీ ఈపనీ అని లేకుండా అన్ని పనులూ మా చేతుల్లోంచి చనువుగా లాక్కుని మరీ చేసేస్తుంది తలుపులమ్మ.  మాంగారు రాత్రి భోజనానికి కూర్చున్నప్పుడు , అత్తగారు అబ్బులు గురించి ఆరా తీస్తే  ” మన్యం వెళ్ళొచ్చాడు కదా ! నీళ్ళు తేడా చేసాయేమో ..రెండు రోజులు రాలేనని కబురంపేడు “అన్నారట  . రెండ్రోజులే …..అని తలపట్టుకు కూర్చున్నారు అత్తగారు.

అంతోటి అత్తగారే అలా అయిపోయేసరికి ఏం చేయాలో తెలీక కంగారుపడిపోయాన్నేను . ఇదేం పట్టని తలుపులమ్మ  రాములవారి గుళ్ళోంచీ మైకులో వినిపిస్తున్న మూగమనసులు సినిమాలోని ”  గోదారి గట్టుందీ… ..” అన్న పాటని   తలాడిస్తూ వింటుంది .

ఆ మర్నాడు కూడా కోడికన్నా ముందులేచి అంతే హుషారుగా పనులన్నీ చేసేసి  అత్తగారిని ఆశ్చర్యపరిచేసింది తలుపులమ్మ.

ఎంత పెట్టినా ఎప్పుడూ మొఖం మొటమొటలాడించుకుని గిన్నెలూ గిరాటేసే  నరసమ్మకీ , చలాగ్గా చేతిలో పని అందుకుని చేసేస్తున్న ఈ మనిషికీ  నక్కకీ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది కదే అన్నారు అత్తగారు .

అవునంటూ తలాడించాను .

మెతుకు చూస్తే అన్నం పదును తెలిసిపోదూ , ఈ రెండ్రోల్లోనీ  పిల్ల పద్ధతి తెలిసిపోయింది కదా , మనకీ చేదోడుగా వుంటుంది పోనీ ఉండనిద్దామా అన్నారు . మనిషి మొరటే అనుకో అయినా  పోగా పోగా తీరిక అదేవస్తుందిలే అన్నారు మళ్ళీ ఆవిడే . అదీ నిజమేలెండి అన్నాను .

ఆ సాయంత్రం “ పెరట్లో ఆ మనిషెవరూ కొత్తగావుందీ ?” అనడిగిన మాంగారితో  .  ఇంటిపనిలో చేతిసాయానికి పెట్టుకున్నాం ఇక ఇక్కడే వుంటుంది అని డిక్లేర్ చేసేసారు అత్తగారు  . వీధిలో రాజకీయాలకే రోజు చాలటంలేదు పెరటి రాజకీయాలు మనకెందుకనుకున్నారో ఏమో  వివరాలజోలికి పోకుండా ” ఓహో ” అనేసి ఊరుకున్నారు మాంగారు .

మూడోనాడు పొద్దున్నే ఈనులాగేసిన కొబ్బరాకులా వాలిపోతూ వాకిట్లో నిలబడ్డ అబ్బులు “అయ్యగారూ  సత్తెపెమాణకంగా పేణం బాగోక రాలేకపోయేనండీ … నిజవండీ బాబూ , ఒట్టండీ బాబూ ”   అంటూ పెద్దయ్యగారిని  ప్రసన్నం చేసుకోటానికి  తలమీద చేతులేసుకుని  తెగ ప్రయాస పడి పోతున్నాడు .

చేటలో బియ్యం పోసుకొచ్చిన తలుపులమ్మని ” ఒలే…నీ సంచొట్టుకొచ్చీ . అయ్యగారొద్దన్నాకా నువ్వో చనం కూడా ఉండటానికి ఈల్లేదు ” అంటూ వాడు  తొందర చేస్తుంటే ….”అయిందేదో అయిందిలే , ఇక్కడే వుండనీ “ అని అత్తగారు ప్రసన్నవదనంతో అభయం ఇచ్చేసరికి అంత నీరసంలోనూ అబ్బులు ఆనందతాండవం చేయబోయాడు .

అత్తగారు వాడి ఆత్రానికి పగ్గాలు బిగిస్తూ ” ఇక తలుపులమ్మ ఆలనా పాలనా మేం చూసుకుంటాం కాబట్టి, నువ్వు దాని ఇరుపంచాలా  కనిపించకూడదు. మేం లేనప్పుడు నీళ్ళనీ, నిప్పులనీ పెరట్లోకి  వెళ్ళి పలకరించకూడదు  . పనున్నాసరే నువ్వుదాని దరిదాపుల్లో మసలకూడదు ..మళ్ళీ లేనిపోని తంటసా  అంటూ ముచ్చటగా  పెట్టిన మూడు షరతులకే  మూర్చొచ్చినంత  పనయింది అబ్బులుకి . అయినా తమాయించుకుని ఉస్సూరంటూ ఓ చూపు చూసి    ” అలాగేలెండి ఏదో మీనీడన   ఆయమ్మి సల్లగా వుంటే  నాకంతే సాలు “అంటూ  ప్రేమ కథల్లో  నాగేస్సర్రావులా భుజమ్మీద  తువ్వాలు  జారిపోతున్నా పట్టించుకోకుండా తూగుతూ వెళ్ళిపోయాడు.

అబ్బులు వెళ్ళాకా తలుపులన్నీ బిగించి,  ఆ అడవిమల్లికి  కొన్ని సుగంధాలు  అద్దే ప్రయత్నంలో పడ్డారు  అత్తగారు  .

ఆప్రకారం ….  అత్తగారి అనుమతిలేకుండా వీధి గుమ్మం దాటకూడదనీ,ఊరికే గోడలెక్కీ గుమ్మాలెక్కీ వీధిలోకి చూడకూడదనీ , ఏదయినా పనిమీద ఎవరింటికయినా పంపిస్తే ఆ పని  చప్పున చక్కబెట్టుకు వచ్చేయాలి కానీ    అక్కడే కబుర్లు చెపుతూ కూర్చోకూడదనీ, అలా చేస్తే అవతలివాళ్ళు మాటల్లో పెట్టేసి మన ఇంటిగుట్టంతా లాగేస్తారనీ , ఎవరిగగ్గరా ఏదీ ఊరికే పుచ్చుకోకూడదనీ, ఇంట్లో మగాళ్ళుండగా వంచిన తలెత్తకుండా పనులు చేసుకోవాలి తప్ప, వచ్చేదెవరూ పోయేదెవరూ అని ఊరికే ఆరాలు తీయకూడదనీ , ఇంకా అదనీ, ఇదనీ ….పెద్ద పురాణమే చదివేసారు .  అవన్నీ విన్న తలుపులమ్మ అర్ధం అయీ కానట్టు అయోమయంగా  తలాడించినా నాకు మాత్రం    చుట్టూ కారుచీకట్లు కమ్ముకున్నట్టూ అనిపించి పైకి చూస్తే ఆకాశంలో కూడా గోడలు కనిపించాయి . సరిగ్గా అప్పుడే మా పొట్టి బ్రహ్మం ” చీకటిలో కారుచీకటిలో….” అన్న విషాద గీతానికి తనపొట్టి సన్నాయిమీద ట్యూన్స్ కట్టుకుంటున్నాడు. పాపం వాడి పెళ్ళం మళ్ళీ వాడ్ని కొట్టేసి పుట్టింటికెళ్ళిపోయినట్టుంది అనుకొని కాస్త విషాదంగా నవ్వుకున్నాను .

వచ్చిన నెలలో ఉన్న హుషారు తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టి  వాడిన  సన్నజాజి తీగలా వేలాడుతూ  తిరుగుతుంది తలుపులమ్మ .  ఇంకో పదిరోజులు గడిచేసరికి వంకర ముగ్గులు వేస్తూ , నూతిలో బకెటుకి బదులు తాడు వదిలేస్తూ పరధ్యానంలో పడింది. అబ్బులు గోడమించీ అందించిన గోలీ షోడాలు దాచినంత సులభంగా వాడందించిన సంపెంగలు, మొగలిరేకులూ మా కంట పడకుండా దాచలేక అవస్థ  పడుతుంది  .  పక్కూళ్ళో తీర్థానికి వెళ్ళాలని ఉబలాటపడి అయ్యగారి పర్మిషన్ దొరకక ఢీలా పడింది.  గోరింటాకు కోసుకురావటానికి  కరణంగారి తోటవరకూ  వెళ్ళొచ్చినరోజు మాత్రం కాస్త హుషారుగా కనపడింది . అటకమీద ఆవకాయ జాడీలు దించడానికి , చెట్టుమీంచీ కొబ్బరి గెలలు దించడానికీ , అబ్బులుగాడు వచ్చిపోయినప్పుడు దిగులుగా వాడెళ్ళినవేపు చూస్తూ వుండిపోయింది .  చుట్టూవున్న నాలుగు గోడల్నీ చూసినట్టే , రోజూ  కనపడే మా నాలుగు ముఖాల్నీ ఏభావం లేకుండా చూస్తుంది . కొత్తమనుషులెవరన్నా వస్తే వదలకుండా వాళ్ళనే అంటిపెట్టుకు తిరుగుతుంది . బయటినుంచి వినిపించే ప్రతీ మాటనీ , మైకులో వినవచ్చే ప్రతీ పాటనీ ఒళ్ళంతా చెవులుచేసుకు వింటుంది .

ఒక మిట్ట  మద్యాహ్నం  మండువా గుమ్మంలో  తీరిగ్గా కూర్చునున్నప్పుడు  …..” తలుపులొచ్చి మూడ్నెలు అయింది కదే “ అన్నారు అత్తగారు .  పత్తిలో గింజలు తీస్తూ …

అయ్యేవుంటుందిలెండి అన్నాను  నేను ,   పంచదారతో వచ్చిన పొట్లాల కాగితం విప్పుతూ….

“ ఆ అడవిలో ఏం తినేదో ఏంటో….మనతోపాటు శుబ్రమయిన తిండి తింటుందికదా  మనిషి  ఒల్లుచేసింది.  కానీ , మొఖంలో కళపోయి పాండురోగం వచ్చినదాన్లా రోజురోజుకీ అలా  అయిపోతుందేంటో !“ అన్నారు అత్తగారు .

అలా అడిగితే నాకు మాత్రం ఏం తెలుసు …వాళ్ళూరు మీద బెంగ పెట్టుకుందేమో అని అప్పటికి తోచిందేదో చెప్పేసాను

ఇంకా నయం అక్కడెవరూ లేరనేగా ఇక్కడికొచ్చింది . అయినా మనం బానే చూస్తున్నాం కదా !   బట్ల భాస్కర్రావు దగ్గర దానికి నచ్చిన రంగు చీర తీయించి ఇచ్చామా . మనముందు బోడి బొంగరంలా తిరుగుతుంటే చూళ్ళేక రామిండ్రీనించీ గాజులూ పూసలూ తెప్పించి వేసామా . నెలక్రితం ద్వాదసి దీపాలు  వదలడానికెళుతూ మనతో పాటూ దాన్నీ  పుష్కరాలరేవుకు  తీసుకెళ్ళాం కదా ….అంటూ  చిన్న స్వరంతో చిట్టా విప్పుతున్న అత్తగారు

దూరంగా వాకిట్లో పందిరి రాటకు ఆనుకుని  ఆకాశంలోకి చూస్తూన్న తలుపులమ్మని  చూపించి  …దీని వాలకం చూస్తుంటే నాకు భయంగా వుందేవ్ ” వెర్రి మాలోకంలా అలా శూన్యంలోకి చూస్తుందేవిటే ”  అని గాభరాగా అంటూ గింజలు పళ్ళెంలోనూ, పత్తి నేలమీదికీ గిరాటేస్తున్నారు  .

ఇవతలున్న సగం జోకూ చదివేసి, నవ్వురాక పొట్లంలో చిక్కుకున్న పూర్తి జోకు చదవాలనే  కుతూహలంతో   కాగితం మడతల్ని జాగ్రత్తగా విప్పుకుంటున్నదాన్నల్లా  “ ఆకాశంలో అడ్డు  గోడలుండవుకదండీ  ! అందుకే  అందినంతమేరా అలా చూస్తూ పోతుందేమో !” అనేద్దామనుకుని  …..అసలే అత్తగారు ఒకింత గాభరాగా వున్నారుకదా  ఇంకా కంగారుపెట్టడం భావ్యం కాదనిపించి  , నా కవి హృదయాన్ని తొక్కిపట్టి   ” ఏమోనండీ నాకెలాతెలుస్తుందీ  ”  అని అప్పటికి తప్పించుకున్నాను .

పండుగ నెల . సీతాకాలం పొద్దు ,  భోగి పిడకలకి ఆవుపేడ తెస్తానని మధ్యాహ్నం వెళ్ళిన తలుపులమ్మ   దీపాలవేళయినా  ఇల్లుచేరలేదేవిటని అత్తగారు హైరానా పడుతున్నారు . “అదేం చిన్నపిల్లా తప్పిపోటానికీ …రావాలంటే  తనే వస్తుంది . ఓ..ఇదయిపోతారెందుకూ” అని మాంగారు కేకలేస్తున్నారు .  అంతలో,  ఆ మధ్య ఇంటికి సున్నాలేయటానికొచ్చిన జట్టులో సూరిబాబనే వోడు , పడుతూ లేస్తూ  వచ్చి ఈ కబురు చెప్పేడు  .

మధాహ్నమే  తలుపులమ్మ  గోకారం రోడ్డులో ఉల్లిపాయల సూరిబాబు ఒంటెద్దుబండిమీద వెళ్ళటం చూసేనని .  ఎక్కడికని అడిగితే కోపంగా చూసిందట   . మళ్ళీ ఎప్పుడొస్తావ్ అంటే  ” మళ్ళీనా ! సత్తేరాను …ఆ కొంపలో నాకు గాలాడతాలేదు ” అందట . “ఎందుకన్నా మంచిది ఓపాలి సూసుకోండి రాజుగారూ ఏవన్నా అట్టుకుపోయిందేమో”  అని మాకంటే ఎక్కువ కంగారు పడిపోయాడు  .

ఇలా తెల్లారిందో లేదో అలా ఊళ్ళో జనం ఒకళ్ళనొకళ్ళు తొక్కుకుంటూ తోసుకుంటూ పరామర్శకి వచ్చేసారు .

అమ్మో  అలా జరిగిందా అని ఆశ్చర్యపోయారు  . నమ్మి ఇన్నాళ్ళూ ఇంట్లో పెట్టుకుంటే ఒక్క మాటన్నా చెప్పకుండా చెక్కేసిందంటే ఎంత గుండెలు తీసిన బంటో చూడండి  అంటూ  ఆడిపోసుకున్నారు .   ఏవేం పట్టుకు పోయిందీ అని ఆరాలకి దిగారు .

ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయింది …పాపం ! పూచికపుల్లకూడా పట్టుకెళలేదు అని మేం చెపుతుంటే వినరే . అలా ఎలా జరుగుతుందీ  ఏ చెంబో గిన్నో అయినా ఎత్తేసుంటుంది సరిగా చూసుకోండి అంటూ  మాకు ఊపిరాడకుండా చేసేస్తుంటే , విసిగిపోయిన మేం ” ఏమో బాబూ  ఇక్కడయితే ఏం పోలేదు . అక్కడినుంచేవయినా కొల్లగొట్టుకుపోయిందేమో ఆరా తీయండి  “ అంటూ  మల్లెపందిరి  కింద చతికిలపడి విచారవదనంతో  గాల్లో దణ్ణాలు పెడుతున్న అబ్బులు మీదికి తోలేసాం . వాడ్ని పట్టుకుని  కావల్సిన కథలేవో వాళ్ళే దులుపుకుంటారని .

తలుపులమ్మ తలపుల్లోంచీ అబ్బులు తొందరగానే బయటపడ్డా “  ఆ కొంపలో గాలడతాలేదు ” అని  ఆ అడవిమల్లి అనేసి పోయిన మాటని మాత్రం అత్తగారు మర్చిపోలేక పోతున్నారు .

“ అంత మాటందా ! మరీ విడ్డూరం కాకపొతే . ఇవే కొంపల్లో మనం తరాల తరబడి బ్రతికేయడంలేదూ”  అన్నారు   అమాయకంగా .

“ దట్టమయిన అడవుల్లో మొలిచే కొన్ని మొక్కలు ఎండని వెతుక్కుంటూ పెరుగుతూ పోతాయట .  మరికొన్ని   మొక్కలకి ఆట్టే గాలీ వెలుతురూ అక్కరలేదట . వాటిని ఇళ్ళలో ఉంచేసినా  కిటికీలోంచి పడే చిన్నపాటి ఎండతోనే అవి చక్కగా జీవించడానికి అలవాటు పడిపోతాయట   . వాటినే ఇండోర్ ప్లాంట్స్ అంటారట”  . అని నేను అన్నదాతలో వచ్చిన వ్యాసాన్ని పైకి చదివి వినిపించబోతే , నే అడిగేదానికీ నువ్వు చెప్పేదానికీ ఏవన్నా సంబంధం వుందా  …” అయ్యోరాత  ! ఇంత  అయోమయం ఏవిటే !” అని విసుక్కుంటున్న అత్తగారికి విడమర్చి చెప్పటం నావల్లకాదు బాబు .

–దాట్ల లలిత

పారా హుషార్

datla lalitha
 ‘ అకూ-వక్కలా అత్తా కొడళ్ళిద్దరూ కల్సి రావాల్సిందే ‘  అని పిలుపుల కొచ్చినపుడు మరీ మరీ చెప్పివెళ్ళారు మా అత్తగారి  ఆఖరి మేనల్లుడు .ఆ మాట విసుగు-విరామం లేకుండా చెప్పినవాళ్ళకే మళ్ళీ మళ్ళీ చెప్పి మురిసిపొయారు మా అత్తగారు . అటు అన్న తమ్ముల ఇళ్ళల్లోనే కాక ఇటు మేనల్లుళ్ళ ఇళ్ళల్లోనూ ఆది ఆడపడుచుగా తనకే అగ్ర తాంబూలమని ఆవిడ బడాయి పోతుంటే ” అబ్బో అదృష్టవంతులు మీకలా చెల్లిపోతుంది మరి”  అని దీర్ఘాలు తీస్తుంటారు అత్తగారి వ్యవహారం తెలిసినవారు .“ ఏ శుభకార్యానికయినా అయినవాళ్ళంతా తలోపనీ అందుకుని చేసుకుంటే ఆ అందమే వేరు .  తోసుకుంటూ వెళ్ళామా- చేయి తొలుపుకు వచ్చేసామా అన్నట్టుంటే నాకు మా చెడ్డ చిరాకేవ్.  మనం మాత్రం గుమ్మానికి మావిడాకులు కట్టకమునుపే అక్కడుండాలి”  అంటూ పిలుపందిన మరుక్షణమే ప్రయాణానికి ముహుర్తం పెట్టేయడమే కాకుండా ఆ రోజునుంచే మూటలు కట్టే పనిలో పడిపోయారు .‘ అత్తయ్యా అంటూ అంతా ఎదురొస్తారు  మరీ ఉత్తచేతుల్తో ఏలా వెళతాం’  అంటూ వాడికి అదిష్టం,  దీనికి ఇదిష్టం అని మేనల్లుళ్ళనీ, మేనకోడళ్ళనీ అందరినీ పేరుపేరునా తలుచుకుని సున్నుండల నుండి సున్నిపిండి వరకూ   మా అత్తగారు చేర్చి కూర్చిన సరంజామా ఒక గూడ్స్ బొగీకి సరిపడేంత .  ఆ మూటలు చూసిన మా మగమహారాజులు మాకు అర్జెంటు పనులున్నాయ్ మేం మీతో రామురాకరాము   అంటూ  మారాం చేసారు .

” అమ్మో …అవతల చేను కోతకొచ్చేసింది . ఇప్పుడెలా వదిలేసి పోతాం “ అని హైరానా పడిపొయారు  అబ్బాయిగారు

” అదేవిట్రా నాట్లేసి నెలన్నా కాలేదు కదా అపుడే కోతకొచ్చేసిందా!”   అని అత్తగారు  ఆశ్చర్యం  వ్యక్తం చేస్తే  ,“అదంతేనండీ…హైబ్రీడ్ రకం . అదునూ పదునూ చూడదు దానిష్టం వచ్చినపుడు అదొచ్చేస్తుంది మనం    కొడవళ్ళు పట్టుకుని సిద్ధంగా వుండాలి  అంటూ అడ్డంగా కోతలకి  దిగిపోయారు .

“ ఏవిటో అంతా పిదపకాలం !” అంటూ విసుక్కున్నారు అత్తగారు  .

మూటలు మోసేవాళ్ళు తగ్గారు కాబట్టి మూటలు కూడా  తగ్గాల్సిందే  అని  నేను ప్రయాణానికి ముందు పట్టు పట్టడంతో అయిష్టంగానే కొంత సరుకు దించడానికి సిద్ధపడ్డారు అత్తగారు . ఉట్టిలో  పెట్టడానికని ఎంచిన బూడిద గుమ్మడికాయ, దప్పళంలోకని దాచిన సూరేగుమ్మడికాయలు   , పులిహోరకని తెప్పించిన  గజనిమ్మకాయలు, పులావుకి  పనసకాయలు ,   మనకి కాస్తుండగా మళ్ళీ కొనుక్కోటం ఎందుకూ దండగా అంటూ దండిగా పేర్చిన  కొబ్బరికాయలు వంటి భారీ సరుకులు దించేద్దాం అంటే ససేమిరా అనేసారు అత్తగారు . వాటికి బదులుగా మద్రాసు మేనకోడలికోసం మనిషిన పంపించి మరీ సామర్లకోటనుంచీ తెప్పించిన రొట్టెమూకుడూ, అట్లపెనం , బూందీ చట్రాలు , పెద్దన్నగారి చిన్నకోడలు అడిగిన ఇత్తడి అమాన్ దస్తా , ఇంకెవరికో ముచ్చటపడ్డారని కొనిదాచిన రాగి పళ్ళెం , ఇత్తడికుంచం  వంటి అత్యవసరం కాని , ఆలశ్యం అయినా పాడవని వస్తువుల్ని ” పోనీ ….ఆనక పంపిద్దాంలే “ అని పక్కకు నెట్టేసి , మిగిలినవన్నీ మళ్ళీ మూటలు కట్టించారు  .

ఒకటి,రెండు మూడు నాలుగు అంటూ తెల్లవార్లూ వాటిచుట్టూ తిరుగుతూ లెక్కపెట్టిన అత్తగారు …..” నాతో కలిపి మొత్తం పదమూడు సాల్తీలేవ్ …..జాగ్రత్త “ అంటు బస్సెక్కేముందు మరోసారి నా భుజం గిల్లి మరీ గుర్తుచేసారు.

ముందెక్కిన మూటల్ని మొఖం చిట్లించి చూసిన కండక్టరు ‘ వెనక్కిపొండి ‘ అనేసాడు విసుగ్గా .

మమ్మల్ని తేరిపార చూసుంటే మర్యాదగా ముందు సీట్లో కూర్చోపెట్టేవాడని మా అత్తగారి అభిప్రాయం .  “ వాడేవిటే అలా కసురుతాడు బొత్తిగా పెద్దంతరం చిన్నంతరం లేకుండా “ అంటూ అత్తగారు అక్కడే అడ్డంగా నిలబడి విస్తుపోతుంటే , బాగానేవుంది …అక్కడికి  మీరేవన్నా  క్వీన్ విక్టోరియానా ప్రపంచమంతా  తల కెత్తుకోటానికి , మనూర్లోనే మనం గోప్ప పొలిమేర దాటితే గుంపులో గోవిందమ్మలవేకదా ! అని స్వగతంగా అనుకుంటూ  ” అబ్బా…. అసలింత లగేజీతో మనల్ని టాపుమీద పడేయకుండా బస్సులోకి ఎక్కనివ్వడమే గొప్ప . ముందు వెనక్కి నడవండి  ఆ తర్వాత తీరిగ్గా  చింతిచవచ్చు ” అంటూ మా అత్తగార్నీ ముందుకి  నెట్టేసరికి , “ హా..అంతేనంటావా !” అంటూ ఓసారి గాజులూ గొలుసులూ సర్దుకుని   కదిలారు  .

మేం ఆ సీట్ల మధ్యనుంచీ లగేజీలన్నీ వెనక్కి మోయలేక నానా అవస్థా పడుతున్నాం. ఇంతలో వెనకనుంచీ ఎడం పక్క  మూడో సీట్లో కూర్చున్న నిలువు నామాల కోరమీసం  వాడు   మాకు  ఎదురొచ్చేసి మా చేతుల్లో బేగ్గులు లాగేసుకుని బస్సులో ఖాళీ వున్నచోటల్లా సర్దేసి ,  కుడిపక్కనున్న  సీటు చూపించాడు  ఒంకరగా నవ్వుతూ  .

అప్పటికే   ఆసీటు  మధ్యలో మట్లపాలెం మహాలక్ష్మి లా  మఠం వేసుకుని స్తిమితంగా కూర్చున్న ఎర్రచీర గళ్ళరవిక   తన  కాటుక కళ్ళను చికిలించి చిరగ్గా చూసింది మమ్మల్ని . అక్కడికి మేవేదో ఆవిడ సొంత ఆస్తిలో వాటాకొచ్చినట్టు .  అత్తగారు గుళ్ళపేరు పైకి కనిపించేలా సర్దుకుని, ” అలా జరుగమ్మాయ్ ” అన్నారు అజమాయిషీగా.  దానికా ఎర్రమందారం    “ ఏటి ! నా నెత్తి నెక్కుతారేటి ! అల్లదంతా సీటుకాదేటి …..అలాకూకోమీ “  అంటూ   హుంకరించేసరికి  నేనూ మా అత్తగారూ మిగిలిన ఆ కాసింత చోటులోనూ గబుక్కున   కూలబడి ఒకరి మొఖం ఒకరం చూసుకున్నాం బెరుగ్గా.

అత్తగారు  ఎవరూ చూళ్ళేదుకదా అని చుట్టూచూసుకుని అందరూ చూసేసారని నిర్ధారణగా తెలిసిపోవటంతో  హవ్వ అని బుగ్గలునొక్కుకుని    ”  మరిడమ్మలా  అలా మీద పడిపోతుందేవిటే మనం ఏవన్నామనీ ….”   అంటూ ఏదో అనబోతుంటే ” అబ్బా..మీరు ఊరుకుందురూ  అనువుగానిచోట అధికులమనరాదు- కొంచముండుటెల్ల కొదువకాదు – అనుకొని ఇప్పటికి దొరికినదాంట్లోనే సర్ధుకుందాం “ అంటూ అత్తగారిని శాంత పరిచే ప్రయత్నంలో ఉండగా     ” ఏవమ్మో ….సీటు మొత్తం నువ్వే  ఆక్రమించేత్తే మిగిలినోళ్ళు ఏవయిపోవాల   …..కుంత అసింటా జరుగూ ” అంటూ ఇందాకటి కోరమీసం నిలువు నామాలు  తన సీట్లోంచి లేచి మరీ మాకు వత్తాసుపలికాడు. దాంతో ఆవిడ కళ్ళెర్రజేసి పళ్ళునూరి జరిగీ జరగనట్టుగా కదిలీ కదలట్టుగా అటూ ఇటూ ఊగింది .   దాంతో సగం సీటు మా ఆక్రమణలోకి వచ్చింది.

“ ఎవరిక్కడ టికెట్ “ అంటూ ఆర్టీసీ భాషలో అరుచుకుంటూ వచ్చాడు  కండక్టర్ .

“అడ్డరోడ్డు రెండూ “అన్నారు అత్తగారు .

“అక్కడాగదు- అనకాపల్లి కొట్టిచ్చుకోండి “అన్నాడు కండక్టర్ .

ఒక్క క్షణం తెల్లమొఖం వేసిన అత్తగారు మరు క్షణంలో తేరుకుని “ అబ్బే..అనకాపల్లి దాకా ఎందుకూ  పైవచ్చే నెలలో మా పెద్దాడపడుచుగారి మనవడి   అన్నప్రాశన  పెట్టుకుంటాం అన్నారు అప్పుడెలాగూ వెళ్ళాలి ..ఇదిగో ఇప్పుడు గుమ్ములూర్లో మా మేనల్లుడి గృహప్రవేశం అడ్డరోడ్డులో దిగిపోయి అక్కడినుంచి ఏ రిక్షానో జట్కానో పెట్టుకు వెళిపోతాం….  అంటూ హరికథ మొదలుపెట్టేసరికి , ఆవుదం తాగినట్టు మొఖం పెట్టిన కండక్టరు  ఎక్స్ ప్రెస్ బండిలో ఎక్కడబడితే అక్కడికి టికెట్టు కొట్టరు – ఓ మూటలేసుకుని కనపడ్డ బస్సెక్కేడవే …. చూసుకో  అక్కరలేదా ! బోర్డు  చదువుకో  అక్కరలేదా !  ఓల్డాన్ ఓల్డాన్ …అంటూ   చిందులెయటం మొదలుపెట్టాడు.   మా అత్తగారు కంగారుగా  గాజులూ గొలుసులూ  సవరించారు . కనీసం వాటికైనా గౌరవం ఇవ్వకపోతాడా అని.  ఆ చిన్నెలు చూసి కండక్టరు మరింత చిర్రెత్తిపోయాడు కొత్తగా కమ్యూనిష్టు పార్టీలో చేరినవాడిలా మాకు అస్సలు అర్ధంకాని భాషలో మమ్మల్ని నిందించాడు . ఆ ధాటికి మేం బిక్క చచ్చిపోయి కూర్చుంటే కిటికీలో తలపెట్టేసి కిలకిల్లాడింది ఎర్రమందారం . ఆ నవ్వులో ‘భలేగయ్యిందా’  అన్న భావం కనపడింది .

“పోన్లెండి బాబూ…ఆడలేడీసు . ఆళ్ళ  కంగారు ఆళ్ళదీ ….  పాపం ఇంత లగేజీతో దిగి  మళ్ళీ ఇంకో బస్సట్టుకోవాలంటే  సేనా ట్రబులయిపోతారు” అని  కండక్టరుని  బుజ్జగిస్తూ , పోని ఓ పనిసెయ్యండి పెద్దమ్మగారూ అనకాపల్లికి టికెట్టు కొట్టిచ్చుకుని అడ్డరోడ్డు లో దిగిపోండి. డబ్బులు పోతే పోయినియ్యి …మరింకేం సేత్తారు”  అంటూ      అందరికీ ఆమోదయోగ్యమయిన ఉపాయం  చెప్పి ఆదుకున్నాడు నిలువు నామాలవాడు.

అడక్కుండానే అడగడుక్కీ సాయపడుతున్న ఆ ఆపద్భాంధవుడిని  ప్రశంశా పూర్వకంగా  చూసి,   “అన్నట్టు ……. అతనెవరే మీ ఊరివాడా ….మీకేవన్నా చుట్టాలా!   నిన్నుచూసి నవ్వాడు కూడానూ!  ”  ఆరాగా అడిగారు అత్తగారు.

అయ్యోరామ…ఇదెక్కడి గొడవా!  అనుకున్న నేను అత్తగార్ని చాటు చేసుకుని ఆ నిలువు నామాల వాడ్ని  నఖశిఖ పర్యంతం పరీక్షించి చూసినా ఆ సదరు సాల్తీ ఎవరో ఆనవాలు దొరకలేదు. నున్నని గుండు- నుదుటన నామం -కోరమీసం –వంకరనవ్వు- పచ్చచొక్కా -తెల్లపేంటూ – కాలరుకింద గళ్ళ జేబురుమాలు  -మణికట్టుకి కాశీ తాడు ” అబ్బో చూడానికి రంగూన్ రౌడీలా వున్నాడు మాకు చుట్టం ఎలా అవుతాడు  …అంత చనువుగా చేతిలో బేగ్గులు లాగేసుకుంటుంటే  మీ కలిదిండివారేమో అనుకున్నాను. ఎందుకన్నా మంచిది ఓసారి  పరీక్షగా చూసి జ్ఞాపకం తెచ్చుకోండి అన్నా. ” కళ్ళజోడు కొనల్లోంచీ పక్కసీటుకేసి అదేపనిగా చూసిన అత్తగారు ” అబ్బే” అంటూ పెదవి విరిచేసారు . మావాళ్ళెవరికీ అంత నాసిరకం ముక్కులు వుండవేవ్ ….అయితే గియితే మీ  మావగారి తరపువాళ్ళెవరన్నా అయ్యుండాలి  అంటూ ఆలోచనలో పడ్డారు . మాటి మాటికీ మొఖంకేసి చూసి ఎంతో పరిచయం వున్నవాడిలా నవ్వుతున్న ఆ కోరమీసం ఎవరయి వుండొచ్చూ అని మా అత్తగారూ నేనూ తర్జన బర్జన పడుతుంటే , అది కిట్టకో ఏమో ఒళ్ళో సంచి సర్దుకునే వొంకతో మాటిమాటికీ  మోచేత్తో నా డొక్కలో  పొడిచేస్తుంది  ఎర్రమందారం . పగపట్టిన పడుచులా -పక్కలో బల్లెంలా ఇదెక్కడ దాపురించిదిరా భగవంతుడా నా ప్రాణానికి అని  నిశ్శబ్ధంగా  నిట్టూర్చి, ఇటు తిరిగేసరికి నామాలవాడు నవ్వుతూ చూస్తున్నాడు నామొఖంలో కోతులాడుతున్నట్టు .

అపరిచితుడ్ని చూసి అదేపనిగా పళ్ళికిలించడానికి  నేనేం  పిచ్చిమాలోకాన్నా అని   కోపంతో కళ్ళెర్రచేయబోయి అంతలోనే అతను చేసిన సాయాలు గుర్తొచ్చి పోన్లే పాపం అని చిన్న మోతాదులో ఒక చిరునవ్వు విసిరేసి , ” ఆ నున్నగుండు- నిలువు నామాలు నాకేదో తేడాగా అనిపిస్తున్నాడు.మీరు వాడివంక చూడకండి . నేను నిద్రపోయినా మీరు మెలకువగా వుండండి . లగేజీ జాగ్రత్త…. మీతో కలిసి పదమూడు సాల్తీలు “ అంటూ అత్తగారి చెవిలో గుసగుసలాడాను . అత్తగారు  అర్ధంకానట్టూ  చూసి , “ఇందాకటినుంచీ గమనిస్తున్నాను ఆ మరిడమ్మ మాటిమాటికీ నీ మెడకేసి చూస్తుంది. ముందు నువ్వు  జాగ్రత్తగా వుండు ”  అంటూ నా చివికి చెయ్యడ్డుపెట్టి చెప్పేస్తుంటే నేను ఢంగైపోయి తలతిప్పి చూసేసరికి ఎర్రమందారం ఆవేశంగా ముక్కుపుటాలెగరేస్తూ మోచేత్తో ఒక్కపోటు పొడిచింది .  అత్తగారి అతిరహస్యం  గాలివాటుకు అటు కొట్టుకుపోయి ఆ చెవిలో పడిపోలేదుకదా అన్న అనుమానం రావటంతోటే  భయంతొ  ఆంజనేయ దండకం చదువుకుంటూ అత్తగారికీ ఎర్రమందారానికీ మధ్య కూరుకుపోయి గట్టిగా కళ్ళు మూసేసుకున్నాను .

‘ బొయ్యి…..’మని మోగిన హారను గోలకి  మెలకువొచ్చి చూద్దునుకదా ఎర్రమందారం నా భుజం మీద పడి నిద్రపోతుంది. కదిలితే కొడుతుందేమో అన్న భయంతో అలాగే బిగుసుకుపోయి కూర్చొని మెల్లగా తలతిప్పి చూస్తే   చరిత్రలో  గుప్తుల స్వర్ణయుగం గురించి , శ్రీకృష్ణ దేవరాయల పాలన గురించి మొదటిసారి తెలుసుకుంటున్నట్టూ    అత్తగారు చెపుతున్న మాటల్ని అమితాశక్తితో వింటున్నాడు కోరమీసం వాడు . మధ్యలో ప్రశ్నలేస్తున్నాడు …సందేహాలు తీర్చుకుంటున్నాడు. నాకు తెలిసినంతవరకూ అత్తగారికి పాకశాస్త్రంలో తప్ప చరిత్ర పురాణేతిహాసాలలో ప్రావీణ్యం మాట దేవుడెరుగు కనీసం ప్రవేశం కూడా లేదుకదా …మరేవిటి ఈవిడ ఇంత ఉత్సాహంగా  చెప్పేస్తుందీ వాడు అంత  ఆసక్తిగా వినేస్తుందీ అని సందేహిస్తూ    నేను నా చెవులని వీలయినంత సాగదీసాను.  చంటినాన్నగారి కోళ్ళపెంపకం చాప్టరులో ఉన్నారు అత్తగారు .

“ఏటి నిజవే ….కోడి పుంజుకి జీడిపప్పు మేపుతారాండీ ?” కళ్ళుపెద్దవి చేసి అడుగాడు కోరమీసం.

“ అయ్యో ….ఒట్టి జీడిపప్పేం ఖర్మ వాటికోసం గుండెకోసి పెట్టేస్తాడు మా తమ్ముడు . అంత పిచ్చి వాడికి ఆ కోడిపుంజులంటే . వాడిమకాంలో పెంచేలాంటి  మేలుజాతి పుంజులు ఏడేడు జిల్లాల్లో ఇంకెక్కడా వుండవట   ….ఇందాకా చెప్పాను చూసావూ జగన్నాధపురం  చిట్టిబాబుగారనీ, ఇంటికి చుట్టం చూపుగా వచ్చినవాళ్ళకి భోజనంతోపాటు బట్టలుకూడా పెట్టిపంపిస్తాడనీ,  ఆ…ఆయనా ఈయనా వరసకి బావా బావమరుదులవుతారు. ఈ చంటిబాబుగారు  మా చినబావజ్జీ కి దత్తుడన్నమాట . అలా నాకు తమ్ముడు వరస ”  అంటూ ఆయాసం తీర్చుకోడానికన్నట్టు ఆగారు .

వింటున్న నేను ఉలిక్కిపడ్డాను . అసలు మొఖం వంకే చూడొద్ద్దని హెచ్చరిస్తే ఈవిడ మొత్తం హిస్టరీ చెప్పేసుకొచ్చారా ! నేను నిద్రలో వుండంగా ఇంకా ఏవేవి చెప్పేసారో ఏంటో అని కంగారుగా దిక్కులు చూస్తుంటే …నిద్రా భంగమయిన ఎర్రమందారం  నాకేసి అనుమానంగా చూస్తూ ఒళ్ళో సంచీ తెగ వెతికేసుకుంటుంది. ఖర్మరా భగవంతుడా అనుకొని …  అత్తగారి వీపు గోకాను హెచ్చరికగా . ” లేచావా అంటూ ఇటు తిరిగిన అత్తగారు …..నేనూ నిద్రపోతే లగేజీలన్నీ ఎవడన్నా దింపుకుపోతాడంటివి కదా అందుకే ఈ అబ్బాయితో మాటల్లో పడ్డాను.  పాపం ఎంత మంచోడో …..చిన తిరపతిలో మొక్కు తీర్చుకు వస్తున్నాడట . ప్రసాదంకూడా ఇచ్చాడు అంటూ చేతిలో లడ్డూ చూపించారు. నేను ఓరగా చూస్తే  నామాలవాడు మళ్ళీ అదే వంకరనవ్వుతో దర్శనం ఇచ్చాడు.

అన్నవరం దాటిందోలేదో “ అడ్డరోడ్డు టికెట్లు ముందుకు రావాలి “ అని అక్కడినుంచే అరిచేస్తున్నాడు ఆర్టీసీవాడు   .” ఆడలాగే అరుత్తాడు ఇంకా సేనా దూరంవుందండి పెద్దమ్మగారు మీరు కూకోండి . నేను దింపుతానుకదా ” అంటున్న నున్నగుండుని అభిమానంగా చూసారు అత్తగారు .

అయితే …. కాలవకింద  తవరికెవరూ సుట్టాల్లేరేమోనండి అంటూ ….అత్తగార్ని మళ్ళీ మాటల్లో దింపేసాడు  తెలివిగా .

“అయ్యో లేకపోవటవేవిటీ …..” అంటూ అత్తగారు ఇంజనుబోటులా యమా స్పీడుగా కాలవకింద ఊర్లన్నీ చుట్టబెట్టేసారు. ఏ ఊర్లో ఎందరున్నారు , ఎందరుపోయారు . ఆ పోయినవాళ్ళకీ ఈ వున్నవాళ్ళకీ మధ్య ఏ సంబంధాలున్నాయి, అందులో ఎన్ని నిలిచేలా వున్నాయి ఎన్ని తెగేలా వున్నాయి  అన్నవిషయాలు కొన్ని టూకీగానూ, కొన్ని వివరంగానూ తన ఆసక్తి మేర చెప్పుకొచ్చారు. మధ్యలో మూడుసార్లు నేను భుజం గిల్లి వారించబోతే ” అబ్బా వుండవే…..” అంటూ కళెర్రజేసి నన్ను విసుక్కున్నారు కూడా .

“అల్లదుగో ఆ వొచ్చీదే అడ్డరోడ్డు పదండి  పెద్దమ్మగారు” అంటూ మాకంటే ముందే హడావిడిపడిపోయి , ఎక్కడెక్కడో ఉన్న మా బేగ్గులూ, మూటా ముల్లే అన్ని డోరు దగ్గర చేర్చి,  ఓల్డాన్ ఓల్డాన్ అంటూ అరిచి సరిగ్గా అడరోడ్డు సెంటర్లో బస్సాపించి మమ్మల్నీ లగేజీని  రోడ్డున పడేయడంలో నామాలవాడి కృషి నిజంగా ప్రశంసనీయం .

“ఎంతసాయంచేసాడో అనవసరంగా అనుమానించేవ్ పాపం  “అంటూ అత్తగారూ నామీద చిరుకోపం ప్రదర్శిస్తూ ఒకట్రెండు మూడు అంటూ లగేజీ లెక్కిస్తుండగా సెంటరునించీ అంతదూరం వెళ్ళి  కీచుమంటూ ఆగిన బస్సులోంచీ ఉరికిన నామాలవాడు చేతిలో సంచితో పరిగెత్తుకుంటూ వచ్చి”మీదేగావోలండి …నా సీటుకింద వుండిపోయింది సూసుకోలేదు ” అని చిన్న గుడ్డసంచీ మా అత్తగారి చెతికిచ్చేసి మళ్ళీ  స్పీడుగా పరిగెత్తి  స్లోగా వెళుతున్న బస్సెక్కేసాడు. ఆ సంచిలో ఉన్నవి అన్నగారికోసం మా అత్తగారు ఎంతో ప్రేమగా పట్టుకొచ్చిన అటుకులు .

అవి చూస్తూనే అత్తగారు ఆనందభాష్పాలు కారుస్తూ ….ఇలాంటి మంచోళ్ళు ఇంకా ఉన్నారుకాబట్టే లోకం ఇంత సుభిక్షంగా వుందన్న అర్ధం వచ్చేలా ఒక చిన్న ఉపన్యాసం ఇస్తుంటే…  సర్లెండి నాదే తప్పు  అని చెంపలు వాయించుకున్నాను….లోపలమాత్రం ఆ పంగనామాలకీ …..సారీ, ఆ దొంగనామాలకీ….మళ్ళీ సారీ , ఆ నిలువు నామాలకీ ఆ ఒంకరనవ్వుకీ  ఎక్కడా నప్పలేదు …ఏదో తేడహై అని అనుకోకుండా వుండలేకపోయాను .

           ***

మేం ఊరినించీ వచ్చిన రెండో రోజు  మూడు ఉత్తరాలు ఇచ్చివెళ్ళాడు పోస్ట్ మేన్  సత్తినాణ  . అందులో ఒకటి చివర్ల నల్లరంగు రాసిన పోస్టుకార్డు . దాన్ని చదవగానే చించి అవతల పడేసిన అత్తగారు ” మీ మావయ్య భోజనం అయ్యేవరకూ ఈ కబురు తెలీనీకు …ఎంత  మనకి పడని వాళ్ళయినా పోయారని తెలిస్తే బాధేకదా ” అంటూ నిట్టూర్చారు .  రెండో కార్డు  మా మాంగారికి ఒంగోలునుంచీ పుగాకు రైతులు రాసింది. ‘ఈ ఏడు పొగనారు తగ్గించిపోయండి .ఇక్కడి రైతులు ఇతరపంటలవైపు మొగ్గేట్టువున్నారు . మేం నారుకోసం ఫలానా అప్పుడు వస్తాం పాతబాకీ తీర్చేస్తాం ‘ అన్నది సారాంశం .మూడోది ఇన్ లాండ్ కవరు జగన్నాధపురం చిట్టిబాబుగారి  దగ్గరనుంచి వచ్చింది.  ఉభయకుశలోపరి – ఇంతేసంగతులుకి మధ్య మేటర్ – ‘ మీ ఊరినించీ పనిమీద మా ఊరు వచ్చిన వ్యక్తి రెండు రోజులు మా ఇంట్లో మకాం చేసి ఈ పూటే బయలుదేరాడు. నేను అలవాటుగా బట్టలు పెడుతుంటే తీసుకోలేదు. మరీ మొహమాటస్తుడిలా వున్నాడు . అందుకే అతనిచేతికే కొంత రొక్కం ఇచ్చి పంపుతున్నాను.వాటితో  అతనికి నచ్చిన బట్టలు అక్కడే కొనివ్వండి. మీరు మా ఇంటికి వెళ్ళమని మరీ మరీ చెప్పారట . మామీద మీకు గల అభిమానానికి ధన్యుడిని – మా మర్యాదల్లో ఏవన్నా లోపం వుంటే క్షమించగలరు  ‘ అంటూ సాగిన ఆ ఉత్తరం మాంగారు చదివి  “నేనెవరిని పంపినట్టూ  !” అని  ఆలోచనలోపడ్డారు .

ఆ తరువాత  ఒకవారం వ్యవధిలో అలాంటివే మరో రెండు ఉత్తరాలు అందుకున్నాం. మీ మనిషికి సరుకిచ్చి పంపాం. చేరాకా ఉత్తరం రాయటం మర్చిపోకండి అని ఒకటి,   మీపేరు చెప్పి బ్రతిమాలడంతో డబ్బివ్వక తప్పలేదు …ఇంకోసారి ఇలాంటివాళ్ళని మా ఇంటికి పంపకండి అని ఒకటి ….అవి చదివి తలపట్టుకున్నారు మాంగారు .

అప్పుడే డెంకాడ పెళ్ళినించీ దిగిన మా రాజుగారు కాళ్ళయినా కడుక్కోకుండానే  పందిట్లో విన్న కథొకటి చెప్పుకొచ్చారు.  చంటినాన్న  గారి  మకాం దగ్గరికి ఎక్కడినుంచో ఒకడొచ్చి , ఆ కోళ్ళపెంపకం అదీ చూసి ఆశ్చర్యపోయి  మీగురించి ప్రపంచమంతా తెలియాల్సిందేనండీ అని ఉబ్బేసి ,మీకోళ్ళపెంపకం గురించి ప్రజలంతా కథలుగా చెప్పుకోవాలండి ….ఇంత అల్లారుముద్దుగా పెరుగుతున్న ఈ కోడిపుంజు గురించి పేపర్లో రాయించాలండి అంటూ కహానీలు చెప్పి , టౌనుకి తీసుకెళ్ళి స్టూడియోలో  ఫొటో తీయించి పంపిస్తానని తెగ బ్రతిమాలి , పుంజుని చంకన పెట్టుకెళ్ళినవాడు వెంట కాపలాగా పంపిన పాలేరుని బురిడీ కొట్టించేసి మాయమయిపోయాడట. పోలీసు కంప్లైంటు ఇచ్చినా మనుషుల్ని పెట్టి వెతికించినా ఫలితం లేకపోవటంతో  బెంగపడిపోయిన చంటినాన్న “కాస్త వెతికి పెట్టండ్రా ..” అని కనపడినవాడినల్లా బ్రతిమాలుతూ తిండీ తిప్పలూ లేకుండా తిరుగుతున్నారట  .

“మా దగ్గర మంచి జాతిపెట్టలున్నాయ్  ఒక పట్టు దింపుకునిస్తాను పుంజుని పంపవయ్యా అంటే ….తిండి కుదరక పుంజు పాడయిపోతుంది బావా అని తెగ గింజుకున్నాడు . మాబాగా  రోగం కుదిరింది సన్నాసికి …..ఇంకెక్కడి పుంజూ ఈపాటికి పులావయిపోయుంటుంది” అని నవ్వేసారు మాంగారు .

అంతావిన్న అత్తగారు ” అయ్యోరాత …. తలతాకట్టు పెట్టి మరీ వాటిని మేపుతున్నాడు  . వీడికయినా తెలివుండక్కర్లా .  అయినా ముక్కూ మొఖం తెలీనివాడిని అలాఎలా నమ్మేసాడ్రా!! ” అంటూ  ముక్కునవేలేసుకున్నారు  .

“సిం హాచలం నుంచొస్తున్నాని గుండు చూపించి ప్రసాదం ఇచ్చాడట మరి . నామాలు చూపించి పంగనామాలు పెట్టేసాడని అందరూ నవ్వుకుంటున్నారు “ అంటూ అబ్బాయిగారు చెపుతుంటే అత్తగారికి ఒక్కసారిగా  పొలమారిపోయింది .  అత్తగారి అవస్థకి నాకు నవ్వొచ్చింది .

ఆ సాయంత్రం పాతిక పోస్టు కార్డులు తెప్పించి , ఇలా నున్నని గుండు -నిలువు నామం తో ఉన్నవాడొస్తే నమ్మొద్దు అని ఎడ్రసులు ఉన్నవాళ్ళందరికీ వివరంగా ఉత్తరాలు రాయమన్నారు . ఇంకా నయం పచ్చచొక్కా తెల్లపేంటులో ఉన్నవాడిని నమ్మొద్దని చెప్పేరు కాదు అనుకొని, ‘ ఒంకరనవ్వులు ఒలికిస్తూ ఒకడొచ్చేనమ్మా ….పారా హుషార్ ‘  అని  నాలుగు ముక్కలు రాసి నాలుగు దిక్కులకీ టెలిగ్రాం లో పంపించాం  .

–లలిత దాట్ల

ఎంత నేర్చినా…?

SAM_0344

ఆవేళ బుధవారం -పాత బట్టల మూట ముందేసుకుని కూర్చున్నారు అత్తగారు .

అప్పటికి అయిదారుసార్లు తిరగేసి మరగేసి చూసారు అందులో చీరల్ని . ఒక్కోటీ విప్పతీసి చూడటం మళ్ళీ మడతేసి పెట్టడం .ఎప్పటికో రెండు చీరలు తీసి ఒళ్ళో వేసుకున్నారు . అదా ఇదా అని కాసేపు ఆలోచించి చివరికి ఎటూ తేల్చుకోలేక రెండిటినీ మూటలో వేసేసి తలపట్టుకు కూర్చున్నారు . మా అత్తగారి అవస్థ చూసి నేను గట్టిగా నిట్టూర్చాను ఎప్పట్లానే .

“కొత్త చీరలు కొనుక్కునేప్పుడు ఆలోచించాం – హైరానా పడ్డాం అంటే అర్ధం వుంది కానీ , మాయదారి పాత చీరల సెలక్షనుకి కూడా ఇన్ని పుర్రాకులు పడాలా . కళ్ళుమూసుకుని మూటమొత్తంగా తీసుకెళ్ళి పారేస్తే పోయేదానికి” అన్నాను అత్తగారితో . అంతటితో ఊరుకున్నానా …..”దానధర్మాలు చేయాలంటే ఎంతో అదృష్టం ఉండాలటండీ దేవుడు మనకా అవకాశం ఇచ్చాడు కాబట్టి ఉదారంగా ఇచ్చిపారేయడమే . మన ఇంట్లోంచీ ఒక రూపాయి దానంగా వెళితే రెండు రూపాయలు మనింట్లోకొచ్చే దారి చూపెడతాడటండీ ఆ భగవంతుడు . అంటే ….ఇప్పుడు మనం ఒక పాత చీర ఇస్తే రెండు కొత్త చీరలు కొనుక్కునే అవకాశం మనకి దొరుకుతుందన్నమాట” అని ఎక్కడో విన్నవి టీకా తాత్పర్య సహితంగా అనుమానం లేకుండా అప్పచెప్పేసాను.

అయిందా ఉపన్యాసం అన్నట్టు ఆవిడ నాకేసి శాంతంగా చూసి, “ఇలావచ్చి కూచోవే …నీకో కథ చెపుతాను” అనేసరికి గానీ నే చేసిన తప్పు బోధ పడలేదు . దాన ధర్మాల గురించి నేనిలా తేలిగ్గా మాట్లాడినప్పుడల్లా ఆవిడ ఒకానొక బరువయిన కథ చెప్పటం , నేను కళ్ళొత్తుకుంటూ ఆ కథ వినేయడం పరిపాటయిపోయింది .

“వరాల్రాజుగారి కథేనా …..తెలుసుగా “ అన్నాను నింపాదిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ.

“ ఊరికే తలాడిస్తూ వినేస్తే సరిపోయిందా దేన్నుంచయినా నేర్చుకోవాల్సింది నేర్చుకోవద్దూ . అత్తయినా చెప్పిందికాదమ్మా అని అందరూ నన్నంటారు ఇలా వచ్చి కూచొని మళ్ళీ ఒక్కసారి చెప్పించుకోవే “ అని బ్రతిమాలేస్తుంటే ….బ్రోచేవారెవరురా అని నేను దిక్కులు చూడ్డం మొదలుపెట్టాను.

వాకిట్లోంచీ ” అయ్యగారండో ….అయ్యగారండమ్మా …” అన్న పిలుపు వినపడగానే …. బ్రతికానురా భగవంతుడా అనుకొని ఒక్క ఉరుకులో అక్కడినుంచీ బయటపడ్డాను .

చాకలి పోలమ్మ . పాపం పెద్దయ్యగారు ఇస్తానని ఆశపెట్టిన పాత చీరకోసం కాళ్ళరిగిపోయేలా తిరుగుతుంది . మంగళవారం పొద్దొచ్చేసిందనీ, శుక్రవారం పొద్దు ఇంకా దాటలేదనీ , ఈవాళ ఇంట్లో చుట్టాలున్నారనీ, రేపు మాకు పనుందనీ, ఇంకా అదనీ ఇదనీ ఎన్నాళ్ళబట్టి తిప్పుతున్నారో దాన్ని . ఈవాళయినా దాని ఆశ తీరుతుందో లేదో….ఏ చీరను వదిలించుకోవాలి అనే విషయం మీద అత్తగారు ఇంకా ఒక నిర్ణయానికొచ్చినట్టులేదు .

మా అత్తగారి పద్ధతేవిటో నాకు అర్ధం కావటంలేదు . తనంత తాను ఇవ్వాల్సివస్తే ఒకటికి రెండిస్తారు . అడిగింది ఇవ్వడానికి మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు . ఎంత వీలయితే అంత వెనక్కి తీస్తారు . ఆ అడిగినవాడు ఎందుకడిగాన్రా బాబోయ్ అని ఏడ్చేంతగా తిప్పిస్తారు . ప్రతీ ఏటా దీపావళికి ప్రమిదలు తీసుకొచ్చి ఇచ్చే కుమ్మరోళ్ళ పిల్లకి పురుడొచ్చిందని తెలిసి , మెత్తని నూలు చీరలన్నీ ఏరేరి మరీ పంపించారు అబ్బులుగాడితో . ఏనాడో మా ఇంట్లో పనిచేసిన నాగలక్ష్మి నడుం వంగి పనిలోకి వెళ్ళలేకపోతుందని విని బియ్యం బస్తా పడేయించారు దాని పాకలో . “అయ్యగారూ మంచి జరీ ఉన్న పాత కోక ఇప్పించండి బాబూ తవరి పేరు సెప్పుకుని కట్టుకుంటాను ” అని ఆ మధ్య ఎప్పుడో నోరు తెరిచి అడిగింది పాపం పోలమ్మ . ఇదిగో ఇప్పటిదాకా తిప్పుతున్నారు. హేవిటో ఈవిడ వరస అంతా తికమక- మకతిక అనుకుంటుండగా వచ్చారు అత్తగారు .

“ఊ..ఇదిగోనే పోలమ్మా . ….చీర చీరని చంపుతున్నావని ఇస్తున్నా అంచయినా మాయలేదు. జాగ్రత్తగా కట్టుకుంటే పదేళ్ళయినా మన్నుతుంది “ అంటూ ఆవిడ పోలమ్మ చేతుల్లో పడేసిన పాత చీర చూసి నోరెళ్ళబెట్టిన పోలమ్మని చూస్తే నాకు నవ్వాగలేదు . ఆ చీరకసలు అంచేలేదు. రంగయినా ఇదని చెప్పటానికి వీల్లేనిది . విప్పతీస్తే ఇంకా లోపల ఏవేం విచిత్రాలు దర్శనమిస్తాయో .

ఆవుదం తాగినట్టూ మొహం పెట్టి అంతలోనే సర్దుకుంది పోలమ్మ . “సూసేరాండీ సిన్నయ్యగారూ మీ అత్తయ్యగారి పరాచికాలు ” అంటూ నవ్వేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంటే….మా అత్తగారు బుగ్గలు నొక్కుకుని ” ఇందులో పరాచికమేవుందేవ్ ! నువ్వడిగింది పాత చీరేగా” అనేసారు తేలిగ్గా.

“ ఆ…..మీరు భలేవోరు అయ్యగారు . పాతకోకని అడగాపోతే తవరు కట్టుకునీ పట్టుకోకలిమ్మని అడుగుతావాండీ … మారాజులు మీరే అర్దం సేసుకోవాల . తవరిచ్చిన కోక కట్టుకుని మా మెండపేట తమ్ముడింటిని ఎలదారనీ , మా అయ్యగారు ఎంత నాణవయిన కోకలు కడతారో అక్కడ మాఓల్లందరికీ సూపిద్దారనీ ఎంత సంబరపడ్డానో తెలుసాండీ” అంటూ….చూసుకోండి మరి ఈ చీర కట్టుకెళితే పోయేది మీ పరువే అన్న అర్ధం ద్వనించేలా కళ్ళూ ఒళ్ళూ విచిత్రంగా తిప్పేసింది పోలమ్మ .

పోలమ్మ వంటిమీద జీరాడుతున్న నిమ్మపండు రంగు గద్వాల చీరను పరీక్షగా చూస్తూ “చాల్లే వే చెప్పొచ్చేవ్ …..నీ సంగతి నాకు తెలీకనా !! నీకు చీరలకి కరువేంటే , రేవులో పడ్డ జరీ చీరలన్నీ ఓ తిప్పు తిప్పికానీ ఇళ్ళకు చేర్చవు కదా . ఇక మాలాంటివాళ్ళిచ్చిన పాత కోకలు చుట్టుకుని చుట్టాలింటికి వెళాల్సిన ఖర్మం నీకేవిటీ” అని అత్తగారు సుతారంగా అంటించేసరికి , ఉడుక్కున్నట్టూ మొఖం ముడుచుకుంది . “మనసులో ఏదో పెట్టుకుని మాట్టాడతన్నారు పెద్దయ్యగారు “అంటూ గారం పోయింది .
దాన్నలా చూస్తే నాకు జాలేసిపోయింది. నిజం చెప్పాలంటే కొంచెం భయం కూడా వేసింది. ఇస్త్రీ కోసం ఇచ్చిన నా పెళ్ళి పట్టు చీర దాని దగ్గరేవుంది. కోపంలో కాల్చి పారేస్తేనో ? మంగలి కత్తి మెడమీద పెట్టినపుడు – చాకలింట మన కొత్తకోక ఉన్నప్పుడు ఎవరయినా ఎంత జాగ్రత్తగా వాళ్ళపట్ల ఎంత మర్యాదగా వుండాలి . అయినా అత్తగారూ …. ఇదేం అమాయకత్వం అని నేను గొణుగుతూనే వున్నాను .

అదేం పట్టించుకోకుండా ఆవిడ అతి సీరియస్ గా మొఖం పెట్టి “ పోయిన పండక్కి పాలేర్లందరితోపాటూ నీకూ కొత్త బట్టలు పెట్టానా ….మా కోడలు తొలిమాటు సారెతో ఇంటి చాకలని నీకో కొత్త చీర తెచ్చిందా …..అవి కాక మా పెద్దొదినగారు దీపావళికి పంపించిన మూరతక్కువ చీర నీకు పనికట్టుకుని కబురంపి మరీ ఇచ్చానా ….అవన్నీ ఏం చేసావ్ …పోనీ ఒక్కమాటు సరదాగా కట్టుకొనొచ్చి అయ్యగారికి కనపడదాం అననుకున్నావా …పైగా రంగు నప్పలేదు, బట్ట బాగోలేదు అని నీ అరుగుమీద కూర్చుని వచ్చేపోయేవాళ్ళకి పేరంటం పెడతావా !….మళ్ళీ ఇప్పుడు ఏం ఎరగనట్టూ అయ్యగారూ పాతకోక అంటూ వచ్చి నిలబడితే నాకేం తెలీదనుకున్నావా …..పోన్లేపాపం ఇంట్లో కట్టుకుంటావని నేనో పాత చీర పడేస్తే అది ఇంటింటికీ కట్టుకెళ్ళి మరీ చూపించొస్తావా ..హమ్మా!! “ అంటూ పాయింటు మీద పాయింటు లాగుతూ చింత నిప్పులా చిటపటలాడిపోతున్న అత్తగార్ని చూస్తూ గాభరాగా గుటకలు మింగుతూ నిలబడిపోయింది పోలమ్మ . నేను మాత్రం గబగబా వంటింట్లోకి పరిగెత్తి గ్లాసు నీళ్ళు తాగొచ్చాను .

అంతటితో వదలకుండా దాన్ని ఎప్పటినుంచో అడగాలనుకున్న నాలుగు ప్రశ్నలూ అడిగేసి, కడిగేసి శాంతించిన అత్తగారు అరుగు చివర కాలుమీద కాలేసుకుని, మూతిమీద వేలుంచుకుని అలిగినట్టూ ఎటో చూస్తూ కూర్చున్నారు.

ఇటువంటి సీరియస్ సీనుల్లో ఎటువంటి డైలాగులుంటాయో తెలీక పాఠం మర్చిపోయిన స్టుడెంట్ లా చేతులు నలుపుకుంటూ పోలమ్మనీ అత్తగార్నీ మార్చి మార్చి చూస్తూ ఉండిపోయాను .

ముందుగా తేరుకున్న పోలమ్మ చెంగున అరుగు మీదికెక్కి చూర్లో దోపిన విసనకర్ర అందుకుని ఆవిడ ఎటు తిరిగితే అటు తిరిగి అత్తగారికి గాట్టిగా విసరరటం మొదలుపెట్టింది.

“అమ్మ…దీని తెలివో !? “ అని ఆశ్చర్యపోయాను .

అదే స్పీడులో నావైపు తిరిగి “అలా సూత్తనిలబడిపోయారేంటండీ …ఎల్లి అత్తయ్యగారికి సల్లగా మజ్జిగిదాహం అట్టుకు రండీ “ అని ఆర్డరేసి పారేసింది .అమ్మమ్మో…ఏం లౌక్యం !!! అని ఈసారి ఇంకాస్త ఎక్కువ ఆశ్చర్యపోతూ లోపలికి పరిగెత్తాను .

అత్తగారు అస్తమానూ చెప్పే వరాల్రాజు అనబడే ఆ వరహాల్రాజు గారి కథ ఆ సమయంలో వద్దన్నా గుర్తొచ్చేసింది .

అనగనగా ఓ వరాల్రాజుగారట . ఆయనదసలు మాఊరు కాదట భీవారం సైడునించీ వచ్చేరట . మా ఊర్లో పాతికెకరాలు కౌలుకి తీసుకుని పొగాకు వ్యవసాయం మొదలు పెట్టారట.అంతకుముందు చేపల చెరువులు, రొయ్యల చెరువులూ చేసి లాసయిపోయేరట .రొయ్యలు పండించిన చేతుల్తో బియ్యం పండించలేక ఇటుసైడు వచ్చేసేరట .”ఊరుకోండి మీరు మరీ సెపుతారు…ఊ కులాసాలకి పోకుండా కుదురుంగా యవసాయం సేసుకుంటే లాసెందుకవుతారు . పావలా పెట్టేకాడ రూపాయెడితే ఇలాగే మిగులుతారు” అని ఆయన్ని గతంలో ఎరిగున్నవాళ్ళు అనేవారట. అయినా అయన అదేం పట్టించుకోకుండా తన కులాసాలు దర్జాలు భేషుగ్గా కొనసాగిస్తూ వచ్చారట .
శ్రీరామనవమి చందాలని వెళితే ఊర్లో అందరూ ఇచ్చినదానిమీద ఓ రూపాయి ఎక్కువ రాసుకోండి అనేవారట . ఆవునో దూడనో కొనాల్సి వచ్చినపుడు అమ్మే ఆసామీ చెప్పిన రేటుకి ఒక రూపాయి ఎక్కువే తీసుకో అనేవారట.

పెళ్ళికీ పేరంటానికీ వెళితే చదివింపుల్లోకూడా తనదే పైచేయి అనిపించుకునేవాడట . దాంతో ఎక్కడెక్కడివారూ ఆయన ఇల్లు వెతుక్కుంటూ వచ్చి ఆహ్వానాలు అందించి , ఆయనందిచిన చందనతాంబూలాది సత్కారాలు పొంది వెళ్ళేవారట. ఆస్తి ఉన్నవాడు అందరికీ బంధువే అన్నట్టు మాఊర్లోనేకాక చుట్టుపక్కల ఊర్లలో కూడా అట్టహాసంగా జరిగే ప్రతీ కార్యక్రమానికీ ఆయన్నే ముఖ్య అతిధిగానూ, గౌరవాధ్యక్షుడిగానూ నిలబెట్టి కూర్చోబెట్టేవారట. అడగటవే ఆలశ్యం అన్నట్టుండేదట ఆయనతో పని . మనూర్లోనూ ఉన్నారు రాజులు ఎందుకూ ఊ..మీసాలు తిప్పుకుంటూ తిరగడానికీ మనమీద రంకెలెయ్యడానికీ తప్ప రాజంటే వరాల్రాజు గారే అని మిగతా రాజుల్ని పబ్లిక్ గానే ఆక్షేపించేస్తున్నారట తినమరిగిన జనం .

ముచ్చటగా మూడేళ్ళు గడిచేసరికి ‘మీ చందా ఇంతా’ అని ఎవరన్నాసరే దబాయించి తీసుకునేంత అలుసయిపోయేరట వరాల్రాజుగారు .ఊళ్ళో తీర్థాలకి లైటింగు ఖర్చయినా , శివరాత్రి సంబరాల్లో సినిమా ఖర్చయినా ఆయన ఖాతాకే వెళ్ళిపోయేదట . వరాల్రాజుగారి అయ్యగారు ఊర్లో దిగేప్పుడు పెట్టుకొచ్చిన మొహరీల మొలతాడు కానీ, రూపులపేరు కానీ అయిదేళ్ళ తరవాత ఆవిడ వంటిమీద కనపడలేదట . ఊర్లో దిగిన కొత్తలోనే ఆయన బుల్లెట్టు నడపటానికో మనిషిని పెట్టుకున్నారట .వాడి జీతం కూడా ఊర్లో పాలేర్లందరికంటే ఓ రూపాయెక్కువే అని మాట్లాడుకున్నారట . కొన్నేళ్ళకి ఆ బండిమీద వాడొక్కడే సొంతదారులాగా దర్జాగా తిరుగుతూ కనిపించేవాడు వెనక వరాల్రాజుగారు లేకుండా.

ఆయేడు శ్రీరామ నవమికి చందాలిచ్చినవారి పేర్లు మైకులో చదువుతూ చివరాకర్లో వరాల్రాజు గారి పేరు కూడా ఒక్కరూపాయెక్కువేసి చదివేసి, మర్నాడు పొద్దున్నే ఆయనింటికెళ్ళి చూస్తే తాళం పెట్టుందట . గడపమీద ఆయేటి చందా వందలకట్టతో పాటు ఓ రూపాయి బిళ్ళ ఒత్తెట్టి కనిపించిందట . కొన్నాళ్ళకి రామిండ్రీ నుంచీ , అనపర్తినుంచీ అప్పులోళ్ళొచ్చి తాళం పగలకొట్టి విలువయినవి అనుకున్న సామానులన్నీ పంచుకు పోయారట. అప్పటివరకూ ఆహా అన్నవాళ్ళే అంతా స్వయంకృతం తేల్చేసారట . మాటలేవన్నా కొనితేవాలా? నాలుక మడతేసి ఎటు కావాలంటే అటు ఆడించడమేకదా !రాజంటే వరాల్రాజే అన్నవాళ్ళెవరూ ఆయన గురించి బెంగిల్లిపోలేదు , మనకింత చేసిన మారాజు ఏవయిపోయేడో అని ఆరా తీయలేదు. ఎందరో వరాల్రాజుల్నీ బంగార్రాజుల్నీ మర్చిపోయినట్టే మర్చిపోయి ఊరుకున్నారట . అంతెందుకూ …వరాల్రాజుగారు చేయించి వేసిన ముత్యాల హారాలు, వెండి కిరీటాలు ధరించిన సీతారాములే ప్రతిఏటా ఆ పాడుబడ్డ ఇంటిముందునించీ ఏవీ తెలీనట్టు చిరునవ్వుతో ఊరేగుతూ వెళ్ళిపోతుంటే ఇంక మనుషుల్ని అనుకోటానికేవుందని అత్తగారు తరచూ బాధ పడేవారు .

ఈ కథ ఇంతవరకే ఊళ్ళోవాళ్ళకి తెలుసట .

కొన్నేళ్ళ క్రితం తిరపతి బస్టాండులో ” టికెట్టుకి డబ్బులు తక్కువయ్యాయి ఒక్క రూపాయిప్పించండమ్మా ” అని చేయి చాచిన వ్యక్తిని పరీక్షగా చూస్తుంటే , అనుమానంతో కళ్ళు చిట్లించిన అతను, గబుక్కున చేయి వెనక్కి లాక్కొని మరు నిమిషంలో మాయమయిపోయాడట.

“ఆయన మనూర్నించీ వెళ్ళిపోయిన వరాల్రాజు గారిలా ఉన్నారండీ “ అని అత్తగారు కళ్ళనీళ్ళు తిప్పుకుని మా మాంగారితో అంటే “ చ.చ…అయ్యుండదు” అనేసారట మాంగారు మొఖంలో బాధని దాచేస్తూ .

ఏట్లో పోసినా ఎంచిపోయాలి అనీ , అపాత్ర దానం కూడదనీ, ఇంకా ఎన్నెన్నో సామెతలతో ఈ కథ మా అత్తగారు నాకు మొదటిసారి చెప్పినప్పుడు మనసుకదోలా అయిపోయి కళ్ళనీళ్ళు తిరిగిపోయాయంటే నమ్మండి .

నేను మజ్జిగ దాహంతో తిరిగొచ్చేసరికి పోలమ్మ చెపుతున్న కబుర్లు వింటూ ప్రసన్న వదనంతో కనిపించారు అత్తగారు. ఇంతలో ఏం మాయ చేసేసిందబ్బా అని నేను ఆశ్చర్యపోతుంటే…. “ ఏమేవ్ ….ఆ గుడ్డలమూటిలా పట్రా . పోలమ్మకి నచ్చిన చీరలు తీసుకుంటుంది . అలాగే మొన్న చేసిన మురిపీలు రెండు పుంజీలు పొట్లం కట్టి పట్టుకురా పిల్లలకి పట్టుకెళుతుంది ” అని నాకు పురమాయించి, “ కోళ్ళ గూడు కింద బొగ్గుల మూటుంది వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళవే పోలమ్మా “ అంటూ దర్జాగా వరాలొకపోస్తున్న అత్తగారిని పక్కకి పిల్చి వరాల్రాజుగారి కథ నాకు చెప్పీ చెప్పీ మీరేం నేర్చుకోలేదా ? అని అడిగేద్దామనిపించింది. పొగడ్త పన్నీరు వంటిది పీల్చి వదిలేయాలి కానీ తాగి పడిపోకూడదు అని క్లాసు చెప్పేద్దామా అనికూడా అనిపించింది .

ఏవిటో….!! అనుకుంటా కానండీ …ఒకరి అనుభవం మరొకరికి గుణపాఠం అవుతుందా చెప్పండి ?

–లలిత దాట్ల

పిలవని పేరంటం

” ఏం చేస్తున్నావే ” అంటూ స్వతంత్రంగా  గది తలుపు తోసుకొచ్చారు  అత్తగారు .  ఆకాశం లోని ఇంద్రధనుస్సును ఒక్కలాగు లాగి భుజాలమీద వేసుకొచ్చేసినట్టూ ఆవిడ భుజాలనిండుగా రంగురంగుల చీరలు .

“తులసిదళం చదువుతున్నానండీ” . అంటూ చేతిలో పుస్తకం మడిచి కిందపెట్టి లేచి నుంచున్నాను .  “అయ్యో… అదేవిటే ! అంత పవిత్రమయిన పుస్తకాన్ని అలా కింద పెట్టేస్తావూ ! “ అంటూ …అదాట్న భుజమ్మీద  ఇంద్ర ధనుస్సును  మంచమీదికి గిరాటేసి , యండమూరి తులసిదళాన్ని వంగి తీసుకుని భక్తిగా కళ్ళకద్దుకుని , నా కళ్ళచుట్టూ కూడా ఓ తిప్పు తిప్పి పైనపెట్టారు. నాకు నవ్వొచ్చింది కానీ  దాచేసుకున్నాను .

మా అత్తగారు తెచ్చిన చీరల్ని వరసగా మంచం మీద పేర్చి, కాస్త వెనక్కి జరిగి గడ్డం మీద వేలుంచుకుని వాటినే తదేకంగా చూస్తూ దీర్ఘంగా ఓ శ్వాస తీసి వదిలారు .

” ఈ ఎర్రంచు వెంకటగిరి చీర క్రితంసారి ఎప్పుడు కట్టుకున్నానో నీకేవన్నా గుర్తుందటే…ఎంత ఆలోచించినా నాకు జ్ఞాపకం రావటంలేదు ” అన్నారు . నేను అలవాటయిన అయోమయాన్ని ప్రదర్శిస్తూ తల అడ్డంగా ఊపాను .

పోనీ ఈ నేరేడుపండు రంగు చీర ? అన్నారు ఆ చీర ఎత్తి పట్టుకుని నా కళ్ళముందు  ఆడిస్తూ . నేను తల అటూ ఇటూఆడిస్తూ ఊ..హు అనేసాను  .

ఈ గంధం రంగు గద్వాలు చీర బ్రేమ్మలింట్లో పేరంటానికి  కట్టుకున్నానంటావా ? అన్నారు నన్నే గుచ్చి గుచ్చి చూస్తూ . అప్పటివరకూ,  ఆ ..ఏదయితే ఏంటిలే అని , అలా అలా… తలాడించేస్తున్న నాకు ఇక ఆలోచించక తప్పలేదు .

ఓసారి ఎడంచేత్తో కుడి చెవి నలుపుకుని , వేళ్ళు విరుచుకుని , నుదురు చిట్లించి తల పంకించాను ( అలా చేస్తే నేను నిజంగానే ఆలోచిస్తున్నట్టు ఆనవాలు మా అత్తగారికి ) . రెండు నిమిషాల నిశ్శబ్దం తరువాత ” ఆ…కట్టుకున్నారండోయ్”  అనేశాను నమ్మకంగా. నా  అదృష్టం పండి పక్వానికి రావటం వల్ల , ఎప్పుడూ? ఏ పేరంటానికి? ఆ వేళ తిధీ నక్షంత్రం ఏవిటీ ? వంటి అనుబంధ ప్రశ్నలు   రాల్చకుండా ఊరుకున్నారు అత్తగారు .

ఎంత కాలక్షేపం కాకపోతేమటుకు వేళకాని వేళలో ఈ చీరల సంత ఏవిటీ ? అని అడిగేద్దామా అనుకుంటుంటే అందుకున్నారు అత్తగారు . ” అదికాదే……కరణంగారి తల్లిగారిని తేలు కుట్టిందని తెలిసి పెద్దత్తయ్యా  , నేనూ వెళ్ళి చూసొస్తే బావుంటుందనుకున్నాం కదా   . అక్కడికి కట్టుకెళ్ళటానికి చీర తీసి పెట్టుకోవద్దూ . తీరామోసి, ఇదివరకూ కట్టుకెళ్ళిన చీరే కట్టుకెళ్ళిపోతానేమో అని ….నాకసలే మతిమరుపూ “అంటూ నుదురుకొట్టుకున్నారు  అక్కడికి అదేదో మహా అపరాధం అన్నట్టు .

“నాకు జ్ఞాపకం వున్నంతవరకూ ఇదుగోండి… ఈ  చందనం రంగు చీర  మీరింతవరకూ ఊర్లో ఎవరింటికీ కట్టుకెళ్ళలేదు “. అని మామిడిపిందెల బుటా  ఉన్న ఉప్పాడ చీర తీసి అత్తగారికి అందించాను . ఆవిడ దాన్ని భూజం మీద అటూ ఇటూ వేలాడేసి చూసుకుని సంతృప్తిగా తలాడించేరు. నిజమేనేవ్….ఇది మొన్న దీపావళికి మా రెండో అన్నయ్య పెట్టిన చీర కదా ! ఇదే కట్టుకెళతాను . పైగా చీర ఎక్కడ కొన్నారు అని అడిగినవాళ్ళందరికీ మా పుట్టింటివాళ్ళు పెట్టారని చెప్పకనే చెప్పొచ్చు అని మురిసిపోతూ కదిలారు.

వెళుతూ వెళుతూ ఏదో గుర్తొచ్చినట్టూ గిరుక్కున వెనక్కి తిరిగి,” ఆ తులసిదళం చదివేస్తే నా గదిలో బల్లమీద కుమారీశతకం , రుక్మిణీ కళ్యాణం ఉన్నాయి అవి తీసుకో , ఇంకా కాలక్షేపం కాకపోతే గోడబీరువాలో మీ ఆయన చిన్నప్పుడు కొన్న పెదబాలశిక్ష వుంది అది తెచ్చి చదువుకో . నే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను”  అంటూ హుషారుగా నిష్క్రమించారు .

కుమారీ శతకం చదువుకోవాలా … ఇంకా నయం!? వ్యవసాయ పంచాంగం చదువుకోమన్నారు కాదు. అది తప్పు కుమారీ -ఇటు కూడదు కుమారీ  అని ఇన్నాళ్ళూ వేపుకు తిన్నారు మావాళ్ళు. ఏదో శ్రీమతినయి బ్రతికిపోయానని నేను సంబరపడుతుంటే ,  ఇంకా శతకాలు చదవమంటారేవిటీ !   అని నాతో నేనే సంభాషించుకుని, అప్పటికే ముప్పై ఆరుసార్లు చదివిన ఆ సస్పెన్స్ నవలని ముప్పై ఏడోసారి ఆశక్తిగా చదవటానికి  ప్రయత్నించాను .

మనసు పుస్తకం మీదికి పోనని మొరాయించింది . అత్తగారి వెంట కొత్తకోక కట్టుకుని షికారుకి  పోదాం  అని సరదాపడింది. ఈ మూల గదిలో కూర్చొని ‘ఈగంట గడిస్తే చాలు’ , ‘దుపట్లో మిన్నాగు’ , ‘ఒంటరి పక్షి’  వంటి నవల్లు నమిలే బదులు ఎంచక్కా అలా నాలుగిళ్ళు తిరిగొస్తే నలుగురి కష్ట సుఖాలూ తెలుస్తాయి కదుటే ! అంటూ ఉత్సాహపరిచింది .  నిజమేనేవ్…..! కానీ అత్తగారేవంటారో ! అని సందేహిస్తూ …’పద పద ఒక ప్రయత్నం కావించి చూద్దాం  అనుకొని అత్తగారిని  వెతుక్కుంటూ బయలుదేరాను.

అంతలోనే చక్కగా  ముస్తాబయిపోయిన అత్తగారు వీధిగుమ్మంలో చందనం బొమ్మలా నిటారుగా నిలబడి ఎవరికోసమో ఎదురుచూస్తున్నారు .  నన్ను చూస్తూనే   ”   ఎప్పటికి వస్తుందో మీ పెద్దత్తగారు  ”  అంటూ ఒకటే హైరానా పడిపోతూంటే , వీధిలో పెద్ద గేటు తోసుకొచ్చాడు అందరూ నత్తగాడని పిలిచే సత్తిగాడు ( మా పెదమాంగారి పాలేరు) .  వాడికి నాలుగు క్షణాలు మనకి నాలుగు కాలాలు, వాడికి నాలుగు కాలాలు మనకి నాలుగు యుగాలు అదీ లెక్క .

నత్తలా నడిచొస్తున్న వాడిని చూస్తూ చింతకాయ తిన్నట్టూ మొఖం చిట్లించి వాకిట్లోకి ఎదురెళ్ళిపోయారు అత్తగారు . ” మజ్జేనం-  మూడు -గంటల -కల్లా-రెడీ- గ- వుండ -మని –సెప్ప- మన్నా -రండి -మా అయ్యగారు ” అంటూ తెచ్చిన కబురు తాపీగా ఒక్కో మాటా విడదీసి అందించాడు . ఇంకా ఏవిటి విషేషాలు !? అన్నట్టూ  అలాగే ఆశక్తిగా వాడికేసి చూస్తున్న అత్తగారితో ” అంతేనండీ -ఇంకేలేదండి” అని టూ.కీ గా  అనేసి తల బకురుకుని  నేలచూపులుచూస్తూ  నిలబడిపోయాడు .

అత్తగారు మిరియం గింజ నమిలినట్టూ మొఖం కారంగాపెట్టి , “అసలేవిట్రా మీ అయ్యగారి పద్ధతి . తీర్చి తివాటించుకుని మూడు గంటలకి ఇళ్ళ దగ్గర బయలుదేరితే తిరిగి దీపాలవేళకి ఇల్లు చేరొద్దూ. మీ రాజుగారింట్లో టౌను అలవాట్లు మరిగేరు . ఎనిమిదయ్యేవరకూ భోజనాలకి కూర్చోరు. మా ఇంట్లో ఆరు దాటితే ఆకలికి ఆగలేరు .  పైగా బయటికెళ్ళిన మగాళ్ళు ఇల్లుచేరేసరికి ఎదురుగా కనిపించకపోతే కొంపలంటుకుపోవూ  .ఆవిడకేం ….ఒకరికి  ఇద్దరు కోడళ్ళున్నారు . ఇద్దరూ చెరో పనీ చేసేసి, అత్తగారొచ్చేసరికి అన్నీ అమర్చి ఉంచుతారు . అందరికీ ఆ అదృష్టం వుండద్దూ “ అని ఒక గాట్ఠి నిట్టూర్పు విడిచారు  . హమ్మ..! ఇదేవిటి ఉరుము వురిమి మంగళం మీద పడ్డట్టు!  అటుతిప్పీ ఇటుతిప్పీ నన్నే పొడుస్తారు  అనుకొని నేనూ నిష్టూరంగా  ఒక నిట్టూర్పు విడిచాను  .

ఒకసారి ఊపిరితీసుకుని మళ్ళీ అందుకున్నారు అత్తగారు  “ఇదిగో వస్తుందీ అదిగో వస్తుందీ అని ఎదురుచూస్తూ ఇక్కడ నేను గంట నించీ గబ్బిలంలా వేలాడుతుoటే …తీరామోసి ఇప్పటికి ఈ కబురు తెస్తావా ! తగలేసినట్టేవుంది”  అంటూ వాడిమీద గయ్యిమనేసరికి , వాడు అవన్నీ తనకి కాదన్నట్టూ నింపాదిగా ఓ చూపు చూసి, “అలా -సెప్పమంటారాండీ -అయితే ?” అంటూ మళ్ళీ తల బకురుకున్నాడు .  దాంతో అత్తగారు కంగారుగా నాలుక కరుచుకుని,  “ ఏడ్చావులే “  అని వాడినో కసురు కసిరి,  ” మూడుగంటలకి వెళితే ఆలశ్యం అయిపోతుందటండీ… ఠంచనుగా పావు తక్కువ మూడు గంటలకన్నా బయలుదేరితే బావుంటుందన్నారని  చెప్పుఫో” … అని  ఆజ్ఞాపించినట్టుగా అనేసి మరో మాటకు తావులేకుండా వచ్చి అరుగు చివర కూర్చుండిపోయారు ఆయాసపడుతూ.( అత్తగారు అంత ఆయాసపడిందీ పావుగంట ముందువెనకలకోసం  కోసం కాదనీ , ఇందులో ఇంకేదో  రాజకీయం వుందని తలున్నవాడికెవరికన్నా తెలుస్తుంది . ఒక్క కబురు మోసుకుపోతున్న నత్తగాడికి సారీ…సత్తిగాడికి తప్ప)

ఉమ్మట్లో ఉన్నన్నాళ్ళూ నన్ను వేపుకు తినేసింది చాలదులావుంది …నాకు కోడలొచ్చినా నాకీ తోటికోడలి  అజమాయిషీ తప్పదులావుంది,  అయ్యో…రాత ! ఎప్పుడూ ఆవిడ చెప్పటం నేను వినడమేనా  అంటూ తనలో తనే గొణుక్కుంటున్నారు.

అగ్గిమీద గుగ్గిలంలా చిటపటలాడుతున్న అత్తగారి దగ్గర ఆ సమయంలో ‘అత్తా -నేనూ వత్తా ‘ అని గారాలుపోవటం అంత మంచిదికాదని ఎంచి , గడపవెనకే నిశ్శబ్ధంగా నిలబడిపోయాను. వంటింట్లోకి వెళ్ళి ఒక చెంబు నీళ్ళు తాగొచ్చిన అత్తగారు కాస్త చల్లబడి మళ్ళీ వీధి అరుగు మీదికి చేరి ఎదురుచూపుల పర్వం కొనసాగిస్తున్నారు . ఇక పనయ్యేట్టులేదని   ‘మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే’  అని నా బుజ్జి మనసుకి నచ్చచెప్పుకుని, తులసిదళ పారాయణంలో పడ్డాను .

ఇందాకా ఇక్కడి కబురు మోసుకు వెళ్ళిన నత్తగాడు తిరిగొచ్చి వీధి గేటు దగ్గర బాగా  వంగి నిలబడ్డాడు. ( అంత బరువయిన కబురేమో మరి ) . అత్తగారు పెద్దరుగుమీంచీ చిన్నరుగు మీదికి ఒక్క గెంతు గెంతి , నాలుగు అంగల్లో వాడిని చేరి తలెగరేసారు . ఏవిటో చెప్పమన్నట్టూ !?

వాడు ఒకడుగు గేటు బయటా ఇంకో అడుగు లోపలా పెట్టి , “మూడుగంటలకి ఒక్క నిమసం అటూ ఇటూ అయినా మా అయ్యగారు రాటానికి ఈలుపడదంటండి . అంత కంగారుగా వుంటే తవరినే ఎల్లి రమ్మనీ సెప్పమన్నారండి ” అని వాడికి చేతనయినంత కుదురుగా  కబురు చెప్పేసి రెండో అడుగు కూడా అవతల పెట్టేసి నెమ్మదిగా నడివీధిలో  కలిసిపోయాడు  “ఒరేయ్….” అని అత్తగారు వెనకనించీ అరుస్తున్నా లెక్కచేయకుండా .

సెగలు కక్కుకుంటూ వచ్చి పడ్డారు అత్తగారు .”చూసావంటే ఆ నిర్లక్ష్యం . వాడిని కాదు అనాల్సింది….ఆ తలబిరుసూ, ఆ లెక్కలేనితనం అంతా అయ్యగారి చలవే అంటూ …..అటూ ఇటూ చూసి గొంతు తగ్గించి ” అసలు ఆ తూర్పోళ్ళ పద్ధతే అంత . అందులోనూ తునోళ్ళ సంగతి చెప్పాలా అమ్మో.. పెద్ద పిటింగు మేస్టర్లు కదూ! . అంటూ తోటికోడలిమీద అక్కసుని అక్కడే కక్కేసారు.

ఏవిటో ఈ తోటికోడళ్ళ తిక్కబాగోతం . ఎదురుగా వుంటే ఒకరి  మాట ఒకరు జవదాటనట్టూ ‘అవునా అంటే -అవునేవ్ ‘ అనుకొంటూ సరీగా సమయం వచ్చినపుడు మాత్రం ‘ఎడ్డెం అంటే తెడ్డెం’  అంటూ చెలరేగిపోతారు అని మనసులో ఓ మూలుగు మూలిగి , పైకిమాత్రం ‘  ఆహా….అలాగా ! ‘ అని తలాడించాను . “ఎప్పటికెయ్యది ప్రస్తుతమో….”  అని పెద్దలే చెప్పారు కదా !

ఇంతకీ ప్రయాణం వున్నట్టో లేనట్టో తేలక మా అత్తగారు గడియారం వంకా గేటువంకా చూస్తూ కూర్చున్నారు. నేను ‘ఈ గంట గడిస్తే చాలు’ చదువుదామా లేక  ‘ ఒంటరి పోరాటం’ లో మునుగుదామా అన్నది తేల్చుకోలేక సతమతమయిపోతున్నాను .

అంతలో హటాత్తుగా ” నువ్వు కరణంగారి ఇల్లు చూళ్ళేదు కదూ ” అన్నారు అత్తగారు . అడుగంటిన ఆశలు చిగురిస్తుండగా ” అబ్బే లేదండీ అత్తయ్యా ….కరణంగారి ఇల్లూ చూళ్ళేదు , కరణంగారి తల్లిగారినీ చూళ్ళేదు . ఆమాటకొస్తే  అసలు తేలు కుట్టిన మనిషినే ఎప్పుడూ  చూళ్ళేదు ” అని  గొంతులో పట్టినంత నిరాశని నింపుకుని జవాబిచ్చాను.  నా నోటినించి అరుదుగా వినవచ్చే “అత్తయ్యా”  అన్న పిలుపుకి ఆవిడ  వెన్నముద్ద మింగినట్టూ మొఖం పెట్టి, “అదేం భాగ్యం !పద నే తీసుకెళతాను. ఇద్దరం వెళ్ళి వచ్చేద్దాం. ఎవరిగొడవో మనకెందుకూ”   అని మెత్తగా అనేసరికి , రొట్టెవిరిగి నేతిలో పడ్డం అని దీన్నే అంటారేమో అనుకుంటూ ….హుషారుగా లేచి నుంచున్నాను .

ఎవరొచ్చినా రాకపోయినా మనం మాత్రం పావుతక్కువ మూడుకల్లా ఠంచనుగా బయల్దేరిపోవాల్సిందే కాబట్టి

నువ్వు అయిదంటే అయిదు నిమిషాల్లో తెమిలిపోవాలి అన్న అత్తగారు మూడున్నర నిమిషాల్లో ముస్తాబు పూర్తిచేసుకొచ్చిన నన్ను చూసి అవాక్కయిపోయారు. అంతలోనే తేరుకుని, నే కట్టుకున్న నల్లంచు తెల్లచీర ని ఎగాదిగాచూసి, “అబ్బా…ఏం బావుందే ఈ చీర , ఇక చీరలే లేనట్టూ …..!  నీ పుట్టినరోజునాడు కట్టుకున్నావ్ చూడు   చిట్టిచామంతి రంగుచీర  అది కట్టుకురా ఫో”  అంటూ ఆర్డరేసారు (నేకట్టిన నల్లంచు తెల్లచీర మా అమ్మాగారు పెట్టిందయితే  చిట్టిచామంతుల  చీర అత్తింటివారు పెట్టిందీ – అయ్యా అదీ సంగతి – అదేకదా అసలు సంగతి  )

నేను ఉస్సూరంటూ వెళ్ళి చీర మార్చుకొచ్చేసరికి మా అత్తగారు చెప్పుల్లో కాళ్ళు పెట్టుకు వాకిట్లో నిలబడిపోయారు . అప్పటికి గడియారంలో సమయం సరీగా రెండు గంటలా నలభై అయిదు నిమిషాలు .

మాంగారు, మా రాజుగారు చుట్టాలింట్లో ఊపనయానికి వెళ్ళటంతో  ‘వెళ్ళమంటారా  ’  అంటూ అర్జీ పెట్టుక్కునే అవసరం లేకపోయింది .

పెద్ద గదులు రెండింటికీ తాళాలు వేసి, మిగతా వసారాలు, వంటిల్లు ఎవడు ఎత్తుకుపోతాడులే అని  గెడలుమాత్రం తగిలించి   ఇద్దరం మా రాజమార్గం అయిన పెరటిగుమ్మoలోకొచ్చాం. అక్కడ నీడన గోళీలాడుకుంటున్న అప్పలమ్మ మనవడ్ని పిలిచి, తిరిగొచ్చాకా బెల్లం మిఠాయి పెడతాను . అందాకా ఇక్కడే అడుకోరా అని వాడిని కాపలాగా వుంచి , మా పెరట్లోని రెండడుగుల పాటిమట్టిగోడ అదాట్న దిగేసి అవతల పిల్లెంక మామ్మగారి దొడ్లోకి ఎంటరయిపోయాం .

మధ్యాహ్నం ఉక్కపోతకి నిద్రపట్టక అట్టముక్కతో ఉస్సురు ఉస్సురని విసురుకుంటూ అవస్థ పడుతున్న పిల్లెంక మామ్మయ్య మమ్మల్ని చూస్తూనే ” ఏవర్రా ….కరణంగారి ఇంటికేనా నేనూ వస్తా  ఆగండి అంటూ అలా మాయమయి ఇలా ప్రత్యక్షమయిపోయారు తెల్లని గ్లాస్కో చీర లో ఉమ్మెత్తపువ్వులా .

తోటికోడలిమీద పంతానికి ప్రయాణమయితే అయ్యారు కానీ  లోలోలపల  అత్తగారికి కొంచెం బెదురుగానే వుంది . ఇద్దరం ఎలాగూ వెళ్ళటం అని. ఎందుకంటే,  నాలుగు దిక్కులా నలుగురయినా లేకపోతే అత్తగారికి అడుగు పడదు. ఊర్లో రోడ్డుమీద నడవాల్సివచ్చిన ప్రతిసారీ  కొత్తగా ఓణీవేసిన పడుచుపిల్ల పదిమందిలో మసలాల్సివచ్చినప్పుడు  ఎంత తత్తరపడుతుందో  అంతకంటే ఓ మోతాదు ఎక్కువే కంగారుపడతారు . అందుకే ఆవిడ వస్తాననగానే “ అంతకంటేనా పిన్నమ్మా . అసలు నేనే మీకు కబురుపెడదామనుకున్నాను” అనేసారు .

మేం  ముగ్గురం మామ్మయ్యగారి దడి కంతల్లోంచీ అవతల పక్కనున్న వర్మగారి వాకిట్లోకి, అక్కడినుంచీ సందులా వున్న సన్నని మట్టి రోడ్డుని గబుక్కున దాటేసి, మందపాటోరి పెరట్లోకి వెళ్ళాం .

మమ్మల్ని చూస్తూనే మందపాటివారి చిన్నకోడలు చేస్తున్న పని వదిలేసి , మొహం చాటంత చేసుకుని ఎదురొచ్చేసారు . రండి రండి ….ఇప్పుడే అనుకుంటున్నాం ఏం తోచటంలేదు ఎవరన్నా వస్తే బావుండూ అని ” అంటూ మా చేతులు పట్టుకుని సావిట్లోకి లాక్కుపోయి చాపమీద కూర్చునేదాకా వదల్లేదు.

హుం…పాపం!  మనుషులకి మొఖం వాసిపోయి వున్నట్టున్నారు అనుకున్నాను. ఎకరం స్థలంలో చుట్టూ కోటగోడలాంటి ప్రహారీ మధ్యన ఎక్కడో లోతుగా వున్నట్టుందా ఇల్లు. కావాలని వారి  వాకిట్లోకి వచ్చివాలిన జీవులు తప్ప ఇతరాలేవీ వారి కళ్ళపడవు .  ఆ లంకoత కొంపలో వుండే మనుషులు ముచ్చటగా ముగ్గురే  .

మనం వెళ్ళవలసింది కరణంగారి ఇంటికి కదా మధ్యలో ఈ మజిలీలేవిటీ అని మా అత్తగారి చెవి కొరికాను . ఆవిడ ఏం చెప్పకుండా  మొఖం అంతా నవ్వు పులుముకుని, ” కరణంగారి ఇంటికి వెళుతూ మిమ్మల్నీ చూసిపోదామని వచ్చాం….ఇంతకీ మీ అత్తగారెక్కడా …. పడుకున్నారా ? అని ఆ ఇంటావిడని ఆరాగా అడగుతుంటే ….”ఓసోస్ ….మీరటే  ఎన్నాళ్ళయింది చూసి, అందరూ బావున్నారా “ అని బోసి నవ్వులు  చిందిస్తూ వచ్చారు మందపాటి మామ్మగారు .

మిలట్రీ సెల్యూట్ లా  మర్యాదకోసం ఓ సారి లేచి నుంచొని మళ్ళీ కూర్చున్నాం అందరం .

“మాకేం నిక్షేపంలావున్నాం. మీ ఆరోగ్యం ఎలావుందీ ? “ ఆరాగా అడిగారు అత్తగారు.

“పళ్ళసెట్టేనా ? బీరువాలో వుందమ్మా . ఎమేవ్….తీసి చూపించు”  అని కోడలికి సైగ  చేసారు.

మేం అందరం గుడ్లుతేలేసి, ఒకరి మొఖాలు ఒకరం చూసుకున్నాం .

ముందుగా తేరుకున్న పిల్లెంక మామ్మయ్య….” పెద్దకొడుకు ఇంటినుంచీ ఎప్పుడొచ్చారు?”  అనడిగారు కాస్త స్వరంపెంచి .

“మరే ….బాగా చెప్పారు వదినియ్యా.  పెద్దాడు కట్టించిన పళ్ళు చిన్నాడింట్లో అరగ్గొట్టుకుంటే బావుంటుందా . అందుకే ఇక్కడికి రాగానే తీసి బీరువాలో పెట్టించాను. మళ్ళీ అక్కడికి వెళ్ళాకా  తగిలించుకుంటాను ” అంటూ ఒక బోసినవ్వు మాకు వరంగా ప్రసాదించారు. వెనకే నిలబడి తలకొట్టుకుంటున్న కోడలిని ” తీసి చూపించవే ” అంటూ గద్దించేసరికి ఇక తప్పదనుకొన్న ఆవిడ, గోడబీరువా తీసి , అందులోంచీ ఒక ప్లాస్టిక్ డబ్బా తెచ్చి మా ముందుపెట్ట్టారు .

నీళ్ళలో తేలుతున్న కట్టుడుపళ్ళు  ఊరేసిన ఉసిరికాయల్లా బాగానే వున్నాయి .

ఏంచెప్పమంటారు పెద్దావిడ చాదస్తం . మేం కొన్న కాలిజోడు మా గుమ్మం దాటాకా విప్పేస్తారు . కూతురు వేయించిన కళ్ళజోడుతో కూతురు కాపురమే చూస్తారట . ఇదిగో ఇప్పుడిలా ….అంటూ ఆ కోడలు చెప్పుకుంటున్న కష్ట సుఖాలని వింటూ ఆవిడ పెట్టిన కారప్పూస -కోవాబిళ్ళ కాదనకుండా తినేసి , చల్లని మంచినీళ్ళు తాగి ఇక వెళతాం – మళ్ళీ ఎపుడయినా తీరిగ్గా వున్నప్పుడు తప్పక వస్తాం అంటూ లేచాం .

అక్కడినుంచీ మరో నాలుగిళ్ళు చుట్టి, నలుగురి యోగక్షేమాలూ విచారించాం .

ప్రమీల అత్తయ్య స్పెషల్ గా ఆర్డరిచ్చి నేయించుకున్న బండారులoక చీరలు  లాగీ-పీకీ చూసి,  ఆహా- ఓహో అనేసి అక్కడే కాసిన్ని జంతికముక్కలూ ఇంకాసింత టీ నీళ్ళు కడుపులో పోసుకున్నాం. పెనుమత్స వారి రెండు మండువాల లోగిలి లో ఉన్న ఆరువాటాలవారినీ ఒకసారి పలకరించి, వాళ్ళు కొత్తగా కొనుక్కున్న స్టీలు కేనులూ, ఇత్తడి పళ్ళాలు వంటివాటి నాణ్యతా ప్రమాణాలమీద కాసేపు చర్చించుకొన్నకా చిమ్మిలుండలూ, కరకజ్జం , మజ్జిగదాహం వంటివి వద్దు వద్దంటూనే పట్టించేశాం .

అలాగే , పనిలో పనిగా… కూరలు కోస్తూ  వేలుకోసుకుని,  రక్తంకంటే ఎక్కువ కన్నీరు కార్చేసిన సుబ్బరాజుగారి పట్నం కోడలి కళ్ళుతుడిచి (  వాళ్ళమ్మగారిది  హైడ్రాబేడ్ లెండి ) ఏం పర్లేదు అదే అలవాటవుతుందిలే అని ధైర్యం చెప్పి, ఈ మధ్యే కిడ్నీలో నాలుగు రాళ్ళు పోగేసుకున్న భాస్కరం గారిని ” ఇప్పుడెలావుందండీ- పాపం అంత బరువెలామోస్తున్నారో ” అని  తలుపుచాటునుంచే పరామర్శ కావించీ , అమెరికాలో ఉంటున్న అచ్చిగారు అక్కడ మంచులో కాలు జారి పడబోయారుటకదా  అందదూరం వెళ్ళి ఎలాగూ విచారించలేం  అని, ఇక్కడే వుంటున్న అచ్చిగారి తాలూకా వాళ్ళని వివరాలు అడిగి -మాకు తోచిన జాగ్రత్తలు చెప్పి  జనాభాలెక్కల కోసం ఇల్లిల్లూ తిరిగేవాళ్ళలాగా ఒక్క ఇల్లూ వదిలిపెట్టకుండా  ఆ వరసలోఉన్న అన్నిళ్ళూ చుట్టేసాం. మళ్ళీ ఎప్పటికి ఇంట్లోంచి బయటికొస్తామో ఏవిటో అనుకుంటూ . (అవతలి వరసలోకి కూడా వెళ్ళేవాళ్ళమే కానీ ఆ వరసలోనే మా అత్తగారి తోటికోడలుండేది)
అప్పటికే  మేం బయలుదేరి చాలా సేపయింది .

ఇదే ఈ వీధిలో చివరిల్లేమో ! ఇక నయినా కరణంగారింటికెళదామా ….లేకపోతే ఇక్కడినుంచే వెనక్కి మళ్ళేద్దామా అనడిగాను అత్తగారి వీపుగోకుతూ రహస్యంగా. మా అత్తగారు నాకేసి గుర్రుగా చూసి, అటువైపు కూర్చున్న పిల్లెంక మామ్మ తో సంప్రదించి, దారిలో చిట్టిపంతులుగారి కొత్తకోడలిని చూసి, చివరాకర్లో ఆ పక్కనే వున్న కరణంగారింటికి వెళితే యాత్రా పరిసమాప్తమయినట్టే అని తీర్మానించేరు .

పంతులుగారి ఇల్లు  హైస్కూల్ వెనక వుందట  . దాంతో ఇక రాజుల వీధి వదిలి రోడ్డెక్కక తప్పలేదు . దొడ్డిగుమ్మాలూ, మొండిగోడలూ మీదుగా చేసే చాటుమాటు ప్రయాణం ఇక తప్పింది కదా  దర్జాగా నడివీధిలో నడిచిపోవచ్చు అని సంబరపడుతున్న నన్ను వెనక్కి గుంజి “ఇదిగోవిను ”  అంటూ కొన్ని మార్గదర్శక సూత్రాలు జారీ చేశారు అత్తగారు . వాటిలో ఒకటీరెండు – తలొంచుకుని రోడ్డు చూస్తూ నడవాలి తప్ప తలెత్తి పరిసరాల పర్యవేక్షణ చేయకూడదనీ , ఎవరన్నా ఎదురుపడి మాట్లాడిస్తే ఓ చిరునవ్వు నవ్వు నవ్వితే చాలనీ, అదేపనిగా నోరంతా తెలిచి మాట్లాడక్కరలేదనీ . నేను ఆ ప్రకారముగా వాటినే నెమరేసుకుంటూ … ఏవిటో ! ఎంచక్కా దర్జాగా తలెత్తుకు తిరగాల్సినచోట, దొంగల్లాగా ఈ దొడ్డిదారి ప్రయాణాలేంటో. పోనీ ఇప్పటికన్నా వీధిన పడ్డాం అని సంతోషించడానికి లేకుండా మళ్ళీ ఈ చాటుమాటులెందుకో   అర్ధరాత్రి స్వతంత్రం గురించి గాంధీగారు ఆలోచించేశారు కాబట్టి, మాఊర్లో మేం పట్టపగలు నడివీధిలో నిటారుగా నడిచి పోయే రోజు కోసం నేను పోరాటం చెయ్యాలో ఏమో అని కుంచెం సీరియస్గా ఆలోచిస్తూ తలొంచుకుని మా అత్తగారి కొంగు ఆనవాలుగా ముందుకి కదిలాను .

మా అత్తగారు వినయవిధేయతలు ప్రదర్శిస్తూ భుజాలు మెడా కాస్త వంచి “పిన్నమ్మా మీరు ముందు నడుద్దురూ….” అంటూ మమ్మయ్యని ముందుకు తోసి ఆవిడ వెనకాల నక్కి నక్కి నడుస్తున్నారు . హతవిధీ…అనుకుంటూ నేను అత్తగారిని అనుసరిస్తున్నాను. చింత చచ్చినా పులుపు చావలేదనీ, ఇంకా ఈ ఘోషాలూ, భేషజాలూ ఎందుకండీ. మా ఊర్లో మేం ఎంచక్కా అవతల వీధికీ ఇవతలవీధికీ మా ఇష్టం వచ్చినట్టూ తిరుగుతాం మమ్మెల్నెవరూ ఏవీ అనరు తెలుసా ! అని ఒకసారెప్పుడో అత్తగారితో వాదనకు దిగాను.

“  ఏవిటా వితండవాదం….మీ ఊళ్ళోవాళ్ళకి పద్ధతులూ పాడూ తెలీవు  . ఈ ఊళ్ళో ఇదే పద్ధతి ఇలానే వుండాలి లేకపోతే ఆక్షేపిస్తారు. పూర్వంలా మీనాలూ, పల్లకీలూ లేకపోయినా మా అత్తగారి కాలం వరకూ తెరలుకట్టిన  సవారీ బండ్లలో వెళ్ళేవారు . రానురానూ రెండెడ్లబండి ఎక్కడం అంటే చిన్నతనం అయిపోయింది. అందుకే ఇలా రెండు కాళ్ళకీ పనిచెప్పాల్సి వస్తుంది అంటూ  చెరిగిపారేసారు . రెంటికీ చెడ్డ రేవడులాగా అటు సవారీబళ్ళూ లేవు, ఇటు ఘోషాలూ తప్పటంలేదు   . హుమ్మ్…ఏం చేస్తాం రోమ్మ్ లో ఉన్నప్పుడు రోమన్ లా వుండమన్నారు  అనుకుంటూ అత్తగారిని ఫాలో  అయిపోతున్నాను .

అలా రైలుబండి లాగా  ఒకరి వెనక ఒకరం నాలుగు గజాలదూరం నడిచి చిన్న మలుపు తిరగ్గానే  టక్కున సడెన్ బ్రేక్ వేసినట్టూ నిలబడిపోయారు అత్తగారు . ఏవిటా!  అని తలెత్తిచూద్దును కదా  రోడ్డుపక్కగా ఎవరి వాకిట్లోనో దడివారగా నిండా పూలతో కళకల్లాడుతున్న ముద్దబంతి చెట్టును చూస్తూ   నిలబడిపోయారు పిల్లెంక మామ్మయ్య . ఇంజనులాంటి ఆవిడ అలా ఆగిపోతే బోగీలం మేం ముదుకెళ్ళాలేం కదా ! మా అత్తగారు …అయ్యో రాత అనుకుంటూ “రండి పిన్నమ్మా ఎవరన్నా చూస్తే బాగోదు”  అని ఆవిడ బుజం పట్టుకు లాగుతున్నారు . ఆవిడ అదేం పట్టించుకోకుండా “అబ్బ..! ఎంతపెద్ద పువ్వులో చూడవే  నాలుగు పువ్వులు కోద్దామంటే విత్తనాలు కట్టుకోవచ్చు”. అని అదేపనిగా మురిసిపోతున్నారు . ఇంతలో చూరుకిందనించీ తొంగిచూసిన ఆ ఇంటావిడ  బయటికొచ్చి, “అయ్యగారూ  తవరా… “ అని అమితానందంతో పులకించిపోతూ” ఎండగావుంది కున్ని మంచినీళ్ళు ఉచ్చుకుంటారా…పోనీ మజ్జిగదాహం కలపమంటారా “ అంటూ వాకిట్లో నులకమంచ వాల్చి అతిధి మర్యాదలకు దిగింది . ఆ సమయంలో మా అత్తగారి ముఖంలో మారిన రంగులు చూసితీరాల్సిందే. ”  చాల్లే వే … మేవేవన్నా కాశీ రామేశ్వరం పోతూ మార్గమధ్యంలో మీ ఇంట్లో విడిది చేశామా ! అని  వెట ’ కారం‘ గా అనేసి  , ఇంకా అక్కడే నిలబడ్డ మామ్మయ్యని ఒక్క గుంజు గుంజి రోడ్డెక్కించారు.

“ కోడలుగారు గావాలసండి …… ముద్దబంతిపువ్వులా ఇంచక్కున్నారు “ అని  ఆ ఇల్లాలు వెనకనించీ అనడం నాకు వినిపిస్తూనేవుంది. ఇలాంటిచోట ఇంకాసేపుంటే ఇంకెన్ని ‘ఎంచక్కని’  మాటలు వినచ్చో కదా ! ఏవిటో అత్తగారి  పద్ధతి.  ఇలాంటి మాటలు అస్సలు చెవికెక్కించుకోరు.  ఆమధ్య మా ఇంటికి సారె పంచడానికొచ్చిన బొండాం షావుకారు భార్య ” కోడలుగారు పటికీబెల్లం ముక్కలా మిలమిల్లాడిపోతన్నారండి ” అంది ఆ మాట కూడా మా అత్తగారు విననట్టే ప్రవర్తించారు . హుం…అదేవిటో ! అని మనసులో అనుకుంటూ అయిష్టంగానే అత్తగారిని అనుసరించాను .

మరో రెండు నిమిషాలు తలొంచుకు నడిచి, చివరికి పంతులుగారి  ఇల్లు చేరాం. మార్గమధ్యంలో మాకు ఎదురయిన  కొన్ని సైకిళ్ళూ, గడ్డిమోపులూ, నీళ్ళకావిళ్ళూ వాటంతట అవే పక్కకి  తప్పుకుంటే ఒకటో రెండో మమ్మల్ని ఖాతరుచేయకుండా అదే స్పీడులో ముందుకెళ్ళిపోయాయి. అలా వెళ్ళినవాటిని ‘ ఫలానా కదూ ‘ అని మా అత్తగారు వివరాలతో సహా గుర్తుపెట్టుకున్నారు .

వాకిట్లో  పడక్కుర్చీలో విశ్రాంతిగా పడుకున్న  చిట్టిపంతులుగారి అబ్బాయి , మా అత్తగారిని చూస్తూనే  హెడ్మాస్టర్ని ఇంటిదగ్గర చూసిన స్కూలు పిల్లాడిలా తడబడిపోయి , బాగోదన్నట్టుగా ఒక బలవంతపు నవ్వి, పలకరించే అవకాశం లేకుండా పెద్దపెద్ద అంగలేసుకుంటూ రోడ్డుమీదికి పారిపోయారు ( ఎందుకూ? ఏవిటీ? అనేది ఇంకోసారి చెప్పుకుందాం)

”  మీరా ….రండి రండి . ఏవిటో విశేషం ! ఇలా చెప్పాపెట్టకుండా వచ్చేసారూ ….అందరూ కులాశానా ” అంటూ  మందారమొగ్గలు కోసుకుంటున్న పంతులుగారి భార్య ఆశ్చర్యపోతూ ఎదురొచ్చారు

అన్ని ఇళ్ళలోనూ చెప్పుకొచ్చినట్టే” ఇలా కరణంగారింటికెళుతూ…..అంటూ కాశీ మజిలీకథంతా  చెప్పుకొచ్చారు అత్తగారు.  “అలాగా”  అంటూ ఆవిడ నా దగ్గరగావచ్చి “కోడలుగారూ విశేషాలేం లేవా ” అనేసరికి నేను కాసిన్ని సిగ్గులు ఒలకపొయ్యాల్సివచ్చింది. అలా నాలుగు కబుర్లయ్యేసరికి,  ప్రత్యక్షమయింది పంతులుగారి కొత్త కోడలు పచ్చనిపాదాలతో , పాపిట్లో కుంకుమా కంఠానికి గంధం, తలలో చామంతిచెండు తో . “అచ్చం పార్వతీదేవిలా లేదూ” అన్నారు మా అత్తగారు నా చెవిలో . అవున్నిజమేనండోయ్…పార్వతీదేవి చేతిలో అరటిపళ్ళ అత్తం కూడా వుంది అన్నాను ఆమెనే ముచ్చటగాచూస్తూ .  ప్లేట్లో చలివిడీ  , అప్పాలు పెట్టుకొచ్చారు కామాక్షమ్మగారు .

అప్పటికే బిగ్గా పట్టించేసిన మేం అబ్బెబ్బెబ్బే…..అని ఎంత తోస్తున్నా వదలకుండా  తలోరెండూ తినిపించేసారు. తింటున్నంతసేపూ …పంతులుగారి కోడలి గుణగణాల గానం చేస్తూనేవున్నారు మా అత్తగారు . ఆహా..ఏం వినయం, ఏం వందనం, ఏం మర్యాద, ఏం అభిమానం…ఏం అదీ..ఏం ఇదీ…. ఆ రంగూ, ఆ రూపూ ,ఆ స్వరం  అంటూ ,  ఆ గానం అలా ఎందాకా సాగేదోకానీ,

” అయ్యగారండోయ్…మీరిక్కడ కూకొని కథలు సెప్పుకుంటన్నారా …..మీకోసం ఊరంతా తిరిగితిరిగి వత్తన్నాను . రాజుగారు ఊర్నించీ వచ్చేసేరండి. కాళ్ళు కడుక్కోటానికి నీళ్ళిచ్చేవోళ్ళు లేరని నిప్పులు కక్కేత్తన్నారండి బాబూ….” అంటూ  ఫైరింజన్  సైరన్లా  వీధిలోంచే అరిచేస్తున్నాడు అబ్బులు .  ఆ హడావిడికి   తింటున్న చలివిడి అంగిట్లో అంటుకుపోయి ఊపిరాడక కళ్ళుతేలేసారు అత్తగారు. పార్వతీదేవి లాంటి పంతులగారికోడలు నిమ్మళంగా నీళ్ళుతాగించి, వెన్ను పామేసరికి తేరుకుని తెరిపినపడ్డారు  .

“ఇక వెళతాం”  అని చెప్పేసి అర్జెంటుగా గుమ్మందిగేసిన అత్తగారితో ” అయ్యో ఇంతాచేసి కరణంగారి ఇంటికి వెళ్ళొద్దూ….తేలు కుట్టినావిడని చూడొద్దూ ??” అంటుంటే  ” అబ్బా ఇంకోసారి వద్దాంలేవే ” అని నన్ను తోసుకొచ్చేసారు అత్తగారు. ఇంకోసారంటే మళ్ళీ  తేలుకుట్టినప్పుడా అని అడగాలనుకున్నాను కానీ , అప్పటికే మా అత్తగారు  ” ఒరేయ్…నువ్వెళ్ళి ఇద్దరికీ వేణ్ణీళ్ళు కాచిపొయ్యి  అంతలోపల మేం వచ్చేస్తాం “ అని అబ్బులిని ఆజ్ఞాపిస్తూ వెనకాముందూ చూసుకోకుండా  రోడ్డెక్కేసి , వాడికంటే ముందు నడిచి చిరుచీకట్లో కలిసిపోయారు   కంగారులో ఘోషా మాట మర్చిపోయిన కలిదిండి మహరాణిగారు .

–దాట్ల లలిత

‘ తంతే బూరెల బుట్టలో ……’

నోములూ వ్రతాలూ, పెళ్ళిళ్ళూ పేరంటాలు లేకుండా   పొదుగుడు కోడిపెట్టల్లాగా  ఎవరింట్లో వాళ్ళు పడుండే  ఆషాఢ  మాసం అంటే అత్తగారికి అంత అభిమానం లేదు. అలా అని అలక్ష్యమూ లేదు . ” ఆషాఢం ఇంకా ఎన్నాళ్ళుంటుందే  ” అని అక్కరకురాని చుట్టాన్ని తప్పక  భరిస్తున్నట్టూ రోజూ  కేలండర్ చూస్తూనే వుంటారు .  ఎక్కడో మూడు వారాల అవతల వున్న శ్రావణాన్ని  మాత్రం  “అదిగో వచ్చేస్తుంది ….ఇంకెంత ”  అంటూ  అంత మొహం చేసుకుని ఆహ్వానించేస్తూ వుంటారు .

అయినా  దేని దారి దానిదే అన్నట్టూ  ఆషాఢానికి జరగాల్సిన లాంచనాలన్నీ తు. చ తప్పక జరిపిస్తారు .ఆ ప్రకారం  ఆషాఢం  లో తప్పక తినాలని చెప్పే మునగాకు కోసం దొడ్లో మునగ చెట్టుని ఆకు లేకుండా దూసేశాం . నల్లేరు పచ్చడి, బలుసాకు పులుసు ,వాక్కాయ్ -పప్పూ  అంటూ నాలుక పసరెక్కేలా  కంచెలన్నీ మేసేశాం  . రంగు మాయకుండా డిజైను మారకుండా ( ఇంకేవిటీ చందమామ చుక్కలూను )  మళ్ళీ మళ్ళీ చేతులకి గోరింట పూయించేశాం .

తొలేకాశి వెళ్ళేనాటికి   లాంచనాలన్నీ యధావిధిగా పూర్తిచేసి పప్పులో ఉండ్రాళ్ళు కూడా వండుకు తినేసి   , ఈ ఆషాఢం ఇంకెన్నాళ్ళుందో అని  రోజులు   లెక్కపెట్టుకుంటుంటే ….హటాత్తుగా   అత్తగారికి గుర్తొచ్చింది తాటిపండు లాంచనం  ఒకటి . “ఈకాలంలో తాటి బూరెలు వండుకోవటం కూడా ఆచారమేమేనేవ్ . కానీ …,” అంటూ  కామాలో  ఇరుక్కుపోయారు .

అప్పటివరకూ అత్తగారి ఆకుపసరు  ఆచారాలకి నాలుక పీక్కున్న నేను ఈ పండాచారానికి  లొట్టలేసాను. చిన్నప్పుడెప్పుడో తిన్న తాటిరొట్టె, తాటిబూరెలు, అప్పాల రుచులు  గుర్తొచ్చి గుటకలు మింగాను .

“కానీ లేదు అర్ధణా లేదు కానిచ్చేద్దాం ..కానిచ్చేద్దాం” అని  తొందరపడ్డాను .

నా తొందరకాళ్ళకి బంధం వేస్తూ అత్తగారు ”  ఎప్పుడో నాలుగు తరాలకి ముందే మనింట తాటిపండుకి  తిలోదకాలు ఇచ్చేసారట  . ఎవరయినా పెడితే తినచ్చుకానీ  మనింట్లో వండుకోటం ఆనవాయితీలేదు . మనకి  అచ్చిరాదు  అని మా అత్తగారు మాకు మరీ మరీ చెప్పేవారు  అన్నారు . ” ఒకసారెప్పుడో మందపాటోరి ఇంటినుంచీ వచ్చాయి …..నిరుడు పెనుమత్సోరి చిన్నకోడలు వాళ్ళ పుట్టింట్లో  వండి తెచ్చి అందరికీ పంపింది . అలా తినడమే తప్ప మనింట్లో ఎప్పుడూ వండలేదుమరి. అయినా …..ఆనవాయితీ లేని పని అగచాట్ల పాలుచేస్తుందనీ ఎందుకొచ్చిన సంత ఊరుకుంటేపోయేదానికి అని నాలుక చప్పరించేసారు .

అప్పటికే తాటిబురెల మీద మనసుపడిపోయిన నాకు  అత్తగారి మాటలు ఏమాత్రం రుచించలేదు . పైగా అప్పుడెప్పుడో ఆవిడ అత్తగారు చెప్పిన మాట ఈనాటికీ పాటించడం అనేది అసలు  బుర్రకెక్కలేదు . ” ఊరుకుందురూ …మీరు మరీ చెపుతారు . ఒకరికి ఆచారం ఇంకొకరికి అనాచారం ఎలా అవుతుంది . అయినా ‘ పప్పులో ఉప్పెయ్యడానికీ, నిప్పుమీద నీళ్ళొయ్యడానికీ’  కూడా ఆనవాయితీలు చూసుకుంటామా . అలాంటివన్నీ నేను నమ్మనుబాబూ ” అనేసాను తేలిగ్గా  . “అంతేనంటావా !?”   అన్నట్టూ అనుమానంగా చూసేరు  అత్తగారు. అంతేకదామరి ! ఒకరికి మంచి ఇంకొకరికి చెడెందుకవుతుంది . చెట్టునించీ రాలిన పండు ఏ దేశంలో అయినా కిందికే పడుతుంది . ఎండలో నుంచుంటే ఎవరి నెత్తయినా మాడుతుంది . కాలమేదయినా  మబ్బుంలోంచే కదా  వాన పడుతుంది . అంటూ సినిమాల్లో లాయర్ లా  అటూ ఇటూ తిరుగుతూ అడ్డదిడ్డంగా వాదించేసాను  . దాంతో  కన్ ఫ్యూస్ అయిపోయిన అత్తగారు    “అంతేనంటావా ” అంటూ గుడ్లు తేలేసారు  .

అనుమానంలేకుండా అంతేమరి . ఈ ఆచారాలనేవి ఏనాడో ఏర్పడ్డాయి …ఇలా  నచ్చలేదనీ , అచ్చిరాలేదనీ ఎవరికి వారు మధ్యలో  వదిలెయ్యడం ఏం బావుంటుందీ అంటూ ,ఆచారాలు – సాంప్రదాయాలు , బూరెలు- గారెలు, పరమాన్నాలూ- పట్టుకొమ్మలు  అంటూ అప్పటికప్పుడు ఒక ఉపన్యాసం  అల్లి  అత్తగారి మీదికి  విసిరాను

ఎంతోకాలంగా వస్తున్న ఈ  ఆచారాలను   మనం ముందు తరాలకు  ముక్కుపిండయినా సరే నేర్పించి తీరాలన్నాను  . భూమ్మీద తాటి చెట్టనేది ఉన్నంతవరకూ ఆషాఢంలో  తాటిబూరెలు- అప్పాలు ఒండుకు తినడం అనే ఈ ఆనవాయితీని మనం  పాటించి తీరవలసిందే అన్నాను.  అసలా మాటకొస్తే ప్రతీ ఇంటిలోనూ కొబ్బరి మొక్కలు, అరటి పిలకలు నాటినట్టే ఒకటో రెండో  తాడి చెట్లు కూడా పెంచి వాటిని వారసత్వ ఆస్తిగా పిల్లలకు  రాసిచ్చే ఒక కొత్త ఆచారానికి మనమే నాంది పలకితే ఎలా వుంటుందో ఆలోచించండన్నాను .

అసలు సంగతి గ్రహింపుకి రాని అత్తగారు నా ఆరాటానికి  మురిసిపోయి , ఆచారాల మీద నాకు గల మక్కువకు మిక్కిలి సంతసించి  ” సర్లే  నువ్వంత సరదా పడుతుంటే నేనెందుకు కాదనాలీ  .అయినా …..అప్పాలొండటం అదెంతపనీ ” అంటూ చెంగున లేచి కూర్చున్నారు . లేడికి లేచిందే పరుగన్నట్టూ ఉన్నపళంగా బియ్యం నీళ్ళలో పోసేసి , అవతల దొడ్లో ట్రాక్టరుకి దమ్ము చక్రాలు బిగిస్తున్న అబ్బులు ని ఒక్క కేకేసి , ” ఒరేయ్ ఆ పనులు తరవాత …ముందెళ్ళి కట్టవలోంచీ మాంచి తాటిపళ్ళు నాలుగు ఏరుకురా ఫో” అని ఆర్డరేసారు.

ఆకారానికే కాక బుద్ధికీ ‘బండోడు’ అయిన  అబ్బులుగాడు ఓ బండినిండా తాటిపళ్ళు తోలుకొచ్చి వాకిట్లో  ఒంపేసేడు  . పైగా” కొనాలా పెట్టాలా ఉత్తినే వొచ్చినియ్యేకదండీ …మిగిలితే  తంపటేసుకుందారి ” అని అలవాటుగా  అక్కరలేని సలహా ఒకటి ఫ్రీగా పడేసాడు. ముందు ‘ ఇన్నేం  చేసుకుంటావ్ ‘   అని చిరాకు పడ్డా “ ఒండిపెడితే తినేవాళ్ళకి కరువా . మనవాళ్ళందరికీ తలో నాలుగూ పెట్టుకోవచ్చు  ” అని మరిన్ని బియ్యం నీళ్ళలో పోసేసారు అత్తగారు .

ఆ సీనంతా నడుస్తున్నప్పుడే  మొదటి ప్రమాదపు హెచ్చరికగా నా ఎడం కన్ను అదరడం మొదలుపెట్టింది. కానీ బూరెలు తినాలన్న బులబాటంలో  నేను దాన్ని ఖాతరు చెయ్యలేదు . అటకమీదనించీ పెద్దం బెల్లం దిమ్మ తీయించి దాన్ని మెత్తగా తరిగేయాలన్నారు. నీళ్ళు వాడేసి బియ్యం పిండి చేసి  , జల్లించేస్తే సగం పనయిపోయినట్టే అన్నారు. ఆ తరవాత బాగా మాగిన తాటిపళ్ళు  మదాయించి మెత్తగా గొజ్జు తీసుకుంటే ముప్పావువంతు వంటకం     తయారయిపోయినట్టే , ఇంకేవుందీ ఆ పిండీ బెల్లం తాటిపేశం ( గుజ్జు) కలిపి మనకి కావల్సిన బూరెలు, అప్పాలు నూనెలో వేయించి తీసేయడమే అన్నారు.  రోట్లో తలపెడుతున్నాని తెలీని నాకు నోట్లో నీళ్ళూరిపోయాయి .

బూరెలొండే బృహత్తర కార్యక్రమం లో భాగంగా పెందలాడే భోజనం చేసేసి , ఆ కార్యక్రమానికి అవసరమయిన రోలూ రోకలి, జల్లెడా, మూకుడూ వంటి సరంజామా అంతా సిద్ధం చేసేసి కూర్చున్నారు అత్తగారు . సరిగ్గా అదేసమయంలో రెండో ప్రమాద హెచ్చరికగా  చెవుల్లో చిన్నగా సైరన్ మోగింది కానీ  నేను దాన్ని వినిపించుకోలేదు.

”  కరెంటు మిల్లులో వేసిన పిండి తింటే వేడి చేస్తుందట . అయినా అదేవంతపనీ . నాలుగు దెబ్బలు పడితే నలిగి కూచుంటుంది  ”  అంటూ రోకలి నా చేతికిచ్చేసరికి గానీ నాకు బల్బు వెలగలేదు . ఓర్నాయనోయ్ …పిండి పోటెయ్యడమా ఎప్పుడూ కోలాటం  ఆడిన చేతులు కూడా కావే ఇవి ….రోకలి ఎత్తెత్తి దంచాలా ” అని లోపల్లోపల కుమిలిపో తూ   ”  అమ్మో…!నాకు చాతకాదండీ ” అనేసరికి   , “నేర్చుకుంటే సరి  అదేవంత  బ్రహ్మవిద్య! ఊ… కానియ్”  అని,  నేను ‘ ఊహు’  అంటున్నా వినిపించుకోకుండా  అప్పటికే ” ఆహూo…” అంటూ దంచుడు మొదలెట్టేసారు అత్తగారు.

అత్తగారికి ఎదురాడ్డం నేర్చుకోని ఆ రోజుల్లో ఇక చేసేదేముంది . ‘ దంచూ దంచూ…బాగా దంచూ’  అని పాడుకోటం దంచుకోటం తప్ప.

అలవాటులేని ఆచమనం లాగా  సాగుతుంది పని . పడాల్సినచోట తప్ప అంతటా పడుతుంది రోకలి . అంత పొడవున్నరోకలిని   ముందుకీ వెనక్కీ పడిపోకుండా   బేలన్స్ చేయలేక నానా హైరాన పడ్డాను . ఒక చేత్తో గాల్లోకి లేపిన రోకలిని   ఇంకో చేతిలోకి మార్చుకుంటుంటే  చెయ్యి జారి అత్తగారి నెత్తిన పడతానని బెదిరించింది. ‘ హవ్వ పరువు తియ్యకే ‘ అని బ్రతిమాలి బామాలి ఎలాగో దార్లోకి  తెచ్చుకునేసరికి  తలప్రాణం తోక్కొచ్చింది.   కత్తికట్టిన కాలం గురించి తెలుసుకానీ,  రోకలెత్తిన కాలం కూడా ఒకటుంటుందని  అది నాకే ఎదురవుతుందనీ   కలలోనైనా కలగనలేదు.

అదేం చిత్రమో ఎంత దంచినా బియ్యం తరుగుతున్నట్టు అనిపించడంలేదు . విఠలాచార్య సినిమాలోలాగా ‘ డొయ్యి…..’ మని అడుగునించీ   ఊరిపోతున్నాయేమో అని   అనుమానం వచ్చింది. ” హే ప్రభూ ఏవిటి ఈ పరీక్ష !? కాలాన్ని బట్టి     ఇష్టాలు మారుతున్నట్టే కష్టాలూ  మారాలికదా . సతీ సక్కుబాయికీ నాకూ ఒకేటైపు కష్టాలు పెట్టి , చూసిన సినిమానే మళ్ళీ మళ్ళీ చూడాలని సరదాపడుతున్నావే నీకిది న్యాయమా !? నోటికి కాస్త రుచిగా తినాలని కోరుకోవడమే  పాపమా ? ఆ కోరికని దాచుకోకుండా అత్తగారిముందు ప్రకటించడమే  నేరమా ? ఎందుకు స్వామీ ఈ పిండి పరీక్ష ? అని  అలవాటుగా కలవరిస్తు  ఏ మూలనుంచయినా ఆ దేవదేవుడు డింగ్మంటూ ప్రత్యక్షమయి నా కష్టాన్ని తీర్చకపోతాడా అని దిక్కులు చూసాను.

మా అత్తగారు వాయ వాయకీ ” అబ్బో…భలే దంచేస్తున్నావే ” అంటూ నన్ను భుజం తట్టి ముందుకు తోస్తుంటే నేను నిజమే కాబోలని మురిసిపోయి మరిoత ఎగిరెగిరి దంచడం మొదలుపెట్టాను . అలా ఒక పూటంతా దంచగా దంచగా పని ఒక కొలిక్కివచ్చింది . కానీ అప్పటికి ఒంట్లో ఓపికే కాదు బూరెలు తినాలన్న కోరికా కొడిగట్టిపోయింది . ఆ మాటే అత్తగారితో చెప్పేసాను.

”   నాకు బూరెలు తినాలని లేదు  మొర్రో  ” అని  ఏడుపు మొహం పెట్టుకున్నాను. ” ఓసి పిచ్చిదానా …..అలా ఢీలా పడిపోతే పనులవుతాయా . సగం పని అయ్యేపోయింది . ఇంకెంత  తాటిపళ్ళు గుజ్జుచేసి కలిపేసి ఒండేసుకోవడమే ” అనేసారు ఎంతో తేలిగ్గా . దాంతో నేనూ పారిపోయిన ఉత్సహాన్ని తిరిగితెచ్చుకుని ‘ఓస్  అంతేనటే పిచ్చి మొహమా’  నాకు నేను నచ్చచెప్పుకుని…. నడుం  బిగించి కూర్చున్నాను.    తీరా కూర్చున్నాకా తెలిసింది  అదంత ఆషామాషీ వ్యవహారం కాదనీ. తాటి పళ్ళు గుజ్జుతీయటం అరటి పండు తొక్క తీయటం ఒకటికాదని  .  పండులో ఉండే చిక్కని పీచునుంచీ మెత్తని గొజ్జుని వేరు చేయటానికి  చాలా భుజబలం అవసరమని .

మా అత్తగారు చేతులకి మట్టి అంటకుండా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించే మంత్రిగారిలా  తాటిపండు నుంచి మెత్తని గొజ్జును సేకరించడం ఎలా ? అనేదాన్ని ఎంతో చాకచక్యంగా పైనుంచీ  చక్కని అభినయంతో ప్రదర్శించి చూపించి  , “అదిగో అవతల ఎవరో పిలుస్తున్నారు . నే చూసొస్తాను నువ్వు కానీయ్” అని   చక్కగా  చేతులు దులుపుకు చెక్కేసారు.

నేను మళ్ళీ ‘ అలో లక్ష్మణా ….!’అంటూ నా ప్రారబ్ధానికి మిక్కిలి వగచుచూ పనిలో పడ్డాను . చేతులు విరిగేలా, భుజాలు వాచేలా నాకు చాతనయినంతగా కష్టపడుతూ ‘ ఆచారాలు-  అగచాట్లు  ‘ అనే విషయం మీద మనసులోనే ఒక దీర్ఘ కవిత   రాసేసుకున్నాను ( కంగారుపడకండి ఇప్పుడది వినిపించను ) .

‘ఇదిగో వస్తా ‘ అన్నావిడ ఎంతకీ రారేవిటీ ? పనంతా నా నెత్తిన పడేసి ఎక్కడికి మాయమయిపోయారు ! ఇదేం పద్ధతి ?.అని నేను అలోచిస్తుంటే , ఆకుపచ్చ అంచున్న ఎర్ర చీరలో ఆకుల మధ్య మందారంలా మెరిసిపోతూ ప్రత్యక్షమయ్యారు అత్తగారు . మొహానికి పౌడరు రాసుకుని తల నున్నగా దువ్వుకున్నట్టున్నారు . మెడలో మేచింగు   పగడాల దండ ధరించారు. బూరెలొండటానికి ఇంత ముస్తాబెందుకబ్బా అని ఆశ్చర్యపోతూనే  ‘ ఒకవేళ ఇదీ ఆచారం కాబోలు  బాగానేవుంది !’ అనుకున్నాను .

‘చీర కుచ్చెళ్ళు సర్దుకుంటూ  పని ఏ మాత్రం అయిందీ అని ఆరాగా అడిగి ” అబ్బో…భలే తీసేశావే !” అంటూ  అలవాటయిన  లౌక్యాన్ని తిరిగి ప్రదర్శించారు అత్తగారు  . ఈసారి నేను ఆనందపడలేదు సరికదా ” ఆహా ఏమి  రచనా చమత్కృతి ” అని హాశ్చర్యపడ్డాను.  అత్తగారు కాస్త దూరంగా  ఎత్తుపీటమీద కూర్చుని , నే తీసిన తాటిపండు గొజ్జుకు సరిపడా పిండీ బెల్లం నాతోనే కలిపించి, ” ఇంకేవుందీ అయ్యేపోయింది” అన్న దంపుడు డైలాగుని మళ్ళీ కొట్టి , పొయ్యిమీద నూనె మూకుడు పెట్టించారు .

ఇందాకటి అభినయం తిరిగి కొనసాగిస్తూ ” నూనెలో పిండిని గుండ్రంగా వదిలితే బూరెలు,  పలచగా వేస్తే అప్పాలు అయిపోతాయి  అంతే ” అన్నారు .  మొదటివాయ వేయించి తీసాకా   వినాయకుడికీ, గ్రామదేవతకీ, ఇష్ట దైవాలకీ అంటూ పొయ్యి చుట్టూ నైవేద్యాలు పెట్టించారు ….”  రెండో వాయ , మూడో వాయ కూడా దగ్గిరుండి నాతో వేయించి ” వంద వాయలయినా ఇదే పద్ధతి . ఇలా వేసి అలా తియ్యడమే “  . నువ్వు కానీయ్ …నేనలా శాంత అత్తయ్యగారి ఇంటివరకూ వెళ్ళొస్తాను .  వాళ్ళింట్లో మూణ్ణాళ్ళ క్రితం కోడి పట్టు పెట్టిందట . ఆ మాయదారి పెట్ట ఒక్క గంటన్నా పట్టుమీదలేకుండా షికార్లు పోతుందట. అలా అయితే పిల్లలెలాదిగుతాయ్ . అదేవిటో  వాళ్ళకి కోడి పట్టు అచ్చిరాదు .ఎప్పుడూ  ముచ్చటగా మూడు పిల్లలయినా దిగవు .  పాపం ఏం చేయాలో తోచక నాకు కబురంపింది . అన్నారు . వెళ్ళటానికి తొందరపడుతూ .

“మనకు బాగా అచ్చొచ్చిందని మీరు కానీ పొదుగుతూ కూర్చుంటారా పట్టుమీద “ అనబోయి మర్యాదకాదని మాటలు మింగేసి ఒట్టి క్వశ్చన్ మార్కు మాత్రం మొఖానికి తగిలించి చూసాను . ఆన్సరుగా అత్తగారు  పెంకి పెట్టలని దార్లోకి తెచ్చే మంత్రం ఒకటి ఉందనీ ,  అది కోడి చెవిలో మూడుసార్లు చెప్పి ,  దాన్ని బుట్టచుట్టూ తిప్పి పట్టుమీద వదిలేస్తే నిక్షేపంలా పడుంటుందనీ మేతకి కూడా లేవదనీ  ఉత్సాహంగా  చెపుతుంటే నేను ఆశ్చర్యంలో పడిపోయాను .

నే తేరుకునేలోగా   శాంత అత్తయ్యగారి పనమ్మాయ్ సూర్యావతి వెనకే పెళ్ళినడక నడుచుకుంటూ దొడ్డి గుమ్మం దాటేయబోయిన అత్తగారు  అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టూ  స్పీడుగా వెనక్కి నడిచొచ్చి ” నేనలా వెళ్ళగానే నోట్లో వేసుకుంటావేమో….  వేడిగాతింటే వెర్రెక్కుతుందoటారు జాగ్రత్తేవ్ ….. అసలే ఆనవాయి లేని పనొకటి  “ అనేసి మళ్ళీ ఓసారి  కుచ్చిళ్ళు సర్దుకుని ,పెళ్ళినడక నడుచుకుంటూ వెళ్ళిపోయారు  . నా గుండెల్లో  రాయి పడింది .

ఎప్పుడో కానీ గుమ్మం దాటే అవకాశం రాని అత్తగారు ఇలావెళ్ళి అలా రావటం అన్నాది ఒట్టిమాటే . ఆ వరసలో ఉన్న పది గుమ్మాలయినా ఎక్కి దిగకుండా వెనక్కి మళ్ళరు .  జరుగుతున్నదంతా పెద్ద కుట్రలా అనిపించింది . తన హెచ్చరికలని ఖాతరు చేయని నన్ను నీ చావు నువ్వు చావని వదిలేసి పోయింది నా సిక్త్ సెన్స్ .

నాకు మమ్మీ…..అని గట్టిగా ఏడవాలనిపించింది . కానీ నా ఏడుపు వినిపించేంత దూరంలో మమ్మీ లేదని గుర్తొచ్చింది . నాకు అత్తగారిని నిందించాలో …నా ప్రారబ్ధానికి  చింతించాలో అర్ధం కాలేదు. ఇక చేసేదేవీలేక ”  అయితే అరిసెలపాకం- కాకపోతే కాణిపాకం “ అని ఒక కొత్తసామెత చెప్పుకుని ”   నాముందున్న పెద్ద బేసినుడు పిండినీ  బూరెలు , అప్పాలేకాక  చేగోడీలు, చక్కిడాలు వంటి ఆకారాల్లో మలుస్తూ కొత్త పిండి వంటలకు ప్రాణం పోసే ప్రయత్నం చేసాను .

ఊరినించీ దిగిన రాజుగారు పొయ్యిదగ్గిర మసిపట్టిన  నా ఏబ్రాసి మొహాన్ని  చూసి గతుక్కుమని  నాలుగడుగులు వెనక్కీ  ఒక్కడుగు ముందుకీ వేసి  ”  చందమామ కథల్లో రాక్షసి  బొమ్మలా అలా అయిపోయావు ఏవిటోయ్. ఏ మాంత్రికుడు నిన్ను ఇలా మార్చేసాడు  . చెప్పు  వాడ్ని  తక్షణమే బంధించేస్తాను ”  అన్నారు  మీసాలు  మెలేసి వెటకారంగా నవ్వుతూ .

పూర్వ వృత్తాంతమతా తెలిపి బావురుమన్నాను   . చలించిపోయిన రాజుగారు  ” అకటా!!” అని అదేపనిగా బాధపడి “ఏవయినా సాయం చేద్దామంటే ఇది వంటింటి  వ్యవహారం అయిపోయింది . మగాళ్ళు పొయ్యికి పదడగుల దూరంలో ఉండటం మా ఇంటాచారం .  నేను కొంచెం మాడ్రన్ భావాలు కలవాడిని కాబట్టి ఇలా మూడడుగుల దూరం వరకూ వచ్చేసాను .  అని చుట్టూ పరికించి  , ఎవరూ తనని చూడ్డంలేదని నిర్ధారించుకుని  ,  ఒకడుగు ముందుకేసి  “ఓ నా ముద్దమందారం కావాలంటే   నీకు కష్టం తెలీకుండా  ఉండటానికో కథ చెపుతాను  . అది  వింటే నువ్వు వద్దన్నా నవ్వేస్తావు తెలుసా అన్నారు  ” భుజాలు కుదుపుకుంటూ కితకితల నవ్వొకటి  ఒంపేసి .

‘ ఆకలేస్తే రోకలిమింగు అరగకపోతే తిరగలి మింగు’  అన్నాట్ట వెనకటికొకడు .  ఈ కష్టమేమిటిరా పరమాత్మా అని నేనేడుస్తుంటే … కథలూ కాకరకాయలూ అంటారేం   ! నా వల్ల కాదు పొమ్మన్నాను  .  అయినాసరే అదేం  పట్టనట్టూ  ” దేవీ కష్టములెట్లున్నానూ …. నా కథ విని తీరవలె ” అంటూ అంగడి పాలైన హరిశ్చంద్రుడి పోజులో  చెప్పుకుపోయారు . ఆ కథేవిటంటే ……

అనగనగా ఆయన చిన్నప్ప్పుడు   ‘నచ్చిన పండుగ ‘   వ్యాసం రాసుకురండి అని తెలుగు మాస్టారు చెపితే ,     నాకు నచ్చిన పండుగ మా తాతయ్య తద్దినం అని రాసుకెళ్ళారట . ఆ ఒక్క లైనూ చదివి తరువాతి విషయం చూడకుండానే తెలుగు మాస్టారు ” బుద్ధిలేదటరా ” అని బడిత పూజ చేసేసి అంతటితో వదలక ఆ వ్యాసం ఇంటికి పంపించారు. ఇంట్లో ఉన్న పెద్దలందరూ తలో రెండూ వాయించి , ఆ వ్యాసాన్ని వీధిలోకి వదిలారట. ఇక అంతే ఆ వీధిలో వుండే  ఇరవై ఆరు కొంపల వాళ్ళూ తలో మొట్టికాయ వేస్తే అంత సాహసం చేయలేని ఇతరులు కనపడచోటల్లా కాలర్ పుచ్చుకుని ” తప్పుకదండీ బాబుగారు” అని అక్షింతలు వేసేసారట. పాయసం, గారెలూ వండుకుతింటాం  కాబట్టి  అదీ ఒక పండగే అనుకున్నానని చెప్పినా ఒక్కరూ  నమ్మలేదట.  దాంతో ఆయనకి బాగా కోపం వచ్చేసి , తనని ఇంత అవమానపరిచిన పాయసం -గారెలూ జన్మలో తినకూడదని నిర్ణయించేసుకుని , ఒక కాగితం మీద గారెలు, పాయసం అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి , కాశీ వెళుతున్న చిన్న తాతయ్య కి ఇచ్చి వీటిని తనపేరు చెప్పి కాశీలో వదిలేసి రమ్మన్నారట ( వాళ్ళ నానమ్మ గుమ్మడికాయ తినమoటే కాశీలో వదిలేసాను  ఇక తినను అని చెప్పటం  విన్నారట )  .  అది చూసినవాళ్ళంతా ” తెలివి తెల్లారినట్టేవుంది ” అంటూ మళ్ళీ ఒకరౌండువేసి, బలవంతంగా పాయసం గారెలూ నోట్లో కుక్కి వ్రతభంగం కావించారట  .  అక్కడితో వదిలిపెట్టకుండా ఏటా వినాయక చవితికి క్రమం తప్పక కథ చదువుకుని అక్షింతలు జల్లుకున్నట్టూ , ప్రతీ తాతయ్య తద్దినం లోనూ  ఈ అజ్ఞానపు కథని  చెప్పుకుని అబ్బాయి నెత్తిన అక్షింతలు వేయటం ఆచారంగా వస్తుందట .

కథంతా అయ్యాకా “నవ్వవోయ్ “ అంటూ దోసిలి పట్టుకు కూర్చున్నారు  .  అడిగిన వెంటనే నవ్వేస్తే లోకువైపోతావని  “ఇప్పుడు వీలుపడదు  తరవాతెపుడయినా సావకాశంగా వున్నప్పుడు నవ్వుతా “పొమ్మన్నాను .

   ***

” ఇందుకే ఆనవాయితీ లేని పనులు చేయకూడదు అనేది “.

” మా కాలంలో వద్దంటే ఊరుకునేవాళ్ళం.  ఇలాంటి వితండ వాదనలు మేం ఎరగవమ్మా ”

ముందు రోజు పడ్డ శ్రమ ఫలితంగా జొరం తెచ్చుకుని  మూలుగుతూ పడున్న నన్ను చూసిపోటానికొచ్చిన  మా పిన్నత్తగార్లూ , పెద్దత్తగార్లూ, వాళ్ళ కోడళ్ళూ , ఇంకా వరసకి  పిన్నమ్మలూ, కన్నమ్మలూ అంతా చాప చుట్టూ కూర్చుని మధ్యలో పళ్ళెం నిండా ఉన్న బూర్లెలు అప్పాలు తింటూ పై విధంగా చింతిస్తున్నారు .

” ఏవిటో…  అచ్చిరాదని వదిలేశాం వద్దంటే విన్నదికాదు” .  అంటున్నారు అత్తగారు తింటున్నవాళ్ళకి మంచినీళ్ళు అందిస్తూ .

” అనుభవం అయింది కదా ఈసారి వింటుందిలే…..ఇకనైనా ఇలాంటి ఆనవాయితీ లేని పనులు చేయ్యకండి” అని అక్కడ ఉన్న కోడళ్ళందరికీ ఏకమొత్తమ్మీద వార్నింగ్ ఇచ్చేసిన మా పెద్దత్తగారు ” నువ్వేవన్నా వంటకంలో  చేయిపెట్టావా ?” అనడిగారు మా అత్తగారిని .

“అయ్యో…. లేదు అప్పయ్యా నేనసలు వేలుకూడా పెట్టందే … పెద్దావిడ మాటే పదే పదే గుర్తొస్తుంటే ఎందుకన్నా మంచిదని  దూరంగానే వున్నా .  తాటిపండుని చేత్తో తాకనన్నా తాకలేదు”  అన్నారు .

” అలా అయితే నువ్వు ఈ బూరెలు నిక్షేపంగా తినొచ్చు . వండినవాళ్ళు తినడమే మనకి ఆనవాయిలేదు ”  అంటూ అత్తగారికి బూరెల పళ్ళెం  అందించి నాకేసి  అదోలా  చూసేరు మా పెద్దత్తగారు  .  ఆ చూపులో అయ్యిందా నీపని అన్న అర్ధం ద్వనించింది .

మా అత్తగారు నాకేసి జాలిగా చూసి , తోటికోడలి కోసం తప్పక తింటున్నట్టూ  ” ఆ…ఏదో ఆచారం అన్నారని తినడం తప్పిస్తే …….పూర్ణం బూరెల రుచి వీటికెక్కడొస్తుందీ ”  అంటూ బురె తీసి బుగ్గన పెట్టుకున్నారు .

నేను నీరసంగా నిట్టూర్చి ” దాల్ మే కాలా హై , కుచు కుచ్ హోతాహై ” అని  హిందీలో చింతించడం మొదలు పెట్టాను అక్కడున్నవాళ్ళకెవరికీ అర్ధం కాకుండా .

అత్తగారికి తెలిసింది కోడి మంత్రం ఒకటేనా …..అన్న అనుమానం మీక్కూడా వచ్చిందా ! తప్పు లెంపలేసుకోండి . ఇప్పుడు చెప్పండి ’ తంతే బూరెల బుట్టలో పడ్డట్టా …. పడనట్టా  !?’

–దాట్ల లలిత

 

“అలసిన వేళనే చూడాలీ….”

 

అలా నా జీవితం నువ్వుపప్పు జీడిలా తియ్యగా కమ్మగా సా…….గుతూ వుండగా ,  ఒక వెచ్చని సాయంత్రం  ……

‘ సోగ్గాడిపెళ్ళం’ అనే పతిభక్త సినిమానుంచీ ” కొండకోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్యపైన ….రాయల్లెవున్న ఆ రామయ్యపైన ” అన్న ఏసుదాసు కీర్తనని భక్తితో ఆలకిస్తూ బిందె, చెంబూ బరబరా తోమి పడేసాను. ఉప్పూ చింతపండూ కలిపి తోమితే ఇత్తడి పుత్తడిలా మెరుస్తుందని ఆ మధ్యన మా అత్తగారు ఎవరికో చెపుతుంటే  పరధ్యానంగా  విన్నానేమో ….ఆ పాఠం అవసరానికి పనికొచ్చింది. (అదేవిటో నేను స్కూలుకెళ్ళి  శ్రద్ధగా నేర్చుకున్న పాఠాల కంటే , ఇలా అశ్రద్ధగా విన్న అత్తగారి పాఠాలే జీవితంలో ఎక్కువగా అక్కరకొస్తుంటాయి)

నే తోమి బోర్లించిన బుడ్డి చెంబు బాల భానుడిలా ప్రకాశిస్తుంటే , చెప్పొద్దూ ….నా తోముడు కళాప్రావీణ్యానికి నాకే తెగ ముచ్చటేసింది   . నా చేతిలో పడితే రాయైనా రత్నమై మెరుస్తుందేమో అన్న అనుమానం తన్నుకొచ్చింది. . “నువ్వు సూపరే పిల్లా” అని ఆయన అస్తమానూ  అనేది ఇందుకే కదా అని తలుచుకుంటే సిగ్గు ముంచుకొచ్చింది .  ఆ సిగ్గుతోనే  వంచిన నడుం ఎత్తకుండా రెండెకరాల   వాకిలీ గాలివాలుకు గబా గబా తుడిచేసి , ఓ  రెండు గాబుల నీళ్ళు తోడి కళ్ళాపు చల్లేసి , ఈ చివర్నించీ ఆ చివరికి  నాకొచ్చిన చుక్కలముగ్గులూ, చిక్కులముగ్గులూ అన్నీ పెట్టుకుంటూ కూర్చునేసరికి  సూరిబాబు మొఖం  వేళ్ళాడేసుకుని చెట్లవెనక్కి జారిపోయేడు .

అమ్మో…! అపుడే వంట వేళయిందా .  పొద్దున్నేకదా వండి పడేసాం!’ అని విసుక్కోకుండా మళ్ళీ హుషారుగా వండేసి- మళ్ళీతినేసి, మళ్ళీతోమేసి – మళ్ళీతుడిచేసి…..చీ…చీ…ఇంతేనా వెధవ జీవితం అన్న పాడుఆలోచన  అణుమాత్రమయినా  రానీయకుండా ……’పతియే ప్రత్యక్ష దైవమూ …నా అత్తారిల్లే స్వర్గమూ’ అని  పతిభక్తి పాటలు పాడుకుంటూ ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఎప్పుడెప్పుడు కిందా మీదా పడుతూ ఈ పాచి పనులన్నీ చేసేసుకుందామా అని కలలు కంటూ పడుకోటం  ‘ఆహా …. జీవితమే సఫలమూ ‘అని అరమోడ్పు కన్నులతో నేను తన్మయం చెందుతుంటే ….

కత్తిపీటా కూరలబుట్టా పట్టుకుని అటుగా వచ్చిన అత్తగారు నీరసంగా అరుగు చివర కూలబబడ్డారు. “ పంచాయితీ ఆఫీసులో ఎమ్మారావో ఎవడో  వచ్చి కూచున్నాడట  .  భోజనం ఏర్పాట్లు చూడమని మీ మావయ్య కబురంపేరు ” అంటూ ఉల్లిపాయలు ఒలవటం మొదలుపెట్టారు.  నాకళ్ళల్లో నీళ్ళొచ్చాయి అత్తగారి అవస్థ తలుచుకుని  ( సందేహం అక్కరలేదు నిజంగా అందుకే )

“ అప్పుడప్పుడూ కసురుకున్నా,  విసురుకున్నా నరసమ్మ చేసిన చాకిరీ తక్కువేం కాదేవ్. పాపం బండ గొడ్డులాగా రోజల్లా ఎంత పని చేసేది “అన్నారు అత్తగారు ఉల్లిపాయ తరుగుతూ  .  ” బాగా చెప్పారు ” అన్నాను    కళ్ళొత్తుకుంటూ . ఇంటిపనితో నాకూ వంట పనితో అత్తగారికి ఒళ్ళుపులిసిపోతుంటే మా జీవితాల్లో నరసమ్మలేని లోటు బాగా తెలిసొస్తుంది.

“ఇప్పుడు ఎన్ననుకుని ఏం లాభంలెండి  ! చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవా అన్నారు. నరసమ్మని వదిలించుకున్నాం అనుకున్నాం కానీ, అదే  మనల్ని  విదిలించుకుని వెళ్ళిపోయిందని అది వెళ్ళాకే తెలిసింది” అన్నాను నరసమ్మ దివ్యమంగళ రూపాన్ని ఓసారి  స్మరించుకుని.

“ మీ కొంపలో కాపీ గిన్ని తోమలేక సచ్చిపోతన్నాను  తల్లో- అని పాపం ఎంత మొత్తుకునేది . కనపడ్డవాడినల్లా కాఫీకి పిలుకొచ్చే  ఈ మగ మహారాజులకేం తెలుసు గిన్నెలు తోమలేక ,కూరలు తరగలేక ఆడవాళ్ళు పడే అవస్థలు ” అంటూ  ఆవేశ పడ్డారు అత్తగారు .

నరసమ్మకీ మాకూ మధ్య  ఋణానుబంధం   తెగిపోయి చాన్నాళ్ళయింది  . మరో నరుసు కోసం మేం తీవ్రంగా  ప్రయత్నించాం కానీ ఇంతవరకూ  మాకాభాగ్యం కలగలేదు.

“ఇక్కడపుల్ల  అక్కడ పెట్టక్కరలేదని  పెళ్ళికి ముందు పలికితిరే ! అంతా  ఉత్తుత్తేనా  . మల్లెపువ్వులాంటి  ఇల్లాలిని  మసిగుడ్డ వలె  మార్చితిరి కదా  ప్రభూ తమకిది  తగునా  .  అని వీలుచిక్కినప్పుడల్లా దెప్పిపొడుస్తూ “ బ్రోచేవారెవరురా….. ! “   అని ముక్కుచీది  రాగంతీస్తే  ,” పొలం  పనులు బిగ్గా  దొరుకుతుంటే ఇంటిపనికెవరొస్తారు . ఒకవేళ వచ్చినా మీరు నిలబడనిస్తారా . అయినా ఎవరింటి పని వాళ్ళు చేసుకోటం కూడా బరువే !    జోడెద్దుల్లా ఇద్దరున్నారుగా ఎంచక్కా ఆడుతూ పాడుతూ దున్నేసుకోండి “  అంటూ కాడి మా భుజాన పడేసి చల్లగా గట్టెక్కిపోయేరు . (అకటా!  ఎంత దయలేనివాడు ఈ గండరగండడు)

” ఇందుకే బాబూ….ఈ పల్లెటూర్లంటే నాకు చిరాకు.  ఇదే   మా సిటీలో అయితేనా ఓ…అంటే వందమంది   …” అంటూ పుండుమీద కారం చల్లేసి వెళ్ళింది మా చెల్లాయమ్మ  .

” మీ కొంపలో పని చేయలేనని వెళ్ళిపోయిందటగా నరసమ్మ….ఇంకా ఎవరూ కుదరలేదా ? ఎలా చేసుకుంటున్నారో పాపం”  అని సానుభూతి చూపించడానికీ, కోడలుతో అత్తగారు చేయిస్తుందా లేక కోడలే అత్తగారికి పని పురమాయిస్తుందా అని  కనిపెట్టిపోడానికి    వంతులవారీగా వచ్చివెళుతున్నారు అమ్మలక్కలు .

అక్కడికీ ఒకరోజు “అయిందేదో అయింది…ఏరు మీద కోపగించి నీరు తాగడం మానేస్తే ఎండిపోయేది మనగొంతే కదా! అబ్బులు ద్వారా నరసమ్మకి రాయబారం పంపిద్దాం.   సంధి ప్రయత్నాలు కావిద్దాం  . ఏవంటారూ ?” అని  అలిసిన ఒళ్ళు  నొక్కుకుంటూ ఆశగా అడిగాను  .   “అప్రదిష్ట  “  అంటూ ఒక్క ముక్కలో తేల్చేసారు  అత్తగారు .

ప్రత్యక్ష దైవాలకి మా మీద కనికరం ఎలానూలేదు . కనీసం మీరయినా మా ప్రార్ధన ఆలకించండి  అంటూ పటాల్లో దేవుళ్ళకి మొక్కుకున్నాం. శుక్రవారంలోగా పనిమనిషి దొరికితే పాయసం వండి నైవేద్యం పెడతానని లచ్చిందేవికి మా అత్తగారు ఆశపెడితే ,   ఆలస్యం అయినా పర్లేదు ఆదివారం నాటికయినా పనయ్యేటట్టుచూడు స్వామీ  అంటూ నేను ఆంజనేయుడికి అప్పాలదండ మొక్కేసాను .  శుక్రవారాలూ ఆదివారాలూ  క్రమం తప్పక   వస్తూనేవున్నాయి .  పాయసం అప్పాలతో మాకు మొహం మొత్తిపోయాకా ….గ్రామ దేవతకి కోళ్ళూ కొబ్బరికాయలూ కూడా మొక్కేశాం. మా ఇంటికో పనిమనిషి వచ్చేవరకూ పండుగలూ , బంధువులూ రాకూడదనీ…..పంచాయతీ అఫీసులన్నీ మూతపడిపోవాలనీ కోరుకున్నాం.

అలా నే  కోరుకున్నవన్నీ జరిగిపోతే మూడు మూళ్ళు పదహారయ్యేది ,నా జడ రెండు బారలయ్యేది, మా తోడికోడలు ముక్కు తప్పడయ్యేది

మా అత్తగారు   ఉల్లిపాయలు తరిగిన పళ్ళెం నా చేతికిచ్చి  …నీరసంగా గోడకి ఘటం జారేసారు  . కాళ్ళు సాగదీసి మెల్లగా ఓ మూలుగు మూలిగి” ఏమేవ్…ఆ  జీడిపిక్కల కత్తిపీట ఇలా తగలెయ్ ….. గుప్పెడు జీడిపప్పు కొట్టి కోడిగుడ్డు  కూరలో వేద్దాం  . కాసేపట్లో సంతలోంచీ చేపలూ  రొయ్యలూ వచ్చిపడతాయ్ . ఉల్లిపాయ నూరి ఉంచితే  పలావూ , పులుసూ   చేసి తగలెయ్యొచ్చు. ( మా అత్తగారికి కోపం వస్తే అన్నిటినీ తగలేస్తానంటారు – అపార్ధం చేసుకోకూడదు మనం … అదొక ఊత పదం అంతే )  . నిచ్చెనేసుకుని అటకమీంచీ పలావుడేగీశా దించి, తోమి తగలెయ్ . అలాగే మూడు సేర్లుడికే తెపాళా తీసి ఎసరు పడెయ్. అంటానికి ఒక్కడే అంటారు కానీ , తినేటప్పుడు  నలుగుర్ని వెంటేసుకొస్తారు .   ఒక్కడికీ పెట్టి మిగిలినవాళ్ళని  మీ ఇంటికెళ్ళి తినండి అంటామా….హవ్వ…అప్రదిష్ట అంటూ పనిలో పడ్డారు.

నేను దేబ్యం మొహం పెట్టుకుని  కాకినాడలో కాపురం పెట్టిన మా పద్దూని  తల్చుకున్నాను. చీకటి పడుతందనగా రెండు గుప్పెళ్ళు బియ్యం కుక్కర్లో పోసి, ఒక అరటికాయో రెండు బంగాళాదుంపలో అలా అలా వేయించేసి, ఎంచక్కా చిలకలా ముస్తాబయ్యి  సన్నజాజులు మాల కట్టుకుంటూ  ” నీవులేక వీణా  …… “ లాంటి  ఎదురుచూపుల పాటలు పాడుకోవటం, వంట చెయ్యడం విసుగనిపిస్తే సుబ్బయ్య హొటల్నుంచీ  బోయినం పార్సిల్  తెచ్చుకోవటం, బోరు కొట్టినపుడల్లా సినిమాకో వాకలపూడి బీచ్ కో జంట గా వెళ్ళిరావటం ,  అహ ఏమి హాయిలే హలా ….అంటూ మధురస్వప్నాలు చూపించి  నన్ను పెళ్ళికి ఉసిగొలిపింది పాపాత్మురాలు కనిపిస్తే పీక పిసికేద్దును.

సంతలో దొరికిన జల చరాలు చాలవన్నట్టూ  , చేలోంచీ ‘గిన్నికోడి ‘ అనబడే  భూచరాన్నొకదాన్ని  భుజాన్నేసుకుని  ఒగుర్చుకుంటూ  వచ్చిపడిపోయాడు  అప్పడు .(  ఊర్లో ఉన్న నూటొక్క మంది అప్పయ్యలకు లేని భాగ్యం వీడికి ఉండటం మూలాన అందరూ వాడిని మెల్లకన్నప్పడు అంటారు . చేలో కోళ్ళనీ దూళ్ళనీ మేపుతుంటాడు . వాడి మకాం కూడా చేలోనే . ఇంటిమీద కాకి అరిచినా  రోడ్డుమీదకి గవర్నమెంటు జీపొచ్చినా  ఉరుకులు పరుగులమీద ఊళ్ళోకొచ్చి పడిపోతాడు )

” మళ్ళీ  ఇదెందుకురా   ఏ అరటికాయో ,ఆకాకరకాయో  వండుదాంలే ? ” అన్నారు అత్తగారు విసుగ్గా .

దానికి వాడు గిలగిచ్చకాయలా ఒళ్ళంతా  ఊగిపోయేలా నవ్వేసి “బలేవోరే అయ్యాగారూ….. ఎమ్మారావుగారికి  కాయా కసరా  ఏసి పత్తిం బోయినం ఎడతారా ! కక్కా ముక్కా ఒండి పులావు కబాబూ  సేయ్యాలండి   . ఆనక ఆరు ఒణ్ణం తిని సెయ్యి కడుక్కున్నప్పుడల్లా మన లోగిట్లో తిన్న బోయినo గేపకం  వచ్చీయాలండి. అసలుండీ …ఆరు బోయినానికుంటారని కబురు తెలుసుంటే , ఏజెన్సీనించీ ఏట మాసం అట్టుకొచ్చీద్దునండి. ఇలా ఉన్నపళంగా బోయినం అంటే ఉన్న దాంతోనే సర్దుకోవాలండి మరి “ అని కొంచెం నిట్టూర్చేసి,     తలకున్న తువ్వాలు  విప్పి దులిపి నడుముకి  ముడేసాడు.   “సిన్నయ్యగారూ  పెద్ద కత్తిపీట, మాసం కత్తీ   ఇలాగడెయ్యండి చనంలో ఈటిని వొంటకి రెడీ సేసేత్తాను అని   కదనోత్సాహంతో  కదులుతున్నవాడు నా కళ్ళకి కూర్మావతారంలా  కనిపించాడు.  “పోన్లేరాబాబు సగం భారం తగ్గించావు “అని మనసులోనే  ఒక నమస్కారం చేసుకుని వాడడిగిన   సరoజామా అందించాను  .   ఉత్తప్పుడు  మెట్ట తాబేలులా ముక్కుతూ మూల్గుతూ తిరుగుతాడా  ఇంటికెవరన్నా చుట్టాలో పక్కాలో వచ్చారని తెలిస్తేమాత్రం  పీత పరుగే …. పట్టపగ్గాలుండవు  .  ఊళ్ళోకి అప్పుల వసూళ్ళకి వచ్చే బేంకోళ్ళు, తగువులు తీర్చడానికొచ్చే పోలీసోళ్ళు, సీజన్లో వచ్చే పొగాకు బోర్డోళ్ళు పంచాయతీ మీటింగులకి హాజరయ్యే ఆఫీసర్లూ అంటే వాడికి  అదోరకమైన గౌరవం ఎందుకోమరి . ఇక ఎలక్షన్ల  ప్రచారంకోసం  పిడత మొహం పెట్టుకొచ్చే ప్రతి రాజకీయనాయకుడూ వాడికి  పవర్ స్టారే   .  పార్టీలతో సంబంధంలేకుండా అందర్నీ ఆదరించేయాలని తహతహలాడిపోతాడు .

గుమ్మంలోఅడుగుపెట్టినవాళ్ళకి   కాళ్ళు తొలుపుకోటానికి  చెంబుతో  నీళ్ళందించడం  దగ్గరనుంచీ  భోజనం పూర్తయ్యాకా చేతులుమీద నీళ్ళు పొయ్యటం వరకూ అన్నీ తానే  చేసేయలన్నట్టూ  తెగ  తారట్లాడిపోతాడు. ఆఖర్న చేతులు తుడుచుకోటానికి తువ్వాలు అందిస్తూ ” బోయినం ఎలావుందండీ ” అనడుగుతాడు మహా భక్తిగా . తిన్నవాడు  తనముందు  బ్రేవ్ మని ఒక్కసారయినా త్రేంచకపోతే……” సగం సగవే తిన్నట్టున్నారు  ఒంటకాలు బాగా కుదరలేదంటారా?” అని మామీదే అనుమానపడతాడు.  మనుషుల్ని మేపటమంటే మహా సరదా వాడికి రాజుగారి మల్లేనే.

తెచ్చినవాటికి తోళ్ళూ కీళ్ళూ పీకే పనిలో అప్పడు ,  తాలింపు చూడ్డంలో అత్తగారూ  వాళ్ళిద్దరికీ  అసిస్టెంటులాగా అవీ ఇవీ అందిస్తూ నేనూ ఫుల్ల్ బిజీగా వుండగానే …  పంచాయతీలో కూర్చుని ప్రైవేటు తగూలు తీర్చే పాత ప్రసిడెంటు సుబ్బరాజు గారి పాలేరు చందర్రావు    చేతులు నలుపుకుంటూ వచ్చి నిలబడ్డాడు . ”  సుబ్బరాజుగారు  …పది టీలట్టుకురమ్మన్నారండి   ” అంటూ .

అత్తగారు  పళ్ళు పటపటలాడించేరు  పైకి వినిపించకుండా . నేను తలబాదుకున్నాను  మా అత్తగారు చూడకుండా( ఏ నోముఫలమో…ఏ జన్మ వరమో అని తలపోస్తూ)   .

“బుల్లిరెడ్డిగారింట్లో అన్నదమ్ములిద్దరి మద్దినా తగువయ్యింది కదండీ . ఏడాదిబట్టి పీక్కున్నా ఎటూ  తెగలేదండి  . ఆ తగువు తెగ్గొడ్డటానికి   అనపర్తినుంచీ రెడ్లొచ్చేరండి.   సిన్నకోడలు గారిది  ఆవూరే  గావాలండి   . ఈళ్ళూ ఆళ్ళూ  మాటమీద మాట పెంచేసుకుంటన్నారండి. తగువు కోసం కూకున్నోళ్ళందరి బుర్రలు వీటెక్కిపోనియ్యండి. ఇయ్యాల ఎలా అన్నా ఈ తగూ అటో ఇటో తేలిపోవాలని  మా రాజుగారి పంతం అండి. ఎంకన్నా ఎల్లి టీలట్టుకురా తాగేసి తగూ తీర్చేద్దారి అని  నన్ను  పురమాయించేరండి ” అంటూ ….అన్నదమ్ములిద్దరి మధ్యనా అగ్గెలా పుట్టిందో అదెలా రాజుకుని మంటయ్యిందో దాంతో ఎవరికి ఎంత కాలిందో ….ఆ మంట ఇప్పుడెక్కడకొచ్చి ఆగిందో అన్ని గుక్క తిప్పుకోకుండా  సినిమా రిలీజు రోజున మొదటి ఆట చూసొచ్చినోడిలా చెప్పేసుకు పోతున్నాడు  మహోత్సాహంగా .

అదేం పట్టించుకునే స్థితిలో లేని అత్తగారు “  తగలేసినట్టేవుంది…అలాయితే తగువెట్టుకున్న బుల్లిరెడ్డి ఇంటికో , తగువు తీర్చేయాలని సరదా పడుతున్న  మర్యాదరామన్న  (సుబ్బరాజు గారన్నమాట) ఇంటికో వెళ్ళకుండా  మా ఇంటికొచ్చి టీ పెట్టమంటావేం రా ….అంత లోకువగా కనిపిస్తున్నామా ఊరుమ్మడి చాకిరీలు చేయడానికి “ అంటూ  వేడిపెనం మీద  నీళ్ళు చల్లినట్టూ  చిటపటలాడిపోయేరు .

” అయ్యబాబో. ..అలా కోప్పడకండి అయ్యగారు . బుల్లిరెడ్డిగారి ఇల్లు ఆ సివరెక్కడో ఉందండి. అక్కడనించీ అట్టుకొచ్చీసరికి టీలు సల్లారిపోవాండీ (  తగువు కూడా సల్లారిపోవచ్చు)…..ఇంక సుబ్బరాజుగారి అయ్యగారి సంగతి తవరికి తెల్దేటండీ.  అయినా మీకూ ఆరికీ పోలికేటండీ అయ్యగారూ ….. ఎన్నేళ్ళబట్టీ సూత్తనానండీ మిమ్మల్నీ …  మీ సేతికి ఎముకలేదండి మీ నోట్లో నాలుక లేదండి . మీకసలు ఇసుక్కోటమే తెలదండీ ….మీ అసుంటోరిని  నేనీ సుట్టుపక్కల మూడు  జిల్లాల్లో సూళ్ళేదండి అని అప్పటికప్పుడు  అలవాటయిన అస్టోత్తరం చదివేసి , చివరికి  గోడమీదఉన్న కాశీ అన్నపూర్ణమ్మని,   గరిటపట్టుకు కూర్చున్న మా అత్తగార్నీ మార్చి మార్చి చూసి “ఎన్నాళ్ళబట్టో అడుగుదారనుకుంటన్నానండి అయ్యగారూ ఆరు మీకేవవుతారండి “అనేసాడు  . అప్పటిదాకా గుంభనంగా కూర్చుని లోపల్లోపల మురిసిపోతున్న అత్తగారు ఈ అధిక మోతాదుకి  అవస్థపడ్డి  చాల్లేరా ఇక ఆపు  అని చిరుకోపం ప్రదర్శించారు  .    “ఫలానా ఊరెళ్ళాం పచ్చి మంచినీళ్ళు పుట్టలేదు అని చెప్పుకుంటే  మనకేసిగ్గుచేటు  . అయినా వాళ్ళకేం లేక వస్తారా …ఏదో పాపం పనిమీదొచ్చేరు . అంటూ యాలక్కాయలేసి డికాషన్ లేకుండా చిక్కగా టీ పెట్టిమ్మని నాకు  పురమాయించి  , “ఇంటికెళ్ళేటపుడు ఓసారి కనపడరా ….. పులావు  పెడతానూ “ అనేసరికి ఆ  బట్రాజు మొహం చేటంత చేసుకున్నాడు .

ఏవిటో  ఈ మాత్రం పొగడ్తలకోసం ఒళ్ళు హూనం చేసుకుని  పడీ పడీ చాకిరీ చెయ్యటం అబ్బే…. అత్తగారూ ఈ వరస నాకేం నచ్చలేదండి. అంతగా కావాలంటే చివర్లో ఎప్పుడో ‘మహా సాధ్వి  మా అత్తగారు’  అంటూ మీపేరుతో  ఒక వ్రత కథ, రెండు భజన కీర్తనలూ నేనే రాసి పెడతానుకదా   అని చింతిస్తూ   అత్తగారి ఆజ్ఞ శిరసా వహించాను చేసేదేంలేక.

వాడలా ట్రే పట్టుకుని గుమ్మం దాటాడోలేదో…..”చిన్నరాజుగారు గానుగ సెట్టుకాడ కూకున్నారండి . అయిసు     నీళ్ళట్టుకు రమ్మన్నారండి “అంటూ ఓ  పిల్లోడు పరిగెత్తుకొచ్చి నిల్చున్నాడు .   ఇదిగో ఇందుకే నాకు మండిపోయేది. వీధిలో కూర్చుని అదీ ఈదీ అని ప్రాణాలు తోడేస్తారు. పనులు తెమలనివ్వరు.

వంటింట్లో  పొయ్యిముందు బాసీపట్టం వేసికూర్చున్న అత్తగారు  గిన్నియ్యి, గరిటియ్యి, చింతపండు నానబెట్టు,  మసాలా నూరిపెట్టు అనీ……దొడ్లోంచీ ఆ కన్నప్ప గాడేమో  కత్తిపీటమీద నీళ్ళొయ్యండి, సేపలు తోమడానికి బూడిదియ్యండి , రొయ్యలమీదికి ఏణ్ణీళ్ళు  కాయండి  అనీ  నన్ను ఒక్క క్షణం కుదురుండనీయకుండా బొంగరంలా తిప్పేస్తున్నారు.   ఆ తిరుగుడు చాలదన్నట్టూ టీలనీ, మజ్జిగలనీ, మంచినీళ్ళనీ, వీధిలోంచీ వచ్చిపడే అబ్బాయిగారి ఆర్డర్లు  . కాళ్ళకి చక్రాలు కట్టుకుని  అందరికీ అన్నీ అవిర్చి నేనూ బోల్డంత కష్టపడినా చివరాకరికి నే చేసిన పని లెక్కలోకి రాదు . వంటెవరు చేసారు అంటే అన్నివేళ్ళూ అత్తగారివైపే చూపిస్తాయి  అన్ని నోళ్ళూ అత్తగారినే పొగుడుతాయి అదేవిటో !

ఏమాటకామాటే  మా అత్తగారు   ప్రారంభంలో విసుక్కున్నా  పనిలో పడ్డాకా మాత్రం   శ్రద్దగా దీక్షగా మనసంతా లగ్నం చేసేస్తారు .  శంకరశాస్త్రి సంగీతం పాడినట్టూ, ఆయనెవరో డోలు వాయించినట్టూ, మా పొట్టి బ్రహ్మం సన్నాయి మోగించినట్టూ ….ఆయాసపడయినా సరే  అంతుచూస్తారు .అబ్బా అదేనండీ…. అనుకున్న రిజల్ట్  రాబడతారూ అని.

రామాలయంలో భజన సంఘం తమ గొంతులు సవరించుకుంటూ  మైక్ టెస్టింగ్ చేసుకుంటున్న వేళకి  ఒక మహా యజ్ఞం పూర్తయినట్టూ అందరం హమ్మయ్యా అనుకుంటూ అరుగుమీద  చతికిలపడేసరికి  వీధి గేటు తీసుకుని ముందుగా పెద్దరాజుగారూ ఆయన  బృందంతోనూ , ఆ వెనకే చిన్న రాజుగారు మరో బృందంతోనూ వచ్చేసారు.   అత్తగారు ” నే చెప్పలేదూ…ఇద్దరూ చెరో బేచీని తీసుకొచ్చేసారు చూసేవా !”అన్నట్టూ కళ్ళెగరేసి  వడ్డన్లు చేయడానికి ఉపక్రమించారు. ఆ వెంటనే అప్పడు  వాకిట్లోకి ఒక్క గెంతు గెంతి మడతమంచాలూ , ఫ్రేము కుర్చీలూ సర్దేసి వచ్చినోళ్ళని కూర్చోబెట్టేసాడు.   మారాజుగారు బిత్తిరి చూపుచూసుకుంటూ వచ్చి…. “అమెరికాలో ఉంటున్న అచ్చిగాడి మావిడితోట కౌలు విషయం మాట్లాడ్డానికొచ్చేరోయ్ .   ఎలాగూ భోజనాల వేళయింది కదా అని   ఇంటికి తీసుకొచ్చేసాను . అందులో ఒకడు మనకి బాగా అలవాటయినోడే బాగోదుకదా మరి  “  అని కామెడీ హీరోలా భుజాలెగరేసుకుంటూ వెళ్ళిపోయేరు .

నాకు తిక్కరేగిపోయింది మా రాజుగారి ఘనకార్యానికి . మాంగారు కనీసం కబురయినా చెప్పేరు . ఏ కబురూ లేకుండా   వెంటేసుకొచ్చేస్తే వెంటనే   ఆకేసి అన్నం పెట్టేయడానికి ఇదేవన్నా చందావాళ్ళ సత్రమా . “అబ్బే….నాకు మీ వరసేం నచ్చలేదు . అయినా ఇదేం పద్ధతీ ..టాఠ్ “ అని ప్రైవేటు చెప్పేయాలనిపించింది . పొద్దుటినుంచీ పాడుకున్న పతిభక్తి పాటలు గొంతుకడ్డం పడ్డాయి కానీ లేపోతేనా ….పిక్కపాశం పెట్టి గోడకుర్చీ వేయించేయొద్దూ.

ఉత్తరంవైపు సావిట్లో  భోజనాల బల్లమీద మంచినీళ్ళతో సహా అన్నీ అమర్చేసి,  విస్తళ్ళలో  పచ్చళ్ళూ కూరలూ ఒక వరుసలో సర్ధి ,మధ్యలో  పులావు పెట్టి, నేతిగిన్నే …అన్నం పళ్ళెం, పెరుగు కేనూ ఇంకో బల్లమీద విడిగా వుంచి  అన్నిటినీ ఒక్కసారి పరకాయించి చూసి ” వడ్డనలయ్యాయని చెప్పరా ” అంటూ అప్పడికి   పురమాయించి, ఘోషా పాటిస్తూ  వంటింట్లోకి వచ్చేసారు అత్తగారు .

ఓ చేత్తో నీళ్ళ బకేట్టూ , ఇంకో చేత్తో ఇస్త్రీ తువ్వాలుతో  అరుగు చివర నుంచున్నాడు  అప్పడు. “కాళ్ళు కడుక్కుని భోజనానికి కూర్చోండి” అంటూ మాంగారు అతిధుల్ని ఆహ్వానిస్తే , అబ్బాయిగారు  ఫేనేసి కుర్చీలు జరిపేరు  .  మా భక్త కన్నప్ప    సావిడి గుమ్మానికి  అతుక్కుపోయి  తొండలా మాటిమాటికీ మెడసాగదీసి చూస్తున్నాడు  అన్నీ సరిగా  జరుగుతాయో లేదో అని ఊరికే టెన్షన్ పడిపోతూ   .  ఓసారొచ్చి,” అయ్యగారో…బలేవోరే నిమ్మకాయ సెక్కలు  మర్సిపోయేరు …ఏటండీ బాబూ మీరు” అని   విసుక్కుని వెళ్ళాడు . ఇంకోసారొచ్చి నెయ్యి ఏడిసేసేరా ఎక్కడా కమ్మని వోసనొత్తాలేదు” అని అనుమానపడ్డాడు .

వంటలన్నీ సరిగా కుదిరాయో లేదో, వడ్డనలు సరిగా జరుగుతున్నాయో లేదో అని అత్తగారు తెగ ఇదయిపోతూ వంటిల్లంతా  కలియ తిరిగేస్తున్నారు . కాసేపటికి    “చ…చ…చా…”అని చేతులు నలుపుకుంటూ తల బకురుకుంటూ  యమ యాతన  పడిపోతూ వచ్చాడు అప్పడు .

వాడి వాలకం చూసి కంగారు పడ్డ అత్తగారు ” ఏవిట్రా ?” అంటూ గుడ్లు తేలేసారు .   తెగబాధ పడిపోతూ  వాడు చెప్పుకొచ్చిన  చేట భారతాన్ని సంక్షిప్తం చేస్తే….

అనుమానిస్తూనే అందరితోపాటు భోజనానికి కూర్చున్న ఎమ్మారావు గారు , విస్తట్లో చెయ్యి పెట్టగానే  గండు చీమ కుట్టినోడిలా ఎగిరి పడీ  ముక్కూ కళ్ళూ చిట్లించి  ” రాజుగారూ …ఈవన్నీ  నాకు పరిచయంలేని పదార్ధాలండీ  అని మొహమాటపడి , అప్పటికీ అర్ధం కాక గుచ్చి గుచ్చి చూస్తున్నవాళ్ళతో ” మేం బ్రాహ్మలం అండీ ”  అనేసరికి మాంగారు “అచ్చొచ్చో….”అని నొచ్చుకుని , గిన్నెలన్నీ మూతలు తీసి చూస్తే ఒక్కదాంట్లోనూ ఎమ్మారావు గారు గుర్తుపట్టి తినగల  పదార్ధమొక్కటీ కనపడక పోయేసరికి , కంగారు పడిపోయి  “మీ పేరు చూసి పొరపాటుపడ్డాను చూశారా…అహ ఏం అనుకోకండి .   నిమషంలో వంట చేయిస్తాను కాసేపు  ఇలా వచ్చి కూర్చోండి “అన్నారట. దానికి ఆ ఎమ్మారావుగారు ఇంకా కంగారుపడిపోయి ….”అయ్యయ్యో …ఇప్పుడవన్నీ ఏం వద్దండీ “ అనేసి   మా అత్తగారు ఆచారంకొద్దీ దూరంగా పెట్టిన అన్నం లో పెరుగు  కలుపుకొని భోజనం అయిందనిపించేరట.  బంతిలో కూర్చున్న మిగతా అతిధులు   ముందు బాగా కంగారుపడి, ఆనక కొంచెం మొహమాటపడి , చివరికి తిండిలో పడ్డారట సుబ్బరంగా .

“అంతటి ఎమ్మారావు బాబుగారు అలా అసంటా కూకొని, పెరుగన్నంలో పచ్చడి నంజుకు తింటంటే నా పేణం ఉసూరుమనేసింది అయ్యగారో “ అని కన్నప్ప  అదే పనిగా బాధ పడిపోయాడు.

” అదేవిట్రా క్రితం సారొచ్చినపుడు ఎంచక్కా తిన్నాడు కదా . ఇంతట్లోనే  బ్రాహ్మెడెలా అయిపోయాడు ” అని అత్తగారు ఆశ్చర్యపోయారు.

అప్పటికీ అనుమానం తీరక …..ఒరేయ్….వచ్చినాయనకి బట్టతలుందా . చూడ్డానికి హైబ్రీడ్ బొబ్బాసి చెట్టులా బరువుగా భూమికి జానెడున్నాడా  ? అనడిగారు. ఇంకా ఏదో గుర్తుచేసుకోటానికి ప్రయత్నిస్తూ ….

” అచ్చిచ్చీ…..మట్టలు చెక్కేసిన తాటిసెట్టులా నిటారుగా అంతపొడుగుంటేనీ ……పైగా గిరజాల జుట్టండీ ఆరికి అన్నాడు ”

గిరజాల జుట్టు బట్టతలవ్వడానికి చాన్సుంది కానీ…..అటు సూర్యుడు ఇటు పొడిచినా బట్టతలమీద గిరజాలు మొలవటం అసంభవం కదా అని అర్ధం చేసుకున్న అత్తగారు…..” అయితే వచ్చింది  వేరే ఎమ్మారావా అని సాలోచనగా అనుకుంటూ ….

” అసలెంత మంది ఎమ్మారావులుంటారే……?”   అన్నారు నన్ను పట్టి కుదుపుతూ .

అసలే ఆకలికి సగం మతి పోయున్నానేమో ……ఒక వెర్రినవ్వునవ్వి సినిమాల్లో రామారావు నాగీస్ రావు లాగా   ఒక్కడే ఎమ్మారావు ఉంటాడనుకున్నారా ! ఎంతమందుంటారో సరిగ్గా లెక్క తెలీదు కానీ మొత్తానికి   ఎక్కువే వుంటారు … ఉన్నవాళ్ళు కుదురుగా ఉండకుండా అక్కడోళ్ళు ఇక్కడికీ ఇక్కడోళ్ళు అక్కడికీ మారుతుంటారు . అంటూ వెర్రి సమాధానం చెప్పేసాను .( అది ఆకలివేళ కాకపోతే ప్రభుత్వ శాఖలు  పరిపాలనా తీరుతెన్నులు వంటి మరిన్ని విషయాలు విశదీకరించేదాన్ని )

” ఏడ్చినట్టుంది . అంతమందిని పెట్టుకోటం ఎందుకూ ,అటూ ఇటూ  అలా పరుగులెత్తిచ్చడం ఎందుకూ  బుద్ధి  లేని గవర్మెంటు ” అనేసారు అత్తగారు .

” బాగాచెప్పారు …అయినా మావయ్య ముందే కనుక్కోవలిసింది కదా ” అని అనుకోకుండా అమోఘమయిన పాయింటందించేసాను  అత్తగారికి.

ఆ పాయింటుమీద జువ్వలా లేచిన అత్తగారు  ” అదీ….చూసావా  మీ మావయ్య నిర్వాకం .  అంతా  పుల్లయ్య యవ్వారం. బొత్తిగా వ్యవహారం తెలీని మనిషి అంటూ  నిప్పులు కక్కుతుంటే……    మొహం జేవురించుకుని       మాకేసి వస్తూ తూర్పు గుమ్మం దాటబోయిన మాంగారు ”  సడెన్ బ్రేకేసినట్టూ  అక్కడే ఆగిపోయి ” ఆ …ఆ….వస్తున్నా ” అని ఎవరో పిలుస్తున్నట్టూ పంచె సర్దుకుంటూ వేగంగా వెనక్కిమళ్ళేసేరు .

” ఏటండయ్యగారూ….ఆకురున కుంత పప్పుసారన్నా  కాసేరుగాదు ” అని  పెద్ద ఆరిందాలా అనేసాడు అప్పడు మా అత్తగారికేసి చూస్తూ ….( నన్నే అనాట్టా ….ఏమో?)

ఒళ్ళు చీరేస్తాను గాడిదా. వెధవ సన్నాసి సలహా ఒకటి పడేసి, ఇప్పుడేమో తప్పంతా మా మీదికి తోసేస్తావా అని ఒక్క టెంకి జెల్ల కొట్టాలనిపించింది నాకు.

“అందరూ సుబ్బరంగా తిన్నారు ఆ బాబొక్కడే అర్ధాకలితో చెయ్యి కడుక్కున్నారు “ అని తువ్వాలు నోట్లో కుక్కుకుని అదే పనిగా బాధ పడిపోతున్న భక్త కన్నప్పడిని ఓదారుస్తూ  “ సర్లేరా అయిందేదో అయింది ఎవరికెంత ప్రాప్తమో అంతే దక్కుతుంది . ఇలా జరగాలని రాసుంది.   …  తప్పించడం మన వశమా అని ,  ఆకేసి అన్నం పెట్టేరు అత్తగారు.  వాడు “ఇలా జరిగిపోయిందేటీ”  అని ముద్ద ముద్దకీ బాధపడుతూనే వున్నాడు  . ముద్ద  గొంతు కడ్డం పడి పొలమారిన ప్రతిసారీ మా అత్తగారు కొంచెం కొంచెంగా  గీతా మకరందం దానితో పాటూ  కాస్త కర్మ సిద్ధాంతం లాంటిదేదో  వడ్డిస్తూ వచ్చారు.

మొత్తానికి ఆద్యంతం బాధపడుతూనే  అప్పడు సుష్టుగా భోంచేసి ,మకాంలో ఉన్న  వాళ్ళావిడకీ, అమ్మకీ కూడా కేరేజీలు సర్దుకుని  ” ఇలా జరిగిందేటండీ అయ్యగారూ ” అని  తీవ్రంగా బాధ పడిపోతూ వెళ్ళిపోయాడు .

“హమ్మయ్యా…అందరి భోజనాలు అయిపోయినట్టేకదా .   రండి  మనంకూడా  మనకి ప్రాప్తమున్న పలావు మెతుకులు తినేసి త్వరగా బజ్జుందాం “ అని నేను అత్తగారిని కంగారు పెడుతుంటే ఆవిడ ,  తెల్లారితే శుక్రవారం వంటింట్లో అంటు ఉండటానికి వీల్లేదు  అన్నీ కడుక్కున్నాకే పడుకోటం అంటుంటే ……ఇంకేం చెప్పను హతవిధీ నా పై ప్రాణాలు పైకే పోయాయి

ముక్తాయింపు –  తాలింపు  :)

ఏది ఏవైనా  పతివ్రతా ధర్మాలంటూ కొన్ని ఉన్నాయికదా . ఒకటీ రెండూ పాటించాం కదా అని మూడూ నాలుగూ  అశ్రద్ధ  చేసి  ‘ సపతివ్రత ‘ అనిపించుకోటం  దేనికీ అనిచెప్పి,  విష్ణుమూర్తిలా ఒక పక్కకి తిరిగి హాయిగా నిద్రపోతున్న శ్రీవారి పాద పద్మములను చిన్నగా గిల్లి……కిటికీ దగ్గర చేరి పాత సినిమా హీరోయిన్లా ఒంటికాలిమీద వయ్యారంగా ఊగుతూ ”  రావోయి చందమామా…..  ” అని మంద్రస్థాయిలో  మొదలుపెట్టేసరికి   మబ్బులమాటునున్న  చంద్రుడు , మంచం మీదనున్న చంద్రుడు ఒకేసారి నాముందు ప్రత్యక్షమయ్యారు.

“చంద్రుడు వెండి కంచంలా లేడూ”  అన్నారు   ఆకాశంలోకి చూస్తూ.

నేను “ఊహు…” అని తల అడ్డంగా ఊపేను.

“పోనీ… వెన్నముద్దలా  ఉన్నాడా”అన్నారు.

నేను వూహుహు…అని తల అడ్డడ్డంగా ఊపేను.

పోనీ నువ్వే చెప్పవోయ్ అన్నారు  గారంగా.

నేను రెప్పవాల్చక చందమామని చూస్తూ,” మధ్యలో ఆ మసేవిటండీ మాడిపోయిన అన్నం తెపాళాలా  చిరాగ్గా . ఏవండీ ఓసారి చందమామను కిందికి దించండి సుబ్బరంగా తోమి బోర్లించేస్తాను “ అని  చూద్దునుకదా మబ్బు మాటున ఆ చందమామ , ముసుగు చాటున నా చందమామ భయం భయంగా నన్నే చూస్తూ ….

అయ్యో… ఏవయిందండీ …..ఎందుకలా బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు.

“రసికరాజ తగువారము కామా ….ఆఅ.ఆ..అ.ఆ.ఆఆ…………..….” అంటూ కిచకిచలాడేను వసంతకోకిల సినిమాలో శ్రీదేవిని తల్చుకుని .

సర్వమంగళం

datla lalithaఇల్లంతా , కాలుకాలిన పిల్లిలా  తెగ  తిరిగేస్తున్నారు  అత్తగారు . కాసేపటికి ఉన్నచోటే నిలబడిపోయి వేళ్ళమీద లెక్కలేస్తున్నారు . వేళ్ళతో లెక్కలు తేలకో ఏమో , విసుగ్గా చేతులు విదిలించి వాటిని నడుoమీద వుంచుకుని సీరియస్ గా ఇంటి  వాసాలకేసి  చూస్తూ వుండిపోతున్నారు. ఆ వాలకం అదీ చూస్తే నాక్కొంచెం భయమేసి  పక్కన మరో మనిషుంటే ధైర్యంగా వుంటుందని నరసమ్మని వెతుక్కుంటూ వెళ్ళాను .

పెరట్లో , నూతి గట్టుమీదకి నుంచున్న చోటినుంచే ఢమాల్ ఢమాల్ మని అంట్లు విసిరేస్తూ కనిపించింది నరసమ్మ. దాని విసురుకి కాకులు అరవటం కూడా మర్చిపోయి  , ఉందుమా పోదుమా అని అనుమానప్పడుతూ అక్కడక్కడే తచ్చాడుతున్నాయి .  నన్నుచూస్తూనే మరింత ధుమధుమలాడుతూ  చేతిలో తపేలాతో నెత్తికొట్టుకుని ఠపీమని సామాన్లమీదికి విసిరేసింది .  తపేలా చొట్టపడిందోలేదోగానీ నేను మాత్రం తుళ్ళిపడ్డాను  .

ఇవాళ తిధీ నక్షత్రం ఏవిటోగానీ …..అక్కడ  అత్తగారూ , ఇక్కడ  నరసమ్మా నాకు అంతుపట్టకుండా ప్రవర్తిస్తున్నారు అనుకుంటూ కేలండర్ లో వెతికి చూస్తే అటు అమావాస్యకీ ఈటు పున్నమికీ మధ్యలో ఉన్నాం . అయినా ఈ విపరీతాలేంటో !  అని  నాఆలోచనలో నేనుండగానే …హటాత్తుగా వచ్చిన అత్తగారు నా చెయ్యి పట్టుకుని “ఇలారా ఓసారి “ అంటూ నన్ను కొట్టుగదిలోకి లాక్కెళ్ళిపోయారు . నేను బిత్తరపోయి తేరుకుని , ఆ చీకటిగదిలో బిక్కుబిక్కుమంటూ నిలబడ్డాను.  గొంతు పెగుల్చుకుని “ఏ…ఏ… ఏవి….” అనబోతుంటే ……”ఉష్…మాట్లాడకు” అని నోటికి వేలు అడ్డం పెట్టేసరికి  మిగతా సగం మాట గొంతులో నొక్కేసుకున్నాను .

” కళ్ళుమూసుకో ” అన్నారావిడ రహస్యంగా …

కన్ను పొడుచుకు చూడాల్సినచోట కళ్ళు మూసుకోవటమేవిటో  మతిలేని ముచ్చట ! అని లోలోపల విసుక్కుని   అత్తగారి సంతృప్తికోసం   “ ఆ ….. మూసుకున్నాలెండి “ అంటూ కళ్ళుపెద్దవి చేసి చూస్తున్నాను .

దుమ్ముకొట్టుకుపోయిన  డొక్కు హార్మనీ పెట్టె ఇరుకుల్లోంచీ  ఏదో తీసి పట్టుకుని ఇప్పుడు కళ్ళుతెరు అన్నారు .

నేను అపుడే కళ్ళుతెరిచినట్టూ నటిస్తూ “ఏవిటిదీ  ఏవన్నా నిధినిక్షేపాలా  “?అన్నాను అసక్తిగా

“నీ మొహం!  ఇలా చూడు”  అంటూ కిటికీ రెక్క కొద్దిగా తెరిచి ఆ వెలుగులో ఆవిడ చేతిలో నోట్లు చూపించారు. పైగా వాటిని ఇలా విసినకర్రలా విప్పి మొహానికడ్డంగా  పట్టుకుని జపానుబొమ్మలా నిలబడ్డ్డారు .

పాతా  కొత్తా , చిన్నా పెద్దా రూపాయలు. “అబ్బా ”!  అని నే హాశ్చర్య పోతుంటే …..

“మొన్న నువ్వు ఊరెళ్ళినపుడు  చిట్టిపంతులుగారి అబ్బాయి ఆవునెయ్యి కావాలని  వచ్చారేవ్ . ఎవరో ఏవో పూజలు  చేసుకుంటున్నారట. నెయ్యి ఎక్కడకావాలన్నా  దొరుకుంది కానీ , మడిగా చేసింది  కావాలటండీ . ధర ఎంతయినా పర్లేదు . మీ దగ్గర ఎంతుంటే అంతా  తీసుకురమ్మన్నారండీ నాన్నగారు   అంటూ పాలేర్ని వెంటపెట్టుకొచ్చారు .  ఆఫీసర్ల అభిషేకానికి, మీటింగుల్లో సంతర్పణకి  అప్పనంగా సమర్పించుకోవటం తప్ప నాలుగు ఆవుల పాడి చేసిన్నాడన్నా ఒక్క చుక్క నెయ్యి అమ్మిన పాపాన పోయామా ! అందుకే , నాలుగు సేర్లుంటుందేమో  కేనులో పోసి ఇచ్చేసాను .

దైవకార్యానికే కదా పోనీలే పోస్తే పుణ్యం వస్తుందీ అనుకున్నా… ఆయనేమో , అలా తీసుకోకూడదండీ . వచ్చేపుణ్యం మా ఖాతాలోపడాలికానీ నెయ్యిచ్చి మీరు కొట్టేస్తే ఎలా అంటూ వద్దన్నా వినకుండా డబ్బులు గడపమీద పెట్టేసి వెళ్ళిపోయేరు . గుమ్మంలోకొచ్చిన శ్రీమహాలక్ష్మిని కాదనకూడదని తీసి లోపలపెట్ట్టేనుకానీ, ఈ సంగతి ఇంట్లో మగాళ్ళకి తెలిస్తే అవమానం ఆవకాయబద్దా అంటూ  నామీద ఎక్కడ  విరుచుకు  పడతారో అని భయపడి చస్తున్నాను . అసలెవరికీ  తెలియనివ్వ కూడదనుకున్నాను కానీ,  నీకూనాకూ రహస్యాలేవిటని  చెప్పేస్తున్నానేవ్. ”  బరువు దించుకున్నట్టూ హాయిగా నిట్టూర్చి  ,  “నువ్వూ ఒకసారి లెక్కపెట్టు నేనిప్పటికే పదిసార్లు లెక్కపెట్టేననుకో” “  అంటూ ఆ నోట్లు  నా చేతిలో పెట్టి  ఆనందంతో అగులుగక్కుతూ నిలబడ్డారు.

అత్తగారి అపేక్షకి ఆనందబాష్పాలు కార్చాలనిపించినా అతిగావుంటుందేమో అని ఆగిపోయాను. కానీ అవకాశం వస్తే అత్తగారికోసం ఏమైనా చేసి ఆవిడ్ని సంతోషపెట్టాలని మాత్రం ఆ క్షణo   నిర్ణయించేసుకున్నాను .

నేను ఆ నోట్లనించీ అయిదులూ పదులూ యాభైలూ వేరుచేస్తుంటే …. కిర్రుమంటూ తలుపు తోసుకుని    “ సీకట్లో ఏం చేత్తన్నారండీ  “ అంటూ చీపురు చేత పూని గుమ్మంలో  ప్రత్యక్షమయిపోయింది  నరసమ్మ .

“ హుం…ఇదొక్కత్తి పానకంలో పుడకలా”  విసుగ్గా అంటూ  …..  నాచేతిలో నోట్లు చటుక్కున లాక్కుని హార్మనీ పెట్టెలో కుక్కేసి ఏం ఎరగనట్టూ నిలబడ్డారు అత్తగారు . నేను కంగారుగా ఖాళీ చేతులు వెనక్కి దాచేసుకుని ” “ఆ…  ! చీకట్లో దొంగా పోలీస్ ఆడుకుంటున్నాం . అయినా నీకిక్కడేం పనే….సామాన్లు చొట్టలు   పెట్టడం అయిపోయిందా ….ఇందాకా చూసాలే ఠపీ ఠపీమని ఆ విసిరేయడం అదీ…” అంటూ  స్వరం పెంచాను అత్తగారి అండ చూసుకుని

” ఏటండోయ్ ట్రాపిక్కు మార్సేత్తన్నారూ….. నాకు తెల్దనుకున్నారా  ” అంటూ అంతదూరం నుంచీ చీకట్లో బాణం వేసేసింది.

ఆ దెబ్బకి  అత్తగారు ఠపీమని పడిపోయారు  . ” ఒసేవ్ ….రాజుగారికి గానీ చెప్పకేవ్ ”  అనేసారు గాభరాగా .

“కోడలిగారికి వార్మనీ నేర్పిత్తన్నారనా …..! అందులో తప్పేవుందండీ !   సీకట్లో కూకోపోతే అరుగుమీద  కూకుని వోయించుకోచ్చుకదండీ.  వొడియాలమీద కాకులు వోలకుండా వుంటాయ్  అంది .

” నీమొహం నేర్పించడానికి నాకేం వచ్చి చచ్చు కనకా .. ! ‘పుట్టింటినుంచీ  ఉత్తచేతులతో వెళితే  అత్తారింట్లో ఏం గౌరవం వుంటుందీ’ అంటూ  మావాళ్ళు  ఈ హార్మనీ పెట్టి నా మెడకి తగిలించి పంపారు  .అసలావేళ…..”అంటూ ఆవిడ ఇంకేదో చెప్పేయబోతుంటే …..”అదే అదే….. నాకు సరళీస్వరాలు వచ్చు కదా   . రండి ఇద్దరం కలిసి వాయిస్తే అవే జంట స్వరాలయిపోతాయి  …  మనం పోయి పై గదిలో నేర్చుకుందాం సంగీతం అంటూ హార్మనీపెట్టి చoకనెత్తుకుని మా అత్తగారి  చెంగుపట్టుకుని లాక్కుపోయాను . కంగారులో కన్ఫ్యూస్ అయిపోటం మా అత్తగారి వీక్నెస్సు. అటువంటప్పుడు నేనన్నాఆదుకోకపోతే ఎలా  పాపం !

వెళుతున్న మా ఇద్దరినీ అనుమానంగా  చూసి  , చీపురు కిందా  చూపులూ పైనా తిప్పుతూ “అహా…….అబ్బో !” అంటూ వళ్ళంతా కుదిపేసుకుంది నరసమ్మ .

***

“అయితే తప్పులేదంటావా….అయినా ఆక్షేపణ కాదూ .  మీ మావగారికి తెలిస్తే ఇంకేవన్నా వుందా…..ఇలాంటి అప్రదిష్ట పన్లు మా ఇంటా వంటా లేవంటూ  సూక్తిముక్తావళి చదివేస్తారు   ” అన్నారు అత్తగారు అటూ ఇటూ తేల్చకుండా .

” భలేవారే ఇదేవన్నా దొంగసొమ్మా ..మన కష్టార్జితం కదండీ….” అన్నాను గుడ్లు తిప్పుతూ .

మన దొడ్లో కాసినవి అచ్చంగా మనసొత్తే కదండీ . వాటిమీద దాన విక్రయాది  సమస్త హక్కులూ మనకే చెందుతాయ్. వాటిని ఏట్లో పారేసుకుంటామో…..ఎవరికయినా అమ్ముకుంటామో మనిష్టం . అంటూ అత్తగారికి లా పాయింట్లు చెప్పేను.    అయినా మనకి పండుతున్నాయికదా అని  పంచుతూ పోతే ‘ అబ్బా రోజూ అవే కూరలు వండుకోలేక చస్తున్నాం ‘ అన్నా అనేస్తారు జనం  అంటూ…. బాగా అర్ధమవడంకోసం అర్ధశాస్త్రంలోని ఆపిల్ పళ్ళ సూత్రం        విడమర్చి చెప్పాను .  అక్కడితో ఆగకుండా  సహజ వనరులు -వాటి వినియోగం, మూలధనంపెంపు -ఆవశ్యకత    అంటూ మరికొంత  అర్ధశాస్త్రం  కూడా అప్పచెప్పాను. పనిలో పనిగా అరిస్టాటిల్ నీ ఆడంస్మిత్ నీ పరిచయం చేసిపారేసాను . ( హన్నా…లేకపోతే, అష్టోత్తరమయినా చదవడం రాదు  అన్నేళ్ళు ఏం చదువుకున్నావో ఏవిటో  అని అందరిముoదూ అంటారూ )

అసలేంటంటే , మాంగారికి తెలీకుండా ప్రారంభమయిన నేతి వ్యాపారంలో చేకూరిన వందలని  నా సొంత తెలివితేటల్తో వేలుగా మార్చి చూపెట్టాలని సరదా పుట్టింది  .  అందుకు నా బియ్యే బుర్రతో ఆలోచించి నేనో బ్రహ్మాండమయిన అయిడియా ఇచ్చేను  . అది విని ఆవిడ అదిరిపోయేరు . కాస్త బెదిరినట్టున్నారుకూడా !

పెరట్లో కోతకి సిద్దంగావున్న కూర అరటి గెలలు   ,అవతల మొండిగోడమీద కాసిన గుమ్మడికాయలు  , వాస్తు ప్రకారం మాకు కలవకూడదని వదిలేసిన ఉత్తరపేపు క్రాసులో మేమే ఎవరిపేరుమీదో వేసి పెంచిన కొబ్బరి చెట్ట్లు నించీ ముదిరి రాలిన  కొబ్బరి బొండాలు, గోడమీంచీ వీధిలోకి వాలిపోయే పంపరపనస, గజనిమ్మ కాయలు  ఇవన్నీ అబ్బులుగాడి అజమాయషీలో పక్కూరి సంతకి తోలేస్తే  నాలుగు పచ్చకాగితాలు  భేషుగ్గా రాలతాయన్నది నా ఆలోచన  .

అత్తగారేమో…హవ్వ గుమ్మడికాయలు అమ్ముకుంటామా …నలుగురూ చెప్పుకోరూ అంటారు.

గుళ్ళూ గోపురాలూ కట్టిoచిన వాళ్ళగురించే చెప్పుకోటం మానేసినవాళ్ళు గుమ్మడికాయలగురించి ఎన్నాళ్ళు చెప్పుకుంటారు. ఊరికే మనం భుజాలు తడుముకోవటం తప్ప అన్నది నా పాయింటు  . ఒక పక్క ఆశ పీకుతుండగా అయిష్టంగానే ‘  ఏమో బాబూ నీ ఇష్టం ‘ అనేసారు ఆఖరికి .

ఆ సాయంత్రం నరసమ్మని ఏదో పనిమీద బయటకి పంపించి , అబ్బులుగాడిని పెరట్లోకి పిలిచి …..ఇదిరా అబ్బాయ్ సంగతి అని అత్తగారూ నేనూ చెరో చెవిలోనూ విషయాన్ని నూరిపోసేసాం  . వాడు ముందు షాకయ్యి (ఆశ్చర్యంతో) తర్వాత షేకయ్యాడు ( నవ్వుతో) .

“ఊరుకోండయ్యగారూ ….మీకెక్కువయితే మాలాటోళ్ళకి పారెయ్యాలికానీ ఇదేం పనండీ “అనేసాడు ఆరిందాలా .

చూశావా చివరికి వీడితో చెప్పించుకోవాల్సివచ్చింది. అన్నట్టూ నాకేసి ఓ చికాకు చూపు విసిరేరు అత్తగారు

నాకు ఒళ్ళుమండిపోయింది ( అత్తగారిమీద కాదండోయ్….అబ్బులుగాడిమీద )

మేం పారేసేదాకా నువ్వెక్కడ ఆగుతావ్ రా ……! కొబ్బరిచెట్టు మొవ్వులో కూర్చుని బొండాలు తాగెయ్యడం , చేలోంచీ పాలకేనుతో వస్తా మధ్యలో  సూరమ్మ కాఫీ హొటల్ లో దూరడం , ట్రాక్టరు కి ఆయిల్ కొట్టించడానికని వంకెట్టి మీ  వీధిలో జనాలందర్నీ తొట్టినిండా ఎక్కించేసుకుని  సినిమాకి ఎల్లిపోటం ఇవన్నీ  మాకు తెలీదనుకున్నావా …మర్యాదగా చెప్పింది చేస్తావా . మీ ఆవిడకి కబురెట్టమంటావా ? అని బెదిరింపుగా అనేసరికీ ” అయబాబోయ్ మద్దిల మా యావిడెందుకండీ “ అన్నాడు అయోమయంగా తలగోక్కుంటూ .

” ఎందుకా …? మొన్నామధ్యన చెరుకులోడేసుకుని చెల్లూరు వెళ్ళేవా ….సాయంత్రానికి లోడు దిగిపోయినా  ఇవాళ రేపు అంటూ  మూడ్రోజులు చెల్లూరులోనే వుండిపోయేవా …..

ఎందుకూ? అనేసరికి వాడు కంగారుపడిపోయి అయబాబోయ్ సిన్నయ్యగారో  అంటూ దణ్ణం పెట్టేసాడు.

‘ చచ్చింది గొర్రె ‘  అని నేను లేడీ రాజనాలలా వంకరనవ్వు నవ్వాను.

నే వెనక్కి తిరిగి చూళ్ళేదు కానీ నా తెలివి తేటలకీ  కార్య దక్షతకీ  మా అత్తగారు మురిసి ముక్కలయిపోయి వుంటారు .

“సర్లే నువ్వు మరీ ఏడ్చి చావకు….సంతకెళ్ళినప్పుడల్లా నీకు  రూపాయో రెండురూపాయలో ఇస్తానులే ఏ షోడాకాయో తాగుదువుగాని  . కానొరేయ్ ఈ సంగతి  మూడోకంటికి  తెలిసిందా ఆ తరవాత నా అంత చెడ్డది  ఈ భూ ప్రపంచలోనే వుండదు . తెలుసుగా కోపం వస్తే నే మనిషిని గాను “  అంటూ ముందుకి వంగి గట్టిగా కళ్ళెర్రజేసి పళ్ళుబిగించారు అత్తగారు . ఆవిడని ఆ ఫోజులో చూస్తే  గుక్కెట్టి ఏడ్చేవాడుకూడా గోళీసోడాలా కిసుక్కుమనాలిసిందే  . కానీ అబ్బులుగాడు మాత్రం వణికిపోతున్నట్టూ వంగి ..వంగి ,నంగి వినయాలు చూపిస్తూ ” అయ్యగారో నా పేణం పోయినంత ఒట్టండీ పిట్టమడిసికి కూడా తెలనీనండీ   ” అంటూ సూపర్ గా ఏక్టింగ్ చేస్తూ వెళ్ళిపోయాడు .

మర్నాడు సాయంత్రం దట్టంగా పౌడర్ రాసుకుని , గంజిపెట్టిన కాకీ నిక్కరూ , పొడుగుచేతుల తెల్ల జుబ్బా , భుజం మీద గళ్ళతువ్వాలుతో తుప్పట్టిన డొక్కు సైకిలు మీద టిప్పు టాపుగా వచ్చేసాడు అబ్బులు.

హడావిడిగా అరటిగెల నరకబోతుంటే ….. “ఆగరా ముహుర్తం చూడొద్దూ “ అంటూ అడ్డుపడ్డారు అత్తగారు.

ఏవైపునించి ఎవరొచ్చిపడతారో  అని దిక్కులుచూస్తూ ‘  ఇప్పుడు రాహుకాలాలు ముహుర్తాలూ అంటారేంటీ ఈవిడా ‘ అని కంగారు పడుతుంటే,  ప్పీ….ప్పి..ప్పీ..పి…  అంటూ మంగలి పొట్టిబ్రహ్మం సాధనకోసం తన సన్నాయి శృతిచేసుకోటం వినిపించింది. “ఆహా మంగళవాద్యాలు …..ఇంతకన్నా మంచి ముహుర్తం ఏవుంటుంది కానివ్వండి కానివ్వండి “ అంటూ తొందర పెట్టేసి, అరటిగెలా…గుమ్మడికాయలూ, కొబ్బరి బొండాలూ గోనెల్లో చుట్టేసి సైకిలుకి కట్టేసాం . మా అత్తగారు  కొత్త వ్యాపారానికి కొబ్బరికాయ కొట్టి నన్ను ఎదురు రమ్మని , పెళ్ళికొడుకుని  కళ్యాణ  మండపానికి సాగనంపుతున్నంత హడావిడి తో  లోడు సైకిల్ని పెరడు దాటించారు .

సంతరోజు మధ్యాహ్నం  అబ్బులుగాడికి అర్జెంటుగా కడుపునొప్పో కాలునెప్పో వచ్చేయటం . దాంతో రాజుగారో పేణం పోయేలావుందండోయ్ అని మళ్ళీ సూపర్ గా ఏక్టింగ్ చేసుకుంటూ పని ఎగ్గొట్టి పొలం నుంచీ పడుతూ లేస్తూ ఇంటికొచ్చేయటం , మేం ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం నరసమ్మకి ఏదో ఒక పని పురమాయించి దాన్ని  ఇంటికి వీలయినంత దూరంగా పంపించేయటం ( ఇంటిగుట్టు లంకకి చేటన్న సామెత లాగా….. సంత గుట్టు శంకిణీ కి తెలియకూడదు అన్నది అత్తగారి ఆర్డరు ), దొడ్లో పండిన కాయా పండూ  అబ్బులుగాడు గోతాంలో వేసుకుని సైకిలుకి కట్టుకుని చెక్కేయటం నిరాఘాటంగా నాలుగయిదు  సంతలపాటు జరిగాయి.

ఈ వంకన అబ్బులుగాడి డొక్కు సైకిలు కొత్త సీటూ, సైడు అద్దాలూ, చక్రానికి రంగు రిబ్బన్లూ , డైమండ్ లైటూ వంటి కొత్త సోకులు చేసుకుని రాజహంసలా తయారయింది . అవసరం మాదికాబట్టి అదంతా చూసీచూడనట్టూ ఊరుకున్నాం.  అబ్బులుగారి దర్జాకర్చులన్నీ పోనూ మా చేతిలోపడ్డ ఒక్కోరూపాయినీ చిల్లర శ్రీమహాలక్ష్మి అంటూ కళ్ళకద్దుకుని  అత్తగారి ఇత్తడి మరచెంబులో సీక్రెట్ గా దాచుకున్నాం .

ఇలోగా నరసమ్మ అనుమానాలూ ….ఆరాలూ…విసుర్లూ ….కసుర్లూ ఎక్కువయ్యాయి. మేం చూస్తుండగానే నాలుగు తపేలాలు చొట్టపడ్డాయి .
ఓరోజు అబ్బులుగాడు లబలబలాడుతూ వచ్చాడు . “అయ్యగారో మీ మూలంగా నాకు  సెడ్డ సిక్కొచ్చిపడిందండీ బాబూ ……నాగాలెక్కువెట్టేత్తనావ్ , జీతం తెగ్గొట్టేత్తాన్రోయ్ అని పెదరాజుగారు  పబ్లీకుగా పాలేర్లందరిముందూ గసిసేరిపాడేసారండీ బాబూ…. నాకు సెడ్డ నామర్దాగావుందండీ బాబూ….మీకూ ఆరికీ మద్దిన నేను ఇదయిపోతనాను “ అంటూ దండకం చదివేసాడు.

“పోన్లేరా  నువ్వు మరీ అంత ఇదవ్వకు”  అంటూ అత్తగారు వాడిని ఓదార్చి, “ఎలాగూ వచ్చేది వేసవికాలం కదా . ఇక కాయా కసరా ఎక్కడనిలబడతాయ్ . మళ్ళీ వానాకాలం రాగానే మొదలెడదాం . ఈసారి నూతి వెనకాల  మళ్ళుకట్టి ఆకుకూరలు కూడా వేద్దాం  …..ఏవంటావే? “ అంటూ  ఆరాగా అడిగేసరికి  నాకు పల్లకీ ఎక్కినంత ఆనందంవేసింది.  నువ్వో వెలుగు వెలిగే రోజు దగ్గరలోనే వుందేవ్ అని మనసు పిల్లకోతిలా గంతులేసింది .  అదంతా పైకి కనిపించనీకుండా …..  “అయ్యో… మీకన్నా నాకెక్కువ తెలుసా . మీరెలా చెపితే అలానే “ అంటూ ఆవిడని ఏకంగా ఏనుగే ఎక్కించేసాను  .

‘పని పడింది పది రూపాయలివ్వండి’  అంటూ ప్రతీ రూపాయీ అడిగి తీసుకోవటానికి అలవాటు పడ్డ  ప్రాణాలకి  ఇలా అనుకోకుండా చేతుల్లో చిక్కిన శ్రీ మహాలక్ష్మిని  చూస్తుంటే భలే ఆనందగావుంది. ఆశకు అంతులేదన్నది అందరికీ తెలిసిందేకదా …..

***

బొమ్మనావోళ్ళ కొట్లో డిస్కౌంటీ పెట్టేరట. మనమూ ఓ నాలుగు చీరలు కొనేసుకుందాం  అన్నారు అత్తగారు. మా కష్టార్జితాన్ని కళ్ళెదురుగా పెట్టుకుని.

వెనకిటికో వెర్రి వెంగళమ్మ గుడ్డుకోసం బాతును కోసేసిందంట అలావుంది మీరు చెప్పేది.  మనం ఈ డబ్బుని వడ్డీకి తిప్పుదాం . అపుడు అసలు బాతులా వుంటుంది  వడ్డీ గుడ్డులా వస్తూనే వుంటుంది అన్నాను . మరో ఆలోచనకి   అంకురార్పణ చేస్తూ…

మనం వడ్డీవ్యాపరం చేయ్యడమే హవ్వ…..! ఎక్కడయినా వుందా అంటూ బుగ్గలు నొక్కుకున్నారు  అత్తగారు . ఆవిడ సంతృప్తిగా తలాడించేలా ఒక్క ఉదాహరణయినా ఇస్తే బావుంటుందని నేను చరిత్ర తిరగేసాను…..

దానాలు చేసి దరిద్రులయిపోయినవాళ్ళూ,  అప్పులు తీర్చలేక అడవులు పట్టిపోయినవాళ్ళూ  తప్ప సుబ్బరంగా వడ్డీవ్యాపారం చేసుకుని వృద్దిలోకొచ్చిన మహారాజొక్కడూ కనిపించలేదు . ఔరా …నిజమే కదా అనిపించింది. అయిననూ సరే ……అనుకొని ,

రోజులు మారిపోయాయండీ ! కూర్చుని తింటే కొండలయినా కరిగిపోతాయ్….మా అమ్మగారి ఊర్లో బొజ్జ పంతులుగారే  వడ్డీ వ్యాపారం మీద నాలుగెకరాలు కొన్నారు ట …. ఆనాడు అప్పిచ్చేవాడే  లేకపొతే ఏడుకొండలవాడి కళ్యాణం జరిగేదా   …కాబట్టి ఇదీ ఒకరకమయిన పుణ్యకార్యమే.ఇలా ఒకదానికొకటి సంభంధం లేని  నూటొక్క వివరణలు  ఇచ్చేసరికి  మెరుస్తున్న కళ్ళతో  చూసారు  అత్తగారు. చదువుకున్న కోడల్ని తెచ్చుకున్నందుకు మొదటిసారి సంతోషించి వుంటారు అనిపించింది నాకు.  హమ్మయ్యా ఓ పనయిపోయింది అనుకుని….

ఇటు ఇంట్లోవాళ్ళకీ అటు వీధిలో వాళ్ళకీ తెలీకుండా డబ్బెలా గడపదాటించాలీ ….ఈ వ్యాపారానికి ఏజేంటుగా ఎవర్ని నియమించాలీ అని ఆలోచిస్తుంటే ….పనిలేక పళ్ళుకుట్టుకుంటున్న నరసమ్మ కనిపించింది.

వసుదేవుడ్ని తలుచుకుని నరసమ్మని పట్టుకున్నాను.  దాన్ని మెల్లగా దువ్వి,  మీ ఇంటి చుట్టుపక్కల ఎవరికి డబ్బు అవసరమో కనుక్కో…..అసలెన్నాళ్ళుంచుకున్నా పర్లేదు వడ్డీ మాత్రం నెలనెలా ఖచ్చితంగా ఇచ్చేయాలి . అసలు విషయం ఈ డబ్బు మాదనీ నీద్వారా  అప్పిస్తున్నామనీ , అప్పుతీసుకున్నవాడికి కూడా  తెలీటానికి  వీల్లేదు  అంటూ అన్నీ వివరంగా చెప్పేసరికి అది నన్నూ మా అత్తగారినీ మార్చి మార్చి చూసి, ” యాండీ ….ఈ కొంపలో కాపీ గిన్ని తోమలేక సచ్చిపోతన్నాను. ఆ డబ్బులేయో నాకిప్పిత్తే …..ఎండురెయ్యలో ఉప్పుసేపలో కొనుక్కుని  మీ ఈదిగుమ్మంకాడే  యాపారం ఎట్టుకుంటాను కదండీ ”  అంటుంటే మా అత్తగారు ముక్కుమూసుకుని …..చీ…చీ…అనేసారు.

అది మొహం చిట్లించుకుని ……రోజూ రాములోరి గుడిలోంచీ క్రమం తప్పక వినిపించే ” ఏ నిమిసానికి ఏమి జరుగునో  ఒవలూఇంచెదరూ …ఇది ఇసాదమును …..” అని ఆ పైన దానికి నచ్చినట్టూ పాడుకుంటూ ఎళ్ళిపోయింది .

మర్నాడు అది పట్టుకొచ్చిన కబురు విని మా అత్తగారు అంతెత్తున లేచారు….” ఏంటే…..ఆ చాకలి పోలమ్మకా ….చస్తే వీల్లేదు. అది ఒక్కనాడన్నా వేసిన బట్టలు వేసినట్టూ తేలేదు. నావి  కొత్తమాయని మూడు చీరలు మాయం చేసేసింది. పెద్దరాజుగారి పంచలయితే లెక్కేలేదు….ఇంకా దుప్పట్లూ , తువ్వాళ్ళూ రేవుకొకటయినా ఎగరగొట్టేది అందుకే కదా దాన్ని మానిపించేశాం . అదసలే లెక్కతెలీని మనిషి . పోయి పోయి దాని చేతిలో పోస్తామా ఠాట్ వీల్లేదు అనేసారు

ఇంకోరోజు ….నరసమ్మ  అక్క  కోడలు కుట్టుమిషను కొనుక్కోటానికి  అడిగిందనీ…..మిషను కుట్టి నెల నెలా తీర్చేస్తుందనీ నరసమ్మ చెపితే …హత్తెరీ వీల్లేదన్నారు. దాని మొగుడు ఉత్త తాగుబోతు మర్నాడే ఆ మిషను పట్టుకెళ్ళి తాక్ట్టుపెట్టి తాగేస్తే మనగతేం కావాలి అన్నారు .

ఓ వారం పాటు నరసమ్మ తీసుకొచ్చిన బేరాలేవీ అత్తగారికి నచ్చలేదు.  తలనెప్పిబేరాలు అంటూ  అందరినీ తిప్పికొట్టారు  .

అనవసరంగా డబ్బులు ఇంట్లో పెట్టుకు కూర్చోటం వల్ల ఇప్పటివరకూ ఎంత నష్టం వచ్చిందీ నే కాకిలెక్కలేసి   చెప్పేసరికి మా అత్తగారు ఆలోచనలో పడ్డారు .
ఆ తరవాతరోజు మా అంతట మేవే నరసమ్మని బ్రతిమాలి సాయంత్రానికల్లా డబ్బులు ఎవరికో ఒకరికి అప్పుగా ఇచ్చేయమనీ రేపటినుంచే వడ్డీ లెక్కేసుకుంటామనీ చెప్పి  మా కష్టార్జితాన్ని (ఒకటికి పదిసార్లు లెక్కపెట్టిమరీ) నరసమ్మ చేతుల్లోపెట్టి హమ్మయ్యా అనుకున్నాం .

మర్నాటినుంచీ నరసమ్మ పనిలోకి రాగానే నేనో అత్తగారో ఒక్కోసారి ఇద్దరూనో …మా డబ్బు అప్పుగా తీసుకున్న సదరు సాల్తీ యోగక్షేమాలు క్రమం తప్పక విచారించేవాళ్ళం (అప్పిచ్చువాడు వైద్యుడు అని ఇందుకే అన్నారేమో). రోజులు లెక్కపెడుతూ నెల గడిపాం . అసలుకంటే వడ్డీ ముద్దని ఎందుకన్నారో మాకు అనుభవంలో తెలిసి  ముద్దొచ్చే మా వడ్డీకోసం ఎప్పుడెప్పుడాని ఎదురుచూసాం . నెల దాటి వారం అయింది నరసమ్మ రోజుకో కథచెపుతుంది. ఆ కథలు వింటూ ఇద్దరం చెరోపక్కా దాన్ని వీలయినంత సాధిస్తూ ఉండగానే రెండో నెలా నిండిపోయింది. ” అబ్బే…దీని పద్ధతేం బాగోలేదు ” అని ఇద్దరం రహస్యంగా విచారించాం .

ఓనాడు దాన్ని కొట్టుగదిలోకి లాక్కుపోయి గట్టిగా నిలదీసి అడిగితే …….ఏమాత్రం భయం బెరుకూ లేకుండా ,   “ “కరుసయిపోయినియ్యండి  “అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేసి  చెంగు జాడించేసింది  .అంతేనా…”నాకన్నీ తెలుసులెండి “అంటూ అదోలా నవ్వింది.  అత్తగారూ నేనూ అయోమయంలో పడి కొట్టుకుపోతూ ఒకరికొకరం ఆసరాగా లేచి నిలబడ్డాం.

“ఓసి దొంగముచ్చుకానా  ! వడ్డీకి తిప్పమంటే  ఇది  వాడుకు దొబ్బిందేవ్ ” అనేసారు అత్తగారు కళ్ళింత చేసుకుని

” అలాగేవుందండోయ్” అని నేనూ వంతపాడేను .

“విశ్వాతఘాతకీ “ కోపంగా అన్నారు

నాకు నోరుతిరక్క “అవునవును “ అనేసాను

కొన్ని వడగాల్పూలూ …మరి కొన్ని నిట్టూర్పులూ అయ్యాకా …..అది పోగొట్టిన సామన్లూ, నూతిలో వదిలేసిన బాల్చీలూ,  మేం దానికిచ్చిన పాత చీరలూ  అది మమ్మల్ని కసురుకున్న కసుర్లూ, విసుర్లూ అన్నీ తవ్వుకున్నాం . ఇక నరసమ్మకి వెంటనే ఉద్వాసన పలికెయ్యాలని ఏకగ్రీవంగా నిర్ణయానికొచ్చేశాం  .

నెయ్యి ఊరకే ఇచ్చాం  అనుకుందాం , గుమ్మడికాయలూ అరటిగెలలూ అసలు కాయనేలేదు అనుకుందాం . ఈ నరుసుకి  మనం పూర్వ జన్మలో రుణపడిపోయాం అనుకుందాం  ‘’  అనుకొని , ఇద్దరం ఒకర్నొకరు ఓదార్చుకున్నాం .  చివరికి…. పోయిన మా కష్టార్జితాన్ని తల్చుకుని ‘ మనకి ప్రాప్తం లేదు ఏం చేస్తాం’  అని వేదాంతం చెప్పుకుని మాకొచ్చిన కష్టం గురించీ,  మేం కోరి తెచ్చుకున్న  నష్టం గురించీ ఎవరికీ చెప్పుకోలేం కాబట్టి  తేలు కుట్టిన దొంగల్లా …ఉష్…గప్చుప్ అయిపోయాం

***

వీధిలోంచి వస్తూనే ” నరసమ్మని  గుమ్మం తొక్కడానికి వీల్లేదన్నారట  . అది వీధిలో మీటింగు పెట్టి మరీ ఏడుస్తుంది.   ఏం చేసిందదీ ….ఎందుకు రావద్దన్నారూ ?” ఆరాగా అడుగుతున్నారు మాంగారు .

“అవును నేనూ అడుగుదామని మర్చిపోయాను ఎందుకు రావద్దన్నారూ …. ఏం చేసిందదీ  ?” అదే ప్రశ్నని  తిరగేసి అడిగారు అబ్బాయిగారు . కుక్కుటశాస్త్రం లోంచీ తలెత్తి ….

నేను కిటికీలోంచీ చూస్తే  అత్తగారు పక్కచూపులు చూస్తూ గోవిందనామాలు పాడుకుంటున్నారు గట్టిగా …..

వడ్డికాసులవాడా గోవిందా …..
వసుదేవ తనయా గోవిందా
గోవిందా హరి గోవిందా…. గోవిందా హరి గోవిందా….

హుమ్మ్మ్… మళ్ళీ నేనే  అత్తగార్ని ఆదుకోవాలి కాబోలు అనుకుని ,

“మిమ్మల్నే…..  ఒకసారి లోపలికొస్తారా ….” అని తలుపుచాటునుంచీ గోముగా పిలిచాను .

ఏడో చేప ఎందుకెండలేదని రాజుగారు అడుగుతున్నారు .

ఏదో ఒక కథ చెప్పాలిగా మరి !

.

‘అతనికంటె ఘనుడు’

SAM_0344శ్రీ శ్రీ శ్రీ  గిరజాల  బోడిబాబు  మాఊరికే కాదు చుట్టుపక్కల మూడూళ్ళకి  మహా మహా వైద్యగాడు గా చెలామణీలో ఉన్నాడు.  వాడినడిగితే హోలు తూ.గో. జిల్లాకే తాను తలమానికం అని చెపుతాడు అరగిద్ద మొహం పెట్టుకుని .  నేను నమ్మలేదు  మీరూ నమ్మకూడదు . నాకు వాడు  యమలోకానికి దారిమర్చిపోయి,  భూలోకంలో సెటిల్ అయిపోయిన యమకింకరుడిలా  అనిపిస్తాడు.  వాడు  ఎంబీబిఎస్స్ ఎఫ్ఫార్సీయెస్ కాకపోయినా కనీసం ఆరెంపీ అయినా , అవునో కాదో అని నాకో గొప్ప అనుమానం.

ఆ మాటే అంటే అత్తగారు అంతెత్తున లేచారు. నీకేం తెలుసూ నిమ్మకాయపులూసూ… బోడిబాబు తాత ‘పెదబోడిబాబు‘ కి ఆయుర్వేదంలో ఎంత పట్టుండేదో ….మనిషిని కళ్ళతో చూసి మందిచ్చేవాడు  – ఆ మందు ని అంతదూరం నించీ వాసన చూస్తే రోగం  రెక్కలు కట్టుకు ఎగిరిపోయేది  అంటూ ఇంతని అంత చేసి చెప్పుకొచ్చేవారు.

‘గాడిదగుడ్డేం కాదూ ……. ! మా అమ్మమ్మ గొప్ప సంగీత విద్వాంసురాలు (మా లోగిట్లో ). అలా అని నేను ‘ సరిగమ పా’ అంటే అది సంగీతం అయిపోతుందా?  ఇంటన్నానుకదా అని  ఇల్లాజికల్ కథలు చెప్పకండి. అసలు మీ బోడిబాబుల్నీ వాడి తాతబాబుల్నీ ఐ డోంట్ కేర్ ‘ అని మనసులో గట్టిగా అనుకొని, పైకి మాత్రం  “అదికాందండీ   నేను రామిండ్రీ  విమలమ్మ ఆస్పత్రిలో పుట్టేను  కాబట్టి, నాకు దగ్గొచ్చినా దురదొచ్చినా అక్కడ చూపించుకుంటేనే తగ్గుతుందట . వేరే వైద్యాలు అచ్చిరావంట  మా అమ్మమ్మ చెప్పేరు”  అని  వివరంగా చెప్పేను. ఎంచక్కా నాకు జరమో జలుబో వస్తే …..అక్కడికే పోతానుకానీ, మీ బోడి వైద్యాలు  నాకొద్దుబాబూ అని అత్తమాటకు ఎదురాడేసాను.

“చాల్లే  బడాయి….ఆ వంకన బండెక్కి రామిండ్రీవెళ్ళి  మొగుడితో షికార్లు తిరగాలనీ , సినిమాలు చూడాలనీ ఉంటే అలాక్కానీ  , దానికోసం మా బోడిబాబు వైద్యానికి  వొంకలు పెట్టకు  ఠాట్ …..” అంటూ నా నోరు మూయించేసారు . నా బొందిలో ప్రాణముండగా  బోడివైద్యానికి  దొరక్కూడదు అని ఊర్లో చావుమేళం వినిపించినప్పుడల్లా అనుకునేదాన్ని. ఎవరో కవి చెప్పినట్టూ  అనుకోలేదని ఆగవు కొన్నీ ……!

ఓనాడు ఏం తోచక నేనొక్కదాన్నే కూర్చుని  పులీమేకా ఆడుకుంటుంటే ,మా అబ్బులుగాడు   తంపటేసిన తేగలు గంపతో  తెచ్చి అరుగుమీద గోనేసి అక్కడ వొంపేసి పోయేడు.  సాయంత్రానికి సల్లారతాయండి అంటూ…..

చల్లారేకా వేడి తేగ దొరకదు కదా అని ఒకటి తీసుకు తినేసి, మధ్యలో చందమామ తీసి  చీల్చి చూస్తే అబ్బాయొచ్చింది.  అయ్యో అమ్మాయయితే బావుంటుంది కదా  అని , ఇంకో తేగా ఇంకో తేగా తింటూ చందమామలు చీలుస్తూ ఉన్నా …..మొత్తం పూర్తయ్యేసరికి,  ఇరవైమూడు అబ్బాయిలూ రెండో మూడో అమ్మాయిలూ వచ్చాయి . హమ్మయ్యా….”  అమ్మాయే పుడుతుందీ అచ్చం అమ్మలాగే వుంటుందీ ” అని హాయిగా పాడుకుని బ్రేవ్ మని త్రేంచి వెళ్ళి పడుకున్నాను.

సాయంత్రం , పెద్దవీధి రామాలయంలో శ్రీరామాంజనేయ యుద్ధం రికార్డు వేసే టైం కి మెలకువొచ్చింది. కడుపులో పుట్టిన సుడిగుండం నన్ను ఈడ్చి అవతలపారేసింది. ఇంకేవుందీ అరుగుచివరి కూర్చుని బొళక్…బొళక్ మని ఒకటే కక్కులు.

ఒకటి రెండు….ఆరు…తొమ్మిది…..అంతే , ఇంక  లెక్కెట్టలేక  కక్కటం మానేసి  తలపట్టుకు కూలబడ్డాను. నూతి దగ్గరనుంచీ  “సిన్నయ్యగారూ…..” అని మధ్యమంలో  అరుచుకుంటూ నరసమ్మ స్లోమోషన్ లో  లగెత్తుకు రావడం మాత్రం గుర్తుంది.

కళ్ళు తెరిచేసరికి రెండు ప్రశ్నార్ధకాలూ, ఒక హాశ్ఛర్యార్ధకం, ఒక బ్రేకెట్ ఫేసూ ( ఇది అత్తగారిదే   పెద్దయ్యగారికి గుట్టెక్కువకదా)  నా మొహంలోకి  చూస్తూ నిలబడ్డాయి.  పోన్లే  బతికే ఉన్నాను అనుకొని తృప్తిగా కళ్ళుమూసుకున్నాను.

కళ్ళుమూసుకున్నట్టూ చెవులు మూసుకోలేం కదా ! కళ్ళకి రెప్పలు పెట్టిన దేవుడు చెవులకి డిప్పలు పెట్టడం ఎలా మర్చిపోయాడబ్బా!!

“అమట్నీ…..నరసమ్మోయ్ నన్నట్టుకోయే అని పేద్ద గావు కేకెట్టేసి చిన్నయ్యగారు అమాoతం అరుగుమీంచీ…….” నరసమ్మాయణం వినిపించేస్తుంది నరిసి . నేను ఇలానే ఇంకాసేపు కళ్ళుమూసుకుంటే  భారత భాగవతాలు కూడా కల్పించేస్తుంది. పైగా వాటిలో దశావతారాలూ తానే  అని నమ్మించేస్తుంది.

దేనికయినా అద్దూ ఆపూ ఉండొద్దూ – అబ్బాయిగారి వెటకారం

రాయమంద్రం తీసుపోదారాండీ , తొట్టి తగిలించేమంటారాండీ  – అబ్బులుగాడి ఆరాటం

పుట్టింటివాళ్ళకి కబురు చెప్పొద్దూ..మళ్ళీ మాటొస్తుందేమో – మాంగారి అనుమానం

ఏవని కబురెడతాం….ఏ సంగతీ తెలవాలికదా ! ఒరేయ్ అబ్బులూ నువ్వెళ్ళీ ఉన్నపళంగా వెంటపెట్టుకురా – అత్తగారి అల్టిమేటం

రాగం తాళం తప్పినా ఒకే ప్రశ్నని బృందగానంలా  వినిపించాయి నాలుగు స్వరాలూ….. ఎవరినెవరినెవరినీ…….????

నా గుండె పీలగా కొట్టుకుంటూ నాకేదో సంకేతం పంపిస్తోంది…….  ఆ ‘ ఎవరు ‘ ఎవరైతే కాకూడదని  చెవులు రిక్కించుకుని  దేవుడ్ని ప్రార్ధించానో ఆ పేరే మా సావిట్లో ప్రతిధ్వనించింది. ఇంకేవుందీ….  బోడిబాబుకి కబురెళ్ళింది.

కలలో ‘ కైలాసరధం’  కనిపించినట్టూ  నేను  కంగారుగా లేచి కూర్చున్నాను.  ఎలాగో ఓపికతెచ్చుకుని మంచం దిగి పరిగెట్టాలని ప్రయత్నించినా “ఈ పరిస్థితిలో మర్యాదలేవిటీ  అక్ఖరలేదు  పడుకో”  అంటూ అత్తగారు నన్ను మళ్ళీ మంచంలో కుక్కేసారు .

అవకాశంకోసం చూస్తున్నట్టూ  టింగ్మంటూ నా చెవిదగ్గర చేరి…” గుస…గుస…గుసా …”  అంటూ ఆరా తీసారు. అందరూ ఆసక్తి గా  నన్నే చూస్తున్నారు.  ‘ చీ… పొండీ ‘  అంటూ   సినిమా హీరోయిన్ లా  అనవసరంగా సిగ్గుపడిపోయి, అబ్బులుగాడు తేగల గంప దింపటం దగ్గరినుంచీ జరిగిందంతా పూస గుచ్చినట్టూ చెప్పేసరికీ….. “ఇంతా చేసి పైత్యం వాంతులా  సరిపోయింది సంబడం” అంటూ  ….అత్తగారు గబగబా  ఇంట్లోకి పరిగెట్టి ఓ చేత్తో మిరపకాయలూ, మరో చేత్తో ఉప్పూ పట్టుకొచ్చి, దిష్టి తీసి అవతల పారేసి వచ్చారు.” ఈ మాట ఎవరితోనన్నా అన్నావు కనక.   రాజుగారి  కోడలు గంపడు తేగలు తినేసి పైత్యం తెచ్చుకుందటా అని  ఊరు ఊరంతా చెవులు కొరుక్కుంటారు  అప్రదిష్ట” అన్నారు.

చెప్పనులెండి ఆయన ప్రేమగా ఓ తేగబద్ద పెట్టారు అది సయించలేదు అని చెపుతాను.

” ఇంకా నయం …..” అన్నారు గాభరాగా …..” సంసారం గుట్టు రోగం రట్టు అన్నారు పెద్దలు  .మొగుడూ పెళ్ళం ముక్క బద్దా పంచుకు తింటారని తెలిస్తే దిష్టి కాదూ  ! అలాక్కూడా చెప్పకు” అన్నారు.

పోనీఒకే ఒక్క తేగ  మీరూ నేనూ పంచుకు తిన్నాం అని చెప్పనా ….అన్నాను అమాయకత్వం ఒలకపోస్తూ …..(అత్తగారిని ఆకట్టుకునే అవకాశం ఎప్పుడోకానీ రాదు కదా. వచ్చినప్పుడు వాడేసుకోవాలి మరి)

హారి భగవంతుడా మరీ ఇంత అమాయకురాలివేంటే …..అసలెందుకూ చెప్పటం . ఆ ముదనష్టపు  తేగల సంగతి మర్చిపో, అసలు వాటిమాటెత్తకు అన్నారో లేదో……

అవునూ మధ్యాహ్నం  పొలం నుంచీ  తేగలు పంపించాను.  ఎక్కడా కనిపించవేం అన్నారు మీసాలు సర్దుకుంటూ మా మాటలు సగం సగం వినబడ్డ మాంగారు.

అత్తగారు గతుక్కుమని  హుష్ ..ఏవిటా గావుకేకలూ , తేగలు  ఈగలెత్తుకెళ్ళాయి  అనేసరికి  , ఒహో అలాగా అనేసి ఊరుకున్నారు మాంగారు.

మరి… పెళ్ళాం మాటమీద  ఆ మాత్రం నమ్మకం ఉండాలి మొగుడుకి.  చూసి నేర్చుకోండి అంటూ కళ్ళెగరేసి  సోగ్గాడికి సంసారోపనిషత్   బోధించాలని ప్రయత్నించాను . మొద్దుపిల్లాడిలా తల అడ్డదిడ్డంగా ఊపేసారు ఏవర్ధవయిందో ఏంటో!

బోడిబాబుకోసం వెళ్ళిన అబ్బులు చివర్ల నల్ల నల్లరంగు రాసిన  పోస్టు కార్డు లా  తిరుగుటపాలో వచ్చేసాడు. హమ్మయ్యా…వీడికి బోడిబాబు దొరకలేనట్టుంది. ఎక్కడ ఎవరి ప్రాణాలు పిండుతున్నాడో ! నే పడ్డ వేళమంచిదయింది అనుకొని ఊపిరి పీల్చుకునానో లేదో …..

“బాబుగారు పొగడ్రి రాసుకొచ్చేత్తాను పదమన్నారండి,” అంటూ చావుకబురు చల్లగా చెప్పేడు.

“వీడి సోకు సంతకెళ్ళా   ….ప్రాణాలు పోతున్నాయన్నా పొగడ్రు రాసుకోకుండా రాడేంట్రా వాడు?” మాంగారు ముచ్చటగా అడిగారు .

“సొగసు తక్కువా సోకెక్కువా సన్నాసికి,  చావుకు కబురెడితే తద్దినానికి దిగబడతాడు. వస్తాడులెండీ కాంగారేం ….” సోగ్గాడి స్వగతం.

“ఏవైనా బోడిబాబు నీట్నెస్సు ఇంకెవరికీ రాదు,” మెచ్చుకోలుగా అంటున్నారు అత్తగారు.

పిలుపు అందాకా పొగడ్రు రాసుకునీ , నడినెత్తిన ఆనవాలుగా మిగిలిన నాలుగు వెంట్రుకలనీ సమాంతరంగా  అన్నివైపులకీ సర్ధీ, సర్ధీ సర్ధీ…. ఇస్త్రీచొక్కా తగిలించి, ఫుల్ హేండ్స్ ని  సగం వరకూ నీటుగా మడిచి, కాలర్ సర్దుకుని, జేబురుమాలుకు సెంటురాసుకుని, నల్ల కళ్ళద్దాలు నెత్తిని తగిలించుకుని గానీ గుమ్మందాటడు బోడిబాబు.

ఆ ఆలశ్యమే ఒక్కోసారి రోగులపాలిట అమృతం అవుతుంది . ఇకనో ఇప్పుడో వాలిపోతాడు ఎలా తప్పించుకోవాల్రా భగవంతుడా అని నేను మిగుల చింతిస్తూ వుండగా ….చేత్తో ఇత్తడికేను తో  పిల్లంక మామ్మయ్య  (మాంగారి మేనత్త) గుండ్రాయిలా డుబుడుబుమంటూ దొర్లుకొచ్చేసారు. మామ్మ ని చూడగానే  నాకు కొంచెం ధీమా వచ్చింది. ఆవిడ  తనవెనక సగం   భూగోళాన్ని దాచేయగలరు  మరి.

ఆవిడ చేతిలో కిళం పట్టిన ఇత్తడికేను  చూస్తూనే  అక్కడున్నవాళ్ళంతా  గుండుదెబ్బ తప్పించుకున్న పిట్టలగుంపులా  తలో దిక్కూ ఎగిరిపోయారు. ఆ  కేనులో ఉండేవాటిని సున్నండలు అని ఆవిడ పిలుచుకున్నా  వాటిని కళ్ళతో నూ ముక్కుతోనూ చూసినవాళ్ళంతా అవేవో గ్రహం నుంచీ జారిపడ్డ మట్టిబెడ్డలు అనీ, వాటినించీ వెదజల్లబడుతున్న సుగంధం ఈ నేలకూ ఈ గాలికీ చెందినది కాదనీ వాదిస్తారు . అసలు ఒక్కరయినా నోట్లో పెట్టకుండా ఆ వాదనలేంటీ ? అని కాపరానికొచ్చిన కొత్తల్లో అబ్బాయిగారితో అంటే ….. అది నోట్లో పెట్టుకున్నాకా ఇంక వాదన ఉండదే ….రోదనే  అంటూ గోడమీద దండేసిన ఫొటో చూపించారు. అది పిల్లెంక తాతయ్యది.

ఆవిడ కొనే రూపాయి పాలనే పెరుగు చేసి, దేవతలు పాలసముద్రం చిలికినంత ఓపిగ్గా చిలికి రోజూ గోరంత వెన్న తీసి, దాన్నే దాచీ… కాచీ అలా తయారయిన నెయ్యితో  యుగానికొక్కటిగా తయారయిన సున్నుండలు ఆ మాత్రం కంపు రావటం సహజమే కదా!’  పైగా పుల్లలు పొదుపుచేస్తూ బియ్యాన్నీ  మినుములనీ ఓసారి  మూడుకుకి అలా చూపించి ఇలా తీసేస్తారట. అదో పచ్చికంపు.

పిల్లంక వాళ్ళకి పొదుపని తెలుసుకానీ మరీ ఇంతా….’ అని హాస్చర్యపడీ ….పడీ  పోయారంట తాతయ్య.

అలా అంతా ప్రాణభయంతో పారి పోగా మర్యాదకోసం మా అత్తగారూ, మంచంలోంచి లేవలేక నేనూ అక్కడే చిక్కడిపోయాం . “కోడలు కళ్ళుతిరిగి పడిందటగా ఏవన్నా విశేషమా… ఇందా పట్టూ  సున్నుండ” అంటూ మామ్మయ్య పట్టలేని సంతోషంతో కేన్ లోంచీ  ఎండిపోయిన మారేడుకాయలాంటిదాన్ని  తీసి, మా అత్తగారి నోటికందిచడాని మీదమీదకొచ్చేసరికి, ఎటు పరిగెత్తాలో పాలుపోక మా అత్తగారు పిల్లిముందు ఎలకలా అటూ ఇటూ గెంతుతున్నారు.

ఆపదలో ఉన్నది నేనుకాదు కాబట్టీ నీరస దరహాసంతో  ఆ ఆటని తిలకిస్తూ వుండగానే … ఊర్లో ఉన్న పిన్నత్తగార్లూ, పెద్దత్తగార్లూ,తోడికోడళ్ళూ, ఆడబడుచులూ  అంతా( ఇస్త్రీ చీరలు కట్టుకుని ) కట్టకట్టుకుని పెరటిగుమ్మం తోసుకుని వచ్చేసారు బోడిబాబుకు కబురెట్టారట   ఏం జరిగిందీ? ఎవరికి మూడిందీ? అంటూ అందరూ ఆరాగా అడిగేస్తున్నారు. ఆ వెనకే నరసమ్మ చెంగుమంటూ సీన్లోకి ఎంటరయిపోయి, సూడండమ్మా ఎంత ఘోరం జరిగిపోయిందో అన్న ఎక్స్ ప్రెషన్ తో గుక్కతిప్పుకోకుండా,  ఏం జరిగిందీ, ఎలా జరిగిందీ…..అన్నది వివరంగా ఒక్క ముక్క పొల్లుపోకుండా వివరించేసింది.

మా అత్తగారు తలపట్టుకున్నారు గుట్టూ – రట్టూ  సామెత గుర్తుచేసుకుని.

అపార్ధం చేసుకున్న అమ్మలక్కలు  “అయ్యో….ఈ మాత్రానికే అంత బెంగ పెట్టేసుకుంటారా… పోతేపోయిన తేగలు . మళ్ళీ తవ్వుకుని తంపటేసుకోవచ్చు దానికేం భాగ్యం.  ఏవయినా  కోడలంటే మీకు…ఎంత ఇదో…ఎంత అదో… మీలాంటి అత్తాగారిని  సినిమాల్లోకూడా చూడలేం బాబూ “ అంటూ ముఖ స్తుతి  కావించారు. అత్తగారు ఆనందాన్ని దాచుకుంటూ వచ్చిన అందరికీ టీలు ఆర్డరిచ్చారు.

‘ఈ యాలప్పుడు టీలేటండీ  మతిలేపోతేసరీ….’ అని అందరికీ వినిపించేలా సణుక్కుంటూ వెళ్ళింది నరసమ్మ. నాక్కొంచెం బాధేసింది వాళ్ళొచ్చింది  నన్ను పరామర్శించడానికా, మా అత్తగారిని  చెట్టెక్కించడానికా అని.

“వచ్చినవాళ్ళు ఎలానూ వచ్చారు కాసేపు కూర్చోండర్రా ”  అంటూ మా పిల్లెంక మామ్మయ్య అరుగుమీద చాప పరిచి, కాను మూత తీసేసరికి, అమ్మో….బాబో….మాకు అర్జెంటు పనులున్నాయ్, అవతల కొంపలు మునిగిపోతున్నాయ్ అని వచ్చిన తోవనే  గేలాపెత్తేసారు అమ్మలక్కలు.

నరసమ్మ పని తప్పిందని టీ గిన్నె దించేసింది.

వీధిలోంచీ  అబ్బులుగాడు “బోడిబాబుగారొచ్చేత్తానారహో….” అని  టముకేసుకుంటూ వచ్చేస్తునాడు. అత్తగారు  అభయ హస్తం చూపించారు ఇక అయ్యింది నీ పని అన్నట్టు. నాకు ఆవిడమీద ఇంతెత్తుకోపం వచ్చేసింది.  ‘మీకు విడాకులిచ్చేసాను ఫో ….’ అని  బెదిరిద్దామని చూస్తే  దరిదాపుల్లో కనిపించలేదు ‘ నలమహారాజు’ . ఇంక ఎవరిని బెదిరించాలో ఈ ఆపదనించీ ఎలా బయటపడాలో అర్ధం కాక కుడితిలో పడ్డ  ఎలకలా కుక్కిమంచంలో పడి కొట్టుకుంటున్నాను.  చివరి ప్రయత్నంగా మనసులోనే  కేశవనామాలు పఠించాను (నాకొచ్చిన మంత్రాలు అవొక్కటే). ఘుమఘుమలాడిపోతూ  బోడిబాబు మూత ఊడిపోయిన సెంటుబుడ్డిలా దొర్లుకొచ్చేసాడు.  కడుపులో వికారం మళ్ళీ మొదలయింది.

ఊరికే  చెప్పారా ‘అనగా అనగా రాగం  తినగా తినగా రోంగo’ అనీ….  ‘నీకీశాస్తి జరగాల్సిందే’ నన్ను నేను నూటపదారోసారి తిట్టుకున్నాను.

బోడిబాబుగారు  ఒకసారి కళ్ళజోడుతీసి మళ్ళీ తలకి తగిలించుకుని, కాలర్ సర్దుకుని, జేబురుమాలుతో పీట తుడుచుకుని చొక్కా ఎత్తి పట్టి కూర్చున్నాడు. అబ్బులు చేతిలోంచీ యమపాశంలాంటి మడత సంచీ అందుకుని బోర్లించాడు. సూదులూ, ఇంజెక్షన్ బుడ్లూ, రకరకాల రంగుబిళ్ళలూ, ఒకటో రెండో సెలైన్ సీసాలూ. గాజు సీసాల్లో పొడులూ, లేహాలూ…..అత్తగారు ఆ సరంజామాని అద్భుతంగా చూస్తున్నారు. ఎలా చస్తావో నువ్వే కోరుకో అని నాకు బోలెడు ఆప్షన్స్ ఇచ్చినట్టూ నాకేసీ, వాటికేసీ మార్చిమార్చి చూస్తున్నారు.

నరసమ్మ గ్లాసుతో నీళ్ళుతెచ్చి బోడిబాబు పక్కన పెట్టింది. ‘టేంక్సు’ చెప్పి గ్లాసెత్తెయ్యబోతే…..”అయబాబోయ్  బోడిబాబుగారో అయ్యి యేణ్ణీళ్ళండీ  ఇండీసనుకోసం  అట్టుకొచ్చేను” అనేసింది గాభరాగా.

‘ఓసి నరసమ్మోయ్ ఇండీషనేంటే  అపశకునపక్షీ……’ నా  ప్రాణాలు గిలగిలా కొట్టుకున్నాయి.

అబ్బులుగాడు మోకాళ్ళమీద వంగి ఆసక్తి గా   చూస్తూ  పతంజలి కథల్లో  మందిచ్చి ప్రాణం తీసే పకీర్రాజు  వెనకాల గోపాత్రుడులా బోడిబాబుకు తెగ సలాహాలిచ్చేస్తున్నాడు.  నేను మంచందిగి పారిపొయే అవకాశం లేకపోలేదని గ్రహించినట్టూ మా అత్తగారు నా తలదగ్గర కొచ్చి మంచం  పట్టిమీద కూర్చున్నారు.

అప్పుడు అడిగాడు  బోడిబాబు  “ఏటండీ తేడా ఏం  తినేహేరూ ?? ”

నరసమ్మ ఉత్సాహంగాగొంతు సర్ధుకుంది. అత్తగారు  దాన్ని కళ్ళతోనే వారించి, ఆ ఏవుందీ ….అది వద్దు వద్దూని మొత్తుకుంటున్నా నేనే ఓ ముద్ద ఎక్కువ తినిపించాను . అజీర్తిచేసినట్టుంది .  అలా వాంతిచేసుకుని ఇలా మంచానపడింది. ఏంటో ఈ కాలం పిల్లలు …. అందులోనూ మా కోడలు మరీ అపురూపం  అన్నారు. గుట్టూ రట్టూ బేలెన్స్ చేస్తూ …

ఊ … కొడుతూ కథ వినేశాడు బోడిబాబు.

“సిన్నయ్యగారు  సాలా నీరసవయిపోయేరండి బోడిబాబుగారూ…. అది తగ్గటానికి సూదిమందెయ్యాలండి,” నరసమ్మ సూచన

“నీరసం తగ్గితే సరిపోద్దేటే …బలం రావొద్దూ  ఓ పంచేయ్యండి బోడిబాబుగారూ ….రెండో నాలుగో సెలైన్ కాయలెట్టెయ్యండి” అబ్బులుగారి సలహా.

మీరు నోరుమూసుకోండి ఏం చేయాలో  వాడికి తెలీదా? అంటూ వాళ్ళమీద కేకలేసి  త్వరగా  పైత్యం సర్దుకుని పనుల్లో దిగేలా గుళికో లేహ్యమో  చూసివ్వయ్యా అత్తగారి ఆర్డర్ .

అన్నిటికీ తలాడిస్తూ బోడిబాబు క్రతువు ప్రారంభించాడు. వాడి స్పెషాలిటీ నే అది. ‘రోగి కోరిందీ వైద్యుడు ఇచ్చిందీ ఒకటే’ అన్న సామెతని నిజం చేయడానికే పుట్టినట్టుంటాడు. ఆయుర్వేదంలో అల్లోపతీని మిక్స్ చేసి కొత్త ప్రయోగాలు చేస్తుంటాడు.

పొట్లం విప్పి  అందులో  పొడిని నీళ్ళతో కలిపి ఉండలు గా చేసాడు . సీసాలో రంగునీళ్ళని సిరంజ్ లోకి తోడాడు . .ఇంకా ఏవేవో చేసి, ఒరేయ్ అబ్బులూ నువ్వీ సెలైన్ కాయట్టుకుని  అలా నిలబడు అంటూ వాడిభుజానికి దాన్ని తగిలించి, ఉండలు నరసమ్మ చేతికిచ్చి, చెవిలో ఏదో చెప్పాడు. అది పాత కోపాలన్నీ గుర్తు తెచ్చుకుని నావైపు క్రూరంగా చూసి నవ్వినట్టనిపించింది. మా అత్తగారు ఎలర్ట్ అయిపోయి , నా భుజం గట్టిగా పట్టుకున్నారు. బోడిబాబు  మారువేషంలో ఉన్న మాంత్రికుడిలాగా నావైపు  వచ్చేసాడు.

చావు ఎదురుగా ఉన్నప్పుడు పుట్టుకొచ్చేవాటినే  చావు తెలివితేటలు అంటారా? ఏమో!

కనీసం మృత్యుంజయ మంత్రమయినా నేర్పితివికాదేవమ్మా  అని నన్ను పదారేళ్ళు పెంచిన అమ్మమ్మని కసి తీరా తిట్టుకుని   మంచీ మర్యాదా అవతలకి విసిరేసి, అత్తగారిని ఇవతలకి ఒక్క లాగు లాగి ఓపికంతా కాళ్ళలోకి తెచ్చుకుని ఒక్క  గెంతులో గదిలోకెళ్ళి తలుపేసుకున్నాను.

ఆ వెనకే …….చచ్చాన్రోయ్ అని అత్తగారి ఆర్తనాదం.

“ఏం పర్లేదు కుంత ఓర్చుకోండి  అయిపోయింది. అయినా మీరడ్డం పడ్డారేటండీ పెద్దయ్యగారూ…” అంటూ ఆవిడ  భుజానికి ఈ పక్కన దించిన సూదిని ఆ పక్కనించీ పీక్కుంటూ అంటున్నాడు బోడిబాబు. ఎలాగూ మంచాన పడ్డారుకదా సిలైను కాయెటేత్తాను. కూసేపలా పడుకోండి అంటే ఆవిడ ‘ నాకొద్దులేరా బాబూ  అదిగో  పిల్లెంక ఆయ్యగారికి ఈ మధ్య నీరసం అంటున్నారు అదేదో ఆవిడకి ఎక్కించు’  అనేసరికి  బోడిబాబు అటు మళ్ళాడు.  ఆ వెనకే సెలైన్ స్టేండు ని ( అబ్బుల్నీ) తీసుకుపోయాడు.

అల్లోపతిలో రోగాని కి  మందు , హోమియోపతిలో రోగికి మందు …..మరి ఈ బోడోపతీలో …….!!!!

ఇంతాచేసి,  రుబ్బురోలు పొత్రంలా వాచిపోయిన భుజానికి వేణ్ణీళ్ళ కాపడం పెట్టుకుంటూ అత్తగారంటారుకదా …. ….. వీడు తాతని మించిపోయాడేవ్! వాడిచ్చిన మందును వాసన అయినా చూడాల్సొచ్చేది,  మన బోడిబాబును కళ్ళతో చూస్తేనే రోగం పారిపోతుంది.

ముక్కుతూ మూల్గుతూ మంచాన పడున్నదానివి  ఒక్క గెంతులో గదిలోకెళ్ళి పడ్డావంటే అదంతా ఎవరి ఘనతా!

***

(మీకూ తెలిసేవుంటుంది :  తేగలో మధ్యన పుల్లలా ఉండేదాన్ని చందమామ అంటాం. (అదేం చిత్రం?)

ఆ చందమామని నిలువుగా పట్టుకుని రెండుచేతులతో చీల్చినపుడు అది సమంగా రెండు బద్దలవుతుంది లేదా, అడ్డదిడ్డంగా విడుతుంది . దాన్ని బట్టి, పాసవుతానా ఫేలవుతానా, రాత్రి బస్సు వస్తుందా రాదా, అందులో చుట్టాలు దిగుతారా దిగరా, అక్కలో అత్తలో కడుపుతో  ఉంటే వాళ్ళకి పుట్టేది  ఆడపిల్లా మగపిల్లాడా…..అలా ఎన్నెన్నో క్లిష్టమయిన సమస్యలకు  సమాధానాలు చెప్పేది తేగలో చందమామ.

శుభవార్తలు తెచ్చే కార్డు చివర్ల పసుపు రాసినట్టు, దుర్వార్తలు తెచ్చే కార్డులకి నల్లరంగు (సిరా)  పూస్తారు. ఇప్పుడసలు కబుర్లు మోసుకొచ్చే కార్డులే లేవనుకోండీ!

తెల్లారగట్ల ప్రయాణం

“ఎన్నిగంటలకి పెట్టమంటావ్  అలారం,” అంటూ గడియారం పట్టుకొచ్చారు మా అత్తగారు.  మా అత్తగారికి తెలిసిన అతికొద్ది విద్యల్లో అలారం పెట్టడం ఒకటి.

ఆ గడియారంలో సెకన్ల ముల్లు నడుం విరిగి అందులోనే పడిపోయింది. ఇన్నాళ్ళూ తమతోపాటూ కలిసి తిరిగింది అలా పడుందన్న బాధ కాస్తయినా లేకుండా ఒకదాన్నొకటి రాసుకు పూసుకు తిరిగేస్తున్నాయి గంటలముల్లూ నిమిషాల ముల్లూ. “ఎప్పుడో  తెల్లారగట్ల పెళ్ళి ….ముహుర్తం  వరకూ ఎవరుంటున్నారు  రాత్రి భోజనాల్లో అయితే అందరూ కనిపిస్తారు. అంటే సాయంత్రానికి చేరుకుంటే సరిపోతుంది. పోనీ  మధ్యాన్నానికి  వెళ్ళగలిగితే ఊళ్ళో మిగతా చుట్టాల ఇళ్ళుకూడా చుట్టి రావచ్చు లేదంటే మళ్ళీ నిష్టూరాలు.  కాబట్టి పొద్దున్నే బయల్దేరాలి. తప్పుతుందా…తెల్లారు  గట్టే లేవాలి.”

“అవునవును   నాలుక్కి లేవలేకపోయినా కనీసం అయిదయ్యేసరికన్నా లేవాల్సిందేనండీ  హ…ఆ…..ఆ….” అని హాయిగా అవులిస్తూ నా అమూల్యమయిన సలహా ఆవిడముందు  పరిచాను.  ఆవిడ దాన్ని అధికారికంగా చుట్టేసి ఓ మూలకి విసిరేస్తూ…

“నీ మొహంలావుంది …..నాలుక్కి లేచి, టిఫినూ, అన్నంకూరా వండి ,నీళ్ళుకాచుకుని  స్నానాలు చేసి …  దేవుడికి దీపం పెట్టుకుని, ఇద్దరం టిఫిన్ తిని కాఫీ తాగి, మగమహారాజులిద్దర్నీ లేపి, వాళ్ళకీ ఇంత కాఫీ పోసి ….  ఇల్లు చూస్తుండమని శారదత్తయ్యకి చెప్పి మనం  ఎదురుచూసుకుని  బయల్దేరేసరికి  దుర్ముహుర్తం  వచ్చెయ్యదూ! రేపు శనివారం , అయితే అయిదు లోపులో లేదా ఎనిమిది తర్వాత పెట్టుక్కోవాలి ప్రయాణం.  అయిదు గంటలకి ప్రయాణం అంటే రెండు గంటల కైనా  లేవొద్దూ ….. అందుకనీ  ఒంటి గంటకి పెడతాను . అలారం మోగాకా బద్ధకంగా ఓ గంట అటూ ఇటూ దొర్లి లేచినా పర్లేదు.”  అంటూ ….అలారం  సెట్ చేసిన గడియారం  నా గదిలో టేబుల్మీద పెట్టి, “పడుకో పడుకో……మళ్ళీ  తెల్లారగట్లే లేవాలి,” అంటూ వెళ్ళిపోయేరు.  ఆ మాత్రం దానికి  “ఎన్నింటికి పెట్టనూ?” అని అడగడం ఎందుకూ…అన్నీ అబ్బాయి పోలికలే  అని అసందర్భపు అక్కసుని వెళ్ళబోసుకుంటూ.   టైం చూస్తే  పన్నెండున్నర !!

హత్తెరీ బేగ్గులు సర్ధుకోటంలో టైం చూసుకోలేదు  ఇంకేం  నిద్ర  అనుకుంటు తలుపు జారేయబోతుంటే  అత్తగారు , వీధరుగు మీద నిద్రపోతున్న అబ్బులు గాడిని  నిద్రలేపి “ఒరేయ్ తెల్లారగట్లే లేవాలి గుర్తుందా  పడుకో పడుకో ” అనడం వినిపించింది.

“మర్చేపోయాను…..నా గంధం రంగు చీర పెట్టేవా ?” అంటూ మళ్ళీ  వచ్చేసారు .  “ హా…….పెట్టానేమో లెండి!!” అన్నాను.  నాకు అర్జెంటుగా నిద్ర ముంచుకొచ్చేస్తుంది. అసలే అలారం మోగడానికున్న టైం అరగంటేనాయే….

“ఏ గంధం రంగనుకున్నావూ …….మొన్న దీపావళికి మా పెద్దన్నయ్య పెట్టాడూ అదీ ……చింతపిక్క రంగు అంచూ……అక్కడక్కడా మామిడిపిందె బుటాలూ……”
“హా….హ……ఆ ……..” పెట్టానండీ అని ఆపద్ధర్మంగా అబద్ధం ఆడేసాను. ఇప్పుడు బీరువా తీస్తే …….ఆ బరబరలకి   నిద్రాభoగమయితే ముసుగులో  సింహం మేల్కొనవచ్చు….ఏమో మీదపడి నమిలేయొచ్చు. . ఇప్పటికే పది గాండ్రింపులయ్యాయి. “పగలంతా ఏ పెద్దగుర్రాలకి  పళ్ళు తోమారు  అత్తాకోడల్లిద్దరూ అర్ధరాత్రి  అపరాత్రి లేకుండా …వెధవ సర్దుళ్ళూ మీరూనూ” అంటూ.

మీకేం తెలుసు మా అవస్థలు .  అనుకోటానికి నాలుగు జతల బట్టలేకానీ….ఎన్నెన్ని చూసుకోవాలి . మేచింగు ప్రకారం   సాల్తీలన్నీ సర్దుకోవాలి , క్రితం సారి పెళ్ళికి కట్టుకెళ్ళినవి పట్టుకెళ్ళకూడదు ,  రోజులో నాలుగు చీరలు  ఆ నాలుగు ఒకదానికొకటి సంబంధం లేని రంగులు వెతుక్కోవాలి,  ఆ రంగులకి సరిపోయే  బొట్టూ, గాజులూ…..అంటూ నాలువేళ్ళు ముడిచేసరికే నిద్రలోకి జారుకున్నారు .

“మా పెద్దొదిన  దిగుతుంది  పెళ్ళికి ….ఆవిడముందు ఆ చీర కట్టుకుని తిరిగితేకానీ   సిగ్గురాదు ….. జానాబెత్తెడు  కొలతతో ఉంది కొని పంపింది చూడు. పవిటేస్తే కుచ్చీళ్ళు రావు కుచ్చీళ్ళు పోస్తే పవిట చాలదు. చీరపెట్టలేదని నేనేవన్నా ఏడ్చానా?” తనధోరణిలో చెప్పుకుపోతున్నారావిడ. ఏంటో   పీత కష్టాలు పీతవి   హా…..ఆఅ….ఆ….అ.  గాట్టిగా ఆవులించి  గడియారం వంక చూస్తే  హమ్మో !! పెద్దముల్లపుడే పదడుగులేసేసింది.

నాకక్కడే  నేలమీద పడి  గడపమీద తలపెట్టుకునయినా  పడుకుండిపోవాలనిపించేంతగా  ముoచుకొచ్చేస్తుంది నిద్ర…..

“అవునూ ఎన్నిబేగ్గులయ్యేయీ…..మరీ ఎక్కువ లగేజీ అయితే బస్సుల్లో ఎక్కీ దిగీ కష్టం . అలాని మరీ కుక్కి పెట్టేసేవంటే వచ్చేప్పుడు బేగ్గులు పట్టవ్….ఇస్త్రీ బట్టల్లా  ఇడిసిన బట్ట్టలు సర్దలేం కదా! పోయిన సారి ఇలాగే   నీలపల్లి పెళ్ళిలో  బేగ్ పట్టక మూడు లంగాలు వదిలేసొచ్చాను. నే తర్వాత పంపిస్తాలే పిన్నీ అంది  మా చిన్నన్నయ్య మూడో కోడలు సుభద్ర . ఒకటే పంపటం….నిక్షేపంలాంటి లంగాలు. పరకాళ్ళా గుడ్డలే అనుకో తుని నించి తెప్పించేను    పదేల్లబట్టీ కట్టినా పిసరు రంగు దిగితేనా !!” ఓరి నాయనో…  ఈవిడని నీలపల్లిలో ఆపకపొతే యానం లో లాంచీఎక్కి , అలా  ఎదుర్లంక ,మురమళ్ళ ,అమలాపురం పెళ్ళిళ్ళకి కూడా పోయి  ఆయా పెళ్ళిళ్ళల్లో  వదిలేసొచ్చిన తువ్వాళ్ళూ, జేబురుమాళ్ళూ లెక్కేస్తూ కూర్చుంటారు  అని భయం వేసి, “అవన్నీ బస్సులో చెప్పుకోవచ్చులెద్దురూ ఇప్పుడు పడుకుందాం,” అనేసాను.

“సర్లే పడుకో…..మళ్ళీ తెల్లారగట్లే  లేవాలి. పొద్దున్న ఉప్మా లోకి కర్వేపాకు కోసిపెట్టేవాలేదా ! చీకట్లో దొడ్లో కెళీతే పురుగో పుట్టో ఉంటాయ్. ఓ సారిలాగే  తెల్లారు ఝాము ప్రయాణం… అపుడు మీ ఆయనకి మూడో ఏడు…మీ మావయ్యా నేనూ …..”

అబ్బాయిగారు నిద్రకీ మెలకువకీ మధ్య ఇబ్బందిగా కదులుతున్నారు. లేచారంటే ఓ గసురు గసురుతారు…….అని భయపడి . “హుష్…..అత్తయ్యా ఇలా రండి” అని ఆవిడ్ని  గుమ్మం బయటికి పిలుచుకెళ్ళాను.

ఏంటీ…..అని ఆవిడా గుసగుసగా అంటూ  నా చెవి దగ్గర చేరి చెయ్యడ్డుపెట్టి, ఆ  వస్తువులెక్కడ పెట్టేవ్. చంద్రహారం విడిగా జేబురుమాలులో ముడేయమన్నాను వేసేవా ……..ఏ బేగ్గులో పెట్టావో  నాకూ చెపితే  ఓ కన్నేసి ఉంచుతాను.  అసలే బస్సు ప్రయాణం  …..జాగ్రత్తగా పెట్టావా….అని అతి రహస్యంగా అడుగుతున్నారు. అంతే, …….

టేబుల్ మీద గడియారం  కర్ర్……..ర్ర్ర్….ర్ర్ర్ర్……………..ర్ర్ర్ర్ర్ర్ర్…..ర్ర్ర్ర్ర్ర్ మంటూ   రాక్షస స్వరంతో   గుక్కెట్టి ఏడ్చింది.  మా ఇంట్లో మగాళ్ళకి లానే దానికీ అత్తాకోడళ్ళిద్దర్నీ కలిపిచూస్తే కన్ను కుట్టేస్తుంది కాబోలు.

అప్పుడే తెల్లారిపోయిoదా లే…లే… ( అసలు పడుకుందెక్కడా!!). పొయ్యంటించు, అని మా అత్తగారు  తెగ హైరానా పడిపోయారు.  ఆ గోలకి అబ్బాయిగారు అదాట్న మంచమీంచి లేచి  నన్ను నమిలి మింగెయ్యాలన్న కోరికని అతికష్టం మీద ఆపుకుని ( పరగడుపున పచ్చిమాంసం అరగదనుకున్నారేమో), దుప్పటీ తలగడా తీసుకుని ఎటో వెళ్ళిపోయారు. మాం గారు  లేచి ఓసారి పెరట్లో కెళ్ళొచ్చి పడుకున్నారు ( బాగా గుర్తుచేసావ్ అన్నట్టూ).

ఇక నా పరిస్తితి ఏం చెప్పుకోనూ…..హాఅ….ఆఆ…హా…ఆ…..    సీన్ కట్ చేస్తే,
నేనూ మా అత్తగారూ మా ట్రాక్టర్ డ్రయివరు అబ్బులూ విత్  అవర్ బేగ్స్ అండ్ బెడ్డింగ్స్  మా ఊరి పుంతరోడ్డులో ఉన్నాం.

సమయం మూడుగంటలా నలభై  అయిదు నిమిషాలు.   చెప్పానో లేదో…..మా అత్తగారు గడియారానికి గంటంపావు ముందుంటారు   ప్రయాణాలప్పుడు మరీనూ…
మా ఊరు  పెద్దరోడ్డుకి  దగ్గిరిలెండి. ఎలాగో ఆ రోడ్డుకి  చేరితే అక్కడినుంచి ప్రయాణం నల్లేరుమీద బండి నడకే.  ఇప్పుడు మేం వైజాగ్ వెళ్ళాలంటే వెనక్కి రామిండ్రీ వెళ్ళి బస్సెక్కి మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇలా ముందుకెళ్ళటం సుద్ధ దండగ కదా ! అందుకే ఇక్కడే  కాపుకాసి   ఆగిన బస్సులో ఎక్కేస్తుంటాం. అవును మేం చెయ్యెత్తితే బస్సులు ఆగుతాయ్   ‘ ఒక్కోసారి ‘ నిద్ర మొహాన లేపుకొచ్చేసాం ఏమో… అబ్బులు కునిపాట్లు పడుతూ  దెయ్యాలు తిరిగే ఏళప్పుడు ఈ పయాణేలేటండీ. కుంత తెల్లారేకా ఎల్లకూడదేటండీ అని  చనువుగా ఇసుక్కుంటున్నాడు.

నేను బితుకూమంటూ  “అవున్రోయ్ ” అనుకుంటూ చుట్టూ చూసాను. ఎదురుగ్గా తళ తళలాడే తార్రోడ్డున్నా. మా వెనకున్నది సన్నగా మలుపులు తిరిగిన డొంక దారి.  ఈ పక్కా ఆ పక్కా   చింపిరి   దెయ్యాల్లాగా   కనిపించాయి  అడ్డడిడ్డంగా పెరిగిపోయిన చెట్లూ కంపలూ.  ఎక్కడా నరవాసన  చీ…చీ…ఎక్కడా నరసంచారం లేదు.   “ఇక్కడవుతే మలుపుంది గనక  బస్సులు ఇసులో ( స్లో )అయ్యినపుడు మనల్ని  సూడగానే  ఆటోమేటిగ్గా ఆగుతాయండి”   అని మా అబ్బులి ఆలోచన. ఆందుకే  ఏ వాహనం ప్రయాణించవీల్లేని  చిట్టడవిలాంటి ఈ చీకటి ప్రదేసానికి అడ్డదారిన నడిపించి తీసుకొచ్చేసేడు.

ఇంట్లోకూడా దుప్పటి ముసుగేసి భయపడుతూ చూసే  పాటొకటి చప్పున గుర్తొచ్చేసింది. నిను వీడని నీడను నేనే………   నాకు భయం వేసి , మా అత్తగారికీ అబ్బులుకీ మధ్యకొచ్చి నుల్చున్నాను. చేతిలో బేగ్గు భుజం లాగేస్తుంది. కింద పెడదామంటే అంతా మట్టి ..పెంట…ఏమో ఇంకేవేం వున్నాయో!

అత్తగారు  చేతులు రెండూ నడుమ్మీద పెట్టుకుని, ఒరేయ్ ఏదో బస్సొస్తుంది చూడు అంటూ ఆర్డరేసారు కలిదిండి మహారాణిలా ( ఆవిడ పుట్టిల్లు అదేలెండి). వాడు నెత్తినున్న మూడుబేగ్గుల్నీ  ఓ చేత్తో కాసుకుంటూ  భుజాన్నున్న ఇంకో సంచీని సర్దుకుని రోడ్డు మధ్యకెళ్ళి చూసొచ్చాడు. “వత్తవయితే  రైటేగానండి  బస్సో లారీయో దగ్గిరికొత్తేగానీ తెల్దండి….” అనేసాడు.

చుట్టూ చీకటి, పక్కనున్న మాకు మేవే కనప్డటం లేదు. ఇంక మమ్మల్ని చూసి ఏ బస్సు ఆగిచస్తుంది. తెల్లారగట్ల కీ అర్ధరాత్రికీ తేడా తెలొద్దూ ఈ పెద్దావిడకి  విసుగ్గా మనసులో అనుకున్నా… ఆవిడకి కాస్త దూరంగా  జరిగి.

దూరం నించీ లైట్లు  కనపడగానే అబ్బుల్ని రోడ్డుమీదికి తోలేస్తున్నారు మా అత్తగారు.  వాడు  మూటలన్నీ నెత్తినపెట్టుకుని ముఠామేస్త్రిలాగా పోజుగా  చెయ్యూపుతూ నుంచోటం, ఆ వాహనం ఒంటికన్నో రెండుకళ్ళో వేసుకుని బోయ్….అంటూ దగ్గరికొచ్చేసరికి వీడు అమ్మోయ్ అని  పక్కకి ఒక గెంతు గెంతడం.     రక్షించండీ రక్షించండీ అని చేతులూపుతూ హాహా కారాలు చేస్తున్నట్టున్న మా అబ్బులి గాడి సైగలు చూసి రోడ్డు వొంపులో  ఒకటో రెండో బస్సులు కీచుమంటూ  స్లో అయ్యి , మళ్ళీ వేగంగా వెళ్ళిపోయేవి. బస్సు మమ్మల్ని దాటెళ్ళిపోయేకా ఒకటిరెండు బండబూతులు గాలికి ఎగిరొచ్చి పడేవి. మేం వచ్చి  అరగంట అయినట్టుంది. ఎక్కడో కోడికూత  వినిపించింది . హమ్మయ్య పోన్లే  బస్సు రాకపోతే పోయే వెలుగన్నా వస్తుంది అనుకొని నేను ఆనందపడుతుంటే… బస్సుకంటే ముందు  వెలుతురెక్కడ వచ్చేస్తుందో అని మా అత్తగారు కంగారుపడుతున్నారు.

టైమెంత అయ్యుంటుందంటావ్ అన్నారు మా అత్తగారు. నేను నా ఎడంచెయ్యి వెనక్కి దాచేసి  పైకి కిందికీ వెనక్కీ ముందుకీ చూసి ఏమో తెల్దండీ  అనేసాను. అబ్బులుగాడయితే ఎటూ చూడకుండా ….. “కరకెస్టుగా నాలుగున్నరకీ  అయిదున్నరకీ మజ్జిలో ఎంతో అయ్యుంటాదండి,”అన్నాడు  ఇబ్బందిగా కడుపు నొక్కుకుంటూ.

అంత కరకెస్టుగా ఎలా చెప్పేసేవ్రా బాబూ….అని మేం ఇద్దరం అడగలేదు. అప్పుడే …   పైనుంచీ రాలిపడ్డట్టూ  మా ముందు కొచ్చి నుంచుందో ఆకారం. నేను హడలిపోయి, తు…తు..తు..అనుకుని  తేరుకున్నాను. మా అత్తగారు  నువ్వట్రా సింగినాధం అన్నట్టు ఓ తేలిక చూపు విసిరి, గుళ్ళగొలుసు ఓసారి సర్దుకుని  రోడ్డుకేసి చూస్తూ ఠీవీగా నిలబడ్డారు.

“ఏట్రా అబ్బులూ……అయ్యగారిని ఇక్కడ నిలబెట్టేవ్.  బస్సు కోసరవా?  నీకు తెల్దేటిరా…..పైన దాబా ఒటేలు ఎట్టినకాడ్నించీ అక్కడే ఆగుతున్నాయ్ బస్సులు.  ఈర్ని అక్కడకి తీసుకుపో”  అందా సాల్తీ .

అబ్బులు గాడ్ని రెండు తన్నాలనిపించింది.  వివరం తెలకుండా ఇంత సేపూ అక్కడ నిలబెట్టినందుకు.  అత్తగారుండగా కోడలు పెత్తనం చేసిందంటారని ఊరుకున్నా . ఎలాగో  ఆయన్ని బ్రతిమాలి బస్సెక్కించే ఏర్పాట్లు చేయిద్దామనుకుంటే, “ఎందుకండి బాబూ….. గంపకింద కోడి కూయ్యకముందే  మిమ్మల్ని బస్సెక్కిచ్చీ పూచీ నాది,” అని  ఆ కబురూ ఈ కబురూ చెప్పేసి అర్జెంటుగా అవసరం పడిందని యాభైరూపాయలు పట్టుకుపోయాడు రాత్రి.

ప్రయాణం అనుకున్నప్పటినుంచీ మూడు అయిదులు మా అత్తగారిదగ్గరా, మూడు యాభైలు నా దగ్గరా గుంజేసినట్టు లెక్కతేలింది. “వాణ్ణనుకోటం ఎందుకూ మన బంగారం మoచిదయితే ….పెళ్ళికెళ్ళాలని ముచ్చట పడుతున్నారు. దగ్గరుండి రైలో బస్సో ఎక్కిద్దాం అని ఉండొద్దూ. పైగా పిలిచిన ప్రతీ పెళ్ళికీ వెళ్ళిపోటమే  మీ తిప్పలు మీరు పడండి అనేసారు చూడు”. అని మా అత్తగారు నిన్న రాత్రి భోజనాల దగ్గర బాధపడ్డారు. నేనూ నా వంతుగా  ‘భామాకలాపం’ సాగించినా  ఫలితం లేకపోయింది.

“లేదు మాయ్యా బస్సులిక్కడా ఆగుతాయ్……ఆ మద్దిన మా యమ్మనీ, మా యావిడ్నీ ఇక్కడే కదేటీ  గోపాలపొరం బస్సెక్కిచేను”  అని అడ్డoగా దబాయించేస్తున్నాడు  అబ్బులు.

ఏం చేద్దావండీ అని మా అత్తగారిని అడుగుదామని చూద్దును కదా ఆవిడప్పుడే పిలుపుకు అందనంత దూరంలో  ఉన్నారు  ఆది చూసి, ఆబ్బులుమాయ్య ( అదే ..అబ్బులుకి మాయ్య)  “అదేటండీ పెద్దయ్యగారు అటెల్లతన్నారు….. ఇటెల్లాలండి” అని   చెంబున్న చెయ్యెత్తేడు. ఈవిడేమో చుట్టున్న చెయ్యివేపు వెళ్ళిపోతున్నారు లేడికి లేచిందే పరుగంటే ఇదే మరి.

ఏలాగో అరిచీ కేకలేసీ ఆవిడ్ని పట్టుకుని పూర్తి అపసవ్య దిశలో నడిపించుకొచ్చేసరికి అప్పటివరకూ మేం నుల్చుని ఉన్న ఆ చోట్లో  ఇత్తడి చెoబు మైలు రాయిలాగా  మసగ మసగ్గా కనిపించింది….తుప్పల వెనకనుంచీ  అలా తిన్నంగా ఎల్లిపోండి అని  అబ్బులు మాయ్య గారి సలహాకూడా వినిపించింది.

నాకు ఇంటికెళ్ళి ఇంకోసారి తలస్నానo చేసి రావాలనిపించింది. మా అత్తగారు ససేమిరా అంటారని ఊరుకున్నాను. మేం ఆ ‘ దాబా ఒటేలు కాడికి ‘  నడిచొచ్చేసరికి  ఎంచక్కా తెల్లారిపోయింది.   ఒకటో మూడో బస్సులు బోయ్..మని హారని కొట్టుకుంటూ మమ్మల్ని దాటుకుని వెళ్ళిపోయాయి.

మా మొదటిపెళ్ళిరోజు శ్రీవారు బహుమతిగా ఇచ్చిన (అంకెలేలేని ) టైటన్ వాచీలో చుక్కల్ని లెక్కపెట్టుకుని పెద్దముల్లుకీ చిన్న ముల్లుకీ ఉన్న దూరాన్ని బట్టి చూస్తే టైము అంచనాగా  అయిదున్నర  లెక్కకొచ్చింది.

ఇక దుర్ముహుర్తం వచ్చేసినట్టే అని మా అత్తగారూ ……ఇంకో అరగంట వరకూ పర్లేదని నేనూ వాదించుకున్నాం.

ఇదేం ఖర్మే ….దరిద్రగొట్టోడు  దండుకోటానికెళితే వడగళ్ళవాన కురిసిందనీ ……కదలక కదలక ఇల్లు కదిలితే ఇలా అయ్యిందేవిటీ అని అవిడ నానా హైరానా పడుతూ అబ్బులు కేసి కొరకొరా చూసి  ……టైమెంతయ్యిందీ అన్నారు పద్దెనిమిదోసారి. నేను వాచీ ఆగిపోయిందండీ  అని అలవాటుగా అబద్ధం ఆడేసాను.  అబ్బులుగాడు కడుపు పాముకుంటూ “కరకెస్టుగా ఆరయ్యుంటాదండి,” అన్నాడు కడుపే కైలాసం అన్నట్టు వాడికి కడుపే గడియారం.

ధాబా ఒటేలు నించి వస్తున్న కమ్మని వాసనలకి మా కడుపులో ఎలకలు  కలియతిరిగేస్తున్నాయి.  బస్సొచ్చేలోగా ఓ పనయిపోతుందని  అన్నవరం దాటాకా తిందామని  మేం తెల్లారగట్ల వొండితెచ్చుకున్న కరివేపాకు వేయని ఉప్మాని ముగ్గురం   నుంచున్న పళంగా  పంచుకు తినేసాం.

మేం మూతులు కడుక్కుని మంచినీళ్ళు తాగేసరికల్లా  బస్సొచ్చి సరిగ్గా మా ముందే ఆగింది. ముందు బోర్డు చూసుకుని, ఎందుకయినా మంచిదని కండక్టర్ని  కూడా అడిగి సందేహం లేకుండా గబగబా అందిన బేగ్గులు పుచ్చుకుని ముందు నేనూ,  వెనక అత్తగారూ బస్సులో కాళ్ళుపెట్టేసాం. తీరా చూస్తే ఇంకో రెండు బేగ్గులు కిందవుండిపోయాయ్. అబ్బులుగాడు అయిపూపజాలేడు. కండక్టరేమో “ఏటమ్మా ఎక్కుతే ఎక్కండి లేపోతే దిగండి. డోరుకడ్డంగా నిలబడిపోతే ఎలాగా అని  మమ్మల్ని అయితే బస్సులోకి లాగెయ్యడానికి లేకపోతే కిందకి తోసేయ్యడానికీ రెడీగా వున్నాడు.  అత్తగారు ఉండు నేను తెస్తా అని దిగేరు….అయ్యో పెద్దవిడ ఆవిడెక్కడ మోస్తారు అని నేనూ దిగాను. డ్రయివరు బస్సుని రయ్యిన లాగించేసేడు.  అపుడొచ్చాడు అబ్బులు ….. “ఊ కంగారడిపోతారేటండీ నోనొత్తన్నాను కదా”  అంటూ …అత్తగారు యధాలాపంగా వాడి నెత్తిన నాలుగు అక్షింతలు చల్లి శాంతించారు. అదయ్యాకా మాకు తెలుసున్నవాళ్ళు ఒకరిద్దరు కనిపించారు కానీ మేం వాళ్ళని చూళ్ళేదు  ఎక్కడికీ ప్రయాణం అనడుగుతారని.  అలా అడిగితే ప్రయాణం సాగదనీ….అనుకున్న టైముకి ఆశించిన విధంగా ప్రయాణం జరగనందుకు  కారణాలను మేం విశ్లేషించుకుంటూ ఉండగా ఓ రెండు బస్సులు ఖాళీ లేదు అని  అబ్బుల్ని లెక్కచేయకుండా వెళ్ళిపోయాయి.

నిన్న రాత్రనగా మొదలయిన ప్రయాణం  నిద్రలేక నిలబడలేక నీరసం వచ్చేస్తుందిరా దేవుడా.  నా సంగతొదిలేయ్….పాపం ఆ మహతల్లి  నీకు నైవేద్యం పెట్టకుండా ఏనాడన్నా తాను తిందా ….మాకు పెట్టిందా !! (ఏదో ఇలా ప్రయాణాలప్పుడూ ప్రాణం బాగోనప్పుడూ ఎలానూ తప్పదనుకో )  మహా సాద్విని  ఇలా కష్టపెడతావా? “కరుణామయా దేవా కరుణించగా రావా…..ఆపద్భాంధవ రావా …ఆపదలో కాపాడవా …” భక్త తుకారం పాట పూర్తయ్యేసరికి దేవుడే పంపినట్టూ  సరాసరి మాముందుకొచ్చి ఆగిందొక బస్సు. హమ్మయ్యా  నిరీక్షణ ఫలించింది అని సంబరంగా బస్సెక్కెయ్యబోతుంటే ఆ నిర్దాక్షిణ్యపు కండక్టరు, ఇది నాన్ స్టాప్,ఎక్కడపడితే అక్కడ దించుతాం కానీ ఎవళ్ళని పడితే వాళ్ళని ఎక్కించుకోం లేండి…లేండి, అని మా పరువు దుమ్ములో కలిపేసి పోయేడు.  నువ్వు చెప్పి చావొచ్చుకదా  మా అత్త్తగారు అబ్బులుమీద పడ్డారు.

వాడికి చాలా పౌరుషం వచ్చేసింది. దాంతో  ఏవైనాసరే ఈసారి వచ్చిన బస్సులో మమ్మల్ని ఎక్కించి తీరుతానని పంతం పట్టేడు .దాని ప్రకారం  నిద్రలో జోగుతున్నట్టూ ఆగాగి వస్తున్న  బస్సును రోడ్డుకు అడ్డం పడి ఆపేసాడు.

బస్సు ఆగగానే అబ్బులు కండక్టరుకీ డ్రయివరుకీ, ఆ మాటకొస్తే  యావన్మంది ప్రయాణికులకీ వినిపించేలా  “ఎవరనుకుంటునారండీ …పెసిడెంటుగారి తాలూకా ఈరు. బస్సెక్కిచుకోకపోతే  రేపీరూట్లో వొత్తారుకదా అప్పుడు సూద్దిరిగాని ఏవవుతదో . డోరు తియ్యండి డోరు తియ్యండి ….” అంటూ పెద్ద హడావిడిచేసి  లగేజీ  ముందు ఇంజను  మీదా  డ్రయివరు వెనక సీట్లో కూర్చున్నవాళ్ళ కాళ్ళమీదా సర్దేసి, “కుదుపులేకుండా వుంటాది ఇక్కడ కూకోండి అయ్యగారూ” అని, ముందు నించీ మూడో సీటు దులిపి  మేం కూర్చున్నాకా  దిగి డోరేసి, రైట్ రైట్  అనేసరికి బస్సుకదిలింది. వాడు ఇవతలపక్క కిటికీ దగ్గరికి పరిగెత్తుకొచ్చి, ఆయ్….జాగర్తండి, బేగ్గులులన్నీ సరీగా ఉన్నయోలేదో సూసుకోండి, పెళ్ళవగానే బీగొచ్చేయండి …ఆయ్ ….మరెల్లిరండి….ఆయ్…అని చేతులూపేసాడు. బతుకు జీవుడా అనుకుంటూ  సీట్లో జారబడి అత్తగారు చూడకుండా వాచీ చూస్తే   పెద్దముల్లు పైచుక్క  మీదా చిన్నముల్లు కిందచుక్కకి కాస్త అవతలగానూ ఉన్నాయి…అంటే టైము   ఏడేకదండీ….ఏడే…..ఏడే…
ఎక్కెడ దిగుతారమ్మా – కండక్టర్ .
వైజాగు రెండు టిక్కెట్లు -అత్తగారు.
వైజాగయితే ఈ బస్సెక్కేరేటీ – వెనక సీటు ప్రయాణికుడు.
డయివరు గారూ బస్సాపండి  పాపం ఈళ్ళు సూసుకోకుండా ఏరే రూటు బస్సెక్కేసేరు  -ముందు సీట్లో మదర్ తెరీస్సా.
ఏటమ్మా  ఓ లగేజీలేసుకుని తోసుకుని బస్సెక్కేటవేనా ?  దిగండి దిగండి  -కండక్టరు డ్రయివరు తోపాటూ యావన్మంది   ప్రయాణికులూ.
అత్తగారు నేనూ ఒకేసారి తలతిప్పి ఒకర్నొకరం చూసుకున్నాం . కంగారులో ఇద్దరం చూడలేదు ఆ బస్సు ఎటువేపెళుతుందో!
బస్సాగింది . మేం  మోయలేని మా లగేజీ తో సహా మళ్ళీ రోడ్డున పడ్డాం .   ఆ కంపలూ  ఆ తుప్పలూ, ఆ  డొంకలూ  “హత్తేరీ …..మా ఊరు పుంతరోడ్డు.”

***

నోట్ :  ఇంట్లో పనివాళ్ళు ఆడవారిని అమ్మగారు అనీ, మగవారిని అయ్యగారు అనీ పిలుస్తారు కదా అన్నిచోట్లా . కానీ మా ఊర్లో ( చాలా ఊర్లల్లో) మగవారిని  రాజుగారు, పంతులుగారు , కాపుగారు ఇలా ….ఆడవారిని  చిన్నయ్యగారు, పెద్దయ్యగారు ,  అనీ అంటుంటారు . కథలో అదే రాసాను .